pss:శరీరము అద్దె ఇల్లు, ఆఖరీ మరణము

శరీరము అద్దె ఇల్లు




 Audio 

https://ibm.box.com/s/fgr8rym1tozbhvldtw9db50lw0p6hu1p

శరీరము అద్దె ఇల్లు, ఆఖరీ మరణము

ఒక మనిషిని విభజించి చూచితే శరీరము మరియు జీవుడు అని చెప్పవచ్చును. జీవుడులేని శరీరమును “శవము” అంటాము.  అలాగే శరీరములేని జీవున్ని “దయ్యము” అంటాము. ఒక దయ్యము, ఒక శవము రెండు కలిసియున్నప్రడు “మనిషి" అంటున్నాము.  వివరముగ చెప్పుకొంటే ఒక జీవుడు ఒక శరీరములో నివసిస్తూ జీవితకాలమునుగడుపుచున్నాడు. జీవునికి శరీరము గృహములాంటిది. శరీరమనే గృహములో జీవుడు కొంతకాలము నివశిస్తున్నాడు. జీవుడు శరీరములో నివశించిన మొత్తము కాలమును జీవితకాలము అంటున్నాము. జీవితకాలమును పూర్వము “జీతకాలము” అనెడివారు. జీత అను రెండక్షరముల మధ్యలో “వి” అను అక్షరము కాలక్రమములో చేరి పోయినది. అందువలన జీత కాలము అనునది జీవితకాలము అను పదముగ మారిపోయినది. మారిన పదమును వదలి చూస్తే శరీరములో జీవుడున్న కాలమును జీత కాలము అనడములో కొంత అర్ధము ఇమిడియున్నది. ఒక పనికి ప్రతిఫలితముగ ఇచ్చుదానిని జీతము అంటాము లేక బాడుగ (కిరాయి) అని కూడ అంటాము. జీవుడు తన స్వంతము కాని ఇతరుని ఇంటిలో నివశిస్తున్నాడు, కావున ఆ ఇంటి యజమానికి కిరాయి ఇవ్వవలసి వస్తున్నది. శరీరము జీవునికి స్వంత ఇల్లుకాదు అను విషయమును ప్రతి మనిషి జ్ఞప్తికి పెట్టుకోవలెను. శరీరము జీవునిది కాకపోతే మరి ఎవరిదను ప్రశ్న కూడ వెంటనే రాగలదు. దానికి జవాబేమనగా!. 


కొన్ని నగరములలో కొందరు యజమానులు తమ స్వంత ఇంటిని పూర్తి తామేవాడుకోక, ఇంటిలో కొంతభాగమునో లేక ఒక గదినో ఇతరులకు అద్దెకు ఇచ్చుచున్నారు. ఉదాహరణకు ఒక ఇంటి యజమాని తన ఇంటిలోని ఒక గదిని మరియొకనికి ఇచ్చాడనుకొనుము. అప్పుడు బాడుగకున్న వానికి నీటితో సహ అన్ని సౌకర్యములుకలుగజేసి దానికి ప్రతి ఫలముగ కిరాయి (బాడుగ) వానినుండి తీసుకొనును. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇక తెలియని ముఖ్యమైన విషయమేమనగా! విశాలమైన ఇంటిలో ఆ ఇంటి యజమానికి కిరాయి చెల్లిస్తూ, ఒక గదిలో కాపురమున్న కిరాయిదారునివలె జీవుడు శరీరమను ఇంటిలో నివశిస్తున్నాడు. శరీరమను ఇంటియంతటికి ఆత్మ అనుయజమాని (అధిపతి) కాగ, శరీరమను ఇంటియందు కొద్ది భాగములో జీవాత్మ నివశిస్తున్నాడు. జీవుడు తన ఇంటిలో నివశించుటకు కావలసిన సౌకర్యములన్ని ఆత్మ యను యజమాని కలుగజేయుచున్నాడు. దానికి ప్రతిఫలితముగా జీవుడనబడు కిరాయిదారుడు ఆత్మయను శరీర గృహ యజమానికి ఆహారమనబడు అద్దె (బాడుగ) చెల్లించవలసియున్నది.జీవుడు చెల్లించిన ఆహారమను కిరాయిని ఆత్మ తన మనుగడకొరకు ఉపయోగించుకొనును. బయటి గృహ యజమానులు నెలకొకమారు డబ్బురూపములో కిరాయిని (బాడుగ) ఇప్పించుకొందురు. లోపల శరీరగృహ యజమాని పూటకొకమారు ఆహారరూపములో కిరాయి ఇప్పించుకొనుచున్నాడు. బయటి గృహ యజమాని నెలకొకమారు అడిగి తన కిరాయినిఇప్పించుకుంటే, లోపలి యజమాని పూటకొక మారు ఆకలిని కలుగజేసి తన బాడుగను ఇప్పించుకొనును. ఆత్మ యను యజమానికి ఆహారమను కిరాయి కట్టుటకు మనిషి ఎన్నో పనులు చేయవలసి వస్తున్నది, ఆ పనులు చేయుటకు ఎన్నో విద్యలు నేర్వవలసి వస్తున్నది. అందువలన కూటికొరకు కోటి విద్యలని పెద్దలన్నారు. కోటి విద్యలు కాకపోయిన కొన్నివిద్యలైన నేర్వవలసి వస్తున్నది. నేటి కాలములో మానవుని సగటు ఆయుస్సు 60 సంవత్సరములైతే కూటి కొరకునేర్వవలసిన చదువులు దాదాపు 30 సంవత్సరములు పట్టుచున్నవి.


ఇప్పటి కాలములోని మనిషి మేము విజ్ఞానము కొరకు చదువుచున్నామనినా, చివరకు ఆ విజ్ఞానము కూడ మనిషి బ్రతికేదానికే, ఆహార సముపార్జనకేనని మరువకూడదు. ఎన్ని విద్యలు నేర్చినా, ఏ డిగ్రీలు (పట్టాలు) సాధించినా, ఆ విద్యలన్ని బయటి చూపును కల్గించునవి గానే ఉన్నవి. నేనొకరి ఆధీనములో అద్దెకున్నానని కాని, నాకొకయజమాని ఉన్నాడని గాని, అతని ఇష్టాయిష్టము మీదనే నేను బ్రతుకుచున్నానని గాని, బ్రతుకుట అంటే శరీరములో నివశించడమేనని గాని ఏ విజ్ఞానమూ, ఏ విద్యా మనిషికి తెలుపలేక పోయినది. శరీరయజమాని అయిన ఆత్మ యొక్క వివరమును తెలుపునదే బ్రహ్మవిద్య. బ్రహ్మ అనగ పెద్ద అని అర్ధము. నీకు ఒక పెద్ద ఉన్నాడని, ఆ పెద్దయే నీశరీరములోని ఆత్మ యని తెలుపు విద్యయే బ్రహ్మవిద్య. ప్రపంచ జ్ఞానమును తెలుపు విద్యలు ఎన్నో విభాగములుగ డాక్టర్లనీ, ఇంజనీర్లనీ, లాయర్లనీ, వగైరా వగైరా ఎన్నో కలవు. బయట ఏ సైన్సును చదివిన అది భౌతిక శరీరమునకు ఉపయోగపడునదే కాని, భౌతికశరీరమునకు అధిపతియైన ఆత్మ ను తెలుపునది కాదు. 

