pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

 


విషయ సూచిక.

1. గురు ప్రార్థనామంజరి

2. గురువు అంటే ఏవరు?

3. గురువును గురించి పెద్దలు ఏమి చెప్పారు?

4. గురువు యొక్క జ్ఞానమును ప్రజలు గుర్తించగలరా? 

5. గురువును మనుషులు గౌరవిస్తారా?

6. గురువును దూషించిన వారిని గురువేమి చేయును?

7. గురువు అడవిలో ఉంటాడా లేక ఊరిలో ఉంటాడా? 

8. గురువుకు శిష్యులుంటారా?

9. గురువుకు మహత్యములుండునా? 

10. గురువుకు రోగాలు వస్తాయా?

11. గురువును ఎవరూ గుర్తించలేరా?

12. గురువు అందరివలె చనిపోవునా?

13. గురుపౌర్ణమి

14. గురువు-పౌర్ణమి

15. గురు

16. గురువులేని విద్య గ్రుడ్డివిద్య 

17. గురుప్రార్థన శ్లోకములు

--

గురు ప్రార్థనామంజరి.


నేటి మానవులను మరియు కేవలము యాభైసంవత్సరముల వెనుకటి కాలపు మానవులను గమనిస్తే, ఇటు ప్రపంచపద్ధతిలోగానీ, అటు పరమాత్మ పద్ధతిలో గానీ ఎంతో గణనీయమైన తేడా కనిపిస్తున్నది. ప్రపంచ పద్ధతిలో చూస్తే ఒక నాగరికతే కాక, మానవుని జీవితములో ఎన్నో పరికరములూ, యంత్రములూ చోటు చేసుకొని మానవుని జీవితము సుఖవంతమైనట్లు కనిపిస్తున్నది. ఉన్నతమైన చదువులూ, అధునాతన యంత్రములూ, వేగవంతమైన వాహనములూ, సరిక్రొత్త పరిశోధనలు, ఖండాతర మారణా యుధములూ మనిషి జీవితములో ఎంతో ఉన్నత స్థితికి తీసుకొని పోయినట్లు కనిపిస్తున్నవి. ఇటు ప్రపంచ రంగమునందు కేవలము యాభై సంవత్సరము లలో ఉన్నత స్థితికి పోయినట్లు కనిపిస్తున్న మానవుడు, అటు పరమాత్మ యొక్క ఆధ్యాత్మికరంగములో చాలా వెనుకబడి పోయి కనిపిస్తున్నాడు. అర్థశతాబ్ది వెనుక కాలములో మనిషిలోనున్న తత్త్వభావము గానీ, ఆధ్యాత్మిక చింతనగానీ, దేవుని మీద విశ్వాసముగానీ ఈనాడు లేకుండ పోయినట్లు తెలియుచున్నది. ప్రపంచరంగములో ఎంతో ఎత్తుకు ఎగబ్రాకి పోయిన మానవుడు, పరమాత్మరంగములో చాలాక్రిందికి దిగజారిపోయాడు. ఇది మా ఉద్దేశము కాగా కొందరు ఏమనుచున్నారంటే! "మనిషి ప్రపంచ రంగములో ఎదిగిపోయిన మాట వాస్తవమే కానీ పరమాత్మరంగములో దిగజారిపోయాడనుట మేము నమ్మము” అంటున్నారు. ఇంకా ఏమంటున్నా రంటే! పూర్వకాలములో ఊరికొక రాముని గుడికానీ, అదిలేక పోతే ఆంజనేయుని గుడికానీ ఉంది. కొన్ని ఊర్లలో అవి కూడ పాడుపడి పోయి ఏ గుడులు ఉండేవి కాదు. నేడు చూస్తే ప్రతి ఊరిలోనూ, ప్రతి పట్టణములోనూ సాయిబాబా గుడి, అయ్యప్పస్వామి గుడి మొదలగు ఎన్నో క్రొత్త దేవుళ్ళ గుడులు కూడా తయారైనవి, రాముడు, ఆంజనేయుని గుడులు పునరుద్దరించబడినవి. పూర్వము కంటే ఇపుడే ఎన్నో క్రొత్త గుడులు తయారై ఎన్నో పూజలు జరుగుచున్నవి. అంతేకాక భక్తి విధానమును ఎంతోమంది స్వామిజీలు తెలియజేస్తున్నారు. ఇప్పటి కాలములోనే అటు గుడులు, గోపురాలు ఎంతో అభివృద్ధియై, ఇటు స్వామిజీలు, బాబాలూ చాలామంది యుండి భక్తి భావమును పెంచుతూయుంటే మీరేమిటి పరమాత్మ రంగములో దిగజారి పోయారంటున్నారు? అని మమ్ములను ప్రశ్నించుచున్నారు. ఈ మాటకు మా సమాధానము ఏమనగా! నేటికాలములో గుడులూ, గోపురములూ, స్వామిజీలు, బాబాలూ ఎక్కువైన మాట నిజమే. గుడులలో అనేక విధ పూజలు రకరకాల అర్చనల పేర్లతో నిత్యము జరుగుచుండడమూ సత్యమే. అంతమాత్రమున మనిషి దైవరంగములో వెనుకబడలేదనుట, ప్రపంచ రంగములో ముందుకు పోయినట్లు దైవరంగములో కూడ ముందుకు పోయాడనుట అసత్యమనియే చెప్పుచున్నాము. ఎందుకనగా కొన్ని విషయములలో పైకి కనిపించునవన్నీ సత్యములని అనుకోవడము పొరపాటవుతుంది. ఎండమావులు నీటి సరస్సులవలె కనిపించినప్పటికి చివరకు పోయి చూస్తే అక్కడ నీరు లేదని తెలియుచున్నది. అదేవిధముగా ఆధునాతన పరికరములతో, యంత్రము లతో, వాహనములతో, వైద్యముతో మనిషి జీవితము సుఖవంతమైనట్లు కనిపించినా, ఎండమావులవలె మనిషి జీవితములలో వాస్తవానికి పూర్వమున్న సుఖములేదు. అలాగే గుడులూ, గోపురములూ, స్వామిజీలూ, బాబాలూ, ఆరాధనలూ, అర్చనలూ ఎన్ని పెరిగినా మనిషి జీవితములో ఆధ్యాత్మికత ఏమాత్రము లేకుండ పోయినదనుమాట వాస్తవము.


మనిషియొక్క సుఖముగానీ, ఆధ్యాత్మికముగానీ బాహ్యరంగానికి సంబంధించినవి కావు, అవి అంతరంగానికి మాత్రమే సంబంధించినవని ఏ మనిషి మరచిపోకూడదు. అందువలన మనిషి యొక్క సుఖమునకుగానీ, ఆధ్యాత్మికమునకు గానీ పైకి కనిపించు వాటితో సంబంధముండదు. కావున బయట ప్రపంచములో యంత్రములున్నా, వాహనములున్నా, రసాయనిక మందులున్నా, మనిషి లోపల సుఖపడుచున్నాడని చెప్పలేము. వాస్తవానికి నేడు పైకి కనిపించు ఎన్ని సౌకర్యములుండినా, మనిషి లోపల మాత్రము అసంతృప్తితోనే, అ సుఖముతోనే ఉన్నాడు. అలాగే నేడు బయటికి



--

కనిపించు భక్తిమార్గములు ఎన్ని ఉండినా, మనిషికి లోపల ఆధ్యాత్మికము లేదనియే చెప్పవచ్చును. మీరిప్పుడు ఒక ప్రశ్న అడుగుటకు అవకాశముగలదు. అదేమనగా! పైన దేశము ఎంతో అభివృద్ధి చెంది, సుఖవంతమైన యంత్ర సామాగ్రి ఉన్నపుడు, అంతరంగములో జీవుడు ఎందుకు అసంతృప్తి అ సుఖముతో ఉన్నాడని ప్రశ్నించవచ్చును. మరియు పైన ఎంతో అభివృద్ధి చెందిన గుడులు, గోపురములు ఉన్నప్పటికీ, స్వామిజీల ఉపన్యాసములు ఉండినప్పటికీ, మనిషి అంతరంగములో ఆధ్యాత్మికతను ఎందుకు పొంద లేకపోవుచున్నాడని కూడా అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ప్రపంచములో మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అది అంతయు మనిషిని అంతరంగములో అంతే క్రిందికి దిగజారిపోయినట్లు చేయుచున్నదనీ, బయట ఎన్ని అనుకూలములుండినా లోపల ఏమి ప్రయోజనములేదనీ, మనిషి పూర్వముకంటే ఎక్కువ చింతించుచున్నాడనీ మరియు పూర్వములేని అనేక రోగములను పొందుచున్నాడనీ, పూర్వమున్న తృప్తి మనిషిలో లేకుండ పోయినదనీ చాలామంది ఒప్పుకొంటున్నారు. ఎన్ని ఔషధములను శాస్త్రజ్ఞులు కనిపెట్టినా, వాటిని మించిన పూర్వములేని రోగాలు ఇప్పుడు రాలేదని ఎవరైనా చెప్పగలరా. వైద్యులకు తెలియని ఎన్నో రోగములు పుట్టుకొస్తున్న మాట అందరు ఒప్పుకోక తప్పదు. పూర్వము మనిషిలో లేని ఆందోళన నేడు మనిషిలో కలదు. పూర్వము లేని స్వార్థము నేడు మనిషిలో పెరిగిపోయి బయటి సుఖములు ఎన్నియుండినా అంతరంగములో సుఖము లేకుండ పోయినది. బాగా యోచించి చూస్తే మేము చెప్పుమాట నిజమని ఒప్పుకోక తప్పదు. ఇతరుల విషయమటుంచి నీ విషయమును నీవు చూచుకొనినా, ఆనాడు నీతాత, ముత్తాతలు కాలినడకన నడచినప్పటికీ, ఈనాడు నీవు కారులో పోవుచున్నప్పటికీ, వారు పొందిన అంతరంగ సుఖమును నీవు పొందలేదని చెప్పవచ్చును. వారు అనాగరిక కాలములో ఉన్నప్పటికీ రోగ నిరోధకశక్తి కల్గియుండెడివారు. అప్పుడు లేని మందులు ఇప్పుడున్నప్పటికీ నేడు మనిషిలో రోగనిరోధకశక్తి తగ్గిపోయినదనియే చెప్పవచ్చును. ఇదంతయు గమనిస్తే బాహ్యముగ ఎన్ని సుఖములు పెరిగినా, శరీరాంతరంగములో మనిషికి దుఃఖములే ఎక్కువైనాయని చెప్పక తప్పదు.


ఇక దైవరంగములోనికి వచ్చి చూస్తే, పూర్వముకంటే ఇప్పటి కాలములో ఆరాధనలు, అర్చనలు ఎక్కువైనప్పటికీ, మనిషి దేవునికి దూరమై పోయాడనీ, ఆధ్యాత్మికము యొక్క అర్థమే మనిషికి తెలియకుండ పోయినదని చెప్పవచ్చును. ఇప్పుడు దేవాలయములూ పెరిగిపోయి, దేవతలూ పెరిగి పోయీ, బోధించు స్వామిజీలూ పెరిగిపోయారని ఒక ప్రక్క చెప్పుచూ, మరొక ప్రక్క మనిషి ఆధ్యాత్మికముగా అభివృద్ధికాక దిగజారిపోయి, దేవుని జ్ఞానానికి దూరమైపోయాడని చెప్పుచున్నారు కదా! దేవాలయములు, స్వామిజీలు పెరిగినపుడు మనిషిలో ఆధ్యాత్మిక జ్ఞానమెందుకు పెరగలేదని ప్రతి ఒక్కరికీ సంశయము రావచ్చును. దానిని గురించి వివరముగా తెలుపుటయే ఈ గ్రంథము యొక్క సారాంశము. ఈ సారాంశమును తెలుసుకొనుటకు ముందు, మనము కొన్ని ప్రశ్నలను వేసుకొని చూడవలసి యున్నది. మొదట భక్తి అంటే ఏమిటి? రెండవది ఆధ్యాత్మికమంటే ఏమిటి? మూడవది గురువు అంటే ఎవరు? ముఖ్యముగ ఈ మూడు ప్రశ్నలకు జవాబును తెలుసుకోగలిగితే ఈ గ్రంథములోని సారాంశమంతయు అర్థమైపోయినట్లగును. ఇపుడు ముందుగా భక్తిని గురించి తెలుసుకొందాము.


భక్తి అను పదమునకు సరియైన అర్థము విశ్వాసము అని చెప్ప వచ్చును. విశ్వాసము అనగా నమ్మడము అని అర్థము. ఇక్కడ నీవు ఎవరిని నమ్ముచున్నావు? అని ప్రశ్నించుకొంటే, ప్రతి మనిషి చూడకుండ నమ్మవలసినది ఒకే దేవున్నని తెలియుచున్నది. చూచి నమ్మవలసినవి కొన్ని, చూడకుండ నమ్మవలసినవి కొన్ని భూమిమీద గలవు. దేవుని విషయానికి వస్తే దేవునికి ఆకారములేదు, పేరూ లేదు కనుక చూడకుండానే నమ్మాలి. నమ్మకముండాలి కానీ నమ్మకము



---

గ్రుడ్డినమ్మకము కాకూడదు. గ్రుడ్డి అంటే కనిపించక చీకటిగ ఉండడమని అర్థము. అందువలన గ్రుడ్డి నమ్మమును మూఢనమ్మకమని కూడా అనుచున్నాము. మూఢము అనగా! అంధకారము లేక చీకటి అని అర్థము. దీనిని బట్టి చూస్తే మన నాస్తికులు, హేతువాదులు వాడే మూఢనమ్మకము అనే పదము యొక్క అర్థము గ్రుడ్డిభక్తి అని తెలియుచున్నది. దేవుని విషయములో మనుషులకు మూఢ నమ్మకములు గలవని అంటుంటారు. అంటే కనిపించని దేవుని విషయములో గ్రుడ్డినమ్మకమే కాక చూపున్న నమ్మకము కూడా కలదని తెలియుచున్నది. దీనిని బట్టి చూపులేని భక్తిని మూఢనమ్మకమనీ, అటువంటి మూఢనమ్మకము దేవుని పట్ల ఉండకూడదనీ, మూఢనమ్మకము హేతువాదమునకు నిలువదనీ చెప్పుచున్నాము. దేవుడు కనిపించకుండినా, దేవుని గురించిన సమాచారమును సవివరముగా శాస్త్రబద్ధముగ తెలిసి విశ్వసించడమును చూపున్న భక్తి అనుచున్నాము. ప్రస్తుతకాలములో దేవుని పట్ల మనుషులకు చూపున్న భక్తి కలదా? మూఢభక్తి కలదా? అని ప్రశ్నించుకొని చూస్తే తొంభైతొమ్మిది పాళ్ళు మూఢభక్తియే కలదని చెప్పవచ్చును. అందువలన చూపులేని వాడు దేనినో పట్టుకొని దేనినో అనుకొనునట్లు, మనిషి మూఢభక్తి వలన దేవుడుకాని దానిని పట్టుకొని దేవుడు అనుకొనుచున్నాడు. అట్లనుకోవడము వలన దేవున్ని వదలి దయ్యమును ఆశ్రయించినట్లగుచున్నది. మూఢభక్తి వలన దేవుని విషయములో పొరపాటుపడిపోయి, దేవుడుకాని దానిని దేవుడు అనుకోవడము జరుగుచున్నది. అట్లు అనుకోవడము మానవ జీవితములో పెద్దపొరపాటు. ప్రపంచములో కనిపించు వాటిని గురించి చాలా వివరముగా తెలుసు కొంటున్నాము. ఒక కంప్యూటర్ కంటికి కనిపించే పరికరమే అయినప్పటికీ ఇతరుల ద్వారా దానిని గూర్చి పూర్తిగ తెలుసుకొని అప్పుడు కంప్యూటర్ను ఆశ్రయిస్తున్నాము. కంప్యూటర్ గురించి తెలియనపుడు నీ దగ్గరుంచుకొన్నది కంప్యూటర్ కాకుండ, కంప్యూటర్వలె నున్న ఖాళీడబ్బా కావచ్చును కదా! కంప్యూటర్ యొక్క పనితనమును గురించి తెలుసుకోకుండ, గ్రుడ్డిగ ఒక డబ్బాను కంప్యూటర్ అనుకొంటే అది ఎట్లు కంప్యూటర్ కాదో, అలాగే దేవుని వివరము తెలియకుండ గ్రుడ్డిగ ఒక దానిని దేవుడని అనుకొంటే అది దేవుడు కాదు. దేవుడని గ్రుడ్డిగ నీవు విశ్వసించినంత మాత్రమున అది దేవుడు కాకపోవచ్చును. అందువలన దేవుని వివరమును తెలిసి విశ్వసించినపుడు, ఆ విశ్వాసము సరియైనదగును. అలాకాకపోతే అది మూఢనమ్మకమే అగును.


మూఢనమ్మకము హేతువాదులకు సమాధానమివ్వలేదు. చూపున్న విశ్వాసము ఎవరికైన సమాధానము ఇవ్వగలదు. ఒకవేళ సరియైన సమాధానమును కూడ కాదనువాడు హేతువాది కాదు, అతనిని నాస్తికవాది అనాలి. అందువలన దైవభక్తిని గురించి మాట్లాడునపుడు హేతువాదితోనైనా మాట్లాడవచ్చును, కానీ నాస్తికవాదితో మాట్లాడకూడదు. నేటి కాలములో భక్తి అనునది ప్రజలలో ఉండినప్పటికీ, మూఢభక్తియే ఎక్కువగా ఉన్నది. ప్రపంచరంగములో ఎంతో తెలివైనవారు దేవుని భక్తివద్దకు వచ్చేటప్పటికి చాలా తెలివితక్కువగా ప్రవర్తిస్తున్నారు. ఆలోచన చేయకుండ గ్రుడ్డిగ నమ్ముచున్నారు. మన భక్తి సరియైనదా, కాదా? అని ఏమాత్రము వెనుదిరిగి చూచుకోవడము లేదు. మనము నమ్మినది దేవుడినా? దేవుడు సృష్టించిన దానినా? అని యోచించడము లేదు. దేవుని పట్ల చూపవలసిన భక్తిని దేవుడు కాని వాటి మీద చూపిస్తూ మూఢంగా ప్రవర్తిస్తున్నాడు. చాలామంది ప్రథమ దశలోని భక్తియొద్ద, చూపున్న భక్తి కాకుండ చూపులేని గ్రుడ్డి విశ్వాసమును కల్గియున్నారు. అట్లున్న మూఢవిశ్వాసమును వదలి, చూపుకల్గిన విశ్వాసము కలవారమై, నిన్ను, నన్ను సృష్టించిన అసలైన దైవమునే ఆరాధించడము సరియైన పద్ధతి అగును.


ఇపుడు ఆధ్యాత్మికమును గురించి కొంత తెలుసుకొందాము. ఆధ్యాత్మికము అను మాటను చాలామంది వినియేయుందురు. మన స్వామిజీలందరు వాడే పదము ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికమును గురించి భగవద్గీతలో భగవంతుడు, ఆత్మను తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అని చెప్పాడు. ఆత్మను అధ్యయనము చేసి తెలుసుకొను విధానమును ఆధ్యాత్మికమని



---

అనవచ్చును. ఇంకోవిధముగా చెప్పుకొంటే ఆత్మను ధర్మయుక్తముగా తెలుసుకోవడము అనియూ, ఆత్మను శాస్త్రబద్దముగా తెలుసుకోవడము అనియూ అనవచ్చును. ముఖ్య విషయమేమంటే నీవు ఏ విధముగా తెలుసుకొనినా, తెలుసుకోవలసినది ఆత్మను. ఈ ఆత్మ అను పదమును తెలియనివారు గానీ, ఆ శబ్దమును విననివారు గానీ బహుశా ఎవరూ ఉండరేమో! ఎందుకనగా! అన్ని మతాలలోను ఇంచుమించు ఆత్మ అను పేరును అందరూ పలుకుచునే ఉన్నారు. దీనినిబట్టి చూస్తే ప్రతి మనిషికి ఆత్మ అను మాట పరిచయమైనదేనని తెలియుచున్నది. మనము వాడు భాషలో ఎన్నో చోట్ల ఆత్మ శబ్దమును పలుకుచూనే ఉన్నాము. ఇటు జ్ఞానిగానీ, అటు అజ్ఞానిగానీ నిత్యమూ పలుకుమాటలలో ఆత్మ అను పదము ఇలా గలదు. ఆత్మజ్ఞానము, ఆత్మద్రోహము, ఆత్మహత్య, ఆత్మబలము, ఆత్మవిమర్శ, ఆత్మబంధువు, ఆత్మశోకము, ఆత్మదర్శనము, ఆత్మసాక్షి, ఆత్మాహుతి, ఆత్మ సమర్పణ, ఆత్మచైతన్యము ఇలా ఎన్నో పదములు కలవు. ప్రతి మతములోనూ ఆత్మ అను పదము పలుకబడుచూనే ఉన్నది. విచిత్రమైన సత్యమేమంటే ఎంతో మంది చేత ఎన్నో సందర్భములలో పలుకబడు ఆత్మ, ప్రతి మతములోను ప్రతి బోధకుడు బోధించు జ్ఞానములోనూ పలుకబడు ఆత్మ; దైవజ్ఞానము నందు, ప్రపంచ జ్ఞానమునందు జ్ఞానులచేతగానీ, అజ్ఞానులచేతగానీ పలుకబడు ఆత్మ; ఎటువంటిదో, ఎక్కడుంటుందో, ఏమి చేస్తుంటుందో, దాని స్వరూపమేదో, దాని స్థితిగతులేమిటో భూమిమీద ఎవరికీ తెలియదు. ఇంతమంది చేత పలుకబడుచున్న ఆత్మను గురించి స్వామిజీలు గానీ, బాబాలుగానీ, బోధకులుగానీ తెలియరు. నాకు ఆత్మజ్ఞానము తెలుసునను కొన్న ఎంత పెద్ద బోధకునికిగానీ ఆత్మను గురించి తెలియదని చెప్పడము విచిత్రముగా ఉంది కదా! అవును విచిత్రమే మరి. నేను ఆత్మజ్ఞానిని, నాకు ఆత్మ తెలియక పోవడమేమిటని కొందరనుకోవచ్చును. మీరు ఎంత గాఢముగా అనుకొనినా అందరికి తెలియని సత్యము “ఆత్మ ఎవరికీ తెలియదు”.


ఒక దయ్యమును చూచినవాడు నేను ఆత్మను చూచాను అంటున్నాడు. దయ్యమును ఆత్మ అనవచ్చునా? అనకూడదు. అయినా అందరూ అలాగే అంటున్నారు. కొన్ని మతములలో దయ్యమును ఆత్మ అనియే చెప్పుచున్నారు. ఆత్మ యొక్క నిజ స్వరూపము తెలియక కొందరు జీవుణ్ణి ఆత్మయనీ, మరికొందరు దేవుణ్ణి ఆత్మయనీ అంటున్నారు. కానీ ఆత్మ ఇటు జీవుడుగానీ, అటు దేవుడుకానీ కాదని తెలియదు. ఆత్మను తెలియడము లేక ఆత్మను అధ్యయనము చేయడము ఆధ్యాత్మికము అయితే, ఆత్మంటే ఏమిటో ఎవరికి తెలియనపుడు, బోధించు బోధకులైన స్వామిజీలకే తెలియనపుడు ఆధ్యాత్మికము వీరందరికి తెలుసునని చెప్పవచ్చునా? ఆత్మను తెలియనివాడు ఆధ్యాత్మికుడు కాడు అను సూత్రము ప్రకారము, భూమిమీద ఎవరు ఆధ్యాత్మికమును తెలిసినవారో మీరే లెక్కించి చూచుకోండి. మేము ఇక్కడ ఉన్న సత్యమును చెప్పుచున్నాము కానీ ఎవరినీ కించపరచవలెనని చెప్పడము లేదు. ఇంత నమ్మకముగా ఎలా చెప్పుచున్నారని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. దానికి మా సమధానము ఏమనగా! నేను సూత్రము ప్రకారమే చెప్పుచున్నాను, కానీ సూత్రమును వదలి శాస్త్రబద్ధతలేని విధముగా చెప్పడములేదు. కొందరు దూరమునుండి చింతచెట్టును చూచి జమ్మిచెట్టని అనుకోవచ్చును. అలా వారనుకున్నంతమాత్రమున చింతచెట్టు జమ్మిచెట్టు కాగలదా? అలాగే చాలామంది ఇటు జీవాత్మనుగానీ, అటు పరమాత్మను గానీ ఆత్మగా భావించుకొంటున్నారు. అలా భావించుకొనియే బోధిస్తున్నారు. అంతమాత్రమున వారనుకొన్నట్లు ఆత్మ జీవాత్మకాదు, అలాగే ఆత్మ పరమాత్మ కాదు. దేవుడు బోధించిన బోధలలో గానీ, భగవద్గీతలోగానీ ఆత్మలని పేరుగాంచినవి మూడే మూడున్నాయని తెలుపబడినది. ఆ మూడు ఆత్మలనే భగవద్గీత పురుషోత్తమప్రాప్తియోగములో 16,17 శ్లోకములయందు క్షరుడు, అక్షరుడు, పురుషోత్తములని చెప్పబడినది. ఇదియే మా త్రైత సిద్ధాంతము. సూత్రము ప్రకారము ఎవరికి త్రైత సిద్ధాంతము తెలియదో, ఎవరు త్రైత సిద్ధాంతమును ఒప్పుకోరో వారికి ఆత్మ తెలియనట్లే. అటువంటివారు ఎవరైనా వారికి ఆధ్యాత్మికమే తెలియదు. భూమిమీద భగవాన్లని పేరు



---

పెట్టుకొనినా, స్వామిజీలైనా, బాబాలైనా, గురువులని పేరుగాంచినా, ఆత్మను గురించి తెలియనివారు ఆధ్యాత్మికులు కారు. ఆత్మ ఏదో తెలియనపుడు ఖచ్చితముగా జీవాత్మను చూడలేరు, పరమాత్మను తెలియలేరు. అటువంటి వారు జీవాత్మను గురించి చెప్పవలసి వచ్చినపుడు, దానిస్థానములో పరమాత్మను గురించో, ఆత్మను గురించో చెప్పుదురు. అలాగే ఆత్మను గురించి చెప్పవలసి వచ్చినపుడు, వారికి తెలిసినవి రెండే కావున ఇటు పరమాత్మనో అటు జీవాత్మనో చెప్పుదురు. అట్లుకాక మూడు ఆత్మలైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మలను తెలిసినవాడే నిజమైన జ్ఞాని.


గురువు అంటే ఎవరు?.


ఇంతకుముందు భక్తిని గురించి చెప్పుకొనినపుడు మూఢభక్తి ఉండకూడదనుకొన్నాము. అలాగే ఇపుడు భగవద్గీతలోని త్రైతసిద్ధాంతమును తెలియనివాడు ఆధ్యాత్మికము తెలియనివాడన్నాము. ప్రస్తుతము గురువును గురించి చెప్పుకోవలసి యున్నది. విద్యను బోధించువాడు గురువని చాలామంది అనుకొంటుంటారు. మనము ఇక్కడ విద్యలను, రెండు రకములుగా విభజించుకొనిన, ఒకటి ప్రపంచవిద్య, రెండవది పరమాత్మ విద్య అని తెలుసుకొన్నాము. ప్రపంచ విద్యలలో గురువు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ పరమాత్మ విద్యలో తప్పనిసరిగ గురువు ఉండి తీరాలి అని కూడ చెప్పుకొన్నాము. దాని ప్రకారము పరమాత్మ విద్యలో గురువు ఎట్లుంటాడో, ఎవరు గురువో తెలుసుకొనే దానికి ప్రయత్నిద్దాము.


