pss book:ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు మార్కు సువార్త FULL
ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు
మార్కు సువార్త :(1) మార్కు సువార్త, 2వ అధ్యాయము, 19, 20 వచనములు.
(19) పెండ్లికుమారుడు తమతో కూడా యున్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయతగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము ఉపవాసము చేయతగదు గానీ
(20) పెండ్లి కుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు.
కొందరు ఏసువద్దకు వచ్చి ''యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసము చేయుదురుగానీ, నీ శిష్యులు ఉపవాసము చేయరు దానికి కారణమేమని'' ఏసును అడుగగా ఏసు పై వాక్యములను చెప్పియున్నాడు. ఉపవాసము అనగా ఆహారమును తీసుకోకుండా ఉండడమని ఇక్కడ అర్థము. ఇది సర్వసాధారణ ప్రపంచ అర్థముగా యున్నది. ఈ వాక్యములో విశేష అర్థముతో కూడుకొన్న పదము పెళ్ళి కుమారుడు. ఈ పదమును ఆధ్యాత్మిక అర్థముతో చెప్పుకొంటే పెళ్ళి అనగా దేవుడు అని అర్థము గలదు. దానిప్రకారము పెళ్లి కుమారుడు అనగా! దేవుని కుమారుడు అని అర్థము. దేవుని కుమారుడు అయిన ఏసు తమతో యుండగా దేవుని కుమారుని వద్ద యున్నవారు సంతోషముతో యుందురు కావున ఉపవాసము ఉండరు. పెళ్లి కుమారుని (దేవుని కుమారుని) తమవద్ద నుండి ఇతరులు బలవంతముగా తీసుకొని పోయినప్పుడు దేవుని కుమారుని వద్ద యున్న వారందరూ ఆయన తమవద్ద నుండి లేకుండా పోవుచున్నాడే యను బాధతో అన్నము తినకుండా ఉపవాసముందురు. అదే విధముగా మనుష కుమారునిగా చెప్పుకొనుచూ దేవుని కుమారుడైన ఏసు తమవద్ద యున్నంత కాలము ఏసు శిష్యులు సంతోషముతో యుందురు కావున ఉపవాస ముండరు. ఏసు తమవద్ద లేకుండా పోయినప్పుడు దిగులుతో ఉపవాస ముండవచ్చును. పెళ్లి కుమారుడు అనగా దేవుని కుమారునిగా అర్థము చేసుకోవలెను.
మార్కు సువార్త :(2) మార్కు సువార్త, 4వ అధ్యాయము, 38, 39 వచనములు.
(38) ఆయన (ఏసు) దోనె అమరమున తలగడ మీద (తలవాల్చుకొని) నిద్రించుచుండెను. వారు (శిష్యులు) ఆయనను లేపి బోధకుడా! మేము నశించిపోవుచున్నాము నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి.
(39) అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను.
ఏసును ఆయన శిష్యులును సముద్రము మీద చిన్న పడవను ఎక్కి ప్రయాణించుచుండగా కొంత దూరము పోయిన తర్వాత వారి పడవ తుఫానులో చిక్కుకొనెను. వారి పడవ తుఫానులో యున్నందువలన, పడవ మీదికి అలలు కొట్టినందువలన పడవ నీటితో నిండి పోయెను. అప్పుడు ఏసు శిష్యులు భయపడిపోయి తాము సముద్రములో మునిగిపోతామని తలచి ఆందోళన చెందినవారై ఏసును లేపి పడవ తుఫానులో చిక్కుకొన్నదని, అది మునిగిపోయే ప్రమాదముందని, దాని వలన అందరూ జలసమాధి అగుదుమని చెప్పగా ఏసు లేచి అల్లకల్లోలముగా యున్న సముద్రమును, వేగముగా వీచు తుఫానును గద్దించి ఆగిపొమ్మని చెప్పగా, ఆ ఒక్క మాటతోనే తుఫాను లేకుండాపోయి సముద్రము ప్రశాంతముగా మారిపోయెను. ఇది పెద్ద వింత అయినా ఎందుకు అలా జరిగినది? అని అక్కడున్న వారికి ఎవరికీ అర్థము కాలేదు. ఏసు మహిమగలవాడని వారు చెప్పుకొనిరిగానీ అలా జరుగుటకు కారణమైన విషయము వారికి తెలియదు. అక్కడ జరిగిన సంఘటనను గురించి చెప్పుకొంటే ఎంతో విశేషమైన జ్ఞానము తెలియును, అది ఏమనగా!
