pss book:gt3 త్రైత సిద్ధాంత భగవద్గీత: జ్ఞాన యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత:☜ జ్ఞాన యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత:☜ జ్ఞాన యోగము
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 1: ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే ఽబ్రవీత్ ||
(కర్మ యోగము, బ్రహ్మ యోగము)
భావము :ఇది అవ్యయమైన జ్ఞానము. మొదట దీనిని సూర్యునికి చెప్పియుంటిని. సూర్యుడు మనువుకు చెప్పెను. తర్వాత మనువు ఇక్ష్వాకుడను రాజుకు చెప్పెను.
వివరము : చెప్పినవాడు భగవంతుడు. చెప్పినది నాశనములేని జ్ఞానమును. మొదట విన్నవాడు సూర్యుడు. చెప్పిన వాడు ఆనాడు ఎట్లున్నాడో, శరీరము ధరించి చెప్పాడో, శరీరము లేకనే శూణ్యములో శబ్దము పుట్టించి చెప్పాడో తెలియదు. ఆయన ఎట్లు చెప్పినప్పటికి జ్ఞానము శబ్దరూపములోనే రావాలి. శబ్దరూపములో ఉన్న జ్ఞానమును సూర్యుడెలా విన్నాడు? అన్నది ప్రశ్న. పూర్వకాలమైతే ఏమి చెప్పినా నమ్మేవారమే. కాని ఈనాడు అంత గ్రుడ్డిగ నమ్మలేము. విజ్ఞానము ఎంతో పెరిగిన ఈ రోజులలో సూర్యుడు ఒక గోళమని, అది అగ్నిమయమని, భూమికంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దదైన సూర్యగోళము నిత్యము మండుచూ వేడిమి వెలుతురు నిచ్చుచున్నదని అందరికి తెలుసు. మనుజుల మాదిరి శరీరములేని సూర్యుడు పరమాత్మ చెప్పిన జ్ఞానము ఎలా విన్నాడు? అను ప్రశ్న రాకమానదు. ఇంతటితోనే ఆగక మనువు భూమిమీద ఉన్న ఒక మనిషి కావున అతనికి సూర్యుడెలా చెప్పాడు? చెప్పుటకు సూర్యునికి నోరు లేదే? అంతపెద్ద సూర్యుడు ఎక్కడ? ఎంతో చిన్న భూమిమీద మరీ చిన్నగవున్న ఒక మనిషి ఎక్కడ? సూర్యుడు నిజముగ చెప్పాడా? చెప్పితే ఒక మనిషి వినగలిగాడా? మనిషి దగ్గరకు సూర్యుడు వస్తే మనిషి సూర్యుని వేడిమికి తట్టుకోగలడా? ఇట్లు అనేక ప్రశ్నలు ఉద్భవించగలవు.ఈ ప్రశ్నలకు జవాబు లేకున్న ఎడల జ్ఞానము సంశయమయమైపోగలదు. సంశయములులేనిది జ్ఞానము అను సూత్రము ప్రకారము సంశయములున్నది అజ్ఞానమగును. ఎందరో భగవద్గీతను వ్రాసినవారు చదివినవారు ఉన్నప్పటికి వారికి ఈ ప్రశ్నలు వచ్చియుండవా? ఒకవేళ వ్రాసిన వారు ఈ విషయమును దాటివేసియుండవచ్చును. చదువు వారికైన ఈ అనుమానములు వచ్చియుండవా? వ్రాసినవారి మరియు చదివినవారి భావము మాకు అర్థముకాక, భగవద్గీతను ప్రతిదినము చదువుచున్న ఒక వ్యక్తిని మేము ఈ ప్రశ్నలు అడిగాము. దానికి అతను నవ్వి ఒక మాటన్నాడు. 'కథకు కాల్లులేవు ముంతకు చెవులు లేవు ' ఆ మాటవిన్న మేము ఒక నిమిషము స్థంభించిపోయాము. అతనితో ఏమి మాట్లాడవలెనో అర్థముకాక ఊరకుండి పోయాము. ప్రజలవద్ద భగవద్గీత ఏ రూపములో ఉన్నదో మాకు అర్థముకాలేదు.
భగవద్గీత కథ కాదు. భగవద్గీత మానవాళి ఎడల జ్ఞానరేఖ. ప్రకృతి నుండి మొదలిడి దైవము వరకు గీయబడిన గీతయే ఇది. ఇందులో అసత్యమునకు తావులేదు. అన్నీ సత్యములే. అన్నీ యదార్థ సత్యములైనపుడు, శాస్త్రబద్ధమైనపుడు ఏ ప్రశ్నకైన జవాబుండును. ఇపుడు సూర్యుని గురించి మనువును గురించి వచ్చిన ప్రశ్నలకు జవాబులను తెలుసుకొందాము.
ప్రపంచములో ఎన్నో జీవరాసులున్నవి. అనేక శరీరములు ధరించిన జీవరాసులు భూమిమీదనే కాక సముద్రములోను, ఆకాశములోను కూడ కలవు. జీవరాసులు ధరించిన శరీరములను బట్టి స్థావర జంగమములను కదలనివి కదిలెడివి రెండు రకములుగ ఉన్నవి. భూమిమీద మనుజులు, సముద్రములో జలచరములు, ఆకాశములో పక్షులేకాక విశ్వగగనములో ఉన్న ఎన్నో గ్రహములు కూడా సజీవమైనవే. సూర్యచంద్రాది గ్రహములు కూడ నాటికి నేటికి సజీవమైనవే. ఈ మాట క్రొత్తదేమి కాదు. మొదట సూర్యునికి జ్ఞానమును చెప్పానని, భగవంతుడే అన్నాడుకదా! ఆ మాటను బట్టి సూర్యుడు సజీవమైనవాడని తెలియుచున్నది. జీవులు ధరించిన శరీరములు అనేక రకములుగ ఉన్నాయని ముందే అనుకొన్నాము. ఆ మాటప్రకారము మనిషి శరీరము కదులుచున్నది. మనిషి శరీరము మాదిరి తయారు చేయబడిన గుడిలోని ప్రతిమకు కూడ జీవము గలదు. మనిషి కదలుట వలన జీవమున్నదని సులభముగ తెలియుచున్నది. ప్రతిమ కదలదు కావున దానిలో జీవమున్నదని గుర్తించలేకున్నాము. ఇటువంటి శరీరముండి కదలనివి ఎన్నో రకముల జీవరాసులున్నవి. అటువంటి వాటిలో సూర్యగోళము కూడ ఒకటి. రకరకాల జీవ శరీరములు ఉన్నట్లు, గోళముల రూపములోవున్న జీవరాసులు కూడ ఎన్నో గలవు. అందులో సూర్యుడొకడని తెలియాలి. కనిపించని గజ్జిక్రిమి ఆకారమునకు, కనిపించెడి ఏనుగు ఆకారమునకు ఎంతో తేడావున్నది కదా! అట్లే చిన్నగ ఉన్న మనిషి ఆకారమునకు దూరముగావున్న సూర్యుని ఆకారమునకు ఎంతో తేడా ఉన్నప్పటికి ఆయా శరీరములలోని జీవాత్మలలో తేడాలు లేవు. అన్ని శరీరములలో గల జీవులు కర్మబద్ధులై ఉన్నవారే. కర్మబద్ధుడైన సూర్యునికి కూడ జ్ఞానము అవసరము. కాబట్టి పరమాత్మ సూర్యునికి మొదటనే జ్ఞానమును చెప్పానన్నాడు.
ప్రతి జీవరాశి శరీరమును విభజించితే 25 భాగములుగనున్నది. ఆ 25 భాగములలో బయటి ఇంద్రియములైన కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, మొత్తము 10కాగ లోపలి భాగములు15 కనిపించనివిగ ఉన్నవి. కనిపించని జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను ఐదు అంతఃకరణములు, కనిపించని వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాణ వాయువులు ఐదు మరియు చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అను జ్ఞానేంద్రియములలో అణిగివున్న పంచతన్మాత్రలు కనిపించనివి. కనిపించని 15 భాగములకు సూక్ష్మశరీరమని పేరు పెట్టారు. కనిపించెడి బయటి శరీరములోని భాగములైన కాళ్ళు, చేతులు, నోరు, గుదము, లింగము అను కర్మేంద్రియములు మరియు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక,చర్మము అను జ్ఞానేంద్రియములు మొత్తము పదింటిని స్థూలశరీరము అనవచ్చును. దీనిని బట్టి స్థూల, సూక్ష్మ శరీరములని శరీరము రెండు భాగములుగ విభజింపబడినది. అన్ని జీవశరీరములు సూక్ష్మ స్థూలములుగ ఉన్నవని తెలియాలి. ఈ సూత్రము ప్రకారము ఆకాశములోని సూర్యునికి కూడ స్థూల సూక్ష్మములను రెండు శరీరములున్నవి. ఈ సూత్రము ప్రకారమే గుడిలోని ప్రతిమకు కూడ రెండు శరీరములున్నవి.
ప్రతి దేహములోను ఒక జీవుడున్నట్లు, ప్రతి దేవాలయములోని ప్రతిమలో ఒక జీవుడున్నాడు. మనిషి దేహములోని సూక్ష్మశరీరమును గ్రహ అంటాము. అట్లే ప్రతిమ శరీరములోని సూక్ష్మశరీరమును విగ్రహ అంటాము. మనిషి సూక్ష్మశరీరము ఇతరుల శరీరములో ప్రవేశించి మాట్లాడుట మనము చూచియే ఉంటాము. అట్లే గుడిలోని విగ్రహము కూడ ఇతరుల శరీరములో ప్రవేశించి మాట్లాడుట కూడ చూచియేయుందుము. స్థూలశరీర నిర్మాణము ఏ విధముగ ఉన్నప్పటికి, సూక్ష్మమునందు పంచతన్మాత్రలతో చూచుట వినుట గలదు. సూక్ష్మశరీరములు అందరిని చూస్తున్నవి. అట్లే అందరి మాటలు వినగలుగు చున్నవి. స్థూలశరీరములున్న చెట్లలో కూడ సూక్ష్మమున్నది. అందువలన చెట్లు వినగలుగుచున్నవి, చూడగలుగుచున్నవి. ఈ విధముగనే సూర్యుడు చూడగలుగుచున్నాడు మరియు వినగలుగుచున్నాడు
ముఖ్యముగ గమనించవలసిన విషయమొకటున్నది. అదేమనగా! స్వయముగ కదిలెడు శరీరములలో ఉన్న సూక్ష్మశరీరము, ఒక్కమారు బయటికి వస్తే తిరిగి ఆ శరీరములో ప్రవేశించదు. స్వయముగ కదలని ప్రతిమ శరీరములో ఉన్న సూక్ష్మశరీరము ఎన్నోమార్లు బయటికి రాగలదు, తిరిగి ఆ శరీరములో ప్రవేశించగలదు. శరీరము బయటికి వచ్చి తిరిగి చేరలేని సూక్ష్మ శరీరములను గ్రహలు అన్నాము. శరీరము నుండి బయటికి వచ్చి తిరిగి శరీరమును ప్రవేశించు సూక్ష్మశరీరములను విగ్రహములు అన్నాము.గ్రహాలు తమ శరీరము నుండి తామనుకొన్నపుడు బయటికి రాలేవు. అట్లే శరీరములోనికి చేరనులేవు. విగ్రహాలు తమ శరీరములనుండి తామనుకొన్నప్పుడు బయటికి రాగలవు, తిరిగి అట్లే చేరగలవు. గ్రహాలు తమ ఇష్టమొచ్చినప్పుడు స్థూలశరీరముతో ఎక్కడికైనా పోగలవు. విగ్రహాలు తమ స్థూలశరీరముతో తామంతకు తాము ఎక్కడికి పోలేవు. ఇట్లు స్థూల సూక్ష్మములలో స్థావర జంగమమైన వాటికి ఎన్నో తేడాలున్నాయి.
మనిషి కదిలెడి జీవరాసుల తెగలోనికి వస్తాడు. కనుక వాని సూక్ష్మమును గ్రహ అనవచ్చును. ఒక గోళము తమంతకు తాము కదలలేదు. కనుక దాని సూక్ష్మమును విగ్రహ అనవచ్చును. ఈ లెక్క ప్రకారము సూర్యుడు విగ్రహ, మనిషి గ్రహ అని గ్రహించవచ్చును. జగతి పుట్టినపుడు మొదటనే పరమాత్మ సూర్యునకు జ్ఞానమును బోధించాడు. సూర్యుడు తనలోని సూక్ష్మమునకున్న వినికిడియను తన్మాత్రచేత ఆనాటి జ్ఞానమంతయు వినగలిగాడు. తర్వాత సూర్యుడు విన్న జ్ఞానమును భూమిమీద మనిషిగ ఉన్న మానవునకు బోధించాడు. అదెట్లనగా! సూర్యుడు తన స్థూలశరీరము విడిచి, సూక్ష్మశరీరముతో భూమి మీదకు వచ్చి, వేరే మనిషి శరీరములో ప్రవేశించి, మనువుకు జ్ఞానమును బోధించియుండవచ్చును. అలా మనువునకు బోధించి తిరిగి తన స్థూలశరీరమైన అగ్ని గోళమును చేరియుండవచ్చును, ఉండవచ్చు అనుమాటకాదు, నిజముగ ఆనాడు అలాగే జరిగినది. సూర్యుని ద్వారా భూమి మీదనే జ్ఞానము తెలుసుకొన్న మనువు, తాను తెలుసుకొన్న జ్ఞానమును ఇక్ష్వాకుడను రాజుకు తెలిపినాడు.
ఇప్పుడీ వివరము తెలిసినది కావున మనలోని ప్రశ్నలన్నింటికి జవాబు దొరికినది. జ్ఞానము విన్న సూర్యుడు జీవాత్మ అని తెలియకపోయిన, శరీరము ధరించిన ప్రతి ఒక్కరికి రెండు శరీరములున్నవని తెలియకపోయిన, ఆ శరీరములకు ఉన్న ప్రత్యేకతలు తెలియకపోయిన, పై శ్లోకమునకర్థమే తెలియదు. అందులోని ప్రశ్నలకు జవాబులే ఉండవు. అందువలన స్థూల సూక్ష్మము గురించి పూర్తి అవగాహన చేసుకోవాలని కోరుచున్నాము. లేకపోతే నిన్ను నీవే తెలుసుకోలేవు.
శ్లోకం 2: ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః |
సకాలే నేహ మహతా యోగో నష్టః పరన్తప! ||
(కర్మ యోగము, బ్రహ్మ యోగము)
భావము : ఒకరినుండి ఒకరికి పరంపరగ తెలుస్తుపోయి రాజులు, ఋషులు తెలుసుకొనిరి. ఎంతో కాలము ఈ విధముగ జరుగగ, చివరకు యోగముల జ్ఞానము తెలియకుండపోయినది.
వివరము : భగవంతుడు మొదట సూర్యునికి తెలిపిన జ్ఞానము ఒకరి నుంచి ఒకరికి తెలుస్తూ పోయి, పరంపరగ గొప్ప రాజులు ఋషులెల్ల తెలుసుకొనిరి. మొదట రాజులతో మొదలైన జ్ఞానము చివరకు అడవులలో ఉన్న ఋషుల వద్దకు చేరినది. పూర్వము మొదట భగవంతుడు జ్ఞానము ప్రజలకు తెలియాలనుకొని, ప్రజలకు పెద్దలైన రాజలకు చెప్పితే, వారిద్వార సులభముగ ప్రజలలోనికి ప్రాకిపోవునని తలచి, రాజులకే తెలియునట్లు చేసెను. రాజులకు తెలిసిన దానిని ప్రజలకు బోధించగ తెలిసిన కొందరు కాలక్రమేపి అడవులలో చేరిపోయిరి. రాజులకు జ్ఞానము మీద ఆసక్తి తగ్గి చివరికు వారికే తెలియకుండ పోయెను. ఎక్కడైనా జ్ఞానము మీద ఆసక్తి కల్గిన రాజులుంటే, వారు అడవులలోని ఋషులవద్దకు పోయి జ్ఞానము తెలుసుకొనెడి వారు. కాలక్రమేపి అడవులలోని ఋషులయందు, ప్రజలలోని నాయకులయందు జ్ఞానము శూణ్యమైపోయింది. ఒకవేళ ఎక్కడైనా తెలిసిన ఋషులున్నారనుకొనిన, అట్లే తెలిసిన నాయకులున్నారనుకొనిన, వారివద్ద ఉన్నది యోగజ్ఞానము కాదు, కామ్యజ్ఞానము. పరధర్మమైన ఆశాజ్ఞానమే ప్రజలలో కూడ నిండిపోయి కోర్కెల పూజలు, కోర్కెల యజ్ఞములు, కోర్కెల వ్రతములు శ్రద్ధగ ఆచరించుచున్నారు. ఆశను అణచివేయు స్వధర్మ జ్ఞానముకాని, కర్మను నాశనము చేయు ఆత్మజ్ఞానముకాని ఏమాత్రము లేకుండ పోయినది. అందువలన దీనిని చెప్పవలసిన అవసరమొచ్చినదని క్రింది శ్లోకమున భగవంతుడు ఈవిధముగ అంటున్నాడు.
శ్లోకం 3: స ఏవాయం మయా తే ఽ ద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తో ఽసి మే సఖా చేతి రహస్యం హ్యేత దుత్తమమ్ ||
(కర్మ యోగము, బ్రహ్మ యోగము)
భావము : ఉత్తమమైనది, చాలా రహస్యమైనది, పురాతనమైనది అయిన యోగ విద్యను ఇపుడు నీవు నాకు భక్తుడవు, ప్రియుడవు కావున చెప్పుచున్నాను.
వివరము : యోగములకు సంబంధించిన జ్ఞానము ఎంతో విలువైనది. ఎంతో విలువైన యోగజ్ఞానము భగవంతుని మీద భక్తివున్న వారికి, ఆత్మజ్ఞానము మీద శ్రద్ధవున్న వారికి మాత్రమే తెలియజేయాలి. అపుడే జ్ఞానమునకు విలువవుండును, తెలిపిన జ్ఞానము సార్థకమగును. అట్లుగాక కోర్కెలుండి కోర్కెలు కోరుచు పూజలు చేయు భక్తులకు, యోగములందు ఆసక్తిలేనివారికి, ఈ జ్ఞానమును ఏమాత్రము తెలుపకూడదు. అట్లు తెల్పిన ఎడల జ్ఞానమునకు వారియందు ఏమాత్రము విలువ లేకుండ పోవును. జ్ఞానమును తెలుసుకొనుటకు తెలుపు వానివద్దకు వచ్చునపుడు ఖర్చయిన పదిరూపాయలే వానికి పెద్దగా ఉండును. వచ్చి తెలుసుకొన్న జ్ఞానము వానిలెక్కలో పదిరూపాయల విలువకంటే తక్కువగ ఉండును. అందువలన శ్రద్ధాభక్తులున్న వారికే తెలియజేయాలను నిమిత్తము, అర్జునుని భక్తుడవు ఇష్టుడవు అన్నాడు.
అర్జునుడిట్లనియె :
శ్లోకం 4: అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః |
కథ మేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : ఆదిలో సూర్యునికి జన్మకలిగెను. నీ జన్మ ఇపుడు ఈ కాలములో కల్గినది. ఇపుడున్న నీవు పూర్వము సూర్యునికెలా చెప్పితివి. నమ్ముటెట్లు?
వివరము : ఇలా అర్జునుడు ప్రశ్నవేయడము చాలా సంతోషదాయకము. విషయము అర్థముకానపుడు, ప్రశ్నవేసి తెలుసుకోవలసిన అవసరమున్నపుడు, భగవంతునినైన నిలదీసి అడుగవలసిందేనని ఇక్కడ తెలియుచున్నది. అట్లు అడుగుట వలన వినేవానిలో ఆసక్తి పెరిగినదని తెలియుచున్నది. ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునునికి మధ్యలో ప్రశ్నలు వేయకూడదని చెప్పలేదు. ఆనాటి సాంప్రదాయమలావుండేది. ఈనాడు చెప్పునపుడు వినవలసిందే కాని ప్రశ్న వేయకూడదను సాంప్రదాయమొచ్చినది. అందువలన ప్రశ్నలకు జవాబులు లేకుండా పోయినవి. వినేవానికి విషయము లోపలికి దూరుతుందో లేదో అర్థముకాలేదు. వినేటప్పుడు అర్థము కాకపోతే ప్రశ్నవేసి తెలుసుకోవడము సత్ సంప్రదాయము. అర్థము కాకపోయిన తలూపడము మంచిదికాదు. ఒకవేళ అడిగేవారున్నప్పటికి మధ్యలో ప్రశ్నవేయకూడదనుట జ్ఞానాన్ని మభ్యపెట్టడమగును. 'నా యెదుట ఇప్పుడున్న నీవు ఎంతో పూర్వము పుట్టిన సూర్యునికెలా చెప్పావు' అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవంతుడైన శ్రీకృష్ణుడు క్రింద ఈ విధముగ అంటున్నాడు.
శ్రీ భగవంతుడిట్లనియె :
శ్లోకం 5: బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప! ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : నాకు ఎన్నో జన్మలు కల్గినవి, నీకు కూడ ఎన్నో జన్మలు కల్గినవి. అవి అన్నియు వరుసగ నాకు తెలియును. నీకు మాత్రము ఏవీ తెలియవు.
వివరము : పరమాత్మ ఎన్నోమార్లు భూమిమీద పుట్టాడు. అట్లే జీవాత్మ కూడ పుట్టుచువచ్చాడు. ఆయనకు అన్ని జన్మలు జ్ఞాపకమున్నాయి. జీవులమైన మనకు ఏమాత్రము జ్ఞాపకము లేవు. ఇక్కడ మనకెందుకు జ్ఞాపకము లేకుండ పోతున్నదని ప్రశ్న. ఈ ప్రశ్నను అర్జునుడు అడుగవలసివున్నది, కాని అడగలేక పోయాడు. అయిన మనము వదలడము లేదు. ఈ ప్రశ్నను ఇక్కడ అడుగుచున్నాము. ఏమి చెప్తాడో చూస్తాము.
"జీవత్మవైన నీవు శరీరములో కొంత పరివారముతో నివశిస్తున్నావు. పరివారమంటే అర్థము కాలేదా! నీతో పాటు శరీరములో మనస్సు, బుద్ధి, చిత్తము మొదలగు 24 మంది సహచరులున్నారు. వారిలో మనస్సు అనువాడు అన్ని విషయములను జ్ఞాపకము పెట్టుకొనువాడుగ ఉన్నాడు. జీవాత్మకు సహచరముగ ఉన్న మనస్సు జన్మతో పుట్టి పెరుగుచువచ్చి మరణముతో నశించి పోవుచున్నది. ఒక జీవుడు ఎన్ని మరణములు పొందినప్పటికి వాడు వాడుగనే ఉండును. కాని శరీరము అలా ఉండదు. ముందు జన్మలో ఉన్న ముక్కు వెనుక జన్మలో ఉండదు. ఒక జన్మలో అందమైన ముక్కు ఉండవచ్చును. మరొక జన్మలో అందహీనమైన ముక్కు ఉండవచ్చును. అట్లే అన్ని భాగములు జన్మజన్మకు అవి అలాగే ఉండక వేరు వేరుగ వచ్చుచుండును. ఆ విధముగనే మనస్సు కూడ ఒక జన్మలో ఉండునది మరో జన్మలో ఉండదు. ఒక జన్మలో జ్ఞాపకశక్తి ఎక్కువగ ఉన్న మనస్సు ఉండి, వేరు జన్మలో ఎక్కువ మరుపువున్న మనస్సు ఉండవచ్చును. ఒక జన్మలోవున్న విషయ జ్ఞాపకములన్ని ఆ జన్మ మనస్సుకే ఉండును. అది మరణములో పోయినపుడు దానితోపాటు ఆ జ్ఞాపకాలన్ని పోవును. అందువలన వెనుకటి జన్మ జ్ఞాపకాలు మరుజన్మమున ఉండవు. ఎన్ని జన్మలెత్తిన ఏ జన్మ జ్ఞాపకాలు ఆ జన్మకే పరిమితమై పోవుట వలన, జీవునికి ఎన్ని జన్మలెత్తినది, ఏ జన్మలో ఏమి చేసినది తెలియదు. నీవు జీవునివే కావున నీకు నీ జన్మల విషయము ఏమి తెలియదు.
మనకు జన్మలున్నది, జన్మల విషయము మనకు జ్ఞాపకము లేకున్నది, శ్లోకములో చెప్పడమేకాక తనకు కూడ జన్మలు కలవని, అవన్నియు ఆయనకు తెలుసునని, భగవంతుడు ప్రకటించుకొన్నాడు. తర్వాత శ్లోకములలో మానవులు పుట్టినట్లు తాను మరణిస్తూనే పుట్టువాడనుకానని, తన అవసరము భూమి మీద కల్గినపుడు మాత్రమే పుట్టువాడనని కూడ చెప్పాడు. తాను భూమిమీద భగవంతునిగ పుట్టి ఏమి చేయవలెనో అది కూడ చెప్పాడు. ఆయన జన్మల విషయములో ఇక్కడ పెద్దగ ప్రశ్నరాకున్నను, ఆ శ్లోకములలో మాత్రము ఒక ప్రశ్నవచ్చుటకు అవకాశము గలదు. ఎన్నో జన్మలు ఎత్తిన మనకు దేవుడు ఎన్ని జన్మలు ఎత్తాడని ప్రశ్నరావచ్చును. దానికి జవాబు తర్వాత శ్లోకములోకంటే ఇప్పుడే తెలుసుకోవడము మంచిది. కావున ఆ జవాబు ఏమిటో చూచెదము.
