pss book:gt6 త్రైత సిద్ధాంత భగవద్గీత : విజ్ఞాన యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత : విజ్ఞాన యోగము
శ్రీ భగవంతుడిట్లనియె:-
శ్లోకము 1: మయ్యాసక్తమనాః పార్థ! యోగం యుంజన్మదాశ్రయః ।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : నా మీదనే ఆసక్తికల్గి, నన్నే ఆశ్రయించి యోగాభ్యాసము చేయుచు, సంశయము లేకుండ సంపూర్ణముగ నన్ను ఎట్లు తెలియగలవో ఆ విధానమును వినుము.
ఇంతవరకు చెప్పిన అధ్యాయములలో ఎక్కువ కర్మయోగమును, బ్రహ్మయోగమును గురించి చెప్పడమైనది. ఇప్పుడు ఈ అధ్యాయములో జీవాత్మ, పరమాత్మల గురించి ఎక్కువగ ఉండును. రాబోవు అధ్యాయములలో ప్రకృతి, ఆత్మల విషయమే ఎక్కువగా ఉన్నది. యోగముల విషయము బహుతక్కువగ ఉండును. ముఖ్యముగ చెప్పడమేమనగా! పూర్వకాలములో రోగమునకు తగ్గవాత, విషమునకు తగ్గమంత్రము, జాఢ్యమునకు తగ్గమందు అవసరమని పెద్దలనెడివారు. వాస్తవముగ వారు ఆ పద్ధతినే అనుసరించెడివారు. ఆ కాలములో నేటి వైద్య సదుపాయములు సూదిమందులేదు. కావున అప్పటి కాలములో వాతలతో కొన్ని రోగములు నయమైపోయెడివి. నేడు కూడ కొన్ని చోట్ల కామెర్ల రోగమునకు అదే పద్ధతి అనుసరిస్తున్నారు. విషమునకు తగ్గ మంత్రములు ఈ కాలములో కూడ అక్కడక్కడ పనిచేయిచునే ఉన్నవి. బాధపడుచున్న వానికి రోగము వలన బాధపడుచున్నాడా, లేక విషము వలన బాధపడుచున్నాడా అని కనిపెట్టి, ఏ వైద్యము అవసరమో ఆ వైద్యము చేయాలి. అట్లు చేయుట వలననే వాడు బాగుపడును. అట్లుకాక రోగమున్న వానికి మంత్రము, విషమున్నవానికి మందువేస్తే పనిచేయదు, వాడుబాగుపడడు. ఆ విధముగనే గీతలో మనము చదువు శ్లోకమును బాధగ్రస్తునికున్నది విషమా, రోగమా అని పరిశీలించినట్లు ఆలోచించి చూచి, ఈ శ్లోకము ఫలానా విషయమై ఉన్నదని తెలిసినపుడె చదువువాడు బాగుపడును. అట్లు తెలియక అక్కడొకటుంటే మనమొకటి అర్థము చేసుకొంటే గీత అర్థము కాదు, మనము బాగుపడలేము. ఈ అధ్యాయములో శ్లోకములన్ని ఆత్మల గురించి చెప్పియున్నారు. వాటిలో ఏ శ్లోకము ఏ ఆత్మదో తెలిసినపుడే భావము తెలియును. అట్లు తెలియకపోతే గీత భావమునకు మనము చాలా దూరముగ ఉన్నవారమౌతాము.
వివరము : ఇక్కడ శ్రీకృష్ణుని శరీరమునుండి పరమాత్మ అర్జునునిగనున్న జీవాత్మకు "జీవాత్మయిన వాడు ఎవరైన పరమాత్మ అనువాడొకడున్నాడని గ్రహించి, వానిని తెలియాలను ఆసక్తి పెట్టుకొని, ఆయనను తెలియుటకు ఆధారమైనది యోగమని తెలిసి, ఆ విధానము ప్రకారమే యోగమాచరించి చివరకు అనుమానము లేకుండ పూర్తిగ పరమాత్మను తెలియు విషయమంతా చెప్పెదను వినుము"యని తెలియజేయుచున్నాడు. ఇక్కడ ముఖ్యముగ గ్రహించవలసిన విషయమేమంటే! జీవాత్మ పరమాత్మల మధ్యవారధిలాంటిది ఆత్మ, జీవాత్మ స్థానమునుండి పరమాత్మ స్థానమునకు చేరాలంటే ఆత్మయను దానిని తప్పక తెలియవలసిందే. ఆత్మను తెలియని జీవాత్మ, పరమాత్మను చేరలేడని దీని భావము.
శ్లోకము 2: జ్ఞానం తేఽహం సవిజ్ఞాన మిదం వక్ష్యామ్య శేషతః ।
యజ్జ్ఞా త్వానేహభూయోఽన్యత్ జ్ఞాతవ్య మవ శిష్యతే ||
(జీవాత్మ)
భావము : జ్ఞానమును నీకు నేను విజ్ఞాన పూర్వకముగా తెలియచేసెదను. దానిని తెలిసిన తర్వాత ఇంకొకటి తెలియవలసినదుండదు.
వివరము : ప్రపంచములో అన్నిటికంటే ముఖ్యముగ తెలుసుకోవలసినది కర్మను పోగొట్టుకొను యోగవిధానము. జన్మలకు కారణమైన కర్మనే భస్మీపటలము చేయు విధానమును తెలుసుకున్న తర్వాత ఇంకొక దానిని తెలుసుకోనవసరములేదు. కర్మను కాల్చివేయు యోగ విషయ జ్ఞానమును అనుభవసహితముగ ఎట్లు తెలుసుకోవాలో, ఆ విషయమును తెల్పెదనని భగవంతుని శరీరములోని పరమాత్మ చెప్పాడు.
శ్లోకము 3: మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।
యతతా మపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ||
(జీవాత్మ)
భావము : నరులలో మోక్షమునకై ప్రయత్నము చేయువాడు వేయిమందిలో ఒకడుండుట అరుదు. అట్లు ప్రయత్నము చేయువారిలో చివరకు ఎవడో ఒకడు నన్ను తెలుసుకోగలడు.
వివరము : జన్మరాహిత్యము చేసుకొని పరమాత్మలోనికి ఐక్యము కావలెననుకొనువారు లక్షకొకరు కనబడుట కూడ కష్టము. భగవద్గీతను అర్జునునికి చెప్పిన దినమున వేయిమందికి ఒకడు అరుదే అయివుండవచ్చును. అప్పటికంటే అజ్ఞానము పెచ్చు పెరిగిన ఈ దినములలో లక్షకొకడు కనబడుట కూడ అరుదుగనే ఉన్నది. అటువంటి వారిలో చివరకు ఎవడో ఒకడు మోక్షము పొందును. భగవంతుని మాటప్రకారము వేలలో ఒకడు ప్రయత్నము చేయువాడుండగ, వారిలో ఎవడో ఒకడు మాత్రము మోక్షము పొందగలడనుకొందాము. అదియునుకాక వేయిమందికొకడు అరుదుకాకుండా ఒకడు తప్పనిసరిగ ఉంటాడనుకొందాము. ఆ ఒక్కడు తప్పనిసరిగ ఎందుకు మోక్షము పొందలేక పోవుచున్నాడని యేచిస్తే తెలియునదేమనగా ! ఉదాహరణకు ఒక ఊరిలో వేయిమంది జనాభా ఉన్నారనుకొనుము. అందులో ఒకడు దైవచింతన కల్గి ధ్యానము, యోగము అనుకొంటు ప్రయత్నము చేయుచుండెను. వానికి ఇంటిలోనివారు ప్రథమశత్రువులుకాగ ఊరిలో 999 మంది వ్యతిరేఖులుగనే తయారైనారు . ఊరంతా ఉత్తరమంటే వానిదొక్కనిది దక్షిణమన్నట్లున్నది. 999 మంది వ్యతిరేఖులతో ఒక సంవత్సరము, రెండు సంవత్సరములు జరుగగ, మిగతా వారితో ఇబ్బందులు పడలేక చివరకు వాడు కూడ వారి దారిననే నడుచుటకు మొదలుపెట్టెను. ఆ విధముగ వాడుకూడ మారిపోవుట వలన ఆ ఊరిలో వేయికి వేయి ఒకే అజ్ఞాన మార్గములో నడుచువారై ఉండిరి. అట్లుకాక అందరికి ఎదురీత ఈది, చివరకు మరణమైన పరవాలేదనుకొనువాడైతేనే మోక్షము పొందగలడు. అంత తెగింపుగల వారెక్కడున్నారు. ఉన్నా మాయ వానినుండనివ్వదు. బయట ప్రజలకు, లోపలి మాయకు లొంగనివాడైతేగాని మోక్షసిద్ధికి సాధ్యపడదు. అందువలన అనుకొన్నవారందరు మోక్షము పొందలేరని భగవంతుడు చెప్పాడు.
శ్లోకము 4 : భూమి రాపోఽనలో వాయుః ఖం మనోబుద్ధి రేవ చ ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా ||
(ప్రకృతి)
భావము : భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహము అను అష్ట భాగములుగ నా ప్రకృతి గలదు.
వివరము : యావత్ చరాచర ప్రపంచమునంతటిని రెండుగ చెప్పుకోవచ్చును. అవియే ప్రకృతి, పరమాత్మ. కంటికి కనిపించునదంతయు ప్రకృతికాగ, ప్రకృతికి ఆధారమై కంటికి కనిపించక సూక్ష్మముగ ఉండునది పరమాత్మ. ప్రకృతిని చర అచర ప్రకృతియని రెండు భాగములుగ చెప్పుకోవచ్చును. చర ప్రకృతి అనగ సకల జీవరాసుల శరీరములు మరియు వాటిలోని భాగములుగ ఉండి మార్పు చెందునది. అచర ప్రకృతియనగా మార్పు చెందక ఎప్పటికి ఒకేలాగుండు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. అచర ప్రకృతి 5 భాగములుగ ఉండగ, చర ప్రకృతి శరీరములో జీవుడు తప్ప 24 భాగములుగ ఉన్నది. పంచభూతములుగను మరియు శరీర రూపములుగనున్న ప్రకృతియంతయు ఒక భాగముకాగ, శరీరములకు ఆధారమైన ఆత్మ, జీవాత్మలు, పంచభూతములకు ఆధారమైన పరమాత్మ మూడు ఒక భాగముగ ఉన్నవని చెప్పవచ్చును. పంచభాగములుగ ఉన్న ప్రకృతియంతయు ఒక్కటికాగ, మూడు భాగములుగ ఉన్న ఆత్మలు అన్నీ ఒకే పరమాత్మ అంశగనున్నవి. ప్రకృతి పరమాత్మలను రెండు భాగములతో కూడుకొన్న ఈ చరాచర ప్రపంచములో మానవుని కర్మాచరణకు ప్రకృతిలో ముఖ్యమైన భాగములేవియని యోచించిన బయట తెలియబడు పంచభూతములు ఐదు, శరీరములోని మనస్సు, బుద్ధి, అహంకారము అనునవి మూడు. మొత్తము ఎనిమిది ముఖ్య ప్రకృతి భాగముల చేత కర్మాచరణ ప్రపంచములో జరుగుచున్నది. అందువలన ఈ శ్లోకములో నా ప్రకృతి ఎనిమిది విధములనున్నదని పరమాత్మ తెలియజేశాడు.