ఏసు సామాన్యమైన మనిషికాడు. అయినా ఆయన సర్వ సాధారణముగా కనిపించుచూ మనిషివలె ప్రవర్తించు దేవుడని చెప్పకతప్పదు. పరిశుద్ధాత్మయిన దేవుడు మానవ ఆకారములోనికి వచ్చినప్పుడు ఆయన ఎవరికీ గుర్తింపబడడు. ఆయన ఫలానావాడని ఎవరూ చెప్పలేరు. దేవుని జన్మ మానవునిగా యున్నప్పుడు అత్యంత రహస్యముగా ఉండును. ప్రపంచ బుద్ధితో ఆయనను ఎప్పటికీ, ఎవరూ తెలియలేరు. ఆయనను జ్ఞానము వలననే తెలియుటకు అవకాశముండును. జ్ఞానము వలన దేవుని అవతారమును రెండు విధములుగా తెలియవచ్చును. ఒకటి ఎవరూ చెప్పని దేవుని ధర్మములు శాస్త్రబద్ధముగా ఎక్కడ తెలియబడుచున్నవో అక్కడ దేవుని అవతారము ఉందని తెలియవచ్చును. రెండవది ఎక్కడ ప్రకృతి శాసించ బడుచున్నదో అక్కడ పరమాత్మ మనిషి ఆకారములో ఉన్నాడని చెప్పవచ్చును. ఈ రెండు విధానముల ప్రకారము కాకుండా వేరు విధముగా ఎవరూ దేవుని అవతారమును గుర్తించలేరు. త్రైతాయుగములో రావణబ్రహ్మకు దేవతలు నమస్కరించారు. ఆయన నవగ్రహములను శాసించగలిగినప్పుడు ఆయన సాధారణ మనిషి కాదని తెలిసింది. రావణబ్రహ్మ ఎవరికీ తెలియని దైవ ధర్మములను బోధించడమేకాక వాటిని ప్రజల చేత ఆచరింపజేశాడు. అందువలన రావణబ్రహ్మ దేవుని అవతారమని తెలిసినది. అట్లే ద్వాపర యుగములో కృష్ణుడు సూర్యున్ని శాసించి ఒక విధముగా, భగవద్గీతలో ధర్మములను బోధించి మరొక విధముగా దేవుని అవతారమని తెలియబడి నాడు. రెండు వేల సంవత్సరముల పూర్వము మనిషిగా వచ్చిన ఏసు సముద్రమును శాసించి ఒక రకముగా, దైవ ధర్మములను బోధించి మరొక రకముగా దేవుడని గుర్తించబడినాడు. ఏసు ఎవరయినది ప్రజలకు తెలియుటకే సముద్ర ప్రయాణములో తుఫాను లేచిందని అర్థమగుచున్నది. ఈ విధముగా దేవుని అవతారము రహస్యమైనది యైనా తెలియుటకు కూడా అవకాశమును దేవుడే కల్పించాడు.
మార్కు సువార్త :(3) మార్కు సువార్త, 5వ అధ్యాయము, 38, 39, 40, 41, 42, 43 వచనములు.
(38) సమాజ మందిరపు అధికారి యొక్క ఇంటికి వచ్చి వారు గుంపుగాయుండి ఏడ్చుట చూచి
(39) లోపలికి పోయి మీరేల గొల్లుచేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదేగానీ చనిపోలేదని వారితో చెప్పెను.
(40) అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి, ఆ చిన్నదాని తల్లితండ్రులను తనతో యున్నవారిని వెంటపెట్టుకొని ఆ చిన్నది పరుండిన గదిలోనికి వెళ్లి
(41) ఆ చిన్నదాని చేయిపట్టి ''తలీతాకుమీ'' అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు ''చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని'' అర్థము.
(42) వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె పడ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు చాలా విస్మయమొందిరి.
(43) జరిగినది ఎవరికీ తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.
చనిపోయిన మనిషి తిరిగి బ్రతకడము అందరికీ గొప్ప ఆశ్చర్యకరమైన విషయమే. ఏసు తన జీవితములో చనిపోయిన వారిని లేపాడు. ఇతరులను ఆయన లేపడమేకాక, ఆయనే స్వయముగా చనిపోయి బ్రతికివచ్చిన సంఘటన కూడా జరిగినది. ఇది ఎలా జరిగినదని ఆలోచిస్తే, కొంత తెలియని రహస్యము తెలియుచున్నది. అది ఏమనగా! మరణము అనునది నాలుగు రకములు గలదు. 1) కాలమరణము 2) అకాల మరణము 3) తాత్కాల మరణము 4) ఆఖరీ మరణము. ఆఖరీ మరణమును పొందినప్పుడు అతడు తిరిగి పుట్టడు. అతడు ఆఖరీ మరణముతో మోక్షమును పొందును. అట్లే మొదటిదయిన కాలమరణము సర్వ సాధారణముగా జరుగుచుండును. కాలమరణము వలన మనిషి ప్రస్తుత శరీరమును వదలి రెండవ జన్మకు పోవును. కాలమరణములో రెండవ జన్మకు పోవడము తప్ప ఇతర దారి ఉండదు. ఇకపోతే అకాల మరణము వలన మనిషి పూర్తి చనిపోక సగము శరీరమును మాత్రము కోల్పోయి సగము శరీరముతో బ్రతికియుండును. ఇది కొంత ఆశ్చర్యముగా యున్నా జరుగుచున్న సత్యము అంతే.
