rill 132




అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
126. ఏ ప్రమాణము లేకుండానే అల్లాహ్ నిదర్శనాల గురించి వాదిస్తారు. అది దేవునికి సరిపోదు. వారికి ముద్ర పడుతుంది. (40-35)
(40-35) ''వారు తమవద్దకు వచ్చిన ఏ ప్రమాణము లేకుండానే అల్లాహ్ నిదర్శనాల విషయములో మొండిగా వాదిస్తారు. ఈ పోకడ అల్లాహ్ వద్ద, విశ్వాసుల వద్ద కూడా ఎంతో అయిష్టకర మైనది. ఈ విధముగా గర్విష్టి మరియు కౄరుడైన ప్రతి వ్యక్తి హృదయముపై అల్లాహ్ ముద్ర వేసేస్తాడు.''

నిదర్శనము అనగా కనిపించనిది. కనిపించని ఏ జ్ఞానమయినా ప్రమాణములతో కూడుకొని యుండుట సహజము. కనిపించే దానికి ప్రమాణము అవసరము లేదు. దేవుడు అనేకమైన తన నిదర్శన జ్ఞానమునకు అనేక ప్రమాణములను చెప్పియున్నాడు. ఉదాహరణకు మనస్సును గురించి చెప్పినప్పుడు ''గాలి లేనిచోట దీపము వెలిగినట్లు'' అని చెప్పాడు. మనస్సు నిదర్శనముతో కూడుకొన్నదై యున్నది. దానికి గాలి లేనిచోట దీపము వెలిగినట్లు అనునది ప్రమాణముగా యున్నది. అలా ప్రమాణమును చెప్పినప్పుడు కనిపించని నిదర్శన విషయము కూడా కనిపించునట్లు తెలియబడును. అయితే కొందరు కౄరులైనవారు, గర్విష్టులయినవారు ఏ ప్రమాణము లేకుండా కొన్ని నిదర్శన విషయాలను గురించి మాట్లాడు చుందురు. అటువంటివారికి దేవుడు వారి హృదయాలపై అనగా వారి బుద్ధిపై దేవుడు ముద్రవేస్తాడు. ముద్ర వేయడము అనగా ఉన్న గ్రహింపు శక్తి కూడా లేకుండాపోవును. వారి హృదయాలలో ఆత్మ, పరమాత్మ ఉండడమే కాకుండా ముఖ్యముగా బుద్ధి కూడా ఉండును. అలా హృదయములో యున్న బుద్ధికి ఉన్న శక్తిని దేవుడు లేకుండా చేయును. దేవుడు అను ధ్యాస వచ్చినప్పుడు ఏ ప్రమాణమును లేకుండా వాదించు వారు మొండిగా వాదించువారుగా యున్నారు. అటువంటి వారికి ఎప్పటికీ జ్ఞానము అర్థము కాకుండా దేవుడు చేయుటకు వారి బుద్ధికి గ్రహింపు శక్తి లేకుండా ముద్ర వేయును.




అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
127. భూమి ఆకాశముల సామ్రాజ్యము అల్లాహ్‍దే. తాను కోరినది సృష్ఠిస్తాడు. కొందరికి ఆడ పిల్లలను ఇస్తాడు. మరికొందరికి మగ పిల్లలను ఇస్తాడు. (42-49)
(42-49) ''భూమి ఆకాశముల సామ్రాజ్యము అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్ఠిస్తాడు. తాను కోరిన వారికి ఆడపిల్లలనిస్తాడు. తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు.''

(42-50) ''లేదా వారికి ఆడ పిల్లల్ని, మగ పిల్లల్ని కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతానహీనులుగా చేస్తాడు. ఆయన మహా జ్ఞాని, సంపూర్ణ అధికారము కలవాడు.''

ఈ రెండు ఆయతులలో రెండవ ఆత్మయిన వాడు, అందరికీ ఆరాధ్య దైవముగా యున్నవాడు, శరీర సామ్రాజ్యమునకు సంపూర్ణ అధికారిగా యున్నవాడు, సమస్త జీవరాసులకు బీజదాతగాయుండి నిజమైన తండ్రిగా యున్నవాడు అయిన దేవున్ని గురించి ఇక్కడ చెప్పియున్నారు. ప్రథమ దైవ గ్రంథములోనే గుణత్రయ విభాగ యోగమున మూడు, నాలుగు శ్లోకములలో ఈ అల్లాహ్‍ను గురించి ఏమి చెప్పారో చూడండి.
శ్లో|| 3. మమ యోని ర్మహద్భహ్మ్ర తస్మిన్ గర్భం దధామ్యహమ్ |
సంభవ స్సర్వభూతానాం తతో భవతి భారత! ||

భావము :- శరీర రూపములో యున్న ప్రకృతి నాకు భార్యగా ఉండగా, నేను ప్రకృతికి బీజదాతగా యున్నాను. అందువలన భూమిమీద జీవరాసులు పుట్టుచున్నవని చెప్పుచున్నాను.
శ్లో|| 4. సర్వయోనిషు కౌంతేయ! మూర్తయః సంభవంతి యాః |
తాసాం బహ్మ్ర మహద్యోనిః అహం బీజపద్రః పితా ||

భావము :- సకల గర్భములయందు పుట్టుచున్న సర్వ జీవరాసులకు బీజదాతనైన నేను తండ్రికాగా, ప్రకృతి తల్లిగా యున్నది. ఈ విధముగా సర్వజీవులకు తల్లితండ్రులు ప్రకృతి పురుషులని తెలియవలెను.

ఈ రెండు శ్లోకములలో అల్లాహ్ (దేవుడు) పుట్టిన జీవరాసుల కందరికీ నేను తండ్రిని, ప్రకృతి తల్లిగా యున్నదని, అయితే తమ నమూనాగా బయట కనిపించు తల్లి తండ్రులున్నారనీ ఆత్మజ్ఞానము (దైవజ్ఞానము) తెలియనివారికి బయట తల్లితండ్రులే కనిపించుచుందురనీ, వారి వెనుక కనిపించకయున్న తండ్రియైన తానుగానీ, తల్లియైన ప్రకృతిగానీ కనిపించడము లేదని చెప్పాడు. ఇదంతయూ ప్రథమ దైవ గ్రంథములోని విషయముకాగా, అదే విషయమునే అంతిమ దైవగ్రంథములో (42-49, 50) ఆయత్‍లలో చెప్పారు. సర్వులకు ఆరాధ్య దైవమైన అల్లాహ్ మరియు శరీరములో ఆత్మగాయుండి అన్నీ చేయుచూ, బీజదాతగా యున్న అల్లాహ్‍యే సర్వజీవరాసులకు తండ్రియని తెలియక, లోపలి వారి నమూనాను చూపునట్లున్న బయటి తల్లితండ్రులనే అందరూ తల్లి తండ్రులుగా లెక్కించు చున్నారు. వాస్తవముగా నిజమైన తల్లి తండ్రులను తెలియు నిమిత్తము బయట తల్లి తండ్రులను దేవుడు చూపుచున్నాడు. బుద్ధి వికాసములేని వారు, ఆత్మజ్ఞానము తెలియనివారు బయట కనిపించు మనుషులనే తల్లి తండ్రిగా గుర్తించగా, ఆత్మజ్ఞానము గలవాడు దైవగ్రంథములలోని జ్ఞానమును గ్రహించి, గ్రహించిన జ్ఞానము ప్రకారము కనిపించక శరీరములోనే యున్న తల్లి తండ్రులను గుర్తించుచున్నాడు.

దైవ గ్రంథములలో దేవుడు తెల్పిన జ్ఞానము ప్రకారము జీవరాసులు ఎక్కడ ఏ గర్భములో పుట్టినా, వాటికన్నిటికీ నిజమైన తల్లితండ్రులు ప్రకృతి పురుషులని తెలియుచున్నది. వాక్యములో భూమి ఆకాశముల సామ్రాజ్యము అల్లాహ్‍దేయని చెప్పారు. దాని ప్రకారము భూమి, ఆకాశములు అని చెప్పగానే జీవుడు ధరించు శరీరమని తెలియవలెను. దానిప్రకారము మనము శరీరములో నివశించుచున్నాము. అయినా మనము నివశించు శరీరమునకు యజమాని ఆత్మయిన దేవుడే. బయటి ఇంటిలో కిరాయికి మనమున్నామనుకోండి. ఇంటిలో ఉన్నది మనమే అయినా ఇంటి యజమాని ఇంకొకరున్నారు. ఆయనకు ఇంటి కిరాయిని (బాడుగను) కట్టి ఉంటున్నాము. అలాగే శరీరములో నివశించు మనకు శరీరము నాదేయను భావముండినా, వాస్తవముగా శరీరము మనదికాదు. శరీరమునకు యజమాని శరీరమంతా వ్యాపించియున్న అల్లాహ్‍యే. నిత్యము ఆహారము అను కిరాయిని కట్టుచూ, ఇల్లును శుభ్రము చేసినట్లు ప్రతీ రోజు స్నానము, పళ్లు తోమడము, ముఖము కాళ్లు కడుక్కోవడము మొదలగు పరిశుభ్రత పనులు చేయుచూ శరీర గృహములో నివశించుచున్నాము. ఈ శరీరమునకు యజమానిగాయున్న అల్లాహ్‍యే నీకు తండ్రిగా, ప్రకృతి తల్లిగా యున్నది.

తండ్రియైన అల్లాహ్ శరీర సామ్రాజ్యమునకు అధిపతిగా యున్నాడు. అందువలన ఆయన అనుకొంటే ఆడ పిల్లలను ఇస్తాడు. అట్లే ఆయన అనుకొంటే కొందరికి మగ పిల్లలను ఇస్తాడు. ఆడ మగ పిల్లలను ఎవరికి ఎట్లు ఇవ్వాలని బాగా తెలిసినవాడు శరీరములో ఆత్మగా వ్యాపించి యున్న దేవుడు. ఆయన ఎవరి కర్మకు తగినట్లు వారికి ఆడ పిల్లలనుగానీ, మగ పిల్లలను గానీ ఇవ్వడము జరుగుచుండును. అట్లుకాకుండా ఆయన అనుకుంటే కర్మననుసరించి ఆడ, మగ పిల్లలను కలిపి కూడా ఇవ్వగలడు. కొందరికి అందరినీ ఆడ పిల్లలను ఇచ్చినవాడు, కొందరికి అందరినీ మగ పిల్లలనే ఇచ్చును. అంతేకాక ఇంకా కొందరికి సంతానము కలుగకుండా చేసి గొడ్రాళ్లుగా చేయును. సంతతికి ఆయనే తండ్రి అయినందున ఎవ్వరికి ఏ విధముగానయినా సంతానమును ఇవ్వవచ్చును. ఏ సంతానమునకయినా, ఎక్కడపుట్టిన సంతానమునకయినా, ఏ జాతిగా పుట్టిన సంతానమునకయినా, దేవుడే తండ్రియని తెలియవలెను. రెండవ ఆత్మకు మార్పు చెందే ప్రకృతికి సంతానము కలదుగానీ, మొట్టమొదటి ప్రకృతిని (ప్రపంచమును) సృష్ఠించిన పరమాత్మయను దేవునికి సంతతి లేదని జ్ఞాపకముంచుకోవలెను.



అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
128. ఘనమైన రాత్రి అంటే ఏమనుకొన్నావు? ఏదనుకొన్నావు? (97-1, 2, 3, 4, 5)
(97-1, 2, 3, 4, 5)

(1) నిశ్చయముగా మేము దీనిని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము.

(2) ఘనమైన రాత్రిని గురించి నువ్వు ఏమనుకొన్నావు?

(3) ఘనమైన రాత్రి వెయ్యి నెలలకంటే కూడా మేలయినది.

(4) రాత్రియందు దేవదూతలు, ఆత్మ తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల నిర్వాహణ నిమిత్తము దిగివస్తారు.

(5) ఆ రాత్రి మొత్తము (ఆసాంతము) శాంతియుతమైనది. తెల్లవారే వరకు అది శాంతియుతముగానే ఉంటుంది.