బ్రహ్మవిద్య లేక దైవవిద్య అయిన పరమాత్మ జ్ఞానమును బోధించు వారు నేడు భూమిమీద చాలామంది కలరు. అయితే వీరందరు గురువులౌతారా? అని ప్రశ్నించుకొని చూస్తే ఒక్క ప్రాంతములో, ఒక్క కాలములో, ఒక్క వ్యక్తిగానే గురువుంటాడు అను సూత్రము ప్రకారము మేము గురువులమని ఎందరో పేరుగాంచినా, అందరిలో ఒక్కడు మాత్రము గురువుండవచ్చును. పై సూత్రము ప్రకారము ఏక కాలములో ఒకనికంటే మించి గురువులుండుటకు వీలులేదు. ఒక్క ప్రాంతములో అన్నాము కాబట్టి భూమండలములో దేశములన్నిటిని కలిపి చూచిన ఒక దేశములోనే ఒకే గురువుండును. దీని ప్రకారము విశ్వమంతటికి గురువు ఒక్కడేనని తెలియుచున్నది. దైవజ్ఞానమును తెలుపువారు ఎందరుండినా వారిలో ఒకడు గురువు ఉండవచ్చును. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ ఇతర మనిషికి తెలియదు. దైవజ్ఞానము మనుషులకు తెలియాలంటే దేవుడే గురువుగా భూమిమీద ఉండి తన జ్ఞానమును తానే చెప్పవలసియుండును. అతనే నిజమైన గురువు. దేవుడు భూమిమీదకు ఎప్పుడు వస్తాడంటే? తన ధర్మములు భూమి మీద తెలియకుండా పోయినపుడు, అధర్మములు ప్రజలలో ప్రాకిపోయినపుడు, అధర్మములను లేకుండ చేయుటకు తన ధర్మములను తెలుపుటకు తనకు తానుగా వచ్చువాడు దేవుడు. ఆ దేవుడే నిజమైన గురువు. ధర్మములకు ముప్పు ఏర్పడి అధర్మములు భూమిమిద చెలరేగుటకు కొన్ని వేలు లేక కొన్ని లక్షల సంవత్సరముల కాలము పట్టును. కావున గురువు భూమిమీదకు లక్షల సంవత్సరములకో, వేల సంవత్సరము లకో రాగలడు. భూమిమీద జ్ఞానము చెప్పు ప్రతివాడు గురువగుటకు అవకాశమే లేదు. జ్ఞానము చెప్పు ప్రతివాడు బోధకుడు కావచ్చును, కానీ గురువు ఎప్పటికీ కాలేడు. దేవుడు మనిషిగా వస్తే గురువు అవుతాడు, కానీ మనిషి ఎప్పటికీ గురువు కాలేడు. ఇక్కడ కొందరికి లేక కొన్ని మతముల వారికి ఒక ప్రశ్న రావచ్చును. దేవుడు దేవునిగానే ఉంటాడు, మనిషిగా ఎప్పుడు రాడు, ఒకవేళ భూమిమీద జ్ఞానము అవసరమైతే తన దూతలను పంపి వారి ద్వారా జ్ఞానమును చెప్పించును. ఆ విధముగా దేవునిచేత పంపబడిన దూతను ప్రవక్త అంటున్నాము. అటువంటి ప్రవక్తను గురువన వచ్చును. కానీ దేవుడు భూమిమీదకు వస్తాడని మీరెలా చెప్పుచున్నారని ప్రశ్నించ వచ్చును. దానికి మా జవాబు ఏమనగా! పరమ పవిత్ర పరిశుద్ధగ్రంథమైన భగవద్గీతలో శ్రీకృష్ణుడు జ్ఞానమును బోధిస్తూ "పరిత్రాణాయ



---

సాధూనాం వినాశాయచ దృష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని అన్నాడు. దీని అర్థము చెడు చేయువారిని లేకుండ చేయుటకు, మంచివారిని అభివృద్ధి చేయుటకు ధర్మసంస్థాపన నిమిత్తము నేను సంభవిస్తాను అన్నాడు. దీనిని బట్టి దేవుడు భూమిమీదకు ధర్మమును స్థాపించుట కొరకు వస్తానని చెప్పినట్లే కదా! అని మేమంటే దానికి కొందరు కృష్ణుడు దేవుడని నిరూపణ ఏమిటని అంటున్నారు. ఇటువంటి ప్రశ్న భవిష్యత్తులో వస్తుందని తెలిసిన దేవుడు, తాను దేవుడననే విషయము ఇతరులు తెలియునట్లు అర్జునునకు విశ్వరూపమును చూపాడు. అంతేకాక కృష్ణునిగా వచ్చినవాడు దేవుడని తెలిసిన భీష్ముడు కృష్ణున్ని జగద్గురువు అన్నాడు.


ఇతర మతముల సోదరులు, పెద్దలు ముఖ్యముగా గమనించవలసిన దేమనగా! దేవుడు విశ్వమంతా అణువణువున వ్యాపించియున్నాడు. అట్లు విశ్వవ్యాపి, సర్వధారి అయిన దేవుడు, అంతట లేకుండపోయి ఒక మనిషిగా వస్తాడని మేము కూడ చెప్పలేదు. విశాలమైన దేవుని నుండి ఒక్క అణువంత అంశ (భాగము) లేక విశాలమైన దేవుని శక్తి నుండి ఒక అణువంత శక్తి ఒక కనిపించెడి మనిషిగా పుట్టడమును దేవుని అవతారము అంటున్నాము. అటువంటి వానినే భగవంతుడు లేక గురువు అంటున్నాము. దేవునికి గల అనేక కోటానుకోట్ల అంశలలో ఒక్క అంశ పుట్టితే అదే గురువు. దీనిని బట్టి దేవుడు మనిషిగా రావచ్చును అన్నాము. దేవుడు మనిషిగా అనగా గురువుగా భూమి మీద కనిపిస్తే, ఆ సమయములోనే అసలైన ధర్మములతో కూడుకొన్న జ్ఞానము మానవులకు ఆయన ద్వారా తెలియును. కానీ ఆయన గురువుగా ఏమాత్రము తెలియబడడు. ఆయన మనుషులకు తెలిసినా, తెలియకుండినా ఆ సమయములో విశ్వమునకంతటికి ఆయనొక్కడే గురువు. ఈ విధముగా దేవుడే గురువు లేక గురువే దేవుడని చెప్పవచ్చును. అందువలన ఏ మనిషి గురువుగా మారలేడు అని చెప్పాము. భూమిమీద కనిపించని దేవుడు కనిపించే గురువుగా రావచ్చును. కానీ కనిపించే మనిషి గురువుగా మారలేడు. గురువు దేవుడే అగును, ఆయన దైవత్వమును గురించి పూర్వపు పెద్దలు ఒక శ్లోకములో ఈ విధముగా అన్నారు.


" దుర్లభం త్రిషులోకేషు, తచ్చణుష్వ పదామ్యహమ్, గురుబ్రహ్మ వినా నాన్యః సత్యం సత్యం."


భావము :- ముల్లోకములందు వ్యాపించి తెలియుటకు దుర్లభమైన దేవున్ని గురించి చెప్పుచున్నాను వినుము. కనిపించు గురువే కనిపించని దేవుడు. విశ్వమంతటిని లెక్కించి చూచితే గురువును వదలి అన్యమైనదేదియు లేదు. ఈ మాట ముమ్మాటికి సత్యము! సత్యము!!


వివరము :- దుర్లభమైన వాడు దేవుడు ఒక్కడే. ఎందుకనగా ఆయనకు ఆకారములేదు, పేరూ లేదు. రూపనామములులేని వానిని కనుగొనుట దుస్సాధ్యమే కదా! ఒకవేళ రూపము, పేరూ లేకున్ననూ ఆయనకు ఏదైనా ఒక అడ్రస్ (చిరునామ) ఉన్నదా అని యోచిస్తే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడనుటకు ఏమాత్రము వీలులేని విధముగ అంతట వ్యాపించియున్నాడు. నామముగానీ, చిరునామముగానీ లేకుండ, ఆకారముగానీ, అందముగానీ లేకుండ, కనిపించక అంతట అందరిలో ఉన్న దేవుడు ఒకప్పుడు తనకవసర మైనప్పుడు కనిపించు మానవాకారముతో వస్తే, ఆ ఆకారమునే గురువు అంటున్నాము. దేవుడే గురువైనపుడు గురువును మించినదేదియు ప్రపంచములో లేదు. ఈ మాట పూర్తి సత్యమైనది అని శ్లోకములో పెద్దలు చెప్పియున్నారు. ఆనాటి పెద్దలు చెప్పిన విషయమునే మేము కూడ బలపరుస్తూ దేవుడే గురువుగా వస్తాడు తప్ప, ఏ మనిషికి గురువుగా ఉండుటకు ఏమాత్రము అవకాశములేదు. దేవుడు గురువూ, గురువు దేవుడూ కావచ్చును కానీ



---

మనిషిని గురువనుకోవడము పూర్తి అజ్ఞానమగును. ఒకవేళ ఏ మనిషైనా తాను గురువువని ప్రకటించుకొంటే అతను ఎంతటి వాడైనా అతనిని గురువుయొక్క వివరము తెలియని అజ్ఞానియేనని చెప్పవచ్చును.


ఇంతవరకు గురువును గురించి వ్రాసినవారు ఇప్పుడు మేము చెప్పిన విధముగ గురువు మనిషిగా రావచ్చుననకుండ, మనిషి గురువుగా మారునని చెప్పియున్నారు. పుట్టిన మనిషి ఎవరు గురువుగ మారడని వారికి తెలియక అలా వ్రాసియుండవచ్చును. పుట్టిన మనిషి గురువుగా మారుట దుర్లభము. ఎప్పుడైనా సంభవిస్తే దేవుడు గురురూపముగా అనగా మనిషిగా రావచ్చును. ఆ విధముగనైన గురువు ఎల్లప్పుడు భూమిమీద ఉండడు. ఆయనకు అవసరమైనపుడు, ధర్మములను తెలియ జేయునిమిత్తము మాత్రమే వచ్చి, సందర్భము చూచి ధర్మములను తెలియజేసి పోవును. అటువంటి గురువు తాను గురువునను గుర్తింపు ఏమాత్రము తెలియకుండ ప్రజలమధ్యలో ఉండును. ఆయన చెప్పిన బోధను చూచి ఇది సాధారణ మనిషి చెప్పు జ్ఞానముకాదనీ, దీనిని ఒక గురువు తప్ప ఎవరు చెప్పలేరని, ఎవడైన తెలివైనవాడు మనిషిగాయున్న గురువును గ్రహించగలిగితే నిజమైన గురువు వానిని ఆ భావమునుండి తప్పిపోవునట్లు చేయగలడు. గురువు కృష్ణుడను మనిషిగా వచ్చినపుడు, కృష్ణుని బోధను చూచి ఈయన నిజమైన దేవుడని కొందరు గ్రహించినప్పటికీ, ఆయన ప్రవర్తనను చూచి కృష్ణున్ని సాధారణ మనిషియేనని కొందరూ, మోసగాడని కొందరూ, జారుడని కొందరూ, చోరుడని కొందరూ అనుకొన్నారు. కొందరు తెలివైనవానిగ లెక్కించుకోగా, కొందరు గొప్పజ్ఞానిగ లెక్కించుకొన్నారు. కానీ దైవాంశనిండిన గురువనీ, దేవుడనీ అనుకోలేదు. ఆ కాలములో భగవద్గీతను వినీ, విశ్వరూపమును చూచిన అర్జునునికి కూడ కృష్ణుడు దేవుడు కాదని అనుమానమురాగా కృష్ణున్ని మేథావిగా మాత్రము అర్జునుడు అనుకొన్నాడు తప్ప గురువుగా గానీ, దేవునిగా గానీ గుర్తించలేదు. కానీ అనాటి భీష్ముడు కృష్ణుని గీతను వినకుండినా, ఆయన విశ్వరూపమును చూడకుండినా కృష్ణున్ని నిజమైన దేవునిగా, సృష్టికర్తగా, జగద్భర్తగ, జగద్గురువుగా లెక్కించాడు. చాలా సందర్భములలో కృష్ణుడు సాధారణ మనిషికాదని ఇతరులకు కూడ చెప్పాడు. భీష్ముని విశ్వాసము ముందర ఏ మాయ పని చేయలేదు. దీనినిబట్టి విశ్వాస లోపముంటే గురువును ఎవరూ గుర్తించనట్లు తన మాయ చేత అనుమానమును రేకెత్తించును. సంపూర్ణ విశ్వాసిని మాత్రము తననుండి దూరము చేయడని తెలియుచున్నది. గురువును భూమిమీద ఎవరూ గుర్తించరు అనుటకు వీలులేకుండ దేవుని మీద శ్రద్ధ విశ్వాసము ఉన్నవారు గుర్తించగలరని చెప్పుటకు భీష్ముడు తార్కాణముగా నిలిచాడు.


గురువును గురించి పెద్దలు ఏమి చెప్పారు?


శ్లోకము.

ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః


భావము : గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. ఇంకనూ సత్యము చెప్పాలంటే గురువే ఆత్మకంటే వేరైన మూడవ పురుషునిగానున్న పరమాత్మ. నిరాకారమైనవాడై సాకారముగ వచ్చియున్న గురువుకు నేను నమస్కరించుచున్నాను. 


విశేషార్థము : దేవతలందరికి సాకారమున్నది. బ్రహ్మకానీ, శివుడుకానీ, విష్ణువుకానీ శరీరమును ధరించి అందులోని ఆత్మను ఆధారము చేసుకొని చలించువారే. ఆత్మ అన్ని దేహములలో ఉన్నది. గురువు ఆత్మ స్వరూపుడై బ్రహ్మ శరీరములోను, విష్ణు శరీరములోను, మహేశ్వరుని శరీరములోను ఉన్నాడు. అందువలన గురుని బ్రహ్మగ, విష్ణువుగా, శివునిగ చెప్పడమైనది. గురువు ఒకటవ ఆత్మ (క్షరుడు) గ, రెండవ ఆత్మ (అక్షరుడు) గ, మూడవ ఆత్మ (పరమాత్మ)గ ఉన్నాడు. అందువలన


---

గురువు సాకార జీవుడు, నిరాకార ఆత్మ మరియు జీవాత్మ, ఆత్మలకంటే వేరైన పరమాత్మగ ఉన్నాడు. మూడు ఆత్మలుగ ఉన్నవాడే నిజమైన నిత్యమైన గురువు. ఆయన ధరించిన శరీరము పవిత్రమైనది. అందువలన ఆ సాకార గురువుకు నమస్కరించుచున్నాము.


శ్లోకము:

ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం 

తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవేనమః


భావము : అండ, పిండ, బ్రహ్మండమంతయు వ్యాపించి విశ్వరూపమే తన ఆకృతిగకల్గి అఖండముగ వ్యాపించి ఉన్నవాడు ఎవడో, కదలుచున్న కదలకున్న జీవరాశులందు మరియు మార్పు చెందని పంచభూతములలోను వ్యాపించి యున్నవాడు ఎవడో, పరమాత్మ స్థానము తెలిసియున్నవాడు ఎవడో ఆ గురువుకు నమస్కరించుచున్నాను.

శ్లోకము:

ఓం మన్నాథో శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు

మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవేనమః


భావము : నా యొక్క నాథుడైన గురువే జగత్తంతటికి నాథుడు. నా యొక్క గురువే జగత్తులోని సర్వజీవరాసులకు అన్వయించు జ్ఞానమును బోధించు జగత్ గురువు. నా శరీరములో ఆత్మగనున్న గురువే, సర్వ జీవుల శరీరములో ఆత్మగ ఉన్నాడు. ఆ గురువుకు నా నమస్కారము.


శ్లోకము:

ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా 

చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవేనమః


భావము : అజ్ఞానమనే గ్రుడ్డితనమునకు జ్ఞానమనే కాటుకను దిద్ది, ఆత్మను దృశ్యముగ చూపించు గురువుకు నమస్కరించుచున్నాను.

శ్లోకము:

ఓం బ్రహ్మానందం, అచలపూర్ణం, త్రిగుణాతీతం,

ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం

ఆనంద నిత్యసద్గురుం తం నమామి.


భావము : అన్నిటిని మించిన ఆనందము కలవాడు, మార్పు చెందని దానితో నిండినవాడు, మూడు గుణముల కర్మ అంటనివాడు, ఆత్మను సాక్షాత్కరింపజేసుకొన్నవాడు, రెండు కాని ఒక్కటైన పరమాత్మలో మూర్తీ భవించినవాడు, నిత్యము ఆత్మానందమును పొందువాడైన సద్గురువుకు నేను నమస్కరించు చున్నాను.

శ్లోకము:

ఓం నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, 

ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్త్వమస్యాది లక్ష్యం, 

ఏకం నిత్యం విమల మచలం, సర్వధీ సాక్షిభూతం,

భావాతీతం, త్రిగుణరహితం సద్గురుం తం నమామి.


భావము : నిత్యము ఆత్మానుభవము అను ఆనందముతో కూడినవాడు, జీవుని కంటే వేరుగయున్న ఆత్మ సుఖము కలుగజేయువాడు, కేవలము ఆత్మ జ్ఞానమే స్వరూపముగ కలవాడు, పాపపుణ్యములైన ద్వంద్వముల కతీతుడు, ఆకాశమువలె వ్యాపించి దేనిని అంటనివాడు, తత్త్వమస్యాది వాక్యముల ధ్యేయము కలవాడు, ఎప్పటికీ ఏక స్వరూపుడైన వాడు, పాప




--

పుణ్యమనే ఏ మాలిన్యము లేనివాడు, చలనము లేని (మార్పు లేని) వాడు, సమస్త జీవరాసుల బుద్ధికి సాక్షిగ నున్నవాడు, ఏ భావమునకు అందని వాడు, మూడు గుణములందుండినా వాటికి అతీతుడైన వాడును అయిన సద్గురువుకు నమస్కరించుచున్నాను.


శ్లోకము:

అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే

జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవేనమః


భావము : బహుజన్మలనుండి పేర్కొనిన పాప, పుణ్య మిశ్రమములను జ్ఞానమను అగ్నిచేత దహింపజేయునట్టి గురుమూర్తికి నేను నమస్కరించు చున్నాను.


ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే

నమః శ్రీ గురునాథాయ ప్రకాశానంద మూర్తయే


భావము : సత్తు, చిత్తు యొక్క ఆనందమునే (చిత్తునందు సత్తును అనుభవించు ఆనందమునే) స్వరూపముగ గలవాడును, జీవాత్మగయుంటూ ఆత్మ స్థానమును, పరమాత్మ స్థానమును వ్యాపించినవాడును, అన్నిటికి ప్రకాశమునిచ్చు శక్తిని అనుభవించువాడును ఐన గురువుకు నమస్కారము.


ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ, విష్ణు, శివాత్మకం,

గురోః పరతరం నాస్తి తస్మాస్థం పూజ యేద్గురుం


భావము : గురువే బ్రహ్మ, విష్ణు, శివుల యొక్క ఆత్మగ నున్నవాడు, గురువు ఒక్కడే జగత్తంతయునిండి సర్వమై ఉన్నవాడు. గురువుకంటే మించిన వేరైన మోక్షము లేదు. అందువలన గురువును అన్ని విధముల పూజింప వలయును.


శ్రీ సద్గురు పాదుకాస్తవమ్

1.శ్లోకము॥ 

శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశమగోచరం 

భేదవర్జిత మప్రమేయ మనంత మాద్యమ కల్మషం !

నిర్మలం నిగమాస్త మద్వయ మప్రతర్క్యమ బోధకం

ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకామ్ !!


భావము : శుభకరమైనది, నాశనములేనిది, నీకంటే వేరుగ ఉండి నీకు తెలియకుండ ఉండునది, భేదము లేక అంతటనిండినది, ప్రమాణములకు తెలియనిది, ఆది మొదలు లేనిది, కర్మ కాలుష్యము లేనిది, నిర్మలమై, వేదాంత సారమై, ద్వందములు లేనిదై బోధించుటకు బుద్ధికి సాధ్యముకాని గురుపాదము లను ప్రాతఃకాలముననే మనస్సునందు ధ్యానింతును.


2.శ్లోకము॥ 

నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం

మంత్రరాజ విరాజితం నిజమండలాస్తర్భాసితమ్ ! 

పంచవర్ణమఖండ మద్భుత మాది కారణ మచ్యుతం 

ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!



---

భావము : శబ్ద, రూపమనుతన్మాత్రలకు శక్తినిచ్చు ఆత్మగ ఉన్నది. శబ్దమందు పదిరకములైన నాదములను పుట్టించి వినోదము కల్గించునది, మంత్ర రాజమైన “ఓం” కార శబ్దమును పుట్టించి దానియందు ప్రకాశించునది, నిజ మండలమైన బ్రహ్మనాడిలోపల నివశించునది, పంచ భూతములంతట అఖండముగ, అద్భుతముగ వ్యాపించి మూలకారణమై అర్థము కాకుండ ఉన్నది యగు గురుపాదములను నిర్మలకాలమున మనస్సునందు ధ్యానింతును.


3. శ్లోకము॥ 

వ్యోమవద్భహిరంత రస్థిత మక్షరం నిఖిలాత్మకమ్

కేవలం పరిశుద్దమేకమజన్మహి ప్రతి రూపకం ! 

బ్రహ్మతత్త్వవినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకమ్

ప్రాతరేవ హిమానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!


భావము : సర్వ జీవరాసులందు నాశనము లేనిదై, ఆకాశమువలె లోపల బయట వ్యాపించినది, ప్రతీది తన రూపముగ, విశ్వరూపమై, పవిత్రమై ద్వంద్వముకాని ఏకమైనది, నిరంతరము మోక్షమును బోధించుచు బ్రహ్మతత్త్వమును నిర్ణయించునదైన గురుపాదములను మనస్సునందు మొదట కాలముననే స్మరింతును.


4.శ్లోకము॥ 

బుద్ధిరూపమ బుద్ధికం త్రితయైకకూట నివాసినం

నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్ ! 

పశ్చిమాన్తర ఖేలనం నిజ సుద్దసంయమి గోచరం

ప్రాతరేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్ !!


భావము : బుద్ధికి శక్తినిచ్చుచు బుద్ధికానిదై, మూడు నాడులు కలియు భూమధ్యమున నివాసముకలది, మార్పుచెందనిదై నిరంతరము, నిర్మలము సర్వకారణమై ప్రకాశించునది, బ్రహ్మనాడిలో సహస్రారచక్రమున ఆడునది, ఏ గుణము లేని శుద్ధమైనవారికి గోచరించునది. అయిన గురు పాదములను నిర్మలకాలమున ధ్యానింతును.

5.శ్లోకము॥ 

హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం 

నీల మధ్య సునీల సన్నిభ మాదిభిందు నిజాంశుకమ్ ! 

సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం

ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్గురు పాదుకామ్ !!


భావము : ప్రతి జీవరాసి హృదయమందు నివాసమై, మలినములేనిదై, పరమాణువై మనస్సుకు సాక్షిగ ఉన్నది, నల్లనిరంగు మధ్యలో నల్లనిదై ఉన్నది, మొదటి స్వరూపమై నిజమైన అంశ కలిగినది, శరీర మధ్యలో నుండి సూక్ష్మమైన దానిని కూడ వినుచు మిక్కిలి చురుకైనదిగనున్నది అయిన గురుపాదములను ప్రాతఃకాలముననే తలంచి నమస్కరించుచున్నాను.


6.శ్లోకము॥ 

పంచ పంచ హృషీక దేహ మనశ్చ తుష్కపరస్పరం

పంచభూతస కామషట్క సమీర శబ్దము ఖేతరమ్ ! 

పంచకోశ 'గుణత్రయాది సమస్త ధర్మవిలక్షణం

ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్గురు పాదుకామ్ !!


భావము : ఐదైదు ఇరువదైదు ఇంద్రియములచే తయారయిన శరీరమున మనస్సు మొదలైన అంతఃకరణములందు



---

పరస్పరము సంబంధము కలుగజేయునది, పంచ భూతములచే తయారైన కామము మొదలగు ఆరు గుణములు, పంచవాయువులు, శబ్దము మొదలగు పంచతన్మాత్రలకు వేరుగనున్నది. పంచకోశములకు, మూడు గుణముల ధర్మములకు విలక్షణమైనది అయిన గురుపాదములను మొదటనే మనస్సునందు భక్తిచే ధ్యానింతును.


7.శ్లోకము॥ 

పంచముద్ర సులక్ష్యదర్శన భావమాత్ర నిరూపణం

విద్యుదాది, ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్ధనమ్ !

చిన్ముఖాస్తర వర్తినం విలసద్విలాసమ మాయకం

ప్రాతరేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్ !!


భావము : ఖేచరీ, భూచరీ, షణ్ముకీ మొదలగు పంచముద్రల లక్ష్యార్థ దర్శనభావముచే నిరూపణకు వచ్చునది, మెరుపులవలె ధగధగ మెరయు జ్యోతి స్వరూపముచే సంతోషమును కలుగజేయునది, బ్రహ్మనాడి మొదట భాగమైన సహస్రారము లోపలి వర్తించునది, మాయయందే ప్రకాశించునప్పటికీ మాయలేనిదైన గురుపాదములను ఉదయకాలముననే ధ్యానింతును. 

8.శ్లోకము॥

పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధతత్య విచారణం 

చన్ద్రసూర్యచిదగ్ని మణ్డలమణ్ణితం ఘనచిన్మయమ్ !

చిత్కళా పరిపూర్ణమస్తర చిత్సమాధి నిరీక్షణం

ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్గురు పాదుకామ్ !!


భావము :తత్త్వవిచారణ చేసిన పంచభూతములందు విచిత్రముగనున్నది, సూర్య, చంద్ర, అగ్ని మొదలగు వాటియందు సారాంశమై అనగ ప్రకాశమై మూల పదార్థముగ ఉండునది, చిత్కళచే నిండినది, శరీరాంతరమున జ్ఞాన సమాధిచే తెలియబడు గురుపాదములకు మనో నిర్మలకాలమున, భక్తిచే నమస్కరించుచున్నాను.


9.శ్లోకము॥ 

హంసచార మఖణ్డనాద మనేక వర్ణమ రూపకం

శబ్దజాలమయం చరాచరజన్తుదేహ నివాసినమ్ ! 

చక్రరాజమనాహతోద్భవమేకవర్ణ మతః పరం

ప్రాతరేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్ !!


భావము : రూపము లేని, శ్వాసరూపమున అఖండనాదమై అనేక జీవశరీరములందు ఉండినది, “సోహం” అను శబ్దముచేత చరాచర జీవరాసుల దేహములందు నివాసము చేయునది, అన్నిజీవరాసుల అనాహత స్థానమందు ఒకే విధముగ పుట్టినదై వాటికంటే వేరైనది అయిన గురు పాదముల భక్తిచే మనస్సునందు భావించి పూజింతును.


10.శ్లోకము॥ 

జన్మ కర్మ విలీనకారణ హేతుభూతమ భూతకం

జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం !

నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం 

ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్గురు పాదుకామ్ !!


భావము : జన్మ కర్మల నాశనమునకు కారణమై జన్మలేనిదై ఉన్నది, జన్మ కర్మల నివారించునది, సంసారసాగరమును



---

దాటింపజేయు ప్రకాశ జ్ఞాన మైనది, పేరు, రూపము లేనిది, శుభకరమై అన్నిటికంటే గొప్ప నాయకత్వము గలదియైన గురుపాదములకు మనసంతర్భాగమున మొదటి కాలముననే నమస్కరింతును.


11.శ్లోకము॥ తప్తకాంచన దీప్యమాన మహాణుమాత్రమ రూపకం

చన్దికాస్తరతారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్ ! 

నీలనీరద మధ్యమస్థితి విద్యుదాది విభాసితం

ప్రాత రేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్ !!


