pss book:gt2 త్రైత సిద్ధాంత భగవద్గీత : కర్మ యోగము
త్రైత సిద్ధాంత భగవద్గీత : కర్మ యోగము
అర్జునుడిట్లనియె :-
శ్లోకం 1: జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన!|
తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ!||
(కర్మ, బ్రహ్మయోగములు)
భావము :పాపపుణ్య కర్మలగు పనులు చేయుటకంటే బ్రహ్మయోగమే శ్రేష్ఠమైనదని నీ అభిప్రాయమైన, భయంకరమగు కర్మలు కలుగు పనులనే చేయమని నన్ను ఎందుకు నియమించుచున్నావు.
వివరము : సాంఖ్యయోగమను మొదటి అధ్యాయములో మొదట కర్మయోగమును గూర్చి చెప్పడము,తర్వాత చివరిలో బ్రహ్మయోగమును గురించి చెప్పడము జరిగినది. మొదట కర్మయోగమును విన్న అర్జునుడు తర్వాత విన్న బ్రహ్మయోగమే బాగున్నదని అనుకున్నాడు. శ్రీకృష్ణుడు పలానా యోగము మంచిదని గాని, గొప్పదని గాని, చెప్పకున్నప్పటికి అర్జునుడు తన భావములో పనులు చేయు యోగముకంటే పనులు చేయని యోగమే గొప్పదనుకొనుట వలన, ముఖ్యముగా శ్రీకృష్ణుడు చెప్పినంత వివరముగా కర్మయోగము అర్థము కాకపోవడము వలన, మరియు బ్రహ్మయోగమే బాగున్నదనుకొనుట వలన, ఏ పనులు చేయక ఊరకుండడమే మంచిదైనపుడు పాపము సంభవించు యుద్ధమును చేయుటకు నన్ను ఎందుకు నియమించావు అన్నాడు. అర్జునునికి కర్మయోగ విధానము అర్థము కాలేదనుటకు నిదర్శనముగా క్రింది శ్లోకము చెప్పబడియున్నది.
శ్లోకం 2: వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో ఽహ మాప్నుయామ్||
(కర్మ, బ్రహ్మయోగములు)
భావము :మిశ్రమవాక్యములను చెప్పి నా బుద్ధిని భ్రమింపచేయుటకంటే మోహగుణమందు చిక్కుకోకుండునట్లు ఏది చేయుట మంచిదో దానిని నిశ్చయించి చెప్పుము.
వివరము: మొదట కర్మయోగమును చెప్పి తర్వాత బ్రహ్మయోగమును చెప్పగ అర్జునునికి అర్థముకాలేదు. యోగ విషయములు మొదటిసారిగా వినడము వలన, కొంత బ్రహ్మయోగము అర్థమైనప్పటికి, కర్మయోగము అర్థము కాకపోయినది. ఇది ఒక అర్జునునికే కాదు. మొదట ఎవరికైన కర్మయోగము అర్థముకాదనియే చెప్పవచ్చును. ఇంకనూ యోచించి చూచిన ఎడల కర్మయోగమంటే ఏమిటో, దాని అసలు స్వరూపమేమిటో, భగవద్గీతను బోధించు వారికి కూడ పూర్తి అర్థముకాలేదు. వారు భగవధ్గీతను వివరించి చెప్పినపుడు కర్మయోగమును గురించి అసలు విషయమును చెప్పలేకపోవుచున్నారు,వారు ఆచరించను లేకపోవు చున్నారు. ఇకపోతే బోధకులందరు బ్రహ్మయోగమును గురించి బాగా చెప్పగలుగు చున్నారు. మరియు చేతనైనంత ఆచరించుచున్నారు. బోధకులందరిని కదలించి చూడగ వారియందు కర్మయోగమునకు విరుద్ధమైన ధోరణి కనిపిస్తున్నది. కావున కర్మయోగము యొక్క అసలు సిద్ధాంతము చాల మందికి తెలియదనియే చెప్పవచ్చును.
నిత్యము ఆధ్యాత్మిక విషయములందే మునిగి తేలు వారికే అర్థముకాక, కర్మయోగమునకు విరుద్ధమైన పద్ధతిలో మంచి చెడు పనులను విభజన చేస్తున్నప్పుడు,కొన్ని పనులు వదలండి కొన్ని చేయండని చెప్పునప్పుడు,ఒక్కమారువిన్న అర్జునునికి అర్థమవడము కష్టమే కదా! అందువలననే అర్జునుడు అర్థముకాని స్థితిలో కర్మ బ్రహ్మయోగ విభజన వివరము తెలియక, శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను మిశ్రమ వాక్యములన్నడు. నీ యొక్క మిశ్రమవాక్యములు వినుట వలన నా బుద్ధికి ఏది అర్థముకాక ముందు మాదిరి నాది నావారు అను మోహగుణములోనే చిక్కుకోగలను. అట్లు కాకుండ నేను ఏమి చేయవలెనో వివరించి చెప్పుము అన్నాడు.
అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు ముఖ్యముగా రెండు యోగములను గురించి చెప్పి, అర్జునునికి ఏ యోగమవసరమో కూడ వివరించి చెప్పాడు.
మానవుడు మెలుకువగా ఉండి చేయు ఏ కార్యమైన, కలవరింపైన, యుద్ధమైన, దైవభక్తియైన యోగమైయుండాలి. అర్జునుడు అప్పుడు చేయవలసినది, అతనికి అవసరమైనది రెండుగా విభజించిన యోగములలో కర్మయోగమే ముఖ్యము.
అందువలన కర్మయోగమునే గీతయందు అనేక విధములుగా అర్థమగునట్లు చెప్పాడు. భూమి మీద ఎవడైన యోగము లేక, యోగమంటే ఏమిటో తెలియక బ్రతుకువాడు ఎల్లప్పుడు వియోగముతోనే బ్రతుకుచున్నాడని తెలియుచున్నది. యోగమంటే కలయిక అని అర్థము, వియోగము అనగా విడిపోవడము అని అర్థము. రాముడు సీతతో కలిసి అడవిలో ఉన్నప్పుడు రాజ్యసుఖములకు దూరముగా ఉన్నను బాధపడక సంతోషముగా ఉన్నాడు. సీత విడిపోయిన తర్వాత రాజ్యసుఖములున్నను తీరని వియోగ బాధను అనుభవించాడు. అలాగే మానవుడు దైవత్వమును విడిపోయినవాడై ప్రపంచములో ఎంతో ధనము, ఎంతో హోదా, ఎంతో పలుకుబడి ఉన్నప్పటికి, ఎన్నో సుఖములు ఉన్నప్పటికి ఏదో వెలితిగ అసంతృప్తితోనే బ్రతుకుచున్నాడు, దైవత్వముతో యోగములేని వియోగముకల్గి బ్రతుకు ఏ జీవునకైన అసంతృప్తి జీవితము తప్ప ఏమిలేదు. అందువలన భగవంతుడైన శ్రీకృష్ణుడు యోగమును గురించి అర్జునుని అడ్డుగా పెట్టుకొని సర్వులకు అర్థమగులాగున, మానవుడు ఈ హద్దులో ఉంటే యోగము, ఈ హద్దు దాటితే వియోగము పొందునని ఆ హద్దు ఏమిటో తెలిపాడు. ఆ మాటల హద్దునే 'గీత' అంటున్నాము .
భగవంతుడు సాంఖ్యయోగమున సూచనగా చెప్పిన కర్మ, బ్రహ్మయోగము లను గూర్చి సమూలాగ్రముగా ఈ అధ్యాయము నుండి చెప్పను మొదలు పెట్టాడు. ఈ అధ్యాయములో భగవంతుడు చెప్పిన మొదటి శ్లోకమును క్రింద చూడుము.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 3: లోకే ఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా ఽనఘ!|
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ||
(కర్మ, బ్రహ్మయోగములు)
భావము : మనుజులు ఆచరించుటకు రెండు రకములైన యోగనిష్టలు గలవని ముందే తెలిపియున్నాను. సాంఖ్యము తెలిసినవారు జ్ఞానయోగమును, కార్య వివరము తెలిసినవారు కర్మయోగమును ఆచరించగలరు.
వివరము: పరమాత్మ,ఆత్మ,జీవాత్మ,శరీరము అనునవి వేరువేరుగా ఉన్నాయని తెలిసినవారు సాంఖ్యులు. వారు ఆత్మను అనుభవించితే చివరకు పరమాత్మను చేరవచ్చుననెడి మార్గము తెలిసినవారు.జీవాత్మ, ఆత్మ యొక్క సుఖమును పొందాలంటే శరీరపనులన్ని స్తంభింపచేసి లోపలయున్న మనస్సు ద్వార ఆత్మను అనుభవించవలెను. సాంఖ్యము తెలిసినవారు ప్రతిది మనస్సు ద్వారానే అనుభవిస్తున్నామని తెలిసినవారై, ఆ మనస్సును బయటి సుఖముల నుండి వదలింపజేతురు. ఆత్మ, జీవాత్మల భేదము తెలిసిన సాంఖ్యులు మనస్సును స్వాధీనపరచుకొని, శరీరమును స్తంభింప చేసి, బయటి విషయముల నుండి మనస్సును మళ్ళించు సాధన కల్గియుందురు. ఆ సాధననే 'జ్ఞానయోగము లేక బ్రహ్మయోగము' అని అంటాము. మనస్సు ఆత్మ మీద లగ్నమై ఉండడమే జ్ఞానయోగమని తెలియాలి.
కర్మయోగము తెలిసిన వారెవరనగా శరీర యంత్రాంగమంతయు తెలిసిన వారై కర్మవలన గుణములు, గుణముల వలన యోచనలు, యోచనల వలన కార్యములు, కార్యముల వలన కర్మ కలుగునని తెలిసి మరియు కార్యములు జరుగుచున్నను కర్మ కలుగకుండునట్లు చేయువానిని కర్మయోగము తెలిసిన వాడంటాము. కార్యముల వలన కర్మ కలుగకుండునట్లు చేయు పద్ధతినే 'కర్మయోగము లేక రాజయోగము' అంటాము. కర్మయోగము ఆచరించువాడు శరీరమును కార్యములకు వదలి, శరీరము ద్వారా పనులు చేయుచు పనుల వలన కలుగు పాపపుణ్యకర్మను జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయుచుండును. కర్మను కాల్చు అగ్నిపేరు జ్ఞానాగ్ని అంటాము. 'జ్ఞానాగ్ని' కలిగి కర్మకాలిపోవాలంటే శరీర యంత్రాంగములోని 'అహము' యొక్క పనిని అణచివేయాలి. కార్యము జరుగు చున్నప్పుడు అహము మీద లగ్నమైయుండడమే కర్మయోగము అంటాము.
బ్రహ్మయోగము:- జీవాత్మ మనస్సుతో లగ్నమైయుండడమే బ్రహ్మయోగము లేక జ్ఞానయోగము. మనస్సు బయటి విషయముల మీదికి పోకుండ బుద్ధి మనస్సును బంధన చేయును. బయటి విషయధ్యాస ఎప్పుడైతే లేకుండపోవునో అప్పుడు మనస్సునకు ఆత్మధ్యాస కల్గును. అప్పుడే ఆత్మసుఖము మనస్సు ద్వారా జీవాత్మ తెలియుచున్నాడు. బ్రహ్మయోగమున ముఖ్యమైన పాత్ర మనస్సుది. ఎవని మనస్సు జీవాత్మతో ఏకీభవించియున్నదో వాడు బ్రహ్మయోగి, ఎవని మనస్సు ఆత్మ అనుభూతిని జీవాత్మకు అందజేయుచున్నాడో వాడే బ్రహ్మయోగి, ఎప్పుడైతే జీవాత్మ మనస్సు ఏకమైవుండి బ్రహ్మయోగమైనదో అపుడే యోగికి తెలియకనే 'జ్ఞానాగ్ని' వానియందు ప్రజ్వరిల్లుచున్నది. ఆ జ్ఞానాగ్ని వానియందుగల సంచిత కర్మను కాల్చివేయుచున్నది. మనస్సు బయటి విషయముల మీద లగ్నమైనపుడు జీవాత్మ మనస్సుతోనే లగ్నమై బయటి విషయములను అనుభవిస్తున్నది కదా! అది కూడ యోగమే కదాయని కొందరికి ప్రశ్నరావచ్చును. దానికి మా జవాబు జీవాత్మ మనస్సుతోనే లగ్నమై బయటి విషయములను అనుభవించడమును కూడ యోగమే. అయితే అది జ్యోతిష్య శాస్త్రములో చెప్పు యోగములగును. జ్యోతిష్యశాస్త్రములో చెప్పు యోగములు అనేక పేర్లు కలిగివున్నవని తెలియాలి. ఉదాహరణకు బుధార్కయోగము, గజకేసరి యోగము, చంద్రమంగళయోగము మొదలగునవి ఎన్నో కలవు. ఆ యోగము లన్నియు బయటి విషయసుఖములకు సంబంధించినవై ఉన్నవి. బయటి విషయయోగములు జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధించినవి. లోపలి విషయ యోగములు యోగశాస్త్రమునకు సంబంధించినవి. బయటి యోగములు జ్ఞానాగ్ని నిర్మిత యోగములు కావు. కావున యోగశాస్త్రములో ఆధ్యాత్మిక విషయమును కేవలము లోపలికలయికనే యోగమంటాము. అందులో మనస్సుతో జీవాత్మను కలిపి బయటి విషయముల నుండి మళ్ళించడమును బ్రహ్మయోగము అంటున్నాము. ఈ యోగమందు బాహ్య స్పర్శాదులందు మనస్సుకు సంబంధములేదు. జీవుడు బయటి సుఖములను అనుభవించడు.
కర్మయోగము:-జీవాత్మ అహంకారముతో లగ్నమైయుండడమే కర్మయోగము లేక రాజయోగము అంటాము. కర్మయోగమున అహము బయటి పనుల మీదికి పోకుండ బుద్ధి అహమును బంధన చేయును. బయటి కార్య ధ్యాస అహమునకు ఎప్పుడు లేకుండా పోవునో అపుడు బుద్ధి అహమును అణచివుంచి ఉండును. అప్పుడే కార్యములు తాను చేయలేదని, కర్మరీత్యా కార్యములు రూపుదాల్చుచున్నవని, జీవాత్మ తెలియుచున్నాడు. కర్మయోగమున ముఖ్యపాత్ర అహము వహించుచున్నది. ఎవని అహము కర్మను జీవాత్మకు చేర్చలేక పోవుచున్నదో వాడే కర్మయోగి. ఎప్పుడైతే జీవాత్మ బయటి ధ్యాసలేని అహముతో కలిసి కర్మయోగమైనదో అపుడే కర్మయోగికి తెలియకనే 'జ్ఞానాగ్ని ' ప్రజ్వరిల్లి అప్పుడు జరుగుచున్న కార్యములందు పుట్టుకొచ్చిన కర్మను (ఆగామికర్మను)కాల్చివేయుచున్నది. కర్మయోగమున యోగి అన్ని పనులు చేయుచు అజ్ఞానివలె కనిపించును. లోపల అహమును అణచి బయటి కార్య సంబంధము లేకుండా చేయడమే యోగము. కావున కర్మయోగమును బయటికి ఎవరూ గుర్తించలేరు.
ఈ విధమైన రెండు యోగములే పరమాత్మయందు ఐక్యమగుటకు ముఖ్య మార్గములై ఉన్నాయి. పరమాత్మయందు చేరుటకు కర్మ ఏమాత్రము లేకుండా పోవాలి. కర్మశేషమున్నంత వరకు లభించని పరమపదము, కర్మశేషము లేకుండా అయిపోయినపుడే లభించును. అందువలన భగవంతుడు జ్ఞానాగ్ని తయారగు రెండు యోగములు మనకు బోధించాడు. ఒక యోగములో సంచితకర్మ మరియొక యోగములో ఆగామికర్మ పోవునట్లు యోగములను నిర్మించాడు. పుట్టినప్పటినుండి చనిపోవు వరకు క్రొత్తగా వచ్చు కర్మను ఆగామికర్మ అంటాము. అమలుకు వచ్చిన కర్మ ప్రారబ్ధము కాగా, మిగిలిన నిలువను సంచితకర్మ అంటాము. బ్రహ్మయోగమున సంచితకర్మ క్రమముగ జ్ఞానాగ్నిచే కాలిపోవుచుండును. కర్మయోగమున ఆగామికర్మ కాలిపోవుచుండును. ప్రారబ్ధకర్మ కాలిపోవుట ఏ యోగములో లేదు .ఒక యోగికి తనయందు రగిలిన జ్ఞానాగ్ని కర్మను నాశనము చేయగా మిగిలిన అగ్ని తన శిరో భాగమున నిలువయుండును. అట్టి నిలువ అగ్నిని ఒక యోగి ఇంకొకనికి దానము చేసిన అది కేవలము ప్రారబ్ధము మీదికే పోయి కాల్చివేయును. ఈ విధానము తప్ప ప్రారబ్ధము కాలిపోవుటకు ఏ యోగములేదని తెలియాలి.
ఉన్నవి కర్మయోగము, బ్రహ్మయోగములను రెండే పద్ధతులు. కనుక పై శ్లోకమున 'ద్వివిధా నిష్టా' అని భగవంతుడు మొదటనే చెప్పాడు. ఆ రెండు నిష్టల పేర్లు స్పష్టముగా చెప్పుచు 'జ్ఞాన యోగేన' 'కర్మ యోగేన' అన్నాడు. ఇక క్రింది శ్లోకములలో ఈ రెండు యోగములను గూర్చి ఏమి చెప్పుచున్నాడో చూద్దాము.
శ్లోకం 4: న కర్మాణా మనారమ్భాన్నైష్కర్మ్యం పురుషో ఽశ్నుతే |
న చ సన్న్య సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి ||
(ప్రకృతి)
భావము : కర్మ ప్రారంభింపనంత మాత్రమున మరియు చేయుచుండు కర్మలను వదలుట వలనను మోక్షము లభించదు.
వివరము : కర్మలను ప్రారంభించుట అనగా పాపపుణ్యములను కార్యరూపముగా చేయుటకు ఉపక్రమించుట అని అర్థము. అట్లే చేయు కర్మలను వదలుటనిన కర్మ కార్యరూపమై మానవుని ఎడల జరుగుచున్నప్పుడు వదలుటయని తెలియవలయును. కార్యములన్నియు పాపపుణ్య మిశ్రితములని తెలిసి వీటిని చేయుట వలన పాపమొచ్చునని, చేయకుండుట వలన పాపమురాదు కదా! అని ఆ పనులను చేయకుండినను, మరియు పనులు చేస్తు ఈ పనులు చేయుచుండుట వలన పాపమొచ్చుచున్నదని తెలిసి, అలా కర్మరాకుండుటకు ఆ పనులను వదలివేయుట మంచిదని తలచు వారిని తెలియని వారేనని చెప్పవచ్చును.ఎందుకనగా! పనులు చేయనంత మాత్రమున, చేస్తున్న పనులు వదలుకొన్నంత మాత్రమున మోక్షము లభించదు. ఉదాహరణకు పెళ్ళి చేసుకొనుట వలన అనేక కర్మలు వచ్చునని పెళ్ళి మానుకొనువారు కొందరు, మరియు వివాహము జరిగి కొంత కాలము భార్యతో కాపురము చేసిన తర్వాత ఈ సంసారము చేయుట వలన కర్మలు కలుగుచున్నవని, కర్మలు కలుగకుండుటకు భార్యను కాపురమును వదలివేయవలెనని తలచి వదలివేయువారు కొందరు ఉన్నారు.
ఆ విధముగా కొందరు పనులు చేయకుందురు. మరియు ఒకవేళ చేయుచుండిన జ్ఞానమనుకొని ఎందరో పెళ్ళి చేసుకొనక బ్రహ్మచారులుగా నిలచిపోయినవారు ఉన్నారు. అట్టి వారిని గొప్ప జ్ఞానులుగా దైవజ్ఞులుగా చాలా మంది భావిస్తుండడము తెలిసిన విషయమే. కాని భగవద్గీతలోని భగవంతుడు దానివలన మోక్షము లభించదంటున్నాడంటే అది సరియైన పద్ధతి జ్ఞానముకాదనియే తెలియుచున్నది. ఇంకను ఎందరో భార్యాబిడ్డలతో కాపురము చేస్తూ పెళ్ళిలేని బ్రహ్మచారులను చూచి, వారు కర్మ అంటని స్థితిలో మంచి జ్ఞానములో ఉన్నారని తలచి, అట్టివారి మార్గమునే అనుసరిస్తే కర్మలు కలుగవని, దానికంటే మించిన జ్ఞానములేదని తలచి, చిన్నగా భార్యాబిడ్డలను వదలి సన్న్యాసమును పుచ్చుకొన్న వారిని కూడ చూస్తున్నాము. అట్లు సన్న్యసించుట వలనను సిద్ధి లభించదు అన్న దేవుని వాక్యము ప్రకారము అదియును సరియైన పద్ధతి కాదని తెలియుచున్నది. దీనిని బట్టి ఒక వివాహమే కాదు సర్వకార్యముల ఎడల కర్మమొచ్చునని చేయక పోవడము, చేస్తున్నది వదలుకోవడము పద్ధతి కాదన్నది జ్ఞానసూత్రమని తెలియాలి.ఎందుకనగా! క్రింది శ్లోకమును చూడుము.
శ్లోకం 5: నహికశ్చిత్ క్షణ మపి జాతుతిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశఃకర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః ||
(ప్రకృతి)
భావము : ఎవ్వడుగాని ఎట్టి కర్మ ఆచరింపక ఒక్క క్షణమైన ఊరకయుండలేడు. ప్రకృతి జనితములైన గుణములకు చిక్కినవారై,కర్మముల వశులై పనులు చేయుచుందురు.
వివరము : ప్రకృతిచే పుట్టినవి గుణములు.అవి సజీవముగావున్న అందరి శరీరములలో ఒకే విధముగా ఉన్నవి. ఆ గుణముల మధ్యనే జీవాత్మ నివాసము చేస్తున్నాడు. మూడు రకముల గుణ భాగములలో ఏదో ఒక భాగమున నివసిస్తూ ఆ భాగములోని గుణములందు బద్ధుడైవున్నాడు. గుణముల వలననే యోచనలు, యోచనల వలననే కార్యములు అను వరుస ప్రకారము జరుగుచున్నవి. ఏ కార్యము జరుగుటకు, ఏ గుణము పనిచేయవలెనో, ఆ గుణమును ప్రారబ్ధకర్మ ప్రేరేపించి చివరకు పనిని చేయించుచున్నది. ప్రతి జీవుడు శరీరములో కర్మ వశమున గుణములందు బంధింపబడి, కర్మ ప్రేరణ ప్రకారము కార్యములు చేయుచున్నాడు. ప్రారబ్ధకర్మ గుణమై, గుణము యోచనై, యోచన కార్యమై పోవుచున్నది.ఇది అనివార్య కార్యము.
ప్రతి మానవుడు మెలుకువలో ఉన్న ప్రతిక్షణము ఏదో ఒక ప్రారబ్ధకర్మ జరుగుచునే ఉన్నది. ఏదో ఒక యోచన మెదలుచునే ఉన్నది. ప్రతి క్షణము కర్మననుసరించి యోచనలు రాని మానవుడు భూమి మీద లేడనియే చెప్పవచ్చును. వచ్చిన యోచనలన్ని కార్యరూపము కావు. ఏవి కార్యరూపము కావలెనో అవియే కార్యరూపమైపోవును. మిగిలినవి యోచనల వరకే ఉండును. ఎటు తిరిగి ఏ క్షణము ప్రారబ్ధములేనిది ఉండదు. ప్రతిక్షణము ప్రారబ్ధకర్మ ఆడిస్తూనే ఉన్నది.
మానవుని నిర్ణయము ప్రకారము ఏ కార్యములు జరుగవు. జరుగు పనులన్నియు ప్రారబ్ధము ప్రకారమే జరుగును. అందువలననే మనిషి ఒకటనుకొంటే జరుగునది వేరొకటి ఉండును. బ్రహ్మచర్యము ఆచరించి ఆడవారి ఎడల జాగ్రత్తగా ఉండవలెనను వారు కూడ, స్వప్నావస్థయందైన తమ బ్రహ్మచర్యమును వదలి వేయడమో, లేక మెలకువలో ఏదో ఒక సమయమున తమ నిష్ఠను కోల్పోవడమో జరుగుచున్నది. కొందరు పెళ్ళి చేసుకొని భార్యతో కాపురము చేయవలెననుకొన్నను జీవితములో పెళ్ళియే కాకపోవడము గమనించగలరు. అవన్నియు పరిశీలించి చూచిన ఎవరు స్వతంత్రులై వారి ఇష్టప్రకారము ఉండలేరని, అందరు స్వతంత్రము లేనివారై కర్మచేతిలో ఆడింపబడుచున్నారని తెలియుచున్నది. ప్రతిఒక్కరు ప్రతిఒక్క సమయమున కర్మతంత్రులై ఏదో ఒక పని చేయుచున్నారు.
శ్లోకం 6:కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే ||
(బ్రహ్మ యోగము,జీవాత్మ)
భావము : కర్మేంద్రియముల పనులను నిగ్రహించి, జ్ఞానేంద్రియముల యొక్క విషయములను స్మరించు వానిని మూఢాత్ముడందురు.
వివరము: మనస్సు యొక్క ఆదేశానుసారము పనులు మాత్రము చేయు కర్మేంద్రియములనబడు కార్యేంద్రియములైన కాళ్లు, చేతులు, నోరు మరియు గుప్తముగా ఉన్న రెండు మొత్తము ఐదింటిని కదలకుండునట్లు చేసి, గొప్ప బ్రహ్మయోగమాచరించు వానివలె పైకి కనిపిస్తు,లోపల మనస్సునందు జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము యొక్క విషయములను జ్ఞప్తికి తెచ్చుకొని, వాటిని యోచిస్తూ కూర్చుండు వాని సాధన యోగసాధన అనబడదు. పై ఇంద్రియములు నిగ్రహించినప్పటికి లోపలి విషయములు యోచించు వాని ఆచారమును మూఢాచారము అందురు.
