PSS book: తల్లి తండ్రి book audio draft 31stJan24 12:22pm

                                        తల్లి తండ్రి


తల్లి తండ్రి అను మాటను తెలియనివాడే లేడనుకుంటాను. అయితే తల్లి తండ్రి అంటే ఎవరో తెలిసినవారెందరు
అని ప్రశ్న వస్తే నా దృష్టిలో జవాబు కొంచెము కష్టముగా ఉంటుంది. ఇదేమి ప్రశ్న? తల్లి తండ్రిని తెలియని
వారుంటారా? అని చాలామంది అనవచ్చును. ఇక్కడే మనకు తెలియని విషయమెంతో ఉన్నదని చెప్పుచున్నాము.
ఇంతవరకు మనుషులకు ఎంత తెలిసిందో, తెలియనిది ఎంత ఉందో వివరించుకొంటే, మనిషికి తెలిసిన దానికంటే
తెలియనిదే ఎంతో ఉన్నదని చెప్పవచ్చును. మనకు ఇంతవరకు తెలిసిన దానిని గురించి చెప్పుకొందాము. ఒక మనిషి
పుట్టాడు అంటే అతనికి తల్లి తండ్రి తప్పక ఉండవలసిందే. విజ్ఞానము ప్రకారము ఒక స్త్రీ గర్భాశయములోని అండము
అనబడు రజోకణముతో, పురుషుని యొక్క వీర్యకణము కలిసినపుడు స్త్రీకి గర్భము ఏర్పడి, ఆ గర్భములో శిశువు
తొమ్మిది నెలలు పెరిగి, పదవ నెలలో ప్రసవింపబడునని విజ్ఞానులు, భౌతిక శాస్త్రవేత్తలు చెప్పుచుందురు. అలా
పుట్టబడిన శిశువుకు అతనిని ప్రసవించిన స్త్రీ తల్లియనీ, ఆ స్త్రీ గర్భమునకు వీర్యకణమును అందించిన పురుషున్ని
తండ్రియనీ అనడము జరుగుచున్నది. ఇది ప్రపంచమునకు తెలిసిన సత్యము. సమాజములో ఒక స్త్రీ భార్యగా
ఉండగా, భర్తగా పురుషుడు ఉన్నాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ భార్యాభర్తలుగా ఉంటూ, వారికి కల్గిన సంతానమునకు
తల్లి తండ్రులుగా వ్యవహరిస్తున్నారు.

సమాజములో ఏ మనిషినైనా నీ తల్లి తండ్రులు ఎవరు అని ప్రశ్నించితే, అతను తడబడకుండా తన తల్లి తండ్రి
పేర్లను చెప్పును. ఏ అప్లికేషన్‌ ఫారమ్‌లో అయినా పేరెంట్స్‌ అని ఉన్నచోట ఒక స్త్రీ పేరును తల్లి స్థానములో, ఒక
పురుషుని పేరును తండ్రి స్థానములో వ్రాయును. తల్లి తండ్రులు సజీవముగా ఉండినా, లేక చనిపోయి చాలాకాలమైనా,
మనిషి తన తల్లి తండ్రుల పేర్లనే చెప్పును. కానీ తల్లి తండ్రుల విషయములో ఏమాత్రము పొరపాటు పడడు. మనిషి
చనిపోవు వరకు తన తల్లి పేరును గానీ, తండ్రి పేరును గానీ మరచిపోడు. ప్రపంచములో ప్రతి మనిషికీ దగ్గర
సంబంధమున్నవారు తల్లి తండ్రులే. ఒక మనిషి కష్టాల్లో చిక్కు కున్నప్పుడు గానీ, ప్రమాదమునకు గురియైనపుడుగానీ,
చనిపోయినపుడు గానీ అతనిని గురించి అందరికంటే ఎక్కువగా బాధపడువారు తల్లితండ్రులే నని చెప్పవచ్చును. వీడు
మా కొడుకు అని తల్లి తండ్రులకున్నంత ప్రేమ, వీరు నా తల్లి తండ్రులని కుమారునికి ఉండును. ఇది ఎల్లప్పుడూ
ప్రపంచములో ఉండే పద్ధతి. ఈ పద్ధతి ఏ జ్ఞానములేని మనిషికైనా ఉండును. అన్ని విషయములలో తెలివి తక్కువవాడైనా
తల్లితండ్రులను గుర్తించగలడు, వారిని మరిచిపోడు. ఈ విధముగా ప్రపంచములో తల్లి తండ్రులకు వారి సంతానమునకు
అనుబంధము ఏర్పడివున్నది. ఈ బంధమును ఎవరూ తుంచివేయలేరు.

బయట సమాజములో ఇంకా కొందరు తల్లి తండ్రులను చాలా పూజ్య భావముతో చూస్తున్నారు. తల్లి తండ్రులను
దైవముగా భావించి పూజించువారు కూడా ఉన్నారు. వారి లెక్క ప్రకారము పూజింపదగిన వారిలో మొదటిది తల్లియనీ,
రెండవవాడు తండ్రియనీ, మూడవ వాడు గురువుయనీ, నాల్గోవాడు దేవుడనీ చెప్పుచుందురు. అటువంటి వారి భావములో
తండ్రికంటే తల్లి పూజ్యమైనదనీ, తల్లి తండ్రి తర్వాత గురువనీ, గురువు తర్వాత దేవుడని చెప్పుచుందురు. చూచారా
వీరి లెక్కలో దేవుడే చివరివాడై పోయాడు. మరికొందరు మాతృదేవో భవః, పితృదేవో భవః, ఆచార్య దేవోభవః అని
అంటూ చివరికి దేవున్ని పూర్తిగా వదలివేశారు. ఈ ముగ్గురిని పూజిస్తే చాలు అంటున్నారు. కొందరైతే తల్లి తండ్రులను
మించిన దైవములేదు అని ఉదయము లేస్తూనే తల్లి తండ్రుల పాదములకు నమస్కరించు వారు కూడా కొందరు
కలరు. ఈ విధముగా తల్లి తండ్రులను వారు సమాజములో ప్రత్యేక స్థానములో ఉండినా, కొందరి దృష్టిలో మాత్రము
దైవ సమానులుగా ఉన్నారు.

--
తల్లి తండ్రి పవిత్ర భావముతోనున్న వారైనా కొందరిలో ఆ పవిత్రత లేకుండా పోవుచున్నది. తల్లి తండ్రులు
తమ పిల్లల ఎడల అతి కిరాతకముగా ప్రవర్తించు వారూ కలరు. అదే విధముగా తల్లి తండ్రులు మంచివారైనా వారి
పిల్లలు తల్లి తండ్రుల ఎడల అమిత దుర్మార్గముగా ప్రవర్తించువారూ కలరు. పిల్లలు మంచివారైనా తల్లి తండ్రులు
పిల్లల ఎడల కిరాతకముగా ప్రవర్తించువారు బహు అరుదుగా ఉందురు. కానీ తల్లి తండ్రులు మంచివారైనా పిల్లలు
వారి ఎడల దుర్మార్గులుగా ప్రవర్తించువారు చాలామంది ఉన్నారని చెప్పవచ్చును. తల్లి తండ్రులు పిల్లలను ఎంతో
ప్రేమతో పెంచడము ప్రకృతి సిద్ధమని చెప్పవచ్చును. తమకున్న దానిలో తమ పిల్లలను మంచిగా పెంచి, విద్యాబుద్దులు
చెప్పించి సమాజములో గౌరవముగా బ్రతకవలెనని ప్రతి తల్లితండ్రి అనుకుంటారు. అలాగే శ్రమించి తాము తినకున్నా
తమ పిల్లలు తినాలి అని చూస్తారు. అలా ఎంతో కష్టపడి పిల్లలను పెద్ద చేసిన తర్వాత ఆ పిల్లలు తమ తల్లితండ్రులనే
మోసము చేయుచూ, తమ సుఖమును చూచుకొనువారు చాలామంది సమాజములో కలరు. తల్లి తండ్రుల మీద
ప్రేమలేకున్నా ఫరవాలేదుగానీ, యుక్తవయస్సు వచ్చు వరకు తమను ఏ లోటు లేకుండా సాకినందుకు బదులుగా తల్లి
తండ్రులను పోషించవలసిన బాధ్యత పిల్లలకుంటుంది. అటువంటి బాధ్యతను మరచి పోవడము ప్రపంచ పద్ధతిలో
అన్యాయమగును. బయట సమాజమునకు సంబంధించిన నీతి న్యాయము ప్రకారము చూస్తే వయస్సు మీదపడి
తమంతకు తాము బ్రతకలేని తల్లి తండ్రులను పోషించకపోవడమూ, వారి మంచిచెడులను చూడకపోవడమూ అక్రమమూ,
అన్యాయమగును. తల్లి తండ్రులు చెడువారైనా వారిని పోషించడము సమాజములో వారి సంతానము యొక్క బాధ్యత.
ఇంతవరకు బయటి సమాజ సంబంధమైన విధానమును చెప్పుకొన్నాము. ఇకపోతే ఆధ్యాత్మిక సంబంధమైన విధానము
ప్రకారము చెప్పుకొంటే ఈ విధముగా కలదు.

తల్లి తండ్రి అనువారు రెండు రకములుగా ప్రతి మనిషికి కలరు. రెండు రకముల తల్లి తండ్రులేమిటి?
అందరికి ఉన్నది ఒకే తల్లి ఒకే తండ్రి కదా! అని ఎవరైనా అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! వివరముగా
చెప్పుకొంటే ప్రకృతి విధానములోనున్న తల్లి తండ్రులు వేరు, పరమాత్మ విధానములోనున్న తల్లి తండ్రులు వేరు.
బయట సమాజ సంబంధము ప్రకారము కనిపించు తల్లి తండ్రులు ప్రకృతి విధానములోని వారు. అలాగే అంతర్గత
ఆధ్యాత్మికమునకు సంబంధించిన కనిపించని తల్లి తండ్రులు వేరని చెప్పవచ్చును. వాస్తవానికి ప్రతి ఒక్కరికీ కనిపించెడి
మరియు కనిపించని రెండు రకముల తల్లి తండ్రులున్నారని చెప్పవచ్చును. ఆధ్యాత్మికమును తెలిసినవారు రెండు
రకముల తల్లి తండ్రులను తెలిసి యుందురు. ఆధ్యాత్మికము తెలియనివారు కనిపించే తల్లి తండ్రులను మాత్రమే
తెలిసివుందురు. ఆధ్యాత్మికము, అనాధ్యాత్మికము అంటే మీకు అర్థము కాకపోవచ్చు. అందువలన అర్ధమయ్యే పద్ధతిలో
చెప్పుకొందాము. ప్రతి మనిషికి ఒక జీవితము కలదని అందరికి తెలుసు. జీవితము అనునది పుట్టుకతో ప్రారంభమై,
మరణముతో ముగియుచున్నది. పుట్టుకనుండి చావు వరకు గడచిన కాలమును ఒక జీవిత కాలము అంటున్నాము.
పుట్టుకలో కొత్త శరీరము వస్తున్నది, మరణములో అంతవరకున్న శరీరము పోవుచున్నది. ఒకప్పుడు క్రొత్త శరీరము
వచ్చినా, తర్వాత మరణములో పాతశరీరము పోయినా, శరీరములో నివసించు జీవుడు మాత్రము అలాగే ఉన్నాడు.
దీనినిబట్టి జీవితములో జీవుడు శాశ్వితమైనవాడనీ శరీరము అశాశ్వితమనీ తెలిసిపోవుచున్నది. సజీవముగానున్న ఒక
మనిషిని విభజించి చూస్తే, జీవుడు వేరనీ, శరీరము వేరనీ తెలియుచున్నది. జీవుడు+శరీరము = ఒక మనిషి, దీనిని
ఎవరూ కాదనలేరు. జీవుడు, శరీరము అను రెండు భాగములుగానున్న మనిషిలో శరీరము కొంతకాలమే ఉంటున్నది.
కావున శరీరము నాశనమైనా జీవుడు నాశనము కానివాడనీ, వాడు తర్వాత జన్మలో మరియొక క్రొత్త శరీరమును

--
పొందుచున్నాడనీ తెలియుచున్నది. ఒక జీవితములోని శరీరమును, జీవున్ని తీసుకొని చూస్తే రెండిటికి తల్లి తండ్రులు
ఉన్నారని తెలియుచున్నది. ఒక సజీవ శరీరమునకు తల్లితండ్రులు ఉన్నారని చెప్పితే, ఇటు శరీరమునకు అటు జీవునకు
ఇద్దరికి తల్లి తండ్రులున్నట్లే కదా!

ఒక సజీవ మనిషికి ఫలానావారు తల్లి తండ్రులని చెప్పగలుగు చున్నాము. అలాగే వారిని చూపగలుగుచున్నాము.
ఒక ఉద్యోగము కొరకు దరఖాస్తు వేసినపుడు అందులో కూడా తల్లి తండ్రుల పేర్లు అను చోట శరీరమునకు
సంబంధించిన తల్లి తండ్రి పేర్లనే వ్రాయుచున్నాము. ప్రతి మనిషికి తన శరీరమునకు సంబంధించిన తల్లి తండ్రుల
పేర్లే తెలియును. కానీ తనకు తల్లి తండ్రి ఎవరో, వారి పేర్లేమిటో తెలియదు. ప్రతి మనిషి తన శరీరమునే తాను
అనుకొనుచున్నాడు. కావున శరీరమునకు సంబంధించిన తల్లి తండ్రులనే. తన తల్లి తండ్రులుగా చెప్పుచున్నాడు.
వాస్తవానికి తన తల్లి తండ్రులువేరని ఎవరికీ తెలియదు. తన శరీరమునకు తల్లి తండ్రులైన వారిని పొరపాటుగా, తన
తల్లి తండ్రులుగా అనుకోవడము జరుగుచున్నది. సమాజములో ఎంత పెద్ద హోదాలో ఉన్నవాడుగానీ, దేశానికి
రాజుగానీ, మంత్రిగానీ, విజ్ఞాన వేత్తగానీ, మేధావిగానీ ఎవడుగానీ, ఎంత గొప్పవాడుగానీ తన తల్లి తండ్రులను
మాత్రము తెలియరు. తనకు తల్లి తండ్రులున్నారను విషయమునే మరచి పోయారు. వాస్తవానికి తననే మరిచిపోయి,
తన శరీరమునే తానుగా లెక్కించుకొని, తాను పొడుగు వాడిననియో, పొట్టివాడిననియో, నల్లనివాడిననియో లేక తెల్లని
వాడిననియో అనుకొంటున్నాడు. వాస్తవానికి ఏ మనిషీ తాను శరీరమును కాననీ, తాను వేరు, తన తనువు వేరని
జ్జప్తిలో ఉంచుకోక తన శరీరమునే తానని పూర్తిగా నమ్మి, తన శరీరము యొక్క తల్లి తండ్రులనే తన తల్లితండ్రులు
అనుకోవడము జరుగుచున్నది.

పుట్టిన ప్రతి మనిషి అలా అనుకోవడము వలన మనిషియొక్క అసలైన తల్లి తండ్రులెవరో మనిషికే తెలియకుండా
పోయినది. అటువంటి సమయములో దేవుడే స్వయముగా జీవుని యొక్క తల్లి తండ్రులను గురించి తెలియజేయవలసి
వచ్చినది. భగవద్గీతను చెప్పిన సందర్భములో జీవుని యొక్క తల్లి తండ్రులెవరో దేవుడే తెలియజేశాడు. భగవద్గీతలో
గుణత్రయ విభాగ యోగమున మూడు, నాలుగు శ్లోకములు ఇలా వున్నవి.

శ్లోకము 3 : మమ యోని ర్మహ ద్భ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ ।
	       సంభవ స్సర్వభూతానాం తతో భవతి భారత ! ||
(ప్రకృతి, పరమాత్మ)

శ్లోకము  4 : సర్వ యోనిషు కౌంతేయ ! మూర్తయః సంభవంతి యాః ।
                  తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదః పితా ||

ఈ శ్లోకముల భావము ప్రకారము దేవుడు చెప్పినది ఇలావున్నది. “విశాలమైన, పెద్దదైన ప్రకృతియే స్త్రీస్వరూపమైన
యోనిగా (గర్భముగా) ఉన్నది. దానిని నేను గర్భము ధరించునట్లు చేయుచున్నాను. అందువలన సర్వ జీవరాసులు
పుట్టుచున్నవి. భూమిమీద ఏ జీవరాసి ఏ తల్లి గర్భము నుండి పుట్టినా, వివిధ రూపములలో కనిపించు జీవరాసులన్నిటికి
ప్రకృతి తల్లికాగా బీజదాతనైన నేను తండ్రిగ ఉన్నాను” అని అన్నాడు. భగవంతుడు గీతలో చెప్పిన దాని ప్రకారము
జీవుడు ఏ శరీరము గర్భములో పుట్టినా ఆ శరీరములో మూల ధాతువులైన పంచభూతముల ప్రకృతి తల్లి, దానికి
చైతన్యమను బీజమునిచ్చిన దేవుడు తండ్రియగును. దీనినిబట్టి ఎంతో గొప్పవాడైన దేవునికి స్వయాన కొడుకులైవుండి
మరియు ఎంతో గొప్ప బలము కల్గిన ప్రకృతి సంతానమైయుండి, మనిషి తన హోదాను తాను మరచిపోయి. తనను

అశాశ్వితమైన శరీరముగా పోల్చుకొని చాలా చిన్నవాడై పోయాడు.


--
శాశ్వితమైన తల్లి తండ్రులను తెలుసుకోగల్గితే మనిషి శాశ్వితమైన మోక్షమును పొందగలడు. అశాశ్వితమైన
శరీరముగా తనను తాను లెక్కించుకోవడము వలన మనిషి అశాశ్వితమైనవాడై పోయాడు. అశాశ్వితమైన జన్మలను
పొందుచున్నాడు. అశాశ్వితమైన శరీరమును తానుగా నమ్మునట్లు జీవున్ని మాయ భ్రమింపజేయుచున్నది. మనిషి
తన నిజమైన తండ్రిని గురించి తెలుసుకోవాలనీ, తండ్రిమీద శ్రద్ధ వహింపనంతవరకు మాయ మనిషిని తాను ఎవరో
తెలియకుండా, తాను శరీరమునేనని భ్రమింప చేయుచుండును.  ప్రకృతి మనిషికి తల్లియైన విషయము మనిషికి
తెలియదు కదా! తల్లి ప్రకృతియే మరియొక రూపము ధరించి మాయగా పిలువ బడుచున్నది. శరీరములో గుణముల
రూపముతోనున్న మాయ మనిషిని దేవుని జ్ఞానమువైపు పోకుండా కర్మలలోనే ముంచివేయుచున్నది. మాయ మాతచేత
తయారు చేయబడిన వలలో చిక్కుకున్న మనిషి, ఆ వలనుండి బయటపడలేక పోవుచున్నాడు. మాయ వలలో పండ్రెండు
రకముల దారములున్నవి. ఒక్కొక్క దారముపోగు మనిషికంటే అన్ని రకముల బలమైనదైవున్నది. మనిషిని బంధించుటకు
మాయ ఉపయోగించిన వలలో ఒక్కొక్క రక దారముపోగులు తొమ్మిది గలవు. దాని ప్రకారము పండ్రెండు రకముల
దారములు కలిసి మొత్తము 108 పోగుల వలగా తయారైనది. 108 పోగుల వల చిన్నదే అయినా, పోగులు ఎక్కువగా
లేకున్నా మనిషిని బంధించుటకు చాలా సులభమైనది. మాయ వల సాధారణ చేపల వల లాంటిది కాదు. వలలోని
ప్రతి దారము పోగు ఒక ప్రభావము కల్గి వుంటుంది. ప్రతి దారము పోగులో ఒక గుణ ప్రభావముంటుంది. ఆ గుణ
ప్రభావము కల్గిన వలలోని ప్రతి దారము మనిషిని తనవైపులాగుకొను ప్రభావము కల్గియున్నది. అందువలన మనిషి
ప్రతి క్షణము ఏదో ఒక గుణమునకు అంటుకొని పోవుచున్నాడు. ప్రతి గుణము వలలోని ఒక దారము పోగుగా వుండి,
ఆకర్షణ కల్గియుండుట వలన ఆ గుణము యొక్క ఆకర్షణ ప్రభావములో పడిపోవుచున్నాడు. ఆకర్షణనే వలపు అని
కూడా అనవచ్చును. వలపు అను పదమునుండి వల అను పదము పుట్టినది. కావున ఆకర్షణ ప్రభావము గల
గుణములను వలగా వర్ణించి చెప్పు చున్నాము. మాయయొక్క గుణములువలలో చిక్కుకోని వాడు భూమిమీద ఎవడూ
లేడనియే చెప్పవచ్చును. అనగా మాయ ప్రభావములో పడనివాడు ఎవడూ లేడని చెప్పవచ్చును. ఏదో ఒక ఆకర్షణ
వలన చేపలు వలలో చిక్కుకొన్నట్లు, మాయ వలలో కూడా మనిషి చిక్కుకొనుచున్నాడు. చేపల వలలోనున్న దారములన్నీ
ఒక్కటే రకమైనవికాగా, మాయవలలో 108 రకముల దారములున్నవని చెప్పుకొన్నాము కదా! 108 దారములు
పండ్రెండు గుణ భాగములతో కూడుకొని ఉన్నవి. వాటిని ఒక్కొక్క దాని పేర్లను చెప్పుకొంటే ఈ విధముగా గలవు.
1) కామ 2) క్రోధ 3) లోభ 4) మోహ 5) మద 6) మత్సర 7) దాన 8) దయ 9) ఔదార్య 10) వైరాగ్య 11) వినయ
12) ప్రేమ. ఈ పండ్రెండు గుణ భావములలో మనిషిని అశాశ్వితమైన తన శరీరమును తానుగా భ్రమింపజేయునది,
శరీరము యొక్క అశాశ్విత తల్లి తండ్రులను తన తల్లితండ్రులుగా భావింపజేయునది, నేను అందగాడిననీ లేక
అందహీనుడననీ, నల్లనివాడినని లేక తెల్లనివాడిననీ, పొడుగువాడిననీ లేక పొట్టివాడిననీ తన శరీరమును బట్టి
భ్రమింపజేయునది, గుణ వరుసలో నాల్గవదైన మోహగుణము. అంతేకాక శరీరము యొక్క తల్లితండ్రులను కూడా ఆ
శరీరములోని జీవునియొక్క తల్లితండ్రులుగా భ్రమింపజేయునది కూడా మోహగుణమే.

