sheep test
పొట్టేలు పిల్లల పెంపకంతో ఆదాయము.
గొర్రె, మేక మాంసానికి ఉన్న ధర, డిమాండ్ దృష్యా యువకులు, ఔత్సాహిక జీవాల పోషకులు. మహిళలు గొర్రెల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. పాడిపరిశ్రమతో పోల్చితే ఈ జీవాల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టడం, జీవాల పెంపకాన్ని మహిళలు, వృద్ధులు తేలికగా భావించడం వల్ల ప్రభుత్వం స్వయం సహకార సంఘాల మహిళలకు గొర్రెలు/ మేకల యూనిట్లను రాయితీపై సరఫరా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో గొర్రె మాంసం డిమాండ్ దృష్టిలో ఉంచుకొని తక్కువ కాలంలో దృఢంగా, ఏపుగా పెరిగి మంచి తూకం ఇచ్చే గొర్రె జాతులను ఎంపిక చేసుకొని వాటి పోషణలో చిన్న చిన్న మెలకువలు అవలబించడం వల్ల జీవాల పెంపకాన్ని లాభదాయకంగా మార్చుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు జాతి, డెక్కన్ జాతి గొర్రెలు ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా 90 శాతం జీవాలు సెప్టెంబర్-జనవరి మాసాల్లో పిల్లలు వేస్తాయి. సరైన ప్రణాళిక వేసుకొని ఈ పిల్లలను పెంచితే గొర్రె/ మేక మాంసానికి అధిక డిమాండ్ ఉండే బక్రీద్, దసరా, క్రిస్మస్, సంక్రాంతి సమయాలకు వీటిని మార్కెట్ బరువుకు తీసుకురావచ్చు. మాంసం కోసం పెంచే గొర్రెపిల్లలు 9-12 నెలలు వయస్సులో 25-35 కిలోల బరువుకు వచ్చి మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటాయి.
గొర్రె పిల్లల్లో మరణాలు పుట్టిన రెండు వారాల్లోపు అధికంగా ఉంటాయి. దీనిని మనం అధిగమిస్తే మరణాల శాతం 2.5 శాతానికి మించకుండా జీవాల పెంపకాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. ఆరోగ్యకరమైన గొర్రెపిల్లల పోషణ తల్లిగర్భం నుంచే మొదలవుతుంది. దీనికై చూడి గొర్రెలను గుర్తించి అవి ఈనడానికి 3-4 వారాల ముందు నాణ్యమైన దాణా అందిస్తే పుట్టబోయే గొర్రెపిల్లలు అధిక బరువు కలిగి మరణాల శాతం మందలో తక్కువగా ఉంటుంది. ఈనిన వెంటనే జున్నుపాలు పట్టించడం, తల్లిగొర్రెకు మంచి దాణాను అందించడం వల్ల పాలు బాగా ఉత్పత్తయ్యి గొర్రెపిల్లలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వారం వయస్సు కలిగిన గొర్రె పిల్లలకు క్రీపు దాణా అలవాటు చేయాలి. క్రీపు దాణాలో మాంసకృత్తులు 20-22 శాతం ఉండటం వల్ల గొర్రెపిల్లలు త్వరగా పెరుగుతాయి. దీంతోపాటు లేత గడ్డిని కూడా గొర్రె పిల్లలకు అందించాలి. 2-3 నెలల జీవాలను తల్లుల నుంచి వేరు చేయాలి. తల్లుల నుంచి వేరుచేసిన గొర్రెపిల్లలను రెండు విధాలుగా పెంచుకోవచ్చు.
సాంద్ర పద్ధతి: పచ్చిక బయళ్లలో మేపే అవకాశం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీవాలను ఈ పద్ధతిలో పెంచుకోవచ్చు. 6-8 వారాల పిల్లలను తల్లుల నుంచి వేరుచేసి షెడ్లలో ఉంచి వాటికి అవసరమయ్యే గడ్డి, దాణా, నీరు షెడ్డులోకి సరఫరా చేయాలి. ఈ పద్దతిలో పెంపకం ఎక్కువ ఖర్చుతో కూడినది.
విస్తృత పద్ధతి: ఈ పద్ధతిలో తక్కువ ఖర్చుతో జీవాలను పెంచుకోవచ్చు. పగటివేళలో జీవాలను అందుబాటులో ఉండే పచ్చిక బయళ్లలో మేపి, రాత్రి సమయంలో పాకలలో/ షెడ్లలో ఉంచి వాటికి గడ్డి, దాణా నీ అందించాలి. సాంద్రపద్ధతిలో పెంచే జీవాలతో పోల్చినప్పుడు ఈ పద్ధతిలో పెరిగే జీవాలు మార్కెట్ బరువుకు రావడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది. పరిమితంగా దాణా/ మెక్కజొన్న/ బియ్యం, జొన్న, సజ్జ గింజల నూకలు అందించడం వల్ల వీటి పోషణ ఖర్చు తక్కువగా ఉంటుంది. జీవాలలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లలు మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటాయి. అంతేగాక ఈ జీవాల నుంచి వచ్చే మాంసంలో విటమిన్-ఇ, ఓమేగా ఫ్యాటీ ఆమ్లాలు, సమృద్ధిగా ఉండి రుచిగా ఉంటుంది. అయితే ఈ పద్ధతిలో పెరిగే జీవాలకు పరాన్నజీవుల (బాహ్య, అంతర) సమస్య అధికంగా ఉంటుంది. ఏ పద్ధతిలో గొర్రెలు/ మేకల పెంపకం అవలంబించినా క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించి, నట్టల నివారణా మందు తాగించాలి.
