pss book:gt5 త్రైత సిద్ధాంత భగవద్గీత : ఆత్మ సంయమ యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత : ఆత్మ సంయమ యోగము
శ్రీ భగవంతుడిట్లనియె:-
శ్లోకం 1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః |
స సన్న్యాసీ చ యోగీ చ ననిరగ్ని ర్నచాక్రియః||
(కర్మయోగము)
భావము : కర్మఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. అగ్నిలేనటువంటివాడు, పనులు మానుకొన్నవాడు యోగికాడు మరియు సన్న్యాసి కాడు.
వివరము : యోగిని సన్న్యాసి అనియు, సన్న్యాసిని యోగి అనియు పిలువవచ్చును. సన్న్యాసి అనిన యోగి అనినా రెండు ఒకే అర్థమని తెలియాలి. ఈ అధ్యాయములో మొదటనే సన్న్యాసి అంటే ఎవరని అర్థమగులాగున భగవంతుడు చెప్పాడు. నిత్య జీవితములో బ్రతుకుతెరువు కోసము ఎందరో ఎన్నో పనులను చేయుచున్నారు. దీనికి సమతగా 'కూటి కొరకు కోటి పనుల' న్నారు. ఎన్నో పనులతో కూడుకొన్న మన జీవితములో అన్ని పనులు మంచివి ఉండవు, అట్లే అన్ని పనులు చెడ్డవి ఉండవు. పనులు మంచివైన చెడువైన మనమెందుకు చేస్తున్నాము అనుకుంటే, పనిచేయుట వలన దానికింత కూలియను ప్రతిఫలితముండును. ఒక రోజు పనిచేయుట వలన 100 రూపాయలు ప్రతిఫలితము వస్తున్నదనుకొందాము. ఇలా ఒక్కొక్కరి పని వేరు మరియు ఫలితము వేరుగా ఉండును. రోడ్డు ప్లాన్ వేయు ఇంజనీరుకు ఒక ఫలితము, అదే రోడ్డుపని చేయువానికి ఒక ఫలితముండును. ఒక మనిషికి రోజుకు కొంత కంటికి కనిపించు ఫలితమున్న విషయము అందరికి తెలిసినదే.
అందరికి తెలియని విషయము కూడ ఒకటున్నది. అదేమనగా! మనిషి చేయు ప్రతి పనిలోనూ కంటికి కనిపించని ఫలితము కూడ ఒకటి ఉన్నది. కంటికి కనిపించు ఫలితము డబ్బురూపముగా, కనిపించని ఫలితము కర్మ రూపముగ ఉన్నది. కర్మ కనిపించనిది కావున ఏ పనిలో ఎవనికెంత కర్మవచ్చునది చెప్పలేము. బయటి ఫలితములను సంపాదించుకొన్న దానిని బట్టి వాడు ఇంత ధనికుడు, వీడు ఇంత పేదవాడు అని చెప్పవచ్చును. కనిపించని ఫలితమైన కర్మను బట్టి ఎవడెంత కర్మపరుడో చెప్పలేము. దీనినంతటిని బట్టి మండుచున్న అగ్నికి క్రింద కనిపించు కట్టెలు పైన కనిపించని గాలి తగులుకొని ఉన్నట్లు, జరుగుచున్న పనికి ఒక ప్రక్క కనిపించు ఫలితము మరియొక ప్రక్క కనిపించని ఫలితము ఉన్నది. రూపాయి బిళ్లకు బొమ్మ బొరుసులాంటిదే కార్యమునకు కనిపించు, కనిపించని ఫలితములని తెలియాలి. మనకు తెలియని మరొక విషయమొకటి ఉన్నది. అదేమనగా! చేయుచున్న పనిలో కంటికి కనిపించని కర్మను లేకుండా చేసుకోవడము. చేసిన పనికి కూలి రూపాయలుగ తీసుకొంటే బొమ్మ బొరుసు రెండు రూపములు ఉండును. వేరే ధాన్యరూపముగానో, వస్తురూపముగానో తీసుకొంటే దానికి ఒక రూపము తప్ప రెండు రూపములు ఉండవు. అట్లే కనిపించు ఒక ఫలితము తప్ప కనిపించని రెండవ ఫలితములేని కార్యములు, వాటిని చేయు విధానము కూడ ఉన్నదని భగవంతుడు తెలియజేశాడు. అది ఎట్లనగా! ఒక కార్యము జరుగునప్పుడు కర్మ ఎలా తగులుకొనుచున్నదో మొదట తెలుసుకోవాలి. తర్వాత కర్మ అంటని విధానమును తెలుసుకోవచ్చునన్నాడు. ఇదంతయు ఇతర దేశాలకు పోయి తెలుసుకోవల్సినది కాదు, మన దేహమునందే తెలుసుకోతగినది. కావున చాలా సులభముగా ఉండును. ఒక కార్యము చేయునప్పుడు ఆ కార్యము జరుగుటకు కారణము ఏమిటని మొదట తెలుసుకొందాము. గత జన్మల సంచితకర్మ ప్రస్తుతమున్న జన్మలో ప్రారబ్ధకర్మయై నిత్యము అనుభవమునకు వస్తుండును. ఒక కార్యము జరగాలంటే ఆ ప్రారబ్ధమే మొదటి కారణము. ప్రారబ్ధము ప్రకారము ఒక విషయము మొదట మనస్సుకు జ్ఞప్తికి వచ్చును. ఆ విషయమును వెంటనే బుద్ధి గ్రహించి, ఆ సమయమునకు అందుబాటులో ఉన్న గుణములతో యోచించును. గుణములు రెండు రకములుగా ఉన్నవి. కావున బుద్ధి యొక్క యోచన కూడ రెండు రకములుగా ఉండును. ఒక రకము యొక్క గుణముల ప్రకారము బుద్ధి యోచన ఆ విషయము యొక్క పని చేయమని సూచిస్తే, రెండవ రకము యొక్క గుణముల ప్రకారము ఆ పని చేయవద్దు అని బుద్ధి సూచిస్తుంది. ఇట్లు అందులో లాభముంటుందని ఒక రకము, అందులో లాభము ఉండదని మరొక రకము, ఇది మంచి పనేనని ఒక రకము అంటే, దానికి వ్యతిరేఖముగా ఇది చెడు పనేయని మరొక రకము చెప్పుచుండును. ఇట్లు అన్ని రకములుగా యోచన చేయడమే బుద్ధి యొక్క కర్తవ్యము. అట్లు యోచన చేయబడిన విషయమును వెంటనే ప్రక్కనే ఉన్న చిత్తము గ్రహించి ఆ పని చేయమనో, చేయవద్దనో ఏదో ఒక దానిని నిర్ణయించును. అట్లు నిర్ణయించడమే చిత్తము యొక్క పని. ఆ నిర్ణయము ఏదియైన చిత్తము తన ఇష్టానుసారము చేయదు. అది ఒక ఆధారముతోనే నిర్ణయము చేయును. ఆ ఆధారము ఏమిటనగా! అప్పటి ప్రస్తుత ప్రారబ్ధకర్మ ఏది జరుగవలెనని చూపిస్తున్నదో, దానినే చిత్తము చిత్తగించి, ఆ విషయమును అమలు చేయవలసిన విధానమును మనస్సుకు తెలియజేయును. మనస్సు వెంటనే ఆ విషయమును శరీర బాహ్యేంద్రియములకు చేర్చును. మనస్సు ఆదేశించినట్లు శరీర అవయములు పనిచేయును. ఇదంతయు ఒక కార్యము జరుగుటకు నిర్ణయింపబడిన శరీర యంత్రాంగమని తెలియాలి. ప్రారబ్ధకర్మ కార్యరూపమౌటకు మనస్సు, బుద్ధి, చిత్తము, శరీర అవయములు పది మొత్తము 13 పాత్రధారులై ఉన్నవి.
ఒక కార్యము జరుగునప్పుడు శరీర యంత్రాంగమెలా ఉన్నదో గ్రహించాము కదా! ఇందులో జీవుని పాత్ర ఏమిలేదు. జీవుడు సాక్షిగా చూస్తూవుండువాడే, ప్రారబ్ధకర్మ అమలుకు రావడములో మనస్సు, బుద్ధి, చిత్తము వాటివాటి పనిచేయు చున్నప్పుడు జీవుడు కూడ అక్కడే ఉన్నాడు. కనుక ఆ విషయమంతయు జీవునికి తెలుస్తూనే ఉండును. అట్లే ఒక దాని విషయము మరొక దానికి తెలుస్తూనే ఉండును. శరీరములో జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను ముఖ్య అంతరంగములైన వాటిలో కర్మ కార్యరూపమౌటకు మనస్సు, బుద్ధి, చిత్తము మూడు మాత్రమే పాత్రధారులై ఉండగ జీవాత్మ, అహము ఏమాత్రము సంబంధము లేనివై ఉన్నవి. కార్యము జరుగుటకు వీటి సంబంధము ఏమాత్రము లేదు. మనో, బుద్ధి, చిత్తముల స్పందన ప్రకారము శరీరము ద్వార కార్యము జరుగు చున్నప్పుడు ఆ కార్యములో ఉన్న బాధలుగాని, సుఖములుగాని అనుభవించు వాడు జీవాత్మ. జీవుడు శరీరములో కష్ట సుఖముల అనుభవములను పొందుటకే ఉన్నాడని తెలియాలి. ఒక సమయములో లడ్డు తినవలెనను జ్ఞప్తిరావడము, అప్పటి ఆశ గుణము ప్రకారము బుద్ధి తినమని యోచించిన దానిని చిత్తము నిర్ణయంచడము, శరీరములోని చేతులు తినిపించడము, నోరు తినడము, అందులోని రుచి యొక్క అనుభూతిని నాలుక మనస్సుకు అందివ్వడము, దానిని వెంటనే మనస్సులోపలనున్న జీవునికి చేర్చడము, జీవుడు ఆ అనుభూతిని పొంది సంతోషించడము జరుగుచున్నది. ఆ విధముగనే వైద్యము ప్రకారము మందు తినవలసి వచ్చినప్పుడు, తినే మందులో చేదును కూడ మనస్సు ద్వార అనుభవించి బాధపడవలసి వస్తున్నది. పని చేయించునది మనో, బుద్ధి, చిత్తములు కాగ సుఖ దుఃఖములు అనుభవించువాడు జీవాత్మ. ప్రారబ్ధము యొక్క ఉద్దేశ్యము జీవున్ని అనుభవింపచేయడమే కావున దానికి తగినట్లు శరీర యంత్రాగమంతయు అమర్చి పెట్టబడినది.
ఇంతవరకు అహము యొక్క పని ఏమిటో తెలియలేదు కదా! ఇప్పుడు చూస్తాము. ఒక కార్యములో మనస్సు, బుద్ధి, చిత్తములు శ్రమించగ, జరిగిన పనిలోని అనుభవమును జీవుడు పొందుచుండగ, ప్రక్కనే ఉన్న అహము ఈ పని మొత్తమునకు నీవే అధిపతివి, నీవలననే ఈ పని జరుగుచున్నదని జీవునికి బోధిస్తున్నది. జీవుడు అహము యొక్క భావమును గ్రహించినవాడై, అనగా అహంభావుడై ఈ పనిని నేనే చేయుచున్నానని భావిస్తున్నాడు. అప్పుడు కార్యములో స్వభావముగా పుట్టిన ఆగామికకర్మ జీవుని కర్మచక్రములో చేరిపోవుచున్నది. జీవాత్మ పాత ప్రారబ్ధకర్మను అనుభవించినవాడైనప్పటికి క్రొత్త ఆగామికకర్మ తిరిగి సంపాదించుకొన్నవాడైనాడు. అనుభవించి పాతకర్మను లేకుండా చేసుకొనగ తిరిగి క్రొత్త కర్మ వచ్చి చేరినది. ఇది సాధారణ జీవుని యొక్క నిత్యకర్మ విధానము, నిత్య కార్యాచరణలో పుట్టుకొస్తున్న నిత్య కర్మాభివృద్ధి. ఈ విధానము సర్వ జగత్తులో జీవుల ఎడల జరుగు యాంత్రిక విధానము. ఇది అంతర్ముఖముగా జరుగుచున్నది. కావున ఎవరికి తెలియకపోయినది. బాహ్యకార్యముల మీద ఉన్న దృష్ఠి అంతరంగ విధానము మీద ఏమాత్రము ఎవరికి లేదు. అందువలన కర్మ తరగడమే గాక పెరుగుచూ పోవుచున్నది. కర్మవున్నంత వరకు జన్మలు తప్పవు. కావున జీవుడు జనన మరణచక్రము నుండి బయటపడలేక పోవుచున్నాడు.
కర్మ ఎలా వస్తున్నదో తెలుసుకొన్నాము. కర్మ ఎలా రాకుండ చేసుకోవాలో కూడా తెలుసుకొందాము. ఇంతవరకు శ్లోకము యొక్క నిజార్థములోనికి మనము రాలేదు. ఇప్పుడు శ్లోకములో చెప్పబడిన విషయములోనికి వస్తున్నాము. ప్రారబ్ధము ప్రకారము కార్యములు ఎలా జరుగుచున్నవో, శరీరములోనున్న మనో, బుద్ధి, చిత్త, అహంకారముల యొక్క పనియేమో, ఏమిచేయని జీవుడు ఎందుకున్నాడో తెలుసుకొన్నాము. చివరిలోనున్న అహము కార్యమునకు కారణము నేను అను భావము జీవునకు పుట్టించుట చేత క్రొత్తకర్మను తగిలిస్తున్నదని తెలుసుకున్నాము. కర్మ అంటుకొనుటకు కారణము అహమేనని తెలిసిపోయినది. కర్మను తగిలించడమే అహము యొక్క పనియైనపుడు, కర్మ నిర్మూలణము కూడ అహము వద్దనే ఉన్నదని తెలిసిపోవుచున్నది. అహము యొక్క మాటను జీవుడు గ్రుడ్డిగా వినడము వలననే కర్మ అంటుచున్నది. కావున జీవునకు అహమునకు ఉన్న సంబంధములోనే కర్మ అంటు సారాంశమున్నది. వాస్తవానికి కార్యములో జీవునకు సంబంధములేనప్పుడు నేనే చేయుచున్నానని జీవుడు అనుకోవడము, అహము యొక్క మాటను నిజమా కాదా అని చూడక జీవుడు గ్రుడ్డిగా నమ్మడము ఎందుకు జరుగుచున్నదని యోచించి చూచిన, జీవునకు సత్యమేది? అసత్యమేదని తెలుసుకొను విచక్షణా దృష్ఠిలేదని తెలియుచున్నది. అజ్ఞాన అంధత్వముతోనున్న జీవుడు ప్రక్కన ఉన్న అహము మీద ఆధారపడుచున్నాడు. అహము యొక్క పని ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడమే, కావున జీవునకు సంబంధములేని విషయమును సంబంధమేర్పరచి అహము చెప్పుచున్నది. అజ్ఞానమను గ్రుడ్డితనము గల జీవుడు అహము మీద ఆధారపడి అది చెప్పినది నిజమేనని నమ్ముచున్నాడు.
జ్ఞానదృష్ఠి కల్గిన జీవుడు అహము మీద ఆధారపడడము లేదు. కార్యమునకు కారణమూలము కర్మని, దాని ప్రేరణలో మనస్సు, బుద్ధి, చిత్తము గుణములను ఉపయోగించుకొని కార్యము చేయుచున్నవని, జీవుడైన తనకు కార్యములోని అనుభవము తప్ప ఇతరత్రా సంబంధమేమిలేదని తన జ్ఞానదృష్ఠి తో తెలుసుకొనుచున్నాడు. అటువంటప్పుడు అహము యొక్క మాటను అసత్యమని త్రోసివేయుచున్నాడు. బాహ్యముగా అగ్నిమండుటకు ఆక్సిజన్ (ప్రాణవాయువు) అవసరము. అట్లే అగ్ని ఆరిపోవుటకు కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు) అవసరము. ఆక్సిజన్ ఉన్నప్పుడే మంట మండగల్గుచున్నది. ఆ విధముగానే అహము పని చేయకున్నప్పుడే జ్ఞానాగ్ని మంట ప్రకాశముగా మండుచున్నది. కార్బన్ డై ఆక్సైడ్ ఉన్నప్పుడు అగ్ని ఆరిపోవునట్లు అహము యొక్క పని ఉన్నప్పుడు జ్ఞానాగ్ని మండక ఆరిపోవుచున్నది. బాహ్యాగ్ని మండుటకు ఆరిపోవుటకు వాయువు యొక్క ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ లు కారణమైనట్లు. శరీరములో జ్ఞానాగ్ని మండుటకు ఆరిపోవుటకు అహము యొక్క వృత్తి నివృత్తులు కారణమగుచున్నవి. అహము వృత్తిగా ఉన్నప్పుడు జ్ఞానాగ్ని ఆరిపోయి కర్మలను కాల్చలేని స్థితిలోనున్నది. అప్పుడు సంభవించు ఆగామికర్మ జీవుని కర్మచక్రమును చేరుచున్నది. అహము నివృత్తి అయినప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లి మండుచు కర్మను కాల్చు స్థోమత కలిగివున్నది. అప్పుడు సంభవించు ఆగామి కర్మ జ్ఞానాగ్ని లో పూర్తి కాలిపోవుచున్నది. ఆగామికర్మ దహనమగుటకు మరియు కాకుండుటకు అహంకారవృత్తి నివృత్తుల మీద ఆధారపడివున్నది.
అహంకారము శరీరములో ఒక్కమారు కొంత సమయము లేకుండా పోయిన తర్వాత ఎప్పటికి లేకుండా పోతుందనుకోకూడదు. జీవునకు ఒకమారు మరణమొచ్చినంత మాత్రమున వేరేచోట పుట్టడని చెప్పలేము కదా! అట్లే అహము కూడ ఒక విషయములో నివృత్తి అయినంతమాత్రమున వేరే విషయములో పుట్టదనుకోకూడదు. శరీరము ఉన్నంతవరకు అది ఉండును. అది మాటి మాటికి తన పని తాను చేయుచుండును. జ్ఞానము కల్గిన జీవుడు కూడ మాటి మాటికి దాని మాటను పెడచెవిన పెట్టుచు అహమును నివృత్తి చేయుచునే ఉండవలెను. ఎప్పుడైతే అహమున్నదో అప్పుడు జ్ఞానాగ్ని లేదు, ఆగామికర్మ కలదు. ఎప్పుడైతే అహము లేదో అప్పుడు జ్ఞానాగ్ని వున్నది, ఆగామికర్మ లేదు. అహమును బట్టి జ్ఞానాగ్ని, జ్ఞానాగ్నిని బట్టి కర్మ కలదని తెలియాలి. అహంకారమున్నప్పుడు ఆగామికర్మ ఉన్నది. అహంకారము లేనప్పుడు ఆగామికర్మ లేదు. అహంకారములేనప్పుడు జ్ఞానాగ్ని వున్నది. అహంకారమున్నప్పుడు జ్ఞానాగ్ని లేదు. జ్ఞానాగ్ని ఉన్నప్పుడు ఆగామికర్మ కాలిపోవుచున్నది. జ్ఞానాగ్నిలేనప్పుడు ఆగామికర్మ వృద్ధి అగుచున్నది.
జ్ఞానము కల్గినవాడు, శరీర యంత్రాంగమంత తెలిసినవాడు, పని చేయునప్పుడు ప్రారబ్ధకర్మ ప్రకారము పని జరుగునని తెలిసినవాడై, ప్రారబ్ధకర్మ ప్రకారమే కనిపించు ఫలితము వచ్చునని తెలిసి చేయుచుండును. ఫలితము మీద ఆశ పెట్టుకొనక దానిని ప్రారబ్ధము ముందే నిర్ణయించివుండునని, తన ఇష్ట అయిష్టముల మీద ఫలితముండదని తెలిసిచేయుచుండును. ఈ విధముగా ఫలితము మీద ఆశలేక అంతటికి ప్రారబ్ధకర్మే కారణమని, దాని ప్రకారమే శరీర భాగములన్నియు పనిచేయుచున్నవని, శరీరములో తానొక భాగమని, తన పని కష్టసుఖములు అనుభవించడమేడనని తెలిసివుండును. అట్లు తెలిసి నిమిత్తమాత్రముగ కార్యములు చేయువానిని కర్మయోగి అంటున్నాము. వానిలో జ్ఞానాగ్ని వుండి ఆగామికర్మ రాకుండ కాల్చి బూడిద చేయుచున్నది. కర్మల బూడిద కల్గినవాడు కనుక సన్న్యాసి అంటున్నాము. సన్న్యాసి దగ్గర బూడిద తప్ప ఏముంటుందని మాటవరసకు అంటుంటాము కదా! సన్న్యాసి అంటే కర్మయోగియని, బూడిద అంటే కర్మకాలినదని ఎవరు అనుకోరు. బయటకి కనిపించు బూడిద లేకున్నప్పటికి వాని దగ్గర బూడిద తప్ప ఏముంది అనడము విచిత్రమేకదా!
దీనికంటే మరొక పెద్ద విచిత్రమేమిటంటే 'ననిరగ్ని' ' అగ్నిలేనివాడు' అని పై శ్లోకములో చెప్పగ, బాహ్యముగా ఉన్న అగ్నితో యజ్ఞయాగాదులు చేయనివాడు అని అర్థము చెప్పడము మరీ విచిత్రము కాదా! జ్ఞానాగ్నికి ఎంతో చరిత్ర ఉండగ దానిని మచ్చుకైనా వివరించక, బాహ్య అగ్నిని పోల్చిచెప్పడము ఏమాత్రము సమంజసమైన పనో మీరే యోచించండి. కర్మఫలము మీద ఆశలేక కార్యములు చేయువాడు నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి అని శ్లోకములో చెప్పబడివున్నది. దీనికర్థము శరీర యంత్రాగమంతయు తెలిసి, సర్వ కార్యములకు ప్రారబ్ధము కారణమని, ఫలితము కూడ దాని నిర్ణయమేనని తెలిసినవాడు, నిజమైన యోగి అని తెలియాలి. అట్లే అగ్నిలేనటువంటి వాడు, పనులు మానుకొన్నవాడు సన్యాసికాదు, యోగి కాదు అనుటలో అర్థము జ్ఞానాగ్ని లేనివాడని, పనులు చేయుట వలన కర్మ వస్తుందని భయపడి పనులు చేయనివాడని అర్థము. పై శ్లోకములో 'ఫలితము మీద ఆశ పెట్టుకోక కార్యములు చేయవలెనని తలచి చేయువాడు నిజమైన సన్న్యాసి నిజమైన యోగి. అగ్నిలేనటువంటి వాడు, పనులు చేయనివాడు సన్న్యాసి కాడు, యోగికాడు' అను విషయము వ్రాయబడిన వివరములో పూర్తి అర్థమైందను కొంటాము. దీని విషయమే క్రింది శ్లోకములో కూడా చూడుము.