దేవుని చేత మొదట ప్రపంచము, తర్వాత జగతి రెండు సృష్ఠించబడినాయి. దేవుని చేత సృష్ఠింపబడిన మానవునికి తాను దేవుని చేత సృష్ఠింపబడినానని, తనకంటే ముందే తయారు చేయబడిన పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి దేవుని చేతనే సృష్ఠించబడినాయని, విశ్వమంతటికి ఒక సృష్ఠికర్తయున్నాడని తెలియదు. ఆనాటి మానవునికి కనిపించు ప్రకృతి ధ్యాస తప్ప కనిపించని దేవుని జ్ఞాపకముగాని, ధ్యాసగాని ఏమాత్రములేవు. దేవుడు అను పదమే తెలియని మానవునికి దేవుడొకడున్నాడని చెప్పుటకు, దేవుని విషయము తెలిసిన వాడొకడు కావాలి. ఆ విధముగ దేవుని విషయము తెలిసిన మనిషి యొక్క అవసరము భూమి మీద మొదట ఏర్పడినది. దేవుని విషయము దేవునికి తప్ప ఇతరులెవరికి తెలియదు. కావున అటువంటపుడు దేవుడే ఒక మనిషిగ భూమిమీదకు వచ్చి తన విషయమును తానే చెప్పవలసివచ్చినది. ఈవిధముగ మొదట భూమి మీద దేవుని పుట్టకకు అవసరమేర్పడినది. దేవుడు మనిషిగ భూమి మీద పుట్టడమును భగవంతుని అవతరణ అంటున్నాము. మొట్టమొదట దేవుడు భగవంతునిగ భూమి మీద పుట్టాడు. దేవుడు మనిషిగ పుట్టితే భగవంతుడౌతాడు. అట్లు పుట్టినవాడు దేవుడు అయినప్పటికి అతనిని భగవంతుడనే అనాలి. దేవుడు విశ్వమంతట వ్యాపించిన వాడుకాగ, భగవంతుడు కేవలము ఒక శరీరములో మాత్రమున్నవాడు. దీనిని బట్టి సందార్భానుసారము దేవున్ని దేవుడనియే అనాలి, భగవంతున్ని భగవంతుడనియే అనాలి. దేవున్ని భగవంతుడనిగాని, భగవంతున్ని దేవుడనిగాని అనకూడదు. నేటికాలములో చాలామంది బోధకులు దేవుని యొక్క, భగవంతుని యొక్క అర్థము తెలియక, దేవుడని చెప్పవలసిన చోట భగవంతుడని చెప్పడము జరుగుచున్నది. అలా చెప్పడము వలన దేవుని యొక్క, భగవంతుని యొక్క వ్యత్యాసము ప్రజలకు తెలియకుండ పోయినది.
తన విషయమును తానే తెల్పుటకు వచ్చిన భగవంతుడు, దేవుడున్నాడనిగాని, దేవుని విషయముగాని ఏ కొద్దిగ కూడ తెలియని మానవులకు సృష్ఠి మొదలైన తర్వాత మొట్టమొదట దేవుని విషయము తెలియజేశాడు. మానవునికి భూమి మీద కనిపించని దేవున్ని తెల్పుటకు, దేవుడున్నాడను విషయము మానవుని మనస్సులో నిలిచి పోవునట్లు చేయడానికి, భగవంతునికి ఒక జన్మపట్టినది. ఈ విధముగ భగవంతుని మొదటిజన్మ భూమి మీద మానవులకు దేవుని ఉనికిని తెలియజేయడానికే అవసరమైనది. భగవంతుని మొదటిజన్మతో జగతిలో దేవుని గురించిన విషయము తెలిసిపోయినది. అప్పటి కాలములో భగవంతుని బోధ వలన తమకంటే అన్యుడు, అధిపతి, విశ్వసృష్ఠికర్త ఒకడున్నాడను భావము మనుషులలో ఏర్పడినది. ఆ విధముగ సృష్ఠి తర్వాత కొంత కాలమునకు భగవంతుని వలన దేవుని సమాచారము తెలియబడినది. దేవుడొకడున్నాడను భావన మనుషులలో కొన్నివేల సంవత్సరములు నిలిచిపోయినది. తర్వాత మనుషుల తలలోని మాయ ప్రభావము వలన దేవుడున్నాడనుట అసత్యమని, ఉంటే ఎలా ఉన్నాడని, దేవుడున్నాడనుటకు ఆధారము లేదని తలంపులు రావడము మొదలైనాయి. దానివలన కొన్ని వేల సంవత్సరములకు దేవుని ఉనికి మానవులలో మాసిపోవుటకు మొదలిడినది. అలా దేవుడున్నాడను మొదటి ధర్మమునకు గ్లాని ఏర్పడను మొదలైనది. అప్పుడు దేవుడు సత్యమని, దేవుడిలా ఉన్నాడని మనుషులకు తెల్పుట అవసరమైనది. ఆ విధముగ దేవుని అంశ భగవంతునిగ రెండవమారు వచ్చుటకు అవసరమేర్పడినది.
దేవుని ఉనికి భూమి మీద మాసిపోకుండుటకు, దేవుడు భగవంతునిగ భూమిమీద రెండవమారు పుట్టాడు. అలా పుట్టిన భగవంతుడు దేవుడిలా ఉన్నాడని ఆధారము చూపుటకు దేవలయములను తయారుచేశాడు. అంతవరకు దేవాలయముల ఉనికి భూమిమీద ఎక్కడలేదు. భగవంతుని రెండవరాకతో భూమిమీద దేవాలయములు వెలసినవి. దేవుడీవిధముగ నిరాకరముగ ఉన్నాడని తెల్పుటకు ఈశ్వరలింగము గల ఆలయములు మొట్టమొదట తయారైనవి. నిరాకారముగ ఉన్న దేవుడు భూమి మీద భగవంతునిగ శరీరము ధరించి పుట్టునని తెల్పుటకు ఆకారప్రతిమ కల్గిన రంగని దేవాలయములు ఏర్పడినవి. అప్పటి కాలములో దేవునికి ఉదాహరణగ ముక్కు ముఖములేని లింగమును ప్రతిష్ఠించిన ఆలయము తయారు కాగ, భగవంతునికి ఉదాహరణగ ముక్కు ముఖమున్న ప్రతిమను ప్రతిష్ఠించిన ఆలయము తయారైనది. ఆ విధముగ భూమిమీద రెండు రకముల ఆలయములు తప్ప వేరే ఆలయములు లేవు. స్త్రీరూపము కల్గిన ఆలయములు ఏమాత్రము లేకుండెడివి. దేవాలయములు దేవుని ఉనికిని తిరిగి ప్రతిష్ఠించుటకొరకు తయారైనవి. దేవుడు నిరాకారుడు అనియు, దేవుడు మూడు విధముల ఆత్మలుగ విభజింపబడి ఉన్నాడనియు, దేవుడు ప్రకృతిని తన పీఠముగ చేసుకొని ఉన్నాడనియు, దేవునిద్వార వచ్చుచున్న జీవులు ప్రకృతినుండి బయల్పడుచున్నవనియు, దేవుడు తండ్రికాగ ప్రకృతి తల్లిగ ఉన్నదనియు, ఎంతో జ్ఞానము తెలియునట్లు అర్థములతో ఈశ్వరాలయమును భగవంతుడు నిర్మించాడు. అంతేకాక దేవుడు ఒక ఆకారముతో మనిషిలాగ భూమిమీద పుట్టునని, భగవంతునిగ పుట్టిన మనిషి దేవుని ప్రతినిధియని, అతని ద్వారానే భూమిమీద దేవుని ధర్మములు తెలియునని, జ్ఞానము శబ్దమునే చేయునదని సూచించునట్లు శంఖమును, జ్ఞానము తెలిసిన తర్వాత కర్మను నాశనము చేయునట్లు సూచననిచ్చు చక్రమును ధరించిన ప్రతిమ ఉండు ఆలయములను తయారుచేశాడు. ప్రతిమ ఆలయమునకు ఆరాధనలు కూడ కల్పించి అర్థమును కూడ తెలిపాడు. ప్రతిమ ఆలయము భగవంతుని గుర్తుగ నిర్మించాడు. ఆ విధముగ పరమాత్మ యొక్క, భగవంతుని యొక్క ఆలయములు భగవంతుని చేతనే సృష్ఠించబడినాయి. మొదట దేవాలయ వ్యవస్థను స్థాపించుటకు భగవంతునికి ఒక జన్మ పట్టినది. ఈ విధముగ భగవంతుని రెండవ జన్మలో భూమిమీద ఆలయములు వెలసి వాటి ద్వార దైవము యొక్క వివరము క్షుణ్ణముగ తెలుపబడినది. దేవాలయముల ద్వార దేవుని ఉనికి తిరిగి ప్రతిష్ఠింపబడినది. దేవుని ధర్మము దేవాలయముల ద్వార ప్రతిష్ఠింపబడగ, ఆ భావము భూమిమీద ఎన్నో వేలసంవత్సరములు నిలిచిపోయినది. తర్వాత కొంత కాలమునకు మాయప్రభావము చేత ఆలయముల ధర్మము మాసిపోవను మొదలుపెట్టెను. అంతటితో మాయ ఆగకుండ మానవుని చేత స్త్రీ దేవతాలయములను ఇతరదేవాలయములను సృష్ఠించినది. దానితో దేవుని ఉనికి, ఆలయాల ఉనికి మారిపోయినది. దేవుడు ఒక్కడే అను భావము పోయి దేవుని స్థానములో ఎందరో వేల దేవతలు ఏర్పడ్డారు.
ఆ విధముగ దేవుని ఉనికి, దేవాలయ ఉనికి యొక్క ధర్మములకు గ్లాని ఏర్పడినది. కావున ఆ సమయములో భగవంతుని అవసరము తిరిగి ఏర్పడినది. మొదట దేవుని ఉనికిని ప్రతిష్ఠించుటకు దేవాలయములను చిహ్నములుగ, భావపూరిత నిర్మాణములుగ పెట్టగ, అవికూడ మాయవలన కలుషితమగుటను చూచిన దేవుడు, తర్వాత భగవంతుని రూపముతో వచ్చాడు. అట్లు మూడవమారు వచ్చిన భగవంతుడు గురువురూపములో దేవుని ధర్మములను, దేవాలయ ధర్మములను తిరిగి ప్రతిష్ఠించాడు. ఈ మారు కొందరు శిష్యులను తయారు చేసుకొని వారిద్వార దేవుని యొక్క, దేవాలయముల యొక్క ధర్మములను భూమి మీద ప్రచారము చేశాడు. ఎల్లకాలము ధర్మములు మాసిపోకుండునట్లు శిష్యపరంపరలు ఉండునట్లు ఏర్పాటు చేశాడు. ఆ విధముగ శిష్యులు దేవుని యొక్క, దేవాలయముల యొక్క ధర్మములను చాలాకాలము ప్రచారము చేయుచు, వాటికి గ్లాని ఏర్పడకుండ చూచుచుండిరి. అప్పటికాలములో భగవంతుడు ఏర్పరచిన విధానము ప్రకారము భూమి మీద ఎప్పటికి గురువు ఒక్కడే. శిష్యులు ఒకరి ద్వార ఒకరు జ్ఞానము తెలుసుకొనుచు శిష్యుల సంఖ్యను పెంచుకొనుచుండిరి. మొదట భూమి మీద తెలిపినవాడు గురువని, తర్వాత దానిని తెలియచెప్పువారు కాని, తెలుసుకొను వారుగాని అందరు శిష్యులను నియమముండెడిది. ఆ నియమము ప్రకారము మొదట తెల్పిన భగవంతుడు ఎప్పటికి గురువే. తర్వాత దానిని ఎవరు ఎవరికి చెప్పుకొనిన, ఎందరు తెలుసుకొనిన అందరు శిష్యులే. అట్లు ఎన్నో వేల సంవత్సరములు భగవంతుడు ఒక్కడే గురువుగ చలామణి అగుచువచ్చాడు. ఒకరికొకరు చెప్పుకొనుచు అందరు శిష్యులుగ నడుచుకొంటువచ్చారు. కావున ఆ కాలములో గురువు ఒక్కడే, శిష్యులు అనేకము అనెడి నానుడి ఉండెడిది. భగవంతుడు భూమి మీద తన ధర్మములను ప్రతిష్ఠించుకొలది మాయ వాటిని భగ్నము చేయుచుండెను. ఈ మారు మాయ అలాగే చేయాలనుకొన్నది. భూమి మీద భగవంతుడు తన ప్రతినిధులైన శిష్యపరంపరను ఉంచాడు. కావున మాయకు కొంత ప్రయాస అయినది. మాయ తిరిగి విజృంభించి శిష్యపరంపరనే చెడగొట్టాలనుకొన్నది. అలాగయితే తన పట్టు నెరవేరునని తలచినది. ఈ మారు శిష్యుల తలలో మాయపనిచేసి, శిష్యపరంపరను కాస్త గురుపరంపరగ మార్చివేసినది. దానితో ఎప్పటికి గురువు ఒక్కడే అను సూత్రము పోయినది, అప్పటికి ఉన్నవాడే గురువు అను సూత్రము వచ్చినది. అప్పటినుండి శిష్యులు కొంతమంది కాగ, గురువులు అనేకమంది అయ్యారు. అందువలన శిష్యుడు ఒక్కడే, గురువులు అనేకము అనే నానుడి ఏర్పడినది. ఎవరికి వారు గురువులైపోయి తిరిగి దేవుని ధర్మములైన వాటికి గ్లాని ఏర్పడజొచ్చినది. ఈ మారు గురువు (భగవంతుని) యొక్క ధర్మములను కాపాడవలసిన అవసరము ఏర్పడినది. దేవుని ఉనికిని కాపాడుటకు దేవాలయములను నిర్మించి వాటికి ధర్మములను ఏర్పరచగ, దేవాలయ ధర్మములు నాశనమై పోయినవి. తర్వాత వాటి ఉనికిని కాపాడుటకు గురు శిష్యులను ఏర్పరచగ వాటి ధర్మములు కూడ చెడిపోయినవి. ఈ మారు గురువు యొక్క ధర్మము కాపాడుటకు భగవంతుని అవసరము ఏర్పడినది. ఉదాహరణకు ఒక యజమాని కుండలో నీరుపోసి పెట్టాడనుకొనుము. కొంతకాలమునకు కుండకు ఒక రంధ్రము ఏర్పడి కుండలోని నీరు కారిపోవను మొదలు పెట్టాయి. అది గమనించిన యజమాని ఆ రంధ్రమును సిమెంటు వేసి మూసివేశాడనుకొనుము. కొంతకాలానికి మరియొక చోట మరియొక రంధ్రముపడి నీరు కారిపోవను మొదలుపెట్టినది. దానిని కూడ గమనించిన యజమాని ఈ మారు సిమెంటుకంటే వేరుగ ఉండే లక్కతో ఆ రంధ్రమును మూసి నీరు కారనట్లు చేశాడు. కొంతకాలము బాగానే ఉన్న కుండకు మరియొక చోట మూడవమారు రంధ్రము పడినది. ఈ విధముగ కుండకు రంధ్రము పడినట్లు దేవుని ధర్మములకు గండి ఏర్పడుచుంటే, వాటిని సరిచేయుటకు భగవంతునిగ మరిమరి పుట్టవలసిన పని దేవునికి ఏర్పడినది. ఈ మారు శిష్యపరంపర పోయి గురుపరంపర అను రంధ్రము దైవధర్మము అను కుండకు ఏర్పడినది. ఈ మారు భగవంతునిగ వచ్చినవాడు గురువు శిష్యుని యొక్క ధర్మమును తిరిగి నెలకొల్పుటకు బ్రహ్మవిద్యను (దైవవిద్యను) శాస్త్రపద్ధతిలో తెలపాలనుకొన్నాడు. అధర్మములను రంధ్రమును శాస్త్రధర్మమను పద్ధతితో పూడ్చాలనుకొన్నాడు. నాల్గవ మారు వచ్చిన భగవంతుడు బ్రహ్మవిద్యా శాస్త్రమును బోధించాడు. బ్రహ్మవిద్యా శాస్త్రము ద్వార గురువు యొక్క పద్ధతిని శిష్యునియొక్క పద్ధతిని తెలియజేశాడు. దైవవిద్య ఒక గురువు ద్వారానే బయల్పడునని తెలియజేశాడు. గురువు చెప్పిన దానిని తిరిగి ఎందరు ఎందరికి చెప్పిన వారందరు గురువులుకారని, మొదట తెల్పిన వాడే గురువని, తర్వాత చెప్పిన వారందరు కేవలము బోధకులేనని తెలియజెప్పాడు. ఎన్నో విధముల దేవుని యొక్క ధర్మములను గురించి తిరిగి బ్రహ్మవిద్యశాస్త్రము ద్వార తెలియజేశాడు. అలా నాల్గవమారు భగవంతుడు తెలియజేసిన బ్రహ్మవిద్యాశాస్త్రము కొన్ని వేల సంవత్సరముల వరకు భూమి మీద నిలిచి అందరికి తెలిసియుండెడిది. దేవునికి ప్రతిపక్షమైన మాయ మానవుని తలలో గుణముల రూపములో తిరిగి చెలరేగి హేతువాదము, నాస్తికవాదము అను వాదములను లేవదీసి బ్రహ్మవిద్యాశాస్త్రమునకు గుర్తింపు లేకుండ చేసినది. షట్ శాస్త్రములను ఆరుశాస్త్రములలో గొప్పదైన దైవశాస్త్రమును మాసిపోవునట్లు చేయుటకు భూమిమీద శాస్త్రపద్ధతిలేని అనేక శాస్త్రములను తయారు చేసినది. క్రొత్తగ వచ్చిన అనేక మాయ శాస్త్రములలో దైవశాస్త్రము అంటే ఏమిటో కూడ మనుషులకు తెలియకుండ పోయినది. ఈ విధముగ భగవంతుడు తెల్పిన ధర్మములు భగవంతునికి వ్యతిరేఖమైన మాయవలన కాలక్రమమున వేల, లక్షల సంవత్సరములకొక మారు మాసిపోతూనే వస్తున్నవి. మొదట దేవుని ఉనికిని తెలియజేసిన భగవంతుడు దానిని కాపాడుటకు దేవాలయధర్మములను తెలియజేశాడు. తర్వాత దేవాలయ ధర్మములను కాపాడుటకు గురు శిష్యధర్మమును తెలియజేశాడు. తర్వాత గురువు ధర్మములను కాపాడుటకు దైవవిద్యాశాస్త్రమును బోధించాడు. చివరకు దైవవిద్యా శాస్త్రము కూడ మాసిపోవుటకు అనేక అధర్మశాస్త్రములు బయటికి వచ్చినవి. ఈ విధముగ తిరిగి కుండకు రంధ్రము పడినట్లయినది. ఈ మారు అధర్మరంధ్రమును ధర్మమను సీసముతో భగవంతుడు పూడ్చాలనుకొన్నాడు. దాని కొరకు వచ్చినదే భగవంతుని ఐదవరాక. భగవంతుని ఐదవరాకనే మనము కొంత గుర్తించగలిగాము. అంతకు ముందు వచ్చిన రాకలను నామమాత్రము కూడ గుర్తించలేకపోయాము. ఈ గుర్తింపు కూడ స్వయముగ మనము గుర్తించినది కాదు. వచ్చినవాడు నేను ఫలానా వాడినని సాక్ష్యాధారాలతోసహా చెప్పియుంటే అదియు కొందరు నమ్మగలిగారు. కొందరు ఇప్పటికి అతను భగవంతుడని నమ్మలేక పోవుచున్నారు. ఐదవమారు భగవంతునిగ వచ్చిన వాడే శ్రీకృష్ణుడు. ఎవరు నమ్మిన నమ్మకపోయిన కృష్ణుడు భగవంతుడే.
భగవంతుని జన్మల వివరము
1) దేవుని ధర్మముల ఉనికి
- - -
భగవంతుని మొదటి జన్మ.
2) దేవాలయ ధర్మముల ఉనికి
- - -
భగవంతుని రెండవ జన్మ.
3) గురు శిష్య ధర్మముల ఉనికి
- - -
భగవంతుని మూడవ జన్మ.
4) బ్రహ్మవిద్య ధర్మముల ఉనికి
- - -
భగవంతుని నాల్గవ జన్మ
5) గీత ధర్మముల ఉనికి
- - -
భగవంతుని ఐదవ జన్మ
6) అన్ని ధర్మముల ఉనికి
- - -
భగవంతుని ఆరవ జన్మ.
ఒక్క భారత దేశములో మాత్రము భగవంతుడు పుట్టిన వివరమును
ఇక్కడ తెలియజేయడమైనది.
తాను ధర్మములను నెలకొల్పితే తిరిగి కొంత కాలమునకు అధర్మము చెలరేగడమును చూచిన భగవంతుడు, తన ఐదవ జన్మలో కొంత ప్రత్యేకతతో ధర్మములను తెలియజేయాలనుకొన్నాడు. అందువలననే తనను భగవంతునిగ ప్రకటించుకొన్నాడు. అంతేకాక సాకారముగ కనిపించు తానే కనిపించని దేవుడనని తెలియజేసి అర్జునునికి జ్ఞానదృష్ఠినిచ్చి తన దైవత్వమును తెలియునట్లు చేశాడు. ఎన్నిమార్లు సరిదిద్ధిన అనేక మార్లు అధర్మపరులుగ మారిపోవు మానవులకు ఒక హద్దును ఏర్పరచాలనుకొన్నాడు. హద్దును సూచించు పేరుతోనే తన బోధను గీత అని, భగవద్గీత అని పేరుపెట్టి తెలియజేశాడు. మానవునికి శరీరమే హద్దుగ చేసి దానిని దాటి చూచితే అంతా అధర్మమేనని, శరీరములోపల చూడడమే ధర్మమని తెలియజేశాడు. గీతలో శరీరంతర్గతమునే చెప్పాడు. అందులోనే ఆత్మలు మాయ కలవని తెలియజేశాడు. దేవుని చేరు మార్గములు ఏవికావో వాటిని తెలుపుచు దేవుని చేరు పద్ధతులను కూడ తెలియజేశాడు. ఇట్లు ఎన్నో రహస్యములను తెలిపిన గీత యొక్క బోధ ఎంతో ఉన్నతమైనప్పటికి, ఈ మారు మాయ కూడ ప్రత్యేక పద్ధతిలో ఆ గీతను మానవునికి అర్థము కాకుండ చేసినది. దేవుడు నేను పలానా, నా బోధ ఫలానా అని తెలిపినప్పటికి ఈ మారు మాయకూడ నేను పలానా అన్నట్లు మానవుని తన అదుపులోనే పెట్టుకొని, గీత అంటే ఏమిటో అర్థము కాకుండ చేసినది. ఇంతకుముందు నాలుగుమార్లు భగవంతుడు చెప్పినది కనీసము వెయ్యి సంవత్సరములకైన మానవులలోనికి చొచ్చుకొనిపోయి, కొన్ని వేల సంవత్సరములు వారియందుండెడిది. ఈ మారు భగవంతుని ఐదవరాకలో తాను ఎంతో బలముగ చెప్పదలచుకొని నేనే దేవున్ని అని చెప్పినప్పటికి, మాయ అంతకు రెండింతల బలముతో చెప్పినవాడు సాధారణ మనిషేనను భావమును మనుషులలో కలుగజేసినది. కొందరు భగవద్గీతను వారివారి భాషలలోనికి సంస్కృతమునుండి అనువదించుకొనినప్పటికి, వారి మనస్సులో కృష్ణుడు చెప్పిన భావము లేకుండ పోయేటట్లు చేసి వేరు భావము వచ్చునట్లు చేసినది. ఎంతో తెలివైనవారు, సంస్కృత పండితులు, గురువులని పేరుగాంచినవారు, స్వాములు, పీఠాధిపతులు, గీతబోధకులని పేరు పెట్టుకొన్నవారు, భగవద్గీత పరిశోధన సంఘము అని పేరు పెట్టుకొన్నవారు, భగవద్గీతలోని భావమును నూటికి పదింతలు కూడ అర్థము చేసుకోలేకపోయారు. ఈ విధముగ గీతను చెప్పి ఐదువేల సంవత్సరములు గడిచిపోగా, చివరకు గీతలో జీవాత్మ పరమాత్మ అను రెండు ఆత్మలు తప్ప రెండింటికి మధ్యనున్న ఆత్మ అసలుకు లేకుండపోయినది. చివరకు గీత అంటే హద్దు అని కూడ తెలియనంత మూఢులుగ మనుషులను మాయ మార్చివేసినది.
దేవుడు తయారు చేసినదే మాయ. దేవుని ఆజ్ఞ ప్రకారమే మాయ భగవంతునికి ప్రతిపక్షమై ఉన్నది. మాయకున్న బలము దేవుడిచ్చినదే. అయిన ఎవరి పని వారిది. ఎవరి ఆట వారిది. ఇది భూమిమీద సాగే ఆట. ఈ ఆటలో పోటీదారులు ఒకవైపు మాయ, ఒకవైపు భగవంతుడు. భగవద్గీతను భగవంతుడు చెప్పి ఐదు వేల సంవత్సరములైన అది ముందుకు పోక, వెనుకకు కనిపించని విధముగ వెళ్ళి పోయినది. ఈ మారు భగవద్గీతనే అధర్మమై పోవునట్లు మాయ చేసినది. ఎన్నో పెడార్థములను దానియందు ఇరికించినది. ఈ మారు తన గీతను రక్షించుకొనుటకు భగవంతుడు తిరిగి రావలసియున్నది. ఈ మారు వస్తే ఆరవమారు వచ్చినట్లగును. ఈ మారు భగవంతుడు భూమి మీదకు వస్తే, మాయను అణచివేసి ధర్మములను ఏ విధముగ నెలకొల్పునో, దానికొరకు ఏ పథకమును రచించుకొని భూమిమీదకు వస్తాడో వేచి చూడవలసియున్నది.