మనిషికి శరీరము రెండు భాగములుగా గలదు. మనిషికే కాదు మిగతా జీవరాసుల శరీరములు కూడా స్థూల, సూక్ష్మ అను రెండు రకములు గలవు. మనిషి శరీరములో పది భాగములు స్థూల శరీరముగా, పదిహేను భాగములు సూక్ష్మశరీరముగా యున్నది. మనిషి అకాల మరణమును పొందినప్పుడు పది భాగములు గల స్థూల శరీరమును వదలి పదిహేను భాగముల సూక్ష్మ శరీరముతో జీవించుచుండును. అందువలన అకాల మరణమును పొందిన వానిని సగము చచ్చినవాడు యని చెప్పవచ్చును. మిగిలియున్న సూక్ష్మ శరీరము పూర్తిగా మరణించినప్పుడు కాలమరణ మగును. అప్పుడు వాడు రెండవ జన్మకు పోవును. కాల మరణము రాకుండా అకాల మరణముతో చనిపోయినవాడు కనిపించక బ్రతుకుచుండును. అతడు కాలమరణము వచ్చు వరకు అట్లే యుండును. ఇకపోతే తాత్కాల మరణము మాత్రము ఇంతవరకూ ఎవరికీ తెలియనిదిగా యున్నది. తాత్కాల మరణములో మనిషి శరీరములో అన్ని కార్యములు నిలిచిపోవును. అయినా మనిషి శరీరములోని జీవుడు బయటికి పోకుండా శరీరములోనే అణిగియుండును. శరీరములో అణిగియున్న జీవుడు నిద్రలో మునిగి యుండును. తాత్కాల మరణములో మనిషి చనిపోకుండా అతని ప్రాణము శరీరములోనే అణిగి యుండుట వలన ఆ మనిషి పైకి మాత్రము చనిపోయినట్లే కనిపించుచుండును. అలా కనిపించుట వలన అతనిని చనిపోయిన వానిక్రింద జమకట్టి అతని శరీరమును పూడ్చి పెట్టిన సంఘటనలు చాలా జరిగినవి. తాత్కాల మరణములో అతడు చనిపోలేదు అని ఎవరూ గుర్తించలేరు. అందువలన చాలామంది ప్రాణముతోయున్నా వారిని పూడ్చిపెట్టడము జరిగినది. కొన్ని జరిగిన ప్రత్యక్ష సంఘటనలను క్రింది పేజీలలో ఇస్తున్నాము చూడండి.
(జమ్ముకాశ్మీర్‌లోని అబ్దుల్ అజీజ్ కథ)
2009 డిశంబర్ 7వ తేదీన టీవీ9 లో మధ్యాహ్నము 1-30 నిమిషములకు ఒక కథనము ప్రసారమైనది. అదేమనగా! అప్పటికి వారము రోజుల క్రితము అనగా 2009 నవంబరు, 30వ తేదీన జమ్ము కాశ్మీరులోని 'రాజౌరి' అను గ్రామములో అబ్దుల్ అజీజ్ అను 60 సంవత్సరముల వృద్ధుడు చనిపోయాడు. అతను ముస్లీమ్ అయిన దానివలన ఇస్లామ్ సాంప్రదాయము ప్రకారము అతనిని భూమిలో పూడ్చిపెట్టడము జరిగింది. అతనిని పూడ్చిపెట్టిన మూడు రోజులకు అతను సాధారణముగా చనిపోలేదనీ, ఎవరో హత్య చేశారని ఆరోపణ పోలీసులకు చేరింది. వెంటనే పోలీసులు కేసు వ్రాసుకొని స్మశానానికి పోయి అబ్దుల్ అజీజ్ శవమును బంధువుల సమక్షములోనే వెలికి తీశారు. వెలికి తీసిన అబ్దుల్ అజీజ్ శరీరమును పోస్టుమార్టమ్ (శవపరీక్ష) కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అందులోని డాక్టర్ శవపరీక్ష చేయను మొదలు పెట్టాడు. మొదట తల భాగమును పరీక్షించుటకు తలమీద చర్మమును తీయుటకు కత్తితో తలమీద కొట్టడము జరిగింది. తలమీద గాయమైంది. అప్పుడు అందరికీ ఆశ్చర్యమగునట్లు అంతవరకు చనిపోయిన అబ్దుల్‌అజీజ్ లేచి కూర్చొని ''నన్నేమి చేయుచున్నారని'' ప్రశ్నించాడు. అలా అతను లేచి అడుగడము డాక్టర్‌కు నమ్మశక్యము కాలేదు. అయినా డాక్టరు తేరుకొని అతను అడిగిన ప్రశ్నకు 'నిన్ను శవపరీక్ష చేయుచున్నామని' చెప్పాడు. దానికి అబ్దుల్‌అజీజ్ 'నేను బ్రతికే ఉన్నానుకదా!' అని అన్నాడు. అంతలో డాక్టర్‌గారు అబ్దుల్‌అజీజ్ యొక్క బంధువులకు విషయమును తెలుపగా, బయటనున్న బంధువులు వచ్చి ఆయనను తీసుకుపోవడము జరిగినది. మూడు రోజుల క్రిందట అబ్దుల్ అజీజ్ చనిపోయినపుడు పదిహేను నిమిషముల తర్వాత పరీక్షించి, చూచి అతను చనిపోయాడని చెప్పాననీ, అజీజ్ విషయములో అద్భుతము జరిగిందని డాక్టరు చెప్పడము జరిగింది. రాజౌరి గ్రామ ప్రజలు కూడా తమ చేతులతో పూడ్చిపెట్టిన అబ్దుల్‌అజీజ్ మూడు రోజుల తర్వాత బ్రతికి రావడమేమిటని ఆశ్చర్యమును వ్యక్తము చేశారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి కేవలము ఆరు సంవత్సరముల ఏడు నెలలు మాత్రమే అవుతుంది. ఈ విషయమును అందరికీ తెలిసేలాగ ఆ రోజే టీవీ ఛానళ్ళు అన్నీ ప్రసారము చేశాయి. ఈ సంఘటన కూడా డాక్టర్ల సమక్షములోనే జరిగింది. కావున ఎవరూ దీనిని ఖండించడానికి గానీ, మూఢ నమ్మకమనుటకు గానీ వీలులేదు.
