till 100




అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
82. అల్లాహ్ అమితముగా క్షమించేవాడు, అమితముగా శిక్షించేవాడని తెలియవలెను. (15-49, 50)
(15-49,50) ''ఓ ప్రవక్తా! నేను అమితముగా క్షమించేవాడిననీ, అపారముగా కరుణించేవాడిననీ, నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని చెప్పు''

శరీరములో అల్లాహ్ కార్యకర్తగా యుండి ప్రతి చిన్న పనినీ, అలాగే ప్రతి పెద్ద పనినీ చేయుచున్నాడు. దేవుడు శరీరములో కార్యకర్తగా పనులు చేయుచున్నాడని జీవుడు తెలియక జరిగే పనులన్నిటికీ నేనే కర్తను అనుకోవడము వలన ఆ పనులను గురించి దేవుడు అంత్య దినమున అనగా ప్రళయము దినమున లేక మరణ దినమున ప్రశ్నించి తిరిగి జీవుడు పొరపాటున తాను చేశానని ఒప్పుకొన్న పనులన్నిటికీ తీర్పుతీర్చుచున్నాడు. ఆ తీర్పు ప్రకారము ఆత్మే జీవునికి అమితముగా శిక్ష వేయుచున్నాడు. శిక్ష వేయడమేకాక జీవుడు జ్ఞానిగా మారితే వాని కర్మలను కూడా అమితముగా క్షమించుచున్నాడు. ఆత్మ క్షమించే పనిని, శిక్షించే పనిని చేయుచున్నాడు.



అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
83. మీ దగ్గరున్నదంతా నశించేదే. అల్లాహ్ దగ్గరున్నది మాత్రము మిగిలి ఉండేది. (16-96)
మనుషులు తమకు బుద్ధి వచ్చినప్పటినుండి ప్రపంచ ధనము మీద శ్రద్ధను పెంచుకొందురు. అప్పటినుండి ధనము, బంగారు, వాహనములను చరాస్థిని, ఇల్లు, భూములు అను స్థిరాస్థులను సంపాదించుకొని నాకు ఇంత ధనమున్నదని, నావద్ద ఇన్ని స్థిరాస్థులు ఉన్నాయని అనుకొను చుందురు. అయితే అవన్నీ లేకుండాపోయేవని వాక్యములో చెప్పుచున్నారు చూడండి.

(16-96) ''మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. అల్లాహ్ వద్ద యున్నదే మిగిలి యుండేది. ఓర్పు వహించేవారికి మేము వారి సదాచరణలకు గాను మంచి ప్రతిఫలితమును తప్పక ఇస్తాము.''

మనిషి సంపాదించు స్థిర చరాస్థులు నశించేవని వాక్యములో చెప్పడమేకాక అల్లాహ్వద్ద (దేవునివద్ద) యున్నవే మిగిలి ఉండేవని చెప్పారు. నాస్తి అంటే లేదని, ఆస్తి అంటే ఉన్నట్లు కనిపిస్తు భ్రమను కల్పించేదియని పెద్దలు చెప్పుచుందురు. ఆ మాటప్రకారము ఎంత ఆస్తియున్నా అది అప్పటికి కనిపిస్తావున్నా, ఉన్నదను భ్రమ మాత్రమే. తర్వాత అదయినా పోతుంది లేక వాడయినా దానిని వదలిపోతాడు. లేనివానికి ఎటూ లేదు కాబట్టి అది పోయేదీ లేదు, వీడు పోయేదీ లేదు. అందువలన వాక్యములో మీవద్ద యున్నదంతా నశించేదియని అన్నారు. అయితే అల్లావద్ద యుండేది మాత్రమే చివరకు నీ వద్ద మిగిలి యుండేది అని చెప్పుచూ, అల్లాహ్ వద్ద యుండేదే మిగిలియుంటుంది అని చెప్పారు. దేవుని వద్ద యుండేది జ్ఞానధనము. జ్ఞాన ధనమును ఎవ్వరూ లాగుకొనరు. మనమే ఎవరికయినా ఇచ్చినా ఎంత ఇస్తే అంతవరకు చేకూరి ఉంటుంది. అందువలన ఎందరికి ఇచ్చినా వెలితిపడునది కాదు. జ్ఞానధనము మనిషి చనిపోతే వానివెంట పోవునదిగా ఉండును. జ్ఞాన ధనమును కొంత సంపాదించుకొన్నవాడు ప్రపంచ ధనము మీద ద్యాసను వదలి పూర్తి ద్యాసను జ్ఞానధనము మీదనే కేంద్రీకరించును. అందువలన జ్ఞానధనము మనిషికి తొందరగా చేకూరగలదు. ప్రపంచ ధనము కర్మనుబట్టి వచ్చునది కావున మనిషి ఎంత ఆశపడినా, ద్యాసనంతా దాని మీదనే పెట్టుకొనినా అది చేకూరునను నమ్మకము లేదు. కర్మనుబట్టి రాబడియుండును కనుక వచ్చే కర్మయుంటే వస్తుంది. రాని కర్మయుంటే ఎంత ప్రయత్నించినను రాదు. అదే జ్ఞాన ధనమునకు ఎంత సదాచరణయుంటే అంత ఎక్కువగా అది సమకూరగలదని వాక్యములో చెప్పారు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
84. విశ్వసించిన వారికి జ్ఞానము తెలియుటకు నీ ప్రభువు అల్లాహ్ వద్ద నుండి సత్యసమేతమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ (పరమాత్మ) పంపాడు. (16-102)
భూమిమీద బోధకులు అనేకులు గలరు. అట్లే బోధలు అనేకము గలవు. ఒక బోధకునికి మరొక బోధకునికి కొంచెమయినా వ్యత్యాసము కల్గిన బోధ ఉండును. ఇద్దరు ఒకే సిద్ధాంత బోధను చెప్పినా దానిలోనే ఎన్నో తేడాలతో చెప్పుచుందురు. మేథావులు అని చెప్పుకొను కొందరు మత పెద్దలు కూడా తమ మతమును ఉద్ధరించుటకు జ్ఞానమును మతములో కలిపి చెప్పుచుందురు. ఎక్కడయినా స్వచ్ఛమయిన దేవుని బోధ వుంది అనుటకు అవకాశమే లేదు. అలాంటప్పుడు దేవున్ని విశ్వసించిన వారికి సరైన బోధ దొరకదా?యను ప్రశ్నవస్తే 'దొరుకుతుంది' అను జవాబు వచ్చును. భూమిమీద అంతా కల్తీ బోధ అయినప్పుడు తన భక్తులకు దేవుడు (భగవంతుడు) వచ్చి సరియైన బోధను చెప్పునట్లు మూడవ ఆత్మయిన పరమాత్మ అనగా పరిశుద్ధాత్మ చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ నుండి వచ్చిన భగవంతుడు విశ్వాసులకు సరియైన బోధను అందించును. ఆ విషయమును అంతిమ దైవ గ్రంథములో సూరా 16, ఆయత్ 102 లో ఇలా చెప్పారు చూడండి.

(16-102) ఓ ప్రవక్తా! వారికి చెప్పు ''విశ్వసించిన వారికి నిలకడను ఒసగటానికి, ముస్లీమ్‍లకు సన్మార్గమును చూపడానికి, వారికి శుభవార్తను వినిపించటానికి, నీ ప్రభువు వద్దనుండి పరిశుద్ధాత్మ (జిబ్రయేల్) దీన్ని సత్యసమేతముగా అవతరింపజేశాడు.''

ఈ వాక్యములో పరిశుద్ధాత్మయన్నచోట బ్రాకెట్లో జిబ్రయేల్ అని వ్రాయడము జరిగినది. చాలా తెలుగు అనువాద గ్రంథములలో పరిశుద్ధాత్మయని వ్రాశారు. అయితే దాని ప్రక్కనే జిబ్రయేల్ అని వ్రాశారు. ఏదో ఒక గ్రంథములో పరిశుద్ధాత్మయని వ్రాసారు, ప్రక్కన ఏమీ పెట్టలేదు. మిగతా గ్రంథములన్నీ పరిశుద్ధాత్మయని వ్రాశారుగానీ దాని ప్రక్కనే జిబ్రయేల్ అని వ్రాయడము జరిగినది. పరిశుద్ధాత్మ అనగానే జిబ్రయేల్ మీదికి ద్యాస పోవడానికి కారణము పరిశుద్ధాత్మ అంటే ఎవరో ఖచ్చితమైన వివరము తెలియనప్పుడు వారికి అందరికీ తెలిసిన పేరు మతికి వచ్చినది. వాక్యములో నీ ప్రభువు వద్దనుండి అనగా దేవుని వద్దనుండి అను అర్థము సరిపోతుంది. నీ ప్రభువు వద్దనుండి పరిశుద్ధాత్మ దీన్ని సత్యసమేతముగా పంపాడు లేక అవతరింపజేశాడు అని అన్నప్పుడు అవతరింపజేయువాడు దేవుడు కదాయను మాటను మరచిపోయారు. సత్యసమేతముగా పంపాడు అని ఉంది. పంపాడు అనినా అవతరింపజేశాడు అనినా ఒకే భావమే అయినా పంపువాడు, అవతరింపజేయువాడు దేవుడుకాగా, దానిని మోసుకొని వచ్చినవాడు జిబ్రయేల్ అనడములో తప్పులేదు. అట్లు కాకుండా అవతరింప జేసినవాడు జిబ్రయేల్ అనడము పూర్తి తప్పుగా యున్నది. 'నీ ప్రభువు (నీ దేవుడు) వద్దనుండి వచ్చినది' అన్నప్పుడు అందరికీ దేవుని వద్దనుండి వచ్చినది అని తెలిసిపోయినది. అయితే ఎవరు పంపారు అను విషయములో అందరూ పొరపడి పోయారు. అక్కడ వాక్యములో స్పష్టముగా పరిశుద్ధాత్మ యని గలదు. పరిశుద్ధాత్మయను పదమును మొట్టమొదట సృష్ఠిని తయారు చేసిన మొదటి సృష్ఠికర్తయిన పరమాత్మకు ఆ పదమును వాడుదురు.

నేను ఇంతకుముందే చాలామార్లు చెప్పాను. భగవద్గీతలో ఆత్మ, పరమాత్మయని చెప్పబడిన దేవుళ్లు, బైబిలులో తండ్రి, పరిశుద్ధాత్మయని చెప్పారు. ఇలాగే ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరినీ అల్లాహ్యను ఒక పేరుతోనే పిలిచారు. అందులో ప్రజలకు దేవుడు ఆరాధ్య దైవము భగవద్గీతలో ఆత్మయని చెప్పబడినవాడు, బైబిలులో తండ్రియని చెప్పబడినవాడు, ఖుర్ఆన్‍లో అల్లాహ్ అని అంటున్నారు. ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరు అల్లాహ్‍లను మొదటి అల్లాహ్, రెండవ అల్లాహ్యని చెప్పవచ్చును. ఇప్పుడు ఈ వాక్యములో నీ ప్రభువు అన్నచోట అల్లాహ్ అనుమాట సరిపోతుంది. పరిశుద్ధాత్మయనుచోట మొదటి అల్లాహ్‍ను గుర్తుచేసుకోవలసినది పోయి బోధను మోసుకొని వచ్చినవాడు, దేవుని చేత సృష్ఠింపబడినవాడు అయిన జిబ్రయేల్‍ను చెప్పడము పూర్తి పొరపాటగును. సత్యసమేతముగా జ్ఞానమును తన ప్రతినిధియైన భగవంతుని ద్వారా పరమాత్మయను పెద్ద దేవుడు పంపాడు అని అర్థము చేసుకోవలసియున్నది.

మనిషి తనకు దేవుని జ్ఞానము కావాలని కోరుకొన్నప్పుడు దేవుడు తప్పకుండా జ్ఞానమును కలుగజేయవలసి యున్నది. సత్యసమేతమైన జ్ఞానమును అందివ్వవలసి యున్నది. దేవుని జ్ఞానమును దేవుడే చెప్పవలసి యుండగా, మూడవ ఆత్మగా యున్న పరమాత్మ లేక పరిశుద్ధాత్మ తన జ్ఞానము పూర్తి తన ప్రతినిధి ద్వారా తెలుపును. పరమాత్మ ప్రతినిధిగా వచ్చినవాడు భగవంతుడు యనబడును. పరమాత్మ మారువేషమునే భగవంతుడు యని అనవచ్చును. శరీరములోని ఆత్మ (దేవుడు) కర్మనుబట్టి ప్రవర్తించుచూ, శ్రద్ధనుబట్టి జ్ఞానమును తెలుపవలసియుండును. కర్మ పరిమితినిబట్టి, మనిషి శ్రద్ధనుబట్టి జ్ఞానమును పరిమితిగా తెలుపవలసి యున్నది. అయితే భగవంతునికి అటువంటి నియమములు ఏవీ లేవు. భగవంతుడు సత్యసమేతమైన జ్ఞానమును తెలిపిపోగా అది దేశానికంతటికీ ఉత్తమోత్త జ్ఞానముగా ఉండును. మనిషి బుద్ధినిబట్టి యోచించగలిగి తనకు కావలసినంత జ్ఞానమును తెలియవచ్చును. బయట మనిషి కర్మనుబట్టి జ్ఞానముండదు. మనిషి శ్రద్ధనుబట్టి జ్ఞానము తెలియుచుండును. పరమాత్మ లేక పరిశుద్ధాత్మ పంపిన సత్యసమేతమైన జ్ఞానమును నీకు ప్రభువైన భగవంతుని నుండి వచ్చుచుండును. భూమిమీద భగవంతుడు ఉన్నప్పుడు ఆయనను గుర్తించగలిగితే సులభముగా మోక్షము లభించగలదు. అలా గుర్తించుటకు సాధ్యమయ్యే పనికాదు. అయితే ఆయన చెప్పు బోధలనుబట్టి, ఆయన తెలుపు ధర్మములనుబట్టి ఫలానావాడు భగవంతుడు అని గుర్తించుటకు వీలుగలదు. అయినా మాయా ప్రపంచములో భగవంతున్ని గుర్తించుటకు వీలుపడదు. అందువలన పరమాత్మను చెప్పవలసిన చోట మనిషివలెయున్న గ్రహమైన జిబ్రయేల్‍ను చెప్పారు.

దీనికంతటికీ కారణము దేవుడు భగవద్గీతలో చెప్పినట్లు, బైబిలులో చెప్పినట్లు, ఖుర్ఆన్ గ్రంథములో ఇద్దరు దేవుళ్లకు వేరువేరు పేరు పెట్టకపోవడము వలన, ఇద్దరు దేవుళ్లను ఒకే పేరు అయిన అల్లాహ్యని పిలువడము వలన, వాక్యములో అల్లాహ్యని చెప్పిన చోటంతా ఒకే అల్లాహ్యని అందరూ అనుకొని పొరపడుట వలన ఇప్పుడు నీ ప్రభువు అయిన రెండవ ఆత్మయిన లేక భగవంతుడయిన దేవున్ని గుర్తించక, అట్లే పరిశుద్ధాత్మయని చెప్పినప్పుడు మూడవ ఆత్మయిన పెద్ద అల్లాహ్యని గుర్తించక అందరినీ ఒకటే అల్లాహ్యని లకూర గంపవలె చేసుకొని, ఇది ఫలానాదియని స్వచ్ఛముగా తెలియక పొరపాటు పడడము వలన మనిషికి ఆత్మ, పరమాత్మల జ్ఞానము, లేక తండ్రి, పరిశుద్ధాత్మల యొక్క జ్ఞానము, లేక అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క జ్ఞానము తెలియక అజ్ఞానములోనే కూరుకపోయాడు. మా యటువంటివారు ఇద్దరు దేవుళ్ల తారతమ్యమును చెప్పిన, మనిషి గ్రహించలేని స్థితిలో యున్నాడు. ఉన్నది ఒక దేవుడేయని మొండివాదన చేయుచున్నారు. ఆరాధ్య దైవము ప్రజల కందరికీ ఒక్కడేయను మాట వాస్తవమే అయినా, ఆయనను సృష్ఠించిన దేవుడు మరొకడున్నాడని చెప్పినా, దైవ గ్రంథములలోని మాటను కూడా వినడము లేదు. ముఖ్యముగా ముస్లీమ్‍లకు చెప్పడమేమనగా! ఈ వాక్యములో చెప్పిన 'నీ ప్రభువు దేవుడే', అట్లే 'పరిశుద్ధాత్మ దేవుడే'యని తెలియవలెను. జిబ్రయేల్‍కు పరిశుద్ధాత్మ యను పేరు వర్తించదు. జిబ్రయేల్ సాధారణ జీవాత్మయిన ఒక ఖగోళగ్రహము అని తెలియవలెను. ఆ గ్రహమును పూర్వము అందరూ సూర్యుడు అని అనెడివారు. సూర్యుని పేరునే ఖుర్ఆన్ గ్రంథములో జిబ్రయేల్ అన్నారు. ప్రథమ దైవగ్రంథములో ఇద్దరు దేవుళ్లను ఆత్మ, పరమాత్మ యని అన్నారు. ద్వితీయ దైవ గ్రంథములో ఇద్దరు దేవుళ్లను తండ్రి, పరిశుద్ధాత్మ యని అన్నారు. అంతిమ దైవ గ్రంథములో ఇద్దరినీ ఒకే పేరుతో పిలిచారు. ఇద్దరు దేవుళ్లను అల్లాహ్ మరియు అల్లాహ్ అని పిలువడము వలన ఎవరు ఏ దేవుడు అని తెలియక ఆరాధ్య దైవము ఒక్కడేయను మాట ఆధారముగా ఇద్దరు దేవుళ్లు లేరు, ఉన్నది ఒక్కడే దేవుడు ఆయనే అల్లాహ్ అంటున్నారు. అయితే ఖుర్ఆన్ గ్రంథములో పని చేయు అల్లాహ్ ఒకరు, పని చేయని అల్లాహ్ మరొకరు ఉన్నారని చెప్పినా, ఆ ఇద్దరి అల్లాహ్‍ల భేదమును తెలియక దేవుడు ఒక్కడేయని చెప్పుచూ, దేవునికి సంబంధించిన జ్ఞానములో పూర్తి వెనుకబడిపోయారు. మనిషి పూర్తిగా దేవునికి సంబంధించిన జ్ఞానము తెలియనంత వరకు పూర్తి జ్ఞాని కాలేడు. పరలోకమునకు పోలేడు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
85. విశ్వసించిన తర్వాత ఎవరయితే అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ప్రకటిస్తారో వారికి పెద్ద శిక్ష గలదు. (16-106)
(16-106) ''ఎవరయితే విశ్వసించిన తర్వాత అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతారో, ఎవరయినా హృదయపూర్వకముగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రము వారిమీద దైవాగ్రహము పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష వుంది.'' (అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్)

(16-106) ''ఎవడయితే విశ్వసించిన తర్వాత అల్లాహ్‍ను తిరస్కరిస్తాడో, ఎవడయితే హృయపూర్వకముగా సత్యతిరస్కారానికి పాల్పడుతాడో, అలాంటి వారిపై అల్లాహ్ ఆగ్రహము (కోపము) విరుచుకు పడుతుంది. వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంటుంది'' (దివ్య ఖుర్ఆన్ సందేశము)

దేవున్ని విశ్వసించినవాడు దేవుని జ్ఞానాన్ని తిరస్కరించవచ్చు గానీ, దేవున్ని తిరస్కరించలేడు. ఒకమారు దేవుని మీద విశ్వాసము పొందినవాడు ఏదయితే సత్యమైన జ్ఞానమున్నదో దానిని తిరస్కరించుటకు అవకాశము గలదు. ఎందుకనగా! దేవున్ని గురించి మాట్లాడు ప్రతివాడు దేవుని జ్ఞానమును ఒప్పుకోవడము లేదు. తాను దేవున్ని విశ్వసించినట్లే అసత్యమైన జ్ఞానమును విశ్వసించి, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు వ్యవహరించుచూ, సత్యసమేతమైన జ్ఞానమును తిరస్కరించుచూ, అది కాదు నేను చెప్పునదే సత్యము అని అనుచుందురు. అజ్ఞానియు కూడా దేవుడు ఉన్నాడని చెప్పుచున్నాడు. అయితే జ్ఞానులు చెప్పినట్లుగానీ, దేవుడు చెప్పినట్లుగానీ దేవున్ని గురించి ఒప్పుకోవడము లేదు. వారి అజ్ఞానము ప్రకారము ఎలా ఊహించుకొనివుంటే అలాగే ఉన్నాడని వాదించుచుందురు. ఉదాహరణకు దేవుడు ఒక్కడే ఉన్నాడనీ, దేవున్ని ఒక్కన్నే ఆరాధించవలెననీ చెప్పుచుందురు. అది వారికి తెలిసిన విధానము. అయితే వారికి తెలియని విధానము ప్రకారము, దేవుడు చెప్పిన సత్యసమేత జ్ఞానము ప్రకారము ఆరాధ్య దైవము ఒక్కడే అయినా, ఆరాధ్య దైవమును తయారు చేసిన దేవుడు, ఆరాధ్య దైవమునకు తండ్రియైన దేవుడు మరొకడున్నాడను సత్యమును పూర్తి తిరస్కరించుచుందురు.

