pss:16 t b g diva asura
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
శ్రీ భగవంతుడిట్లనియె : -
(15) శ్లో|| 1: అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞా నయోగవ్యవస్థితిః ।
దానం దమ శ్చ యజ్ఞ శ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్ ||
(దైవగుణము)
(15) శ్లో|| 2: అహింసా సత్య మక్రోధస్త్యాగ శ్శాన్తి రపైశునమ్ ।
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీ రచాపలమ్ ||
(దైవగుణము)
(15) శ్లో|| 3: తేజః క్షమా ధృతిః శౌచ మద్రోహో నాతిమానితా ।
భవన్తి సమ్పదం దైవీ మభిజాతస్య భారత ! ||
(దైవగుణము)
భావము : భయము లేకుండుట, సత్త్వగుణములో మంచివైన ఆరు గుణములు కల్గియుండడము, జ్ఞానము యోగములందలి వ్యవహారములన్ని తెలిసియుండడము, దానమిచ్చుట, ఇంద్రియములను స్వాధీనములో ఉంచుట, ద్రవ్య జ్ఞానయజ్ఞములు తెలిసి వేదాధ్యాయణము చేసివుండుట, తపస్సుకల్గి కపటము లేకుండుట, అహింస, సత్యమునే పలుకుట, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతికల్గి చాడీలు చెప్పకుండుట, జీవరాసులమీద దయ,విషయములందు ఆసక్తి లేకుండుట, మృదువుగ ఉండుట, గంభీరభావము కల్గియుండుట మనస్సు చలింపకుండుట, తేజస్సు, క్షమించు స్వభావము, ధైర్యము, శుభ్రత, పరులకు ద్రోహము చేయకుండుట, అభిమానము లేకుండుట దైవాంశయందు పుట్టినవారికి కల్గుచున్నవి.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15) శ్లో|| 4: దమ్భో దర్పోఽభిమాన శ్చ క్రోధః పారుష్య మేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ! సమ్పద మాసురీమ్ ॥
(అసుర గుణము)
భావము : గర్వము, అధికారత్వము చలాయించుట, అభిమానము కల్గివుండుట, క్రోధము, కఠినత్వము కల్గివుండుట, అజ్ఞానము కల్గియుండుట రాక్షసాంశయందు పుట్టినవారికుండును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15) శ్లో|| 5: దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాఽసురీ మతా ।
మాశుచ స్సమ్పదం దైవీ మభిజాతోఽసి పాణ్డవ ! ||
(దైవ, అసుర గుణము)
భావము : దైవ అంశ మోక్షమును కల్గించును. అసురాంశ బంధమే కల్గించును. నీవు దైవాంశ సంభూతుడవైనందు వలన బాధపడవలసిన పనిలేదు.
వివరము : దైవాంశ, రాక్షసాంశ అను రెండు భాగములలో దైవాంశ దైవము వైపు, రాక్షసాంశ జన్మలవైపు మార్గములై ఉన్నవి. దైవాంశ అనుదానిలో పుట్టినవారు దైవమునకు జ్ఞానమునకు విరుద్ధమైన పనులు చేయకుందురు. మంచి పనులు చేయుచు, వాటి వలన కొద్ది కొద్దిగ ఆలోచిస్తు, ఆ ఆలోచనల వలన కొద్ది కొద్దిగ జ్ఞానము మీద ధ్యాసకల్గుచు, గురు సన్నిధికి చేరుచుందురు. అక్కడ గురువు బోధించు జ్ఞానమును బట్టి కొన్ని జన్మలకైన మోక్షమును పొందగలరు. రాక్షసాంశయందు పుట్టినవారు దైవమునకు జ్ఞానులకు విరుద్ధమైన పనులు చేయుట వలన వారికి జ్ఞానమునకు మధ్య దూరమేర్పడును. జ్ఞానము మీద ధ్యాసలేని వారు గురువులను సహితము హేళనగా మాట్లాడుచుందురు. అటువంటి వారికి జ్ఞానము యొక్క గట్టు దొరకక జన్మ జన్మలకు దైవమునకు దూరమగుచు జన్మకర్మలను పొందుచునే ఉందురు. దైవికమైన విషయములందు విలువ, గౌరవమిచ్చు సజ్జనులు (దైవాంశపరులు) దైవికమైన శ్రద్ధను పొందుచు కొన్ని జన్మల తరువాత దైవమును గురించిన సమాచారము తెలియగలరు. ఇటువంటి వారిని గూర్చియే విజ్ఞాన యోగములో 19వ శ్లోకములో 'బహూనామ్ జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ' అని అన్నారు. రాక్షసాంశ గలవారు దైవిక విషయములను చులకనగా చూస్తు జ్ఞానులను శత్రువులుగ లెక్కించుచుందురు. అటువంటివారు దేవతలకు భక్తులుకావచ్చును కాని పరమాత్మ విషయముల గురించి తెలియలేరు. జన్మ జన్మకు జ్ఞానము యొక్క గట్టుకు దూరమగుచు ఎప్పటికీ జ్ఞానమును తెలియలేరు. అర్జునుడు దైవాంశమున పుట్టినవాడు కనుక ఎన్నో జన్మల శ్రద్ధ చేత గురువుగ భగవంతుడే లభించాడు. దైవాంశములో పుట్టిన వారిని దేవతలని, రాక్షసాంశలో పుట్టిన వారిని రాక్షసులని అనుచున్నాము. పురాణాలలో చెప్పినట్లు వారెక్కడో లేరు. భూమి మీద మానవాకారులలోనే ఉన్నారు. దీని విషయము క్రింది శ్లోకములో చూడండి.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15) శ్లో|| 6: ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ ।
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ! మే శృణు ||
(దైవ, అసుర గుణములు)
భావము : లోకమున దైవ అసుర అను రెండు రకముల జీవులు పుట్టుచున్నారు. దైవ విషయముల వాటి గుణముల గురించి చెప్పివున్నాను. అసురులను గూర్చి చెప్పెదను వినుము.
వివరము: దేవతలు, రాక్షసులు అను రెండు రకములవారు భూమిమీద ఉన్నారంటే నమ్మలేని విషయముగ ఉంటుంది. కాని భగవంతుడు చెప్పిన మాట నిజము. దేవతలనువారు ఎక్కడో పై లోకాలలో ఉన్నారని అనుకోవడము పొరపాటు, దేవతలు రాక్షసులు నిజముగ భూమిమీదనే ఉన్నారు. కొంత జ్ఞానమున్నవారు వీరిని భూమిమీదనే గుర్తించవచ్చును. ఈ రెండు జాతులు గుణములను బట్టి ఏర్పడుచున్నవి. ఇక్కడ 'ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ అసుర ఏవచ' అనడములో లోకములకు నిలయమైన భూమి మీదనే దేవతలు, రాక్షసులు పుట్టుచున్నారని చెప్పడము బాగుగ గ్రహించవచ్చును.
దేవతలు ముప్పదిమూడు కోట్లు కలరని ప్రతీతి కలదు. వారెంత మందైనప్పటికి విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలుకొని చిన్న చిన్న దేవతల వరకు భూమి మీద విస్తరించి మనుషులరూపములో ఉన్నారు. ఇక్కడ కొందరికొక అనుమానము రావచ్చును. భూమిమీద దేవతలున్నట్లె కాదా! కనిపించలేదే! వారెక్కడ ఉన్నారు? వారెట్లున్నారు? అని అడుగవచ్చును. దానికి సమాధానము భగవంతుడు చెప్పినట్లు దేవతలు రాక్షసులు భూమి మీదనే కలరు. అయినప్పటికి వారిని మనము గుర్తించలేక పోవుచున్నాము. అలా ఎదుటి వారిని గుర్తించుటకు కొంతైనా జ్ఞానదృష్ఠి అవసరము. ఎదుటి వారిని గుర్తించలేక పోవడమే కాక మానవులలో దేవతలైనవారు వారిని వారు కూడ గుర్తించలేరు. ఎదుటి వారిని గుర్తించుటకు అవకాశమున్నది కాని ఎవరిని వారు గుర్తించుటకు అవకాశములేదు. ఎదుటి వారు దేవతలని గుర్తించుటకు జ్ఞానదృష్ఠి అవసరమన్నాము కదా! అలాంటి దృష్ఠిలేని వారికి అందరు మనుషులుగానే కనిపించుచుందురు. మనుషులలో గల తారతమ్యములు తెలియవు. చిన్న చిన్న దేవతలు మొదలుకొని విష్ణువు వరకు గల దేవతా వ్యత్యాసములు మానవులలోనే కలవు.
