pss book: ద్వితీయ దైవగ్రంథములోరత్నవాక్యములు: మత్తయి సువార్త full
ద్వితీయ దైవగ్రంథములోరత్నవాక్యములు: మత్తయి సువార్త
(1) మత్తయి సువార్త, 3వ అధ్యాయము, 7వ వచనము.(7) సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించు కొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు?ఈ వాక్యములో 'సర్పసంతానమా' అనుమాట క్రొత్తగా వినిపించుచున్నది. ఇది మనుషులను ఉద్దేశించి చెప్పినది. అయితే మనుషులలో పాము సంతానము ఉంటుందా!యని అనుమానము రాక తప్పదు. అందువలన ఈ వాక్యమును చదివే ప్రతివాడికి ఇది ప్రశ్నగానే ఉండును. ఇంకా ఈ వాక్యములో 'రాబోవు ఉగ్రత' అంటే ఏమిటో వివరముగా తెలియవలసియున్నది. అంతేకాకుండా 'మనుషులకు బుద్ధి చెప్పినవాడు ఎవడు?' అనుమాట కూడా కలదు. ఇది జరిగిపోయిన కాలమును సూచించుచున్నది. అందువలన గతములో మనుషులకు బుద్ధి చెప్పిన వాడెవడు? అనే విషయము కూడా తెలియవలసియున్నది. మొత్తము మీద ఈ వాక్యములో మూడు ప్రశ్నలకు జవాబు తెలియవలసియున్నది.
పాముకు విరోధి పక్షి. పక్షి పామును చంపి లేకుండా చేయగలదు. అయితే పాము మొదట బుసకొట్టి పక్షిని భయపెట్టగలదు. అయినా పక్షి భయపడదు. పక్షి పామునే ఆహారముగా తినేయగలదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. పామును, పక్షిని ఆధ్యాత్మిక విద్యతో పోల్చి చెప్పుకోవడము జరుగుచున్నది. పక్షులలో పావురమును ఆత్మగా, పాములలో కొండశిలువ పామును మాయగా పోల్చి చెప్పడము జరుగుచున్నది. పై వాక్యములో సర్పము అనగా కొండశిలువ (పెద్ద శిలువ) యని అర్థము చేసుకోవలసి యున్నది. ఈ వాక్యములో పక్షిని చెప్పలేదుగానీ, పామును మాత్రము చెప్పడము జరిగినది. సర్పమును మాయగా పోల్చినప్పుడు 'సర్పసంతానమా' యను మాటనుబట్టి 'మాయ సంతానమా' యని చెప్పవచ్చును. దానిని ఇంకా వివరముగా చెప్పుకొంటే 'మాయతో కూడిన మనుషులారా' యను మాటను 'సర్పసంతానమాయని' చెప్పారు అని తెలియుచున్నది.
మాయ అనగా గుణముల కూడికయని తెలియుచున్నది. ఎల్లప్పుడూ గుణముల చింత కల్గిన వారిని, దేవుని చింత ఏమాత్రము లేనివారిని సర్ప సంతానమా యని సంబోధించడము జరిగినది. మాయతో కూడిన మనుషులకు రాబోవు ఉగ్రత గలదని తెలియుచున్నది. ఉగ్రత అనగా భయంకరమైనది అనియు, భరించను కష్టమైనదనియు చెప్పవచ్చును. లేనిది రాబోవును కనుక రాబోవు ఉగ్రతయని చెప్పారు. మనిషికి మొదట లేనిది, మాయవలన (గుణముల వలన) రాబోవునది ఏదియని చూచినట్లయితే అన్ని విధముల పాపపుణ్య కర్మయని తెలియుచున్నది. పాపమను కర్మను అనుభవించుటకు భయంకరముగా ఉండును. కనుక మనిషికి జీవితములో రాబోవు కర్మను రాబోవు ఉగ్రతయని చెప్పారు. కర్మ అనునది పుట్టిన ప్రతి మనిషికీ వచ్చునదే కావున మనుషులను హెచ్చరించుచూ 'సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?' అని చెప్పారు.
మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అని చెప్పినప్పుడు గతములో మనుషులకు కర్మనుండి తప్పించుకొనుటకు తగిన బుద్ధిని జ్ఞాన రూపములో ఎవరో చెప్పియున్నారని తెలియుచున్నది. రాబోవు కర్మలనుండి బయటపడుటకు గతములో ఏదో ఉపాయమును చెప్పినవాడున్నాడని ఈ వాక్యము వలన తెలియుచున్నది. కావున అట్లు చెప్పినవాడు ఎవడో మనుషులు తప్పక తెలియవలసియున్నది. గతములో రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు ఎవడు బుద్ధి చెప్పియున్నాడో, వాడు ఎటువంటివాడో, వాడు ఏమి చెప్పియున్నాడో, ఎప్పుడు చెప్పియున్నాడో మనము తెలియవలసిన అవసరమున్నది. గతములో జరిగిపోయిన విషయమును తెలియడము కష్టమే అయినా ఈ విషయము తెలియకపోతే, నాలుగు సువార్తలలో మొదటి అధ్యాయములో మొదట వచ్చిన ప్రశ్నకు జవాబు తెలియకపోతే, మొదటనే ద్వితీయ దైవగ్రంథములోని విషయము అర్థము కాకుండా పోవుట వలన తర్వాత తెలియవలసిన వాక్యములకు వివరము తెలియకుండా పోవును. అందువలన మొదటి ప్రశ్నగా వచ్చిన వాక్యమునకు తప్పక వివరము తెలియవలసియున్నది. దీనిని గురించిన సత్యము తెలియుటకు ముందు ఈ ద్వితీయ దైవగ్రంథము యొక్క విశిష్ఠతను తెలుసుకొందాము.
దేవుడు చెప్పిన జ్ఞానము ఒకమారు ఐదు వేల సంవత్సరములకు ముందే గ్రంథరూపముగా తయారయినది. అది 'మహా భారతము' అను గ్రంథములోగల 18 పర్వముల గ్రంథము మధ్యలో కొంత భాగముగా వ్రాయబడిన 18 అధ్యాయముల గ్రంథముగా యున్నది. ఆ పదునెనిమిది అధ్యాయములను ప్రథమ దైవగ్రంథముగా చెప్పుచున్నాము. సృష్ఠ్యాదిలో దేవుడు 'ఆకాశవాణి' ద్వారా జ్ఞానమును చెప్పియున్నాడు. అప్పుడు ఆ జ్ఞానమును జపర జ్ఞానము అని అన్నారు. ''పర'' అనగా వేరయినది అని అర్థము కాగా ''జ'' అనగా జన్మించినదని అర్థము. జన్మించిన దానికంటే వేరయినదని జపర యొక్క అర్థము. జననము లేనిది దేవుడే కనుక దేవుని జ్ఞానమును జపర జ్ఞానము అని అన్నారు. జపర జ్ఞానము మొదట ప్రథమ దైవ గ్రంథముగా తయారుకాగా, తర్వాత మూడు వేల సంవత్సరములకు అనగా ఇప్పటికి రెండువేల సంవత్సరముల పూర్వము ద్వితీయ దైవ గ్రంథముగా వ్రాయబడినది. అదే జ్ఞానమే 1400 సంవత్సరముల పూర్వము మూడవ దైవగ్రంథముగా కూడా వ్రాయబడినది. ద్వితీయ గ్రంథముగా వ్రాయబడిన దానినే మనము ఇప్పుడు చెప్పుకొంటున్నాము. అందులోని వాక్యమునే ఇప్పుడు వ్రాయుచున్నాము.
మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అన్నప్పుడు గతములో జ్ఞానము చెప్పిన వానినే చెప్పుకోవాలి. దీనిప్రకారము ప్రథమ దైవగ్రంథములో జ్ఞానము చెప్పినవాడు ఎవడో వాడే ముందు బుద్ధి చెప్పినవాడని చెప్పవచ్చును. గతములో చెప్పిన వానితో మనకేమి పని? అని ప్రశ్నించుకొంటే ప్రపంచములో దేవుని జ్ఞానమును దేవుడే చెప్పాలి కనుక ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా ఒక్క దేవుడే చెప్పాలి. అందువలన ముందు చెప్పినవాడే ఇప్పుడు కూడా వాక్యరూపములో చెప్పునని తెలియవచ్చును. ఇప్పుడు ద్వితీయ దైవగ్రంథములో జ్ఞానమును చెప్పినవానిని తెలియు నిమిత్తము ముందు గతములో జ్ఞానమును చెప్పిన వానిని తెలియవలసియున్నది. కావున మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అని ప్రశ్న వేసి అడుగవలసి వచ్చినది. గతములో చెప్పిన వానిని గుర్తించగలిగితే ఇప్పుడు చెప్పువానిని గుర్తించుటకు అవకాశము దొరుకును. ప్రథమ దైవగ్రంథమును చెప్పినవాడే ద్వితీయ దైవగ్రంథమయిన దానిని చెప్పుచున్నాడను నమ్మకముతో ఈ గ్రంథమును చదవాలని ముందే మేము తెలుపుచున్నాము.
ద్వితీయ దైవగ్రంథమును చదువుటకు ముందు ఈ గ్రంథములో ప్రథమ దైవగ్రంథమును చెప్పిన దేవుడు ఎక్కడ ఏ వాక్యమును చెప్పాడో తెలియవలసియున్నది. ఈ గ్రంథము మొత్తము అరవై ఆరు (66) భాగములుగా ఉండగా, అందులో కేవలము నాలుగు భాగములందు మాత్రమే దేవుడు చెప్పిన వాక్యములుండగా, మిగతా (62) భాగములలో ఇతర జ్ఞానులు చెప్పిన వాక్యములు గలవు. దేవుడు మనిషిగా అవతరించినప్పుడు ప్రత్యక్షముగా చెప్పిన వాక్యములు నాలుగు భాగములలో గలవు. నాలుగు భాగముల పేర్లు 1) మత్తయి, 2) మార్కు, 3) లూకా, 4) యోహాను. ఈ నాలుగు భాగములు గ్రంథములో మధ్య భాగమున గలవు. దీనినిబట్టి గ్రంథమును మూడు భాగములుగా విభజించి చెప్పవచ్చును. మొదటి 39 భాగములను ఒక భాగముగా, నాలుగు సువార్తలను రెండవ భాగముగా, మిగతా చివరిలోని 23 భాగములను మూడవ భాగముగా చెప్పవచ్చును. ఏసుప్రభువు జీవిత కాలములో చెప్పిన నాలుగు భాగములకు ప్రత్యేకముగా 'సువార్త'లని పేరు పెట్టి యుండడమును గమనించవచ్చును.
ప్రథమ భాగము 39 భాగములుగా యున్నది.
ద్వితీయ భాగము 4 సువార్తలుగా యున్నది.
తృతీయ భాగము 23 భాగములుగా యున్నది.
ప్రథమ మరియు తృతీయ భాగములలో దేవుని జ్ఞానమునే ఇతర జ్ఞానులు చెప్పియుండగా, మధ్యలో యున్న నాలుగు సువార్తలలోని వాక్యములను ప్రథమ దైవ గ్రంథమును చెప్పినవాడే తిరిగి ఏసు అవతారముగా వచ్చి చెప్పాడని తెలియుచున్నది. అందువలన ఈ విషయము తెలియుటకై పై వాక్యములో ''రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు?'' అని ప్రశ్నించి చెప్పారు. అందువలన అన్నిటికంటే ముందు వ్రాయబడిన ఈ వాక్యము ఎంతో విశిష్ఠత కల్గియున్నదని చెప్పవచ్చును.
ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు
(2) మత్తయి సువార్త, 3వ అధ్యాయము, 11వ వచనము.(11) మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోనూ, అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును.ఈ వాక్యములో ''మారుమనస్సు'' అను మాట, అట్లే ''బాప్తిస్మము'' అనుమాట వినిపించడమేకాక 'నీళ్లతోను, అగ్నితోను' అను రెండు మాటలు కూడా గలవు. ఈ నాలుగు పదములకు వివరమును తెలియగలిగితే ఈ వాక్యము సంపూర్ణముగా అర్థము కాగలదు. ఈ నాలుగు పదములలో ఒక్క పదము అర్థము కాకపోయినా వాక్యములోని సారాంశము తెలియకుండా పోగలదు. అందువలన ఈ నాలుగు పదములకు ముందు వివరమును తెలుసుకొందాము. మొదటిది మారు మనస్సు అని కలదు. మారు మనస్సు అనగా ఉన్న మనస్సుకాక వేరే మనస్సుయని అర్థము. మన శరీరములో మనస్సు అనునది గలదు. మనస్సు అనగా మననము చేయునది అని అర్థము. ఒక జీవితములోని విషయములను జ్ఞాపకము పెట్టుకొనునది మనస్సు మాత్రమే. మొదటి మనస్సు మారిపోతే రెండవ మనస్సు వస్తే మొదటి మనస్సుకున్న జ్ఞాపకములన్నీ దానితోనే పోవును. రెండవ మనస్సుకు మొదటి మనస్సు యొక్క జ్ఞాపకములు ఒక్కటి కూడా తెలియవు. మొదటి మనస్సు మరణముతో పోవును. రెండవ మనస్సు జననములో వచ్చును. మొదటి మనస్సు పోయి రెండవ మనస్సు రావడమును 'మారుమనస్సు'యని చెప్పవచ్చును. మరణములో ప్రతి ఒక్కరికి పాత మనస్సు పోయి క్రొత్త మనస్సు వచ్చుచున్నది. అలా జన్మ మారునప్పుడు మనస్సు మారుట సహజముగా జరుగుచుండును. జన్మలో 'మారుమనస్సు' పొందుటకు బాప్తిస్మము అవసరము లేదు.
మనిషి మరణము పొంది తిరిగి పుట్టడమును జన్మించడము అని అంటాము. జననముతో మనిషి యొక్క పాత శరీరము పోయి క్రొత్త శరీరము లభించుచున్నది. దానివలన జరుగు భౌతికమార్పును జననము అంటున్నాము. భౌతికము అనగా కనిపించే శరీరము. మనిషికి కనిపించే శరీరము, కనిపించని శరీరము అని రెండు రకముల శరీరములు గలవు. కనిపించే శరీరము పాతదిపోయి క్రొత్తది వస్తే జననము అంటున్నట్లే, కనిపించని సూక్ష్మశరీరము పాతదిపోయి క్రొత్తది వస్తే దానిని 'బాప్తిస్మము' అని క్రైస్తవులు, 'ఉపదేశము' అని హిందువులు (ఇందువులు) అంటున్నారు. ఈ వాక్యములో చెప్పినట్లు బాప్తిస్మము అనగా సూక్ష్మముగా యున్న మనస్సు మారిపోవుచున్నదని అర్థము. జననములో పాత జ్ఞాపకముల మనస్సుపోయి క్రొత్త మనస్సు ఎలా వచ్చుచున్నదో, అలాగే జీవితములో ఉన్న మనస్సు మార్పుచెంది అజ్ఞాన జ్ఞాపకములను కలుగజేయకుండా జ్ఞాన సంబంధ, దైవ సంబంధ జ్ఞాపకములనే బాప్తిస్మములో కలుగజేయును. బ్రతికి యున్నప్పుడే అజ్ఞాన జ్ఞాపకముల మనస్సు పోయి జ్ఞాన సంబంధ మనస్సు కలుగడమును వాస్తవముగా ''బాప్తిస్మము'' అని చెప్పవచ్చును. అజ్ఞాన జీవితము గల మనిషి బ్రతికియున్నట్లే గురు ఉపదేశము వలన మారు మనస్సును పొందడమును 'బాప్తిస్మము' అని చెప్పవచ్చును.మారు మనస్సు = అజ్ఞానము నుండి జ్ఞానము వైపు పోవడము.బాప్తిస్మము = గురు ఉపదేశమును పొందుట.
'యోహాను' అను గురువు నీటితో ఉపదేశమిచ్చుచూ, ''నేను మీకు నీళ్లతో బాప్తిస్మము ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన పరిశుద్ధాత్మతోనూ, అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును'' అని అన్నాడు. ఇంతకు ముందు 'మారుమనస్సు' అంటే ఏమిటి? బాప్తిస్మమంటే ఏమిటి అని వివరముగా తెలుసుకొన్నాము. ఇప్పుడు 'నీళ్లు' అంటే ఏమిటి? నీళ్లకు వ్యతిరేఖమయిన 'అగ్ని' అంటే ఏమిటి? అని తెలియవలసియున్నది. బాప్తిస్మము గురువు వలన పొందుచున్నాము. అయితే గురువులు రెండు రకముల వారున్నారు. జ్ఞానశక్తి అను అగ్ని గలవారు కొందరు. జ్ఞానశక్తి లేని గురువులు కొందరుగలరు. సాధారణముగా బాప్తిస్మ కార్యక్రమములో అనగా గురు ఉపదేశ కార్యములో చాలామంది గురువులు నీళ్లతోనూ, కొందరు పాలతోను ఉపదేశమిచ్చుచుందురు. నీళ్లు, పాలు రెండూ కనిపించు ద్రవపదార్థములే. మరికొందరు విభూతితోను, ఇంకా కొందరు పొగవచ్చు ధూపముతోనూ ఉపదేశమిచ్చుచుందురు. అలా ఒకమారు గురువువద్ద ఏదో ఒక విధానము చేత మంత్రమునో, వాక్యమునో, దృశ్యమునో పొందుచుందురు. ఈ విధముగా పొందు ఉపదేశములు అనేకములు గలవు, అలాగ ఇచ్చువారు అనేక గురువులు కలరు. వారిలో యోహాను ఒకడు కాగా ఆయన తన విధానమును ఒప్పుకొనుచూ ''నేను నీటితో బాప్తిస్మము ఇచ్చువాడను'' అని చెప్పాడు. అయితే నా వెనుక వచ్చువాడు ''పరిశుద్ధాత్మతోను, అగ్నితోను బాప్తిస్మమిచ్చు వాడు'' అని చెప్పాడు. బాప్తిస్మము అనగా మారుమనస్సు పొందు మార్గము అని చెప్పుకొన్నాము. బాప్తిస్మము వలన అజ్ఞానము నుండి జ్ఞానములోనికి మారిపోతే దానివలన మనిషిలోని పాపకర్మలు అన్నియూ కాలిపోవును. అలా పాపములు కాలిపోవుటకు తగిన అగ్నిని గురువు తన బాప్తిస్మము ద్వారా ఇచ్చును. గురువు దైవత్వము అను అగ్ని కలిగియుండవలెను. ''అగ్ని లేనివాడు, పనులు మానుకొన్నవాడు యోగి (గురువు) కాడు'' యని ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో ఆత్మ సంయమయోగమను అధ్యాయమున మొదటి శ్లోకమందు ''సయోగీచ నని రగ్ని నచాక్రియః'' అని అన్నారు.
నిజమైన యోగి అయినవాడు అనగా నిజమైన గురువు అయిన వాడు పనులు చేయకుండా ఉండడు. అట్లే అగ్ని లేకుండా ఉండడు అని చెప్పారు. అగ్ని అనగా జ్ఞానాగ్ని అని అర్థము. ఇక్కడ పై వాక్యములో కూడా ''అగ్నితో బాప్తిస్మము'' అని అన్నారు. ఇక్కడ కూడా అగ్ని అనగా దైవశక్తితో కూడుకొన్న అగ్ని అని తెలియవలెను. అందువలన వాక్యములో పరిశుద్ధాత్మతో కూడిన అగ్ని అన్నట్లు ''పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును'' అని అన్నారు. దైవసంబంధమైన అగ్ని కంటికి కనిపించదు. అయితే గురువు ద్వారా అటువంటి అగ్నిని పొందడము వలన కర్మలు కాలిపోవు శక్తి మనిషిలో ఏర్పడును. అనగా జ్ఞానము అను అగ్ని బాప్తిస్మము పొందినవానిలో చేరి వాని కర్మలను కాల్చివేయుటకు ప్రారంభించును. యోహాను అను గురువు మనుషులు మారుమనస్సు పొందు నిమిత్తము బాప్తిస్మము ఇచ్చినా అందులో కర్మలను కాల్చు శక్తి అయిన జ్ఞానాగ్ని లేదు అందువలన నేను నీటితో బాప్తిస్మము ఇచ్చువాడను మాత్రమేయని అన్నాడు. ''నా బాప్తిస్మము వలన మీ కర్మలు క్షమించబడవు, ఏమాత్రము కాలిపోవు నా వెనుక రాబోవువాడు ఇచ్చు బాప్తిస్మము వలన మీ కర్మలు కాలిపోవును'' అని యోహాను అక్కడి ప్రజలకు చెప్పాడు.నీటితో బాప్తిస్మము = కర్మలు కాలిపోని ఉపదేశము
అగ్నితో బాప్తిస్మము = కర్మలు కాలిపోవు ఉపదేశము
ద్వితీయ దైవగ్రంథములోరత్నవాక్యములు
(3) మత్తయి సువార్త, 3వ అధ్యాయము, 12వ వచనము.(12) ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.ఈ మాట యోహాను అను ఒక గురువు చెప్పినది. ఆ కాలములో జనులకు ఉపదేశము (బాప్తిస్మము) ఇచ్చు గురువు యోహాను. అప్పటి కాలములో గొప్ప జ్ఞానియైన యోహాను ఏసు రాకను గురించి ముందే చెప్పెను. దేవుని కుమారుడైన (భగవంతుడైన) ఏసుప్రభువుకు ఉపదేశ మిచ్చినవాడు యోహాను. ప్రభువుకే గురువైనవాడని కూడా యోహానును చెప్పవచ్చును. అప్పటి కాలములో గురుస్థానములో ఉండి ఎందరికో బాప్తిస్మ (గురూపదేశ) మిచ్చు యోహాను, తన్ను తాను తగ్గించుకొనెడివాడు. అహంకారము ఆయనలో చాలా తక్కువని చెప్పవచ్చును. ఏసుప్రభువుకు ఉపదేశమిచ్చుటకు కొద్దికాలము ముందు నా వద్దకు వచ్చువాడు నాకంటే గొప్పవాడని, ఆయన చెప్పులు మోయుటకు కూడా నేను అర్హుడను కానని తన్ను తాను తగ్గించుకొని చెప్పుకొన్న గురువు. ప్రభువు స్వయముగా ఆయన వద్దకు వచ్చి తనకు బాప్తిస్మమిమ్మని అడిగినప్పుడు యోహాను ''నేను నీవద్ద బాప్తిస్మము పొందవలసిన వాడను, నేను నీకు బాప్తిస్మమిచ్చు వాడనా'' అనెను. అటువంటి యోహాను తనవద్దకు రాబోతున్న ప్రభువును గూర్చి ముందే చెప్పినప్పుడు పై వాక్యమును కూడా చెప్పెను. ఆ వాక్యములో గింజలను ఎత్తుకొను చేట మరియు గోధుమలు తర్వాత నిత్యము మండు అగ్ని అని ఉన్నది. ఇందులో ఏమి గొప్ప తనమున్నది? చేటతో గోధుమల నెత్తుకొని పిండి చేసుకొని అగ్నితో కాల్చుకొంటే రొట్టె అగును కదా! మనమంతా చేటను, గోధుమలను, పొయ్యిలోని అగ్నిని చూస్తూనే ఉన్నాము కదా! ఇది ఏమి పెద్ద వాక్యమని కొందరనవచ్చును. దానికి జవాబేమనగా! ఇది ద్వితీయ దైవ గ్రంథములోని వాక్యము. గ్రంథములోని ప్రతీ వాక్యము దైవ జ్ఞానమును తెలుపునదై ఉండును. ఆ పద్ధతి ప్రకారము పై వాక్యమును జ్ఞానదృష్ఠితో చూచినట్లయితే అందులో విశేష జ్ఞానమిమిడి ఉన్నదని తెలియుచున్నది. ఈ వాక్యము ఏసుక్రీస్తు యొక్క ఔన్నత్యమును తెల్పునదై ఉన్నది.
పూర్వము పుట్టిన పిల్లలను మొదట చేటలో పడుకోబెట్టి తీసుకొనెడివారు. బిడ్డ పుట్టిన వెంటనే చేటలో బియ్యము చదురుగా పోసి అందులో పడుకోబెట్టడము మొదట ఒక ఆచారముగా ఉండెడిది. బీదవారుగానీ, ధనికులుగానీ, తెలిసినవారుగానీ, తెలియనివారుగానీ పుట్టిన శిశువును మొదట అలా పడుకోబెట్టి తీసుకొనెడివారు. కనీసము రెండు నిమిషములైనా చేటలో పడుకోబెట్టినప్పుడు బ్రహ్మ 'శిశువు నుదుటి' మీద వ్రాత వ్రాసి పోవునని వారి నమ్మకము. 'కర్మలిఖితము' అనుమాటను 'బ్రహ్మవ్రాత' అని కూడా అనడము జరుగుతుంది. చేటలో పడినప్పుడు కర్మ లిఖితమలా ఉండెడిదని కూడా కొందరనుచుందురు. ఎవరు ఎలా అనుకొనినా, యోహాను మాత్రము ఏసుప్రభువు విషయములో ఎంతో సత్యమును చెప్పాడనియే అర్థమగుచున్నది. యోహాను భావములో గోధుమలను కార్యములతో పోల్చాడు. గోధుమలు ఆహారమని అందరికీ తెలుసు. మానవుడు ఆహారమును తిని జీవిస్తున్నాడు. ఆహారమును తింటూ ఉంటే అయిపోతూ ఉంటుంది. అలాగే కర్మను జీవుడు కార్యరూపములో అనుభవిస్తున్నాడు. కర్మను అనుభవించుకొలదీ అది అయిపోతూనే ఉంటుంది. అనుభవించు కర్మల కార్యములను గోధుమలుగా వర్ణించి యోహాను చెప్పాడు. మనము అనుభవించు కర్మలు మన శరీరములోనే లిఖించబడి ఉన్నాయి. వాటినే కర్మవ్రాత, తలవ్రాత, దేవుని తీర్పు అని అంటుంటాము. మనలో ఉన్న తలవ్రాత నుండియే మన కర్మలను మనము అనుభవిస్తున్నాము. కనుక కర్మానుభవములను గోధుమలుగా వర్ణించినారు, కర్మ నిలయ ప్రారబ్ధముగల తలను చేటగా వర్ణించారు. మనము తిను ధాన్యమును వండుటకు చివరిగా చేటనుండే తీసుకొంటాము. కనుక అనుభవించవలసిన కర్మలుండు తలను చేటగా వర్ణించారు.
మనుషులందరికీ వారికి తెలియకుండానే వారి తలలో కర్మ లిఖించబడి ఉండును. అందువలన ముందు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతీ మనిషీ వారి కర్మనుండి తప్పించుకోలేని స్థితిలో ఉన్నారు. కర్మ చేతిలో కీలుబొమ్మలై ఆడుచుండుట మానవుల పనికాగా, కర్మకు అతీతమైన పరమాత్మ, పరిశుద్ధాత్మ, జగద్భర్తయైన దేవుడు మనిషిగా పుట్టవలసి వచ్చినప్పుడు ఆయనే తనకు తానుగా కర్మను సృష్ఠించుకొని, అనగా తన తలవ్రాతను తానే వ్రాసుకొని భూమిమీదకు వచ్చును. కర్మే లేనివాడు కర్మను తానే వ్రాసుకొని రావడము మానవులకు జ్ఞానము తెలుపు నిమిత్తమేనని జ్ఞాపకముంచుకోవాలి. తన కర్మను తానే వ్రాసుకొను దేవున్ని గురించి గురువుయైన యోహాను ''ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది'' అన్నాడు. ప్రపంచములో ఎవరి చేట వారి చేతిలో లేదు. మానవుల పరిస్థితి అది కాగా, మానవులకు జ్ఞానము తెల్పు నిమిత్తము దేవుడే భూమి మీద మనిషిగా పుట్టినప్పుడు ఆయన కర్మను ఆయనే తయారు చేసుకొని వచ్చును. ప్రభువు పుట్టినప్పటి నుండి చివరకు చనిపోవు వరకు అనుభవించునవి ఆయనే స్వయముగా నిర్మించుకొనిన కర్మ అని తెలుసుకోండి. ప్రభువు పశువుల పాకలో పుట్టడముగానీ, చివరిలో చిత్రహింసల పాలుగావడముగానీ, సిలువమీద మరణముగానీ స్వయానా ఆయన సృష్ఠించుకొన్నవే. ఆయనకు తెలియకుండా ఆయనను పుట్టించుశక్తి గానీ, బాధించు కర్మగానీ ఏదీ లేదు. ఆయన భూమిమీద నడువవలసిన విధానము ఆయన నిర్ణయించు కొన్నదే. కావున ఆయన చేట ఆయన చేతిలో ఉన్నదనుట సత్యమైన వాక్యము.
సాధారణ మనుషులకు జరిగెడి ప్రతి పనిలోనూ క్రొత్త కర్మ వచ్చుచుండును. ఇలా భూమిమీద ప్రతి పనికీ కర్మ తయారగుచుండును. అగ్ని శిఖలకు పొగ అనుబంధమైనట్లు, కార్యములకు కర్మ అనుబంధమై ఉన్నది. అన్ని పనులకూ కర్మ ఉండడము ప్రకృతి విధానము. దేవుడు అవతరించి దేవుని కుమారునిగా (భగవంతునిగా) భూమిమీదకు వచ్చినప్పుడు ఆయన చేయు కార్యములలో కూడా కర్మ అంటుకొని వచ్చుచుండును. సాధారణ మానవుడు వచ్చెడి కర్మను తప్పించుకోలేడు. కానీ భగవంతుడైన ప్రభువు ఆ కర్మల నుండి తప్పించుకొనును. భగవంతుని వద్ద జ్ఞానమను అగ్ని సంపూర్ణముగా ఉండును. పనులలో సహజముగా వచ్చుచున్న కర్మను జ్ఞానాగ్ని చేత ఆయన కాల్చివేయును. సంపూర్ణ జ్ఞానియైన ప్రభువు వద్ద ఎల్లప్పుడూ సంపూర్ణముగా జ్ఞానాగ్ని ఉండును. జ్ఞానమను ఆరని అగ్నిలో వచ్చెడి సర్వ కర్మలూ కాలిపోవుచుండును. పనులకు అనుబంధమైనది కర్మ, అలాగే గింజలకు అనుబంధమైనది పొట్టు. కార్యములను అంటుకొని వచ్చు కర్మలను తన జ్ఞానాగ్ని చేత ప్రభువు కాల్చివేసి కర్మ అంటనట్లుండుట వలన "ఆరని అగ్నిలో పొట్టును కాల్చి వేయును" అని యోహాను అన్నాడు. ఏసుప్రభువు తన శరీరము అను కల్లమును, గుణముల మురికి నుండి శుభ్రము చేసి, కార్యములోనున్న కర్మను కాల్చివేయుచున్నాడు. అందువలన శరీరమును కల్లమని, గుణముల ప్రభావము తనమీద లేకుండా చేసుకోవడమును కల్లము శుభ్రము చేసినట్లనీ, అనుభవించు కార్యములు గోధుమలనీ, వాటిని అంటుకొని ఉండు కర్మను పొట్టు అనీ, కర్మను కాల్చు అగ్నిని ఆరని అగ్ని అనీ యోహాను ఎంతో గొప్పగా వర్ణించి చెప్పాడు. యోహాను ప్రభువు యొక్క గొప్పతనమును ఒకే వాక్యములో చెప్పగా, అది ఇంతవరకూ మనకు అర్థము కాకపోవడము మన దురదృష్టకరము.
ఈ వాక్యము స్థూలముగా కనిపించినా ఇందులో సూక్ష్మ భావము ఎంతో ఇమిడియున్నదని ఈ వాక్య వివరములో తెలిసినది. ఈ విధమయిన సూక్ష్మ భావములు గల ఎన్నో వాక్యములను నాలుగు సువార్తలలో తెలియగలవు. నా జ్ఞానము కొంత పరిమితితోయున్నదే అందువలన బైబిలు మొత్తము 66 భాగములకు వివరమును వ్రాయక ముఖ్యమగు నాలుగు సువార్తలు మరియు ఎక్కడయినా అరుదుగా మిగతా భాగములలోని వాక్యములను వ్రాశానని తెలుపుచున్నాను.
(4) మత్తయి సువార్త, 3వ అధ్యాయము, 16, 17 వచనములు.(16) ఏసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదుగో ఆకాశము తెరువబడెను. దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
(17) ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు. ఈయన యందు నేనానందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.ఏసు యోహాను ద్వారా నీళ్లతో ఉపదేశము (బాప్తిస్మము) పొందెను. బాప్తిస్మమునే ఉపదేశము అని అంటున్నాము కదా! ఉపదేశము అనగా ఈ దేశమునకు గల ప్రక్క దేశము అని అర్థము. ఇంకొక విధముగా చెప్పితే పొరుగుదేశము అని కూడా చెప్పవచ్చును. పొరుగువాడున్నది పొరుగు దేశము. నీ శరీరములో పొరుగు దేశము కలదు. అలాగే నీ శరీరములోని పొరుగు దేశములో పొరుగువాడు గలడు. ప్రతి మనిషికీ పొరుగు దేశము కలదు, ప్రతి మనిషికీ పొరుగు వాడు గలడు. మనిషిలోని పొరుగు దేశము కనిపించదు, అలాగే మనిషిలోని పొరుగు వాడు కనిపించడు. కనిపించని పొరుగు దేశమును గురువు చూపించుటను బాప్తిస్మము లేక ఉపదేశము అని అంటున్నాము. యోహాన్ ఇచ్చిన ఉపదేశ కార్యము నీళ్లతో ఇచ్చినది. అందులో అగ్ని లేదు, అందువలన అది పేరుకు ఉపదేశమే కావున అందులో పొరుగు దేశము లేదు, పొరుగువాడు లేడు. అయినా ఉపదేశ కార్యక్రమము అలాగే జరుగవలసి యున్నది. అందువలన (3-15) ఏసు ''ఇప్పటికి కానిమ్ము నీతి (జ్ఞానము) యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను.''