మనిషికి తండ్రియైనవాడు దేవుడు. ఆయనే అందరికీ ఆరాధ్య దైవముగా యున్నాడు. ఆరాధ్యదైవముగా, అందరికి తండ్రిగాయున్న దేవుడు ఉండడము వాస్తవమే. అయితే తండ్రియైన దేవునికి తండ్రియైన దేవుడు కూడా ఉన్నాడను సత్యమును వారు పూర్తి తిరస్కరించుచుందురు. తండ్రి, తండ్రికి తండ్రియైన పరిశుద్ధాత్మను గురించి దైవ గ్రంథములో సంపూర్ణ సమాచారమున్నా, దానిని ఏమాత్రము ఒప్పుకోక సత్యతిరస్కారమునకు పాల్పడుచుందురు. మనిషి 'దేవుడు లేడనుట' అజ్ఞానము కాదు. దేవుడు ఉన్నాడని చెప్పుచూ తన బుద్ధికి తోచినట్లు చెప్పు జ్ఞానమునుబట్టి మనిషిని అజ్ఞాని అని అంటున్నాము. ప్రతి మనిషి దేవుడున్నాడని అంటూనే సత్యసమేతమైన జ్ఞానమును ఒప్పుకోక తిరస్కరించుచూ, తనకు తెలిసిన జ్ఞానమే అందరూ సమ్మతించవలెనని అంటున్నాడు. అప్పుడు వాని హృదయ పూర్వకముగా వాడు సత్యమును తిరస్కరించినట్లగును. ప్రార్థనామందిరము లలో యున్న బోధకులు సహితము అల్లాహ్ ఒక్కడేయని చెప్పుచూ, తాను అనుకున్న అల్లాహ్కంటే పెద్ద అల్లాహ్ ఉన్నాడను మాటను తిరస్కరించు చున్నారు. అప్పుడు ప్రథమ, ద్వితీయ దైవగ్రంథములలో చెప్పిన ఆత్మ, పరమాత్మలలో, మరియు తండ్రి, పరిశుద్ధాత్మలలో ఖుర్ఆన్‍లో చెప్పిన ఇద్దరు అల్లాహ్‍లలో ఒక్కరిని మాత్రము ఒప్పుకొని తమ జ్ఞానము ప్రకారము, తమకు తెలిసిన జ్ఞానము ప్రకారము దేవుడు ఒక్కడే ఇద్దరు లేరు అంటున్నారు. అప్పుడు మూడు దైవ గ్రంథములలో యున్న సత్యసమేతమైన జ్ఞానము ప్రకారమున్న పెద్ద దేవున్ని తిరస్కరించుచూ, ఆరాధ్య దైవమయిన చిన్న దేవున్ని మాత్రము ఒప్పుకొంటున్నారు. ఇదంతయూ గమనిస్తే బోధకులుగా యున్నవారు, దేవుడున్నాడనువారు తమకు తెలిసినదే జ్ఞానమనీ ఇతరులు చెప్పునది, దైవగ్రంథములలోనిది జ్ఞానము కాదను ధోరణిలో ఉండుట వలన వారు పూర్తి సత్యతిరస్కారులని చెప్పవచ్చును. అటువంటి వారిమీద దేవుని కోపము ఉండును. దేవుని కోపము వలన వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
86. వారు పరలోకముకన్నా ప్రాపంచిక విషయాన్నే ఎక్కువ ప్రేమించారు. అవిశ్వాసులకు అల్లాహ్ సన్మార్గము చూపడు. (16-107)
(16-107) ''ఎందుకంటే వారు పరలోకము కన్నా ప్రాపంచిక జీవితమునే ఎక్కువగా ప్రేమించారు. నిశ్చయముగా అల్లాహ్ అవిశ్వాసులకు సన్మార్గము చూపడు.''

ఈ వాక్యములో 'పరలోకము' అన్న పదము గలదు. పరలోకము అని చెప్పినమాటకు మోక్షము అని అర్థము. మనిషి ఇహలోకములో జన్మ తీసుకొని ఉండకుండా, పరలోకములో జనన మరణము లేకుండా ఉండ వచ్చును. పరలోకము అనగా ముక్తి, మోక్షము అని జన్మలు లేని స్థితియని చెప్పుట వాస్తవమైన విషయము. అయితే చాలామంది మనుషులకు పరలోకము అను జనన మరణ రహితమైన స్థితి ఒకటి కలదని వారికి తెలియదు. వారికి తెలిసినదంతా స్వర్గము. పరలోకము అంటే స్వర్గము అని అర్థము చేసుకొనువారు 90 శాతము ప్రజలు గలరు. చాలామంది దేవుని మీద విశ్వాసము ఉంటే దేవుడు తమను తీర్పుదినమున స్వర్గానికి పంపుతాడుయని నమ్ముచున్నారు. దేవుని విశ్వాసమునకు స్వర్గమునకు సంబంధము లేదని వారికి తెలియదు. అంతేకాక దేవుని మార్గములో దేవుని కొరకు పోట్లాడినా, యుద్ధము చేసినా, వారికి మరణము తర్వాత స్వర్గము వచ్చునని అనుకొని, దేవుని కొరకు పోరాడవలెనని తలచి, తమ మతము కాని వారందరూ దేవుని వ్యతిరేఖులని తలచి, ఇతర మతముల వారిని చంపడమే దేవుని మార్గములో పోరాడినట్లగునని, దానివలన చనిపోతే స్వర్గమునకు పోవచ్చునని, స్వర్గము కొరకు ఆశపడి ఉగ్రవాద చర్యలు చేయుచూ ఇతర మతస్థులను పీడించి వేధించువారు కూడా కలరు. వారి దృష్ఠిలో స్వర్గమును మించినది లేదని, అన్ని సుఖములు స్వర్గము ద్వారా లభించునని స్వర్గము కొరకు దుర్మార్గము చర్యలను కూడా మంచివేయని చేయుచున్నారు.

దేవుని విద్యను బ్రహ్మవిద్యయని అంటారు. బ్రహ్మవిద్య అనగా పెద్దవిద్య యని అర్థము. పెద్ద విద్యయిన దేవుని విద్యలో స్వర్గము వేరు, పరలోకము వేరు. స్వర్గమునకు పరలోకమునకు తూర్పు పడమరకు వ్యత్యాసమున్నట్లు వ్యత్యాసము కలదు. మనిషి జీవితములో పాపమును సంపాదించుకొంటే తర్వాత జీవితములో పాపమునకు ఫలితముగా నరకమును అనుభవించవలసియుండును. అట్లుకాకుండా జీవితములో పుణ్యమును సంపాదించుకొంటే స్వర్గమును అనుభవించును. స్వర్గము అనగా సుఖములను అనుభవించుట, నరకము అనగా కష్టములను అనుభవించుట. మనిషి ఎక్కడ, ఎప్పుడు సుఖమును అనుభవించుచుండినా అక్కడ అప్పుడు అతను స్వర్గమును అనుభవించుచున్నాడని చెప్పవచ్చును. అట్లే మనిషి ఎప్పుడు ఎక్కడ దుఃఖమును అనుభవించుచుండినా అక్కడ అప్పుడు అతను నరకమును అనుభవించుచున్నాడని చెప్పవచ్చును. దీనినిబట్టి స్వర్గ, నరకములు ప్రత్యేకమయిన లోకములు కావుయనీ, భూమి మీదనే స్వర్గము, నరకము రెండూకలవని తెలియుచున్నది. స్వర్గములో సుఖములున్నవని గ్రంథములో వ్రాసియుండుట నిజమే. అయితే స్వర్గము భూమిమీద లేదని అక్కడ చెప్పలేదు కదా! స్వర్గమును 15 నిమిషములు అనుభవించిన మనిషి దాని తర్వాత నరకమును కూడా అదే స్థలములో అనుభవించవలసియుండును. 15 నిమిషముల స్వర్గము తర్వాత తేలుకుట్టి దాదాపు గంటసేపు నరకమును అనుభవింపవలసి యుండును. అప్పుడు స్వర్గము తర్వాత నరకము అనుభవానికి వచ్చినది. దీనినిబట్టి మనిషి నివశించు భూలోకములోనే స్వర్గము, నరకము రెండూ ఉన్నట్లు తెలియుచున్నది.

ఇక పరలోక విషయానికి వస్తే అది స్వర్గ నరకములవలె కనిపించునది కాదు. మనిషి చనిపోయిన తర్వాత తిరిగి పుట్టకుండాపోతే వాడు పరలోకమునకు పోయినట్లు చెప్పుచుందురు. పరలోకప్రాప్తి చెందాడు అంటే వాడు మోక్షమును పొందాడుయని అర్థము. లోకము అనగా మనిషి గుణములతో నివశించునది లేక అనుభవించునదియని అర్థము. దీని భావము ప్రకారము చనిపోయిన మనిషి గుణరహితునిగా తయారయితే వాడు లోకములో లేనట్లేయగును. మనుషులు నివశించుదానిని లోకము అని అంటున్నాము. ఈ లోకము అందరికీ తెలియునదిగా ఉన్నది. లోకముకంటే వేరయిన నివాసస్థలమును పరలోకము అని అనవచ్చును. లోకము కాని లోకము, లోకముకంటే వేరయిన లోకము పరలోకము. పరలోకము స్వర్గనరకములకు భిన్నమైనది. లోకముకంటే వేరయినది. చాలామందికి పరలోకము ఉన్నదను విషయమే తెలియదు. దేవున్ని ఆరాధిస్తే స్వర్గము వస్తుందనీ, ఆరాధించనివారికి నరకము వస్తుందనీ అంటున్నారు. అయితే దేవుని ఆరాధనకు స్వర్గమునకు ఏమాత్రమూ సంబంధము లేదు. మనిషి మంచి పనులు చేస్తే పుణ్యము వచ్చును. ఆ పుణ్యము వలన తర్వాత జన్మలో స్వర్గ సుఖములు లభ్యమగును. అంతేగానీ స్వర్గమునకు దేవుని ఆరాధనకు ఎంతమాత్రమూ సంబంధము లేదు.

నేడు మనిషి అయినవాడు ప్రాపంచిక సుఖముల కొరకే ప్రాకులాడు చున్నాడుగానీ, పరలోకము కొరకు ప్రయత్నించలేదు. అయితే దేవుడు అవిశ్వాస జనులకు స్వర్గ, నరకములను ఇస్తూ, పరలోకమునకు దూరము చేయుచున్నాడు. పరలోకము అనునది ఉందని కొందరికి చెప్పితే అది స్వర్గముకంటే చిన్నదనో లేక అది మనిషికి అవసరము లేదనో చెప్పు చుందురు. పరలోకము మీద విశ్వాసము లేనివారు దేవుని మీద విశ్వాసముంచినా, వానికి పరలోకము లభించదు. స్వర్గ నరకములను ఎంతకాలము అనుభవించినా చివరకు మనిషి దేవునియందు చేరి పరలోకమును పొందవలసినదే. పరలోకము మీద విశ్వాసము లేనివానికి దేవుడు పరలోకము అంటే ఏమిటో తెలియకుండా చేయును. దేవుడు అవిశ్వాసులకు దైవజ్ఞానమును ఇవ్వడు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
87. దేవుడు వారి హృదయాలపై, వారి చెవులపై, వారి కళ్లపై ముద్ర వేశాడు. (16-108)
(16-108) ''వారి హృదయాలపై వారి చెవులపై, వారి కళ్లపై అల్లాహ్ ముద్రవేశాడు. పరద్యానానికి గురయినవారంటే వీరే.''

మనిషికి చెవులు, కళ్లు బయట విషయములను తెలియజేయును. దేవుని ధర్మములు జ్ఞానబోధల రూపములో ఉండును. బోధకుడు లేక గురువు జ్ఞానబోధలను చెప్పితే కళ్లు బోధకున్ని చూస్తే, చెవులు బోధకుడు చెప్పు మాటలను వినగలుగును. కళ్లు, చెవులు పనిచేయగా బయట చెప్పు జ్ఞానము లోపలి బుద్ధికి చేరును. బుద్ధి జీవునితోపాటు బ్రహ్మనాడిని అంటుకొనియున్న గుణచక్రములో ఉండును. బ్రహ్మనాడిలోనే ఆత్మకూడా యుండును. హృదయము అను బ్రహ్మనాడిలో యున్న బుద్ధికి జ్ఞానము తెలియవలసియుండును. అయితే అవిశ్వాసులు దేవుడనే వానిని విశ్వసిస్తున్నాము అని దేవుని జ్ఞానమును విశ్వసించరు. అటువంటి వారికి గురువు జ్ఞానబోధ చెప్పినా, వారిలోనికి అది వినిపించినా బుద్ధి గ్రహించదు. దైవ గ్రంథములోని జ్ఞానమును సక్రమముగా గ్రహించక తమకు తెలిసినదే జ్ఞానమనుచూ దైవజ్ఞానమును తిరస్కరించువారికి దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పినా ఆ బోధ వాడు వినడు, వినినా వాని బుద్ధి గ్రహించదు. అందువలన దేవుడు వాని కళ్లను, చెవులను మూసివేసి ఎవరూ తెరవని విధముగా అనగా ఎవరు చెప్పినా అర్థముకాని విధముగా ముద్రవేసి మూసివేశాడు. వాని హృదయము కూడా మూసివేయబడియుండుట చేత వాని బుద్ధికి జ్ఞానము ఏమాత్రమూ చేరదు. ప్రపంచ ద్యాసలో ఉన్నవారు వీరే యని చెప్పవచ్చును.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
88. ఆ రోజు ప్రతి ఒక్కడు తన ఆత్మరక్షణ కోసము వస్తాడు. అప్పుడు వారు చేసుకొన్న కర్మల ఫలితమును ఇవ్వబడుతుంది. ఎవరికీ అన్యాయము జరుగదు. (16-111)
(16-111) ''ఆ రోజు ప్రతి ఒక్కడు తన ఆత్మరక్షణ కోసము వాదు లాడుతూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ అతను చేసుకొన్న కర్మల ప్రతిఫలమంతా ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయము జరుగదు.''

ఈ ఆయత్‍లో 'ఆ రోజు' అని చెప్పాడు. అది ఏ రోజో ముందు తెలియగలిగితే తర్వాత తెలుసుకోవలసిన విషయము సులభముగా అర్థము కాగలదు. మనిషికి ముఖ్యమైనవి రెండు దినములు కలవు. ఆ రెండు దినములు చాలా ముఖ్యమైనవి. ఎందుకనగా! జీవితము ప్రారంభమయ్యే దినము, అట్లే జీవితము అంత్యమయ్యే దినము. ఇవి ప్రతి మనిషికి రెండు దినములు ఉన్నట్లు తెలియుచున్నది. అయితే మా లెక్కలో రెండు దినములను కలిపి ఒక్క దినముగా చెప్పుచున్నాము. జీవితము ప్రారంభమయ్యే దినము మనిషి పుట్టిన దినము. మనిషి జీవితమునకు చివరి రోజు మరణ దినము. అయితే ఈ రెండు దినములు మనిషికి ఎంత ముఖ్యమైనవి అయినా మనిషి పుట్టిన రోజుగానీ, మనిషి చనిపోయిన రోజుగానీ ఎవరికీ జ్ఞాపకము ఉండదు. ఇది నా పుట్టిన రోజు అని ఈ రోజు చెప్పినా పుట్టినప్పుడు నీకుగానీ, ఎవరికిగానీ జ్ఞాపకము ఉండదు. అట్లే చనిపోయిన రోజు కూడా చనిపోయిన సమయములో ఎవరికీ జ్ఞాపకముండదు. అందువలన పుట్టుకలో గానీ, చావులోగానీ మనిషి అనుభవము ఎట్లున్నదీ ఎవరూ చెప్పలేరు. ఇంకా వివరముగా చెప్పితే పుట్టుకగానీ, చావుగానీ ఎవరి అనుభవములో లేదాయని ప్రశ్నించి చూస్తే అప్పుడు పుట్టిన సమయమును, చనిపోయిన సమయమును జీవుడు అనుభవించియుండును. అయితే అప్పటి అనుభవమును చెప్పుటకు ఆ రెండు సమయములు ఎవరికీ జ్ఞాపకముండవు, ఎందుకనగా! పుట్టిన సమయములో మనస్సు ఉండినా, అది జ్ఞాపకము పెట్టుకొని తర్వాత చెప్పేంత శక్తి దానికి లేదు. పుట్టిన శిశు శరీరములోని మనస్సు కూడా శిశు దశలోనే ఉండును. దానికి జ్ఞాపకము పెట్టుకొను స్థోమత లేనిదిగా ఉండును. అందువలన పుట్టిన దినముగానీ, పుట్టిన తర్వాత రెండు మూడు సంవత్సరముల వరకుగానీ మనస్సుకు మననము చేయు శక్తి ఉండదు.