(విశాఖ జిల్లాలో జరిగిన ఒక సంఘటన)
విశాఖజిల్లాలో అరకు లోయకు పోవు దారిలో 'శృంగవరపు కోట' అను ఊరు కలదు. శృంగవరపు కోట మండలమునందు అక్కడికి 12 కిలోమీటర్ల దూరములో 'సారెపురము' అను గ్రామము కలదు. సారెపురము గ్రామములో 67 సంవత్సరముల వయస్సున్న 'సముద్రమ్మ' అను పేరుగల ఆడ మనిషి ఉండేది. ఆమెకు దాదాపు పది సంవత్సరముల నుండి హై బిపి. మరియు షుగర్ వ్యాధి ఉండేవి. ఆమె శృంగవరపు కోటలోని సీనియర్ డాక్టరయిన ధర్మలింగాచారి వద్ద వైద్యము చేయించుకొనేది. ఎం.బి.బి. యస్ డాక్టరు ధర్మలింగాచారిగారు మంచి పేరుగాంచిన దాదాపు 60 సంవత్సరముల వయస్సుగల అనుభవజ్ఞుడు. ఇప్పటికి 6 సంవత్సరముల పూర్వము ఒకరోజు సాయంకాలము 6 గంటల సమయములో సముద్రమ్మను డాక్టరు ధర్మలింగాచారి వద్దకు తీసుకరావడము జరిగినది. అంతకుముందే ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిందని చెప్పిన తర్వాత అక్కడికి తీసుక వచ్చారు. అప్పుడు డాక్టరు గారు ఆమెను చూడగా ఆమె శరీరములో బి.పి గానీ, నాడిగానీ ఏమాత్రము లేదు. ఆమె శ్వాసగానీ, నాడి (పల్స్) గానీ ఏమాత్రము లేనందున ఆమెను చనిపోయినట్లు నిర్ధారించిన డాక్టరు ''ఇంటికి తీసుకెళ్ళండి, ఈమె చనిపోయింది, ఈమెకు వైద్యము అవసరము లేదు'' అన్నాడు. అప్పుడు వారు 12 కిలోమీటర్ల దూరములోనున్న వారి గ్రామమునకు తీసుకెళ్ళారు. అప్పటికే రాత్రి అయినందున ఉదయమే ఆమెను పూడ్చాలనుకొన్నారు. తెల్లవారగానే వర్షము ప్రారంభమై రెండు రోజులు ఏమాత్రము వదలకుండా కురియుచుండుట వలన బయటికి పోయేదానికి అవకాశమే లేకుండా పోయింది. సముద్రమ్మ శవాన్ని అలాగే మూడురోజులు వరండాలోనే ఉంచారు. మూడు రోజుల తర్వాత నాల్గవ రోజు ఉదయము ఆమె లేచి కూర్చొని అందరినీ పిలిచిందట. అప్పుడు ఆమె బంధువులు ఆమె బ్రతికినట్లు గ్రహించి, వెంటనే డాక్టరు ధర్మలింగాచారి గారికి ఫోన్ చేయడము జరిగింది. పదిహేను రోజులు గడచిన తర్వాత ఆమెను డాక్టరుగారి దగ్గరకు తీసుకరావడము జరిగింది. అప్పుడు డాక్టరు ''నీవు చనిపోయి మూడురోజులు అట్లే ఉన్నావు కదా! అప్పుడు నీకు యమభటులు గానీ, యమలోకము గానీ ఏమైనా కనిపించారా?'' అని అడిగాడు. దానికి ఆమె ''నాకు ఏమీ కనిపించలేదు'' అని చెప్పిందట. ఈ సంఘటన కూడా ఒక డాక్టరు సమక్షములో ఆరు సంవత్సరముల క్రిందట జరిగినది. అందువలన దీనిని కూడా ఎవరూ కాదనుటకు గానీ, మూఢనమ్మక మనుటకు గానీ వీలులేదు. (మరో సంఘటన గూర్చి ప్రక్కపేజీలో చూడండి.)
