pss book: ధర్మము - అధర్మము , ready review pending 22n june 2024
ధర్మము - అధర్మము
ఒక పదార్థము యొక్క స్వభావమును తెల్పునది దాని ధర్మమగును. వేరువేరు పదార్థములకు వేరువేరు ధర్మములుండును. ఒక పదార్థమును చూచిన తర్వాత దాని ధర్మమును తెలుసుకోవచ్చును. ఒకమారు ఒక పదార్థమునకున్న ధర్మమును తెలిసిన తర్వాత దాని ధర్మమును గుర్తు పెట్టుకొని, ఎంతకాలము తర్వాతనైనా దాని ధర్మము ప్రకారము ఆ పదార్థమును గుర్తుపట్టవచ్చును. ఒకమారు ఒక వస్తువు ధర్మము తెలియనిదే, తర్వాత ఆ వస్తువును గుర్తుపట్టేదానికి వీలుండదు. ఒక పదార్థములో శాశ్వితముగా మారకుండ వుండు స్వభావమును ధర్మము అంటాము. ఒక వస్తువు లేక పదార్థములో శాసనముగా శాశ్వితముగా ఉండు స్వభావము ధర్మము అయినపుడు, అటువంటి ధర్మము శాస్త్రబద్ధమైనదని కూడా చెప్పవచ్చును. ఒక వస్తువులోని ధర్మము ఎప్పటికీ మారనిదై ఇలాగే వుండునని శాసన రూపముగా ఉండుటవలన దానిని శాస్త్రీయతకల్గినదని చెప్పవచ్చును. ధర్మము ఎప్పటికీ మారునది కాదు. మారిన దానిని ధర్మము అనకుండ అధర్మము అనాలి. దేనికైనా ధర్మముకాని దానిని అధర్మము అంటాము. ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ధర్మముండినపుడు, విశ్వములోని అన్నిటికీ వాటివాటి ధర్మములు వేరువేరుగా ఉన్నాయని తెలియుచున్నది. ఈ పద్ధతి ప్రకారము కనిపించు పదార్థములకుగానీ, వస్తువులకుగానీ, శరీరములకు గానీ అన్నిటికీ అన్ని ధర్మములున్నాయి. అట్లే కనిపించని వాటికి కూడా ధర్మములున్నవి. కనిపించే జీవరాసులూ పదార్థములూ ఉన్నట్లే, విశ్వములో కనిపించనివి కోట్లాది కోట్లుగా ఉన్నాయి. కనిపించేవన్ని మనకు తెలియకున్నా అవన్నిటినీ లేవని చెప్పుటకు వీలులేదు. అలాగే కనిపించని వాటిలో అన్నిటికంటే పెద్ద (బ్రహ్మ) దేవుడు ఒక్కడు మాత్రమే. అందరికీ అన్నిటికీ ఉన్నట్లే దేవునికి కూడా ధర్మము కలదు.
అందరికీ కనిపించే నిమ్మపండుకు ఒక ధర్మమున్నది. అలాగే చింతపండుకు ఒక ధర్మమున్నది. వాటికున్న శాశ్విత శాసన స్వభావమును ధర్మము అంటామని చెప్పుకున్నాము కదా! దానిప్రకారము నిమ్మపండుకు పుల్లగా ఉండడము ధర్మము. అలాగే చింతపండుకు కూడా పుల్లగా ఉండడమే ధర్మము. రెండూ పండ్లే అయినా, చింతపండుకు, నిమ్మపండుకు పులుపే ధర్మమైనా, నిమ్మపండు, చింతపండు కొద్దిపాటి తేడాతో వేరువేరు ధర్మములు కలిగివున్నవి. అందువలన వాటి రుచులు కూడా కొద్దిపాటి తేడాతో వేరువేరుగా ఉన్నవి. నిమ్మపండుకు పులుపు ధర్మమైనపుడు, దాని ధర్మమును తెలిసినవాడు నిమ్మపండు పులుపును గురించి తెలిసివుండును. విశ్వములో ఒక వస్తువు యొక్క ధర్మము తెలిస్తే, ఆ వస్తువు యొక్క స్వభావమంతా తెలిసిపోవును. అలాగే ఒక వస్తువు యొక్క స్వభావము తెలిస్తే, దాని ధర్మము కూడా తెలిసిపోవును. అయితే ఉదాహరణకు నిమ్మ పండును చూచి, దాని స్వభావమును పూర్తిగా చూడకుండా, దాని రుచిని చూడకుండా, నిమ్మపండు చేదుగా ఉంటుంది అనుకోవడము అధర్మమగును. చేదు నిమ్మపండు యొక్క ధర్మముకాదు. కావున చేదు అనుమాట నిమ్మ పండు ఎడల అధర్మమగును. అలాగే నిమ్మపండును చూడకనే, నిమ్మపండు ఆకారమును, రంగును చూడకనే చేదును రుచి చూచి, ఇది నిమ్మపండు రుచి అనుకొనినా అది అధర్మమగును. నిమ్మపండును చూచి దానికున్న ధర్మమును తెలియుట ఒక మార్గమైతే, ధర్మమునుబట్టి నిమ్మపండును తెలియుట ఒక మార్గమగును. కనిపించే వస్తువుయొక్క స్వభావమైన ధర్మమును సులభముగా కనిపెట్టవచ్చును. వస్తువు తెలియనపుడు ముందుగా చూచినవారు తెలిపిన వస్తువుకున్న ధర్మమునుబట్టి వస్తువును గుర్తించవచ్చును. దీనినిబట్టి వస్తువు లేకుండా దాని ధర్మమును తెలియలేము. అట్లే ధర్మము తెలియకుండా వస్తువును తెలియలేము.
విషయా*
ఇప్పుడు అసలు విషయానికి వస్తాము, కనిపించే వస్తువులను చూచి వాటి ధర్మములను తెలియవచ్చును. అలాగే కనిపించని సూక్ష్మ వస్తువుల ధర్మములనుబట్టి కనిపించని దానిని గ్రహించవచ్చును. కనిపించే వస్తువుల ధర్మ
---
విషయములలో ఎవరూ పొరపాటుపడరు. తెలియవలసిన వస్తువు కనిపిస్తున్నది, కాబట్టి దాని ధర్మమును తెలియుటలో పొరపడుటకు అవకాశములేదు. ఇకపోతే కనిపించని దేనినైనా తెలియాలంటే ముందు దాని ధర్మము తెలిసివుండాలి. దాని ధర్మము తెలియకపోతే కనిపించనిదేదైనా తెలియబడదు. ఒకవేళ కనిపించని తెల్లని వస్తువు యొక్క ధర్మము తెలియక, కనిపించని వేరొక నల్లని వస్తువు యొక్క ధర్మమును తెలిసి, తెల్లని వస్తువును నల్లని వస్తువుగా పోల్చుకుంటే తెల్లని వస్తువు తెలియనట్లే కదా! అందువలన ఒక వస్తువు యొక్క ధర్మముగా వేరొక వస్తువు యొక్క ధర్మమును పెట్టుకుంటే అది మొదటి వస్తువుకు అధర్మమగును. అధర్మము వలన మొదటి వస్తువు యొక్క రూపురేఖలు ఏమాత్రము తెలియకుండా పోవును. కనిపించే వాటి విషయములోకంటే కనిపించని వాటి విషయములో మనకు తెలిసినవి ధర్మములో, అధర్మములో జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరమున్నది. అట్లు పరిశీలించక ధర్మముల స్థానములో అధర్మములను పెట్టుకొంటే తెలియవలసినవి తెలియకుండా పోవును.
విశ్వములో కనిపించనివి ఎన్నో కోట్లు కలవు. వాటన్నిటిలో అతి పెద్ద దానిని పరమాత్మ లేక దేవుడు అనవచ్చును. దేవుడు కనిపించే వాడు కాదు. కావున దేవున్ని గురించి తెలియాలంటే దేవుని యొక్క ధర్మములను ఆధారము చేసుకొని దేవున్ని తెలియవచ్చును. దేని ధర్మమునుబట్టి దానిని తెలియవచ్చునను సూత్రము ప్రకారము, దేవుని ధర్మములనుబట్టి దేవుడెట్లు న్నాడో, ఆయన ఏమి పని చేయుచున్నాడో, ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో తెలియవచ్చును. అయితే ప్రపంచములోని అందరూ దేవున్ని తెలియాలనే ఉండినా, వారిలో ఎక్కువ ప్రయత్నము చేయువారు స్వామీజీలు, పీఠాధి పతులు, మఠాధిపతులు, మహర్షులు, ఉపాసకులు మొదలగువారు. అయితే దేవున్ని తెలియుటకు దేవుని ధర్మమవసరమని అందరికీ తెలిసినా, దేవుని ధర్మమేదో ఎవరికీ తెలియదు. భూమిమీద ఎందరో జ్ఞానమును తెలిసిన వారున్నా, తమ జ్ఞానము దేనికి సంబంధించినదో వారికి తెలియడము లేదు. జ్ఞానము తెలిసిన ప్రతి ఒక్కరూ, తమ జ్ఞానము దేవునికి సంబంధించి నదే అనుకొంటున్నారు. అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు తమతమ జ్ఞానములు గొప్పవని ఒకరినొకరు వాదించుకొనుచున్నారు. వీరే కాకుండా మిగతావారు కొందరు యజ్ఞములు గొప్పవనీ, వాటి ద్వారానే దేవునివద్దకు పోవచ్చనీ చెప్పగా, కొందరు స్వామీజీలు వేదములు గొప్పవనీ, వేదముల వలననే దేవుడు తెలియుననీ చెప్పుచున్నారు. కొందరు ధ్యానమంటున్నారు, కొందరు శ్వాస మీద ధ్యాస అంటున్నారు, కొందరు మనస్సు మీద ధ్యాస అంటున్నారు. వాస్తవానికి వీటి ద్వారా దేవుడు తెలియునా? అని ప్రశ్నించు కొని చూస్తే, ఎవరివి దేవుని ధర్మములైతే వారికి దేవుడు తెలియునని చెప్పవచ్చును.
ఇంతమంది జ్ఞానులలో ఒకరి జ్ఞానముతో మరియొకరి జ్ఞానము ఏకీభవించనపుడు, ఎవరిదో ఒకరిది సరియైన జ్ఞానమైతే మిగతా వారిది సరియైన జ్ఞానము కాదనియేగా అర్థము. దేవుని ధర్మము, జ్ఞానము ద్వారానే తెలియును. జ్ఞానము చూపులాంటిది, ధర్మము దృశ్యములాంటింది. ఏ ధర్మమైనా జ్ఞానము ద్వారానే తెలియును. చూపునుబట్టి దృశ్యమున్నట్లు, జ్ఞానమునుబట్టి ధర్మముండును. దేవుని జ్ఞానము ద్వారా మాత్రమే దేవుని ధర్మము తెలియబడును. దేశములోని ఇంతమంది జ్ఞానులలో, స్వామీజీలలో, పీఠాధిపతులలో మొత్తము అందరిలో ఎవరిది నిజమైన దేవుని జ్ఞానము అను ప్రశ్నవస్తే, దానికి భగవద్గీతలో దేవుడే సమాధానము ఇలా చెప్పాడు "యజ్ఞముల వలన, వేదాధ్యాయనము వలన, దానముల వలన, తపస్సుల వలన నన్ను తెలియుటకు శక్యముకాదు” అని దేవుడే చెప్పినపుడు, మొత్తము అందరి జ్ఞానము దేవునికి సంబంధించినది కాదని తెలియుచున్నది. అన్ని రకముల స్వామీజీలు భగవద్గీతలో భగవంతుడు
---
చెప్పినట్లు కొందరు యజ్ఞములను, కొందరు వేదములను, కొందరు దానములను, కొందరు ధ్యానములను ఆశ్రయించి ఉండుట వలన, అవి అన్నియు దేవుని జ్ఞానము కాని దానివలన, వారి జ్ఞానము వలన దేవుని ధర్మము తెలియదు. యజ్ఞముల, వేదముల, దానముల, ధ్యానముల జ్ఞానము దేవునికి అధర్మమగును. అధర్మము వలన దేవుడు తెలియబడడు. దేవుని ధర్మము వలన మాత్రమే దేవుడు తెలియబడును.
కనిపించని దేవుడు తెలియాలంటే ఆయన ధర్మము మొదట తెలిసి వుండాలి. అటువంటపుడు ఆయన ధర్మములు ఎవరికి తెలుసు అని ప్రశ్నించుకొంటే, దేవుని ధర్మములు దేవునికే తెలుసు, ఇతరులకెవరికీ తెలియవు. దేవుని ధర్మములను దేవుడే చెప్పాలి, దేవుడు తప్ప ఎవరూ చెప్పలేరు అని చెప్పవచ్చును. దేవుని ధర్మములను దేవుడు ఒకమారు మనుషులకు చెప్పినప్పటికీ, కొంత కాలమునకు తిరిగి అవి అధర్మములుగా మారిపోవుచుండును. ఒకమారు చెప్పినపుడు వినిన మనుషులు కాల క్రమములో జనన మరణములను పొందుట వలన, దేవుని జ్ఞానముమీద శ్రద్ధారాహిత్యమువలన, తెలిసిన ధర్మములు కూడా తెలియకుండా పోయి వాటి స్థానములో అధర్మములు వచ్చి చేరుచున్నవి. దేవుని ధర్మములను దేవుడే చెప్పాలని మూడు మత గ్రంథములలోనూ ఉన్నది. భగవద్గీతలో జ్ఞానయోగము అను అధ్యాయములో 7,8వ శ్లోకములలోనూ, బైబిలు గ్రంథములో యోహాన్ సువార్తలో 16వ అధ్యాయములో 12,13వ వాక్యము లలోనూ, తర్వాత ఖురాన్ గ్రంథమందు మూడవ సురా “అలీ ఇమ్రాన్"లో 7వ ఆయతియందు ఈ విషయము చెప్పబడివున్నది. మూడు మూల గ్రంథములలోనూ దేవుని ధర్మములను దేవుడే చెప్పునని ఉన్నది. ఇతర మనుషులు దేవున్ని చూచినవారు ఎవరూ లేరు కనుక ఏ మనిషీ చెప్పుటకు వీలులేదు. “ఇంతకుముందు దేవుడు తన ధర్మములను చెప్పియుండినప్పుడు ఒక్క మనిషైనా దేవుడు తెలిపిన ధర్మముల ప్రకారము దేవున్ని తెలిసివుండును కదా! అటువంటి మనిషి దేవుని ధర్మములను చెప్పవచ్చును కదా!” అని ఎవరైనా ప్రశ్న అడుగవచ్చును. దానికి జవాబు ఈ విధముగా కలదు. దేవుడు తన ధర్మములను ఇంతకుముందు యుగములలో చెప్పినపుడు, అప్పుడు తెలుపబడిన ధర్మములను అనుసరించి దేవున్ని తెలుసుకోగలి గారు. ఏ మానవుడైనా ఒక్కమారు దేవున్ని తెలుసుకోగలిగితే అతని కర్మలన్నీ కాలిపోయి అతను దేవునియందు ఐక్యమైపోవును. అటువంటివాడు తిరిగి పుట్టడు. అందువలన దేవున్ని తెలిసినవాడు భూమి మీద ఎవడూ ఉండడు. ఒకమారు దేవుని ధర్మములను తెలిసినపుడు, ధర్మములను అనుసరించి కొందరు మోక్షమును పొందగా, ధర్మములను అర్థము చేసుకోని వారు, దేవుని జ్ఞానము మీద శ్రద్ధలేనివారు, కొంత కాలమునకు దేవుని విషయములో అధర్మములను ఆశ్రయింతురు. అప్పుడు ధర్మముల స్థానములో అధర్మములు ఉండుట వలన దేవుడు సరియైన పద్ధతిగా అర్థముకాడు. దేవున్ని అధర్మముల ప్రకారము లెక్కించుకొని దేవున్ని కూడా ఒక దేవతగా లెక్కించుకొందురు. అటువంటి సమయములో అధర్మములు పూర్తిస్థాయిగా వ్యాపించినపుడు దేవుడు తన ధర్మములను తిరిగి తెలియ జేయవలసి వచ్చును.
మనకు తెలిసి ద్వాపరయుగము చివరిలో దేవుడు భగవంతునిగా అవతరించి భగవద్గీతరూపములో తన ధర్మములను తెలియజేశాడు. దేవుని ధర్మములు తెలియబడినపుడు, అధర్మములు స్పష్టముగా బయటపడి పోవును. ఇవి అధర్మములని ప్రత్యేకించి చెప్పకపోయినా, ధర్మములు తెలిస్తే అధర్మములు ఇవియని చెప్పకనే తెలిసిపోవును.
---
భగవద్గీతలో అక్షర పర బ్రహ్మయోగమున చివరిలో గల 28వ శ్లోకము...
వేదేషు యజ్ఞేషు తపస్సుచైవ దానేషు యత్పుణ్య ఫలంప్రదిష్టమ్,
అత్యేతి తత్సర్వ మిదం విదిత్వా యోగీ పరంస్థాన ముపైతి చాద్యమ్.
భావము :- దీనిని తెలిసినవాడు వేదములను, యజ్ఞములను, దానములను, తపస్సులను ఆచరించుట వలన వచ్చు పుణ్యఫలములను అతిక్రమించినవాడై మంచి జ్ఞానముకల్గి పరము అనబడు మోక్షమును పొందును.
విశ్వరూపసందర్శన యోగము :- 48వ శ్లోకము...
నవేద యజ్ఞాధ్యయనైర దానైర చక్రియాభిర్న తపోభిరుగ్రైః,
ఏవంరూప శ్శక్యఅహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుపవ్రీర.
భావము :- ఓ అర్జునా! భూమిమీద నీవు తప్ప, నా ఈ రూపమును ఎవరూ చూడలేదు. వేదముల వలన, యజ్ఞముల వలన, దానముల వలన, గొప్ప తపస్సుల వలన నన్ను చూచుటకు శక్యముకాదు.
విశ్వరూపసందర్శన యోగము :- 53వ శ్లోకము...
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా!
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవా నసి మాం యథా॥
భావము :- వేదములచేతగానీ, తపస్సుల (ధ్యానముల) చేతగానీ, దానముల చేతగానీ, యజ్ఞముల చేతగానీ ఇపుడు నీవు చూచిన నా రూపమును చూచుటకు శక్యము (సాధ్యము) కాదు.
భగవద్గీతలో విశ్వరూపసందర్శన యోగము అను అధ్యాయము కంటే మూడు అధ్యాయముల ముందున్న అక్షర పరబ్రహ్మయోగమున 28వ చివరి శ్లోకములోనే భగవంతుడైన శ్రీకృష్ణుడు " ఏ మానవుడైనా ధర్మములను తెలిసినపుడు, అధర్మముల వలన వచ్చు జనన ఫలితమును అతిక్రమించి జన్మరాహిత్య మోక్షమును పొందవచ్చునని చెప్పాడు.” తర్వాత విశ్వరూప సందర్శన యోగమను అధ్యాయము 48వ శ్లోకమున భగవంతుడు కాకుండా, ప్రత్యక్షముగా స్వయముగా దేవుడే చెప్పిన మాటల ప్రకారము అధర్మములైన నాలుగు క్రియల వలన దేవుడు ఏమాత్రము తెలియబడడనీ, ఆ అధర్మ కార్యములను చేయుట వలన దేవున్ని తెలుసుకొనుటకు శక్యముకాదనీ తెలియబడినది. తర్వాత అదే అధ్యాయమున దేవుడు కాకుండా భగవంతుడైన కృష్ణుడు చెప్పిన 53వ శ్లోకములో కూడా దేవుని ధర్మములని భ్రమించి అందరూ చేయు నాలుగు ఆచరణల వలన దేవున్ని తెలుసుకొనుటకు ఏమాత్రము సాధ్యపడదని చెప్పడము జరిగినది. అక్షర పరబ్రహ్మయోగ మను అధ్యాయములో 28వ శ్లోకమున, తర్వాత విశ్వరూపసందర్శన యోగమున 48వ శ్లోకమందు మరియు 53వ శ్లోకమందు అధర్మముల పేర్లను, వాటి ఆచరణలను తెలుపడము జరిగినది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటలను ఎందుకు వినాలి? ఆయన కూడా సాధారణ మనిషే కదా! అని ఎవరైనా అనుకొనుటకు వీలులేకుండా, జ్ఞానయోగము అను అధ్యాయములో అర్జునుడు అడిగిన ఇటువంటి ప్రశ్నకే కృష్ణుడు జవాబు చెప్పుచూ ఇలా అన్నాడు.
శ్లోకము :- 5 బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున
తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప॥
---
శ్లోకము :- 6 అజోపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరోపిసన్
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా॥॥
శ్లోకము :- 7 యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్॥
ము*
శ్లోకము :- 8 పవిత్రాణాయ సాధూనాం వినాశయచ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే॥॥
ద్వాపరయుగము చివరిలో దేవుడు భగవంతునిగా పుట్టాడు. దేవుడు దేవునిగా పుట్టుటకు వీలులేదు, కావున దేవుడు ఒక మనిషివలె జన్మించును. అటువంటి జన్మను భగవంతుడు అంటాము. పైన గల ఐదవ శ్లోకమును బట్టి దేవుడు భగవంతునిగా గతములో కూడా పుట్టాడనీ, మనము ఎన్నిమార్లు పుట్టినది మనకు జ్ఞాపకము లేకున్ననూ, ఆయన జన్మలు మాత్రము ఆయనకు అన్నీ తెలుసునని చెప్పాడు. అంతేకాక ఆరవ శ్లోకములో సకల జీవరాసులకు ఈశ్వరుడైన నేను, చావు పుట్టుకలు ఏమాత్రము లేని నేను, నా ప్రకృతిని అధిష్టించి శరీరముతో మాయను కూడి పుట్టుచున్నాను అన్నాడు. ఇక ఏడవ శ్లోకములో ఎప్పుడైతే ధర్మములు మనిషికి తెలియకుండా పోయి, ఇవే ధర్మములను భ్రమతో అధర్మములలో చిక్కుకుంటాడో, అప్పుడు తప్పనిసరిగ నేను పుట్టుచున్నాను అన్నాడు. ఆయన పుట్టి ఏమి చేస్తాడు? అను ప్రశ్నకు సమాధానముగా ఎనిమిదవ శ్లోకమున ఈ విధముగా చెప్పాడు. నేను ధర్మములను తెలియచెప్పుటకే పుట్టుచున్నాను. ధర్మములను తెలుపుటకు, అధర్మములను లేకుండ చేయుటకు పుట్టిన నేను ఇవి ధర్మములనీ, ఇవి అధర్మములనీ తెలుపుచున్నాను. అలా తెలుపడము వలన, దుష్కృతములైన అధర్మ ఆచరణలను వదలిపెట్టి, సాధుత్వము కల్గిన ధర్మములను ప్రజలు ఆచరించగలుగుదురు
ఈ నాల్గు శ్లోకముల సారాంశములు దేవుడే పుట్టి తన ధర్మములను తెలుపునని తెలియబడుచున్నది. మనము ముందు చెప్పుకొన్న సూత్రము ప్రకారము పదార్థమునుబట్టి దాని ధర్మములు తెలియాలి, లేకపోతే పదార్థ ధర్మములనుబట్టి పదార్థము తెలియాలి. దీనినిబట్టి ఒక పదార్థమునకు ఒక ధర్మముండుననీ, పదార్థమునుండి దాని ధర్మమునుగానీ, ధర్మమునుండి పదార్థమునుగానీ తెలియునని తెలియుచున్నది. ఒకదానితో ఒకటి అవినా భావ సంబంధమున్న పదార్థముగానీ, దాని ధర్మముగానీ, ఏదో ఒకటి మిగిలియున్నపుడు ఒకదాని ఆధారముతో మరియొక దానిని కనుగొన వచ్చును. రెండూ లేనప్పుడు ఏ మనిషీ వాటి ఉనికిని గురించి చెప్పలేదు. అలాగే ఇప్పుడు దేవుని విషయములోనికి వస్తే, ఏ మనిషైనా కానీ ముందు దేవున్ని చూచివుంటే ఆయనను ఆధారము చేసుకొని ఆయన యొక్క ధర్మములను కనుగొనవచ్చును. ముందు దేవుడు తెలియకపోతే ఆయన ధర్మములు తెలిసివుంటే వాటి ఆధారముతో దేవున్ని తెలియవచ్చును. అయితే ఇక్కడ దేవుడుగానీ, ఆయన ధర్మములుగానీ రెండూ లేనప్పుడు మనిషికి ఏ ఆధారము లేకుండా పోయినది. ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధమున్న దైవము, ధర్మము రెండూ లేనప్పుడు మనిషి ఇటు ధర్మమును గానీ, అటు దైవమునుగానీ తెలియుటకు అవకాశమే లేదు. అందువలన భూమిమీద దేవుని జ్ఞానమును, ధర్మములను దేవుడే చెప్పాలి. దేవుని ధర్మములు దేవునికి తప్ప ఏ మనిషికీ తెలియవు అని చెప్పడము జరిగినది.
---
మనుషులకు దేవుడుగానీ, దేవుని ధర్మములుగానీ తెలియనప్పుడు దేవుడే వచ్చి దేవుని ధర్మములను తెలియజేశాడు. అలా తెలియబడిన ధర్మములు ఎవరి ద్వారా తెలియబడినవని మనిషికి తెలియక, తనవలెనున్న ఒక మనిషి చెప్పాడనుకొనును. చెప్పిన మనిషి దేవుని అంశనుండి వచ్చిన భగవంతుడని ఎవరికీ తెలియదు. భూమిమీద ఒక మనిషి ద్వారా ధర్మములు తెలియబడినా, ఆ మనిషి భగవంతుడనీ, భగవంతుడే దేవుడనీ ఎవరూ గ్రహించలేరు. ధర్మములు లేకుండాపోయి అధర్మముల ఆచరణ మనుషులలో ఇమిడివున్నప్పుడు, దేవుడు మనిషి రూపములో వచ్చి ధర్మములను తెలియ జేసినా, చెప్పిన వానియొక్క విలువను తెలియని మనుషులు తమకు తెలిసినవే ధర్మములనీ, భగవంతుడు చెప్పినవి పూర్తి అధర్మములనీ అనుకోవడమే కాకుండా, భగవంతుడు చెప్పు ధర్మములను ప్రచారము కాకుండా చూడాలని ప్రయత్నము చేస్తూ, ఇతను పని గట్టుకొని ఇతర మత ధర్మములను బోధిస్తున్నాడనీ, ఇందూధర్మమని చెప్పుకొని హిందువువలె ఉండి పర మతమును బోధిస్తున్నాడని ప్రచారము చేసి, అసలైన ధర్మములను ఎవరూ తెలుసుకోకుండా చేతురు. మేము హిందువులము, హిందూ మతరక్షకులము, హిందూ ధర్మపోషకులము అని పేరు పెట్టుకొన్నవారూ, తమకు దేవుని ధర్మములేవో తెలియనివారూ, ఇందూ ధర్మములంటే అర్థము కూడా తెలియనివారూ అసలైన దేవున్ని, కనిపించు భగవంతున్ని సాధారణ మనిషిగా తలచి, అతనిని గూర్చి అవమానకరముగా మాట్లాడుదురు. దేవుని ధర్మము లను భగవంతుని ఎదుటే దూషింతురు. మానవులను ఉద్ధరించుటకు అంతటి దేవుడే భూమిమీదకు భగవంతునిగా వస్తే, ఆయనను సాధారణ మనిషికంటే హీనముగా మనుషులు చూడడమే కాకుండా, మేమే నిజమైన ధర్మరక్షకులమని చెప్పుకొంటూ, భగవంతుడు చెప్పే ధర్మములు తమ మతము నకు, తమ ధర్మమునకు విరుద్ధమని భగవంతున్ని హత్య చేయాలని ప్రయత్నము చేయువారు కూడా కలరు.
భగవద్గీతయందు కృష్ణుడు రాజవిద్యా రాజగుహ్యయోగమను అధ్యాయములో పదకొండవ శ్లోకమున ఇలా చెప్పాడు.
శ్లోకము :అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్,
పరంభావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్.
భావము : సర్వ జీవరాసులకు దేవుడైన నేను, మనుష్య శరీరము ధరించి భూమిమీద మనుషుల మధ్యలోనికి వస్తే, మూఢులైన (అజ్ఞానులైన) వారు నా దైవత్వమును తెలుసుకోలేక నన్ను అవమానిస్తున్నారు.
