pss:12 gita




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
అర్జునుడిట్లనియె :-

(12) శ్లో|| 1: ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ ।
ఏత ద్వేదితు మిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ! ||
(ప్రకృతి, పురుషుడు)

భావము : ఓ కృష్ణా! ప్రకృతి అనగా ఏది? పురుషుడెవడు? క్షేత్రము అనగానేది? క్షేత్రజ్ఞుడెవడు? జ్ఞానమేది? జ్ఞేయమైనదేది? వీటన్నిటిని తెలియవలెనని కోరిక కల్గినది తెలియజెప్పుము.
వివరము : ఇక్కడ అర్జునుడడిగినవి ఆరు ప్రశ్నలు గలవు. ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఆ ప్రశ్నలు మూడు జతలుగనున్నవి. 1) ప్రకృతి, పురుషుడెవరు? 2) క్షేత్రము ఏది, క్షేత్రజ్ఞుడెవరు? 3) జ్ఞానము, జ్ఞేయము లేవి? ఈ ప్రశ్నలలో కొన్నిటికి వెనుక జవాబులు చెప్పబడివున్నవి. తనకున్న అనుమానములు నివృత్తికోసము తిరిగి ప్రకృతి, పురుషుల గురించి అడిగాడు. అట్లే జ్ఞానము జ్ఞేయమును గురించి అడిగాడు. ఇకపోతే ఇందులో క్రొత్త ప్రశ్నలు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఎవరు అన్నవే. వీటిని గురించి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏమి చెప్పుచున్నాడో క్రింద చూచెదము.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
శ్రీ భగవంతుడిట్లనియె :-

(12) శ్లో|| 2: ఇదం శరీరం కౌన్తేయ ! క్షేత్ర మిత్యభిధీయతే ।
ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||
(ప్రకృతి, పురుషుడు)

భావము : అర్జునా! ఈ శరీరమే క్షేత్రమని చెప్పబడుచున్నది. దీనిని పూర్తిగ ఎవడు తెలిసివున్నాడో వానిని జ్ఞానులైనవారు క్షేత్రజ్ఞుడని చెప్పుచున్నారు.
వివరము : క్షేత్రమనగ భూమి అని అర్థము. క్షేత్రజ్ఞ అనగ భూమిని తెలిసినవాడని అర్థము. ఒక ఇంటి యజమాని తన ఇంటి వివరములన్ని తెలిసివుండును. తన ఇంటికి వెనుక తలుపు ఉన్నది లేనిది, ఆ ఇంటి అధిపతికే తెలుసును. అట్లే ఎన్ని కిటికీలు, ఎన్ని తలుపులు, ఎన్నిగదులున్నది పూర్తిగ తెలిసినవానినే ఆ ఇంటిని గూర్చి తెలిసిన వాడందుము. అట్లే ఒక ఎకరము పొలము ఒకనికి ఉన్నదను కొందాము. ఆ ఎకరములో ఎన్ని గుంతలున్నది, ఎక్కడ గట్టున్నది, ఎక్కడ కాలువవున్నది ఆ ఎకర క్షేత్రము యొక్క యజమానికే తెలుసును. అలాగే మన శరీరము కూడ ఒక పొలములాంటిదే. దీనికొక యజమాని ఉన్నాడు. వానికి దీని సవివరమంతయు తెలిసియున్నది. పొలములో ఎచటైన పని చేయుటకు యజమానికి అధికారముండును. యజమాని అధికారము పొలమంతా ఉన్నట్లు, శరీరమను క్షేత్రములో శరీరమంతట శరీర యజమాని యొక్క అధికారము వ్యాపించివుండును. శరీరమంతట అధికారము వ్యాపించి ఉన్నవాడు, శరీరమంత అణువణువున తెలిసివున్నవాడు, శరీరమునకు అధిపతియైన ఆత్మయనువాడు ఒకడున్నాడు. సంపూర్ణ జ్ఞానము తెలిసినవారు శరీరములో అధిపతిగ ఉన్న ఆత్మనే క్షేత్రజ్ఞుడని చెప్పుచున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా? జీవాత్మ ఆత్మల విభజన తెలియనివారు గీతను వ్రాయడములో క్షేత్రజ్ఞుడనగా జీవాత్మ అని వ్రాశారు. అది పూర్తి ధర్మవిరుద్ధమైన విషయము. క్షేత్రజ్ఞుడు జీవాత్మ ఏమాత్రము కాదు. ఆత్మయే క్షేత్రజ్ఞుడని గ్రహించవలెను.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 3: క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ! ।
క్షేత్ర క్షేత్రజ్ఞ యోర్జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||
(ప్రకృతి, పురుషుడు)

భావము : సర్వ శరీరములందున్న క్షేత్రజ్ఞుడను నేనేయని తెలియుము. శరీరమును అందులోని ఆత్మను తెలుపు జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా భావము.
వివరము : క్షేత్రవేత్త అయిన ఆత్మ శరీరమంతయు వ్యాపించి శరీర కార్యములు జరుగునట్లు చేయుచున్నాడు. అలాగే వేరు వేరు శరీరములందు వేరువేరుగ ఆత్మ అనబడునది ఉండి ఆ శరీరమునకు తగిన చైతన్యము నిచ్చి కదలించుచున్నది. అనేక జీవరాసులు అనేక శరీరములు ధరించి కోట్లాదిగనున్న జగత్తులో, ప్రతి జీవరాసి ధరించిన శరీరములో ఆత్మ కలదు. జగత్తులో ఎన్నో జీవరాసులు గలవు. అట్లే వాటి శరీరములలో ఎన్నో ఆత్మలు కలవు. అన్ని శరీరములలో జీవుడు అను పేరున్నవాడు ఒకడే అయినప్పటికి, ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క జీవుడున్నాడు. అలాగే ఆత్మ అను పేరున్నది ఒకటే అయినప్పటికి, అనేక శరీరములలో అనేక జీవులతో పాటు అనేక ఆత్మలున్నవని గ్రహించవలెను. చాలా మంది జ్ఞానులు అన్ని శరీరములలో ఒకే ఆత్మ ఉన్నదని పొరపడుచున్నారు. అలా అన్ని శరీరములలో ఒకే ఆత్మలేదని, అన్ని శరీరములలో ఒకే పేరున్న ఆత్మవున్నదని గ్రహించవలెను.

భూమి మీద జీవుడు ధరించిన శరీరములెన్నివున్నను అవి అన్నియు ప్రకృతితో తయారైనవే. కావున శరీరములు ప్రకృతి యొక్క అంశతో తయారైనవని చెప్పగలము. అదే విధముగనే జగతిలో జీవులెన్నివున్నను అవి అన్నియు పరమాత్మచే తయారైనవి. కావున జీవులను పరమాత్మ అంశ అనగలము. మరియు అదే విధముగ అన్ని శరీరములలోవున్న ఆత్మలన్ని పరమాత్మచేత తయారైనవే, కనుక ఆత్మలు కూడ పరమాత్మ అంశ అని చెప్పబడుచున్నవి. ఒక శరీరము ప్రకృతి అంశకాగ అందులోని జీవుడు, ఆత్మ, పరమాత్మ అంశమని తెలియుచున్నది. ఈ జగత్తులో కార్యములు జరుగుటకు శరీరము పరికరములాగ ఉండగ, అందులోని పనులు చేయించు శక్తిగ ఆత్మవున్నది. ఆత్మ పనులు చేయిస్తుండగ, శరీరము చేయుచుండగ, ఆ పనులలో కలుగు అనుభూతులను జీవుడు అనుభవిస్తున్నాడు. ఈ విధముగనే సర్వజగత్తంతయు శరీరము, జీవుడు, ఆత్మ వాటి వాటి పాత్రలు వహిస్తున్నవని తెలియుట ఉత్తమమైన జ్ఞానమందురు. శరీరమను క్షేత్రములో క్షేత్రజ్ఞుడను ఆత్మ ఏ విధముగ పనులు చేయిస్తున్నదో తెలుపునట్టి జ్ఞానమే నిజమైన జ్ఞానమని భగవంతుడు చెప్పాడు.

ఇక్కడ కొందరికొక అనుమానము రావచ్చును. అదేమనగా! "అందరి శరీరములలో ఒకే పేరు గల ఒకే పరమాత్మ అంశయైన ఆత్మవున్నదని చెప్పారు. అన్ని శరీరములలోనున్న ఆత్మలు ఒకే అంశకల్గి ఒకే లాగుండునని చెప్పారు. ఆత్మలు శరీరములకు శక్తి నిచ్చి పని చేయిస్తున్నవని కూడ చెప్పారు. జగత్తులో వేరు వేరు శరీరములకు వేరు వేరు శక్తికలదు. ఒకడు ఎత్తిన బరువును మరొకడు ఎత్తలేడు. బక్కపలుచని వాడు బలిసిన శరీరమున్న వానిని కూడ కొట్టగలడు. బలిసినవాడు చిన్న బరువును కూడ ఎత్తలేక పోవుచున్నాడు. అంతేకాక ఒకే బరువున్న ఇద్దరు వ్యక్తులలో ఒకడు మోయు బరువును మరొకడు ఎత్తలేడు, మోయలేడు. ఇద్దరిలోను ఒకే విధమైన ఆత్మలున్నపుడు ఆ శరీరములలో తేడా ఎందుకు వచ్చినది?" అని వారి ప్రశ్న. క్షేత్రము, క్షేత్రజ్ఞుని తెలియుట ముఖ్య జ్ఞానమని చెప్పియుండుట వలన ఇక్కడ శరీరము ఆత్మను గురించిన ప్రశ్న సమంజసమైనదని చెప్పవచ్చును. ఈ ప్రశ్నకు అంతరంగము నుండి ఏ జవాబు వస్తుందో మీరు మేము అందరము క్రింద చూస్తాము.

మనుషులలోనే శారీరకముగ ఎందరో బలవంతులను బలహీనులను మనము చూచియేవుందుము. అలాగే ఆరోగ్య అనారోగ్యులను కూడ చూచివుందుము. కొందరు తొందరగ రోగగ్రస్తులుకావడము. కొందరు ఎటువంటి రోగక్రిముల మధ్య ఉన్నప్పటికి రోగగ్రస్తులు కాకపోవడము జరుగుచున్నది. ఎక్కువ తినువారు, బలమైన తిండి తినువారు, బలహీనులుగ ఉండడము, కొందరు తక్కువ తినుచున్నప్పటికి, బలమైన ఆహారము కాకపోయినప్పటికి వారు బలముగ ఉండడము జరుగుచున్న విషయమే. రోగముల మధ్యనున్న వారికి రోగములు రాకపోయి ఆరోగ్యముగ ఉండడము, బలహీనమైన ఆహారము తీసుకొన్నప్పటికి, కొద్దిపాటి ఆహారము తిన్నప్పటికి బలవంతులుగ ఉండడము, అంతేకాక కొన్ని చోట్ల ఒకపూట చాలా కొద్దిపాటి తిండితో బ్రతుకుచు అన్ని పనులు చేసుకుంటు ఆరోగ్యముగనున్న వారుండడము కలదు. ఈ విధముగ హెచ్చు తగ్గు భేదములు ఉండడమునకు కారణము, వారి శరీరములలోనున్న ఆత్మ యొక్క పాత్రయని తెలియుచున్నది. ఆత్మ శరీరమంతా వ్యాపించి శరీరము ద్వారా పనిచేయిస్తుండడమే కాక, ఆ శరీరము ఎంత పొడవు పెరగవలెనో, ఎంత పొట్టిగనుండవలెనో నిర్ణయించి పెంచునది ఆత్మయే. శరీరము యొక్క పెరుగుదలయే కాక, శరీరములోని ముఖము యొక్క అందము, ముఖములోని ముక్కు పెదవులు మిగతా కండరములు, ముఖవర్చస్సు యొక్క అందమును తీర్చిదిద్ది పెంచునది ఆత్మయే. శరీరము యొక్క వంపు సొంపులను క్రమబద్ధీకరణ చేయుటయే కాక, శరీర ఆరోగ్యమును అనారోగ్యమును తీర్చి పెట్టునది ఆత్మయేనని తెలియుము. ఇంకనూ శరీరములో తనశక్తిని నరముల ద్వారా ప్రసరింపజేయుచు శరీరమునకు బలము నిచ్చునది ఆత్మయే. బక్కచిక్కిన శరీరములోని బలము, దృఢ శరీరములోని బలహీనతయు అన్నియు ఆత్మయే కల్గించుచున్నది. శరీరములో అన్నిటికి కారణమైన ఆత్మ బ్రహ్మనాడిని కేంద్రముగ చేసుకొని, మిగతా నాడుల ద్వారా శరీరమంతా వ్యాపించివున్నది. ఆత్మ శరీరమంత చైతన్య (శక్తి) రూపముగ వ్యాపించి శరీరమును కదలించు కార్యమొకటి చేస్తు, శరీర పెరుగుదల, ఆరోగ్యము మొదలగు మరొక కార్యములు కూడ చేయుచున్నది.