ఎక్కడయినా తాత్కాల మరణము పొందినవాడు చనిపోయినట్లు కనిపించినా అతడు ఒక సంవత్సరమువరకు గానీ లేక అంతకంటే ఎక్కువ కాలముగానీ బ్రతికియుండుటకు అవకాశము గలదు. అటువంటివాడు ఎప్పుడయినా తనకుతానుగా గానీ, లేక ఇతరులు తట్టి లేపితేగానీ తిరిగి బ్రతుకుట అవకాశము గలదు. తాత్కాల మరణము పొందినవారు అనేక చోట్ల ఉదయము చనిపోయి సాయంకాలము లేచినవారుగలరు. ఒక వారమునకు లేచినవారుగలరు. ఈ మధ్య కాలములో చితిమీద పెట్టబడిన ముత్తుస్వామి అను వ్యక్తి బ్రతికి లేచి కూర్చోవడము తమిళనాడులో జరిగినది. ఆ విధముగా తాత్కాల మరణము పొందిన బాలికను ఏసు గుర్తించి ఆమె చనిపోలేదు అని చెప్పి ఆమెను తట్టి లేపాడు. అలాగే ఏసు స్వయముగా చనిపోయి బ్రతికి వచ్చినట్లు చరిత్ర కలదు. ఇదియంతయూ తాత్కాల మరణము వలన జరిగినదేయని తెలియవలెను. మరణములను గురించి నాల్గు రకముల మరణములు కలవని వాటి వాస్తవికతను మా రచనలలోని ''మరణ రహస్యము'' అను గ్రంథములో వ్రాశాము. దానిని చూస్తే విషయము సంపూర్ణముగా తెలియును.
మార్కు సువార్త :(4) మార్కు సువార్త, 7వ అధ్యాయము, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 వచనములు.<
15) వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదుగానీ, లోపలి నుండి బయలు వెళ్లునవే
16) మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.
17) ఆయన జన సమూహములను విడచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయనను అడుగగా
18) ఆయన వారితో ఇట్లనెను. ''మీరును ఇంత అవివేకులైయున్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునది ఏదియూ వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?''
19) ''అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనికి ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్రపరచును.''
20) ''మనుష్యుని లోపలినుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్ర పరచును.''
21) లోపలి నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలును, జారత్వమును, దొంగతనములును
22) నరహత్యలును, వ్యభిచారమును, లోభములును, చెడుతనములును, కామ వికారమును, మత్సరమును, దైవదూషణయును, అహంభావమును, అవివేకమును వచ్చును.
23) ఈ చెడు పనులన్నియు లోపలి నుండి బయలు వెళ్లి మనుష్యుని అపవిత్ర పరచునని ఆయన చెప్పెను.
మనిషి పుట్టుకలోనే మనిషి తలయందు ఆరు చెడు గుణములు, ఆరు మంచి గుణములు నింపబడియుండును. మనిషి పెరిగేకొద్ది గుణములు కూడా పెరుగుతావచ్చును. గుణములు శరీరములోనే తల యందుగల బుద్ధిని చేరి బుద్ధిని ప్రేరేపించి బుద్ధి ఆజ్ఞ వలన బయట పనులు జరుగునట్లు గలదు. శరీరము బయట కార్యములను చేయు కర్మేంద్రియములకు బుద్ధి సూచనలిచ్చి పనిని చేయించుచుండును. బుద్ధి గుణానుసారిణి అన్నట్లు మనిషిలోని చెడు గుణములు బుద్ధిని ప్రభావితము చేయుట వలన బుద్ధి గుణముల పనులనే ఆదేశించగా బయటి ఇంద్రియములు బుద్ధి ఆదేశము ప్రకారము చేయుచుండును. మనిషిలో యున్న చెడు గుణములు కామము (ఆశ), క్రోధము (కోపము), లోభము (పిసినారి తనము), మోహము (నాది నా వారు అనడము), మదము (గర్వము), మత్సరము (అసూయ) అను దురాలోచనలు ఈ గుణముల వలననే వచ్చుచుండును. మొదట బుద్ధిని చేరిన గుణములు అక్కడి నుండి శరీరమునకు ఆదేశించును. ఏదయినా బుద్ధి ద్వారానే రావలసియున్నది. మనుషులు చేయు దురాగతములన్నియు లోపలే గల గుణముల వలన వచ్చుచున్నవే యని తెలియవలెను.
మనిషి బయటి నుండి తీసుకొను ఆహారము శరీర ఆరోగ్యమునకు పనికి వస్తున్నదిగానీ బుద్ధిని ప్రేరేపించదు. ఆహారము నేరుగా శరీరమునకు పోషక పదార్థములుగా ఉపయోగపడి మనిషిని ఆరోగ్యముగా ఉండునట్లు చేయుచున్నది. మనిషి తిను ఆహారము బుద్ధితో ఏమాత్రము సంబంధపడదు. ఆహారము శరీరములోనికి పోయి మనిషి ఆరోగ్యము మీద పని చేయుచున్నది. ఆహారము శరీరమునకు ఉపయోగపడగా, శరీరము బలముగా ఆరోగ్యముగా ఉంటున్నది. అందువలన బయట నుండి శరీరములోనికి పోవు ఆహారము వలన మనిషికి ఎటువంటి చెడు ప్రవర్తన రాదు. శరీరము నుండి బయటికి వచ్చు గుణముల ప్రభావముల వలన మనిషిలో చెడు ప్రవర్తన కలుగుచున్నదని తెలియవలెను. అందువలన ఆహార నియమములు పాటించకున్ననూ ఫరవాలేదు, గుణముల నియంత్రణను కల్గియుండవలెను.
