pss book: ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు:లూకా సువార్త Full
ద్వితీయ దైవగ్రంథములో
రత్నవాక్యములు
(1) లూకా సువార్త, 2వ అధ్యాయము, 49వ వాక్యము.
(49) ఆయన ''మీరేల నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా'' అని వారితో చెప్పెను.
ఏసు తల్లితండ్రులు ఏసు కొరకు వెదకుచూ వచ్చి ఒకచోట ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి ''కుమారా! మమ్ములను ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు, నేనును దుఃఖపడుచూ నిన్ను వెదకుచుంటిమనగా, దానికి ఏసు బదులుగా ''మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా'' అని అన్నాడు. ఇక్కడ వెదకుచూ వచ్చిన వారిలో ఏసు తండ్రి కూడా యున్నాడు అని చెప్పుచున్నారు. అయితే ఏసు వారికి జవాబు చెప్పుచూ ''నేను నా తండ్రి పనుల మీద ఉండవలెను'' అని అన్నాడు. వెదకుచూ వచ్చిన వారిలో ఉన్నవాడు కనిపించు తండ్రి కాగా, ఏసు చెప్పినది కనిపించని తండ్రిని. ఏసు ఏ తండ్రిని గురించి చెప్పాడు అనునదే ఇక్కడ ముఖ్యముగా తెలియవలసియున్నది. ఏసు చెప్పు తండ్రి ఎవరో తెలిస్తే, ఆ తండ్రి పనులు ఏవో తెలియవచ్చును. అప్పుడు ఏసు చేయు పనులేవో? ఏ పనుల నిమిత్తము ఆయన తల్లిని, తండ్రిని విడచి తిరుగుచున్నాడో? అర్థము కాగలదు.
ఏసును బాగా గమనించితే ఆయనను గురించి ఆయనే చెప్పిన మాటలలో తనను మనుష్య కుమారునిగా చెప్పుకొన్నాడు. తర్వాత కొన్ని సందర్భములలో తనను దేవుని కుమారునిగా కూడా చెప్పుకొన్నాడు. ఈ విధముగా ఆయన చెప్పిన మాటలలో ఏసు మనుష్య కుమారునిగా ఉన్నాడు మరియు దేవుని కుమారుడుగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచములో యున్న మనుషులందరూ ఎవరి కుమారులని చెప్పవచ్చునని ప్రశ్నించుకొని చూస్తే మనుషులనందరినీ మనుష్య కుమారులనియే చెప్పవచ్చును. అలా చెప్పడములో కొంత రహస్యము ఇమిడియున్నది. అది ఏమనగా! ఒక మనిషి పుట్టితే వాని పుట్టుకు ఒక బీజదాత అవసరము. అయితే అందరూ మనిషి పుట్టుకకు కారణము కనిపించే తండ్రియే బీజదాతయని అనుకొనుట సహజము. అయితే కనిపించే మనిషి, కనిపించే పురుషునిగా యున్నా అతను పురుషుని గుర్తుకు నమూనాగా పుట్టించబడిన వాడే గానీ, వాడు వాస్తవముగా పురుషునిగా లెక్కించబడడు. అతనుగానీ, అతని భార్యగానీ ఇద్దరూ స్త్రీతత్త్వమైన ప్రకృతి క్రిందికే జమ కట్టబడుదురు.
మనిషి శరీరములోయున్న జీవాత్మ ఆత్మ సంబంధ పురుషుడే అయినా అతను పుట్టించబడేవాడే గానీ పుట్టించువాడు కాదు. ప్రతి మనిషినీ పుట్టించువాడు మనిషి శరీరములోయున్న ఆత్మయే అని చెప్పవచ్చును. ఆత్మ శరీరములో అన్ని కార్యములు చేయునది అనియూ, ఆత్మే అందరి సృష్ఠికి బీజదాతయనియు చెప్పియున్నాము. సర్వకార్యముల కార్యర్తగా ఆత్మే యున్నాడు. మనుషులలో యుండి మనిషిని పుట్టించుచున్నాడు కనుక పుట్టినవానిని మనుష్య కుమారుడు అని అనుచున్నాము. ఏసు తాను సర్వసాధారణ మనిషినేనని చెప్పినట్లు ''నేను మనుష్య కుమారుడనని'' చెప్పాడు. అప్పుడు ఆయన తండ్రి బయట కనిపించు 'యోసేపు' అనునతడు కాడని, అందరి శరీరములలో యున్న ఆత్మని చెప్పినట్లయినది. వాస్తవముగా ఒక కోణములో తల్లిగర్భము నుండి పుట్టిన ప్రతి జీవరాసికీ తండ్రి ఆత్మయనీ, తల్లి ప్రకృతియనీ ప్రథమ దైవగ్రంథములో చెప్పియున్నారు. మరొక కోణములో చెప్పితే ఏసు ప్రత్యేకముగా పుట్టినవాడని, అతను కనిపించు తండ్రి లేకుండానే నేరుగా పుట్టినవాడని చెప్పవచ్చును. అతను సాధారణముగా అందరూ పుట్టినట్లు పుట్టలేదు. ఆయన నేరుగా ఆత్మకంటే వేరుగాయున్న పరమాత్మ (పరిశుద్ధాత్మ) కుమారుడని తెలియవలెను. ఆ విధముగా పరిశుద్ధాత్మ కుమారుడు అయినందున ఆయనను దేవుని కుమారుడు అని అనుచున్నారు. ఏసును ఆయన తల్లితండ్రులు కలిసి నప్పుడు ఆయన ఎవరి కుమారుడు అని అర్థముకానట్లు ''నేను నా తండ్రి పనుల మీద ఉండవలెను'' అని అన్నాడు. వాస్తవముగా ఆయన భావములో ఎవరి కుమారుడుగా తనను చెప్పాడో అని ప్రశ్నించుకొని చూస్తే తనను దేవుని కుమారునిగా లెక్కించి చెప్పాడు. ఏసు శరీరములో యున్న ఆత్మ పనిని చేయలేదు. ఆయన సర్వము వ్యాపించియున్న పరమాత్మ యొక్క పని అయిన దేవుని జ్ఞాన ప్రచారము చేయుచున్నాడు. కావున నా తండ్రి (పరిశుద్ధాత్మ) పనిని చేయవలెనను ఉద్దేశ్యముతోనే ఆయన అలా చెప్పాడు. పరమాత్మయినవాడే స్వయముగా శరీరమును తయారు చేసి అందులోనికి తన ఆత్మనే నింపి పంపుట వలన దేవుని కుమారునిగా వచ్చినవాడు వాస్తవముగా దేవుడే అయి ఉన్నా, తనను ఎవరూ గుర్తించనట్లు ఒకప్పుడు మనుష్య కుమారుడనని, మరొకప్పుడు దేవుని కుమారుడనని చెప్పాడని తెలియవలెను.
(2) లూకా సువార్త, 11వ అధ్యాయము, 37, 38, 39, 40, 41 వచనములు.
(37) ఆయన మాటలాడుచుండగా ఒక పరిశయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా! ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండెను.
(38) ఆయన (ఏసు) భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిశయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.
(39) అందుకు ప్రభువు ఇట్లనెను. ''పరిశయ్యులైన మీరు గిన్నెయు, పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గానీ మీ అంతరంగమున చెడుతనము నిండియున్నది.
(40) అవివేకులారా! వెలుపలి భాగమున చేసిన వారు లోపలి భాగమున శుద్ధి చేయలేరా?
(41) కాగా మీకు కలిగినవి ధర్మము చేయండి. అప్పుడు మీకన్నియు శుద్ధిగా ఉండును.
ఇక్కడ చివరి వాక్యములో ''మీకు కలిగినవన్నియు ధర్మము చేయండి అప్పుడు మీకన్నియు శుద్ధి యగును'' అను వాక్యము గలదు. ఈ విషయములో గ్రంథములోని వాక్యమును మనుషులు సరిగా అర్థము చేసుకోక ఏసు చెప్పిన విషయమును ఇంకొక విధముగా భావించుకోవడము జరుగుచున్నది. ఇక్కడ 'ధర్మము చేయండి' అనినప్పుడు మనుషులకున్న ధనము, వస్తు, వాహనములన్నియు దానము చేయండియని చెప్పుచున్నారు. వాస్తవముగా ఏసు అలా చెప్పలేదు. బాహ్య వస్తువులను దానము చేస్తే లోపల శుద్ధి కాదు. అందువలన ఆయన బయటి వాటిని దానము చేయండని చెప్పలేదు. అంతరంగమున ధర్మము తెలిసి ఆచరించితే లోపల యున్న చెడుతనమంతయు శుద్ధి అయిపోవునని ఆయన భావము. ఏసు బయట శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతరంగమున గుణముల శుద్ధికి ప్రాధాన్యత నిచ్చాడు. అందువలన గుణములకు వ్యతిరేఖముగా దైవ మార్గములో గల ధర్మము ప్రకారము నడువండి యని చెప్పాడు. ఏసు అంతరంగములో శుద్ధిగలవాడుగా యుండి ధర్మముగా నడుస్తూ, ఇతరులను కూడా ధర్మమార్గములో నడపాలని ఆ విధముగా చెప్పాడని అర్థము చేసుకోవాలి.
(3) లూకా సువార్త, 12వ అధ్యాయము, 4, 5 వచనములు
(4) నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా! దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరనివారికి భయపడకుడి.
(5) ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియ జేయుదును. చంపిన తరువాత నరకములో పడత్రోయు శక్తి కలవానికి భయపడండి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను.