ఏసు నీటితో ఉపదేశము తీసుకొనినా ఆయన శరీరములోని పొరుగు దేశము ఆయనకు తెలియును. ఆయన అప్పుడేకాక ఎల్లప్పుడూ కనిపించు బయటి దేశమును, కనిపించని పొరుగు దేశమును చూస్తూనే యున్నాడు. అందువలన ఆయనకు యోహాన్ ఇచ్చినది పేరుకు ఉపదేశమే అయినా అది ఆయనకు నిజమైన ఉపదేశముగా లెక్కించబడినది. ఏసు సాధారణ జీవాత్మవలె ముప్పది సంవత్సరములు ఉన్న తర్వాత బాప్తిస్మమును పొందాడు. అప్పటినుండి తన శరీరములో జీవాత్మవలెకాక, ఆత్మవలె దైవ సంబంధ విషయములను జ్ఞానరూపములో చెప్పను మొదలు పెట్టాడు. ఏసు బాప్తిస్మము పొందిన తర్వాత ఆత్మగాయుంటూ పరమాత్మ జ్ఞానమును చెప్పాడనుటకు సాక్ష్యముగా ఏసు యోహాన్ వద్ద బాప్తిస్మమును పొందిన వెంటనే నీళ్లనుండి బయటికి రాగానే ఆకాశం నుండి ఆత్మ పావురమువలే ఆయన మీదికి వచ్చుట కనిపించినది. అంతేకాక పరమాత్మ (పరిశుద్ధాత్మ) ''ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి ఒక శబ్దము వినిపించెను.'' అలా వినిపించడము వలన పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఆత్మ తన ప్రియ కుమారుడుయని చెప్పి నా ప్రియ కుమారుడైన ఏసుయందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. దీనివలన పరిశుద్ధాత్మ తండ్రిగా, ఆత్మ ఏసు యనుబడు కుమారుడుగా ఉన్నాడని తెలియుచున్నది. ఇదంతయూ గమనిస్తే పరిశుద్ధాత్మయనబడు పరమాత్మ ఆత్మవలె కనిపించక, జీవాత్మవలె సాధారణ మనిషిగా కనిపిస్తూ ఈ లోకములో నివశించెను అని తెలియుచున్నది. ఈ మాట క్రైస్థవులను పొగడుటకు గానీ, క్రైస్థవ మత ప్రచారము కొరకుగానీ చెప్పినది కాదు. నూటికి నూరుపాళ్లు జరిగిన సత్యమును, దేవుడు భూమిమీదికి వచ్చిన విధానమును తెలుపుచున్నాము.
మత్తయి సువార్త, 4వ అధ్యాయము, 10వ వచనము.(10) ఏసు వానితో ''సాతానా, పొమ్ము! ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింప వలెను'' అని వ్రాయబడి యున్నదనెను.ఈ వాక్యములో సాతాను అను మాట క్రొత్తగా వినిపించుచున్నది. ఈ వాక్యముకంటే ముందు వాక్యములలో సాతానును ఒకచోట 'శోధకుడు' అనియు, మరియొక చోట 'అపవాది' అనియు చెప్పియున్నారు. అపవాది అనగా తప్పుగా వాదించువాడు, తప్పుగా చెప్పువాడు అని అర్థము. అట్లే శోధకుడు అనగా నీలో ఏదయినా చెడు ఉన్నదేమోయని వెదకువాడు. చెడువుంటే దానిని బయటికి తెచ్చువాడు అని అర్థము. అపవాది లేక శోధకుడు అను వానినే ఈ వాక్యములో సాతాను అని చెప్పుచున్నారు. అపవాది, శోధకుడు అను పదములు తెలుగు భాషా పదములు కాగా, సాతాను అను మాట తెలుగు భాషా పదము కాదు. గ్రంథములో అనేక చోట్ల సాతాను అనే పదమునే వాడారు. సాతాను అను పదము ఆధ్యాత్మిక విద్యలో మనము చెప్పుకొను ''మాయ'' అను పదమునకు బదులుగా వాడబడినదని తెలియవలెను. సాతాను అనినా, మాయ అనినా ఒకటే అగుట వలన మాయను గురించి చెప్పిన వివరము సాతానుకు చెప్పవచ్చును.
ప్రథమ దైవగ్రంథములో మాయ అనగా మనిషి తలలోయున్న గుణముల సారాంశము అని తెలియుచున్నది. ఈ విషయమై మొదటి దైవ గ్రంథములో ''గుణమయీ మమమాయా'' అని చెప్పియున్నారు. దాని ప్రకారము గుణముల కూడలినే మాయ అని అంటున్నారని చెప్పారు. ఇందులో మమ మాయా అని ఉండుట వలన దేవుడు 'నా మాయ' అని చెప్పియున్నాడని తెలియుచున్నది. దేవుడే సమస్తమును సృష్ఠించాడు. మాయను కూడా దేవుడే సృష్ఠించాడు. అందువలన ఆయన మాటలో నా మాయ (మమ మాయా) అని చెప్పియున్నాడు. మాయ అనునది స్త్రీ లింగముతో కూడుకొన్నది. దేవుడు, దేవుని నుండి విభజింపబడిన మిగతా రెండు ఆత్మ, జీవాత్మలు మొత్తము మూడు తప్ప మిగతా ఏదీ పురుషుడు కాదు. దేవుని చేత సృష్ఠింపబడినవన్నీ స్త్రీ లింగములే యని చెప్పవచ్చును. అందువలన మాయను స్త్రీ లింగముగా చెప్పుచున్నాము. మాయ (సాతాను) అంటే ఎక్కడో కలదని అనుకోకూడదు. ఏసును శోధించిన మాయ ఏసు శరీరములోనే, ఏసు తలయందే ఉండి ఏసును శోధించినది, అపవాదిగా వాదించినది. అట్లే నేడు కూడా ప్రతి మనిషి తలయందు గల గుణములే వానికి మాయగా ఉండి వానికి వ్యతిరేఖముగా శోధించడము, వాదించడము చేయుచున్నది. ఏసును బాప్తిస్మము పొందిన తర్వాత మొదటనే మూడుమార్లు మాయ శోధించడము జరిగినది. మూడుమార్లు ఏసు తన జ్ఞానముతో మాయకు సమాధానము చెప్పాడు.
ఏసు అనుసరించిన విధానమునే నేడు మనుషులు కూడా అనుసరించవలెనను విధానమును ఏసు తన జీవితములో చూపాడు. ఏసును మాయ శోధించిన ప్రతిసారి ఆయన జ్ఞానముతోనే సమాధానము చెప్పాడు. కనుక ప్రతి మనిషీ అలాగే చేయవలెనని తెలియవలెను. మూడవ మారు ఏసుకు మాయ అను సాతాన్ తనకు నమస్కారము చేయమని చెప్పినప్పుడు ఏసు తగిన సమాధానమును సాతాన్‌కు చెప్పాడు. ఆ మాటను చూస్తే ఇలాగున్నది. ''ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను'' అని చెప్పియున్నాడు. మనిషివలె కనిపించు ఏసు చెప్పిన మాటను ఆయన శరీరములో గల ఆత్మే స్వయముగా చెప్పినదని తెలియవలెను. పరిశుద్ధాత్మయిన దేవుడు అనగా పరమాత్మ స్వయముగా ఎవరితోనూ మాట్లాడడు. అయినా తన జ్ఞానమును ఆత్మతో, ఆత్మ ద్వారా చెప్పించుచుండును. అందువలన శరీరములోని ఆత్మ చెప్పినా అది స్వయముగా పరమాత్మయే చెప్పుచున్నాడని తెలియవలసియుంటుంది. మూడవదయిన అంతిమ దైవగ్రంథములో మూడవ సూరా, ఏడవ ఆయత్ నందు దేవుడు ఈ విధముగా చెప్పాడు. ''దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ ఇతర మానవులకు తెలియదు'' అని అన్నాడు. దీనినిబట్టి శరీరములోని ఆత్మ ద్వారా తెలియబడు జ్ఞానమంతయూ పరమాత్మయిన దేవుడు చెప్పునదేయని తెలియాలి.
నేడు ప్రపంచములో పన్నెండు మతములుండగా, అందులో ఏ మతములో లేని దేవతలందరూ ఒక్క హిందూమతములోనే ఉన్నారు. దేవుడు దేవతలను, మనుషులను సృష్ఠించగా మనుషులు సృష్ఠికర్తయిన దేవున్ని వదలి, దేవుని జ్ఞానమును ఏమాత్రము తెలియకుండా దేవున్ని వదలి దేవతలను మ్రొక్కుచున్నారు. అలా మ్రొక్కడము వలన దైవ గ్రంథములలో చెప్పిన దేవుని మాటను మనుషులు ఏమాత్రము లెక్కించలేదని తెలియుచున్నది. దేవున్ని వదలి దేవతలను ఆరాధించువారు మాయ మాటను విని మాయలో యున్నారని తెలియుచున్నది. దేవుని పక్షము, మాయ పక్షము అని రెండు పక్షములే గలవు. అయితే కొన్ని మతములలో ఆ మతములవారు దేవుని పక్షములో యుండి అన్యదేవతారాధన చేయక, దేవున్ని ఒక్కనినే ప్రార్థించుచున్నారు. కేవలము ఒక్క హిందూమతములో మాత్రమే మాయ (సాతాన్) పక్షమున మనుషులుంటూ దేవున్ని కాకుండా అనేక దేవతలను ఆరాధించుచున్నారు. అలా దేవతలను ఆరాధించువారు అందరూ మాయ పక్షములో ఉన్నట్లు తెలియుచున్నది.
మత్తయి సువార్త, 5వ అధ్యాయము, 10వ వచనము.(10) నీతి (జ్ఞానము) నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది.నీతి అని వాక్యములో వ్రాసియున్నది. అయితే అక్కడ నీతి బదులు జ్ఞానము అని ఉండవలెను. ఏసు చెప్పినప్పుడు హెబ్రీ భాషలో జ్ఞానము అనియే చెప్పియుండును. అయితే అనువాదకులు తెలుగు భాషలోనికి వ్రాయునప్పుడు హెబ్రీ భాషలోని పదమునకు సరిసమానమైన పదము వ్రాయలేక జ్ఞానము బదులు నీతియని వ్రాశారు. వాస్తవముగా నీతివేరు, జ్ఞానము వేరు. నీతి, న్యాయము ప్రపంచ సంబంధమైనవి. జ్ఞానము, ధర్మము దైవ సంబంధమైనవి. నీతి, న్యాయముల వలన కర్మలు వచ్చును. జ్ఞానము, ధర్మము వలన కర్మలు కాలిపోవును. అందువలన నీతి లోక సంబంధమైనదనీ, జ్ఞానము దైవ సంబంధమైనదనీ తెలియవలెను. ప్రపంచములో నీతి అవినీతి, న్యాయము అన్యాయములు గలవు. నీతివలన పుణ్యము, అవినీతివలన పాపము వచ్చును. అట్లే న్యాయము వలన పుణ్యము, అన్యాయము వలన పాపము వచ్చును. దీనిప్రకారము పై వాక్యములో నీతియను చోట జ్ఞానము అని ఉండవలెను.
జ్ఞానము కొరకు హింసింపబడువాడు, జ్ఞానమార్గములో ఉన్నందుకు ఇతరుల చేత హింస పొందితే ఒక విధముగా వాడు ధన్యుడనియే చెప్పవచ్చును. ఎందుకనగా! జ్ఞాన నిమిత్తము హింసను ఇతరుల చేత పొందు వానికి ఫలితముగా ముక్తి లభించును. ముక్తి అనగా కర్మల బంధనము నుండి విడుదల పొందడము. ఎప్పుడయితే ముక్తి లభించునో అప్పుడు మనిషి లోకములో లేకుండా, లోకముకంటే వేరయిన స్థితిలో చేరిపోవును. అలా ఉండిపోయిన వానిని పరలోకములోనికి పోయాడని అందురు. పరలోకము అనగా! ఏ అనుభవము లేనిదని తెలియవలెను. కొందరి జీవితములలో మాత్రము జ్ఞాననిమిత్తము హింసింపబడడము జరుగుచుండును. అందరి జీవితములలో హింస ఉంటుంది అని అనుకోకూడదు. కొందరు ఏ ఆటంకము లేకుండా జ్ఞానమును తెలిసి మోక్షమును (పరలోకమును) పొందుదురు.☞
మత్తయి సువార్త, 5వ అధ్యాయము, 17వ వచనము.(17) ధర్మశాస్త్రమునైనను, ప్రవక్తల ప్రవచనముల నైననూ కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకేగానీ కొట్టివేయుటకు నేను రాలేదు.ధర్మశాస్త్రమును ఎవరూ ఖండించలేరు. అది ఖండింపబడునది కాదు. ధర్మశాస్త్రము ఆదిలోనే పుట్టినది. దానిని ఎందరో ప్రవక్తలు, వక్తలు బోధిస్తూ వచ్చారు. పరమాత్మ కూడా భగవంతునిగా భూమిమీదకు వచ్చినప్పుడు ఆయన దానిని ఆచరించి, అందరికీ అర్థమగులాగున చేయును. ధర్మశాస్త్రములోని ధర్మములను దేవుని కుమారుడైన భగవంతుడు తెల్పుచున్నప్పుడు, ఆచరించునప్పుడు అవి కొందరికి ధర్మములే కావని అర్థమగును. ఎందుకనగా! అధర్మములను వారు ధర్మములనుకొని నమ్మి ఉన్నందువలన భగవంతుడు చెప్పు అసలైన ధర్మములు అధర్మములుగా గోచరించు అవకాశము కలదు. కావున ప్రభువే పై వాక్యములో ''ధర్మశాస్త్రమును నేను కొట్టి వేయవచ్చితిననుకోకు నెరవేర్చుటకే వచ్చాను'' అని చెప్పెను.
ప్రపంచములో ప్రజలు సాతాన్ (మాయ) చేతిలో చిక్కినవారై అధర్మములనే ధర్మములని నమ్మినవారై దేవునికి విరుద్ధముగా అనేక రకముల ఆరాధనలు చేయుచూ, అదియే నిజమైన భక్తి అని అనుకొనుచున్నారు. ప్రజలలో దేవుడు అను భావాన్ని మాయ తనవైపు తిప్పుకొని మీరు దేవుని వైపు పోతున్నారని నమ్మించి ధర్మములను ఆచరించకుండా, అధర్మములను ఆచరించునట్లు చేసి, దేవునికి వ్యతిరేఖ దిశలోనికి నడుపుచున్నది. అటువంటి స్థితిలో దేవుడు మనిషిగా వచ్చి ధర్మములను ఆచరించినా అవి వారికి తప్పుడు నడకగా కనిపించును. వారు చేయునదే నిజమైన ధర్మములనీ, వారే నిజమైన భక్తులమనుకొని మనిషిగా వచ్చిన దేవున్ని కూడా అధర్మవరుడని నిందించుచున్నారు. దైవదూషకుడని దేవున్నే ప్రచారము చేయుచున్నారు. నిజ దైవము ఏసుప్రభువుగా భూమిమీద సంచరించునప్పుడు ఆయన చెప్పునవి, ఆచరించునవియైన ధర్మములు అప్పటి పండితులకు, స్వాములకు, గురువులకు వ్యతిరేఖముగా కనిపించాయి. అందువలననే ఆనాటి కైపావంటి గురువులు, శాస్త్రులు, పరిసయ్యులు అనువారు ప్రభువును వ్యతిరేఖించి దూషించిరి. అందువలననే ఏసుప్రభువు పై వాక్యములో ''ధర్మశాస్త్రమును నెరవేర్చుటకొచ్చానుగానీ కొట్టివేయుటకు రాలేదనెను.''
(8) మత్తయి సువార్త, 5వ అధ్యాయము, 18వ వచనము.(18) ఆకాశమును, భూమియు గతించి పోయిననే గానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దాని నుండి ఒక పొల్లయిననూ ఒక సున్నయైననూ తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.ఈ వాక్యములో 'ధర్మశాస్త్రము' అను పదము ప్రత్యేకముగా చెప్పబడియున్నది. ధర్మశాస్త్రము అనగా ఏది? అను సంశయము కొందరికి రావచ్చును. అటువంటి సంశయములు తీరుటకు ముందు శాస్త్రమంటే ఏమిటి? శాస్త్రములు ఎన్ని రకములు గలవు? శాస్త్రములలో ధర్మశాస్త్రము యొక్క ప్రత్యేకత ఏమిటియని తెలియవలసియుండును. మొదట శాస్త్రము అను పదమునకు అర్థము తెలియగలిగితే కొంతవరకు శాస్త్ర విషయము తెలియగలదు. శాసనము అను పదమునుండి శాస్త్రము అను పదము పుట్టినది. శాసనము అనగా 'తప్పక అమలు జరిగితీరునది' అని అర్థము. అదే విధానము ప్రకారము శాస్త్రము అనగా 'చెప్పినది జరిగితీరునది' యని అర్థము. శాస్త్రము అను పదమునుండి శాపము అను పదము పుట్టినది శాపము అనగా! 'తప్పక అమలు జరుగునదని' తెలియవలెను. శాసనము, శాపము, శాస్త్రము మూడు సమాన భావము కలవిగా యున్నవి. చెప్పినది లేక వ్రాసినది నిరూపణగా జరిగితీరునది శాస్త్రము కాగా, శాస్త్రములు మొత్తము ఆరు విభాగములుగా యున్నవి. ఆరు శాస్త్రములు రెండు రకములని కొందరు, కాదు మూడు రకములని కొందరు చెప్పుచున్నారు. ఒక విధముగా చెప్పితే శాస్త్రములు రెండు రకములని చెప్పవచ్చును. ఇంకొక రకముగా చూస్తే శాస్త్రములు మూడు రకములని చెప్పవచ్చును. రెండు రకములు చెప్పితే ఒకటి ప్రపంచ సంబంధము, రెండు పరమాత్మ సంబంధము అని చెప్పవచ్చును. ఇంకొక విధముగా చెప్పితే నాలుగు ప్రపంచ సంబంధము కాగా ఒకటి పరమాత్మ సంబంధముగా ఉండగా, ఒకటి మాత్రము ప్రపంచ సంబంధమునకు, పరమాత్మ సంబంధమునకు మధ్యలో ఉంటూ రెండు విధానములకు అనుసంధానముగా కొంత పరమాత్మవైపు, కొంత ప్రపంచము వైపు ఉన్నదని చెప్పవచ్చును.
శాస్త్రములను వరుసగా చెప్పితే ఇలా గలవు. 1) గణిత శాస్త్రము 2) ఖగోళ శాస్త్రము 3) రసాయన శాస్త్రము 4) భౌతిక శాస్త్రము 5) జ్యోతిష్య శాస్త్రము 6) బ్రహ్మవిద్యా శాస్త్రము. ఇందులో మొదటి నాలుగు ప్రపంచ సంబంధమైనవనీ, ఐదవదయిన జ్యోతిష్య శాస్త్రము అటు ప్రపంచ, ఇటు పరమాత్మ సంబంధమునకు అనుసంధానముగా యున్నదనీ చెప్పవచ్చును. అట్లుకాక జ్యోతిష్యమును కూడా ప్రపంచములో కలిపితే ఐదు ప్రపంచ సంబంధ శాస్త్రములుకాగా, బ్రహ్మవిద్యా శాస్త్రము ఒక్కటి మాత్రమే దైవ సంబంధముగా యున్నదని చెప్పవచ్చును. మొత్తము శాస్త్రములు ఆరుకాగా, అన్నిటికంటే గొప్పది బ్రహ్మవిద్యా శాస్త్రము. అందువలన దానిని బ్రహ్మవిద్యా శాస్త్రము అని అన్నారు. బ్రహ్మ అనగా పెద్దయని అర్థము. అంతేగానీ బ్రహ్మ అనునది పేరుకాదు. దేవుడు అన్నిటికంటే పెద్ద, అందరికంటే పెద్ద అయిన దానివలన ఆయనను బ్రహ్మ (పెద్ద) యని అన్నారు. దేవునికి సంబంధించిన శాస్త్రము అయిన దానివలన దానిని బ్రహ్మవిద్యా శాస్త్రము అని అన్నారు. మిగతా ఐదు ప్రపంచ శాస్త్రములయిన గణిత, ఖగోళ, రసాయన, భౌతిక, జ్యోతిష్య శాస్త్రముల పేర్లలో విద్య అను పదము లేకుండా కేవలము వాటిపేర్లు మాత్రము గలవు. ఒకే ఒక్క దేవుని శాస్త్రములో మాత్రము విద్య అను పదము గలదు. అలా ఉండుటకు కారణము ఏమని కొందరికి ప్రశ్న రావచ్చును, దానికి ఈ విధముగా జవాబు కలదని చెప్పవచ్చును.
ప్రపంచ సంబంధ శాస్త్రములు, పరమాత్మ సంబంధ శాస్త్రము అని రెండు విధములుగా విభజించి చెప్పియున్నారు. ప్రపంచ సంబంధ ఐదు శాస్త్రములను ఎవరయినా సంపూర్ణముగా తెలియవచ్చును. అయితే చివరిగా యున్నది, పెద్దదని పేరుగాంచినది, దేవుని విషయమును, దేవుని ధర్మములను తెలియజేయునది అయిన దానిపేరులో మాత్రము విద్య అను పదము గలదు. దానినే పెద్ద విద్యాశాస్త్రము అని అంటున్నారు. విద్య అను పదము విత్ అను శబ్దమునుండి పుట్టినది. విత్ అనగా తెలియడము అని అర్థము. విద్య అనగా తెలుసుకొనునది యని అర్థము. విద్యార్థి అనగా విద్యను అర్థించువాడని అర్థము. అర్థించుట అనగా తనవద్ద లేని దానిని ఇతరులవద్ద ఉన్నదానిని అడిగి ఇప్పించుకోవడము అని అర్థము. విద్యార్థులు తెలిసిన బోధకులనుండి నేర్చుకొనుచుందురు. విద్య అనగా తెలియబడునదేగానీ పూర్తి తెలిసినది కాదని అర్థముండుట వలన దేవుని సమాచారమును పూర్తి ఎవరూ తెలియలేరు. అట్లే తెలిసినవారు లేరు. ఎవరయినాగానీ జీవితకాలమంతయు తెలుసుకొనుచూ ఉండవలసినదేగానీ, ఇది గట్టు, నేను సంపూర్ణముగా తెలిసినవానినని ఎవడూ చెప్పుటకు వీలులేదు. అందువలన దేవుని సమాచారము మనుషులు ఎప్పటికయినా తెలుసుకొనుచూ యుండవలసినదేగానీ పూర్తి తెలిసినామనుటకు వీలులేదు. అందువలన దేవుని శాస్త్రమును విద్యాశాస్త్రమని ఎల్లప్పటికీ చెప్పుచున్నారు. అందువలన అది ఎప్పటికీ బ్రహ్మవిద్యా శాస్త్రమే. మిగతా ఐదు శాస్త్రములను మనిషి సంపూర్ణముగా తెలియగలుగుచున్నాడు. తర్వాత ఏమీ తెలియవలసినది ఉండదు. అందువలన వాటిపేర్ల వెనుక 'విద్య' అను పదమును పెట్టలేదు.
బ్రహ్మ అయిన అనగా పెద్దయిన దేవుని సమాచారమును సంపూర్ణముగా తెలిసినవాడే దానిని ఇతరులకు చెప్పవచ్చును. మానవుడు అయినవాడు దేవుని సమాచారము తెలియనప్పుడు దానిని గురించి సంశయము లేకుండా చెప్పువాడు ఎవడు? అను ప్రశ్న రాగలదు. దానికి మా సమాధానము ఈ విధముగా కలదు చూడండి. దేవుని జ్ఞానమును గురించి దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. అందువలన దేవుని సమాచారము దేవుడే చెప్పవలసియుండును. దేవుడు నేరుగా ఎవరితోనూ మాట్లాడడు. అందువలన దేవుడు దేవునివలె కాకుండా మనిషివలె మారువేషములోయుండి తన జ్ఞానమును తానే చెప్పుచున్నాడు. అట్లని దేవున్ని మనిషియని చెప్పలేము. దేవుడు మనిషివలె వస్తాడుగానీ మనిషి కాదు. మనిషి ఆకారమును వేషముగా ధరించి వచ్చిన దేవుడు తన జ్ఞానమును సంపూర్ణముగా, శాసనములతో కూడుకొన్న ఒక శాస్త్రముగా చెప్పిపోయాడు. అట్లు దేవునిచేత చెప్పబడిన దానినే బ్రహ్మవిద్యా శాస్త్రము అని అంటున్నాము. బ్రహ్మవిద్యా శాస్త్రమును చెప్పినవాడు స్వయముగా దేవుడే. దానిని తెలియవలసినవాడు మనిషి. మనిషి దేవుడు చెప్పిన బ్రహ్మవిద్యను సంపూర్ణముగా తెలిసినరోజు వాని కర్మలన్నీ లేకుండా పోయి దేవునియందు ఐక్యమై పోగలడు. అలా మనిషి మోక్షము పొందువరకు దేవుని శాస్త్రమును తెలుసుకొనుచూ ఉండవలసిందే. అందువలన దానికి బ్రహ్మవిద్య యను పేరును శాశ్వితముగా పెట్టడము జరిగినది. ప్రపంచములోని విద్యలలో కెల్ల పెద్ద విద్య అయిన దానివలన దీనిని బ్రహ్మవిద్యయని చెప్పుచున్నాము.
దేవుడు చెప్పిన బ్రహ్మవిద్యా శాస్త్రములో దేవుని ధర్మములు చెప్పబడినవి. అందువలన బ్రహ్మవిద్యా శాస్త్రమును ధర్మశాస్త్రము అని దైవ గ్రంథములలో చెప్పియున్నారు. దేవుడు శాసనములతో కూడిన తన శాస్త్రమును సృష్ఠి ఆదిలోనే చెప్పియున్నాడు. అలా చెప్పిన శాస్త్రమును అనుసరించి మూడు దైవ గ్రంథములను మూడు వేరువేరు కాలములలో, మూడు వేరువేరు ప్రదేశములలో చెప్పడమైనది. ఆ విధముగా చెప్పిన మూడు దైవగ్రంథములను మూడు ధర్మశాస్త్రములుగా చెప్పవచ్చును. ధర్మశాస్త్రములలో ధర్మములే ఉండును. కనుక మూడు ధర్మశాస్త్రములు ఒక్కటే విధానము కలిగి, దేవుని ధర్మములనే బోధించాయని చెప్పవచ్చును. మూడు ధర్మశాస్త్రములు బ్రహ్మవిద్యకు కట్టుబడియుండును. దేవుని ధర్మములను తెలిపియుండును. అందువలన మూడు ధర్మశాస్త్రములు ఒకదానికొకటి సాక్ష్యముగా ఉండును తప్ప విభేదములు కల్గియుండవు. అందువలన ప్రథమ దైవగ్రంథము అని భగవద్గీతను, ద్వితీయ దైవగ్రంథము అని బైబిలును, అంతిమ దైవగ్రంథమయిన మూడవ గ్రంథమును ఖుర్‌ఆన్ అనియు చెప్పడము జరిగినది. ఈ మూడు గ్రంథముల పేర్లు వేరువేరుగా యున్నా, మూడు గ్రంథములు ధర్మశాస్త్రములుగా ఉంటూ, మూడూ ఒకే దేవుని ధర్మములను తెలియజేశాయి.
బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి ముగ్గురు ప్రవక్తలు చెప్పిన జ్ఞానము మూడు దైవగ్రంథములుగా తయారైనవి. ఆ మూడు దైవ గ్రంథములు వేరువేరుగా యున్నా ఒకే దేవుని ధర్మములను గురించి మూడు కోణముల నుండి చెప్పియున్నవి. అందులో చెప్పిన ధర్మములు శాస్త్రబద్దమైన వయిన దానివలన ప్రతి ఒక్కటి చెప్పినవి చెప్పినట్లు నెరవేరుచుండును. ఇక్కడ వాక్యములో ''భూమి, ఆకాశము గతించి పోయినా గానీ'' యని చెప్పియున్నారు. బయట కనిపించు భూమి, ఆకాశము ఎప్పటికీ నశించునవి కావు. అవి శాశ్వితముగా ఉండునట్లు దేవుడు తయారు చేశాడు. బయట కనిపించు భూమి, ఆకాశము కనిపించకుండా మనిషి శరీరములో యున్నవి. అవి పూర్తి నశించిపోగలవు. అందువలన ''భూమి, ఆకాశము నశించి పోయినా'' అను మాటను మనిషి ధరించిన శరీరము మరణము పొందినాయని అర్థము చేసుకోవలెను. మనిషి దేవుని జ్ఞానము కొరకు ప్రయత్నము చేయునప్పుడు దేవుడు చెప్పిన ధర్మములన్నింటినీ మనిషి ఆచరించవలసి యుండును. దేవుని ధర్మములను పూర్తి ఆచరించు వరకు మనిషి పరలోకమును పొందజాలడు. ధర్మశాస్త్రములో చెప్పిన ప్రకారము దానిని నెరవేర్చినప్పుడే మనిషికి మోక్షము లభించగలదు. ధర్మశాస్త్రములో చెప్పిన ప్రకారము కొంత ఆచరించకపోయినా మనిషికి ముక్తి లభించదు. 'చెప్పిన ధర్మములనుండి కొంత ఆచరించకపోయినా' అని చెప్పుటకు 'దానినుండి ఒక పొల్లయినా, ఒక సున్నా అయినా' అని చెప్పియున్నారు. దానినిబట్టి చెప్పినది కొంత కూడా వదలకుండా ఆచరించవలెనని తెలియుచున్నది. పొల్లు, సున్నాయంటే గ్రంథము వ్రాతలోని పొల్లు, సున్నా కాదని తెలియవలెను.☞
మత్తయి సువార్త, 5వ అధ్యాయము, 19వ వచనము.(19) ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినయి ననూ మీరి, మనుష్యులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడన బడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును.దేవుడు చెప్పిన ధర్మశాస్త్రములలో ధర్మములు ముఖ్యమైనవి కొన్ని యుండగా వాటికి అనుసంధానమైనవి అనేకము ఉండును. దేవుని ధర్మములను మనుషులకు చెప్పిన 'ఆజ్ఞలు' అని కూడా చెప్పుచున్నారు. దేవుడు చెప్పిన ధర్మములు లేక ఆజ్ఞలు అత్యంత గొప్పవి, పెద్దవి రెండే యుండగా వాటికి అనుసంధానమైనవి మరికొన్ని గలవు. అలాయున్న ఉప ధర్మములలో మిగుల చిన్నదైన ఒక దానినయినా అతిక్రమించి చెప్పువాడు అత్యంత నీచుడు అగును. దేవుడు చెప్పిన చిన్న ధర్మము అయినా, పెద్ద ధర్మము అయినా ఏదయినా మనిషి అతిక్రమించక తప్పక ఆచరించ వలసియుండును. చిన్న ధర్మమును కూడా వదలక మనిషి ఆచరించక గొప్పగా చెప్పుకోవలసినది పోయి, దానిని లెక్కచేయక తాను చెడిపోయి అధర్మవరుడు అగుటయేకాక తనకు తెలిసిన అధర్మములను ఇతరులకు బోధించువారుగలరు. బోధించువారు గురువులుగా చలామణి అగుచుందురు. లోకములో గురువులుగాయుండి దైవగ్రంథములోని దేవుని ఆజ్ఞలలోని (దేవుని ధర్మములలో) దేనినయినా అర్థము చేసుకోక అపార్థము, అధర్మముగా గ్రహించి ''తాను చెడిన కోతి వనమెల్ల చెరిసె'' అన్నట్లు తాను ధర్మములలో చెడినవాడైయుండి, దైవగ్రంథమును సక్రమముగా అర్థము చేసుకోలేక అధర్మముగా తెలిసినవాడు తాను స్వయముగా అధర్మవరుడై పోవుటయేగాక ఇతరులకు కూడా తనకు తెలిసిన అధర్మములనే బోధించుట వలన ప్రజలను కూడా తప్పుదారిలో పంపించి, వారు చెప్పినదే నిజమైన జ్ఞానమనీ, నిజమైన దేవుని ధర్మములనీ చెప్పుచుందురు. అలా చెప్పువారు ప్రజల దృష్ఠిలో గొప్ప పేరు పొందిన గురువులుగా ఉండినప్పటికీ దేవుని దృష్ఠిలో మిగుల అల్పులు.
దేవుని ధర్మములను సక్రమముగా అర్థము చేసుకొన్నవాడు పెద్దగా పేరు పొందిన గురువు కాకపోయినా, జ్ఞానమును తెలియగోరి తనవద్దకు వచ్చు మనుషులకు తనకు తెలిసిన ధర్మములను ధర్మములుగానే బోధించు వారు కూడా కలరు. దేవుడు తన గ్రంథములో చెప్పిన ధర్మములను అధర్మములుగా అర్థము చేసుకొని, అధర్మములనే ప్రజలకు బోధించువారు కూడా కలరు. అలా అధర్మములను బోధించువారు పరలోక రాజ్యమును పొందలేరు. పరలోక రాజ్యమును అజ్ఞానులతో పోల్చి చూస్తే అటువంటి వారు ఎప్పటికీ పరలోకమును పొందలేరు. వారి కొరకు శాశ్వితముగా పరలోకము మూసివేయబడినది. వాడు పరలోక రాజ్యమును పోగొట్టుకొనిన అల్పుడని చెప్పవచ్చును. వాడు లోకములో పెద్ద గురువుగా చలామణి అయినా ఫరవాలేదుగానీ, మోక్షము అను పరలోకము లభించదు. దైవ గ్రంథము నుండి దేవుడు చెప్పిన ఆజ్ఞలను ధర్మములను గ్రహించినవాడు గురువు కాకపోయినా తనకు తెలిసిన ధర్మములను ఇతరులకు బోధించు వానికి పరలోకములో గొప్ప స్థానము ఉండును. అటువంటి వానిని ధర్మవరుడు అనుటయేగాక, వాడు దేవుని దృష్ఠిలో గొప్పవానిగా లెక్కించ బడును. దేవుని ధర్మములలో చిన్న ధర్మమునయినను వివరముగా బోధించు వానిని నిజమైన ధర్మవరుడని చెప్పవచ్చును.☞
(10) మత్తయి సువార్త, 5వ అధ్యాయము, 20వ వచనము.(20) శాస్త్రుల నీతికంటెను, పరిశయ్యుల నీతి కంటెను, మీ నీతి అధికము కాని ఎడల, మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను.లోకములో శాస్త్రులనీ, భక్తులనీ, బోధకులమనీ చెప్పుకొనువారు అనేకులుగలరు. వారికి తెలిసిన జ్ఞానముకంటే మీరు తెలిసిన జ్ఞానము అధికముగా ఉండవలెను. అట్లుకాకుండా వారికి తెలిసిన జ్ఞానముకంటే తక్కువ జ్ఞానమును తెలిసినవారు పరలోకములో ప్రవేశింపలేరని దేవుడు చెప్పాడు. దీనినిబట్టి ''ప్రపంచములో స్వాములమనీ, శాస్త్రులమనీ చెప్పుచూ అనేకముగా యజ్ఞయాగాదులు చేయుచూ, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేఖముగా ప్రవర్తించు వారికంటే మీరు ఎక్కువ జ్ఞానమును తెలిసినప్పుడు మీకు పరలోకము సులభముగా లభించగలదు'' అని ఈ వాక్యములో చెప్పియున్నారు.☞
మత్తయి సువార్త, 5వ అధ్యాయము, 28వ వచనము.(28) ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.మనిషి రెండు విధములుగా కార్యములను చేయుచున్నాడు. ఒకటి బయట ప్రత్యక్షముగా చేయు కార్యములు కాగా, రెండవది ప్రత్యక్షముగా కాకుండా బయటికి ఎవరికీ తెలియకుండా అంతరంగములో భావములచేత చేయు కార్యములు ఉండును. రెండు కార్యముల విధానము ప్రతి మనిషిలో యుండును. అన్ని గుణములకు సంబంధించిన కార్యములు మనిషి లోపల భావము చేత చేయుట ఒక విధానముకాగా, అదే గుణముల చేత స్థూలశరీరము ద్వారా బయట చేయుట ఒక విధముగా ఉండును. మనిషి చేయు పనుల ద్వారా పాపపుణ్య కర్మలు వచ్చుచుండును. అయితే ఆ పనులు కనిపించేవి, కనిపించనివని రెండు రకములుగా ఉండుట వలన స్థూలశరీరము ద్వారా చేయు పనులనుబట్టి వానిని మంచివాడు లేక చెడ్డవాడని చెప్పవచ్చును. కనిపించకుండా అంతరంగములోని భావములచేత చేయు పనులనుబట్టి ఎవరినీ మంచివారుగా గానీ, చెడువారిగా గానీ చెప్పలేము. ఏ కార్యము చేయునది తెలియనప్పుడు ఎదుటి వానిని మంచివాడుగా గానీ, చెడువానిగా గానీ గుర్తించలేము.
