Financial Planning: మ్యూచువల్ ఫండ్ల-మీ ఇంట్లో డబ్బులు కాయాలంటే..!
Financial Planning: మ్యూచువల్ ఫండ్ల-మీ ఇంట్లో డబ్బులు కాయాలంటే..!
ఆలస్యం.. అమృతం.. విషం... మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా.. పెట్టుబడుల విషయంలో ఇది అక్షర
సత్యం. యువతీ, యువకులు తొలి జీతం అందుకోగానే ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు ఫీలవుతారు. ఖర్చు చేయాలనే ఉత్సాహం
వారిలో పెరుగుతుంది.
ఆలస్యం.. అమృతం.. విషం...
మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా..
పెట్టుబడుల విషయంలో ఇది అక్షర సత్యం.
యువతీ, యువకులు తొలి జీతం అందుకోగానే
ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు ఫీలవుతారు.
ఖర్చు చేయాలనే ఉత్సాహం వారిలో పెరుగుతుంది.
పొదుపు మదుపు గురించి మాట్లాడితే జెన్-జి,
మిలేనియల్స్లో చాలామందికి నచ్చకపోవచ్చు...
ఇప్పుడే దాని గురించి ఆలోచించడం అనవసరం అనుకుంటారు కొందరు.
కానీ సంపాదిస్తున్న మొత్తంలో కాస్త పెట్టుబడులకు
మళ్లించడం చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా..
జీవితంలో ఎన్నో విషయాలు మన ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి.
అవే మనకు డబ్బు అవసరాన్ని తెలియజేస్తాయి. ఆ సమయంలో మనకు ఇబ్బంది
కలగకూడదనుకుంటే.. స్వేచ్ఛగా బతకాలంటే.. వెంటనే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపై దృష్టి
సారించాలి.
(ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నెలనెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టినప్పుడు. వార్షిక సగటు
రాబడి 12% అంచనాతో)
ఇక్కడ మరో సంగతి.. రాజేశ్ నెలకు రూ.5,000 మదుపు చేస్తూ.. వెళ్తూ.. ఏటా 10% చొప్పున
పెట్టుబడి మొత్తాన్ని పెంచుకున్నాడనుకుందాం. అప్పుడు మొత్తం పెట్టుబడి రూ. 1,62,61,462
అవుతుంది. దీనిపై అదే 12% రాబడితో వచ్చే మొత్తం ఎంతో తెలుసా... అక్షరాలా
రూ.8,88,34,698. చూశారుగా.. కోటీశ్వరులు కావడం పెద్ద విషయమేమీ కాదు...
ఇప్పుడు రూ.1,00,000 మదుపు చేస్తే...
ఒకేసారి పెట్టుబడి పెట్టి 30 ఏళ్ల తర్వాత తీసుకోవాలని ఆలోచిస్తున్నారా... ఇప్పుడు రూ.1,00,000
ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టి... సగటున ఏటా 12 శాతం రాబడి వస్తుందనుకుంటే అప్పటికి
రూ.29.95 లక్షలు అవుతాయి. 28 ఏళ్ల వ్యక్తి ఏటా రూ.1,00,000 చొప్పున... 30 ఏళ్లపాటు
మదుపు చేస్తే చాలు.. పదవీ విరమణ తర్వాత మంచి మొత్తాన్ని రాబట్టుకోవచ్చు.
15,15,15 Formula.
ప్రవీణ్ ఒక ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. జీతం నెలకు రూ.50,000. ఇందులో నుంచి
తాను నెలకు రూ.15,000 క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా ఈక్విటీ మ్యూచవల్
ఫండ్లలో మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
నెలకు పెట్టుబడి: 15,000 రూ.
రాబడి అంచనా: 15 శాతం
పెట్టుబడి వ్యవధి: 15 ఏళ్లు
ఈ లెక్కన ప్రవీణ్ పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.27,00,000 అవుతుంది. దీనిపై రాబడి
రూ.74,52,946. వెరసి ఆయన ఖాతాలో రూ.1,01,52,946 ఉంటుంది
మరో అంశమూ చూడొచ్చు...