మనుషులు దేహమును చంపవచ్చును కానీ, లోపలి జీవాత్మను ఏమీ చేయలేరు. జీవాత్మ బయటికి కనిపించునది కాదు. దేహము కనిపించుట వలన దేహమును చంపవచ్చును, అంతకంటే ఎవడూ ఏమీ చేయలేడు అటువంటి వారికి భయపడవలసిన పని లేదు. భయపడవలసినది ఒకే ఒక్కనికి మాత్రమే, వాడు చనిపోయిన తర్వాత కూడా నీవు చేసిన పాపములను లెక్కగట్టి, పాపములకు తగినట్లు శిక్షించి, అనుభవింపజేయును. చనిపోయిన తర్వాత మానవునికీ, మానవునికీ సంబంధము తెగిపోవుచున్నది. చచ్చినవాడు చంపినవాని ఇంటిలోనే తిరిగి పుట్టినా వీడు నాకు శత్రువు కదా! అని గుర్తించలేడు. దేవుడు మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవాత్మను గుర్తించగల్గుచున్నాడు, వాడు ఏ జన్మకు పోవునది కూడా గమనిస్తున్నాడు. చనిపోయిన తర్వాత చేసుకొన్న కర్మను అనభవింపజేయు దేవునికి జీవుడు భయపడాలి కానీ చనిపోయిన తర్వాత తనను గుర్తించని మనిషినికి భయపడవలసిన పనిలేదు.
(4) లూకా సువార్త, 12వ అధ్యాయము, 25వ వచనము.
(25) మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు?
మానవుడు తన తెలివితోనే అన్నీ చేయుచున్నాననుకున్నప్పటికీ వానికి, వాని తెలివికి కూడా సంబంధము లేదు. మానవుడు అస్వతంత్రుడు స్వయముగా తాను ఏదీ చేయలేనివాడు. కర్మచేతిలో కీలుబొమ్మవలె ఆడువాడు. తను అనుకుంటే చేయుదునని తలచు మనిషి తన విషయము తనకే తెలియని స్థితిలో ఉన్నాడు. దేవుడు నిర్మించిన నిర్మాణము ప్రకారము దేవుని చేతిలో కర్మ, కర్మ చేతిలో మనిషి ఉండి, కర్మ ఆడించునట్లు కదలువాడు తాను స్వయముగా ఏ నిర్ణయమును తీసుకోలేడు. తాను ఎంత యోచించినా తన తెలివినెంత ఉపయోగించినా, తన ఎత్తును తగ్గించుకోవడము గానీ, ఎక్కించుకోవడము గానీ చేయలేని అస్వతంత్రుడు. ప్రతి మనిషి తనను తాను తెలుసుకొని తన శక్తి ఎంత వరకు గలదని యోచించుకొంటే తాను స్వల్పమైనవాడిననీ, తనకంటే చెప్పలేనంత అధికుడైనవాడు దేవుడు గలడనీ తెలియగలదు.
లూకా సువార్త, 12వ అధ్యాయము, 33, 34 వచనములు.
(33) మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొట్టదు.
(34) మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.
ధనము అనునది రెండు రకములు గలదు. ఒక ధనముతో ప్రపంచములో దేనినైనా కొనవచ్చును. మరియొక ధనముతో ప్రపంచము నకు అతీతమైన దేవున్ని కొనవచ్చును. ప్రపంచమును కొనునది మానవుల మధ్యనున్న ధనము. దేవున్ని సహితము కొనగల జ్ఞాన ధనమును దేవుడే సృష్ఠించాడు. మానవుల చేత సృష్ఠింపబడిన ధనమును మనము నిత్యము చూస్తునే ఉన్నాము దానితోనే ప్రపంచ వస్తువులను కొంటూనే ఉన్నాము. దైవము సృష్ఠించిన జ్ఞాన ధనము కంటికి కనిపించునది కాదు. జ్ఞాన ధనమునకు ప్రపంచ ధనమునకు ఎన్నో తేడాలు గలవు. ప్రపంచ ధనమును దొంగలు దొంగలించవచ్చు, జ్ఞానధనము కనపడదు దొంగలు దొంగిలించ లేరు. ప్రపంచ ధనమునకు చెదలు పట్టవచ్చును, జ్ఞాన ధనమునకు చెదలు పట్టు అవకాశము లేదు. ప్రపంచ ధనముతో చిన్న కర్మను కూడా పోగొట్టు కోలేము. జ్ఞాన ధనముతో పెద్ద కర్మనయినా లేకుండా చేసుకోవచ్చును. పనులు చేస్తే లభించునది డబ్బు, దైవ సాన్నిధ్యమును చేస్తే లభించునది జ్ఞానధనము. ప్రపంచ ధనమునకు విలువ కట్టవచ్చును, జ్ఞాన ధనమునకు విలువ కట్టలేము. మానవుని మరణముతో సంబంధము తెగిపోవునది ధనము, జీవుని వెంట ఒక రూపాయి కూడా పోదు. జ్ఞానధనము మనిషి మరణముతో కూడా సంబంధము తెగిపోక జీవుని వెంటపోవును. ఎవడు ఎంత జ్ఞానమును సంపాదించుకొనునో అంత వానివెంట జన్మల పర్యంతమూ అంటిపెట్టుకొని ఉండును. ప్రపంచ ధనమున్నవారు ప్రపంచములో మానవుల మధ్య గౌరవింపబడుదురు, దేవుని ఎదుట గౌరవింపబడరు. జ్ఞానధనమున్నవారు దేవుని ఎదుట గుర్తింపబడుదురు, మానవుల మధ్య గౌరవింపబడరు. ఇట్లు అనేకమైన భేదములు ప్రపంచ ధనమునకు, జ్ఞానధనమునకు గలవు.