వేల సంవత్సరములకొకమారు భూమి మీదకు వచ్చు భగవంతుని రాక వరకు మనముండము. చచ్చి ఇంకొక చోట పుట్టినప్పటికి ఈ జ్ఞానము ఆ దినము మన మతికి లేకుండపోవచ్చును. సృష్ఠి ఆదినుండి ఉన్న మనము భగవంతుడు ఐదు మార్లు వచ్చినపుడు కూడ మనము ఉండియె ఉంటాము. ఐదుమార్లు ఆయనను కనుక్కోలేని వాళ్ళము ఆరవమారు వస్తే కనుక్కోగలమను గ్యారంటీ ఏమీలేదు. అందువలన ప్రస్తుతము ఇపుడు తెలిసిన కొద్దిపాటి మన జ్ఞానముతో భగవంతుడొస్తే ఎట్లుండగలడో, ఎట్లు ప్రవర్తించగలడో, ఎట్లు మాయ వ్యూహమును ఎదుర్కొనగలడో ఊహించుకొందాము. భగవంతుడు భూమిమీదకు వస్తే అందరికంటే తెలివైన వాడుగ వస్తాడు, కాని తెలివితక్కువ వానిగ నడుచుకొంటే ఆయనను కనుగొనలేము. ఐదవమారు తాను ఫలానా భగవంతుడనని ప్రకటించుకొనిన దానివలన మాయకు ఎక్కువ బలము ఏర్పడినది. కావున ఆరవమారు తన విషయమును మాయకు కూడ తెలియనీయడేమో! అలాంటపుడు మనుషులము మనము కనుగొనగలమా? ఐదు దఫాలుగ భగవంతుడు వచ్చి, ఐదు మార్లు, ఐదు అంశలతో కూడుకొన్న ధర్మములను బోధించగ, చివరకు ఐదు రకముల ధర్మములు మానవులకు తెలియకుండపోయాయి. ఈ దఫా వస్తే గీతను మాత్రమే పునరుద్దరించడని, ఇంతకుముందు ఉండి చెప్పిపోయిన ధర్మములనన్నిటిని కూడ పునరుద్దరించడానికి ప్రయత్నిస్తాడను కొందాము. ఆరవ మారు తన దృష్ఠిని మాయ మీదనే ముఖ్యముగ కేంద్రీకరిస్తాడనుకొందాము. అట్లు మాయమీద దృష్ఠిపెట్టి ఎన్నోమార్లు ధర్మములను అధర్మములుగ మార్చిన మాయయొక్క పుట్టు పూర్వోత్తమును మానవులకు విప్పి చెప్పగలడనుకొందాము. అట్లు చేస్తే మాయను గుర్తించి మానవుడు దానివైపు పోకుండుటకు కొంత అవకాశమేర్పడును. అందువలన మాయలో మునిగిపోవు మనకు మాయను గురించియే తెలుపమని వచ్చే భగవంతున్ని కోరుకొందాము. దేవుడు గీచిన గీతను మానవులు దాటి పోవునట్లు చేసిన మాయకే, ఈ మారు ఒక హద్దును ఏర్పరచగలడని అనుకొందాము.
భూమి మీదకు మొట్టమొదట వచ్చిన భగవంతుడు దేవుని ఉనికిని మానవులలో కలుగచేయగ, ఆ ఉనికి ఉన్నా లేనట్లయినది. రెండవమారు వచ్చిన భగవంతుడు తాను మొదటదఫా తెలిపిన బోధకు అనుగుణముగ మొదటి ధర్మములు తిరిగి పునరుద్ధరింపబడునట్లు, రెండవమారు దేవాలయ రహస్యములను తెలిపాడు. తాను మొదట వచ్చినపుడు చెప్పినది తనకు జ్ఞాపకముండుట వలన ముందు ధర్మములకు బలము చేకూర్చునట్లు, రెండవమారు దేవాలయముల గూర్చి చెప్పాడు. దీనిని బట్టి అన్ని జన్మలు ఆయనకు జ్ఞప్తికున్నాయని చెప్పవచ్చును. భగవంతుని జన్మకు జన్మకు మధ్యలో వేల, లక్షల సంవత్సరముల కాలము తేడాగలదు. ఆయన ఎన్ని వేల సంవత్సరములకు పుట్టిన ముందు జన్మలో ఆయన దేనికి వచ్చినది, అప్పుడు ఏమి చేసినది ఆయనకు జ్ఞప్తికియుండును. మనము వెంట వెంటనే పుట్టుచున్నప్పటికి మన జన్మలకు మధ్యలో ఏమాత్రము కాలవ్యవధి లేకున్నప్పటికి వెనుకటి జన్మ జ్ఞాపకాలు ఉండవని తెలుసుకొన్నాము. భగవంతునికి మన మాదిరి కాకుండ ఆయన జన్మలు వరుసగ ఆయనకు జ్ఞప్తికి ఉండును. అలా ఎందుకు జ్ఞాపకమున్నాయనగా! ఆయన శరీరములో మనస్సు మనలోగల మనస్సువలె ఉండినప్పటికి, మన మనస్సువలె జ్ఞాపకాలే దాని పని కూడ అయినప్పటికి, నిద్రలో మనస్సు లేనప్పుడు మనకు జ్ఞాపకములేకున్నట్లు ఆయన నిద్రలో ఉన్నపుడు ఆయన మనస్సుకు కూడ జ్ఞాపకాలు లేకున్నప్పటికి, చనిపోయిన తర్వాత వెనుక శరీరములోని మనస్సు అక్కడే పోయి మనకు వెనుకజన్మ జ్ఞాపకము లేనట్లు, ఆయనకు కూడ వెనుక శరీరములోని మనస్సు లేకుండ పోయి వెనుక జ్ఞాపకములు మనస్సు అందివ్వలేక పోయినప్పటికి, ఆయనకు అన్ని జన్మల జ్ఞాపకములు గలవు. శరీరములో నిద్ర పోయినపుడు జరిగిన విషయము కూడ ఆయనకు జ్ఞాపకము ఉండును. ఆయన శరీరములోని ఆత్మ మనస్సువలె శరీరమంత వ్యాపించి అన్ని వేళల ఎరుక కల్గియున్నది. కావున ఆ ఆత్మే అన్ని జన్మల జ్ఞాపకములను అందిస్తున్నది. మన శరీరములో కూడ ఆత్మ ఉన్నప్పటికి మనము వేరు, ఆత్మ వేరు.కావున జీవునకు ఆత్మ జ్ఞాపకమును అందివ్వదు. భగవంతుని శరీరములో ఆత్మగ భగవంతుడు ఉండుట వలన అన్ని జ్ఞాపకములు ఆత్మవలన కల్గుచుండును. మానవుడు జీవునిగ భూమి మీద జీవిస్తే శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఉన్నప్పటికి, జీవుడు జీవునిగానే జీవిస్తున్నాడు. భగవంతునిలో అలాకాక పరమాత్మయే జీవునిగ, ఆత్మగ ఉంటున్నది. భగవంతుడు జీవునిగ, ఆత్మగ, పరమాత్మగ జీవిస్తున్నాడు. అందువలన మనకు లేని జన్మల జ్ఞాపకములు ప్రత్యేకించి ఆయనకుండును. కావున పై శ్లోకములో నీ జన్మలు నీకు జ్ఞాపకములేవు. నా జన్మలు అన్ని నాకు జ్ఞాపకమున్నాయన్నాడు. అంతేకాక మనము ఎన్నో జన్మలు ఎత్తినట్లు, ఆయన కూడ ఎన్నో జన్మలు ఎత్తినట్లు చెప్పాడు. మన జన్మలు ఎన్ని అన్నది మనకు ఎటూ తెలియదు. ఆయన జన్మలు ఎన్ని అను విషయము చెప్పకుండ అన్ని జ్ఞాపకములున్నాయని చెప్పాడు. అన్ని జన్మల జ్ఞాపకములున్న భగవంతుడు భూమి మీద ఎట్లు పుట్టుచున్నది క్రింది శ్లోకములో చూచెదము.
శ్లోకం 6: అజో ఽపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో ఽ పిసన్ |
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా ||
(నిరాకారము, సాకారము)
భావము : నాకు పుట్టుకలేదు, నాశనము లేదు. నేను సర్వజీవరాసులకు అధిపతినై ఉన్నాను. అయినప్పటికి నాచేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుందును.
వివరము : ఈ అధ్యాయము మొదటి శ్లోకములో సృష్ఠి ఆదిలో సూర్యునికి జ్ఞానము చెప్పియుంటినని, తర్వాత సూర్యుని ద్వార భూమి మీదున్న మనువుకు తెలిసినదని, మనువుద్వార ఇక్ష్వాకుడను రాజుకు తెలిసినదని, తర్వాత అతని ద్వార ఇతరులకు తెలిసినదని చెప్పబడినది. రెండవ శ్లోకములో ఒకరి ద్వార మరొకరికి పరంపరగ తెలుస్తుపోయి అందరు తెలుసుకోగా చివరకు ఇప్పటికి ఆ యోగముల జ్ఞానము లేకుండ పోయినదని కూడ చెప్పాడు. ఇక మూడవ శ్లోకములో ఇట్లు ఎవరికి తెలియకుండ పోయిన రహస్యమైన జ్ఞానమును తిరిగి ఇప్పుడు నీకు చెప్పుచున్నానని చెప్పడము జరిగినది. నాల్గవ శ్లోకములో ఇప్పుడున్న నీవు సృష్ఠి ఆదిలో సూర్యునికెట్లు చెప్పావని అర్జునుడు అడగడము జరిగినది. ఐదవ శ్లోకములో నీవు పుట్టుచున్నావు, నేను పుట్టుచున్నాను. నీకు వెనుక జన్మలు మతికి లేవు, నాకు అన్ని జ్ఞప్తికున్నాయని కృష్ణుడు అర్జునునికి జవాబు చెప్పడము జరిగినది. ఇపుడు హేతువాదులకు మంచి అవకాశము దొరికి ఈ విధముగ ప్రశ్నించవచ్చును. ఆదిలో సూర్యునికి చెప్పిన తర్వాత ఇతరులకు చెప్పానని కృష్ణుడు తెలుపలేదు. అప్పుడు తాను చెప్పిన దానిని ఒకరికొకరు పరంపరగ చెప్పుకొన్నారని చెప్పాడు తప్ప తానెవరికి చెప్పినట్లు లేదు. అటువంటపుడు ఆయనకు ఎన్నో జన్మలు కల్గినవని చెప్పడము సత్యమా? అని అడుగవచ్చును. అట్లు జన్మలు కల్గియుంటే ఆయన భూమిమీద జ్ఞానము చెప్పేదానికే కదా పుట్టేది. అటువంటపుడు సూర్యుని దగ్గరనుండి అర్జునుని వరకు మధ్యలో ఎవరికి తాను జ్ఞానము చెప్పినట్లు లేదే? అప్పుడు చెప్పినది కాల గమనములో లేకుండపోయినది, కావున ఇపుడు నీవు నాకు ఇష్టమైనవాడివి కనుక నీకు చెప్పుచున్నానని చెప్పాడు కదా! దీనిని బట్టి ఆయన ఎన్నో మార్లు పుట్టినది వాస్తవమా? లేక ఆదిలో కృతయుగములో పుట్టి తర్వాత ఇపుడు ద్వాపరయుగములో అర్జునునితో పాటు పుట్టాడనునది వాస్తవమా? అని అడుగవచ్చును. ఆయన మధ్యలో పుట్టలేదు అంటే ఎన్నో జన్మలు నాకు కల్గినాయని అతనే చెప్పాడు కదా! అన్నది అడ్డమొచ్చును. పుట్టాడు అంటే నేను ఆదిలో చెప్పాను తర్వాత ఇపుడు నీకు చెప్పుచున్నానని ఇపుడే పుట్టినట్లు ఆయనే చెప్పుచున్నాడు కదా! అని అడుగవచ్చును. పుట్టాడంటే పుట్టలేదనుటకు పై రెండవ శ్లోకము ఆధారమవుచున్నది. పుట్టలేదంటే ఎన్నోమార్లు పుట్టాడనుటకు పై ఐదవ శ్లోకము ఆధారమవుచున్నది. ఇటుపోతే బావి, అటుపోతే చెరువు అన్నట్లున్నది. కనుక ఏ ఆధ్యాత్మికవాది అయిన హేతువాది అడుగు ప్రశ్నకు జవాబు చెప్పలేక కప్పదాటు వేయవలసియున్నది.
ఇక్కడ ఆరవ శ్లోకములో ఏమైన జవాబు దొరుకుతుందా అని చూస్తే, మొదట వాక్యములో నాకు పుట్టుకే లేదన్నవాడు, రెండవ వాక్యములో నేను పుట్టుచున్నానని చెప్పాడు. పుట్టుకలేని వానినని చెప్పి పుట్టుచున్నాననడమేమిటి? అదియు ఒకే శ్లోకములోనే రెండు విధములుగ చెప్పడముతో ఎవరికైన పిచ్చిపట్టినంతపని కాకతప్పదు. ఇక్కడ వినేవారికైన పిచ్చి ఉండాలి, లేకపోతే అక్కడ చెప్పేవానికైన పిచ్చి ఉండాలి అనక తప్పదు. అటో ఇటో ఎవరిలోనో ఒకరిలో లోపముండాలి. వాస్తవముగ చెప్పినది భగవంతుడు కావున చెప్పేవానిలో లోపముండదు, కాని విని అవగాహన చేసుకొనేవానిలోనే లోపమున్నట్లు తెలియుచున్నది. ఇపుడు చెప్పేవానిది సత్యమెట్లో వివరించుకొందాము.
సృష్ఠి ఆదిలో పరమాత్మ(దేవుడు) సూర్యునికి జ్ఞానమును చెప్పినది వాస్తవమే. అప్పటినుండి ద్వాపరయుగములో అర్జునుని వరకు ఆయన జ్ఞానము చెప్పనిమాట వాస్తవమే. మధ్యలో మనుషులు ఒకరికొకరు తన జ్ఞానమును చెప్పుకొన్నారన్నది నూటికి నూరుపాల్లు సత్యమే. ఇకపోతే ఐదవ శ్లోకములో ఉన్నట్లు భగవంతుడు ఆదినుండి ఐదుమార్లు పుట్టినది నూటికి నూరుపాల్లు వాస్తవమే. ఇదేమిటి ఈయన కూడ అడ్డము మాట్లాడుచున్నాడే అని అనుకోవద్దండి నేను చెప్పునది కూడ నూరుపాల్లు వాస్తవమే. నా మాటలోని వాస్తవమేమనగా! కృష్ణుడు అర్జునునితో మాట్లాడినపుడు జరిగిన సంభాషణయే కదా ఈ రాద్దాంతమంతయు. అర్జునుడు సర్వసాధారణముగ మనలాంటి మనిషే. ఇకపోతే కృష్ణుడు మాత్రము మనలాంటి మనిషి కాదు. పైకి మనిషే అయిన కృష్ణున్ని భగవంతుడు అనుచున్నాము కదా! గీతలోనే శ్రీకృష్ణ ఉవాచ అనక భగవానువాచ అని కృష్ణుని మాటల ముందర చెప్పడము జరిగినది కదా! అందువలన భగవంతుడని కృష్ణున్ని ముమ్మాటికి అనక తప్పదు. భగవంతునిలో సాధారణ మనిషిలోకంటే ప్రత్యేకతయుండును. భగవంతుని ప్రత్యేకతను గురించి తెలుసుకుంటే, భగవంతుని శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు ఉండును. సాధారణ మనిషిలో కూడ మూడు ఆత్మలుండును. సాధారణ మనిషిలో పరమాత్మ సాక్షిగ ఉండును. పరమాత్మ సామాన్యుని శరీరములో కేవలము సాక్షియై ఏ పనిచేయక, ఏమి మాట్లాడకయుండును. భగవంతుని శరీరములో కూడ సామాన్యునిలో ఉన్నట్లే పరమాత్మ సాక్షియై ఉండగ, ఆత్మ చైతన్యము నిచ్చునదై ఉన్నది. కాని కొన్ని ప్రత్యేక సందర్భములలో భగవంతుని శరీరములోని పరమాత్మ స్వయముగ మాట్లాడము జరుగుచున్నది. సామాన్యునిలోనున్న ఆత్మ శరీరములోని కార్యములను చైతన్యమై చేయుచుండగ, పరమాత్మ ఏమి చేయనిదై, ఏమి మాట్లాడనిదై ఉన్నది. భగవంతుని శరీరములో మాత్రము కొన్ని సమయములలో ఆత్మ శరీరములో నుండి బయట జోక్యము చేసుకొని మాట్లాడుచున్నది. అట్లే ప్రత్యేకించి భగవంతుని శరీరములో మాత్రము పరమాత్మ మాట్లాడగలదు. ఆ విధముగ భగవంతుని శరీరములో నుండి సృష్ఠి ఆదిలో సూర్యునితో స్వయముగ మాట్లాడిన పరమాత్మ ద్వాపరయుగములో తిరిగి అర్జునునితో కృష్ణుని శరీరమునుండి మాట్లాడాడు. ఆ విషయమునే మొదటి శ్లోకములో చెప్పాడు. దీనిని అసత్యమని చెప్పుటకు వీలులేదు. శరీరమును ధరించిన సాధారణ జీవునిగనున్న భగవంతుడు అప్పుడప్పుడు కొన్ని మార్లు అధర్మమేర్పడినపుడు భూమిమీద పుట్టడము వాస్తవమే. ఒక మనిషి శరీరములో మూడు ఆత్మల పనియుంటే వానిని భగవంతుడు అంటాము. భగవంతుడైన జీవుడు కూడ శరీరము ధరించియే పుట్టవలసియున్నది. కావున ఆయనకు పుట్టుకలున్నది వాస్తవమే. కనిపించే శరీరములోని కనిపించని తతంగమును తెలుసుకోగల్గితే దానినే ఆత్మజ్ఞానము తెలుసుకోవడము అంటాము. మూడు ఆత్మల జ్ఞానము తెలియకపోతే పై శ్లోకములలో తెలియని గందరగోళ స్థితి ఏర్పడును.
ఈ శ్లోకములో చెప్పినట్లు లోపలి నుండి పలుకు పరమాత్మకు చావుకాని పుట్టుకగాని లేవు. బయటి ధ్యాసతో మాట్లాడు జీవాత్మకు చావు పుట్టుకలు కలవు. అందువలన ఇక్కడ ఒకే శ్లోకములో లోపలి నుండి మాట్లాడు పరమాత్మ నాకు నాశనముగాని, పుట్టడముగాని లేవన్నాడు. ఈ శ్లోకములోనే మాట్లాడు జీవాత్మ నేను గుణములరూపమైన మాయతో కూడుకొని పుట్టుచున్నానని అన్నాడు. ఇదంతయు చూస్తే అపరిచితుడు సినిమాలో ఒకే మనిషి "నేను చంపాను" అనిన వెంటనే "నేను చంపలేదు" అని ఒకే వాక్యములో రెండు విధముల చెప్పినట్లున్నది కదా! అవును అర్థము చేసుకొంటే అతను చంపాననునది వాస్తవమే, చంపలేదు అనునది వాస్తవమే. అట్లే ఈ శ్లోకములో కృష్ణుడు నాకు పుట్టుకలేదు అన్నదీ వాస్తవమే, చాలామార్లు పుట్టాను అన్నది వాస్తవమే. భగవంతుడు భూమిమీద ఎప్పుడు పుట్టునో క్రింది శ్లోకములో చూస్తాము.
శ్లోకం 7: యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! |
అభ్యుత్థానమధర్మస్య తదా ఽ ఽత్మానం సృజామ్యహమ్ ||
(నిరాకారము, సాకారము)
భావము : ఎపుడెపుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మము వృద్ధిచెందుచున్నదో, అపుడు నన్ను నేను తయారుచేసుకొని భూమిమీద పుట్టుచున్నాను.
వివరము : వెనుక శ్లోకములో వచ్చిన ప్రశ్నకు జవాబుగ పలాన సమయములోనే పుట్టుచున్నానని తెల్పాడు. అపుడే పుట్టవలసిన అవసరమేమొచ్చినది? అను ప్రశ్న మనకు రాగలదు. అందుకు జవాబేమనగా! ఒక డిపార్టుమెంటులో క్రిందిస్థాయి ఉద్యోగులు సరిగ పనిచేయనపుడు, వారిని మందలించి పనిచేయించు బాధ్యత పై అధికారికుండును. అట్లే భూమిమీద పరమాత్మ ధర్మములు సరిగ ఆచరించబడనపుడు, వాటిని సరిచేయు బాధ్యత పరమాత్మకే ఉండును. పరమాత్మ భూమిమీద తన ధర్మములను ఆచరించునట్లు, మానవుల మధ్య ఎన్నో ప్రక్రియలను ఏర్పాటుచేసి పెట్టాడు. ధర్మయుక్తమైన ఆ ప్రక్రియలు నేటికిని ఉన్నను, వాటి అర్థము తెలియక పోయిన దానివలన, ధర్మములు అధర్మములుగ మారుచున్నవి. ఉదాహరణకు 'నాకర్మ' అనుమాటను ఎందరో అనుచుందురు. ఒక్కొక్కపుడు మనము కూడ అంటుంటాము. అది ఒక ధర్మమే అయినప్పటికి, అది ఒక ఊత పదములాగ మన నోటివెంట వస్తున్నది. దాని అర్థము మనకు తెలియదు. అది ధర్మయుక్తమైన పదమే, ఆ పదములోని ధర్మము మన నోటి దగ్గరేవున్నది. అయినప్పటికి అర్థము తెలియక పోవడము వలన అధర్మముగ మారిపోయినది.
మొదట మనము ధర్మపరులమే, కాలక్రమేపి అధర్మపరులైనాము. ధర్మములు ఆకాశములోకాని మరి ఎక్కడోకాని లేవు. అవి భూమి మీద ధర్మముగానో, అధర్మముగానో మనమధ్యలో ఆచరణరూపముగ ఉన్నవి. మనము ధర్మముల ఆచరణ చేస్తున్నప్పటికి, అర్థము తెలియక పోవడము వలన, భావరహితమైపోయి అధర్మములుగ మారిపోయినవి. వాటి భావము తెలిసి ఆచరించితే ధర్మపరు లౌతాము. 'గోవింద' అను పదము ధర్మమే. అది అర్థరహితమై అధర్మమై పోయినది. అట్లే 'భగవంతుడు' అను పదము కూడ ధర్మమే. అది పెద్దపెద్ద గురువుల వద్దనే అధర్మమై పోయినది. 'పెళ్ళి' అనునది ధర్మము, దాని ఆచరణ అంతయు ధర్మయుక్తముగనున్నది. పెళ్ళి ఆచరణ రూపములో ఉన్నను, దాని ఆచరణ యొక్క అర్థము తెలియకుండ పోయినది. కావున అధర్మమై పోయినవి. ఇలా ఎన్నో మన జీవితాలలో ధర్మములు మిళితమై ఉన్నాయి. వాటి వివరణ తెలియనంతవరకు అవి మనకు అధర్మములుగానే మిగులుతాయి. ఉదాహరణకు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, చందమామ, అబ్బా, గోవింద అను పదములు ధర్మములే అయినప్పటికి అవి ధర్మములని ఎవరికి తెలియవు.
ఇదంతయు ఆస్తికత్వము కల్గియుండి దేవుడున్నాడను వారు అధర్మపరులుగ మారిపోవడమును గురించి చెప్పినది. ఆస్తికులు ధర్మములను ఆచరిస్తున్నామను కొనుచు అధర్మపరులుగ మారిపోయి, అధర్మములను ఆచరిస్తున్నపుడు ధర్మములకు గ్లాని ఏర్పడి, అధర్మములు అభివృద్ధి అగుచున్నవని చెప్పడము జరిగినది. ధర్మములు తెలియకుండ పోవడమే ధర్మములకుగ్లాని ఏర్పడినట్లు అర్థము చేసుకోవలెను. అధర్మపరులు రెండు విధములుగ ఉన్నారు. అధర్మములను దేవుని ధర్మములనుకొని తెలియక పొరపడి, అసలైన ధర్మములను వదలి అధర్మములను ఆచరించువారు ఒక రకము వారు. ఉదాహరణకు యజ్ఞయాగములు చేయుట, వేదములను పఠించుట, తపస్సులు చేయుట మొదలగు పనులు చేయువారు అధర్మపరులని చెప్పవచ్చును. వేదధ్యాయణములు, యజ్ఞములు, దానములు, తపస్సులు ధర్మములు కాకపోయినప్పటికి, అవి ధర్మాచరణలేనని పొరపడి చేయు ఆస్తికులందరు అధర్మపరులేనని చెప్పవచ్చును. ఇక రెండవ రకము అధర్మపరులెట్లు ఉన్నారనగా! దేవుడే లేడని, దేవుని ధర్మములంటూ ఏవిలేవని, ఉన్నదంతయు ప్రత్యక్ష ప్రకృతియేనని, కనిపించు ప్రకృతి అనేక పదార్థములతో కూడుకొన్నదని, పదార్థమునకు ధర్మమున్నది కాని పదార్థముకానటువంటి దేవునికి ధర్మములేదని, పదార్థము దాని ధర్మము సత్యము, దేవుడు దేవుని ధర్మము అసత్యమని చెప్పు హేతువాదులు, నాస్తికవాదులు అనబడు రెండవరక అధర్మపరులు గలరు. దేవుని ధర్మమున్నదనుచు దానిని వదలి ధర్మముగాని దానిని ఆచరించు ఆస్తికులు, దేవుని ధర్మమేలేదనుచు ప్రకృతి ధర్మములను ఆచరించు నాస్తికవాదులు ఇరువురిని అధర్మపరులేనని చెప్పవచ్చును. ఇటువంటి అధర్మపరులు ఎక్కువైనపుడే అధర్మములు అభివృద్ధి అగుచున్నవని శ్లోకములో "అభ్యుత్థానమధర్మస్య" అని అన్నాడు.
ధర్మములు పూర్తిగ నశించిపోవునవి కావు. వాటికి గ్లాని మాత్రము ఏర్పడగలదు. మన శరీరమునకు గ్లాని ఏర్పడినపుడు, వైద్యుని వైద్యముతో నయమైపోయి తిరిగి శక్తివంతమైనట్లు, ధర్మములకు అలసట ఏర్పడినపుడు, భగవంతుని వైద్యము ద్వారా అలసట తీరిపోయి ధర్మములు శక్తివంతమగును. ఆ విషయమే క్రింది శ్లోకమున అంటున్నాడు.
శ్లోకం 8: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతామ్ |
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ||
(సాకారము)
భావము : ధర్మాచరణ కల్గిన వారిని సంరక్షించుటకు, అధర్మ ఆచరణ కల్గిన వారిని లేకుండచేయుటకు, ధర్మసంస్థాపన మొనర్చుటకు యుగ యుగమందు పుట్టుచుందును.
