pss book:gt14 త్రైత సిద్ధాంత భగవద్గీత: పురుషోత్తమ ప్రాప్తి యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత: పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్రీ భగవంతుడిట్లనియె:-
శ్లోకం 1: ఊర్ధ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్॥
(ప్రకృతి, పురుషుడు)
భావము : పైకి వేర్లు క్రిందికి కొమ్మలు గల అశ్వర్థమనే వృక్షము అవ్యయమైనదని, వేదములు ఆకులుగ ఉన్నవని ఎవడు తెలియునో వాడు వేదములు తెలిసినవాడని చెప్పవచ్చును.
వివరము : ఒక వృక్షమునకు వేర్లు, మొదలు, కొమ్మలు, ఆకులు, ఫలములు ఉండుట సహజము. ఇక్కడ మనము చెప్పుకొను అశ్వర్ధమనబడు దానికి వేర్లు (మూలము), కొమ్మలు (శాఖలు), ఆకులు, ఫలములు గలవు కావున వృక్షములాంటి పోలికలున్నవి. కనుక ఒక విధముగ అర్ధమగుటకు వృక్షమని చెప్పుకోవచ్చును. వాస్తవానికిది వృక్షముకాదని తెలియాలి. సాధారణముగ వృక్షమునకు వేర్లు క్రింద భూమిలో, కొమ్మలు పైన ఉంటూ కొమ్మలకు ఆకులు అందముగ కనిపిస్తుంటాయి. అలాగే వృక్షము పెరుగుటకు భూమి నుండి వేర్లు ఆహారమును గ్రహించి పెట్టుచున్నవి. వేర్లు నుండి గ్రహించిన ఆహారమును ఆకులు ఉపయోగించుకొని చెట్టు పెరుగుచు పైకి క్రిందికి దిశలకు కొమ్మలు ప్రాకియుండుట మనము చూస్తూనే ఉన్నాము . కాని ఇక్కడ చెప్పబడు అశ్వర్ధమనబడు వృక్షము పైకి వేర్లు, క్రిందికి కొమ్మలు కలదిగ ఉండడము విచిత్రము. అశ్వర్ధమనబడు వృక్షము పెరుగుటకు కావలసిన సదుపాయములన్ని పైనున్న మూలము నుండి లభిస్తున్నవి. ఆకులు, కాయలకు కావలసిన ఆహారము పైనున్న మూలము నుండి లభిస్తు చెట్టు పెరుగుచూ పోయి దృఢముగ వ్యాపించుకొన్నది. చెట్టు నిర్మాణములోనే విచిత్రముకాగ, ఫలములు కాయడములో కూడ సాధారణ చెట్టుకంటే మరీ విచిత్రముగ ఉండును. సాధారణముగ మామిడి చెట్టుకు మామిడి కాయలు కాయడము సహజము. అలాగే ఏ జాతి చెట్టుకు ఆ జాతి కాయలు కాయడము అందరికి తెలిసిన విషయమే. కాని అశ్వర్ధవృక్షమనబడు దానికి ఒక విధమైన కాయలు కాయవు. ఈ చెట్టుకు అనేక విధములగు ఫలములు కాయుచున్నవి. ఈ అశ్వర్ధవృక్షము ఆకారములోనేకాక కాయలలో విచిత్రముగ ఉండగ, కాయలలోనేకాక ఆకులలో కూడ విచిత్రముగనే ఉన్నదని చెప్పవచ్చును. అదేమిటంటే దీని ఆకులు వేదములకు ప్రతిరూపములు. వేదములే ఆకులుగ ఉన్న ఈ చెట్టును తెలిసినవాడు నిజముగ వేదములు తెలిసినవాడని చెప్పవచ్చును. ఇంకనూ క్రింది శ్లోకమున ఏమనుచున్నాడనగా!
శ్లోకం 2: అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।
అధశ్చ మూలా న్యనుసన్త తాని కర్మానుబన్ధీని మనుష్యలోకే॥
(ప్రకృతి, పురుషుడు)
భావము : ఆ అశ్వర్ధమను వృక్షము యొక్క శాఖలు గుణ విషయములచే వృద్ధి అయినవై అనేక దిశలకు వ్యాపించి ఉన్నవి. మరియు దాని వేర్లు విస్తరించినవై మనుష్య లోకమున వ్యాపించినవి.
వివరము : ఈ వృక్షము అనేక విధములుగ ప్రత్యేకతలు కల్గివున్నదనుకొన్నాము కదా! వాటిలో ఇది పెరుగుటకు ఆహారమొక ప్రత్యేకతతో కలదు. సాధారణ వృక్షమునకు భూమిలో నత్రజని, భాస్వరము మొదలగు పదార్థములు ఆహారము కాగ! ఈ చెట్టుకు గుణ విషయములే ఆహారముగ ఉన్నవి. గుణముల వలన పెరిగిన కొమ్మలు, ఆకులు, ఆహార బలమునే ప్రదర్శించుకొనుచు కనిపిస్తున్నవి. ఇక్కడ చాలామందికి కొన్ని ప్రశ్నలు రావచ్చును. అవి ఏవనగా! గుణములే ఆహారముగ గల చెట్టెక్కడున్నది? దాని ఆకులను చెట్లను ఎక్కడా చూడలేదే! మీరు చూచారా? వేదములే ఆకులుగ, గుణవిషయములే ఆహారముగ ఉన్న చెట్టు భూమిమీద ఉన్నదా? ఉంటే ఎక్కడున్నది? ఈ విధ ప్రశ్నలకు జవాబులు చూస్తామా!
ఈ శ్లోకము చివరిలో మనుష్యలోకే అను పదము వాడబడినది, కావున ఈ చెట్టు మనుషులకు సంబంధించి ఉన్నదని తెలియుచున్నది. ఆ దృష్ఠితో చూచిన గుణముల విషయములు మనుషులలోనే ఉన్నవి. కావున ఈ చెట్టు తప్పనిసరిగ మనిషిలోనే అణిగివున్నదని చెప్పవచ్చును. మనిషిలో సూక్షముగ అణిగివున్న అశ్వర్థవృక్షమను దానిని పరిశీలించి చూచిన మనిషి తలలోనే మూలము, క్రింది శరీరమంత చెట్టుగ విస్తరించి ఉన్నదని తెలియుచున్నది. ఒక మానవ శరీరమును ఒక వృక్షముగ చెప్పవచ్చును. తలలోని కర్మ, కాల, గుణచక్రములు మూలముకాగ, శరీరమంత విస్తరించిన నాడులు కొమ్మలుకాగ, జ్ఞానేంద్రియములు ఆకులుకాగ, కర్మేంద్రియములు కాయలుగ ఉన్నవని గ్రహించవలెను.
మానవుని శిరస్సులో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను నాల్గుచక్రముల అమరిక బ్రహ్మనాడిని కేంద్రముగ చేసుకొని ఉన్నది. కాల కర్మ గుణచక్రములలో మానవుని ఆయుస్సు, జీవితకాలములో చేయవలసినపనులు, పనులకు సంబంధించిన గుణములు అన్నియు అణిగివున్నవి. మానవుని జీవితమునకు సంబంధించినవన్నియు అక్కడ (శిరస్సులో) అమరియుండుట వలన ఊర్ధ్వమూలము అన్నారు. జీవితమునకు మూలమైనదంత శరీరము పై భాగమున శిరస్సులో ఉండుటవలన పైన మూలమనుట వాస్తవమే. పైన ఉన్నదేదో దాని కారణముననే క్రింద శరీరమంతయు కదలి పని చేయుచున్నది. ఒక పని ఎపుడు జరుగవలెననుటకు కాలచక్రములోని కాలము, ఎట్లు జరుగవలెనను విధానమును కర్మచక్రములోని కర్మయు, ఏ గుణముచేత జరుగవలెననుటను గుణచక్రములోని గుణములు సూచిస్తున్నవి. మూడుచక్రములను అనుసరించి శరీరావయవముల ద్వార జరిగెడు పనులచే క్రొత్త కర్మ పుట్టుచున్నది. కావున పనులు చేయు కర్మేంద్రియములకు కర్మమను ఫలములు కాయుచున్నవన్నారు.పైనగల గుణముల ప్రేరణకు జ్ఞానేంద్రియములు కారణమగుట వలన వాటిని ఆకులుగ వర్ణించి, వాటినే గుణములకు మారు పేరైన వేదములుగ చెప్పారు. కాల కర్మములు ప్రసారమగు నాడులను కొమ్మలుగ వర్ణించి చెప్పారు. ఈ విధముగ పైన అన్నిటికి కారణమైన కర్మ గుణములు ఉండగ క్రిందవాటిని ప్రేరేపించు జ్ఞానేంద్రియములు, కర్మలను సంపాదించు మరియు ఆచరించు కర్మేంద్రియములు కలవు.
ఈ విధమైన శరీరము అశ్వర్థ వృక్షమని చెప్పబడివున్నది. ప్రతి శరీరము ఒక వృక్షములాంటిదని చెప్పవచ్చును. దీని ప్రకారము జీవుడు ధరించిన శరీరములన్నియు వృక్షములే. జీవుడైన నేను, నీవు ధరించిన శరీరములు కూడ అశ్వర్థవృక్షములేనని తెలియవలెను.
శ్లోకం 3: న రూప మస్యేహ తథోపలభ్యతే నాన్తో న చాది ర్నచ సమ్ప్రతి ష్ఠా ।
అశ్వత్థ మేనం సువిరూఢమూల మసంగ శస్త్రేణ దృఢేన ఛిత్వా ||
(ప్రకృతి, పురుషుడు)
భావము : అశ్వర్థవృక్షము యొక్క రూపముగాని, దాని మొదలుగాని, చివరగాని ఉన్న స్థితియుగాని తెలియబడడములేదు. దృఢమైన మూలముగల ఈ వృక్షమును అసంగశస్త్రముచే నరుకవలెను.
వివరము : ఎంతో జ్ఞానదృష్టి ఉంటే కాని అశ్వర్థవృక్షము యొక్క నిజస్వరూపము అర్థముకాదు. అందువలన శరీరమందు అమరియున్న దీనిరూపము జ్ఞానదృష్ఠిలేని ఎవరికి అర్థముకాదు. కొంత జ్ఞానమున్నవారు కూడ దీనిని పోల్చుకోలేరు. ఒక జీవుడు శరీరము ధరించడము ఎప్పుడు మొదలు పెట్టాడో తెలియదు. జీవుడు పుట్టినప్పుడు శరీరవృక్షము కూడ పుట్టియున్నది. కావున జీవుడు అనాది అయినట్లు శరీరవృక్షము కూడ అనాదియైనదేనని చెప్పవచ్చును. శరీరాంతర్గతములో సూక్షముగ ఇమిడివున్న అశ్వర్థవృక్షము శరీరము నశించినను తాను నశించునది కాదు. కాల, కర్మ, గుణచక్రములతో పాటు అమరియున్న ఈ వృక్షము మరణములో శరీరమును విడచి మరో క్రొత్త శరీరమును ఆశ్రయించుచున్నది. ఈ వృక్షము యొక్క గుణచక్రమను వేర్లలో జీవుడు బంధించబడి ఉన్నాడు.ఒక శరీరము జీవుడు వదలినాడంటే వృక్షముతో సహా కదలిపోయిందని అర్థము చేసుకోవాలి. ఈ విధముగ అనాది నుండి శరీరములు మారుచు కర్మ అను వేర్లు దృఢముగ వ్యాపించి ఉండుట వలన ఇది దృఢమూలమైనదని శ్లోకములో చెప్పబడివున్నది. ఆది తెలియని అనాదియైన ఈ వృక్షము యొక్క అంత్యము కూడ ఎవరికి తెలియదు. పుట్టుక అంత్యము తెలియబడని ఇది ప్రస్తుతము శరీరములో ఎట్లున్నది కూడ తెలియకున్నది. ఇట్టి వృక్షము యొక్క ఆదిని, ప్రస్తుతస్థితిని, తెలుసుకొని దానిని అంత్యము కూడ చేయవచ్చును. జ్ఞానదృష్టిచేత అదెట్లున్నది తెలిసినవాడు దానిని నాశనము చేసి అంత్యము కూడ చూడగలడు. దానిని తెలుసుకున్నవాడు సర్వవేదములు తెలిసినవాడని మొదటి శ్లోకములో చెప్పినట్లు తెలిసినవాడై దానికి నీరు, ఆహారమైన విషయములను, గుణములను లేకుండ చేసిన ఎడల, దానంతటది ఎండిపోయి నశించిపోవును. గుణములతో సంగమించనివాడు చెట్టును నాశనము చేయగలడు.