జ్ఞానశక్తి ఉన్నవారంత దేవతలేనని చెప్పవచ్చును. వారి వారి జ్ఞానశక్తిని బట్టి దేవతలందు వ్యత్యాసములు కలవు. అత్యధిక జ్ఞానశక్తివున్న వాడు విష్ణువు. అతనికంటే కొంత తక్కువ కలవాడు రుద్రుడు. తరువాత బ్రహ్మ అలాగే జ్ఞానశక్తి తగ్గుకొలది వారిలో వ్యత్యాసములుండి ఆయా దేవతలుగ చెప్పబడుచున్నారు. దీనిని బట్టి జ్ఞానశక్తి ఉన్నవారంతా దేవతలని, జ్ఞానశక్తిలేని వారంతా రాక్షసులని చెప్పవచ్చును.
దేవతలైన విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలగువారు ఈ కలియుగములో ఉన్నారా? విశేషమైన జ్ఞానశక్తి ఉన్న విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలగువారు పరమాత్మయందైక్యము చెందక కలియుగములో కూడా ఉన్నారా? వారికి ముక్తి రాలేదా? వారు కూడ అందరి మాదిరి జన్మ ఎత్తుచునే ఉన్నారా? అను ప్రశ్నలు అందరికి రావచ్చును. దానికి సమాధానమేమనగా!
దేశములో రాజు, యువరాజు, ప్రధానమంత్రి, మంత్రి అను ఎన్నియో లెక్కలేనన్ని పదవులున్నవి కదా! ఆ పదవులు మొదటినుండి ఉన్నప్పటికి ఒక పదవిలో ఒకే మనిషి ఎప్పటికి లేడు. దేశానికి రాజు పదవి శాశ్వతమైనది. అయినప్పటికి రాజు మాత్రము శాశ్వతము కాదు. ఒకే రాజ్యానికి రాజుగ ఎంతో మంది మారివుండుట మనకు తెలిసిన విషయమే. అంత దూరమెందుకు ఇప్పుడున్న ప్రధాని పదివిలో ఎంతో మంది ప్రధానులుగ ఉండి మారిపోవుట చూచుచూనే ఉన్నాము కదా! ఎంతమంది ప్రధానులు మారినా ప్రధానమంత్రి పదవి మాత్రము అలాగే శాశ్వతముగ ఉన్నది కదా! అలాగే భూమిమీద విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అను మొదలగు దేవతా పదవులు కలవు. ఈ పదవులకు అర్హత పొందిన జీవులు నిర్ణయించబడుచున్నారు. అలాగే ఒకే జీవుడు శాశ్వతముగ ఒక పదవికి అర్హుడుగ లేడు. అతను కొంత కాలముండగ, మరియొకడు కొంత కాలము అర్హత పొందుచున్నాడు. ఒక జీవుడు ప్రపంచమంతటిలోను జ్ఞానశక్తి (యోగాగ్ని)లో మొదటివాడైనాడనుకొనుము. యోగశక్తిలో మొదటివాడైన దానివలన అన్నిటికంటే పెద్ద దేవతా పదవియైన విష్ణు పదవికి అర్హత పొంది ఉండును. అప్పుడు ఆ జీవుడు స్త్రీ పురుషులలో ఏ శరీరము ధరించి ఉన్నప్పటికి అతడే విష్ణువు. అటువంటి వాడు కొద్దిపాటి కర్మతో పుట్టివుండును. ఆ జన్మలో పూర్తి జ్ఞానాగ్నిని సంపాందించుకొని, ఉన్న కొద్దిపాటి కర్మను కూడ లేకుండ చేసుకొని, ఆ జన్మలోనే మోక్షము పొందును. అప్పుడు తిరిగి ఆ పదివికి భూమి మీద ఎవడో ఒకడు జ్ఞానశక్తిలో అధికుడు అర్హత పొంది విష్ణువగును. ఈ విధముగ దేవతల పదవులు ఖాళీ ఏర్పడుచూనే ఉండును. తరువాత వాటికి ఇతరులు అర్హులగుచూనే ఉందురు. భూమిమీద జీవులే వారి వారి జ్ఞానశక్తిని బట్టి దేవతల యొక్క అర్హతలు పొందివున్నారని తెలియుచున్నది. విష్ణు, ఈశ్వర, బ్రహ్మలు కూడ భూమిమీద మనుషులేనని తెలియుచున్నది. అట్లు శరీరధారులైన దేవతలు యోగమాచరించి కర్మలేకుండ చేసుకొని మోక్షము పొందుచున్నారు. పెద్ద పెద్ద దేవతలు భూమి మీద ఉన్నప్పటికి, మాయా ప్రాబల్యము వలన వారెవరైనది వారికే తెలియదు. దేవతలైన వారు గురువులుగ, జ్ఞానులుగ, యోగులుగ, భక్తిపరులుగ, సన్న్యాసులుగ ఎందరో ఉండగ, వారికి విరుద్ధముగ ఎందరో రాక్షసులు కూడ భూమిమీదే మనుష్యుల రూపములో ఉన్నారు.
జ్ఞానము కల్గిన వారికి విరుద్ధముగ ఉండు వారంత రాక్షసులే, వీరియందు జ్ఞానముకాని, జ్ఞానశక్తికాని ఏమాత్రముండదు. పరమాత్మ విషయములు వీరికి వ్యతిరేఖముగా ఉండును. ముఖ్యముగ తామసభక్తి గల రాక్షసులు తామే నిజమైన భక్తులమనుకొనుట కూడ కలదు. ఇంకనూ వారెట్లున్నారనగా క్రింది శ్లోకములు చూచెదము.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15) శ్లో|| 7: ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదు రాసురాః ।
న శౌచం నాపి చాఽచారో న సత్యం తేషు విద్యతే ||
(హేతువాద అసురగుణము)
భావము : అసురులైన వారు మనిషి యొక్క పుట్టుకనుగాని, మరణముగాని తెలుసుకోలేరు. వారివద్ద శుచిత్వముగాని, ఆచారముగాని, సత్యముగాని ఉండదు.
వివరము : భూమి మీద దేవతలు, రాక్షసులు అను రెండు రకముల మనుషులు గలరని ఆరవ శ్లోకములో చెప్పిన భగవంతుడు, ఈ శ్లోకమునుండి అనేక విధములుగ ఉన్న రాక్షసులను గురించి చెప్పను మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏడవ శ్లోకములో హేతువాదులను గురించి చెప్పి, ఎనిమిదవ శ్లోకములో నాస్తికవాదులను గురించి చెప్పి, తొమ్మిదవ శ్లోకమున హేతువాదులను, నాస్తికవాదులను కలిపి ఇరువర్గము వారిని గురించి చెప్పాడు. ఈ శ్లోకములో ప్రత్యేకించి హేతువాదులను గురించి చెప్పాడు, కావున హేతువాదులను భూమిమీదున్న అసురులుగానే లెక్కించుకోవలెను. అసురులైన హేతువాదులు మనుషుల యొక్క పుట్టుకనుగాని, మరణముగాని ఏమాత్రము తెలియరన్నాడు. అంతేకాక శుచిత్వమన్నది, ఆచారమన్నది, సత్యమన్నది వారియందు లేదని, అది ఏమిటో వారికి తెలియదన్నాడు. ఈ మాట వింటూనే చాలామందికి కొన్ని ప్రశ్నలు వెంటనే రాగలవు. హేతువాదులు భూమి మీద ఎందరో ఉన్నారు. ఆస్తికులకంటే హేతువాదులు చాలా తెలివైన వారుగ కనిపిస్తున్నారు. మనిషి పుట్టడము, చావడము వారికి తెలియకుండ పోవడమేమిటి ? ఎందరో ఎం.డి డాక్టర్లు, ఎమ్.బి.బి.యస్ డాక్టర్లు హేతువాదులుగ ఉన్నారు. వారికి మనుషుల పుట్టుక, చావులు తెలియవా? ఈ మాట నమ్మదగినదేనా? ఎంతో శుభ్రముగ ఉన్న వారికి శుభ్రతలేదనడము అసత్యము కాదా? ఎందరో హేతువాదమును ముఖ్యవాదముగ పెట్టుకొన్నవారు సత్య నిర్ధారణయని, సత్యాన్వేషణయని, సత్యప్రచారమని, సత్యశోధనయని, సత్యమను పేరుతో సమాజమునకు సత్యమును తెలుపుచున్నామనుచుండగ వారివద్ద సత్యములేదని, వారికి సత్యము తెలియదనడము సమంజసమైన మాటనా? హేతువాదమునకు ఒక పద్ధతిని ఏర్పరుచుకొని దాని ప్రకారమే చివరి వరకు క్రమము తప్పకుండ ఆచరించు వారివద్ద ఆచారము లేదను గీతమాట సత్యమెట్లగును? ఇన్ని ప్రశ్నలు ఉద్భవించి, ఈ శ్లోకములో నిజములేనట్లు అనిపించుచున్నది. అయినప్పటికి లోతుగ చూస్తే అన్ని ప్రశ్నలకు జవాబు దొరికి శ్లోకములోని అసలైన సత్యము తెలియుచున్నది.
