pss:vemana sloka
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమా. 2
భావము:- ఈ పద్యమును చాలామంది జ్ఞానసంబంధముగకాక ప్రపంచ సంబంధముగ అర్థము చేసుకొను ప్రమాదముగలదు. చూడ జూడ జూడగల్గు చోద్యమగు జ్ఞానంబు అన్నట్లు ఇందులో పూర్తిగ జ్ఞానమే ఇమిడియున్నది. భగవద్గీత ప్రకారము సర్వజీవులకు ప్రకృతి తల్లిగ ఉన్నది. సర్వజీవరాసుల శరీరములను తయారుజేయు ప్రకృతి తల్లికాగ, ఆ శరీరములకు చైతన్యమిచ్చి కదలించుచున్న ఆత్మ తండ్రిగా ఉన్నాడు. తల్లియైన ప్రకృతి, తండ్రియైన పరమాత్మను తెలియనివాడు, ప్రకృతి పురుషులమీద ధ్యాస లేనివాడు. వాటి జిజ్ఞాస లేనివాడు పుట్టియు ప్రయోజనము లేదు. శరీరమును తయారు చేసిన ప్రకృతి మీద, శక్తి నిచ్చుచున్న ఆత్మ మీద విచక్షణాజ్ఞానము లేనివాడు పుట్టలోన చెదలుతో సమానమే.
పుట్టలోని చెదలు పుట్టలోనే పుట్టుచున్నది. పుట్టలోనే పెరుగుచున్నది. పుట్టలోనే చస్తూ ఉన్నది. ఆ విధముగనే మానవుడై పుట్టినవాడు నిజమైన తల్లిదండ్రులైన ప్రకృతి పురుషులను ఆలోచించక మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయలోనే చస్తూ ఉన్నాడు.
----
త్రైతశకము
నిగూఢ తత్వార్థ బోధిని
వేమన పద్యములు
☜ నిగూఢ తత్వ వివరము
☞
పతియొప్పిన సతి యొప్పును
పతి సతులొకటైన పరమ పావనమందున్
పతి సతి న్యాయమె మోక్షం
బతులిత పరమాత్మనైక్యమగురా వేమా. 109
భావము:- పతి అనగా భర్త, సతియనగ భార్య అని అందరికి తెలుసు. పెళ్లి అయితేనే పతి సతులౌతారను విషయము కూడ తెలుసు. పతి సతులకు పిల్లలు పుడతారని కూడ తెలుసు. ఈ విధానమంతా జ్ఞానులకు, అజ్ఞానులకు అందరికి తెలిసినప్పటికి చాలామందికి ఈ విషయము దైవికమైనదని, ఆ దైవిక విషయమే ప్రపంచములో ఇలా ప్రతిబింబించి ఉన్నదని, ప్రపంచములో ప్రత్యక్షముగనున్న పతి, సతుల విధానమును ఆధారము చేసుకొని పరోక్షముగనున్న దైవ విధానమును అర్థము చేసుకో గలరని దేవుడే ఇలా ఉంచాడు. దైవికమైన పతి, సతి విధానమేదో ఇపుడు వివరించి చూచుకొందాము.
భగవద్గీత గుణత్రయ విభాగ యోగమను అధ్యాయములో మొదటనే పరమాత్మను పతిగ, ప్రకృతిని సతిగ చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారము జగతి మొత్తమునకు ప్రకృతి, పురుషులు సతి పతులుగా ఉంటూ ప్రతి జీవరాసికి వారే తల్లితండ్రులైనారు. ప్రపంచములోని మనుషజాతికేకాక క్రిమి, కీటక, పశు, పక్షి, వృక్షలతాదులకన్నిటికి తల్లి ప్రకృతి, తండ్రి పరమాత్మ అని తెలుపబడి ఉన్నది. జగతి మొత్తమునకు తల్లి తండ్రులుగ ఉంటూ పతి సతులుగ యొప్పు పరమాత్మ ప్రకృతి ప్రపంచములో విభిన్నముగ ప్రవర్తించుచున్నారు. పతియైన పరమాత్మకు సతియైన ప్రకృతి విధేయురాలైనప్పటికి, పరమాత్మ ఆదేశానుసారము జగతి పట్ల పరమాత్మ మార్గమైన దైవమార్గమునకు ప్రకృతియైన మాయ ఎంతో వ్యతిరేఖముగనున్నది. దైవమార్గమును అనుసరించవలెననుకొను వానిని ఆ ప్రయత్నమును భంగముచేసి విరమించుకొనునట్లు చేయుచున్నది. అంతయు దేవునికి తెలిసే జరుగుచున్నది. దేవుని గూర్చిన ప్రయత్నములో మాయ ప్రభావమునకు తట్టుకొనలేక అందరు వెనుదిరుగుచున్నారు. అయినప్పటికి ఎన్నో లక్షల మందిలో ఏ ఒక్కడో మాయను వ్యతిరేకించి అన్ని కష్టములకు ఓర్చుకొని దేవుని చేరుకోవాలని ప్రయత్నించుచున్నారు. అటువంటి వానిని దేవుడు, వాని మార్గమును సుగమముచేసి మాయ ఆటంకమును తొలగించి, తనయందు కలుపుకొనును. బలమైన మాయ కల్పించు పరిస్థితులన్నిటిని అనుభవిస్తు, పట్టువదలక దేవునికొరకు ప్రయత్నించు వానిని దేవుడు ఒప్పుకొనును. దేవుడు ఒప్పుకొన్నపుడు మాయ వానిని ఆటంకపరచదు. అటువంటివాని యోగము యొక్క క్షేమమును దేవుడే పరిరక్షించును. అపుడు వాడు దేవునియందైక్యమై పోవును.