మార్కు సువార్త :(5) మార్కు సువార్త, 3వ అధ్యాయము, 35వ వచనము.
(35) ''దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సోదరుడు, సహోదరి మరియు తల్లియు'' అని చెప్పెను.
దేవుని చిత్తము అనగానేమి? అని మొదట ప్రశ్నించుకొని పరిశీలించి చూచిన ఎడల దేవుడు తెల్పిన ఆజ్ఞలే ఆయన చిత్తమని మనకు తెలియుచున్నది. ఆయన ఆజ్ఞ (ధర్మము)లకు లోబడి ఉంటే దేవుని చిత్తానుసారము మనుషులున్నట్లే, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా మన ఇష్టమొచ్చి నట్లుండడము ఆయన ఆజ్ఞలను అతిక్రమించి సాతాను ఇష్టము ప్రకారము నడచినట్లగును. దేవుని అంశ భగవంతుడై భూమిమీద అవతరించినప్పుడు దేవుని జ్ఞానము తెలిసినవారు, ఆయన జ్ఞానము ప్రకారము నడుచువారు, దేవుని జ్ఞానమును గూర్చి, ఆయన ఆజ్ఞల గూర్చి తెలియజేయువారు భగవంతునికి సన్నిహితులగుచుందురు. సాతాను మార్గములోనున్న వారందరూ భగవంతునికి శత్రువులుగా తయారగుచుందురు. భగవంతునికి సన్నిహితులుగా తయారై దేవుని వాక్యములను ప్రచారము చేయుచూ దేవుని ఆజ్ఞలకు అనుగుణముగా నడుచు వారందరూ ఆయనకపుడు సోదరి, సోదరులుగా మిక్కిలి దగ్గరవారుగా లెక్కించబడి ఉందురు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు కానీ, లేనప్పుడు కానీ ఆయన గీచిన హద్దు ఆజ్ఞలకు లోబడి ఉండు జ్ఞానులు దేవునికి సన్నిహితులుగానే లెక్కించబడుదురని తెలియాలి.
మార్కు సువార్త :(6) మార్కు సువార్త, 4వ అధ్యాయము, 17వ వచనము.
(17) ''కొంత కాలము వారు నిలుతురుగానీ వాక్యము నిమిత్తము శ్రమయైనను, హింస అయినను కలుగగానే అభ్యంతరపడుదురు.''
నా మీద భక్తిగలవారు 1) అర్తులు, 2) అర్థార్థులు, 3) జిజ్ఞాసులు, 4) జ్ఞానులు అను నాల్గు రకములవారు గలరని వారిలో చివరి రకమైన జ్ఞానులంటే నాకిష్టమని గీతలో కూడా చెప్పినట్లు ఇక్కడ కూడా నాల్గు రకముల భక్తులను ప్రభువు చెప్పుచూ అందులో ఒక రకమైన వారిని గూర్చి చెప్పిన మాట ఇది. దేవుని జ్ఞానము తెలుసుకోవాలను జిజ్ఞాస కలవారు కొందరు వాక్యమును విని దానిప్రకారము ఉండవలెనని అనుకొందురు. అటువంటివారిని సాతాను తన పద్ధతిలో తాను శోధింప మొదలు పెట్టును. ఆ శోధనలో ప్రపంచ సంబంధమైన ఒడిదుడుకులు ఎన్నో కలుగుచుండును. అప్పటికే వారు కొంత ఓర్చుకొని ఉందురు. జ్ఞానము వలన కొద్ది శ్రమ కల్గినప్పుడు, సాతాను వారి తలలో బోధించను మొదలు పెట్టును. నీవు జ్ఞానము తెలుసుకొనుట వలననే కదా! నీకు ఈ శ్రమ ఏర్పడినది, నీవు తెలివితక్కువగా ఉండక, తెలివి ఉపయోగించి పైకి జ్ఞానమార్గములో ఉన్నట్లే కనిపిస్తూ, వచ్చే శ్రమలను తప్పించుకోమని బోధిస్తుంది. జ్ఞానము యొక్క సారము పూర్తి తెలియని మనిషి దానిప్రకారమే నడుచుకొనుటకు మొదలు పెట్టును. తర్వాత కొంత కాలమునకు జ్ఞానము ద్వారా కానీ, జ్ఞానము బోధించు గురువు ద్వారా కానీ సమస్యలొచ్చి ఇతరులతో తగాదా పడవలసి వచ్చినప్పుడు ఇతరులు తమను