ఉదాహరణకు : ఒక వ్యక్తి యోగము చేయుచున్నాననుకొని ఒక మంత్రమును మనస్సునందు ఉచ్చరించుచు కదలక కూర్చున్నాడనుకొందాము. అతని బయటి ఇంద్రియములు పనిచేయకున్నను లోపలి మనస్సుకు జ్ఞానేంద్రియమైన చెవి విన్న విషయము జ్ఞప్తిగ స్మరించుచున్నాడు. కావున అతని ఆచారము సరియైనది కాదని, అట్టివానిని అజ్ఞాని లేక మూఢాత్ముడని భగవంతుడు తెల్పుచున్నాడు. అట్లు కదలక కూర్చొని మేము ప్రపంచ విషయములను స్మరించలేదు కదా! దైవసంబంధమైన మంత్రమునో నామమునో ఉచ్ఛరించుచున్నాము కదా! ప్రపంచ సంబంధ విషయమైతే మంచిది కాకపోవచ్చు. అలాకాక మంత్రమును స్మరించుట కూడ మంచిది కాదా! అను సందేహము కొందరికి రావచ్చును. దానికి జవాబు ఏమనగా! మంత్రమును స్మరించునపుడు మాది సరైన ఆచరణని అనుకొని పొరపడుటకు అవకాశమున్నది, కావున భగవంతుడు ఈ విషయమును ప్రత్యేకించి ఇచ్చట చెప్పవలసి వచ్చినది. ఇంద్రియార్థ విషయములన్నపుడు మనము మనస్సునందు స్మరించు మంత్రము కూడ ఒక రోజు చెవి యొక్క వినికిడి ద్వార మనస్సుకు చేరినదనియే చెప్పవచ్చును. అందువలన అది దైవసంబంధ మంత్రమైన లేక ప్రపంచ విషయమైన దానిని చెవి ద్వారా వచ్చిన విషయమేనని చెప్పవచ్చును. ఆ విధముగ ఇంద్రియముల ద్వార వచ్చిన విషయములు ఏవైన ఇంద్రియార్థ విషయాలే అవును. బ్రహ్మయోగ మనునది ఏ ఇంద్రియ విషయమునకు సంబంధము లేనిది. కావున కదలక కూర్చొని ఏ విషయమును స్మరించిన అది సరియైన ఆచరణకాదని, దానిని బ్రహ్మయోగమనరని తెల్పుచు కదలక మనస్సునందు దైవమంత్రమును స్మరించుటకంటే కదలుచు ప్రపంచ విషయములు ఆచరించు కర్మయోగము మంచిదని క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు.
శ్లోకం 7: యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభ తేఽర్జున |
కర్మేంద్రియైః కర్మయోగ మసక్తస్స విశిష్యతే ||
(కర్మ యోగము)
భావము : ఎవడు జ్ఞానేంద్రియములచే మనస్సును నియమించి, కర్మేంద్రియముల చేత పని చేయుచున్నాడో, వానిని కర్మయోగి అందురు. అట్టివాడు అందరికంటే ఉత్తముడు.
వివరము : ప్రపంచములో ఏ పని జరగాలన్నా జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రియముల యొక్క ప్రమేయము తప్పనిసరిగ ఉండవలసిందే. ఉదాహరణకు ఒక రేడియో మెకానిక్ రేడియోను రిపేరు చేయాలనుకొనుము. అపుడు కేవలము కర్మేంద్రియములైన చేతులొక్కటే కాక జ్ఞానేంద్రియములైన కన్నులు కూడ ముఖ్యపాత్ర వహిస్తున్నవి. జ్ఞానేంద్రియములు కదలకున్నవి, కర్మేంద్రియములు కదలి పని చేయుచున్నవి. అందువలన ఒక పని జరగాలంటే కర్మేంద్రియములు ప్రత్యక్షముగ జ్ఞానేంద్రియములు పరోక్షముగ అవసరము.
ఒక కార్యమందు జ్ఞాన కర్మేంద్రియములకంటే ముఖ్యపాత్ర వహించునది అంతరంగముననున్న మనస్సు. లోపలయున్న మనస్సు యొక్క విధానమును బట్టి చేయుచున్నపని కర్మయోగమైతే పాపపుణ్యమను కర్మ ఏ మాత్రము పని చేయుచున్న వానికి అంటదు. కర్మయోగము కాకపోతే ప్రస్తుత పనిలోని పాపము లేక పుణ్యములు తప్పక చేయువానికంటును.
పై శ్లోకమున భగవంతుడు జ్ఞానేంద్రియముల చేత మనస్సును నియమించి కర్మేంద్రియముల చేత కర్మయోగమాచరించువాడు విశిష్టత కల్గినవాడని చెప్పాడు. ప్రతి మనిషి ప్రతి దినము ఏదో ఒక పని చేయుచున్నపుడు ఎవరిది యోగముగ, ఎవరిది భోగముగ మారుచున్నదని తెలియాలంటే అది సాధ్యముకాని పని. ఎందుకనగ కర్మయోగము అంతర్గత మనస్సుకు సంబంధించిన విషయము, ఎదుటి వాని మనస్సు కనిపించదు. కావున ఎదుటి వానిని గుర్తించుట కష్టము. తనకు తాను ఆచరించు వానికి మాత్రము తనది కర్మయోగమైనది లేనిది తెలియవచ్చును. ఇప్పుడు ఉదాహరణకు ఒక పనిని వివరించుకొందాము. ఒక మెకానిక్ రేడియోను రిపేరు చేయుచున్నపుడు కంటితో చూస్తు చేతితో చేస్తు ఉన్నాడు. ఆ సమయములో ఆ మెకానిక్ మనస్సుతో తను చేయుచున్నపని యొక్క ఫలితము మీద యోచించిన మరియు నేను ఈ పనిని చేయుచున్నాను, ఇది మెకానిక్ పని, నేను మెకానిక్ ను, ఇతరులకు చేతగాని దానిని సహితము నేను చేయగలను, నేను నైపుణ్యుడను అను మొదలగు అహము యొక్క యోచనలు వచ్చిన ఎడల వానికి ఆ పనియందు గల పాపపుణ్యములు ఏవి గలవో అవి వచ్చి చేరును. అట్లుకాక పని చేయుచున్నవాడు నేను అను అహము యొక్క ధ్యాస లేకుండా, ఆ పనిమీదనే ధ్యాసనుంచి చేసిన వానికి ఏ కర్మ అంటదు. అట్టి దానినే కర్మయోగమందుము.
నేడు ఒక చిన్న ఉద్యోగము చేయువాడు సహితము నేను పలానవాడనను అహంకారముతో చేయుచున్నాడు. ఒక మనిషికి పోలీసు డిపార్టుమెంటులో జవాన్ పని వస్తే, నేను పోలీసునను అహమును తన శరీరమంత నింపుకొని, నేనొక మనిషిని అన్నమాట మరచి పోతున్నాడు. అట్లే పై అధికారులైతే నేను పలానయని భావించుకొనుచున్నారు. ఎవడూ తాను వేరు తన వృత్తి వేరు అనుకోవడము లేదు. వృత్తిని బట్టి నేను గొప్పయని సాటి మనిషికంటే గొప్పగా తలచినపుడు అతను చేయుచున్నపని అహంకారము నిండినదౌతున్నది. కావున అట్టి పనులన్నియు కర్మయుక్తములేకాని కర్మయోగములు కావు. కర్మయోగమునకు ముఖ్యముగ అహంకారము ఉండకూడదనుట సిద్ధాంతము.
ఇపుడు ఒక వ్యక్తికి అనుమానము రావచ్చును అది ఏమనగా! నేను చేయు ఉద్యోగము ఇతరులను దండించి శిక్షించునదని, ఇతరులను కొట్టునప్పుడు పాపమొచ్చుట నిజము, కర్మయోగ జ్ఞానమంటే నాకు తెలియనపుడు, నేను చేయునది అంతా పాపమైనపుడు, ఆ పని చేయుటకంటే వేరే పని చేయుట మేలు కదా! ఈ ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి వేరు పని చేసుకుంటాననుకోవచ్చును. ఇట్లు ఎందరికో వారుచేయుచున్న పనుల మీద వారికి ఏహ్యభావము కల్గి ఈ పని మానివేయుదమనుకోవచ్చును. దానికన్నిటికి భగవంతుడు క్రింది శ్లోకమున సమాధానమిస్తున్నాడు చూడండి.
(శ్లోకం 8 : నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః ||
(బ్రహ్మయోగము)
భావము : నీవు చేయు నియమిత పనులను వదలుకొనుటకంటే ఆచరించుట మేలు, చేయు పనులను వదలి దేహయాత్రను చేయలేవు.
వివరము : మనిషి జీవితములో ఒక్కొక్కరు ఒక్కో విధమైన పనులు చేయుచుందురు. ఒకడు బస్ కండక్టర్ పనిచేసి బ్రతికితే, ఒకడు బస్ ను నడిపి బ్రతుకుచుండును.అట్లే ఒకడు పోలీస్ పనిచేసి బ్రతుకుతుంటే, మరియొకడు దొంగతనము చేసి బ్రతుకుచుండును. ఒకడు రైతు పని చేస్తే, మరియొకడు రాజకీయముతో బ్రతుకుచుండును. ఒకడు గుడ్డలునేసి బ్రతుకుచుంటే, మరియొకడు గుడ్డలుతికి బ్రతుకుచున్నాడు. ఒకడు నాటకమాడి బ్రతుకుతుంటే, మరొకడు ఆడించి బ్రతుకుచున్నాడు. ఇట్లు ఏదో ఒక పనిచేసి దానివలన వచ్చిన డబ్బుతో ఆకలికి కావలసిన ఆహారమును సమకూర్చుకొనుచున్నారు. ఎవరు ఏమి చేసిన కోటి విద్యలు కూటికొరకేనన్నది నగ్నసత్యము. ఆరోగ్యముగ ఉండుటకు శరీరమునకు కావలసిన ఆహారమునిచ్చి పోషించడమును శరీరయాత్రను సాగించినట్లని తెలియుము.
శరీరయాత్ర సాగించుటకు మానవుడు ఎన్నో లెక్కలేనన్ని పనులు చేయుట మనకు తెలిసినదే. ఆ విధముగ ఎందరికో ఎన్నో విధములైన పనులు వారి కర్మానుసారముగ నియమితమై ఉన్నవి.ఆలోచించి చూచిన కొందరి పనులు మంచివై పుణ్యమును సంపాదించి పెట్టునవై ఉన్నవి. కొందరివి చెడు పనులై పాపమును సంపాదించి పెట్టునవై ఉన్నవి. అవి ఏవైనను వారికి నియతకర్మవలన జరుగు కార్యములు. అనగా వారివారి ప్రారబ్ధానుసారముగ ఉన్న పనులని తెలియవలయును. ఈ జన్మలో ఏ పనులు చేయవలెనో వెనుకటి జన్మల కర్మ ప్రకారము నియమింపబడి ఉండును. కావున ప్రారబ్ధానుగుణముగ ఉన్న కర్మను నియతకర్మ అంటున్నాము.
బ్రహ్మయోగమాచరించవలెనని ప్రారబ్ధము ప్రకారము నడుచుకోక, చేయు పనులను వదలి సాధనకు కూర్చుంటే, శరీరమునకు కావలసిన ఆహారమును సమకూర్చలేరు, శరీరయాత్ర జరగదు. శరీరపోషణ చేయువారు వేరుగ ఉండిన వారు బ్రహ్మయోగము చేయబూనిన పరవాలేదు. కాని శరీరపోషణ నిమిత్తము పనులు చేయువారికి బ్రహ్మయోగ సాధన కుదరదు. గట్టిగ కూర్చుంటే వాని శరీర పోషణ జరగదు. కావున శరీరయాత్ర కొరకు నియమింపబడిన కార్యములు చేయువారందరికి తగిన విధముగ క్రింది శ్లోకము చెప్పబడినది.
శ్లోకం 9:యజ్ఞార్థాత్కర్మణో ఽన్యత్ర లోకో ఽ యం కర్మబంధనః |
తదర్థం కర్మ కౌంతేయ! ముక్త సంగస్సమాచర||
(కర్మ యోగము)
భావము: యజ్ఞ సంబంధము లేకుండ కర్మలు ఆచరించుట వలన మానవులకు తిరిగి కర్మబంధనములు కలుగుచుండును. కనుక అర్జునా! కర్మలయందు బంధింపబడక కార్యములు చేయుము.
వివరము: ఇది కర్మయోగములో అత్యంత కీలకమైన శ్లోకము. ఇక్కడ "యజ్ఞార్థ " అన్న క్రొత్తపదము వచ్చినది. యజ్ఞము అన్న పదమునకు అర్థము ముఖ్యముగ తెలియవలసి ఉన్నది. యజ్ఞము అను పదము అందరికి చాలా సుపరిచితమైనప్పటికి, యజ్ఞమంటే అందరికి తెలిసినదే కదా! అనుకొన్నప్పటికి, పరమాత్మ భావము ప్రకారము ఇంతవరకు ఆ పదభావమునకు మనము దూరముగ ఉన్నామనియే చెప్పవచ్చును. ఎందుకనగా! ఒక చోట అగ్నిగుండము కావించి అందులో కొన్ని సమిధలను కాల్చివేయడమును యజ్ఞమని అందరము అనుకొంటున్నాము. అది కేవలము యజ్ఞమునకు గుర్తుకాని, వాస్తవయజ్ఞముకాదని తెలియాలి. యజ్ఞము యొక్క విషయము తెలియుటకు కృతయుగము మొదటి కాలములోనికి వెళ్లెదము.
కృతయుగములో మనుషుల మధ్య నివాసముండుటకు ఇష్టపడని గురువులు అందరు అరణ్యములో నివాసముండెడివారు. ఆ యుగములో గురువులకు గొప్ప గుర్తింపు ఉండెడిది. రాజులు సహితము గురువుల వద్దకే పోయి ఆత్మజ్ఞానము తెలుసుకొనెడివారు. ఆ పద్ధతి ప్రకారమే ఒక గొప్పరాజు గురువు దగ్గరికిపోయి జ్ఞానాసక్తుడై వచ్చినట్లు తెలిపి జ్ఞానముకొరకు అర్థించాడు. ఆ గురువు చాలా మితభాషి, చెప్పవలసిన జ్ఞానము సూటిగ ఒకటి రెండు మాటలలో చెప్పి మౌనముగ ఉండెడివాడు. ప్రతిదినము అందరితో మాట్లాడువాడు కాదు. రాజు కొన్ని రోజులు అక్కడే ఉన్న తర్వాత ఒక రోజు సాయంకాలము రాజును చూచి 'నీవు యజ్ఞము చేయాలి' అన్నాడట. ఆ మాటవిన్న రాజు యజ్ఞమంటే ఏమిటో తెలియక అర్థముకాని ముఖముపెట్టి అది ఏమిటో నాకు తెలియదన్నాడు. అపుడు గురువుగారు యజ్ఞమును గురించి తెలుపుటకు యోచించి లోహములలో బంగారు ఇనుము, వస్త్రములలో పట్టువస్త్రము నూలువస్త్రము, నూనెలలో నెయ్యి వేపనూనె, కట్టెలలో గంధపుకట్టె తుమ్మకట్టె, ఔషధములలో మర్రిపుల్లలు నేల ఉసిరిపుల్లలు, ధాన్యములలో బియ్యము నూగులు, ఇట్లు ఒక దానికొకటి విరుద్ధమైనవి, హెచ్చుతగ్గులు గలవి,ఒక దానికొకటి ప్రత్యేకత గలవియైన అనేక వస్తువులను తెమ్మని రాజుగారికి ఆజ్ఞాపించెను. ఆ కాలములో ఉన్న గురువులందరిలో గొప్పవాడనిపించుకొన్న ఆ గురువు చెప్పిన వెంటనే రాజుగారు స్వయముగ బయలుదేరిపోయి, గురువుగారి ఆజ్ఞమేరకు సమస్త వస్తువులను సమకూర్చుకొని ఏనుగుల మీద మోయించుకొని తెచ్చెను. ఆ విధముగ గురువుగారు చెప్పడము రాజు తేవడము ఆ కాలములో అందరికి క్రొత్తపనిగ కనిపించినది. చాలా మంది గురువులు కూడ ఏమి చేయుచున్నారో చూడాలనుకొన్నారు.
గురువుగారు ఒక అగ్నిగుండమును తయారుచేయించి, మండుచున్న అగ్నిలో తెచ్చిన వస్తువులన్నిటిని వేసి స్వాహా చేయమనెను. అపుడు ఆ రాజు ఒక్కొక్క వస్తువును తీసివేస్తు దానిపేరు చెప్పి స్వాహా చెప్పను మొదలిడెను. స్వాహా అనగ అయిపోయినదని అర్థము. ఆ ఉద్ధేశ్యముతోనే తెచ్చిన బంగారు అయిపోతూనే సువర్ణ స్వాహా అన్నాడు. అట్లే తెచ్చిన వస్తువులన్ని వేస్తు ఏ వస్తువు అయిపోతే ఆ వస్తువు పేరు చెప్పి స్వాహా అన్నాడు. అట్లే తెచ్చిన వస్తువులన్ని వేస్తు ఏ వస్తువు అయిపోతే ఆ వస్తువు పేరు చెప్పి స్వాహా అనుచు మొత్తము వస్తువులన్ని ముగించెను. ఆ పనిని ఎందుకు తన చేత చేయించాడో రాజుగారికి ఏమి అర్థము కాలేదు.అలా రాజుగారి చేత చేయించడము మిగత గురువులు చాలామంది తెలుసుకొని, ఆ రాత్రికి రాజుగారిని కలిసి అలా ఎందుకు చేయించారని అడిగారు. అందులకు రాజుగారు యజ్ఞము చేయమని గురువుగారు చెప్పారని, యజ్ఞమంటే ఏమిటో తనకు తెలియదని గురువుకు చెప్పగ, దానిని తెలుపుటకు అనేక రకమైన వస్తువులు గురువుగారు తనచేత తెప్పించి అగ్నిగుండములో వేయించి స్వాహా చేయించాడని తెలిపాడు.
రాజుగారి మాటలువిన్న మిగతా గురువులందరు ఇలా అనుకొన్నారు.రాజుగారు తన రాజ్యము సుఖసౌఖ్యముగ ఉండుటకు గురువుగారిని అడిగి ఉంటారని, దానికి గురువుగారు ఎవరికి తెలియని గొప్ప కార్యము చేయించాడని, అలా చేసిన కార్యము రాజుగారి మాటల వలన యజ్ఞమని తెలిసినదని, ఆ యజ్ఞము వలన రాజుగారు తెచ్చిన వస్తువులన్నియు అగ్నిదేవుని ద్వార మిగతా దేవతలకు వరుణ దేవునికి అంది ఉంటాయని, ఆ వస్తువులు తీసుకొన్న వరుణుడు వర్షము సకాలముగ కురిపిస్తాడని, దానివలన రాజుగారి రాజ్యము కరువు కాటకములు లేకుండ సుఖముగ ఉండగలదని, రాజుగారు రాజ్యము కొరకే యజ్ఞమను పేరుతో ఈ పని చేశారని, తాము కూడా అలా చేస్తే వర్షాలు వస్తాయనుకొని వారి వారి రాజుల వద్దకు పోయి, ప్రజలు సుఖముగ ఉండుటకు, వర్షాలు కురిసి పంటలు బాగాపండుటకు, యజ్ఞము చేస్తామని దానికి ఇంత ఖర్చు ఇన్ని వస్తువులు కావాలని అడిగి ఇప్పించుకొని, గురువుగారు రాజుగారి చేత చేయించినట్లే చేయను మొదలిడిరి. అట్లు పూర్వము యజ్ఞములను రాజులుచేసెడివారు. ఓపికలేని రాజులు అన్ని ఇచ్చి గురువుల చేత చేయించెడివారు. ఇలా కాలక్రమేపి యజ్ఞాలు అను పేరుగల కార్యములు జరుగుచు వస్తున్నవి. నేటికిని అక్కడక్కడ గలవు. ఇప్పటికి చేయించువారు అగ్నిగుండము ముందర కూర్చొని వస్తువులు వేయడము గలదు. అట్లు ఓపిక లేకపోతే డబ్బు ఇస్తే చేయు యజ్ఞములు కలవు.
విశేషమేమిటంటే గుడిలోని ప్రతిమ నిజముగా దేవుడుకాదని అది కేవలము దేవుని గుర్తింపని చాలామందికి నేడు తెలియలేక పోయినట్లు, కృతయుగములో గురువు రాజుగారిచేత చేయించిన దహనకార్యము నిజముగ యజ్ఞముకాదని, అది కేవలము యజ్ఞము యొక్క గుర్తింపని తెలియక పోయినది. దహనకార్యమునే నిజముగ యజ్ఞమనుకొన్నారు.నాటి నుంచి నేటి వరకు దానిని యజ్ఞమనియే అంటున్నారు. పూర్వము తిరుపతిలో గుణరహిత భావము వ్యక్తము చేయుటకు ఒక భక్తుడు గుండు కొరిగించుకొనగా ఆ దినము దానిని చాచినవారు నాటి నుండి నేటివరకు మ్రొక్కుబడిగ ఎట్లు కొరిగించుకొనుచున్నారో అట్లే భావపూరిత కార్యము కూడ భావరహితమై కోర్కెల నిమిత్తమైన కార్యమై యజ్ఞమనిపించుకొంటూ ఉన్నది.
ఆనాడు గురువుగారు రాజుకు ఆ దహన కార్యమును గురించి మరుసటి దినము ఏమి చెప్పాడో, మిగత వారికి తెలియని దానివలన గుణముల రూపములో ఉన్న మాయ తప్పుడు ఊహనందించి, అసలు మార్గమునుండి తప్పించినదనియే చెప్పవచ్చును. అగ్నికి సమిధలను (వస్తువులను) అర్పించిన రాజుగారికి కూడ చేసిన కార్యము గురించి తెలియక నాకు మోక్షము కావాలనుకొన్నాను, గురువుగారు యజ్ఞము చేయమన్నారు. నాకు తెలియదన్నాను నాచేత చేయించాడు. దీని వలన మోక్షము సాధ్యమా! ఇందులో ఏదో నాకు తెలియని రహస్యమున్నదని తలచి అది ఏమిటని తీవ్రముగ యోచిస్తూ ఉన్న సమయములో మరుసటి దినము గురువుగారు పిలిచి 'రాజా నేను చాలామందిలాగ ఎక్కువగా మాట్లాడువాడను కాను, సూటిగ సమాధానము చెప్పువాడను. అందువలన నీవడిగిన దానికి సరియైన సమాధానము ఇచ్చాను. నీవు మోక్షము గురించి అడిగావు. నేను యజ్ఞము చేయమన్నాను. నీవు తెలియదన్నావు, దానిని తెలుపు నిమిత్తము యజ్ఞమునకు ఉదాహరణగ ఒక దహన కార్యము చేయించాను. వెంటనే దానిని గురించి నీకు చెప్పలేదు. అలా చెప్పక పోవడము వలన దానిమీద నీకు శ్రద్ధ ఎక్కువై తెలుసుకోవాలను తపన మొదలిడవలె నని చెప్పలేదు. అలా శ్రద్ధ ఎక్కువైనప్పుడే తెలుపబడే విషయము బాగుగా గ్రహింపబడును. దహనకార్యము యజ్ఞమునకు ఉదాహరణయని చెప్పానుగ! ఆ ఉదాహరణ విపులముగ చెప్పుచున్నాను వినుము.
మోక్షమనగ విడుదలయని అర్థము. దేనినుండి విడుదల కావలెను? ఏది బంధనముగ ఉన్నదని యోచించిన, పాపము మరియు పుణ్యము అను కార్య ఫలితములు కర్మరూపమున జీవున్ని బంధించి జన్మలపాలు చేయుచున్నవి. పాపము పుణ్యము కంటికి కనిపించని కర్మరూపములు. అవి ఒక దానికొకటి వ్యతిరిక్తముగ ఉండి ఒకటి మంచి ఒకటి చెడు, ఒకటి సుఖము ఒకటి దుఃఖము కలుగ చేయుచుండును. ఈ విధముగ ఉన్న విభేదములైన పాపపుణ్యములకు ఉదాహరణగ తియ్యనైన అతి మధురపు పుల్లలు, చేదైన వేపపుల్లలు, నెయ్యి, వేపనూనె, గంధపుచెక్కలు, తుమ్మచెక్కలు, ఒక దానికొకటి విభేదములు కల్గిన వస్తువులను తెప్పించాను. తెచ్చిన వస్తు సముదాయములన్ని పాప పుణ్యములకు సమానమని గుర్తించుము.
పాపపుణ్యములున్నంత వరకు మోక్షమురాదు. ఎప్పుడైతే పాపపుణ్య బంధనములు తెగిపోవునో అప్పుడే మోక్షము. కావున పాపపుణ్యములు లేకుండా చేయాలి. పాప పుణ్యములను లేకుండ చేయునది ఒకేఒక జ్ఞానశక్తి, దానిని జ్ఞానాగ్ని అనికూడ అంటాము. జ్ఞానాగ్నిలో పాపపుణ్యములు ఎపుడు దహించబడి లేకుండా పోతాయో అప్పుడే మోక్షము ప్రాప్తిస్తుంది. అందువలననే మోక్షకాముడైన నీవు యజ్ఞము చేయాలి అన్నాను.ఉన్న పాపపుణ్యములను లేకుండ చేయడమే నిజమైన యజ్ఞము. యజ్ఞము అనగా "నాశనము " అని నిజమైన అర్థము. ఇప్పుడు చేసినది యజ్ఞమునకు ఉదాహరణ, కాని యజ్ఞముకాదని తెలియాలి. శరీర అంతరంగమున పాపపుణ్యములను జ్ఞానాగ్ని చేత దహించడము గురించి తెలియునట్లు, బయటి సమిధలను అగ్నియందు కాల్చి చూపాను. పాపపుణ్యములు ఎలా వస్తుంటాయో, వాటిని యజ్ఞమెలా చేయాలో, వివరముగ చెప్పెదను వినుము.
నిత్యము మనము చేయు పనులయందు కొన్ని మంచి, కొన్ని చెడు పనులు తప్పక ఉంటాయి. మంచి చెడు కార్యముల యొక్క కనపడని ఫలితములు పాపపుణ్యములు. పనులు చేయుచున్నపుడు వచ్చు పాపపుణ్యములను జ్ఞానాగ్ని ద్వారా లేకుండ చేయకపోతే, అనగ యజ్ఞము చేయకపోతే, అవి కర్మ బంధనములై కూర్చుంటాయి. కనుక నీవు ఇప్పటినుండి ఏ పని చేసిన అహంకారరహితుడవై, కర్మములు అంటకుండునట్లు, ప్రతి కర్మను యజ్ఞము చేయాలి" అన్నాడు.
