pss book: వేమన పద్యాలు 1-110 21stApril24 23
రచయిత ముందుమాట
రెడ్డి కులమున పుట్టి వేమనయోగి నామధేయము పొందిన వేమారెడ్డి గారు జీవితములో ఎన్నియో మలుపులు చూచాడు. కష్టసుఖాల అంచులు చూచి జీవితము మీద విరక్తి కల్గి, వదినె సహకారముతో, శివయోగి ఉపదేశముతో, ప్రేరేపితుడై సత్యము తెలుసుకొని తను తెలుసుకున్న జ్ఞానమును పద్యరూపములుగ బోధించినాడు. ఆయన పద్యములన్నియు సులభశైలిలో ఉండును. ప్రతి పద్యము బాహ్యర్థముగ చెప్పినట్లు కనిపించుచుండును. అందువలన వేమన తన పద్యములలో లోకనీతి ఎక్కువగా చెప్పినాడని చాలామంది అనుచుందురు. వాస్తవముగ తన పద్యములలో జ్ఞానము తప్ప నీతి, న్యాయము గురించి ఏమాత్రము లేవు. వేమనయే స్వయముగ నేను చెప్పినదంతయు జ్ఞానమే అన్నాడు. జ్ఞానము అర్థం చేసుకోలేని వారు వేయి విధములు అర్థముతో ఆయన పద్యములను పోల్చుకొనుచుందురు.
భూమిమీద జన్మించిన యోగులలో ఉత్తమమైన యోగి వేమన యోగి.అందరికంటే మేటి యోగియని చూడకనే చెప్పవచ్చును. తక్కువ రచనలో ఎక్కువ భావము ఇమిడ్చినవారు తక్కువ భావమును పెద్ద రచనలలో కూర్చిన వారికంటే ప్రశంసనీయులు. చాలా పెద్ద భావములను చిన్న పద్యములలో ఇమిడ్చినవారు ఒక్క వేమనేనని గట్టిగ చెప్పవచ్చును. తన జీవితములో తెలుసుకొన్న దైవత్వమును జ్ఞానరూపమున పద్యములలో దాచి ఉంచిన వారు వేమన. ఆయన పద్యములను ఊరక చదివినంతమాత్రమున అందులోని రహస్యము బయటపడదు. యోచించి చూచినపుడే ఆయన పద్యమర్థమగును.
తనపద్యములను అర్థము చేసుకొను శక్తి అందరికి ఉండదని తెలిసిన వేమారెడ్డి తన అంత్యకాలంలో తన కులములో కొందరి యువకులను పిలిచి తన పద్య రహస్యములన్నియు తెలిపి నా జీవితము అంతయు గడచిపోయినది నేను చెప్పిన జ్ఞానమంతయు నాపేరు మీద మీరు ఊరూరు తిరిగి ప్రచారము చేసి అజ్ఞానులను జ్ఞానులుగ మార్చమని తెలిపినాడు. ప్రయాణము చేయుటకు ఆ కాలములో ఇప్పటిలా వాహనములు లేవు. కావున ప్రయాణమునకు అనుకూలముగ మంచి గుఱ్ఱమును పెట్టుకొని గ్రామములకు పోయి అక్కడగల సత్రములో దిగి ఊరి ప్రజలందరికి వేమారెడ్డి వచ్చాడని దండోరా వేయించి సాయంకాలము తనవద్దకు అందరు వచ్చునట్లు చేసి తన పద్యముల జ్ఞానమును బోధించమని వేమన చెప్పిపోయినాడు. పెండ్లియైన వారికి అనుకూలముగ ఉండదని పెండ్లికాని వారికి మాత్రమే ప్రచార కార్యమును తెలిపి పోయినాడు. పోయిన ఊరిలో దండోర వేయుటకు మనిషి ఒకవేళ దొరకక పోవచ్చని దండోర మనిషిని తన వెంటనే తీసుకు పొమ్మని చెప్పాడు. ఇట్లు తన జ్ఞానమును ప్రజలు తెలుసుకోవలయునని తప్పక తన మాట ఆచరించు స్వకులస్థులైన వారికే వేమారెడ్డి పేరుతో చలామణి కమ్మని కూడా తెలిపినాడు.
చాలాకాలము వేమన ఆశించినట్లు వేమారెడ్డి పేరుతొ కాపువారు ఊరూర జ్ఞానమును చాటుచుండిరి. ఇప్పటికాలములో ఆ పద్ధతియందు కొంత మార్పు వచ్చినది. వేమయ్యగారేమో గుఱ్ఱముల మీద వస్తున్నారు. దేవాలయములలోనో, సత్రములలోనో దిగుచున్నారు. తప్పెట కొట్టించుచు, గుఱ్ఱములను ఇండ్లముందర ఆడించుచున్నారు. ధాన్యమును పెట్టించుకు పోవుచున్నారు. వేమన యోగి మాట నీటిమూట చేయుచున్న వేమయ్యగారున్నారు. మేము చిన్న తనములో చూచిన విధము ఇది. ప్రస్తుతము వేమయ్యగారే కరువైనారేమోననిపిస్తున్నది. వారి సంఖ్య చాలా తగ్గి పోయినట్లున్నది. వారివద్ద మంచి గుఱ్ఱంఉంటుంది చూస్తామను ఆశ కూడ పోయినది.
ఒకవేళ వేమన పేరుతో వచ్చు వారికనుకూల పరిస్థితులు లేకపోవచ్చును. కాని స్వకులస్తులైన రెడ్డి కులమువారు ఇంతమంది ఉండి మరియు ఎంతో ధనికులుగ పేరు ప్రఖ్యాతులు గాలవారిగ ఉండి వేమనకు ఏమి చేసినట్లు? అసలు వేమనయోగి అంటే ఎవరో తెలియనివారు కూడ రెడ్డి కులములో కలరు. వేమన సమాధి ఎక్కడుందో తెలియనివారున్నారు. వేమనయోగి ఆశయములను నెరవేర్చని వారము ఆయనకు మనమేమి చేసినట్లు? నిజమునకు ఆయనే మనకు ఎక్కువ చేశాడు. పరిపూర్ణమైన వేమనద్వారా రెడ్డి కులస్తులకు అందరికి ఆయన కీర్తి లభించినది.
Next.
కలియుగముననున్న కాపుకులాలకు
వేమన ధనకీర్తి విక్రయించె
నున్న ధర్మమెల్ల నుర్విలో నరులకు
కోరుపెట్టె పరమ గోరి వేమా.
వేమన ఒక ఆధ్యాత్మికవేత్తయేకాక నేటి హేతువాదులకు అందరికి ఆది గురువులాంటివాడు. ఆయన తన పద్యములలో ఎన్నో మూఢ విశ్వాసములను నిష్పక్షపాతముగ ఖండించాడు. అంతేకాక మూఢాచారములను, అక్రమ జ్యోతిష్యమును హేతుపద్ధతిలో ఖండించి పెద్దలమనుకొని చేయువారి చేష్టలను పూర్తిగా విమర్శించాడు. అందువలన నేటి కాలములో చాంధసవాదులైన కొందరికి వేమన వాదన సరిపడదు. వారంతా వేమనను తిక్కవాని క్రిందికి జమకట్టడము వలన వేమన యొక్క ఔన్నత్యము ప్రజలందరికి తెలియక పోయినది. నేటికి కూడ ఒక కులమువారు వేమనను హేళనగ మాట్లాడడము ఆయన మాటలను మతిలేని మాటలనడము మేము చూస్తూనే ఉన్నాము. ఆలా కొందరు ఆయనను అన్నివిధముల తక్కువ చేయగ స్వయాన రెడ్డి కులస్థులు కూడ ఆయనను గమనించక పోవడము, ఆయన గొప్పతనమును గుర్తించలేకపోవడము వలన వేమన కొంత మరుగునపడిపోయాడని చెప్పవచ్చును. ముఖ్యముగ చెప్పాలంటే వేమన జీవిత ధ్యేయమైన జ్ఞానప్రచారము రెడ్డి కులస్థుల మీదనే వేమన పెట్టిపోయాడు. ఆయన ధ్యేయమును సరిగ నిర్వర్తించలేకపోవడము ఒక లోపమనియె చెప్పవచ్చును. నేడు సమాజములో ఎన్నో విషయములలో ఎంతో గొప్ప స్థానముల వరకు ఎదిగిపోయిన రెడ్లు ఆధ్యాత్మిక విషయము యొక్క రుచినే తెలియక పోయారు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. రెడ్డి కులస్తులు వేమన ప్రచార సంఘమును స్థాపించి ఆయన గొప్పతనమును చాటిచెప్పితే వేమన కీర్తి భారతదేశములోనే కాక విదేశములకు కూడ విస్తరించగలదు. క్రీ.శ. 1839వ సంవత్సరములో ఇంగ్లాండ్ దేశస్తుడైన రాబర్ట్ బ్రౌన్ వేమన పద్యములలోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి ఆయన పద్యములను ఇంగ్లీష్ లోనే కాక మరెన్నో విదేశీ భాషలలో ముద్రించి ప్రచారము చేయగ ఆయన వారసులైన మనము వేమనంటే ఎవరో తెలియని స్థితిలో ఉండడము చాలా సిగ్గుచేటు.
జ్ఞానబోధలు చేయమని రెడ్డి కులస్తులకు కీర్తివచ్చునట్లు చేసి, లోకములోనున్న వారందరికి తన ధర్మములు తెలియునట్లు చేసిన వేమన జన్మ, రెడ్డి కులమున రత్నములాంటిది. ఇప్పటికైనా రెడ్డి కులస్తులు మేల్కొని వేమన ప్రచార సభలు నిర్వహించి వేమన ఆశయములను నెరవేర్చి, ధన్యులగుదురని నమ్ముచున్నాము. క్రొత్తగ వచ్చిన అయ్యప్పస్వామి భక్తిననుసరించి నల్లబట్టలు తొడిగి, కాళ్ళ చెప్పులు వదిలి, గడ్డములు పెంచి కఠినమైన ఆచరణ ఆచరించు ఓపిక ఉన్న మనకు ఏ కష్టములేని వేమన ఆశయము సాధ్యముకానిదంటు ఏమిలేదు. అందువలన ధనవ్యయమో, శ్రమవ్యయమో చేసి వేమన పేరు నిలబెట్టగలరని ఆశిస్తు ముగించు చున్నాము.
ఇట్లు
త్రిమత ఏకైక గురువు
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి
శతాధిక గ్రంథకర్త
ఇందూ జ్ఞాన ధర్మ ప్రదాత
సంచలనాత్మక రచయిత
త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు
----
Next.
వేయి విధము లమరు వేమన పద్యంబు
లర్థమిచ్చు వాని నరసి చూడ
జూడ జూడ గల్గు జోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినుర వేమా. 1
భావము:- వేమన యోగి రాసిన పద్యములు చూచుటకు అనేక విధములుగా కన్పించును. ఎవరిలోకము వారిది అన్న సామెత ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగ వాటి భావము తెలియుచుండును. చాలా మంది ప్రపంచ సంబంధమైన అర్థములనే వేమన పద్యములనుండి గ్రహించుచుందురు. కాని ఆత్మజ్ఞానము తెలిసినవాడు వేమన పద్యములను కేవలము ప్రపంచ విషయములుగ అర్థము చేసుకోక బాగా లోతుగా అలోచించి జ్ఞాన సంబంధమైన భావనే వాటినుండి అర్థము చేసుకొనును.
_----
Next.
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమా. 2.
భావము:- ఈ పద్యమును చాలామంది జ్ఞానసంబంధముగకాక ప్రపంచ సంబంధముగ అర్థము చేసుకొను ప్రమాదముగలదు. చూడ జూడ జూడగల్గు చోద్యమగు జ్ఞానంబు అన్నట్లు ఇందులో పూర్తిగ జ్ఞానమే ఇమిడియున్నది. భగవద్గీత ప్రకారము సర్వజీవులకు ప్రకృతి తల్లిగ ఉన్నది. సర్వజీవరాసుల శరీరములను తయారుజేయు ప్రకృతి తల్లికాగ, ఆ శరీరములకు చైతన్యమిచ్చి కదలించుచున్న ఆత్మ తండ్రిగా ఉన్నాడు. తల్లియైన ప్రకృతి, తండ్రియైన పరమాత్మను తెలియనివాడు, ప్రకృతి పురుషులమీద ధ్యాస లేనివాడు. వాటి జిజ్ఞాస లేనివాడు పుట్టియు ప్రయోజనము లేదు. శరీరమును తయారు చేసిన ప్రకృతి మీద, శక్తి నిచ్చుచున్న ఆత్మ మీద విచక్షణాజ్ఞానము లేనివాడు పుట్టలోన చెదలుతో సమానమే.
పుట్టలోని చెదలు పుట్టలోనే పుట్టుచున్నది. పుట్టలోనే పెరుగుచున్నది. పుట్టలోనే చస్తూ ఉన్నది. ఆ విధముగనే మానవుడై పుట్టినవాడు నిజమైన తల్లిదండ్రులైన ప్రకృతి పురుషులను ఆలోచించక మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయలోనే చస్తూ ఉన్నాడు.
------
Next.
బ్రహ్మ జంపి విష్ణుభాగంబున గలిపి
విష్ణు జంపి శివుని వెలయ గలిపి
శివుని జంపి తాను శివయోగి కావలె
విశ్వదాభిరామ వినుర వేమా. 3.
భావము:- సకల జీవరాసుల శరీరములలోను మూడు గుణములున్నవి. 1 ) తామసము 2 ) రాజసము 3 ) సాత్వికము. ఆ మూడు గుణములలో జీవుడు నివాసముండును. ఏదో ఒక గుణభాగములో జీవుడుండును. తామసములో ఉన్నప్పుడు రాజస, సాత్వికములలో ఉండడు. రాజసములో ఉన్నప్పుడు తామస, సాత్వికములలో ఉండడు. సాత్వికములో ఉన్నప్పుడు తామస, రాజసములలో ఉండడు. మూడు గుణముల తర్వాత మూడు గుణములకు మధ్యలో ఆత్మ నివాసము ఉన్నది. ఆత్మను చేరవలయునంటే జీవుడు మొదట తామస గుణభాగమును వదలి రాజస భాగమును చేరవలయును. అట్లే రాజస గుణభాగమును వదలి సాత్విక గుణభాగమును చేరవలయును. తర్వాత సాత్విక గుణభాగమును కూడా వదలి ఆత్మను చేరవలయును. ఆత్మను చేరిన జీవుడు తానే ఆత్మగా మారిపోవును. అపుడు జీవాత్మ ఆత్మగా మారిపోయినదన్నమాట.
పై పద్యములో తామస గుణభాగమును బ్రహ్మస్థానముగా వర్ణించి అందుండు జీవుణ్ణి బ్రహ్మ అని పిలిచినారు. అట్లే రాజస గుణభాగమును విష్ణుస్థానమని పిలిచినారు. అందున్న జీవుణ్ణి విష్ణువని పిలిచినారు. తర్వాత సాత్విక గుణభాగమును శివునిస్థానముగా వర్ణించి అందున్న జీవుణ్ణి శివునిగా పోల్చినారు. జీవుడు తామస భాగమును వదలి రాజస భాగమును చేరడమును బ్రహ్మ జంపి విష్ణుభాగములో కలిపి అన్నారు. అట్లే రాజసమును వదిలి సాత్వికమును చేరడమును విష్ణు జంపి శివుని వెలయ గలిపి అన్నారు. తర్వాత సాత్వికమును కూడా వదిలి ఆత్మను చేరడమును శివుని జంపి తాను శివయోగి కావలెనన్నారు. ఆత్మ స్వరూపముగా మారిపోవడమును శివయోగిగా వర్ణించారు. మూడు గుణములను జయించిన తర్వాతయే ఆత్మ ప్రాప్తి అను భావమును తెలియజేయడమే పైపద్య సారాంశము.
---
ఇనుమున జేసిన మైనపు కడ్డి
ముంటి మొనను నఱ్రావుల దొడ్డి
కూర్చుండి మేపిన కుందనపు గడ్డి
విప్పి చెప్పురా వేమారెడ్డి. 4.
భావము:- మన శరీరములోని మనస్సు అన్ని భాగములకంటే ముఖ్యమైనది. మనస్సు చలించక నిలిచిపోయిన వానికి ఆత్మదర్శనము సులభముగా అగును. వశమైన మనస్సు ఆత్మదర్శనమునకు కారణమగుచున్నది. కావున అది మిత్రునితో సమానముగా చెప్పబడుచున్నది. వశముకాక చలించుచు ప్రపంచవిషయములనే ప్రేరణ చేయుచు ఆత్మ దర్శనమునకు ఆటంకపరుచు మనస్సును శత్రువుగా చెప్పబడుచున్నది. ఒక మనస్సే చలించిన ఎడల శత్రువుగా, చలించక నిలిచిపోయిన ఎడల మిత్రునిగా ఉన్నది. కావున మనస్సును ఒకే కడ్డీగ పోల్చి ఆ కడ్డీ ఇనుముగా, మైనముగ రెండు విధములుగ ఉన్నదని వేమన తెల్పుచున్నాడు. చలించు మనస్సు మైనము కడ్డీతో సమానము, ఇష్టమొచ్చినట్లు వంగి పోవుచుండెను. చలించక ఏకాగ్రతగ నిలిచిన మనస్సు ఇనుపకడ్డీతో సమానము. అది ప్రక్కకు వంగక భద్రముగ నిలిచి ఉండును.
బయటనున్న జ్ఞానేంద్రియముల ద్వారా వచ్చు విషయములు అన్నియు మొదట మనస్సుకు చేరును. అట్లు చేరిన విషయములను మనస్సు గ్రహించి ఆ విషయములను లోపల ఉన్న బుద్ధి, చిత్తము, జీవునికి తెలియజేయును. బుద్ధి, చిత్తము చెప్పిన తిరుగు జవాబులను మనస్సు గ్రహించి బయటనున్న కర్మేంద్రియములకు తెలియజేయుచుండును. ఈ విధముగ అంతరేంద్రియములకు, బాహ్యేంద్రియములకు మనస్సు మధ్యవర్తిగ ఉన్నది. మనస్సు బ్రహ్మనాడి కుండలీశక్తి ప్రారంభమగు భూృమధ్య స్థానమునకు ప్రక్కనున్న సూర్య చంద్ర నాడుల మీద ఉన్నది. కావున ముంటిమొన అని అన్నారు. అన్ని విషయములు నరాల ద్వారా మనస్సుకు చేరుచున్నవి. అందువలన విషయములను ఆవులుగ పోల్చి అవి అన్నియు చేరు స్థలమైన మనస్సును దొడ్దిగ పోల్చినారు.
మనస్సు బయటి విషయములను సేకరించి లోపలికి, లోపలి విషయములను సేకరించి బయటకు పంపడమేకాక అన్ని విషయములను జ్ఞాపకము పెట్టుకొను శక్తికల్గి ఉన్నది. అంతేకాక క్రొత్త విషయములను కూడా జ్ఞాపకము చేయు శక్తికలదిగా ఉన్నది. ముందు ఒక విషయమును జ్ఞాపకము తెచ్చును. వెంటనే దానిని వదలి ముందుదానికి అనుబంధమైన వేరొక విషయమును తెచ్చును. దానిని వదిలి దానికి అనుబంధమైన ఇంకొక విషయమును తెచ్చును. ఈ విధముగ అది ఒకదానికొకటి అనుబంధ విషయములనే జ్ఞాపకము చేయుచు చివరికి ఏ విషయమునో తెచ్చిపెట్టును. మొదటి విషయమునకు, చివరి విషయమునకు చూచిన సంబంధములేక ఉండును. మొదలైనది ఒక విషయము, చివరికి నిలిచినది ఒక విషయముండును. మనస్సు విషయ ప్రేరణ చేసిన ఎడల ఎడతెగని విషయములను తెచ్చి పెట్టుచుండును.
కుందనపుగడ్డి పైకి గడ్డిగ కనిపించిన లోపల వేర్లు ఒకదానితో ఒకటి కలిసి ఉండును. కుందనపుగడ్డి వేర్లుకూడ ఎడతెగనివై మనస్సు మాదిరే ఉన్నవి. కనుక కుందనపుగడ్డిగ పోల్చినారు. మనస్సును వదిలిపెట్టిన ఎడతెగని చింతనలు చేయుచుండును. కాబట్టి కూర్చుండి మేసిన కుందనపుగడ్డి అని అన్నారు.
Next.
నీరు కారమాయె కారంబు నీరాయె
గారమైన నీరు కారమాయె
కారమందు నీరు కడురమ్యముగనుండు
విశ్వదాభిరామ వినురవేమా. 5.
భావము:- ఆత్మనుండి పుట్టిన ఆత్మ అంశయే జీవాత్మ. అందువలన ఆత్మను నీరుగ పోల్చి, జీవాత్మను కారముగ పోల్చి నీరు కారమాయె అన్నారు. అనగ ఆత్మయే జీవాత్మగ మారినదని అర్థము.
యోగము చేసిన సమయములో జీవాత్మ, ఆత్మలో కలిసి ఆత్మగమారి పోవుచున్నది. కావున కారము నీరాయె అని చెప్పినాడు. యోగము వదిలినపుడు ఆత్మలో ఐక్యమై ఆత్మగమారియున్న జీవాత్మ తిరిగి ఆత్మకంటే వేరై జీవాత్మగ నిలుచుచున్నది. అందువలన కారమైన నీరు కారమాయె అని కూడా చెప్పినారు.
ఎక్కడైతే జీవాత్మ ఉన్నదో అక్కడ ఆత్మ వానిలో కూడా కలిసి సర్వ జీవులయందు నివాసమున్నది. కావున కారమందు నీరు కడు రమ్యముగ నుండు అని తెలిపారు. ఆత్మను నీరుగ పోల్చి, జీవాత్మను కారముగ పోల్చి యోగసమయములో జీవాత్మ, ఆత్మలో కలియుచున్నదని, యోగము లేని సమయములో జీవాత్మ, ఆత్మను వదిలి ఉన్నదని, సర్వజీవరాసుల శరీరములలో ఆత్మ నివాసమున్నదని కూడా తెల్పినారు.
Next.
నీరు కారమౌను నీరౌను కారంబు
వానివద్ద నిద్ర పోవచ్చు
నీటిలోన నుండ నిఖిల బ్రహ్మాండముల్
విశ్వదాభిరామ వినురవేమా. 6.
భావము:- ఆత్మ జీవాత్మగ మారును. జీవాత్మ, ఆత్మగను మారును. అందువలన నీరు కారమౌను, నీరౌను కారంబు అని చెప్పినారు. ఆత్మలో చేరిన జీవాత్మ, ఆత్మలోనే ఎంతకాలమైనా ఉండవచ్చును. ఆత్మలో జీవాత్మ ఎంతకాలము చేరియుండునో అంతకాలం బయటి ప్రపంచము తెలియదు. కావున ఆ కాలమును నిద్రగ పోల్చి వానివద్ద నిద్రపోవచ్చని చెప్పినారు.
ఆత్మలోనే అఖిల ప్రపంచము ఇమిడివున్నది. కావున నీటిలోనేనుండు నిఖిల బ్రహ్మాండముల్ అని వర్ణించినారు.
Next.
చిన్నది ఎల ప్రాయంబున
కన్నది పతిలేక సుతుని కడుచిత్రముగన్
యన్నడు రతికేళెఱుగదు
సన్నియ్యక పెంచెనెవడు జగతిన వేమా. 7.
భావము:- మనిషికి 12 గంటలు పగలు, 12 గంటలు రేయి ఉన్నట్లు పరమాత్మకు వేయి యుగములు రాత్రి, వేయి యుగములు పగలుగ ఉన్నవి. పరమాత్మ పగలు వేయియుగముల కాలములో ప్రపంచము, జీవరాసులు ఉన్నవి. రాత్రి వేయి యుగములు ప్రపంచము లేదు, జీవరాసులు లేవు. అన్నీ ప్రళయము చెందుచున్నవి. పగలు వేయి యుగములు మొదలైనపుడు ప్రపంచము, జీవరాసులన్నియు పుట్టుచున్నవి. జీవరాసులు పుట్టు సమయమును పై పద్యములో ప్రాయమని చెప్పినారు. సమస్త ప్రపంచమునకు ఆదిశక్తియై పుట్టుక నిచ్చుచున్న పరమాత్మశక్తిని స్త్రీగా పోల్చి చిన్నది అని అన్నారు. పరమాత్మకు పగలు ప్రారంభ సమయములో జీవాత్మ ఉద్భవించుచున్నది. కావున చిన్నది ఎల ప్రాయంబున అని చెప్పడమైనది.
పరమాత్మకు మించినశక్తి ఏదిలేదు. కనుక పతిలేడు అని చెప్పియున్నారు. పరమాత్మశక్తియందు ఏ శక్తి ప్రమేయము లేకనే జీవాత్మ ఉద్భవించుచున్నది. కావున జీవాత్మను సుతునిగ పోల్చి కన్నది పతిలేక సుతుని అని అన్నారు. ఇది అందరికి అర్థముకాని విషయము కావున కడుచిత్రముగన్ అని కూడా చెప్పారు. పరమాత్మ సర్వవ్యాపియై అణువణువున వ్యాపించివున్నది. అన్నియు తానై ఉన్నది. కావున అది ఏ దానితో కలిసేదిలేదు, అందువలన ఎన్నడు రతికేళెఱుగదని అన్నారు. పరమాత్మకు ఉద్భవించిన జీవాత్మను పరమాత్మ ఏమాత్రము పోషించడము లేదు. పరమాత్మ ఏమి చేయక చూస్తూ సాక్షిగా ఉన్నాడు. పుట్టిన జీవాత్మ కర్మ చేత తనకుతాను ఎన్ని జన్మలవరకైన సాగుచునే పోవుచున్నాడు. అందువలన జీవాత్మను సన్నివ్వకనే పెంచెనని పరమాత్మనుద్దేశించి చెప్పినారు.
Next.
అవని నొక్కబిడ్డ యతని తండ్రికి బుట్టి
అట్టే యేలె జగము లగణితముగ
తల్లిలేక పుట్టి ధాత్రినెట్లేలెరా
విశ్వదాభిరామ వినురవేమా. 8
భావము:- ప్రకృతి, పరమాత్మయందు ఉద్భవించినది. అందువలన ప్రకృతిని బిడ్డగపోల్చి పరమాత్మను తండ్రిగ పోల్చి చెప్పడమైనది. పుట్టిన ప్రకృతి జీవరూపమై లెక్కలేనన్ని జీవరాసులుగ జగమంతా విస్తరించి ఉన్నది. అందువలన అట్టే యేలె జగము లగణితముగ అని ప్రకృతిని ఉద్దేశించి చెప్పినారు.
ప్రకృతికి తండ్రి పరమాత్మ, ప్రకృతికి తల్లిలేదు. ఏమియులేని ఆదిలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అతని నుండి ఉద్భవించినది ప్రకృతి, ఆ ప్రకృతి నుండి సర్వజీవరాసులు పుట్టినవి.
ప్రకృతి పుట్టక పూర్వము పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. కావున ప్రకృతికి తల్లిలేదని చెప్పుచున్నాము. తల్లిలేక పుట్టిన ప్రకృతి స్త్రీ స్వరూపముగ నిలిచి ఆత్మతో సంయోగము చెంది సకల జీవరాసులను పుట్టించి పోషించుచున్నది. ఈ విషయము అందరికి తెలియదు కావున తల్లిలేక పుట్టి ధాత్రినెట్లేలెరా అని ప్రశ్నవేయుచు పద్యము వ్రాశారు.
Next.
కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు
పందిని తిన్నవాడు పరమయోగి
ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానో
విశ్వదాభిరామ వినురవేమా. 9.
భావము:- మన శరీరములో మనస్సు కుక్కవలె అతిచంచలమైనది. ఒక్క క్షణము కుడా స్థిరముగ ఉండక కుక్క ఇల్లిల్లు తిరిగినట్లు మనస్సు కూడా విషయముల మీదికి చరించుచుండును. కుక్కమాదిరి చంచలమైన మనస్సును ఎవడు జయించునో వాడు నిజముగ గురువుతో సమానమే. గురువు మనస్సు జయించి ఉన్నవాడను విషయమును కుక్కను తిన్నవాడు గురులింగడని పై పద్యములో చెప్పారు.
మనస్సు చంచలమైనదియేకాక పరమనీచమైన విషయముల మీదికి కూడా పోవుచుండును. అందువలన దీనిని పందితో సమానముగ పోల్చి దానిని జయించిన పరమయోగి అని తెల్పుచు పందిని తిన్నవాడు పరమయోగి అని వర్ణించారు.
మనస్సు చంచలమైనది, నీచమైనదియేకాక దృఢ బలమైనదిగ కూడ ఉన్నది. దానిని జయించవలయునని ప్రయత్నము చేసిన వారికి సులభముగ లొంగదు. ఎంత బలముగ మనస్సును నిలుపవలయునని ప్రయత్నము చేసిన అది బలమైనది కనుక పోవుచునే ఉండును. ప్రయత్నమను పగ్గములకు నిలబడక మనలను సులభముగ లాగుకొని పోవు మనస్సును బలమైనదిగ వర్ణించుచు దానిని ఏనుగుగ పోల్చి చెప్పినారు. అటువంటి బలమైన మనస్సును జయించినవాడు సుజ్ఞాని అని చెప్పుచు ఏనుగును తిన్నవాడు అని అన్నారు.
మనస్సు చంచలమైనది కనుక కుక్కగను, నీచమైనది కనుక పందిగను, బలమైనది కనుక ఎనుగుగా వర్ణించి దానిని జయించుటను తిని లేకుండ చేయడమని వర్ణించి చెప్పినారు.
ఉక్కు చూర్ణము దిన నుడుగును కష్టంబు
ఉక్కు చూర్ణము దిన నుడుగును క్షయము
ఉక్కు చూర్ణము దిన నుడుగును కర్మముల్
విశ్వదాభిరామ వినురవేమ 10.
భావము:- ఉక్కు అన్ని లోహములలో కి చాలా గట్టిది ఉక్కు తో సమాన బలమైన పదార్ధము భూమి మీద ఏదీ లేదు. ఆ విధముగనే "నహీ జ్ఞానేన సదృశ్యం పవిత్ర మిహ విద్యతే" అను భగవద్గీతా వాక్యము ప్రకారము జ్ఞానమునకు మించినది దానికి సాటైనది, దాని కంటే పవిత్రమైనది ఏదియులేదు. అందువలన జ్ఞానమును ఉక్కుతో సమానముగ పోల్చి చెప్పడమైనది. జ్ఞానము తెలిసి, ఆ జ్ఞానశక్తి సంపాదించుకొన్న వారికి కర్మలన్నియు నశించును. "జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్" అన్నట్లు జ్ఞానశక్తి అను దాని వలన కష్టములు, రోగములు కర్మ వలన కల్గు సమస్తము తొలగిపోవును. అందువలన ఉక్కు చూర్ణము తిన నుడుగు కష్టంబు, క్షయము, కర్మముల్ అని వేమన యోగి అన్నారు.
Next.
పేడుముదురు కాయ పెనుబాము కుబుసంబు
జోడు కూర్చి రసము పోక జేసి
యొక్క యేడు తినగ నుర్వి హేమము తానె
విశ్వదాభిరామ వినురవేమా. 11
భావము:- ప్రతి కాయ ముదరక మునుపు విత్తనమునకు పనికిరాదు. ముదిరిన కాయయందే మొలకెత్తుటకు తగిన విత్తన బీజముండును. ఆ విత్తన బీజములో చెట్టు సూక్ష్మరూపముగ ఉండును. చివరికి బీజములో సూక్ష్మముగ అణిగి ఉన్న చెట్టు పెరిగి పెద్దదై దాని స్థూలరూపము కనిపించును. ఆవిధముగనే మనస్సునందు విషయములు సూక్ష్మముగ అణిగి ఉండును. అది ఏనాడో ఒక రోజు బయటపడి కార్యరూపమై నిలచును. శరీరమను చెట్టులో మనస్సు అను ముదురుకాయ ఉన్నది. దానియందు విషయబీజములున్నవి. చిన్న విత్తనమునుండి మహావృక్షము బయటికి వచ్చినట్లు, కనుపించక ఉన్న మనసు నుండి సూక్షముగ అణిగివున్న విషయములు మహాకార్యములుగ బయటపడును. అందువలన విషయ బీజములకు నెలవుగ ఉన్న మనస్సును ముదురు కాయగ పోల్చడమైనది. పేడు అనగ తాట. కాయమీద తాటను బట్టియే కాయ ముదిరినది లేనిది గుర్తించుచుందుము. అందువలన విషయములతో నిండిన మనస్సును పేడుముదిరిన కాయ అని అనుచున్నాము.
బుసపెట్టునది పాము. పాము వదిలిన కుబుసమును జూచి పామును పోల్చుకొన్నాము. మన శరీరములో కూడ కుండలీశక్తి అను పాము శబ్దము చేయుచునే ఉన్నది. పాము కుబుసము వదిలినట్లు మన శరీరములోని శక్తియను పాము 12 అంగుళముల పొడవుగల శ్వాసను వదులుచున్నది. కుబుసము ద్వారా పాము ఆకారమును చూచినట్లు శ్వాస ద్వారా దానికి కారణమైన శక్తిని తెలియవచ్చును. అందువలన ఆత్మశక్తిని పాముగ పోల్చి దానిద్వార శ్వాసరూపమున బయటపడు గాలిని కుబుసముగ పోల్చడమైనది.
మనస్సును, శ్వాసను ఏకము చేసినపుడు మనస్సు కదలక శ్వాస ఆడక నిలిచిపోవును. మనోమారుతములు అవినాభావ సంబంధములు కలవి. ఒకటి నిలిచిపోయిన వేరొకటియును నిలిచిపోవును. అందువలన కొందరు గాలిని కుంభించి బలవంతముగ నిలిపి మనస్సును నిలిచి పోవునట్లు చేయుచున్నారు. కొందరు మనస్సుని ప్రయత్నముగ నిలిపి శ్వాసను నిలిచి పోవునట్లు చేయుచున్నారు. ఈ రెండు నిలిచి కలిసి పోయినపుడే ఆత్మ సాక్షాత్కారమగును. శ్వాసను మనస్సును ఒకటిగ చేయడమునే కాయ కుబుసము జోడుకూర్చి రసము తీసి అన్నారు. రెండు ఒకటిగ చేరినపుడు క్రొత్తగ తయారగు యోగమను సారాంశమునే రసము అన్నారు. యోగసాధన చేయడమునే తినుట అన్నారు. లోహములలో అన్నిటికంటే విలువైనది, కల్మషములేనిది బంగారు కనుక ఆత్మను హేమముగ పోల్చి చెప్పారు. యోగము లభ్యము అయినప్పుడు తానే ఆత్మగ మారిపోవును గనుక నుర్వితానె హేమమౌనన్నారు.
Next.