భావము : కాంచిన బంగారు ప్రకాశము కలది, సూక్ష్మాణు రూపమైనది, చంద్రుని వెన్నెలకంటెను, నక్షత్రకాంతికంటెను, తెల్లని కలువ అందము కంటెను గొప్పగ వేరైనది, నల్లని మేఘముల మధ్య మెరుపు తీగలవలె ప్రకాశించునది అయిన గురుపాదములను మనస్సునందు భావించి పూజించుచున్నాను.


12.శ్లోకము॥ స్థూలసూక్ష్మసకారణాన్తర ఖేలనం పరిపాలనమ్ 

విశ్వతైజసప్రాజ్ఞ చేత సమస్తరాత్మ నిజాంశుకమ్ ! 

సర్వకారణమీశ్వరం నిటలాన్తరాళ విహారకమ్

ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్గురు పాదుకామ్ !!


భావము : స్థూల, సూక్ష్మ, కారణ శరీరములందు వ్యాపించి ఉండునది, విశ్వ, తైజస, ప్రాజ్ఞ (నిద్ర, మెలుకువ, స్వప్న అవస్థల)లో సమస్త జీవుల అంతరమున నివశించునది, సూర్య, చంద్రనాడుల మధ్యన ఉన్న బ్రహ్మనాడి యందు ఉండి సర్వమునకు కారణమైన ఈశ్వరశక్తిగనున్న గురుపాదములకు మనస్సునందు తలంచి నమస్కరించుచున్నాను.


గురు స్తోత్రములు.


1.శ్లోకము॥ కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం

గృహం బాంధవా సర్వమే తద్ధిజాతం

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


భావము : భార్య, ధనము, పుత్రులు, మనువళ్లు, బంధువులు, గృహము మొదలగునవన్నియు మానవునికుండినప్పటికి, గురుపాదపద్మముల మీద మనస్సు లగ్నముకానియెడల ఉన్నవన్నియు ఎందుకు? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము?


2.శ్లోకము॥ షడంగాది వేదో ముఖేశాస్త్ర విద్యా

కవిత్వాది గద్యం సుపద్యం కరోతి

గురోరంఘ్ర పద్మే మన శ్చేన్నలగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతః కిం !!


భావము : షడంగాది వేదములు, శాస్త్రవిద్యలు కంఠములోనే ఉన్నప్పటికీ, కవిత్వాది గద్య పద్యములు సులభముగ



---

కూర్చగల సామర్థ్యమున్నప్పటికీ, గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని వానికి అవి అన్నియు ఉండిననూ ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? అవియన్ని ఎందుకు?


3.శ్లోకము॥ 

విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః 

సదాచార నిత్య సువృత్తిన్నచాన్యః 

గురోరంఘ్ర పద్మే మన శ్చేన్న లగ్నం

తః కిం తతఃకిం తతఃకిం !!


భావము : మానవుడు విదేశములందు మహా పూజ్యుడుగ ఉండిననూ, స్వంతదేశమున ధన్యుడిగా ఉండిననూ, ఎల్లపుడు సదాచారములు, సత్ ప్రవర్తన కలిగి ఉండినప్పటికినీ, గురుపాద పద్మములమీద మనస్సు లగ్నము కానివాడు ఎట్లుండినా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?


4.శ్లోకము॥ 

క్షమామండలే భూప భూపాల బృంధం

సదా సేవ్యతే యస్యపాదార విందం

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


భావము : నీవు భూమి మీద చక్రవర్తివైనప్పటికినీ, చిన్న రాజులందరు ఎల్లపుడు నీ పాదముల సేవ చేసినప్పటికినీ గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని ఎడల నీవు ఎంతటివాడవైనా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?


5.శ్లోకము॥ 

నభోగే నయోగే నవారాజ్యభోగే

సకాంతా ముఖేనైవ విత్తేషు యుక్తః 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


భావము : ఎన్నియో భోగ సుఖములుండినా, గొప్ప యోగి అయినా, గొప్ప రాజ్యమును భోగించినా, మంచి అందమైన స్త్రీల సాంగత్యముండినా, గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నముకానివానికి ఏమి ఉండినా ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?.


6.శ్లోకము॥ 

యశోమేగతం దిక్షుదాన ప్రతాప

జగద్వస్తం సర్వం కరే యత్ ప్రసాదాత్ 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

కిం తతఃకిం తతఃకిం !!


భావము : తన యొక్క కీర్తి, ప్రతాపము, దానగుణము అన్నిదిక్కులయందు వ్యాపించినా, జగత్తంతయు తన స్వాధీనములో ఉండినా, గురుపాద పద్మములమీద మనస్సు లగ్నము కానివానికి ఏమి ఉన్ననూ, ఎట్లు ఉండిననూ, ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?.



---

7.శ్లోకము॥ 

అరణ్యే నివాసే స్వగేహేచ కార్యః 

నదేహే మనో వర్తతేమే అనార్వే

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


భావము : మానవుడు అరణ్యమందుండినా, స్వంత ఇంటిలో ఉండినా, స్థిరముకాని శరీరకార్యములలో మనస్సునుంచక విరక్తుడైనప్పటికీ, గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని ఎడల ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?


8.శ్లోకము॥ అనర్ఘ్యాణి రత్నాని యుక్తాని సమ్యక్

సమాలింగితా కామినీ యామినీసు

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


భావము : వెల లేని గొప్పరత్నములు కలవాడైనను, సుందరమైన స్త్రీలను ఆలింగనము చేసుకొనువాడైననూ, గురుపాద పద్మముల మీద మనస్సు ఉంచనివాడు ఎట్లుండిననూ, ఏమి ఉన్ననూ ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము? ఏమి ప్రయోజనము? ఏమి సార్థకము?


9.శ్లోకము॥ శరీరం, సురూపం, తథావాకళత్రం

యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!



భావము : మానవునికి సుందరమగు శరీరము మరియు మంచి గుణవంతురా లగు భార్య, విచిత్రమగు గొప్ప యశస్సు, మేరు పర్వతమును బోలు ధనము ఉండినప్పటికీ, గురుపాద పద్మముల మీద మనస్సు లగ్నము కాని వానికి ఎన్ని ఉండినా ఏమి ప్రయోజనము? ఏమి సార్ధకము? ఏమి ఫలము? ఏమి ఉపయోగము?.


గురువు యొక్క జ్ఞానమును ప్రజలు గుర్తించగలరా?.


గురువుగా వచ్చినవాడు తనను ఎవరూ గుర్తించనట్లు, మాయలో మాయగా నటించినప్పటికీ, మాయను గుర్తించిన భీష్మునిలాంటివారు, మాయలో మాయగానున్న మాయాధిపతియైన గురువును సులభముగా గుర్తించగలరు. కానీ భీష్మునిలాంటివారు భూమిమీద అరుదు, కాబట్టి గురువును గుర్తించుట అరుదైన పనియేనని చెప్పవచ్చును. ఆయనను గుర్తించలేనపుడు ఆయన విద్యను ఎవరైనా గుర్తించగలరా అని కొందరికి ప్రశ్నరాగలదు. దానికి మా జవాబు ఏమనగా! మన దేశములో ఐదువేల నూట చిల్లర సంవత్సరముల క్రితము దేవుడు భగవంతునిగా అనగా గురువుగా భూమిమీదకు వచ్చాడని ఈ రోజు మనము చెప్పుకోగల్గుచున్నాము. ఆనాడు భగవంతుడైన కృష్ణుడు భగవద్గీతను చెప్పినప్పటికీ, దానిని వినకుండినా ఎనిమిది రోజులకే యుద్ధరంగములో భీష్ముడు క్రింద పడిపోయాడు. అర్జునునకు గీతను చెప్పిన విషయము కూడా భీష్మునికి తెలియదు. కృష్ణుడు ఎవరైనది ఆనాడు భీష్మునకు తప్ప ఎవరికీ తెలియదు. కృష్ణుని విలువ



--

ఎవరికి తెలియదు అందువలన ఆయన చెప్పిన విద్యను లేక ఆయన చెప్పిన జ్ఞానమును ఎవరూ పట్టించుకోలేదు. ఆనాడు భగవద్గీతను అర్జునుని ద్వారా తెలుసుకొని దానిని శ్లోకములుగా తీర్చి గ్రంథరూపము చేసిన వ్యాసుడు కూడా గీతలోని సారాంశమును గ్రహించలేక పోయాడు. ఆనాడు గీతను వ్రాసిన వ్యాసుడే తెలుసుకోలేనపుడు, ఆయనకంటే విద్యలో ఎంతో తక్కువైన మిగత ప్రజలు తెలుసుకొన్నారని ఎలా చెప్పగలము? అందువలన గురువు శరీరముతోనున్నపుడు ఆయన చెప్పిన బోధను గ్రహించలేము. ఆయన పోయిన తర్వాత తెలుసుకోవచ్చును. ప్రత్యక్షముగ ఉన్నవానికంటే చనిపోయిన వానికే కొంత ఎక్కువ విలువ నిస్తాము. కావున గురువు శరీరముతో ప్రత్యక్షముగ లేకుండ పోయిన కొంతకాలమునకు ఎవరైన తెలుసుకొనుటకు అవకాశము గలదు. కృష్ణుడు అని పేరుకల్గిన గురువు ద్వాపరయుగములో భగవద్గీత అను పేరుతో జ్ఞానమును చెప్పితే, ఆయన చెప్పిన గీతాజ్ఞానములో ధర్మములు సంపూర్ణముగా ఉండినప్పటికీ, ఆనాటి నుండి నేటికి ఐదువేల సంవత్సరములు గడచిపోయినా, ఆయన జ్ఞానమును సంపూర్ణముగ మనుషులు తెలుసుకోలేక పోయారు. ఇంకొకమారు ఆయన వస్తేగానీ మనకు గీత అర్థము కాదేమో!


గురువును మనుషులు గౌరవిస్తారా?.


ఒక మనిషిలోని విలువ ఎదుటివానికి తెలిస్తే వాడు ఆ మనిషిని గౌరవిస్తాడు. గురువులోని విలువ ప్రజలకు తెలియదు కదా! అలాంటపుడు ఎలా గౌరవిస్తారు? గురువు శరీరముతో ఉండి గుణాలతో సంచరిస్తున్నపుడు గుణాల కార్యములే కనిపించును. మిగత ప్రజలందరు కూడా గుణాలతోనే కార్యములు చేయుచున్నారు. కావున గురువును గురువుగా కాక సామాన్య మనిషివలె ప్రజలు గుర్తిస్తారు. గురువుయొక్క విలువ తెలియనపుడు కొన్ని సందర్భములలో ఆయనను అవమానము పాలు కూడ చేయుదురు. ఇదే విషయమును భగవద్గీతయందు రాజవిద్యా రాజగుహ్య యోగమను అధ్యాయములో పదకొండవ శ్లోకమందు భగవంతుడే చెప్పాడు.


"అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం,

పరం భావ మజానన్తో మమ భూతమహేశ్వరమ్".


భావము :- సర్వజీవరాసులకు మహేశ్వరుడనైన నన్నూ, గొప్పదైన నా మహత్యమునూ తెలుసుకోలేక, మానవ శరీరము ధరించిన నన్ను చూచి మూఢులు అవమానపరుస్తున్నారు.


వివరము :- భూమి మీదున్న సమస్త జీవరాసులను సృష్ఠించినవాడు సృష్టికర్తయిన దేవుడు. ఆ దేవుడు విశ్వమంతా వ్యాపించి ఉంటూనే తనశక్తిలోని కొంత అంశ, శరీరమును ధరించి పుట్టునట్లు చేయును. దేవునినుండి అలా పుట్టిన ఆకారమును భగవంతుడు లేక గురువు అని మనము అంటున్నాము. గురువు లేక భగవంతుడు సాకారముగ కనిపిస్తున్నాడు. దేవుడు నిరాకారముగ కనిపించకుండ ఉన్నాడు. కనిపించడము, కనిపించక పోవడము అను తేడా తప్ప దేవునికి, గురువుకు ఏ భేదములేదు. విశాలముగనున్న సముద్రములోనుండి ఎగిరి వచ్చిన నీటి బిందువులోనూ, సముద్రము లోను నీరేవున్నట్లు, దేవునిలోనూ, గురువులోనూ ఒకేశక్తి ఉన్నది. బిందువుగా నున్న నీటికి సముద్రముగానున్న నీటికి ఒకే ధర్మముగలదు. గురువు శరీరము ధరించి కనిపించుట వలన, గురువు కూడ కర్మానుసారము అజ్ఞానివలె ప్రవర్తించుట వలన, జ్ఞానములేని మానవులు గురువును కూడా సాధారణ మనిషిగా లెక్కించి ఆయనను అవమానింతురు. గురువులోని గొప్పతనమును ఏమాత్రము గ్రహించని మనుషులు ఆయన చెప్పు జ్ఞానమును విభేదించి, ఆయనకంటే వారికే ఎక్కువ




---

జ్ఞానము తెలుసుననుకొని, “నీవు అజ్ఞానమును బోధిస్తున్నావని” ఆయనతో వాదమునకు దిగి హేళనగా మాట్లాడుదురు. ఆయన యొక్క జ్ఞానమును గానీ, ఆయన యొక్క వ్యక్తిత్వమునుగానీ లెక్కించక ఆయన మీదికి దాడిచేయుటకు కూడ ప్రయత్నింతురు. ఇదంతయు ఆయనను (గురువును) అవమానపరచి నట్లు కాదా? సంపూర్ణ జ్ఞానకేంద్రమైన గురువుకు ఏమాత్రము విలువ ఇవ్వక ఆయన చెప్పినది అజ్ఞానమని, తమకు తెలిసినదే జ్ఞానమనుకోవడము ఆయనను (గురువును) అవమానపరచినట్లు కాదా! మనము బాగుపడే దానికి, మనకు మోక్షము వచ్చేదానికి, మనకు ధర్మములను తెలియ బరచుటకు పనిగట్టుకొని భూమిమీదకు వచ్చిన భగవంతుణ్ణి (గురువును) ఆయన చెప్పునదేదో వినకనే, ఇతరులచేత రెచ్చగొట్టబడిన వారు మూర్ఖముగ మనము ఏమి చేయుచున్నామని ఆలోచించక గురువును దూషించి అవమానపరచు వారు కూడ కలరు. అందువలన భగవద్గీతలో భగవంతుడు మూఢులు నన్ను అవమానించుచున్నారని చెప్పాడు. మూఢులైన అజ్ఞానులు దేవుడైన భగవంతుడు (గురువు) ఎప్పుడు భూమి మీదకు వచ్చినా ఆయనను అవమానించుట మానరు. దైవభక్తి (గురుభక్తి) ఏమిటో తెలియని దేవతల భక్తికల్గిన వారూ, దేశభక్తి కల్గిన వారూ, మతభక్తి కల్గినవారూ తమకు తెలిసినదే నిజమైన జ్ఞానమని, గురువు చెప్పు జ్ఞానమును హేళన చేయడమేకాక గురువును దూషింతురు. కావున మీరు దేశభక్తులైతే దానిని మించిన దైవభక్తి పెంచుకోవాలి. మీరు మతభక్తులైతే దానినిమించిన గురుభక్తిని పెంచుకోవాలి. అప్పుడే గురువును గౌరవించిన వారమగుదుము.


గురువును దూషించిన వారిని గురువేమి చేయును?


భౌతిక శరీరమును ధరించిన గురువును మూఢులైన వారు దూషించితే గురువు వారిని ఏమియు చేయాలనుకోడు. ఎందుకనగా గురువును అవమానపరచితే, భయంకరమైన కర్మ (పాపము) వారికి చేరుచున్నది. ఆ పాపమును అనుభవించుటే పెద్దశిక్ష అయినపుడు వేరుగా ఆయనేమి చేయవలసిన పనిలేదు. గురువును దూషించిన మూఢులు భయంకర పాపమును పొందినవారై, దేశభక్తి, మతభక్తి అనుచు వ్యర్థమైన జ్ఞానమును పొందినవారై, అసురగుణములలో చిక్కుకొని పోవుచున్నారని రాజవిద్యా రాజగుహ్యయోగమున 12వ శ్లోకమునందు చెప్పియుండడమేకాక అదే భగవద్గీతయందు దైవాసురసంపద్వి భాగయోగమున 20వ శ్లోకములో...


"అసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని,

మామ ప్రాత్ర్యైన కౌంతేయ తతోయాన్యధమాం గతిమ్.”


భావము :- అసుర యోనులందు జన్మించుచు, మూఢులగుచు నన్ను తెలుసుకొను జ్ఞానమును ఏమాత్రము తెలియక జన్మ, జన్మకూ అధోగతి పాలగుచున్నారు.


వివరము :- గురువును అవమానించు వారు రాక్షసగుణము కలవారై, పాపములను మూటగట్టుగొన్న వారై, దేవుని జ్ఞానము యొక్క గట్టే దొరకక చస్తూ, పుట్టుచూ, జన్మ, జన్మకు అధోగతిపాలగుచూ, అంతముగాని పాపము గలవారైయుందురు.


ఈ విధముగ గీతయందు తానేమి చేయకనే పాపములలో చిక్కుకొందురని భగవంతుడు చెప్పియున్నాడు. భగవంతుడు ప్రతీకారముగ ఏమి చేయడని, వాని పాపమే వానిని హింసించి అధోగతి పాలుచేయు చున్నదని దానివలన అట్టి మూఢునికి జ్ఞానమును తెలుసుకొను అవకాశమే లేదని తెలియుచున్నది. మరియొక విచిత్రమేమనగా! గురువును నిందించిన వానికి ఎవరికి తెలియని చిత్రమైన సంఘటనలు కూడ జరుగుచున్నవి. వాటిని గూర్చి చెప్పినా అర్థము



---

కానివిగా ఉన్నవి. తర్వాత జన్మలలో పాపములను అనుభవించవలసి యున్నదని కృష్ణుడు చెప్పగా, ఆయన చెప్పని సంఘటనలు, ఈ జన్మలోనే జరుగుచుండుట విచిత్రము కాదా? గురువును అవమానించిన వానికి ఈ జన్మలో కూడ శిక్షలుపడునని తెలియుచున్నది. ఆ శిక్షలను గురించి తెలుసుకొనుటకు ముందు, కొంత క్రొత్త వివరమును కూడ తెలుసుకోవలసియున్నది, అదేమనగా!


భూమిమిూద కనిపించు స్థూల జీవరాశులే కాక, కనిపించని సూక్ష్మ జీవరాశులు ఎన్నో కలవు. ఈ మాటను నాస్తికవాదులు నమ్మకపోయినా కనిపించని అన్ని జీవరాశులు ఉండుట సత్యమే. భూమిమీదనే కాక ఖగోళములో ఎన్నో సూక్ష్మగోళగ్రహములు కూడ కలవు. భూమిమీదకు గురువు వచ్చినపుడు భూమిమీద స్థూల జీవరాశులు గానీ, సూక్ష్మ జీవరాశులు గానీ గురువును గుర్తించలేరు. స్థూలముగానున్న వారు గుర్తించలేరని ముందే తెలుసుకొన్నాము. స్థూలముకంటే సూక్ష్మములో గ్రహించుటలో కొంత తేడాయున్నప్పటికీ, సూక్ష్మజీవరాశులు కూడ గురువును గుర్తించలేక పోవుచున్నవి. ఇకపోతే, ఖగోళములోని సూక్ష్మ గోళగ్రహములు గురువును గుర్తించగలవు. అందువలన ఖగోళములోని సూక్ష్మగ్రహములు భూమిమీదకు వచ్చి, గురువు దగ్గర జ్ఞానమును తెలుసుకొనుచుండును. గురువు వారికి ప్రత్యేకించి జ్ఞానమును చెప్పకుండినా, మనుషులకు చెప్పునపుడు గోళగ్రహములు కూడ జ్ఞానమును శ్రద్ధగా తెలుసుకొను చుండును. మనుషుల మధ్యలో పెద్ద పెద్ద గ్రహములుండి జ్ఞానమును తెలుసుకోవడము జరుగుచుండును. అలా జ్ఞానమును తెలుసుకొని గురువు మీద ఎంతో విశ్వాసముతో ఉండును. గురువును ఎవరైనా దూషించినా, అవమానపరచినా వారికి కోపమొచ్చును. అట్టివారు ఖగోళములో వారి స్థానములో వారుంటూ, అప్పుడప్పుడు గురువువద్దకు వస్తూ, జ్ఞానమును తెలుసుకొనుచుందురు. వారు ఎప్పుడు వచ్చినదీ, ఎప్పుడు పోవునదీ మనుషులు చూడలేరు, కనుక వారి రాకపోకలు ఒక గురువుకు తప్ప ఎవరికీ తెలియదు. గురువు, జ్ఞానము చెప్పునపుడు వందమంది మనుషులుంటే, అక్కడ అంతకంటే ఎక్కువ గానీ, తక్కువ గానీ ఖగోళగ్రహములుంటున్నవి. గురువు జ్ఞానము చెప్పని దినములలో కూడ గ్రహములు వచ్చి గురువును దర్శించుకొని పోవుచుండును. అలా వచ్చు వారు సూక్ష్మముగ కనిపించ కుందురు, కావున ఒక్కొక్కపుడు మనము వారి మధ్యలోనికి పోవడముగానీ లేక వారు మన మధ్యలో ఉండడము గానీ జరుగుచుండును. అటువంటి సమయములో వారి సమక్షములో ఎవరైనా గురువును నిందించినా, అవమానపరచినా వారికి గురువును దూషించిన వాని మీద కోపము వచ్చును. వారికి కోపము వస్తే వారి కోపమునకు గురియైన వానిని వదలక ఏదో ఒక విధముగ కష్టనష్టములను కలుగ చేయడము గానీ, లేక రోగగ్రస్తుని చేయడము గానీ, లేక వానిని చంపివేయడముగానీ జరుగుచున్నది. దేవునికి వ్యతిరేఖముగా మాట్లాడినా, స్థూలముగానున్న భగవంతుణ్ణి (గురువు) దూషించినా, ఆ సమయములో గ్రహములు అక్కడ ఉంటే గురువును దూషించడము చూస్తే, దూషించిన వానికి గానీ, అవమానించిన వానికి గానీ ముప్పు తప్పదు. గురువు ఏమి ప్రతీకారము చేయకున్ననూ గ్రహములు మాత్రము వదలవు.


ఉదాహరణకు ఎల్లయ్య అనువాడు మల్లయ్య అనువానితో మాట్లాడుచూ, మల్లయ్య యొక్క గురువును దూషించి “మీ గురువు ఏమి చేస్తాడో చేయమను, నేను దూషించుచున్నాను కదా! మీ గురువు శక్తి వంతుడైతే నాకేమైనా కావాలి, అట్లు కాకపోతే మీ గురువును తన్ని తరిమేస్తా”నన్నాడు. ఆ సమయమునకు అక్కడ గ్రహము ఒకటి ఆ మాటలు వినగల్గి అలా అన్న వానిమీద మిక్కిలి కోపము కల్గినదై తగిన సమయము కొరకు వేచి చూస్తుండెను. కర్మరీత్యా బలమైన సమయమున సూక్ష్మముగ నున్న ఖగోళ గ్రహము వానిమీద దాడిచేసి వానిని చంపివేసింది. స్థూలముగ నున్న గురువు ఏమి అనకున్నను, ఆ గురువు మీద అభిమానముగల గ్రహము, దూషించిన వానిని చంపినప్పటికీ ఆ మరణము గుండె



---

ఆగిపోవడము వలన జరిగిందని చాలామంది అనుకొన్నారు. చనిపోయిన వాడు ఆరోగ్యముగ ఉండుట వలన అందరూ అతని గుండె ఆగిపోవడము జరిగినదనుకొన్నారు. ఒక విచిత్రమేమంటే! చనిపోయిన వ్యక్తి చనిపోయే ముందు లేక చనిపోయే సమయములో గుడ్డలలోనే మల మూత్ర విసర్జన చేసుకోవడము జరిగినది. హార్ట్ ఫెయిల్కు, మూత్రవిసర్జనకు సంబంధము లేదని వైద్యనిపుణులైన కొంతమంది డాక్టర్లకు తెలిసినప్పటికీ ఎటూ తోచక గుండె నిలిచిపోవడము వలన చనిపోయాడని చెప్పారు. చనిపోయిన వాడు చివరిగా ఏదో భయంకర రూపమును చూచియుంటేనే ఆ విధముగ మల,మూత్ర విసర్జన చేసుకొని ఉంటాడని సులభముగా చెప్పవచ్చును. కానీ అతను ఏమి చూచినది, తనకేమి జరిగినది చెప్పకనే చనిపోవడము జరిగినది. ఇంకో విచిత్రమేమంటే అతడు చనిపోయినది రాత్రి పూటకాదు, నిర్జన ప్రదేశముకాదు. పగటి పూట మనషుల మధ్యలో కూర్చొని ఉన్నపుడు ప్రక్కవానికి కూడ తెలియకుండ చనిపోయాడు. ఇదంతయు సూక్ష్మముగ జరిగినది కావున, ఎవరికీ ఏ అనుమానమూ రాలేదు, కానీ మల్లయ్యకు మాత్రము ఎల్లయ్య మరణము మీద అనుమానము వచ్చినది. అతను ఏ విధముగా చనిపోయినా ఆ మరణము తమ గురువును నిందించిన దానివలననే వచ్చిందనుకొన్నాడు. గురువును నిందించడము వలననే అతను చనిపోయినా, అది సూక్ష్మగ్రహము వలన జరిగినది కావున ఏమీ అర్థముకాక గుండె జబ్బు అని అన్నారు.


గురువును నిందించితే ఆయన వలన ఏ ప్రతీకారము లేక పోవచ్చును. కానీ ఆ సమయములో అక్కడ ఎవరైన గురువు మీద అభిమానము, ప్రేమ, భక్తిగల సూక్ష్మరూపులుంటే నిందించిన వానికి తప్పక ముప్పు ఏర్పడును. అలా ఎందరో తెలియక గురువును నిందించి, ఎంతో నష్టపోయిన వారైనారు. కొందరు కాళ్ళు, చేతులు పోగొట్టుకొన్నారు, కొందరు మాట్లాడే నోరును పోగొట్టుకొని మూగవారైనారు. కొందరు కళ్ళ చూపును పోగొట్టుకొన్నారు. కొందరు ఏకంగా ప్రాణమునే పోగొట్టుకు న్నారు. సూక్ష్మగ్రహములు బయటి ఆధారము లేకుండ చేయడము వలన అలా ఎందుకు జరిగినది తెలియకుండ పోయినది. డాక్టర్లు కళ్ళు పోయిన వానికి విటమిను లోపమంటున్నారు, కాళ్ళు, చేతులు పడిపోయిన వానికి నరాలలోపమంటున్నారు. అన్నీ ఆరోగ్యముగా ఉండి చనిపోతే గుండెపోటు అంటున్నారు. కానీ వాస్తవస్థితి ఎవరికీ అర్థము కాలేదు.