కలియుగములోకంటే కొంతమేలైన ద్వాపరయుగములో ఇప్పుడు ఉన్నంత మూర్ఖులు, మూఢులు అప్పుడు లేరనుకుంటాను. కొంతమేలైన ఆ కాలములో కృష్ణుడు తనకు 90 సంవత్సరముల వయస్సు వచ్చినపుడు దేవుని ధర్మములైన భగవద్గీతను చెప్పాడు. అదియు ఎవరూ వినకుండ అర్జునునికి మాత్రమే చెప్పడము జరిగినది. యుద్ధరంగములో ఒక్కమారు తప్ప తర్వాత ఎప్పుడూ జ్ఞానమును చెప్పినట్లు లేదు. ఒక్కమారు జ్ఞానము చెప్పిన ఆయనకు కూడా మూఢులతో అవమానము తప్పలేదని చెప్పినపుడు, నిత్యము దేవుని ధర్మములు ఇవియనీ, మీరు ఆచరించునవి అధర్మములనీ చెప్పు మాలాంటి వారికి ఇప్పటికాలములో ఎలాగుండునో మీరే ఊహించు కోవచ్చును. మేము వ్రాసిన త్రైతసిద్ధాంత భగవద్గీతను అనంతపురం జిల్లా, గుంతకల్లు విశ్వహిందూ పరిషత్ ఆఫీసు ముందర మేము హిందువులము అనువారు అగ్గిపెట్టి కాల్చడము, ఫోన్లలో మమ్ములను దూషించడము మాకు అవమానమే కదా! హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బి.జె.పి కార్యకర్తలను వారు మా భక్తుల మీద భౌతిక దాడులకు దిగడము మాకు
---
అవమానమే కదా! మేము స్వచ్ఛముగా ఇందూధర్మములను బోధిస్తే, పరమతమును బోధిస్తాడని ప్రచారము చేసి కోర్టులో కేసులు పెట్టిన హిందువులు కూడా కలరు. త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి అని గోడలమీద హంపీక్షేత్రము నకు కిలోమీటరు దూరములో వ్రాస్తే, హంపికి దగ్గరగా ఎటువంటి వ్రాతలు ఉండకూడదను సాకుతో, ఆ వ్రాతలు వ్రాసిన మా భక్తులకు హౌస్పేట కోర్టులో 20 రోజులు జైలు శిక్ష వేయించిన హిందువులు కలరు. అద్వైత సిద్ధాంతము, విశిష్టాద్వైత సిద్ధాంతము, ద్వైత సిద్ధాంతములాగ మేము త్రైత సిద్ధాంతమును ప్రతిపాదిస్తే, హిందూమతములోని సిద్ధాంతములనే తెలియని హిందువులు త్రైతసిద్ధాంతము అను పేరు వింటూనే, క్రైస్తవ మతములోని త్రిత్వములోనికి చేర్చి ఇది క్రైస్తవ బోధ అనినవారు కూడా కలరు.
ఒక్కమారు ధర్మములను బోధించిన భగవంతున్నే అవమానపరచిన హిందువులు, నిత్యము దేవుని ధర్మములను గురించి చెప్పు మాలాంటి వారిని హత్య చేసేదానికైనా వెనుకాడరు. ఇదంతా అధర్మములను ఆశ్రయించి మేము హిందువులమని చెప్పుకొనువారికి కనువిప్పు కలుగుటకు చెప్పు చున్నాము. హిందూ ధర్మరక్షకులమని పేరుపెట్టుకొన్న మీకు హిందూ (ఇందూ) ధర్మములంటే ఏమిటివో తెలుసునా? అని అడుగుచున్నాను. హిందువుల ముసుగులోనున్న పరమతమువాడని నన్ను నిందించిన వారికి కనువిప్పు కలుగుటకు ఈ గ్రంథము ఉపయోగపడగలదు. హిందూ (ఇందూ) మతములోని జ్ఞానమును చెప్పవలసినది సిద్ధాంతకర్తలు. సిద్ధాంతకర్తల విషయమే తెలియనివారు హిందువులెట్లవుతారని ప్రశ్నించుచున్నాను. గతములో ముగ్గురు సిద్ధాంతకర్తలు వారివారి సిద్ధాంతములను అనుసరించి హిందువులకు జ్ఞానమును బోధించారు. ప్రస్తుతము మా ద్వారా త్రైత సిద్ధాంతము భగవద్గీతనుండి ప్రతిపాదించబడినది. గతములో ముగ్గురు సిద్ధాంతకర్తలైన ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వారి బోధలను వినిన హిందువులు త్రైతసిద్ధాంతమును ఎందుకు అసూయగా చూస్తున్నారు? అను ప్రశ్నకు సులభముగా జవాబు దొరికి పోతున్నది. ఆ జవాబు ఏమనగా! ప్రస్తుత కాలములో మేము జ్ఞానులము, మేము హిందూ ధర్మ పెద్దలము, మేము స్వాములము, మేము విశ్వహిందూ రక్షకులము, మేము ధర్మ బోధకులము, మేము ధర్మసాధకులము అను వారందరికీ గతములోని సిద్ధాంతకర్తల బోధలు, సిద్ధాంతములు ఎటువంటి ఆటంకమూ కలుగజేయ లేదు. ఎవరికి నచ్చిన ఆచరణ అయినా సిద్ధాంతకర్తల బోధలకు వ్యతిరేఖముగా కనిపించలేదు. అయితే ఇప్పుడు త్రైతసిద్ధాంత జ్ఞానము కొందరికి తప్ప మొత్తము అందరికి నచ్చడము లేదు. కారణ మేమనగా "త్రైతసిద్ధాంతము”, భగవద్గీత గర్భమునుండి పుట్టినది. పురుషోత్తమ ప్రాప్తియోగములోని 16, 17వ శ్లోకములను ఆధారము చేసుకొని చెప్పబడిన మూడు ఆత్మల సిద్ధాంతము. త్రైతసిద్ధాంతము భగవద్గీత అంతర్భాగమై నందున దీనియందు గీతలోని ధర్మములనే చెప్పవలసి వచ్చినది. మిగతా సిద్ధాంతములన్నియు వేదములనుండి పుట్టినవి. త్రైత సిద్ధాంతమునకు వేదములకు ఏమాత్రము సంబంధములేదు.
మాకంటే ముందు కేరళ రాష్ట్రమునుండి అద్వైత సిద్ధాంతకర్త ఆది శంకరాచార్యులు వచ్చారు. తర్వాత తమిళనాడు రాష్ట్రమునుండి విశిష్టా ద్వైత సిద్ధాంతకర్తయిన రామానుజాచార్యులు వచ్చారు. తర్వాత కర్ణాటక రాష్ట్రమునుండి ద్వైత సిద్ధాంతకర్తయిన మధ్వాచార్యులు వచ్చారు. అందరి కంటే ముందువచ్చిన ఆది శంకరాచార్యులు 32 సంవత్సరములు మాత్రమే జీవించి తన సిద్ధాంతమును చెప్పాడు. తర్వాత వచ్చిన రామానుజాచార్యులు 120 సంవత్సరములు బ్రతికి తన సిద్ధాంతమును బోధించాడు. ఆ తర్వాత వచ్చిన మధ్వాచార్యులు 79 సంవత్సరములు బ్రతికి తన ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేశారు. అయితే అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత అను మూడు సిద్ధాంతములు వేదములనుండి పుట్టుకొచ్చినవి.
---
వ్యాసుడు వ్రాసిన వేదముల ఆధారముతో ఈ మూడు సిద్ధాంతములు వచ్చిన దానివలన, ముగ్గురు సిద్ధాంతకర్తలు వారివారి సిద్ధాంతములను అనుసరించి వేదములను బాగా ప్రచారము చేశారు. ముగ్గురు ఆచార్యుల మూడు సిద్ధాంతములు వేదముల నుండి పుట్టినవి. కావున భగవద్గీతకు ఏమాత్రము సంబంధములేదు. ముగ్గురు సిద్ధాంతకర్తలు చెప్పిన దానివలన ఇప్పటి కాలములోని కొందరు ఎక్కువగా వేదములను ఒంటబట్టించుకొన్నారు. ముఖ్యముగా ముగ్గురు సిద్ధాంతకర్తలు ఒకరు కేరళ బ్రాహ్మణులు కాగా, రెండవ వారు తమిళనాడు బ్రాహ్మణులు. మూడవ ఆయన కర్నాటకలోని ఉడిపి బ్రాహ్మణులు. ముగ్గురు సిద్ధాంతకర్తలు బ్రాహ్మణులైన దానివలన ఎక్కువగా బ్రాహ్మణ సమాజము వేదములను ఎక్కువగా అభ్యసించినది. మొదటి నుండి బ్రాహ్మణులు తెలివైనవారు గనుక జ్ఞానము, ధర్మము అన్ని వేదములలో ఉన్నాయని చెప్పి అందరిని వేదములవైపు నడిపించారు. వేదములు చదివినవాడే జ్ఞానియని, ప్రచారము చేయుట వలన జ్ఞానజిజ్ఞాసులందరు వేదములవైపు మొగ్గుచూపారు.
ప్రస్తుత కాలములో క్రొత్తగా పుట్టినది త్రైతసిద్ధాంతము. త్రైత సిద్ధాంతము వేదములకు ఏమాత్రము సంబంధములేనిదైవుంటూ, వేదము లనే అధర్మములని చెప్పినది. అంతేకాకుండా యజ్ఞములు అధర్మ ఆచరణ అని చెప్పడము వలనా, త్రేతాయుగములోనే బ్రహ్మజ్ఞానియైన రావణబ్రహ్మ అధర్మాచరణ అయిన యజ్ఞములను నివారించుటకు కృషి చేశాడని చెప్పుట వలనా, ఒక్కమారుగా వేద ప్రియులందరికీ క్రింద పైన మండిపోయింది. ఆ దెబ్బతో అందరూ త్రైత సిద్ధాంతమునకు వ్యతిరేఖులయ్యారు. మిగతా వారిని కూడ త్రైత సిద్ధాంతమునకు వ్యతిరేఖముగా ప్రేరేపించారు. త్రైతసిద్ధాంతము హిందూమతమే కాదని ప్రచారము చేశారు. తెలివైన కొందరు అలా ప్రచారము చేయగా, తెలివి తక్కువవారు కూడా ఏమాత్రము ఆలోచించకుండ వారి మాటలనే గ్రుడ్డిగా నమ్మి, త్రైతసిద్ధాంతమును నిందించను మొదలు పెట్టారు. కొందరు స్వంత ఆలోచనలేని ప్రజలు ఇతరులు ప్రేరేపించగా అన్నిటికంటే మించినది త్రైతసిద్ధాంతమని గ్రహించక, త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించిన ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులను అవమానించుటకు, నిందించుటకు మొదలుపెట్టారు. అయితే యోగీశ్వరులు ఇదంతయు అధర్మవరులు చేయు పన్నాగమని గ్రహించి, తన పనిని తాను చేయుచు నిజమైన దేవుని ధర్మములను ప్రచారము చేయుచున్నారు.
ద్వాపరయుగములో ఇప్పటికంటే ఎక్కువగా భక్తి అనుకొని యజ్ఞ యాగములు చేసెడివారు. అలాగే ధ్యానము, తపస్సు, దానములు, వేద మంత్రోచ్ఛాటనలు ఎక్కువగా ఉండేవి. నిత్యము యజ్ఞము చేయువారు కొందరుండగా, నిత్యము వేదపారాయణము చేయువారు కొందరుండెడి వారు. ప్రతి దినము ఎవరికో ఒకరికి ఏదో ఒకటి దానము చేయువారు కొందరుండగా, ప్రతి దినము ఉదయము, సాయంకాలము రెండుమార్లు ధ్యానము చేయువారు, సంవత్సరములో ఒక నెల లేక రెండు నెలలైనా ఏకధాటిగా తపస్సు చేయువారు కూడా ఉండెడివారు. ఇవన్నియు ఒక మోస్తరుగా ఇప్పటికాలములో కూడా ఉన్నవి. యజ్ఞములు చేయువారు, ఇతరులకు దానము చేయువారు, వేదములను పఠించువారు, చిన్న ధ్యానము మొదలుకొని పెద్ద తపస్సు వరకు చేయువారు మనుషుల దృష్ఠిలో గొప్ప వారుగా, ఎంతో దైవజ్ఞానమున్నవారుగా లెక్కించబడుచుందురు. అటువంటి వారిని గొప్ప ధర్మవరులనుకోవడము, దైవమార్గములో ఉన్నవారిగా అనుకోవడము పూర్వపు యుగములనుండి అందరికీ అలవాటైపోయినది. ద్వాపరయుగముకంటే ముందు యుగములలో యజ్ఞములు, దానములు, తపస్సులు చేయడము ఉండినా, వేదములు మాత్రము నిర్దిష్టముగా ఇవి అని చెప్పుకొనుటకు లేకుండెడివి. కొన్ని శుభకార్యములందు కొన్ని మంత్రములను చదువుచుండినా, అవి వేదమంత్రములు
---
కాకుండా వేరు మంత్రములై ఉండెడివి. ద్వాపరయుగమున వ్యాసమహర్షి నాల్గువేదము లను తయారు చేశాడు. వ్యాసమహర్షి వేదములను రచించిన తర్వాత కొంతకాలమునకు పదునెనిమిది పురాణములను కూడా రచించెను. అప్పటికి వ్యాసమహర్షి తాను చేయునది మంచిపనియని తలచి మంచి ఉత్సాహముతో చతుర్విద వేదములను, అష్టాదశ పురాణములను వ్రాయడము జరిగినది. అలా వ్యాసునిచే వ్రాయబడిన తర్వాత వేదములను, పురాణము లను అందరూ చదవగలిగారు. వేదములు వ్యాసరచితమై బయటికి వచ్చిన తర్వాత వ్యాసుడు చెప్పినట్లు వేదమంత్రములను ఉపయోగించి యజ్ఞ యాగములు చేయువారు ఎక్కువైపోయారు. వేద పారాయణము చేయడమే దైవమార్గమనీ, వేదములు వ్రాసినవాడే భగవానుడనీ వ్యాసున్ని వ్యాసభగవాను డనీ, భగవాన్ వేదవ్యాసుడనీ అనెడివారు. తనను ప్రజలు పొగడుచువుంటే వ్యాసుడు దానిని చూచి సంతోషించెడివాడు. వ్యాసుని కాలములో ఎందరో గొప్ప మహర్షులని పేరుగాంచినవారు కూడా యజ్ఞములను చేయడములో, వేదములను ప్రచారము చేయడములో నిమగ్నమై ఉండిరి.
ఇదంతా మానవులైన మనకు మంచిగా కనిపించినా దేవుని దృష్ఠిలో ధర్మములకు పూర్తిగా ఆటంకము ఏర్పడినట్లు, ధర్మములు తెలియకుండా పోయి వాటి స్థానములో అధర్మములు వచ్చి చేరినట్లు, ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మములకు బలము చేకూరినట్లు తెలిసిపోయింది. ఇది కొందరికి ఆశ్చర్యముగా అనిపించినా ముమ్మాటికి సత్యము. ఎప్పుడైతే ధర్మములకు ముప్పు ఏర్పడి అధర్మములు చెలరేగిపోవునో, అప్పుడు నేను అవతరించి తిరిగి ధర్మసంస్థాపన చేస్తానని దేవుడు చెప్పినట్లు, ద్వాపరయుగములో ధర్మములకు అటువంటి హీనస్థితి ఏర్పడిన దానివలన, దేవుడు భగవంతునిగా జన్మించి తిరిగి తన ధర్మములను తానే తెలియజేశాడు. దేవుని ధర్మములు దేవునికి తప్ప ఇతరులకెవరికీ తెలియవు. కావున దేవుడే మానవరూపము లోనికి వచ్చి భగవద్గీతరూపములో తన ధర్మములను తెలియజేయడము జరిగింది. భగవంతుడైన కృష్ణుడు ఆ దినము తాను తెలియజేయు ధర్మము లన్నీ లోక విరుద్ధమైనవనీ, అలాగే ఇతరులకు మంచిగా కనిపించి అలవాటుగానున్నవన్నీ అధర్మములని తెలిపితే, తనమాటలను ఎవరూ జీర్ణించుకోరని తెలిసి తనకు అనుకూల వ్యక్తి అయిన అర్జునునికి మాత్రము తెలియజేశాడు. ఆ విధముగా తెలియజేసిన జ్ఞానము కొద్దిరోజులకు అర్జునుని ద్వారా వ్యాసునికి తెలిసినది. వ్యాసుడు ఎంతో తెలివైనవాడు, సూక్ష్మగ్రాహి. అందువలన అర్జునుని ద్వార విన్న విషయములను అందరివలె విరుద్ధముగా తలచక ఎంతో తెలివిగా వాటిలోని సత్యమును, ధర్మములను గ్రహించాడు. వ్యాసుడు అర్జునుని ద్వారా వినినవన్నీ తాను చెప్పిన వాటికి పూర్తి వ్యతిరేఖముగా ఉండినా, అదంతయు వాస్తవమని తన తప్పును తప్పుగా గ్రహించగలిగాడు. కృష్ణుడు యుద్ధసమయములో అర్జునునికి చెప్పిన విషయములన్నియు అర్జునునికి అవసరములేదు తనకే అవసరమను కొన్నాడు. కృష్ణుడు ఎంత తెలివిగా తనకు తెలియవలసిన జ్ఞానమును అర్జునుని ద్వారా అందించాడో తెలుసుకొన్నాడు. దానితో తాను పూర్తిగా అధర్మములను ప్రచారము చేశానని చింతించాడు.
ఆ విధముగా తన తప్పును తెలుసుకొన్న వ్యాసమహర్షి దానికి పరిష్కారమార్గమేమని ఆలోచించాడు. చివరకు తన యోచనకు ఒక విషయమందినది. తనలో వచ్చిన యోచన ప్రకారము తన అధర్మ ప్రచారము వలన వచ్చిన పాపమునకు పరిహారముగా కృష్ణుడు చెప్పిన ధర్మములను తానే స్వయముగా ప్రజలకు తెలుపాలనుకొన్నాడు. విధముగా అనుకొనిన వెంటనే అర్జునుని ద్వారా తెలిసిన విషయమంతయు గ్రంథముగా వ్రాశాడు. అలా వ్రాయబడిన గ్రంథమే నేడు మనముందున్న భగవద్గీత. భగవద్గీతను వ్రాయకముందు భగవద్గీతకు నూటికినూరుపాల్లు వ్యతిరిక్తముగాయున్న వేదములను, పురాణములను వ్రాసిన వ్యాసుడు తన తప్పును సరిదిద్దుకొను నిమిత్తము భగవద్గీతను వ్రాయడము జరిగినది. వ్యాసుడు మారుమనస్సు పొందినవాడై భగవంతుడు చెప్పినది చెప్పినట్లు వ్రాయగా, దానిని
---
చూచిన అధర్మవరులు యజ్ఞములను, వేదములను, ధ్యానములను (తపస్సులను) వదులుకోలేక వ్యాసుని మీదనే అసూయపడి నారు. తాము ఆచరించుచున్నవి అధర్మములనీ, వ్యాసుడు రెండవమారు వ్రాసిన భగవద్గీతలోనున్నవి అసలైన ధర్మములనీ తెలుసుకోలేకపోయారు. వ్యాసుడు మతిభ్రమించి మొదట వ్రాసిన వేదములకు వ్యతిరేఖముగా గీతను వ్రాశాడని అనుకొన్నారు. అయితే వ్యాసుని ముందర తమ ఉద్దేశమును చెప్పుటకు ఎవరికీ ధైర్యము లేకపోయింది.
కొంతకాలమునకు వ్యాసుడు చనిపోయిన తర్వాత, వ్యాసుడు వ్రాసిన సంస్కృత శ్లోకములరూపములోనున్న భగవద్గీతలోనికి ఆనాడు శ్లోకములను వ్రాయగలిగిన పాండిత్యమున్నవారు యజ్ఞములకు, వేదములకు సంబంధించిన శ్లోకములను తయారుచేసుకొని గీతలోనికి అవకాశమున్న చోట ఇరికించడము జరిగినది. వ్యాసుడు కృష్ణుడు చెప్పిన అసలైన భగవద్గీతను వ్రాసిపెట్టిపోగా, తర్వాత కొందరు స్వార్థవరులైన అధర్మవరుల ద్వారా గీతలో కొంత కలుషితము ఏర్పడినది. అప్పటినుండి గీత ధర్మ అధర్మములకలయికగా, రెండు విధములా బోధించునదిగా కనిపిస్తున్నది. ఈ విధముగా హిందూ ధర్మములు ఏనాడో భ్రష్టుపట్టిపోయినవి. ధర్మ అధర్మ సమ్మేళనముగానున్న భగవద్గీతను చదివినవారు, అందరికి అలవాటైన అధర్మములనే గీతనుండి తీసుకొంటున్నారు. ధర్మములను వదలివేయు చున్నారు. కృష్ణుడు చెప్పిన, వ్యాసుడు వ్రాసిన ఉద్దేశములను గ్రహించ లేకపోయారు. వ్యాసుడు ముందు తానే యజ్ఞములను, వేదములను గురించి వ్రాసియుండుట వలన, గీతలో కూడా కొందరికి అవియే అర్థమైనాయి. వ్యాసుడు తనతప్పును సరిదిద్దుకొనినా, మనుషులు మాత్రము తమ ఉద్దేశ్యమునకు అనుగుణముగా ఉంటూ, తమ తప్పును ఏమాత్రము తెలుసుకోలేకపోయారు. నాటికీ నేటికీ మూర్ఖముగా ప్రవర్తిస్తూ తమవే ధర్మములను ఉద్దేశ్యములో ఉన్నారు.
ఈ మధ్యకాలములో 2000 సంవత్సరములో మేము త్రైత సిద్ధాంతమును ఉపయోగించి భగవద్గీతను వ్రాసినపుడు వ్యాసుడు వ్రాసిన శ్లోకములకు భావము వ్రాసి, మధ్యలో అధర్మవరులు కలిపిన శ్లోకములకు భావమును వ్రాయకుండ వదలివేశాము. అటువంటి శ్లోకములను కల్పిత శ్లోకములని వ్రాశాము. మేము ఆ విధముగా కల్పిత శ్లోకములను గుర్తించి ప్రక్కన పెట్టడమును కొందరు జీర్ణించుకోలేకపోయి, మేము హిందువుల ముసుగులోనున్న క్రైస్తవులమని, త్రైతము అంటే క్రైస్తవమతములోని త్రిత్వ మని, హిందువులను లోలోపల క్రైస్తవులుగా మత మార్పిడులు చేయుచున్నా మని అజ్ఞాన ప్రజలకు నేర్పించి మా మీదికి పురికొల్పడము జరిగినది. అటువంటి వారిద్వారా మాకు కొంత ఆటంకములు ఏర్పడినా, త్రైతసిద్ధాంత జ్ఞానమును ఎందరో జ్ఞానులైనవారు తెలుసుకొని వ్యాసునివలె మారిన వారు కూడా కలరు. “ఇంతకాలము మేము ఇతరుల గ్రంథములు చదివి, ఇతరుల బోధలు విని జ్ఞానులమైనామనుకొనెడి వారము. ఇప్పుడు త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివిన తర్వాత ఇంతవరకు మాకు తెలిసినది జ్ఞానమేకాదనీ, ఇంతవరకు కాలమంతా వృథా అయిపోయిందనీ” బాధపడు వారు ఎందరో కలరు. జ్ఞానములో ఎంతో పేరుగాంచిన వారు కూడా మా జ్ఞానమును తెలిసిన తర్వాత తమకు ఇంతవరకు తెలిసిన జ్ఞానము ఈ జ్ఞానము ముందర జ్ఞానమేకాదని చెప్పడము చూస్తే, మూర్ఖులు కలుగ జేయు ఆటంకములకంటే మా జ్ఞానమును తెలిసి సంతోషించు వారిని చూచిన తర్వాత మాకు వచ్చిన ఉత్సాహము పెద్దదని చెప్పవచ్చును. భగవద్గీతలోని అసలైన ధర్మములు బయటికివస్తే తమకు ఇంతవరకున్న గౌరవము ప్రజలలో లేకుండా పోతుందని భయపడువారు మాకు ఎన్ని ఆటంకములను కలుగజేసినా, ఎందరిని మా మీదికి పురిగొల్పినా మేము ఏమాత్రము భయపడడములేదు.
---
ఒక మనిషి జనన మరణచక్రమునుండి బయటపడి దేవునియందు ఐక్యమైపోవుటకు వారు గతములో చేసుకొన్న పాపపుణ్యములను లేకుండా చేసుకోవాలి. పాపపుణ్యములు లేకుండా పోవుటకు రెండే మార్గములు గలవు. ఒకటి అనుభవించి అయిపోగొట్టాలి. రెండు దేవుని జ్ఞానమును తెలియుట చేత ఏర్పడిన జ్ఞానాగ్ని చేత కాల్చివేయాలి. మొదటి మార్గము ప్రకారము అనుభవించి కర్మను లేకుండా చేసుకొనుట సాధ్యముకాని పనియగును. ఎందుకనగా! ఒక్క ప్రక్క అనుభవించి అయిపోగొట్టుచుంటే మరియొక ప్రక్క క్రొత్తది తయారైవచ్చుచుండును. అందువలన పాప పుణ్యములను (కర్మను) అనుభవించుట వలన అయిపోవని తెలియుచున్నది. ఇకపోతే రెండవమార్గము ప్రకారము దైవజ్ఞానము పొందుట చేత, మనిషిలో పుట్టు జ్ఞానాగ్ని చేత కర్మను సులభముగా లేకుండా చేసుకోవచ్చును. ఇదే విషయమునే భగవద్గీతయందు జ్ఞానయోగమను అధ్యాయములో 37వ శ్లోకమున చెప్పారు.
శ్లోకము: యథైధాంసి సమిద్దోగ్ని ర్భస్మసాత్కురు తేర్జున
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా॥
భావము :- ఏ విధముగా అగ్నియందు కట్టెలు కాలిపోవుచున్నవో, అదే విధముగా జ్ఞానమను అగ్నియందు మనిషియొక్క సర్వకర్మలు కాలిపోవును.
మనిషి తన కర్మలను లేకుండ చేసుకొనుటకు జ్ఞానమును ధర్మ యుక్తముగా తెలిసినపుడు కర్మరాహిత్యమైపోయి ముక్తి లభించును. కర్మ రాహిత్యమునకు కావలసిన జ్ఞానము ధర్మయుక్తముగా భగవద్గీతలో తెలుప బడివున్నది. ఇదే విషయమునే మేము ఎక్కువగా బోధిస్తూవుంటాము. ప్రతి మనిషి ముక్తి పొందుటకు అవసరమైన జ్ఞానము భగవద్గీతలో ఉన్నది. అందువలన ప్రతి ఒక్కరూ గీతను చదవండి అని చెప్పుచూ, భగవద్గీతలోని విషయములు అందరికీ సులభముగా అర్థమగుటకు త్రైతసిద్ధాంత భగవద్గీత అని పేరుపెట్టి గీతను వ్రాయడము జరిగినది. త్రైత సిద్ధాంత భగవద్గీత అచ్చువేయబడి గ్రంథరూపములో 2000 సంవత్సరములో వచ్చినది. అప్పుడు చాలామందికి త్రైతసిద్ధాంత భగవద్గీత లను ఉచితముగా ఇచ్చాము. నేను చిన్నవయస్సులో 7,8 తరగతులు గోరంట్ల హైస్కూలులో చదివినప్పుడు ప్రక్క పల్లెనుంచి ఒక బ్రాహ్మణుల అబ్బాయి కూడా వచ్చి నేనున్న తరగతిలోనే చదివెడివాడు. అతను 2000 సంవత్సరములో హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్గా ఉండడము తెలిసి ఆయనకు కూడా ఒక భగవద్గీతను స్వయాన పోయి ఇవ్వడము జరిగినది. వారము రోజుల తర్వాత, భగవద్గీతను ఇచ్చినపుడు నా వెంటవచ్చిన మనిషితో మా భగవద్గీతను గురించి అతను మాట్లాడుచు “త్రైతసిద్ధాంతము అని ఇందులో ఉన్నది. ఇది క్రైస్తవసంస్థకు సంబంధించినదిగా అనిపిస్తున్నది. నీవు దీనిని చదవద్దు” అని చెప్పడము జరిగినది. నావెంట వచ్చిన మనిషి ఆ పోలీస్ ఆఫీసర్కు ఒకప్పుడు సహ ఉద్యోగిగా పనిచేసేవాడు. ఆ పరిచయముతో అతనికి నా భగవద్గీతను గురించి చెప్పడము జరిగినది.
నేను బ్రాహ్మణుని కాదని కమ్మకులములో పుట్టినవాడినని ఆ పోలీస్ ఆఫీసర్కు ముందే తెలుసు. అతనిలో బ్రాహ్మణులే జ్ఞానము చెప్పాలి, ఇతరులు చెప్పకూడదను అసూయ ఉండుట వలన, ఆయన ఆ విధముగా నేను వ్రాసిన భగవద్గీతను చదువవద్దు అని చెప్పడము జరిగినది. నా సిద్ధాంతము త్రైతసిద్ధాంతము కావడము వలన త్రైత అను పదమును చూస్తూనే క్రైస్తవుల త్రిత్వముగావర్ణించి నాది క్రైస్తవబోధలని దుష్ప్రచారము చేయుటకు అనుకూలించింది. 2010వ సంవత్సరములో మా రచనలలో “దయ్యాలు-భూతాల యదార్థసంఘటనలు" అను గ్రంథము తయారై వచ్చినది.