శ్లోకం 4: తతః పదం త త్ప రిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తన్తి భూయః|
తమేవ చాఽద్యం పురుషం ప్రపద్యేయతః ప్రవృత్తిః ప్రసృతాపురాణీ ||
(పరమాత్మ)
భావము: ఏ పదమును పొందిన తరువాత తిరిగి జన్మించరో దానిని తెలియవలెను. ఈ ప్రకృతి జీవరాసులన్ని ఎవరి వలన పుట్టి వ్యాపించియున్నవో అట్టి పురాణ పురుషుని శరణువేడవలెను.
వివరము: శరీరమందున్న అశ్వర్థవృక్షమును నశింపజేసిన తరువాత అందులోగల జీవాత్మ ఎక్కడికి పోవునో తెలుసుకోవలెను. జీవాత్మవృక్షమును వదలిన తరువాత తిరిగి పుట్టని పరమాత్మ స్థానమునలంకరించి పరమాత్మగ మారిపోవును. తిరిగి జన్మ పొందని ఆ స్థానమును పొందవలెనంటే ఈ ప్రపంచమునకు ఆది, పురాణ పురుషుడైన పరమాత్మను శరణువేడడము వలననే సాధ్యమగును. ఏదీకాని పరమాత్మను నేరుగ ఎవరు ఆరాధించలేరు. కావున మొదట జీవాత్మకు, పరమాత్మకు మధ్యవర్తి అయిన ఆత్మను పూజించవలసిందే.
శ్లోకం 5: నిర్మానమోహా జితసంగదోషా అధ్యాత్మ నిత్యా వినివృత్తకామాః|
ద్వన్ద్వైర్విముక్తాస్సుఖదుఃఖసంజ్ఞైర్గచ్ఛన్త్యమూఢాః పద మవ్యయం తత్||
(పరమాత్మ)
భావము: మాన, మోహములను వీడిన వారు, ప్రపంచ విషయములతో సంగమించుట వలన కల్గు కర్మను లేకుండ చేసుకొన్నవారు, నిత్యము ఆత్మ చింతన చేయువారు, ఆశలను లేకుండ చేసినవారు, సుఖదుఃఖములకు కారణమగు పాపపుణ్యములనుండి బయట పడిన వారు అయిన జ్ఞానులు, నాశనములేని పరమపదమును పొందుచున్నారు.
శ్లోకం 6: న త ద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః|
య ద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ||
(పరమాత్మ)
భావము:దానిని సూర్యుడు కాని, చంద్రుడు కాని , అగ్ని కాని ప్రకాశింప చేయలేరు. దేనిని పొందిన తిరిగి జన్మించరో అదే నా పరంధామము.
వివరము: శరీరములోని అశ్వర్థవృక్షమును నాశనము చేసినవాడు మోక్షమును పొంది పరమాత్మయందైక్యమై పోవుచున్నాడు. అట్టి పరమాత్మ స్వయంప్రకాశమైనది. దానిని సూర్యుడు కాని, అగ్నికాని, చంద్రుడుకాని ప్రకాశింప చేయజాలరు. ఎందుకనగ చీకటిగనున్న దానిని వెలుతురు చేయుట సూర్యచంద్రాదులకు సాధ్యమగును. వాటికంటే వెలుతురెక్కువైన పరమాత్మను ఏది ప్రకాశింప చేయలేదు. దేనిని పొందిన వారు తిరిగి వర్తించుటకు పుట్టరో అదియే శ్రేష్టమైన పరమపదమని తెలియవలెను.
శ్లోకం 7: మమై వాంశో జీవలోకే జీవభూత స్సనాతనః|
మనష్షష్టా ణీన్ద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి||
(పరమాత్మ)
భావము: బ్రతికివున్న జీవరాసులలో జీవాత్మ నా అంశమై, ప్రకృతి సంబంధమైన ఇంద్రియములలో ఆరవదైన మనస్సును ఆకర్షించుచున్నది.
వివరము: కార్యరూపమైన ప్రపంచములో పరమాత్మ మూడు భాగములుగ విభజింపబడివున్నదని ముందే తెలుసుకున్నాము. అందులో ఒకటైన జీవాత్మ పరమాత్మతో పాటు అనాదియనియే చెప్పవచ్చును. అనాదియైన జీవాత్మ శరీరములో ఉంటూ అందులో బయటి విషయములను తెలియజేయు జ్ఞానేంద్రియముల తర్వాత ఉన్న ఆరవదైన మనస్సును ఆకర్షించుచున్నది. భూమ్యాకర్షణ వలన వస్తువులు క్రిందపడునట్లు గుణచక్రములో ఉన్న జీవాత్మ ఆకర్షణ వలన మనస్సు తనకు తెలిసిన విషయములను లోపలివైపుకు జారవిడిచినట్లు పంపుచున్నది. అట్లు పంపుట వలన బయటి విషయములతో జీవాత్మ మరియు దాని బుద్ధి సంబంధపడుచున్నవి. జీవాత్మకున్న ఆకర్షణ చేతనే మనస్సు ద్వారా ప్రపంచ సంబంధములు తగులు కొనుచున్నవి. జీవాత్మకున్న ఆకర్షణను లేకుండ చేయడమే బ్రహ్మయోగము.
శ్లోకం 8: శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్క్రామ తీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధాని వాశయాత్||
(ఆత్మ, ప్రకృతి)
భావము : ఆత్మ శరీరమును వదిలి ఎప్పుడు పోవుచున్నదో, పోయి ఎక్కడ ప్రవేశిస్తున్నదో,అక్కడికి వాయువు వాసనను తీసుకుపోయినట్లు ఆత్మ గుణములను కూడ తీసుకొని పోవుచున్నది.
వివరము : ఇక్కడ చాలామంది జీవుడు శరీరమును వదిలి పోవునపుడని పొరపడుచున్నారు.ఈ శ్లోకములో ఈశ్వరుడని స్పష్టముగ చెప్పియుండగ జీవుడని చెప్పుకోవడము తప్పుగ తెలియుచున్నది. ఆత్మల వివరము తెలియక పోతే చాలా చోట్ల ఇటువంటి పొరపాట్లు జరుగుచుండును. ఇక్కడ చెప్పబడినది శరీరములో విభజింపబడి ఉన్న జీవాత్మ, ఆత్మ , పరమాత్మలలో పరమాత్మ శరీరమును వదిలి పోవునది కాదు.ఎందుకనగ పరమాత్మ మరోకచోట లేదనుటయే లేదు. కనుక అక్కడ లేకపోతే కదా పోవలసి వచ్చునది. అంతటా ఉన్న పరమాత్మ పోదు. కనుక శరీరమును వదిలిపోవునది రెండే భూతములు. అవి జీవాత్మ, ఆత్మ. ఈ రెండిటిలో శరీరమునకంతయు అధిపతి (ఈశ్వరుడు) యైనది, శరీరమంతయు వ్యాపించి కదిలించు శక్తియైనది ఆత్మయే. మరణములో శరీరమును వదిలి పోవునది పైకి తెలియబడునట్లున్నది ఆత్మయే. ఎందుకనగ శరీరమంతయు చైతన్యమై కదలించు కదలికలు ఆత్మవే. ఆ కదలికలు మరణముతో నిలిచిపోవుచున్నవి. కనుక శరీరమును ఆత్మ వదిలి పోయినదని చెప్పవచ్చును. అంతేకాక సత్తైన ఆత్మ మరణములో పోవుచున్నది కావున సత్తు పోయినది (సచ్చిపోయినది) అనుట సాధారణముగ వినుచున్నాము. శరీరమును వదిలి ఆత్మ పోవుచున్నప్పుడు ఆత్మతోపాటు ఉన్న జీవాత్మ కూడ పోవలసి వస్తున్నది.ఈ విషయము వెనుక చెప్పబడివున్న సాంఖ్యయోగమను అధ్యాయములో 23,24 శ్లోకములలో వివరము చెప్పబడివున్నది.
ఆత్మ జీవాత్మతోపాటు అక్కడే ఉన్న కామాది గుణములను కూడ తీసుకొని పోవుచున్నది. శరీరమును వదిలి పోవుటకు, ఎక్కడో చేరుటకు కారణమైన కర్మ కూడ వాటితో పోవుచున్నది. జ్ఞానదృష్ఠితో చూచిన ఎడల శిరోభాగములో ఉన్న బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములు నాలుగు వాటితో అనుసంధానమైన అశ్వర్ధవృక్షము మొత్తము శరీరము నుండి బయల్పడి, స్థూలకన్నులకు కనిపించకుండ ప్రయాణించి రెండు సెకండ్లలో మరొక క్రొత్త శిశుశరీరమును ధరించుచున్నది. పుష్పములలోని సువాసన గాలిలో కలసి ప్రయాణిస్తున్నపుడు కంటికెట్లు కనిపించదో, అట్లే ఆత్మతో పాటు ప్రయాణిస్తున్న అశ్వర్ధవృక్షము కనిపించదని గ్రహించవలెను.
శ్లోకం 9: శ్రోత్రం చక్షు స్స్పర్శనం చ రసనం ఘ్రాణ మేవ చ|
అధిష్ఠాయ మన శ్చాయం విషయానుపసేవతే||
(జీవాత్మ)
భావము : చెవులు,కన్నులు, చర్మము, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియములను మరియు మనస్సును అధిష్ఠించి వాటి విషయములను అనుభవిస్తు జీవాత్మ శరీరమందున్నాడు.