ఈ సూరాలో ఐదు వాక్యములున్నవి. ఈ ఐదు ఆయత్‍లలో మొదటి దానియందు, నాల్గవదానియందు దేవుడు చెప్పినది చెప్పినట్లు కాకుండా కొంత మానవ జోక్యముతో చెప్పబడినట్లు కన్పించుచున్నది. సామాణ్యముగా దానిని ఎవరూ గమనించలేరు. అట్లే ఇంతకుముందు కొన్ని సూరాలలోని ఆయత్‍లను కూడా జిబ్రయేల్ చెప్పిన దేవుని వాక్యమును అట్లేయుంచక బ్రాకెట్లలో తమకు తోచినది వ్రాశారు. ఖుర్ఆన్ మాతృగ్రంథములో గలదు అని చెప్పిన వెంటనే ఉమ్ముల్ కితాబ్ అని వ్రాశారు. (56-78) లో సురక్షితమైన గ్రంథములో ఖుర్ఆన్ నమోదై ఉన్నది అని చెప్పిన వెంటనే ఉమ్ముల్ కితాబ్ అని వ్రాయడము పెద్ద పొరపాటుగా కనిపించుచున్నది. అలాగే ఆత్మ అను పేరు వస్తూనే ఆత్మ విషయము పూర్తిగా తెలిసినట్లు ఆత్మను బ్రాకెట్లో ''జిబ్రయేల్'' అని వ్రాశారు. అట్లే (28-52) లో కూడా దీనిని అనగానే ఖుర్ఆన్ అని అక్కడ చెప్పని గ్రంథము పేరు చెప్పడమైనది. అదే విధముగా 97వ సూరాలో 1,4 ఆయత్‍లలో అలాగే వ్రాయడము జరిగినది. ఒకటవ ఆయత్‍లో అక్కడ చెప్పని ఖుర్ఆన్ పేరు చెప్పడము జరిగినది. అలాగే నాల్గవ ఆయత్‍లో ఆత్మని చెప్పిన చోట ''జిబ్రయేల్'' అని అనవసరపు పేరుని వ్రాసి ఆయత్‍లోని జ్ఞానమును దారిమళ్లించడము జరిగినది. అదేపనిగా ఇది తెలిసి చేసిన తప్పుకాదు. పాఠకులకు బాగా అర్థము కావాలని చేసిన మంచి ప్రయత్నములో దొర్లిన తప్పుగా మేము అనుకొంటున్నాము. నేను కూడా సాధ్యమైనంత దగ్గరగా పాఠకులకు అర్థము కావాలని ప్రయత్నము చేసి చెప్పుచున్నాము. అయితే మేము ప్రతి వాక్యములోను శాస్త్రబద్దతను విధిగా ఉండునట్లు చూస్తున్నాము. అల్లాహ్ తన ప్రతి వాక్యములోనూ శాస్త్రబద్దత యున్నట్లు చేశాడు. శాస్త్ర విధానము లేని చిన్న వాక్యము కూడా దేవుని బోధలో కనిపించదు. అందువలన మేము చాలా జాగ్రత్తగా శాస్త్రబద్దతను కల్గిన వివరమునే చెప్పుచున్నాము గానీ, అశాస్త్రీయముగా ఎప్పుడూ చెప్పలేదు. ఆ విధానములో మా పద్ధతి ప్రకారము మేము చెప్పుచూ ఎక్కడయితే దేవుని వాక్యములోని అర్థము తప్పుదారి పట్టుచున్నదో, ఎక్కడయితే శాస్త్రబద్దత లేని వివరము చెప్పబడుచున్నదో, అక్కడ జోక్యము చేసుకొని పక్షపాతము లేకుండా తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పుచున్నాము.

దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే. అలాగే మనిషి జాతి ఒక్కటే మనుషులలోని మాయ ఒక్కటే. దేవుని జ్ఞానమును గురించి దైవ గ్రంథములలో విపులముగా చెప్పబడినదిగానీ, మనిషిలోని మాయను గురించి ప్రథమ దైవగ్రంథములో విపులముగా చెప్పబడినా, అది హిందువులకే సరిగా అర్థము కాలేదు. అంతిమ దైవగ్రంథములో దేవుని జ్ఞానమును విపులముగా చెప్పినా, మాయ ప్రభావము వలన దైవ జ్ఞానము అర్థము కాని పరిస్థితి ఏర్పడినది. అటువంటి పరిస్థితిని అతిక్రమించుటకు దేవుడు తన జ్ఞానమును నా బుద్ధికి అందించగా దానినే నేను మీకు అందించు చున్నాను. ఇందులో నా స్వార్థము ఏమీ లేదు. సత్యము ప్రకటించడమే దేవుని పనిగా చేయుచున్నాము. సత్యసమేతమైన జ్ఞానము దేవునిదే, చెప్పించు వాడు దేవుడే. మధ్యలో నేను బొమ్మను మాత్రమే. ఇప్పుడు (97)వ సూరాలోని ఐదు ఆయత్‍లను శ్రద్ధతో చూస్తాము.

మొదటి ఆయత్‍లో ఘనమైన రాత్రియని చెప్పబడినది. ఆ ఘనమైన రాత్రియందు అవతరింపజేయబడినది ఒకటి గలదు. ఈ వాక్యములో రెండే ముఖ్యమైనవి గలవు. అందులో ఒకటి ఘనమైన రాత్రి, రెండవది ఉద్భవించినది. ఈ రెండును జాగ్రత్తగా గమనించవలసియున్నది. అయితే రెండవ దానిని ఖుర్ఆన్ గ్రంథము అని బ్రాకెట్లో వ్రాసియున్నారు. వారు వ్రాసినది అటుంచి మనము తెలియవలసినది ఏమిటో జాగ్రత్తగా చూడవలెను. మిగతావారు వ్రాసిన వాక్యము ఇలా కలదు చూడండి.

(97-1) నిశ్చయముగా మేము దీనిని (ఖుర్ఆన్‍ను) ఘనమైన రాత్రియందు అవతరిపంజేశాము. (అంతిమ దైవగ్రంథము ఖుర్ఆన్)

ఈ వాక్యములో దీనిని అనుచోట ఖుర్ఆన్ అని వ్రాయడమే కాక మరియొక గ్రంథమయిన 'దివ్య ఖుర్ఆన్ సందేశము' అను గ్రంథములో ఘనత గల రాత్రి యని చెప్పుచూ రంజాన్ నెలలో చివరి పది రోజులలో బేసి రాత్రులలో ఒకటని చెప్పారు. ఆ మాటను చాలా హదీసులలో వ్రాశారు అని చెప్పారు. ముస్లీమ్ పెద్దలు చెప్పిన మాటలు అయినందున అందరూ నమ్మవలసి వచ్చినది. అయితే ఇక్కడ సత్యాసత్య వివరము తప్పదని చెప్పుచూ ముందు రాత్రిని గురించి చెప్పుచున్నాము. ఒక దినము రెండు భాగములుగా గలదు. ఒకటి పగలు, రెండు రాత్రి. దినములో పగటిపూట సూర్యుడుండుట చేత వెలుగుయుండును. ఆ వెలుగులో అన్నీ స్పష్టముగా కనిపించు చుండును. ప్రతి వస్తువు యొక్క రూపురేఖలు సక్రమముగా తెలియు చుండును. అదే చీకటితో నిండిన రాత్రిలో ఏదీ తెలియదు. ఇతరులు చూడకుండా చేయు రహస్య కార్యములను రాత్రిపూట చేయుచుందురు. అందువలన రాత్రి యనగా తెలియని స్థితి కల్గించునదని ఒక విధమైన అర్థమును చెప్పవచ్చును. ఇంకా 'రా' అంటే లేనిది, తెలియనిది అని చెప్పుకొంటే రాత్రి అనగా మూడు తెలియనిది అని అర్థము. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ విషయములు తెలియనిది. రాత్రి అంటే తెలియని రహస్యము అనీ, ఏమీ తెలియకుండా చేయు అంధకారమని చెప్పవచ్చును. చీకటిలో ఒక పనిని చేస్తే అది ఇతరులకు తెలియదను నమ్మకము గలదు. అంటే ఇతరులకు తెలియనిది అని చెప్పవచ్చును. ఇతరులకు తెలియని రహస్యము ఏదయినా ఉంటే దానిని చీకటి రాత్రితో పోల్చి చెప్పవచ్చును.

97వ సూరాలో రెండవ వాక్యమునందు ఘనమైన రాత్రిని గురించి నువ్వు ఏమనుకొన్నావు? అని ప్రశ్నించి అడుగడము కూడా జరిగినది. దేవుడు ప్రశ్నించిన రాత్రి సాధారణ చీకటి రాత్రికాక ఘనమైన రాత్రియని చెప్పబడినది. అది ఎవ్వరికీ తెలియదు కావున ఘనమైన రాత్రి అంటే నువ్వు ఏమనుకొంటున్నావు? అని ప్రశ్నించడము కూడా జరిగినది. అంతేకాక ఘనమైన రాత్రి వెయ్యి నెలలకంటే కూడా మేలయినది అని మూడవ ఆయత్‍లో చెప్పారు. ఆ రాత్రి మొత్తము శాంతితో కూడుకొన్నదని చివరి ఐదవ వాక్యములో చెప్పారు. అంతపెద్ద గొప్పగా ఆ రాత్రిని గురించి చెప్పారు అంటే, అదేదో గొప్ప సారాంశమయిన రాత్రియని అనుకోక తప్పదు. అయితే నాల్గవ వాక్యములో ఘనమైన రాత్రిని గురించి కొంత విషయము తెలిసినది. అందులో సమస్త విషయముల నిర్వాహణ నిమిత్తము తమ ప్రభువు ఆజ్ఞ మేరకు దేవదూతలు, ఆత్మ దిగి వస్తారు అని చెప్పియున్నారు. అలా వారు దిగి వస్తున్న రాత్రి అయినందున అది ముఖ్యమైన రాత్రి అయినది. దానినే ఘనమైన రాత్రియని చెప్పారు. దేవదూతలు మరియు ఆత్మ దిగి వచ్చారు అని వ్రాసియుంది. అలా వ్రాసిన దానినిబట్టి (1) ఎక్కడ నుండి దిగి వచ్చారు? (2) ఎంత ఎత్తునుండి దిగి వచ్చారు? (3) పైన ఎవరున్నారు? (4) పైన ఉన్నవారు క్రింద లేరా? (5) పై నుండి వచ్చిన దేవదూతలు, ఆత్మ కార్యనిర్వాహణ నిమిత్తము ఎవరు పంపగా వచ్చారు? (6) పంపినవారు ఎవరు? (7) కార్యముల నిర్వాహణ నిమిత్తము వచ్చారు అనగా అవి ఏ కార్యములు? (8) వీరే ఎందుకు చేయాలి? (9) వచ్చినవారికి ఆ కార్యములకు ఏమి సంబంధము? అని తొమ్మిది ప్రశ్నలకు సమాధానమును తెలిసినట్లయితే ఈ ఐదు వాక్యముల 97వ సూరాలోని అంతరార్థము పూర్తిగా తెలియును.

ఇంతవరకు 97వ సూరాలో చెప్పుకొన్న ఐదు ఆయత్‍లను మరచిపోయి, జవాబులులేని ఆ ప్రశ్నలను వదలివేసి, బుర్ర బద్దలు చేసుకొన్నా అర్థముకాని వాటిని వదలివేసి ఇప్పుడు మనము క్రొత్త కథను, రహస్యమైన కథను, అంతో ఇంతో జ్ఞానము గలవారు మాత్రమే విశ్వసించు కథను, అజ్ఞానులు ఏమాత్రము ఒప్పుకోని కథను, అందరికీ ఆశ్చర్యమును సంతోషమును కల్గించు కథను చెప్పుకొందాము. ఈ కథను సృష్ఠి రహస్యమని కొందరు, దేవుడు చేసిన మొదటి పనియనీ, అదే చివరి పనియనీ, కొందరు చెప్పుకొన్నట్లున్న కథను, సత్యమునకు నూరుపాళ్లు దగ్గరగా యున్న కథను, శాస్త్రబద్దతతో కూడిన కథను చెప్పుకొందాము. ఒకమారు వింటే అర్థముకాని కథను, ఇది నిజమాయని ఆశ్చర్యమును కల్గించు కథను, రహస్యములలో కెల్ల రహస్యమైన కథను నువ్వు చెప్పడమేమిటి? యని అందరిచేత అనిపించు కథను ఇప్పుడు నా చేత చెప్పబడుచున్నది చూడండి.