మానవ సమాజములో ఎందరో ఎన్నో పనులుచేసి బ్రతుకుచున్నారు. ప్రతి పనిలోను దానికి సంబంధించిన విజ్ఞత, చేయవలసిన పద్ధతి, పనిమీద ఆసక్తి, పని విలువ అన్ని తెలిసే చేయుచుందురు. అందరు బ్రతికే ఉద్ధేశ్యముతోనే పని చేయుచున్నారు. అయినప్పటికి కొందరు చేయు పనులు చట్ట సమ్మతమైనవిగ, కొందరు చేయు పనులు చట్ట విరుద్ధముగ ఉండును. దొంగపనిచేయువానికి ఆ పనిలో నైపుణ్యత, చేయవలసిన పద్ధతి, చేయడములో ఆసక్తి అన్నియుండును. అట్లే కూలి పని చేయడానికి కూడ క్రమశిక్షణ, నైపుణ్యత, ఒక పద్ధతి, పనిలో ఆసక్తి అన్ని ఉండును. ఇద్దరి ఉద్ధేశ్యము డబ్బు కొరకే అయినప్పటికి ప్రభుత్వ దృష్ఠిలో దొంగపని చట్ట విరుద్ధముగ, కూలిపని చట్ట సమ్మతముగ ఎట్లున్నదో, అట్లే భూమిమీద అందరికి కనిపించని చట్టమొకటున్నది. ఆ చట్టములో కొందరు ధర్మవిరుద్ధులుగ, కొందరు ధర్మసమ్మతులుగ ఉన్నారు. బయటి ప్రభుత్వ చట్టములో శిక్షలున్నట్లు, లోపలి ప్రభుత్వము యొక్క ధర్మమను చట్టములో కూడ శిక్షలు గలవు.
కూలి పని చేసేవానికంటే ఎక్కువ శ్రద్ధతో, క్రమశిక్షణతో, పద్ధతిగ నైపుణ్యముతో బ్రతుకు తెరువుకని దొంగపని చేస్తే, వానికంటే వీడు బాగా చేశాడని ప్రభుత్వము యొక్క చట్టము ఒప్పుకోదు కదా! అట్లే ఆత్మవాదులకంటే హేతువాదులు సమాజ శ్రేయస్సుకొరకని విజ్ఞానముతో, క్రమశిక్షణతో, పద్ధతి ప్రకారము ఆచరించిన వానికంటే వీడు బాగా చేశాడని దేవుని యొక్క ధర్మము ఒప్పుకోదు. అందరు బ్రతుకుతెరువుకే పనులు చేస్తున్నా వానిపనిని బట్టి కొందరిని మర్యాదస్థులని, కొందరిని నేరస్థులని న్యాయశాస్త్రము ఎట్లు చెప్పగలుగుచున్నదో అలాగే ఆత్మవాదులు, హేతువాదులు సమాజశ్రేయస్సుకే పని చేస్తామనుచున్నా వారి పనినిబట్టి కొందరిని సురులని, కొందరిని అసురులని గీతాశాస్త్రము చెప్పగలుగుచున్నది.
తీవ్రవాదులు గవర్నమెంటును, చట్టమును ఒప్పుకోరు. తాము చేయుచున్న తీవ్రవాదము సరియైనదే అనుచుందురు. మా పనిలో ప్రాణమును సహితము లెక్కచేయకుండ క్రమశిక్షణగా మా సిద్ధాంతములకు అనుగుణముగ నడుచుకొను చున్నామనుచుండినప్పటికి గవర్నమెంటు వారి సిద్ధాంతములను వారి క్రమశిక్షణను ఒప్పుకోక తప్పుగ లెక్కించి తీవ్రవాదము చట్టవిరుద్ధమని చెప్పుచున్నది. అలాగే తీవ్రవాదులు గవర్నమెంటును ఒప్పుకోనట్లు, హేతువాదులు దేవున్ని, ధర్మమును ఒప్పుకోరు. తాము అనుసరిస్తున్న హేతువాదము సరియైనదని అనుచుందురు. వారు వారి సిద్ధాంతములకు అనుగుణముగ నడుచుకొనుచుండిన, వారి విధానములో సత్యముగ ఉండిన, చక్కని ఆచరణకల్గియుండిన దేవుడు వారి సిద్ధాంతములను, వారి సత్యమును, వారి విధానమును ధర్మవిరుద్ధమని చెప్పుచున్నాడు.
ఇపుడు అసలు విషయానికొస్తాము. ఈ శ్లోకములో మనిషి యొక్క పుట్టుక, చావు రెండు తెలియవన్నాడు కదా! అది నిజామా అని ప్రశ్నవచ్చినది కదా! దానికి జవాబు చూస్తాము. ఒక సజీవ శరీరము ప్రపంచములోని ఐదు విషయ జ్ఞానములను, ఐదు ఇంద్రియముల చేత తెలుసుకోగల్గుచున్నది. పరిమితమైన జ్ఞానమును తెలుసుకొనునది పరిమిత అవయవమని గుర్తించి వాటికి కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అని పేరు పెట్టుకున్నాము. వీటి వలన దృశ్యము, శబ్దము, వాసన, రుచి, స్పర్శ తెలియుచున్నవి. ఈ ఐదు విషయములు తప్ప ఇతరము ఏమి ఎవరికి తెలియదు. ఒక సాధారణ అమాయకునికైనగాని, శాస్త్రవేత్తయిన విజ్ఞానికి గాని ఐదు జ్ఞానములే తెలియును. ఐదు ఇంద్రియములకు తెలియనిది ఏదైనవుంటే అది ఇంద్రియాతీతమైనదని, ఇంద్రియాలకు అగోచరమైనదని చెప్పవచ్చును. ఉదాహరణకు రెండు ఇనుప ముక్కలను తీసుకొని చూస్తే వాటి ఆకారము, వాటి రంగు అన్ని ఒకలాగునే ఉన్నవి. ఆ రెండిటిలో ఒకటి అయస్కాంతమున్నది. దానిని ఏమాత్రము గుర్తించలేకపోయాము. దాని అయస్కాంతశక్తి కంటికిగాని, చెవికిగాని, స్పర్శకుగాని, రుచికిగాని, వాసనకుగాని తెలియకున్నది. కనిపించని అయస్కాంతశక్తిని వేరే విధానము ద్వార తెలుసుకోవచ్చును. అపుడది అయస్కాంతమని తెలియును. ఆ విధానము లేకుండ ఇంద్రియాలకు అయస్కాంతశక్తి తెలియలేదు, కావున దానిని ఇంద్రియాతీతశక్తి అని అనవచ్చును. లేకపోతే ఇంద్రియాగోచరశక్తి అనవచ్చును. ఇలాంటివి ప్రపంచములో ఎన్నో ఇంద్రియాలకు తెలియనివి గలవు. వాటిని ప్రత్యక్షముగకాక పరోక్షముగ తెలుసుకోవచ్చును. పరోక్షముగ తెలియుటకు ఏదో ఒక విధానము అవసరము. ఆ విధానమునే ప్రయోగము అంటున్నాము. కాని అన్నియు ప్రయోగాల ద్వార తెలియవని ముఖ్యముగ గుర్తుంచుకోవలెను. అటువంటి వాటిని ఎలా తెలుసుకోవాలనిన, కేవలము యోగాల ద్వార మాత్రమే తెలియవచ్చును. ఐదు ఇంద్రియములకు తెలియని వాటిని ప్రయోగాల ద్వార కాని, యోగాల ద్వార కాని తెలియవచ్చును.