---
నా రచనలలో ఆ గ్రంథము 25వది. ఆ గ్రంథములో అతని స్వంత ఊరుకు దగ్గరగానున్న గోరంట్లలో జరిగిన సంఘటనలున్న దాని వలన, ఆ గ్రంథమును ఆ పోలీస్ అధికారికి ఇమ్మని చెప్పి పంపడము జరిగినది. అప్పుడతను పోలీస్ డిపార్టుమెంటులో ఉన్నత పదవియైన డి.జి.పిగా ఉన్నాడు. అతనికి “దయ్యాలు భూతాల యదార్థ సంఘటనలు” గ్రంథమును ఇస్తే అతను "మీ స్వామి వ్రాసిన పుస్తకములను చదవను. ఆయనకు సంస్కృతము రాదు. సంస్కృతము నేర్వనివారంత పుస్తకములు వ్రాయకూడదు. హిందూమతములో హద్దుపద్దు లేకుండా పోయినది. ఇష్టమొచ్చిన వారంతా స్వాములైపోయి, వారి ఇష్టమొచ్చినట్లు పుస్తకములను వ్రాస్తున్నారు. అదే ఇస్లామ్ మతములో అయితే ఫత్వా విడుదల చేసి బోధలు చెప్పకుండా చేస్తారు.” అని చెప్పడము జరిగినది. నేను బ్రాహ్మణుని కాదనీ, నేను జ్ఞానము తెలిసిన వ్యక్తిగా చలామణి అగుట ఇష్టములేదనీ, అందువల ననే అలా మాట్లాడాడనీ తెలిసినది. ఒక పెద్ద అధికారిగా ఉన్న వ్యక్తి అలా మాట్లాడడము వారిలోని అసూయ పూర్తి బయటకు కనిపించినట్లయినది సద్ బ్రాహ్మణులుగానున్న వారు కొందరు ఏ అసూయ లేనివారుగా ఉండగా, ఎక్కువమంది దుష్ బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులైన ఇతర కులము వారు జ్ఞానము చెప్పకూడదనీ, స్వాములుగా చలామణికాకూడదనీ అసూయ కల్గియున్నారు. అందువలన అనేక చోట్ల వారివలన దైవజ్ఞానమునకు ఆటంకము ఏర్పడుచున్నది. కొందరు మా మీద అసూయకల్గిన దుష్ బ్రాహ్మణులు, విశ్వహిందూపరిషత్లంటి కొన్ని హిందూసంస్థలలో ఉండి హిందూమతము క్షీణించిపోవుచున్నదనీ, దానికి కారణము మాలాంటివారని ప్రచారము చేసి, మతమును అడ్డముపెట్టి ఏమీ తెలియని ఇతరకులముల వారిని మామీదికి ప్రేరేపించి, దాడులకు పంపుచున్నారు. కొద్దిపాటి జ్ఞానము కూడా లేనివారు హిందుధర్మములను సిద్ధీకరించి బోధించు ఒక సిద్ధాంతకర్తనే అవమానిస్తే, హిందూమతము ఎలా బాగుపడగలదు? హిందూమతమున కంతటికీ జీవించియున్న సిద్ధాంతకర్తను నేను ఒక్కడినే. హిందువుల ధర్మములను గురించి, అధర్మముల గురించి చెప్పవలసిన కర్తవ్యము మాకు ఉండగా, ఆత్మజ్ఞానము ఏమాత్రము తెలియనివారు మమ్ములను విమర్శించడము సరియైన పనియేనా అని అడుగుచున్నాము.
సంస్కృతము నేర్వని వారు స్వాములెట్లగుదురని అడిగిన వారికి మేము చెప్పడమేమనగా! ఒక మనిషిలోని భావమును తెల్పునది భాష. ఎటుచూచినా భావమునకు విలువ ఉన్నది, కానీ భాషకు ఏమాత్రము విలువ లేదు. భావమును వ్యక్తము చేయలేనిది భాషకాదు. భావములో మంచి చెడు భావములుండవచ్చును. అంతేగానీ భాషలో మంచి చెడు భాషలు ఉండవు. అన్ని శబ్దములను పలుకుటకు ఎక్కువ అక్షరములు కలిగినది తెలుగు భాషయే. అందువలన చాలామంది దేశభాషలలోకెల్ల తెలుగులెస్స అన్నారుగానీ సంస్కృతము లెస్స అని ఎవరూ అనలేదే? అటువంటపుడు సంస్కృత భాషను గురించి చెప్పవలసిన అవసరమేమి వచ్చినది? సంస్కృత భాషకూ దేవుని జ్ఞానమునకూ సంబంధమున్నట్లు ఎక్కడా కనిపించలేదు. సంస్కృతము లిపిలేని ఎరికలి, సుగాలి భాషలాంటిది. మనదేశములో కర్నాటక రాష్ట్రములోను మరికొన్ని చోట్ల సంస్కృతమును వాడుక భాషగా మాట్లాడువారున్నారు. కొందరు ఇళ్ళలో సంస్కృతమునే మాట్లాడుచున్నారు. ధారాళముగ సంస్కృతమును మాట్లాడువారు జ్ఞానమేమి తెలియనివారుగా ఉన్నారు కదా! కొందరు తమలోని అసూయ గుణముతో మనుషులలో మేము తప్ప ఎవరూ పూజ్యులుగా ఉండకూడదను భావముతో ఒక్క హిందువులలోనే మీరు వేరు, మేము వేరు అను భావమును చూపుట వలన, మిగతా వారిని అంటరానివారిగా మాట్లాడుట వలన, హిందువులలో వివక్షను చూడలేక చాలామంది హిందువులు, అంటరాని తనములేని
---
ఇతర మతములలోనికి పోయారు. బ్రాహ్మణులలో కొందరు అసూయవరులున్నంత వరకు హిందూమతము క్షీణించిపోవుటకు అవకాశము కలదు.
బ్రాహ్మణులలో బ్రహ్మజ్ఞానము కల్గినవారు, బ్రహ్మజ్ఞానము లేనివారు అని రెండు రకములవారున్నారు. బ్రహ్మజ్ఞానమున్నవారు బహుకొద్దిమంది ఉండగా, బ్రహ్మజ్ఞానము లేనివారు చాలామంది ఉన్నారు. బ్రహ్మజ్ఞానము మీద ఆసక్తి, భక్తియున్న కొద్దిమంది సద్బ్రాహ్మణులు మా బోధలను పవిత్రముగా వింటూ ఎంతో జ్ఞానమును సంపాదించుకొన్నవారు కూడా కలరు. అటువంటివారు వ్యాసునివలె మారిపోయి, వ్యాసుడు కృష్ణుని జ్ఞానము గొప్పదని గ్రహించినట్లు, వీరు కూడా వేదములను, యజ్ఞములను అధర్మములని తెలిసి, మేము చెప్పిన జ్ఞానమునే ఆశ్రయించి, మమ్ములను ఎంతో పూజ్యభావముతో చూస్తున్నారు. బ్రాహ్మణులలో కొందరు ఎంతో సభ్యతగా ఉండగా, చాలామంది మాకంటే ఇతరులు గొప్పవారు కాదు అను భావములో ఉన్నారు. అటువంటివారు ఘోరపాపమునకు గురికాగలరని చెప్పుచున్నాము. దేవుని విషయములో జ్ఞానులమీద అసూయ కల్గియున్న వారు ఇప్పటికే ఎన్నో విధముల చెడిపోయారు. వంద సంవత్సరముల వెనుకకు పోయి చూస్తే ఆనాడు బ్రాహ్మణులు అందరికంటే సుఖముగా బ్రతికెడివారు. భూములన్నీ వారి పేరుతో ఉండేవి. నేడు వారికున్న భూములు పోయాయి, అలాగే సుఖాలు పోయాయి. ఎన్నో కుటుంబములు పేదరికములోనికి పోయాయి. దీనికంతా కారణము దేవుని విషయములో, జ్ఞానుల విషయములో, ఇతరుల మీద అసూయ కల్గివుండుట వలన అలా అయింది అనుకొంటాము. దేవుని విషయములో కుట్రలు, కుతంత్రములు చేయువారు ఎవరైనా అధోగతిపాలుకాక తప్పదు.
విశ్వమంతయు దేవునిచే సృష్ఠింపబడినది. కావున విశ్వమంతటికి సృష్టికర్త దేవుడు ఒక్కడే. సృష్ట్యాదినుండి భూమిమీద హిందూ (ఇందూ) ధర్మమే ఉండేది. ఇందూధర్మమును సృష్ట్యాదిలోనే మనుషులకు దేవుడే తెలియజేశాడు. జగతి పుట్టి ఎంతో కాలమైనది. కాలక్రమములో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. చివరకు దేవుడు చెప్పిన ధర్మములను కూడా మనిషి మార్చుకొన్నాడు. ఆదిలో దైవజ్ఞానము అను అర్థము నిచ్చు ఇందూ శబ్ధమును, ఏ అర్థములేని హిందూశబ్ధముగా మార్చుకొన్నాడు. ధర్మములనూ, ధర్మములకున్న పేరునూ మార్చుకోవడమే కాకుండా మార్గము అను అర్థము నిచ్చు 'పథము' అను పదమును 'మతము' అను పదముగా మార్చుకొన్నాడు. దాని తర్వాత క్రొత్త మతములను కూడా సృష్ఠించుకొన్నాడు. ఈ విధముగా మనిషి ధర్మమును మార్చుకొనినా, ధర్మము పేరును మార్చినా, చివరకు పథమును మతములుగా మార్చుకొనినా, మనిషిని సృష్టించిన దేవుడు మారలేదు. అలాగే సృష్ఠింపబడిన మనిషీ మారలేదు. మనిషి ఏ మతములో ఉన్నా ఆకలి తప్పదు, దప్పిక తప్పదు. అట్లే చావు తప్పదు, పుట్టుక తప్పదు. ఒక మనిషికి ఆదిలో ఏవైతే ఉన్నాయో, అవియే ఇప్పుడూ ఉన్నపుడు, ఏ మార్పులేనప్పుడు మనిషి క్రొత్తక్రొత్త పేర్లను తన మతమునకు, తన ధర్మమునకు ఎందుకు పెట్టుకోవాలి? అని ప్రశ్నించుకొంటే మనిషి తన అజ్ఞానము చేత అలా చేసుకొన్నాడని తెలియుచున్నది.
మనిషి తన అజ్ఞానమును వదలి వెనుతిరిగి జ్ఞానము ప్రకారము చూచుకొంటే ఏ మతస్థునికైనా, ఏ కులస్థునికైనా, ఏ దేశస్థునికైనా దేవుడు ఒక్కడే, దేవుని ధర్మమును తెలుపు జ్ఞానమూ ఒక్కటేనని తెలియును. దేవుడు ఒక మనిషి మీద ఎంత అధికారము కల్గియున్నాడో, అంతే అధికారము ఏ మనిషి మీదయినా కల్గియున్నాడు. దేవుని దృష్ఠిలో మతములు,
---
కులములు లేవు. అందువలన అన్ని కులములవారికీ, అన్ని మతములవారికీ దేవుడు ఒక్కడే, అలాగే దేవున్ని తెలుసుకొను ధర్మమూ ఒక్కటే. అందువలన అన్ని మతముల మూల గ్రంథములలో ఒకే దేవుడు, ఒకే జ్ఞానము, ఒకే ధర్మము ఉన్నట్లు దేవుడు చేశాడు. దేవునికి తెలియకుండా ఏమీ జరుగదు. మనిషి అజ్ఞానము చేత వేరువేరు మతములను సృష్ఠించుకొనినా, అందులో కూడా దేవుడూ, దేవుని ధర్మము మారనట్లు వారికి గ్రంథములను తయారు చేసి ఇచ్చాడు. దేవుడూ ఒక్కడే, దేవుని జ్ఞానమూ ఒక్కటే, మనిషీ ఒక్కడే అయినప్పుడు, ఒక్క మతములోని జ్ఞానమునూ, ధర్మమునూ తెలుసుకో గలిగితే, అదియే అన్ని మతములలోనూ ఉన్నట్లు తెలియును. అట్లుకాకుండా జ్ఞాన దృష్ఠి లేకుండా మతగ్రంథమును చదివినా అది వేరు మతముగా, దానికి వేరు దేవుడున్నట్లుగా తెలియును. జ్ఞానదృష్ఠి లేనివాడు గ్రంథము లోనిది గ్రహించలేడు, దైవమును చేరలేడు. నిజమైన జ్ఞానదృష్టి కలిగిన వాడు ఏ మతములో పుట్టివుండినా, ఆ మతములోని గ్రంథమును చూచినపుడు దేవుని ధర్మము తెలియుట వలన, అన్ని మతములలోనున్న జ్ఞానము సులభముగా తెలిసిపోవును.
ఏర్పడి*
ఇందూ ధర్మములో త్రైతసిద్ధాంతమును ప్రతిపాదించి త్రైత సిద్ధాంత ఆదికర్త అని పేరుపొందిన నేను భగవద్గీతను చదివాను. తర్వాత ఖురాన్ గ్రంథమును చదివాను. ఆ తర్వాత బైబిలు గ్రంథమును కూడా చదివాను. భగవద్గీతలో చావు పుట్టుకలున్నాయి అని చెప్పడము జరిగినది. అయితే ముస్లీమ్లు, ఇస్లామ్ ధర్మములో చావుంది, కానీ పుట్టుకలేదు అంటున్నారు. ఖురాన్ గ్రంథములో, భగవద్గీతలో ఉన్న ధర్మముల జ్ఞానమే వ్రాసి, అక్కడ కూడా చావు పుట్టుకలున్నాయని చెప్పడము జరిగినది. అదే విషయమును బైబిలు గ్రంథములో కూడా చెప్పడమైనది. మూడు గ్రంథములలో ఒకే జ్ఞానమున్నపుడు, ఒక మతములోనున్న పునర్జన్మలు ఇంకొక మతములో ఎందుకు లేవు అంటున్నారని చూస్తే, వారికి జ్ఞానదృష్ఠి లేనిదానివలన అవగాహనలోపము అలా చెప్పుచున్నారనీ, ఉన్న విషయమును అర్థము చేసుకోలేక అలా చెప్పుచున్నారని అర్థమైనది. ఉదాహరణకు ఒక విద్యార్థి పాలు అని ఇంగ్లీషు భాషలో నేర్చుకొనుటకు ఆ పదము యొక్క అక్షరములను నిదానముగా యం, ఐ, యల్, కే అని చెప్పుచుండెను. తర్వాత కొంతసేపటికి అదే అక్షరములనే వేగముగా పలకను మొదలు పెట్టెను. వేగముగా చెప్పడము వలన ప్రక్క ఇంటిలోని వానికి ఆ మాట వినిపించుచుండెను. పలికేవాడు యం ఐ యల్ కే అను ఉద్దేశముతో పలుకుచుండినా ప్రక్క ఇంటిలో వినేవానికి యమ్మా యల్కే అని వినుపించు చుండెను. చదివేవాడు పాలను గురించి ఆంగ్ల పదము నేర్చుకొనుచున్నాను అను ఉద్దేశ్యముతో ఉండగా, వినేవానికి అమ్మకు ఎలుకను గురించి కొడుకు చెప్పుచున్నట్లు అర్థమైనది. ఇక్కడ చదివేవాని ఉద్దేశము ఒక్కటైతే వినేవాని ఉద్దేశ్యము వేరైపోయినది కదా! అలాగే ఒకే జ్ఞానము వేరువేరు గ్రంథములలో ఉండినప్పటికీ, అవగాహనలో ఒక్కొక్కరిది ఒక్కొక్క దారిగా మారిపోయి, ఒకే జ్ఞానమునే వేరువేరు భావములుగా చెప్పుకొనుచున్నారు. నేను మూడు మూల గ్రంథములను చదివాను. బైబిలు, ఖురాన్లో కూడా భగవద్గీత యందున్న భావములే ఉన్నవి. ఆ గ్రంథములు నాకర్థమైనట్లు ఆయా మతములలో జ్ఞానులమనుకొనువారికి కూడా అర్థము కాలేదు. అన్ని ధర్మములు ఒకటే అయిన దానివలన అవి నాకు సులభమైనవి. అందులో నేను ప్రశ్నను అడిగితే వారి గ్రంథములే వారికి సరిగా అర్థము కాకపోవడము వలన ఆయా మతములవారు సరియైన సమాధానము చెప్పలేక తికమక పడుచున్నారు. అందరిదీ ఒకే జ్ఞానమని తెలియకపోవడము వలన, వారు కొన్నిచోట్ల వేరు భావములున్నట్లు ప్రచారము చేసుకొన్నారు.
---
భూమిమీద మనుషులు కులాలుగా మతాలుగా చీలిపోయి, కుల భేదములు, మతభేదములు కలిగి, మతమునకు దేవుడువేరు, కులమునకు పూజవేరు అనుకొని, వేరువేరు దేవుళ్ళను అశ్రయించి, వేరువేరు పూజలు చేసినా ఏమీ ప్రయోజనముండదు. ఏ మతమువారైనా దేవుడు చెప్పిన ధర్మముల ప్రకారము నడుచుకొన్నప్పుడే వారికి ముక్తి లభించును. దేవుడు ఎవరో తెలుసుకొనుటకు అవసరమైన ధర్మములను దేవుడే అనేక మార్లు చెప్పినట్లు తెలిసినా, నాకు మాత్రము ద్వాపరయుగములో దేవుడు భగవంతు డైన కృష్ణునిగా వచ్చి తన ధర్మములను తెలియజేసినట్లు సాక్ష్యాధారములతో సహా తెలిసినది. అప్పుడు చెప్పిన దానినే భగవద్గీత రూపములో వ్యాసుడు వ్రాసి మనకిచ్చాడు. భగవద్గీత ఏడువందల శ్లోకముల రూపములో వున్నా, అందులో ఎన్నో జ్ఞాన వివరములుండినా, ధర్మముల విషయానికి వస్తే మూడు ధర్మములను, నాలుగు అధర్మములను తెలిపినట్లు కనబడుచున్నది. ఇంతవరకు భగవద్గీతను చదివిన ఎందరో పండితులు కూడా చెప్పని మూడు, నాలుగు అను మాటను మీరు ఎలా చెప్పుచున్నారని కొందరు ప్రశ్నించ వచ్చును. దానికి జవాబు ఏమనగా!
నీటిలోని మొసలికి నాలుక ఉండదు. అది తన ఆహారమైన మాంసమును ఎంత తినినా ఆ మాంసము యొక్క రుచి దానికి తెలియదు. మొసలి ఎంతతినినా దాని కడుపు నిండవలసిందేగానీ, తినిన ఆహారము యొక్క రుచి కొంతమాత్రము కూడా దానికి తెలియదు. అదే విధముగా కొందరు నాలుకలేని మొసలిలాంటివారు ఎంత చదివినా వారికి చదివినామని తృప్తి తప్ప చదివిన చదువులోని సారము తెలియదు. అదే విధముగా భగవద్గీతలోని రుచి హిందువులకు, ఖురాన్లోని రుచి ముస్లీమ్లకు, బైబిలు లోని రుచి క్రైస్తవులకు తెలియలేదు. అందువలన వాటిలోని ధర్మములు, అధర్మములు వారికి తెలియకుండా పోయినవి. మనుషులలో నాలుకలేని మొసలివలె కాకుండా, కొందరు నాలుకగల కప్పవలె కూడా ఉంటారు. కప్ప అడుగు దూరములోనున్న పురుగునుగానీ, ఈగనుగానీ తన నాలుకతో అమితమైన వేగముగా నోటిలోనికి లాగుకోగలదు. కప్ప నోటినుండి నాలుక బయటికి వచ్చి అడుగుదూరము సాగి పురుగును తాకును. అప్పుడు కప్పు నాలుకకున్న జిగురుకు పురుగు అంటుకొనును. అపుడు నాలుకను కప్ప ముడుచుకొనుట వలన పురుగు కప్పనోటిలోనికి నాలుకకు అంటుకొని వచ్చిపడును. ఈ పని అంతయు ఎవరికీ కనిపించనంత వేగముగా జరిగి పోవును. అయితే కప్ప నాలుక ఆహారమును లాగుకొనుటకేగానీ రుచి చూచుటకు ఉ పయోగపడదు. మొసలి ఎలా అయితే ఆహారమును నమిలి మ్రింగకుండ అమాంతముగా ఎలా మ్రింగివేయగలుగుచున్నదో, అలాగే కప్ప కూడ దొరికిన దానిని దొరికినట్లు మ్రింగివేయును. మొసలికి ఎట్లు రుచి తెలియదో, కప్పకు కూడా అట్లే రుచి తెలియదు. అయితే ఆహారము దగ్గరకు పోయేంతవరకు మొసలి ఆహారమును పట్టుకోలేదు. కప్ప అట్లు కాకుండా ఆహారము తనకంటే పదిరెట్లు ఎక్కువ దూరముగా ఉండినా దానిని వేగముగా పట్టుకోగలదు. అదే విధముగా కప్పవలె చురుకైన మనస్సుగల వారు జ్ఞాపకశక్తి ఎక్కువ కలిగి, ఒక్కమారు చదివిన ఏ విషయమునైనా జ్ఞాపకము పెట్టుకొని చెప్పగలరు. అయినా చురుకైన నాలుకగల కప్ప ఎట్లు రుచి చూడలేదో అట్లే చురుకైన మనస్సుగలవారు ఏ పుస్తకములో జ్ఞానమునైనా చెప్పగలిగినప్పటికీ, జ్ఞానములోని సూక్ష్మమైన ధర్మములు వారికి తెలియవు.
వంటలు వండువానికి అన్ని రకముల వంటల రుచి విషయము తెలిసివుండును. వంటమాస్టరును ఒక వంట విషయము గురించి అడిగితే దానిని తినకున్నా అది ఇట్లేవుండునని దాని రుచిని చెప్పగలడు. వంటల మాస్టరు పప్పు, సాంబారు, తాలింపుల రుచి ప్రస్తుతము తినకున్నా అతను చెప్పగలిగినట్లు, కొందరు మూడు మతముల గ్రంథములలో
---
ఏ ధర్మములు ఉన్నవో సులభముగా చెప్పగలరు. ఒక్కమారు వండినంతమాత్రమున వండిన వానికి దానిరుచి తెలిసిపోయినట్లు, ఒక్కమారు చదివినంత మాత్రమున అందులోని ధర్మములేవో కొందరికి తెలిసిపోవును. విధముగా మనుషులలో మొసలి, కప్ప, వంటమాస్టరులాగ మూడు రకముల గ్రాహితశక్తిగలవారు కలరు. మొసలికి, కప్పకు తినే ఆహారము రుచి తెలియకున్నా, వంట చేయువానికి పూర్తి రుచి తెలిసినట్లు, మూల గ్రంథములలోని ధర్మములను గ్రహించని వారు, గ్రహించువారుకలరని చెప్పవచ్చును.
భూమిమీద ఎందరో జ్ఞానులమనుకొనువారు గలరు. కొందరు అమితమైన జ్ఞాపకశక్తిగలిగి, అన్ని గ్రంథములలోని విషయములను పేజీ నంబర్లతో సహా చెప్పువారూ కలరు. కొందరైతే ఆచరణ ముఖ్యమని దినమునకు కొన్నిమార్లు ఆరాధనలు చేయువారూ గలరు. దేవుని మీద పూర్తి విశ్వాసమును కల్గినవారు కొందరున్నారు. కొందరు దేవున్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఆయనను తప్ప ఇతరులనెవ్వరినీ ఆరాధించని వారూ గలరు. ఇట్లు అనేక విధముల దేవున్ని గురించి ప్రాకులాడువారున్నప్పటికీ, దేవుడు ఎట్లుంటాడో, ఎక్కడుంటాడో, ఏమి చేస్తుంటాడో ఎవరికీ తెలియదు. ఒకేమాటగా చెప్పాలంటే ఇంతవరకు బ్రతికియున్న ఎంతటి వారికిగానీ దేవుడు తెలియబడలేదు. దేవుడు తెలియబడితే వాడు జన్మలలో ఉండక, శరీరములో చిక్కుకోక దేవునియందైక్యమైపోతాడు. అందువలన సజీవముగా నున్నవాడు ఎవడుగానీ దేవున్ని చూచినవాడు లేడని చెప్పవచ్చును. మనిషి బ్రతికివున్నప్పుడు దేవుని ధర్మములను తెలియవచ్చునుగానీ, దేవున్ని తెలియ లేడు. మొదట దైవముయొక్క ధర్మములను తెలియగల్గితే, వాటి ఆధారముతో దేవున్ని తెలియవచ్చును. దేవుని ధర్మములు తెలియుటకు మనుషులు చెప్పిన జ్ఞానమును ఆశ్రయించక, దేవుడు చెప్పిన జ్ఞానమునే మనిషి ఆశ్రయించాలి. దేవుడు ఎప్పుడైనా మనిషి రూపములోనే తన జ్ఞానమును చెప్పును. అటువంటపుడు ఏది మనిషి చెప్పిన జ్ఞానము? ఏది దేవుడు చెప్పిన జ్ఞానము? అను ప్రశ్న రాగలదు. ఇది ఒక విధముగా కష్టమైన ప్రశ్నగా ఉండినప్పటికీ దీని జవాబు చాలా సులభమైనదే, అదెలా అనగా!
మనిషి ఎక్కడ చెప్పినా అధర్మములనే చెప్పును. దేవుడు భగవంతుని రూపములో ఎక్కడ చెప్పినా ధర్మములనే చెప్పును. లోకులకు అనుకూలము లేనివి ధర్మములు, లోకులకు అనుకూలమైనవి అధర్మములు. ఈ సూత్రమును బట్టి సాధారణ మనిషి ఎవరైనదీ, అసాధారణ భగవంతుడు ఎవరైనదీ, సులభముగా తెలియవచ్చును. ఇదే సూత్రము ప్రకారము భగవద్గీతను చెప్పినది సామాన్య మనిషికాదనీ, స్వయముగా భగవంతుడే చెప్పాడనీ తెలియుచున్నది. భగవద్గీతలో ఇవి ధర్మములనీ, ఇవి అధర్మములనీ స్పష్టముగా తెలియబడినవి. కర్మయోగము, బ్రహ్మయోగము, భక్తియోగము అను మూడు ధర్మములు గీతలో తెలియజేయడము జరిగినది. అంతేకాక యజ్ఞములు, వేదములు, దానములు, తపస్సులు అనునవి నాలుగు అధర్మము లని చెప్పబడినవి. అధర్మములైన యజ్ఞముల వలన, వేదముల వలన, దానముల వలన, తపస్సుల వలన దేవున్ని తెలియుటకు శక్యముకాదని చెప్పడము జరిగినది. దేవున్ని తెలియుటకు కర్మ దహించబడాలి. కర్మ దహించబడుటకు ధర్మములైన కర్మయోగము, బ్రహ్మయోగము, భక్తియోగము వలననే సాధ్యమగును. ఈ విషయము విన్న తర్వాత కొందరు ఆశ్చర్యమును వ్యక్తము చేస్తూ “దేవుని ధర్మములంటే ఎన్ని ఉన్నాయో అని అనుకొనియుంటిమి. ఇప్పుడు కేవలము మూడే ధర్మములని వినడము మాకు కొంత ఆశ్చర్యమును కల్గించుచున్నది. తర్వాత జ్ఞానులము అను వారందరూ ఆచరించు యజ్ఞములను, వేదములను, దానములను, తపస్సులను అధర్మ ములనడము కొంత
---
బాధాకరముగా ఉన్నది.” అని అన్నారు. దానికి మేము చెప్పునదేమనగా! మేము కొందరి మీద కక్షతోనో, ద్వేషముతోనో చెప్పు విషయము కాదు కదా! ఇవి భగవద్గీతలో స్వయముగా కృష్ణభగవానుడు చెప్పిన మాటలని గుర్తుంచుకోవలెను.
మనుషులను దేవుని విషయమై బాహ్యప్రపంచములో మూడు రకములుగా విభజించవచ్చును. ఒకటి నాస్తికులు, రెండు ఆస్తికులు, మూడు హేతువాదులు. నాస్తికులు అంటే దేవుడు లేడనువారు, నాస్తికులు ఇటు ధర్మవరులూకాదు, అటు అధర్మవరులూ కాదు. ధర్మ అధర్మములకు సంబంధము లేనివారు నాస్తికులు. అటువంటి వారు బాహ్యసమాజములో బహుకొద్ది మంది మాత్రమే ఉంటారు. ప్రపంచములో ఆస్తికులు అనువారు 90 శాతము ఉన్నారు. మా అంచనా ప్రకారము నాస్తికులు కేవలము రెండు శాతము ఉండగా, హేతువాదులు 8 శాతము వరకు ఉండవచ్చును. నాస్తికులు, హేతువాదులు కలిసి 10 శాతము పోగా మిగిలిన 90 శాతము ఏదో ఒక విధముగా దేవునిమీద నమ్మకము కలవారున్నారని చెప్పవచ్చును. దేవుడు లేడనువారు నాస్తికులుకాగా, దేవుడున్నాడను వారు ఆస్తికులుకాగా, దేవుడు ఎలా ఉన్నాడని ప్రశ్నించువారు హేతువాదులు. హేతువాదులు దేవుడున్నాడను వారినీ సమర్థించరు. లేడను వారినీ సమర్థించరు. దేవుడున్నాడను ఆస్తికులను చూచి దేవుడెలా ఉన్నాడని ప్రశ్నింతురు. అట్లే లేడను వారిని (నాస్తికులను) చూచి ఎలా లేడు అని ప్రశ్నించుచుందురు. ఏ విషయమునైనా హేతుబద్దముగా తెలుసుకోవాలనుకొనువారు హేతు వాదులు. హేతువు అనగా కారణము అని అర్థము. దేవుడున్నాడను వారిని చూచి దేవుడు ఏ కారణము వలన ఉన్నాడని అడుగుట వారి కర్తవ్యము. వారి ప్రశ్నకు జవాబు దొరికితే వారు దేనినైనా ఒప్పుకోగలరు. హేతువాదు లకు శాస్త్రబద్దత ముఖ్యమని తెలియుచున్నది. దేవుడు శాస్త్రబద్ధమైన జ్ఞానమును చెప్పాడు కావున, దేవుని జ్ఞానము హేతువాదులు సంపూర్ణముగా తొందరగా అర్థము చేసుకోగలరు.