ఆత్మ శరీరములో రెండు భాగములుగ తన కర్తవ్యమును చేయుచున్నది. ముఖ్యముగ శరీర బలాబలము యొక్క పని చూడడమొక కార్యము కాగ, రెండవది శరీర ఆరోగ్య అనారోగ్యముల విషయమైన కార్యము. ఒక శరీరములోని ఆత్మయొక్క కర్తవ్యము రెండు విధములుగ నిర్వర్తింపబడుచున్నదను మాట వాస్తవమే అయినప్పటికి, చాలామందికి ఈ విషయము తెలియదు. ఆత్మ బ్రహ్మనాడిని కేంద్రముగ చేసుకొని , బ్రహ్మనాడి నుండి ప్రారంభమగు నాడుల ద్వారా శరీరమంత ప్రాకి, ప్రతి ధాతువులోను ప్రతి చిన్న భాగములోను చైతన్యముగనున్నది. అలా అంతట వ్యాపించి, జీవుని కర్మానుసారము జరుగవలసిన పనులకు కావలసిన కదలిక శక్తినిచ్చి, శరీరమును కదిలించి పనిచేయిస్తున్నది. ఇది చాలా మందికి తెలిసిన విషయమేననుకుంటాను. శరీరమునకు బలమునిచ్చి కదలించు ఆత్మ, ఒక శరీరమునకు ఎక్కువ బలమునిచ్చుచు, మరొక శరీరమునకు తక్కువ బలము నివ్వడమేమిటని అడుగవచ్చును. శరీరము ద్వారా ఏ కార్యము జరుగవలెనో, అక్కడ ఆ కార్యము జరుగుటకు ఎంత బలము కావలెనో, అన్నీ కర్మననుసరించి ఉండును. ఉదాహరణకు ఒకడొక మూట ఎత్తవలసినపుడు అక్కడ ఎంత బలము ఉపయోగింపబడవలెను, అతను పూర్తిపైకి ఎత్తునా లేక మధ్య వరకు ఎత్తునా, ఎత్తిన బరువును ఎంతసేపు మోయును అను విషయములన్ని కర్మననుసరించి ఉండును. జరుగవలసిన కార్యాకార్యములలో శక్తి ఆత్మదే అయినప్పటికి, అది కర్మననుసరించి ఉండడము వలన ఒకే కార్యములో ఒకడు బలవంతునిగ, ఒకడు బలహీనునిగ కనిపిస్తున్నారు. అలా భేదములు కనిపించని కర్మవేనని తెలుసుకోవలెను. అలా శరీరములోని ఆత్మబలము నాడుల ద్వారా వ్యాపించి పనులకు ఉపయోగపడడము ఒక కార్యము కాగ, రెండవ కార్యములో ఆత్మచైతన్యము (ఆత్మబలము) శరీరములో ప్రాకి అక్కడక్కడ గల కొన్ని స్థానముల్లో ప్రవేశించి మార్పుచెంది ద్రవముగను, కాంతిగను బయల్పడి శరీరమునకు ఆరోగ్య అనారోగ్యమును మరియు అందము అందహీనమును కలుగజేయుచున్నది.

బ్రహ్మనాడిలోగల ఏడు కేంద్రములనుంచి బయల్పడు శక్తి కదలికగ, ఆ కదలికలోని బలముగ, శరీరమునకు ఉపయోగపడుచున్నదని తెలుసుకొన్నాము. అలాగే ఆత్మశక్తి శరీరములోని ఏడుగ్రంథులలో ప్రవేశించి మార్పుచెంది ద్రవరూపముగ, మరియు కనపడని కాంతికిరణములరూపముగ మారి గ్రంథుల నుండి బయటపడుచు, శరీర ఆరోగ్య అనారోగ్యములను, యవ్వన, వృద్ధాప్యములను కలుగజేయుచున్నది. ఏడుగ్రంథులనుండి బయల్పడునది కాంతియుక్తమైన ద్రవమని తెలియాలి. ఏడు నాడీకేంద్రములలో ముఖ్యమైన నాడీకేంద్రము అన్నిటికంటే పైన శిరోభాగములోనున్న సహస్రారమనబడునది. సహస్రారములో గల ఆత్మ క్రిందనున్న ఆరు కేంద్రములలో ఎంత శక్తి విడుదల కావలెనో నిర్ణయించుచున్నది. అలాగే గ్రంథులలోకెల్ల ముఖ్యమైన గ్రంథి శిరోభాగములోనే కలదు. ఇది ఆకారములో అన్ని గ్రంథులకంటే చిన్నదైనప్పటికి గ్రంథులకన్నిటికి రాజులాంటిది, కావున దీనికి గ్రంథిరాజమని పేరు గలదు. పిండిమిషనులో గింజలు పిండిగ మారి బయట కొస్తున్నట్లు, ఆత్మబలము గ్రంథులలో ప్రవేశించి ద్రవరూపముగ బయటికి వస్తున్నది. నాడీకేంద్రములలో పైనున్న నాడీకేంద్రము క్రింది ఆరు కేంద్రముల మీద అధికారముకల్గి శక్తి బహిర్గతమును నిర్ణయించునట్లు, గ్రంథులలో పైనున్న గ్రంథిరాజము క్రింద గల ఆరు గ్రంథుల మీద అధికారముకల్గి వాటిని పని చేయిస్తున్నది. ఉదాహరణకు శరీరములో మనకు తెలిసిన ఒక గ్రంథి విషయము చూస్తాము.

శరీరములో జీర్ణప్రక్రియ సక్రమముగ జరుగుటకు ఉపయోగపడు రసమును స్యందించు లాలాజలగ్రంథియనబడు గ్రంథులు మన ముఖములో ఇరువైపుల చెవులకు దగ్గరగ కొద్ది క్రిందిగానున్నవి. ఈ గ్రంథి ఒక చిన్న చెలిమెలాంటిది. దీనియందు లాలాజలమను ద్రవము ఊట కల్గివున్నది. ఈ ఊట నిమ్మకాయను, చింతకాయను తలచుకొన్నప్పుడు ఎక్కువగ ఉండును. ఈ లాలాజలగ్రంథి అనబడు దానిలో ఊరు లాలాజలమను రసము, మనము తిను ఆహారములోని చక్కెరను తీపిపదార్థము (గ్లూకోజ్)ను, లేక పిండి పదార్థములను జీర్ణముచేయును. లాలాజలగ్రంథి నుండి లాలాజలము ఎంత తయారు కావలెననునది పైనున్న గ్రంథిరాజము నిర్ణయించును. ఈ రసము యొక్క సామర్థ్యమును బట్టి శరీరములోని జీర్ణశక్తివుండును. నోటిలో ఊరు ఈ రసము ఎక్కువ తయారైతే పైన చెప్పిన పదార్థములు బాగా జీర్ణమగును. ఈ రసము తక్కువ తయారైతే పైన చెప్పిన పదార్థములు సరిగ జీర్ణము కావు. శరీరమునకు వేడిమిని శక్తినిచ్చు కార్భోహైడ్రేట్స్ అనునవి పిండిపదార్థముల నుండి తయారు కాగలవు. పిండి పదార్థములను జీర్ణము చేయు లాలాజలరసస్యందన తక్కువైతే పిండి పదార్థముల జీర్ణము తక్కువగును. అలాగైనపుడు వేడిమినిచ్చు కార్భోహైడ్రెట్స్ తక్కువగుట వలన శరీరము నిస్సారముగ ఉండుట బలహీనత ఏర్పడును. ఇటువంటి ఆరోగ్య అనారోగ్యమునకు ముఖ్యకారణము లాలాజల గ్రంథియని తెలియుచున్నది. ఇలా శరీరములో గల మిగిలిన గ్రంథుల రసము కూడ ఒక్కొక్కటి ఒక్కొక్క రకముగ తమ పనులు చేయుచు శరీరము ఆరోగ్యముతో సంబంధము పెట్టుకొనుచున్నవి. కంఠభాగములో ఉన్న థైరాయిడ్ గ్రంథి ముఖవర్చస్సు, ముక్కు, పెదవుల పెరుగుదలను నిర్ణయించి వాటి ఆరోగ్యములను పర్యవేక్షించును. అలాగే పైత్యరసగ్రంథి, క్లోమరసగ్రంథులు రెండు జీర్ణక్రియలో ఉపయోగపడును. క్లోమరసగ్రంథిలో తయారగు క్లోమరసము జీర్ణక్రియలో ఉపయోగపడడమే కాక, ఇన్సులిన్ అను హార్మోన్ ను తయారు చేసి ఇన్సులిన్ ద్వారా శరీరములో గ్లూకోజ్ శాతము నిర్ణయించి షుగర్ రోగమునుండి కాపాడుచున్నది. ఈ గ్రంథి పనిచేయక పోతే షుగర్ రోగము తప్పదు. వీర్యగ్రంథులలో తయారగు వీర్యమును బట్టి కూడ శరీరము ఆరోగ్యముగవుండును. వీర్యగ్రంథుల నుండి తయారైన వీర్యము శరీరములో నిలువవుండును. వీర్యము నిలువ ఎక్కువైన తక్కువైన ఆరోగ్యములో మార్పుండును. ఎక్కువ నిలువ ఉంటే గ్రంథుల పని మందగించి శరీరములో మార్పువచ్చి కొద్దిగ అనారోగ్యమగును. ఈ విధ అనారోగ్యము ఎక్కువ మానసికముగ, కొద్దిపాటి శారీరకముగవుండును. యుక్తవయస్సులో వీర్యము నిలువ ఎక్కువ లేనట్లు బయటికి పోవు విధానము కూడ గ్రంథిరాజము చేయగలదు. ఎక్కువ వీర్యము బయటికి పోయి తయారు చేయుటకు గ్రంథులకు పని ఎక్కువైన శరీర అనారోగ్యము ఎక్కువగును. శరీరము నుండి క్రమము మించి ఎక్కువ వీర్యనష్టమైనపుడు వెంటనే నిస్పృహ నిరుత్సాహము ఏర్పడును. వీర్యగ్రంథులలో తయారగు వీర్యములోనున్న వీర్యకణములలో కంటికి కనిపించు నీలవర్ణమగు ప్రకాశము కూడ కలదు. వీర్యగ్రంథులలో తయారగు వీర్యము గ్రంథిరాజము యొక్క సామర్థ్యము మీద ఆధారపడివుండును. కర్మను అనుసరించి అవి పనిచేయునట్లు నిర్మాణముండుట వలన కొందరిలో వీర్యాభివృద్ది ఎక్కువ, కొందరిలో తక్కువ ఉండును. దీనినే మగసిరి అనుట కూడ కలదు. సిరిలో పేద ధనికుడున్నట్లు మగసిరిలో కూడ కలరు. గ్రంథులన్ని ఒకదానితో ఒకటి గ్రంథిరాజముతో సంబంధము కల్గివున్నవి. ఆత్మజ్ఞానమున్న యోగులు మనస్సును గ్రంథిరాజములోనే లగ్నము చేయుచున్నారు. భృకుటికి మధ్యన ఉపజిహ్వకు పై భాగమున గ్రంథిరాజము కలదు. పెద్దలందరు ఇక్కడే మనస్సును నిలుపమన్నారు. అలా నిలపగలిగిన బ్రహ్మయోగుల శరీరములోని గ్రంథులన్ని పూర్తిస్థాయి ఆరోగ్యముగ పని చేయు చుండును. బ్రహ్మయోగులకు షుగర్ రోగము లేకుండుట గమనార్హము. అంతేకాక యోగుల శరీరములోని గ్రంథిరాజము నుండి బయల్పడు కాంతితరంగములు ఎక్కువ ప్రకాశవంతముగనుండును. అదే సామాన్య మనిషిలో తక్కువ ప్రకాశము గలవిగ ఉండును. శరీర ఆరోగ్యములో కూడ గ్రంథిరాజము ముఖ్యపాత్ర వహిస్తున్నది. ఈ విధముగనే మిగతా గ్రంథులు కూడ వాటి వాటి పనులను చేయుచు శరీరమును ఆరోగ్యముగ ఉంచడములో పాత్రవహిస్తున్నవి. ప్రతి గ్రంథిరసములోను ఒక విధ కాంతి ఉండడము విశేషము. అన్నిటికి పెద్దదైన గ్రంథిరాజములో బయలుదేరిన కాంతి తరంగాలుగ ప్రసరిస్తు అన్ని గ్రంథులను పని చేయిస్తున్నది. గ్రంథిరాజము యొక్క కాంతి తరంగములు ఏ గ్రంథికి సరిగ లభ్యము కాకపోతే ఆ గ్రంథి సక్రమముగ పనిచేయదు.