ఈ విధముగ ఆ గురువుగారు యజ్ఞము యొక్క అసలు రహస్యము చెప్పి బాహ్యయజ్ఞములు నిజమైన యజ్ఞములుకావని, అవి కేవలము యజ్ఞము యొక్క ఉదాహరణ మాత్రమేనని, అంతరంగమున కర్మనాశనమే నిజమైన యజ్ఞమని అర్థమగునట్లు చేశాడు. ఆనాటి భావపూరిత దహనమే, నేడు నిజమైన యజ్ఞముగ తలచుచుండుట చాలా పొరపాటని తెలియుచున్నది. భగవంతుడు శ్లోకమున 'యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః' అన్నాడు యజ్ఞముకాని కర్మ లోకములో బంధమౌనని దాని అర్థము. పనిలో వచ్చుకర్మ యజ్ఞము కావాలని ఎవరు అనుకోవడము లేదు. యజ్ఞమంటే నాశనమని తెలియక పీఠాధిపతులు, పేరుగాంచిన గురువులు వస్తు దహనకార్యమే యజ్ఞముగ బోధించుచున్నారు. కర్మ దహన కార్యమును గురించి భగవంతుడు తెల్పాడని గురువులు చెప్పలేక పోవడము వలన, దేవతల మెప్పు పొందాలనుకొన్నవారు, కోర్కెలు గల మొదలగు వారందరు విపరీతముగ డబ్బులు ఖర్చుచేసి బాహ్య వస్తుయజ్ఞములు చేయుచున్నారు. కాని శరీరము లోపల కర్మయజ్ఞము చేయలేక పోవుచున్నారు.
భగవద్గీతలో భగవంతుడు చెప్పిన యజ్ఞము యొక్క భావము అర్థము కాకుండ చేయుటకు మాయ కొందరిలో దూరుకొని లోపలి యజ్ఞములను నిర్వీర్యము చేయుటకు, బాహ్య యజ్ఞములను సమర్థించుటకు, మేము చేయు బాహ్యయజ్ఞములు తప్పు కావుయని ఎప్పటికైన వాదించుటకు అనువుగ, భగవద్గీతయందే బాహ్యయజ్ఞములను గూర్చి భగవంతుడే చెప్పినట్లు శ్లోకములు అల్లి, యజ్ఞము అని పేరు వినిపించిన ఈ శ్లోకము క్రిందనే వాటిని అమర్చారు. అట్లు అమర్చిన శ్లోకములే ఇపుడు వరుసగ ఏడు గలవు. శాస్త్రరీత్య ఇవి భగవద్గీతలో భగవంతుడు చెప్పకున్నను, అవి శాస్త్రబద్దము కాకపోయినను, ఇంతవరకు అవి భగవంతుడు చెప్పిన శ్లోకములుగనే గురువులందరు చెప్పడము వలనను, ప్రజలందరు వాటిని నమ్మడము జరిగినది. భగవంతుడు చెప్పినది కర్మయోగమునకు సంబంధించిన యజ్ఞమైయుండగ, కర్మలు కాల్చబడుటకై ఉండగ, మోక్షము పొందుటకై ఉండగ, అందులకు విరుద్ధముగ వస్తువులను కాల్చి దేవతలకు ఇవ్వడము, దానికి బదులుగా వారు మనకు వర్షము కురిపించడము, ఒకరికొకరు సహాయము చేసుకోవడమేమిటని ఎవరు ప్రశ్నించుకోలేకపోయారు.
గీతయందు పరమాత్ముడు ఏ దేవతల గురించి చెప్పలేదు. వారి ప్రీతి కొరకు యజ్ఞములు చేయమని కూడ చెప్పలేదు. దేవతలను ఆరాధించితే దేవతలలోనికి పోతావు, నావద్దకు రాలేవని కూడ అచ్చటచ్చట హెచ్చరిక చేశాడు. నన్నే ఆరాధించుము, నన్నే పొందుదువని హితము కూడ చెప్పాడు. ఇచ్చట వరుసగ ఉన్న ఏడు శ్లోకములు దేవతలకు సంబంధించినవి. కావున దేవుడు చెప్పలేదని, ఎవరో కల్పించి అందులో చొప్పించారని, యోచించు ప్రతివారికి అర్థమగును. భగవంతుడు కర్మయోగము యొక్క వివరము చెప్పుసమయమున, యజ్ఞమను మాట పై శ్లోకమందు చెప్పిన వెంటనే, కొందరు ఇప్పుడు సంధు దొరికింది కదాయని ఏడు శ్లోకములు ఇరికించారు. "యజ్ఞార్థా" అన్న శ్లోకము కర్మయోగమునకు సంబంధించినది కాగ, వెంటనే బ్రహ్మయోగమునకు సంబంధించిన 'యస్త్వాత్మరతి' అన్న శ్లోకము చెప్పబడియుండగ, వీటికి మధ్యలోనున్న "యజ్ఞార్థ " అను కర్మయోగ శ్లోకమునకు, "యస్త్వాత్మరతి" అన్న బ్రహ్మయోగ శ్లోకమునకు మధ్యలో ఏ యోగముకానివి, ఏ ఆత్మకు సంబంధించనివియైన ఏడు కల్పిత శ్లోకములు చేర్చబడినవి. ఈ పని ఎప్పుడు ఎవరు చేశారో కాని, ఇంతవరకు వాటిని గుర్తించక పోవడము పెద్ద పొరపాటని చెప్పుచున్నాము. ఆ కల్పిత అశాస్త్రీయ శ్లోకములు వరుసగ ఇలా ఉన్నాయి.
శ్లోకం 10: సహయజ్ఞః ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వమేషవో స్త్విషకామధుక్ ||
(అశాస్త్రీయము)
శ్లోకం 11: దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః|
పరస్పరం భావయంత శ్రేయః పరమావప్స్యథ ||
(అశాస్త్రీయము)
శ్లోకం 12: ఇష్టాన్ భోగన్ హిచోదేవా దాస్యంతే యజ్ఞ భావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యోయో భుజ్త్కే స్తేవ ఏవ సః ||
(అశాస్త్రీయము)
శ్లోకం 13: యజ్ఞాః శిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః |
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ||
(అశాస్త్రీయము)
శ్లోకం 14: అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ||
(అశాస్త్రీయము)
శ్లోకం 15: కర్మబ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం |
తస్మాత్పర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ||
(అశాస్త్రీయము)
శ్లోకం 16: ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః |
అఘాయురింద్రియారామోఘం పార్థ!సజీవతి ||
(అశాస్త్రీయము)
ఈ ఏడు శ్లోకములందు చెప్పిన విషయము మూడవ అధ్యాయమైన జ్ఞాన యోగమందుగల 33వ శ్లోకమున చెప్పబడిన భావమునకు, అట్లే ఏడవ అధ్యాయమైన అక్షరపరబ్రహ్మయోగమందు గల 4వ శ్లోకమున చెప్పబడిన భావమునకు పూర్తి వ్యతిరిక్తముగ ఉన్నది. ఉన్నవి ద్రవ్య జ్ఞానయజ్ఞములు రెండేనని, అందులో జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనదని, అది కర్మను మాత్రమే కాల్చునని చెప్పబడిన జ్ఞానయోగములోని 33వ శ్లోక భావమునకు, అట్లే అక్షర పరబ్రహ్మ యోగములో 4వ శ్లోకమున నేను ఆత్మగ ఉండి దేహములలో జరుగు రెండు రకముల యజ్ఞములకు అధిపతిగ ఉన్నానను దేవుని భావమునకు, పై ఏడు శ్లోకములు పూర్తి విరుద్ధముగా ఉన్నవి. ఇష్టకామములు తీర్చుకొనుటకు యజ్ఞములు చేయండని ఏడు శ్లోకములలో చెప్పడము, మానవుని కోర్కెలను రేకెత్తించడమే తప్ప, వాటినుండి తప్పించడము ఏమాత్రము కాదు. దేవతలకు యజ్ఞములు చేయుట వలన వారు మీకు వృద్ధి చేయుదురని, ఇట్లు ఒకరికొకరు అభివృద్ధి చేసుకొమ్మని పైన 11వ శ్లోకములో చెప్పడము, దేవతలు మనుషులు ఒకరికొకరు వస్తు మార్పిడి వ్యాపారము చేసుకొమ్మని చెప్పినట్లున్నది. అంతేకాక 12వ శ్లోకమున యజ్ఞ పూజలందిన దేవతలు మీకు సర్వభోగములు ఇచ్చుచుందురు. వారి సొత్తు మరల యజ్ఞము చేసి వారికివ్వకపోతే, పండిన పంటలు మీరేతింటే, దొంగతనము చేసినట్లేనని చెప్పడము మరీ చోద్యముగనున్నది. ఇది ఎట్లున్నదనగా! నేను వాని పెళ్ళిలో బహుమతి ఇచ్చాను, వాడు నా పెళ్ళికి బహుమతి తిరిగి ఇవ్వలేదు అన్నట్లున్నది. భగవానుడు ధర్మసంస్థాపనకు వచ్చి తన ధర్మములను తెలుపుచున్నప్పుడు, తన మాటలకే విరుద్ధమైన ఇటువంటి విలువలేని మాటలు చెప్పునా! ఈ ఏడు శ్లోకములలో బ్రతుకు తెరువుకు సంబంధించిన ప్రపంచ ధర్మముతప్ప, మోక్షమునకు పనికి వచ్చు పరమాత్మ ధర్మములు ఏమాత్రములేవని పాఠకులు గ్రహించవలెనని కోరుచున్నాము.
ఇచ్చట చాలామందికి యజ్ఞముల మీద తమకున్న భావమునకు, ఇప్పుడు ఇక్కడ మేము చెప్పు భావమునకు వ్యత్యాసమేర్పడి, మా మాటలు కొంత బాధ కల్గించునవియే అయినప్పటికి, మేము చెప్పునది సత్యము కావున చెప్పక తప్పలేదు. అటువంటివారు ఎవరైన ఉంటే కొంత వివరణాత్మక యోచన చేయాలని కోరుచున్నాము. ఇందులో గొప్పగొప్ప గురువులే పొరపడి, పనిగట్టుకొని అదే ముఖ్యమైన ఆరాధనని తలచి, అగ్నిగుండములు కావించి కాల్చి ఖర్చు పెట్టుచుంటే, మిగతావారు కూడ పెద్దలజాడ నడవాలనుకొన్నారు తప్ప మనము చేయుచున్నది ఏమిటని యోచించలేదు. బాహ్యముగ చేయు యజ్ఞములలో కూడ ఉన్న వస్తువులను లేకుండ చేయడము ప్రత్యక్షముగ కనిపిస్తున్నది కదా! అపుడు అది నాశనము అని ఎందుకు అర్థము కాలేదు? నీటిలో ఈది బయటపడవచ్చు, గాలిలో తేలిపోవచ్చు, భూమిలోతులో కూడ బ్రతకవచ్చు, కాని అగ్నిలో సర్వులు నాశనము కాకతప్పదు. ఒక అడవి అంటుకొంటే అందులోని ఏ జీవరాశియైన చావక తప్పదు. ఆ అగ్నితో చేయబడు యజ్ఞము నాశనమని అర్థము తెల్పుచు, జ్ఞానాగ్నిచేత కర్మను కాల్చు కొమ్మని, మోక్షము పొందమని, సందేశమిచ్చు అగ్నిగుండమును యజ్ఞము యొక్క నమూనాయని తెలియక యజ్ఞమే అనుకోవడము చాలా పెద్ద పొరపాటు. అగ్నిగుండములు కావించి వాటిని యజ్ఞములని కొందరనుకుంటే, గీతను బోధించు బోధకులు ఆ బోధకు "గీతాయజ్ఞము " అని పేరు పెట్టడము ఇంకా పొరపాటు. ఉదాహరణకు 72వ గీతాయజ్ఞము, 73వ గీతాయజ్ఞము అని వరుసగ పేరు పెట్టి చెప్పడము జరుగుచున్నది. నిజార్థము ప్రకారము, పరమాత్మ గీతయందు తెల్పిన ఉద్దేశ్యము ప్రకారము గీతను 72వ మారు కాల్చుచున్నాము, 73వ మారు కాల్చుచున్నామని అర్థము. అనగ గీతను ఉద్ధరించవలెనని బోధించుట మంచిదే, కాని ఎన్నిమార్లు బోధించినది బోధించు సంఖ్య పెట్టి దానిప్రక్కన యజ్ఞమని పేరు పెట్టడము బాగలేదు. చెప్పానుగ నిజమైన అర్థము ప్రకారము యజ్ఞమనగ ఉన్న దానిని లేకుండ చేయడమేనని. దాని ప్రకారము గీతనే లేకుండ చేసినట్లగును.
జ్ఞాన యోగమైన మూడవ అధ్యాయములో యజ్ఞములు రెండు రకములని భగవంతుడు చెప్పినపుడు కూడ యజ్ఞములను గూర్చి 9 కల్పిత శ్లోకములు అమర్చబడినవి. విశేషమేమిటంటే అక్కడ కేవలము అగ్నితో చేయునవి చెప్పక, భజనలు మొదలుకొని తపస్సుల వరకు కూడ యజ్ఞములని చెప్పడము జరిగింది. ఇంకను ఇక్కడ యజ్ఞము అన్నపేరు వచ్చిన తర్వాత కల్పించి చెప్పగ, అక్కడ యజ్ఞమన్న శ్లోకమునకు ముందే కల్పించి చెప్పారు. ఇట్లు మనుషులు కల్పించిన ఈ కల్పిత యజ్ఞములను వదలి భగవంతుడు చెప్పిన 'యజ్ఞార్థా' అన్న శ్లోకము తర్వాత ఉన్న అనుబంధ శ్లోకమును చూస్తాము.
శ్లోకం 17: యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః|
ఆత్మన్యేవ చ సంతుష్ట స్తస్య కార్యం న విద్యతే ||
(బ్రహ్మయోగము)
భావము : ఆత్మయందే లగ్నమగచు, ఆత్మతోనే తృప్తిపొంది, ఆత్మతోనే సంతోషము పొందువానికి ఏకార్యము లేదు.
వివరము: పనులు చేయుచు యజ్ఞ సంబంధముగ కార్యములు చేసినప్పటికి కర్మలంటవని, లేని ఎడల కర్మబంధనములు ఏర్పడునని తెలుసుకొన్నాము. దానినే కర్మయోగమని అంటున్నాము. ఉన్న రెండు యోగములలో రెండవది బ్రహ్మయోగము. బ్రహ్మ యోగమున మానవుడు ఏ పని చేయకుండ ఆత్మయందు లగ్నమైయుండును. అట్టి బ్రహ్మయోగి ఆత్మయందు లగ్నమైవుండి దానియందే తృప్తి, దానియందే సంతోషము పొందుచుండును. కావున అట్టి వానికి బయటి పనులతో సంబంధము లేదు. ఆత్మను పొందిన బ్రహ్మయోగికి బయటి ప్రపంచ కార్యములతో పనిలేదు.
ఈ బ్రహ్మయోగము వివాహితులకు మరియు కొందరి జీవనమునకు ఆధారమైవున్న వానికి తగదు. ఎందుకనగ అతడు ఇతరుల కొరకు పనులు చేయవలసియున్నది. ఏ పని లేనివానికి బ్రహ్మయోగము అనుకూలమైనది.అట్లుకాక పనిచేయవలసి ఉన్న వానికి కర్మయోగము తప్ప వేరు దారిలేదు.
శ్లోకం 18: నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహకశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః ||
(బ్రహ్మయోగము)
భావము: అట్టివాడు పనిచేయకుండుట వలన లాభము లేదు. మరియు నష్టము లేదు. అతడు ఏ ప్రయోజనమునకైన ఎవరిని ఆశ్రయించవలసిన పనిలేదు.
వివరము: బ్రహ్మయోగి ఏ పని చేయనివాడై ఆత్మయందే లగ్నమై ఉండుట వలన వానికి లాభనష్ట భేరీజు లేదు. బాహ్య స్పర్శలేని అతనికి కావలసినదేది లేదు. అతడు ఏ ప్రయోజనముల కొరకు ఎవరిని ఆశ్రయించవలసినది లేదు. బ్రహ్మయోగమున లోపలి ఆత్మ తప్ప బయటి ప్రపంచము తెలియదు. కావున అట్టి వానికి బయటి ప్రపంచ లాభనష్టములుగానీ, వ్యర్థ ప్రయోజనములుగాని, సుఖదుఃఖములు గాని, ప్రేమ, అసూయలుగాని లేవని తెలియాలి. కర్మయోగి యొక్క విధానము బ్రహ్మయోగి యొక్క విధానము చాలావేరై ఉన్నవి. కనుక కర్మయోగము చేయువారు పనులు చేయాలి. ఆ పనులు కర్మ సంగ వినిర్ముక్తముగ ఉండవలెనని క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు చూడండి.
శ్లోకం 19: తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుషః ||
(కర్మయోగము)
భావము: అందువలన చేయుచుండు కార్యము యొక్క ఫలితము మీద ఆసక్తిలేని వాడవై, కర్మప్రకారము కార్యములు చేయుము. అట్లు చేయుట వలన పరమును పొందవచ్చును.
వివరము: నీవు బయట ప్రపంచ సంబంధము ఎక్కువ కల్గివున్నావు.కావున ఈ కార్యము నేను చేయుచున్నానని, నేను చేయుట వలన ఈ కార్యము జరుగుచున్నదని, ఈ కార్యము జరుగుట వలన ఈ ఫలితము వచ్చుచున్నదని, లేక ఈ కార్యము యొక్క పర్యవసానము పలానాయని దానిమీద ధ్యాసయుంచక చేయుము. ఉదాహరణకు ఒక పొలములో పత్తి పైరుకు పురుగు మందుకొట్టుచున్నావనుకొనుము. అపుడు మందు కొట్టుట నా పనియని చేయుటలో తప్పులేదు. కాని మందుకొట్టి ఎన్నో వేల పురుగులను చంపుచున్నాననుకోకూడదు. నీవు మందుకొట్టుట వలన పురుగులు చనిపోవుట నిజమే అయినప్పటికి దానిని నీవు యోచించకూడదు. మందుకొట్టుట కార్యము, పురుగులు చనిపోవుట కార్యము యొక్క ఫలితము, కార్యము మీద లగ్నమైన పరవాలేదు. కాని కార్య ఫలితము మీద లగ్నము కాకూడదు. ఒక వేళ కార్య ఫలితమునకు నీవే కారణమని తలపోసిన ఎడల, ఆ పురుగులను చంపిన పాపము తప్పక అంటుకొనును. దానిని తర్వాత జన్మమెత్తి అనుభవించవలసి ఉంటుంది. కార్యము చేయుటకు మాత్రమే నేను నియమితుడనని తలచి ఫలితము మీద 'నేను' అను అహంభావము పెట్టుకోక చేసిన కార్యములలో కర్మ అంటదు. అలా చేయువాడు పరమాత్మ ప్రాప్తి పొందును.
ఇది నిజమా అని అనుమానపడవలసిన పనిలేదు. కార్యములు చేసినప్పటికి కర్మ అంటక పోవడమును కర్మయోగమంటాము. ఇది ఇప్పటి క్రొత్త మాట కాదు. పూర్వము కూడ ఎందరో ఈ పద్ధతి ద్వారా దైవప్రాప్తి పొందారు. ముఖ్యముగ సంసారములో ఉండి, బయట సంబంధముండి పనులు చేయువారు తప్పక ఆచరించ వలసిన పద్ధతిది. దీనిని గురించి భగవంతుడు క్రింది శ్లోకమున ఏమి చెప్పుచున్నాడో చూడండి.
శ్లోకం 20: కర్మణైవ హిసంసిద్ధి మాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి|| (కర్మయోగము)
భావము: కర్మయోగమాచరించి జనకుడు మొదలైనవారు మోక్షము పొందిరి. లోకులు తెలుసుకొనుటకైన నీవు ఈ పద్ధతిని ఆచరింపుము.
వివరము : జనకుడు ఒక రాజైయుండియు, తన రాజ్యములోని అనేక సమస్యలతో అనేక పనులతో ఆయన సంబంధపడియుండియు, కర్మయోగ పద్ధతి ఆచరించుట వలన మోక్షము పొందినాడు. అందువలన కర్మయోగ మార్గము ద్వారా మోక్షము పొందవచ్చునని ఇతరులు తెలుసుకొనునట్లు, నీవు అన్ని కార్యములు చేయుచు కర్మయోగమాచరింపుము.
శ్లోకం 21: యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః|
సయత్ర్పమాణం కురుతే లోకస్త దనువర్తతే ||
(కర్మయోగము)
భావము : శ్రేష్ఠుడు ఏది ఆచరించునో దానినే ఇతరులు ఆచరింతురు. అతడు ఏ ప్రమాణమును చూపునో దానినే ఇతరులు అనుసరింతురు.
వివరము : ఇక్కడ శ్రేష్ఠులు అను పదము వచ్చినది. ఇప్పటి కాలమున మనుషులలో శ్రేష్ఠులు ఎవరైనది తెలియకుండ పోయినది. పూర్వకాలములో శ్రేష్ఠులను గుర్తించి వారి ప్రకారము ఇతరులు నడుచుకొనేవారని పై శ్లోకములో అర్థమగుచున్నది. జగతిలో అన్నిటికంటే శ్రేష్ఠమైనది ఒకే ఒక దైవజ్ఞానము. దైవజ్ఞానమునకు సమానమైనదిగాని, దానికంటే పవిత్రమైనదిగాని లేదని పూర్వమనెడివారు. శ్రేష్ఠమైన జ్ఞానమును ఎవడు తెలిసియున్నా అటువంటి వానిని శ్రేష్ఠ అనెడివారు. అంతేకాక దైవజ్ఞానము రహస్యములలోకెల్ల రహస్యమైనది,కావున అంతటి గుప్తమైన (రహస్యమైన) జ్ఞానమును తెలిసినవానిని గుప్తుడు అనెడివారు. వీడు దైవజ్ఞానము తెలిసినవాడని ఇతరులకు తెలియునట్లు అప్పటి కాలములో గురువులు వాని పేరు చివర శ్రేష్ఠ అనియు, లేకపోతే గుప్త అనియు గుర్తింపు పదమునుంచెడివారు. ఇది ద్వాపరయుగములోని మాట. కలియుగములోనికి వచ్చెటప్పటికి కాలక్రమమున శ్రేష్ఠ, గుప్త అను పదములు ఒక కులము చివరకు వచ్చాయి. కేవలము ఒక్క వైశ్య కులములోనే ఈ పదములు పేరు చివరన గలవు. గుప్త అను పదము ఇప్పటికి మారకున్నను శ్రేష్ఠ అను పదము కొంత మారిపోయి శ్రేష్ఠి అను రూపాంతరము చెందినది. వంద సంవత్సరముల క్రితము గుప్త, శ్రేష్ఠ అను పదములు వైశ్యుల పేర్ల చివరిలో కనిపిస్తుండెడివి. ప్రస్తుతకాలములో శ్రేష్ఠి అను పదము మరి కొంత మారిపోయి "శెట్టి " అయిపోయినది. గుప్త, శ్రేష్ఠి అను పదములు కలియుగము మొదటికాలములోనే వైశ్యకులములో చేరిపోయినట్లు అర్థమగుచున్నవి.
బ్రాహ్మణులు అనగా బ్రహ్మజ్ఞానము కలవారని, వైశ్యులు అనగా యజ్ఞములు చేయువారని పూర్వము అర్థముండెడిది. ప్రస్తుత కాలములో ఆ అర్థములు మారి పోయినవి. వైశ్యులు అనగా వ్యాపారము చేయువారను భావము వచ్చినది. కేవలము కులమును నిర్ణయించునవిగానే బ్రాహ్మణ, వైశ్య పేర్లు మారిపోయినవి. వైశ్వానరుడు అనగ అగ్నిదేవుడని, అన్నిటిని భష్మీపటలము చేయువాడని, శరీరములో ద్రవ్యములను కాల్చు జఠరాగ్నియని, ద్రవ్యములను లేకుండ చేయువాడని భావముండెడిది. ఆ భావము కాలక్రమమున మారిపోయి, ద్రవ్యములను అమ్మువాడు వైశ్యుడు అను భావము వచ్చినది. వైశ్వానర అను పదమునుండి వైశ్యులు అను పదము పుట్టుకొచ్చినది. వైశ్వానరుడు కడుపులో ద్రవ్యము వస్తూవుంటే కాల్చివేస్తు లేకుండ చేయువాడు కాగ, నేటి వైశ్యులు దుకాణములో ద్రవ్యములు వస్తూవుంటే అమ్మివేస్తు లేకుండ చేయువారుగ గుర్తింపు పొందారు. ఈ విధముగ శ్రేష్ఠ అను పదము శెట్టిగ, వైశ్వానరులు అనుపదము వైశ్యులుగ రూపాంతరము చెందినది.
దేవుడు చెప్పిన శ్రేష్ఠులు ఎవరైనది గుర్తింపు లేకుండ పోయినది. అందువలన ఎవరిని ఆదర్శముగ తీసుకొని వారిని అనుసరించాలని సంశయమేర్పడుచున్నది. దానికి జవాబుగ దేవుడు చెప్పిన సూత్రమునే ఉపయోగించుకొని చూడాలి. పవిత్రమైన, శ్రేష్ఠమైన జ్ఞానము ఎవరివద్దగలదో వారినే శ్రేష్ఠులు అనుకోవాలి. జ్ఞానమును తెలిసిన శ్రేష్ఠులలో శ్రేష్ఠుడెవడో యోచించి చూడాలి. శ్రేష్ఠులలోకెల్ల శ్రేష్ఠుడు నిజముగ భగవంతుడేనని తెలిసి భగవంతుడు చెప్పిన మార్గమును అనుసరించాలి, అదియే సరియైన మార్గము.
శ్లోకం 22: నమే పార్థాఽస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నా ఽనవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||
(కర్మయోగము)
భావము : నాకు కర్తవ్యమనునది లేదు. ముల్లోకములందు నేనింత వరకు పొందినది ఇక పొందవలసినది లేదు. ఐనను నేను కర్మలను ఆచరించుచున్నాను.
వివరము : ముల్లోకములనగా మూడు గుణములని తెలియవలయును. ప్రత్యేకించి మూడు లోకములు ఎక్కడాలేవు. మూడు గుణముల ద్వారా పనులు చేయవలసిన అవసరము నాకు లేదని శ్రీకృష్ణుడు పై శ్లోకమున తెల్పాడు. అట్లే మూడు గుణములతో తానింత వరకు పొందనిది, పొందవలసినది లేదు. ఐనప్పటికి నేను మూడు గుణముల ద్వారా పనులు చేయుచున్నానని కూడ తెల్పాడు. ఆ విధముగ ఎందుకు చేయుచున్నాడనగా!
శ్లోకం 23: యదిహ్యహంనవర్తే యం జాతు కర్మణ్యతన్ద్రితః|
మమవర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ! సర్వశః ||
(కర్మయోగము)
భావము : ఓ అర్జునా! నేనెప్పుడైనను పనులయందు అజాగ్రత్త కలిగి చేయని ఎడల, భూమిమీద జనులందరు అన్ని విధముల నావలె వారు కూడ పనులు చేయక ఊరకుందురు.