మనిషి చేయు స్థూలకార్యమునకయినా, సూక్ష్మకార్యమునకయినా మనిషిలోని అహంభావమే కర్మలను తెచ్చిపెట్టుచున్నది. మనిషి పాపమును పొందుటకుగానీ, పుణ్యమును పొందుటకుగానీ వాని శరీరములోని అహమునుబట్టి యుండును. మనిషి స్థూలముగా చేయు కార్యములలో శరీర బాహ్య అవయవములు పని చేయుచుండును. అయితే అప్పుడు కూడా లోపల భావము అయిన అహంభావము పని చేయుట వలన జరిగిన ఆ కార్యములోని కర్మయను పాపపుణ్యములు మనిషి కర్మచక్రములో చేరుచుండును. అలాగే మనిషి స్థూలశరీరముతో పని చేయకున్ననూ మనిషి గుణముల భావములను బుద్ధిచేత యోచించినప్పుడు కూడా ప్రక్కనే యున్న అహము బుద్ధి యోచనలలోని భావమునుబట్టి వానికి కర్మలను అంటగట్టుచుండును. అహము లేకుండా స్థూలముగాగానీ, సూక్ష్మముగా గానీ పనులు చేయుట వలన మనిషికి కర్మలు అంటవు. అట్లుకాకుండా అహము పని చేయుట వలన చేయని పనులలో కూడా ఆలోచన పని చేసినంత మాత్రమున పాపపుణ్యములు వచ్చుచున్నవి. అందువలన ప్రథమ దైవగ్రంథములో ''ఎవని భావములో అహము లేదో వాడు లోకములో యున్న వారినందరిని చంపినా వానికి హత్యా పాపము రాదు. వాడు హంతకునిగా లెక్కించబడడు'' యని చివరి అధ్యాయమైన మోక్షసన్న్యాస యోగము అను అధ్యాయములో పదిహేడవ (17) శ్లోకమందు చెప్పియున్నారు. ఇక్కడ అహంభావమే ముఖ్యమయిన దానివలన అహంభావమును పొందక చేయు హత్యయందు కూడా హత్యాపాపము అంటదనీ, హత్య చేసినవానిని హంతకుడనుటకు వీలులేదనీ చెప్పడమైనది. అదే విషయమునే ఏసు ''అహంభావము వలన చేయని పనిలో అయినా ఆలోచన చేసినంత మాత్రమున పాపము వచ్చును'' అని చెప్పారు. దీనినిబట్టి ప్రథమ దైవగ్రంథములో, ద్వితీయ దైవగ్రంథములో చెప్పినవాడు ఒక్కడేయనీ, చెప్పబడిన జ్ఞానము ఒక్కటేయనీ తెలియబడుచున్నది. స్థూలముగా చేసిన పనిలో అహము లేకపోతే ఆ పని జరగనట్లే లెక్కించబడుననీ, సూక్ష్మముగా యోచన చేసినా దానియందు 'పని చేయకున్నా' అహము ఉండుట వలన ఆ పని జరిగినట్లేయని చెప్పుట వలన మనిషి శరీరము లోపల అహము అనునదే పాపపుణ్య కర్మలను జీవునికి అంటకట్టుచున్నదని తెలియుచున్నది. అందువలన 'స్థూలముగా చేసిన పనులలో అహంకార భావము లేకుండా చేయుటను కర్మయోగము' అని పూర్వము సృష్ఠ్యాదిలో చెప్పబడినది. దానినే ప్రథమ దైవగ్రంథములోను, ద్వితీయ దైవగ్రంథములోను చెప్పియున్నారు.☞
(12) మత్తయి సువార్త, 5వ అధ్యాయము, 29, 30 వచనములు.(29) నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దానిని పెరికి నీవద్దనుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా!
(30) నీ కుడిచేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ వద్దనుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా!ఈ రెండు వాక్యములలో 29వ వాక్యమునందు 'కన్ను'ను గురించి చెప్పారు. 30వ వాక్యములో 'చేయి'ని గురించి చెప్పారు. ఇక్కడ చెప్పిన విధానమునుబట్టి బాగా గమనించితే మనిషికి స్థూలశరీరము, సూక్ష్మశరీరము అను రెండు శరీర భాగములు గలవు. అందులో స్థూలశరీర భాగములు పది (10) కాగా, సూక్ష్మశరీర భాగములు పదిహేను (15) గలవు. మొత్తము స్థూల, సూక్ష్మశరీర భాగములు జీవునితో సహా 25 గలవు. శరీరములో ప్రత్యేకమైన పని చేయు దానిని ప్రత్యేక భాగముగా గుర్తించుచున్నారు. ఆ విధముగా చూస్తే పది కనిపించు స్థూలశరీర భాగములు గలవు. అందులో జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదని చెప్పవచ్చును. స్థూలముగా పని జరగడములో రెండు రకముల అవయవములు పని చేయును. జ్ఞానేంద్రియములు విషయమును లోపలికి తెలియజేయగా, ఆ విషయములు మనస్సు ద్వారా ఇంద్రియ భాగములవద్ద నుండి బుద్ధికి చేరును. లోపలి నుండి బుద్ధి తెలిపిన సమాచారమును మనస్సు బయటి కర్మేంద్రియములగు ఐదు భాగములకు తెలియజేయుచుండును. జ్ఞానేంద్రియములు ఐదు వరుసగా ఇలా కలవు. కన్ను, చెవు, ముక్కు, నాలుక, చర్మము అట్లే కర్మేంద్రియములు ఐదు ఇలా కలవు. చేయి, కాలు, నోరు, గుదము, గుహ్యము (లింగము) అని చెప్పవచ్చును. జ్ఞానేంద్రియములు బయటి సమాచారమును లోపలికి చేరవేయగా, అంతరంగములోని బుద్ధి తెలియజేసిన సమాచారమును మనస్సు ద్వారా కర్మేంద్రియములకు చేర్చబడును. బుద్ధి చెప్పిన దానిని కర్మేంద్రియములు కార్యముగా ఆచరించును.
జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ సమన్వయము వలన మనిషి కార్యములను చేయగల్గుచున్నాడు. జ్ఞానేంద్రియములలో కన్ను ప్రధానమైనదనీ, కర్మేంద్రియములలో చేయి ప్రధానమైనదనీ చెప్పుచుందురు. అందువలన రెండు వాక్యములలో జ్ఞానేంద్రియమైన కన్నును, అట్లే కర్మేంద్రియమైన చేయిని గురించి చెప్పారు. కన్ను చూచుట వలన బయట సమాచారము లోపలికి పోయి, బుద్ధి ఆలోచించి బయటికి కర్మేంద్రియములకు సమాచారమందించి కార్యము చేయమని చెప్పకున్ననూ కేవలము బుద్ధి ఆలోచించుట వలన, లోపలి బుద్ధికి ప్రక్కనే అనుసంధానముగా యున్న అహము పని చేయడము వలన, బయట కార్యము జరగకున్నా బుద్ధి ఆలోచన ద్వారా పాపము వచ్చుటకు అవకాశము గలదు. అందువలన మొదట కన్ను చూచుట వలననే కదా పాపము వచ్చు అవకాశము కలదు. ఒక స్త్రీని చూచుట వలన లోపలి కామగుణము చేత ఆలోచించుట వలన కార్యరహితమైనా, అహంభావము వలన కార్యము జరిగినట్లు లెక్కించబడుట వలన పాపము వచ్చుటకు అవకాశము ఏర్పడుచున్నది. జరగని కార్యమునకు కూడా పాపము వచ్చు అవకాశమును మొదటనే జ్ఞానేంద్రియమైన కన్ను కల్గించుచున్నది. కావున జ్ఞానేంద్రియమైన 'కన్నును పెరికి పారవేయుము' అని చెప్పారు. అలా అని వాక్యములో చెప్పినట్లు స్థూలముగా యున్న కన్నును పెరికి వేయకూడదు. వాక్యములో 'నీ కుడి కన్ను' అని చెప్పియున్నారు. పాపము కుడికన్ను వలన వచ్చుచున్నదని చెప్పలేము. కుడి కన్ను చేసే పనిని ఎడమ కన్ను కూడా చేయుచున్నది కదా! రెండు కన్నుల చూపువలననే కదా! పాపము వచ్చునది. అలాంటప్పుడు వాక్యములో చెప్పినది కుడి కన్నును మాత్రమే కదా! అలా చెప్పడము వలన మనము ఆలోచించి చేయవలసి యున్నది.
అది ఏమనగా! మనిషి శరీరములో కుడి, ఎడమ అని రెండు భాగములు గలవు. కుడివైపున బలముగా, ఎడమ వైపున బలము తక్కువగా యుండుట సహజము. ఎక్కడయినా కుడివైపు శరీర భాగము కొలతలోగానీ, బలములోగానీ ఎడమవైపుకంటే ఎక్కువగానే యుండును. కన్నుగానీ, చేయిగానీ రెండూ కుడి ప్రక్క భాగములనే వాక్యములో చెప్పియున్నారు. అంతేకాక ఈ వాక్యములో ఆలోచింపదగిన మరొక విషయము గలదు. అదేమనగా! 'నీ దేహమంతయూ నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా!' అని అన్నారు. వాస్తవానికి శరీరములోని కన్నుగానీ, అట్లే చేయిగానీ వచ్చే పాపమునకు కారణము కాదు. వచ్చే పాపమునకు కారణము అయినది నీ శరీరములోని అహము అను భావమే యని తెలియుచున్నది. అదే విషయమునే ప్రథమ, ద్వితీయ దైవగ్రంథములు తెలియజేయుచున్నవి. అందువలన పాపమును సంపాదించడములో గానీ, అనుభవించడములో గానీ శరీర బయటి భాగములకు ఎటువంటి సంబంధము లేదు. పాపమును సంపాదించునది మనిషి శరీరములోని అహంభావము. పాపమును అనుభవించునది శరీరములోని జీవుడు. కర్మలను సంపాదించడములో అహంభావమునకు, అనుభవించడములో జీవాత్మకు సంబంధముండుట వలన బయటి జ్ఞానేంద్రియమైన కన్నుగానీ, కర్మేంద్రియమైన చేయిగానీ కర్మలకు సంబంధము లేకుండా నిమిత్తమాత్రముగా పని చేయుచున్నవి.
కన్నుకు, చేయికి కర్మలతో సంబంధము లేనప్పుడు కన్నును పెరికేయి, చేయిని నరికేయి అని ఏసు ఎందుకు చెప్పాడని కొందరికి అనుమానము రావచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! నీ కన్ను బయట సమాచారమును అందించినప్పుడు అది బుద్ధికి చేరును. అప్పుడు బుద్ధి గుణములచే ఆలోచించును. దాని తర్వాత ఆ విషయముతో అహము సంబంధపడకుండా, అహమును అణచివేయడము వలన కన్ను అందించిన దృశ్యములో, బుద్ధి ఆలోచించిన గుణములలో ఏమాత్రము పాపముగానీ, పుణ్యముగానీ రాకుండా పోవును. అలా చేయుట వలన అనగా కన్ను అందించిన సమాచారముతో లోపల అహము సంబంధపడకుండా చేయుట వలన, కన్ను వలన వచ్చు పాపము నివారించబడుట వలన అతడు కన్నును లేకుండా చేసుకొన్నట్లే యగును. అలాగే వినికిడి వలన వచ్చు విషయముతో అహమును సంబంధము లేకుండా చేయుట వలన చెవిని లేకుండా చేసినట్లే యగును. ఒక కన్ను వలననే పాపపుణ్యములు రావడము లేదు. మిగతా నాలుగు జ్ఞానేంద్రియముల వలన కూడా వచ్చుచున్నవి. అందువలన జ్ఞానేంద్రియములలో కన్ను ముఖ్యమైనది కాగా, రెండు కన్నులలో కుడి కన్నుకు సహజముగా ఎక్కువ చూపు ఉండుట వలన వాక్యములో 'కుడి కన్నును పెరికివేయి' అని అన్నాడు. ఈ వాక్యము స్థూలముగా కనిపించుచున్ననూ సూక్ష్మముగా అర్థము చేసుకోవలసియున్నది.
అదే విధముగా కర్మేంద్రియములలో కుడిచేయిని గురించి చెప్పారు. ఒక కుడిచేయి వలననే కాకుండా మిగతా కర్మేంద్రియముల వలన చేయు పనులలో కూడా కర్మలు వచ్చుచున్నవి. జ్ఞానేంద్రియములు పనులు చేయకున్నా కర్మలు వచ్చుచుండగా, కర్మేంద్రియములు పనులు చేయుట వలన కర్మలు వచ్చుచున్నవి. జ్ఞానేంద్రియములు ఐదు అని చెప్పినప్పుడు రెండు కళ్లను ఒకటిగానే లెక్కించి చెప్పాము. అలాగే రెండు చెవులను ఒకటిగానే చెప్పాము. ముక్కురంధ్రములు రెండు ఉండగా ఒక ముక్కుగానే చెప్పాము. మిగతా చర్మము, నాలుక ఒకటిగానే యున్నవి. అలాగే కర్మేంద్రియములలో రెండు చేతులను ఒక్కటిగానే లెక్కించాము. అట్లే రెండు కాళ్లను ఒక్కటిగానే చెప్పాము. మిగతా మూడు నోరు, గుదము, లింగము జతగా లేకుండా ఒక్కటిగానే యున్నవి. రెండు జతలుగా యున్న వాటియందు కుడి ప్రక్కగల కన్నుకు, కుడి ప్రక్కగల చేయికి ఎక్కువ బలముండుట వలన, ఎక్కువ చూపు కుడికన్నుకు, ఎక్కువ కార్యములు కుడి చేయికి ఉండుట వలన ''కుడికన్ను, కుడిచేయి'' అని వాక్యములో ప్రత్యేకముగా చెప్పారు. వాక్యములో చెప్పిన సూక్ష్మభావము ప్రకారము కన్ను చూపు వలన వచ్చు పాపమును, చేయి కార్యము వలన వచ్చు పాపమును లేకుండా, రాకుండా అహమును అణచివేయుము అని చెప్పాడు తప్ప కన్నును పెరికివేయడము వలనగానీ, చేయిని నరికివేయడము వలన గానీ వచ్చే కర్మ ఆగిపోదు. మిగతా అవయవ భాగముల వలన వచ్చును. పాపమునకు కారణమైనది చివరిగా అహము ఉన్నది, కావున దానిని లేకుండా చేయమని చెప్పడమే వాక్యములో ఉన్నదని తెలియవలెను. ముఖ్యముగా తెలియవలసినదేమనగా! శరీర అవయవములు పాపమును సంపాదించవు. శరీరము పాపమును అనుభవించదు. శరీరము లోపల పాపమును సంపాదించునది అహము అను భాగము. అట్లే పాపమునుగానీ, పుణ్యమునుగానీ అనుభవించునది శరీరములో ఒక భాగముగాయున్న జీవాత్మ. ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు వాయువులు, ఐదు జ్ఞానేంద్రియములకు యున్న సామత్యములు, ఐదు అంతఃకరణములు. అంతఃకరణములలో జీవుడు కూడా యున్నాడు. అందువలన జీవునితో సహా శరీరములో ఇరువది ఐదు (25) భాగములున్న వని చెప్పవచ్చును. శరీర యంత్రాంగమును బాగా తెలిస్తే ఇక్కడ ఏసు చెప్పిన వాక్యములు అర్థమగును. జ్ఞానియైనవాడు శరీరము 25 భాగములుగా యున్నదని తెలిసియుండును. అట్లు తెలియనివానిని జ్ఞాని అని అనలేమని ఒక ఆధ్యాత్మికవేత్త తన పద్యములో ఈ విధముగా చెప్పారు చూడండి.పంచతత్త్వములను పంచీకరించకమంచి యతులమన్న మాటలన్నకుంచమందు గజము గ్రుడ్డు పెట్టిన చందంబుఅఖిల జీవసంగ ఆత్మలింగ.
మత్తయి సువార్త, 6వ అధ్యాయము, 3, 4 వచనములు.(3) నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడిచేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను.
(4) అట్లయితే రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలితమిచ్చును.ఈ వాక్యమును గురించి చాలామంది బోధకులు వక్రీకరించి ధర్మమును దానముగా చెప్పుచున్నారు. కొన్ని ప్రార్థనాలయములలో దేవుని సేవకు ఇచ్చు డబ్బును ఎవ్వరికీ కనిపించనట్లు కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదని చెప్పడము జరుగుచున్నది. అలాగే చేతిని మూసిపెట్టుకొని కానుకలు ఇవ్వడము చేయుచున్నారు. వాస్తవానికి వాక్యములో చెప్పినది ధర్మమును గురించేగానీ, దానమును గురించి కాదు. దానమునకు, ధర్మమునకు నక్కకు నాగలోకమునకు ఉన్నంత తేడా యున్నది. ఒకరికి ఇచ్చునది దానము. ఒకడు ఆచరించునది ధర్మము. ముందు ధర్మములు ఏవో తెలియగలిగితే తర్వాత ధర్మములను చేయు విధానము కూడా తెలియును. ఈ వాక్యములో దానమును గురించి ఏమాత్రము చెప్పలేదు, ధర్మమును గురించియే చెప్పియున్నారు. దేవుని ధర్మములు దైవ గ్రంథములో చెప్పినట్లు ముఖ్యముగా రెండే గలవు. మరియొకటి స్థూలమైనది గలదు. ఆ మూడు ధర్మములకు అనుసంధానమైన ధర్మములు కొన్ని గలవు. మనిషి దేవున్ని చేరుటకు పనికి వచ్చునవి మూడు ముఖ్యమైన ధర్మములుకాగా దేవున్ని గురించినవి మరికొన్ని గలవు. అయితే మనిషి ఆచరించవలసినవి, దేవున్ని చేరుకొనుటకు అవసరమైన మూడు ధర్మములే ముఖ్యమైనవి.
దేవున్ని చేరుటకు కావలసిన బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు మూడు ధర్మములలో రెండు లోపలి భావములతో కూడినవికాగా, ఒకటి బాహ్య ఆచరణతో కూడినదిగా యున్నది. రెండు ధర్మములను ఆచరించుట ఇతర మనుషులు గుర్తించలేరు. ఒక ధర్మమును ఆచరించడము ఇతరులు తెలియుటకు అవకాశము గలదు. అందువలన వాక్యములో కూడా ధర్మము అని ఏకవచనముగా చెప్పియున్నారు. ఒక ధర్మమే ఇతరులు గుర్తించునట్లు ఉండుట వలన ఆ ఒక్క ధర్మమును గురించే ఏకవచనముగా 'ధర్మము' అని చెప్పారుగానీ, 'ధర్మములు' అని చెప్పలేదని గ్రహించవలెను. ఇతరులు తెలియుటకు అవకాశమున్న ఒక్క ధర్మమును కూడా ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడి చేయవలెనని తెలుపు నిమిత్తము ''నీ కుడిచేయి చేయునది ఎడమ చేతికి తెలియకుండా చేయవలెనని'' చెప్పారు. ఇతరులు నీవు ఆచరించు ధర్మమును చూచి బాగుపడుటకంటే చెడిపోవు అవకాశమే ఎక్కువ గలదు. అందువలన నీవు ధర్మమును చేయునప్పుడు అనగా ఆచరించునప్పుడు ఇతరులకు తెలియకుండా చేయవలెనని చెప్పారు.☞
మత్తయి సువార్త, 6వ అధ్యాయము, 6వ వచనము.(6) నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రిని ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.మనిషి దేవున్ని ధర్మముతో ప్రార్థించవలెను. ప్రార్థనయనగా! ధర్మబద్దమైనదిగా ఉండవలెను. ధర్మముతో కూడిన ప్రార్థన కాకుండా నోటితో మాటల రూపములో చేయునది ధర్మమునకు సంబంధించినది మరియు దేవున్ని చేరునది కాదు. అందువలన ఇతరులకు తెలియునట్లు గల ధర్మముతో కూడుకొన్న ప్రార్థన చేయునప్పుడు గదిలోనికి వెళ్లి ఇతరులు రానట్లు తలుపులు వేసి రహస్యమందున్న ఆత్మను ప్రార్థన చేయవలెను. మనుషులకు తండ్రి మనుషుల శరీరములో యున్న ఆత్మయేనని తెలియవలెను. ఇతరులకు తెలియు ప్రార్థన ఎవరికీ తెలియకుండా చేయవలెను. అట్లు చేయుట వలన శరీరములో రహస్యముగా యున్న ఆత్మ నీకు ప్రతిఫలము ఇచ్చును. ఆత్మను ఆరాధించు ప్రార్థనను ప్రథమ దైవగ్రంథములో 'పెద్ద యోగము' అని అన్నారు. దానినే ఇంకొక విధముగా 'బ్రహ్మయోగము' అని కూడా అన్నారు.☞
మత్తయి సువార్త, 6వ అధ్యాయము, 7, 8వ వచనములు.(7) మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు.
(8) మీరు వారివలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా యున్నవేవో ఆయనకు తెలియును.నేటి సమాజములో చాలామంది దేవున్ని చేరునటువంటి ధర్మయుక్త మైన 'యోగము' అను ప్రార్థన చేయక వ్యర్థమైన మాటలతో కూడుకొన్న ప్రార్థన చేయుచున్నారు. ఎక్కువగా మాటల రూపములో అడుగుట వలన తమ కోర్కెను దేవుడు తీర్చునని అనుకొంటున్నారు. వారివలె నీవు ప్రార్థన చేయవద్దు. మీరు దేవునియందు ఐక్యమైపోవు ప్రార్థన చేయక ప్రపంచ లాభములు, ప్రపంచ వస్తువులను కోరు ప్రార్థన చేయుచున్నారు. మీరు అడుగునవి, మీరు మీ తండ్రియైన ఆత్మను అడుగకముందే ఆయనకు అన్నీ తెలియును. మీకు ఇయ్యవలసినవేవో, ఇయ్యకూడనివేవో ముందే ఆయనకు తెలియును. అందువలన ప్రపంచ సంబంధ లాభములను గురించి మీరు అడిగినా, అడుగకున్నా ఒక్కటే. మీకు తండ్రిగాయున్న ఆత్మ మీ కర్మలనుబట్టి మిమ్ములను నడిపించుచుండును. అందువలన గతజన్మలో మీరు సంపాదించుకొన్న ప్రకారమే ఆత్మ మీకు ఇచ్చుచుండును. అడిగారని ఇచ్చునది గానీ, అడగలేదని ఇవ్వకపోవడముగానీ ఉండదు. అన్నీ కర్మనుబట్టి ఆత్మ అందించునని తెలియవలెను. ఆత్మ మనుషులకు తండ్రిగాయుండగా, ఆత్మకు తండ్రిగా యున్న పరిశుద్ధాత్మ అన్నిటినీ సాక్షి భూతునిగా చూస్తూ యుండును.☞
(16) మత్తయి సువార్త, 7వ అధ్యాయము, 13, 14వ వచనములు.(13) ఇరుకు ద్వారమున ప్రవేశించుము. నాశనము నకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలముగను ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులుగలరు.
(14) జీవమునకు పోవు ద్వారము ఇరుకును, సంకుచితమునైయున్నది. దానిని కనుగొనువారు కొందరే.అనుభవములు గల ఈ లోకములో రెండు మార్గములు గలవు. ఒకటి పరమాత్మ (పరిశుద్ధాత్మ) మార్గము, రెండవది మాయ మార్గముగా యున్నది. అయితే దేవున్ని కోరుకొనువారు అరుదుగా ఉండగా, విశాలముగా యున్న మాయ మార్గమును కోరువారు అనేకులుగలరు. జీవమునకు అనగా మోక్షమునకు పోవు ద్వారము ఇరుకుగా సంకుచితముగా యుండి ఆ దారిలో పోవుటకు చాలా కష్టముగా యుండును. ఇరుకు దారిగాయున్న దేవుని దారిని కనుగొనువారు అరుదుగా యున్నారు.
ఈ వాక్యములో ప్రభువు ద్వారము, దారి అని రెండిటిని తెలియజేశాడు. మొదట ప్రవేశించునదే ద్వారము, తర్వాత పోవునదే దారి. మొత్తము మానవులకందరికీ రెండే రెండు దారులున్నాయి. ఒకటి ఇరుకు దారి, రెండవది విశాలమైన దారి. అట్లే వాటి ద్వారములు ఒకటి ఇరుకును, రెండవది వెడల్పును కల్గియున్నది. మొదట ద్వారము గానీ, తర్వాత మార్గముగానీ ప్రవేశించువాని సైజుకంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉండాలి. అటువంటప్పుడే ఆ ద్వారములో ఆ దారిలో ప్రవేశించుటకు వీలగును. పైన చెప్పిన ఇరుకు ద్వారములో సంకుచిత దారిలో ప్రవేశించు వాడు ఎంత సైజుగలడో అంతే సైజు ద్వారము, దారి గలవు. రెండవదయిన వెడల్పు ద్వారము విశాల మార్గము ప్రవేశించువాని సైజుకంటే నూట ఎనిమిది రెట్లు పెద్దది. ఈ విధముగా నూట ఎనిమిది రెట్లు పెద్దదైన మార్గము ద్వారము, ఒక్క రెట్టు కూడా పెద్దది కాని ద్వారము, మార్గము ప్రపంచములో రెండే గలవు. సమస్త మానవులకు గల ఈ రెండు ద్వారములను దారులను జ్ఞానము, అజ్ఞాన మార్గములుగా పోల్చి ప్రభువు చెప్పాడు. జ్ఞానమార్గము చాలా ఇరుకైనదని, ప్రవేశించు వాని సైజు మాత్రమే గలదని అందువలన జ్ఞానమార్గములో నడచుట చాలా కష్టముగా ఉండుననీ తెలియుచున్నది. అజ్ఞాన మార్గములో పోవువాని సైజుకంటే ఆ మార్గము 108 రెట్లు పెద్దదిగా ఉండి విచ్చలవిడిగా పోవుటకు అవకాశము కలదై ఆటంకములు లేనిదై ఉన్నది. ఇరుకు దారియైన జ్ఞానమార్గము ఆటంకములు కలదై ఉన్నప్పటికీ దాని గమ్యము పరమాత్మ. వెడల్పు ద్వారము విశాలమైన మార్గము గల అజ్ఞాన దారి ఏ ఆటంకములు లేనిదై ఉన్నప్పటికీ దాని గమ్యము సాతాను. పరమాత్మ గమ్యము చావుపుట్టుకలు లేనిదై, నాశనము లేనిదై, ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండునదై, మార్పులేనిదై ఉన్నది. సాతాను గమ్యము చావు పుట్టుకలు గలదై, నాశనము గలదై, ఎల్లప్పుడు ఒకే స్థితి లేనిదై, మార్పుగలదై ఉన్నది. పరమాత్మ గమ్యము గొప్పదైనప్పటికీ, సాతాను గమ్యము నీచమైనప్పటికీ అందరూ విశాలమార్గమైన సాతాను మార్గములోనే పయణిస్తున్నారు. ప్రపంచరీత్యా సాతాను మార్గములో ప్రవేశించిన వానికి వాని చుట్టూ సంబంధీకులందరూ అనుకూలముగా ఉంటూ ఏ ఆటంకములూ కలుగజేయరు. ఆర్థికముగా ఇబ్బందులుండవు. జీవితము సుఖమయముగా కనిపించినట్లుండును. అదే జ్ఞానమార్గములో ప్రవేశించిన వానికి చుట్టూ ఉన్న బంధువులు భార్యతో సహా వ్యతిరేఖులుగా ఉంటూ, వాని మార్గమునకు ఆటంకములు కలుగజేయుచుందురు. వాని జీవితము కష్టముగా సాగినట్లుండును. అందువలన జ్ఞానమార్గమున ప్రవేశించువారు లక్షల సంఖ్యలో ఒకడు కూడా కనిపించడు.
ఎవరూ వ్యతిరేఖించని ఏ ఆటంకములు లేని సువిశాలమైన అజ్ఞాన మార్గమున అనేకులు పయణిస్తున్నారు. విశేషమేమిటంటే మోక్షమునకు పోవునది, పరలోక తండ్రియొద్దకు చేర్చునదియైన జ్ఞానమార్గమైన ఇరుకు దారి ఒకటున్నదని కూడా చాలామందికి తెలియదు. భగవద్గీతలో కూడా ఈ దారిని గూర్చి చెప్పుచూ ఈ దారిలో ప్రయాణించవలెనని అనుకొనువారు వేయింటికొకడు కూడా లేడనీ, ఎక్కడయినా అరుదుగా ఉంటే వాడు ఈ దారిలో ప్రవేశించుట అరుదుగా ఉండునని, ఒకవేళ ప్రవేశించిన వాడు మాయ ఆటంకముల వలన గమ్యము చేరుట మరీ అరుదుగా ఉండునని అన్నిటినీ అధిగమించి గమ్యము చేరువాడు ధన్యుడనీ, అటువంటి వాడు చావు పుట్టుకలు నాశనము లేని పరమాత్మలో చేరిపోవుననీ శ్రీకృష్ణుడు చెప్పాడు. పరమాత్మ ప్రతినిధులైన కృష్ణుడు ద్వాపరయుగ అంత్యములో భగవద్గీత రూపములోనూ, ప్రభువు కలియుగము మూడు వేల సంవత్సరములు గడచిన తర్వాత పరిశుద్ధ గ్రంథములోనూ జ్ఞాన, అజ్ఞాన మార్గముల గూర్చి చెప్పారు. పరమాత్మ ప్రతిబింబాలైన శ్రీకృష్ణ, ఏసు ప్రభువులు చెప్పిన జ్ఞాన, అజ్ఞాన మార్గముల వివరము తెలిసినవారు సూచించిన జ్ఞానమార్గమువైపు ప్రయాణించి ఎన్ని ఆటంకములు కల్గినా ప్రయాణము సాగించి చివరకు నాశనము లేని మోక్షమైన పరమాత్మను చేరవలెనని తెలుపుచున్నాము.☞
(17) మత్తయి సువార్త, 7వ అధ్యాయము, 7, 8వ వచనములు.(7) అడుగుడి మీకియ్యబడును. వెదుకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును.
(8) అడుగు ప్రతివాడును పొందును. వెదుకువానికి దొరుకును. తట్టువానికి తీయబడును.ప్రభువు చెప్పిన ఈ వాక్యములో అడుగు, వెదకు, తట్టు అను మూడు ముఖ్యమైన క్రియలు గలవు. ఈ మూడు పనులు ఆధ్యాత్మికముగా చేయమన్నాడని తెలుసుకోవలెను. అట్లుగాక ప్రపంచములోని సర్వులవలె ప్రపంచ విషయములు ప్రభువు చెప్పలేదు. చాలామంది ఈ వాక్యమును ప్రపంచ సంబంధముగా అర్థము చేసుకొన్నారు. అందువలన ఈ వాక్యము చెప్పిన ప్రభువునే వారి వారికి అవసరమైన కోర్కెలను అడగను మొదలు పెట్టారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చదివినప్పటికీ, అక్కడ కూడా సాతాను ప్రవేశించి ప్రభువు చెప్పిన వాక్యమును అర్థము కాకుండా చేసి, ప్రపంచ కోర్కెలడుగునట్లు చేసినది. దేవుని వాక్యమును అతిక్రమించకూడదను నియమమును అవగాహనా లోపము చేత వాక్యమునకు లోబడి ఉండునట్లే మానవున్ని నమ్మించి వాక్యమును అతిక్రమించునట్లు చేయుచున్నది. దేవుడెక్కడ గలడో దేవుడు పుట్టించిన సాతాను కూడా అక్కడే గలదు. దేవుని వాక్యమెచటగలదో సాతాను ప్రభావము కూడా అచటనే ఉండును. అందువలన దేవుడు చెప్పిన వాక్యములను జాగ్రత్తగా అవగాహన చేసుకోవలెను. వాక్యము విషయములో సాతాను ప్రభావము లేనట్లు చూచుకోవలెను.
దేవుని కొరకు అడగవలెను, దేవుని కొరకు వెదకవలెను, దేవుని కొరకు తట్టవలెను. ఆ విధముగా చేయుట దేవుని మార్గమగును. అలాకాక ఇతరత్రా దేనిని అడిగినా, దేనిని వెదకినా దేనికొరకు అడిగినా అది మాయ (సాతాన్) మార్గమగును. దేవుని మార్గములో ప్రవేశించువాడు దేవుని జ్ఞానము నిమిత్తము అడుగుచుండును. దేవుడెలా ఉండునని, దేవుని సన్నిధానమునకు ఎలా చేరవలెనని, దేవున్ని గూర్చిన సమస్త సమాచారమును తెలుసుకోవాలనుకొన్నవానికి సరియైన జవాబివ్వువారు భూమిమీద లేరే అనుకోవద్దు. అందరూ సాతాను ప్రభావములో ఉండి దేవుని సమాచారము చెప్పు మానవులే భూమిమీద లేనప్పుడు స్వయముగా దేవుడే వచ్చి మీకు కావలసిన సమాధానమిచ్చి పోగలడు. నీ ప్రశ్నలకు సమాధానమైతే దొరకగలదు కానీ వచ్చి చెప్పువాడు ఎవడు? అనునది మాత్రము తెలియదు. భూమిమీద దేవుడే పుట్టి వచ్చి మనలను సమాధానపరిచినప్పటికీ దేవునిగా గుర్తించక మనిషిగానే గుర్తించగలము. అడుగుట వలన సంపూర్ణ జ్ఞానము లభించగలదు. వెదకుట వలన భూమిమీద మనిషిగానున్న దేవుడే తెలియగలడు. భూమిమీద దేవుడు అవతరించినప్పుడు తాను ఫలానా వాడినని చెప్పుకోడు మరియు ఎవరికీ తెలియనివ్వడు. అది తన యొక్క నియమము. ఆ నియమము ప్రకారము వెదకని వానికి కనిపించడు, వెదికేవానికి మాత్రము కనిపించును. ప్రభువు మనిషిగా ఉన్నప్పుడు అడిగేవారు కొందరుండిరి కనుక వారికి జ్ఞానము చెప్పబడినది. వెదికేవారు లేరు కనుక ఆయన అపుడు దేవునిగా ఎవరికీ కనిపించలేదు. అందరికీ సామాన్య మానవునివలె కనిపించాడు. చివరకు తనవద్దనున్న పండ్రెండు మంది శిష్యులకు బోధకుడుగానే అర్థమయ్యాడు. సాక్ష్యాత్తూ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మయే శరీరధారియైన ప్రభువని వారికి తెలియదు. ఎవరికీ తను ఫలానా అని గుర్తించనట్లు ఆయన కూడా నటించి పోయాడు.
