pss book: త్రైత సిద్ధాంత భగవద్గీత : "1" సాంఖ్య యోగము short

 త్రైత సిద్ధాంత భగవద్గీత : "1" సాంఖ్య యోగము .


శ్రీ భగవంతుడిట్లనియె:-


శ్లోకం 11: (ప్రకృతి, పరమాత్మ)

భావము: శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి) నెల్లనుపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు.


శ్లోకం 12: (జీవాత్మ)

భావము: నేను లేకుంటిననుట ఎప్పటికీ లేదు. నీవు ఎప్పటికీ ఉందువు. ఈ ధరణి పాలించు రాజులు కూడ ఎప్పటికీ ఉందురు. ఇక ముందు కూడ మనమందరము లేకపోవుటనునదే లేదు.


శ్లోకం 13: (జీవాత్మ)

భావము: దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము,కౌమారము, ముసలి తనము వరుసగ ఎట్లు కల్గునో, అట్లే శరీరమును వదలిపోవడమను మరణము కూడ కల్గుచున్నది.


శ్లోకం 14: (జీవాత్మ)

భావము: పంచతన్మాత్రలచేత, శీతోష్ణములు సుఖదుఃఖములు మానవులకు కల్గుచుండును. శీతోష్ణములు సుఖదుఃఖములు ఎప్పటికి ఉండునవి కావు. అశాశ్వతములైనవి. వచ్చిపోయెడు వాటిని ఆ కొద్దికాలము ఓర్చుకోవలయును.


శ్లోకం 15: (జీవాత్మ)

భావము: ఎవడు సుఖదుఃఖ భేదములెంచుకొనడో, ఎవనికి వాని వ్యథ కలుగదో వాడే అమృతత్వమునకు అర్హుడగును.


శ్లోకం 16: (ఆత్మ)

భావము: సత్తు కనుక ఆత్మకు నాశనము లేదు. శరీరము అసత్తుకనుక దానికి నాశనము తప్పదు నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించినవారికి తెలిసివుండును.


శ్లోకం 17: (పరమాత్మ)

భావము: నాశనములేని పరమాత్మ ప్రపంచమంత వ్యాపించి సర్వము ఇమిడి ఉన్నది. ఇది శరీరంలోపల కూడ ఉన్నది. అట్టి దానిని ఎవడు నాశనము చేయలేడు.


శ్లోకం 18: (ఆత్మ, పరమాత్మ)

భావము: శరీరములలో నిత్యము ఉండువాడైన ఆత్మయు, నాశనములేని వాడు అప్రమేయుడు అయిన పరమాత్మయు నివశించు శరీరమునకు ఎప్పటికైన నాశనము తప్పదు కావున యుద్ధము చేయుము.


శ్లోకం 19: (జీవాత్మ)

భావము: జీవాత్మను చంపుదునని ఎవడనుకొనునో మరియు అది చంపబడునని కూడ ఎవడనుకొనునో ఆ ఇరువురు ఙ్ఞానశూన్యులని తెలియుము. జీవాత్మ చావునది కాదు, చంపబడునది కాదు.


శ్లోకం 20: (పరమాత్మ)

భావము: పరమాత్మ పుట్టునది కాదు గిట్టునది కాదు. ఒకప్పుడుండి మరియొకప్పుడు లేదనుటకు వీలుకాదు. నిత్యముండువాడు, పురాణుడు శరీరము చంపబడినను తాను చచ్చువాడు కాదు.


శ్లోకం 21: (పరమాత్మ)

భావము: నిత్యుడు, నాశనములేనివాడు పరమాత్మయని ఎవడు తెలుసుకొనునో, వాడు అట్టి పరమాత్మను ఎట్లు హింసింపగలడు? హింసచేయుటకునైన ఎట్లు తలచును?


శ్లోకం 22: (జీవాత్మ)

భావము : మానవుడు పాతవస్త్రమును వదలి క్రొత్తవస్త్రమును ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకొచ్చిన పాతదేహమును వీడి క్రొత్త శరీరములో ప్రవేశించుచున్నది.


శ్లోకం23: (జీవాత్మ)

భావము:- జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు.


శ్లోకం 24: (పరమాత్మ)

భావము: నిత్యముండువాడు, సర్వ జగత్తంతయు వ్యాపించినవాడు, నిలకడగ ఉండువాడు, చలనము లేనివాడు అయిన సనాతనమైన పరమాత్మ ఛేదింపబడడు, కాలడు, తడుపబడడు, త్రోయబడడు.