వివరము : భగవంతునిగ పుట్టిన పరమాత్మ పనులు చేయుట ఏమిటని ఆశ్చర్యము కలుగకమానదు. పైగా నేను తప్పక చేయాలి అంటున్నాడు. అదియు మార్గదర్శకతకు అన్నాడు. మానవుని కర్తవ్యమును తెలుపుటకు దేవుడు భగవంతునిగ పుట్టాడు. కావున అది ఏమిటో ఆయనే చేసి చూపించాలి. ఆయన జప తపములనుగాని, వ్రతక్రతువులనుగాని, ఇలా చేయండని దేనిని చూపలేదు. ఆయన చేసినదంతా సాధారణ మానవుడు చేయుపనులనే చేసాడు. అలా చేయుటయందే కర్మయోగము కలదని తెలియజేసాడు. పనులు చేయుటయందే కర్మయోగము గలదని, పనులు చేయకపోతే కర్మయోగమనునదే లేదని, అందువలననే తాను ఎల్లప్పుడు పనులు చేసి కర్మయోగమాచరించి చూపవలెనని, అట్లు చేయకపోతే మిగతావారు కూడ కర్మయోగమును అనుసరించలేరని తెలిపాడు.
శ్లోకం 24: ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చే దహమ్ |
సంకరస్య చ కర్తా స్యా ముపహన్యామిమాః ప్రజాః||
(కర్మయోగము)
భావము : నేను పనులు చేయకపోతే జగతిలోని మనుషులెల్లరు చెడు మార్గమున పోవుదురు మరియు వర్ణ సంకరమేర్పడును. ప్రజలనెల్ల నేను చెడగొట్టిన వాడనగుదును.
వివరము : దేవుడు మానవునిగ భూమిమీదకు వచ్చినపుడు సామాణ్యముగ ఎవరికి తెలియదు. వచ్చిపోయిన తర్వాత కొంత కాలమునకు పలానా మనిషి, పలానా జ్ఞానమును, ధర్మమును తెలియజేశాడు, కావున ఆయన దేవుని అవతారమైన భగవంతుడని తెలుసుకొనుటకు వీలున్నది. అలా పలాన మనిషిని భగవంతునిగ నిర్ణయించుకొనిన పిదప ఆయన తన జీవితములో ఏమి చెప్పాడు? ఏమి చేశాడు? అని ముఖ్యముగ గమనిస్తాము. చెప్పినది జ్ఞానరూపములో, చేసినది చరిత్ర రూపములో ఉండును. భూమిమీద తెలిసిన పెద్దలు పలానావాడు భగవంతుడని తెలియజేసిన తర్వాత అతను చెప్పిన దానిని కొందరు ముఖ్యముగ చూస్తారు. కొందరు చేసిన దానిని చూస్తారు. మరికొందరు రెండింటిని గమనిస్తారు. అటువంటి మూడు రకములలో కొందరికి ఆయన చెప్పినది నచ్చినప్పటికి, ఆయన చేసినది నచ్చదు. కొందరికేమో ఆయన చేసినది నచ్చినప్పటికి, ఆయన చెప్పినది నచ్చదు. మరికొందరికి రెండు నచ్చవు. అలా భగవంతుడు పలానావాడని ఇతరుల ద్వార తెలుసుకొన్నప్పటికి చెప్పినదో, చేసినదో నచ్చక, ఆయన భగవంతుడు కాదను నిర్ణయానికి చాలామంది వస్తారు. చాలా అరుదుగ ఆయన చెప్పినది, చేసినది నచ్చిన వారుందురు. ఒక మనిషి భగవంతునిగ గుర్తింపు రావడమే కష్టము. గుర్తింపు వచ్చిన తర్వాత అతను అందరికి నచ్చడము మరీకష్టము. ఎవనికైన ఒకనికి బహు అరుదుగ రెండు విధముల నచ్చి, ఈయన దేవుని అంశతో పుట్టిన భగవంతుడని తెలియును. అట్లు తెలిసినపుడు ఆయనను అన్ని విధముల మార్గదర్శకునిగ తీసుకొని అలాగే నడుచుకొనుటకు ప్రయత్నించుదురు.
ఇక్కడ శ్రీకృష్ణుడు అన్ని విధముల భగవంతునిగ కొందరికి గుర్తింపబడినాడు. కావున ఆయన బోధను, ఆయన ప్రవర్తనను అందరు ఆదర్శముగ తీసుకొనుటకు అవకాశముగలదు. శ్రేష్ఠులు దేనిని ఆచరించితే దానినే ఇతరులు ఆచరిస్తారని ముందే చెప్పుకొన్నాము. అలా అన్ని రకముల శ్రేష్ఠుడు భగవంతుడే, కనుక ఆయన పనులు చేయకపోతే మిగతవారు కూడ ఆయనను అనుసరించి పనులు మానుకొనుటకు అవకాశము కలదు. మనుషుల లెక్కలో లోక నీతి ప్రకారము న్యాయము, అన్యాయము అనియు, చేయవలసిన పనులు, చేయకూడని పనులు అనియు, మంచి కార్యములు చెడు కార్యములు అనియు, పుణ్యమువచ్చు పనులు, పాపమువచ్చు పనులు అనియు రెండు తెగలుగ ఉండును. వీటిని బట్టి మనషులు కొన్ని పనులు చేయవలెనని, కొన్ని పనులు చేయకూడదని కూడ నిర్ణయించుకొని ఉందురు. చేయవలసినవి, చేయకూడనివి అనునవి ప్రకృతి ధర్మము ప్రకారముంటే, దేవుని ధర్మము ప్రకారము చేయవలసిన పద్ధతి, చేయకూడని పద్ధతి అనునవి గలవు. దేవుని ధర్మమునకు, ప్రకృతి ధర్మమునకు చెప్పుకోవడములో కేవలము కొంత తేడా మాత్రము అగుపించిన ఆచరించడములో చాలా భిన్నముగ ఉండును. కృష్ణుడు దేవుని ధర్మము ప్రకారము ఆచరించాడు. ఆయన ఆచరణ ప్రకృతి ధర్మములోనున్న వారికి చాలా భిన్నముగ కనిపించినది. అందువలన ఆయనను, ఆయన ప్రవర్తనను చాలామంది ఒప్పుకోలేదు. చేయవలసినవి, చేయకూడనివి మనుషుల నియమమైతే, చేయవలసిన పద్ధతి, చేయకూడని పద్ధతి భగవంతుని నియమమై ఉన్నది.
ఈ శ్లోకములో "సంకరస్య" అను పదము వాడబడినది. సంకరము అనగా ఉన్నదున్నట్లుండక ఇంకొకదానితో కలిసిపోయి వేరుగ మారిపోవడము అని అర్థము. ఉదాహరణకు నలుపురంగును ఎరుపురంగుతో కలిపితే నలుపురంగు మొదటి తన ఆకారమును కోల్పోయి వేరొక రంగుగ మారిపోవును. అలాగే దేవుని ధర్మమిదియని, చేయవలసిన పద్ధతిదియని, తాను చేసి చూపకపోతే దేవుని పద్ధతిలోనికి మనుషుల పద్ధతి చేరిపోయి దైవపద్ధతి వేరుగ మారిపోవు అవకాశమున్నది. ఎలాగైతే నలుపురంగు ఎరుపురంగుతో కలిసినపుడు ఇటు నలుపుగాక అటు ఎరుపుగాక మధ్యలో వక్క (పోక) రంగు వచ్చినట్లు ఇటు దేవుని పద్ధతికాక, అటు మనుషుల పద్ధతికాక మరియొక పద్ధతి ఏర్పడును. ఈ కాలములో కూడ అటువంటి సంకరపద్ధతి కలదని చెప్పవచ్చును. ఎలా అనగా! అజ్ఞాన మనుషుల పద్ధతి దైవజ్ఞానమను పద్ధతిలో కలిసిపోయి ఆస్తికపద్ధతి ఏర్పడినది. వీరు అటు అజ్ఞానులు కాదు, ఇటు జ్ఞానులు కాదు. రెండిటికి తప్పినవారుగ సంకరపద్ధతిగ ఉన్నారు. అజ్ఞానులైతే మంచి చెడు అయిన పాపపుణ్యకార్యములనే చేయుచుందురు. పూర్తి జ్ఞానులైతే దైవపద్ధతి ప్రకారము కర్మ, బ్రహ్మ, భక్తియోగములనే చేయుచుందురు. అటు ఇటు కాని సంకరక్రియలు గలవారు యజ్ఞములు, దానములు, వేదధ్యాయణములు, తపస్సులు చేయుచుందురు. ఈ సంకరపద్ధతి భూమిమీద లేకుండ చేయుటకు పై నాలుగు క్రియలవలన దేవుడు తెలియబడడని తనబోధ అయిన గీతలో భగవంతుడు చెప్పాడు. తనబోధలో చెప్పడమే కాకుండ అసలైన దేవుని పద్ధతిని తాను ఆచరించి చూపించాడు. అట్లు ఆచరించి చూపకపోతే మనుషులు చేయవలసిన పద్ధతిని వీడి, చేయకూడని సంకరపద్ధతి లోనికి పోవుదురని కూడ తెల్పినాడు. ఎప్పుడో అరుదుగ భూమిమీదకు దేవుని అంశ అయిన భగవంతుడు వచ్చి, తాను స్వయముగ పనులుచేసి, మీరు కూడ నా పద్ధతి ప్రకారము నడుచుకొమ్మని చెప్పిపోగా! ఆయన అజ్ఞానివలె ప్రవర్తించాడను వారు కూడ లేకపోలేదు. అట్లు మాట్లాడువారు అర్థము చేసుకొనునట్లు క్రింది శ్లోకముగలదు చూడండి.
శ్లోకం 25: సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వన్తి భారత !
కుర్యాద్విద్వాంస్తథా ఽసక్త శ్చికీర్షుర్లోక సంగ్రహమ్ ||
(కర్మయోగము)
భావము : ఒక అజ్ఞాని అన్ని విధముల పనులయందు ఆసక్తిపరుడై ఎట్లు చేయుచున్నాడో, జ్ఞానమంతయు తెలిసిన జ్ఞానియు అజ్ఞానివలెనె పనులు చేయవలయును. కాని ఆ పనులు చేయుటలో జ్ఞానికి ఫలితము మీద ఆసక్తి ఉండకూడదు.
వివరము :అజ్ఞానులు కొన్ని సందర్భములలో మాత్రము మంచి పనులు చేయుచు, అనేక సమయములలో చెడు పనులు చేయుట సహజము. వారు ఏ పనులు చేయుచున్నప్పటికి అహంకారముతో కూడుకొని జరిగిన పనికి తామే కారణమను భావము కలిగి చేయుచుందురు. అటువంటి పనులు జ్ఞానము తెలిసినవారు చేయకూడదని, అట్లు చేసిన ఎడల జ్ఞానులకు అజ్ఞానులకు ఏమి తేడాయని, జ్ఞానము తెలిసినంత మాత్రమున సరిపోదు దానికి తగిన మంచి ఆచరణ ఉండవలెనని, సత్ప్రవర్తనలేనప్పుడు జ్ఞానములేనట్లేనని, జ్ఞానము తెలిసినవారు మంచి పనులే చేయవలెనని, కలలో కూడ చెడు పనులు చేయకూడదని, ఎందరో పెద్దలు చెప్పు మాటలన్నిటిని ఇచట భగవంతుడు కొట్టివేయుచున్నాడు. మంచి చెడు పనులు ముఖ్యము కాదు. కర్మ ముఖ్యమంటున్నాడు. గత జన్మలో చేసుకున్న కర్మప్రకారము ఎవడైన చలామణి అవుతాడు. ఒకవేళ జ్ఞానము తెలిసినప్పటికి, వాని కర్మ ప్రకారము కొన్ని చెడుపనులు వాని ద్వార జరుగనున్న ఎడల ఎవరు మాన్పలేరు. అంతమాత్రమున వానిని అజ్ఞాని అనుట తగదని తెలుపుచున్నాడు.
కర్మ సిద్ధాంతము తెలిసిన జ్ఞాని తాను ఇట్లు చేయవలెనని, తాను చేయుట వలననే పనులు జరుగుచున్నవనిగాని అనుకోడు. కర్మప్రకారము తాను అజ్ఞానుల వలె పనులు చేయుచుండును. కాని జరిగిన పనికి తాను కారణమని ఎప్పటికి అనుకోడు. తాను జ్ఞానినని, పనులయందు అనగ ఆచరణయందు తాను అజ్ఞానికంటే వేరుగ ఉండవలెనని, వేరుగ కనిపించవలెనని అనుకోడు.అటువంటి కర్మాచరణ కల్గిన వానిని జ్ఞానిగ ఎవరు గుర్తించలేరు. కర్మయోగము పైకి కనిపించదు, కావున అజ్ఞానివలె జ్ఞానియు కనిపించును.
శ్లోకం 26: న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్ |
జోషయేత్సర్వ కర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్ ||
(కర్మయోగము)
భావము : జ్ఞాని పనులు చేయుటయందు అజ్ఞానుల బుద్ధికి భేదము కలిగించ కూడదు. తెలిసినవాడు అన్ని పనులు చేయుచు, ఇతరుల చేత కూడ తనవలె చేయించవలెను.
వివరము : అజ్ఞానులవలె తాను పనులు చేయకూడదని, తాను జ్ఞానినైనందుకు నా ఆచరణవేరని,జ్ఞానము తెలిసిన వారిపనులు అందరివలె ఉండవనియనుట వలన, అజ్ఞానులైన వారు జ్ఞానము తెలుసుకొనుటకు అవకాశమే లేకుండ పోవుచున్నది. ఉదాహరణకు ఒక అజ్ఞాని కొంతకాలమునకు తనలో కొంత మార్పు వచ్చి జీవితము శాశ్వతముకాదని, ఇప్పటినుంచైన కొంత జ్ఞానము తెలుసుకోవాలని నిశ్చయించుకొన్నాడు. జ్ఞానము కావలయునంటే లేక తెలియవలెనంటే ఆధ్యాత్మిక గ్రంథాలైనా చదవాలి లేక గొప్ప గురువులవద్దయిన బోధనలు వినాలి. ఆ ప్రయత్నములో ఒక దినము గొప్ప స్వామిజీ వ్రాసిన ఆధ్యాత్మిక గ్రంథాన్ని తీసి చదివాడు. అందులో మంచి పనులు చేయడము మంచివారి లక్ష్యమని, చెడు పనులు చేయుట చెడ్డవారి లక్ష్యమని, అజ్ఞానులు జ్ఞానమును తెలుసుకోలేక వారికి ఇష్టమొచ్చిన చెడుపనులు చేయుచు పాపమును పొందుచుందురని, వారు తప్పక నరకమును అనుభవించవలె నని, అటువంటి వారు దైవమునెప్పటికి తెలుసుకోలేరని, మోక్షమనునది వారికి దొరకదని వ్రాయబడివున్నది. దానిని చదివిన తర్వాత అతను తన ప్రవర్తనలో ఎన్నో మార్పులు తెచ్చుకొని, అన్నీ మంచి పనులే చేయవలెనని దృఢసంకల్పముతో ప్రయత్నించుచుండెను. కొంతకాలమునకు ఒక గురువుగారి ఉపన్యాసము వినుటకు అవకాశము దొరికినది. అతను ఎంతో ఆసక్తితో జ్ఞానము తెలుసుకోవాలని ఆ గురువుగారి ఉపన్యాసము వద్దకుపోయి వినసాగాడు. అచటి గురువుగారు ఈ విధముగ చెప్పుచున్నాడు.
"మనిషి జ్ఞాని అనిపించుకోవాలంటే ఆచరణ ముఖ్యము. అతను చేయు ఆచరణను బట్టి వాడు జ్ఞానియా, అజ్ఞానియా అని నిర్ణయింపబడును. చదవు చెప్పు వానిని టీచర్ అంటాము. భూమిని దున్నువానిని రైతు అంటాము. కత్తి కర్రలతో బెదిరించు వానిని రౌడీ అంటాము. అట్లే సత్ప్రవర్తన కలిగిన వానిని జ్ఞాని అంటాము. మంచి పనులు చేయుచు చెడుపనులు ఏ ఒక్కటి చేయకుండువాడే నిజమైన జ్ఞాని. పెద్ద పాత్రలోని పాయసమైన, ఒక చిన్న విషబిందువు అందులో పడినంత మాత్రమున అది భుజించుటకు యోగ్యముకానట్లు, ఎంత పెద్ద జ్ఞాని అయిన ఒక చిన్న చెడుకార్యముతో తాను జ్ఞానమునకు యోగ్యుడు కాకుండ పోవును, జ్ఞాన భ్రష్టుడగును. అటువంటి వాడు రెండింటికి చెడినవాడనిపించు కొనును." ఆ విషయమంతయు విన్న అతను అప్పటినుండి చాలా జాగ్రత్తగ వ్యవహరించుచు, ఏ చెడుకార్యము చేయక అన్నీ మంచి పనులే చేయుచు, నేను జ్ఞానినౌచున్నానను సంతోషముతోయుండెను.
ఒకనాడు విధివశాత్తు తప్పక తప్పు చేయవలసి వచ్చినది. తనకిష్టము లేకున్న తాను తప్పు చేసినవాడై దానిని యోచించసాగాడు. అండాపాయసమైనా విషపుచుక్కతో ఆహార యోగ్యత కోల్పోయినట్లు, నేను కూడ ఈ ఒక్క చెడు కార్యముతో జ్ఞానమునకు అనర్హుడనని తలచి, నేను ఎప్పటికైన భ్రష్టుపట్టువాడనే కనుక జ్ఞానమార్గము నాకు సరిపోదు. అది సన్న్యసించి కాషాయగుడ్డలు వేసి ఏ కార్యములు చేయని వారికైతే సరిపోతుంది, మాలాంటి సంసారులకు కానిపనియని తలచి, ఆనాటినుండి జ్ఞానమను మాట విడిచి మొదటివలె నేను అజ్ఞానినే అనుకొనెను. జ్ఞానమనునది ఆచరణలో లేదని, అంతరంగ విచారణయందున్నదని తెలియక, జ్ఞానమను పేరుపెట్టి నీతిని బోధించు గురువుల మాటలు విని, అసలు జ్ఞానమార్గమంటే ఏమిటో తెలియక, జ్ఞానమార్గము యొక్క ప్రయత్నము మాటే విడచి, తనకు జ్ఞానమే వద్దనుకొని, దానికి తగనను తలపు వచ్చునట్లు చేసినదెవరు? ఉపన్యాసము చెప్పిన వారు, గ్రంథములు వ్రాసినవారు. అందువలననే పై శ్లోకమందు భగవంతుడు జ్ఞానియైనవాడు, అజ్ఞానులైన వారి బుద్ధికి కలవరము కలుగజేయ కూడదన్నాడు. మంచి చెడు పనుల మిళితమైన సంసారములోయుండక సన్న్యసించి పనులు చేయకుండ ఉండమని బోధించుటకంటే, పనులు చేయుట మంచిదని, ఆ పనులు మన ఇష్టప్రకారము జరుగక కర్మప్రకారము జరుగుచుండునని, దానికి అజ్ఞానము వలన బాధ్యులమనుకోవడము పొరపాటని బోధించి, తాను పనులు చేయుచు అందులో కర్మ అంటక ఉండు విధానము బోధించుచు, మంచి చెడు పనుల తారతమ్యములు మన వలన జరుగునవి కావని, అవి వెనుకటి జన్మల కర్మ వలన నిర్ణయింపబడినవని, వాటిని ఏమాత్రము మన దృష్ఠిలో పెట్టుకోక కర్మరీత్య పనులు చేయుచుండుమని చెప్పుటయే తెలిసినవారి పద్ధతి.
ఇపుడు మేము చెప్పిన భావమును చాలామంది ఒప్పుకోకపోవచ్చును. మంచిచెడు పనుల తారతమ్యములను వదలి సహజముగ ఎవరిపని వారు చేసుకుపొమ్మని చెప్పడము సమంజసమా! ఇది జ్ఞానపద్ధతాయని అడుగవచ్చును. దానికి నా తరుపున దేవుని సమాధానము క్రింది శ్లోకములో చూడండి.
శ్లోకం 27: ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |
అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||
(ప్రకృతి)
భావము : ప్రకృతి నిర్మాణము ప్రకారము కర్మ వలన కల్గు గుణప్రేరణ ద్వార జరుగు అన్ని పనులకు, కర్త తానేయని అహంకారము గల అజ్ఞాని తలచుచుండును.
వివరము : పంచభూతములచేత తయారైన ఈ శరీరమునందు శిరోభాగమున కంటికి కనిపించని నిర్మాణమొకటున్నది. అది అందరికి మూలమైనది. అందులో బ్రహ్మ, కాల, కర్మ గుణచక్రములను నాలుగు చక్రాకారభాగములు గలవు. అందులో కర్మ, గుణచక్రములు మానవుని ఎడల చాలా ముఖ్యమైనవి. కర్మ చక్రములో జీవుడు గతములో చేసుకొన్న పాపపుణ్యములన్నియు నమోదై ఉండును. వాటినే కర్మ అంటున్నాము. ఆ కర్మ ప్రకారము క్రింది చక్రములో 3 భాగములలోని గుణములు ప్రేరేపింపబడి, ఆ గుణముల ప్రకారము బయటి కార్యములు జరుగుచుండును. అనగ ఒక పని జరుగుటకు కర్మచక్రములోని కర్మ కారణమైతే దాని వలన ప్రేరేపింపబడిన గుణము ద్వారా కార్యము ఆచరణకొచ్చుచున్నది. ఇది కార్యము జరుగుటకు శరీరమందు నెలకొల్పిన సూత్రబద్ద నిర్మాణమై ఉన్నది. బయటి కార్యము మంచిదా చెడ్డదా అనుట లోపలనున్న కర్మనుబట్టి ఉండును. లోపలనున్న కర్మలోని పాపము ఆచరణకొచ్చినపుడు, జీవుడు కష్టమును నష్టమును అనుభవించుచున్నాడు. అదే విధముగ పుణ్యము ఆచరణకొచ్చినపుడు, సుఖము అనుభవమునకు వచ్చుచున్నది. ఇలా పాపపుణ్యములు ఆచరణకొచ్చి జీవుడు సుఖదుఃఖములు అనుభవించవలసిన పద్ధతి ప్రతి జీవరాసికి నిర్మాణమై ఉన్నది. ఇది దేవుడు నిర్మించిన ప్రకృతి యొక్క పద్ధతి. దైవ నిర్మితమైన ప్రకృతి శాసనములలో కర్మ, గుణములు, కార్యములన్నవి ఇమిడి ఉన్నవి. మానవుడు కర్మానుసారమైన కష్టసుఖములు అనుభవించుటకు గుణముల వలన ప్రేరేపింపబడిన కార్యములు చేయవలసియున్నది. బయట మానవుడు ఒక పనిని చేయుటకు ప్రకృతి నిర్మితమైన గుణనిర్మాణము మొదలగునవి ముఖ్యకారణమై ఉన్నవి. జరుగుచున్న పని మంచిదా చెడ్డదా అనుట ముఖ్యము కాదు. అందుకు కారణమైన కర్మ, గుణములు ముఖ్యము. బయట జరుగుపని ఏదైనప్పటికి దానికి లోపల కర్మ, గుణములు సూత్రములుగ ఉన్నాయి. వాటి వలననే అన్ని పనులు జరుగుచున్నాయని తెలియక అన్నిటికి నేనే కారణమని, నా వలననే అన్ని పనులు జరుగుచున్నాయని, అజ్ఞానముతో నిండుకొని శరీరములో కేవలము ఒక భాగమై, ఒక్కచోట ఉన్న జీవుడు శరీర ఆకారము మొత్తము నేనేయను అహంకారమును పొందుచున్నాడు. అందువలన భగవంతుడు ప్రత్యేకించి ఈ శ్లోకమును చెప్పుచూ ప్రకృతి నిర్మితమైన కర్మ గుణముల ప్రకారము జరుగు పనులకు నేనే కర్తనని అహంకారము గలవాడనుకొనుచున్నాడని తెలిపాడు. అటువంటి వానికి మంచి చెడు అన్న భేదము ఉన్నది మరియు పాపపుణ్యములు ఉన్నవని తెలియాలి. జ్ఞానము కల్గినవారు ఏమి తెలిసి, ఎట్లు నడుచుకొంటాడో క్రింది శ్లోకము చూస్తాము.
శ్లోకం 28: తత్త్వవిత్తు మహా బాహో ! గుణకర్మ విభాగయోః |
గుణా ఽగుణేషు వర్తన్త ఇతి మత్వాన సజ్జతే ||
(కర్మయోగము)
భావము : తత్త్వ జ్ఞానమును తెలిసినవారు, కర్మలు గుణముల యొక్క భాగములను తెలిసినవారై, గుణముల వలననే కార్యములు జరుగుచున్నవని తెలిసియుందురు.
వివరము : ఆత్మజ్ఞానము తెలిసిన వానికి కర్మలంటే ఏమిటో, గుణములంటే ఏమిటో ముఖ్యముగ తెలిసియుండాలి. కర్మ గుణముల వివరము తెలియనివాడు ఆత్మజ్ఞానము తెలియనివాడేనని అర్థము. ఆత్మయొక్క వివరము తెలియాలంటే, ఆత్మ నివసించు శరీరము యొక్క వివరము తెలిసియుండాలి. శరీరము ఒక యంత్రములాంటిది. శరీరములో ఒకదానికొకటి అనుసంధానమైన విషయములు భాగములు ఎన్నో కలవు. శరీర యంత్రాంగములో ముఖ్యమైనవి కర్మ, గుణములు. ఒక ఇంజనులో ఇంజనుకు ఇంధనమైన నూనెను అందించు కార్భోరేటర్ మరియు దాని స్పీడును కంట్రోల్ చేయుటకు అనగ ఇంజను స్పీడును హెచ్చించుటకు తగ్గించుటకుయున్న గవర్నర్ అను పరికరములు ఎంత ముఖ్యమో, శరీరమను యంత్రమునకు కర్మ, గుణములు అంతే ముఖ్యమని తెలియాలి. ఇంజనులోని గవర్నర్,కార్భోరేటర్ పనిచేసినపుడు ఇంజను పనిచేయుచున్నది. అలాగే శరీరములోని కర్మ, గుణములు పనిచేసినపుడే శరీరము పనిచేయగలుగుచున్నది. ఇంజనులో కార్భోరేటర్ వేరని, గవర్నర్ వేరని, కదిలెడి భాగములైన పిస్టన్లు, చక్రములువేరని, తెలిసినపుడే దేనివలన ఇంజను కదలుచున్నదని తెలియుచున్నది. అట్లే శరీరములోని కర్మ, గుణములు వేరని, శరీరములోని కదిలెడు అవయవములు వేరని, తెలిసినపుడు శరీరము దేని కారణమున కదలుచున్నదని తెలియుచున్నది.