వివరము : శరీరములోపల ఎక్కడో గుణచక్రములోనున్న మూడుభాగములలో ఏదో ఒక భాగములో నివాసము చేయుచున్న జీవుడు నిజముగ అంధుడు. అప్పుడే పుట్టిన కన్నులు తెరువని కుక్క పిల్ల తనవద్దకు వచ్చిన వాటిని మాత్రము వాసనచే తెలుసుకొనుచుండునే కాని నిజముగ చూడలేదు. అట్లే మనస్సు వలన తన వద్దకు వచ్చిన విషయములను మాత్రము బుద్ధిచే జీవుడు తెలుసుకొనుచున్నాడు. మనస్సు శరీరమునకు బాహ్యముగనున్న కన్ను, చెవి, ముక్కు, చర్మము, నాలుక అను ప్రత్యేక శక్తులు గల ఐదు ఇంద్రియములనుండి చూపు, వినికిడి, వాసన, స్పర్శ, రుచి అను ఐదు అనుభూతములను గ్రహించి లోపలనున్న బుద్ధికి జీవునికి తెలియజేయును. బుద్ధి అందించు వివరముతో సహా జీవుడు వచ్చిన అనుభూతులను స్వయముగ అనుభవించుచుండును. అనుభూతులను జీవుడు అనుభవించినప్పటికి వాటి వివరము బుద్ధి ద్వారానే బయటికి చెప్పబడును. జీవుడొక గ్రుడ్డివాడు, మూగవాడు, చెవిటివానితో సమానమని చెప్పవచ్చును. సాధారణముగా ప్రపంచములో గ్రుడ్డి, చెవిటి, మూగవాడు చూడలేక వినలేక చెప్పలేక పోయినప్పటికి చేతికి దెబ్బ తగిలిన బాధను అనుభవించును. కాని బాధను గురించి బయటికి చెప్పలేడు. అట్లే జీవుడు స్వయముగ వినలేక, చూడలేక, చెప్పలేక పోయినప్పటికి బాధలు అనుభవించుచుండును. అట్లే సుఖములు అనుభవించుచుండును. అనుభవించిన వాటి వివరము, ప్రక్కనే జీవునకు దగ్గరగ ఉన్న బుద్ధి వివరించి చెప్పుచుండును. బుద్ధి వివరించి తెలియజేస్తే కాని అనుభవించిన అనుభవముల వివరము జీవునుకి తెలియదు. బుద్ధి లేకపోతే జీవాత్మ స్తబ్ధునిగ అనుభవించవలసిందే తప్ప అనుభవించిన దానిని గురించి కూడ చెప్పలేడు.
ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క జీవాత్మ దానికి దగ్గరగ బుద్ధిని ఏర్పాటుచేసి పెట్టబడివున్నది. ప్రతి శరీరములో ఉన్న జీవాత్మ ఒకే పరమాత్మ అంశ అయినప్పటికి వాటి వాటి బుద్ధిని బట్టి వాటిలో అనేక తేడాలు కన్పిస్తున్నవి. అలా కన్పించినవి ఆ జీవాత్మల బుద్ధి భేదమే తప్ప మరివేరుకాదని తెలియాలి. ఉదాహరణకు ఒకే పదార్థమును నలుగురు వ్యక్తులకిచ్చి వాటిని రుచి చూచి వాటి రుచిని గురించి చెప్పమన్నామనుకొందాము. నలుగురు ఒకే విధముగ చెప్పలేరు. నలుగురు కొద్ది కొద్ది తేడాలతో నాల్గు విధములుగ చెప్పుచుందురు. బెల్లము నిచ్చి రుచి చెప్పమనిన ఒక్కడు కొద్దిగ పులుపు కలిసిందనో, మరియొకడు తీపు తక్కువుందనో, మూడవవాడు చాలా తియ్యగవున్నదనో, నాల్గవ వాడు వీరికంటే విభిన్నముగనో చెప్పును. ఒకే బెల్లమును నల్గురు రుచి చూచి వాటి అనుభవమును ఆ నాల్గు జీవాత్మలు అనుభవించినప్పటికి, వారిలోని బుద్ధి వివరించుటలో కొద్ది తేడాలు కన్పిస్తున్నవి. దీనిని బట్టి ఒక్కొక్క జీవునికి ఒక్కొక్క రకమైన బుద్ధికలదని తెలియుచున్నది. అందువలననే పూర్వపు పెద్దలు 'తలకొక్క బుద్ధి' అను మాటను చెప్పారు. మనమింకా వివరముగా యోచించినట్లయితే మన అనుభవములో ఒకనిని మందబుద్ధి అని అనడము,మరొకనిని పదునైన బుద్ధి అనడము జరుగుచున్నది కదా! అనేక రకములుగ అనేక శరీరములలో బుద్ధులున్నవని తెలియాలి. వారి వారి బుద్ధిని బట్టి ఆయా జీవాత్మలు వివరము తెలుసుకుంటున్నవని, నిజముగ జీవాత్మ కర్మబంధము చేత అనుభవములను అనుభవించువాడేనని, తనకు ఏ వివరము తెలియని శుద్ధాత్మయేనని తెలియాలి. గుణములలో చిక్కినందున, వాటివిరవము బుద్ధి తెల్పుచుండుట వలన, బుద్ధి యొక్క రంగే జీవునకంటుకొనుచున్నది. శరీరములో జీవాత్మ ఏ ఆకారముతో ఉన్నాడో వానికి దగ్గర బుద్ధి ఎట్లు కలదో తెలుసుకోవలెనను ఆసక్తి కలవారికి విశదముగ అర్థమగునట్లు చెప్పడమేమనగ! జీవాత్మ ఏమికాని శూణ్యము. పరమాత్మ అంశ అయినందువలన అది ఏ పదార్థముకాక శూణ్యముగ శరీరములో ఉన్నదని తెలియాలి. అయినప్పటికి కర్మబంధముచే దానికి గుండ్రని ఆకారము ఏర్పడినది. ఏమి కాని శూణ్యమును ఒక గుండ్రని పొర ఆవహించి ఉండడము వలన బంతిలాంటి ఆకారములో శూణ్యము మిగిలిపోయినది. ఆవరణములోని ఆశూణ్యమునే జీవాత్మ అంటున్నాము. చుట్టూవున్న పొరను బుద్ధి అంటున్నాము. బుద్ధి పొరను ఆనుకొని ఇంకను రెండు పొరలు కలవు. అవి చిత్తము, అహము. దీనిని బట్టి జీవాత్మ అనుబడు ఖాళీస్థలమునకు మూడు పొరల ఆవరణమేర్పడినదని తెలియుము. అట్టి జీవాత్మ ఆకారమును క్రింది పటములో చూడవచ్చును.
శ్లోకం 10: ఉత్క్రామన్తం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్|
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః||
(జీవాత్మ)
భావము : దేహము అంతమై దానిని వదిలిపోవునపుడు, దేహములో ఉన్నపుడు, గుణముల అనుభవములను పొందుచున్నప్పుడు, ఆ జీవుడెలానున్నది జ్ఞానులు జ్ఞాననేత్రముచే చూడగలరు. అజ్ఞానులు చూడలేరు.
వివరము : జీవాత్మ శరీరము వదిలి పోవునపుడు జన్మలకు కారణమైన కాల, కర్మ, గుణ సముదాయముగల చక్రములతో సహా పోవుచున్న విషయమును, శరీరములో ఉన్న మూడు గుణభాగములలో ఏదో ఒక భాగములో అంధత్వములో జీవుడు నివశిస్తు, ఆ గుణ అనుభవములను అనుభవిస్తు, వాటి వివరమును బుద్ధి ద్వార తెలుసుకొనుచున్న విషయమును అజ్ఞానులు తెలియలేరు. జ్ఞాననేత్రమున్న వారు మాత్రము చూడగలరు. జ్ఞాననేత్రము ఎక్కడున్నది తెలియదు కదా! మన శరీరములో ఉన్న గ్రంథి రాజమే జ్ఞాననేత్రముగ కూడ పనిచేయుచున్నది. గ్రంథి రాజము యొక్క స్థానములో మనస్సు లగ్నము చేయుటకు అలవాటుపడినవానికి ఆత్మ విషయములన్నియు గోచరము కాగలవు. అట్లు తెలిసిన విషయములో ఆత్మను తప్ప జీవాత్మను గూర్చి మరియు మిగత ప్రకృతి జనిత భాగములైన బుద్ధి, చిత్తము, అహము, మనస్సును గూర్చి బయటికి కూడ చెప్పనగును. అందువలననే బుద్ధి, చిత్తము, అహము యొక్క ఆకారమును, జీవాత్మ యొక్క ఆకారమును బయటికి చెప్పగల్గుచున్నాము. గుణములను వాటి మధ్యలో ఉన్న జీవాత్మను కూడ చెప్పగల్గుచున్నాము.
శ్లోకం 11:యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|
యతన్తోఽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః||
(ఆత్మ)
భావము : ప్రయత్నము చేయు యోగులు దేహామందున్న ఆత్మను చూడగలరు. అచేతస్కులు, అకృతాత్ములు ఎంత ప్రయత్నించినను ఆత్మను తెలియలేరు.
వివరము : మూడు ఆత్మలు దేహములో కలవు. అందులో జీవాత్మ ప్రయత్నము చేసి ఆత్మను తెలుసుకోవాలి. ఒక విధానము ప్రకారము యోగపద్ధితిలో జీవాత్మ పరమాత్మను చేరాలంటే మార్గము మధ్యలో ఉన్నది ఆత్మయే, కనుక ఆత్మను తెలియనివారు పరమాత్మను తెలియలేరు. కనుక ఎంతో మంది బ్రహ్మయోగులు ప్రయత్నము చేసి తమ శరీరములో ఉన్న ఆత్మను తెలుసుకోగల్గుచున్నారు. మనస్సు స్వాధీనపడనివారు, బ్రహ్మయోగ సాధనలో కృతకృత్యులు కాని వారు, ఎంత ప్రయత్నించినను ఆత్మను తెలియలేరు.
శ్లోకం 12: య దాదిత్యగతం తేజో జగ ద్భాసయతేఽఖిలమ్|
యచ్చన్ద్రమసి య చ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్||
(పరమాత్మ)
భావము : సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యునిలో ఉండు తేజస్సు, చంద్రునికున్న తేజస్సు, అగ్నికున్న తేజస్సు నా యొక్క తేజస్సేనని తెలియవలెను.
వివరము : సమస్తములోను మూలవస్తువై పరమాత్మ కలదు. ఏ దానిలోనైన ఎవరిలోనైన ఒక ప్రత్యేకత కల్గివున్నదంటే, ఆ ప్రత్యేకత పరమాత్మనుండి కల్గినదేనని తెలియవలెను. అలాగే సూర్యునికి ప్రత్యేకమైన ప్రకాశమును, చంద్రునికున్న ప్రత్యేకమైన వెన్నెలను, అగ్నికున్న ప్రత్యేకతైను కాల్చివేయు వేడియును పరమాత్మనేనని తెలియాలి. ఈ విషయము విభూతి యోగమను అధ్యాయములో ముందు చెప్పబడి ఉన్నప్పటికి సందర్భానుసారము చెప్పవలసి వచ్చినది.
శ్లోకం 13:గా మావిశ్య చ భూతాని ధారయా మ్యహ మోజసా|
పుష్ణామి చౌషధీ స్సర్వాస్సోమో భూత్వా రసాత్మకః||
(పరమాత్మ)
భావము : భూమియందుండి నా బలము చేత సమస్త జీవరాసులను నేనే ధరించుచున్నాను. రసమయుడైన చంద్రునిగా ఉంటు సమస్త ఔషధులను పోషించుచున్నాను.
వివరము : అణువణువున వ్యాపించిన వాడు పరమాత్మ. ఆయన భూమియందు కూడ ఉన్నాడు. భూమి యందుండి భూమినుండి సమస్త ఆహారపదార్థముల ఉత్పత్తికి కావలసిన బలమునిచ్చుచున్నాడు. ఆహార పదార్థములను భూమినుండి తయారు చేసి సమస్త జీవులను పోషించుచున్నాడు. అంతేకాక ఆకాశమున చంద్రుడైవుండి, భూమి మీద మొక్కలుగ మరియు వృక్షములుగ ఉన్న ఔషదాలకు వెన్నెల ద్వార రసాయణములను చేకూర్చి, వాటిలో ఔషధశక్తి కల్గునట్లు చేయుచున్నాడు. భూమి మీద పెరుగుచున్న మొక్కలను,వృక్షములను రెండు భాగములుగ విభజించి, ఒక భాగము సమస్త జీవరాసుల శరీరములను పోషించు పోషక పదార్థములైన ఆహారములుగ, రెండవ భాగమును సమస్త జీవరాసులకు కల్గు రోగముల నివృత్తికి కావలసిన రసాయణములు గల ఔషధములుగ, పరమాత్మయే తన శక్తి ద్వార తయారుచేసి పెట్టుచున్నాడు.