శ్లోకం 25: (ఆత్మ)

భావము:- ఆత్మను తెలియచెప్పుటకు, చింతించి తెలుసుకొనుటకు సాధ్యము కాదు. ఆత్మను ఏ వికారములు అంటవు. అందువలన దానికోసము దుఃఖ పడవలదు.


శ్లోకం 26: (జీవాత్మ)

భావము:- అట్లు కాకుండ వాడు నిత్యము పుట్టి నిత్యము చచ్చునని తెలిసితివేని, ఆ విధంబునైన వాని కొరకు నీవు ఏల దుఃఖపడవలయును.


శ్లోకం 27: (జీవాత్మ)

భావము:- పుట్టుట ఎప్పటికైన చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే, కనుక అనివార్యమైన ఈ సంగతిని గురించి దుఃఖించుట తగదు.


శ్లోకం 28: (జీవాత్మ)

భావము:-జీవ సంభవములెల్ల తెలియబడవు. అట్లే వాని మరణములు కూడ తెలియబడవు. కాని పుట్టుక చావుల మధ్యనగల జీవితము మాత్రము తెలియును. అట్టి జీవునకు నీవు శోకింపతగదు.


శ్లోకం 29: (జీవాత్మ)

భావము:- మధ్య జీవితములో జరుగు పనులను ఒకడు ఆశ్చర్యముగా చూచుచున్నాడు. ఆ పనులను ఇంకొకడు ఆశ్చర్యముతో వినుచున్నాడు. మరియొకడు వింతగా చెప్పుకొనుచున్నాడు. కాని జీవాత్మ నిజస్థితిని గూర్చి ఎవడు తెలియడు.


శ్లోకం 30: (జీవాత్మ)

భావము:-సర్వదేహములలోను నివశించు జీవాత్మలు ఎప్పటికీ చంపబడునవి కావు. కావున అన్ని జీవరాసుల గురించి నీవు బాధపడవలసిన పనిలేదు.


శ్లోకం 31 - 37(X)కల్పిత శ్లోకము.

పై శ్లోకములు కల్పితములని తెలియునట్లు వాటి ప్రక్కన(X) మార్కు గుర్తించి ఉంచాము. వాటి వివరము కూడ వ్రాయలేదు.


శ్లోకం 38: (కర్మయోగము)

భావము : కష్టసుఖములు, లాభనష్టములు, జయాపజయములను సమముగ తలచి యుద్ధము చేయుము. అట్లు చేయుట వలన పాపకర్మములు పొందవు.


శ్లోకం 39: (కర్మయోగము)

భావము : ఇంతవరకు శరీరములందు ఆత్మల వివరముగల జ్ఞానము తెలియజేసాను. ఇకనుండి కర్మబంధములు కలగని జ్ఞానము తెలియజేతును వినుము.


శ్లోకం 40: (కర్మయోగము)

భావము :- కర్మయోగమును ఆరంభించి మానుకొనుట వలన ఏ దోషము లేదు. కొద్దిగ ఆచరించినప్పటికి గొప్ప కర్మభయమునుండి కాపాడగలదు.


శ్లోకం 41: (ప్రకృతి)

భావము :- యోగమునందు బుద్ధిగలవారు ఒకటే నిశ్చయముతో ఉందురు. వేరభిప్రాయములు కల్గువారికి బుద్ధి శాఖోపశాఖలైవుండును.


శ్లోకం 42: (ప్రకృతి)

భావము :- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు.


శ్లోకం 43: (ప్రకృతి)

భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును.


శ్లోకం 44: (ప్రకృతి)

భావము: కోర్కెల చేత ఆకర్షింపబడిన మనస్సు గలవారు అటువంటి సుఖములనే ఆశ్రయించుదురు. వారి మనస్సుకు ఆత్మ విజ్ఞానదాయకమైనట్టి జ్ఞానము ఎప్పటికి పట్టుబడదు.


శ్లోకం 45: (బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము: మూడు గుణముల విషయములే వేదములు. వేద భూయిష్టమైన ఆ మూడు గుణములను పూర్తిగ వదలివేయుము. సుఖదుఃఖములు, లాభనష్టములు మొదలగు ద్వంద్వములను వదలి వేసినట్లే యోగక్షేమము అనుదానిని కూడ వదలి నిత్యమైన దైవమును చేరుము.


శ్లోకం 46: (కర్మ యోగము)

భావము: బావి నిండుగవున్న నీరు ఏ విధముగ నిత్యము త్రాగుటకు స్నానము చేయుటకు ఉపయోగపడుచున్నదో, ఆ విధముగనే సర్వ వేదముల నుండి కూడ మనకు నిత్యము ఉపయోగము గలదని బ్రహ్మజ్ఞానియైన వానికి తెలియును.