గురువును అవమానించుట వలన లేక దూషించుట వలన ఆ జన్మలోనే కొందరికి ప్రక్కనున్న గ్రహముల వలన బాధలు కలుగుటయే కాక తర్వాత వచ్చు జన్మలు కూడా నరకప్రాయమగును. ప్రపంచములో ఇతరులను దూషించినా, అవమానించినా, బాధించినా, మోసము చేసినా వచ్చు పాపము తర్వాత జన్మలో అనుభవించి అయిపోజేసుకోవచ్చును. అట్లు అనుభవించి లేకుండ చేసుకోవడము ఒక పద్ధతికాగా, జ్ఞానము తెలిసి యోగము చేసి, జ్ఞానాగ్నిని సంపాదించుకొని, ఆ అగ్ని వలన వెనుక జన్మలో చేసుకొన్న పాపమును కాల్చివేయవచ్చును. దీనినిబట్టి ప్రపంచములో మనుషుల ఎడల చేసిన పాపమును అనుభవించిగానీ, అనుభవించక జ్ఞానము వలనగానీ లేకుండ చేసుకోవచ్చును. కానీ సాకార గురువు ఎడల గానీ, నిరాకార దేవుని ఎడలగానీ చేసుకొన్న పాపమును ఎటు తిరిగీ అనుభవించవలసిందే. దేవుని జ్ఞానశక్తి వలన అది కాల్చివేయబడదు. గురువు ఎడలగానీ, దేవుని ఎడలగానీ ఒక్క జన్మలో చేసుకొన్న పాపము తర్వాత జన్మలో అనుభవించినా అయిపోదు. దైవదూషణ లేక గురుదూషణ వలన ఏర్పడిన పాపము యుగ యుగముల పర్యంతము అనుభవించవలసి యుండును. దేవున్ని ప్రార్థించినా, దేవుడు కూడా ఆ పాపమును క్షమించడు. అందువలన అటువంటి పాపమును క్షమించబడని పాపము అంటాము. దైవ, గురు దూషణ వలన అనేక యుగములలో అనేక జన్మలు పొంది అనేకమైన బాధలను అనుభవించవలసి ఉండునని, ఇటు భారతదేశములోని భగవద్గీతయందూ, అటు విదేశములలోని



---

మతగ్రంథములందు కూడ చెప్పబడియున్నది. దీనిని బట్టి నీవు ఏ మతస్థుడవైనా దేవున్ని దూషిస్తే క్షమించరాని పాపము తప్పదు. అందువలన అన్ని మతాలకు పెద్దయిన దేవున్ని నేను పరమతస్థుడిని కదా! ఇతర మత దేవున్ని దూషించాను కదా అనుకొనినా, పాపము నిన్ను వదలదు. ఎందుకనగా సర్వసృష్టికీ సర్వ మతాలకు అధిపతి దేవుడొక్కడే. కావున ఇందూమతములోని దేవుడైన పరమాత్మను లేక భగవంతుడైన కృష్ణున్ని పరమతస్థుడు దూషించినా, పరమతములోని దేవుడైన వానిని హిందువు దూషించినా క్షమించరాని పాపము వచ్చుటకు అవకాశముగలదు. అందువలన జాగ్రత్తకలిగి జ్ఞానమును సంపాదించుకొని దేవున్ని దూషించక, జీవితమును సాగించవలెనని కోరుచున్నాము.


గురువు అడవిలో ఉంటాడా లేక ఊరిలో ఉంటాడా?


గురువు అనువాడు ప్రజలమధ్యలో ఉండడనీ, జన సంచారములేని అడవిలోనూ, గుహలలోనూ ఉండునని, మనకు జ్ఞానము అవసరమైనపుడు అడవిలో లేక గుహలలోనున్న గురువును వెదకుచూ పోయి గురూ పదేశము తీసుకోవాలని కొందరంటుంటారు. అంతేకాక గురువును శిష్యుడే వెదకుచూ పోవాలి. కానీ గురువు శిష్యున్ని వెదకుచూ రాడని కూడ చెప్పుచుందురు. ఈ మాటలను వినిన కొందరు సామాన్య జనులు ఊరిలో జ్ఞానమును చెప్పువాడు గురువు కాదని, గురువు అడవిలో ఉంటాడని గురూపదేశము అవసరమైనపుడు అడవికి పోయి గురువునెదుకుకోవాలని అనుకొనుచుందురు. అటువంటి వారిని ఉద్దేశించి వేమనయోగి ఏమన్న డనగా!

జరుగుచుండెడిది.


గుహలలోన జొచ్చి గురువుల నెదుకంగ

కూౄరమృగ మొకండు తారసిల్లిన

ముందుగ ముక్తి మార్గమదియె చూపు

విశ్వదాభిరామ వినురవేమా.



వేమన చెప్పిన ఈ పద్యము అందరికి సులభముగా అర్థమై ఉంటుంది. ఆయన చెప్పిన మాటలలో గురువులు అడవిలో ఉండరని తెలియుచున్నది. పూర్వము కొందరు రాజులు తమ రాజ్యమును వారి వారసులకు అప్పగించి పిల్లల బంధాన్ని తెంచుకొని అడవికిపోయి, అక్కడ తపస్సు చేసుకొనెడివారట. నిర్జన ప్రదేశమైన అడవిలో వారి తపస్సుకు భంగము కలుగదని భావించి, అలా అడవికి పోయి తమ వారికి దూరముగా ఉంటూ మోహగుణమును తగ్గించుకొనెడివారు. అట్లు వారు వదిలించుకోవాలనుకొనినా, వారి పిల్లలు కొందరు అడవికి పోయి అక్కడ వారి తల్లితండ్రులతో కలిసిరావడము అలా కొంతకాలము జరుగగా వారితో పాటు, వారి బంధువులు కూడా అడవికి పోయి కలిసి రావడము వలన చివరికి అడవిలో ఉండినా, ఊరిలోనున్నట్లే అన్ని బంధాలు తగులుకోవడము జరుగుచుండెను. ప్రశాంతత కొరకు అడవికి పోయి ముక్కు మూసుకొని జపమో, తపమో చేసుకోవాలనుకొన్న వారికి అడవిలోని అడ్రసు కూడ తమ పిల్లలకు బంధువులకు తెలియడము వలన, అక్కడ కూడ కుటుంబ బాధ్యతలలో చిక్కుకొని, శేషజీవితము ప్రశాంతముగ గడుపుటకు అవకాశము లేకుండ పోవుచుండెడిది. అందువలన కొందరు అడవిలో కూడ వారి అడ్రసు బంధువులకు దొరకనట్లు, గుహలలో కాలము గడిపెడివారు. ఆ విధముగ పూర్వము కొందరు రాజులు అడవులలోను, మరికొందరు గుహలలోను నివాసము ఏర్పరుచుకొని ఉండెడివారట. అలా అడవిలోగానీ, గుహలలోగానీ ఉన్నవారి మీద ఊరిలోని వారికి గొప్ప భావముండెడిది. అడవిలో దైవజ్ఞానమును నెమరువేస్తు కాలము గడుపు వారు గొప్ప జ్ఞానులని ఊరిలోని ప్రజలు అనుకొనెడివారు.



---

కాలము గడచి పోవుకొలది రాజులకాలము పోయి నేటి కాలము వచ్చినది. నేటికాలము వచ్చినప్పటికీ పూర్వమనుకొన్నట్లు కొందరు అడవులలోను, గుహలలోను తపస్సు చేయు మునులుంటారని అనుకోవడము జరుగుచున్నది. ఎవనికైన వైరాగ్యము వచ్చి, జ్ఞానము కావాలనుకొన్నపుడు అడవులలోను, గుహలలోను రహస్యముగ తపస్సు చేయువారి వద్దకు పోతే మనము కూడా పూర్తి జ్ఞానులుగా మారిపోతామని అనుకొనుచుందురు. ఊరిలో జ్ఞానము చెప్పువారికి ఎన్నో బంధనాలున్నాయి. వీరు చెప్పు బోధను వినినా, దానివలన మనకు ఏ బంధనాలు పోవు. కానీ అడవిలో అజ్ఞాతముగా నున్న వారిని కలుసుకొంటే, మనకు కూడా బంధనములు పోయి వారి మాదిరి మారిపోతామని అనుకొని, వారికి వైరాగ్యము వచ్చినపుడు అన్నిటిని వదలి అడవికి పోవాలనుకొనుచుందురు. అలా పోయినా, అడవులలో వెదకినా, అక్కడ ఎవరూ కనిపించరు. పూర్వము కొందరు రాజులు మొదలైన వారు అడవికి పోయిన మాట వాస్తవమే. అది పూర్వకాలము మాట. ఆనాటివారు నేటికినీ అడవులలో ఎందుకు ఉంటారు? ఆనాడే కాలము తీరి ఆయుష్షు అయిపోయి చనిపోయి వుంటారు. అడవుల్లో తపస్సులు చేయుచు, దీర్ఘకాలము బ్రతుకువారు ఆనాడు లేరు, ఈనాడూ లేరు. కొద్దిపాటి శేషజీవితము ప్రశాంతముగ దైవజ్ఞానములో గడుపవలెనను వారు, అడవికి పోయినా వారు నేటి వరకు ఉండరు కదా! ఒకవేళ ఈ కాలములో జ్ఞానము కొరకు అడవిలోనికి పోయి, ఎవరికి తెలియకుండానున్న మహర్షులతో కలిసిరావాలనుకొన్నా, వారు కనిపించరు గానీ అడవిమృగాలే కనిపిస్తాయి. ఎవడైన తెలియక అడవిలో ఎవరో తనను ఉద్దరించువారున్నారనీ, వారు తనకు మోక్షమును చూపుదురనుకొని అడవికి పోతే, అక్కడ ఆకలిగొన్న మృగము ఎదురుపడితే మహర్షులకంటే ముందుగ ముక్తి ఆ మృగమే చూపుతుందని వేమనయోగి అన్నాడు. అంటే నీవనుకున్న మాట ఏమోగానీ, ఆకలిగొన్న మృగము తన ఆకలి కొరకు నిన్ను చంపి తింటుందనీ, చావు అనే ముక్తిని మృగము చూపుతుందని చెప్పాడు. శాశ్వతముగా దేహమునుండి ముక్తిని గురువు చూపగలవాడైతే తాత్కాలికముగా దేహ ముక్తిని మృగము చూపుతుందనీ, అట్లు పోవుట మంచిదికాదనీ, గురువు అడవిలో ఉండడనీ, మనకు అర్థమగునట్లు వేమన ఆ పద్యమును చెప్పాడు.


వేమనయోగి చెప్పిన మాట వాస్తవమే కదా! గురువు మనుషులకు జ్ఞానము చెప్పుటకు భూమిమీద అవతరిస్తాడని చెప్పుకొన్నాము. మనుషుల కొరకు పనిగట్టుకొని వచ్చిన గురువు, మనుషులున్న చోట లేకుండ జంతువులున్న అడవిలోనికి ఎందుకు పోవును? శరీరములేని దేవుడు శరీరముగల గురువుగా భూమిమీద కనిపించి, మనుషుల మధ్యలో ఉండి, మనుషులతో సంబంధమేర్పరచుకొని సందర్భానుసారము జ్ఞానము తెలియజేయును. ప్రజలకు జ్ఞానము తెలియజేయడమే ఆయన ఉద్దేశమైనపుడు ప్రజలున్న ఊరిలో ఉండక, జంతువులున్న అడవిలో ఎందుకుండును? గురువు అడవిలో ఉంటాడనుట అసత్యము. గురువు ఎప్పుడు అవతరించినా ప్రజల మధ్యలో, ఊరిలోనే ఉంటాడు.


గురువుకు శిష్యులుంటారా?.


ఇదేమి ప్రశ్న? గురువన్న తర్వాత శిష్యులు లేకుండా ఎట్లుంటాడు? అని మీరు ఎదురు ప్రశ్న అడుగవచ్చును. ఇక్కడ విచిత్రమేమంటే గురువుకు శిష్యులుండరు. శిష్యులు లేకపోతే గురువెలా అవుతాడని మీరు ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఈ విధముగా ఉంది. గురువు ప్రజలకు ధర్మముతో కూడుకొన్న దైవజ్ఞానమును తెలుపుటకు భూమిమిదకు రావచ్చును. కానీ శిష్యులను తయారు చేసుకొనుటకు కాదు. గురువు భూమిమీదకు వచ్చిన ఉద్దేశము ధర్మయుక్తమైన జ్ఞానము తెల్పడము. అంతేకానీ ఏ ఒక్కనిని శిష్యునిగా చెప్పుకోవడానికి రాడు. గురువు భూమిమీదకు లక్షల సంవత్సరములకో, కోట్ల సంవత్సరములకో ఒకమారు వస్తే, ఎవరికీ గురువుగా గుర్తింపులేనట్లు, అజ్ఞాతముగా ప్రజల




---

మధ్యలో ఉండి, సందర్భము వచ్చినపుడు మాత్రమే, జ్ఞానము చెప్పునని ముందే తెలుసుకొన్నాము. ప్రజలకు ఇతను గురువు అని తెలియనట్లుండుట వలన, శిష్యులేర్పడుటకు అవకాశమే లేదుకదా! “నేను గురువును” అని బోర్డు పెట్టుకొన్న వాని వద్దకు ఎవడైన పోయి శిష్యుడు కావచ్చును. కానీ ఫలానా వాడు గురువు అని తెలియనపుడు, ఎవడూ అతనివద్ద శిష్యుడయ్యే అవకాశమే లేదు. అందువలన నిజగురువుకు శిష్యులుండరు.


ద్వాపరయుగములో గురువు కృష్ణుని రూపములో వచ్చినపుడు, శ్రీకృష్ణునికి ఒక్క శిష్యుడూ లేడని మరచిపోకూడదు. కనీసము ఒక్క శిష్యుడు కూడ లేని కృష్ణుడు, భూమిమీద నుండి పోయిన తర్వాత చాలామంది జ్ఞానులు, యోగులు కృష్ణుణ్ణి జగద్గురువు అన్నారు. శిష్యులేలేనపుడు ఆయన జగద్గురువని ఎలా పేరుగాంచాడని అడుగవచ్చును. దానికి సమాధానము ఏమనగా! ఈ కాలములో పేరుగాంచిన అద్వైత పీఠము కలదు కదా! అద్వైత సిద్ధాంత కర్త ఆదిశంకరాచార్యులని అందరికీ తెలుసు. ఆది శంకరాచార్యున్ని వారి శిష్యులు “జగద్గురువు” అని అంటున్నారు. ఆది శంకరాచార్యుడు గురువే కదా! అతనిని జగద్గురువు అని ఎందుకంటున్నారని ప్రశ్నిస్తే కొందరిలా సమాధానము చెప్పుచూ "శంకరాచార్యులు గురువే అయినప్పటికీ ఆయన శిష్యులు జగత్తంతయు ఉండుట వలన మరియు ఆయనకు శిష్యులు ఎక్కువమంది ఉండుట వలన శంకరాచార్యున్ని “జగద్గురువు” అని అన్నామని వారికి తెలిసిన మాట వారు చెప్పారు. వారు చెప్పినపుడు వినవలసిందే, విన్న తర్వాత అది సత్యమా అసత్యమా అని యోచించి చూడవలసిందే. అలా యోచిస్తే రెండు వేల సంవత్సరముల నాడు పుట్టిన శంకరాచార్యుడు అనేకమంది శిష్యులను కల్గి జగద్గురు అని పేరుగాంచియుంటే, ఐదు వేల సంవత్సరములనాడు పుట్టిన కృష్ణుడు ఒక్క శిష్యున్ని కూడ పెట్టుకోకుండ ఎలా జగద్గురువైనాడను ప్రశ్న రాగలదు. దానికి జవాబును వెదకితే ఇలా తెలియుచున్నది. "జగత్తులోనున్న సమస్త జీవరాసులకు వర్తించు జ్ఞానమును చెప్పినవాడు జగద్గురువు” అను సూత్రము ప్రకారము కృష్ణుడు జగద్గురువైనాడు. కృష్ణుడు బోధించిన జ్ఞానమును బట్టి గురువైనాడు, కానీ శిష్యులను బట్టి గురువు కాలేదు. శిష్యులున్న వాడు గురువు అనుమాట సరియైనది కాదు మరియు అది సూత్రము కాదు. ఒకవేళ ఎవరైన శిష్యులను బట్టి గురువు అను సూత్రమును నమ్మితే, దాని ప్రకారము ఇద్దరు శిష్యులున్నవాడు కూడ గురువే అగును. ఆ లెక్క ప్రకారమైతే, ఇప్పటి కాలములో పదిమంది శిష్యులనుండి వేల సంఖ్య వరకు శిష్యులున్న గురువులు భూమిమీద కొన్ని వేలమంది గలరని చెప్పవచ్చును. ఎప్పుడైన భూమిమీద గురువు ఒక్కడే ఉంటాడు అన్నది సూత్రము. అనేక మంది గురువులు ఏక కాలములో ఉండుట అసత్యము.



కొన్ని వేల, కొన్ని లక్షల సంవత్సరములకో లేక కొన్ని కోట్ల సంవత్సరములకో అరుదుగా అవసరమొచ్చినపుడే, దేవుని అంశే గురువుగా భూమిమీదకొస్తుందనడము, బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీత యొక్క మాట కాగా, వచ్చినవాడు కూడ గురువని తెలియకుండునని చెప్పడము మా మాటకాగా, ఆ మాటలకు సరిపోయినవాడు కృష్ణుడని తెలియుచున్నది. అలా కాకుండ సూత్రబద్ధము కాకుండ, శిష్యులున్న వానిని గురువనడము, చాలామంది శిష్యులున్నవానిని జగద్గురువు అనడము పూర్తి తప్పని తెలియుచున్నది. శాస్త్రబద్దముగా భారతదేశములో ఐదువేల సంవత్సరముల పూర్వము వచ్చిన కృష్ణుడు తప్ప, ఇంతవరకు గురువుగానీ, జగద్గురువుగానీ భారతదేశ భూమిమీదకు రాలేదు. కొందరు శిష్యులు వారి గురువు మీద అభిమానముతో మా గురువు నిజమైన గురువనిగానీ, జగద్గురువని గానీ చెప్పుకోవచ్చును. కానీ చెప్పుకొన్నంతమాత్రమున వారు గురువులు కాదు కదా! అందువలన ప్రక్క పురుషున్ని నమ్ముకోవడముకంటే, స్వంత పురుషున్ని నమ్ముకోవడము మంచిదని పెద్దలు చెప్పినట్లు, బోధలు చెప్పు ప్రతి వానిని గురువనుకోక, నిజముగ నీకు అధికారియైన దేవుణ్ణి గురువుగా లెక్కించు కోవడము మంచిది. ప్రస్తుతానికి నీకు గురువుండినా పరవాలేదు, గురూ



---

పదేశము తీసుకొనినా ఫరవాలేదు. శిష్యులు లేని గురువును చూచుకో! శిష్యులను బట్టి గురువు ఉండడనీ, చెప్పే ధర్మములను బట్టి గురువుంటాడని తెలుసుకో!


గురువుకు మహత్యములుండునా?.


మనుష్యులందరు మోసపొయ్యేది మహత్యముల వద్దనే. మహత్యము లను చూచి అదే నిజమైన దైవత్వమనుకొని మాయమార్గములో పోవువారు చాలామంది కలరు. దీనినిబట్టి మాయకు మహత్యములు ఉన్నాయా? గురువుకు మహత్యములు లేవా? అని మీరు ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఏమనగా! మాయకే మహత్యములున్నపుడు మాయకంటే పెద్ద అయిన, మాయను సృష్టించి పెట్టిన వానికి మహత్యము లేకుండునా? గురువుకు కూడా మహత్యములు కలవనే చెప్పవచ్చును. ప్రపంచములో గురువు వలనా మహత్యము జరుగుచున్నది, మాయ వలనా మహత్యము జరుగుచున్నది. కానీ ఏది గురువు మహిమో? ఏది మాయ మహిమో ఎవరికి తెలియకుండా ఉన్నది. ఇక్కడ కొందరికొక ప్రశ్న రాగలదు. అదే మనగా! "గురువు శరీరముతో ప్రత్యక్షముగా కనిపిస్తున్నాడు, కాబట్టి ఆయన ద్వారా జరుగు మహత్యమును కనుగొనవచ్చును. కానీ ఆకారములేని మాయ తన మహత్యమునెలా చూపును? దానిని చూచి మాయవెంట మనమెలా పోవుదుము” అని అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా!


దేవుని శక్తిలోని భాగము గురువుగా వచ్చినపుడు మాత్రము గురువు కనిపిస్తున్నాడు. దేవుని సృష్ఠిలోని భాగమైన మాయ, మనిషి శరీరములో తలయందు గుణముల రూపముతోనున్నది. ఈ విషయమునే భగవద్గీతలో "గుణమయీ మమ మాయా" అని భగవంతుడన్నాడు. నేను తయారు చేసి పెట్టిన నా మాయ, గుణముల రూపముతోనున్నదని భగవంతుని భావము. దానిప్రకారము మాయ కనిపించని విధముగా, అన్ని శరీరములలో పని చేయుచున్నది. దేవుడు కనిపించు మనిషిగా వచ్చి, భూమిమీద ఉన్నపుడు అంతవరకు అన్ని శరీరములలో గుణరూపములో నుండి, ఆ శరీర జీవులను మాత్రము తనయందు లగ్నము చేసిన మాయ, కొన్ని శరీర జీవులను గురువుకు వ్యతిరేఖముగా నడుచునట్లు చేయును. మరికొన్ని శరీరముల నుండి గురువుకు వ్యతిరేఖముగా బోధించునట్లు చేయును. కొన్ని శరీరములను దైవజ్ఞానమను పేరుతో తన మాయ జ్ఞానమును బోధించునట్లు చేసి, గురువులుగా ప్రవర్తించునట్లు చేయును. కొందరిని బాబాలుగా ప్రవర్తింప చేసి, వారిచేత ఎన్నో మహత్యములను చేయించును, బాబాల చేత మనుషులు కోరిన కోర్కెలన్నిటిని నెరవేరునట్లు చేయును. అట్లు మాయ ముందు జాగ్రత్తగా దేవుడు గురువుగా రాకముందు, కొన్ని సంవత్సరముల నుండే చేయుట వలన, ప్రజలందరు అంతవరకు తయారైన మాయ గురువుల చేతిలోను, మహత్యములు కల్గిన మాయ బాబాల చేతిలోను చేరిపోయి ఉందురు. అట్లుండుట వలన నిజ గురువు దగ్గరకు చేరువారు అరుదై పోవుదురు. అట్లు మాయ అందరి తలయందుండి మనుషుల నుండియే తన గురువులను, తన బాబాలను తయారు చేసి అక్కడక్కడ ముందే ప్రచారములో ఉండునట్లు చేయుచున్నది.


నిజ గురువు వచ్చినపుడు, ఆయన జ్ఞానమును చెప్పడమేకాక ఆ జ్ఞానమునకు కర్మను కాల్చుశక్తి ఉన్నదని తెల్పు నిమిత్తము, ఎక్కడైనా జ్ఞానాగ్ని వలన ఒకని కర్మ కాలిపోవునట్లు చేయుచున్నాడు. ఉదాహరణకు ఒక రోగము అనుభవించు వానికి, వాని కర్మను తన అగ్ని చేత కాల్చివేసి రోగమును లేకుండా చేశాడనుకొనుము. అది బయటికి మహత్యముగానే కనిపించును. జ్ఞానము యొక్క శక్తిని నిరూపించు నిమిత్తము, కర్మను కాల్చి, లేకుండ చేయడము బయటి ప్రజలకు మహత్యమే అయినప్పటికీ బహు అరుదుగా కొన్ని సందర్భములలో గురువు తన మహత్యమును ఆ విధముగా




---

చూపవలసియున్నది. దానిని గురు మహత్యమే అనవచ్చును. మాయ మాత్రము రోగ సంబంధ కర్మనే కాక, మానవునికి సుఖములు కలుగజేయు అన్ని మహత్యములను బాబాల ద్వారా నెరవేరునట్లు చేయించును. అటువంటి మహత్యముల మత్తులో పడిపోయిన మనిషి ఇంతకంటే కష్టాలు తీర్చు దేవుడులేడంటూ అతనినే ప్రత్యక్ష దైవమంటూ నిజ గురువు వైపు కూడ చూడరు. అటువంటి వారి దగ్గర ఎవరైన గురువు ప్రస్తావన తెచ్చి జ్ఞానమును బాగా చెప్పుచున్నాడనగా, వారి మాటను వినక బాబాకంటే మించిన గురువులేడందురు. ఈ విధముగా మాయ తన మనుషులనుండి నిజ గురువుకు వ్యతిరేఖముగా, గురువులను, బాబాలను, స్వామిజీలను తయారు చేయడమే కాక, గురువు మహత్యముకంటే తన మహత్యమునే గొప్పదనిపించి, మనుషులను తనవైపు లాగుకొనుచున్నది. గురువుకు మహత్యముండినా మాయకున్న మహత్యముండినట్లుండదు.


గురువుకు రోగాలు వస్తాయా?


పోయిన జన్మలో చేసుకొన్న పాపములు రోగములుగా వస్తాయనీ, రోగముల బాధలు అనుభవించినపుడే పాపము అయిపోవునని జ్ఞానము ప్రకారము తెలుసుకొన్నాము. ఒక సాధారణ జీవాత్మకు గత జన్మ ఉండును, ఆ జన్మలో పాపము చేసియుండును. ఆ జీవాత్మ పుట్టి రోగరూపములో పాపమును అనుభవించాడంటే సరిపోవును. కానీ గురువుకు వెనుకటి జన్మలేదు, మరియు ఒక చోట మరణించి, మరొక చోట పుట్టిన వాడూ కాదు. అతనికి కర్మంటూ లేనేలేదు. అయినప్పటికీ గురువుకు రోగములు వచ్చుట వాస్తవమే. ఎవడైన ఒక బాధను అనుభవించాలి అంటే, దాని వెనుక ఒక తతంగముండాలి. ఒక బాధనే కాదు, ఏ చిన్న పని జరుగవలె నన్నా దానికి సంబంధించిన కర్మ అను విధానముండాలి. ప్రతి చిన్న కదలికకు సంబంధించిన సమాచారము, కారణము ముందే నిర్ణయింపబడి ఉండును. అలా వ్రాసి పెట్టబడిన దానినే కర్మ అంటున్నాము. ఎవనికైనా కర్మ ఉందీ అంటే అది వాడు వెనుక జన్మలలో చేసుకొన్నదేనని బ్రహ్మవిద్యా శాస్త్రము తెలియజేయుచున్నది. ఇక్కడ గురువుకంటూ వెనుక జన్మలేనే లేదు. అయితే అతను భూమి మీద సంచరించి, మాట్లాడి, ఎంతో చేయుటకు కావలసిన విధానము ముందే వ్రాసి పెట్టబడి ఉండదు కదా! అలాంటపుడు గురువు అను మనిషి ఎలా ఏ విధానము ప్రకారము సంచరించుచున్నాడని ఎవరికైన ప్రశ్నరాగలదు. దానికి జవాబు ఏమనగా! గురువుకు వెనుకటి జన్మలేదు, దాని ప్రకారము ఆయనకు కర్మాలేదు. కానీ కర్మ అను విధి విధానము ప్రకారమే ఆయన కూడ సంచరించడము, అనుభవించడము జరుగుచున్నది. వెనుక జన్మలేదూ, వెనుకటి కర్మాలేదూ, అయితే ఇప్పుడు ఆయన నడచుకొనుటకు అవసరమైన విధి విధానము ఎక్కడిది? అని ప్రశ్నించుకొంటే, దేవుడు తన శక్తిలోని భాగమును భూమిమీద గురువుగా సంచరింపజేయవలసి వచ్చినపుడు, దేవుడే గురు ఆకారమునకు కావలసిన కర్మ విధానమును తయారు చేసి, గురు శరీర కర్మచక్రములో వ్రాసిపంపును. అలా దేవుడు తన కర్మను తానే వ్రాసుకొని గురువుగా అవతరించుచున్నాడు. ఆయనకుగా ఆయన వ్రాసుకొన్న కర్మ, తనను ఎవరూ గుర్తించనట్లు, అందరివలె అన్ని బాధలు అనుభవించునట్లు, తనకు ఎలా ఇష్టమైతే అలా నిర్ణయించుకొని వచ్చియుండును. ఆ నిర్ణయమును, అనగా ఆ కర్మ విధానమును ఏ జ్యోతిష్యము గుర్తించలేదు. మానవుని కర్మను జాతకము ప్రకారము జ్యోతిష్య శాస్త్రము వలన కొంతకు కొంతైనా గుర్తించవచ్చును. కానీ జాతకమే లేని గురువుకు జ్యోతిష్యము కర్మను కనుగొనలేదు. జాతకమున్న వానికి పలాన లగ్నమని చెప్పవచ్చును. జాతకమే లేనివానికి లగ్నము లేదు. లగ్నమే లేనపుడు జ్యోతిష్యమును చూడలేము. అందువలన గురువు ఎప్పుడు ఎలా ప్రవర్తించునో చెప్పలేము.