అనగనగా ఒకరోజు. ఆ రోజు పగలు కాదు, రాత్రి కాదు. అది ఒక సమయము, ఆ సమయములో అంతవరకూ చేయని ప్రత్యేకమైన పనిని ఒకడు చేయాలనుకొన్నాడు. అప్పుడు ఆ ఒక్కడుతప్ప ఎవరూ లేరు. ఆ ఒక్కడు మాయల మరాఠికంటే గొప్పవాడులాగా కనిపించుచున్నాడు. అతని వేషధారణనుబట్టి ఆడాకాదు, మగకాదు అన్నట్లు ఆడ, మగ రెండు లక్ష్యణములు కలిసియున్నవానిగా కనిపించుచున్నాడు. అతడు ఉండు స్థలము పైన ఆకాశమూ కాదు, క్రింద భూమీ కాదు. అనగా ఆకాశముగానీ, భూమిగానీ లేనిచోట ఆయన ఉన్నాడు. నీ పేరు ఏమి అని అడిగితే నాకు పేరు లేదు అన్నాడు. నీకు భార్యలేదా, పిల్లలు లేరాయని అడిగితే లేరని చెప్పాడు. నీకు తల్లితండ్రులు లేరాయని అడిగితే నేను ఎవరికీ పుట్టలేదు అన్నాడు. నీవు ఏమి చేస్తావు అని అడిగితే నేను చేసేది నీవు చూస్తావు, అయినా నేను చేసేది నీకు అర్థము కాదు. తర్వాత ఎప్పటికీ ఏమీ చేసేవాడిని కాను అని చెప్పాడు. ఆయన చెప్పినదానినిబట్టి నీవు దేవునివా అని అడిగితే, అది నీవు అనే మాటేగానీ నేను దేవున్ని కూడా కాను అని అన్నాడు. నిన్ను ఎలా అర్థము చేసుకోవాలియని అడిగితే, నేను ఎవరికీ అర్థము కాను కదా! యని అన్నాడు. చివరకు నేను అంతగా అడిగాను కదా! నాకు తృప్తి కల్గించుటకు, నా కోసమయినా నీవు ఎవరో పూర్తిగా కాకుండా కొద్దిగా అయినా చెప్పు అని అడిగితే అప్పుడు అతను ఒకమాట చెప్పాడు. ''నేను నేనే, నేనే పెద్ద'' అని రెండు మాటలు చెప్పాడు. అయితే ఎంత పెద్దయని గానీ, ఎవరికి పెద్దయనిగానీ చెప్పలేదు. తర్వాత ప్రశ్నించితే నేను ఇంతవరకు చెప్పిన జవాబు సరిపోదాయని అన్నాడు.

ఇది ఒక కథే అయినా యదార్థమువలె జరిగిపోయినది. కలలో వలె నేను అడుగడము, ఆయన చెప్పడము జరిగినది. అందువలన ఈ కథ చాలా ఆసక్తికరమైనది. ఒక విధముగా ఇది కథే అయినా, కలలో నాకు తెలుస్తూ జరిగినది కావున ఒక విధముగా యదార్థమని చెప్పవచ్చును. కల యదార్థమైనా, చూచినవానికి యదార్థమే అయినా, మిగతా వారికందరికీ యదార్థము కాదు, కల ఒక్కరి అనుభవమునకే వచ్చునది. నా కల మిగతా వారందరికీ యదార్థము కానిదయినా నాకు ఒక్కనికి సత్య అనుభవము. కలలో అంతవరకూ కనిపించిన వ్యక్తి చెప్పలేనంత విశాలముగా మారిపోయి తననుండి పెద్ద ప్రపంచమును తీసి చూపించాడు. అలా చూపబడిన ప్రపంచములో జీవరాసులు ఒక్కటి కూడా లేవు. మనుషులుగానీ, జంతువులుగానీ, ఈగ, దోమగానీ, చిన్న పురుగుగానీ ఏదీ లేని జీవరహిత ప్రపంచముగా ఉండేది. అలా ఒక్కటే ఒకటి చేసిన ఆయనను చీమగానీ, దోమగానీ ఏదీ లేనిది దేనికి? అని అడుగగా! అప్పుడే కొన్ని కోట్లమంది దేవదూతలను, ఒకే ఒక్క ఆత్మను తననుండి బయటికి తీసి చూపి ఆయన కదలక, మెదలక, ఏమీ మాట్లాడక ఊరికే ఉండిపోయాడు. ''నేనే పెద్ద, నేను నేనే'' యనిన ఆయన తర్వాత నాతో ఏమీ మాట్లాడక మౌనము వహించి ఊరక ఉండిపోయాడు. అప్పుడు నేను అడుగు అనేక ప్రశ్నలకు ఆత్మగా వచ్చిన ఆయన నీ ప్రశ్నలకు నేను జవాబును చెప్పుదును కదా! నన్ను అడుగు నీ ప్రశ్నలకు జవాబు చెప్పేదానికే మేము వచ్చాము అని అత్మ చెప్పాడు.

మీరు తప్ప ఎవరూ కనిపించలేదేయని ఆత్మను అడిగితే అయితే చూడు అని జీవరూపమైన సమస్త జీవరాసులను, మనుషులను ఆత్మ తయారు చేసినది. ఒకే దినము ఒకే స్వప్నములో జీవరహిత ప్రపంచమును ''నేను నేనే, నేనే పెద్ద'' యనువాడు చేయగా, ఆయన తన నుండి ఆత్మను, దేవదూతలను కూడా బయటికి తీశాడు. అప్పుడు ఆత్మయినవాడు జీవరూప శరీరములోనికి చేరి నేను ఒక్కనినే శరీరములో పని చేయుదును. కోట్లాదిమంది బయట ప్రపంచములో పని చేయుదురు. మమ్ములను సృష్ఠించినవాడే మాకు సమస్త విషయముల నిర్వాహణ నిమిత్తము పంపాడని చెప్పాడు. అందువలన నా కంటే పెద్ద, ప్రప్రథమముగా పుట్టించినవాడు అయిన ఆయన మాట ప్రకారము మేము పనులు చేయుచుందుము అని చెప్పాడు. నీవు ఆత్మవు కదా! స్వప్నములో కనిపించిన నీవు మెలుకువలో నాకు కనిపిస్తావా? అని అడుగగా అలా నేను ఎవరికీ కనిపించను. ఎవరికి కనిపించినా స్వప్నములోనే కనిపిస్తాను. అయితే నేను ఆత్మనని వారికి తెలియదు. వారు నన్ను గుర్తించలేరు. అయితే తర్వాత నిన్ను ఎప్పుడు చూడాలి? అని అడిగితే నన్ను చూచుటకు నన్ను తెలియు విద్య ఒకటి గలదు దానినే ఆత్మను అధ్యాయనము చేయు విద్య అని అంటారు. దానినే ఆధ్యాత్మిక విద్యయని కూడా చెప్పవచ్చును. ఆధ్యాత్మిక విద్యను నేర్వాలంటే దేవుడిచ్చిన దైవ గ్రంథములను చదువు. అప్పుడు నేను తెలియగలను అని అన్నాడు.

నా స్వప్నము సృష్ఠ్యాదిలో దేవుడు అనబడువాడు. నేను దేవున్ని యని ఒప్పుకొననివాడు. నేను నేనేయని, నేను పెద్దయని చెప్పినవాడు. నాకు చెప్పినది సృష్ఠ్యాదిలోనే జ్ఞాపకము గలదు. దేవుడు అనినా నేను దేవున్ని కాను అను పరమాత్మ, ఆత్మను తయారు చేసి ఇతనే మీ దేవుడని అందరికీ ఆ రోజే చెప్పాడు. అప్పటి నుండియున్న ఆత్మే అందరిలో యుంటూ శరీర కార్యములన్నీ చేయుచూ, శరీరములో కార్యకర్తగా యున్నానని చెప్పాడు. ఇదంతయూ ఎవరికీ తెలియకుండా జరిగినది. కావున అది ఘనమైన రాత్రియనీ, ఆ రాత్రి ఈ ప్రపంచమును అవతరింపజేశాను అని అన్నాడు. పెద్దవాడయిన ఆయన ప్రపంచమును అవతరింపజేశానని చెప్పగా, ఏమీ తెలియనివారు ఖుర్ఆన్‍ను అని చెప్పడము పొరపాటు కాదా?

ఖుర్ఆన్ గ్రంథము ముహమ్మద్ ప్రవక్తగారికి కలియుగములో దాదాపు 1400 సంవత్సరముల కిందట జిబ్రయేల్ అను గ్రహము ఆకాశము నుండి వచ్చి చెప్పగా తయారయినది. 97వ సూరాలో చెప్పినది సృష్ఠి మొదట జరిగిన సమాచారము. అది ఎవరికీ తెలియని సమాచారము అని తెలియునట్లు ఘనమైన రాత్రి జరిగినదని చెప్పబడినది. సృష్ఠి మొదటి రోజు విశ్వమునకు చక్రవర్తి అయిన పరమాత్మ మొదట జీవరహిత ప్రపంచమును తర్వాత ఆ ప్రపంచములో తన పాలన సాగించుటకు కోట్లాది దేవదూతలను ఒక ప్రక్క, ఆత్మను ఒక ప్రక్క సృష్ఠించి ఆత్మ ద్వారా సర్వ జీవరాసులను తయారు చేయించాడు. తాను మాత్రము ఏమీ చేయక అవసరమైన దానిని సంకల్పించుకోగా దేవదూతలు ఆ పనిని చేసేవారు. దేవదూతల సైన్యము బయట ప్రపంచములో ఉండగా, సర్వ శరీరముల లోపల ఆత్మయుండి దేవుని పాలనను సాగించుచున్నారు. తర్వాత జరుగునది దేవుని పాలనే అయినా, మొదట సృష్ఠి జరిగిన విధానమును ఈ ఐదు వాక్యములలో చెప్పారు. మీకు అర్థమయ్యే నిమిత్తము నేను స్వప్నములో చూచాను, ఇట్లే ఆ దినము జరిగినది అని చెప్పాను. నేను చెప్పినట్లు జరిగినది వాస్తవమే. అయినా ఇప్పుడు చెప్పే నేనుగానీ, వినే మీరుగానీ ఆ రోజు లేము. అయినా నేను ఉన్నట్లు చెప్పినా, చెప్పకున్నా ఆ రోజు జరిగినది సత్యము.