శ్లోకం 47: (కర్మయోగము)

భావము: కర్మ సంపాదించుటయందే నీకు అధికారము కలదు. కర్మఫలము లందు ఆశపడవలదు. కర్మయగు పాపపుణ్య ఫలములైన కష్టసుఖములకు కారకుడవు కావద్దు. అట్లే కర్మ వచ్చునని దానికి సంబంధించిన పనులు మానవద్దు.


శ్లోకం 48: (కర్మయోగము)

భావము: చేయు పనులయందు కల్గు లాభనష్టముల ఎడల ధ్యాసలేక, మంచి చెడు పనులందు సమబుద్ధి గలవాడై, కార్యములాచరించినవాడు యోగనిష్ఠ ఆచరించిన వాడగును. ఈ విధముగనే నీవు కార్యములు చేయుము.


శ్లోకం 49: (కర్మయోగము)

భావము: కర్మనాశనము చేయు కర్మయోగమునకంటే, నీచస్థితిని కలుగజేయు కర్మ చాలా భేదమైనది. నీవు నీచస్థితిని కలుగజేయు కర్మను విడిచి, ఉన్నత స్థితిని కలుగజేయు కర్మయోగమునే ఆశ్రయింపుము.


శ్లోకం 50: (కర్మయోగము)

భావము: కర్మయోగముననుసరించిన వాడు కర్మయైన పాప పుణ్యములను నాశనము చేయుచున్నాడు. అందువలన నీవు కూడ కార్యములను చేయుచు ఆ పనులయందే ఇమిడిన పాపపుణ్యములను పొందని నేర్పరితనమును తెలియుము. అదియే కర్మయోగము.


శ్లోకం 51: (కర్మయోగము)

భావము: జ్ఞానపరులు కర్మ ఫలములను వదలి, జన్మ బంధములను విడచి మోక్షమును పొందుచున్నారు.


శ్లోకం 52: (కర్మయోగము,బ్రహ్మయోగము)

భావము: ఎపుడైతే మోహగుణమను కల్మషమును దాటగలవో, అపుడే నీవు ఇంతవరకు వినిన, వినవలసి విషయముల కొరకు వైరాగ్యము పొందగలవు.


శ్లోకం 53: (బ్రహ్మ యోగము)

భావము: వివిధ శ్రుతుల వలన కలత చెందిన నీ బుద్ధి చలింపనిదై స్థిరమైన సమాధియందు నిలిచినపుడు నీవు యోగము పొందిన వాడవగుదువు.


అర్జునుడిట్లనియె:-

శ్లోకం 54: (బ్రహ్మయోగము)

భావము: ఓ కృష్ణా! బుద్ధి నిలిచిపోయి సమాధి స్థితిలో ఉన్నవాడు ఏ భాషలో మాట్లాడును? ఏమి మాట్లాడును? ఏ విధముగా కూర్చుండును? ఏమి ఆచరించును?


శ్రీ భగవంతుడిట్లనియె:-


శ్లోకం 55: (బ్రహ్మయోగము)

భావము: ఎప్పుడైతే సర్వ ఆశలు మరియు మనోగతములైనవన్ని ప్రయత్న పూర్వకముగా వదలి ఆత్మయందే జీవాత్మ తృప్తిబొందుచున్నదో అపుడే వానిని స్థిత ప్రజ్ఞుడని చెప్పవచ్చును.


శ్లోకం 56: (బ్రహ్మయోగము)

భావము: దుఃఖమందు బాధపడని వానిని, సుఖములందు సంతోషించని వానిని, మరియు ప్రేమ, కోపము, భయములేని వానిని మౌనము వహించిన బుద్ధిగల వాడందురు.


శ్లోకం 57: (బ్రహ్మయోగము)

భావము: ఎవరైతే అన్నిటియందు సంబంధము లేక, శుభాశుభములయందు మనోధ్యాస ఏమాత్రము లేకుండా, సుఖదుఃఖములు అనుభవించకుండునో, అట్టివాని ప్రజ్ఞ గొప్పది.


శ్లోకం 58: (బ్రహ్మయోగము)

భావము: తాబేలు ఏ విధముగా తన అవయవములను ముడుచుకొనుచున్నదో , ఆ విధముగా మనస్సును ఇంద్రియముల నుండి మరలింపవలెను.


శ్లోకం 59: (బ్రహ్మయోగము)

భావము: బ్రహ్మయోగమాచరించు యోగి ఇంద్రియములకు ఆహారమైనట్టి విషయములయందు మనోధ్యాసలేకుండా చేసుకొన్నప్పటికి, వాని తలలోని విషయముల మీద ఆశ అనుగుణము వీడకయుండును. ఆ ఆశయు కొంత కాలము ఆత్మను దర్శించుట వలన నశించిపోవును.