ఒక మెకానిక్‍కు యంత్రము యొక్క పూర్తి వివరము తెలిసినట్లు, ఆత్మ జ్ఞానము తెలిసినవానికి శరీరములోని కర్మ గుణముల యొక్క విభాగముల వివరము పూర్తిగా తెలిసియుండును. అటువంటివాడు కర్మవలన గుణములు ప్రేరేపింప బడుచున్నవని, ఆ గుణముల వలన శరీరము ద్వార సర్వ కార్యములు జరుగుచున్నవని, బయట జరుగు మంచి చెడు కార్యములకు లోపలయున్న కర్మ, గుణములే కారణమని, జీవుడైన తాను ఏమాత్రము ఏ కార్యమునకు కారణముకానని, శరీరము ద్వారా జరుగు పనులయందు తటస్థుడుగ ఉండవలెనని తలంచి, తాను పనులు చేయుచున్నను వాటిమీద ఆసక్తిలేనివాడై ఉండును. శరీరములో నేను ఒక భాగమైన జీవుడననుకొని, శరీరము యొక్క ఆకారము నేను కాదనుకొని, అహంకారము లేకుండ పనులు చేయుచుండును.
శ్లోకం 29: ప్రకృతేర్గుణ సమ్మూఢా స్సజ్జన్తే గుణకర్మసు |
తానకృత్స్న విదోమందాన్‍కృత్స్నవిన్న విచాలయేత్ ||
(ప్రకృతి)
భావము : ప్రకృతి జనిత గుణములందు చిక్కియున్న మనుషునకు ఆ గుణముల కార్యములయందే కర్మముల ప్రకారము ఆసక్తి కలిగించును. జ్ఞానులగువారు అట్టి అజ్ఞాన పరులను చలనమొందించకూడదు.
వివరము : కర్మప్రేరణ వలన గుణముల ప్రకారము కార్యములు చేయుట సమస్త మానవుల ఎడల నిర్మింపబడిన ప్రకృతి ధర్మము. అగ్నికి కాల్చుట ధర్మము, పాటకు రాగము ధర్మము, అట్లే మానవునకు కర్మప్రకారము కలుగు గుణముల కార్యములు చేయుట ధర్మము. మాటకు శబ్దమునెట్లు దూరము చేయలేమో, పాటకు రాగమునెట్లు లేకుండ చేయలేమో, అట్లే కర్మబద్దుడైన మానవున్ని ఆ కర్మ ప్రేరణవలన కలుగు గుణముల ప్రకారము కదలకుండ చేయలేము. ఇదే గీతయందు భగవంతుడు తెలియజేసిన ముఖ్యమైన ప్రకృతి ధర్మము. ఈ ధర్మము ప్రకారము జ్ఞానియైన అజ్ఞానియైన నడవక తప్పదు.
ఒక జీవితములోని అనేక సంఘటనలు కల్గిన చలనచిత్రమును మూడు గంటలపాటు మనము చూస్తున్నాము. ఆ చిత్రములోని అనేక దుఃఖసంఘటనలు, ఎన్నో హాస్య సంఘటనలు మరెన్నో సంతోష సంఘటనలు మొదలగు ఎన్నో విధములైన విషయములు జరుగుట చూస్తున్నాము. ఇవన్ని తెల్లని తెరమీద చూడగల్గుచున్నాము. తెల్లని గుడ్డమీద ఇన్ని సంఘటనలు కల్గుటకు ప్రొజక్టరులోని ఫిల్ముకారణము. చిత్రములోని సంఘటనలన్ని ఫిల్ములో చిన్నగ చిత్రించబడి ఉండి, చిత్రింపబడిన వరుస ప్రకారము తెరమీద ప్రొజక్టరు ద్వార పెద్దగ కన్పిస్తున్నాయి. హాలులో ఒక చిత్రమును మనము చూడాలంటే అందుకు అవసరము మొదటిది ఫిల్ము, రెండవది ప్రొజక్టరు, మూడవది తెల్లని పరదా(తెర) అట్లే ఒక కార్యము జరగాలంటే మొదటిది కర్మ, రెండవది గుణములు, మూడవది కర్మేంద్రియములు.
ఏ విధముగ ఫిల్ములేనిది చిత్రములేదో, అట్లే కర్మలేనిది అసలు జీవితమే లేదు. ఫిల్ము కారణముగ ఒక చిత్రమెట్లు జరుగుచున్నదో, అట్లే కర్మ కారణముగ ఒక జీవితము జరుగుచున్నది. ఫిల్ములో ఏ సంఘటనలు చిన్నగ ముద్రింపబడి ఉన్నాయో, అవియే పరదామీద కనపడుననుట జగమెరిగిన సత్యము. కాని కర్మలో ఏమి రికార్డయి ఉన్నదో, అదే కర్మేంద్రియములైన కాల్లు, చేతులు, నోరు మొదలగు వాటిద్వార జరుగుచున్నదనుట జగమునకు తెలియని సత్యము. హాలు, ఫిల్ము, ప్రొజక్టరు, పరదా మనకు తెలియును.కావున హాలులో ఫిల్ము ఏదైతే సినిమా అదేనని అందరికి తెలియుచున్నది. కాని కర్మ, గుణములు, శరీరము, కర్మేంద్రియముల గురించి మనకు తెలియదు. కావున శరీరములో కర్మ ఏదైతే అదే కార్యము జరుగునని మనకు తెలియక పోయినది. మనకు తెలిసిన తెలియకపోయిన ఫిల్ములోని బొమ్మయే పరదా మీదకు వచ్చి ఆడునట్లు, కర్మలోనున్న సంఘటనలే కర్మేంద్రియముల ద్వారా కార్యమై జరిగితీరును. ఈ విషయము చాలామందికి తెలియదు. కావున వారందరు జరుగుచున్న కార్యమునే చూడగల్గుచున్నారు. కాని వెనుకయున్న కర్మను చూడలేకపోవుచున్నారు.
(హాలులో చిత్రపద్ధతి)
(శరీరములో జీవిత పద్ధతి)
ఫిల్ము:కర్మ
ప్రొజక్టరు:గుణములు
తెర (పరదా):కర్మేంద్రియములు
చిత్రము:కార్యములు
అనుభూతి పొందువాడు ప్రేక్షకుడు
అనుభూతి పొందువాడు జీవుడు
బాహ్యముగ జరుగు కార్యములను మంచివి, చెడువి అను రెండుగ విభజించవచ్చును. జరుగుచున్నవి మంచివైన, చెడువైన వాటికి లోపలయున్న కర్మేయే కారణము. ఫిల్ములో ఉన్నదే పరదామీద చిత్రమైనట్లు, కర్మలో ఉన్నదే కర్మేంద్రియముల మీద కార్యమౌచున్నది. లోపలయున్న కర్మ మంచిదైన మంచి కార్యములు, చెడుదైన చెడు కార్యములు మానవులయందు జరుగుచుండును. ఈ విషయము ఏమాత్రము తెలియనివారు, ఒక దొంగను చూచి నీవు చెడు కార్యములు చేయుచున్నావు, ఆ పని చేయవద్దని చెప్పినప్పటికి, అతను అపుడు దొంగతనము చేయకూడదని, దానివలన పాపమొచ్చుననుకొన్నప్పటికి, రెండవమారు జరుగు కర్మవుంటే తప్పక జరిగితీరును. అలా జరిగిన కార్యము అనగ దొంగతనము గూర్చి ఆ దొంగ నేను వద్దనుకొన్నప్పటికి తిరిగి చేశానే ఇక "నేను మంచివానిగ మారను"అని చింతించెను. తెలిసినవాడు కర్మ రహస్యము తెలుపక మంచి చెడు భేదము చూపి వానిని కలవర పెట్టకూడదు. కర్మ సిద్ధాంతమును, దేహ ధర్మములను తెలిపి, కర్మమారితే కార్యము మారునని తెలిపి, వానికి కర్మఅంటనట్లు తెల్పాలి కాని, కార్యమును గురించి చింతించునట్లు చేయకూడదని భగవంతుడు పై శ్లోకమున తెల్పాడు. అపుడు తాను చేయుచున్నది హత్యలు, దాని వలన పాపమొచ్చునని, తనపని మంచిది కాదని చింతించిన అర్జునునకు, కార్యచింతమాని కర్మ అంటకుండ యుద్ధము చేయమని క్రింది శ్లోకమున భగవంతుడు ఏ ఉపాయము చెప్పుచున్నడో పరిశీలించి చూస్తాము.
శ్లోకం 30: మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా|
నిరాశీ ర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః ||
(కర్మయోగము)
భావము : సర్వ కర్మలను నాయందే సన్న్యసించి, ఆధ్యాత్మికచింతన చేయుచు, రాజ్యకాంక్ష, నావారను మోహము మొదలగు గుణములను లేకుండ చేసుకొని, కలిగిన తాపమును వదలి యుద్ధము చేయుము.
వివరము : ఇచట భగవంతుడు సర్వకర్మలని చెప్పడములో విశేషమును ప్రతి ఒక్కరు గ్రహించవలెను. పాపమొచ్చు చెడు కార్యములు, పుణ్యమును తెచ్చిపెట్టు మంచి కార్యములు రెండింటిని కలిపి సర్వకార్యములని, వాటి ఫలితమును సర్వ కర్మలని చెప్పడము జరిగినది. గత జన్మలోని కర్మ ప్రారబ్ధమైనపుడు, దాని వరుస క్రమములో ఏ కార్యము జరుగవలయునో ఆ కార్యము జరిగితీరును. జరిగిన కార్యములలో జీవుడు అహంకార భావమును కల్గియుండుట వలన, తిరిగి ఆ కార్యము క్రొత్త కర్మయిన ఆగామికముగా మారి తలకెక్కుచున్నది. అలా క్రొత్త కర్మ మన తలకెక్కకూడదంటే కర్మయోగము ఆచరించడమొక్కటే మార్గము. అది సులభముగ అర్థము కావాలనుటకు భగవంతుడు కర్మలను నాకు వదలి కార్యములు చేయమన్నాడు. కార్యము చేయడములో కార్యము మీద ఆశకాని, నాది, నా అను మోహము లేకుండ చేయమన్నాడు. అట్లు చేయబడునది యుద్ధమైన దానివలన కర్మ అంటదన్నాడు.
శ్లోకం 31: యేమే మత మిదం నిత్యమను తిష్ఠన్తి మానవాః |
శ్రద్ధావన్తో ఽనసూయన్తో ముచ్యన్తే తే ఽపి కర్మభిః
(కర్మయోగము, జీవాత్మ)
భావము : ఎవరైతే నేను చెప్పిన ఈ నాపద్ధతి నచ్చినవారై పూర్తి శ్రద్ధకల్గి అసూయలేని వారై అనుసరింతురో వారికి కర్మ అంటకుండ పోవును.
వివరము : పైన జరుగు కార్యములకు లోపలి కర్మ కారణమని తెలిసి, కార్యములను త్రోసివేయు ప్రయత్నము చేసినప్పటికి ప్రయోజనము లేదని తెలిసి, కర్మనే త్రోసివేయ వలయునను నా పద్ధతి నచ్చినవారై, నేనుచెప్పిన జ్ఞానము ప్రకారము శ్రద్ధకలిగి, మంచి చెడు కార్యములు ప్రారబ్ధము ప్రకారము వచ్చునని, జరుగుచున్న కార్యములను గూర్చి యోచించక, రాబోవు కర్మ అంటకుండ ఎవరైతే ప్రపంచములో పనులు చేయుచుందురో, వారే నిజమైన కర్మయోగులని, అట్టివారికి వారు చేయు పనులయందు వచ్చు కర్మ అంటదన్నాడు.
శ్లోకం 32: యే త్వేతదభ్య సూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్ |
సర్వజ్ఞానవిమూఢాం స్తాన్ విధ్ధి నష్టానచేతసః ||
(కర్మయోగము, జీవాత్మ)
భావము : ఎవడైతే నా పద్ధతి మీద అసూయ పొంది అనుసరింపడో, అట్టివాడు నేను చెప్పిన అన్ని జ్ఞానములకు మూఢుడై జ్ఞానమార్గములో పూర్తి నష్టము పొందినవాడగును.
వివరము : సహజముగ ఎందరో మంచి చెడు కార్యముల భేదము కల్గియుందురు. వారికి జ్ఞానము తెలియనపుడు, కార్యములు ఏ విధముగ జరుగుచున్నవో వాటి విధానము తెలియనపుడు, చెడును అసహ్యించుకొనుట సహజమే. మంచిని చెడును రెండింటిని సమానముగా తలచి, ఏది జరిగినప్పటికి కర్మ అంటని విధానము ఉందన్నప్పుడు, ఎందరికో చోద్యముగా కన్పించి ఆ విధానము నచ్చక, ఆ విధానము చెప్పిన వానిమీదనే అసూయ ఏర్పరుచుకొను అవకాశము గలదు. అట్టి వారికి భగవంతుడు చెప్పిన జ్ఞానము నచ్చక పరమాత్మ జ్ఞానమునకు దూరమగుదురు. ప్రకృతి విషయాలే వానికి గొప్పజ్ఞానముగా కన్పించుచు జ్ఞానమార్గమున లాభము పొందుచున్నాననుకొనునట్లు చేసి, జ్ఞానమున నష్టపోయిన వానిగ చేయును. వాని మార్గమే వానికి గొప్పగ కన్పించునట్లు చేయును. నిజముగ వాడు జ్ఞానహీనుడైపోవును.
శ్లోకం 33: సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి |
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహఃకిం కరిష్యతి ||
(జీవాత్మ)
భావము : జ్ఞానియైనప్పటికి తనయొక్క గత జన్మ సంస్కారములకు తగినట్లు నడుచుకొనును. మిగత జీవరాసులు కూడ వాటివాటి కర్మప్రకారము నడుచు చున్నవి, ఫలితమును పొందుచున్నవి. నేనిట్లు నడువకూడదను నిగ్రహము ఎవనికి పనికిరాదు.
వివరము : చలనచిత్ర ప్రదర్శనలో ఫిల్ము ఎంత ముఖ్యమో, జీవితములో కర్మ అంతయే ముఖ్యమని ముందే తెలుసుకొన్నాము. ఫిల్మును బట్టి బొమ్మ, సంఘటనలు మొదలగునవి చిత్రములో ఉండును. ఫిల్మును మార్చకుండ బొమ్మను మార్చవలయును అనుకొంటే ఎట్లు సాధ్యము కాదో, అట్లే మానవుని లోపలి కర్మ మార్చక బయటి కార్యములు మార్చవలయుననుకొంటే అది సాధ్యము కానిపని. ధర్మము ప్రకారము ప్రతి జీవరాసి కర్మానుసారము చలించక తప్పదు. విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలగువారు దేవతలైనప్పటికి కర్మను అతిక్రమించి నడువలేరు. వారు కూడ ఉన్న కర్మను అనుభవించక తప్పదు. మనిషి జ్ఞానియైనప్పటికి తన గత జన్మ కర్మ ప్రారబ్ధమై వచ్చినపుడు అది ఏ కర్మ అయినప్పటికి,దాని ప్రకారము అతను నడువవలసి వస్తుంది. జ్ఞానియైనప్పటికి తన ప్రవర్తన తన చేతిలో ఉండదు. అతని ప్రవర్తన అతని లోపల నిక్షిప్తమైవున్న కర్మను బట్టియుండును. గొప్ప జ్ఞానవంతుడైనను అతని చేత ప్రారబ్ధ కర్మరీత్య ఒక్కొక్కపుడు చెడు కార్యమైనను జరుగవచ్చును లేక ప్రతిదినము నీచ వృత్తిలోనైన అతను బ్రతుకుతుండవచ్చును. కర్మరీత్య బయట జరుగు పనులనుబట్టి జ్ఞానము తెలియనివారు అతనిని నీచుడన్నను, తెలిసిన వారియందు అతను గొప్ప జ్ఞానియే. భగవంతుడు చెప్పిన ఈ పద్ధతియే చాలా మందికి అర్థముకాక పోయినది. కర్మ యొక్క పద్ధతి తెలియనివారు కార్యములనే చూస్తు, ఎదుటి వారిని తక్కువగ తప్పుడు అంచనా వేయగల్గుచున్నారు. అటువంటి వారికి భగవద్గీత పుస్తకము అహర్నిశలు దగ్గరేవున్నప్పటికి, గీతలోని భావము మాత్రము చాలా దూరముగ ఉండునని తెలియాలి.
జ్ఞానులైనప్పటికి తన పూర్వజన్మ కర్మమునకు తగినట్లు నడువక తప్పదను దేవుని మాటను ప్రతి ఒక్కరు గుర్తించవలయును. గొప్ప జ్ఞానులైన కర్మయోగులు కూడ కర్మబంధనము ప్రకారము నడువక తప్పనపుడు, సామాన్యుడు కర్మనుండి తప్పించుకోగలడా! తన ధర్మము ప్రకారము కర్మ ఎవరినీ వదలదు. తన లిస్టులో ఏమి ఉండునో దాని ప్రకారమే ప్రతి ఒక్కరిని ఆడించగలదు. అందువలన జ్ఞానులైనా, సామాన్యులైనా కర్మరీత్య ఏ వృత్తిలో నడువవలెనో, ఏ సమయమునకు ఏ పని చేయవలయునో దానిని చేయవలసి ఉండును. అట్లుకాక నేను ఈ పనులను మాత్రము చేయుదును, ఆ పనులు చేయననుకొనుట అవివేకము. వాని నిగ్రహము కర్మముందర ఏమి పనికి రాదని తెలియుము. ఎందరో చెడు కార్యములను వదలండి మంచి కార్యములు చేయండని వేదికలెక్కి హితము చెప్పుచుందురు. కాని ఆ విధముగ చెప్పినవారు కూడ చెడు కార్యములు చేయక తప్పలేదు. కారణము కర్మయని తెలియాలి. చెప్పువారు కాని, చెప్పించుకొనువారు కాని ఉన్న కర్మప్రకారము నడువక తప్పదు. ఇది దేవుని శాసనము, భగవంతుడు చెప్పిన ధర్మము.
ఇంతవరకు చెప్పిన విధానమునకు పూర్తి భిన్నముగ ఉన్నట్లు క్రింది శ్లోకము భ్రమింపజేస్తున్నది. ఇటువంటి సందర్భములోనే మెదడు పూర్తి ఉపయోగించి చూడాలి. అంత జాగ్రత్తగ చూడవలసిందేమిటో క్రింద చూస్తాము.
శ్లోకం 34: ఇంద్రియ స్యేంద్రియస్యార్థే రాగద్వేషౌవ్యవస్థితౌ |
తయోర్నవశ మాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ ||
(బ్రహ్మయోగము)
భావము : ప్రతి ఇంద్రియ విషయమునందు రాగద్వేషములు ఉన్నవి. ఆ రాగ ద్వేషములకు మనుజుడు వశము కారాదు. వాటిని నిగ్రహించుకోవలయును. ఆ రాగద్వేషములు మనిషికి శత్రువులలాంటివి.
వివరము : ఇక్కడ చెప్పిన శ్లోకముకంటే ముందు శ్లోకములో మానవుని నిగ్రహ ప్రయత్నము ప్రయోజనము లేదు. కర్మప్రకారము కార్యములు జరిగితీరునన్నాము. ఇపుడు ఈ శ్లోకమున రాగద్వేషమనెడి గుణములకు వశము కారాదన్నపుడు ఆ గుణముల జోలికి నీవు పోవద్దని అర్థము. అవి వచ్చినప్పటికి శత్రువులకు దూరముగ ఉన్నట్లు దూరముగ ఉండవలెనని అర్థము. ఈ శ్లోకము నిగ్రహించుకోమంటే పై శ్లోకము నిగ్రహించుకోలేవు అని చెప్పడము చూస్తే, ఎవరికైన పిచ్చిపట్టినంత పని అవును. ఈ రెండు శ్లోకములందు భగవంతుడు వాస్తవమునే చెప్పాడు కాని ఆయన ఏ మాత్రము పొరపడి చెప్పలేదు. ఎందుకనగా! ఈ రెండు శ్లోకములలోను విధానములు వేరై ఉండుట గ్రహించవలసి ఉన్నది. కార్యముల ఎడల ఎవడు నిగ్రహించుకోలేడనుట వాస్తవము. కాని కార్యముల విషయము కాక బ్రహ్మయోగము ఆచరించవలెనని ప్రయత్నిస్తూ ఆసనము మీద ఊరక కూర్చున్న వానికి మంచి చెడు యోచనలు వచ్చుట సహజము. ఆ సందర్భములో యోచనలరూపములో వచ్చు గుణములను తప్పక నిగ్రహించ వలయును. అట్లు నిగ్రహించని ఎడల అది బ్రహ్మయోగము కాజాలదు. శరీరమందు ఏ ఒక్క గుణము పని చేయనపుడే బ్రహ్మయోగమగును. బ్రహ్మయోగ భ్రష్టత్వమునకు లోపల రగులుగుణములే కారణములు. బ్రహ్మయోగికి మాత్రము రాగద్వేషములు మొదలగు గుణములన్నియు పరమ శత్రువులతో సమానము. అందువలన బ్రహ్మయోగ సాధకుడు తప్పక గుణములను నిగ్రహించుకొని తీరవలెను. ఇపుడు కొందరికొక ప్రశ్న రావచ్చును. అది ఏమనగ! "కర్మ ప్రకారము గుణములు, గుణముల ప్రకారము కార్యము అన్నప్పుడు అవి శాసనమైనపుడు మనము నిగ్రహించుకోలేమని తేల్చి చెప్పినపుడు గుణములను నిగ్రహించుకోమని వాటికి వశము కారాదనడమేమిటి?" అని అడుగవచ్చును. దానికి సమాధానమేమనగా! నిగ్రహించుకోలేవు అని చెప్పినది అజ్ఞానులకు, మరియు అజ్ఞానులను కలవర పెట్టకుండ అజ్ఞానులవలె ప్రవర్తించి తీరవలెనని చెప్పినది కర్మయోగులకు, వారు ప్రపంచములో పనిచేసి తీరవలసిందే. కావున మంచి చెడు కార్యముల వరుస తప్పక వచ్చితీరును. పనిచేయు వారికి చెప్పిన ధర్మమది, పని చేయునపుడు మంచిది చేయవలెనని, చెడుది చేయకూడదను తన నిర్ణయము నిలువదు. అది కర్మను బట్టి జరిగిపోవుచుండును. ఎవడు ఆ విధానమును అతిక్రమించలేడు. కాని బ్రహ్మయోగులు ఏ కర్మను ఆచరించనివారు. వారియందు ఏ అవయవము, ఏ గుణము పని చేయదు. బ్రహ్మయోగములో ఉన్నంత కాలము కర్మ స్థంభించిపోయి ఉండును. అట్టి వానికి బాహ్య శబ్ద,స్పర్శ,రూప,రస,గంధాదులతో సంబంధములేదు. అందువలన కర్మయోగులుగాని, మిగతావారు గాని కార్యబద్దులైనట్లు బ్రహ్మయోగులు కారు. కర్మయోగులు కార్యములు చేయవలసి ఉన్నది. జ్ఞానముతెలిసిన వారికి కర్మ ప్రకారము కార్యములు ఏవైన చేయవలసివున్నది కావున వారు నిగ్రహించుకోవడమనుట కానిపని. బ్రహ్మయోగులు కర్మనే స్థంభింప చేయువారు, కనుక గుణములను తప్పక వదలవలసివచ్చును. బ్రహ్మయోగి గుణములను స్థంభింపచేసి, వాటికి అనుసంధానమైన కర్మను స్థంభింపచేయును. ఆ ప్రయత్నమే బ్రహ్మయోగసాధన. అట్టి సాధనలో గుణములు బ్రహ్మయోగికి శత్రువులలాంటివి. ప్రయత్నము చేయుచు వాటిని జయించిన వానికి బ్రహ్మయోగము లభ్యమగును. ఆ యోగ సమయములో కర్మ స్థంభించివున్నది. కావున కార్యములు లేవు, గుణములు లేవని తెలియాలి. అట్లుకాక కర్మ గుణములు అన్ని పనిచేయుచు కార్యములు ఆచరించునది కర్మయోగము. దీనియందు జ్ఞానము తెలిసిన కర్మయోగులకు, తెలియని అజ్ఞానులకు ఏమి తేడా ఉండదు. వారికి కర్మరీత్యా గుణములు, గుణములరీత్యా కార్యమన్న సూత్రము వర్తించును. కావున వారు కార్యములను నిగ్రహించలేరని తెలియాలి. కర్మయోగము వేరని, బ్రహ్మయోగము వేరని, తెలిసినపుడే నిగ్రహించలేని వారు వేరని, నిగ్రహించువారు వేరని తెలియును. పనులు చేయువారు నిగ్రహించలేరు. బ్రహ్మయోగులు మాత్రము నిగ్రహించవలసి ఉన్నదని తెలియుచున్నది.
శ్లోకం 35: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||
(జీవుడు, కర్మ యోగము)
భావము : అనుష్ఠితమగు పరధర్మముకంటే గుణములేని స్వధర్మమే శ్రేయస్కరము. పరధర్మములో ఉన్న భయముకంటే స్వధర్మములోని మరణమే మేలు.
వివరము : ఈ శ్లోకములో ముఖ్యముగ తెలుసుకోవలసినది పరధర్మము, స్వధర్మము. శాస్త్రబద్ధముగ స్వధర్మమంటే ఏమిటని తెలిస్తే దానివెంట పరధర్మము కూడ తెలియును. దానికంటే ముందు ధర్మమంటే ఏమిటని తెలియాలి. ధర్మమును తెలిస్తే దాని తర్వాత స్వధర్మమేది, పరధర్మమేదని సులభముగ తెలియవచ్చును. "ఒక వస్తువు లేక పదార్థము జీవమున్నది కాని, జీవములేనిది కాని దానికున్న సూక్ష్మ సహజత్వమును ధర్మము" అంటాము. ఆ సహజత్వము మొదట దైవత్వము నుండి లభించినదై ఉండును. ఒక పదార్థమునకున్న సహజత్వమును దానికున్న ధర్మము అనగలము. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడుగవచ్చును. అది ఏమనగా! "ఒక మనిషి చిన్నతనము నుండి మిక్కిలి కోపము గలవాడై ఉన్నాడు. పెద్దవాడైనను అతను కోపిష్టిగనే ఉన్నాడు. అతనికి చిన్నతనము నుండి కోపము సహజముగ ఉన్నది కదా! ఆ మనిషికి కోపము ధర్మమేయగునా?" దానికి మా సమాధానము. మనుష్యజాతికంతయు ఏదైతే సహజముగ ఉన్నదో అదే ధర్మమగును. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ధర్మముండదు. ఇక్కడ ఒకడే కోపిష్టి కావున అది ధర్మము కాదు. ఉదాహరణకు ఒక నిమ్మకాయ పుల్లగా ఉన్నది. అన్ని నిమ్మకాయలు పుల్లగనే ఉన్నవి. నిమ్మకాయలో పులుపే దాని ధర్మమగును. ఈ విధముగా ఒక చెట్టుకు ఒక ధర్మముంటే ఆ జాతి చెట్లన్నింటికి అదే ధర్మముండాలి. అపుడే అది ధర్మమగును. ఒక జాతి మొక్క ఆకులో తేలు విషమును హరించు సహజత్వమున్నది. ఆ జాతి మొక్కల ప్రతి ఆకులోను అదే సహజత్వమున్నది. ఇక్కడ ఆ మొక్కకున్న సహజత్వమే దాని ధర్మమగును. అట్లుకాక ఒక మొక్కలో ఆ శక్తి ఉండి, అదే జాతి వేరు మొక్కలకు ఆ శక్తి లేకపోతే అది ధర్మమనబడదు. ఒక మనిషికి ఉన్నది ధర్మము కాదు. అందరికి ఉన్నదే ధర్మమగును. ధర్మము అనునది పుట్టుకతోనే వచ్చునది. అందువలన దానిని సహజత్వమన్నాము. 'జ' అనగ పుట్టుట అని అర్థము. సహచరుడు అనగ వెంట తిరుగువాడని అర్థము. అట్లే 'సహజ' అనగ వెంట పుట్టునదని అర్థము. దీని ప్రకారము 'సహజత్వము' అనగా పుట్టుకతోనే వచ్చినదని అర్థము. ఒక జాతికి ఒకే విధముగ పుట్టుకతో వచ్చినదేదో అదే ధర్మమగును. ఇపుడు ధర్మమంటే ఏమిటి అన్న విషయము కొంత అవగాహనయైనదనుకుంటాము. పై శ్లోకములో భగవంతుడు ధర్మమును రెండుగా విభజించాడు. వాటికి స్వధర్మము, పరధర్మము అని పేరు పెట్టాడు.