పోషణ: విస్తృత పద్ధతిలో పెంచే జీవాలు మేసే పచ్చిక బయళ్లలో స్టయిలో లూసర్న్ విత్తనాలను తొలకరి సమయంలో చల్లితే అవి మంచి మాంసకృత్తులు ఉన్న పశుగ్రాసం జీవాలకు అంది, వాటి ఎదుగుదలను వేగవంతం చేస్తాయి. సాంద్ర పద్ధతిలో పెంచే జీవాలకు సాగుచేసే పచ్చగడ్డిని ముక్కలుగా కత్తిరించి అందించాలి. దీంతో పాటు స్టైలో, లూసర్న్, అలసంద పిల్లిపెసర, హెడ్జ్ లూసర్న్ వంటి లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను సాగుచేసి అందించినా అవి దాణా ఖర్చును 50 శాతం వరకు తగ్గిస్తాయి. సుబాబుల్, అవిశ చెట్లను పాకల చుట్టూ లేదా పొలం చివర గట్లపై వేసి సాగుచేసి వాటి కొమ్మలను జీవాలకు మేపుకోవచ్చు. వ్యవసాయ ఉప ఉత్పత్తులైన కళాదపొట్టు, మినపపొట్టు శనగపొట్టు, ముక్కలుగా కత్తిరించిన వేరుశనగ కట్టె మొదలైనవి కూడా జీవాలకు మేపవచ్చు.
జీవాలకు పెట్టే ఆహారంలో 10 శాతం దాణా, 90 శాతం గడ్డి ఉండేలా చూసుకోవాలి. సమీకృత ఆహారాన్ని స్వతహాగా తయారు చేసుకోవాలనుకునేవారు దిగుబ తెలిపిన దినుసులను కలుపుకొని మర ఆడించి జీవాలకు మేపుకోవచ్చు. మొక్కజొన్న- 25 భాగాలు, వేరుశనగ చెక్క (పొద్దు తిరుగుడు చెక్క నువ్వులచెక్క, కుసుమ చెక్క కూడా వాడవచ్చు) 32 భాగాలు, గోధుమ తవుడు/ నూనె తీసిన తవుడు 40 భాగాలు, మినరల్ మిక్చర్ 2 భాగాలు ఉప్పు 1 భాగం చొప్పున కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న సమీకృత దాణాను విత్తనపు పొట్టేలుకు 400 గ్రా., గొర్రెకు 200-250 గ్రా., గొర్రెపిల్లలకు 30-50 గ్రా. చొప్పున అందించాలి. క్రీపు దాణా తయారుచేసుకొని పాలు తాగే జీవాలకు వారం వయస్సు నుంచి అందించాలి. ఈ దాణా తయారీలో మొక్కజొన్న/ జొన్న/ సజ్జలు 35-40 శాతం, వరి తవుడు (నూనె తీసింది) 20-25 శాతం, వేరుశనగ చెక్క/ సోయాపిండి 20 శాతం, పొద్దుతిరుగుడు చెక్క 17 శాతం, మినరల్ మిక్చర్ 2 శాతం, ఉప్పు 1 శాతం చొప్పున వాడాలి.
పెంపకంలో మెలకువలు.
మొదటిసారి గొర్రెల పెంపకం చేపట్టే వారు 50 ఆడగొర్రెలు, రెండు విత్తనపు పొట్టేళ్లతో ప్రారంభించడం శ్రేయస్కరం. రెండు నుంచి రెండున్నర సంవత్సరాల వయస్సున్న ఆడగొర్రెలను ఎంపిక చేసుకోవాలి. విత్తన పొట్టేలు 10-20 నెలలు వయసు కలిగి ఉండాలి.
త్వరగా లాభాల కోసం గొర్రెల పెంపకం చేపడితే 2-3 నెలల వయసు కలిగిన 15-20 పిల్లలను కొనుగోలు చేసి వాటిని 6-8 మాసాలు పెంచి 30-35 కిలోల బరువుకు చేరుకోగానే మార్కెటింగ్ చేసుకోవాలి.
గొర్రెలు మార్చి, ఏప్రిల్ మాసాల్లో 15-25 శాతం, జూన్-సెప్టెంబరులో 70-80 శాతం ఎదకు వస్తాయి. అక్టోబరు, నవంబరులో పుట్టిన గొర్రెపిల్లలు త్వరగా ఎదుగుతాయి.