శ్లోకం 2: యం సన్న్యాస మితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |
నహ్య సన్న్యస్త స్సంకల్పో యోగీ భవతి కశ్చన ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : జ్ఞానులు దేనిని సన్న్యాసమందురో అదియే కర్మయోగమని తెలియుము. మనిషి సంకల్పరహితుడైనప్పుడే యోగము ప్రాప్తించును.
వివరము : పనులు చేయుచు అందులోని కర్మను సన్న్యసించిన వానిని నిజమైన సన్న్యాసియందురు. నిజమైన సన్న్యాసి యొక్క సన్న్యాసత్వము శరీరము లోపల ఉండునది. కావున బయటకు కనిపించునది కాదు. బాహ్యముగా వీడు సన్న్యాసియని గుర్తించుటకు వీలుకాదు. నిజమైన సన్న్యాసియైనవాడు నేను సన్న్యాసినని బయటికి చెప్పుకోవాల్సిన అవసరము లేదు. అంతరంగములో అగ్నికల్గి కర్మను కాల్చి సన్న్యసించువానిని కర్మయోగి అనుచున్నాము. పూర్వకాలములో జనకమహారాజు మొదలైనవారు కర్మయోగమును ఆచరించిన వారై మోక్షము పొందియున్నారు. వారు బయటికి కనిపించునట్లు ఏ గుర్తులేని నిజమైన సన్న్యాసులైవున్నారు. వారు రాజ్యమును పాలించుచు అన్ని పనులు చేయుచు యోగమాచరించిరని తెలియాలి. దీనినే కర్మయోగమంటున్నాము.
బ్రహ్మయోగమనునది మరొకటి ఉన్నది. అది బయటికి కనిపించునదై ఉన్నది. బ్రహ్మయోగము బాహ్యాచరణలన్నియు నిలిపి చేయునది. కావున పనులు ఆచరించక ఒకచోట స్థంభించి కూర్చున్న వానిని బ్రహ్మయోగి అని సులభముగా గుర్తించవచ్చును. బ్రహ్మయోగములో అంతరంగములోని మనస్సు తన సంకల్పములన్ని విసర్జించవలసి ఉన్నది. మనస్సు సంకల్ప వికల్పములులేనిదగుట వలన లోపలనున్న గుణములు ఉపయోగపడక ఉండును. బుద్ధి, చిత్తమునకు కూడ పనిలేదు. అట్లే బాహ్య శరీరమంతయు కదలక ఉండును. శరీరమును, లోపల సంకల్పమును కదలక ఉంచువాడు నేరుగా మనస్సుచేత ఆత్మను చూడగల్గుచున్నాడు. బ్రహ్మయోగికి బాహ్య ప్రపంచ దృష్ఠిపోయి లోపలనున్న ఆత్మదర్శనము ఏర్పడుచున్నది. ఆత్మదర్శనము కల్గుటకు సర్వసంకల్పములను వదలవలసివున్నది. అందువలన సర్వసంకల్పసన్న్యాసి అని పై శ్లోకములో చెప్పబడివున్నది. సర్వసంకల్పసన్న్యాసి అయినవాడు బ్రహ్మయోగి అనబడును. ఈ శ్లోకములో కర్మయోగ విధానము, బ్రహ్మయోగ విధానము రెండును చూచాయగ చెప్పబడివున్నవి.
శ్లోకం 3 : ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : యోగసాధనకు కారణము కర్మ అని చెప్పబడుచున్నది. యోగికి కారణము కర్మనాశనమని చెప్పబడుచున్నది.
వివరము : ఒక మనిషి యోగసాధన చేయుటకు కారణమైనదేది? అట్లే ఒక మనిషి యోగము చేయుటకు కారణమైనదేది? అను రెండు ప్రశ్నలకు ఇందులో జవాబు కావలసివున్నది. ప్రతిపనికి ఒక కారణముండియే తీరును. అట్లే యోగసాధనకు ఒక కారణము. యోగమునకు ఒక కారణమున్నది. యోగసాధనకు ముఖ్యకారణము కర్మేనని శ్లోకములో చెప్పబడినది. కర్మ ఉన్నది కాబట్టి యోగము నేర్చుకోవలసి వచ్చినది, యోగమున్నప్పుడే కర్మ పోవును కనుక కర్మను పోగొట్టుకొనుటకు యోగసాధన చేయవలసి వచ్చినది. దీనిని బట్టి యోగసాధనకు కర్మే కారణమని చెప్పారు.
యోగము చేయుటకు ముఖ్యకారణము కర్మ నివృత్తేనని కూడ శ్లోకములో చెప్పారు. కర్మను కాల్చవలయును కాబట్టి యోగమాచరించవలసి వచ్చినది. ఎప్పుడైతే శరీరములో కర్మ కాలుచున్నదో అప్పుడు యోగము జరుగుచున్నది. కావున యోగమునకు కారణము కర్మ నిర్మూలణమేనని తెలియాలి. ఈ శ్లోకములో యోగసాధనవేరు, యోగమువేరని చెప్పబడుట ముఖ్యముగ గమనించవలసి ఉన్నది. యోగసాధన చేయువారందరు యోగులు కారు, యోగులు యోగసాధకులు కారు. ఇక్కడ పొరబడు అవకాశమున్నది. కావున సాధనవేరు, యోగము వేరని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణమున్నదని చెప్పవలసి వచ్చినది. ఇది రెండు యోగములకు సంబంధించిన విషయము.
ఈ శ్లోకమునకు మిగతా గీతలలో భావము పూర్తి వేరుగా చెప్పబడివున్నది. ఏది సరియైనదో మీరే గ్రహించుకోమని కోరుచున్నాము.
శ్లోకం 4: యదా హి చేంద్రియార్థేషు నకర్మ స్వను షజ్జతే ।
సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢస్త దోచ్యతే ||
(బ్రహ్మయోగము)
భావము: ఇంద్రియ విషయములయందు, వాటి పనులయందు ఎప్పుడైతే సంగవర్జితము ఏర్పడునో అపుడే వానిని యోగి అనియు, మరియు సర్వసంకల్పసన్న్యాసీ అనియు అందురు.
వివరము : శరీరములో ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క ప్రత్యేకమైన పని నిర్ణయించబడివున్నది. ప్రత్యేక పనులను బట్టి శరీరమును 25 భాగములుగ విభజించడమైనది. అందులో బాహ్యముగనున్నవి 10, వాటిలో జ్ఞానేంద్రియములు ముఖ్యము. కన్నుకు చూచుట, చెవికి వినుట, ముక్కుకు వాసన గ్రహించుట, నాలుకకు రుచి తెలుసుకొనుట, చర్మమునకు స్పర్శను గ్రహించుట కార్యములై ఉన్నవి. ఇవి తమ కార్యములను మనస్సుకు తెలియజేయుచుండును. ఈ ఐదు లోపలనున్న మనస్సుకు అనుబంధమైవున్నవి. జ్ఞానేంద్రియములైదు తెలియజేసిన విషయములను లోపలనున్న బుద్ధికి తెలియజేయడము మరియు వీటిని జ్ఞప్తికి పెట్టుకోవడము మనస్సు యొక్క పనియైవున్నది. ఇంతకు ముందు జరిగిన ఇంద్రియ విషయములను మననము చేయడము ఒక పనికాగ, ప్రస్తుత ఇంద్రియ విషయములను లోపలి బుద్ధికి తెలియజేయడము రెండవ పనిగ ఉన్నది. మనిషి నిద్రనుండి మేల్కొన్నది మొదలుకొని రెండు పనులలో ఏదో ఒక పనిని మనస్సు చేయుచునే ఉండును. మనస్సు యొక్క రెండు పనులు నిద్రలోనే నిలిచిపోవును.
ప్రయత్నము చేసి మెలకువలో మనస్సు యొక్క రెండు పనులు నిలిపి వేయడము బ్రహ్మయోగమగును. ఈ ప్రయత్నములో జ్ఞానేంద్రియములను పని చేయకుండ చేసి, వాటి విషయములను మనస్సుకు చేరకుండ సులభముగ చేయవచ్చును. ఉదాహరణకు కన్నులు మూయుట ద్వార కంటి విషయము అనగ దృశ్య విషయము లోపలికి చేరవేయుట మనస్సుకు లేకుండా పోవుచున్నది. అట్లే చెవులకు శబ్దము లేని గదిలో కూర్చొనుట ద్వార ఆ విషయము మనస్సుకు లేదు. నాలుకకు ఏమి పెట్టకుండుట వలన రుచి తెలియదు. ఏమి తాకని ప్రాకని దాని వలన చర్మము యొక్క స్పర్శ మనస్సుకు తెలియదు. అట్లే ఏ వాసనలేని చోటుండుట వలన మనస్సుకు ఒక విధమైన పని లేకుండపోయినది. బ్రహ్మయోగ సాధకుడు నిర్జన నిర్మలమైన ప్రదేశములో కూర్చొని, జ్ఞానేంద్రియ విషయములకు మనస్సుకు సంబంధము లేకుండ చేసి, మనస్సుకు పనిలేకుండ చేయుచున్నాడు. అయినప్పటికి మనస్సు రెండవ పనిని ప్రారంభించి గడచిన కాలములోని ఇంద్రియ విషయములను, చూచిన దృశ్యములనో, విన్నమాటలనో జ్ఞప్తికి తెచ్చిపెట్టుచుండును. మనస్సు యొక్క ఈ పనిని నిలిపివేయడము బ్రహ్మయోగమగును. మనస్సు పనిచేయుచుండుట బ్రహ్మయోగము కాదు. మనస్సుకు ఇంద్రియ విషయములను తాత్కాలికముగ లేకుండ చేసినప్పటికి, మనస్సు గడచిన ఇంద్రియార్థ విషయములను జ్ఞప్తికి తెచ్చిపెట్టు పని చేయుచుండుటవలన, బ్రహ్మయోగము సాధించుటకు చాలా కష్టముగా ఉండును. ఎంతో అభ్యాసముతో మనస్సు విషయములను మననము చేయుటమానును. అపుడే బ్రహ్మయోగము సాధ్యమగును. మనస్సు యొక్క రెండు పనులలో ఒకటైన ఇంద్రియ విషయములను మనస్సుకు చేరకుండ చేయడము. రెండవ పనైన ఇంద్రియ విషయములు మనస్సుకు జ్ఞప్తి రాకుండ చేయడము జరిగినప్పుడే బ్రహ్మయోగము సాధ్యపడును. అందువలననే పై శ్లోకమున ఇంద్రియ విషయములను వాటి పనులను మనస్సుకు లేకుండ చేసిన వానిని సర్వసంకల్పసన్న్యాసి అనియు యోగి అనియు చెప్పుచున్నారు.
శ్లోకం 5: ఉద్ధరే దాత్మనాఽఽత్మానం నాఽత్మాన మనసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మానో బన్దు రాత్మైవ రిపురాత్మనః ||
(పరమాత్మ,ఆత్మ,జీవాత్మ)
భావము : ఆత్మచేత ఆత్మకు ఔన్నత్యగతియు, మరియు ఆత్మచేత ఆత్మకు అధోగతియు ఏర్పడుచున్నది. అందువలన ఆత్మకు ఆత్మే బంధువు మరియు ఆత్మకు ఆత్మే శత్రువుగ ఉన్నది.
వివరము : ఈ శ్లోకములో రెండు ఆత్మలున్నవి. ఆత్మల వివరము తెలియక పోతే ఈ శ్లోకములోని అర్థము అపార్థమైపోవును. అందువలన ఏ శ్లోకము ఏ ఆత్మకు చెప్పబడుచున్నదో గ్రహించాలని మొదటనే చెప్పాము. కొందరు ఇక్కడ ఈ శ్లోకమునకు సంబంధములేని మనస్సును తెచ్చి పెట్టుచున్నారు. ఇందులో మనస్సుకు సంబంధించినది ఒక్కమాట కూడా లేదు. ఇది కేవలము ఆత్మల విషయమైవున్నది. ఒక ఆత్మచేత ఒక ఆత్మ ఉద్ధరించబడి గొప్పస్థాయికి చేరుకోవడము, అట్లే ఒక ఆత్మచేత ఒక ఆత్మ ఉద్ధరించబడక అధోగతి చెందడము జరుగుచున్నదని ఈ శ్లోకములో చెప్పారు. అంతేకాక ఒక ఆత్మ మరొక ఆత్మకు బంధువుగనున్నది. అట్లే ఒక ఆత్మ మరొక ఆత్మకు శత్రువుగ కూడ ఉన్నదని చెప్పడమైనది.
ఇక్కడ రెండు ప్రశ్నలకు స్థానమున్నది. ఒకటి ఏ ఆత్మ, ఏ ఆత్మను ఉద్ధరించుచున్నది? అట్లే ఏది దేనిని అధోగతికి పంపుచున్నది? రెండవది ఏ ఆత్మ ఏ ఆత్మకు బంధువుగనున్నది? అట్లే ఏది దేనికి శత్రువుగనున్నది? ఈ ప్రశ్నలలో ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు ఎందుకు బంధువగుచున్నది, అట్లే ఎందుకు శత్రువగుచున్నదను విషయము ప్రక్కనే 6వ శ్లోకములో చెప్పబడివున్నది. ఏ ఆత్మ ఏ ఆత్మకు శత్రువు, మిత్రువు అగుచున్నదను ప్రశ్నకు వివరము ఇక్కడ ముందే మనము తెలుసుకోవలసివున్నది.
మన శరీరములో మూడు ఆత్మలున్నవని ఆత్మల వివరము తెలుసుకున్నాము. మూడు ఆత్మలలో ఎవరికి ఎవరు శత్రువు? ఎవరు ఎవరికి మిత్రువు అన్నదే ముఖ్యమైన ప్రశ్న. ఎవరు ఎవరికి ఏమౌచున్నారని తెలిసిన తర్వాత ఎందుకగుచున్నారని సులభముగ తెలియవచ్చును. మూడు ఆత్మలలో వరుసగ మొదటిది జీవాత్మ, రెండవది ఆత్మ, మూడవది పరమాత్మ. ఈ మూడు ఆత్మలను, వస్తువులను తూకము చేయు త్రాసు (తక్కెడ)గ పోల్చుకుందాము. మొదటిదైన జీవాత్మ తక్కెడలో ఒక ప్రక్క వ్రేలాడబడిన పళ్లెమనుకొందాము. అట్లే రెండవ ప్రక్క వ్రేలాడబడిన పళ్లెమును పరమాత్మ అనుకొందాము. తక్కెడకు కట్టెకు మధ్యలో ఉన్న ఆధారమును ఆత్మ అనుకుందాము. తర్వాత పేజీలో బొమ్మను గమనించుము.
తక్కెడలో రెండువైపులనున్న రెండు పళ్లెములకు మధ్యలో సమాన దూరములో ఉన్న ఆధారము రెండు పళ్లెములకు సమానమని తక్కెడలో తెలిసినట్లే జీవాత్మ పరమాత్మలకు మధ్యలోనున్న ఆత్మ రెండిటి ఎడల సమానముగనున్నదని, అది దేనివైపు పక్షపాతము లేని విధముగ తక్కెడలోని ఆధారమువలె కలదని తెలియాలి. దీనివలన రెండవదైన ఆత్మ, జీవాత్మ, పరమాత్మలకు సమానముగావుండి ఎవరికి శత్రువుకాక, మిత్రువుకాక ఉన్నదని తెలియాలి. ఆత్మను ప్రక్కకు పెట్టగ మిగిలినవి జీవాత్మ, పరమాత్మలు. ఈ రెండు ఒకదానికొకటి మిత్రశత్రువులుగ మారుటకు అవకాశము గలదు. దీనిని బట్టి పరమాత్మ చేత జీవాత్మ ఉద్ధరించబడుచున్నదని, మరియు పరమాత్మచేత జీవాత్మ అధోగతియు కూడ చెందుచున్నదని తెలియుచున్నది. ఉద్ధరింపబడిన జీవాత్మ పరమాత్మకు బంధువని, అధోగతి చెందిన జీవాత్మ పరమాత్మకు శత్రువని కూడ తెలియుచున్నది. ఎట్లు శత్రువో ఎట్లు మిత్రువో? క్రింది శ్లోకమున చూస్తాము.
శ్లోకం 6 : బంధు రాత్మాఽఽత్మన స్తస్య యేనాత్మైవాఽత్మనా జితః ।
అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాఽత్మైవ శత్రువత్ ||
(పరమాత్మ, ఆత్మ, జీవాత్మ)
భావము : ఎవడు ఆత్మను తెలుసుకొన్నాడో, వానికి ఆత్మ బంధువుగనున్నది. అట్లే ఎవడు ఆత్మను తెలుసుకోలేడో, వానికి ఆత్మ శత్రువుగ కూడా ఉన్నది.
వివరము : జీవాత్మగనున్న మానవుడు బ్రహ్మయోగమాచరించి తన శరీరములోని ఆత్మను తెలుసుకోవడము వలన పరమాత్మకు బంధువుగ మారిపోవుచున్నాడు. అదే విధముగనే యోగపద్ధతులు తెలియక ఆత్మను తెలియనటువంటివాడు పరమాత్మకు శత్రువుతో సమానముగ ఉన్నాడు. ఈ శ్లోకములో 'ఆత్మనాజితః' అను పదము ఉపయోగించబడినది. ఆత్మను జయించుటని ఆ పదము యొక్క అర్థము. మీరు భావములోగాని, వివరము చెప్పడములోగాని ఆత్మను జయించినవాడని చెప్పక ఆత్మను తెలుసుకొన్నవాడని చెప్పారే! అని కొందరడుగవచ్చును. వాస్తముగా తనకంటే పెద్దదైన, తనకు దేవుడైన ఆత్మను ఎవడూ జయించలేడు. జీవాత్మ ఆత్మను జయించడమంటే మనిషి దైవాన్నే జయించినట్లగును. ఇక్కడ ఆత్మను జయించినవాడని చెప్పకుండ ఆత్మను తెలుసుకొన్నవాడని చెప్పుటయే సరియైనదని తెలియాలి. ఆత్మను తెలుసుకోవడములో సాధన అను పెద్ద పోరాటమున్నది.
ఒక రాజు కోటలో ఉండి కోటచుట్టు సైన్యమును కాపలాగ పెట్టారు. ఇతర శత్రువులెవరు కోటలోనికి ప్రవేశించకూడదు. రాజు సైనికుల శక్తికి కావలసిన ఆహారమును పెట్టి పోషిస్తూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకొన్నాడు. ఒకవేళ శత్రురాజులు ఎప్పుడైన దాడిచేసి సైన్యమునంతయు జయించి రాజును చేరగలిగితే, రాజును చూడగలిగితే, రాజును జయించినట్లే. యుద్ధము చేయునది సైన్యము తప్ప రాజు చేయడు. రాజు కోటలోపలనుండువాడే. శత్రురాజులు పోరాడి గెలిచినప్పటికి, వారు జయించింది నిజముగ సైనికులనే కాని రాజును కాదు. చివరిగ రాజుతో కూడ పోట్లాడనవసము లేదు సైనికులకు కోట వశమౌతూనే శత్రురాజులు రాజ్యమును, రాజును జయించినట్లే. ఆ విధముగనే మన శరీరము కోటలాంటిది. అందులో రాజు ఆత్మ. జీవుడు తప్ప మిగతా బాహ్యేంద్రియములు, అంతరేంద్రియములు అన్నియు సైన్యమనుకొందాము. సైన్యాధిపతి మనస్సు, మనస్సును సంబంధించివుండు లోపల బయట ఇంద్రియములన్నియు సైనికులుగ గుర్తించుము. జీవుడు శత్రురాజుతో సమానము. జీవుడు మనస్సను సైన్యాధిపతిని, ఇంద్రియములను సైన్యమును జయించినపుడు, శరీర కోటలోపలనున్న రాజైన ఆత్మను చూడగలడు. మనస్సును ఇంద్రియములను జయించి ఆత్మను దర్శనము చేసుకోవడమే 'ఆత్మనాజితః' అని శ్లోకములో అన్నారు. అదియు అంత సులభముగ ఉండదు. శరీరమను కోటలో జీవుడను రాజు, ఆత్మయను రాజును చూడాలంటే ఆత్మశక్తిచే కదలుచున్న మధ్యలోని సైన్యమను ఇంద్రియములు, సైన్యాధిపతియైన మనస్సు అనేక ఆటంకములు కలుగజేయుచునేవుందురు. శరీర కోటలోని ఆత్మయను రాజును చూడాలంటే, జీవుడను శత్రురాజు అనేక సంవత్సరములు సైన్యముతోను, సైన్యాధిపతితోను, యుద్ధము చేయగ, చివరకు వారు ఓడిపోతే రాజును జయించి నట్లగును. సైన్యాధిపతి యొక్క ధాటికి ఓడిపోతే లోపలునున్న రాజు కనిపించడు.
ఒక చక్రవర్తి ఆధీనములోని సామంతరాజు, వేరొక సామంతరాజును జయించినపుడు చక్రవర్తి తన సామంతరాజును పొగుడును. అట్లుకాక సామంత రాజు వేరొక సామంత రాజుతో లాలూచిపడి యుద్ధము చేయక తనే ఓడిపోతే ఆ సామంత రాజు మీద చక్రవర్తికి కోపమొచ్చును. పరమాత్మ చక్రవర్తికాగ, జీవాత్మ సామంత రాజుగ ఉన్నాడనుకొనుము. ఆత్మ వేరొక సామంత రాజనుకొనుము. జీవాత్మయను రాజు ఆత్మయను రాజును జయిస్తే పరమాత్మయను చక్రవర్తి సంతోషించును. అట్లుకాక జీవాత్మయను రాజు ఆత్మయను రాజు సైన్యముతో యుద్ధము చేయక వారితో కలిసిపోతే జీవుడు కూడ శత్రువుతో సమానమేయగును.
శ్లోకం 7: జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావ మానయోః ||
(బ్రహ్మయోగము)
భావము : ఆత్మను తెలిసినవాడు పరమాత్మ ఎడల ప్రశాంతత పొందియుండును. అట్టివాడు శీతోష్ణ సుఖదుఃఖములందు, అట్లే మానావమానములందు సమానత్వము కల్గివుండును.