---

సాధారణ మనిషికి రోగము వచ్చినట్లే, గురువుకు కూడ రోగము రావడము, అనుభవించడము అన్నీ జరుగుచుండును. ప్రతి బాధను, ప్రతి రోగమును, ప్రతి సంఘటనను, ప్రతి కదలికను ఆయన నిర్ణయించుకొని వచ్చినవేనని ఎవరికీ తెలియదు. చూచువారందరికి సాధారణ మనిషిగా కనిపించు వాడు తన కర్మను తానే నిర్ణయించుకొని వచ్చాడని ఇతరులెలా అనుకుంటారు? ఆయన గురువు అను విషయమే ఎవరికి తెలియనపుడు, ఆయన స్వయముగా పుట్టిన "స్వయంభూ” అని తెలియనపుడు, ఆయన కర్మ విషయము ఎవరికీ తెలియదు. సర్వసాధారణ మనిషి ఏ విధముగా కర్మలనుభవించుచున్నాడో, ఏ విధముగా రోగములను పొందుచున్నాడో, ఏ విధముగ ప్రవర్తించుచున్నాడో, ఆ విధముగ గుర్తింపులేనట్లు గురువు భూమిమీద కర్మలను అనుభవించుచున్నాడు. అనుభవించు కర్మలను బట్టిగానీ, ఆచరించు పనులను బట్టిగానీ ఈయన గురువని ఎవరూ నిర్ణయించి చెప్పలేరు.


గురువును ఎవరూ గుర్తించలేరా?


ఒక విధముగా గురువును సర్వసాధారణముగా ఎవరూ గుర్తించ లేరనియే చెప్పాలి. ఇంకొక విధానము ప్రకారము గుర్తించవచ్చునేమోనని కూడ చెప్పాలి. గురువును గుర్తించుటకు ఉన్న ప్రత్యేక విధానమేమో నాకు కూడ సరిగా తెలియదు. కానీ ఆయనను గుర్తించుటకు ఏదో ఒక విధానమంటూ ఒకటున్నదని చెప్పగలము. ఎందుకనగా గురువు హోదాలో కృష్ణుడు భూమిమీద ప్రత్యక్షముగ ఉన్నపుడు, ఎవరూ ఆయనను గుర్తించ లేకపోయినా ఒకే ఒక భీష్ముడు గుర్తించగలిగాడు. అదే విధముగా కృష్ణుడు భూమిమీద లేకుండ పోయిన తర్వాత, ఉత్తరప్రదేశ్లో జన్మించిన మీరాబాయి, ఆయన ఫలానావాడనే సత్యమును గుర్తించగల్గినది. కృష్ణుడు ప్రత్యక్షముగనున్నపుడు భీష్ముడు, పరోక్షముగనున్నపుడు మీరాబాయి గుర్తించగలిగారంటే గురువును గుర్తించుటకు ఏదో ఒక దారి ఉన్నదని తెలియుచున్నది. వారికి తెలిసిన దారి ఏదో మనకు తెలియదు. కానీ గురువు చెప్పిన జ్ఞానమును బట్టి, అందులోని ధర్మములను బట్టి ఇటువంటి ధర్మమునూ, జ్ఞానమునూ గురువు తప్ప ఎవరూ చెప్పలేరని గ్రహించుటకు అవకాశము కలదు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కంతా, ఆయన చెప్పిన జ్ఞానమును మనము గుర్తించగలమా అన్నది ప్రశ్న. ఆయన భూమి మీదకు రాకముందే, వందేళ్ళ నుండి మాయ తన గురువులనూ, స్వాములనూ, బాబాలను ప్రవేశపెట్టి వారిని దాటి ప్రజలు రాకుండ చేసినది. ఎంతో మందికి ముందే పేరు పొందిన స్వామిజీలు చెప్పిన బోధలు రుచించి ఉండగా, గురువు చెప్పు ప్రతి బోధ వ్యతిరేఖముగ కనిపిస్తుండును. పేరుగడించిన స్వామిజీలు చెప్పిన బోధను వదలి, పేరులేని వాడు చెప్పు బోధను, అదియు అన్నిటికి వ్యతిరేఖముగ కనిపించు బోధను ఎవరు ఆశ్రయించగలరు? ఆయన బోధ అర్థము కానపుడు ఆయన ధర్మములనెలా గుర్తించగలరు? తర్వాత ఆయన ధర్మములను బట్టి ఆయననెలా గుర్తించగలరు? శాస్త్రబద్దమైన జ్ఞానము, ధర్మము తెలియనపుడు గురువును వాటి ద్వారా గుర్తించుట కష్టమేయగును. కానీ మనకు కనిపించు మార్గము ఆయన బోధించిన ధర్మములనియే తెలియుచున్నది. అయితే ఆనాటి భీష్ముడు కానీ, నిన్నటి మీరాబాయి కానీ ఆయన చెప్పిన జ్ఞానము ధర్మములను ఆధారము చేసుకొని కృష్ణుడు ఫలానావాడని గుర్తించలేదు. కృష్ణుడు చెప్పిన ధర్మములు, ద్వాపరయుగములోని భీష్మునికిగానీ, కలియుగములోని మీరాబాయికి గానీ తెలియవు. కృష్ణుడు గీతను యుద్ధ రంగములో చెప్పాడు. అప్పుడు శత్రుసైన్యాధిపతిగా భీష్ముడున్నాడు. గీతను చెప్పిన బహశా ఎనిమిదవ రోజే భీష్ముడు యుద్ధరంగములో క్రిందపడి పోయాడు. కృష్ణుడు గీతా జ్ఞానము చెప్పిన విషయము కూడా భీష్మునికి తెలియదు. కావున కృష్ణుడు చెప్పిన జ్ఞానముగానీ, ధర్మముగానీ భీష్మునికి తెలియవనియే చెప్పాలి. అట్లే మీరాబాయి విషయానికివస్తే, ఆమె కృష్ణుడు చెప్పిన గీతనే చూచినట్లు లేదు. అందువలన ఆమెకు కూడా ఆయన తెల్పిన ధర్మములేవో తెలియవు. అందువలన అటు భీష్ముడు



---

కానీ, ఇటు మిరాబాయి కానీ గురువుయొక్క జ్ఞానమును బట్టి ఆయనను గుర్తించినట్లు చెప్పుటకు వీలులేదు. వారు గుర్తించిన విధానము ఏదో ప్రత్యేకముగ ఉండి తీరాలి. అది మనకు అర్థము కాలేదు కనుక మనకు ఆ విధానము ఏదో తెలియదనే చెప్పాలి.


గురువు అందరివలె చనిపోవునా?


శరీరమును ధరించిన వాడు తిరిగి దానిని వదల వలసిందే అన్నది సూత్రము. శరీరమును ధరించినది సాధారణ జీవాత్మ కావచ్చును లేక దేవడగు గురువు అయినా కావచ్చును. ఎవరైన సూత్రము ప్రకారము శరీరమును వదలి పోవలసిందే. అందువలన గురువు కూడ అందరివలె శరీరమును వదలి పోవును. "జాతస్య ధృవం మృత్యు” అను గీతా వాక్యము ప్రకారము పుట్టిన వాడు మరణించవలసిందే. అయితే గీతలో అక్షరపర బ్రహ్మయోగమునందు మరణముల వివరమును చూస్తే అందరికి చావు తప్పనిసరి. అయినా మరణములలో మోక్షము పొందునవి, మోక్షము పొందనవి రెండు రకములు ఉన్నవి. అంతేకాక సాధారణ మనుషుల మరణము వేరు, యోగుల మరణము వేరుగానున్నవి. ఇపుడు గురువు మరణమును, సాధారణ మనుషుల మరణములోనికి చేర్చవలెనా లేక యోగుల మరణములోనికి చేర్చవలెనా అను సంశయము రావచ్చును. గురువు సాధారణ మనిషివలె నటించినా, అతను మనకు తెలిసినా తెలియ కుండినా నిజమైన యోగియే. అట్లని సాధారణ యోగికూడకాదు యోగీశ్వరుడు అటువంటి వానిని రెండు రకముల మరణములలో యోగుల మరణములోనికే లెక్కించవలెను.


బ్రహ్మవిద్యా శాస్త్రమైన గీతయందు అక్షర పరబ్రహ్మయోగములో యోగుల మరణములో కూడ విశ్లేషణ కలదు. యోగులు ఏ సమయములో చనిపోతే మోక్షమును పొందుదురో, ఏ సమయములో చనిపోతే మోక్షమును పొందరో ఆ విశ్లేషణలో కలదు. గురువు మరణమును యోగుల మరణములోనికి లెక్కించి చూచినా, ఆ యోగుల మరణములో మోక్షము పొందెడిదా, మోక్షము పొందనిదా అని కూడ చూడవలసియున్నది. యోగుల యొక్క రెండురకముల మరణములనునవి ఏవి? అని చూస్తే అవి మరణించు సమయమును బట్టి విభజింపబడినవని తెలియుచున్నది. ఒకటి యోగి మోక్షమును పొందు మరణము పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణములో ఉండును. రెండవది యోగి మోక్షము పొందని మరణము రాత్రి కృష్ణ పక్షము, దక్షినాయణములో ఉండును. దీని ప్రకారము సమస్త యోగుల మరణమును లెక్కించి చూడవలసిందే. అయితే ఇక్కడ గురువు యోగియే అయినా ఆయన అందరూ మరణించినట్లు మరణిస్తే కదా మనము ఆయన మరణమును విశ్లేషించి చూడగలము. గురువు శరీరము ధరించి పుట్టిన రోజు కూడ తల్లిగర్భమునుండియే చైతన్యముతో పుట్టి భగవంతుడు అనిపించుకొన్నాడు. అలాగే శరీరమును వదలి చనిపోయిన రోజు కూడ ప్రత్యేకత కల్గియున్నాడు. ఆ ప్రత్యేకత ఏమియనగా! గురువు (దేవుడు)కు పుట్టుకలేదు మరియు చావులేదు. చావుపుట్టుకలు లేనివాడు గురువు. అయినా చావుపుట్టుకలున్నట్లు నటించుచుండును. గురువు శరీరము ధరించి పుట్టినప్పుడు ఎవరూ పుట్టనట్లు చైతన్యముతో పుట్టాడు. అలాగే శరీరము వదలి పోవునపుడు శరీరమును వదలి బయటికి పోకుండ, శరీరములోనికి అణిగి పోయాడు. శరీరములోనికి అణిగి పోయిన గురువు విశ్వవ్యాపి అయిపోయాడు.


కర్మ శేషము లేకుండ అయిపోయిన యోగి మరణిస్తే పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణ కాలములో మరణించుననుకొన్నాము కదా! అలా మరణించు సమయములో యోగి శరీరములోని జీవుడు మొదట ఆత్మ యందు కలిసి ఆత్మగా మారిపోవును. అలా జీవాత్మ కలిసిన ఆత్మ శరీరములోనే ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోవును. ఈ




---

విధముగా మోక్షమును (దైవమును) పొందు యోగి శరీరములో జరుగు విధానము కలదు. (మా రచనలలోని "జనన మరణ సిద్ధాంతము” లో పూర్తిగా వివరించ బడినది) కానీ గురువు మరణిస్తే అది యోగుల మరణము మాదిరి కూడ ఉండదు. జీవాత్మ ఆత్మలోనికి, ఆత్మ పరమాత్మలోనికి కలిసి పోవడమంటూ గురువు శరీరములో జరుగదు. ఆయన మొదటికే జీవుడు కాదు, ఆత్మ కాదు. గురువు శరీరములో, యోగి శరీరములోనున్నట్లు జీవుడు లేడు, ఆత్మ లేదు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మము కావున గురువు మరణమును యోగుల మరణములో చూచినట్లు ఈయన దేవునియందు ఐక్యమైనాడా లేదా అని చూడవలసిన పనేలేదు. అందువలన యోగుల మరణములో చూడవలసిన కాలము గురువుకు వర్తించదు. “అయిపోయిన పెళ్లికి మేళమేల” అన్నట్లు దేవుడై ఉన్నవానిని దేవుడైనాడా లేదా అని చూడవలసి పనిలేదు. అలాగే మోక్షమైయున్న గురువును మోక్షము పొందునా పొందడా అని చూడవలసిన పనిలేదు. అందువలన గురువుకు పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణ కాలములు వర్తించవు. ఆయన ఏ కాలములో చనిపోయినా ఆయన ఆయనే. ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు. అయి శరీరమును ధరించినపుడు పుట్టినట్లు భ్రమింపజేశాడు. అలాగే చనిపోవునపుడు మరణించినట్లు భ్రమింప చేశాడు. గురువు మరణిస్తాడా అంటే మరణిస్తాడు. కాని అది అందరిలాంటి మరణము కాదు అని తెలియవలెను. మనిషికి, దేవునికి చావు పుట్టుకలలో ఎంత తేడా ఉందో తెలియాలంటే "జనన మరణ సిద్ధాంతము” అను పుస్తకమును చదవండి.


గురుపౌర్ణమి.


అంతు లేక అంత్యము అనగా అందరికి తెలుసు. ప్రపంచములో అన్నిటికి మొదలు చివర తప్పని సరిగ ఉంటాయి. ప్రపంచములో మొదలు అంత్యము లేనివి ఏవి లేవు. ప్రపంచమే ఆది అంత్యముతో కూడుకొని ఉన్నది. పేరుకు ఊరుకు, గీతకు రాతకు, పనికి పాటకు, ఆటకు బాటకు, చేనుకు సాలుకు అన్నిటికి మొదలు చివర ఉండనే ఉన్నవి. అందువలన నేమో ఎవరినైన దేనినైన నీ అంతుచూస్తానంటుంటాము. దీనితో అంతు అందరికీ అంత్యము అన్నిటికీ ఉన్నదని తెలియుచున్నది. అన్నిటికి అంతు ఉండినప్పటికీ ఒకే ఒక దానికి అంతులేదు. అదియే గోళము లేక గుండ్రము. గుండ్రము అను పదము నుండి పుట్టిన పదమే గురువు అను పదము. పరమాత్మకు కూడ ఆది అంత్యము లేదు. ఆది మధ్య అంత్యరహితుడైన పరమాత్మ భూమి మీద సాకార రూపముతో భగవంతునిగా పుట్టినపుడు ఆయననే గురువు అంటున్నాము. ఆది అంత్యములులేనిది కావున దానినే గురువు అంటున్నాము. పరములోని పరమాత్మకు, ఇహములోని గురువుకు మొదలు చివరలు లేవని తెలియాలి. దీనిని బట్టి పరమాత్మ అనిన, భగవంతుడనిన, గురువు అనిన ముగ్గురు ఒక్కటేనని తెలియుచున్నది.


పూర్వము కొందరు పెద్దలు, "గురువు గుండ్రాయిలాంటివాడని” సామెతగ అనెడివారు. గుండ్రాయికి కూడ మొదలు చివరలుండవు. అందువలన గురువును గుండ్రాయితో పోల్చారు. గురువు అనగా కేంద్రము అని కూడ అర్థము గలదు. జ్ఞానమునకు కేంద్రమైనవాడు గురువు. జ్ఞానమనునది ఎక్కడ ఎవరిచేత తెలియబడుచుండిన, అనగ ఎక్కడైన ఏ బోధకులు చెప్పుచుండినప్పటికీ అది మొదట జ్ఞానకేంద్రమైన గురువు నుండియే వచ్చి ఉండును. అపార జ్ఞానకేంద్రము, వాస్తవ ధర్మనిలయము గురువే యగును. పరమాత్మ భూమి మీద అవతరించినపుడు, భగము నుండి పుట్టినవాడు కనుక భగవంతుడని, ఆది, అంత్యములు లేనివాడు కనుక గురువని చెప్పబడుచున్నాడు. జ్యోతిష్య శాస్త్రము ప్రకారము జ్ఞానమునకు చిహ్నము చంద్రుడు. సంపూర్ణ జ్ఞానమునకు చిహ్నము పున్నమి రోజు వచ్చిన గుండ్రని చంద్రుడు. పున్నమి చంద్రుడు




---

పూర్ణజ్ఞానమునకు గుర్తు. మానవులు దైవమైన గురువును గుర్తు చేసుకొనునట్లు, సంవత్సరమున కొక పౌర్ణమిని గురు పౌర్ణమిగ పెద్దలు నిర్ణయించారు.


ఆదీ అంత్యములు లేనివాడను అర్థము కల్గిన గురువును గుర్తు చేసుకొని, సంపూర్ణ జ్ఞానముగ పున్నమి చంద్రుని దినమైన పౌర్ణమిని గురుపౌర్ణమిగ తలచి, భగవంతుడైన గురువును ఆరాధించడమే గురుపౌర్ణమి యొక్క అంతరార్థము. ఆచారముండి అర్థము తెలియని ప్రజలకు గురువంటే ఏమిటో, గురుపౌర్ణమంటే ఏమిటో తెలియదు. అర్థము, అంతరార్థము తెలియని ప్రజలకు దేవుడెవరో, దయ్యమేదో, గురువెవరో, బోధకుడెవరో తెలియదు. తెలియని తనమును ఆసరాగా చేసుకొని మాయ తానే గురువునని అందరికి తెలియునట్లు ప్రచారము చేసుకొన్నది. జ్ఞానము, ధర్మము తన వద్ద లేకున్ననూ తన మహత్యములే జ్ఞానమని తాను చేయు దానములనే ధర్మములని అందరికి అర్థమగునట్లు చేసి అందరిని తన వైపు తిప్పుకొని, తానే గురువునని తెలియునట్లు, మాయ చేయుట వలన ప్రజలు అసలైన దైవ గురువును వదలి, మాయ గురువును ఆశ్రయించడము, ఆ గురువునే గురు పౌర్ణమి దినమున గుర్తు చేసుకోవడము ఆరాధించడము జరుగుచున్నది. గురుపౌర్ణమి రోజు కొన్ని లక్షల చోట్ల గురుపూజలు జరుగుచున్నను, కనీసము ఒక్క చోట కూడ నిజ గురువు యొక్క పూజ జరుగుచున్నదను నమ్మకము లేదు. పరమాత్మకు వ్యతిరేఖమైన మాయ పరమాత్మ వైపు ఎవరు పోకుండ, తనవైపే అందరు ఉండునట్లు, ఎన్నో పథకములతో ప్రజలకు మేలు చేయుచు అందరిని తనవైపు లాగుకొనుచున్నది. మాయలోపడిన ఎందరో గురువును గుర్తించలేక పోవడమేకాక, దైవమును గురువుకాదని నిందించడము, అవమాన పరచడము చేయుచు, మాయను గురువుగ లెక్కించి ఆనందముతో ఆరాధించడము జరుగుచున్నది. భక్తియనునదున్న ప్రతివాడు తమ భక్తిని దేవతల వైపు, మహత్యములు చూపు బాబాల వైపు, పురాణములు బోధించు బోధకులవైపు చూపుచు, గురువును అగౌరవపరచుచున్నారు. క్షుద్రదేవతలకు మ్రొక్కు ఒక సామాన్యుడు పదవిలో ఉంటే, దేవతలకే దేవుడైన గురువును తన ముందు నిలబెట్టుకొని కనీసము కూర్చోమనక హేళనగా మాట్లాడడము జరుగుచున్నది. మాయ ప్రభావము మనుషులలో ఉన్నంత వరకు వారికి మాయ గురువులు గొప్పగ కనిపించడము, భగవంతుడైన నిజగురువు నీచముగ కనిపించడము సహజమే. మాయకు పరమాత్మకు జరుగుచున్న ఆటలో సమస్తము మాయవైపు ఉండగ ఒకే ఒక జ్ఞానము, ధర్మము పరమాత్మవైపు గలవు. మాయవైపు మహత్యములు, దానము, ధనికులను చేయుట, కోరిన కార్యములు నెరవేర్చుట ఇలాంటి ఎన్నో వేల ఆయుధములు ఉండగ పరమాత్మ వైపు ధర్మములు అను ఆయుధము ఒక్కటే గలదు. ఈ విషయమునకు ఉదాహరణగ ద్వాపరయుగమున భారత యుద్ధములో నాతో సమానమైన పదివేలమంది యోధులు అందరు ఒక వైపు, నేనొక్కనిని ఒక వైపు ఉందునన్నాడు. పదివేల మంది యోధులు ఆయుధములు పట్టి పోరాడగ, నేను ఆయుధము పట్టక ఊరక మాటలు చెప్పువాడనై ఉందునన్నాడు. ఆనాడు చెప్పిన అంతరార్థమేమని యోచించిన నా చేత తయారు చేయబడిన నామాయ, నాతోనే ఎన్నో ప్రజానుకూల సంఘటనలను ఆయుధములతో పోరాడుచు జీవులను తనవైపు లాగుకొని యుద్ధములో గెలువాలని చూస్తున్నది. నేను మాత్రము ఏ సంఘటనలను ఆయుధములు పట్టక, “ధర్మములను” మాటల ఆయుధములతోనే పోరాడుదు నని తెల్పినట్లున్నది.


ఈ కాలములో మాయ అనేక మార్గములలో మనుషులను తన వైపు లాగుకొనుచు, తానే దైవముగ లెక్కించబడుచు ఎన్నో గుడులను సహితము కట్టించుకొని, దైవముగనే రంగు మార్చుకొని కన్పిస్తున్నది. మనుషులెవరు గుర్తించలేని మాయను, పరమాత్మే గుర్తించాలి. పరమాత్మ ఇది “మాయ”యని చెప్పినప్పటికీ పరమాత్మవలెనున్న మాయను పరమాత్మేనని నమ్ముచు, పరమాత్మనే మాయగ తలచువారు గలరు. ఇటువంటి పరిస్థితిలో మనమున్నాము. ఈ స్థితిలో మాయ



--

ఎవరో, గురువు ఎవరో గుర్తించడము చాలా కష్టము. ఒకవేళ నీవు మాయను వదలి దేవుని వైపు పోతున్నానని అనుకొనినా, నిజగురువును ఎన్నో సంవత్సరముల నుండి గుర్తించినప్పటికీ, మాయ తలచుకొంటే నిజగురువును మాయయనీ, మాయను గురువుయనీ నీతోనే అనిపించగలదు. దేవుడు అన్ని ఆయుధములు మాయకిచ్చాడు. దేవునివి ఉత్తమాటలు తప్ప ఏమి లేవు. ఉత్తమాటలతో మనకేమి లాభమని నిండుగంటులిచ్చు మాయవైపు పోతారో, ఉత్తగంటు ఉన్న పరమాత్మవైపు పోతారో మీరే నిర్ణయించుకోండి. సర్వులకు ప్రకృతి అమ్మ, పరమాత్మ నాన్నయని తెలుసుననుకుంటాను. మొత్తానికి అమ్మగంటు, నాన్నగంటు రెండు ఉన్నాయి. అమ్మగంటు నిండుది. నాన్నగంటు ఉత్తది. ప్రపంచములో నిండుగంటైన మీ అమ్మగంటు కావాలో, ఉత్తగంటైన మీ నాన్నగంటు కావాలో మీరే నిర్ణయించుకోండి.


గురువు - పౌర్ణమి.


పౌర్ణమి అంటే చంద్రుడు సంపూర్ణముగ కనిపించు దినము. చంద్రుడు సంపూర్ణముగ కనిపించుట వలన మనకేమి ఉపయోగమో చాలామందికి తెలుసుననుకుంటాను. మనకు తెలిసిన ఉపయోగము చంద్రుడు వెన్నెలతో ప్రకాశించడమే. వెన్నెల ప్రకాశమును చల్లగా, హాయిగ అని ఎందరో కవులు బహు చక్కగ తమ కవిత్వములో వర్ణించుకొన్నారు. ఎవరు ఏమి చెప్పినప్పటికి, వెన్నెలను గూర్చి మనకు తెలియని విషయ మొకటున్నది. చంద్రుడు అమృత స్వరూపుడు. మృతము అనగా మరణమని, అమృతమనగా మరణము లేనిదని అర్ధము. అమృత స్వరూపమంటే మరణములేని స్వరూపముగలదని అర్థము. నిజముగ అంతటి శక్తి చంద్రునికి కలదా అని విచారిస్తే ఆమాట వాస్తవమేననుటకు ఆధారము గలదు. బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తియోగమును అధ్యాయములో 13వ శ్లోకమున "పుష్టామి చౌషధీ స్సర్వా స్సోమో భూత్వా రసాత్మకః" అను వాక్యము గలదు. దాని "అర్థము నేను అమృతమయుడగు చంద్రుడనై, భూమి మీదగల ఔషధములను పోషించుచున్నాను” అని దేవుడన్నాడు. నిజముగ చంద్రుడు తన కిరణములను భూమి మీదకు ప్రసరింపజేయుచు భూమి మీదగల ఔషధమొక్కలకు ఔషధశక్తి నిచ్చు చున్నాడు. చంద్రకాంతి ద్వారా ఔషధశక్తిని కల్గియున్న మొక్కలు మానవుని రోగములను పోగొట్టి, ఆ రోగము నుండి విముక్తుని చేయుచున్నవి.




ఒక మనిషి ఒక రోగమునుండి బయట పడాలంటే ఔషధము అవసరము. ఔషధము మొక్కలనుండి లభించుచున్నది. మొక్కలకు చంద్రుని నుండి ఔషధగుణము వస్తున్నది. చంద్రునిలోని అమృతమునకు మూలకారణము పరమాత్మశక్తి అని తెలియుచున్నది. ఇప్పటి కాలములో చెట్ల మూలికలను ఎవరూ ఔషధముగ వాడడము లేదుకదా! అని కొందరడుగ వచ్చును. దానికి సమాధానము, నేడు మనము వాడు మందులైన టాబ్లెట్స్, ఇంజక్షన్లు కూడ చాలా చెట్లనుండి తయారైనవే గలవు. ఆస్మాకు వాడు అడ్రినలిన్ ఇంజక్షన్ మారేడు చెట్టునుండి తయారైనదే. అలాగే ఉమ్మెత్త చెట్టునుండి బెల్లడోనా ప్లాస్టరు మొదలగునవి తయారైనవి. కొన్ని అల్లోపతి మందులు తప్ప ఆయుర్వేదిక్లోను, హోమియోపతి వైద్యములోను అన్ని మందులు మొక్కలనుండి, చెట్లనుండి తయారైనవే గలవు. పూర్వము రెండు వందల సంవత్సరముల క్రితము మూలికా వైద్యము బహుళ ప్రచారములో ఉండెడిది. పాము విషమునకు, తేలు విషమునకు, ఇప్పటికీ మూలికా వైద్యముకు సాటిగల మందులే లేవు. "ప్రతి ఆకు ఒక ఔషధమే" అన్న సూత్రము నాటికి నేటికి సజీవముగనే గలదు.

పౌర్ణమి దినమున ఉత్తర, దక్షిణ ధృవములుగ ఉన్న గురుత్వాకర్షణ శక్తి (అయస్కాంతశక్తి) కూడ అధికముగ ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు కూడ చెప్పుచున్నారు. ఆ దినము వాతావరణములో కూడ కొంత మార్పుగలదనుటకు సముద్రములోని అలలు చాలా ఎత్తులేవడమే నిదర్శనము. ఇంకనూ మనకు తెలియని విషయమేమనగా! పౌర్ణమి దినమున




---

చంద్రుడు సంపూర్ణుడై అమృతముతో కూడుకొన్న కిరణములను క్రిందకి ప్రసరించునని పూర్వమే పెద్దలు తెలియజేశారు. అందువలన ప్రతి పౌర్ణమి ప్రత్యేకత కల్గియున్నది. పూర్వము పౌర్ణమి యొక్క విలువను తెలిసినవారు ఆ దినము రాత్రియంత ఆరుబయట వెన్నెలలో గడిపెడివారు. దానివలన కొన్ని రోగములు వారినుండి దూరమై పోయెడివి. కొందరికి శరీరములో రోగనిరోధక శక్తి పెరిగెడిది. కంటి చూపులో లోపము గలవారు పౌర్ణమి దినమున తలస్నానము చేసి వెల్లకిలా పడుకొని తదేకముగ చంద్రుని చూచెడివారు. అట్లు చూచుట వలన చంద్రకిరణములు నేరుగ కన్నుల మీద పడుటవలన కొన్ని నెలలకు వారికళ్లలోని లోపములు పోయెడివి. ఈ విధముగ చంద్రుడు నిజముగ అమృత స్వరూపుడనుటకు ఎన్నో ఆధారములు గలవు.