ఎడ్లు రెండు తిన్న నిహమున స్థంభించు
నెడ్లు మూడు తిన్న నిహము విడుచు
నెడ్లు తెలియు మనుజుండు నేర్పడ యోగిరా
విశ్వదాభిరామ వినురవేమా. 12
భావము:- సర్వ ప్రపంచము జీవరాసి నిండి ఉన్నది. సమస్త జీవరాసులు స్వయంశక్తి లేనివి. ప్రతి జీవరాసి ఒకశక్తిని ఆధారము చేసుకొని బ్రతుకుచున్నది. అదియే ఆత్మశక్తి. జీవాత్మ, ఆత్మ లేనిది లేనేలేదు. అందువలన జీవాత్మ, ఆత్మ శరీరమందు నివాసమై ఉన్నవని తెలియుచున్నది. ఒక్క శరీరమందు మాత్రము పరిమితమై ఉన్నది జీవాత్మ. అన్ని శరీరములందు సంబంధముకల్గి అన్ని జీవాత్మలతో కూడివున్నది ఆత్మ. అన్ని శరీరముల లోపల, బయట నిండివున్నది పరమాత్మ. వేరుగనున్న జీవాత్మ, ఆత్మ ఒక్కటైపోయిన, అనగ జ్ఞానయోగము ఆచరించిన సమయములో ఇంద్రియ విషయములను సేకరించక స్థంభించిపోవును. ఆ సమయములో ప్రపంచ విషయములు తెలియక పోవును.
ఎడ్లనగ జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఎడ్ల రెండు తిన్న అనగ జీవాత్మ, ఆత్మ ఒక్కటై స్తంభించి పోవుటని తెలియవలయును. జీవాత్మ, ఆత్మ స్థంభించినపుడు ప్రపంచము తెలియకపోవును. కావున నిహము స్థంభించునన్నారు.
జీవాత్మ, ఆత్మ వివరము మరియు విషయము తెలిసినవాడు యోగి. ఆత్మననుభవించినవాడు యోగి. ఆత్మననుభవించినవానికి ఆత్మకంటే వేరైనది మరొకటున్నదను విషయము తెలియును కావున ఎడ్లు తెలియు మనుజుండు యోగిరా అనుట జరిగినది.
జీవాత్మ, ఆత్మయందు కలియడము యోగము. ఇది శరీరముతో శరీరములో జరుగుపని. జీవాత్మ, ఆత్మ ఏకమై పరమాత్మలో కలిసిపోయి శరీరమును వదిలి మోక్షము(విడుదల) పొందుచున్నాడు. అందువలన నెడ్లు మూడు తిన్న నిహము విడుచు అనుట జరిగినది.
Next.
కృష్ణ పర్వమందు వృత్తికలైదుండు
కృత్తులైదు పట్టి కృష్ణమ్రింగె
వెలయ కృష్ణలైదు వేమన మ్రింగెరా
విశ్వదాభిరామ వినురవేమా. 13
భావము:- ప్రకృతినుండి శరీరము తయారైనది. ప్రకృతినుండి కర్మ తయారైనది. ప్రకృతినుండి గుణములు తయారైనవి. ప్రకృతినుండియే అజ్ఞానమంతయు తయారైనది. అందువలన శరీరము ప్రకృతి సంబంధమైనది. పరమాత్మ సంబంధము ఒకే ఒక జ్ఞానమైతే ప్రకృతి సంబంధమైనవి చాలావున్నవి. ప్రకృతి సంబంధమైనది శరీరమైనపుడు ప్రతి శరీరము అజ్ఞానముతో కూడివున్నది. అజ్ఞాన(ప్రకృతి) సంబంధమైన శరీరమును జ్ఞాన(పరమాత్మ) సంబంధమైన శరీరముగ మార్చ వలయును.
ఆకాశము,గాలి, అగ్ని, నీరు, భూమియను ఐదు భాగములుగ ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతి నుండి తయారైన శరీరము కూడా 1.జ్ఞానేంద్రియములు 2. కర్మేంద్రియములు 3. వాయువులు 4. తన్మాత్రలు 5. అంతరేంద్రియములుగ విభజింపబడి ఉన్నది. ప్రకృతి స్వభావమంతయు పంచతత్వములుగ ఉన్నది. కావున జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, వాయువులు ఐదు, తన్మాత్రలు ఐదు, అంతరేంద్రియములు ఐదు గా విభజింపబడి ఉన్నవి.
కృష్ణమనగ నల్లనిది. అజ్ఞానము చీకటితో సమానమైనది కనుక అజ్ఞాన సంబంధమైన ప్రకృతిని కృష్ణమనుట జరిగినది. ప్రకృతి పంచ భాగములుగ ఉన్నది. కనుక కృష్ణమందు వృత్తికలైదుండు అనుట జరిగినది. వృత్తికలైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి నుండి తయారైన శరీరము ఐదు భాగములుగ ఉన్నది. కనుక శరీర ఐదు భాగములను కృత్తుకలనుచున్నారు. శరీరభాగములన్నియు అజ్ఞానములోనే మునిగి ఉన్నవి. కావున కృత్తుకలైదు పట్టి కృష్ణమ్రింగెనన్నారు. పంచేంద్రియములను ఆవహించిన పంచ అజ్ఞానములను వేమన అణచివేసి శరీరమందు జ్ఞానజ్యోతిని వెలిగించాడు. కావున వెలయ కృష్ణలైదు వేమన మ్రింగెనన్నారు.
Next.
కామిగాని వాడు కవిగాడు రవిగాడు
కామిగాక మోక్షకామి గాడు
కామియైనవాడు కవియౌను రవియౌను
విశ్వదాభిరామ వినురవేమా. 14.
భావము:- కామి అనగా ఒకదానిని ఆశించి దానిని పొందినవాడని అర్థము. ఆశను కామమనుట సహజము. అజ్ఞానముతో ఇతర దానిని పొందవలయుననునట్లు జ్ఞానముతో ఆత్మను పొందవలయుననుట కామమే. కామగుణముననుసరించువాడు కాముడు లేక కామి. ఆత్మను పొందవలయునను కోర్కెగల్గి ఆత్మను పొందినవాడు యోగి.
ఆత్మ సర్వజీవరాసుల శరీరములందు నివాసమై ఉన్నది. తెలివిలో ప్రకాశవంతులైన కవులు, కవితలో ప్రకాశవంతులైన కవులు ఆత్మశక్తితో అల్లాడు వారే కనుక ఆత్మయందు ఐక్యమైనవాడు కవి, రవి తానేయగును. అట్లు ఆత్మను పొందనివాడు ఒక శరీర పరిధియందు మాత్రమే ఉండును. కనుక అతడు రవికాని, కవికాని కాలేడు.
ఆత్మను పొందవలయునను కోర్కె లేని మరియు ఆచరణలేనివాడు పరమాత్మను ఆశించనులేడు, పొందను లేడు ఆత్మను పొందకపోతే పరమాత్మను(మోక్షమును) కూడా పొందలేడు. అందువలన కామిగాక మోక్షగామిగాడు అనుట జరిగినది.
చచ్చువార లెవరు? చావని వారేరి ?
చచ్చి బ్రతికియుండు జనము లెవరు?
విచ్చల విడిగాను వివరించిచూడరా
విశ్వదాభిరామ వినురవేమ 15.
భావము:- జీవుడు ఆత్మలో ఐక్యమైనప్పుడు జీవపదము నశించిపోవును. జీవాత్మ లేక ఆత్మయే మిగిలిపోవును. అందువలన జీవాత్మను చచ్చువాడు అనుట జరిగినది. భగవద్గీతయందు కూడ క్షరుడు అని జీవాత్మను ఉచ్చరించడము జరిగినది. ఆత్మ శాశ్వతమైనది, నాశనములేనిది. ఒక్క శరీరమందుకాక అన్ని శరీరములందు వ్యాపించి ఉన్నది. అందువలన ఆత్మను అక్షర పురుషుడని భగవద్గీతయందన్నారు. ఆత్మయందైక్యమైన జీవాత్మ కర్మనాశనమైన తర్వాత పరమాత్మయందు ఐక్యము చెందిపోవును. అటువంటివాడు ప్రపంచమంతయు నాశనమైనా తాను నాశనము కాడు.
ఆత్మ నాశనము కానిది కావున చావనిదని తెలియవలయును. జీవుడు నాశనమై పరమాత్మగ మారి పరమాత్మయందు చావు, పుట్టుకలు లేక శాశ్వితముగ మిగిలిపోవును. కనుక చచ్చి బ్రతికి ఉండునదని తెలియవలెయును. అందరికి ఈ వివరము తెలియదు. కావున విచ్చలవిడిగ వివరించి చూడరా అన్నారు.
చచ్చువారు ఎవరు?... ...జీవాత్మలు
చావనివారేరి?... ...ఆత్మ
చచ్చిబ్రతికియుండుజనములెవరు?... ...పరమాత్మగా మారిన జీవాత్మలు
ఉన్నవి మూడు ఆత్మలని తెలియనివాడు అజ్ఞానుడే అని తెలియవలయును.
Next.
కాంతమీద ఆశ కనకంబుమీద యాశ
లేనివాడు పుడమి లేనివాడు
అవి కలిగెనేని అతను కానరాడు
విశ్వదాభిరామ వినురవేమా. 16
భావము:- బంగారము మీద ఆశ, స్త్రీ మీద ఆశ లేనివాడు లేడు. వాస్తవమే! బంగారు, దాని ఆశ మీద స్త్రీలు ఎందరైనా చేరగలరు. బంగారు(ధనము) లేనినాడు విలువ లేదు. రెండు లేని వాడు దరిద్రుడు. అట్లే జ్ఞానమున్నపుడు మోక్షము లభించును. జ్ఞానము లేనప్పుడు మోక్షం లభించదు. ధనము లేని వానిని కాంత వరించనట్లు, జ్ఞానము లేని వానిని మోక్షము వరించదు.
మోక్షము మీద ఆశ, జ్ఞానము మీద ఆశ లేనివాడు తనకు ఏమున్నను లేని వానితో సమానమే. అంటే ప్రపంచ విషయములలో దరిద్రుని మాదిరి, జ్ఞాన విషయములలో దరిద్రుడే. ఒకవేళ జ్ఞానము కలిగి దానివలన మోక్షము కల్గెనేని అతడు శరీరములో ఉండక అంతట వ్యాపించి పోవును. కనుక అదికల్గెనేని అతడు కానరాడన్నారు.
కాంత మీద ఆశ అనగ మోక్షము మీద ఆశ అని గ్రహించవలెను. కనకము మీద ఆశ అనగ జ్ఞానము మీద ఆశ అని గ్రహించవలెను.
Next.
నిన్ను జూచెనేని దన్ను తామఱచును
దన్ను జూచెనేని నిన్నుమఱచు
నేవిధమున మనుజుడెరుగు నిన్నును దన్ను
విశ్వదాభిరామ వినురవేమా. 17
భావము:- జీవాత్మ జ్ఞానముచేత ఆత్మను కలిసిన తన మీద జ్ఞప్తి లేక ఆత్మ జ్ఞప్తితో ఉండును. దానినే యోగమందురు. యోగ సమయములో బాహ్యశబ్ద, స్పర్శ, రూప, రస, గంధములతో సంబంధము లేక జీవాత్మ తన్నుతాను మరచి ఉండును. అందువలన ఆత్మను నిన్ను అని చెప్పుచు నిన్ను జూచెనేని తన్నుతామరుచునన్నారు.
యోగము నిలిపి ఆత్మ జ్ఞప్తిని వదలి తిరిగి ప్రపంచ ధ్యాసలోనికి వచ్చినవాడు ఆత్మను మరిచిపోవును. అందువలన దన్ను జూచెనేని నిన్నుమఱచునన్నారు. శరీరముతో ఉన్నంత వరకు యోగమాచరించిన సమయములో జీవాత్మ ధ్యాస పోవును. యోగమాచరించని సమయములో ఆత్మ ధ్యాస పోవును. అట్లుకాక పూర్తిగ జీవాత్మ మూడవ పురుషుడైన పరమాత్మలో ఐక్యమైపోయినపుడు తాను ఆత్మకు, జీవాత్మకు సాక్షిగ ఉన్నాడు. సమస్త జీవులందు మరియు బయటగలడు. కనుక నిన్ను అను ఆత్మను, తన్ను అను జీవాత్మను చూడగల స్థితి మోక్షస్థితి. అందరికి ఈ విషయము తెలియదు కనుక ఏ విధముగ నెరుగు నిన్నును దన్నును అన్నారు.
Next.
ఆలుమాటలు విని అన్నదమ్ముల రోసి
వేరె పోవువాడు వెఱ్ఱివాడు
కుక్కతోకను బట్టి గోదావరీదునా
విశ్వదాభిరామ వినురవేమా. 18
భావము:- అన్నదమ్ములు మొదటినుండి ఉండువారు. భార్య మధ్య వచ్చునది. అయినా మొదటినుండి దగ్గర ఉన్న అన్నదమ్ముల విడిచి భార్యమాట వినుట సహజము. అట్లే ఆత్మ, పరమాత్మలు జీవాత్మలకు అన్నదమ్ములవంటివారు. పుట్టుకనుంచి తోడై ఉన్నవారు. అయినా కొంత వయస్సు వచ్చిన తర్వాత పని చేయబూనిన మనస్సుకే జీవులు అందరు లొంగిపోయి ఆత్మ, పరమాత్మల ధ్యాసలను మరుచుట జరుగుచున్నది. అందువలన ఆలుమాట(మనస్సు మాట) విని అన్నదమ్ముల(ఆత్మ, పరమాత్మ) విడుచువాడు వెర్రివాడనుట జరిగినది.
మనస్సు చంచలమైనది, వక్రమైనది. దగ్గరకొచ్చిన కుక్కతోక మాదిరి అల్లాడునది. దానిని నమ్మిన, ప్రపంచమును జయించలేడు. కనుక కుక్కతోకను బట్టి గోదావరీదునా? అన్నారు. మనస్సును వదలి ఆత్మ, పరమాత్మల సంబంధమేర్పరచుకొన్నవాడు ప్రపంచ వారధి సులభముగ దాటగలడు.
Next.
ఉప్పు చింతపండు ఊరిలోనుండగ
కరువేల వచ్చునో కాపులారా
తాలకం బెరుగరు తగరంబెరుగరు
విశ్వదాభిరామ వినురవేమా. 19
భావము:- ఉప్పు, చింతపండు తినుబండారములు. అవి ఒకదానితో ఒకటి కలిసినపుడు రుచి ఏర్పడును. పెద్దలు కూడ ఉప్పు, చింతపండుండగా భయమేల అను సామెతను అనుచుందురు. రుచి కలుగజేయు ఉప్పు, చింతపండు ఉంటే ఎదో ఒక పదార్థముతో జతపరచుకొని ఆకలి తీర్చుకోగలము. అందువలన కరువు లేదని బయట ప్రపంచములో చెప్పుకొన్నట్లు, వేమన జ్ఞానపరముగ ఊరనగ దేహమని, కాపులారా అనగ దేహమందు నివసించు జీవులారా అని, కరువంటే కర్మము(కష్టము)లని, ఉప్పనగా జ్ఞానమని, చింతపండనగ సాధనని తెల్పుచు గొప్ప రహస్యమును పద్యమందు ఇమిడ్చారు.
జ్ఞానముండి ఆచరణ లేనంతమాత్రాన ఏమి ప్రయోజనము లేదు. జ్ఞానము తెలిసి ఆచరణగల్గిన వానికి జ్ఞానశక్తి కల్గును. "జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్" అన్నట్లు గీతావాక్యము ప్రకారము జ్ఞానశక్తి కర్మలను కాల్చివేయును. అటువంటి వారికి కర్మల బంధముండదు. కర్మచేత సంభవించు జన్మలు కూడ ఉండవు. కర్మ బాధలే ఉండవు. కనుక ఉప్పు, చింతపండు ఊరిలో ఉండగ కరువేల వచ్చు కాపులార అని వేమనన్నాడు.
తాలకము, తగరము విభిన్నమైనవి. అట్లే జ్ఞానము, అజ్ఞానము విభిన్నమైనవి. కొందరు మానవులు జ్ఞానమంటే ఏమిటో అజ్ఞానమంటే ఏమిటో తెలియక నిత్యమూ చేయుపనులనే చేయుచు విమర్శలేనివారైనారు. కనుక అటువంటి వారినుద్దేశించి తాలకంబెరుగరు, తగరంబెరుగరు అని వేమనన్నాడు.
Next.
తల్లి గర్భమందు దాబుట్టినప్పుడు
మొదట బట్టలేదు తుదకు లేదు
నడుమ బట్టగట్ట నగుబాటు గాదొకో
విశ్వదాభిరామ వినురవేమా. 20
భావము:- అగ్నినుంచి బయటపడిన అగ్నికణమువలె, సముద్రపు అలల నుండి నీటిబిందువు బయటపడినటుల, సూర్యగోళమునుండి రాలిన ఉల్కలవలె పరమాత్మనుండి బహిర్గతమై జీవరూపము దాల్చిన సమయములో జీవునకు కర్మయనునది ఏమాత్రము లేదు. అగ్నిలో వత్తిడికి అగ్ని కణమెగిరినట్లు, సముద్ర అలల స్పందనకు నీటిబిందువు బయల్పడినట్లు, పరమాత్మ అంత:ప్రేరణ చేత ఆ పరమాత్మ అంశయే జీవాత్మగ మారినదికాని మొదట ఉద్భవించిన జీవునకు కర్మ కారణము లేదు. "మద్భావ మానసా జాతా" అన్నట్లు భగవద్గీతా వాక్యము ప్రకారము ఏ కర్మ కారణము లేక పరమాత్మ మనోసంకల్పము చేతనే మొదట జీవాత్మ ఉద్భవించాడు.
మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః
మనష్షష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి.
అన్నట్లు జీవుడు పరమాత్మ అంశయైనను ప్రకృతిలో వచ్చిపడిన అంశ కావున జీవాత్మ అనుట జరుగుచున్నది. ప్రకృతి తన ఆధీనములో ఉన్న ప్రతి జీవుణ్ణి మొదట గుణముల చేత ప్రేరేపించి కార్యముల చేయించి కర్మనంటగట్టుచున్నది. అప్పటినుండి తేనెలో చిక్కిన ఈగలాగ జీవాత్మ, కర్మననుభవిస్తు, కర్మను సంపాదిస్తు ప్రకృతి ఆధీనమందే ఉన్నాడు. సముద్రము నుండి బయటపడిన నీటిబిందువు బయటి సూర్యరశ్మికి ఇగిరిపోయి ఆవిరిగ మారి, వర్షముగ వర్షించి, నదులద్వారా తిరిగి సముద్రము చేరునట్లు జీవాత్మ కూడ జ్ఞానిగమారి, మహర్షిగ నడచి తిరిగి పరమాత్మను చేరవలయును. ఆ విధముగ ఏ జీవాత్మయైన ప్రకృతికి వ్యతిరేఖమైన జ్ఞానమును సంపాదించి దాని ఫలితమైన జ్ఞానశక్తి ద్వారా కర్మను పూర్తిగ కాల్చిననాడు తిరిగి పరమాత్మలో ఐక్యము కాగలడు.
భగవద్గీతాశాస్త్రము ప్రకారము నా బీజము ప్రకృతి గర్భమందు ఉద్భవించి జీవరాసులుగ శరీరము ధరించుచున్నది. కనుక సర్వజీవులకు మాత ప్రకృతి అనుట జరిగినది. పరమాత్మనుండి బయల్పడి ప్రకృతి రూప శరీరము ధరించిన మొదట సమయములో కర్మలేదు. కావున తల్లిగర్భమందు తాబుట్టినపుడు మొదట బట్టలేదన్నారు. బట్ట అనగ శరీరమునకు చుట్టబడునది. అట్లే కర్మ జీవాత్మను బంధించునది కావున కర్మను వేమన బట్టగ సంబోధించారు. అట్లే తిరిగి పరమాత్మయందైక్యమై పోవు సమయములో కూడ కర్మశేషము లేదు. కావున తుదకు లేదన్నారు. మధ్యలో కల్గిన కర్మవలన నానాబాధలు, బాంధవ్యాల మధ్యన చిక్కిన జీవుడు జ్ఞానుల లెక్కలో హాస్యాస్పదముగ ఉన్నాడు. కావున నడుమ బట్ట కట్టనగుబాటు కాదొకో అన్నారు.
Next.
తల్లినెరుగు వాడు దైవంబు నెరుగును
మన్ను నెరుగు వాడు మిన్ను నెరుగును
మన్ను మిన్నెరిగిన తన్ను తానెరుగును
విశ్వదాభిరామ వినురవేమా. 21
భావము:- సకల జీవులకు తల్లిదండ్రులు బ్రహ్మవిద్య ప్రకారము గీతాశాస్త్రములో చెప్పినట్లు ప్రకృతి, పురుషులు. మనిషి బాల్యములో మొదట తల్లిని తెలుసుకొన్న తర్వాత తండ్రి దగ్గరకు పోయినట్లు, సర్వజీవులు మొదట మాత అయిన ప్రకృతిని గురించి పూర్తిగ తెలుసుకొన్న తర్వాత, ఆత్మను గూర్చి కూడ తెలుసుకొందురు. తల్లి దగ్గరకు చేరక బాల్యంలో తండ్రి దగ్గరకు చేరనట్లు ఏ జీవుడు కాని ప్రకృతిని తెలియక మునుపు పరమాత్మను గూర్చి తెలియలేడు. అందువలన తల్లినెరుగు వాడు దైవంబు నెరుగును అన్నారు.
ప్రకృతిలోని పంచ భాగములలో చివరిది భూమి మొదటిది ఆకాశము. మొదటిది తెలియక చివరిది తెలియదు. అందువలన చివరిదైన మన్ను తెలిసినవాడు మొదటిదైన ఆకాశమును తెలిసియే ఉండును. అందువలన మన్ను నెరుగువాడు మిన్ను నెరుగునన్నారు. మన్ను మిన్ను తెలిసినవాడు తనలోని ఆత్మను గురించి తప్పక తెలియును. అందువలన మన్ను మిన్ను నెరిగినవాడు తన్నుతానెరుగును అన్నారు. ఈ పద్యములో తల్లి అనగా ప్రకృతి అని, మన్ను మిన్ను అనగ ప్రకృతిలోని భాగములైన భూమి, ఆకాశములని తెలియవలెను.
Next.
హేమకార విద్య నెరిగిన వారెల్ల
వెతల బడనియట్లు విద్యచేత
తత్వ మెరుగు వెనుక తనకు చింతేలరా?
విశ్వదాభిరామ వినురవేమా. 22
భావము:- ప్రపంచ వస్తువులలో అన్నిటి కంటే విలువైనది బంగారు. బంగారు చేయు విధానము తెలిసినవాడు దాని వలన డబ్బు ఆర్జించును. కనుక కష్టములు పడడు. ఆ విధముగనే దైవ మార్గముల తెలియుటలో బ్రహ్మవిద్యయే గొప్పయినది. అన్ని విద్యలకంటే గొప్పది మరియు విలువైనది బ్రహ్మ విద్యయే. బ్రహ్మవిద్యను తెలిసినవాడు జ్ఞానాగ్నినార్జించి కర్మల నాశనము చేసుకుని ఏ కర్మలను అనుభవించడు. అందువలన బ్రహ్మవిద్యకు హేమకారవిద్యని చెప్పి హేమకార విద్యనెరిగినవాడు వెతల బడనియట్లన్నారు.
ఆత్మను తెలిసినవాడు కర్మనాశనము చేయగల జ్ఞానాగ్నిని పొంది ఉండి చివరకు జన్మరాహిత్యము పొందును. అందువలన తత్వమెరుగు వెనుక చింత ఏలరా అన్నారు.
Next.
తిట్టికొట్టి రేని తిరిగి మారాడక
నూరకున్న చూడ నుర్విమీద
వాడగు పరమాత్మ వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినురవేమా. 23
భావము:- ప్రపంచ బాహ్య స్పర్శ శబ్దాదులందు మనస్సునుంచక ఆత్మయందైక్యము చేసినవాడు అంతర్ముఖ ధ్యాసలో ఇమిడివుండును. బయట ఏమి జరుగునది తెలియదు అటువంటివానిని ఎవడు ఏమన్ననూ తెలియదు కావున చలించని స్థితిలో ఉండును. అటువంటి వానిని గూర్చి తిట్టి కొట్టి రేని తిరిగి మారాడక అన్నారు. ఆత్మయందైక్యమైన వాడు చివరకు పరమాత్మయందు చేరగలడు. పరమాత్మలో చేరిన వానిని ఇక్కడున్నాడని గుర్తించ వీలుకాదు మరియు వివరింప వీలుపడదు. అందువలన వర్ణింప శక్యమా అన్నారు.
Next.
ఆకు చాటునుండు నన్ని లోకంబులు
కొమ్మగానరాదు బ్రహ్మకైన
కొమ్మగానబడిన కొనియాడ వచ్చురా
విశ్వదాభిరామ వినురవేమా. 24
భావము:- మన శరీరమందు కంటికి కనిపించక శిరోభాగమున నాల్గుచక్రములున్నవి. వాటి పేర్లు పై నుండి బ్రహ్మ, కాల, కర్మ, గుణ చక్రములు. బ్రహ్మ చక్రము క్రింద కాల చక్రమున్నది. కాల చక్రము క్రింద కర్మచక్రము ఉన్నది. కర్మచక్రము క్రింద గుణచక్రమున్నది.గుణచక్రమందు మూడు గుణభాగములున్నవి. ఆ భాగములలో జీవుడు నివసించుచుండును. పైభాగమునగల కర్మచక్రము నుండి ప్రసరించబడు కర్మకిరణములకు గుణములు చెలరేగుచుండును. గుణముల మధ్యనున్న జీవుడు ఆ గుణములకు లొంగిపోవు చుండును.
గుణ భాగములను లోకములుగ బ్రహ్మవిద్యయందు వర్ణించారు. ముల్లోకములైన మూడు గుణములు కర్మచక్రము కిందనే ఉన్నవి. కర్మననుసరించి చెలరేగుచున్నవి. కావున కర్మను ఆకుగ పోల్చి, గుణములను లోకములుగ పోల్చి ఆకుచాటున ఉండునన్ని లోకంబులు అన్నారు. బ్రహ్మ, కాల, కర్మ, గుణ చక్రములకు మధ్య ఇరుసుగ బ్రహ్మనాడి యందు ఆత్మ గలదు. ఈ నాల్గుచక్రములకు ఆత్మ ఆధారముగ ఉన్నది. ఆత్మశక్తి వలననే అన్ని చక్రములు తిరుగుచున్నవి. కంటికి కనిపించని బ్రహ్మనాడిలోని ఆత్మను కొమ్మగ పోల్చి దానినాధారము చేసుకున్న చక్రములను ఆకులుగ పోల్చడమైనది. కొమ్మగ పోల్చిన బ్రహ్మనాడి మధ్యలోని ఆత్మ కనిపించదు. కావున కొమ్మకానరాదు బ్రహ్మకైననన్నారు. కనిపించని ఆత్మను యోగము ద్వారా పొందినవాడు కర్మరహితుడై పరమాత్మయందైక్యమగును, అటువంటివాడు ప్రశంసనీయుడు. అందువలన కొమ్మ కానబడిన కొనియాడవచ్చురా అన్నారు.
Next.
వాడు వాడు వాడు వానిలోపలనుండు
వాడు వాడు వాడు వాడుగాడు
వారి వాని గూర్చు వాడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా. 25
భావము:- శరీరమందు గుణచక్రములో మూడు భాగములు కలవు. 1.తామసము 2.రాజసము 3.సాత్వికము. ఈ గుణ భాగములందు జీవుడు నివసిస్తువుండును. ఏ గుణభాగమందు ఎక్కువ కాలము జీవుడుండునో ఆ గుణము యొక్క పేరుతో వాడు పిలువబడును. తామసుడని, రాజసుడని, సాత్వికుడని అనుట సహజముగ ఉన్నది. వీరు ముగ్గురికి అతీతునిగ ఆత్మ ఉన్నది. గుణచక్రమునకు మధ్యనగల ఆత్మ సర్వజీవులకు, గుణములకు సాక్షిగా ఉన్నది. మధ్యనున్న ఆత్మలోనికి జీవాత్మ చేరిన ఆత్మయందైక్యమగును. అపుడు తామసుడని, రాజసుడని, సాత్వికుడని పిలువబడడు. గుణములలో ఉన్నపుడే గుణస్తుడగును. గుణములలో ఉన్నపుడే ఆత్మతో సంబంధములేనివాడై గుణముల పేర్లచే పిలువబడును. తామసుడుకాని, రాజసుడుకాని, సాత్వికుడుకాని ఆత్మకాడు. ఆత్మవేరు జీవుడు వేరుగ ఉండును. అందువలన వాడు(తామసుడు) వాడు(రాజసుడు) వాడు(సాత్వికుడు) వాడుకాడు(ఆత్మ) అన్నారు.
సూర్యుడు ఆకాశమందున్నప్పటికి దాని ప్రకాశము ప్రపంచమంతా వ్యాపించినట్లు, ఆత్మ మూడు గుణములకు ఆవల ఉండినప్పటికి దాని ప్రకాశము(శక్తి) మూడు గుణభాగములందంతా వ్యాపించివుండును. ఏ గుణములలో ఉన్న జీవుడైన ఆత్మశక్తియందిమిడి ఉన్నవాడే అగును. అందువలన వాడు వాడు వాడు వానిలోపల ఉండునన్నారు.
ఏ జీవుడైతే మూడు గుణభాగములను వదిలి మధ్యలో చేరిపోవునో వాడే ఆత్మ అగును, తరువాత పరమాత్మ అగును. తామస, రాజస, సాత్వికుడను పేర్లను వదలి ఆత్మ పేరు పొందినవాడు దేవుడగును కనుక వారివాని గూర్చు వాడెపో బ్రహ్మంబు అన్నారు.
Next.
మొదల మాను యగును తుద పక్షియునుగాదు
నోరులేదు పండ్లు యారుగలవు
జీవి యొకటి లేదు జీవులు జంపురా
విశ్వదాభిరామ వినురవేమా. 26
భావము:- మాను ఎంతో విశాలముగ కొమ్మలు వ్యాపించినదై ఆకులు, పూలు, కాయలు గలదిగ ఉండును. కొమ్మలు,ఆకులు పూలు,కాయలు అన్నియు చెట్టుకు అంటుకొని ఉండునవియే. పక్షి చెట్టుకొమ్మ మీద కూర్చొన్నను చెట్టుకు సంబంధంలేదు. పక్షి చెట్టును వదలి వెళ్ళిపోవును.
కర్మ అనునది ఒక వృక్షములాగ ఉన్నది. అందులో ఎన్నియో రకముల పాపపుణ్యములు ఉన్నవి. ఆకులు, కొమ్మలు చెట్టులోని భాగములైనట్లు రక రకాల పాపపుణ్యములు కర్మలోని భాగములు. ఉన్న ప్రతికర్మను జీవుడు అనుభవించవలసివుండును. ఏ ఒక్క కర్మ కూడ అనుభవానికి రాకుండ ఉండదు. అనుభవించకపోవు కర్మలేదు. కావున కర్మను చెట్టుగ పోల్చి ఏ కర్మ అయిన చెట్టులోని భాగమే కాని సంబంధము లేనిది కాదని తుద పక్షియును గాదన్నారు.
కర్మ, గుణచక్రములోని కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యములను ఆరు గుణములను ప్రేరేపించి జీవుని హింసించుచుండును. కర్మ కనిపించునది కాదు. అయినా గుణముల ప్రభావములను మాత్రము అందరు తెలుసుకోవచ్చును. అందువలన కనిపించని కర్మను నోరుగ పోల్చి, ఆరు గుణములను దంతములుగ పోల్చి నోరు లేదు పండ్లు ఆరు గలవు అన్నారు.
కర్మ స్వయంశక్తి కాదు. ఆత్మచైతన్యము చేతనే పని చేయుచుండును. అన్ని జీవులందున్న కర్మ ఆత్మ చైతన్యము చేతనే పని చేయుచు సకల జీవుల చావు పుట్టుకలకు కారణమై ఉన్నది. స్వయంశక్తిలేదు కావున జీవమొకటిలేదు అన్నారు. అన్ని జీవుల చావులకు కారణమైనది కర్మే కావున జీవుల చంపురా అన్నారు.
Next.
ఉర్వివారినెల్ల నొక్క కంచము బెట్టి
పొత్తు గుడిపి కులము పొలయ జేసి
తలను చెయ్యి పెట్టి తగనమ్మ చెప్పరా
విశ్వదాభిరామ వినురవేమా. 27
భావము:- ప్రపంచ జనులందరికి శరీరములో ఇంద్రియ భాగములు అన్నియు ఆత్మ శక్తి చేతనే పని చేయుచున్నవి. ప్రతి అవయవమునకు శక్తి అవసరము. శక్తి లేక ఏ అవయవము పనిచేయదు. ప్రపంచ జీవరాసులందరియందు ఒకే ఆత్మ నివాసమై శక్తి నిచ్చుచున్నది. కాగిన ఇనుప ముక్కలు ఏవియైన వాటి యందు మిళితమైన అగ్ని ఒక్కటే ఉన్నది. ఆవిధముగ శరీరములు ఏవియైన వాటియందుగల ఆత్మ ఒక్కటే ఉన్నది. కావున ఉర్వివారినెల్ల ఒక్క కంచము పెట్టి అన్నారు. ఉర్వివారనగ ప్రపంచ జీవరాసులని అర్థము. జీవరాసులన్నియు ఒకే ఆత్మశక్తిని వాడుకొనుచున్నవి కావున ఒక్క కంచము పెట్టి పొత్తుగుడిపి అన్నారు.
ఒక్కొక్క రకము పనిచేయువారిని ఒక్కొక్క రక కులముగ వర్ణించుట లోక సహజముగ ఉన్నది. ఏ రకము పనిచేసిన ఆ పనికి ఉపయోగ పడుచున్న శక్తి ఒక్కటే. కావున కులములేదని సర్వ మానవులు సమానమేనని తెలిసిన పెద్దలు చెప్పుచుందురు. అందువలన కులము పొలియజేసి అని పై పద్యమందన్నారు. సర్వమానవుల శరీరములకు ఉపయోగపడు శక్తి శరీర పైభాగమైన తలయందే నివాసమై ఉన్నది. దానిని తెలియవలయును, సర్వజీవులకు ఒకే ఆధారమై, అన్నిటియందు సమానమై నివాసమున్న ఏమాత్రము భేదములేని ఆత్మను చేరవలయునని తెలుపుచు, ఆశక్తి తలయందే ఉన్నదని తెలియునట్లు తలను చెయ్యిపెట్టి తగనమ్మ చెప్పరా అని వేమనన్నాడు.
Next.
ఆలివంక వారు ఆత్మబంధువులైరి
తల్లివంక వారు తగిన పాటి
తండ్రివంక వారు దాయాది పగవారు
విశ్వదాభిరామ వినురవేమా. 28
భావము:- మన శరీరములోని మనస్సు ఎన్నియో విషయ సంకల్పములు చేయుచుండును. మనోసంబంధమైన విషయసుఖములే ఆనందమును కల్గించునవిగ వాటిమీదనే, వీడక తగిలి ఉండువారు చాలామంది ఉన్నారు. కావున మనస్సును ఆలిగ పోల్చి, మనోసంబంధ విషయములను ప్రియమైన బంధువులుగ పోల్చి ఆలివంక వారు ఆత్మబంధువులనిరి.
పంచభూత నిర్మితమైన శరీరము మీదనే ధ్యాస కల్గి అందముగ కన్పించునట్లు అలంకరించుకొంటు ఎంతో ఆప్యాయతగ శరీరమే తానుగ తలచి ఉండువారు కలరు. కనుక పంచభూతములైన ప్రకృతిని తల్లిగ చెప్పి, దాని సంబంధమైన శరీరమును తగినపాటి వారుగ చెప్పుచు తల్లివంకవారు తగినపాటి అన్నారు.