వివరము : ఇక్కడ దుష్ట జనులను చంపి మంచివారిని కాపాడుటకు దేవుడు భగవంతునిగా జన్మిస్తాడని, దుర్మార్గులను చంపివేసి ధర్మమును కాపాడునని చాలామంది భావిస్తున్నారు. అలా అందరనుకొనునట్లు దుర్మార్గులను భగవంతుడు చంపుతూ పోయి వారిని లేకుండ చేస్తాడనుకొనుట సరియైన అర్థము కాదు. ఎందుకనగా! ఇదే భగవద్గీతలోనే ఇంకొక చోట ఏ గుణములో చనిపోయినవాడు అదే గుణములో పుట్టి పెరిగి అదే పనులు చేయునని, దుర్మార్గుడు దుర్మార్గునిగానే పుట్టి పెరుగునని కూడ అన్నారు. ఇచటేమో దుర్మార్గులను సంహరించి లేకుండ చేస్తానన్నపుడు ఆ దుర్మార్గులు ఎచటను లేకుండ పోవాలి కదా! అట్లుకాక ఒకచోట చనిపోయిన చెడ్డవాడు, ఇంకొక చోట చెడ్డవానిగనే పుట్టుచున్నాడన్నపుడు భగవంతుడు వానినెట్లు లేకుండ చేసినట్లగును? ఇలా ఎన్నో ప్రశ్నలు బయలుదేరుచున్నవి. ఇక్కడి శ్లోకమునకు అక్కడి శ్లోకమునకు విరుద్ధ భావమేర్పడినది. ఈ ప్రశ్నలకు జవాబు ఏమిటి? ఏ శ్లోకములోని అర్థము నిజము, ఏది నిజము కాదు అని యోచిస్తే వాటి పరిష్కారమిలా ఉన్నది.
ఒక చెడ్డవానిని ఒక మంచివాడు చంపడానికి పూనుకొన్నపుడు, అందరి మనోభావాల మీద ఎక్కువ ప్రభావము చూపు సినిమాలలో కూడ విలన్ ను హీరో చంపపూనినపుడు 'పరిత్రాణాయ సాధూనాం' అను శ్లోకమును గుర్తు చేయడము జరుగుచున్నది. దీనిని బట్టి చెడ్డవారిని చంపితే కాని మంచివారు వృద్ధి చెందరను భావము సర్వదా అందరిలో ఇమిడిపోయినది. ఈ శ్లోకములో ధర్మమును ఉద్ధరించవలెనని వచ్చిన భగవంతున్నే అధర్మపరున్ని చేశారు. భగవంతుడు చెప్పిన విషయము అర్థము కాకపోగ, ఆయనే అధర్మాచరణ చేసినట్లు వ్రాసుకోవడము చోద్యము. వాస్తవానికి భగవంతుడు ఎవరిని సంహరిస్తానని ఎక్కడా చెప్పలేదు. పై శ్లోకములో 'వినాశాయచ దుష్కృతాం' అన్నాడు. చెడ్డవారిని లేక అధర్మపరులను నాశనము చేస్తానన్నాడు. నాశనము అన్నంత మాత్రమున చంపివేయడము అని అర్థము చేసుకోవడము పొరపాటు. మరణము వేరు, నాశనమువేరని వెనుక చెప్పబడిన సాంఖ్యయోగమను అధ్యాయమునందు 19వ శ్లోకములో విపులముగ చెప్పడమైనది. నాశనమంటే పూర్తిగ లేకుండ పోవడము. మరణము అంటే శరీరమార్పిడి మాత్రమే అని మరొకమారు గుర్తు చేయుచున్నాము.
ఏ రీతిలో చనిపోయినవాడు తిరిగి అదే రీతిలో పుట్టును. ఒక ఊరిలో చనిపోయి లేకుండపోయినవాడు తిరిగి వేరొక చోట పుట్టి ఉంటున్నాడు. ఎక్కడో ఒక చోట ఉంటున్నాడు కాని లేకుండ పోలేదు. ఈ సూత్రము భగవంతునికి బాగా తెలుసు కనుక దుర్మార్గున్ని చంపపూనలేదు. వానిని ఎక్కడా లేకుండ నాశనము చేయాలనుకొన్నాడు. అట్లు చేయుటకు ఒకటే మార్గము కలదు. వానిలోని అధర్మములను ధర్మములుగ మారిస్తే వాడు శాశ్వతముగ ధర్మపరుడై పోతాడు. ఉదాహరణకు ఒక చిన్న ఊరిలో వేయిమంది అధర్మ పరులున్నారనుకొనుము. అట్లే కేవలము పదిమంది ధర్మపరులున్నారనుకొనుము. అంత మంది అధర్మపరులలో కేవలము పదిమంది ధర్మపరులకు ఇబ్బందిగనే ఉండును. అపుడు భగవంతుడు ఒక మనిషిగ ఆ ఊరిలో చేరి, అధర్మపరులను లేకుండ చేయాలనుకొన్నాడు. రోగులకే వైద్యుడు అవసరము, ఆరోగ్యవంతులకు వైద్యమవసరము లేదు. అందుకే భగవంతుడు ఆ ఊరిలో ధర్మపరులతో ఏమాత్రము స్నేహమేర్పరుచుకోలేదు. ఆయన అధర్మపరులతో పూర్తిగా కలసిపోయాడు. వారుచేయు పనులే తాను చేయుట వలన చెడ్డవారందరు ఆయనకు బాగాదగ్గరైనారు. అలా కొంత కాలముండగ సందర్భానుసారము వారు చేయుపనులను మాన్పక, వాటి ఫలితము చెప్పుచు వచ్చి పాపభీతి ఏర్పరచి, తర్వాత తాముచేయుపనులలో అర్థమిలాగున్నదని తెల్పుచు చివరకు యోగసారమును, దానివలన వచ్చు ఫలితమును, బోధించడము వలన వారందరు ధర్మపరులుగ మారిపోవుటకు మొదలిడిరి. అలా కొంత కాలము జరుగగ చివరకు కేవలము పదిమంది మాత్రము అధర్మపరులు మిగలగా, ధర్మపరులు వేయిమందిగ తయారైనారు.
ఈ విధముగ ఒకరకమైన ఆస్తికత్వముగల అధర్మపరులకు మనిషిగ వచ్చిన భగవంతుడు ధర్మములను తెలియజేసి, వారిని తిరిగి ధర్మపరులుగా మార్చును. ఇక రెండవ రకమైన నాస్తికత్వముగల అధర్మపరులను ఏమి చేయుననగా!
రెండవరక అధర్మపరులను రెండు విధములుగ విభజించవచ్చును. దైవత్వము మీద ప్రశ్నలు వచ్చి, వారి ప్రశ్నలకు జవాబులు దొరకనపుడు, హేతువాదులను పేరు పెట్టుకొని దేవునికి దూరమైనవారు ఒక రకము. దైవత్వము మీద ప్రశ్నలు కూడ రాకుండనే దైవత్వము మీద ద్వేషభావము కల్గి, అసలు దేవుడే లేడను నాస్తికులు రెండవరకమువారు. ఈ విధముగ దేవుని మీద విశ్వాసములేని అధర్మపరులు రెండు భాగములుగ ఉన్నారు. దైవత్వము మీద అనుమానముతో ప్రశ్నించు హేతువాదులతోగాని, నాస్తికవాదులతో గాని భగవంతుడు ప్రత్యక్షముగ సంబంధము పెట్టుకోడు. మనిషిగ ఎటువంటి సంబంధము పెట్టుకోని భగవంతుడు భూమిమీద ఉన్నపుడు కేవలము హేతువాదుల ప్రశ్నలకు జవాబులు దొరుకునట్లు చేయును. జవాబులు దొరికినప్పటికి దేవుడులేడని, దేవుని ఉనికిని ప్రశ్నించుట వారి స్వభావమైయుండుటవలన, భగవంతుడే జవాబిచ్చినప్పటికి ఆ జవాబులను ఒప్పుకోరు. ఇక నాస్తికవాదులు దైవత్వము మీద అసూయ కల్గియుందురు, కావున వారికి దైవజ్ఞానమును భగవంతుడు ఏ విధముగ తెలియజేయడు. హేతువాదులు, నాస్తికులు మరుజన్మలలో భయంకరమైన కర్మకుగురియై, నష్టాత్ములగుదురు. అపుడు హేతువాదులు కొంత మారగలరు. అట్లు జన్మజన్మకు కొంత తేడాతో కొన్ని జన్మలకైన అధర్మపరులైన హేతువాదులు ధర్మపరులగుటకు అవకాశము గలదు. నాస్తికవాదులకు మాత్రము ఏ జన్మకుగాని ఎటువంటి దైవజ్ఞానము లభించదు. వారు జన్మజన్మకు అధోగతిచెందుచు ఉగ్రకర్ములై పోవుచుందురు. దేవుని ఉనికిని ప్రశ్నించు హేతువాదులకైన దేవుడు కొంత అవకాశము ఇచ్చాడు. కాని నాస్తికవాదులకు ఎటువంటి అవకాశము ఇవ్వలేదు. రెండు విధములుగ ఉన్న అధర్మపరులతో ప్రత్యక్షముగ, పరోక్షముగ భగవంతుడు సంబంధము పెట్టుకొంటున్నాడు. కేవలము నాస్తికులను మాత్రము క్షమించరాని పాపము క్రిందికి వదలి వేయుచున్నాడు. అధర్మపరులను సాధ్యమున్నంత వరకు మాటలతో మార్చగలను. వినని వారిని వదలి వేయగలనని చెప్పాడు తప్ప ఎవరిని ఆయుధములతోగాని, అణ్వాయుధములతో గాని చంపుతానని చెప్పలేదు.
ఇక్కడ ధర్మపరులను పెంపొందింపజేసి, అధర్మపరులను లేకుండా చేశాడనుట తప్పు కాదుకదా! పై శ్లోకములోనే "ధర్మ సంస్థాపనార్థాయ" అన్నాడు. మంచివారిని కాపాడి చెడ్డవారిని లేకుండ చేయుటకు ధర్మసంస్థాపనకొరకు నేను వచ్చానన్నాడు. ధర్మ సంస్థాపన ద్వారానే దుష్ఠులను లేకుండ చేయుచున్నానని అర్థము తప్ప, ఆయుధములతో లేకుండా చేస్తానని చెప్పలేదు కదా! భగవంతుడు ధర్మసంస్థాపనార్థమే వచ్చి, ఆ పని ద్వారనే సాధుజనుల సంఖ్యను రక్షించి, దుష్ట జనుల సంఖ్యను తగ్గించాడు. ఈ పద్ధతియే ఈ శ్లోకమందున్నదని, సంహరించు పద్ధతి లేదని, సంహరించుట ద్వార ఎవరు లేకుండ పోరని తెలియాలి. భగవంతుడు ఎంతో ఉన్నతుడైనప్పటికి, నీచములో ఉన్న మానవులతో కలిసిపోయి, వారివలె పనులు చేయుచు, వారివలె ఎన్నో బాధలను అనుభవించుచు, మానవుల మధ్య ఎన్నో అవమానములను కూడ చవిచూస్తు, సాధరణ మానవునికంటే తక్కువ వానివలె కనిపించు భగవంతున్ని, భగవంతునిగ ఎవరు గుర్తించగలరు. ఏ ఆధారములేని భగవంతున్ని గుర్తించగలిగిన వానికేమి లభ్యమగునను విషయము క్రింది శ్లోకమున చూస్తాము.
శ్లోకం 9: జన్మ కర్మచ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో ఽర్జున! ||
(సాకారము, నిరాకారము)
భావము : నా దివ్యమైన పనులను జన్మను తెలుసుకొన్నవాడు మరణించిన తర్వాత, వేరు జన్మమునకు పోక నాలోనికి ఐక్యమగును.
వివరము : ఇంతవరకు మూడు అధ్యాయములలోను పరమపదమును, మోక్షమును పొందుదువు అంటూ వచ్చిన శ్రీకృష్ణుడు, మొట్టమొదటి సారిగా ఇక్కడ 'మామేతి' అనడము విశేషము. మామేతి అనగా నాయందే ఐక్యమగుదువు అని అర్థము. ముందు రెండు అధ్యాయములలోను పరమాత్మను గూర్చి చెప్పినప్పటికి, ఆ పరమాత్మను నేనేనని చెప్పలేదు. ఈ అధ్యాయములో పరమాత్మను నేనేనని ప్రకటించుకోవడమేకాక, మోక్షము లేక పరపదము అను స్థితిని నేనేననియు, కర్మ అయిపోయిన తర్వాత జన్మలు లేకుండ పోయిన జీవులు నాయందే ఐక్యమై, వారుకూడ నేనుగ (పరమాత్మగ) మారి పోవుదురని చెప్పాడు. అంతేకాక ఈ అధ్యాయములో ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే! కర్మయోగము లేక బ్రహ్మయోగముల ద్వార మోక్షము పొందవచ్చని ఇంతవరకు చెప్పిన భగవంతుడు, ఇపుడు ఆ యోగములతో ఏమాత్రము సంబంధము లేకున్నప్పటికి, పరమాత్మ ఫలానా మనిషిగ జన్మించాడని ఆయన జన్మను తెలిసి, ఆ జన్మలో ఆయన కర్మ అంటని విధానముతో పనులు చేయుచున్నాడని తెలిసి, ఆయన పనులను గ్రహించిన జనుడు ఎవడైనగాని, వాడు మరణించిన పిమ్మట నాలోనికి ఐక్యమగునని తెలిపాడు.
అట్లయితే సాధనతో కూడుకున్న యోగములను, మధ్యలో భంగమగు యోగములను, ప్రజల మధ్య ఎన్నో ఆటంకములతో కూడుకున్న యోగములను, అనేక జన్మలలో సాధించి మోక్షము పొందడముకంటే, పరమాత్మ పుట్టుకైన భగవంతున్ని, ఆయన కార్యములను తెలుసుకోవడము వలన ఒకే జన్మలో మోక్షమును సులభముగ పొందవచ్చును కదా! అని చాలామంది అనుకోవచ్చును. కాని అది అంతసులభముగ ఉండదని చెప్పవచ్చును. ఎందుకనగా! యోగములు ఆచరించుటకు తగిన విధానములున్నవి. ఆ విధానముల ప్రకారము ఆచరించి ఎప్పటికైన మోక్షమును పొందవచ్చును. కాని ఏ విధానములేని భగవంతుని యొక్క జన్మను తెలుసుకోవడము చాలా కష్టము. సాధారణ వ్యక్తిగ ఉంటూ ఏ ప్రత్యేకతలులేని వానిని గుర్తించుట కష్టమగును. ఒకవేళ కార్యములను బట్టి తెలుసుకొనవచ్చుననుకొనుటకు, ఆయన చేయుపనులు ఉచ్ఛ నీచములగు రెండు కార్యములుండును. ఇటువంటి సాకార భగవంతుని తెలుసుకొనుటకంటే ప్రత్యేక విధానములున్న యోగములను ఆచరించుట వలననే సులభముగ మోక్షము పొందవచ్చును. భగవంతున్ని తెలుసుకొనుటకు ఆధారమేలేనపుడు, నా జన్మను కర్మను తెలిసిన వానికి మోక్షము వచ్చునని ఎలా చెప్పాడు? అలా చెప్పుట వలన ఏదో ఒక అవకాశముండును కదా! అను సంశయము మనకు రావచ్చును. అలా యోచిస్తే ప్రమాణ పూర్వకమైన ఆధారములు లేకపోయినప్పటికి సంశయ పూర్వకమైన ఆధారమొకటున్నది. అదియు ఆయన చెప్పినదే, అదేమనగా! ఆయన భూమి మీదకు వచ్చునది ధర్మసంస్థాపన కొరకే కదా! ఆ ఒక్క ఆధారమును బట్టి ఆయనను గుర్తించుటకు అవకాశమున్నది. అయినప్పటికి అది సంశయాలతో కూడుకొన్నది. అన్ని సంశయములకు జవాబులున్నపుడే ఆ ఆధారమును విశ్వసించి భగవంతున్ని తెలియవచ్చును. ఆ ఒక్క ఆధారము ప్రకారము ఎచ్చటైతే తెలియని ధర్మములు తెలియబడుచున్నవో, ఎచ్చటైతే ఆచరణలో ఉండి అర్థరహితమై పోయిన కార్యక్రమాలకు ధర్మయుక్తార్థము బోధింపబడుచున్నదో, ఎచ్చటైతే పూర్వము ఉండి ఇపుడులేని పరమార్థ రహస్య విషయములు తెలియబడుచున్నవో, ఎచ్చటైతే మానవుని బుద్ధికి అందని ఆత్మ విషయములు బోధించబడుచున్నవో, ఎచ్చటయితే మతాతీత బోధ కలదో అచట పరమాత్మ జన్మవున్నదని తెలియవచ్చును. ఒక శరీరము నుండి బయటికి వచ్చు బోధను బట్టి భగవంతుడనుకొనినప్పటికి, ఆయన చేయు కార్యములు అనేక సంశయములను రేకెత్తించునవిగ ఉండును. ఆయన జీవిత విధానమంతయు ఇతను భగవంతుడుకాదను నిరూపణలతో కూడుకొని ఉండుట వలన ఎవరు గుర్తించలేరని చెప్పవచ్చును. చెప్పెడి బోధలకంటే చేయు కార్యములే ముఖ్యమని మాయ మనలో మాటిమాటికి గుర్తుచేయుచుండుట వలన, ఒకరు సంవత్సర కాలము భగవంతున్ని భగవంతునిగ గుర్తించినప్పటికి, సం||చివరికి ఒక రోజు ఆయన భగవంతుడుకాదని వాని నోటిద్వారానే మాయ చెప్పించును. దుర్లభమైన భగవంతుని గుర్తింపుకావాలంటే మనిషిలో విశేషమైన జ్ఞానముండి, మన శరీరములో మాయ ద్వారా వచ్చు అన్ని సంశయములకు సమాధానములు ఉన్నప్పుడే భగవంతున్ని గుర్తించవచ్చును. అఖండమైన, బ్రహ్మాండమైన ఆత్మజ్ఞానము గలవాడు పరమాత్మ జన్మయగు భగవంతున్ని గుర్తించవచ్చును. అట్లు గుర్తించిన వానికి తిరిగి జన్మలేని స్థానము లభించును.
ముఖ్యముగ గమనించవలసిన విషయమేమిటంటే భూమిమీద భగవంతుడు ఉన్నపుడే గుర్తించుటకు అవకాశముండును. ఎన్నో వేల, లక్షల, కోట్ల సంవత్సరములకు ఒకమారు అవసరమొచ్చినపుడు వచ్చు భగవంతున్ని ఆ సమయములోనే గుర్తించు అవకాశ ముండును. ఆయన జన్మ భూమిమీదలేనపుడు మోక్షము పొందడానికి రెండు యోగములే ఆధారమార్గములు. ఆయన భూమి మీద ఉన్నపుడైతే సాకార గుర్తింపు కూడ ఒక మార్గమగును. మోక్షము పొందుటకు ఎల్లపుడు ధర్మయుక్తమైన యోగములనబడు రెండు మార్గములు, ధర్మాతీతమైన యోగమనబడు ఒక మార్గము, ఒకప్పుడు మాత్రము సాకార గుర్తింపు అను ఒక మార్గము మొత్తము నాలుగు మార్గములున్నవి. ఎల్లప్పుడు ధర్మయుక్త, ధర్మాతీత రెండు విధముల యోగములే ఉండును. సాకార గుర్తింపు ఎల్లప్పుడు ఉండునది కాదు.
శ్లోకం 10: వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో జ్ఞాన తపసా పూత మద్భావ మాగతాః ||
(సాకారము)
భావము : భయము, ప్రేమ, కోపము విడిచి నామీద ధ్యాసకలవారై నన్ను ఉపాసించువారు ఎందరో జ్ఞాన తపనచే పవిత్రులై నాస్వరూపమును పొందిరి.
వివరము : పరమాత్మ సాకారమైన భగవంతున్ని తెలుసుకొనుటకు, ఆయన కొన్ని మార్గములు ఈ శ్లోకమున చెప్పాడు. ఈ పద్ధతిలో చాలామంది ముక్తిని పొందారని కూడ చెప్పాడు. ఆ మార్గములను వివరముగ తెలుసుకొందాము. ప్రేమ, కోపము, భయము వదలి ధ్యాస నామీదనే పెట్టుకొనుము అన్నాడు. మనచుట్టు ఉన్న వారిమీద ప్రేమగుణముండుట వలన మనస్సు యొక్క ధ్యాస వారిమీద ఉండును. సాకార భగవంతుని మీద ఉండదు. అందువలన నీకు మిక్కిలి ప్రేమ ఎవరి మీద ఉందో వారిమీద ప్రేమను వదలివేయాలి. అట్లే ఇతరుల మీద క్రోధముండుట వలన మనసులో ఆ శత్రువే మెదలుచుండును. శత్రువును మనసులో నుండి తొలగించాలంటే కోపమును వదలివేయాలి. నీవు ఎవరికి భయపడుచుందువో, వాని ధ్యాస కూడ లేకుండ పోయి, భగవంతుని మీద ధ్యాస రావాలంటే భయమును కూడ వీడాలి. భయక్రోధ రాగములు విడిచినవారు, భగవంతుని రూపము మీద ధ్యాసకల్గినవారు, ఆయన ద్వార బయల్పడు జ్ఞానము కోసము తపన కల్గియున్నవారు, చాలామంది భగవంతుని సాకారమును తెలిసి మోక్షము పొందినారు.
జ్ఞాన తపన అందరికి ఉండవచ్చును. కాని ప్రేమ, భయము వదలాలంటే చాలా కష్టము. ప్రేమను జయించాలంటే ప్రేమ కల్గిన భార్యనో, పిల్లలో బంధనములై కట్టిపడేయగలరు. భయమును జయించాలనుకొన్నవానికి నీకు జ్ఞానమేవద్దు, జ్ఞానము కావాలంటే నిన్ను అట్లు చేస్తాము, ఇట్లు చేస్తామని ఇంట్లో వారే బెదిరిస్తారు. అందువలన జ్ఞాన తపన ఉన్నా మనచుట్టు దగ్గరగ ఉన్నవారే బంధములగుదురు.
శ్లోకం 11: యే యథామాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహం |
మమ వర్త్మాను వర్తన్తే మనుష్యాః పార్థ! సర్వశః ||
(సాకారము, నిరాకారము)
భావము : ఎవరు నన్ను ఏ విధముగా భావించి పూజించుచున్నారో, అట్లే వారు నా అనుగ్రహము పొందుచుందురు. మనుజులు ఎన్నో రకములుగ నన్నారాధించు చున్నారు.
వివరము : చాలా మంది నన్ను చేరుటకు ఎన్నో మార్గములలో నన్ను ఆరాధించు చున్నారని పై శ్లోకములో భగవంతుడన్నాడు. అట్లు ఆరాధించు ఆరాధనలు ఎన్నివున్న వాటిని రెండుగ విభజించవచ్చును. ఒకటి సాకార ఆరాధన, రెండవది నిరాకార ఆరాధన. నిరాకారమంటే యోగపద్ధతులను అనుసరించడమని అర్థము. సాకార ఆరాధనలే చాలా రకములుగ ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆకారమును పెట్టుకొని, అదే భగవంతుడనుకొని పూజించుచుందురు. భగవంతుని రూపు కాకపోయినప్పటికి, వాడు తన భావములో చిన్న ప్రతిమను దైవస్వరూపమని తలంచియుండును. అట్లు అనేకులు అనేక రూపములను పూజించుచున్నారు. అయినప్పటికి వారిలో పరమాత్మ భావము కల్గి మోక్షమును కోరువారు చాలా తక్కువ. ఎక్కువ మంది కష్టాలు తీరవలెననియో, ధనము కల్గవలెననియో, అనేక కోర్కెలతో ఆరాధించువారు కలరు. మోక్షమును కోరి పూజించువారు కూడ ఉన్నారు. కర్మఫలములందు ఆశ కల్గి పూజించువారు కూడ ఉన్నారు. ఆ విషయమును క్రింది శ్లోకములో చూస్తాము.
శ్లోకం 12: కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః |
క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||
(ప్రకృతి)
భావము : కర్మఫలములందు ఆశగలవారు దేవతా పూజచేతురు. జగతిలో కామ్య కర్మఫలములు వేగముగ సిద్ధించును.
వివరము : ఈ పనికి ఇంత విలువ అన్నట్లు, వేరు వేరు పనులకు వేరు వేరు లాభములున్నట్లు, వేరు వేరు దేవతల పూజకు వేరువేరు ఫలములున్నాయని ఆశించిన ప్రజలు, ఆయా దేవతలను ఆరాధించుచున్నారు. కర్మ వలన జరిగెడి పనులకు వెంటనే కనిపించు ఫలితమొస్తున్నది. ధనికులు కొందరు ఒక దేవుని ఆరాధిస్తు తమ వ్యాపారములో ఎక్కువ లాభాలు రావాలని కోరుచుందురు. వారు డబ్బు కోసము అక్రమ వ్యాపారము కూడ చేయుచుందురు. సంవత్సరము చివరకు వారు చేసిన వ్యాపారములో లాభము కనిపించగ, అది వారి పూజా ఫలమే అనుకొందురు. మనము చేసిన కర్మాచరణలో సిద్ధించినదనుకోరు.
'క్షిప్రం సిద్దిర్భవతి కర్మజా' వెంటనే కర్మ ఫలములు కల్గును అను భగవంతుని మాటప్రకారము, పనులను చేయు కూలివానికి సాయంకాలమునకు, ఉద్యోగస్తునికి నెల చివరికి, వ్యాపారస్తునికి సంవత్సర ఆఖరుకు ఫలితము కనిపిస్తున్నది. ఈ ఫలితములు దేవతా పూజవలన కలుగుచున్నవని ఆశ పడుట వలన, ఇంకనూ కావాలను కోర్కెలతో దేవతలనారాధించుచున్నారు. కార్యము వలన కనిపించు ఫలితము డబ్బు, కనిపించని ఫలితము కర్మ వస్తున్నదని తెలియని ప్రజలు ఆశతో కర్మాచరణ వలన వచ్చు ఫలితముల కొరకు దేవతాపూజ చేయుచున్నారని భగవంతుడు పై శ్లోకమున చెప్పాడు.
శ్లోకం 13: చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగశః |
తస్యకర్తార మపి మాం విద్ధ్యకర్తార మవ్యయమ్ ||
(పరమాత్మ)
భావము : కర్మ, గుణ విభాగములను బట్టి నాల్గు వర్ణములు నాచేత సృష్ఠింపబడినవి. వాటి కర్తనైనను కాకుండ నాశనములేనివాడనై ఉన్నాను.