నెలకు రూ.15,000లతో పెట్టుబడి ప్రారంభించి, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలని
అనుకున్నారనుకోండి. అప్పుడు మొత్తం పెట్టుబడి రూ.57,19,047 అవుతుంది. దీనిపై 15 శాతం
అంచనాతో రూ.1,09,30,946 రాబడి అందుతుంది. అంటే ప్రవీణ్ దగ్గర రూ.1,66,49,992 జమ
అవుతుందన్నమాట. ప్రవీణ్ ఇలా మరో 5 ఏళ్లు అధికంగా కొనసాగిస్తే ఆ మొత్తం
రూ.4,17,54,468లకు చేరుతుంది ఇంకో 5 ఏళ్లపాటు అంటే.. 25 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే
జమయ్యే మొత్తం ఎంతో తెలుసా... రూ.9,87,26,200.
నెలకు రూ.2 వేలు మిగిలాయా..!
పెట్టుబడి పెట్టేందుకు ఎంతో డబ్బు కావాలని అనుకుంటారు చాలామంది. కానీ, పెట్టుబడులు
పెట్టాలన్న ఆలోచన, దాన్ని పాటించాలనే క్రమశిక్షణ ఉంటే చాలు. ఆదాయంలో కనీసం 20 శాతం
పెట్టుబడి పెట్టడం ఒక అలవాటుగా మారాలి. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న రవి దగ్గర అన్ని
ఖర్చులూ పోను నెలకు రూ.4వేల వరకూ మిగులు మొత్తం కనిపిస్తోంది. ఈ మొత్తాన్నే ఎలా
పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉందో చూద్దాం..
• రెండు ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో ఒక్కో దానిలో రూ.1,000 చొప్పున రూ.2,000.
అత్యవసర నిధి కోసం బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) లో నెలకు రూ.1,000
• ఆరోగ్య బీమా, టర్మ్ పాలసీ కోసం నెలకు రూ. 1,000.
ఇలా పెట్టుబడి ప్రణాళికలను వేసుకోవచ్చు. గుర్తుంచుకోండి.. నెలకు రూ.500లతోనూ
పెట్టుబడులు పెట్టేందుకు అటు మ్యూచువల్ ఫండ్లలోనూ, ఇటు పోస్టాఫీసుల్లోనూ ఎన్నో పథకాలు
అందుబాటులో ఉన్నాయి.
జాగ్రత్తగా ఉండాల్సిందే..
• ప్రస్తుతం మార్కెట్లో వందలాది ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవడం
తేలికైన విషయం ఏమీ కాదు. మీ ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలు, పెట్టుబడికి ఉన్న వ్యవధి,
నష్టభయం భరించే సామర్థ్యం ఆధారంగా ఫండ్లను ఎంచుకోవాలి.
ఆర్థిక ప్రణాళికల విషయంలో అనుభవం ఉన్న నిపుణుల సలహా తీసుకోవాలి.
మీ పెట్టుబడుల పనితీరును అంచనా వేసుకుంటూ ఉండాలి.
కనీసం 7-8 ఏళ్ల వ్యవధి ఉందనుకున్నప్పుడే మ్యూచువల్ ఫండ్ల జోలికి వెళ్లాలి.
పెట్టుబడి ఎందుకు?
ఆహారం, ఇల్లు.. నిత్యావసరాలు.. ప్రయాణాలు.. అత్యవసరం.. ఇతర ఖర్చులు... నేడూ
ఉంటాయి. రేపూ ఉంటాయి.. మనం జీవించి ఉన్నంత కాలం ఈ వ్యయాలు తప్పవు. కానీ, నేటి
ఖర్చులు.. రేపటికి పెరుగుతాయి. మరి అప్పుడు ఎలా? వీటికి అదనంగా కొన్ని ఉంటాయి. అవే..