శరీరములో గ్రంథుల విధానముతో కొంతపని, నాడీకేంద్రముల విధానముతో కొంతపని చేయుచు ఆత్మ, శరీరమను క్షేత్రమును పాలించు రాజుగ ఉన్నది. శరీరమంతా వ్యాపించి దాని మీద అధికారము కల్గియున్న ఆత్మను తెలియు జ్ఞానము చాలా ముఖ్యమైన జ్ఞానమని భగవంతుడు చెప్పాడు. కనుక అందరు బాహ్యవిషయ జ్ఞానము వదలి, శరీరాంతరంగమునందుగల జ్ఞానమును తెలుసుకొనుటకు ప్రయత్నించవలెను.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 4: తత్ క్షేత్రం యచ్చయాదృక్చ యద్వికారి యతశ్చ యత్ ।
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మేశృణు ||
(ప్రకృతి, పురుషుడు)

భావము : అట్టి క్షేత్రమేదియో, అది ఎట్టిదగునో, దానికేవికారములుగలవో, ఆ వికారములు దేనినుండి పుట్టుచున్నవో, ఎవడు క్షేత్రజ్ఞుడో, వానికేమి ప్రభావములున్నవో వాటిని క్లుప్తముగ చెప్పెదను వినుము.
వివరము : క్షేత్రము, క్షేత్రజ్ఞుని గురించిన జ్ఞానము తెలిపెదనని భగవంతుడు చెప్పాడు. క్షేత్రమనగా ఏది? అది ఎన్ని విధములుగ ఉన్నది? దానికేయే మార్పులున్నవి. ఆ మార్పులు దేనివలన వచ్చుచున్నవి. క్షేత్రజ్ఞుడను వాడు ఎవడు? క్షేత్రజ్ఞునకున్న ప్రభావమేమిటి. ఆ ప్రభావము శరీరములో ఏ విధముగ పనిచేయుచున్నది. మొదలగు విషయములు తెలుసుకోవడమే జ్ఞానము




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 5: ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభి ర్వివిధైః పృథక్ ।
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భి ర్వినిశ్చితైః ||
(ప్రకృతి, పురుషుడు)

భావము : ఋషుల వలనను, వేదములవలనను, హేతువులతో సిద్ధాంతము చేయబడిన బ్రహ్మసూత్రముల వలనను, నిర్ణయింపబడి శరీరము మరియు ఆత్మ యొక్క విషయములు చెప్పబడివున్నవి. పెద్దలందరు నిర్ణయించిన జ్ఞానము తెలుసుకొందాము.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 6: మహాభూతా న్యహంకారో బుద్ధి రవ్యక్త మేవ చ ।
ఇంద్రియాణి దశైకంచ పంచేంద్రియ గోచరాః || (ప్రకృతి)

(12) శ్లో|| 7: ఇచ్ఛా ద్వేష స్సుఖం దుఃఖం సంఘాత శ్చేతనా ధృతిః ।
ఏతత్ క్షేత్రం సమాసేన సవికార ముదాహృతమ్ ||
(ప్రకృతి)

భావము : గొప్ప భూతములైన జీవాత్మ, ఆత్మయును, అవ్యక్తమైన బుద్ధి, అహము మొదలగునవియు, ఒకటిగనున్న పది ఇంద్రియములు, అగోచరమైన ఐదు ఇంద్రియములు.

ప్రేమ, అసూయ, సుఖదుఃఖము, ధైర్యము, భయము, శ్రద్ధ, అను చేతనమైన సంఘము. ఎన్నో వికారములు గలదిగ ఈ శరీరక్షేత్రము చెప్పబడివున్నది.
వివరము : ఇక్కడ ఆరవ శ్లోకములో 'ఇంద్రియాణి దశైకంచ' అను పదములో "దశైకం" అను పదమునకు ఏకముగనున్న పది అని అర్థముండవలెను. గీతలో చాలామంది పదనొకండు అని వ్రాసివుంచారు. ఏకం దశ అన్నప్పుడు పదకొండు అనడములో తప్పులేదు. దశ ఏకం అన్నపుడు పది ఒక్కటిగ అనగ పదియు ఒక గుంపుగ అని గ్రహించుకోవలెను. పది ఇంద్రియములను ఒక గుంపుగ, ఐదు ఇంద్రియములను ఒక గుంపుగ ఇక్కడ చెప్పడమైనదని తెలియాలి. ఇక్కడ పైన కనిపించెడి పది ఇంద్రియములను ఒకటిగ చెప్పారు. కనిపించని ఐదు ఇంద్రియము లను వేరుగ చెప్పారు. కనిపించెడు, కనిపించని వాటిని వేరు వేరుగ చెప్పడములో ఈ పది ఒకటిగ, మిగతా ఐదు వేరుగనున్నవనడములో 'ఇంద్రియాణి దశైకంచ, పంచేంద్రియగోచరాః' అని భగవంతుడన్నాడు. అంతేకాక ఆరవ శ్లోకములో మొదట మహాభూతా అను పదము వాడబడినది. ఈ పదమునకు కూడ చాలా గీతలలో తప్పు అర్థము వ్రాశారు. మహాభూత అను పదమునకు పంచభూతములు అన్నారు. అలా అనడము పూర్తి తప్పని తెలియవలెను. ఎందుకనగ పంచభూతములు శరీరములో ప్రత్యేకముగ లేవు. పంచభూతముల విభజనచేత తయారైన భాగములే శరీర భాగములుగ ఉండగ, తిరిగి ప్రత్యేకించి పంచభూతములని చెప్పడమేమిటి? ప్రత్యక్షముగ పంచభూతములచే మార్పుచెంది పుట్టిన భాగములు తప్ప శరీరములో పంచభూతములు ప్రత్యేకించిలేవు. కావున మహాభూత అను పదమునకు అర్థము పంచభూతములుకావని, మహాభూతములైన జీవాత్మ, ఆత్మలని గ్రహించాలి.

ఒక శరీరములో అవ్యక్తముగ (కనిపించక) ఉన్నటువంటి రెండు గొప్పవైన భూతములని పిలువబడు జీవాత్మ, ఆత్మలు గలవు. అట్లే తొమ్మిది కనిపించనటువంటి బుద్ధి, అహము, మనస్సు, చిత్తము, ప్రాణ, అపాణ, ఉదాన, సమాన, వ్యాన, వాయువులు గలవు. ఇంకనూ ఇంద్రియములని పిలువబడు కనిపించు పది కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు, ఐదు కనిపించని ఇంద్రియ శక్తులు గలవు. కనిపించు భాగములైన కన్ను, చెవి, నాలుక, చర్మము, ముక్కు, కాళ్ళు, చేతులు, నోరు, గుదము, గుహ్యము ఒక గుంపుకాగ, కనిపించని ఇంద్రియశక్తులు చూపు, వినికిడి, వాసన, స్పర్శ, రుచి ఒక గుంపు అని తెలియవలెను.

మహాభూతములని పిలువబడు జీవాత్మ, ఆత్మలు
-
2
అవ్యక్తమైన అంతరంగములు
-
9
కనిపించు ఇంద్రియములు
-
10
కనిపించని ఇంద్రియములు
-
5
---------------------------------------
సజీవ శరీరములో మొత్తము భాగములు
-
26
---------------------------------------

ఈ విధముగ క్షేత్రమనునది 24 భాగముల చేత మరియు రెండు ఆత్మల చేత కలిసివుంటున్నది. అంతేకాక ప్రేమ అసూయలను గుణములు, సుఖదుఃఖములను అనుభూతులు, శ్రద్ధ, ధైర్యము, భయము అను చేతనమైన సంఘము మరియు ఎన్నో వికారములు కల్గి శరీరమను క్షేత్రమున్నదని తెలియాలి.




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 8: అమానిత్వ మదమ్భిత్వ మహింసా క్షాన్తి రార్జవమ్ ।
ఆచార్యోపాసనం శౌచం స్థైర్య మాత్మ వినిగ్రహః ||
(జ్ఞానము)

(12) శ్లో|| 9: ఇంద్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవచ ।
జన్మమృత్యుజరావ్యాధి దుఃఖదోషాను దర్శనమ్ ||
(జ్ఞానము)

(12) శ్లో|| 10: అసక్తి రనభిష్వంగః పుత్రదారగృహాదిషు ।
నిత్యం చ సమచి త్తత్వ మిష్టానిష్టోపప త్తి షు ||
(జ్ఞానము)

(12) శ్లో|| 11: మయి చానన్యయోగేన భక్తి రవ్యభిచారిణీ ।
వివిక్త దేశసేవిత్వ మరతి ర్జనసం సది ||
(జ్ఞానము)

(12) శ్లో|| 12: ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్త్వజ్ఞానార్థ దర్శనమ్ ।
ఏతద్జ్ఞానమితి ప్రోక్త మజ్ఞానం యదతోఽన్యథా ||
(జ్ఞానము)