ప్రపంచములో మాయ కలుగజేయు అనేక కష్టములను అతిక్రమించి, దేవుని మార్గమును వదలని వానిని, దేవుడు తన మనిషిగ అంగీకరించును. అపుడు వెంటనే ప్రకృతియైన మాయ తాను కూడ వానిని ఒప్పుకొన్నదై వానికి ఆటంకము కలుగజేయదు. కావున పై పద్యమందు పతియొప్పిన సతి యొప్పునన్నారు. ఆ విధముగ పరమాత్మ, ప్రకృతి ఇద్దరు వానిపట్ల ఒకటై నడుచుకొన్నపుడు వాడు మోక్షము పొందును. దానినే పద్యమందు వ్యక్తపరుస్తు పతిసతులొకటైన పరమ పావనమందున్ అన్నారు. పతి, సతి ఇద్దరు ఒక మార్గమును నడచుకోవడము న్యాయమగును. పతికి సతి విరుద్ధముగ నడుచుకోవడము అన్యాయమగును. ప్రకృతి, పరమాత్మ భక్తునిపట్ల న్యాయమార్గమున చరించిన మోక్షము లభించును. కావున పై పద్యమందు పతి సతి న్యాయమే మోక్షము అన్నారు. పతి, సతి న్యాయముగ చరించినపుడు భక్తుడు వెంటనే జన్మరాహిత్యము పొందును. కనుక బతులిత పరమాత్మనైక్యమగురా అన్నారు.
ప్రపంచములో ఒక భక్తునిపట్ల భార్యాభర్తలైన ప్రకృతి పరమాత్మలు మొదట అన్యాయముగ ప్రవర్తించుదురని ఈ పద్యము ద్వారా వేమన మనకు తెలియజేసాడు. పతి ఒప్పినపుడే సతియు ఒప్పుకొని ఇద్దరు న్యాయముగ ప్రవర్తించుదురు. వారిద్దరు ఒకటై న్యాయముగ ప్రవర్తించి నపుడే భక్తునికి మోక్షము లభించును. మాయ ఆటంకములను ఓర్చుకోలేక నేనెంత భక్తిగ ఉన్న నాకే కష్టాలొస్తున్నవని, దేవుని వద్ద న్యాయము లేదను కొన్నవాడు దేవుని మార్గములో భ్రష్టుడగును. దేవుని గూర్చి ఏమి అనుకోక అన్నిటికి ఓర్చుకొన్నవాడు మొదట పరమాత్మచేత ఒప్పుదల పొంది ప్రకృతి, పరమాత్మలు న్యాయముగ ప్రవర్తించగ భక్తుడు మోక్షము పొందును.
పతి సతుల విధానము ప్రపంచములో ప్రతిబింబించి ఉన్నదని ముందే చెప్పుకొన్నాము. పతికి సతి వ్యతిరిక్తముగ నడుచుకొనుట, పతిని తన మాటవినునట్లు చేసుకొనుటైన అన్యాయవిధానము భూమి మీద కలదు. అట్లే పతికి, సతి అనుకూలముగ నడుచుకొనుట, పతిమాటయే తన మాటగ పతి చెప్పినట్లు సతి నడుచుకొను న్యాయమార్గము భూమి మీద గలదు. మీ అనుభవములో న్యాయ, అన్యాయ, పతి, సతులను గూర్చి తెలిసినట్లయితే ఎవరైన సంపూర్ణ జ్ఞానులుకాగలరు. దేవుని మార్గములో నడుచువారికి ఆటంకటములేర్పడిన, దేవుని దగ్గర న్యాయముందా? అని సహనము కోల్పోయి మాట్లాడరు. ఎన్ని కష్టములొచ్చిన ఇది తల్లియైన మాయపని అని ఎరుకగల్గి నడుచుకొందురు.
--_-