శరీరము యొక్క తల్లి తండ్రులనుండి పుట్టిన శరీరమునకు తల్లి తండ్రుల శరీర పోలికలు వచ్చియుండును.
బాహ్య తల్లితండ్రుల శరీర పోలికలు వారి సంతతికి ఉండడము సహజము. తల్లి పోలిక కొంత, తండ్రి పోలిక కొంత
పుట్టిన సంతతికి ఉండడము సహజము. కొందరిలో తల్లి పోలికలు ఎక్కువవుండి, తండ్రి పోలికలు తక్కువ ఉండును.
కొందరిలో అయితే తండ్రిపోలికలు ఎక్కువగా ఉండి, తల్లి పోలికలు తక్కువగా ఉండును. అరుదుగా కొందరిలో తల్లి
తండ్రులలోని ఒక్కరి పోలికలు మాత్రమే ఉండును. మనిషి ఈ పోలికల విషయములో పూర్తిగా మోహగుణము వలలో

----
చిక్కుకొనుచున్నాడు. తన శరీరమునకున్న తల్లి తండ్రుల పోలికలను చూచి నేను వీరి కొడుకునేనని అనుకోవడము
జరుగుచున్నది. శరీరమే తానని అనుకొన్న మనిషి, తన శరీర పోలికలున్న తల్లి తండ్రులను తన తల్లి
తండ్రులనుకొనుచున్నాడు తాను, తనవారని, భ్రమ కల్గించునది మోహగుణము. మోహ గుణ ప్రభావము వలన చిన్న
వయస్సునుండి తల్లి తండ్రులను తన వారిగా గుర్తించిన మనిషి, పెద్దయ్యాక తన శరీర పోలికలు, తల్లితండ్రుల
పోలికలతో కూడుకొని ఉండడమును చూచి, నేను నిజముగా వీరి కొడుకునే, వీరే నా తల్లి తండ్రులను బంధమును
పెంచుకొనును. తల్లి తండ్రుల మీద కొడుకుకూ, కొడుకు మీద తల్లి తండ్రులకూ అనురాగము, ఆప్యాయత పెరిగి
పోవును. అప్పుడు మనిషి మోహగుణమను వలలో చిక్కుకున్నట్లేయగును. ఇదే విషయమునే ఒక కవి తన పాటలో
అనురాగము ఆప్యాయత అందమైన వలలు అని అన్నాడు. ఈ మాటను ఆ కవి కొంత జ్ఞానదృష్టితో అన్నట్లే తెలియుచున్నది.
పండ్రెండు గుణములలో ఒక మోహగుణమే అతి చిన్న వయస్సులోనే ప్రారంభమై మొదట తల్లిని తనదానిగా గుర్తించి
తర్వాత తండ్రిని గుర్తింపచేసి, ఆ తర్వాత కుటుంబములోని వారందరిని తనవారిగా లెక్కింపజేయుచున్నది.

మోహగుణముకంటే మొదటిదైన ఆశను, రెండవదైన కోపమును అందరూ గొప్పగా చెప్పుకొనినా, ఆధ్యాత్మికముగా

మనిషిని తాను నిజముగా ఎవరో తెలుసుకోకుండా చేయునది మోహగుణమే. తనకు కర్మలను అంటగట్టు వాటిలో
కామ (ఆశ), క్రోధ (కోప)ములు మొదటివైనా, మనిషిని ఆధ్యాత్మికముగా మోసము చేయుటలో మొదటిది మోహగుణమే.
అందు వలననే భగవద్గీతలో దేవుడు అర్జునునికి మొదట మోహగుణమే యుద్ధము నకు అడ్డువచ్చునట్లు చేసి, తాను
మోహగుణము చేత తన శరీరమునకు సంబంధమున్న వారినందరిని తన వారిగా తలచి అర్జునుడు దుఃఖించునట్లు
చేసి, తనను తాను మరచిన స్థితిలో అర్జునుడున్నప్పుడు, ఇప్పుడే మనిషికి జ్ఞానమవసరమన్నట్లు భగవంతుడు దైవజ్ఞానమును
అర్జునునికి తెలిపాడు. దీనినిబట్టి ఆధ్యాత్మికమునకు అడ్డువచ్చునది ముఖ్యముగా మోహగుణమేనని, అదియే నిజమైన
శాశ్వితమైన తన తల్లి తండ్రులను మరచునట్లు చేసి, తనకు ( అంటే జీవునకు) తల్లి తండ్రులు కానటువంటి అశాశ్విత తల్లి
తండ్రులను తన తల్లితండ్రులుగా లెక్కింపజేయుచున్నది. ఈ విధముగా మోహగుణములో అంటుకొని తన తల్లితండ్రులైన
ప్రకృతి పరమాత్మలను గుర్తించనివాడు భూమిమీద పుట్టినా ప్రయోజనము లేదని కొందరు పెద్దలు చెప్పారు. ఇదే
విషయమునే వేమన యోగికూడా, తన పద్యములో వివరిస్తూ ఇలా అన్నాడు.

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమా. 

ఈ పద్యమును చాలామంది. చిన్న వయస్సులోనే చదివినప్పటికీ దీనిలోని భావము ఎవరికీ అర్ధము కాకుండా
మాయ చేయడమేకాక, పై పద్యములో వేమనయోగి చెప్పినది కూడా శరీర తల్లి తండ్రులనే అన్నట్లు భ్రమింపచేసినది.
వేమనయోగి ఈ పద్యమును చెప్పకముందే ఒక పద్యమును ఇలా చెప్పాడు.

వేయి విధము లమరు వేమన పద్యంబు
లర్థమిచ్చు వాని నరసి చూడ
జూడ జూడ గల్గు జోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినుర వేమా.


--
ఈ పద్యము యొక్క భావము ప్రకారము వేమన పద్యమును చదివే అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకముగా
వేయి విధముల అర్ధము నిచ్చినా, ఆ పద్యమును వివరించుకొని చూస్తే పద్యములో ఆశ్చర్యకరమైన జ్ఞానము తప్ప వేరు
ఏమీ లేదని వేమన యోగియే స్వయముగా చెప్పినట్లు తెలియు చున్నది. దీనినిబట్టి తల్లి తండ్రి మీద దయలేని
పుత్రుండు అను పద్యములో వేమనయోగి ఆత్మజ్ఞాన సంబంధమైన తల్లి తండ్రులను గురించి చెప్పాడనీ, శరీర సంబంధ
తల్లి తండ్రులను గురించి చెప్పలేదని అర్థమగుచున్నది. అత్మసంబంధ జ్ఞానము ప్రకారము ఆ పద్యమును అర్థము
చేసుకొంటే మనిషియొక్క నిజమైన, శాశ్వితమైన తల్లి తండ్రులైన ప్రకృతి పరమాత్మలను గురించి పుట్టిన తర్వాత
తెలుసుకోనివాడు, ప్రకృతి పరమాత్మల మీద ధ్యాసలేనివాడు, వారిమీద శ్రద్ధ, దయలేనివాడు పుట్టినా ప్రయోజనము
లేదనీ, అటువంటివాడు పుట్టినా పుట్టకపోయినా ఒక్కటేననీ, పుట్టలోని చెదలు పుట్టి గిట్టినట్లేనని, వానిది నిష్ప్రయోజనమైన
జన్మ అని వేమనయోగి తన పద్యములో చెప్పాడు. ఆ మాట మనకు మాయవలననే అర్ధము కాలేదు.

బ్రహ్మవిద్యాశాస్త్రము కాకుండా భౌతికశాస్త్రమును చదివిన వారూ, విజ్ఞానులమనుకొని విజ్ఞాన వేదికలను
పెట్టుకొన్నవారూ, మాకు తెలియని సైన్సు ( అంటే విజ్ఞానము) లేదని మేధావులుగా చలామణియగువారూ, వారు చదివిన
శాస్త్రముల ప్రకారము, ప్రకృతి పరమాత్మ తల్లితండ్రులుగా ఉన్నారను మా మాటను ఖండించవచ్చును. మామాట
శాస్త్రవిరుద్ధమైనదని చెప్పవచ్చును. దేవుడు అందరికీ నిజమైన తండ్రి అను మాటను పిచ్చిమాటగా వర్ణించి చెప్పవచ్చును.
వారలా చెప్పుటకు కారణము కలదు, అదేమనగా! ఒక బిడ్డకు వారి శరీర తల్లితండ్రుల శరీర పోలికలే కాక, వంశపారంపర్య
జీన్సు కూడా బిడ్డ శరీరములో ఉండుట వలన, కొన్ని తరముల సంబంధము ఆ బిడ్డకున్నదనీ, బిడ్డకు శరీర తల్లితండ్రుల
భౌతిక సంబంధ రూపు రేఖల పోలికలే కాకుండా, అభౌతికమైన గుణములు మరియు ఆచార వ్యవహారములుండుననీ,
దానివలన ఒక బిడ్డ భౌతికముగా, అభౌతికముగా కనిపించు తల్లితండ్రులకు సంబంధించినవాడనీ శాస్త్రబద్దముగా
చెప్పవచ్చు ననీ, అట్లు కాకుండా తల్లితండ్రులు ప్రకృతి పరమాత్మలనడము అశాస్త్రీయ మనీ చెప్పుటకు అవకాశము
కలదు. అటువంటప్పుడు మీ మాట సత్య మెట్లగునని మమ్ములను కొందరు ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు
ఏమనగా!

భూమిమీదున్న ఆరు శాస్త్రములలో భౌతికశాస్త్రము కూడా ఒకటి. ఏ శాస్త్రమైనా ఎప్పటికీ ఖండింపబడదు.
ఖండింపబడని శాసనముగా ఉండడమే శాస్త్రము యొక్క ప్రత్యేకతయని మేము కూడా చెప్పుచున్నాము. షట్‌ శాస్త్రములలో
మిగతా ఐదు శాస్త్రములకంటే గొప్పది బ్రహ్మవిద్యా శాస్త్రము. నా వాదన బ్రహ్మవిద్యాశాస్త్రమునకు సంబంధించినది.
మిగతా వారి వాదన భౌతిక శాస్త్రమునకు సంబంధించినది. శాస్త్రబద్ధమైన ఏ వాదనైనా సత్యమే. ఇప్పుడు కొందరు
విజ్ఞానులు భౌతికశాస్త్రము ప్రకారము, అభౌతికమైన కనిపించని గుణములు కూడా వారివారి వంశమును అనుసరించి
వచ్చుచున్నవనీ దానివలన భౌతికముగా, అభౌతికముగా రెండు విధముల ఒక బిడ్డకు కనిపించు తల్లితండ్రులే నిజమైన
తల్లితండ్రులని చెప్పుట శాస్త్రబద్ధమేనని నేను కూడా ఒప్పుకొనుచున్నాను. అయితే ఇక్కడ గమనించ వలసిన
విషయమేమనగా! తల్లి తండ్రులనుండి సంక్రమించు డిఎన్‌ఎ ( అంటే జీన్సు) కూడా భౌతికమైనవేననీ, జీన్సుకు పురితిరిగిన
నిచ్చెనలాంటి ఆకారమున్నదని, తల్లి అండములోని మరియు తండ్రి వీర్యములోని క్రోమోజోమ్స్‌ వలన వారి వంశ
పారంపర్య జీన్సు (DNA.) తయారగుచున్నవనీ, వంశపారంపర్య గుణముల ఆచరణలు కూడా భౌతికమైనవేనని
తెలియుచున్నది. ఇకపోతే బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి చూస్తే మనిషిలోని జీన్స్‌గానీ, వంశపారంపర్యముగానీ
బ్రహ్మవిద్యకు సంబంధములేదు. తండ్రి వీర్యకణముగానీ, తల్లి రజోకణము ( అంటే అండము) గానీ, బ్రహ్మవిద్యాశాస్తమునకు



--
సంబంధించినవి కావు. అవి కేవలము భౌతికశాస్త్రమునకు సంబంధించినవి మాత్రమే. భౌతిక శాస్త్రమునకు
సంబంధించినంత వరకు ఒక మనిషికి భౌతిక తల్లి తండ్రులుండుట వాస్తవమే. మరియు వారి వంశపారంపర్య
సంబంధము ఉండుట కూడ వాస్తవమే. అయితే ఇక్కడ కొంత గమనించ వలసిన విషయమేమనగా!

శరీరములోని జీవునికి కర్మ అనునది ఒకటున్నది. ఒక జీవుడు తన కర్మానుసారము తనకు దగ్గర సంబంధ
కర్మలున్న వారి గృహములోనే పుట్టుచుండును. జీవునకున్న కర్మే ఆ విధముగా ఒక వంశములో పుట్టించు చున్నది.
ప్రపంచములో ఎన్నో విధ కర్మలుగలవారున్నారు. వారి వారి కర్మలు వారిని మరుజన్మకు తీసుకుపోవుచున్నవి. అలా
తీసుకుపోయినపుడు దాదాపు అటువంటి కర్మలున్న వారి వంశములోనే పుట్టించుచున్నవి. దాని వలన గతములో తమ
పెద్దలు కర్మప్రకారము చేసిన పనులనే తర్వాత పుట్టినవారు కూడా అటువంటి కర్మల ప్రకారము, అటువంటి పనులనే
చేయడము వలన చూచేవారు వీనికి తాత బుద్దులు వచ్చాయనీ, లేక వీనికి ముత్తాత బుద్ధులు వచ్చాయనీ, తండ్రి
బుద్దులు వచ్చాయనీ అనుచుందురు. కర్మలను బట్టి మనోబుద్ధి, చిత్తములు పని చేయునని తెలియక పనిచేయు బుద్ధిని,
తాతది లేక ముత్తాతది అని అనుచుందురు. ఈ విధముగ పైకి కనిపించు కార్యములనుబట్టి ఒక మనిషి ఒక
వంశమునకు చెందినవాడనీ, ఫలానా తండ్రి కొడుకని అనుచుందురు. ఇవన్నియు భౌతిక తల్లితండ్రులను చూపించుచు
మనిషికి తాను ఎవరో, తన నిజస్థితి ఏమిటో తెలియకుండా చేయుచున్నవి. ఒక మనిషిని విభజించి చూచితే శరీరము
వేరనీ, జీవుడు వేరనీ తెలియుచున్నది. అట్లే శరీరములో జీవుడు, కర్మ వేరువేరుగా ఉన్నారు. జీవుడు తన జీవితములో
కర్మను సంపాదించుకొనుచున్నాడు మరియు అనుభవించుచున్నాడు. గతజన్మలో సంపాదించుకొన్న కర్మ ప్రకారము
జీవుడు జీవితమును గడపవలసివున్నది. ప్రతి పనికి కర్మయే కారణముకాగా, జరిగే పనిలో కష్ట సుఖములను జీవుడు
అనుభవించుచుండును. అంతేగానీ జరిగే పనులను బట్టిగాన్సీ వానికున్న కర్మనుబట్టిగానీ, జీవుడు ఫలానా వారికి
సంబంధించినవాడని చెప్పలేము. అంతేకాక జీవుని యొక్క రూపు రేఖలను గానీ, జీవుడు ఏ పదార్ధముతో
కూడుకొనియున్నాడని గానీ, జీవుడంటే ఏమిటి? ఎవరు? అను విషయమునుగానీ చెప్పలేము. జరిగే కర్మనుబట్టి,
కార్యములను బట్టి ఒక వ్యక్తి యొక్క భౌతిక తల్లి తండ్రులనూ, అతని వంశమునూ చెప్పవచ్చును. కానీ అతనిలోని
జీవుని యొక్క అంశనుగానీ, ఆకారమునుగానీ చెప్పలేము.

భూమిమీదున్నవి షట్‌ శాస్త్రములు ( అంటే ఆరు శాస్త్రములు) మాత్రమే. అందులో ఐదు శాస్త్రములు జనరల్‌ "సైన్సుకు
సంబంధించినవి. జనరల్‌ సైన్స్‌ అనగా సామాన్యశాస్త్రము. అలాగే సూపర్‌ సైన్సు ఒకటి కలదు. సూపర్‌సైన్సు అనగా
బ్రహ్మశాస్త్రము లేక పెద్ద శాస్త్రము అని అనవచ్చును. బ్రహ్మ అనగా పెద్ద అని మాత్రమే అర్ధము. సైన్సును విజ్ఞానము
అని అనవచ్చును. ఆరు శాస్త్రములలో ఐదు శాస్త్రములు అనగా ఒకటి గణిత శాస్త్రము, రెండు ఖగోళ శాస్త్రము,
మూడు రసాయనశాస్త్రము, నాలుగు, భౌతికశాస్త్రము, ఐదు జ్యోతిష్యశాస్త్రము. ఈ ఐదు శాస్త్రములకంటే ముందు
పుట్టినది ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్తము లేక బ్రహ్మశాస్త్రము అని చెప్పవచ్చును. ప్రపంచములోని ఏ విషయముగానీ
శాస్త్ర ప్రమాణము కలిగివుండవలెను. శాస్త్ర ప్రమాణము లేనిది అది అసత్యముగా లెక్కించబడును. అందువలన ఒక
విషయమును సత్యమని చెప్పుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే ఒక విషయమును అసత్యమని చెప్పుటకు కూడా
శాస్త్రము అంతే అవసరమగునను సూత్రము ప్రకారము ఏది సత్యమో, ఏది అసత్యమో శాస్త్రము ద్వారా తేల్చివేయవచ్చును.
శాస్త్రము ప్రకారము చెప్పని విషయము సత్యముకావచ్చును లేక అసత్యమూకావచ్చును. అలా చెప్పడము గ్రుడ్డిగా
చెప్పినట్లగును. అందువలన ఏ విషయమునైనా సత్యమా అసత్యమా అని చూచుటకు శాస్త్రము కన్నులాంటిదని చెప్పవచ్చును.



--
ప్రపంచములోని ఆరు శాస్త్రములలో ఐదు సామాన్య శాస్త్రములు కాగా ఒకటి అసామాన్యమైన పెద్ద శాస్త్రమని
చెప్పుకొన్నాము కదా! పెద్ద శాస్త్రమైన భగవద్గీతలో కూడా ఒక జన్మలోని సంస్కారమును బట్టి మరు జన్మలోని భౌతిక
తల్లి తండ్రులుంటారని చెప్పడము జరిగినది. ఎటువంటి వారు అటువంటి అలవాట్లు, ఆలోచనలు, ఆచారములున్న
వారి ఇళ్లలో పుట్టుదురని గీతలో కృష్ణభగవానుడు కూడా చెప్పాడు. భగవద్గీత ఆత్మ సంయమ యోగము 41,42
శ్లోకములు.


శ్లోకం  41 : ప్రాప్య పుణ్య కృతాం లోకా నుషిత్వా శాశ్వతీ స్సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ||
(జీవాత్మ)

శ్లోకం  42 : అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్ ।
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||
(జీవాత్మ)

భావము :- ముందు జన్మలో యోగ భ్రష్టులైనవారు వారికున్న పుణ్య ఫలములను అనుభవించిన తర్వాత మంచి
ఆచారములు గలిగిన శ్రీమతులు ( అంటే జ్ఞానులు) అయిన వారి గృహములో పుట్టుచుందురు. అట్లుకాకపోతే దైవ జ్ఞానములో
మంచి మేధావులైన యోగుల వంశములోనైనా పుట్టుచుందురు. లోకములో అటువంటి జన్మ పొందడము ఎంతో
దుర్లభమైనది.

దీనినిబట్టి గతజన్మలో జ్ఞానులైనవారు జ్ఞానులవద్ద, యోగులైన వారు యోగులవద్ద వారి వంశములలో
జన్మించుచుందురని తెలియుచున్నది. ఈ విషయము బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో చెప్పడము వలన పూర్తి
సత్యముగా తెలియబడినది. అంతేకాక ప్రత్యక్షముగా జరుగుచున్నదని కూడా తెలిసిపోయినది.

ఒక మనిషి ఎటువంటి ఆచార వ్యవహారాల మీద శ్రద్ధ కలిగి ఉంటాడో, అటువంటి భావములు గల వారి
ఇళ్ళలో పుట్టడము వలన, తండ్రికీ తాతకూ ఉన్న భావములుండుట వలన, ఆ వ్యక్తి ఫలానా వారి మనుమడు, ఫలానా
వారి కొడుకు అని చెప్పుటకు బలము కల్గుచున్నది. ఇటువంటి బలమైన కొన్ని బయటి ఆధారములనుబట్టి ఒక మనిషి
నేను ఫలానా వారికి పుట్టినవాడినని అనుకోవడము జరుగుచున్నది. అందువలన ప్రతి మనిషి బయట ప్రత్యక్షముగనున్న
తల్లి తండ్రులనే తన తల్లి తండ్రులుగా చెప్పుకోవడము జరుగుచున్నది. అయితే వాస్తవానికి ఇదంతయు బయటి
వ్యవహారములకు సంబంధించిన విషయమనీ, ఆచార వ్యవహారములు గుణముల శ్రద్ధనుబట్టి వస్తున్నవనీ, గుణములు
వాటి ఆచారములు వేరు, జీవుడు వేరనీ, జీవుడు ఆత్మకు సంబంధించినవాడనీ, జీవుడు గుణము లకు సంబంధించినవాడు
కాదనీ, ఎవరూ తెలియలేక పోవుచున్నారు. అందువలన శరీరమునకు సంబంధించిన తల్లితండ్రులనే తన తల్లి
తండ్రులుగా మనిషి భావించుచున్నాడు. ఒకటి శరీర పోలికలనుబట్టి, రెండు ఆచార అలవాట్లనుబట్టి, రెండు విధముల
కారణముల వలన ప్రతి మనిషి తల్లితండ్రుల విషయములో పొరబడి తన శరీర తల్లి తండ్రులను తన తల్లి తండ్రులుగా
అనుకోవడము జరుగుచున్నది. తనకు రెండు రకముల తల్లి తండ్రులున్నారనీ, ఒకరు తనకు ( అంటే జీవాత్మకు) సంబంధించిన
వారనీ, రెండవవారు తన శరీరమునకు సంబంధించినవారనీ, తనకు సంబంధించిన వారు సృష్టి ఆదినుండి ఒకే
తల్లితండ్రులుగా, శాశ్విత తల్లి తండ్రులుగా ఉన్నారనీ, తన శరీరమునకు సంబంధించినవారు జన్మజన్మకు వేరువేరు తల్లి
తండ్రులుగా ఉన్నారని ఎవరూ అనుకోవడము లేదు.