శ్లోకము 5 : అపరేయ మిత స్త్వన్యాం ప్రకృతిం విద్ధిమేపరాం ।
జీవభూతాం మహాబాహో ! యయేదం ధార్యతే జగత్ ||
(ప్రకృతి, పరమాత్మ)
భావము : దేనిచేత ఈ ప్రపంచమంతయు ధరింపబడుచున్నదో అనగా ప్రపంచమునకు ఏది ఆధారముగనున్నదో, అదే జీవరూపమై ప్రకృతికంటే అన్యమై ఉన్నది, దానిని తెలుసుకొనుము. దానికంటే ప్రకృతి చాలా తక్కువై ఉన్నది.
వివరము : ఈ శ్లోకములో 'అన్యాం ప్రకృతిం' అను మాటకు ప్రకృతికంటే వేరైనది అను అర్థము సరైనది కాగ, వేరొక ప్రకృతి అను అర్థము సరికానిది. ఈ శ్లోకములో అన్ని గీతలలోను వేరొక ప్రకృతి అను మాటనే ఉపయోగించి దీని భావము ఇలా వ్రాశారు. ‘ఈ ప్రకృతి చాలా తక్కువైనది, జీవరూపమై శ్రేష్ఠమై జగత్తంతయు ధరింపబడు ప్రకృతి వేరొకటున్నది. దానిని తెలుసుకొనుము' ఇది సరైన భావము కాదు. ప్రకృతి పురుషులు వేరువేరని చెప్పుకొన్నాము. జీవాత్మ పరమాత్మ సంబంధమైన పురుషుడని కూడ చెప్పుకొన్నాము. జీవరూపమైనది, శ్రేష్ఠమైనది, జగత్తంతయు వ్యాపించినది, ప్రకృతికంటెను వేరుగనున్న పురుషుడైన పరమాత్మను మరొక ప్రకృతి అనడము సమంజసము కాదు. ప్రకృతికంటే భిన్నమై, సర్వ శరీరములలో జీవరూపమై, సర్వ శరీరములకు చైతన్యము నిచ్చు ఆత్మస్వరూపమై, అణువణువున వ్యాపించినది ప్రకృతికంటే శ్రేష్ఠమైనది మరొకటున్నదని దానిని తెలుసుకొమ్మని, దానికంటే ప్రకృతి చాలా తక్కువైనదని, ఈ శ్లోకములోని పూర్తి భావము గలదు. అలా కాకుండ ప్రకృతి తక్కువైనదేనని, దానికంటే శ్రేష్ఠమైన ప్రకృతి మరొకటున్నదని వ్రాసుకొనుట చాలా తప్పు . ఇదేమో నీచమైన ప్రకృతి, దీనికంటే శ్రేష్ఠమైన పురుషుడొకడున్నాడు. వానినే తెలుసుకొమ్మన్నాము. ఆ పురుషుడెట్టివాడనగా! వాని ప్రభావము ఎట్టిదనగా! క్రింది శ్లోకాలలో చూస్తాము.
శ్లోకము 6 : ఏత ద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా! ||
(ప్రకృతి, పరమాత్మ)
భావము : ప్రకృతి సమస్త జీవరాసుల పుట్టుకకు స్థానమైన యోనిలాంటిది. నేను జీవరాసుల పుట్టుకకు కారణమైన వానిని, మరియు వాటి ప్రళయమునకు కూడ కారణమైన వానిని.
వివరము : ఒక మనిషి పుట్టుటకు భౌతికముగ తల్లి తండ్రి ఇద్దరు అవసరమే. తల్లివుండి తండ్రి లేకుండ, అట్లే తండ్రివుండి తల్లి లేకుండ ఎవడు పుట్టజాలడు. ఎవరి తల్లితండ్రి వారికి తెలుసు. మీ తల్లి పేరేమని అడిగిన చెప్పగలరు, తండ్రిపేరును చెప్పగలరు. ఒకనికి ఒక తల్లి తండ్రి ఉన్నట్లు, జీవరాసులన్నిటికి సమిష్ఠిగ ఒక తల్లి తండ్రి ఉన్నారు. అందరికి కలిసి ఒకే తల్లి, ఒకే తండ్రి ఎవరో చాలామందికి తెలియదు. సర్వ జీవరాసులకు శరీరమును తయారు చేసి ఒక రూపమిచ్చునది ప్రకృతి. తల్లిగర్భములోని శిశువు ఒక రూపము సంతరించుకొన్నట్లు, ప్రకృతిలోని జీవుల శరీరములన్ని స్త్రీస్వరూపమైన ప్రకృతినుండే తమ తమ ఆకారమును పొందాయి. తల్లి గర్భములోని శిశువు ఆకారము పొందుటకు పైనున్న తల్లి ఏమి చేయకున్నను, లోపలనున్న చర ప్రకృతియొక్క కార్యముల వలననే గర్భములోని శిశువుకు ఆకారమేర్పడుచున్నది. దీనిని బట్టి తల్లి వెనుక సర్వ జీవరాసులకు తల్లిగ ప్రకృతి పేరుగాంచినది. ఆ విధముగనే శిశువు పుట్టుటకు కారణమైనవాడు తండ్రి. లోపల చైతన్యమై ఉండి, శిశువు శరీరము తయారగుటకు భీజదాతయై కనిపించకయున్న లోపలి తండ్రి పరమాత్మ. కనుక సర్వజీవరాసులకు తండ్రి పరమాత్మయని తెలియాలి. జీవరాసులన్ని భూమి మీద పుట్టుచు, పెరుగుచు, గిట్టుచు మరియు పుట్టుచు, తిరిగి పెరుగుచు జరుగుచున్న ప్రపంచమునకు ప్రకృతి, పురుషులే కారణముగ ఉన్నారు. ఈ పుట్టి పెరిగిన ప్రపంచమంతయు ఒకానొక రోజు లేకుండపోవును, దానినే ప్రళయమంటారు. 'ప్ర' అనగ పుట్టునది. 'ళయము' అనగా నాశనమని తెలియాలి. ప్రళయమనగా పుట్టినదంతయు లేకుండ పోవుటని అర్థము. అటువంటి ప్రళయమునకు కూడ పరమాత్మయే కారణము. ఎప్పుడో ఒకప్పుడు సంభవించు ప్రళయములో పరమాత్మ ప్రకృతిని ప్రేరేపించి, దానిచేతనే జీవులను లేకుండ చేసి, చివరకు ప్రకృతిని కూడ లేకుండ చేయును. కావున ప్రళయమునకు కారణము, ప్రభవమునకు కారణము నేనేనని శ్లోకములో చెప్పాడు. ఇంకనూ పురుషుడైన పరమాత్మ ఎట్లున్నాడనగా! క్రింది శ్లోకము చూడుము.
శ్లోకము 7 : మత్తః పరతరం నాన్యత్ కించి దస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణా ఇవ ||
(పరమాత్మ)
భావము : జగతిలో నన్నుమించి ఘనత పొందినది వేరేదియులేదు. దారమందు మణులు ధరింపబడునట్లు సర్వ ప్రపంచమును నేనే ధరింతును.
వివరము : పరమాత్మ ప్రకృతినే సృష్ఠించి దానిద్వారా జీవరాసులను తయారు చేసి పెద్ద ప్రపంచమునకే అధిపతిగనున్నది. పరమాత్మకంటే అన్యమైన వస్తువేదియు లేదు. కావున దానికంటే మించినది మరొకటి ఎక్కడినుండి వచ్చును. పరమాత్మకంటే మించినది భూతకాలములో లేదు. భవిష్యత్ కాలములో ఉండబోదు. సర్వజీవరాసుల హృదిమధ్యలో చైతన్యమై ఆత్మగవుంటూ, సర్వ జీవాత్మల యొక్క ఆత్మలను తనతో సంబంధమున్నట్లు చేసి, సర్వజీవరాసులకు సూత్రధారై పరమాత్మ ఉంటున్నాడు. చర ప్రకృతియైన సర్వ జీవరాసులలోను తాను వ్యాపించి, వాటియందు కనిపించక పూలలో దారమువలె ఉన్నాడు. పూలన్నిటికి దారమాధారమైనట్లు పరమాత్మ సర్వజీవులకు ఆధారముగ శరీరములో ఆత్మరూపమై కనిపించక ఉన్నాడు.
ఈ విధముగ చర ప్రకృతికేకాక, అచర ప్రకృతికి కూడ పరమాత్మ ఆధారమై ఉన్నాడు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమికి గురుత్వాకర్షణశక్తిగ ఉంటు, గగనములో అణువణువున వ్యాపించి సూర్యచంద్రాది గ్రహాలకు, నక్షత్రములకు, పాలపుంతులకు, నల్ల రంధ్రము (బ్లాక్ హోల్)నకు అధిపతియై, శరీరములో ఆత్మవలె జీవరాసులను కదిలించునట్లు గగనములో అయస్కాంతశక్తియై సర్వగోళములను కదిలించుచున్నాడు. ఈ విధముగ అచర ప్రకృతికి, చర ప్రకృతికి సర్వప్రపంచమునకు ఆధారమై పరమాత్మ ఉన్నాడు, అది ఇంకా ఎట్లున్నదనగా!
శ్లోకము 8 : రసోఽహ మప్సు కౌంతేయ ! ప్రభాఽస్మి శశిసూర్యయోః ।
ప్రణవ స్సర్వ వేదేషు శబ్ధః ఖే పౌరుషం నృషు ||
(పరమాత్మ)
భావము : జలములోనున్న రసమును నేను, సూర్య చంద్రులకున్న ప్రకాశమునేను, వేదములందలి ఓంకారమును నేను. ఆకాశములోనున్న ధ్వనిని నేను. అట్లే పురుషులలోని పౌరుషము కూడ నేనే అయివున్నాను.
వివరము : ఒకే విద్యుశ్ఛక్తి ఫ్యానుతో కలిసినపుడు గాలిగాను, రేడియోతో కలిసినపుడు పాటగను, టి.వి. తో కలిసినపుడు దృశ్యముగను, బల్బులోని నైక్రోమ్ తీగతో కలిసినపుడు వెలుతురు వేడి ఉత్పత్తిగ మారినట్లు ఒకే పరమాత్మ శక్తి నీటితో కూడి దానిలోని రుచిగను, సూర్యచంద్రులతో కలసి వెలుతురు వేడిమిగను, శరీరములోని గుణములతో మిళితమగుటవలన శ్వాసగను, గగనములో కలియుట వలన శబ్దముగను, పురుషులతోనుండుట వలన పౌరుషముగను తయారగుచున్నది. ప్రపంచములో దేనికైన ప్రత్యేకత కల్గించునది పరమాత్మయే.