శ్లోకం 14 : అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచా మ్యన్నం చతుర్విధమ్||
(ఆత్మ)
భావము : నేను సకల జీవుల శరీరములందు వైశ్వానరుడను అగ్నిగ ఉండి, ప్రాణ అపాన వాయువులచేత మండుచు, నాల్గు విధములగు ఆహారములను పచనము చేయుచున్నాను.
వివరము : సర్వ శరీరములందు పరమాత్మ ఆత్మ ద్వార చైతన్యమునిచ్చి వాటి కదలికకు మూలమైవున్నాడు.ఆత్మ, జీవాత్మలు, పరమాత్మ అంశముగ ఉంటు వాటి పని అవి చేస్తున్నవి.ఆత్మ తన పనిలో భాగమైన శరీరములను కదిలించడమే కాక, తన శక్తిని గ్రంథుల ద్వార ప్రసరింపజేసి వాటిద్వార అతీతమైన శక్తిని విడుదల చేయుచున్నది. ఆత్మ చైతన్యము శరీరమంత ఒక విధముగ పనిచేయుచు, గ్రంథులనుండి దూరి మరోశక్తిగ బయటికి వచ్చి మరొక విధముగ పనిచేయుచున్నది. లాలాజలగ్రంథి నుండి వచ్చిన లాలాజలమను మహిమగల రసము, క్లోమరసగ్రంథి నుండి బయటికి వచ్చిన క్లోమరసము, అలాగే పైత్యరసగ్రంథి నుండి వచ్చిన పైత్యరసములు మూడు శక్తియుక్తమైనవి. ఈ మూడు రసములు ఒక చోట జీర్ణాశయములో కలసినపుడు ఒక విధమైన అగ్ని ఏర్పడుచున్నది. దాని పేరే ‘వైశ్వానర’ అంటున్నారు. ఈ మూడు రసముల కలయికశక్తి తీక్షణమైనది. అందువలన జీర్ణశయములో గల నాల్గురకములైన ఆహారములు జీర్ణమగుచున్నవి. నీరు తగిలిన వెంటనే గట్టి సున్నపురాయి మెత్తగ విడిపోయినట్లు రసముల ప్రభావమునకు గట్టి ఆహారముకూడా మెత్తగ మారిపోవుచున్నది.
మనము భుజించు ఆహారములు నాల్గు భాగములుగ ఉన్నవి. 1) పిండి పదార్థములు (కార్బోహైడ్రేట్స్) 2) మాంస పదార్థములు (ప్రోటీన్స్) 3) ఖనిజ లవణములు (మినరల్స్) 4) నూనె, కొవ్వు ( లిపిడ్స్,ఆయిల్స్)పదార్థములు .మనము నిత్యము భుజించు వాటిలో ఉన్న ఈ నాల్గు రకముల పదార్థములను ఆత్మ శక్తిచే తయారైన రసములే జీర్ణము చేయుచున్నవి.
గమనిక : నాల్గు విధ ఆహారముల గూర్చి చాలామంది భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య అని వ్రాసినారు. దంతములతో కొరికి తినునవి, దంతములతో నమలకయే తినునవి, నాలుకతో చప్పరించుచు తినునవి, నాలుకతో చప్పరించకయే త్రాగునవి అను నాల్గు రకములుగ తినుపద్ధతిని చెప్పియున్నారు. తినుపద్దతిని అనుసరించి విభజించిన అది మానవులకొక్కరికి సరిపోతుంది. దంతములులేని బల్లి, కప్పలకు సరిపోదు. గీతలో చెప్పిన విషయములన్నీ సర్వ జీవులకు వర్తించునవిగ ఉండవలెను. మనుషులకు సరిపోయి జంతువులకు సరిపోని బోధ జగత్తుకంతటికి వర్తించదు. అలా చెప్పువాడు జగద్గురువు కాదు. జగత్తులోని సమస్తజీవులకంతటికి వర్తించు బోధ చెప్పువాడే జగద్గురువు. శిష్యుల సంఖ్యను బట్టి జగద్గురువు కాదు, బోధలను బట్టి జగద్గురువుండును. శ్రీకృష్ణుడు చెప్పిన గీతా శాస్త్రమంతయు సర్వజీవులకు వర్తించునది. కావున ఆయనకు శిష్యులు లేకున్నను జగద్గురువైనాడు. ఆయన బోధను ఎవరూ సంకుచిత బోధ చేయకూడదు. మేము చెప్పిన నాల్గు రకముల ఆహారపదార్థములు సర్వజీవుల శరీరములకు అవసరమైనవి. వాటి ఆహారములో ఉండునవి. అలా చెప్పుకోకపోతే మాంసము తిను జంతువులు దంతములతో తిను భక్ష్యములనే తినగలవుకాని వాటికి లేహ్యములు, భోజ్యము, చోష్యములుండవు.
శ్లోకం 15: సర్వస్య చాహం హృది సన్నివిష్టోమత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ|
వే దైశ్చ సర్వైరహమేవ వేద్యోవేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ||
(ఆత్మ)
భావము : సర్వజీవరాసుల హృదయ స్థానములో నేనున్నాను. స్మృతి, ఙ్ఞానము, ఊహ దాని మరుపు నా వలననే కల్గుచున్నవి. వేదవేదాంతములు నన్నే తెల్పుచున్నవి. వేదముల తెలిసినవాడను నేనే.
వివరము : హృది అనగ మరియు హృదయము అనగ రెండు ఒక్కటే. హృదయము అనగ గుండె అని చాలా మంది భావములో కలదు. ఆ భావము చాలా తప్పు. హృదయము అనగ గుండెకాదని చాలామార్లు చెప్పాము. ఆధ్యాత్మిక విద్యలో హృదయము అనగ బ్రహ్మనాడి అని అర్ధము. శరీరమధ్యలో నున్న బ్రహ్మానాడి లో ఆత్మ నివాసము చేయుచున్నది. అన్ని జీవరాసుల శరీరంలలోని బ్రహ్మానాడిలోనే ఆత్మ నివశిస్తున్నది. అందువలన పై శ్లోకమును “సర్వస్య చాహం హృది సన్ని విష్టో” అని చెప్పబడినది. శరీరములో జీవాత్మ ఆత్మలు వేరువేరుగనున్నవి. శరీరములోని జీవాత్మ ఏ పని చేయదు. అయినప్పటికి అన్ని తానే చేయుచున్నట్లు భ్రాంతి చెందుచున్నది. వాస్తవానికి అన్ని పనులు ఆత్మే చేయుచున్నది. శరీరములో స్మృతి, జ్ఞానము, ఊహ మరియు మరుపు ఆత్మ వలననే కల్గుచున్నవి. శరీరములో ఆత్మ ఎన్నో కార్యములను చేయుచున్నను ఇక్కడ ప్రత్యేకించి మూడు కార్యములను చేయుచున్నట్లు చెప్పబడినది. ఒకటి స్మృతి, రెండవది ఙ్ఞానము, మూడవది ఊహ. ఈ మూడింటిని ఆత్మ బుద్ధికి అందిస్తుంది. ఊహ అనగ ఆలోచన అనియు, ఙ్ఞానము అనగ ప్రపంచ ఙ్ఞానము అనియు, స్మృతి అనగ జ్ఞాపకము అనియు ఈ మూడు మనస్సు వలన కల్గుచున్నవనియు అందరు అనుకోవడము జరుగుచున్నది. ఈ మూడు వాస్తవముగ మనస్సుకు కల్గునవి కావు. స్మృతి, జ్ఞానము, ఊహను మొదట ఆత్మ బుద్ధికి అందించుచున్నది. ఆత్మ ద్వార బుద్ధికి కల్గు స్మృతి ప్రత్యేకమైనది. మనిషి నిద్రావస్థలో ఉండి శరీరములో మనస్సు బుద్ధి స్తబ్ధతగ ఉన్నప్పుడు ఆత్మనుండి బుద్ధిద్వార వచ్చు మెలుకువను స్మృతి అంటున్నాము. ప్రతి దినము నిద్రనుండి వచ్చు మెళుకువను స్మృతి అంటున్నాము. అలాగే శరీరములో పరమాత్మ జ్ఞానమును అందించునది ఆత్మ. ప్రపంచ జ్ఞానమును ఐదు ఇంద్రియముల నుండి అందించునది మనస్సు. పరమాత్మ వివరము ఆత్మకే తెలియును కావున పరమాత్మ జ్ఞానమును తెల్పునది ఆత్మ అని తెలియవలెను.
ఊహ ఆత్మ వలన కల్గునది.అలాగే ఆలోచన మనస్సుకు కల్గుచున్నది.ఊహ హృదయమునుండి క్రొత్తగ పుట్టుచున్నది. అలా పుట్టిన ఊహ తిరిగి అణిగి పోవుచున్నది. ఎక్కడలేని వివరము మొదట ఆత్మనుండి పుట్టుచున్నది. ఉదాహరణకు మొదట ఎవరికి తెలియని టెలివిజన్ అను యంత్రవివరము ఆత్మ మొదట ఒక మనిషి యొక్క బుద్ధికి అందించగ,దానిని ఆ మనిషి కనిపెట్టాడని ప్రచారము జరిగినది. రేడియోను మార్కోని అను వ్యక్తి కనుగొన్నాడనుచున్నాము. వాస్తవానికి మార్కోని అను వ్యక్తి శరీరములోని ఆత్మ అతని బుద్ధికి ఊహ ద్వార అందించిన విషయమే రేడియో. అతని ఆత్మ అందించిన విషయము అతనికి తెలియదు. అలాగే ప్రక్క మనుషులకు తెలియదు. అందువలన నేనే రేడియోను కనుగొన్నానని అతను అనుకోగా, మార్కోని కనుగొన్నాడని ప్రజలు అనుకొంటున్నారు. ఇలాగే నేడు భూమి మీద ప్రచారములోనికి వచ్చిన విమానములు, రైళ్లు, కంప్యూటర్లు మొదలగు అనేక పరికరములను ఆత్మ అందించినవే, అయిన ఆ వివరము మనకు తెలియకుండపోయినది. కావున పై శ్లోకములో నా వలననే ఊహ కల్గుచున్నదని చెప్పబడినది. మానవుని హృదిలో మెదలిన ఊహ తిరిగి మరచి పోవడము కూడా జరుగు చున్నది. కొంత మంది మాత్రము వచ్చిన ఊహను మనస్సులో లగ్నము చేయుచున్నారు. అలా మనసులో లగ్నము చేయబడిన ఊహ తిరిగి మనోఙ్ఞప్తికి రాగలిగితే అపుడది ఆలోచన అవుతుంది. మనిషికి వచ్చు ఊహలు అన్నియు ఆలోచనలు కావడము లేదు. ఎందుకనగ వచ్చిన ఊహ బుద్ధిలోనే అనిగి పోవుచున్నది. మనస్సులో అణిగిపోతే ఎప్పుడైన ఆలోచనరూపములో రాగలదు. అలా కాకపోతే శాశ్వతముగ మరచిపోవడము కూడ జరుగుచున్నది. అందువలన ఊహ మరుపులు కూడ నావలననే కలుగుచున్నవని పై శ్లోకమున చెప్పబడినది.
శ్లోకం 16: ద్వా విమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ|
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే||
(ఆత్మ, జీవాత్మ)
భావము : లోకములో రెండు రకముల పురుషులు కలరు. వారు క్షరుడనియు,అక్షరుడనియు చెప్పబడుచున్నారు. క్షరుడు సర్వభూతములందు కలడు. క్షరునితో కూటస్తునిగనున్న వాడు అక్షరుడని చెప్పుచున్నారు.