ఇప్పుడొక కథను చెప్పుకొందాము! భూపతి అను పేరుగల వ్యక్తి ఒక పెద్ద ఇంటిలోని, ఒక గదిలో మాత్రము కిరాయికున్నాడు, ఆ ఇంటి యజమాని పేరు పతి. పతి ఇల్లు పెద్దదికావడం వల్ల పతి తన ఇంటిలో ముందర గదిని భూపతికి బాడుగకు ఇచ్చి తాను మాత్రము వెనుకనున్న మిగత గదులలో ఉండెడివాడు. పతికి పనిమనుషులు రెండుడజన్ల మంది ఉందెడివారు. పతి అంతమందితో పని చేయించు కొనుచున్నప్పటికీ, అంతమందికి యజమానియైనప్పటికీ, తాను ఏమాత్రము గర్వపడెడివాడు కాదు, తాను గొప్పయని చెప్పుకొనెడివాడు కాదు. తన ఇంటిపనినంతటిని తన మనుషులకు అప్పచెప్పి తాను అందరిని గమనిస్తూయుండెడివాడు. బయట వ్యవహారమంతయు తన మనుషులే చూచుకొనెడివారు. ఇంటిముందు భాగములోనే ఉన్న భూపతి ఆ ఇంటికి వచ్చిపోయే వాళ్ళందరిని చూస్తూ ఉండెడివాడు. తాను ముందుగదిలోనే ఉన్నాడు కావున బయటినుండి వచ్చు అందరిని చూచెడివాడు, అన్ని విషయములను తెలుసుకొనెడివాడు. పతి యొక్క పనిమనుషులు 24 మంది భూపతికి బాగా పరిచయముండుటవలన అన్ని విషయములు భూపతికి సులభముగ తెలిసెడివి. పతి మనుషులందరు భూపతికి అనుకూలముగ ఉండుట వలన భూపతి వారందరిని తన మనుషులుగ లెక్కించి తానే వారికి యజమానినను భావము కల్గియుండెడి వాడు. వివరముగ చెప్పుకొంటే 24 మందిని పనిలో పెట్టుకొన్నది పతియే అయినప్పటికి 24 మందిలో కొంతమంది పతికివ్యతిరేఖముగ ఉంటూ భూపతికి అనుకూలముగ ఉండిరి. తుస్సు తస్సు అను ఇద్దరు పని మనుషులు పతికి విరుద్ధముగ కనిపిస్తూయుండిరి. తుస్సు అనువాడు ప్రతి విషయమును భూపతికి చెప్పుచు. భూపతి మనిషిలాగ ప్రవర్తించుచుండెను. ఇక తస్సు అనువాడు పతికి పూర్తి వ్యతిరేఖమై తనకు యజమాని భూపతియేనని, భూపతే ఇక్కడి పనులకంత మరియుఇక్కడి ఇంటికంత పెద్దఅని చెప్పెడివాడు. తుస్సు తస్సుల వలన తాను పరాయి వాని ఇంటిలో ఉన్నానను విచక్షణ కూడ లేనివాడై భూపతి తస్సు మాటలతో తాను ఉబ్బిపోయెడివాడు. ఇంటిలోని పనిమనుషులు అనేక రకాల పనులు చేసెడివారు. కొందరు చిన్న చిన్న పనులకు మాత్రమే పరిమితమైతే కొందరు ముఖ్యమైన పనులు చూచుకొనెడివారు. ఇంటిలో అతి ముఖ్యమైన పనులు చూచుకొనువారు నలుగురు మాత్రమే. ఆ. నలుగురిలో ఇద్దరు తుస్సు, తస్సుకాగ మరి ఇద్దరు సద్ధి గిద్ధి. ముఖ్యమైన ఆ నలుగురిలో తుస్సు, తస్సు ఇద్దరు ఒక గుంపుగ సద్ధి గిద్ధి ఇద్దరు ఒక గుంపుగ ఉన్నారు. ముఖ్యమైన ఈ నలుగురు భూపతికి అనుకూలురు, పతికి వ్యతిరేఖులని చెప్పినప్పటికీ, నూటికి నూరుపాల్లుతుస్సు తస్సు పతికి వ్యతిరేఖులుగ. ఉన్నారు.  ఇక మిగత ఇద్దరైన సద్ది, గిద్ధి కనిపించి కనిపించకుండ ఉంటారు. భూపతితో నా సలహా లేనిది ఏమి జరుగదని సద్ధీ, సద్ధి చెప్పినా నేను ఒప్పుకోనిదే ఏమి జరుగదని గిద్ధీ అనుచు తాము భూపతికోసము ఇంటిలో పని చేయుచున్నాము కానీ పతి కోసము కాదంటుంటారు.


భూపతి, పతి యొక్క ఇంటిలో కిరాయికుండి నెలనెలా కిరాయి కట్టుచున్నప్పటికి నేను ఎవరికి కిరాయి కట్టలేదు. ఈ ఇల్లు నాదే అంటున్నాడు. అంతేకాదు ఇంటిలోని పని మనుషులంతా నావారే అంటున్నాడు. వీడునా తుస్సు, వీడు నా గిద్ధి అని చెప్పుకొంటున్నాడు. ఈ విషయమంతా పతికి తెలుసు అయినప్పటికి పతి భూపతిని ఏమిఅనలేదు. తన ఇంటిలో బాడుగకున్న ఒక బచ్చాగాడు తానే యజమానినని చెప్పుకొనినా పతి మౌనముగ ఉండడమునకు కారణము కొంత కలదు. అది ఏమనగా! ఇల్లు తనదే అయినా అది ఇంకొకరి దగ్గర కుదువకున్నది. ఇల్లు తన పేరుమోద ఉన్నట్లు గల దస్తావేజులన్ని ఆ కుదువ పెట్టుకొన్నవాని దగ్గర కలవు. భూపతి ఏమనినా! వాని మాటలుచెల్లవు. వ్రాతమూలముగ ఉన్నది పతి పేరుతోనే. పతిదే ఇల్లు అనుటకు సాక్ష్యముగ పరపతి అను మూడవ వ్యక్తి దగ్గర ఇల్లు కుదువకున్నది. ఇల్లు పతిదే అయిన కుదువయుండుటవలన, ఇంటి రికార్డంతయు పరపతి వద్దయుండుట వలన, ప్రస్తుతానికి యజమానికి పరపతియేనని, ఇల్లంతయు అతని ఆధీనములోనిదేనని చెప్పవచ్చును. అందువలనభూపతి ఇల్లు నాదేనని అనుకొనినా పతికి ఏమి బాధలేదు. పరపతి వద్ద బాకీ తీరేంతవరకు, కుదువ రద్దయేంత వరకు, పతికి భూపతికి ఇద్దరికి యజమాని పరపతియేనని చెప్పవచ్చును. పతి బాకీ పరపతివద్ద తీరాలంటే భూపతి తానుకట్టు కిరాయిని నేరుగా పరపతికే కట్టవలసియుండును. పరపతి పేరు మిద కట్టితే దానిని తన బాకీలోనికి జమవేసుకొంటూపోయి చివరకు తీరిపోయిన రోజు తన బాకీని రద్దు చేసుకొని బాకీనుండి పతిని విడుదల పొందునట్లు చేయును. భూపతి బాకీ కట్టడమేమిటి? పతి బాకీనుండి విడుదల పొందడమేమిటి? అని ప్రశ్నించుకొంటే దానికి సమాధానము ఈ విధముగ కలదు. వాస్తవముగ భూపతియే పరపతికి బాకీదారుడు. కానీ భూపతి చేత నేను నీ బాకీకట్టిస్తానని మధ్యలో పతి అనువాడు పూచీపడినాడు. అందువలన భూపతి అనువాడు ఎంతపనికిమాలినవాడైన ఓర్చుకొని తన ఇంటిలో ముందుగదిలోనే పెట్టుకొన్నాడు.