--
సర్వసాధారణ మనుషులకు, కనిపించెడి తల్లి తండ్రులు మాత్రమే తెలిసి, కనిపించని తల్లి తండ్రులు
తెలియకపోవచ్చును. తల్లి తండ్రులు రెండు విధములుగా ఉన్నారని కూడా వారికి తెలియదనే చెప్పవచ్చును. అయితే
దైవజ్ఞానము తెలిసిన జ్ఞానులకు, యోగులకు రెండవ రకమైన ప్రకృతి పరమాత్మలు తల్లి తండ్రులుగా ఉన్నారని
తెలిసివుండును. జ్ఞానము తెలిసిన వారికి జన్మ జన్మలకు శాశ్విత తల్లి తండ్రులైన వారి విషయము తెలియుట వలన,
తన శరీర తల్లి తండ్రులను చాలా స్వల్పమైన వారిగా, ఒక జన్మకు మాత్రమే పరిమితమైన వారుగా భావించుదురు.
అటువంటపుడు జ్ఞానము తెలిసిన వ్యక్తి తన శరీర తల్లి తండ్రులను గౌరవించునా? వారిని వృద్ధాప్యములో పోషించునా?
అను ప్రశ్నలు రాగలవు. దానికి మా సమాధానము ఏమనగా! శరీర తల్లి తండ్రి తన శరీరమును పుట్టినప్పటి నుండి
పోషించుచున్నారు. నా కొడుకు అను మోహగుణముతో తమకు పుట్టిన బిడ్డను పెంచి పోషించుట అందరికి తెలిసిన
విషయమే. జ్ఞానము తెలిసిన వ్యక్తి తన శరీర తల్లి తండ్రులను, తన శరీరమును పోషించిన అత్యంత సన్నిహితులుగా
గుర్తించి, దానికి బదులుగా వారి శరీరమును కూడా తాను పోషించుట ముఖ్యమైన బాధ్యతగా తలచవలెను. తన చిన్న
తనములో తనకు ఎంత బాధ్యతగా విద్యాబుద్ధులు చెప్పించారో, ఎంత ప్రేమగా తనను పెంచారో, తనను ఆకలికొనకుండా
పూటపూటకు ఎలా ఆహారమును సమకూర్చారో, అలాగే అన్ని విధముల తల్లి తండ్రులను బాధ్యతగా చూచుకోవాలని
జ్ఞానము తెలిసిన వ్యక్తి అనుకొనును. జ్ఞాని లేక యోగి అయినవాడు తన తల్లి తండ్రులైన ప్రకృతి పరమాత్మలు ఎప్పటికీ
వృద్ధులుకారనీ, తాను ఎప్పుడూ పెద్దవాడిగా పెరగననీ, తాను శాశ్వితముగా ప్రకృతి తల్లి ఒడిలో పసి బిడ్డనేననీ,
అటువంటపుడు తండ్రి పరమాత్మ తల్లి ప్రకృతియే ఎల్లప్పుడు తనను పోషించుచుందురనీ, తాను వారిని పోషించు స్థితికి
ఎదగలేనని తెలిసివుండును.

శరీర తల్లి తండ్రులు మాత్రము ముసలివారుకాగా, తాను వయస్సు వచ్చినవాడై వారిని పోషించు
స్థోమతకల్గియుండును. కావున తన తల్లి తండ్రులను వదలి, తన శరీర తల్లితండ్రులను పోషించుటే ఆ జన్మకు తగిన
పనిగా, న్యాయమైన పనిగా జ్ఞాని గుర్తించి, తన శరీర తల్లి తండ్రులకు ఎటువంటి అసౌకర్యము కలుగకుండా చూచుకోవాలని
తలచును. జ్ఞానము తెలిసిన వ్యక్తి తనకు ప్రకృతి పరమాత్మ తల్లి తండ్రులని తెలిసినా, శరీర తల్లి తండ్రులను అశ్రద్ధ
చేయడు. తన చిన్నతనములో వారు తన శరీరమును పోషించినందున, వృద్ధాప్యములో వారి శరీరములను పోషించుట
తన బాధ్యతగా లెక్కించును. యోగి లేక జ్ఞాని అయినవాడు తన తల్లి తండ్రుల మీద ఎంత భక్తి కల్గియుండినా, తన
శరీర తల్లి తండ్రుల ఎడల మాత్రము బాధ్యతారాహిత్యముగా ప్రవర్తించడు. తన శరీరమును పోషించినందుకు బదులుగా,
వారి శరీర పోషణ చూడడము తనకు ముఖ్యమైన కార్యముగా తలచును. ప్రపంచములో జ్ఞానము లేని సాధారణ
వ్యక్తులు వారి తల్లి తండ్రులను పోషించక చివరిదశలో వారి ఆస్తులను ఆభరణములను లాగుకొన్నవారు కలరు.
ముసలివారైన తమ తల్లి తండ్రులు చనిపోతే ఉన్న ఆస్తిని ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చని వారిని చంపినవారూ కలరు.
వారి ఆస్తిని అనుభవిస్తూ తల్లితండ్రులను బజారుపాలు చేసినవారూ కలరు. ఈ విధముగా జ్ఞానములేని కొందరు తమ
తల్లి తండ్రులను ఎన్నో విధముల బాధించువారు కలరు. కానీ యోగులు, జ్ఞానులు అయినవారు కనిపించెడి తల్లితండ్రులను
తమ శరీర తల్లి తండ్రులని తెలిసి, వారిని తగిన విధముగా గౌరవించి, వారికి ఎటువంటి అసౌకర్యము కలుగకుండా,
ఎటువంటి బాధ కలుగకుండా బాధ్యతగా చూచుకొనుచుందురు.

శరీర తల్లితండ్రులను సరిగా పోషించని కొడుకులు కొందరూ, ఏమాత్రము పోషించని కొడుకులు కొందరూ,
అక్కడక్కడ కనిపిస్తూవుంటారు. అటువంటి కొడుకులను చూచి తల్లి తండ్రులు బాధపడుచుందురు. పోషణ విషయములో



--
కొడుకులు ఏమాత్రము పట్టించుకోక పోయినా, కొడుకులను గురించి బాధపడక అదంతయు తమ కర్మ అని సరిపెట్టుకొను
తల్లి తండ్రులూ కలరు. కొడుకులు పోషించకపోయినా, తమను ఆస్తులు సంపాదించలేదని దూషిస్తున్నా ఉన్నత
విద్యలు చదివిన కొడుకులు తమ తల్లి తండ్రులను తెలివితక్కువ వారిగ భావించినా, చీటికి మాటికి హేళనగా మర్యాద
లేకుండా మాట్లాడుచుండినా, తల్లి తండ్రులు కొంతవరకు బాధపడుచుందురు. అయితే అన్నిటికంటే ఎక్కువ బాధకల్గించు 
విషయము ఒకటి గలదు. తల్లి తండ్రులను ఏ కష్టము లేకుండా పోషించు కొడుకులైనా, ఒక్క విషయములో మాత్రము
తప్పుగా మాట్లాడితే, ఆ మాట వారి తల్లి తండ్రులను అన్నిటికంటే ఎక్కువగా బాధించును. అటువంటి యదార్థ
విషయమును క్రింద వివరిస్తాము చూడండి.

ఒక మధ్య తరగతి కుటుంబమునకు చెందినవారికి ఒకేవొక కొడుకు సంతానము. తమకు ఒకే కొడుకు
ఉన్నదానివలన ఆ కొడుకు మీద మోహ గుణమూ, ప్రేమ గుణమూ మేళవించి ఎంతో ఆప్యాయతతో పెంచుకొను
చుండిరి. తమ జీవితమే తమ కొడుకు అన్నంత గాఢముగా తమ కొడుకును పెంచుతూ, తమకులేని సౌకర్యములను
కొడుకుకు కలుగజేయుచుండిరి. రుచికరమైన పదార్థమును కొడుక్కు వండిపెట్టి, తాము రుచిలేని ఆహారమును తినుచుండిరి.
తమకు డబ్బు స్థోమత లేకున్నా అప్పుచేసి కొడుక్కు మంచి దుస్తులు సమకూర్చుచుండిరి. ఆ విధముగా కొడుకును చిన్న
వయస్సు నుండి సుఖముగా పెంచుతూ తాము ఎన్నో కష్టాలను అనుభవించారు. పెద్ద చదువులు చదివించు స్థోమత
తమకు లేకున్నా శ్రమపడి తమ కొడుకును ఉన్నత చదువులు చదివించేడివారు. తమ కొడుకు పెద్ద చదువు చదువుతున్నాడని
సంతోషపడుచు తమ కష్టమును మరచిపోయెడివారు. అలాంటి సమయములో కొడుకు పట్టణములో నివసిస్తూ, తన
కొరకు తల్లి తండ్రులు ఎంత కష్టపడుచున్నారని ఏమాత్రము గ్రహించక, తనకిష్టమొచ్చినట్లు నడుచుకొనుచుండెను.
అతని తల్లి తండ్రులు ఎన్నో కష్టములుపడి తన కొరకు పంపిన డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేయుచుండెను. అంతే
కాకుండ తనవలె జాలీగా డబ్బును ఖర్చుచేయుచూ, తనతోపాటు చదువుచున్న ఒక ధనిక కుటుంబమునకు చెందిన
అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అతనిని ధనిక కుటుంబమునకు చెందినవాడని నమ్మి అతనిని ప్రేమించింది.
ఇలా ఒకరినొకరు ప్రేమించుకొన్న తర్వాత తమ చదువులు కూడ అయిపోయాయి. చదువు ముగిసిన వెంటనే అతనికి
పెద్ద ఉద్యోగము కూడా రావడము జరిగినది. ఉద్యోగము వచ్చిన తర్వాత ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి
చేసుకోవాలనుకొన్నాడు. పెళ్ళి విషయమును మాట్లాడే కొరకు అమ్మాయి చెప్పినట్లు ఒక దినము వారి ఇంటికి
పోయాడు. ఆ అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయిని ఆమె తల్లితండ్రులకు పరిచయము చేసినది. అమ్మాయి ఇంటికి
పోయిన అతను ఎంతో విలువైన ఆ ఇంటిని, ఉన్నతమైన పదవులలోనున్న ఆమె తల్లితండ్రులను చూచి, తన పూరి
గుడిసెను చూచినా, తన తల్లితండ్రులను చూచినా తాను ప్రేమించిన అమ్మాయి తనను పెళ్ళి చేసుకోదనీ, అలాగే ఆమె
తల్లితండ్రులు తమ పెళ్ళికి ఒప్పుకోరని తలచిన అతను, వారు తన ఇంటికి పోకుండా ప్రస్తుతానికి తన తల్లితండ్రులు
విదేశాలకు వెళ్ళారని తిరిగి వచ్చిన తర్వాత వారిని పరిచయము చేస్తానని చెప్పాడు. అప్పుడు అమ్మాయి తల్లి తండ్రులు
తమకు ఒక్కతే అమ్మాయి అని వేరు సంతానము లేదనీ, అందువలన ఉన్న ఆస్తి అంతా ఆమెదేననీ, ఆమెను చేసుకుంటే
తమ కుంటుంబములోనే ఇల్లరికములాగా ఉండవలెనని చెప్పారు. అప్పుడు అతను తనకు ఏ ఆస్తి లేనిదానివలన
అంతకంటే మించిన భాగ్యము లేదనీ, అటువంటి అవకాశమును వదలుకుంటే ఇక దొరకదని తలచి, అలాగే వారి
ఇంటిలోనే ఉంటానని ఒప్పుకొన్నాడు.



--
అలా ఒప్పుకోవడము వలన వారి పెళ్ళి నిశ్చయమైనది. తన పెళ్ళి నిశ్చయమైనదని అతను తన తల్లితండ్రులకు
చెప్పలేదు. అలా చెప్పితే వారు తన పెళ్ళికి వస్తారని, వారి ఎండిపోయిన ముఖములను, బక్కచిక్కిన శరీరములను తన
మామగారు చూస్తే తాము పేదవారని తెలిసిపోతుందనీ, అంతవరకు తాను ధనికుడనని బొంకిన మాటలన్ని అసత్యమని
తెలిసి పోవుననీ, దానివలన పెళ్ళి ఆగిపోగలదని తలచి, తన తల్లి తండ్రులకు పెళ్ళి విషయమును చెప్పలేదు. అంతేకాక
పెళ్ళి రోజు తన తల్లితండ్రులుగా తన మామగారికి పరిచయము చేయుటకు, బాగా కనిపించు వయస్సు మళ్ళిన ఒక
జంటను ఏర్పాటు చేసుకొన్నాడు. తన తల్లి తండ్రులుగా నటించునట్లు ముందే వారికి చెప్పి ఏర్పాటు చేసుకొన్నాడు.
పెళ్ళికంటే ముందు రోజు తన మామగారికి వీరే నా తల్లితండ్రులని తాను ఏర్పాటు చేసుకొన్న వారిని చూపడము
జరిగినది. చివరికి పెళ్ళి జరుగు సమయము వచ్చినది. వాస్తవముగా తన తల్లితండ్రులకు తమ కుమారుని పెళ్ళి
విషయము తెలియదు. అయితే తమ కొడుకును చూచి రావాలని అతని తల్లితండ్రులనుకొని బయలుదేరి పట్టణమునకు
వచ్చారు. సరిగా ఆ దినము వారి కొడుకు పెళ్ళి జరుగు దినమని వారికి తెలియదు. పట్టణమునకు వచ్చిన తర్వాత
తమ కొడుకు పళ్ళనీ, ఆ పెళ్ళి ముహూర్తము ఒక గంట వ్యవధిలో ఉన్నదనీ, వివాహము ఫలానా కళ్యాణమండపములో
జరుగుచున్నదనీ తెలిసినది. ఆ విషయము తెలిసిన వెంటనే వారు హుటాహుటిన కళ్యాణమండపము వద్దకు వచ్చారు.
వారు వచ్చే సమయానికి పెళ్ళి పీటల మీద తమ కొడుకు ఉండడము చూచి, అప్పుడు ఏమి మాట్లాడునది లేక
అక్కడున్న జనములో నిలబడి కొడుకు పెళ్ళిని చూస్తు నిలిచిపోయారు. వారు అక్కడికి వచ్చిన తర్వాత పది నిమిషములలో
పెళ్ళి అయిపోయినది. పెళ్ళి ముగిసిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వారి వారి తల్లి తండ్రులకు పాదనమస్కారము
చేయవలెనని పురోహితుడు చెప్పగా, పెళ్ళికొడుకు ముందుగానే తన తల్లి తండ్రులుగా ఏర్పాటు చేసుకొన్న వారికి
మొక్కి తర్వాత పెళ్ళి కూతురు తల్లితండ్రులకు మొక్కారు. ఆ సంఘటనను ప్రత్యక్షముగా చూచిన పెళ్ళికొడుకు అసలు
తల్లి తండ్రులకు, అక్కడి విషయమంతా అర్దమైపోయినది. తమ ప్రాణముకంటే మిన్నగా పెంచిన తమ కొడుకే తమను
ఘోరముగా మోసము చేశాడని గ్రహించారు.

తమను ఎందుకంత మోసము చేశాడో తమ కొడుకును కలిసి తెలుసుకోవాలని, జనములో ముందుకు పోయి
తమ కొడుకును కలిసారు. అప్పుడు  వారి కొడుకు ఏమీ తొణకకుండా సర్వసాధారణముగా, బాగున్నారా అని
బయటివారిని పలకరించినట్లు పలకరించాడు. వెంటనే అక్కడేనున్న తన మామగారికి, అత్తగారికి తన తల్లితండ్రులను
చూపి వీరు తమ పొలమును కౌలుకు చేయు పాలేరులని పరిచయము చేశాడు. అప్పుడు అతని తల్లితండ్రులు ఆ మాట
విని ఆశ్చర్యపోయి, తమ కొడుకు తమను గూర్చి వారితో అబద్దము చెప్పుచున్నాడని అర్ధము చేసుకొన్నారు. తమను
గురించి అబద్దము చెప్పడమే కాకుండా, తమ స్థానములో వేరే తల్లి తండ్రులను ఏర్పాటు చేసుకొన్నాడని కూడా తెలిసి,
ఆ సమయములో అక్కడ ఏమి మాట్లాడినా తమ కొడుకు మోసగాడని అందరికి తెలిసిపోవునని తలచి, తామే
తల్లితండ్రులమని అప్పుడు చెప్పితే, చివరకు తమ కొడుకే బాధపడవలసి వచ్చుననీ, అలా తమ కొడుకు తమ వలన
చిక్కుల్లో ఇరుక్కోవడము ఇష్టములేక, వారు ఏమీ మాట్లాడక ఊరకుండి పోయారు. అతను తన సుఖము కొరకు, తనకు
ఇష్టమైన అమ్మాయిని పెళ్ళి చేసుకొనే దానికి, తన తల్లి తండ్రులను వదలి వేరే వారిని తల్లి తండ్రులుగా చూపడము
జరిగినది. తమ కొడుకు నిజమైన తల్లి తండ్రులను వదలి, తన గౌరవము కొరకు కిరాయికి కొంతకాలముండి
పోవువారినే తల్లి తండ్రులుగా చూపడమే కాకుండా, పెళ్ళి సమయములో శాశ్వితము కాని తల్లితండ్రుల పేర్లనే తన



--
తల్లితండ్రులుగా చెప్పడము గమనించిన తల్లి తండ్రులు, తమకు పుట్టి తమ పేరు చెప్పక వేరే వారి పేర్లు చెప్పడము
ఎంతో బాధాకరమైన విషయమైనప్పటికీ, తమ బిడ్డ ఎంత మోసగాడైనా తమ బిడ్డే కదాయని ఓర్చుకొని ఉండిరి.

చూచారా ఇది ఎంత బాధాకరమైన విషయమో! ఏ తల్లి తండ్రయినా తమ ఎదుటే తముకొడుకు తమను
కాదని, ఇతరులను తల్లి తండ్రులుగా చెప్పడము చూస్తే, వారు ఎంతో కృంగిపోవడము జరుగుతుంది. ఈ విషయము
ఏ తల్లితండ్రులకైనా మానసిక బాధను కల్గిస్తుంది. కానీ ఇక్కడ జరిగిన సంఘటనలో పెళ్ళి కుమారుని నిజమైన
తల్లితండ్రులు బాధపడలేదు. ఎక్కడుండినా, ఎవరిని తల్లితండ్రులుగా చెప్పినా, చివరికి అతను తమ కుమారుడే కదా!యనీ,
తమ కుమారుడు సుఖముగా ఉంటే చాలునని అనుకొన్నారు. తమ కుమారుడు తమ కళ్ళెదుటే తమను పాలేరులుగా
చిత్రించి, తల్లి తండ్రికాని తాత్కాలిక తల్లి తండ్రులను తన తల్లి తండ్రులుగా చెప్పుకోవడము ఓర్చుకొని, అతను ఎలా
చెప్పినా మేమే కదా! అతని తల్లితండ్రులమనుకొన్నారు. ప్రస్తుతానికి తనది తప్పని తెలియక ఇతరులను తల్లితండ్రులుగా
చెప్పినా, ఏనాటికైనా తమనే తల్లి తండ్రులుగా ఒప్పుకొని తీరునని అనుకొన్నారు. అలా ఆరు నెలల కాలము గడచి
పోయినది. అంతలో ఒకరోజు తమ కొడుక్కు పెద్ద జబ్బు చేసినదని పల్లెటూరిలోనున్న తల్లితండ్రులకు తెలిసింది. తమ
కొడుకు జబ్బుతో బాధపడుచున్నాడని తెలిసిన వెంటనే, ఆ వృద్ధదంపతులు పట్టణమునకు బయలు దేరిపోయారు.
వారు పోకముందే అసుపత్రిలోనున్న అతనికి రక్తము తక్కువగా ఉన్నదనీ, అతనికి సరిపడు గ్రూప్‌ రక్తము కావాలనీ
డాక్టర్లు చెప్పారు. అప్పుడు పెళ్ళిలో ప్రస్తుతానికి తల్లి తండ్రులుగానున్న వారిని అతని మామగారు పిలువనంపాడు.
వారి రక్తమును పరీక్షించగా వారిలో అతని గ్రూప్‌కు సంబంధించిన రక్తము లేదని తెలిసింది. అలా జరిగిన తర్వాత
అతని నిజమైన తల్లితండ్రులు ఆసుపత్రికి రావడము జరిగినది.  తన అల్లుడు పాలేరులని చెప్పబడిన వారిని చూచి
అతని మామకు అనుమానము వచ్చినది. ముందు తల్లితండ్రులుగా వచ్చిన వారిలో అతని పోలికలు లేకపోవడమూ,
వారి రక్తము గ్రూప్‌ వేరయివుండడమూ, వారు తల్లితండ్రులు కాదేమో అను సంశయము కల్గినది. అట్లే పాలేరులుగా
చెప్పబడిన దంపతులలో అల్లుని పోలికలు ఎక్కువగా ఉండడమును చూచి వీరే అతని తల్లి తండ్రులేమో అని అనుమానము
వచ్చినది. వెంటనే అతని మామగారు అక్కడికి వచ్చిన దంపతుల రక్తమునూ, డిఎన్‌ఎను ( అంటే జీన్స్‌ను) పరీక్షించగా
అతని రక్తము గ్రూప్‌ సరిపోవడమేకాక, ఆ దంపతుల డిఎన్‌ఎ ( అంటే జీన్స్‌) తన అల్లుని డిఎన్‌ఎ ఒక్కటేనని తెలిసిపోయింది.
దానివలన ఆ దంపతులకే అతను కొడుకన్సీ వారే అతని నిజమైన తల్లి తండ్రులని తెలిసిపోయింది. చివరకు తామే
నిజమైన తల్లితండ్రులమనీ, పెళ్ళిలో కనిపించిన వారు తాత్కాలిక తల్లితండ్రులుగా ఉన్నవారేననీ, అందరికి
తెలిసిపోవడముతో తమ కొడుకు కూడ తమను నిజమైన తల్లి తండ్రులుగా ఒప్పుకోవడముతో ఆ దంపతులు సంతసించారు.
అప్పుడు తమ కొడుకును సొంత ఇంటికి పిలుచుకపోయారు.