వివరము : భగవంతుడు నాలుగు వర్ణములు సృష్ఠించాడు వాస్తవమే. అవి ఏవి అనుటయే ఇక్కడ పెద్ద సమస్య. ఇంతవరకు ఆ నాల్గు వర్ణములను గురించి చాలామంది నాల్గుకులాలుగ వర్ణించుకోవడము జరిగినది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగ నాల్గువర్ణములు సృష్ఠించబడినవని ప్రచారమైనది. అది నిజమాయని చూచిన, సమస్త ప్రపంచమును సృష్ఠించిన పరమాత్మ ప్రపంచములో ఉన్న మనుషులను కూడ ప్రకృతిచేత తయారు చేశాడు. కాని ప్రపంచ జనాభాలో ఈ నాల్గుకులాలు ఎక్కడ కనిపించవు. దీనిని బట్టి మనకు సంశయమేర్పడుచున్నది. భగవంతుడు చెప్పిన ప్రతి మాట సర్వ జీవరాసులకు వర్తించునదై ఉండగ, ఈ నాల్గు వర్ణములు నాలుగు కులాలను మాట, విదేశాలలోనే కాదు ఇండియాలో కూడ వర్తించదు. పరమాత్మ బాహ్యముగ ఉన్న ఏ మతమునుగాని, ఏ కులమునుగాని ఇంతవరకు ఏర్పరచలేదు. కులాలు మతాలు భూమిమీద ఏర్పరచుకొన్నవారు మనుషులే. కుల మత భేదములు మనుషులు ఏర్పరచుకున్నవే కాని పరమాత్మ సృష్ఠించలేదు. ఇంకా కొందరు 'భగవంతుడు గుణకర్మ విభాగ అన్నాడు కదా! మనుషులు చేయు పనులను బట్టి, గుణములను బట్టి వారిని విభజించుకోవచ్చును. వ్యాపారము చేయువారు ఎవరైన వైశ్యులని, నీచ పనులు చేయువారు శూద్రులని, రాజ్యమునేలు వారిని క్షత్రియులని చెప్పుకోవచ్చును. వారి పుట్టుకతో వచ్చిన కులము ముఖ్యము కాదు. వారు చేయు పనులను బట్టి కులమేర్పరచాలి. పుట్టుకతో బ్రాహ్మణుడైనప్పటికి నీచ పనులు చేస్తే శూద్రుడని చెప్పాలి.' అని అంటున్నారు. ఆయన చేసినది కాని, చెప్పినది కాని, ప్రతి జీవరాసికి వర్తించునదిగ ఉన్నపుడు, మనుషులలో అయితే నాల్గుకులాలు ఏర్పరచినట్లు చెప్పుకోవచ్చు. మిగతా జీవరాసులెన్నో ఉన్నాయి కదా! వాటిని ఏ కులాలుగ చెప్పగలము? కుక్కలను, నక్కలను, పిల్లులను, ఎలుకలను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగ విభజించి చెప్పగలరా? అట్లు చెప్పుటకు వీలులేదు. కావున ఈ నాల్గువర్ణములు పరమాత్మ చెప్పినవి కావు. మానవులు సృష్ఠించుకొన్నవే అని తెలియాలి. పై శ్లోకములో నాల్గువర్ణములు నాచేత సృష్ఠింపబడినాయి అన్నాడు. కాని అవి బ్రాహ్మణ, క్షత్రియ కులములని పేరు పెట్టలేదు కదా! ఈ విధముగ యోచిస్తే ఇంతవరకు ఈ శ్లోకమునకు వ్రాసుకొన్న భావము సరియైనదికాదని తేలిపోవుచున్నది. ఇది సరియైన అర్థము కానపుడు ఏది సరియైనదనుట అందరికి వచ్చు ప్రశ్నయే. దాని జవాబు క్రింద చూస్తాము.
భగవంతుడైన శ్రీకృష్ణుడు తన తలమీద నెమలిపింఛమును ధరించాడు. ఎవరు ధరించని పింఛమును ఆయన ధరించడములో ప్రత్యేకత ఏమిటని ఎవరు ఇంతవరకు యోచించలేదనియే చెప్పవచ్చును. ఇపుడు మనము యోచిస్తాము. శ్రీకృష్ణుడు నెమలిపింఛమును అందమునకో, అలంకారమునకో ధరించలేదు. తానున్న స్థితిని గూర్చి నెమలిపింఛము ద్వారా తెలుపుచు, మీరు కూడ ఈ మాదిరే ఉండవలెనని బహిర్గతము చేయు ఆధ్యాత్మిక రహస్యమే పింఛము ధరించడములోని విశేషార్థమని తెలియాలి. నెమలి పింఛము గొప్ప ఆధ్యాత్మిక రహస్యమును గూర్చి బోధించు విశిష్టత కల్గివున్నది. దాని విశేషమేమనగా! పింఛము యొక్క మధ్య భాగము నలుపు కలిసిన నీలిరంగుతో కూడుకొని కొద్దిగ గుండ్రముగ ఆకర్షణగ కనిపిస్తూ ఉండును. ఈ భాగము పింఛములో అన్ని రంగులకంటే ముఖ్యముగ తెలియునట్లుండును. దానికి చుట్టు మెరుపు గల ఆకుపచ్చ రంగు ఉండును. దాని తర్వాత లేతగోధుమ రంగు గల ఆకారము చుట్టు ఉండును. ఈ లేత గోధుమరంగు చుట్టు చివరియందు మెరియుచుండును. దీని చివరి అంచు మెరుపు తర్వాత చుట్టు గుర్తించలేనంత లేతగ ఒకరంగు భాగముండును. వీటిని బట్టి పింఛములో మొత్తము నాలుగు భాగములున్నట్లు గుర్తు తెలియుచున్నది. 1) మధ్యలో నలుపు రంగు కలిసిన నీలిరంగు ఉన్నది. 2) గుండ్రని మెరుపుగల ఆకుపచ్చ భాగము 3) లేత గోధుమ రంగు 4) రంగు గమనించలేనంతగా ఒక భాగముండును. నాల్గవ దాని అంచు చివరిలో కూడ సులభముగ గుర్తించవచ్చును. బయటి నుండి మూడు గుండ్రని భాగములుండి మధ్యలో కన్నుగ లేక కేంద్రముగయున్న నెమలిపింఛమును బ్రహ్మవిద్యయైన మరియు యోగశాస్త్రమైన గీతాశాస్త్రమును చెప్పిన శ్రీకృష్ణుడు ధరించడము గొప్ప అర్థమై ఉన్నది. దాని వివరమేమనగా!
మన శరీరములో శిరోభాగమునందు గుణములు కలవు. శరీరముచే జరుగు కార్యములన్నిటికి కారణమైన గుణములు ఒక పద్ధతిగ అమర్చబడి ఉన్నవి. ఆ పద్ధతి ఒక చక్రముగ నిర్మితమై ఉన్నది. గుణములు మూడు రకములుగ విభజింపబడి ఉన్నవి. వాటి పేర్లు 1) సాత్త్వికము 2) రాజసము 3) తామసము. ఈ మూడు రకముల గుణములు గుణచక్రములో మూడు భాగములుగ విభజింపబడి ఉన్నాయి. ఆ మూడు భాగములకు సాత్త్వికభాగము, రాజసభాగము, తామసభాగము అని పేర్లు పెట్టబడినవి. ఈ మూడు భాగములకు మధ్యలో గుండ్రని భాగమొకటున్నది. దానినే బ్రహ్మనాడి అనుచున్నాము. దానియందే ఆత్మ నివాసమై ఉన్నది. ఆత్మ నివాసమున్న బ్రహ్మనాడిని ఇరుసుగ చేసుకొని కంటికి కనిపించని గుణచక్రము అమరివున్నది. దాని అమరిక తర్వాత పేజీలోని పటము చూడవచ్చును.
నేనుకాని, నీవుకాని, సర్వజీవులుగాని ఈ గుణచక్రములోనే చిక్కుకొని ఉన్నాము. ఈ మూడు భాగములలో జీవుడు ఎక్కువ ఏ భాగములో ఉండునో, ఆ జీవునికి ఆ భాగము యొక్క పేరు పెట్టబడినది. తామస భాగములో ఎక్కువ కాలమున్న జీవుని తామసుడని, రాజసగుణభాగములో ఉన్న జీవుని రాజసుడని, సాత్త్వికములో ఉన్న జీవున్ని సాత్త్వికుడని పేరు పెట్టడమైనది. ఏ భాగములో ఉన్న జీవునికైన మధ్యలో ఉన్న ఆత్మయే సాక్షిగ ఉన్నది. మధ్యలో ఉన్న ఆత్మకు తెలియని జీవరాసి లేదు. ప్రతి శరీరములో గల గుణచక్రము మధ్యలో ఉన్న ఆత్మ తన చుట్టు ఉన్న గుణములతో సంబంధము లేక సాక్షిగ ఉన్నది. ప్రతి జీవరాసి గుణముల వలన పనులుచేయుచున్నది. జరిగెడి పనుల వలన పాపపుణ్యములు ఆ జీవునికి సంభవించుచున్నవి. పాపపుణ్య కర్మలు జీవాత్మకే గాని మధ్యనున్న ఆత్మకు అంటవు. ఆత్మశక్తియే శరీరమంత వ్యాపించి కదలిక నిచ్చునదైనప్పటికి, ఆ కదలికలు గుణములననుసరించి ఉండును. ఆ గుణములు కర్మననుసరించి ఉండును. శరీరములో గుణముల ఆదేశాల ప్రకారము వివిధ పనులు జరుగుచున్నప్పటికి, ఆ పనులకు శక్తినిచ్చునదైన ఆత్మకు మాత్రము కర్మ అంటక అన్నిటికి సాక్షిగ ఉన్నది.
నెమలి పింఛము నెమలి పింఛములో మధ్యనగల గుర్తింపు భాగము గుణచక్రములో మధ్యన గల ఆత్మ నివాస స్థానమని తెలియాలి. దానికి చుట్టుగల రెండవ భాగమును సాత్త్విక భాగమనియు, దాని చుట్టు గల మూడవ భాగమును రాజసభాగమనియు, అట్లే చివరి నాల్గవ భాగమును తామస భాగమనియు తెలియాలి. ఈ విధముగ నెమలి పింఛముతో గుణచక్రముకు సమాన పోలికలున్నవి. శ్రీకృష్ణుడు నేను పనులు చేయుచున్నాను, నాకు ఏ గుణకర్మ అంటదు. నేను మూడు గుణముల మధ్య కర్మ అంటని ఆత్మగ ఉన్నానని తెలుపు నిమిత్తమే మూడు రంగుల మధ్యలో గుర్తింపుగ కనిపించు ప్రత్యేక రంగున్న పింఛమును ధరించాడు.
మన శరీరములో బ్రహ్మనాడి తలనుండి గుదస్థానమువరకు వెన్నముక మధ్యలో వ్యాపించి ఉన్నది. ఈ నాడియందే ఆత్మ నివాసముంటు, తన శక్తిని వెన్నెముకకు ఇరువైపుల బ్రహ్మనాడి నుండి చీలిపోయిన చిన్న నరముల ద్వార శరీరమంత వ్యాపింప చేసి, అన్ని అవయములను కదులునట్లు చేయుచున్నది. పైన శిరస్సులోని గుణచక్రము నుండి ఆదేశములు బ్రహ్మనాడి నరముల ద్వార చివరకు అవయములకు చేరుచున్నవి. అవయవముల నుంచి వచ్చు విషయములు కూడ బ్రహ్మనాడినుంచే పైకి చేరుచున్నవి. బ్రహ్మనాడి యొక్క చిన్న నరముల అమరిక నెమలిపింఛమును గమనిస్తే అర్థమగును. పింఛము యొక్క కాడ లావుగ తెల్లగ మొదలై పొడవుగ ఉండును. ఆ కాడను బ్రహ్మనాడిగ అర్థము చేసుకోవలెను. పింఛము యొక్క కాడ పొడవునా చిన్న చిన్న ఈక వెంట్రుకలు రెండువైపుల వ్యాపించి ఉండును. వాటిని బ్రహ్మనాడి నుంచి బయల్పడిన చిన్న చిన్న నాడులుగ గుర్తుంచుకోవలెను. పింఛము పైన కనిపించు నాల్గు భాగములను గుణచక్ర భాగములుగ లెక్కించుకోవలెను.
తలలోని గుణచక్రమును మరియు బ్రహ్మనాడిని పోలు పింఛము శ్రీకృష్ణుడు ధరించడములో విశేషములు 1) సర్వ జీవరాసుల శరీరములో ఈ విధ అమరిక ఉన్నదను జ్ఞానము తెలుపు నిమిత్తము పింఛము ధరించాడు. 2) సర్వ జీవులకు ఆత్మ సాక్షిగ ఉన్నదను సూచన నిమిత్తము పింఛము ధరించాడు. 3) ఆత్మ మూడు గుణములకు మధ్యన ఉండి, ఏ గుణములకు సంబంధములేదని తెలుపు నిమిత్తము పింఛము ధరించాడు. 4) ఏ పనులు చేయుచున్నను వాటికర్మ మధ్యన గల నాకంటదని తెలుపు నిమిత్తము పింఛము ధరించాడు. 5) సర్వ జీవరాసుల శిరస్సులలోనే ఆత్మ మరియు గుణములున్నాయను తెలుపు నిమిత్తము తల మీదనే పింఛము ధరించాడు. 6) చివరి అంచు రంగు లేతదై, రెండవది దానికంటే ఎక్కువ కనిపించునదై, మూడవది రెండవ దానికంటే మరీ ఎక్కువ కనిపించునదై, నాల్గవది అన్నిటికంటే మిన్నగ కనిపించునదై ఉన్నది. అటువంటి పింఛము ధరించడములో ఏ జీవరాసియైన చివరకు ఇక్కడకు రావలసిందేనని అర్థము తెలియవలెను. 7) రెండవ అధ్యాయమైన కర్మయోగము 28వ శ్లోకమున 'తత్త్వ విత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తన్త ఇతి మత్వాన సజ్జతే' గుణకర్మ విభాగములు తెలిసినవాడు ఆత్మను తెలిసినవాడగును. అటువంటి వాడు గుణముల వలన జరిగెడి పనులు ఎన్ని చేయుచున్నను, చేయని వాడేనని తెలుపు నిమిత్తము శ్రీకృష్ణుడు పింఛము ధరించాడు.
ఇపుడు అసలు విషయానికొస్తాము. భగవంతుడు పై శ్లోకములో చెప్పిన నాలుగువర్ణములు గుణచక్రములోని నాలుగు భాగములేయని తెలియాలి. వాటి ప్రకారము బయట మొదటి భాగములో ఉన్నవారు తామసులు, రెండవ భాగములో ఉన్నవారు రాజసులు, మూడవ భాగములో ఉన్నవారు సాత్త్వికులు, నాల్గవ భాగములో ఉన్నవారు యోగులు. యోగమాచరించు వారు గుణరహితులై ఆత్మను పొందినవారు కనుక వారిని యోగులనుట జరిగినది. ఈ లెక్క ప్రకారము సర్వజీవరాసులలోను నాల్గు వర్ణములు కలవని అవియే తామసులు, రాజసులు, సాత్త్వికులు, యోగులని పిలువబడుచున్నవని తెలియుచున్నది. ఈ నాల్గు వర్ణములతో పరమాత్మ సంబంధములేనివాడై ఉన్నాడు. కనుక వాటికి కర్తనై కాకుండనున్నానన్నాడు. ఇపుడు దైవ నిర్మితమైన నాల్గువర్ణములు సర్వ జీవరాసులకు సంక్రమించిన నాల్గువర్ణములని తెలిసిందా!
శ్లోకం 14: నమాం కర్మాణి లింపన్తి నమే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ||
(కర్మయోగము, సాకారము)
భావము : నాకు కర్మములంటవు. నాకు వాని ఫలములందు ధ్యాసలేదు. నేనిట్టివాడనని ఎవడెరుగునో, వానికి కర్మబంధనములు కలుగవు.
వివరము : ఇంతవరకు నెమలి పింఛము ధరించడములో ఏ అర్థమున్నదో దాని ప్రకారము నాకు కర్మలంటవు అన్నాడు. ఆయన ఏ విధముగ కర్మలు నన్నంటవన్నాడో తెలియగలిగితే, వాడు కూడ అదే విధానము అనుసరించి, కర్మలనంటకుండ చేసుకొనును.
శ్లోకం 15: ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ||
(కర్మయోగము)
భావము : ఏ విధముగ కర్మ అంటదో తెలిసిన మోక్షకాములు ఆ విధముగనే ఆచరించిరి. వారు ఆచరించినట్లే నీవు ఆచరించుము.
శ్లోకం 16: కిం కర్మకి మకర్మేతి కవయోఽ ప్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే ఽశుభాత్ ||
(కర్మయోగము)
భావము : ఏది కర్మయో, ఏది కర్మకాదో అనుభవమున్న జ్ఞానులు కూడ తెలియక భ్రమపడుచున్నారు. అందరికి అర్థము కాని కర్మ రహస్యమును నీకు చెప్పెదను. దాని వలన మోక్షమును పొందగలవు.
వివరము : నేడు నిత్య జీవితములో అనేక సమస్యలతో చిక్కుకొని తప్పనిసరిగ పనులు చేయువారికి ఏ విధముగ కర్మ అంటుతున్నదో, ఏ విధముగ కర్మ అంటకుండ పోవునో, పెద్ద జ్ఞానులమనుకొన్నవారికి కూడ అర్థము కాలేదు. అందువలననే వారు మంచి పనులు చేయండి, చెడు పనులు చేయద్దండని చెప్పుచున్నారు. ఆ లెక్క ప్రకారము పోతే అర్జునుడు కూడ యుద్ధము చేయకూడదు. యుద్ధము హింసతో కూడుకున్న పని కనుక పాపమొచ్చునని అంగీకరించక తప్పదు. మరి యుద్ధము చేయమని చెప్పు శ్రీకృష్ణుడు చెడు పనిని ఎందుకు చేయమంటున్నాడు. జ్ఞానులమనుకొన్న వారికంటే ఎక్కువ ఏదో తెలుసును కనుక యుద్ధము చేయమన్నాడు. ఈ విషయము శ్రీకృష్ణుడు కూడ చెప్పుచు 'ఎందరో జ్ఞానులకు కూడ ఈ విషయము తెలియక భ్రమపడుతున్నారు. ఏది కర్మనో, ఏది కర్మకాదో చెప్పెద వినుము ' అన్నాడు.
శ్లోకం 17: కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ||
(ప్రకృతి, కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మను తెలుసుకోవాలి. అట్లే వికర్మను తెలుసుకోవాలి మరియు అకర్మను తెలుసుకోవాలి. ఈ కర్మ గతులు తెలుసుకోవడము చాలా కష్టము.
వివరము : కర్మ, అకర్మ, వికర్మ అన్నీ గందరగోళము. అందుకే 'గహనా కర్మణో గతిః అని ఈ శ్లోకములో అన్నాడు. ఈ కర్మ గతులు తెలియడము చాలా గహనముగ ఉండును. అందువలననే ఇంతవరకు ఈ శ్లోకమునకు వివరము వ్రాసుకొన్నవారు కూడ తికమకమై పోయి శాస్త్రబద్దమైన కర్మ అని, శాస్త్రబద్దము కాని కర్మ అని రకరకములుగ వ్రాసుకొన్నారు. ఎందరో గీతను వ్రాసినవారు ఏ అధ్యాయములోను వివరము వ్రాయుటలో ఇంత ఇబ్బందిపడివుండరు. కాని ఇక్కడ ఈ శ్లోకములో కర్మ, అకర్మ, వికర్మ అను మాటలకు వివరము వ్రాయడములో నానా తంటాలు పడినారు. చివరకు కుప్పించి ఎగిరి దాటి పోయారు. కర్మలు నానా రకములుగ ఉన్నాయి. ఆ కర్మలు ఎవరి ఆధీనములో లేక వాటి ధర్మమును అవి నెరవేర్చుచు, నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా బలవంతముగ నియమించి చేయించు చున్నాయి. ఇది చేయకూడని పని, ఇది చేయవలసిన పని, ఇది శాస్త్రబద్దమైన పని, ఇది శాస్త్రబద్దముకాని పని అనడము ఇక్కడ అనర్థమగును. మన ఇష్టాయిష్టములు కార్యముల ఎడల సంబంధములేదని శ్రీకృష్ణుడు పదేపదే చెప్పుచునే ఉన్నాడు. ఆయన మాటనుకాదని వివరము వ్రాసుకోవడము మంచిది కాదు. ఈ విషయములో పండితులు కూడ తెలియక భ్రమపడుదురని ఆయన ముందే చెప్పాడు. అందువలన మనమెక్కడైన ఈ విషయములో పొరపాటుపడినామేమో పునరాలోచన చేయమని అందరికి మనవి చేయుచున్నాము. మన కథ వదలివేసి ఆయనేమి చెప్పాడో చూస్తాము.
పై శ్లోకములో మూడు విధానములున్నాయి. 1) కర్మ 2) వికర్మ 3) అకర్మ. ఈ మూడు కర్మలలో మొదటిదైన కర్మ అనుపదమును గురించి తెలుసుకొందాము. సాధారణ మనిషి చేయు పనులను కార్యములు అంటున్నాము. ఈ కార్యములు వెనుకటి కర్మవలన జరుగుచున్నవి. జరుగుచున్న కార్యములు జీవుడే చేయుచున్నాడని అహము జీవున్ని భ్రమింప చేయుచున్నది. అహము యొక్క భ్రమలో పడిన జీవాత్మ తానే చేశాననుకొంటున్నాడు. వాస్తవానికి జీవాత్మకు శరీరము ద్వారా జరిగెడి పనులకు ఏమాత్రము సంబంధములేదు. అయినప్పటికి అహము యొక్క మహిమచేత పొరపడినవాడై జీవుడు కార్యములకు కర్తను తానే అనుకొనుచున్నాడు. అట్లనుకొనుట వలన శరీరము ద్వారా జరుగబడు కార్యములకు పాపము లేక పుణ్యమను క్రొత్తకర్మ జీవునికి చేరుచున్నది. అగ్నిశిఖలకు వేడిమి సహజమైనట్లు ప్రతి పనికి కర్మ సహజమే. జీవుడు అహము పొందినపుడు కర్మ వానిని అంటుకొనును. అహము పొందనపుడు కర్మ నశించిపోయి వానికి అంటదు. జ్ఞానము తెలిసి కర్మయోగమాచరించు వారికి కర్మ అంటని విధానముండును. సాధారణముగ ప్రకృతి మాయలో ఉండి జ్ఞానము తెలియని మనిషి, నిత్యము కర్మ ఆడించినట్లు కార్యములు చేయుచు, అహము చేత తిరిగి క్రొత్త కర్మను పొందుచున్నాడు. పనులు చేయుచు కర్మను సంపాదించుకొనుటకు పై శ్లోకమున 'కర్మ' అని అన్నారు. ఈ విధముగ మనిషికి కర్మ అంటుచున్నదని తెలియడమునే 'కర్మణోహ్యపి బోద్ధవ్యం' కర్మను తెలుసుకోవలెను అన్నాడు. అంతేకాక 'బోద్ధవ్యంచ వికర్మణః' వికర్మను తెలుసుకోవలెను అన్నాడు. వికర్మ అంటే ఏమిటో చూద్దాము. సహజముగ కర్మచేత ప్రేరేపించబడి జరుగు కార్యములను బ్రహ్మయోగము ద్వార స్థంభింపచేసి నిలిపివేయు అవకాశముగలదు. ప్రారబ్ధకర్మను జరగకుండ నిలిపివేయు శక్తి ఒక్క బ్రహ్మయోగము (జ్ఞానయోగము) నకే గలదు. తలలోని ప్రారబ్ధకర్మ గుణములు, బుద్ధిద్వార బయలుదేరి, మనస్సు ద్వార బయటి ఇంద్రియములకు ప్రాకి, బయటి అవయవముల ద్వార పని చేయుచుండును. బ్రహ్మయోగ సాధకులు ప్రయత్నము చేత శరీరములో బాహ్య అంతర భాగములకు మధ్యనవున్న మనస్సును పనిచేయకుండ చేయుట వలన ప్రారబ్ధకర్మ ఆచరణ పూర్తిగ నిలిచిపోవుచున్నది. ఇట్లు బ్రహ్మయోగము ద్వార ప్రారబ్ధకర్మను దాని పనులను జరుగకుండ చేయడమును 'వికర్మ' అంటాము. వికర్మ అనగ కర్మ జరగడము కాని కర్మ రావడము కాని లేదని అర్థము.
మూడవదైన అకర్మ అనగా! ప్రారబ్ధము ప్రకారము పనులు జరుగుచున్నను, శరీరములోని అహము పనిచేయని దానివలన, కర్మ అంటక పోవడమును 'అకర్మ' అంటున్నాము. అకర్మ కర్మయోగులకే సాధ్యమగును. కర్మయోగమున అహము పనిచేయదు. అందువలన ఆ విధానములో పనులు చేసినప్పటికి కర్మ అంటదు.
1) ప్రారబ్ధకర్మ చేత పనులు జరుగుచు క్రొత్తకర్మ రావడమును 'కర్మ' అంటాము. ఇది అజ్ఞానుల ఎడల జరుగును. పాతకర్మ ఆచరణకు వచ్చి క్రొత్తకర్మ అంటుకోవడమును కర్మ అంటున్నాము.
2) ప్రారబ్ధకర్మ ఆచరణవుండదు, క్రొత్తకర్మరాదు, అన్ని స్థంభించి కర్మలన్ని నిలిచి పోవడమును 'వికర్మ ' అంటాము. ఇది బ్రహ్మయోగులకు మాత్రమే జరుగును. శరీరములోని మనస్సు నిలిచిపోవడము వలన వికర్మలో మనిషికి బయటి జ్ఞప్తియే ఉండదు.
3) ప్రారబ్ధకర్మ ఆచరణ ప్రకారము పనులు జరుగుచున్నప్పటికి, క్రొత్త కర్మ రాకుండ పోవడమును 'అకర్మ ' అంటాము. ఇది కర్మయోగులకే సాధ్యపడును. ఈ యోగములో శరీరములోని అహము నిలిచిపోవుచున్నది. అకర్మలో సాధారణ అజ్ఞానికి జరిగినట్లు పనులు జరుగుచుండును. అయినప్పటికి నూనెకు నీరంటనట్లు వానికి కర్మ అంటక పోవుచున్నది.