వివరము : ఆత్మ పరివారమును జయించి ఆత్మదర్శనము చేసుకొన్న జీవుడు, పరమాత్మకు తనకు మధ్య శత్రుత్వములేనివాడై, ఇద్దరి మధ్య ప్రశాంతత కల్గినవాడై ఉండును. అతడు శీతోష్ణములందును, సుఖదుఃఖములయందును, మానావమానములయందును సమానత కల్గివుండును. ఇక్కడ గమనించవలసిన విశేషత ఒకటున్నది. అదేమనగా ఈ శ్లోకము బ్రహ్మయోగమునకు సంబంధించినది. యోగియైనవాడు మెలకువతో వచ్చు సుఖదుఃఖములకు సమానముగ ఉన్నాడని అనుకోకూడదు. సుఖదుఃఖములు సమానత యోగములో ఉన్నప్పుడేనని తెలియాలి. ఒకడు బ్రహ్మయోగములో ఉన్నప్పుడు కన్నులు మూసుకొని నిశ్శబ్దమైన ప్రదేశములో శుభ్రమైనచోట కూర్చొని యోగములో లగ్నమై ఉన్నపుడు, అతని ముందర సుఖమును కల్గించు అందమైన దృశ్యమునుంచినను, అట్లే కష్టమును బాధను కల్గించు సమీప బంధువు యొక్క శవమును తెచ్చిపెట్టినను, బయటి ధ్యాస లేనివానికి రెండు సమానమే. మానావమానములందును, శీతోష్ణములందును సమానత్వము కల్గినవాడనగ, పూర్తి బ్రహ్మయోగములో లగ్నమై బాహ్య విషయధ్యాసలేనివాడని అర్థము. వాని శరీరము లోని మనస్సు ఏమాత్రము పనిచేయనిదై ఉన్నప్పుడే, బాహ్యవిషయముల సుఖమును దుఃఖమును మానావమానములను లోపలి జీవునికి అందించలేదు. ఈ శ్లోకములోని విషయమును ఈ విధముగ అర్థము చేసుకోక, మెలుకువలోనున్న యోగి కష్టసుఖము లలో సమానత్వము కల్గివున్నాడంటే, యోగి శరీరములోని జీవునికి కష్టసుఖ అనుభూతుల భేదము లేదంటే మొత్తము కర్మ సిద్ధాంతమే తలక్రిందులై పోవును. ధర్మములను తెలియజేయు భగవద్గీతకే అర్థము లేకుండపోవును. అందువలన ఈ విషయము బ్రహ్మయోగములోనున్న సమయములో సంభవించునదని, మిగతా సమయములో కర్మయోగికి కాని, బ్రహ్మయోగికి కాని కష్టసుఖ అనుభూతులను జీవుడు అనుభవించి తీరవలసిందేనని, అప్పుడు వాటి బేధము జీవునకు తప్పనిసరిగ తెలియుచునే ఉండునని గ్రహించాలి. ఈ శ్లోకములో కూడ జితాత్మనహః అని చెప్పియున్నారు. ఆత్మను అనుభవించు సమయమునే జితాత్మనహః అన్నారని తెలుసుకోవాలి. బ్రహ్మయోగములో మనస్సు ఆత్మమీద లగ్నమై, ఆత్మయొక్క విషయమును బుద్ధికి జీవునకు తెలియజేయు సమయములో, బయటి విషయములన్ని సమానముగ తెలియకుండ పోవుచున్నవని క్రింది శ్లోకములో కూడ తెల్పుచున్నారు చూడండి.
శ్లోకం 8 : జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః ||
(బ్రహ్మయోగము)
శ్లోకం 9: సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు ।
సాదుష్వపిచ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే ||
(బ్రహ్మయోగము)
భావము : జ్ఞాన విజ్ఞాన తృప్తుడు, ఆత్మతో ఆనందములో మునిగియున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, నిజమైన బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, మన్ను, రాయి, బంగారను భేదముల ధ్యాసలేనివాడు, స్నేహితులందు సుహృధ్భావము కలవానియందు శత్రువులయందు, బంధువులయందు మిగతావారందరి ఎడల సమతనుండువాడే యోగి.
వివరము : ఆత్మజ్ఞానమును ఆచరణ చేయడమే బ్రహ్మయోగము యొక్క ఆచరణ, బ్రహ్మయోగములో ముఖ్యమైన పని మనస్సును జయించడమే. ఎంతో కాలము ప్రయత్నముచేత చివరకు మనోజయమును సాధించినపుడు బ్రహ్మయోగము ఏర్పడుచున్నది. ఇంద్రియ ధ్యాసలు అప్పటివికాని, గడచిన కాలమువికాని , మనస్సుకు మననము లేకుండ చేయడము మనోజయములోనున్న కష్టము. బయటి ఇంద్రియ ధ్యాసలులేని మనస్సు లోపలి ఆత్మను గూర్చి తెలియజేయుటకు మొదలుపెట్టును. అట్లు ఆత్మను తెలియజేయడమే బ్రహ్మయోగము. బ్రహ్మయోగ ఆచరణ సమయములో శరీర బయటి ధ్యాసలు ఏమాత్రములేవు. అప్పుడు వానిముందర మన్నుపెట్టిన, రాయిపెట్టిన, విలువైన బంగారు పెట్టిన ఏవి వానిని ఆకర్షింపలేవు. ఆ బ్రహ్మయోగి ఎడల రాయి, మన్ను, బంగారు అన్ని ఒక్కటే. అదే విధముగనే వాని ముందరికి శత్రువు వచ్చి నిలబడిన, మిత్రువు వచ్చి నిలబడిన, బంధువుగాని, మిగులపాపిగాని, పవిత్రమైన సాధువుగాని అందరూ సమానమే. ఎవరిని ప్రేమించడు ఎవరిని ద్వేషించడు. అతను బాహ్యరంగములో ఇట్లుండ అంతరంగములో ఎలా ఉన్నాడో క్రింది శ్లోకము వివరిస్తున్నది చూడుము.
శ్లోకం 10 : యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః ||
(బ్రహ్మయోగము)
భావము : యోగి సతతము ఆత్మతో కలసియుండి రహస్యముగ ఉండును. ఏకాకిగ ఆశలెల్ల విడచి ఏది గ్రహించనివాడై, నియమించిన చిత్తము కలవాడై ఉండును.
వివరము : ఈ శ్లోకమును చాలా మంది బాహ్యముగ అర్థము చేసుకోవడము జరిగినది. రహస్యముగ అంటే ఎవరూ చూడని కొండగుహలందని, ఏకాకి అంటే ఎవరూలేని స్థలములోనని చెప్పుకోవడము జరిగినది. ఆవిధముగ బాహ్యమునకు సంబంధించిన అర్థమునే తీసుకోకూడదని మరిమరి తెలియజేయుచున్నాము. ఈ శ్లోకములో బ్రహ్మయోగి యొక్క అంతర్గతస్థితిని గూర్చి చెప్పియున్నారు. బ్రహ్మయోగి అయినవాడు ఎల్లప్పుడు ఆత్మ యొక్క అనుభవముతో కూడుకొని ఉండును. బ్రహ్మయోగి శరీరములోని జీవాత్మ, తన శిరస్సులో బాహ్యప్రజలకు తెలియని రహస్యస్థావరములో ఆత్మయొక్క అనుభూతులను అనుభవిస్తుండును. తలయందు భృకుటికి మధ్యమున ఉపజిహ్వకు ప్రాక్‍దిక్కున ఆ రహస్య స్థావరమున్నది. ఇతరులకు తెలియనిది రహస్యమగును. కొంతవరకు ఆ స్థలము యొక్క ఆచూకీని చెప్పినప్పటికి, దానిని కనుగొనలేనపుడు అది రహస్యమే కదా! కనుబొమ్మలకు మధ్యలో చిరునాలుకకు పై భాగమున అని కూడ కొంత వివరము చెప్పినప్పటికి, జీవుడు ఆత్మను పొందు ఆ స్థలమును ఎవరు చూడలేనపుడు అది రహస్యస్థావరమనియే చెప్పబడును. అందువలననే శ్లోకములో బ్రహ్మయోగి రహస్యమైన స్థలములో ఆత్మతో కలసియున్నాడని చెప్పారు. అంతేకాక ఏకాకి అనుమాట కూడకలదు. ఏకాకి అనగ శరీరములో ఆత్మ జీవాత్మ రెండుజోడు పక్షులవలెనున్నవి. అవి కనిపించునవి కావు. కనుక వాటిని నల్లని చీకటితో సమానముగ పోల్చారు. నల్లని చీకటిలో ఏమీ కనిపించదు, కావున వాటిని నల్లని పక్షులైన కాకులతో సమానముగ పోల్చి చెప్పారు. జీవాత్మ ఆత్మలు శరీరమను వృక్షములో పైన మారుమూల కొమ్మమీద ఉన్నాయి, ఆ రెండు కలిస్తే ఏకమగును. బ్రహ్మయోగములో జీవాత్మ ఆత్మలు కలిసిపోవుటవలన, ఆ సమయములో రెండు ఆత్మలు లేకుండ పోయి ఒకే ఆత్మగ ఏర్పడుట వలన, వానిని అప్పుడు ఏకాకి అనడము జరుగుచున్నది. కావున ఆత్మతో కలిసిన బ్రహ్మయోగిని ఏకాకి అని అనవచ్చును. యోగసమయములో రహస్య స్థలములో ఉన్న జీవాత్మ, అంతకు ముందు తనతో సంబంధమున్న విషయములన్నిటిని వదలి, తానొక్కడుగ మిగిలిపోయి ఆత్మను అనుభవిస్తున్నాడు. మనస్సు అనేకమునుండి ఏకములోనికి పోయి జీవుని ఏకాగ్రత పొందించుచున్నది. అనేకములైన గుణవిషయములను మనస్సందివ్వని దానివలన బుద్ధికూడ ఏకముగానే నిలుచును. బుద్ధి అందించు అనేక విషయములను గ్రహించి నిర్ణయించు పని చిత్తమునకు లేనిదానివలన చిత్తము కూడ ఏకమైపోయినది. ఈ విధముగ మొదట మనస్సు అనేకము నుండి ఏకమైపోగ, దానిననుసరించి బుద్ధికూడ అనేకమునుండి ఏకమైపోగ, బుద్ధిననుసరించి చిత్తము ఏకముకాగ, చివరకు జీవుడు ఏకమైపోయాడు. మనస్సు బుద్ధి చిత్తము యంత్రములోని చక్రములవలె ఒకదానికొకటి సంబంధమున్నవి. యంత్రములో ఒకచక్రము కదిలితే దానికి అనుసంధానమైన వేరొక చక్రము తిరుగునట్లు, మనస్సు, బుద్ధి, చిత్తములలో ఒకటి కదులుచున్నదంటే మిగిలినవి కదులుచున్నట్లే, చివరిదైన చిత్తము అపరిగ్రహమై నిలిచినదంటే, మిగతా మనస్సు బుద్ధి కూడ నిలిచినవనే అర్థము. మనో, బుద్ధి, చిత్తములందించు అనుభూతులు కూడ జీవునికి నిలిచిపోయినట్లే. అందువలన బ్రహ్మయోగము పొందిన జీవుడు రహస్య స్థావరములో ఏకాకిగనున్నాడని చెప్పియున్నారు. అటువంటి స్థితిని పొందకోరువారు చేయవలసిన ఆచరణ ఏమిటో క్రింది శ్లోకములో వివరిస్తున్నారు చూడండి.
శ్లోకం 11 : శుచౌదేశే ప్రతిష్ఠాప్య స్థిర మాసన మాత్మనః ।
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్ ||
(బ్రహ్మయోగము)
భావము : ఎత్తు తగ్గులులేని శుభ్రమైన స్థలములో యోగసాధనకు కూర్చొనునట్లు స్థిరాసనము ఏర్పరచుకొని దానిమీద దర్భలువేసి, దర్భలమీద చర్మము, చర్మముమీద గుడ్డ పరచియుంచుకొని కూర్చొనవలెను.
వివరము : బ్రహ్మయోగ సాధనకు హెచ్చుతగ్గులులేని శుభ్రమైన స్థలములో ఆసనము కూర్చొనుటకు తగినట్లు ఏర్పాటు చేసుకోవడము వరకు అందరికి అర్థమైవుంటుంది. ఆ స్థలములో దర్భలు, చర్మము, గుడ్డ ఉపయోగించడము దేనికని కొందరికి సంశయమేర్పడి ఉండవచ్చును. విషయము పూర్తి తెలుసుకొనుట మంచిదే కనుక వాటి అవసరము ఏమిటో తెలుసుకొందాము. మొదట దర్భలు గురించి ఆరాతీసిన దానికొక పెద్దకథ కలదు. అది నిజమో కాదో మనకు తెలియదు, కావున ఆ కథను వదలివేసి మనకు తెలిసిన విషయమును గూర్చి తెలుసుకొందాము. దర్భలు కరుకుగ ఉండునవి, దర్భలు గడ్దిజాతిలోనివి. దర్భ గడ్డి మెత్తగ కరుకుగ ఉండుటవలన క్రిమికీటకాదులు వాటిమీద ప్రాకలేవు. యోగసమయములో చీమలు సహితము ఆసనము మీదికి రాకుండుటకు తగినట్లు దర్భలు వేసుకోవలసి వచ్చినది. చిన్న చీమలు శరీరము మీదికి ప్రాకికుట్టుట వలన యోగసాధనకు భంగమేర్పడును. అట్లు సాధనాపరునికి ఆటంకము కలుగకుండుటకు దర్భలను ఉపయోగించ వలసివున్నది. తర్వాత జింక చర్మము దర్భల మీద పరచవలసియున్నది. దర్భల కరుకు సాధకుని శరీరమునకు తగలనట్లు దర్భలమీద చర్మము పరచవలెను. యోగసాధనలోను, యోగముచేయు సమయములోను చర్మాసనము యొక్క విశిష్టత ఏమంటే! ప్రతి జీవరాసి శరీరము క్రిందినుంచి పై వరకు కుడి ఎడమ అను రెండు భాగములుగ విభజించబడి తయారైనది. శరీరములో కుడిప్రక్క కన్నుంటే ఎడమప్రక్క కన్నుండును. ఎడమ ప్రక్క చెవివుంటే కుడిప్రక్క కూడ చెవివుండును. ఇట్లు ఏ అవయవముండునో, దానికి వ్యతిరేకదిశలో అదే అవయవము మరొకటుండును. ఒకే అవయముగ కనిపించు ముక్కు రెండు భాగముల అతుకుగనున్నది. ముక్కుకు కుడి ఎడమలలో రంధ్రములున్నవి. ముక్కుకొన మధ్యలో రెండు కండరముల విభాగము బాగా కనిపించుచుండును. పై పెదవి మీద బాణము గుర్తుగ మధ్యలో సూచించునట్లు, కనిపిస్తు శరీరమధ్యలో ఒక రేఖ క్రిందివరకున్నట్లు కనిపిస్తున్నది. క్రింది బీజముల మధ్య దారములాంటి విభజన గుర్తును కూడ చూడవచ్చును. అట్లే లోపల కూడ కుడి ఎడమ రెండు అవయమముల నిర్మాణమున్నది. ఇది మనుషులకే కాక జంతువులకు, చెట్లకు కూడ ఉన్నది. చెట్లకు ప్రతి ఆకు మధ్యలో రెండు భాగముల విభజనవుండును. ఈ విధముగ సర్వజీవరాసుల శరీరములు రెండు భాగములుగ విభజింపబడుటకు కారణము కర్మ. కర్మ రెండు భాగములుగ ఉండిన దానివలననే శరీరములు కుడి ఎడమ రెండు భాగములుగ పుట్టినవి. పాపపుణ్య రెండు భాగములైన కర్మను పాలించు నవగ్రహాలు కూడ రెండు భాగములుగ విడిపోయి గురు, శని పక్షములుగనున్నవి. కర్మ రెండు భాగములు, కర్మను పాలించు గ్రహాలు రెండు భాగములు. గ్రహాల గ్రహచారమనుభవించు శరీరము రెండు భాగములు. అట్లే జరుగు కాలము కూడ రెండు భాగములుగ ఉన్నది. అదెట్లనగ! మధ్యలో వచ్చిన రాహుకేతువులను ఛాయా గ్రహములను వదలి మిగతా ఏడు గ్రహాలకు ఏడు దినములు కేటాయించబడినవి. అవియే ఈ రోజు ప్రపంచమంత అమలులోనున్న ఆదివారము, సోమవారము అను దినముల పేర్లు. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క దినమునకు అధిపతిగ ఉన్నది. నవగ్రహముల రెండు భాగములుగ విభజింపబడి ప్రతిదిన పగటి కాలమునకు అధిపతిగనున్నవి. పగలు 12 గంటల కాలములో పదిన్నర గంటకాలము ఆ దినము ఒక గ్రహానికి కేటాయించగ, ఒకట్టిన్నర గంటకాలము రాహుకేతువులకు నిర్ణయించబడివున్నది. ప్రతిదినము రాహుకాలముండుట వలన 7 దినములు ఒకటిన్నర గంట ప్రకారము, పదిన్నర గంటలు అన్ని గ్రహములవలె సరిపోవును. ఈ విధముగ కాలమును కూడ విభజించుకొని గ్రహాలు పాలించుచున్నవి.
విభజింపబడిన కాలములో, విభజింపబడిన శరీరములో, బ్రహ్మయోగము చేయు యోగికి జ్ఞానాగ్ని కూడ ఆయా గ్రహాల దినములను బట్టి కుడి ఎడమలలో చేరుచుండును. ఏడు గ్రహాలలో సూర్యుడు, కుజుడు, గురువు ముగ్గురు గురు పక్షముకాగ, శుక్ర, బుధ, శని ముగ్గురు శనిపక్షములోనున్నారు. చంద్రుడు మాత్రము శుక్ల, కృష్ణ పక్షములను బట్టి గురు శనిపార్టీలలో మారుచుండును. శుక్లపక్షములో గురుపార్టీలోనికి, కృష్ణపక్షములో శనిపార్టీలోనికి మారుచుండును. ఆయా గ్రహాల కాల అధికారమునుబట్టి శుక్లపక్షము 15 రోజులలో మనిషి యోగమాచరించు సమయమున ఆది, సోమ, మంగళ, గురువారములలో శరీరమునందు కుడి ప్రక్క భాగమున జ్ఞానాగ్ని ప్రవేశించును. అట్లే కృష్ణపక్ష బుధ, శుక్ర, శని, సోమవారములలో ఎడమప్రక్క జ్ఞానాగ్ని ప్రవేశించును. దీనిని బట్టి పూర్వము యోగులు యోగదండమును కూడ ఉపయోగించెడివారు. జ్ఞానాగ్ని ప్రవేశించు దిశకు వ్యతిరిక్త దిశలో యోగదండమును ఉపయోగించెడివారు. యోగదండముతో పాటు చర్మాసనములు కూడ ఉపయోగించెడివారు. ఇప్పుడు చర్మాసనము యొక్క ప్రాధాన్యత సులభముగ అర్థము కాగలదు.
బ్రహ్మయోగి యోగమాచరించు సమయములో ప్రపంచమంతా అణు వణువున వ్యాపించిన పరమాత్మశక్తి జ్ఞానాగ్నిగ మారి, యోగి శరీరములో కుడి ఎడమలుగా ఆయా దినములనుబట్టి ప్రవేశించుచుండును. అట్లు శరీరములోనికి ఒక్క ప్రక్కనుండి బ్రహ్మనాడి పొడవున ప్రవేశిస్తున్నది. గుదస్థానము మొదలుకొని శిరస్సు వరకు శరీర మధ్యలోని వెన్నుముకలోనున్న వెన్నుపాము లేక బ్రహ్మనాడి అనబడు పెద్దనరములో భృకుటి, కంఠము, గుండె, నాభి, లింగము, గుద స్థానములకు సరిగ ఆరు నాడీకేంద్రములున్నవి. చివరిలో ఏడవ పెద్ద నాడీకేంద్రమైన మెదడు ఉన్నది. క్రింది ఆరు నాడీకేంద్రములలోనికి జ్ఞానాగ్ని ప్రవేశించుచుండును. అట్లు ప్రవేశించిన జ్ఞానాగ్ని పైకిప్రాకి ఏడవ కేంద్రమైన మెదడు స్థానములో నిలిచిపోవును. అచటనే సూక్షముగనున్న సంచితకర్మను కాల్చుచుండును. ఈ అగ్ని యొక్క వెలుగునే దేవతా చిత్రపటములలో తల వెనుక వెలుగుగ చూపించారు. యోగి శరీరములో ఆరు కేంద్రములలో ప్రవేశించు జ్ఞానాగ్ని భూమ్యాకర్షణ శక్తి వలన సగము అనగ మూడు కేంద్రములలో ప్రవేశించునది భూమిలోనికి లాగుకొనబడును. అందువలన యోగి యోగ సమయములో వచ్చు జ్ఞానాగ్నిని సగము నష్టపోవుట జరుగును. అట్లు నష్ట పోకుండుటకు పెద్దలు చర్మమును ఆసనములో వాడారు. విద్యుశ్చక్తికి రబ్బరు నిరోధకమైనట్లు జ్ఞానశక్తికి లేక జ్ఞానాగ్నికి చర్మములు నిరోధకములు. విద్యుత్తు రబ్బరును దాటిపోనట్లు, జ్ఞానాగ్ని చర్మమును దాటిపోదు. కావున యోగి తన ఆసనములో చర్మమును ఉపయోగించుట వలన మూడు కేంద్రముల నుండి జారిపోవు శక్తిని నష్టపోడు. చర్మములను ఆసనములుగ వాడుట వలన పూర్తి శక్తి తన శిరోభాగమున చేరును.
జ్ఞానాగ్ని యోగసమయములో శరీరమందు చేరుచున్న వివరము తెలిసిన పెద్దలు చాలామంది చాలారకముల చర్మములను వాడినట్లు చరిత్ర చెప్పుచున్నది. దీనిని బట్టి యోగి శరీరమునకు ఇతరముగానున్న ఏ జీవరాసి చర్మమైన జ్ఞానాగ్నికి నిరోధముగ ఉన్నదని తెలియుచున్నది. అది సజీవ జీవరాసిది కాని, నిర్జీవ జీవరాసిది కాని ఒకటే సామర్థ్యమున్నదనుటకు అనేక ఆధారములు కలవు. ఉదాహరణకు శివుడు ఏనుగు చర్మము, జింకచర్మము, పులిచర్మము ధరించినట్లు చాలా చిత్ర పటములలో చూడవచ్చును. క్రైస్తవ మతకర్తయిన ఏసుప్రభువు గురువుగారైన యోహాను ఒంటె చర్మమును ధరించెడివాడు. విష్ణువు పాము మీద యోగము ఆచరించుట వలన అక్కడ పాము చర్మము ఉపయోగపడినట్లు తెలియుచున్నది. శివుడు ఎద్దు మీద కూర్చున్నట్లు, మిగతా దేవతలందరు యోగసమయములో వారివారి వాహనములుగ చెప్పుకొను జంతువుల మీద కూర్చొన్నట్లు కలదు. కొందరు మునులు చర్మమును చాపవలె తమవెంట తీసుకుపోయెడివారు. చరిత్రను బట్టి ఏ చర్మమైన తప్పనిసరిగ ఉపయోగించవలెనను విషయము తెలియుచున్నది.