తన నిజమైన తల్లి తండ్రులను వదలి ఇంతకాలము వేరుగా, దూరముగా ఉన్నందుకు కొడుకు తల్లి తండ్రులకు
క్షమాపణ చెప్పుకొన్నాడు. తన తప్పును తెలుసుకొన్నందుకు, తిరిగి నిజమైన తండ్రి ఇంటిని చేర గలిగాడు. ఈ
మొత్తము సంఘటనలో ఎవరైనా కొడుకుదే తప్పనీ, తల్లి తండ్రులు ఎంతో ఓపికతో వ్యవహరించారనీ, అటువంటి
కొడుకు ఏ తల్లి తండ్రులకు ఉండకూడదని చెప్పుదురు. ఈ సంగతిని చదివిన మీరు కూడా కొడుకుది విలన్‌పాత్ర,
తండ్రిది హీరోపాత్ర అని తప్పక చెప్పుదురు. అయితే ఆ విలన్‌ పాత్ర తనదేనని ఎవరూ అనుకోరు. ఈ విషయమును
వివరముగా చెప్పుకొంటే ఇలా కలదు. ప్రతి మనిషికి శాశ్వితమైన, అశాశ్వితమైన రెండు రకముల తల్లి తండ్రులు
కలరు. ఇప్పుడు చెప్పిన ఉదాహరణలో పెళ్ళి కుమారునికి పెళ్ళి సమయములో కొద్దిసేపు తల్లి తండ్రులుగానున్నవారు



--
అశాశ్విత తల్లి తండ్రులు. అతనిని చిన్నప్పటినుండి పెంచిన శాశ్విత తల్లితండ్రులు ఉన్నట్లే, ప్రతి మనిషికి ప్రపంచము
పుట్టినప్పటినుండి జీవాత్మను పోషించుచున్న ప్రకృతి పరమాత్మ శాశ్విత తల్లి తండ్రులుగా, ఒక జన్మకు మాత్రము తల్లి
తండ్రులుగానున్న శరీర తల్లి తండ్రులు అశాశ్విత తల్లితండ్రులుగా గలరు. జీవుడు తన శాశ్వితమైన తల్లితండ్రులను
పెళ్ళికొడుకువలె వదలివేసి, పెళ్ళిలో మాత్రము పనికి వచ్చు వారిని పట్టుకొన్నట్లు, ఒక జన్మలో మాత్రము పనికి వచ్చు
అశాశ్వితమైన వారిని చెప్పుకొంటున్నాడు. అతను చేసినట్లే మనము కూడా శాశ్విత జననీ జనకులైన ప్రకృతి పరమాత్మలను
వదిలి, తల్లితండ్రి కానివారిని పట్టుకొన్నాము. మనము ప్రకృతి పరమాత్మలను తల్లి తండ్రులుగా అనుకోక పోయినా,
వారు మాత్రము ఎంతో ఓపికతో మనము ఎక్కడున్నా ఎవరిని ఆశ్రయించినా,  చివరకు వారు మనిషిని తమ సంతతే
కదా! యని అనుకొనుచున్నారు. పెళ్ళిలో తమ కొడుకు తమ ముందరే వేరే తల్లి తండ్రులకు పాద నమస్కారము
చేస్తుండినప్పుడు కూడా, తమ కొడుకు క్షేమమునే కోరుకున్న తల్లి తండ్రులవలె, ప్రకృతి పరమాత్మలు జీవుని మీద
ఏమాత్రము ఆగ్రహమును (కోపమును) చూపలేదు. వారి కొడుకు తన తప్పును తెలుసుకొని చివరకు తన సొంత
ఇంటికి పోయినట్టు, జీవుడు కూడా తను అజ్ఞానముతో ప్రవర్తించినది తప్పని తెలుసుకొని, జ్ఞానమును కలిగి తన
నిజమైన తల్లి తండ్రులైన ప్రకృతి పరమాత్మల సన్నిధిని ( అంటే మోక్షమును) చేరగలడు. ఈ విషయము జీవులైన మనందరికి
కనువిప్పుగా ఉండవలెనని తలచుచున్నాను.

ప్రతి మనిషి తల్లి తండ్రుల విషయములో పొరపాటుపడకూడదనీ, శరీర తల్లితండ్రులను శరీర గౌరవముతోనే,
ఆత్మ తల్లితండ్రులను ఆత్మ గౌరవముతోనే చూడవలెననీ మేము చాలామార్లు చాలామందికి తెలియ జేశాము. చాలామంది
శరీర తల్లితండ్రులను తప్ప తన ( అంటే జీవాత్మ) యొక్క తల్లి తండ్రులను ఏమాత్రము గుర్తించడము లేదనీ, అలా చేయడము
వలన తనకు ప్రకృతి పరమాత్మల వలన సంక్రమించునది ఏదీ లభించకుండా పోవునని తెలిపాము. మేము చెప్పినమాట
విన్న కొందరు ఇలా ప్రశ్నించడము కూడా జరిగినది. "ఎవరూ ఇంతవరకు చెప్పని విషయమును మీరు చెప్పుచున్నారు.
మాకు తెలిసినంతవరకు కనిపించు తల్లి తండ్రులు తప్ప ఎవరూ లేరు. ఇది మాకు తెలిసిందేకాక, ఎంతోమంది
స్వాములు మరియు జ్ఞానమును తెలిసిన పెద్దలు కనిపించు తల్లితండ్రులనే పోషించమన్నారు, గౌరవించమన్నారు మరియు
పూజించమన్నారు. పెద్దలు చెప్పినట్లు కొందరు చేయుచున్నారు, కొందరు చేయడము లేదు. కానీ మీరు మాత్రము
ఇప్పుడు ఇంకొక తల్లితండ్రులు కూడా ఉన్నారనీ, వారు వీరికంటే పెద్దవారనీ, వారిని మీరు గుర్తించకపోతే వారి ఆస్తి
మీకురాదనీ చెప్పుచున్నారు. వారు ఎవరో, వారి ఆస్తి ఏమిటో మాకు తెలియదు. అందరికి తెలిసినట్లు మా తల్లితండ్రులే
మాకు తెలుసు. వారు నాకు పంచి ఇచ్చిన పది ఎకరముల ఆస్తి కూడా తెలుసు. అయితే కనిపించని తల్లితండ్రులను
గురించిగానీ, వారి వలన వచ్చు ఆస్తి విషయముగానీ మాకు తెలియదు. మీకేమైన తెలిసియుంటే వారు ఎలావుంటారో,
వారి ఆస్తి ఏమిటో తెలిపితే, వారిని వెతికి తెలుసుకోవడమేకాక, వారి నుండి వచ్చు ఆస్తి కూడా తీసుకొంటాము.” అని
అడిగారు. దానికి మేము చెప్పిన జవాబు ఏమనగా!

మేము మీకురెండవ తల్లితండ్రులున్నారని చాలామార్లు చెప్పినా మీరు అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు
వారి ఆస్తి మీకు రాదు అంటూనే, ఆస్తిపేరు వింటూనే వారు ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? వారివద్ద మాకు వచ్చే ఆస్తి
ఏమివుంది అని అడుగుచున్నారు. కృష్ణ భగవానుడు ఐదువేల సంవత్సరముల పూర్వము భగవద్గీతలో తల్లితండ్రుల
విషయమును చెప్పినప్పటినుండి మీరు ఇంత ఆసక్తిని కనపరచకూడదా? ఒకవేళ ఆయన చెప్పినది మాకు తెలియదంటే,
రెండు వేల సంవత్సరముల పూర్వము బైబిలులో ఏసుప్రభువు “నీ తండ్రి పరలోకమందున్నాడని” చెప్పినప్పుడు, ఆ


--
తండ్రిని గురించి, ఆయన వలన వచ్చు ఆస్తిని గురించి అడుగకూడదా? 14 వందల సంవత్సరముల క్రిందట ఖురాన్‌
గ్రంథములో మహమ్మద్‌ ప్రవక్తగారు “నిన్ను పుట్టించింది దేవుడే” అని గట్టిగా చెప్పినపుడు ఆయన ఎవరు? ఆయన ఆస్తి
ఏమిటి అని చిన్నగానైనా, ఎవరైనా అడిగారా? ఎంతోమంది ప్రవక్తలు, భగవంతుడు గతములోనే నీ నిజమైన తల్లితండ్రులను
గురించి చెప్పియుండగా, ఎవరూ చెప్పని విషయము మీరు చెప్పుచున్నారే అని అడగడమేమిటి? మీవలె అసలైన
తల్లితండ్రుల గురించి ప్రస్తుత కాలములోని కొందరి స్వాములకు తెలియకుండాపోయింది. కావున వారు చెప్పకపోతే
సత్యమును చెప్పిన మేము కల్పించి చెప్పినట్లా? కొందరనుకొన్నట్లు మేము తల్లితండ్రుల విషయములో అసత్యమును
చెప్పలేదు. ఎంతోమంది వక్తలు, ప్రవక్తలు గతములో చెప్పిన విషయములనే మేము కూడా చెప్పాము. ఇప్పుడు ఆ
తల్లితండ్రుల ద్వారా వచ్చు ఆస్తి ఏమిటో తెలియజేస్తాను వినండి.

కనిపించు శరీర తల్లితండ్రులు కనిపించే ఆస్తినే ఇవ్వగలరు. కనిపించు ఆస్తి ధన, కనక, వస్తు, వాహనములు
అయిన చరాస్థి, అట్లే గృహములు, భూములు అనబడు స్థిరాస్థులు తప్ప ఏమీ ఉండదు. ఇందులో చర ఆస్తులని కొన్ని
స్థిర ఆస్తులని కొన్ని ఉన్నా వాస్తవానికి అన్నీ చరాస్థులనియే చెప్పవచ్చును... చర ఆస్తి అనగా అశాశ్వితమైనదనీ,
మార్చుచెందేదని అర్థము. అలాగే స్థిరాస్తి అనగా శాశ్వితముగా ఉండునదనీ, మార్పు చెందనివని అర్థము. పేరుకు
భూములను స్థిరాస్థులని కొందరు చెప్పుకొనినా, వాస్తవానికి అవి కూడా మనిషికి చరాస్థులేనని చెప్పవచ్చును. అదెలా
అనగా! కనిపించు శరీర తల్లితండ్రులు శాశ్వితమైనవారు కారు. వారు ఒక జన్మకే తల్లి తండ్రులు కాగా, ఒక జన్మలో
కూడా పూర్తి కాలముండక కొంతకాలముండి పోవువారే. అశాశ్వితమైన వారినుండి లభించునవి కూడా అశాశ్వితమైనవేనని
చెప్పవచ్చును. దీనినిబట్టి ఇంతవరకు బాహ్య తల్లి తండ్రులనుండి శాశ్వితమైనది లభించలేదు. ఇప్పుడు కొందరు ఒక
ప్రశ్నను అడుగవచ్చును. మనిషి కూడా కొంతకాలముండి పోవువాడే కదా! అటువంటప్పుడు మనిషే శాశ్వితము
కానప్పుడు, వానికి శాశ్వితమైన ఆస్తి ఏమివుండును? అని,అడుగవచ్చును. దానికి జవాబును గమనిస్తే ఇలా కలదు.
కనిపించే మనిషిలో శాశ్వితమైనది, శాశ్వితముకానిది అని రెండు భాగములు కలవు. శాశ్వితముకానిది పైకి కనిపించు
శరీరమని తెలుసు కొన్నాము. పైకి కనిపించని జీవుడు సృష్ట్యాదిలోనుండి ఉన్నాడు. తాను ధరించిన ఎన్నో శరీరములు
నశించి పోయినా, తానుమాత్రము నాశనము కాకుండా ఉన్నాడు. అందువలన జీవుడు శాశ్వితమైనవాడనీ, శరీరము
అశాశ్వితమైనదనీ చెప్పుచున్నాము. అంతేకాక ఒక జీవుడు శరీరమును ధరించి ఒకచోట ఉండడము లేదు. ఒక్కొక్క
జన్మలో ఒక్కొక్క ప్రాంతమునకు, ఒక్కొక్క పేరుకు పరిమితమై పోతున్నాడు. ప్రాంతములు, పేర్లు శరీరము కొంతకాలమే
ఉండగా జీవుడు శాశ్వితముగా ఉన్నాడు. శరీరముతో కూడుకొన్న మనిషి అశాశ్వితముకాగా, అందులోని జీవుడు
శాశ్వితమేనని తెలుసుకొన్నాము కదా! అదే విధముగా కనిపించు మనుషులైన అశాశ్విత తల్లి తండ్రులనుండి లభించునవి
అశాశ్విత ఆస్తులేనని చెప్పవచ్చును. అయితే శాశ్వితమైన తల్లి తండ్రులనుండి లభించు ఆస్తి, శాశ్వితముగానే ఉండునను
నది సూత్రము. దానిప్రకారము సృష్టాదిలో జీవునికి తల్లితండ్రులైన ప్రకృతి పరమాత్మలు ఎప్పటికి ఒకేలాగున్నారు.
వారూ మారలేదు, వారికి పుట్టిన జీవుడూ మారలేదు. అందువలన శాశ్వితమైన తల్లితండ్రుల నుండి వచ్చు ఆస్తి
శాశ్వితమైనదేనని చెప్పాము.

కనిపించు తల్లి తండ్రులనుండి చర స్థిరాస్తులనునవి లభించినా అవి అన్నీ చరాస్తులేనని చెప్పాము కదా! అలాగే
ప్రకృతి పరమాత్మల నుండి ఆస్తులుగా లభించినవి కూడా చర స్థిరాస్తులుగలవనియే చెప్పవచ్చును. దేవుని నుండి
మనిషికి లభించు వాటిని ఒక పద్దతి ప్రకారము చర స్ధిర ఆస్తులని చెప్పినా, వాటిని మరొక విధముగా స్థిరాస్థులనియే



--
చెప్పవచ్చును. శాశ్వితమైన తల్లితండ్రులనుండి లభించు ఆస్తులు శాశ్వితమైనవేనను సూత్రము ప్రకారము, తండ్రి
అయిన దేవునినుండి లభించు చర స్థిర ఆస్తులన్నీ శాశ్వితమైనవే అగును. దేవుని నుండి లభించు వాటిలో కూడా చర,
స్థిర అను రెండు రకములు ఉండునా? అని ఎవరైనా అడిగితే ఈ విధముగా జవాబును చెప్పవచ్చును. దేవుని నుండి
లభించు వాటిలో ఒక జీవితకాలమంతా ఉండునవి చరాస్తులనీ, ఒక జీవితము అను కొలత లేకుండా శాశ్వితముగా
ఉందునది స్థిరాస్తి అనీ చెప్పవచ్చును. ఒక జీవిత కాలములో మాత్రముండి, మరణసమయములో పోవునవి చరాస్తులని
చెప్పవచ్చును. అవి మన శరీరములో జన్మలోనే లభించినప్పటికీ కనిపించెడి, కనిపించని రెండు రకముల అవయవములని
చెప్పవచ్చును. అటువంటి చరాస్తులలో ముఖ్యమైనవి గుండె, మూత్రపిండములు, కాలేయము, ఊపిరితిత్తులు మొదలగునవి
ఎన్నో కలవు. ఇవన్నియు ఒక జన్మకు పరిమితిగా ఉన్ననూ, తర్వాత జన్మలలో కూడా "అటువంటి అవయవములనే
దేవుడు ఇస్తున్నాడు. శరీరములోని అవయవములన్నీ ఒక జన్మకే పరిమితమైనవయినప్పటికీ, అన్ని జన్మలలోనూ అవే
అవయవములు లభించుట వలన, వాటిని కూడా ఒక విధముగా శాశ్వితమైన వాటి జావితాలోనికి చేర్చి చెప్పవచ్చును.

ఇకపోతే దేవుని నుండి లభించు శాశ్వితమైనది ఒకటి గలదు. దానికంటే మించినది, దానికంటే గొప్పది ఏదీ
ఉండదు. అదియే మోక్షము, మోక్షమునే ముక్తి అనికూడా అందురు. ఒక్కమారు ముక్తి లభించితే అది నీవద్ద
శాశ్వితముగా ఉండును. అది లభించిన తర్వాత జన్మ జన్మకు మారిపోవు చరాస్తులతో పనిలేదు. అందువలన ముక్తి
లభించినవానికి జన్మలే ఉండవు. మోక్షము ఒక్కమారు లభిస్తే, అది పూర్తి స్థిరాస్తిగా ఉండి పోవును. ఎంతో గొప్ప
స్థిరాస్తి అయిన మోక్షము దేవుడైన తండ్రి వద్దనుండి లభించునదైనా, అది అంత సులభముగా ఎవరికీ లభించదు. నీవు
నిజముగా సృష్ట్యాదినుండి ఎవరి కుమారుడవో తెలిసి, ఫలానావాడే నాకు శాశ్విత తండ్రి అని తెలిసి, మౌనముగా ఉండు
దేవునివద్ద నేను నీ కుమారున్ని నీవే నాకు నిజమైన శాశ్వితమైన తండ్రివని ఒప్పుకొని, చెప్పుకొని దానికి తగిన
సాక్ష్యాధారములన్నిటిని దేవునికి చూపగలిగితే, మనిషి చెప్పునదంతా మనస్పూర్తిగా చెప్పుచున్నాడని దేవునికి తెలిస్తే,
అప్పుడు ఆయన నుండి మోక్షము లభించును. మనిషి చెప్పునది పూర్తి సత్యమని తెలిసి దేవుడు మనిషికి మోక్షమునివ్వగా,
అది లభించిన మనిషి తిరిగి జన్మించక దేవుని సన్నిధానమైన పరమును చేరును. పరలోకమును చేరినవాడు ఎవ్వడైనా
అంతవరకున్న తన స్థితిని కోల్పోయి, దైవస్థితిగా మారి పరలోకమును చేరును. దేవుని ఆస్తి అయిన మోక్షమును
పొందిన వాడు, దేవుడంతటి వానిగా కాకుండా దేవునిగా మారిపోవును. ఒక మనిషి మోక్షమును పొందితే, వాడు
దేవుడైపోతే, అంతవరకున్న దేవుడేమవుతాడు? అప్పుడు ఇద్దరు దేవుళ్ళవుతారా? అని కొందరు అడుగవచ్చును. దానికి
సమాధానము ఏమనగా! సృష్టాదినుండి దేవుడు ఒక్కడే ఉంటాడు. కానీ మనిషి మోక్షము పొందితే ఇద్దరు దేవుళ్ళు
కారు. ఎంతమంది మనుషులు మోక్షమును పొందినా వారందరు, ఉన్న దేవునిలోనికి కలిసిపోయి వారు కూడా దేవుడై
పోతున్నారు. వేయిమంది జీవుళ్ళు మోక్షమును పొందినా వారందరు ఒక్క దేవునిలోనికే చేరిపోవుదురు. నదులు ఎన్ని
సముద్రమును చేరినా అన్నియు సముద్రముగా మారిపోవును కదా! నదులు సముద్రమును చేరిన తర్వాత అంతవరకు
తమకున్న పేరును స్థితిని కోల్పోయిన నదులు సముద్ర స్థితిగా, సముద్రము అను పేరుగా మారిపోవును కదా! అదే
విధముగా శరీరమును ధరించిన వారు ఎందరు మోక్షమును చేరినా, వారందరూ దేవునిగానే ఉందురు. సముద్రములో
నదిని గుర్తించలేనట్లు, దేవునిలో చేరిన వానిని ఫలానా అని గుర్తించలేము. ఎన్ని నదులు చేరినా మొదటి నుండి ఉన్న
సముద్రము తన స్థానమునుగానీ, తన స్థితినిగానీ, తన సాంధ్రతను గానీ ఎలా కోల్పోదో, అదే విధముగా ఎందరు




--
జీవుళ్ళు దేవుని లోనికి చేరినా దేవుడు తన స్థితినిగానీ, తన ధర్మమునుగానీ కోల్పోవడము లేదు. సముద్రమును చేరిన
ఏ నది అయినా మాయమైపోయినట్లు, దేవున్ని చేరిన ఎవడుగానీ అంతవరకున్న తన స్థితినీ, పేరునూ కోల్పోవును.

భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమను అధ్యాయములో ఏడవ శ్లోకము ఈ విధముగానున్నది.

శ్లోకము: మమై వాంశో జీవలోకే జీవభూత స్సనాతనః|
మనష్షష్టా ణీన్ద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి||
భావము :- జీవాత్మ నా అంశముతోనే ప్రకృతిలో పుట్టినప్పటికీ అది కర్మచేత కూడుకొన్నదై, మనస్సు మొదలగు
ఇంద్రియములచేత బంధింప బడి జన్మలకు అటు ఇటు లాగబడుచున్నది.

పై శ్లోకములో దేవుడు చెప్పినట్లు జీవాత్మ అయినవాడు మొదట పరమాత్మనుండి పరమాత్మ అంశతో పుట్టినవాడేనని
తెలియుచున్నది. పరమాత్మ ( అంటే దేవుడు) లోని సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక భాగముచేత పుట్టిన వాడే ఒక మనిషి, అందువలన
పై శ్లోకములో “మమైవాంశో జీవలోకే జీవభూత” అని చెప్పబడివున్నది. ఒక జీవుడు భూమిమీద ఏ మనిషిగా
నున్నప్పటికీ, అతడు సముద్రము నీరు వర్షపు బిందువు అయినట్లు, దేవుని నుండి వచ్చిన అంశేనని తెలియుచున్నది.
దేవుని నుండి విడిపోయిన దేవుని అంశ అయిన జీవుడు కర్మచేత బంధింపబడివుండి, ఎన్నో జన్మలు పొంది, చివరకు
కర్మను తెలుసుకొని, దానినుండి బయటపడి, తిరిగి తన మొదటి స్థానమైన దేవున్ని చేరుచున్నాడు. కర్మ బంధనములేని
జీవుడు దేవున్ని చేరినపుడు, జీవుడు దేవుని అంశే అయిన దానివలన సులభముగా దేవునియందు కలిసి పోవుచున్నాడు.
దానినే జీవ బ్రహ్మ ఐక్య సంధానము అని అనవచ్చును. కర్మ బంధము నుండి బయటపడడమునే ముక్తి లేక మోక్షము
అనవచ్చును. దేవుని అంశ అయిన జీవుడు కర్మచేత బంధింపబడి, అనేక జన్మలను పొంది, ఎప్పుడో ఒకప్పుడు తన
జ్ఞానమును తాను తెలుసుకొని, కర్మ అను జైలునుండి విడుదల ( అంటే ముక్తి) పొంది, మొదటి స్థానమైన తన స్థానమును
తాను చేరి, మొదట తాను ఎవరైవుండెనో అతనిగానే ( అంటే దేవునిగానే) మారిపోవుచున్నాడు.