ప్రయోగానికి, యోగానికి ఏమి తేడాగలదని కొందరడుగవచ్చును. దానికి జవాబు, జ్ఞానేంద్రియములకు తెలియని దానిని తెలుసుకొనుటకు కర్మేంద్రియముల సహాయముతో చేయు కార్యమును ప్రయోగము అంటున్నాము. ప్రయోగములో మనిషిలోని జ్ఞానకర్మేంద్రియములు పది పనిచేయుచున్నవి. కనిపించే ఇంద్రియాలతో కనిపించని దానిని తెలుసుకొనుటకు చేయు పనినే ప్రయోగము అనుచున్నాము. ప్రయోగముతో కనిపించని అయస్కాంత శక్తిని, దాని సాంద్రతను, దాని ఆవరణ క్షేత్రమును తెలుసుకోవచ్చును. ప్రయోగాన్నిబట్టి పరికరాలు కూడ అవసరమే. ఉదాహరణకు ఐదు ఇంద్రియాలకు తెలియని సూక్ష్మక్రిములను మైక్రోస్కోప్ ద్వార చూడగల్గుచున్నాము. ఇక యోగము యొక్క విషయానికి వస్తే ఇంద్రియాలకు తెలియని దానిని తెలుసుకోవచ్చును. కాని ఇక్కడ యోగమును శరీరమునకున్న కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో పనిలేకుండ చేయవలసియుండును. ప్రయోగములో ప్రకృతికి సంబంధించియుండి, ఇంద్రియాలకు అతీతముగనున్న దేనినైన తెలుసుకోవచ్చును. పంచభూతములకు సంబంధములేకుండ ఉన్నదానిని ప్రయోగము ద్వార తెలుసుకొనుటకు వీలులేదు. పంచభూతములకు సంబంధము లేకుండ మొత్తము ప్రకృతికి అతీతమైన దానిని యోగము ద్వార మాత్రమే తెలుసుకొనుటకు వీలగును. సర్వజగత్తులో పంచభూతములకు అతీతమైనవి మూడే కలవు. 1) జీవాత్మ 2) ఆత్మ 3) పరమాత్మ. ఈ మూడు ఎటువంటి ప్రయోగాలకు అందునవికావు. ఇంతవరకు ప్రపంచములో ఎందరో శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాలు చేసి కనుగొన్నవన్ని ప్రకృతికి సంబంధించినవేనని తెలియవలెను. భౌతికశాస్త్రము తెలిసిన డాక్టర్లకు భౌతిక శరీరము యొక్క అంతర్ భాగములు, వాటి రోగములు, వాటి నివారణ విధానములు తెలుసియుందురు. గుండెను తెరిచి చూచిన డాక్టర్లుగాని, మెదడును శస్త్రచికిత్స ద్వార చూచినవారుగాని, శరీరములోని జీవున్నిగాని, శరీరమంత ఉన్న ఆత్మనుగాని చూడలేదు. ఎందుకనగా వీరు చేసినది ప్రయోగమేకాని యోగము కాదు, కనుక ప్రకృతికి అతీతమైన ఆత్మ తెలియలేదు. కోసి లోపల చూచినపుడే తెలియని ఆత్మ, పుట్టినపుడుగాని, చనిపోయినపుడుకాని పైన మాత్రమే చూచువారికి జీవాత్మ యొక్క పుట్టుకగాని, చావుగాని ఎట్లు తెలియును. చాలామంది హేతువాదులు ప్రాణమును జీవుడు అని అనుకొన్నారు. జీవుడు వేరు, ప్రాణము వేరని తెలియనిది జీవుని యొక్క ప్రవృత్తి అనగ పుట్టుకను గూర్చిగాని, నివృత్తిని గూర్చిగాని ఎలా తెలియగలరు. అందువలన ఈ శ్లోకములో చావు, పుట్టుకలు తెలియనివారని చెప్పడము జరిగినది.
శౌచము అనగా శుభ్రత అని అర్థము. ఇక్కడ శుభ్రత నీకా, నీ శరీరమునకా అని యోచించవలెను. శరీరశుభ్రత అందరు కలిగివుందురు. కాని శరీరము లోపలనున్న వాడు మాత్రము శుభ్రముగ ఉండడములేదు. అందువలన చెడుగుణముల మలినము అంటుకొన్నవానిని శుచిత్వములేని వాడన్నారు. అలాగే శరీర లోపలి సత్యము తెలియని వాడు, బయట సత్యము అను పేరుతో ఎన్ని బోర్డులు పెట్టుకొనిన, వాడు సత్యము తెలియనివాడేనని చెప్పాలి. అలాగే శరీరములో నివశించువాడు ఎవడైన లోపలి తన ఆచారమేమి అని తెలియకపోతే వాడు ఆచారములేనివాడేనని చెప్పాలి. జీవుడు శరీరములోనికి వచ్చునది, పోవునది తెలియని వాడు, గుణముల మలినము కలవాడు, లోపలి సత్యమును, ఆచారమును తెలియనివాడు, బయటి ప్రపంచములో దేశమునకు రాజయినప్పటికి వాడు అసురుడేనని చెప్పాలి.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15) శ్లో|| 8: అసత్య మప్రతిష్ఠం తే జగ దాహు రనీశ్వరమ్ |
అపరస్పర సమ్భూతం కి మన్యత్కామహైతుకమ్ ||
(నాస్తికవాద అసురగుణము)
భావము : దేవుడు అనేవాడు లేడు అనియు, దేవునిచేత జగత్తు సృష్ఠింపబడినదనుట అసత్యమనియు, స్త్రీ పురుషుల పరస్పర సంబంధము వలననే జీవరాసులు పుట్టుచున్నవని, స్త్రీ పురుష సంబంధమునకు కామము తప్ప వేరే ఏముంది అనుచున్నారు.
వివరము: భూమి మీద నాలుగు విధముల మనుషులు గలరని చెప్పవచ్చును. నాస్తికులు -దేవుడు లేడనువారు. హేతువాదులు-దేవుడు ఉంటే ఎట్లున్నాడని ప్రశ్నించువారు. ఆస్తికులు-దేవుడున్నాడని చెప్పుచు, దేవున్ని వదలి దేవుడు కాని వారిని ఆరాధించువారు. ఆత్మవాదులు-వీరు కేవలము ఆత్మల గురించే మాట్లాడుదురు. నాస్తికులకు ఆస్తికులు ఎంత వ్యతిరేఖమో అట్లే హేతువాదులకు, ఆత్మవాదులకు అంతే విరుద్ధ భావములుండును. వెనుకటి ఏడవ శ్లోకములో ఆత్మవాదులకు విరుద్ధవాదులైన హేతువాదులను గురించి చెప్పుకొన్నాము. ఇక్కడ ఈ శ్లోకములో నాస్తికవాదులను గురించి చెప్పుకోవలసియున్నది.