పదవీ విరమణ ప్రణాళిక. పిల్లల భవిష్యత్తు. సొంతిల్లు. కారు కొనుగోలు... ఇవన్నీ సాధించేందుకు
ఏం చేయాలి? ఇక్కడే పెట్టుబడుల అవసరం వస్తుంది. ద్రవ్యోల్బణం మన కొనుగోలు శక్తిని
తగ్గిస్తుంది. దీన్ని తట్టుకునేందుకు పెట్టుబడులను ఆశ్రయించాలి.
స్వల్పకాలంలో.. నష్టం వచ్చినా.
చిన్న వయసు నుంచే పెట్టుబడులను ప్రారంభించడం వల్ల, నష్టభయం భరించే సామర్థ్యం
అధికంగా ఉంటుంది. ఆర్థిక బాధ్యతలు తక్కువగా ఉండటం ఇక్కడ కలిసొచ్చే అంశం. దీంతో
అధిక నష్టభయం ఉన్న పెట్టుబడులను ఎంచుకుని, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆర్జించే అవకాశం
ఉంది. పెట్టుబడులను ప్రారంభించిన కొత్తలో మంచి రాబడి వచ్చినట్లు కనిపించదు. కొద్దిగా
తగ్గుతున్నట్లూ అనిపిస్తుంది. మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావం మన పెట్టుబడులపై
కనిపిస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ మార్పు స్పష్టంగా గోచరిస్తుంది. సగటు విధానం పనిచేయడం
ప్రారంభిస్తుంది. ఫలితంగా పెట్టుబడులపై సగటు వార్షిక రాబడి పెరుగుతుంది. ఉదాహరణకు
కొవిడ్ సమయంలో స్టాక్ మార్కెట్ ఊహించనంతగా పతనం అయ్యింది. అప్పుడు పెట్టుబడులను
కొనసాగించిన వారికి.. ఇప్పుడు ఎన్నో రెట్ల లాభాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎనిమిదో
వింత చక్రవడ్డీ.. దీర్ఘకాలంపాటు మదుపు చేసిన వారికి ఇది ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుంది.
పింఛను వచ్చేలా..
పదవీ విరమణ తర్వాత వచ్చిన ప్రయోజనాలను మదుపు చేసి, పింఛను వచ్చే మార్గాన్ని ఏర్పాటు
చేసుకునేందుకు మ్యూచువల్ ఫండ్లు తోడ్పడతాయి. దీనికోసం సిస్టమేటిక్ విత్ డ్రాయల్ ప్లాన్
(ఎస్ఓబ్ల్యూపీ)ను వాడుకోవచ్చు.
ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం..
మధు ఇటీవలే పదవీ విరమణ చేశారు... తనకు వచ్చిన రూ.30 లక్షలను మ్యూచువల్ ఫండ్లలో
మదుపు చేసి, నెలనెలా ఆదాయం పొందాలనుకున్నారు. పెట్టుబడి నుంచి ఏటా 6 శాతం వెనక్కి
తీసుకోవాలన్నది ఆలోచన. దీన్ని ఏటా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా 6 శాతం చొప్పున
పెంచుకోవాలనీ ఆలోచిస్తున్నారు.
• మొత్తం పెట్టుబడి: రూ.30,00,000
• వార్షిక రాబడి అంచనా: 12 శాతం
ఏటా 6 శాతం వెనక్కి తీసుకుంటే నెలకు అందే మొత్తం: 15,000
240 (20 ఏళ్లు) నెలలు ఇలా వెనక్కి తీసుకునే మొత్తం: రూ.36 లక్షలు
ఇలా చేస్తే చివరకు మిగిలే మొత్తం రూ1.54 కోట్లు
ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేస్తూ ఏటా 6 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తే 240 నెలలకు
అందుకునే మొత్తం దాదాపు
రూ.66 లక్షలు అవుతుంది. ఇంకా ఖాతాలో రూ.86 లక్షలు ఉంటుంంది.
పన్ను ఆదా చేసేయండి..
పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు పొందాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్లలోనూ
అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం వివిధ పథకాల్లో మదుపు చేసి,
రూ.1,50,000 వరకూ పన్ను మినహాయింపు పొందడానికి వీలుంది.
పెట్టుబడిపై అధిక రాబడిని ఆర్జిస్తూ, పన్ను ఆదా చేసుకోవాలనుకున్న వారికి ఈక్విటీ ఆధారిత
పొదుపు పథకాలు (ఈఎల్ఎస్ఎస్) ఉపయోగపడతాయి. ఈ ఫండ్లు తమ పోర్ట్ఫోలియోలో 80
శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెడతాయి. పెట్టిన పెట్టుబడిని కనీసం
మూడేళ్లపాటు కొనసాగించాల్సిందే. ఇంకా ఎక్కువ కాలం కొనసాగించడం వల్ల ఈక్విటీ లాభాలు
మెరుగ్గా ఉంటాయి.
ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకూ, క్రమానుగత విధానంలో మదుపు చేసేందుకూ అవకాశం ఉంది.
మార్కెట్ హెచ్చుతగ్గుల లాభాలను స్వీకరించాలంటే.. క్రమానుగత విధానంలో మదుపు
చేయడమే ఎప్పుడూ మేలు.
• మూడేళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించాలనే నిబంధన వల్ల మధ్యలోనే వెనక్కి తీసుకోవాలనే
ఆలోచన ఉండదు. ఫలితంగా పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉంటుంది.
మనశ్శాంతితో...
సంపాదన ప్రారంభించిన వెంటనే పొదుపు, పెట్టుబడులూ మొదలుపెడితే. ఆర్థిక భద్రతకు దోహదం
చేస్తుంది. ఊహించని ఖర్చులు, అత్యవసర పరిస్థితుల కోసం ఒక రక్షణ వలయాన్ని నిర్మించడంలో
ఇది సాయం చేస్తుంది. ఇది మీకు మనశ్శాంతి ఉండేలా చేస్తుంది. ఊహించని వైద్య ఖర్చులు,
ఉద్యోగం కోల్పోవడం, అత్యవసర పనులకు ఈ పెట్టుబడులు తోడ్పడతాయి. ఇల్లు కొనుగోలు,
పిల్లల చదువులు, పదవీ విరమణ ప్రణాళిక ఇలా ఎన్నో ఆర్థిక లక్ష్యాలు మీరు సులభంగా
సాధించేందుకు వీలవుతుంది. ఆర్థిక స్వేచ్ఛ అంటే. మీ అభిరుచులను కొనసాగించేందుకు ఎలాంటి
పరిమితులు లేకపోవడమేనని గుర్తుంచుకోండి.
అవగాహన పెరుగుతుంది...
ఆర్ధిక అవగాహన పెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. చిన్న వయసులోనే
పెట్టుబడుల ప్రయాణం ప్రారంభించినప్పుడు, స్టాక్ మార్కెట్ల గురించి అనుభవపూర్వక జ్ఞానాన్ని
పొందేందుకు వీలవుతుంది. లాభనష్టాలు రెండింటి నుంచీ నేర్చుకునే అవకాశమూ కలుగుతుంది.
ప్రారంభంలో పెట్టుబడుల విషయంలో పొరపాట్లు చేసినప్పటికీ.. రానున్న రోజుల్లో వీటి నుంచి
నేర్చుకున్న పాఠాలు, మీ డబ్బు ఇబ్బడిముబ్బడిగా పెరిగేందుకు దోహదం చేస్తాయి.
ఖర్చులపై నియంత్రణ.
చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే.. మీ ఖర్చు అలవాట్లలో గణనీయమైన
మార్పు కనిపిస్తుంది. ఏది అవసరం, ఏది వాయిదా వేయొచ్చు.. అనే ఆలోచన పెరుగుతుంది.
