అధిక లాభాలు పొందేలా రైతులు అడుగులు : ఆకుకూరల సాగు.


అన్ని కాలాలకు అనువైన.. ఆకుకూరల సాగు.


సమయానుకూలంగా మార్కెట్లో డిమాండ్కు తగ్గట్టు పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు పొందేలా రైతులు అడుగులు వేయాలి. తక్కువ కాలంలో పంట చేతికి వచ్చి ఆర్థికంగా ఆసరాగా నిలిచే పంటల్లో ఆకుకూరలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఈ పంటలను సాగు చేపట్టే రైతులు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్లో అమ్మితే మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుంది.



ఏడాది పొడవునా ఆకుకూరలకు డిమాండ్ ఉంటుంది. కొత్తమీర, మెంతి, పుదీనా తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కకూర వంటి వాటికి ఆరోగ్యపరంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. రోజువారీ వంటకాల్లో ఇవి తప్పనిసరయ్యాయి. కొత్తిమీర, మెంతి, పుదీనాకు ఏడాదంతా గిరాకీ బాగా ఉంటుంది. ఆకుకూరల సాగుకు మెట్ట ప్రాంతాలు బాగా అనుకూలం. సాగులో సరైన జాగ్రత్తలు పాటిస్తే, తక్కువ సమయంలో మంచి దిగుబడులు సాధించటానికి ఆకుకూరల సాగు ఎంతో అనుకూలం.


గోంగూర సాగు: నీరింకే అన్ని నేలలు గోంగూరు సాగుకు అనుకూలం. నల్లరేగడిలో బాగా పండుతుంది. ఎకరాకు 15 నుండి 20 కిలోల విత్తనాలు అవసరం. ఎకరాలో సాగుకు రూ.12 వేలు ఖర్చవుతుంది. విత్తిన తర్వాత రెండు నెలలకు పంట చేతికొస్తుంది. ఆరు నెలలు దిగుబడి మెరుగ్గా ఉంటుంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి లభించి మంచి ఆదాయం సమకూరుతుంది.


తోటకూర... ఆకుకూరల్లో రాణి.


వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైనది. ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే పంట సక్రమంగా పెరగదు. నీరు నిలిచే బంక మట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుంచి అక్టోబరు వరకు, జనవరి నుంచి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. ఆర్ఎన్ఎ:1, కో:1 (ఆకుపచ్చ రకం), ఆర్క సుగుణ (ఎరుపు రకం) వంటి రకాలు ఎంపికచేయవచ్చు. ఎకరాకు 800 గ్రాములు విత్తనం సరిపోతుంది. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 40 నుంచి 50 క్వింటాళ్లు వస్తుంది. ఎకరాకు రూ.10 నుండి15 వేలు వరకు ఖర్చవుతుంది. తోటకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం:397 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం : 247 మిల్లీ గ్రాములు, ఇనుము:26 మిల్లీ గ్రాములు. గంధకం:61 మిల్లీ గ్రాములు, విటమిన్ ఏ:9200 ఐ.యు, నికోటినిక్ యాసిడ్:1 మిల్లీ గ్రాములు, రిబోఫ్లావిన్:0.10 మిల్లీ గ్రాములు విటమిన్. సి:100 మిల్లీ గ్రాములు, ప్రొటీన్ 4 శాతం ఉన్నాయి.


చుక్కకూర: ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. వేసవిలో నీరందించాల్సి ఉంటుంది. ఎకరాకు 6-8 కిలోల విత్తనం కావాలి. ఎకరాకు పెట్టుబడి 8 నుండి10 వేలు వరకు అవుతుంది. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుంచి 4 నెలలు. 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 


బచ్చలికూర: ఇది శరీరానికి శీతల గుణాన్నిస్తుంది. నీరింకే అన్ని భూముల్లో పండించవచ్చు. ఎకరాకు 12 కిలోల విత్తనం అవసరం. రూ.8 నుండి10 వేలు వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. నాటిన నెల తర్వాత కోత మొదలవుతుంది. పంటకాలం 3 నుంచి 4 నెలలు, నీటిపారుదల సవ్యంగా అందిస్తే ఆరు నెలలు కూడా ఉంటుంది. నాలుగు నెలల్లో నాలుగు కోతలతో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.