(6) లూకా సువార్త, 12వ అధ్యాయము, 49వ వచనము.
(49) నేను భూమిమీద అగ్ని వేయ వచ్చితిని. అది ఇది వరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను.
అగ్ని అనగానే మనము ప్రతి దినము చూచునదేనని పొరపడ కూడదు. అగ్నులు రెండు రకములు గలవు. ఒకటి సాధారణ అగ్ని, రెండవది అసాధారణ జ్ఞానాగ్ని. సాధారణ అగ్ని కట్టెలను, ప్రపంచ వస్తువులను కాల్చగలదు. జ్ఞానాగ్ని కర్మయను కట్టెలను కాల్చును. మానవులు పాప కర్మల మధ్య చిక్కుకొని ఘోరమైన కష్టములు అనుభవిస్తుండగా వారిని కడతేర్చుటకు దేవుడు భూమిమీద తన జ్ఞానమను అగ్నిని వేయుటకు వచ్చును. జ్ఞానమను అగ్ని మానవులలో చేరితే వారి కర్మలను కాల్చివేసి జన్మలు లేకుండా చేసి తనయొద్దకు వారిని చేర్చగలదని దేవుని భావము. జ్ఞానమును భూమిమీద బోధించుటకు వచ్చిన దేవుడు జ్ఞానమును అగ్నిగా చెప్పుటలో జ్ఞానము వలన మానవుడు కడతేరగలడని చెప్పడమేనని తెలియాలి. దేవుడు భూమిమీద తన అగ్నిని గతములో కూడా వేశాడు, అప్పుడు కొంత కాలము మండి అది తిరిగి కనిపించక అణిగిపోయినది కావున తిరిగి అగ్నిని వేయను వచ్చాడు. ఇంతకుముందు వేసిన అగ్ని ఇదివరకే రగులుకొని మండవలెనని కోరుచున్నానన్నాడు. దానిలోని అర్థము 'అగ్నిలేని చోట అగ్ని వేయుచున్నానని, ఇంతకుముందు వేసినచోట అది అణిగివుండక తిరిగి రగులుకొని మండవలెనని' ఆయన ఉద్దేశ్యము.
(7) లూకా సువార్త, 12వ అధ్యాయము, 51, 52, 53 వచనములు.
(51) ''నేను భూమిమీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరనుకొనుచున్నారా? కాదు. భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను.
(52) ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు.
(53) తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధులుగా ఉందురు.''
పరమాత్మ భగవంతుని రూపముతో భూమిమీద అవతరించినప్పుడు తన జ్ఞానమునే తెల్పుచుండును. భగవంతుని జ్ఞానము సాతాను మార్గములో మునిగి ఉన్నవారందరికీ వ్యతిరేఖ భావములను కల్గించుచుండును. అటువంటప్పుడు దేవుని జ్ఞానము తెలియువారికి, తెలియనివారికి అభిప్రాయ భేదములేర్పడును. జ్ఞానము తెలిసినవారు తెలియనివారితో విభేదించవలసి వచ్చుచున్నది. అటువంటి పరిస్థితి ఒకే ఇంటిలో కల్గుట వలన ఇంటిలోని వారే విరోధులుగా తయారగుదురు. ఒకడు జ్ఞానము తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, సాతాను జాగ్రత్తపడి తండ్రి మీదికి కొడుకును కొడుకు మీదికి తండ్రిని, అత్త మీదికి కోడలును, కోడలు మీదికి అత్తను, భార్య మీదికి భర్తను, భర్త మీదికి భార్యను పురికొల్పి విభేదించునట్లు చేయును. తన జ్ఞాన నిమిత్తము భార్యభర్తలు పోట్లాడుకొనుచున్నారని తెలిసిన గురువుగానున్న భగవంతుడు కూడా జ్ఞానములో సమాధానపడవద్దని నీతో భేదించు వారితో నీవు కూడా భేదించమని చెప్పును. దానితో వారి తగాదా పెరుగును కానీ తరగదు. అందువలన పై వాక్యములో ''ప్రభువు నేను సమాధాన పరచను రాలేదు, భేదమునే కలుగజేయవచ్చితినన్నాడు.'' జ్ఞానమును భూమిమీద బోధించను వచ్చినవాడు మీ ఇంట్లోవారి మాట వినండి, నా జ్ఞానము తెలుసుకోవద్దండని చెప్పునా? దేవుని విషయములో చేయి ఆటంక పరచిన చేతిని నరికివేయమని చెప్పినవాడు, శరీరమును కూడా లెక్కచేయ వద్దని చెప్పినవాడు, శరీరము కంటే మినహా ఉన్న భార్యను, బంధువులతో రాజీపడమని చెప్పునా? చెప్పడు. ప్రాణము పోయినా ఫరవాలేదు సాతాను మార్గములోని వారితో రాజీకావద్దనియే చెప్పాడు. కావున దేవుని జ్ఞాన నిమిత్తమై అనేకచోట్ల అనేక కుటుంబములలో తగాదాలు చెలరేగుచూనే ఉండును. ఇక్కడ విశేషముగా గమనించవలసినదేమంటే ఎక్కడయితే అసలైన జ్ఞానము ప్రకటించబడుచున్నదో అక్కడ మాత్రమే ఇంటిలోని వారితో విరోధ మేర్పడును. ఎక్కడైతే దేవుని జ్ఞానమని సాతాను జ్ఞానము చెప్పబడుచున్నదో అక్కడ ఏ విభేదాలు రావు. అటువంటి జ్ఞానమునకు అందరూ సహకరిస్తారు. జ్ఞాన విషయములో ప్రభువు మాట ప్రకారము ఇంటిలోని వారందరూ విరోధులగుచున్నారంటే అది అసలైన దేవుని జ్ఞానమై ఉండునని తెలియ వచ్చును.