ప్లాన్ చేసి ఖర్చు చేయడం తెలిస్తే.. ఆదాయంలో మిగులు పెరుగుతుంది. వచ్చిన జీతంలో ఎంత
వీలైతే అంత పెట్టుబడులకు మళ్లించి, తర్వాతే ఇతర అవసరాల గురించి ఆలోచిస్తే.. భవిష్యత్తులో
'ఫైర్' (ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎర్లీ రిటైర్మెంట్) సాధ్యం అవుతుంది.
ఏ వయసులో.. ఎంత?
20-30 ఏళ్లప్పుడు...
కాస్త దూకుడుగా పెట్టుబడి పెట్టే వయసు ఇది. 80 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించే
ప్రయత్నం చేయొచ్చు. మధ్యస్థంగా ఉండాలంటే 60 శాతం వరకే ఈక్విటీలకు మళ్లించాలి.
నష్టభయాన్ని తగ్గించుకునేందుకు కొంత మొత్తాన్ని లిక్విడ్, డెట్ ఫండ్లలో మదుపు చేయాలి.
మూడేళ్లలోపు నగదు అవసరం ఉన్నప్పుడు ఈ పథకాల్లో నుంచి డబ్బు తీసుకునే ప్రయత్నం
చేయొచ్చు. ఈక్విటీ పోర్ట్ఫోలియోలో.. 30 శాతం మిడ్ క్యాప్, థీమాటిక్ ఫండ్లకు కేటాయించొచ్చు.
30-40 ఏళ్లలో..
ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇల్లు కొనడం, పిల్లల చదువులు, పదవీ విరమణ ప్రణాళికలు
ప్రారంభం అవుతాయి కాబట్టి, ఈక్విటీ పెట్టుబడులను కొంత తగ్గించుకోవాలి. 70 శాతం వరకూ
ఈక్విటీ పెట్టుబడులకు కేటాయించాలి. మిగతాది కాస్త సురక్షితంగా ఉండే పథకాల్లో మళ్లించాలి.
40-50 ఏళ్లప్పుడు...
ఈ వయసులో ఉన్న వారు పెట్టుబడులను నిర్వహించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పథకాల
ఎంపికలో మిశ్రమ విధానం పాటించాలి. మిగులు మొత్తం ఆధారంగా ఈక్విటీ పెట్టుబడులు 60
శాతం మించకుండా చూసుకోవాలి. మిగతా మొత్తాన్ని డెట్ ఫండ్లకు కేటాయించాలి.
50 దాటితే...
పెట్టుబడిని కాపాడుకోవడమే మీ ప్రధాన లక్ష్యం కావాలి. వీలైనంత వరకూ ఈక్విటీ పెట్టుబడులను
తగ్గించుకుంటూ రావాలి. పదవీ విరమణకు మూడేళ్ల ముందు నుంచి ఈక్విటీల నుంచి డెట్ కి
లేదా ఇతర సురక్షిత పథకాల్లోకి పెట్టుబడులను మళ్లించాలి.
వడ్డీని రాబట్టుకోవచ్చు...
గృహరుణం తీసుకొని, ఇల్లు కొనడం సాధారణ విషయమే. రమేశ్ ఇల్లు కొనేందుకు ఒక బ్యాంకులో
వార్షిక వడ్డీ 8.5 శాతంతో 20 ఏళ్లకు రూ.35,00,000 రుణం తీసుకున్నాడు. నెలకు కిస్తీ
రూ.30,374. మొత్తం 20 ఏళ్ల వ్యవధికి అసలు రూ.35 లక్షలు, వడ్డీ రూ. 37,89,760 కలిపి మొత్తం
రూ. 72,89,760 చెల్లించాల్సి వస్తుంది.
ఈ వడ్డీ రూ.37,89,760 తిరిగి రాబట్టుకోవాలంటే.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో 12 శాతం
రాబడి వచ్చేలా చూసుకుంటూ.. నెలకు రూ.3,800 మదుపు చేశారనుకుందాం. 20 ఏళ్ల తర్వాత
రూ.37,96,762 అయ్యేందుకు అవకాశం ఉంది. అంటే.. ఈఎంఐ మరో రూ.3,800 పెరిగిందని
అనుకుంటే చాలు. మీరు చెల్లించిన వడ్డీని తిరిగి పొందేందుకు వీలవుతుంది.