మెంతికూర: సుగంధద్రవ్య పంటల్లో ఇదొకటి. ఈ పంట సాగుకు తక్కువ ఉష్ణోగ్రతలు అనుకూలం. ఇసుక నేలలు, నీరింకే ఒండ్రు భూములు మేలు. విత్తనాల్లో గుజరాత్ మెంతి:1, లాంసెలెక్షన్:1 రకాలు అనువైనవి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఎకరాకు 10 నుండి15 వేలు ఖర్చవుతుంది. విత్తిన తర్వాత 25 నుంచి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకోసారి చొప్పున మూడుసార్లు కోత కోయవచ్చు. దిగుబడి 40 క్వింటాళ్లకు పైగా వస్తుంది.


కొత్తిమీర: ఇది సుగంధద్రవ్యపు పంట. అధిక ఆమ్ల, క్షార గుణాల్లేని నేలలు, నీరింకే భూములు సాగుకు అనుకూలం. చల్లని వాతావరణంలో పంట బాగా వస్తుంది. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. విత్తనాల్ని విత్తేముందు ఐదారు గంటలు నానబెట్టాలి. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరం. సాధన, సింధు రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. 12 నుండి15 వేలు వరకు ఖర్చవుతుంది.


పుదీనా: ఎర్ర, నల్లనేలలు పుదీనా సాగుకు అనుకూలం. చల్లని వాతావరణం సరిపడదు. ఈ పంటకు విత్తనాలు ఉండవు. కొమ్మలను ముక్కలుగా చేసి నాటాలి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల కొమ్మలు అవసరం. జపాన్ పుదీనా, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. ఎకరాకు 30 నుండి 40 వేల వరకు పెట్టుబడి అవుతుంది. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎనిమిది నెలల్లో 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.


పాలకూర: ఈ పంట సాగుకు సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు అనుకూలం. 35 డిగ్రీలు దాటితే ఆకులు ఎరుపుగా మారే అవకాశం ఉంటుంది. నీరింకే భూములు అనువైనవి. చౌడు నేలలు పనికిరావు. పంటకాలం మూడు నెలలు (అక్టోబరు నుంచి డిసెంబరు వరకు). ఎకరాకు 10 నుండి12 కిలోల విత్తనాలు సరిపోతాయి. పెట్టుబడికి సుమారు 10 నుండి12 వేలు ఖర్చవుతాయి. విత్తిన తర్వాత నాలుగైదు వారాల్లో పంట చేతికొస్తుంది. వారం వ్యవధిలో 5 నుంచి 7 కోతలు తీయవచ్చు. ఐదు కోతల్లో 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పేనుబంక, ఆకుతినే గొంగళిపురుగులు ఆశించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు వస్తాయి.


ఆకుకూరల ప్రాధాన్యం: దాదాపు 25 రకాలకు పైగా ఆకుకూరలు, కాయగూరలను మనం ఆహారంగా వినియోగిస్తున్నాం. ఆరోగ్య పరిరక్షణలో పండ్లు, మాంసం, పాలు, చేపలు తదితరాలతో పాటు సమృద్ధిగా విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు అందించే ఆకుకూరలకు అధిక ప్రాధాన్యం ఉంది. ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. నిత్యం ప్రతి మనిషి 250 గ్రాములు కూరగాయలు తినాలి. ఇందులో సగభాగం వరకు ఆకుకూరలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరల వినియోగంతో జీర్ణక్రియ మెరుగై మలబద్దకం తగ్గుతుంది.


చిన్న కమతాలు అనుకూలం: సన్న, చిన్నకారు రైతులు రెండు గుంటల భూమి నుంచి ఎకరా విస్తీర్ణంలో కూడా ఆకుకూరలను సాగు చేసుకోవచ్చు. దఫు, దఫాలుగా కోతకు వచ్చేలా పలు రకాలు సాగు చేసుకోవటం మంచిది. పొలాల గట్లమీద, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ తోటల్లోనూ అంతర పంటలుగా, ఇంట్లో, ఆవరణలో, కుండీల్లో, మిద్దె తోటల్లో కూడా సాగు చేసుకోవచ్చు.


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024