భూమిమీద హత్యచేయు హంతకుడు, మానభంగము చేయు హత్యాచారకుడు వారి మనోభావములలో ఎంత దగ్గరివారో అలాగే నాస్తికవాది, హేతువాది దగ్గరి భావములున్నవారు. ఒకడు పాము లేదు అంటే, మరొకడు ఉంటే చెప్పు లేకుండ చేస్తానంటాడు. ఇక ఆస్తికవాది, ఆత్మవాదుల విషయమును చూస్తే వీరు కూడ దగ్గర సంబంధమున్నవారే. ఆస్తికవాది ఇదిగో పాము అంటే, ఆత్మవాది అది విషముండేపామో కాదో చూడు అంటాడు. ఆస్తికుడు పాముంది అంటే, నాస్తికుడు అసలు పామేలేదు అంటాడు. విషముండే దానినే నిజమైన పామనాలి అని ఆత్మవాది అంటే, ఏ పామున్నాదనిన లేకుండ చేస్తానంటాడు హేతువాది. ఈ విధముగ విభిన్న భావములు కలవారుగ నాస్తిక, ఆస్తిక, హేతువాద, ఆత్మవాదులున్నారు. నాస్తికుడు ఆస్తికున్ని మూఢనమ్మకము కలవాడని మూఢుడని అంటాడు. ఆస్తికుడు నాస్తికున్ని మూర్ఖభావము కలవాడని మూర్ఖుడు అంటాడు. అలాగే హేతువాది ఆత్మవాదిని భావవాది అంటాడు. ఆత్మవాది హేతువాదిని మెండివాది అంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నాలుగురకముల వారిని గూర్చి చెప్పాడు. గీతలో ఎక్కువ ఆత్మవాదమును గురించి చెప్పి, దానికంటే తక్కువ ఆస్తికత్వమును చెప్పాడు. చాలాకొద్దిగ హేతువాదమును, నాస్తికవాదమును గురించి చెప్పాడు. ఇక్కడ నాస్తికవాదమును గురించి చెప్పుచు, నాస్తికులు దేవుడు లేడని విశ్వమును సృష్ఠించాడనుట పూర్తి అసత్యమని అంటారన్నాడు.
మనకు తెలిసిన విధానమును చెప్పుకుంటే, ఒక ఊరిలో రంగయ్య, మల్లయ్య అనబడు ఇద్దరు మగపిల్లలకు వారి పెద్దలు ఏడు సంవత్సరముల చిన్న వయస్సులోనే పెళ్లి చేశారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత కాపురానికి పంపవచ్చని ఆడపిల్లలను పుట్టింటివాల్లు వారి ఇంటిలోనే పెట్టుకొన్నారు. యుక్తవయస్సు వచ్చేంతవరకు ఒకరునొకరు చూచుకోలేదు. మగపిల్లలకు 22 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత ఆడ పిల్లలను కాపురానికి పంపాలనుకొన్నారు. మగపిల్లలకు యుక్తవయస్సు వచ్చింది. అప్పుడే వారిద్దరికి ఒక జబ్బు కూడ వచ్చింది. ఆ మాయదారి జబ్బు వలన రంగయ్యకు పూర్తి జ్ఞాపకశక్తి పోయింది. మల్లయ్యకు పూర్తి జ్ఞాపకము పోకుండ కొంతమాత్రము మిగిలింది, అయిన చూపు కొంత పోయింది. ఆ చూపు ఉన్నా ఎదురుగ ఉన్నది ఉన్నట్లు కనిపించదు. వేరుగ కనిపిస్తుంది. ఎలాగైతేనేమి చిన్నప్పుడే పెళ్లి అయింది కావున ఆడపిల్లలను భర్తల ఇంటికి పంపాలని వారి పెద్దలనుకొన్నారు. ఒక మంచి దినము చూచుకొని, ఆడపిల్లలను భర్తల ఇంటికి పిలుచుకొని వచ్చారు. ముందు రంగయ్య దగ్గరకు పోయి, ఇదిగో నీ భార్యను పిలుచుకొని వచ్చామని అన్నారట. రంగయ్యకు పూర్తి జ్ఞాపకము పోయింది. కావున నాకు పెళ్లే కాలేదు, నాకు భార్యే లేదన్నాడట. ఎంత చెప్పిన రంగయ్య వినడములేదు. అసలుకు నాకు భార్యేలేదు, ఎప్పుడూ పెళ్లి కాలేదు, మీరెంత చెప్పిన వినను, నన్ను ఒప్పించలేరు అన్నాడు. రంగయ్యకు కొద్దిగైన జ్ఞాపకముంటే ఎలాగో ఒకలాగ చెప్పేవారు. ఏమాత్రము జ్ఞాపకములేక నాకు భార్యె లేదనువానిని ఏమి అనలేక వెనుతిరిగి పోయారు. ఇక మల్లయ్య దగ్గరకు పోయారు. నీ భార్యను తెచ్చామని చెప్పారు. మల్లయ్యకు పూర్తి జ్ఞప్తి పోలేదు, కనుక నా భార్యను చూపమన్నాడు. అలాగే వారి పెద్దలు అతని భార్యను చూపారు. భార్యను చూచిన మల్లయ్యకు చూపు సరిగ లేనిదానివలన అతని భార్య ఒక గాడిద మాదిరి కనిపించింది. అతనికి ఉన్నదున్నట్లు కనిపించదు కదా! అపుడు మల్లయ్య నా భార్యను చూపుతామని గాడిదను చూపుతారే అన్నాడట. ఆ మాటకు ఆశ్చర్యపోయిన పెద్దలు అతని ఒప్పించడానికి మంచి నగలు పెట్టి, మంచి గుడ్డలు కట్టి తీసుకవచ్చి చూపారట. అపుడతనికి ఎలుగుబంటి మాదిరిగా కనిపించిందట. నాకు ఎలుగుబంటిని చూపుతున్నారే అని మల్లయ్య అనగా, వారి పెద్దలకు ఏమని చెప్పాలో అర్థముకాక, ఏ దుస్తులలో చూపిస్తే బాగుంటుందని ఆలోచించి పంజాబీడ్రస్ లో చూపించారట. ఈ మారు మల్లయ్య నిఘాగ చూసి గుర్రాన్ని తెచ్చారే అన్నాడు. అతని భార్యను భార్యగ ఒప్పించడానికి నానాతంటాలుపడి, చివరకు ఒక ఆలోచన ప్రకారము మల్లయ్యను భార్య దగ్గరకు పిలుచుకొని వచ్చి చేతితో తాకించి చూపించారట. ఇన్ని పనులు చేసిన తర్వాత మల్లయ్యకు ఆమె తన భార్యేనని అర్థమైనది. అయినప్పటికి ఇంతవరకు గాడిద, గుర్రము అని ఇపుడు ఒప్పుకుంటే బాగుండదనుకున్నాడు. ఈ మారు ఈమె నా భార్యే కాదన్నాడు. తనకు సరిగా కనిపించదు, కావున ఎక్కడ మోసము చేస్తారో అనుకొని ఎప్పుడు చూపిన, ఎట్లు చూపిన ఆమె తన భార్య కాదనడమె పనిగ పెట్టుకొన్నాడు. ఈ విధముగ జ్ఞాపకము లేని రంగయ్య భార్యే లేదని అంటే, కొంత చూపున్న మల్లయ్యకు భార్యను చూపినా అర్థముకానప్పుడు ఒప్పుకోని అతను అర్థమైనప్పటికి కాదనుటకు అలవాటుపడినాడు. ఇట్లు రంగయ్యలాంటి నాస్తికుడు అసలు దేవుడే లేడంటే, మల్లయ్యలాంటి హేతువాది అర్థమైన ఒప్పుకోడు.