రూ.100తోనూ..
మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలంటే.. రూ. వేలల్లోనే డబ్బు ఉండాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు రూ.100తోనూ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. న్యూ ఫండ్ ఆఫర్
(ఎన్ఎఫ్ఎ)లో భాగంగా వచ్చిన ఫండ్లతో పాటు, క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు
చేసేందుకూ వీలవుతుంది. మొత్తంగా పెట్టుబడులు పెట్టకుండా ఉండే బదులు.. చిన్న
మొత్తంతోనూ పెట్టుబడులు ప్రారంభించడం అలవాటు చేసుకోవాలి.
కొత్త ఫండ్లను తీసుకొస్తూనే ఉంటాయి.
కంపెనీలు తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వచ్చినట్లే.. మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త ఫండ్లను
తీసుకొస్తూనే ఉంటాయి. వీటిని న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఎ)గా పేర్కొంటారు. ఇలా
ఎన్ఎఫ్ఎలను గమనిస్తూ ఉండాలి. ఇందులో రూ.100 నుంచి రూ.5,000 వరకూ పెట్టుబడి
పెట్టేందుకు వీలుంటుంది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఈ
ఎన్ఎఫ్ఎ మార్గాన్ని ఎంచుకోవచ్చు.
సురక్షితంగా.
పెట్టుబడి మొత్తం సురక్షితంగా ఉండాలి.. కచ్చితమైన రాబడి హామీ ఉండాలి అని భావించే వారికీ
పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీ పెట్టుబడిలో కొంత వీటికీ కేటాయించే ప్రయత్నం
చేయొచ్చు.
• ఫిక్స్డ్ డిపాజిట్లు: అత్యంత ఆదరణ పొందిన, సురక్షితమైన పెట్టుబడి పథకాలివి. బ్యాంకులు,
పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయొచ్చు. పొదుపు ఖాతాతో పోలిస్తే వీటికి వడ్డీ ఎక్కువ.
నష్టభయం ఉండదు.
• ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)ని అన్ని సురక్షిత పథకాల్లో రారాజు అని చెప్పొచ్చు. 15 ఏళ్ల
వ్యవధి ఉంటుంది. ప్రస్తుతం దీనిపై వార్షిక వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. పాత పన్ను
విధానంలో ఉన్న వారికి సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. వడ్డీ రాబడిపైనా
ఎలాంటి పన్ను ఉండదు.
60 ఏళ్లు (రక్షణ రంగంలో పనిచేసిన వారికి 50 ఏళ్లు) అంతకంటే ఎక్కువ వయసున్న వారి
కోసం అందుబాటులో ఉన్న పథకమే పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకం. దీని కింద 8.2 శాతం
వడ్డీ లభిస్తోంది.
పోస్టాఫీసు అందించే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లకు ప్రస్తుతం 7.7 శాతం వడ్డీ వస్తోంది.
అమ్మాయిలకు సురక్షితమైన ఆర్థిక భద్రతను కల్పించాలనుకునే వారికోసం కేంద్రం తీసుకొచ్చిన
పథకం సుకన్య సమృద్ధి యోజన. అమ్మాయిలున్న ప్రతి ఒక్కరూ ఈ ఖాతాను ప్రారంభించడం
మంచిది.
ఆదుకుంటావా.. బంగారం!