నాస్తికులు, హేతువాదులు కాకుండా ఉన్న మిగతావారందరు ఆస్తికులే. ఇది ఒక్క హిందూమతమునకు మాత్రమేకాదు. అన్ని మతములకు వర్తించు విధానమని తెలియవలెను. మనుషులలో దాదాపు 90 శాతముగా నున్న ఆస్తికులు అందరూ ఒక్క రకముగా లేరు. దేవుడు చెప్పిన ధర్మవరులు, అధర్మవరులు అందరూ ఆస్తికులలోనే ఉందురు. ఆస్తికులలో నేడు ధర్మవరులు మచ్చుకైన కనిపించడము లేదు. ఎక్కడైనా అరుదుగా ఉన్నారేమో చెప్పలేము. అధర్మవరులు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఆస్తికులలో ధర్మ అధర్మవరులుకాక అజ్ఞానులు ముఖ్యముగా ముందు చెప్పబడేవారు మతవాదులు. మతవాదులు ఒక్క మతమునకు పరిమితి కాలేరు. ప్రపంచములో ఎన్ని మతములున్నవో అన్ని మతములవారు, తమ మతమే దేవునికి దగ్గరగాయున్న మతమనీ, తాము చెప్పుకొను దేవుడే అందరికంటే పెద్దవాడనీ అనుకొనుచుందురు. అటువంటపుడు ఇతర మతములను అగౌరవముగా చూడడమూ, ద్వేషముతో చూడడమూ జరుగు చున్నది. తమ మతమును తాము పెద్దగా చూచుకొన్నపుడు, ప్రక్క మతము లను చిన్నగా చూడడము సహజముగా జరుగుచుండును. తమ మతము తప్ప మిగతా మతములన్నీ తప్పుద్రోవలోనున్నవని అనుకొను ఒక మతస్థులు మిగతా మతములను గురించి తప్పుగా చెప్పడమూ, తమ మతమును గురించి మంచిగా చెప్పుకోవడమూ జరుగుచున్నది. ప్రతి మతస్థుడు ఈ విధముగా ప్రవర్తించుచూ, తన మతమును అభివృద్ధి చేసుకొనుటకు విచక్షణ కోల్పోయి పరమతములను నిందించును. అటువంటపుడు మతద్వేషములు, మత ఘర్షణలు ఏర్పడును. మతద్వేషమూ, మతఘర్షణా ఒక్కమారు జరిగితే అడవిలో అగ్నిపడినట్లగును. అడవిలో అగ్గిపడితే ఆర్పేదానికి ఎంత కష్టమో, మతఘర్షణలు ఒక్కమారు ప్రారంభమైతే అవి అణిగిపోవుటకు చాలా కాలము పట్టును. అంతలో ఎందరో మనుషుల ప్రాణములు గాలిలో
--
కలిసిపోవును. అడవిలో చిచ్చు ఒకచోట పుట్టితే అది అడవంతా వ్యాపించి ఎంతో విలువైన గంధపు చెట్లను, టేకు చెట్లను, రబ్బరు చెట్లను కాల్చివేసినట్లు ఒకమారు మతఘర్షణ మొదలైతే వివేకమును కోల్పోయిన మనుషులు, ఎంతో విలువైన వ్యక్తులను కూడా చంపుదురు.
మతఘర్షణ మహత్యమును ఇంతయని చెప్పుటకు ఎవరికీ చేత కాదు. అది చివరకు దేశముల మధ్యలో యుద్ధమును కూడా తెచ్చి పెట్టును. ఏ సంబంధములేని, ఏమీ తెలియని చిన్నపిల్లలను, వృద్ధులను సహితము మతద్వేషముతో హింసించి చంపు మూర్ఖులుగా మనుషులు మారిపోవుదురు. ఏమాత్రము దైవజ్ఞానములేని మూఢులతో మొదలైన మతద్వేషములు చాలా ప్రమాదకరమైనవి. మతమును రక్షించుటకని, స్వమత రక్షణ పేరుతో తయారైన కొన్ని మతసంఘములు, దైవజ్ఞానమును బోధించి మతమును రక్షించుకోవాలని అనుకోకుండా, పరమతమును హింసతో అణచివేస్తే తమ మతము క్షీణించదను దురభిప్రాయములో ఉండుట వలన అన్ని మతముల వారు, వారివారి మతములను రక్షించుకొనుటకు అను సాకుతో, కొన్ని పేర్లతో కొన్ని సంఘములను తయారు చేసుకొని హింసకు దారులు ఏర్పరచు కొన్నారు. ఇటువంటి పరిస్థితిలో ధర్మ అధర్మవరులుకాక ఏమాత్రము జ్ఞానము లేనివారు హిందూధర్మ రక్షణ సంఘములో ఉండి హిందూ (ఇందూ) ధర్మ ప్రదాతను, హిందూ ధర్మ సిద్ధాంతకర్తనైన నన్ను కూడా గుర్తించలేని గ్రుడ్డివారై పోయి, మతము అను బూచిని అడ్డము పెట్టుకొని నాది పరాయి మతము, అనువారు ఉన్నారంటే నేడు హిందూమతస్థులు తమ మతమునే తాము గుర్తించలేని గ్రుడ్డివారై పోయారని తెలుస్తున్నది. ఇట్లు ధర్మము, అధర్మము కాకుండ అజ్ఞాన ఆచరణలో మొదటి స్థానములో ఉన్నది మతము అనునది. మతము అనునది అన్ని దేశములలోని ప్రజలకు ఉన్నందువలన, మత పిచ్చి అందరికీ ఉండుట వలన అన్ని మతములవారు మతరక్షణ, మతాభివృద్ధి అను అజ్ఞానములో కూరుకుపోయి ఉన్నారు.
భగవంతుడు తన భగవద్గీతలో నాలుగు అధర్మములను తెలిపాడు కదా! అందులో మీరు చెప్పిన మతద్వేషము అనునది అధర్మముగా చెప్పలేదే అని కొందరడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! దేవుడు చెప్పినవి నాలుగు అధర్మములే. అందులో మతద్వేషము అనునది లేదు. అయితే దేవుడు చెప్పిన అధర్మములు నాలుగు పెద్ద నదులలాంటివి అనుకొనుము. ఒక పెద్దనదికి ఎన్నో ఉపనదులు ఉన్నట్లు, ఒక పెద్ద అధర్మము వెనుక దానికి సంబంధించిన అజ్ఞాన ఆచరణలు ఎన్నో ఉండును. అలాగే పథము (దైవ మార్గము) అనునది మతముగా మారిపోయినది. పథము లేక మార్గము అనునది జ్ఞానముకాగా, మతము అనునది అజ్ఞానమైనది. పథము అనునది మోక్షము అను గమ్యమువైపు తీసుకొనిపోవునది. కావున దానిని జ్ఞానము అని అంటున్నాము. మతము అనునది పాపమును అంటగట్టి జన్మలకు తీసుకొనిపోవును. అందువలన దానిని అజ్ఞానము అంటున్నాము. వాస్తవానికి నాలుగు అధర్మములలో మతము అనునది లేకున్నా దానివలన దేవుడు తెలియబడడు. కావున మతమును అజ్ఞానమని చెప్పవలసివచ్చినది. నాలుగు అధర్మములు బయటికి దేవుని ద్వారా మనకు తెలియబడినా, వాటి వెనుక వాటికి అనుబంధముగా ఎన్నో అజ్ఞాన ఆచరణలు ఉన్నాయని చెప్పవచ్చును.
ఒక అధర్మము వెనుక దానికి అనుబంధముగా ఎన్నో అజ్ఞాన అచరణలు ఉన్నట్లు, ఒక ధర్మము వెనుక కూడా దానికి అనుబంధముగా ఎన్నో చిన్నచిన్న జ్ఞానాచరణలు ఉండును. భగవద్గీతలో మూడు ధర్మములనే చెప్పినప్పటికీ వాటిని ఆచరించుటకు ఎన్నో ఆచరణలను అనేక శ్లోకముల రూపములో చెప్పియున్నారు. ద్రవ్యయజ్ఞమును గురించి,
---
జ్ఞానయజ్ఞమును గురించి జ్ఞానయోగము అను అధ్యాయములో 33వ శ్లోకమున చెప్పి యున్నారు. యజ్ఞములు అధర్మములని గీతలోయున్నా ఇక్కడ 33వ శ్లోకమున చెప్పిన యజ్ఞములు ధర్మమునకు అనుబంధమైనవి. ఇప్పుడు కొందరికి ఒక ప్రశ్నరాగలదు. యజ్ఞములు అధర్మములని ఇంతవరకు చెప్పి ఇక్కడ జ్ఞానయోగము 33వ శ్లోకములో చెప్పిన యజ్ఞము ధర్మ సంబంధమైనదని ఎందుకు చెప్పుచున్నారని అడుగవచ్చును. దానికి మా జవాబు ఇలాగున్నది. అధర్మములని చెప్పినది మనుషులు చేయు బాహ్య యజ్ఞములు. కానీ ఇక్కడ 33వ శ్లోకమున చెప్పిన యజ్ఞము బాహ్యముగా చేయునది కాదు. అంతరంగములో ఆచరించవలసినది. ఈ యజ్ఞములో మనిషికున్న కర్మలు కాలిపోవుచున్నవి. అందువలన జ్ఞానయజ్ఞము అనునది ధర్మమునకు సంబంధించినదని చెప్పవచ్చును. ఒక నదికి ఎన్నో ఉపనదులున్నట్లు, ఒక ఉపనదికి ఎన్నో పిల్లకాలువలున్నట్లు, ఒక ధర్మమునకు సంబంధించినవి ఎన్నో కార్యములుండును. ఆ కార్యములన్నిటిని జ్ఞాన కార్యాచరణలే అనవచ్చును. యజ్ఞములు బాహ్యముగా జరుగునవన్నీ అధర్మమునకు సంబంధించినవి కాగా, శరీరములోపల జరుగు యజ్ఞము ధర్మములలో మొదటి ధర్మమైన కర్మయోగమునకు సంబంధించినది.
ప్రజలు మేము జ్ఞానమువైపు ప్రయాణిస్తున్నామని కొందరూ, మేము భక్తిమార్గములో ఉన్నామని కొందరూ, మేము దేవాలయములను కట్టించి ఎవరూ చేయలేని పనిని చేస్తున్నామనుకొనువారు కొందరూ, మేము మతమునూ, మతధర్మములనూ కాపాడుచున్నాము, దేవునికి మాకంటే ముఖ్యమైనవారు ఎవరూ లేరనువారు కొందరూ, కొందరు సంగీతముతో దేవుని పాటలను కూర్చి పాడుచూ, మాకంటే మించి భజన చేయువారు ఎవరూ లేరనుకొనువారు కొందరూ ఉన్నారు. ఇట్లు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకముల కార్యములను చేయుచు మేము చేయునదే నిజమైన భక్తియనీ, అదే నిజమైన సాధనయనీ, అదే అసలైన ధర్మమని అనుకొనుచుందురు. ఇప్పుడు మేము వాటన్నిటిని చిక్కుదీసి, ఏవి నిజమైన ధర్మములో, ఏవి అధర్మములో వివరించి చెప్పవలసిన కర్తవ్యము ఒక సిద్ధాంత కర్తగా నాకున్నది. నేను చెప్పునవి చిన్నచిన్న అజ్ఞానములు మాత్రమే ఉండును. పెద్ద నదులలాంటి నాలుగు అధర్మములను భగవద్గీతలో దేవుడే చెప్పాడు. గీతలో భగవంతుడు చెప్పిన నాలుగు అధర్మములు ఏమాత్రము ఎవరికీ మ్రింగుడుపడవని చెప్పవచ్చును. ఎందుకనగా నాలుగు అధర్మము లను మనుషులందరూ మంచి కార్యములనీ, మంచి ధర్మములనీ తలచినవారై ఎంతో భక్తిగా చేయుచున్నారు. ఎంతో శ్రద్ధాభక్తులతో చేయు కార్యములను ఒక్కమారు చెడు కార్యములుగా, అధర్మపనులుగా వినడము వలన అందరికీ ఒక విధమైన కోపము వచ్చియుండును. చెప్పినవాడు మనిషి అయితే వానిని ఊరకనే వదలక చిత్రహింసలు పెట్టి చంపేవారు. అయితే చెప్పినవాడు భగవంతుడు, అదియు ఇప్పుడు ఆయన లేడు. అందువలన క్రక్కలేక మ్రింగలేక జనముండగా, ఇప్పుడు నాలాంటివారు తిరిగి జ్ఞప్తి చేయడము పుండుమీద కారము చల్లినట్లుండును. ఆ బాధకు నేను కనిపిస్తే దూషిస్తారు. దొరికితే ఊరక వదలరు. ఈ విషయము కృష్ణునికి కూడా తెలుసు. అందుకే ఎవరికీ తెలియకుండా అర్జునునికి ఒక్కనికే, ఎవరికీ వినిపించకుండ ప్రక్కకు పిలుచుకొని పోయి చెప్పడము జరిగినది. మూర్ఖులతో ఇబ్బందిగా ఉంటుందని తలచిన భగవంతుడు, అధర్మములను గూర్చికానీ, ధర్మములను గూర్చికానీ రెండవమారు ఎవరితోనూ చెప్పలేదు. ఎవరికీ వినిపించకుండా ఒక్కనికే చెప్పినా, ఒక్కమారే చెప్పినా అదియు తనకు అణుకువగా, వినయముగానున్న మనిషి అయిన అర్జునునికే చెప్పాడు. అయితే ఇప్పుడు మేము అందరికీ క్రొత్తవారికే చెప్పాలి. అంతేకాకుండా నా విలువ తెలియనివారికీ, నాపట్ల వినయ విధేయతలు లేనివారికీ చెప్పడము చాలా కష్టముతో కూడుకొన్న పనియని నాకు కూడా తెలుసు. అయినా ఇందూధర్మ సిద్ధాంతకర్తగా
---
నేను నిజము చెప్పకపోతే ఇక చెప్పేవారే లేరు. కావున గ్రంథరూపములో చెప్పడము జరిగినది. విశేషమేమంటే నాపట్ల భక్తి, వినయముకల్గిన వారికే నేను కనిపించాను. కానీ క్రొత్తవారికి ఎక్కడా కనిపించలేదు. నా గ్రంథములు చదివిన వారు ఎందరో కలరు. నాపేరు వినినవారు కూడా ఎందరో కలరు. అయినా ఎవరూ నన్ను చూడలేదు. చాలామంది మా భక్తులను “మీ స్వామి ఏ టి.వీ. ఛానల్లోను కనిపించలేదే" అని అడిగారు. ప్రబోధానంద యోగీశ్వరులు అందరికీ చెప్పుతాడు, కానీ ఎవరికీ కనిపించడు అని వారికి తెలియదు.
ప్రస్తుత కాలములో ప్రజలయందు ఆచరణ రూపములోనున్న కార్యములు ఏవి ధర్మములో, ఏవి ధర్మములుకావో తెలుసుకొందాము. నిత్యము మనుషులు చేయు పనులను కొన్ని దైవసంబంధమైనవనీ, కొన్ని ప్రపంచసంబంధమైనవనీ రెండు రకములుగా విభజించవచ్చును. దైవ సంబంధ కార్యములు జ్ఞానము, ధర్మములతో కూడుకొనియుండును. ప్రపంచ సంబంధ కార్యములు నీతి, న్యాయముతో కూడుకొనియుండును. దీనినిబట్టి జ్ఞానధర్మములతో కూడుకొన్నవి దేవుని పనులనీ, నీతి న్యాయములతో కూడుకొన్నవి మనుష్య సంబంధ పనులని తెలియుచున్నది. మనుష్య సంబంధ కార్యములలో నీతిని న్యాయమునుబట్టి మనిషికి పుణ్యము వచ్చు చున్నది. అలాగే అవినీతిని, అన్యాయమునుబట్టి మనిషికి కనిపించని ఫలితమైన పాపము వస్తున్నది. బీదవానికి ఆహారము లేనప్పుడు వానికి ఉచితముగా అన్నము పెట్టితే అది న్యాయమగును. అలా పెట్టడము వలన పెట్టిన మనిషికి పుణ్యమువచ్చును. పాపముగానీ, పుణ్యముగానీ మనిషిని మరు జన్మకు తీసుకొని పోయి ఫలితముగా కష్టసుఖములను అనుభవింప జేయును. పాపపుణ్యముల వలన జన్మలు వస్తాయి. పాపపుణ్యకర్మలు లేనప్పుడు మనిషికి ముక్తి లభిస్తుంది. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగుటకు అవకాశము కలదు. ఆకలికొన్న మనిషికి అన్నము పెట్టడము న్యాయమైనది, పుణ్యమొచ్చునది అన్నారు. అకలికొన్న మనిషికి అన్నము పెట్టడము నీతి కాదా, న్యాయమేనా అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నీతి న్యాయము, జ్ఞానము ధర్మము అనుమాటలు జంటపదములుగా ఉన్నవి. మాటల రూపముతో చెప్పుదానిని నీతి అంటాము. నీతి బోధ రూపములో ఉంటుంది. వినిన నీతి ప్రకారము చేయుపనిని న్యాయము అంటాము. ప్రపంచ విధానములో మంచిని బోధించునది నీతి, నీతి వలన జరుగు కార్యాచరణను న్యాయమని అంటాము. అలాగే దేవుని విషయములో బోధింపబడు మంచిమాటలను జ్ఞానము అంటాము. వినిన జ్ఞానము ప్రకారము చేయు కార్యములను ధర్మము అంటాము. అందువలన నీతి న్యాయమని, జ్ఞాన ధర్మములని జంట పదములుగా వాడినా తప్పేమీ లేదు.
కొన్ని దినముల క్రిందట ఒక టి.వీ. ఛానల్లో ఒక స్వామీజీ చెప్పు జ్ఞానమును వింటూవున్నపుడు ఆయన చెప్పు మాటలు జ్ఞానమేకాదని పించినది. ఎందుకనగా! "బీదలకు ఇచ్చు దానము సాక్షాత్తు దేవునికి ఇచ్చిన దానముతో సమానమగును. అలా దానము చేయడము వలన పుణ్యము వచ్చును. అటువంటి పుణ్యము వలన మనిషికి ముక్తి లభించును” అని ఆయన చెప్పడము జరిగినది. ఆ మాటలలో నీతివుందా, జ్ఞానము వుందా అని ఆలోచిస్తే దానము చేయడము ప్రపంచ సంబంధ కార్యమగును. అది దేవుని జ్ఞానమునకు సంబంధించినది కాదు. అది ప్రపంచ జ్ఞానమునకు సంబంధించినదగుట వలన దానిని నీతి అంటాము. నీతి కార్యమైన దానము వలన పుణ్యము రావడము నిజమే అయినా, పుణ్యము వలన ముక్తి రాదు. పుణ్యము వలన మోక్షము వచ్చుననుట అజ్ఞానమగును, అధర్మమగును. మనిషి ధర్మాచరణ వలన జ్ఞానశక్తి (జ్ఞానాగ్ని) లభించి, దానివలన ముక్తి రావడము ధర్మమగును. అట్లు కాకుండా నీతి
---
ఆచరణ వలన పుణ్యము లభించిన, దానివలన ముక్తి లభించుననుట అధర్మమగునని చెప్పవచ్చును. ఈ విధముగా మనుషులు భక్తిమార్గములో ఆచరించునవి ధర్మములగునో కాదో తేల్చి చెప్పవచ్చును.
కొందరు మానవసేవే మాధవసేవ అని మనుషులకు అనేక విధములుగా సేవలు చేయుచుందురు. సాటి మనుషులకు సేవ చేయడము వలన నిజముగా దేవునికే సేవ చేసినట్లగునని మానవసేవే మాధవసేవ అన్నారు. కొందరు ఆ విధముగా చెప్పడమేకాక మధర్ థెరిస్సా, ఫాదర్ పెర్రర్ మొదలగువారు మనుషులకు ఉచిత వైద్యశాలలు కట్టించి, విద్యార్థు లకు ఉచితబోధ కొరకు స్కూళ్ళు, కాలేజీలు కట్టించి, ఇల్లులేని పేదలకు ఇల్లు కట్టించి ఎంతో సేవలు చేశారు. మంచినీటి వసతిలేని గ్రామాలకు కొన్ని కోట్లు ఖర్చుచేసి మంచినీళ్ళు తెప్పించినవారూ కలరు. ఇట్లు అనేకమంది అనేక విధముల సేవలు చేసి తమ జీవితము ధన్యమైనదని తమ సేవ మాధవసేవ అయినదనీ, దానివలన జనన మరణ చక్రమునుండి తప్పించుకోవచ్చని అనుకొన్నారు. ఇటువంటివారిని గురించి ధర్మాధర్మముల ప్రకారము జ్ఞానాజ్ఞానముల ప్రకారము వివరించుకొని చూస్తే ఒక మనిషికి సేవ చేసినా లేక చాలామందికి సేవ చేసినా అది మనుషులకు చేసిన సేవే అగునుగానీ, మాధవునికి (దేవునికి) చేసిన సేవ కాదు. సేవ చేయువాని ఉద్దేశము ఎలా ఉండినా, మానవుని రూపములో మాధవున్నే ఊహించు కొనినా, అది అతని ఊహేగానీ సత్యము అనుటకు అవకాశములేదు. గాడిద కాళ్ళు పట్టుకొని నేను గుర్రముకాళ్ళు పట్టుకొన్నానని అనుకొన్నంత మాత్రమున, అది సత్యముకాదు. గాడిద గుర్రము కాదు. మానవసేవ ప్రపంచ సంబంధ మైనది. మాధవసేవ దైవసంబంధమైనది. దానికి దీనికి ఎంతో తేడా ఉండును. ప్రపంచ సంబంధ పనులు చేసి దేవుని పనులనుకోవడము పూర్తి తప్పు. ధర్మాధర్మముల ప్రకారము ప్రపంచ సంబంధమైన పనికావడము వలన, మానవసేవ అంతయు దాన గుణము చేత చేయుట వలన, వచ్చు ఫలితము పుణ్యమే అగును. వచ్చిన పుణ్యము వలన సుఖములను అనుభవించుటకు పుట్టవలసి యుండును. జనన మరణ చక్రమునుండి బయటపడవలెనని అనుకొని చేసిన సేవ జనన మరణచక్రములోనికి ఇంకా ఇరికించినది. కానీ ఆ చక్రమునుండి బయటపడునట్లు చేయలేదు. నా అనుభవములో పెద్ద పెద్ద స్వామీజీలు, విదేశీ డబ్బులు వచ్చు బాబాలు, ధనికులు, మాధవసేవ అని మానవసేవ చేసి, పుణ్యమును మూటగట్టుకొన్నారు. ఇటువంటి సేవలు దానము అను అధర్మమగును. అందువలన దానము వలన దేవుని చెంతకు చేరుటకు వీలులేదు.
కొందరు స్వామీజీలు, బాబాలు తమ బోధలలో ప్రేమే దేవుడు అని బోధిస్తుందురు. అందరినీ ప్రేమతో చూడడము మానవుడు చేయ వలసిన ముఖ్యమైన పనియని చెప్పుచుందురు. ఈ మాటలు వినేదానికి చాలామంచి జ్ఞానమువలె కనిపించుచుండును. అయితే ఆ మాటను లోతుగా యోచించి చూచితే ప్రేమ దైవము అను మాట ధర్మమో, అధర్మమో తెలిసి పోగలదు. మనిషి శరీరములో ఆరు చెడు గుణములు, ఆరు మంచి గుణములు గలవు. చెడు గుణముల వలన జరుగు కార్యములకు ఫలితముగా పాపమువచ్చుచుండును. అలాగే మంచి గుణముల వలన జరుగు కార్యము లకు ఫలితముగా పుణ్యమువచ్చుచుండును. ఈ విధముగా మంచి చెడు గుణముల వలన వచ్చు పాపపుణ్యములు మనిషి తలయందు చేరి తర్వాత జన్మలలో కష్టసుఖముల రూపములో అనుభవమునకు వచ్చును. మనిషి తలలోని గుణచక్రములో చెడు గుణములు ఆరు వరుసగా 1) కామ 2) క్రోధ 3) లోభ 4) మోహ 5) మధ 6) మత్సర అనునవి గలవు. అలాగే మంచి గుణములు వరుసగా 1) దాన 2) దయ 3) ఔదార్య 4) వైరాగ్య 5) వినయ 6) ప్రేమ అనునవి గలవు. మంచి గుణములలో ప్రేమ అను గుణముకలదు. చెడు గుణములలో
---
చివరిలోనున్న మత్సరము లేక అసూయ అను గుణమునకు వ్యతిరేఖముగా మంచి గుణములలో చివరిలో ప్రేమ అనునది కలదు. అసూయకు వ్యతిరేఖమైనది ప్రేమ గుణము. ఇతరులమీద అసూయ వలన చేయు పనులకు పాపము వస్తుంది. అలాగే ఇతరుల మీద ప్రేమ వలన చేయు మంచి పనులకు పుణ్యము వస్తుంది. ఇది ప్రేమ యొక్క వాస్తవ రూపముకాగా ప్రేమను దైవముగా చెప్పు కోవడము, ప్రేమే దేవుడు అని చెప్పడము అధర్మమగును. వాస్తవానికి ప్రేమ ఒక గుణము. మనిషికున్న ప్రేమ బయట ప్రపంచములో పుణ్యమును సంపాదించి ఇచ్చి మరలజన్మకు పోవునట్లు చేయును.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగుటకు అవకాశము కలదు. "క్రైస్తవ బోధకులైన ఫాదర్లు, ఫాస్టర్లు నీ పొరుగువానిని ప్రేమించమని ప్రభువు చెప్పాడని చెప్పుచుందురు. మీరు చెప్పినట్లు ప్రేమ అనునది గుణము అని వారికి తెలియదా! పైగా బైబిలులోనే పొరుగు వానిని ప్రేమించమని ఉండడము తప్పగునా?” అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఈ ప్రశ్న మీరు క్రైస్తవులనే అడిగివుంటే బాగుండేది. వారికి వారి బైబిలులో చెప్పిన విషయము ఇంతవరకు ఎవరికీ అర్థము కాలేదనియే చెప్పవచ్చును. దేవుని ధర్మములు అన్ని మతములకు ఒకటేగానీ, వేరువేరుగా ఉండవని ముందే చెప్పుకొన్నాము. క్రైస్తవులకు కూడా అందరివలె వారి తలలో గుణములే ఉన్నవి. ధర్మాధర్మములను అనుసరించి చూస్తే ప్రేమవలన పుణ్యము వారికి కూడా వచ్చును. బైబిలులో నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పినది వాస్తవమే. అయితే పొరుగువాడంటే వారికి అర్థముకాలేదు. ఇంటి ప్రక్కన కాపురముండు వారిని పొరుగువారనుకోవడము జరిగినది. బైబిలులో చెప్పినది నీ శరీరమునకు పొరుగు వానిని కాదు. నీకు పొరుగు వానిని గురించి చెప్పారు. నీవు శరీరములో ఉండువానివి, అందువలన శరీరములోపల చూచుకోవలెనుగానీ బయట చూడకూడదు. చూచుకొంటే జీవాత్మవైన నీ ప్రక్కనయున్న ఆత్మను ప్రేమించాలి అని తెలియును. అంతర్ముఖ జ్ఞానములేని క్రైస్తవులకు బైబిలులోని వాక్యము అర్థముకాలేదని చెప్పవచ్చును. శరీరము యొక్క బయటి విషయము ప్రపంచ విషయమగును. శరీరము లోపలి ఆత్మ విషయము దైవిక విషయమగును. అందువలన బయట ప్రేమ అధర్మమగును. లోపలి ప్రేమ ధర్మమగును అని తెలియవలెను. క్రైస్తవులకు, ముస్లీమ్లకు అంతర్ముఖ జ్ఞానము ఏమాత్రము తెలియదు. వారు వారి గ్రంథములలోన చెప్పిన జ్ఞానము నంతటిని బయటి స్థూల విషయములుగా లెక్కించుకొందురు. అందువలన వారికి వారి ప్రవక్తలు చెప్పిన సూక్ష్మ జ్ఞానము తెలియకుండ పోయినది.
శరీరములో తర్వాత పుట్టిన క్రైస్తవ, ఇస్లామ్మతములలోనే కాకుండా ముందు పుట్టిన హిందూమతములో కూడా సూక్ష్మజ్ఞానములు తెలియనివారు చాలామంది కలరు. అటువంటి వారికి భగవద్గీతలోనున్న కొన్ని ధర్మయుక్త మైన భావములు తెలియకుండా పోయాయి. అలా తెలియకుండా పోయినపుడు, గీతలో చెప్పిన ధర్మము బయటి మనిషిలో అధర్మముగా మారిపోవుటకు అవకాశము కలదు. భగవద్గీతలోని ధర్మసంబంధ భావములు ఎన్నో మనుషులకు అధర్మములుగా అర్థమైనవి. అలాగే అధర్మ విషయములు ధర్మములుగా అర్థమైనవి. గీతలో మానవశరీరములో నిర్మితమైన ఒక విషయమును భగవంతుడే చెప్పితే ఆ విషయములో లేని భావమును కల్పించుకొని అర్థము చేసుకొన్నారు. దానితో భగవంతుడు చెప్పిన ఉద్దేశము దూరమైపోయి, మనుషుల ఉద్దేశము తెలుపబడినది. పండితులైన వారు కొందరు భగవద్గీతను అర్థము చేసుకోలేక వారికి త్రోచినది వారు చెప్పడముతో, వారి తర్వాత ఆ పండితులు చెప్పినదే అందరూ చెప్పుకోవడము జరిగినది. ఈనాడు భగవద్గీతలోని జ్ఞానమును అజ్ఞానముగా అర్థము చేసుకొని వారి
---
దృష్ఠిలో దానినే గొప్ప జ్ఞానముగా చెప్పుకోవడము వలన గీతలోని ధర్మముల సారాంశము నేటికీ తెలియకుండా పోయినది. గీతలోని భగవంతుని మాటలు ఎలా వేరుగా అర్థమైనాయో ఉదాహరణకు ఒక శ్లోకమును చెప్పుకొందాము. గీతలో జ్ఞానయోగమను అధ్యాయమున 13వ శ్లోకము ఇలా కలదు.
చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగచః |
తస్యకర్తార మపి మాం విద్యకర్తార మవ్యయమ్ ॥
ము*
భావము: నాలుగు వర్ణములు నాచేత సృష్టించబడినాయి. మనిషి కర్మము లనుబట్టి, గుణములనుబట్టి నాలుగువర్ణములు సృష్టించాను. ఆ విధముగా నేను వాటికి కర్తనైనా, అవ్యయుడైన నేను వాటికి కర్తనని ఎవరికీ తెలియ కుండా ఉన్నాను.
భగవద్గీతలో ఇది ఒక ముఖ్యమైన శ్లోకమే. ఈ శ్లోకమును మూడు వందల మందికిపైగా సంస్కృత పండితులైనవారు తెలుగులోనికి, మిగతా భాషలలోనికి వివరించి వ్రాశారు. ఎవరు ఈ శ్లోకము యొక్క భావమును చెప్పినా, మనుషుల నాలుగు కులములను దేవుడు తయారు చేశాడనీ, అందులో ఒకటి బ్రాహ్మణులనీ, రెండు వైశ్యులనీ, మూడు క్షత్రియులనీ, నాలుగు శూద్రులని చెప్పడము జరిగినది. మనుషులలో నేటికినీ ఆ నాలుగు కులములుండుట వలన ఆ శ్లోకములో కులముల గురించి దేవుడు చెప్పాడనీ, దేవుడే కులములను తయారు చేసి పెట్టాడనీ ప్రజలందరూ అనుకోవడము జరిగినది. వాస్తవానికి ఆ శ్లోకములో కులముల ప్రసక్తే లేదు. లేని విషయమును ఆ శ్లోకమునకు కరిపించడము వలన అందులో దేవుడు చెప్పిన విషయము తెలియకుండా పోయినది. శ్లోకములో నాలుగు వర్ణములని చెప్పాడు తప్ప, నాలుగు కులములనీ వాటి పేర్లు ఇవి అనీ ఎక్కడా లేదు. అయినా శ్లోకములో లేని విషయములు వ్రాయడము వలన, పండితులు తెలిసి చెప్పివుంటారను నమ్మకముతో అందరూ పండితుల మాటనే నమ్మడమైనది. మధ్యలో చెప్పిన పండితుల మాట అధర్మమని ఎవరికీ తెలియకుండా పోయినది. దానితో దేవుడు చెప్పిన ఆ శ్లోకములోని ఉద్దేశము నేటికినీ తెలియకుండా పోయినది.
పై శ్లోకములోని భావమును రెండు భాగములుగా విభజించి మనము చూచుకోవచ్చును. ఆ భాగములలో చివరి రెండవ భాగమున “నాశనములేని నేను వాటి కర్తనయినట్లు ఎవరికీ తెలియకుండా ఉన్నాను.” అని ఉన్నది. మొదటి భాగములో "గుణములను, కర్మలను విభజించి వాటి ప్రకారము నేను నాలుగు వర్ణములుగా ప్రజలను సృష్టించాను.” అని చెప్పాడు. అయితే సృష్టికర్త అయిన దేవుడు మనిషిలోని గుణములను, కర్మను ఎలా విభజించాడో, ఆ విభజననుబట్టి నాలుగు వర్ణములుగా మనుషులను ఎలా చెప్పాడో ఎవరికీ తెలియదు. ఆ శ్లోకమునకు భావమును వ్రాసిన పండితులకు వర్ణములంటే కులములని ఎందుకు అర్థమైనదో వేరెవరూ ఆలోచించలేదు. వర్ణము అంటే కులము అని చెప్పడము తప్పా, ఒప్పా అని వేరెవరూ యోచించకుండా పోయిన దానివలన, దేవుడు కులములను గురించి చెప్పాడని మిగతావారు కూడా అనుకోవడము జరిగినది. వాస్తవానికి బయటి కులముల ప్రసక్తే శ్లోకమునందు లేదు. శ్లోకమును రెండు భాగములుగా విభజించి చూచినప్పుడు మొదటి భాగములో కర్మ గుణ విభాగములను ఆధారము చేసుకొని నాలుగు వర్ణములుగా సృష్టించాను అని ఉన్నది. కర్మ, గుణములనునవి మనిషి లోపల తల భాగములోనున్న నాలుగుచక్రములలో క్రింది నుండి మొదటి దానిలో గుణములు, రెండవ దానిలో కర్మలు నిలువగలవు. బ్రహ్మ, కాల, కర్మ, గుణ అను పేర్లుగల నాలుగు చక్రములలో క్రింది చక్రమునందు మొత్తము నాలుగు
---
(4) భాగములు గలవు. దానిపైనగల కర్మచక్రమందు మొత్తము పన్నెండు (12) భాగములు గలవు. కర్మచక్రములోని పన్నెండు భాగములలో ఒక్కొక్క దానియందు తొమ్మిది రకముల కర్మల ప్రకారము మొత్తము 108 రకముల కర్మలు కలవు. క్రింద గుణచక్రములో బయట నుండి మొదటి మూడు భాగములందు ఒక్కొక్క దానియందు పన్నెండు (12) రకముల గుణములుగలవు. అందులో ఆరు మంచిగుణములు, ఆరు చెడుగుణములు ఉండును. ఈ విధముగా మూడు భాగములలో 36 గుణములున్నవి. ఇక మధ్యలోగల నాల్గవ భాగమందు ఏ గుణమూ ఉండదు. ఇట్లు మూడు గుణములున్న, ఒకటి గుణములేని మొత్తము నాలుగు భాగములు గుణచక్రములో గలవు. ఈ గుణచక్రము భాగములలోనే ప్రతి శరీరములోని జీవుడు ఉండును. నాలుగు భాగములలో జీవుడు పైనున్న కర్మనుబట్టి నివాసముండును. ఏ భాగములో జీవుడు నివాసముంటే ఆ గుణము యొక్క పేరు అతనికి చెప్పబడును.
గుణచక్రములోని నాలుగు భాగములను నాలుగవర్ణములుగా దేవుడు విభజించి శ్లోకములో చెప్పాడు. పైనగల కర్మనుబట్టి క్రిందయున్న గుణముల భాగములలో జీవుడుండును. జీవుడుండు గుణభాగముల పేర్లనుబట్టి వీడు ఫలానా వర్ణమువాడు అని చెప్పబడుచున్నది. వర్ణము అనగా గుణభాగము యొక్క పేరు. నాలుగు భాగములకు నాలుగు పేర్లుండుట వలన వాటినే నాలుగువర్ణములని చెప్పడము జరిగినది. మనిషి శరీరములోని జీవుడు ఏ గుణభాగములో ఉంటే ఆ గుణభాగము యొక్క పేరు అతనికి వస్తున్నది. గుణభాగములనుబట్టి బయటినుండి మొదటి భాగములో ఉన్నవాడు తామసుడనీ, రెండవ భాగములోనున్నవాడు రాజసుడనీ, మూడవ భాగములో నున్నవాడు సాత్త్వికుడనీ, నాల్గవ భాగములోనున్నవాడు యోగి అనీ చెప్పడము జరుగును. దేవుని ఉద్దేశములో తామస, రాజస, సాత్విక, యోగి అను నాలుగువర్ణముల వారున్నారని శ్లోకములో చెప్పగా, మనిషి తన ఇష్టమొచ్చి నట్లు వాటిని బయట కులములుగా చెప్పుకొన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పినది ధర్మమునకు సంబంధించిన జ్ఞానముకాగా, మనిషి చెప్పినది పూర్తి అధర్మ సంబంధ అజ్ఞానమగును. దేవుడు మనిషిలోపలి జ్ఞానము ప్రకారము చెప్పాడుగానీ, బయటి కులములను ఏర్పరచలేదు. శ్లోకములో లేని కులముల పేర్లను మనుషులకు పెట్టి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని విభజించి శూద్రులు అంటరానివారని చెప్పడము బయట పూర్తి అన్యాయము. లోపల పూర్తి అధర్మమగును. కుల వ్యవస్థలను దేవుడు పెట్టలేదు. శూద్రులు అంటరాని వారని గుడిలోని ప్రసాదమును కూడా పైకి ఎత్తివేయడము దేవుడు ఒప్పుకోని అధర్మమగును. దేవుడు భగవద్గీతలో చాతుర్వర్ణము అను శ్లోకమును ధర్మయుక్తముగా చెప్పితే మనిషి తన స్వార్థముతో అధర్మముగా మార్చి వేశాడని తెలియుచున్నది. ఇప్పుడు ధర్మమునకు, అధర్మమునకు ఉన్న తేడా కొద్దిగ తెలిసిందనుకొంటాను. ఇదే విధముగా మనుషులు చేయు అధర్మములు ఎలా ఉన్నాయో మరికొన్ని విషయములను విశదీకరించుకొని చూస్తాము.
దాదాపు ముప్పయి (30) సంవత్సరముల క్రితము ఒక ఉన్నతమైన వ్యక్తి, బ్రహ్మకుమారి సమాజము (ఓంశాంతి)లో జ్ఞానమును తెలుసుకొన్న వ్యక్తి, తాను పూర్తి జ్ఞానినని తలచిన వ్యక్తి, ఒక దినము నన్ను ఇలా అడిగాడు.
అతను:- మీరు వేదములను చదివారా?
నేను :- లేదు. చదువలేదు.
అతను :- వేదములను చదవనిదే నీవు స్వామివెట్లయ్యావు?
నేను :- నేను స్వామినని ఎవ్వరితోనూ ఇంతవరకు చెప్పలేదు. బయట వారే నన్ను స్వామి అని అంటుంటారు. వాస్తవానికి నేను యోగిని. స్వామిని కాను. ఒక విధముగా నాకు సంస్కృత భాషరాదు కావున వేదములను చదువలేదు.
---
రెండవ కారణము వేదములు చదువుట వలన, వాటిని తెలియుట వలన దేవుడు తెలియబడడు. మూడవ కారణము వేదములు అధర్మములు కావున చదువలేదు.
అతను :- వేదములు అధర్మములా? మొత్తము భారతదేశములో ఎవరూ ఇంతవరకు ఈ మాటలను చెప్పలేదు. ఎవరూ చెప్పని విషయమును మీరు ఒక్కరే చెప్పడమేమిటి? ఇంతవరకు ఎంతోమంది జ్ఞానులు, స్వాములు నిత్యము వేదపారాయణము చేయుచున్నారు. వేదములను నేర్పుటకు వేదపాఠశాలలను స్థాపించారు. ప్రతి పూజలోను, ప్రతి యజ్ఞములోనూ వేదమంత్రములులేనిది పనే జరుగదు. భారతదేశ సంస్కృతికి వేదములు నిదర్శనమన్నారు. వ్యాసుడు వేదములను వ్రాసి వేదవ్యాసుడని పేరుగాంచినా, అంతపెద్దవారు వేదములను కొనియాడుచుండగా, నీవు ఒక్కనివే వేదములు అధర్మములు అనడము వింతగా ఉన్నది. నీవు ఈ మధ్యకాలములో ఇతర మతములలో చేరలేదు కదా! ఒకవైపు చూస్తే నీవు సామాన్యమైన వ్యక్తివి కూడా కాదు. నీ మాటకు దేవతలు, దయ్యాలు భయపడడము నేను స్వయముగా చూచాను. అంతటి గొప్ప వ్యక్తివి నీవు ఇలా చెప్పడమేమిటి?
నేను :- ఈ దేశములోని మనుషులలో వేదములు ఎంతవరకు చొచ్చుకొని పోయివున్నాయో నాకు బాగా తెలుసు. ప్రజలలో ఎంతో గౌరవమున్న వేదములను అధర్మములని నేను అనడము మీకు కూడా బాధాకరమే అయినా, అందరి మేలును కోరినవానిగా చెప్పక తప్పలేదు. ఈ మాట నేను స్వయముగా చెప్పునది కాదు. దైవాంశసంభూతుడైన భగవానుడు కృష్ణునిగా వచ్చినపుడు భగవద్గీత లో చెప్పిన విషయమును చెప్పుచున్నాను. భారతదేశములో వేదము చదవనిదే అధ్యాత్మికము తెలియదు అని కొందరంటుంటారు. మీరన్నట్లు వేదముల మంత్రములు చదవనిదే ఏ శు భకార్యము చేయకూడదని అందరూ అనుకొంటున్నారు. ఈ మధ్య కాలములో అమెరికా దేశములో కూడా అమెరికా ప్రెసిడెంట్ క్రొత్తగా తన సీటులో కూర్చొనునపుడు భారతదేశము నుండి పోయిన వేదపండితులతో వేదమంత్రములను పారాయణము చేయించి తన పదవిని చేపట్టాడట. దీనినిబట్టి వేదమంత్రముల మీద విదేశీయులకు కూడా మోజుకల్గినదని అర్థమగుచున్నది. ఇంకా క్రొత్త విషయమేమంటే క్రైస్తవులు, ముస్లీమ్లు వేదమంత్రములను చదివి అందులో తమ ప్రభువును గురించి ఉందని క్రైస్తవులు అంటుండగా, ముస్లీమ్లు కూడా వేదములలో తమ ప్రవక్తను గురించి ఉందని చెప్పుచున్నారు. అలా చెప్పడమే కాకుండా వేదముల మంత్రములను ధారాళముగా చెప్పు ముస్లీమ్లను కూడా చూచాను. పూర్వమునుండి హిందువులలో పేరుగాంచిన వేదములను ఈనాడు ముస్లీమ్లు, క్రైస్తవులు చదువుచున్నారు. మనుషులు ఏది గొప్పదనుకొనినా దానిని గురించి దేవుడు ఏమి చెప్పుచున్నాడో చూడవలెను. దేవుడు ధర్మమని చెప్పిన విషయమును మనుషులందరూ తిరస్కరించివుండినా ఫరవాలేదు. దేవుడు దేనిని ధర్మమని చెప్పాడో దానినే స్వీకరిస్తాను. అలాగే మనుషు లందరూ ఆమోదించి గౌరవించు విషయమును దేవుడు అధర్మమని చెప్పితే, దానిని తిరస్కరించడమేకాక, అదే విషయమును అందరికి తెలియునట్లు చెప్పుతాను.
దేవుడు తన బోధలో నాలుగు అధర్మములను గురించి చెప్పినపుడు, వేదములు కూడా అధర్మములే అని నాలుగులో ఒక అధర్మముగా భగవంతుడు చెప్పడము జరిగినది. వేదముల వలన నేను తెలియబడను అని దేవుడే స్వయముగా చెప్పినపుడు దానిని వినిన తర్వాత కూడా వేదములను ఆశ్రయించివుండడము అంతకంటే అజ్ఞానము లేదనియే చెప్పవచ్చును. దేవుడు దేనివలన నన్ను తెలియలేరని చెప్పాడో, దానిని వదలకపోవడము వలన దేవున్ని అగౌరవపరచినట్లు కాదా! దేవుని మాటను తిరస్కరించినట్లు కాదా! దేవుని భక్తులము, దేవుని జ్ఞానులము, దేవుని జ్ఞానములో మునిగియున్నాము, దేవున్ని ప్రత్యక్షముగా చూస్తున్నాము అని తమను తాము గొప్పగ చెప్పుకొను జ్ఞానులు,
---
ఎందుకు దేవుడు వద్దు అని చెప్పిన వేదములను వదలకున్నారు? అని ప్రశ్నించుకొంటే దానికి ఒకే ఒక జవాబు దొరుకుతుంది. అదేమనగా! దేవుడు చెప్పిన ధర్మములు మనుషులకు అర్థముకాలేదని తెలియుచున్నది.
అతను :- మీరన్నట్లు దేవుడు చెప్పిన ధర్మములు కొందరికి అర్థముకాలేదని అంటే ఒప్పుకోవచ్చును. ఇంతమంది చిన్న పెద్ద స్వాములు, గురువులు, పీఠాధిపతులు, బ్రాహ్మణులు, వేదపండితులు మొత్తము అందరికీ తెలియ కుండా పోవుటకు కారణమేమి ఉంటుంది? మీరు చెప్పేమాటలు నాకు ఒకప్రక్క సత్యమనిపించినా, మరొక ప్రక్క నమ్మశక్యము కాకుండా ఉన్నవి. అంతేకాక మీ మాట వినకూడదని లోపల ఎవరో బలముగా చెప్పినట్లు, మీరు చెప్పునది మనుషులను తప్పుదారిన పంపించుటకు అన్నట్లు అనిపిస్తున్నది. నిజమా, అబద్ధమా అని యోచించు నాకే ఏమాత్రము యోచించకుండా మీ మాట తప్పని ఎందుకనిపిస్తున్నది?
నేను :- మీకు అలా ఎందుకనిపిస్తున్నదో వివరముగా చెప్పెదను బాగా వినండి. వేదముల వలన నన్ను తెలియలేరని చెప్పడమేకాక, వేదముల నిజ స్వరూపమును గురించి భగవద్గీతలోనే మరొక చోట సాంఖ్యయోగమను అధ్యాయమున
45వ శ్లోకములో...
త్రైగుణ్య విషయావేదా నిస్త్రైగుణ్యో భవార్జున!।
నిర్ద్వంద్వో నిత్య సత్త్వస్థా నిర్యోగక్షేమ ఆత్మవాన్ |
భావము :- “వేదములనగా మూడు గుణవిషయములే, ఆ మూడు గుణములను వదలిపెట్టవలెను. రాగద్వేషములను ద్వంద్వములు లేకుండా యోగివైయుండుము.”
విజ్ఞానయోగము 13,14 శ్లో॥
త్రిభిర్గుణ మయైర్భావై రేభి స్సర్వమిదమ్ జగత్ |
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ॥
దైవీహ్యేషా గుణమయీ మమమాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తో మాయామేతాం తరన్తి తే ॥
భావము :- ఈ జగత్తులోని మనుషులందరూ మూడు గుణములలో ఉంటూ, ఆ గుణముల ప్రభావములో చిక్కుకొనియుండి నేను నాశనము లేని వాడిననీ, నా మహత్యము గొప్పదనీ తెలియలేకున్నారు. నేను నా మాయను గుణములరూపములో తయారుచేసి ఉంచాను. దానిని దాటుటకు ఎవరికీ శక్యముకాదు. ఎవడైతే నన్ను ఆరాధించగలడో వాడు మాత్రము గుణములను మాయను సులభముగా దాటిపోగలడు.
భగవద్గీతలో ఈ మూడు శ్లోకములను పరిశీలిస్తే ఎవరికీ తెలియని పెద్ద రహస్యము తెలియుచున్నది. ప్రపంచములోని మనుషులందరినీ మభ్యపెట్టి, నీవు సరియైన మార్గములోనే ఉన్నావని నమ్మించి, దేవునివైపు పోకుండా
చేసి, ప్రపంచ విషయములలోనే ముంచివేయు మాయను దేవుడే సృష్టించాడు. ఆ మాయ ప్రతి మనిషి తలలో గుణ చక్రములోని మూడు గుణముల రూపములో ఉన్నది. ప్రతి మనిషికీ మాయ వాని తలలోనే గుణములరూపములోవుండి దేవుని జ్ఞానమును అర్థము కాకుండా, దేవుని ధర్మములు తెలియకుండా చేయుచున్నది. దేవుని జ్ఞానము తెలియాలంటే ఏ మనిషైనా మాయను జయించి, దానిని దాటి పోవాలి. అట్లు మాయను దాటిపోవుట
---
దుస్సాధ్యమైన పని అని దేవుడే శ్లోకములో తెలియజెప్పాడు. ఈ జగత్ అంతయు మూడు గుణములైన తామస, రాజస, సాత్విక గుణములలో చిక్కుకొని ఉన్నది. కావున గుణములను మాయలో చిక్కుకొన్న దానివలన, ఏ మనిషి దేవున్ని గురించి తెలియలేక పోవుచున్నాడు. మాయ అనునది ఎవరినీ వదలని శక్తియనీ, దానిని జయించుటకు ఎవరికీ సాధ్యపడదనీ, అది (మాయ) గుణముల రూపములో ఉన్నదనీ, గుణములను విభజించి చూచితే, అనేక విషయముల రూపములో ఉన్నవనీ, మూడు గుణవిషయములే అనగా 36 గుణముల విషయములే వేదములందున్నవనీ గీతయందు పై శ్లోకములలో చెప్పబడి వున్నది. గుణ విషయములతో నిండుకొనిన వేదములు అధర్మములనీ, భగవద్గీతలోనే విశ్వరూప సందర్శనయోగములో 48,53వ శ్లోకములలో భగవంతుడు చెప్పాడు. వేదముల వలన దేవుడు తెలియబడడని కూడా అక్కడే చెప్పాడు. ఈ ఐదు శ్లోకములను బాగా అర్థము చేసుకొన్నవాడు ఎవడూ వేదముల జోలికి పోడు. అయితే వేదములు భగవద్గీతకంటే ముందువనీ, భగవద్గీతకంటే ముఖ్యమైనవి వేదములనీ, మనుషుల తలలోని మాయ లోపలే నేర్పించడము వలన, అందరూ మాయవలలో చిక్కుకొని వేదములనే ముఖ్యమనుకొన్నారు. వేదములను వ్రాసిన వ్యాసుడే తన తప్పును తాను తెలుసుకొని మాయవలలో పడకుండా తప్పించుకొని భగవద్గీతను వ్రాయగా, అందరూ దానిని మరచిపోయారు. వ్యాసుడు మహాజ్ఞాని కాబట్టి వేదరూపమైన, గుణరూపమైన మాయను జయించగలిగాడు.
మనుషులలో ఎందరో స్వాములు, పీఠాధిపతులు, బాబాలు, సన్న్యాసులు, ఆధ్యాత్మికవేత్తలను వారుండినప్పటికీ మాయ ప్రభావము నుండి బయటపడలేక, తమ తలలోనేవున్న మాయను జయించలేక, దేవుడు ఎవరో తెలియక, మాయకు మారురూపములోనున్నవి వేదములని తెలియక, నిత్యము వేదపఠనము చేయుచున్నారు. వేదమంత్రములను జోడించిన ఆరాధనలనే చేయుచున్నారు. ఈ కాలములో ఏమీ తెలియని మనుషులు తెలిసినవారను నమ్మకముతో ఇతరుల సలహామేరకు కొన్ని రకముల పనులు చేయుచుందురు. మిగతా బ్రతుకు తెరువు విషయము కాకుండా భక్తి విషయములోగానీ, జ్ఞాన విషయములోగానీ, ఆ విషయములు బాగా తెలిసిన గురువులనూ, స్వాములను, పురోహితులను ఆశ్రయించి, వారు చెప్పినట్లు నడుచుకొనెడివారు. తెలియనివారు తెలిసినవారిని అనుసరించడము సర్వసాధారణముకాగా, తెలిసినవారందరి తలలో వేదములు, వేదముల సంబంధిత కార్యములు ముఖ్యమైనవను ధ్యాసవుండుట వలన, వేదమంత్రము లతో కూడుకొన్న యజ్ఞములనో, మంత్రములతో కూడుకొన్న ఆరాధనలనో చేయమని చెప్పడము వలన, అలా • చెప్పువారే అడిగేవారికి గురువులుగా తయారై భక్తి, జ్ఞానమార్గములో సలహాలు ఇవ్వడము వలన, అటువంటి వారు చెప్పినదే అందరికీ తెలిసివుండును. ఈ పద్ధతి ప్రకారము పూర్వము నుండి తలయందు మాయలోవుంటూ, మాయా ప్రభావములో భక్తి, జ్ఞానమును ఇతరులకు బోధించుట వలన, ఒక గురువును కొన్నివేల మంది, కొన్ని లక్షలమంది అనుసరించి అధర్మములైన వేదములను, యజ్ఞములను, దానములను, తపస్సులను ఆచరించి మంచి మార్గములోనున్నామని తృప్తి పడుచున్నారు. తాము ఆచరించునవి సరియైన మార్గములుకాదనీ, ఆ మార్గములో దేవుడు, దేవుని జ్ఞానము తెలియదనీ, తాము ఆచరించు ఆచరణలు పూర్తి అధర్మములని వారికి తెలియకుండ పోయినది.
ఒక వ్యక్తి దాదాపు ముప్పది సంవత్సరములనుండి వారి గురువు ఉపదేశించినట్లు నిత్యము ప్రాతఃకాలముననే వేదమంత్రములను కొంతైనా పారాయణము చేసెడివాడు. ఒక సందర్భములో ఆ వ్యక్తి నాతో కలిసి మాట్లాడినపుడు తాను ఒక గురువును ఆశ్రయించి మంత్రోపదేశమును పొందాననీ, తన గురువుగారు చెప్పినట్లు ధ్యానమును చేయడమేకాక, చాలా సంవత్సరములనుండి గురు ఆజ్ఞమేరకు ప్రతి దినమూ ఉదయమునే అరగంటసేపు వేదపారాయణమును
---
చేయుచున్నానని చెప్పాడు. అప్పుడు నేను ఇలా అడిగాను. “నీవు మంత్రోపదేశమును పొంది మంత్రధ్యానము చేయుచున్నావు కదా! అదికాక అధికముగా వేదపారాయణము ఎందుకు చేయుచున్నావు.” అని అడగగా దానికి “నేను బ్రాహ్మణున్ని కావున తప్పక వేదపఠనము చేయవలెనని మా గురువుగారు చెప్పాడు” అని అన్నాడు. ఈ విధముగా మాయ ఎందరో గురువులను తన పక్షములో చేర్చుకొనుట వలన, ఒక్క గురువు చెప్పే దానినిబట్టి కొన్ని లక్షలమందిని మాయ తన ప్రభావములో ఇరికించుకొనుచున్నది. అట్లు ఒకమారు మాయవలలో పడితే వాడు జీవితాంతము బయటపడుటకు వీలుపడదు. అటువంటి వానికి దేవుడే దిగివచ్చి చెప్పినా వినే పరిస్థితిలో ఉండడు. ఈ విధముగా భూమిమీద మాయ ప్రభావము పెరిగిపోయి, అధర్మములే అందరి దృష్ఠిలో ధర్మములుగా ఉండుట వలన, అసలు ధర్మముల ఉనికి లేకుండా పోవు చున్నది. కర్మయోగము, బ్రహ్మయోగము అనుమాటే తెలియకుండా పోయినది. అటువంటి సమయములో దేవుడు భగవంతునిగా అవతరించి యోగములనబడు ధర్మములనూ, వాటికి అనుబంధ కార్యములనూ బోధించును. అయినా మాయ మాట ముందర దేవుని మాట లెక్కించ బడకుండ పోవుచున్నది. తలలోనే బోధించు దానికంటే బయటనుండి బోధించు బోధలు చెవిలో దూరవు. అందువలన దేవుడు బోధించిన బోధలు ఎవరికీ అర్థము కాకుండా పోయాయి. ఒక్క వేదములు ఆచరణలోనే ధర్మములు ఇవి, అధర్మములు ఇవి అని అర్థము చేసుకోకపోతే, మిగతా మూడు అధర్మముల విషయములలోనూ ఇంకా ఎక్కువమంది పొరపడి దేవునికి దూరముగా పోవుచున్నారు.
పూర్వము ద్వాపరయుగమున ప్రజల దృష్ఠిలో గొప్పవారుగానున్న మహర్షులు వేదములకు, యజ్ఞములకు అలవాటుపడియుండెడివారు. మహర్షులు చేయు పనులు మంచివేననీ, ధర్మములేననీ మిగతావారందరు అనుకొనెడివారు. ప్రస్తుతకాలములో మహర్షులు లేకుండా పోయారు. వారి స్థానములో బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులలో సత్బ్రాహ్మణులు కొందరుండగా, మిగతావారు దుష్ప్ర బ్రాహ్మణులున్నారు. బ్రాహ్మణులలో మంచి బ్రాహ్మణులు, చెడు బ్రాహ్మణులు అని రెండు రకములున్నట్లు చాలామందికి తెలియదు. అయినా సద్బ్రాహ్మణ అను పదమును చాలామంది వినియేవుందురు. ప్రపంచములో సద్ బ్రాహ్మణలున్న తర్వాత దుష్ప్ర బ్రాహ్మణులు ఉండడము సహజమే కదా! కొందరు తెలియని స్థితిలో దుష్బ్రాహ్మణులుగా ఉండినప్పటికీ, తమ తప్పును తెలుసుకొని సద్ బ్రాహ్మణులుగా మారినవారు కూడా చాలామందికలరు. కొందరైతే తాము అధర్మములలో ఉన్నామని తెలిసినా, తమను తాము సమర్థించుకొనుచూ, తమదే నిజమైన ధర్మమని వాదించుచుందురు. అటువంటివారు దేవుని బోధలకు, దేవుని ధర్మములకు వ్యతిరేఖముగా మాట్లాడుట వలన వారికి తర్వాత జన్మలలో పెద్దశిక్షలుండును.