పరలోక రాజ్యాధిపతియైన పరమాత్మ ప్రభువుగా భూమిమీద ఉండినప్పుడు తానే స్వయముగా తన శిష్యుల కాళ్లు కడిగాడు. అలా చేయడములో ఆ శిష్యులు మిగతా ప్రజలు ఆయనను ఏమాత్రము గుర్తించుటకు అవకాశమే లేకుండా పోయినది. ప్రభువు ఎవరైనది గుర్తించ లేని ప్రజలు ఆయనను, ఆయన మహత్యమును తెలుసుకొనలేక సాధారణ మానవునిపట్ల ప్రవర్తించినట్లు అగౌరవముగా ప్రవర్తించి, ముఖాన ఎంగిలి మూసి, నెత్తిన ముళ్ళనుంచి, కొరడాలతో కొట్టి, చివరకు ములుకులు కొట్టి చంపారు. చనిపోయిన ఏసు తిరిగి మూడవ దినమున అదే శరీరముతో లేచి వస్తే శిష్యులు దయ్యమని భ్రమపడ్డారు. దీనినిబట్టి చూస్తే ఆనాటి శిష్యులు కూడా అడిగేవారేగానీ, వెదికేవారు కాదని తెలియుచున్నది. ''వినుట కంటే చూచుట మరీ గొప్ప'' అన్నట్లు ఆయన జ్ఞానమును వినేవారికంటే ఆయననే చూచినవారు మరీ గొప్పవారు. ప్రపంచమునకంతటికీ దేవుడైన వాడు ఏసుప్రభువుగా ఉన్నప్పుడు ప్రత్యక్షముగా ఆయనను చూచి ఉండవచ్చును. కానీ ఆయనను చూడనట్లే. ఈ విషయములో ప్రభువే తన శిష్యులను కళ్ళుండి గ్రుడ్డివారన్నాడు. అలా గ్రుడ్డివారము కాకుండా ఉండాలంటే నీవు దేవున్ని చూడాలని వెదుకుటకు ఆరంభించాలి. అడిగే వానికి ఇయ్యబడును అనువాడు, వెదకే వానికి దొరకబడునని కూడా అన్నాడు. కావున అడిగే వానికి దేవుని వాక్యములు ఇవ్వబడినట్లు, వెదకే వానికి దేవుని ఆకారమే దొరుకును, వినే వారికంటే చూచువారు గొప్ప వారైనట్లు చూచేవారికంటే అనుభవించేవాడు మరీ గొప్పవాడు. ఆ సూత్రమును అనుసరించి ' తట్టువానికి తీయబడును' అన్నాడు. తట్టడమంటే ఎదుటివాని ద్వారము గానీ, ప్రక్క ఇంటి తలుపులుగానీ తట్టడమని అర్థము చేసుకో కూడదు. మోక్ష సామ్రాజ్య ద్వారమును తట్టవలెను. పరలోక రాజ్యము యొక్క తలుపులు తట్టవలెను. మోక్షమును కోరువారు పరమాత్మలోనికి ఐక్యమై, ఆయనతో కలిసి ఆయన యొక్క సారమునే అనుభవింతురు. అడిగేదానికి, వెదకేదానికి అలవాటుపడినవాడు తప్పనిసరిగా దేవునియందు ఐక్యమగుటకు ప్రయత్నించును. అనగా తప్పనిసరిగా తట్టువాడగును. అడుగుటవలన, వెదకుటవలన, తట్టుటవలన ఎవడైనా దేవునిలోనికి చేరి పోవును. అందువలన ప్రతి మనిషికీ ముఖ్యముగా పై వాక్యములో దేవుడు చెప్పిన మూడు లక్ష్యణములుండవలెను. దేవుని వాక్యము ప్రకారము అడిగే వానికి జ్ఞానము, వెదికేవానికి భగవంతుడు (దేవుని కుమారుడు), తట్టేవానికి మోక్షమను ఇల్లు లభించును.☞
(18) మత్తయి సువార్త, 7వ అధ్యాయము, 15వ వచనము.(15) అబద్దపు ప్రవక్తల గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములను వేసుకొని మీవద్దకు వత్తురు. కానీ లోపల వారు కూృరమైన తోడేళ్లు.ఒక మనిషి దేవుని సాన్నిధ్యము చేరాలంటే వానికి మార్గదర్శకత అవసరము. మార్గదర్శకత ఇతరుల వలననే కల్గవలెను. ఒక మనిషి దేవుని మార్గములో నడువాలంటే వేరొక మనిషి మీద ఆధారపడవలసి వస్తున్నది. మార్గము చూపువాని చేతిలో మార్గము చూచువాడుండును. ఎందుకనగా! చూపువాడు చూపించు దారినే చూచువాడు నడువాలి. మార్గదర్శకతను ఇచ్చువానినిబట్టి మార్గములో నడుచువాడుండును. వాని దర్శకత్వము సరియైనదైతే నడుచువాడు సరియైన మార్గముననే నడచును. దర్శకుడే సరిలేని ఎడల నడచువాడు కూడా సరియైన మార్గములో నడువలేడు. చూపించు వానిని (బోధకుని) బట్టి చూచు సామాన్యుని జీవిత ధ్యేయమే ఆధారపడియున్నది. ఒకమారు గురువుగా ఒక వ్యక్తిని నిర్ణయించుకొన్న తర్వాత జీవితాంతము అతను చెప్పినదే నిజమని నమ్ము అలవాటు అందరికీ ఉన్నది. అందువలన మొదట గురువుగా (దర్శకునిగా) ఒక వ్యక్తిని ఎన్నుకొనునప్పుడు జాగ్రత్తపడవలసి ఉన్నది. అందువలననే ప్రభువు పై వాక్యములో ''అబద్ద ప్రవక్తల గూర్చి జాగ్రత్తపడుడి'' అన్నాడు. ప్రస్తుత కాలములో గురువులుగానున్న కొందరు గురువులే కాదనీ, గురువుల వలె నటిస్తున్నవారనీ, ఆయన చెప్పుచూ వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ, వారు కౄరమైన తోడేళ్లు అన్నాడు. ప్రభువు వాక్యము ప్రకారము ఎందరో గురువులు రంగు పూసుకొని బోధిస్తున్నారు. కానీ వారు గురువులు కాదు, వారు చూపు మార్గము దేవుని దగ్గరకు చేర్చలేదు. వారు చెప్పు బోధలలో దేవుడు, జ్ఞానము, ఆత్మ అను మాటలుండుట వలన దేవుని గూర్చియే చెప్పుచున్నారని ఆ మాటలనే వినవలసి వస్తున్నది. గొర్రె చర్మమును కప్పుకొన్నంత మాత్రమున తోడేలు గొర్రె కానట్లు అటువంటి గురువులు ఎంతగానో గురువులవలె కనిపించినా వారు గురువులు కానేకారు. అందువలన అటువంటి గురువులను నమ్మి జీవితమును వృథా చేసుకోకూడదని ప్రభువు అబద్ద ప్రవక్తల గూర్చి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు.☞
(19) మత్తయి సువార్త, 7వ అధ్యాయము, 21వ వచనము.(21) ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గానీ, పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును.పరమాత్మ నుండి వచ్చినవాడు ఏసుప్రభువు. ప్రభువు శరీరము ధరించి ఉన్న భగవంతుడుకాగా, పరలోక తండ్రి అనబడు పరమాత్మ శరీరము లేని దేవుడు. శరీరము లేని దేవుడు ప్రపంచమంతా అణువణువునా వ్యాపించి ఉండగా, శరీరమున్న భగవంతుడు ప్రభువు పేరుతో భూమిమీద ఉండు సమయములో కొందరు ప్రభువు యొక్క గొప్పతనమును చూచి ఆయనవద్ద చేరి భక్తి ప్రదర్శించుచూ ఆ భక్తి తమ కోర్కెల నిమిత్తముండునట్లుందురు. తమకేదో లాభము కల్గునని ఆయనను ప్రభువా ప్రభువా అని పిలుచుచుందురు. సాకార రూపములోనున్న ప్రభువువద్దకు చేరి దైవ జ్ఞానము లేకుండా ప్రభువును ఎంత గొప్పగా పిలిచినా ప్రయోజనము లేదు. సాకారములోనున్నవాడు నిరాకారములోనున్నవాడు ఒక్కడే యైనప్పటికీ సాకారములో ఉన్నవానికి ఎన్నో పరిమితులు గలవు. నిరాకారములోనున్న పరలోక తండ్రికి ఏ పరిమితులూ లేవు. పరిమితిలేని పరమాత్మ మానవులకు తన ధర్మములను తెలుపు నిమిత్తము తననుండి ఒక రూపమును పంపును. అట్లు పంపినదే ఏసుప్రభువు. ఏసుప్రభువు కంటికి కనిపించువాడైననూ తెలుపు వాక్యములు పరలోక తండ్రివే. దేవుని ధర్మములు ప్రకటించు నిమిత్తము దేవుడే ప్రభువు రూపముగా భూమిమీదకు వచ్చి ఉన్నాడు.
ప్రభువు చెప్పు పరలోక తండ్రి యొక్క చిత్తానుసారమైన వాక్యములను ఎవడు ఆచరించడో, ఆ వాక్యములను ఎవడు గుర్తించడో వాడు సాకారమున ఉన్న ప్రభువును ''ప్రభువా!'' అనినా ప్రయోజనము లేదు. దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము ఆచరించువాడు ప్రభువు నామమును ఉచ్ఛరించు వానికంటే గొప్పవాడు. దాసుని భక్తి దండముతో సరిచేయు వారికంటే దేవుని వాక్యముతో కలిసి నడుచువాడు ముఖ్యుడు. దేవుని ఆజ్ఞ ప్రకారము నడచువాడు దేవుని చిత్తానుసారము నడచినట్లగును. అటువంటివాడే మోక్షమనబడు పరలోకములో ప్రవేశించును. దేవుడు పొగడ్తలకు పొంగిపోడు, లొంగిపోడు. దేవుడు తన జ్ఞానమాచరించు వారిని చూచి పొంగిపోగలడు, వారికి లొంగిపోగలడు. కావున దేవున్ని పొగడుటకంటే దేవుని వాక్యమును ఆచరించుట మేలు. దేవునికి అందరిలో నున్న భావములు తెలుసు. జ్ఞానము తెలిసినవానికి, తెలియనివానికి ఉన్న భావములో తేడాను గమనించగలడు. దేవుని జ్ఞానము తెలిసి, దాని భావము ప్రకారము నడచుకొనువాడు ముఖ్యుడు. జ్ఞానమును మరియొక విధముగా అర్థము చేసుకొని దేవుని ఇష్టప్రకారము కాకుండా నడుచువాడు మోక్షము పొందలేడు.☞
(20) మత్తయి సువార్త, 7వ అధ్యాయము, 22, 23వ వచనములు.(22) ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా! నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా! నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా! అని చెప్పుచుందురు.
(23) అప్పుడు నేను మిమ్ములను ఎన్నడును ఎరుగను. అక్రమము చేయువారలారా! నావద్ద నుండి పొండని వారితో చెప్పుదును.ప్రభువు యొక్క గొప్పతనమును తెలిసినవారు కొందరు పరలోక రాజ్యాధిపతియైన పరమాత్మను మరచి ప్రభువును మాత్రము స్తుతించుచుందురు. సర్వ ప్రపంచమునకు తండ్రియైనవాడు, పరమ పితయైనవాడు తననుండి పంపిన భాగమే ఏసుప్రభువు. పరమాత్మకు ఎంతశక్తి ఉన్నదో ప్రభువుకు అంతే శక్తి ఉండును. ప్రభువును స్తుతించినప్పటికీ పరమ తండ్రిని స్తుతించినట్లే. ఎందరో ప్రభువును స్తుతించుచున్నారు. కానీ కొందరు స్వార్థవరులుగా, కొందరు నిస్వార్థవరులుగా దేవుని ఎడల కలరు. పరలోకపిత తన వాక్యములను తాను పంపిన వాని ద్వారా ఎన్నోమార్లు ప్రకటించుకొన్నాడు. పరమ తండ్రి యొక్క వాక్యములు తెలిసి, ఆయన యొక్క నిజతత్త్వము తెలియనివారు అనేకులుగలరు. తండ్రి వాక్యములను చదివినంతమాత్రమున, వినినంతమాత్రమున అలాగునే స్తుతించినంత మాత్రమున తండ్రి యొక్క స్థితిని భావమును గ్రహించు స్థితిలో లక్షమందికి ఒకరు కూడా లేరని చెప్పవచ్చును. ప్రభువు ద్వారా ప్రకటించబడినవి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యములు. దేవుని యొక్క జ్ఞానముగానీ, ఆజ్ఞలుగానీ, వాక్యములుగానీ అన్నియూ ప్రభువు వాక్కు ద్వారానే ప్రకటితమైనవి. కనిపించు ప్రభువు కనిపించని దేవుని యొక్క చిహ్నము. దేవునికి ప్రతిరూపమైన వాడు ప్రతినిధియైనవాడు ప్రభువు. వాక్యములలోనున్న జ్ఞానమును, ఆజ్ఞలను అర్థము చేసుకోలేనివాడు ప్రభువును స్తుతించినప్పటికీ పూర్తి లాభమును పొందలేడు.
ప్రభువును గొప్పవానిగా తలచి ఆయనను స్తుతించుట వలన కొంత లాభము మాత్రము పొందగలరు. మానవునికి పూర్తి లాభమైనది పరలోక ప్రాప్తియేనని తెలియుము. ఈ సాతాను (మాయ) లోకము నుండి విడవబడి దేవుని లోకమున ప్రవేశించుటయే ప్రతి ఒక్కనికీ పూర్తి ఫలితమని తెలియవలెను. ప్రస్తుతమున్న సాతాను నివాసముంటున్న ఈ లోకములోనికి ఎప్పుడూ ప్రవేశించకుండా దేవుని లోకమైన పరమ పదములో చేరిపోవడము మానవుని యొక్క పెద్ద చివరి లాభమని చెప్పవచ్చును. పరలోక ప్రాప్తికంటే మించిన లాభము మనిషికి మరియొకటి లేదు. అంత పెద్ద లాభము రావాలంటే, సాతాను సంబంధము అనగా ప్రకృతి లేక మాయ యొక్క సంబంధము లేకుండా పోవాలంటే దేవుని జ్ఞానము పూర్తి అర్థమై ఉండాలి. ఆయన వాక్యములోని లోతైన జ్ఞానమును, ఆయన ఆజ్ఞలోని హద్దును తెలియనివాడు కొంత భక్తుడేగానీ పూర్తి విశ్వాసుడు కాదని తెలియాలి. ప్రభువు చెప్పిన వాక్యములలోని సంపూర్ణ జ్ఞానమును ఆయన చెప్పిన ఆజ్ఞలలోని హద్దు లేక గీతను దాటకుండా వర్తించువాడు ధన్యుడగును. పరమాత్మ యొక్క పూర్తి జ్ఞానము తెలియనివాడు ఎంత బోధకుడైనా, ఎంత స్తుతివరుడైనా పూర్తి విశ్వాసుడు కాదనియే చెప్పవచ్చును. అట్లని అతనిని తీసివేయడము లేదని గ్రహించాలి. అతను దేవుని మీద విశ్వాసవరుడే కానీ సంపూర్ణ విశ్వాసవరుడని చెప్పడము లేదు. దేవుని జ్ఞానము సంపూర్ణముగా తెలియువరకు ప్రపంచములో కొంత విశ్వాస లోపము మానవునిలో దాగి ఉంటుంది. అది ప్రస్తుతానికి కనిపించకపోయినా ఎప్పుడో ఒకప్పుడు బయటపడగలదు. పూర్తి ప్రభువు భక్తులమనుకొన్న వారికి పెద్ద పెద్ద బోధకులకు కూడా వారియందు సంపూర్ణముగా దేవుని జ్ఞానము లేకపోతే ఏదో ఒక కోణములో అవిశ్వాసము దాగి ఉంటుంది. అందువలన ప్రభువు ''నన్ను పెదవులతో ఘనముగా చెప్పుకొను వానికంటే మనసుతో పూర్తి విశ్వసించువాడు శ్రేష్ఠుడన్నాడు.'' పూర్తి విశ్వాసము రావాలంటే సంపూర్ణముగా దేవుని జ్ఞానము అవసరము.
ప్రభువును ప్రభువుగానే, దేవున్ని దేవునిగానే అర్థము చేసుకొన్న వారు ఇద్దరూ ఒకటేనని తెలియనివారు ప్రభువు తిరిగి ప్రభువుగానే వస్తాడని అనుకొనువారు దేవుని యొక్క విశాలత్వము తెలియనివారని చెప్పవచ్చును. దేవుడు సనాతుడనీ, ఆయనకు ఆది అంత్యము లేదనీ తెలియనివాడు, దేవుడు ఎన్నోమార్లు భూమిమీదకు వచ్చి పోయాడనీ, తిరిగి వస్తాడనీ ఆయనకు అవసరమనిపించినపుడల్ల తప్పక వస్తాడనీ తెలియనివాడు సంపూర్ణ జ్ఞాని కాదనియే చెప్పవచ్చును. పరిపూర్ణ జ్ఞానము గలవాడు దేవుని రాకను గుర్తించగలడు. సంపూర్ణ జ్ఞానము లేనివాడు దేవుని రాకను గుర్తించలేడు. దేవుడు మానవునిగా వచ్చి ఎదురుగా నిలబడినప్పటికీ పై రూపమును, పనులను మాత్రము చూడగలవాడు దేవున్ని గుర్తించలేడు. అటువంటి వారు క్రైస్థవులలో మేము విశ్వాసులమనుకొని ఉండినప్పటికీ ప్రభువు మారువేషములో వచ్చితే, వచ్చినవాడు ప్రభువని గుర్తించలేక ఆయనకు కూడా బాప్తిస్మమిస్తామనగలరు.
భూమిమీద అవిశ్వాసులకంటే విశ్వాసులు శ్రేష్ఠులు, విశ్వాసులకంటే పూర్తి విశ్వాసముగల వారు పూర్తి శ్రేష్ఠులు. సంపూర్ణ విశ్వాసులకే పరలోక ప్రవేశము గలదు. అంతవరకూ వారిని దేవుడు ఒప్పుకోడు. సంపూర్ణ జ్ఞానులైనవారినే దేవుడు పరలోక ప్రవేశములో గుర్తించును. అట్లుకాని వారిని గూర్చి నాకు తెలియదని చెప్పును. కావున సంపూర్ణ జ్ఞానులగుటకు ప్రయత్నించవలెను. చాలామంది దేవునికి దగ్గర కావాలని, దేవుని రాజ్యములో ప్రవేశించాలని అనుకొనుచుందురు. కానీ వారు సాతాను రాజ్యములోనుండుట వలన సాతాను (మాయ) వారిని దేవుని వైపు పోకుండునట్లు, పూర్తి జ్ఞానులు కాకుండునట్లు తన ప్రయత్నము తాను చేయుచునే ఉండును. సాతాను దేవునికి వ్యతిరేఖమైనదని తెలిసిన బోధకులు కూడా సాతాను పనులేమిటో తెలియకున్నారు. సాతాను వివరము తెలియని వారు ఎందరో దాని మార్గములో ఉంటూ మేము దేవుని మార్గములో ఉన్నామని భ్రమిస్తున్నారు. అందువలననే దేవుడు బోధకులను తనకు దగ్గరగానున్నట్లున్న వారిని కూడా తనలోనికి ప్రవేశము లేదన్నాడు.
పై వాక్యములో ''నా నామముతో దయ్యములను వెళ్ళగొట్టినప్పటికీ నా నామముతో రోగములను పోగొట్టి అద్భుతములు చేసినప్పటికీ వారిని అక్రమము చేయువారిగా చెప్పుచున్నాననెను. వారిని నా వద్దనుండి పోండని చెప్పెదననెను.''
నేడు సమాజములో దేవుని నామముతో అద్భుతములు చేయువారిని నిజమైన భక్తులుగా, దేవునికి దగ్గరనున్న వారిగా ప్రజలు తలచుచున్నారు. అద్భుతములు చేయువారు కూడా తాము ప్రభువుకు దగ్గరవారమను కొనుచున్నారు. ప్రభువు మహిమలు తమ ద్వారా బయల్పడుచున్నవని అందువలన తాము ప్రభువుకు సన్నిహితులమనీ, ప్రభువు వాక్యమును స్తుతించి రోగిని తాకిన రోగి యొక్క రోగము క్షమించబడి పోతున్నదనీ అది మా ద్వారా జరుగుట వలన ప్రభువు మహత్యము మా ద్వారా జరుగుచున్నదనీ తలచుచున్నారు. మహత్యములు జరుగుట నిజమే, దాని ద్వారా ప్రభువు అందరికి తెలియడము నిజమే, అయితే పై వాక్యము ప్రకారము మనము ప్రభువుకెందుకు సరిపోలేదని యోచించలేదు. ఈ విషయములో ప్రభువు వాక్యములే మరచిపోయారు. తాము చేయుచున్నది మంచి పనేయైతే, అది ప్రభువు మహత్యమేయైతే ప్రభువెందుకు చీదరించుకొంటున్నాడు? ప్రభువెందుకు మీరు అక్రమ మార్గములో నడచుచున్నారన్నాడు? ప్రభువు తన వాక్యములో అలా చెప్పాడంటే ఆ మాట నూటికి నూరుపాళ్ళు నిజమై ఉంటుంది.
ప్రభువు మాటలోని నిజమేమిటని యోచించి చూచినట్లయితే నమ్మశక్యముగాని సత్యములు బయల్పడుచున్నవి. అవి ఏమిటనిన ప్రభువు నామముతో చేయు మహత్యములు దేవునివా లేక సాతానువా అని మానవుడు గ్రహించలేకపోవడము పెద్ద తప్పు. ప్రజల దృష్ఠిలో గురువులుగా, బోధకులుగా, దేవునికి ప్రతిబింబములుగానున్నట్లు కనిపించువారు కూడా దేవుని మార్గములోనున్నట్లు భ్రమిస్తూ, మాయ మార్గములో ఉన్నారని తెలియుచున్నది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ మా మాటతో చాలామంది బోధకులకు కూడా కోపమొచ్చును. కానీ నేను నిమిత్త మాత్రుడను ఇది నా వాక్యము కాదు దేవుని వాక్యమేనని మీరు పైన వ్రాయబడిన మత్తయి ఏడవ అధ్యాయములోని 22వ వాక్యము గుర్తు చేసుకోండి. ''దేవుడే అక్రమములన్నాడు, దేవుడే మీరెవరో నాకు తెలియదు పో'' అన్నాడు. కావున మనమంతా ఇప్పుడు ఆలోచించవలసినది ఏమనగా! ఆనాడు ప్రభువునే శోధించిన మాయ నేడు ఏ రూపములో మనలను శోధిస్తున్నదోనని యోచించాలి. దేవుని జ్ఞానములో మాయను (సాతానును) తెలియడము కూడా ఒక భాగమే. దానిని తెలియకపోతే దేవుడు కాకున్నా దేవుని రూపములోనున్న సాతానును అనుసరిస్తూ దేవుని అనుసరిస్తున్నామని పొరపడగలరు. అదే రీతిలోనే నేడు చాలామంది వక్తలు, గురువులు, బోధకులు పొరపడుచున్నారు. ఎన్ని రూపములనైనా మార్చగల మాయ (సాతాను) దేవుని నామముతో మహత్యములు అద్భుతములు చేయిస్తున్నది. ఇది దేవునికి ఇష్టముండదని తెలియనివారు అదియే నిజమైన భక్తిగా తలచి ముందుకు సాగలేకున్నారు. భయంకర సత్యమేమంటే, దేవుడని మాయను ఆశ్రయించిన గ్రుడ్డివారు భూమిమీద చాలామంది ఉన్నారు. తాము ఆశ్రయించినది దేవుని మార్గము కాదు సాతాను మార్గమని వారు తెలియలేని స్థితిలో ఉన్నారు. సాతాను ప్రభావము నుండి బయటపడు అవకాశమే లేనట్లున్నది. ఈ విషయమై దేవుడే స్వయముగా దిగివచ్చి చెప్పినా దేవున్నే నిందించి దూషించగలరుగానీ, తాము మారలేరు. వారియందు మాయయే దేవునిగా కన్పించుచుండగా దేవుడు వారికి మనిషిగానే కన్పించును.
దేవుని రాజ్యములో ప్రవేశింపకోరు వారు, చావుపుట్టుకలు లేని దేవునిలో ఐక్యమై ఆయనయందే ఉండకోరువారు దేవుని మీద విశ్వాసము ఉండాలనుకొనువారు పై వాక్యమును గుర్తు చేసుకొని అద్భుతములను చేయు వారిని సహితము ఎందుకు ఏవగించుకొన్నాడో, ఎందుకు అక్రమములన్నాడో కొంత ఆలోచించండి. దేవునికి ఇష్టము లేని వారెవరో, ఇష్టముండు వారెవరో యోచించండి. దేవుని వాక్యమును తెలుసుకొని అందులోని దేవుని జ్ఞానమును, ఆయన ఆజ్ఞలను తెలుసుకొని జ్ఞానమును సంపూర్ణముగా ఇముడ్చుకొని, ఆజ్ఞను తమ ఎడల గీచిన గీతగా తలచి దానిని ఏమాత్రము దాటకూడదని తెలియాలి. గీత లోపలుంటే దేవుని రాజ్యము, గీత దాటితే సాతాను రాజ్యమని తెలియాలి. ఆయన పరిశుద్ధ గ్రంథములో మానవాళి ఎడల గీచిన గీతను జ్ఞాపకము చేసుకొంటూ సాతాను ఎడల అప్రమత్తముగా ఉండవలెను.☞
(21) మత్తయి సువార్త, 8వ అధ్యాయము, 22వ వచనము.(22) ఏసు అతనిని చూచి ''నన్ను వెంబడించుము. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొన నిమ్మని చెప్పెను.''ఏసు శిష్యులలో ఒకడు నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని పాతిపెట్టుటకు పోయి వస్తాను మీరు సెలవివ్వండి అని అడిగినప్పుడు ఏసు అతనితో అన్న మాట పై వాక్యములో గలదు. ఏసు చెప్పిన మాట అర్థము కాని విధముగా ఉన్నది. అందువలన ఏసు చెప్పినదేమని కొందరు ఆలోచించుచున్నారు. ఈ విషయమై మనము ఆలోచిస్తే ప్రపంచములో మనుషులను రెండు రకములుగా విభజించవచ్చని చెప్పవచ్చును. జ్ఞానమును తెలిసి దానిని యోగముగా ఆచరించినవారు నిత్య జీవనమును పొందుచున్నారు. అటువంటి వారు భూమిమీద అరుదుగా ఉందురు. నిత్య జీవనమునకు అర్హులైన వారు మృతులుగా లెక్కించబడరు. నిత్య జీవనమును పొందినవాడు ఎప్పటికీ మృతుడు కాకుండా ఉండును. అట్టివానిని మోక్షము పొందినవాడని చెప్పవచ్చును. జ్ఞానము తెలియనివారిని, యోగము చేయని వారిని మృతులు అని అనవచ్చును. అటువంటి వానికి నిత్య జీవనము ఉండదు. వానిని మృతుడు అని చెప్పవచ్చును. వాడు ఎప్పటికయినా చనిపోవువాడని మృత్యువు పొందువాడని చెప్పవచ్చును. అజ్ఞానులు, అజ్ఞానులను పాతిపెట్టుకొనుచుందురు. అందువలన మృతులు మృతులను పాతిపెట్టుకొననిమ్మని వాక్యములో చెప్పాడు. జ్ఞానము తెలియని వారినందరినీ మృత్యువాత పడువారిగా లెక్కించి మృతులు అని అందరినీ కలిపి చెప్పడమైనది. జ్ఞానము తెలిసినవాడు జ్ఞానము తెలియని వారితో సంబంధము పెట్టుకోకూడదు. అందువలన ఏసు తన శిష్యునితో నీవు జ్ఞానము తెలిసిన వానివి, నా వెంట వెంబడించుము అని చెప్పాడు. జ్ఞానము తెలియనివాడు జ్ఞానము తెలియని వారిని పాతిపెట్టుకొమ్మని చెప్పాడు.☞
(22) మత్తయి సువార్త, 9వ అధ్యాయము, 12, 13వ వచనములు.(12) రోగులకేగానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర లేదు కదా!
(13) నేను పాపులను పిలువ వచ్చితిని గానీ నీతివంతులను పిలువ రాలేదు.దేవుడు భూమిమీదికి అప్పుడప్పుడు ధర్మసంస్థాపనకు వస్తాడని ముందే చెప్పుకొన్నాము. అలాగే ఏసు నేను అజ్ఞానవంతులను జ్ఞాన మార్గములోనికి పంపుటకు వచ్చానని చెప్పాడు. నేను పాపులను పిలువ వచ్చితిని గానీ నీతివంతులను కాదు అన్నాడు. పాపులు అనగా ఇక్కడ జ్ఞానము తెలియని అజ్ఞానులని అర్థము చేసుకోవలెను. అలాగే నీతివంతులు అనగా జ్ఞానము తెలిసినవారని అర్థము. అజ్ఞానము అను అనారోగ్యము గల వారికి మాత్రమే జ్ఞానము అను మందు ఇచ్చి వాని రోగమును పోగొట్టుటకు దేవుడు బోధకుడు అను వైద్యుని రూపములో భూమిమీదికి వచ్చి అజ్ఞాన రోగమును లేకుండా చేయును. జ్ఞానము అను ఆరోగ్యము గల వానికి వైద్యుడు అను బోధకుడు అవసరము లేదు. లోకములో అజ్ఞాన రోగము పూర్తిగా వ్యాపించి మనుషులందరూ రోగులయినప్పుడు దేవుడు భూమిమీద వారికోసమే అవతరించి తన ధర్మములను మందునిచ్చి అజ్ఞానులుగాయున్న వారిని జ్ఞానులుగా మార్చివేయును. దేవుడు వైద్యునిగా అవతరించకపోతే లోకమంతా అజ్ఞానమను అనారోగ్యమై పోవును. అందువలన దేవుడు అవతరించి తన జ్ఞానమును అజ్ఞానులకు తెల్పును.☞
(23) మత్తయి సువార్త, 8వ అధ్యాయము, 23, 24, 25, 26 వచనములు.(23) ఆయన దోనె నెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.
(24) అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోనె అలల చేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించు చుండగా!
(25) వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించి పోవుచున్నాము మమ్ములను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.
(26) అందుకాయన ''అల్ప విశ్వాసులారా! ఎందుకు భయపడుచున్నారని'' వారితో చెప్పి లేచి గాలిని, సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను.ఇది ఏసు జీవితములో జరిగిన ఒక సంఘటన. ఇందులో ఏసు బోధించినది ఏదీలేదుగానీ, ఈ సంఘటనలో మనము తెలియవలసినది ఎంతో యున్నది. ఇక్కడ సముద్రము, తుఫాను రెండూ ప్రకృతికి సంబంధించి నవి. తుఫానులోని గాలిగానీ, సముద్రములోని నీరుగానీ రెండూ ప్రకృతిలోని భాగములే. ప్రకృతి పరమాత్మ ఆధీనములో మాత్రముండును. బయటి ప్రకృతియైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములు ఒక్క పరిశుద్ధాత్మయిన దేవుని ఆధీనములో యున్నవి. పరమాత్మ తర్వాత దైవత్వము గల ఆత్మకు కూడా ప్రకృతి మీద అధికారము లేదు. శరీరములోని ఆత్మకు శరీర రూపములో యున్న చర ప్రకృతి మీద మాత్రము అధికారముండును. మార్పుచెందని అచర ప్రకృతిమీద ఆత్మకు అధికారము ఉండదు. ఆత్మ మాటను ప్రకృతి వినదు. బయట కనిపించు ప్రకృతి ఒక్క పరమాత్మయిన దేవుని మాటను మాత్రము వినగలదు. ప్రకృతి ఐదు భూతములతో కూడుకొన్నది. భూతము అనగా జీవుడు అని అర్థము. ప్రకృతిలోని ఐదు భాగములు ఐదు జీవులుగా ఉండుట వలన దేవుడు చెప్పినమాటను ఐదు భూతములు గౌరవించుచున్నవి. పరమాత్మ చెప్పినట్లు నడుచుకొనును.