భూపతి అనువాడు పరపతి దగ్గర అప్పుచేసి, పతిని పూచిపెట్టి ఇల్లు కుదువ పెట్టించి, తాను అన్నీ మరచిపోయి, నేను ఎవరికి బాకీలేనను భావముతో ఉండడమే కాక, తానున్న ఇల్లే నాదనుచున్నాడు. భూపతి ఏమనుకొనినా పతి, భూపతి ఇద్దరు నావద్ద ఇరుక్కొన్నారులే అని పరపతి అనుకొనుచున్నాడు. భూపతిని బాకీతీర్చువరకు వదలి పెట్టనులేననిపతి అనుకొనుచున్నాడు. భూపతి తాను కట్టేది పరపతికి అనుకొంటే. అది పరపతి. బాకీలోనికి జమ అవుతుంది. అట్లుకాకుండ తానుకట్టేది పతికి అనుకుంటే పతి బాకీలోనికి జమ అవుతుంది. పతికి కట్టినా చివరకు దానిని పరపతికే చెందునట్లు పతి చేయును. ఏదో ఒక విధముగ ఇంటికి కిరాయి రూపములోనైన కట్టిన దానిని బాకీ క్రిందజమవేసుకొనునట్లు ఏర్పాటు ఉన్నప్పటికి భూపతి తాను ఎవరికీ కిరాయి కట్టడములేదని, ఇల్లు తనదేనని, ఆహార రూపములో కట్టునది తన పోషణ నిమిత్తమేనని, మరి ఎవరికొరకు కాదని, పతి, పరపతి అనువారెవరో తనకు తెలియదని అనుకోవడము వలన భూపతి బాకీ ఏమాత్రము తీరకుండ పోయినది.


భూపతి పరమ మూర్ఖుడని గ్రహించిన పరపతి. బాకీ విషయములో కొంత రాయితీ కూడ ప్రకటించాడు. ఆ రాయితీ ఏమనగా! భూపతి కట్టునది ఏదైన పతి పేరు మిద కట్టితే ఎంత కట్టివుంటే అంత బాకీ తీరును. అలాకాకుండ నేరుగ పరపతి పేరు మిద కట్టితే ఎంత కట్టివుంటే అంతకు వేయింతలు ఎక్కువ కట్టినట్లు లెక్కించబడును. అలా ఎందుకనగా! పరపతి తన భార్య ద్వార భూపతికి బాకీ ఇచ్చాడు. పతికూడ భూపతి బాకీ విషయములో పరపతి భార్యవద్దనే పూచీ పడినాడు. అందువలన, భార్య అయిన సకృతీదేవి ఎంత జమ ఇస్తే అంతే జమవేసుకొంటున్నది. తన భార్య సకృతీదేవి ఖచ్చితమైన లెక్కాచారము కలది కావున ఈ బాకీ అంత సులభముగ తీరునది కాదని పరపతియేభూపతి ఎడల మంచి చేయదలచి సకృతీదేవికి కూడ అధిపతియైన పరపతి తన ఇష్టమొచ్చినట్లు రాయితీ ప్రకటించాడు. నేరుగ తనకు కట్టే బాకీ విషయములో ఎంత ఇస్తే అంత జమ అను నియమములు ఉండవన్నాడు. నాకు నచ్చితే నీ బాకీనంతటిని ఒకేరోజు జమ వేసుకుంటానన్నాడు. ఈ పద్ధతి ప్రకారమైతే భూపతి బాకీ తొందరగ తీరిపోవునుబాకీనుండి బయటపడును. అయినా ఇంత రాయితీని పరపతి ప్రకటించినప్పటికి పతి ఎవరు? పరపతి ఎవరు? నేను భూపతిని, నేను ఎవరి ఆధీనములోలేను, నేను స్వతంత్రున్ని నా ఇష్టమొచ్చినట్లు చేసుకోగలను అని అనుకొనుచున్నాడు. అందువలన భూపతి యొక్క బాకీలో సాధారణ జమకాని, రాయితీ జమకాని పడడము లేదు. ఏమాత్రము లెక్కాజమాలేని భూపతి స్థిరస్థాయిగ భూమి మిద బాడుగ ఇంట్లోనే నివశిస్తూనే ఉన్నాడు. బాకీ ఉండీ బాకీ మరచిపోవడము అన్యాయము కాదా? తన కొరకు పూచీపడిన వానిని ఏమాత్రము లెక్క చేయకుండ ఎవడోవాడనడము మరీ అన్యాయము కాదా? సాధారణముగా అయితే బాకీ తొందరగ తీరదని రూపాయికి వేయిరూపాయల జమ అని ప్రకటించిన వానినిమరచి ప్రవర్తించడము మరీ పెద్ద అన్యాయము కాదా! వడ్డీలేకుండ జమ చేసుకుంటానని చెప్పిన పతి పట్లగానీ, వేయింతలు జమ చేసుకుంటానని చెప్పిన పరపతి పట్లగానీ, ఏమాత్రము వినయ విధేయతను కనపరచని భూపతిని ఏమనాలో మీరే చెప్పండి? నీచుడు, నికృష్టుడు, దుష్టుడు, దుర్మార్గుడు అని ఏమనిన తక్కువే అని అనిపిస్తుంది కదా!