(8) లూకా సువార్త, 13వ అధ్యాయము, 3వ వచనము.
(3) ''మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరును అలాగే నశింతురు.''
మన శరీరమునందు అంతరంగములలో ముఖ్యమైనది మనస్సు. విషయములను మననము చేయునది కావున దానికి మనస్సు అని పేరు వచ్చినది. మనస్సు ఎల్లపుడూ మాయకు (సాతానుకు) లోబడి ఉండును. అది ఎల్లప్పుడు సాతానుకు బలము చేకూర్చునదై ప్రపంచ విషయములనే జ్ఞప్తికి తెచ్చుచుండును. మనిషి పుట్టినప్పటినుండి దేవునివైపు మనస్సు ఏనాడూ పని చేయక సాతాను వైపే పని చేయుచున్నది. అటువంటి మనస్సును సాతాను వైపు నుండి దేవుని వైపు మార్చడమును 'మార్పు మనస్సు' లేక 'మారు మనస్సు' అనవచ్చును. మారుమనస్సు పొందనిది దేవునివైపు ఎవడూ పోలేడు. మారు మనస్సు పొందితే జ్ఞానశక్తి లేక జ్ఞానాగ్ని లభించుటకు మొదలు పెట్టును. జ్ఞానాగ్ని వలన కర్మలు పోయి చావు పుట్టుకలు లేని దైవములోనికి ఐక్యమగును. మారు మనస్సు పొందక మనస్సు యొక్క విషయ జ్ఞాపకాలు నిలువకపోతే, ప్రపంచముతో పాటు పుట్టుచూ గిట్టుచూ నరక యాతనలు పొందవలసి ఉండును. కావున ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందవలెను.
(9) లూకా సువార్త, 14వ అధ్యాయము, 26వ వచనము.
(26) ఎవడయినను నా వద్దకు వచ్చి తన తల్లిని తండ్రిని భార్యను పిల్లలను, అన్నతమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
ఈ మాట వింటే ఇదెక్కడి జ్ఞానము ఆయనెట్ల గురువు వీరెటువంటి శిష్యులనీ ఆశ్చర్యమగును. గురువు వద్దకు వచ్చి 'ఇంటిలోని వారందరినీ తిట్టితేనే నాకు శిష్యుడు, తిట్టకుంటే శిష్యుడు కాడని' ఏ గురువైనా చెప్పునా అని కూడా అడుగవచ్చును. ఇక్కడ కొంత యోచింపవలసి యున్నది. ఇంటిలోని వారందరినీ తిట్టితే గురువుకు సంతోషమై శిష్యునిగా చేర్చుకొనే దానికి గురువేమైనా పిచ్చివాడా! ఇక్కడ చెప్పిన భావమును వివరించి చూచుకొంటే అందరినీ వరుసగా ద్వేషింపమని లేదు. గురువుకు గానీ, శిష్యునికి గానీ సరిపడనివారు అజ్ఞానులు, సాతాను మార్గములో నడిచేవారు సరిపడని అజ్ఞానులను ద్వేషిస్తే గురువుకు సంతోషమగుట వాస్తవమే. శిష్యుడు కూడా తనలోని భావమునకు సమానముగా అజ్ఞానులైన వారిని దూషిస్తే శిష్యుడు తన పక్షమువాడేనని వానిని శిష్యునిగా ఒప్పుకొనును. అట్లుకాక వాడు కూడా అజ్ఞానులతో విభేదించక, వారితో కలిసిపోతే గురువు వానిని శిష్యునిగా ఎట్లు ఒప్పుకొనును? జ్ఞానులు, అజ్ఞానులను రెండు తెగల వారికి మధ్య విరోధముండుట సహజమే. అజ్ఞానులలో తల్లి తండ్రి ఉండినా, భార్య పిల్లలుండినా, అన్నదమ్ములుండినా, అక్కచెల్లెండ్రుండినా చివరకు తన ప్రాణమునైనా ద్వేషింపవలసిందేనని తెలియుచున్నది. అజ్ఞానులను ద్వేషింపక బంధుప్రీతి చూపువాడు తనకు శిష్యుడు కానేరడని ప్రభువు చెప్పాడు. ఈ మాటను బట్టి అజ్ఞానము ఎడల ఏమాత్రము రాజీ భావముండకూడదని తెలియుచున్నది. తన జ్ఞానమార్గమున ఆటంకము కల్గించు తల్లినిగానీ, తండ్రినిగానీ, అన్నదమ్ములనుగానీ, భార్య బిడ్డలనుగానీ తప్పక వదలుకోవలసిందేనని ఏసుప్రభువు యొక్క ఉద్దేశ్యము.