ఏసు సామాన్యమైన మనిషివలెయున్న పరిశుద్ధాత్మ అయిన దానివలన ఏసు చెప్పినమాటను గౌరవించి సముద్రములో లేచిన తుఫాను ఆగిపోయినది. బయట ప్రకృతిని శాసించు శక్తి దేవునికొక్కనికే గలదు కావున ఏసును దేవుని అవతారముగా చెప్పవచ్చును. దేవుడు మనిషివలె భూమిమీదికి వచ్చి తన జ్ఞానమును చెప్పిపోవునని ప్రథమ దైవగ్రంథము భగవద్గీతలోని జ్ఞానయోగము అను అధ్యాయమున ఏడు, ఎనిమిది, తొమ్మిది శ్లోకములయందు చెప్పియున్నారు. అయితే దేవుడు మనిషి ఆకారముగా వస్తే ఆయన సాధారణ మనిషి కాకున్ననూ, సాధారణ మనిషివలె కనిపించుట వలన, దేవుని అవతారమైన భగవంతున్ని చూచినా అతను సాధారణ మనిషివలె ఉండుట వలన, ఆయనను (దేవున్ని) ఎవరూ గుర్తించుటకు వీలులేదు. దేవుడు మనిషిగా వస్తే ఆయనను కనుగొనుటకు వీలులేకున్నా చివరకు దేవున్ని తెలియుటకు రెండు ఆధారములు గలవని చెప్పవచ్చును. ఒకటి ఎక్కడ దైవధర్మములు బోధింపబడుచున్నవో అక్కడ దేవుని అవతారము ఉండవచ్చని తెలియవచ్చును. రెండవది ఎక్కడ పక్రృతి ఎవరి మాట వినుచున్నదో అక్కడ అతనిని దేవుని అవతారముగా గుర్తించవచ్చును. మనిషి రూపములో యున్న దేవున్ని గుర్తించుటకు రెండు అవకాశములు గలవని తెలియుచున్నది. అందులో ఏసు సముద్రమును అణిగిపోమని చెప్పినప్పుడు తుఫాను అణిగిపోవడమును చూస్తే అక్కడ తుఫానును శాసించినది దేవుడేయని తెలియవచ్చును. ఇట్లు ధర్మములను తెలియజెప్పినప్పుడు, ప్రకృతిని శాసించినప్పుడు మనిషి రూపములో యున్న దేవున్ని గుర్తించవచ్చును. కావున ఏసు దైవజ్ఞానమును బోధించాడు, అట్లే ఆచరించి చూపించాడు. ప్రకృతిని శాసించాడు. కనుక ఏసును దేవుని మారురూపుగా వచ్చిన దేవుడని తెలియవచ్చును. సముద్రము మీద ప్రయాణములో తుఫానును అణిగిపొమ్మని చెప్పడము వలన, చెప్పిన వెంటనే తుఫాను ఆగిపోవడము వలన ఏసు దేవుడేయని నిరూపణకు వచ్చినది.☞
(24) మత్తయి సువార్త, 9వ అధ్యాయము, 6వ వచనము.(6) పాపములను క్షమించుటకు భూమిమీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్లెను.పాపమును క్షమించుటకు భూమిమీద మనుష్య కుమారునికి అధికారము కలదని స్వయముగా ఏసు చెప్పాడు. పక్షవాయువు వచ్చిన వానిని ఏసువద్దకు తీసుకురాగా నీ పాపములు క్షమించబడియున్నవని పక్ష వాయువుగల వానికి చెప్పెను. అప్పుడు అక్కడేయున్న శాస్త్రులు కొందరు ఏసు దైవదూషణ చేయుచున్నాడని వారు తమతో తాము అనుకోగా ఏసు వారి తలంపులను గ్రహించి ''మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు? నీ పాపములు క్షమించబడియున్నవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా?'' అని ప్రశ్నించి వారికి అర్థమగులాగున పాపములను క్షమించుటకు భూమిమీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోండని చెప్పి, పక్షవాయువు వచ్చిన వానిని చూచి నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన మంచమును ఎత్తుకొని తన ఇంటికి వెళ్లెను.
దీనినంతటినీ గమనిస్తే మాకు అంతా తెలుసు అనుకొన్న శాస్త్రులు ఏసును చెడుగా అనుకోవడము వలన ఏసు అలా చేసి చూపించాడు. అంతేకాక పాపక్షమాపణ భూమిమీద మనుష్యకుమారునికి కలదని చెప్పాడు. ఆయన దేవుని కుమారుడుగా భూమిమీదికి వచ్చియున్నా తనను తాను తగ్గించుకొని తనను మనుష్య కుమారునిగానే చెప్పుకొన్నాడు. అంతేగాక పాపక్షమాపణ భూమిమీద తనకొక్కనికే కలదని చెప్పడమేకాక, చేసి చూపించాడు. పాపములను క్షమించు అధికారము దేవునికి (పరిశుద్ధాత్మకు) ఒక్కనికే కలదని తెలిసినవాడు ఏసుగా వచ్చినవాడు ఎవడో తెలుసుకోగలడు. ఆయన పరిశుద్ధాత్మ నుండి వచ్చిన దేవుడైనా తనను ఎవరూ గుర్తించనట్లు మనుష్య కుమారునిగా చెప్పడము జరిగినది. కాళ్లు చేతులు పనిచేయని పక్షవాయువు గలవాడు ఏసు చెప్పిన వెంటనే లేచి తన మంచమును తానే ఎత్తుకొని పోయాడు. అది చూచిన ప్రజలు ఆశ్చర్యపోయారు. అంతగొప్ప కార్యమును చేసిన ఏసును చివరకు సాధారణ మనిషిగానే తలవడమేకాక తప్పు చేసిన ముద్దాయిగా న్యాయస్థానములో నిలబెట్టారు. అందువలన మనుషులు 'చేసిన మేలును మరచేవారని' చెప్పవచ్చును.☞
(25) మత్తయి సువార్త, 10వ అధ్యాయము, 20వ వచనము.(20) మీ తండ్రి ఆత్మ మీలోయుండి మాటలాడుచున్నాడేగానీ మాటలాడువారు మీరు కారు.ఈ వాక్యము సర్వసాధారణ జ్ఞానముగా కనిపించినా చాలా ముఖ్యమైన వాక్యమని చెప్పవచ్చును. ఆధ్యాత్మిక విద్యలో అతి రహస్యమైన జ్ఞానము ఇందులో ఇమిడియున్నది. దీనిని వివరించుకొని చూచిన వాక్యములో చెప్పిన 'మీ తండ్రి' అనువాడు బయట భౌతిక దేహమునకు తండ్రియైనవాడు కాదుయనీ, అభౌతికమైన జీవాత్మకు తండ్రియైన వానినే చెప్పుకోవలెనని తెలియవలెను. జీవాత్మకు తండ్రియైనవాడు శరీరములో యుండి శరీరమును అన్ని విధములా నడిపించు ఆత్మయని తెలియవలెను. జీవాత్మకు ఆత్మ తండ్రికాగా, ఆత్మకు పరమాత్మ తండ్రిగా యున్నాడని మరువకూడదు. మనిషిగా జీవాత్మ యుండగా, జీవాత్మ అయిన మనిషిని జీవుడు చేసుకొన్న కర్మప్రకారము అన్ని విధములా ఆడించుచూ జీవుని చేత కర్మలను (పాపపుణ్యములను) ఆత్మ అనుభవింపజేయుచున్నది. శరీరములో ప్రతీ కార్యమును కార్యకర్తవలె యుండి చేయుచూ, శరీరముతో చేయిస్తూ జీవాత్మను సుఖదుఃఖములననుభవింపజేయుచున్నది.
జీవుడు శరీరములో ఏ కార్యమును చేయనివాడై ఊరక యుంటున్నాడు. కార్యములను చేయకపోయినా జరిగిన పనిలో గల సుఖ దుఃఖములను మాత్రము మౌనముగా అనుభవించుచున్నాడు. శరీరములో మనిషిగా జీవాత్మనే చెప్పుచున్నా, జీవాత్మ ఏ కార్యమును చేయక, చేయుటకు చేతకాక ఊరకయున్నా, శరీరములో జరిగే కార్యములను అన్నిటినీ ఆత్మే చేయుచున్నా, జీవుడు అజ్ఞానము చేత ఆత్మ చేయలేదనీ, అన్ని కార్యములను నేనే చేయుచున్నానని అహము చెప్పినమాట విని, తననే కార్యకర్తగా భావించు కొనుచున్నాడు. వాస్తవముగా కార్యకర్త ఆత్మ అయినప్పటికీ ఆత్మను లెక్కించక, ఆత్మంటూ ఒకటున్నదని మరచినవాడై తననే అన్ని కార్యములకు కర్తగా అనుకొంటున్నాడు. అటువంటి అజ్ఞాన మనిషికి జ్ఞానము కల్గునట్లు ఏసు తన మాటలలో పై వాక్యమును చెప్పాడు. ''మీ తండ్రి ఆత్మ మీలో యుండి మాటలాడుచున్నదే గానీ, మాటలాడువారు మీరు కాదు'' అని అన్నాడు. ఈ వాక్యమును బట్టి చేసే పనియేగాక, మాట్లాడే మాట కూడా జీవాత్మ మాటలాడలేదనీ, మాటలను కూడా ఆత్మే మాట్లాడుచున్నదనీ, మేము మాట్లాడుచున్నామని మనుషులు అనుకోవడము పూర్తి అజ్ఞానమగుననీ ఏసు చెప్పాడు. దశేంద్రియములు చేయు ఏ కార్యముగానీ జీవాత్మ చేయలేదనీ ఇంద్రియ భాగముల చేత ఆత్మే చేయుచున్నదని తెలియుచున్నది. ఈ సత్యమును తెలియడము జ్ఞానములలో కెల్ల ఉత్తమమైన జ్ఞానము.☞
(26) మత్తయి సువార్త, 10వ అధ్యాయము, 30వ వచనము.(30) మీ తల వెంట్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి.మనిషి తన మదిలో ఎన్నో విషయములను దేవునికి విన్నవించు కొనుచుండును. దేవునికి చెప్పుకొనుచున్నాడంటే దేవునికి తెలియదనియే వాని ఉద్దేశము. మనుషులందరిలోను ఆ భావముండుట వలన దేవుని గుడిలో దేవుని ఎదుట భయము, భక్తి ప్రదర్శించినవాడు వెలుపలికి వచ్చిన తర్వాత ఏమి చేసినా దేవునికి తెలియదను భావముతోనే ప్రవర్తించుచుండును. దేవాలయములో భక్తిగా ఉన్నవాడు ఆలయము బయటికి వచ్చిన తర్వాత రైలులో ఇద్దరి సీటు తనకొక్కనికే కావాలని ఆక్రమించుకొని ఇతర ప్రయాణికులకు తావివ్వక పోట్లాడుచుండును. అది మంచి పద్ధతి కాకపోయినా అలా చేస్తున్నాడంటే గుడిలోనే దేవునికి తెలిసేది, రైలులో తెలియదనుకోవడము వలననే అలా చేశాడు. దేవునికి అన్నీ తెలియుననీ, దేవుడు సూది మోపను సందులేక ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాడనీ, ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశములో తాను ఒక్కడు చేసిన తప్పును కూడా దేవుడు అక్కడుండి చూస్తున్నాడనీ వానికి తెలియదు. మానవుడు దేవునికి అన్నీ తెలియవను భావములో ఉన్నాడు కనుక దేవుని మహత్యమును గూర్చి ప్రభువు తెలియజేస్తూ పై వాక్యము చెప్పాడు.
పై వాక్యములో దేవుడు మానవుల ఎడల ఎంత జాగ్రత్తగా ఉన్నది అర్థమగును. దేవుడు మానవులపట్ల ఒక విధానమును ఏర్పరచి, దాని ద్వారా ప్రతిదీ గుర్తించగల్గుచున్నాడు, నెరవేరునట్లు చేయుచున్నాడు. 'కర్మ విసర్గ'మను చిన్నచిన్న లెక్కాచారములు కూడా దేవునివద్ద గలవు. దాని వలననే మనిషి తన జీవితములో కనురెప్పలు ఎన్నిమార్లు మూసి తెరవాలనునది నిర్ణయించి అలాగే ఒకటి కూడా ఎక్కువ తక్కువ లేకుండా నెరవేరునట్లు చేయుచున్నాడు. కర్మ విసర్గము ద్వారా మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉండాలో, ఏది ఎప్పుడు ఊడిపోవాలో కూడా లెక్కించబడి ఉన్నది. తల వెంట్రుకలతో సహా లెక్కాచారమున్నప్పుడు మనిషికి జరుగు పెద్ద చిన్న కార్యములన్నీ దేవుని చేత గుర్తించబడియే ఉన్నవి. ఎవనికి ఏ సమయములో ఏ ఆపద వచ్చునది, దానిలో ఎంత బాధపడవలసినది అన్నియూ సూక్ష్మాతిసూక్ష్మముగా దేవుని చేత గుర్తించబడియున్నాయి. దేవునికి భూమిమీద జరిగినవి, జరుగుచున్నవి, జరుగబోవునవి అన్నీ తెలియునని భగవద్గీతలో కూడా ప్రభువు చెప్పడము జరిగినది. దీనినిబట్టి దేవునికి తెలియనిది ఏమీ లేదన్న విషయము స్పష్టమగుచున్నది.☞
(27) మత్తయి సువార్త, 10వ అధ్యాయము, 34, 35, 36 వచనములు.(34) నేను భూమిమీదికి సమాధానమును పంప వచ్చితినని తలంచకుడి. ఖడ్గమునే గానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు.
(35) ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కన్న కూతురుకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
(36) ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులు అగుదురు.ఈ మూడు వాక్యములు లోకవిరుద్ధముగా కనిపించునట్లు గలవు. ఏసు మనుష్యుల మధ్య వివాదము మరియు విరోధము పెట్టవచ్చాడని చెప్పడము మంచిగా కనిపించకున్నా, ఆ విధముగా జరుగుచున్నది మాత్రము వాస్తవమే. అట్లని ఏసు ఉద్దేశ్యపూర్వకముగా మనుషుల మధ్య వివాదములు సృష్ఠించలేదు. ఆయన వచ్చినది మనుషులను అజ్ఞానము నుండి జ్ఞానము వైపు నడిపించే దానికే గానీ వివాదములు పెట్టను కాదు. ఆయన మంచి ఉద్దేశ్యముతో ప్రజలకు జ్ఞానము చెప్పితే అది మనుషుల మధ్యలో వివాదముగా మారుచున్నది. చల్లగా ఉండవలెనని నీళ్ళు చల్లితే ఇసుక చల్లబడును అయితే సున్నపురాళ్లు ఇంకా వేడెక్కి తన రూపమును మార్చుకొని సున్నముగా తయారగును. అలాగే ఏసు చెప్పిన జ్ఞానము వలన జ్ఞాన సంస్కారులు సంతోషించగా, జ్ఞాన సంస్కారము లేనివారిలో వివాదములు పుట్టుకొస్తున్నవి. భర్త జ్ఞానము తెలియుటకు ప్రయత్నిస్తే భార్య ఒప్పుకోవడము లేదు. అలాగే కొన్నిచోట్ల భార్య జ్ఞానము తెలియుటకు ప్రయత్నిస్తే భర్త ఒప్పుకోవడము లేదు. ఈ విధముగా ఏసు జ్ఞానమును అర్థము చేసుకోలేని కొందరు అర్థము చేసుకొను వారితో పేచీ పడుచున్నారు. అట్లు ఊహించని పరిణామము వలన తండ్రికి కొడుకుకు, తల్లికి కూతురుకు, అత్తకు కోడలుకు సరిపోక ఒకే ఇంటిలోనే ఒకరికొకరు శత్రువులుగా మారుచున్నారు. ఏసు ఉద్దేశ్యము మంచిదే అయినా అది ఊహించని పరిణామముతో మనుష్యులలో బంధుత్వమును కూడా మరచి శత్రుత్వమును కలుగజేయుచున్నది. అందువలన ఏసు పువ్వును ఇస్తే అది ముల్లుగా మారుచున్నది. ఆయన వంగేకట్టెను ఇస్తే అది గట్టిగా యున్న కత్తిగా మారుచున్నది. ఇదంతా మనుషులలోని గుణముల లోపమేగానీ ఆయన తప్పు ఏమీ లేదు.☞
(28) మత్తయి సువార్త, 10వ అధ్యాయము, 37వ వచనము.(37) తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించు వాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను, కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.తల్లితండ్రులు తమ బిడ్డల మీద ప్రేమ చూపుట సహజము. అలాగే బిడ్డలు తమ తల్లితండ్రుల మీద ప్రేమ చూపుట కూడా సహజమే. ఎక్కువ ప్రేమ వారి మధ్యనే ఉండును. తల్లితండ్రులకు తమ సంతతి మీద ఉన్నంత ప్రేమ ప్రపంచములో దేనిమీద ఉండదు. మనిషి మెదడులో గల గుణముల ప్రభావము అలాగే ఉండును. అయితే ప్రపంచములో అత్యంత ప్రేమ జ్ఞానము మీద, దేవుని మీద ఉన్నప్పుడే మనిషి ప్రపంచము వైపు పోకుండా జ్ఞానమువైపు పోగలడు. అట్లుకాకుండా జ్ఞానముకంటే ఎక్కువ ప్రేమ దేనిమీద ఉండినా వాడు జ్ఞానమువైపు పోజాలడు. మనిషిలో ఆరు మంచి గుణములు, ఆరు చెడు గుణములు ఉండును. మంచి చెడు గుణములు రెండూ బంగారు ఇనుప సంకెళ్లలాంటివి. 'సంకెళ్లు ఏ లోహముతో తయారయినా మనిషిని బంధించుటకే' అన్నట్లు గుణములలో మంచిదయిన ప్రేమ, చెడుదయిన అసూయ రెండూ మనిషిని జ్ఞానము వైపు పోనివ్వవు. గుణములకంటే మించినది జ్ఞానము మీద శ్రద్ధయని తెలియవలెను. గుణములలో ఆరు చెడు గుణములు ఇలా కలవు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర. అట్లే మంచి గుణములు వరుసగా ఇలా కలవు. దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమలు అని తెలియవలెను.☞
(29) మత్తయి సువార్త, 10వ అధ్యాయము, 38వ వచనము.(38) తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు.శిలువ అనుమాటను క్రైస్థవులు అప్పుడప్పుడు పలుకుచుందురు మరియు వినుచుందురు. ప్రతి క్రైస్థవుడు శిలువను మెడలో ధరించి యుందురు. అంతేకాక శిలువను అందరూ గౌరవించుచుందురు. శిలువ మీద ఏసు చనిపోయాడని, శిలువ మీద ఏసు శిక్షింపబడినాడని అందరికీ తెలుసు. ఏసు మరణమునకు ఆయుధముగా ఉపయోగపడిన శిలువ మీద క్రైస్థవులకు ఎందుకంత ప్రేమయో అని ఆలోచించి చూస్తే, తమకంటే గొప్పవాడు ఏమి చేస్తే అతనిని అనుసరించి అందరూ సహజముగా చేయుచుందురు. అలాగే ఎవరో శిలువను గౌరవిస్తే తమ దేవుడయిన ప్రభువు మరణమునకు ఆయుధముగా ఉపయోగపడిన శిలువను గొప్పగా ఎందుకు చూడాలని ఎవరూ ఆలోచించలేదు. తెలిసో తెలియకో ఇంతవరకూ జరిగిపోయినది. ఇకనైనా శిలువ విషయములో కొంత విచక్షణ కల్గి శిలువ యొక్క వివరమును తెలుసుకొందాము.
వాక్యములో శిలువను నీవు ఎత్తుకొంటే దేవుని మార్గములో నడువ గలవనీ, నిన్ను శిలువ ఎత్తుకుంటే నీవు సాతాను మార్గములో నడవగలవనీ ఏసు తన వాక్యములో హెచ్చరించాడు. అదే విషయమునే తెల్పుచు ''శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు'' అని చెప్పాడు. దాని అర్థము శిలువను ఎత్తుకొననివాడు దేవునికి ఇష్టుడు కాడు అని చెప్పడమైనది. శిలువ అనునది సాతానుయని మనము అర్థము చేసుకోవలసియున్నది. ఈ విషయము వివరముగా తెలియుటకు మా రచనలలోని ''శిలువ దేవుడా?'' యను గ్రంథమును చదవండి.
శిలువ అనగా పాముయని అర్థము. పామును మాయగా (సాతానుగా) పక్షిని (పావురమును) ఆత్మగా పోల్చడము ఆధ్యాత్మికములో ఉన్న విషయమే. సాతాను లేక మాయ అనునది మనిషి శరీరములోనే యున్నది. సాతాను మనిషిని ఎత్తుకొని అజ్ఞాన మార్గములో పయణించుచున్నది. సాతాను మనిషిని ఎత్తుకొన్నదంటే మనిషి బలహీనుడు సాతాను బలమైనదని అర్థము. అదే విధముగా మనిషి శిలువను ఎత్తుకొని ప్రయాణించుచున్నాడంటే మనిషి బలము ఎక్కువ సాతాను బలము తక్కువయని అర్థము. అందువలన ఏసు తన జీవితములో కొంతసేపు శిలువను మోసి చూపించాడు. అలా చూపడము సాతానును మనిషి జయించినట్లు చెప్పవచ్చును. అదే ఏసే కొంతసేపు శిలువ మీద ఎక్కాడు. అనగా శిలువ ఏసును మోయుచున్నదని తెలియుచున్నది. దాని అర్థము ఎంతటి వారినయినా సాతాను తన మార్గములో తీసుకుపోగలదని చెప్పవచ్చును. మనిషి జ్ఞానమార్గములో పోవాలంటే మనిషే శిలువను మోయాలి. కావున వాక్యములో ''తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు'' అని ఏసు చెప్పాడు.
సాతానును శిలువ రూపములో చూపుచున్నాము. శిలువ అనగా పాముయని కొండశిలువ అనగా పెద్ద పాము అని చెప్పవచ్చును. పెద్దపాము అనగా పెద్దమాయ అని కూడా చెప్పవచ్చును. మాయ మనిషిని తన ఇష్టమొచ్చిన దారిలో నడిపించి మనిషిని దేవునికి దూరముగా పంపుచున్నది. అటువంటి సాతానును (మాయను) జయించాలంటే మాయను విశ్లేషించి చూడాలి. అలా చూడగలిగితే మనిషి తలలోని గుణముల గుంపునే మాయ అని అంటున్నాము. గుణముల ప్రకారము నడచువాడు అజ్ఞాన మార్గములో పోవుచుండును. అటువంటి వానిని మాయ తన బలముతో మనిషిని మోయుచూ పోవుచున్నదని చెప్పవచ్చును. ఎవడయితే గుణములను జయించి వాటి మాట వినడో వాడు మాయను (సాతాను)ను జయించిన వాడని వాడే తన బలము చేత మాయను పట్టి ఎత్తుకొని జ్ఞానమార్గములో పోవుచున్నాడని తెలియుచున్నది. ఆ విధముగా శిలువ అని చెప్పబడు మాయను జయించి దానిని మనిషే ఎత్తుకొని జ్ఞానమార్గములో పోవువాడు దేవుని కృపకు పాత్రుడగును. ఆ విషయమునే వాక్యములో చెప్పాడు. శిలువ అనగా కట్టెలతో చేయబడినదని అనుకోకూడదు. సాతానుకు గుర్తయిన కొండ శిలువగా (పైతాన్‌గా) లెక్కించవలెను. ఆంగ్లములో పైతాన్ అనుమాటను కొందరు తెలుగు భాషలో సైతాన్ అని చెప్పగా, సైతాన్ అనే మాటయే సాతానుగా మారినదని తెలియవలెను. శిలువను (పామును) మాయకు గుర్తుగా, పక్షిని ఆత్మకు గుర్తుగా పెద్దలు చెప్పుచుందురు. ఏసు యోహాన్‌వద్ద బాప్తిస్మము పొంది బయటకు వచ్చినప్పుడు ఆత్మ పావురము వలె వచ్చి ఏసు శరీరములోనికి చేరినదని కూడా చెప్పారు. ఆత్మకు వ్యతిరేఖమయినది శిలువ. అందువలన మనిషి తన జ్ఞాన బలముచేత శిలువను కదలకుండా చేసి దానిని ఎత్తుకొని నడుపువాడు దేవుని కృపకు పాత్రుడు కాగలడని, పరలోకమునకు అర్హుడు కాగలడని చెప్పుచూ ఏసు పై వాక్యమును చెప్పాడు.☞
(30) మత్తయి సువార్త, 10వ అధ్యాయము, 40వ వచనము.(40) మిమ్ములను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనువాడు, నన్ను పంపిన వానిని చేర్చుకొనును.మనుషులు జీవాత్మలుకాగా, మనుషులను సృష్ఠించినవాడు ఆత్మకాగా, ఆత్మను ప్రకృతిని సృష్ఠించినవాడు పరిశుద్ధాత్మయనబడు పరమాత్మయని తెలియవలెను. అయితే పరమాత్మ మనిషిగా వస్తే ఆయనను ఆత్మ అనవలెనా లేక జీవాత్మయని అనవలెనా?యను ప్రశ్న రాగలదు. దేవుడు మనిషిగా వస్తే బయటికి జీవాత్మ గానే లెక్కించవలసియున్నది. మనుషులు అయిన జీవాత్మలను ఆత్మ చావులో తనయందు చేర్చు కొనుచున్నాడు. ఆత్మ మనుషులను చేర్చుకొన్నట్లే జీవాత్మ వలెయున్న మనిషిగా వచ్చిన దేవున్ని కూడా చేర్చుకొనును. అదే విషయమును ''మిమ్ములను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును'' అని వాక్యములో చెప్పారు. మనిషివలె జీవాత్మగా వచ్చినవాడు సాక్ష్యాత్తూ దేవుడే కనుక దేవుడు మనిషిగా వచ్చిన వానిని పంపాడు గనుక, ఆత్మ జీవాత్మవలె యున్న మనిషిని చేర్చుకొన్నప్పుడు మనిషిగా పంపినవాడు అయిన దేవుడే చేర్చుకొన్నట్లే కావున ''నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును'' అని వాక్యములో చెప్పాడు.☞
(31) మత్తయి సువార్త, 11వ అధ్యాయము, 9వ వచనము.(9) మీరు ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవును గానీ ప్రవక్తకంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను.'ప్రవక్త' యనగా ఎవరూ చెప్పని జ్ఞానమును బోధించువాడని చెప్పవచ్చును. విడదీసి చెప్పితే 'ప్ర' అనగా ముఖ్యమైనదనియూ, 'వక్త' యనగా చెప్పువాడు అనియు అర్థము. జ్ఞానములో ముఖ్యమైన జ్ఞానమును చెప్పువాడు ప్రవక్త యనబడుచుండును. అయితే ఏసు తనను ప్రవక్త కంటే గొప్పవానిని అని చెప్పాడు. ప్రవక్త కంటే గొప్పవాడు, ప్రవక్త కంటే గొప్ప జ్ఞానమును చెప్పువాడు ఒక్కడే ఒక్కడు గలడు. ''దేవుడు తన జ్ఞానమును ఏ మానవమాత్రుని మీద ప్రసరింపచేయలేదు. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ ఇతర మానవునికీ తెలియదు.'' అందువలన దేవుని జ్ఞానమును దేవుడే చెప్పాలి యని అంతిమ దైవగ్రంథములో సూరా మూడు, ఆయత్ ఏడు (3-7) లో చెప్పియున్నారు. దీనినంతటిని పట్టి చూస్తే దేవుడు ప్రవక్తవలె వచ్చి జ్ఞానమును చెప్పినా, అతను ప్రవక్తకంటే గొప్ప వాడుగా ఉండును. ''దేవుడు మనుషులతో ప్రత్యక్షముగా మాటలాడడు'' అని అంతిమ దైవగ్రంథములో సూరా 42, ఆయత్ 51లో చెప్పియున్నారు. దేవుడు మారువేషములో మనిషిగా వచ్చి మాట్లాడవచ్చును. అలా దేవుడు ఎప్పుడు మనిషిగా వచ్చినా, అతను ప్రవక్తగా చెప్పబడినా, అతను ప్రవక్త కంటే గొప్పవాడుగా యుండును. ఈ వాక్యములో ఏసు చెప్పిన దానినిబట్టి ఏసు ప్రవక్తల కంటే గొప్పవాడయిన దేవుని అవతారమని చెప్పకనే తెలియుచున్నది. ఏసు అనేక సందర్భములలో తాను ఎవరైనదీ చెప్పినా మనుషులు ఆయనను గుర్తించలేకపోయారు.☞
(32) మత్తయి సువార్త, 11వ అధ్యాయము, 28వ వచనము.(28) ప్రయాస పడి భారమును మోయుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండు; నేను మీకు విశ్రాంతిని కలుగజేతును.మనుషులు ప్రయాసపడునది బరువును మోయునప్పుడేయని అందరికీ తెలియును. అయితే మనిషి ఎల్లప్పుడు బరువు మోయకున్నను ప్రయాస పడుచున్నాడు. కనిపించని బరువు పాపము (కర్మ). కర్మలను అనుభవించు ప్రతివాడు ఏదో ఒక విధముగా ప్రయాస పడుచునే యున్నాడు. కర్మలు ఎల్లప్పుడూ మనిషికి అనుభవమునకు వస్తున్నవి. మనిషి కర్మలు అనుభవించని సమయము నిద్రపోవు సమయము మాత్రమే. మనిషి మెలుకువలో యున్నప్పుడుగానీ, స్వప్నములో యున్నప్పుడుగానీ ఏదో ఒక విధముగా కర్మ అనుభవములో యున్నాడు. అనగా ఎల్లప్పుడు ప్రయాస పడుచునే ఉన్నాడని తెలియుచున్నది. వీడు, వాడు అనకుండా అందరూ కర్మలను అనుభవిస్తూ బాధపడుచున్నారు కావున 'సమస్త జనులారా' యని సంబోధించి ఏసు ప్రజలను తన వద్దకు రమ్మన్నాడు. తనవద్దకు వస్తే విశ్రాంతి దొరుకును అన్నాడు.
ఎల్లప్పుడు కర్మలు అనుభవించువానికి ఏసువద్దకు పోయినప్పుడు ఎలా విశ్రాంతి దొరుకును? అను ప్రశ్న రాగలదు. దానికి మా జవాబు ఈ విధముగా కలదు. ఏసు తనవద్దకు వచ్చిన ప్రజలకు దైవజ్ఞానమును బోధించుట వలన, దానిని తెలుసుకొన్న వారందరికీ జ్ఞానమను అగ్నిలో కర్మలు కాలిపోవుట వలన, కర్మయొక్క అనుభవము లేకుండా పోవుట వలన, మనిషికి బాధల వలన పడు ప్రయాస తగ్గిపోయి విశ్రాంతి దొరుకును. ఇది కుల మత భేదము లేకుండా మనుషులందరికీ కలుగు మేలగుట వలన ఏసు 'సమస్త జనులారా! నావద్దకు రండియని' పిలిచాడు. ఇక్కడ బాగా గమనిస్తే ఏసు క్రైస్థవుల గురువు యనీ, క్రైస్థవ ప్రవక్త యనీ చాలామంది అనుచుందురు. ఆయన కేవలము క్రైస్థవులను మాత్రము పిలిచియుంటే ఏసు క్రైస్థవ గురువు అనుటకు అవకాశముండేది. అట్లు క్రైస్థవులను మాత్రము పిలువక సమస్త జనులను పిలిచాడు, కావున ఏసును క్రైస్థవునిగా చెప్పుట అన్యాయమగును. ఆయన మాటలను విశ్వసించి ఆయనవద్దకు పోయిన వారు క్రైస్థవులు అని చెప్పుటకు వీలులేదు. దేవుడు అందరికీ కావలసిన వాడే, దేవుని జ్ఞానము అందరికీ అవసరమైనదే అందువలన ''సమస్త జనులారా'' యని ఏసు సంబోధించి పిలిచాడు.☞
(33) మత్తయి సువార్త, 12వ అధ్యాయము 17, 18, 19, 20, 21 వచనములు.(17) పవ్రక్తయైన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు ఇలాగున జరిగెను, అదేమనగా!
18) ఇదిగో ఈయన నా సేవకుడు.ఈయనను నేను ఏర్పరచుకొంటిని.ఈయన నా పాణ్రమున కిష్టుడయిన నా పియ్రుడు.ఈయన మీద నా ఆత్మనుంచెదను.
19) ఈయన అన్య జనములకు న్యాయవిధిని పచ్రురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు.
20) ఈయన శబ్దము వీధులలో ఎవరికీ వినిపించదు. విజయమొందుటకు న్యాయవిధిని పబ్రలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విడువడు.
21) మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు.ఈ మధ్య కాలములో దాదాపు 350 సంవత్సరముల క్రితము వీరబ్రహ్మముగారు అను ఒక మహాత్ముడు జరుగబోవు విషయములను, సంభవించబోవు ప్రకృతి వైపరీత్యములను 'కాలజ్ఞానము'గా ముందే భవిష్యత్తును గురించి చెప్పాడు. అదే విధముగా పూర్వము ఎషయా అను గొప్ప వ్యక్తి రాబోవు ఏసును గురించి ముందే చెప్పియున్నాడు. అదే విషయమును పై వాక్యములుగా చెప్పారు. ఎషయా చెప్పిన వాక్యములను వివరముగా చెప్పుకొంటే ఆయన వాక్యములలోని గొప్పతనము మనుషులకు తెలిసిపోవును. చెప్పినవాడు ఎవడు, ఎవరిని గురించి చెప్పాడు అని తెలియగలదు. ఎషయా అను వ్యక్తి ఏసు జన్మించకముందు చాలా సంవత్సరముల పూర్వము ఉండేవాడు. ఎషయా 13వ అధ్యాయములో కూడా కొన్ని విషయములను చెప్పియున్నారు. ఇప్పుడు చెప్పిన వాక్యములను గురించి చూస్తే పరిశుద్ధాత్మయిన దేవుడు ఏసును గురించి చెప్పియున్నాడని తెలియుచున్నది. గ్రంథమును అంతా చూచిన తర్వాత అక్కడక్కడ ఏసు తనను గురించి చెప్పిన దానిని బట్టి చూస్తే ఏసును గురించి పరిశుద్ధాత్మ చెప్పియున్నా, చెప్పినవాడు చెప్పబడువాడు ఇద్దరూ ఒక్కరేయని తెలియుచున్నది.
''ఇదిగో ఈయన నా సేవకుడు'' అని మొదటి వాక్యములో చెప్పియున్నారు. సేవ అంటే అనేక రకముల ప్రపంచ సేవ కలదు. అయితే ఇక్కడ ప్రపంచ సేవను గురించి చెప్పలేదు. పరమాత్మ సేవను గురించి చెప్పడము జరిగినది. పరమాత్మ సేవ ఒక్కటే గలదు. దేవుని జ్ఞానమును, దేవున్ని గురించి ప్రచారము చేసి ఇతరులకు తెలియచేయడమే నిజమైన పరమాత్మ సేవ యగును. ఏసు, దేవుని జ్ఞానమును గురించి ప్రచారము చేయుచుండుట వలన పరమాత్మ, ఏసును 'ఈయన నా సేవకుడు' అని చెప్పడము జరిగినది. ఎవడయితే దేవున్ని, ఆయన జ్ఞానమును గురించి ప్రచారము చేయుచున్నాడో, అతడు దేవునికి అత్యంత ఇష్టుడు యగును. అందువలన పరమాత్మ, ఏసును 'ఈయన నా కిష్టమైన నా ప్రియుడు' అని చెప్పాడు. పరిశుద్ధాత్మ మట్టితో ఒక మానవ అవతారమును చేసి, ఆ బొమ్మలో తన ఆత్మనే ఊది పంపును అనియు, అలా వచ్చిన వానిని 'దేవ దూతలు చూచి దేవునిగా గుర్తించి సాష్టాంగ నమస్కారము చేయునని' అంతిమ దైవగ్రంథములో 15వ సూరాయందు 28, 29, 30 ఆయతులలో చెప్పబడినది. అందువలన ఇక్కడ ఎషయా చెప్పిన వాక్యములలో 'పరమాత్మ ఈయన మీద నా ఆత్మను ఉంచెదను' అని అన్నాడు. ఈ వాక్యము ప్రకారము మానవ అవతారములో యున్న ఏసు పరమాత్మ యొక్క ఆత్మేనని తెలియుచున్నది.