ఏది చెప్పిన కాదను హేతువాదులకంటే మొదటనే అసలు దేవుడేలేడను నాస్తికుడే నయమనుకొంటాము. ఎట్లు చెప్పిన కళ్లులేని గ్రుడ్డివాడొకడైతే, కళ్లున్న గ్రుడ్డివాడు మరొకడన్నట్లు నాస్తికులు, హేతువాదులు ఇద్దరు దేవుడు లేడని వాధించువారే. ఒక కార్యము జరగాలంటే ఒక కర్తకావాలి అను సూత్రము ప్రకారము, ఇంత పెద్ద విశ్వము సృష్ఠించబడినదంటే దానివెనుకల ఒక సృష్ఠికర్త ఉండి తీరాలి. కార్యమును, కర్తను తెలుసుకొని ప్రపంచ సృష్ఠికి కూడ ఒక కర్త ఉన్నాడని చాలామంది ఒప్పుకొనుచుండగ మేము సైన్సు చదివాము, మాకు ఆధారము కనిపించలేదు, మేము చూడనిదే విశ్వసించము, మేము శాస్త్రజ్ఞులము అని పావలా బేడ శాస్త్రజ్ఞులు అనుచుండగ పెద్ద శాస్త్రవేత్తలు విశ్వమును నడిపించే శక్తి ఒకటుంది, అదియే దేవుడని అంటున్నారు. అబ్దుల్ కలామ్ పెద్ద శాస్త్రవేత్తయిన ఆయనకు దేవుని మీద మంచి అభిప్రాయము కలదు, మిగతవారికెందుకు లేదో ? ఎవరు ఏ అభిప్రాయములో ఉండిన మనము తెలుసుకోవలసింది, తెలియనిది ఒకటుంది. దానిని తెలుసుకొనుటకు ఒక విధానము కూడ కలదు. భౌతిక శరీరములో అభౌతికముగనున్న దానిని తెలుసుకొనుటకు పరికరములు, ప్రయోగాలు పనికిరావు. భౌతిక శరీరములో అభౌతికముగనున్న దానిని అభౌతిక విధానమైన జ్ఞానముతోనే తెలుసుకోవాలి. అట్లుకాక ఎన్నాల్లు వాధించిన జన్మవృథా అగును తప్ప సాధించినదేమి ఉండదు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో|| 9: ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానోఽల్ప బుద్ధయః|
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః||
(హేతువాద, నాస్తిక అసురగుణము)
భావము: ఈ విధమైన భావము గలవారు అల్పబుద్ధిగలవారై, నష్టాత్ములై, క్షయమును పొందుచు, ఇతరులకు అహితులగుచు, భయంకరమైన కర్మను సంపాదించుకొన్నవారై తిరిగి పుట్టుచున్నారు.
వివరము: ఈ శ్లోకములో విశేషమైన పదము ఉగ్రకర్మాణః అన్నది. నాస్తికులకు, హేతువాదులు కర్మసిద్ధాంతమంటే అసలు గిట్టదు. కర్మసిద్ధాంతము యొక్క రహస్యము వారికి తెలియదు. ఈ శ్లోకములో చెప్పుకోతగిన పదము మరొకటి కలదు. నష్టాత్మనః అను ఈ పదమును గురించి కూడ కొంత యోచించవలసియున్నది. ఆత్మ అంటేనే అసత్యమను వారిపట్ల నష్టాత్మ అను పదము ఉపయోగించబడినది. ఒక రాజ్యములో ఉన్నవారందరికి ఆ రాజ్యాంగ చట్టము అమలు జరుపబడును. ఆ రాజ్యములోనున్న ఉగ్రవాదులు, తీవ్రవాదులు చట్టమును వ్యతిరేఖించిన, చట్టమును ఒప్పుకోకపోయిన అక్కడున్న చట్టమునే వారియెడల అమలు జరుపబడును. చట్టమును ఒప్పుకోనంతమాత్రమున ఆ చట్టమునకు అతీతులు కారు. దానితోనే శిక్షింపబడుదురు. ఆ విధముగానే దేవుని రాజ్యమనబడు శరీరములో ఉండి కూడ దేవుని ధర్మమును ఒప్పుకోనంత మాత్రమున ధర్మమునకు వారు అతీతులు కారు. దేవుని చట్టము ప్రకారము శరీరములోనే తగిన శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఎవని శరీర రాజ్యములో వాని యొక్క కర్మ లెక్కించ బడుచుండును. అక్కడ వ్రాయబడిన ధర్మవ్యతిరేఖతకు తగిన శిక్ష శరీరములోనే అమలు జరుపబడును. బయట కోర్టులలో న్యాయవాదులున్నట్లు అక్కడ నీ తరుపున వాదించువారు ఎవరు ఉండరు. అక్కడ వాదనలు, సాక్షాలు ఉండవు. తప్పుచేసిన రోజే శిక్షకూడ వ్రాసిపెట్టబడి ఉండును. చేసిన తప్పుతోపాటు దానికి తగిన శిక్ష కూడ నిర్ణయించి వ్రాయబడి ఉండును.
తప్పుకు శిక్ష సహజమే అయినా ఇక్కడ అసురులైన హేతువాదులు, నాస్తిక వాదులు ఉగ్రకర్మను సంపాదించుకొనుట వలన నష్టాత్ములగుచున్నారు. మానసిక బాధలు, బాధ్యత బాధలు, దెబ్బల బాధలు మొదలగు బాధలను ఎన్ని అనుభవించిన అవి ఉగ్రకర్మలు కావు. శరీరములో ఆత్మశక్తి అందక కొన్ని అవయవములు పనిచేయక పోవడము భయంకర కర్మ అగును. శరీరమునకు శక్తినిచ్చునది ఆత్మ. ఆత్మను నష్టపోవడము అంటే శరీరములో శక్తిని నష్టపోవడమని అర్థము చేసుకోవలెను. ఆత్మశక్తి నష్ట పోయిన వానికి శరీరములో శక్తి అందక, శరీరము అనుకూలించక పోవడము అన్నిటికంటే పెద్ద నరకమగును. పూర్తి పరిశోధించకనే, పూర్తి అవగాహన కాక మునుపే, తాను స్వయముగ అనుభవిస్తున్న ఆత్మనే లేదనడము మహా పాపమగును. అందువలన శ్లోకములో ఉగ్రకర్మ అను పదమును వాడారు. అవయవములకు శక్తి అందకపోతే దానికి మించిన శిక్ష ఉండదు. ఊహించుకుంటేనే భయంకరముగ ఉండును. జీవితమే నరకయాతనై ఎటు తిరిగి అనుభవించవలసి వచ్చును. అంతేకాక తన చుట్టు ఉండువారికి హితములేనివారై పోవుట వలన వారికి ఒక జంతువువలె కనిపిస్తువుండును. శరీర క్షయము కల్గుచు ఒక్కొక్క అవయవము శరీరమునుండి వేరై పోవుచుండును. ఉగ్రవాదులను ప్రభుత్వము దేశ ద్రోహులుగ గ్రహించి వారికి కఠిన శిక్ష అమలు చేసినట్లు, హేతువాదులు, నాస్తికవాదులను ఆత్మద్రోహులుగ లోపలి ఆత్మ గుర్తించి శరీరములోనే శిక్షను అమలు చేయును. ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడము ఎందుకు? తర్వాత జన్మలలో ఆత్మనుండి ఎందుకు నష్టపోవాలి? బయట సమాజమును ఉద్దరించుతానని నీ శరీరములోపల ఉండే సమాజమునకు చెడ్డకావద్దు. ముందు లోపలి సమాజమును తెలుసుకొని తర్వాత బయట సమాజము మీదికి దృష్టి పెట్టు, అదియే సరియైన పద్ధతి.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో||10: కామ మాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః|
మోహా ద్గృహీత్వాఽ సద్గ్రాహాన్ ప్రవర్తంతే ఽశుచివ్రతాః||
(అసుర గుణము)
భావము: దంభ, మాన, మధ, గర్వయుతులైన రాక్షసులు తీరని కోర్కెలు కలవారై, మోహమున తమ తప్పులు గ్రహించనివారై, శాస్త్రీయతలేని పనులచే వ్రతములు ఆచరింతురు.
వివరము: రాక్షసాంశకలవారు కూడ వ్రతములు చేయుదురు. అది మిక్కిలి కోర్కెల నిమిత్తమై ఉండును. అంతేకాక తమ ఆడంబరమును చాటవలెనను ఉద్దేశ్యముతో గర్వముగ చేయునవియై ఉండును. ఎప్పుడు ఎవరికి పైసా ఇవ్వని వారు, తన గొప్పదనమును బయటికి తెలియజేయుటకు, అనవసరమైన సందర్భములో ఎంతైనా ఖర్చుపెట్టి వ్రతములు కూడ చేయుదురు. ఆ వ్రతములు తీరని అసాధారణ కోర్కెలై ఉండును. అటువంటి పూజలు ఈ కాలములో ఎందరో చేయుచున్నారు. దైవాంశ కలవారు చేయు పూజలు, రాక్షసాంశకలవారు చేయు పూజలలో కూడ ఎంతో తేడావుండును. అసురుల పూజలు కోర్కెల నిమిత్తమై ఉంటూ తమ గొప్పదనమును చాటునవై ఉండును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో|| 11: చిన్తా మపరిమేయాం చ ప్రళయాన్తా ముపాశ్రితాః|
కామోపభోగపరమా ఏతావ దితి నిశ్చితాః||
(అసుర గుణము)
(15)శ్లో|| 12: ఆశాపాశశతైర్బద్ధాః కామ క్రోధపరాయణాః|
ఈహన్తే కామభోగార్థ మన్యాయే నార్థ సంచయాన్||
(అసుర గుణము)
భావము: మరణించువరకు బ్రతుకు తెరువు కొరకు పరిమితములేనట్టి చింత చేయువారై, కోర్కెల వలన కల్గు సుఖములే గొప్పవని మనస్సులో నిశ్చయము చేసుకొన్నవారై, ఆశయను పాశముచే అనేక విధముల బంధింపబడినవారై, కామక్రోధ పరవశులై, తమ కోర్కెలు నెరవేర్చుకొనుటకు అన్యాయమైన మార్గముల ద్వార ధనము సంపాదింతురు.