భూమి మీద ఎన్నో జాతి మొక్కలు, చెట్లుగలవు. అన్నిటికి అమృత ప్రదాత చంద్రుడే అయినప్పటికీ, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఔషధగుణము కలిగియున్నది. 'పిప్పాకు' మూలిక తేలు విషమునకు ఔషధము కాగ, తెల్ల 'ఈశ్వరి' మూలిక పాము విషమునకు ఔషధము. ఇట్లు అనేక మూలికలు అనేక ఔషధగుణము గలవిగానున్నవి. ఇంకనూ యోచించి చూచితే, కొన్ని చెట్ల యొక్క స్వభావమును బట్టి చంద్రుని కిరణములు పనిచేయునని కూడ తెలియుచున్నది. ఒకే చెట్టు రెండు విధములుగ పనిచేయునట్లు కూడ చంద్రకిరణములు పనిచేయుచున్నవి. ఉదాహరణకు ఉమ్మెత్త చెట్టు ఉన్మాదము, పిచ్చివున్నవారికి ఔషధముగ పనిచేయును. పిచ్చిలేని మంచివారు చెట్టును పరీక్షించాలని అదేపనిగ వాడితే బాగున్నవారికి పిచ్చిపట్టును. అదే విధముగ మరొక ఉదాహరణ కూడ గలదు. పాముకాటు పడినవానికి విషప్రభావముతో మత్తెక్కి చనిపోవు ప్రమాదము గలదు. అటువంటి వానికి విషముష్టి చెట్టును ఉపయోగించితే ఔషధముగ పనిచేయును, ప్రమాదము తప్పిపోవును. అట్లుకాక పాముకాటు పడనివాడు, విషప్రభావము లేనివాడు, విషముష్టి చెట్టును వాడితే పాముకాటు లేకున్నను విషప్రభావములో చిక్కి, మత్తెక్కి చనిపోగలడు. మాటలురాని చెట్లుకూడ తమను సవ్యముగ చూచితే మంచిని, అపసవ్యముగ చూస్తే చెడును ప్రదర్శించగలవని తెలియుచున్నది.

ఇపుడు అసలు విషయానికొస్తాము, గురువు సంపూర్ణ జ్ఞానము గలవాడు. భూమియంతటికి ఒకే చంద్రుడున్నట్లు ఎప్పటికైన ప్రపంచము నకంతటికి ఒకే గురువు గలడు. చంద్రుడు కనిపిస్తున్నప్పటికి అతని వెన్నెలలోని ఔషధశక్తికి మూలకారణము పరమాత్మ. అలాగే గురువు స్థూలముగ కనిపించు శరీరముగల వ్యక్తి అయినప్పటికి, అతనిలోనున్న జ్ఞానశక్తికి మూలము కనిపించని పరమాత్మ. ఆకాశములో చంద్రుడు వెన్నెలతో ప్రకాశిస్తే, భూమిమీద గురువు జ్ఞానముతో ప్రకాశిస్తాడు. ఈ విషయము తెలియుటకు పూర్వము పెద్దలు గురువును, పౌర్ణమిని ఏకము చేయుచు గురుపౌర్ణమి అని ఒక పౌర్ణమిని ప్రత్యేకముగ ఎంచుకొన్నారు. గురుపౌర్ణమి ఎంతో ప్రత్యేకత కల్గియున్నది. పౌర్ణమి అందరికి తెలిసినదే కాని గురువే అందరికి తెలియనివాడు. పౌర్ణమిని గురించి ఆ దినము చంద్రకాంతిని గురించి కొంత తెలుసుకొన్నాము. ఇక తెలుసుకోవలసింది ఒక గురువును గురించిన వివరము.


చంద్రుడు భూమిమీద చెట్లకు ఔషదశక్తినిచ్చినట్లు, గురువు భూమిమీద మనుషులకు జ్ఞానశక్తిని ఇవ్వగలడు. చంద్రకాంతి పడిన చెట్లు మాత్రము ఔషదశక్తిని పొందునట్లు, గురువు మీద భక్తి, శ్రద్ధ, వినయములు కల్గినవారు మాత్రమే, జ్ఞానమును పొంది జ్ఞానశక్తిని పొందుదురు. చంద్రకాంతి పడనిచెట్లు, చంద్రుని అమృతమును పొందక ఔషధశక్తిని సంపాదించుకోలేనట్లు, గురువు ఎడల వినయము, భక్తిలేని వారు జ్ఞానమును పొందక జ్ఞానశక్తిని సంపాదించుకోలేరు. చంద్రుడు అమృతమయుడైనట్లు, గురువు నాశనరహిత జ్ఞానమయుడు. గురువును వినయముగ సేవించినవారు మాత్రము, చెట్లు ఔషధములైనట్లు, సాధారణ మనుషులు జ్ఞానధనులు కాగలరు. ఒకే చంద్రకాంతి




---

చెట్లలో ఔషధమై రోగుల ఎడల ఔషధముగ, ఆరోగ్యవంతుల పట్ల రోగముగ ఎట్లు పరిణ మించుచున్నదో, అట్లే ఒకే గురుజ్ఞానము జ్ఞానశక్తిగా మారి విధేయుల ఎడల కర్మనిర్మూలనము చేయునదిగ, అవిధేయుల పట్ల కర్మను అంటగట్టు మాయగ తయారగుచున్నది. ఒకే ఔషధము విషనివారిణిగ మరియు విషముగ ఎట్లుగలదో అదేవిధముగ ఒకే జ్ఞానము, కర్మనివారణచేయు జ్ఞానశక్తిగ మరియు కర్మను అంటగట్టు మాయగ ఉన్నది.


గురువు నిండు పౌర్ణమిలాంటివాడు. చంద్రుడు స్వచ్ఛమైన ఆకాశములో ఉన్నపుడు మంచి వెన్నెలనివ్వగలడు. చంద్రునికి మేఘములు అడ్డువచ్చినపుడు చంద్రకాంతియున్నను అది మన వరకు చేరదు. అలాగే శిష్యుల మనస్సు స్వచ్ఛత కల్గినపుడే, గురువు మంచి జ్ఞానమునందివ్వ గలడు. గురువు ముందర, మాయ అను మేఘములు ఆవహించిన శిష్యులున్నపుడు, గురువు జ్ఞానము పవిత్రమైనదైననూ, అది కలుషితముగనే కనిపించును. చంద్రుడు ఒకడే, చంద్రకాంతి ఒకటే, క్రిందచెట్లు అనేకరకములు గలవు. అలాగే గురువు ఒకడే! గురుజ్ఞానము ఒక్కటే! తెలుసుకొను మనుషులు అనేకరకములుగ ఉన్నారు. చంద్రుడు కనిపిస్తాడు కాని దొరకడు, అలాగే గురువు కనిపిస్తాడు కాని ఎవరికి అర్థముకాడు. చంద్రుడు చేతికి దొరకకపోయిన చంద్రకాంతిని మనము అనుభవించు చున్నాము. అలాగే గురువు మన మెదడుకు అర్థము కాకపోయిన ఆయన జ్ఞానమును మనమనుభవించెదము. చంద్రుడు కొంతకాలము క్షీణచంద్రుడై పోతాడు, మరికొంతకాలము వృద్ధి పొందు చంద్రుడై కనిపిస్తాడు. అలాగే గురువు ఒకప్పుడు జ్ఞానహీనునిగ కనిపిస్తాడు, మరియొకపుడు జ్ఞానతేజునిగ అగుపిస్తాడు. చంద్రుడు అమావాస్య దినమున కనిపించడు, పౌర్ణమి దినమున సంపూర్ణముగ కనిపిస్తాడు. అలాగే గురువు ఒకపుడు అజ్ఞానిగ మరియొకపుడు సంపూర్ణ జ్ఞానిగ కనిపిస్తాడు. జ్యోతిష్యశాస్త్రములో, చంద్రుడు జ్ఞానప్రతినిధి మరియు జ్ఞానమునకు అధిపతి. అలాగే బ్రహ్మవిద్యా శాస్త్రములో, గురువు దైవప్రతినిధి మరియు దైవజ్ఞానమునకు అధిపతి. ఈ విధముగ చెప్పుకుంటూపోతే గురువుకు, చంద్రునకు ఎన్నో పోలికలు గలవు. అందువలననే గురు జ్ఞానమునకు చంద్రుని వెన్నెలకు అవినాభావ సంబంధముండునట్లు, పెద్దలు సంవత్సరములో ఒక పౌర్ణమిని అదియు ఆషాడమాసములో వచ్చు పౌర్ణమిని గురుపౌర్ణమిగ నియమించారు.


గురువు పరమాత్మ అంశతో పుట్టువాడు. పరమాత్మ అంశతో పుట్టువాడే భగవంతుడని ముందే తెలుసుకున్నాము. ఎవడైతే భగవంతుడో వాడే గురువగును. అట్లే ఎవడైతే గురువగునో వాడే భగవంతుడు. గురువు భగవంతుడు ఇద్దరు ఒక్కటేనని చెప్పవచ్చును. పరమాత్మ అంశయైన భగవంతుడు భూమి మీదకు వచ్చినపుడు ఆయన ఎవరికి తెలియబడడు. ఈయన భగవంతుడనుటకు ఏ ఆధారములు ఉండవు మరియు ఆయన చెప్పడు. కావున గురువును గుర్తించుట చాలా దుర్లభమైన పని. కొందరికి ఇక్కడొక ప్రశ్నరావచ్చును. నేటికాలములో ఎందరో తాము గురువులమని చెప్పుకొనుచుండగ మరియు ఎందరో తాము భగవంతులమని పేరు చివరనో ముందరనో భగవాన్ అని పేరుపెట్టుకొనియుండగ, గురువులు, భగవంతులు దొరుకుట దుర్లభమంటారేమిటని అడుగవచ్చును. దానికి మా జవాబేమనగా! మొన్న ఒక టివిఛానల్లో ఒక స్వామిజీ ఒక మాట చెప్పాడు "నేను భగవంతున్ని కాదు. నేను అవదూతను మాత్రమే" అన్నాడు. ఆ మాట వింటూనే, ప్రతిదినము టివిలో కనిపిస్తు బోధలు చేయుచున్న ఆయన ఆ మాట చెప్పడము చాలా విచిత్రముగ తోచినది. అంత వింత ఏమిటో అని అనుమానమా! నేను బిడ్డలను కనేదాన్నే కాని స్త్రీని మాత్రము కానేకాదని ఒక మగువ అన్నపుడు ఆశ్చర్యము కాక ఏమగును. బిడ్డలనుకనేది స్త్రీఅని అందరికి తెలిసినపుడు, నేను స్త్రీని కాదంటే ఆమెకు స్త్రీ అంటే ఏమిటో అర్థము తెలియదనుకోవాలి. అలాగే అవధూత దైవధర్మములను మోసుకువచ్చి చెప్పువాడైనపుడు, దైవధర్మములు చెప్పువాడే భగవంతు డైనపుడు భగవంతున్ని మాత్రము కాదు అవధూతనంటే, ఆడదానిని మాత్రము కాదు నేను పదిమంది



---

పిల్లలనుకన్నాను అన్నట్లున్నది. దీనికంతటికి కారణము భగవంతుడంటే అర్థమేమిటో, అలాగే అవధూత అంటే అర్థమేమిటో తెలియకపోవడమే. అదేవిధముగ నేడు గురువులుగ చలామణి అగుచున్న చాలామందికి, గురువు అంటే అర్థముగాని, భగవంతుడంటే అర్థముగాని, పరమాత్మ అంటే అర్థముగాని, దేవుడంటే అర్థముగాని తెలియకుండపోయినది. ఒక్కొక్క పదమునకు ఒక్కొక్క ప్రత్యేకమైన నిర్వచనము, భావము గలదని తెలియనివారు వారికిష్టమొచ్చినట్లు చెప్పుకొనుచున్నారు.


సాకారముగ ఉన్నవాడు భగవంతుడు లేక అవధూత అని, నిరాకారముగ ఉన్నవాడు పరమాత్మ లేక దేవుడని చాలామందికి తెలియదు. అందువలన భగవంతుడని చెప్పవలసిన చోట దేవుడని చెప్పుచున్నారు. అలాగే పరమాత్మ అని పలుకవలసిన సందర్భములో భగవంతుడని పల్కుచున్నారు. దీనిని బట్టి వీరికి లింగభేదము, అంగభేదము రెండు తెలియవని అర్థమగుచున్నది. నీవు ఇంట్లో ఉన్నావా? బయట ఉన్నావా? అని ఒకరు సెల్ఫోన్లో అడిగితే, నేను వంటరూములో ఉన్నానని ఒకావిడ సమాధానము చెప్పినది. తర్వాత అవతల వ్యక్తి “ఇపుడు ఏమి చేయుచున్నావని” అడిగాడు. దానికి జవాబుగ నేను చెట్టుచాటున మూత్రము పోస్తున్నాను నీకేమికావాలి అని అడిగిందట. ఇంటిలో వంటగదిలో ఉండడమేమిటి? చెట్టుచాటున మూత్రముపోయుట ఏమిటి? ఈ మాటలకు ఏమైన పొంతనయుందా? అలాగే మనము వినెడి జ్ఞాన బోధలుంటాయి. ఉపన్యాసము చెప్పుచు ఒక స్వామి ఇలా అన్నాడు, ఒక మహర్షి యోగము చేస్తుంటే ఆ యోగశక్తికి శివుడు కదలివచ్చి నీ తపస్సుకు మెచ్చాను ఇక ఏమి వరము కావాలో కోరుకొమ్మనెనట. ఇంతకు అతను చేయుచున్నది యోగమా? తపస్సా? అని చెప్పే ఆయన చూచుకోలేదు, వినేవారు అంతకూ పట్టించుకోలేదు. అక్కడ వినే ఆయనను మహర్షి చేయునది తపస్సా, యోగమా అని అడిగితే, ఏమయ్యా అంతమటుకు తెలియదా అన్నమన్నా, బువ్వన్నా రెండు ఒక్కటే కదా! ఏమి తెలియని వాళ్ళు కూడ ఉపన్యాసము వినేదానికి వస్తారని చీదరించుకున్నాడట. తనకేమో తెలుసుననుకొన్న అతనిని చూచి, నవ్వాలో ఏడ్వాలో అర్థము కాలేదు కదా! భగవద్గీతలో "తపస్విభ్యోదికో యోగీ” అను భగవంతుని మాటకు ఇక్కడ అర్థమే లేకుండ పోయినదని తెలియుచున్నది. ఇటువంటి జ్ఞానము బోధించువారు ఎందరో, గురువులుగ ఉంటూ భగవంతులని పేరు పెట్టుకొన్నారు. 


భూమి మీద ఒక్క సమయములో ఒక్క గురువే 

గురువుకు, బోధకునికి తారతమ్యము తెలియని


ఆకాశములో ఒక్కసమయములో ఒక్క చంద్రుడే ఉండునట్లు,  భూమి మీద ఒక్క సమయములో ఒక్క గురువే ఉండును. మిగతా వారందరు బోధకులౌతారు గాని గురువులు కారు. గురువుకు, బోధకునికి తారతమ్యము తెలియని వారందరు, పొరబడి తాము గురువులమను కొనుచున్నారు. చుక్కలలో చంద్రునివలె, బోధకులలో గురువుండును. వేలు, లక్షలు ఎన్ని నక్షత్రములుండినప్పటికి అమావాస్య దినమున వెలుగులేనట్లు, భూమి మీద గురువులేనపుడు, ఎందరు బోధకులుండిన జ్ఞానవెలుగు నివ్వలేరు. బోధించు బోధకుడు తాను గురువుననుకోవడము మిరగడపువ్వు తాను చంద్రుడనను కొన్నట్లుండును.


చంద్రుడు ఔషధశక్తిని మొక్కలకు చెట్లకు ఇచ్చును కదా! గురువు తన జ్ఞానమును మనుషులకే ఇవ్వవలెను గదా! అలాంటపుడు చంద్రుని వెన్నెల అడవిలోను, గురువు యొక్క జ్ఞానము ఊరిలోను ఉపయోగ పడుతుంది గదా! అటువంటపుడు గురువులు అడవిలో ఉండవలెననుట, వెన్నెల ఊరిలో కాయవలెననుట సమంజసమేనా? అడవిలో చెట్లు, మొక్కలు విశేషముగ ఉంటాయి. అక్కడ చంద్రకాంతి ఎంతయుంటే అంత ఔషధముల శక్తి పెరుగుతుంది. అదే విధముగ ఊరిలో ప్రజలుంటారు. గురువు ప్రజల మధ్యన ఎంత ఎక్కువగా ఉంటే, అంత జ్ఞానము ప్రజలకు అందగలదు. అట్లుకాక గురువు గుహలలో ఉండవలెననడము, వెన్నెల ఊరి వీధులలో కాయవలెననడము పొరపాటు కాదా! కొందరైతే “అడవికాచిన వెన్నెల మాదిరి వృథా అయినదని” పోల్చి చెప్పుచుంటారు. మమ్ములనడిగితే అడవిగాచిన వెన్నెలే సరైనదని, ఊరిలోనున్న




--

గురువే సరైనవాడని చెప్పగలము. అడవిలో ఉండువారు గురువులు కాదని, గురువులకోసము అడవులలోనికి, గుహలలోనికి పోతే అక్కడ కౄరమృగములుంటాయని, వాటి బారిన పడి చావకతప్పదని వేమనయోగి తన పద్యములో కూడ చెప్పాడు.


గుహలలోన జోచ్చి గురువుల నెదుకంగ

కౄరమృగ మొకండు తారసిల్లిన

ముందుగ ముక్తి మార్గమదియె జూపు

విశ్వదాభిరామ వినుర వేమా!


వేమన మాటప్రకారము కూడ అడవికాచిన వెన్నెల, ఊరుగాచిన గురువు, సరియైన పద్ధతిలో ఉన్నట్లని తెలియుచున్నది. అట్లే అడవిలోని గురువు, ఊరులోని వెన్నెల సరియైన పద్ధతి కాదని కూడ తెలియుచున్నది. చంద్రుని నుంచి చెట్లు వెన్నెలను ఆశించినట్లు, గురువు నుండి జ్ఞానమును ఆశించుట మంచిది. గురువు వద్ద చేరిన మనుషులు జ్ఞానమును ఆశించక ప్రపంచవిషయములను కోరినట్లయితే, చెట్లు చంద్రుని నుండి చల్లని వెన్నెలను కోరక మండుటెండను కోరినట్లుండును. ఎండకు, వెన్నెలకు వివరము తెలిసిన వారు, జ్ఞానమునకు, ప్రపంచకోర్కెలకు తారతమ్యము తెలియవలెను. గురువు వద్ద చేరినవారు, ప్రకృతి విషయములను వదలి పరమాత్మ విషయములను కోరవలెను. చంద్రుని వలన కలువపువ్వు వికసించి లాభముపొందినట్లు, గురువు చెంతచేరినవారు జ్ఞాన లాభమును పొందవలెను. గురువును, పౌర్ణమిని వేరువేరుగ చూడక, గురువే పూర్ణుడని, పూర్ణుడే గురువని తెలిసి గురుపౌర్ణమిని చేసుకోవలెను.


గురు.



ఒక మనిషి శరీరమును పరిశీలించి చూచితే శరీర నిర్మాణమును గొప్ప మేధావి కూడ రూపకల్పన చేయలేడని చెప్పవచ్చును. ఒక పురుష శరీరమును తయారు చేయాలనినా, స్త్రీ శరీరమును తయారు చేయాలనినా ఎంతో గొప్ప మేధావికి కూడ అటువంటి రూపకల్పన మెదడుకు అందదు. పురుష శరీరములోని పురుషత్వమునూ, స్త్రీ శరీరములోని స్త్రీతత్వమునూ, ఆ శరీరముల పరస్పర పొందికనూ, డిజైన్ చేసినవాడు మనిషి ఏమాత్రము కాదని అందరికీ తెలుసు. కానీ ఎవరు రూపకల్పన చేశారన్నది చాలామంది భౌతికశాస్త్రజ్ఞులకు కూడా తెలియదు. బ్రహ్మవిద్యా శాస్త్రమును తెలిసినవారు మాత్రము, ఆ శాస్త్ర ప్రమాణముతో మనిషిని రూపకల్పన (డిజైన్) చేసినది దేవుడేనని చెప్పగల్గుచున్నారు. మనిషి తయారైన తర్వాత తన తెలివినుపయోగించి జీవములేని ఎన్నో ఆకారములనూ, యంత్రములనూ రూపకల్పన చేశాడు. మనిషి ఎంత చదువు చదివినా, ఎంత విజ్ఞానమును సంపాదించుకొనినా, ఎంత మేధావి అయినా జీవమున్న దేనినీ తయారు చేయలేడు. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా! మనిషి మరొక మనిషిని తయారు చేయలేకపోయినా, మనిషిలాంటి కదలికలున్న ఆకారముగల రోబోట్ అను మరమనిషిని తయారు చేశాడు కదా అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! మనిషి, మనిషిలాంటి రోబోటన్ను తయారు చేశాడు, కానీ మనిషిని తయారు చేయలేదు కదా! భవిష్యత్తులో ఎప్పుడైనా మనిషి తన మేధాశక్తితో జీవపదార్థమును కనుగొన్నానని ప్రచారము చేసుకొనినా, అది సంపూర్ణ జీవముకాదని చెప్పవచ్చును. సంపూర్ణ జీవము అనగా జీవమునకు ప్రక్కలో ఆత్మయుండాలి. ఎచట జీవమున్నదో, అచట ఆత్మ ఉంటుంది అన్నది శాసనము. ఆత్మలేనిది ఏది జీవమనబడదు. ఆత్మ అంటే ఏమిటో ఇంతవరకు అద్వైతులకూ, విశిష్టాద్వైతులకూ, ద్వైతులకూ, పూర్వమున్న మహర్షులకు కూడ తెలియదు. ఇంతవరకు ఎవరు బోధించినా, ఏ మహర్షులు బోధించినా పరమాత్మ, జీవాత్మలను గురించి చెప్పారు గానీ ఆత్మను




--

గురించి ఎవరూ చెప్పలేదు. అందువలన ఆత్మ అగమ్యగోచరముగా ఎవరికీ తెలియకుండ ఉన్నది. ఒకే ఒక్క భగవద్గీతలో శ్రీకృష్ణుడు తప్ప ఎవరూ ఆత్మను గురించి చెప్పలేదు. భగవద్గీతలో చెప్పబడిన ఆత్మ ఎవరికీ ఇప్పటికీ అర్థముకాలేదు. ఆత్మంటే ఏమిటో తెలియనిదే ఆత్మ ఆధీనములోనున్న జీవాత్మను కనుగొనుట అసాధ్యమని చెప్పవచ్చును. అందువలన ఏ శాస్త్రవేత్తయినా ఆత్మయున్న జీవాత్మను కనుగొనలేడనీ, జీవాత్మను తయారు చేయలేడనీ చెప్పవచ్చును.


సూక్ష్మరూపమున్న ఆత్మనూ, దాని ఆధీనములోనున్న జీవాత్మను తయారు చేసి, సూక్ష్మమైన జోడు ఆత్మలు నివసించుటకు స్థూలమైన శరీరమును డిజైన్ చేసి తయారు చేసినవాడు దేవుడొక్కడే. కనపడని ఆత్మ, జీవాత్మలను కనపడనివాడే చేశాడు. ఆ కనపడని వాడే దేవుడు. ఇది శాస్త్రాధారములేని మాట అని నాస్తికులు కొట్టివేయవచ్చును. కానీ సజీవమైన మనిషి ప్రత్యక్ష ప్రమాణముగా ఉండగా, శాస్త్రప్రమాణములేని మాట అనడమేమిటని మేము ప్రశ్నిస్తున్నాము. ఒక మనిషి పుట్టాలంటే స్త్రీపురుష సంయోగము వలన జరుగుచున్నదనీ, పురుష వీర్యకణము, స్త్రీ అండము కలిసినపుడే మనిషి పుట్టుచున్నాడని చెప్పు శాస్త్రవేత్తలు కొన్ని కోట్ల సంవత్సరముల క్రితము మనుషులులేరని చెప్పుచున్నారు కదా! అపుడు స్త్రీ పురుషులు లేనపుడు మనిషి ఎలా పుట్టగలిగాడో చెప్పగలరా? చెప్పలేరు. పరిణామ సిద్ధాంతమను పాట మొదలిడినా ఏ పరిణామములేని ఈ కాలములో ఆ పాట శృతిలేనిదగుచున్నది. కాబట్టి ఒక బ్రహ్మవిద్యా శాస్త్రము తెలిసినవాడు మాత్రమే అన్నిటికి జవాబు చెప్పగలడు. ఇప్పటికాలములో బ్రహ్మవిద్య ఒక శాస్త్రమను విషయము కూడా మిగతా శాస్త్రజ్ఞులకు తెలియదు.


శాస్త్రము అనగా శాసనములతో కూడుకొన్నదని అర్థము. కొన్ని శాసనములను సమకూర్చి శాస్త్రమును తయారు చేసినవాడు శాస్త్రకర్త. మొదట శాస్త్రకర్త ద్వారా తయారు చేయబడిన శాస్త్రమును తర్వాత తెలుసుకొన్న వారు ఎందరైనా ఉండవచ్చును. శాస్త్రమును తెలిసినవారిని శాస్త్రవేత్తలని అనుచున్నాము. ముఖ్యముగ గమనించదగిన విషయమేమంటే శాస్త్రకర్తవేరు, శాస్త్రవేత్త వేరని గుర్తుంచుకోవలెను. భూమిమీద షట్శాస్త్రములు మాత్రమే గలవు. ప్రతి శాస్త్రము వెనుక శాస్త్రకర్త ఒకడుంటాడు. ఆరు శాస్త్రములను రెండుగా విభజించి చెప్పుకోవచ్చును. ఒకటి ప్రపంచమునకు సంబంధించిన శాస్త్రములనీ, రెండు పరమాత్మకు సంబంధించిన శాస్త్రములనీ విభజించ వచ్చును. అలా విభజించి చూచితే ఐదు శాస్త్రములు ప్రపంచమునకు సంబంధించినవనీ, ఒక్కటి మాత్రము పరమాత్మకు సంబంధించినదనీ తెలియుచున్నది. ప్రపంచమునకు సంబంధించిన ఐదు శాస్త్రములను, మనుషులకు ఊహనందించి మనుషులచేతనే దేవుడు తయారు చేయించాడు. ఒక్క బ్రహ్మవిద్యా శాస్త్రమును మాత్రము దేవుడే స్వయముగా తయారు చేశాడు. ఆ విధముగ బయటికొచ్చిన ఆరు శాస్త్రములు నేటికినీ ఉన్నవి. ప్రపంచ సంబంధ ఐదుశాస్త్రములు వరుసగా 1) గణితశాస్త్రము 2) రసాయనికశాస్త్రము 3) భౌతికశాస్త్రము గోళశాస్త్రము 5) జ్యోతిష్యశాస్త్రము. ఈ ఐదుకంటే పెద్దది బ్రహ్మవిద్యాశాస్త్రము. బ్రహ్మ అంటే పెద్ద అని అర్థము. బ్రహ్మవిద్య అనగా పెద్దవిద్య అని అర్థము. అన్నిటికంటే పెద్దగాయున్న దేవున్ని గురించి తెలియుజేయు శాస్త్రము కావున దానిని బ్రహ్మవిద్యాశాస్త్రము అని అంటున్నాము. ఈ శాస్త్రమును స్వయముగా దేవుడే చెప్పాడని చెప్పాము. ఒకప్పుడు అందరికీ తెలిసిన బ్రహ్మవిద్యాశాస్త్రము, నేడు ఎవరికీ తెలియకుండ పోవడమేకాక ఇపుడు మేము చెప్పినా అర్థము చేసుకోలేని స్థితిలో మనుషులున్నారు.