(34) మత్తయి సువార్త, 12వ అధ్యాయము, 31 వచనము.(31) కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా! మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గానీ, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.ఈ వాక్యము దైవగ్రంథములో మిగతా వాక్యములకంటే చాలా ముఖ్యమైనది. మనుష్యులు అనేక రకములైన పాపములు దైవజ్ఞానమును తెలియుట వలన మనిషి తెలుసుకొన్న జ్ఞానము శక్తిగా మారి అది అగ్నిగా యుండి కర్మలను (పాపములను) కాల్చివేయుచున్నది. ప్రపంచ సంబంధ ఏ పాపముగానీ అది మనిషి తెలియు జ్ఞానము వలన లేకుండా పోవు అవకాశము గలదు. అయితే మనిషి ఆత్మసంబంధముగా చేసిన దూషణ వలన, చేసిన వ్యతిరేఖ కార్యముల వలన వచ్చు పాపము జ్ఞానాగ్నిలో కూడా కాలదు. అనగా అది క్షమించబడదు.☞
ఇక్కడ 19వ వాక్యములో 'న్యాయవిధిని ప్రచారము చేయును' అని చెప్పియున్నారు. బైబిలు గ్రంథమును తెలుగులోనికి అనువదించు వారు సరియైన పదములు ఉపయోగించి వ్రాయలేదని తెలియుచున్నది. జ్ఞాననిధి అని వ్రాయవలసిన చోట, న్యాయవిధి అని వ్రాశారు. న్యాయము ప్రపంచ సంబంధమైనది యగును. అందువలన న్యాయము అను పదమును ఉపయోగించకూడదు. నీతి, న్యాయము ప్రపంచ సంబంధము కాగా, జ్ఞానము ధర్మము పరమాత్మ సంబంధమైనవి. అయితే జ్ఞానము అని చెప్పవలసిన చోట నీతి అని, కొన్నిచోట్ల న్యాయము అని చెప్పడము అనువాద లోపముగా కనిపించుచున్నది. అందువలన మనము కొన్నిచోట్ల సవరించి చదువుకోవలెనని చెప్పుచున్నాము. అట్లే పేర్లు వచ్చినచోట మరియు పదము మొదలు పెట్టుచోట అచ్చులే వ్రాయవలెను, హల్లులను వ్రాయకూడదు. ఏసు అని చెప్పవలసిన చోట యేసు అని వ్రాయడము భాషలో తప్పుగా యుండును. అట్లే శిలువ అని ఉండవలసినచోట సిలువ అని వ్రాయడము కూడా పొరపాటే. శిలువ అంటే పాము అని అర్థము కలదు గానీ, సిలువ అంటే అర్థము ఉండదు. ఈ విధముగా అనేకచోట్ల అనేక అనువాద తప్పులు కనిపించుచున్నవి. వాటిని సవరించుకొని వ్రాయడము జరిగినది.
19వ వాక్యములో న్యాయవిధిని ప్రచురము చేయును అని ఉంది. ప్రచురము అంటే అచ్చువేయడము అని అర్థము వచ్చును. దానిని సవరించుకొని 'ప్రచారము' అంటే ఇతరులకు 'బోధించడము' అని అర్థము వచ్చును. కనుక ఈ వాక్యమును సవరించి చెప్పుకొంటే ''ఈయన అన్య జనులకు జ్ఞాననిధిని ప్రచారము చేయును'' అని చెప్పుకోవలసియున్నది. ఏసు తన జీవితములో ముప్పది సంవత్సరములు గడచిపోయిన తర్వాత తనలో యున్న జ్ఞాననిధిని దాదాపు రెండు సంవత్సరముల మూడు నెలలపాటు ప్రజలకు బోధించాడు అందువలన ఏసును గురించి ఈ వాక్యమును చెప్పారు. ఆయన జ్ఞానమును అనేకచోట్ల తిరిగి నిస్వార్థముగా ఎవరినీ ఏమీ ఆశించక బోధించడము జరిగినది. అంతేకాక తనవద్దకు వచ్చిన అనేక రోగములు కలవారిని స్వస్థపరచడము జరిగినది. గ్రుడ్డివానికి చూపును, కుంటివానికి నడకను, కుష్టురోగులను బాగు చేయడము, చనిపోయిన వారిని బ్రతికించడము జరిగినది. అప్పుడు ఏసును కొందరు మంత్రగాడని చెప్పడమేకాక, దైవవిరుద్ధమైన పనులు చేయుచున్నాడని దూషించడము కూడా జరిగినది. అప్పుడు కూడా ఆయన ఎవరితోనూ జగడమాడడము గానీ, కేకలు వేయడము గానీ చేయలేదు. అదే విషయమునే ''ఈయన జగడమాడడు, కేకలు వేయడు'' అని వ్రాశారు.
ఏసు తన జ్ఞానమును కొందరికి మాత్రము అవకాశమొచ్చినప్పుడు మరియు తనవద్దకు వచ్చినప్పుడు చెప్పాడుగానీ, వీధులలో నిలబడి గట్టిగా అరచి చెప్పలేదు. అందువలన వాక్యములో ''ఈయన శబ్దము వీధులలో ఎవరికీ వినపడదు'' అని వ్రాశారు. అంతేకాక జ్ఞాననిధిని ప్రజలలో చేర్చు వరకు ఎండిన పుల్లనయినా విరువలేదు. దీనినిబట్టి ఆయన జ్ఞాన ప్రచారము తప్ప ఇతర పని ఏమీ చేయలేదనుటకు వాక్యములో తను అనుకొన్న పనిని సాధించుటకు అనగా విజయమొందుటకు జ్ఞాననిధిని ప్రబలము చేయు వరకు 'ఈయన నలిగిన రెల్లును విరువడు' అని చెప్పారు. అంతేకాక ఎవరియందు జ్ఞానాగ్ని అంటుకొనునో వాని కర్మయంతయూ కాలిపోవు వరకు దానిని ఆరిపోకుండా చూచును. కర్మలు అనేక రకములుగా ఉండును కనుక కర్మలను అనేక పీసులుగా యున్న అవిసెనారతో పోల్చారు. అదే విషయమునే వాక్యములో ''మక మక లాడుచున్న అవిసెనారను ఆర్పడు'' అని చెప్పారు. కొందరు ఆయన జ్ఞానము కొరకు కాచుకొని యుందురు కనుక ''ఈయన నామమందు అన్యజనములు నిరీక్షించెదరు'' అని వాక్యములో చెప్పారు.☞
(36) మత్తయి సువార్త, 12వ అధ్యాయము, 36, 37 వచనములు.(36) నేను మీతో చెప్పునది ఏమనగా! మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శదినమున లెక్క చెప్పవలసి యుండును.
(37) నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పు నొందుదువు.మనిషి పుట్టినప్పటి నుండి అనేకమైన పనులు చేయుచుండును. అట్లే అనేకమైన మాటలను మాట్లాడవలసియుండును. మనిషి చేసిన ప్రతి చిన్నపనిగానీ, చిన్నమాటగానీ మనిషి మాట్లాడడము లేదు, మనిషి చేయడము లేదు. శరీరములో యున్న ఆత్మే అన్నియూ చేయుచున్నది. అయినా ఆ విషయము తెలియని మనిషి అన్నీ తానే చేయుచున్నాడనీ, అన్నీ తానే మాట్లాడుచున్నాననీ అనుకోవడము జరుగుచున్నది. అప్పుడు జరిగిన కార్యములోగానీ, మాట్లాడిన మాటలోగానీ యున్న కర్మ ఏదయినా అది ఆ మనిషినే చేరును. అలా జీవితములో ఏర్పడిన కర్మలన్నియూ ఆత్మ చేతనే కర్మచక్రములో నిలువ చేయబడుచుండును. మనిషి మరణించిన రోజు జీవితములో సంపాదించబడిన కర్మయంతయూ విచారింపబడును. అప్పుడు మాట్లాడిన ప్రతి మాటకూ, చేసిన ప్రతి పనికీ నిర్ణయించబడిన కర్మయంతయు తీర్పు చేయువాడు ఆత్మయే. అప్పుడు మనిషి మాట్లాడిన ప్రతి మాటలోని పాపమునుగానీ, పుణ్యమునుగానీ తీర్పు దినమున లెక్కించి చూచి అతడు జ్ఞానవంతుడా లేక అజ్ఞానముతో కూడినవాడా యని కూడా లెక్కించి చూడబడును. అతడు అనగా మనిషి చేసుకొన్న ప్రతి పాపమును బట్టి, అట్లే ప్రతి పుణ్యమునుబట్టి తీర్పు తీర్చబడును. మనిషి తన జీవితములో సంపాదించుకొన్న జ్ఞానమునుబట్టి జ్ఞానవంతుడనీ, అట్లే అతడు చేసిన అజ్ఞానమునుబట్టి అజ్ఞానియనీ లెక్కించి, దాని ప్రకారము తర్వాత జన్మలో జీవితమును ఆత్మే నిర్ణయించును. పరిశుద్ధాత్మ మనిషి చేసుకొన్న దానినిబట్టి తీర్పు తీర్చడు. మనిషి శరీరములో కర్తగాయున్న ఆత్మే మరణ దినమున అనగా తీర్పు దినమున తీర్పు తీర్చి తర్వాత జన్మకు జీవున్ని పంపును. మరణ దినమునే 'తీర్పు దినము' అని అంటున్నాము. అట్లే మరణ దినమును 'అంతిమ దినము' అని అనడమేకాక, ఆ దినమునే జీవితములో ప్రథమ దినము అని కూడా చెప్పుచున్నాము. అంతిమ దినమునకు గానీ, ప్రథమ దినమునకు గానీ అధిపతి ఆత్మేయనీ, పరిశుద్ధాత్మ ఏది చేయనివాడనీ తెలియవలెను. ఈ వాక్యములో అంతిమ దినమును 'విమర్శ దినము' యని అన్నారు. విమర్శ దినము అనగా 'మనిషి యొక్క కర్మలను విడమరచి చూచు దినము' అని అర్థము చేసుకోవాలి. అంతిమ దినమును విమర్శ దినము అని వ్రాయడము అనువాద లోపము అని చెప్పవచ్చును. కర్మలను లెక్కించు దినమని చెప్పవచ్చును. మనిషి శరీరములో కార్యములను చేయువాడు ఆత్మే. ఆ విషయమును తెలిసి తాను చేయలేదని అనుకోవడము వలన, మనిషి పాపాత్మునిగా, పుణ్యాత్మునిగా లెక్కించబడును. చేయువాడు ఆత్మే తాను చేసిన పనులలోని కర్మలను నిర్ణయించి మనిషిని జన్మకు పంపువాడు ఆత్మేయని తెలియవలెను. శరీరములో ప్రతి చిన్న పెద్ద కార్యములను చేయుచూ, కార్యములోని ఫలితములైన పాపపుణ్యములను తనకు అంటీ అంటకుండా చేయుచున్నది. భావము వలన మనిషి జ్ఞానిగా లేక అజ్ఞానిగా, అట్లే పాపాత్మునిగా పుణ్యాత్మునిగా లెక్కించబడుచున్నాడు.☞
(35) మత్తయి సువార్త, 12వ అధ్యాయములో 32వ వచనము.(32) మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదుగానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైననూ, రాబోవు యుగ మందైననూ పాపక్షమాపణ లేదు.మనుషులందరినీ మనుష్య కుమారులని చెప్పవచ్చును. సర్వ సాధారణ మనుషులందరూ తమ తల్లితండ్రులను మనుషులుగానే చెప్పుచుందురు. నేను ఫలానా మనిషి కుమారుడనని చెప్పుచుండుట వలన మనిషిని మనిషి కుమారుడు గానే చెప్పవచ్చును. అయితే సాధారణ మనిషి వలె కనిపించు ఏసును మనిషి కుమారుడు అని చెప్పుటకు వీలులేదు. ఏసు కూడా తన తండ్రిని గురించి చెప్పునప్పుడు 'నా తండ్రి పరలోకములో యున్నాడని' చెప్పాడుగానీ, ఇహలోకములో యున్న మనిషిని తన తండ్రిగా చెప్పలేదు. అందువలన ఏసును దేవుని కుమారునిగా చెప్పవచ్చును. దీనినిబట్టి ప్రజలనందరినీ మనుష్య కుమారులుగా చెప్పినా, సాధారణ మనిషి వలె యున్నవాడు, సాధారణ మనిషివలె పేరు కల్గినవాడు, సాధారణ మనిషివలె కష్టసుఖములను పొందువాడు అయిన ఏసును సాధారణముగా మనిషి కుమారుడు అనకుండా 'దేవుని కుమారుడు' అని చెప్పుచున్నాము.
సాధారణ మనుషులకు బీజదాత అయినవాడు మనిషి కాడు. ఏ మనిషీ తన సంతతియని చెప్పుకొనువారికి వాస్తవముగా తండ్రి కాడు. సర్వ మానవులకే కాకుండా సమస్త జీవరాసులకు బీజదాత అయినవాడు, శరీరములో అధిపతిగా యుండి శరీరమును నడిపించుచూ ప్రతి కార్యమును చేయువాడు అయిన ఆత్మయే. అయితే ఆ విషయము మనుషులకు తెలియదు. అందువలన మనిషి ఇంకొక మనిషిని తండ్రిగా చెప్పు కొంటున్నాడు. మనిషి చెప్పుకొన్నట్లు మనిషిని మనుష కుమారునిగానే అందరూ చెప్పుచున్నారు. మనిషి తాను ఏ పనినీ చేయలేదు. అన్ని పనులు చేయునది ఆత్మయే యని ప్రథమ, ద్వితీయ దైవగ్రంథములలో అనేకచోట్ల చెప్పబడియున్నది. మనిషి స్వయముగా ఏ పనినీ చేయలేదు కావున మనిషి స్వయముగా ఏ పాపమునూ చేయలేదనియే చెప్పాలి. అయితే మనిషి తాను ప్రతి పనినీ చేయుచున్నానని అనుకోవడము వలన, జరిగిన కార్యము వలన వచ్చిన పాపము జీవుని (మనిషి) ఖాతాలోనికి చేరుచున్నది. ఈ విధముగా చేయని పాపమునకు మనిషి తానే బాధ్యుడు అయిపోవుచున్నాడు. అలాగే మనిషికి తండ్రి ఆత్మయినా, తన తండ్రి మనిషేయని చెప్పుట వలన అతడు మనిషి కుమారునిగానే లెక్కించబడుచున్నాడు.
ఏసు వాస్తవముగా తన తండ్రి పరలోకపు తండ్రియని ఆయనకు తెలుసు. ఏసు అందరివలె ఆత్మ వలన పుట్టినవాడు కాడు. ఏసు పరిశుద్ధాత్మయిన దేవుని కుమారుడని ఆయనకు తెలియును. అంతేగాక అన్ని చోట్ల తన తండ్రి పరిశుద్ధాత్మయిన పరలోకపు తండ్రియని ఏసు చెప్పుట వలన ఏసును దేవుని కుమారునిగా, మనిషిని మనుష్య కుమారుడుగా గ్రంథములో చెప్పారు. సాధారణ మనిషిని విరోధముగా దూషించినా, ఆ దూషణ వలన వచ్చు పాపము దేవుని జ్ఞానము వలన క్షమించబడును. అయితే దేవుని కుమారునికి విరుద్ధముగా మాట్లాడితే వచ్చు పాపము ఎప్పటికీ క్షమించబడదు. ఈ యుగమందుగానీ, రాబోవు యుగమందు గానీ క్షమించబడదని చెప్పియుండుట వలన దైవదూషణ వలన వచ్చిన పాపము ఈ యుగములోనూ, రాబోవు యుగములోనూ మొత్తము రెండు యుగములలోనూ పాపమును అనుభవించవలసి యుండును.☞
(37) మత్తయి సువార్త 12వ అధ్యాయము, 40వ వచనము.(40) ఏనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో, అలాగే మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును.ఏసుకంటే ముందు కాలములో జరిగిపోయిన విషయమును సమానముగా పోల్చుచూ, జరుగబోవు విషయమును చెప్పడము జరిగినది. ''తిమింగలము అను పెద్ద చేప, ఏనా అనునతన్ని మ్రింగగా అతడు తిమింగలము కడుపులో మూడు రాత్రులు, మూడు పగళ్ళు సజీవముగా ఉన్నట్లు'' వాక్యములో చెప్పారు. అలాగే ఏసు కూడా మూడు రాత్రింబ గళ్ళు భూగర్భములో ఉండునని చెప్పినట్లు తెలియుచున్నది. ఏనా అనునతడు మూడు రాత్రిళ్ళు, మూడు పగళ్ళు తిమింగలము కడుపులో ఉండుట నిజమే అయినా ''మనుష్య కుమారుడు'' అని చెప్పబడిన ఏసు భూగర్భములో మూడు రాత్రిళ్లు, మూడు పగళ్ళు ఉన్నాడనుట పూర్తి అసత్యమగును. ఈ విషయమై విచారిస్తే ఏసు శిలువ మీద శుక్రవారము సాయంకాలము చనిపోయినట్లు చెప్పుచున్నారు. తిరిగి ఆయన ఆదివారము తెల్లవారక మునుపే వేకువ జాముననే భూసమాధి నుండి బయటికి వచ్చినట్లు చెప్పుచున్నారు. ఆ విధముగా చూస్తే శుక్రవారము పగలు సాయంకాలము మూడున్నర నుండి నాలుగు గంటల లోపల ఏసు శిలువ మీద చనిపోయి ఉండవచ్చును. ఆయన చనిపోయిన తర్వాత సాయంకాలము సంధ్యవేళలో అనగా పగలు అయిపోయి రాత్రి ప్రారంభమగు సంధికాలములో ఆయన శరీరమును భూసమాధిలో పెట్టడము జరిగినది. అలా జరిగిన దానిని లెక్కించితే శుక్రవారము పగలు ఏసు భూసమాధిలో లేడు అని తెలియుచున్నది. శుక్రవారము రాత్రి భూసమాధిలో ఉన్నట్లు చెప్పవచ్చును. అలాగే శనివారము పగలు, రాత్రి రెండు పూటలు భూసమాధిలో ఉన్నట్లు తెలియుచున్నది. ఆదివారము తెల్లవారు జామున ఏసు భూసమాధి నుండి బయటికి వచ్చినట్లు చెప్పియున్నారు. కావున ఏసు భూసమాధిలో శుక్ర వారము రాత్రి మరియు శనివారము రాత్రి పగలు ఉండి, ఆదివారము తెల్లవారక ముందే బయటికి రావడము జరిగినది.
దానిప్రకారము ఏసు రెండు రాత్రిళ్లు, ఒక పగలు మాత్రమే భూగర్భములో యున్నట్లు తెలియుచున్నది. అందువలన దైవ గ్రంథములో చెప్పిన వాక్యము అసత్యముగా కనిపించుచున్నది. దైవగ్రంథములోని వాక్యము అసత్యముగా ఎప్పటికీ ఉండదు. అయినా ఇక్కడ ఈ వాక్యము అసత్యముగా యున్నట్లు ఇతరులు అడిగారు మరియు నాకు కనిపించినది. ఈ వాక్యములో సత్యము తప్ప అసత్యమునకు తావు లేదు అని చెప్పిన నేను, ఇతరులు అడిగిన దానికి తప్పక జవాబు చెప్పవలసి వచ్చినది. ''మీరు మాట్లాడు ప్రతి మాట మీలో యున్న మీ తండ్రే మాట్లాడుచున్నాడు, మీరు కాదు'' అని ఇదే మత్తయి సువార్తలో పదవ అధ్యాయమందు, 20వ వాక్యమున చెప్పియున్న విషయము నాకు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాపకముండుట చేత దేనికయినా జవాబు చెప్పుతున్నప్పుడు నాకెందుకు భయము అని అనుకొన్నాను. ప్రశ్న అడిగేవాడు ఆత్మే, ప్రశ్నకు జవాబు చెప్పువాడు ఆత్మే, చెప్పే దానిని విని తెలుసుకోతగినవారము జీవులమయిన మనమే.
మనుష్య కుమారుడు అని చెప్పబడినవాడు దేవుని కుమారుడే. దేవుని కుమారునిగా మనము చెప్పినా, వాస్తవముగా ఆయన ఎవరి కుమారుడు, కాని దేవుడేయని నేను నమ్ముచున్నాను అని చెప్పినా, ఆ విషయము నాకు పూర్తిగా తెలుసునని చెప్పుచున్నాను. దేవునికి మరణముందా? యని ప్రశ్నించుకొని చూస్తే దేవుడు ధరించిన శరీరమునకు మరణమున్నది గానీ దేవునికి మరణము లేదు. వాస్తవముగా మరణములు నాలుగు రకములు గలవు. మనుషులమయిన మనకు మరణము అంటే ఒక్కటేయని తెలిసియున్నా, కొంతమంది జ్ఞానులయిన వారికి నాలుగు మరణములున్నట్లు తెలియును. అవి వరుసగా 1) కాల మరణము 2) అకాల మరణము 3) తాత్కాల మరణము 4) ఆఖరి మరణము అని యున్న నాలుగు రకముల మరణములలో దేవుడు మనిషిగా పుట్టినప్పుడు గానీ, మనిషి మోక్షము పొంది దేవునియందు ఐక్యమగునప్పుడుగానీ వచ్చు మరణము ఆఖరీ మరణము అని చెప్పుచున్నాము. ఏసు శిలువ మీద చనిపోయాడని ప్రజలందరూ చెప్పుచున్నారు. అయితే ఆయన నాలుగు మరణములలో ఏ మరణమును పొందాడో ఎవరికీ తెలియదు.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏసు మూడు రాత్రిళ్లు, మూడు పగళ్లు భూగర్భములో యుండి వచ్చాడు అని చెప్పారుగానీ, ఆయన చనిపోయాడు అని చెప్పలేదు. ఏసును శిలువ వేసినప్పుడు ఆయన శిలువ మీద చనిపోయాడు అని అందరూ అనికొనినా, ఆదివారము ఉదయము భూసమాధి నుండి బయటికి వచ్చిన ఆయన 'నేను చనిపోలేదు' అని చెప్పడము జరిగినది. ఎదురుగా కనిపిస్తున్నా తనను నమ్మలేని శిష్యులకు తన శరీరమునకున్న ములుకులు కొట్టిన గుర్తులను, బల్లెముతో డొక్కలో పొడిచిన గుర్తును కూడా చూపించాడు. దానితో ఆయన చనిపోలేదు అని మనకు కూడా రూఢీగా తెలిసిపోయినది. అయితే శుక్రవారము సాయంకాలము ఏసు చనిపోయినట్లు తెలియగా, ఆయన శరీరమును క్రిందికి దింపి భూసమాధిలో పెట్టినది కూడా సత్యమే. అయితే ఆయన చనిపోయినట్లు శుక్రవారము కనిపించినా, ఆదివారము చనిపోలేదు అన్నట్లు ఆయన కనిపించడములో రహస్యమేమిటి?యని ప్రశ్నించుకొని చూస్తే, ఇప్పుడు చెప్పిన 40వ వాక్యములో ''మనుష్య కుమారుడు మూడు రోజులు, మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్భములో ఉండును'' అని వ్రాసిన దానిని చూస్తే భూగర్భములో మూడు రోజులు లేడు ఉన్నది రెండు రోజులే, అదియూ రెండు రాత్రులు, ఒక పగలు మాత్రమేయని తెలియుచున్నది. ఇలా అసత్యమును కనిపించునట్లు చెప్పడములో ఉన్న రహస్యమేమిటి? అని ప్రశ్నించుకొని చూస్తే, రెండూ సత్యములే యని తెలియుచున్నది. కనిపించు అసత్యములో కనిపించని సత్యము ఎలా దాగియున్నదో ఇప్పుడు చూస్తాము.
ఏసు శిలువ మీద చనిపోయినది వాస్తవమే అయినా అది తాత్కాల మరణము అని ఎవరికీ తెలియదు. నాలుగు మరణములలో తాత్కాల మరణము పొంది, తిరిగి ఆదివారము తెల్లవారక మునుపే, వేకువ జామునే తాత్కాల మరణము నుండి లేచి బయటికి వచ్చి 'నేను చనిపోలేదు' అని చెప్పాడు. ఏసు 'కాలమరణము'ను పొందియుంటే తిరిగి లేచి రాలేడు. ఆయన పొందినది 'తాత్కాల మరణము' కావున మూడవ రోజు లేచి వచ్చాడు. అందువలన ఏసు చనిపోయాడు అన్నది భ్రమే కానీ సత్యము కాదు. అట్లే ఏసు మూడు రోజులు భూగర్భములో యున్నాడని చెప్పిన వాక్యము పూర్తి సత్యమే అయినా, మనము ఇందులో తెలియవలసినది ఎంతో యున్నది.
ఏసు శరీరములో జీవాత్మగా నివసించుచున్నాడు. అట్లే అందరికీ తండ్రి అయిన ఆత్మ శరీరములో నివసించుచున్నాడు. ప్రతి మనిషి శరీరములో జీవాత్మ కర్మలను అనుభవించుచూ యుండగా, ఆత్మ కర్మరీత్యా అవసరమైన పనులను కార్యకర్తగా చేయుచున్నది. శరీరములో జీవాత్మ తల లోపలయుండగా, ఆత్మ శరీరము బయటి అంచుల వరకు వ్యాపించి యున్నది. బయట గల పది ఇంద్రియ భాగములను పని చేయిస్తూ, శరీరమును కదలించుచున్నది ఆత్మయే అని తెలియవలెను. శరీరము కదులుచుంటే మనిషి బ్రతికాడు అని అనుకొంటాము. మనిషి శరీరములో పది భాగములు, అవయవములు పని చేయక, శ్వాస ఆడకపోతే మనిషి చనిపోయాడు అని అంటాము. మనిషి మరణములో అనగా కాల మరణములో ఆత్మ, ఆత్మతోపాటు జీవాత్మ రెండూ శరీరము నుండి బయటికి పోవును. అప్పుడు శరీరము ఆత్మ లేనిదాని వలన కదలకుండా పడిపోవుచున్నది.
తాత్కాల మరణములో ఆత్మగానీ, జీవాత్మగానీ శరీరమును వదలి బయటికి పోవు. ఆత్మ శరీరము బయటి అంచుల నుండి లోపలికి ముకుళించుకొని జీవాత్మవలె శరీరములో తలయందు చేరిపోవుచున్నది. ఆత్మ పని చేయకపోవడము వలన అన్ని అవయవములు పని చేయవు, అట్లే శ్వాస కూడా ఆడదు. శరీరములోని బయటి పనులుగానీ, అట్లే శరీరములోని లోపల పనులుగానీ నిలిచిపోవుట వలన మనిషి మరణించాడని బయట వారందరూ అనుకోవడము జరుగుచున్నది. అలా శరీరములో ఆత్మ నిలిచిపోయి కొంతకాలమైన తర్వాత ఎప్పుడయినా బయటికి వచ్చి సర్వసాధారణముగా పని చేసినప్పుడు, ఆ మనిషి తిరిగి బ్రతికాడని చెప్పవచ్చును. ఏసు విషయములో ఇదే జరిగినది. శిలువ మీద ఆత్మ శరీరములోనికి అణిగిపోయి, శుక్రవారము రాత్రి, శనివారము పగలు, రాత్రి లోపలే యుండి ఆదివారము వేకువజామునే శరీరము బయటికి వచ్చి, తిరిగి బ్రతికి భూగర్భము నుండి రావడము జరిగినది. మూడు పూటలు మాత్రము తాత్కాల మరణమును పొందడమైనది. ఏసు శరీరములోని ఆత్మ ఆ విధముగా మూడు పూటలు మాత్రమే ఉండగా, శరీరములో జీవాత్మగా యున్న ఏసు ఆరుపూటలు భూగర్భములో ఉండి పోయాడు అని చెప్పుటకు కూడా సత్యమే. మనకు తెలియని ఒక విధానము ఏసు ఎడల శరీరములో జరిగినది. అదే ఏమనగా!
ఏసు శరీరములో ఆత్మ చేసిన విధానమునుబట్టి, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని అనుచున్నా, ఆత్మ శిలువ మీద చనిపోకముందే శరీరములోని జీవాత్మ శరీరములోనే సమాధి చేయబడ్డాడు. గురువారము దినముననే ఆయన బంధింపబడునని తెలిసిన తర్వాత ఏసు శరీరములోని జీవాత్మకు, బుద్ధికి సంబంధము తెగిపోయినది. ఏసుకు ఏమీ తెలియని స్థితి ఏర్పడినది. అప్పటినుండి ఏసును బంధించినదీ, న్యాయస్థానమునకు తీసుకపోయినదీ, కొరడాలతో కొట్టి శిలువ మోయించినదీ, శిలువ మీద వ్రేలాడదీసినదీ ఏమీ ఏసుకు తెలియదు. ఆయన శరీరము అను భూమిలోనే సమాధి చేయబడినాడు. సమాధి చేసిన వానికి ఎట్లు ఏమి తెలియదో అదే విధముగా ఏసు ఏమీ తెలియని స్థితిలో మూడు రోజులు ఉన్నాడు. ఏసుకు ఏమీ తెలియకపోయిన తర్వాత కూడా ఆత్మ శరీరమును ఆడించినది అయితే ఏమి జరిగినది ఏసుకు తెలియదు. ఏసు ఏ అనుభవమును అనుభవించకుండునట్లు, ఏసు ఆత్మయే ఏసును తెలియని స్థితిలోనికి పంపినది. ఏసు నిద్రలాంటి తెలియని స్థితిలోనికి పోయిన తర్వాత మనుషులు కొట్టిన దెబ్బలుగానీ, శిలువ మీద వ్రేలాడబడిన అనుభవము గానీ తెలియకుండాపోయినది. అలా శరీరములో సమాధి స్థితిలోనికి వెళ్ళి పోయిన జీవాత్మ ఆదివారము ఉదయము ఆత్మ లేపు వరకు జ్ఞాపకము లోనికి రాలేదు. కనుక ఏసును ''ఆరుపూటలు భూసమాధిలోనికి పోయాడు'' అని చెప్పారు. ఏసు శరీరము బయటి భూసమాధిలోనికి పోయినట్లు ప్రజలకు తెలిసినా, దానికంటే ముందే ఏసు శరీరములో జీవాత్మ తెలియని స్థితిలోనికి పోగా, తర్వాత శుక్రవారము సాయంకాలము ఏసు ఆత్మ తాత్కాలిక మరణములోనికి పోవడము జరిగినది. పైకి మాత్రము చూడగల చూపున్న మనుషులకు ఏసు శరీరము లోపల జరిగిన ఆత్మ, జీవాత్మల కార్యములు తెలియకుండా పోయినవి. ఏసు ఆరు పూటలు, ఆత్మ మూడు పూటలు సమాధిలోనికి పోయినది వాస్తవమే.☞
(38) మత్తయి సువార్త, 13వ అధ్యాయము, 13, 14, 15 వచనములు.(13) ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని హృదయముతో గ్రహించి
(14) మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందమైనవి. వారు తమ కన్నులు మూసి కొనియున్నారు.
(15) కనుక మీరు వినుటమట్టుకు విందురు గానీ, గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గానీ ఎంతమాత్రము తెలిసికొనరు.ఈ విషయమును 'ఎషయా' అను ప్రవక్త ఎంతోకాలము ముందు చెప్పినదని తెలిసినది. అజ్ఞాన ప్రజలు ఆనాడు ఉన్నారు, నేడు యున్నారు. అజ్ఞాన ప్రజలు కొందరు కన్నులతో చూచి, చెవులతో విని హృదయముతో (బుద్ధితో) గ్రహించి కూడా మనస్సును త్రిప్పుకొంటున్నారు. చూచిన దానిని, వినిన దానిని తెలిసిన దానిమీద ఆసక్తిని చూపకపోవడము వలన ఏసు వలన వారి కర్మలను పోగొట్టుకొనకుండునట్లు వారి బుద్ధి మందగించినది. వారి చెవులు జ్ఞానము ఎడల చెవిటివైపోయినవి. వారు చెప్పినవన్నీ విందురుగానీ వినిన దానిని గ్రహించకుండా వదలివేసి ప్రపంచ విషయము లలో లగ్నమైయున్నారు. వారి దృష్ఠిలో ధనార్జన తప్ప ఏమీ కనిపించడము లేదు. అటువంటి వారి దృష్ఠిలో జ్ఞానమును తెలిసినవారు కూడా తెలివి తక్కువవారిగా కనిపించుచుందురు.☞
(39) మత్తయి సువార్త, 15వ అధ్యాయము, 7, 8, 9 వచనములు.(7) వేషధారులారా!
(8) ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘన పరచుదురు. కానీ వారి హృదయము నాకు చాలా దూరముగా యున్నది.
(9) మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.''దేవుని విషయము దేవునికే తెలుసునని మానవులకు తెలియదని'' మేము చాలామార్లు చెప్పాము. దేవుని విషయము దేవుడే తెలుపవలసి ఉన్నది. దేవుని ఆరాధన విషయము కూడా దేవుడు చెప్పితేనే మానవునకు తెలియును. మానవుడు స్వయముగా దేవుని ఆరాధన గూర్చి చెప్పితే అది సరైన మార్గము కాదని తెలియవలెను. తనను ఏ విధముగా ఆరాధించ వలసినది దేవుడు ముందే తెలిపియుండగా, ఆయన చెప్పిన మార్గము కాదని వేరు పద్ధతిని తెల్పువారు కూడా అనేకులున్నారు. ఎందరో స్వాములు, గురువులు దైవోపదేశములనీ, దైవారాధనలనీ వారు కల్పించుకొన్న పద్ధతులను ప్రజలకు బోధిస్తున్నారు. అటువంటి 'ఉపదేశములు, ఆరాధనలు వ్యర్థములనీ, అవి తనవద్దకు చేర్చలేవనీ' దేవుడే తెల్పుచున్నాడు. ఎందరో స్వాములు, గురువులు తమతమ ఉపన్యాసములలో దేవుని గురించి చెప్పుచూ దేవునికి వ్యతిరేఖమైన, దేవుడు చెప్పని ఆరాధనలను ఉపదేశములను చెప్పుచున్నారు. పై మాటల వరకు దేవుడు, జ్ఞానము అని చెప్పు గురువులు, స్వాములు వారి అంతరంగములో దేవుని జ్ఞానము తెలియక, వ్యర్థమైన ఆరాధనలు వారు చేయుచూ, ఇతరుల చేత చేయిస్తున్నారు. ఉదాహరణకు దేవుని ఆరాధనకు ఉపవాసమునకు సంబంధము లేదు. ఉపవాసము వలన వారు శ్రమపడుటకాక లోపలనున్న దేవున్ని కూడా ఇబ్బంది పెట్టుచున్నారు. దానివలన దైవమునకే అపకారము చేసినవారమగుచున్నాము. అలాగే ''దానములు చేయుట, వేదమంత్రములు చదువుట, యజ్ఞములు చేయుట, తపస్సులు చేయుట వలన నన్ను చేరలేరని నేను వారికి తెలియనని'' భగవద్గీతలో కూడా ఐదువేల సంవత్సరముల పూర్వమే చెప్పాడు. ఎందరో నన్ను గొప్పగా చెప్పుకొని, అధర్మ పద్ధతిలో వ్యర్థముగా ఆరాధించుచున్నారని కూడా గీతలో చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రభువు అదే విషయమును చెప్పాడు.