భగవద్గీతయందు దేవుడు చెప్పిన నాలుగు అధర్మములలో వేద పఠనము, యజ్ఞములు అవినాభావసంబంధముగా ఉన్నవి. పూర్వము కృత, త్రేతా యుగములలో యజ్ఞములున్నా వాటికి వేదమంత్రములుండక దేవతా మంత్రములుండెవి. ఏ దేవతకు యజ్ఞము చేయవలెనో ఆ దేవతా మంత్రమును ఆ యజ్ఞములో చదివెడివారు. ద్వాపరయుగము నుండి ఆ పద్ధతిపోయి ఏ యజ్ఞమునకైన వేదమంత్రములను జోడిస్తున్నారు. ఇప్పటి కాలములో వేదములు, యజ్ఞములు అందరి దృష్ఠిలో సత్కార్యములుగా కనిపిస్తున్నా, దేవుని జ్ఞానము ప్రకారము అవి రెండు అధర్మములేనని తెలియవలెను. వేదములను, యజ్ఞములను ఆచరించువారు సద్ బ్రాహ్మణు లుగా కనిపిస్తున్నా, దేవుని మార్గములో వారు అధర్మవరులేనని తెలియ వలెను. వారు మంచి బ్రహ్మజ్ఞానమును (దైవజ్ఞానమును) తెలిసి సద్ బ్రాహ్మణులుగా మారవచ్చును. తామున్న
---
స్థితినుండి బ్రహ్మజ్ఞానము తెలిసి, బ్రాహ్మణుడు అను మాటను సార్థకము చేసి సద్ బ్రాహ్మణులుగా మారిన వారిని చాలామందిని చూచాను. అలా మారి బ్రహ్మజ్ఞానులైన వారికి ఎవరైనా నమస్కరించవచ్చును. కానీ దుష్ బ్రాహ్మణులుగా ఉంటూ అధర్మ ఆచరణలైన వేదపఠనము, యజ్ఞములను చేయువారికి నమస్కరిస్తే నమస్కరించిన వానికి కూడా కొంత పాపమువచ్చును. అందువలన ఎవరి దర్శనమువలన, ఎవరికి నమస్కరించుట వలన పాపము నశించునో, అటువంటి బ్రాహ్మణులకు నమస్కరించడము మంచిది.
బ్రాహ్మణులలో సద్ బ్రాహ్మణులు, దుష్ బ్రాహ్మణులు అని రెండు రకములున్నట్లు, యజ్ఞములలో కూడా ధర్మముతో కూడిన యజ్ఞములు, అధర్మముతో కూడిన యజ్ఞములని రెండు రకములు కలవు. భగవద్గీతలో యజ్ఞముల వలన దేవుడు తెలియడని చెప్పియున్నారు. దైవము అధర్మముల వలన తెలియడు, కావున యజ్ఞములను అధర్మములన్నాము. అధర్మములని చెప్పిన యజ్ఞములు దుష్ బ్రాహ్మణులు చేయుచున్న బాహ్యయజ్ఞములని తెలియవలెను. బాహ్య యజ్ఞములను నిత్యకృత్యములుగా పెట్టుకొన్న ఆర్య సమాజము మొదలగు వారు కలరు. ఎంత పెద్దవారు బాహ్య యజ్ఞములను ఆచరించినా, ధర్మాధర్మముల ప్రకారము చూస్తే అవి అధర్మయుక్తములే అగును. అయితే భగవద్గీతయందు కర్మయోగమున 10వ శ్లోకమునుండి 16వ శ్లోకము వరకు 7 శ్లోకములు మరియు జ్ఞానయోగమున 24వ శ్లోకమునుండి 32వ శ్లోకమువరకు 9 శ్లోకములు, వ్యాసుడు వ్రాసిపోయిన భగవద్గీతలో కలుపడము జరిగినది. కర్మయోగములో 7 శ్లోకములు బాహ్య యజ్ఞములను గురించి వ్రాసిన శ్లోకములే, అలాగే జ్ఞానయోగములో కలిపిన 9 శ్లోకములు కూడా బాహ్య యజ్ఞములను గురించి చెప్పినవే. కర్మ యోగములో 9వ శ్లోకములో యజ్ఞము అను పేరువస్తూనే దుష్టబుద్ధిగలవారు అధర్మయజ్ఞములను కలుపగా, వాటిని నేటికీ ఎవరూ గుర్తించలేకపోయారు. అలాగే జ్ఞానయోగమున 23వ శ్లోకమందు యజ్ఞము అను పేరు కనిపిస్తూనే 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 వరకు మొత్తము 9 శ్లోకములను కలిపివేశారు. కర్మయోగములోని 7 శ్లోకములు, జ్ఞానయోగములోని 9 శ్లోకములు మొత్తము 16 శ్లోకములు బాహ్యయజ్ఞములను గురించి వ్రాసినవే. ఈ శ్లోకములతో వ్యాసునికి ఎటువంటి సంబంధములేదు. వ్యాసుడు పోయిన తర్వాత స్వార్థవరులు బాహ్యముగా చేయు యజ్ఞములను గురించి కల్పిత శ్లోకములను గీతయందు కలుపగా, తర్వాత వచ్చిన జ్ఞానులు ఎవరూ వాటిని కనుగొనలేకపోయారు. అలా కనుగొనలేకపోవడానికి కారణము ఏమనగా! ఎవరికీ ధర్మాధర్మముల వివరము తెలియకపోవడమే కారణమని చెప్ప వచ్చును. కొందరు గురువులుగా చలామణి అగువారు ఏమాత్రము విచక్షణా దృష్ఠిలేనివారై తమను ఆశ్రయించిన మనుషులందరికీ కళ్ళకు గుడ్డకట్టి గ్రుడ్డివారిని చేసినట్లు చేసి, మేము ఎట్లు నడిపిస్తే అట్లు నడవండి, మిమ్ములను నడిపించే బాధ్యత మాది అంటున్నారు. అ విధముగా వారికి కూడా విచక్షణా చూపులేకుండా చేసి భార్యభర్తలను ఒక యజ్ఞ గుండమువద్ద ఒక్క జోడిగా కూర్చోపెట్టి, వారి చేతికి కొన్ని సమిదలు ఇచ్చి ఎప్పుడు వేయమంటే అప్పుడు అగ్నిగుండములోనికి వేయునట్లు చేయుచున్నారు. వందమంది దంపతులకు వంద గుండములను కాయించి, ఒక్కొక్క దంపతు లకు ఒక్కొక్క గుండము నుంచి గ్రుడ్డివానిని నడిపించినట్లు మంత్రములు చదువుచు గుండములోనికి ఏమి వేయమంటే అవి వేస్తూ, ఎప్పుడు వేయమంటే అప్పుడు వేయునట్లు ఒక ఆటలాగ చేయిస్తున్నారు. ఎందుకు చేస్తున్నాము? మనము చేయు పని ధర్మమైనదా? అధర్మమైనదా? దీనివలన వచ్చు ఫలితము నిజమేనా? అని ఏమాత్రము ఆలోచించనివారు, చేయించే వారు ఎలా ఆడిస్తే అలా ఆడుచున్నారు. కొందరి స్వార్థముకొరకు అందరినీ అజ్ఞాన బాటలో అధర్మ గమ్యమునకు నడిపిస్తున్నారు.
---
ఒక్కమాటలో చెప్పాలంటే బాహ్యయజ్ఞములన్నీ అధర్మయుక్తమైనవే. వాటిని చేసేవారందరూ అధర్మయుతులే. గీతలో యజ్ఞముల ప్రసక్తిని భగవంతుడు తీసుకువచ్చాడు. అయితే భగవంతుడు చెప్పిన యజ్ఞములు బయట జరుగునవికావు. మంత్రములతో చేయునవికావు. ఆయన చెప్పిన యజ్ఞములు శరీరము లోపల జరుగునవి. శరీరములో జరుగు యజ్ఞములు ధర్మముతో కూడుకొన్నవి, సర్వ కర్మలను కాల్చివేయునవి. అయితే బాహ్య యజ్ఞములు కర్మలను సృష్టించునవిగా ఉన్నవి. బాహ్యయజ్ఞములు ఎన్నో రకముల పేర్లతో కలవు. ధర్మముతో కూడుకొన్న శరీరము లోపల యజ్ఞము కేవలము ఒకే ఒక్కటి కలదు. దానిపేరే జ్ఞానయజ్ఞము. ధర్మయుక్తమైన ఈ యజ్ఞమును గురించి భగవద్గీతయందు జ్ఞానయోగమున 33వ శ్లోకములో ఈ విధముగా కలదు.
శ్రేయాన్ ద్రవ్యమయా దృజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః పరంతప!
సర్వం కర్మాఖిలం పార్థ! జ్ఞానే పరిసమాప్యతే ॥
భావము :- ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఎందుకనగా జ్ఞానయజ్ఞములో సర్వకర్మలు పరిసమాప్తమగును.
ఈ శ్లోకములో సర్వకర్మలు నాశనమైపోవు ఒకే ఒక యజ్ఞమును గురించి చెప్పాడు. అదియే జ్ఞానయజ్ఞము. సర్వకర్మలు మనిషికి లేకుండా పోయినపుడు మనిషి దేవునియందు ఐక్యమైపోవును. మనిషి దేవున్ని చేరుటకు కావలసినవేవో వాటినే దేవుడు చెప్పాడు. సర్వకర్మలు నాశన మగుట యోగవిధానములోనే కలదు. అందువలన జ్ఞానయజ్ఞము దేవుడు చెప్పిన మూడు యోగములలో ఒక యోగమగునని తెలియవలెను. కర్మలు నాశనము కాకుండా మరికొన్ని కర్మలను తెచ్చిపెట్టునవి అధర్మములనీ, వాటివలన మనిషి దేవున్ని చేరలేడనీ చెప్పవచ్చును. బాహ్యయజ్ఞములు కర్మలను తెచ్చిపెట్టునవీ, అధర్మములతో కూడుకొన్నవీ అగును. త్రేతా యుగములో బ్రహ్మజ్ఞానియనీ, త్రికాల జ్ఞానియనీ పేరుగాంచిన ఒక రాజు తన రాజ్యములో ఎక్కడా ఎవరూ యజ్ఞములను చేయవద్దని శాసించాడు. బాహ్యయజ్ఞములను అధర్మములని తెలిసిన ఆ రాజ్యములోని వారు ప్రక్క రాజ్యములో యజ్ఞములను చేయువారితో ఘర్షణపడి, వారి యజ్ఞములను భంగము చేయుచుండిరి. ఆ చరిత్ర తెలిసిన మనము యజ్ఞములు చేసిన వారిని మంచి వారుగా ధర్మవరులుగా లెక్కించాము. బ్రహ్మజ్ఞానము కలిగి యజ్ఞములను చేయకుండా ఆటంకపరచిన వారిని చెడువారిగా అధర్మ వరులుగా లెక్కించాము. ఇప్పుడు జ్ఞానము తెలిసిన తర్వాత ఎవరినైతే ధర్మవరులనుకొన్నామో వారిని అధర్మవరులనీ, అట్లే ఎవరినైతే అధర్మ వరులనుకొన్నామో వారిని ధర్మవరులనీ అనుకోవడము జరిగినది. జ్ఞానము తెలియనివారంతా ధర్మమును అధర్మముగా, అధర్మమును ధర్మముగా అనుకోవడము జరుగుచున్నది.
భగవద్గీతలో భగవంతుడు చెప్పిన నాలుగు అధర్మములలో ఒక దానికొకటి అవినాభావసంబంధమున్న యజ్ఞములను, వేదములను రెండిటిని గురించి కొంతవరకు తెలుసుకొన్నాము. మిగత రెండు అధర్మములలో ఒకదానిని ఎక్కువమంది ఆచరించుచున్నారు. అదియే తపస్సు లేక ధ్యానము. ధ్యానము చేయడము కూడా అధర్మమేనా అని కొందరు మూతి ముడుచుకొని మాట్లాడవచ్చును. మీ లెక్కలో ఎవరు మంచివారు అని నన్ను ఎదురు ప్రశ్నవేసి అడుగవచ్చును. ఎంతో కాలమునుండి శ్రమపడి ధ్యానము చేసిన వారంతా ఒకటై మేము చేసినదంతా వృథా శ్రమయేనా? అని అడుగవచ్చును. తమది మంచి మార్గమనుకొని ఎవరు ఎంత శ్రద్ధతో ధ్యానము చేసినా, కుమ్మరోళ్ళ పెళ్ళికూతురు మీదికి వస్తే తెలుస్తుంద న్నట్లు, దేవుడు చెప్పిన ధర్మా ధర్మముల ప్రకారము ధ్యానము అధర్మమని తెలిసిపోయింది. పూర్వము నుండి ఎంతోమంది పెద్దలందరూ ఆచరించుచున్నది, నేడు కూడా ఎక్కడ దైవజ్ఞానమను మాట వినిపించినా
---
అక్కడ అందరూ చేయునది ధ్యానమే. ధ్యానము నేడు మనుషుల ఆచరణలో ఎన్నో రకములుగా ఉన్నది. ధ్యాస కల్గినది ధ్యానము అనీ, తపనకల్గినది తపస్సు అనీ పెద్దలు విడదీసి వివరముగా చెప్పినా, ధ్యాస తపన రెండూ ఒక్కటే, కావున ధ్యానమనినా, తపస్సనినా రెండూ ఒక్కటిగా లెక్కించు కోవలెను. పూర్వము మహర్షులు చేసేది తపస్సనీ, నేడు మనుషులు చేయునది ధ్యానమనీ అనినా రెండు కార్యములు ఒక్కటేననీ, రెండు అధర్మములేననీ గీతాచార్యుడు చెప్పిన దాని ప్రకారము అర్థమగుచున్నది. నేడు నిత్యము ధ్యానము చేయువారు కొందరుండగా, ధ్యానమందిరములను కట్టించి సామూహికముగా ధ్యానము చేయించువారూ కొందరున్నారు.
ఇప్పటి నవీనకాలములో కొందరు గురువులు ధ్యానమును (తపస్సును) క్లాసులు, కోర్సులు అని చెప్పి చేయించి, అతనికి ఒక యోగ్యత పత్రమును కూడా ఇచ్చుచున్నారు. కొందరు గురువులు తమ ధ్యానములో క్రొత్తదనమును చూపిస్తూ అందరూ మంత్రము, జపము మీద ధ్యాసను పెట్టుకొంటే, మంత్రము మీద లేకుండా శరీర అవయవముల మీద ధ్యాస పెట్టించుచు క్రొత్తక్రొత్తగా బోధించుచున్నారు. కొందరు ధ్యానములో తమ ధ్యాసను ముక్కుమీద ఉంచుకోమని చెప్పితే, కొందరు శ్వాసమీద ధ్యాస నుంచుకోమని చెప్పుచున్నారు. మరికొందరు నాసికాగ్రము మీద ధ్యాస నుంచుకోమనీ, కొందరు ముక్కుకొన భాగములో ధ్యాసనుంచుకోమనీ, కొందరు తలమీదయనీ, కొందరు తలముందర పాలభాగములోయనీ రక రకముల ధ్యాసలు నేర్పిస్తున్నారు. కొందరు గురువులు వేరువేరు మంత్రము లను ఉపదేశము చేసి వాటిని ధ్యానము చేసుకోమని చెప్పుచున్నారు. కొందరైతే చేసేది ధ్యానమే అయిన స్పెషల్ మెడిటేషన్ అని ఆంగ్లభాషలో చెప్పుచున్నారు. ఇట్లు నేను కూడా ఆధ్యాత్మికములో ఉన్నానను గుర్తింపు కొరకు అందరూ ధ్యానమును చేయుచున్నారు. కొందరు మీరు సాధన ఏమి చేయుచున్నారని నన్ను అడుగగా, మేము ఏ సాధనా చేయలేదని చెప్పాము. అప్పుడు వారు "అయ్యో వీరు ఎంత వెనుకబడివున్నారో” అని మమ్ములను జాలిగా చూచినవారూ కలరు.
ఒక దినము తిరుపతిలో ఒక వ్యక్తి కలిసాడు. అతను గురువు ద్వారా పొందిన మంత్రమును ఏకాగ్రతగా ధ్యానించుచూ కొన్ని సంవత్సరము లుగా సాధన చేయుచున్నాననీ, ఇప్పటికి తన మనస్సు ఒకే ధ్యాసలో నిలిచి పోవుచున్నదనీ చెప్పి, నేను నా సాధనను పూర్తిగా సాధించినట్లే కదా! నాకు మోక్షము వస్తుంది కదా! అని అడిగాడు. అప్పుడు నేను "ఈ మాటను మీ గురువుగారినే అడగండి" అని చెప్పగా అతను “మా గురువుగారు ఈ మధ్యనే పాముకరచి చనిపోయాడు.” అని చెప్పాడు. అప్పుడు నేను అతనితో ఇలా చెప్పాను. నీవు ఒక మంత్రమును పట్టుకొని దానిని మనస్సులో ఎన్నోమార్లు జపిస్తూ కూర్చున్నావు. కొంతకాలమునకు నీ మనస్సు ప్రక్క ధ్యాసల మీదికి పోకుండా మంత్రముమీదనే నిలిచింది. దానితో నీవు తృప్తిపొంది, నేను మనస్సును జయించాను మోక్షము వస్తుంది అనుకొంటు న్నావు. కానీ సత్యము తెలుసుకోగలిగితే ఉగ్రమైన తపస్సుల వలన కూడా నేను తెలియబడను, తపస్సుల వలన ఎవనికీ ముక్తి లభించదని దేవుడు చెప్పాడు. కొన్ని సంవత్సరములు పైకి లేవకుండ ఒకే ధ్యాసలో ఉండువానిని ఉగ్రమైన తపస్సు చేసినవాడని అందురు. అతడన్ని సంవత్సరములు ఏదో ఒక దానిని పట్టుకొని జపించుచున్నాడు (తపించుచున్నాడు) కానీ దేవున్ని గురించి ప్రయత్నించలేదు. కావున ఏ తపస్సులైనా కానీ మోక్షము నివ్వవు. వాటివలన దేవుడు తెలియబడడు. కొన్ని సంవత్సరములు లేవకుండా కూర్చొని తపించే వారికే మోక్షము లేనప్పుడు గంటో, అరగంటో కూర్చొని ధ్యానము చేయువానికి దేవుడు తెలియడు, మోక్షమూ రాదు.
---
కొందరు హిమాలయములలోనికి పోయి ధ్యానము చేయువారు కలరు. కొందరు భూమిలో గుంత త్రవ్వి దానిలో కూర్చొని జపించువారు కలరు. కొందరు గొంతు వరకు నీటిలో దిగి ధ్యానము చేయువారు కలరు. కొందరు చుట్టూ మంటలను రగిల్చి మంటల మధ్యలో కూర్చొని జపించు వారూ కలరు. కొందరు కొండ శిఖరముల మీద కూర్చొని తపించువారూ కలరు. ఈ విధముగా ఎందరో ఎన్నో రకముల సాధనములు చేయుచున్నారు. జపించినా, తపించినా, ధ్యానించినా అవన్నియు మనస్సుతో చేయవలసిందే. ఆ పనులలో కూడా మనస్సు ఏదో ఒక పని చేయుచున్నది. కావున అవన్నియు ధర్మబద్ధమైనవి కావు. గాలిలేని చోట దీపము వెలిగినట్లు ఎవని మనస్సు నిలిచిపోగలదో వాడు బ్రహ్మయోగమును సాధించినట్లగునని భగవద్గీతయందు చెప్పియున్నాడు. మనస్సు నిలిచితే యోగమగును. మనస్సుకు ఒక పనియుంటే అది ధ్యానమగును. ధ్యానము వలన దేవుడు తెలియబడడు. కావున గీతయందు తపస్సును అధర్మములోనికి చేర్చి చెప్పడము జరిగినది. అధర్మమైన కార్యముల వలన తిరిగి జన్మలు కలుగును. కానీ జన్మరాహిత్యము కలుగదు. ఎంత పెద్దవారైనా, గురువులని పేరు పెట్టుకొన్నవారైనా, ఒక విషయమును ధ్యాసలో పెట్టుకొని ధ్యానించడము వలనగానీ, ఒక మంత్రమును జపించడము ద్వారాగానీ, ఒక దానిని గూర్చి తపించడము వలనగానీ, మనిషికి శక్తులు కలుగును, కర్మలు పెరుగును. కర్మలు కరిగిపోయే విధానము జప, తప, ధ్యానములందు లేదు. అందువలన ఇప్పటినుంచైనా కాలమును వృథా చేసుకోకుండా, అధర్మములని దేవుడు చెప్పిన వాటిని వదలివేసి, ధర్మములైన యోగములను ఆచరించవలెనని తెలుపుచున్నాము. అధర్మములైన వేదములు, యజ్ఞములు, తపస్సులు, దానములు చాలా కష్టముతో కూడుకొన్నవై ఉన్నవి. ధర్మములైన యోగములు మూడు, వాటికి సంబంధించిన జ్ఞానమును తెలిస్తే చాలా సులభముగా కష్టము లేనివై ఉన్నవని చెప్పవచ్చును. త్రేతాయుగములో జనకమహారాజు వేదముల, యజ్ఞముల, తపస్సుల, దానముల జోలికి పోకుండా ఒకే ఒక కర్మయోగము ద్వారా మోక్షమును పొందాడు. దేవునిలోనికి ఐక్యమై పోయాడని గీతలో భగవంతుడే చెప్పాడు.
ధర్మములంటే ఏమిటోననీ, ఇంతమంది స్వామీజీలకు, గురువులకు తెలియకుండా పోయినపుడు మనకు తెలుస్తాయా అని అనుకోవలసిన పనిలేదు. ధర్మములు అధర్మములకంటే సులభమైనవి. అధర్మముల సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో ఉన్నవి. తెలుసుకోవాలను శ్రద్ధవుంటే పామరుల కైనా, చదువురానివానికైనా సులభముగా అర్థముకాగలవు. ఎప్పుడైనా ధర్మములకు ముప్పు ఏర్పడి అవి ఎవరికీ తెలియకుండా పోయినపుడు, అధర్మములు ప్రచారమైపోయి వాటినే అందరూ ఆచరించునపుడు, నేను అవతరించివచ్చి తిరిగి ధర్మములను తెలియజేస్తానని భగవద్గీతలో జ్ఞాన యోగములో మొదటనే చెప్పడము జరిగినది. ఆ మాట ప్రకారము ద్వాపరయుగము చివరిలో వ్యాసుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలగు వారేకాక, ఎందరో మహర్షులున్న సమయములో, మనుషులకు ధర్మములు తెలియ కుండాపోయి అధర్మ ఆచరణలు ఎక్కువై పోవడము వలన, దేవుడు భగవంతునిగా పుట్టి భగవద్గీత రూపములో తన ధర్మములను తెలియ జేయడము జరిగినది. దేవుడు విశ్వములో మూడు భాగములుగా విభజింపబడియున్నాడు. క్షర పురుషునిగా, అక్షర పురుషునిగా, పురుషోత్తమునిగా దేవుడు ఉండుట వలన ఆయన భూమిమీద మూడుమార్లు జన్మించితే ఒకమారు పూర్తిగా అవతరించినట్లగును. ఈ పద్ధతిని అనుసరించి దేవుడు మొదట ద్వాపరయుగము చివరిలో కృష్ణునిగా జన్మించాడు. మూడు జన్మలు పూర్తి అయిపోవునప్పటికి దేవుడు ధర్మములను పూర్తిగా తెలుపవలసి ఉన్నది. మూడు జన్మలలో ధర్మములను పూర్తిగా తెలిపి, వాటితోపాటు మానవుడు పొరపాటుగా ధర్మములని తలచి ఆచరించు అధర్మములను
---
కూడా తెలుపుట వలన ధర్మములకు పూర్తి విలువ ఏర్పడును. అందువలన దేవుడు తన మూడు అవతారములలో అలా తెలుపుట వలన మనుషులలో చాలామంది ఇటు ధర్మములనూ, అటు అధర్మ ములను తెలియజేయును.
అధర్మములను వదలి ధర్మములను ఆశ్రయింతురు. అప్పుడు ధర్మములు తిరిగి ఆచరణలోనికి వచ్చును.
దేవుడు భగవంతునిగా కృష్ణుని రూపములో వచ్చి తన మొదటి అవతారమును పూర్తి చేసుకొన్నాడు. అంతేకాక తన రెండో అవతారమును కూడా పూర్తి చేసుకొన్నట్లు కొంత అర్థమగుచున్నది. ఇక మూడవది పూర్తి చేసుకోవలసియున్నది. మొదటి అవతారము తర్వాత ఇంకా రెండుమార్లు వచ్చి చెప్పే పనివుండుట వలన, మొదటి అవతారములో భగవద్గీతను చెప్పి దానిలో ధర్మములను, అధర్మములను కూడా చెప్పిపోవడము జరిగినది. అయితే ఆయన చెప్పిన జ్ఞానమును మనుషులందరికి చెప్పకుండా కేవలము ఒక్క అర్జునునికి మాత్రమే చెప్పాడు. కృష్ణుడు తన 120 సంవత్సరముల జీవితములో 90వ సంవత్సరము భగవద్గీతను చెప్పడము జరిగినది. యుద్ధ రంగములో ప్రక్క మనిషి కూడా వినుటకు అవకాశములేకుండ ఒక్కమారు చెప్పిన కృష్ణుడు తర్వాత రెండవమారు ఎప్పుడూ చెప్పలేదు. అలా చెప్పడము వలన అది ప్రారంభ అవతారములో జ్ఞానమును సాక్ష్యమునకు మాత్రమే చెప్పి తర్వాత అవతారములలో ఎక్కువగా చెప్పదలచాడు అని అర్థము అగుచున్నది. మొదటి అవతారములో చెప్పినవి ధర్మములే అయినా, వాటిని ఆ జన్మలో మరీమరీ చెప్పలేదు. అంతేకాకుండా అర్జునునికి మాత్రము నిరూపణ నిమిత్తము చెప్పి, మిగతా వారికి ఎవరికీ చెప్పనట్లు తెలియు చున్నది. ఆనాడు వ్యాసుని ద్వారా అధర్మములైన వేదములు, పురాణములు వ్రాయబడి ఉండుట వలన, అర్జునుడు వినిన విషయము వ్యాసునికి తెలియుటకు, అర్జునుడు వ్యాసునితో చెప్పునట్లు కృష్ణుడు అర్జునునికి తెలియకుండానే అంతరంగములోనే అర్జునున్ని ప్రేరేపించినట్లు అర్థమగు చున్నది. తాను యుద్ధరంగములో కృష్ణుని ద్వారా చూచినదీ, విన్నదీ అన్నిటిని వ్యాసునికి చెప్పాలని అర్జునుడు అనుకొని చెప్పడము జరిగినది. అలా కృష్ణుడు తన జ్ఞానము వ్యాసునికి తెలియునట్లు చేశాడు. అర్జునుని ద్వారా వినిన వ్యాసుడు, తాను వినిన విషయము చాలా గొప్పదని తలచి, తాను ముందు వ్రాసిన వాటికి వ్యతిరిక్తముగా ఉండినా అవియే సత్యమైనవని తలిచి, కృష్ణుని జ్ఞానమును భగవద్గీత అను గ్రంథరూపములో వ్రాసి యుంచాడు. దేవుడు తన మొదటి జన్మలో ధర్మములను, అధర్మములను అర్జునునికి తెలుపడమేకాక ఆయనే నిజమైన దేవుడనీ, దేవుడు తన ధర్మములను తెలియజేయుటకు అవతరించునని సాక్ష్యముగా తెలియునట్లు తన నిజ రూపమైన విశ్వరూపమును అర్జునునికి చూపడము జరిగినది. తన నిజరూపము ఎవరికీ తెలియదు. కావున కృష్ణుడే అర్జునునికి జ్ఞాన దృష్ఠినిచ్చి దైవస్వరూపము ఎలాగుండునో అర్థమగునట్లు చేశాడు. జ్ఞాన దృష్ఠి దృశ్యమును చూడదు. కానీ దృశ్యమును అవగాహన చేసుకోగలదు. ఆ విధముగా దేవుడు జ్ఞానదృష్టిని అర్జునునికిచ్చి తన స్వరూపము మనకు కొంత అర్థమగునట్లు చేశాడు. తర్వాత వచ్చు రెండు అవతారములలో ఎక్కువగా చెప్పుటకు, ముందు చెప్పిన బోధ ఆధారముగా ఉండునట్లు అర్జునునికి మాత్రము చెప్పిపోవడమూ, దానినే వ్యాసుడు గ్రంథరూపముగా చేయడము జరిగినది. దేవుడు తర్వాత రాబోయే రెండు అవతారములలో చెప్పుటకు అవకాశముండునట్లు అర్జునునికి మాత్రము బోధించాడని తెలియుచున్నది.