ప్రకృతి, పురుషుడని ప్రపంచమంతా రెండు భాగములుగా విభజింపబడి ఉన్నది. ప్రకృతి అనగ పంచభూతములు మరియు వాటివలన పుట్టిన సమస్తము. పురుషుడనగా పరమాత్మ మరియు దాని అంశయైన జీవాత్మ, ఆత్మ. పరమాత్మ,ఆత్మ, జీవాత్మ ఒక భాగముకాగా, పరమాత్మ చేతనే తయారు చేయబడిన ప్రకృతి, దానికి సంబంధమైన గుణములు, ఇంద్రియములు మొదలగునవి అన్నియు ఒక భాగమైవున్నవి. మొత్తము మీద ప్రకృతి అంశయైన దానికంతటికి ఒక ధర్మము, పరమాత్మ అంశయైన దానికంతటికి ఒక ధర్మము కలదని తెలియుచున్నది. దీనివలన ప్రకృతి పరమాత్మ ధర్మములు వేరు వేరని చెప్పకనే తెలియుచున్నది.
ఇపుడు మనము ప్రకృతిలోని భాగమైవున్నామా లేక పురుషునిలోని భాగమై ఉన్నామాయని యోచిస్తే, మన శరీరము మరియు దానిలోని భాగములన్నియు ప్రకృతికి సంబంధించినవి కాగ, అందులో జీవాత్మగనున్న మనము పరమాత్మకు సంబంధించిన అంశగలవారమై ఉన్నాము. అందువలన మన శరీరము ప్రకృతి ధర్మముతో కూడుకొనివుండగ, అందులోని జీవాత్మ అయిన మనము పరమాత్మ ధర్మమునకు సంబంధించివున్నాము. 'స్వ ' అనగ నా, 'పర ' అనగ నాకంటే వేరైనదని అర్థము. స్వ, పర ధర్మములనగా జీవుని ధర్మము స్వధర్మమని, ప్రకృతి ధర్మము పరధర్మమని తెలియాలి. జీవాత్మలకు ఆత్మధర్మమే స్వధర్మమని తెలిసిన తర్వాత ప్రకృతి లేక శరీరము యొక్క ధర్మమంతయు పరధర్మమని సులభముగా తెలిసిపోతున్నది.
ఇక్కడ అసలు విషయానికొస్తే పై శ్లోకమున స్వధర్మములోను, పరధర్మము లోను జరుగు పనులున్నాయని తెలియుచున్నది. ఆ శ్లోకములోనే స్వధర్మము గుణములులేనిదని కూడ చెప్పారు. స్వధర్మమునకు పరధర్మము వ్యతిరిక్తమైనది. కావున స్వధర్మము గుణములులేనిదైతే, పరధర్మము గుణములు కలదిగ ఉన్నదని తెలియుచున్నది. దీనిని బట్టి గుణములు లేకుండ ఆచరించునది స్వధర్మమని, గుణములతో ఆచరించునది పరధర్మమని సులభముగ తెలియుచున్నది. ఈ రెండింటిలో స్వధర్మమును ఆచరించుట జీవునిగవున్న నీకు మంచిదని కూడ చెప్పాడు. మనమందరము జీవులమే. కావున స్వధర్మమనునది ఆనాటి అర్జునునకే కాదు మనకు కూడ అవసరమని తెలియుచున్నది. స్వధర్మమైన మనందరి ధర్మము శ్రేయస్కరమైనది.
నిమ్మకాయకు సహజముగవున్న ధర్మము పులుపు. అలా నిమ్మకాయ పుల్లగ ఉండక చేదుగనో, చప్పగనో ఉన్నదనుకొందాము. అపుడా నిమ్మకాయ తన స్వధర్మమును కోల్పోయినదని, అధర్మమైన పరధర్మములో ఉన్నదనుకొనవచ్చును.అలాగే ఒక మనిషి స్వధర్మమును కలిగివుండక పరధర్మములో ఉన్నాడనుకొనుము. అపుడువాడు అధర్మములో ఉన్నాడని చెప్పవచ్చును. భూమిమీద చాలా వరకు చెట్లు, కాయలు పదార్థములు తమ ధర్మమును కోల్పోవడములేదు. కాని మనుషులు చాలావరకు నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు స్వధర్మమును కోల్పోయి పరధర్మపరులైనారని చెప్పవచ్చును. అందువలననే పై శ్లోకమున హెచ్చరించుచు స్వధర్మము మంచిదని చెప్పవలసి వచ్చినది.
ఇక్కడ స్వధర్మ ఆచరణ ఏమి? పరధర్మ ఆచరణ ఏమి? అను ప్రశ్నలు రాక తప్పవు. వాటి జవాబు క్రింద చూస్తాము. స్వధర్మము, పరధర్మము ఒకే శరీరములో ఉన్నవి. జీవితమును శరీరముతో మొదలుపెట్టిన ప్రతి జీవుడు మొదట పరధర్మములోనే ఉండును. చిన్నతనమునుండి ప్రతి ఒక్కరు పరధర్మమునే ఆచరించవలసి ఉన్నది. మొదట పరధర్మముతో మొదలిడిన జీవితము కొంత కాలమునకు స్వధర్మములోనికి రావలసివున్నది. కాని 99 శాతము మానవులు చివరి మరణము వరకు స్వధర్మములోనికి రాలేక పరధర్మములోనే పోతున్నారు.
మొదట పరధర్మమునుండి స్వధర్మమునకు దారివున్నది. ఎందుకనగ ప్రతి ఒక్కరు కడుపు కోసము ఏదో ఒక పనిని ఆచరించవలసివుండును. ఆ పని శరీరములోని గుణములు, మనస్సు, జ్ఞానేంద్రియములు చివరకు కర్మేంద్రియముల ద్వారా జరుగుచుండును. గుణముల కార్యములన్ని ప్రకృతికి సంబంధించినవి. అలాంటప్పుడు ప్రతి మనిషి ఉదయము నుండి కార్యములలోనే మునిగివుండును. కనుక వాడు ఆత్మకంటే వేరైన పరధర్మములో ఉన్నాడని చెప్పవచ్చును. ఆత్మజ్ఞానమును తెలిసినవాడు అనగ స్వధర్మమును తెలిసినవాడు గుణములను మనస్సు ద్వారా నిలిపివేసి కార్యము మీద లగ్నముకాక, ఆత్మ మీదనే లగ్నమైనాడనుకొనుము, అపుడు వాడు స్వధర్మమును ఆచరించినట్లగును. ఒకే శరీరములో రెండు ధర్మములున్న దానివలన, ఏది స్వధర్మమో, ఏది పరధర్మమో తెలియక పోవడము వలన, మరియు స్వధర్మము యొక్క వివరమే తెలియక పోవడము వలన, పరధర్మము చిన్నతనమునుండే అలవాటైన దానివలన, చాలావరకు చాలామంది పరధర్మములో సులభముగ చిక్కుకున్నారు. స్వధర్మము యొక్క విలువకాని, దాని ఆవశ్యకత కాని తెలియక పోవడము వలన, దానిని తెలుసుకొను తీరిక ఓపిక లేని దానివలన, మరియు దానిని గురించి తెలుపువారు లేని దానివలన, ఎన్నో కారణముల వలన తన ధర్మమును తానే వదులుకొన్నవారై ఉన్నారు. చిన్న వయస్సు నుంచే అలవడినది పరధర్మము కాగ, ఇపుడు కష్టపడి నేర్చుకోవలసినది స్వధర్మము. తానెవరు అను ప్రశ్నరాని వారు తన ధర్మమును గురించి ఆలోచించరు.
స్వధర్మము వలన లాభమేమి? పరధర్మము వలన నష్టమేమి? స్వధర్మము ఎందుకు శ్రేయస్కరమైనదని యోచిస్తే, పై శ్లోకములోనే 'పరధర్మోభయా వహః' అను మాటను బట్టి పరధర్మము భయముతో కూడుకొన్నదని, 'స్వధర్మే నిధనం' అను మాటను బట్టి స్వధర్మములో మరణమున్నదని తెలియుచున్నది. ఇక్కడ అందరు పొరపాటుపడుటకు అవకాశము కలదు. అదేమనగా మరణము, భయము అను రెండింటిలో మరణము నుంచి దూరముగ ఉండవలెనని అందరు అనుకోవడమే పొరపాటు. ఆత్మజ్ఞానము తెలియనివారు పొరపడుటకంటే, తెలిసినవారు పొరపడుట మరీ విడ్డూరము. నిజానికి యోచిస్తే ఈ శ్లోకములోనే పరధర్మములో ఉండు భయముకంటే, స్వధర్మములో ఉండు మరణమే శ్రేయస్కరము అన్నారు. అటువంటపుడు భగవంతుడు చెప్పిన మాటకు వ్యతిరేకముగ మనుషులు మరణముకంటే భయమే శ్రేయస్కరము అనుకొనుట పొరపాటు కాదా!
జ్యోతిష్యశాస్త్రములో మొత్తము నవ గ్రహములున్నవని వాటిలో ఏడు కనిపించునవని, రెండు మాత్రము మసకగ కనిపించు ఛాయగ్రహములని, అవియే రాహువు, కేతువులని, ఈ రెండు గ్రహములు ఏడు గ్రహములకు వ్యతిరేకదిశలో తిరుగుచున్నవని, గురు శని భాగములుగ విభజింపబడిన సప్తగ్రహాలకు రాహువు, కేతువులు అధిపతులని, గురు భాగమునకు కేతువు,శని భాగమునకు రాహువు అధిపతులుగ ఉన్నారని పెద్దలు తెలిపినట్లు మన శరీరములో కూడ ఒక్కొక్క గుణభాగములో యోగశాస్త్రరీత్య కనిపించు 12 గుణములున్నవి. అట్లే రాహువు కేతువులవలె ఛాయగ కనిపించు రెండు గుణములున్నవి. అవియే భయము, ధైర్యము. ఇవి కాక మరియొకటి మాత్రము ప్రత్యేకత కల్గి రెండు వైపుల ఉన్నది అదియే శ్రద్ధ. 12 గుణములలో గురు శని పార్టీలలాగ మంచివి ఆరు, చెడువి ఆరుగ విభజింపబడి దైవ, అసుర గుణములని పేరు పెట్టబడినవి. ఈ విధముగ మన శరీరములోని ఒక్క గుణభాగములో 12+2+1=15 గుణములున్నవని తెలియు చున్నది. ఇందులో అజ్ఞాన సంబంధమైనది భయము. జ్ఞాన సంబంధమైనది ధైర్యము. శ్రద్ధ అనునది అజ్ఞానము, జ్ఞానము రెండింటికి సమానముగ ఉన్నది. గుణములు పని చేయునపుడు అజ్ఞాన వశమున భయము కూడ కల్గుచుండును. 'పరధర్మో భయావహః' అను మాట ప్రకారము శరీరములో గుణములు పని చేయునంత కాలము భయము కల్గుచునేవుండును. దీనిని బట్టి చిన్నతనము నుండి భయము ఉన్నదని తెలియుచున్నది.
సాధారణముగ అందరు భయముకంటే మరణము పెద్దదనుకొంటారు. మరణము జీవితములో ఒక్కక్షణము మరియు ఒక్కమారే ఉండును. భయము జీవితములో ఎంతో కాలముండును మరియు ఎన్నోమార్లు ఉండును. ఎంతో కాలము పొడవుగ ఉన్న భయము పెద్దదా? ఒక్క క్షణ కాలమున్న మరణము పెద్దదా? అని యోచిస్తే చాలాకాలముండు భయమే పెద్దదగును. కాని క్షణ కాలముండు మరణమెలా పెద్దదగును? చాలా కాలము మానవున్ని పీడిస్తు అనేక వ్యథలు కలుగచేయు భయమును పెద్దదనుకోక ఒక్కక్షణము ఒక్కమారు వచ్చు ఏ బాధాలేని మరణము పెద్దదనుకొనుట చాలా పొరపాటు కదా! అందువలన పై శ్లోకమున భగవంతుడు 'స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మోభయావహః' పరధర్మములో ఉన్న భయముకంటే స్వధర్మములో ఉన్న మరణమే మేలు అన్నాడు. జీవితాంతము పీడించి కృశింపజేయు భయము ప్రకృతి పరమైనది, అజ్ఞాన వశమైనది. ఏ సమస్యకైన కర్మ విధిని తెలిపి బాధలేకుండ చేయు ధైర్యము జ్ఞానపరమైనది.
ఆత్మజ్ఞానమును జీర్ణింపజేసుకొనని ఎవరినైన భయము పీడిస్తు, మరణమే గొప్పదను భావము కలుగజేసి పరధర్మములోనే నిలుచునట్లు చేయుచున్నది. ఉదాహరణకు ఒక గురువు దగ్గర 12 సంవత్సరములు జ్ఞానము తెలుసుకొన్నవారు కొందరున్నారనుకొందాము. గురువువద్ద ఎంతో జ్ఞానము తెలిసినప్పటికి దానిని ఆచరించకపోతే వారు తెలియనివారితో సమానమేయగుదురు. ఒక గురువు తన శిష్యులుగ ఉన్నవారిని వాచాజ్ఞానములోనే గొప్పవారు కాక, ఆచరణ జ్ఞానములోను గొప్పవారుగ ఉండవలెనని తలచి, వారు ఆచరణలో ఎట్లుందురోనని వేచిచూచెను. కర్మప్రకారము గురువుగారికి పెద్దసమస్య వచ్చింది. ఆ సమస్యలో ప్రత్యక్షముగ అందరికి తెలిసినట్లు గురువుగారికి ఎంతో కష్టము నష్టము వచ్చింది. అంతవరకు గురువును ఎంతగానో పొగుడుచుండిన కొందరు గురువుగారి పరిస్థితిని చూచి, ఈయన వద్దకు వచ్చేదానివలన మనకు కూడ కష్టము నష్టము వస్తుందని తలచి, గురువుగారి దగ్గరకే రాకుండ మానుకొన్నారు. ఇక్కడ భయమనునదియే ముఖ్యముగ వారియందు పనిచేసిందని తెలియాలి. కష్టము వస్తుందను భయముతోనో, లేక నష్టము వస్తుందను భయముతోనో, వారు రాకుండా మానుకొన్నారు. ఏది జరిగిన కర్మవలననే జరుగుతుందని, ఆ నిర్ణయమును ఎవరు మార్చుకోలేరను ఆత్మజ్ఞానమును మరచిపోయారు. వాచాజ్ఞానము కలవారు ఆచరణ జ్ఞానములేనివారైనారు.
ఒక వంటను ఎలా వండితే రుచిగా ఉంటుందో తెలుసుకొన్నామనుకొనుము. తెలుసుకొన్నంత మాత్రమున ఆ వంట రుచిని అనుభవించలేము. ఆ రుచి యొక్క అనుభూతియేమో తెలియదు. ఆ రుచి ఎట్లుండునను అనుభవము ఎలా వండితే వంట తయారవుతుందో అలా వండినపుడే తెలియును. ఆ విధముగనే జ్ఞానము విని తెలుసుకొని చాలా గొప్పదనుకొన్నంత మాత్రమున దాని గొప్పతనమేమో నిజముగ మనకు తెలియదు. విని తెలుసుకొన్న దానిని ఆచరించినపుడే దానియొక్క గొప్పతనము తెలిసేది. గురువువద్ద ఎంతో కాలము జ్ఞానము తెలుసుకొని, ఏ ప్రశ్నకైన జవాబు చెప్పు స్థోమతవున్న వారు కూడ వచ్చిన సమస్యలను జ్ఞానముతో యోచించికపోతే వారిది ఆచరణజ్ఞానము కాదు. అలాగే గురువుగారి వద్ద జ్ఞానులైన వారు గొప్ప జ్ఞానమును మా గురువుగారు తెలిపారని గురువును పొగుడుకొన్నప్పటికి, వారి జ్ఞానమును మాటల వరకే పెట్టుకొన్నారు. ప్రపంచ సమస్యల మీద ప్రయోగించి నిర్ణయము తీసుకోలేక పోయారు. గురువుగారికి కష్టమొచ్చి ఆయన అనుభవిస్తుంటే, వీరికి ఆ కష్టము లేకున్నను అలాంటిదే మాకు వచ్చునేమోనను భయముతో పారిపోయారు. అలా కొంతమంది పోగా ఇంకను కొంతమంది మిగిలివుండెడివారు. బయటి చదువులలో ఒక తరగతి నెగ్గి పై చదువులకు పోవుటకు మూడునెలల పరీక్ష, ఆరునెలల పరీక్ష, సంవత్సరము పరీక్ష ఉన్నట్లు,చివరకు ఆ మిగిలిన శిష్యులకు సంవత్సరపు పరీక్షలాంటి సమస్య ఎదురైనది. ఆ సమస్యలో గురువుగారికి శత్రువులుగ ఉన్నవారు గురువుగారిని చంపే నిర్ణయానికొచ్చారు. ఒక నెలలోపల ఎపుడు వీలు దొరొకితే అప్పుడు చంపేదానికి నిర్ణయము చేసుకొని ఆ పని మీదనే వేచివున్నారు. ఆ విషయము మిగిలిన శిష్యులకు తెలిసినది. తర్వాత గురువు గారికి తెలిసింది. కర్మ ఎలావుంటే అలా జరుగుతుందని ఆ సమస్యను ఏమాత్రము గురువుగారు లెక్కించుకోలేదు. ఇక మిగిలిన శిష్యుల విషయానికోస్తే వారు ఈ విధముగ ఆలోచించారు. ముందే జారుకొన్నవారు ఎంతో తెలివైనవారు. మేము అపుడే చిన్నగ రాకుండ పోయివుంటే బాగుండేది. మేము తెలివితక్కువవారము. పొరపాటున ఇక్కడవున్నాము. ఇక్కడుండుట వలన మనకు ప్రమాదమే. గురువును ఎటు వారు పది ఇరవై రోజులలో చంపుతారు. ఒకవేళ మనము ఈయనతో సంబంధము పెట్టుకొని అలాగే ఉండుట వలన మనకు కూడ ముప్పు, చావు ఉండవచ్చును. ఈయన శిష్యులమనిపించుకోవడము కూడ మంచిది కాదు. ఇక్కడికి రాకుండా పోయి, గురువుగారికి శత్రువులైన వారితో చేతులు కలిపితే మనకు వారి ద్వార ఏమి ముప్పువుండదు అనుకొన్నారు. తర్వాత గురువుగారి ముఖమే చూడలేదు. బలవంతులైన శత్రువులతో పరిచయమేర్పరచుకొని వారెక్కడైన కనిపిస్తే నమస్తే అన్నా అనెడివారు.
చివరిగ మరణమను సమస్యకు చలించినవారై, చిరకాలము ఇతరులకు భయపడుచు కొందరు పోగా, అప్పటికి కూడ జ్ఞానముతో యోచన చేసినవారై, జ్ఞానసిద్ధాంతము ప్రకారము సర్వులను ఆడించునది కర్మ, కర్మ నిర్ణయము ప్రకారము జరిగెడిది జరుగును. మరణము ఎప్పుడైన ఒకమారు తప్పదు. దానికి చలించితే మనకు జ్ఞానము తెలిసి ఏమి ప్రయోజనమని చలించక మిగిలిన శిష్యులు కొందరున్నారు. ఇలా కొంతకాలము జరుగగ చంపబడుననుకొన్న గురువు చంపబడలేదు. చంపగలరనుకొన్న శత్రువులు చంపబడ్డారు. ముందేమి జరుగుతుందో కనిపించని కర్మలో ఉన్న రహస్యము కొంతకాలానికి కనిపించినది. సమస్య మొదలైనప్పటి నుండి నోరు మెదపని గురువు ఇలా అన్నాడు. 'నేనెంతో జ్ఞానమును తెల్పాను. చివరకు భగవద్గీతను విపులముగ వ్రాయుట నా జీవిత ధ్యేయమన్నాను. దానిని పూర్తి చేయువరకు నాకు మరణములేదన్నాను. అలా భగవద్గీత కర్మయోగములో 34వ శ్లోకము వరకు వ్రాశాను. 35వ శ్లోకము స్వధర్మము, పరధర్మమును తెలియజేయునది. 34వ శ్లోకము వరకు వ్రాసి నిలిపివేశాను. 35వది ఇంతవరకు వ్రాయక దాదాపు ఆరు సంవత్సరములు వేచి చూచాను. నా జ్ఞానమును తెలుసుకొన్నవారు స్వధర్మపరులెంత మందివున్నారు, పరధర్మపరులెంతమంది వున్నారని చూడక తప్పలేదు. జరిగిన కార్యమును బట్టి చూస్తే పరధర్మపరులు నూటికి 99 శాతము కాగ, ఒక్క శాతము మాత్రము స్వధర్మమును ఆచరించువారై ఉన్నారు. అందువలననే రచనలో నిలిచిపోయిన కర్మయోగములో 35వ శ్లోకము ఇక్కడ ఇప్పుడు మొదలు పెట్టి చెప్పడమైనది. స్వధర్మ పరధర్మములను ఎంతో వివరముగ చెప్పితే కాని భవిష్యత్తులో జ్ఞానము తెలుసుకొనువారు, "తెలిసినంత మాత్రమున ప్రయోజనములేదు, తెలిసిన దానిని జీవితములో ఉపయోగించుకొన్నపుడే జ్ఞానము యొక్క విలువ పొందగలిగిన వారమౌతామనుకోగలరు."
భగవంతుడు ఏది చెప్పిన అది సత్యమే, కనుక ఆయన చెప్పినట్లే అన్ని విధముల యోచిస్తే భయముకంటే మరణమే మేలు. పరధర్మముకంటే స్వధర్మమే మేలు. గుణములు, కర్మగల అధర్మముకంటే అవిలేని ధర్మమే మేలని పై శ్లోకము యొక్క సారాంశము తెలియుచున్నది. ఇంతవరకు స్వ, పర ధర్మముల వివరము విన్న అర్జునుడు ఎంతోమంది పరధర్మమునే ఆచరించుచున్నారని, తెలిసి తెలియక తప్పు చేసినవారుండవచ్చును కాని జ్ఞానము తెలిసినవారు తప్పుచేయుచుండుట చాలా విచిత్రమనుకొని, ప్రపంచ విషయములలో కూడ తెలిసి కొందరు తప్పు ఎందుకు చేస్తున్నారని శ్రీకృష్ణున్ని ప్రశ్నవేశాడు.
శ్లోకం 36: అథ కేన ప్రయుక్తో ఽయం పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వ్వార్ణే య! బలాదివ నియోజితః ||
(బ్రహ్మ యోగము)
భావము : మనిషికి ఇష్టము లేకున్నను దేనిచేత బలత్కార పూర్వకముగ నియమింప బడి పాపకార్యములు చేయుచున్నాడు?
వివరము : "అనిచ్ఛన్నపి" అన్నారు అనగ ఇష్టములేకున్నా అని అర్థము. ఇష్టము ఎవనికుండదనిన జ్ఞానము తెలిసి బ్రహ్మయోగమాచరించవలెనను వానికి మాత్రము పనులయందు ఇష్టముండదు. జ్ఞానము తెలిసి ఇది చెడ్డపనియని ఇది చేయకూడదని అనుకోకూడదని వెనుక చెప్పబడినది. అది కార్యములు చేయు కర్మయోగులకని తెలియాలి. పాపపుణ్య విచక్షణ ఏమాత్రము లేకుండ పనులు చేయవలెననెడి జ్ఞానము కర్మయోగ సంబంధమైనదని పాఠకులు గుర్తుంచుకోవాలి. ఏ కార్యముకాని, దాని తలంపుగాని, ఉండకూడదని చెప్పు జ్ఞానము బ్రహ్మయోగ సంబంధమైనది. ఇక్కడ అర్జునుడు అడుగు మాట బ్రహ్మయోగులకు సంబంధించినదని తెలియాలి. బ్రహ్మయోగులు పనులు చేయకూడదని, వారి మనస్సును ఆలోచనలనుంచి దూరము చేయాలని ప్రయత్నము చేయుచుందురు. అట్టివానికి యోచనలు వచ్చి ఇష్టము లేకున్నా వాని ద్వార పనులు చేయబడుచుండును. అట్లు ఎందుకు జరుగుచున్నది దానికి కారణమేమి అని అర్జునుడు వివరముగ తెలియకోరినాడు. దానికి జవాబుగ శ్రీకృష్ణుడు ఈ విధముగ అంటున్నాడు.
శ్రీ భగవంతుడిట్లనియె: -
శ్లోకం 37: కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |
మహాశనో మహాపాప్మా విద్ధ్యేన మిహ వైరిణమ్ ||
(ప్రకృతి)
భావము : రజోగుణములో పుట్టిన కామమనెడి గుణము మరియు క్రోధమనెడి గుణములు కలవు. ఈ ఆశ తృప్తిలేనిది. కోపము పాపము కలుగజేయునది. ఇవి జ్ఞానమునకు శత్రువులు.