పుట్టుకలో మననము చేయు స్థోమత లేని మనస్సు మరణములో పూర్తిగా నాశనము చెందుచున్నది. అందువలన మరణము తర్వాత మరణములో ఏమి జరిగినది తెలియుటకు అవకాశము లేదు. జరిగిపోయిన విషయములను తెలియజేయు మనస్సు మరణములో లేకుండా నశించి పోవడము వలన మరణ సమయ అనుభవమును తెలియుటకు అవకాశమే లేదు. ఈ విధముగా పుట్టుకను గురించిగానీ, మరణమును గురించి గానీ ఏ మనిషి తెలియుటకు అవకాశము లేదు. అందువలన ఆ రోజు ఈ రోజు మనవెంట యున్న ఆత్మ తెలియజేస్తేనే అప్పటి విషయములు ఇప్పుడు తెలియగలవు. మరణ సమయములో ఒక సెకను కాలములో పదవవంతు కాలములోనే తర్వాత జన్మకు కావలసిన 'కర్మ నిర్ణయము' అను తీర్పును ఆత్మ తీర్చి రెండవ జన్మకు పంపుచున్నది. అంత తక్కువ కాలములో మనిషి పుట్టినప్పటి నుండి చనిపోవువరకు చేసిన పాపపుణ్యములన్నియూ లెక్కించి, తగిన విధముగా తీర్పు చేయబడును. మనకు తెలిసినంతవరకు ఒక సెకను కాలములో మరీ తక్కువ పదవవంతు కాలములోనే తీర్పులన్నియూ తీర్చబడును. అయితే మనకు తెలియని విషయము ఏమనగా!

మరణములో తీర్పు జరుగు కాలము జీవునికి ఒక దినమంతయూ జరిగినట్లు కనిపించుచుండును. మనకు బయట సెకను కాలము కూడా పట్టని కొద్ది సమయము లోపల జీవునికి ఎక్కువ సమయముగా (ఒక దినముగా) తీర్పు జరిగినట్లు తెలియుచుండును. అప్పుడు ప్రతి మనిషి చేసుకొన్న ప్రతి పాపము వానికి తెలియాలను ఉద్దేశ్యముతో దేవుడు అలా తెలియు అవకాశమును ఇచ్చాడు. అప్పుడు జీవుడు తన రక్షణకోసము అది తప్పుకాదు, ఇది పాపము కాదుయని తీర్పు చేయు ఆత్మతో (దేవునితో) అడుగుచుండును. అయినా అతనికి ఆత్మ ఏమీ జవాబు చెప్పక వాడు చేసుకొన్న కర్మల ఫలితము అంతా వానిని చూచుకోమని ఇవ్వబడుతుంది. కర్మల నిర్ణయములో ఎవరికీ ఎలాంటి అన్యాయము జరుగకుండా అన్నీ జీవునికి చూపి కర్మల ప్రకారమే నిర్ణయము చేయడము జరుగుతుంది. కర్మల నిర్ణయము చేయువాడు రెండవ ఆత్మయిన దేవుడు. మూడవ ఆత్మయిన దేవుడు ఏమీ చేయక అన్నీ చూస్తూయుండును. అందరికీ ఆరాధ్య దైవమయిన ఆత్మకు 'తీర్పు తీర్చు అధికారమును', 'మృతులను తిరిగి జన్మలకు పంపు అధికారమును' మూడవ ఆత్మయిన పరమాత్మ రెండవ ఆత్మయిన దేవునికి ఇచ్చియుండును. అందువలన పరమాత్మ సమక్షములో ఆత్మ ఎవరికీ అన్యాయము జరుగకుండా తీర్పును తీర్చును.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
89. మనిషి యొక్క ఆహార విషయము. (16-114,115, 116)
(16-114, 115, 116) ''మీరు అల్లాహ్‍ను మాత్రమే ఆరాధించే వారయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారమును తినండి. అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞత చూపండి.'' (115) ''నిశ్చయముగా ఆయన చచ్చిన పశువు, రక్తము, పందిమాంసము, అల్లాహ్ పేరుమీదకాక ఇతర దేవతల పేర్లు ఉచ్ఛరించబడినవి మీకు నిషేధించాడు. అయితే ఎవరయినా ఇష్టముతో కాకుండా అల్లాహ్ చెప్పిన దానిని మితిమీరిపోయే ఉద్దేశ్యము లేకుండా, గత్యంతరము లేని పరిస్థితిలో తిన్నట్లయితే దానిని అల్లాహ్ క్షమిస్తాడు.'' (116) ''ఏ వస్తువయినా తమ నోటితో ఇది ధర్మసమ్మతమనీ, ఇది నిషిద్ధమనీ ఇష్టమొచ్చినట్లు అబద్దము చెప్పేసి, అల్లాహ్‍కు అబద్దాలు ఆపాదించకండి. అల్లాహ్‍కు అబద్దాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని (పర లోకమును) పొందలేరు.''

ఈ మూడు ఆయత్‍లలో (వాక్యములలో) చెప్పిన విషయమును చూచి అంతో ఇంతో జ్ఞానులు అయినవారు సహితము పొరపాటు పడే అవకాశము ఉన్నది. ఇంతవరకు ఈ వాక్యములను చదివినవారు అందరూ తప్పులో కాలువేసి, తప్పుగా అర్థము చేసుకోవడము జరుగుచున్నది. స్వయముగా దేవుడు చెప్పిన మాటలను తప్పుగా అర్థము చేసుకొని, అదే రీతిలో ఆహార నియమములు పాటిస్తున్నారు. దేవుడు చెప్పునది ఏదయినా ధర్మ సంబంధ జ్ఞానమునే చెప్పును తప్ప, ప్రపంచ సంబంధ పనులను గురించి చెప్పడు అను దేవుని ప్రథమ సూత్రమును ఎవరూ మరచిపోకూడదు. బాగా గమనించితే ఈ వాక్యములో మొదటనే 114వ వాక్యములో ధర్మ సమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారమును గురించి ఆత్మయిన దేవుడు చెప్పియున్నాడు. తర్వాత 116వ వాక్యములో కూడా ఇది నిషిద్ధమనీ, ఇది ధర్మ సమ్మతమనీ మీ ఇష్టమొచ్చినట్లు మీరు నిర్ణయము చేసుకొన్న వాటిని నేను చెప్పానని, నా మీద ఆపాదించవద్దండి అనికూడా చెప్పాడు. 114లో ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారమును తినండియని చెప్పాడుగానీ, ఇది ధర్మసమ్మతమైనదనీ, ఇది కాదనీ చెప్పలేదు. ఒకవేళ మీరు అట్లు దేవుడు చెప్పాడని చెప్పితే, అబద్దాలు దేవుని మీద ఆపాదించినట్లేయని కూడా చెప్పాడు. అటువంటప్పుడు ఎంతో జాగ్రత్తగా దేవుడు ఏమి చెప్పాడని చూడాలి తప్ప, మనుషులకు తోచినది ధర్మసమ్మతమని, ధర్మసమ్మతము కానిదని చెప్పకూడదు.

పూర్వము ఒక యోగి తన అనుభవ జ్ఞానమును పద్య రూపములో చెప్పాడు. ఆయన చెప్పినది విని ప్రజలు తాను ఆచరించినట్లే ఆచరించ వలెనను ఉద్దేశ్యముతో పద్యమును చెప్పాడు. ఈ పద్యము మా రచనలలోని ''నిగూఢ తత్త్వార్థ బోధిని'' అను గ్రంథములో గలదు.

పద్యము :- కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు
పందిని తిన్నవాడు పరమయోగి
ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానో
విశ్వదాభిరామ వినురవేమా.

ఈ పద్యములో పైకి కనిపించు అర్థము ఒక విధముగాయున్నా, దానిలోపల నిగూఢముగా ఇమిడియున్న అర్థము మరొక విధముగా యున్నది. లోపల నిగూఢముగా యున్న అర్థము కొద్దిమందికి మాత్రమే తెలుసు, అయితే బయటికి కనిపించు అర్థము అందరికీ తెలుసు. లోపలి సూక్ష్మ అర్థము అందరికీ తెలియకూడదు, జ్ఞానము కోసము శ్రమించు వారికే తెలియాలను ఉద్దేశ్యముతో వేమనయోగి గారు తన జ్ఞానమునంతయూ నిగూఢముగా పద్యములలో ఇమిడ్చి చెప్పాడు. శ్రద్ధలేనివానికి జ్ఞానము తెలియకూడదని, శ్రద్ధయున్నవానికే జ్ఞానము తెలియునని చెప్పిన దేవుని వాక్యమును అనుసరించి, వేమన తాను ప్రజలకు చెప్పిన హితబోధ అయిన జ్ఞానమునంతటిని ఎవరికీ సులభముగా అర్థముకాని విధముగా, పైకి ఒక రకము, లోపల మరొక రకమైన అర్థము ఉండేటట్లు పద్యమును సమకూర్చాడు. వేమన చెప్పినది గొప్ప జ్ఞానమే అయినా అది బాహ్యార్థముగా ఒక రకముగా, అంతరార్థముగా మరొక రకముగా యుండును. ఆ విధముగా వ్రాయుట చాలా కష్టమైన పనియే అయినా, శ్రమించి అలా వ్రాశారు. శ్రద్ధయున్న వానికే జ్ఞానము తెలియవలెననీ, శ్రద్ధ లేనివారికి దేవుని జ్ఞానము లభించకూడదని, సులభముగా తెలియబడు జ్ఞానమునకు ప్రజలు విలువనివ్వరని, కష్టపడి యోచన చేయువారికే జ్ఞానము తెలియునట్లు ఆ విధముగా పద్యరూపములో వేమనయోగి చెప్పాడు. ఈ పద్యమును చదివిన కొందరు తమకు ఇష్టమొచ్చినట్లు ఊహించుకొని, పద్యములోని నిగూఢమైన భావమును వదలి, బయట భావమును తెలిసి అదే విధముగా ఇతరులకు చెప్పడము, వినకపోతే వారితో వాదించడము చేసెడివారు.

అటువంటి మనుషులు ముగ్గురు ఈ పద్యమును చూచి అందులో ఒకరు నేను గురువును కావాలనుకొన్నాడట. రెండవవాడు గొప్పయోగి కావాలనుకొన్నాడట, మూడవవాడు మంచి సుజ్ఞాని కావాలనుకొన్నాడట. ముగ్గురి ఉద్దేశ్యము మంచిదే. అయితే గురువు కావాలనుకొన్నవాడు కుక్క మాంసమును తినేదానికి మొదలుపెట్టాడు. అది చూచిన కొందరు అతనిని విమర్శించగా ఇది మహాయోగి అయిన వేమన యోగి చెప్పిన విధానము అని చెప్పాడట. అట్లే గొప్పయోగి కావాలనుకొన్న రెండవవాడు పంది మాంసమును తినేదానికి మొదలు పెట్టాడు. ఇక మూడవవాడు సుజ్ఞాని కావాలని ఏనుగు మాంసమును తినేదానికి మొదలు పెట్టాడు. ఎవరయినా అడిగితే దానికి వేమనయోగి చెప్పిన జ్ఞాన సూత్రమని చెప్పేవారు. ఇదంతయూ గమనించిన వేమనయోగి ఆత్మ, దేవుని ఆజ్ఞతో వచ్చి ఇంకొక మనిషిలో దూరి, ఆ ముగ్గురితో సంభాషించినాడట. ఆ సంభాషణ ఎలాగున్నదో మీరు జ్ఞానులగుటకు నేను కల్పించి వ్రాయునది చూడండి. వేమనయోగి పాత్రలో నేనే ప్రశ్నలను అడుగుచున్నానని తెలియండి. ఈ సంభాషణ తెలియగలిగితే ఖుర్ఆన్‍లో 16-114, 115, 116 ఆయత్‍లకు సులభముగా అర్థము తెలియును.

వేమన :- మీకు నా పద్యము తప్పుగా అర్థమయినదని అనుకొంటున్నాను.

ప్రజలు :- అట్లేమీ లేదు. మీరు ఎలా చెప్పారో అలాగే అర్థమయినది, అలాగే ఆచరించుచున్నాము.

వేమన :- నేను మనుషులకు దైవజ్ఞానమును నిగూఢముగా చెప్పాలను కొన్నాను, అలాగే చెప్పాను. అయితే మీరు ఇలా అర్థము చేసుకుంటారని నేను కలలో కూడా ఊహించలేదు.

ప్రజలు :-మీరు చెప్పిన దానికి విలువనిచ్చి మీరు చెప్పినట్లే చేయుచున్నాము కదా! ఇందులో మీరు ఊహించనిది ఏమి గలదు?

వేమన :- నేను దైవజ్ఞానమునే బోధించాను. ప్రపంచ జ్ఞానమును బోధించలేదు. దేవుని జ్ఞానమును దేవుడు చెప్పిన పద్ధతిలో చెప్పవలెనని, చెప్పవలసిన సత్యమును నిగూఢముగా చెప్పాను. దేవుని జ్ఞానము ప్రపంచ విషయములకు అతీతముగా ఉంటుంది. ప్రపంచ విషయములతో సంబంధము లేనిదిగా ఉంటుంది. దేవుడు చెప్పినా తన ధర్మములకు సంబంధించిన జ్ఞానమునే చెప్పునుగానీ, ప్రపంచ విషయములను చెప్పడు కదా! మీరు దేవుని విషయమనుకొని ప్రపంచ విషయమైన తిండి (ఆహార) విషయమును అర్థము చేసుకొన్నారు. అది తప్పు.

ప్రజలు :- మీరు చెప్పినదే మేము చేస్తున్నాము తప్ప వేరు చేయలేదు కదా! చెప్పేదంతా చెప్పి ఇప్పుడు మమ్ములను తప్పు అనడములో మీ ఉద్దేశ్యమేమో మాకు తెలియలేదు. మేము దేవుని మీద విశ్వాసముతో గురువు కావాలనుకొన్నాము, యోగి కావాలనుకొన్నాము మరియు సుజ్ఞానిగా మారాలనుకొన్నాము. మా ఉద్దేశ్యము తప్పా, మేము కోరుకొన్నది దైవికమయిన విధానమునే కదా! మాకు దేవుని మీద విశ్వాసమున్నది, కావున మాకు ఇష్టమున్నా లేకపోయినా మీరు చెప్పినవే కష్టపడి తింటున్నాము. నాకు కోడికూర అంటే ఇష్టము, అయినా కష్టపడి కుక్కకూర తింటున్నాను. అట్లే మిగతా ఇద్దరికి పొట్లికూర అంటే ఇష్టము అయినా మా ఇష్టములను ప్రక్కన పెట్టి మేము యోగులము, జ్ఞానులము కావాలని పందికూరను, ఏనుగుకూరను తింటున్నాము. ఇప్పుడు మమ్ములను చూచి ఓర్చుకోలేక మీరు అలా అంటున్నారు.

వేమన :-నేను చెప్పిన పద్యము సత్యమే. మీరు అర్థము చేసుకొన్న భావము అసత్యమైనది. నేను ఎప్పుడు చెప్పినా దైవ ధర్మమునే చెప్పుదును గానీ ప్రపంచ విషయమును చెప్పను. మీరు తినే ఆహార విషయములన్నీ ప్రపంచ సంబంధమైనవగును. దైవ ధర్మములతో స్థూల ఆహారము ఉండదు, సూక్ష్మ ఆహారముండును. నేను చెప్పినది ధర్మయుక్తమైన, పవిత్ర మైన ఆహారమును చెప్పానుగానీ, అధర్మయుక్తమైన ప్రపంచ ఆహారమును చెప్పలేదు. మీ ఇష్టమొచ్చిన దానిని మీరు ఆచరించుచూ, మీరు ఇదే చెప్పారని అబద్దమును నా మీద ఆరోపించవద్దండి.

ప్రజలు :- అయితే మీరు చెప్పిందే మేము చేస్తున్నామా? మీరు చెప్పనిది చేస్తున్నామా?

వేమన :-నేను చెప్పింది చేస్తున్నామని మీరు అనుకొంటున్నారు. అయితే మీరు అనుకొన్నది నేను చెప్పలేదు. దాని పోలిక చెప్పాను. కుక్క యొక్క పోలికను చెప్పానుగానీ, కుక్కను తినమని చెప్పలేదు. కుక్కను తిన్నవాడు గురువు అని అన్నాను. అది నా మాటలలో పోలికయే గానీ స్థూలముగా యున్న కుక్కను తినమని చెప్పలేదు. ఒకవేళ ఎవరయినా కుక్కను తిన్నా వానిలో గురువు లక్ష్యణములు రావు.

ప్రజలు :- మీరు చెప్పినది చేయాలని చేశాము, మీరు ఇప్పుడు అది పోలిక మాత్రమే వాస్తవము కాదు అని అంటున్నారు. ఇప్పుడు మేము ఏమి చేయాలి? దేశములో మేమే పొరపడినామా, మాలాగా ఇంకా ఎవరయినా పొరపడినారా?

వేమన :- మీలాగా పొరపడినవారు చాలామంది యున్నారు. వారి విషయములో నేను ఏమి చెప్పుచున్నానో మీరు సావధానముగా వింటే మీకు స్వచ్ఛమయిన జ్ఞానము, నిగూఢమైన జ్ఞానము తెలియగలదు. అందువలన శ్రద్ధగా వినండి. ఈ విషయమును ఈ గ్రంథ రచయిత చెప్పును చూడండి. ఈ విధముగా వారి సంభాషణ జరుగగా! ఈ గ్రంథములో ఏమి వ్రాయుచున్నారో యని వారు కూడా శ్రద్ధగా చూడను మొదలు పెట్టగా మేము ఈ విధముగా చెప్పుచున్నాము చూడండి.

పద్యము యొక్క భావము :- మన శరీరములో మనస్సు కుక్కవలె అతిచంచలమైనది. ఒక్క క్షణము కూడా స్థిరముగా ఉండక కుక్క ఇల్లిల్లూ తిరిగినట్లు మనస్సు కూడా అనేక విషయముల మీదికి చరించుచుండును. కుక్క మాదిరి చంచలమైన మనస్సును ఎవడు జయించునో వాడు నిజముగా గురువుతో సమానమే. గురువు మనస్సు జయించి ఉన్నవాడను విషయమును 'కుక్కను తిన్నవాడు గురులింగడని' పోలికతో పై పద్యములో చెప్పారు.

మనస్సు చంచలమైనదియేకాక పరమ నీచమైన విషయముల మీదికి కూడా పోవుచుండును. అందువలన దీనిని పందితో సమానముగా పోల్చి దానిని జయించినచో పరమయోగి అని తెల్పుచూ 'పందిని తిన్నవాడు పరమ యోగి' అని వర్ణించారు.