నోటి ద్వారా వచ్చునవి మాటలు. హృదయము నుండి వచ్చునవి భావములు. నోటి మాటలు ఎంత గొప్పగా దేవుని గూర్చి చెప్పినను హృదయములోని భావములు దేవునికి అనుకూలముగా లేక వ్యతిరేఖముగా ఉండకూడదు. నేడు భూమిమీద చాలామంది మాటలు దేవున్ని ఘనపరచు లాగ ఉన్ననూ, వారి హృదయములో దేవుని ధర్మములు లేవు. మాయ ధర్మములు చోటు చేసుకొన్నవి. చెప్పునవి దేవుని మాటలు, చేయునవి మాయ (సాతాన్) ప్రభావమున దైవ వ్యతిరేఖ ఆరాధనలు. ఎందరో గురువులు దైవజ్ఞానమని వారు చెప్పు మాటలకు పేరు పెట్టి, దేవుడు ''నన్ను చేర్చలేవని'' చెప్పిన ఆరాధనలనే చేయుచున్నారు. ఈ ఆరాధనలు మార్గము తప్పినవై ఉన్నవని గీతలో కూడా హెచ్చరించాడు. అయినప్పటికీ పీఠాధిపతులని పేరుగాంచినవారు కూడా ఆయన వ్యర్థమన్న యజ్ఞ యాగాదులు, దానములు, ఉపవాసములు, వేదమంత్ర పఠనములు, తపస్సులు చేయుచున్నారు. అటువంటి వారు నాకు దూరముగానున్న వారేనని పరిశుద్ధ బైబిలులోనూ, భగవద్గీతలోనూ దేవుడు తెలియజేశాడు. అందువలన ఇప్పటి నుండి మనము మన మాటలయందు దేవుని ఘనపరచడమేకాక, ఆయన వ్యర్థమనిన ఆరాధనలను, ఆయనకు వ్యతిరేఖమైన ఆరాధనలను వదలి ఆయన చెప్పిన పద్ధతినే అనుసరిద్దాము.☞
(40) మత్తయి సువార్త, 15వ అధ్యాయము, 11వ వచనము.(11) నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదుగానీ, నోటి నుండి వచ్చునదే మనుష్యుని అపవిత్రపరచును.నోటిలో పడునది మనుష్యుడు తిను ఆహారము. మనుష్యుని ఆహారము ఒకే పదార్థముకాక అనేక పదార్థములుగా నున్నది. కొందరు శాఖాహారులు, కొందరు మాంసాహారులు అను రెండు రకములుగా మనుషులుగలరు. దేవుని జ్ఞానము తెలియువారు శాఖాహారులుగా నుండవలెనని, మాంసాహారులుగా ఉండకూడదని కొందరు స్వాములు, గురువులు చెప్పుచుందురు. ఇక్కడ ప్రభువు ''నోటిలో పడు ఏ ఆహారము మనుష్యుని అపవిత్రము చేయదని చెప్పడమేకాక, నోటి నుండి వచ్చునదే మనుష్యుని అపవిత్రము చేయునని'' చెప్పాడు. ఆహార విషయములో కొందరికి అభిప్రాయ బేధములున్నవి. ముఖ్యముగా మాంసాహారము తినకూడదని కొందరి వాదన, కొందరేమో జ్ఞానమార్గములో నున్నవారు అగ్నిచేత ఉడకబెట్టని, వేడి చేయని అపక్వాహారము తినవలెనని అంటున్నారు. కొందరు శాఖాహారమును దినములో ఒక్కపూట మాత్రము తినవలెనని, మిగతా ఆహారమును తీసుకోకూడదని అంటున్నారు. ఇలా కొందరు ఆహార నియమములు పెట్టుకొని ఉన్నారు. ఏ విధముగా ఏ ఆహారమును తీసుకొనినా అది శరీర ఆరోగ్య, అనారోగ్యములకు సంబంధించినదేగానీ పవిత్రత, అపవిత్రతలకు సంబంధించినది కాదు. ఏ మనుజునీ, ఏ ఆహారమూ పవిత్రునిగానీ, అపవిత్రునిగానీ చేయలేదు. మనుష్యుని ఆహారము జ్ఞానమార్గమునకు ఆటంకము కాదు. మనిషి నోటితోనే తింటున్నాడు, నోటితోనే మాట్లాడుచున్నాడు. ఇక్కడ గమనించవలసిన దేమనగా! నోరు చేయు రెండు పనులలో నోటి ద్వారా శరీరములోనికి పోవు ఆహారము వలన సమస్య లేదుగానీ, శరీరము నుండి నోటి ద్వారా బయటకు వచ్చు మాటల విషయమే మనుష్యుని అపవిత్రము చేయుచున్నది. మనుష్యుడు పైకి ఏ విధముగా నటించి మాట్లాడినప్పటికీ, వాని స్వభావము మాటల ద్వారా బయటపడుచునే ఉండును. జ్ఞానమున్నవాడే పవిత్రుడునీ, జ్ఞానము లేనివాడు అపవిత్రుడనీ పెద్దల అభిప్రాయము. జ్ఞానమున్నవాడు పవిత్రుడని వాని మాటలను బట్టి తెలియుచున్నది. ఆ విధముగనే జ్ఞానము లేనివాని యొక్క మాటలలో వాని అజ్ఞానము బయటపడుచుండును. మాట్లాడు దానినిబట్టి వాని అపవిత్రత బయటపడినట్లే కదా! అందువలన ప్రభువు పై వాక్యమును చెప్పాడు. పరిశుద్ధ గ్రంథములోని ప్రభువు వాక్యము ప్రకారము, భగవద్గీతలోని భగవంతుడు చెప్పిన ఆహార విషయము ప్రకారము, మనిషిని ఆహారము అపవిత్రుని చేయదనీ, వాని కర్మ వాని ఆహారమును సమకూర్చుననీ, జ్ఞానమార్గములో ఉన్నవానికి ఆహార నియమములుండవనీ, అలవాటు ప్రకారము ఏ ఆహారము తీసుకొనినా అది దేవునికి పట్టింపు లేదనీ తెలియుచున్నది.☞
(41) మత్తయి సువార్త, 15వ అధ్యాయము, 12, 13వ వచనములు.(12) అంతట ఆయన శిష్యులు వచ్చి ''పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరబడిరని'' చెప్పగా, ప్రభువు ఇలాగ అనెను.
(13) ''పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.''మనిషి ఆహారము వలన అపవిత్రుడు కాడనీ, ఏ ఆహారము తీసుకొనినా దేవుని మార్గములో ప్రయాణించవచ్చని ప్రభువు చెప్పిన మాటలు విని అప్పటి పండితులు, పరిసయ్యులు అనువారు వారి అభ్యంతరమును తెలిపారు. ప్రభువు చెప్పిన మాటనే తిరస్కరించారు, అది జ్ఞానమే కాదన్నారు. ప్రభువు అజ్ఞానమును బోధిస్తున్నాడని, అలా బోధించు అధికారమెవరిచ్చారని ప్రశ్నించారు. దేవుని గూర్చి బోధించు అధికారము తమకే కలదనీ, తామే గురువులమనీ తమను గొప్పగా చెప్పుకొని, దేవుని గూర్చి బోధించు అధికారము ప్రభువుకు లేదన్నారు. ఆ విషయమును ప్రభువు శిష్యులు కొందరు ప్రభువుతో చెప్పగా 'పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింప బడునని' సమాధానమిచ్చాడు.
పరలోక తండ్రియైన పరమాత్మ తన ధర్మములను స్థాపించి ఉంచాడు. ఆయన స్థాపించిన ధర్మములకు భూమిమీద అప్పుడప్పుడు గ్లాని ఏర్పడవచ్చునుగానీ అవి పూర్తి నశించవు. ధర్మగ్లాని ఏర్పడినప్పుడు పరమాత్మ భగవంతునిగా అవతరించి తన ధర్మములకు బలము చేకూర్చి పోవును. ధర్మములకు గ్లాని ఏర్పడినప్పుడు అధర్మములు చెలరేగడము కూడా జరుగుచుండును. దేవునివి ధర్మములైతే, సాతానువి అధర్మములని తెలియాలి. పరమాత్మ నాటిన మొక్కలు ధర్మములు కాగా, సాతాను నాటిన మొక్కలు అధర్మములు. పరమాత్మ తానే స్వయముగా భూమిమీద అవతరించి, తన ధర్మములు ఇవి అని తెల్పిపోగా, సాతాను తాను కూడా పండితులు, పరిసయ్యులు, గురువులు, స్వాములుగా అవతరించి దేవుని ధర్మములని వారి చేత ప్రజలను నమ్మించి, తన ధర్మములను తెల్పుచుండును. సాతాను (మాయ) ధర్మముల వలన పరమాత్మ ధర్మములు అప్పుడప్పుడు బలహీన పడుచుండును. దేవుని ధర్మములు గొప్పవైతే ఎందుకు మాయ ధర్మముల వలన బలహీనపడాలి? అని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి సమాధానము పరమాత్మ భగవంతునిగా ఒక్కచోట పుట్టి తన ధర్మముల గూర్చి ప్రచారము చేసి పోవును. అప్పటికి బలము చేకూరినా కొన్ని వేల సంవత్సరములకు తిరిగి ధర్మములు బలహీనపడుచున్నవి. అలా జరుగుటకు కారణమేమనగా! దేవుడు భగవంతునిగా ఒక్కమారు వచ్చిపోతే తిరిగి తనకు అవసరమనిపించినప్పుడు తిరిగి ఆయన రాక ఉండును. మాయ (సాతాను) దేవునివలె కాక ఎల్లప్పుడూ తన అంశతో గురువులను, స్వాములను పుట్టించి వారి ద్వారా ఇది దేవుని జ్ఞానమేనని నమ్మించి తన ధర్మములను ప్రచారము చేయుచున్నది.
వేల సంవత్సరములకు ఒక్కమారు వచ్చు గుర్తింపులేని భగవంతుని కంటే ఎల్లప్పుడూ స్వాములు, గురువులు, బాబాలుగా ఉన్న వారినే భగవంతులుగా చూపు మాయ ప్రభావములో ప్రజలు ఆకర్షితులగుచున్నారు. ఒక్క సమయములో ఒక్కమారు వచ్చి పోవు దేవునికంటే, అనేకసార్లు అనేకమందిగా పుట్టు సాతాను ప్రభావమునకు దేవుని ధర్మములు సన్నగిల్లుచున్నవి. చేనులో కలుపు మొక్కలెక్కువైనప్పుడు రైతు విత్తిన చెట్లు సన్నగిల్లి పోవును. అప్పుడు రైతు తాను విత్తిన చెట్టుకు బలము చేకూర్చేదానికి స్వయముగా పొలములోనికి పోయి కలుపు మొక్కలను కూకటి వ్రేళ్లతో సహా పెరికివేయును. తర్వాత కొంత కాలమునకు ఎవరూ విత్తకున్ననూ కలుపు మొక్కలు అనేకము పెరుగుట మనము చూచియే ఉందుము. పరమాత్మ రైతులాంటి వాడు, తాను తన ధర్మములను మొక్కలను నాటి ఉంచాడు. సాతాను కలుపు మొక్కలను దేవుని మొక్క చుట్టూ పుట్టునట్లు చేయుచున్నది. మాయ మొక్కల ప్రభావమునకు దేవుని మొక్క బలహీన పడడము సహజమే. అటువంటి సమయములో దేవుడు వచ్చి తన ధర్మమునకు చుట్టూ ఉన్న అనేక మాయ ధర్మములను పెకళించి వేయును. అందువలననే ప్రభువు పై వాక్యమును చెప్పాడని తెలియవలెను. ''దేవుడు తాను నిర్మించిన ధర్మములను బలహీనపరచు సాతాను ధర్మములను పూర్తి ఖండించివేసి, తన ధర్మమునకు బలము చేకూర్చును.''☞
(42) మత్తయి సువార్త, 15వ అధ్యాయము, 14వ వచనము.(14) వారి జోలికి పోవద్దండి. వారు గ్రుడ్డివారై యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు.మాయ ప్రభావములోనున్న మనుషులు మాయ యొక్క అంశయైన పండితులు, పరిసయ్యులు భగవంతుడైన ప్రభువును విమర్శించారు. అటువంటివారు దేవుని జ్ఞానము తెలియనివారు. వారికి జ్ఞాన నేత్రము లేనే లేదు. వారు జ్ఞానదృష్ఠి లేని గ్రుడ్డివారు. దేవుని జ్ఞానము తెలియనివారు మరియొకనికి దేవుని జ్ఞానమునెలా తెలుపుదురు? తమకు దృష్ఠి లేకున్ననూ దృష్ఠి ఉన్న వారివలె నటిస్తూ తమకు దేవుని జ్ఞానము తెలియకున్ననూ తెలిసిన వారివలె ప్రచారము చేసుకొనుచున్నారు. అటువంటి ప్రచారకులను నమ్మి వారికి జ్ఞానము సంపూర్ణముగా తెలుసునని ప్రజలు వారిని మార్గదర్శకులుగా చేసుకొనుచున్నారు. మాకు మార్గము చూపువాడొకడు న్నాడను ధైర్యముతో వారివెంట నడుస్తున్నారు. వాస్తవానికి వారు పట్టుకున్నవాడు కూడా మావలె గ్రుడ్డివాడేనని ప్రజలకు తెలియదు. ఒక గ్రుడ్డివాడు మిగతా గ్రుడ్డివారిని తోడు చేసుకొని, నాకు కళ్ళున్నవి మీకు దారి చూపెదనని తనవెంట చేయి పట్టుకొని పిలుచుకు పోవుచున్నాడను కొనుము. ఎక్కడైనా గుంతవస్తే ఆ గుంతలో మొదట దారి చూపుదునని చెప్పిన గ్రుడ్డివాడు పడును. తర్వాత వాని మీద మిగతావారు పడుదురు. అలాగే దేవుని జ్ఞానము తెలియనివారు తెలిసినవారిని కూడా హేళనగా మాట్లాడుచూ, తామే గొప్ప గురువులమని చెప్పుకొనుచుందురు. వారితో తెలిసినవారు వాదించవలసిన పనిలేదు. జ్ఞానదృష్ఠి లేనివారు మోక్షమను శిఖరమును ఎక్కలేరు. జ్ఞానదృష్ఠి లేని గురువును జ్ఞానదృష్ఠి లేని ప్రజలు ఎంతమంది ఆశ్రయించినా మోక్ష శిఖరమునెక్కలేరు కానీ, గుణములను గుంతలలో పడక తప్పదు.☞
(43) మత్తయి సువార్త, 16వ అధ్యాయము, 21, 22 వచనములు.మత్తయి సువార్త, 17వ అధ్యాయము, 22, 23 వచనములు.మత్తయి సువార్త 20వ అధ్యాయము, 17, 18, 19 వచనములు.(మత్తయి, 16-21) అప్పటినుండి తాను ఎరూషలేము నకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని ఏసు శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా
(మత్తయి, 16-22) పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. (ఒకటవమారు చెప్పుట)
(మత్తయి, 17-22) వారు గలిలయలో సంచరించు చుండగా ఏసు ''మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు.
(మత్తయి, 17-23) వారు ఆయనను చంపుదురు. మూడవ దినమున ఆయన లేచునని'' వారితో చెప్పగా, వారు బహుగా దుఃఖపడిరి. (రెండవమారు చెప్పుట)
(మత్తయి, 20-17) ఏసు ఎరూషలేమునకు వెళ్లు నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను.
(మత్తయి, 20-18) ఇదిగో! ఎరూషలేమునకు వెళ్లుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును, శాస్త్రులకును అప్పగించబడును వారాయ నకు మరణశిక్ష విధించి
(మత్తయి, 20-19) ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. మూడవ దినమున ఆయన మరల లేచును. (మూడవమారు చెప్పుట)మత్తయి సువార్త, 16, 17, 20 అధ్యాయములలో ఏసు తన భవిష్యత్ కాలమును గురించి చెప్పాడు. సాధారణ మనుషులు ఎవరయినా తన మరణము ఫలానా అప్పుడు వచ్చునని చెప్పలేరు. భవిష్యత్ అంధకారము. అనగా ముందు ఏమి జరుగునో ఎవరికీ తెలియదు. తన మరణమును ఎవరూ కనుగొనలేరు. ఏసు సాధారణ మనిషి కాదనీ, ఆయనలో ఏదో ప్రత్యేకత యున్నదని ఎంత అజ్ఞానికయినా అర్థమగునట్లు తన మరణమును గురించి ఏసు ముందే చెప్పడము జరిగినది. ఒకమారు కాకుండా మూడుమార్లు తన మరణమును గురించి చెప్పాడు. అలా ఎవరికీ సాధ్యము కాదు. ఏసు తన మరణమును ముందే నిర్ణయించుకొని వచ్చాడు కనుక ఆ విషయమును గురించి చెప్పాడు. శరీరములో జీవితమునకు సంబంధించిన కర్మలను నింపి పంపువాడు ఒక్కడే! అతడే ఆత్మయని పిలువబడుచున్నాడు.
ఏసు తన మరణమును గురించి మూడుమార్లు చెప్పియున్నాడు. తన కర్మలను తానే నిర్ణయించుకొన్నాడు కావున ఏసు ముందే ఈ విషయమును చెప్పాడు. కర్మల తీర్పు తీర్చువాడు ఆత్మ అయినప్పుడు పరమాత్మకు ఆత్మ కుమారునిగా ఉన్నాడు. ఏసు పరిశుద్ధాత్మను తండ్రియని అనేకమార్లు చెప్పాడు కనుక ఆయన కర్మలను నిర్ణయించు ఆత్మయని తెలిసినది. అందువలన తన జీవితమునకు తానే తన కర్మను నిర్ణయించుకొని వచ్చాడని తెలియుచున్నది. కర్మను ముందే తయారు చేసుకొని వచ్చాడు కనుక తాను శాస్త్రులు, ప్రధాన యాజకుల చేత అనేక హింసలు పొంది, చంపబడిన తర్వాత మూడవ దినమున లేచుట తప్పదని చెప్పాడు. ఆయన చెప్పినట్లే జరిగినది. తనకు మరణ శిక్ష విధించబడుతుంది యని ఏమాత్రము ఆందోళన చెందక చెప్పాడు. అలా చెప్పడము వలన ఏసు సాధారణ మనిషి కాదని, ఆయనలో ఏదో ప్రత్యేకత యున్నదని బుద్ధియున్న ప్రతివాడు తెలియవచ్చును.☞
(44) మత్తయి సువార్త, 19వ అధ్యాయము, 23, 24 వచనములు.(23) ఏసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
(24) ఇదిగాక ''ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని'' మీతో చెప్పుచున్నాననెను.ఏసు ఇక్కడ ఒక ఉపమానమును చెప్పాడు అది ఏమనగా! ''ధనవంతుడు పరలోకములో ప్రవేశించుటకంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమన్నాడు.'' ఒంటె సూది రంధ్రములో దూరుట అసాధ్యమైన పనిగా ఎట్లు గలదో అంతే అసాధ్యమైన పనిగా ధనవంతుడు పరలోకమును చేరుట కలదని చెప్పవచ్చును. మనిషికి 'ధనమెక్కిన మదమెక్కునని' కొందరు పెద్దలు చెప్పుచుందురు. ధనమెక్కువయిన వానిని ధనవంతుడు అని అంటారు. మదమెక్కువయిన వానిని మదవంతుడు (గర్వము గలవాడు) అని అంటారు. మదము అనగా ఆరు చెడు గుణములలో ఒక గుణమును మదము అని అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అను ఆరు చెడు గుణములలో ఐదవ చెడు గుణముగా మదము అనునది గలదు. మదము అనగా గర్వము అని అర్థము. గర్వము లేని మనిషి భూమిమీద లేడు. అంతో ఇంతో అయినా గర్వము ప్రతి మనిషిలోను ఉండును. మనిషిలో వంద శాతము గర్వము లేకున్నా 90, 80, 70, 60, 50, 40, 30 శాతమయినా ఉండును. ఒకనిలో 90 శాతము ఉంటే, మరొక మనిషిలో 80 శాతము ఉండును. ఇట్లు చివరకు ముప్ఫయి (30) శాతము అయినా ఉండిన మనుషులుండవచ్చును.
శరీరములో జీవునితో తగులుకొని ఆలోచన చేయించునది ఒక గర్వమే కాదు, దానికి అనుబంధముగా యున్న మిగతా ఐదు గుణములు కూడా పని చేయుచున్నవి. ప్రపంచములో ధనము లేనివానికి గర్వము తక్కువ ఉండవచ్చును. ధనము ఉన్నవానికి గర్వము ఎక్కువగా యుండును. కోట్ల ధనమున్న వానికి గర్వము కూడా అధికముగా ఉండును. ధనమున్న వానికి ఒక గర్వమే కాక మిగతా గుణములు కూడా అధికముగా ఉండును. ధనము మనిషిని ఏ విధముగానయినా మార్చగలదు. అందువలన ధనము వలన మనిషి జ్ఞానమునకు దూరము కాగలడు. మోక్షమును సూదికున్న రంధ్రములాగ పోల్చినప్పుడు, ధనము గల వానిని ఒంటెగా పోల్చవచ్చును. పెద్ద ఒంటె చిన్నగా యున్న సూదిరంధ్రములో దూరనట్లు, ధనవంతుడు మోక్షమును చేరలేడు అని చెప్పారు. ఒంటె ఏ విధముగా సూది బెజ్జములో దూరలేదో, అదే విధముగా ధనము గలవాడు గుణములు అను బలము యున్న ఒంటెలాగా యుండి పరలోకములో ప్రవేశింపలేడు.☞
(45) మత్తయి సువార్త, 22వ అధ్యాయము, 36, 37, 38, 39, 40 వచనములు.36) బోధకుడా! ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.
37) అందుకాయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెననునదియే.
38) ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
39) నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
40) ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని, ప్రవక్తలకును ఆధారమైయున్నవని అతనితో చెప్పెను.ఏసును శోధించి అడుగవలెనని, ఏసు సమాధానము చెప్పక పోతే హేళన చేయవలెనను ఉద్దేశ్యములో కొందరు ఏసువద్దకు వచ్చి ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. అందుకు ఏసు వెంటనే సమాధానము చెప్పుచూ ''నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెననునదియే.'' మొదటి ఆజ్ఞ అనియు మరియు ముఖ్యమైన ఆజ్ఞ అనియు చెప్పడమైనది. తర్వాత వెంటనే రెండవ ఆజ్ఞను గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు మనము మొదటి ఆజ్ఞను గురించి తెలుసుకొందాము. ఈ వాక్యములో ఆజ్ఞ అను పదమును చెప్పారు. చివరిలో రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమున కంతటికి మరియు ప్రవక్తలకందరికి ఆధారమైనవని చెప్పడమైనది. దానిని గురించి చూస్తే ఇలా చెప్పవచ్చును.
ఆజ్ఞ అనగా ఆజ్ఞాపించబడినది అని చెప్పవచ్చును. అయితే వెంటనే ఎవరు ఆజ్ఞాపించారు? అను ప్రశ్న రాగలదు. దానికి జవాబుగా పెద్దవాడు చిన్నవారిని ఆజ్ఞాపించును. ప్రపంచమునకు అంతటికీ పెద్దయిన వాడు ప్రపంచమును సృష్ఠించిన సృష్ఠికర్తయిన దేవుడే. దేవుడు శాసించి చెప్పినది లేక ఆజ్ఞాపించి చెప్పినది ఆజ్ఞ అనియు, శాసనము అనియు చెప్పవచ్చును. మార్పు చెందనిది శాసనముతో కూడుకొన్న దానిని శాసనము అనియూ మరొక పదమును ఉపయోగించి చెప్పితే 'ధర్మము' అనియు చెప్పవచ్చును. శాసనము అనినా, ఆజ్ఞ అనినా మార్పు చెందనిది అయిన దానివలన దానిని ప్రత్యేక పదము ద్వారా ధర్మము అని చెప్పవచ్చును. ఉదాహరణకు ఒక మిరపకాయను తీసుకొని చూస్తే అందులో మార్పు చెందనిది, శాసనముగా యున్నది మిరపకాయ యొక్క కారము. మిరపకాయలో కారము అనునది దాని ధర్మము అని చెప్పవచ్చును. మిరపకాయ ఎప్పటికీ ఒకే విధముగా మార్పు చెందనిదై యున్నది. కావున దాని ధర్మము కారముగా ఉండడమేయని తెలియుచున్నది. మిరపకాయకు కారము ధర్మమైనట్లు, చింతకాయకు పులుపు ధర్మముగా యున్నది. వేపకాయకు చేదు ధర్మముగా యున్నది.
ధర్మము అనునది ఒక నియమ నిబద్ధతతో కూడియున్నదని చెప్పవచ్చును. ధర్మము లేక ధర్మములు ఎవరికి ఉంటాయి? అని ప్రశ్నించు కొని చూస్తే సృష్ఠించబడిన చింతకాయకు, మిరపకాయకు, వేపకాయకు ధర్మమున్నట్లే సృష్ఠించబడిన దేనికయినా ధర్మము ఉండును. దేవుడు సృష్ఠించిన సృష్ఠికర్త అయిన దానివలన ఆయనకు ధర్మములంటూ ఏవీ ఉండవు. సృష్ఠికర్తయిన దేవుడు ధర్మములకు అతీతుడుగా ఉండును. సృష్ఠి కర్తయిన దేవుడు తప్ప సృష్ఠింపబడిన ఆత్మకు, జీవాత్మకు కూడా ధర్మములు గలవు. పరమాత్మ అంశములయిన ఆత్మకు, జీవాత్మకు ధర్మములున్నప్పుడు తయారు చేయబడిన ప్రకృతికి తప్పనిసరిగా ధర్మములుండును. అయితే మనము తెలియవలసినది బ్రహ్మవిద్యయిన ఆధ్యాత్మిక విద్యను. కావున ఆత్మ, జీవాత్మలను గురించిన ధర్మములనే తెలియవలసియున్నది. బ్రహ్మవిద్యను తెలియవలసినవాడు జీవాత్మయినవాడు కనుక అతను తెలియవలసినది ఆత్మ ధర్మములను మాత్రమే.
ఇక్కడ వాక్యములో కూడా ఆత్మను తెలియవలసిన విధానమును గురించియే చెప్పారు. అలా తెలియడమే ముఖ్యమని కూడా చెప్పారు. ధర్మశాస్త్రము ఆత్మను గురించి తెలియునదై యున్నది. అందువలన ధర్మశాస్త్రములో ముఖ్యమైన ధర్మము ఏది అని అడిగినప్పుడు ''నీ దేవుడయిన ప్రభువును ప్రేమింపవలయుననునదే ముఖ్యమైనదియు, మొదటిదియునైన ఆజ్ఞ'' అని చెప్పియున్నారు. ఇక్కడ దేవుడయిన ప్రభువు అని చెప్పారు. ప్రభువు అనగా ముఖ్యముగా పుట్టినవాడు అని అర్థము గలదు. పుట్టిన దేవున్ని ప్రేమించడమే ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పారు. ఇంతకుముందే సృష్ఠించినవాడు మరియు సృష్ఠింపబడనివాడు దేవుడు అనియు, ఆయనకు ధర్మము లేదు అనియు చెప్పుకొంటున్నాము. సృష్ఠింపబడనివాడు, సృష్ఠిని అంతటినీ సృష్ఠించినవాడు దేవుడు అయినప్పుడు ముఖ్యముగా పుట్టిన (ప్రభువు) అనువాడు దేవుడు ఎట్లగును? అను ప్రశ్న రాగలదు. 'దేవుడయిన ప్రభువు' అని చెప్పియున్నారు కనుక దేవుడు పుట్టనివాడా? పుట్టినవాడా యని అనుమానము వచ్చుచున్నది. దానికి జవాబు ఏమనగా!
దేవుడు పుట్టనివాడు అని మొదటికి చెప్పవచ్చును. సృష్ఠింపబడని సృష్ఠికర్తయిన దేవుడు మొదట ప్రకృతిని మాత్రమే సృష్ఠించాడు. ప్రకృతిని సృష్ఠించిన దేవుడయిన పరమాత్మ తన ప్రకృతిలో జీవరాసులను సృష్ఠించాలని అనుకొన్నాడు. ఒకమారు ప్రకృతిని సృష్ఠించిన దేవుడు తనకు తాను ఏ కార్యమును చేయకూడదని నిర్ణయించుకొన్నాడు. పంచభూతములయిన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు సజీవమున్న పంచ భూతములను తయారు చేసిన తర్వాత ఏ కార్యము చేయనివాడుగా ఉండిపోదలచిన దేవుడు తన ప్రకృతిలో జీవులను సృష్ఠించుటకు, పాలించుటకు, గతింపజేయుటకు సామత్యముగా చేయు ఆత్మను ప్రత్యేకముగా, తనకు తాను పుట్టునట్లు అనుకోగా దేవుడు అనుకొన్న వెంటనే ప్రభువు అనబడు ఆత్మ తయారయినది. ఆత్మ సర్వజీవరాసులను సృష్ఠించుచున్నది, పాలించుచున్నది, మరణించునట్లు చేయుచున్నది. జీవులనందరినీ సృష్ఠించిన సృష్ఠికర్త ఆత్మయే కనుక ఆత్మను కూడా దేవుడు అని అనవలసి వచ్చినది. ఈ విధముగా ప్రకృతిని సృష్ఠించిన దేవుడు మొదటివాడు కాగా, ప్రకృతిలో జీవరాసులను సృష్ఠించిన దేవుడు రెండవవాడు అని చెప్పవచ్చును.
ఆత్మను కూడా సృష్ఠించినవాడు, ఆత్మకు కూడా దేవుడయినవాడు, ఆత్మకు కూడా వేరుగా (పరముగా) యున్నవాడయిన మొదటి దేవున్ని పరమాత్మయని చెప్పుచున్నాము. జీవరాసులను సృష్ఠించిన రెండవ దేవున్ని ఆత్మయని చెప్పుచున్నాము. పరమాత్మ, ఆత్మ అను ఇద్దరు దేవుళ్లు సృష్ఠికర్తలే, ఇద్దరు దేవుళ్లుగానే పిలువబడుచున్నా, మొదటి దేవుడయిన పరమాత్మ ధర్మములకు అతీతుడు. రెండవ దేవుడయిన ఆత్మ ధర్మములు కలవాడు. ధర్మములు లేని దేవుడు మొదటి సృష్ఠికర్త కాగా, ధర్మములుగల దేవుడు రెండవ సృష్ఠికర్తగా యున్నాడు. ప్రపంచములో ఇద్దరు దేవుళ్లున్నారని వాస్తవముగా ఎవరికీ తెలియదు. ఇద్దరు దేవుళ్ళున్నా మొదటి దేవున్ని పెద్దగా చెప్పుచున్నా మనుషులను సృష్ఠించినది రెండవ దేవుడయిన ఆత్మే అగుట వలన మనుషులకు దేవుడు ఆత్మేయని చెప్పవచ్చును. మనుషులు ఆరాధింపతగిన దేవుడు ఆత్మేయని చెప్పవచ్చును. మనుషులు రెండవ దేవుని ధర్మములనే తెలియవలసియున్నది. దైవ గ్రంథములలో తెలియజేసిన ధర్మములన్నియూ ఆత్మను గురించినవే యని తెలియవలెను.
మనిషి పూజించవలెనన్నా, ఆరాధించవలెనన్నా, నమస్కరించవలెనన్నా, ప్రార్థన చేయవలెనన్నా రెండవ దేవుడయిన ఆత్మను ఆరాధింప వలసిందే, ఆత్మను ప్రార్థన చేయవలసిందే. మొదటి దేవున్ని ఎవరూ ఆరాధించలేరు. ఆయనను ఆరాధించుటకు, ప్రార్థించుటకు ఎవరికీ సాధ్యపడదు. ఆయన ఏ అవసరమూ లేనివాడు, ఎవరినీ పుట్టించిన వాడు కాడు, ఆయన పుట్టించబడినవాడు కాడు. అందువలన మొదటి దేవున్ని అంతిమ దైవగ్రంథములో ''ఆయన ఎవరికీ సంతతి కాడు, ఆయనకు ఎవరూ సంతానము లేరు'' అని చెప్పియున్నారు. ఆయన ఎవరి ప్రార్థనతో అక్కర లేనివాడని కూడా 112వ సూరాలో చెప్పియున్నాడు. నమాజ్ లేక ప్రార్థనతో సంబంధము లేని దేవుడు మొదటివాడు కాగా, ప్రార్థనతో సంబంధమున్నవాడు రెండవ దేవుడు గలడు. ఇటు క్రైస్థవులకుగానీ, అటు ముస్లీమ్‌లకు గానీ ఇద్దరు దేవుళ్ళుయని (ఇద్దరు అల్లాహ్‌లుయని) తెలియదు. ఉన్నది ఒకే దేవుడు అని అంటున్నారు. ఆ ఒక్క దేవున్నే ఆరాధించుచున్నారు. ఆరాధింపతగిన దేవుడు వేరు, సృష్ఠికర్తయిన మొదటి దేవుడు వేరు అని రెండు మతముల వారికి తెలియదు. హిందువులకయితే దేవుడు అనే విషయమే తెలియక అనేక దేవతలను ఆరాధించుచూ పూర్తి తప్పుదారిలో (అజ్ఞాన మార్గములో) నడుస్తున్నారు.
మొదటి దేవుడు ధర్మములకు అతీతుడు. అందువలన ఆయనను ఎవరూ తెలియలేరు, ఆరాధించలేరు. ధర్మములుగల దేవుడయిన ఆత్మను ఆరాధించుటకు మనిషి శరీరములో కొన్ని భాగములు ముఖ్యముగా యున్నవి. జీవుడు తన మనస్సుతో మరియు తన బుద్ధితో ఆత్మయిన దేవున్ని ఆరాధించవలసియున్నది. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ధర్మముగా యున్నది. ఆత్మయిన దేవున్ని ''నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమించవలెనని'' చెప్పియున్నారు. ఇక్కడ ప్రేమించవలెనంటే ఆరాధించవలెనని అర్థము. అలా చేయడమే ముఖ్యమైనదియు మొదటిదయిన ఆజ్ఞ (ధర్మము) అని వాక్యములో గలదు. ఆజ్ఞ అంటే ధర్మము అని అర్థము చేసుకొన్నట్లు, పూర్ణహృదయముతో అంటే బుద్ధి అంతటితో యని అర్థము. అలాగే పూర్ణాత్మతో అనగా జీవుడయిన నీవు అని అర్థము. ప్రేమించుము అంటే ప్రార్థించుము అని అర్థము. ధర్మశాస్త్రములో అనగా ఆధ్యాత్మిక ధర్మములలో నీవు, నీ బుద్ధితో, నీ మనస్సుతో ఆత్మయిన దేవున్ని ఆరాధించవలెనని చెప్పియున్నారు. ఇది మొదటి ఆజ్ఞకాగా, రెండవ ఆజ్ఞ మరొకటి కలదు. అది ఏమనగా!