ఇప్పుడు మీ తరపున నేనే జీవున్ని ఒక ప్రశ్నను అడుగుచున్నాను. అదేమనగా! శరీర తల్లితండ్రులు తమ
కుమారునికి ఆస్తి ఇచ్చినప్పుడు ఒక చరాస్థియేకాక్క స్థిరాస్తిని కూడా ఇవ్వడము జరుగుచున్నది. ఒకమారు తండ్రి ఆస్తిని
ఇస్తే రెండు రకముల ఆస్తులను ఇచ్చును. కానీ మొదట ఒకటి ఇచ్చి తర్వాత కొంత కాలమునకు మరియొకటి
ఇవ్వడము లేదు. అయితే మనిషికి దేవుడు మొదటి శరీరములోని అవయములను చరాస్తులుగా ఇచ్చి, తర్వాత ఎన్నో
జన్మలు గడచిన పిమ్మట జీవుడు ఇష్టముగా కోరుకుంటే, అదియూ జీవుని కోర్కెను తాను ఒప్పుకొంటే, అప్పుడు స్థిరాస్తి
అయిన మోక్షమును ఇచ్చునని మీరు తెలిపారు. శరీర తండ్రి ఇచ్చినట్లు జీవుని తండ్రి అయిన దేవుడు రెండు రకముల
ఆస్తులను ఒకేమారు ఎందుకు ఇవ్వలేదు? అని అడుగుచున్నాను. దానికి సమాధానము నా ప్రక్కనేవున్న నా హితుడు
(ఆత్మ) ఇలా చెప్పుచున్నాడు. బాహ్యముగా కనిపించు శరీరతండ్రి ఇచ్చిన చర, స్థిర అను రెండు రకముల ఆస్తులు ఒక
మనిషి పొందిన తర్వాత అతని వద్దనున్న చరాస్థిని స్థిరాస్తిగా మార్చుకోవచ్చును. అలాగే తనకున్న స్థిరాస్తిని కూడా
చరాస్తిగా మార్చు కోవచ్చును. చరాస్తి అయిన డబ్బుతో స్థిరాస్తి అయిన భూములను, గృహములనుకొని చరాస్తిని
స్థిరాస్తిగా మార్చుకోవచ్చును. అలాగే స్థిరాస్తి అయిన భూమిని గృహములను అమ్మి చరాస్థి అయిన డబ్బుగా
మార్చుకోవచ్చును. కానీ దేవుడిచ్చిన చరాస్తిని స్థిరాస్తిగా మార్చుకోలేము. అలాగే దేవుడిచ్చిన స్థిరాస్తిని కూడా చరాస్తిగా
మార్చుకోలేము.




--
ఇంకా వివరముగా చెప్పుకొంటే కనిపించు తండ్రి ఒక్కమారు రెండు రకముల ఆస్తులను ఇచ్చినట్లు, కనిపించని
తండ్రి అయిన దేవుడు రెండు ఆస్తులను ఒక్కమారు ఇవ్వడు. మొదట చరాస్తి మాత్రము ఇచ్చును. చరాస్తితో మనిషి
జీవనము సాగించుచుండును. ఏ మనిషియైనా నాకు చరాస్తి వద్దు, నాకు స్థిరాస్తియే కావలెనని కోరుకున్నపుడు, అతను
పూర్తి ఇష్టముతో స్థిరాస్తిని కోరియుంటే అతనికున్న చరాస్తిని తీసుకొని, స్థిరాస్తిని దేవుడు ఇవ్వడము జరుగుచున్నది.
దేవుడు ఇచ్చు రెండు ఆస్తులలో ఒకటి ఉంటే రెండవది ఉండదు. దేవుడిచ్చు రెండు ఆస్తులు పరస్పర విరుద్ధమైనవి.
చరాస్తి అయిన శరీరముంటే స్థిరాస్తి అయిన మోక్షముండదు. ఒకవేళ స్థిరాస్తి అయిన మోక్షము లభిస్తే చరాస్తి అయిన
శరీరముండదు. ఇదిలా ఉండగా జీవుని తండ్రి అయిన దేవుడు, మొదట మనుషులందరికి చరాస్తి అయిన శరీరమును
ఇచ్చాడు. అలా ఇచ్చిన శరీరముతోనే మనిషి తృప్తిపడి జీవించుచున్నాడు. శరీరములోనున్న మనిషి (జీవుడు) రెండవ
ఆస్తి విషయమునే మరిచి పోయాడు. రెండవ రకమైన ఆస్తి అయిన మోక్షము నాకు అవసరమే లేదని కొందరనుచున్నారు.
కొందరైతే శరీరముతో చస్తూ బ్రతుకుచూ ఇలా కాలము గడపడమే మంచిది కదా! ఏ పనీ లేని మోక్షమును పొందితే
కాలమెట్లు గడుస్తుంది అని అంటున్నారు. అటువంటి వారు మోక్షమును కోరడములేదు. మోక్షమును ఇష్టముగా
కోరితేనే దేవుడిస్తాడు. కానీ దానిని కోరకుండినా, అయిష్టముగా కోరినా దేవుడు ఇవ్వడు. దేవుడిచ్చు రెండు రకముల
ఆస్తులలో ఒకదానిని కోరకుండానే ఇచ్చును. రెండవ దానిని, కోరినా వానికున్న శ్రద్ధనుబట్టి ఇచ్చును. శ్రద్ధా లోపము
ఏ కొద్దిగాయుండినా దేవుడిచ్చు మోక్షము లభించదు.

ఇంకా కొందరైతే దేవుడిచ్చిన చరాస్తి అయిన శరీరము ఉండవలెనని కోరుచూ, రెండవ రకమైన మోక్షమును
కూడా కోరుచున్నారు. అయితే అలా ఇచ్చుటకు దేవుడు ఒప్పుకోడు. దేవుడు ముందే, ఒకటివుంటే మరొకటి ఉండదని
శాసనము చేశాడు. ఆ శాసనము ప్రకారము, శరీరమున్నట్లే మోక్షము ఎవరికీ లభించదు. శరీరమును కోరువారు
మోక్షమును కోరరు. కోరినా వారికి మోక్షము లభించదు. కొందరికైతే వారికి కనిపించని తండ్రి ఒకడున్నాడనిగానీ,
ఆయన వలన మోక్షము లభిస్తుందని గానీ ఏమాత్రము తెలియదు. అటువంటి వారు రెండవ ఆస్తి అయిన మోక్షమును
కోరే ప్రసక్తేలేదు. వారు శాశ్వితముగా జనన మరణములను పొందుచుందురు. అటువంటి వానికి దేవుడు ఎవరని
కూడా తెలియదు. కావున వారు దేవున్ని కూడా నిందించు స్థితిలో ఉందురు. వారు దేవున్ని నిందిస్తే, వారికి దేవుడు
తప్పక శిక్షను విధించును. భూమిమీద కొందరు కనిపించే తల్లి తండ్రుల ఆస్తులను అనుభవిస్తూ, ఆ ఆస్తులను తమ
హక్కుగా తలచుచూ, తల్లితండ్రులు తమకు ఇచ్చినవే ఈ ఆస్తులు అని ఏమాత్రము అనుకోకుండా, ఇప్పుడున్న ఆస్తులకంటే
ఇంకా *శేష్టమైన వాటిని ఇవ్వలేదే. అని, తమ తల్లితండ్రులను అసమర్థులుగా చిత్రించి మాట్లాడుచుందురు. అదే
విధముగా దేవుని విలువను, జ్ఞానమును గుర్తించని మనుషులు కొంత వయస్సు మళ్ళిన తర్వాత వృద్ధాప్యములో
కళ్ళు కనిపించకపోతే, మోకాళ్ళ నొప్పులు వస్తే, శరీరము మెత్తబడిపోతే, దేవుడు ఇటువంటి శరీరమును ఎందుకివ్వాలి?
నల్లరాయితో చేసిన శరీరమును ఇవ్వకూడదా! లేక ఏదో ఒక లోహముతో చేసిన శరీరమును ఇవ్వకూడదా? ఈ
విధముగా మోకాళ్ళు అరిగిపోయేది, ఎముకలు విరిగి పోయేది, కండలు కరిగిపోయేది అయిన శరీరమును ఇవ్వమనీ,
అసలుకు ఇటువంటి శరీరమును తయారు చేయమనీ ఎవరు సలహా ఇచ్చారో! అని అడిగేవారు కూడా ఉన్నారు. ఈ
విధముగా ఉన్న ఆస్తిని వదలి లేని ఆస్తిని, ఇంకా సుఖమునిచ్చే ఆస్తినీ కావాలని కోరుకొనేవారున్నారు. అలా కోరడములో
తప్పులేదుగానీ, తమకున్న ఆస్తి విలువను తెలుసుకోలేకపోవడము తప్పగుచున్నది. తమకు ఇచ్చిన శరీరములోని బుద్ధి
అను ఆస్తి ప్రపంచములో ఏ జీవరాసులకు ఇవ్వలేదనీ, తమకున్న యోచనాశక్తి ఏ జాతి జంతువులకు కూడా లేదనీ,


--
అటువంటి బుద్ధిని ఇచ్చినందుకు తమ తల్లితండ్రులైన ప్రకృతి పరమాత్మలు ఎంతో గొప్పవారనీ, అన్నిటికి సమర్ధులు
అనీ ఎవరూ అనుకోవడము లేదు. సృష్టాదిలో పుట్టించిన, శాశ్వితముగా తల్లితండ్రులైన ప్రకృతి పరమాత్మలను మనిషి
తెలుసుకోకుండా పోవడానికీ, వారి విలువను తెలియకుండాపోవడానికీ మనిషిలోని అజ్ఞానమే కారణము.

భూమిమీద కొందరు మనుషులు కొంత జ్ఞానమును తెలుసుకొని ఆ కొద్ది జ్ఞానముతోనే దేవుడు ఇటువంటివాడని
చెప్పుకొనుచున్నారు. ఒక్కొక్క మతమువారు ఒక్కొక్క విధ జ్ఞానమును కొంతవరకే తెలుసుకొని, దేవున్ని గురించి
మాట్లాడుచున్నారు. ఏ మతములో అయినాగానీ సంపూర్ణమైన జ్ఞానమును తెలియకుండానే, దేవుని గురించి మాట్లాడితే
అది అసంపూర్ణము గానే ఉండును. కొద్దిమాత్రము జ్ఞానమును తెలిసిన వాడికి దేవుడు ఎటువంటివాడో, ఆయన నిజ
స్వరూపమేమిటో, ఆయన విధానమేమిటో పూర్తిగా తెలియబడదు.  తమకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానముతో దేవుడు,
దేవుని విధానములు (ధర్మములు) కొద్దిగానే తెలియునని చాలామందికి తెలియదు. అందువలన ప్రతి మనిషి దేవుని
గురించి తనకు తెలిసినంత ఇతరులకు తెలియదని అనుకొనుచుండును. అలాగే ప్రతి మతము వారు తమ మతములో
దేవుని గురించి తెలిసినంత, ఇతర మతమువారికి తెలియదని అనుకొనుట, జరుగుచున్నది. ఇంకనూ మా మతములో
చెప్పబడిన దేవుడే నిజమైన దేవుడు అనీ, ఇతర మతములలో చెప్పబడిన దేవుడు నిజమైన దేవుడుకాదనీ అనుకోవడము
జరుగుచున్నది. ఈ విధముగా అన్ని మతములలోని ప్రజలు అనుకోవడము వలన, వారివారి భావములలో దేవుడు
వేరువేరు విధములుగా అర్థమైనాడు. దానివలన దేవుడు తమకు ఎలాతండ్రి అయినాడని మనిషికి పూర్తిగా అర్ధముకాకుండా
పోయినది. తండ్రి అయిన దేవుని విషయమే తెలియనపుడు, తల్లి అయిన ప్రకృతి విషయము ఏమాత్రము తెలియదనియే
చెప్పవచ్చును. దేవున్ని మరియు భగవంతున్ని గురించిన సమస్త జ్ఞానము మనిషికి ఎంతవరకు తెలియబడదో అంతవరకు
మనిషికి నిజమైన తండ్రి విషయము తెలియదు. అలాగే ప్రకృతి మరియు మాయను గురించి సమస్త జ్ఞానము మనిషికి
ఎంతవరకు తెలియబడదో అంతవరకు తనకు నిజమైన తల్లి ఎవరో తెలియదు. ముఖ్యముగ చెప్పుకొంటే అన్ని
మతములలో అన్ని మూల గ్రంథములలో పరమాత్మను (తండ్రిని) గురించి ఎక్కువగా, ప్రకృతిని (తల్లిని) గురించి
తక్కువగా చెప్పడము జరిగినది. ఎక్కువగా చెప్పబడిన పరమాత్మను గురించే మనిషికి సరిగా తెలియనపుడు, తక్కువ
వివరము చెప్పిన ప్రకృతిని గురించి మనిషి పూర్తి తెలియదనియే చెప్పవచ్చును. మొదట తల్లి అయిన ప్రకృతిని గురించి
తెలియనిదే, తండ్రి అయిన దేవున్ని గురించి ఎవరూ తెలియలేరు. ఎందుకనగా! ప్రకృతియే మనిషిలో మాయగా
తిష్టవేసుకొని ఉన్నది. మనిషి తలలోనున్న మాయ, దేవున్ని తెలుసుకొను ప్రతివానికి ఆటంకమై దైవ మార్గము నుండి
బయటికి త్రోయును.  మాయను దాటిపోవలెనంటే ఎంతటివారికైన దుస్సాధ్యము. దేవుడే ఆ విధముగా మాయకు
బలమునిచ్చి యుంచాడు.  ప్రతి మనిషిలోను గుణముల రూపములో మాయ ( అంటే సాతాను) లేక సైతాను స్థానము చేసుకొని
ఉన్నది. అటువంటి మాయను గురించి భగవంతుడు భగవద్గీతలో విజ్ఞానయోగము 14వ శ్లోకములో ఇలా తెలియ
చేశాడు.

శ్లోకము  14: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యన్తే మా యా మేతాం తరన్తి తే ||

భావము :- “దైవమునైన నా, చేత సృష్టింపబడిన నా మాయను జయించి దాటిపోవుట దుస్సాధ్యము. కానీ ఎవడైతే
నన్నే విశ్వసిస్తున్నాడో, ఆరాధిస్తున్నాడో వాడు మాత్రము నా మాయను జయించి దాటి పోగలడు” అని చెప్పబడినది.
ఈ మాట భగవంతుడు చెప్పిన దేవుని మాట. కావున క్రైస్తవులు యెహోవా చెప్పినట్లు, ముస్లిమ్‌లు అల్లాహ్‌ చెప్పినట్లు




--
లెక్కించుకోవలసిన అవసరమున్నది. దేవుడు సర్వమానవులకు చెప్పినది కాబట్టి అందరు పై వాక్యమును స్వీకరించవలెను.
భూమిమీద ఏ మతస్తుడైనా మనిషే కావున అతనికి గుణములున్నవి. గుణముల సమ్మేళనమే మాయగా ఉన్నది.
మాయను జయించనిదే ఎవడూ దానిని దాటి దేవున్ని చేరలేడు. అందువలన మొదట ఏ మతస్టుడైనగానీ మాయను
గురించి తెలియవలసిన అవసరమున్నది. మాయను గురించి తెలియనిదే, ఏ మానవుడూ దేవున్ని గురించి తెలియలేడు.
ముఖ్యముగ మాయ, మతమును అడ్డము పెట్టి మనిషిని దేవుని జ్ఞానములో ఉన్నట్లు మభ్యపరుచుచున్నది. మనిషి
మాయ చేతిలో మోసపోకుండా ఉండాలంటే మతాతీతుడు కావాలి. అన్ని మతములు తనవే అనుకోవాలి. అన్ని
మతములలో చెప్పబడిన దేవుడు వేరువేరు కాదని అందరికి ఒకడే దేవుడను భావము రావాలి. అలా కానంతవరకు నా
మతమువేరు, నీ మతమువేరు అను భావమున్నంతవరకు, మనిషి మాయ చేతిలోనే ఉండును. తాను ఆధ్యాత్మికవేత్తనని
హిందువునూ ( అంటే ఇందువునూ), నేను నిజమైన విశ్వాసిని ముస్లీమ్‌నూ, నేను అసలైన యెహోవా భక్తుడనని కైస్తవుడనూ
అనుకొనునట్లు చేసి అందరిని మాయ మభ్యపెట్టుచుండును. అటువంటి వారికి ఎవరికీ తన మతములోని జ్ఞానమునుగానీ,
ఇతర మతములలోని జ్ఞానముగానీ తెలియకుండా చేయును. తన మతములోని జ్ఞానము తనకు అర్ధమైనదని నమ్మించును.
అందువలన మొదట నీ తల్లినీ, తర్వాత నీ తండ్రిని తెలియవలెను. తల్లిని (మాయను) తెలియనిదే ఎవడు గానీ
తండ్రిని దేవున్ని తెలిసే ప్రసక్తే లేదు. ఈ రహస్యము తెలియక అన్ని మతములలోని వారూ తాము జ్ఞానులమని
అనుకోవడము జరుగుచున్నది.

ఇక్కడ చాలామందికి నన్ను ఒక ప్రశ్న అడుగుటకు అవకాశము కలదు. అదేమనగా! మీరు మీ రచనలలో
చాలాచోట్ల "త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భ ఽవార్జున" మూడు గుణ విషయములే వేదములు వాటిని విసర్జించు, వేదములను
వదలివేయుట వలన గుణ విషయములతో కూడుకొన్న మాయ నుండి బయటపడగలవు అని భగవద్గీత సాంఖ్య యోగములో
45వ శ్లోకమునందు వ్రాసినట్లు చెప్పారు. అంతేకాక విజ్ఞానయోగము 13,14 శ్లోకములలో...

శ్లోకము  13: త్రిభి ర్గుణమయై ర్భావై రేభి స్సర్వమిదమ్‌ జగత్‌ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పర మవ్యయమ్‌ ||
(పరమాత్మ)

శ్లోకము  14: దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యన్తే మా యా మేతాం తరన్తి తే ||
(పరమాత్మ)

“సర్వ జగత్తంతయు సాత్త్విక, రాజస, తామస గుణములతో కూడుకొని ఉండుట వలన ఆ గుణప్రభావముల
వలన సమ్మోహనము చెంది ( అంటే హిప్నటైజ్‌ చేయబడి) నాశనము కాని నన్నూ నా యొక్క పరం భావమును గురించి
ఏమాత్రము తెలియలేకున్నారు.”

“నాచేత తయారు చేయబడి గుణములతో కూడుకొన్న మాయను దాటుట దుస్సాధ్యమైన పని. ఎవడైతే నా
జ్ఞానమును తెలిసి నన్ను ఆరాధిస్తాడో, వాడే మాయను సులభముగా దాటిపోగలడు.” అందువలన మూడు గుణములు
మాయయనీ, మూడు గుణముల విషయములతో కూడుకొన్న వేదములు మాయకు ప్రతిరూపములనీ, మాయను
జయించుటకు వేదములను వదలి వేయాలనీ చెప్పారు కదా! ఇప్పుడేమో మాయను తెలియనిదే దేవున్ని తెలియలేరు
అంటున్నావు. అప్పుడేమో దేవున్ని నమ్మిన వాడు మాయను జయించగలడు అన్నావు. ఇప్పుడు ముందు మాయను
తెలుసుకో తర్వాత దేవుడు తెలియబడుతాడు అని చెప్పుచున్నావు. ఇదంతయు చూస్తే మీరు ద్వంద్వముగా మాట్లాడినట్లు


--
తెలియుచున్నది. ఇట్లు రెండు విధములుగా మాట్లాడితే, మేము ఏది నమ్మాలి? అంతరంగములోని మాయను
జయించాలంటే, బాహ్యములోని వేదములను వదలమన్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పే జ్ఞానము కూడా వేదము
కాదా? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఇలా ఉన్నది.

తండ్రిని గురించి చెప్పునది తల్లియేననీ, అలాగే దేవున్ని గురించి చెప్పునది ప్రకృతియేననీ (మాయయేననీ)
చెప్పాను కదా! కనుక దేవుడు మాయ ద్వారా (వేదము ద్వారా) తెలియునని ఇప్పుడు కూడా చెప్పుచున్నాను. ఇక్కడ
మీరు బాగా గమనించితే, మేము చెప్పిన దానిలో ఏ తప్పులేదనీ, మేము రెండు రకములుగా మాట్లాడలేదని మీకే
తెలియగలదు. ఇప్పుడు బాగా వినండి, మాయ దైవమార్గములో పంపగలదు, అలాగే మాయ దేవుని మార్గమునుండి
తప్పించనూ గలదు. మాయ రెండు రకముల సామర్థ్యమును కల్గియున్నది. మాయ అనుకొంటే, ఎంతటి తెలివైన
వానిని కూడా అజ్ఞానిగా మార్చగలదు. అలాగే మాయ అనుకొంటే, ఎంత తెలివి తక్కువవానిని కూడా గొప్ప జ్ఞానిగా
మార్చగలదు. దీనినిబట్టి వేదము అను మాయ రెండు రకములుగా ఉన్నదని తెలియుచున్నది. ఒక రకము మాయ
దేవునికి వ్యతిరేఖమైనదనీ, మరొక రకము మాయ దేవునికి అనుకూలమైనదనీ తెలియు చున్నది. దేవునికి వ్యతిరేఖమైన
మాయ దేవునివైపు ఎవ్వరినీ పోనివ్వదు. దేవునికి అనుకూలమైన మాయ, దేవునివైపు పోవువానిని ఆటంకపరచక, వాని
దారిని సుగమము చేయును. ఇట్లు దేవుని చేత తయారైన మాయ రెండు విధములుగా పని చేయుచున్నది. ఒకే
మాయ రెండు రకములుగా ప్రభావము చూపుచున్నది. కావున మాయను రెండు రకములుగా చెప్పాము. అట్లే మాయ
స్వరూపమైన వేదములను కూడ రెండు రకములుగా చెప్పవచ్చును. వేదము దైవత్వమును తెలుపునట్లే నమ్మించి,
దేవున్ని చేరకుండా దేవునికి వ్యతిరేఖ మార్గములో మనుషులను పంపగలదు. అట్లే వేదమే దేవున్ని చేరునట్లు దేవునికి
అనుకూల మార్గములో కూడా పంపగలదు.