మనస్సు చంచలమైనది, నీచమైనదియేకాక దృఢ (బల) మైనదిగా కూడా ఉన్నది. దానిని జయించవలయునని ప్రయత్నము చేసినవారికి సులభముగా లొంగదు. ఎంత బలముగా మనస్సును నిలుపవలయునని ప్రయత్నము చేసినా, అది బలమైనది కనుక నిలువక పోవుచునే ఉండును. ప్రయత్నమను పగ్గములకు నిలబడక మనలను సులభముగా లాగుకొని పోవు మనస్సు బలమైనదిగా వర్ణించుచూ దానిని ఏనుగుగా పోల్చి చెప్పినారు. అటువంటి బలమైన మనస్సును జయించినవాడు సుజ్ఞాని అని చెప్పుచూ 'ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానో' అని పోల్చి అన్నారు.

మనస్సు చంచలమైనది కనుక కుక్కగను, నీచమైనది కనుక పందిగను, బలమైనది కనుక ఏనుగుగా వర్ణించి దానిని జయించుటను 'తిని లేకుండా చేయడమని' లెక్కించి చెప్పారు.

ఈ పద్య భావములో చెప్పినట్లే ఖుర్ఆన్ వాక్యములో కూడా చెప్పారు. వాక్యములో 'ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారము తినండి' అని ఉన్నది. దానికంటే ముందు 'మీరు అల్లాహ్‍ను మాత్రమే ఆరాధించే వారయితే' అని కూడా చెప్పియున్నారు. దేవున్ని ఒక్కనినే ఆరాధించే వారయితే కొంతవరకు దేవుని జ్ఞానమును తెలిసినవారై ఉంటారని చెప్పుకోవచ్చును. గ్రుడ్డిగా దేవుడు ఒక్కడేయనువారికంటే వివరమును తెలిసినవాడు దేవుడు ఒక్కడే యను విశ్వాసమును గట్టిగా కల్గి ఉండును. జ్ఞానరీత్యా ఈ వాక్యమును చెప్పుకొంటే దేవుడు ధర్మబద్దుడు, జ్ఞానశీలియని చెప్పవచ్చును. దేవుడు ధర్మములను జ్ఞానముతో బోధించుటకు వస్తాడు తప్ప ప్రపంచ విషయములను చెప్పుటకు రాడు. ప్రపంచ విషయములన్నీ ప్రకృతి సంబంధ విషయములగును. ప్రపంచములో నిద్ర, మెలుకువ, ఆహారము, మైథునము, కష్టసుఖముల అనుభవములు మొదలగునవన్నీ ప్రకృతి విషయములేగానీ పరమాత్మ జ్ఞాన విషయములు కావు. అంతేకాక ఆత్మ, పరమాత్మ విషయములు తప్ప మిగతా జీవుని అనుభవమునకు సంబంధ విషయము లన్నీ ప్రకృతికి సంబంధించినవే గానీ దేవునికి సంబంధించినవి కావు.

ప్రకృతి సంబంధ జీవుని అనుభవ విషయములన్నీ మరణ సమయములో కర్మనుబట్టి తీర్పు తీర్చియుండును. అందువలన జీవుని ప్రతి విషయము, ప్రతి అనుభవము ముందే అల్లాహ్ నిర్ణయింపబడిన కర్మప్రకారముండును. మనిషి ఏమి తినాలి? ఏమి త్రాగాలి, ఏమి మాట్లాడాలి, ఏమి చేయాలి, ఎప్పుడు ఎక్కడికి పోవాలి అను మొదలగు విషయములు అన్నియూ మరణ సమయములో ఆత్మ తీర్పు తీర్చి జన్మకు పంపియుండును. గత జన్మ మరణము ప్రస్తుత జన్మ జననము ఒక సెకనులో పదవవంతు కాలములో జరిగిపోయివుండును. మనిషి ఆరాధించు ఆరాధ్య దైవముయైన రెండవ ఆత్మగాయున్న అల్లాహ్ తీర్పు తీర్చి నిర్ణయించిన దానిప్రకారము మనిషికి ప్రతి ఒక్కటి లభ్యమగుచుండును. ఎప్పుడు ఏమి తినాలి, ఏమి ఆహారము దొరుకుతుంది అను విషయము దేవుడు ముందే నిర్ణయించి యుండుట వలన, మనిషి ప్రమేయము లేకుండా అవన్నీ కర్మ నిర్ణయము ప్రకారమే జరగుచుండును. ముందే నిర్ణయించబడిన కర్మ నిర్ణయము ప్రకారము రుచికరమైన ఆహారముగానీ, రుచికరము కానిదిగానీ, నీచమైనదిగానీ, మాంసాహారముగానీ, శాఖహారముగానీ లభించుచుండును. అంతేగానీ మనిషి అప్పటికప్పుడు తన నిర్ణయము ప్రకారము సంపాదించు కొన్నట్లు కనిపించినా, అదంతయూ ముందే దేవుని దర్శకత్వము చేత స్క్రీన్‍ప్లే (దృశ్య నిర్ణయము) చేయబడియుండును. అందువలన తప్పక ప్రతీదీ నిర్ణయము ప్రకారము జరుగుచుండును. అటువంటప్పుడు అన్నీ తెలిసిన దేవుడు, ఎవరికి ఏ ఆహారము అని ముందే నిర్ణయించిన దేవుడు, ఇది తిను ఇది తినవద్దు యనీ, ఇది నిషేధము అనీ నిషేధము కాదు అనీ ఎలా చెప్పును. మీరు కొంత యోచించండి. చట్టమును చేసిన రాజు తన చట్టమును అతిక్రమించమని ఇతరులకు చెప్పునా! అలా చెప్పాడు అంటే అది అర్థము లేని మాటయగును. దేవుడు ఎంతో విచక్షణశాలి, వివేకవంతుడు. వివేకవంతుడయిన దేవుడు మనిషి ఆహారమును ముందే నిర్ణయించిన దేవుడు, సమస్త జీవరాసుల జీవితములను క్షణ క్షణమూ తానే నడుపుచున్న దేవుడు మనిషి ఇష్టము ప్రకారము నడువమని చెప్పునా? చెప్పడు.

అందువలన దేవుడు మనిషి తిను ఆహారమును గురించి ఇది ధర్మసమ్మతము, ఇది పవిత్రము అని చెప్పాడు అని నేను కూడా ఒప్పుకొంటున్నాను. అయితే ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయ మేమనగా! దేవుడు చెప్పినది ఏ ఆహారమును గురించి అని ప్రశ్నించుకొని చూడవలసిన అవసరమున్నది. అలా ప్రశ్నించుకొని చూస్తే మనిషి తీసుకొను ఆహారములు రెండు రకములుగా యున్నవి. ఒకటి ముందే నిర్ణయించబడిన ప్రపంచ సంబంధ ఆహారము. అది అందరికీ తెలిసినదే, మనిషి కర్మ నిర్ణయము ప్రకారము శాఖాహారమునో, మాంసాహారమునో తీసుకోగలుగు చున్నాడు. దేవుడు దానినే ఇస్తున్నాడు. అయితే మనిషి కర్మ నిర్ణయమునకు సంబంధము లేనిది, మనిషి స్వయముగా కోరుకొని, తన శ్రద్ధ ప్రకారము, తన ఇష్టము ప్రకారము తీసుకొను ఆహారము గలదు. అది స్వయముగా మనిషి కోరుకొను దానినిబట్టి యుండును. మనిషి తీసుకొను ప్రపంచ సంబంధ ఆహారము అయిన శాఖాహారముగానీ, మాంసాహారముగానీ మనిషి కడుపు నిండినంతే కర్మ నిర్ణయము ప్రకారము తినవలసియుండును. కడుపు పరిమితి మించి తినలేరు. అయితే కర్మ నిర్ణయమునకు సంబంధము లేనిదయిన ఆహారమును మనిషి పరిమితి అనునది లేకుండా తన ఇష్టమొచ్చినంత తీసుకోవచ్చును. ప్రకృతి సంబంధముకాని 'పరమాత్మ జ్ఞానము' అను దానిని మనిషి ఎంతయినా పొందవచ్చును. జ్ఞాన సంబంధ ఆహారము ఇతరుల బోధవలన గానీ, దైవగ్రంథములలోని రచన వలనగానీ లభించుచుండును. దైవ జ్ఞానమును తృప్తిగా పొందవచ్చును. ఎవరికి ఎంత ఇష్టమున్నదో, ఎవరికి ఎంత శ్రద్ధయున్నదో అంత పొందవచ్చును. ప్రకృతి సంబంధము కాని జ్ఞానమును మనిషియొక్క రెండవ ఆహారముగా తెలిసిన దేవుడు అందులో సారాంశమైన మంచి సంతోషదాయకమైన జ్ఞానమును పొందమని మనుషులకు చెప్పాడు. మనిషి అనేకచోట్ల, అనేక బోధలు వినుచుండును. అందులో కొన్ని బోధలు ఎంతో గొప్పవిగా ఉండును. కొన్ని సర్వసాధారణ జ్ఞానమును ఇచ్చునవిగా ఉండును. అవి బోధించే వానినిబట్టి జ్ఞాన ఆహారమును నిర్ణయించవచ్చును. ద్వితీయ దైవ గ్రంథమయిన ఇంజీలులో దైవజ్ఞానమును 'జీవాహారము' అని కూడా చెప్పారు. శరీరమునకు ఆహారము ప్రపంచ సంబంధమైన ఆహారముకాగా, శరీర లోపలి జీవునికి ఆహారము పరమాత్మ సంబంధమైన జ్ఞానము అని తెలియవలెను.

జీవాహారమైన జ్ఞానమును కొన్నిచోట్ల వినేకొద్దీ లేక కొందరి గ్రంథములలో చదివేకొద్దీ జ్ఞానములో లభించే రుచినిబట్టి జీవుడు పొందే ఆనందమునకు కళ్లవెంట ఆనంద భాష్పములు వచ్చుచుండును. ఆనందము పట్టలేనంత రుచిని పొందు ఆహారమును మీరు తినవలెనని మా అభిలాష. అందువలన నేను మీకు రుచికరమైన జ్ఞానమును అందివ్వాలని ప్రయత్నమును చేయుచున్నాను. నాది చిన్న ప్రయత్నము కాగా దేవుడు మనకు అందరికీ బలమైన, రుచికరమైన ఆహారమును ఇవ్వాలని ఎల్లప్పుడూ కోరుకొంటున్నాడు. దానిలో భాగముగానే ఈ వాక్యములో 'ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారమును తినండి' అని చెప్పాడు. తర్వాత 'చనిపోయిన జంతువులను, పశువులను తినవద్దండి' అని చెప్పాడు. అంతేకాక 'రక్తము, పందిమాంసమును తినవద్దని' చెప్పాడు. ఇంకా దేవుని (అల్లాహ్) పేరు మీద కాకుండా 'ఇతర దేవతల పేరుమీద ఉచ్ఛరించబడినవి' అని ప్రత్యేకముగా చెప్పి ఇవి మీకు నిషేధించాడు అని చెప్పాడు. ఇక్కడ దేవుడు చెప్పిన విషయమును పైకి చూస్తే వాడు పెడదారి పట్టిపోవును. సక్రమముగా ఆలోచించి చూస్తే దేవుడు చెప్పిన గొప్ప సూచన అర్థము కాగలదు.

మనిషి వినే బోధను అనేక బోధకులు అనేక రకములుగా చెప్పుచుందురు. అందరిలో ఉత్తమమైన బోధలను కొందరు చెప్పుచుందురు. కొందరు జ్ఞానశక్తి తక్కువగా యున్న బోధలను చెప్పుచుందురు. కొందరు చెప్పు బోధలలో ఏమి సారాంశము లేనివై, ఆత్మ విషయములు లేనివై ఉండును. అందరూ చెప్పు బోధలు దేవున్ని గురించేననీ, దేవుని భక్తిని గురించేయని చెప్పుచుండినప్పటికీ అందులో ఆత్మ, పరమాత్మ సంబంధము లేనివయిన బోధలు, దేవుడుకాని దేవతల బోధలు చెప్పుచుందురు. మరి కొందరు అనవసరమైన ఆరాధనలు చేసి భూత ప్రేతములకు చెట్టు చేమలకు, పుట్టలకు, పురుగులకు మ్రొక్కమని కూడా చెప్పుచుందురు. మరికొందరు జంతు బలులను చేయిస్తూ, మాంసాహారమును పంచి పెట్టుచూ ఇదే నిజమైన పూజ, ఇదే నిజమైన భక్తియని కూడా చెప్పుచుందురు. ఇవన్నీ గమనించిన తర్వాత దేవుడు 16-115వ వాక్యములో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. దేవుడు చెప్పిన వాక్యము మొదట అర్థము కాకపోయినా ఇప్పుడు బాగా అర్థమయినది, అది ఏమనగా!

దేవుడు చెప్పిన మాటలలో 'చచ్చిన పశువును తినవద్దని' చెప్పాడు కదా! దానిని గురించిన వివరము ఏమనగా! ఆత్మ ప్రతి శరీరములో కదలిక శక్తిగా (చైతన్య శక్తిగా) యుండి జీవరాసుల శరీరములను కదలించు చున్నది. ఆత్మ లేని శరీరము కదలదు, మెదలదు. అందులో జీవుడు ఉండడు. ఆత్మ ఉన్నచోట జీవాత్మ, జీవాత్మ ఉన్నచోట ఆత్మ ఉండడము సహజము. అందువలన జీవాత్మ, ఆత్మలను జోడు ఆత్మలని అంటాము. ఆత్మజ్ఞానము లేని ఏ బోధలయినా అవి చనిపోయిన పశువుల్లాంటివే. అందువలన 'ఆత్మజ్ఞానము లేని బోధలు వినవద్దని' తెలుపుచూ 'చచ్చిన జంతువులను రక్తమును తినవద్దు' అని అన్నారు. బయట చనిపోయిన జంతువులను పోల్చి జ్ఞానమును చెప్పారుగానీ, బయట చనిపోయినవి తినవద్దని అర్థము చేసుకోకూడదు. అలా అర్థము చేసుకొంటే దేవుని జ్ఞానము చట్టబద్దత, శాస్త్రబద్దత లేనిదియగును. ఎక్కడయినా బ్రతికిన జంతువును చంపిన తర్వాతనే దాని మాంసమును ఆహారముగా అందరూ తీసుకొంటున్నారు కదా! కోళ్లను చంపిన తర్వాత ఆహారముగా తీసుకోవడము జరుగుచున్నది కదా! అటువంటప్పుడు దేవుడు అలా ఎందుకు చెప్పును?

ఇంకా చెప్పిన విషయములలో పందిమాంసము నిషేధమని కూడా చెప్పారు. దీనినిబట్టి నీవు తెలుసుకొనే జ్ఞానము అపవిత్రముగా ఉండకూడదని చెప్పుచూ దాని పోలికగా పందిమాంసము అని అన్నారు. మనిషి వినే జ్ఞానము లేక చదివే జ్ఞానము జంతు బలులతో కూడుకొన్నదై, క్షుద్రదేవతల పూజలుగా ఉండకూడదు. క్షుద్రము అనగా నీచము అని అర్థము. అందువలన క్షుద్రమైన పూజలు, బలులతో కూడుకొన్న పూజలు, రక్తసిక్తమైన ఆరాధనలు మొదలగువాటిని పందిమాంసమంత నీచమైన వాటిగా పోలిక చెప్పారు. అంతేగాక దేవుడు కాదని, ఆత్మ పరమాత్మల సమాచారము ఏమాత్రము లేకుండా చేయు ఆరాధనలను ఇతర దేవతల పేర్లమీద చేయు పూజలని పోల్చి చెప్పారు. చనిపోయినది అనగా ఆత్మ జ్ఞానము లేనిది, నీచమైన ఆరాధనలను పందిమాంసముగా పోల్చి చెప్పారు. దేవుడయిన పరమాత్మ, ఆత్మ జ్ఞానము కాక, ఇతరత్రా దేవతల జ్ఞానమును కూడా నిషేధముగా ఇతర దేవతల పేర్లు ఉచ్ఛరించిన ఆహారమును తినకూడదని చెప్పారు. మనిషి శరీరమునకు ఆహారము నోటితో తినునవి, అలాగే మనిషిలోని జీవునికి ఆహారము బుద్ధితో గ్రహించునవి. ఈ విధమైన రెండు రకముల ఆహారములు ఉండుట వలన బయటి ఆహారమును పోల్చి రెండవ ఆహారమైన ధర్మసమ్మతమైన, పవిత్రమైన జ్ఞానమను ఆహారమును తీసుకోవలెనని, ధర్మసమ్మతముగాని పవిత్రత లేని వాటిని తినకూడదని బయట ఆహారముల పోలికను తెలియజేశారు. అయితే వాక్యములో చెప్పిన నిగూఢ విషయమైన జ్ఞానాహారమును వదలి అపవిత్రతతో కూడిన కర్మసంబంధమైన ఆహారమును తినకూడదని చెప్పుకోవడము పొరపాటు. నీవు తినకూడదు అనుకున్నా కర్మ నిర్ణయమైనప్పుడు తప్పక తినవలసి వచ్చును.

అలా నీచమైన పందిమాంసము మొదలగునవి ఇష్టము లేకున్నా తప్పని పరిస్థితిలో తిన్నా దేవుడు ఏమీ అనుకోడు అని వ్రాశారు. దానిని గురించిన నిగూఢ సమాచారము ఏమనగా! నీవు జ్ఞానివై ఇతర దేవతలను ఆరాధించనివాడవయినా పదిమంది అజ్ఞానులతో కలిసియున్నప్పుడు, వారితో పాటు గుడికి పోవలసివచ్చును. అట్లే గుడిలోని విగ్రహములకు మ్రొక్కవలసి వచ్చును. అప్పుడు అలా మ్రొక్కకపోతే ప్రక్కనయున్న వారందరికీ చెడుగా కనిపించును. అందువలన కొన్ని సమయములలో ఇష్టము లేకున్నా తప్పనిసరిగా ఇతర దేవతలను మ్రొక్కవలసివచ్చినా ఫరవాలేదు. అతడు జ్ఞాని అయినందున కొన్నిచోట్ల నటించినా ఫరవాలేదని దేవుడు చెప్పుచూ అలా అన్నాడు. ఈ మూడు వాక్యములు బయటి ఆహారమును గురించి చెప్పలేదు. లోపలి ఆహారమైన జీవాహారమును గురించి చెప్పినదని తెలియవలెను.