గొర్రెలు రెండేళ్లలో మూడుసార్లు ఈనాలి. ఈనిన తర్వాత మూడోమాసంలో చూలు కట్టేలా చూసుకోవాలి. చూలు కట్టిన తర్వాత 5 నెలల్లో ఈనుతుంది.
విత్తన పొట్టేళ్లను తరచూ మంద నుంచి మారుస్తూ ఉండాలి.
ప్రతి ఏటా 5-10 శాతం గొర్రెలను మంద నుంచి వేరుచేసి అమ్ముకోవాలి. వయస్సు మళ్లిన, గొడ్డుపోయిన, ఆరోగ్య సమస్యలున్న గొర్రెలను వేరు చేయాలి.
అంతర పరాన్నజీవులను నివారించడానికి ఫిబ్రవరి, మే, నవంబర్ మాసాల్లో నట్టలమందు తాగించాలి. బాహ్య పరాన్నజీవులను నివారించడానికి ఏడాదికి రెండుసార్లు సలహామేరకు మందు కలిపిన నీటిని జీవాలపై పిచికారి చేయాలి.
క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించాలి.
100 నెల్లూరు జాతి పొట్టేలు పిల్లలు పెంచాలంటే...
సాంద్ర పద్ధతిలో పెంచుకోవాలి. ఒక యూనిట్లో 100 నెల్లూరు పొట్టేళ్ల పిల్లలు ఉండాలి. ఒక్కొక్క పిల్లకు (3 నెలల వయస్సు ఉండి పాలు మరిచినవి) రూ.4000 ఖర్చవుతుంది. ఒక్కొక్క బ్యాచ్ 6 నెలలు (ఏడాదికి రెండు బ్యాచ్లు) ఉంటుంది. లోపలి స్థలం లేదా కవర్డ్ ఏరియా 2000 చదరపు అడుగులు ఉండాలి. బయటి స్థలం లేదా ఓపెన్ ఏరియా 4000 చదరపు అడుగులు వరకు ఉండాలి. స్టోర్, ఆఫీసు స్థలం 500 చదరపు అడుగులు ఉండాలి. షెడ్ లేదా పాక తూర్పు-పడమర దిశలుగా ఉండి, మంచి వెలుతురు, గాలి ప్రసరించేలా ఉండాలి.
తక్కువ ఖర్చులో షెడ్ తయారీకి.
అస్బెస్టాస్ షీట్స్ లేదా బోదగడ్డి లేదా సజ్జ దంట్లతో కూడిన పైకప్పు ఉండి, వీటికి ఇనుప బొంగులు, కర్ర దిమ్మెలు ఆధారంగా ఉండాలి. సిమెంటు ఇసుకతో చేసిన నేల ఉండాలి. నీటి తోట్టెలు/ దాణా తొట్టెలు ప్లాస్టిక్ తో చేసినవి ఉండాలి. పక్కన ఉండే గోడలు 4-5 అడుగుల ఎత్తు ఉండి, దాని పైన డైమండ్ ఇనుప కంచె ఉండాలి. షెడ్డు బయటి ఏరియా నిడ్జి రాళ్లతో 6-8 చదరపు అడుగులు ఎత్తు లేదా డైమండ్ ఇనుప కంచెతో ఏర్పాటు చేయాలి.
ఇంకా.
పశుగ్రాసానికి రెండు ఎకరాలు కావాలి. ఎకరాకు 4000 ఖర్చు అవుతుంది. ప్రతి పోట్టేలుకు పశుగ్రాసం రోజుకి 3-4 కిలోలు (6 నెలలు సరాసరిగా) అందించాలి. పొట్టేలు పిల్లలకు 1వ నెల 100 గ్రా., 2వ నెల :150 గ్రా., 3వ నెల 200 గ్రా., 4, 5, 6వ నెలల్లో 250 గ్రా. చొప్పున దాణా అందించాలి. అలాగే దాణా ఒక్కో పొట్టేలుకు కిలో(కిలో దాణా రూ.10) చొప్పున అందించాలి. వీటి పోషణ కోసం పనిచేసే వ్యక్తికి నెలవారీ ఖర్చు రూ.5000 అవుతుంది. అలాగే పశువైద్యానికి మరో రూ.5,000 (100 పొట్టేళ్లకు) అవుతుంది. మాములుగా మరణాలు 4-5 శాతం వరకు ఉంటాయి. ఒక్కో పొట్టేలు రోజుకు ఆర కిలోల చొప్పున ఎరువు ఇస్తుంది. బతికి ఉన్న వాటిని తుకం వేసి అమ్మితే కిలోకు రూ.300-350 ధర లభిస్తుంది. జీవాల ద్వారా వచ్చే ఎరువును అమ్మితే టన్నుకు రూ.500 వస్తుంది. ఇంకా మిగతా ఖర్చులు ప్రతి ఏటా రూ.10,000 వరకు అవుతాయి.