మీరు ఆ రోజు లేకున్నా అప్పుడు జరిగిన విషయము సత్యము అని ఎలా చెప్పగలుగుచున్నారని అడుగవచ్చును? మీరు అడుగు ప్రశ్న సమంజసమైనదే. ఆ దినము జీవము అనునది ఏదీ లేదు. అటువంటి అగోచర చీకటి సమయములో మొదట నేనే పెద్ద అనునతని నుండి (పరమాత్మ నుండి) ప్రకృతి తయారు చేయబడినది. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగముల ప్రకృతి జీవరహితముగా ఉండగా, ప్రకృతిని చేసిన తర్వాత తాను పనిని చేయదలచుకోని దేవుడు తన పనిని చేయు ఆత్మను, అట్లే బయట ప్రపంచములో తన పాలనను సాగించుటకు కోట్లాది దూతలను (దేవుని సైన్యమును) తయారు చేశాడు. పరమాత్మయను దేవుని నుండి బయటికి వచ్చిన ఆత్మ జీవ శరీరములను తయారు చేసి శరీరముల లోపల పాలన సాగించగా, శరీరము బయట దేవదూతలు పాలనను సాగించారు. సృష్ఠ్యాదిలో ఆత్మ, దూతలు తయారయిన తర్వాత నేను నువ్వు మనమందరము తయారు చేయబడినాము. అప్పుడు ఏమి జరిగినది నీకు తెలియని చీకటి రాత్రిగా అది యున్నది. సృష్ఠి తయారయిన మొదటి దినము కావున దానిని ఘనమైన రాత్రియని అన్నారు. దేవుని పాలన సూర్యోదయముతో ఆదివారము ప్రారంభము అయినది. సృష్ఠియంతయూ ఆదివారము సూర్యోదయము కాకముందే జరిగినది. కావున రాత్రి జరిగినదని అది ముఖ్యమైన రాత్రి, ఘనమైన రాత్రియని అన్నారు. దేవుడు తన సృష్ఠిని రాత్రి సాగించగా తన సృష్ఠిలో సూర్యుడు, గ్రహములు, భూతములు అన్నీ పూర్తిగా తయారయినవి. అందువలన దేవుని సృష్ఠియొక్క మొదటి దినము చైత్రమాసమయిన మొదటి మాసముతో మొదటి దినమైన ఆదివారముతో ప్రారంభించడము జరిగినది. తర్వాత గ్రహములనుబట్టి శనివారము వరకు తయారు చేయబడినాయి. సృష్ఠి తయారయిన తర్వాత ఆదివారము నుండి శనివారము వరకు తయారైనవి. మొదట శనివారము లేదు. ఆదివారము లేదు. సృష్ఠి ప్రారంభమైన తర్వాతే వారములు, నెలలు వచ్చాయి. దీనినిబట్టి శనివారము రాత్రి సృష్ఠి తయారై ఆదివారము ఉదయము మొదలయినదని చెప్పవచ్చును. శనివారము విషయములో ఎవరు విభేదించుకొన్నారో వారికి మాత్రమే దాని విశిష్ఠత విధించబడినది అని సూరా 16లో ఆయత్ 124లో కూడా చెప్పియున్నారు.

సృష్ఠి ప్రారంభ దినమును అనగా తెలియని ఆ రాత్రిని ఘనమైన రాత్రి అని అనుటకు కారణము తెలిసినది. అయితే ఆ ఘనమైనరాత్రిని గురించి నీవు ఏమనుకొన్నావు? అని ప్రశ్నించారు. అంతేకాక మూడవ ఆయత్‍లో ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలలకంటే కూడా మేలయినది అని అన్నారు. ఆ మాట చెప్పడములో ఒక నిగూఢ భావము అందులో గలదు. సంఖ్యలో పెద్ద సంఖ్య కోటి అయినా అందరూ సర్వసాధారణముగా పెద్ద సంఖ్యగా వేయి నే చెప్పుచుందురు. ఇక్కడ వేయి నెలలు అని చెప్పడములో ఒక రహస్య భావము గలదు. వేయి నెలలు 83 సంవత్సరముల 4 నెలలు అగును. అనగా దాదాపు ఒక మనిషి జీవితము అని అర్థము. మనిషి 83 సంవత్సరములు బ్రతుకవచ్చును, బ్రతుకకపోవచ్చును. అనగా ఒక జీవితకాలములో కూడా ఘనమైన రాత్రిని గురించి తెలియలేడను అర్థముతో అలా చెప్పారు. ఘనమైన రాత్రి వేయి నెలలకంటే కూడా మేలయినది అని అన్నాడు. ఘనమైన సృష్ఠి రాత్రి యొక్క రహస్యము వేయి నెలలకయినా తెలియలేనంత గొప్పదని అర్థము చేసుకోవలెను.

ఇకపోతే నాల్గవ ఆయత్‍లో తమ ప్రభువు ఉత్తర్వుల మేరకు అనగా పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకు సమస్త విషయముల నిర్వాహణ నిమిత్తము అని చెప్పారు. దాని ప్రకారము దేవుని ఆజ్ఞ మేరకు పాలన సాగించు నిమిత్తము దేవదూతలు, ఆత్మ దేవుని నుండి దిగివచ్చారు అని అర్థము చేసుకోవలెను. ఆ దినము జరిగినది అంతే. ఎంతో ప్రశాంతముగా సృష్ఠి జరిగినది. అందువలన ఆ రాత్రి మొత్తము శాంతియుతమైయున్నది అన్నారు. తెల్లవారేవరకు శాంతిగానే యున్నది. తెల్లవారిన తర్వాత రాత్రి తయారయిన సృష్ఠిపాలన దేవదూతల వలన బయట ప్రపంచములో, ఆత్మ వలన శరీరములో సాగుట వలన అంతా అశాంతిమయమైపోయినది. అందువలన తెల్లవారేవరకు శాంతియుతముగానే యున్నది అని అన్నారు. దాని అర్థము ప్రకారము తెల్లవారిన తర్వాత శాంతిలేదు అని అర్థము. సృష్ఠి జరిగినప్పుడు నేను లేను, సృష్ఠి తర్వాత నేనున్నాను. అయినా గత జన్మ జ్ఞాపకము ఎవరికీ ఉండదు. పోయిన వంద సంవత్సరముల క్రిందట నేను ఎక్కడున్నది నాకే తెలియదు. అటువంటప్పుడు సృష్ఠి జరిగిన సమయమును గురించి ఎలా చెప్పగలుగుచున్నారు? అని ప్రశ్న రాగలదు. ఒకవేళ నాలోని ఆత్మయినా చెప్పుటకు ఆత్మ పుట్టక ముందు ప్రకృతి తయారయినదని చెప్పుచున్నారు. అందువలన మొదట జీవరహిత ప్రకృతి తయారయినప్పుడు ఆత్మలేదు. అప్పుడున్నది పరమాత్మ ఒక్కడే. అప్పటి విషయమును పూసగ్రుచ్చినట్లు ఎట్లు చెప్పుచున్నారని ఎవరయినా అడుగవచ్చును. దీనికి జవాబు నాకు తెలుసు. అయినా నేను చెప్పను.

సృష్ఠి జరిగిన రాత్రి ఆదివారము ఉదయముకంటే ముందుగల రాత్రి అనగా శనివారము రాత్రి అగును. శనివారమునకు శని అధిపతియని చెప్పుచుందురు. శని ద్వాదశ గ్రహములలో ఒకడు, ఘనమైన రాత్రికి అనగా శనివారము రాత్రికి శని పేరే చెప్పియుండుట వలన, ఘనమైన రాత్రి ఎవరికీ తెలియని చీకటి రాత్రియని చెప్పుట వలన, పదకొండు గ్రహములకు లేని నల్లని రంగును శనికి పూసిపెట్టారు. దానివలన శని నల్లగా ఉంటాడు అని చెప్పుచుంటారు. ఎక్కడయినా శని విగ్రహమును పెట్టితే నల్లగా ఉండే విగ్రహమునే పెట్టుదురు. సృష్ఠి రహస్యము తెలియనిది అని నల్లని రంగును చూపడము జరిగినది. అంతేకాక ఘనమైన రాత్రి వేయి నెలలకంటే గొప్పదియని అన్నారు. ప్రత్యేకించి వేయి సంఖ్యను తీసుకొని చెప్పడములో కూడా కొంత అర్థము గలదు. అది ఏమనగా! వేయి సంఖ్యను వ్రాస్తే ముందు ఒకటి యుండి తర్వాత మూడు సున్నాలు ఉండును. దేవుడు మూడు ఆత్మలుగా యున్నాడు కావున మూడు సున్నాల సంఖ్యను చూపారు. దేవుడు పరిపూర్ణుడు అందువలన ఆయన జీవాత్మగా, ఆత్మగా, పరమాత్మగా యుండుట వలన, ఆత్మలు సంపూర్ణమైనవి అయినందున, వాటి గుర్తుగా మూడు సున్నాల వేయి సంఖ్యను వ్రాయడమైనది. ఆత్మలు మూడు పురుషులుగా యున్నవి. అట్లే ప్రకృతి స్త్రీగా యున్నది. పురుషులయిన ఆత్మలకు సున్నాలు, స్త్రీతత్త్వమైన ప్రకృతికి ఒకటి సంఖ్యను పెట్టి వేయిగా చూపి ''వేయి నెలలు గడచినా ప్రకృతి, పురుషులు అను నాలుగు భాగములుగా యున్నవానిని తెలియలేరు'' అని చెప్పడమైనది.


సృష్ఠి తర్వాత దేవుడు నాలుగు భాగములుగా ఉన్నాడని వేయి సంఖ్యను చూపడమైనది అని తెలియవలెను.



అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
129. నీపై పర్యవేక్షకులు నియమితులైయున్నారు. (82-10,11,12)
(82-10) నిశ్చయముగా మీపైన పర్యవేక్షకులు నియమితులై యున్నారు.

(82-11) వారు మీ కర్మలను నమోదుచేసే గౌరవనీయులైన లేఖకులు.

(82-12) మీరు చేసేదంతా వారికి తెలుసు.

ఈ మూడు వాక్యములు ఒకే విషయమునకు సంబంధించినవై యున్నవి. 'మీపై మిమ్ములను చూస్తూ కాపలా కాయు పర్యవేక్షకులు గలరని' చెప్పారు. పర్యవేక్షకులు అనగా ప్రతీదీ గమనించువారని అర్థము. మనుషుల మీద నియమితులైన పర్యవేక్షకులు ఎవరని గానీ, ఎక్కడ నుండి వారు తమను గమనిస్తున్నారని గానీ మనుషులకు తెలియదు. పర్యవేక్షకులు ఎంతమంది యున్నారని గానీ తెలియదు. చాలామందికి తమ మీద నిఘాపెట్టిన పర్యవేక్షకులు ఎవరికీ తెలియకుండా తమను పూర్తి గమనించుచూ, మనుషులు చేయు ప్రతి పనిని, ప్రతి మాటను నమోదు చేసుకొంటున్నారు. అందువలన మీరు చేసేదంతా వారికి తెలుసుయని 12వ ఆయత్‍లో చెప్పియున్నారు. పర్యవేక్షకులయిన వారు మనుషులు చేయు ప్రతి పనిని చూస్తూ ఉన్నారు. సి.ఐ.డి పోలీసులు తెలియకుండా గమనిస్తున్నట్లు పర్యవేక్షకులయిన వారు గమనించుచున్నారు. అయితే ఆ విషయము మనుషులకు తెలియదు. తనకు తెలియకుండా నన్ను ఎవరు గమనిస్తున్నారు, ఎవరూ నన్ను గమనించుటకు వీలులేదని అనుకొంటున్నారు. చాలామంది ఈ ఆయత్‍లలో చెప్పిన మాటలను నమ్మునట్లు లేదు. అయినా మనిషి నమ్మినా, నమ్మకపోయినా నిన్ను నన్ను అందరినీ గమనించుచున్న పర్యవేక్షకులు ఉన్నారనుట వాస్తవము.