ఈ శ్లోకములో చర్మము వాడవలెనని చెప్పారు. ఫలానా చర్మమే వాడమని చెప్పలేదు. కౄరమైన పులి చర్మముకంటే సాధు జంతువైన జింకచర్మము యోగమునకు మంచిదని కొందరనుచుందురు. అటువంటి నియమముకాని, దానివలన ప్రయోజనముకాని లేదు. కావున యోగమునకు ఇది అది అనక ఏ చర్మమైన వాడవచ్చును. గుడ్డనుపయోగించమని శ్లోకములోనే చెప్పారు. చర్మము మీద గుడ్డను ఉపయోగించాలి. చర్మము మీద రోమములు కుచ్చుకోవడము వత్తుకోవడము వంటి ఇబ్బంది లేకుండునట్లు మెత్తని నూలువస్త్రమును పరచుకొనుట మంచిది. ఈ విధముగ ఆసనము తయారు చేసుకొన్న సాధకుడు తర్వాత ఏమి చేయాలన్నది క్రింది శ్లోకములో చూస్తాము.
శ్లోకం 12 : తత్రై కాగ్రం మనః కృత్వాయత చిత్తేంద్రియ క్రియః ।
ఉపవి శ్యాసనే యుంజ్యాద్యోగ మాత్మ విశుద్ధయే ||
(బ్రహ్మయోగము)
భావము : ఆసనము తయారు చేసుకొని కూర్చొని మనస్సును ఏకాగ్రతనొనర్చి, ఇంద్రియములను, చిత్తము యొక్క పనులను అణచివేసి ఆత్మప్రాప్తి కొరకు బ్రహ్మయోగమును అభ్యసింపవలెను.
వివరము : ముందు శ్లోకములో చెప్పబడినట్లు సమ స్థలములో దర్భలు చర్మము గుడ్డను వేసుకొని కూర్చొని, మనస్సును ఏకాగ్రత పరచుకొనుటవలన ఇంద్రియముల పనులు, వాటిని అనుసరించు బుద్ధి, చిత్తము యొక్క పనులు మొత్తము నిలిచి పోవును. అట్లుచేసి ఆత్మ ప్రాప్తికొరకు యోగము చేయవలెను. ఇక్కడ మనస్సును ఏకాగ్రత పరచుకొనుట వలన బయటి ఇంద్రియములు మొదలుకొని లోపలి చిత్తము వరకు అన్నిటి కార్యములు నిలిచిపోవును. కావున ఇందులో మనస్సును ఏకాగ్రత పరచుకొనుటయే ముఖ్యము. అది ఎట్లు సాధించవలెనో దాని ప్రక్రియ ఏమిటో ఇపుడు చూస్తాము.
మనస్సు బాహ్యేంద్రియముల విషయమును జ్ఞప్తి చేయడము దాని రెండవ పనియని ముందు చెప్పుకొన్నాము. అది ఉదయము మొదలుకొని నిద్రించువరకు అనేక విషయములను జ్ఞప్తి చేయుచునే ఉండును. సాధన చేయువానికి ఆ సమయములో మరీ ఎక్కువ జ్ఞాపకాలను తెచ్చిపెట్టుచుండును. ముందు కన్ను చూచిన విషయములనే కాక చూడని దృశ్యములను కూడ జ్ఞప్తికి తెచ్చును. చూడని అరణ్యమును, చూడని జంతుజాలములను, చూడని మనుషులను స్మృతి పథములో (మనోదృష్ఠిలో) తెచ్చి పెట్టును. అట్లు చూచినవి చూడనివి, విన్నవి విననివి జ్ఞాపకము వచ్చుట వలన యోగసాధకునకు యోగము లేకుండ విషయములే ఎక్కువగ ఒకదానివెంట ఒకటి ఎడతెరపి లేకుండ ఉండును. ఒక సమయములో ఒక జ్ఞాపకము మనసులో మెదలును, అది నిమిషమో, అరనిమిషమో లేక కొన్ని నిమిషాలో ఉండి ఆ జ్ఞాపకము వదలి పోయిన వెంటనే మరొక జ్ఞాపకము ఏర్పడి ఉండును. ఇట్లు అనేక విషయములలో మనస్సు సంచరించుచుండును.
ఏకమనగ ఒకటి అని అర్థము. అనేకమనగా ఒకటి కానిది ఎన్నైన కావచ్చును. ఏకాగ్రము అనగ ఒకటికంటే పైన ఉండునదని అర్థము. ఒకటి తరువాత రెండు మూడు అనువరుసగ ఉన్నవి. ఒకటికంటే ముందు లేక పైన ఏమిలేదు అనగ సున్న అని అర్థము. ఏకాగ్రత అనగ ఒకటికి పైనున్న సున్న అని అర్థము. ఈ శ్లోకములో మనస్సు ఏకాగ్రత చేయమని "ఏకాగ్రం మనః" అన్నారు. ఒక సంకల్పము కూడ లేని శూణ్యస్థితిలోనికి మనస్సును ఏకాగ్రత పరచడము వలన యోచించుటకు బుద్ధికి ఒక విషయము కూడా లేకుండ పోవును. చిత్తమునకు కూడ ఏ విషయము లేకుండపోయి స్థంభించిపోవుచున్నది. ఆ సమయములో లభించు ఆత్మసిద్ధికై యోగి ప్రయత్నించవలెను. బ్రహ్మయోగ సాధకుడు ఇంకా ఎట్లుండుననగా !
శ్లోకం 13 : సమంకాయ శిరోగ్రీవం ధారయ న్నచలం స్థిరః ।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చాఽన్నవలోకయన్ ||
(బ్రహ్మయోగము)
భావము : శరీరము, శిరస్సు, కంఠము మూడిటిని సమముగ అచంచలముగ నిలిపి, తన దృష్ఠిని నాసికాగ్రములో నిలిపి ప్రక్కదిక్కులు చూడకుండనుండవలెను.
వివరము : శరీరములోని వీపు భాగమును, కంఠమును, తలను మూడిటిని చక్కగ నిటారుగ ఉండునట్లు చేసి, కదలకుండ కూర్చొని యోగసాధన చేయవలయును. వీపు భాగము, కంఠము తల వంగిపోవుట వలన వెన్నెముక చక్కగ లేకుండ వంకరులుగ ఉండును. అట్లుండుటవలన ఆరు స్థానములలో చేరు జ్ఞానాగ్ని వెన్నెముకలో గల బ్రహ్మనాడిలో సులభముగ ప్రవహించక నిరోధమేర్పడుచుండును. నిరోధమేర్పడుట వలన లోనికి చేరు శక్తి పూర్తి చేరలేదు. ఒక గంటకు చేరు శక్తి ఒకటిన్నర గంటకాలమునకు చేరును. వెన్నుపాము నిటారుగనుండుట వలన జ్ఞానాగ్ని సులభముగ లోపలి ఏడవస్థానమును చేరును. అందువలన వీపు, తల, కంఠము నిటారుగ పెట్టి కూర్చోమన్నారు. తలనుండి వెన్నెముక వంగకుండుటకు తగిన ఆసనము పద్మాసనము. పద్మాసనము వేసి నిటారుగ కూర్చొన్న సాధనా పరుడు, తన మనోదృష్ఠిని నాసికాగ్రమైన కనుబొమల మధ్య స్థానములో లోపలి భాగమున ఉంచవలెను. కనుబొమలకు సమతలములో శిరస్సు మధ్యభాగమున మనోదృష్ఠిని కేంద్రీకరించవలెను. అట్లు కేంద్రీకరించుట వలన మనస్సు ప్రక్క విషయముల మీదికి పోకుండ వాటి మీద దృష్ఠిలేకుండ పోవును. ప్రక్క విషయముల మీదికి మనోదృష్ఠిని సారించక తల మధ్యభాగములో చూపు కల్గినవాడు ఎట్లుండుననగా !
శ్లోకం 14 : ప్రశాన్తాత్మా విగతభీ ర్బ్రహ్మ చారి వ్రతే స్థితః ।
మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ||
(బ్రహ్మయోగము)
భావము : ప్రశాంతుడగుచు, బ్రహ్మచారి వ్రతము పూనినవాడై, భయములేనివాడై, ఆత్మయందే చిత్తమునుంచి మనస్సును అణచి కూర్చొనవలయును.
వివరము: శాంతమనగ ఏ గుణములేనిదని అర్ధము. ప్రశాంతత పొందిన వానికి భయముండదు. బ్రహ్మయొక్క ఆచరణే వానికి దీక్షగనుండును. వాని మనస్సు అణచివేయబడి ఏ విషయ ప్రస్తావన తేలేని దానివలన, చిత్తము కూడ నిలిచిపోయి ఉండును. ఆ విధముగ బ్రహ్మయోగమును పొందినవాడు ఆత్మను మనస్సు ద్వార అనుభవించుచుండును.
శ్లోకం 15:యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ నియత మానసః ।
శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థా మధిగచ్ఛతి. ||
(బ్రహ్మయోగము)
భావము : యోగి ఎల్లప్పుడు మనస్సును నియమించిన వాడైయుండి నేననుగ్రహించు మోక్షమను శాంతిని పొందగలుగును.
వివరము : బ్రహ్మయోగి అయినవాడు, అప్పుడప్పుడుగాని ఎల్లప్పుడుగాని మనస్సును నియమించగలిగి ఆత్మను అనుభవిస్తున్నవాడు, కొంతకాలమునకు అనగ కర్మ అయిపోయిన తర్వాత శరీరమును వదలి మోక్షమును చేరును. వాడు తిరిగి పుట్టడు. వాడు పరమాత్మయందే ఐక్యమైపోయి శాశ్వత శాంతిని పొందును.
శ్లోకం 16 : నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంత మనశ్నతః ।
నచాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున ||
(బ్రహ్మయోగము)
భావము : అమితముగ భుజించువాడు, ఎక్కువగా ఉపవాసముండువాడు, నిదుర పోతు, నిష్ప్రయోజనముగ మేల్కొనువాడు బ్రహ్మయోగమును అభ్యాసము చేయలేడు.
శ్లోకం 17 : యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు ।
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా ||
(బ్రహ్మయోగము)
భావము : మితమైన భోజనము, మితమైన పనులు, మితమైన నిద్ర మెలుకవ కల్గువాడు బ్రహ్మయోగమును పొంది దుఃఖమును పొందడు.
శ్లోకం 18 : యదా వినియతం చిత్త మాత్మన్యే వాఽవతిష్ఠతే ।
నిస్స్పృహ స్సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ||
(బ్రహ్మయోగము)
భావము : ఎప్పుడు నియమితమైన చిత్తమును ఆత్మయందే నిలుపగలుగుచున్నాడో, అప్పుడువాడు సర్వకోర్కెలయందు ధ్యాసలేనివాడై, ఆత్మయందే ధ్యాసతో యుండి యోగమును పొందివున్నాడు.
శ్లోకం 19 : యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా ।
యోగినోయత చిత్తస్య యుంజతో యోగ మాత్మనః ||
(బ్రహ్మయోగము)
భావము : నియతచిత్తుడై యోగముతో కూడుకొన్న జీవాత్మకు ఉపమానముగ గాలి వీచనిచోట దీపము కదలకుండ వెలుగునట్లుండునని చెప్పవచ్చును.
వివరము : మనస్సు, బుద్ధి, చిత్తములలో ఏది నిలిచిపోయిన మిగిలినవి అనుబంధముగ నిలిచిపోవును. నియమింపబడిన చిత్తము గలవాడన్నపుడు వానినే నియమిత మనస్సు గలవాడని కూడ చెప్పవచ్చును. ఈ శ్లోకమున చిత్తము నిలిచిపోయిన యోగి అన్నారు. అట్టి వానికి ఆ సమయములో మనస్సు కూడ నిలిచిపోయినదని తెలియాలి. మనో సంకల్ప వికల్పములున్నపుడు బుద్ధి, చిత్తమునకు కూడ పని ఉండును. మనస్సుకు పనిలేనపుడు మిగతా రెండిటికి కూడ పనిలేదు. అట్లే బయటి జ్ఞాన కర్మేంద్రియములకు కూడ పని ఉండదని ముందు కూడ చెప్పియున్నాము.
సాధారణముగ మనస్సు పనిచేయు శరీరములోని జీవాత్మ క్షణక్షణము బయటి నుండి వచ్చు మరియు మనస్సు తెలియజేయు విషయములలోని మానావమానములకు, కష్ట సుఖములకు, శీతోష్ణములకు వచ్చు అనుభూతులు పొందుచుండును. అన్ని వైపుల వీచు గాలి తాకిడికి దీపము అల్లాడునట్లు అనేక విషయముల సుఖదుఃఖముల తాకిడికి అనేకముగ అల్లాడుచునే ఉండును. బ్రహ్మయోగము పొంది మనస్సు ద్వార ఏ విషయము తన వరకు చేరనపుడు, ప్రశాంతత పొంది గాలి వీచనిచోట దీపము కదలక వెలుగునట్లు శరీరంలోని జీవుడుండును. బ్రహ్మయోగము పొందినవాడు ఇంకనూ ఎట్లుండుననగా!
శ్లోకం 20 : యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।
యత్ర చైవాత్మనాఽఽత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ||
(బ్రహ్మయోగము)
భావము : ఎప్పుడు యోగమాచరించుటచేత చిత్తము పనిచేయకుండ పోవుచున్నదో, అపుడు జీవాత్మ ఆత్మను చూచి ఆత్మానందము అనుభవించుచున్నాడు.
వివరము : బ్రహ్మయోగము చేయుట వలన దేహములోని భాగముల కార్యములు అన్నియు స్తంభించిపోవును. నిద్రలో తప్ప మిగతా సమయములలో బుద్ధికి, చిత్తమునకు, జీవునకు ఏదో ఒకటి అందించవలసిన బాధ్యత మనస్సుకున్నది. మానవుని జీవితకాలము ముఖ్యముగ నాలుగు భాగములుగ ఉన్నదని చెప్పవచ్చును. అవియే 1) నిద్ర 2) మెలుకువ 3) స్వప్నము 4) యోగము. నిద్రలో మనస్సుకు ఏ పని ఉండదు. మెలకువలో మనస్సు, ఇంద్రియములు పనిచేయుట అందరికి తెలిసినదే. స్వప్నములో బాహ్యకర్మేంద్రియములు తప్ప అన్ని పని చేయుచున్నవి. యోగములో అనగ బ్రహ్మయోగములో శరీర భాగములన్నియు స్తంభించి ఉన్నప్పటికి మనస్సు, బుద్ధి, చిత్తము, జీవుడు ఎరుక కల్గివుందురు. మనస్సు మాత్రము బయటి విషయములను వదలివుండి అంతర్ముఖముగనున్న విషయమునే తెలుపుచుండును. బ్రహ్మయోగములోనున్నది ఆత్మ తప్ప మనస్సుకు వేరేది లేదు. కనుక ఆత్మయొక్క విషయమునే జీవునకు, బుద్ధికి, చిత్తమునకు తెలియజేయుచుండును. అప్పుడు జీవాత్మ తన మనస్సుచేత ఆత్మను చూడగల్గుచున్నాడు. మనస్సు మధ్యలో లేకపోతే, జీవాత్మ ఆత్మను నేరుగ చూడలేడు. జీవాత్మ మనోదృష్ఠిచేతనే ఆత్మను చూడగల్గుచున్నదని గ్రహించాలి. యోగములో జీవాత్మ మనస్సు అందించు ఆత్మానుభూతిని బుద్ధిద్వార పొందుచున్నదని తెలుసుకొనుము. ఆ సమయములో జీవాత్మ ఆత్మయొక్క అనుభవమును, దానియొక్క ఆనందమును పొందుచున్నాడు.
శ్లోకం 21 : సుఖ మాత్యన్తి కం యత్తద్భుద్ధిగ్రాహ్య మతీంద్రియమ్ ।
వేత్తి యత్రన చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ||
(బ్రహ్మయోగము)
భావము : అనంతమైన ఆ సుఖము ఇంద్రియాతీతము. దానిని బుద్ధిమాత్రము గ్రహించుచున్నది. ఆ సుఖమును గ్రహించినవాడు దానినుండి చలించక నిశ్చలత పొందివుండును.
వివరము : బ్రహ్మయోగ సమయములో మనస్సు జీవునకందించు ఆత్మసుఖము బయటి జ్ఞానేంద్రియములు గ్రహించలేనిది. ఎందుకనగ ఆత్మ సుఖము కన్నులకు కనిపించు అందమైన దృశ్య సుఖము కాదు. కన్నులు అందించు ఏ సుఖము దానికి సరికాదు. కన్నులు, చెవులు, నాలుక అందించు సుఖములకు అతీతముగ ఉన్నది. కావున జ్ఞానేంద్రియములు విషయజ్ఞానమును అందులోని సుఖమును తెలియ జేయునవి మాత్రమే. జ్ఞానేంద్రియములకంటే గొప్పదైన బుద్ధిమాత్రము ఆత్మసుఖమును గ్రహించగలదు. మనస్సు తెలియజేయు ఆత్మయొక్క సుఖమును బుద్ధిగ్రహించి దానిలోని సారమునంతయు వివరముగ తెలుసుకోగల్గుచున్నది. పుట్టినప్పటి నుండి నిత్యము చూస్తున్న ఇంద్రియ సుఖములకంటే ఆత్మసుఖము అనంతమైనదని బుద్ధిగ్రహించి, జీవాత్మకు తెలుపుట చేత జీవుడు స్థిరముగ ఆ సుఖమునే పొందగోరి ఉండును. ఇంతకు ముందెప్పుడు ఇంద్రియముల ద్వార అటువంటి సుఖము పొందని జీవుడు దానినే గొప్పగ తలచియుండును.
శ్లోకం 22 : యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికమ్ తతః ।
యస్మిన్ స్థితో నధుఃఖేన గురుణాపి విచాల్యతే ||
(బ్రహ్మయోగము)
శ్లోకం 23 : తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగ్నితమ్ ।
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణ చేతసా ||
(బ్రహ్మయోగము)
భావము : తనకు లభించు వాటిలో ఇతరములకంటే ఏది అధిక లాభముగ కనిపిస్తున్నదో, పెద్ద దుఃఖము తటస్థించినప్పటికి ఏ స్థితిలో అది తనకు విచారము చలనము కల్గించదో, దుఃఖము పొందుట దేనివలన లేదో, దానిపేరే బ్రహ్మయోగమని తెలియుము. ఈ యోగము యొక్క సారాంశము నిశ్చయముగ తెలిసినవాడు వ్యాకులము లేనివాడై బ్రహ్మయోగమునే ఆచరించును.
వివరము : శరీరము లోపలనున్న జీవునకు చేరు విషయ సుఖములతో పోల్చితే ఆత్మసుఖముకంటే ఇతర ఏ సుఖము అధికముగా కనిపించదు. బ్రహ్మయోగము ఆచరించు సమయములో బయట పెద్ద దుఃఖము కలుగజేయు విషయము సంభవించి ఉన్నప్పటికి ఆ విషయము తనవరకు చేరి విచారమును కల్గించదు. ఈ యోగములో దుఃఖసంయోగమను మాటేలేదు. ఈ యోగమున్నంత వరకు దుఃఖమునకు తావులేక అపరిమితమైన మాటలకందని ఆనందమునే పొందుట కలదు. దీని విషయము తెలిసినవాడు వ్యాకులము లేని మనస్సు గలవాడై ఈ యోగమునే ఆచరించును.
శ్లోకం 24 : సంకల్ప ప్రభవా న్కామాం స్త్యక్త్వా సర్వానశేషతః ।
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమన్తతః ||
(బ్రహ్మయోగము)
శ్లోకం 25 : శనై శ్శనై రుపరమే ద్భుద్ధ్యా ధృతి గృహీతయా ।
ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చిన్తయేత్ ||
(బ్రహ్మయోగము)
భావము : మనో సంకల్పము వలన సంభవించు ఆశ మొదలగు గుణములను నిశ్శేషముగ లేకుండ చేసి, ఇంద్రియ విషయముల నుండి మనస్సును నిగ్రహించి, మరియు ధైర్యముగల బుద్ధిచేత కొద్ది కొద్ధిగ మనస్సును విషయముల నుండి మరల్చి ఆత్మయందే నిలుచునట్లు చేయవలెను.
వివరము : మనస్సుకు యోచనలచేత గుణ విషయములను రేకెత్తించడము ఒక పనికాగ, బయటి ఇంద్రియ విషయములను తెలియజేయడము రెండవ పనిగ ఉన్నదని చెప్పుకున్నాము. ధైర్యముగల బుద్ధిచేత మనస్సును మెల్లమెల్లగ ఇంద్రియ విషయములనుండి మరియు సంకల్పముల నుండి మరల్చవలెను. మనస్సు మాటిమాటికి చంచలముగనుండుట దాని సహజత్వము. అది అధిక చంచలమగుట వలన బుద్ధి అధైర్యపడక, మాటిమాటికి మనస్సుకు హితము చెప్పి విషయముల నుండి మరల్చు ప్రయత్నము చేయుచుండవలెను. మనస్సు యొక్క రెండవ పనియైన సంకల్పమును లేకుండ చేయడమే కష్టమైనపని.
శ్లోకం 26 : యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరం ।
తతస్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్ ||
(బ్రహ్మయోగము)
భావము : అస్థిరము అధిక చంచలమైన మనస్సు దేనివైపు పరుగిడునో, ఆ విషయము నుండి మనస్సును నిగ్రహించి మరల్చి ఆత్మయందే వశమగునట్లు చేయవలెను.
వివరము : మనస్సు అధిక చంచలమైనది మరియు దృఢమైనది. పరమ నీచ విషయములను సహితము యోచించు నీచమైనదియును. దీనిని గురించి వేమనయోగిగారు ఒక పద్యమును కూడ చెప్పాడు.
కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు
పందిని తిన్నవాడు పరమ యోగి
ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానియో
విశ్యాదాభిరామ వినుర వేమ !
మన శరీరములో మనస్సు కుక్కవలే అతి చంచలమైనది. ఒక్క క్షణము కూడ స్థిరముగ ఉండక ఇల్లిల్లు తిరిగినట్లు, మనస్సు కూడ విషయముల మీదికి చలించుచుండును. కుక్క మాదిరి చంచలమైన మనస్సును ఎవడు జయించునో వాడు నిజముగ గురువుతో సమానమే. గురువు మనస్సు జయించి ఉన్నవాడను విషయమును కుక్కను తిన్నవాడు గురులింగడని పై పద్యములో చెప్పారు.
మనస్సు చంచలమైనదియే కాక పరమ నీచమైన విషయముల మీదికి కూడా పోవుచుండును. అందువలన దానిని పందితో సమానముగ పోల్చి, దానిని జయించినవాడు పరమయోగి అని తెల్పుచు, పందిని తిన్నవాడు పరమయోగి అని వర్ణించారు.
మనస్సు చంచలమైనది, నీచమైనదియే కాక దృఢబలమైనదిగ కూడా ఉన్నది. దానిని జయించవలయునని ప్రయత్నము చేసినవారికి సులభముగ లొంగదు. ఎంత బలముగ మనస్సును నిలుపవలయునని ప్రయత్నము చేసిన, అది బలమైనది కనుక పోవుచునే ఉండును. ప్రయత్నమను పగ్గములకు నిలబడక మనలను సులభముగ లాగుకొనిపోవు మనస్సును బలమైనదిగ వర్ణించుచు దానిని ఏనుగుగ పోల్చి చెప్పినారు. అటువంటి బలమైన మనస్సును జయించినవాడు సుజ్ఞాని అని చెప్పుచు ఏనుగును తిన్నవాడు అని అన్నారు.