శ్లోకము 9 : పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ||
(పరమాత్మ)
భావము : భూమిలోగల సువాసన, అగ్నిలోగల తేజస్సు, జీవరాసులలోని జీవనము, తపస్వికులలోని తపస్సు అయివున్నాను.
వివరము : పరమాత్మ అగ్నిలో, భూమిలో అణువణువున వ్యాపించి మట్టి కణములకు వాసననిచ్చుచున్నాడు. అగ్నికణములకు తేజస్సునిచ్చుచున్నాడు. అచర ప్రకృతిలో అగ్ని, భూమికెట్లు వాటి వాటి ప్రత్యేకతల వెనుక కారణభూతుడై ఉన్నాడో, అట్లే చర ప్రకృతిలోని జీవరాసుల వెనుక కనిపించని కర్మరూపమై వాటి జీవన విధానము నేర్పరుచుచున్నాడు. అంతేకాక ఒకదానికై పరితపించు వారిలోని తపము కూడ తానేయైయున్నాడు. ఇంకనూ ఎట్లున్నాడనగా!
శ్లోకము 10 : బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ! సనాతనమ్ ।
బుద్ధిర్బుద్ధి మతా మస్మి తేజస్తే జస్వినా మహమ్ ||
(పరమాత్మ)
భావము : సర్వ జీవరాశులకు శాశ్వతముగ బీజము నేనేయని తెలియుము. బుద్ధిమంతులలోని బుద్ధిని మరియు తేజస్సులందు తేజంబునేనై ఉన్నాను.
వివరము : బీజం అనగా పుట్టుకకు కారణమైనదని అర్థము. "జం" అనగా పుట్టుట అనియు, "బీ" అనగా కారణమైనదనియు చెప్పుకోవచ్చును. బీజం అనగా చెట్టు యొక్క విత్తనమేనని అనుకోక, జీవరాసి యొక్క పుట్టుకకు కారణమైనదని తెలియవలెను. చెట్టుకు బీజము విత్తనముకాగ, పక్షికి బీజము గ్రుడ్డుకాగ, మనిషికి బీజము వీర్యకణమైయున్నది. విత్తనముకాని, గ్రుడ్డుకాని, వీర్యకణముకాని ఈ మూడింటిని బీజము అంటాము. బీజము మూడు రూపములలోనున్నది. మూడు రూపములలోనున్న బీజముతో మూడు రకముల జన్మలు భూమిమీద కలవు. గ్రుడ్డునుంచి పుట్టుదానిని అండజము అనియు, వీర్యమునుండి పుట్టుదానిని పిండజము అనియు, విత్తనము నుండి పుట్టుదానిని ఉద్భిజము అనియు అనుచున్నాము. భూమి మీద పుట్టు అండజ,పిండజ, ఉద్భిజ అను మూడు విధ జన్మలకు కారణము బీజము మూడు విధములుగ ఉన్నప్పటికి వాటిలోని బీజశక్తి ఒకటే. విత్తనము, వీర్యము, అండము స్థూలముగ కనిపించునవే అయినప్పటికి వాటిలోని కనిపించని శక్తి ఒకటి కలదు. విత్తనములోని బీజము వేరు, విత్తనము వేరు. అందువలన బీజశక్తిలేని విత్తనములు కూడ కొన్ని ఉండవచ్చునని చెప్పవచ్చును. అటువంటి విత్తనములు భూమిలో పడినప్పటికి మొలకెత్తవు. అలాగే బీజశక్తిలేని వీర్యము ఉండవచ్చును. అటువంటి వీర్యమునకు గర్భమురాదు. అదే విధముగ బీజశక్తిలేని గ్రుడ్లు పిల్లలుగా మారవు. విత్తనము, వీర్యము, గ్రుడ్డులోని బీజశక్తికి కారణమైన శక్తి ఒకటి కలదు. అదియే పరమాత్మశక్తి. అన్నిటిలోను అణువణువున వ్యాపించిన పరమాత్మ వీర్యములోను, విత్తనములోను, గ్రుడ్డులోను బీజశక్తిగ ఉన్నాడు. అందువలన "బీజం మాం సర్వభూతానామ్" అని శ్లోకములో చెప్పాడు.
విత్తనములోని బీజశక్తి కనిపించక పోయినప్పటికి చెట్టు మొలకెత్తుటకు కారణము విత్తనమని అందరికి తెలుసు. కనిపించే పదార్థము పుట్టుటకు కనిపించని శక్తి కారణమై ఉన్నది. పదార్థములు జీవమున్నవి, జీవములేనివి కూడ ఉండవచ్చును. అన్నిటికి కారణమైనది పరమాత్మ శక్తియే. ఇక్కడ సర్వభూతానామ్ అని జీవమున్న వాటినే గురించి మాట్లాడుచున్నామని జ్ఞప్తికుంచుకోవలెను. ఏ ఇంద్రియమునకు తెలియని పరమాత్మశక్తి జీవరాసుల శరీరములో అనేక విధ శక్తులుగ మారియున్నది. మనస్సుతో చేరి మనస్సుకు జ్ఞాపకశక్తిని, బుద్ధితో చేరి బుద్ధికి యోచనాశక్తిని అందిస్తున్నది. ఎవడైన ఎక్కువ తెలివైనవాడు ఉంటే వాని తెలివియొక్క ప్రావీణ్యత కూడ పరమాత్మశక్తి చేతనే కల్గియున్నది. ఆ విధముగ మనిషిలోగాని మరి ఏ ఇతర జీవరాసిలోగాని ఏదైన ప్రావీణ్యతయుంటే ఆ ప్రావీణ్యతయంత పరమాత్మ శక్తి వలననే కల్గినదని తెలియవలెను. ఏ విద్యలోగాని, ఏ ఆటలోగాని, ఏ కళలోగాని, ఎవని మాటలోగాని, ఎవని పనిలోగాని గొప్ప ప్రావీణ్యతయుంటే అది అంత దైవశక్తి వలన ఏర్పడినదేనని తెలియవలెను.
ఇక్కడొక గమనిక పరమాత్మను ఒకచోట ఉన్నాడని పురుషునిగ, మరొకచోట ఉన్నదని స్త్రీ లింగముగ చెప్పడమేమిటని అనుమానమురావచ్చును. పరమాత్మ అనునది స్త్రీను కాదు పురుషుడును కాదు. అది ఏదీ కానిది. దానికి రూపులేదు, పేరులేదు, పరమాత్మనునది పేరు కూడ కాదు. ఆత్మకు వేరైనదని తెలుపు అర్థము పరమాత్మ. ఏదీ కానిదానిని ఏ దానిగైన చెప్పవచ్చును. ఒకప్పుడు స్త్రీతత్త్వముగ, ఒకప్పుడు పురుషతత్త్వముగ చెప్పడములో రెండింటియందు ఇమిడి, రెండింటికి అతీతునిగను ఉన్నాడని అర్థము చేసుకోవలయును. పరమాత్మను సందర్భానుసారముగ అది అనియు అతడు అనియు చెప్పుచుందుము. స్త్రీగ పురుషునిగ పిలువబడువాడు ఒక్క పరమాత్మ అనియే తెలియవలెను.
శ్లోకము 11 : బలం బలవతాం చాహం కామరాగ వివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్ష భ ||
(పరమాత్మ)
భావము : కామ రాగ వివర్జిత మొనరించు బలవంతులయందలి బలము నేను. ధర్మమునకు విరుద్ధముగనున్న వారిలో ఆశయును నేను.
వివరము : మేము వ్రాసిన భావము చూచారు గదా! గుణములను జయుంచుట ఒక యుద్ధములాంటిదని మొదట చెప్పుకొన్నాము. యుద్ధము చేయుటకు బలము అవసరము. ఇక్కడ కూడ అదే విషయము ప్రస్తావిస్తు కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మత్సరములను ఆరు గుణములు వాటి విరుద్ధమైన దానము, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమ అను ఆరు గుణములు మొత్తము పండ్రెండులో మొదటిదైన ఆశ (కామము) చివరిదైన ప్రేమ వరకు ఉన్న గుణములను జయించవలెనన్న, వాటిని నిరోధించవలెనన్న, జీవునకు శ్రద్ధ అను బలము ఎంతో అవసరము. శరీర బలము ఇక్కడ అవసరములేదు. శరీర బలమున్నవారు గుణములను జయించలేరని, శరీరములోపల గల శ్రద్ధ ఎంత బలవంతమైనదైతే అంత తొందరగ గుణములను జయించవచ్చునని తెలియాలి. గుణములను జయించు శ్రద్దాబలము గలవారి యందలి బలము కూడ పరమాత్మయే అయివున్నాడు. ఆయన (పరమాత్మ) శరీరములో కూడ అంతట వ్యాపించివున్నాడు. అందువలన శరీర భాగములలో ఎక్కడ ఏది ఉన్నదో అక్కడ దాని ప్రభావము కూడ పరమాత్మయేయై ఉన్నాడు. మంచి వాటిలో మంచిది, చెడువాటిలో చెడ్డది ఆయననేయని గ్రహించాలి, అట్లుకాక మంచివి మాత్రము పరమాత్మయని, మంచివి కానివి పరమాత్మకాదని అనుకోకూడదు. ఈ విషయమై ఉదాహరణగ పై శ్లోకమున 'ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి' అన్నాడు. ధర్మ విరుద్ధమైన జీవరాసులలోని కామమును నేనే అయినాను అని చెప్పాడు. ఇతర గీతలలో ధర్మవిరుద్ధముకాని కామమునేనని భావము వ్రాయడము శోచనీయము.
శ్లోకము 12 : యేచైవ సాత్త్వికా భావా రాజసా స్తామసాశ్చయే ।
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహాం తేషు తే మయి ||
(పరమాత్మ)
భావము : సాత్విక, రాజస, తామస భావములు నాచేత సృష్ఠింపబడినవని తెలుసుకొనుము. వాటియందు నేను లేను అవి నాయందున్నవి.
వివరణ : ముల్లోకములనబడు మూడు గుణభాగములు ప్రకృతి జనితము లైనప్పటికి అనగా ప్రకృతినుండి పుట్టినప్పటికి, మొదట ప్రకృతినే పుట్టించిన వాడు పరమాత్మ. కావున గుణముల పుట్టుక కూడ పరమాత్మవలననే జరిగినదని మూలము తీసుకొని చెప్పవలెను. దాని ప్రకారము ముల్లోకములు నా వలన పుట్టినవన్నాడు. గుణములకు ఆధారముగ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మకు ఆధారముగ గుణములు లేవు. కావున వాటిలో నేనులేను అవి నాయందే ఉన్నాయన్నాడు. సాత్విక, రాజస, తామసమనబడు మూడుగుణములు ప్రకృతిలోని భాగములే అయినప్పటికి వాటికి ఆధారము పరమాత్మేనని తెలియుము.
శ్లోకము 13: త్రిభి ర్గుణమయై ర్భావై రేభి స్సర్వమిదమ్ జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పర మవ్యయమ్ ||
(పరమాత్మ)
భావము : ఈ జగమంతయు సాత్త్విక, రాజస, తామస గుణమయమగుటచే వాటి ప్రభావముచేత మోహింపబడినవారై, నేను అవ్యయమైన మోక్షమునని తెలియకున్నారు.