సకల జీవులకు తల్లి ప్రకృతికాగ, తండ్రి పరమాత్మ అని తెలిపినాము. మానవుడు స్థూల శరీరము మరియు దాని అంతర్గతములో ఉన్న మనో ధ్యాసలలో ఉండి ఆత్మజ్ఞానము ఏమాత్రము తెలియక ఆత్మ పరమాత్మల ధ్యాస పూర్తిగా మరచినవాడై ఉన్నాడు. అందువలన పరమాత్మను తండ్రిగ చెప్పుచు పరమాత్మ సంబంధ విషయములు వంటబట్టని వారున్నారని తలచి తండ్రి వంక వారు దాయాది పగవారని వర్ణించారు. చిన్నతనము నుండి తోడు ఉన్న వారిని మరచి మధ్యలో వచ్చిన భార్యతో ఎక్కువ సంబంధముంచుకొన్నట్లు శిశుదశలో నుండి కలిసి ఉన్న ఆత్మ పరమాత్మల తలువక మధ్యలో వచ్చిన మనో గుణములందు మానవుడు చిక్కుకొంటున్నాడు.
తనకు సరిపోని దాయాదులలో స్నేహము చేసిన వాడిని కూడ శత్రువుగ చూచుకొన్నట్లు, ఈ కాలములో ఆత్మ సంబంధమైన జ్ఞానము కల్గిన వారిని, తెలియని అజ్ఞానులు తెలివితక్కువ వారిగ జమకట్టి తమకంటే తక్కువగ, శత్రుత్వముగ చూచుకొనుచున్నారు.
Next.
ఇంటియాలి విడచి ఇలజారకాంతల
వెంట తిరుగు వాడు వెఱ్ఱివాడు
పంట చేను విడచి పరిగె ఏరినయట్లు
విశ్వదాభిరామ వినురవేమా. 29
భావము:- కొందరికి ఇంటి భార్యకంటే బయట స్త్రీలు ఎక్కువ అందముగ కన్పించుచుండును. భార్య బయటి స్త్రీలకన్న అందముగ ఉండినా, దినాము దగ్గరగా చూచి చూచి ఇంటి ఆలి దయ్యమయ్యెనన్నట్లు అంద హీనముగ తోచుచుండును. బయటి జారస్త్రీలు పురుషులను ఆకర్షించ వలయునను ఉద్దేశ్యముతో అలంకరించుకొని కంటికింపగునట్లు కనిపించుచుందురు. వారి పైమెరుగులకు పురుషులు బుట్టలో పడి పోవుచుందురు.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహః
భగవద్గీతలో స్వధర్మము, పరధర్మమని చెప్పినట్లు ఆత్మ సంబంధమైనవన్నీ స్వధర్మములు. ప్రపంచమునకు సంబంధించిన ధర్మములన్నియు పరధర్మములు. ఎల్లవేళల తన శరీరమందు నివాసమున్న ఆత్మ విషయములను విడచి ప్రపంచ సుఖముల మరిగిన వారున్నారు. ఉదయము లేచింది మొదలు ప్రపంచ విషయములలో మునిగిన వారికి చివరకు వాటి యందు బాధలే తప్ప శాంతి ఏమాత్రము లభించదు. ప్రపంచ సుఖములందు మునుగువారు, తీట రోగి నవ్వకు బరుకునపుడు సుఖముగ ఉండి తర్వాత మంటలేచినట్లు విషయముల వలన కర్మలు కల్గి ఆత్మశాంతి ఏమాత్రము లభించక చివరిదశలో రోగములకు ఎంత డబ్బయిన ఖర్చు చేయుచు మృత్యువుకు భయపడు వారిని జూచి జ్ఞానులు వెఱ్ఱివారుగ లెక్కింతురు. ఆత్మ విషయముల వదలి ప్రపంచ విషయములదిరుగు వానిని ఇంటి ఆలి విడచి ఇలజారకాంతల వెంట తిరుగువాడు వెఱ్ఱివాడన్నారు. ప్రపంచ విషయములందు సుఖములేదు. కావున ఎల్లపుడు శాంతినిచ్చు ఆత్మజ్ఞానములేని వారిని పంట చేను విడచి పరిగె ఏరువారన్నారు.
Next.
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా
విశ్వదాభిరామ వినురవేమా. 30
భావము:- మానవుని శరీరములోపల జీవుడు నివాసమున్నాడు. లోపల నున్న జీవునికి బయటి ఇంద్రియముల ద్వార ప్రపంచ విషయములు తెలియుచున్నవి. ఇంద్రియాలు మనస్సు ద్వార ప్రతి విషయమును జీవునకు చేరవేయుచున్నవి. ఆ విధముగ విషయములు చేరవేయు ఇంద్రియ భాగములు ఐదు మాత్రము కలవు. వాటినే జ్ఞానేంద్రియములు అనుచున్నాము. అవి 1 .కన్ను 2 .చెవి 3 .ముక్కు 4 .నాలుక 5 .చర్మము.
పంచజ్ఞానేంద్రియముల ద్వారా వచ్చు విషయములను అనుభవించుచు జీవుడు ఎడతెరపి లేని కర్మననుభవిస్తు తేనెలో చిక్కిన ఈగ మాదిరి అల్లాడుచున్నాడు. పంచేంద్రియాల విషయాలు సుఖమును చూపి కష్టమును కలుగజేయునవి. జీవాత్మ పంచేంద్రియ విషయవాసనలకులోనై కర్మములను సంపాదించుకొనుచున్నాడు.
చర్మ స్పర్శవలన కలిగెడి కర్మను చెప్పులోని రాయి అన్నారు. చెవి శబ్ద విషయము వలన కలిగెడి కర్మను చెవిలోని జోరీగ అన్నారు. కంటి దృశ్య విషయము వలన కలిగెడి కర్మను కంటిలోని నలుసు అన్నారు. ఇంద్రియ విషయములు మనస్సు వలననే అనుభవమునకొచ్చును. కావున మనస్సును ముల్లుగ వర్ణించినారు. శరీరములో అన్ని ఇంద్రియాల విషయములు అనుభవమునకొస్తున్నవి. కావున శరీరమును ఇల్లుగ చెప్పి అనుభవములను పోరుగ పోల్చి ఇంటిలోని పోరు ఇంతింతకాదయా అని అన్నారు.
Next.
అంచ ఘనాక్షర బిందువు
పంచాక్షరినాద మండ్రు పరమ మునీంద్రుల్
ప్రాంచితముగ నది తెలిసిన
మంచాసన మెక్కువాడు మహిలో వేమా. 31
భావము:- క్షరమనగ నాశనమగునది. అక్షరమనగ నాశనములేనిది. నాశనములేని ఒక అంశ మన శరీరమందు ఒక కేంద్రములో ఉన్నది. ఆ అంశనే ఆత్మ అనుట జరిగినది. మన శరీర శిరోభాగములో ఒక బిందువువద్ద కేంద్రీకృతమైన ఆత్మను అంచ ఘనాక్షర బిందువన్నారు. ఆత్మ నాశనములేనిది కనుక ఘనాక్షర అను పదమును ఉపయోగించారు.
ఆత్మ శిరస్సునందు కేంద్రీకృతమై శరీర భాగములన్నిటికి దాని శక్తి ప్రసరించుచున్నది. దానిశక్తి వలననే మన శరీరమందు శ్వాస కదులుచున్నది. ఆ శ్వాసయందు ఒక నాదము ఉద్భవించుచున్నది. అది "సోహం" సో-హం నందు "ఓం" కార శబ్దమిమిడి ఉన్నది. సో అంత్యములో ఓ, హం అంతములో మ్ ఉన్నదానివలన ఓం కారము శ్వాసయందున్న సూక్ష్మశబ్దము. పంచాక్షరి నాదమని, ఓంకార శబ్ధమునే తెలిసినవారనుచుందురు. పంచాక్షరి అనగ పై భావముతోనే చూడక వివరముగ దానిని తెలిసినవాడు మోక్షము పొందును. వివరము తెలియడమేమనగ!
ఓంకారము శ్వాసయందు ఇమిడి ఉన్నదని, ఆ శ్వాస ఆత్మశక్తి వలన శరీరమందు చలించుచున్నదని, ఆత్మ శరీరమందు సర్వమునకు కారణమైనదని తెలియవలయును. ఈ ఆత్మ పంచభూతములకు నాశనము కానిదై, పంచభూతముల నిర్మాణమైన శరీరములో అతీతముగ ఉన్నది. పంచభూతములు నాశనము కాగలవి. పంచభూతములు శరీరములను నశింపజేయగలవు. శరీరమందుగల ఆత్మను పంచ భూతములు నాశనము చేయలేవు. కావున పంచమునకు నాశనము కాని ఆత్మను పంచాక్షరి అని మునులు అందురు. దానిశక్తిచే ఉద్భవించు ఓంకారమును పంచాక్షరి నాదమందురు. ప్రకృతి వలన నాశనముకాని ఆత్మను తెలిసినవాడు మోక్షము పొందును కావున ప్రాంచితముగ నది తెలిసిన మంచాసన మెక్కువాడు మహిలో వేమా అని వేమనయోగి వివరించాడు.
Next.
అంటియంటకుండ నమలుని తెఱగున
మింటి మంటి నడుమ మెలగుదాని
నొంటి స్తంభమందు జంటించి చూచును
విశ్వదాభిరామ వినురవేమా. 32
భావము:- ఆకాశము మొదలుకొని భూమి వరకు అంతట అణువణువున వ్యాపించిన వాడు పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క అంశయే ఆత్మగ ఉండి సర్వజీవరాసుల శరీరమందు నివాసమై ఉన్నది. పరమాత్మ అంశయైన ఆత్మ శరీరములో శిరోభాగమందు స్థానముకలదియై తనశక్తిని బ్రహ్మనాడియందు ఆరు కేంద్రముల ద్వారా శరీరమంతయు వ్యాపింపజేయుచున్నది. ఆకాశము మొదలుకొని భూమివరకు అణువణువున అంతట వ్యాపించిన పరమాత్మ అంశ ఆత్మ కావున, మింటి మంటి నడుమ మెలగుదాని అని పద్యమందన్నారు.
శరీరమున బ్రహ్మనాడి శిరోభాగమునుండి గుదస్థానము వరకు వ్యాపించి ఉన్నది. దానియందే ఆత్మ మొత్తము ఏడు కేంద్రములుగ ఉన్నది. బ్రహ్మనాడియే శరీరమంతటికి ఆధారము. కావున బ్రహ్మనాడిని ఒంటిస్తంభము అన్నారు. బ్రహ్మనాడియందుగల ఆత్మ తన కిరణములను గుణముల మీద ప్రసరించినప్పటికి, గుణములు బ్రహ్మనాడినుండియే పయనించినప్పటికి వాటికి అతీతముగ ఉన్నది. వాటి బంధము ఆత్మకు లేదు. అందువలన అంటియంటకుండ నమలుని తెఱగునన్నారు. అమలుడు అనగ తన కిరణములను అశుద్ధము మీద పడిన ఏమాత్రము మలినమంటని సూర్యుడని అర్థము. సూర్యునివలె ఆత్మ శరీరమందు శిరోభాగము నుండి తన కిరణముల చేత శరీరమంతయు ప్రకాశింపజేయుచున్నది. అటువంటి ఆత్మను మన శరీరమున బ్రహ్మనాడియందే తెలుసుకోవలయును. కనుక ఒంటి స్థంభమందు జంటించి చూచునన్నారు.
Next.
ఎలుక తోలు తెచ్చి ఎందాకనుదికిన
నలుపు నలుపే కాని తెలుపు కాదు
కొయ్య బొమ్మదెచ్చి కొట్టిన గుణియౌనె
విశ్వదాభిరామ వినురవేమా. 33
భావము:- ప్రపంచ విషయములను పూర్తిగ తెలిసినవాడై వీటివలన కర్మయే కలుగునని తెలిసి విషయవాసనలను పూర్తిగ జయించిన వానిని ఏ విషయము చలింపజేయలేదు. మనస్సు అంతరాత్మ జ్ఞప్తియందిమిడి బాహ్య విషయజ్ఞప్తియందు లేనపుడు ఏ విషయము జీవుని చేరలేదు. అందువలన బయటి విషయము లోపలనున్న జీవాత్మకు తెలియదు. యోగమునందు నిలిచినవాడు బయటి విషయముల సంబంధము లేనివాడై ఉండును. అటువంటి వానిని ఆకారమునకుండి ఏ గుణములేని బొమ్మతో సమానముగ చెప్పవచ్చును. అందువలన పై పద్యమందు కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన గుణియౌనె అన్నారు.
యోగియైనవాడు ఆత్మ విషయము పూర్తిగ తెలిసినవాడై ఉండును. ప్రపంచ విషయములు అతనికి రుచించవు. ఏ ప్రపంచ విషయము అతనిని అజ్ఞానదిశకు మళ్లించలేవు. దుఃఖమయములైన ప్రపంచ విషయములు ఎన్నియైన వానిని మార్చలేవు. కనుక ఎలుకతోలు తెచ్చి ఎందాక ఉతికిన తెలుపుకాదన్నారు. నిర్ణయము మారని సత్యము తెలిసిన యోగి రంగుమారని ఎలుకతోలుతో సమానముగ చెప్పినారని తెలియవలయును.
Next.
అల్పబుద్ధివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగ గొట్టు
చెప్పుతినెడి కుక్క చెఱకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినురవేమా. 34
భావము:- మన శరీరములోని మనస్సు, బుద్ధి, చిత్తము అంతరంగమందు పనులు చేయగ, బాహ్యమున జ్ఞాన, కర్మేంద్రియములు పనులు చేయగ కార్యములన్నియు జరుగుచున్నవి. ఏ ఒక్క చిన్న బయటి పనియైన శరీరములోని 23 భాగములు పని చేయవలసివుండును. అహము, జీవుడు ఏమాత్రము పని చేయనివారై ఉన్నారు. జరిగిన పనిలోని కష్టసుఖములను జీవాత్మ అనుభవించుచుండును. అహంకారము మాత్రము ఏ పనిజేయక మిగత ఇంద్రియముల ద్వార జరిగిన పనులన్నిటికి నీవే కారణమని జీవునకు బోధించుచుండును. అహము యొక్క మాట వినిన జీవుడు ఇంద్రియ కార్యముల మరచి అన్నిటికి నేనే కర్తననుకొనుచుండును.
v జీవాత్మ అహమునకు చోటిచ్చి, పనిచేయు ముఖ్యమైన ఇంద్రియములన్నిటిని విస్మరించినది. అందువలన అల్పబుద్ధివాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగ గొట్టు అన్నారు. అల్పబుద్ధి అహంకారమని, దానికధికార మిచ్చినవాడు జీవుడని, తొలగగొట్టబడినవారు ముఖ్యమైన మనోబుద్ధి మొదలైన ఇంద్రియములని తెలియవలయును. చిన్న వయస్సు నుండి అహంకారమునకు అధికారమిచ్చి నేనే అనుభావమున్న మానవునకు చేయు పనులందు పాపపుణ్యములనెడు కర్మ అంటుచుండును. ఈ విషయము తెలిసి ఈ విధముననున్న కర్మలన్ని అనుభవించవలసి ఉండునని తలచి జ్ఞానమును దానిని తెలియవలెనను సంకల్పము జీవునకు ఒకవేళ కల్గినప్పటికి, అహంకారమనునది జీవుని మాటవినక దానిపని అది చేయుచు జీవునకు కర్మ అంటగట్టుచునే ఉండును. అజ్ఞాన పనికి అలవాటుపడిన అహము జ్ఞానమార్గమునకు మరలుట కష్టము కావున చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా అన్నారు. చెరుకు తీపనగ జ్ఞానము యొక్క విలువని తెలియవలయును. చెప్పు తినెడి కుక్క అనగ జీవునకు అసత్యము బోధించు అహమని తెలియవలెను.
Next.
ఆరు దూలముల కాధారమైనట్టి
యొంటికంబ మింటికొనర నిల్చి
ఇంటికొకడు కర్త ఏపారుచుండు
విశ్వదాభిరామ వినురవేమా. 35
భావము:- ప్రతి శరీరములోను బ్రహ్మనాడి కలదు బ్రహ్మనాడియే శరీరమంతటికి ఆధారమై ఉన్నది. ఆ బ్రహ్మనాడి మొత్తము ఏడు కేంద్రములుగ విభజింపబడివున్నది. ఏడవ కేంద్రములో ఆత్మ నివాసమై ఉన్నది. ఆ ఏడవ కేంద్రములోని ఆత్మ తనశక్తి మిగత ఆరు కేంద్రముల ద్వారా ప్రసరింపజేస్తు ఆ కేంద్రముల నుండి శరీర భాగములను కదలించుచున్నది. ఈ విధముగ అన్ని శరీరముల బ్రహ్మనాడులందు ఆత్మ ఒక్కటియే నివాసమై అన్ని జీవరాసుల శరీరములకు శక్తినిచ్చుచున్నది.
శరీర భాగములు పట్టిక: చిత్రంను నిగూఢ తత్వార్థ బోధిని నుండి 35వ పేజీ లో చూడండి.
ప్రతి శరీరమునకు ఆత్మయే ఆధారమైవున్నది. కావున ఇంటికొకడు కర్త ఏపారుచుండును అన్నారు. ఇల్లనగ శరీరమని కర్తనగ ఆత్మని తెలియవలయును. ఆత్మ బ్రహ్మనాడి పై చివరి ఏడవ భాగములో ఉన్నది. కావున యొంటికంబ మింటికొనర నిల్చి అన్నారు. ఒంటికంబమనగ బ్రహ్మనాడని, మింటికొన అనగ బ్రహ్మనాడి పైనగల ఏడవ కేంద్రమని తెలియవలయును. బ్రహ్మనాడి ఆరు కేంద్రముల నుండి శరీరభాగములకు శక్తి ప్రవహిస్తు ఉన్నది. కావున ఆరు దూలముల కాధారమైన అన్నారు.
Next.
ఆరు మూడుగట్టి యలమట జెందక
పోరి గుణము లడచి పూని మిగుల
తేరు శిఖరమెక్కి తెలివంట జూడర
విశ్వదాభిరామ వినురవేమా. 36
భావము:- మన శరీరము నవరంధ్రములుగలదియై ఉన్నది. కన్నులు 2 , ముక్కులు 2 , చెవులు 2 , నోరు 1 , గుదము 1 , గుహ్యము 1 మొత్తము తొమ్మిది రంధ్రములు గల శరీరములో ఈ తొమ్మిది రంధ్రముల ద్వార జీవునకు ఎన్నియో విషయ సంఘటనలు ఏర్పడుచున్నవి. ముఖ్యముగ జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవుల ఆరు రంధ్రములచే ఎక్కువ విషయములు, కర్మేంద్రియములైన నోరు, గుదము, గుహ్యముల ద్వార తక్కువ విషయములు కలుగుచున్నవి. మనస్సు విషయములను అంటకుండ ఉంటే ఏ గుణములు చెలరేగవు. విషయములను అణచివేసిన గుణములను గెలువచ్చును. అందువలన నవరంధ్రముల విషయముల నిరోధింపమనెడు అర్థమునిచ్చునట్లు ఆరు మూడుగట్టి అన్నారు. ఆరు జ్ఞానేంద్రియములని, మూడు కర్మేంద్రియములని తెలియవలెను.
విషయముల సంబంధము లేనపుడు గుణములణిగి పోవును. అపుడు మనస్సు ఏ గుణ విషయములేని దానివలన బ్రహ్మనాడి చివరి ఏడవ భాగమైన సహస్రారమందు చేరి అక్కడి విషయము తెలియజేయుచుండును. అపుడు మన బుద్ధి ఆ విషయమును గ్రహించును. అందువలన గుణము లడచి పూని మిగుల తేరు శిఖరమెక్కి తెలివంట జూడర అన్నారు. తేరు అనగ శరీరము, శిఖరమనగ శిరోభాగమని తెలియవలయును.
Next.
ఇంటిలోని కోతి ఇరువుగానక లేక
తిరుగబోవు వారు తీరకుంద్రు
కోతినొకటి నిల్పి కుదురుండలేరయా
విశ్వదాభిరామ వినురవేమా. 37
భావము:- కొందరు దైవభక్తిగలవారు పుణ్యక్షేత్రములకు పోవుచు దైవ దర్శనము చేయుచు ఆత్మశాంతి కావలయునని కోరువారున్నారు. అట్లు ఎన్ని క్షేత్రములు తిరిగిన ఆత్మశాంతి దొరకదు. దైవము తెలియడు. మన శరీరములోని విషయజ్ఞప్తి చేయు మనస్సును సాధన చేత నిలిపివేసినపుడు మాత్రమే గుణములు చెలరేగక ఆత్మశాంతి కలుగును. మనలోని మనస్సు అనుక్షణము ఎదో ఒక విషయమును రేకెత్తించుచు అనేక విషయజ్ఞప్తుల మీదికి ప్రాకుచుండును. అందువలన మనస్సును చంచలమైన కోతిగ పోల్చి శరీరమును ఇల్లుగ పోల్చి ఇంటిలోని కోతి అన్నారు.
మనస్సును ఏవిధముగ నిలుపవలెనను జ్ఞానము తెలియక ఎన్ని క్షేత్రములు తిరిగిన ఏమి ప్రయోజనము లేదు. కావున ఇరువు గానలేక తిరుగబోవువారు తీరకుంద్రు అన్నారు. జ్ఞానము లేనిది కర్మ నాశనము కాదు. అందువలన కర్మ తీరదని చెప్పుటకు తీరకుంద్రు అన్నారు. మనస్సును నిల్పి యోగమను స్థితియందుండ లేరు. కావున కోతిని ఒకటి నిల్పి కుదురుండలేరయా అన్నారు. ఇల్లు అనగ శరీరమని, ఇరువు అనగ జ్ఞానమని, కోతి అనగ మనస్సని తెలియవలయును.
Next.
ఇహమునందు సుఖము నింపారలేదట
పరమునందు సుఖము బడయుటెట్లు
ధనములేక సుఖము తనకెట్లు కలుగురా
విశ్వదాభిరామ వినురవేమా. 38
భావము:- ప్రపంచములో ఎంత ధనమున్నను చివరికి తృప్తి, సుఖము ఉండదు. సుఖమునిస్తుందని నమ్మిన డబ్బే ఎన్నో సమస్యల మధ్య ఇరికించి శాంతిలేకుండ చేయును. ఇహములో శాంతి పొందినవాడే పరము పొందును. ఇహములో జ్ఞానములేనిది శాంతి లేదు. సర్వదుఃఖములకు హానికరమైనది జ్ఞానమని భగవద్గీతలో చెప్పినట్లు జ్ఞానధనము లేనివాడు ప్రపంచములో ఎంత పెద్ద ధనికుడైన సుఖమనుభవించలేడు. అందువలన ధనములేక సుఖము తనకెట్లు కల్గురా అన్నారు. ఇక్కడ ధనమనగా జ్ఞానధనమని అర్థము చేసుకోవలెను. జ్ఞానముండిన ఇహములో పరములో సుఖము పొందినవాడగునని తెలియవలయును.
Next.
ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున
త్రిపుటికి మధ్యంబునందు దీపము తానై
జపియించు రామ మెవడురా
తపసిని గనుగొన్న వాడు ధన్యుడు వేమా. 39
భావము:- శరీరములో శిరోభాగమున ఆత్మ నివాసమై ఉన్నది. శిరస్సు నందు మూడు గుణములకు మధ్యన గుణచక్రమునకు ఆధారమై ఉన్న బ్రహ్మనాడిలో ఆత్మ నివాసమై ఉన్నది. సర్వజీవరాసుల శరీరమందు కూడా ఈ విధముగనే ఉన్నదని తెలియవలయును. నోటిలోని చిన్న నాలుకను అందరు చూచి ఉందురు. దానినే ఉప జిహ్వయని కూడ అందురు. ఉపజిహ్వకు పై భాగమున మూడు గుణములకు మధ్యన ఆత్మ ఉన్నది. కావున ఆ విషయము తెలియు నిమిత్తము ఉపజిహ్వకు ప్రాగ్దిక్కున త్రిపుటికి మధ్యంబున అన్నారు.
శరీరములో ఆత్మ ఉన్నపుడే జీవాత్మ ఉండగలడు. ఆత్మచైతన్యము చేతనే శ్వాస ఆడుచున్నది. ఆత్మలేనపుడు శ్వాస ఆడదు. జీవాత్మ శరీరములో ఉండవలయునని ఎంత ప్రయత్నము చేసిన ఆత్మ వెడలిన వెంటనే జీవాత్మ కూడ పోవలసియుండును. ఎందరు ఎన్ని ఆసుపత్రులు తిరిగిన, ఎంత డబ్బు ఖర్చుపెట్టిన ఆత్మ ఉండువరకే జీవాత్మ శరీరమునందు ఉండును. శరీరముకంతటికి వెలుగునిచ్చి కదిలించునది ఆత్మే. కావున దానిని దీపముగ వేమన పోల్చాడు. ఆత్మ శరీరమందున్నపుడే శ్వాస చలించుచుండును. ఆత్మచైతన్యము బ్రహ్మనాడి కేంద్రముల ద్వార బయటి నరములకు చేరి అక్కడినుండి ఊపిరితిత్తులకు ప్రాకి ఊపిరితిత్తులను కదిలించుచు శ్వాస ఆడునట్లు చేయుచున్నది. శ్వాస శబ్దము ఉశ్చ్వాసయందొక రకము, నిశ్చ్వాసయందొక రకముగ ఉన్నది. కావున "రా" అని "మ" అని రెండు శబ్దములుగ ఉన్నదన్నారు. దీనికి కారణమైన ఆత్మను తెలిసినవాడు గొప్పవాడని చెప్పుచు జపియించు రామ మెవడా తపసిని గనుగొన్నవాడు ధన్యుడు వేమా! అన్నారు.
శిరోభాగములో శిరస్సు మధ్యన ఉండి శరీర జీవనముకు శ్వాస కారణమైన ఆత్మను తెలిసినవాడు పరమాత్మను చేరగలడను వివరమును పై పద్యమందు వేమనయోగి పొందుపరచాడు. త్రిపుటి అనగ మూడు గుణభాగములని తెలియవలయును. మధ్యననగ గుణభాగమధ్యనగల బ్రహ్మనాడి అని తెలియవలయును. దీపమనగ ఆత్మని, రామమని జపియుంచు తపసి అనగ సోహం శబ్దమునకు కారణమైన ఆత్మని తెలియవలయును.
Next.
ఉప్పులేని కూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలము లేదు
అప్పులేనివాడే యధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినురవేమా. 40
భావము:- ఆత్మజ్ఞానము లేని జీవితము వాసనలేని పువ్వులాంటిది. వాసనవున్నపుడే పువ్వుకు విలువ ఉన్నట్లు, జ్ఞానమున్నపుడే జీవితమునకు విలువ సార్థకత ఉన్నది. అజ్ఞాన విషయములందు కాలము గడుపు వాడు ఉండినా, ఊడిపోయినా బుధజనుల దృష్టిలో సమానమే. అందువలన ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు అన్నారు. ఉప్పులేని కూర అనగా జ్ఞానములేని బ్రతుకని అర్థము. ఒప్పదు రుచులకు అనగ ఏ విధమైన సార్థకములేనిదని అర్థము.
ఒకవేళ జ్ఞానముండి ఆచరణ లేనపుడు ఫలితములేదు. అందువలన పప్పులేని తిండి ఫలము లేదన్నారు. పప్పు పోషక పదార్థములనిచ్చునది. ఉప్పు రుచిని మాత్రము ఇచ్చునది. ఉప్పు పప్పు ఉన్నపుడు రుచి బలముగల తిండి అగును. అందువలన జ్ఞానము, ఆచరణ రెండు ఉండవలెను. ఆచరణ ఉండి జ్ఞానములేకపోయిన, జ్ఞానము ఉండి ఆచరణ లేకపోయిన రుచిలేని బలమైన ఆహారముగనో లేక బలములేని రుచిగల పదార్థముగనో జీవితముండును.
కర్మయున్నపుడు కష్టములు అనుభవించుచుండవలెను. జన్మలకు, అనుభవములకు మూలకారణమైన కర్మను లేకుండ చేసుకొనువాడు చాలా ధన్యుడు. జ్ఞానము మరియు ఆచరణ ఉన్నవాడు ఆత్మశక్తిని సంపాదించుకొని కర్మను కాల్చివేయుచుండును. కర్మ కాలిపోగ శేషము లేనినాడు జీవాత్మ పరమాత్మయందైక్యము కాగలడు. అందువలన కర్మ అను అప్పు లేనివాడు అధికసంపన్నుడని వేమనన్నాడు. ఉప్పు పప్పు ఇంటిలో ఉండగా అప్పుచేయనట్లు జ్ఞానము, సాధన రెండు ఉన్నప్పుడు కర్మకలుగదు. ఉన్న కర్మ కూడ సమసిపోవును. పై పద్యమందు ఉప్పనగ జ్ఞానమని, పప్పనగ ఆచరణని, అప్పు అనగ కర్మని తెలియవలయును.
Next.
కట్టెపైన నున్న గట్టెకు ఘనమేమి
చెట్టుపైన ఘనము చేరగలడె
కట్టె చెట్టు రెండు గలసె దైవంబులో
విశ్వదాభిరామ వినురవేమా. 41
భావము:- క్రింది కట్టెకు ఎంత విలువ ఉన్నదో పై కట్టెకు కూడ అంతే విలువ ఉన్నది. క్రింది కట్టె జడమైనట్లు పై కట్టె కూడ జడమైనదియే. శరీరము జడమైనది స్వతంత్రములేనిది. అట్లే శరీరమునధిష్ఠించి ఉన్న జీవాత్మ కూడ స్వతంత్రము లేనిదై ఉన్నది. శరీరమునధిష్టించి ఉన్న జీవాత్మ గొప్పదనము ఏమియులేదు. కావున కట్టెపైనున్న గట్టెకు ఘనమేమి అని వేమనన్నాడు. కట్టె అనగ శరీరము, పైనున్న కట్టెయనగ శరీరమును అధిష్టించిన జీవాత్మ అని తెలియవలయును.
సర్వ కట్టెలకు సారము చెట్టునుండి లభించుచున్నది. అట్లే సర్వ శరీరములకు శక్తినిచ్చునది ఆత్మ. చెట్టుపైన ఘనము చేరగలడె అనుట శరీరములకాధారమైన ఆత్మను చేరగలడె అని అర్థము. జీవాత్మ ఆత్మను చేరి కొంత కాలముండగ కర్మంతా నశించిన వెనుక జీవాత్మ, ఆత్మలు రెండు పరమాత్మయందైక్యమై పోవును. అందువలన కట్టె చెట్టు రెండు గలసె దైవంబులో అన్నారు. శరీరముననున్న జీవాత్మ, ఆత్మను తెలియనిది ప్రయోజనములేదు. శరీరమునకున్న విలువయే ఆత్మను చేరని జీవాత్మకు ఉండును. శరీరమునకు ఆధారమైన ఆత్మను జీవాత్మ చేరితీరవలయును. అట్లు జీవాత్మ ఆత్మలు కలిసి ఉండగ ఒక నాటికి పరమాత్మ ప్రాప్తి లభించునని వేమన పద్యము యొక్క సారాంశమని తెలియవలయును.
Next.
కడక నఖిలములకు నడినాళమందున్న
వేగుచుక్క వంటి వెలుగు దిక్కు
వెలుగు కన్న దిక్కు వేరెవ్వరున్నారు
విశ్వదాభిరామ వినురవేమా. 42
భావము:- సర్వజీవుల శరీరములందు వెన్నుపాములో గల బ్రహ్మనాడి అన్ని నాడులకంటే ముఖ్యమైనది. దానియందే సకల శరీరములను కదిలించుశక్తి ఇమిడి ఉన్నది. శరీరములోని ప్రతిభాగము యొక్క కదలిక ఆత్మచైతన్య శక్తిదే. గుండె స్వయముగ కదలలేదు. అట్లే ఊపిరితిత్తులు స్వయముగ కదలలేవు. ఉదరములోని జీర్ణాశయ గోడలుకాని, గ్రంథులందు రసస్యందనకాని ఆత్మశక్తి లేనిదే స్వయముగ కలుగజాలవు. ఈ పద్ధతి అన్ని శరీరములందు ఒకే విధముగ ఉన్నది. కావున అఖిలములకు నడినాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కన్నారు. నడినాళమనగ బ్రహ్మనాడిలోని భాగమని వేగుచుక్క అనగ బ్రహ్మనాడిలోని ఆత్మని తెలియవలెను. ఆత్మచైతన్యశక్తి లేనిది ఏ శరీరభాగము పనిచేయదు. కావున వెలుగుకన్న దిక్కు వేరెవ్వరున్నారు.
Next.
చంద్రసూర్య గతుల జర్చించి లేగమె
రంధ్రంబునను జొచ్చి రంగు మీఱ
జంద్రశాల జేరి చైతన్యమందరా
విశ్వదాభిరామ వినురవేమా. 43
భావము:- మానవ శరీరములో మూడు లక్షల యాభైవేల నాడులున్నట్లు వినికిడి. అందు 72 వేల నాడులు ముఖ్యమైనవి. వాటికంటే ముఖ్యమైనవి పది మాత్రము గలవు. పదినాడులందు ప్రధానమైనవి మూడునాడులు. అవి సూర్య, చంద్ర, బ్రహ్మనాడులు. బ్రహ్మనాడియందు ఆత్మశక్తి ఇమిడి ఉండి తన ఏడు కేంద్రముల ద్వార సూర్యచంద్రనాడులతో సంబంధపడి ఆ నాడుల ద్వార ఊపిరితిత్తులను కదిలించుచు శ్వాస అడునట్లు చేయుచున్నది. ముక్కురంధ్రములలో ఆడు శ్వాసకు సూర్య, చంద్రనాడుల ద్వారా వచ్చు బ్రహ్మనాడిలోని శక్తియే కారణము.
కుడిముక్కు రంధ్రములో ఆడు శ్వాసను సూర్యనాడి అని, ఎడమ ముక్కురంధ్రములో ఆడు శ్వాసను చంద్రనాడి అని అనుట పరిపాటి. ముక్కురంధ్రముల శ్వాసను ఆ విధముగ పిలువకూడదు. శ్వాసకు కారణమైన బ్రహ్మనాడికి ఇరువైపులగల నాడులకాపేర్లని గ్రహించవలయును. ఈ రెండు నాడుల మీద మనస్సు నివాసముండును. బ్రహ్మనాడికి కుడిప్రక్క గల సూర్యనాడి మీద మనస్సుండునపుడు కుడి ముక్కురంధ్రములో శ్వాస ఎక్కువ వచ్చుచుండును. ఆ సమయములో ఎడమ ముక్కురంధ్రములో తక్కువ వచ్చుచుండును. అట్లే ఎడమనాడైన చంద్రనాడి మీదికి మనస్సు పోయినపుడు ఎడమ ముక్కురంధ్రములో గాలి ఎక్కవ వచ్చుచుండును. ఇదంతయు జాగ్రత్తావస్థయందే జరుగుచుండును.
మనస్సు యొక్క స్థానములు తెలిసినవాడు దానిని మధ్యనాడియందు చేర్చు నైపుణ్యమును కూడ తెలిసినవాడగును. మనస్సు సూర్య, చంద్ర నాడుల మీద లేకుండ ఎరుకగ మధ్యనాడిలోనికి చేరినపుడు యోగమగును. ఆ సమయములో ఆత్మయొక్క అనుభూతిని మనస్సందించుచుండును. జీవుడు ఆత్మానుభూతిని అనుభవించుచుండును. అందువలన రంధ్రమున జొచ్చి చంద్రశాల జేరి చైతన్యమందరా అన్నారు.