(10) లూకా సువార్త, 14వ అధ్యాయము, 27వ వచనము.
(27) ఎవడయినను తన శిలువను మోసికొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు.
విడివిడిగా యున్న కట్టెలను ఒక కుప్పగా మోపుకట్టి, మోసికొను పోవుటకు వీలుగా చేసుకొని కట్టెల మోపును ఎత్తుకొని ఎంతదూరమయినా పోవచ్చును. విడివిడిగా యున్న కట్టెలను ఒక కుప్పగా బంధించినప్పుడు మాత్రమే వాటిని ఎక్కడినుండి ఎక్కడికయినా తీసుకుపోవచ్చును. విడిగా యున్న కట్టెలను కుప్పగా కట్టివేయనిదే వాటిని తీసుకొని పోవుటకు వీలుపడదు. అట్లే నీ తలలో కట్టెలవలె విడివిడిగా 108 భాగములుగా యున్న గుణములను ఒక్కటిగా బంధించినప్పుడు అవి పని చేయని స్థితిలో కట్టి వేయబడినప్పుడు అవి మనిషి చేతిలో మోపుగా మారిపోవును. మనిషి శరీరములో మంచి గుణములు, చెడు గుణములు అని రెండు రకముల గుణములు గలవు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అను ఆరు చెడు గుణములు, అలాగే దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమలు అను ఆరు మంచి గుణములు గలవు. ఆరు చెడు గుణములు ఒక్కొక్కటి తొమ్మిది భాగములుగా విభజింపబడినది. ఆ విధముగా 54 భాగములుగా చెడు గుణములుండగా, మంచి గుణములు కూడా ఒక్కొక్కటి తొమ్మిది భాగములుగా విభజింపబడి 54 భాగములుగా మంచి గుణములు గలవు. మంచి, చెడు రెండు రకముల గుణములు కలిసి 108గా ఉన్నవి.
108 భాగములుగా యున్న గుణములను ప్రథమ దైవగ్రంథములో మాయ అని అంటున్నారు. ద్వితీయ దైవగ్రంథములో సాతాన్ అని అంటున్నారు. అంతిమ దైవగ్రంథములో సైతాన్ అనియు, ఇబ్లీస్ అనియు అంటున్నాము. దేవుని చేత తయారు చేయబడిన గుణములను మాయ అని అంటున్నాము అని దేవుడే మొదట ప్రథమ దైవగ్రంథములో ''గుణమయి మమ మాయా'' అని చెప్పియున్నాడు. దాని అర్థము మనిషి శరీరములో ఉన్న గుణములే 'నా మాయ' అని చెప్పాడు. మాయ అనునది దేవుని మార్గము వైపు పోకుండా తనవైపే యుండునట్లు చేయగలదు. మాయ మనుషులను దైవమార్గములో పోకుండా చేయుటకే దేవుని చేత తయారు చేయబడినది. మాయ అనగా గుణము అనియు, గుణము అనగా మాయ అనియు చెప్పవచ్చును. గుణము అను మూడు అక్షరములకు సమానముగా చెప్పితే మాయము అని చెప్పవచ్చును. మాయము అనగా కనిపించకుండా ఉండునది యని అర్థము. మాయము=గుణము=శిలువ అని మూడు అక్షరములకు అర్థము గలదు. మన శరీరములోని మాయను శిలువ యను పేరుతో కూడా పిలుస్తున్నాము. శిలువ అనగా మాయ లేక గుణములు అని తెలిసినా, మాయను ఆధ్యాత్మిక భావములో పాముగా చెప్పుచున్నారు. ఆత్మను పావురముగా, మాయను పాముగా చెప్పుచున్నాము. శిలువ యనగా పాము అని అర్థము, కొండ శిలువ అనగా పెద్ద సర్పము అని అర్థము. మాయను కొండ శిలువ అను పాముగా (పైతాన్‌గా) చెప్పుచున్నారు.