వివరము : ప్రపంచము తయారైన తర్వాత మొట్టమొదట పుట్టినది ఆత్మ. ఆత్మ పుట్టిన తర్వాత మార్పుచెందు ప్రకృతి తయారైనది. ఆత్మ పురుషతత్త్వముకాగ, ప్రకృతి స్త్రీ తత్త్వముగ ఉన్నది. ఆత్మను పురుషతత్వముగ, ప్రకృతిని స్త్రీతత్వముగ ఎందుకు చెప్పాలి అను ప్రశ్నకూడ రాగలదు. దానికి సమాధానము మొదట ఏదైన పుట్టుటకు బీజము అవసరము. బీజముంటే దానికి సంబంధించినది పుట్టును. మొదట ప్రపంచము పుట్టుటకు బీజము ఒకటి కలదు. అదియే ఏదికానిది,ఏ పేరు లేనిది. దాని నుండి పుట్టినది ప్రకృతి. ఉత్పత్తి చేసిన బీజము పురుషునిగ, ఉత్పత్తి చేయబడిన ప్రకృతి స్త్రీగ లెక్కించబడి ఉన్నది. ఈ విషయమునే వెనుక గుణత్రయవిభాగ యోగములో 3,4 శ్లోకములలో స్పష్టముగా తెలుపబడినది. భరించువాడు భర్త , భరిచబడునది భార్య అన్నట్లు ఉత్పత్తి చేయునది పురుషుడు, ఉత్పత్తి చేయబడినది స్త్రీగ లెక్కించి చెప్పుచున్నాము. దీనినిబట్టి ఆత్మ ఏ విధముగనున్నా పురుషునిగ, ప్రకృతి ఏ రూపములోనున్నా స్త్రీగ చెప్పుకోవలసివచ్చినది.
పురుషుని నుండి పుట్టినది ప్రకృతి. విశ్వమున్నంత వరకు పురుషత్తత్వము గల ఆత్మ, స్త్రీతత్త్వముగల ప్రకృతి ఉంటుంది. మొట్టమొదట ప్రపంచము తయారైన తర్వాత పురుషుడని చెప్పుకొను దానినుండి ఆత్మ బహిర్గతమైనదని విభూతియోగములో ఆరవ శ్లోకమునందే తెలుసుకొన్నాము. బహిర్గతమైన ఆత్మ ఏడు భాగములుగ విభజింపబడినదని కూడ తెలుసుకొన్నాము. ఏడు భాగములలో పై భాగమునందు గల ఆత్మ భాగము కొంత చర ప్రకృతి భాగములచేత వేరు చేయబడినది. ఆ విధముగ వేరుచేయబడిన కొంత ఆత్మను ప్రత్యేకమైన పేరుతో పిలుస్తున్నాము. దాని పేరే “జీవాత్మ”.ఏది కాని దాని నుండి దాని అంశతో విడివడిన దాని పేరు ఆత్మ కాగ, ఆత్మ నుండి వీడిపోయి ప్రత్యేకమైన భాగముగనున్నది జీవాత్మ యని ఙ్ఞప్తికి పెట్టుకోవలెను. ఇక్కడ ఇంకా కొంత వివరముగ తెలుసుకొంటే, మొదట తయారైన ఆత్మ ఏడు భాగములైనదని చెప్పుకొన్నాము. ఆ ఏడు భాగములు ఎట్లున్నవనగా! మొదట ఆత్మ రెండు సమాన భాగములుగ విభజింపబడినది.ఆ రెండులో ఒకటి అలాగా నిలిచిపోగా రెండవది మరియు రెండు సమాన భాగములుగ చీలిపోయినది.ఈ విధముగ చీలిపోయినవి ఒకటి అలాగే ఉండగ రెండవది సమానముగ చీలిపోవుచు చివరకు ఏడు భాగములుగ తయారైనది. ఉదాహరణకు కింది చిత్రము చూడుము.
ఈ విధముగ ఆత్మ ఏడు భాగములుగ విభజింపబడినది. ఉదాహరణకు సంఖ్యలలో గుర్తించడము జరిగినది. ఆత్మ రెండు వేల యూనిట్ల శక్తిగ ఉన్నట్లు తెలియుచున్నది. అందులో వెయ్యి యూనిట్లు మొదటి భాగముండగ, మిగతా ఆరు భాగములు వెయ్యి యూనిట్లుగ విభజింపబడినదని గ్రహించవచ్చును. ప్రథమములోనున్న మొదటి భాగము వెయ్యి యూనిట్ల శక్తి కల్గియున్నదనుటకు గుర్తింపుగ ఆ మొదటి భాగమును సహస్త్రారము అని పేరు పెట్టుకొన్నాము. ఇది తెలిసి పెట్టిన పేరు కాకున్నాను కాకతాళీయముగ సహస్త్రారమనియే పేరు వచ్చినది. ఇదంత ఏ శాస్త్రప్రమాణముతో చెప్పుచున్నారని అడుగువారుండవచ్చును. దానికి మా జవాబు ఏమనగ ! ఇదంతయు బ్రహ్మవిద్య శాస్త్రప్రమాణముతో చెప్పబడినదని తెలుపుచున్నాము. ఇదెక్కడి శాస్త్రమనుకోవద్దండి. ప్రపంచములో గల షట్ శాస్త్రములలో పెద్ద శాస్త్రము ఇదియే. మిగత ఐదు శాస్త్రములు దీనికంటే చిన్నవి. ఐదు శాస్త్రములు ప్రకృతికి సంబంధించినవికాగ, ఆరవదైన బ్రహ్మవిద్యాశాస్త్రము పరమాత్మకు సంబంధించినది. బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము ఆత్మ ఏడు భాగములుగ విభజింపబడగా, తర్వాత చర ప్రకృతి వలన తయారు చేయబడిన బుద్ధి, చిత్తము, అహము, మనస్సు వలన జీవాత్మ తయారైనది. జీవాత్మ ఆత్మలోని కొంత భాగమేనని తెలుసుకొన్నాము కదా! ఆత్మలోని ఎంత భాగముతో జీవాత్మ తయారైనదని ప్రశ్నవస్తే దానికి జవాబును కూడ చూడవలసియున్నది.ఆత్మ ఏడు భాగములలో మొదటి భాగము వెయ్యి యూనిట్లుగ ఉందనుకొన్నాము కదా! ఆ వెయ్యి యూనిట్లలో సగము ఐదు వందల యూనిట్లను చరాప్రకృతి చీల్చుకొని బుద్ధి చిత్త అహంకార రూపములతో చుట్టుకొనగ జీవాత్మ అయినది. అనగా మొదటి ఆత్మ భాగములో సగము జీవాత్మగ తయారైనది. ఆ వివరము ఆర్థమగునట్లు బొమ్మ రూపములో చూచెదము.
ఈ విధముగ మొదటి భాగములో సగము జీవాత్మకాగ, మొదటి స్థానములో ఆత్మ 500 యూనిట్లుగ ఉండగ, రెండవ స్థానములో కూడ 500 యూనిట్లే ఆత్మ భాగమున్నది. ఇలా పైన రెండు స్థానములలో ఆత్మ సమాన బలము కల్గియుండగ, క్రింది ఆరు, ఏడు స్థానములలో 31 ¼ (31.25) యూనిట్లుగ సమానముగ ఉన్నది. ఈ ఏడు భాగముల ఆత్మస్థానములనే సప్తస్థానములని గుర్తింపు పేర్లను కూడ ఆ స్థానములకు పెట్టడము జరిగినది. పైన గల మొదటి స్థానమును సహస్త్రారము అని పిలవగ, రెండవ దానిని ఆగ్నేయ స్థానము, మూడవది విశుద్ధము, నాల్గవది అనాహతము, ఐదవది మణిపూరకము, ఆరవది స్వాదిష్ఠానము, ఏడవది ఆధారము అని చెప్పడము జరిగినది.
ఏడు ఆత్మ భాగములు శరీరములో ఏడు నాడీకేంద్రములను ఆక్రమించుకొన్నవి. మొదటి నాడీ కేంద్రమైన మెదడును (సహస్త్రారమును) ఆత్మ
మొదటి భాగము 500 యూనిట్లు ఆక్రమించుకోగా, రెండవ నాడీకేంద్రమైన మెదడు క్రింది భాగమును (ఆగ్నేయమను) ఆత్మ రెండవ భాగము 500 యూనిట్లు ఆక్రమించుకొన్నది. ఈ విధముగ మిగిత ఐదు నాడీకేంద్రములలో ఆత్మ యొక్క ఐదు భాగములు ఆక్రమించుకొన్నవి. ఏడు నాడీకేంద్రములకు ఆత్మ భాగముల పేర్లే నిర్ణయింపబడినవి. శరీరము యొక్క ఏడు నాడీకేంద్రములనుండి ఆత్మయొక్క ఏడు భాగములు తమ తమ కార్యములను చేయుచున్నవి. వీటినే శరీరములో సప్తస్థానములని కొందరంటున్నారు. మరికొందరి సప్తచక్రములని కూడ అంటున్నారు. వీటినే పద్మములని వాటికి కొన్ని రేకులున్నవని కొందరు చెప్పగ, మరికొందరు ఒక్కొక్క స్థానమును ఒక మంత్రముగ కొన్ని బీజాక్షరమున్నట్లు కూడ చెప్పారు. ఈ విధముగ అక్కడ ఉన్న సత్యమును వదిలి చాలామంది చాలా విధములుగ చెప్పగ హేతువాదులు ఇదంత పూర్తి అసత్యము అని అన్నారు. ఏడు నాడీకేంద్రములున్నది సత్యమే, అందులో ఆత్మశక్తులు ఏడు విధములుగ ఉన్నది సత్యమే. హేతువాదులు ఏడు భాగముల ఆత్మను ఒప్పుకోకపోయినప్పటికి వారికి తెలిసిన విజ్ఞానము ప్రకారము ఏడు నాడీకేంద్రములు లేవని చెప్పలేరు.
ఇక్కడ ఇంకొక విశేషమేమిటంటే 500 యూనిట్లుగ ఉన్న మొదటి సహస్త్రా నాడీకేంద్రము, రెండవ ఆగ్నేయ నాడీకేంద్రము రెండు ఒకే మెదడు స్థానములో పైన క్రింద ఉండగ, 31 ¼ యూనిట్లుగనున్న ఆరవ స్వాదిష్ఠాన నాడీకేంద్రము, ఏడవ ఆధార నాడీకేంద్రము రెండు వెన్నముక చివరి భాగములో ఒకే చోట పైన క్రింద గలవు. మిగతా మూడు ఆత్మభాగములు 250, 125, 62 ½ యూనిట్లుగ తేడాలు కల్గియుండి ఒకదానికొకటి దాదాపు జానెడు దూరముగానున్న నాడీకేంద్రములలో గలవు. ఒక్క చోటగల పై రెండు కేంద్రముల ఆత్మపని దాదాపు ఒకేలాగుండును. అలాగే క్రింద ఒక్క చోటనున్న రెండు నాడీకేంద్రములలోని ఆత్మపనియు దాదాపు ఒకే విధముగనుండును. పై రెండు నాడీకేంద్రములు ఒక్కచోట ఉన్నవి కావున వాటి రెండిటిని ఒకటిగ లెక్కించి, క్రింద రెండు నాడీకేంద్రములు కూడ ఒక్కచోటివే కావున వాటిని కూడ ఒకటిగ లెక్కించినట్లయితే, మధ్యలో మూడిటిని లెక్కించి చూచిన మొత్తము ఐదు భాగములుగ తెలియుచున్నవి. ఒకచోట యుండి ఒకే విధముగ పనిచేయు పై రెండు ఆత్మభాగములు సమాన శక్తియుండి,రెండు ఒకటిగ గుర్తింపబడి “ సహస్త్రాగ్నేయ” అని పేరుగాంచియుండగ, అలాగే క్రింద రెండు ఆత్మభాగములు సమానశక్తికల్గి ఉండి ఒకటిగ గుర్తింపబడి “స్వాదిష్ఠాధార” అని పేరు గాంచియున్నవి. ఈ విధముగ 1) సహస్త్రాగ్నేయ 2) విశుద్ద 3) అనాహత 4) మణిపూరక 5) స్వాధిష్టాధార అను ఐదు పేర్లుగలిగినవి. శరీరములోని ప్రకృతి అయిన పంచ భూతములకు ఇవి అధిపతిగనున్నవి. సహస్త్రాగ్నేయము ఆకాశతత్త్వమునకు, విశుద్దము గాలితత్త్వమునకు, అనాహతము అగ్నితత్త్వమునకు, మణిపూరకము నీటితత్త్వమునకు, స్వాధిష్ఠాధారము భూమి తత్త్వమునకు అధిపతిగ ఉన్నవని తెలియవలెను.