వివరము : మన శరీరములో గుణములున్నాయని తెలుసుకొన్నాము. అవి ఎక్కడున్నాయి అనునది తెలుపలేదు. ఇచట భగవంతుడు సూచనగ ఒక గుణము పేరు పెట్టి చెప్పాడు. కనుక వాటి స్వరూపమును కొద్దిగ తెలుసుకోవలసి ఉన్నది. గుణత్రయ విభాగయోగమను అధ్యాయములో మూడు గుణముల వివరము పూర్తిగ ఇవ్వబడినది. ఇచ్చట రాజసములో పుట్టిన కామ క్రోధమన్నాడు దీనిని బట్టి ఇది ఒక తెగ అని తెలియుచున్నది. వాస్తవముగ గుణములు మూడు తెగలుగ ఉన్నవి 1) సాత్త్వికము 2) రాజసము 3) తామసమనునవి. వాటిలో మధ్యలో ఉన్న రాజసభాగములో పుట్టిన కామమునకు క్రోధమునకు ఎక్కువ బలమున్నది. రాజస కామమునకు తృప్తి చాలా తక్కువ, తృప్తి పొందనపుడు దాని వెంటనే అందులోని కోపము వస్తున్నది. ఆ కోపము ఎక్కువ చెడు కార్యములు చేయించి పాపమును పొందునట్లు చేయును. తృప్తిలేని మానవుడు తృప్తికోసమే ప్రాకులాడుచుండును. జ్ఞానమువైపు రాలేడు. అట్లే క్రోధము జ్ఞానమును తెలుసుకోనివ్వదు. మిగతా గుణభాగములలో పుట్టిన వాటికంటే రాజస భాగములోని ఈ రెండు గుణములే ఎక్కువగ జ్ఞానమునకు ఆటంకమైవున్నవి. అందువలన ఈ రెండు గుణములు జ్ఞానమునకు శత్రువులవలె ఉన్నవి.
గమనిక : మొట్టమొదట భగవద్గీతలో కామము అనుమాట విశేషముగ ఇచటనే చెప్పబడినది. శరీరములో దీని పాత్ర చాలా ముఖ్యమైనది. అందువలన దీని స్వరూపము మొదటనే అర్థము కాకపోతే భావమంతయు చెడిపోవును. పురుషునికి స్త్రీల ఎడల ఉన్న శారీరక కోరికనే కామమని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. వాస్తవానికి కామము అన్నమాటకు అర్థము ఆశ లేక కోరిక అనవచ్చును. ప్రత్యేకించి స్త్రీల మీద కోరికను కామమనకుడదు. కామము అనగ బంగారు మీద ఆశ కావచ్చును, కొడుకుల మీద ఆశ కావచ్చును, భూముల మీద ఆశ కావచ్చును, వస్తువుల మీద ఆశ కావచ్చును. అలా ఏ దానిమీద ఆశనైన కామము అనియే ఉచ్ఛరింపబడుచున్నది. కామము అన్నంత మాత్రమున స్త్రీల మీదనే అనుకోకూడదు. అట్లే స్త్రీలు పురుషుల మీదున్న ఆశనే కామము అనుకోకూడదు. సందర్భానుసారము అర్థము చేసుకోవాలి. ఈ విషయములో బాగా తెలిసిన జ్ఞానులమనిపించుకొన్నవారే పొరబడుచున్నారు. ఉదాహరణకు ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసము చెప్పు పండితుని ఇంటిలో పెళ్ళి జరుగుచుండెను. పెళ్ళి సందడిగ ఉండవలెనని మైక్‍సెట్ పెట్టి అందులో ఘంటసాల భగవద్గీత రికార్డు పెట్టారు. ఆ రికార్డులో పై శ్లోకమే వచ్చినది. అందులో కామమనెడి గుణము జ్ఞానముకు శత్రువులాంటిది దానిని వదిలివేయుము పార్థ అని చెప్పుట గలదు. అప్పుడు అచటనే ఉండి ఆ మాటవిన్న ఆ పండితుడు ఎవరీ రికార్డు పెట్టినదని కోపగించుకొని ఇలా అన్నాడట 'శుభమా అని పెళ్ళి చేస్తువుంటే కామమును విడిచి పెట్టమని చెప్పు రికార్డు పెట్టవచ్చునా కామము లేకపోతే వారి పెళ్ళిదేనికి' ఈ మాట విన్నవారు వెంటనే ఆ రికార్డును తీసివేశారు. ఇచట సాధారణ మానవుడు తన తెలియని తనము చేత తప్పుగ కామమనెడి పదమును అర్థము చేసుకొన్నా ఫరవాలేదు. కాని తెలిసిన జ్ఞానియే కామమంటే వేరుగ అర్థము చేసుకోవడము అజ్ఞానమే అగును. సందు దొరికితే చాలు మాయ మనలను తప్పుత్రోవ పట్టిస్తుంది. కావున జాగ్రత్తగ జ్ఞానవిషయములు పరిశీలించవలెనని కోరుచున్నాము. కామమనెడి పదము భగవద్గీతలో చాలామార్లు, చాలా సందర్భములో ఉపయోగించబడినది. అన్ని చోట్ల ఆశ అను అర్థమునే తీసుకోవాలని తెలుపుచున్నాము.
శ్లోకం 38: ధూమే నావ్రియతే వహ్నిర్యథా ఽ ఽ దర్శోమలేన చ |
యథోల్బే నావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ||
(ప్రకృతి)
భావము : పొగచేత అగ్నియు, దుమ్ముచేత అద్దము, గర్భపొరలతో శిశువు కప్పబడినట్లు ఆశచేత జ్ఞానము కప్పబడివున్నది.
వివరము : పొగ ఆవహించినపుడు అగ్ని యొక్క తేజము కనిపించదు. దుమ్ము నిండుకొన్నపుడు అద్దములోని ప్రతిబింబము కనిపించదు. గర్భములోని మావి పొరలో ఉన్నపుడు శిశువు ఆడనో లేక మగనో తెలియదు. అట్లే ఆశ అను గుణము మన తలలో నిండుకొన్నపుడు, తలలోనే ఉన్న జ్ఞానము ప్రకాశింపలేదు. పొగ నిండుకొన్నపుడు పొయ్యిలోని అగ్ని ఎట్లు ప్రకాశించి మండజాలదో, అట్లే మన తలలో ఆశ నిండుకొన్నపుడు ఉన్న జ్ఞానము తెలియకుండ పోతుంది. బ్రహ్మయోగము చేయువానికి ఆ యోగము అందదు. బ్రహ్మయోగ ఆచరణకది పూర్తి ఆటంకమగును.
శ్లోకం 39: ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌంతేయ! దుష్పూరే ణానలేన చ ||
(ప్రకృతి)
భావము : తీరనిది మరియు తృప్తిలేనిదైన ఆశ జ్ఞానమునకు నిత్య శత్రువైయుండి జ్ఞానమును కప్పివేయుచున్నది.
వివరము : ఆశకు అంతులేదు అనుమాట చాలామంది వినివుంటారు. ఆకాశానికి హద్దు ఎట్లు లేదో, ఆశకు కూడ హద్దులేదని చెప్పవచ్చును. జ్ఞానులనే ముప్పు తిప్పలు పెట్టు ఆశ అజ్ఞానులను ఏమైన చేయగలదు, ఏమైన చేయించగలదు. జ్ఞానమును కప్పిపుచ్చునది, జ్ఞానులకు నిత్యశత్రువు అయిన ఆశ సాధారణ మానవుని ఎడల శత్రువు కాదు.ఇదేమి విచిత్రమనుకోవలసిన పనిలేదు. వేరే వర్గమువాడు శత్రువగును కాని, తన వర్గమువాడు శత్రువుకాడు మిత్రుడే అగును. అట్లే ఆత్మ వర్గమైన జ్ఞాని శత్రువగును. కాని ప్రకృతివర్గములో ఉన్న అజ్ఞాని తన వర్గములోని వాడే కనుక కామునకు శత్రువుకాడు. ప్రకృతిని విడిచి ఆత్మవర్గములోనికి పోవాలనుకుంటే అప్పుడు శత్రువగును. జ్ఞానికి శత్రువు అని చెప్పబడిన ఆశ బలమైనదా కాదా? ఆ బలము దేనివలన ఉన్నదను విషయమై క్రింది శ్లోకము చూడండి.
శ్లోకం 40: ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్ఠాన ముచ్యతే |
ఏతైర్విమోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినమ్ ||
(ప్రకృతి)
భావము : మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఆశకు అధిష్ఠానములుగ ఉన్నవి. వీటి ఆధారముతో మోహమును కలుగజేసి జ్ఞానమును కప్పివేయుచున్నది.
వివరము : శరీరములో జ్ఞానేంద్రియములైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. అంతరేంద్రియమైన బుద్ధి, మరియు బయట జ్ఞానేంద్రియములకు లోపలి బుద్ధికి మధ్యవర్తిగ ఉన్న మనస్సు మొత్తము ఏడును గుణములకు ఆధారముగ ఉన్నవి. బయటి జ్ఞానేంద్రియములు విషయజ్ఞానమును తెలిపితే, ఆ విషయమును మనస్సు స్వీకరించి లోపలి భాగమైన బుద్ధికి తెల్పితే, బుద్ధికి గుణములు తగులుకొని యోచింపజేయును. ఇట్లు జ్ఞానమును తెలుసుకోవలసిన బుద్ధి గుణములలో చిక్కుకొనుట వలన జ్ఞానము తెలియకుండ పోతున్నది. కామాది గుణములు బుద్ధిని భ్రమింపజేయుచున్నవి. బుద్ధినే భ్రమింపజేయు గుణములను లేక ఆశను అణచివేయాలంటే ఏమి చేయాలో క్రింది శ్లోకములో చూస్తాము.
శ్లోకం 41: తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశనమ్ ||
(బ్రహ్మ యోగము)
భావము : అందువలన ఇంద్రియములను అణచివేసి పాపమును చేయించునది, జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునదియైన ఆశను జయించవలెను.
వివరము : శరీరము యొక్క బాహ్య ఇంద్రియములైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మముల యొక్క విషయములే లోపలి గుణముల ప్రేరణకు ముఖ్యమైన ఆధారము. మొదట విషయములే లేకపోతే మనస్సుకు, బుద్ధికి, గుణములకు పనిలేకుండ పోవును. అప్పుడు గుణములలో మొదటిదైన ఆశ నిలిచిపోవును. ఈ పద్ధతి ఒక్క బ్రహ్మయోగులకే అవసరమని మరియొకమారు గుర్తు చేయుచున్నాము. యోగము చేయాలని ఆసనము వేసుకొని కూర్చున్న వానియందు మనస్సు, బుద్ధి,గుణములు పనిచేయకుండ పోవాలంటే జ్ఞానేద్రియములైన ఐదింటిని వాటివాటి ధ్యాసలనుండి మరల్చాలి. ఐదు ఇంద్రియములు స్తంభించినపుడే వాటితో ప్రారంభమగు కార్యములన్ని నిలిచిపోవును. ఈ విధానముతో లోపలనున్న ఆశను ప్రయత్న పూర్వకముగ అణచి వేయవచ్చును.
శ్లోకం 42: ఇంద్రియాణి పరాణ్యాహు రింద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరాబుద్ధి ర్యో బుద్ధేః పరతస్తుసః||
(ప్రకృతి, ఆత్మ)
భావము : శరీరములో ఇంద్రియములు శ్రేష్ఠమైనవి. వాటికంటెను మనస్సు శ్రేష్ఠమైనది. దానికంటెను బుద్ధి శ్రేష్ఠమైనది. బుద్ధికంటెను ఆత్మ శ్రేష్ఠమైనది.
వివరము : ఒక మోటారు సైకిల్‍ను తీసుకుంటే రోడ్డుమీద పరిగెత్తుటకు చక్రాలు, చక్రాలను త్రిప్పుటకు గొలుసు, గొలుసును త్రిప్పుటకు గేర్‍బాక్స్, గేర్‍బాక్స్‍లో గేర్ చక్రాలు తిరుగుటకు ఇంజను ఉన్నాయి. చక్రాలు, గొలుసు, గేర్‍బాక్స్, ఇంజను అను నాలుగు భాగాలుగా సైకిల్ మోటారును విభజించుకోవచ్చును. ఒకచోటనుండి మరొక చోటకి పోవాలంటే మోటార్‍సైకిల్‍కు ఈ నాలుగు భాగములు ముఖ్యమైనవే. ఇపుడు దానికి చక్రాలు తీసి వేశామనుకొందాము. అది ముందుకు పోలేదు. కాని ఇంజను, గేర్లు, గొలుసు మూడు పనిచేయుచున్నవి. తర్వాత గొలుసు తీసివేశామను కొందాము. అప్పటికి గేర్స్, ఇంజన్ పనిచేయుచుండును. ఆ తర్వాత గేర్‍బాక్స్‍నే తీసివేశామనుకొందాము. చివరకు ఇంజను పని చేయుచుండును. సైకిల్ మోటార్‍కు ఉన్న నాలుగు భాగములలో మూడు తీసివేసినప్పటికి, చివరి ఒకభాగమైన ఇంజన్ పనిచేయుచున్నది. ఇప్పుడు అలా కాకుండ నాలుగు భాగములలో మూడు భాగములను అలాగే ఉంచి, ఇంజన్ ఒక్కటి తీసివేశామను కొందాము. ఇపుడు మొత్తము మూడు భాగములు పనిచేయవు. ఎందుకనగ మూడు భాగములు కదిలి పనిచేయుటకు కదిలించు ముఖ్యభాగమైన ఇంజన్ లేదు. దీనిని బట్టి మోటార్ సైకిల్‍కు చక్రాలు ముఖ్యమైనవి కాగ వాటికంటే ముఖ్యమైనది గొలుసు. గొలుసుకంటే ముఖ్యమైనది గేర్‍బాక్స్. దానికంటే ముఖ్యమైనది ఇంజన్ అని తెలియుచున్నది.
మోటార్ సైకిల్‍లో నాలుగు భాగములున్నట్లు, మన శరీరములో కూడ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మ అను నాలుగు భాగములున్నాయి. ఇంద్రియములు లేకపోయిన మనస్సు, బుద్ధిలేకున్నా ఆత్మగల సజీవ శరీరముండును. కాని ఇంద్రియములు, మనస్సు, బుద్ధివున్నను ఆత్మలేనిది అవియేవి పనిచేయవు. ఆత్మలేని శరీరము భూమి మీద ఎక్కడ ఉండదు. ఆత్మ లేకపోతే శరీరము మొత్తము నిర్జీవమై శవముగా మారును. అందువలననే పై శ్లోకములో ఇంద్రియములకంటే మనస్సు, మనస్సుకంటే బుద్ధి, బుద్ధికంటే ఆత్మగొప్పదని భగవంతుడు చెప్పాడు.
శ్లోకం 43: ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సం స్తభ్యా త్మా నమాత్మనా |
జహిశత్రుం మహాబాహో! కామరూపం దురాసదమ్ ||
(బ్రహ్మ యోగము)
భావము : బుద్ధికంటే శ్రేష్ఠమైనది ఆత్మయని తెలిసి, జీవాత్మను ఆత్మలో ఐక్యమగునట్లు చేసి, జయింప దుస్సాధ్యమైన ఆశను జయించును.
వివరము : ఈ శ్లోకము పూర్తిగ బ్రహ్మయోగమును గురించి చెప్పినది. బ్రహ్మ యోగములో జీవాత్మ ఆత్మతో సంబంధమేర్పరుచుకొని, ఆత్మయొక్క అనుభవమును చవిచూడడమే సారాంశము. సాధారణవ్యక్తిలో ఆత్మ జీవాత్మలు రెండు ఉన్నాయి. ఆత్మ జీవాత్మను చూడగల్గుచున్నది. కాని జీవాత్మ ఆత్మను చూడలేదు. ఇద్దరు ఒకచోట ఉండి ఆత్మ జీవాత్మను చూడగల్గినపుడు, జీవాత్మ ఆత్మనెందుకు చూడలేదని ప్రశ్న అడుగవచ్చును. దానికి సమాధానము ఇద్దరు వ్యక్తులు ఒకచోట ఉండినప్పుడు, ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడినపుడు, ఇద్దరు ఒకరినొకరు చూచుకోగలరు. ఎదురెదురు కాక ఒకరివెనుక ఒకరు నిలబడినారనుకొందాము. అప్పుడు ముందర ఉన్నవానిని వెనుకనున్నవాడు చూడగలడు. వెనుకనున్న వానిని ముందరున్న వాడు చూడలేడు. ఆ విధముగనే సాధారణవ్యక్తిలో ఆత్మ జీవాత్మ ఒక్కచోటనే ఉన్నప్పటికి, అవి ఒకదాని వెనుకల ఒకటున్నది. జీవాత్మ వెనుక ఆత్మవున్నది. అందువలన ఆత్మకు జీవాత్మ కనిపించగలదు. కాని జీవాత్మకు ఆత్మ కనిపించదు. జీవాత్మముందు గుణములు, బుద్ధి, మనస్సు ఉండుటవలన, అతనికి అవియే కనిపించుచుండును. వాటి అనుభవములనే పొందుచుండును. వెనుకనున్న ఆత్మ తెలియదు. దాని అనుభవము తెలియదు.
అదే బ్రహ్మయోగములో జీవాత్మ గుణములు, మనస్సు, బుద్ధివైపు నుండి వెనుతిరిగి వాటి అనుభవములను వదలి, వెనుక సాక్షిగ ఉన్న ఆత్మవైపు ఎదురుగ నిలబడుచున్నాడు. అప్పుడు జీవుడు ఆత్మను చూడగలుగుచున్నాడు, ఆత్మానుభవము పొందుచున్నాడు. అలా ఉన్నంతసేపు ఆశ మొదలగు గుణములు కాని, వాటి జ్ఞాపకములు కాని, ఇంద్రియ విషయములు కాని, బుద్ధి యోచించడము కాని, ఏ ఇతర ధ్యాసలు జీవునికి తెలియవు. దానినే స్వచ్ఛమైన బ్రహ్మయోగము అంటున్నాము. అలవాటు చేసుకొని ఈ యోగములో ఎంతకాలమైన ఉండవచ్చును. ఈ పద్ధతి ద్వారా మనస్సును, ఆశను అణచివేయమని భగవంతుడు చెప్పాడని తెలియండి.
----------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత : కర్మ యోగము
అర్జునుడిట్లనియె :-
శ్లోకం 1: జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన!|
తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ!||
(కర్మ, బ్రహ్మయోగములు)
భావము :పాపపుణ్య కర్మలగు పనులు చేయుటకంటే బ్రహ్మయోగమే శ్రేష్ఠమైనదని నీ అభిప్రాయమైన, భయంకరమగు కర్మలు కలుగు పనులనే చేయమని నన్ను ఎందుకు నియమించుచున్నావు.
శ్లోకం 2: వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయో ఽహ మాప్నుయామ్||
(కర్మ, బ్రహ్మయోగములు)
భావము :మిశ్రమవాక్యములను చెప్పి నా బుద్ధిని భ్రమింపచేయుటకంటే మోహగుణమందు చిక్కుకోకుండునట్లు ఏది చేయుట మంచిదో దానిని నిశ్చయించి చెప్పుము.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 3: లోకే ఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా ఽనఘ!|
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ||
(కర్మ, బ్రహ్మయోగములు)
భావము : మనుజులు ఆచరించుటకు రెండు రకములైన యోగనిష్టలు గలవని ముందే తెలిపియున్నాను. సాంఖ్యము తెలిసినవారు జ్ఞానయోగమును, కార్య వివరము తెలిసినవారు కర్మయోగమును ఆచరించగలరు.
శ్లోకం 4: న కర్మాణా మనారమ్భాన్నైష్కర్మ్యం పురుషో ఽశ్నుతే |
న చ సన్న్య సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి ||
(ప్రకృతి)
భావము : కర్మ ప్రారంభింపనంత మాత్రమున మరియు చేయుచుండు కర్మలను వదలుట వలనను మోక్షము లభించదు.
శ్లోకం 5: నహికశ్చిత్ క్షణ మపి జాతుతిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశఃకర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః ||
(ప్రకృతి)
భావము : ఎవ్వడుగాని ఎట్టి కర్మ ఆచరింపక ఒక్క క్షణమైన ఊరకయుండలేడు. ప్రకృతి జనితములైన గుణములకు చిక్కినవారై,కర్మముల వశులై పనులు చేయుచుందురు.
శ్లోకం 6:కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే ||
(బ్రహ్మ యోగము,జీవాత్మ)
భావము : కర్మేంద్రియముల పనులను నిగ్రహించి, జ్ఞానేంద్రియముల యొక్క విషయములను స్మరించు వానిని మూఢాత్ముడందురు.
శ్లోకం 7: యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభ తేఽర్జున |
కర్మేంద్రియైః కర్మయోగ మసక్తస్స విశిష్యతే ||
(కర్మ యోగము)
భావము : ఎవడు జ్ఞానేంద్రియములచే మనస్సును నియమించి, కర్మేంద్రియముల చేత పని చేయుచున్నాడో, వానిని కర్మయోగి అందురు. అట్టివాడు అందరికంటే ఉత్తముడు.
(శ్లోకం 8 : నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః ||
(బ్రహ్మయోగము)
భావము : నీవు చేయు నియమిత పనులను వదలుకొనుటకంటే ఆచరించుట మేలు, చేయు పనులను వదలి దేహయాత్రను చేయలేవు.
శ్లోకం 9:యజ్ఞార్థాత్కర్మణో ఽన్యత్ర లోకో ఽ యం కర్మబంధనః |
తదర్థం కర్మ కౌంతేయ! ముక్త సంగస్సమాచర||
(కర్మ యోగము)
భావము: యజ్ఞ సంబంధము లేకుండ కర్మలు ఆచరించుట వలన మానవులకు తిరిగి కర్మబంధనములు కలుగుచుండును. కనుక అర్జునా! కర్మలయందు బంధింపబడక కార్యములు చేయుము.
శ్లోకం 10: సహయజ్ఞః ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వమేషవో స్త్విషకామధుక్ ||
(అశాస్త్రీయము)
శ్లోకం 11: దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః|
పరస్పరం భావయంత శ్రేయః పరమావప్స్యథ ||
(అశాస్త్రీయము)
శ్లోకం 12: ఇష్టాన్ భోగన్ హిచోదేవా దాస్యంతే యజ్ఞ భావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యోయో భుజ్త్కే స్తేవ ఏవ సః ||
(అశాస్త్రీయము)
శ్లోకం 13: యజ్ఞాః శిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్భిషైః |
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ||
(అశాస్త్రీయము)
శ్లోకం 14: అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ||
(అశాస్త్రీయము)
శ్లోకం 15: కర్మబ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం |
తస్మాత్పర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ||
(అశాస్త్రీయము)
శ్లోకం 16: ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః |
అఘాయురింద్రియారామోఘం పార్థ!సజీవతి ||
(అశాస్త్రీయము)
ఈ ఏడు శ్లోకములందు చెప్పిన విషయము మూడవ అధ్యాయమైన జ్ఞాన యోగమందుగల 33వ శ్లోకమున చెప్పబడిన భావమునకు, అట్లే ఏడవ అధ్యాయమైన అక్షరపరబ్రహ్మయోగమందు గల 4వ శ్లోకమున చెప్పబడిన భావమునకు పూర్తి వ్యతిరిక్తముగ ఉన్నది. ఉన్నవి ద్రవ్య జ్ఞానయజ్ఞములు రెండేనని, అందులో జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనదని, అది కర్మను మాత్రమే కాల్చునని చెప్పబడిన జ్ఞానయోగములోని 33వ శ్లోక భావమునకు, అట్లే అక్షర పరబ్రహ్మ యోగములో 4వ శ్లోకమున నేను ఆత్మగ ఉండి దేహములలో జరుగు రెండు రకముల యజ్ఞములకు అధిపతిగ ఉన్నానను దేవుని భావమునకు, పై ఏడు శ్లోకములు పూర్తి విరుద్ధముగా ఉన్నవి. ఇష్టకామములు తీర్చుకొనుటకు యజ్ఞములు చేయండని ఏడు శ్లోకములలో చెప్పడము, మానవుని కోర్కెలను రేకెత్తించడమే తప్ప, వాటినుండి తప్పించడము ఏమాత్రము కాదు. దేవతలకు యజ్ఞములు చేయుట వలన వారు మీకు వృద్ధి చేయుదురని, ఇట్లు ఒకరికొకరు అభివృద్ధి చేసుకొమ్మని పైన 11వ శ్లోకములో చెప్పడము, దేవతలు మనుషులు ఒకరికొకరు వస్తు మార్పిడి వ్యాపారము చేసుకొమ్మని చెప్పినట్లున్నది. అంతేకాక 12వ శ్లోకమున యజ్ఞ పూజలందిన దేవతలు మీకు సర్వభోగములు ఇచ్చుచుందురు. వారి సొత్తు మరల యజ్ఞము చేసి వారికివ్వకపోతే, పండిన పంటలు మీరేతింటే, దొంగతనము చేసినట్లేనని చెప్పడము మరీ చోద్యముగనున్నది. ఇది ఎట్లున్నదనగా! నేను వాని పెళ్ళిలో బహుమతి ఇచ్చాను, వాడు నా పెళ్ళికి బహుమతి తిరిగి ఇవ్వలేదు అన్నట్లున్నది. భగవానుడు ధర్మసంస్థాపనకు వచ్చి తన ధర్మములను తెలుపుచున్నప్పుడు, తన మాటలకే విరుద్ధమైన ఇటువంటి విలువలేని మాటలు చెప్పునా! ఈ ఏడు శ్లోకములలో బ్రతుకు తెరువుకు సంబంధించిన ప్రపంచ ధర్మముతప్ప, మోక్షమునకు పనికి వచ్చు పరమాత్మ ధర్మములు ఏమాత్రములేవని పాఠకులు గ్రహించవలెనని కోరుచున్నాము.