మనుషుల మీద నియమితులైన పర్యవేక్షకులు మనుషులు చేయు ప్రతి పనినీ గమనిస్తూ, వారు చేయు పనులు మంచివా! చెడువాయని చూస్తున్నారు. మంచి పనులు అయితే వాటికి తగిన పుణ్యమును, చెడు పనులైతే వాటికి తగిన పాపమును పర్యవేక్షకులయినవారు నమోదు చేయుచున్నారు. పర్యవేక్షకులు ఒక్కొక్క మనిషికి ఒకొక్క పుస్తకమును ప్రత్యేకముగా పెట్టుకొని అందులో మనుషులు చేయు ప్రతి పనినీ, ప్రతీ మాటను నమోదు చేయుచున్నారు. ఆ పుస్తకము పేరు కర్మ పుస్తకము లేక కర్మ గ్రంథము అని అనవచ్చును. వారు ప్రతి విషయమును కర్మ గ్రంథములో న్యాయబద్దముగా నమోదు చేయుచున్నారు. అందువలన వారు 'గౌరవనీయులయిన లేఖకులు' అని అంటున్నారు. వారు మనుషులు చేయు విషయములను తూకము వేసినట్లు కొద్దిగ ఎక్కువగానీ, కొద్దిగ తక్కువగానీ లేకుండా వ్రాయుచుందురు. ప్రతి మనిషి మీద నిఘాపెట్టి చూస్తూ వారి కర్మలను, కార్యములను కర్మపత్రము అను గ్రంథములో వ్రాయుచూ, మనిషికి తెలియకుండా యున్నవారు లెక్కించితే 324 మంది గలరు. 324 మంది మూడు విభాగములుగా విభజింపబడి యున్నారు. ఒక్కొక్క విభాగమునకు 108 మంది విభజింపబడి యున్నారు. ఇట్లు మూడు విభాగములవారు అహర్నిశలు మనుషుల మీద నిఘాను కొనసాగించు చున్నారు. అయితే మనిషికి తన మీద పర్యవేక్షకులున్నారను విషయము తెలియక తాను చేయు పనులు మంచివా కాదా!యని ఆలోచించకుండా చేయుచున్నాడు. మనిషి చేయు కర్మలను నమోదు చేయువారు ఒక సెక్షనుకు 108 మంది యుండగా అలాంటి సెక్షనులు మూడు గుంపులుగా పని చేయుచున్నవి. మొత్తము 324 మంది పర్యవేక్షకులు అన్నీ గమనిస్తూ ప్రతీదీ వ్రాసిపెట్టుచుండగా, గతజన్మలో వ్రాసిపెట్టబడిన పనులకు అంత్య దినమున (మరణ దినమున) తీర్పు తీర్చి పంపియుండును. దేవుని తీర్పును అమలు చేయువారు బయట ప్రపంచములో కోట్లాదిమంది దైవదూతలు గలరు. శరీరము లోపల అయితే ఒకే ఒక ఆత్మ గలదు. సృష్ఠ్యాదిలో దేవుని చేత పంపబడిన దైవ దూతలు, ఆత్మ మనిషి యొక్క కర్మనుబట్టి పరమాత్మ పాలనను సాగించుచున్నవి. పరమాత్మ పాలన దేవుడు నియమించినట్లు దేవదూతలు మరియు ఆత్మ నిర్వాహణ సాగించుచున్నారు. మనిషి చేయు పాపపుణ్యములను కర్మపత్రములో వ్రాయుచున్న పర్యవేక్షకులు 108 మంది ప్రకారము మూడు గుంపులుగా మొత్తము 324 మంది యుండగా, పాలనను కొనసాగించు దైవ దూతలు కోట్ల సంఖ్యలో బయట పనిచేయుచుండగా, శరీరము లోపల ఆత్మ ఒక్కడే దేవుడై పనిచేయుచున్నాడు. ఆయనే అందరి ఆరాధ్య దైవముగా యున్నాడు.



అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
130. తనను కనిపెట్టుకొని ఉండే దూత లేకుండా ఏ ప్రాణీ లేదు. (86-4)
(86-4) ''తనను కనిపెట్టుకొని ఉండే దూత లేకుండా ఏ ప్రాణీ లేదు.''

దూత అనగా సేవకుడు అని అర్థము. దూతలు అనగా సేవకులు అని అర్థము. ప్రపంచములో రాజు యున్నాడు. రాజు అనగా యజమాని అని అర్థము. యజమాని క్రింద సేవకులు కూడా యున్నారు. యజమాని క్రింద ఒక సేవకుడు ఉండవచ్చును లేక అనేకమంది సేవకులు ఉండ వచ్చును. పూర్వము రాజుల వ్యవస్థ ఉండేది. భూమిమీద చిన్న పెద్ద రాజులు ఎందరో ఉండేవారు. అనేకమంది రాజులు చిన్నచిన్న రాజ్యములు ఏర్పరచుకొని యుండగా, వారి క్రింద ఎందరో దూతలు సైనికులుగా కొందరూ, వార్తాహరులుగా కొందరూ, పండితులుగా కొందరూ, వైద్యులుగా కొందరూ, అంతఃపుర కార్యకర్తలుగా కొందరూ, రాజుకు అంగరక్షకులుగా కొందరూ, ప్రజల సౌకర్యార్థము వీధులను శుభ్రము చేయువారు కొందరూ ఇట్లు రాజు క్రింద మంత్రినుండి సేనాధిపతి వరకు, కరణము నుండి కాటి పాపడు వరకు అందరూ అనేక స్థానములలో సేవలందించుచూ ఉండేవారు. వారందరినీ రాజదూతలు అనేవారు. ఒక రాజు క్రింద ఎందరో దూతలు ఉండగా, ఒక దేశములో ఎందరో రాజులు ఉండేవారు. రాజులందరి మీద రాజుగా చక్రవర్తి అనునతడు దేశమునకు అంతా పెద్దగా ఉండేవాడు. చక్రవర్తి క్రింద ఎందరో రాజులు, సామంత రాజులు ఉండగా, రాజుల, సామంత రాజుల క్రింద ఎందరో దూతలు (సేవకులు) ఉండేవారు.

అదే విధముగా పరమాత్మయను చక్రవర్తి క్రింద రాజులు, సామంత రాజులవలె భూతములు, గ్రహములు ఉండగా వారి క్రింద ఉపభూతములు, ఉపగ్రహములు అను దూతలు ఎందరో కలరు. మొత్తానికి అందరికీ పెద్ద చక్రవర్తి అయినట్లు, పరమాత్మయను పెద్ద క్రింద శరీరము లోపల ఆత్మ, ఆత్మ పరివారము, శరీరము బయట భూతములు, గ్రహములు వారి పరివారము పని చేయుచూ విశ్వసామ్రాజ్యమును నడుపుచున్నారు. శరీరము ఒక వ్యవస్థవలె కొందరితో కూడి పనిచేయుచున్నది. శరీరములో ఎన్నో రకముల కార్యములు చేయువారుండడము వలన శరీరమును ఒక వ్యవస్థ అని అంటున్నాము. శరీరములో జీవుడు నివశించుచున్నాడు. శరీరములో నివశించు జీవుడు కొంతకాలము వరకే శరీరములో యుండునట్లు నిర్ణయము చేయబడి, ఒక ఒప్పందము ప్రకారము ఇన్ని రోజులు, ఇన్ని గంటలవరకే శరీరములో నివాసముండునట్లు శరీర యజమాని అయిన ఆత్మ చేత నిర్ణయము చేయబడి శరీరములో జీవుడు నివాసము చేయుచున్నాడు. శరీరములో జీవుడు నివాసము చేయుచున్నంత కాలము శరీర గృహ యజమాని అయిన ఆత్మ తన కొందరి సేవకులతో ఇంటిలోనే ఉంటూ శరీరములో నివశించుచున్న జీవునకు ఎటువంటి ఆటంకములు తన ఇంటిలో కలుగకుండా చూచుకొనుచుండును. అంతేకాక తన ఇంటిలో నివశించు జీవుడు ఏమి చేస్తున్నాడో చూస్తూ జీవునికి తోడుగా, జోడు ఆత్మగా శరీరములో ఆత్మ యున్నాడు. శరీరములో ఆత్మ చేయు పనులు ఎన్నో యున్నా, అవి అన్నియూ శరీరములో నివాసమున్న జీవునికి తెలియవు. పట్టణములో అందరూ నిద్రపోయిన తర్వాత పట్టణ వీధులన్నీ పురపాలక సంఘమువారు శుభ్రము చేసినట్లు జీవుడు నిద్రలో యున్నప్పుడు గానీ, మెలకువలో యున్నప్పుడుగానీ జీవునికి తెలియకుండా శరీరములో ఆత్మ ఎన్నో పనులను చేయుచుండును. శరీరములో జోడు ఆత్మగా (తోడు ఆత్మగా) యున్న ఆత్మ తాను అందరికీ ఆరాధ్య దైవము అను విషయము కూడా జీవునికి తెలియకుండా మసలుకొనుచుండును.

శరీరములో నివశించుటకు ముందే నిర్ణయము చేయబడిన జీవుడు శరీరములో నివశించుచున్నా నేను శరీరమునకు యజమానిని కాను యను ఎరుక లేకుండా, తానే యజమానిని అన్నట్లు ఏ సంకోచము లేకుండా వ్యవహరించుచుండును. జీవుడు తాను శరీర యజమాని కాకున్నా యజమానివలె భావించుకొని, శరీరమునకు తాను తప్ప ఇతర యజమాని లేడు అను అహముతో వ్యవహరించుచుండును. అదంతయూ గమనించు చున్న నిజమైన శరీర అధిపతియైన ఆత్మ జీవునికి శరీర నివాస గడువు అయిపోవునంతవరకు ఏమీ చెప్పకూడదు అన్నట్లు తాను యజమానిని అని శరీరములోనే జీవునికి తెలియకుండా ఉండును. శరీరములో నివశించు ప్రతి జీవునికి ఆత్మ యజమానిగానే ఉండడము జరుగుచున్నది. ముఖ్య విషయము ఏమనగా! ఆత్మ శరీరమునకు యజమానే కాకుండా, ఆ శరీరములోని జీవునికి, మిగతా శరీరములలోని కోట్లాది మంది జీవులకు ఆత్మే దేవుడుగా యున్నాడు. ఆత్మే అందరి ఆరాధ్య దైవముగా యున్నాడు. ఆత్మను ఆరాధించు విధానములు బయట ప్రపంచములో గలవు. అల్లాహ్ అయిన ఆత్మను ప్రార్థించు ప్రార్థనా మందిరములు, ప్రార్థనా విధానములు (నమాజ్ చేయు విధానములు) ఎన్నో ఉన్నాయి. అయితే బయట ఆచరణ ప్రకారము ప్రార్థనా మందిరమునకు పోయి వారివారి మతాచారముల ప్రకారము ప్రార్థన చేయుచున్నా తాము ప్రార్థన చేయు దేవుడు, తాను నివశించు శరీరములోనే ఉన్నాడను ద్యాస గానీ, భయముగానీ, భక్తిగానీ లేకుండా జీవుడున్నాడు.

బయటి ప్రపంచములో భక్తిని ప్రదర్శించు జీవుడు, దేవుడున్నాడు అని చెప్పుకొను జీవుడు, తాను శరీరములో దేవుని ప్రక్కనే యున్నానని తెలియలేకపోయాడు. శరీరములో ఏమాత్రమూ దేవుని మీద భక్తిలేని మనిషి, బయటనే దేవుడున్నాడని చెప్పుకొనుచూ బయటనే ఆరాధనలు, ప్రార్థనలు చేయుచున్నాడు. శరీరములో తానే యజమానిని అను అహము కల్గి తాను చేయు పనులన్నీ తన ఇష్టము ప్రకారమే చేయుచున్నానని తలచి, తన శక్తి యుక్తి చేతనే ధనవంతుడను అయ్యాననీ, అధికారము గల వాడినయ్యాననీ, ఇంకా ఏమయినా సాధింతుననీ, నేను చేయు పనుల చేత మిగతా ప్రజలకంటే గొప్పవాడిగా యున్నాననీ, మిగతా వారికంటే అధికారిగా యున్నాననీ, రాజకీయ హోదాలో యున్నాననీ అనేక రకముల అనుకోవడము జరుగుచున్నది. అవన్నియూ పుట్టుక పూర్వమే తనకు నిర్ణయము చేయబడిన పనులని, ఆ నిర్ణయము ప్రకారమే శరీరములోని దేవుడే తనకు అన్నీ సమకూర్చాడని మనిషి తెలియక అంతా తన తెలివి వలన కల్గినవే అనుకోవడము పెద్ద పొరపాటు.