ఈ కథలోని భూపతిని ఎవరూ ఒప్పుకోరనుకుంటాను. ఎంతో ఓర్పుకల్గిన పతినిగానీ బాకీ తీరుటకు రాయితీ పేరుతో ఎంతో అవకాశము కల్పించిన పరపతినిగానీ ప్రశంసింపక తప్పదు. ఇపుడు ఇంత కథ మనము చెప్పుకోవలసిన అవసరమేమొచ్చినదని కొందరనుకోవచ్చును. దానికి జవాబేమనగా! ఈ కథను తప్పనిసరిగ అందరు తెలుసుకోవలసిన అవసరమున్నది. ఎందుకనగా! ఇది కల్పితగాధ కాదు యదార్థగాధ. ఇందులోని భూపతి పాత్రధారుడు ఎవరో కాదు. ప్రత్యక్షముగ నీవే. బాడుగ ఇల్లు నీవున్న శరీరమే. పతి నీ శరీరమునకు అధిపతియైన ఆత్మ యే. పరపతి ఎవరోకాదు ఆత్మ కంటే పరముగావున్న పరమాత్మే. పతికి పనిమనుషులుగనున్న 24 మంది, 24 శరీరభాగములేనని జ్ఞప్తి చేసుకోవలెను. పతికి వ్యతిరేఖముగ భూపతికి అనుకూలముగనున్న ముఖ్యమైన నలుగురులో తుస్సు మనస్సుకాగ, తస్సు అహమని తెలియవలెను. అంతేకాక సద్ధి అనగా మనకున్న బుద్ధియేననీ, గిద్ధి అనగా మనలోని చిత్తమని అర్ధము చేసుకోవలెను. భూపతి కట్టు కిరాయి మనము లోపలికి అందించు ఆహారమని తెలియవలెను... భూపతి యొక్క బాకీ అనునది జీవాత్మ యొక్క కర్మయని, కర్మను లేకుండ చేసుకోవడమే పరమాత్మ బాకీ తీర్చినట్లని అర్ధము చేసుకోవలెను. పతి, పరపతి యొక్క విషయమును భూపతి అనువాడు తెలియకుండ పోవడము ఆత్మ, పరమాత్మల యొక్క జ్ఞానమును జీవాత్మ గ్రహించకుండ పోయినట్లని తెలియవలెను. పతి భూపతికి పూచీగ ఉండడము అంటే ఆత్మ జీవాత్మ యెడల తోడుగ ఉన్నదనీ, జీవుని పనులను స్వయముగ తానే చేయు చున్నదని అర్ధము చేసుకోవలెను. పతికి జమకట్టడమంటే ఆత్మ ను బ్రహ్మకర్మయోగముల ద్వార ఆరాధించడమని పరపతికి జమకట్టడమంటే పరమాత్మను భక్తియోగము ద్వారా ఆరాధించడమని తెలియవలెను. భక్తియోగము ద్వార కర్మ తొందరగ లేకుండపోయి కర్మనుండి విముక్తి పొందవచ్చును, కావున పరపతికి జమచేస్తే వేయింతలు రాయితీకలదని చెప్పాము. సకృతీదేవి అనగ ప్రకృతీశక్తి అని తెలియవలెను. నియమములు అనగా ధర్మములనీ, ధర్మములను అతిక్రమించి మోక్షమిచ్చు స్థోమత ఒక్కపరమాత్మకే కలదనీ, అందువలన పరపతి తన ఇష్టమొచ్చిన రాయితీ ప్రకటించాడని చెప్పాము. పరమాత్మ ప్రకృతి ద్వారానే జగత్తును నడుపుచున్నాడు కావున పరపతి తన భార్య ద్వార బాకీ ఇప్పించాడు అని చెప్పాము. ఇంత పెద్దకథ మన శరీరములోనే జరుగుచున్నదని, ఈ కథలోని యదార్థమును తెలిసినవాడు తన కర్మ బాకీని తొందరగ తీర్చుకొని మోక్షము పొందగలడని తెల్పుచున్నాము.


కల్సితము : యదార్థము

1 భూపతి  : జీవాత్మ  

2 పతి : ఆత్మ  

3 పరపతి : పరమాత్మ  

4 ఇల్లు : శరీరము  

5 బాడుగ (కిరాయి)  : ఆహారము  

6. పని మనుషులు : శరీర భాగములు 

7 తుస్సు : మనస్సు  

8 తస్సు : అహము    

10. గిద్ధి : చిత్తము 

11. బాకీ  :కర్మ 

12. పూచీగ ఉండడము : తోడుగ ఉండడము  

13. పతిని మరువడము : ఆత్మ జ్ఞానము తెలియకుండడము  

14. పతికి జమకట్టడము బ్రహ్మ కర్మయోగములనాచరించడము  

15. బాకీ పూర్తిగారద్దవడము : మోక్షము పొందడము  

16.  సకృతీదేవి : ప్రకృతిశక్తి  

17 నియమములు . ధర్మములు  

18. బాకీరాయితీ : కర్మను రద్దుచేయడము



ఆఖరీ మరణము


https://ibm.box.com/s/zypahd0mlmbqcytj5exn8ckrs0f3d9m3


ఒక మనిషి బ్రతుకుచున్నాడు అంటే ఆ మనిషి శరీరము పెద్ద:యంత్రాంగములాగ పనిచేయుచున్నదని అర్ధము. శరీరమను యంత్రములో కనుపించునవి కొన్నీ, కనిపించనివి కొన్నీ యంత్ర భాగములు గలవు. కనుపించునవి పది (10) భాగములు కాగా, కనిపించక ఉండునవి పదునాలుగు (14) భాగములు గలవు. శరీరయంత్రము బయటి ఇనుప ముక్కల యంత్రములాంటిది కాదు. ఇనుప ముక్కల యంత్రములో అన్ని భాగములున్నాా అందులో ఇందనమైన నూనె ఉన్నా దానిని ఆడించుటకు ఒక మనిషి కావాలి. వానినే జంత్రగాడు అని తెలుగులో, డ్రైవర్  అని ఇంగ్లీషులో అంటాము. కనిపించు కొన్ని భాగములతో కూడుకొన్న మాంసపు ముక్కల శరీరయంత్రములో ఇందనముగా రక్తమున్నా శరీరయంత్రమును ఆడించుటకు ఒకడు కావాలి. బయటి యంత్రమును ఆడించువాడు మనిషి అయితే మనిషి యొక్క శరీరయంత్రమును ఆడించువాడు మిస్టర్‌ x (యక్స్‌) అనుకొందాము. బయటి యంత్రమును ఆడించు మనిషిని జంత్రగాడు అంటున్నాము. ఇక్కడ శరీరయంత్రమును ఆడించువానిని మంత్రగాడు అంటున్నాము. ఇనుప వస్తువులచే నిర్మితమైన యంత్రము యొక్క డ్రైవర్ ను జంత్రగాడు అని అంటే, మాంసపు అవయవములచే నిర్మితమైన శరీర యంత్రము యొక్క డ్రైవర్‌ను మంత్రగాడు. అని అనాలి. పూర్వము ఈ విధముగా జంత్రగాడు, మంత్రగాడు అను పేర్లు పుట్టినవి. ఇంకా వివరముగా చెప్పుకొంటే బయట కనిపించే యంత్ర భాగములను నడుపు కనిపించే వానిని జంత్రగాడు అనీ, లోపల కనిపించని శరీర యంత్రభాగములను నడుపు కనిపించని వానిని మంత్రగాడు అని అనుచున్నాము.  