శ్లోకం 60: (బ్రహ్మయోగము)

భావము: జ్ఞానియైనవాడు యోగ సమయమందు మనస్సు చలించకుండునట్లు ఎంత ప్రయత్నము చేయుచుండిన, యోగభ్రష్టతయను ప్రమాదము కలుగునట్లు ఇంద్రియములు వాని మనస్సును చలింపజేయుచున్నవి.


శ్లోకం 61: (బ్రహ్మయోగము)

భావము: ఇంద్రియములనెల్ల అణచివేసి మనస్సును నాయందు ఎవడుయుంచునో, ఇంద్రియములెవనికి స్వాధీనమైయుండునో అట్టి వాని ప్రజ్ఞ గట్టిది.


శ్లోకం 62: (ప్రకృతి)

భావము: విషయముల ధ్యాసలో వాటి సంగమము మానవునకు ఏర్పడుచున్నది. అట్టి సంగమము వలన మానవునకు కోర్కె పుట్టుచున్నది. దాని వలన క్రోధము పుట్టుచున్నది.


శ్లోకం 63: (ప్రకృతి)

భావము: క్రోధము వలన సమ్మోహము గల్గును. సమ్మోహము వలన స్మృతి భ్రమించుట, స్మృతి భ్రమించుట వలన బుద్ధి నాశనము, బుద్ధి నాశనము వలన భ్రష్టత్వము పొందుట కల్గును.


శ్లోకం 64: (బ్రహ్మయోగము)

భావము: రాగద్వేషములను వదలి అట్లే ఇంద్రియ విషయములను వదలి స్వాధీనపడిన మనస్సుగలవాడెపుడైతే అపుడు ప్రసాదంబు కలుగును.


శ్లోకం 65: (బ్రహ్మయోగము)

భావము: ఆత్మదర్శనము కల్గినపుడే సర్వదుఃఖములకు హాని ఏర్పడును. బుద్ధి సుస్థిరత చెందును. మనస్సు నిర్మలత్వము పొందును.


శ్లోకం 66: (బ్రహ్మయోగము)

భావము: యోగహీనునికి బుద్ధి నిలకడగ ఉండదు. దైవభావము అతనికి కలుగదు. దైవభావములేని వానికి శాంతి లేదు. శాంతిలేని వానికి సుఖముండదు.


శ్లోకం 67: (ప్రకృతి)

భావము: ఏ మనుష్యుని మనస్సు ఇంద్రియముల వెంట తిరుగుచుండునో వాని బుద్ధియు గాలి వలన నావ కదిలినట్లు చలించుచుండును.


శ్లోకం 68: (బ్రహ్మయోగము)

భావము: ఎవడు ఇంద్రియముల యొక్క సర్వ విషయములను నిగ్రహించుచున్నాడో అట్టివాని ప్రజ్ఞ నిలకడగా నిలిచినదగును.


శ్లోకం 69: (బ్రహ్మయోగము, ప్రకృతి)

భావము: సర్వ జీవరాసులకు రాత్రివలె నిద్రించు అజాగ్రత్త ఎందుగలదో అందే బ్రహ్మయోగి జాగ్రత్త కల్గియుండును. ఏదైతే బ్రహ్మయోగికి రాత్రివలె స్థంభించి ఉన్నదో అందే సర్వ జీవరాసులు జాగ్రత్తగానున్నవి.


శ్లోకం 70: (బ్రహ్మయోగము)

భావము: నిండి నిబిడీకృతముగా ఉన్న సముద్రమునందు నదుల నీరు ఎంత చేరినప్పటి పొంగిపోనట్లు, బ్రహ్మయోగనిష్ఠయందున్న వానికి ఎన్ని కోర్కెలున్నను వాటి ప్రభావమేమి లేకపోవును. బ్రహ్మయోగి కాక కోర్కెలు కోరువానికి ఎప్పటికి ఆత్మదర్శనము లభించదు, శాంతిరాదు.


శ్లోకం 71: (బ్రహ్మయోగము, కర్మయోగము)

భావము: సర్వ కోర్కెలను విడనాడి వాటి ధ్యాస ఏమాత్రము లేకుండు వాడును, అట్లే మోహమును, అహంకారమును లేనివాడును తప్పక శాంతి పొందును.


శ్లోకం 72: (బ్రహ్మయోగము,కర్మయోగము)

భావము: ఇది దైవమును పొందుస్థితి. ఈ స్థితి పొందినవాడు నాది నావారు అను మోహమును పొందడు. ఈ స్థితి పొందిన వాడు మరణకాలమున మోక్షమును పొందును.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024