భావము : గర్వ దంభములనునవి కలుగకుండ, శాంతి నిష్కపటము, అహింస కలిగి, సద్గురువులను పూజించుచు, ధైర్యము ఆత్మనిగ్రహముకల్గి ఇంద్రియముల మీద ఆసక్తి లేక, నేనను అహంకార భావము లేకుండ, జన్మ, మృతి, ముసలితనము, రోగము, దుఃఖము వచ్చునవి, పోవునవిగ తలచుకొనుచు, భార్యాపుత్రులందు ప్రేమలేకుండ గృహము, భూమి మొదలగు వాటిమీద ఆసక్తి లేక, నిత్యము సంభవించెడి ఇష్టాఇష్టములందు, కష్టసుఖములందు సమచిత్త్వము కల్గి, వ్యభిచరింపని భక్తికల్గి, అనన్యమైన యోగము చేయుచు, మనుషులులేని స్థలములో ఉండుటకు ఇష్టపడుచు, జనసమూహములందు ఇష్టములేనివాడై ఆధ్యాత్మిక జ్ఞానమును నిత్యము కల్గి, ఆత్మను జ్ఞానముచేత తెలియగోరినవాడై ఉండవలెను. దానినే జ్ఞానమని అట్లుకాని అన్యమంతయు అజ్ఞానమని తెలియవలెను.
వివరము : ఇక్కడ ఒకే మారు ఐదు శ్లోకముల భావమంతయు చెప్పబడివున్నది. ఐదు శ్లోకములలోను జ్ఞానవిషయము గురించి చెప్పారు. ఈ విధముగ ఉండడమే జ్ఞానమని వివరించారు. 8 నుండి మొదలై 12వ శ్లోకముతో ముగిసిన ఈ విషయములలో 11వ శ్లోకములో 'మయిచానన్య యోగేన భక్తి రవ్యభిచారిణీ' అనుమాట చాలామందికి బాగా అర్థమై ఉండదనుకొంటాము. 'భక్తిరవ్యభిచారిణీ' అన్న పదమునకు భక్తిలో వ్యభిచారమేమిటని అర్థమైవుండదు. వ్యభిచారమంటే ఒకరు శారీరకముగ అనేకమందితో సంబంధము పెట్టుకోవడము. ఇక్కడ భక్తి అనునది మనసుకు సంబంధించినది. కావున మనస్సుతో భక్తి ద్వారా అనేక మంది దేవతలతో సంబంధము పెట్టుకోవడమును భక్తిలో వ్యభిచారమంటున్నాము. ఒక స్త్రీ తన భర్తను వదలి ఇతరులతో సంబంధము పెట్టుకోవడము ఎలా వ్యభిచారమో, అలాగే ఒక జీవునకు భర్తయైన పరమాత్మను వదలి ఇతర దేవతలతో సంబంధము పెట్టుకోవడము భక్తిలో వ్యభిచారమగును. శరీర వ్యభిచారమెంత తప్పో అలాగే భక్తి ద్వార చేయు మానసిక వ్యభిచారము అంతే తప్పని చెప్పవచ్చును. వేశ్య విటుడిచ్చు డబ్బు ఆశతో ఎంతోమంది విటులను ఆశ్రయించినట్లు, మనిషి దేవతలిచ్చు ఫలితములకు ఆశపడి ఎంతోమంది దేవతలను ఆశ్రయించి పూజించుట జరుగుచున్నది.

సర్వమునకు మూలకర్తయై భరించు పరమాత్మను వదలి స్వల్పమైన దేవతలను పూజించుట నేడు ఎక్కువ శాతము జరుగుచున్నది. ప్రపంచ జనాభాలో భక్తి తక్కువగనున్న ఈ కాలములో, ఉన్న భక్తి కొంత ఇతర దేవతలమీద ఉన్నది. వేయిమంది భక్తులను పరిశీలించినట్లయితే అందులో ఒక్కడు కూడ పరమాత్మ మీద భక్తి కల్గివుండడము అరుదు. ఆ వేయిమందిలోను అందరు కూడ ఒకే దేవుని మీద భక్తి కల్గివుండరు. వెయ్యిమందికి పదివేలమంది దేవతలుండుట ఆశ్చర్యము. అట్లుండుట అజ్ఞానమని అది సరియైన పద్ధతికాదని, పరమాత్మను మినహా ఏ దేవతను ఆరాధించకూడదని, దేవతలమీద ధ్యాసవదలి పరమాత్మ మీద ధ్యాస పెంచు కోవడమును జ్ఞానమని తెలియజేశారు.




త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 13: జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వాఽమృత మశ్నుతే ।
అనాది మత్పరం బ్రహ్మ న సత్త న్నాఽస దుచ్యతే ||
(పరమాత్మ)

భావము : ఏది జ్ఞేయమో దానిని చెప్పెదను. దానిని తెలియుట వలన అమృతమును పొందవచ్చును. అది అనాది, మత్పరము, బ్రహ్మము. దానిని సత్తనియు, అసత్తనియు పిలువకూడదు.
వివరము : చేనుకు గట్టు, దారికి గమ్యములాంటిది జ్ఞానమునకు జ్ఞేయమని తెలియాలి. చేను గట్టుతో ముగిసినట్లు, దారి గమ్యముతో ముగిసినట్లు, జ్ఞానము జ్ఞేయముతో ముగియును. చేనుకు కట్ట గట్టయినట్లు, దారికి ఊరు గమ్యమైనట్లు జ్ఞానమునకు పరమాత్మ జ్ఞేయమగును. పరమాత్మ తెలుపు మార్గమే జ్ఞానము. జ్ఞానము ద్వార చివరకు తెలియబడునదే పరమాత్మ. పరమాత్మనే అనాది అనియు, పరము అనియు, బ్రహ్మ అనియు పిలుతురు. ఆది లేనివాడు కావున అనాది అనియు, అన్నిటికంటేమించినది వేరైనది కావున పరము అనియు, అన్నిటికంటే పెద్దది మొదటిది కావున బ్రహ్మ అనియు పిలుతురు. జ్ఞానగమ్యమైన పరమాత్మను సత్తనికాని, అసత్తని కాని పిలువరాదు. ఎందుకనగ ఆయన సత్తుకాదు, అసత్తుకాదు. ఇక్కడొక ప్రశ్న కొందరికిరావచ్చును. అదేమనగా అసలు సత్తెవరు? అసత్తెవరు? సత్తు, అసత్తులెవరో తెలుసుకొంటే రెండూ కాని వానిని సులభముగ తెలియవచ్చును? అని అడుగవచ్చును. ఆ విషయము తెలుసుకొందాము.

సత్తు, అసత్తు అనునవి రెండు మన దేహములోనే ఉన్నవి. సత్తు దేహమంతయు ఉన్నది. అసత్తు దేహములో ఒక్కచోట స్థిరముగ ఉన్నది. వివరముగ చెప్పుకోవాలంటె సత్తు అనగా ఆత్మ, అసత్తు అనగ జీవాత్మయని తెలుసుకోవాలి. మరికొందరు అసత్తయిన జీవాత్మను చిత్తు అని కూడ పిలుతురు. సత్తును సత్ అనియు చిత్తును చిత్ అని కూడ పిలుతురు. దీనినే సత్ చిత్ అని కలిపి పిలుతురు. బ్రహ్మయోగము చేయువాడు మనస్సు ద్వార ఆత్మ అనుభవము పొందుచున్నాడు. అనగ సత్ చిత్ కలిసిన అనుభవమును ఆనందమని చెప్పుచున్నారు. దానినే ఆత్మానందమని, సచ్చిదానందమని పిలుతురు. సచ్చిదానందమను మాటకు సత్తు చిత్తు కలిపిన ఆనందమని అర్థము చేసుకోవాలి. బ్రహ్మయోగిని ఆత్మానంద అనియు సచ్చిదానంద అనియు పెద్దలు పిలుచుటలో అర్థము కలదు.

అంతేకాక తెలిసినవారు, తెలియనివారు సత్తయిన ఆత్మను సచ్చు అని పిలుచుట కూడ జరుగుచున్నది. ఆత్మ శరీరమంతా వ్యాపించివున్నదని, ఆత్మయే ప్రతి శరీరభాగమున శక్తియై కదలించుచున్నదని తెలుసుకొన్నాము. శరీరమంత వ్యాపించిన ఆత్మశక్తి ఎక్కడో ఒకచోట, ఎవరికో ఒకరికి, శరీరములో కాలులోనో, చేయిలోనో లేకుండ పోవును. ఉదాహరణకు ఒక చేయిలో ఆత్మ వ్యాపించకుండ భుజమువరకే వ్యాపించి నిలిచిపోయినదనుకొనుము. అపుడు వాని చేయి కదలదు, మెదలదు. ఆ చేయిలో ఏ మాత్రము చైతన్యము లేదు. సత్తు భుజము వరకే వున్న దాని వలన చేయి సత్తుపడిపోయిందని పూర్వమనెడివారు. కాలక్రమేపి ఆ పదము మారి చేయి సచ్చుపడిపోయిందంటున్నారు. సత్తు సచ్చుగ అందరి చేత పిలువబడుచున్నది. అలాగే మనిషి శరీరములోని ఆత్మ పూర్తిగ పోయి, ఏమాత్రము చైతన్యము లేకుండ పోయినపుడు, పూర్వము మనిషి సత్తుపోయింది అనెడివారు. అలాగే ఆవు శరీరములోని సత్తు పూర్తి పోయినపుడు ఆవు సత్తుపోయిందనెడివారు. ప్రస్తుత కాలములో ఆవు సచ్చిపోయిందంటున్నారు. అలాగే ఏది మరణించిన అందులోని ఆత్మ శరీరమును వదలి పోవుచున్నది. కనుక ఫలానా జంతువు సచ్చిపోయిందనో, ఫలానా మనిషి సచ్చిపోయినాడనో చెప్పుట జరుగుచున్నది.

ఇలా అందరిచేత సచ్చు అనియు కొందరిచేత సత్తనియు పిలువబడు ఆత్మయు, అట్లే కొందరిచేత చిత్తని మరికొందరి చేత అసత్తని పిలువబడు జీవాత్మయు పరమాత్మ కాదు. కావున పరమాత్మను సత్తని కాని, అసత్తని కాని పిలువకూడదు. ఒకే శరీరములో సత్తు, అసత్తు, రెండూకాని వాడు ఉండి వేరు వేరు పనులు కల్గియుండుట వలన ముగ్గురిని కలిపి పిలువకూడదు. సత్తు, అసత్తులను పుట్టించినవాడు పరమాత్మ కావున జన్మలేనివాడు పరమాత్మ, జన్మలున్న వారు ఆత్మ, జీవాత్మలు. ఆదిలేని పరమాత్మ పుట్టించిన జీవాత్మలమైన మనము ఎప్పుడు పుట్టామో తెలియదు. కావున జన్మలుకల్గిన అనాదలము మనము. జన్మలు లేని పరమాత్మ అనాది కాగ, జన్మలున్న అనాదులు జీవాత్మలని తెలియాలి. ఇపుడు తెలుసుకోవడము ఏమిటి? ప్రతి దినము మనము అనాదులన్నమాట వింటూనే ఉన్నాము. ఎక్కడ ఎవరు అంటున్నారని ఆలోచించనవసరము లేదు. 'అనాది జన్మ దానము చేయండి' అనియో లేక 'అనాది జన్మ అన్నము పెట్టండి' అనియో అక్కడక్కడ బిక్షగాల్లు అనడము వినియేవుందుము. పూర్వము త్రిజట అను రాజు తన గడచిన జీవితమును గురించి ఆలోచించి పశు, పక్షి, మృగాదులవలె మానవుని జీవితము కూడ గడుచుచున్నదని, ఇందులో ప్రత్యేకత ఏమి లేదని, ప్రత్యేకత కావాలంటే వాటికంటే మిన్నగనున్న పని పరమాత్మ జ్ఞానము సంపాదించుటేనని తలచి, జ్ఞానార్థియై చిత్రవర్ణ అను మహర్షి వద్దకు పోయి ఆయన దర్శనార్థము మహర్షి గృహము చెంత నిలిచివుండెను. చాలాసేపు వేచి ఉన్నప్పటికి తలుపులు తెరువలేదు. గురువుగారైన మహర్షి బయటికి రాలేదు. అపుడా రాజు "నేను త్రిజట రాజును, జ్ఞానము కొరకు వచ్చివున్నాను తలుపు తెరవండని" మహర్షిని పిలువలేదు. రాజు పిలువనిదే లోపలున్న వారికి తెలియదు. కావున రాజు తప్పక పిలువవలసి వచ్చినది. అపుడేమని పిలిచాడనగా! 'అయ్యా అనాది జన్మ ధర్మము తెలుపండి' అని ఒకమారు 'అనాది వాడు వచ్చాడు ధర్మము చేయండి' అని మరొకమారు పిలిచెను. ఆ మాటలు లోపలనున్న చిత్రవర్ణ మహర్షి విని ప్రక్కనున్న శిష్యునితో వచ్చిన వానికి దానము కావాలో ధర్మము కావాలో అడిగి రమ్మని చెప్పెను. ఆ శిష్యుడు బయటికి వచ్చి త్రిజట రాజును చూచి నీకు ధర్మము కావాలా? దానము కావాలా? అని అడిగెను. దానికి రాజు "నేను త్రిజట అను రాజును. నాకు వస్తువాహన, ధనకనకాదులు చాలా ఉన్నవి. కావున మీరిచ్చు దానము వద్దు. నా వద్ద లేనివి తెలియనివియైన ధర్మములు మీవద్ద ఉన్నవి. ఆ ధర్మములు నాకు కావాలి. వాటిని దానము చేయండి, ఆది తెలియని అనాది జన్మనాది, జన్మలేని అనాదిని చేయండని కోరుచున్నాను" అనెను. రాజుగారి మాటలు తెలుసుకొన్న చిత్రవర్ణ మహర్షి సంతసించి రాజుకు ధర్మములను తెలిపి జీవాత్మయైన రాజు అసత్తని, చైతన్యమైన ఆత్మ సత్తని ధర్మములచేత సత్తు అసత్తు కాని పరమాత్మను తెలుసుకొమ్మని చెప్పెను.