మనస్సు చంచలమైనది కనుక కుక్కగను, నీచమైనది కనుక పందిగను, బలమైనది కనుక ఏనుగుగాను వర్ణించి, దానిని జయించుటకు తిని లేకుండ చేయడమని వర్ణించి చెప్పినారు.
మనస్సుకు అనేక ఇంద్రియ విషయములు మరియు సంకల్పములు ఆహారములుగ ఉన్నవి. మనస్సుకు బలము లేకుండ చేసి ఒక్కచోట ఉండునట్లు చేయుటకు ముఖ్యముగ సంకల్పములను లేకుండ చేయవలయును. యోగ సాధకునకు ప్రస్తుత ఇంద్రియ విషయములతో అంత ఇబ్బంది ఉండదు. ఎందుకనగ సాధకుడు ప్రస్తుతము ఆ సమయములో వాటి ఇబ్బంది లేకుండునట్లు చేసుకొని కూర్చుండును. వచ్చిన కష్టమంతయు మనస్సు యొక్క సంకల్ప జ్ఞాపకాలతోనేనని తెలియుచున్నది. సాధకునకు ఒక్క మారుగా సంకల్పములు రావు. ఒక దాని తర్వాత ఒకటి వచ్చుచుండును. సాధకుడు బుద్ధిచేత మనస్సును హెచ్చరించుచు సంకల్పములు లేకుండ చేసుకొను ప్రయత్నము చేయుచుండును. అట్లు ప్రయత్నము చేయగా. . చేయగ మనస్సు కొన్ని సెకండ్లు నిలబడి తిరిగి ఆలోచనలోపడుచుండును. ఇట్లు మనస్సుతో పోరాటం చేస్తుండగ, కొంతకాలము జరుగగ అప్పటికి కొంత ఫలితముండును. మనోవేగము తగ్గి వెంటవెంటనే సంకల్పములు రాకుండును. ఒక జ్ఞాపకము తర్వాత ప్రయత్న పూర్వకముగ ఆ విషయమును మనస్సుకు లేకుండ చేసిన వెంటనే మరొక జ్ఞాపకమురాదు. మధ్యలో కొంత వ్యవధి నిరామయస్థితి ఏర్పడును. ఆ స్థితినే నిర్వికల్ప సమాధి అంటున్నారు. అనగ సంకల్పములు లేని సమాధి స్థితి అని అర్థము. ఆ స్థితిని అభ్యాసముచేత పెంచుకుంటూపోగా కొంతకాలమునకు ఒక గంట సేపు యోగసాధన చేస్తే కనీసము 15 లేక 20 నిమిషములైన మనస్సుకు సంకల్పములేనిస్థితి ఏర్పడును. అదియే నిజమైన బ్రహ్మయోగమని తెలియును. కొంతకాలము అట్లే సాధన చేయగ చివరకు ఒక గంటకాలము సాధనలో 30 నిమిషాలో, 40 నిమిషాలో యోగము కాగలదు. పది సంవత్సరములు సాధన చేసినవానికి కూడ గంటకు గంట పూర్తి యోగము కాదు.
మరికొందరు ప్రతిదినము గురూపదేశము ప్రకారము సాధన చేస్తు, నియమము తప్పక పది పదిహేను సంవత్సరములు అభ్యాసము చేసి, మనస్సు ప్రక్క విషయముల మీదికి పోకుండ చేసుకున్నవారు కూడ ఉన్నారు. ఎందరో భూమి మీద సాధనలు చేస్తు మనస్సును నియంత్రించుకొనుచున్నారు. మనస్సును జయించుటకు సంవత్సరముల కాలము పట్టునా అని కొందరికి అనుమానము రావచ్చును. అది వారి వారి సాధనా తీవ్రతను బట్టి ఉండునని చెప్పుచున్నాము. శ్లోకములో మనస్సును గూర్చి చెప్పుచు ఎక్కడెక్కడకు పోవునో అక్కడ నుంచి మరల్చవలెనన్నారు. ఈ అధ్యాయములో 12వ శ్లోకములో "ఏకాగ్రం మనః" అన్నారు. మనస్సును ఏకాగ్రపరుచుకోమని దాని అర్థము. మనస్సును గూర్చి ఇంతవరకు ఎంతో తెలుసుకొన్నప్పటికి, ఇక్కడ మరికొంత తెలుసుకోవాలిసిన అవసరమున్నది. మనస్సుకు అనేక సంకల్ప వికల్పములున్నప్పటికి, అవి అన్నియు ఒక్క మారుగ రావని, ఒకదాని తర్వాత ఒకటి వచ్చునని కూడ తెలుసుకున్నాము. మనస్సుకు ఒక సూత్రము గలదు. అది ఏమనగా! ఒక్క సమయములో ఒక్క యోచన చేయునది మనస్సు. ఒక్క సమయములో ఒకటికంటే ఎక్కువ యోచనలు మనస్సులో ఉండవని అనుభవపూర్వకముగ కూడ తెలియుచున్నది. మనస్సుకు ఒక యోచన తరువాత మరొక యోచనవచ్చును.ఒక సమయములో ఒక యోచన అన్న సూత్రము ప్రకారము ఒక యోచన ఎంత సమయమైన ఉండవచ్చును. అది పోయిన వెంటనే మరొకటి రాగలదు. ఇట్లు అనేక విషయములు మారుచుండును. అనేక విషయములు మనస్సుకు రాకుండా ఒక్క విషయము మీదనే ఉండునట్లు ఎందరో సాధకులు సాధించారని కూడ చెప్పుకొన్నాము. అసలు సమస్య ఇక్కడే ఉన్నది. అది ఏమనగా!
మనస్సుకు సహజమైన పని ఏమి? అను ప్రశ్నవేసుకుంటే దానికి ఇంద్రియ విషయముల జ్ఞప్తి చేయడము లేక బయటి ప్రస్తుత విషయములు లోపలికి తెలియజేయడము. మనస్సు చలించు అనేక విషయములలో ఐదు జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక యొక్క విషయము తప్ప వేరేది ఉండదు. ఈ ఇంద్రియాల యొక్క అనేక విషయములలో ఏక సమయమున, ఏక విషయము మీద ఉన్నది మనస్సను సూత్రము కలదు. ఇప్పుడు అసలు విషయానికొస్తాము. ఒక గురువువద్ద ఒక శిష్యుడు ఉపదేశము తీసుకొన్నాడు. గురువుగారు 'సోహం' అను మంత్రోపదేశముగాని, లేక 'రామ' అను మంత్రోపదేశముగాని, 'నమఃశివాయ' అను మంత్రోపదేశముకాని చేశాడనుకొందాము. అట్లే మరొక శిష్యుడు మరొక గురువునాశ్రయించాడు. ఆ గురువుగారు తన శిష్యునికి మంత్రోపదేశము చేయక ఒక గుర్తును చూపి దానినే చూస్తుండమని దృశ్యోపదేశము చేసాడు. దీనిని తప్ప మరొక విషయమును మనస్సున చేరనీయక సాధన చేయమన్నాడు. గురువులవద్ద ఉపదేశము పొందిన శిష్యులు నియమము ప్రకారము గురువుగారు చెప్పినట్లు మనస్సులో ఇతర విషయములు చేరనీయక వారివారి సాధన చేస్తున్నారు. దాదాపు కొన్ని సంవత్సరములు గడచిన తర్వాత సాధనలో వారి మనస్సును ప్రక్క విషయముల మీదికి పోకుండ చేసుకోగలిగారు. అంతలో ఒక దినము మాలాంటి ఒక వ్యక్తి వారివద్దకు రావడము జరిగినది. మాటల సందర్భములో వారి సాధన విషయము వచ్చినది. వారు చెప్పు విషయమంతా విన్న తర్వాత ఆ క్రొత్త వ్యక్తి మనస్సును గూర్చి వారికర్థమగులాగున చెప్పను మొదలుపెట్టాడు. అనేక విషయములలో చలించు మనస్సు ఒక సమయములో ఒక విషయము మీదనే ఉండును. దానిని మరొక విషయము మీదికి పోకుండ సాధన చేయుట వలన అది ఒక విషయము మీదనే నిలబడును. దానివలన అనేకమునుండి మనస్సును ఏకము మీదికి తెచ్చినట్లైనది. భగవద్గీతలో 'ఏకాగ్రం మనః' అన్నారు. మనస్సును ఏకం నుండి ఏకాగ్రతకు చేర్చమన్నారు. ఏకాగ్రత అనగ ఏ ఒక్క విషయము లేకుండ చేయడమని అర్థము. అట్లు చేయుట వలన ఇంద్రియ ధ్యాసలు పోయి ఆత్మ ధ్యాస మనస్సుకు ఏర్పడును. ఇప్పుడు అనేక సంవత్సరములనుండి సాధన చేసినప్పటికి ఏకములోనున్నారు తప్ప ఏకాగ్రతకు రాలేదు. ఒక్క ఇంద్రియ విషయమును కూడ మనస్సుకు రాకుండ చేయడమే ఏకాగ్రత కాగ, ఒకరేమో చెవి యొక్క వినికిడి విషయమైన శబ్దమునకు సంబంధించిన మంత్రోపదేశము, మరొకరేమో కన్ను చూపు యొక్క విషయమైన దృశ్యోపదేశము పొంది, దానినే సాధన చేయుట ద్వారా ఇంద్రియానికి సంబంధించిన ఒక్క విషయములోనే ఇరుక్కుపోయారు. తమ మనస్సును ఒక విషయము మీదనే ఉంచారు తప్ప ఒకటికంటే పైనవున్న సున్న లేక శూణ్యము మీదికి పంపి ఏకాగ్రత పరుచుకోలేదు. కావున తమది ఏమాత్రము యోగముకాదు. అని నిగ్గు తేల్చి చెప్పెను.
వారేకాదు అలాంటి సాధకులు ఎందరో ఉన్నారు. వారు ఇప్పటికైనా వారి మనస్సును ఏకాగ్రత పరచుకోవాలి. అట్లుకాని ఎడల ఒక రేడియో మెకానిక్ రిపేరు చేయడంలో అరగంటసేపు ఒకే ధ్యాసలో ఉన్నాడనుకొందాము. అట్లే సాధకుడు 'సోహం' మంత్రము మీద అరగంటసేపు ఒకే ధ్యాసలో ఉన్నాడనుకొనుము. ఇద్దరి పని ఒకటే అగును. అందులో ఇద్దరి మనస్సు ఇంద్రియ విషయ ధ్యాసలోనే ఉన్నది తప్ప వేరుకాదు. అందువలన ఈ శ్లోకములో ఏ ఇంద్రియ విషయము మీదికి మనస్సు ప్రాకిన దానినుండి మరల్చవలెనన్నారు. అట్లు చేయుట వలన ఇంద్రియ విషయములు మనస్సునకు చేరవు.
శ్లోకం 27 : ప్రశాన్త మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్ ।
ఉపైతి శాన్త రజసం బ్రహ్మభూత మకల్మషమ్ ||
(బ్రహ్మయోగము)
భావము : ప్రశాంతత పొందిన మనస్సు గలవాడును, రాజసగుణములేనివాడు, ఆత్మానుభవము పొందినవాడు, కర్మకల్మషము లేకుండ చేసుకొనువాడు ఎల్లవేళల ఉత్తమమైన ఆత్మసౌఖ్యమునే పొందుచుండును.
శ్లోకం 28 : యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ విగత కల్మషః ।
సుఖేన బ్రహ్మసంస్పర్శ మత్యన్తం సుఖ మశ్నుతే ||
(బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మయోగి సాధనచేసి ఎల్లవేళల ఆత్మయందునే మనస్సును లయమొనర్చి కర్మ కల్మషములు నశించగ, ఆత్మసుఖమునే పొందుచు అపరిమితమగు ఆనందమును అనుభవించుచుండును.
శ్లోకం 29 : సర్వ భూతస్థ మాత్మానం సర్వభూతాని చాఽత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ||
(బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, అందరి ఎడల ఒకే సమదృష్ఠి కలిగివున్నాడు, సర్వులలో ఆత్మను చూడగల్గుచున్నాడు. మరియు ఆత్మయందే సర్వ భూతములను చూడగల్గుచున్నాడు.
వివరము : బ్రహ్మయోగియైనవాడు సర్వజీవరాసులందు సమదృష్ఠికల్గి ఉన్నాడు. సర్వజీవరాసుల శరీరములలో జీవాత్మతోపాటు ఉన్న ఆత్మను చూడగల్గుచున్నాడు. తన శరీరములో తనతోపాటు ఆత్మవున్నట్లు, మిగతా అన్ని శరీరములలో కూడ అట్లే కలదని అతనికి తెలియుచున్నది. అంతేకాక సర్వజీవరాసులు పరమాత్మయందే కలవని కూడ తెలియుచున్నది. సర్వ సజీవశరీరములలో ఆత్మకలదని, పరమాత్మ యందే సర్వ సజీవశరీరములు వానిలోని ఆత్మయు కలదని తెలియువాడే నిజమైన బ్రహ్మయోగి. బ్రహ్మయోగియైనవాడు తన శరీరములోని ఆత్మను చూడగలిగి, తన శరీరమునకు తనకు (జీవునకు) ఆధారము ఆత్మనియు, తన శరీరములోనున్న ఆత్మవలె అన్ని శరీములలోని ఆత్మలకు ఆధారము మరోకశక్తి ఉన్నదనియు, అదియే ఆత్మకంటే పరముగ ఉన్న పరమాత్మయని తెలియుచున్నాడు.
శ్లోకం 30 : యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : ఎవడు నన్ను అంతటా చూస్తున్నాడో, అంతయు నాయందే చూడగల్గు చున్నాడో, వానిని నేను చూస్తున్నాను. వాడు నన్ను చూస్తున్నాడు.
వివరము : ఎవడైతే సర్వచరాచర ప్రపంచమంతయు అణువణువున పరమాత్మను చూడగల్గుచున్నాడో, వాడు సర్వ ప్రపంచమంతయు పరమాత్మయందే ఉన్నట్లు చూడగల్గును. వాడు ఎల్లపుడు నన్ను చూస్తున్నాడు. నేను ఎల్లపుడు వానిని చూస్తున్నానని పరమాత్మ పల్కిన మాటలివి. ఆత్మను తెలుసుకొన్నవాడు పరమాత్మను సులభముగ తెలుసుకోగలడు. పరమాత్మను తెలుసుకొనుటకు ముఖ్య ఆధారము మన శరీరములోని ఆత్మ. అందువలననే ఈశ్వరలింగము మీద మూడు విభూతిరేఖలను మూడు ఆత్మలుగ పోల్చి మొదటిదైన జీవాత్మ మూడవదైన పరమాత్మను తెలియాలంటే మధ్యదైన ఆత్మను తెలియవలెనని, దానినే ఆరాధించవలెనని, అదియే ఆధారమని తెలియునట్లు మధ్యరేఖకు గుర్తుగ బొట్టుపెట్టారు. మూడు విభూతిరేఖలలో మధ్యదానికి బొట్టుపెట్టుట అర్థముతో కూడుకొన్న పని, అట్లుకాక మధ్యదానిని వదిలి క్రిందిదానికో పైదానికో బొట్టుపెట్టిన అది అర్థములేని కార్యమగును.
(ఇచట ఈ శ్లోకములో చెప్పిన సారాంశమును గ్రహించగా ఆత్మను తెలిస్తే పరమాత్మ యొక్క ఉనికి విధానము ఎట్లున్నది తెలియుచున్నది. కాని పరమాత్మ సంపూర్ణముగ తెలిసినదని అనుకోకూడదు. ఆత్మను తెలియుట వలన పరమాత్మ అంతట వ్యాపించి ఉన్నదను సత్యము, అంతయు ఆయనయందే ఇమిడి ఉన్నదను సత్యము తెలియుచున్నది. అంతమాత్రమున పూర్తి తెలిసి పరమాత్మను అనుభవించినట్లు కాదు. చూచుటకు అనుభవించుటకు ఎంత తేడా ఉండునో ఇక్కడ కూడ అంతే తేడా కలదని తెలియాలి. సజీవముగ ఆత్మను అనుభవించవచ్చును కాని పరమాత్మను సజీవముగ ఎవరు అనుభవించలేరని జ్ఞప్తి పెట్టుకోవలెను.)
శ్లోకం 31 : సర్వ భూత స్థితం యోమాం భజత్యేకత్వ మాస్థితః ।
సర్వధా వర్తమానోఽపి సయోగీమయి వర్తతే ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : సర్వ జీవరాసులలో నేను ఏకరూపముగ ఉండుట తెలిసి ఎవడు నన్ను సేవించునో, పొగడునో అట్టియోగి సర్వదా వర్తించుచున్నప్పటికి అతడు నాయందే వర్తించును.
వివరము : సర్వ జీవరాసులలో ఆత్మలున్నవని తెలిసినవాడు, ఆత్మలకు ఆధారమైన శక్తి మరొకటున్నదని తెలిసినవాడు, ఆ శక్తి లోపల బయటనున్నదని తెలిసినవాడు ఎవడో వాడు యోగములనాచరించుట వలన నన్నారాధించినట్లేయగును. అట్టివాడు ఎక్కడ ఏమి చేయుచున్నను, అతడు నాయందే చేయుచుండునని పరమాత్మ తెలిపాడు. ఆత్మను తెలిసినవాడు పరమాత్మ యొక్క ఉనికిని మాత్రము తెలుసుకోగల్గుచున్నాడు. ఆత్మను అనుభవించినట్లు, దాని సుఖము తెలిసినట్లు పరమాత్మను అనుభవించడము గాని, దాని సుఖము తెలియడముగాని ఎవనికి జరుగదు. యోగి అయినవాడు పరమాత్మ గొప్పతనమును, ఆయన వ్యాపకమును మరియు ఆయన ప్రకృతికి, ఆత్మకు ఆధారమని తెలియగలడు. అంతేగాని ఆయనలోనికి పూర్తి ఐక్యముగాడు. బ్రతికి ఉండువాడు ఎవడు ఆయనవలె మారలేడు. అది మోక్షము పొందిన వారికే సాధ్యమగును. యోగి మోక్షకామియే కాని మోక్షాయుతుడు కాడు. పరమాత్మను చేరవలెనను యత్నపరుడేగాని పరమాత్మను చేరినవాడు కాడు.
శ్లోకం 32 : ఆత్మౌ పమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున ।
సుఖం వా యది వాదుఃఖం సయోగీ పరమో మతః ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : ప్రపంచములో సర్వ జీవరాసులకు సంభవించు సుఖమైన దుఃఖమైన వారిలోని ఆత్మకు సమానముగనున్నట్లు చూచువాడు నిజమైన యోగియని నేననుకొందును.
వివరము : చాలామంది ఈ శ్లోకములో కూడ ఆత్మకు చెప్పుకోవలసిన విషయమును జీవాత్మకు చెప్పుకోవడము జరిగినది. ఒక కష్టము తనకెంతో ఇతరులకు అంతేకావున జీవహింస చేయకూడదని కూడా కొన్ని గీత రచనలలో వ్రాయబడివున్నది. అక్కడ అర్జునునకు భగవంతుడు ఎవరి కర్మను వారనుభవిస్తున్నారు. నీవు బాధ్యుడవు కావు, పాపమును రాకుండ కర్మయోగపద్ధతి ద్వార యుద్ధము చేయమన్నాడు. అలా చెప్పిన శ్రీ కృష్ణుడు శత్రువులను చంపుట హింసయని దయాగుణమును బోధించునా? మంచిది చెడ్డదని యోచించక కర్మరీత్య పనిచేయమని చెప్పినవాడే ఇది పాపము, ఇది పుణ్యము, ఇది చేయమని, ఇది చేయవద్దని చెప్పునా? ఇదంతయు చూచి ఆలోచించిన గీతలో ఈ శ్లోకమునకు వివరము చెప్పినవారిదే పొరపాటని తెలియుచున్నది.
నిజమైన అర్థమేమనగా నీ శరీరములోని ఆత్మ నీవు దుఃఖిస్తున్నను, సంతోషిస్తున్నను రెండిటిని సమానముగ చూస్తున్నది. అలాగే అందరిలో వారివారి ఆత్మ ఆ జీవులు అనుభవించు సుఖమైన, వ్యసనమైన సమానముగ చూస్తున్నది. ఆత్మ సర్వజీవరాసుల ఎడల కష్టసుఖములలో సమముగ సాక్షిగనున్నదని జ్ఞాన దృష్ఠిచే చూడగల్గినవాడు నిజమైన యోగి అని పరమాత్మ పలికినాడు. శ్లోకములో చెప్పువాడు పరమాత్మ కాగ, కర్మ అనుభవించువాడు జీవుడు, సాక్షియై సమానముగ చూచువాడు ఆత్మ. ముగ్గురు పురుషుల విషయము శ్లోకములో ఇమిడి ఉన్నది.
అర్జునుడిట్లనియె :
శ్లోకం 33 : యోఽయం యోగస్త్వయా ప్రోక్త స్సామ్యేన మధుసూదన ! ।
ఏత స్యాహం నపశ్యామి చంచలత్వాత్ స్థితిమ్ స్థిరామ్ ||
(కల్పితము)
శ్లోకం 34 : చంచలమ్ హి మనః కృష్ణ ! ప్రమాథి బలవ ద్దృఢమ్ ।
తస్యాహం నిగ్రహం మన్యే వా యోరివ సుదుష్కరమ్ ||
(బ్రహ్మయోగము)
భావము : నాలోని మనస్సు చంచల స్వభావము కలదైనందువలన నీవు చెప్పిన స్థిరమైన స్థితిని యోగమున పొందలేక ఆత్మసామ్యమును తెలియకున్నాను. అమిత చంచలము, దృఢమైనది, బలమైనదియునైన మనస్సును నిగ్రహించుట దుస్సాధ్యమని తోయుచున్నది కృష్ణా ! గాలినెవరు మూటకట్టగలరు.