అన్నిటికంటే పెద్దదైనదీ, ఎంతో తెలివియుంటేగానీ అర్థముకానిదీ అయిన బ్రహ్మవిద్యాశాస్త్రమును మొదట తెలియజేసినవాడు దేవుడేనని తెలుసుకొన్నాము. దేవుడు అంటే ఎవరికీ తెలియనివాడని అర్థము. ఎవరికీ తెలియని వాడు, మనుషులకు తెలిసేటట్లు వచ్చి, వివరముగా చెప్పినపుడు మనుషులకు అర్థమౌతుంది. కావున దేవుడు మనిషి



--

రూపములో వచ్చినపుడు వానిని గురువు అంటున్నాము. గురువు సాక్షాత్తు దేవుడే అగును. కనిపించని దేవుడు కొన్ని లక్షల, వేలసంవత్సరములకొకమారు కనిపించెడి మనిషిగా వచ్చి బ్రహ్మవిద్యను చెప్పవలసియుంటుంది. ఎందుకనగా! ఇది పెద్దవిద్య కావున ఈ విద్య ఒకమారు చెప్పితే శాశ్వితముగ తెలిసియుండదు. దీనినిబట్టి కొన్ని లక్షల సంవత్సరములకో, కొన్ని వేల సంవత్సరములకో ఎప్పుడు తన శాస్త్రము భూమిమీద తెలియకుండ పోతే, అపుడు భూమి మీదకు గురువు వచ్చి చెప్పవలసియున్నదని తెలియుచున్నది. అట్లు గురువు అవసరమొచ్చిన సమయములలో మాత్రము భూమిమీదకు వస్తాడనీ, ఎల్లపుడు భూమిమీద గురువుండడని తెలియుచున్నది. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న అడుగుటకు అవకాశమున్నది. అది ఏమనగా! నేడు భూమిమీద ఎందరో గురువులున్నారు కదా! మీరు చెప్పే ప్రకారము వీరందరు గురువులు కాదా! ఎప్పుడో ఒకప్పుడు వచ్చువాడు ఒకడే గురువైతే, నేడు వందలసంఖ్యలోనున్న గురువుల నేమనాలి? అని అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! ఎప్పుడైనా భూమిమీద ఉంటే ఒక గురువుంటాడు. అదియు లక్షల సంవత్సరముల కొకమారు మాత్రమే. ఎల్లపుడు భూమిమీద గురువుండడు. ఎల్లవేళలా ఉన్నారు, చాలామందియున్నారు అంటే వారు గురువులుకాదు. గురువులు బహువచనములో ఉండరు. ఇపుడున్న గురువులనబడువారు గురువులుకాదు బోధకులని చెప్పవచ్చును. శాస్త్రకర్త, శాస్త్రవేత్త అని రెండు రకములున్నట్లు బ్రహ్మవిద్యా శాస్త్రకర్త గురువైతే, దానిని తెలిసి చెప్పుకొను వారు శాస్త్రవేత్తలైన బోధకులని చెప్పవచ్చును. దీనినిబట్టి గురువువేరు బోధకుడువేరని తెలియుచున్నది.


గురువు అంటే, సాధారణ మనిషికాదు అని తెలిసిన కొందరు జ్ఞానులు, గురువును దైవ సమానముగానే భావించుచుండిరి. భూమిమీద గురువు అను పేరేలేని ప్రాచీనకాలములో, మొదట జ్ఞానమును తెలియజేసిన మనిషిని దేవుడని గుర్తించగలిగిన జ్ఞానముగల మనుషులు, ఆయనను ఏ పేరుతో పిలువాలని యోచించి, చివరకు అర్థముకాక, నిన్ను ఏమని సంభోదించాలని ఆయననే అడిగారు. అపుడు బ్రహ్మవిద్యను బోధించి ఆయన చెప్పిన పేరే “గురు”. ఈ విధముగా మొదట భూమిమీద “గురు” అను పదము బయటికి వచ్చినది. మొదట బ్రహ్మవిద్యను తెల్పినవాడు సామాన్యుడు కాదని తెలిసినవారు, ఆయననుండియే చెప్పబడిన గురు అను పదము కూడ, విశేష అర్థముతో కూడుకొనియుండునని తలచినవారై, గురు అను పదమునకు అర్థమును చెప్పమనీ, మీరు తప్ప ఎవరు ఆ శబ్దమునకు అర్థము చెప్పలేరని కోరారు. అపుడు తనపేరు "గురు" గా ప్రకటించుకొన్న భగవంతుడు "గుకారస్య గుణాతీతః, రుకారో రూపవర్జితమ్" అని అన్నాడు. అంతేకాక మరొక విషయమును కూడా చెప్పాడు. "నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పుకోను. మీరు అడిగారు కాబట్టి రెండక్షరములకు సూచనగా అర్థమును చెప్పాను. ఈ రెండక్షరములలో ఇంకనూ విశేషమైన అర్థము ఇమిడియున్నది. మీరు శ్రద్ధతో నేను చెప్పిన జ్ఞానమును ఎంతగా తెలుసుకోగలరో, అంతగా గురు పదములోని రహస్యము తెలియగలదు" అన్నాడు. దీనితో జ్ఞానులందరికీ ఒక పరుగుపందెము పెట్టినట్లయినది. గురు పద అర్థము కొరకు పరుగు ప్రారంభించారు. అప్పటినుండి బ్రహ్మవిద్యను తెలుసుకొన్న జ్ఞానులందరూ గురు పదమునకు, అనేక రకములుగా అర్థమును చెప్పుచూ వచ్చారు. వారి వారి జ్ఞానమును బట్టి, ఎందరో జ్ఞానులు గురువును గురించి వర్ణించుచూ సంస్కృతములో ఎన్నో శ్లోకములను కూడ చెప్పారు. అలా ఎందరో జ్ఞానులు చెప్పిన అర్థములన్నియు చాలా గొప్పవేవని చెప్పవచ్చును.


ఇపుడు మనము కూడ బ్రహ్మవిద్యను నేర్చినవారమే, కావున మనము కూడ గురు పదము యొక్క అర్థము కొరకు పరుగు పందెములో పాల్గొనవచ్చును. మనకు సంస్కృత భాష రాకుండినా, శ్లోకముల రూపములో చెప్పకుండినా, మనకు వచ్చిన తెలుగుభాషలోనే మనము “గురు” పదమునకు అర్థము చెప్పుటకు ప్రయత్నిద్దాము. భూమిమీద మనుషులకు, శరీరమున్న మనిషి ద్వారానే మొదట బ్రహ్మవిద్య తెలిసినది. జ్ఞానమును తెలిసిన ఆ మనిషి గుణములున్నవాడే. గుణములులేని




--

మనిషి భూమిమీద ఉండడను సూత్రము ప్రకారము గురువు కూడ గుణములున్నవాడే. గుణములకు మారుపేరు “మాయ” అని భగవద్గీతలో తెలుసుకొన్నాము. "గుణమయీ మమ మాయా" అను గీత వాక్యము ప్రకారము శరీరముతోయున్న గురువుకు కూడ గుణములున్నవని తెలియుచున్నది. గురువు కూడ గుణముల ప్రకారమే పనులు చేయుచుండును. అయినప్పటికీ "గుకారస్య గుణాతీతః" అన్నట్లు గురు అను పదములో “గు” అక్షరము యొక్క అర్థము ప్రకారము, బ్రహ్మవిద్యా శాస్త్రమును తెల్పినవాడు గుణాతీతుడని తెలియుచున్నది. తర్వాత గురు పదములో రెండవ అక్షరమునకు "రుకారో రూపవర్జితమ్” అన్నారు. దానిప్రకారము గురువుకు రూపమున్నా రూపములేనివాడని తెలియుచున్నది. గుణములుండినా, గుణములకు అతీతుడనీ, రూపముండినా, రూపము లేనివాడనీ మొదట గురువే తన విధానమును తెలియజేశాడు. ఇది మనము చెప్పిన అర్థము కాకపోయినా, మనిషిగా ఉన్నపుడు మనుషులు అడిగిన దానికి గురు పదమునకు ఆయనే అర్థము చెప్పినప్పటికీ, ఇది కొద్దిమాత్రము అర్థమేననీ, గురు అను రెండక్షరములలో ఇంకనూ విశేష అర్థమున్నదనీ, దానిని మీ జ్ఞానముతో తెలుసుకొమ్మని కూడా చెప్పియున్నాడు. ఆయన చెప్పినట్లు, మాకున్న జ్ఞానముతో పరిశీలిస్తే కొంత నిగూఢ అర్థము తెలియుచున్నది, అదేమనగా!


దేవుడు నిరాకారుడు మరియు సాకారుడు. నిరాకారమైన దేవుడు రూపములేనివాడు, సాకారమైన భగవంతుడు రూపమున్నవాడూ మరియు గుణములున్నవాడు. దీనిని బట్టి దేవుడు రెండు రకములుగా ఉన్నాడని తెలియుచున్నది. భగము నుండి పుట్టి భగవంతుడైనవాడు గుణములతోనే చరించుచున్నాడు. అటువంటి భగవంతుని ద్వారానే భూమిమిద మనిషి జ్ఞానమును తెలుసుకొంటున్నాడు. కావున గుణములలోని మొదటి అక్షరమైన “గు” అనుదానిని భగవంతుని గుర్తుగ పెట్టవలసి వచ్చినది. భూమిమీద మనిషిగ గుణములలోనున్న భగవంతుడు, తర్వాత రూపము లేని నిరాకారునిగా మారిపోవును. రూపములేని దేవుని గుర్తుగ రూపములోని “రు” అను మొదటి అక్షరమును “గు” తర్వాత అక్షరముగా పెట్టవలసి వచ్చినది. అలా రెండు అక్షరములను కలిపి చూచితే “గురు” అగుచున్నది. గురు అనగా గుణములున్నవాడు, రూపములేనివాడు ఇద్దరూ కలిసియున్నదని తెలియుచున్నది. ఇక్కడ ఎవరైనా ఒక ప్రశ్న అడుగుటకు అవకాశముగలదు. అది ఏమనగా! మొదట రూపములేని నిరాకార దేవుడు, తర్వాత అవసరమొచ్చినపడు భూమిమీద శరీరముతో వచ్చి జ్ఞానము చెప్పాడు కదా! అటువంటపుడు మొదట రూపములేని దేవుని గుర్తుగ “రు” అను అక్షరమును పెట్టి తర్వాత గుణములతో వచ్చాడు కనుక “రు” తర్వాత “గు” అను అక్షరమును పెట్టి “రుగు” అనవచ్చును కదా! అలాకాకుండ మొదట “గు” ను తర్వాత “రు” ను పెట్టడములో అర్థమేమిటి? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఇట్లున్నది.


మనకు మొదట, గుణములున్న మనిషి ఆకారమునుండే జ్ఞానము తెలిసినది. తర్వాత ఆ మనిషి నిరాకారము పొందాడని కూడ తెలిసినది. కావున మనము ముందు “గు” అని తర్వాత “రు” అని వరుస పెట్టుకొని “గురు” అనవలసిందే కానీ “రుగు” అనకూడదు. దేవుడు రూపములేనివాడే కానీ మొదట మనకు తెలియదు, కాబట్టి “రు” ను మొదట తీసుకోకూడదు. జ్ఞానము తెలిసిన తర్వాత జ్ఞానము చెప్పినవాడు దేవుడనీ, వాడు నిరాకారుడని తెలిసినది. కాబట్టి “గు” తర్వాతే “రు” ను పెట్టుకొని “గురు” అను శబ్దమును పలుకవలసియున్నది. అందువలననే పూర్వమునుండి “గురు” అను శబ్దము వరుస క్రమములోనే ఉన్నది. దేవుని వైపునుండి చెప్పేమాట అయితే “రుగు” అని దేవుడు చెప్పాలి. మనుషులవైపు నుండి చెప్పే మాటయితే “గురు” అని చెప్పాలి. మనము మనుషులమే కాబట్టి మనము చెప్పుమాట “గురువు గానే ఉండాలి. దీనిని బట్టి యోచించి చూచిన “గు” అనినా, “రు” అనినా, రెండూ దేవున్ని ఉద్దేశించి



---

చెప్పునవేననీ, దేవుడు సాకార, నిరాకారములైన దానివలన “గురు” శబ్దము రెండు అక్షరములుగా ఉండినప్పటికీ, రెండూ ఒకటేనని తెలియుచున్నది. మనుషులైన మనము, మనిషిగానున్న గురువు నుండి జ్ఞానమును తెలుసుకొన్న తర్వాత, కనిపించెడి గురువే కనిపించని దైవమని మనకు అర్థమగుచున్నది. ఆ విధానమును తెలుపు నిమిత్తము మొదట “గు” తర్వాత “రు” గలదని తెలియుచున్నది.


దైవము లేక దేవుడు అనేక అంశలతో విశ్వవ్యాప్తముగా అణువణు వునా వ్యాపించియున్నాడు. విశ్వవ్యాప్తి అయిన దేవుని అంశలో కొంత భాగము మాత్రమే కనిపించెడి గురువుగా పుట్టుచున్నది. ఒకే సమయములో భూమిమిద గురువుగా పుట్టిన భగవంతుడూ ఉన్నాడు మరియు విశ్వవ్యాప్తముగా దేవుడూ ఉన్నాడు. దీనినిబట్టి దేవుడు సంపూర్ణుడు అనియు, భగవంతుడు దేవునిలో కొద్ది అంశయే కావున అసంపూర్ణుడనియు తెలియు చున్నది. కనిపించెడి గురువు శరీరమును వదలిపోతే గురువు దేవుడే అగునని తెలుసుకొన్నాము కదా! అపుడు గురువు కూడ సంపూర్ణుడగుచున్నాడు. దీనినే ఇంకొక విధముగా చెప్పుకొంటే గురువు జ్ఞానము చెప్పునపుడు అసంపూర్ణుడు, చెప్పిపోయిన తర్వాత సంపూర్ణుడు అని తెలియుచున్నది. ఈ విధానము దైవజ్ఞానమును తెలిసిన వారికి మాత్రమే వర్తించును. జ్ఞానము తెలియని వారి దృష్ఠిలో గురువు చనిపోయిన తర్వాత పూర్తి విలువలేని వాని క్రిందనే జమకట్టుచున్నారు. జ్ఞానమున్నవాడు జ్ఞానములేనివాడు గురువును ఎట్లు తలచుచున్నారో, జ్ఞానమున్న వారిదగ్గర గురువుకు ఎంత విలువున్నదో, జ్ఞానము లేనివానిదగ్గర గురువుకు ఎంత విలువలేదో, గురు పదమును దృశ్యరూపముతో చూచినా, మనకు అర్థమగునట్లు గలదు. అదెలా అనగా!


కనిపించి జ్ఞానమును చెప్పువానిని “గు” అను అక్షరముగా పోల్చుకొన్నాము కదా! జ్ఞానమును తెలుసుకొన్న మనిషి జ్ఞానము చెప్పువానికి విలువనిచ్చి గొప్పగ చూచుకొంటే దృశ్యరూపముగానున్న “గు” అను అక్షరమునకు క్రింద అరసున్న అను విలువను చేర్చినట్లగును. అనగా “గు” కు క్రింద అరసున్నను తగిలించితే “గు” అను దృశ్యము “రు” అను దృశ్యముగా మారిపోవును. “రు” అను దృశ్యము దేవుని గుర్తు కావున జ్ఞాని అయినవాడు, జ్ఞానము చెప్పిన వానిని దేవునిగా గుర్తించాడని అర్థమగుచున్నది. మొదట దేవుడే మనిషిగా (భగవంతుడుగా) వచ్చాడు కాబట్టి మొదట అక్షరము “రు” నే అనుకొని, “రు” అనుదానికి క్రింద అరసున్నను తీసివేస్తే “గు” అను దృశ్యము మిగిలిపోవును. “గు” భగవంతుని గుర్తు కావున దేవుడు భగవంతుడుగా మారినాడని అర్థమగుచున్నది. ఇంకొక విధముగా “గు” ను “రు” మీద పెట్టినా, లేక “రు” ను “గు” మీద పెట్టినా రెండు ఒకే “రు” దృశ్యముగానే కనిపిస్తున్నవి. దీని అర్థము దేవుడు భగవంతుడైనా, భగవంతుడు దేవుడైనా ఇద్దరూ ఒకే దేవుడని ఒకే “రు” కనిపిస్తున్నది. చెప్పినట్లు చేసి చూడండి “గురు” లో ఉండే మ్యాజిక్ అర్థమౌతుంది. “గురు" అను రెండక్షరములు ఒక దానిలో ఒకటి కలిసిపోయి “రు” గా కనిపిస్తుందంటే శాశ్వితమైన వాడు దేవుడనీ, వాడే తాత్కాలికముగ మనిషిరూపములో కనిపించి పోవుచున్నాడని తెలియుచున్నది. ఇదంతయు జ్ఞానము తెలిసినవారికి మాత్రమే గురువు యొక్క విలువ తెలుస్తుందన్నాము కదా! జ్ఞానము తెలియని అజ్ఞానుల దృష్ఠిలో “గురు” అనువాడు నిష్ప్రయో జకుడుగా, వ్యర్థునిగా, అర్థహీనునిగా, తోచునన్నాము కదా! అదెలా అనగా! “గు” అనునది కనిపించెడి భగవంతునికి గుర్తన్నాము కదా! దృశ్యరూపములో నున్న “గు” అను అక్షరమునకు జ్ఞానులు వినయముగ క్రింద అరసున్న చేర్చి చూచితే, అజ్ఞానులు గర్వముతో పైన తలకట్టునే తీసివేయుచున్నారు. అపుడు “గు” యొక్క తలలేని ఆకారము “౧ు” వంకరగా, అర్థములేనిదిగా వ్యర్థముగ కనిపించుచున్నది. దీనినిబట్టి అజ్ఞానులు దృష్టిలో కనిపించెడి భగవంతుడు కూడ వ్యర్థుడేనన్నమాట. అదే విషయమునే భగవద్గీతలో అక్షరపరబ్రహ్మయోగమను అధ్యాయమున పదకొండవ శ్లోకములో భగవంతుడు ఈ విధముగా అన్నాడు.




--

అవజానన్తి మాం మూఢా మానుషీం తను మాశ్రితమ్,

పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్.


భావము : సర్వ జీవరాసులకు అధిపతినై, దేవుడనైయుండిన నేను శరీరము ధరించి మనిషిగా పుట్టితే, నన్ను చూచిన అజ్ఞానులు నాశ్రేష్ఠత్వమును తెలియలేక నన్ను అవమానించుచున్నారు.


చూచారా! భగవద్గీతలో కూడ దేవుడేమి చెప్పాడో! భూమిమీద మనిషిగా పుట్టిన వాని తలకున్న గౌరవమును తీసివేసి, విలువలేని వానిగా అజ్ఞానులు లెక్కించుచున్నారనుటకు గుర్తుగా “గు” కు తలమీదున్న కొమ్మును తీసివేసిన, దృశ్యరూపములో అర్థములేని అక్షరముగా నిలుచునట్లు కనిపిస్తున్నది. ఈ విధముగా అందరి భావములకు సరిపోవునట్లు “గురు” అను అక్షరములున్నవనీ అందులో విశేషఅర్థముందనీ, మీకు గల జ్ఞానమును బట్టి, ఆ విశేషము తెలియునని మొదట గురువే అన్నాడు కదా! ఇంతవరకు "గురు" పదముకు ఎందరో ఎన్నో అర్థములు చెప్పినప్పటికీ, మనమిప్పుడు చెప్పుకొన్నట్లు ఎవరూ ఇంతవరకూ చెప్పుకోలేదు. దేవుడు పెట్టిన పరుగు పందెములో, మనకు తెలిసిన జ్ఞానము ప్రకారము అందరికంటే నాలుగడుగులు ముందుకు పోయి, అందరూ చెప్పిన దానికంటే విశేషముగా, వినూత్నముగా “గురు” అను రెండక్షరములలోని దృశ్యరూప రహస్యమును, జ్ఞానపద్ధతిలో తెలుసుకొన్నాము. ఈ క్రొత్తరక అర్థముతో, నేను అందరికంటే మించిన జ్ఞానినని నాకు నిరూపణకొచ్చినది. దీనిని తెలుసుకొని మీరు కూడ సంపూర్ణ జ్ఞానులు కావలెనని తెల్పుచున్నాను.


గురువులేని విద్య గ్రుడ్డివిద్య.


గురువులేని విద్య గ్రుడ్డివిద్య అనుమాట పూర్వము చాలామంది అనెడివారు. ప్రస్తుతకాలములో ఆ మాట బహు అరుదుగా వినిపిస్తున్నది. దీని అర్థము ఏ విద్యకైనా గురువు అవసరము అని తెలియుచున్నది. ఎవడైన ఏ విద్యనైనా స్వయముగా నేర్వాలనుకొన్నపుడు గురువు లేకుండ ఎంత నేర్చుకొన్నా అది గ్రుడ్డి విద్యేనని పూర్వము పెద్దలనెడివారు. ఈ మాట వాస్తవమేనా అని పరిశీలించి చూస్తే ఏకలవ్యుడు విలువిద్యను గురువు నేర్పకున్నను పట్టుదలగా నేర్చుకోగలిగాడు. ఆయనకది గురితప్పని విలువిద్య అయినది కానీ గ్రుడ్డివిద్య కాలేదు కదా! అలాగే నేటి కాలములో ఎవరు నేర్పకున్ననూ, డ్రైవర్ విద్యను నేర్చుకొని వాహనములను నడుపువారు గలరు. స్వయాన సంగీతమును నేర్చుకొని, గాన గంధర్వుడని పేరుగాంచిన గాయకుడు బాలసుబ్రమణ్యములాంటి వారూ గలరు. అలాగే కొన్ని విద్యలను కొందరు గురువు లేకుండగనే, అవలీలగ నేర్చుకోగలిగి వాటిలో ప్రావీణ్యత పొందిన వారూ గలరు. ఇటువంటివన్నియు గమనిస్తే గురువులేని విద్య గ్రుడ్డి విద్య అను మాట సత్యమేనా? అని అనుమానము రాక తప్పదు. ఇటువంటి సందర్భములో మనము బాగా యోచించ వలసిన పనియున్నది. తీక్షణముగా యోచించి చూస్తే గురువులేని విద్య గ్రుడ్డివిద్య అను మాటలో మూడు ముఖ్యమైన పదములు గలవు. అవి ఒకటి గురువు, రెండు విద్య, మూడు గ్రుడ్డివిద్య. ఈ మాట ముఖ్యముగ విద్యను గురించి చెప్పిన మాట కావున రెండవ భాగమైన విద్యను గురించి వివరించుకొని చూస్తాము.


'విత్' అను పదము నుండి పుట్టినది విద్య అను పదము. విత్ అనగా తెలియడము అని అర్థము. దాని ప్రకారము ఏదైతే తెలియగల్గు చున్నామో, లేక దేనినైతే నేర్వగలుగుచున్నామో దానిని విద్య అంటున్నాము. దేనినైతే తెలియుచున్నామో దానినే జ్ఞానము అని కూడ అంటున్నాము. దేనినైతే తెలియలేకున్నామో, దానిని అజ్ఞానము అంటున్నాము. దీనిప్రకారము, విద్యను జ్ఞానము అనియు, అవిద్యను అజ్ఞానమనియు అంటున్నాము. అదే విధముగ తెలిసిన దానిని



---

విద్య లేక జ్ఞానము, తెలియని దానిని అవిద్య లేక అజ్ఞానమని అందరికి అర్థమైపోయివుంటుంది. ఇపుడు విద్యనుగానీ, అవిద్యనుగానీ విభజించి చూస్తే రెండు రకములుగా ఉన్నవని తెలియుచున్నది. అవియే ఒకటి ప్రపంచ విద్య, రెండవది పరమాత్మ విద్య. ఈ రెండు విద్యలో గురువులేని విద్య అని దేనిని అన్నారని చూస్తే పరమాత్మవిద్యనే అని తెలియుచున్నది. ఎందుకనగా! ప్రపంచ విద్యలను గురువు లేకుండానే నైపుణ్యముగా నేర్వగలుగుచున్నారు. ఆ విద్యలోని ఫలితమును పొందు చున్నారు. అందువలన వృథాకాని పెద్దలమాట పరమాత్మ విద్యను గురించి చెప్పినదని తెలియుచున్నది. దీనినిబట్టి గురువులేని విద్య అను దానిని ఒక పరమాత్మ జ్ఞానము పట్ల మాత్రమే లెక్కించి చూడవలసియున్నది. ఈ మాట ప్రపంచ జ్ఞానమునకుగానీ లేక ప్రపంచ విద్యకుగానీ వర్తించదని తెలియాలి.


ఇపుడు గురువు అను పదమును చూస్తే, విద్యను బట్టి ఈ పదము కూడ ప్రపంచవిద్యకు వర్తించదని తెలియుచున్నది. అందువలన గురువును ఒక పరమాత్మ విద్య అయిన బ్రహ్మజ్ఞానముపట్ల మాత్రము చూడాలి. ఇపుడు అటువంటి గురువులను గమనిస్తే, దైవజ్ఞానమను పేరుతో ఎన్నో జ్ఞానములను తెల్పువారు కలరు. ఎన్నో జ్ఞానములని ఎందుకంటున్నా మంటే, ఒకదాని కొకటి కొంత భిన్నముగా ఉండును కనుక అలా చెప్పవలసి వచ్చినది. ఉదాహరణకు ఒక గురువేమో సిద్ధసమాధి యోగమని ఒక రక జ్ఞానమును బోధిస్తే, మరియొక గురువు పిరమిడ్ ధ్యానమని బోధిస్తాడు. ఇంకొకరు బ్రహ్మకుమారి సమాజ మార్గమని బోధిస్తారు. అలాగే మాస్టర్ ధ్యానమని ఒకరూ, రాజయోగ ధ్యానమని ఒకరూ, కుండలీయోగమని ఒకరూ, శ్వాస మీద ధ్యాస అనీ ఒకరూ, మనోయోగమనీ ఒకరూ, అచలయోగమని ఒకరూ, తారక మార్గమని ఒకరూ, సాంఖ్యమార్గమని ఒకరూ, ముక్తిమార్గమని ఒకరూ, కేవలము భక్తిమార్గమని ఒకరూ, నామ జపమని ఒకరూ ఇలాగ ఎందరో ఎన్నో భిన్నమైన విధానములను బోధించుచున్నారు. గమ్యము ఒకటే అయినా, దారులు ఎన్నో అని సమర్థించుకొని భిన్న భిన్నముగా బోధించుచున్నారు. ఈ విధముగా బోధించు వారందరూ గురువులుగానే చలామణి అగుచున్నారు. వీరు బోధించు విద్యలన్నీ గురువు బోధించు విద్యలైనపుడు, అందులో ఏదీ గ్రుడ్డివిద్య కాకూడదు. అన్నీ చూపువున్న విద్యలే అయివుండాలి. అనగా అన్ని విద్యలు దేవుణ్ణి తెలుపు అసలైన బ్రహ్మజ్ఞానమై ఉండాలి. ఇపుడు అసలు విషయానికి వస్తాము నేడు ఇన్ని విధములుగా బోధింపబడు విద్యలన్నీ దేవుణ్ణి తెలుపునవేనా? బోధించువారందరూ గురువులేనా? అని ప్రశ్నించుకొని చూస్తే, ఏ ఒక్క విద్య వలన దేవుణ్ణి చూడలేక పోవుచున్నాము. దీనిని బట్టి, ఇది గ్రుడ్డి విద్య అని ఒక్కొక్క దానిని తీసివేయవలసి వస్తున్నది. దేవున్ని తెలుపలేని విద్య ఏదైతే ఉన్నదో దానిని బోధించిన వాడు గురువు కాదని తెలియుచున్నది. గురువులేని విద్య గ్రుడ్డిది అయినపుడు గ్రుడ్డివిద్యను నేర్పిన వానికి గురువు లేడనియేగా అర్థము. అయితే ఇక్కడ విద్యను లేక జ్ఞానమును గురువే బోధించాడు కదా అని మీకు ప్రశ్నరాగలదు. దానికి మా జవాబు ఏమనగా! దైవజ్ఞానమును పేరుపెట్టి బోధించువాడు గురువు కాడు. అటువంటివాడు బోధకుడే అవుతాడు కానీ గురువుకాడు. దేవున్ని తెలియజేయు బోధ, చూపుకల్గినది కావున అటువంటి జ్ఞానమును బోధించిన వాడు మాత్రమే గురువు అగును.