ఇక్కడ కొందరికి మరియొక ప్రశ్నరావచ్చును. అది ఏమనగా! ఆత్మ 2000 యూనిట్ల శక్తి కల్గియున్నదని చెప్పారుగదా! అది అందరిలో 2000 యూనిట్లే ఉంటే అందరు ఒకే బలము కల్గియుండాలి కదా! ఆ విధముగ అందరు ఒకే బలము కల్గియున్నట్లు ఎక్కడలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క బలము కల్గియున్నారు కదా! దీనిని బట్టి 2000 యూనిట్లు అందరిలో లేనట్లే కదా! అని అడుగవచ్చును. అంతేకాక యూనిట్ అంటే ఎంత కొలత అని కూడ అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! ఒకే పొడవు, ఒకే వెడల్పుగలిగిన విస్తీర్ణములోనున్న శక్తిని ఒక యూనిట్ అనుచున్నాము. పొడవు వెడల్పు ఒకే కొలతతో యున్న చతురస్త్రశక్తిని ఒక యూనిట్ అనుచున్నాము. ఒక ఆత్మ 2000 యునిట్లశక్తిగ విభజింపబడినదని అర్థము. అన్ని శరీరములలో ఆత్మ ఒకే కొలతతోలేదు. ఒక్కొక్క శరీరములోని ఆత్మ ఒక్కో పరిమాణముతో ఉన్నది. ఏ శరీరములో, ఏ పరిమాణములో ఉండిన అది మాత్రము 2000 సమానశక్తి భాగములుగ విభ జింపబడినది. ఆత్మ అదియున్న శరీరమంత వ్యాపించియున్నది. శరీరమంత వ్యాపించిన దానివలన ఆత్మ శరీర ఆకృతిని పొందియున్నది. శరీరమంత వ్యాపించిన ఆత్మ ప్రత్యేక సమయములో (బ్రహ్మయోగములో) 1500 యూనిట్లు 500 యూనిట్లుగ మారిపోగలదు. ఒక్క యూనిట్ లో రెండు యూనిట్ల చొప్పున అనిగిపోగలదు. తిరిగి విడిపోయి శరీరమంత వ్యాపించి 1500 యూనిట్లుగ మారిపోగలదు. ఆత్మ మొదటి స్థానమైన 500 యూనిట్లలో క్రింది ఆరు స్థానములలోని 1000 యూనిట్లు చేరిపోగలవు. పైవి క్రిందివి అన్ని 1500 యూనిట్లు 500 యూనిట్లగనే ఉండిపోవును.
యూనిట్ అనునది పరిమితమైన కొలతతో లేదు. ఆత్మ ఒకే పరిమాణములో లేదు. ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క పరిమాణములో గలదు. కావున ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క శక్తి ఉండును. పరమాత్మనుండి వచ్చిన ఆత్మ ఒకే కొలతలో లేకుండుట వలన శరీరములకు వ్యత్యాసబలములు కలవు. పరమాత్మనుండి వచ్చిన ఏ ఆత్మయిన 2000 యూనిట్లగనే సమానముగ విభజింపబడినది. అంతేకాక అందరికి తెలియని విషయమొకటి కలదు. అది ఏమనగా! పైన గల మొదటి రెండవ కేంద్రములైన సహస్త్రాగ్నేయములలో గల 500+500=1000 యూనిట్ల ఆత్మతప్ప మిగత క్రిందగల ఐదు కేంద్రముల ఆత్మభాగములలోని 500 యూనిట్ల శక్తి ఒకప్పుడు ఎక్కువ సాంద్రతగ, ఒకప్పుడు తక్కువ సాంద్రత ఉండును. క్రింది స్థానములలోని 500 ఆత్మ యూనిట్లు కొంతకాలము బలముగవుండి, కొంత కాలము బలహీనపడడము కూడ జరుగుచుండును. అందువలన శరీరములో ఒకప్పుడున్న బలము ఒకప్పుడు ఉండదని తెలియవలెను.
ఏడు స్థానములను ఆధారము చేసుకొని చరప్రకృతిచేత శరీరమంత తయారైనది. శరీరమంతయు స్త్రీతత్త్వమైన ప్రకృతికాగ, ఆత్మ, జీవాత్మ రెండు పురుషతత్త్వమైన ఆత్మలైనవి. అందువలన ఆత్మ జీవాత్మలను ఈ శ్లోకములో ఇద్దరు పురుషులుగ వర్ణించి చెప్పడము జరిగినది. ఈ ఇద్దరి పురుషులనే ఒకరు క్షరపురుషుడని, మరియొకడు అక్షర పురుషుడని కూడ చెప్పడమైనది. క్షరపురుషుడనగా! నాశనమగువాడని, అక్షర పురుషుడనగా! నాశనము కానివాడని అర్థము. వీరిలో నాశనమగు వాడు జీవాత్మ, నాశనము కానివాడు ఆత్మ. శరీరములోని బుద్ధి, చిత్త అహములు ఉన్నంత వరకు జీవాత్మ ఉండగలడు. ఆ మూడు పొరలు లేకుండ పోయినపుడు జీవాత్మ యథావిధిగ ఆత్మలో కలసిపోవును. అప్పుడు జీవాత్మ ఉండదు కనుక జీవుడు క్షరుడనియు, ఆత్మ అక్షరుడనియు చెప్పబడినది. క్షరాక్షరులుగానున్న ఆత్మ, జీవాత్మలు రెండు ఒక శరీరములోనే నివశిస్తున్నవి. ఆత్మలేకుండ జీవాత్మకాని, జీవాత్మలేకుండ ఆత్మగాని ఉండవు. అందువలన ఆత్మను శ్లోకములో కూటస్థుడన్నారు.
ఈ శ్లోకము వరకు భగవద్గీతలో ఎక్కడగాని ఆత్మ, జీవాత్మల విభజన చేసి చెప్పలేదు. ప్రత్యేకించి ఈ శ్లోకములోనే ఆత్మ, జీవాత్మల విభజనను శాస్త్రబద్దముగ భగవంతుడు తెలియజేశాడు. ఈ శ్లోకము భగవద్గీతలో ఎంతో కీలకమైనది కాగ, చాలామంది ఈ శ్లోకములోని భావమునే అవగాహన చేసుకోలేక పోయారు. క్షర పురుషుడని చెప్పిన జీవాత్మను స్త్రీతత్త్వమైన శరీరముతో పోల్చుకొని అర్థము చెప్పుకోవడము జరిగినది. అందువలన గీతకు ముఖ్య ఆధారమైన ఈ అధ్యాయములోని 16,17 శ్లోకములు పూర్తి అర్థశూణ్యమైపోయినవి. గుణత్రయవిభాగ యోగములో మూడవ శ్లోకములో ప్రకృతి స్త్రీ అనియు, దానికి నేను బీజదాతనైన పురుషుడనని తెలియ చెప్పగ ప్రకృతి సంబంధ శరీరముగా జీవాత్మను పోల్చడము చాలాతప్పు. ఈ శ్లోకములో క్షరుడు అక్షరుడని ఇద్దరు పురుషులైన జీవాత్మ, ఆత్మను తెలిపి, తర్వాత శ్లోకములో ఇద్దరి పురుషులకంటే ఉత్తమమైన పురుషుడున్నాడని, వానినే పురుషోత్తముడనుచున్నామని కూడ చెప్పాడు. ఇక్కడ ముగ్గురు పురుషులను తెలియజేసి "త్రైతసిద్ధాoతమును" శాస్త్రపద్ధతిలో భగవంతుడు తెలిపాడు. భగవంతుని మాటను త్రోసివేసి ప్రకృతితో కూడుకొన్న శరీరమును క్షరపురుషుడని చెప్పినవారు, దేవుని భావమునకు పూర్తి వ్యతిరేఖముగ చెప్పినవారగుదురు. దాని వలన పెద్దపాపమే వస్తుంది. ఇప్పటికైన చాలామంది పొరబడి వ్రాసిన వ్రాతలను వదలివేసి, సరియైన పద్ధతిలో దేవుని భావము ప్రకారము మూడు ఆత్మల త్రైతమును తెలుసుకొందాము. 16వ శ్లోకములో జీవాత్మ , ఆత్మల వివరము చెప్పిన భగవంతుడు 17వ శ్లోకములో మూడవ ఆత్మను గురించి ఏమి చెప్పుచున్నాడో గమనిస్తాము.
శ్లోకం 17 :ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః|
యో లోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః||
(పరమాత్మ)
భావము : ఉత్తముడగు పురుషుడు అన్యమైనవాడొకడున్నాడు. వాడే పరమాత్మయని చెప్పబడుచున్నాడు. అతడే ముల్లోకములను ఆవహించి అవ్యయుడై, అధిపతియై, భర్తయై ఉన్నాడు.
వివరము : విశ్వమునంతటిని భరించు భర్తయైనవాడు, ప్రపంచము, జగత్తు రెండు నాశనమైనప్పటికి నాశనము కానివాడు, అన్నిటికి అందరికి అధిపతియైనవాడు, జీవాత్మ ఆత్మలకు వేరుగ ఉన్నవాడు అయిన వానికి ఆత్మ జీవాత్మలవలె పేరులేదు. పేరేకాదు, రూపము కూడ లేదు. ఆకారముగాని, పేరుగాని లేనివానిని ఏమని పిలువాలో అర్థముకాక చివరకు ఒక మార్గమును అన్వేషించినవారు ఆయన ఏ పద్ధతిలో ఉన్నాడో, ఆ పద్ధతి కలవాడని చెప్పను మొదలు పెట్టారు. జీవాత్మ ఆత్మలు ఇద్దరు పురుషులే అన్నాము కదా! ఇద్దరికంటే ఉత్తమునిగా నున్నవాడు గనుక "పురుశోత్తమ"అనడము జరిగినది.
అంతేకాక ఆత్మకంటే వేరుగ ఉన్నవాడు గనుక "పరమాత్మ" అని కూడ చెప్పడము జరిగినది. పర అనగా వేరు అని అర్థము. ఆత్మకంటే పరముగానున్నాడు కావున పరమాత్మ అనడము జరిగినది. పరమాత్మ అనిన పురుశోత్తమ అనిన అవి పేర్లు కాదు. ఆయనున్న విధానమును తెలుపు అర్థముతో కూడుకొన్న గుర్తింపు పదములని తెలియాలి. అలాగే ఈ శ్లోకములో చెప్పబడిన భర్త, అవ్యయ, ఈశ్వర అను పదములు అర్థముతో కూడుకొని దేవుని విధానమును తెలుపునవని గ్రహించాలి. అందరు చెప్పుకొను దేవుడు అను పదము కూడ అలాంటిదే. దేవుని పిలుచు ఏ పదముగాని అలాగే ఉండునని తెలియవలెను.