వివరము : ఈ ప్రపంచములోని అన్ని జీవరాసులు మరియు మనుషులు సాత్త్విక, రాజస, తామస గుణములచేత ప్రవర్తించుచున్నందున, ఆ గుణ ప్రభావముల వలన ప్రపంచమునే గుర్తించి దానియందు సంచరించుచున్నారు. గుణములు ప్రకృతి జనితములైనందువలన అవి ప్రకృతికి సంబంధించిన విషయములందే మానవులను ఉంచుచున్నవి. గుణముల ప్రభావము వలన ప్రకృతికంటే వేరుగనున్న సాకారుడైన భగవంతుని గాని, నిరాకారుడైన పరమాత్మను కాని గుర్తించలేక పోవుచున్నారు. గోడ వెనుకలనున్నవాడు గోడ యివతల వైపున నున్న వాడిని చూడలేనట్లు, గుణముల వెనుకలనున్న జీవుడు గుణముల ఇవతలవైపున ఉన్న పరమాత్మను చూడలేకున్నాడు.
శ్లోకము 14: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యన్తే మా యా మేతాం తరన్తి తే ||
(పరమాత్మ)
భావము : దైవనిర్మితమైన గుణములతో కూడుకొన్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణుజొచ్చుదురో వారు మాయను దాటిపోగలరు.
వివరము: ఆదికర్త అయిన పరమాత్మ సర్వజగత్ కంతటికి అధిపతియై, సర్వమును తానే సృష్ఠించి అవి అన్ని నడుచుటకు కావలసిన పద్దతిని ఏర్పరిచాడు. తాను ఏర్పరిచిన పద్ధతికి సమస్తము కట్టుబడి ఉండునట్లు చేశాడు. సర్వప్రపంచమునకు తానే సృష్ఠికర్త, అధిపతియైనప్పటికి ప్రపంచముతో తాను ఏమాత్రము జోక్యము చేసుకోక, బంధము పెట్టుకోక, తాను నిర్మించిన పద్ధతిచే నడుచునట్లు నిర్మాణము చేశాడు. తాను నిర్మించిన పద్ధతికి సమస్తము ఆధీనమైయుండి, ఆ పద్ధతి ప్రకారమే నడుచుకొనుచున్నవి. ఈ లెక్క ప్రకారము సర్వప్రపంచమును ఆధీనపరుచుకొని ఆడించుచున్నది స్వయముగా పరమాత్మగాదు. పరమాత్మచే నిర్మింపబడిన ప్రత్యేకమైన విధానము. ఆ విధానమునకు లేక పద్ధతికి ముఖ్యమైన పేరు గలదు. దానినే మాయ అనుచున్నాము. మాయకు మరికొన్ని పేర్లు గలవు. ఏసుప్రభువు దానికి సాతాన్ అని పేరు పెట్టగ, ఇస్లాం ప్రవక్త సైతాన్ అను పేరుతో పిలిచాడు. పరమాత్మ నిర్మించినది మాయ కావున ఈ శ్లోకములో 'దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా' అని అన్నాడు.
మాయ పరమాత్మచే నిర్మింపబడి ఆయన మొదట చెప్పిన ఆదేశానుసారము తన పనిని తాను చేస్తూపోతున్నది. ప్రపంచములో మాయకు లోబడనిది ఏదీలేదు. పుట్టినవన్నియు మాయకు లోబడిఉన్నాయి. మాయకు లోబడనిది మాయనే పుట్టించిన పరమాత్మ ఒక్కటే. మాయపద్ధతి ప్రకారము తన ఆధీనములో ఉండు వారిని సాధారణముగ నడిపించుచుండును. అలాకాక తనకు వ్యతిరేఖముగ నడువవలెననుకొను వారికి పూర్తి విరుద్ధముగ చేయుటకు ప్రయత్నించును. ప్రకృతిసిద్ధమైన జననము మరణము నుండి తప్పించుకోవలెనను వారందరు మాయ ఆధీనమునుండి తప్పించుకోవలెననుకొనెడివారే. కనుక మాయకు ముక్తి కావలెననువారు వ్యతిరిక్తులు, ముక్తి కావలెననుకొనువారికి మాయ వ్యతిరిక్తము. ముక్తికావలెను అనుకొనువాడు ప్రపంచాధినేతయైన మాయను ఏమిచేయలేడు. కాని మాయ అనుకొంటే ఎవరినైన ఏమైన చేయగలదు. దానిని జయించవలెనంటే దుస్సాధ్యముగా ఉండును. అందువలన 'మమమాయా దురత్యయా' అని పై శ్లోకములో చెప్పారు. అట్లయిన మోక్షమును ఎవరూ పొందలేరుకదాయను ప్రశ్నకూడ రాగలదు.
ఎవరూ జయించలేని అతిబలమైన మాయను జయించి, దాని ఆధీనము నుండి బయటపడుటకు పరమాత్మను శరణుజొచ్చిన వారికే సాధ్యమగును. కనుక పై శ్లోకములో "మామేవ యేప్రపద్యన్తే' అన్నాడు. పరమాత్మ జ్ఞానము ఫలానాయని కొద్దిగైన తెలిస్తే కదా! ఆయనను శరణుజొచ్చవలెనను జ్ఞప్తి రాగలదు. దానికి పరమాత్మ ఒక ప్రత్యేకమైన విధానమును నిర్మించాడు. అవియే ధర్మములు (జ్ఞానము). పరమాత్మ ధర్మములను ఆచరించువారిని మాయ ఎంత ఆటంక పరచిన దానినుండి బయటపడి చివరకు పరమాత్మనే చేరగలరు. అలా ఆచరించుటకు పరమాత్మ ధర్మములు ఫలానా అని తెలియాలి గదా! అని కొందరడుగవచ్చును. దీనికీ జవాబేమనగా! ప్రపంచ సృష్ఠి ఆదిలో మాయను తయారు చేసిన పరమాత్మ, మాయకు ప్రత్యర్థిగ ఉండునట్లు సూత్రబద్దమైన జ్ఞానమును ధర్మములను కూడ తయారు చేసి పెట్టాడు. మాయపని మాయకు, ధర్మముల పని ధర్మములకు నిర్మించిపెట్టాడు. అప్పటినుండి అవి రెండు వాటి వాటి పనిని నిర్వర్తించుచునే ఉన్నవి. మాయ దానికి వ్యతిరిక్తమైన ధర్మములు ప్రపంచములోని జీవరాసుల కొరకే నిర్మించినప్పటికి, జీవరాసులన్ని మాయ ఎడలయే ఎక్కువగా ప్రభావితమగుచున్నవి. ధర్మముల ప్రక్క చేరలేక పోవుచున్నవి. దీనికి కొంత కారణముగలదు. పరమాత్మ మాయను మూడు విధములుగ జీవరాసుల మీద పనిచేయునట్లు నిర్మించాడు. దానికొరకు జీవరాసులను మూడు రకములుగ సృష్ఠించాడు అవి ఏమనగా! ఒకరకము పైకి పెరుగునవి, రెండవరకము అడ్డముగ పెరుగునవి, మూడవరకము క్రిందికి పెరుగునవి. మొదటి రకము పైకి పెరుగు వాటి మీద మాయ ప్రభావము తక్కువగ ఉండును. ఆ జాతి జీవరాసులు కర్మను చాలా తక్కువ సంపాదించుకొనునవై, మాయకు దూరముగ దేవునికి దగ్గరగ ఉన్నవి. రెండవ రకమైన జీవరాసులు మొదటి జాతికంటే కొంత ఎక్కువ కర్మ సంపాదించు కొనునవైవుంటు, మాయకు దేవునికి సమాన దూరములో ఉన్నాయి. మూడవరక జీవరాసులు ఎక్కువ కర్మను సంపాదించుకొనుచు, మాయకు దగ్గరగ దేవునికి దూరముగ ఉన్నవి. ఆ మూడు రకముల జీవరాసులు ఏవి అని పరిశీలించి చూచిన, భూమినుండి పుట్టుచున్న చెట్లు తీగలు మొదలగునవన్నియు మొదటి తరగతి జాతియని, వాటి శరీరములో ఆత్మ స్థానమైన మొదులు లేక వేర్లనుండి పైకి పెరుగుచున్నవని తెలియాలి. అట్లే అండజములుగ, పిండజములుగ పుట్టుచున్న అనేక విధ జంతు, క్రిమి, కీటక, చేపలు, పాములు మొదలగునవన్నియు రెండవ తరగతికి చెందినవనియు, అవి తమ శరీరములోని ఆత్మ స్థానమైన శిరస్సు నుండి ప్రక్కకు పెరుగుచున్నవని తెలియాలి. ఇక పిండోద్భవములైన ఒకే ఒక మానవజాతి మాత్రము మూడవ తరగతికి చెందినది. ఈ జాతి ఆత్మ స్థానమైన శిరో స్థానము నుండి క్రిందికి పెరుగునదై ఉన్నది. ఈ మూడు జాతులలో వాటివాటి అంతఃకరణములైన మనో, బుద్ధి, చిత్తముల పనిలోగాని, గుణముల చురుకుదనములో గాని చాలా తేడా ఉండును. అన్నిటికంటే ఎక్కువ చురుకుదనముగ పని చేయునవి మూడవ జాతియైన మనిషిలోని బుద్ధి, చిత్తము, అహము, మనస్సు. మానవునిలో అంతఃకరణములు బలమైనవిగ ఉన్నవి కనుక గుణములు బాగా పనిచేయుచున్నవి. మాయ గుణముల రూపములో శరీరమందుండి మనిషిని తన ప్రభావములోనే ఉంచుకొనుచున్నది. అందువలన పై శ్లోకములో కూడ 'గుణమయీ మమ మాయ' అన్నాడు. దేవుడు మాయను గుణములరూపములో మానవునియందు ప్రతిష్ఠించాడు. కావున మాయకు మానవుని మీద ఎక్కువ బలమున్నది. దేవుడు మానవునియందు మాయను, ధర్మములను రెండింటిని ప్రతిష్ఠించినప్పటికి, ధర్మము లేవో మనిషికి తెలియని కారణమున, మరియు దేవుడు తనకిచ్చిన అధికారము వలన, మాయ మానవులందరిని తనవైపుకు లాగుకొనుచున్నది. తన పక్షమే అందరికి మంచిగ కనిపించునట్లు చేయుచున్నది. మాయ మరియు దానికి వ్యతిరిక్తమైన జ్ఞానము వాటి వాటి ఉనికిని కోల్పోకుండ ఉండుటకు వాటి ప్రయత్నము అవి చేయుచునే ఉన్నవి. ఆ ప్రయత్నములలో మాయజ్ఞానము దైవధర్మములవలె నటిస్తు తన ప్రాబల్యమును పెంచుకొనుచున్నది. ఏది ఏమైన ప్రపంచములో దైవజ్ఞానముకంటే మాయ యొక్క ప్రాబల్యము అధికముగా ఉండుటకు ముఖ్యమైన కారణమొకటి కలదు. దైవజ్ఞానమునకు ఒకవంతు బలముండగా, మాయకు వేయివంతులు బలమెక్కువ ఉండునట్లు ముందే నిర్ణయించబడియున్నది. ఒకవంతు బలము కూడ జ్ఞానమునకు సరిగాలేదు. కనుక గీతలో భగవంతుడు మనుషులలో వేయింటికొకడు సిద్ధికొరకు ప్రయత్నించుట కూడ అరుదుగ ఉందురని తెలియజేశాడు.