అయితే నేడు 16వ సూరాలో చెప్పిన 114, 115, 116 ఆయత్‍లను చదివినవారు మాకు దేవుడు వీటిని తినవద్దని, చచ్చిన పశువును, రక్తమును, పందిమాంసమును, ఇతర దేవతల పేరుమీద ఉచ్ఛరించిన ప్రసాదములను తినకుండా వదలివేశారు. బయట లభించు స్థూలమైన ఆహారములు ఏవయినా చచ్చినవయినా, బ్రతికినవయినా, ద్రవ పదార్థమయినా, ఘనపదార్థమైనా దేవుడు నిర్ణయించిన కర్మనుబట్టి లభించునవేగానీ, మనిషి ఇష్టము మీద ఆధారపడి లభించునవి కావు. ఏవయితే నిషేధ ఆహారమని అనుకొంటున్నారో వాటినే తిని బ్రతకవలసిన వారు చాలామంది కలరు. పశువులను, ఆవులను తినువారు వాటిని చంపిన తర్వాత, అవి చనిపోయిన తర్వాతనే తింటున్నారు. పశువులను దేవుని పేరు చెప్పి తినమని దైవగ్రంథములో చెప్పలేదు. చనిపోయిన వాటిని తినకూడదను మనిషి నిర్ణయము నిలబడుతుందను నమ్మకము లేదు. అయినా దేవుడు తన గ్రంథములో బయటి ఆహారములను గురించి చెప్పలేదు కదా! బాగా ఆలోచించుకొని చూడండి.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
90. ప్రజలు హితము గ్రహించటానికి మేము ఖుర్ఆన్‍ను విడమరచి చెప్పాము. దాని మూలముగా వారు సత్యమునకు మరింత దూరమయినారు. (17-41)
(17-41) ''ప్రజలు హితవు గ్రహించటానికి గాను మేము ఈ ఖుర్ఆన్‍లో విషయమును పలు విధములుగా విడమరిచి చెప్పాము. కానీ దాని మూలముగా వారిలో సత్యముపట్ల దూరమే మరింత పెరుగుతోంది.''

అల్లాహ్ (దేవుడు) ప్రజలకు మంచి చేయాలను ఉద్దేశ్యముతో ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞాన విషయములను ఎన్నో రకముల విడమరచి చెప్పాడు. ఉదాహరణకు 16-114, 115, 116 వాక్యములను ఇంతకు ముందు గ్రహించాము కదా! అందులో మనుషులకు అర్థము కావాలను ఉద్దేశ్యముతో చచ్చిన పశువును, పంది మాంసమును సూచనగా చెప్పి ధర్మములేనివి, అపరిశుద్ధమైనవి తినకూడదని పోలికగా చెప్పాడు. ధర్మ సమ్మతమైన పరిశుద్ధమైన ఆహారమునే తినండి అని చెప్పాడు. అయితే మనిషి ధర్మసమ్మతమైన ఆహారము ఏదో, పరిశుద్ధమైన ఆహారము ఏదో తెలియక మరింత అజ్ఞానము వైపు పోయాడు. దేవుడు చెప్పినది జీవునకు ఆహారమైతే, మనుషులు శరీరమునకు అవసరమైన ఆహారమును ఎంచుకొన్నారు. ఈ విధముగా దేవుడు ప్రతి విషయమును వివరముగా ఎన్నో విధముల పోలికలతో పోల్చి చెప్పినా, దానిని గ్రహించుకోలేక సత్యమైన జ్ఞానమునకు శాస్త్రబద్దమైన జ్ఞానమునకు దూరమగుచున్నారు. ఆ విషయమును అల్లాహ్‍యే స్వయముగా తెలియజేసినా లెక్కచేయక, నేడు కొందరు ముస్లీమ్ పెద్దలు మేము ఖున్ఆన్ గ్రంథములో అక్షర అక్షరమునకు, పద పదమునకు జ్ఞానము తెలిసియున్నామని ఏకంగా మమ్ములను ఎదిరించి మాట్లాడుచూ, మేము గ్రంథములో వ్రాసిన జ్ఞానము సరికానిదని నిందారోపణ చేయుచున్నారు. అటువంటి నిందారోపణను నేను లెక్క చేయను. కనుక వారు అలా మాట్లాడిన తర్వాత కూడా నేను అంతిమ దైవ గ్రంథములోని ఆయత్‍లకు వివరమును ఇంకా విడమరచి వ్రాయుచున్నాను. అల్లాహ్‍యే నా చేత శాస్త్రబద్దమైన జ్ఞానమును వ్రాయించి నన్ను అజ్ఞానియని ఆరోపణలు చేసిన వారినే తప్పుదారిలో యున్నట్లు చూపించాడు. ఆహార నియమములను పాటించువారు సత్యమునకు దూరమైనవారిగా చూపించాడు. అంత్య కాలములో అల్లాహ్ తీర్చిన తీర్పు కాదని మీరు స్వతంత్రముగా ప్రవర్తించగలరా? మేము ఇది తింటాము, ఇది తినము అంటారా? అని అడుగుచున్నాడు. ఏదీ నీ స్వతంత్రతలో లేదని నీకు తెలియదా?యని అడుగుచున్నాడు. మీ ఇష్టమొచ్చినవి ధర్మసమ్మతమని అనుకొనుచూ, నేను చెప్పినట్లు నా మీద నిందవేస్తే అల్లాహ్ మీద అబద్దాలు ఆరోపించినట్లు కాదాయని అడుగుచున్నాడు. ఇదంతయూ గమనిస్తే దేవుడు ఎన్ని రకముల విడదీసి చెప్పినా, మనిషి దేవుడు చెప్పిన సత్యనమునకు దూరమగుచూ మాకు ఖుర్ఆన్‍లోని ప్రతీ పదమునకు జ్ఞానము తెలుసు అనడము సిగ్గచేటు కాదా!


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
91. సప్తాకాశాలు, భూమి వాటిలోయున్నవన్నీ ఆయన (అల్లాహ్) పవిత్రతనే కొనియాడుతున్నాయి. అయితే అది ఎవరికీ తెలియదు. (శరీరములోని ప్రతి భాగము దేవున్ని స్తోత్రము చేయుచున్నాయి. అయితే అది ఎవరికీ తెలియదు.) (17-44)
(17-44) ''సప్తాకాశములు, భూమి వాటిలో యున్నవన్నీ ఆయన (అల్లాహ్) పవిత్రతనే కొనియాడుచున్నాయి. ఆయన స్తోత్రముతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీలేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమా గుణము కలవాడు.''

ఈ వాక్యము చాలా నిగూఢమైనది. దీని భావము చాలా సూక్ష్మమైనది. అందువలన దేవుడే మీరు దానిని గ్రహించలేదుయని తేల్చి చెప్పాడు. అంత నిగూఢమైన విషయము ఏమున్నదని కొందరు అనుకోవచ్చును. పూర్వము పెద్దల నానుడిగా ఒక మాటను అనేవారు. ''గంటుముడి విప్పితే ధనము, విప్పకపోతే నిధనము'' అని అన్నారు. నిధనము అనగా ధనము లేదుయని అర్థము. ఈ విషయమును పూర్తి తెలియుటకు గంటు విషయమును ఒకమారు చెప్పుకోవలసినదే. పూర్వము ఒక భక్తుడు దేవున్ని ధనము కావాలని కోరిక కోరుచూ తపస్సు చేశాడట. కోర్కెలతో కూడుకొన్న ప్రార్థనను తపస్సుయని అంటారు. అప్పుడు అల్లాహ్ అతని మొర ఆలకించి ధనముగల ఒక మూటను అతనికి ఇచ్చి మూటకు గల ముడి విప్పుకొంటే ధనము లభించును, విప్పుకోకపోతే నిధనము అని అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు సంతోషపడి గంటును (మూటను) తీసుకొని దాని ముడి విప్పి, అందులోని ధనము తీసుకోవాలని అనుకొన్నాడట. అప్పుడు అతను విశ్వ ప్రయత్నము చేసి ఆ మూట ముడి విప్పాలని చూచాడు. అయితే ఆ మూట ముడిని విప్పేదానికి సాధ్యపడలేదు. మూటలో ధనమున్నట్లు తెలిసినా, ముడి విప్పకపోవడము వలన ధనము లభించలేదు. గంటు ముడి విప్పితే ధనము, విప్పకపోతే నిధనము అన్నట్లు అయినందున దేవుడు ధనము మూట ఇచ్చినా, ముడివేయబడిన మూట అయినందున ధనము లభించలేదని తలచి, మూటలోని ధనమును పొందుటకు ఆ మనిషి క్రొత్త ఆలోచన చేసి, తనకు తోచిన ఉపాయముతో కత్తిని ఉపయోగించి మూటను చించితే ముడి విప్పనవసరము లేకుండా ధనము లభించునని తలచి కత్తితో మూట క్రింది భాగమును చించాడట. అప్పుడు మూటలోనిది బయటపడినా అది ధనమువలె కనిపించక చెత్త కాగితములవలె కనిపించాయి. అప్పుడు దేవుడు చెత్త కాగితములను ఇచ్చి తనను మోసము చేశాడని అనుకొని, అదే విషయమునే దేవున్ని అడగదలచి తిరిగి తపస్సు చేశాడట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఎందుకు నన్ను గురించి తపస్సు చేశావని అడుగగా నా మూటలో చెత్తకాగితములు తప్ప ధనము లేదని చెప్పాడట. అప్పుడు దేవుడు ''నేను నీకు మూటను ఇచ్చి దాని ముడి విప్పుకొంటే ధనము దొరుకుతుంది లేకపోతే నిధనము అని చెప్పాను కదా! నీవు ముడి విప్పక చించి చూచావు. కావున అందులో నీకు ధనము కనిపించలేదు. నా మాట ప్రకారము చేసినప్పుడే ధనము లభించునుగానీ నీ ఇష్టమొచ్చినట్లు చేస్తే ధనము లభించదు'' అని చెప్పాడు.

అదే విధముగా దేవుడు తన సూక్ష్మ జ్ఞానముతో చెప్పిన వాక్యములో ఎంతో గొప్ప జ్ఞానమున్నా దాని వివరమును విడమరచి తెలియకపోతే, వాక్యములో చెప్పిన జ్ఞానము ఏమిటో ఎవరికీ అర్థము కాదు. నేడు మేము బోధకులము అన్నవారికి సహితము దేవుని జ్ఞానము అర్థముకాకుండా పోయినది. అదే విషయమునే వాక్యములో ''మీరు వాటి స్థితిని గ్రహించలేరు'' అని అన్నాడు. వాస్తవముగా అల్లాహ్ తన ఆయత్‍లో చెప్పిన జ్ఞానమును మనిషి ముడివిప్పుకోలేని పరిస్థితిలో అర్థముకానివారై నిలచిపోయారు. అయినా తనకు తోచినది ఏదయితే, అదే జ్ఞానమనుకొంటున్నాడు. ముడి విప్పలేనప్పుడు దొరుకునది చెత్త కాగితములన్నట్లు మనిషికి దొరికినది అజ్ఞానమే అయినది. ఎంతకాలమునకు ముడివిప్పుకోలేని మనిషి మూటను ముడి విప్పు స్థోమత, యుక్తి, శక్తి గలవానివద్దకు తీసుకపోయి మూటను విప్పమని అడిగితే అతను గంటు యొక్క ముడిని విప్పి అందులోని ధనమును వెలికితీసి ఇవ్వగలడు. అయితే మనిషి గర్వముతో మూటను నేను విప్పగలనని భ్రమ చెంది, మెలుకువలో కాకుండా కలలో ముడి విప్పినట్లు ధనమును తీసుకొన్నట్లు అనుకొనినా, నిద్రలేచి చూచేటప్పటికి ధనము ఉండదు. అందువలన తమకు తాము జ్ఞానులము అని భ్రమించుట కంటే దేవుడే దిగివచ్చి తన జ్ఞానమును తాను చెప్పినట్లు, మనకు చేతకానప్పుడు దేవుడే వచ్చి తన మూటను తాను విప్పగలడు.

ఇప్పుడు దేవుడు తన గ్రంథములో జ్ఞానధనమున్న ఎన్నో మూటలను మనము అడుగకనే ఇచ్చాడు. నాకు తెలిసినంతవరకు ప్రథమ, ద్వితీయ దైవ గ్రంథములలో దేవుడు తన జ్ఞానమును బాహ్యముగా మూటగట్టకుండా ఇచ్చాడు. ఒక అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్‍లో మాత్రమ ఎక్కువ ముడి వేసిన మూటలు గల జ్ఞానమును ఇచ్చాడు. అయితే ఖుర్ఆన్ మాది అను ముస్లీమ్‍లు మూటల ముడులు విప్పుకోలేక అలాగే పెట్టుకొన్నారు. సూక్ష్మ వాక్యముల జోలికి పోకూడదు అను మాటను వారు ప్రచారము చేసుకొని ఇతరులను విప్పనివ్వరు, తాము విప్పరు. దైవ గ్రంథములోని మూటలను అలాగే యుంచుకొన్నారు. దైవ గ్రంథము ఏదయినా ఒక మతమునకు, ఒక సమాజమునకు ప్రత్యేకించి చెప్పినది కాదు. దైవ గ్రంథము ఏదయినా సర్వమానవాళికి సంబంధించినది, అది అందరి సొత్తు. గ్రంథము నుండి ఎవరు ఎంత జ్ఞాన ధనమునయినా గ్రహించుకోవచ్చును. ఇది నాది అనుటకు ఎవరికీ హక్కు లేదు. అందువలన అంతిమ దైవగ్రంథములోని జ్ఞాన మూటలను చాలా వాటిని తీసుకొని మూటల ముడి విప్పి పెట్టాను. మూటల ముడిని విప్పుటకు తగిన ఉపాయమును నా శరీరములో యున్న అల్లాహ్‍ను అడుగగా ఆయన నాకు జవాబుగా చెప్పిన ఉపాయము చేత మూటల ముడులను సులభముగా విప్పగలుగుచున్నాను. (2-186)వ ఆయత్‍లో దేవుడు ''మీకు నేను అత్యంత సమీపమున ఉన్నాను. మీరు అడిగే ప్రతి మాటకు జవాబు ఇస్తానని'' చెప్పాడు కదా! ఆ మాట ప్రకారము నాకు ఆయన (దేవుడు) జవాబు ఇచ్చిన దాని ప్రకారము ఇప్పుడు ప్రత్యేకమైన మూటవలె యున్న (17-44) వ ఆయత్ ముడులను విప్పుకొని చూద్దాము.

వాక్యములో ''సప్తాకాశములు, భూమి వాటిలోయున్నవన్నీ ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడుచున్నాయి'' అని అన్నారు. ఏడు ఆకాశములు, భూమి అనునవి కనిపించు మానవ శరీరముగా యున్నాయి అని మనము ముందే చెప్పుకొన్నాము. శరీరములోపల కనిపించక ఎన్నో అవయవములు వాటి అనుబంధములు కలవు. అందువలన సప్తాకాశములు, భూమి మరియు వాటిలో యున్నవన్నీయని వాక్యములో చెప్పారు. ఈ విధముగా ఏడు ఆకాశములు, భూమియని చెప్పియున్న మొదటి ముడిని మనము దేవుడు ఇచ్చిన ఉపాయము చేత సులభముగా విప్పుకోగలిగాము. ఈ వాక్యము అను మూటకు గల మొదటి ముడిని విప్పగలిగినా రెండవ ముడి చాలా గట్టిగా, విప్పుటకు చాలా కష్టముగా యున్నది. అయినా ఆ ముడిని విప్పుటకు మన బుద్ధికి తెలియని దానివలన శరీరం లోపలగల నాకు అత్యంత సమీపమునగల దేవున్ని ఉపాయమడుగగా, ఆయన చెప్పిన జవాబు ప్రకారము కష్టమైన రెండవ ముడిని విప్పుకోగలుగుచున్నాము. అది ఎట్లనగా!

శరీరము లోపల కనిపించని అవయవ భాగములు పేర్లుగలవి మొత్తము పదిహేను (15) గలవు. ఆ పదిహేనుకు అనుబంధముగా శరీరమంతా వ్యాపించిన మూడు లక్షల యాభైవేల నాడులు, 25 లక్షల కోట్ల ధాతుకణములు గలవు. ఇవన్నీ దేవుని స్తోత్రమును చేస్తున్నాయి. ఆయన స్తోత్రమును చేస్తూ, ఆయన పవిత్రతను కొనియాడనిది ఏదీ లేదు. శరీరములో మనిషికి తెలియకుండానే దేవుని స్తోత్రము చేయడము దేవుని పవిత్రతను కొనియాడడము జరుగుచున్నది. అది ఎలా జరుగుచున్నదో రెండవ ముడిని విప్పితే తెలుస్తుంది చూడండి. శరీరము లోపల నాడులు లక్షల సంఖ్యలో, ధాతుకణములు కోట్ల సంఖ్యలో గలవు. అంతేకాక పదిహేను అవయవములు వాటికి అనుబంధముగా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయము అను మొదలగు అవయవములు దాదాపు (70) ఉన్నట్లు చెప్పవచ్చును. శరీరములోపల జీవుడు మినహయున్న 14 అవయవములకు ఒక్కొక్క దానికి ఐదు అనుబంధములున్నట్లు తెలియుచున్నది. దాని ప్రకారము 14I5=70 ప్రధాన, ఉప అవయవములు గలవు. ఇవన్నియూ సప్తాకాశములు, భూమి వాటిలోపల గలవు. లోపల డెబ్బయి (70) బయట పది (10) మొత్తము ఎనబైకాగా, వాటి మధ్యలో చిక్కుకొన్న జీవుడు ఒకడు గలడు. జీవునితో సహా శరీరమును లెక్కించితే (81) భాగములుగా యున్నది. ఈ 81 భాగములు కాకుండా శరీరములోనే ఆరాధ్య దైవమయిన అల్లాహ్ ఒకరు. ఆయనను సృష్ఠించిన సాక్షిభూతుడయిన అల్లాహ్ మరొకరు వేరుగా గలరు. వారు ఇరువురూ పవిత్రమైన దేవుళ్లు కావున వారిని శరీరము కంటే వేరుగా చూడాలి. ఈ విధముగా ఎనభై ఒక్క (81) భాగములుగా యున్న శరీరమును ఏడు ఆకాశములు, భూమి, వాటి మధ్యలోయున్న సమస్త వస్తువులు అని అంటున్నాము.

సజీవమైన శరీరములో ఆరాధ్య దైవమయిన రెండవ ఆత్మయిన అల్లాహ్ ఉండగా, ఆయనను మొత్తము శరీర భాగములుగా యున్న ఎనభై ఒక్క (81) భాగములు స్తోత్రము చేయుచున్నవి. అదే విషయమునే వాక్యములో చెప్పారు. వాక్యములో దేవుడే చెప్పినట్లు శరీరములో ఏమి జరుగుచున్నదో చూస్తాము. దేవుడు చెప్పిన మాట సత్యమని గ్రహిద్దాము. శరీరములో బయట కనిపించునవి మొత్తము పది భాగములు గలవు. అవి ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములుగా గలవు. అట్లే శరీరములోపల కనిపించని ఐదు వాయువులు గలవు. అట్లే ఐదు జ్ఞానేంద్రియ శక్తులు గలవు. ఇంకా నాలుగు అంతఃకరణములు గలవు. వాటిని పేర్లతో సహా చెప్పుకొంటే ఇలా గలవు.
ఐదు జ్ఞానేంద్రియములు :- కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక

ఐదు కర్మేంద్రియములు :- కాళ్లు, చేతులు, నోరు, గుదము, గుహ్యము

ఐదు వాయువులు :- వ్యాన వాయువు, సమాన వాయువు, ఉదాన వాయువు, ప్రాణ వాయువు, అపాన వాయువు.