అయితే ఇపుడు గురువు గురించి, గురువు ఎవరు? గురువు ఎప్పుడు భూమి మీద ఉంటాడు? గురువు బోధించు జ్ఞానము ఎలాగుండును? అను మొదలగు వాటికి జవాబు తెలియవలసియున్నది. పూర్వము దైవజ్ఞానమును తెలిసిన పెద్దలు, గురువును అనేక విధములుగా వర్ణించి చెప్పారు. వారు చెప్పిన విషయములను గమనిస్తే గురువు సాధారణ మనిషి కాడు, ఆయన ప్రత్యేకమైనవాడని తెలియుచున్నది. దానిని బట్టి ఒక మనిషి ఎప్పటికి గురువు కాలేడు, గురువే మనిషిగా రాగలడు. ఈమాట కొందరికి అర్థము కాకపోవచ్చును. దీని వివరమేమనగా! భూమిమీద పుట్టిన మనిషి



---

ఎవడూ గురువు కానేకాడు. భూమిమీద పుట్టని మనిషి మాత్రమే గురువు కాగలడు. ఇపుడు మీరు ఇంకా సంశయములోనికి పోవు అవకాశముగలదు. భూమిమీద పుట్టని మనిషి ఉంటాడా? ఇవేమి మాటలు? ఈయనకేమైన తిక్కనేమో? అని కూడ నన్ను గూర్చి అనుకోవచ్చును. కొన్ని సందర్భములలో సత్యము అలాగే అనిపిస్తుంది. ఇక్కడ అందరిని ఆశ్చర్యపరచు సత్యమేమంటే, భూమిమీద గురువు జన్మించకుండా శరీరమును ధరించియుండును. కనిపించు శరీరముతో యున్న గురువును “గురు సాక్షాత్ పరబ్రహ్మ” అని పెద్దలన్నట్లు ఆయన దైవశక్తిలోని లేక దైవములోని అంశయే. దైవము అణువణువున అంతటా వ్యాపించియున్నది. అందువలన ఒక చోట మరణించడముగానీ, ఒకచోట జన్మించడముకానీ జరుగదు. అంతటానున్న దైవశక్తి తల్లిగర్భములో శిశుశరీరముగా తయారై, లోపలినుండియే చైతన్యము కల్గి అనగా సజీవముగా పుట్టుచున్నది. అలా పుట్టు శరీరమును తల్లి అండముతోగానీ, తండ్రి వీర్యకణముతోగానీ పనిలేదు. సాధారణ మనిషి పుట్టడానికి తల్లి అండము, తండ్రి వీర్యకణము తప్పనిసరిగ అవసరము. విశేషమేమంటే, తల్లిగర్భములో తయారైన సాధారణ మనిషి శరీము గర్భము నుండి జీవము లేకుండ పుట్టును. పుట్టిన సాధారణ శిశుశరీరములోనికి జీవము మరియు చైతన్యము లేక ఆత్మ, శిశువు పుట్టిన తర్వాతే చేరును. గర్భమునుండి బయటికి వచ్చిన తర్వాత కదలిక వచ్చు లేక చైతన్యము వచ్చు మనిషి సాధారణ మనిషియే. అలాకాకుండ బహు అరుదుగా కొన్ని వేల సంవత్సరములకో లేక కొన్ని లక్షల సంవత్సరములకో గర్భములో నుండియే చైతన్యముతో పుట్టు శరీరము సాధారణ మనిషికాడు. ఆ మనిషే గురువు. అలాంటి మనిషినే సాక్షాత్ దైవమని పెద్దలు పేర్కొన్నారు. గర్భమునుండి ఎవరు, ఎట్లు పుట్టుచున్నారో మనుషులకు తెలియకుండ పోయినది. అందువలన కొన్ని వేల సంవత్సరములకు భూమిమీదకు వచ్చు గురువును మానవులు గుర్తించలేక పోవుచున్నారు. అందువలన జ్ఞానము చెప్పువారందరిని గురువులుగ లెక్కించుచున్నారు. తాను గురువు అనుకొన్న వాడు బోధించు బోధ దైవజ్ఞానమును తెల్పునదో కాదో తెలియలేక పోవుచున్నాడు. అందువలన మానవుడు భూమిమీదకు వచ్చిన గురువును గుర్తించలేక తనకు నచ్చినవారినీ, తనకు ప్రపంచమేలు చేకూర్చు బోధలు చెప్పువారినీ గురువుగ లెక్కించడము జరుగుచున్నది.


గురువు మనిషిగ భూమిమీదకు వస్తే, అసలైన దేవున్ని గురించే బోధిస్తాడు తప్ప చిల్లర దేవుల్లను గురించి బోధించడు. ఆయన బోధ ప్రపంచ లాభములను చేకూర్చునదై ఉండక, కేవలము ముక్తిని కలుగ జేయునదైయుండును. ఆయన ఎప్పుడు భూమిమీదకు వచ్చినా, ఎన్ని మార్లు వచ్చినా, ఒకే దైవమును గురించి, ఒకే విధానముగా బోధించును తప్ప, వచ్చిన ప్రతిమారు వేరు వేరు విధానములను చెప్పడు. అంతేకాక దైవమునుండి దైవప్రతినిధిగ వచ్చిన గురువు, ఎప్పటికి తాను గురువునని ప్రజలకు తెలియనట్లుండును. సాధారణ మనిషిగా ఉంటూనే తన జ్ఞానమును ప్రజలందరు తెలుసుకొనునట్లు బోధించును. భూమి మీద మతములు, మతపరమైన బోధలు ఎన్నియుండినా, గురువు ఎప్పటికి మత సంబంధ బోధలు చెప్పక, ఆయన దైవమునకు సంబంధించిన బోధలే చెప్పును. భూమిమీద అర్థము చేసుకోలేని అజ్ఞాన ప్రజలు ఆయనను వ్యతిరేఖించినా, ఆయన బోధ విధానమును మార్చి, వారికి నచ్చినట్లు ఎప్పటికీ చెప్పడు. ఆయన బోధ, అంతట వ్యాపించిన, అందరికి సంబంధించిన దైవమును గూర్చియే ఉండును. గురువు ఇతర దేశములలో కూడ అక్కడ వేరు వేరు పేర్లతో చలామణి అయినప్పటికీ దైవజ్ఞానమును మాత్రమే తెల్పి, తానెవరైనది గుర్తించనట్లు ఉండి పోయాడు. మన భారతదేశములో గురువులుగా ఎందరో చలామణి అగుచున్నప్పటికీ దాదాపు ఐదువేల నూట డెబ్బయి సంవత్సరముల పూర్వము దైవము యొక్క అంశ ఉత్తరప్రదేశ్లో పుట్టినట్లు, ఆయనే శ్రీకృష్ణుడని ఇప్పటికి తెలుసుకోగలిగాము. కృష్ణుడు గురువు మాదిరి ఎప్పుడు ప్రవర్తించనప్పటికి ఆయన చెప్పిన బోధలను బట్టి ఆనాటి కృష్ణుడు గురువు అని కొందరు తెలియగల్గుచున్నారు.



--

ఈనాడు మనదేశములో పరమహంసలు, భగవాన్లు, బాబాలు, అమ్మలు, మహర్షులు, బ్రహ్మర్షులు అని పేరును తగిలించుకొన్న ఎందరో గురువులున్నారు కదా! వారిని గురువులని చెప్పక ఐదువేల సంవత్సరముల పూర్వము పుట్టిన కృష్ణున్ని గురువుగా చెప్పుచున్నారేమిటి? అని నన్ను మీరు ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! నేను ఎవరి ముఖస్తుతికి గానీ, ఎవరిని నొప్పించడానికి గానీ మాట్లాడడములేదు. సత్యమునే చెప్పాలనుకొన్నాము కాబట్టి, నేడు భూమిమీద ఎందరో బోధించు వారుండినప్పటికి, వారిలో ఎవరు గురువుగా లేడు, వారు చెప్పునవి ఒకరికొకరికి భిన్నమైన బోధలు. నేడు కృష్ణుడు చెప్పిన భగవద్గీతను బోధించు వారుండినప్పటికి, కృష్ణుడు చెప్పిన భావమునకు వేరుగా బోధిస్తున్నారు. కావున వారిని సరియైన బోధకులు కూడ కాదనియే చెప్పవచ్చును. ఇంతకు ముందే ఇతరుల చేత బోధింపబడిన దానిని బోధించువాడు బోధకుడే అవుతాడు. గురువు ఎప్పటికి ఇతరులు బోధించిన దానిని బోధించడు. గురువు బోధించునది గురువుకు తప్ప, ఎవరికి తెలియదు. కావున దేనినైన చెప్పితే అది మొదటి బోధగయుండును. ఎవరు చెప్పని బోధను కానీ, ఎవరు వ్రాయని జ్ఞానమును గానీ చెప్పినవాడే గురువు. ఈ సూత్రమును అనుసరించి చూచినా, ఇంతకు ముందు రామానుజులు చెప్పిన బోధలనే బోధించువారందరు గానీ, ఇంతకుముందు శంకరాచార్యులు చెప్పిన బోధలు బోధించువారు గానీ, అట్లే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు చెప్పిన వాటిని చెప్పువారుగానీ గురువులు కారు బోధకులేనని చెప్పవచ్చును. ఇప్పుడు మీరొక ప్రశ్న అడుగుటకు అవకాశము గలదు. ఇంతకు ముందు చెప్పబడిన బైబిలును గానీ, ఖురాన్ ను గానీ, భగవద్గీతను గానీ చెప్పువారు గురువులు కాదు కదా! వారు కూడ కేవలము బోధకులే కదా! అని అడుగవచ్చును. దానికి సూత్రము ప్రకారము, బోధకులనియే మేము చెప్పితే, కృష్ణుడు అధర్మము చెలరేగినపుడు తిరిగి పుట్టుతానని చెప్పాడు కదా! అపుడు దేవుని అంశతో పుట్టిన వాడు కనుక గురువు అవుతాడా? లేక ముందు చెప్పిన తన బోధనే చెప్పుట వలన బోధకుడవుతాడా? అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! తను బోధించిన దానిని తిరిగి తానే బోధించువాడు గురువే అవుతాడు కానీ ఎప్పటికీ బోధకుడు కాడు. ఇతరులు బోధించిన దానిని ఎట్లు బోధించినప్పటికీ, వాడు బోధకుడే అవుతాడు కానీ ఎప్పటికి గురువు కాలేడు. ఈ సూత్రము ప్రకారము ఇప్పుడున్న వారు ఎవరు బోధకులో, ఎవరు గురువులో లెక్కించి మీరే తేల్చి చెప్పవచ్చును.


భూమిమీద ఎప్పుడైన గురువు ఒక్కడే ఉండుటకు అవకాశము కలదు. కానీ ఇద్దరు లేక ముగ్గురు గురువులుండుటకు వీలుకాదు. భూమిమీద అరుదుగా వచ్చు గురువు, ఏదో ఒక్క దేశములో ఒక్కడుగానే ఉంటాడు. ప్రస్తుతము భారతదేశములో చిన్న పెద్ద అందరిని కలుపుకుంటే వేయిమంది గురువులుగా చలామణి అగువారు ఉన్నారనుకొందాము. ఒకవేళ దేవుని అంశ (శక్తి) భూమిమీదకు మనిషిగా వచ్చియుంటే, వేయిమందిలోనూ గురువు ఒక్కడే ఉంటాడు. మిగత 999 మంది గురువులు కారు, కేవలము బోధకులేనని తెలియవచ్చును. 999 మందిలో ఎంత పెద్ద పేరుగాంచిన వారుండినప్పటికీ, మనము ఎంత పెద్దగా భావించుకొన్నప్పటికీ వారు గురువులు కారని తెలియవలెను. ఒకవేళ ప్రస్తుతకాలములో దేవుని అంశ భూమిమీద పుట్టియుండకపోతే, వేయిమందిలో కూడ గురువులేడనియే చెప్పవచ్చును. కొన్ని లక్షల సంవత్సరములలో, ఒక్కమారు మాత్రమే వచ్చిపోవు గురువును గుర్తించుట కష్టమైన పనియే. ఎప్పుడో, ఎన్ని సంవత్సరములకో అరుదుగా వచ్చు గురువును, ఎల్లపుడు భూమిమీద ఉంటాడనుకోవడము పొరపాటు. కొందరు గురు పరంపర అని ఒకరు తర్వాత ఒకరు రాజులు సింహాసనము ఎక్కినట్లు నేనూ, నా తర్వాత ఇతను, ఇతను తర్వాత అతను గురువనుకోవడము పొరపాటు కాదా! వాస్తవానికి గురుపరంపర భూమిమీద ఉండదు. ఒక్కమారు గురువు భూమిమీదకు వస్తే తిరిగి రావడానికి ఎంతో సుధీర్ఘకాలము పట్టుతుంది. అందువలన గురువు భూమి మీద ఎల్లప్పుడూ ఉండడు. గురువులేని కాలములో, గురువు కాని వారిచేత వినే బోధంతయు గురువులేని బోధ అనియే చెప్పవచ్చును. అందువలన పూర్వము "గురువు లేని



---

విద్య గ్రుడ్డి విద్య” అన్నారు. ఇంతవరకు విద్య అను దానికి అర్థము తెలుసుకొన్నాము. అలాగే గురువు అను పదమునకు వివరము తెలుసు కొన్నాము. గురువులేని కాలమునూ, గురువున్న కాలమును గురించి చెప్పుకొన్నాము. ఇక గ్రుడ్డివిద్యకు అర్థము తెలుసుకొందాము. “గురువులేని విద్య గ్రుడ్డి విద్య" ఎలా అగుచున్నదో తెలుసుకొందాము.


ప్రత్యక్షముగ గురువు ఉండి చెప్పిన బోధను ఆశ్రయించడము వలన ఆ విద్య మార్గమును బాగా చూపించి గమ్యమును చేర్చును. పుట్టిన ప్రతి మనిషికి ముక్తిని పొందడము ముఖ్యము. ముక్తి అనునది గమ్యము కాగా, జ్ఞానము లేక విద్య మార్గముకాగా, గురువు దారిని చూపించు దీపమైయున్నా డని అనుకొందాము. దీపము లేకుండా మార్గములో పోలేము. దీపము లేని ప్రయాణము అంధకారమయమని తెలియవలెను. దానివలన గురువులేని జ్ఞానము గ్రుడ్డివాని ప్రయాణములాంటిదని చెప్పవచ్చును. గురువు భూమి మీదకు వచ్చినపుడు 40 లేక 50 సంవత్సరములుగానీ, నాలుగు లేక ఐదు సంవత్సములుగానీ, చెప్పిన బోధనే చూపున్న వెలుగైన బోధ అని చెప్పవచ్చును. గురువు పోయిన తర్వాత అదే బోధను ఉన్నదున్నట్లు ఇతరులచేత తెలుసుకొని నప్పటికీ, అది గురువు యొక్క బోధయే అగును. కావున అది కూడ చూపుగల విద్యయే అగును. అట్లుకాక గురువు చెప్పి పోయిన తర్వాత అది ఆయన భావముతోకాక వేరు భావముతో చెప్పబడితే అది గురువు యొక్క బోధకాదు. అందువలన అట్టిదానిని గ్రుడ్డి విద్యయే అని చెప్పవచ్చును. గురువు చెప్పిన జ్ఞానమే భావము వేరైనపుడు, అది గ్రుడ్డివిద్య అయితే, గురువు చెప్పినది కాకుండయున్న ఏ జ్ఞానమునైన గ్రుడ్డివిద్యయే అని చెప్పవచ్చును. అందువలన నేడు భగవద్గీతకు వేరుగా ఉన్న శైవ, వైష్ణవములుగానీ, శ్వాసమీద ధ్యాసలు గానీ, మరి యే ఇతర మార్గములుగానీ మోక్షమను గమ్యమును చేర్చలేని గ్రుడ్డివిద్యలనియే చెప్పవచ్చును. ఇపుడు కొందరికి మా మీద కోపము వచ్చియుండవచ్చును అయినా పరవాలేదు నేను చెప్పునది సత్యమా కాదా మీరే చూచుకోండి. నేడు బోధించు వారందరిలో ఏ ఒక్కడు గురువు లేనప్పుడు, బోధించబడు బోధలలో ఏ ఒక్కటి గురువు చెప్పినది కానపుడు, అది గ్రుడ్డి విద్యకాక ఏమగును? అటువంటి దానినే గురువులేని విద్య గ్రుడ్డివిద్య అన్నారు. ఒకవేళ గురువునని పేరు పెట్టుకొన్న వానివైతే నీవు గురువువో, బోధకునివో సూత్రము ప్రకారము చూచుకో! ఒకవేళ నీవు బోధకునివైతే నీవు బోధించు బోధ భగవద్గీతలో గురువు చెప్పినదో కాదో, సూత్రము ప్రకారము చూచుకో! ఒకవేళ నీవు భగవద్గీతనే బోధిస్తూయుంటే అది గురువు చెప్పినట్లే ఉందో లేదో చూచుకో! ఒకవేళ నీకు బోధలు తెలుసుకోనే వానివైతే నీవు ఆశ్రయించి నది గురువునా బోధకున్నా చూచుకో, ఒకవేళ నీవు బోధకుని ఆశ్రయించి యుంటే నీవు వింటున్న బోధలుగానీ, నీవు చదువుచున్న బోధలు గురుబోధలో కాదో చూచుకో. ఒకవేళ నీకు గురుబోధలు తెలియకుండ బోధకుల బోధలు మాత్రమే తెలియుచుంటే అవి గ్రుడ్డివిద్యలేనని, మోక్షమును చేర్చలేవని తెలుసుకో. ఒకవేళ ఇంతవరకు గురువును ఆశ్రయించక బోధకున్ని ఆశ్రయించినా, గురువు యొక్క జ్ఞానము తెలియక బోధకుల మతవర్గ బోధలే తెలిసియుండినా “గురువు లేని విద్య గ్రుడ్డి విద్య" అను మాట నీకు పూర్తి వర్తించుచున్నదని తెలుసుకో. ఇప్పటి నుండైన గురువునుగానీ లేక గురువుయొక్క బోధను గానీ ఆశ్రయించి వెలుగులో ప్రయాణించవలెను. ఇపుడు గురువు లేకపోయినా గురువు చెప్పిపోయిన ఆయన బోధ శాశ్వితముగా భగవద్గీత రూపములోనున్నది. కావున గీతను ఆశ్రయించుము. భగవద్గీతలు గురువు చెప్పిన భావముతో కాక వేరు భావముతోనున్నవి దాదాపు మూడువందలు భారతదేశములో ఉన్నాయి. అట్లని గురువుయొక్క భావము లేనిది, భూమిమీద లేదని చెప్పుటకు వీలులేదు. అటువంటి భగవద్గీతను ఆశ్రయించి అసలైన భావమును తెలుసుకొని “గురువున్న విద్య చూపున్న విద్య" అని నిరూపించుకో. శ్రద్ధతక్కువయున్న చాలామందికి గురువులేని విద్య గ్రుడ్డివిద్య అయితే ఎక్కువ శ్రద్ధయున్న కొందరికి గురువున్న విద్య చూపుగల విద్యయని తెలియునట్లు చేస్తాము.




--

గురుప్రార్థన శ్లోకములు :-


శ్లోకము॥ 

ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః 

గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

శ్లోకము॥ 

ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం 

తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవేనమః

శ్లోకము॥ 

ఓం మన్నాథో శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు 

మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవేనమః

శ్లోకము॥ 

ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలకయా 

చక్షురునిలితం ఏన తస్మై శ్రీ గురవేనమః

శ్లోకము॥ 

ఓం బ్రహ్మానందం, అచలపూర్ణం, త్రిగుణాతీతం, 

ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం

ఆనంద నిత్యసద్గురుం తం నమామి.

శ్లోకము॥ 

ఓం నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, 

ద్వందాతీతం, గగన సదృశం, తత్త్వమస్యాది లక్ష్యం, 

ఏకం నిత్యం విమల మచలం, సర్వధీ సాక్షిభూతం, 

భావాతీతం, త్రిగుణరహితం సద్గురుం తం నమామి.

శ్లోకము॥ 

అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే 

జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవేనమః

శ్లోకము॥ 

ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే 

నమ శ్రీ గురునాథాయ ప్రకాశానంద మూర్తయే

శ్లోకము॥ 

ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ, విష్ణు, శివాత్మకం, 

గురోః పరతరం నాస్తి తస్మాస్థం పూజ యేద్గురుం


-: శ్రీ సద్గురు పాదుకాస్తవమ్ :-


1.శ్లోకము॥ 

శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశమగోచరం

భేదవర్జిత మప్రమేయ మనంత మాద్యమ కల్మషం !

నిర్మలం నిగమాస్త మద్వయ మప్రతర్క్యమ బోధకం 

 ప్రాతరేవహి మాన సాంతర్భావ యేద్గురు పాదుకామ్ !!

 



---

2.శ్లోకము॥ 

నాదబిందు కళాత్మకం దశనాద భేద వినోదకం 

మంత్రరాజ విరాజితం నిజమండలాన్తర్భాసితమ్ ! 

పంచవర్ణమఖండ మద్భుత మాది కారణ మచ్యుతం 

ప్రాతరేవహి మానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !! 


3.శ్లోకము॥ 

వ్యోమవద్భహిరంత రస్థిత మక్షరం నిఖిలాత్మకమ్ 

కేవలం పరిశుద్దమేకమజన్మహి ప్రతి రూపకం ! 

బ్రహ్మతత్త్వవినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకమ్ 

ప్రాతరేవ హిమానసాంతర్భావ యేద్గురు పాదుకామ్ !! 


4.శ్లోకము॥ బుద్ధిరూపమ బుద్ధికం త్రితయైకకూట నివాసినం 

నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్ ! 

పశ్చిమాన్తర ఖేలనం నిజ సుద్దసంయమి గోచరం 

ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్గురు పాదుకామ్ !! 


5.శ్లోకము॥ 

హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం 

నీల మధ్య సునీల సన్నిభ మాదిభిందు నిజాంశుకమ్ ! 

సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం 

ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్గురు పాదుకామ్ !! 


6.శ్లోకము॥ 

పంచ పంచ హృషీక దేహ మనశ్చ తుష్కపరస్పరం 

పంచభూతస కామషట్క సమీర శబ్దము ఖేతరమ్ ! 

పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మవిలక్షణం 

ప్రాతరేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్ !!


7.శ్లోకము॥ 

పంచముద్ర సులక్ష్యదర్శన భావమాత్ర నిరూపణం 

విద్యుదాది, ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్ధనమ్ ! 

చిన్ముఖాస్తర వర్తినం విలసద్విలాస మమాయకం 

ప్రాతరేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్ !! 


8.శ్లోకము॥ 

పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధతత్త్య విచారణం 

చక్రసూర్యచిదగ్ని మణ్డలమణ్ణితం ఘనచిన్మయమ్ ! 

చిత్కళా పరిపూర్ణమన్తర చిత్సమాధి నిరీక్షణం 

ప్రాతరేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్ !! 


9.శ్లోకము॥ 

హంసచార మఖణ్డనాద మనేక వర్ణమ రూపకం 

శబ్దజాలమయం చరాచరజన్తుదేహ నివాసినమ్ ! 

చక్రరాజమనాహతోద్భవమేకవర్ణ మతః పరం 

ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్గురు పాదుకామ్ !!



--

10.శ్లోకము॥ 

జన్మ కర్మ విలీనకారణ హేతుభూతమ భూతకం

జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం ! 

నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం 

ప్రాత రేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్ !! 


11.శ్లోకము॥ 

తప్తకాంచన దీప్యమాన మహాణుమాత్రమ రూపకం 

చన్దికాస్తరతారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్ ! 

నీలనీరద మధ్యమస్థితి విద్యుదాది విభాసితం 

ప్రాత రేవహి మానసాన్తర్భావ యేద్గురు పాదుకామ్ !! 


12.శ్లోకము॥ 

స్థూలసూక్ష్మసకారణాస్తర ఖేలనం పరిపాలనమ్ 

విశ్వతైజసప్రాజ్ఞ చేత సమస్తరాత్మ నిజాంశుకమ్ ! 

సర్వకారణమీశ్వరం నిటలాన్తరాళ విహారకమ్ 

ప్రాతరేవహి మానసాన్తర్భావయేద్గురు పాదుకామ్ !!


-: గురు స్తోత్రములు :-


1.శ్లోకము॥ 

కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం

గృహం బాంధవా సర్వమే తద్ధిజాతం 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


2.శ్లోకము॥ 

షడంగాది వేదో ముఖేశాస్త్ర విద్యా 

కవిత్వాది గద్యం సుపద్యం కరోతి 

గురోరంఘ్ర పద్మే మన శ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


3.శ్లోకము॥ 

విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః 

సదాచార నిత్య సువృత్తిన్నచాన్యః 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


4.శ్లోకము॥ 

క్షమామండలే భూప భూపాల బృంధం 

సదా సేవ్యతే యస్యపాదార విందం 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం 

తతఃకిం తతఃకిం తతఃకిం తతః కిం !!




--

5.శ్లోకము॥ 

నబోగే నయోగే నవారాజ్యబోగే 

సకాంతా ముఖేనైవ విత్తేషు యుక్తః 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


6.శ్లోకము॥ యశోమేగతం దిక్షుదాన ప్రతాప 

జగద్వస్తం సర్వం కరే యత్ ప్రసాదాత్ 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


7.శ్లోకము॥ 

అరణ్యే నివాసే స్వగేహేచ కార్యః 

నదేహే మనో వర్తతేమే అనార్వే 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం !!


8.శ్లోకము॥ 

అనర్ఘ్యాణి రత్నాని యుక్తాని సమ్యక్ 

సమాలింగితా కామినీ యామినీసు

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం 

తతఃకిం తతఃకిం తతఃకిం తతః కిం !!


9.శ్లోకము॥ 

శరీరం, సురూపం, తథావాకళత్రం 

యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం 

గురోరంఘ్ర పద్మే మనశ్చేన్న లగ్నం

తతఃకిం తతఃకిం తతఃకిం తతః కిం !!


ఓం విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి 

మూఢులను జ్ఞానులన్ జేయ బయల్పడిన ఓ గురురాయా 

ఇదే నా మనహ్ పూర్వక వందనమ్.


ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే 

సర్వలోక శరణ్యయా సాదురూపాయ మంగళం 

ఓం తత్సత్.


ఇట్లు,

ఇందూధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైతసిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.

---


---

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024