భూమిమీద కొందరు గురువులుగ బయలుదేరి జ్ఞానమును బోధించుట, ఉపదేశములు ఇచ్చుట జరుగుచున్న పనియే. మాయ వారి మీదనే దృష్ఠిని సారించి, వారిని మంచి జ్ఞానులుగ బయటికి కనిపించునట్లు చేసి, వారిని చాలామంది ప్రజలు ఆశ్రయించునట్లు చేసి, ఆ గురువులు చెప్పిన విషయములు బాగా వినునట్లు చేయుచుండును. అంతేకాక బోధించునదంతయు పరమాత్మ జ్ఞానము ధర్మమేనన్నట్లు, జ్ఞానము దేవుడు అను పదములుపయోగించుచు, ఎంతో ఆకర్షణీయమైన బోధలు చేయుచుండును. ఆ బోధలలో ఒక్క శాతము దైవజ్ఞానము ఉండగ 99% మాయకు సంబంధించిన జ్ఞానమే ఇమిడివుండును. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమైనప్పటికి, ఇది మాయకు సంబంధించిన జ్ఞానమని, పరమాత్మలోనికి ఐక్యము చేయునదికాదని ఎవరూ గుర్తించలేరు. అదియే మాయయొక్క గొప్పతనము. ఎంతో పెద్ద ఆధ్యాత్మిక గురువున్నప్పటికి, స్వచ్ఛమైన ఆధ్యాత్మికమును బోధిస్తున్నప్పటికి వారియందు కూడ చివరికు 95% దైవధర్మములేని మాయ యొక్క బోధయేవుండును. ఇలా కనిపించు గురువులలో కూడ ఉండి వారిచేతనే దైవజ్ఞానమన్నట్లు దైవధర్మములన్నట్లు అధర్మములను బోధిస్తుండుట వలన, దేవుని తెలుసుకోవాలనుకొనువారు కూడ మాయలోనే చిక్కుకొని పరమాత్మవైపు ప్రయాణించలేకున్నారు. ఉన్న కోట్ల ప్రజలలో వేలసంఖ్యలో కొందరికి మాత్రమే జ్ఞానము మీద ఇచ్ఛ కలుగగా, వారిని కూడ మాయ గురువులరూపములో బోధిస్తూనే తన వైపుకు లాగుకొనుచున్నది. కావున గీత విజ్ఞానయోగములో మోక్షము కోరువారిలో చివరకు ఎవరో నన్ను తెలుసుకోగలిగేది అన్నాడు. మాయ అనేక స్థాయిలలో రకరకముల గురువులను ఆవహించి ఉండుట వలన, జ్ఞానము కోరువారు ఏదో ఒక గురువును ఆశ్రయించి మాయ ఆవరణములోనే చేరి పోవుచున్నారు. అందువలన నిజమైన పరమాత్మ జ్ఞానము దొరకాలంటే అనేక జన్మల సంస్కారము వలననే లభించునని గీతయందన్నాడు. అనేక అంటే వందలు కావచ్చు, వేలు కావచ్చు. ఇక్కడ కొందరికొక అనుమానమురావచ్చును. అది ఏమనగా! గురువులందరిని మాయ మభ్యపెట్టి భ్రమింపజేసి, తన బోధనే బోధిస్తున్నదన్నప్పుడు, ఎవరూ పరమాత్మ జ్ఞానము బోధించువారే లేరని చెప్పినపుడు, అనేక జన్మల తర్వాతైన వారికి పరమాత్మ జ్ఞానమెట్లు లభించును అని అడుగవచ్చును. దానికి మా సమాధానము పరమాత్మ యొక్క జ్ఞాన ధర్మములను నూటికి నూరుపాళ్ళు బోధించు గురువులు భూమిమీద ఉంటే పరమాత్మ పుట్టవలసిన అవసరమే లేదుకదా! అలా తన ధర్మములు తెలిసి బోధించువారు లేని దానివలన, పరమాత్మయే స్వయముగ భూమిమీద పుట్టి బోధించవలసి వస్తున్నది. అందువలన ధర్మములకు గ్లాని ఏర్పడినపుడు నేను జన్మించి, నా ధర్మములను తెలియజేస్తానని గీతయందు చెప్పాడు.
దైవధర్మముల తరుపున పరమాత్మయే స్వయముగ ఉద్భవించి, తన ధర్మములను పూర్తిగ తెలుపుటవలన మాయకు ఇబ్బంది ఏర్పడి, గురువుల మీదనే తన పట్టు తప్పిపోవు పరిస్థితి ఏర్పడును. కనుక అటువంటి పరిస్థితి రాకుండ మాయ కూడ స్వయముగ జన్మ ఎత్తి, భగవంతునికంటే గొప్పగ కనిపించి, తనే భగవంతుడనని పేరుగాంచుచుండును. మాయ అవతార భగవంతుని ముందర అసలైన పరమాత్మ అవతారము కూడ తక్కువుగా ఉండును. అందువలన నిజమైన భగవంతుని జ్ఞానులు సహితము గుర్తించలేరు. కాని మాయా భగవంతుని అజ్ఞానులు సహితము గుర్తించగలరు. భూమి మీద ధర్మములు తెలియనపుడు, అనేక జన్మ సంస్కారపరులకు ధర్మములు అవసరమైనపుడు, వేల సంవత్సరములకో లేక లక్షల సంవత్సరములకో పరమాత్మ జన్మము ఎత్తవలసి వస్తున్నది. మాయ మాత్రము పరమాత్మ జన్మకు ముందు వెనుక అవతారమెత్తడమేకాక, పరమాత్మ భగవంతునిగ జన్మించినపుడు తాను కూడ మూడు నాలుగు చోట్ల జన్మించి, అందరిని తనవైపు ఆకర్షించుకొనుటకు ప్రయత్నించును. పరమాత్మ భగవంతునిగా ఏ దేశములో పుట్టునో మాయ కూడ అదే దేశములో పుట్టుచున్నది. పరమాత్మ ఏ ప్రదేశములో పుట్టునో, ఆ ప్రదేశమునకు చుట్టు ప్రక్కల మాయ మూడు లేక నాలుగు జన్మలు కలిగివుండును. పరమాత్మ కేవలము జ్ఞాన ధర్మములనే బోధించగ, మాయకూడ ధర్మములులేని ఆధ్యాత్మికమునే ఆకర్షణీయముగ చెప్పుచుండును. తినెడి ఆహారము రుచిగా ఉన్నను అందులో పోషక పదార్థములు విటమిన్లులేనట్లు మాయ బోధించునది నిజజ్ఞానమే అన్నట్లుండును, కాని అందులో ధర్మయుక్త జ్ఞానముండదు. మాయ ప్రపంచమునకే అధిపతియై ఉన్నది, కావున ప్రపంచములోని ఏ విషయమనైన తాననుకొన్నట్లు చేయగలదు. పరమాత్మ జన్మ కేవలము ధర్మములనే బోధించగ, మాయ తనది నిజమైన జ్ఞానమన్నట్లు బోధించడమే కాక ప్రపంచములోని ఏ అద్భుతమైన చేసి దానిని దైవ మహత్యమనుకొనునట్లు భ్రమింపచేయగలదు. బంగారును రాయిగా, రాతిని బంగారుగ చూపగలదు. ఉన్న వస్తువులను లేకుండ పోవునట్లు, లేని వస్తువులను ఉండునట్లు చేయగలదు. రోగములను సృష్ఠించగలదు. మరియు లేకుండ చేయగలదు. అమెరికాలో ఉండి రష్యాలో, రష్యాలో ఉండి అమెరికాలో కనిపించగలదు. చెప్పేది ధర్మములుకాకున్న అంతా ధర్మప్రచారమే చేయునట్లు తెలియగలదు. అన్నిటికి అధిపతియైన దాని వలన ఎన్ని కోట్ల డబ్బునైన సృష్ఠించగలదు. ఎంతటి వారి చేతనైన పాదాభివందనము చేయించగలదు. తానే నిజదైవముగా ప్రత్యక్ష దైవముగా అందరిచేత అనిపించగలదు.
పరమాత్మ భూమిమీద జన్మించి తన ధర్మముల ప్రకారము తాను నడుచుకొనుచు, తన ధర్మములనే బోధించుచుండును. తన బోధలో మహత్యములు లేని దానివలన లక్షల సంఖ్యలోని మనుషులలో ఆయన బోధను ఒకరైన గుర్తించగలరను నమ్మకము లేదు. ఎవనికైన కొంత నమ్మకము ఏర్పడినప్పటికి వాని తలలోని మాయ ఏదో ఒక విధముగా దానిని వమ్ముచేయును. మాయనే సృష్ఠించిన పరమాత్మ మాయ ముందర తక్కువగా కనిపించడమేమిటని కొందరడగవచ్చును. దానికి జవాబేమనగా! పరమాత్మ మాయకంటే ఎప్పటికీ గొప్పవాడే. కాని పరమాత్మ భూమి మీద జన్మించి భగవంతుడైనపుడు మాత్రము మాయకంటే బలహీనుడే. అందువలన పరమాత్మయే స్వయముగ ఏసుప్రభువుగ పుట్టిన బలహీనుని చేసి మాయ తన ప్రజలచేతనే కొట్టించింది, తిట్టించింది. శ్రీ కృష్ణునిగ పుట్టిన సమయములో ఆయనకు కూడ శత్రువులనేర్పరిచి కంసుని చేత తిట్టించడమే కాక, అనేక సమయములలో అనేక ఇబ్బందుల పాలు చేసినది. జారునిగా, చోరునిగా చూపించింది. భూమిమీద మాయకంటే భగవంతుడు బలహీనుడుగాన ఇది నారాజ్యముకాదు, నా రాజ్యము వేరుగనున్నది, నా రాజ్యమునకు రాజును నేనే అన్నాడు. అంతేకాక ఇది జన్మలు మరణములు గల స్థలము దీనికి అధిపతి మాయ. జనన మరణములు లేని మరియొక స్థలము కలదు అచటికి చేరండని అచట నేను తప్ప ఎవరులేరని కూడ చెప్పాడు.