కనిపించకుండ పనిచేయుదానిని మంత్రము అంటాము, దానిని పని చేయుంచువానిని మాంత్రికుడు అంటాము.  శరీర యంత్రములో కనిపించని భాగములు పదునాలుగున్నాయి అన్నాము. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పని తనము  కల్గియున్నది. వాటిలో ఇపుడు మనము చెప్పుకొనుటకు సందర్భానుసారము అవసరమొచ్చినది, మనస్సు అను   భాగము. మననము చేయునది, లేక మననము కల్గినది కావున దానిని మనస్సు అంటున్నాము. శరీరములో అన్ని జ్ఞాపకాలకు ముఖ్యకారణమైనది మనస్సు. మనిషి యొక్క జీవితములో చిట్టచివరిగా నశించి పోవునది కూడ మనస్సు అని చెప్పవచ్చును. శరీరములోపల కనిపించని భాగములు అన్నీ పని చేయలేని స్థితికి వచ్చి, నశించి పోయిన తర్వాత అన్నిటికంటే చివరిలో నాశనము చెందునది మనస్సు. మనస్సు నాశనమైన తర్వాత జీవుడు కూడ శరీరమును వదలి పోవును. దానినే మరణము అంటాము. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే మరణములో నాశనము చెందునవి లోపల కనిపించని యంత్రభాగములైన పదునాలుగు (14) భాగములని తెలియవలెను. జీవుడు మాత్రము నాశనము చెందలేదని జ్ఞప్తికుంచుకోవలెను. మరణములో బయటి పది (10) భాగములతో, లోపల పదునాలుగు (14) భాగములతో జీవునికి సంబంధము తెగిపోవుచున్నది. మనిషి బ్రతికియున్నపుడు, శరీరములో అన్ని భాగములు పని చేయుచున్నపుడు, శరీరమును నడుపు డ్రైవర్ (మంత్రగాడు) ఒకడు గలడు అన్నాము కదా!  ఆ డ్రైవర్ జీవుడుకాదని బాగా జ్ఞప్తికుంచుకోవలెను. శరీరమను వాహనములో జీవుడు ప్రయాణికుడు మాత్రమే డ్రైవర్ మాత్రము కాదు.


జీవుడు (జీవాత్మ) అను ప్రయాణికుడు ప్రయాణము చేయు నిమిత్తము శరీరమను వాహనము నిర్మాణము చేయబడినది. వాహనము నడిచినంతవరకు జీవుడు దానిలో ప్రయాణించుచుండును. వాహనము నడువలేని స్థితికి వచ్చినపుడు దానిని నడుపు డ్రైవర్  ఈ బండి పనికిరాదు, వేరే క్రొత్తవాహనము నెక్కెదమని, జీవున్ని పిలుచుకొనిపోయి వేరే క్రొత్త బండి ఎక్కును. బండి పనికిరానపుడు ప్రయాణికుడొకడే దిగక ఆ బండిని నడుపు డ్రైవర్ కూడ దిగును. అలా ప్రయాణికుడు, డ్రైవర్ ఇద్దరు పనికిరాని బండి దిగి వేరొక క్రొత్త బండి ఎక్కి ప్రయాణము సాగించు చుందురు. బండి ఏదైనా ప్రయాణకుడు ఒకడే, డ్రైవర్  ఒకడే ఉండును. ఒక ప్రయాణికుడు ప్రయాణించుటకు ఒక్కసీటు మాత్రమున్న బండిని నడుపుటకు, ప్రయాణికుని వెంట శాశ్వితముగా ఒకే డ్రైవర్ ఉండును. ఎన్ని వాహనములు చెడిపోయినా, ఎన్ని వాహనములు మారినా ప్రయాణికుడు ఒకడే, డ్రైవర్ ఒకడే, దారి ఒకటేనని మరువకూడదు. ఒక వాహనము చెడిపోయి నడువలేని స్థితికి వచ్చినపుడు, వేరొక క్రొత్త వాహనమును ఆందించు వాహనము తయారుచేయువాడు మరొకడు గలడు. వాడే వాహనముల అధిపతి. ఎంతమంది ప్రయాణికులకైన క్రొత్త వాహనములను అందించు స్థోమత వాహనాలను తయారు చేయువానికుండును. వాహనములను తయారు చేయువాడు ఒక ప్రయాణికుడు కూర్చుండునట్లు ఒక సీటును, ఒక డ్రైవరు నడుపునట్లు ఒక డ్రైవర్ సీటును, వాహనములో ఉంచడమే కాక, మొదటివాహనములో ఎన్ని భాగములున్నవో, అన్ని భాగముల నమూనాతోనే బండిని తయారు చేసియుండును.

ఒక బండిలో ప్రయాణము ఆగిపోతే దానిలోని డ్రైవర్‌, ప్రయాణికుడు ఇద్దరు దిగి వెంటనే క్రొత్తబండి ఎక్కి పోగలరు. శరీరమను బండిలో జీవుడు తన సామానుతో (లగేజితో) ప్రయాణము చేయుచుండును. బండిని నడుపు మంత్రగాడు (డ్రైవర్‌) మిస్టర్‌ X అనుకొన్నాము. డ్రైవర్ ఎవరైనది చివరిలో చెప్పుకొందాము. కానీ ఎన్ని క్రొత్తవాహనములనైన ఎందరికైనా ఇచ్చువాడు ఒకడు గలడు. ఆ వాహనముల యజమానిని పరమాత్మ లేక దేవుడు అంటాము. ఇపుడు నీ శరీరము ఒక వాహనము కాగా, దానిని ఇచ్చినవాడు దేవుడు. నీ శరీర వాహనములో జీవిత ప్రయాణమును సాగించువానివి నీవేనని తెలుసుకో. కానీ ఎన్నో కోట్ల సంవత్సరములనుండి నీకు పర్మనెంట్‌ డ్రైవర్ గాయుండి, నీ శరీర వాహనములో నీతోపాటు నీముందే కూర్చోని, దానిని నడుపుచున్న వానిని నీవు ఎపుడు చూడలేదు. వాడు ఎవడో కూడ చాలామందికి తెలియదు. వానిని ఇపుడు కూడ మిస్టర్‌ X గానే చెప్పుకొందాము. జీవుడు ప్రయాణించు శరీరమను బండిలో జీవుని వెంట ఒక మూట ఉండునని చెప్పుకొన్నాము కదా!  ప్రయాణికుడైన జీవుడు ఎపుడు పాతబండి దిగి క్రొత్తబండి ఎక్కినా, అపుడు తన మూటను జాగ్రత్తగా తీసుకొని పోవుచుండును. ఏ బండి ఎక్కినా తన ప్రక్కనే ఆ మూటను ప్రయాణించు జీవుడుంచుకోవడము జరుగుచుండును. ఆ మూటలో ఏమి సామగ్రియుందని గమనిస్తే అందులో అనేక రకములైన పచ్చికాయలు, పక్వానికి వచ్చి మాగిన పండ్లు కలవనితెలియుచున్నది. ఎడతెరపి లేని ప్రయాణములో జీవుడు ఆ ఫలములను ఆహారముగా తీసుకొనుచుండును. ఆ విధముగా సంచిలోని ఫలములను తింటూ ఉంటే అవి అయిపోయి సంచి ఖాళీ అవుతుంది కదా! కానీ జీవుడు ఆ ఫలమును తింటూ అవి అయిపోకుండ దారిలో ప్రక్కనే ఉన్న చెట్లకు కాచి వేలాడుచున్న ఫలములను పోతూ పోతూనే కొసుకొని తన సంచిలో  వేసుకొనుచుండును. ఈ విధముగ దారి ప్రక్కన అనేక చెట్లకు కాచిన అనేక జాతి ఫలములను తెంపుకొనుచు, తన సంచి ఖాళీ కానట్లు, తను ఎంత దూరము ప్రయాణము చేసిన ఫలములు అయి పోకుండునట్లుచేసుకొనుచుండును. ఈ విధముగా దారిలో జీవుడు ప్రయాణిస్తూ, కొన్ని పక్వానికి వచ్చిన ఫలములను తింటూ ఖర్చు చేస్తూ, కొన్ని కాయలను అందిన చెట్లనుండి పెరికి జమ చేసుకొనుచుండును. ఒక దినము తన ప్రయాణములో నాలుగు పండ్లను తింటే, ఆ దినము తొమ్మిది లేక పది కాయలను జమ చేసుకొనుచుండును. ఒక్కొక్క దినము పదిపండ్లను తిని ఖర్చు చేస్తే ఆ దినము మూడు లేక నాలుగు పండ్లను జమ చేసుకొనును. ఈ విధముగా ఎచ్చుతగ్గులుగ ఖర్చు, ఎచ్చుతగ్గులుగ జమ ఉండును. అట్లు సేకరించిన పండ్లు జమయే ఎక్కువై కొన్ని సంచులు మిగులుగా చాలామందికి గలవు. ఇదంతయు జీవుని ప్రయాణమేనని ముందే చెప్పుకొన్నాము కదా! ఈ మూటల సంగతేమిటనికొందరడుగవచ్చును. ఈ మూటలు మనకందరికి ఉన్న మూటలే. అవియే కర్మ మూటలు. వాటిలో అనేకరకమైన పండ్లు అనబడు పాపపుణ్యములు గలవు. మనము నిత్యము పాపపుణ్యములను కర్మ నిల్వలనుండి అనుభవిస్తూ అయిపోగొట్టుచూ, తిరిగి క్రొత్త పాపపుణ్యములను కర్మసంచిలోనికి జమ చేయుచున్నాము. 