Next.
తొఱ్ఱిమానులోని తోరట జీవులనెల్ల
మొల్ల లేక జంపు ముదము తోడ
నగ్నిలేని మంట యదియేమి చోద్యమో
విశ్వదాభిరామ వినురవేమా. 44
భావము:- నవరంధ్ర శరీరముగల జీవులనందరిని కర్మ తన అధీనము నందుంచుకొని పాపపుణ్యములనెడి క్రమముచేత కష్ట సుఖములను అనుభవింపజేయుచున్నది. కర్మ కంటికి కనిపించక శరీరాంతర్గతములోనే ఉండి గుణములను ప్రేరేపించి చిత్తముచే పనుల నిర్ణయింపజేసి కార్యములజేయించుచుండును. చేయుచుండు కార్యములలోని కష్టసుఖముల అనుభూతులను జీవుడు అనుభవించుచుండును. ఈ విధానమంతయు జీవునకు తెలియకనే ఒక పద్ధతి ప్రకారము జరుగుచుండును. అందువలన కష్టసుఖములన్నిటికి తామే కారణమని మానవులనుకొనుచుందురు.
తామే చేయుచున్నామని ప్రేమతో చేసిన కార్యములు కూడ ఆయుధములవలె బాధించును. అందువలన మొల్లలేక జంపు ముదము తోడ అన్నారు. నవరంధ్రముల శరీరము కల్గియున్నాము కావున తొఱ్ఱిమానులోని జీవులన్నారు. కర్మ కనిపించకనే ఆలోచనలను అగ్నిచేత కాల్చుచున్నది. అందువలన కర్మను అగ్నిలేని మంట అని వేమనన్నాడు.
Next.
తోలు తిత్తిలోన దొలత బుట్టిన తాను
వెనుక తెలియవలయు వివరమరసి
వెనుక తెలియలేక వెఱ్ఱియై చెడిపోవు
విశ్వదాభిరామ వినురవేమా. 45
భావము:- శరీరమందు జీవుడు జన్మించుచున్నాడు. కావున శరీరమును తోలుతిత్తి అని చెప్పారు. సృష్టిపూర్వము జీవులు లేరు. లేని జీవులు పరమాత్మ సంకల్పము చేత సృష్టించబడ్డారు. పుట్టిన జీవులు ప్రకృతితో సంబంధపడి ప్రకృతి గుణములందు చిక్కుకొని తాము జీవులు కాకమునుపు ఎట్లుంటిమి? ఎవ్వరై ఉంటిమి? అప్పటిస్థితి ఏమి? అని ఏమాత్రము యోచించడము లేదు. పుట్టినవారు ప్రపంచ మాయలోనే చిక్కుకొనక జీవాత్మగ మారక మునుపు ఎవరుగ ఉంటిమని వెనుకటి స్థితిని వివరముగ తెలుసుకొనుటకు ప్రయత్నించవలయును. అట్లు తెలుసుకొనుటకు ఆత్మజ్ఞానమవసరము. ఆత్మజ్ఞానము లేనిది వెనుకటి పరమాత్మ స్థానము తెలియదు.
జీవాత్మయైన తనస్థితిని గురించి ఏమాత్రము యోచించని వారు నిత్యము ప్రపంచ కార్యములనే చేయుచు వాటియందే లగ్నమై ఉన్నారు. కొద్దికాలముండి ఏనాడో ఒకనాడు చెప్పకనే మునిగిపోవు జీవితమే గొప్పగ తలచుకొని తన్నుతాను యోచించక వెనుకటి తనస్థితిని గురించి తలచక కాలమును పశువులవలె గడిపెడు జీవులు జ్ఞానుల దృష్టిలో వెర్రివారు. అందువలన వెనుక తెలియలేక వెఱ్ఱియై చెడిపోవునని వేమారెడ్డి అన్నారు.
Next.
నలుగురు దొంగలబట్టుగ
తల బట్టగవలయును నొకని దగ దండింపన్
వలెరా మువ్వురి దీర్చుమ
ఇలలోపల నెరుక ఫలమెయిదియగు వేమా. 46
భావము:- మన శరీరములో శిరోభాగమున గల గుణచక్రమందు మూడు భాగములు గలవు. ఆ మూటికి అతీతమైన భాగము మూడు గుణభాగములకు మధ్యనగలదు. మధ్యనగల భాగమందే శరీరమునకు శక్తినిచ్చు ఆత్మగలదు. ఏ జీవుడైన మూడు గుణభాగములకు అతీతమైన మధ్యనగల నాల్గవ భాగములోని ఆత్మను తెలియనిదే మూడు గుణములను వదలి ఆత్మయందైక్యముకానిదే జన్మరాహిత్యమైన మోక్షమును పొందలేడు.
మూడు గుణభాగములు మరియు ఆవలనున్న ఆత్మ భాగమైన బ్రహ్మనాడిని తెలియవలయునను ఉద్దేశ్యముతో నలుగురు దొంగలబట్టుగ తలబట్ట వలయునన్నారు. నల్గురు దొంగలనగ మొత్తము నాల్గు భాగములని, బట్టగ అనగ తెలియవలయునని అర్థము. తెలిసినవాడు మూడు గుణభాగములను వదలి నాల్గవ భాగమైన బ్రహ్మనాడియందే నిలువవలయును. కావున ఒకనిదగడందింపన్ వలెరా అన్నారు. మూడు గుణములను పూర్తి వదలివేయుమనుటకు మువ్వురి దీర్చుమ అన్నారు. అట్లు చేయుటవలన ఫలితము ఆత్మదర్శనమే. కావున ఇలలోపల నెరుక ఫలమెయిదియగు అని వేమనయోగి అన్నాడు.
Next.
అయిదు వర్ణములనె యఖిలంబు తెలిసిన
నయిదునందు ముక్తి యమరియుండు
నయిదులోన నున్న యతడెపో యఖిలము
విశ్వదాభిరామ వినురవేమా. 47
భావము:- ప్రకృతి అయిన పంచభూతములచే నిర్మింపబడిన శరీరమందే అఖిలజీవరాసులకు అధిపతియైన ఆత్మను తెలియవలయును. పంచ భూత నిర్మాణ శరీరమునకు బయట ఎంత వెదకిన అఖిల జీవులకు కారణమైనవాడు తెలియడు. పంచభూతములచే పంచీకరణ చెందిన శరీరమునందు మూల పురుషుడైన ఆత్మను తెలిసిన , శరీరము బయట పంచభూతములలో అణువణువున వ్యాపించి ఉన్న పరమాత్మను తెలియనగును. కావున అయిదు వర్ణములనె అఖిలంబు తెలిసిన అయిదునందు ముక్తి అమరి ఉండు అన్నారు.
శరీరాంతర్గతమున సర్వజీవులకు కారణమైన ఆత్మను తెలిసిన, శరీరము బయట ఉన్న అయిదు భాగములైన పంచభూతములలో వ్యాపించినవాడు తెలియును. బయట అయిదు భాగములందు ఇమిడి ఉన్న పరమాత్మయే సర్వమునకు కారణము. అందువలన అయిదులోనున్న అతడెపో అఖిలము అన్నారు. అయిదు వర్ణములను శరీరముగ తెలిపి మిగత అయిదు భాగములను శరీర బయట పంచభూతములుగ తెలియవలయును. పూసల మధ్యలో కనిపించక, పూసలకు ఆధారమై ఉన్న దారము కనిపించనట్లు, పంచభూతములలో కనిపించక వ్యాపించి ఉన్నవాడు పరమాత్మని తెలియవలయును.
Next.
ఐదునైదు నెన్మి దారును నొక్కటి
యోడలోన నుండి యోరసిల్లు
నోడ యెక్కి తిరుగు నోడయతడే తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమా. 48
భావము:- శరీరములో ఇరువదైదు భాగములున్నవని సాంఖ్యము ద్వార తెలియుచున్నది. నిర్దిష్టమైన పనిని చేయు అవయవమును ఒక భాగముగ గుర్తించుచున్నాము. ఉదాహరణకు కన్ను ఒక భాగముగ ఉన్నది. కన్ను చూచు పని తప్ప వేరే ఏ పని చేయదు. దృశ్యమును గ్రహించు నిర్దిష్ట భాగముగ ఉన్నందున కన్నును శరీరములో ఒక భాగముగ గుర్తించాము. అట్లే చెవి మొదలగునవన్నియు లెక్కించనగును. జీవాత్మ కూడ అనుభూతులను అనుభవించు కార్యము చేయుచున్నాడు కావున జీవాత్మ కూడ ఒక భాగముగ లెక్కించడము జరిగినది.
జ్ఞానేంద్రియములు
=
5
కర్మేంద్రియములు
=
5
వాయువులు
=
5
తన్మాత్రలు
=
5
అంతఃకరణాలు
=
5
మొత్తము
=
25
ఇరువది ఐదు ఇంద్రియ భాగములపైన ఇరువదరావ భాగముగ ఉండి ఇరువదైదు ఇంద్రియములకు శక్తినిచ్చి కదలించుచున్నది ఆత్మ. పై పద్యములో ఐదునైదు నెన్మిదారునొక్కటి అని మొత్తము 25 వచ్చునట్లు తెలిపారు. శరీరమును ఓడగ తెల్పి 25 భాగములు శరీరములో ఉన్నాయని తెల్పుచు ఓడలోన నుండి యోరసిల్లు అన్నారు. శరీరమున పై శిరోభాగములో ఉండి శరీరమును నడిపించువాడు ఆత్మ. కనుక ఓడనెక్కి తిరుగు ఓడ అతడే తత్వంబు అని వేమన శరీర రహస్యమును సులభముగ తెల్పినాడు.
Next.
ఒకటి రెంట మూట యోగీంద్రుని గూడి
యుదయ పర్వతంబు మొదలి గిరుల
క్రమమెరింగి కాంచు ఘన పట్టణంబుల
వీరు డొక్కడేలు వినురవేమా. 49
భావము:- మన శరీరములో ముఖ్యమైనవి మూడునాడులున్నవి. ఒకటి సూర్యనాడి, రెండు చంద్రనాడి, మూడు బ్రహ్మనాడి. ముఖ్యమైన బ్రహ్మనాడి యందే అసలైన ఆత్మ నివాసమై ఉన్నది. ఆ బ్రహ్మనాడి ఏడు నాడీ కేంద్రములుగ విభజింపబడి ఉన్నది. ఏడవ నాడీకేంద్రమైన మెదడు భాగములోనే ఆత్మ నివాసమై అక్కడి నుండి తన చైతన్యశక్తిని మిగత ఆరు నాడీకేంద్రముల ద్వార శరీరమంతటికి వ్యాపింపజేయుచున్నది.
మూడు నాడుల వివరము తెలిసి అందుగల ఆత్మను కూడుటను ఒకటి రెండు మూట యోగీంద్రుని గూడి అన్నారు. యోగీంద్రుడనగ ఆత్మని తెలియవలయును. ఏడు నాడీకేంద్రములను పర్వతములుగ పోల్చి మొదటి నాడీకేంద్రము నుండి చివరి నాడీకేంద్రము వరకు తెలియ వలయుననుచు ఉదయ పర్వతంబు మొదలు గిరుల క్రమమెఱింగి అన్నారు. ఒక్కొక్క నాడీకేంద్రము సారాంశము తెలియుటను కాంచు ఘనపట్టణంబుల వీరుడొక్కడేలు అన్నారు. వీరుడొక్కడు అనగ ఆత్మ ఒక్కటియే అని అర్థము.
Next.
ప్రొద్దుపొడుచు చోటు ప్రొద్దునిలుచు చోటు
ప్రొద్దుగ్రుంకు చోటు పొసగ జూచి
ప్రొద్దెఱ్ఱిగినవాడు పొలుసైన యోగిరా
విశ్వదాభిరామ వినురవేమా. 50
భావము:- ప్రొద్దనగ వెలుగుని అందరికి తెలియును. అట్లే మన శరీరములో కూడ జ్ఞప్తియను ప్రొద్దు ఉన్నది. జ్ఞప్తి అనగ మనస్సని ముఖ్యముగ తెలియవలయును. నిద్రావస్థలో జ్ఞప్తిలేదు, జాగ్రతావస్థలో ఉన్నది. బాగుగా అలోచించి జ్ఞప్తి ఎక్కడనుండి శరీరములో కలుగుచున్నది? ఆ జ్ఞప్తి శరీరములో ఎట్లు నిద్రావస్థలో లేకుండ పోవుచున్నది? మెళుకువలో వచ్చిన జ్ఞప్తి జాగ్రత్తలో ఎట్లు నిలిచివున్నది తెలిసినవాడు యోగి అగును.
మనస్సుకు మారుపేరు జ్ఞప్తి అందుము మనస్సు జాగ్రతావస్థలో సూర్యచంద్రనాడుల మీద ఉండునని తెలుసుకున్నాము. నిద్రావస్థలో బ్రహ్మనాడియందు చేరుచున్నది. బ్రహ్మనాడి నుండి సూర్య, చంద్ర నాడులను చేరడము, సూర్య చంద్రనాడుల నుండి బ్రహ్మనాడి చేరడము యొక్క వివరము మనస్సును గురించి తెలుసుకొన్న తర్వాతే తెలియును. మనస్సు యొక్క సాంగో పాంగములు తెలిసినవాడు నిజమైన యోగి అగును. అందువలన పైపద్యములో మనస్సును ప్రొద్దుగ పోల్చి ప్రొద్దు పొడుచు చోటు, ప్రొద్దు నిలుచు చోటు, ప్రొద్దుగ్రుంకు చోటని మనస్సు మారు సూర్య, చంద్ర, బ్రహ్మనాడుల గూర్చి తెలిపారు. మూడు నాడుల తెలిసి మనస్సును తెలిసినవాడు యోగి అనుచు ప్రొద్దెఱ్ఱిగినవాడు పొలుసైన యోగిరా అన్నారు.
------------
ఆశచేత ధనము నార్జింపగానేల
మట్టిక్రింద బెట్టి మరువనేల
ధనము పోవు వెనుక ధర్మం బదేలరా
విశ్వదాభిరామ వినుర వేమ. 51
భావము:- కొందరు జ్ఞానమును తెలుసుకొని ఏమాత్రము ఆచరించక తెలిసినవారమని తిరుగుచుందురు. జ్ఞానము ఆచరణలేనిది ఏమి ప్రయోజనములేదు. అచరణ లేని జ్ఞానము ఉపయోగపడని ధనముతో సమానము. కొందరు ఆశచేత ధనము సంపాదించివారు తినక, ఇంకొకరికి పెట్టక భూమిలో దాచిన ఏమి ప్రయోజనము? అట్లే తెలియవలయునను కోర్కెచేత జ్ఞానము తెలిసి ఆచరించక, ఇతరులకు తెలిపి వారిని ఆచరింప జేయకున్న ధర్మముకాదని పై పద్యమందు భావము.
పేదవాని బాధ పెనుభూతమైయుండు
జాడలేదు బాధ చూడవశమే
కలుగు వాని బాధ కనుల జూడగలేమి
విశ్వదాభిరామ వినుర వేమ. 52
భావము:- ధనము లేనివాడు పేదవాడు. అట్లే జ్ఞానధనము లేనివాడు నిజముగ పేదవాడు. ధనములేని వానికి ప్రపంచ బాధలున్నట్లే, జ్ఞానధనము లేనివానికి కర్మచేత బాధలుండును. కంటికి కనిపించనిది కర్మ. అందువలన ఎపుడేకర్మ ఉన్నదో ఎవరికి తెలియదు. అనుభవించునపుడు మాత్రము బాధ తెలియును. కర్మవలన కలుగు బాధను బయటివారు చూడగల్గుచున్నారు. కానీ కర్మ ఎదుటి వారికి కూడ తెలియలేదు.
భూతము కనిపించదు. కనిపించకనే మనిషిని బాధించుచుండును. అందువలన కర్మను పెనుభూతముగ వర్ణించారు. బాధకు కారణమైన కర్మను జూడ చేతకాదు. కావున జాడలేదు బాధ చూడవశమే అన్నారు. ప్రతి బాధకు, కష్టమునకు, నష్టమునకు అట్లే మానవుని అనుభవమునకు కర్మ కారణమై ఉన్నది. "జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్" అన్నట్లు జ్ఞానమను అగ్నిచే సర్వకర్మలు నాశనమగును. అది లేనివాడు ప్రపంచములో ఎంత ధనికుడైనను జ్ఞానులలెక్కలో బీదవారితో సమానమే.
మూడు లోకములను మొనసి యొక్కటి జేసి
యారు తారములనంట గూర్చి
స్థిరముగానె యుండు శివమూర్తి
విశ్వదాభిరామ వినుర వేమ. 53
భావము:- జ్ఞానము తెలిసినవాడు ఆత్మసాధన చేయుచుండును. సాధనయందు మనస్సు, మూడు గుణముల విషయముల జ్ఞప్తి లేకుండ పోయి గుణములకు ఆవల ఉన్న ఆత్మజ్ఞప్తియందు లగ్నమై ఉండును. మనస్సు మూడు గుణముల విషయములను వదులుచున్నది. కావున మూడు లోకముల మొనసి అన్నారు. మూడు గుణములకు ఆవల ఒక్కటైన ఆత్మజ్ఞప్తిలో చేరియున్నది. కావున యొక్కటి చేసి అన్నారు.
యోగమందు లగ్నమైయున్నపుడు బ్రహ్మనాడిలోని ఆరుకేంద్రములు స్థంభించిపోవును. ఏడవకేంద్రమైన శిరోభాగముననే ఆత్మ నివాసమై ఉన్నది. కనుక ఆ ఒక్క స్థానము చైతన్యముగ ఉండి మిగతా ఆరు కేంద్రములు పని చేయక నిలిచిపోవును. అందువలన పై పద్యమునందు ఆరు తారములనంట గూర్చి అన్నారు. శరీరమందు ఆరు కేంద్రములు పని చేయని దానివలన అట్టి యోగి ఆత్మానుభూతిని అనుభవిస్తు ఏకస్థాయిగ ఉండును అటువంటి సమయములో జీవాత్మ, ఆత్మను చేరియున్నది. కావున యోగిని శివమూర్తి అనడము జరిగినది.
అంతరంగమందు నపరాధములు చేసి
మంచివాని వలెనె మనుజుడుండు
ఇతర లెరుగకున్న నీశ్వరుండెఱుగడా
విశ్వదాభిరామ వినుర వేమ. 54
భావము:- జీవుడు శరీరములో నివాసమున్నాడు. గుణచక్రమందు గుణముల మధ్యలో నివాసమున్న జీవుడు ఏదో ఒక గుణముతో సంబంధపడి ఉండును. గుణముల ప్రేరణచేత జరిగెడు పనులన్నిటి అనుభూతిని, గుణములందు జీవుడు అనుభవించుచుండును. గుణచక్రమునకు ఆధారముగ మధ్యనున్న బ్రహ్మనాడిలో ఆత్మ నివాసముండి గుణములకు, జీవునకు సాక్షిగ ఉన్నది. ఎపుడు ఏ గుణము చెలరేగినది, ఎపుడు జీవాత్మ ఏ బాధలేక సుఖము అనుభవించునది చూస్తు సాక్షిగ ఉన్నది. అన్ని గుణములు బ్రహ్మనాడినుండి ప్రయాణము చేయవలయును. అందువలన బ్రహ్మనాడిలోని ఆత్మకు తెలియనిది ఏ పని జరుగదు. అంతరంగమందు అన్నిటికి ఆత్మ సాక్షిగ ఉన్నదని తెలియని కొందరు ప్రపంచములోని కొన్ని చెడ్డపనులు ఎవ్వరులేని చోట, ఎవ్వరు చూడనపుడు రహస్యముగ చేసి మేము చేసిన పనులు ఎవరు చూడలేదనుకొనుచున్నారు. పైకి మంచివారివలె కనిపించుచున్నారు. బాహ్యముగ ఎవరు చూడకున్నను అంతరంగమందు ఆత్మ అన్నిటిని చూస్తువున్నది. అందువలన పై పద్యమందు ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా అన్నారు.
Next.
మురికి లోన బుట్టి మురికిలోన పెరిగె
మురికి తనవు కింత మురిపె మేల
మురికెరుంగు నతడ మురికిలో బుట్టునా?
విశ్వదాభిరామ వినుర వేమా. 55
భావము:- ప్రతి జీవరాసి కర్మవలన జన్మించుచున్నది. కర్మకారణము చేతనే పెరుగుచున్నది. కర్మవలననే ప్రతి కష్టసుఖములను అనుభవించుచున్నది. కాని ఏ జీవరాసి కర్మ కారణము చేతనే ప్రతికార్యము జరుగుచున్నదని ఏమాత్రము తెలియక అజ్ఞానమునందే కాలమును గడుపుచున్నవి. ప్రతి పనికి తమ సొంత ప్రయత్నమే కారణమనుకొను జీవులు తమ శరీరమును ఎంతో మురిపెముగ పెట్టుకొన్నవి. కారణము తెలియని జీవులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శరీరము ఎందుకున్నదని ఏమాత్రము యోచింపకున్నారు. ఒకవేళ జ్ఞానము తెలిసి కర్మ రహస్యము నెరిగిన మానవుడు ప్రతిది కర్మ సంభవమేనని గ్రహించును. అటువంటి వాడు కర్మ ఏ విధముగ తగులుకొనుచున్నదని గ్రహించి దానినుండి బయటపడును.
ప్రతి జీవి కర్మాధీనములో ఉండి, కర్మచేతనే పుట్టి, పెరిగి, గిట్టుచున్నవి. కావున కర్మను మురికిగ వర్ణించి మురికిలోనే పుట్టి మురికిలోనే పెరిగె మురికితనువు అన్నారు. కర్మ రహస్యము తెలిసినవాడు కర్మను జ్ఞానాగ్నిచే కాల్చివేసి, పుట్టక పరమాత్మలో ఐక్యము చెందును. కావున మురికెరుంగు నతడు మురికిలో బుట్టునా అన్నారు.
Next.
వాగు లడ్డు గట్టి వల్లకాడులు దున్ని
మున్ను నడచు త్రోవ ముండ్లు గొట్టి
పైరు బెట్టునట్టి పాపులు గలరొకో
విశ్వదాభిరామ వినుర వేమా. 56
భావము:- మన శరీరములో ప్రవాహము మాదిరి ఆలోచనలు వస్తూనే ఉండును. ఒక ఆలోచన వెనుకనే వేరొక యోచనవస్తు ఎడతెరిపి లేని ప్రవాహమువలె ఉన్నది. కనుక మనో విషయములను వాగుగ పోల్చినారు. అటువంటి మనో విషయములను యోగసాధనపరుడు నిలిపివేయును. విషయప్రవాహమునకు కారణమైన మనస్సును నిగ్రహించి యోచనలు రాకుండచేయును. కావున వాగులడ్డు గట్టి అన్నారు. స్మశానములో ఎప్పటి శవము యొక్క అస్తికలో బయటపడి కనిపించుచుండును. బయట పడిన ఎముకలు శవములను గుర్తు చేసినట్లు, ఎప్పటి విషయములనో మనస్సు జ్ఞప్తి చేయుచుండును. కావున మనస్సును వల్లకాడుగ (స్మశానముగ) వర్ణించారు. మనస్సుకు పాత విషయ జ్ఞప్తి లేకుండ యోగి చేయుచున్నాడు. కనుక వల్లకాడులు దున్ని అని తెలిపినారు.
సాధారణముగ మనస్సు చలించుచున్నది. మనస్సు చలించు మార్గమును యోగి మూసివేసి చలింపక చేయుచున్నాడు. కావున మున్ను నడచుత్రోవ ముండ్లుగొట్టి అన్నారు. మనస్సును జయించి జ్ఞానమను బీజములను శరీరమందు నాటి యోగమను పైరును యోగి పెట్టుచున్నాడు. కర్మలోనుండిన వ్యక్తి జ్ఞానముచేత ఇన్ని పనులు చేసి యోగిగ మారుచున్నారు. కనుక పైరు పెట్టు పాపులన్నారు. పై పద్యమందు శరీరమును భూమిగ పోల్చి, మనస్సును వాగుగ, వల్లకాడుగ, నడచుత్రోవగ వర్ణించారు. మనస్సును జయించడమును వాగులడ్డుగట్టి, వల్లకాడులు దున్ని, మున్ను నడచుత్రోవ ముండ్లుగొట్టి అని వర్ణించారని తెలియ వలయును.
Next.
ఆకసంబు మీద నాడు దొమ్మరిపాప
చూపులొకటి గాని సుఖము లేదు
ఆకసమను వీధి హంసను జూడరా
విశ్వదాభిరామ వినుర వేమా. 57
భావము:- మన శరీరములో శిరోభాగమందు కంటికి కనిపించని స్థలములో ఆత్మనివాసమై ఉన్నది. ఆత్మను దొమ్మరి పాపగ ఈ పద్యమందు పోల్చారు. పై స్థానమందున్నది కావున దొమ్మరివాల్లు ఆకాశములో ఆడువారు కావున ఆత్మను దొమ్మరిపాపగ వర్ణించడమైనది. ఆత్మ కంటికి తెలియని పై స్థానములో నివాసమున్నది కావున ఆకసంబు మీద అనుట కూడ జరిగినది.
శిరోభాగములో బ్రహ్మనాడి ఏడవ కేంద్రములో ఉన్న ఆత్మమీదికి మనోఙ్ఞప్తిని కేంద్రీకరించవలయును. అట్లు ఆత్మ మీద మనోదృష్ఠిని కేంద్రీకరించనపుడు ఆత్మననుభవించడము జరుగుచున్నది. అందువలన చూపులు ఒకటిగాని సుఖము లేదన్నారు. పై భాగమునున్న ఆత్మ శక్తిచేత నరముల ద్వార శ్వాసను నడుపుచున్నది. శ్వాసకు ఆధారమైన ఆత్మను చూడమనుచు ఆకసమను వీధి హంసను చూడరా అన్నారు.
Next.
తనువనేటి ఇంట తన శత్రుమిత్రుల
దెలియలేని వాని తెలివదేమి
తెలిసిన మనజునకు దివ్యామృతంబురా
విశ్వదాభిరామ వినుర వేమా. 58
భావము:- శరీరమనే ఇంటిలో జీవాత్మ నివసిస్తు ఉన్నాడు. బయటి ప్రపంచములో మిత్రు శత్రువులున్నట్లు, శరీరమనే ఇంటిలో కూడ మిత్రులు మరియు శత్రువులు కలరు. శరీర గృహములో మిత్ర శత్రువులను తెలియలేని వాడు వారి వలన సుఖదుఃఖములను పొందుచునేయుండును. మిత్రు శత్రువులను తెలుసుకొన్న జీవాత్మ, వారివలన కల్గెడు అనుభవములను తెలుసుకొని వారినుండి ఏ అనుభవము లేకుండ తప్పించుకొనును.
శరీరమను ఇంటిలో నివాసమున్న జీవాత్మకు మూడు గుణ భాగములందు గల గుణములే మిత్ర శత్రువులుగ ఉన్నవి. పాపమును సంపాదించి పెట్టు 1 . కామ 2 .క్రోధ 3 . లోభ 4 . మోహ 5 . మధ 6 . మాత్సర్యములను ఆరు గుణములు జీవునకు శత్రువులతో సమానము. అట్లే ఈ గుణములకు వ్యతిరేఖమైన పుణ్యమును సంపాదించి పెట్టు 1 . దాన 2 . దయ 3 . ఔదార్య 4 . వైరాగ్య 5 . వినయ 6 . ప్రేమ అను ఆరు గుణములు జీవునకు మిత్రులు. వీరిరువురివలన పాపపుణ్యములు జీవునకు సంభవించుచున్నవి. వాటిని అనుభవించుటకు జీవుడు జన్మలెత్తవలసి వస్తున్నది. జ్ఞానియైనవాడు రెండు రకముల గుణములను తెలిసినవాడై వీటివలన జన్మ బంధనమే కల్గుచున్నదని వాటిని వదలి జన్మరాహిత్యమైన నిర్గుణపదము పొందును. ఎవడైతే నిర్గుణుడగుచున్నాడో వాడు కర్మరహితుడగును. ఎవడు కర్మ రహితుడో వానికి మృత్యువులేదు. మృతములేనట్టి అమృతమనెడి స్థితి లభించును.
Next.
కల్ల గురుడు గట్టు కర్మచయంబులు
మధ్యగురుడు గట్టు మంత్రచయము
ఉత్తముండు గట్టు యోగసామ్రాజ్యంబు
విశ్వదాభిరామ వినుర వేమా. 59
భావము:- భూమిమీద ఎందరో మహానుభావులు దైవమును గురించి బోధచేయుచుందురు. అటువంటివారు గురువులుగ ఉండుట అందరికి తెలిసిన విషయమే. ఆ గురువులను సహితము వేమనయోగిగారు తూకము వేసి ఇంత బరువున్న జ్ఞానమే వీరివద్ద ఉన్నదని తెలిపినాడు. కొందరు గురువులు భక్తులకు పనులతోకూడుకొన్న సాధనలు తెల్పుచుందురు. ప్రదక్షణలు, చెట్టుకు గుట్టకు పోయి నమస్కరించివచ్చుట, ఆసనములు, యాత్రలు మొదలగు శరీర కార్యములతో కూడుకొన్న భక్తిసాధనలనే తెల్పుచుందురు. ఇటువంటి శరీర కార్యసాధనలు ఎప్పటికి ఆత్మను తెలియబరచలేవు. దైవమును తెలియుటకు ఈ పనులు పనికిరావని గీతయందు విశ్వరూపసందర్శన యోగమందు కూడ తెలిపినారు. మనో నిగ్రహమునకు పనికిరాని పనులుగ లెక్కించి శరీరకార్యములతో కూడిన భక్తిమార్గముల బోధించు గురువులను వేమనయోగిగారు కల్ల గురువులను చున్నాడు.
కొందరు గురువులు శిష్యులకు మంత్రములను ఉపదేశించి మంత్రమునందు మనస్సును ఉంచమంటున్నారు. వీరు శరీర కార్య భక్తి పనులు బోధించు గురువులకంటే గొప్పవారుగ వేమారెడ్డి చెప్పుచున్నారు. మంత్రము వలన మనస్సు బయటి విషయముల సంబంధము వదలుకొని మంత్రము మీదనే కేంద్రీకృతమై ఉండును. మంత్రము వలన కూడ ఆత్మ తెలియబడదు. మంత్రసాధన వలన మంత్రభక్తి లభించును కాని ఆత్మశక్తి లభించదు. ఏ చింతన మనస్సుకు లేనపుడే ఆత్మ తెలియబడును. అందువలన మనస్సుకు మంత్రమున్నపుడు ఆత్మ తెలియదు. గుడ్డికంటే మెల్ల మేలన్నట్లు కర్మచయము బోధించు గురువుకంటే మంత్రము చెప్పువాడు నయము. కనుక మధ్య గురుడు గట్టు మంత్ర చయమన్నారు.
జీవాత్మ, ఆత్మ కలయికకు ముఖ్యమైనది మనస్సని తెలిసి, ఆ మనస్సుకు ఏ ధ్యాసలేనపుడే ఆత్మ తెలియబడునని తెలిసిన గురువులు శిష్యులకు అన్ని విషయముల నుండి మనస్సును మరల్చుకొమ్మని, శారీరకముగ, మానసికముగ ఏ పని లేనపుడే ఆత్మ తెలియునని తెలుపు చున్నారు. వీరు మిగత గురువులకంటే శ్రేష్టులు. అందువలన ఉత్తముండు గట్టు యోగసామ్రాజ్యమన్నారు.
Next.
జీవి పోకముందె జీవ వస్తువు లిచ్చి
జీవి నిలువ వలయు జీవనముగ
జీవి తొలగు వెనుక జీవవస్తువు లేల
విశ్వదాభిరామ వినుర వేమా. 60
భావము:- జీవాత్మ శరీరమును వదలిపోక మునుపే జ్ఞానమును తెలుసు కోవలయును. జ్ఞానము తెలియుట ద్వార ఆత్మ సాధనచే ఆత్మశక్తి లభించును. ఆత్మశక్తి వలన కర్మ నాశనమై పోవును. కర్మ నాశనమైన వెనుక చావు పుట్టుకలకు కారణమైన కర్మలేనపుడు జీవుడు శాశ్వితమైన మోక్షమును పొంది స్థిరస్థాయిగ నాశనము లేనివాడై ఉండును.
జ్ఞానమును జీవ వస్తువుగ తెల్పుచు శరీరమున్నపుడే దానిని తెలియ వలయునని, అట్లు తెలిసినవాడు శాశ్వితముగ చావు పుట్టుకలు లేనిస్థితిని పొందుచున్నాడనుచు జీవి నిలుపవలయు జీవనముగ అన్నారు.
శరీరమున్నపుడు ఆత్మజ్ఞానమును గూర్చి ఎవ్వరు తెలుసుకోవడము లేదు. అటువంటివారు మరణించిన తర్వాత మిగతవారు వారి శవముల దగ్గర భజన చేయడము, భగవద్గీత చదవడము, బైబిలు చదవడము చేయుచున్నారు. దైవ విషయములు శవమునకు వినిపిస్తే ఏమి లాభము? జీవి పోకముందే జీవవస్తువులైన జ్ఞాన విషయములు తెలియబరచి ఉంటే ఎంతో మేలు ఉండెడిది. అందువలన జీవి తొలగు వెనుక జీవవస్తువు లేలరా అని వేమనన్నాడు.
Next.
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమా. 61
భావము:- అజ్ఞానములో మునిగి ఉన్నవారికి జ్ఞానవిషయములు చాలా చేదుగ కనిపించుచుండును. రోగమున్న వానికే వైద్యమన్నట్లు అజ్ఞానికే జ్ఞానము కూడ అవసరము. జ్ఞానము ఒంటబట్టనిదైనప్పటికి బలవంతము గనైన దాని సంబంధము కలుగజేసుకోవలయును. కంఠము సరిగ లేనివాడు బలవంతముగ పాడగ పాడగ కంఠస్వరము మెరుగుపడి రాగ మతిశయించినట్లు అజ్ఞాని, జ్ఞానమును బలవంతముగ తెలుసుకోగా కొంత కాలమునకు జ్ఞానిగ మారిపోవును. మొదట విషమై తుదకు అమృతమైనదన్నట్లు జ్ఞానము మొదట ఎంత చేదుగ కనిపించినా, చివరకు విలువ తెలిసినపుడు చాలా మాధుర్యముగా ఉండును. అందువలన తినగ తినగ వేము తీయనుండు అన్నారు. జ్ఞానసాధనచే ఎంతటి జ్ఞానమైన పొందవచ్చును.
Next.
హృదయమందునున్న ఈశుని దెలియక
శిలలకెల్ల మ్రొక్కు జీవులార
శిలలనేమియుండు జీవులందే కాక
విశ్వదాభిరామ వినుర వేమా. 62
భావము:- హృదయమనగ గుండె అని చాలామంది యొక్క భావము. హృదయమనగ గుండెకాదు. గుండెయందు ఆత్మ నివాసము లేదు. ఆత్మ బ్రహ్మనాడియందు నివాసమున్నది. అందువలన ఆత్మ నివాసమైన బ్రహ్మనాడినే హృదయము అనవలయును. గుండెకు స్వయంశక్తి లేదు. బ్రహ్మనాడి నుండి వచ్చుశక్తి గుండెను కదలించుచున్నది. బ్రహ్మనాడిలో స్వయంశక్తి ఇమిడి ఉన్నది.