హింసింతురే మోనని ఆలోచన వచ్చినప్పుడు మాయకు మంచి అవకాశము దొరికినట్లగును. అప్పుడు ఈ విధముగా వాని తలలోనే తలంపులొచ్చునట్లు చేయును. నేను మొదటినుండి తెలివిగా ఉంటే బాగుండేది. దగ్గరి బంధువులు చెప్పినా అప్పుడు వినక గురువు, జ్ఞానము అని గురువును వెంబడించుట వలన ఈ పరిస్థితి ఏర్పడినది. ఈ జ్ఞానము కొరకు నేనెందుకు ఇతరులతో దెబ్బ తినాలి? ఇంతటితో ఈ జ్ఞానము, గురువు, సహవాసము విడిచి పెట్టేది మంచిది. జ్ఞానమని మూర్ఖముగా పోతే చివరకు మనమే దెబ్బతినేది. మన సంసారాలు దీనివలన చెడిపోతాయి. ప్రపంచములో ఉన్నాము కనుక ప్రపంచము ప్రకారము పోవడము మన కర్తవ్యము. అడవులలో ఉండేవారికయితే ఏ సమస్యలూ ఉండవు, వారు ఎట్లు నడుచుకొనినా ఫరవాలేదు. మనము ఊర్లలో ఉండి జ్ఞానమంటూ అందరికీ విరుద్ధముగా పోతే అది మన తెలివి తక్కువే అవుతుంది అని వారి తలలో మెదలి అప్పటి నుండి జ్ఞానమును వదలి దూరముగా ఉండుటకు ప్రయత్నించుదురు. అందువలన జ్ఞానమార్గములో కొంత కాలమున్నవారు కూడ జ్ఞానము నిమిత్తము శ్రమయైన, హింసయైన కలుగగానే అభ్యంతర పడుదురని తెలిపాడు.
పూర్తి జ్ఞానము తెలిసి దేవుని యొక్క విలువ తెలిసినవాడు సాతాను లోపల ఎంత శోధించినప్పటికీ దానికి లొంగడు. జ్ఞానమార్గములో శ్రమనే కాదు ఇతరులు తనను హింసించుదురని తెలిసినా, వారి చేత తాను చంపబడుదునని తెలిసినా (వెంటనే తమ స్వార్థమును పెంచుకొనక) జ్ఞానమును గురువును తనకు సంబంధము లేనివారిగా తలచక, అందరికంటే ప్రపంచములో భార్యకంటెను, సన్నిహితులకంటెను, చివరకు తన ప్రాణము కంటే విలువైనదిగా జ్ఞానమును, గురువును తలచితేగానీ సాతాను బారినుండి తప్పించుకోలేము. సాక్ష్యాత్తు దేవుని అంశ అయిన ప్రభువు చెంతనున్న శిష్యులే ఆనాటి రక్షక భటులను చూచి భయపడి తమ ప్రాణాలు రక్షించుకొను నిమిత్తము తమ గురువునే వదలి పరిగెత్తి పోయారు. ఆనాటి శ్రమకు, హింసకు వారు భయపడి పారిపోయారనే అర్థమగుచున్నది. ఆ దినము తమ గురువయిన ప్రభువుతో పాటు మరణమునకైన సిద్ధపడి ఉంటే వారి జీవితమే ధన్యమయ్యేది. ఆనాడు ప్రభువు శిష్యులనే మాయ శోధించి వారి మార్గములో పూర్తి సాఫల్యము కాకుండా చేసింది. మనము అలా కాకుండా జ్ఞానమార్గములో శ్రమగానీ, హింసగానీ వచ్చిన ఎడల ఎదురొడ్డి నిలవాలి. అజ్ఞాన మార్గములో 'భయము' అను మాయ యొక్క మాట విని ఎక్కువ కాలము జీవించుటకంటే, దైవ జ్ఞానమార్గములో మరణమును కూడా లెక్క చేయనివాడు ధన్యుడు. ఈ మాటను భగవద్గీతలో ''పరధర్మమైన సాతాను మార్గములోని భయముకంటే స్వధర్మమైన పరమాత్మ ధర్మములో మరణించుట మేలని'' ప్రభువు చెప్పాడు.
మార్కు సువార్త :(7) మార్కు సువార్త, 4వ అధ్యాయము, 21, 22 వచనములు.
(21) దీపము దీప స్థంభము మీద ఉంచబడుటకే గానీ కుంచము క్రిందనైనను, మంచము క్రిందనైనను నుంచుటకు తేబడదు గదా!
(22) రహస్యమేదయినను తేటపరచక పోదు. బయలు పరచబడుటకే గానీ ఏదియు మరుగు చేయబడలేదు.