పరమాత్మ అని పిలువబడువాడు జీవాత్మ ఆత్మలకంటే అన్యముగ ఉన్నవాడై, ఇంకా ఎలాగున్నాడనగా! జీవాత్మ ఆత్మలున్న దానికంటే అధికముగ, అన్యముగా ఉన్నాడని తెలియుచున్నది. జీవాత్మ ఒక శరీరములో ఆత్మ మొదటి స్థానమైన తలలో ఒక్కచోట మాత్రమున్నది. ఆత్మ మాత్రము ఏడు భాగములుగ ఉంటూ శరీరమంత తన శక్తిని వ్యాపింపచేసి శరీర మంతయు నఖశిఖ పర్యంతము గలదు. దీనిని బట్టి ఆత్మ వ్యాపించని శరీర భాగము లేదని తెలియుచున్నది. ఆత్మ శరీరములో అణువణువున ఉంటూ శరీరమునంతటిని చైతన్యము చేసి కదలునట్లు చేయుచున్నది. ఆత్మ వ్యాపించని శరీరభాగముంటే అది కదలదు. ఆరోగ్యముగ ఉండదు. ఆత్మ వ్యాపించని శరీర భాగమున్న వారిని నష్ఠాత్ములనవచ్చును. సర్వసాధారణముగ శరీరమంత ఆత్మ వ్యాపించియుండగ, జీవాత్మ మాత్రము శరీరమంతలేక ఒక చోట మాత్రమున్నది. శరీరమంత వ్యాపించిన ఆత్మ ఒక్క జీవాత్మలో మాత్రము లేదు. జీవాత్మ వేరు ఆత్మ వేరుగ ఉన్నవి, కావున ఆత్మ, జీవాత్మ మినహా శరీరమంత గలదు. ఒక్కచోటున్న జీవాత్మను శరీరమంత వ్యాపించిన ఆత్మను సృష్టించిన పరమాత్మ మాత్రము ఇక్కడ లేదనకుండునట్లు అంతట వ్యాపించినది. అంతట అనగా ఆత్మలేని జీవాత్మలో కూడ కలదు. ఆత్మవ్యాపించిన శరీరమంతట కూడ విస్తరించియున్నది. శరీరములోపలే కాక శరీరము బయట అణువణువున ఉన్నది ఒక పరమాత్మేనని తెలియవలెను. ఆత్మ శరీరము లోపల మాత్రమే ఉండి, శరీరము బయట లేదు. శరీరమంతట లేకుండ ఒక్కచోటున్న జీవాత్మలోను, జీవాత్మలో లేకుండ శరీరమంతట ఉన్న ఆత్మలోను, జీవాత్మ ఆత్మలు లేని ప్రకృతిలోను, ప్రతి అణువులోను వ్యాపించినది ఒకే ఒక పరమాత్మ. అందువలన పరమాత్మను సర్వవ్యాపి అన్నారు. జీవాత్మ ఆత్మలను తయారుచేసిన పరమాత్మ ఆ రెండు ఆత్మలకంటే ఉత్తమునిగ ఉంటూ పురుషోత్తమ అని గుర్తింపు పొందడమే కాక, రెండు ఆత్మలయందు కూడ వ్యాపించి ఆ రెండిటికి అధిపతిగ ఉన్నాడు. కావున ఆ పురుషోత్తమున్ని ఈశ్వరుడని కూడ పిలువడము జరిగినది. రెండు ఆత్మలకు వాటి ఉణికికి కారణమైన వాటిని పోషిస్తున్నాడు కావున భర్త అనియు, జగద్భర్త అనియు పొగడబడుచున్నాడు.
ఇక్కడున్న 16,17 శ్లోకములు రెండు కేవలము మూడు ఆత్మల వివరమును మాత్రమే తెలియజేశాయి. అందువలన ఈ రెండు శ్లోకములు భగవద్గీతలో అత్యంత ప్రాముఖ్యమైనవని చెప్పుచున్నాము. జగత్తులో బ్రహ్మవిద్యకు మూలకారణమైన మూడు ఆత్మల వివరము ఇక్కడే గలదు. ఈ మూడు ఆత్మలు గల రెండు శ్లోకములు అర్థమైతేనే మిగతా భగవద్గీత శ్లోకములన్ని అర్థముకాగలవు. ఈ శ్లోకములు అర్థము గానిది ఇటు ఆస్తికవాదులకుగాని, అటు హేతువాదులకుగాని గీత అర్థముగాదు. దేవుడున్నాడను చెప్పు ఆస్తికులకుగాని, దేవుడెట్లున్నాడని వాదించు హేతువాదులకు గాని, దేవుని వాస్తవికత తెలియకపోవడానికి ప్రధాన కారణము త్రైతమైన మూడు ఆత్మలు తెలియకపోవడమేనని తెలియవలెను.
గమనిక: చాలమంది వ్రాసిన గీతలలో ముగ్గురు పురుషుల విభజన అర్థము కాక ప్రకృతితో కూడిన శరీరమును క్షరుడని , జీవుడు అక్షరుడని, దేవుడు పురుషోత్తముడని చెప్పుకొన్నారు. ప్రకృతిని భాగముగ కలుపుకోవడము తప్పుగ తెలుసుకోవాలి . ఇక్కడ చె ప్పినది కేవలము పురుషునికనియే తెలియాలి .
శ్లోకం 18: యస్మాత్ క్షర మతీతోఽహ మక్షరాదపి చో త్తమః ।
అతోఽస్మిలోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||
(పరమాత్మ)
భావము : క్షరునికంటే అతీతుడను, అక్షరునికంటే ఉత్తముడను అయినందువలన లోకమునందు వేదములలో నేను పురుషోత్తముడనని ప్రసిద్ధిగాంచివున్నాను.
వివరము : పరమాత్మ క్షరపురుషునికంటే అధికుడు, అక్షరపురుషునికంటే ఉత్తముడు అయి ఉన్నందువలన పురుషోత్తముడని పిలువబడుచున్నాడు. ఆత్మకంటే పరాయి వాడైనందువలన అనగ ఆత్మకంటే వేరైనవాడగుట వలన పరమాత్మయని పిలువబడు వాడు, ఇక్కడ క్షర అక్షరు లైన ఇద్దరి పురుషులకంటే ఉత్తముడగుటవలన పురుషోత్తమ అనికూడ పిలువబడుచున్నాడు. ఈ ప్రపంచములో ఏదైతే పెద్ద శక్తియో, ఈ ప్రపంచమును ఎవడైతే పుట్టించి పాలించుచున్నాడో, ఈ ప్రపంచములో దేవతలకంతా దేవుడై సర్వలోకములకధిపతియై ఎవడైతే ఉన్నాడో, ఈ ప్రపంచమంత ఒక్క అణువు కూడ వదలక అంతట వ్యాపించి అన్నిటికి మృత్యువు ఎవరై ఉన్నాడో, ఆ ఏకైక శక్తియే పేరులేనివాడు మరియు రూపములేనివాడు. ఇప్పుడు ఇక్కడ పురుషోత్తము డని, పరమాత్మయని పిలువబడువాడే సృష్ఠి, స్థితి, లయ కారణకర్తయై ఉన్నాడు. వానికి పేరులేదని చెప్పి పరమాత్మ, పురుషోత్తమ అంటున్నారే అనుకోవద్దండి. అవి పేర్లుకావు. ఆయనకు పేరు పెట్టడానికి వీలులేదు. అందువలన ఆయనకున్నవి పేర్లుకావని, ఇతరులతో పోల్చి పిలువడములోని పోలికలే పరమాత్మ అనుట మరియు పురుషోత్తమ అనుట అని తెలియాలి. శరీరములోని ఆత్మతో పోల్చి ఆత్మకంటే వేరైన దానివలన పరమాత్మ అని అంటున్నాము. పరమాత్మ అనుటలో ఆత్మకంటే పరముగా (వేరుగా) ఉన్నవాడని అర్థము కలదు. అట్లే పురుషులతో పోల్చి చెప్పినపుడు పురుషోత్తమ అన్నారు. పురుషోత్తమ అనుటలో ఉన్న ఇద్దరి పురుషులలో ఉత్తమమైనవాడు అని అర్థము కలదు. ఇతరులతో పోల్చి చెప్పుకోవడమే కాని అవి పేర్లు కావని గ్రహించవలెను. పదిమంది నల్లవారిలో ఒక తెల్లవాడున్నప్పుడు వానిని తెల్లోడు అంటాము. తెల్లోడు అనుమాట ఇతరులతో పోల్చు పోలిక కాని అది పేరు కాదు కదా! అట్లే క్షరాక్షరులతో పోల్చు పోలికలే పరమాత్మ, పురుషోత్తమ అనుమాటలు, నిజముగ ఆయనకు పేరుగాని ఆకారముగాని లేవు.
శ్లోకం 19: యో మా మేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ ।
స సర్వవి ద్భజతి మాం సర్వభావేన భారత ! ||
(పరమాత్మ)
భావము : ఎవడు అజ్ఞానరహితుడై జ్ఞానసహితుడై పురుషోత్తమునిగా నన్ను ఎరింగిన వాడై, ఉన్నాడో, వాడు సర్వము తెలిసినవాడై అన్ని భావములతో నన్ను ఆరాధించిన వాడగుచున్నాడు.
వివరము : ఎవడైతే పూర్ణస్థాయి జ్ఞానము తెలుసుకొంటున్నాడో, వాడు పురుషోత్తముడైన పరమాత్మను క్షర అక్షరులకంటే వేరుగ చూస్తున్నాడు. క్షర అక్షరులను శరీరమందే చూస్తు, పరమాత్మ అంతట ఉన్నట్లు తెలియుచున్నాడు. పరమాత్మ యొక్క నిజ స్వరూపమును అర్థము చేసుకోగల్గుచున్నాడు. సర్వవిధముల పరమాత్మను అర్థము చేసుకొన్న వానిని సర్వజ్ఞుడని చెప్పవచ్ఛును. వాడు పరమాత్మను సర్వవిధముల ఆరాధించినవాడగుచున్నాడు.
శ్లోకం 20: ఇతి గుహ్యతమం శాస్త్ర మిద ముక్తం మయాఽనఘ! ।
ఏత ద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యా త్కృతకృత్యశ్చ భారత ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : ఈ ప్రకారముగ మిగుల రహస్యమైన శాస్త్రము నీకు నేను చెప్పితిని. దీనిని తెలుసుకొన్నవాడు బుద్ధిమంతుడును, కృతకృత్యుడగును.
వివరము : ఈ అధ్యాయములో చివరిదైన ఈ శ్లోకములో రహస్యమైన శాస్త్రము నాచే నీకు చెప్పబడినదని చెప్పారు. రహస్యమైనదనగా ఎవరికి తెలియనిదని అర్ధము. ఇదివరకు తెలియబడని విషయమేమనగా! ఒకే పురుషుడు మూడుగ విభజంపబడివుండడము, మరియు ఆ ముగ్గురు ఎవరనుట. ఈ విషయములో భగవంతుడు రహస్యమనినట్లే గొప్పగ తెలిసినవారు కూడ ముగ్గురిని తెలియలేక, ఒకరి స్థానములో ప్రకృతిని వాటి శరీరములను పెట్టుకొన్నారు. వేరు వేరైన ప్రకృతి పురుషులలో ఒక్క పురుషునికి సంబంధించిన విషయమిది అని తెలియక, పురుషునికి విభిన్నముగనున్న ప్రకృతిని ఆ స్థానములో పెట్టుకొన్నారు. దీనివలన ఈ విషయము ఎవరికి అర్ధము కాలేదనుటకు నిదర్శనమైనది. ఇది రహస్యమైనదని భగవంతుడు చెప్పుటవలన మనకు తెలియని రహస్యమేదో ఇందులో కలదని పరిశీలించి చూడవలసిన అవసరమున్నది.