హృదయమనగ బ్రహ్మనాడని, హృదయమందున్న ఈశుడనగ బ్రహ్మనాడిలోని ఆత్మని తెలియవలెను. బ్రహ్మనాడి మరియు అందులోని ఆత్మ సజీవమైన శరీరములందే ఉండును. జీవములేని రాతిశిలలందు బ్రహ్మనాడికాని అందులోని చైతన్యము కాని ఉండవు. దైవత్వమును తెలియగోరువారు శిలలకు మ్రొక్కుచు ఉంటే ఏమి ప్రయోజనములేదు. ఆత్మ సజీవమైన శరీరమందే ఉండును. కావున జ్ఞానులు తమ శరీరమందే వెదకి ఆత్మను తెలియవలయును. నిజమైన దేవాలయము శరీరమని అందులోని దేవుడు ఆత్మని తెలుసునట్లు పై పద్యమును వేమారెడ్డిగారు చెప్పారు.
Next.
జనన మరణములకు సరిస్వతంత్రుడు గాడు
మొదట కర్తగాడు తుదనుగాడు
నడుమ కర్తననుట నగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమా. 63
భావము:- ఏ మానవుడు తెలిసి పుట్టలేదు. తెలిసి చావనులేదు.తనకు తెలియకనే జననము, అట్లే మరణము సంభవిస్తున్నవి. మొదలైన జననము, అంత్యమైన మరణమందేకాక మధ్యన జరుగు జీవితమంతా ఏమాత్రము స్వతంత్రములేనివాడై బ్రతుకుచున్నాడు. ప్రతి పని కర్మ ప్రేరణచే జరుగుచున్నది. అయినప్పటికి గ్రుడ్డి మానవుడు కర్మవలన, గుణముల ప్రభావము చేత పనులు జరుగుచున్నవని తనపాత్ర ఏమి లేదని తెలియనివాడు అన్నిటికి నేనే కర్తనని అనుకొనుచున్నాడు. భగవద్గీత కర్మయోగము 27వ శ్లోకము ....
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాని సర్వశః
అహంకార విమూఢాత్మా కర్తాహ మితి మన్యతే
"ప్రకృతిచే తయారైన గుణముల వలన జరిగెడు సర్వ పనులకు తానే కర్తనని అహంకార మగ్నుడనుకొనుచుండును" అని గీత చెప్పుచున్నది. అట్లు అహము చేత నేనే కర్తననుకొనుట వలన జరిగిన పనులలోని కర్మ జీవునకంటుచున్నది. ఆ కర్మ తిరిగి కష్టసుఖములు అనుభవించుటకు కారణమగుచున్నది. చావు పుట్టుకల మధ్య భాగమైన జీవితములో తాను కర్తననుట కష్టములకేగాని వేరుగాదు. అందువలన నడుమ కర్తననుట నగుబాటు కాదొకో అని వేమారెడ్డిగారు చెప్పారు.
Next.
గురు చరణము బట్ట కుక్కలు గరచునా!
గురు చరణము విడువ కుక్క గరుచు
కుక్కకున్న గుణము గురునకు లేదురా
విశ్వదాభిరామ వినుర వేమా. 64
భావము:- మన శరీరములో బ్రహ్మనాడియందు ఆత్మ నివాసమై ఉన్నదని తెలుసుకున్నాము. ఆ నాడికి ఇరుప్రక్కలగల సూర్య, చంద్రనాడులలో మనస్సుగలదని కూడ తెలుసుకున్నాము. బ్రహ్మనాడిలోని ఆత్మశక్తి సూర్య చంద్రనాడుల ద్వారా ఊపిరితిత్తులను కదలించుచు శ్వాస ఆడునట్లు చేయుచున్నది. మనము జ్ఞానము ద్వారా శ్వాస ఎట్లు ఆడుచున్నదని విమర్శించి శ్వాసకు కారణమైన శక్తిని తెలుసుకొన్న ఎడల సూర్య చంద్ర నాడుల మీద ఉన్న మనస్సు పనిచేయకుండ నిలిచిపోవును. సూర్య చంద్ర నాడుల మీద పనిచేయని మనస్సు బ్రహ్మనాడిలోని ఆత్మయందు చేరిపోవును. మనస్సు పనిచేయనపుడు శ్వాసకూడ నిలిచిపోవును.
గురువనగ ఆత్మని తెలిసి గురుచరణములుగ ఆత్మచైతన్యముచే కదలు శ్వాస అని తెలియవలెను. మనిషికి పాదములు క్రింద ఉన్నట్లు ఆత్మ యొక్క చివరి చలనము శ్వాస కావున శ్వాసను గురుచరణములన్నారు. శ్వాస నిలిచిపోయినపుడు మనో విషయములు నిలిచిపోవును కనుక మనో విషయములను కుక్కలుగ పోల్చి గురుచరణములు బట్ట కుక్కలు గరచునా అన్నారు. శ్వాస నిలిపినంతవరకు మనస్సు నిలుచును. మనో మారుతములు అవినాభావ సంబంధము కలవి. శ్వాస కదలిన వెంటనే మనస్సు కూడ చలించును. అందువలన గురుచరణములు విడువ కుక్కగరచు అన్నారు.
మనస్సు చలించు స్వభావము కలది. ఎల్లప్పుడు ఇంద్రియ విషయ జ్ఞప్తి కలుగజేయుచుండును. మనస్సు ప్రపంచ సంబంధమైన జ్ఞప్తులందే ఇమిడి ఉండును. ఆత్మ గుణములకు, జీవునకు సాక్షియై కదలకున్నది. ఆత్మ బ్రహ్మనాడియందు స్థిరస్థాయిగ ఉన్నది. మనస్సుకు, ఆత్మకు ఎంతో తేడా ఉన్నది. అందువలన కుక్కకున్న గుణము గురునకు లేదురా అన్నారు.
కుక్క అనగ మనస్సని, కుక్కలనగ మనో విషయములని, గురు చరణములనగ శ్వాస అని, గురువనగ ఆత్మ అని పై పద్యమందు సారాంశమిమిడ్చారని గమనించవలయును.
Next.
వెదకి కానలేడు వేదాంత వేద్యుని
తత్త్వవేత్త లేడు ధరణిలోన
కలిగెనేని యతడు కనబోడు మరివేరె
విశ్వదాభిరామ వినుర వేమా. 65
భావము:- భూమిమీద తత్త్వమును (ఆత్మను) తెలిసినవారు చాలా అరుదు. ఒకవేళ ఎవడైన జ్ఞానము ఆర్జించి ఆత్మను తెలిస్తే, కొంత కాలమునకు వాని కర్మంతయు నాశనమైపోయి శరీరము వదిలి పరమాత్మలోనికి ఐక్యమగును. అటువంటి వాడు తిరిగి పుట్టడు. కావున కలిగె నేని అతడు కనబడబోడు మరివేరె అన్నారు. వేదములనగ మూడు గుణములని గీతయందు సాంఖ్యయోగమున తెలియజేసారు. మూడు గుణములను జయించి, మూడుగుణముల కావలపోయి అక్కడున్న ఆత్మను తెలిసినవానిని వేదాంత వేద్యుడనుచున్నాము. అటువంటి వారు చాలా అరుదుగ ఉన్నారు. కావున వెదకి కానలేరు వేదాంత వేద్యునన్నారు.
Next.
సొమ్ముయున్న చోట శోధింపగలుగును
సొమ్ములేని చోట శోధ ఏల
యంజనమ్ము లేక నా సొమ్ము తెలియదు
విశ్వదాభిరామ వినుర వేమా. 66
భావము:- భూమిలో దాచిన ధనమును ఎక్కడ దాచి ఉంటే అక్కడనే త్రవ్వి తీయవలయును. దాచిన స్థలము తెలియకపోతే ఎక్కడ శ్రమపడి త్రవ్వినా సొమ్ము లభించదు. సొమ్ము ఎక్కడున్నది తెలియని వారు అంజనమునందు జూచి భూమిలోని సొమ్ము తెలియవలయును. అట్లే ఆత్మధనమును శరీరమందే వెతకవలయును. శరీరమందు ఆత్మధనము ఎక్కడున్నది తెలియవలయునంటే జ్ఞానమను అంజనము అవసరము. జ్ఞానాంజనము లేనిది ఆత్మధనము లభించదు. జ్ఞానాంజనము లేనివారు ఆత్మధనమును శరీరమందు వదలి బయట వెదుకుచున్నారు. శరీరమునకు బయట దైవమును ఎంత అన్వేషణ చేసిన ఎప్పటికి దేవుడు తెలియబడడు.
Next.
సతియందె పతిబుట్టెను
సతియును పతియందె బుట్టె పరమార్థముగ
సతి పతులనగ నెవ్వరు
మతిలో దలపోసి జూడు మహిలోవేమా. 67
భావము:- సతి పతి అనగ ఒకరికొకరు అవినాభావ సంబంధము కలవారు. వీరిద్దరి పాత్రలు ప్రతిసంసారమందు ముఖ్యముగ ఉండును. మొదట ఏ పురుషుడైన ఒక స్త్రీకే పుట్టవలయును. పుట్టిన పురుషుడు తిరిగి ఏదో ఒక స్త్రీకి భర్తగ మారిపోవుచున్నాడు. భర్తగ మారిన పురుషునికి తిరిగి సంతతిగ స్త్రీ జన్మించుచున్నది. అందువలన సతియందు పుట్టె సతియును పతియందె బుట్టె అని అన్నారు. స్త్రీకి భర్తగమారు పురుషుని పతి అని, పురుషునికి సతిగమారు స్త్రీని సతి అని సంబోధించారని తెలియవలెను.
పై వివరమంతయు జ్ఞాన సంబంధమైనదేనని గ్రహించవలెను. కర్మ అను దానివలన కార్యము జరుగుచున్నది. కర్మయందే కార్యము పుట్టుచున్నది. కావున కర్మను సతిగ పోల్చి సతియందు పతి బుట్టె అన్నారు. కర్మ, కార్యము వలన సంభవించుచున్నది. ప్రతి పనిలోను కనిపించని కర్మ చేరుచున్నది. కావున సతియును పతియందు పుట్టెనన్నారు. కర్మ వలన కార్యము, కార్యమువలన కర్మ అవినాభావ సంబంధముగ ఉన్నవి. కావున కర్మ, కార్యములను సతి పతిగ పోల్చి వేమనయోగి చెప్పారు.
Next.
దొరసాని ఎవ్వతె దొరకుమారుండెవడు
ధరణియనగ నేమి కరణమెవడు
దీని భావము దెలిసి జ్ఞాని గావలెనయా
విశ్వదాభిరామ వినుర వేమా. 68
భావము:- దొర దొరసాని అనుట భార్యాభర్తలకే వర్తిస్తుంది. దొరసాని అనగ మాయ (ప్రకృతి) అని అర్థము. దొర అనగ ప్రకృతికతీతమైన, ప్రకృతిని భరించుచున్న పరమాత్మ అని తెలియవలెయును. దొర కుమారుడనగ ప్రకృతి పురుషులకు సంభవించిన జీవాత్మ అని తెలియ వలయును. ధరణి కొలతవేయువాడు, భూమికి దగ్గర సంబంధమున్న వాడు కరణము, ధరణి అనగ శరీరమని తెలియవలయును. శరీర ఇంద్రియములతో తరచు సంబంధముకల్గిన మనస్సును కరణముగ తెలియ వలయును. గుప్త పదముల అవినాభావ సంబంధము తెలిసినవాడు జ్ఞానియే అని వేమనన్నాడు.
Next.
ఒక సందులో దూరి ఒకసందులో వచ్చి
యొక సందులో దాగి వెరపు చూపు
వెరపు పుట్టిన చోట వివరంబు చూడర
విశ్వదాభిరామ వినుర వేమా. 69
భావము:- మన శరీరములోని మనస్సు జాగ్రత్తావస్థలో సూర్యచంద్ర నాడుల మీద, నిద్రావస్థలో బ్రహ్మనాడియందు నివాసముండును. జాగ్రత్త, నిద్రయేకాక మూడవది స్వప్నావస్థయున్నది. స్వప్నావస్థయందు కూడ మనస్సు బ్రహ్మనాడియందే ఉండును. జాగ్రత్తావస్థలో మనస్సు, సూర్య చంద్రనాడుల మీద ఉండి బయటి జ్ఞానేంద్రియములు అందించు విషయములనో లేక గత విషయములనో జీవునకు తెలుపుచుండును. స్వప్నావస్థయందు బయటి ఇంద్రియముల విషయములుకాని, గత విషయముల జ్ఞప్తికాని మనస్సుకు ఉండదు. స్వప్నమందు ఎన్నియో దృశ్యములు శబ్దములు కనిపించిన, వినిపించిన అవన్నియు బయటి ఇంద్రియముల ద్వారా తెలిసినవికావు. బ్రహ్మనాడియందు సర్వము ఇమిడియున్నది. ఆ బ్రహ్మనాడియందే కర్మకనుగుణముగ అన్ని దృశ్యములు కనిపించుచుండును. బయటి నుంచి తెలియకపోయిన అంతరంగమందు, బయటి విషయముల మాదిరే మనస్సుకు తోచుచుండును. మనస్సుకు అందుచున్న విషయములు జీవునకు చేరుచుండును. అందువలన స్వప్నావస్థలోని కష్టసుఖములను జీవుడనుభవించుచుండును. బయటి నుండి వచ్చిన, బ్రహ్మనాడినుండి వచ్చిన, మనస్సు ద్వారా వచ్చు విషయములను అనుభవించడమే జీవునియొక్క విధి. స్వప్నావస్థలో బ్రహ్మనాడియందు కనిపించిన దృశ్యములకు విషయములకు భయము కల్గడము కూడ జరుగుచుండును. జీవుడు స్వప్నము నుండి బయటపడినపుడు మనస్సు సూర్యచంద్రనాడులలోనికొచ్చి జాగ్రత్త కల్గును. జాగ్రత్తకల్గిన జీవుడు అనుభవించిన విషయము బయట లేకపోయినా, విషయ భయము మాత్రము కొద్దిసేపు వీడకుండును. స్వప్నమును కొందరసత్యమని అనుచుందురు. స్వప్నము అసత్యముకాదు సత్యమైనదే. బయట లేనంత మాత్రమున జీవుడు అనుభవించిన విషయములు ఎట్లు అసత్యమని చెప్పవచ్చును? స్వప్నము అసత్యమైతే స్వప్నములో కల్గిన భయము కూడ అసత్యము కావలయును కదా! అట్లుకాక జాగ్రత్తయందు కూడ కొద్దిసేపు సత్యముగ స్వప్నానుభూతిని జీవుడు అనుభవించునపుడు స్వప్నము సత్యమే అగును. బ్రహ్మనాడియందు పంచతన్మాత్రలచే మనస్సుకు తెలిసిన విషయమే స్వప్నమని తెలియనివారు, శరీరయంత్రాంగము పూర్తి తెలియనివారు స్వప్నమసత్యమనుట జరుగుచున్నది.
అటువంటివారిని ఉద్దేశించి వేమన పై పద్యము చెప్పాడు. మనస్సు జాగ్రత్తలో సూర్యనాడిని వదిలి చంద్రనాడిలోనికి, చంద్రనాడిని వదలి సూర్యనాడిలోనికి ప్రవేశించుచున్నది. కావున పై పద్యమందు ఒక సందులో దూరి యొక సందులో వచ్చి అన్నారు. సూర్యచంద్రనాడులలో మారుచున్న మనస్సు నిద్రావస్థలో బ్రహ్మనాడియందు చేరుచున్నది. కావున యొక సందులో దాగియన్నారు. బ్రహ్మనాడియందే స్వప్నావస్థ కూడ కల్గుచున్నది. స్వప్నావస్థలో మనస్సు భయము చూపుచున్నది. కావున యొక సందులో దాగి వెరపుచూపుచున్నది అన్నారు. భయము బయటినుండి కల్గక బ్రహ్మనాడియందే కల్గుచున్నది. ఆ బ్రహ్మనాడిలో ఏముందో తెలిసిన సర్వము తెలిసినవాడగును. అందువలన వెరపు పుట్టిన చోట వివరంబు చూడర అని వేమన యోగిగారు చెప్పారు.
Next.
మేడిపండు జూడ మేలిమైయుండును
పొట్టవిప్పి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమా. 70
భావము:- అందముగ అలంకరింపబడి రంగులు పూయబడ్డ గోరీలు (సమాధులు) కంటికి ఎంతో ప్రీతిగ కనిపించును. కాని వాటిలోపల దుర్గంధపూరితమైన శవము ఉండును. లోపల అనేక విధమైన అస్తికలచే భయంకరముగ కనిపించు గోరి బయటికి ఎంతో అందముగ కనిపించునట్లు, కపట సన్న్యాసుల అంతర్గతము కూడ అట్లే ఉండును. బాహ్యమునకు రుద్రాక్షమాల, కాషాయవస్త్రములు, విభూతిరేఖలు మొదలగు వేష భూషణములు ధరించిన కపటసన్న్యాసులు బయటికి ఎంతో గొప్ప జ్ఞానులుగ కనిపించినప్పటికి వారి అంతరంగము అనేక విధములైన గుణములతో నిండివుండును. గుణములతో సంబంధముండి వాటి కర్మ అంటని విధానము వారికి తెలియదు.
గుణ చక్రము: చిత్రంను నిగూఢ తత్వార్థ బోధిని నుండి 70వ పేజీ లో చూడండి.
మేడిపండు చూచుటకు కాషాయరంగులోనే ఎంతో అందముగ కనిపించుచుండును. దానిపొట్ట విప్పితే పురుగులున్నట్లు కపట సన్న్యాసులు కూడ పైకి పటారము, లోన లోటారముగ ఉందురు. ధైర్యమను జ్ఞానము లేనినాడు పిరికితనమను అజ్ఞానము పోదు. అజ్ఞానమున్నపుడు జీవుడు విషయకర్మలందు చిక్కుకొనుచుండును. జ్ఞానమున్నవాడు వేషము వేయవలసిన పనిలేదని, అంతరంగము శుభ్రముగ ఉండిన చాలని పై పద్యమందు వేమన తెలియజేశాడు.
Next.
వేరు పురుగు చేరి వృక్షంబు జెరచును
చీడ పురుగు చేరి చెట్టు జెరచురా
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినుర వేమా. 71
భావము:- ఈ పద్యములో వేరుపురుగు, చీడపురుగు, కుత్సితుని ఒక కోవలో పెట్టి వీరివలన వృక్షము, చెట్టు, గుణవంతుడు చెడిపోవు చున్నారన్నాడు. ఇందులో వేరు పురుగును, చీడ పురుగును ఉదాహరణగ చూపుచు వృక్షము, చెట్టు చెడిపోవునని అలాగే కుత్సితుని వలన గుణవంతుడు చెడిపోవునన్నారు. ఇక్కడ అలోచించి చూచిన పురుగుకు శత్రువు చెట్లని, వృక్షజాతికి శత్రువు పురుగని తెలియుచున్నది. అలాగే కుత్సితునికి గుణవంతులు, గుణవంతునికి కుత్సితుడు శత్రువన్నమాట. ధనముకల వానిని ధనవంతుడని, బలముగల వానిని బలవంతుడని అనుట సహజముగ అందరికి తెలిసిన విషయమే. అట్లే గుణములు కలవానిని గుణవంతుడని అనుట కూడ సహజమే. ప్రపంచములో ధనవంతులను, బలవంతులను, గుణవంతులను సులభముగ గుర్తించ వచ్చును. అలాగే వృక్షములను, చెట్లను కూడ సులభముగ గుర్తించగలము. కాని కనిపించని వేరు పురుగును, చీడ పురుగును సులభముగ గుర్తించ లేము. అలాగే కుత్సితుని కూడ సులభముగ గుర్తించలేము. త్రవ్వి చూస్తే వేరుపురుగును, భూతద్దముచేత చీడపురుగును గమనించినట్లే శోధించి చూచిన కుత్సితుడిని కూడ తెలుసుకోవచ్చు.
ఆకారములో పురుగులు, చెట్లు వేరువేరుగ ఉన్నందున ఇవి పురుగులని, ఇవి చెట్లని గుర్తించవచ్చును. కాని ఆకారములో ఒకే రూపముగ ఉన్న మనుషులలో కుత్సితుల గుర్తించుట కష్టతరముగ ఉండును. శాఖోపశాఖలైన వృక్షము యొక్క కొమ్మలన్నిటిని ఎండి పోవులాగున వేరుపురుగు చేసినట్లు, పచ్చని ఆకులతో అందముగ ఉన్న చెట్టుయొక్క ఆకులన్ని పోయి వాడిపోవులాగున చీడపురుగు చేసినట్లు, గుణ సమృద్ధముగనున్న గుణవంతుని యొక్క గుణప్రభావములన్ని పోయి గుణహీనుడగులాగున కుత్సితుడు చేయును. గుణవంతుని చెరచు కుత్సితుడంటే కొంత వివరముగా తెలుసుకొందాము. కుత్సితుడనగా చెడబెట్టువాడని అర్థము. కాని చాలామంది భావములో చెడు చేయు వాడని గలదు. చెడబెట్టుటకు, చెడు చేయుటకు చాలా వ్యత్యాసము గలదు. చెడ, చెడు కు గల వ్యత్యాసము గమనించాలి. చెడ బెట్టుట అనగ లేకుండ చేయడమని, చెడు చేయడమనగా వ్యతిరేఖము చేయడమని తెలియాలి. గుణవంతుని గుణములు లేకుండ చేయువాడు కుత్సితుడు. వేరుపురుగు వృక్షమును నాశనము చేసినట్లు, గుణములుకల్గి వాటి వలన కర్మకల్గు విధానమును మాసిపోవునట్లు చేయువాడు గురువు. గుణవంతుని జెరచు కుత్సితుడనగా గురువనియే అర్థము. గురువు గుణవంతులకు శత్రువులాంటివాడు కనుక గుణబలము గలవారు గురువులను శత్రుసమానులుగ చూస్తుందురు. గుణబలము లేనివారికి గురువు మిత్రునివలె కనిపించుచుండును. ఇక్కడ వృక్షమునకు వేరుపురుగును చెప్పినట్లు, గుణవంతునికి గురువు కుత్సితుడని అర్థమొచ్చునట్లు వేమన చెప్పాడు.
Next.
లంజ లంజ యండ్రు లౌకిక ధర్మాన
లంజగాని దెవరు రాజ్యమందు
లంజకొడుకు బ్రహ్మరాతెట్ల రాసెర
విశ్వదాభిరామ వినుర వేమా. 72
భావము:- ప్రపంచరీత్యా లంజ అనగ పరపురుషునితో కూడునదని అర్థము. పరపురుషునితో సంబంధము పెట్టుకొనునది స్త్రీ (లంజ) ఇది లౌకిక ధర్మము ప్రకారము చెప్పబడునది. ఈ విధముగనే జ్ఞాన ధర్మము ప్రకారము చూచిన ప్రపంచములో లంజ (స్త్రీ) కానివారు ఎవరు లేరు. అనగ ప్రకృతిలో శరీరములు ధరించి పుట్టిన మగవారు, ఆడవారు అందరు స్త్రీలనియే తెలియవలెను. పరమాత్మ ఒక్కడే పురుషుడు. పరమాత్మకంటే వేరైన ప్రకృతియంతయు స్త్రీ అని తెలియవలెయును. ఆకారముకల్గిన ప్రతి ఒక్కరు ప్రకృతిలో ఉన్నవారే. ప్రకృతిలో నుండి పరమాత్మలోనికి కలియవలసినవారు కావున జీవులనందరిని స్త్రీలుగ చెప్పబడుచున్నది. అందువలన లంజగాని దెవరు రాజ్యమందున అన్నారు. ఇక్కడ పరమాత్మ పురుషుడైతే వానితో కలియు జీవులు స్త్రీలుగ అర్థము చేసుకోవలయును. ఆత్మ ప్రతి జీవరాసికి వాస్తవముగ భర్త. ఆత్మకంటే వేరుగ ఉన్న పరాయివాడు పరమాత్మ, పరమాత్మతో కలియవలెననుకొను వారు వ్యభిచారులే కదా! అందువలన జీవులను లంజ అను పదముతో వేమన సూచించాడు.
సర్వ జీవరాసులను పుట్టించు కర్మ మరియు దానికి సంబంధించిన గుణములు, శరీరము అన్నియు ప్రకృతిలోనివే. రూపము కల్గిన ప్రతీది ప్రకృతియే ఆకారము కల్గిన త్రిమూర్తులలోని బ్రహ్మ కూడా ప్రకృతిలోని వాడే. వానిని పుట్టించుటకు కూడా కారణమైన కర్మ ప్రకృతియందే ఉన్నపుడు దానికి పుట్టిన బ్రహ్మ జీవులకు కర్మ వ్రాసినాడంటే నమ్మదగిన మాటకాదు. అందువలన పై పద్యమందు లంజకొడుకు బ్రహ్మ వ్రాతెట్లు వ్రాసెర అన్నారు. అనగ బ్రహ్మ వ్రాత వ్రాయడము అబద్దమని తెలియవలయును. ప్రతిది జరుగడముకాని, పుట్టడముకాని కర్మవలన జరుగు చున్నది. కావున బ్రహ్మకూడ కర్మాధీనుడే. బ్రహ్మ కర్మాతీతుడుకాదు.
Next.
జాతులందు మిగుల జాతి ఏదెక్కువో
ఎరుక లేక తిరుగ నేమి ఫలమొ
ఎరుక గలుగు వాడె హెచ్చైన కులజుండు
విశ్వదాభిరామ వినుర వేమా. 73
భావము:- "చాతుర్వర్ణం మయా సృష్టం" అను గీతాచార్యుని వాక్యము ప్రకారము భూమిమీద నాలుగే నాలుగు జాతులున్నవి. ఆ నాలుగు జాతులలో మిగుల ఎక్కువైన జాతి ఎరుక కల్గిన జాతి. 'ఎరుక' అనగ తెలియడమని అర్థము. ఆత్మను తెలియడమును ఎరుక అంటున్నారు. భూమిమీద జన్మించిన తర్వాత తనలోని ఆత్మ ఏదో తెలియక, కాలము గడుపువాని జన్మ వృథా అని చెప్పవచ్చును. కావుననే ఈ పద్యములో ఎరుకలేక తిరుగు నేమి ఫలమన్నారు. ప్రపంచములోని నాల్గు జాతులలో తామసజాతి మిగుల నీచమైనది, రాజసజాతి మధ్యమమైనది, సాత్త్విక జాతి ఉత్తమమైనదని తెలియవలెను. ఈ మూడు జాతులకంటే ఉత్తమోత్తమమైనది యోగులజాతి లేక ఎరుక జాతి అంటారు. యోగము గలవాడె నిజమైన ఎక్కువ జాతివాడు గనుక ఎరుకగలవాడె హెచ్చైన కులజుండని వేమన అన్నాడు. భూమిమీద కులములు నిజముగ కులములుకావని, అవి దేశ, ప్రాంత విభజనవలన మరియు వృత్తి పనుల వలన అనేక గుర్తింపు కులములున్నవని, ఒక ప్రాంతములోని లేక ఒక దేశములోని కులములు వేరు ప్రాంతములోగాని వేరు దేశములో గాని లేవని, అందువలన వాటిని మానవ సృష్ఠి అయిన కులములని అవి దేవుడు పుట్టించినవికావని తెలియవలెను. దేవుడు సృష్టించిన నాల్గుకులములు ఒక ప్రాంతము, ఒక దేశముకాక యావత్ ప్రపంచ మంతయు వృత్తి పనుల భేదములు లేకుండ గలవు. దైవనిర్మితమైన తామస, రాజస, సాత్త్విక, యోగకులములు మనుజులందేకాక సకల జీవులందు గలవు. భూమిమీద ప్రజలకు దేవునిచేత నిర్మితమైన తమ కులమేదో తమకే తెలియదు. ఇప్పటినుంచియైన నాలుగింటిలో నీ కులమేదో తెలుసుకొని ఒకవేళ నీవు తక్కువ కులమువాడవైతే హెచ్చు కులజుడవగుటకు ప్రయత్నించుము.
Next.
కులము గలుగు వారు గోత్రంబు గలవాడు
విద్యచేత విర్రవీగు వారు
పసిడి కల్గు వాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ వినుర వేమా. 74
భావము:- తామస రాజస, సాత్త్విక, యోగ అను నాల్గుకులములు గలవారు గాని, 108 గోత్రములు గలవారు గాని, 64 విద్యలు తెలిసిన వారు గాని భూమి మీద ఒకనికి బానిసలై ఉన్నారు. ప్రపంచమంతయు ఆవహించి, పేరు రూపములేనివాడైన పరమాత్మ చేత అన్ని జీవరాసులు, మానవులందరు పుట్టినారు. సర్వులకు తండ్రియైనవానికి అందరు కొడుకులే. ఒకని ఆదేశానికిలోనై వాడుచెప్పునట్లు ఆడువారు వానికి బానిసలు అంటాము. కర్మ అను తాడును సూత్రముగ చేసుకొని ప్రపంచములో శాసించి, ఆడించువాడు పరమాత్మ. పరమాత్మకు ఆధీనమై ఉండి విధి చేత తప్పనిసరిగ ఇష్టముండిన లేకున్నా ఆడవలసినవారు మానవులు. అందువలన మనుషులను బానిసలని పై పద్యములో చెప్పాడు. అందరికి పరమాత్మ తండ్రి కావున అందరు ఆయనకు బానిస కొడుకులే అన్నారు. ప్రపంచములో అన్నిటికంటే విలువైనది బంగారు కనుక అందరికంటే గొప్పవాడైన పరమాత్మను పసిడికల్గువాడు అన్నారు. ఎన్నో పరిశోధనలు చేసి, అరువదినాల్గు విద్యలు నేర్చి, ఎన్నో క్రొత్త విధానములు కనిపెట్టగల్గినవాడుగాని, విడువదగిన నూట ఎనిమిది (108) గోత్రములు గలవారుగాని, నాల్గు కులములు గలవారుగాని కర్మతంత్రులై బ్రతకవలసి ఉన్నదని తెలియాలి.
గోత్రములు అనగ విడువదగినవని తెలియాలి. ఒకే కులములో అనేక గోత్రములు కలవారుండుట అందరికి తెలిసిన విషయమే. విడువ తగినవి విషయములని బ్రహ్మవిద్యాశాస్త్రము బోధిస్తున్నది. శాస్త్రరీత్యా ఒక్కొక్క గుణమును 9 భాగములుగ విభజించి మొత్తము 12 గుణములను 108 భాగములుగ గుర్తించారు. ఒక్కొక్క విడి భాగమునకు ఒక్కొక్క వస్తువును గుర్తింపుగ పెట్టినారు. ఒకజాతివారు తప్పనిసరిగ కనీసము ఒక్క గుణమునైన విడువవలెనని, ఆ విడువవలసిన గుణమేదో బయటివారికి తెలియునట్లు ఆ వస్తువు వారి గోత్రమనెడివారు. ఇలా 108 గుణభాగములకు నూటఎనిమిది (108) వస్తువులు గోత్రములుగ ఏర్పడ్డాయి. పూర్వము పలాన వస్తువు పలానా గుణమునకు గుర్తింపని అందరికి తెలిసి ఉండెడిది. కాలక్రమేణ ఏ వస్తువు ఏ గుణమునకు గుర్తింపో తెలియకుండ పోయినది. అసలుకు గోత్రములనే మరచిపోవు కాల మాసన్నమైనదని చెప్పవచ్చును. గోత్రముల సాంప్రదాయములు పెద్దలకే తెలియకుండ పోయినది. కావున రాబోవు చిన్నలకు తెలుస్తుందనుకోవడము ఆశించలేని విషయము. ప్రస్తుత పరిస్థితిలో ఎవరిది ఏ కులమో తెలియదు. ఎవరిది ఏ గోత్రమో అనగా ఏ విషయమున్నదో తెలియదు. ఇటువంటి పరిస్థితి నుండి బయటపడి మనదే కులమో, ఏ గోత్రమో తెలుసుకోవాలని కోరుచున్నాము.
Next.
కాపు బలిమయున్న కరణాన కదిబల్మి
కరణము బలమెల్ల కాపు బలిమి
కాపు సంతసంబు కరణము సంతోష
మరసి చూడ లోకమందు వేమా. 75
భావము:- ప్రతి జీవరాసి శరీరము ధరించి పుట్టుట అందరికి తెలిసిన విషయమే. జ్ఞానరీత్యా విశదముగ తెలుసుకొనిన జీవుడొక్కడే శరీరము ధరించి పుట్టుచున్నాడా! అని యోచించిన జీవుడొక్కడేకాక వానితోపాటు మరియొకడు కూడ అదే శరీరము ధరించి పుట్టుచున్నాడు. దీనిప్రకారము ఒకే శరీరములో ఇద్దరు జన్మిస్తున్నారని తెలియుచున్నది. పుట్టినప్పటి నుండి మరణించువరకు శరీరములో ఇద్దరున్నారన్నమాట. వారిలో ఒకడు జీవాత్మ, రెండవవాడు ఆత్మ. జీవాత్మ, ఆత్మ ఆధారముతో జీవిత కాలమును గడుపుచున్నది. బ్రతకడానికి కావలసిన ఆధారమంతయు ఆత్మ ద్వారానే జీవాత్మకు లభ్యమగుచున్నది. జీవితకాలములో శరీరము మొత్తము కదలించుటకు, అన్ని అవయవములకు శక్తినిచ్చుటకు తద్వార జీవుడు కాలము గడుపుటకు ఆత్మే ఆధారమై ఉన్నది. జీవుడు శరీరములో ఉండాలంటే ఆత్మ శరీరములో ఉండవలసిందే! జీవుడులేని శరీరములో ఆత్మ ఉండుటకు వీలులేదు. జీవాత్మ లేని చోట ఆత్మ ఉండలేదు కనుక ఆత్మకు జీవాత్మ ఆధారమై ఉన్నదని చెప్పవచ్చును. ఇలా ఒక ఆత్మ మీద మరియొక ఆత్మ ఆధారపడి ఉండుటవలన వీటి సంబంధము అవినాభావ సంబంధమని చెప్పవచ్చును.
ఒక ఊరిలో కాపువాని పంటమీద ఆధారపడి కరణము, కరణము వ్రాతల మీద ఆధారపడి కాపువాడు బ్రతికినట్లు, ఒక శరీరములో జీవాత్మ మీద ఆధారపడి ఆత్మ, ఆత్మ మీద ఆధారపడి జీవాత్మ ఉన్నవి. కావుననే పై పద్యములో కాపు బలిమి ఉన్న కరణానికది బల్మి కరణము బలిమెల్ల కాపు బలిమి అని వేమన అన్నాడు. అంతేకాక కాపు సంతసంబు కరణము సంతోషమన్నాడు. జీవాత్మ జ్ఞానము తెలిసి మోక్షము పొందితే దానికి జంటగవున్న ఆత్మ కూడ ఆధారము లేక పుట్టకుండపోవును. కావున జీవాత్మకు కల్గితే ఆత్మకు కూడ మంచిదే కావున కాపు సంతసంబు కరణము సంతోషమరచి చూడ అన్నారు. పద్యములో వేమన జీవాత్మను కాపుగ, ఆత్మను కరణముగ, సంతోషమును ముక్తిగ వర్ణించి చెప్పాడని తెలియవలెను.