ఆత్మ ప్రతి మనిషిలో ఆ మనిషికి తెలియకుండా ఉంటూ ఎల్లప్పుడూ ఆ జీవుని నిమిత్తము పనులు చేయడము జరుగుచున్నది. ఆత్మ దేవుడైయున్నా తాను కార్యకర్తగా శరీరములో పనులు చేయుచూ, జీవుని జీవనములో శరీరములో జరుగవలసిన కార్యములన్నీ చేయుచున్నాడు. దేవుడు మనిషి నిద్రపోవునప్పుడు కూడా కార్యములను చేయుచూ, తన అనుచరుల చేత చేయిస్తూ ఉండడము వలన ఒక విధముగా దేవుడుగాయున్న ఆత్మ కూడా జీవునికి దూతగా (సేవకునిగా) పని చేయుచున్నాడని చెప్పక తప్పదు. ఆత్మ దేవుడుగా యున్నా, దూతగాయున్నా ప్రపంచములో ఆ విషయము ఎవరికీ తెలియకుండానే యున్నాడు. ప్రపంచములో ఏ జీవుడయినా ఆత్మయను దూత లేకుండా భూమిమీద పుట్టడము లేదు. ఆత్మ దూత కాదు, వాస్తవముగా యజమానియే. జీవునికి తొంభై తొమ్మిది శాతము దేవుడుగా యున్న ఆత్మ ఒక్కశాతము అతని కొరకు కార్యములు చేయుచూ దూతగాయున్నది. శరీరములో కార్యకర్తగా కనిపించు ఆత్మ జీవున్ని చంపుటకు, పుట్టించుటకు, శిక్షించుటకు, రక్షించుటకు దేవుడుగా యున్నది. దేవుడయిన ఆత్మనే శరీరములో జీవునికి పొరుగువాడని ద్వితీయ దైవ గ్రంథములో చెప్పియున్నారు. దైవ గ్రంథముల సాక్షిగా దేవుడైన ఆత్మ జీవునికి శరీరములో కార్యకర్తగా యున్నాడని అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్‍లో చెప్పియున్నారు. దీనినిబట్టి జీవున్ని కనిపెట్టుకొని శరీరములో యుండే దూత (ఆత్మ) లేకుండా ఏ ప్రాణి లేదని పై వాక్యములో (86-4) లో చెప్పియున్నారు. ఈ వాక్యములోని భావమును తెలియగల్గితే ఎవడయినా జ్ఞాని కాగలడు.



అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
   ☞
131. 19 మంది దేవదూతలు కలరు. (74-30, 31)
(74-30) ''దానిపై పందొమ్మిదిమంది దైవదూతలు నియమితులై ఉన్నారు.''

(74-31) మేము నరకపాలకులుగా దైవ దూతలను మాత్రమే ఉంచాము. ఇంకా మేము వారి (19) సంఖ్యను అవిశ్వాసులను పరీక్షించటానికి మాత్రమే నిర్ధారించాము. గ్రంథవహులకు నమ్మకము కుదరటానికి, విశ్వాసులు తమ విశ్వాసములో మరింత ముందంజ వేయడానికి, గ్రంథవహులు, విశ్వసించినవారు సందేహానికి (అనుమానానికి) గురికాకుండా ఉండడానికి మేమిలా చేశాము. ఇంకా హృదయాలలో రోగమున్నవారు, అవిశ్వాసులు, ''ఇంతకీ ఈ (19) దృష్ఠాంతము ద్వారా అల్లాహ్ ఏమి చెప్ప దలచాడు?'' అని చెప్పటానికి కూడా మేము ఈ విధముగా చేశాము. ఈ విధముగా అల్లాహ్ తాను కోరినవారిని పెడదారి పట్టిస్తాడు. తాను కోరినవారికి సన్మార్గమును చూపుతాడు. నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు. ఈ వృత్తాంతము మానవమాత్రుల బోధనార్థము ప్రస్తావించ బడింది.''

పరమాత్మ తన సృష్ఠిని పాలించుటకు బయట దైవదూతలను తయారు చేసుకొన్నాడు. శరీరము లోపల జరుగు కార్యములన్నీ శరీరములోని ఆత్మే చేయునట్లు ఏర్పాటు చేశాడు. బయట మనుషులకు కష్టసుఖములను కల్గించుటకు కోట్ల కొలది దైవపాలకులు సైన్యమువలెయున్నారు. అయితే దేవుని సైన్యము ఎంతమంది కలరని చెప్పుటకు వీలులేదు. దేవుని దూతల సైన్యము దేవునికి తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదు. అందువలన వాక్యములో నీ ప్రభువు సైన్యాలను స్వయముగా ఆయన తప్ప ఇతరులు ఎరుగరు అని అన్నారు. మనుషుల నరకమును కష్టరూపములో విధించువారు ఎందరో దేవదూతలు కలరు. అట్లే స్వర్గ సుఖమును అందించు వారు కూడా లెక్కలేనన్ని మంది దైవదూతలు కలరు. ఈ విధముగా అల్లాహ్ యొక్క దూతల సైన్యమును ఎవరూ చెప్పలేరు.

ముఖ్యముగా దేవుని మీద విశ్వాసము గలవారు, దేవుని మీద ఇష్టము గలవారు, దేవుని సాన్నిత్యమును కోరువారు అయిన మనుషులు ఉన్నప్పుడు దేవుడు వారిని స్వయముగా సన్మార్గములోనికి పంపును. సన్మార్గములోనికి దేవుడు పంపుట వలన వారికి అప్పటి వరకు అర్థముకాని జ్ఞానము, అప్పటి వరకూ తెలియని జ్ఞానము తెలియుటకు, అర్థమగుటకు మొదలవును. అలా కొంత కాలము గడువగా వారు దేవుని జ్ఞానములో ఉన్నతస్థాయికి చేరుకొందురు. దేవునిమీద అవిశ్వాసముగా యున్నవారు, దేవుని జ్ఞానము అంటే సరిపోనివారు, దేవుని గురించి హేళనగా మాట్లాడువారు, దేవుని మార్గములో యున్న జ్ఞానులను సహితము చాలా ఇబ్బందులకు గురిచేయువారు ఎవరున్నారో వారిని దేవుడు అదే పనిగా అజ్ఞాన మార్గములోనే పోవునట్లు, ఎప్పటికీ వారికి దైవ జ్ఞానము తెలియ కుండునట్లు చేయుటకు పూనుకొనును. అటువంటి అజ్ఞాన మనుషులను పూర్తిగా తప్పుదారి పట్టించి, తనకు దూరముగా పోవునట్లు దేవుడు చేయుచున్నాడు.

దేవుడు నరక పాలకులుగా దైవదూతలను నియమించాడు. అయితే వారి సంఖ్య దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. అయితే దేవుడు చెప్పినట్లు అవిశ్వాసులను అపవర్గ మార్గమును పట్టించుటకు, అవిశ్వాసులను పరీక్షించి వారి భావమునకు తగినట్లు వారికి అజ్ఞానమునే అంటగట్టుటకు దేవుడు ప్రత్యేకించి పందొమ్మిది (19) మంది దూతలను నియమించాడు. పందొమ్మిది (19) మంది దైవదూతలు ప్రత్యేకముగా నియమింపబడిన వారై యుండుట వలన ఈ (19) మందికి అజ్ఞానులను పరీక్షించుటకు, జ్ఞానులకు సహకరించుటకు తగిన జ్ఞానము గలవారై యుందురు. దేవుని నరకపాలన, స్వర్గపాలన సాగించుటకు కోట్లమంది నియమితులై ఉండగా, దేవుని మార్గములో దారితప్పినవారిని అదే పనిగా ప్రక్కకు పంపుటకు, దేవుని మార్గములో ఇష్టము కల్గినవారికి, దేవుని మీద విశ్వాసమున్నవారికి దేవుని మార్గములో ఆటంకములు కలుగకుండా చేయుటకు, తర్వాత ఎక్కడయినా దేవుని జ్ఞానములో అనుమానములు రాకుండా ఉండుటకు, దేవుని మార్గములో ముందుకు పోవడానికి కావలసిన జ్ఞానమును అందించి వారి మార్గమును ఆటంకము లేని మార్గముగా చేయుటకు పందొమ్మిది మంది (19) దేవదూతలు అహర్నిశలు పనిచేయుచున్నారు. పందొమ్మిది (19) మంది ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన దేవదూతలు. మిగతా కోట్లాది మంది దూతలవలె కాకుండా ప్రత్యేకమైన విజ్ఞతకల్గి పని చేయుచున్నారు.

దేవుడు తన కోట్లాది మంది సేవకులయిన దూతలలో పందొమ్మిది (19) మంది సంఖ్యనే ఎందుకు ఎంచుకొన్నట్లు? అని ప్రశ్నించుకొని చూస్తే అది మానవులు తెలియు నిమిత్తమే పందొమ్మిది (19) సంఖ్యను ఎంచుకొన్నా డని అర్థమగుచున్నది. దేవుడు అందించిన యోచన ప్రకారము ఆలోచించి చూస్తే ప్రకృతి ద్వారా మానవ శరీరము తయారయినది. ప్రకృతితో తయారయిన శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు ఆత్మలు నివశించుచున్నవి. మూడు ఆత్మలు పురుష సంబంధమైనవి. ప్రకృతి సంబంధ శరీరము అంతయూ స్త్రీ సంబంధమైనది. ప్రకృతి సంబంధ శరీరమును మాయకు గుర్తుగా చెప్పుకోవచ్చును. అట్లే ప్రకృతితో తయారయిన స్త్రీతత్త్వమైన శరీరములో పురుషతత్త్వమైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు నివశించుచున్నారు. ఆత్మలు మూడు అని తెలిసిన విషయమే. అయితే ప్రకృతి ఐదు భాగములుగా యున్నది. శరీరముగా యున్న ప్రకృతిలో ఐదు భాగములు ఉన్నప్పటికీ అవి ఏమాత్రము తెలియకుండా శరీరములో అణిగియున్నాయి. ప్రకృతితో తయారయిన గుణములలో ఆత్మసంబంధ జీవుడు చిక్కుకొనియున్నాడు. గుణములలో తయారయినది మాయ అయితే, ప్రకృతి జనితములైనవి గుణములు. సృష్ఠ్యాదిలో ప్రకృతిని తయారు చేసినవాడు దేవుడే. ప్రకృతిని మాత్రమే కాకుండా, ప్రకృతితో గుణములను కూడా తయారుచేశాడు. గుణములను మాయ అని కూడా చెప్పుచున్నాము. మాయ దేవుని మార్గమునకు పూర్తి వ్యతిరేఖమైనది. దేవుని మార్గము నుండి దూరముగా పంపునది మాయ. ఉన్న సత్యము ప్రకారము చూస్తే గుణరూపముగా యున్న మాయను తయారుచేసినవాడు దేవుడే. అందువలన దేవుడు ప్రథమ దైవ గ్రంథములో ''గుణమయీ మమ మాయా దురత్యయా'' అని విజ్ఞాన యోగము అను అధ్యాయములో 14వ శ్లోకములో చెప్పియున్నాడు.
14వ శ్లో|| దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా |
మామేవ యే పప్రద్యన్తే మాయా మేతాం తరన్తితే ||

భావము :- ''నేను తయారు చేసిన గుణములతో కూడుకొన్న నా మాయను దాటుట దుస్సాధ్యమైన పనియగును. నా మాయను జయించి ముందుకు పోతాను అనువాడు ఎవడూ లేడు. ఎవడయితే నన్ను విశ్వసించి ఆరాధించునో వాడు నా మాయను సులభముగా దాటిపోగలడు.''