ఇచ్చట చాలామందికి యజ్ఞముల మీద తమకున్న భావమునకు, ఇప్పుడు ఇక్కడ మేము చెప్పు భావమునకు వ్యత్యాసమేర్పడి, మా మాటలు కొంత బాధ కల్గించునవియే అయినప్పటికి, మేము చెప్పునది సత్యము కావున చెప్పక తప్పలేదు. అటువంటివారు ఎవరైన ఉంటే కొంత వివరణాత్మక యోచన చేయాలని కోరుచున్నాము. ఇందులో గొప్పగొప్ప గురువులే పొరపడి, పనిగట్టుకొని అదే ముఖ్యమైన ఆరాధనని తలచి, అగ్నిగుండములు కావించి కాల్చి ఖర్చు పెట్టుచుంటే, మిగతావారు కూడ పెద్దలజాడ నడవాలనుకొన్నారు తప్ప మనము చేయుచున్నది ఏమిటని యోచించలేదు. బాహ్యముగ చేయు యజ్ఞములలో కూడ ఉన్న వస్తువులను లేకుండ చేయడము ప్రత్యక్షముగ కనిపిస్తున్నది కదా! అపుడు అది నాశనము అని ఎందుకు అర్థము కాలేదు? నీటిలో ఈది బయటపడవచ్చు, గాలిలో తేలిపోవచ్చు, భూమిలోతులో కూడ బ్రతకవచ్చు, కాని అగ్నిలో సర్వులు నాశనము కాకతప్పదు. ఒక అడవి అంటుకొంటే అందులోని ఏ జీవరాశియైన చావక తప్పదు. ఆ అగ్నితో చేయబడు యజ్ఞము నాశనమని అర్థము తెల్పుచు, జ్ఞానాగ్నిచేత కర్మను కాల్చు కొమ్మని, మోక్షము పొందమని, సందేశమిచ్చు అగ్నిగుండమును యజ్ఞము యొక్క నమూనాయని తెలియక యజ్ఞమే అనుకోవడము చాలా పెద్ద పొరపాటు. అగ్నిగుండములు కావించి వాటిని యజ్ఞములని కొందరనుకుంటే, గీతను బోధించు బోధకులు ఆ బోధకు "గీతాయజ్ఞము " అని పేరు పెట్టడము ఇంకా పొరపాటు. ఉదాహరణకు 72వ గీతాయజ్ఞము, 73వ గీతాయజ్ఞము అని వరుసగ పేరు పెట్టి చెప్పడము జరుగుచున్నది. నిజార్థము ప్రకారము, పరమాత్మ గీతయందు తెల్పిన ఉద్దేశ్యము ప్రకారము గీతను 72వ మారు కాల్చుచున్నాము, 73వ మారు కాల్చుచున్నామని అర్థము. అనగ గీతను ఉద్ధరించవలెనని బోధించుట మంచిదే, కాని ఎన్నిమార్లు బోధించినది బోధించు సంఖ్య పెట్టి దానిప్రక్కన యజ్ఞమని పేరు పెట్టడము బాగలేదు. చెప్పానుగ నిజమైన అర్థము ప్రకారము యజ్ఞమనగ ఉన్న దానిని లేకుండ చేయడమేనని. దాని ప్రకారము గీతనే లేకుండ చేసినట్లగును.
జ్ఞాన యోగమైన మూడవ అధ్యాయములో యజ్ఞములు రెండు రకములని భగవంతుడు చెప్పినపుడు కూడ యజ్ఞములను గూర్చి 9 కల్పిత శ్లోకములు అమర్చబడినవి. విశేషమేమిటంటే అక్కడ కేవలము అగ్నితో చేయునవి చెప్పక, భజనలు మొదలుకొని తపస్సుల వరకు కూడ యజ్ఞములని చెప్పడము జరిగింది. ఇంకను ఇక్కడ యజ్ఞము అన్నపేరు వచ్చిన తర్వాత కల్పించి చెప్పగ, అక్కడ యజ్ఞమన్న శ్లోకమునకు ముందే కల్పించి చెప్పారు. ఇట్లు మనుషులు కల్పించిన ఈ కల్పిత యజ్ఞములను వదలి భగవంతుడు చెప్పిన 'యజ్ఞార్థా' అన్న శ్లోకము తర్వాత ఉన్న అనుబంధ శ్లోకమును చూస్తాము.
శ్లోకం 17: యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః|
ఆత్మన్యేవ చ సంతుష్ట స్తస్య కార్యం న విద్యతే ||
(బ్రహ్మయోగము)
భావము : ఆత్మయందే లగ్నమగచు, ఆత్మతోనే తృప్తిపొంది, ఆత్మతోనే సంతోషము పొందువానికి ఏకార్యము లేదు.
శ్లోకం 18: నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహకశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః ||
(బ్రహ్మయోగము)
భావము: అట్టివాడు పనిచేయకుండుట వలన లాభము లేదు. మరియు నష్టము లేదు. అతడు ఏ ప్రయోజనమునకైన ఎవరిని ఆశ్రయించవలసిన పనిలేదు.
శ్లోకం 19: తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుషః ||
(కర్మయోగము)
భావము: అందువలన చేయుచుండు కార్యము యొక్క ఫలితము మీద ఆసక్తిలేని వాడవై, కర్మప్రకారము కార్యములు చేయుము. అట్లు చేయుట వలన పరమును పొందవచ్చును.
శ్లోకం 20: కర్మణైవ హిసంసిద్ధి మాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి|| (కర్మయోగము)
భావము: కర్మయోగమాచరించి జనకుడు మొదలైనవారు మోక్షము పొందిరి. లోకులు తెలుసుకొనుటకైన నీవు ఈ పద్ధతిని ఆచరింపుము.
శ్లోకం 21: యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః|
సయత్ర్పమాణం కురుతే లోకస్త దనువర్తతే ||
(కర్మయోగము)
భావము : శ్రేష్ఠుడు ఏది ఆచరించునో దానినే ఇతరులు ఆచరింతురు. అతడు ఏ ప్రమాణమును చూపునో దానినే ఇతరులు అనుసరింతురు.
శ్లోకం 22: నమే పార్థాఽస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన |
నా ఽనవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||
(కర్మయోగము)
భావము : నాకు కర్తవ్యమనునది లేదు. ముల్లోకములందు నేనింత వరకు పొందినది ఇక పొందవలసినది లేదు. ఐనను నేను కర్మలను ఆచరించుచున్నాను.
శ్లోకం 23: యదిహ్యహంనవర్తే యం జాతు కర్మణ్యతన్ద్రితః|
మమవర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ! సర్వశః ||
(కర్మయోగము)
భావము : ఓ అర్జునా! నేనెప్పుడైనను పనులయందు అజాగ్రత్త కలిగి చేయని ఎడల, భూమిమీద జనులందరు అన్ని విధముల నావలె వారు కూడ పనులు చేయక ఊరకుందురు.
శ్లోకం 24: ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చే దహమ్ |
సంకరస్య చ కర్తా స్యా ముపహన్యామిమాః ప్రజాః||
(కర్మయోగము)
భావము : నేను పనులు చేయకపోతే జగతిలోని మనుషులెల్లరు చెడు మార్గమున పోవుదురు మరియు వర్ణ సంకరమేర్పడును. ప్రజలనెల్ల నేను చెడగొట్టిన వాడనగుదును.
శ్లోకం 25: సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వన్తి భారత !
కుర్యాద్విద్వాంస్తథా ఽసక్త శ్చికీర్షుర్లోక సంగ్రహమ్ ||
(కర్మయోగము)
భావము : ఒక అజ్ఞాని అన్ని విధముల పనులయందు ఆసక్తిపరుడై ఎట్లు చేయుచున్నాడో, జ్ఞానమంతయు తెలిసిన జ్ఞానియు అజ్ఞానివలెనె పనులు చేయవలయును. కాని ఆ పనులు చేయుటలో జ్ఞానికి ఫలితము మీద ఆసక్తి ఉండకూడదు.
శ్లోకం 26: న బుద్ధిభేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్ |
జోషయేత్సర్వ కర్మాణి విద్వాన్ యుక్త స్సమాచరన్ ||
(కర్మయోగము)
భావము : జ్ఞాని పనులు చేయుటయందు అజ్ఞానుల బుద్ధికి భేదము కలిగించ కూడదు. తెలిసినవాడు అన్ని పనులు చేయుచు, ఇతరుల చేత కూడ తనవలె చేయించవలెను.
శ్లోకం 27: ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |
అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||
(ప్రకృతి)
భావము : ప్రకృతి నిర్మాణము ప్రకారము కర్మ వలన కల్గు గుణప్రేరణ ద్వార జరుగు అన్ని పనులకు, కర్త తానేయని అహంకారము గల అజ్ఞాని తలచుచుండును.
శ్లోకం 28: తత్త్వవిత్తు మహా బాహో ! గుణకర్మ విభాగయోః |
గుణా ఽగుణేషు వర్తన్త ఇతి మత్వాన సజ్జతే ||
(కర్మయోగము)
భావము : తత్త్వ జ్ఞానమును తెలిసినవారు, కర్మలు గుణముల యొక్క భాగములను తెలిసినవారై, గుణముల వలననే కార్యములు జరుగుచున్నవని తెలిసియుందురు.
శ్లోకం 29: ప్రకృతేర్గుణ సమ్మూఢా స్సజ్జన్తే గుణకర్మసు |
తానకృత్స్న విదోమందాన్‍కృత్స్నవిన్న విచాలయేత్ ||
(ప్రకృతి)
భావము : ప్రకృతి జనిత గుణములందు చిక్కియున్న మనుషునకు ఆ గుణముల కార్యములయందే కర్మముల ప్రకారము ఆసక్తి కలిగించును. జ్ఞానులగువారు అట్టి అజ్ఞాన పరులను చలనమొందించకూడదు.
శ్లోకం 30: మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా|
నిరాశీ ర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః ||
(కర్మయోగము)
భావము : సర్వ కర్మలను నాయందే సన్న్యసించి, ఆధ్యాత్మికచింతన చేయుచు, రాజ్యకాంక్ష, నావారను మోహము మొదలగు గుణములను లేకుండ చేసుకొని, కలిగిన తాపమును వదలి యుద్ధము చేయుము.
శ్లోకం 31: యేమే మత మిదం నిత్యమను తిష్ఠన్తి మానవాః |
శ్రద్ధావన్తో ఽనసూయన్తో ముచ్యన్తే తే ఽపి కర్మభిః
(కర్మయోగము, జీవాత్మ)
భావము : ఎవరైతే నేను చెప్పిన ఈ నాపద్ధతి నచ్చినవారై పూర్తి శ్రద్ధకల్గి అసూయలేని వారై అనుసరింతురో వారికి కర్మ అంటకుండ పోవును.
శ్లోకం 32: యే త్వేతదభ్య సూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్ |
సర్వజ్ఞానవిమూఢాం స్తాన్ విధ్ధి నష్టానచేతసః ||
(కర్మయోగము, జీవాత్మ)
భావము : ఎవడైతే నా పద్ధతి మీద అసూయ పొంది అనుసరింపడో, అట్టివాడు నేను చెప్పిన అన్ని జ్ఞానములకు మూఢుడై జ్ఞానమార్గములో పూర్తి నష్టము పొందినవాడగును.
శ్లోకం 33: సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి |
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహఃకిం కరిష్యతి ||
(జీవాత్మ)
భావము : జ్ఞానియైనప్పటికి తనయొక్క గత జన్మ సంస్కారములకు తగినట్లు నడుచుకొనును. మిగత జీవరాసులు కూడ వాటివాటి కర్మప్రకారము నడుచు చున్నవి, ఫలితమును పొందుచున్నవి. నేనిట్లు నడువకూడదను నిగ్రహము ఎవనికి పనికిరాదు.
శ్లోకం 34: ఇంద్రియ స్యేంద్రియస్యార్థే రాగద్వేషౌవ్యవస్థితౌ |
తయోర్నవశ మాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ ||
(బ్రహ్మయోగము)
భావము : ప్రతి ఇంద్రియ విషయమునందు రాగద్వేషములు ఉన్నవి. ఆ రాగ ద్వేషములకు మనుజుడు వశము కారాదు. వాటిని నిగ్రహించుకోవలయును. ఆ రాగద్వేషములు మనిషికి శత్రువులలాంటివి.
శ్లోకం 35: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||
(జీవుడు, కర్మ యోగము)
భావము : అనుష్ఠితమగు పరధర్మముకంటే గుణములేని స్వధర్మమే శ్రేయస్కరము. పరధర్మములో ఉన్న భయముకంటే స్వధర్మములోని మరణమే మేలు.
శ్లోకం 36: అథ కేన ప్రయుక్తో ఽయం పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వ్వార్ణే య! బలాదివ నియోజితః ||
(బ్రహ్మ యోగము)
భావము : మనిషికి ఇష్టము లేకున్నను దేనిచేత బలత్కార పూర్వకముగ నియమింప బడి పాపకార్యములు చేయుచున్నాడు?
శ్రీ భగవంతుడిట్లనియె: -
శ్లోకం 37: కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |
మహాశనో మహాపాప్మా విద్ధ్యేన మిహ వైరిణమ్ ||
(ప్రకృతి)
భావము : రజోగుణములో పుట్టిన కామమనెడి గుణము మరియు క్రోధమనెడి గుణములు కలవు. ఈ ఆశ తృప్తిలేనిది. కోపము పాపము కలుగజేయునది. ఇవి జ్ఞానమునకు శత్రువులు.
శ్లోకం 38: ధూమే నావ్రియతే వహ్నిర్యథా ఽ ఽ దర్శోమలేన చ |
యథోల్బే నావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ||
(ప్రకృతి)
భావము : పొగచేత అగ్నియు, దుమ్ముచేత అద్దము, గర్భపొరలతో శిశువు కప్పబడినట్లు ఆశచేత జ్ఞానము కప్పబడివున్నది.
శ్లోకం 39: ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌంతేయ! దుష్పూరే ణానలేన చ ||
(ప్రకృతి)
భావము : తీరనిది మరియు తృప్తిలేనిదైన ఆశ జ్ఞానమునకు నిత్య శత్రువైయుండి జ్ఞానమును కప్పివేయుచున్నది.
శ్లోకం 40: ఇంద్రియాణి మనోబుద్ధి రస్యాధిష్ఠాన ముచ్యతే |
ఏతైర్విమోహయ త్యేష జ్ఞాన మావృత్య దేహినమ్ ||
(ప్రకృతి)
భావము : మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఆశకు అధిష్ఠానములుగ ఉన్నవి. వీటి ఆధారముతో మోహమును కలుగజేసి జ్ఞానమును కప్పివేయుచున్నది.
శ్లోకం 41: తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశనమ్ ||
(బ్రహ్మ యోగము)
భావము : అందువలన ఇంద్రియములను అణచివేసి పాపమును చేయించునది, జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునదియైన ఆశను జయించవలెను.
శ్లోకం 42: ఇంద్రియాణి పరాణ్యాహు రింద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరాబుద్ధి ర్యో బుద్ధేః పరతస్తుసః||
(ప్రకృతి, ఆత్మ)
భావము : శరీరములో ఇంద్రియములు శ్రేష్ఠమైనవి. వాటికంటెను మనస్సు శ్రేష్ఠమైనది. దానికంటెను బుద్ధి శ్రేష్ఠమైనది. బుద్ధికంటెను ఆత్మ శ్రేష్ఠమైనది.
శ్లోకం 43: ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సం స్తభ్యా త్మా నమాత్మనా |
జహిశత్రుం మహాబాహో! కామరూపం దురాసదమ్ ||
(బ్రహ్మ యోగము)
భావము : బుద్ధికంటే శ్రేష్ఠమైనది ఆత్మయని తెలిసి, జీవాత్మను ఆత్మలో ఐక్యమగునట్లు చేసి, జయింప దుస్సాధ్యమైన ఆశను జయించును.
----------------------------------
త్రైత సిద్ధాంత భగవద్గీత : కర్మ యోగము
అర్జునుడిట్లనియె :-
శ్లోకం 1: (కర్మ, బ్రహ్మయోగములు)
భావము :పాపపుణ్య కర్మలగు పనులు చేయుటకంటే బ్రహ్మయోగమే శ్రేష్ఠమైనదని నీ అభిప్రాయమైన, భయంకరమగు కర్మలు కలుగు పనులనే చేయమని నన్ను ఎందుకు నియమించుచున్నావు.
శ్లోకం 2: (కర్మ, బ్రహ్మయోగములు)
భావము :మిశ్రమవాక్యములను చెప్పి నా బుద్ధిని భ్రమింపచేయుటకంటే మోహగుణమందు చిక్కుకోకుండునట్లు ఏది చేయుట మంచిదో దానిని నిశ్చయించి చెప్పుము.
శ్రీ భగవంతుడిట్లనియె :-
శ్లోకం 3: (కర్మ, బ్రహ్మయోగములు)
భావము : మనుజులు ఆచరించుటకు రెండు రకములైన యోగనిష్టలు గలవని ముందే తెలిపియున్నాను. సాంఖ్యము తెలిసినవారు జ్ఞానయోగమును, కార్య వివరము తెలిసినవారు కర్మయోగమును ఆచరించగలరు.
శ్లోకం 4: (ప్రకృతి)
భావము : కర్మ ప్రారంభింపనంత మాత్రమున మరియు చేయుచుండు కర్మలను వదలుట వలనను మోక్షము లభించదు.
శ్లోకం 5: (ప్రకృతి)
భావము : ఎవ్వడుగాని ఎట్టి కర్మ ఆచరింపక ఒక్క క్షణమైన ఊరకయుండలేడు. ప్రకృతి జనితములైన గుణములకు చిక్కినవారై,కర్మముల వశులై పనులు చేయుచుందురు.
శ్లోకం 6: (బ్రహ్మ యోగము,జీవాత్మ)
భావము : కర్మేంద్రియముల పనులను నిగ్రహించి, జ్ఞానేంద్రియముల యొక్క విషయములను స్మరించు వానిని మూఢాత్ముడందురు.
శ్లోకం 7: (కర్మ యోగము)
భావము : ఎవడు జ్ఞానేంద్రియములచే మనస్సును నియమించి, కర్మేంద్రియముల చేత పని చేయుచున్నాడో, వానిని కర్మయోగి అందురు. అట్టివాడు అందరికంటే ఉత్తముడు.
(శ్లోకం 8 : (బ్రహ్మయోగము)
భావము : నీవు చేయు నియమిత పనులను వదలుకొనుటకంటే ఆచరించుట మేలు, చేయు పనులను వదలి దేహయాత్రను చేయలేవు.
శ్లోకం 9: (కర్మ యోగము)
భావము: యజ్ఞ సంబంధము లేకుండ కర్మలు ఆచరించుట వలన మానవులకు తిరిగి కర్మబంధనములు కలుగుచుండును. కనుక అర్జునా! కర్మలయందు బంధింపబడక కార్యములు చేయుము.
శ్లోకం 10: (అశాస్త్రీయము)
శ్లోకం 11: (అశాస్త్రీయము)
శ్లోకం 12: (అశాస్త్రీయము)
శ్లోకం 13: (అశాస్త్రీయము)
శ్లోకం 14: (అశాస్త్రీయము)
శ్లోకం 15: (అశాస్త్రీయము)
శ్లోకం 16: (అశాస్త్రీయము)
శ్లోకం 17: (బ్రహ్మయోగము)
భావము : ఆత్మయందే లగ్నమగచు, ఆత్మతోనే తృప్తిపొంది, ఆత్మతోనే సంతోషము పొందువానికి ఏకార్యము లేదు.
శ్లోకం 18: (బ్రహ్మయోగము)
భావము: అట్టివాడు పనిచేయకుండుట వలన లాభము లేదు. మరియు నష్టము లేదు. అతడు ఏ ప్రయోజనమునకైన ఎవరిని ఆశ్రయించవలసిన పనిలేదు.
శ్లోకం 19: (కర్మయోగము)
భావము: అందువలన చేయుచుండు కార్యము యొక్క ఫలితము మీద ఆసక్తిలేని వాడవై, కర్మప్రకారము కార్యములు చేయుము. అట్లు చేయుట వలన పరమును పొందవచ్చును.
శ్లోకం 20: (కర్మయోగము)
భావము: కర్మయోగమాచరించి జనకుడు మొదలైనవారు మోక్షము పొందిరి. లోకులు తెలుసుకొనుటకైన నీవు ఈ పద్ధతిని ఆచరింపుము.
శ్లోకం 21: (కర్మయోగము)
భావము : శ్రేష్ఠుడు ఏది ఆచరించునో దానినే ఇతరులు ఆచరింతురు. అతడు ఏ ప్రమాణమును చూపునో దానినే ఇతరులు అనుసరింతురు.
శ్లోకం 22: (కర్మయోగము)
భావము : నాకు కర్తవ్యమనునది లేదు. ముల్లోకములందు నేనింత వరకు పొందినది ఇక పొందవలసినది లేదు. ఐనను నేను కర్మలను ఆచరించుచున్నాను.
శ్లోకం 23: (కర్మయోగము)
భావము : ఓ అర్జునా! నేనెప్పుడైనను పనులయందు అజాగ్రత్త కలిగి చేయని ఎడల, భూమిమీద జనులందరు అన్ని విధముల నావలె వారు కూడ పనులు చేయక ఊరకుందురు.
శ్లోకం 24: (కర్మయోగము)
భావము : నేను పనులు చేయకపోతే జగతిలోని మనుషులెల్లరు చెడు మార్గమున పోవుదురు మరియు వర్ణ సంకరమేర్పడును. ప్రజలనెల్ల నేను చెడగొట్టిన వాడనగుదును.
శ్లోకం 25: (కర్మయోగము)
భావము : ఒక అజ్ఞాని అన్ని విధముల పనులయందు ఆసక్తిపరుడై ఎట్లు చేయుచున్నాడో, జ్ఞానమంతయు తెలిసిన జ్ఞానియు అజ్ఞానివలెనె పనులు చేయవలయును. కాని ఆ పనులు చేయుటలో జ్ఞానికి ఫలితము మీద ఆసక్తి ఉండకూడదు.
శ్లోకం 26: (కర్మయోగము)
భావము : జ్ఞాని పనులు చేయుటయందు అజ్ఞానుల బుద్ధికి భేదము కలిగించ కూడదు. తెలిసినవాడు అన్ని పనులు చేయుచు, ఇతరుల చేత కూడ తనవలె చేయించవలెను.
శ్లోకం 27: (ప్రకృతి)
భావము : ప్రకృతి నిర్మాణము ప్రకారము కర్మ వలన కల్గు గుణప్రేరణ ద్వార జరుగు అన్ని పనులకు, కర్త తానేయని అహంకారము గల అజ్ఞాని తలచుచుండును.
శ్లోకం 28: (కర్మయోగము)
భావము : తత్త్వ జ్ఞానమును తెలిసినవారు, కర్మలు గుణముల యొక్క భాగములను తెలిసినవారై, గుణముల వలననే కార్యములు జరుగుచున్నవని తెలిసియుందురు.
శ్లోకం 29: (ప్రకృతి)
భావము : ప్రకృతి జనిత గుణములందు చిక్కియున్న మనుషునకు ఆ గుణముల కార్యములయందే కర్మముల ప్రకారము ఆసక్తి కలిగించును. జ్ఞానులగువారు అట్టి అజ్ఞాన పరులను చలనమొందించకూడదు.
శ్లోకం 30: (కర్మయోగము)
భావము : సర్వ కర్మలను నాయందే సన్న్యసించి, ఆధ్యాత్మికచింతన చేయుచు, రాజ్యకాంక్ష, నావారను మోహము మొదలగు గుణములను లేకుండ చేసుకొని, కలిగిన తాపమును వదలి యుద్ధము చేయుము.
శ్లోకం 31: (కర్మయోగము, జీవాత్మ)
భావము : ఎవరైతే నేను చెప్పిన ఈ నాపద్ధతి నచ్చినవారై పూర్తి శ్రద్ధకల్గి అసూయలేని వారై అనుసరింతురో వారికి కర్మ అంటకుండ పోవును.
శ్లోకం 32: (కర్మయోగము, జీవాత్మ)
భావము : ఎవడైతే నా పద్ధతి మీద అసూయ పొంది అనుసరింపడో, అట్టివాడు నేను చెప్పిన అన్ని జ్ఞానములకు మూఢుడై జ్ఞానమార్గములో పూర్తి నష్టము పొందినవాడగును.
శ్లోకం 33: (జీవాత్మ)
భావము : జ్ఞానియైనప్పటికి తనయొక్క గత జన్మ సంస్కారములకు తగినట్లు నడుచుకొనును. మిగత జీవరాసులు కూడ వాటివాటి కర్మప్రకారము నడుచు చున్నవి, ఫలితమును పొందుచున్నవి. నేనిట్లు నడువకూడదను నిగ్రహము ఎవనికి పనికిరాదు.
శ్లోకం 34: (బ్రహ్మయోగము)
భావము : ప్రతి ఇంద్రియ విషయమునందు రాగద్వేషములు ఉన్నవి. ఆ రాగ ద్వేషములకు మనుజుడు వశము కారాదు. వాటిని నిగ్రహించుకోవలయును. ఆ రాగద్వేషములు మనిషికి శత్రువులలాంటివి.
శ్లోకం 35: (జీవుడు, కర్మ యోగము)
భావము : అనుష్ఠితమగు పరధర్మముకంటే గుణములేని స్వధర్మమే శ్రేయస్కరము. పరధర్మములో ఉన్న భయముకంటే స్వధర్మములోని మరణమే మేలు.
శ్లోకం 36: (బ్రహ్మ యోగము)
భావము : మనిషికి ఇష్టము లేకున్నను దేనిచేత బలత్కార పూర్వకముగ నియమింప బడి పాపకార్యములు చేయుచున్నాడు?
శ్రీ భగవంతుడిట్లనియె: -
శ్లోకం 37: (ప్రకృతి)
భావము : రజోగుణములో పుట్టిన కామమనెడి గుణము మరియు క్రోధమనెడి గుణములు కలవు. ఈ ఆశ తృప్తిలేనిది. కోపము పాపము కలుగజేయునది. ఇవి జ్ఞానమునకు శత్రువులు.
శ్లోకం 38: (ప్రకృతి)
భావము : పొగచేత అగ్నియు, దుమ్ముచేత అద్దము, గర్భపొరలతో శిశువు కప్పబడినట్లు ఆశచేత జ్ఞానము కప్పబడివున్నది.
శ్లోకం 39: (ప్రకృతి)
భావము : తీరనిది మరియు తృప్తిలేనిదైన ఆశ జ్ఞానమునకు నిత్య శత్రువైయుండి జ్ఞానమును కప్పివేయుచున్నది.
శ్లోకం 40: (ప్రకృతి)
భావము : మనస్సు, బుద్ధి, ఇంద్రియములు ఆశకు అధిష్ఠానములుగ ఉన్నవి. వీటి ఆధారముతో మోహమును కలుగజేసి జ్ఞానమును కప్పివేయుచున్నది.
శ్లోకం 41: (బ్రహ్మ యోగము)
భావము : అందువలన ఇంద్రియములను అణచివేసి పాపమును చేయించునది, జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునదియైన ఆశను జయించవలెను.
శ్లోకం 42: (ప్రకృతి, ఆత్మ)
భావము : శరీరములో ఇంద్రియములు శ్రేష్ఠమైనవి. వాటికంటెను మనస్సు శ్రేష్ఠమైనది. దానికంటెను బుద్ధి శ్రేష్ఠమైనది. బుద్ధికంటెను ఆత్మ శ్రేష్ఠమైనది.
శ్లోకం 43: (బ్రహ్మ యోగము)
భావము : బుద్ధికంటే శ్రేష్ఠమైనది ఆత్మయని తెలిసి, జీవాత్మను ఆత్మలో ఐక్యమగునట్లు చేసి, జయింప దుస్సాధ్యమైన ఆశను జయించును.