మాయ కూడ భగవంతునివలె జన్మించుచున్నదంటున్నారు కదా! పరమాత్మ భగమునుంచి సజీవముగ బయటికి వస్తున్నాడు కావున ఆయనను భగవంతుడు అనవచ్చును. మాయ ఏ విధముగ జన్మ తీసుకొంటున్నది. సాధారణ మానవులవలెనా లేక భగమునిండి వచ్చు భగవంతునిగనా? అని కొందరడుగవచ్చును దానికి వివరమేమనగా! మాయ భగవంతునివలె చలామణి అగునుకాని భగమునుండి సజీవముగా పుట్టలేదు, కావున భగవంతుడుకాదు. అట్లని సాధారణ మనుజులవలె కూడ పుట్టలేదు. మాయ తల్లి గర్భములోపల నుండికాని, గర్భము బయటగాని జన్మ పొందలేదు. అటుకాక ఇటుకాక ఏ విధముగా జన్మించినదనిన? భూమి మీద పరమాత్మ జన్మించు అవకాశము గల ప్రాంతమును మాయ ముందుగానే పసిగట్ట గలదు. అటువంటి ప్రాంతమును తెలుసుకొన్న మాయ, ఆ ప్రాంతము చుట్టు ప్రక్కలగల సాధారణ మనుషులలో ఒకనిని గుర్తించి ఎన్నుకొని వానియందు కొంత కొంతగా ప్రవేశించి పూర్తిగా నిండుకొనును. అట్లు వానియందు పూర్తిగా నిండుకొనుటకు ఆరునెలల నుండి సంవత్సర కాలమైన పట్టును. అలా పూర్తి ప్రవేశించిన వానినుండి తన పూర్తిస్థాయి కార్యములు మొదలు పెట్టును. మాయ ప్రవేశించువాడు బీదవాడు కావచ్చు, యుక్తవయస్కుడు కావచ్చు లేక ముసలివాడు కావచ్చును. ఎవనియందు మాయ ప్రవేశించిన, దానిని మాయ యొక్క జన్మ అనవచ్చును. మాయ ప్రవేశించిన వ్యక్తికి తనయందు మాయ పూర్తి స్థాయిలో ఉన్నదని ఏమాత్రము తెలియదు. అందువలన మొదట తన ద్వారా జరుగు కొన్ని మహత్యములు ఎలా జరిగినవో తనకే తెలియకుండును. తరువాత తనకేదో మహత్తుగలదని, తను అందరివలే సామాన్యుడుకాదని తను ప్రత్యేకమైన మనిషినని అనుకొనును. ఇలా మాయ కొందరియందు ప్రవేశిస్తున్నది కాని క్రొత్తశరీరములో జన్మించలేదు, పరమాత్మవలె పుట్టనూలేదు, కావున మాయ ఎప్పటికీ భగవంతుడు కాదు. భగవంతునివలె కనిపించినప్పటికి నిజముగా భగవంతుడుకాదని తెలియాలి.
ఇంకొక విచిత్రమేమిటంటే మాయ జన్మించితే రెండు మూడు చోట్లయిన ఉండి తన మహత్యమును నూటికి నూరుపాళ్ళు చూపగలదు. కాని పరమాత్మ జన్మించి భూమిమీద ఉన్నప్పుడు శరీరములోని జీవునిగ, ఆత్మగ, పరమాత్మగ ఉంటూ కొన్ని సమయములలో కేవలము సాధారణ జీవునిగ కష్ట సుఖములను అనుభవిస్తుండును. కొన్ని సమయములలో మాత్రము ఆత్మగ అనుభూతులకు అతీతముగ ఉండును. ప్రత్యేకించి కొన్ని సమయములలో మాత్రము ఆదికర్తయైన పరమాత్మగ ఉండగలడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు జీవునిగ, ఆత్మగ, పరమాత్మగ మూడుస్థాయిలలో మాట్లాడినట్లు అర్థమగుచున్నది. అలాగే ఏసుప్రభువుగ వచ్చిన దినములలో జీవునిగ శరీర బాధలు అనుభవించాడు. ఆత్మగ నిన్నెప్పుడూ చూస్తున్నానన్నాడు. పరమాత్మగ తుఫానులో చెలరేగిన సముద్రమునే నిశ్చలమగునట్లు శాసించాడు.
పరమాత్మ జన్మలో ఉన్నప్పుడు జీవునిగ ఉన్న సమయములో మాయ హింసిస్తుంది, ఆత్మగ ఉన్న సమయములో ద్వేషిస్తుంది మరియు ధూషిస్తుంది, పరమాత్మగ ఉన్నప్పుడైతే పూర్తి భక్తి వినయముకల్గి ఆయన మాట ప్రకారము నడుచుకుంటుంది. ఏసు జీవునిగ ఉన్నపుడు కొరడాలతో కొట్టించి కష్టమును అనుభవింపచేసింది. ఆత్మగ ఉన్నపుడు ఆధ్యాత్మిక గురువులలో నుండి నిందించింది. పరమాత్మగ ఉన్నప్పుడు చెప్పినట్లు నడుచుకొని శవమును సజీవముగ చేసింది. ఏసు జీవునిగ ఉన్నప్పుడు మాయ అతనితో నాకెంతో బలముందని రాళ్లను ఆహారముగా మార్చగలనని, ఈ రాజ్యానికి రాజును చేయగలనని కూడ చెప్పినది. అలాగే ఏసుప్రభువు జీవునిగ నా తండ్రి ఒకడున్నాడని చెప్పాడు. ఆత్మగ నీపొరుగువానిని ప్రేమించమన్నాడు. పరమాత్మగ జీవము (జీవుడు), మార్గము (ఆత్మ), గమ్యము (పరమాత్మ) నేనే అన్నాడు. శ్రీకృష్ణ జన్మలో తామరాకు మీద నీరంటనట్లు కర్మ అంటకుండ ఉన్నానని జీవునిగ, శరీరములో అగ్నినై తిన్న ఆహారమును జీర్ణము చేయుచున్నానని ఆత్మగ, క్షయమును వృద్ధిని కల్గించు కాలుడను నేనే. ఎల్లలులేని విశ్వరూపమును నా అనుగ్రహమున నీకు చూపానని పరమాత్మగ మాట్లాడిన సందర్భములు గలవు. పరమాత్మ ఆధీనములోనున్న మాయ పరమాత్మ ఎడల మాత్రము పూర్తి భక్తిగా వినయముగా ఉంటూ, మిగతా వారి ఎడల తన కర్తవ్యమును తాను నిర్వర్తించుచున్నది. అంతేకాక జ్ఞానము యోగము, ధర్మములకంటే అతీతునిగనున్న పరమాత్మను లేక భగవంతున్ని పూర్తి విశ్వసించి ఆరాధించువానిని మాయ ఏమి చేయలేదు. వాడు పూర్తి అధిపతియైన పరమాత్మనే నేరుగ నమ్మినవాడు, కనుక మాయ వాని ఎడల ఏమి చేయలేదు. అట్టివాడు ఆ జన్మలోనే మోక్షము పొందవచ్చును. అందువలననే గీతయందు పరమాత్మ 'మామేవ యే ప్రపద్యన్తే మాయా మేతాం తరంతితే' ఎవరైతే నన్ను ఆరాధించుచున్నారో వారు మాయనుండి సులభముగ దాటి పోగలడన్నాడు. కావున మాయను తయారు చేసివుంచిన పరమాత్మనే ఆరాధించవలెను. అట్లు ఆరాధించని ఎడల జగతి మీద సర్వ హక్కులు కల్గిన మాయ, జగతిలో నిజమైన దైవముగ కూడ కనిపిస్తుంది. పరమాత్మ విభూతులు ఎంత గొప్పవో, అంతకంటే గొప్పవిగ భూమిమీద మాయ యొక్క విభూతులు కనిపించును. మేము ఎంత చెప్పిన పరమాత్మ జ్ఞానము అనేక జన్మల సంస్కారము గలవారికే అర్థమగును. వారిలో ఇంకనూ సంస్కరింపబడిన వారికే భగవంతుడర్థమగును. ఎంత అర్థమైనప్పటికి నేనే గొప్పయను మాయ మాటలు వినని వారెవరో అరుదుగా ఉందురు. గీత చివరిలో భగవంతుడు 'మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు' నన్నే నీ మనసులో గొప్పగ పెట్టుకొనుము, నాకే భక్తిగ ఉండుము, నన్నే నమస్కరించుము నాయందే కలిసి పోవుదువనగా! మాయ కూడ నన్నే గొప్పగ పెట్టుకొనుము, నన్నే నమస్కరింపుము, నీకు ఏ కష్టములు రాకుండా ఏ లోటు లేకుండా చూస్తానంటుంది. ఏది వింటారో ఎటువైపు పోతారో మీ ఇష్టము.
శ్లోకము 15 : న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః ।
మాయయాఽ పహృతజ్ఞానా ఆసురం భావ మాశ్రితాః ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : పాపకార్యములు చేయువారు, మూఢులైనవారు, మాయచేత మూసి వేయబడిన జ్ఞానము కలవారు, అసుర భావము గల జనులు నన్ను తెలియలేరు, పొందలేరు.
శ్లోకము 16 : చతుర్విధా భజన్తే మాం జనాస్సుకృతి నోఽర్జున! ।
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : అర్జునా నన్ను భజించు సుకృతులు నాల్గురకములుగ ఉన్నారు. వారిని ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అని విభజించి చెప్పవచ్చును.
వివరము : పరమాత్మను అనేక రకములుగ విభజించుకొని ఆరాధించువారున్నారు. మేము దైవమునే ఆరాధిస్తున్నామని వారి నమ్మకము. అసలు దైవమను వాడెట్లుండునను వివరము తెలియక, ఎవరి ఊహకు వారు పేరు రూపము కల్పించుకొని ఆరాధిస్తున్నారు. ఎవరికి తోచినది వారు చేయగ వారి మనస్సులో మేము దైవమునే ఆరాధిస్తున్నామను భావముండుట వలన వారు పరమాత్మను ఆరాదించినట్లే. అట్లు ఆరాధించువారిలో నాల్గురకములుగా ఉన్నారని చెప్పవచ్చును. 1) ఆర్తుడు 2) జిజ్ఞాసి 3) అర్థార్థి 4) జ్ఞాని అని చెప్పవచ్చును.
1) ఆర్తుడు :- ఆర్తుడనగా ఆపదలందు మాత్రము మ్రొక్కువాడని అర్థము. ఏదైన కష్టమొచ్చినపుడో, రోగమొచ్చినపుడో, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడో, ఏ దైవమైతే తొందరగ ఫలితమిస్తాడో అతనికి ముడుపు కట్టి మరీ మ్రొక్కువాడు. ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఆపద మ్రొక్కులవాడని పేరు పెట్టి ఆపదలందే మ్రొక్కు వారెందరో కలరు. అంతేకాక ఒక్కొక్కరు ఒక్కొక్క దేవున్ని వారి వారి ఆపదలకు అడ్డము పెట్టుకొని ఆరాధిస్తుందురు. పిల్లవానికి జ్వరము వచ్చిన అప్పటికప్పుడు మ్రొక్కువారందరిని ఆర్తులని చెప్పవచ్చును.