ఐదు ఇంద్రియ శక్తులు :- చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ

నాలుగు అంతఃకరణములు :- మనస్సు, బుద్ధి, చిత్తము, అహము

కర్మ ఆధీనములో, గుణముల మధ్యలో చిక్కుకొన్న వాడు :- జీవుడు

శరీరములో దేవుళ్లు ఇద్దరు :- ఆత్మ (ఆరాధ్య దైవము), పరమాత్మ (ఏ అక్కర లేనివాడు)

ఈ విధముగా యున్న శరీరము ఏడు ఆకాశములు ఒక భూమితో యుండగా వాటి మధ్యలో 81 భాగములు గలవు. అటువంటి శరీరములో ప్రాణవాయువు శరీరములోని ఊపిరితిత్తులనుండి ముక్కు బయటికి అడుగు దూరము వరకు వస్తూ లోపలికి పోవుచూ నిత్యము ఒక్క క్షణము కూడా ఊరక ఉండక చలించుచునే యున్నది. మనుషులు ఏ మతములోయున్నా ఏ ఆచారముల మధ్యలోయున్నా ప్రాణవాయువు శ్వాస రూపములో ఆడుచునే యున్నది. ముస్లీమ్ శరీరములో ఎట్లు శ్వాస చలించుచున్నదో అట్లే హిందువు శరీరములోనూ, మిగతా వారి శరీరములలోనూ ఆడుచున్నది. శరీరములో చైతన్యముగా రెండవ ఆత్మ యున్నది. ఆ రెండవ ఆత్మయే అందరూ ఆరాధింపతగిన అల్లాహ్గా యున్నాడు. అంతేకాక సూరా ఆరు, ఆయత్ 102 లో చెప్పినట్లు ''ఆయనే మీ ఆరాధ్య దైవము, ఆయనే మీ కార్యకర్తగా యున్నాడు'' అని కలదు. అందువలన శరీరములో సర్వ కార్యములను చేయుచున్న ఆత్మయే అందరికీ ఆరాధ్య దైవముగా యున్నది. ఆత్మ శరీరము లోని ఊపిరితిత్తులను కదలించుచూ, శ్వాస ఆడునట్లు చేయుచున్నది. శ్వాస ఆడు విషయము అందరికీ తెలిసినదే. అయితే దానిని ఆడించువాడు రెండవ ఆత్మయని చాలామందికి తెలియదు.

ప్రతి మనిషి శరీరములోను శ్వాస ఆడుచున్నది. శ్వాస ముక్కు రంధ్రములలో పోవునప్పుడు రెండు రంధ్రముల ద్వారా పోవుచున్నది. లోపలికి పోయిన శ్వాస తిరిగి బయటికి వచ్చునప్పుడు ఒక రంధ్రము ద్వారా వచ్చి రెండుగా చీలి బయటికి వస్తున్నది. అందువలన శ్వాస లోపలికి పోవునప్పుడు ఒక శబ్దము, బయటికి వచ్చునప్పుడు మరొక శబ్దము కల్గి ముక్కు రంధ్రములలో చలించుచున్నది. లోపలికి పోవునప్పుడు ''సో'' అను శబ్దము కల్గి పోవునట్లు బాగా గమనించితే తెలియుచున్నది. అట్లే శ్వాస బయటికి వచ్చునప్పుడు గమనించితే ''హం'' అను శబ్దముతో వచ్చునట్లు తెలియుచున్నది. ఒకమారు శ్వాస శరీరము లోపలికి పోయి బయటికి వచ్చు లోపల ఏర్పడు రెండు శబ్దములను కలిపి చూస్తే ''సోహం'' అను శబ్దము ఏర్పడుచున్నది. కొందరికి అర్థమయినా అర్థము కాకపోయినా ఆడే శ్వాసలో ఏదో శబ్దమున్నట్లు అయినా తెలియగలదు. ఆ శబ్దము యొక్క అర్థము ఎల్లప్పుడూ ఉండునది లేక ఎల్లప్పుడు ఉండువాడని చెప్పవచ్చును. 'సో' అనగా ఎల్లప్పుడు, 'హం' అనగా ఉండువాడు అని చెప్పవచ్చును. ఎల్లప్పుడూ ఉండువాడు పరమాత్మయిన మొదటి దేవుడు. రెండవ ఆత్మను సృష్ఠించినవాడు సృష్ఠ్యాది నుండి యున్నవాడని చెప్పవచ్చును. శరీరములో కార్యకర్తగా అన్ని పనులు చేయుచున్న ఆత్మకు దేవుడు పరమాత్మ. అందరికీ ఆరాధ్యదైవము ఆత్మకాగా, ఆత్మకు ఆరాధ్య దైవము పరమాత్మ. అందువలన ద్వితీయ దైవ గ్రంథములో పరమాత్మను పరిశుద్ధాత్మయని చెప్పుచూ ఆత్మను పరిశుద్ధాత్మకు కుమారుడుగా చెప్పారు. ఈ విషయము యోహాన్ సువార్త ఐదవ అధ్యాయములో 21 నుండి 27వ వాక్యము వరకు ఈ విషయము గలదు.

శరీరములో ఆత్మ ఊపిరి తిత్తులను కదలించుచూ శ్వాస ఆడునట్లు చేయుచున్నది. శ్వాస ఒక్క క్షణము కూడా ఆగకుండా నిత్యము జరుగుచునే యున్నది. నిత్యము శ్వాస ఆడునప్పుడల్లా ప్రతి శ్వాసకు ''ఎల్లప్పుడూ ఉండువాడు'' అను శబ్దముతో ఆత్మ పరమాత్మను స్తోత్రము చేయుచున్నది. ప్రతి క్షణము ఆత్మ పరమాత్మను స్తోత్రము చేయడమును (17-44) వ వాక్యములో సప్తాకాశములు భూమి వాటిలో యున్న సమస్తమును పరమాత్మను 'ఎప్పటికీ ఉండువాడా' యని స్తోత్రము చేయుచున్నవి. శరీరములో యున్న అవయవములు కదలలేనివి. ఆత్మ వాటిని కదలించి పని చేయించుచున్నది. అట్లే శరీరములో శిరస్సునుండి మొదలయిన ఆత్మశక్తి చివరకు శ్వాసగా తయారయి, ఆ శబ్దములో పరమాత్మను స్తుతిస్తున్నది. శరీరమంతా ఆత్మయుండి నడుపుచున్నది. కావున సోహం శబ్దమునకు ఆత్మే కారణమయినందున ఆత్మే, పరమాత్మను నిత్య శ్వాసతో స్తోత్రము చేయుచున్నదని తెలియుచున్నది.

ఇట్లు స్తోత్రము చేయడమేకాక శరీరమంతా వ్యాపించియున్న ఆత్మ పరమాత్మ పవిత్రతను పొగడుచున్నది. నిత్యము ఎల్లవేళలా ఆత్మ పరమాత్మను శ్వాసతో స్తోత్రము చేసినట్లు, ఒక్క సెకను కూడా ఆగకుండా దేవుని పవిత్రతను పొగడుచున్నది. దేవుని స్తోత్రము బయట శ్వాస ద్వారా జరుగుట వలన స్తోత్రము యొక్క శబ్దమును మనము వినగలుగుచున్నాము. నిశ్శబ్ద స్థలములో శ్వాస శబ్దము వినినట్లయితే ''సోహం'' అను శబ్దము తెలియుచున్నది. అదే ఆయన పవిత్రతను కొనియాడడము, శరీర ధాతువులలో జరుగుచుండుట వలన అది వినిపించదు. పరమాత్మ పవిత్రత యొక్క విషయమును గమనించి చూస్తే శరీరములోగల కోట్లకొలది ధాతు కణములలో జరుగు క్రియలో ఏర్పడు శబ్దము పరమాత్మను కొనియాడు శబ్దముగా యున్నది. శరీరములో ప్రతి ధాతుకణము ఒక సైనికుడుగా పని చేయుచున్నది. పరమాత్మశక్తి జ్ఞానశక్తియనీ, జ్ఞానాగ్నియని చెప్పవచ్చును. శరీరములోని ఒక ధాతుకణమును పరిశీలించి చూస్తే అక్కడ నిత్యము మండుచుండును. ఆ మంట ఎప్పటికీ ఆరిపోవునది కాదు. చిన్నగనో పెద్దగనో ఎల్లప్పుడూ మండుచుండును. శరీరములోని ధాతుకణములన్ని మండుచుండుట వలన శరీరము ఎల్లప్పుడూ ఒకేరకమైన వేడి కల్గి యుంటుంది. ధాతుకణములో మంట మండుటకు శ్వాసలోని ప్రాణ వాయువు (ఆక్సిజన్), ఆహారములోని పిండి పదార్థములు ఉపయోగ పడుచున్నవి. ఎలాగయితేనేమి ధాతుకణములు ఎల్లప్పుడూ మండుచున్నవి. మండేమంట కొంత శబ్దమును చేయుచూ మండుచున్నది. శరీరములోని ధాతుకణములో మండే మంటయొక్క శబ్దము బయటికి వినిపించనిదై యున్నది. ఆ వినిపించని శబ్దమే దేవుని పవిత్రతను పొగిడినట్లు కలదు.

మండే మంట ఎక్కడయినా కొంత శబ్దము చేయుచూ మండు చుండును. శరీరములో శరీరమంతా మండే అగ్నిని పరమాత్మ యొక్క అగ్ని అనవచ్చును. దానిని మండించువాడు ఆత్మ. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోవువరకు ఒక్కక్షణము కూడా ఆరిపోకుండా మండుచూ కొంత శబ్దము చేయుచుండుట వలన శరీరములో నిత్యమూ ఎల్లవేళలా పరమాత్మ పవిత్ర అగ్నిని, ఆత్మ ఆహారమును గాలితో మండించుచూ ఆయన పవిత్రతను ఎల్లప్పుడూ కొనియాడుచున్నది. ప్రపంచములోని మనుషులంతా ఆత్మను ఆరాధ్య దైవముగా ఎంచుకొని ఆరాధించుచుండగా, ఆత్మ శరీరము లోపల పరమాత్మను శ్వాస ద్వారా, ధాతుకణముల ద్వారా ఆరాధించుచున్నది. పరమాత్మ, ఆత్మే మీ ఆరాధ్యదైవమని అందరికీ చెప్పి, ఆత్మను మనుషుల చేత ఆరాధింపజేయుచుండగా, ఆత్మ మాత్రము ఎవరికీ తెలియకుండా తాను పరమాత్మను శరీరములోనే ఆరాధించుచున్నది. పరమాత్మ ఆరాధనకు అతీతముగా యున్నా శరీరములో తనను సృష్ఠించిన పరమాత్మను, ఆత్మ స్తోత్రము చేయుచున్నది. ఆయన పవిత్రతను పొగడుచున్నది.

శరీరములో జీవుడు (జీవాత్మ) కర్మలను అనుభవించేది తప్ప ఏ పనినీ చేయనివాడుగా యున్నాడు. శరీరములోని జీవాత్మను కర్మలకు అనుగుణముగా నడుపుచూ బాధలను, సుఖములను అనుభవింపజేయుచూ, ఎల్లప్పుడూ శరీరములో కార్యకర్తగా ఆత్మ పనిని చేయుచూ, మరొకవైపు తనకంటే పెద్దయిన పరమాత్మను రెండురకముల ఆరాధించుచున్నది. జీవుడు జ్ఞానిగా మారితే వాని కర్మను కాల్చు జ్ఞానాగ్నిని జీవునికి ఆత్మ ద్వారా పరమాత్మ ఇచ్చుచున్నది. అందువలన జీవునికి దేవుడయిన పరమాత్మకు మధ్యవర్తిగా ఆత్మకలదని తెలియుచున్నది. పరమాత్మ జీవుల కర్మలను లేకుండా చేయు జ్ఞానాగ్ని అను శక్తి కలవాడు. అందువలన ఆయనను 'క్షమాశీలుడు, సహనశీలుడు' అని అంటారు. ఖుర్ఆన్‍లో అల్ ఫాతిహా అను మొదటి సూరాలో గల మొదటి మూడు వాక్యములను పరమాత్మయిన మూడవ ఆత్మకు సంబంధించినవిగా గలవు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
92. వారు మేల్కొని ఉన్నారని అనుకున్నావు. వారు మేల్కొని లేరు. వారి గుహ ద్వారము దగ్గర కుక్క ఒకటి గలదు. (18-18)
(18-18) ''వారు మేల్కొని ఉన్నారని నీవు భావిస్తావు. కానీ వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడి ప్రక్కకూ, ఎడమ ప్రక్కకూ ఒత్తిగిలి పడుకొనేలా చేస్తూయున్నాము. వారి కుక్క కూడా గుహ ముఖ ద్వారము వద్ద తన ముందు కాళ్లను చాపి కూర్చొని ఉంది. ఒకవేళ నీవు వారిని తొంగిచూస్తే వెను తిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యము నిన్ను భయకంపితున్ని చేస్తుంది.''

ఈ వాక్యము కూడా సూక్ష్మభావముగల వాక్యమేయని చెప్పవచ్చును. మాకు ఇది సులభముగా యున్నా మిగతవారు ఎటు చూచినా అర్థము కాని వాక్యముగా యున్నది. గుహ ఏమిటో, గుహ ద్వారమువద్ద కుక్క ఏమిటో తెలియకున్నదని అంటారు. వాస్తవముగా ఇది అర్థముకాని విధముగాయున్నా నాకు అర్థమయిన విధముగా తెలిపెదను. నేను చెప్పిన దానిని మీరు గ్రహించుకోగలరని అనుకొంటున్నాను. పై వాక్యమును బాగా ఆలోచించి చూచిన కొందరు గుంపుగల గుహలో వారు మేల్కొని ఉన్నారని భావించినా వారు నిద్రపోతూ ఉంటారని చెప్పాడు. వారిని త్రిప్పి పడుకోబెట్టేది నేనేయని దేవుడు చెప్పుచున్నాడు. అంతేకాక గుహ ముఖ ద్వారము వద్దనే వారి కుక్క తన ముందరి కాళ్లను చాపి కూర్చొని ఉంది అన్నారు. ఒకవేళ పొరపాటుగా లోపలి వాళ్లను తొంగిచూస్తే వారి గాంభీర్యమునకు వెను తిరిగి పారిపోతావు అని ఉంది. దీనిని అంతటినీ గమనిస్తే శరీరము ఒక గుహలాగా ఉన్నదని అర్థమగుచున్నది. శరీరములో మొత్తము 25 మంది గలరు. వారు నిద్రపోతూ ఉన్నప్పుడు అనగా శరీరము నిద్రపోయేటప్పుడు శరీరమును లోపల యున్న ఆత్మే కుడి ప్రక్కగానీ, ఎడమ ప్రక్కగానీ, ఒత్తిగిలి గానీ త్రిప్పి పడుకోబెడుతున్నది. నిద్రలో మనిషికి మూడు ప్రక్కలా తనకు తెలియకుండానే పొర్లుతున్నాడు. అనగా శరీరములోని ఆత్మయిన దేవుడు మనిషిని త్రిప్పి పడుకోబెడుతున్నాడు.

మనిషి శరీరము నిద్రలోయున్నప్పుడు లోపలయున్న దేవుడే మనిషి శరీరమును త్రిప్పి పడుకోబెట్టడము జరుగుచున్నమాట వాస్తవమే. శరీరములో 25 మంది అవయవములు అను పేరుగల వారున్నారు. శరీరమునకు తొమ్మిది రంధ్రములున్నాయి. అందువలన శరీరమును గుహవలె పోల్చి, ఆ గుహలో 25 మంది యున్నట్లు చెప్పవచ్చును. శరీర ద్వారములలో అన్నీ మూసుకొనియుండగా చెవులు ముక్కు ద్వారములు (రంధ్రములు) తెరుచుకొని యుండును. అందులో చెవులు ఇంచు లోపల పూడిపోయినట్లు మూసివేయబడియున్నాయి. చివరకు ముక్కులు గుహ లోపలి వరకు రంధ్రము కల్గియున్నాయి. ముక్కు రంధ్రముల వద్ద శబ్దము చేయు శ్వాసయను కుక్క తన ముందరి కాళ్లను బయటికి, వెనుక కాళ్లను లోపలికి చాపి పడుకొని యున్నదని చెప్పారు. శ్వాస బయటికి లోపలికి ఆడుచుండుట వలన కుక్క ముందరి కాళ్లను గుహ బయటికి, వెనుక కాళ్లను గుహలోపలికి చాపి పడుకొని ఉందని చెప్పుటలో తప్పులేదు. శ్వాసను కుక్కతో పోల్చి చెప్పారు. అయితే మనిషి నిద్రపోవునప్పుడు గుహ ముఖ ద్వారము వద్దకు పోయి లోపలయున్న వారిని తొంగిచూస్తే వారు నిద్రలో చేయు గురక అను శబ్దమునకు భయపడి పారిపోతావు అని అన్నారు. నిద్రపోయే వారి ముక్కు దగ్గర చెవి పెట్టి చూస్తే వారు వేసే గురకకు తప్పనిసరిగా భయపడవలసి వస్తుందని చెప్పారు.

ఒక మనిషి నిద్రను అతని శరీరమును, దానికున్న రంధ్రములను, అతని గురకను పోల్చి చెప్పిన మాటలు ఈ వాక్యములో గలవు. మనిషి శరీరమును ఒక గుహలాగ పోల్చి శరీరమునకున్న తొమ్మిది దారులలో ఎల్లప్పుడూ తెరచుకొని ఉండేది, లోపలికి బయటికి పోవు దారివలె ముక్కులు ఉండగా శ్వాసను కుక్కగా పోల్చి చెప్పారు. 25 మంది గల గుహలో నేను ఒక్కనిగా ఉన్నానని నీవు తెలుసుకొని చూస్తే ఇక్కడ చెప్పినదంతా అర్థమవుతుంది. మానవ శరీరమను గుహను గురించి ఇంకా క్రింది వాక్యములో ఏమి చెప్పారో చూడండి.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
93. గుహలో ఎంతమంది యున్నారని ప్రత్యక్షముగా చూడలేక అంచనాగా చెప్పుకొనుచున్నారు. (18-22)
(18-22) ''వాళ్లు ముగ్గురు నాల్గవది వారి కుక్కయని కొందరు అంటారు. వారు ఐదుగురు ఆరవది వారి కుక్కయని మరికొందరు అంటారు. వారు తమకు తెలియని విషయములో ఉహాగానాలు చేస్తున్నారు. వారు ఏడుగురు ఎనిమిదవది వారి కుక్కయని ఇంకా కొందరు అంటారు. వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగును. వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు అని వారికి చెప్పు. కాబట్టి నీవు వారి విషయములో స్థూలంగా మాత్రమే వాదించు. గుహలోని వాళ్లను గురించి వీళ్లలో ఎవరినీ అడుగకు.''