శ్లోకం 18: కర్మణ్య కర్మయః పశ్యే దకర్మణిచ కర్మయః |
సబుద్ధి మాన్మను ష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్ ||
(కర్మయోగము)
భావము : కర్మలను రాకుండ నిగ్రహించుట అకర్మ అనియు, కర్మములయందే అకర్మ కలదని తెలిసి, ఎవడు అన్ని కర్మలాచరించుచున్నాడో, వాడే జ్ఞానియని తెలిసిన పెద్దలందురు.
వివరము : సమస్త కార్యములు చేయుచున్నను, క్రొత్తకర్మ రాకుండ చేసుకొను విధానము అకర్మ అని, పనులు చేయుచు ఏ విధానమును అనుసరిస్తే పాప పుణ్యములురావో బాగా తెలిసి, మంచి చెడు కార్యములనుకోక సమయానుసారము ఏ కర్మ ఆచరణకొస్తే ఆ పనులు చేయువాడు సంపూర్ణ జ్ఞాని అనియు, సంపూర్ణ కర్మయోగి అనియు చెప్పవచ్చు. ఇక్కడ కొందరికొక సంశయమొచ్చి "మంచిపనులు చేసినవానిని జ్ఞాని, యోగి అనవచ్చును. చెడుపనులను చేయువానిని జ్ఞాని అనిగాని, యోగి అనిగాని అనుట బాగుండునా? ఈ మాట ఏ గీతలోను వ్రాయలేదే. ఎక్కడ వ్రాయనిది ఇక్కడ నిజమగునా" అని అడుగవచ్చును. భగవంతుడు మాత్రము ఈ విషయమును ఇంతకుముందు, ఇపుడు, తర్వాత వచ్చు అధ్యాయములలోను చాలామార్లు చెప్పాడు. అలా కార్య భేదము పెట్టుకొనువాడు యోగియేకాదని కూడ చెప్పాడు.
శ్లోకం 19: యస్య సర్వే సమారమ్భాః కామ సంకల్ప వర్జితాః |
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం త మాహుః పండితం బుధాః ||
(కర్మయోగము)
భావము : ఎవడైతే ఆశ అను గుణము లేకుండ సర్వ(మంచిచెడు) కార్యములు చేయునో, ఎవడైతే జ్ఞానాగ్నిచేత కర్మను కాల్చునో, వానిని బుధులు జ్ఞానపండితుడని అందురు.
వివరము : "సర్వే సమారమ్భాః" అని శ్లోకములో కూడ అన్నారు. సర్వే అనుటలో అన్ని అని అర్థము. మంచివి కావచ్చు, చెడువి కావచ్చని అర్థము. సర్వకార్యములు కోర్కెలేకుండ చేయువానిని పండితుడని చెప్పవచ్చునన్నాడు. ఇక్కడ ఒక సంశయము కొందరికి రావచ్చును. అదేమనగా! 'ఆశ ఉన్నప్పుడే కదా! పని చేసేది ఆశ లేనపుడు ఎవడు ఏ పని చేయడు కదా!' అని అడుగవచ్చును. నిజమే అందరు ఆశ ఉన్నపుడే చేస్తున్నారు, అట్లు చేయువాడు జ్ఞానికాడు. ఆశతో చేయువానికి కర్మరహస్యము తెలియదు. ఆశ వలననే కార్యమనుకొనుచున్నాడు. నిజమైన జ్ఞానము తెలిసినవాడు కర్మవలనే కార్యమనుకొనుచున్నాడు. ఆశ వెనుకల ఉన్న కర్మను కూడ జ్ఞప్తిలో పెట్టుకొని చేయుచుండుట వలన వానిని 'కర్మయోగి ' అంటున్నారు.
'జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం' జ్ఞానాగ్నిచేత కర్మ కాలినవాడు అని అర్థము. ఇక్కడ జ్ఞానాగ్ని అనుమాట క్రొత్తగ వచ్చినది. జ్ఞానాగ్ని యోగమాచరించు వారియందే ప్రజ్వరిల్లును. యోగులు జ్ఞానాగ్ని కలవారైయుందురు. వారియందు జ్ఞానాగ్ని కర్మలను కాల్చునదై ఉన్నది. జ్ఞానాగ్ని యోగియందెట్లున్నది? అది అతనికెట్లు లభించుచున్నది? అను ప్రశ్నలు కొందరికిరావచ్చును. సంశయములు లేకుండ పోవాలంటే జ్ఞానాగ్ని విషయము కొంతైన ఇక్కడ తెలుసుకోవాలి. మామూలు అగ్నిచే వంటలు చేయుచున్నాము. మనము వంట ప్రారంభింపక ముందు పొయ్యిలో అగ్నిలేదు. వంట ప్రారంభించిన తర్వాత పొయ్యిలో అగ్నిని రగుల్చుతాము. మొదట లేని అగ్నిని అగ్గిపుల్లనుండియో లేక చెకుముఖి రాయివల్లనో అగ్నిని పుట్టించుచున్నాము. మనము బయట తయారు చేయు అగ్ని కంటికి కనిపించును. తాకితే చేయికూడ కాలును. అగ్ని ఏ వస్తువునైన కాల్చివేయును. గంధపు చెక్కైన, తుమ్మచెక్కైన అగ్నికి సమానమే. అట్లే ప్రాణములేని వస్తువునుకాని, ప్రాణమున్న మనిషినికాని రెండిటిని కాల్చివేయు స్థోమత కలది అగ్ని. ఈ అగ్నిని గురించి తెలియని వారుండరు. మరొకటి మనకు తెలియని అగ్ని కూడ ఉన్నది. అది బయటి వస్తువులను కాల్చలేని అగ్ని. మన శరీరమును కొద్దిగ కూడ కాల్చలేనిది, కేవలము కర్మలను మాత్రము కాల్చునది. కంటికి కనిపించని ఆ అగ్ని యొక్క పేరు జ్ఞానాగ్ని. జ్ఞానాగ్నికి సాధారణ అగ్నికి చాలా తేడాలున్నాయి. ఆ తేడాలు వరుసగ క్రింద పట్టికలో చూస్తాము.
అగ్ని -----
జ్ఞానాగ్ని
1) కంటికి కనిపించునది.(1) కంటికి కనిపించదు.
2) కట్టెలను కాల్చును,కర్మలను కాల్చలేదు.(2) కర్మలను కాల్చును, కట్టెలను కాల్చలేదు.
3) స్థూల శరీరమునకు వేడి కలుగజేయును.(3) సూక్ష్మ శరీరమునకు వేడి కలుగజేయును.
4) మంచి,చెడు వస్తువుల భేదము లేకుండ కాల్చును.(4) పాప, పుణ్య కర్మ భేదము లేకుండ కాల్చును.
5) ప్రకృతి సంబంధమైనది(5) పరమాత్మ సంబంధమైనది.
6) స్థూలమునకు కనిపించును.(6) సూక్ష్మమునకు కనిపించును.
7) అజ్ఞానులైన వెలిగించగలరు.(7) యోగులకు మాత్రము వెలుగును.
8) శరీరము బయట నిలువ వుండును.(8) శరీరము లోపల నిలువవుండును.
9) నీటికి ఆరిపోవును, గాలికి మండును.(9) నీటికి ఆరిపోదు, గాలికి మండదు.
10) ఇతరుల యొక్క వస్తువులను వేటినైన కాల్చును.(10) ఇతరుల ప్రారబ్ధమును మాత్రము కాల్చును.
11) తన శరీరములోని ఏ భాగమునైన కాల్చును.(11) తన శరీరములో ఆగామికకర్మను సంచితకర్మను కాల్చును.
12) ఎక్కడైన ఎప్పుడైన తయారు చేయవచ్చును.(12) యోగము చేయు సమయములోనే తయారగును. కర్మయోగులకు శరీరము లోపల నుంచి, బ్రహ్మయోగులకు శరీరము బయటి నుండి చేరును.
జ్ఞానాగ్ని అను మాట విషయము అర్థమగుటకు చెప్పిన ఉపమానము గాని, వాస్తవానికి జ్ఞానాగ్నిలేదని చాలామంది చెప్పుచున్నారు. ఎవరు ఏమి చెప్పినప్పటికి, గీతలో దీనిని ప్రత్యేకించి వ్రాయనప్పటికి, సత్యము కొంతకాలము కనిపించక పోయినప్పటికి, దానికి నాశనము లేదు. ఏనాటికైన అది బయట పడగలదు. అట్లే భగవద్గీతలోని సత్యములను ఎవరు గుర్తించనంత మాత్రమున అవి మాసిపోవు. మానవాళికి తెలియాలను భగవంతుని ఉద్ధేశ్యము వృథాకాదు. నూరు మంది గుర్తించలేకపోయిన చివరకు ఒక్కడైన గుర్తించును. అట్లు చివరకు ఒకడు కూడ గుర్తించకపోతే, ఆయన తన(పరమాత్మ) మళ్ళీ జన్మలోనైన దానిని గూర్చి తెలియజేయును. ఇక్కడ జ్ఞానాగ్ని విషయము కూడ అలాంటిదే.
జ్ఞానాగ్ని ఉపమానము కాదు. అగ్నిని జ్ఞానాగ్నికి ఉపమానముగ చెప్పడమైనది. అగ్నిలో కట్టెలు కాలునట్లు, జ్ఞానాగ్నిలో సర్వ కర్మలు కాలిపోవునని భగవంతుడు ఇదే భగవద్గీతలో మరొకచోట కూడ చెప్పాడు. దీనిని బట్టి జ్ఞానాగ్ని ఉన్నదేనని, దానికి ఉపమానముగ బయట అగ్నిని చెప్పడమైనదని తెలియుచున్నది. అంతేకాక జ్ఞానాగ్ని కర్మయోగులలో ఒక విధముగ, బ్రహ్మయోగులలో ఒక విధముగ పనిచేయుచు తన ఉనికిని చాటుకొనుచున్నది. జ్ఞానాగ్ని యోగుల శరీరములో ప్రత్యేకమైన పనులు చేయుచు, అది అజ్ఞానుల మీద యోగుల ద్వార ప్రసరించి ప్రత్యక్ష ప్రమాణములు చూపుచున్నది. అది ఉన్నదనుటకు అంతకంటే నిదర్శనములు వేరే అవసరము లేదనుకుంటాము. జ్ఞానాగ్ని విషయము తెలియకపోతే జ్ఞానదృష్ఠికి మసక చీకటి ఉన్నట్లే. అందువలన జ్ఞాననేత్రము యొక్క చూపు సరిగా ఉండాలంటే ఇక్కడ జ్ఞానాగ్నిని గూర్చి విపులముగ తెలుసుకొందాము. వెనుక పట్టికలో చెప్పబడిన వరుస ప్రకారము
1) కంటికి కనిపించునది కాదన్నాము. జ్ఞానాగ్నికి స్థూల ఆకారము లేదు. ఇది మామూలు అగ్నివలె ఎర్రగ ఉండునని కూడ చెప్పలేము. కొందరి దేవతల జ్ఞానుల చిత్రపటములలో వారి తల వెనుక ప్రకాశమున్నట్లు గుర్తించివుండుట కనిపించగలదు. అది వారి జ్ఞానప్రకాశమని, వారి తలలో జ్ఞానాగ్ని ఉన్నదని, తెలిసినవారు పూర్వమునుంచి అట్లు చిత్రించుచున్నారు. ఈ చిత్రములు జ్ఞానాగ్ని తలలో ఉండునని తెలియజేయుచు దాని ఉనికిని సూచిస్తున్నాయి.
2) జ్ఞానాగ్ని అగ్నివలె బయటి వస్తుజాలమును ఏమి చేయలేదు. దాని ప్రభావమంతయు పాప పుణ్యములను కాల్చివేయడమే. కావున జ్ఞానాగ్నికి సమిధలు కర్మలేనని చెప్పవచ్చును.
3) సూక్ష్మశరీరముతో తిరుగు గ్రహాలను జ్ఞానాగ్ని వేడెక్కించును. అందువలన యోగుల సమీపములో దయ్యాలనబడు సూక్ష్మశరీరములు నిలువజాలవు. జ్ఞానాగ్ని వేడికి తట్టుకోలేక వారికి భయపడును. యోగులు చెప్పినట్లు నడుచుకొనును. ఈ ప్రకారము ఏసుప్రభువు వద్ద ఎన్నో దయ్యములు నమస్కరించి ఆయన మాట ప్రకారము పోయినవని బైబిలులో కలదు.
4) కర్మ అనగ పాపము మరియు పుణ్యము యొక్క కలయిక. జ్ఞానాగ్ని యొక్క సహజత్వము కర్మను కాల్చుట. కర్మలో పుణ్యము మంచిదని, పాపము చెడ్డదను భేదములు దానికి లేవు. తన పద్ధతి ప్రకారము కర్మలోవున్న దేనినైన కాల్చును.
5) జ్ఞానాగ్ని పరమాత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైన కర్మలకు వ్యతిరేఖమైనది. అంతేకాక పరమాత్మవలె బయలులో కూడ అణిగివున్నది. బ్రహ్మయోగులకు బయటినుండే వారిలోకి ప్రవేశిస్తున్నది.
6) జ్ఞానాగ్ని గ్రహాలు విగ్రహాలు అనబడు సూక్ష్మశరీరములకు కనిపించును. జ్ఞానాగ్ని ఏ యోగివద్ద ఎంత ఉన్నది, యోగులలో ఎవరివద్ద ఎక్కువ ఉన్నది వాటికి తెలియును. అందువలననే యోగులకు దయ్యాలు మరియు చిన్న చిన్న దేవతలు సహితము భయపడుదురు. దేవతలు సహితము యోగులకు నమస్కరించు చుందురు. చరిత్రలో మనుష్యులైన యోగుల మాటను గౌరవించి దేవతలు కూడా పనిచేశారని అనేక సంధర్భాలలో విన్నాము.
7) జ్ఞానాగ్ని యోగులందుమాత్రము వెలుగును. యోగ సమయములో మాత్రము ప్రజ్వరిల్లు అగ్ని జ్ఞానాగ్ని, అందువలన యోగులు తప్ప ఎవరియందును వెలుగునది కాదు.
8)జ్ఞానాగ్ని బయటి అగ్నివలె నీటికి ఆరిపోవునది కాదు. ఇది ప్రకృతిలోని శక్తులకు లొంగునది కాదు. పంచభూతములకు అతీతమైనది.
9) జ్ఞానాగ్నిని ఇతరుల కర్మమీద యోగి సంకల్పముచేత ప్రసరింపజేయవచ్చును. హస్తము, పాదము, చూపు ద్వార యోగి శరీరము నుండి ఇతర శరీరములో ప్రవేశించిన జ్ఞానాగ్ని ఆ శరీరములో ఉన్న సంచిత, ఆగామి, ప్రారబ్ధమనబడు కర్మలలో ప్రారబ్ధము మీదకు పోయి దానిని కాల్చివేయును. ఇది జ్ఞానాగ్ని ఉన్నదనుటకు ప్రత్యక్ష ప్రమాణము. ఏసుప్రభువు తన చేతితో తాకి ప్రారబ్ధకర్మ అయిన కుష్ఠురోగమును పోగొట్టెను. అట్లే గ్రుడ్డివాని కళ్ళకు చూపు తెప్పించెను. ఇక్కడ ఏసుప్రభువు శరీరము నుంచి బయటికి వచ్చిన జ్ఞానాగ్ని గ్రుడ్డివాని శరీరములో అంధత్వమునకు కారణమైన ప్రారబ్ధమును కాల్చివేయుట వలన వానికి వెంటనే చూపు వచ్చెను. ఇట్లు ఎందరో యోగులు వారి జ్ఞానాగ్నిచేత కొందరి రోగములను అంగలోపములను పోగొట్టినట్లు ఎన్నో ఆధారములున్నవి.
10) యోగుల శరీరము నుండి బయటికి వచ్చి ఎదుటివాని ప్రారబ్ధము మీద దాడిచేసిన జ్ఞానాగ్ని యోగుల శరీరములలో మాత్రము ప్రారబ్ధము మీద పని చేయదు. ఉదాహరణకు ఒక యోగి కడుపునొప్పితో బాధపడుచున్న ఎదుటి వానిని చూచి దయతలచి, తన యొక్క యోగాగ్ని(జ్ఞానాగ్ని) చేత వాని ప్రారబ్ధమును కాల్చివేసి, వానికి కడుపునొప్పి లేకుండ చేసెను. ఆ యోగికి ఉన్న చిన్న చెవి నొప్పిని తప్పని సరిగ అనుభవించుచుండెను. వానికి కడుపునొప్పి బాగు చేసిన వానివి నీకున్న చెవినొప్పిని బాగుచేసుకోలేవా అని ప్రశ్నించితే, నా శక్తి నామీద పనిచేయదనెను. దీనిని బట్టి యోగి శరీరములోని జ్ఞానాగ్ని అతని ప్రారబ్ధము మీద పని చేయదని తెలియుచున్నది. యోగి శరీరములోని అగ్ని ఏ కర్మ మీద పని చేయుననిన? ఇది బ్రహ్మయోగిలో ఒక విధముగ, కర్మయోగిలో ఒక విధముగ పనిచేయుచున్నది. బ్రహ్మయోగిలో జ్ఞానాగ్ని అతని సంచితకర్మ మీద పనిచేయును. అట్లే కర్మయోగి శరీరములోని జ్ఞానాగ్ని అతని ఆగామికకర్మ మీద పనిచేయును. ప్రారబ్ధమనగ! ప్రస్తుతము అనుభవించునదనియు, ఆగామికకర్మయనగా! చేయుచున్న కార్యములలో క్రొత్తగ వచ్చునదనియు, సంచితకర్మ అనగ! జన్మజన్మల నుండి మిగులుచు వచ్చిన కూడలియని తెలియాలి.
11) జ్ఞానాగ్ని అగ్గిపుల్లలోని అగ్నివలె కనిపించక ప్రపంచమంత వ్యాపించి ఉన్నప్పటికి అగ్గిపుల్ల గీచినపుడే మండినట్లు, జ్ఞానాగ్ని యోగులు యోగము చేయునపుడే ప్రజ్వరిల్లును. బ్రహ్మయోగమాచరించు వానికి బయటవున్న జ్ఞానాగ్ని కణములు యోగదండము ఉపయోగించిన ప్రక్కగాక, దానికి వ్యతిరిక్త దిశలోని బ్రహ్మనాడిలో చేరి, దాని ద్వార శిరోభాగమున చేరి ప్రజ్వరిల్లుచుండును. ఈ విషయము ఐదవ అధ్యాయము ఆత్మసంయమ యోగములో బ్రహ్మయోగమును గురించి చెప్పిన చోట వివరముగ చెప్పబడినది. కర్మయోగము ఆచరించువానికి తలలోనే ప్రజ్వరిల్లును. కర్మయోగులకు బ్రహ్మయోగులవలె చర్మాసనము, యోగదండము, పద్మాసనము యొక్క ఆవశ్యకత ఉండదు. బ్రహ్మయోగులకు బయటినుంచి లభించు జ్ఞానాగ్ని బ్రహ్మనాడినిచేరి, భూమి ఆకర్షణచేత కొంత క్రింది భాగములో నుండి బయటికి పోవు అవకాశముండుట వలన, జ్ఞానాగ్ని అలా కొంచెము కూడ నష్టము కాకుండునట్లు దర్భలు, చర్మములు ఆసనముగ సమకూర్చుకోవలెనని పెద్దలు చెప్పారు. ఇవన్నియు జ్ఞానాగ్ని ఉన్నదని చెప్పుటకు తార్కాణములు.
శ్లోకం 20: త్యక్త్వా కర్మ ఫలా సంగమ్ నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభి ప్రవృత్తోఽపినైవ కించిత్కరోతి సః || (కర్మయోగము)
శ్లోకం 21: నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || (కర్మయోగము)
శ్లోకం 22: యదృచ్ఛా లాభ సంతు ష్టో ద్వంద్వాతీతోవిమత్సరః|
సమస్సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబద్ధ్యతే ||
(కర్మయోగము)
భావము : కర్మఫలము ఎడల ధ్యాసలేక, నిత్యతృప్తుడవై ఆశను నిగ్రహించుకొని సర్వ కార్యములను సదా చేయువాడు చేయని వానితో సమానము. ఆశ విడిచి, నియమిత చిత్తుడై, దేని మీద శ్రద్ధలేక కేవలము శరీర సంబంధముగ పనులు చేయవలెను. అట్లు చేయువానికి కర్మలంటవు. దొరికినట్టి లాభముతో తృప్తిపొంది, ద్వంద్వములు వీడి, మత్సరము లేని వాడై లాభనష్టములను సమానముగ ఎవడు చూచునో వానికి కర్మబంధములు కలుగవు.
వివరము : ఇక్కడ మూడు శ్లోకములకు ఒకేమారు వివరమివ్వడము జరుగుచున్నది. ఈ మూడు శ్లోకములు ఒకే కర్మయోగమును గూర్చి చెప్పినవి. ఈ మూడుకంటే ముందు చెప్పిన 19వ శ్లోకము వీటి తర్వాత ఉండు 23వ శ్లోకము కూడ కర్మయోగమునకు సంబంధించినవే. దైవమును తెలుసుకొనుటకు మోక్షమును పొందుటకు రెండే మార్గములున్నవి. అవియే కర్మయోగము, బ్రహ్మయోగము. ఇవి బాగా అర్థము కావాలని మార్చి మార్చి అనేక శ్లోకాలరూపములుగ చెప్పారు. కర్మయోగమును గూర్చి సాంఖ్య, కర్మ, జ్ఞానయోగములను అధ్యాయములలో, బ్రహ్మయోగమును గూర్చి కర్మ సన్న్యాస, ఆత్మ సంయమ యోగములను అధ్యాయముల లోను ఎక్కువగ చెప్పారు. అంతేకాక మిగతా అధ్యాయములలో అక్కడక్కడ కూడ చెప్పారు. ఇపుడు కర్మయోగమునకు సంబంధించి మూడు శ్లోకములకు ఒకే భావ వివరము చెప్పుచున్నాము.
శ్లోకం 23: గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః |
యజ్ఞా యాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ||
(కర్మయోగము)
భావము : సంగము లేనివాడై, ఫలాసక్తి లేక దైవమును చేరవలెనను కోర్కెగలవాడై, కర్మయజ్ఞము చేయువానికి వాని కర్మ అంతయు కాలి నాశనమగును.
వివరము : ఈ శ్లోకములో 'యజ్ఞా యాచరతః కర్మ' అను వాక్యము ముఖ్యము. ఇదే అర్థమునిచ్చు 'యజ్ఞార్థాత్కర్మనోన్యత్ర' అని కర్మయోగము 9వ శ్లోకములో చెప్పినపుడు బాహ్యయజ్ఞములు చేయమని కల్పితమైన ఏడు శ్లోకములు అక్కడ చేర్చారు. వాటిని గుర్తించి అవి అశాస్త్రీయమైనవని మనము తీసివేయడము జరిగినది. అదేవిధముగ ఇక్కడ కూడ యజ్ఞమను మాట వినిపిస్తూనే 9 కల్పిత శ్లోకాలను చొప్పించారు. అనేక రకముల యజ్ఞాలున్నాయని చెప్పిన 9 శ్లోకముల భావములు, రెండే యజ్ఞములు ఉన్నాయని చెప్పిన భగవంతుని మాటకు విరుద్ధముగ ఉన్నాయి. 23వ శ్లోకములో 'యజ్ఞాయాచరతః కర్మ' యజ్ఞకర్మ చేయుము అన్న భగవంతుడు ప్రక్క శ్లోకములోనే యజ్ఞములు రెండు రకములు 1) ద్రవ్యయజ్ఞము 2) జ్ఞానయజ్ఞము అని, వాటిలో ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనదని కూడ చెప్పుచు 'శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః' అన్నాడు. 24వ శ్లోకముగ ఉండవలసిన దానిని 33వ శ్లోకముగ చేసి మధ్యలో 9 కల్పిత శ్లోకములు ఇరికించారు. వివిధరకాల యజ్ఞాలను తెలుపు 9 శ్లోకాలు 23వ శ్లోకమునకు వ్యతిరేఖమైనవిగ ఉన్నవి. అందువలన వాటిని తీసివేయడమైనది. ఇంతవరకు మూడు అధ్యాయములలోను కల్పిత శ్లోకాలున్నట్లు కనుగొన్నాము. మూడు అధ్యాయములలోను వరుసగ 7+7+9 మొత్తము 23 శ్లోకములున్నవి. ఈ అధ్యాయములో 23వ శ్లోకము తర్వాత అనుబంధ శ్లోకము 33వదని గ్రహించాలి.
శ్లోకం 24 -32:
(కల్పితము)
శ్లోకం 33: శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః పరంతప! |
సర్వం కర్మాఽఖిలం పార్థ!జ్ఞానే పరిసమాప్యతే ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. సర్వకర్మలు జ్ఞానయజ్ఞములో పరిసమాప్తమగును.