ఆనాడు సర్వమున్న గొప్పరాజు అనాది జన్మనాది ధర్మము చేయండని అడుగగా ఈనాడు ఏమిలేని బిక్షగాళ్ళు ఆ మాటననుచున్నారు. బిక్షగాళ్ళవద్దయిన గుర్తుకు మిగిలిన ఆ మాటను వారు కూడ కోరికొకటి మాట ఒకటిగ పల్కుచున్నారు. వారికి కావలసినది దానము, వారడుగుచున్నది ధర్మము. అడిగేవాని దగ్గరకాని ఇచ్చేవానిదగ్గరకాని ధర్మము లేదు. అంతేకాక వారు అనాది జన్మ అనుటలో దిక్కులేని జన్మయను భావముతో అంటున్నారు తప్ప, మొదలు తెలియని జన్మనాది అను అర్థముతో కాదు. ఇప్పటికైన మనము సరియైన అర్థము తెలుపు జ్ఞానమునే ఆశ్రయిస్తాము. జ్ఞేయమును గూర్చి క్రింద తెలుసుకొందాము.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 14: సర్వతః పాణి పాదం త త్సర్వతోఽక్షిశిరోముఖమ్ ।
సర్వత శ్శ్రుతిమ ల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ||
(పరమాత్మ)

భావము : అందరియందు కాళ్లు, చేతులు, కన్నులు, ముఖము, చెవులు కల్గి పరమాత్మ అంతట వ్యాపించివున్నది.
వివరము : పరమాత్మ అనునది స్త్రీకాదు పురుషుడు కాదు. ఒక విధముగ అన్ని ఆయనే కావున పురుషునిగ ఆయన అనియు, స్త్రీగ అది అనియు వ్రాయడములో జరుగుచుండును. ఒకచోట అది అని, మరొకచోట ఇదియని, ఆయన ఈయన అంటున్నారే అనుకోకూడదు. పరమాత్మ ఏది కానివాడని తెలియడము కోసమే అలా వ్రాయవలసి వచ్చినది. ఇక్కడ ఈ శ్లోకములో కూడ ప్రకృతి పురుషులు రెండు పరమాత్మేనని, విడదీసిచూస్తే వేరు వేరుగనున్నవని తెలుపడమే సారాంశమని తెలియుము. కాళ్ళు, చేతులు, ముఖము, కన్నులు, చెవులు ప్రపంచములోని జీవరాసులకన్నిటికి ఉన్నవే. స్థూలమైన అవయవములు ప్రకృతిలో తయారైనవని, వాటియందుండి కదలించునది ఆత్మని ముందే తెలుసుకొన్నాము. ప్రపంచములోని సర్వజీవరాసుల స్థూల అవయవములు, అందులోని సూక్ష్మశక్తి రెండు పరమాత్మే అయివున్నాడని ఈ శ్లోకములో చెప్పడమైనది. స్థూల సూక్ష్మములైన ప్రకృతి, ఆత్మల రెండింటిని కలిపి చూచిన జగత్తులోని శరీరములన్ని పరమాత్మేనని, అన్ని అవయవములు ఆయనేనని తెలియుచున్నది. జ్ఞానము ద్వార తెలియు జ్ఞేయము జీవరూపమైన ప్రపంచముగ వ్యాపించి ఉన్నదని తెలియవలెను. జ్ఞేయమైన పరమాత్మ ఇంకా ఎట్లున్నాడనగా!


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 15: సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రి యవివర్జితమ్ ।
అస క్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ||
(పరమాత్మ)

భావము : పరమాత్మ సర్వేంద్రియముల గుణములలో ప్రకాశించునదియైయుండి సర్వేంద్రియములు లేనిదిగనున్నది. అన్నిటిని భరించునదైయుండి ఏది లేనిదని, అన్ని గుణములను అనుభవించునదై ఏ గుణములేనిదని చెప్పవచ్చును.
వివరము : పరమాత్మను ఎటూ తేల్చిచెప్పలేమని ముందే చెప్పాము, అది వర్ణనాతీతమైనది. అందువలన ఫలానాయని చెప్పుటకు చేతకాక రెండు విధముల చెప్పారు. సర్వేంద్రియ భావములతో ఉండునదై ఏ ఇంద్రియములేనిది సర్వమును భరించునదై ఏదికానిది మరియు అన్ని గుణములుకల్గినదై ఏ గుణములేనిది పరమాత్మయని చెప్పారు. పరమాత్మను ఏకస్తముగ చూచిన ఇంద్రియములు, గుణములు కలదియై భర్తగనున్నదని చెప్పవచ్చును. విడదీసి చూచిన ఏదీకానిదని, ఏమి చేయనిదని చెప్పవచ్చును. ఏకముగ చూచినవున్నది ఒకటే అగును. విడదీసిన ప్రకృతి, పరమాత్మ, ఆత్మ, జీవాత్మయని నాలుగవుచున్నది. ఏకముగ చూచిన అన్ని పనులకు మూలకర్త పరమాత్మయని చెప్పవచ్చును. విడదీసి చూచిన పరమాత్మ సాక్షీభూతుడు, ఏ పని చేయడు, చేయునవి ప్రకృతి ఆత్మ అని చెప్పవచ్చును. విడదీయక పరమాత్మను ఒక్కనిగ చూచిన, కార్యమునకు మూలము పరమాత్మయని చెప్పవచ్చును. విడదీసి చూచిన ప్రకృతి చేయునదైవుండగ, చేయించువాడు ఆత్మకాగ, అనుభవించువాడు జీవుడని చెప్పవచ్చును. ఈ విధముగ ఉండుటవలననే అన్నిటికి నేనే కారణమని ఒకచోట చెప్పడము. ప్రకృతియే కారణమని మరొకచోట చెప్పడము జరిగినది. అందువలన ఎక్కడ పరమాత్మను విడదీసి అర్థము చేసుకోవాలో, ఎక్కడ విడదీయక అర్థము చేసుకోవాలో బాగా తెలిసివుండాలి.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 16: బహి రన్తశ్చ భూతానా మచరం చర మేవ చ ।
సూక్ష్మత్వాత్త దవిజ్ఞేయం దూరస్థం చాన్తి కే చ తత్ ||
(పరమాత్మ)

భావము : చర అచర ప్రపంచముగ జీవరాసుల లోపల బయట పరమాత్మ ఉన్నది. అది సూక్ష్మమగుటచే తెలియబడునది కాదు. దూరముగ మరియు దగ్గరగనున్నదని తెలియుము.
వివరము : కంటికి కనిపించు ప్రపంచమునంతటిని ప్రకృతి అంటాము. కదలెడి ప్రకృతియని, కదలని ప్రకృతియని రెండు రకములుగ ప్రకృతివున్నది. సమస్త జీవరాసుల శరీరములు కదలెడి ప్రకృతియని (చర ప్రకృతియని) పిలువబడుచున్నది. జీవరాసుల శరీరములు మినహాగల సమస్తముయైన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కదలని లేక మార్పుచెందని ప్రకృతియని (అచర ప్రకృతియని) పిలువబడుచున్నది. జీవరాసులలోపల మార్పుచెందుచు కదలుచున్న చర ప్రకృతియు, జీవరాసుల బయట మార్పుచెందక కదలని అచర ప్రకృతియు రెండు పరమాత్మయేనని చెప్పబడుచున్నది. ఎందుకనగ అణువణువున వ్యాపించినది పరమాత్మయే, కనుక చరాచర ప్రపంచమంతయు పరమాత్మయేనని తెలియాలి. పరమాత్మ ఇంద్రియములకు తెలియని సూక్ష్మము కావున అది చూపుకు తెలియునది కాదు. జ్ఞానము వలన కూడ సులభముగ తెలియునది కాదు. ధర్మములు తెలిసినవారికి పరమాత్మ చాలా దగ్గరగ గలదు. ధర్మములు తెలియని వారికి చాలా దూరముగనున్నదని చెప్పవచ్చును. ఎందుకనగ ధర్మములు తెలిసినవాడు తొందరలో పరమాత్మను చేరగలడు. కనుక వానికి చాలా దగ్గరగ ఉన్నదని చెప్పవచ్చును. అట్లే ధర్మములు తెలియనివాడు పరమాత్మను ఎప్పటికి చేరలేడు. కనుక వానికి చాలా దూరముగ ఉన్నదని చెప్పవచ్చును.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 17: అవిభ క్తం చ భూతేషు విభక్త మివ చ స్థితమ్ ।
భూతభర్తృ చ తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ ||
(పరమాత్మ)

భావము : పరమాత్మ విభజింపబడక ఒక్కటైయున్నను, జీవరాసులలో విభజింపబడి ఉన్నది. సమస్త జీవులను భరించునదియు, సమస్త జీవులను లయము చేయునదియు, సమస్త జీవులను పుట్టించునదియై ఉన్నది.
వివరము : ఈ విషయము 15వ శ్లోకములో కూడ చెప్పుకొన్నాము. పరమాత్మ ఒక్కటిగ ఉన్నది. దీనికి మించినశక్తిగాని, దీనిని మించి పేరు పొందినది గానిలేదు. సర్వమునకు మూలకారణమైన పరమాత్మ విభజింపబడక, సర్వత్ర వ్యాపించి పరమాణువు సహితముతానై ఉన్నది. ఇట్లు ఇతరమునకు స్థానములేనిదై, అంతట అదేనిండియున్న దానిని ఒక్కటిగా చెప్పుకోవచ్చును. ఒక విధముగ ఇట్లుండియు ప్రపంచము కార్యరూపము దాల్చుటకు పరమాత్మ అనేక రూపములుగ విభజింపబడి వున్నది. పరమాత్మయే అనేక భాగములుగవుంటూ, ఒక్కొక్క భాగము ఒక్కొక్క కార్యము చేయుచు, ప్రపంచమును కార్యరూపముగ నడిపిస్తున్నది. ప్రపంచమును పుట్టించుటకు, భరించుటకు, లయము చేయుటకు పరమాత్మ విభజింపబడివున్నదని చెప్పవచ్చును. ప్రపంచమును పుట్టించువాడు, పెంచువాడు, లయము చేయువాడు ఒకే పరమాత్మ అయినప్పటికి విభజించి చెప్పుకోవలసివున్నది. పరమాత్మ విభజన రూపముగను, విభజనలేని వానిగను ఉంటూ ఎటూ తేల్చి చెప్పలేనివానిగ ఉన్నాడని చెప్పవచ్చును.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 18: జ్యోతిషా మపి తజ్జ్యోతి స్తమసః పర ముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య ధిష్ఠితమ్ ||
(పరమాత్మ)