ఇంతకూ దేవునికి వ్యతిరేఖమైన మార్గములో పంపు వేదములేవి? అట్లే దేవునికి అనుకూలమైన మార్గములో
పయణింప చేయు వేదములేవి? అని అడిగితే,అవి ఇలా కలవు. ఇందూ (హిందూ) మతములో కొందరికి మాత్రమే
వేదములు తెలియును. నేటి సమాజములో అందరికీ వేదముల గురించి తెలియకుండా పోయినది. ఇంకా చెప్పాలంటే
తనది ఏ మతమో కూడా తెలియని స్థితిలో హిందువు ఉన్నాడు. అందువలన కొందరికి మాత్రమే వేదములు నాలుగనీ,
అవి 1) సామవేదము 2) యజుర్వేదము 3) అధర్వణవేదము 4) రుగ్వేదము అని తెలియును. ఈ నాలుగు
వేదములను వ్యాసమహర్షి వ్రాయడము జరిగినది. వ్యాసుడు నాలుగు వేదములనే కాకుండ 18 పురాణములను కూడా
వ్రాశాడు. వేదములు నాలుగు దేవునికి వ్యతిరేఖ మార్గములో మనిషిని పంపునవేనని తెలియవలెను. నాల్గువేదములు
తయారై ప్రజలలోనికి పోయిన తర్వాత అంతవరకున్న కొద్దిపాటి ధర్మములు కూడా లేకుండా పోయాయి. అందువలన
అప్పుడే ధర్మములను తిరిగి తెలుపుటకు భగవంతుడు పుట్టాడు. అధర్మములు అభివృద్దియగుటకు నాలుగు వేదములు
మూడు గుణముల మిళితమైన మాయగా మనుషులను ప్రేరేపించినది. అప్పుడే భూమిమీద ధర్మసంస్థాపన నిమిత్తము
మొదటి అవతారముగా భగవంతుడైన కృష్ణుడు పుట్టాడు. ఒక్కమారు ధర్మములు పూర్తి స్థాయిలో స్థాపించబడుటకు
దేవుని అంశ మూడుమార్లు పుట్టవలసిన అవసరమున్నది. దాని ప్రకారము గమనిస్తే ఒక్కమారు భగవంతుని రాక
ద్వాపరయుగము యొక్క చివరిలో జరిగినది. తర్వాత రెండవ మారు ప్రవక్త రాక కూడ అయిపోయినది. ఇక మూడవ
రాక ఆదరణకర్తగా రావలసివున్నది. అదలా ఉండగా మాయరూపములైన నాలుగు వేదములు దేవునికి వ్యతిరేఖ
మార్గమును సూచించగా, దేవునికి అనుకూల మార్గమును సూచించు ఐదవ వేదము కూడా ఒకటి కలదు. దానినే


--
“పంచమ వేదము” అని అందురు. కొందరు భారతము పంచమ వేదమనీ, కొందరు భాగవతము పంచమవేదమని
అనడము జరుగుచున్నది. వాస్తవానికి ఆ రెండు కూడా పంచమవేదము కావు. భారతము చరిత్ర కాగా, భాగవతము
పురాణమని తెలియవలెను.

నాలుగు వందల సంవత్సరముల క్రిందట పోతులూరి వీరబ్రహ్మము గారు తన కాలజ్ఞానములో పంచమవేదమైన
సాంద్రసింధూ వేదమును గురించి చెప్పాడు. “సాంద్రసింధూ వేదమునకు కర్త ఆనంద గురువు. సాంద్రసింధూ
వేదము భూమిమీద లేదు. దానిని సమగ్రముగా చెప్పేవాడు ఆనంద గురువు” అని అన్నాడు. అంతేకాక “సాంద్రసింధూ
వేదమార్గము చొప్పున సకలమైనవారు (అన్ని మతములవారు) నడిచేరయా” అని కూడా అన్నాడు. మీరు నన్ను
ప్రశ్నించిన ప్రశ్నలో మీరు చెప్పేది వేదము కాదా? అని ప్రశ్నించారు. దాని, సరియైన జవాబుగా మేము చెప్పునది
కూడా వేదమే. కాలజ్ఞానములో బ్రహ్మముగారు చెప్పిన సాంద్రసింధూ వేదమునే మేము చెప్పుచున్నాము. నా ద్వారా
చెప్పబడునది దైవమార్గమని తెలుసు. కానీ సాంద్రసింధూ వేదమని నాకు కూడా తెలియదు. ఆ విషయమును
బ్రహ్మముగారు తన కాలజ్ఞానములో కొన్ని చోట్ల వ్రాయడము వలన ఆ విషయముమాకు ఇప్పుడే తెలిసింది. బయట
ప్రపంచములో నన్ను నేను హెచ్చించుకొనక తగ్గించుకోవాలను వానిని. నేను బయటి ప్రపంచమునకు తెలియకుండా
ఉండాలనుకొనువాడిని. అయితే వీరబ్రహ్మముగారు తన కాలజ్ఞానములో “ప్రబోధాశమము ఉన్నతమైన జ్ఞానము
కలది” అని వ్రాయడము వలన నేను కొంత బయటికి తెలియబడము జరిగినది. అంతేకాక “ప్రబోధాశ్రమము వారు
శయనాధిపతి గుణములు కల్గియున్నారనీ, శయనాధిపతియే ఆనందగురువనీ, సిద్ధాంత శిరోమణి అయిన గురుస్వామి
సిద్ధాంతము ముఖ్యమయ్యేనయా” అని వ్రాయడము వలన, ఇంకా మమ్ములను బహిర్దతము చేయుచు వ్రాసిన కొన్ని
వాక్యముల వలన మేము జ్ఞానము చెప్పే గురువునని బయటపడవలసివచ్చినది. వాస్తవముగా మేము చెప్పు విషయములను
అన్ని మతములవారు ఇష్టపడుచుండడమూ, మేము చెప్పినది త్రైతసిద్ధాంతము కావడము వలన, నాలుగువందల
సంవత్సరముల పూర్వము వ్రాసిన కాలజ్ఞానమునకు పూర్తిగ సరిపోయినది. మా రచనలన్నీ క్రొత్తవి కావడము వలన,
ఇంతవరకు ఎవరికీ తెలియని సరిక్రొత్త జ్ఞాన విషయములైన దానివలన, మేము చెప్పునది సాంద్రసింధూ వేదమేనని
ఒప్పుకోక తప్పదు.

బ్రహ్మముగారు “సిద్ధాంత శిరోమణి అయిన గురుస్వామి సిద్ధాంతము ముఖ్యమయ్యేనయా” అని చెప్పినట్లు
మరియు “సాంద్రసింధూ, వేదమార్గము చొప్పున సకలమైనవారు నడిచేరయా” అని చెప్పినట్లు మాకు ఇప్పుడిప్పుడు
తెలిసింది. అయితే ఇంతకుముందే ఇదే, విషయమునే మేము చెప్పే జ్ఞానమును అన్ని మతములవారు అనుసరిస్తారనీ,
మూడు మతములవారు ఏకమై పోయి త్రైత సిద్ధాంత జ్ఞానమును గొప్పగా చెప్పుకొంటారనీ చాలామార్లు చెప్పాము.
మేము చెప్పినట్లే జరుగుచుండడము తెలిసిన సత్యమే. అందువలన బ్రహ్మము గారు మమ్ములను గురించి వ్రాసిన
వ్రాతలను కాదనలేక పోవుచున్నాము. మేము చెప్పుచున్నది ఎవరికీ తెలియని సాంద్రసింధూ వేదమని ఒప్పు కొంటున్నాము.
ఇప్పటికి దాదాపు మూడు వందల యాఖై సంవత్సరముల క్రితము జీవసమాధి చెందిన బ్రహ్మముగారు, తన సమాధినుండి
బయటికి వచ్చి జన్మ తీసుకొని ముప్పయి సంవత్సరములగుచున్నది. ఆయన వయస్సు ఇప్పటికి ముప్పయి సంవత్సరములు.
ఆయన ఇంకా కొంత కాలమునకు మావద్దకు వస్తాననీ, ఆనంద గురువే నా గురువనీ తన కాలజ్ఞానములో చెప్పడము
జరిగినది. ఆయన వచ్చినపుడు నేనెవరో ఆయన బహిర్గతము చేయును. అప్పుడయినా నా యొక్కమరియు నా
ఆత్మయొక్క విషయము బయటపడగలదు. అందువలన మీరు అడిగిన ప్రశ్నకు జవాబుగా మేము చెప్పినది కూడా


--
వేదమేననీ, నా చేత చెప్పబడిన వేదము దేవుని జ్ఞానమును సుగమము చేసి, మనిషిని మోక్షమునకు (దైవసన్నిధికి)
పంపగలదని చెప్పుచున్నాను.

మేము ఇంతవరకు తెల్పిన జ్ఞానము పూర్తి దైవసంబంధమైనదై ఉన్నది. అన్ని మతములకు ఆమోదయోగ్యమైనది.
అన్ని మత గ్రంథముల లోను మేము చెప్పిన జ్ఞానమున్నది. కావున అన్ని మతముల వారు మా జ్ఞానమును ఒప్పుకోవలసి
వస్తున్నది. కొందరు అసూయతో అజ్ఞానముతో మేము చెప్పిన జ్ఞానమును కాదనినా, అదే మతము వారు ఎందరో మా
జ్ఞానమును గొప్పదని చెప్పుకోవడము జరుగుచున్నది. ఇప్పుడు కూడా “తల్లి తండ్రి” అను ఈ చిన్న గ్రంథములోని
విషయములను ఎవరూ ఖండించలేరు. ఎందుకనగా సిద్ధాంతముతో కూడుకొన్న జ్ఞానము ఖండింపబడదు. తల్లి
సమాచారము మేనమామకు తెలియదా! అన్నట్లు మాయ సమాచారము యోగి అయిన వానికి తప్పక తెలియును.
కనుక అందరికీ తల్లి తండ్రి ఎవరో సిద్ధాంతకర్తను అయిన నేను చెప్పక తప్పదు. అదే విషయమునే నీ తండ్రి ఎవరో,
నీ తల్లి ఎవరో తెలియమనీ చెప్పు చున్నాను. తల్లివైపు నుండి తండ్రివైపు పోవునట్లు, వేదము కాని వేదమైన సాంద్రసింధూ
వేదమును తెలిసి అసలైన తల్లితండ్రులను కనుగొనవలెనని నా వైపునుండి చెప్పుచున్నాను. ఇక్కడ కొందరు మీ
గొప్పతనమును గురించి మీరు చెప్పుకొంటున్నారే అని అడిగినా అడగవచ్చును. దానికి జవాబు నేను ఎవరో నాకే
తెలియనప్పుడు నా గొప్పతనమును గురించి నేనెలా చెప్పగలను. నా గురించి నేను చెప్పలేదు గానీ, నా గురించి
ఇతరులు చెప్పిన దానిని చెప్పాను. నా గురించి చెప్పిన పోతులూరి వీరబ్రహ్మము గారు లోకములో జరుగు కొన్ని
వందల సంవత్సరముల భవిష్యత్తును ముందే చెప్పిన గొప్పవ్యక్తి. కావున ఆయన చెప్పిన విషయమునే సందర్భము
వచ్చింది కాబట్టి చెప్పాను. మేము చెప్పినది అర్థముకాకుండా పోతే, వేరు విధముగా మీరు అనుకొంటే అది కూడా
మాయయే అవుతుంది. అందువలన దేవునికి దూరమయ్యే మాయను వదలి, దేవునికి దగ్గరయ్యే మాయ మాట
విందాము. అసలైన తల్లితండ్రిని గురించిన సమాచారమును ఇంకా చూస్తాము.

ఒక మనిషికి తన బాహ్యతండ్రి ఎవరైనది తన బాహ్య తల్లియే తెలుపవలెను. తన బిడ్డకు తండ్రి ఎవరు అన్న
విషయము తల్లికి మాత్రము తెలియును. అదే విధముగా దేవుడు ఎవరు అన్న విషయము ప్రకృతికి మాత్రమే తెలియును.
బాహ్య శరీర తల్లి తన బిడ్డతో ప్రత్యక్షముగా మాట్లాడు చున్నది, కావున స్వయముగా తల్లియే తండ్రిని చూపుచున్నది.
ఇక్కడ జీవునికి తండ్రి స్థానములోనున్న పరమాత్మను, తల్లి స్థానములోనున్న ప్రకృతి చూపవలసివున్నది. అయితే ప్రకృతి
మనిషితో మాట్లాడదు. అందువలన ప్రకృతి దేవున్ని గురించి జీవునికి తెలియజేయలేదు. అటువంటపుడు దేవుడే
జీవునికి దేవుని విషయమును తెలుపుటకు ప్రకృతి తరుపున పని చేయవలసి వచ్చినది. ప్రకృతి తరుపున పని చేసి,
దేవుని విషయమును తెలుపుటకు, దేవుని అంశ భగవంతునిగా వచ్చుచున్నది. ప్రకృతి మాయగా మారి ఎల్లకాలము
మనిషిలో ఉంటే దేవుడు మాత్రము భగవంతునిగా ఎప్పుడో ఒకప్పుడు భూమిమీదకు వస్తున్నాడు. ప్రకృతి మనిషిలో
మాయగా మారివుంటే, దేవుడు మనుషుల మధ్యలో భగవంతునిగా మారి వచ్చును. భగవంతుడు ప్రకృతితో తయారు
చేయబడిన శరీరమును ధరించి కనిపించు మనిషిగా పుట్టును. అలా పుట్టినవాడు ప్రకృతి తెలియజేయవలసిన పరమాత్మను,
ప్రకృతి తరుపున తాను తెలియజేయును. ప్రకృతి మాయ రూపముతో మనిషియందున్నది. కావున ప్రకృతి తరుపున
పనిచేయుటకు భగవంతునిగా వచ్చిన దేవుడు, ప్రకృతికి మారురూపమైన మాయవలె ప్రవర్తించును. మాయ దేవుని
మార్గమునకు ఆటంకమును కలుగజేయుటకు గానీ, దేవుని మార్గమును సుగమము చేయుటకుగానీ ఎలా యోగ్యత


--
కల్గియున్నదో, అలాగే భగవంతునిగా వచ్చినవాడు తాను ప్రకృతి అయిన మాయవలె ప్రవర్తించుచు అవసరమైనవారిని,
యోగ్యతకల్గిన వారిని దేవుని మార్గము చేర్చును. అనవసరమైన వారినీ, యోగ్యత లేనివారినీ దేవుని మార్గమునుండి
తప్పించును. భగవంతున్నే గురువు అని అనవచ్చును. గురువు లేక భగవంతుడు భూమిమీదకు వస్తే, జ్ఞానము మీద
ఆసక్తి కలవారికి గురువుగా కనిపించును. ఆసక్తిలేని వారికి మాయగా కనిపించి, దేవుని జ్ఞానమును తెలియకుండా
చేయును. దేవుడు తన ప్రకృతి వలన తయారగు దేహమును అధిష్టించి మాయయొక్కగుణ భావములు కల్గి భగవంతునిగా
పుట్టుచున్నాడు. భగవంతుడు దేవుని అంశయే అగుట వలన దేవుని జ్ఞానమును తెలుపును. అలాగే భగవంతుడు
ప్రకృతిని అధిష్టించి ప్రకృతి పాత్రను పోషించవలసి ఉండుట వలన, మాయగా దేవుని జ్ఞానమును తెలియకుండా
చేయును.

భగవంతుడు ( అంటే గురువు) తెలియజేయు ఒకే జ్ఞానము మనిషికి అర్ధము కావడములో సవ్యముగాగానీ,
అపసవ్యముగాగానీ రెండు విధముల అర్థమగు చుండును. సవ్యముగా అర్థమైతే అది దేవుని జ్ఞానముగా కనిపించి
దేవునివైపు పంపును. అపసవ్యముగా అర్థమైతే తెలుసుకొన్నది దేవుని జ్ఞానమువలె కనిపించక అది జ్ఞానమేకాదన్నట్లు
తెలియబడి, జ్ఞానమునకు దూరమగునట్లు చేసి మాయవైపు పంపగలదు. దీనినిబట్టి గురువు (భగవంతుడు) మాయ
స్థానములో ఉండి దేవుని మార్గమునకూ, దేవుని జ్ఞానమునకూ దూరము చేయగలడు. అలాగే దేవుని మార్గమునకూ,
దేవుని జ్ఞానమునకూ దగ్గరా చేయగలడు. అందువలన భగవద్గీతలో జ్ఞానయోగమందు ఆరవ శ్లోకములో “ప్రకృతిం
స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా నా ప్రకృతిని అధిష్టించి మాయ తరపున (మాయవలె) నా ఆత్మ పుట్టుచున్నది
అని చెప్పడము జరిగినది. దేవుడు భగవంతుడై పుట్టినా, దేవున్ని గురించి తెలియ చెప్పవలసినది భగవంతుడే అయినా,
ఆయన వచ్చినది ప్రకృతి వైపునుండి మాయవలె వచ్చాడని తెలియుచున్నది. అందువలన ఆయన చెప్పిన జ్ఞానము
ఒక్కటే అయిన్తా అది దేవునివైపుగానీ లేక మాయవైపు గానీ తీసుకుపోవును. ఈ విషయము అర్ధమగుటకు ఒక
ఉదాహరణను చూస్తాము. కనిపించే శరీర తల్లి, శరీర తండ్రిని గురించి తెలియజేయునదనీ, తల్లికి మాత్రమే బిడ్డకు
తండ్రి ఎవరైనది తెలుసుననీ చెప్పుకొన్నాము కదా!  అటువంటి స్థానములోనున్న ఒక తల్లికి ముగ్గురు కుమారులు
కలరు. ముగ్గురు కొడుకులు ఐదు సంవత్సరముల వ్యవధిలో పుట్టారు. ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత ఒక
సంవత్సరమునకు తండ్రి వ్యాపార నిమిత్తము విదేశములకు పోయారు. అక్కడినుండి వచ్చుటకు 12 సంవత్సరముల
కాలము పట్టినది. భర్త వచ్చే సమయానికి తమ పిల్లలకు చిన్నవానికి 13 సంవత్సరములు కాగా, రెండవ వానికి 16
సంవత్సరములు, పెద్దవానికి 18 సంవత్సరముల వయస్సున్నది. చిన్న వయస్సులోనే తమ తండ్రి తమకు తెలియని దానివలన,
కొంతకాలము తర్వాత వచ్చిన తండ్రిని గురించి తల్లి చెప్పవలసి వచ్చినది. తమ బిడ్డలకు తండ్రి ఎవరు అను
రహస్యము తల్లికి మాత్రమే తెలియుట వలన, ఈయనే మీ తండ్రి అని తల్లి తెలియజెప్పినది. తల్లి ఒకే భావముగల,
ఒకే అర్థము గల విషయమును అందరికీ సమానముగా చెప్పినది. అందరూ ఒకే సమయములో ఒకచోట లేని
దానివలన, ముగ్గురు కుమారులు వేరువేరు పనులను, వేరువేరు స్థలములో చేయుట వలన, అందరికి ఒకేమారు
చెప్పుటకు వీలుపడలేదు. ముగ్గురు కొడుకులు విడివిడిగా వేరువేరు సమయములలో ఇంటికి వచ్చినపుడు, వారికి
విడివిడిగానే ఈయనే మీ తండ్రియని చెప్పడము జరిగినది.

ముందు రాత్రికి ఇంటికి వచ్చిన పెద్దకొడుకుకు అతని తండ్రి విషయమును తల్లి చెప్పినది. అతను ఆ
సమయములో నిద్రమత్తులో ఉండిన దానివలన తల్లి చెప్పిన మాటను వినినా “ఈయన మీ తండ్రి” అనుమాట ఈయన


--
మా తండ్రి అని అన్నట్లు అర్థమైనది. అప్పుడు తన తల్లి చెప్పిన విషయము వేరుగా అర్థమైపోయి, తల్లి చూపించిన
మనిషిని తనకు తాతయ్యగా పోల్చుకొన్నాడు. రెండవ రోజు ఉదయమే రెండవ కొడుకు రాగా, పెద్ద కొడుకుకు తెలిపిన
విషయమునే తల్లి అతనికి కూడా తెలుపుచూ “ఈయన మీ కన్నతండ్రి” అని చెప్పినది. తల్లి చెప్పిన విషయమును
శ్రద్ధగా వినని రెండవ కుమారుడు “ఈయన మీ చిన్న తండ్రి” అని చెప్పినట్లు అర్థమైనది. అదే దినము సాయంకాలము
ఇంటికి వచ్చిన చిన్న కుమారునికి “ఈయనే నా భర్త” అని తల్లి చెప్పినది. అతను వయస్సులో చిన్నవాడైన దానివలన,
తల్లికి భర్త తనకు ఏమౌతాడో కూడా తెలియదు. అటువంటపుడు తల్లి చూపిన వ్యక్తిని తమకు బంధువుగా తలచాడు
కానీ తండ్రిగా అర్థము కాలేదు. ఈ విధముగా ముగ్గురు కుమారులకు తల్లి చెప్పిన సత్యము అర్థముకాక తమ
తండ్రిని ఒకరు తాతగా, ఒకరు చిన్నాన్నగా, మరియొకరు బంధువుగా అర్థము చేసుకొన్నారు. తండ్రి విషయమును
తెలియజేసిన తల్లికి అదేరోజు రోగము వచ్చి వైద్యశాలకు (ఆసుపత్రికి) పోయింది. ఆమె రోగమునకు తగినట్లు చికిత్స
చేయుటకు ఆమెను నెల రోజులు పడకమీదనే ఆసుపత్రిలో ఉండునట్లు వైద్యులు చెప్పగా వారి తల్లి అక్కడే
ఉండిపోయినది. ఆమెకు ఆరోగ్యము బాగాలేని దానివలన ఆమె సోదరుడు (తమ్ముడు) వైద్యశాలకు పోయి, తన అక్క
బావలను పలకరించిన తర్వాత తన మేనళ్ళుల్లను పలకరించుటకు, అక్కఇంటికి వచ్చి అక్కడే కొద్ది రోజులుండిపోయాడు.
అప్పుడు తనకు బావ, అక్కకు భర్త, అల్లుళ్ళకు తండ్రి అయిన వానిని తన అల్లుళ్ళు తప్పుగా అర్థము చేసుకొన్నారని
ఆయనకు తెలిసింది. స్వంత తండ్రిని ముగ్గురు కుమారులు తండ్రిగా అర్ధము చేసుకోకుండా వేరువేరు విధములుగా
చెప్పుకోవడము అతనికి ఆశ్చర్యము కల్గించినది. వారికిఆయన మేనమామ అయిన దానివలన, వారి తల్లి తనకు అక్క
అయిన దానివలన, వారి తండ్రి స్వయాన బావ అయిన దానివలన, తన అల్లుళ్ళు పూర్తిగా పొరపడినారను సత్యము
అర్ధమైపోయింది. వారిలోని భావమును తొలగించి, వారి ముగ్గురికి తండ్రి ఒక్కడేననీ, వారు పుట్టక ముందునుండి
వారి తండ్రి తనకు తెలుసునని ముగ్గురు అల్లుళ్ళకు నచ్చజెప్పాడు. చిన్నవాడు ఒక్కడు మాత్రము తన మామగారు
చెప్పిన మాటను నమ్మి ఒప్పుకొన్నాడు. మిగతవారు ఇద్దరూ తన మామ చెప్పిన మాటను నమ్మకుండా వారివారి
వాదనను వారు వినిపించారు. తమ తల్లి తనకు ఇట్లే చెప్పిందని ఒకడు అంటే, లేదు నాకిట్లే చెప్పిందని మరొకడు
అనడము మొదలుపెట్టారు. ఒకడేమో తండ్రిని తాత అంటాడు, మరొకడేమో తండ్రిని చిన్న తండ్రి (బాబాయి) అని
అంటాడు. వారి సంశయమును తీర్చుటకు వారి తల్లి అక్కడలేదు. వారి తల్లి వచ్చిన తర్వాత వారి అనుమానము
లేకుండా చేస్తుందిలే అని వారి మేనమామ అనుకొన్నాడు. అయితే వారి తల్లి ఆసుపత్రిలోనే చనిపోయింది. భార్య
చనిపోవడమును చూచిన భర్త కూడా గుందె ఆగి చనిపోవడము జరిగినది. ముగ్గురు కుమారులు తమ తల్లి చనిపోయినదని
బాధపడినా అందులో ఒకడు మాత్రము తన తల్లితో సహా తండ్రి కూడా చనిపోయాడని అనుకొన్నాడు. మిగతా
ఇద్దరిలో తమ తల్లితో సహా తాతకూడ చనిపోయాడని ఒకడు అనుకొంటే, మరొకడు తల్లితో సహా చిన్నాన్న కూడా
చనిపోయాడని అనుకోవడము జరిగినది. వారి తల్లి లేనిదానివలన ఇద్దరికి తండ్రి విషయము తెలియకుండా పోయినది.
మేనమామ చెప్పినా వినే స్థితిలో వారు లేకుండా పోయారు. వారు ఇరువురు తమకు ముందు అర్ధమైన అసత్యమునే
సత్యముగా అనుకొంటూ, తర్వాత తెలిసిన సత్యమును అసత్యముగా లెక్కించుకొన్నారు.