కొండ శిలువ చాలా బలమైన సర్పము. దాని చేతికి చిక్కినవాడు ఎవడూ విడిపించుకోలేడు. అనగా మాయ బలమైనది అని అర్థము. అంత బలమైన మాయను అనగా శిలువను బంధించి మోయగల మోపుగా కట్టివేసి మనిషి తన మాయను కదలకుండా చేసి, దానిని తన చేతిలో ఉండునట్లు చేసుకొని, ఏసును వెంబడించువాడు ఆయనకు శిష్యుడు అగునని చెప్పాడు. మాయను జయించువాడు నిజముగా శిష్యుడు అగునని ఏసు చెప్పడము జరిగినది. మాయ అను శిలువను ఎవడయితే బంధించి మోయుచూ దేవుని మార్గములో ప్రయాణించునో వాడు దేవునికి నిజమైన శిష్యునిగా చెప్పబడును. నేడు అందరూ గొప్పగా చెప్పుకొను శిలువను మోయుచూ ఏసు వెంబడి పోవువాడు ఆయన శిష్యుడు అని వాక్యములో చెప్పారు.
(11) లూకా సువార్త, 18వ అధ్యాయము, 29వ వచనము.
(29) దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, అన్నతమ్ములనైనను, తల్లితండ్రులనైనను, పిల్లలనునైనను విడిచి పెట్టినవాడు ఇహమందు చాలా రెట్లును, పరమందు నిత్య జీవితమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
దేవుని రాజ్యము అనగా మోక్షము. ఒక మనిషి మోక్షము పొందితే వాడు తిరిగి భూమిమీద పుట్టడు. భూమిమీద పుట్టితే కదా! సాతాను బాధ వానికుండేది? పుట్టడు కావున సాతాను బాధ వానికుండదు. మోక్షము పొందడమంటే సాతాను నుండి విడుదల పొంది దేవుని వద్ద చేరిపోవడ మన్నమాట. ఇంకనూ వివరముగా చెప్పాలంటే దేవునియందు ఐక్యమై ఉండిపోవడమే. ఇంకా వివరముగా చెప్పాలంటే దేవునిగా మారిపోవడమే నన్నమాట. ఎంతో చెప్పలేనంత విశాలమైనవాడు, మొదలు చివర లేనివాడు, ఎవరి ఊహకు అందక అంతటా వ్యాపించినవాడు అయిన పరమాత్మలోనికి, ఆకారముండి ప్రకృతిలో ఎంతో చిన్నవాడయిన జీవుడు చేరిపోయి, తాను దేవుడు ఒకటైపోవడము ఎంత గొప్పతనమో చెప్పలేము. అటువంటి స్థానమును, స్థితిని పొందగోరి జ్ఞానమార్గములో ప్రవేశించినవానికి ఎవరు ఏ విధముగా ఆటంకపరచినా వారి మీదున్న ప్రేమ మోహములు వదలిపెట్టి తనకు ప్రపంచములో దగ్గర అనుకొన్న ఇల్లుగానీ, భార్య పిల్లలను గానీ, తల్లితండ్రులనైన గానీ, అన్నదమ్ములనైన గానీ త్రుణముగా తలచి వారినైనా వదలుకొనువాడు ఇహములో సంపూర్ణ జ్ఞానియై, పరములో దైవమునే పొందును. వదలుకోవడము చిన్నపని కాదు కదా! భార్య బిడ్డలను, అన్నదమ్ములను, తల్లితండ్రులను వదులుకోవడము చాలా గొప్ప పనియే అగును. ఈ విషయములో మాయ మానవుని చుట్టుకొని వారినే మనిషి కాళ్లకు అడ్డము వేయుచుండును. అయినప్పటికీ ప్రహ్లాదుడు తండ్రిని లెక్క చేయనట్లు, మీరాబాయి భర్తను, బంధువులను వదలిపోయినట్లు, బుద్ధుడు యుక్తవయస్సు భార్యను, సంవత్సర వయస్సున్న కుమారున్ని, తల్లితండ్రులను, ఇంటిని, రాజ్యమును వదలిపోయినట్లు ఎవడైతే తన వారినయిననూ పరాయివారిగా తలచనెంచునో వానికి పరాయిగానున్న దేవుడు తనవాడగును. కొద్దికాలము సంబంధముండి పోవువారిని వదలి శాశ్వతముగా ఉండువానిని పొందడము తెలివైనవాని పని అగును. కానీ అది ప్రపంచములో తెలివితక్కువ పనిగా కనిపించును. అటువంటి వానిని తెలివి తక్కువవాని క్రిందికి లెక్కింతురు. సాతాను రాజ్యమైన ప్రపంచములో దేవుని కొరకు అందరినీ వదలుకొను త్యాగ పురుషుడు కనిపించుట అరుదు. ఎందుకనగా! ఎవని మనుసులోనయినా దేవుడు అను యోచన వచ్చినప్పటి నుండీ సాతాను