భావము : పరమాత్మ ప్రకాశించెడి వాటికి ప్రకాశమైయున్నది. అజ్ఞానమున కంటే వేరైనది. జ్ఞానము జ్ఞేయమైనది. సర్వజీవరాసుల హృదయములో జ్ఞానగమ్యమైయున్నది.
వివరము : పరమాత్మ ప్రకాశించే సూర్యచంద్రాదులందే కాక, అన్ని జ్యోతులందు ప్రకాశమునిచ్చు మూలపదార్థమైయున్నది. తెలియనిదానికంటే వేరుగనున్నది, అనగ అన్నిటికి జ్ఞానవిజ్ఞానమైవున్నది. జ్ఞానమును మరియు జ్ఞేయమును రెండుయైవున్నది. అంతేకాక పరమాత్మ జ్ఞానగమ్యమై సర్వజీవుల శరీరములలోని హృదయములో (బ్రహ్మనాడిలో) అధిష్ఠించివున్నది. హృదయమనగ గుండెకాదు. మెదడు మొదలుకొని చివరివరకున్న సుషుమ్ననాడి లేక బ్రహ్మనాడియని గ్రహించవలెను.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 19: ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః ।
మద్భక్త ఏత ద్విజ్ఞాయ మద్భావా యోపపద్యతే ||
(ప్రకృతి, పరమాత్మ)

భావము : ఈ విధముగ క్షేత్రమును, అట్లే జ్ఞానమును, జ్ఞేయమును సంగ్రహముగ చెప్పబడినది. నా భక్తులు దీనిని బాగుగ తెలిసినవారై నన్ను పొందుటకు అర్హులగుదురు.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 20: ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి ।
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సమ్భవాన్ ||
(ప్రకృతి, పరమాత్మ)

భావము : ప్రకృతి, పురుషులు రెండును ఆదిలేనివని తెలియుము. గుణవికారములెల్ల ప్రకృతినుండి పుట్టినవేనని తెలియవలయును.
వివరము : ఆదిలేనివాడు పరమాత్మయే అయినప్పటికి, పరమాత్మ ప్రకృతిని ఎప్పుడు తయారు చేసిపెట్టినది మనకు తెలియదు. కావున ప్రకృతి కూడ అనాదియేనని చెప్పవచ్చును. పుట్టుకలేని అనాది పరమాత్మకాగ, పుట్టి అనాదియైనది ప్రకృతి. ప్రకృతిలోని వారమే మనమంతా. మనమంతా ఎప్పుడు పుట్టామో! ఎప్పటినుండి చస్తూ పుట్టుచున్నామో తెలియదు. కనుక మనము కూడ అనాదులమే. ఇటువంటి మనలోగల గుణములు ప్రకృతి నుండి పుట్టినవే, ప్రకృతి నుండి పుట్టిన గుణములకు కూడ నాంది మనకు తెలియదు. మనయొక్క మరియు మనయొక్క గుణముల మొదలు మనకు తెలియకపోయిన పరవాలేదు. కాని మనము మన గుణముల యొక్క అంతుచూడాలి, తర్వాత మనమంతమైపోయి అంతములేని పరమాత్మగ మారిపోవాలి.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 21: కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే ।
పురుష స్సుఖదుఃఖానాం భోక్తృ త్వే హేతు రుచ్యతే ||
(ప్రకృతి, జీవాత్మ)

భావము : కార్య కారణములను కలుగజేయుటయందు ప్రకృతి హేతువుగనున్నది. పురుషుడు సుఖదుఃఖములనుభవించుటకు కారణభూతునిగ ఉన్నాడని చెప్పవచ్చును.
వివరము : పురుషుడనగ పరమాత్మయని చెప్పుకొన్నాము. పరమాత్మ సర్వము తానైవున్నదని కూడ చెప్పుకొన్నాము. అటువంటి పరమాత్మ కార్యరూపమైన ప్రపంచము ఎడల విభజింపబడి ఉన్నాడని కూడ తెలుసుకొన్నాము. ఆ విభజన ఈ శ్లోకములో కనిపిస్తున్నది. కార్యములు జరుగుటకు ప్రకృతిగ విభజింపబడి, ప్రకృతి నుండి శరీరము వరకు విభజన జరిగినది. కార్యములకు ప్రకృతితో తయారైన శరీరము కారణము కాగ, ఆ కార్యములలో ఉండు సుఖదుఃఖములను అనుభవించుటకు పరమాత్మ నుండి జీవాత్మ విభజింపబడి ఉన్నది. పరమాత్మ భాగమైన జీవాత్మ శరీరములో నివశిస్తు, పనులలోనున్న కష్టసుఖములను అనుభవిస్తున్నాడు. ఈ విధముగ కార్యరూపజగత్తులో ప్రకృతి శరీరముగను, పరమాత్మ జీవాత్మగను పాత్ర వహిస్తున్నట్లు తెలియుచున్నది.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 22: పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ ।
కారణం గుణ సంగోఽస్య సదసద్యోనిజన్మసు ||
(ప్రకృతి, జీవాత్మ)

భావము : పురుషుడు ప్రకృతియందున్నవాడై ప్రకృతి సంభవములైన గుణములను అనుభవించుచున్నాడు. గుణములతో సంబంధపడియున్న కారణమువలన మంచి చెడు యోనులయందు జన్మించుచున్నాడు.
వివరము : ఇక్కడ పురుషుడనగా జీవాత్మయని తెలియవలయును. జీవాత్మ శరీరమందున్నాడు, కనుక ప్రకృతియందున్నాడని చెప్పుచున్నారు. జీవాత్మ శరీరమందుండి శరీరములో ప్రకృతి జనిత గుణములతో మనస్సుద్వార సంబంధ పడియుండి వాటి అనుభవములను పొందుచు, పాపపుణ్యములను తగిలించుకొను చున్నాడు. కనుక పాపపుణ్యముల ఫలితములబట్టి మంచి చెడు జన్మలు కలుగుచున్న వని చెప్పవచ్చును.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 23: ఉపద్రష్టాఽనుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః ।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : దేహము ధరించిన పురుషుడు దేహమునందు సాక్షీభూతునిగను అనగ ఆత్మగను, సమ్మతించువాడైన జీవునిగను, భరించు భర్తగనున్న పరమాత్మగను, అనుభవించు జీవునిగను, మహేశ్వరుడుగను, ఆత్మగను, పరమాత్మగను చెప్పబడుచున్నాడు.
వివరము : శరీరమునందు శరీరముకంటే వేరైన పరమాత్మ శరీరములో మూడు విధములవుంటూ అనేక విధముల పిలువబడుచున్నాడు. సాక్షి, సమ్మతించువాడు, భర్త, భోక్త, మహేశ్వరుడు, పరమాత్మయని అనేక విధముల పిలువబడుచున్నాడు. పరమాత్మ శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మగ ఉంటు వేరు వేరు పాత్రలు వహిస్తు అనేక విధముల పిలువబడుచున్నాడు. ఉన్నది ఒక్కడే అయిన విభజన ద్వార మూడుగ ఉంటూ కార్యరూపమైన తంతు నడుపుచున్నాడు.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 24: య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై స్సహ ।
సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే ||
(ప్రకృతి, పురుషుడు)

భావము : ఎవడైతే ఈ ప్రకారముగ పురుషులను, ప్రకృతిని, గుణములను తెలుసుకొన్నాడో, వాడు ఎల్లపుడు అన్ని విషయములలో వర్తించుచున్నప్పటికి తిరిగి జన్మించడు.
వివరము : ప్రకృతి వలన శరీరము తయారైనదని, శరీరములోని గుణములు కూడ తయారైనవని తెలిసి, గుణ విశేషములను పూర్తిగ తెలిసి, సర్వకార్యములకు ప్రకృతి జనిత గుణములే కారణమని తెలిసినవాడై, అలాగే పురుషుడైన పరమాత్మ కూడ మూడు భాగములుగ విభజింపబడివున్నదని తెలిసి, గుణములలో చిక్కుకొని వాటి అనుభవములను పొందుచున్నది పరమాత్మలోని అంశ అయిన జీవాత్మయని, మొత్తము శరీర యంత్రాంగ కార్యమును నడుపునది ఆత్మయని, అన్నిటికి సాక్షిభూతుడై ఏమి చేయక శరీరములో తటస్థముగ ఉండువాడు పరమాత్మయని ఎవడు తెలిసివున్నాడో, వాడు జగత్తులో ఎక్కడేకార్యము చేయుచున్నప్పటికి వానికి కర్మలంటవు. పునర్జన్మకు కారణమైన కర్మలు తయారు కాకపోవుటవలన వానికి పునర్జన్మ ఉండదు. ఇక్కడొక ప్రశ్నకు అవకాశము గలదు. అదేమనగా! "వెనుకటి సంచితకర్మ ఎక్కువ ఉన్నవానికి ప్రస్తుతము క్రొత్త ఆగామికర్మ రాక పోయినప్పటికి, ఒకే జన్మలో వాడు కడతేరి మరుజన్మ లేకుండ పోవునా? భగవంతుడు చెప్పినట్లు ప్రకృతి, పురుషుల వివరము తెలిసినవాడు సంచిత కర్మనంతటిని అనుభవించక రెండవ జన్మ పొందక ఆ జన్మలోనే ముక్తిపొందునా?" ఈ విధముగ ఎవరికైన సంశయమురావచ్చును. దానికి జవాబు ఈ శ్లోకములో 'సర్వధా వర్తమానోపి నసభూయోభిజాయతే' అన్నారు కదా! సర్వధా వర్తమానోపి అనుటలో సహజముగ ఉన్న కర్మరీత్య నీ పనులు నీవు చేయుచు, నీ చావు నీవు చస్తు, నీ పుట్టుక నీవు పుట్టుచున్నప్పటికి క్రొత్తకర్మ రాదు. క్రొత్త జన్మ రాదు అని అర్థము. జన్మకు కారణమైనది కర్మ. కర్మసిద్ధాంతరీత్య పాత కర్మ అయిపోవు వరకు దాని పని అది చేయుచుండును. అందువలన పూర్తి సంచిత కర్మ అంతా అయిపోవు వరకు దాని పద్ధతి ప్రకారము జన్మలుండును. అది అయిపోయిన వెంటనే భగవంతుడు చెప్పిన పద్ధతి ప్రకారము జన్మలుండవు. అట్లు కాక శ్లోకములో పాతకర్మ ఉన్నప్పటికి ఒకే జన్మలో మోక్షము పొందుదువని ప్రత్యేకించి చెప్పలేదని తెలియాలి.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 25: ధ్యానేనాఽత్మని పశ్యన్తి కేచి దాత్మాన మాత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే || (భక్తి, బ్రహ్మ, కర్మ యోగములు)

(12) శ్లో|| 26: అన్యే త్వేవ మజానంతః శ్రుత్వాఽన్యేభ్య ఉపాసతే ।
తేఽపి చాతితర న్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ||
(జీవుడు, మోక్షము)