ఒక ప్రయాణమన్న తర్వాత గమ్యమనునది ఉండి తీరాలి కదా! అట్లు గమ్యము లేకుండ ఎడతెరిపిలేని ప్రయాణము శరీర వాహనములు మార్చుచు మనము చేయుచున్న మాట నిజము. ఇక్కడ ఎడతెరిపి లేని ప్రయాణ మేమిటి? గమ్యముండాలి కదా! అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! గమ్యమనునది ఉన్నది. ఆ గమ్యముపేరు మోక్షము. అయితే గమ్యమును చేరాలంటే. ఒక నియమము గలదు. ఆ నియమమేమంటే ప్రయాణికుని వద్దనున్న సంచి ఎపుడు ఖాళీ అయితే అపుడు వాడు ఎచట గలడో అదియే వాని గమ్యమగును. ఈ నియమము ప్రకారము ప్రయాణమును మొదలు పెట్టిన జీవుడు, తన నియమమును తానే మరిచిపోయి ప్రయాణిస్తూ, తన సంచినిఖాళీ చేసుకోకుండ, కర్మ ఫలములను నింపుకొనుటకు ప్రయత్నము చేస్తూనేయున్నాడు. అట్లు ఖర్చయ్యే ఫలముల కంటే జమ అయ్యే ఫలములే ఎక్కువగా ఉన్నందువలన కొన్ని సంచులు మిగులుపడిపోయిన వారు కూడ చాలామంది కలరు. ఈ విషయమునంతటిని.. ఏదో ఒక కథలాగ చూడక ప్రయాణికునివి నీవేనని అనుకో, వాహనమునీశరీరమే అనుకో, మూటలు నీ కర్మమూటలే అనుకో. ఆ మూటలోనివి నీవు సంపాదించుకొన్న పాపపుణ్యములని తెలుసుకో. నీవు ఎన్ని అనుభవించినా అనుభవించవలసిన ఎన్నో కర్మ ఫలములు ఇంకా నీవద్ద మిగిలి ఉన్నాయనుకో. ఇపుడు నీవు మోక్షగమ్యము ఎందుకు చేరలేక పోతున్నావో అర్ధమై ఉంటుందనుకుంటాను.

 ప్రయాణమునంతటిని మనిషికి వర్తింపజేసుకొని చూస్తే జీవుడు కొన్ని కోట్ల సంవత్సరములనుండి జీవితమును శరీరముతో కొనసాగిస్తూనే వస్తున్నాడు. మరణములో ఎవడు లేకుండ పోవడము లేదు. మరణమనునది జీవుని నాశనము కాదు. మరణములో శరీరము మాత్రము నశించుచున్నది. మరణము వలన జీవునికి పాతశరీరము పోయికొత్త శరీరము వస్తున్నది. అందువలన జీవుడు చావడము లేదు పుట్టడము లేదు. మరణమును పొందుచున్నది శరీరము మాత్రమే. అలాగే పుట్టుచున్నది కూడ శరీరమే. జీవుడు పాతవస్త్రమును వదలి క్రొత్తవస్తమును ధరించినట్టు, పాతశరీరమును వదలి క్రొత్తశరీరమును ధరించుచున్నాడు. శరీరవాహనము పాతది. నిలిచిపోతే చచ్చుట అనియు,క్రొత్త శరీరవాహనము వస్తే పుట్టుట అనియు పేరు గలదు. చచ్చినపుడుగానీ పుట్టినపుడుగానీ, శరీరములో ప్రయాణించు జీవునిలోగానీ దానిని నడుపు డ్రైవర్ లోగానీ ఎటువంటి మార్పు ఉండదు. మరణములో జ్ఞాపకాల పుట్ట అయిన మనస్సు నశించిపోవడము వలన పోయిన శరీరములోనున్న జ్ఞాపకాలన్నీ ఆ,శరీరముతోనే పోవుచున్నవి. అందువలనపాత శరీరములోని సమాచారమును తెలుపునది ఏదీ లేనిదానివలన వెనుకటి జన్మ విషయము జీవునకు ఏమాత్రము తెలియకుండ పోవుచున్నది. క్రొత్త శరీరములోని క్రొత్త మనస్సు తెలుపు విషయములు మాత్రమే తెలియుచుండును. పోయిన పాత శరీరములో తాను ఏమి చేసినది జీవునకు తెలియదు. శరీరబండిని నడుపు డ్రైవర్ కు మనకున్నట్లుభాగాలుండవు. వాడు భాగములు లేని ఏక స్వరూపుడు కావున వానికి అన్నీ జ్ఞాపకముంటాయి, అన్నీ తెలుసు. అయితే వాడు జీవునికి ఒకటి కూడ చెప్పడు. వాని పని బండిని తోలే పని మాత్రమే. వాడు మిస్టర్‌ X గానే జీవునికి తెలియకుండ బండిని మాత్రము నడుపుచుండును. (గమనిక :- వెనుకటి జన్మల వివరము తెలియక పోవడమువలన, వాటిని ప్రత్యక్షప్రమాణముగా, శాస్త్రబద్దముగా ఎవరు చెప్పకపోవడము వలన, భూమి మీద మానవుడు పూర్తి అజ్ఞానములో మునిగి పోయి జీవునికి జన్మలే లేవని చెప్పుకొను ప్రమాదమున్నది. ఇప్పటికే క్రొత్తగా పుట్టిన మతములన్ని జన్మలు లేవనియే చెప్పుచున్నవి. మరియు హిందూమతములోని హేతువాదులు, నాస్తికవాదులు కూడ పునర్జన్మ నునదిఅవాస్తవమని అంటున్నారు. కావున పూర్తిగ జన్మలు లేవను పరిస్థితి భూమి మీద  ఏర్పడకుండుటకు, మన శరీరములో డ్రైవర్ గానున్న వాడే కొన్ని వందల సంవత్సరములకు ఒకమారు బహు అరుదుగా, ఎవరికో ఒకరికి వెనుకటి జన్మ జ్ఞాపకమును కలుగజేయును. మనిషి పుట్టిన తర్వాత చిన్న వయస్సులో మూడు నుంచి ఐదారు సంవత్సరములలోనేవెనుకటి కొన్ని విషయాలను జీవునికి చెప్పును. అపుడు ఆ పిల్లవాడుగానీ, పిల్లగానీ తనకు లోపలే తెలిసిన విషయములను బయటికి చెప్పుచుందురు.. అట్లు చెప్పిన సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆ వెనుకటి జ్ఞాపకము దాదాపు ఒక సంవత్సరము అంతకంటే తక్కువ కాలముండి తర్వాత లేకుండ పోవును. అది వాస్తవముగా జ్ఞాపకముకాదు. శరీరములనునడుపుచున్న మిస్టర్‌ యక్స్‌ అనువాడు చెప్పుచున్నంత వరకే చెప్పుచుందురు. అతను ఎపుడు చెప్పకుండ మానుకొంటే అపుడు పిల్లవాడు ఏమి చెప్పలేడు. ఈ తతంగము తెలియని హేతువాదులు అలా చెప్పే పిల్లలకు ఏదో రోగముందనీ, దానివలన అలా చెప్పుచుందురనీ అదంతయు వాస్తవముకాదని అనుచుందురు. దీనిని గురించి మేము వ్రాయు“పునర్జన్మ జ్ఞప్తి అను పుస్తకములో వివరిస్తాము). 