వివరము: అసురజనులకు మరణించు చివరి క్షణము వరకు కోర్కెలే ఉండును. మరు గంటలో చావు తప్పదని తెలిసినప్పటికి చేతనైతే ఆ గంట కూడ ఏదోఒకటి సంపాదించవలెనను కోర్కెయే ఉండును. ఎటూ నేను పోతున్నాను కదా! కోర్కెలతో నాకేమి పనియని అనుకోడు. అంతేకాక వారు తమ జీవితకాలములో కోర్కెలే దైవముకంటే పెద్దవని తలచినవారై, సంపాదనే మిగుల గొప్పకార్యమని తలపోసిన వారై, తమ బుద్ధినంతటిని సంపాదించుటయందే లగ్నము చేసివుందురు. డబ్బుకొరకు దేనినైన వదలుకొను స్వభావముగలవారు దైవమును కూడ లెక్కించరు. వారి మనస్సులో సంపాదించవలెనను కోర్కె తప్ప మరేమి ఉండదు. అటువంటి వారు నానా ఆశలను త్రాళ్లచే కట్టబడినవారై నాకు ఇల్లు కావలెనను కోర్కె భూమి కావలెనను కోర్కె, బంగారు కావలెనను కోర్కె, ధనము ఎక్కువగ ఉండవలెనను కోర్కె ముఖ్యముగ ఉంటూ, వాటి వెనుక అనేకమైన చిన్న చిన్న కోర్కెలుంటు, అవి నెరవేరుటకు అన్యాయమైన మార్గముల ద్వారా ధనమును సంపాదించుచుందురు. రాజకీయములోకాని, వ్యాపారములోకాని అన్యాయమార్గములో మిక్కిలిగ సంపాదించినప్పటికి ఇక చాలునను తృప్తి ఉండక నానాటికి ఎక్కువగుచునే ఉండును. చివరకు చనిపోవునపుడు కూడా ఆ చింతలోనే చనిపోవుదురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో||13: ఇద మద్య మయా లబ్ధ మిమం ప్రాప్స్యే మనోరథమ్|
ఇద మ స్తీద మపి మే భవిష్యతి పునర్ధనమ్||
(అసుర గుణము)
భావము: ఈ ధనమిప్పుడు నాచే సంపాదించబడినది. మన కోర్కెలను బట్టి సంపాదించగలము. ఇప్పుడు సంపాదించిన ధనమంతయు నాది. మరల నేను ఎంతో ధనమును సంపాదించగలను.
వివరము: రాక్షసాంశకలవారు అన్యాయ మార్గమున సంపాదించుచుందురను కొన్నాము కదా! అలా సంపాదించిన దానిని చూచి నేను ఇంత ధనము సంపాదించానని మురిసి పోవుచుందురు . అంతేకాక మనమెట్లనుకొంటే అట్లు సంపాదించగలమని ఇతరులకు కూడ చెప్పుచుందురు. నా తెలివితో నేనింత ఆస్తిని సంపాదించాను. ఇక ముందు కూడ సంపాదించగలనని చెప్పుచుందురు. నీతి నియమములకు న్యాయమునకు లోబడి సంపాదించలేని వానిని అసమర్థునిగ తాము సమర్థులుగ చెప్పుకొనుచుందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో||14: అసౌ మయా హత శ్శత్రుః హనిష్యే చాపరా నపి|
ఈశ్వరోఽహ మహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ||
(అసుర గుణము)
(15)శ్లో||15: ఆడ్యోఽ భిజనవా నస్మి కోఽ న్యోఽస్తి సదృశో మయా|
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్య జ్ఞాన విమోహితాః||
(అసుర గుణము)
(15)శ్లో||16: అనేక చిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః|
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేఽశుచౌ||
(అసుర గుణము)
భావము: నేను శత్రువును చంపినాను. ఇతర శత్రువులను కూడ చంపగలను. నేనే ఈశ్వరుడను, భోగిని, సుఖిని, నేను సిద్ధుడను, నేను బలశాలిని, జనులలో మంచి కులమువాడను, భాగ్యవంతుడను, నాకు సమానులెవ్వరు లేరు, నేను యజ్ఞము చేయుదును, దానము చేతను, ఆనందపడెదనను అజ్ఞాన భ్రమచే మోహితులైనవారు, అనేక విధములగు చిత్తవిభ్రాంతి పరులు, మోహమను వలలో చిక్కి కోర్కెలను అనుభవించుటయందు ఆసక్తి గలవారై పాపమును సంపాదించుకొని నరకమును అనుభవించుటకు పోవుచున్నారు.
వివరము: అసుర భావములుగలవారు జ్ఞానమును ఏమాత్రము తెలియని వారగుట వలన వారికి కర్మయొక్క విధానము అసలు తెలియదు. ప్రతి పనికి కర్మ కారణమని దాని ప్రకారము మనుషులు నడుచుకోవలసి ఉన్నదని తెలియనివారై , ప్రతి పనికి తామే కారణమనుకొనుచున్నారు.అట్లనుకొనుట వలన శత్రువు తమ చేత చంపబడిన దానికి కారణము నేనేనని, శత్రువును తన బలముచేతనే చంపగలిగానని అనుకొనును. కర్మచేత జరుగబడిన కార్యమని తలపోయడు. అలాగే కర్మ కారణమున ధనికుడయినట్లయితే తానే భోగిని సుఖవంతుడు బలశాలియని అనుకొనును. యజ్ఞ దానములను తానే చేయుచున్నానను భ్రమలోనే ఉండును. అటువంటి అహంకార యుక్తులు చేయుపనులలో కర్మ సంభవించి దానిని అనుభవించుటకు తిరిగి పుట్టుచుందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో||17: ఆత్మ సమ్భావితాః స్తబ్ధా ధనమాన మదాన్వితాః|
యజన్తే నామ యజ్ఞై స్తేదమ్భే నావిధిపూర్వకమ్||
(అసుర గుణము)
భావము: తమ్ము తాము పొగడుకొనుచు, తమ ప్రభావమే గొప్పదనుచు, ధన మాన మధములచే కూడిన వీరు, గర్వముతో అశాస్త్రీయపద్ధతిలో చేయు యజ్ఞమును నామకార్థయజ్ఞమనవచ్చును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో||18: అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః|
మా మాత్మపర దేహేషు ప్రద్విషన్తోఽభ్య సూయకాః ||
(అసుర గుణము)
భావము: అట్టి అసుర జనులు అహంకారాగ్నులై ఉండి, బలము గర్వము కామ క్రోధమును ఆశ్రయించినవారై, తమ శరీరములందును, పర శరీరములందునున్న నన్ను అసూయతో ద్వేషించుచుందురు.
వివరము: అసుర జనులకు తమ శరీరములో ఉన్న దైవమే ఇతరుల శరీరములో కూడ ఉన్నదని తెలియదు. వాడు వేరు తాను వేరను భావములో పూర్తిగ ఉండి, తనకు కల్గిన వాటితో తనను ఫలానావాడనని తలచుకొనుచు అహంకారము కలవాడై, తనయందు మరియు ఇతరులయందుగల దైవమును కూడ అసూయతో ద్వేషించుచున్నాడు. ఆత్మజ్ఞానము పట్టనివారు వారు చేయు బాహ్యారాధనలను గొప్పగ తలచుకొని, జ్ఞానము యోగము మొదలగు ఆత్మ విషయములను అసూయతో చూస్తు ద్వేషించుచుందురు. కోర్కెలతో కూడివుండి, కోర్కెలతో చేయు వ్రతక్రతువులనే గొప్పగా తలచుకొని, దైవికమైన ఆత్మ, పరమాత్మలను తెల్పు జ్ఞానులను, గురువులను ద్వేషించుటేకాక, వారికి చెడు చేయుటకు ప్రయత్నించుచుందురు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో||19: తా నహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్|
క్షిపా మ్యజస్ర మశుభా నా సురీ ష్వేవ యోనిషు ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము: కౄరులు, ద్వేషులు,శుభమును ధూషించు ఆ నరాధములను అసుర యోనులందే త్రోయబడి సంసార దుఃఖ గతులను పొందునట్లు నేనే చేయుచుందును.