వివరము : ఇక్కడ యజ్ఞమంటే ఏమిటి? రెండు యజ్ఞములు ఎక్కడ జరుగును? ఎవరు చేయుదురు, వాటి ఫలితమేమి? ఇన్ని ప్రశ్నలకు జవాబులు దొరికితే అప్పుడు యజ్ఞము వివరము పూర్తి తెలిసినవారమగుదుము. జవాబుల కోసము క్రింద వివరము చూస్తాము. 'యజ్ఞ' మనగా 'కాల్చుట' అని అర్థము. ఒక యజ్ఞము జరుగవలయునంటే కాల్చబడుటకు పదార్థములు కావాలి. కాల్చుటకు అగ్ని కావాలి. ఆ వస్తువులను అగ్నిలో కాల్చుటకు ఒక మనిషి కావాలి. ఇది అందరికి తెలిసిన విషయమే. ఎక్కడ యజ్ఞము జరిగిన గుండములో అగ్ని ఉంటుంది. అందులోనికి వేసే సమిధలు చిన్న పుల్లలు మొదలుకొని గొప్ప ఔషధములు, పట్టుచీరలు, బంగారు, నెయ్యి మొదలగునవి ఎన్నో ఉండును. యజ్ఞములను నెరవేర్చు ఋత్త్విక్కులు ఉండుట సహజమే. బయట జరుగు ఈ యజ్ఞములు ధర్మయుక్తమైనవా, అధర్మయుక్తమైనవా అని యోచిస్తే, గీతలో భగవంతుడు చెప్పినవే ధర్మయుక్తములు. మానవులచే కల్పించబడిన యజ్ఞములు అధర్మయుక్తమైనవని తెలియుచున్నది. ఇక్కడొక ప్రశ్నరావచ్చును. అగ్నిలో ద్రవ్యములు వేసి మంత్రయుక్తముగ కాల్చడము, దేవుడు చెప్పిన రెండు యజ్ఞములలో ద్రవ్యయజ్ఞము కాదా అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! 7వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగమున 4వ శ్లోకములో, శరీరములోపల జరుగు యజ్ఞములకు నేనే అధిపతిగ ఉన్నానని చెప్పడమైనది. దీని ప్రకారము యజ్ఞములు బయట జరుగునవి కావు. శరీరములోనే జరుగుచున్నవని తెలియుచున్నది. అలాంటపుడు బయట జరుగు యజ్ఞములు అధర్మమైనవని, భగవంతుడు చెప్పినవి ధర్మయుక్తమైనవని తెలియుచున్నది. కనుక ఆయన చెప్పిన రెండు యజ్ఞములను బాగా వివరముగా తెలుసుకోవాలి.
పై శ్లోకములో చెప్పిన ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞము అనబడు రెండిటిలో జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనదన్నారు. ద్రవ్యయజ్ఞము ఎందుకు శ్రేష్ఠముకానిదని యోచిస్తే, ద్రవ్యయజ్ఞము ప్రకృతి సంబంధమైనది. పరమాత్మను పొందుటకు ఈ యజ్ఞము పనికిరాదు. ప్రకృతికి సంబంధించిన ద్రవ్యములు ఈ యజ్ఞములో కాలిపోవును. ద్రవ్యయజ్ఞములో జన్మకు కారణమైన కర్మలు అభివృద్ధి అగును. భగవంతుడు తెల్పిన యజ్ఞముల గురించి మనకు తెలిసిన తెలియకపోయిన, ప్రతి ఒక్కరు ప్రతిదినము యజ్ఞము చేయుచున్నారు. 'తెలిసిన జ్ఞానులు చేయవచ్చునేమో, ఏమి తెలియని మేము యజ్ఞము చేయడమేమిటి' అని ఆశ్చర్యపోనవసరము లేదు. వాస్తవముగ ప్రతి ఒక్కరు దినమునకు రెండు లేక మూడుమార్లు యజ్ఞము చేయుచునే ఉన్నారు. దానిపేరే ద్రవ్యయజ్ఞము.
యజ్ఞములు దేహములో జరుగుచున్నవను సూత్రము ప్రకారము, మన శరీరములో భగవంతుడు తెల్పిన ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞము రెండు జరుగు చున్నవి. అందరు చేయగలిగినది, ప్రస్తుతము చేస్తున్నది ద్రవ్యయజ్ఞము. సర్వ జీవరాసుల శరీరములోని జీర్ణాశయములో జఠరాగ్నిచేత మనము తినిన ఆహార ద్రవ్యములన్ని జీర్ణము చేయబడుచున్నవి. జఠరాగ్నిలో నోటిద్వారా లోపలికి వేయు పదార్థములన్ని కాలిపోవుచున్నవి. జీర్ణాశయమను యజ్ఞగుండమున జఠరాగ్ని యొక్క మంటలలో అనేక రకముల ఆహారపదార్థములు కాలిపోవు జీర్ణప్రక్రియను ద్రవ్యయజ్ఞము అన్నారు. ఈ ద్రవ్యయజ్ఞము ప్రతిదినము మన శరీరములో జరుగుచున్నదని ఒప్పుకోక తప్పదు. దినమునకు రెండు లేక మూడు పర్యాయములు ఈ అగ్నిగుండములోనికి ఆహారపదార్థములను వేయుచున్నాము. అట్లు వేయని పక్షములో కాని, కొద్ది ఆలస్యమైన కాని, ఆ అగ్ని ప్రకోపించి జీర్ణాశయగోడలను వేడి పుట్టించుట వలన ఆకలియని, కడుపులో మంటలేసినదని అంటుంటాము. కడుపులో మంటలేసినదని మన నోట వచ్చు మాటలో ఎంతో సత్యమున్నది. ఆ మాట నోటివెంట వచ్చుచున్నప్పటికి, ఈ మంట ఏ అగ్నిదని ఆలోచింపకపోయిన దానివలన, అక్కడ జరుగు యజ్ఞము కూడ తెలియకుండపోయినది. ఈ యజ్ఞములో ఉన్న అగ్ని జఠరాగ్నియని, కాల్చబడునవి ద్రవ్యములని, యజ్ఞము చేయించువాడు జీవుడని, అగ్నిగ ఉండి కాల్చివేయువాడు ఆత్మయని తెలియుచున్నది. దీనిని గురించి పురుషోత్తమ ప్రాప్తియోగమున 14వ శ్లోకములో 'అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః ప్రాణా ప్రాణ సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్' అన్ని దేహములలో జీర్ణాశయమున అగ్ని స్వరూపుడుగా ఉండి వారు తినిన నాలుగు విధముల పదార్థములను నాశనము(జీర్ణము) చేయుచున్నానని భగవంతుడు తెల్పివున్నాడు.
సైన్సు ప్రకారము శరీరములోని జీర్ణాశయములో మూడు రసములు ఇతర గ్రంథులనుండి వచ్చి కలియుచుండును. ఈ మూడు రసములలోని రసాయనిక కలయికలో అగ్నితత్త్వమేర్పడుచున్నది. ఈ అగ్ని తత్త్వమునకు ఏ పదార్థమునైన భస్మీపటలము చేయు శక్తి కలదు. ఈ అగ్ని ప్రకృతి జనిత శరీరములోని గ్రంథులలో పుట్టినది. ఈ గ్రంథులను, వాటిరసమును అందులో ఏర్పడుశక్తిని దాని ప్రక్రియ అయిన ద్రవ్యయజ్ఞము ప్రత్యక్షముగ కనిపించకున్నను అందరి శరీరములో జరుగుచున్నది. జీర్ణాశయములో జరుగు ఈ యజ్ఞమునకు నిత్యము వస్తువులు అవసరము. ఉప్పు, చింతపండు, మిరపకాయలు, కందిబేడలు(పప్పు), జిలకర్ర, ఆవాలు, కరివేపాకు మొదలగు వస్తువులన్ని అవసరము. ఆ వస్తువులు కావాలంటే డబ్బుకావలెను. డబ్బు కావాలంటే పనులు చేయాలి. పనులు చేయుట వలన క్రొత్త కర్మ వస్తుంది. దానిని అనుభవించుటకు పుట్టాలి. పుట్టినవాడు తిరిగి క్రొత్త కర్మ తెచ్చుకొనుట దానిని అనుభవించుటకు పుట్టుట చూస్తే ఇదొక చక్రములాగా తయారైనది. ఈ చావు పుట్టుకల చక్రములో ఎన్నో యుగముల నుండి చిక్కుకొన్న జీవుడు బయటపడాలంటే ఒక్కటే మార్గమున్నది. అదే జ్ఞానయజ్ఞము. ద్రవ్యయజ్ఞము ద్వార జీవుడు కర్మచక్రములో ఇరుక్కుంటే, దానినుండి తప్పించగల స్థోమతగలది జ్ఞానయజ్ఞము. అందువలననే ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనదని భగవంతుడు చెప్పాడు.
జ్ఞానయజ్ఞము అందరు చేయలేరు. దానిని చేయువారు కర్మయోగులు, బ్రహ్మయోగులు మాత్రమే. రెండు రకముల యోగుల శరీరములో జరుగు జ్ఞానయజ్ఞము వారి తలయందు జరుగుచున్నది. ద్రవ్యయజ్ఞ స్థానము జీర్ణాశయము కాగ, జ్ఞానయజ్ఞ వేదిక శరీరములోని శిరస్సని తెలియాలి. యోగుల శిరస్సులో జ్ఞానాగ్ని ఉండునని ఇంతకు మందే తెలుసుకొన్నాము. జ్ఞానాగ్నిలో వారివారి కర్మలు కాలిపోవుచుండును. ఈ విధానమునకు 'జ్ఞానయజ్ఞము' అని గీతలో పేరు పెట్టబడినది. ద్రవ్యయజ్ఞములో సంపాదించుకొన్న కర్మలన్ని జ్ఞానయజ్ఞములో కాలిపోవును. కర్మలు కాలిపోవుట వలన జీవునికి పుట్టుక లేకుండపోయి మోక్షము పొందును. 'జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్' అనుమాట ప్రకారము కర్మలన్ని నాశనమగు ఈ యజ్ఞమును జ్ఞానములేని మనుషులు చేయలేక పోవుచున్నారు. వారు ప్రతి దినము ద్రవ్యయజ్ఞము కొరకు కర్మలు సంపాదించుకొని వాటిని మోయుచున్నారు. వారి యజ్ఞము కొరకు మాత్రమే కర్మలు సంపాదించుకొనుటయే కాక, వారి వెనుక తరాలవారి యజ్ఞములకు కూడ ఇప్పుడే సంపాదించవలెనను కోర్కెలతో విపరీత పనులు చేసి, విపరీతముగ కర్మలు మూటకట్టుకొనుచున్నారు.
జ్ఞానము తెలిసినవారు జ్ఞానయజ్ఞము చేసి వారి కర్మలు బాపుకోవలసి ఉండగ, కొందరు జ్ఞానులు కూడ ప్రకృతి మాయలోపడి శరీరయజ్ఞమేదో తెలియక, బాహ్యయజ్ఞములు చేయుచు స్వాములని పేరు తెచ్చుకొని, ప్రజలను కూడ బాహ్యయజ్ఞముల వైపే మళ్లించుట మరీ చోద్యము. జ్ఞాన విషయములో ఎంత పెద్దవారు చెప్పినప్పటికి, గ్రుడ్డిగ నమ్మక శాస్త్రబద్దముగ యోచన చేసి సరియైన దారి ఎంచుకొన్నపుడే, భగవంతుడు చెప్పిన విషయములు అర్థము కాగలవు. కర్మలు లేకుండచేసి మోక్షము పొందింపజేయు జ్ఞానయజ్ఞమును గూర్చి తెలియాలన్న, దానిని ఆచరించి చేయాలనిన, తప్పనిసరిగ జ్ఞానయజ్ఞము తెలిసిన గురువులు అవసరము.
ఇంత విన్న తర్వాత కొందరికి కొంత సంశయము వచ్చి ఈ విధముగ "ద్రవ్యయజ్ఞమనగా! ద్రవ్యములను కాల్చివేయు కార్యము అను అర్థము ప్రకారము జ్ఞానయజ్ఞమనగా! జ్ఞానమును కాల్చివేయు కార్యమని భావము రాగలదు కదా! యజ్ఞమనగా లేకుండా చేయుట అనినపుడు, జ్ఞానయజ్ఞము యొక్క కార్యములో జ్ఞానమును లేకుండ చేయడమే ముఖ్యకార్యమగును కదా! జ్ఞానమును సంపాదించుకొమ్మని చెప్పిన మీరే జ్ఞానమును లేకుండ చేసుకొమ్మని చెప్పడము మంచిదా" అని కొందరడుగ వచ్చును. దానికి మా జవాబేమనగా! ద్రవ్యయజ్ఞమనగా ద్రవ్యములను కాల్చివేయడమన్నది వాస్తవమే. అలాగే జ్ఞానయజ్ఞమనగా జ్ఞానములను కాల్చివేయడము వాస్తవమే. ఇక్కడ జ్ఞానము అనగానే ఏ జ్ఞానము అని యోచించవలసిన అవసరమున్నది. జ్ఞానము రెండురకములుగ కలదు. ఒకటి ప్రపంచ జ్ఞానము, రెండు పరమాత్మ జ్ఞానము. ఇక్కడ కాల్చివేయమన్నది ప్రపంచ జ్ఞానమును, కాని పరమాత్మ జ్ఞానమును కాదని గుర్తించుకోవాలి. ప్రపంచ జ్ఞానము ఐదు రకములుగ కలదు. పంచ జ్ఞానేంద్రియముల ద్వార లోపలి మనస్సుకు అందించబడు ఐదు విషయ జ్ఞానములను ప్రపంచజ్ఞానము అంటున్నాము. కన్ను ద్వార కనిపించు దృశ్యము యొక్క విషయమునంతటిని దృశ్యజ్ఞానము అంటాము. అదే విధముగ శబ్ద విషయమును, రుచి విషయమును, వాసన విషయమును, స్పర్శ విషయమును ప్రపంచ జ్ఞానములు అనుచున్నాము. ఈ విషయములను లోపలికి తెలియజేయు కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మములను జ్ఞానేంద్రియములు అంటున్నాము. ఇవి ఐదు ప్రపంచ జ్ఞానేంద్రియములు మాత్రమే, శరీరమునకున్న ఐదు జ్ఞానేంద్రియముల ద్వార వచ్చు విషయ జ్ఞానము వలననే పాపపుణ్య కర్మలు వస్తున్నవి. ఐదు జ్ఞానేంద్రియముల ద్వార సంభవించు పాపపుణ్యములను అంటకుండ చేసుకోవడమును జ్ఞానయజ్ఞము అన్నారు. ద్రవ్యయజ్ఞములో నాలుగు ద్రవ్యములు కాల్చి వేయబడుచుండగ, జ్ఞానయజ్ఞములో ఐదు జ్ఞానములు కాల్చివేయబడుచున్నవి. 1) పిండిపదార్థములు, 2) కొవ్వుపదార్థములు, 3) ఖనిజలవణములు 4) మాంసకృతులు అనబడు నాలుగు ద్రవ్యములు జఠరాగ్నిలో కాలిపోవడమును ద్రవ్యయజ్ఞము కాగ, శబ్ద, రూప, రస, గంధ, స్పర్శ అను ఐదు జ్ఞానములు దైవజ్ఞానమను అగ్నిలో కాలిపోవడము జ్ఞానయజ్ఞము అవుచున్నది. దీనిని బట్టి నాలుగు ఆహార ద్రవ్యములను కాల్చివేయునది ద్రవ్యయజ్ఞము, ఐదు ప్రపంచ జ్ఞానములను కాల్చివేయునది జ్ఞానయజ్ఞము అని తెలియుచున్నది. ద్రవ్యయజ్ఞమునకు జ్ఞానయజ్ఞమునకు గల తేడాను తర్వాత పేజీలో గమనిస్తాము.
ద్రవ్య యజ్ఞము---జ్ఞాన యజ్ఞము
1) ద్రవ్యయజ్ఞము కడుపులో జరుగును.(1) జ్ఞాన యజ్ఞము తలలో జరుగును.
2) దీనిలో అనేక రకములైన ఆహార పదార్థములు కాలిపోవును.(2) దీనిలో అనేక రకములైన పాప పుణ్యములు కాలిపోవును.
3) దీనిని అందరు ఆచరింతురు.(3) దీనిని యోగులు మాత్రమే ఆచరింతురు.
4) ప్రతి దినము విధిగ తప్పనిసరిగ చేయవలసి ఉండును.(4) జ్ఞానయజ్ఞము విధిగ జరుగునది కాదు. ప్రయత్నము చేస్తే జరుగును
5) దీనిలో పాపపుణ్యములు వచ్చును.(5) దీనిలో పాపపుణ్యములు పోవును.
6) ఇది బయటికి కనిపించునది.(6) ఇది బయటికి కనిపించదు.
7) దీనిలో ఉన్న అగ్ని జఠరరసములచే ఉత్పత్తియగు జఠరాగ్ని.(7) దీనిలో ఉన్న అగ్ని జ్ఞానముచే ఉత్పత్తియగు జ్ఞానాగ్ని.
8) దీని అగ్ని గ్రంథి రసములతో పుట్టును.(8) దీని అగ్ని గురూపదేశముతో పుట్టును.
9) ద్రవ్యయజ్ఞము ఆత్మకు ఉపయోగపడుచున్నది.(9) జ్ఞానయజ్ఞము జీవాత్మకు ఉపయోగపడుచున్నది.
10) దీనిలో నాలుగు పోషకములు ఆహుతి అగుచున్నవి.(10) దీనిలో ఐదు జ్ఞానములు ఆహుతి అగుచున్నవి.
శ్లోకం 34: తద్ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయవిధేయతలతో నమస్కరించి సేవలు చేయుచు, సమయానుకూలముగ ప్రశ్నలడిగిన వారు జ్ఞానమును ఉపదేశించి, కర్మలు నశించిపోవు జ్ఞానమార్గమును చూపగలరు.
వివరము : ఎక్కడ పొరపడిన ఫరవాలేదు, కాని గురువును ఎన్నుకొనుటలో పొరపడ కూడదు. జీవితమంత వారిని బట్టి నీవు నడచుకొను విధానముండును. కనుక ఈ శ్లోకములో భగవంతుడు స్వయంగా తానే జోక్యము చేసుకొని గురువుల విషయము చెప్పాడు. శ్లోకములో ఆయన మొదటి మాట 'తద్ద్విద్ధి' అన్నాడు. దానికి తత్త్వమును తెలిసినవారని అర్థము. తత్త్వము అనగా శరీరములోని రెండవ ఆత్మ. ఆత్మను తెలిసినవారు మాత్రమే గురువులని ఈమాటలోని అంతరార్థము. గురువులు జన్మరాహిత్యమును కలుగజేయువారుగ ఉండాలి. జన్మలు లేకుండా పోవాలంటే కర్మలు లేకుండాపోవాలి. కర్మలు లేకుండ పోవాలంటే అవి కాలిపోవాలి. అవి కాలిపోవాలంటే శరీర అంతర్ముఖయజ్ఞము చేయాలి. శరీరములోపలి యజ్ఞము చేయాలంటే వాటి వివరము చెప్పువారుండాలి. యజ్ఞముల గురించి చెప్పువారు యజ్ఞముల విషయము పూర్తి తెలిసినవారై ఉండాలి. అట్లు తెలిసినవారు దొరకాలంటే వారి కోసము వెతకాలి. వెతకడములో దొరికిన, వారు తెలిసిన వారో కాదో తెలియాలంటే మనకూ అంతో ఇంతో జ్ఞానముండాలి.
గురువులేనిది జ్ఞానము ఎలా వస్తుందనుకోవలసిన పనిలేదు. పుస్తకము ద్వార లేక తనలో తాను ఆలోచించడము వలన, గురువును గుర్తించుటకు కావలసిన జ్ఞానము లభించగలదు. ముఖ్యముగ తెలియవలసినదేమనగా గురువు లేకపోయిన జ్ఞానము లభిస్తుంది, కాని గురువు లేనిది మోక్షమురాదు. కర్మలనాశనము చేయు విధానము గురువుల ద్వారానే తెలియాలి. కర్మలు పోనిది మోక్షమురాదు, కనుక గురువు తప్పనిసరిగా అవసరము. గురువుల విషయములో తప్పనిసరిగ అందరు ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి అనుకోకూడదు. నీ సంశయములు ఎక్కడ తీరునో అక్కడే గురువున్నాడని తెలియాలి. నీకు ఆలోచనలు రాలేదనుకో, మేము అడుగు ప్రశ్నలకు జవాబున్నదో లేదో చూచుకో.
నీకు గురువు ఉన్నాడా? ఉంటే ప్రకృతితో నిండిన బోధనా? లేక పరమాత్మకు సంబంధించిన బోధ చేయుచున్నాడా! ఏది? కర్మలు కలుగజేయు యజ్ఞము యొక్క పనులు చెప్పాడా? కర్మలు తొలగిపోవు జ్ఞానయజ్ఞము గురించిన పనులు చెప్పాడా? ఇవి బోధ గురించిన ప్రశ్నలు, ఇక ఉపదేశమును గురించిన ప్రశ్నలు. ఏమనగా! ఉపదేశమును పొందావా! లేదా? ఆ ఉపదేశము ప్రకృతి సంబంధ దృశ్యమా, శబ్దమా? ఇట్లు అనేక ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబు దొరికినపుడు పరవాలేదు. జవాబు దొరకకపోతే దొరికేంతవరకు గురువుకోసము అన్వేషణ చేయాలి.
'ఉపదేక్ష్యన్తితే జ్ఞానం' అన్న వాక్యమును బట్టి గురువులు ఏమి ఉపదేశము చేస్తారో తెలుసుకొందాము. ఉపదేశము ప్రకృతి సంబంధము కాకుండా ఉండాలి. కర్మలు కాల్చుకొనుటకు అనుకూలముగ ఉండాలి. ప్రక్క ఇంటిలో పొయ్యి ఉంది. అందులో అగ్నివుంది. కట్టెలు కాలుట వలన ఏర్పడిన అగ్నిచే ప్రక్కింటివారు వంటచేసుకొని తిని రుచి అనుభవించి ఆకలి తీర్చుకొంటున్నారు. మనము ఆ పని చేయాలి. వంట పాత్రలు, వంట సామాగ్రి అన్నీ సమకూర్చుకున్నాము. పొయ్యి కూడ ఉన్నది. వంట తయారగుటకు లేనిది అగ్నియే. ఆ అగ్నిని ప్రక్కింటివానిని అడిగి, వాడు దానము చేసిన నిప్పురవ్వను మన పొయ్యిలో వేసి, కొద్దిసేపు ఊదితే మన పొయ్యిలోని కట్టెలు అంటుకొంటాయి. కట్టెలు కాలిపోతాయి. ఫలితము వంట తయారై ఆకలి తీరుతుంది. ఈ విధముగనే జన్మబంధమను ఆకలి పోవాలంటే, శరీరమను పొయ్యిలో కర్మలను కట్టెలను, జ్ఞానాగ్ని అను అగ్నితో రగిల్చినపుడు, దాని ఫలితముగ మోక్షము అను వంట తయారగును. మనవద్ద శరీరమను పొయ్యి, కర్మలను కట్టెలు, సాధన అను సామాగ్రి ఉన్నప్పటికి గురువుల శరీరములో ఉన్న జ్ఞానాగ్ని రవ్వంత వారి నుండి ఇప్పించుకోవాలి. మొదట గురువు దగ్గరినుండి కొంత నిప్పును పొంది, దాని ద్వార ప్రయత్న పూర్వకముగ అనగ యోగసాధన ద్వార కర్మలను కాల్చాలి. మొదట గురువు దగ్గరి నుండి అగ్నిని పొందడమే ఉపదేశమందురు. జ్ఞానాగ్ని హస్తము ద్వార, పాదము ద్వార, చూపు ద్వార గురువుల నుండి బయటికి వస్తుందని తెలుసుకొన్నాము. అందువలన గడిచిన కాలములో ఏసుప్రభువుకు ఆయన గురువు యోహాను తన హస్తము ద్వార జ్ఞానాగ్నిని దానము చేసినట్లు ఉన్నది. అలాగే వేమన తన గురువు ద్వారా హస్తము చేతనే జ్ఞానాగ్నిని పొందాడు. ఇంకనూ ఎందరో గురువులు వారి పాదమును శిష్యుని శిరస్సున ఉంచి జ్ఞానాగ్నిని దానము చేశారు. ఇట్లు ఉపదేశము యొక్క తార్కాణములు గలవు. ఈ ఉపదేశములన్ని ప్రకృతి సంబంధమైనవి కావు. ఈ శ్లోకమందే గురువువద్ద శిష్యుడు ఎలా మెలగవలెనను విషయము కూడ చెప్పారు. విధేయతతో నమస్కరించుట, సమయోచితముగ ప్రశ్నలడుగుట, సేవలు చేయుట మొదలగునవి కల్గియుండవలెనన్నారు. మనస్ఫూర్తిగ సేవలు చేసి సద్భక్తితో ప్రశ్నలడుగు వారికే ఫలితముండును. గీతలో భగవంతుడు చెప్పినట్లు నడుచుకొనుచుండిన నిజగురువే దొరకగలడు.
శ్లోకం 37: యథైధాంసి సమిద్ధో ఽగ్ని ర్భస్మసాత్కురుతే ఽ ర్జున |
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : ఏ విధముగ అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదేవిధముగ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి.
వివరము : ఈ విషయము ముందే చెప్పుకొన్నాము. 'జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం' అని 19వ శ్లోకములో జ్ఞానాగ్నిని గురించి చెప్పినపుడు, నమ్మలేనివారెవరైన ఇక్కడ పూర్తిగ నమ్మవలసి ఉన్నది. నిజముగ జ్ఞానాగ్ని ఉన్నదని దానికి ఉదాహరణ కూడ ఇవ్వడము జరిగినది. సర్వ కర్మనాశనము చేయు జ్ఞానాగ్నిలేనివాడు యోగికాదు అని, ముందు ఆత్మసంయమయోగములో మొదటి శ్లోకములో చెప్పబడినది. లోకము దృష్ఠిలో నేను గీతను వ్రాసిన స్వామిగ, పెద్ద జ్ఞానిగ, గొప్ప మర్యాదతో ఉన్నప్పటికి నాలోపల జ్ఞానాగ్నిలేనిది ఏమి ప్రయోజనములేదు. దైవ దృష్ఠిలో గాని, ఆధ్యాత్మిక విద్య ప్రకారము గాని, నేను యోగిననుటకు వీలులేదు. ఎవరికైనను ఈ సూత్రమే వర్తించును.
శ్లోకం 38: న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే |
తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి ||
(కర్మయోగము)
భావము : జ్ఞానమునకు ప్రపంచములో సాటియైనదేది లేదు. దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగమాచరించెడు కర్మయోగి కాలము జరుగుకొలది మోక్షమునకు దగ్గరవాడగును.
వివరము : జ్ఞానాగ్నికి సమానమైనదేదీ ప్రపంచమున లేదు. ఈ అగ్ని కంటే పవిత్రమైనది లేదు. కర్మయోగికి కాలము జరుగుకొలది కర్మలు కాలిపోవుచుండును. కర్మయోగిలో ఉన్న అగ్ని కర్మను కాలుస్తూ చివరికి లేకుండజేయును. అప్పుడు ఆ యోగి మోక్షము పొందును.