మేనమామ ఎంత చెప్పినా వారు ఇద్దరు వినకుండా వారి తండ్రిని వారు ఒప్పుకోకుండా ఒకడు బాబాయి
అంటే మరొకడు తాతయ్య అంటున్నాడు. ఒకడు మాత్రము తన తండ్రిని ఒప్పుకొన్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత
ఆస్తిని స్వయముగా మేనమామే కొడుకులకు పంచి ఇవ్వాలనుకొన్నాడు. అయితే మేనమామ ముగ్గురి అల్లుళ్ళకు ఒక
నియమమును పెట్టాడు. ఆ నియమము ప్రకారము తాను చెప్పినట్లు తన బావను ఎవరైతే తండ్రిగా ఒప్పుకొంటారో


--
వారికే తండ్రి ఆస్తిలో వాటా (భాగము) వస్తుందనీ, తండ్రిగా ఒప్పుకోని వారికి వారి తండ్రి ఆస్తిలో భాగము రాదని
చెప్పాడు. అప్పుడు కూడా తమకున్న విశ్వాసమును వదలి వేరుగా ఒప్పుకోమని ఇద్దరు చెప్పగా, వారికి ఆస్తిలో భాగము
రాకుండా పోయింది. తల్లి భర్త అని చెప్పగా అంతవరకు బంధువుగా అర్ధము చేసుకోవడము తన పొరపాటనీ, తన
మేనమామ చెప్పినదే సత్యమని, సత్యము ప్రకారము తాను బంధువు అనుకొన్న వ్యక్తి బంధువు కాదు, నిజముగా తనకు
తండ్రియని తెలియుటచేత, చిన్నకొడుకుకు తండ్రి ఆస్తి అంతయు లభించినది. మిగత ఇద్దరికీ తండ్రిని తండ్రి అని
ఒప్పుకోకపోవడము దానివలన, తండ్రి ఆస్తి ఏమాత్రము లభించకుండా పోయినది. దీనినంతటిని గమనిస్తే తల్లి
చెప్పిన సత్యమును కుమారులు మొదటనే గమనించకపోయిన దానివలన తండ్రి ఆస్తి ఇద్దరికి రాకుండాపోయినదని
అర్థమగుచున్నది. ఈ ఉదాహరణలో తల్లిని ప్రకృతిగా, తండ్రిని పరమాత్మగా, కుమారులను జీవాత్మలైన మనుషులుగా
లెక్కించుకొని చూడవలసివున్నది. ప్రకృతి అయిన తల్లి, తండ్రిని గురించి చెప్పిన మూల గ్రంథములుగా లెక్కించుకొందాము.
తల్లి ముగ్గురు కొడుకులకు ఒకే తండ్రి విషయమును చెప్పినట్లు, మూడు మత గ్రంథములలో ఒకే దేవున్ని గురించి
చెప్పిన విధానమున్నది. అయితే మూడు మూలగ్రంథములలోని ఉద్దేశ్యము, భావము అన్నీ ఒకే తండ్రి (దేవుని)
సమాచరమును తెలియజేయుచుండినా, ఆ సమాచారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అర్థమైనది. మూలగ్రంథములు
చెప్పినట్లు అందరికీ ఒకే దేవుడనీ (ఒకే తండ్రనీ) తెలుసుకోకుండా, కొడుకులైన మనుషులు ముగ్గురు మూడు విధములు
చెప్పుకొనుచున్నారు. ఒకడు తాతయనీ, ఒకడు బాబాయియనీ, ఒకడు బంధువన్నట్లు నేడు మూడు మతములవారు
చెప్పునది ఒకే దేవున్నయినా, వారు ఆ దేవున్ని వేరువేరు భావములతో లెక్కించుకొని ఒకడు యెహోవాయని, ఒకడు
రాముడనీ, మరియొకడు అల్లాహ్‌ అని అంటున్నారు. ముగ్గురు కొడుకులు తాత, బాబాయి, బంధువు అని వేరువేరుగా
చెప్పుకొనినా అతను ఒకే వ్యక్తియనీ, అలాగే నేడు మూడు, సమాజములవారు, మూడు పేర్లతో చెప్పుచున్నవాడు ఒకడే
దేవుడనీ, ప్రకృతిని పరమాత్మను బాగా తెలిసిన మేనమామలాంటి యోగులు చెప్పినా, మత మౌఢ్యములో అందరికీ
దేవుడు ఒక్కడేనని ఒప్పుకోలేక పోవుచున్నారు. యోగి అయినవాడు మేనమామవలె మూడు మతములకు సమాన
సంబంధము కల్గియుండి, ముగ్గురి మంచి కోరి “మీరు పొరపడి మోసపోవు చున్నారు. మీకు అర్థమైనది సత్యముకాదు.
తల్లి మాటను మీరు సరిగా అర్ధము చేసుకోనట్లు, మూల గ్రంథములలోని వాక్యమును మీరు సరిగా అర్ధము చేసుకోలేదని”
చెప్పినా యోగి మాట వినడములేదు. యోగి అయినవాడు తమకంటే ముందునుండి ప్రకృతి పరమాత్మల విషయమును
తెలిసినవాడనీ, వారితో సంబంధము కల్గినవాదనీ, అతనికి తమ దేవుని (తండ్రి) విషయము పూర్తిగా తెలుసునని
ఎవరూ గ్రహించక, హితము చెప్పు యోగి మాటలను లెక్కించక పోవుచున్నారు. చివరకు మామలాంటి యోగి చెప్పునది
మతాతీతమైన జ్ఞానమనీ, పొరపాటుకు తావులేదని తెలిసినవాడు అన్ని మతములకు దేవుడు ఒక్కడేనని అంగీకరించును.
అలా తండ్రి అయిన దేవుడు మిగత అందరికీ కూడా దేవుడేనని తెలియుట చేత, దేవుని (తండ్రి) ఆస్తి అయిన పరమును
(మోక్షమును) పొందగలుగుచున్నాడు. తల్లిలాంటి మూల గ్రంథములలో చెప్పిన ప్రవక్తల మాటలను తప్పుగా అర్థము
చేసుకొన్నవారు తాము తెలుసుకొన్న దేవుడు వేరనీ, ఇతరుల దేవుడు వేరనీ, అనుకోవడము వలన ఇతర మతముల
దేవున్ని తమ దేవునిగా తమ దేవుడే ఇతర మతముల దేవునిగా ఒప్పుకోకపోవడము వలన వారికి మోక్షము లేక పరము
లభించడము లేదు.

ఈనాడు భూమిమీద మానవులందరు ఒకే దేవుని చేత సృష్టింప బడినవారైనప్పటికీ, మనుషులు మతములుగా
విడిపోయి, మీ దేవుడు మా దేవుడు కాడు, మా దేవుడు మీ దేవుడు కాడు అని అంటున్నారు. ఒక మతములోని దేవున్ని
మరొక మతమువారు అసూయతో చూస్తున్నారు. యెహోవాను ఒప్పుకోని వారు దేవుడు అల్లాహ్‌నే అంటున్నారు.




--
కొందరు అల్లాహ్‌ దేవుడు కాదు రాముడే దేవుడు అంటున్నారు. మరొకరు వీరు ఇద్దరు కాదు నిజమైన దేవుడు
యెహోవానే అంటున్నారు. ఒకే తండ్రి ముగ్గురు కొడుకులకు ఒకరికి తాతయనీ, ఒకరికి బాబాయి అనీ, ఒకరికి
బంధువని తెలిసినట్లు, ఒకే దేవుడు మూడు మతముల వారికి మూడు పేర్లతో తెలియుచున్నాడు. వాస్తవముగా ముగ్గురు
కొడుకులు అనుకొన్న మూడు పేర్లు వారి తండ్రికి ఎలా వర్తించవో, అలాగే మూడు మతముల వారు అనుకొను
విధానములు దేవునికి వర్తించవు. ఎందుకనగా దేవునికి రూపము, పేరు, పని మూడూ లేవు. అందువలన దేవున్ని
రూప,నామ, క్రియా రహితుడు అంటారు. ఈ సత్యము తెలియనివారు దేవుడు ఫలానా రూపముతో ఉన్నాడని కొందరూ,
ఫలానా పేరుతో ఉన్నాడని కొందరూ, ఫలానా పని చేయుచున్నాడని కొందరు అంటున్నారు. వారు అనుకొన్నది
సత్యముకాదని వారికి తెలియకపోవడము వలన, అసలైన, సత్యమైన దేవున్ని మతముల వారు తెలియలేకున్నారు.
ప్రకృతి విధానమును, పరమాత్మ విధానమును తెలిసిన యోగి అయినవాడు మతాలకు అతీతమైన జ్ఞానమును చెప్పినా
కొందరు గ్రహించలేకున్నారు. ఎవరైనా గ్రహించగలిగి అసలైన సత్యమును తెలుసుకొంటే వారు సులభముగా మోక్షమును
పొందగలరు.

ఏదయితే భూమిమీద ఉన్నదో అది అంతయు సృష్టింపబడినది. భూమి, ఆకాశము, మధ్యలోని గాలి, అగ్ని
నీరు వాటిని ఆధారము చేసుకొని జీవించు సమస్త జీవరాసులు, సమస్త వస్తువులు, సమస్త వాహనములు
మొదలగునవన్నియు సృష్టింపబడినవే. సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఒకడు గలడు. ఆయనే దేవుడు. అందరూ
దేవుని చేత సృష్టింపబడినవారే, అయినప్పటికీ సృష్టికర్త ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే మనము ఆయన
చేత పుట్టించబడినామో, అప్పుడే ఆయన మనందరికి తండ్రి అయినాడు. అందువలన ఆయనను జగత్‌ పితా అనవచ్చును.
తండ్రి అనగా కారణమైనవాడు, తల్లి అనగా కార్యమైనది. అందరికీ అన్నిటికీ కారణమైన వాడు మొదట ప్రకృతిని
సృష్టించి, ప్రకృతిని కార్యముగా చేసుకొని సర్వమును సృష్టించాడు. పుట్టిన మనిషికి చిన్నప్పటినుండి ప్రకృతి పంచ
భూతములుగా కనిపిస్తూనే ఉన్నది. ఆకాశము, గాలి, అగ్ని నీరు, భూమి అను ఐదు భాగముల ప్రకృతియే “జగత్‌
మాతయని ఎవరికీ తెలియదు. ప్రకృతి కనిపిస్తున్నా ప్రకృతి మన శరీరములో గుణరూపమైన మాయగ ఉండి
మనిషిని పర్యవేక్షించుచూ, తన భర్త అయిన పరమాత్మకు ఇష్టులైన వారినే దేవునివైపు పోవునట్లు చేసి, ఇష్టులుకాని
వారిని దైవమార్గములలో ఉన్నట్లు భ్రమింపచేసి తన మాయను దాటకుండా చేయుచున్నది. ప్రకృతి జనితమైన ప్రకృతినుండి
పుట్టిన) త్రి గుణరూపమైన మాయను దైవజ్ఞానము లేని మనిషి దాటిపోలేడు. మాయను దాటుట దుస్సాధ్యము.
అందువలన జ్ఞాని అయిన పోతులూరి వీరబ్రహ్మముగారు తన తత్వములో త్రి గుణ రూపమైన మాయను ఉద్దేశించి
“మూడు కాల్వలు దాటలేరన్న, ఇల మూఢ జనులు మూడు కాల్వలు దాటలేరన్న” అను తత్త్వమును చెప్పాడు.

తామస, రాజస, సాత్వికమును మూడు గుణముల సమ్మేళనమైన మాయను జయించాలంటే, ముందు మనిషికి
దైవజ్ఞానము తెలిసి దేవుని ధర్మములను సంపూర్ణముగా గ్రహించి ఉండాలి. దేవుని ధర్మములను ఏమాత్రము సరిగా
తెలియకుండినా, వేరు భావముతో అర్థము చేసుకొన్నా ధర్మము అధర్మముగా అర్థమై మాయకు మంచి
అవకాశమిచ్చినట్లవుతుంది. దేవుని ధర్మములలో ఏ ఒక్కటి సరిగా తెలియకుండా పోయినా మనిషిని దేవునివైపు
పోనివ్వక, తనకు తెలిసినదే ధర్మమని నమ్మించి, దేవునికి దూరముగా పంపును. ఏ మనిషయినా, ఎంతటి పెద్ద జ్ఞాని
అని పేరుగాంచి వున్నా, దేవుని ధర్మములను సరిగా తెలియని వానిని తన గేటునుండి ( అంటే ద్వారమునుండి) మాయ
వదలదు. అటువంటపుడు తన ధర్మములు భూమిమీద అందరికి తెలియునట్లు దేవుడు ముందే సృష్ట్యాదిలోనే


--
చెప్పియుంచాడు. దేవుడు ఆదిలోనే చెప్పిన తన ధర్మములను తెలియుట మనిషి యొక్క ఇష్టాయిష్టముల మీద
ఆధారపడియున్నది. ప్రపంచ విధానమంతయు, ప్రపంచ కార్యములన్నీ మనిషి యొక్క కర్మమీద ఆధారపడి జరుగుచున్నవి.
అయితే ఒక్క దైవ జ్ఞానము మాత్రము కర్మకు అతీతమైనదై, మనిషియొక్క శ్రద్ధ అశ్రద్ధల మీద ఆధారపడియున్నది.
మనిషికి దైవజ్ఞానము మీద ఎంత శ్రద్ధయుంటే అంత తెలుసుకోగల్గును. అందువలన భగవద్గీతలో జ్ఞానయోగమను
అధ్యాయమున 39వ శ్లోకమందు “శ్రద్ధవాన్‌ లభతే జ్ఞానమ్‌” అని చెప్పబడివున్నది. మనుషులకు వారివారి శ్రద్ధనుబట్టి
జ్ఞానము లభించును. అలాగే వారివారి కర్మలను బట్టి కష్టసుఖములు కల్గును. కర్మలను బట్టి ప్రపంచ ప్రాప్తా ప్రాప్తములు,
శ్రద్ధనుబట్టి ధర్మాధర్మములు లభించునని తెలియుచున్నది.

మనిషి దేవున్ని చేరుటకు కావలసిన ధర్మములన్నిటిని దేవుడే సృష్టాదిలో తెల్పినప్పటికీ, మనిషియొక్క అశ్రద్ధతో
అవి కాలక్రమములో అధర్మములుగా మారిపోయినవి. భక్తి మరియు ఆధ్యాత్మిక విధానములో మనిషి ధర్మములనుకొని
అధర్మములనాశ్రయించాడు. ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! “దేవుడు ధర్మములను
తెలియ జేశాడు కదా! అధర్మములను ఎవరు తెలిపారు?” అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏవమనగా!
దేవుడు తెలియజేసిన ధర్మములను అర్ధము చేసుకోగలిగితే అవి ధర్మములుగానే ఉంటాయి. ఒకవేళ మనిషి అశ్రద్ధ
వలన వాటిని అపార్ధము చేసుకోగలిగితే ధర్మములే అధర్మములుగా మారి పోతాయి. అధర్మములను ఎవరూ సృష్టించలేరు.
ధర్మములనుండియే అధర్మములు వస్తున్నవి. దేవుడు చెప్పిపోయిన తర్వాత ధర్మములను గురించి తిరిగి చెప్పేవారు
లేనప్పుడు, మనిషి తన అశ్రద్ధ వలన ధర్మముల యొక్క పూర్తి వివరణ తెలుసుకోనప్పుడు, ధర్మములే అధర్మములుగా
మారి పోవుచున్నవి. తర్వాత బోధించు బోధకుల వలన అధర్మములే ప్రచారము అగుచున్నవి. అప్పుడు ధర్మములకు
ముప్పు ఏర్పడి, అధర్మములు అభివృద్దియై పోవుచున్నవి. అటువంటి సమయములో దేవుడే తన ధర్మములను తిరిగి
చెప్పి, అధర్మములను ఖండించవలసియున్నది. దేవుని ధర్మము ప్రకారము దేవుడు పని చేయనివాడనీ, క్రియారహితుదని
చెప్పుకొన్నాము. కావున దేవుడు మనిషికి ధర్మములను గురించి తెలిపే అవకాశమే లేదు. అయితే ఎలాగ అధర్మములు
అణిగిపోయి ధర్మములు తిరిగి పైకి వచ్చును అను ప్రశ్నరాగలదు. దానికి జవాబు ఈ విధముగా ఉన్నది.

అధర్మములుగా మారిపోయిన వాటిని తిరిగి ధర్మములుగా నెలకొల్పుటకు, దేవుడు మూడు విధానములను
ముందే ఏర్పాటు చేసి యుంచాడు. సృష్టిని తయారు చేసినప్పుడే ఈ మూడు విధానములను కూడా తయారు
చేసియుంచాడు. దేవుని ధర్మములు ఏమిటో దేవునికి తప్ప ఎవరికీ తెలియవు. అందువలన దేవుని విధానములను
(ధర్మములను) ఏ మనిషీ చెప్పలేడు. అన్నీ తెలిసిన దేవుడు కూడా తన ధర్మములను ఎవరికీ స్వయముగా చెప్పడు.
ఇటు మనిషీ చెప్పక, అటు దేవుడూ చెప్పక పోతే ధర్మములు ఎలా తెలియునను అనుమానము వచ్చును. దానికి
జవాబుగా దేవుడు ధర్మములను తెలుపుటకు మూడు విధానములను నిర్ణయించియుంచాడని మనము ముందే చెప్పుకొన్నాము
కదా! దాని ప్రకారము ఒకటి భగవంతునిగా, రెండు ప్రవక్తగా, మూడు ఆదరణకర్తగా వచ్చినవారు, దేవుని ధర్మములను
తెలియజేయునట్లు దేవుని నిర్మాణము గలదు. ఈ విధముగా అణగారిపోయిన ధర్మములను తిరిగి యథాస్థానము
లోనికి తెచ్చుటకు దేవుని అంశ మూడు విధములుగా రావలసియున్నది. దేవునికి లెక్కలేనన్ని కోటానుకోట్ల అంశలు
గలవు. అందులో ఒక్క అంశ మాత్రము మూడు విధములుగా జన్మించి, దేవుని ధర్మములను తెలియ జేయును.
ఒక్కమారు భూమిమీద ధర్మములు పూర్తి స్థాయిలో తిరిగి రావాలంటే దేవుని అంశ (దేవుడు కాదు) మూడు విధములుగా
జన్మించి చెప్పవలసియున్నది. ప్రవక్త, భగవంతుడు, ఆదరణకర్త అను వారు సామాన్య మనుషులుకారు. వారు దేవుని



--
అంశతో కూడుకొని పుట్టినవారు. ఇప్పటికి మనకు తెలిసిన సమాచారము ప్రకారము ముందు భగవంతుడు వచ్చాడు,
తర్వాత ప్రవక్త వచ్చాడు. ఇక ఆదరణకర్తదే వంతు. భగవంతుని తర్వాత మూడువేల సంవత్సరములకు ప్రవక్తరాగా,
తర్వాత ఆదరణకర్త ఆగమనము ఎప్పుడో చెప్పలేము. ఆదరణకర్తతో సంపూర్ణముగా దేవుని ధర్మములు తిరిగి
నెలకొల్పబడును. దేవుని అంశ మూడు దఫాలుగా, మూడు కాలములలో, ముగ్గురు అసాధారణమైన వ్యక్తులుగా,
భూమిమీదకు వచ్చుచున్నదని తెలియుచున్నది.

దేవుడు పుట్టనివాడే అయినా దేవుడు కాకుండా దేవుని శక్తిని కోట్లాది కోట్ల క్యాలరీలుగా (భాగములుగా)
విభజిస్తే అందులో ఒక్క క్యాలరీశక్తి (అంశ) మూడు వేరువేరు కాలములలో, వేరువేరు ప్రదేశములలో, వేరువేరు
జాతులయందు, వేరువేరు పేర్లతో పుట్టుచున్నది. అలా భగవంతునిగా, ప్రవక్తగా, ఆదరణకర్తగా పుట్టిన దైవాంశ
పూర్తిగా ధర్మములను తిరిగి నెలకొల్పగలదు. భగవంతుడుగానీ, ప్రవక్త గానీ, ఆదరణకర్తగానీ వచ్చినపుడు వారు సాధారణ
మనుషులు కాకున్నా వారు కూడా అందరివలె జన్మించి శిశుదశనుండి పెరిగి సాధారణ మనుషులవలె వస్తున్నారు.
వారికి కూడా తల్లితండ్రులు ప్రతి జన్మలోను ఉన్నారు. ఇక్కడ మీకు రాకున్నా నాకు ఒక ప్రశ్నవచ్చినది. అదేమనగా!
పుట్టినవారు సాధారణ మనుషులు కాదు కదా! వారు దేవుని అంశతో పుట్టినవారు కదా! దేవుడే అందరికి తండ్రియైనపుడు
దేవుని అంశకు కూడా అదే ధర్మము వర్తించును కదా! అలాంటపుడు పుట్టిన భగవంతునికిగానీ, పుట్టిన ఆదరణకర్తకుగానీ,
పుట్టిన ప్రవక్తకుగానీ శరీర తల్లితండ్రులు ఉంటారా? వారు శరీరమును ధరించి ఒక జంటకు పుట్టినపుడు వారికి ఆ
జంట తల్లితండ్రులే అగుదురు కదా! అలాంటపుడు తండ్రి అయిన వానికే తండ్రి ఉంటాడా? ఈ ప్రశ్నలు నావి కాగా,
జవాబు చెప్పవలసిన వాడు నాకు దగ్గరగా శరీరములోనే ఉన్న నా ఆత్మే ఇప్పుడు ఏమి చెప్పుచున్నదో చూస్తాము.