Next.
కనియు గానలేడు కదలింపడా నోరు
వినియు వినగలేడు విస్మయమున
సంపద గలవాని సన్ని పాతకమిది
విశ్వదాభిరామ వినుర వేమా. 76
భావము:- భగవద్గీతలో భగవంతుడు చెప్పిన రెండు యోగములో ఒకటి బ్రహ్మయోగముకాగ, రెండవది కర్మయోగము. రెండింటిలో ఒకటైన బ్రహ్మయోగమును ఆత్మసంయమ యోగమని కూడ అందురు. బ్రహ్మ యోగమనబడు ఈ పద్ధతిలో జీవాత్మ ఆత్మయందైక్యమైవుండి జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము సంబంధము కల్గి వాటి విషయసుఖములను అనుభవించడమును విషయ భోగము అంటాము. అలాకాక వాటి సంబంధము ఏమాత్రము లేకుండ ఉండడమును బ్రహ్మ యోగము అంటాము. బ్రహ్మయోగములో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఐదు పనిచేస్తు అవి అందించు సమాచారమును జీవుని వరకు చేరవేయు మనస్సు లేకుండుట వలన మాటలు వినిపిస్తున్నను జీవుడు వినలేడు. అలాగే కంటికి దృశ్యము కనిపిస్తున్నప్పటికి జీవుడు చూడలేడు. విషయము తనకు చేరకుండట వలన బుద్ధియోచించదు. బుద్ధి యోచించదు కావున ఏ విషయమును బయట కర్మేంద్రియములకు పంపదు. అందువలన నోరు కదలింపలేడు, చేతులూపలేడు. సన్నిపాత జ్వరము వచ్చినవాడు మూర్ఛస్థితిబొంది వినలేడు, మాట్లాడలేడు. అలాగే బ్రహ్మయోగము పొందినవాడు వినలేడు, మాట్లాడలేడు. జ్ఞానసంపద గలవాడు బ్రహ్మయోగిగ మారి కదలక మెదలక ఉండును. కావున సంపదగలవాని సన్నిపాతమిది అని వేమన బ్రహ్మయోగిని గురించి చెప్పాడు. అలాగే బ్రహ్మయోగి చెవికి శబ్దము వినిపించినా లోపల తాను వినలేడు గనుక కనియు గానలేడు, వినియు వినలేడని చెప్పారు.
Next.
ఉసురు లేనితిత్తి ఇసుమంత ఊదిన
పంచలోహములును భస్మమౌను
పెద్దలుసురు మంటె పెనుమంట లెగయవా
విశ్వదాభిరామ వినుర వేమా. 77
భావము:- ఉసురు అనగ గాలి. ఉసురులేని తిత్తిని కొలిమి దగ్గర ఊదితే బంగారు, వెండి, రాగి, ఇత్తడి, కంచులోహములు కూడ కరిగి చివరకు భస్మాలగును. ప్రాణములేని తిత్తిని ఊదితే కఠినమైన లోహములు కూడ కరిగి భస్మమగు అగ్ని ఏర్పడుచున్నది. ప్రాణమున్న అనగా గాలి ఉన్న యోగులు తమలోని ప్రాణమును పూరించి ఊదితే అది బ్రహ్మ యోగమై శరీరములో యోగాగ్ని అనబడు జ్ఞానాగ్ని చెలరేగి కపాలములోని కర్మచక్రములో ఉన్న కర్మను కాల్చను మొదలుపెట్టును ప్రాణములేని తిత్తిని ఊదితే కొలిమిలో ఏర్పడునది సాధారణ అగ్ని. అదే ప్రాణమున్న తిత్తి అయిన శరీరములోనికి యోగులైనవారు గాలి ఊదితే పెనుమంట అని పేరుగాంచిన జ్ఞానాగ్ని పుట్టునని వేమన తెల్పుచు యోగులను పెద్దలు అన్నాడు.
Next.
తన గుణము తనకునుండగ
నెనయంగా నొరుని గుణము నెంచును మదిలో
తన గుణము తాను దెలియక
బరునిందం జేయు వాడు భ్రష్టుడు వేమా. 78
భావము:- గీతలో చెప్పినట్లు స్వధర్మము, పరధర్మమని రెండు ధర్మములు గలవు. స్వధర్మమనగా తన ఆత్మ ధర్మమని, పరధర్మమనగా ప్రకృతి ధర్మమని అర్థము గలదు. మానవుడు పుట్టింది మొదలు తనదైన పరమాత్మ ధర్మమును వదలి ప్రకృతి ధర్మమును ఆచరించుచున్నాడు. తన ధర్మము తాను తెలియక పోవడముకాక, పరధర్మమును ఆచరిస్తు అందులోని అనుభవములలో తృప్తి లేక పరధర్మములోని మాయలో చిక్కుకొని అనేక ఆశల మయమైపోయి తృప్తి లేని జీవితము గడుపుచు తనకంటే పరునిగ ఉన్న పరమాత్మను నిందించను మొదలు పెట్టు చుందురు. తనకు దేవుడు అన్యాయము చేసాడని, ఎంత డబ్బు ఉన్నా దేవుడు తనకు సరిగ డబ్బు ఇవ్వలేదని పరుని అనగ పరమాత్మను నిందించుచుందురు. అటువంటివాడు నిజముగ అజ్ఞాని అని చెప్పవచ్చును. ఎంతో ఆనందమయమైన స్వధర్మము తెలియక పరధర్మమైన ప్రకృతి ధర్మములో అన్ని ఉన్నా తృప్తిలేక దేవుని సహితము నిందించువారు నిజముగ జ్ఞానభ్రష్టులు. అందువలననే తన గుణము తనకుండగ నొరుని గుణము నెంచును మదిలో అని పరధర్మపరుని తెల్పుచు తన గుణము తాను తెలియక అని స్వధర్మమును తెలియని వానిని గూర్చి చెప్పారు. పరమాత్మనే నిందించు పరధర్మపరులు చెడినవారని, పరుని నిందించువాడు భ్రష్టుడు అని వేమన అన్నాడు.
Next.
నీవాడిన నేనాడుదు
నీవుండిన నేనునుండు నిర్విణ్ణుడనై
నీవు దలంచిన దలపుదు
నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా. 79
భావము:- సినిమా ప్రొజక్టరులో ఫిల్ములోని బొమ్మలాగ మనిషి కర్మ వాని శరీరములో కర్మచక్రమందు ఇమిడి ఉండును. ప్రొజక్టరు తిరుగు కొలది ఫిల్ము కూడ తిరిగి అందులోని బొమ్మలు మారి అనేక రక సంఘటనలు పరదామీద పడునట్లు, కాలచక్రము తిరుగుకొలది కర్మ చక్రము కూడ తిరుగుచు అందులోని సంఘటనలు మారుచు మనిషి మీద ప్రతిబింబించుచుండును. ఫిల్ములో నవ్వే దృశ్యము వస్తే అది పరదా మీద కూడ నవ్వినట్లే కనిపించును. అదే విధముగ జరుగుచున్న కాలములో మానవుని కర్మచక్రములో నవ్వే సంఘటన ఉన్నట్లయితే అది ఆ సమయములో ఆ మనిషిని నవ్వునట్లు చేయును. కర్మలో ఏమి లేక ఉండిన ఆ సమయములో మనిషి కూడ ఏమి చేయక ఊరకుండును. అట్లే కర్మ ఆచరణలో మాట్లాడునదుంటే ఆ మనిషి మాట్లాడును. ఇదే విధముగ అన్నియు కర్మలో నిక్షిప్తమైవుండును. కాలభ్రమణములో కర్మ ఆచరణకొచ్చుట వలన అక్కడేది ఉంటే ఇక్కడ జరుగును. అందువలన మనిషికంటే భిన్నముగ ఉన్న కర్మను నీవని జీవుడైన తనకు నేనని చెప్పుచు నీవు ఏమి చేస్తే పైన నేనది చేయవలసి ఉన్నదని తెలియు లాగ నీవాడిన నేనాడుదు, నీవు నగిన నేను నగుదు నిజముగ అని వేమన అన్నాడు.
Next.
నిన్ను జూచుచుండ నిండును తత్వంబు
తన్ను జూచుచుండ తగులు మాయ
నిన్ను నెరిగినపుడె తన్ను దానెరుగును
విశ్వదాభిరామ వినుర వేమా. 80
భావము:- ప్రతి మనిషిలోను కర్మ కపాలమందుగల కర్మచక్రములో నిక్షిప్తమైవున్నది. అది ఆడించునట్లు మనిషి ఆడవలసి ఉన్నది. దాని ప్రక్రియలే మనిషి ఎడల బయట క్రియలై జరుగుచున్నవి. ప్రతి పనికి కర్మ కారణమై ఉన్నదని తెలిసి, జరిగెడి ప్రతి పనిలోను తాను కర్తను కాదని తెలిసి కర్మరీత్య పనులు చేయువానికి అది యోగమై వానియందు జ్ఞానాగ్ని నిండుకొని కర్మను కాల్చను మొదలుపెట్టును. దీనినే ఉన్న రెండు యోగములలో ఒకటైన కర్మయోగమందురు. కర్మయొక్క అవగాహన లేకపోయినవాడు తన శరీరము ద్వార జరుగు పనులన్నిటికి తానే కారణమనుకొనుచుండును. అటువంటి వానికి జ్ఞానాగ్ని ఏమాత్రము లభించదు. అంతేకాక వాడు తన విధానము తెలియక మాయలో మునిగి ఉండును. ఆ విధముగ మాయలో చిక్కినవాడు తనను తాను తెలియలేడు. కర్మ విధానమెరిగినవాడు మాయ నుండి విడివడి తన్ను తాను తెలియగలడు. ఈ సారాంశమునే పై పద్యమందు ఇమిడ్చి నిన్ను అని కర్మను సంబోధిస్తు, ఆత్మను సమీపించు జ్ఞానాగ్నిని తత్త్వమని, ఆత్మను, జీవాత్మ తెలియడమును తన్ను తానెరుగు అన్నారు.
Next.
గాలి గాలి గలిసె గగనంబు గగనంబు
మన్ను మన్ను గలిసె మంట మంట
నీరు నీట గలిసె నిర్మలంబై యుండె
విశ్వదాభిరామ వినుర వేమా. 81
భావము:- ప్రపంచములో ఎన్నో జన్మలు తీసుకొంటున్న జీవుడు అనేక శరీరములు ధరించి మనుగడ సాగించుచుండును. ఎక్కడ ఏ శరీరము ధరించిన, అది పంచభూత నిర్మితమైనదేయై ఉండును. పంచభూతములనగా ఆకాశము, గాలి, అగ్ని, నీరు,భూమి. ఈ ఐదు ధాతువుల చేతనే తయారైనది శరీరము. ప్రతి శరీరములోను ఈ ఐదు భాగములుండును. మానవుడు మరణించినపుడు ఒక శరీరమును వదలిన సెకను కాలములోనే మరియొక శరీరము ధరించడము జరుగుచున్నది. కావున జీవునకు శరీర మార్పిడి ఉన్నది కాని పంచభూతములతో సంబంధము కూడ ఎల్లపుడు ఉన్నదని తెలియుచున్నది. ఇలా శరీరము ధరించిన ప్రతి జీవునికి కొంత గాలి, కొంత నీరు, కొంత భూమి, కొంత అగ్ని, కొంత ఆకాశము శాశ్వితముగ కేటాయించబడి ఉన్నదన్నమాట. అవి జీవునితో సంబంధము వదలి పోవునది ఒక్క నాశనములో మాత్రమే. మరణములో పాత శరీరము వదలినప్పటికి, వెంటనే వచ్చు జన్మలో క్రొత్త శరీరము వచ్చుట వలన పంచభూతముల సంబంధము తప్ప లేదన్నమాట. జీవుడు పూర్తిగ నాశనమై మరుజన్మ లేకుండ పోయినపుడు మాత్రమే అంతవరకున్న పంచభూతముల సంబంధము లేకుండ పోవును.
అంతవరకు తన కొరకే కేటాయించబడిన గాలి, అగ్ని, నీరు,భూమి, ఆకాశములు జీవుని మోక్షముతో లేకుండ పోవుచున్నవి. అవి ఎక్కడికి పోవుచున్నవనగా విశాలముగా వ్యాపించివున్న బయటి గాలిలోకి శరీరములో వ్యాపించి ఉన్న గాలి పోయి కలిసిపోవుచున్నది. అలాగే బయటి అగ్ని లోనికి అగ్ని, నీటిలోనికి నీరు, భూమిలోనికి భూమి, ఆకాశములోనికి ఆకాశము కలిసిపోవుచున్నది. జీవుడు మాత్రము పంచభూతములకు అతీతముగనున్న పరమాత్మలోనికే ఐక్యమైపోవుచున్నాడు. అందువలన జీవున్ని నిర్మలంబైయుండె అని వర్ణిస్తు, పంచభూతములలోని ఐదింటిని గాలి గాలి గలిసె, గగనంబు గగనంబు, మన్ను మన్ను గలిసె, మంట మంట, నీరు నీట గలిసె అని వేమన అన్నాడు.
Next.
తాగి తాగి ధరణిపై బడుదాక
తాగెనేని తన్ను తాను తెలియు
తాగలేని వాడె తాగుబో తరయంగ
విశ్వదాభిరామ వినుర వేమా. 82
భావము:- ప్రపంచములో మానవుడు జ్ఞానమును తెలియక ఎక్కువ కాలమును ప్రపంచములోనే వినియోగించుచున్నాడు. అలాకాక ప్రపంచ విషయములలో శాశ్విత శాంతిలేదని తెలిసినవారై కొందరు జ్ఞానమును కూడ తెలుసుకొనుచున్నారు. జ్ఞానులు అనేక స్థాయిలలో ఉండి జ్ఞానములో అనేక తెగలుగ విభజింపబడి ఉన్నారు. స్వచ్ఛమైన ఆత్మజ్ఞానమును తెలియువారు తప్ప, మిగతావారందరు తనలో ఉన్న తన యొక్క ఆత్మను తెలియలేరు. అటువంటి ఆత్మ జిజ్ఞాసపరుడు ఆత్మను తెలియుదాక తన ప్రయత్నమును వదలడు. ఆత్మను తెలియువరకు ఆత్మజ్ఞానమును ఆస్వాదించుచునే ఉండును. చివరకు తనలోని మనోధ్యాసను తన ఆత్మ మీద చేర్చగలిగిన నాడు మనోధ్యాస బయటి ప్రపంచము మీద లేకుండ పోవుచున్నది కనుక వాడు చేష్టలుడిగినవాడై కదలక మెదలక స్తంభించి ఉండును. అట్టి వానిని చూచినవాడు నిర్జీవుడైనట్లుగాని, మూర్ఛపోయినట్లు గాని కనిపించును. ఇటువంటివాడు పలుమార్లు జ్ఞానమును తెలుసు కొనుచున్నాడు. కనుక వేమన తన పద్యములో జ్ఞానామృతమును తాగి తాగి అని వర్ణించాడు. ఆత్మను తెలిసిన బ్రహ్మయోగి బయట స్థితిని కోల్పోయి అంతరంగ స్థితిలో ఉండి ఏది గ్రహించలేనివాడు కనుక మరియు అటువంటివాడు ఆత్మానుభవమును పొందుదాక దాని జ్ఞానమును తెలియుచుండును. కనుక ధరణిపై బడుదాక తాగెనేని అని అన్నాడు. బయటి విషయము తెలియని స్థితివరకు జ్ఞానము తెలిసినవాడు తన ఆత్మను తాను తెలియును కనుక తన్నుతాను తెలియు అన్నాడు.
జ్ఞానమును తెలుసుకొని, తెలుసుకొని పూర్తి ఆత్మను పొందిన వాడు జీవాత్మకాక ఆత్మయే అగును. జీవాత్మ ఆత్మలోనికి కలిసిపోయినపుడు జీవాత్మ అనువాడు ఆత్మతో భేదము లేకుండును కావున ఆ స్థితిని ఆత్మతో కూడినవాడు ఆత్మయే తానైనవాడని అందురు. వాడు జ్ఞానానుభవము గలవాడు కావున వానిని తాగుబోతు అని కూడ అనవచ్చును.
మత్తు కావాలని కోరుకొనువాడు, త్రాగేవాడు జీవుడు. మత్తే తానైన వాడు ఆత్మ. నిద్రకల్గిన వానిని నిద్రపోతు అంటాము. మత్తు కల్గిన వానిని త్రాగుబోతు అంటాము. జీవాత్మ త్రాగువాడుకాగ, త్రాగనవసరము లేనివాడు లేక త్రాగలేనివాడు ఆత్మ. ఆత్మను త్రాగలేనివాడని ఎందుకను చున్నామనగా తానే మత్తయి ఉన్నపుడు తనకు త్రాగే అవసరమేముంది. త్రాగే అవసరమున్నవాడు, త్రాగేవాడు జీవుడన్నాము కదా! అలాగే ఎల్లపుడు మత్తుకల్గి త్రాగనవసరములేని, త్రాగలేని ఆత్మను త్రాగుబోతు అన్నారు. ఆత్మ ఎల్లపుడు మత్తుకల్గిన త్రాగుబోతుకాగ, జీవాత్మ అపుడపుడు తాగి తాను త్రాగుబోతగుచున్నాడు. అలా త్రాగి త్రాగి అపుడపుడు త్రాగుబోతవడముకంటే తాగలేని తాగుబోతు కావడము మరి మంచిది.
Next.
మన్నును తినమంటే మండేరు జనులార
మట్టిలోన మేలు మరువనేల
నీళ్లలోని మేలు నిఖిలమై యుండురా
విశ్వదాభిరామ వినుర వేమా. 83
భావము:- ప్రపంచములో మనుషులు ఎక్కువ శాతము ఉదయము లేచింది మొదలుకొని తిరిగి పడుకొను దాక ప్రపంచ విషయములోనే తగులుకొని, పరమాత్మ జ్ఞానమునకు చాలా దూరముగ ఉన్నారు. అటువంటి వారు పరమాత్మ జ్ఞానమంటే ఏవగింపుగ ఉంటు ఎవరైన జ్ఞానము తెలిపితే ఇది మాకవసరములేదని విసిగించుకుంటారు. జ్ఞానము తెలుసుకొంటే సర్వదుఃఖములు తొలగుతాయని వారికి తెలియదు. సర్వ దుఃఖములకు హానికరమైన జ్ఞానము వలన మనకు ఎంతో మేలుకలదని తమ కర్మ అంతా నాశనమగునని, రాబోవు కర్మనుండి తప్పించుకొను వీలు కలదని గ్రహించలేక పోవుచున్నారు.
మట్టిని త్రవ్వుచుపోతే కొంత లోతుకు పోయిన తర్వాత మట్టి అడుగున దాగియున్న నీరు కనిపించును. మనకు తెలిసినంత వరకు మట్టి లోతులో దాగియున్నది నీరు. అలాగే జ్ఞానములో లోతుకు పోతే జ్ఞానములో చివరన అణగివున్నది పరమాత్మ. జ్ఞానమును చివరకు తెలుసుకొంటు పోయిన వానికి చివరకు పరమాత్మప్రాప్తి కలిగి మోక్షము పొందును. దుఃఖ నిర్మూలన చేసి మోక్షము పొందించు జ్ఞానమును తెలుసుకోమంటే కొందరికి గిట్టదు. కావున వేమనయోగి జ్ఞానమును మన్నుగ పోల్చి, మోక్షమును మేలుగ వర్ణించి మన్నును తినమంటే మండేరు జనులార, మట్టిలోన మేలు మరువనేల అన్నారు. జ్ఞానము వలన లభించు పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు కనుక పరమాత్మను నీటిగ వర్ణించి నీళ్ళలోని మేలు నిఖిలమై ఉండురా అన్నారు. జీవుడు పరమాత్మలో కలిసి పరమాత్మగ మారి అంతట వ్యాపించి పోవడమే నీటిలోని మేలన్నాడు. భూమిమీద మట్టిలోనికి పోతే నీరు, సముద్రము మీద నీటిలోనికి పోతే మన్ను లభ్యమగునట్లు జ్ఞానమును పరికించి చూచిన పరమాత్మ, పరమాత్మను పరికించి చూస్తే జ్ఞానము కనిపిస్తున్నాయి. అందువలననే వేమనయోగి మట్టిని, నీటిని ప్రత్యేకించి చెప్పాడని తెలియాలి.
Next.
జీవ మేడనుండు భావమెక్కడ నుండు
కాపురంబు ఏడ గదిసియుండు
తనరుచున్న రెంటి స్థలమేల తెలియరు
విశ్వదాభిరామ వినుర వేమా. 84
భావము:- శరీరములో జీవుడున్నాడని వాడు మరణములో శరీరము వదలి పోవుచున్నాడని అందరికి తెలిసిన విషయమే. కాళ్ళు మొదలుకొని తలవరకున్న శరీరములో జీవుడెక్కడున్నాడను విషయము చాలామందికి తెలియకుండ పోయినది. భగవద్గీతాశాస్త్రము ప్రకారము చూచిన జీవుడు శరీరములో తలయందున్నాడని తెలియుచున్నది. అంతేకాక తలలో గుణములున్నవని, వాటియందు జీవుడున్నాడని కూడ చెప్పబడి ఉన్నది. ఇంకా వివరించుకొని చూచిన ఎడల మన శరీరములోని నొసలు భాగమున శిరస్సులో నాలుగుచక్రములు వరుసగ పై నుండి క్రిందికి గలవు. పై నుండి బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములుగలవు. వాటిలో అన్నిటికంటే క్రింద గల గుణచక్రములో గుణములున్నవి. వాటివలననే మానవునికి అనేక భావములు కల్గుచున్నవి. గుణచక్రము మూడు గదులుగ విభజింపబడివున్నది. ఆ మూడు గదులలో జీవుడు ఏదో ఒక గదియందు నివశిస్తున్నాడు. ఒక్కొక్క సమయములో ఒక్కొక్క గదియందుంటు అందులోని భావములు పొందుచున్నాడు. వాస్తవముగ గుణభావములు, జీవుడు ఒకే స్థలములో ఉన్నారని తెలియుచున్నది. ఈ వివరము అందరికి తెలియదు. కావున వేమనయోగి జీవ భావమెక్కడనుండు అని రెండు కలిసి కాపురము చేయు స్థలము ఏదని వాటి రెంటి స్థల మేల తెలియరని అడిగాడు. అందువలన ఇప్పటికైన మనము శరీరములో ఎక్కడున్నామో, మన గుణములెక్కడున్నాయో తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.
Next.
దేవుడనగ వేరె దేశమందున్నాడె
దేహితోడ ఎపుడు దేహమందె
వాహనములు నెక్కి వడి దోలుచున్నాడు
విశ్వదాభిరామ వినుర వేమా. 85
భావము:- దేవుడు దేహములోనే ఉండగ అది తెలియని ప్రజలు దేవుడు వేరే స్థలములలో ఉన్నాడని దేశ దేశములు తీర్థయాత్రలు చేయుచుందురు. దేవుడు దేహమందు జీవాత్మతోటి ఎల్లపుడు దేహమందే ఉన్నాడు. జీవుడు దేహమనే రథములో కూర్చొని వచ్చు పోవు దృశ్యములను చూచుచుండగ, దేహరథమును దేవుడే నడుపుచున్నాడు. దేహము కదలుటకు దేవుడే కారణమై ఉండగ జీవుడు దేహమును ఏమాత్రము నడిపించక అనుభవములను మాత్రము అనుభవించుచుండును. అందువలన దేవుడెక్కడో ఉన్నాడని భ్రమపడవద్దని, శరీర మందే నీతోటే ఉన్నాడని వేమన తెల్పుచున్నాడు. కావున దేవుని బయట వెతుకక లోపల శరీరమందే వెతకవలెనని కోరుచున్నాము.
Next.
వాక్కు యందు గుర్వు వాక్తత్వమును గుర్వు
చీకటిలో గుర్వు చిక్కియుండు
నఖిలమునకు గురువు యాధారమైయుండు
విశ్వదాభిరామ వినుర వేమా. 86
భావము:- మనిషి నోటి ద్వార బయల్పడునది వాక్కు, ఎందరో భూమి మీద మాట్లాడగలుగుచున్నారు. అందరి మాటలలో వాక్తత్వము అనగ మాటలచమత్కారము ఉండదు. కొందరు మాత్రము చురుకుగ, తెలివిగ మాట్లాడగలరు. అంతేకాక అసలు మాట్లాడలేనివారు కూడ కలరు. దీనికంతటిని పరికించి చూచిన ఒకని నోటి ద్వార మాట రావడానికి వాని శరీరములోని పాత్రధారియై ఆడుచున్న ఆత్మయే కారణము. మానవుని శరీరములో ప్రారబ్ధకర్మ నిక్షిప్తమై ఉండి, దాని సుఖదుఃఖములను జీవుడు అనుభవించవలసి ఉన్నది. అనుభవించుటకు శరీరము కదలాలి, మాట్లాడాలి. శరీరము ఎన్నో పనులు చేయుటకు, ఎన్నో మాటలు మాట్లాడుటకు కారణము కర్మకాగ, దాని ప్రకారము ఆత్మ తన శరీరమును కదిలించుచు పాత్రధారియై ఉన్నది. ఒక శరీరములో మాట రావడానికి గాని, మరొక శరీరములో మాట చమత్కారమునకు గాని ఆత్మయే ఆడవలసి ఉన్నది. మాటలయందు మాట్లాడుచు చిక్కుకొని ఉన్నది ఆత్మ. అలాగే మాటల చమత్కారమందు కూడ చిక్కుకొని ఉన్నది ఆత్మయే. శరీరములో జంటపక్షులవలె నివాసమున్నవి ఆత్మ, జీవాత్మలు. అందులో జీవాత్మ తలభాగములో ఏ పని చేయక మనస్సు ద్వార వచ్చిన అనుభవమును మాత్రము అనుభవించుచుండగ ఆత్మ మాత్రము అన్ని పనులు చేయుచు అహర్నిశలు అన్నిటియందు తగుల్కొని ఉన్నది. కావున వాక్కుయందు గుర్వు, వాక్తత్వమున గురువు అన్నారు. శరీరములో గురువు ఆత్మకాగ శిష్యుడు జీవాత్మ అని తెలియాలి. గురువు అనగ ఆత్మ శరీరమంతా వ్యాపించి అన్ని తెలియువాడై ఉండును. శిష్యుడు అనగ జీవాత్మ శరీరములో ఒక చోటయుండి ఏమి తెలియని వాడుగ ఉండును. శరీరములో గురుత్వాకర్షణ శక్తిగ ఉండి జ్ఞానేంద్రియములను పని చేయించువాడు కనుక ఆత్మను శరీరములో గురువుగ చెప్పడమైనది. కళ్ళు మూసితే కనిపించు చీకటిలో కూడ ఉండువాడు గురువు. ఆత్మ శరీరమంతా వ్యాపించివున్నది. కావున కళ్ళు మూసితే కనిపించు చీకటి యందు కూడ ఆత్మయే కలదు. అందువలననే చీకటిలో గుర్వు చిక్కియుండు అన్నారు. సకల శరీరములలో ఆత్మయుంటు శరీరమును ఆడించుచున్నది. శరీరమంతటికి ఆధారమైనది ఆత్మ కావున అఖిలమునకు గురువు ఆధారమైయుండు అని పద్యమందు అన్నారు. ఈ పద్యమందు శరీరమంతా వ్యాపించి ఉన్న ఆత్మయే శరీరములోని అన్నిటికి ఆధారమై ఉన్నదని తెలియజేయడమైనది.
Next.
కర్మాకర్మము లొక్కటి
కర్మ వినోదునకు దత్వఘనునకు తెలియన్
ధర్మాధర్మము లేర్పడ
నిర్మలమతి దెలుపవలయు నిజముగ వేమా. 87
భావము:- కర్మ అనగ కార్యము వెనుక దాగి ఆ కార్యమునకు కారణమైనది. అకర్మ అనగ కార్యములేనిది, కార్యమునకు కారణము కానిది. తత్వమును అనగ ఆత్మను తెలిసిన వానికి ఆ సమయములో కార్యము చేయడముగాని, కర్మరావడముగాని లేదు ఆ విషయము వానికి తెలియును. అట్లే కర్మము తెలిసిన కర్మయోగి కార్యము చేస్తున్నను కర్మరాని వివరము వానికి తెలిసి ఉండును. అందువలననే ఈ పద్యములో కర్మ వినోదునకు అనగ కర్మము తెలిసిన కర్మయోగికి మరియు తత్త్వ ఘనునకు అనగ ఆత్మయోగికి కర్మాకర్మములు తెలియునన్నారు.
ధర్మములేవి, అధర్మములేవి అను విషయము జ్ఞానము తెలిసిన వానికే తెలియును. జ్ఞానము తెలిసినవాడే నిర్మలమైన అనగ కల్మషము లేని మతి కల్గియుండును. కనుక సంపూర్ణజ్ఞానికి ధర్మాధర్మములు, కర్మ వినోదునకు కర్మములు, తత్త్వఘనునకు అకర్మములు తెలియును అని చెప్పారు.
Next.
అమ్మసుమీ యాలనగా
నమ్మనగా నాలు సుమ్మి యా ఇద్దరినిన్
ఇమ్మహిలో పరమాత్ముని
నెమ్మదిలో తెలియ దానె నేర్పరి వేమా. 88
భావము:- అమ్మ, ఆలి అనుపదములు మనకేమి కొత్తగావు. భూమిమీద పుట్టిన ప్రతి ఒక్కరికి మొదట అమ్మ గలదు తర్వాత ఆలి గలదు. అమ్మకు, ఆలికి ఎంతో వ్యత్యాసము గలదు అను విషయము అందరికి తెలిసినదే. కాని ఇక్కడ మనకర్థముగాని విషయమేదో గలదు. ఈ పద్యములో ఆలి అనగా అమ్మ సుమా అంటూ అమ్మనగా ఆలి సుమీ అనడము కూడ జరిగినది. అమ్మంటే ఆలి అని, ఆలి అంటే అమ్మని కొద్దిగ కూడ తేడా లేకుండ చెప్పడము చాలా విచిత్రము కదా! ఈ ఇద్దరినేకాక పరమాత్మను కూడ తెలిసినవాడు తానే నేర్పరి అన్నారు. నేర్పరియైన వాని దృష్ఠిలో అమ్మ, ఆలి ఇద్దరు ఎలా ఒక్కటయ్యారో చూద్దామా!
ప్రపంచములో స్త్రీ, పురుష అను రెండే జాతులు కలవు. ఆ జాతులు ప్రపంచము పుట్టుకలోనే పరమాత్మ తయారు చేశాడు. జ్ఞాన పరముగ పరమాత్మ పురుషుడని, విడివిడిగ పంచభూతములుగ ఉన్న ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములను కలిపి ప్రకృతి అని ఆ ప్రకృతిని స్త్రీ అని పిలవడము జరిగినది. సమస్త జీవరాసులకు ప్రకృతి శరీరమును తయారు చేసి ఆకారము నిచ్చుట వలన సమస్త జీవరాసులకు ప్రకృతి తల్లి అని, శరీరములలో చైతన్యము నిచ్చిన పరమాత్మ అందరికి తండ్రి అని కూడ భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. దీని ప్రకారము ప్రకృతి అందరికి అమ్మని తెలియుచున్నది. ప్రకృతి, పురుషుడు అనువారున్నారను నిమిత్తము వాటి రెంటికి గుర్తింపుగ లింగము కల్గిన పురుషున్ని, యోని కల్గిన స్త్రీ ఆకారమును పరమాత్మ భూమిమీద పుట్టించాడు. జంతువుల్లోగాని, మనుషుల్లోగాని ఈ రెండు జాతులున్నట్లే సృష్టించాడు. ప్రకృతి పురుషులవలననే సర్వులు పుట్టుచున్నారను జ్ఞానము తెలియునట్లు స్త్రీ పురుష సంగమముతో సంతతి కల్గునట్లు కూడ దేవుడమర్చాడు. పరమాత్మ జ్ఞానము తెలిసి చూస్తే ప్రకృతి తల్లిగ ఉన్నది. జ్ఞానము తెలియకున్నా స్త్రీ తల్లిగ ఉన్నది. అట్లే జ్ఞానము ప్రకారము పురుషునికి ప్రకృతి భార్యగ ఉన్నది. జ్ఞానము తెలియకుండినా పురుష ఆకృతి కల్గిన వానికి స్త్రీ ఆకృతి కల్గినది భార్యగ ఉన్నది. ఎటు చూచిన ఆకృతినిచ్చి పుట్టించుటలో ప్రకృతి తల్లియైయుండి వానికి గుణములు మొదలగునవిచ్చి తనతో జీవులను ఎల్లపుడు సంగమించి ఉండునట్లు, పరమాత్మ ధ్యాసకు పోనట్లు చేయుచున్నది. కావున చనిపోవువరకు భార్యగ ఉన్నది. పుట్టించుటలో తల్లి, జీవించుటలో భార్యగ ప్రకృతి ఉన్నది. కావున అమ్మనగా అలుసుమ్మి అని ఒక విధముగ అంటున్నారు. జీవితాంతము తన గుణములతో సంగమింప చేసిన ప్రకృతియే మరుజన్మకు శరీరమును తయారుచేసి పుట్టుకనిచ్చు చున్నది. కావున అమ్మ సుమి ఆలనగా అని అన్నారు. అమ్మ, ఆలి అయిన ప్రకృతిని తెలిసినవాడు అంతటికి అధిపతియైన పరమాత్మను తెలియబూనును. అటువంటి వాడే నేర్పరి అన్నారు. నేర్పరి అనగ జ్ఞానమును నేర్చినవాడు అని అర్థము. కావున ప్రకృతి, పురుషుల జ్ఞానము తెలియువాడు నిజమైన నేర్పరి తనము గలవాడగును.
Next.
ఎరుక మాలు జీవియెంత కాలంబుండి
చచ్చి పుట్టుచుండు సహజముగను
ఎరుక మరచు చోట నెరుగుట బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినుర వేమా. 89
భావము:- నిద్ర మెలుకువలనునవి అందరికి తెలుసు నిద్రలో ఏమి తెలియకుండ పోవుచున్నది. మెలకువలో అన్ని విషయములు తెలుస్తున్నవి. మెలుకువను ఎరుక అని కూడ అనవచ్చును. ప్రపంచమును తెలియు తనమును ఎరుక అంటున్నాము. అన్నిటిని తెలియనట్లు చేయు శరీరములోని ఎరుకమీద ఎవరికి ధ్యాస లేకుండ ప్రపంచములోని బయటి విషయముల మీదనే పూర్తి ధ్యాస కలదు. శరీరములోని నిద్ర చీకటి లాంటిది. మనిషికి ఏమి తెలియకుండ చేస్తున్నది. అలాగే శరీరములోని ఎరుక వెలుగులాంటిది. మనిషికి అన్ని తెలియునట్లు ఇంద్రియములన్నిటికి వెలుగునిస్తున్నది. ప్రతిరోజు శరీరములో ఉపయోగపడు ఎరుకను తెలియనంతవరకు మనిషి సహజముగ చస్తు పుట్టుచుండును.