జీవుడు ఎన్ని శరీములు మారినా వెనుకటి ఏ ఒక్క శరీరములోని జ్ఞాపకము కూడ జీవునికుండదు. కావున ఇపుడు ఉన్న జన్మలో మాత్రమే నేను పుట్టాననుకొనుచుండును. వెనుకటి సమాచారము ఏమి తెలియదు దానివలన ఇంతకు ముందు తాను ఎప్పుడు భూమిమిద పుట్టలేదను భావముతో ఉండును. వాస్తవానికి తాను ఇంతకు ముందుఎన్నో శరీరములను ధరించానని తెలియని మనిషి, ఇక తర్వాత కూడ ఎన్నో శరీరములను ధరించవలెనని తెలియని మనిషి ప్రస్తుతమున్న జన్మను మాత్రమే తెలిసిన మనిషి, ఇప్పుడు పుట్టినది తప్ప ముందు వెనుకనున్న జన్మల వివరము తెలియక, ఇప్పుడు మాత్రమే తనను దేవుడు పుట్టించాడని అనుకొనుచుండును. లేక తానే ఇపుడు పుట్టానని తనను ఏదేవుడు పుట్టించలేదని అనుకొనుచుండును. ఈ భావము హిందూమతములోగాక ఇతర మతములలో ఉన్నదనుకుంటాము. హిందూమతములో భగవద్గీత బోధవలన మనిషికి ఎన్నో జన్మలు గడచినవనీ, తర్వాత మోక్షము పొందు వరకు ఎన్నో జన్మలు కల్గునని తెలియుచున్నది. ఇతర మతములలో మనిషి చనిపోయిన తర్వాత దేవుడు తిరిగి అదే శరీరముతోనే లేపి మనిషి చేసుకొన్న పాపపుణ్యములకు తీర్పు తీర్చి శిక్షవేయునని చెప్పియున్నదని చెప్పుకోగ విన్నాము. ఆ మాటవాస్తవమే అట్లు ఒకమారే దేవుడు చేయుచున్నాడా? అని యోచిస్తే ఒక్క మారేనని సూచనలేమి లేనట్లు తెలియుచున్నది. ఇదే విషయమును హిందూమత పురాణములలో కూడ చెప్పుకొన్నారు. కానీ అది శాస్త్రబద్దత కాదని గీతలో చెప్పినది మాత్రమే శాస్త్రబద్దతని మేము చెప్పుచున్నాము. 

భగవద్దీత జ్ఞానము తెలిసినవారు కొందరు తమకు ఎన్నో జన్మలు గడచిపోయినవని విశ్వసించినవారై, తర్వాత రాబోవు జన్మలనుండి బయట పడాలని తలచినవారై, ఇప్పటినుండి మోక్షమునకై ప్రయత్నము చేయువారు గలరు. అటువంటి ఉద్దేశము కల్గినవారికి సరియైన జ్ఞానమార్గము దొరకక, వారికి తమవద్దనున్న కర్మసంచి విషయముతెలియక, వారి ప్రయత్నము వారు చేయుచునే ఉన్నారు. మనవద్ద సంచి ఉన్నంతవరకు, అది ఖాళీ కానంత వరకు, శరీరవాహన మంత్రగాడు (డ్రైవర్ ) మనలను ఒక బండి దిగుతూనే మరియొక బండిని బలవంతముగా ఎక్కించుచుండును. కర్మ ఎపుడు లేకుండ పోతుందో అపుడు మోక్షము లభిస్తుంది. ఎందుకనగా! కర్మ లగేజి మనవద్దయున్నంత వరకుమన డ్రైవర్  మనలను వదలిపోడు. డ్రైవర్‌ పోయినపుడు వాహనమును నీవు ఎక్కవలసిన పనిలేదు. డ్రైవర్  (మంత్రగాడు) ఉన్నంతవరకు అతను నిన్ను బండిలోనే కూర్చొనబెట్టును. జీవుని వద్ద కర్మసంచి ఖాళీ అయిపోతే,. నీవు జీవున్ని వదలి పెట్టమని జీవున్ని వాహనమును ఎక్కించవద్దని డ్రైవర్‌కు  దేవునివద్దనుండి శాసనము చేయబడినది. అందువలనఎచట కర్మ కలిగిన జీవుడుండునో, అచట జీవునికి వాహనముండును మరియు దానిని నడుపు మంత్రగాడు ఉండును. ప్రతి జీవునికి ఒక శరీరము, ఒక డ్రైవర్  ఉండుట సర్వసాధారణము.