భావము : మృత్యువును జయించి మోక్షము పొంది పరమాత్మయందు ఐక్యమగుటకు, కొందరు పరమాత్మ సాకారరూపమును ధ్యానించు భక్తియోగము కల్గియుందురు. మరికొందరు బ్రహ్మయోగముననుసరించి ఆత్మదర్శనమును చేసుకొనుచుందురు. ఇంకా కొందరు కర్మయోగమును అనుసరించుచుందురు. ఈ విషయములు తెలియనివారు ఇతరులవలన విని, వారు చెప్పిన ప్రకారము ఉపాసనచేసి సాఫల్యమును పొందుచున్నారు.
వివరము : ఇక్కడ భగవంతుడు చెప్పినట్లు లోకములో ఈ పద్ధతులను అనుసరించు వారెవరైన ఉన్నారా! అని చూచిన ఏ గురువువద్దకు పోయిన, ఏ ఉపన్యాసకుల బోధలనువినిన, ఏ ఉపాసకులను చూచిన, అక్కడ కనిపించునది వినిపించునది ప్రకృతి సంబంధించిన పూజలు, ప్రకృతి సంబంధించిన బోధలు తప్ప ఏమి లేవు. ఎవరిని చూచిన పరమాత్మను వదలి అన్యదేవతలను ఆరాధన చేయువారే కనిపిస్తున్నారు. ఏ ఆశ్రమములో చూచిన అన్యదేవతా ప్రతిష్ఠ స్పష్టముగ కనిపిస్తున్నది. ఏ బోధ వినినా అందులో దేవతలను పొగడడమో, ఆరాధించడమో గూర్చి చెప్పడమే ఉన్నది. ఏ స్వామిని చూచిన అతడు శివభక్తుడైన శైవునిగనో, లేక విష్ణు భక్తుడైన వైష్ణవునిగనో ముద్రవేసికొని ఉన్నారు. అటువంటి వారి బోధలువిని వాటి ప్రకారము ఉపాసన చేసిన వారెక్కడికి పోగలరు? కావున బోధలు వినువారు జాగ్రత్త! పైన చెప్పినట్లు ఇతర దేవతలనారాధించువారి పంచన చేరవద్దండి. పై శ్లోకములో ఉన్నట్లు ప్రకృతి, పురుషుల విభజన చేసి, వారి గూర్చి పూర్తిగ తెలుసుకొన్న వారి దగ్గర చేరి, పరమాత్మ సంబంధ బోధనలనే విని, దాని ప్రకారమే సాధన చేసిన ఎడల మోక్షము పొందుటకర్హులగుదురు. అట్లుకాక దేవతారాధన సంబంధముగ పోయిన దేవతలందే చేరుదురు. పరమాత్మయందు ఎన్నటికి చేరలేరు.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 27: యావ త్సంజాయతే కించిత్సత్త్వం స్థావరజంగమమ్ ।
క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగా త్తద్విద్ధి భరత ర్షభ ||
(ప్రకృతి, పురుషుడు)

భావము : స్థావర జంగమమైన జంతువేది పుట్టిన, అట్లే ఏకించిత్ వస్తువు పుట్టిన అది క్షేత్రక్షేత్రజ్ఞుల కలయికతోనే పుట్టుచున్నదని తెలియవలెను.
వివరము : ఇక్కడ క్షేత్ర క్షేత్రజ్ఞుడను పదము ఉపయోగింపబడినది. క్షేత్రమనగ శరీరమని, క్షేత్రజ్ఞుడనగ ఆత్మ అని ముందే తెలుసుకొన్నాము. ఒక వ్యక్తిని విడదీసినపుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడని చెప్పుకొనుట సమంజసము. అదే విశాలముగ ప్రపంచమును గురించి చెప్పుకొన్నప్పుడు, ప్రకృతిని క్షేత్రమని పురుషుడైన పరమాత్మను క్షేత్రజ్ఞుడని చెప్పవచ్చును. ఇక్కడ పై శ్లోకములో ప్రకృతి, పురుషుడను భావముతో క్షేత్రక్షేత్రజ్ఞుడని చెప్పియున్నారని తెలియవలెను. ప్రపంచములో కదిలెడి జీవులైన మానవులు, క్రిమి కీటక జంతువులు, సర్పములు, పక్షులు, జలచరములు మొదలగు నవన్నియు మరియు కదలని వృక్షలతాదులు మొదలగునవి, అంతేకాక క్రొత్తగ పుట్టుకొచ్చుచున్న నక్షత్రములు మొదలుకొని ఏకించిత్ వస్తువైన క్రొత్తగ పుట్టిన ఎడల అవి ప్రకృతి, పురుషుల సంయోగము వలన పుట్టినవేయగును. ప్రకృతి, పురుషుని కలయిక లేని వస్తువుగాని, స్థావర జంగమమైన జీవిగాని ఏది ప్రపంచములోలేదని చెప్పవచ్చును. ఉదాహరణకు ఒక జీవరాసిని తీసుకొంటే అందులో ప్రకృతి సంబంధ శరీరము, పరమాత్మ సంబంధ ఆత్మ జీవాత్మలు కలవు. అలాగే క్రొత్తగా తయారై వచ్చిన మన ఇంటిలోని ప్రాణములేని ఒక కుర్చీని తీసుకొని చూచిన, అందులో ప్రకృతి సంబంధ పదార్థముండగ ఆ పదార్థములోని అణువణువున పరమాత్మ వ్యాపించియున్నది. ఈ విధముగ ఏ జీవరాసిగాని, ఏ పదార్థముగాని, ప్రకృతి పురుషుల సంబంధము లేనివి లేవని తెలియవలెను.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 28: సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్ ।
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి ||
(పరమాత్మ)

భావము : సర్వజీవరాసులందు సమానముగ నివాసముండు పరమాత్మను, సమస్తము నాశనమైనప్పటికి నాశనముగాని వానిగ ఎవడు చూచునో వాడే చూచినవాడగును.
వివరము : పరమాత్మ సర్వజీవరాసులలో ఉంటూ అవి మరణించినప్పటికి, పరమాత్మ ఉనికి చెడనిదై ఉండడము ఆశ్చర్యమే కదా! పరమాత్మ తిష్టవేసి ఉన్న శరీరములు మరణించినప్పటికి, పరమాత్మ నాశనమెట్లు కాలేదో సవివరముగ తెలుసుకొందాము. అట్లు తెలుసుకొనుట వలన శ్లోకములో 'యఃపశ్యతి సపశ్యతి' అన్నట్లు శరీరములు నాశనమైన పరమాత్మ నాశనము కాలేదని చూచినవాడు నిజముగ చూచినవాడగును.

మనము ఒక ఊరికి బయలుదేరునపుడు ఆ ఊరు ఎంత దూరమున్నది, మనమెక్కడ దిగవలయునో, అన్నియు జ్ఞప్తిలో పెట్టుకొని ప్రయాణిస్తుంటాము. గమ్యము చాలా దూరమైతే దారికి కావలసిన ఖర్చు నిమిత్తము ఎంత డబ్బుకావాలో అంతే దగ్గర పెట్టుకుంటాము. అట్లే ప్రయాణములో ఎవరితో స్నేహము చేసినప్పటికి, దిగి పోవునంతవరకే స్నేహముండునని తెలిసి అంతవరకే పరిచయమేర్పరచుకొంటాము. అది గమ్యము తెలిసిన ప్రయాణము, కనుక ఆ ప్రయాణములో బంధాలు అనుబంధాలు ఏమి పెట్టుకోము.

జీవ ప్రయాణములో మరణమను గమ్యమున్నదని అందరికి తెలుసు. కాని ఆ గమ్యమెంత దూరమున్నది తెలియదు. అది ఎప్పుడొచ్చునది తెలియదు. ఒక ఊరికి పోవాలంటే ప్రయాణకాలము నెల పట్టునని తెలిసినప్పటికి, సాటి ప్రయాణికులతో అంటీ అంటని స్నేహము చేస్తాము. కాని మన శరీరవాహన ప్రయాణ కాలమింతయని ఖచ్చితముగ తెలియనప్పటికి, మన సాటి ప్రయాణికులతో పూర్తి సంబంధాలు ఏర్పరచుకోవడము జ్ఞానరహితమని, అర్థరహితమని తెలియాలి. జ్ఞానసహితముగ యోచిస్తే సాటి ప్రయాణీకులుగ శరీరములందు జీవితము సాగిస్తున్నప్పటికి ఎవరి గమ్యము వారిది. ఎవరు ఏ గమ్యము వరకు ప్రయాణించి నిలిచిపోవుదురో చెప్పలేము. నీ వెంట నీ గమ్యము వరకు ప్రయాణించి నీతో పాటు దిగి పోవువారెవరు ఉండరు. మన వెంట ఎవరు రారనుమాట వాస్తవమే. చివరకు సహచరిణి అని పేరుగాంచిన నీ భార్య కూడ నీ వెంట చనిపోదు. ఈ వాస్తవాన్ని అందరు ఒప్పుకోవలసిందే. అయితే మనకు తెలియని వాస్తవమొకటున్నది. అదేమనగా! సహజముగ కనిపించు నీతోటి, నీసాటి ప్రయాణీకులు నీ గమ్యము వరకు రాకున్నను, నీకు కనిపించకుండ నీతో ప్రయాణము చేయువారు ఇంకా ఇద్దరున్నారు. వారిలో ఒకడు పేరున్నవాడు, మరియొకడు పేరులేనివాడు, ఒకనిపేరు ఆత్మ. పేరులేని రెండవవాడు ఆత్మకు పరముగనున్నాడు, కనుక వానిని పరమాత్మ అనడము జరుగుచున్నది. అతనినే 'ఈశ్వరుడు' (అధిపతి) అనియు, 'శివము' అనియు, దేవుడనియు అనేక విధములుగ పిలుచుచున్నాము.

నీవు జీవాత్మవని నీకు తెలుసు. కాని నీవు శరీరములో జీవయాత్ర సాగిస్తున్నావని మరచినావు. అంతేకాక నీతో కూడ శరీరములో ఎల్లకాలము మరీ ఇద్దరు ప్రయాణిస్తున్నారని కూడ తెలియదు. నీకు తెలిసిన తెలియకపోయిన శరీరములో నీతో సహా ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అట్లే అందరి శరీరములలోను జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఆలోచిస్తే ఒకే వాహనమైన శరీరములో జీవునితో పాటు ప్రయాణిస్తున్న ఆత్మ, పరమాత్మలతో ఏ జీవుడు సంబంధముగాని, స్నేహముగాని పెట్టుకోలేదు. మనవెంటవచ్చు ఆత్మ పరమాత్మలతో స్నేహము చేయని మనము, మనవెంటరాని బయట ప్రజలతో ఎంతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొన్నాము. బయట వారితో కాలము గడుపు మనకు, లోపలనున్న వారితో స్నేహము చేయు తీరిక ఓపిక లేకుండపోయినది. మనము లోపలనున్న వారి వైపు చూడకున్ననూ, నీవైపు వారు చూస్తున్నారు. వారితో మనము బంధము పెట్టుకోకున్నను, వారి బంధము ఎల్లవేళలా మనతో ఉన్నది. వారి బంధము లేకపోతే శరీరములో మనమొక్క నిమిషము కూడ ఉండలేము. శరీరవాహనములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు ప్రయాణిస్తు మరణగమ్యము చేరుకోగానే, శరీరము నుంచి జీవాత్మ దిగిపోవును. జీవాత్మ ఒక్కడే కాక జీవాత్మతోపాటు ఆత్మ కూడ దిగిపోవును. నీతో పాటు మొదటినుండి ఉన్న ఆత్మ పరమాత్మలలో నీతో వచ్చువాడు ఆత్మ ఒక్కడే. ఈ విషయము పురుషోత్తమ ప్రాప్తి యోగమను అధ్యాయములో 8వ శ్లోకములో కూడ చెప్పబడినది.

నీ మరణ గమ్యములో నీతో పాటు శరీర వాహనము నుండి దిగిపోవు వాడు ఆత్మకాగ, ఆత్మకంటే వేరుగనున్న పరమాత్మ అట్లే శరీరమందే ఉండును.

సజీవయాత్రలో జీవుడు సుఖదుఃఖములను అనుభవించుచుండును. సుఖ దుఃఖములను అనుభవించుటకు కావలసిన కార్యాచరణకు చైతన్యమునిచ్చి శరీరమును కదలించువాడు రెండవవాడైన 'ఆత్మ', మూడవవాడైన పరమాత్మ సాక్షిగ అన్నిటిని చూస్తు ఏమి చేయక మౌనముగానుండును. జీవుడు శరీరములో ఉన్నపుడు మరియు లేనపుడు స్తబ్దతగనుండువాడు శివము లేక ఈశ్వరుడు లేక పరమాత్మ. ఏమియుకాని ఈ మూడవ వానిని పరమాత్మ అనడములో అర్థము తెలుసుకొన్నాము కదా! అట్లే ఈశ్వరుడని ఎందుకంటున్నామో వివరముగ తెలుసుకొందాము.