నిద్ర, మెలుకువరూపములో ప్రతి మనిషి శరీరములో గల ఎరుక, మరుపులను మనిషి తెలియకున్నాడు. ప్రతిరోజు ప్రతి మనిషి పొందునవి రెండే రెండు గలవు. అవియే ఎరుక, మరుపు లేక మెలుకువ, నిద్ర. ప్రపంచములో ఎంత తెలివైనవాడు గాని తాను నిద్రలోనికి పోవు సమయమును గుర్తించలేడు. అలాగే తాను ఎలా మెలుకువలోనికి వచ్చింది గుర్తించలేడు. నిద్రలోనికి తాను ఎలా జారుకుంటున్నాడో తెలిసినవాడుగాని, అలాగే మెలుకువలోనికి ఎలా వచ్చి మెలకువను ఎలా ఉపయోగించుకొంటున్నాడో తెలిసినవాడుగాని ఇద్దరు జ్ఞానము తెలిసిన యోగులే అగుదురు. అందువలన ఒక పద్యములో వేమనయోగి నిద్రను తెలిసినవాడు నిజయోగి అన్నాడు. అలాగే ఎరుక తెలిసినవాడు యోగి అనికూడ అన్నాడు. అలాగే ఎరుక పొందు చోటుగాని, మరుపు చెందు చోటుగాని తెలిసినవాడు నిజముగ దైవమును తెలిసినవాడగునని ఇద్దరిని ఉద్దేశించి ఎరుక మరుచు చోటు నెరుగుట బ్రహ్మంబు అన్నాడు. అలాగే ఎరుకను, మరుపును తెలియనివాడు చస్తు పుట్టుచుండునని తెల్పుచు ఎరుక మాలు జీవి ఎంత కాలంబుండి చచ్చి పుట్టుచుండు సహజముగ అన్నాడు.
Next.
బ్రహ్మగుడ్డు యనెడి పట్టణంబులోపల
బ్రహ్మ మెరుగ లేని బాపడేల
తన మనంబు తెలియు దానేపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినుర వేమా. 90
భావము:- నివసించునది పట్టణము అంటాము. తనతోపాటు ఎందరో నివసించు పట్టణములో ముఖ్యమైన వానిని గుర్తించలేకపోతే వాడు ఆ ఊరిలో ఉన్నా లేకున్నా ఒక్కటే. అలాగే బ్రాహ్మణకులములో పుట్టిన బ్రాహ్మణుడు అదే కులము యొక్క పెద్దను గూర్చి తెలియకపోతే వాడు బ్రాహ్మణుడే కాదంటారు. అటువంటివాడు ఆ కులమువాడే కాదనవచ్చును. ఆ విధముగానే ప్రతి జీవి శరీరమనే పట్టణములో నివసిస్తున్నాడు. ఆ జీవునితో పాటు శరీరమనే పట్టణములో ఎందరో గలరు. ఆ శరీర పట్టణమునే ఈ పద్యములో బ్రహ్మగుడ్డు పట్టణమని పేరు పెట్టారు. బ్రహ్మజ్ఞానము తెలిసిన వానిని బ్రాహ్మణుడు అంటారు. బ్రహ్మగుడ్డు పట్టణములో బ్రహ్మయనబడు దేవుడున్నాడు. శరీరములో ఆత్మజ్ఞానము తెలియనివాడు బ్రహ్మజ్ఞానియే కాదు. అనగా బ్రాహ్మణుడే కాదు. శరీరములో ఉన్న బ్రహ్మను తెలియాలంటే అదే శరీరములోని మనస్సు అనే దానిని తెలియాలి. శరీరములో తనతో పాటు నివసించు ఎందరిలోనో మనస్సు అనే దానిని తెలిసితే, బ్రహ్మ అనే వాడెవడో సులభముగ తెలియును. మనస్సు తెలిసితే, తనవలెనున్న ఆత్మయే శరీరములో దేవుడని తెలియును. కావున తనమనంబు తెలియదానెపో బ్రహ్మంబు అన్నారు. ఆత్మశక్తి చేత ఆవహింపబడి ఆ శక్తియే శరీర పరిధిగ ఉన్నది కనుక, శరీరమును బ్రహ్మగుడ్డు అన్నారు. బ్రహ్మజ్ఞానమును తెలిసిన వానినే బ్రాహ్మణుడు అన్నారు.
------------
Next.
గురువు చెప్పు విద్య గురునకు తెలుసును
గురువు చెప్పు విద్య గురువు ఎరుగు
గురవు మహిమ పరమ గురువునకు దెలుసును
విశ్వదాభిరామ వినుర వేమా. 91
భావము:- గురువు శిష్యులనువారిని బయట ప్రపంచములో చూస్తూనే ఉంటాము. కాని శాస్త్రబద్ధముగ గురువు చెప్పువాక్యములు ఎవరు చెప్పనివిగ, ఎక్కడ చదివినవిగ ఉండకూడదనుట నియమము. గురువు ఎప్పుడైన ఎంగిలి విద్యను బోధించడు. ఒకవేళ అట్లు విన్నవికాని, చదివినవికాని చెప్పిన వాడు కేవలము బోధకుడేగాని గురువు కాదు. నియమము ప్రకారము చెప్పాలంటే విననివాడు, చదవనివాడు గురువైతే వాడెట్లా చెప్పగలడను ప్రశ్నరాగలదు. శ్రుతి చేతకాక స్మృతి చేత చెప్పువాడు గురువు. పైన గురువుగ ఒక వ్యక్తి కనిపిస్తున్నప్పటికి లోపల వాని స్మృతి పథములో మెదిలిన విషయములు చెప్పువాడు నిజముగ గురువు. అవి నేరుగ ఆత్మనుండి బయలుదేరి వచ్చునవే కానీ జీవాత్మ చెప్పునవి కావు. ఆ శరీరములోని జీవాత్మకు కూడ అవి క్రొత్తవిగ వినినట్లే ఉండును. అందువలన శరీరములోనే గురువు ఆత్మగ ఉన్నాడని చెప్పవచ్చును. ఆత్మ తెలుపు విద్య ఆత్మకే తెలుసు, జీవాత్మకు తెలియదు కావున గురువు చెప్పు విద్య గురువుకు తెలుసు అన్నారు. ఆత్మ తెలిపిన విద్య తర్వాత ఎంతకాలమునకైన ఆత్మకే తెలిసివుండును. కావున గురువు చెప్పు విద్య గురువు ఎరుగును అన్నారు. ఆత్మకున్న మహిమ పరమాత్మకే తెలుసు జీవాత్మకు ఏమాత్రము తెలియదు. ఆత్మ గురువుకాగ పరమాత్మ పరమ గురునిగ శరీరములో ఉన్నాడు. కావున గురువు మహిమ పరమ గురువునకు తెలుసు అన్నారని తెలుసుకోవాలి.
Next.
విత్తులేని యట్టి వృక్షమొకటి బుట్టె
ఫలము పువ్వు మొగడ పత్రిలేదు
స్వాదులేదు చూడ సాపాటునకు లెస్స
దీని భావమేమి తెల్పు వేమా. 92
భావము:- భూమిమీద పుట్టు ప్రతి దానికి ఒక బీజముండనే ఉంటుంది. అన్నిటికి కర్మ మూలముగ ఉన్నది. కర్మలేనిది ఏదిలేదు. కర్మవలననే అన్ని పుట్టుచున్నవి మరియు అన్ని జరుగుచున్నవి. కావున కర్మ మూల మిదమ్ జగత్ అన్నాము. కర్మ మూలమున ఏర్పడు ప్రతిదానికి ఒక ఆకారము, రుచి, వాసన, రంగు మొదలగునవి ఉండును. అలా కర్మ వలన ఏర్పడిన, జీవమున్న, జీవములేని వాటినన్నిటిని కలిపి ప్రకృతి అన్నారు. ఇలా ప్రకృతిలోని వాటికన్నిటికి కర్మ విత్తుగ ఉండగ దానికి అనగ ప్రకృతికి వ్యతిరిక్తముగనున్న పరమాత్మ జ్ఞానమునకు మాత్రము మూలము లేదు. అది కర్మమునకు పుట్టునది కాదు. చెట్టుకు ఫలము, పువ్వు, ఆకులున్నట్లు జ్ఞానమునకు ఆకారమే లేదు. ఫలమునకు కారణముగనున్న పువ్వుగాని, పువ్వుకు కారణముగనున్న వాసనగాని జ్ఞానమునకు లేవు. అందువలననే పై పద్యమందు బ్రహ్మజ్ఞానమును ఉద్దేశించి విత్తులేనియట్టి వృక్షమొకటి బుట్టె అన్నారు. జ్ఞానమునకు అందము, ఆకారము, రుచి, వాసన లేవు. కావున ఫలము, పువ్వు, పత్రి లేదు స్వాదు లేదు అన్నారు. స్వాదు అనగ వాసన అని తెలియాలి. జ్ఞానమును ఎవరైన తెలుసుకొని ఆచరించి దానిశక్తిని పొందవచ్చును. అనగా ఎవరైన జ్ఞానానుభవము పొంది జ్ఞానమును తనయందు జీర్ణింప చేసుకోవచ్చును. అందువలననే పై పద్యమందు చూడసాపాటునకు లెస్స అన్నారు. జ్ఞానమును ఎవరైన తినవచ్చును. అనగా పొందవచ్చును. తెలుసుకోవలయునను వారికి ఎంతయిన లభించగలదు. అందువలన సాపాటునకు లెస్స అన్నారు.
Next.
తాత గన్న తల్లి తమ తండ్రిని గను తల్లి
తన్ను గన్న తల్లి తల్లి తల్లి
తల్లి శూద్రురాలు తానెట్లు బాపడో
విశ్వదాభిరామ వినుర వేమా. 93
భావము:- మన శరీరములలో మనమే నివాసముంటున్నాము. నేడు బయటి ప్రపంచములో లగ్నమై పోయిన ప్రతి మనిషి తన శరీరములోని ఎన్నో భాగములలో తానుకూడ ఒక చిన్న భాగమై ఉండి నివసిస్తు, మొత్తము శరీరమంతా తానేనని భావించి పొరపడి ఉన్నాడు. తాను కొంతై ఉండి ఎంతో అనుకోవడము పెద్దపొరపాటు గాదా! దానివలన ఎంతో అనర్థము జరుగుచున్నప్పటికి తెలియనివాడై మనిషి మనుగడ సాగిస్తున్నాడు. మనిషి తన శరీరములో ఎంత చిన్న భాగమై ఎక్కడ నివసిస్తున్నాడో కొంత ఆలోచించి చూచినట్లైతే మనిషి శరీరములో మొండెము కనీసము ఏడు జానలుండగ తలమాత్రము ఒక జాన పొడవు మాత్రముండును. జాన అనగ మూడు బెత్తెలుండును. తన చేతి నాలుగువేళ్ళ వెడల్పును బెత్తెడు అంటున్నాము. ముఖములో గల మూడు బెత్తెడలలో క్రిందివి రెండు పోగ పై బెత్తెడు స్థలములో నుదిటి భాగమున శిరస్సులో నాలుగుచక్రములు గలవు. అందులో క్రింది చిటికిన వ్రేలుకు సమానముగనున్న స్థలములో క్రింద చక్రమైన గుణచక్రము గలదు. అది మూడు భాగములై ఉన్నది. ఆ మూడు భాగములలో తాను (జీవుడు) ఒక భాగములో మాత్రము గలడు. దాదాపు మూడు అంగుళాల గుణచక్రములో ఒక అంగుళ భాగమైన ఒక భాగములో మాత్రము జీవుడున్నాడు. అదియు అంగుళమంతయు లేడు. అంగుళమును 108 భాగములుగ విభజించితే ఒక భాగములో ఎంత స్థలముండునో అంత విస్తీర్ణము మాత్రము జీవుడు గలడు. అందువలననే కొందరు మాటల సందర్భములో మరియొకని గూర్చి మాట్లాడుచు నీవు చీమంతయు లేవు అనుచున్నారు. అట్లే నీవు రవ్వంతయు లేవు అని కూడ అనుచున్నారు. ఈమాట మన నోటివెంట వచ్చుచున్నప్పటికి అనేవాడుగాని, వినేవాడుగాని శరీరములో తానెంత పరిమాణములో ఉన్నామని యోచించలేదు. మనిషి శరీరములో నివశిస్తు నేను మనిషిని అనుకొను జీవాత్మ, శరీరమంతయు నేనేనను కొను జీవాత్మ శరీరములో ఎంత చిన్నవాడో గ్రహించారా! ఈ కొలతయు శరీరము యొక్క పొడవులో మాత్రమే. శరీరములో వెడల్పును పరిగణలోకి తీసుకోలేదు. గణితము ప్రకారము శరీరము పొడవు అంగుళాలలో దాదాపు 8 జానలు.
ఒక జానకు మూడు బెత్తెడుల ప్రకారము
=
8 X 3 = 24 బెత్తెడలు
ఒక బెత్తెడుకు నాలుగు వేళ్ళ ప్రకారము
=
24 X 4 = 96 వేళ్లు
ఒక వేలుకు దాదాపు మూడు అంగుళముల ప్రకారము
=
96 X 3 = 288 అంగుళములు
ఒక అంగుళమునకు 108 భాగముల ప్రకారము
=
288 X 108 = 31104 భాగములు
శరీరపొడుగులో కేవలము 31,104 వంతు ఎంత ఉండునో అంత పరిమాణము మాత్రమున్న జీవాత్మ శరీరమంతా నేననుకోవడము పొరపాటు కాదా! కొంత ఆలోచించిన జీవుడు శరీరములో శిరస్సునందు బహుకొద్ది స్థలములో గుణచక్రమందు నివశిస్తున్నాడని తెలియుచున్నది. జీవుడున్న గుణచక్రమును వివరించి చూసుకొనిన తామస, రాజస, సాత్త్విక మను మూడు భాగములుగ గుణచక్రము గలదు. ఈ మూడు భాగములు ప్రకృతి జనితమైనవని గీతయందు కూడ చెప్పబడియున్నవి. ప్రకృతిని తల్లియని కూడ అదే గీతయందు చెప్పారు. ప్రకృతిలోని భాగములై ఉన్న గుణములను కూడ తల్లియనియే చెప్పవచ్చును. గుణములను కూడ ప్రకృతి లేక మాయ అంటున్నాము. కాబట్టి వాటిని కూడ తల్లి అను పేరుతో ఉచ్చరించుచున్నాము. అందువలననే ఈ పద్యములో సాత్త్వికమును, రాజసమును, తామసమును వేరు వేరుగ తల్లి, తల్లి, తల్లి అని మూడు మార్లు ఉచ్చరించి చెప్పారు. తానుగాని, తన తండ్రిగాని, తన తాతగాని అందరు మూడు గుణములలోనే చిక్కుకొని ఉన్నారు కావున తాతగన్న తల్లి, తమ తండ్రిని గన్న తల్లి, తన్ను గన్న తల్లి అని వివరముగ చెప్పారు. మూడు గుణములు వేరు, బ్రహ్మజ్ఞానము వేరు. గుణములు శూద్రత్వముకల్గినవి, బ్రహ్మజ్ఞానము బ్రహ్మణత్వముకల్గినది. అందువలన తల్లి, తల్లి, తల్లి శూద్రురాలు అన్నారు. మూడు గుణములు వదలనివాడు ఎప్పటికి శూద్రుడే. గుణముల వదిలి వాటికి అతీతుడై బ్రహ్మజ్ఞానము కల్గియున్నవాడు బ్రాహ్మణుడే. అట్లుకాక గుణములకు అతీతుడుకాక వాటియందే చిక్కుకొన్నవాడు బ్రాహ్మణుడెట్లగును. అందువలన గుణముల యందే పుట్టి పెరుగువానిని గూర్చి తల్లి శూద్రురాలు తానెట్ల బాపడో అని పై పద్యములో అన్నారు.
Next.
పుట్టువారు లెవరు పుట్టుకుందరెవరు
పుట్టి పుట్టనట్టి పురుషులెవరు
పుట్టి పుట్టనియటు చోధించి జూడరా
విశ్వదాభిరామ వినుర వేమా. 94
భావము:- ప్రపంచములో అండజ, పిండజ, ఉద్భిజములను జీవరాసు లెన్నో పుట్టుచున్నవి. వాటిలో జీవుడు, ఆత్మ రెండు పుట్టుచున్నవి. ప్రపంచములో పాపపుణ్య కర్మలను సంపాదించుకొన్న ప్రతి జీవి పుట్టవలసి ఉన్నది. పుట్టిన ప్రతి జీవితో పాటు ఆత్మ జోడుగ ఉండవలసి ఉన్నది. ఇలా పుట్టువారు జీవాత్మ ఆత్మ అని తెలియుచున్నది. ఈ పద్యములో మొదట ఈ విషయమునే ప్రస్తావిస్తూ పుట్టువార లెవరు అన్నారు. తర్వాత పుట్టకుందురెవరు అనికూడ అన్నారు. పుట్టనివారెవరని విచారించి చూచిన కర్మశేషము లేకుండ అయిపోయినవారు, చావు పుట్టుకలు లేని పరమాత్మలో ఐక్యమైపోయి పరమాత్మగ ఉందురు. పరమాత్మ పుట్టనివాడని తెలియాలి. పరమాత్మ అవసరమైనపుడు పుట్టువాడు. పుట్టుకలేని పరమాత్మ ప్రపంచమంతా విశాలముగ వ్యాపించి ఉండి కర్మాధీనములో లేనివాడై యుండి పుట్టనివాడైనప్పటికి, తనకు అవసరమైనపుడు పుట్టి శరీరముతో ఉండగలడు. అదే సమయములో అంతట వ్యాపించి ఉండగలడు. అంతట వ్యాపించి ఉండి ఒక శరీరములో కూడ జన్మ తీసుకోగలవాడు పరమాత్మ కావున ఆయనను ఉద్దేశించి పుట్టి పుట్టనివారు అన్నారు. ఆకారముతో భగవంతునిగ పుట్టిన పరమాత్మను, ఆకారము లేకుండ అంతట వ్యాపించిన పురుషోత్తముడైన పరమాత్మను ముఖ్యముగ తెలియ వలెను. అందువలననే పుట్టి పుట్టని చోటు చోధించి చూడరా అన్నారు. మనిషి యోగసాధనల ద్వార పుట్టని పరమాత్మనైన తెలియాలి లేక భక్తి ద్వార భగవంతున్నయిన తెలియాలని పై పద్యము యొక్క సారాంశము.
Next.
పంచాక్షరి బీజంబుల
నంచితముగ నెరుగు నాతడఖిలజ్ఞుండై
వంచన మెరుగక కువలయ
సంచారము చేయు నతడు శంభుడు వేమా. 95
భావము:- పంచాక్షరి అనగా ఓం నమఃశివాయ అను ఆరు అక్షరములని అందరికి తెలుసు ఆరు అక్షరములను ఐదక్షరముల పేరుతో పంచాక్షరి అనడమే మిటని చాలామందికి ప్రశ్నరాగలదు. అక్షరము అనగా నాశనము లేనిదని ఒక అర్థము. అట్లే భాషలోని ఒక నియమిత గుర్తు అని కూడ అర్థము గలదు. భాషలోని గుర్తులైతే ఆరు గలవు. నాశనము లేనిదను అర్థముతో అయితే ఒకటే గలదు. ఓం నమఃశివాయ అను పదములో ఐదు క్షరములు గలవు ఒక అక్షరము గలదు. క్షరము అనగా నాశనము గలవి అని అర్థము. అలాగే అక్షరము అనగా నాశనము లేనిదను అర్థము గలదు. ఐదు క్షరములకు నాశనముగానిది ఒకటి గలదు. దానినే అక్షరము అంటున్నాము. పంచాక్షరిలో ఒక అక్షరము, ఐదు క్షరములు గలవు. వాటినే ఓం నమఃశివాయ అంటున్నాము. వాస్తవముగ జగతిలో ఐదు నాశనముగలవి గలవు. అవియే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. వీటినే పంచభూతములని కూడ అందురు. ఈ పంచభూతములు జగతిలో అన్నిటిని మార్పు చేస్తు చివరకు నాశనము చేయగలవు. పంచభూతములకు మార్పుకానిది వాటికి నాశనము చెందనిది ఒకే ఒక ఆత్మ గలదు. అదియే అక్షరము. క్షరములైన పంచభూతములకు అక్షరమైన ఆత్మకు నియమిత గుర్తింపులను పెట్టారు. వాటినే బీజంబులన్నారు. వాటి వివరములోనికి పోతే ఆకాశమునకు 'న' అను గుర్తింపు, గాలికి 'మః' అను గుర్తింపు నిచ్చారు. అలాగే అగ్నికి 'శి' అనియు, నీరుకు 'వా' అనియు భూమికి 'య' అనియు గుర్తులనుంచి అక్షరమైన ఆత్మకు 'ఓం' ను ముందుంచి నాశనమగు మిగత వాటిని తర్వాత ఉంచడములో మొత్తము 'ఓం నమఃశివాయ' అను వాక్యము తయారైనది. ఈ వాక్యము 'ఓం' అను ఒక పదముగను, 'నమః' అను రెండవ పదముగను 'శివాయ' అను మూడవ పదముగను ఉన్నది. నాశనముగాని 'ఓం' ఒక పదముగను, చేతికి దొరకని ఆకాశము, గాలిని 'నమః' అను పదముగను, చేతికి దొరకు అగ్ని, నీరు, భూమి ఒక పదముగను విభజించి 'ఓం నమఃశివాయ' అన్నారు. 'ఓం నమఃశివాయ' అను పంచాక్షరీ బీజంబుల వివరము విశదముగ తెలిసినవాడై పంచభూతముల వలన ఏమి జరుగుచున్నదని మరియు ఆత్మ వలన ఏమి జరుగుచున్నదని తెలిసినవాడు ప్రపంచ కార్యములలోని కర్మను అంటక, కర్మలో చిక్కుకొనక ప్రపంచ కార్యములు కర్మయోగరీత్య చేయుచుండును. పంచాక్షరి వివరము తెలిసి, అలాగే పంచభూతముల వివరము తెలిసి భూమండలములో సంచరించు వాడు నిజముగ శంభునితో సమానమై కర్మ అంటనివాడై ఉండును. అందువలననే పై పద్యములో అజ్ఞుండై వంచన మెరుగక కువలయ సంచారము చేయు నతడు శంభుడు వేమా అన్నారు.
Next.
రూపు పేరు రెండు రూఢితో గలిగిన
పేరు రూపు క్రియను పెనసియుండు
నామ రూపములను నాశనమొందుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమా. 96
భావము:- ప్రపంచములో ఏదైన ఒకటి రూపమున్నదంటే దానికి తప్పక పేరు ఉండును. అలాగే ఒక దానికి పేరున్నదంటే దానికి తప్పనిసరిగ రూపముండును. ఇలా ఏదైనాగాని రూపముంటే పేరు, పేరుంటే రూపము తప్పనిసరిగ కల్గివున్నవి. వస్తువులకే గాక, మనుషులకు గాని దేవతలకు గాని అందరికి ఆకారములు పేర్లు గలవు. చివరకు ఆత్మ, జీవాత్మలను వాటికి కూడ రూపములు గలవు. అలాగే ఆత్మని, జీవాత్మ అని పేర్లు గలవు. ఇలా రూపము, పేరు గలిగిన అన్నియు ఏదో ఒక పనిని కల్గి ఉండును. ప్రపంచములో పేరు కల్గిన అన్నిటికి అలాగే రూపముకల్గిన అన్నిటికి తప్పక క్రియ పెనవేయబడి ఉన్నది. పేరులేని పరమాత్మకు మాత్రము ఏ పని లేదని తెలియవలెను. ఒక్క పురుషోత్తముడైన లేక పరమాత్ముడైన వానికి తప్ప ప్రపంచములో అందరికి రూప, నామ, క్రియలు తప్పవన్నమాట. రూపనామ క్రియల ద్వారా జీవములేని వాటికి తప్ప జీవమున్న వాటికి కర్మ ఏర్పడి దాని ఫలితముగ ఎన్నో రూప నామ క్రియలకు గురికావలసి ఉన్నది. అందువలన పై పద్యములో రూపు పేరు క్రియలను పెనసియుండు అన్నారు. ఏ రూపముగాని, ఏ నామముగాని పొందకూడదంటే రూప, నామ, క్రియలు లేని పరమాత్మనే ఆరాధించాలి. అట్లు ఆరాధించుటకే బ్రహ్మయోగము (జ్ఞానయోగము ) లేక కర్మయోగము (రాజయోగము ) లేక భక్తి యోగములనునవి ఆశ్రయించవలసి ఉండును. ఈ విషయమై నామరూపములను నాశనమొందుట మేలని కూడ ఈ పద్యమందు చెప్పారు. ముఖ్యముగ నామ రూప క్రియ రహితుడవు కావాలంటే నీవు నామ, రూప, క్రియ రహితుడైన పురుషులలో ఉత్తముడైన పురుషోత్తముని, ఆత్మకంటే పరముగ ఉన్న (వేరుగనున్న) పరమాత్మను ఆరాధించాలి.
Next.
చెట్టునందు బుట్టి చెలరేగు కాయలు
దనరు కాంతి తోడ దవిలి పండు
పండు దినుచు కాయ వర్ణము తెలియుడి
విశ్వదాభిరామ వినుర వేమా. 97
భావము:- భగవద్గీతలో శరీరమును అశ్వర్థవృక్షముగ వర్ణించారు. మానవ శరీరమనెడి వృక్షములో కర్మముల ఫలములనేకముగ పుట్టుచుండును. శరీరములో అనేక విధ కర్మముల కాయలతో పాటు జ్ఞానము అను కాయకూడ పుట్టును. జ్ఞానమను ఫలము, కర్మ ఫలములకు వ్యతిరేకమైనదై ఉండును. జ్ఞానఫలము అగ్నిలాంటిది. కర్మఫలములు కట్టెలలాంటివి. సహజముగ అందరు కర్మ ఫలములనే తింటు కాలము గడుపుచుందురు. అనగ కర్మలాచరించుచు కాలము గడుపుచుందురు. చాలామంది జ్ఞానఫలమును ముట్టను కూడ ముట్టరు. దానివిలువే చాలామందికి తెలియదు. మానవులలో అరుదుగ ఎవడో ఒకడు జ్ఞాన ఫలముయొక్క రుచి చూడను మొదలుపెట్టును. అలా జ్ఞానము తెలియుకొలది దాని విలువ తెలియను మొదలుపెట్టును. అలా విలువ తెలిసినవాడు జ్ఞానమార్గమును వీడడు. ఈ పద్యములో మనిషి శరీరమందే కర్మలున్నాయని, అవి చెలరేగి అనుభవింపజేయుచున్నవను విషయము తెల్పుచు చెట్టునందు బుట్టి చెలరేగు కాయలు అన్నారు. శరీరమందే జ్ఞానము కూడ ఉద్భవించుచున్నది. అంతేకాక అది అగ్నియై కాంతి కల్గివున్నది. కావున దనరు కాంతి తోడ దవిలి పండు అన్నారు. జ్ఞానము తెలియు కొలది దాని ప్రత్యేకత మరియు విలువ తెలియును. కావున పండు దినుచు కాయవర్ణము తెలియుడి అన్నారు. మొత్తము మీద ఈ పద్యమందు శరీరములోనే కర్మను, దానిని కాల్చు జ్ఞానాగ్నిని రెండింటిని మానవుడు పొందవచ్చని చెప్పారు. శరీరములోపల కాక బయట జ్ఞానానుభవము దొరకదని తెలియాలి.
Next.
మూల మెవ్వరనుచు ముగ్గురి లోపల
మూల మెరుగ లేరు మూఢ జనులు
మూలము ముగ్గురికి ముఖ్యమైయుండురా
విశ్వదాభిరామ వినుర వేమా. 98
భావము:- త్రైతసిద్ధాంతము ప్రకారము ఆత్మలు మూడు గలవనుట సత్యము. అందులో ఒకటి జీవాత్మకాగ, రెండవది ఆత్మ, మూడవది పరమాత్మ. జీవాత్మ మరియు ఆత్మలు శరీరము ధరించిన వాటియందుండగ మూడవది, ఆత్మకంటే వేరుగనున్నదైన పరమాత్మ శరీరములోపల బయట అంతట ఆవహించి ఉన్నది. శరీరములోగల ఆత్మలకు, జీవాత్మలకు ఆకారముండగ పేరేలేని ఉత్తమ పురుషుడైన పురుషోత్తముడనబడు మూడవ దానికి ఆకారమేలేదు. ఆకారములేని, ఆకారమున్న మరియు పేరులేని, పేరు ఉన్న మూడు ఆత్మలలో ఎవరు ముఖ్యమైనవారో జ్ఞానము తెలియని చాలామందికి తెలియదు. అందువలన ఈ పద్యములో మూల మెవ్వరనుచు ముగ్గురిలోపల మూల మెరుగలేరు మూఢజనులు అన్నారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మలలో ఎవరు మూలము అను విషయము జ్ఞానము తెలియు అందరు తెలియవలసిన విషయము. జీవాత్మ, ఆత్మలు పుట్టినది పరమాత్మనుండియే, తర్వాత ఐక్యమగుట కూడ పరమాత్మయందే కావున అందరికి మూలము మూడవ పురుషుడైన పరమాత్మయే.
ప్రపంచములో పుట్టిన ప్రతి శరీరము జీవాత్మ, ఆత్మ, పరమాత్మలను ముగ్గురిచేత ఆవహింపబడి ఉన్నది. శరీరము ధరించిన ప్రతి జీవి సాత్త్విక, రాజస, తామసములనెడి గుణములందు నివసించుచున్నాడు. కావున జీవులను వారు నివశించు గుణభాగములను బట్టి సాత్వికులు, రాజసులు, తామసులు అను మూడు తెగలుగ విభజించి ఉన్నాము. సాత్వికులకుగాని, రాజసులకుగాని, తామసులకుగాని మూలమైన పరమాత్మయే ముఖ్యపురుషుడు. ముగ్గురూ చివరకు మూడవ పరమాత్మయందు కలియవలసిందే. కావున ఈ పద్యములో మూలము ముగ్గురికి మూలమై ఉండురా అన్నారు. మూడు గుణములలో ఉన్న ఎవరికైన చివరికి ప్రయాణ గమ్యము పరమాత్మయేనని ఇందులో సారాంశమని తెలియాలి.
Next.
కాల్లముందరేరు కడతేర నీదక
ముగ్గురు ముగుడ్రాల్లు మునిగినారు
నరుడు ఈదె ననగ నగుబాటు కాదయా
విశ్వదాభిరామ వినుర వేమా. 99
భావము:- ప్రపంచములో ప్రతి మనిషికి మాయ అనునది ప్రతి బంధకమై ఉన్నది. ప్రతి మనిషి నడవడిక మాయ మీదనే ఆధారపడి ఉన్నది. సాత్త్విక, రాజస, తామసము అనబడు మూడు గుణములే మాయగ ఉన్నవని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. కొందరు పెద్దలు మాయను సముద్రముతో సమానముగ పోల్చి చెప్పారు. మాయాసముద్రము నీదడము చాలా కష్టమన్నారు. అలాగే ఈ పద్యములో మాయను ఒక నదితో సమానముగ పోల్చి చెప్పారు. శరీరము ధరించిన ప్రతి మనిషి మాయ అనబడు గుణములచేతనే నడువవలసివున్నది. శరీరము ధరించిన విష్ణు, ఈశ్వర, బ్రహ్మ సహితము మాయ గుణములను జయించలేక పోయారు. అందరికి అడ్డముగనున్న మాయను కాళ్ళముందరేరు అని ఈ పద్యమందు చెప్పుచు, త్రిమూర్తులు కూడ ఈ మాయను తుదవరకు ఈదలేక మునిగి పోయారని కాళ్ళముందరేరు కడతేర నీదలేక ముగ్గురు ముగుడ్రాల్లు మునిగినారు అన్నారు. ఎంతో గొప్పవారైన విష్ణు, ఈశ్వర, బ్రహ్మలే మాయను జయించలేకపోతే సాధారణ మానవుడు జయించుట చాలా కష్టము. సాధారణ మనిషి మాయను దాటినాడనుట నగుబాటని వేమన అన్నాడు. ఇదే విషయమే గీతయందు కూడ మాయను జయించుట దుస్సాధ్య మన్నారు. ఇందరు గొప్పదిగ చెప్పిన మాయను దాటాలంటే సంపూర్ణ జ్ఞానము తెలియాలి. ఎంత పెద్ద సముద్రమునుగాని చిన్న పడవ చేత దాటవచ్చునను సూత్రము ప్రకారము ఎంతో దుస్సాధ్యమైన మాయా సముద్రమును, జ్ఞానమను ఓడ చేత దాటవచ్చని పెద్దలు తెల్పియున్నారు. మనిషిగాని, త్రిమూర్తులుగాని జ్ఞానము లేకపోతే మాయను జయించలేరని, ఆత్మజ్ఞానము తెలిసినవాడు సులభముగ మాయను జయించగలరని పెద్దలు తెల్పియున్నారు.
Next.
హంస మానసోదక మంటక దిరిగిన
యట్లు కర్మచయము నంటకుండ
యోగి తిరుగు సకల భోగంబుల తోడను
విశ్వదాభిరామ వినుర వేమా. 100
భావము:- హంస అను పక్షులు ఎక్కువ మానససరోవరమనబడు ఒక సరస్సులో తిరుగుతుంటాయి. నీటిలో తిరుగు ఆ పక్షులకు తేమ ఏమాత్రము అంటదు. అదే విధముగ తామరాకును కూడ తేమ అంటదు. నీటిలో ఉండినప్పటికి వీటికి తేమ ఎట్లు అంటదో అదే విధముగ కొందరు కర్మ కార్యములు చేయుచున్నప్పటికి కర్మ అంటదని గీతయందు భగవంతుడు చెప్పాడు. హంస అను పక్షికి, తామరాకుకు నీరంట కుండుటకు వాటియందేదో ప్రత్యేకత ఉండును. అన్ని పక్షులకు గాని, అన్ని ఆకులకుగాని తేమ అంటుచున్నప్పటికీ ప్రత్యేకించి హంసకు, తామరాకుకు నీరంటడము లేదు. అదే విధముగ కర్మలాచరించు మనుజులందరికి కర్మ అంటుచున్నప్పటికి, యోగి అను నతనికి మాత్రము కర్మ అంటడము లేదు.సాధారణ మనుజునికి కర్మ ఏ విధముగ అంటుచున్నది. యోగి అను వ్యక్తికి ఎందుకు అంటడము లేదు అని యోచిస్తే సాధారణ వ్యక్తికి యోగికి ఒకే ఒక తేడా ఉన్నది. సాధారణ వ్యక్తిలో అహము అను భాగము పనిచేయుచుండగా, యోగి శరీరములో అహము ఏమాత్రము పని చేయడములేదు. శరీరములో జీవునితో పాటు ఆత్మ మినహ ఇరువది నాల్గు భాగములు పని చేయుచున్నవి. ఒక కార్యము జరుగుటకు అహము మినహ ఇరువది మూడు భాగములు పని చేయుచున్నవి. కార్యాచరణలో భాగస్వామ్యములేని అహము మాత్రము అన్ని శరీర భాగములు పనిని నీవే చేసినావని జీవునికి బోధిస్తుండడము వలన సాధారణ వ్యక్తి, అహము మాట విని కార్యమును నేనే చేశాననుకొంటుండడము వలన కర్మ అంటుచున్నది. యోగి శరీరములో కూడ ఇరువది మూడు శరీరభాగములు పని చేస్తుండును. కాని అహము నిత్యకృత్యమైన, జీవునికి బోధించడమను పని మాత్రము యోగి శరీరములో జరగడములేదు. అహము తన పని ప్రకారము నీవే చేశావని యోగికి చెప్పిన యోగి వినడములేదు. అందువలన అహము యొక్క పని యోగి శరీరములో జరగడము లేదు. అందువలన యోగియైనవాడు అన్ని భోగములతోడను అన్ని కార్యములను చేయుచు, కర్మ అంటక తిరుగుచుండును. కావున ఈ పద్యమందు కర్మ అంటకుండ యోగి సకలభోగముల తిరుగుచుండు అన్నారు. కర్మ అంటకుండ అన్ని కార్యములు చేయుచు పోవడమే ముఖ్యమైన జ్ఞానమని భగవద్గీత కూడ బోధించినది. భగవంతుడు బోధించిన ఆ విధానమును అందరు తెలిసి ఆచరింతురని కోరుచున్నాము.