శరీరమే ఒక గుహగా యున్నదని, అందులో జీవునితోపాటు 24 మంది యున్నారని చెప్పుకొన్నాము. అంతేకాక ఆ గుహకు తొమ్మిది ద్వారములున్నాయని కూడా చెప్పుకొన్నాము. అయితే చాలామందికి శరీర గుహలో ఎంతమంది ఉన్నది తెలియక మొదటనే కనిపించు శ్వాసను కుక్కగా పోల్చుకొని చెప్పుచూ, లోపల ఉన్నవారు ముగ్గురు వారి కుక్క ఒకటి నాల్గవదియని కొందరు అంటున్నారు. మరికొందరు లోపలయున్న వారు ఐదుమంది ఆరవది వారికుక్క యని అంటున్నారు. కాదు కాదు వారు ఏడుగురు ఎనిమిదవది వారి కుక్కయని ఇంకా కొందరు అంటున్నారు. ఈ విధముగా బయటికి తెలియు శ్వాసను ఒక దానిగా (కుక్కగా) అందరూ చెప్పుకొనినా శరీర గుహలో ఎంతమంది యున్నది తెలియక అంచనాల మీద మాట్లాడుచున్నారు. అయితే శరీరము లోపలయున్న వారి సంఖ్య పూర్తిగా శరీరమునకు అధిపతియైన ఆత్మకే తెలుసు. ఆత్మే శరీరములో అందరికీ పెద్దగా యున్నాడు. ఆత్మ శరీరములోయున్న ప్రతి ఒక్కరిని (ప్రతి ఒక్క అవయవమును) తెలిసియున్నది. శరీరములో ఎంతమంది యున్నది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. శరీరములో 24 మంది జీవునితోపాటు యుండగా, జీవుడు మరియు మిగతావారు అందరూ మొత్తము 25 మందికి అధిపతిగా ఆత్మ కలదు. ఈ విషయము రూఢిగా ఎవరికీ తెలియదు కావున నీవు స్థూలముగా కనిపించువాటిని గురించి మాట్లాడు. కనిపించని వారిని గురించి మాట్లాడవద్దు. బయటికి తెలియునవి ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఒక కుక్కవలె యున్న శ్వాస మొత్తము పదకొండు మందిని గురించే మాట్లాడు మిగతా 14 మందిని గురించి మాట్లాడవద్దని హితము చెప్పినట్లు వాక్యములో గలదు. శరీర వ్యవస్థను ఒక గుహగా పోల్చి, శరీరములోని భాగములన్నిటినీ గుహలో యున్నవారిగా పోల్చి చెప్పారని తెలియవలెను.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
94. ప్రజల వద్దకు మార్గదర్శకము వచ్చిన తర్వాత విశ్వసించనివారు దేవుడు ఒక మనిషిని ప్రవక్తగా (గురువుగా) పంపునాయని అంటారు. (17-94)
(17-94) ''ప్రజలవద్దకు మార్గదర్శకము వచ్చిన మీదట విశ్వసించ నీయకుండా వారిని ఆపిన విషయమెల్లా ఒక్కటే ''అల్లాహ్ ఒక మానవున్ని ప్రవక్తగా పంపాడా?'' అని వారన్నారు.''

అంతిమ దైవ గ్రంథములో 'ప్రవక్త' యని చెప్పిన పదమును, ద్వితీయ దైవ గ్రంథమయిన బైబిలులో 'మనుష్య కుమారుడు' యని చెప్పియున్నారు. అదే ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతయందు 'భగవాన్' యని చెప్పియున్నారు. భగవాన్ యనగా భగవంతుడుయని అర్థము. దేవుడు మనిషిగా తన ప్రతినిధిని పంపినప్పుడు అనగా వివరముగా చెప్పితే మూడవ పురుషుడయిన పరమాత్మ మారువేషములో మనిషిగా వచ్చినప్పుడు అతనిని ప్రవక్తయని గానీ, మనుష్యకుమారుడుయని గానీ, భగవంతుడుయని గానీ అనవచ్చును. దేవుడు ప్రత్యేకమైన మనిషిని చేసి, అందులో తన ఆత్మనే ఊది పంపుదును యని ఇదే ఖుర్ఆన్ గ్రంథములో 15వ సూరా, 28, 29, 30 ఆయత్‍లలో చెప్పియున్నాడు. పరమాత్మయిన పెద్ద దేవుడు మనిషిగా వచ్చి తన జ్ఞానమును తానే చెప్పినా, ఆయనను దేవుని అవతారమని ఎవరూ గుర్తించలేదు. అందుకు అనేక కారణములున్నా ముఖ్య కారణము ఏమనగా! మనిషిగా దేవుడు రాడుయనీ, దేవుడు మనిషిగా వచ్చునాయని అనుకోవడమే కారణము. దేవుడు ఇప్పటికి మాకు తెలిసి మూడు యుగములలో ముగ్గురుగా మూడుమార్లు వచ్చాడు. నాకు తెలిసిన వారి పేర్లు చెప్పి వీరే భగవంతుడుగా వచ్చినవారని నేనంటే వారి పేరు వింటూనే అసూయతో, అక్కసుతో వారిని గురించి చెడుగా మాట్లాడువారు గలరు. కలియుగములో మతముల ప్రభావముండుట వలన హిందువుగా పుట్టిన కృష్ణున్ని క్రైస్థవులు ఒప్పుకోరు. అట్లే క్రైస్థవుడని అనుకొనుచున్న ఏసు పేరు చెప్పితే అలర్జీ వచ్చినవారివలె మారిపోయి దూషించు హిందువులు గలరు. ఇక త్రేతాయుగములో భగవంతునిగా వచ్చిన వానిని గురించి చెప్పితే అన్ని మతముల వారు వ్యతిరేఖించుచున్నారు. దీనికంతటికీ ముఖ్య కారణము దేవుడు మనిషిగా రాడని చాలామంది అనుకోవడమేయని చెప్పవచ్చును.

ఎవరు ఏమనుకొనినా అల్లాహ్ తన జ్ఞానమును దైవ గ్రంథముల రూపములో ఇచ్చాడు. అయితే దాని వివరమును మనుషులు చెప్పలేరు. అందువలన దేవుని జ్ఞానమును దేవుడే చెప్పాలి యను వాక్యము (3-7) లో యున్నట్లు దేవుడు మనిషిగా ఏదో ఒక పేరుతో వచ్చి, తన జ్ఞానమును తానే వివరముగా చెప్పవలసియుండును. అలా చెప్పవలసియుండుట వలన దేవుడు ఎక్కడో ఒకచోట మనిషిగా వచ్చి జ్ఞానమును చెప్పవలసి యుండును. అయితే అలా వచ్చిన ప్రతిసారీ దేవున్ని ఎవరూ గుర్తించక పోవడము, ఆయన చెప్పిన బోధను ఎవరూ గ్రహించకపోవడమును చేయుచున్నారు. అందువలన నేడు ప్రజలందరూ జ్ఞానులు కాలేకపోయారని చెప్పవచ్చును. దేవుడు మనిషి రూపములో వచ్చినప్పుడు మాత్రమే మనుషులకు భూమిమీద సంపూర్ణ జ్ఞానమును తెలియజేయును. దేవుడు మనిషిగా వస్తే జ్ఞాన విషయములో పూర్తి మార్గదర్శకుడుగా యుండును. దేవుడు మార్గదర్శకునిగా ఉన్నప్పుడే మనుషులు దైవ జ్ఞానమును తెలియవచ్చును. అయితే దేవున్ని మనిషిగా లెక్కించని ఎవడుగానీ జ్ఞానమును తెలియలేడు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
95. మనుషులకు మనుషులను, దూతలకు దూతలను ప్రవక్తలుగా పంపుదును. (17-95)
(17-95) ఓ ప్రవక్తా! వారికి చెప్పు! ''ఒకవేళ దైవదూతలు భూమండలము మీద తిరుగుతూ నివాసము ఏర్పరచుకొంటూ ఉన్నట్లయితే మేము వారి వద్దకు కూడా ఆకాశమునుంచి దైవదూతనే ప్రవక్తగా పంపియుండేవారము.''

భూమిమీద దేవుడు కనిపించే మనుషులను, కనపరాని దేవతలను తయారు చేశాడు. ఈ రెండు జాతులు భూమిమీద నివాసము ఏర్పరచుకొని ఉన్నాయి. దేవతలు, మనుషులు అను రెండు జాతులు కర్మప్రకారము పుట్టింపబడి, కర్మను అనుభవిస్తూ జీవించుచున్నారు. వీరి కర్మను పాలించుటకు శరీరము బయట అనుభవములను, శరీరము లోపల అనుభవములను దేవుడు ఏర్పరచాడు. మనుషులు, దేవతలు బయట లోపల అనుభవములను పొందుటకు శరీరములో ఆత్మను, శరీరము బయట దైవదూతలను మూడవ ఆత్మయిన పరమాత్మ ఏర్పరచాడు. శరీరము లోపల అనుభవించవలసిన కర్మలను శరీరములోని ఆత్మ అనుభవింప జేయుచున్నది. అట్లే శరీరము బయటి కర్మలను అనుభవరూపములో పొందుటకు బయట ప్రపంచములో ఎన్నో కోట్లకొలది దైవ దూతలను దేవుడు నిర్మించాడు. ఈ విధముగా శరీరము బయట, శరీరము లోపల జీవుడు కర్మలను అనుభవించుచున్నాడు.

కర్మలను అనుభవించువారు, కర్మలను అనుభవింపజేయువారు అని రెండు రకముల గలరు. అనుభవించువారు దేవతలు, మనుషులుకాగా, అనుభవింపజేయువారు శరీరములోని ఆత్మ, శరీరము బయట ఖగోళము లోని దైవదూతలు గలరు. ఆత్మ శరీరములోపల యుండగా, దైవదూతలు ఆకాశములో యున్నారని చెప్పుకొన్నాము. దైవ దూతలు భూమండలము మీద నివాసము ఏర్పరచుకొనియుంటే అనగా అజ్ఞానులై మనుషులలో, దేవతలలో నివాసము ఏర్పరచుకొనియుంటే వారికి జ్ఞానమును బోధించుటకు వారివద్దకు ఆకాశమునుండి దైవదూతనే ప్రవక్తగా దేవుడు పంపియుండేవాడు అని చెప్పియున్నారు. దీనినిబట్టి ఏ జాతివారికి జ్ఞానము లేకపోయినా అదే జాతివారినే ప్రవక్తగా పంపేవాడినని దేవుడు చెప్పాడు. మనుషులవద్దకు మనిషిగా యుండి, వారు మాట్లాడే భాషనే మాట్లాడు ప్రవక్తను దేవుడు పంపును. అలా పంపినప్పుడే మనుషులలో మనిషిగా యున్న ప్రవక్త వారిలో గుర్తింపు లేనివాడిగా కలిసిపోయి, వారిలో ఎవరికి జ్ఞానము అవసరమో వారికి జ్ఞానము చెప్పును. అందువలన ఏ జాతి వారికి ఆ జాతివానినే ప్రవక్తగా దేవుడు పంపునని తెలియుచున్నది.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
96. అల్లాహ్‍కు కొడుకులుగానీ, భాగస్వామి అయిన వేరొక ఆరాధ్య దైవము గానీ లేడు. (23-91)
(23-91) ''అల్లాహ్ ఎవరినీ కొడుకులుగా చేసుకోలేదు. ఆయనతో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు ఎవడూ లేడు. ఒకవేళ అలాంటిది ఏదయినా ఉంటే ప్రతి దేవుడు తాను సృష్ఠించిన వాటిని వేరుగా తీసుకొని వేరయిపోయేవాడు. ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేసేవాడు. వారు అల్లాహ్‍కు ఏ లక్షణాలను ఆపాదిస్తున్నారో వాటికి ఆయన అతీతుడు, పవిత్రుడు.''

ఇక్కడ ముఖ్యముగా ఈ వాక్యము ఏ అల్లాను గురించి చెప్పాడో ముందు గమనించవలసిన అవసరమున్నది. అల్లాహ్యని పిలువబడు వారు ఇద్దరుగలరు. అందులో మొదటి సృష్ఠికర్తయినవాడు ఒకడు గలడు. అతడు ఏ పనినీ చేయనివాడుగా యున్నాడు. రెండవ అల్లాహ్ శరీరములో అన్ని కార్యములను చేయువాడుగా యున్నాడు. ఏ కార్యములు చేయని అల్లాహ్‍కు సంతతి లేదు. సంతతిలేని అల్లాహ్ రెండవ అల్లాహ్‍ను సృష్ఠించి ఆయనకు పనిని కల్పించాడు. శరీరము లోపల పని చేయు అల్లాహ్‍ను కాదని అన్నిటికీ అతీతునిగా మొదటి అల్లాహ్ గలడు. రెండవ అల్లాహ్‍కు ఏ లక్షణాలు గలవో వాటికి అన్నిటికీ మొదటి అల్లాహ్ అతీతుడుగా యున్నాడు. చాలామందికి ఇద్దరు అల్లాహ్‍లు ఉన్నారని తెలియదు. మొదటి అల్లాహ్ ఆరాధనలకు అతీతుడు అయినందువలన ఆయనతో భాగస్వామిగా వేరే దైవము భాగస్వామిగా లేడు. ఆయన తయారు చేసిన రెండవ ఆత్మయిన అల్లాహ్ సమస్త ప్రజలకు ఆరాధ్య దైవముగాయున్నాడు. మొదటివాడయిన పరమాత్మకు భాగస్వామిగా యున్నవాడుగానీ, సమానమైనవాడుగానీ ఎవడూ లేడు. మొదటి అల్లాహ్ అయినవాడు విశ్వవ్యాప్తముగా అణువణువునా ఉండగా, ఆత్మగా యున్న రెండవ అల్లాహ్ శరీరముల లోపల మాత్రము గలడు. జ్ఞాని అయినవాడు ఇద్దరు అల్లాహ్‍ల విషయము తెలిసియుండాలి. అందరూ ఆ విషయమును తెలియాలను ఉద్దేశ్యముతోనే ప్రత్యేకించి అల్లాహ్‍ను గురించి ఆయనకు కొడుకులు లేరని చెప్పారు. రెండవ అల్లాహ్‍కు సమస్త మానవులు సంతతిగాయున్నారు. మొదటి అల్లాహ్‍కు సంతతి ఏమాత్రము లేదు. ఆయననుండి పుట్టినవి, ఆయనలోని భాగాలే తప్ప ఆయన సంతానమునకు సంబంధించినవి ఏవీ లేవు. మూడవ ఆత్మయిన పరమాత్మకు (అల్లాహ్‍కు) సమానమైనవాడు ఎవడూ లేడని చెప్పవచ్చును. అంతేకాక సృష్ఠిపూర్వము నేడు అందరికీ ఆరాధ్య దైవముగా యున్న ఆత్మ (అల్లాహ్) లేనేలేడు. ఆ రోజు ఉన్నవాడు పెద్దవాడు మొదటివాడయిన అల్లాహ్ మాత్రమే. ఆయన సృష్ఠి పూర్వము ఎవ్వరూ లేనప్పుడు కూడా, ఈ విశ్వముగానీ రెండవ అల్లాహ్గానీ లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అందువలన ఆ అల్లాహ్‍ను ఎల్లప్పుడూ ఉన్నవాడని చెప్పవచ్చును. సృష్ఠి పూర్వము ఆయన ఒక్కడేయుండుట వలన ఖుర్ఆన్ గ్రంథములో 112వ సూరాలో మొదటి వాక్యములోనే ''ఆయన ఒక్కడే గలడు'' అని చెప్పి యున్నారని గమనించవలెను. అంతేకాక 112వ సూరాలో మిగతా మూడు వాక్యములు (ఆయత్‍లు) ప్రత్యేకించి పరమాత్మయైన దేవున్ని (మొదటి అల్లాహ్‍ను) గురించి చెప్పినవేయని తెలియవలెను.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
97. మేము బరువైన గాలులను పంపుచున్నాము. మేమే వర్షాన్ని కురిపించి నీటిని త్రాగిస్తున్నాము. మా వలన కాకపోతే మీరు జలమును సంపాదించుకోలేరు. (15-22)
(15-22) ''మేమే బరువైన గాలులను పంపిస్తున్నాము. మరి ఆకాశము నుండి వర్షమును కురిపించి దాన్ని మీకు త్రాపిస్తున్నాము. ఈ (జల) నిధిని సమకూర్చుకోవడము అన్నది మీ వలన కాని పని.''

ఈ వాక్యము కూడా సూక్ష్మజ్ఞానముతో కూడుకొన్నదే. పైకి వ్రాసినది ఒక్కటైతే లోపల అర్థము చేసుకోవలసినది మరొకటియుండును. దేవుడు ఏమి చెప్పినా, ఎట్లు చెప్పినా తన జ్ఞానమును గురించే చెప్పును. అందువలన చెప్పిన మాటలలో మనము కనిపించని జ్ఞానమునే వెతకాలి. అందువలన ఈ వాక్యములో చెప్పిన మాటలకు జ్ఞాన సంబంధమైన అర్థమునే తీసుకొందాము. దానిప్రకారము 'బరువైన గాలులు' అనగా మనకు ఊపిరి ఆడక ఇబ్బంది పెట్టునవని అర్థము. దీని అర్థము ప్రకారము ప్రపంచములో ఎన్నో కష్టములతో కూడిన సంఘటనలు అని చెప్పవచ్చును. దేవుడు మనిషిని వాని కర్మప్రకారము కష్టపెట్టుచుండును. కష్టపెట్టడమే కాకుండా కష్టములకు కారణమైన పాపకర్మలు లేకుండా పోవుటకు దైవ జ్ఞానమును కూడా ఇచ్చాడు. దైవజ్ఞానము దేవుని నుండి కనిపించని స్థలము నుండి వచ్చుచున్నది. కావున ''ఆకాశము నుండి వర్షమును కురిపిస్తున్నాను'' అని అన్నాడు. వర్షము ద్వారా నీరు లభించును. దేవుని ద్వారా వచ్చిన జ్ఞానమును ఆకాశ వర్షముగా చెప్పాడు. 'తినేది, త్రాగేది' అన్నప్పుడల్లా గ్రంథమును చదివేది, లేక వినేది, తర్వాత త్రాగే దానిని జ్ఞానమును గ్రహించుకోవడము అని అర్థము చేసుకోవలెను. దేవుడు అందించిన జ్ఞానమును గ్రహించుట వలన మనిషిలో యున్న కర్మలు కాలిపోవును. అనగా క్షమించబడును. ఆ విధముగా జ్ఞానమును మనము స్వయముగా పొందలేమని దేవుడు సమకూర్చడము వలన మాత్రమే జ్ఞానమును పొందగలమని తెలియుచున్నది. ఈ వాక్యములో బరువైన గాలులు అనగా మనిషి పడే కష్టాలు అని అర్థము చేసుకోవాలి. అట్లే ఆకాశము నుండి కురిసే వర్షము అనగా, దేవుడు పై నుండి (పైన తలనుండి) అందించే జ్ఞానము అని అర్థము చేసుకోవాలి. నీరును త్రాపుచున్నాడు అనగా జ్ఞానమును అర్థము అగునట్లు చేయుచున్నాడు అని చెప్పవచ్చును. జలమును సమకూర్చుకోవడము మీ వలన కానిపని యని చెప్పడములో అర్థము ఏమనగా! దేవుని జ్ఞానమును మీరు స్వయముగా తెలియలేరు అనీ, దేవుడు అందిస్తేనే అది మీకు లభించునని చెప్పినట్లున్నది.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
98. ప్రాణము తీసేవాడు మరియు ప్రాణము పోసేవాడు దేవుడే. అంతకు ముందున్న వారినీ తర్వాత వచ్చేవారినీ తెలిసినవాడు దేవుడే. దేవుడు అందరినీ సమీకరిస్తాడు. ఆయన మహా వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. (15-23, 24,25)
(15-23,24,25) ''ప్రాణము పోసేది, ప్రాణము తీసేది కూడా మేమే. చివరికి వారసులము కూడా మేమే. మీకు పూర్వము సాగిపోయిన వారినీ మేము ఎరుగుదుము. తర్వాత వచ్చే వారిని కూడా మేము ఎరుగుదుము. నీ ప్రభువు వారందరినీ సమీకరిస్తాడు. నిశ్చయముగా ఆయన మహా వివేకవంతుడు. అన్నీ తెలిసినవాడు.''