భూమి మిద కొందరు మోక్షము కొరకు ప్రయత్నము చేయుచున్నారు. దానికొరకు వారు అనేక మార్గములను అవలంభించు చున్నారు. ఎవరు ఎన్ని మార్గములను అవలంభించినా కర్మ విషయము తెలియనిదీ, శరీరమును నడుపు వాని విషయము తెలియనిదీ మోక్షము దొరకదు. కర్మ సంచియున్నంతవరకు డ్రైవర్  వదలడని తెలియనివారు,శరీరములోపలి ధ్యాసను వదలి, బయటి భక్తిలో పడిపోయి, అనేక భక్తి మార్గములను ఆచరించుచున్నారు. మోక్షము కొరకు యజ్ఞములు చేయువారు, దానములు చేయువారు, వేదపఠనములు చేయువారు, తపస్సులు చేయువారు కలరు. కొందరు చేయించువారూ కలరు. ఈ నాల్గు రకముల భక్తిమార్గములను ఆచరించు ఎవరికైనా మోక్షము ఎప్పటికిలభించదని భగవద్గీతలో విశ్వరూపసందర్శన యోగమందు 48,53 శ్లోకములలో వివరముగా గలదు. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన వివరము తెలియక. చాలామంది పొరబడిపోయి, అసలైన దైవమార్గములో ప్రయాణించ లేక పోవుచున్నారు. భగవద్గీతలో. భగవంతుడు చెప్పినట్లు శరీరాంతర్గతములో చూచుకోక, శరీరమును నడుపుచు నీప్రక్మనేనున్న శరీరవాహక మంత్రగానిని తెలియకున్నంతవరకు ఎవనికి మోక్షము లభించదు. కర్మ సిద్ధాంతమును తెలియనివారు, శరీరములో ఉండి కర్మ ప్రకారము శరీరమును నడుపువానిని తెలియనివారు, భూమిమిద ఎంత పెద్ద స్వామిజీలైనా, ఎంత పెద్ద పీఠాధిపతులైన బండి ఎక్కవలసిందే ప్రయాణము చేయవలసిందే. దేవుని లెక్కలో సామాన్యుడైనస్వామిజీలైనా అందరూ సమానమే. జ్ఞానపథము ప్రకారము నడుచు సామాణ్యుడైన మోక్షము పొందగలడు. జ్ఞానపథము ప్రకారము నడువని స్వామిజీయైన మోక్షము పొందలేడు. యంత్రమును నడుపు జంత్రగాడు ఉన్నట్లు, శరీర యంత్రమును నడుపు మంత్రగాడు ఉన్నాడని గ్రహించి, కర్మ ఉన్నంతవరకు మంత్రగాడు మనలను వదలడని తెలిసి, శరీరములోనే ఉన్న కర్మనూ, శరీరములోనే ఉన్న మంత్రగాడైన మిస్టర్‌ X ను తెలిసీ, ఖాళీ అయిన కర్మసంచిని మిస్టర్‌ X కు ఇచ్చిన రోజు నీకు మోక్షము లభించగలదు. అపుడు చనిపోయిన వానికి ఆ మరణము ఆఖరీ మరణము కాగలదు. అంతవరకు లోపలి వివరమూ విషయమూ తెలియనిదే, కర్మసంచిని మంత్రగానికి ఇవ్వనిదే  నీకు ఎన్ని మార్లుమరణము వచ్చినా అది ఆఖరీ మరణము కాదు.


ఆఖరీ మరణమంటే ఏమిటో ఇపుడు తెలిసింది. కొంతమంది స్వామిజీలు చనిపోయినపుడు మా గురువుగారు మోక్షము పొందాడని ఆ స్వామిజీ శిష్యులు అనుకోవడము జరుగుచున్నది. అపుడు చనిపోయిన ఆ స్వామీజీ ఆఖరీమరణము పొందాడని మనమనుకోవచ్చును. అలా అనుకోవడములో నిజము ఉండవచ్చును లేక అబద్దముఉండవచ్చును. ఆఖరీ మరణము పొందని వానిని కూడ అతను మోక్షము పొందాడని పొరపాటుగ మనము అనుకోవచ్చును. నిజముగ ఆఖరీమరణము పొంది మోక్షము పోయిన వానిని పొరపాటుగ అతను మోక్షమును పొందలేదని కూడ అనుకోవచ్చును. ఇలాంటి గందరగోళము జరిగి, మరణించిన వారిలో ఎవరు మోక్షము పొందారో, ఎవరుపొందలేదో కూడ మనుషులకు తెలియకుండ పోవునని ఊహించిన భగవంతుడు, తన భగవద్గీతలో ఆఖరీ మరణమును గురించి అక్షర పరబ్రహ్మయోగమున చివరిలో 23వ శ్లోకమునుండి 28 శ్లోకము వరకు చెప్పాడు.


మొదట 23వ శ్లోకములో ఏమి చెప్పాడని చూడగా ఇలా ఉంది.

అధ్యాయము 8, శ్లోకము :23


యత్ర కాలే త్వనా వృత్తి  మావ్చత్తిం చైవ యోగిన |

ప్రయాతా యాన్తి తం కాలమ్‌ వక్ష్యామి  భరతర్షభం కాలమ్‌ ||


యోగులైన వారు ఎపుడు చనిపోతే తిరిగి పుట్టుధురో, ఎపుడు చనిపోతే తిరిగి పుట్టరో ఆ కాలమును గురించి చెప్పెదను వినుము.


ఇపుడిది శాస్త్రబద్దమైన విషయముగా అందరూ గ్రహించాలి. భగవంతుడు చెప్పబోవు కాలమును తెలుసుకొన్న తర్వాత అపోహలకు ఏమాత్రము తావుండదు. ఎటువంటి వారి మరణమునైన భగవంతుడు చెప్పిన సమయముతో పోల్చి చూచి అది ఆఖరీ మరణమా కాదా, అని తేల్చి చెప్పుకోవచ్చును. పై శ్లోకములో “యోగిని అని ఈ కాలముయోగులకు మాత్రమే వర్తించునని చెప్పాడు. కావున యోగులైన వారిలో పూర్తి కర్మ అయిపోయిన వారెవరు? కర్మ అయిపోక ఇంకా మిగిలిన వారెవరని కూడ గ్రహించవచ్చును. యజ్ఞయాగాదులు చేయువారు, వేద పఠనము చేయువారు, దానములు చేయువారు, తపస్సులు చేయువారు యోగులుకాదని, వారు జన్మకు తప్ప మోక్షముకు పోరని, అటువంటివారిని చూడవలసిన పనేలేదని, గీతలోని విశ్వరూపసందర్శన యోగమునందు గల 48,53 శ్లోకముల ప్రకారము చెప్పవచ్చును. యజ్ఞ వేద, దాన, తపముల చేయు నాల్గు రకముల వారిని వదలి యోగులైన వారిలో కూడ కర్మ అయిపోక, డ్రైవర్‌ విడిపోక ఎవడు తిరిగి పుట్టునో, వానిది ఆఖరీ మరణముకాదనీ, ఎవని శరీరమును నడుపు డ్రైవర్‌వానిని వదలి పెట్టి పోవునో, ఎవని కర్మ పూర్తి అయిపోవునో అటువంటి యోగి పొందిన మరణము ఆఖరీ మరణమగునని తెలియాలి. ఆఖరీ మరణమును యోగులైన వారు కూడ ఏ సమయములో పొందుదురో గీతయందు అక్షర పరబ్రహ్మ యోగములో 24వ శ్లోకమునుండి భగవంతుడే చెప్పాడు. కావున నేను ఆ సమయమును గురించి చెప్పనవసరము లేదు. భగవద్గీత చదివితే మన డ్రైవర్‌ అయిన మిస్టర్‌ X కూడ తెలియబడునని తెల్పుచున్నాము. మేము భగవద్గీతను చాలామార్లు చదివాము, మీరు  చెప్పినట్లు ఆఖరీ మరణము గురించి, శరీరమును నడుపువానిని గురించి ఏమిలేదేఅని కొందరడుగ వచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఆధ్యాత్మిక రంగములో విప్లవాత్మక రచనతో కూడుకొన్న త్రైతసిద్ధాంత భగవద్గీతను చదవండి, అన్నీ అర్ధము కాగలవు.


ఇట్టు ఇందూ ధర్మప్రదాత సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024