Next.
కాలు చెయ్యిలేదు కంచుకంబు గలదు
కొమ్ము లేదు యురికి చిమ్ము వేగ
గరిడి లేక జంపు గడుపెద్ద చోద్యమో
విశ్వదాభిరామ వినుర వేమా. 101
భావము:- ఈ పద్యము కర్మను గూర్చి చెప్పినదేనని చెప్పవచ్చును. కర్మ ఎవరి కంటికి కనిపించునది కాదు. స్థూలాకారములేనిది కర్మ కావున దానికి కాలు చెయ్యి లేదన్నారు. కర్మ మనో భావమునకు తొలగునది కాదు. అనుభవించుటకు నా చేతకాదన్నను తొలగునది కాదు. ఆచరణలో చాలా గట్టిది. కావున కంచుకంబు గలదన్నారు. కర్మ అనేక విధములుగా ఉండి అనేక రక బాధలు పొందించుచుండును. పదునైన కత్తుల చేత చెక్కించగలదు. వాడియైన కొమ్ములుగల ఎద్దుల చేత పొడిపించగలదు. పైకి కనిపించునది ఎద్దయిన, కత్తి అయిన వెనుక జరిపించునది కర్మ కావున కొమ్ము లేదు కాని యురికి చిమ్మి వేయగలదన్నారు. స్థూలముకాని కర్మకు కాలు, చెయ్యిగాని, కొమ్ములు గాని లేవు అలాగే గరిడి సాము చేసి కండలు పెంచిన బలము కలది కాదు. అయినప్పటికి జీవులను పెద్ద బలమును ఉపయోగించి చంపుచున్నది. వందలు వేలమందినైన బలవంతముగ ఒక్క నిమిషములో చంపుచున్నది. ఉదాహరణకు భూకంపరూపములో బరువైన వస్తువులను, రాళ్ళను మీదకు విసరి వాటి కిందపడి నలుగునట్లు చేయుచున్నది. చెప్పుటకు లెక్కలేనన్ని విధములుగ కర్మ నానారూపములుగ జీవున్ని హింసించుచున్నది. కర్మ విధానములు జగతిలో చూస్తే నానా విధములుగ ఉంటూ ఎవరిచేత గుర్తింపబడక, ఎంత కష్టమునైన అనుభవిస్తు ఇది నా కర్మయని వారి నోటితో అనిపిస్తూనే ఉన్నది. అందరిచేత నా కర్మ అని అపుడపుడు అనిపిస్తూ, తన ఉనికిని తెలియకుండ మానవుల మీద అహర్నిశలు దాడిచేయడము చాలా విచిత్రము కదా! అందువలననే వేమనయోగి తన పద్యములో గడుపెద్ద చోద్యము అన్నాడు.
Next.
వానిగాననోడు వాడు కానేకాడు
వానిలోని వాడు వాడు సుమ్ము
వానిగన్న వాడు వాడు తా యోగిరా
విశ్వదాభిరామ వినుర వేమా. 102
భావము:- మన శరీరములో మూడు గుణములున్నవి అలాగే ఆత్మలు కూడ ఉన్నవి ఇంతకు ముందు వాడు, వాని అను పదములుపయోగించి మూడు గుణముల గురించి చెప్పి ఉన్నాడు. ఇపుడు అవే పదములు ఉపయోగించి మూడు ఆత్మల గూర్చి చెప్పుచున్నాడు. మూడు గుణముల గురించిగాని, మూడు ఆత్మల గురించిగాని తెలిసిన వానిని సంపూర్ణ జ్ఞానియని చెప్పవచ్చును. దేవుని జ్ఞానము తెలిసినవాడు, దేవున్ని బయట వెదకక తన శరీరములోనే శోధించును. శరీరములో జీవునితోపాటు ఆత్మ అనునది కూడ కలదు. జీవాత్మ శరీరములో కర్మలనుభవించుటకు, కావలసిన శక్తినిచ్చి కదలించునది ఆత్మ! శరీరము కదలుచున్నదంటే అది ఆత్మయొక్క కదలికయని తెలియాలి. జీవాత్మ మొదట ఆత్మను తెలుసుకొన్న తర్వాత కర్మ నశించిపోవును. ఆత్మను తెలిసినవాడు, తర్వాత గల పరమాత్మను తెలియవలెను. ఆత్మను తెలియని జీవాత్మ, పరమాత్మను తెలియలేదు. యోగము అనగా కలయిక అని అర్థము. జీవాత్మ పరమాత్మతో కలసి పోవడమును కూడ యోగము అనవచ్చును. పరిపూర్ణ యోగమైన పరమాత్మ కలయిక పొందినవాడు జీవాత్మగ ఎచటా పుట్టక పరమాత్మగ మారిపోవును.
ఆత్మను తెలియని జీవాత్మ, పరమాత్మగ మారుటకు అవకాశములేదు. కావున వానిగాననోడు అని ఆత్మను తెలియని జీవాత్మను గూర్చి వేమన చెప్పాడు. ఆత్మను తెలియనివాడు పరమాత్మగ మారుటకు వీలులేదు కనుక వాడు కానేకాడు అన్నాడు. వాడు అనగ పరమాత్మయని అర్థము. ఆత్మను తెలియని జీవుడు పరమాత్మగ మారుటకు అవకాశము లేదని అర్థము. పరమాత్మలోని వారే ఆత్మ, జీవాత్మలు కావున వానిలోని వాడు, వాడు, సుమ్ము అన్నారు. ఆత్మను తెలిసిన జీవాత్మ చివరకు పరమాత్మలో కలసిపోవును కాబట్టి వానిగన్నవాడు అని ఆత్మను అర్థము చేసుకొన్న జీవాత్మనుగూర్చి చెప్పారు. జీవుడు చివరకు పరమాత్మలో ఐక్యమైపోవును కనుక వానిగన్నవాడు వాడు తాయోగిరా అన్నారు. ఈ పద్యములో జీవాత్మ మధ్యములోనున్న ఆత్మను తెలిసితే చివరనున్న పరమాత్మను తెలిసి పరమాత్మగ మారిపోవునని చెప్పడమైనది. ఆ స్థితి చెందినవాడు జీవుడుగా ఉండక దేవునియందు కలిసిపోవును.
Next.
వ్రాత వెంటగాని వరమీడు దైవంబు
సేత కొలది గాని వ్రాతగాను
వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త
విశ్వదాభిరామ వినుర వేమా. 103
భావము:- వెనుకటి కర్మ ఫలమువలన మనిషి ప్రతి పని చేయుచుండును. కర్మవలన ప్రతికార్యము జరుగుచున్నప్పటికి మనిషి తన అజ్ఞానము చేత ఆ కార్యములను నేనే చేయుచున్నానని తలచుచున్నాడు. కర్మవలన కార్యము నిర్ణయింపబడి ఆత్మ, కార్యమునకు శక్తినిచ్చి కదలించు చుండగ ఏ పాత్రవహించని జీవుడు తానే యోచించి, నిర్ణయించి చేయుచున్నానని అనుకొనుచున్నాడు. అందువలన జరిగిన కార్యములో తయారైన క్రొత్త కర్మ జీవునికే తగులుకొనుచున్నది. పనికి కారణము కర్మకాగ శక్తి ఆత్మది, జీవునిది ఏమి లేకున్నను పనిలోని అనుభవములను మాత్రము అనుభవించడము జీవునిపని. ఒక పని జరుగడము అందులో జీవుడు బాధనో, సఖమునో అనుభవించడము జరుగుచున్నది. అనుభవించడము జీవుని పనికాగ, తెలియని తనముతో కార్యమునకే నేను కారణమని అనుకోవడము వలన చేసిన పాపముగాని, పుణ్యముగాని వ్రాతగా మారి వాని కర్మచక్రములో చేరిపోవుచున్నది. కార్యమునకు నేను కారణము అని అనుకోవడము వలన తన శరీరములో జరుగు కార్యమును బట్టి జీవునికి కర్మ వచ్చుచుండును. పనికి నేనే కర్తనను కొంటే పనిలోని కర్మను ఆత్మ జీవునికి తగిలించుచున్నది. కావున ఈ పద్యములో చేతకు దాకర్తయైతే, వ్రాతకు అజుడు కర్త అన్నారు. జరిగిన కార్యమునుబట్టి కర్మ వస్తున్నది కావున సేత కొలది వ్రాతగాను అన్నారు. ముందు లిఖితమైన కర్మనుబట్టి తనకు అన్ని లభించుచున్నవి. దేవుడు వరమిచ్చిన తన కర్మను బట్టియే ఇవ్వవలసివున్నది. కావున వ్రాత వెంటగాని వరమీడు దైవంబు అన్నారు. వేమన ఈ పద్యములో మనిషికి, కర్మకుయున్న సంబంధమును గూర్చి పూర్తిగ వివరించాడు.
Next.
బ్రహ్మ గుర్రమాయె భవుడు పల్లంబాయె
నాది విష్ణు వెన్నంకె మాయె
నందు మీది వాడు ఆడదో మగవాడో
విశ్వదాభిరామ వినుర వేమా. 104
భావము:- ప్రపంచములో ప్రతి మనిషి, ప్రతి జీవరాసి గుణములవలననే చరించుచున్నవి. శరీరములో కనిపించని కర్మ మరియు కనిపించని గుణములు మనిషిని ప్రేరేపించి నడిపించుచున్నవి. కర్మకు, గుణములకు, శరీరమంతటికి ఆధారమైనది ఆత్మకాగ దానికి కూడ ఆధారమైనది పరమాత్మ. పరమాత్మ ప్రతి శరీరమును అధిష్ఠించియుండి కర్మ, గుణముల చేత కార్యమును ఎన్నుకొనునట్లు చేసి ఆత్మ చైతన్యముచేత చేయించుచున్నది. అందువలన అన్నిటికి మూలపురుషుడు పరమాత్మయని చెప్పవచ్చును. పరమాత్మ అన్ని శరీరములందు వ్యాపించి ఉన్నప్పటికి దానికి రూపము, పేరు ఏ మాత్రము లేవు. కావున పరమాత్మను ఏమని చెప్పుటకు ఎటువంటి ఆధారములేదు.
పై పద్యములో వేమనయోగి మూడు గుణములను గురించి, శరీరమున మూల పురుషుడైన పరమాత్మను గురించి చెప్పినట్లు తెలియుచున్నది. అది ఎట్లనిన మూడు గుణములచేత, పరమాత్మచే నడుపబడు శరీరము కావున మూడు గుణములను ఉద్దేశించి తామసమును బ్రహ్మమనియు, రాజసమును విష్ణువనియు, సాత్వికమును శివుడనియు చెప్పుచు బ్రహ్మగుర్రమాయె అన్నాడు. అట్లే విష్ణువు గుర్రమునకు తగిలించిన కళ్ళెమాయె అన్నాడు. తర్వాత గుర్రము పరుగిడు మైదానమును శివుడన్నాడు. ఈ విధముగ కార్యములను చేయు గుణ సహిత శరీరమును స్వారీ గుర్రముగ వర్ణించాడు. శరీరమునధిష్టించి ఉన్న పరమాత్మను గుర్రమును నడుపు రౌతుగ పోల్చి ఆయన ఎటువంటివాడో, ఏమి పేరుగలదో ఎవరికి తెలియదు కావున పరమాత్మను ఆడదో, మగదో తెలియదన్నాడు. ఈ విధముగ వేమన పరమాత్మ యొక్క ఔన్నత్యమును మూడు ముక్కల పద్యములో చెప్పడము చాలా గొప్ప విషయము. పరమాత్మ ఆడదో మగదో ఎవరికి తెలియనిదానివలన పరమాత్మను కొన్ని సందర్భములలో వాడు అనియు, మరికొన్ని సందర్భములలో అది అనియు వ్రాయబడుచున్నాడని తెలియవలెను.
Next.
జాతులందు నెట్టిజాతి ముఖ్యము చూడ
యెరుక లేక దిరుగ నేమి గలదు
యెరుక గలగు మనుజుడే జాతి గలవాడు
విశ్వదాభిరామ వినుర వేమా. 105
భావము:- ఇక్కడ జాతులను మాట వచ్చినది కావున మనుషులలో ఎన్ని జాతులున్నవో తెలియవలసి ఉన్నది. భాగవద్గీతశాస్త్రము జ్ఞాన యోగమును అధ్యాయములో 13వ శ్లోకము ప్రకారము మరియు శ్రీకృష్ణుడు నెమలి పింఛమును ధరించిన ప్రకారము, మనుజుల జాతులు నాల్గు విధములని తెలిసినది. పై పద్యములో మొదటి చరణములో చెప్పినట్లు ఏ జాతి ముఖ్యమని చూడ తామస, రాజస, సాత్విక, యోగ అను నాల్గు జాతులలో యోగమను జాతి ముఖ్యమై ఆ జాతిలోయున్న యోగియే మిగత తామసులకంటే, రాజసులకంటే, సాత్వికులకంటే ముఖ్యుడని తెలియుచున్నది. మిగత మూడు జాతులకంటే యోగజాతి ఎందుకు ముఖ్యమైనదో యోచించి చూచినట్లయితే, మిగత మూడు జాతులలో మనిషికి తన మీద ఎరుక అనునది లేదని తెలియుచున్నది. శరీరములో గల అనేక భాగములలో ఒక భాగమైన జీవుడు, తన మీద తనకు ఎరుక (జ్ఞప్తి ) లేక శరీరము మొత్తము నేనే అనుకొనుచుండును. అలా శరీరమునంత నేనే అని తలచుటవలన శరీరముతో జరిగిన పని యంతయు నేనే చేసాననుకొనుచున్నాడు. అలా అనుకోవడము వలన జరిగిన పనిలోని పాపపుణ్యములు ఆ జీవునికి చేరుచున్నవి. అటువంటి వాడు ఎల్లప్పుడు పాప, పుణ్య కర్మలనే సంపాదించుకొంటూ, జనన మరణ చక్రములో పడి తిరుగుచుండును. ఎరుక లేనివాడు అజ్ఞానములో ఉండి జ్ఞానము తెలియలేడు. అటువంటి వానికి కర్మను కాల్చు జ్ఞానశక్తి ఎప్పటికి లభించదు. అందువలన తన పద్యములో ఎరుకలేక దిరుగ నేమి గలదు అన్నాడు. నాల్గుజాతులలో ముఖ్యమైన జాతి యోగజాతి కావున ఆ జాతి మనుజునే స్వచ్ఛమైన జాతికలవాడని అనవచ్చును. కావున ఎరుకగలుగు మనుజుడే జాతిగలవాడని అనుచున్నారు. ఈ విషయమును తెలుపు నిమిత్తము శ్రీకృష్ణుడు కూడ నాల్గువర్ణములలో మధ్యలో ఒకటి మాత్రమే ఎక్కువ గుర్తింపుగ కనిపించు నెమలిపింఛమునే ధరించాడు.
Next.
చదువువానికన్న చాకలి తామేలు
గురము వేల్పుకన్న కుక్క మేలు
సర్వ సురులకన్న సర్వేశ్వరుండు మేలు
విశ్వదాభిరామ వినుర వేమా. 106
భావము:- కాగితముల మీద విషయము తెలుసుకొన్న చదువరికంటే గుడ్డలు మీద మురికిని తీసివేయు చాకలి మేలన్నారు. ఈ చరణములోని వేమనయోగి యొక్క ఆధ్యాత్మిక భావమును పరిశీలించి చూచితే ఆయన భావమిలా ఉన్నది. చదివినవాడనగా అన్ని విషయములు తెలిసిన జ్ఞాని అని భావము. చదివినవాడు విషయములను అవగాహన చేసుకొన్నట్లు, జ్ఞానియైనవాడు గురుముఖత విన్న జ్ఞానమును, గ్రంథరూపమున చదివిన జ్ఞానమును తెలిసియుండును. చాకలి అనగా స్వయముగ పనిచేసి మురికిని వదలించువాడు.గురువు అనగా శరీరములలోనున్న కర్మ అను కల్మషములను లేకుండ చేయువాడని అర్థము. చాకలి గుడ్డలను నీటిలో ముంచి సబ్బుపెట్టి ఉతుకునట్లు, గురువు తనవద్ద చేరిన మనుజులకున్న కర్మలను తీసివేయుటకు ఎన్నో విధముల ప్రయత్నము చేయును. జ్ఞానబోధలు అను నీటిలో తడిపి జ్ఞాన పరీక్షలను సబ్బుపెట్టుచు, కొంత జ్ఞానశక్తిని నింపి కర్మ మురికి నుండి ముక్తుని చేయుచుండును. కావున కర్మనుండి విడుదల పొందించు వానిని చాకలి అన్నారు.
రాతి దేవునికన్న ప్రాణముతోనున్న కుక్కమేలన్నాడు. రాతి దేవుడు ఇంటిముంగిటిలో యుండినా దొంగవచ్చి తన సొమ్మంతయు ఎత్తుకుపోయి నష్టపరచినా ఆ దేవుడు కదలడు మెదలడు. అదే ఇంటి ముంగిటిలో కట్టివేసిన కుక్క దొంగను గమనించి, మొరిగి, యజమానిని జాగ్రత్తపరచి నష్టపోకుండ చేయగలదు. ఇలాగే మన శరీరములో రాతి దేవుని మాదిరి కదలకుండ ఒకే చోటున్న అహము గలదు. అహము మనిషిని ఎప్పుడూ కర్మబంధములలో చిక్కుకొనునట్లు చేయుచుండును తప్ప మనిషిని కర్మనుండి తప్పించదు. మానవుని కర్మ నుండి తప్పించక కర్మను అంటించునది అహము. కదలని దేవుడు మనిషికి నష్టము తెచ్చినట్లు, కదలని అహము మనిషికి తీరని నష్టకష్టములను తెచ్చిపెట్టు కర్మనే అంటగట్టుచున్నది. మన శరీరములో కుక్కతో పోల్చిన మనస్సు గలదు. మనస్సు నిలకడలేనిది, సంచారము గలది కావున మనస్సును కుక్కతో పోల్చి చెప్పారు. మనస్సును వదలివేసితే కుక్క ఇల్లిల్లు తిరిగినట్లు, మనస్సు అనేక విషయముల మీదికి తిరుగుచుండును. అదే మనస్సును విచ్చల విడిగ వదలక, అభ్యాసముచేత బంధించి పెడితే, కట్టివేయబడిన కుక్క ఇంటినే కాపల కాస్తు ఏ ఇల్లు తిరగనట్లు, మనస్సు ఏ విషయముల మీదికిపోక శరీరములోని ఆత్మ మీదనే ధ్యాసను ఉంచును. దానివలన మనిషికి కర్మ అంటదు. మనిషికి కర్మ రానందున కష్టనష్టముల నుండి తప్పించుకొనును.
చదువువానికన్నా చాకలి మేలు
-
జ్ఞానికన్న యోగి ( గురువు ) మేలు
గురమువేల్పుకన్న కుక్కమేలు
-
అహముకంటే నిలబడిన మనస్సుమేలు
సర్వసురులకన్న సర్వేశ్వరుడుమేలు
-
దేవతలందరికంటే పరమాత్మమేలు
దేశములోని దేవతలందరికంటే దేహములోని పరమాత్మయే గొప్పయని వేమన తేల్చి చెప్పాడు.
Next.
బ్రహ్మయెవని కొడుకు పరికింపగా భువి
విష్ణువెవని కొడుకు వెలయ జూడ
శివుడు యెవని కొడుకు నిగ్గెరుగరు జనుల్
విశ్వదాభిరామ వినుర వేమా. 107
భావము:- బ్రహ్మ, విష్ణు, శివుడు అనువారు ఎవరికో ఒకరికి పుట్టియుండాలి. ముగ్గురు ఎవరి కొడుకులో నిజముగ జనులు తెలియకున్నారని వేమన అన్నాడు. పుట్టిన ప్రతివారు ప్రకృతి పురుషుల వలననే పుట్టారని, అందరికి తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ అనుమాట భగవద్గీత గుణత్రయ విభాగయోగమను అధ్యాయములో మొదటనే కలదు. వేమన చెప్పిన ఈ త్రిమూర్తులు ఎక్కడగలరోయని చూచినట్టయితే ఆ ముగ్గురు మన శరీరమందేగలరని తెలియుచున్నది. మన శిరోభాగమున నాల్గు చక్రముల చట్రమొకటి కలదు. అందు క్రింద చక్రము, గుణచక్రము అనబడుచున్నది. ఆ గుణచక్రము మూడు భాగములుగ విభజింపబడి ఉన్నది. ఆ మూడు భాగములనే క్రింద పటములో చూడుము.
ఈ మూడు భాగములలో బయటినుంచి మొదటగల భాగమును బ్రహ్మ అనియు, రెండవ దానిని విష్ణువనియు, మూడవ దానిని శివుడు అనియు వేమన గుర్తించాడు. ఇదే విషయమునే చాలా పద్యములలో చెప్పాడు. ఉదాహరణకు ఈ గ్రంథములో మొదట మూడవ పద్యము బ్రహ్మాచంపి, విష్ణు భాగంబులో కల్పి అని చెప్పబడియున్నది. త్రిగుణములను గూర్చి పూర్తిగ తెలిసినవాడు సంపూర్ణ జ్ఞానియగును. గుణముల వివరము తెలిసినవాడు ఏ కార్యములోని కర్మను పొందక ఎరుక కల్గియుండును. ఇదే విషయమునే భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగమున ఇరువది నాల్గవ శ్లోకములో ప్రకృతి పురుషులను, గుణములను బాగా తెలిసినవాడు మోక్షము పొందునని తెలియబరచబడినది. గుణముల వివరము సంపూర్ణము తెలియనివానికి చావుపుట్టుకలు తప్పవు. గుణముల నిర్మాణవ్యవస్థను, అవి పని చేయు విధానము జనులు తెలియరనే వేమనయోగి పై పద్యములో చెప్పాడు.
Next.
వేద విద్యలెల్ల వేశ్యలవంటివి
భ్రమల బెట్టి తేటపడగ నీయవు
గుప్తవిద్య యొకటి కులకాంత వంటిది
విశ్వదాభిరామ వినుర వేమా. 108
భావము:- వేశ్య అంటే స్థిరస్థాయిగ ఒక పురుషుని దగ్గర ఉండునది కాదు. ఎవడు డబ్బు ఎక్కువ ఇస్తే వానివద్దకు పోవునది వేశ్య. ఒక పురుషునితో సంబంధము పెట్టుకోక అనేకమంది పురుషులతో వేశ్య సంబంధము పెట్టుకొని ఉండును. అదే విధముగనే వేద విద్యలను ఆశ్రయించినవాడు ఒక దేవున్నికాక అనేక దేవుళ్ళతో సంబంధము పెట్టుకొని ఉండును. వేద విద్యలందు అనేక దేవతలను గూర్చి చెప్పుట వలన, మన కోర్కెలు నెరవేరుటకు అనేక ఆరాధనలు కల్పించి ఉండుట వలన విష్ణు, ఈశ్వర, బ్రహ్మాది దేవతలను మొదలుకొని అష్టదిక్కుల దేవతల వరకు బోధించుట వలన మానవుడు సంశయాలలోపడి ఎటు తేలక వేశ్యలవలె అనేక దేవతలతో సంబంధము పెట్టుకొని ఆరాధించను మొదలుపెట్టును. ఏ దేవునివద్దకు పోయినపుడు, ఆ దేవుని గూర్చి పొగడడము, నీవే నా నిజదైవమని మ్రొక్కడము మనిషికి అలవాటై పోతున్నది. అన్నిటిని వదలి పరమాత్మను ఆశ్రయించమని వేద విద్యలు చెప్పవు. దేనినీ వదలకూడదు, అన్ని దేవతారాధనలు ఆచరించుమని వేదములు చెప్పుచుండును.
రహస్యవిద్యయైన బ్రహ్మవిద్య మాత్రము దేవతలను గూర్చి చెప్పక, దేవతలందరికి అతీతుడైన మరియు దేవతలందరికి దేవుడైన పరమాత్మను గూర్చి బోధించును. దేవతల భ్రమనుండి వదిలించి పరమాత్మను గూర్చి విశదపరుచును. పరమాత్మను బాహ్య ఆరాధనలచే ఆరాధించలేమని, అంతర్గతముగ మనస్సు, అహములతో పరమాత్మను శోధించవలసి ఉండునని బ్రహ్మవిద్య తెల్పుచుండును. అనేక దేవతల భ్రమని వదిలించి, అందరికి పెద్దయిన పరమాత్మనొక్కనినే మనస్సు నందుచున్నది బ్రహ్మవిద్య. ఈ విద్య, వేద విద్యలవలె ప్రచారములో లేక అందరికి తెలియక పోయినందువలన బ్రహ్మవిద్యను గుప్తవిద్య అని కూడ అనుచున్నారు. గుప్తవిద్య తెలిసినవాడు, వేద విద్యలను లెక్కచేయడు మరియు వేశ్యకాంతలాంటి వేదవిద్యను వదిలి కులకాంతలాంటి గుప్తవిద్యను ఆశ్రయించునని వేమన తన పద్యములో తెలియజేసాడు.
Next.
పతియొప్పిన సతి యొప్పును
పతి సతులొకటైన పరమ పావనమందున్
పతి సతి న్యాయమె మోక్షం
బతులిత పరమాత్మనైక్యమగురా వేమా. 109
భావము:- పతి అనగా భర్త, సతియనగ భార్య అని అందరికి తెలుసు. పెళ్లి అయితేనే పతి సతులౌతారను విషయము కూడ తెలుసు. పతి సతులకు పిల్లలు పుడతారని కూడ తెలుసు. ఈ విధానమంతా జ్ఞానులకు, అజ్ఞానులకు అందరికి తెలిసినప్పటికి చాలామందికి ఈ విషయము దైవికమైనదని, ఆ దైవిక విషయమే ప్రపంచములో ఇలా ప్రతిబింబించి ఉన్నదని, ప్రపంచములో ప్రత్యక్షముగనున్న పతి, సతుల విధానమును ఆధారము చేసుకొని పరోక్షముగనున్న దైవ విధానమును అర్థము చేసుకో గలరని దేవుడే ఇలా ఉంచాడు. దైవికమైన పతి, సతి విధానమేదో ఇపుడు వివరించి చూచుకొందాము.
భగవద్గీత గుణత్రయ విభాగ యోగమను అధ్యాయములో మొదటనే పరమాత్మను పతిగ, ప్రకృతిని సతిగ చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారము జగతి మొత్తమునకు ప్రకృతి, పురుషులు సతి పతులుగా ఉంటూ ప్రతి జీవరాసికి వారే తల్లితండ్రులైనారు. ప్రపంచములోని మనుషజాతికేకాక క్రిమి, కీటక, పశు, పక్షి, వృక్షలతాదులకన్నిటికి తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ అని తెలుపబడి ఉన్నది. జగతి మొత్తమునకు తల్లి తండ్రులుగ ఉంటూ పతి సతులుగ యొప్పు పరమాత్మ ప్రకృతి ప్రపంచములో విభిన్నముగ ప్రవర్తించుచున్నారు. పతియైన పరమాత్మకు సతియైన ప్రకృతి విధేయురాలైనప్పటికి, పరమాత్మ ఆదేశానుసారము జగతి పట్ల పరమాత్మ మార్గమైన దైవమార్గమునకు ప్రకృతియైన మాయ ఎంతో వ్యతిరేఖముగనున్నది. దైవమార్గమును అనుసరించవలెననుకొను వానిని ఆ ప్రయత్నమును భంగముచేసి విరమించుకొనునట్లు చేయుచున్నది. అంతయు దేవునికి తెలిసే జరుగుచున్నది. దేవుని గూర్చిన ప్రయత్నములో మాయ ప్రభావమునకు తట్టుకొనలేక అందరు వెనుదిరుగుచున్నారు. అయినప్పటికి ఎన్నో లక్షల మందిలో ఏ ఒక్కడో మాయను వ్యతిరేకించి అన్ని కష్టములకు ఓర్చుకొని దేవుని చేరుకోవాలని ప్రయత్నించుచున్నారు. అటువంటి వానిని దేవుడు, వాని మార్గమును సుగమముచేసి మాయ ఆటంకమును తొలగించి, తనయందు కలుపుకొనును. బలమైన మాయ కల్పించు పరిస్థితులన్నిటిని అనుభవిస్తు, పట్టువదలక దేవునికొరకు ప్రయత్నించు వానిని దేవుడు ఒప్పుకొనును. దేవుడు ఒప్పుకొన్నపుడు మాయ వానిని ఆటంకపరచదు. అటువంటివాని యోగము యొక్క క్షేమమును దేవుడే పరిరక్షించును. అపుడు వాడు దేవునియందైక్యమై పోవును.
ప్రపంచములో మాయ కలుగజేయు అనేక కష్టములను అతిక్రమించి, దేవుని మార్గమును వదలని వానిని, దేవుడు తన మనిషిగ అంగీకరించును. అపుడు వెంటనే ప్రకృతియైన మాయ తాను కూడ వానిని ఒప్పుకొన్నదై వానికి ఆటంకము కలుగజేయదు. కావున పై పద్యమందు పతియొప్పిన సతి యొప్పునన్నారు. ఆ విధముగ పరమాత్మ, ప్రకృతి ఇద్దరు వానిపట్ల ఒకటై నడుచుకొన్నపుడు వాడు మోక్షము పొందును. దానినే పద్యమందు వ్యక్తపరుస్తు పతిసతులొకటైన పరమ పావనమందున్ అన్నారు. పతి, సతి ఇద్దరు ఒక మార్గమును నడచుకోవడము న్యాయమగును. పతికి సతి విరుద్ధముగ నడుచుకోవడము అన్యాయమగును. ప్రకృతి, పరమాత్మ భక్తునిపట్ల న్యాయమార్గమున చరించిన మోక్షము లభించును. కావున పై పద్యమందు పతి సతి న్యాయమే మోక్షము అన్నారు. పతి, సతి న్యాయముగ చరించినపుడు భక్తుడు వెంటనే జన్మరాహిత్యము పొందును. కనుక బతులిత పరమాత్మనైక్యమగురా అన్నారు.
ప్రపంచములో ఒక భక్తునిపట్ల భార్యాభర్తలైన ప్రకృతి పరమాత్మలు మొదట అన్యాయముగ ప్రవర్తించుదురని ఈ పద్యము ద్వారా వేమన మనకు తెలియజేసాడు. పతి ఒప్పినపుడే సతియు ఒప్పుకొని ఇద్దరు న్యాయముగ ప్రవర్తించుదురు. వారిద్దరు ఒకటై న్యాయముగ ప్రవర్తించి నపుడే భక్తునికి మోక్షము లభించును. మాయ ఆటంకములను ఓర్చుకోలేక నేనెంత భక్తిగ ఉన్న నాకే కష్టాలొస్తున్నవని, దేవుని వద్ద న్యాయము లేదను కొన్నవాడు దేవుని మార్గములో భ్రష్టుడగును. దేవుని గూర్చి ఏమి అనుకోక అన్నిటికి ఓర్చుకొన్నవాడు మొదట పరమాత్మచేత ఒప్పుదల పొంది ప్రకృతి, పరమాత్మలు న్యాయముగ ప్రవర్తించగ భక్తుడు మోక్షము పొందును.
పతి సతుల విధానము ప్రపంచములో ప్రతిబింబించి ఉన్నదని ముందే చెప్పుకొన్నాము. పతికి సతి వ్యతిరిక్తముగ నడుచుకొనుట, పతిని తన మాటవినునట్లు చేసుకొనుటైన అన్యాయవిధానము భూమి మీద కలదు. అట్లే పతికి, సతి అనుకూలముగ నడుచుకొనుట, పతిమాటయే తన మాటగ పతి చెప్పినట్లు సతి నడుచుకొను న్యాయమార్గము భూమి మీద గలదు. మీ అనుభవములో న్యాయ, అన్యాయ, పతి, సతులను గూర్చి తెలిసినట్లయితే ఎవరైన సంపూర్ణ జ్ఞానులుకాగలరు. దేవుని మార్గములో నడుచువారికి ఆటంకటములేర్పడిన, దేవుని దగ్గర న్యాయముందా? అని సహనము కోల్పోయి మాట్లాడరు. ఎన్ని కష్టములొచ్చిన ఇది తల్లియైన మాయపని అని ఎరుకగల్గి నడుచుకొందురు.
Next.
ఆర్గురు దొంగల బట్టుక
మార్గముననె కొట్టి యొకని మన్నింపదగు
దుర్గమ మిది తెలియంగా
నిర్గుణ రూపంబు తెలియు నిజముగ వేమా. 110
భావము:- శరీరములో కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మత్సరములను ఆరు చెడు గుణములు గలవు. ఈ ఆరు పాపము సంపాదించి పెట్టుచున్నవి. వీటికి విభిన్నముగ మంచి గుణములు ఆరుండుట వలన వీటికి చెడు పేరు కల్గినది. ఈ ఆరు గుణములు మనిషిలోని జ్ఞానమును హరింపజేయుచున్నవి. కావున వీటిని దొంగలతో సమానముగ పోల్చి చెప్పడమైనది. చెడు కల్గించు, జ్ఞానమును హరించు షట్ వర్గమైన గుణములను అణచివేయవలెనని వేమన తన పద్యమున చెప్పుచు ఆర్గురు దొంగల బట్టుక మార్గముననే కొట్టవలెనన్నాడు. ఆరు గుణములను అణచివేసి వాటితో సంబంధము పెట్టుకొన్న మనస్సును అణచివేయక, కేవలము గుణముల సంబంధమునుండి తొలగించి, మనస్సును శరీరము లోపలనున్న ఆత్మమీదికి లగ్నము చేయవలెను. శరీరమను దుర్గములో (కోటలో) దాగియున్న ఆత్మను తెలియవలెను. అట్లు తెలియుటవలన తర్వాత ఆకారములేని పరమాత్మను తప్పక తెలియవచ్చును. అనగా మోక్షము పొందవచ్చును. మనస్సును ఆత్మ మీద మళ్ళించుటకు ఆరు గుణములను అణచినట్లు, మనస్సును మాత్రము ఆత్మమీదికి మళ్ళించవలెను కావున ఒకని మన్నింప దగునని మనస్సుని గూర్చి చెప్పారు. శరీరమను కోటలో రహస్యముగనున్న ఆత్మను తెలియుట కష్టము కావున దుర్గమ మిది తెలియంగా అని ఆత్మను గూర్చి చెప్పారు. ఆత్మను తెలియుట వలన నిర్గుణము, నిరాకార మైన పరమాత్మను తెలియవచ్చును. కావున నిర్గుణ రూపంబు తెలియు నిజముగ అని వేమనయోగి ఈ పద్యములో తెలిపాడు.