దేవుడు రక్షించేవాడే కాదు శిక్షించేవాడు కూడా. అంతేకాదు ఆయనే ప్రాణమును పోస్తున్నాడు, ఆయనే ప్రాణమును తీస్తున్నాడు. అయితే ఈ పనిని చేసేది ఒక దేవుడే. ఇంకొక దేవుడు అన్నీ చూస్తూయున్నాడు. ప్రాణము తీసేది, ప్రాణము పోసేది, అందరికీ ఆరాధ్య దైవము, శరీరములో నివశిస్తూ శరీరమునకు అధిపతిగాయున్న రెండవ ఆత్మయని తెలియవలెను. మొదటి ఆత్మ జీవాత్మకాగా, జీవాత్మకు శరీరములో రెండవ ఆత్మ తోడుగా యున్నది. మూడవ ఆత్మ అయిన పరమాత్మ ఏమీ చేయక అన్నిటినీ చూస్తూ సాక్షిగా యున్నాడని ఇంతకుముందే చెప్పుకొన్నాము. అయితే ఈ వాక్యములో ఆత్మ స్వయముగా ప్రాణము పోసేది, ప్రాణము తీసేది నేనేయని చెప్పుచున్నది. అంతేకాక గతములో చనిపోయిన వారు ఎవరో, భవిష్యత్తులో పుట్టేవారు ఎవరో నాకు తెలుసు అని ఆరాధ్యదైవమయిన అల్లాహ్ అనుచున్నాడు. చనిపోయిన వారిని తిరిగి జన్మకు తీసుకవచ్చేది ఆత్మనే అయినందున గతములో చనిపోయినవారు అందరూ ఇప్పుడు జీవితములో ఎవరుగా యున్నారో పుట్టించిన ఆయనకే తెలుసు. ఈ విషయము చాలామందికి తెలియక చనిపోయినవారు వేరు, తర్వాత ఇప్పుడు పుట్టినవారు వేరు అని అనుకొను చుందురు. గతములో చనిపోయినవారే వెంటనే పుట్టి ఇప్పుడు జీవనము సాగించుచున్నారని తెలియదు.

చనిపోయిన వారందరూ తిరిగి పుట్టలేదనీ, పుట్టువారందరూ క్రొత్త వారని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. ముస్లీమ్‍లలో ఈ విధముగా అనుకోవడము గలదు. అయితే ఖుర్ఆన్ గ్రంథములో ఎక్కడా ఆ విధముగా వ్రాసియుండలేదు. వ్రాయని విషయమును బోధల రూపములో కొందరు తెలిసీ తెలియక చెప్పగా, ఖుర్ఆన్ గ్రంథములో చనిపోయిన వాడు తిరిగి పుట్టుచున్నాడని అల్లాహ్ చెప్పిన వాక్యములను కూడా లెక్కచేయక మా పెద్దల మాటే ముఖ్యము అని అంటున్నారు. ఖుర్ఆన్‍లో చెప్పిన మాటకు వ్యతిరేఖముగా చెప్పువారు పెద్దలు కాదు. వారు వయస్సులో పెద్దయినా జ్ఞానములో చిన్నయనే తలవండి. దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍కు విలువ నిచ్చుచూ చెప్పితే, చనిపోయినవానికి మొదటి జన్మవలె మలి జన్మను కల్గించుచున్నానని అల్లాహ్ ఆయత్‍ల రూపములో చెప్పిన వాక్యములను విశ్వసించి తీరవలసిందే. దైవ గ్రంథము ప్రకారము చూస్తే చనిపోయిన వాడు తిరిగి రెండవ జన్మకు వచ్చుచున్నాడని తెలియుచున్నది. దాని ప్రకారము చూస్తే క్రొత్త విషయములు క్రొత్త కోణములో తెలియుచున్నవి. ఇక్కడ ప్రాణము తీసేది నేనే, ప్రాణము పోసేది నేనేయని దేవుడన్నాడు. అయితే దేవుడు అయిన ఆత్మ ఎవరికి ప్రాణము పోస్తున్నాడు, ఎవరికి ప్రాణము తీస్తున్నాడు అని ఆలోచించితే ప్రాణము కనిపించలేదుగానీ, పోసే ప్రాణము శిశువులోను, తీసే ప్రాణము చనిపోవు శరీరములలోను అని తెలియుచున్నది. జీవుడు కనిపించలేదు, చనిపోయే శరీరము, జన్మించే శరీరము రెండూ కనిపించుచున్నవి. కనిపించు శరీరములను వదలి పుట్టే జీవుడు, చనిపోయే జీవుడు ఎవరు? అని ఆలోచించిన ఇట్లు తెలియుచున్నది. ఉదాహరణకు చెప్పుకొంటే త్రేతాయుగములో రాముడున్నాడు, రావణుడు ఉన్నాడు. వారిద్దరికీ యుద్ధము జరిగిన విషయము అందరికీ తెలుసు. శ్రీరాముని ప్రక్కన కోతుల సైన్యము కలదనీ, రావణబ్రహ్మ ప్రక్కన ఆయన సైన్యము కలదని చెప్పుచుందురు. ఇరువైపులా కొన్ని వేలమంది కలరని చరిత్రలో కలదు. అయితే అప్పుడు యుద్ధములో ఇరువైపులా చనిపోయినవారు గలరు. వారు వెంటనే మరుజన్మకు పోయి పుట్టి యుందురు. అక్కడ కొంత కాలము బ్రతికి అక్కడ చనిపోయి, ఇంకొక జాగాలో పుట్టి అక్కడ కొన్ని సంవత్సరములు బ్రతికి, తిరిగి దేవుని చేత చంపబడి, తిరిగి దేవుని చేత మరొక జాగాలో పుట్టుతూ వస్తూ వస్తూ ఆ రోజు రాముని ప్రక్కనయుండి యుద్ధము చేసినవారు మరియు రావణుని ప్రక్కనయుండి యుద్ధము చేసినవారు ఇరువురూ ఒకే ఊరిలో పుట్టారు. అయినా వెనుక జన్మల జ్ఞాపకములు ఎవరికీ ఉండవు కనుక ముందు ఎన్నో జన్మలను పొంది, చనిపోతూ వస్తూ నేడు ఇప్పటికి ఇక్కడున్నామని ఎవరికీ తెలియదు. అయితే దేవుడయిన ఆత్మ అందరినీ సమీకరిస్తాడు. ఎవరినీ వదలక అందరినీ సమీకరించి ఎవరిని ఎక్కడ పంపాలో అక్కడ పంపుచుండును. అందువలన రాముని ప్రక్కన యుద్ధము చేసినవారు ఎక్కడున్నారో, అట్లే రావణ బ్రహ్మ ప్రక్కన యుద్ధము చేసినవారు ఎక్కడున్నారో అల్లాహ్‍కు బాగా తెలుసు. గతములో చనిపోయిన వారిని సమీకరించి ఒకే ఇంటిలో, ఒకే కుటుంబములో కూడా పుట్టియుండునట్లు చేసియుండ వచ్చును. అట్లు ఎవరిని ఎక్కడ పుట్టించాలో, అల్లాహ్ బాగా తెలిసినవాడు. అందువలన అల్లాహ్‍ను వివేకవంతుడనీ, అన్నీ తెలిసినవాడని వాక్యములో చెప్పియున్నారు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
99. వారి హృదయాలపై తెరలు వేస్తాము. వారి చెవులు మొద్దుబారి పోయాయి. (17-46)
(17-45) ''ఓ ప్రవక్తా! నీవు ఖుర్ఆన్ పఠిస్తున్నప్పుడు మేము నీకూ, పరలోకాన్ని నమ్మనివారికీ మధ్య కనిపించని ఒక తెరను వేస్తాము. (46) అంటే వారు దానిని అర్థము చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేస్తాము. వారి చెవులు మొద్దుబార చేస్తాము. నువ్వు ఈ ఖుర్ఆన్‍లో ఒక్కడైన అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని (తౌహీద్‍ను) ప్రస్తావించినప్పుడల్లా వారు తీవ్ర అయిష్టతను వ్యక్తము చేస్తూ వెను తిరిగి వెళ్లిపోతారు.''

ఈ వాక్యము చూచేదానికి సులభముగా యున్నది. అయితే అర్థము చేసుకోవడములో కొంత కష్టముగా యున్నది. మనిషికి జ్ఞానము అర్థము కావాలంటే ముందు మనిషి అల్లాహ్‍కు ఇష్టమయి ఉండాలి. అల్లాహ్‍కు ఇష్టము లేనివారికి అల్లాహ్‍యే తన జ్ఞానము అర్థము కాకుండా చేస్తాడు. అందువలన వారి హృదయాల మీద తెరను వేస్తాను అన్నాడు. అంతేకాక వారి చెవులు మొద్దుబారి వినిపించకుండా చేస్తాను అని అన్నాడు. అలా చెప్పడములో అర్థము ఏమనగా! తన జ్ఞానము, తనమీద విశ్వాసము లేనివారికి అర్థము కాకుండా చేస్తాను అని అన్నాడు. అయితే మాకు అల్లాహ్ మీద విశ్వాసము ఉన్నదని అందరూ అంటున్నారు. అందరూ దేవున్ని ప్రార్థన చేస్తున్నామని అంటున్నారు. అటువంటప్పుడు అలా అనువారికి కూడా దేవుని జ్ఞానము అర్థము కాకుండా పోయినది. గ్రంథములో దేవుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన వాక్యములను వినకుండా వారి పెద్దలు చెప్పినట్లు వినుచున్నారు. షరియత్ అను పేరును అడ్డము పెట్టుకొని దేవునిమాటను కాదని ఇతర మనుషులు చెప్పినమాటను నమ్ము వారికి దేవుడు తన జ్ఞానమును ఏమాత్రమూ అర్థము కాకుండా చేయును. ఈ వాక్యములో అల్లాహ్ యొక్క ఏకత్వమును చెప్పితే విసుగుకొను వారున్నారంటే వారికి దేవుడు తన జ్ఞానమును ఎందుకు ఇచ్చును అని మనము అనుకోక తప్పదు. చాలామంది మేము అల్లాహ్ యొక్క ఏకత్వమును నమ్ముచున్నాము అని అనినా వారు నమ్ముచున్న అల్లాహ్ వేరు, వాక్యములో చెప్పిన అల్లాహ్ వేరని తెలియుచున్నది. వారు ఆరాధించు అల్లాహ్ ఒక్కడేయని, రెండవవాడు లేడుయని అనుచున్నారు. అయితే ఈ వాక్యములో చెప్పిన అల్లాహ్ యొక్క ఏకత్వమును నమ్మలేరని ఏ దేవున్ని గురించి చెప్పుచున్నారని ఆలోచించడము లేదు. మూడవ అల్లాహ్‍ను ''అల్లాహ్ ఏకైకుడు'' అని 112వ సూరాలో మొదటి వాక్యములోనే చెప్పియున్నారు. అయితే ఆరాధించబడు అల్లాహ్ రెండవవాడనీ, మూడవ వాడయిన అల్లాహ్ సృష్ఠి ముందునుండి ఏకైకుడుగా ఉన్నాడంటే ఆ మాట చాలామందికి అర్థము కాకుండా పోయినది. సృష్ఠి ముందునుండి ఉన్నవాడు ఎవరో తెలియనివారు సృష్ఠి తర్వాతయున్న రెండవ అల్లాహ్‍ను ఒక్కడిని మాత్రమే విశ్వసించి మొదటినుండి ఏకైకుడుగా యున్న ఆయనను విశ్వసించడము లేదు. మేము పరమాత్మయిన వాని ఏకత్వమును చెప్పితే రెండవవానిగా పుట్టిన ఆత్మను ఆరాధించడమే ఏకత్వము అని అంటున్నారు. ఆరాధ్య దైవము ఒక్కడేయని మేము కూడా ఒప్పుకొంటున్నాము. అయితే ఆయనకంటే ముందున్నవాడు ఒక్కడేయున్నాడు అని చెప్పితే వారు తీవ్ర అయిష్టతను వ్యక్తము చేస్తున్నారని వాక్యములో చెప్పారు. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమిటంటే! మేము జ్ఞానులము అని అనుకొన్న వారంతా ఆరాధింప బడు అల్లాహ్‍ను మాత్రమే నమ్మి, మిగతా అల్లాహ్ సృష్ఠి పూర్వము నుండి ఉన్నాడని తెలియకపోవడమే వారికున్న పెద్ద అజ్ఞానమయినది. అందువలన వారి హృదయాల మీద తెరలు వేస్తానని మూడవ అల్లాహ్ అయిన పరమాత్మ చెప్పుచున్నాడు.


అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
100. ఆకాశాలలో భూమిలో ఉన్న వాటన్నిటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి శ్రేష్ఠత కల్పించాము. ఇంకా దావూదుకు జబూరను ఇచ్చాము. (17-55)
(17-55) ''ఆకాశాలలో భూమిలో ఉన్న వాటన్నిటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి మరి కొందరిపై శ్రేష్ఠతను ప్రసాదించాము. ఇంకా మేము దావూదుకు జబుర (గ్రంథము) వొసగాము.''

ఆకాశము భూమి అని చెప్పినప్పుడు బయట ప్రపంచములో కనిపించే ఆకాశము, కనిపించే భూమిగా లెక్కించవలసి యుండును. అట్లు కాకుండా ఆకాశములు అని బహువచనము చెప్పినప్పుడు శరీరము లోపల కనిపించకయుండే ఆకాశముగా లెక్కించవలెను. అనగా శరీరమును గురించి చెప్పుచున్నారని గుర్తించుకోవలెను. ఇప్పుడు ఈ వాక్యములో చెప్పిన దానినిబట్టి దేవునికి శరీరములో యున్నదంతా బాగా తెలుసు అని చెప్పారు. శరీరములో కనిపించనివి చాలాయున్నాయి. ఏడు ఆకాశములు కనిపించవు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహము, జీవుడు ఇవేకాక ఇంకా కనిపించనివి చాలాయున్నాయి. శరీరమును గురించి దేవునికి బాగా తెలుసు అన్నప్పుడు ఏ దేవునికి అను వివరము మనకు తెలిసియుండాలి. దాని తర్వాత వాక్యములో ''మేము ప్రవక్తలలో కొందరికి మరికొందరిపై శ్రేష్ఠతను ప్రసాదించాము.'' అని అన్నప్పుడు ఈ మాటను చెప్పినవాడు శరీరములోని రెండవ ఆత్మయని అర్థమగుచున్నది. దానివలన నీ ప్రభువుకు శరీరమును గురించి బాగా తెలుసుయని చెప్పినవాడు ఆత్మకాగా శరీరమును తెలిసినవాడు పరమాత్మ యని, ఆయననే ప్రభువు అని ఉచ్ఛరించి రెండవ ఆత్మ చెప్పడమైనదని తెలిసినది. శరీరములోని ఆత్మ ప్రవక్తలలో కొందరిని పెద్ద ప్రవక్తలను చేసి, వారిలో శ్రేష్ఠత్వమును చూపుచున్నది. అలాగే దావూదు అను ప్రవక్తకు 'జబుర' అను జ్ఞానబోధను మాటల రూపములో ఆత్మయే చెప్పినది. జబుర ను చెప్పినది, ప్రవక్తలను కొందరిని గొప్పగా చేసినది ఆత్మకాగా, మనిషి శరీరము మొత్తమును తెలిసినవాడు పరమాత్మయని ఆత్మయే ఈ వాక్యములో చెప్పినది. అయితే కొందరు జబుర అనునది గ్రంథము పేరని చెప్పారు. వాస్తవముగా జబుర అనునది జ్ఞానమునకు పెట్టిన పేరేగానీ గ్రంథము పేరుకాదని తెలియవలెను. దేవుడు సృష్ఠి ఆదిలో మొట్టమొదట చెప్పిన జ్ఞానము పేరే జబుర. అయితే అది మొదట ''జపర'' యను పేరుతో చెప్పబడేదని, తర్వాత కాలక్రమమున దానిపేరు జపర పోయి జబుర గా చెప్పబడుచున్నది. జబుర అనునది భూమిమీద మొదట మనువు అను వ్యక్తికి చెప్పబడినది. అప్పటి మనువును ఖుర్ఆన్ గ్రంథములో పేరుమార్చి దావూదు అని చెప్పారు. మొదట సూర్యగ్రహము మనువు (దావూదు) అను వ్యక్తికి జ్ఞానము చెప్పాడు. అదే సూర్యగ్రహమే కలియుగములో జిబ్రయేల్ అను పేరు మార్చుకొని ముహమ్మద్ అను ప్రవక్తకు జ్ఞానమును చెప్పాడు. సూర్యుడు జిబ్రయేల్గా, మనువు దావూద్ గా, మోషేను మూసాగా, ఏసును ఈసాగా, బైబిలును ఇంజీలుగా ఖుర్ఆన్ గ్రంథములో పేర్లు మార్చి చెప్పారు. వాస్తవానికి జబుర అనునది గ్రంథము కాదు మాటల రూపములోయున్న జ్ఞానము.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024