ఇంతేకాక ఇది శాస్త్రబద్ధమైన విషయమని కూడ చెప్పబడివున్నది. అనగా ఇది శాసనరూపమైనదని, ఇందులో చెప్పిన విషయము తూచ తప్పక జరుగు విషయములు మరియు ఉన్న విషయములని తెలియాలి. శాస్త్రబద్ధమైన లెక్కాచారములతో కూడుకొని ఉన్న బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల వివరము, వాటి పెంపకమైన అశ్వర్ధవృక్షము యొక్క నిజస్వరూపమునుగాంచలేక సంసార వృక్షమని ఊహించు కోవడము శాస్త్రబద్ధతను చాటి చెప్పలేదు. ఇన్ని సంవత్సరములని జగతి సృష్టిని తెలియజేయు బ్రహ్మచక్రము, ఇంతకాలము మానవ జీవితమని తెలియజేయు కాలచక్రము, ఇంతే కష్టము ఇంతే సుఖమని తెలియజేయు కర్మచక్రము, ఇవే గుణములని తెలియజేయు గుణచక్రము అశ్వర్ధమూలమై ఉన్నవని శాస్త్రబద్ధముగ తెలిసినవాడు బుద్ధిమంతుడగును, కృతకృత్యుడగునని చివరి శ్లోకములో తెలియజేశారు. అందువలన మనము దేనిని చదువుచున్నప్పుడైన అందులో ముఖ్యముగ శాస్త్రీయత గమనించవలయును. శాస్త్రీయత లేని విషయము అగ్నిలేని వంటలాంటిది. హేతువాదుల ప్రశ్నలకు నిలువదు.
---------------------------------------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత: పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్రీ భగవంతుడిట్లనియె:-
శ్లోకం 1: ఊర్ధ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్॥
(ప్రకృతి, పురుషుడు)
భావము : పైకి వేర్లు క్రిందికి కొమ్మలు గల అశ్వర్థమనే వృక్షము అవ్యయమైనదని, వేదములు ఆకులుగ ఉన్నవని ఎవడు తెలియునో వాడు వేదములు తెలిసినవాడని చెప్పవచ్చును.
శ్లోకం 2: అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।
అధశ్చ మూలా న్యనుసన్త తాని కర్మానుబన్ధీని మనుష్యలోకే॥
(ప్రకృతి, పురుషుడు)
భావము : ఆ అశ్వర్ధమను వృక్షము యొక్క శాఖలు గుణ విషయములచే వృద్ధి అయినవై అనేక దిశలకు వ్యాపించి ఉన్నవి. మరియు దాని వేర్లు విస్తరించినవై మనుష్య లోకమున వ్యాపించినవి.
శ్లోకం 3: న రూప మస్యేహ తథోపలభ్యతే నాన్తో న చాది ర్నచ సమ్ప్రతి ష్ఠా ।
అశ్వత్థ మేనం సువిరూఢమూల మసంగ శస్త్రేణ దృఢేన ఛిత్వా ||
(ప్రకృతి, పురుషుడు)
భావము : అశ్వర్థవృక్షము యొక్క రూపముగాని, దాని మొదలుగాని, చివరగాని ఉన్న స్థితియుగాని తెలియబడడములేదు. దృఢమైన మూలముగల ఈ వృక్షమును అసంగశస్త్రముచే నరుకవలెను.
శ్లోకం 4: తతః పదం త త్ప రిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తన్తి భూయః|
తమేవ చాఽద్యం పురుషం ప్రపద్యేయతః ప్రవృత్తిః ప్రసృతాపురాణీ ||
(పరమాత్మ)
భావము: ఏ పదమును పొందిన తరువాత తిరిగి జన్మించరో దానిని తెలియవలెను. ఈ ప్రకృతి జీవరాసులన్ని ఎవరి వలన పుట్టి వ్యాపించియున్నవో అట్టి పురాణ పురుషుని శరణువేడవలెను.
శ్లోకం 5: నిర్మానమోహా జితసంగదోషా అధ్యాత్మ నిత్యా వినివృత్తకామాః|
ద్వన్ద్వైర్విముక్తాస్సుఖదుఃఖసంజ్ఞైర్గచ్ఛన్త్యమూఢాః పద మవ్యయం తత్||
(పరమాత్మ)
భావము: మాన, మోహములను వీడిన వారు, ప్రపంచ విషయములతో సంగమించుట వలన కల్గు కర్మను లేకుండ చేసుకొన్నవారు, నిత్యము ఆత్మ చింతన చేయువారు, ఆశలను లేకుండ చేసినవారు, సుఖదుఃఖములకు కారణమగు పాపపుణ్యములనుండి బయట పడిన వారు అయిన జ్ఞానులు, నాశనములేని పరమపదమును పొందుచున్నారు.
శ్లోకం 6: న త ద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః|
య ద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ||
(పరమాత్మ)
భావము:దానిని సూర్యుడు కాని, చంద్రుడు కాని , అగ్ని కాని ప్రకాశింప చేయలేరు. దేనిని పొందిన తిరిగి జన్మించరో అదే నా పరంధామము.
శ్లోకం 7: మమై వాంశో జీవలోకే జీవభూత స్సనాతనః|
మనష్షష్టా ణీన్ద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి||
(పరమాత్మ)
భావము: బ్రతికివున్న జీవరాసులలో జీవాత్మ నా అంశమై, ప్రకృతి సంబంధమైన ఇంద్రియములలో ఆరవదైన మనస్సును ఆకర్షించుచున్నది.
శ్లోకం 8: శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్క్రామ తీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధాని వాశయాత్||
(ఆత్మ, ప్రకృతి)
భావము : ఆత్మ శరీరమును వదిలి ఎప్పుడు పోవుచున్నదో, పోయి ఎక్కడ ప్రవేశిస్తున్నదో,అక్కడికి వాయువు వాసనను తీసుకుపోయినట్లు ఆత్మ గుణములను కూడ తీసుకొని పోవుచున్నది.
శ్లోకం 9: శ్రోత్రం చక్షు స్స్పర్శనం చ రసనం ఘ్రాణ మేవ చ|
అధిష్ఠాయ మన శ్చాయం విషయానుపసేవతే||
(జీవాత్మ)
భావము : చెవులు,కన్నులు, చర్మము, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియములను మరియు మనస్సును అధిష్ఠించి వాటి విషయములను అనుభవిస్తు జీవాత్మ శరీరమందున్నాడు.
శ్లోకం 10: ఉత్క్రామన్తం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్|
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః||
(జీవాత్మ)
భావము : దేహము అంతమై దానిని వదిలిపోవునపుడు, దేహములో ఉన్నపుడు, గుణముల అనుభవములను పొందుచున్నప్పుడు, ఆ జీవుడెలానున్నది జ్ఞానులు జ్ఞాననేత్రముచే చూడగలరు. అజ్ఞానులు చూడలేరు.
శ్లోకం 11:యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|
యతన్తోఽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః||
(ఆత్మ)
భావము : ప్రయత్నము చేయు యోగులు దేహామందున్న ఆత్మను చూడగలరు. అచేతస్కులు, అకృతాత్ములు ఎంత ప్రయత్నించినను ఆత్మను తెలియలేరు.
శ్లోకం 12: య దాదిత్యగతం తేజో జగ ద్భాసయతేఽఖిలమ్|
యచ్చన్ద్రమసి య చ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్||
(పరమాత్మ)
భావము : సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యునిలో ఉండు తేజస్సు, చంద్రునికున్న తేజస్సు, అగ్నికున్న తేజస్సు నా యొక్క తేజస్సేనని తెలియవలెను.
శ్లోకం 13:గా మావిశ్య చ భూతాని ధారయా మ్యహ మోజసా|
పుష్ణామి చౌషధీ స్సర్వాస్సోమో భూత్వా రసాత్మకః||
(పరమాత్మ)
భావము : భూమియందుండి నా బలము చేత సమస్త జీవరాసులను నేనే ధరించుచున్నాను. రసమయుడైన చంద్రునిగా ఉంటు సమస్త ఔషధులను పోషించుచున్నాను.
శ్లోకం 14 : అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచా మ్యన్నం చతుర్విధమ్||
(ఆత్మ)
భావము : నేను సకల జీవుల శరీరములందు వైశ్వానరుడను అగ్నిగ ఉండి, ప్రాణ అపాన వాయువులచేత మండుచు, నాల్గు విధములగు ఆహారములను పచనము చేయుచున్నాను.
శ్లోకం 15: సర్వస్య చాహం హృది సన్నివిష్టోమత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ|
వే దైశ్చ సర్వైరహమేవ వేద్యోవేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ||
(ఆత్మ)
భావము : సర్వజీవరాసుల హృదయ స్థానములో నేనున్నాను. స్మృతి, ఙ్ఞానము, ఊహ దాని మరుపు నా వలననే కల్గుచున్నవి. వేదవేదాంతములు నన్నే తెల్పుచున్నవి. వేదముల తెలిసినవాడను నేనే.
శ్లోకం 16: ద్వా విమౌ పురుషౌ లోకే క్షర శ్చాక్షర ఏవచ|
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే||
(ఆత్మ, జీవాత్మ)
భావము : లోకములో రెండు రకముల పురుషులు కలరు. వారు క్షరుడనియు,అక్షరుడనియు చెప్పబడుచున్నారు. క్షరుడు సర్వభూతములందు కలడు. క్షరునితో కూటస్తునిగనున్న వాడు అక్షరుడని చెప్పుచున్నారు.
శ్లోకం 17 :ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః|
యో లోకత్రయ మావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః||
(పరమాత్మ)
భావము : ఉత్తముడగు పురుషుడు అన్యమైనవాడొకడున్నాడు. వాడే పరమాత్మయని చెప్పబడుచున్నాడు. అతడే ముల్లోకములను ఆవహించి అవ్యయుడై, అధిపతియై, భర్తయై ఉన్నాడు.
శ్లోకం 18: యస్మాత్ క్షర మతీతోఽహ మక్షరాదపి చో త్తమః ।
అతోఽస్మిలోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||
(పరమాత్మ)
భావము : క్షరునికంటే అతీతుడను, అక్షరునికంటే ఉత్తముడను అయినందువలన లోకమునందు వేదములలో నేను పురుషోత్తముడనని ప్రసిద్ధిగాంచివున్నాను.
శ్లోకం 19: యో మా మేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ ।
స సర్వవి ద్భజతి మాం సర్వభావేన భారత ! ||
(పరమాత్మ)
భావము : ఎవడు అజ్ఞానరహితుడై జ్ఞానసహితుడై పురుషోత్తమునిగా నన్ను ఎరింగిన వాడై, ఉన్నాడో, వాడు సర్వము తెలిసినవాడై అన్ని భావములతో నన్ను ఆరాధించిన వాడగుచున్నాడు.
శ్లోకం 20: ఇతి గుహ్యతమం శాస్త్ర మిద ముక్తం మయాఽనఘ! ।
ఏత ద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యా త్కృతకృత్యశ్చ భారత ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : ఈ ప్రకారముగ మిగుల రహస్యమైన శాస్త్రము నీకు నేను చెప్పితిని. దీనిని తెలుసుకొన్నవాడు బుద్ధిమంతుడును, కృతకృత్యుడగును.