pss book:ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు:యోహాన్ ప్రకటన గ్రంథము
ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు:
☜ యోహాన్ ప్రకటన గ్రంథము :
(14) యోహాన్ ప్రకటన, 9వ అధ్యాయము, 4, 5, 6 వచనములు:
(4) నొసళ్లయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న, గడ్డికైనను, ఏ మ్రొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను.
(5) మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గానీ, ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును.
(6) ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు గానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గానీ మరణము వారి వద్ద నుండి పారి పోవును.
ఈ వాక్యములకంటే ముందున్న మూడవ వాక్యములో ఇలా గలదు. (9-3) ''పొగలో నుండి మిడుతలు భూమిమీదికి వచ్చెను. భూమిలో యుండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను'' అని చెప్పియున్నారు. పొగ నుండి మిడుతలు వచ్చెను అన్నారు. ఇక్కడ పొగ అనగా కట్టెలు మండుట వలన వచ్చు పొగలాంటిది కాదు. చలికాలము ఉదయము వేళ సూర్యుడు కనిపించకుండా ఆకాశములో నిండుకొను పొగమంచులాంటి మేఘము అని తెలియవలెను. అటువంటి మేఘము సూర్యరశ్మి తగ్గి చీకటివలెయుండును. పొగమేఘము యొక్క మసక చీకటి నుండి మిడుతల గుంపులు వచ్చును. మిడుతలు గుంపులు గుంపులుగా సైన్యమువలె భూమిమీదికి వచ్చుట చేత వాటిని 'మిడుతల దండు' అని పూర్వము అనెడివారు. ఉన్నట్లుండి వచ్చు మిడుత దండులు ఎక్కడి నుండి పుట్టు కొస్తున్నవో ఎవరి అంచనాకు తెలియదు. వాస్తవముగా మిడుత దండులు ఆకాశములోనున్న మేఘము నుండి వచ్చుచున్నవి. పొగలాంటి మేఘము నుండి వచ్చు వాటి పుట్టుక ఎవరికీ తెలియదు. అవి ఎక్కడ పుట్టాయో, ఎక్కడ పెరిగాయో తెలియకుండా మాయవలె అవి శూన్యములో గల పొగనుండి వచ్చుచున్నవి. అలా వచ్చునవి కొన్ని వందలు, కొన్నివేలు, కొన్ని లక్షల సంఖ్యలో కూడా ఉండవచ్చును.
అలా వచ్చిన మిడుత దండులో మనుషులను పీడించు అనేక రోగములు ఉండును. అంతేకాక అవి చూచేదానికి మిడుతలే అయినా దేవుడు పంపిన దూతల సైన్యముగా యున్నవి. మానవులను పీడించుటకు దేవుడు ఆ మిడుతల దండుకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞతో మిడుతల సైన్యము మనుషుల మీద వాటి ప్రభావమును చూపుచుండును. అవి కనిపించని చోటినుండి వచ్చినట్లు కనిపించక యుండి, అవి మనుషులను కాటువేయగలవు. రోగముల రూపములో శరీరములో దూరి మనుషులను బాధించగలవు. భూమిలో తేళ్లకున్నంత విష బలము వాటికి దేవుడు ఇచ్చాడు. మనుషులు పాప బాధలను అనుభవించుటకు కనిపించని లోకము నుండి కనిపించే లోకములోనికి వచ్చిన మిడుతల దండు వలన మనుషులు అనేక బాధలు పడవలసి యున్నది. భూమిమీద గల మనుష్యులకు తప్ప గడ్డికిగానీ, మ్రొక్కలకుగానీ, వృక్షములకుగానీ హాని కలిగించకూడదని మిడుతల దండుకు ఆజ్ఞ ఇవ్వబడెను. సామాన్యముగా మిడుతలు అంటే గడ్డికి, మ్రొక్కలకు, వృక్షములకు హాని చేయునవని అనుకొంటారు. అయితే ఈ మిడుతల దండు మనుష్యులకు తప్ప గడ్డికి, మ్రొక్కలకు, వృక్షములకు హాని కలుగ చేయవని వాక్యము వలన తెలియుచున్నది. వాటి పుట్టుక ఏమి, వాటి ఆహారమేమి, యని తెలియని మనుషులకు వాటి పని ఏమి? అని కూడా తెలియదు.
అయితే ఇక్కడ చెప్పిన నాలుగు వాక్యములను బట్టి మిడుతల రూపములో యున్న దేవదూతల దండు (సైన్యము) కేవలము మనుష్యులను బాధించుటకే యని వాక్యము వలన తెలియుచున్నది. మిడుతల రూపములో వచ్చిన దేవదూతల సైన్యమునకు మనుషులను ఐదు నెలల వరకు బాధించు అధికారము కలదు గానీ, మనుష్యులను చంపు అధికారము వాటికి ఇవ్వబడలేదు. మిడుతలు కనిపించక కాటువేస్తే అవి రోగ రూపములో తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధవలె ఉండును. మనిషి కర్మనుబట్టి చిన్న బాధ నుండి తేలు విషము బాధ యున్నంత బాధ వరకు ఉండవచ్చును. అయితే ఆ బాధనుండి తప్పించువారు ఎవరూ లేక తప్పక అనుభవించవలసి యుండును. బాధ ఎక్కువయినప్పుడు, బాధను భరించలేక మనుషులు చావును కోరుకొందురని వాక్యములో చెప్పియున్నారు. అయితే వారు బాధపడవలసిందేగానీ చావు వారి దగ్గరకు రాకుండా దూరము పోవునని కూడా చెప్పారు. ఎందుకనగా! దేవదూతలయిన మిడుతల బాధలు మనుషులు అనుభవించవలసినవే గానీ, వారిని చంపుటకు అధికారము ఇవ్వబడలేదని ముందే వాక్యములో చెప్పారు.