దేవుడు తన జ్ఞానమును సృష్ఠ్యాదిలోనే మనుషులకు ఆకాశము ద్వారా తెలియజేశానని చెప్పాడు. తన జ్ఞానమును చెప్పిన దేవుడు తన జ్ఞానమునకు పూర్తి విరుద్ధముగా యున్న మాయను, దానిని జయించుటకు ఎవరికీ చేతకాని దుస్సాధ్యమైన మాయను దేవుడు తయారు చేసి మనిషి తలలో గుణముల రూపములో పెట్టాడు. తన జ్ఞానమును తయారు చేసినవాడు దేవుడే. తన జ్ఞానమునకు వ్యతిరేఖ మాయను తయారు చేసినవాడు దేవుడే. అలా ఎందుకు చేశాడు అనగా! ''తాను అనుకుంటే దైవమార్గములో పంపుదునని, తాను అనుకుంటే అజ్ఞాన మార్గములో పంపుదునని'' చెప్పినమాట గుర్తుకు రాగలదు. అందువలన జ్ఞానమును నా జ్ఞానము అని అన్నాడు. అట్లే మాయను మమ మాయ (నా మాయ) అని కూడా అన్నాడు. జ్ఞానము దేవునిదే, మాయ దేవునిదేయని స్వయముగా దేవుడే చెప్పాడు. అందువలన దేవుడు అనుకొంటే తన జ్ఞానములోనికి మనిషిని పంపగలడు. అట్లే దేవుడు అనుకొంటే తన మాయలోనికి కూడా పంపగలడు అని పై వాక్యములో కూడా చెప్పియున్నాడు. దేవుడు ముందుచూపుకల్గి, మాయను తయారు చేసి మానవుని తలలో గుణములుగా పెట్టాడని అర్థమగుచున్నది. అట్లే దేవుడు తన జ్ఞానమును కూడా తయారు చేసినవాడై, జ్ఞానమును కూడా మనిషి తలలోనే ఉంచాడు.

దేవుడు ప్రపంచములో స్వర్గ నరకపాలనను సాగించుటకు శరీరము బయట కోట్ల దైవదూతలను సృష్ఠించియుంచాడు. అయితే అజ్ఞానము అయిన మాయలోనికి పంపుటకు, దైవికమైన తన జ్ఞానములోనికి పంపుటకు కేవలము పందొమ్మిది (19) మంది దేవదూతలను మాత్రమే నియమించాడు. అలా పందొమ్మిది (19) మందిని మాత్రమే నియమించుటకు కారణము ఏమియని చూచిన దేవుడే అందించు ఆలోచన ప్రకారము ఇలా తెలియు చున్నది. మనిషికి జ్ఞానము కలగాలన్నా, కలుగకూడదన్నా ఆ పనిని దేవుడు మాయకు అప్పజెప్పాడు. దేవుడు తన మాయ ద్వారానే మనుషులను ఇటు అజ్ఞానము వైపుగానీ, అటు జ్ఞానమువైపుగానీ పంపగలుగుచున్నాడు. మాయ ప్రకృతి జనితమైనది. ప్రకృతి కనిపించు శరీర రూపముగా యున్నది. మాయ అగోచరమైనది అయినా శరీరము గోచరముగా యున్నది. కనిపించే శరీరములో మూడు ఆత్మలను తీసివేసి చూస్తే 24 భాగములుగా ఉన్నది. అందులో కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదుగా యున్నాయి. ఇవి బయటికి కనిపించునవిగా యున్నవి. కనిపించక శరీరము లోపల యున్నవి ఐదు వాయువులు, నాలుగు అంతఃకరణములు గలవు. జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములకు ఉన్న శక్తులను విడదీసిచూడకుండా లెక్కించితే బయట పది, లోపల తొమ్మిది గలవు. జ్ఞానేంద్రియములలో శక్తులు కలిసిపోయి ఉండుట వలన వాటిని ప్రత్యేకముగా లెక్కించడము లేదు. ఆ విధముగా చూస్తే మాయకు నిలయమైన ప్రకృతి శరీర రూపములో పందొమ్మిది (19) భాగములుగా యుండుట వలన ఆ పందొమ్మిది సంఖ్య గల దేవదూతలే మాయ తరపున దేవుడు నియమించి మనిషి ఇటు జ్ఞానము లోనికిగానీ, అటు అజ్ఞానములోనికి గానీ పంపు బాధ్యతను మాయకే అప్పజెప్పాడు.

పాపపాలన, పుణ్యపాలన చేస్తూ మనిషికి సుఖదుఃఖములను అందించు దూతలు కోట్ల సంఖ్యలో యుండగా, ఇటు పాపమునకు, అటు పుణ్యమునకు సంబంధము లేకుండా జ్ఞానమునుగానీ, అజ్ఞానమునుగానీ కల్గించు మాయ గుణముల రూపములో ఉండగా, గుణములు ప్రకృతితో తయారయి ఉండగా, ప్రకృతితో తయారయిన శరీరము యొక్క ముఖ్యమైన భాగములు పందొమ్మిదేయుండగా మాయ ప్రతినిధులుగా పందొమ్మిది (19) సంఖ్యగల దూతలనే నియమించాడు. ఈ పందొమ్మిది దూతలే దేవుడు చెప్పినట్లు మనిషిని జ్ఞానమార్గములోనికిగానీ, అజ్ఞాన మార్గములోనికి గానీ పంపుచున్నారు. మనుషుల శరీరములో యున్న మాయ దృష్ఠాంతమును చూపుటకే పందొమ్మిదిమంది దూతలను నియమించినట్లు తెలియుచున్నది. ప్రపంచములో మాయయే మనిషిని దేవుని మార్గములో ఆటంకపరచి తనను జయించుట దుస్సాధ్యమని తెలియజేయుచున్నది. దేవుడు అయినవాడు పురుషుడు, ప్రకృతి స్త్రీగా యున్నదని ముందే చెప్పుకొన్నాము. ప్రకృతికి పతిగా యున్నవాడు దేవుడే. దేవునికి సతిగాయున్నది ప్రకృతి. దేవుడు తనకు ఇష్టమైన వానిని తనవైపు పంపమని ప్రకృతికి చెప్పగా, ప్రకృతియైన మాయ మనిషిని దేవునివైపు పంపును. దేవునికి ఇష్టములేని వానిని తనను దాటిపోకుండా మాయ చూడగలదు. దేవునికి సతిగాయున్న మాయయే దేవునికి నచ్చినవారినే దేవునివైపు పంపుచూ, నచ్చనివారిని పంపకుండా ఉండుటకు తన శరీరములో భాగములుగా యున్న వారికి సంబంధించిన సంఖ్యనే ఎన్నుకోవడము వలన పందొమ్మిది మంది దేవదూతలు మాత్రమే దేవుని పనిని మాయ ద్వారా పూర్తి చేయుచున్నవి.

ఇప్పటినుండి మాయ మనకు వ్యతిరేఖమయినదని తలచకుండా, దేవుని జ్ఞానమునకు దూరముగా పంపుటకు కారణమున్నదని తెలిసి, దేవునికి అత్యంత సమీపమున ఉండి దేవుని పనిని చేయడములో మాయ మొదటికి ఉన్నదని తెలిసినవాడు దేవునికి ఇష్టునిగా మారగలిగితే సులభముగా మాయకు కూడా ఇష్టునిగా మారవచ్చును. మాయకు ఇష్టునిగా మారగలిగితే మాయయే సులభముగా ఏ ఆటంకము లేకుండా దేవునివైపు పంపగలదు. అందువలన దేవుడు, మాయ ఇద్దరూ దగ్గరివారేయనీ పతి ఇష్టమునుబట్టి సతియైన మాయ ప్రవర్తించుచున్నదని తెలియుచున్నది.

మనిషి దేవుని జ్ఞానము తెలియుచూ మాయను దూషించుచున్నాడు. హిందువులు మాయయనీ, క్రైస్థవులు సాతానుయనీ, ముస్లీమ్‍లు సైతాన్ లేక ఇబ్లీసుయనీ చెప్పుచూ ఈ మూడు పేర్లతో చెప్పబడుచున్నది దేవునికి వ్యతిరేఖమయినదని చెప్పుచూ, మాయయొక్క గొప్పతనము తెలియక మాయను దూషించుచున్నారు. అట్లు చేయుట వలన సాతానును అసహ్యించుకోవడము వలనగానీ, సైతాన్ను దూషించడము వలనగానీ, మాయను నిరోధించవలెనని అనుకొనినా అది పరోక్షముగా దైవ దూషణే యగును. దానివలన దేవునికి మరింత దూరమగుటయే గానీ, దగ్గరగుటకు కుదరదు. మాయ దైవ నిర్మితమైనదే, అది దేవుని మాయయే, దేవున్ని ఎలా గౌరవించుచున్నామో అలాగే మాయను కూడా గౌరవించవలసి యుండును. అలా గౌరవించకపోతే ప్రత్యేకముగా నియమింపబడిన పందొమ్మిది మంది దూతలకు కోపము రాగలదు. దానివలన నష్టము తప్ప లాభము లేదు. అందువలన నేను ఎప్పుడూ దేవున్ని (ఆత్మను) తండ్రిగా, మాయను తల్లిగా గౌరవించుచున్నాను. అందువలన నాకు పందొమ్మిది మంది పాలకులయిన దేవదూతలు నాకు చెడును చేయక జ్ఞానమును అందించుచున్నారు. అదే జ్ఞానమునే మీకు తెలుపుచున్నాను. నాకు దేవుడు, దేవుని మాయ ఇద్దరూ సమానమే. మీరు కూడా దేవున్ని గౌరవించినట్లే మాయ అనుకొను సైతాన్నో, సాతాన్నో గౌరవించండి. అప్పుడు దేవుని మార్గము సులభతరము కాగలదు.



అంతిమ దైవగ్రంథములో
వజ్ర వాక్యములు

☜ వజ్ర వాక్య వివరము  
  
132. ఏడు రాత్రులు, ఎనిమిది పగల్లు అంటే ఏమిటి? (69-1 నుండి 7)
(69-1) జరిగి తీరేది.

(69-2) ఏమిటా జరిగి తీరేది?

(69-3) ఆ జరిగి తీరేదానిని గురించి నీకేమి తెలుసు?

(69-4) తట్టేటటువంటి విపత్తును సమూదు, ఆదు జనులు ధిక్కరించారు.

(69-5) సమూదు వారు అత్యంత భయంకరమైన కేక శబ్దము ద్వారా అంతమొందించబడ్డారు.

(69-6) ఆదువారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనము చేయబడ్డారు.

(69-7) వాటిని (శబ్దమును, గాలులను) అల్లాహ్ వారిపై నిరంతరము ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు విధించాడు. నీవు గనుక అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు చెట్టువలె నేలకొరిగి పడి ఉండడము చూసేవాడివి.

69వ సూరాలో మొదటి ఏడు ఆయత్‍లను తీసుకొని చూస్తున్నాము. అందులో ఒకటి, రెండు ఆయత్‍లలో జరిగి తీరేది అని చెప్పి జరిగి తీరేది ఏమిటి?యని ప్రశ్నను అడిగారు. దానికి సమాధానమును కొందరు వెతికి చెప్పవచ్చును. నేనయితే వెతకకుండా చెప్పుచున్నాను. అదేమనగా! మొదటి దైవగ్రంథము అయిన తౌరాతులో సాంఖ్యయోగమను అధ్యాయమున 27వ శ్లోకములో ఇలా చెప్పారు చూడండి.
27వ శ్లో|| జాతస్య హి ధువ్రో మృత్యుర్ధువ్రం జన్మ మృతస్యచ |
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి ||

భావము :- 'పుట్టుట ఎప్పటికయినా చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే, అనివార్యమైన సంగతి గురించి ఎవరూ బాధపడరు.''