శ్లోకం 39: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః |
జ్ఞానం లభ్ధ్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి ||
(బ్రహ్మయోగము)
భావము : శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కల్గిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు.
వివరము : దైవమును తెలియాలను శ్రద్ధ గలవాడు, ఒక్కటే ధ్యాస కల్గి, ఇంద్రియములను నిగ్రహించు జ్ఞానము కలవానికి జ్ఞానాగ్ని కలుగును. జ్ఞానాగ్ని కల్గిన కొంతకాలమునకు కర్మలు పూర్తిగ కాలిపోవును. కనుక అతడు తొందరగ మోక్షము పొందగలడు. ఇంద్రియములు నిగ్రహించి వాటి పని లేకుండ చేయడము బ్రహ్మయోగమునకే ఉండును.
శ్లోకం 40: అజ్ఞ శ్చాశ్రద్ధా ధాన శ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకో ఽ స్తినపరో నసుఖం సంశయాత్మనః ||
(జీవాత్మ)
భావము : సంశయాత్ముడై, శ్రద్ధలేనివాడై, జ్ఞానశూన్యుడైన జనుడు తప్పక చెడును. సంశయాత్మునకు ఇహ పరములలో ఎక్కడైన సుఖము లేదు.
వివరము : ఈ శ్లోకములో సంశయాత్ముని గురించే ఎక్కువగా చెప్పారు. సంశయములుండి వాటి పరిష్కారము తెలుసుకోలేని వానికి ఇహపరములలో సుఖముండదన్నారు. మానవునికి కొన్ని విషయములలో సంశయములు వచ్చుట సహజమే. ఎటువంటి సంశయమునైన కొంత యోచిస్తే పరిష్కారమార్గము లభిస్తుంది. అలా యోచించక ఈ విషయము ఇంతే అని గోడకట్టుకొని కూర్చున్న వానికి ఎప్పటికి సత్యము తెలియదు. ఒక విషయమును పూర్తి పరిశీలించకనే, ఆ విషయము మీద ముందే ఒక నిర్ణయము కల్గియుండి, ఆ విషయము యొక్క సత్యమును గ్రహించక, తనకు ముందునుండి ఉన్న నిర్ణయమే సరియైనదనుకొని, తమ నిర్ణయమే సత్యమైనదను భ్రమలో పడినవారు కొందరున్నారు. అటువంటివారు అసత్యములో ఉండి సత్యములో ఉన్నామనుకొంటుంటారు. ఉదాహరణకు దయ్యము అన్నది వాస్తవమే అయిన ఆ మాటవింటూనే ఇందులో సత్యమెంత ఉందో పరిశీలిస్తామనుకోక దయ్యమనునది అసత్యమంటారు. దయ్యము యొక్క బాధను అనుభవించువానిని చూచి అదొక రోగమంటారు. ఏ మందులతో నయము కాకపోతే వాని మానసిక పరిస్థితి అటువంటిది అంటారు. ఈ విధముగ ముందే తమ లోపల ఉన్న నిర్ణయమును సమర్థించుకొనుచుందురే కాని సత్యమును తెలియలేరు. అటువంటి అసత్యవాదులు తాము నిజముగ సత్యవాదులము అనుకొంటుంటారు. అటువంటి వారికి ఇహములో ఎప్పుడైన దయ్యముల బాధ కలిగితే దానినుండి బయటపడలేరు. అంతేకాక అటువంటి వాదులు తర్వాత జన్మలలో అదోగతిపాలగుదురని, అటువంటి వారికి తర్వాత జన్మలలో ఇహములో సుఖముగాని, పరములో మోక్షముగాని లభించదని తెలియజేశాడు.
శ్లోకం 41: యోగ సన్న్యస్త కర్మాణం జ్ఞాన సంచ్ఛిన్న సంశయం |
ఆత్మ వన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : జ్ఞాన వివరముచే సంశయములు లేకుండ పోయిన వానికి, యోగ పద్ధతుల ద్వారా కర్మలను కాల్చివేయువానికి, మనస్సును ఆత్మను తెలియువానికి కర్మలు బంధములు కావు.
శ్లోకం 42: తస్మా దజ్ఞాన సంభూతం హృత్ స్థం జ్ఞానాసినాఽఽత్మనః |
చిత్త్వైనం సంశయం యోగ మాతిష్ఠో త్తిష్ఠ భారత! ||
(కర్మయోగము)
భావము : అజ్ఞానము వలన నీ హృదయములో నెలకొన్న సంశయమును జ్ఞాన ఖడ్గముచే నరికివేసి కర్మయోగమాచరించపూనుకొనుము.
వివరము : మొదట అర్జునునికి ఏమి సంశయమొచ్చినదో జ్ఞప్తికి ఉన్నదా! యుద్ధము చేయుట వలన, ఎంతో మందిని చంపుటవలన పాపమొచ్చును కదా! పాపమొచ్చు పనిచేయ వచ్చునా? అను సంశయమేర్పడి యుద్ధము చేయనని కూర్చున్నాడు. ఇపుడు ఇంతవరకు తెల్పిన కర్మయోగ సంబంధ జ్ఞానముచే యుద్ధము వలన పాపమొచ్చునను అనుమానము పోగొట్టుకొనవచ్చును. చేయుచున్న ఏ పనియైన దానివలన సంభవించెడుకర్మను కాలిపోవునట్లు చేయునది కర్మయోగము. ఈ విషయము ఎంతో వివరముగ విన్న అర్జునుని సంశయము పటాపంచలై పోగలదు. అందువలన శ్రీకృష్ణుడు ఈ జ్ఞానముతో నీ సంశయమును త్రుంచి వేయమన్నాడు.
----------------------------------------------------------------------------------------------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత:☜ జ్ఞాన యోగము
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 1: ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే ఽబ్రవీత్ ||
(కర్మ యోగము, బ్రహ్మ యోగము)
భావము :ఇది అవ్యయమైన జ్ఞానము. మొదట దీనిని సూర్యునికి చెప్పియుంటిని. సూర్యుడు మనువుకు చెప్పెను. తర్వాత మనువు ఇక్ష్వాకుడను రాజుకు చెప్పెను.
శ్లోకం 2: ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః |
సకాలే నేహ మహతా యోగో నష్టః పరన్తప! ||
(కర్మ యోగము, బ్రహ్మ యోగము)
భావము : ఒకరినుండి ఒకరికి పరంపరగ తెలుస్తుపోయి రాజులు, ఋషులు తెలుసుకొనిరి. ఎంతో కాలము ఈ విధముగ జరుగగ, చివరకు యోగముల జ్ఞానము తెలియకుండపోయినది.
శ్లోకం 3: స ఏవాయం మయా తే ఽ ద్య యోగః ప్రోక్తః పురాతనః |
భక్తో ఽసి మే సఖా చేతి రహస్యం హ్యేత దుత్తమమ్ ||
(కర్మ యోగము, బ్రహ్మ యోగము)
భావము : ఉత్తమమైనది, చాలా రహస్యమైనది, పురాతనమైనది అయిన యోగ విద్యను ఇపుడు నీవు నాకు భక్తుడవు, ప్రియుడవు కావున చెప్పుచున్నాను.
అర్జునుడిట్లనియె :
శ్లోకం 4: అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః |
కథ మేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : ఆదిలో సూర్యునికి జన్మకలిగెను. నీ జన్మ ఇపుడు ఈ కాలములో కల్గినది. ఇపుడున్న నీవు పూర్వము సూర్యునికెలా చెప్పితివి. నమ్ముటెట్లు?
శ్రీ భగవంతుడిట్లనియె :
శ్లోకం 5: బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప! ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : నాకు ఎన్నో జన్మలు కల్గినవి, నీకు కూడ ఎన్నో జన్మలు కల్గినవి. అవి అన్నియు వరుసగ నాకు తెలియును. నీకు మాత్రము ఏవీ తెలియవు.
శ్లోకం 6: అజో ఽపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో ఽ పిసన్ |
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా ||
(నిరాకారము, సాకారము)
భావము : నాకు పుట్టుకలేదు, నాశనము లేదు. నేను సర్వజీవరాసులకు అధిపతినై ఉన్నాను. అయినప్పటికి నాచేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుందును.
శ్లోకం 7: యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! |
అభ్యుత్థానమధర్మస్య తదా ఽ ఽత్మానం సృజామ్యహమ్ ||
(నిరాకారము, సాకారము)
భావము : ఎపుడెపుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మము వృద్ధిచెందుచున్నదో, అపుడు నన్ను నేను తయారుచేసుకొని భూమిమీద పుట్టుచున్నాను.
శ్లోకం 8: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతామ్ |
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ||
(సాకారము)
భావము : ధర్మాచరణ కల్గిన వారిని సంరక్షించుటకు, అధర్మ ఆచరణ కల్గిన వారిని లేకుండచేయుటకు, ధర్మసంస్థాపన మొనర్చుటకు యుగ యుగమందు పుట్టుచుందును.
శ్లోకం 9: జన్మ కర్మచ మే దివ్య మేవం యో వేత్తి తత్త్వతః |
త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో ఽర్జున! ||
(సాకారము, నిరాకారము)
భావము : నా దివ్యమైన పనులను జన్మను తెలుసుకొన్నవాడు మరణించిన తర్వాత, వేరు జన్మమునకు పోక నాలోనికి ఐక్యమగును.
శ్లోకం 10: వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః |
బహవో జ్ఞాన తపసా పూత మద్భావ మాగతాః ||
(సాకారము)
భావము : భయము, ప్రేమ, కోపము విడిచి నామీద ధ్యాసకలవారై నన్ను ఉపాసించువారు ఎందరో జ్ఞాన తపనచే పవిత్రులై నాస్వరూపమును పొందిరి.
శ్లోకం 11: యే యథామాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహం |
మమ వర్త్మాను వర్తన్తే మనుష్యాః పార్థ! సర్వశః ||
(సాకారము, నిరాకారము)
భావము : ఎవరు నన్ను ఏ విధముగా భావించి పూజించుచున్నారో, అట్లే వారు నా అనుగ్రహము పొందుచుందురు. మనుజులు ఎన్నో రకములుగ నన్నారాధించు చున్నారు.
శ్లోకం 12: కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః |
క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||
(ప్రకృతి)
భావము : కర్మఫలములందు ఆశగలవారు దేవతా పూజచేతురు. జగతిలో కామ్య కర్మఫలములు వేగముగ సిద్ధించును.
శ్లోకం 13: చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మవిభాగశః |
తస్యకర్తార మపి మాం విద్ధ్యకర్తార మవ్యయమ్ ||
(పరమాత్మ)
భావము : కర్మ, గుణ విభాగములను బట్టి నాల్గు వర్ణములు నాచేత సృష్ఠింపబడినవి. వాటి కర్తనైనను కాకుండ నాశనములేనివాడనై ఉన్నాను.
శ్లోకం 14: నమాం కర్మాణి లింపన్తి నమే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ||
(కర్మయోగము, సాకారము)
భావము : నాకు కర్మములంటవు. నాకు వాని ఫలములందు ధ్యాసలేదు. నేనిట్టివాడనని ఎవడెరుగునో, వానికి కర్మబంధనములు కలుగవు.
శ్లోకం 15: ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ||
(కర్మయోగము)
శ్లోకం 16: కిం కర్మకి మకర్మేతి కవయోఽ ప్యత్ర మోహితాః |
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే ఽశుభాత్ ||
(కర్మయోగము)
భావము : ఏది కర్మయో, ఏది కర్మకాదో అనుభవమున్న జ్ఞానులు కూడ తెలియక భ్రమపడుచున్నారు. అందరికి అర్థము కాని కర్మ రహస్యమును నీకు చెప్పెదను. దాని వలన మోక్షమును పొందగలవు.
శ్లోకం 17: కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ||
(ప్రకృతి, కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : కర్మను తెలుసుకోవాలి. అట్లే వికర్మను తెలుసుకోవాలి మరియు అకర్మను తెలుసుకోవాలి. ఈ కర్మ గతులు తెలుసుకోవడము చాలా కష్టము.
శ్లోకం 18: కర్మణ్య కర్మయః పశ్యే దకర్మణిచ కర్మయః |
సబుద్ధి మాన్మను ష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్ ||
(కర్మయోగము)
భావము : కర్మలను రాకుండ నిగ్రహించుట అకర్మ అనియు, కర్మములయందే అకర్మ కలదని తెలిసి, ఎవడు అన్ని కర్మలాచరించుచున్నాడో, వాడే జ్ఞానియని తెలిసిన పెద్దలందురు.
శ్లోకం 19: యస్య సర్వే సమారమ్భాః కామ సంకల్ప వర్జితాః |
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం త మాహుః పండితం బుధాః ||
(కర్మయోగము)
భావము : ఎవడైతే ఆశ అను గుణము లేకుండ సర్వ(మంచిచెడు) కార్యములు చేయునో, ఎవడైతే జ్ఞానాగ్నిచేత కర్మను కాల్చునో, వానిని బుధులు జ్ఞానపండితుడని అందురు.
శ్లోకం 20: త్యక్త్వా కర్మ ఫలా సంగమ్ నిత్యతృప్తో నిరాశ్రయః |
కర్మణ్యభి ప్రవృత్తోఽపినైవ కించిత్కరోతి సః || (కర్మయోగము)
శ్లోకం 21: నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ || (కర్మయోగము)
శ్లోకం 22: యదృచ్ఛా లాభ సంతు ష్టో ద్వంద్వాతీతోవిమత్సరః|
సమస్సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబద్ధ్యతే ||
(కర్మయోగము)
భావము : కర్మఫలము ఎడల ధ్యాసలేక, నిత్యతృప్తుడవై ఆశను నిగ్రహించుకొని సర్వ కార్యములను సదా చేయువాడు చేయని వానితో సమానము. ఆశ విడిచి, నియమిత చిత్తుడై, దేని మీద శ్రద్ధలేక కేవలము శరీర సంబంధముగ పనులు చేయవలెను. అట్లు చేయువానికి కర్మలంటవు. దొరికినట్టి లాభముతో తృప్తిపొంది, ద్వంద్వములు వీడి, మత్సరము లేని వాడై లాభనష్టములను సమానముగ ఎవడు చూచునో వానికి కర్మబంధములు కలుగవు.
శ్లోకం 23: గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః |
యజ్ఞా యాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ||
(కర్మయోగము)
భావము : సంగము లేనివాడై, ఫలాసక్తి లేక దైవమును చేరవలెనను కోర్కెగలవాడై, కర్మయజ్ఞము చేయువానికి వాని కర్మ అంతయు కాలి నాశనమగును.
3) శ్లో|| 24 -32:
(కల్పితము)
3) శ్లో|| 33: శ్రేయాన్ ద్రవ్యమయా ద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః పరంతప! |
సర్వం కర్మాఽఖిలం పార్థ!జ్ఞానే పరిసమాప్యతే ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. సర్వకర్మలు జ్ఞానయజ్ఞములో పరిసమాప్తమగును.
శ్లోకం 34: తద్ద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయవిధేయతలతో నమస్కరించి సేవలు చేయుచు, సమయానుకూలముగ ప్రశ్నలడిగిన వారు జ్ఞానమును ఉపదేశించి, కర్మలు నశించిపోవు జ్ఞానమార్గమును చూపగలరు.
శ్లోకం 37: యథైధాంసి సమిద్ధో ఽగ్ని ర్భస్మసాత్కురుతే ఽ ర్జున |
జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : ఏ విధముగ అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదేవిధముగ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి.
శ్లోకం 38: న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే |
తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి ||
(కర్మయోగము)
భావము : జ్ఞానమునకు ప్రపంచములో సాటియైనదేది లేదు. దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగమాచరించెడు కర్మయోగి కాలము జరుగుకొలది మోక్షమునకు దగ్గరవాడగును.
శ్లోకం 39: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః |
జ్ఞానం లభ్ధ్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి ||
(బ్రహ్మయోగము)
భావము : శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కల్గిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు.
శ్లోకం 40: అజ్ఞ శ్చాశ్రద్ధా ధాన శ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకో ఽ స్తినపరో నసుఖం సంశయాత్మనః ||
(జీవాత్మ)
భావము : సంశయాత్ముడై, శ్రద్ధలేనివాడై, జ్ఞానశూన్యుడైన జనుడు తప్పక చెడును. సంశయాత్మునకు ఇహ పరములలో ఎక్కడైన సుఖము లేదు.
శ్లోకం 41: యోగ సన్న్యస్త కర్మాణం జ్ఞాన సంచ్ఛిన్న సంశయం |
ఆత్మ వన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనంజయ ||
(కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : జ్ఞాన వివరముచే సంశయములు లేకుండ పోయిన వానికి, యోగ పద్ధతుల ద్వారా కర్మలను కాల్చివేయువానికి, మనస్సును ఆత్మను తెలియువానికి కర్మలు బంధములు కావు.
శ్లోకం 42: తస్మా దజ్ఞాన సంభూతం హృత్ స్థం జ్ఞానాసినాఽఽత్మనః |
చిత్త్వైనం సంశయం యోగ మాతిష్ఠో త్తిష్ఠ భారత! ||
(కర్మయోగము)
భావము : అజ్ఞానము వలన నీ హృదయములో నెలకొన్న సంశయమును జ్ఞాన ఖడ్గముచే నరికివేసి కర్మయోగమాచరించపూనుకొనుము.
--------------------------------------------------------------------------------------------------------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత:☜ జ్ఞాన యోగము.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 1:(కర్మ యోగము, బ్రహ్మ యోగము)
భావము :ఇది అవ్యయమైన జ్ఞానము. మొదట దీనిని సూర్యునికి చెప్పియుంటిని. సూర్యుడు మనువుకు చెప్పెను. తర్వాత మనువు ఇక్ష్వాకుడను రాజుకు చెప్పెను.
శ్లోకం 2: (కర్మ యోగము, బ్రహ్మ యోగము)
భావము : ఒకరినుండి ఒకరికి పరంపరగ తెలుస్తుపోయి రాజులు, ఋషులు తెలుసుకొనిరి. ఎంతో కాలము ఈ విధముగ జరుగగ, చివరకు యోగముల జ్ఞానము తెలియకుండపోయినది.
శ్లోకం 3: (కర్మ యోగము, బ్రహ్మ యోగము)
భావము : ఉత్తమమైనది, చాలా రహస్యమైనది, పురాతనమైనది అయిన యోగ విద్యను ఇపుడు నీవు నాకు భక్తుడవు, ప్రియుడవు కావున చెప్పుచున్నాను.
అర్జునుడిట్లనియె :
శ్లోకం 4 :(జీవాత్మ, పరమాత్మ)
భావము : ఆదిలో సూర్యునికి జన్మకలిగెను. నీ జన్మ ఇపుడు ఈ కాలములో కల్గినది. ఇపుడున్న నీవు పూర్వము సూర్యునికెలా చెప్పితివి. నమ్ముటెట్లు?
శ్రీ భగవంతుడిట్లనియె :
శ్లోకం 5:(జీవాత్మ, పరమాత్మ)
భావము : నాకు ఎన్నో జన్మలు కల్గినవి, నీకు కూడ ఎన్నో జన్మలు కల్గినవి. అవి అన్నియు వరుసగ నాకు తెలియును. నీకు మాత్రము ఏవీ తెలియవు.
శ్లోకం 6: (నిరాకారము, సాకారము)
భావము : నాకు పుట్టుకలేదు, నాశనము లేదు. నేను సర్వజీవరాసులకు అధిపతినై ఉన్నాను. అయినప్పటికి నాచేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుందును.
శ్లోకం 7: (నిరాకారము, సాకారము).
భావము : ఎపుడెపుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మము వృద్ధిచెందుచున్నదో, అపుడు నన్ను నేను తయారుచేసుకొని భూమిమీద పుట్టుచున్నాను.
శ్లోకం 8: (సాకారము)
భావము : ధర్మాచరణ కల్గిన వారిని సంరక్షించుటకు, అధర్మ ఆచరణ కల్గిన వారిని లేకుండచేయుటకు, ధర్మసంస్థాపన మొనర్చుటకు యుగ యుగమందు పుట్టుచుందును.
శ్లోకం 9: (సాకారము, నిరాకారము)
భావము : నా దివ్యమైన పనులను జన్మను తెలుసుకొన్నవాడు మరణించిన తర్వాత, వేరు జన్మమునకు పోక నాలోనికి ఐక్యమగును.
శ్లోకం 10: (సాకారము)
భావము : భయము, ప్రేమ, కోపము విడిచి నామీద ధ్యాసకలవారై నన్ను ఉపాసించువారు ఎందరో జ్ఞాన తపనచే పవిత్రులై నాస్వరూపమును పొందిరి.
శ్లోకం 11: (సాకారము, నిరాకారము)
భావము : ఎవరు నన్ను ఏ విధముగా భావించి పూజించుచున్నారో, అట్లే వారు నా అనుగ్రహము పొందుచుందురు. మనుజులు ఎన్నో రకములుగ నన్నారాధించు చున్నారు.
శ్లోకం 12: (ప్రకృతి)
భావము : కర్మఫలములందు ఆశగలవారు దేవతా పూజచేతురు. జగతిలో కామ్య కర్మఫలములు వేగముగ సిద్ధించును.
శ్లోకం 13: (పరమాత్మ)
భావము : కర్మ, గుణ విభాగములను బట్టి నాల్గు వర్ణములు నాచేత సృష్ఠింపబడినవి. వాటి కర్తనైనను కాకుండ నాశనములేనివాడనై ఉన్నాను.
శ్లోకం 14: (కర్మయోగము, సాకారము)
భావము : నాకు కర్మములంటవు. నాకు వాని ఫలములందు ధ్యాసలేదు. నేనిట్టివాడనని ఎవడెరుగునో, వానికి కర్మబంధనములు కలుగవు.
శ్లోకం 15: (కర్మయోగము)
శ్లోకం 16: (కర్మయోగము)
భావము : ఏది కర్మయో, ఏది కర్మకాదో అనుభవమున్న జ్ఞానులు కూడ తెలియక భ్రమపడుచున్నారు. అందరికి అర్థము కాని కర్మ రహస్యమును నీకు చెప్పెదను. దాని వలన మోక్షమును పొందగలవు.
శ్లోకం 17: (ప్రకృతి, కర్మయోగము, బ్రహ్మయోగము).
భావము : కర్మను తెలుసుకోవాలి. అట్లే వికర్మను తెలుసుకోవాలి మరియు అకర్మను తెలుసుకోవాలి. ఈ కర్మ గతులు తెలుసుకోవడము చాలా కష్టము.
శ్లోకం 18:(కర్మయోగము)
భావము : కర్మలను రాకుండ నిగ్రహించుట అకర్మ అనియు, కర్మములయందే అకర్మ కలదని తెలిసి, ఎవడు అన్ని కర్మలాచరించుచున్నాడో, వాడే జ్ఞానియని తెలిసిన పెద్దలందురు.
శ్లోకం 19: (కర్మయోగము)
భావము : ఎవడైతే ఆశ అను గుణము లేకుండ సర్వ(మంచిచెడు) కార్యములు చేయునో, ఎవడైతే జ్ఞానాగ్నిచేత కర్మను కాల్చునో, వానిని బుధులు జ్ఞానపండితుడని అందురు.
శ్లోకం 20 - 22: (కర్మయోగము)
భావము : కర్మఫలము ఎడల ధ్యాసలేక, నిత్యతృప్తుడవై ఆశను నిగ్రహించుకొని సర్వ కార్యములను సదా చేయువాడు చేయని వానితో సమానము. ఆశ విడిచి, నియమిత చిత్తుడై, దేని మీద శ్రద్ధలేక కేవలము శరీర సంబంధముగ పనులు చేయవలెను. అట్లు చేయువానికి కర్మలంటవు. దొరికినట్టి లాభముతో తృప్తిపొంది, ద్వంద్వములు వీడి, మత్సరము లేని వాడై లాభనష్టములను సమానముగ ఎవడు చూచునో వానికి కర్మబంధములు కలుగవు.
శ్లోకం 23: (కర్మయోగము)
భావము : సంగము లేనివాడై, ఫలాసక్తి లేక దైవమును చేరవలెనను కోర్కెగలవాడై, కర్మయజ్ఞము చేయువానికి వాని కర్మ అంతయు కాలి నాశనమగును.
శ్లోకం 24 -32: (కల్పితము)
శ్లోకం 33: (కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : ద్రవ్యయజ్ఞముకంటే జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది. సర్వకర్మలు జ్ఞానయజ్ఞములో పరిసమాప్తమగును.
శ్లోకం 34: (కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : ఆత్మను తెలిసినట్టి గురువులను చేరి వినయవిధేయతలతో నమస్కరించి సేవలు చేయుచు, సమయానుకూలముగ ప్రశ్నలడిగిన వారు జ్ఞానమును ఉపదేశించి, కర్మలు నశించిపోవు జ్ఞానమార్గమును చూపగలరు.
శ్లోకం 37: (కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : ఏ విధముగ అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదేవిధముగ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు కాలిపోవుచున్నవి.
శ్లోకం 38: (కర్మయోగము)
భావము : జ్ఞానమునకు ప్రపంచములో సాటియైనదేది లేదు. దానికంటే పవిత్రమైనది లేదు. కర్మయోగమాచరించెడు కర్మయోగి కాలము జరుగుకొలది మోక్షమునకు దగ్గరవాడగును.
శ్లోకం 39: (బ్రహ్మయోగము)
భావము : శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కల్గిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు.
శ్లోకం 40: (జీవాత్మ)
భావము : సంశయాత్ముడై, శ్రద్ధలేనివాడై, జ్ఞానశూన్యుడైన జనుడు తప్పక చెడును. సంశయాత్మునకు ఇహ పరములలో ఎక్కడైన సుఖము లేదు.
శ్లోకం 41: (కర్మయోగము, బ్రహ్మయోగము)
భావము : జ్ఞాన వివరముచే సంశయములు లేకుండ పోయిన వానికి, యోగ పద్ధతుల ద్వారా కర్మలను కాల్చివేయువానికి, మనస్సును ఆత్మను తెలియువానికి కర్మలు బంధములు కావు.
శ్లోకం 42: (కర్మయోగము)
భావము : అజ్ఞానము వలన నీ హృదయములో నెలకొన్న సంశయమును జ్ఞాన ఖడ్గముచే నరికివేసి కర్మయోగమాచరించపూనుకొనుము.