కనిపించని పొగ మేఘము నుండి వచ్చిన మిడుతలు వందమార్లు వస్తే ఒకమారు కనిపించును. కనిపించని విధముగా వచ్చి వాటి ప్రభావమును అనేక రకములుగా మనుషుల మీద చూపుచుండును. వాటి వలన రోగము రూపములోగానీ, మరి ఏ రూపములో గానీ హాని కలుగ వచ్చును. వాటివలన కలుగు హాని మనుషులకే యని తేల్చి చెప్పబడి యున్నది. హాని అనగా అది ఏ రూపములోనయినా ఉండవచ్చును. వచ్చిన హాని వలన మనిషి బాధపడునని వాక్యములో చెప్పారు. ఆజ్ఞ ఇవ్వబడిన వాటి నుండి కలుగు బాధ వలన మనిషి మరణమును వెదకును గానీ, అది వారికి దొరకనే దొరకదు అని చెప్పారు. భరించలేని బాధవలన చావవలెనని ఆశ పడినా, వారి నుండి మరణము దూరముగా పారిపోవును. ఈ విధముగా ప్రజల యెడల దేవుడు పంపిన 'కనిపించని మిడుతలు' అను దూతల నుండి కనిపించు అనేక బాధలు మనుషులకు కలుగుచున్నా మనిషి బాధలను అనుభవించుచూ ఆ బాధలకు కారణము ఏమిటి?యని కొంతయినా ఆలోచించడము లేదు. దేవుని వాక్యముల వలన బాధలనుండి బయటపడడము లేదు.
ప్రపంచములో లేని రోగములు వచ్చి చేరుతున్నవంటే అవి ఎక్కడ నుండి పుట్టుకొస్తున్నవని మనిషి ఆలోచించడము లేదు. ఒక క్రొత్త రోగము వస్తే అది క్రొత్తదని తెలియుటకు కొంతకాలము పట్టితే, దానికి మందును కనిపెట్టే దానికి మరికొంతకాలము పట్టుతుంది. చివరకు క్రొత్త రోగమునకు మందు కనిపెట్టిన సంవత్సరమునకే మరియొక అంతుచిక్కని సరిక్రొత్త రోగము వచ్చి మనుషులలో చేరుచున్నది. ఇట్లు కొన్ని రోగములు వస్తూ యుంటే, అసలుకు రోగము కానటువంటి బాధలు మనుషులను అనుభవింప జేయుచున్నవి. రోగ నిర్ధారణకు దొరకని ఎన్నో వ్యాధులు, బాధలు గలవు. కనిపించని శక్తుల వలన కొన్ని బాధలు కల్గుచున్నవని కొందరికి తెలిసినా, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదు. సూక్ష్మరూపములో కనిపించక యున్న దూతల వలన కల్గు బాధలను, రోగములను తెలియలేక మూగగా అనుభవించడము తప్ప వేరే మార్గము లేదు. ఇటువంటి బాధలన్నిటి నుండి తప్పించుకోవాలంటే, దేవుడు తన దూతలకు చెప్పినట్లు మనుషులు దేవునికి, దేవుని శక్తికి గుర్తుగాయున్న దేవుని ముద్రను ధరించడము ఒక్కటే ఉపాయము. దేవుని ముద్ర ధరించని వారినే పీడించమని తన దూతలకు దేవుడు ఆజ్ఞాపించియున్నాడు. కనుపించు మిడుతలుగా యున్నవి గడ్డికి, మ్రొక్కలకు, వృక్షములకు హాని అని అందరూ అనుకొనినా, వాక్యములో ''నొసళ్లయందు దేవుని ముద్ర ధరించని వారిని మాత్రమే బాధించమని దేవుడు కనిపించని మిడుతల రూపములో యున్న తన దూతలకు ఆజ్ఞ ఇచ్చినట్లు కలదు.'' దేవుని ముద్ర గురించి అంతిమ దైవగ్రంథములో సూరా 5, రెండవ ఆయత్‌యందు, అలాగే సూరా 22, 32వ ఆయత్‌యందు చెప్పియున్నారు. ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగమున దేవుని ముద్రను సూచాయగా చెప్పియున్నారు. మా రచనలలోని ''దేవుని ముద్ర'' యను గ్రంథమున దేవుని ముద్ర ఎలా ఉంటుందో సవివరముగా చెప్పియున్నాము. ఇతరులు చెప్పినది మేమెందుకు వినాలి? అని అనుకోకుండా ఇప్పటికయినా దేవుని మీద విశ్వాసము కల్గి, దేవుని ముద్రను ధరించండి. దేవుడు, దేవుని ముద్ర ఒక మతమునకు సంబంధించినది కాదు. మూడు దైవ గ్రంథములలో చెప్పబడిన దేవుని ముద్రను ధరించకపోతే కలుగు విపత్తును గురించి బైబిలు గ్రంథములో 'ప్రకటనలు'లో చెప్పియున్నా, క్రైస్థవులు దేవుని ముద్రను ధరించక దానికి దూరముగా ఉండడము అజ్ఞానముకాక ఏమగును, దేవుని విశ్వాసములోని లోపము కాక మరి ఏమగును. నా మాట విని అన్ని మతముల ఇంతవరకు తెలియని 'దేవుని ముద్ర'ను ధరించండి. బాధల నుండి 'రక్షణ' పొందండి.
సమాప్తము.