భారతీయులు బంగారాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తారు. ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి తాహతు
మేర పసిడి ఆభరణాలు చేయించడం అన్ని ఆదాయ వర్గాల్లో ఉన్న అలవాటు. ధర కూడా
పెరుగుతున్నందున వీటిని సమకూర్చుకోవడం మంచిదే అని పెద్దల మాట. అయితే యువత
ధోరణిలో మార్పువస్తోంది. ఆభరణాలు ధరించడంపై మక్కువ ఉన్న వారు మినహా, మిగిలినవారు
బంగారం కొనుగోలునూ పెట్టుబడిగానే చూస్తున్నారు. 24 క్యారెట్ల నాణ్యత బంగారం బిస్కెట్/
నాణేల రూపంలో కొనుగోలు చేద్దామా లేక కమొడిటీ మార్కెట్లో ఈ లోహాలపై పెట్టుబడి
పెడదామా అని ఆలోచిస్తున్నారు. ఆభరణం రూపంలో కొనుగోలు చేస్తే తరుగు, మజూరీ ఛార్జీలకు
అదనంగా చెల్లించాల్సి రావడమే దీనికి కారణం. అయితే షేర్లు, బ్యాంకు డిపాజిట్లతో పాటు
బంగారంపై పెట్టుబడులూ తప్పనిసరి అని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. బంగారం ధరలు
అంతర్జాతీయంగా ఒడుదొడుకులకు లోనయినా, మన దేశంలో పెద్దగా తగ్గడం లేదు. ఒకటి,
రెండేళ్లు ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా.. ఎక్కువ కాలం పాటు ధర పెరగడమే చూస్తున్నాం.
సమీప భవిష్యత్తులోనూ బంగారానికి గిరాకీ పెరుగుతుందే కానీ, తగ్గే ప్రసక్తే లేదని ఆర్థికవేత్తలు
స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సహజ వజ్రాలు తగ్గి, ప్రయోగశాలల్లో తయారైన వజ్రాల అమ్మకాలు
పెరుగుతున్నాయి. గనుల నుంచి బంగారం లభ్యత కూడా తగ్గితే, ధర మరింతగా
ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల పెట్టుబడుల్లో కొంచెమైనా పసిడికి
కేటాయించాలని సూచిస్తున్నారు. ఆభరణాలుగా కొనుగోలు చేస్తే అత్యవసరానికి తనఖా
పెట్టుకుని అయినా నగదు తెచ్చుకునే వీలుంటుంది. అయితే దాన్ని వాస్తవ విలువకు అమ్మి,
సొమ్ము చేసుకోవడం కష్టమైన పని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఫండ్స్ రూపంలోనూ...
బంగారం, వెండిని నేరుగానే కొనాల్సిన అవసరం లేదు. దీనికోసమూ మ్యూచువల్ ఫండ్లలో ప్రత్యేక
పథకాలు అందుబాటులో ఉన్నాయి. అవే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు, సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్
ఫండ్లు (ఈటీఎఫ్). పసిడి, వెండిని కొనాలనుకునే వారు.. వీటిని ఎంచుకోవచ్చు. బులియన్
ధరల ఆధారంగానే వీటి యూనిట్ల ధరలూ ఆధారపడి ఉంటాయి. వీటిని సులభంగా స్టాక్
ఎక్స్ఛేంజీల ద్వారా ఎప్పుడైనా కొనొచ్చు, అమ్మొచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకుండా
నెలనెలా క్రమానుగత పెట్టుబడి విధానంలోనూ వీటిలో మదుపు చేయొచ్చు. డీమ్యాట్ ఖాతా లేని
వారు గోల్డ్, సిల్వర్ ఫండ్లను ఎంచుకోవచ్చు. పెళ్లి కోసం చాలామంది బంగారం, వెండి
కొంటుంటారు. ఇలాంటి వారు.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని, తమ మొత్తం
పెట్టుబడిలో 10 శాతం వరకూ వీటికి కేటాయించొచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో బంగారం, వెండి
ధరలు పెరిగినా ఇబ్బంది ఉండదు.
(గమనిక: పై సమాచారం అంతా పూర్తిగా పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్
ఫండ్లు స్టాక్ మార్కెట్ల ఆధారంగా పనిచేస్తాయి. కాబట్టి, పెట్టుబడికి నష్టభయం ఉంటుంది.
పూర్తిగా తెలుసుకున్నాకే, నిపుణుల సలహాలు తీసుకొని, సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి.
పెట్టుబడి నిర్ణయాలకు సంబంధించిన బాధ్యత పూర్తిగా మీదే.)