ప్రస్తుత కాలములో చాలామంది గురువులు, శిష్యులు తమ జ్ఞానమును ఇతరులకు చెప్పుటకు వీలులేదని చెప్పుచుందురు. తమ జ్ఞానము రహస్యమనియో, ఇతరులకు చెప్పకూడదనియో, మా వద్ద ఉపదేశము తీసుకొన్నవారికి మాత్రమే చెప్పుదుమనియో చెప్పుచుందురు. వారిని ఎవరైనా ప్రశ్నలడిగినప్పుడు చెప్పను చేతకాక ఇలా తప్పించుకోజూచుచుందురు. జ్ఞానమనునది మరుగుపరచబడునది కాదు. దానిని తెలియజేయుటకు దేవుడే మానవాకృతిలో వచ్చి కష్టాలుపడి తెలియజేయుచుండగా, జ్ఞానము యొక్క నిజ స్థితి తెలియని మనము వచ్చీరాని జ్ఞానమును కూడా ఇతరులకు చెప్పకుండా సాకులు చెప్పడము మంచిదేనా యోచించండి. జ్ఞానమనునది ఇతరుల అజ్ఞాన చీకటిని తొలగించు దీపములాంటిది. చీకటిలోని వస్తువు దీపము వెలుతురులో తెలియునట్లు అజ్ఞానములో తెలియని విషయము జ్ఞానముతో తెలియబడుచున్నది. చీకటిని పోగొట్టుటకు దీపము అవసరమైనట్లు అజ్ఞానమును పోగొట్టుటకు జ్ఞానము అవసరము. దీపమును వెలుతురు కోసమే వెలిగించి గంప క్రింద మూసి పెట్టడము ఎంత అవివేకమో, జ్ఞానము తెలిసినవాడు ఇతరులకు చెప్పకుండా దాచిపెట్టడము అంతే తెలివి తక్కువగును. రహస్యమనునది కూడా తప్పక బయటపడుటకే ఉన్నది. ప్రపంచములో ఉత్తమోత్తమయిన దైవజ్ఞానము భగవంతుని ద్వారా బయలు పరచబడినది. అటువంటప్పుడు జ్ఞానముకంటే తక్కువ స్థాయిగలవి ఏవైనా మరుగు పరచబడబోవు. ప్రపంచములో రహస్యమనునదేదీ గుప్తముగా ఉండదు, అది తప్పనిసరిగా బయటపడ గలదు. దైవజ్ఞానము సర్వులకూ అవసరమైనది. అది రహస్యముగా ఉండకూడదు. అలా మూసి పెట్టవలెననుకొనువారు మూసిపెట్టలేరు.
మార్కు సువార్త :(8) మార్కు సువార్త, 6వ అధ్యాయము, 4వ వచనము.
(4) ప్రవక్త తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటివారి లోను తప్ప ఎక్కడా ఘనహీనుడు కాడు.
'వక్త' అనగా వ్యక్త పరచువాడని లేక తెలియజేయువాడని అర్థము. 'ప్ర' అనగా ముఖ్యమైన జ్ఞానమని, పెద్దదని, గొప్ప విశేషత కలదని అర్థము. 'ప్రవక్త' అనగా ముఖ్యమైన దానిని బోధించువాడని అర్థము. ప్రతి మనిషికీ అతి ముఖ్యమైనది పరమాత్మ జ్ఞానము. పరమాత్మ జ్ఞానమును బోధించువాడే ప్రవక్త అని పిలువబడును. పరమాత్మ జ్ఞానము పరమాత్మ నుండి వచ్చిన వానికే తెలియును తప్ప సాధారణ మనుషులకు తెలియదు. పరమాత్మ నుండి వచ్చి మనిషిగా పుట్టినవాడే భగవంతుడని, ప్రవక్త అని పిలువబడుచున్నాడు. ప్రవక్త కూడా సాధారణ మనిషిలాగ ఉండుట వలన తన ఇంటివారిలోను, బంధువులలోను తన దేశములోను ప్రశంసింపబడడు. ఎంత గొప్పవారైనా ఇంటిలోను, బంధువులలోను చిన్నచూపు చూడబడుట సహజము. చిన్నతనము నుండి అతనిని చూచుట వలన ఇంటివారిలోను, బంధువులలోను వీనిలో ఏమి క్రొత్తదనమున్నదని, వీడు చెప్పు మాటలు తెలివి తక్కువగా వినేవారికే సరిపోవునని, మాకు తెలియకుండా వీనికేమి తెలుసునని హేళనగానే చెప్పుకొనుచుందురు. ఇంటిలోని వారికి దేవుడయినా ప్రవక్త కాలేడు. ఎందుకనగా! వ్యక్తి మీద వారికి గొప్పతనము ఏమాత్రము ఉండదు. ఇతరులు ప్రవక్తను గుర్తించి ఈయన గొప్పవాడని ఘనముగా చెప్పిననూ ఇంటిలోనివారు బంధువులు వీనిలో ఏమి గొప్పతనము ఉన్నది? చిన్నతనములో పరుపులో మూత్రము పోసేవాడనో, నిక్కరులో మలవిసర్జన చేసేవాడనో చెప్పి హేళనగా మాట్లాడుదురేగానీ వ్యక్తిలోని ప్రాముఖ్యత గమనించరు. అందువలన ప్రవక్త ఇతర ప్రజలకే ప్రవక్త గానీ తనవారి యందును, తన ఊరి యందును ఘనపరచబడడు. ఈ సూత్రము ప్రకారము ఏసుప్రభువును ప్రవక్తగా తనవారు గుర్తించ లేకపోయారు.