దేవుడు మూడుమార్లు వస్తే ఒకమారు పూర్తి వచ్చినట్లు లెక్కించ బడును అనుటకు ఆధారమేమైనా ఉన్నదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే నావద్ద దానికి జవాబులేదనియే చెప్పవచ్చును. దేవుని విషయములో ఆయనే చెప్పితే తప్ప, ముందుగా మనము చెప్పుటకు వీలులేదు. వచ్చిన తర్వాత నేను ఫలానా అని ఆయన చెప్పవలసిందే, కానీ మనము
---
ఈయన ఫలానా దేవుడని చెప్పలేము. ఆయన ఒకమారు వచ్చాడు, తన జ్ఞానమును బయటపెట్టి పోయాడు. మనుషులకెవరికీ దానిని బోధించక ఒక్క అర్జునునికి మాత్రము చెప్పిపోయాడంటే, చెప్పిన విషయమును తర్వాత అందరికీ విశధీకరించి చెప్పునని తెలియుచున్నది. తర్వాత రావలెనను ఉద్దేశముతోనే ముందుగానే తాను చెప్పవలసిన దానిని చెప్పిపోయాడు. ముందు వచ్చినపుడు ధర్మము లను, అధర్మములను చెప్పిపోయాడు. అవి ఏవీ ఎవరికీ అర్థము కాలేదు. దేవుడు అధర్మములను లేకుండా చేయుటకు, ధర్మములను నెలకొల్పుటకు ఆయనే మనుషులకు వాటిని గురించి పూర్తిగా విశధీకరించి చెప్పవలసి వున్నది. అలా ఆయన కృష్ణుని జన్మలో ధర్మములను విశధీకరించి ప్రజలకు చెప్పినట్లు లేదు. ధర్మములను నెలకొల్పుటకు వచ్చినవాడు ఎవరికో చాటుగా చెప్పిపోతే ధర్మములు ప్రతిష్ఠించబడుతాయా? అధర్మములకు అలవాటుపడిన వారికి వారు చేయుచున్న తప్పు ఏమిటో? విశధీకరిస్తే తెలుస్తుంది. అటువంటపుడు ఎవరికీ తెలియకుండా ఒకమారు చెప్పి ఇక నా పని అయిపోయింది అనుకుంటే సరిపోదు కదా! వచ్చిన పని పూర్తి కాదు కదా! ఇప్పుడు మేము కృష్ణుడు ఆ రోజు చెప్పిపోయిన ధర్మము లను ప్రత్యక్షముగా అరిచి చెప్పుతుంటే, నీది మా మతమేకాదు పరాయి మతమను మనుషులున్నపుడు, ఎవరికీ తెలియకుండా ఒకే ఒక్కనికే, ఒకే ఒక్కమారు చెప్పితే దానిని ప్రజలు వింటారా? విని ఒప్పుకుంటారా? తాము చేయుచున్నదే సరియైన యోగమనీ, తమకు తెలిసి నదే నిజమైన జ్ఞానమనీ, అధర్మములను బోధించే గురువులు మర్రి వృక్షములలాగ వేర్లు ఊడలతో సహా పాతుకొనిపోయివుంటే, తమకు సరిపోని జ్ఞానమును చెప్పితే చెప్పేది ఏమిటి అని ఆలోచించకుండా, తమ ఉనికిని కాపాడుకొనుటకు ఇది పరమత జ్ఞానమనీ, బోధించేవాడు హిందూమత ముసుగులోనున్న పరాయివాడని ప్రజలకు చెప్పి, ఏమాత్రము ఆలోచించని మనుషులను ప్రేరేపించి ఏమైనా చేయగలరు. గీతలో చెప్పిన విషయమును చెప్పితేనే విచక్షణ లేని మనుషులు, హిందూ రక్షణ సంఘము లను పేరుతోయున్నవారు, ఎన్నోమార్లు మా మీదికి దాడులకు దిగిన సంఘటనలున్నాయి.
భూమిమీద ఏ మతము ఉండినా, ఎన్ని మతములుండినా, అన్నిటి యందు దేవుని ధర్మములు ఒక్కటిగానే ఉండును. అన్ని మతములకు దేవుడు ఒక్కడే అయినప్పుడు, ఏ మతములోనైనా దేవుని ధర్మములు ఒకే విధముగా ఉండును. వేరువేరు మతములకు వేరువేరు దేవుడు అనిగానీ, వేరువేరు ధర్మములు అనిగానీ ఉండవు. దేవుని విధానము, జ్ఞానము తెలియని మనుషులు మతబేధములతో బ్రతుకుచున్నప్పటికీ, బేధములన్నీ మనుషులలో మతములలో ఉండవచ్చునేమోగానీ, దేవునియందుగానీ, దేవుని ధర్మములయందుగానీ ఏమాత్రము లేవు. ముఖ్యముగా గమనించవలసిన విషయమేమంటే, దేవుని ధర్మములూ, దేవుడూ ఎప్పటికి మారని విధముగా ఉండినప్పటికీ, అధర్మములు మాత్రము ఒక్కొక్క మతములో ఒక్కొక్క రకముగా మనుషులు ఏమాత్రము గుర్తించనట్లు వ్యాపించియున్నవి. ఉదాహరణకు హిందూ (ఇందూ) మతములో నాలుగు అధర్మములు నాలుగు రకముల కార్యాచరణలలో ఉండగా, ఇవే నాలుగు అధర్మములు మరొక మతమునందు మరొక కార్యాచరణలు కలిగి ఇవి అధర్మములని ఎవరూ గుర్తించలేని విధముగా కలిసిపోయినవి. ఇస్లామ్మతములో ఇబ్లీస్ (సైతాన్) అనీ, క్రైస్తవమతములో సాతాన్ అని అధర్మములను అనుచుండినా, హిందూ మతములో మాయ అని అనుచుండినా అన్ని మతములలో వేరువేరు పోకడలు కలిగియుండుట వలన అధర్మములను సులభముగా ఎవరూ గుర్తించలేరని చెప్పవచ్చును. అధర్మములు ఎన్ని మతములలో ఉండినా దేవున్ని తెలియకుండా చేసి, దేవునికి దూరముగా పంపడమే పనిగా ఉన్నవి. అలాగే ధర్మములు దేవున్ని తెలియునట్లు చేసి దేవునికి దగ్గరగా తేవడమే పనిగా ఉన్నవి.
---
వాస్తవముగా చెప్పాలంటే నాలుగు అధర్మములు నాలుగు కూృర మృగములుగా భూమండలమను అడవిలో విచ్చలవిడిగా తిరుగుచున్నవని చెప్పవచ్చును. నాలుగు కూౄరమృగములు రాజ్యమేలు అడవిలోనికి మూడు సాధుజంతువులైన ఆవులను పంపితే ఎంత ప్రమాదమో చెప్పనవసరము లేదు. నాలుగు కూౄరమృగములున్న అడవిలోనికి పోయి అడవిలో పెరిగిన గడ్డిని నా ఆవులకు మేతగా ఇచ్చి, అడవిలో పెరిగిన గడ్డిని లేకుండా చేస్తానని ఒక వ్యక్తి అనుకొన్నాడట. ఆ అడవిలో మృగములుండుట వలన గడ్డిని తినే చిన్నచిన్న జంతువులు, జింకలు, కుందేళ్ళలాంటివి ఏవీ బ్రతకడము లేదు. అందువలన అడవిలో గడ్డి విపరీతముగా పెరిగి పోయింది. ఒకడు తన మూడు ఆవులను తీసుకొని అడవిలోనికి పోతే కూౄరమృగాలు తనమీద, తన ఆవుల మీద దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లుకాకపోతే గడ్డి అయిపోదు, ఆవులు బ్రతకవు.
కూౄరమృగములున్న అడవిలోనికి ఆవులుగానీ, ఆవులను కాచువాడు గానీ వస్తే ఎంత ప్రమాదమో తెలిసిన భగవంతుడు, తన మొదటి జన్మలో అడవిలోనికి ఒక్కమారు వచ్చి, తన ఆవులకు గడ్డిని చూపించి వెంటనే బయటికిపోయాడు. అడవిలోనికి ఆవులను తోలుకొనిపోయాను అని అనిపించుకొన్నాడు. అయితే అక్కడి ప్రమాదము గుర్తించిన ఆయన అడవిని ఆవులకు చూపించి వెంటనే వెనుతిరిగి రావడము జరిగినది. ఒకమారు పోయినందున అడవిలో గడ్డిని కోయలేదు, ఆవులను మేపనూ లేదు. పశువులకాపరి ఒకమారు అడవిలోనికి పోయివచ్చినా అడవి మొదట ఎట్లున్నదో అట్లే ఉన్నది. మొదట పోయినపుడు ఆవులను మేపనేలేదు. అందువలన ఎట్లున్న గడ్డి అట్లే ఉన్నది. ఆవుల కాపరి తన పథకము ప్రకారము మూడుమార్లు అడవిలోనికి పోయి మొత్తము గడ్డినంతటిని తన ఆవులచేత మేపించి లేకుండా చేయాలి. అయితే ఒకమారు ఆవుల కాపరి అడవిలోనికి తన ఆవులను తీసుకొని పోయి వెంటనే వెను తిరిగి వచ్చాడు. ఒక్కమారు అడవిలోనికి పోయినందుకు ఆవులు గడ్డిని చూచాయి. అంతతప్ప ఏమీ జరుగలేదు. కొంతకాలము జరిగి పోయింది. తర్వాత పశువుల కాపరి రెండవమారు అడవిలోనికి పోయి గడ్డిని మేపే పనిని చేయాలనుకొన్నాడు.
రెండవమారు తన ఆవులను అడవిలోనికి తీసుకొని పోయి అడవిలో తిరుగుచూ గడ్డిని మేపను మొదలుపెట్టాడు. కేవలము మూడు రోజులు నిరాటంకముగా ఆవుల చేత గడ్డిని మేపాడు. మూడురోజులకు మూడు ఆవులు కడుపునిండా గడ్డిమేసినా కొద్ది గడ్డిమాత్రము అయిపోయింది. గడ్డి అంతా అయిపోవాలంటే కనీసము ఆరునెలల కాలమైనా పట్టును. అంతలోనే నాలుగు కూౄర జంతువులు మూడు ఆవులను, ఆవుల కాపరిని పసిగట్టాయి. పశువుల కాపరి తన పశు వులకు కాపలాగా ఉన్నాడు కాబట్టి మృగములు ఆవుల మీద దాడిచేయుటకు అవకాశములేదు. మృగములు దాడిచేస్తే ముందు కాపరి మీదనే దాడి చేయాలి. కూౄరమృగములు కాచుకొని మొదట పశువుల కాపరిమీద దాడిచేశాయి. ఆ దాడిలో కాపరి కొంతవరకు గాయపడి మరణించాడు. కాపరి మీద దాడి జరిగినప్పుడు మూడు ఆవులు పారిపోయి అడవి బయటికి వచ్చి ఇళ్ళు చేరుకొన్నాయి. కాపరిమీద దాడిచేసిన మృగములు మరణించిన కాపరిని వదలి ఆవులకోసము వెదకసాగాయి. అయితే ఆవులు వాటికి దొరకలేదు. ఆవుల కాపరి కూౄరమృగముల దాడికి మరణము పొందినది వాస్తవమే అయినా, అది పూర్తి మరణముకాదు. మూడు మరణములలో ఒకటైన తాత్కాలిక మరణమును పొందిన దానివలన, కాపరి రెండు రోజుల తర్వాత మూడవ రోజు తిరిగి సజీవమైనాడు. సజీవముగా అడవిలో లేచిన తర్వాత తిరిగి ఊరిలోనికి వచ్చాడు. మొదటి మారు పోయినపుడు అడవిలో కూృర మృగములున్నవని తెలిసి వెంటనే వెను
---
తిరిగిరాడము జరిగినది. రెండవ మారు తగిన పథకముతో పోయినా మృగములు దాడి చేయడము జరిగినది. అయినా ఆవులకు ఏమీ కాలేదు. కొంతకాలము గడచిపోయినది. పశువుల కాపరి మూడవమారు మంచి ఊహ రచనతో తన ఆవులను అడవిలోనికి తీసుకొని పోవాలనుకొన్నాడు.
మూడవమారు పశువుల కాపరి తన మూడు ఆవులను తీసుకొని అడవిలోనికి పోవడము జరిగినది. అయితే ఈ మారు కాపరి ఒక పెద్ద వ్యూహముతో అడవిలోనికి పోవడము జరిగినది. తన వ్యూహము ప్రకారము తన ఆవులు సాధు జంతువులు కాదు, అవి కూడా కూృర మృగములే అన్నట్లు ఆవులకు పులిచర్మములను కప్పి, అచ్చము పులిమాదిరి కనిపించు నట్లు తయారు చేశాడు. పులి వేషములోనున్న ఆవులను చూచి మిగతా కూౄర జంతువులన్నీ భయపడి ప్రక్కకు పోయేవి. అలా మిగత కూర జంతువులు తన ఆవులకు భయపడిపోవడము వలన, ఆవులు సులభముగా నిర్భయముగా గడ్డిని మేయసాగాయి. ఇప్పుడు కాపరి ఆవులవద్ద ఉండి కాపల కాయవలసిన పనిలేదు. అందువలన ఆవుల కాపరి తాను ఆవుల కాపరి కాదన్నట్లు ఆవులకు దూరముగా ఉండెను. అలా తన ఆవులకు దూరముగా ఉండి ఆవులను చూచుకొనుచుండినప్పటికీ, తనను ఇతర కూర మృగములు గుర్తించకుండా ఆకులుగల చెట్ల కొమ్మలను దేహమంతా కట్టుకొన్నాడు. అలా ఆకులతో నిండిన కొమ్మలను శరీరమునకు కట్టు కోవడము వలన కాపరి ఒక చిన్నచెట్టువలె కనిపిస్తున్నాడు. ఎక్కడైనా ఏ కూౄరమృగమైనా ఎదురుపడినా కదలకుండానున్న కాపరిని చూచి అవి అతనిని ఒక చెట్టు అని అనుకొనెడివి. ఎదురుపడినా ఏవీ ఆయనను గుర్తించేవి కావు. ఈ విధముగా తన ఉద్దేశమును అమలుపరిచాడు. దానివలన మూడవమారు కొంతకాలము నిరాటంకముగా ఆవులు గడ్డిని మేయగా అడవిలో గడ్డి తగ్గిపోయింది.
*ఏ
మూడుమార్లలో అడవిలోని గడ్డినంతటిని తన ఆవుల చేత మేపి లేకుండా చేయాలనుకొన్న పసువుల కాపరి పథకము ఫలించినది. ఒకమారు కాపరి అడవిలోనికి వచ్చి వెంటనే వెళ్ళిపోవడము జరిగినది. రెండవమారు అడవిలోనికి వచ్చి కూౄరమృగముల చేత హింసింపబడడము జరిగినది. మూడవమారు తగిన వ్యూహముతో వచ్చిన గోవులపాలకుడు తన ఉద్దేశమును నెరవేర్చగలిగాడు. భూమిమీద తన ధర్మములను ప్రతిష్ఠించి, అధర్మములను లేకుండా చేయాలనుకొన్న భగవంతుడు ద్వాపరయుగములో గోపాలునిగా వచ్చినపుడు ఎవరికీ తెలియకుండా, ఎవరూ వినకుండా రహస్యమని అర్జునునికి ఒక్కమారు మాత్రమే చెప్పి తర్వాత ఎవరికీ చెప్పకుండా పోయాడు. మొదట వచ్చినట్లు పూర్తిగా తెలిసింది. కానీ రెండవమారు కూడా వచ్చినట్లు ఎవరూ ఒప్పుకోకపోయినా, మాకు మాత్రము తెలిసిందనుకొంటున్నాము. పశు వులకాపరి రెండవమారు వచ్చి మృగముల చేతిలో హింసకు గురియైనట్లు, రెండవమారు వచ్చినవాడు కూడా అలాగే కొంతకాలమునకు అజ్ఞానుల చేతిలో, అధర్మవరుల చేతిలో హింసకు గురియైనట్లు కొంత అర్థమైనది. ఇక మూడవమారు భగవంతుడు క్రొత్త పథకముతో భూమిమీదికి వచ్చి అధర్మములను లేకుండా చేసి ధర్మములకు ముప్పులేకుండా చేస్తాడని అనుకుందాము. మూడవమారు వచ్చినపుడు పశువుల కాపరివలె అజ్ఞాన మృగములనుండి తననుతాను కాపాడుకొనుచు. అధర్మమను గడ్డిని తన ధర్మములచేత లేకుండా చేయునని అనుకొంటున్నాము.
దేవుడు భూమిమీద అధర్మములను పూర్తిగా లేకుండా చేయుటకు త్రైతసిద్ధాంతము ప్రకారము మూడుమార్లువచ్చి, ఆయన కూడా ఈ లోకములో ఎంతో శ్రమపడి, తన ధర్మములను ఆయన నెలకొల్పిపోయాడు. దేవుడు ధర్మములను
---
మనుషులకు తెల్పుటకు ఎంతో శ్రమపడితే, దేవున్ని తండ్రిగా మనము భావించినపుడు తండ్రి పనిని కుమారుడు చేయకుండా ఉండునా! మనలను సృష్టించిన మన తండ్రియైన దేవుని ధర్మములను మనము ప్రచారము చేయుట మన కర్తవ్యముగా భావించవలెను. బాధ్యత గల కొడుకు తండ్రిపనిని చేసినట్లు నేను దైవధర్మములను సాటి మనుషులకు తెలియజేయాలనుకొన్నాను. అడవిలోనికి పోయి పశువులను మేపుట ఎంత కష్టమో, అంతే కష్టమైన పనికి పూనుకొన్నాను. ఇంతవరకు కొన్ని అధర్మము లను తెలిపాము. అలా తెల్పడము వలన మృగములవలెనున్న కొందరి అజ్ఞానులతో ఇబ్బంది కలిగినా, చివరికి ఏమైనా దేవునిమార్గములోనే నిలబడి దేవుని పనినే చేయాలనుకొంటున్నాను. కాబట్టి బయటి సమాజములో ఇంకా మిగిలియున్న అధర్మములను గురించి వివరించుకొని చూస్తాము.
భూమిమీద దానమును ఎవడూ చెడు పనిగా అనుకోడు. దానము మంచి పనిగా ఉన్నది. దానము చేస్తే దాని ఫలితముగా పుణ్యము వస్తుంది. అయితే మోక్షము రాదు. అందువలన దానమును ప్రపంచ కార్యములలోనికి చేర్చడమైనది. దానమును గీతలో దేవుడు అధర్మముగా పేర్కొన్నాడు. యజ్ఞములను ఆచరించనివారూ, వేదములను పఠించనివారూ, తపస్సులను చేయనివారూ మనుషులలో దాదాపు 90 శాతము ఉందురు. మేము జ్ఞానులము, జ్ఞానమును బాగా తెలిసినవారమనుకొను వారందరూ యజ్ఞము లను, వేదములను, తపస్సులను ఆచరించుచుండగా, అంతటి స్థాయి జ్ఞానములేని వారందరూ దానములను చేయుచూ దానినే ధర్మమను కోవడము జరుగుచున్నది. యజ్ఞ, వేద, తపస్సులు ఇతర మతములలో లేకున్ననూ దానము మాత్రము అన్ని మతములలోనూ ప్రాకియున్నది. ప్రతి మతములోను బీదలకు దానము చేయుట కర్తవ్యముగా పెట్టుకొన్నారు. హిందూ (ఇందూ) మతములో తప్ప ఏ మతములోను దానమును అధర్మమని ఎవరూ చెప్పలేదు. అదియూ భగవద్గీతలోనే దానమును అధర్మములలో నాల్గవ దానిగా పేర్కొన్నారు. భగవద్గీతలో దానము అధర్మమని చెప్పినా ఆ విషయము ఎవరికీ తెలియదు. అందువలన పెద్ద స్వామీజీలు మొదలు కొని సాధారణ వ్యక్తి వరకు దానములను చేయుచున్నారు. కొందరైతే దానమునే ధర్మముగా పోల్చుకొని, దానము చేయండి అను మాటకు బదులు ధర్మము చేయండి అని అనడము జరుగుచున్నది. దానము చేయుట వలన పుణ్యము, పుణ్యము వలన సుఖములు వస్తాయని నేను వాస్తవ జ్ఞానమును చెప్పితే, దానిని వినకుండ కొందరు దానము చేస్తే మోక్షము వస్తుందని చెప్పుచున్నారు. దానము భక్తిమార్గములో యజ్ఞ, వేద, తపస్సులవలె ఆరాధన మార్గము కూడా కాదు. అందువలన అంతో ఇంతో తెలిసిన వారందరూ యజ్ఞ, వేద, తపస్సులను ఎంచుకొని, ఈ మూడు ఆరాధనలు చేయువారికి మిగతవారు దానము చేయండి అని చెప్పారు. యజ్ఞ, వేద, తపస్సులను చేయువారు పది శాతము మంది ఉండగా, మిగతా 90 శాతము మందికి దానమును అంటగట్టారు. బ్రహ్మజ్ఞానము తెలిసినవారు యజ్ఞ, వేద, తపస్సులను చేయుచుందురు. వారు వేరు పనిని చేసి ధనమును సంపాదించరు. కావున ఈ పనులను చేయని 90 శాతము మంది అయిన శూద్రులు, బ్రాహ్మణులకు దానము చేయవలెనని బోధించడము జరిగినది. అలా ప్రచారము కావడము వలన వేద, యజ్ఞ, తపస్సులను చేయు బ్రాహ్మణు లకు మిగతా శూద్రులు దానము చేయవలెననీ, దానము చేయుట శూద్రులకు తప్పనిసరియని కొందరు చెప్పడము జరిగినది.
అధికముగా డబ్బులున్నవారు సమాజసేవయని అనేక రకముల దానములను చేయుచున్నారు. యజ్ఞములు చేయువారు, వేదములను పఠించువారు, తపస్సులు చేయువారు, ఆర్థికముగా వెనుకబడియుండగా మిగతావారు చాలామంది ఆర్థికముగా బాగుండి, సమాజ సేవయను పేరుతో అనేక రకములుగా తమ డబ్బును దానరూపములో
---
ఖర్చు చేయుచున్నారు. దానము అను పేరుతో చేయు పని ఏదైనా అది పుణ్యమును తెచ్చి పెట్టునదే. దానము మనిషికున్న 12 గుణములలో ఒకటిగానున్నది. ఆశ అను గుణమునకు వ్యతిరేఖ గుణముగా ఉండుటవలన ఆశకు పాపము వస్తే, దానమునకు పుణ్యము వస్తున్నది. దానము ఒక గుణమైన దానివలన అది ధర్మము కాదని మనము కూడా చెప్పవచ్చును. అధర్మములలో చివరిదైన దానమును గురించి తెలుసుకొన్నాము. ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. కొందరు ధనికులు సమాజ సేవకుగానీ, ఇతరులకుగానీ దానముగా తమ డబ్బును ఇవ్వకుండ, తిరుపతి వెంకటేశ్వరస్వామికి గానీ, మరి ఏ ఇతర దేవతలకుగానీ హుండీలో కొన్ని లక్షలు వేయడము జరుగుచున్నది. అది మనుషులకు కాకుండా దేవతలకు ఇచ్చిన దానమగును కదా! అటువంటి దానమునకు ఏ ఫలితముండునని అడుగవచ్చును. దానికి మా జవాబు ఇలా కలదు. బయట మనుషులకు ఇచ్చినా, గుడిలోని దేవునికి ఇచ్చినా అది దానమే అగును. దానివలన పుణ్యమే వచ్చును. గుడిలోనివారు దేవతలే గానీ దేవుడుకాదు. కావున దానివలన జ్ఞానమురాదు. మోక్షమూ రాదు. నాలుగు అధర్మములలో మూడు ఒక గుంపునకు సంబంధించినవికాగా, దానము ఒకటి మాత్రము ప్రక్కన ఒకటిగా ఉన్నది. అధర్మములలోని ఒక గుంపుగానున్న యజ్ఞ, వేద, తపస్సులను ఎక్కువ ఒక వర్గమువారే ఆచరించగా ప్రత్యేకముగానున్న దానమును అన్ని వర్గములవారు ఆచరించుచున్నారు.
ఇంతవరకు మూడు ధర్మములని చాలామార్లు చెప్పుకొనినా, వాటి వివరము తెలియదు. వాటి వివరమును ఇప్పుడు చెప్పుకొందాము. అధర్మములలో మూడు ఒక భాగముగా, ఒకటి ఒక భాగముగా మొత్తము రెండు భాగములుగా ఉన్నవని చెప్పుకొన్నాము. అలాగే మూడు ధర్మముల విషయానికి వస్తే మొదటి రెండు ఒక భాగముగా, చివరిది ఒకటి ఒక భాగముగా మొత్తము రెండు భాగములుగలవని చెప్పవచ్చును. భగవద్గీతలో దేవుడు చెప్పిన ధర్మములలో ఒకటి కర్మయోగము, రెండవది బ్రహ్మయోగము. భగవద్గీతలో ముఖ్యముగా చెప్పినవి ఈ రెండు ధర్మములే, వీటికంటే భిన్నమైనది మూడవది కలదు. దానిని భక్తియోగము అంటాము. భగవద్గీతను పిండి చూస్తే ముందు కనిపించునవి కర్మయోగము, బ్రహ్మ యోగము. ఈ రెండు యోగములు ధర్మములతో కూడుకొన్నవై ఉన్నవి. ఇక మూడవ భక్తియోగము అనునది ధర్మాతీతమైనదని చెప్పవచ్చును. ఒక విధముగా చెప్పవలెనంటే కర్మ, బ్రహ్మయోగములకంటే భక్తియోగమనునది కష్టమైనదని చెప్పవచ్చును. ఇంతవరకు ధర్మములని ఇప్పుడు యోగము లని చెప్పుచున్నారేయని అనుకోవద్దండి. ధర్మముల వలన ఏర్పడినవే యోగములు. కావున యోగములనినా, ధర్మములనినా ఒకటేనని గ్రహించవలెను. దేవుని ధర్మములైన మూడు యోగములను వివరముగా చెప్పుకొందాము.
భూమిమీద గల ఏ మనిషి అయినా దేవునివద్దకు పోవాలంటే ధర్మములనబడు ఈ మూడుమార్గములు తప్ప ఇతర దారిలేదు. మనిషి అనువాడు ఏ మతములో ఉండినా, ఆ మత గ్రంథములలో కూడా ఇవే ధర్మములు చెప్పబడియున్నాయి. ఇతర మతముల వారికి వారివారి గ్రంథములలోని జ్ఞానము పూర్తిగా అర్థముకాలేదని చెప్పవచ్చును. ఇతర మత మూలగ్రంథములను నేను చదివిచూడగా భగవద్గీతలో చెప్పిన జ్ఞానమునకు ఆ గ్రంథములలోనున్న జ్ఞానమునకు ఎక్కడగానీ కొద్దిమాత్రము కూడా తేడాలేదు. అందువలన ఏ మతమువాడైనా దేవున్ని తెలియుటకు మూడు ధర్మములను తెలిసివుండాలి. మనిషి ముక్తిపొందాలంటే మూడు ధర్మములలో ఏ ఒక్క ధర్మమును అనుసరించినా వాడు ముక్తి పొంది దేవునివద్దకు చేరిపోవును. ముక్తిని పొందుటకు మూడు ధర్మములను అనుసరించవలసిన పనిలేదు. అన్ని మతములకు ఒకే దేవుడు, ఒకే ధర్మము అను పద్ధతి ప్రకారము దేవుని ధర్మములు అన్ని మతములకు వర్తించునవిగా ఉన్నవి. అన్ని
---
మతముల వారికి శరీరములు ఒక్కటే, అందులోని భాగములు ఒక్కటే. ఆ భాగములకు సంబంధించిన పనులు ఒక్కటే. అటువంటపుడు దేవుని ధర్మము శరీరములోని ఒక భాగముతో సంబంధముంటే, అది అన్ని మతములవారికి ఒకే విధముగా ఉండును. కొన్ని మతములలో జ్ఞానమును స్థూలముగా తప్ప సూక్ష్మముగా అర్థము చేసుకొను శక్తిలేదు. అటువంటి వారు వారి మత గ్రంథములలో దేవుడు చెప్పిన జ్ఞానమునకు చాలా దూరముగా ఉందురు. అటువంటి వారికి దేవుని జ్ఞానము అర్థముకాక, మా జ్ఞానము వేరు మీ జ్ఞానము వేరు అని చెప్పుచుందురు. దేవుని జ్ఞానము ఎక్కడైనా ఏ మతములోనైనా ఒక్కటిగానే ఉన్నట్లు మాకు కనిపిస్తుండగా వారికి అవగాహనశక్తి లేక వేరువేరుగా కనిపిస్తుంది. భగవద్గీతలోని జ్ఞానము సృష్ఠి ఆదిలోనే దేవుడు స్వయముగా చెప్పినది, ఆనాడు ఏ మతములేదు. అందువలన మనుషులకు వర్తించు జ్ఞానమును దేవుడు చెప్పాడుగానీ, మతములకు వర్తించు జ్ఞానమును చెప్పలేదు.
కర్మయోగమనీ పేరుపెట్టబడినది ఒక ధర్మముకాగా, బ్రహ్మ యోగమని పేరు పెట్టబడినది మరియొక ధర్మము
కలదు. ఈ రెండు ధర్మముల ద్వారానే దేవుడు తెలియాలి. ఈ రెండు యోగములను హిందూ (ఇందూ) ధర్మములుగా భగవద్గీతలో చెప్పియున్నారు. అయితే ఇవియే ఇతర మతములలో ఉండినప్పటికీ అక్కడ ఈ పేర్లు లేవు. అందువలన అవి వేరు ఆరాధనలని మిగతా మతములవారు అనుకోవడము జరుగు చున్నది. ఇక మూడవదైన భక్తియోగము కర్మ, బ్రహ్మ అను రెండు ధర్మములకు అతీతమైనది. ఇది కూడా మిగతా మతముల గ్రంథములలో ఉన్నది. కొన్ని మతములలో కర్మయోగము ఎక్కువగా, బ్రహ్మయోగము తక్కువగా చెప్పబడియుండగా, కొన్ని మతములలో కర్మ, బ్రహ్మయోగముల కంటే భక్తియోగము ఎక్కువగా చెప్పబడియున్నది. ఒక మతములో కర్మ యోగము, భక్తియోగము ఉండగా బ్రహ్మయోగము మచ్చుకైనలేదు. ఈ విధముగా గీతలో చెప్పిన యోగములనబడు మూడు ధర్మములు ఇతర మతములలో ఎక్కువ తక్కువగా చెప్పబడివున్నవని తెలియవలెను. కొన్ని మతములలో ఒకే ధర్మముండి మిగతా రెండు ధర్మములు లేకున్నవి. ఒకే ధర్మము ద్వారానైనా మోక్షము పొంది దేవున్ని చేరవచ్చును. కావున అదేమి తక్కువ మతమని చెప్పుటకు వీలులేదు. భూమిమీద ఎన్ని మతములుండినా వాటన్నిటిలో ఒకటిగానీ, రెండుగానీ, మూడుగానీ ధర్మములున్నవి. బహుశ మూడు ధర్మములున్న మతము ఒక్క హిందూ (ఇందూ) మతమనియే చెప్పవచ్చును.