దైవముగానీ, దైవాంశముగానీ ఒకే ధర్మమును కల్గియున్నవి. దేవుడు, దేవునిగా ఉన్నా ఒక అంశగా ఉండినా
తన ధర్మము కోల్పోడు. అందువలన తండ్రి ఎప్పటికీ తండ్రిగానే ఉండును. తండ్రి ఎప్పటికీ తన ధర్మమును కోల్పోయి
ఇతరులకు ఎవరికీ బిడ్డగా మారడు. అందువలన దేవుని అంశ అయిన భగవంతుడికిగానీ, ప్రవక్తకుగానీ, ఆదరణకర్తకుగానీ
శరీర తండ్రి ఉండడు. వారు ఇతర మనుషులవలె తండ్రి వీర్యముతో పుట్టరు. అంతేకాక తల్లి గర్భమునుండి అందరూ
నిర్జీవముగా పుట్టినట్లు పుట్టకుండా గర్భము నుండి సజీవముగా పుట్టుదురు. భూమిమీదున్న సాధారణ మనుషులందరూ
తండ్రి వీర్యకణము చేత, తల్లి అండము చేత పుట్టుచున్నారు. అయితే దేవుని అంశ పుట్టినపుడు అతని శరీరము తండ్రి
యొక్క వీర్యముతోగానీ తల్లి యొక్క అండముతోగానీ సంబంధములేకుండా పుట్టును. తండ్రి వీర్యముతో పుట్టనపుడు
అతనికి తండ్రి అనువాడు ఉండడు. ఒకవేళ అలా పుట్టిన దైవాంశను నీ తండ్రి ఎవరు? అని అడిగితే అతను ఒక
మనిషిని తన తండ్రి అని చెప్పక దేవున్నే తండ్రిగా చెప్పును. దీనినిబట్టి భగవంతునికిగానీ, ప్రవక్తకుగానీ, ఆదరణకర్తకు
గానీ శరీర తల్లితండ్రులు ఉండరని తెలియుచున్నది. అటువంటి వారిని “స్వయంభు” అంటారు. స్వయంభు అనగా
స్వయముగా పుట్టువాడనీ, లేక తనకు తాను పుట్టినవాడనీ అర్ధము. తల్లితండ్రి అనువారు సాధారణ మనుషులకు
మాత్రమే గలరనీ, అసాధారణ భగవంతునికిగానీ, ప్రవక్తకుగానీ, ఆదరణకర్తకుగానీ ఉండరనీ తెలియుచున్నది. సామాన్య
మనుషుల శరీరములకు తాత్కాలిక తల్లితండ్రులు ఉందురు. అయితే అందరకీ శాశ్విత తల్లితండ్రులు ప్రకృతి పరమాత్మలేనని
తెలియవలెను.

ఇంతవరకు మనకు తెలిసిన సమాచారమునుబట్టి ద్వాపరయుగము చివరిలో భగవంతుడూ, కలియుగములో
ప్రవక్త వచ్చిపోయినట్లు తెలిసినది. ప్రవక్త జన్మ భర్త స్పర్శలేని కన్యగర్భమునుండి జరిగినది. కావున ప్రవక్తగా పుట్టినవాడు


--
తండ్రి వీర్యముతో పుట్టలేదని తెలియుచున్నది. ఇకపోతే భగవంతుడైన శ్రీకృష్ణుడు పుట్టినపుడు వసుదేవుడు, దేవకీదేవి
తల్లితండ్రులుగా ఉన్నారు కదా!యని ఎవరికైనా అనుమానము రావచ్చును. అంతేకాక శ్రీకృష్ణుడు దేవకీదేవికి అష్టమ
సంతానము కదా!యని కూడా అడుగవచ్చును. కృష్ణుడు అష్టమ సంతానమైనా, తండ్రి వీర్యకణముతో కాకుండా
స్వయముగా పుట్టినవాడు, భగవంతుడు. అలాగే తల్లి అండము విడుదల కాకముందే ఏడు రోజుల తర్వాత దేవకీదేవి
గర్భము ధరించిన విషయము ఎవరికీ తెలియదు. కృష్ణుని వృషభలగ్న జాతకమును (జాఫథకమును) బట్టి తల్లి ముట్టు
(బహిష్టి) తర్వాత ఏడు రోజుల, ఏడుగంటలకు కృష్ణుని శరీరము తయారగుటకు మొదలైనది చెప్పవచ్చును. తల్లి
అండము 14 రోజుల తర్వాత విడుదల అవుతుంది. అండము విడుదలకాకముందే కృష్ణుని జన్మ మొదలైనది. అందువలన
కృష్ణునికి తల్లితండ్రులు లేరని చెప్పవచ్చును. కృష్ణుడు దేవకీదేవి గర్భమునుండి పుట్టినా, ప్రపంచ దృష్టిలో దేవకీదేవి
తల్లిగా చెప్పబడినా, తండ్రిగా వసుదేవున్ని చెప్పినా, ఆయన దేవుని అంశతో పుట్టినవాడు గనుక ఆయనకు శరీర
తల్లితండ్రులు లేరు. అలాగే దైవధర్మము ప్రకారము కృష్ణునికి ఆత్మసంబంధమైన తల్లితండ్రులు కూడ లేరు. ధర్మమును
అనుసరించి చూస్తే ఆయనే అందరికి తండ్రియగును. ప్రవక్తకుగానీ, భగవంతునికిగానీ, ఆదరణకర్తకుగానీ పైకి శరీర
తల్లి తండ్రులుండినా వాస్తవానికి వారు తల్లితండ్రులు కారనియే చెప్పవలెను. అలాగే దైవజ్ఞానము ప్రకారము మనందరికి
తండ్రి పరలోకమందున్నాడని ప్రవక్తగానీ, భగవంతుడుగానీ, ఆదరణకర్తగానీ పైకి మాట్లాడుచూ చెప్పినప్పటికీ, ఆ
మాట మనకు వర్తించునుగానీ, వారికి వర్తించదు. వాస్తవానికి సూత్రము ప్రకారము వారే జగత్తుకు తండ్రికాగా, వారికి
తండ్రి ఉన్నాడనడము అసత్యమగును. ఒకవేళ ప్రవక్త నా తండ్రి పరలోకమందు ఉన్నాడని చెప్పినా అది మనకు
మార్గదర్శమునకేగానీ వేరుకాదు. అందువలన మీ తండ్రి పరలోకమందున్నాడని ఒక సందర్భములో ఆయనే తెలియజేశాడు.
మొత్తము మీద దేవునికి అయినా, దేవుని యొక్క అంశకి అయినా, శరీర తల్లితండ్రులు గానీ, ఆత్మ తల్లితంద్రులుగానీ
ఉండరు.

భూమిమీద మనుషులకు రెండు రకముల తల్లితండ్రులున్నారను విషయమే తెలియదు. రెండు రకముల
తల్లితండ్రుల సమాచారము ఐదువేల సంవత్సరముల పూర్వము భగవంతుడుగా వచ్చిన కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.
తర్వాత రెండువేల సంవత్సరముల పూర్వము ప్రవక్తగా వచ్చిన ఆయన బైబిలులో చెప్పడము జరిగినది. ప్రస్తుత
కాలములో మేము కూడా అనేకమార్లు రెండు రకముల తల్లితండ్రులను గురించి చెప్పడమేకాక ఇపుడు చిన్న గ్రంథముగా
“తల్లి తండ్రి” అని పేరు పెట్టి వ్రాయుచున్నాము. మేము చెప్పునదే కాకుండా వచ్చే ఆదరణకర్త కూడా ఈ విషయమునే
చెప్పునని అనుకొంటున్నాము. తల్లి తండ్రి ఎవరు అను విషయము ప్రతి మనిషికీ సంబంధించిన విషయము. ప్రతి
మనిషీ తెలుసుకోదగిన విషయము. ప్రతి మనిషి తన శరీరము యొక్క తల్లితండ్రులను, తన తల్లితండ్రులుగా పొరపాటున
అనుకోవడము జరుగుచున్నది. అందువలన తనకు మొదటి నుండి ఉన్న తల్లితండ్రులను గురించి పూర్తిగా మరచిపోయాడు.
తన శాశ్విత తల్లితండ్రుల విషయమును తెలియుటకు ప్రయత్నము చేస్తే అదే ఆధ్యాత్మికమగును. ఆధ్యాత్మికమనినా,
జ్ఞానమార్గమనినా అది తన తల్లి తండ్రుల గురించి తెలియునదేగానీ వేరుకాదు. కనిపించే తల్లితండ్రులు అందరికీ
తెలుసు, కానీ కనిపించని తల్లితండ్రులు బహుశా ఎవరికీ తెలియరు. తెలియని తల్లితండ్రులను తెలియడమే జీవిత
సాఫల్యము.

తల్లి అనగా కార్యమైనది, తండ్రి అనగా కారణమైనవాడు అని అర్ధము చెప్పుకొన్నాము. అలాగే జననీ అనగా
పుట్టించునది, జనకా అనగా పుట్టునట్లు చేయువాడు. మాతా అనగా నిన్ను పోషించునది, పితా అనగా అందరిని




--
పోషించునట్లు చెప్పినవాడు. ఈ విధముగా తల్లితండ్రి అనినా, జననీ జనకుడు అనినా, మాతా పితా అనినా ఆత్మసంబంధ
అర్ధమునే ఇచ్చుచున్నవి. శరీరసంబంధ అర్థము ఇప్పుడు చెప్పుకొన్న ఏ పదములోనూ లేదు. అయితే ఇంతవరకు
మన పురాణములలోగానీ, కొందరు స్వామీజీలు చెప్పడములోగానీ, దేవతల కథలలోగానీ, ఎక్కువగా శరీర తల్లితండ్రుల
ప్రస్థావనే వచ్చినది. ఒక మనిషి జన్మించుటకు కార్య కారణమైన తల్లి తండ్రులైన ప్రకృతి పరమాత్మలను గురించి
ఎక్కడా ఎవరూ చెప్పలేదు. అందువలన అందరికీ శరీర తల్లితండ్రులు తప్ప, ఆత్మసంబంధ తల్లితండ్రులు తెలియరు.
మన పురాణాలు, శరీర తల్లితండ్రుల మీద భక్తి పెంచాయి తప్ప, తెలియని తల్లితండ్రులైన ప్రకృతి పరమాత్మల మీద
భక్తిని పెంచలేదు. ఇప్పుడు పురాణములకూ, వేదములకూ అతీతముగానున్న జ్ఞానముతో శాశ్వితమైన తల్లితండ్రుల
గురించి తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము. సర్వజగత్తుకు ఆకారమునిచ్చిన ప్రకృతిమాతనూ, సర్వజగత్తు సృష్టికి కారణమైన
తండ్రి పరమాత్మనూ గురించి తెలియుటచేత మనకు వచ్చు లాభమేమి? అని యోచిస్తే, వారివలన వచ్చు లాభము
అపారమైనదని చెప్ప వచ్చును. అట్లే శరీర తల్లితండ్రుల వలన ఏమి వస్తున్నదో కొంత వివరించుకొందాము.

శరీరమును ధరించి పుట్టినప్పుడు మొదట ఆహారమును పాల రూపములో ఇచ్చి పోషించునది తల్లియే. అందువలన
ప్రతి బిడ్డకు తల్లి మొదట తెలియబడుచున్నది. శిశుదశలో తండ్రి విషయమే బిడ్డకు తెలియదు. ఆ దశలో బిడ్డకు
అత్యంత సన్నిహితురాలు తల్లియే. తల్లి తప్ప ఎవరూ తెలియని స్థితినుండి కొంత పెరిగిన తర్వాత మరికొందరి
పరిచయమేర్పడినా అప్పుడు కూడా ఫలానావాడు నా తండ్రియని తెలియదు. శిశుదశ నుండి బాల్యదశకు వచ్చిన
తర్వాత ఇతను తండ్రి అని తెలియగలదు. ఈ విధముగా చిన్నతనములోనే తల్లి ముందు, తండ్రి వెనుక తెలియబడుచున్నారు.
చిన్న వయస్సులో తల్లికి ఎక్కువ దగ్గరగా ఉన్న మనిషి, యుక్తవయస్సునుండి తండ్రికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుచూ
వచ్చును. ముప్పయి లేక నలభై సంవత్సరముల వయస్సునుండి తల్లికంటే తండ్రికే పూర్తి దగ్గరగా మారి పోవును. చిన్న
వయస్సులో తల్లి అన్ని విధముల పోషించినా, తండ్రి దూరముగా ఉండినా, పెద్ద వయస్సులో మాత్రము తల్లిని దూరముచేసి
తండ్రికి దగ్గరవుట సహజముగా జరుగుచున్నది. మనిషి జీవితములో మొదట తల్లికీ, తర్వాత తండ్రికీ ప్రాధాన్యత
ఉండినా, కొందరు మాత్రము తమ జీవితములో తండ్రికంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చినవారు కూడా ఉన్నారు.
ఎవరు ఎలా ఉండినా వారు శరీర తల్లితండ్రులకే దగ్గరగా ఉన్నారనీ, వారిని గురించే తెలిసి ఉన్నారనీ చెప్పవచ్చును.
శరీర తల్లి తండ్రులను గౌరవముగా చూస్తూ వారిని పోషిస్తే, దానివలన వచ్చు ఫలితము పుణ్యము. అలాగే వారిని
అగౌరవముగా చూస్తూ దూషిస్తే, దానివలన తప్పక పాపము వచ్చి తీరును. ఈ విధముగా భౌతిక తల్లితండ్రుల పట్ల
మనిషి ప్రవర్తననుబట్టి పాపపుణ్యములు వస్తున్నవి. పాపపుణ్యములను కలిపి కర్మ అంటున్నాము. మనిషికి సంభవించిన
ఏ కర్మనైనా మనిషి అనుభవించి తీరవలసిందే. అలా ఒక జన్మలో చేసుకొన్న కర్మను తర్వాత జన్మలలో అనుభవించవలసి
యున్నది. కర్మను అనుభవించుటకు జన్మలు కలుగు చున్నవి. మొత్తముమీద భౌతిక తల్లితండ్రుల వలన పాపపుణ్యములు
సంభవించడమూ, వాటిని అనుభవించుటకు జన్మించడమూ జరుగుచున్నది. శరీర తల్లితండ్రులవలన జన్మలనుండి
బయటపడక జన్మలలోనే మనిషి చిక్కుకొని పోవుచున్నాడు. భౌతిక సంబంధమైన తల్లితండ్రుల వలన జన్మ సాహిత్యమను
నష్టమే కల్గుచున్నదిగానీ, జన్మ రాహిత్యమను లాభము కలుగడము లేదు.

ఆత్మ సంబంధ తల్లితండ్రులైన ప్రకృతి పరమాత్మలను మనిషి జీవితములో ఎంతవరకు తెలిసియున్నాడని యోచిస్తే
మనిషి పుట్టినప్పటి నుండి చనిపోవు వరకు ప్రకృతి ఆకాశము, గాలి, అగ్ని నీరు, భూమి అను పంచభూతములుగా
అందరికీ తెలియుచున్నది. పంచభూతములైన ఆకాశము, గాలి, నీరు, అగ్ని భూమి మన శరీరములలోనే ఉన్నవనీ,


--
వాటి వలననే మన శరీరము నిర్మాణమై ఉన్నదని చాలామందికి తెలియదు. పంచభూతములైన ప్రకృతి వలననే
శరీరము తయారై ఒక ఆకారమును పొందినదనీ, ఒక ఆకారము గల శరీరము తయారు చేసిపెట్టినదే తల్లియనీ, ఆ
విధముగా ప్రకృతి సర్వమానవులకు తల్లియని తెలియుచున్నది. చిన్న వయస్సులో భౌతిక తల్లికి మనిషి దగ్గరగా
ఉన్నట్లు, ప్రతి మనిషి అతనికి తెలియకనే ప్రకృతికి దగ్గరగా ఉన్నాడు. కనిపించునది, వినిపించునది ఐదు ఇంద్రియములకు
తెలియునదంతా ప్రకృతియే అయినప్పుడు, ప్రతి మనిషి ప్రకృతికి దగ్గరగానే ఉన్నాడని చెప్పవచ్చును. అయితే ప్రకృతి
తనకు శరీరము నిచ్చిన తల్లియని ఎవరికీ తెలియదు. ఒక మనిషి పెరిగి పెద్దయిన తర్వాత భౌతిక తల్లికంటే తండ్రికే
ఎక్కువ ప్రాధాన్యత నిచ్చునట్లు, మనిషి తన జీవితములో పెద్దవయస్సు వచ్చిన తర్వాత్మ తన తండ్రి పరమాత్మయని
తెలియకపోవడము వలన, పరమాత్మకు ప్రాధాన్యత నివ్వడము లేదు. ప్రకృతి తల్లియనిగానీ, పరమాత్మ తండ్రియనిగానీ
ఎంత వయస్సు వచ్చినా తెలియకపోవుచున్నాడు. ఈ విధముగా భూమిమీద 90 శాతము ప్రజలు జీవాత్మ అయిన
తనకు తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు. శాశ్వితమైన, సత్యమైన తల్లితండ్రులు తెలియాలంటే,
వారికి సంబంధించిన సమాచారము మనిషికి తెలిసివుండాలి. ఆ సమాచారమును దైవజ్ఞానము అంటాము. భూమిమీద
దైవజ్ఞానము తెలియని మనిషి ఎవడైనాగానీ, వానికి శాశ్వితమైన. తల్లితండ్రులు తెలియరు. నేటి సమాజములో
దైవజ్ఞానమంటేనే చిన్నచూపు చూచు మనుషులున్నారు. దైవజ్ఞాని అంటే వానిని అసమర్ధునిగా లెక్కించువారున్నారు.
అటువంటి సమాజములో ఎవరికీ దైవజ్ఞానము మీద ఆసక్తిలేకుండా పోయినది. అందువలన ఎవరికీ దేవుని
జ్ఞానమంటే ఏమిటో, మాయ ప్రభావమంటే ఏమిటో తెలియకుండా పోయినది. భూమిమీద ఎన్ని మతములున్నా ఆ
మతములో స్వాములు, బోధకులు, గురువులు ఉండినా. వారు మతమునకే ప్రాధాన్యతనిచ్చుచున్నారు. కుండడు సాంబారులో
చిన్న గరిటెతో తిరువాత పెట్టినట్లు వారి బోధలలో నామమాత్రము దైవజ్ఞానముండును. కొందరు ఆ కొద్ది జ్ఞానమును
కూడా గ్రహించక, మత విధానములకే ఎక్కువ విలువ నిచ్చుట వలన దేవుని విధానము ఏమిటో తెలియకుండా
పోయినది. కొంత దేవుని జ్ఞానమును తెలిసినవారు అరుదుగా ఉన్నారు. వారు దేవున్ని తండ్రిగా ఒప్పుకొంటున్నారు.
కానీ ప్రకృతి అంటే ఏమిటో, ప్రకృతి నుండి పుట్టిన మాయ అంటే ఏమిటో, మాయ మనిషి శరీరములో ఎక్కడున్నదో,
ఏ రూపములో ఉన్నదో, మనిషిలోని మాయ మనిషిని, ఎలా మభ్యపెట్టుచున్నదో ఏమాత్రము తెలియకున్నారు. మేము
దేవున్ని విశ్వసిస్తున్నామని చెప్పువారు దేవున్ని తండ్రి అని చెప్పువారు, మా మతములో తప్ప ఇతర మతములలో
దేవున్ని విశ్వసించేవారు తక్కువగా ఉన్నారని అనుకొనువారు చాలామంది ఉండినా, వారు తండ్రిని మాత్రము చెప్పుచున్నారు
తప్ప, తల్లిని గురించి తెలియనివారేనని చెప్పవచ్చును. తల్లిని గురించి తెలియనిదే తండ్రిని ఎవరూ తెలియలేరు.
ఎందుకనగా తండ్రి ఎవరన్నది తల్లికి మాత్రమే తెలియును. దేవుడెవరన్నది మాయ రూపములోనున్న ప్రకృతికి మాత్రము
తెలియును. అందువలన ప్రకృతితో తయారైన శరీరములోని గుణరూపమైన మాయను తెలిసి, శరీరములో తాను
ఎవరో, ఎక్కడున్నాడో, ఏమి చేయుచున్నాడో తెలియవలెను. అంతేకాక శరీరములో జరిగే పనులు ఎవరు చేయుచున్నారో,
శరీరము బయట శరీరము. ద్వారా జరుగు పనులు ఎవరు చేయుచున్నారో, మొత్తము జ్ఞానరూపముగా తెలియవలెను.
శరీర యంత్రాంగమునంతటిని తెలిసినపుదే, తల్లి అయిన ప్రకృతి ఎలా ఉన్నదో తెలియును. తర్వాత తండ్రి అయిన
పరమాత్మ ఎలా ఉన్నది తెలియుటకు అవకాశము ఏర్పడును. ప్రపంచములో భౌతికతండ్రిని, తల్లి లేనిదే ఎలా తెలియలేమో
అలాగే అభౌతికమైన పరమాత్మను, మాయను గురించి తెలియనిదే తెలియలేము. అభౌతికమైన తల్లి తండ్రులను
తెలియగలిగినపుడు తర్వాత భౌతిక తల్లితండ్రులకు పుట్టడు. తర్వాత శరీరమును ధరించి జన్మించడమంటూ ఉండదు.


ఎవడైతే తల్లిని తెలియునో అతడు తల్లి ద్వారా తండ్రివద్దకు చేరిపోవును. పరలోకములోనున్న తండ్రివద్దకు చేరుటకు
తల్లి ద్వారానే సాధ్యమగును. తల్లిని విస్మరించిన వాడు తండ్రిని చూడలేడు. తల్లి తండ్రిని తెలిసినవాడు ఇక ఎక్కడా
జన్మించడు. అంతటితో జన్మరాహిత్యము కల్గుచున్నది. అదియే మోక్షము లేక ముక్తి. అన్ని మతముల వారు ఈ
విధానముతోనే తండ్రి అయిన దేవుని వద్దకు చేరమని తెలుపుచున్నాము. ఓం మాతాపితాయ నమః


ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.



Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024