వివరము : శ్రీకృష్ణుడు చెప్పిన మాటలన్ని విని అర్జునుడు యోచించి తన అనుమానమును వెంటనే బయటికి చెప్పాడు. గాలిని నూలుగుడ్డలో మూటకట్టుట ఎట్లు సాధ్యము కాదో అట్లే మనస్సును నిగ్రహపరుచుకోవడము సాధ్యముకాదని అర్జునుడు అన్నాడు. ఇక్కడ చెప్పబడిన రెండు (33,34) శ్లోకములలో రెండవదైన 34వ శ్లోకము అర్జునుడు అడిగినదే. 33వ శ్లోకము విషయానికొస్తే భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పుచుండగానే అర్జునుడు ప్రశ్న అడిగాడు. ఆ శ్లోకములో అర్జునుడు యోగము చేసి మనస్సు స్వాధీనపడకయుండినపుడు నీవు చెప్పినట్లు యోగము చేయగా నా మనస్సు స్వాధీనపడలేదు. ఆత్మను సర్వులలో చూడలేక పోయానని అన్నాడంటే నిజమని ఒప్పుకోవచ్చును. అట్లుకాక చెప్పుట మానకనే, వినుట అయిపోకనే యోగము చేసినట్లు ఆయన అనుభవమును అర్జునుడు చెప్పాడనుట పూర్తి అసత్యము. కావున ఈ రెండు శ్లోకములలో క్రిందిదైన 34వ శ్లోకము వాస్తవమని 33వ శ్లోకము అవాస్తవమని తెలియాలి.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 35 : అసంశయం మహా బాహో ! మనోదుర్ని గ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌంతేయ ! వైరాగ్యేణ చ గృహ్యతే ||
(బ్రహ్మయోగము)
శ్లోకం 36 : అసంయ తాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తు ముపాయతః ||
(బ్రహ్మయోగము)
భావము : అర్జునా ! నీవు చెప్పుమాటలో అనుమానము లేదు. మనస్సు నిగ్రహింపబడనిది, చంచలమైనది. అట్టి మనస్సును అభ్యాసవైరాగ్యముల చేత నిల్పవలెను. మనస్సు నిల్పకపోతే ఈ యోగము పొందుట సాధ్యపడదు. కావున మనస్సును నిగ్రహించుటకు చేయు ప్రయత్నమే మంచి ఉపాయము.
వివరము : అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవంతుని జవాబులో క్రొత్తదనమేది లేదు. ఇంతకు ముందు చెప్పినట్లే సాధన తప్ప వేరు ఉపాయములేదని తేల్చి చెప్పాడు. ఏదో అడిగాడుకదాయని ఏ రాయితీ ఇవ్వలేదు. తప్పనిసరిగ అభ్యాసము చేయవలసిందే, ఆ అభ్యాసములో విషయములందు మనస్సుకు వైరాగ్యము కలుగజేయవలసిందే. అదే మనస్సును జయించుటకు ముఖ్యమైన ఉపాయము. మనస్సు నిగ్రహించుట కష్టతరమైన పనియేనని భగవంతుడు కూడ చెప్పాడు. మరియు ఆయనే దానికి కావలసిన ఉపాయము కూడ చెప్పాడు. అందువలన బ్రహ్మయోగ సాధకులు అభ్యాసముతోనే మనస్సును స్వాధీనపరచుకోవలెను. శబ్దమునకు సంబంధించిన మరియు దృశ్యమునకు సంబంధించిన మంత్రములు, ఆకారములు యోగసాధనకాదని తెలియాలి. ఆ సాధనలో మనస్సును నిగ్రహించుకోవలసిన అవసరమే లేదు.
అర్జునుడిట్లనియె :-
5) శ్లో|| 37 : అయతి శ్శ్రద్ధయో పేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ ! గచ్ఛతి ?
(బ్రహ్మయోగము)
5) శ్లో|| 38 : కచ్చిన్నోభయ విభ్రష్ట శ్ఛిన్నా భ్ర మివ నశ్యతి ।
అప్రతిష్ఠో మహాబాహో ! విమూఢో బ్రహ్మణః పథి ?
(బ్రహ్మయోగము)
5) శ్లో|| 39 : ఏతం మే సంశయం కృష్ణ ! చ్ఛేత్తు మర్హ స్యశేషతః ।
త్వదన్య స్సంశయస్యాస్య చ్ఛేత్తా న హ్యుపపద్యతే ||
(బ్రహ్మయోగము)
భావము : శ్రద్ధ కలిగియుండి సంపూర్ణ ప్రయత్నము చేసినను మనోచలనము చేత యోగికాలేనివాని గతి ఏమి? ఆత్మదర్శన మార్గములో అప్రతిష్ఠుడైన మూఢుని గతి ఏమి? ఓ కృష్ణా నాకున్న ఈ సంశయమును నీవే తీర్చవలయును. నీవు తప్ప నా సంశయమును. ఇతరులెవరు తీర్చలేరు.
వివరము : బ్రహ్మయోగమాచరించి దానిద్వార ఆత్మను తెలియాలనుకొన్నవాడు పూర్తి శ్రద్ధతో యోగసాధన చేయుచుండగ, మనస్సు విషయ ధ్యాసల నుండి మరలక యోగము లభ్యము కాలేదు. కాని వాడు అలాగే పట్టుదలగ సాధన సాగించుచుండగ ఆయువు అయిపోయిన దానివలన మరణము సంభవించినది. అట్టివానిని గురించి అర్జునునకు అనుమానము వచ్చినది. వాడు అందరివలె ప్రపంచ విషయములలో లేకుండ ఆత్మను తెలుసుకోవాలని ప్రయత్నములో యోగసాధన చేయుచున్నాడు. అయినప్పటికి వాడు పూర్తిగ యోగము సాధించకనే చనిపోతే వాని పుట్టుక ఎట్లుండును? ఇప్పుడు చేసిన యోగసాధనా ప్రయత్నమంతయు వృథాయేనా? లేక అంతో ఇంతో ఫలితముండునా? ఈ జన్మలో జ్ఞానము మరుజన్మలో కల్గునా? ఇట్లు అనేక ప్రశ్నలు అర్జునునికి రాగ వచ్చిన సంశయమును వెంటనే అడిగాడు. వాస్తవానికి బ్రహ్మయోగి యోగము పొందిన తర్వాత కూడ కర్మ అయిపోవువరకు కొన్ని జన్మలెత్తవలసి ఉండును. మోక్షము పొందుటకు పూర్తిగ కర్మ అయిపోవాలి కదా! యోగముచే కర్మ అయిపోవు వరకు యోగికి జన్మలుండవలెను. ఒకే జన్మలో పూర్తి కర్మ అయిపోదు. అటువంటి జన్మరాహిత్య ప్రయత్నములోనున్నవాని జన్మల గూర్చి భగవంతుడిట్లనుచున్నాడు.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 40 : పార్థ! నై వేహ నాఽముత్ర వినాశ స్తస్య విద్యతే ।
నహి కల్యాణకృ త్కశ్చి ద్గుర్గతిం తాత ! గచ్ఛతి ||
(జీవుడు)
భావము : మంచి పనులు చేయువానికి మంచే జరుగును. ఈ జన్మలోగాని మరి ఏ జన్మలోగాని వాని సాధనకు నాశనముండదు.
వివరము : మంచి చేయువానికి మంచి ఫలితము తప్పకవుండును. ఈ జన్మలో యోగమాచరించి మరణములోపల సాధించలేని యోగికి చెడు ఎప్పటికి జరుగదు. వాని మనస్సులోని ఉద్దేశ్యమేముండునో మరణానంతరము మరుజన్మలో కూడ అదియే ఉండును. అందువలననే పుట్టి పెరుగువారు కొంత వయస్సుకు ఒక్కొక్కడు ఒక్కొక్క పనిలో ఆసక్తి చూపువాడై ఉండును. వానికున్న ఆసక్తి ప్రకారమే ఆ పనిలోనే ప్రావీణ్యత సంపాదించును. చిన్న వయస్సులోనే సంగీతమును మొత్తమును సాధించువాడు గడిచిన జన్మలో సంగీత సాధకునిగ ఉండును. అట్లే యోగవిద్యలో కూడ ఉండవచ్చును.
శ్లోకం 41 : ప్రాప్య పుణ్య కృతాం లోకా నుషిత్వా శాశ్వతీ స్సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ||
(జీవాత్మ)
భావము : యోగభ్రష్టులైనవారు పుణ్యము చేసినవారు పొందులోకములనే తాము పొంది, పరిశుద్ధమైన జ్ఞానము కలవారింటిలో పుట్టగలుగుదురు.
వివరము : ఇక్కడ ఈ శ్లోకములో ఇతరులు వ్రాసిన దానికి మేము వ్రాయుదానికి చాలా భేదమున్నది. ఒకటి రెండు శ్లోకాలకైతే ఏదో పొరపాటనుకోవచ్చును, సవరించి వ్రాయవచ్చును. చాలా శ్లోకాలకు భావాలను సరిదిద్ది ముందు వ్రాసిన వారికి వ్యతిరిక్త దిశలో వ్రాయాలంటే మాకు కూడా కష్టమే. చాలా చోట్ల విభేదించుట వలన కొందరు మా వ్రాతలే తప్పనుకొనుటకు అవకాశము గలదు. ఇన్ని శ్లోకములకు తప్పు వ్రాసియుంటారా! అను అనుమానము ఎవరికైన రాకతప్పదు. ఆ అనుమానము మాకే వస్తుందంటే నమ్మలేరు. ఎంతో చిన్న విషయమును కూడ గ్రుడ్డిగ తప్పు వ్రాసిన దానిని బట్టి గొప్పవారు ఇలా వ్రాయుటేమిటని అనుకోవలసిందే. దైవ విరుద్ధమైన మాయ మాములు ప్రజలందరికంటే బోధకుల మీదనే ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకనగ వీరు చెప్పు బోధను బట్టి మిగతా ప్రజలు నడుచుకుంటారు. మొదట బోధకులనే తప్పుదారి పట్టిస్తే అందరిని పట్టించినట్లగును. అందువలన బోధకుల తలలోనున్న మాయ అక్కడక్కడ తప్పుదారి పట్టించి వ్రాయించిందను కుంటాము. అలాకాకపోతే యోగసాధకులు ధనికుల ఇల్లలో పుట్టడమేమిటి.? శ్రీమంతులకు జ్ఞానము లభించుట సూదిరంధ్రములో ఒంటె దూరినట్లేనని ఏసుప్రభువు సెలవిచ్చాడు. వాస్తవముగ అనుభవపూర్వకముగ చూచిన, కష్టాలలో ఉన్నవాడే అంతో ఇంతో దైవాన్ని తలచుకొనుచున్నాడు తప్ప, ధనికులలో ఆ ధ్యాసలేదనియే చెప్పవచ్చును. ధనికుడుగనున్న వాడు తిరిగి ధనమునే సంపాదించు ధ్యాసలో మునిగివున్నాడు. ధనికులలో ఎక్కడైన భక్తి కనిపిస్తే అదియు డబ్బుతో చేయించునదియే కాని మనసుతో చేయునదిగ ఉండదు.
ఇంకో విధముగ గమనిస్తే యోగభ్రష్టులు శ్రీమంతుల ఇల్లలో పుట్టుదురను మాట పెద్దలు గ్రుడ్డిగ వ్రాసినది తప్ప వాస్తవము కాదని చెప్పవచ్చును. ఎందుకనగా నేడు డబ్బున్నవారు ఉదయము లేచింది మొదలు పాపపుపనులు చేయుటలో నిమగ్నమైనారు. దీనిని బట్టి వారికి వెనుకజన్మలలో జ్ఞానమనునది ఏమాత్రము లేదనియే చెప్పవచ్చును. మరికొందరు ధనికులైనవారు జ్ఞానులను సహితము వారి మాట ప్రకారము నడువవలెనని చెప్పుచున్నారు. గురువులన్నా, యోగులన్నా ఏమాత్రము విలువనివ్వని ధనమున్నవారు పూర్వజన్మలో యోగులా? కావున యోగభ్రష్టులైనవారు శ్రీమంతుల ఇల్లలో పుట్టుట శుద్ధ అబద్ధము. శ్రీమంతుల ఇల్లలో పుట్టినవారు ఒకవేళ ఈ జన్మలో జ్ఞానము సంపాదించుకొనుట జరుగవచ్చును. ఇప్పటి ధనికులు వెనుకటి యోగులు మాత్రము కారు.
పై శ్లోకములో 'శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే' అన్న మాటలో 'శ్రీమతాం' అనుమాటకు శ్రీమతుల అని అర్థము. శ్రీ అనగ శుభమైన, మతి అనగ జ్ఞానము. శ్రీమతాం అనగ శుభప్రదమైన ఆత్మజ్ఞానము కలవారని అర్ధముండగ శ్రీమతాం అను పదమునకు ధనికులనడమేమిటి. శ్రీమంతాం అనగ ధనికులనియే చెప్పవచ్చును. కాని శ్రీమతాం అన్నమాటకు జ్ఞానులనియే చెప్పాలి. చాలామంది వ్రాసినట్లు యోగులు మరుజన్మలో ధనికులుగ పుట్టుదురను మాటను వదలివేసి, యోగులకు మరుజన్మ యోగుల గృహములలోనే కల్గునను అర్థముతోనే చెప్పు కొందాము.
మనము చేయు పనులను బట్టి పాపపుణ్యములు రావడము జరుగుచున్నది. రకరకాల పాపపుణ్యములలో భక్తిమార్గపు పుణ్యములు కూడ ఉండును. అటువంటి పుణ్యము గలవాడు సాత్త్వికులుగ పుట్టగలుగుదురు. వారికున్న భక్తి ప్రవృత్తుల బట్టి నెమలిపింఛములో చూపినట్లు ఆత్మకు దగ్గరగనున్న గుణభాగమైన సాత్త్వికములో పుట్టుచుందురు. సాత్త్విక గుణభాగములోనున్నవారు పరిపూర్ణ జ్ఞానులై చివరకు యోగులగుటకు అవకాశము గలదు. తామస, రాజస, సాత్త్వికములైన ముల్లోకములలో యోగభ్రష్టులైన వారు సాత్త్విక లోకములో పుట్టుచుందురు. వారికి మోక్షము కలుగువరకు ఎన్ని జన్మలు కల్గిన, శాశ్వితముగ జన్మలన్ని సమానముగ సాత్త్వికములోనే కల్గును. సాత్త్వికలోకమున గల మనుషులలో పరిశుద్ధ పవిత్ర ఆత్మజ్ఞానము కల్గిన వారుండు గృహములలోనే జన్మించుదురు. తల్లిదండ్రులే జ్ఞానులుగ ఉండనవసరము లేదు. పుట్టు ఇంటిలో తాత ముత్తాతలైన జ్ఞానులుగ ఉండవలెను. అట్లుండుటవలన వారి వంశ పరంపరకు సంబంధించిన జీన్సు వలన కొడుకుగనో, మనువడిగనో, మునిమనువడుగనో పుట్టవచ్చును.
ఈ విషయమునంతటిని బట్టి పైశ్లోకము యొక్క నిజభావము ఇలాగున్నది. యోగభ్రష్టుడైనవాడు పుణ్యపరులకు లభించు సాత్త్వికలోకములో ఎన్నో జన్మలు సమానముగ కల్గుచుండును. ఆ జన్మలు శుచి కల్గిన పవిత్రమైన జ్ఞానముగల వారిల్లలోనే కల్గుచుండును. ఇంతకుమినహా వేరుగ అర్థము చేసుకోకూడదు. లోకములనగ స్వర్గ, నరకలోకములని అవి ఎక్కడోనున్నవని చెప్పుకోకూడదు. లోకములున్నవి మూడే, అవి మనలోనే ఉన్నవి. లోకములు మనలో తప్ప బయట ఎక్కడలేవు. ఇవి మూడుకాక లోకముకానిలోకమొకటున్నది. దానితో నాల్గు లోకములగును. దానినే ముల్లోకముల కావల ఆలోకంబున్నదని పోతన కూడ చెప్పాడు. స్వర్గనరక లోకములు ఎక్కడున్నాయను అనుమానము కొందరికుండ వచ్చును. మూడు లోకములైన వాటిలోనే స్వర్గ నరకములున్నాయి. శరీరములోనే అనుభవించు సుఖములు స్వర్గము. మరియు శరీరములోనే అనుభవించు కష్టములు నరకము. స్వర్గనరకములు రెండు మన శరీరములో సజీవముగనున్నపుడే ఉన్నవి. అవి మూడు గుణభాగములలోనే ఉన్నవి. కనుక వాటిని కూడ లోకములనుట జరిగినది. అవి మూడులోకములలోనివేనని తెలియాలి. ఈ శ్లోక వివరము అర్థమగుటకు బాగా ఆలోచించాలని కోరుచున్నాము.
శ్లోకం 42 : అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్ ।
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||
(జీవాత్మ)
భావము : అట్లుకాకున్న ధీమంతులైన యోగుల వంశములోనైన పుట్టును. అట్టి లోకపు జన్మ పొందుట ఎంతో దుర్లభము కదా!
వివరము : యోగ సాధకుడు జ్ఞానపరుల ఇండ్లలో పుట్టునని చెప్పుకొన్నాము. అట్లుకాకపోతే యోగపరుల ఇండ్లలోనైన పుట్టవచ్చునని కూడ భగవంతుడు తెలియజేశాడు. భూమి మీద ఆధ్యాత్మికతతో సంబంధమున్నవారు, ఆత్మజ్ఞానము తెలిసిన జ్ఞానులు మరియు తెలిసినది సాధించిన యోగులుకలరు. అట్టి జ్ఞానులు, యోగుల వద్దనే యోగభ్రష్టుడు పుట్టుట వలన తిరిగి యోగము సాధించుటకు వీలగును. పుట్టిన ఇంటిలో ప్రస్తుతము యోగులు ఉండవచ్చును లేక రెండు మూడు తరముల క్రిందయైన ఉండవచ్చును. అందువలన శ్లోకములో 'యోగినామేవ కులేభవతి' అన్నారు దానికి యోగులకు సంబంధించిన వంశమందేనని అర్థము.
శ్లోకం 43 : తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికమ్ ।
యతతే చ తతో భూయ స్సంసిద్ధౌ కురునందన! ||
(జీవాత్మ)
భావము : అట్లు మరుజన్మము పొందినవాడు, తన పూర్వదేహమునందు గల జ్ఞానము బుద్ధికి తోయగ, మరల మోక్షసిద్ధి కొరకు సంపూర్ణ ప్రయత్నము చేయుచుండును.
వివరము : యోగపరుడు మరణించిన తర్వాత జ్ఞానుల వంశములోకాని, యోగుల వంశములోకాని పుట్టి కొంతకాలము పెరిగి, తర్వాత వయస్సు రానురాను వానియందు బుద్ధికి జ్ఞానజిజ్ఞాస ఏర్పడును. అట్లు జిజ్ఞాస ఏర్పడుట వలన వాడు తిరిగి యోగసాధనకు సంబంధించిన మార్గముననే నడుచుటకు ప్రయత్నము చేయును. మొదట ఏదో ఒక కారణముచేత వాని బుద్ధికి జ్ఞానము మీద శ్రద్ధ ఏర్పడును. అట్లు ఏర్పడిన శ్రద్ధయే అన్ని శ్రద్ధలకంటే ఎక్కువగా ఉండును. ఒకచోట వందమంది కలిసి యోగమునకు సంబంధించిన పుస్తకము చదివారనుకొనుము. అందులో ఒక్కనికి మాత్రము అదే చింత వాని బుద్ధికి యోచనై కూర్చున్నదనుకొనుము. అది వాని పూర్వజన్మ సుకృతమని కొందరందురు. అట్లే పూర్వజన్మ సంస్కారమని కూడ అందురు.
శ్లోకం 44 :పూర్వాభ్యాసేన తేనైన హ్రియాతే హ్యవశోఽపి సః ।
జిజ్ఞాసు రపి యోగస్య శబ్ద బ్రహ్మఽతి వర్తతే ||
(జీవాత్మ)
భావము : పూర్వజన్మ అభ్యాస బలముచేత లాగబడి ఈ జన్మలో కూడ యోగము ఆచరించవచ్చును. అటువంటి జిజ్ఞాసులు శబ్ద బ్రహ్మమధిగమించి పోవుచున్నారు.
వివరము : నాద బ్రహ్మము, దృశ్యబ్రహ్మము అని రెండు రకములు కలవు. భూమిమీద గురువులు అందరు వారివారి శిష్యులకు వీటినే ఉపదేశిస్తుందురు. నాదబ్రహ్మమనగ శబ్దముతో కూడుకొన్న దైవము మంత్రమని, అట్లే దృశ్యబ్రహ్మమనగా ఆకార స్వరూప బ్రహ్మము గుర్తు అని చెప్పుకొనుచుందురు. వాటినే ఉపదేశములుగ చెప్పుట పరిపాటైనది. ఇక్కడ యోగమాచరించువాడు దృశ్యనాదములకతీతమైన ఆత్మశక్తి (జ్ఞానాగ్ని)ని పొందుచున్నాడు. నాదబ్రహ్మము అనబడు మంత్రోపదేశము కంటే యోగము ఉత్తమమని తెలియుచున్నది. మంత్రధ్యాసలో తపోఫలము లభించుచున్నది. యోగములో జ్ఞానాగ్నియే లభిస్తుంది. తపోఫలముకంటే జ్ఞానశక్తి ఎన్నో రెట్లు అధికమని చెప్పవచ్చును. కావున యోగి శబ్దబ్రహ్మమధిగమించిన వాడని చెప్పవచ్చును.
శ్లోకం 45 : ప్రయత్నా ద్యత మానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః ।
అనేక జన్మసంసిద్ధ స్తతో యాతి పరాంగతిమ్ ||
(జీవాత్మ)
భావము : అనేక జన్మలనెత్తుచు దృఢప్రయత్నము చేసి యోగమును పొందగల్గి, తనకువున్న సర్వకర్మలు పోయిన తర్వాత పరమును పొందగల్గును.
వివరము : యోగి కావాలనుకొన్నవాడు యోగమును సాధించుటకు వాని ప్రయత్నమును బట్టి సంవత్సరకాలముగాని, కొన్ని సంవత్సరములుకాని, లేక జన్మలు కాని పట్టవచ్చును. చివరకు యోగి అయినవాడు మోక్షము పొందుటకు కొన్ని జన్మలు పట్టును. కర్మమంతయు నశించుటకు కొన్ని జన్మలు తప్పక పట్టును. కర్మ అయిపోవునంత వరకు జన్మలు తప్పవు. కర్మంతయు అనగ తనకున్న పాపపుణ్యములన్నియు శేషములేకుండ అయిపోయిన క్షణమే శరీరమును వదలి సర్వవ్యాపి అయిన మోక్షమును పొందును. ఒకే జన్మలో యోగమును సాధించవచ్చునేమో కాని మోక్షమును సాధించలేము. ప్రయత్నపరునికి అనేక జన్మల సంస్కార ఫలమే మోక్షము కాగలదు.
శ్లోకం 46 : తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||
(జీవాత్మ)
భావము : తపస్వికులకంటే యోగి అధికుడు. అట్లే జ్ఞానులకంటే ఉత్తముడు కర్మములు చేయువారికంటే గొప్పవాడు. కావున నీవు యోగివేకమ్ము.