2) జిజ్ఞాసి : - జిజ్ఞాసులనగా! దైవమును గూర్చి తెలుసుకోవలెనని ప్రయత్నము చేయువారు. వీరు ఆపద నిమిత్తము అక్కడక్కడ చిన్న చిన్న పూజలు చేస్తున్నప్పటికి అంతటితో ఆగక దైవమును తెలుసుకోవాలని ప్రయత్నము కూడ చేయుచుందురు. ఉదాహరణకు ఆర్తుడనగ తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుటకు తిరుపతికి పోయినవాడు. అందరివలె తాను గుండు కొరిగించుకొని తర్వాత అందరివలె ఊరకుండక, మనము గుండుకొరిగించుకొనుట వలన దైవమునకు ఏమి లాభము. దైవమునకు లాభముగాని, మనకు నష్టముగాని లేని ఈ పనినెందుకు అందరు చేస్తున్నారు. దీనికేదో మనందరికి తెలియని రహస్య అర్ధమున్నది. దానిని తెలుసుకొంటే దైవమును అంతో ఇంతో తెలుసుకొన్నవారమైతామని, ఆ వివరము తెలుసుకోవాలని, దైవమును తెలుసుకోవాలని ప్రయత్నించుచుండును. అట్టివారిని జిజ్ఞాసులు అనవచ్చును.
3) అర్థార్థి : - అర్థార్థి అనగ అర్థము కోసము అర్థించువాడని వివరము. అర్థమనగా డబ్బు, డబ్బు కోసము దేవుళ్లను పూజించి అర్థించువానిని అర్థార్థి అందురు. ఉదాహరణకు ఒకనికి ఏ ఆపద ఏ కష్టములేదు. వానికి దైవమును గూర్చి తెలుసుకోవలెనని జిజ్ఞాస లేదు. మరియు ఆపదయందు ఆర్తునిగ మ్రొక్కు అవసరములేదు. అయినప్పటికి ధనము ఇంకనూ కావలెనని మ్రొక్కటయే వాని అభిమతమై ఉండును. ఉదాహరణకు ఒక ధనికుడున్నాడనుకొనుము. వానికి ఆపదలేదు. దైవమును తెలియవలెనను ధ్యాసలేదు. కాని ధనము ఇంకనూ కావలెనను ఆశవున్నది. కనుక అతను ధనము కొరకు పేరున్న దేవతలను, పేరున్న మహత్యముగల స్వాములను కోర్కెలు కోరుచుండును. నాకు ఈ సంవత్సరము వ్యాపారములో 10 కోట్లు లాభమొస్తే పదిలక్షలు ముడుపు ఇస్తాననో, బంగారు కిరీటము చేయిస్తాననో మ్రొక్కుచుందురు. ఎలాగో లాభమొచ్చేటట్లే చేసుకొంటారు. లాభమొచ్చిన వెంటనే ముడుపు రూపముగానో, కానుకల రూపముగానో వారి మ్రొక్కు చెల్లించుకొనుచుందురు. ఈ విధముగ దేవుళ్ళకు కిరీటము చేయించిన వారున్నారు. లక్షల కానుకలు బహూకరించిన వారున్నారు. ఇటువంటి వారినందరిని అర్థార్థులని అనవచ్చును.
4) జ్ఞాని : - ఇతడు ఆర్తుడు, అర్థార్థుడు కాక జిజ్ఞాసుడై ఉండి జ్ఞానమును తెలుసుకొనుచుండును. అట్లు తెలుసుకొనుచు చివరికి సంపూర్ణ జ్ఞానమును పొందగలుగును. ఉదాహరణకు దైవజ్ఞానము మీద జిజ్ఞాసకల్గి కోర్కెలు కోరడము దైవారాధనలో తగదని తెలుసుకొని, ఆరాధనలో ఎంతో జ్ఞానమున్నదని గ్రహించి, వాటి అర్థముల కొరకు ప్రయత్నము చేయుచు చివరకు దైవపూజలోని మరియు దేవాలయములలోని గుర్తుల అర్థములన్ని గ్రహించును. దైవారాధనలోని ప్రతిపనికి అర్థము తెలుసుకొని పూర్తి జ్ఞానికాగలడు. అట్లు జ్ఞానియైనవాడు జ్ఞానము ప్రకారము నడుచుకొనుచు దైవత్వమును తెలుసుకోవాలని, మానవత్వమునుండి దైవత్వమునకు చేరుకోవాలని ప్రయత్నము చేయుచుండును. ఆర్తుడు- అర్థార్థి, జిజ్ఞాసి - జ్ఞాని అను వరుసక్రమమని తెలియవలెను. ఆర్తునికి, అర్థార్థికి దగ్గర సంబంధమున్నది. అట్లే జిజ్ఞాసికి, జ్ఞానికి దగ్గర సంబంధమున్నది. ఆర్తుడు అర్థార్థి కాగలడు, జిజ్ఞాసి జ్ఞాని కాగలడు.
శ్లోకము 17: తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ।
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థ మహం స చ మమప్రియః ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : అట్టివారిలో జ్ఞాని నిత్యము నాతో పొందుకోరి ఒకే భక్తి కల్గియుండు వాడు శ్రేష్ఠుడని చెప్పవచ్చును. వానికి నేను ఎక్కువ ప్రియుడను, అట్లే నాకు వాడు ప్రియుడు.
వివరము : ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసుడు, జ్ఞాని అను నాల్గురకములలో ఎక్కువ శాతము ఆర్తులుగలరు. నూటికి 50 మంది ఆర్తులు కాగా 45 మంది అర్థార్థులు గలరు. కేవలము నలుగురు జిజ్ఞాసులుండగ, ఒక్కరు అదియు అరుదుగ జ్ఞానికలడను కొనుము. ఉన్న ఒక్క జ్ఞాని ఆత్మతో పరమాత్మతో కూడుకోవాలని నిత్యము ప్రయత్నము చేయుచు, ఒకే భక్తి కల్గి అనగ ఇతర దేవతలను ఆరాధించక ఆత్మ మీదనే భక్తి కల్గి ఉన్నవాడైవుండును. అట్టివానిని మిగత మూడు మార్గముల వారికంటే శ్రేష్ఠుడని చెప్పవచ్చును. అట్టివాడు పరమాత్మను అన్నిటికంటే పెద్దగ, దైవములన్నిటికి దైవముగ తలచుకొనుచు పరమాత్మ మీదనే తన ఇష్టతను కల్గియుండును. ఎంత కష్ట సమయములోకాని పరమాత్మ విషయప్రస్తావన వస్తూనే అంతటిని మరిచిపోయి ఆనందబరితుడగుచుండును. అట్టివానిని పరమాత్మ కూడ పరమ ప్రియునిగ భావించుకొనునని చెప్పబడివున్నది.
శ్లోకము 18: ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మేమతం |
ఆస్థిత స్సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : ఈ నాలుగు రకములలోని సర్వులు ఉదారులే. అందులో జ్ఞానిని నా ఆత్మగ తలచుచున్నాను. అతడు నా ఆత్మతో కూడుకొని ఉండి నా యొక్క ఉత్తమమైన గతిని పొందుచున్నాడు.
వివరము : ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసుడు, జ్ఞాని అనువారిలో జ్ఞాని అనువానిని పరమాత్మ వేరువానిగ తలవక తన ఆత్మగానే లెక్కించుకొనుచున్నాడు. ఎందుకనగా సంపూర్ణ జ్ఞానియైనవాడు యోగమునే ఆచరించుచు ఆత్మయందే కూడుకొని ఉన్నాడు. వాని మనస్సుకు బాహ్యచింతలు లేవు. ఆత్మధ్యాస కల్గిన ఆ జీవున్ని ఆత్మగనే పరమాత్మ చూచుచున్నాడు. ఆ జీవాత్మ ఆత్మధ్యాసకల్గివుండి చివరకు పరమాత్మను పొందగల్గుచున్నాడు.
శ్లోకము 19: బహూనాం జన్మనా మంతే జ్ఞాన వాన్మాం ప్రపద్యతే ।
వాసుదేవ స్సర్వ మితి స మహాత్మా సుదుర్లభః ||
(జీవాత్మ, సాకారము)
భావము : జ్ఞానవంతుడు ఎన్నో జన్మలు పొంది చివరకు వాసుదేవుడే సర్వమని తలచి నన్ను పొందగలుగుచున్నాడు. అట్టివాడు ఎంతో దుర్లభముగ లభించును.
వివరము : ఇంతవరకు ముందు చెప్పిన శ్లోకములలో నిరాకారమును గూర్చి చెప్పగ ఇక్కడ సాకారమును గూర్చి చెప్పడము జరుగుచున్నది. ఇది పరమాత్మ భూమిమీద భగవంతునిగ ఉన్నప్పటి అరుదైన విషయము. ఎప్పుడో అవసర మొచ్చినపుడు వేల సంవత్సరములకో, లక్షల సంవత్సరములకో ఒక మారువచ్చు భగవంతున్ని ఆ సమయములో కనిపెట్టినవాడు చాలా అరుదైనవానిగ చెప్పవచ్చును. ఆ విషయమును శ్లోకములో కూడ 'సమహాత్మా సుదుర్లభః' అట్టి మహాత్ముడు సులభముగ దొరకడని చెప్పారు. జ్ఞానియైనవాడు ఎన్నో జన్మలు ఎత్తగా చివరకు భూమిమీద పరమాత్మను భగవంతునిగ గుర్తించు యోగ్యత కల్గియుండును. ఆ సమయములో భగవంతుడు భూమిమీద ఉంటే అతను గుర్తించగలడు. అట్టివాడు దొరుకుట చాలా దుర్లభము. పరమాత్మ జన్మ దుర్లభముగ ఎప్పుడో జరుగునది. అప్పుడే అంతటి జ్ఞాని ఉండుట కూడ దుర్లభమేకదా! పూర్వము పెద్ద యోగులు కూడ గ్రహించలేని భగవంతుని జన్మను శ్రీకృష్ణునిగ గుర్తించిన భీష్ముడు సూక్ష్మములో మోక్షమును పొందాడు. సూక్ష్మములో మోక్షమనగా ఏ యోగము చేయకనే నేరుగ సులభముగ మోక్షము పొందడము.
శ్లోకము 20: కామైస్త్మైస్తైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః ।
తంతం నియమ మాస్థాయ ప్రకృత్యా నియతా స్స్వయా ||
(జీవాత్మ)
భావము : ప్రకృతి సంబంధములైన ఆశ గుణములచేత, జ్ఞానములేనివారై అన్యదేవ తారాధన చేయుచున్నారు. ఆయా దేవతల నియమ నిష్ఠలననుసరించి వారిని ఆరాధించుచున్నారు.
వివరము : ప్రకృతి గుణములచేత ఆశ అను తాటికి లాగబడినవారై, ఆర్తులు అర్ధార్థులు అన్నిటికంటే పెద్దదైన పరమాత్మను వదలి చిల్లర దేవుళ్ళను నమ్ముకొని, వారివలన తనకెంతో లాభము కల్గునని తలచినవారై ఆ దేవుళ్ళనే ఆరాధిస్తున్నారు. ఆరాధనలో నియమనిష్ఠలు లేని ఆత్మ విధానమును వదిలి, నియమ నిష్ఠలుగల ఇతర దేవతారాధన చేయుచున్నారు. పరదేవతారాధనలో శరీర శ్రమ ఎంత ఉన్నా ఓర్చుకొని ఆరాధించడము జరుగుచున్నది.