ఇందూ (హిందూ) మతములో ఎక్కువ ఆధ్యాత్మికముకలదని చెప్పవచ్చును. ఆధ్యాత్మికము అనగా ఆత్మను ఆధ్యాయణము చేయడమని అర్థము. ఆత్మ శరీరములో ఉంటుంది. ప్రస్తుత కాలములో ఆత్మంటే ఏమిటో, ఆధ్యాత్మికము అంటే ఏమిటో తెలియని స్థితిలో హిందువులున్నారు. ఆత్మయను మాట ఎన్నో సందర్భములలో వాడుచున్నప్పటికీ దాని నిజ స్వరూపమును తెలియనివారు ఆత్మ అంటే దయ్యమనియో, లేక దేవుడనియో అర్థము చేసుకొంటున్నారు. వాస్తవానికి ఆత్మయనునది దేవుడూకాదు, దయ్యముకాదు. శరీరములో ముఖ్యమైనది ఆత్మ, దాని తర్వాత జీవాత్మ, దాని తర్వాత బుద్ది, మనస్సు, చిత్తము, అహము అనునవి కలవు. మానవుని శరీరము ఏ మతములోఉండినా దానియందు మొత్తము పని చేయు భాగములు 26 గలవు. ఆత్మను మినహాయిస్తే 25 భాగములు గలవు. భగవద్గీతలో గానీ, ఇతర మతగ్రంథములలోగానీ చెప్పిన ధర్మములను ఆచరించుటకు శరీరములోని భాగములను ప్రతి మనిషి తెలిసివుండాలి. పైన చెప్పుకొన్న ఆత్మ, జీవాత్మ, బుద్ది, మనస్సు, చిత్తము, అహము కంటికి కనిపించునవి కావు. అవి కనిపించక శరీరములో ఉండి పని చేయుచున్నవి. దేవుడు చెప్పిన ధర్మములకు, శరీరములోని సూక్ష్మమైన భాగములకు సంబంధమున్నది. ఒక వ్యక్తి కర్మయోగము అను ధర్మమును ఆచరించుటకు శరీరములో తానొక జీవుడనని ముందు తెలియాలి. తర్వాత
---
తనతో పాటు శరీరములో మరికొన్ని భాగములున్నవని తెలియాలి. తన శరీరములో ఏ భాగము ఏ పనిని చేయుచున్నదని కూడా తెలిసివుండాలి. అన్నిటికంటే ముఖ్యముగా శరీరములోని ఆత్మపాత్ర ఏమిటో తెలిసివుండాలి.
శరీరములోనే మూడు ధర్మములు ఆచరణకు వచ్చుచున్నవి. కావున శరీర భాగముల విషయమంతా తెలియకపోతే ధర్మాచరణయే తెలియకుండా పోవును. శరీరములో ఏమి జరుగుచున్నదో తెలియనివాడు శరీరముతో ఏ యోగమును చేయలేడు. అందువలన ఏ మనిషి అయినా తాను జ్ఞాని కావాలనుకొంటే ముందు శరీరాంతర్గత భాగములనూ, వాటి కార్యములనూ తెలియాలి. అట్లు తెలియనివాడు ఏ మతములో ఉండినా ఆ మత ధర్మమును ఆచరించలేడు, దేవున్ని తెలియలేడు. అందువలన తెలిసిన పెద్దలు పద్యరూపములో ఈ విధముగా చెప్పారు.
ఆటవెలది : పంచతత్త్వములను పంచీకరించక
మంచి యతులమన్న మాటలన్న
కుంచమందు గజము గ్రుడ్డుపెట్టిన విధంబు
అఖిల జీవసంగ ఆత్మలింగ.
భావము :- పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి వాటిచేత పుట్టిన శరీరమును విడదీసి, అందులో ఏయే భాగములు ఏయే పనిని చేయుచున్నవో తెలియకుండా, నేను బాగా తెలిసిన జ్ఞానినని అనుకుంటే గంపక్రింద ఏనుగు గ్రుడ్డు పెట్టిందని చెప్పినట్లుండును. అనగా ఏనుగు గంపక్రింద గ్రుడ్డు పెట్టడము ఎంత అసత్యమో తాను జ్ఞానిని అనుకోవడము కూడా అంతే అసత్యమగును.
కంటికి కనిపించని సూక్ష్మమైన దేవున్ని తెలియాలి అంటే ముందు శరీరములోనున్న నీవు కూడా సూక్ష్మముగానే ఉన్నావని తెలిసి ఉండాలి. తర్వాత కంటికి కనిపించని మనస్సును గురించి, బుద్ధిని గురించి, అహమును గురించి తెలిసివుండాలి. కర్మయోగమును ఆచరించాలి అంటే శరీరములోని అహము యొక్క వృత్తాంతమంతయు తెలిసివుండాలి. అహము శరీరములో ఎక్కడున్నదో, ఏమి చేయుచున్నదో, ఏ ఆకారముతో ఉన్నదో దానికి సంబంధించిన సమాచారమునంతటిని తెలిసివుండాలి. అహము యొక్క సంగతి తెలియనప్పుడు కర్మయోగమును ఎవడూ ఆచరించలేడు. అహమును ఒక ప్రక్కన తెలిసి, మరొక ప్రక్కన ఆత్మను తెలిసినవాడు కర్మయోగమును సులభముగా ఆచరించవచ్చును. అలాగే బ్రహ్మయోగమును ఆచరించాలి అంటే శరీరములోని మనస్సుయొక్క సమాచారమంతయు తెలిసివుండాలి. మనస్సు శరీరములో ఎక్కడున్నదో, ఏమి చేయుచున్నదో, ఏ ఆకారముతో ఉన్నదో, మొత్తము దాని వృత్తాంతమంతా తెలిసివుండవలెను. మనస్సుయొక్క సంగతి తెలియనప్పుడు బ్రహ్మయోగమును ఎవడూ ఆచరించ లేడు. మనస్సును మరియు శరీరములోని ఆత్మను తెలిసినవాడు బ్రహ్మ యోగమును సులభముగా సాధించవచ్చును. కర్మయోగము మరియు బ్రహ్మయోగము యొక్క సమాచారము తెలిసింది కదా! ఇప్పుడు ధర్మాతీతమైన భక్తియోగమును గురించి చెప్పుకొందాము.
భక్తియోగము ఒక విధముగా కర్మ, బ్రహ్మయోగములకంటే గొప్పదనియే చెప్పవచ్చును. ఎందుకనగా కర్మ, బ్రహ్మయోగములు రెండు ధర్మములతో కూడుకొనియున్నవి. కర్మ, బ్రహ్మయోగములను అతిక్రమించిన ధర్మము భక్తియోగమని చెప్పవచ్చును. ముందు కర్మ, బ్రహ్మ యోగ ధర్మములను తెలిసి, వాటిని పరిత్యజించిన తర్వాత
---
వచ్చునది భక్తి యోగము. మొదట కర్మ, బ్రహ్మయోగములు తెలియనిదే భక్తియోగము అర్థము కాదు. కర్మ, బ్రహ్మయోగములకంటే వేగముగా భక్తియోగమున ముక్తిని సాధించవచ్చును. కర్మయోగమును సాధించుటకు అహమునూ, బ్రహ్మ యోగమును సాధించుటకు మనస్సునూ తెలిసినట్లు, భక్తియోగమును సాధించుటకు శరీరములోని బుద్ది ని గురించి పూర్తిగా తెలిసివుండవలెను. భగవద్గీతలో చెప్పబడిన మూడు ధర్మముల విషయము చెప్పుకొనుటకు చాలా సులభముగా ఉన్నది. అయితే ఆచరించుటకు చాలా కష్టమనియే చెప్పవచ్చును. ఎందుకు కష్టమనగా ఒక్కొక్క యోగమును ఆచరించుటకు శరీరములోని ఒక్కొక్క సూక్ష్మమైన అవయవమును గూర్చి తెలిసివుండాలి. బయట కనిపించు పది ఇంద్రియములను సులభముగా చెప్పగలుగు మనిషి, తన శరీరములోపలనున్న సూక్ష్మ అంతరంగములైన మనస్సును, బుద్ధిని, అహమును, ఆత్మను తెలియలేకున్నాడు. వాటిని గురించి తెలియుటకు శరీరాంతర్గత జ్ఞానమును తెలిసివుండాలి. ఈ కాలములో అందరూ బయట జ్ఞానము కలిగియున్నారుగానీ, శరీరము లోపల జ్ఞానమును ఎవరు తెలియ లేకున్నారు. అందువలన శరీరములోని అంతరంగములతో ముడిపడియున్న యోగములు అందరికి కష్టముగా మారియున్నవి.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! మీరు శరీరములో చేయు మూడు యోగములను ధర్మములని చెప్పారు. తర్వాత నాలుగు అధర్మములను కూడా చెప్పారు. అయితే ఇటు ధర్మము కాకుండా, అటు అధర్మము కాకుండా చేయు పనులు కొన్ని ఉన్నవి. వాటిని గురించి మీరేమంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక దేవాలయమును కట్టించాడు, ఆ దేవాలయములో ప్రతి దినము వందమంది దేవున్ని దర్శించుకొని పూజించి పోవుచున్నారు. ఇక్కడ దేవాలయమును కట్టించిన మనిషి ఒకడు, అందులో మ్రొక్కేవారు వందమంది ఉన్నారు కదా! వీరిరువురు దేవునికి సంబంధించిన కార్యమునే చేయుచున్నారు కదా! ఇప్పుడు వీరిది ధర్మము కాదంటామా? అధర్మమంటామా? అని అడిగారు. దానికి మా జవాబు ఇలాగ ఉన్నది. వీరు ఇరువురు చేసినది దైవ సంబంధమని అనుకొనినా ఈ రెండు కార్యములు ఇటు ధర్మములలోగానీ అటు అధర్మములలోగానీ లేవు. అందువలన ఈ రెండు పనులను ధర్మములనిగానీ, అధర్మములనిగానీ చెప్పలేము. అయితే ధర్మములు అధర్మములు గాని విషయములన్నిటిని మంచిపనులని కొన్నిటినీ, చెడు పనులని కొన్నిటిని విడదీసి చెప్పగలము. దేవాలయమును కట్టించడము మరియు అక్కడున్న దేవునికి మ్రొక్కడము రెండు మంచి పనుల క్రిందకే వచ్చును. మంచి పనులైన దానివలన వాటి ఫలితముగా పుణ్యము వచ్చును. పుణ్యమువచ్చుట వలన దానిని అనుభవించుటకు మరల పుట్టవలసి వచ్చును.
అధర్మములైన యజ్ఞ, వేద, తపస్సు, దానములను చేసినపుడు వాటివలన పుణ్యము వచ్చునని అక్షరపర బ్రహ్మయోగము 28వ శ్లోకమున చెప్పబడియున్నది. అధర్మములైన నాలుగు కార్యముల వలన పుణ్యము వచ్చుచున్నది. అలాగే దేవాలయము కట్టడము, మ్రొక్కడము వలన పుణ్యమే వచ్చుచున్నది. అందువలన రెండు రక కార్యములు ఒకే ఫలితమును ఇస్తున్నవి. పుణ్యమువచ్చు కార్యములైనా వాటివలన దేవుడు తెలియబడడు కావున వాటిని కూడా అధర్మముల క్రిందకే జమ చేయుచున్నాము. దేవుడు చెప్పిన నాలుగు అధర్మముల కార్యములు కూడా చెడు కార్యములేవీ కావు కదా! అందువలన వాటిని పుణ్య కార్యములని చెప్పవచ్చును. ముఖ్యముగా చెప్పుకొంటే ధర్మకార్యములు కూడా మంచి కార్యములే అయినా, వాటివలన పుణ్యమురాదు. ధర్మకార్యముల వలన కర్మకు అతీతమైన ముక్తి లభించును. ప్రపంచములోని మంచి పనులలోనికి అధర్మ కార్యములైన నాలుగు పనులు కలిసిపోవుచున్నవి. అయితే ధర్మకార్యములైన మూడు యోగములు ఎటువంటి ప్రపంచ పనులలో కలిసి పోకుండా, ప్రత్యేకముగా ఉండి ప్రత్యేకమైన ఫలితము నిచ్చుచున్నవి.
---
మనుషులు తమ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ తమ ప్రవర్తన ధర్మ బద్దమైనదని అనుకోవడము జరుగుచున్నది. భూమిమీద ఎన్నో మతములు గలవు. వాటి ప్రత్యేకత కొరకు, ఇది ఫలానా మతమని ఇతరులు తెలియుటకు ఆయా మతములకు కొన్ని సాంప్రదాయములను ఏర్పరచుకొనివుంటారు. అటువంటి మత సాంప్రదాయములను ధర్మములని కొందరనుకోవడము జరుగుచున్నది. వారి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ తమ ప్రవర్తన ధర్మబద్ధ మైనదనుకోవడమూ, మత ఆచారములను ధర్మములనుకోవడమూ, మత రక్షకులను ధర్మరక్షకులనుకోవడమూ, పెద్ద పొరపాటు. ధర్మము ఒక మత సాంప్రదాయమునకు సంబంధించివుండదు. అలాగే వారివారి ఆచరణలకు సంబంధించి ఉండదు. ఒక సన్న్యాసి కాషాయవస్త్రము ధరించడము సాంప్రదాయము కావచ్చును, ధర్మముకాదు. ధర్మము కాలానుగుణముగా మారునది కూడాకాదు. ధర్మమును మనుషులు నిర్ణయించలేరు. దేవుడు సృష్టించి దేవుడే తెల్పునది ధర్మము. ధర్మము దేవుని విషయములోనే ఉంటుంది. ప్రపంచ విషయములో ఉండదు. ఏ వస్తువుకైనా దాని స్వభావము ఉండును. అయితే దానిని ధర్మము అనకూడదు. ఒక్క దేవుని విషయములోనే ధర్మము అను పదమును వాడితే ధర్మమునకు గుర్తింపు, దేవునికి మర్యాద ఉంటుంది.
కొందరైతే మేము ధర్మ రక్షకులమని చెప్పుకొనుచుందురు. మరి కొందరైతే ధర్మములను రక్షించండి అనికూడా చెప్పుచుందురు. ధర్మము లంటే ఏవో ఇంతవరకు తెలియనపుడు, ధర్మము అంటే ఫలానిది అని తెలియనపుడు, ఎవడైనా దానిని ఎలా రక్షించగలడు. ధర్మములను రక్షించండి అను చెప్పువారికే ఇవి ధర్మములని తెలియనప్పుడు, వాటి విషయము ఏమాత్రము తెలియనివాడు ఎలా రక్షించును. భూమిమీద మనుషులు ధర్మములను రక్షించు స్థోమత కలిగియుంటే, ధర్మరక్షణార్థము నేను అవతరిస్తానని దేవుడు చెప్పవలసిన పనిలేదు, రావలసిన అవసరము ఉండదు. దేవుడు మనిషిగా వచ్చి ఐదువేల సంవత్సరముల పూర్వము తన ధర్మములు ఇవి అని చెప్పిపోతే, ఇంతవరకు ఆయన చెప్పిన ధర్మములను అర్థము చేసుకోలేని వారు “ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతానన్నట్లు” ధర్మములను రక్షించమని, రక్షించుతానని చెప్పడము తప్పుకదా! దేవుని ధర్మములను దేవుడే తెల్పాలి తప్ప అవి ఎవరికీ తెలియవు. అందువలన ద్వాపరయుగములో ఆయనే వచ్చి చెప్పవలసిన పని ఏర్పడినది.
దేవునికి భగవంతునికి తేడా తెలియనివారు, తపస్సుకు యోగము నకు బేధము తెలియనివారు, మతమునకు పథమునకు తారతమ్యము తెలియనివారు, సాంప్రదాయమునకు ధర్మమునకు వ్యత్యాసము తెలియని వారు, గ్రుడ్డివారై అజ్ఞానమేదో ఆధ్యాత్మికమేదో తెలియక దేవుని విషయములో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తమ ప్రవర్తన అజ్ఞాన భూయిష్టమైనదని తెలియక ధర్మముగా వర్తించు వారిని అజ్ఞానులుగా భావించుకొని తమను తాము గొప్ప జ్ఞానులుగా అనుకొనుచున్నారు. అలా అనుకోవడము వలన తమకు తెలియనిది తెలుసుకోవాలని ఎవరూ అనుకోరు. తెలియనిది తెలుసుకోవాలను భావము రానందున, కాలము గడచుకొలది మనుషులకు దైవజ్ఞానము తెలియకుండా పోవుచున్నది. దైవజ్ఞానము తెలియకుండా పోయినపుడు దైవ ధర్మములంటే ఏమిటో పూర్తిగా తెలియకుండా పోవుచున్నవి. అటువంటపుడు మనిషి తలలోని గుణ ప్రభావము (మాయ ప్రభావము) చేత తెలియబడినవే ధర్మములనుకొని అధర్మములను ఆచరిస్తున్నాడు. కొందరైతే అధర్మములైన యజ్ఞ, వేద, తపస్సు, దానములను కూడా ఆచరించక వాటికి అనుబంధముగానున్న పనులను చేయుచున్నారు. దేవుడు చెప్పిన ధర్మములను ఆచరించువారే దేవునికి ఇష్టులైనపుడు, అధర్మములను మరియు వాటికి అనుబంధ కార్యములను చేయువారు దేవునికి అయిష్టులుగా మిగిలి పోవుచున్నారు. దేవునికి అయిష్టులుగానున్న
---
వారిని దేవుడు ఏమీ అనడు. అయితే ఇటు దేవుడూకాక, అటు మనుషులు కానివారు మాత్రము దేవునికి అయిష్టులైన అధర్మవరుల మీద మిక్కిలి కోపము కల్గియుందురు. పక్కలో బల్లెమువలెనున్న వారు తమ కోపమును అవకాశమొచ్చినపుడు అజ్ఞానులైన అధర్మవరుల మీద చూపెదరు. అది మనుషులకు పెద్దశిక్ష అగును. కనిపించకయుండి అవకాశమొచ్చినపుడు అదునుచూచి శిక్షించువారెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు ఇలా కలదు.
ప్రభువుకు ప్రజలకు మధ్యలో ప్రభుత్వము ఎలాగున్నదో, అలాగే దేవునికి మనుషులకు మధ్యలో దైవత్వము అనునది కలదు. ప్రభువుకు ప్రజలకు మధ్యలోగల ప్రభుత్వము ప్రజలను పాలించునదిగా ఉన్నది. ప్రజలను పాలించు ఆధికారము ప్రభువుచేత పొందినది ప్రభుత్వము. అలాగే దేవునికి మనుషులకు మధ్యలోగల దైవత్వము మనుషులను నడిపించునదిగా ఉన్నది. మనుషులను నడిపించు అధికారము దేవునిచేత పొందినది దైవత్వము. బయట కనిపించేది ప్రభుత్వమైతే, కనిపించనిది దైవత్వము కలదు. ప్రజలను పాలించు ప్రభుత్వములో భాగముగా పోలీసు డిపార్టు మెంటు, రెవిన్యూడిపార్టుమెంటు మొదలగు డిపార్టుమెంట్లు ఉన్నట్లు, మనుషులను నడిపించు దైవత్వములో భాగముగా ఉపగ్రహములు మొదలు కొని గ్రహముల వరకు, ఉపభూతములు, భూతములు మొదలుకొని మహాభూతముల వరకు గలవు.
విశ్వములో జీవరాసులకు దేవునికి మధ్యలో గ్రహజాతులు, భూత జాతులు ఎన్నో కోట్ల సంఖ్యలో గలవు. వాటిలో స్థూలశరీరమున్నవి, స్థూల శరీరములేనివి రెండు రకములు గలవు. కొద్దిసేపు ఆకారముండి కొద్దిసేపు ఆకారము లేకుండునవి కలవు. కొన్ని గ్రహములు, కొన్ని భూతములు కొంతసేపు ఆకారముండీ, కొంతసేపు ఆకారము లేకుండవున్న రెండు రకములు గలవి ఎన్నో గలవు. వీటి విషయము ఎవరికీ ఇంతవరకు తెలియదనియే చెప్పుచున్నాము. ఇవన్నియు దేవుని తర్వాత స్థానములోనున్న ప్రకృతి ఆధీనములో ఉన్నాయి. దేవుడు పనిచేయడు, విశ్వమునంతటిని పని చేయించి సాగించునది ప్రకృతి. ప్రకృతి దేవుని తర్వాత రెండవ శక్తిగా కలదు. భగవద్గీత గుణత్రయ విభాగయోగమను అధ్యాయములో 3,4వ శ్లోకములలో ప్రకృతిని తన భార్యగా దేవుడు పేర్కొన్నాడు.
శ్లోకము 3. మమయోని ర్మహదృహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ |
సంభవ స్సర్వభూతానం తతో భవతి భారత! ॥
శ్లోకము 4.
సర్వయోనిషు కౌంతేయ! మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా ||
భావము :- ప్రకృతియంతయు నాకు భార్యగావుండి నావలన గర్భము ధరించుచున్నది. సర్వభూతములు ప్రకృతి గర్భము నుండి పుట్టుచున్నవి.
సర్వయోనులయందు పుట్టుచున్న అనేక ఆకృతులు కల్గిన సర్వ జీవరాసులకు మాత ప్రకృతికాగా, వాటికి బీజ ప్రదాతనైన నేను (పరమాత్మ) తండ్రిని అగుచున్నాను.
బిడ్డలను సాకునది తల్లియే కదా! అదే విధముగా సర్వ జీవరాసు లను నిత్యము అనేక రకములుగా పని చేయించి జీవితములను సాగించునట్లు ప్రకృతియే చేయుచున్నది. విశ్వవ్యాప్తముగా ప్రకృతి అన్నిటికీ వెనుకవుండి నడిపించుచున్నది. పై శ్లోకములో అందరికీ మాత తల్లియనీ, అందరికీ తండ్రి పరమాత్మయని తెలిసిపోయినది.
---
ప్రకృతి ఒక్కటిగాలేదు. ప్రకృతి ముఖ్యముగా ఐదు భాగములుగా ఉంటూ, దానినుండి పుట్టిన ఎన్నోశక్తులను తన పని నిమిత్తము వాడుకొనుచున్నది. ఒక గృహములో కొందరు కుటుంబ సభ్యులు ఉండగా, కొందరు పని మనుషులు ఉన్నట్లు, విశ్వమను ప్రకృతి పరమాత్మ గృహములో సర్వజీవరాసులు కుటుంబ సభ్యులుగా ఉండగా వాటికొరకు విశ్వములో పనిచేయు పని మనుషులుగా గ్రహములు, భూతములు ఎన్నో గలవు. ఒక ఇంటిలో కొందరు పని మనుషులు పని చేయుచుండగా, కుటుంబ సభ్యులందరు జీవనమును సాగించుచున్నారు. ఈ విధముగా జీవరాసులన్నీ పాలించబడునవనీ, ప్రకృతి మరియు ప్రకృతిలోని శక్తులన్నీ పాలించునవనీ తెలియుచున్నది. పాలించు ప్రకృతి శక్తుల చేతిలో పాలించబడువారు బ్రతకవలసివున్నది. దేవునికి, మనుషులకు మధ్యలో గ్రహ, భూతములువుండి అధర్మములను ఆచరించు వారిమీద దేవునికి అయిష్టులైన వారిమీద, దేవున్ని నిందించు వారిమీద, దేవుని జ్ఞానమును ప్రచారము చేయువారికి నష్టము కష్టము కలిగించువారి మీద కోప చూపు కల్గియుందురు. అవకాశమొచ్చినపుడు అటువంటి వారిని హింసించక మానరు.
ఒక భూకంపము వచ్చింది అంటే దానివెనుక భూమి అను భూతము యొక్క కొంతశక్తి పని చేసినదని అర్థమగుచున్నది. అలాగే ఒక సునామీ వచ్చిందంటే నీరు అను భూతముయొక్క శక్తి పని చేసినదని తెలియుచున్నది. భూకంపము వచ్చినా, సునామీ వచ్చినా నష్టపోవునది, ప్రాణాలు కోల్పోవునది, తల్లి కొడుకులకు, తండ్రీ బిడ్డలకు ఆచూకి తెలియకుండా పోయి చనిపోవునదీ, అనాథలైపోవునదీ మొదలగు చిత్ర హింసలపాలగునది మానవులు మరియు కొన్ని జీవరాసులు. అలా మనుషులు అంత ఘోరముగా బాధపడడము, చనిపోవడము దేవునికి తెలియకుండా జరుగుచున్నదా? అంటే దేవునికి అన్నీ తెలిసే జరుగుచున్నవని తెలియుచున్నది. దేవునికి తెలియకుండ ఎవని తలలోని వెంట్రుక కూడ ఊడి క్రిందపడదు. అలాంటపుడు అంత భయంకరమైన సంఘటనలు దేవునికి తెలిసే జరుగుచుండును. భూమిమీద మనిషి ఎన్నో రకముల పాపములను సంపాదించుకొంటున్నాడు. దైవికముగా ధర్మములను బోధించు వారిని, ఆచరించువారిని హింసించుచున్నాడు. ఇంకా ఎన్నో దేవునికి వ్యతిరేఖమైన పనులను ఇష్టము లేని పనులను చేయుచున్నాడు. ఆ విధముగా చేసిన వారికి పాపము ఎంత వచ్చినది లెక్కించబడియుండును. చేసుకొన్న పాపమునకు తగినట్లు మనిషి దేవుని పరిపాలనలో గ్రహముల వలన, భూతముల వలన, భూమి మీదనే హింసింపబడుచున్నాడు. మనిషి తన పాపమును ఎక్కడో నరకములో అనుభవిస్తాడు అనుకోవడము పొరపాటు. అనుభవించే పాపములన్ని అలాగే పుణ్యములన్నీ భూమిమీదనే మనిషి సుఖ దుఃఖములుగా అనుభవిస్తున్నాడు. నేడు భూమిమీదనే సంభవించు ఎన్నో రోడ్డు ప్రమాదములు, ఎన్నో రైలు, విమాన భయంకర ప్రమాదములు, సుడిమేఘముల గాలులు, ఆకాశమేఘముల వర్షములు, వరదలు సృష్ఠించు ప్రాణనష్టము ఇవన్నియు నరక బాధలే, పాపఫలితములే, వీటి వెనుక కనిపించని గ్రహ, భూతముల శక్తులు ఉండడము ఎవరికీ తెలియదు. చేసుకొన్న పాపములకు ప్రతి ఫలితము ఎక్కడో నరకములో కలదనీ, పుణ్యములను అనుభవించడము స్వర్గములోకలదని అన్ని మతముల వారు అనుకోవడము జరుగుచున్నది. ఈ విధముగా అనుకోవడము ధర్మముకాదు, అధర్మముకాదు. ధర్మ అధర్మములు కాని పనులు ఎన్నో ఉన్నవనీ, వాటివలన పాపము, పుణ్యము రావచ్చుననీ చెప్పుకొన్నాము. దేవుని జ్ఞానమునకు వ్యతిరేఖమైనది ఏదైనా అది మహాపాపమగును. దేవుని ధర్మముకానిది అధర్మమైతే, దేవుని జ్ఞానమునకు, ధర్మమునకు వ్యతిరేఖమైనది ధర్మ శత్రువగును. దేవుడు చెప్పిన అధర్మముల వలన పుణ్యమువచ్చునని దేవుడే చెప్పాడు. ధర్మము వలన ముక్తివస్తే, అధర్మమువలన పుణ్యము వస్తే, ధర్మముకాక అధర్మముకాక ధర్మవిరుద్ధమైన కార్యము వలన (ధర్మ శత్రువువలన) వచ్చు పాపము చాలా భయంకరమైనది. అటువంటి పాపముల
---
వలన భూమిమీద గ్రహములు, భూతములు భయంకర సంఘటనలను సృష్టించి వందలు, వేలు, లక్షలమందిని హింసించి చంపడము జరుగుచున్నది. భగవద్గీతలో హిందువులు గానీ, బైబిలులో క్రైస్తవులుగానీ, ఖురాన్లో ముస్లీమ్లుగానీ సత్యము తెలియకుండా దేవుని వాక్యములను తప్పుగా అర్థము చేసుకొంటే అది దేవుని ధర్మమునకు, జ్ఞానమునకు విరుద్ధమైన భావమగును. అటువంటి భావములను ఇతరులకు బోధించుట వలన అది ధర్మవిరుద్ధ ప్రచారమై మహాపాపమగును. అటువంటి పాపములకు శిక్షగా ఎన్నో భయంకర సంఘటనలు జరుగును. అప్పుడు దేవున్ని ప్రార్థించినా అతను దేవునికి వ్యతిరేఖ భావములో ఉండుట వలన దేవుడు ఏమాత్రము వారి మొర ఆలకించడు. దేవుడు చెప్పిన మూడు ధర్మములు, నాలుగు అధర్మములు కాక మిగతావన్నిటిలో ఎన్నో రకముల కర్మలకు కారణమైన పనులుండగా వాటిలో దేవుని జ్ఞానమువద్ద దైవ విరుద్ధ కార్యములు, బోధలు ఉన్నవని అవియే ధర్మ శత్రువులని తెలియాలి. ధర్మములు, అధర్మములు, ధర్మ శత్రువులను మూడు రకములు అన్ని మతములలోనూ కలవని, అన్ని మతముల వారు వారి దైవ వాక్యములకు సరియైన భావములో ఉన్నారో లేరో చూచుకోవడము మంచిదని తెలుపుచూ ముగిస్తున్నాము.
ఇట్లు
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు
---