వివరము: శరీరమందున్న ఆత్మ, పరమాత్మలను ధూషించువారు, జ్ఞానులను, గురువులను శత్రువులుగ చూచి బాధించువారు, కౄరులు ద్వేషులు అయిన వారిని జన్మ జన్మలకు అసురులుగానే పరమాత్మ పుట్టించుచుండును. వారిని తిరిగి రాక్షసత్వము గల వారింటనే పుట్టించి అక్కడ సంసార విషయములందే మునిగి పోవునట్లు చేయును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15) శ్లో|| 20: ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని|
మా మప్రాప్యైవ కౌన్తేయ! తతో యాన్త్యధమాం గతిమ్||
(జీవాత్మ, పరమాత్మ)
భావము: అట్లు అసుర యోనులందు జన్మించినట్టివారు జన్మ జన్మములకు అజ్ఞానులగుచు నన్ను పొందు జ్ఞానము యొక్క విధానమే తెలియలేరు. జన్మ జన్మకు అధమగతి పొందుచుందురు.
వివరము: అజ్ఞానమార్గమున నడుచుకొనుచు ప్రపంచములో కొంతకాలము బ్రతికి పోవు మానవులు అసుర భావము కల్గినవారై, తాము ఉన్న స్థితిలో తమను ఫలానావారమని లెక్కించుకొని ఆత్మజ్ఞానులను, గురువులను అసూయతో ద్వేషించిన అది పరమాత్మనే ద్వేషించినట్లగును. ఉదాహరణకు ఒక పోలీస్ ఉద్యోగి సి.ఐ లేదా డి.ఎస్.పి హోదాకలిగినవారనుకొందాము. అతడు ప్రస్తుతము చేయుచున్న ఉద్యోగమును బట్టి నేను ఫలానా అని అహము పొందివుండి నేను ఉద్యోగరీత్యా ఎవడైన సాధారణ జీవాత్మనను విషయము తెలియక అహముతో నిండి గర్వదంభములు కల్గి ఒక గురువును లేక ఆత్మజ్ఞానిని పోలీస్ స్టేషన్ లో నిలబెట్టి అసూయతో ద్వేషించాడనుకొందాము. ఇతరులను తిట్టిన అంత ప్రమాదము లేదుకాని ఒక జ్ఞానిని అదేపనిగ తప్పులేకున్న అసూయతో నిందించితే అది దైవదూషణే అగును. అట్టి వాని మీద పరమాత్మ తప్పక ఏవగింపు కల్గినవాడై వానిని జ్ఞానములేని అసురజాతియందే పుట్టించును. ఇచట వాని కర్మ కూడ పుట్టుకను నిర్ధారించలేదు. ఇది కర్మాతీతమైన పరమాత్మ పనిగ పరిగణించబడుతున్నది. అలా అసురయోనులందు పుట్టినవాడు జన్మ జన్మలకు జ్ఞానమునకు దూరమగుచు, ఏ జన్మకు జ్ఞానము యొక్క గట్టు దొరకకుండ పోవునట్లు పరమాత్మ చేయుచున్నాడు. ఈ విధముగ జన్మ జన్మకు అధోగతి తప్ప వేరులేదు. అందువలన ఆత్మజ్ఞానము కల్గినవారి ఎడల ఎంత గొప్ప ఉద్యోగియైన, రాజకీయవేత్తయిన , ధనికుడైన జాగ్రత్తగ వినయ విధేయతలతో మసలుకోవలెను. అట్లుకాక వారిని ధూషించి ద్వేషించుట వలన తిరిగి వారేమి అనరు, కాని వారివెనుక కనిపించకున్న పరమాత్మ ఏమైన చేయును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో|| 21: త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మనః|
కామః క్రోధస్తథా లోభ స్తస్మా దేత త్త్రయం త్యజేత్ ||
(ప్రకృతి)
భావము: ఆత్మ నాశనకరమైన ఈ అసుర భావమునకు మూడు త్రోవలుండును. కామ, క్రోధ, లోభమను మూడింటిని వర్జింపవలయును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15)శ్లో|| 22: ఏత్తెర్విముక్తః కౌన్తేయ! తమోద్వారైస్త్రిభిర్నరః |
ఆచర త్యాత్మన శ్శ్రేయ స్తతో యాతి పరాం గతిమ్ ||
(ప్రకృతి)
భావము : ఈ మూడు తమో ద్వారములను ఎవడు విడుచునో వానికి శుభము ఏర్పడి పరమపదము పొందగలడు.
వివరము : అసుర భావము కలుగజేసి మానవుని అధోగతికి పంపు ఆశ, కోపము, లోభము అను మూడింటిని వదలి వాటికి వ్యతిరేఖమైన దానము , దయ, ఔధార్యాము కలిగివుండుట వలన వాటి ద్వారా మంచిచేయుచు జ్ఞానము వైపు చూపుమరల్చుటకు వీలగును. తరువాత కొన్ని జన్మలకైన జ్ఞానమూనార్జించి మోక్షమునకు అర్హుడగును.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15) శ్లో|| 23: య శ్శ్యాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః|
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ||
(జీవాత్మ)
భావము : శాస్త్రవిధులను విడచి ఆశ కొరకే సంచరించువాడు ఏమి సాధించలేదు . వాడు సుఖమును పొందలేడు, మోక్షమును పొందలేడు.
వివరము : జీవితమునకొక విధానముంటుందని, జీవితమును శాసనబద్ధముగ పెద్దలు చెప్పినట్లు గడుపవలెనని తెలియక, వారి ఇష్టమొచ్చినట్లు సంచరించుచు, ఆశ అను పెద్ద గుణముచే ధనార్జనే జీవిత ధ్యేయముగ పెట్టుకొని , శాస్త్రవిధులైన నీతి న్యాయము, జ్ఞాన ధర్మములను గాలికి వదలి, ధన సముపార్జనకు ఎట్లయిన మాట్లాడి ఎట్లయిన చేయువాడు దైవపరముగ ఏమి సాధించలేడు. ఎంత సాధించిన వానికి సుఖముండదు, మోక్షము ఎప్పటికి పొందలేడు.
☞
త్రైత సిద్ధాంత
భగవద్గీత
☜ దైవాసురసంపద్విభాగ యోగము
☞
(15) శ్లో|| 24: తస్మా చ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్య వస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహ్హారసి ||
(జీవాత్మ)
భావము : కార్య అకార్యములను తెల్పునది శాస్త్రము . కనుక శాస్త్రవిధానము ఎరిగి కర్మలాచరించవలెను.
వివరము :మానవ జీవితములో కర్మ ప్రకారము జరుగు కార్యములను ఈ ప్రకారము చేయవలెనని, ఈ ప్రకారముగ చేయకూడదని తేల్చి చెప్పగలిగినది శాస్త్రము. శాస్త్రము శాసనములతో కూడుకొనివున్నది. శాసన నిర్ణయము ప్రకారము పనులు చేసిన అందులో కర్మ అంటదు. శాస్త్ర ప్రకారము చేయకుండిన ఆ పనులలోని కర్మ అంటుకొనుచుండును. చేతికి తొడుగు తగిలించుకొని పని చేసిన ఏ మురికి చేతికంటదు. అదే పనిని తొడుగు లేకుండ చేసిన చేతికి మురికి అంటుకొనును. అలాగే శాస్త్రమును అనుసరించి చేయు పనిలో కర్మ అంటదు. అదే పనిని శాస్త్రబద్దము కాకుండ చేసిన కర్మ అంటును.
☞