అధిపతి అనగ పెద్దవాడు, గొప్పవాడు, మించినవాడని అర్థమగుచున్నది. లక్షాధిపతియనగ లక్షకు అధిపతియని లేక లక్షకు మించినవాడని, లక్షలు కలవాడని అర్థమగుచున్నది. ఆ విధముగ లక్షాధీశ్వరుడు, కోటీశ్వరుడు అనడములో కోటికి లక్షకు అధిపతియని వాటికంటే గొప్పవాడని తెలియుచున్నది. యావత్ ప్రపంచ మంతటికి అధిపతియైనవాడు పరమాత్మ ఒక్కడే, కనుక మొత్తమునకు అధిపతిగ పరమాత్మను 'ఈశ్వరుడు' అనడము జరిగినది.

పరమాత్మ ఎక్కడా గుర్తించలేనిది, అంతట ఉన్నది, దేనికి తెలియనిది, బ్రతికివున్నవానికి, జ్ఞానులకు, యోగులకు కూడ తెలియనిది, అగమ్యగోచరమైనది కావున దానిని 'శివము' అనడము కూడ జరిగినది. శివము అనగ తెలియనిదని అర్థము. జ్ఞానులకు, యోగులకు శివమనునదొకటున్నదని తెలుసు. అది ఏది అని మాత్రము తెలియదు. జీవుడు బ్రహ్మయోగము చేత శరీరమందున్న ఆత్మను తెలియవచ్చుగాని, శివమును మాత్రము తెలియలేడు. కర్మ అయిపోయిన తరువాత జన్మలేని స్థితిని చేరు యోగులు, శివమునందు ఐక్యమై పోవుదురు. ఆ శివమేదో అపుడే తెలుస్తుంది కాని ముందు తెలియదు.

శరీరమందు జీవయాత్రలో మరణమను గమ్యములో ఆత్మ జీవాత్మలు శరీరమునుండి నిష్క్రమించగ, చివరకు శరీరములో మిగిలిపోవునది శివము. బ్రతికున్నపుడు నీచమైన గుణములతో సంబంధమున్న జీవుడు శరీరములో ఉన్నపుడు, ఆ శరీరమునకు అంత ప్రాముఖ్యత లేదు. చనిపోయిన తరువాత శరీరములో జీవుడు లేడు, ఏ నీచ గుణములు అందులో లేవు. అపుడది శుద్ధ 'శివ' నిలయము, అందులో పరమాత్మ తప్ప మరెవ్వరు లేరు. కనుక ఆ విషయము తెలిసిన జ్ఞానులు, యోగులు మరణించిన శరీరములను విభూతినామములతో అలంకరించి గోవింద నామస్మరణతో పూజించి ఎల్లవారిని మ్రొక్కమనెడివారు. అటువంటి సాంప్రదాయము ఇప్పటికి ఉన్నను, అది అర్థము తెలియని ఆచారమైనది. ఇపుడు మ్రొక్కెడివారు భక్తితో కాక భయముతో మ్రొక్కుచున్నారు. ఒకవేళ మ్రొక్కని ఎడల చనిపోయిన వారు తిరిగి దయ్యముగ వస్తారని, వారి పీడ ఇంటిచుట్టు ఉంటుందని, మ్రొక్కితే వారి పీడ అంతటితో పోతుందని మ్రొక్కుచున్నారు.

పూర్వము అలా చేయలేదు. ప్రతి పని అర్థము తెలిసి చేసెడివారు. జీవుడు పోయిన తరువాత శరీరములో మిగిలినది 'శివము' అని వారికి తెలుసు. అందువలన మరణించబడిన శరీరమును (మృతదేహమును) శివము అనెడివారు. కాలక్రమేపి భావము పోయినది. శివము శవముగ పిలువబడుచున్నప్పటికి, పూర్వము నుండి ఉండు పూజలు మొదలగు ఆచరణలు అలాగే ఉన్నవి. ఈ విధముగ ఆచరణలుండి అర్థములు మారిపోయినప్పటికి, నిజమైన జ్ఞానులు, యోగులు చనిపోయిన శరీరములో కూడ చెడని పరమాత్మ ఉనికిని మనోనేత్రముచే చూడగల్గు చున్నారు. ఈ విషయమును గురించి శ్లోకములో చనిపోయిన దేహములో కూడ నాశనముగాని వానిని చూచిన వాడే నిజముగ నన్ను చూచిన వాడని పరమాత్మ చెప్పాడు.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 29: సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్ ।
న హిన స్త్యాత్మనాఽత్మానం తతో యాతి పరాం గతిమ్ ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)

భావము : సమస్త ప్రాణులందు సమముగ నివశించు పరమాత్మను సమముగ చూచువాడు, ఆత్మచేత ఆత్మను హింసించడు. అందువలన అతడు ఉత్తమగతిని (మోక్షము) పొందును.
వివరము : ఇక్కడ ఆత్మచేత ఆత్మను హింసించడము అన్నమాట అర్థమై ఉండదను కొంటాము. దానిని గురించి ఆలోచించి ఎవడైతే పరమాత్మ అంతట అందరియందు సమానముగ ఉన్నాడని తెలియుచున్నాడో, పరమాత్మ శరీరములో ఎట్లున్నది తెలిసియున్నాడో, వాడు అనగ జీవాత్మ అయినవాడు తన శరీరములో ఉన్న ఆత్మ, పరమాత్మలను దృష్ఠిలో పెట్టుకొని, తన శరీరమునకు ఏ ముప్పు తలపెట్టిన అది ఆత్మకు ముప్పు తలపెట్టినట్లగునని తలచును. ఎందుకనగ తన శరీరమంత చైతన్యముగ ఆత్మయు, సూక్ష్మముగ పరమాత్మ వ్యాపించి ఉన్నారని అతనికి తెలుసు. తన శరీరమునకు ఉరివేసిన అది ఆత్మను హింసించి చంపినట్లగునని తెలియును. అట్లే తనకున్న చేయిని నరికివేసిన అది చేతిలోనున్న ఆత్మను నరికివేసినట్లగునని తలచును. ఈ విధముగ శరీరములో సమానముగ వ్యాపించిన ఆత్మ పరమాత్మలను తెలిసినవాడు, వారివెనుక తలలో జీవాత్మగ ఉన్న తాను తన శరీరమంతటవున్న ఆత్మ పరమాత్మలను హింసింపలేడు. ఈ లోదృష్ఠి కలిగి ఆత్మ పరమాత్మల వివరము తెలిసినవాడు మోక్షమును పొందును.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 30: ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథాఽత్మాన మకర్తారం స పశ్యతి ||
(ప్రకృతి, పరమాత్మ)

భావము : అన్ని విధముల కర్మలు వాటి పనులు ప్రకృతిచేతనే జరుపబడుచున్నవని, పరమాత్మ అకర్త అనియు తెలిసినవాడే నిజమును తెలిసినవాడు.
వివరము : సజీవ శరీరములో ప్రకృతి పరమాత్మయను రెండు ఉన్నవని తెలుసు. ఆ రెండిటిలో సర్వకర్మల ప్రకారము జరిగెడి సర్వకార్యములు ప్రకృతివలననే జరుగుచున్నవని, కార్యాచరణకు ప్రకృతియే బాధ్యత వహిస్తున్నదని, శరీరములోని పరమాత్మ ఏమి చేయక కేవలము సాక్షిగ ఉంటు అకర్తగ ఉన్నాడని ఎవడు తెలియుచున్నాడో, వాడే నిజము తెలిసినవాడని చెప్పవచ్చును.


త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 31: యదా భూతపృథగ్భావమేకస్థ మనుపశ్యతి ।
తత ఏవచ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా ||
(పరమాత్మ)

భావము : భూత భేదంబులన్నియు పరమాత్మ ఒక్కనివేయని, పరమాత్మవలననే అన్ని విస్తరింపబడుచున్నవని ఎప్పుడు తెలియునో అప్పుడు పరమాత్మనే పొందుచున్నాడు.
వివరము : నానా ఆకారములుకల్గి నానారకములుగ కనిపించు జీవరాసులన్ని ఒకే పరమాత్మలోనివేనని, అనేకరక జాతులుగ భూమిమీద పుట్టి విస్తరించు జీవరాసులన్ని ఒకే పరమాత్మ నుండి పుట్టుచున్నవని ఎప్పుడు తెలియుచున్నదో, అప్పుడు వాడు పరమాత్మను పొందుటకు అర్హుడగును.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 32: అనాదిత్వా న్నిర్గుణత్వాత్పరమాత్మాఽయ మవ్యయః ।
శరీరస్థోఽపి కౌన్తేయ! నకరోతి న లిప్యతే ||
(పరమాత్మ)

భావము : అనాదియు, నిర్గుణుడును, అవ్యయుడును అయిన పరమాత్మ శరీరమందున్నప్పటికి కర్మలు చేయడు, కర్మలనంటడు.
వివరము : ఆది లేనివాడును, మూడుగుణములు లేనివాడును, నాశనము లేనివాడును అయిన పరమాత్మ శరీరములో ఉండి కూడ ఏ కార్యములు చేయడు, తాను ఏ కర్మలనంటించుకొనడు.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 33: యథా సర్వగతం సౌక్ష్మ్యా దాకాశం నోపలిప్యతే ।
సర్వ త్రావస్థితో దేహే తథాఽత్మా నోపలిప్యతే ||
(పరమాత్మ)

భావము : ఏ విధముగ అంతట వ్యాపించి అన్నిటిని తాకియున్న ఆకాశము సూక్ష్మమగుట వలన దానినేది అంటనట్లు, అట్లే సర్వదేహములందు వ్యాపించి తాకియున్న పరమాత్మను ఏవిగాని అంటకున్నవి.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 34: యథా ప్రకాశయ త్యేకః కృత్స్నం లోక మిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత! ||
(పరమాత్మ)

భావము : సూర్యుడొక్కడీ లోకమునంతటిని ఎట్లు ప్రకాశింపజేయకల్గుచున్నాడో అట్లే పరమాత్మ సమస్త క్షేత్రములను, క్షేత్రజ్ఞులను ప్రకాశింపజేయుచున్నాడు.
వివరము : సూర్యుడు తన కిరణముల చేత సమస్త భూమండలమునంతటికి ఏ విధముగ వెలుగును ప్రసరింపజేయుచున్నాడో, అదే విధముగ సమస్త ప్రపంచములోని జీవరాసుల శరీరములను మరియు శరీరములలోగల ఆత్మను, పరమాత్మ తన శక్తి చేత చైతన్యవంతము చేసి కదలించుచున్నాడు. పరమాత్మ సమస్త శరీరములను తయారు చేసి వాటిలో ఆత్మను నెలకొల్పి ఆత్మకు శక్తినిచ్చి దాని చేత శరీరమును కదలునట్లు చేయుచున్నాడని తెలియాలి.



త్రైత సిద్ధాంత
భగవద్గీత


☜ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము  
   ☞
(12) శ్లో|| 35: క్షేత్ర క్షేత్రజ్ఞ యో రేవ మన్తరం జ్ఞానచక్షుషా ।
భూతప్రకృతిమోక్షం చ యే విదు ర్యాన్తి తే పరమ్ ||
(ప్రకృతి, పురుషుడు)

భావము : జ్ఞాననేత్రముచేత క్షేత్రము, క్షేత్రజ్ఞులను, వాటి భేదములను, జీవరాసులను, ప్రకృతిని, మోక్షమును ఎవరు తెలియగల్గుచున్నారో, వారు పరమ పదమును పొందగల్గుచున్నారు.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024