శ్లోకము 21: యో యో యాం యాం తనుంభక్త శ్రద్ధ యార్చితు మిచ్ఛతి ।
తస్య తస్యాఽచలాం శ్రద్ధాం తా మేవ విదధామ్యహమ్ ||
(జీవాత్మ)
భావము : ఎవడెవడు ఏ ఏ దేవతను శ్రద్ధతో ఆరాధించవలెననుకొనునో, వాని వానికాశ్రద్ధను దృఢమైనదిగా ఉండునట్లు నేను కలుగజేయుదును.
వివరము : గ్రుడ్డికంటే మెల్ల మేలన్నట్లు ఏదో ఒక దేవతా భక్తి అయినను వానిలో ఉండుట మంచిది. ఏ భక్తిలేనివాడు వాసనలేని పువ్వులాంటివాడగును. అట్లు వ్యర్థ జీవుడు కాకుండ వానికున్న ఆ భక్తినైన దృఢముగ ఉండునట్లు పరమాత్మయే చేయుచున్నాడు.
శ్లోకము 22: సతయా శ్రద్ధ యా యుక్త స్త స్యా రాధన మీహతే ।
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ ||
(జీవాత్మ)
భావము : వాడు శ్రద్ధవహించి ఆ దేవతలనే ఉపాసన చేయగ దానివలన కామ్యార్థసిద్ధి కలుగును. వాని హితము కోరి నేనే కామ్యార్థసిద్ధి కలుగజేయుచున్నాను.
వివరము : ఎవని ఇష్టమునకు అనుగుణముగ వానికాశ్రద్ధయే పరమాత్మ కలుగ జేయగ, ఆ శ్రద్ధతోనే వాడు దేవతారాధనలు చేయగ, ఆ ఆరాధనల వలన వాడు కోరుకున్న కోర్కెలను నెరవేరునట్లు పరమాత్మయే చేయుచున్నాడు. వాని కర్మానుసారము లభ్యమగు ఫలితములనే, కోరినవి లభించినట్లు వానికర్థమగులాగున చేయుచున్నాడు. లభించిన ఫలములను బట్టి వాడు నాస్తికుడుగ మారక ఆస్తికునిగైన ఉండగలడు.
శ్లోకము 25: నాహం ప్రకాశ స్సర్వశ్య యోగమాయా సమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకోమా మజ మవ్యయమ్ ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : 'యోగమాయా సమావృతః' అన్న పదము ఈ శ్లోకములో ఉపయోగించ బడినది. మాయ అనగ త్రిగుణముల సారము. యోగమనగ కూడుకొనుట. "సమావృతః" అనగ కొట్టబడిన లేక కప్పబడిన అని అర్థము. గుణములచేత కూడుకొని గుణముల సారమైన మాయతో కప్పబడువారు పరమాత్మనా? లేక సర్వ మానవులా? అని యోచించాలి.
మిగతా గీతలలో ఇలా వ్రాయబడివున్నది. యోగమాయచే కప్పబడివున్న నేను ఎవరికీ తెలియబడను. పుట్టుక నాశనములేని నన్ను మూఢులు తెలుసుకోలేరు. మూఢులైన మానవులు పరమాత్మను తెలుసుకోలేరను మాట నిజమే. పరమాత్మకు మాయ కూడుకొని ఉన్నదా? పరమాత్మ మాయచే కప్పబడినవాడా! పరమాత్మకంటే మాయ పెద్దదా? అను ప్రశ్నలు ఈ భావమును చూచినవారికి రాగలవు. పై శ్లోకములో సర్వ మానవులు మాయచే యోగమైనారు, అనగ మాయచే కూడుకొన్నారు. మాయచేత కప్పబడిన మూఢులు నన్ను చూడలేరు. పుట్టుక నాశనములేని నన్ను ఎవరూ తెలియలేరు అను భావము స్పష్టముగనుండగ మాయచే పరమాత్మ కప్పబడివున్నాడనడము, మాయచే కూడుకొని ఉన్నాడనడము చాలా పొరపాటు. మాయచే కూడుకొనువాడు, గుణములచే పూడ్చబడి ఉన్నవాడు జీవుడు. గుణముల ప్రభావమువలన, మాయ అను పొర అడ్డముండుట వలన, పరమాత్మ అంశ అయిన ఆత్మను జీవుడు చూడలేక పరమాత్మను అర్థము చేసుకోలేకున్నాడు. సర్వులు మాయలో మునిగి దైవమును చూడలేకున్నారనుట వాస్తవము. అలాకాక దైవమే మాయతో కూడివుండుట వలన ఎవరు తెలియలేకున్నారనుట అవాస్తవము. శుద్ధపొరపాటు. మూఢులైనవారు నాకు పుట్టుక నాశనము లేదను మాటను తెలియజాలకున్నారు. మేము ప్రత్యేకించి వ్రాయు టీక-భావము క్రింద గలదు.
టీక : - సర్వస్య= మానవులందరు, యోగమాయ= మాయచే కూడుకొని
సమావృతః = కప్పబడి ఉన్నవారై, అహం=నేను
నప్రకాశః = అగుపడువాడను కాను లేక తెలియబడువాడను కాను
మామ్ = నన్ను, అజ = పుట్టుకలేని, అవ్యయమ్ = నాశనములేని
లోకోమూఢ = మూఢులైన లోకులు, అభిజానాతి = తెలియలేకున్నారు.
భావము : మాయతో కూడుకొన్నవారు, మాయతో కప్పబడినవారైన సర్వులు నన్ను తెలియజాలకున్నారు. మూఢులైన లోకులు నాకు పుట్టుక నాశనము లేదని తెలియలేకున్నారు.
శ్లోకము 26: వే దాహం సమతీతాని వర్తమానాని చార్జున !
భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : సర్వ జీవులకు జరిగిపోయినవి, జరుగుచున్నవి, జరుగబోవునవి నాకు తెలుసు. నన్ను మాత్రము ఎవడు తెలియలేడు.
వివరము : సర్వ జీవరాసుల కర్మలు వాని శిరస్సులోని కర్మచక్రములో అమరి ఉండును. కాలచక్రము, కర్మచక్రము ఆత్మను ఇరుసుగ చేసుకొని తలలో తిరుగుచుండును. ఏ కాలములో ఏ కర్మ గడిచిపోయినది, ఏ కాలములో ఏ కర్మ జరుగబోవునో, ప్రస్తుతకాలములో ఏమి జరుగుచున్నదో అన్ని అక్కడ ఆ చక్రములలో తెలియగలవు. పరమాత్మ ప్రతి శరీరములో కూడ వ్యాపించి ఉన్నాడు. ప్రతి తలలోని కర్మ కాలము ఆయనకు తెలియును. కావున ఎవరికి ఏమి జరుగునో, ఏమి జరిగినదో కూడ ఆయనకు సులభముగ తెలిసివుండును.
శ్లోకము 27: ఇచ్ఛాద్వేష సముత్థే న ద్వన్ద్వ మోహేన భారత ।
సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప! ||
(జీవాత్మ, ప్రకృతి)
భావము : రాగద్వేషములవలన పుట్టుచున్న ద్వంద్వములచే భ్రాంతి చెందినవారై, సర్వ జీవరాసులు పుట్టినది మొదులకొని వాటియందే సమ్మోహమై పోవుచున్నారు.
వివరము : ప్రేమ, ద్వేషము అను రెండు రకముల గుణములవలె, మిగత గుణముల వలన కల్గు సుఖదుఃఖములకు లొంగిపోయి, సర్వజీవరాసులు పుట్టింది మొదులుకొని మంత్రించబడిన వారివలె ఆ గుణములలోనే చిక్కుకొని ఉన్నారు.
శ్లోకము 28: యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ ।
తే ద్వన్ద్వ మోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : మనుషులలో ఎవడు వాని యొక్క ద్వంద్వ గుణముల మోహము వదలబడి నన్నే భజించుచున్నాడో, అట్టివాడు తన పుణ్యపాపములను నశింప చేసుకొనును.
వివరము : చాలా గీతలలో ఎవని యొక్క పాపపుణ్యములు నశించుచున్నవో, అట్టివాడు ద్వంద్వములను వదిలి పరమాత్మనే భజించునని వ్రాశారు. ద్వంద్వములు వదిలి యోగమాచరించిన తర్వాత పాపపుణ్యములు పోతాయి కాని, పాప పుణ్యములు పోయిన తర్వాత ద్వంద్వములు వదలడము పరమాత్మ భజించడము అర్థములేని మాట అగును . ఏది ముందు ఏది వెనుక అని యోచించక వ్రాశారు. ముందు ద్వంద్వ గుణములను లేకుండ చేసుకొని, యోగము ద్వార పరమాత్మను ఆరాధించగ, తర్వాత పాపపుణ్య కర్మ నశించును.
శ్లోకము 29: జరామరణ మోక్షాయ మా మాశ్రిత్య యతన్తి యే ।
తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలమ్ ॥
(జీవాత్మ, పరమాత్మ)
భావము : జరామరణ మోక్షము కొరకు నన్నే ఆశ్రయించి ఎవడు ప్రయతించు చున్నాడో వాడు ఆత్మను, ఆధ్యాత్మికమును, కర్మమును తెలిసినవాడై ఉండును.
వివరము : చావు పుట్టుకల నుండి విడువబడి, వాటిని పొందకుండ మోక్షమును చేరాలంటే పరమాత్మే దీనికి ఆధారమని, పరమాత్మనే ఆశ్రయించి ఆయనను చేరవలెనని ప్రయత్నము చేయువాడు ఎవడో, అటువంటి వాడు ఆధ్యాత్మికమును, కర్మముల వివరము అన్నియు తెలిసియుండును.
శ్లోకము 30: సాధిభూతాధి దైవం మాం సాధియజ్ఞం చ యేవిదుః ।
ప్రయాణకాలేఽపిచ మాం తే విదుర్యుక్త చేతసః ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : సర్వజీవరాసులకును, సర్వదేవతలకును, సర్వయజ్ఞములకును నేనే ఆధారభూతుడనని ఎవరు తెలుసుకొందురో, వారు అవసానదశలో వారి మనస్సును నాయందే ఉంచుకొని నన్ను తెలుసుకోగలరు.
వివరము : సంపూర్ణ జ్ఞానము తెలిసి ప్రపంచమునకంతటికి అధిపతి ఒకడున్నాడని, వాడు సమస్త జీవకోటికి, సర్వదేవతలకు అధిపతియై ఉన్నాడని, మరియు సమస్త కర్మనిర్మూలనకు అగ్నియై ఉన్నాడని, తెలిసినవాడు అంత్యకాలములో మనస్సుచే ఆత్మనే స్మరించుకొనువాడై చివరకు పరమాత్మను చేరును.
---------------------