దీనిభావము ప్రకారము జరిగి తీరేది జననము మరణము. జరిగి తీరే దానిని గురించి పుట్టితే చావక తప్పదు. చస్తే పుట్టక తప్పదు అని తెలుసు. చావు పుట్టుకలు రెండూ శరీరములోనే జరుగుచున్నవి. శరీరములో జీవుడు జీవించుట అలాగే మరణించుట జరుగుచున్నది. బయట విజ్ఞానము గానీ, లోపల జ్ఞానముగానీ తెలిసినవాడు మనిషి శరీరములో ఏడు నాడీ కేంద్రముల మీద, ఏడు గ్రంథుల మీద ఆధారపడి బ్రతుకుచున్నాడు. మనిషిలో ఏడు నాడీకేంద్రముల ద్వారా శరీరమునకు బలమును, ఏడు గ్రంథుల ద్వారా ఆరోగ్యమును ఇవ్వడము జరుగుచున్నది. దీనినిబట్టి ఏడు నాడీకేంద్రములు, ఏడు గ్రంథులు మనిషికి ఆయుష్షును, జీవనమును ఇచ్చుచున్నవి. ఏడు నాడీకేంద్రములు పని చేయకపోయి, ఏడు గ్రంథులు పని చేస్తూయుంటే మనిషి కోమాలోనికి (అపస్మారక స్థితిలోనికి) పోవును. ఒకవేళ గ్రంథులు ఆగిపోయి, నాడీకేంద్రములు పని చేస్తూయుంటే మనిషి జ్ఞాపకములో (మెలకువలో) యుండునుగానీ, ఏమీ మాట్లాడక మెదడు పని చేయని స్థితిలో ఉండును. గ్రంథులు పనిచేయక నాడులు పని చేస్తే జ్ఞాపకముండి చూస్తూ మాట్లాడక ఉండును. అట్లే నాడీకేంద్రములు పని చేయక గ్రంథులు పనిచేయకపోతే కోమాలో ఉండి మాట్లాడకపోవును. ఎటయినా సగము చనిపోయినట్లగుచున్నది. పూర్తి చనిపోయినప్పుడు ఏడు నాడీకేంద్రమలు, ఏడు గ్రంథులు పూర్తి పని చేయక నిలిచిపోయివుండును. దానినే మరణము అంటాము.

సమూదు జాతివారు అనగా ఏడు నాడీకేంద్రములుయనీ, ఆదు జాతివారు అనగా ఏడు గ్రంథులని తలచవలెను. ఆదు, సమూదు అని గ్రంథి, నాడీకేంద్రములు బాగున్నప్పుడు మనిషి చావును వెక్కిరించుచూ శరీరములో బలముగా, ఆరోగ్యముగా ఉండును. దేవుడు అనుకొంటే నాడీకేంద్రములు పని చేయవు. అట్లే గ్రంథులు పని చేయవు. సమూదు యను నాడీకేంద్రములను పని చేయకుండా నిలిపివేయుటకు శరీరములోనే శబ్దమును కల్పించి నాడీకేంద్రములను పనిచేయకుండా చేయును అని (69-5) లో వ్రాయడము జరిగినది. ఆదు అను గ్రంథులను పని చేయకుండా చేయుటకు శరీరములోనే చలి గాలులను సృష్ఠించి, ఆ గాలులకు గ్రంథులు పనిచేయకుండా నిలిచిపోవునట్లు చేయునను విషయమును (69-6) లో వ్రాశారు. శరీరములో ఏడు నాడీకేంద్రములు, ఏడు గ్రంథులు నిలిచిపోవడమునే మనిషి చనిపోవడము అని అంటారు.

దేవుడు తన జ్ఞానమును చాలాచోట్ల నిగూఢముగా చెప్పాడు. తన జ్ఞానము మీద శ్రద్ధ లేనివారికి అర్థము కాకూడదనే జ్ఞానమును నిగూఢముగా చెప్పడము జరుగుచున్నది. పైకి చెప్పేది ఒకటికాగా, దాని అంతరార్థము ఇంకొకటియుండును. అలాగే ఇప్పుడు 69వ సూరాలో ఒకటి నుండి ఏడు వరకు గల వాక్యములన్నీ అలాగే యున్నవి. సమూదు, ఆదు అను రెండు మనుషుల జాతుల పేర్లు చెప్పారు. అయితే వాటికి లోఅర్థము నాడీ గ్రంథుల పేర్లను సరిచేశారు. అట్లే ప్రతి విషయము పైకి కనిపించునది ఒకటికాగా చెప్పిన ఉద్దేశ్యము మరొకటి యుండును. అదే పనిగా దేవుడు తన జ్ఞానమును అందరూ గుర్తించకూడదని, ఎవనికి శ్రద్ధయుందో వాడే గ్రహించవలెనను ఉద్దేశ్యముతోనే చెప్పాడు. నాడీకేంద్రములు, గ్రంథి కేంద్రములు బాగున్నంత కాలము మనిషి జీవించియుండగలడు. అవి రెండు సరిగా లేకుండా పోయి వాటి పనులకు ఆటంకము ఏర్పడినప్పుడు మనిషి చనిపోవును. ఆ విషయమును తెలియునట్లు చేయుటకు ఈ విధమైన ఆయత్‍లను చెప్పారు. నాడీకేంద్రములను, గ్రంథి కేంద్రములను దేవుడు (ఆత్మ) తనశక్తితోనే నడుపుచున్నది. పైకి శబ్దము, గాలులు కారణము చూపినట్లు, లోపలి గ్రంథులు, నాడీకేంద్రములు పనిచేయకుండా తన శక్తిని వాటికి లేకుండా చేయుచున్నాడు. శరీరములో అన్ని భాగములు ఆత్మ శక్తితోనే పనిచేయుచున్నవి. అందువలన నాడీకేంద్రములలో గ్రంథి కేంద్రములలో యున్న శక్తిని లేకుండా చేసిన వెంటనే మనిషి చనిపోవు చున్నాడు. అందువలన మనిషి చనిపోక తప్పదని చెప్పుచూ అది జరిగి తీరేదేయని (69-1) వ వాక్యములోనే చెప్పారు. అట్లే చివరి ఏడవ వాక్యములో ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు సమూదు, ఆదు జనులపై శబ్దమును, గాలులను వదలి వారిని లేకుండా చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ చెప్పిన ఏడు, ఎనిమిది అనువాటికి అర్థము ఏమిటి? అని చూడవలసి యున్నది. ఈ రెండింటి అర్థము తెలియగలిగితే వాక్యములోని నిగూఢత అంతా అర్థము కాగలదు.

సమూదు జాతి మనుషులు ఏడుమంది యనీ, అట్లే ఆదు జాతి మనుషులు ఏడుమంది అని చెప్పుకొన్నాము. సమూదు అనగా ఏడు నాడీకేంద్రములనీ, ఆదు అనగా ఏడు గ్రంథి కేంద్రములని చెప్పుకొన్నాము. అర్థము చేసుకొనుటకు మొదట అలాగే చెప్పుకొనినా, ఉన్న సత్యము ప్రకారము నాడీకేంద్రములు ఏడే అయినా, గ్రంథులు మాత్రము ఏడుకంటే ఎక్కువనే ఉన్నాయి. అందులో ముఖ్యమైన వాటిని లెక్కించి ఏడని చాలామంది చెప్పారు. అట్లు ముఖ్యమైనవి ఏడుకాదు ఎనిమిది గలవు. అయితే ఎనిమిదిలో పీయూష గ్రంథి అనగా పిట్యూటరీ గ్లాండ్ అనునది ఏమి చేయునది ఎవరికీ తెలియదు. అంతేకాక అందులోనుండి ఏ ఊటలు ఊరవు. అయినా ఆ గ్రంథిని అన్నిటికంటే ముఖ్యముగా కొందరు చెప్పుచుందురు. సాధారణముగా పనిచేయు గ్రంథులు ఏడే అయినా పని చేయనిది అన్నిటికంటే ముఖ్యమైనది యని చెప్పుకొను పిట్యూటరీ గ్రంథిని కలిపి ఎనిమిదిగా చెప్పుకొంటున్నారు. చివరకు మేథావులందరూ గ్రంథుల సంఖ్య ఎనిమిదిగానే నిర్ధారించారు. నాడీకేంద్రములు ఏడేయని కూడా చెప్పుచున్నారు. ఏడు నాడీకేంద్రములలో గానీ, ఎనిమిది గ్రంథులలోగానీ ఆత్మశక్తియే వాటిలో యుండి పనిని చేయిస్తూ యున్నది. దేవుడు అయిన ఆత్మ ఏడు నాడీకేంద్రములలోనూ, ఎనిమిది గ్రంథులలోనూ తన శక్తిని లేకుండా చేయడము వలన అవి పని చేయకుండా పోవుచున్నవి. అలా ఎప్పుడు ఏడు నాడీకేంద్రములు, ఎనిమిది గ్రంథులు పనిచేయవో అప్పుడు మనిషి మరణించును. మరణము చెందిన వెంటనే చెట్టు అంత మనిషి కూడా కుప్పకూలిపోవును. అదే విషయమునే (69-7) లో ''బోసిపోయిన ఖర్జూరపు చెట్టువలె నేలకొరిగి పడిపోవడమును నీవు చూడగలవు'' అని అన్నారు. అనగా చెట్టంత మనిషి చనిపోయి పడిపోవును అని చెప్పుటకు అలా వాక్యములో చెప్పారు.

(69-7) వ వాక్యములో ''ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు అనారోగ్యము చేయడము జరుగును'' అని చెప్పుచూ ''శబ్దము గాలుల వలన ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు విధింతుము'' అని అన్నారు. దీని ప్రకారము శబ్దము, గాలి అనునది శరీరములో లేకున్నా బయట శబ్దము గాలికి మనుషులు చనిపోయినట్లు ఏడు నాడీకేంద్రములు, ఎనిమిది గ్రంథులకు కలుగు శక్తిహీనత వలన శరీరము మొత్తము చైతన్య రహితమై, ప్రాణము లేనిదై చనిపోవడము జరుగుచున్నది. శరీరములో ఏడు నాడీ కేంద్రములకు, ఎనిమిది గ్రంథులకు శక్తిని ఇచ్చునది ఆత్మే అయినా నాడీ కేంద్రముల నుండి శక్తి గ్రంథులకు ప్రాకవలసియున్నది. అట్లే ఎనిమిది గ్రంథులనుండి ఆత్మశక్తి ఆరోగ్యరూపములో ఏడు నాడీకేంద్రములకు ప్రాకవలసి యున్నది. అందువలన నాడీ కేంద్రములు, గ్రంథులు ఒక దానిమీద ఒకటి ఆధారపడి పనిచేయుచున్నవి. అలా పని చేయు రెండూ నిలిచిపోవడము వలన నాడీకేంద్రములను ఏడు రాత్రులు యనీ, గ్రంథులను ఎనిమిది పగళ్లుయనీ మరుగుపెట్టి వాటి అసలు పేర్లను మూసిపెట్టి చెప్పారు. బుద్ధి, శ్రద్ధయున్నవాడు గ్రహించుకోగలడని అలా చెప్పారు. నాడీ కేంద్రములు, గ్రంథికేంద్రములు ఒకదానికొకటి ఎలా అనుసంధానమై యున్నాయో క్రింద చిత్రమును చూచి గ్రహించవచ్చును.


ఈ విధానమును తెలియాలంటే శరీరములోని ఆత్మజ్ఞానము తెలిసి యుండాలి. భగవద్గీతయైనా, బైబిలు అయినా, చివరికి ఖుర్ఆన్ అయినా దేహములోని దేవున్ని, బయట ప్రపంచములోని పరమాత్మను, శరీరములో కాపురము చేయుచున్న జీవున్ని తెలియజేశాయని తెలియవలెను. శరీరమునకు సంబంధించిన జ్ఞానము తెలియనిదే, శరీరములోని మూడు ఆత్మల విషయము తెలియనిదే ఎవరూ జ్ఞానికాలేరు. అంతర్ముఖ జ్ఞానమునే మూడు గ్రంథములు బోధించాయి. మూడు గ్రంథముల జ్ఞానము తెలియక, లోపలి ఆరాధనను తెలియక బయట ఆరాధనను ప్రార్థనను చేయువానికి పరలోక ప్రాప్తి కలుగదు, దేవుడు తెలియడు. మీరు మంచి జ్ఞానులు కావాలని, దేవునివైపు పోవాలను ఉద్దేశ్యముతో ఈ గ్రంథములోని జ్ఞానమును తెలిపాముగానీ వేరు ఉద్దేశ్యము కాదు. ఇందులో మత ప్రచారముగానీ, మత ప్రసక్తిగానీ లేదనీ, సర్వమానవులకు సంబంధించిన బోధ మాత్రమే కలదని గ్రహించవలెను.
సమాప్తము


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024