వాని మీద ప్రత్యేక దృష్ఠి సారించి ఆ మార్గము నుండి, ఆ యోచన నుండి తప్పించగలదు. మరియొక మాట ఏమిటంటే సాతాను బలము ముందర నిర్భలుడైన మనిషి దానిని జయించి దాటిరావడము దుస్సాధ్యమని భగవద్గీతలో విజ్ఞాన యోగమను అధ్యాయములో 14వ శ్లోకములో కూడా చెప్పాడు. ఇక్కడ ఒక అనుమానము మనిషికి రావచ్చును. సాతాను బలము గొప్పదైనప్పుడు, మానవుడు దానిని దాటిపోవుట సాధ్యము కాదన్నప్పుడు మనిషి దేవునివైపు పోలేడు కదా! అటువంటప్పుడు ప్రయత్నము చేయడమెందుకు విఫలము కావడమెందుకు అని అడగవచ్చును. దానికి జవాబు వాస్తవముగా ప్రపంచమంతా విశాలమైన సాతాను ముందర మనిషి ప్రయత్నమెంత మాత్రమూ నిలువజాలదని తెలిసినప్పటికీ తన ప్రయత్నము తాను చేయుచూ, దేవున్ని పూర్తి విశ్వసించి ఉండిన వానిని దేవుడే శ్రద్ధబూని సాతాను నుండి తప్పించి తనవైపు లాగుకొనును. కావున సాతాను ముందర సూక్ష్మాతి సూక్ష్మమైన మానవుడు సాతానును జయించా లంటే ముఖ్యమైనది దేవున్ని సంపూర్ణముగా శరణుజొచ్చడమే మార్గము. సంపూర్ణముగా తననే నమ్మినవానిని ''మాయా మేతాం తరన్తితే'' ''మాయ నుండి బయటపడులాగున నేజేతును'' అన్నాడు. కావున సంపూర్ణముగా దేవుని నమ్మి భారమంతా ఆయన మీద పెట్టితే దేవుడే సాతాను నుండి తప్పించగలడు.
లూకా సువార్త :(12) లూకా సువార్త, 21వ అధ్యాయము, 15వ వచనము.
(15) మీ విరోధులు ఎదురాడుటకు వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
ప్రపంచములో బోధకులు, గురువులమని పేరు పెట్టుకొన్నవారు, బోధించు బోధలను కొంత జ్ఞానము తెలిసిన చిన్నపిల్లలు ప్రశ్నించినా, వారి బోధలలో సమాధానము లేకుండును. అందువలన ప్రపంచములో బోధకుల జ్ఞానమును ఎవరూ ప్రశ్నించకూడదను నియమమునుంచు కొన్నారు. వారి బోధలలో సమాధానము లేకుండా పోవడానికి కారణము అది శాస్త్రబ్దమైనది కాకపోవడమే ముఖ్యకారణము. అశాస్త్రీయమైన బోధలు హేతుబద్దమైన ప్రశ్నలకు జవాబివ్వలేవు. వారు చెప్పుతూ పోవువారే కానీ అడిగితే సమాధానమిచ్చే వారు కాదు. పరమాత్మ భగవంతునిగా వచ్చి బోధించినది అసలయిన పరమాత్మ జ్ఞానము, కనుక బోధకులు చెప్పిన జ్ఞానము కాక భగవంతుడు చెప్పిన జ్ఞానము తెలిసినవారు, చెప్పడమే కాక ఎవరు ఎటువంటి ప్రశ్న అడిగినా జవాబు ఇవ్వగలుగు స్థితిలో కూడా ఉందురు. పరమాత్మ జ్ఞానము తెలిసిన భగవంతుని భక్తులను చూచి మేము గురువులము, మేము జ్ఞానులము అను అహముతో భగవంతుని జ్ఞానము కలవారివద్దకు విరోధముగా వచ్చి, విరుద్ధముగా మాట్లాడ జొచ్చుదురు. అటువంటి సమయములో వారు ఎదురు మాట్లాడుటకు వీలుగాని జ్ఞానము భగవంతుని జ్ఞానము తెలిసినవారికి ముందే తెలుపబడి ఉండును. నిజ జ్ఞానమును తెలిసినవారిని చూచి ఎందరో అసూయ పడుదురని వారితో విరోధము పెంచుకొందురని పైనగల దేవుని వాక్యము లోనే తెలియుచున్నది. దేవుడే దిగివచ్చిన రోజు కూడా నీ జ్ఞానమేపాటిదని ఎదురించి మాట్లాడి నీకు ఇంకా సరిగా తెలియదు, ఫలానా చోటికి పోతే నీకు మంచి జ్ఞానము తెలుస్తుందని దేవునికే చెప్పినవారుగలరు. నా వద్దకే వచ్చి నాకే జ్ఞానము తెలియదనువారు భూమిమీదగలరు. అటువంటి వారు మీ వద్దకు కూడా రాగలరు వారికి తిరుగులేని సమాధానము చెప్పునట్లు మీకు నేను జ్ఞానమును అనుగ్రహింతునని దేవుడు పై వాక్యములో తెలియజేశాడు.