వివరము : దైవమును ఆరాధించు విధానములను మూడు రకములుగ విభజించు కోవచ్చును. ఒకటి యోగము, రెండు తపస్సు, మూడు వ్రతక్రతవులు, యజ్ఞ యాగములు, అనేక విధ గ్రహ విగ్రహ పూజలు. మూడు తెగలలో ఎవరినడిగిన మేము దైవారాధకులమనియే చెప్పుచుందురు. ఈ మూడు విధానములలో ఏది పెద్దదని యోచించిన, అనేక విధ పూజలు చేయువారికంటే తపస్సు చేయువారు గొప్పని, తపస్వికులకంటే యోగులు గొప్పవారని తెలియుచున్నది. సాధారణ పూజలు చేయువారిలో ఏ శక్తి ఉండదు. వారు తమ కోర్కెల నిమిత్తము చెట్లకు, జంతువులకు, గ్రామ దేవతలకు పూజ చేయుచుందురు. మరికొందరు మంత్రోపాసకులై చిన్నచిన్న క్షుద్రదేవతలను వశముగావించు కొన్నవారున్నారు. మంత్రమును నియమము ప్రకారము జపించి దానివలన కొంత శక్తిని పొందినవారు కూడవున్నారు. మంత్రము జపించడమును తపస్సని చెప్పవచ్చును. చిల్లర పూజలు చేయువారు మొదటి తరగతివారైతే, మంత్రజపము చేయువారు రెండవ తరగతివారు. ఈ శ్లోకములో మొదటితరగతివారైన పూజా కార్యములు అనగ కార్యములతో కూడుకొన్న పూజలు చేయువారని చెప్పారు. వంగడము, లేవడము, ప్రదక్షిణలు చేయడము మొదలగు కార్యములతో కూడుకొన్న దానివలన వారిని కార్యములు చేయువారని చెప్పడము జరిగినది.
రెండవ తరగతి క్రిందికి లెక్కగట్టబడిన మంత్రజపము చేయువారిని తపస్వికులు అంటున్నాము. మంత్రమును ఉద్దేశ్యముతో తపించడము వలన వారు చేయునది తపస్సని అంటున్నాము. వీరిలో తీవ్ర తపముచేసి దేవతలను సాక్షాత్కరింప జేసుకొన్నారని పూర్వులు చెప్పగ విన్నాము. ఇప్పటి కాలములో మంత్రజపము చేసి దేవతలను వశపరుచుకొని వారిద్వారకొన్ని పనులు జరుపుకొనువారున్నారని చెప్పవచ్చును. అలా జరుగుటకు దేవతలు వశమగుటకు ఏదో ఒక శక్తి అవసరము. ఆ శక్తినే తపశ్శక్తి అనగలుగుచున్నాము. మంత్రమేదైనకావచ్చును, వానిలో ఉద్దేశ్యమేదైన కావచ్చును, మంత్రజపము చేయువానిని తపస్వికుడని చెప్పవచ్చును.
మూడవ తరగతికి చెందిన యోగులు ప్రత్యేకించినవారై ఉన్నారు. వీరు పూజాకార్యములు చేయరు. మంత్రజపములు చేయరు. ఇంద్రియాలకు అతీతమైన మనస్సు అహముల యొక్క జయమే వీరి ముఖ్య ఉద్దేశ్యమైవుండును. దానిద్వార వీరి కర్మ కాలిపోయి అన్నిటికంటే గొప్పదైన పరమాత్మలోనికే ఐక్యమై పోవుదురు. వీరు బ్రహ్మయోగులుగ కొందరు, కర్మయోగులుగ కొందరు కలరు. కర్మయోగులైన వారు పూజలు చేయువారికంటే, తపస్సు చేయువారికంటే తక్కువ వారిగ కనిపిస్తారు. సాధారణ పూజలు చేయువారిని మంత్రజపము చేయువారు వారి శక్తిచేత ఇబ్బంది పెట్టవచ్చును. ఉదాహరణకు ఒక మాంత్రికుడు తన వశములో ఉన్న ఒక దేవతాపేరుకల శక్తితో మరొక పూజారిని అనారోగ్యపాలు చేశాడు. మా వద్దకు వచ్చిన పూజారిలోపలనున్న అనారోగ్యకారణమైన ఆ దేవతను ప్రశ్నించగ ఫలానా మాంత్రికుని ఆదేశానుసారము ఈ విధముగ చేశానని ఆ దేవత చెప్పడము జరిగినది. దీనిని బట్టి పూజలు చేయువారికంటే తపస్వికుడు అధికుడని తెలియుచున్నది.
మాంత్రికులచేత ప్రయోగింపబడిన శక్తులు యోగులవద్ద భంగపడి వెను తిరిగిపోయిన ఎన్నో సంఘటనలు జరిగినవి ఉన్నాయి. మంత్రసాధనచే లభించిన తపశ్శక్తికంటే యోగులవద్ద గల జ్ఞానాగ్ని ఎంతో పవిత్రమైనది. అణువణువున వ్యాపించిన పరమాత్మశక్తియే జ్ఞానాగ్నిగా తయా రైనది. కనుక దానిని ఏ శక్తి తాకలేదు. అందువలన తపస్వికులకంటే యోగులధికులు. అంతేకాక యోగమునకు మార్గమును చూపునది జ్ఞానము. జ్ఞానము తెలిసిన తర్వాత యోగము సాధించనగును. జ్ఞానము యొక్క ఫలము యోగమగును. అందువలన జ్ఞానముకంటే యోగమధికమైనది. పూజా కార్యములు చేయువారికంటే తపస్వికులు అధికులుకాగ, తపస్వికులకంటే జ్ఞానులు అధికులు కాగ, జ్ఞానులకంటే యోగులధికులని చెప్పవచ్చును. అన్నిటికంటే యోగులధికులైన దానివలన శ్లోకములో పూజకర్మలు చేయువారికంటే తపస్వికులకంటే, జ్ఞానులకంటే యోగులధికులన్నారు.
శ్లోకం 47 : యోగినా మపి సర్వేషాం మద్గతే నాన్త రాత్మనా ।
శ్రద్ధావాన్ భజతే యోమాం స మేయుక్తతమో మతః ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : సర్వయోగులందు ఎవడు నా గతియైన మోక్షము కొరకు ఆత్మను యోగ ఆచరణచే పొందగల్గి నన్నే భజించునో, వాడు ఉత్తమ యోగి అని నా అభిమతము.
వివరము : భూమిమీద మానవులలో పూజలు చేయువారు ఎందరో ఉన్నారు. అట్లే మంత్రజపము చేయువారు కూడ ఉన్నారు. అంతో ఇంతో జ్ఞానము కలవారు ఉన్నారు. చాలా తక్కువ సంఖ్యలో కొన్ని వేలలో ఒక్కడు యోగసాధన చేయువాడు ఉన్నాడు. అటువంటి వారిలో ఎవడో అరుదుగ యోగము సాధించకల్గువాడు కలడు. చివరకు లెక్కవేస్తే కొన్ని లక్షల జనాభాలో ఒక యోగి దొరకవచ్చును. ఇది ఇప్పటి పరిస్థితి. ఆ కొద్దిమంది యోగులలో పరమాత్మను చేరుటకు ముఖద్వారము ఆత్మయేనని తెలిసి, ఆత్మను తొందరగ పొంది కర్మలనాశనము తొందరగా కావాలంటే, సాకారమైన భగవంతుని భజించాలని తెలిసి భజించువాడు యోగులలో ఉత్తముడు అన్నారు.
యోగులలో యోగము పొందిన తర్వాత యోగియే అగును. అందులో ఉత్తముడని నీచుడని హెచ్చుతగ్గులుండవు. ఇక్కడ ఉత్తముడనుటలో ఆ అర్థము తీసుకోకూడదు. యోగము ద్వార కర్మ కాలిపోవు కాలముకంటే తొందరగ మోక్షము పొందువాడని అర్థము. ఉదాహరణకు టేప్ రికార్డర్ లో నిదానముగ రికార్డ్ అవడము సాధారణమైన పనికాగ, ప్రత్యేకించి వేగముగ రికార్డు చేయు పద్ధతొకటున్నది. అన్ని టేప్ రికార్డులలో మామూలుగ రికార్డవు అవకాశముండగ, ప్రత్యేకించిన రికార్డర్లలో మాత్రమే స్పీడ్ రికార్డింగ్ ఉన్నట్లు, యోగులందరికి లేని ప్రత్యేకత వానికెందుకు ఉన్నదనగా వాడు సాకారమైన భగవంతున్ని కూడ గుర్తించి భజించుచున్నాడు. అందువలన వానికర్మ స్పీడ్ గా కాలిపోవుచున్నది. మామూలు యోగి ఒకే జన్మలో మోక్షము పొందలేడు. కర్మ అయిపోవుటకు కొన్ని జన్మలు పట్టవచ్చును. పూర్తి కర్మ అయిపోయిన జన్మలో మోక్షము పొందునని 45వ శ్లోకములో 'అనేక జన్మసంసిద్ధ' అని చెప్పుకొన్నాము. ఇక్కడ 'యోగినామపి సర్వేషాం ఉక్త తమోమతః' అన్నారు. సర్వ యోగులలో ప్రత్యేకించినవాడని చెప్పారు. ప్రత్యేకత కల్గిన యోగి ఒకే జన్మలోనే మోక్షము పొందును. దీనిని బట్టి యోగులలో ఉత్తముడన్నారు తప్ప వేరు అర్థము లేదు. సాకారమైన పరమాత్మ భగవంతునిగ భూమిమీద తెలియడము దుర్లభమైన పని అంత దుర్లభమైన దానిని తెలియుటలో ఆ యోగికి ప్రత్యేకతవున్నదని తెలియుము.
సర్వయోగులలో పరమాత్మ సాకారమును తెలిసి యోగము చేయువాడు ఉత్తమ యోగి. సాకారరూపము గురించి ఏమాత్రము తెలియక యోగము మాత్రము తెలిసినవాడు సాధారణ యోగి. సాధారణ యోగులే కరువైన ఈ కాలములో ఒకే జన్మలో మోక్షము పొందు ప్రత్యేకమైన యోగి దొరకడము కష్టము. అదియు పరమాత్మ భూమిమీద భగవంతునిగ సాకారరూపములో ఉన్నపుడే ఉత్తమ యోగులుండుటకు అవకాశము గలదు.
-----------------------------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత
శ్రీ భగవంతుడిట్లనియె:-
శ్లోకం 1:అనాశ్రితః కర్మఫలమ్ కార్యం కర్మకరోతి యః |
స సన్న్యాసీ చ యోగీ చ ననిరగ్ని ర్నచాక్రియః||
(కర్మయోగము)
భావము : కర్మఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. అగ్నిలేనటువంటివాడు, పనులు మానుకొన్నవాడు యోగికాడు మరియు సన్న్యాసి కాడు.
శ్లోకం 2: యం సన్న్యాస మితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |
నహ్య సన్న్యస్త స్సంకల్పో యోగీ భవతి కశ్చన ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : జ్ఞానులు దేనిని సన్న్యాసమందురో అదియే కర్మయోగమని తెలియుము. మనిషి సంకల్పరహితుడైనప్పుడే యోగము ప్రాప్తించును.
శ్లోకం 3 : ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మ కారణ ముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : యోగసాధనకు కారణము కర్మ అని చెప్పబడుచున్నది. యోగికి కారణము కర్మనాశనమని చెప్పబడుచున్నది.
శ్లోకం 4: యదా హి చేంద్రియార్థేషు నకర్మ స్వను షజ్జతే ।
సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢస్త దోచ్యతే ||
(బ్రహ్మయోగము)
భావము: ఇంద్రియ విషయములయందు, వాటి పనులయందు ఎప్పుడైతే సంగవర్జితము ఏర్పడునో అపుడే వానిని యోగి అనియు, మరియు సర్వసంకల్పసన్న్యాసీ అనియు అందురు.
శ్లోకం 5: ఉద్ధరే దాత్మనాఽఽత్మానం నాఽత్మాన మనసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మానో బన్దు రాత్మైవ రిపురాత్మనః ||
(పరమాత్మ,ఆత్మ,జీవాత్మ)
భావము : ఆత్మచేత ఆత్మకు ఔన్నత్యగతియు, మరియు ఆత్మచేత ఆత్మకు అధోగతియు ఏర్పడుచున్నది. అందువలన ఆత్మకు ఆత్మే బంధువు మరియు ఆత్మకు ఆత్మే శత్రువుగ ఉన్నది.
శ్లోకం 6 : బంధు రాత్మాఽఽత్మన స్తస్య యేనాత్మైవాఽత్మనా జితః ।
అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాఽత్మైవ శత్రువత్ ||
(పరమాత్మ, ఆత్మ, జీవాత్మ)
భావము : ఎవడు ఆత్మను తెలుసుకొన్నాడో, వానికి ఆత్మ బంధువుగనున్నది. అట్లే ఎవడు ఆత్మను తెలుసుకోలేడో, వానికి ఆత్మ శత్రువుగ కూడా ఉన్నది.
శ్లోకం 7: జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావ మానయోః ||
(బ్రహ్మయోగము)
భావము : ఆత్మను తెలిసినవాడు పరమాత్మ ఎడల ప్రశాంతత పొందియుండును. అట్టివాడు శీతోష్ణ సుఖదుఃఖములందు, అట్లే మానావమానములందు సమానత్వము కల్గివుండును.
శ్లోకం 8 : జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః ||
(బ్రహ్మయోగము)
శ్లోకం 9: సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు ।
సాదుష్వపిచ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే ||
(బ్రహ్మయోగము)
భావము : జ్ఞాన విజ్ఞాన తృప్తుడు, ఆత్మతో ఆనందములో మునిగియున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, నిజమైన బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, మన్ను, రాయి, బంగారను భేదముల ధ్యాసలేనివాడు, స్నేహితులందు సుహృధ్భావము కలవానియందు శత్రువులయందు, బంధువులయందు మిగతావారందరి ఎడల సమతనుండువాడే యోగి.
శ్లోకం 10 : యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః ||
(బ్రహ్మయోగము)
భావము : యోగి సతతము ఆత్మతో కలసియుండి రహస్యముగ ఉండును. ఏకాకిగ ఆశలెల్ల విడచి ఏది గ్రహించనివాడై, నియమించిన చిత్తము కలవాడై ఉండును.
శ్లోకం 11 : శుచౌదేశే ప్రతిష్ఠాప్య స్థిర మాసన మాత్మనః ।
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరమ్ ||
(బ్రహ్మయోగము)
భావము : ఎత్తు తగ్గులులేని శుభ్రమైన స్థలములో యోగసాధనకు కూర్చొనునట్లు స్థిరాసనము ఏర్పరచుకొని దానిమీద దర్భలువేసి, దర్భలమీద చర్మము, చర్మముమీద గుడ్డ పరచియుంచుకొని కూర్చొనవలెను.
శ్లోకం 12 : తత్రై కాగ్రం మనః కృత్వాయత చిత్తేంద్రియ క్రియః ।
ఉపవి శ్యాసనే యుంజ్యాద్యోగ మాత్మ విశుద్ధయే ||
(బ్రహ్మయోగము)
భావము : ఆసనము తయారు చేసుకొని కూర్చొని మనస్సును ఏకాగ్రతనొనర్చి, ఇంద్రియములను, చిత్తము యొక్క పనులను అణచివేసి ఆత్మప్రాప్తి కొరకు బ్రహ్మయోగమును అభ్యసింపవలెను.
శ్లోకం 13 : సమంకాయ శిరోగ్రీవం ధారయ న్నచలం స్థిరః ।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చాఽన్నవలోకయన్ ||
(బ్రహ్మయోగము)
భావము : శరీరము, శిరస్సు, కంఠము మూడిటిని సమముగ అచంచలముగ నిలిపి, తన దృష్ఠిని నాసికాగ్రములో నిలిపి ప్రక్కదిక్కులు చూడకుండనుండవలెను.
శ్లోకం 14 : ప్రశాన్తాత్మా విగతభీ ర్బ్రహ్మ చారి వ్రతే స్థితః ।
మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ||
(బ్రహ్మయోగము)
భావము : ప్రశాంతుడగుచు, బ్రహ్మచారి వ్రతము పూనినవాడై, భయములేనివాడై, ఆత్మయందే చిత్తమునుంచి మనస్సును అణచి కూర్చొనవలయును.
శ్లోకం 15:యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ నియత మానసః ।
శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థా మధిగచ్ఛతి. ||
(బ్రహ్మయోగము)
భావము : యోగి ఎల్లప్పుడు మనస్సును నియమించిన వాడైయుండి నేననుగ్రహించు మోక్షమను శాంతిని పొందగలుగును.
శ్లోకం 16 : నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంత మనశ్నతః ।
నచాతి స్వప్న శీలస్య జాగ్రతో నైవ చార్జున ||
(బ్రహ్మయోగము)
భావము : అమితముగ భుజించువాడు, ఎక్కువగా ఉపవాసముండువాడు, నిదుర పోతు, నిష్ప్రయోజనముగ మేల్కొనువాడు బ్రహ్మయోగమును అభ్యాసము చేయలేడు.
శ్లోకం 17 : యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు ।
యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా ||
(బ్రహ్మయోగము)
భావము : మితమైన భోజనము, మితమైన పనులు, మితమైన నిద్ర మెలుకవ కల్గువాడు బ్రహ్మయోగమును పొంది దుఃఖమును పొందడు.
శ్లోకం 18 : యదా వినియతం చిత్త మాత్మన్యే వాఽవతిష్ఠతే ।
నిస్స్పృహ స్సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ||
(బ్రహ్మయోగము)
భావము : ఎప్పుడు నియమితమైన చిత్తమును ఆత్మయందే నిలుపగలుగుచున్నాడో, అప్పుడువాడు సర్వకోర్కెలయందు ధ్యాసలేనివాడై, ఆత్మయందే ధ్యాసతో యుండి యోగమును పొందివున్నాడు.
శ్లోకం 19 : యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా ।
యోగినోయత చిత్తస్య యుంజతో యోగ మాత్మనః ||
(బ్రహ్మయోగము)
భావము : నియతచిత్తుడై యోగముతో కూడుకొన్న జీవాత్మకు ఉపమానముగ గాలి వీచనిచోట దీపము కదలకుండ వెలుగునట్లుండునని చెప్పవచ్చును.
శ్లోకం 20 : యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।
యత్ర చైవాత్మనాఽఽత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ||
(బ్రహ్మయోగము)
భావము : ఎప్పుడు యోగమాచరించుటచేత చిత్తము పనిచేయకుండ పోవుచున్నదో, అపుడు జీవాత్మ ఆత్మను చూచి ఆత్మానందము అనుభవించుచున్నాడు.
శ్లోకం 21 : సుఖ మాత్యన్తి కం యత్తద్భుద్ధిగ్రాహ్య మతీంద్రియమ్ ।
వేత్తి యత్రన చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ||
(బ్రహ్మయోగము)
భావము : అనంతమైన ఆ సుఖము ఇంద్రియాతీతము. దానిని బుద్ధిమాత్రము గ్రహించుచున్నది. ఆ సుఖమును గ్రహించినవాడు దానినుండి చలించక నిశ్చలత పొందివుండును.
శ్లోకం 22 : యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికమ్ తతః ।
యస్మిన్ స్థితో నధుఃఖేన గురుణాపి విచాల్యతే ||
(బ్రహ్మయోగము)
శ్లోకం 23 : తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగ్నితమ్ ।
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణ చేతసా ||
(బ్రహ్మయోగము)
భావము : తనకు లభించు వాటిలో ఇతరములకంటే ఏది అధిక లాభముగ కనిపిస్తున్నదో, పెద్ద దుఃఖము తటస్థించినప్పటికి ఏ స్థితిలో అది తనకు విచారము చలనము కల్గించదో, దుఃఖము పొందుట దేనివలన లేదో, దానిపేరే బ్రహ్మయోగమని తెలియుము. ఈ యోగము యొక్క సారాంశము నిశ్చయముగ తెలిసినవాడు వ్యాకులము లేనివాడై బ్రహ్మయోగమునే ఆచరించును.
శ్లోకం 24 : సంకల్ప ప్రభవా న్కామాం స్త్యక్త్వా సర్వానశేషతః ।
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమన్తతః ||
(బ్రహ్మయోగము)
శ్లోకం 25 : శనై శ్శనై రుపరమే ద్భుద్ధ్యా ధృతి గృహీతయా ।
ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చిన్తయేత్ ||
(బ్రహ్మయోగము)
భావము : మనో సంకల్పము వలన సంభవించు ఆశ మొదలగు గుణములను నిశ్శేషముగ లేకుండ చేసి, ఇంద్రియ విషయముల నుండి మనస్సును నిగ్రహించి, మరియు ధైర్యముగల బుద్ధిచేత కొద్ది కొద్ధిగ మనస్సును విషయముల నుండి మరల్చి ఆత్మయందే నిలుచునట్లు చేయవలెను.
శ్లోకం 26 : యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరం ।
తతస్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్ ||
(బ్రహ్మయోగము)
భావము : అస్థిరము అధిక చంచలమైన మనస్సు దేనివైపు పరుగిడునో, ఆ విషయము నుండి మనస్సును నిగ్రహించి మరల్చి ఆత్మయందే వశమగునట్లు చేయవలెను.
శ్లోకం 27 : ప్రశాన్త మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమమ్ ।
ఉపైతి శాన్త రజసం బ్రహ్మభూత మకల్మషమ్ ||
(బ్రహ్మయోగము)
భావము : ప్రశాంతత పొందిన మనస్సు గలవాడును, రాజసగుణములేనివాడు, ఆత్మానుభవము పొందినవాడు, కర్మకల్మషము లేకుండ చేసుకొనువాడు ఎల్లవేళల ఉత్తమమైన ఆత్మసౌఖ్యమునే పొందుచుండును.
శ్లోకం 28 : యుంజన్నేవం సదాఽఽత్మానం యోగీ విగత కల్మషః ।
సుఖేన బ్రహ్మసంస్పర్శ మత్యన్తం సుఖ మశ్నుతే ||
(బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మయోగి సాధనచేసి ఎల్లవేళల ఆత్మయందునే మనస్సును లయమొనర్చి కర్మ కల్మషములు నశించగ, ఆత్మసుఖమునే పొందుచు అపరిమితమగు ఆనందమును అనుభవించుచుండును.
శ్లోకం 29 : సర్వ భూతస్థ మాత్మానం సర్వభూతాని చాఽత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ||
(బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, అందరి ఎడల ఒకే సమదృష్ఠి కలిగివున్నాడు, సర్వులలో ఆత్మను చూడగల్గుచున్నాడు. మరియు ఆత్మయందే సర్వ భూతములను చూడగల్గుచున్నాడు.
శ్లోకం 30 : యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : ఎవడు నన్ను అంతటా చూస్తున్నాడో, అంతయు నాయందే చూడగల్గు చున్నాడో, వానిని నేను చూస్తున్నాను. వాడు నన్ను చూస్తున్నాడు.
శ్లోకం 31 : సర్వ భూత స్థితం యోమాం భజత్యేకత్వ మాస్థితః ।
సర్వధా వర్తమానోఽపి సయోగీమయి వర్తతే ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : సర్వ జీవరాసులలో నేను ఏకరూపముగ ఉండుట తెలిసి ఎవడు నన్ను సేవించునో, పొగడునో అట్టియోగి సర్వదా వర్తించుచున్నప్పటికి అతడు నాయందే వర్తించును.
శ్లోకం 32 : ఆత్మౌ పమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున ।
సుఖం వా యది వాదుఃఖం సయోగీ పరమో మతః ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : ప్రపంచములో సర్వ జీవరాసులకు సంభవించు సుఖమైన దుఃఖమైన వారిలోని ఆత్మకు సమానముగనున్నట్లు చూచువాడు నిజమైన యోగియని నేననుకొందును.
అర్జునుడిట్లనియె :
శ్లోకం 33 : యోఽయం యోగస్త్వయా ప్రోక్త స్సామ్యేన మధుసూదన ! ।
ఏత స్యాహం నపశ్యామి చంచలత్వాత్ స్థితిమ్ స్థిరామ్ ||
(కల్పితము)
శ్లోకం 34 : చంచలమ్ హి మనః కృష్ణ ! ప్రమాథి బలవ ద్దృఢమ్ ।
తస్యాహం నిగ్రహం మన్యే వా యోరివ సుదుష్కరమ్ ||
(బ్రహ్మయోగము)
భావము : నాలోని మనస్సు చంచల స్వభావము కలదైనందువలన నీవు చెప్పిన స్థిరమైన స్థితిని యోగమున పొందలేక ఆత్మసామ్యమును తెలియకున్నాను. అమిత చంచలము, దృఢమైనది, బలమైనదియునైన మనస్సును నిగ్రహించుట దుస్సాధ్యమని తోయుచున్నది కృష్ణా ! గాలినెవరు మూటకట్టగలరు.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 35 : అసంశయం మహా బాహో ! మనోదుర్ని గ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌంతేయ ! వైరాగ్యేణ చ గృహ్యతే ||
(బ్రహ్మయోగము)
శ్లోకం 36 : అసంయ తాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తు ముపాయతః ||
(బ్రహ్మయోగము)
భావము : అర్జునా ! నీవు చెప్పుమాటలో అనుమానము లేదు. మనస్సు నిగ్రహింపబడనిది, చంచలమైనది. అట్టి మనస్సును అభ్యాసవైరాగ్యముల చేత నిల్పవలెను. మనస్సు నిల్పకపోతే ఈ యోగము పొందుట సాధ్యపడదు. కావున మనస్సును నిగ్రహించుటకు చేయు ప్రయత్నమే మంచి ఉపాయము.
అర్జునుడిట్లనియె :-
5) శ్లో|| 37 : అయతి శ్శ్రద్ధయో పేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ ! గచ్ఛతి ?
(బ్రహ్మయోగము)
5) శ్లో|| 38 : కచ్చిన్నోభయ విభ్రష్ట శ్ఛిన్నా భ్ర మివ నశ్యతి ।
అప్రతిష్ఠో మహాబాహో ! విమూఢో బ్రహ్మణః పథి ?
(బ్రహ్మయోగము)
5) శ్లో|| 39 : ఏతం మే సంశయం కృష్ణ ! చ్ఛేత్తు మర్హ స్యశేషతః ।
త్వదన్య స్సంశయస్యాస్య చ్ఛేత్తా న హ్యుపపద్యతే ||
(బ్రహ్మయోగము)
భావము : శ్రద్ధ కలిగియుండి సంపూర్ణ ప్రయత్నము చేసినను మనోచలనము చేత యోగికాలేనివాని గతి ఏమి? ఆత్మదర్శన మార్గములో అప్రతిష్ఠుడైన మూఢుని గతి ఏమి? ఓ కృష్ణా నాకున్న ఈ సంశయమును నీవే తీర్చవలయును. నీవు తప్ప నా సంశయమును. ఇతరులెవరు తీర్చలేరు.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 40 : పార్థ! నై వేహ నాఽముత్ర వినాశ స్తస్య విద్యతే ।
నహి కల్యాణకృ త్కశ్చి ద్గుర్గతిం తాత ! గచ్ఛతి ||
(జీవుడు)
భావము : మంచి పనులు చేయువానికి మంచే జరుగును. ఈ జన్మలోగాని మరి ఏ జన్మలోగాని వాని సాధనకు నాశనముండదు.
శ్లోకం 41 : ప్రాప్య పుణ్య కృతాం లోకా నుషిత్వా శాశ్వతీ స్సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ||
(జీవాత్మ)
భావము : యోగభ్రష్టులైనవారు పుణ్యము చేసినవారు పొందులోకములనే తాము పొంది, పరిశుద్ధమైన జ్ఞానము కలవారింటిలో పుట్టగలుగుదురు.
శ్లోకం 42 : అథవా యోగినా మేవ కులే భవతి ధీమతామ్ ।
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ||
(జీవాత్మ)
భావము : అట్లుకాకున్న ధీమంతులైన యోగుల వంశములోనైన పుట్టును. అట్టి లోకపు జన్మ పొందుట ఎంతో దుర్లభము కదా!
శ్లోకం 43 : తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికమ్ ।
యతతే చ తతో భూయ స్సంసిద్ధౌ కురునందన! ||
(జీవాత్మ)
భావము : అట్లు మరుజన్మము పొందినవాడు, తన పూర్వదేహమునందు గల జ్ఞానము బుద్ధికి తోయగ, మరల మోక్షసిద్ధి కొరకు సంపూర్ణ ప్రయత్నము చేయుచుండును.
శ్లోకం 44 :పూర్వాభ్యాసేన తేనైన హ్రియాతే హ్యవశోఽపి సః ।
జిజ్ఞాసు రపి యోగస్య శబ్ద బ్రహ్మఽతి వర్తతే ||
(జీవాత్మ)
భావము : పూర్వజన్మ అభ్యాస బలముచేత లాగబడి ఈ జన్మలో కూడ యోగము ఆచరించవచ్చును. అటువంటి జిజ్ఞాసులు శబ్ద బ్రహ్మమధిగమించి పోవుచున్నారు.
శ్లోకం 45 : ప్రయత్నా ద్యత మానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః ।
అనేక జన్మసంసిద్ధ స్తతో యాతి పరాంగతిమ్ ||
(జీవాత్మ)
భావము : అనేక జన్మలనెత్తుచు దృఢప్రయత్నము చేసి యోగమును పొందగల్గి, తనకువున్న సర్వకర్మలు పోయిన తర్వాత పరమును పొందగల్గును.
శ్లోకం 46 : తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||
(జీవాత్మ)
భావము : తపస్వికులకంటే యోగి అధికుడు. అట్లే జ్ఞానులకంటే ఉత్తముడు కర్మములు చేయువారికంటే గొప్పవాడు. కావున నీవు యోగివేకమ్ము.
శ్లోకం 47 : యోగినా మపి సర్వేషాం మద్గతే నాన్త రాత్మనా ।
శ్రద్ధావాన్ భజతే యోమాం స మేయుక్తతమో మతః ||
(జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : సర్వయోగులందు ఎవడు నా గతియైన మోక్షము కొరకు ఆత్మను యోగ ఆచరణచే పొందగల్గి నన్నే భజించునో, వాడు ఉత్తమ యోగి అని నా అభిమతము.
------------------------------------------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత
శ్రీ భగవంతుడిట్లనియె:-
శ్లోకం 1: (కర్మయోగము)
భావము : కర్మఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయునో వాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి. అగ్నిలేనటువంటివాడు, పనులు మానుకొన్నవాడు యోగికాడు మరియు సన్న్యాసి కాడు.
శ్లోకం 2: (కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : జ్ఞానులు దేనిని సన్న్యాసమందురో అదియే కర్మయోగమని తెలియుము. మనిషి సంకల్పరహితుడైనప్పుడే యోగము ప్రాప్తించును.
శ్లోకం 3 : (కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : యోగసాధనకు కారణము కర్మ అని చెప్పబడుచున్నది. యోగికి కారణము కర్మనాశనమని చెప్పబడుచున్నది.
శ్లోకం 4: (బ్రహ్మయోగము)
భావము: ఇంద్రియ విషయములయందు, వాటి పనులయందు ఎప్పుడైతే సంగవర్జితము ఏర్పడునో అపుడే వానిని యోగి అనియు, మరియు సర్వసంకల్పసన్న్యాసీ అనియు అందురు.
శ్లోకం 5: (పరమాత్మ,ఆత్మ,జీవాత్మ)
భావము : ఆత్మచేత ఆత్మకు ఔన్నత్యగతియు, మరియు ఆత్మచేత ఆత్మకు అధోగతియు ఏర్పడుచున్నది. అందువలన ఆత్మకు ఆత్మే బంధువు మరియు ఆత్మకు ఆత్మే శత్రువుగ ఉన్నది.
శ్లోకం 6 : (పరమాత్మ, ఆత్మ, జీవాత్మ)
భావము : ఎవడు ఆత్మను తెలుసుకొన్నాడో, వానికి ఆత్మ బంధువుగనున్నది. అట్లే ఎవడు ఆత్మను తెలుసుకోలేడో, వానికి ఆత్మ శత్రువుగ కూడా ఉన్నది.
శ్లోకం 7: (బ్రహ్మయోగము)
భావము : ఆత్మను తెలిసినవాడు పరమాత్మ ఎడల ప్రశాంతత పొందియుండును. అట్టివాడు శీతోష్ణ సుఖదుఃఖములందు, అట్లే మానావమానములందు సమానత్వము కల్గివుండును.
శ్లోకం 8 : (బ్రహ్మయోగము)
శ్లోకం 9: (బ్రహ్మయోగము)
భావము : జ్ఞాన విజ్ఞాన తృప్తుడు, ఆత్మతో ఆనందములో మునిగియున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, నిజమైన బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, మన్ను, రాయి, బంగారను భేదముల ధ్యాసలేనివాడు, స్నేహితులందు సుహృధ్భావము కలవానియందు శత్రువులయందు, బంధువులయందు మిగతావారందరి ఎడల సమతనుండువాడే యోగి.
శ్లోకం 10 : (బ్రహ్మయోగము)
భావము : యోగి సతతము ఆత్మతో కలసియుండి రహస్యముగ ఉండును. ఏకాకిగ ఆశలెల్ల విడచి ఏది గ్రహించనివాడై, నియమించిన చిత్తము కలవాడై ఉండును.
శ్లోకం 11 : (బ్రహ్మయోగము)
భావము : ఎత్తు తగ్గులులేని శుభ్రమైన స్థలములో యోగసాధనకు కూర్చొనునట్లు స్థిరాసనము ఏర్పరచుకొని దానిమీద దర్భలువేసి, దర్భలమీద చర్మము, చర్మముమీద గుడ్డ పరచియుంచుకొని కూర్చొనవలెను.
శ్లోకం 12 : (బ్రహ్మయోగము)
భావము : ఆసనము తయారు చేసుకొని కూర్చొని మనస్సును ఏకాగ్రతనొనర్చి, ఇంద్రియములను, చిత్తము యొక్క పనులను అణచివేసి ఆత్మప్రాప్తి కొరకు బ్రహ్మయోగమును అభ్యసింపవలెను.
శ్లోకం 13 : (బ్రహ్మయోగము)
భావము : శరీరము, శిరస్సు, కంఠము మూడిటిని సమముగ అచంచలముగ నిలిపి, తన దృష్ఠిని నాసికాగ్రములో నిలిపి ప్రక్కదిక్కులు చూడకుండనుండవలెను.
శ్లోకం 14 : (బ్రహ్మయోగము)
భావము : ప్రశాంతుడగుచు, బ్రహ్మచారి వ్రతము పూనినవాడై, భయములేనివాడై, ఆత్మయందే చిత్తమునుంచి మనస్సును అణచి కూర్చొనవలయును.
శ్లోకం 15: (బ్రహ్మయోగము)
భావము : యోగి ఎల్లప్పుడు మనస్సును నియమించిన వాడైయుండి నేననుగ్రహించు మోక్షమను శాంతిని పొందగలుగును.
శ్లోకం 16 : (బ్రహ్మయోగము)
భావము : అమితముగ భుజించువాడు, ఎక్కువగా ఉపవాసముండువాడు, నిదుర పోతు, నిష్ప్రయోజనముగ మేల్కొనువాడు బ్రహ్మయోగమును అభ్యాసము చేయలేడు.
శ్లోకం 17 : (బ్రహ్మయోగము)
భావము : మితమైన భోజనము, మితమైన పనులు, మితమైన నిద్ర మెలుకవ కల్గువాడు బ్రహ్మయోగమును పొంది దుఃఖమును పొందడు.
శ్లోకం 18 : (బ్రహ్మయోగము)
భావము : ఎప్పుడు నియమితమైన చిత్తమును ఆత్మయందే నిలుపగలుగుచున్నాడో, అప్పుడువాడు సర్వకోర్కెలయందు ధ్యాసలేనివాడై, ఆత్మయందే ధ్యాసతో యుండి యోగమును పొందివున్నాడు.
శ్లోకం 19 : (బ్రహ్మయోగము)
భావము : నియతచిత్తుడై యోగముతో కూడుకొన్న జీవాత్మకు ఉపమానముగ గాలి వీచనిచోట దీపము కదలకుండ వెలుగునట్లుండునని చెప్పవచ్చును.
శ్లోకం 20 : (బ్రహ్మయోగము)
భావము : ఎప్పుడు యోగమాచరించుటచేత చిత్తము పనిచేయకుండ పోవుచున్నదో, అపుడు జీవాత్మ ఆత్మను చూచి ఆత్మానందము అనుభవించుచున్నాడు.
శ్లోకం 21 : (బ్రహ్మయోగము)
భావము : అనంతమైన ఆ సుఖము ఇంద్రియాతీతము. దానిని బుద్ధిమాత్రము గ్రహించుచున్నది. ఆ సుఖమును గ్రహించినవాడు దానినుండి చలించక నిశ్చలత పొందివుండును.
శ్లోకం 22 : (బ్రహ్మయోగము)
శ్లోకం 23 : (బ్రహ్మయోగము)
భావము : తనకు లభించు వాటిలో ఇతరములకంటే ఏది అధిక లాభముగ కనిపిస్తున్నదో, పెద్ద దుఃఖము తటస్థించినప్పటికి ఏ స్థితిలో అది తనకు విచారము చలనము కల్గించదో, దుఃఖము పొందుట దేనివలన లేదో, దానిపేరే బ్రహ్మయోగమని తెలియుము. ఈ యోగము యొక్క సారాంశము నిశ్చయముగ తెలిసినవాడు వ్యాకులము లేనివాడై బ్రహ్మయోగమునే ఆచరించును.
శ్లోకం 24 : (బ్రహ్మయోగము)
శ్లోకం 25 : (బ్రహ్మయోగము)
భావము : మనో సంకల్పము వలన సంభవించు ఆశ మొదలగు గుణములను నిశ్శేషముగ లేకుండ చేసి, ఇంద్రియ విషయముల నుండి మనస్సును నిగ్రహించి, మరియు ధైర్యముగల బుద్ధిచేత కొద్ది కొద్ధిగ మనస్సును విషయముల నుండి మరల్చి ఆత్మయందే నిలుచునట్లు చేయవలెను.
శ్లోకం 26 : (బ్రహ్మయోగము)
భావము : అస్థిరము అధిక చంచలమైన మనస్సు దేనివైపు పరుగిడునో, ఆ విషయము నుండి మనస్సును నిగ్రహించి మరల్చి ఆత్మయందే వశమగునట్లు చేయవలెను.
శ్లోకం 27 : (బ్రహ్మయోగము)
భావము : ప్రశాంతత పొందిన మనస్సు గలవాడును, రాజసగుణములేనివాడు, ఆత్మానుభవము పొందినవాడు, కర్మకల్మషము లేకుండ చేసుకొనువాడు ఎల్లవేళల ఉత్తమమైన ఆత్మసౌఖ్యమునే పొందుచుండును.
శ్లోకం 28 : (బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మయోగి సాధనచేసి ఎల్లవేళల ఆత్మయందునే మనస్సును లయమొనర్చి కర్మ కల్మషములు నశించగ, ఆత్మసుఖమునే పొందుచు అపరిమితమగు ఆనందమును అనుభవించుచుండును.
శ్లోకం 29 : (బ్రహ్మయోగము)
భావము : బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, అందరి ఎడల ఒకే సమదృష్ఠి కలిగివున్నాడు, సర్వులలో ఆత్మను చూడగల్గుచున్నాడు. మరియు ఆత్మయందే సర్వ భూతములను చూడగల్గుచున్నాడు.
శ్లోకం 30 : (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : ఎవడు నన్ను అంతటా చూస్తున్నాడో, అంతయు నాయందే చూడగల్గు చున్నాడో, వానిని నేను చూస్తున్నాను. వాడు నన్ను చూస్తున్నాడు.
(ఇచట ఈ శ్లోకములో చెప్పిన సారాంశమును గ్రహించగా ఆత్మను తెలిస్తే పరమాత్మ యొక్క ఉనికి విధానము ఎట్లున్నది తెలియుచున్నది. కాని పరమాత్మ సంపూర్ణముగ తెలిసినదని అనుకోకూడదు. ఆత్మను తెలియుట వలన పరమాత్మ అంతట వ్యాపించి ఉన్నదను సత్యము, అంతయు ఆయనయందే ఇమిడి ఉన్నదను సత్యము తెలియుచున్నది. అంతమాత్రమున పూర్తి తెలిసి పరమాత్మను అనుభవించినట్లు కాదు. చూచుటకు అనుభవించుటకు ఎంత తేడా ఉండునో ఇక్కడ కూడ అంతే తేడా కలదని తెలియాలి. సజీవముగ ఆత్మను అనుభవించవచ్చును కాని పరమాత్మను సజీవముగ ఎవరు అనుభవించలేరని జ్ఞప్తి పెట్టుకోవలెను.)
శ్లోకం 31 : (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : సర్వ జీవరాసులలో నేను ఏకరూపముగ ఉండుట తెలిసి ఎవడు నన్ను సేవించునో, పొగడునో అట్టియోగి సర్వదా వర్తించుచున్నప్పటికి అతడు నాయందే వర్తించును.
శ్లోకం 32 : (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : ప్రపంచములో సర్వ జీవరాసులకు సంభవించు సుఖమైన దుఃఖమైన వారిలోని ఆత్మకు సమానముగనున్నట్లు చూచువాడు నిజమైన యోగియని నేననుకొందును.
అర్జునుడిట్లనియె :
శ్లోకం 33 : (కల్పితము)
శ్లోకం 34 : (బ్రహ్మయోగము)
భావము : నాలోని మనస్సు చంచల స్వభావము కలదైనందువలన నీవు చెప్పిన స్థిరమైన స్థితిని యోగమున పొందలేక ఆత్మసామ్యమును తెలియకున్నాను. అమిత చంచలము, దృఢమైనది, బలమైనదియునైన మనస్సును నిగ్రహించుట దుస్సాధ్యమని తోయుచున్నది కృష్ణా ! గాలినెవరు మూటకట్టగలరు.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 35 : (బ్రహ్మయోగము)
శ్లోకం 36 : (బ్రహ్మయోగము)
భావము : అర్జునా ! నీవు చెప్పుమాటలో అనుమానము లేదు. మనస్సు నిగ్రహింపబడనిది, చంచలమైనది. అట్టి మనస్సును అభ్యాసవైరాగ్యముల చేత నిల్పవలెను. మనస్సు నిల్పకపోతే ఈ యోగము పొందుట సాధ్యపడదు. కావున మనస్సును నిగ్రహించుటకు చేయు ప్రయత్నమే మంచి ఉపాయము.
అర్జునుడిట్లనియె :-
5) శ్లో|| 37 : అయతి శ్శ్రద్ధయో పేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ ! గచ్ఛతి ?
(బ్రహ్మయోగము)
5) శ్లో|| 38 : కచ్చిన్నోభయ విభ్రష్ట శ్ఛిన్నా భ్ర మివ నశ్యతి ।
అప్రతిష్ఠో మహాబాహో ! విమూఢో బ్రహ్మణః పథి ?
(బ్రహ్మయోగము)
5) శ్లో|| 39 : ఏతం మే సంశయం కృష్ణ ! చ్ఛేత్తు మర్హ స్యశేషతః ।
త్వదన్య స్సంశయస్యాస్య చ్ఛేత్తా న హ్యుపపద్యతే ||
(బ్రహ్మయోగము)
భావము : శ్రద్ధ కలిగియుండి సంపూర్ణ ప్రయత్నము చేసినను మనోచలనము చేత యోగికాలేనివాని గతి ఏమి? ఆత్మదర్శన మార్గములో అప్రతిష్ఠుడైన మూఢుని గతి ఏమి? ఓ కృష్ణా నాకున్న ఈ సంశయమును నీవే తీర్చవలయును. నీవు తప్ప నా సంశయమును. ఇతరులెవరు తీర్చలేరు.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 40 : (జీవుడు)
భావము : మంచి పనులు చేయువానికి మంచే జరుగును. ఈ జన్మలోగాని మరి ఏ జన్మలోగాని వాని సాధనకు నాశనముండదు.
శ్లోకం 41 : (జీవాత్మ)
భావము : యోగభ్రష్టులైనవారు పుణ్యము చేసినవారు పొందులోకములనే తాము పొంది, పరిశుద్ధమైన జ్ఞానము కలవారింటిలో పుట్టగలుగుదురు.
శ్లోకం 42 : (జీవాత్మ)
భావము : అట్లుకాకున్న ధీమంతులైన యోగుల వంశములోనైన పుట్టును. అట్టి లోకపు జన్మ పొందుట ఎంతో దుర్లభము కదా!
శ్లోకం 43 : (జీవాత్మ)
భావము : అట్లు మరుజన్మము పొందినవాడు, తన పూర్వదేహమునందు గల జ్ఞానము బుద్ధికి తోయగ, మరల మోక్షసిద్ధి కొరకు సంపూర్ణ ప్రయత్నము చేయుచుండును.
శ్లోకం 44 : (జీవాత్మ)
భావము : పూర్వజన్మ అభ్యాస బలముచేత లాగబడి ఈ జన్మలో కూడ యోగము ఆచరించవచ్చును. అటువంటి జిజ్ఞాసులు శబ్ద బ్రహ్మమధిగమించి పోవుచున్నారు.
శ్లోకం 45 : (జీవాత్మ)
భావము : అనేక జన్మలనెత్తుచు దృఢప్రయత్నము చేసి యోగమును పొందగల్గి, తనకువున్న సర్వకర్మలు పోయిన తర్వాత పరమును పొందగల్గును.
శ్లోకం 46 : (జీవాత్మ)
భావము : తపస్వికులకంటే యోగి అధికుడు. అట్లే జ్ఞానులకంటే ఉత్తముడు కర్మములు చేయువారికంటే గొప్పవాడు. కావున నీవు యోగివేకమ్ము.
శ్లోకం 47 : (జీవాత్మ, ఆత్మ, పరమాత్మ)
భావము : సర్వయోగులందు ఎవడు నా గతియైన మోక్షము కొరకు ఆత్మను యోగ ఆచరణచే పొందగల్గి నన్నే భజించునో, వాడు ఉత్తమ యోగి అని నా అభిమతము.