మొదటి దానివంటిదే అయిన రెండవ ఆజ్ఞ ''నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము'' అని ఉన్నది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికినీ మరియు ప్రవక్తలకును ఆధారమై యున్నవని చెప్పారు. ధర్మశాస్త్రమంతటికినీ అంటే బ్రహ్మవిద్యా శాస్త్రములో ధర్మములలోనూ మరియు ధర్మములను బోధించు ప్రవక్తలకందరికినీ ఆధారమైనవని వాక్యములో చెప్పారు. ఈ వాక్యమును ఆలోచించి చూస్తే ప్రతి మనిషికీ తనమీద ఎక్కువ ప్రేమ ఉండును. తనమీద అంటే తన ప్రాణము మీద ఎక్కువ ధ్యాస ఉండును. ప్రాణము తీస్తారని ఇతరులు పూనుకొన్నప్పుడు తన ఆస్తినంతటినయినా ఇచ్చి ప్రాణమును కాపాడుకోవలెనని చూచుదురు. అందువలన మనిషి తనను తాను బాగుండునట్లు చూచుకొనుచుండును. తన ప్రాణము మీద తనకు ఆశ ఎక్కువ ఉండును అని అంటుంటారు. తన ప్రాణముంటే తానుండునని తలచి, తనకొరకు ఏ దేవున్నయినా మ్రొక్కగలడు, ఏమయినా చేయగలడు. దీనినిబట్టి జీవుడు తనను తాను ఎక్కువగా ప్రేమించునని తెలియుచున్నది. వాక్యములో నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనని అన్నారు. నిన్నువలె అనగా నీవు ఎలా బాగుండవలెనని కోరుకొందువో, చావునుండి నిన్ను దూరముగా ఉండునట్లు నీ ప్రాణము మీద ఎంత శ్రద్ధ కల్గియున్నావో అలాగే నీ పొరుగువానిని ప్రేమించవలెనని అన్నారు.
పొరుగువాడు అంటే ఏమిటి? అని ఆలోచిస్తే ఇరుగు పొరుగు అను జంట పదములను అప్పుడప్పుడు మనమే అనడముగానీ, వినడముగానీ జరుగుచుండును. ఇరుగు అంటే నేను అని అర్థము, పొరుగు అంటే నా ప్రక్కవాడు అని అర్థము. బాగా గమనించితే పొరుగు అనగా ప్రక్క ఇంటివాడు అని అందరూ అర్థము చేసుకొనుచుందురు. అది తప్పనీ, నీ ప్రక్కనుండు వానినే పొరుగువాడని అనడము జరుగుచున్నదని తెలియవలెను. ఇహ, పర అను రెండు జంట పదములున్నట్లు, ఇరుగు పొరుగు అను రెండు జంట పదములు గలవు. ఇహ లోకము, పరలోకము అన్నప్పుడు నేనున్న లోకము అనియు నేనున్న దానికంటే వేరుగాయున్న లోకము అనియు అర్థము వచ్చును. అలాగే ఇరుగు ఇల్లు, పొరుగు ఇల్లు అంటే నేనుండు ఇల్లు, నేనుండు ఇంటి ప్రక్కన ఇల్లు అని చెప్పవచ్చును. ఇరుగు పొరుగు అన్నప్పుడు నేను నా ప్రక్కవాడు అని చెప్పవలెను. ఇక్కడ వాక్యములో నీ వలె నీ పొరుగువానిని అన్నప్పుడు నీకు నీ మీద ఉన్నంత ప్రేమతో నీ పొరుగువానిని ప్రేమించవలెనని అర్థము వచ్చును. వాక్యము ప్రకారము చూచుకొన్నట్లయితే నీకు పొరుగువాడు ఎవరున్నారని చూస్తే శరీరములో నీ ప్రక్కనే యున్నవాడు నీ ఆత్మ తప్ప మరొకడు లేడు. నీవు జీవాత్మవు అయితే నీవలె ఆత్మగాయున్నవాడు ఒక్కడే, అతడే రెండవ దేవుడయిన ఆత్మ. మొదటి దేవుడు అందరికి అతీతుడుగా, ఎవరికీ తెలియని విధముగా యున్నాడు. అందువలన ఆత్మలుగా యున్నవారు ముగ్గురే అయితే అందులో నీవుకాక మిగతావారు ఇద్దరే కలరు. వారిలో అన్నిటికీ అతీతుడు, ఒకచోట లేకుండా అంతటా వ్యాపించిన వాడు అయిన పరమాత్మను పొరుగువాడని చెప్పుటకు వీలులేదు. నీవుకాక నీవలె యున్న ఆత్మలు రెండయినా, అందులో పరమాత్మను వదలితే మిగిలిన ఆత్మ ఒక్కటే నీ పొరుగువాడుగా యున్నాడు. నీవలె పురుషుడయినవాడు ఆత్మ, పరమాత్మ తప్ప మిగిలినదంతయూ స్త్రీ స్వరూపమైన ప్రకృతియే కలదు.
నీవలె పురుష స్వరూపమైనవాడు ఆత్మ ఒక్కడే గలడు. అందువలన నీ పొరుగువానిని ఆత్మయిన దేవునిగానే చెప్పవలెను. మొదటి దేవుడయిన పరమాత్మను ఎవరూ ఆరాధింపలేరు. ఆయన సర్వ ధర్మములకు అతీతుడు. ఆయన ఆరాధనలకు అతీతుడు, ఎవరితో సంబంధము లేనివాడు. ఆయనను ఆరాధించుటకు ఎవరూ అర్హులు కారు. అందువలన అన్ని విధములా ఆరాధింప తగినవాడు ఆత్మయేనని మూడు దైవగ్రంథములలో చెప్పబడినది. ''ఈయనే మీ అల్లాహ్, ఈయననే మీరు ఆరాధించండి'' అని అంతిమ దైవగ్రంథములో ఆత్మను గురించి అనేకమార్లు చెప్పాడు. సూరా ఆరులో, 102వ ఆయత్‌లోను, సూరా మూడులో 18వ ఆయత్‌లోను, సూరా 16లో ఆయత్ 51లోనూ ఈ విషయము కలదు. నీవలె నీ పొరుగువాడయిన ఆత్మను ఇష్టునిగా చూచుకోవడము అను రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రములో ముఖ్యమైనవిగా ఉన్నవి. ప్రవక్తలైన గురువులకు, బోధకులకు ముఖ్య ధర్మముగా మనిషి ఆత్మను ఆరాధించడమే యని తెలియవలెను. ఏసును ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రములో ముఖ్యమైన ధర్మము ఏది అని అడిగినప్పుడు దానికి సరియైన సమాధానముగా ఈ వాక్యమును చెప్పాడు. ఈ వాక్యము వలన మీరు ఎవరిని ఆరాధించుచున్నారో ఒకమారు వెనుతిరిగి చూచుకొనుటకు అవకాశము గలదు.☞
(46) మత్తయి సువార్త, 23వ అధ్యాయము, 8, 9, 10 వచనములు.
8) మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు.
9) మరియు భూమిమీద ఎవరికైనను తండ్రియని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోక మందున్నాడు.
10) మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు.
ఎక్కడయినా బోధకునిగా యున్నవానిని కొందరు తండ్రియనియు పిలుచుచుందురు. బోధకులుగా యున్న గురువులు తండ్రితో సమానమని కూడా చెప్పుచుందురు. అది సత్యమే అయినా మనిషి అయినవాడు ఎవడుగానీ బోధకుడు అని పిలువబడకూడదు అని చెప్పుచూ మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు అని చెప్పారు. మీరందరూ సహోదరులే అని చెప్పియున్నారు. బోధకుడు అనగా బోధించువాడు అని అర్థము. ఒక విషయమును మరొకరికి చెప్పువానిని బోధకుడు అనినా ఇక్కడ మాత్రము దైవజ్ఞానమును బోధించువారిని గురించి చెప్పియున్నారు. దైవజ్ఞానమును బోధించువాడు ఒక్కడేయని చెప్పారు. దీనినిబట్టి దైవజ్ఞానము ఒక్కనికి తప్ప మిగతావారికి ఎవరికీ తెలియదని చెప్పవచ్చును. మిగతా వారికి ఎందుకు తెలియదు? తెలిసిన ఒక్కడు ఎవరు? అను ప్రశ్నలకు జవాబును చూస్తే ఈ విధముగా కలదు.
దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదని చెప్పబడి యున్నది. అలా చెప్పిన దైవగ్రంథములలోనే మరియొక మాట కూడా చెప్పియున్నారు. అదేమనగా! దేవుని జ్ఞానమును దేవుడు ఏ మానవుని మీద ప్రసరింప చేయలేదు అని అన్నారు. అనగా దేవుని జ్ఞానము ఏ మనిషికీ తెలియదనియేగా అర్థము. అందువలన ఎవడుగానీ దేవుని జ్ఞానమును బోధించలేదు. కావున మీరు బోధకుడని పిలువబడవద్దు అని వాక్యములో చెప్పియున్నారు. దేవుని జ్ఞానమును దేవుడు ఒక్కడే బోధించ గలడు. కావున మీ బోధకుడు ఒక్కడేయనీ, ఆయనే దేవుడని వాక్యములో చెప్పియున్నారు. మనిషి బోధకుడు కాడు గానీ మనుషులందరూ ఒకరి కొకరు సహోదరులుగా యున్నారని చెప్పడమైనది.
ప్రతి మనిషికి భౌతికమైన తల్లితండ్రియున్నారు. చిన్నపిల్లప్పటి నుండి కనిపించు తల్లితండ్రులనే అందరూ పూర్తిగా నా తల్లితండ్రులని నమ్మియున్నారు. ప్రత్యక్షముగా కనిపించు తల్లితండ్రిని గౌరవించాలని చాలామంది పెద్దలు చెప్పుచుందురు. అలాగే కనిపించే తల్లితండ్రులను అందరూ గౌరవించుచుందురు. కనిపించే తల్లితండ్రులు తప్ప ఇతరులు తల్లిగానీ, తండ్రిగానీ లేరని చెప్పవచ్చును. ఇదంతయూ ప్రపంచ సంబంధము. దైవిక సంబంధముగా ప్రతి మనిషికి కనిపించని, తెలియని తల్లితండ్రులు కలరు. నిజమైన తల్లితండ్రులు కనిపించేవారా? లేక కనిపించని వారా!యని ప్రశ్నించుకొని చూస్తే కనిపించనివారే నిజమైన తల్లితండ్రులని తెలియుచున్నది. అలా ఎందుకు చెప్పుచున్నామనగా! మనిషి పుట్టే దానికి తండ్రియే బీజదాతగా యుండును. దాని ప్రకారము ''కనిపించని తండ్రిగా యున్న దేవుడే (ఆత్మే) సర్వజీవరాసులకు బీజదాతగా యున్నాడు.'' అందువలన కనిపించని తండ్రినే నిజమైన తండ్రిగా చెప్పవలసి వస్తున్నది. మనకు తెలిసినా, తెలియకున్నా మనకు నిజమైన తండ్రి ఆత్మేనని తెలియుచున్నది. అందువలన ''తండ్రియని పేరు పెట్టి ఎవరినీ పిలువ వద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన కనిపించని లోకములో కనిపించక యున్నాడని'' చెప్పారు.
కనిపించే బోధకుడు నిజమైన బోధకుడు కానట్లు, కనిపించే తండ్రి నిజమైన తండ్రి కానట్లు, కనిపించే గురువు కూడా నిజమైన గురువు కాదని వాక్యములో చెప్పారు. చాలామంది ఏదో కొంత బోధించుచూ గురువులమని పిలిపించుకొనుచుందురు. అట్లు పిలిపించుకోవడము వలన, నీవు గురువుగా చలామణి కావడము వలన, యోగ్యత లేని పాత్రను పోషించినట్లగును. ఎప్పుడయినా గానీ దేవుడు ఒక్కడే గురువుగా భూమిమీదికి రాగలడు. దేవుడు మనిషివలె అవతరించినప్పుడు తానే గురువుగా యుండి జ్ఞానమును బోధించును. అందువలన ''భూమిమీద మనిషిగా పుట్టిన దేవుని అవతారమే నిజమైన గురువు'' అని తెలియవలెను.
(47) మత్తయి సువార్త, 23వ అధ్యాయము, 15వ వచనము.
(15) వేషధారులైన శాస్త్రులారా! పరిశయ్యులారా! ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు.
మొదట కలియుగము మూడు వేల సంవత్సరములు గడచు వరకు మతము అనునది లేకుండా ఉండేది. రెండు వేల సంవత్సరముల పూర్వము క్రైస్థవము పుట్టినప్పుడు మొదట సంఘములుగా, గుంపులు గుంపులుగా యున్న క్రైస్థవులు చివరకు తమది 'క్రైస్థవ సమాజము'గా చెప్పుకొన్నారు. సమాజముగా యున్నవారు కొంత కాలమునకు తమది 'క్రైస్థవ మతము' అని చెప్పుకొన్నారు. ఈ విధముగా మొదట 'మతము' అనునది పుట్టినది. తమది క్రైస్థవ మతము అని చెప్పుకొన్న తర్వాత తమ మతమును విస్తరింప చేసుకోవాలని ప్రయత్నించారు. అలా క్రైస్థవమును ఒక మతముగా చెప్పుకొన్న తర్వాత మిగతావారు కొందరు తాము చెప్పు బోధలనుబట్టి తమది ఒక మతముగా చెప్పుకోసాగారు. ఇలా మతములు ఒకదానికొకటి తయారగుచూ పోయాయి. అతి తొందరగా భూమిమీద పన్నెండు మతములు తయారయినవి. మతములు తయారయిన తర్వాత తమ తమ మతములను ప్రచారము చేసుకోవడములో కొందరు లగ్నమైపోయారు. ఇతరులను తమ మతములో కలుపుకొనుటకు సముద్రమును, భూమిని చుట్టి వచ్చి దొరికినవానిని దొరికినట్లు తమ మతములో చేర్చుకొనెడివారు.
మతము అనునది ప్రజల ఇష్టముతో తయారయినదిగానీ, దేవుని జ్ఞానముతో తయారయినది కాదు. ప్రజల మనోభావములతో కూడుకొన్న మతములలో దైవజ్ఞానమున్నట్లు కనిపించినా, అందులో దేవుడు చెప్పిన జ్ఞానమునకు వ్యతిరేఖమయిన జ్ఞానముండేది. అందువలన మతముతో సంబంధము లేకుండా దైవజ్ఞానమును, దైవ గ్రంథములను ఆశ్రయించిన వానికి దేవుని యొక్క ధర్మములు, దేవుని జ్ఞానము తెలిసేది. అట్లుకాకుండా మతముతో సంబంధపడి నాది ఫలానా మతము అని చెప్పుకొను వానికి మాయ జ్ఞానము తెలిసేది. దానివలన మనిషి మతమును స్వీకరించితే నరక పాత్రునిగా తయారగుచున్నాడు. మతము లేనివాడు పరలోక రాజ్యములో చేరుటకు అర్హుడగుచున్నాడు.
(48) మత్తయి సువార్త, 24వ అధ్యాయము, 35వ వచనము.
(35) ఆకాశము భూమియు గతించునుగానీ, నా మాటలు ఏమాత్రము గతింపవు.
పరమాత్మయిన దేవుడు మాట్లాడువాడు కాడు. ఆత్మగా శరీరములో యున్నవాడు మాట్లాడగలడు. ఆత్మయిన దేవుడు రెండవ సృష్ఠికర్తగా, రెండవ దేవునిగా చెప్పబడుచున్నాడు. శరీరములో ఆత్మగ యున్నవాడు శరీరము నుండియే మాట్లాడుచున్నాడు. ఆత్మయిన రెండవ దేవుడు మనిషి నుండి ఎంతో జ్ఞానమును బోధించుచున్నాడు. అలా బోధించిన జ్ఞానము మాటల రూపములోనే ఉండును. ఆత్మ శరీరము నుండి బోధ రూపములో చెప్పిన మాటలు ఆకాశము, భూమి గతించినప్పటికీ ఆయన మాటలు గతించవు అని చెప్పుచున్నాడు. ఇక్కడ ముఖ్యముగా గమనించ వలసిన విషయమేమనగా! ''ఆకాశము, భూమి గతించునుగానీ నా మాటలు ఏమాత్రము గతింపవు'' అని చెప్పియున్నారు. అయితే ఆకాశము, భూమి ఎప్పటికీ గతించునవి కావు అని చెప్పవచ్చును. ఇక్కడ వాక్యములో గతించని ఆకాశమును, భూమిని గతించును అని చెప్పియున్నారు. కావున ఈ వాక్యములో చెప్పిన ఆకాశము, భూమి రెండూ మనకు కనిపించు ఆకాశము భూమి కాదని తెలియవలెను. వాక్యములో చెప్పిన ఆకాశము, భూమి నశించునవిగా యున్నవి. ఎప్పటికీ నశించని భూమి, ఆకాశములు ఒక రకము కాగా, ఎప్పుడయినా పూర్తి నశించు భూమి ఆకాశములు మరొక రకముగా యున్నవి. మనిషి శరీరముగా యున్న ప్రకృతిలో ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి రెండు గలవు. శరీర రూపములో యున్న మొదటిదయిన ఆకాశము చివరిదయిన భూమి మధ్యలో యున్న గాలి, అగ్ని, నీరు అన్నీ నశించునవిగానే యున్నాయి. మనిషి ధరించిన శరీరము నశించును గానీ, మనిషిలో నుండి మాట్లాడిన జ్ఞానము ఎప్పటికీ నశించదని వాక్యములో చెప్పారు.
(49) మత్తయి సువార్త, 24వ అధ్యాయము, 42వ వచనము.
(42) ''కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలుకువగా యుండుడి.''
భూమిమీద దేవుని ధర్మములకు ఎప్పుడు ముప్పు ఏర్పడి, సాతాను ధర్మములు చెలరేగుచున్నవో, అప్పుడు దేవుడు తన అంశను భూమిమీదకు పంపి తన ఆజ్ఞలకు (ధర్మములకు) ఆటంకము కలుగకుండా చేసుకొనుచుండును. అట్లు పని పడినప్పుడు దేవుడే మనిషిగా రావలసియున్నది. ఆ విధముగా వచ్చినవాడే ద్వాపర యుగములో కృష్ణుడు, కలియుగములో ఏసుప్రభువు. విశేషమేమిటంటే వారు వచ్చిపోయిన తర్వాత వారిని గుర్తించగలుగుచున్నాము గానీ, వారు వచ్చినప్పుడు ఏమాత్రము వీరు ఫలానా వారని గుర్తించలేకపోయాము. దేవుడే ప్రభువుగా వచ్చిన సమయములో ఏ ఒక్కరునూ గుర్తించలేకపోయారు. ఆయన మహిమలు చూచినవారు కూడా ఆయన గొప్పవాడని అనుకున్నారు తప్ప, సాక్ష్యాత్తూ దేవుడని తెలియలేకపోయారు. ద్వాపర యుగములో కృష్ణుడు ''నేను భూమిమీద ధర్మములకు గ్లాని కల్గినప్పుడు వస్తానని'' చెప్పిపోయాడు అలాగే ప్రభువుగా వచ్చి తన ధర్మముల గూర్చి చెప్పిపోయాడు. ద్వాపరయుగములో గానీ, కలియుగములో గానీ ఆయన తెల్పిన ఆజ్ఞలలో ఏమాత్రము బేధముండదు, కానీ పుట్టిన ఆకారములలోగానీ, పేరులోగానీ, జీవితములో గానీ పోలిక లేకుండా బేధములుండును. అందువలన సాతాను వారిద్దరూ ఒక్కరేనని తెలియుటకు వీలు లేకుండా బయట స్థితి గతులను చూపి మానవులను మోసము చేసి, వచ్చినవానిని గుర్తించకుండునట్లు చేసినది. వచ్చినవాడెవడు, అట్లే రాబోవు వాడెవడు, ఎప్పుడు వచ్చిపోయాడు, ఎప్పుడు రాగలడు అను వివరము తెలియాలంటే మానవునికి కొంత జ్ఞానము అవసరము. అజ్ఞానములో ఉన్నంతవరకు దేవుని రాకగానీ, దేవుడు వచ్చియున్నాగానీ, దేవుడు వచ్చి పోయినా గానీ తెలియదు. కావున దేవుని రాక తెలియాలంటే, ఆయనను గుర్తించాలంటే ఆయనకు సంబంధించిన జ్ఞానము తెలిసి యుండాలి. ప్రస్తుత కాలములో దేవుని జ్ఞానము తెలియకుండాపోయి సాతాను జ్ఞానము నిండి పోయినది. అందువలననే పై వాక్యములో ''ఏ దినము ప్రభువు వచ్చునో మీకు తెలియదు'' అన్నారు. ఈ వాక్యములోనే ''ఆయనను తెలియాలంటే మెలుకువగా ఉండుము'' అని కూడా అన్నారు. మెలుకువ అనగా జ్ఞానము కల్గి ఉండడమని తెలియాలి.
(50) మత్తయి సువార్త, 26వ అధ్యాయము, 26, 27, 28 వచనములు.
(26) వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి ''మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరమని'' చెప్పెను.
(27) మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగండి.
(28) ''ఇది నా రక్తము. అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.''
ఏసు ఆయనకున్న పన్నెండుమంది శిష్యులు కలిసి భోజనము చేయుచుండగా, ఏసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి, విరిచి తన శిష్యుల కిచ్చి ''మీరు తీసుకొని తినుడి. ఇది నా శరీరము'' అని చెప్పెను. అంతేకాక ''ఆయన గిన్నె పట్టుకొని దానిలోని ద్రాక్ష రసమును మీరందరు త్రాగుడి, ఇది నా రక్తము'' అని చెప్పెను. గిన్నెలోని రసమును గురించి ఇది నా రక్తము అని రక్తముగా పోల్చి చెప్పడమే కాక, రక్తమును గురించి వివరించి చెప్పుచూ ''పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము'' అని చెప్పాడు. ఏసు చెప్పినది సర్వ సాధారణ మాటలవలె కనిపించినా, ఆయన చెప్పిన మాటల బోధలలో అతి ముఖ్యమైన మాటలుగా భోజన సమయములో చెప్పిన మాటలను లెక్కించవచ్చును. భోజన సమయములో చెప్పిన మాటలలోని సారాంశము తెలియని క్రైస్థవులు ఈ మాటలను గొప్పగా వివరించి చెప్పుకోలేదు. పైగా ఆయన చెప్పిన వర్తమానకాల మాటను కొందరు భూతకాలము మాటగా, కొందరు భవిష్యత్తుకు సంబంధించిన మాటగా చెప్పుకొంటున్నారు.
ఏసు ఒక గిన్నెలో ద్రాక్షరసమును ఇచ్చి 'ఇది నా రక్తము' అని చెప్పాడుగానీ, శిలువ మీద కార్చబోవు 'నా శరీర రక్తము' అని చెప్పలేదు. అయితే చాలామంది క్రైస్థవ బోధకులు ఏసు శిలువ మీద కార్చిన ఏసు శరీర రక్తముగా చెప్పుచున్నారు. ఏసు పాపుల కొరకు శిలువ మీద చిందించిన రక్తము వలన మనుష్యుల పాపము క్షమించబడుచున్నదని చెప్పుచున్నారు. ఏసు చెప్పినది ఒకటయితే మనుషులు చెప్పునది మరొకటిగా యున్నది. ఏసు తన శరీర రక్తమును గురించి ఏమాత్రము పై వాక్యములలో చెప్పలేదు. అటువంటప్పుడు ఏసు తన శరీర రక్తమును పాపుల కొరకు కార్చాడనడము అన్యాయమగును. ఆ రోజు మనుషులు ఏసును శిలువ మీదికి ఎక్కించి ఆయన రక్తమును కారునట్లు చేసి, ఆయన మరణమునకు కారణమయిన వారికి భయంకరమైన పాపము, క్షమించబడని పాపము వచ్చియుండగా, ప్రజలేదో మంచిపని చేసినట్లు ఏసు మరణము వలన ప్రజల పాపములు క్షమించబడినవని, క్షమించబడునని చెప్పడము ఏసుకు వ్యతిరేఖముగా చెప్పినట్లగుచున్నది గానీ ఇతరము కాదు.
ఏసు తన వాక్యములో ద్రాక్షరసమును గిన్నెలో ఇచ్చి దానిని త్రాగమని చెప్పడమేకాక అది పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు ''చిందింపబడుచున్న నిబంధన రక్తము'' అని అన్నాడు. ఇక్కడ చిందింపబడుచున్న అని వర్తమాన కాలములోని విషయమును గురించి చెప్పాడు గానీ, జరుగబోవు విషయమును గురించి చెప్పలేదు. శిలువ మీద కార్చబోవు రక్తమును గురించి చెప్పలేదు. అయినా అందరూ శిలువ మీద కార్చిన రక్తము పాపుల నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము అని చెప్పడము అవివేకమగును. శిలువ మీద ఏసును రక్తము కారునట్లు చేసిన వారికి, ఆయన శరీర రక్తము చిందుట వలన పాపము వచ్చిందిగానీ, పాపము పోలేదు అని తెలియవలెను. ఏసు చెప్పినది నిబంధన రక్తమును గురించి గానీ, శరీర రక్తమును కాదు. నిబంధన అనగా అజ్ఞాన బంధనము లతో లేని దేవుని జ్ఞానము అని అర్థము. ఏసు ప్రతి దినము ప్రజలకు చెప్పు జ్ఞానమునే ''నేను అనేకుల కొరకు చిందించుచున్న'' అని ప్రతి దినము జరుగుచున్న పనిని గురించి చెప్పాడు. ఆయన ప్రతి దినము మనుషుల పాపములు లేకుండా పోవునట్లు, మనుషుల పాపములు కాలిపోవునట్లు జ్ఞానమను అగ్నిని బోధించుచుండుట వలన బోధించు జ్ఞానమును తన నోటినుండి బోధ రూపములో వెదజల్లు నిబంధన రక్తమును పోలికతో చెప్పాడు. వాక్యములో చెప్పిన విషయమును విచక్షణ అను చూపుతో చూచినప్పుడే చెప్పబడిన సత్యము తెలియబడును.
రక్తము అను పదమును ఉపయోగించుట వలన 'నిబంధన' అను మాటను వదలివేసి 'రక్తము' అను మాటను మాత్రము తీసుకొనుట వలన చెప్పిన మాటలోని భావము సరిగా అర్థము కాకుండా పోయినది. నిబంధన అనగా జ్ఞానములతో ధర్మ సంబంధమైనదని పోల్చుకోలేకపోయారు. చెప్పిన వాక్యములో శరీరములోని రక్తమును గురించి చెప్పలేదని, రక్తము అని చెప్పుటకు మరొక కారణము కలదని చెప్పవచ్చును. శరీరము రక్తముతో నిండియుండును. శరీరములో రక్తమున్నంతవరకు శరీరము ప్రాణముతో ఉండును. శరీరములోని రక్తము కారిపోతే శరీరములో ప్రాణముండక మరణమును పొందును. దీనినిబట్టి శరీరములో సారాంశమైనది శరీరములోని రక్తమేయని తెలియుచున్నది. భోజన సమయములో మొదట ఏసు ఒక రొట్టెను తీసుకొని ''ఇది నా శరీరము దీనిని తినుడు'' అని రొట్టెను శరీరముగా పోల్చి చెప్పాడు. తర్వాత గిన్నెలో ద్రాక్షరసము ఇచ్చి ''ఇది నేను చిందించుచున్న నిబంధన రక్తము''యని చెప్పడము జరిగినది. మొదట ఇచ్చినది 'నా శరీరము అని దీనిని తినుడు' అని అన్నాడు. రొట్టెను ఏసు శరీరముగా పోల్చి చెప్పి దానిని తినమని చెప్పాడు. రొట్టెను శరీరముగా పోల్చి తింటే ఏసు శరీరమును తిన్నట్లే కదా! శరీరములో సారాంశమైనది, శరీరమునకు ఆధారముగా యున్నది శరీరములోని రక్తమే కదా!
నిబంధన రక్తమును దైవజ్ఞానముగా పోల్చితే, రొట్టెయను శరీరమును దైవజ్ఞానమున్న దైవగ్రంథముగా పోల్చి చెప్పవచ్చును. ఆ విధముగా చెప్పితే శరీరమను గ్రంథములో జ్ఞానము అను రక్తము కలదు. శరీరము తింటే యనగా గ్రంథమును చదివితే అందులోయున్న సారాంశమైన జ్ఞానమును తెలియడమునే రక్తమును త్రాగడమని తెలియవలెను. అయితే ఏసు ఇచ్చిన రొట్టెను, ద్రాక్షరసమునే మనిషి చూస్తున్నాడు గానీ, రొట్టె దైవగ్రంథమనీ, రసము గ్రంథసారమైన జ్ఞానమని తెలియకున్నారు. గ్రంథమును శరీరముగా (రొట్టెగా), జ్ఞానమును రక్తముగా (ద్రాక్షరసముగా) పోల్చి చెప్పారు. చిందింపబడుచున్న నిబంధన రక్తము యనగా ప్రస్తుతము బోధింపబడుచున్న ధర్మములతో కూడిన జ్ఞానమని తెలియవలెను. ఏసు గ్రంథమును తన శరీరముగా, గ్రంథములోని జ్ఞానమును శరీరములోని రక్తముగా చెప్పడమైనదని మనుషులు గ్రహించని దానివలన ఏసు శిలువ మీద కార్చిన రక్తము పాపక్షమాపణకొరకని పొరపడి చెప్పుకోవడము జరిగినది.
(51) మత్తయి సువార్త, 28వ అధ్యాయము, 18వ వచనము.
(18) పరలోకమందును, భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడి యున్నది.
'లోకము' అనగా అనుభవము గలదియని చెప్పుచున్నాము. లోకములో అనేకమైన కష్టములు, అనేకమైన సుఖములు అనుభవించుచున్నాము. లోకములో అనుభవములుండగా సుఖముల అనుభవములను స్వర్గలోకము అనియు, కష్టముల అనుభవములను నరకలోకము అనియు చెప్పుచున్నాము. లోకము అనునది ప్రత్యేకమైన దేశముగానీ, ప్రత్యేకమైన స్థలముగానీ కాదు. అనుభవములను లోకము అని చెప్పుచూ సుఖ, దుఃఖ అనుభవములనుబట్టి స్వర్గ, నరక లోకములు అని విభజించాము గానీ అన్ని అనుభవములను కలిపి చెప్పితే 'లోకము' అని అంటున్నాము. లోకము ఏదయినా భూమిమీదనే కలదు. భూమిమీదనే మనిషి అన్ని అనుభవములను పొందుచున్నాడు కావున స్వర్గలోకమయినా, నరక లోకమయినా భూమిమీదనే కలదని చెప్పవచ్చును. అనుభవించే అనుభవములను బట్టి స్వర్గ, నరకమని అంటున్నాము గానీ అవి ఏవయినా భూమిమీదనే కలవు.
ఇహలోకము, పరలోకము అని భూమిమీదనే రెండు విధముల లోకములు గలవు. అనుభవములున్న దానిని ఇహలోకమనియు, అనుభవములు లేని దానిని పరలోకము అనియు అంటున్నాము. ఏ విధముగా చెప్పినా ఇహ, పరలోకములు రెండు భూమిమీదనే గలవు. పర అనగా వేరుగా లేక అన్యముగా యని అర్థము. పరలోకము అనగా అనుభవముల కంటే వేరుగా యున్నదని అర్థము. ఇంకా చెప్పితే ఏ అనుభవము లేనిదానిని, లోకముకంటే వేరుగాయున్న లోకము అనియూ పరలోకము అనియు చెప్పవచ్చును. మనిషి అనగా మనస్సు ద్వారా అనుభవములను పొందువాడు అని అర్థము. అందువలన భూమిమీదగల మనుష్యులందరూ ఇహలోక వాసులేయని చెప్పవచ్చును. మనిషిగా యున్న వాడు ఎవడయినా గానీ పరలోకమును చూడలేదని తెలియుచున్నది. శరీరము ధరించిన ప్రతి మనిషి అనుభవములు లేకుండా ఎవడూ లేడు. కావున ప్రతి మనిషి లోకములోని వాడేయని, పరలోకము తెలియని ఇహ లోక వాసిగా యున్నాడని చెప్పవచ్చును. అనుభవములు లేని స్థితిని పొందువాడు పరలోకములో యున్నాడని చెప్పవచ్చును. పై వాక్యములో ''భూమిమీదగల ఇహలోకమందును, అట్లే పరలోకమందును ఏసుకు సర్వాధికారము ఇవ్వబడియున్నదని'' చెప్పియున్నారు.
ఏసు సాధారణ మనిషి అయివుంటే అతడు ఇహలోకములో ఉండువాడే గానీ, పరలోకమును తెలియనివాడుగా యుండును. అయితే ఏసు సాధారణ మనిషిగా కనిపించినా, ఆయన శరీరములో ఉండునది ఆత్మయేగానీ, జీవాత్మకాదు. ఆత్మ ఏసు శరీరములో నివశిస్తూ జీవాత్మగా నటించుచున్నది. సర్వమానవులలో ఆత్మ, జీవాత్మ రెండు ఉండగా, ఆత్మ కార్యములను చేయుచుండగా, జీవాత్మ శరీరములో ఆత్మ చేయు కార్యములలో గల సుఖమునుగానీ, దుఃఖమునుగానీ అనుభవించుచున్నాడు. దీనినిబట్టి మనిషి శరీరములోని జీవాత్మ కొంతసేపు స్వర్గములో, కొంతసేపు నరకములో ఉంటున్నాడని చెప్పవచ్చును. అయితే దేవుడు మనిషిగా వస్తే ఆయన శరీరములో జీవాత్మ ఉండదు. దేవుని కుమారుడు అనబడు ఆయన శరీరములో ఆత్మ పనిని చేసినా, ఆత్మ దేనినీ అనుభవించువాడు కాడు. అందువలన ఆయనను పరలోకమందున్నాడు యని చెప్పవచ్చును. ఏసు సాధారణ మనిషి కాదు కాబట్టి ఆయన ఇహలోకమయిన భూమిమీదను, అట్లే పరలోకమందును అధికారము గలవాడుగా యున్నాడు. పరమాత్మ అయిన పరిశుద్ధాత్మ నుండి ఆత్మయిన ఏసుకు సర్వ అధికారము ఇవ్వబడి యున్నది. సర్వాధికారిగా యున్నవానికి దైవజ్ఞానము మీద కూడా అధికారము గలదు కావున ఆత్మగాయున్న ఏసు దైవజ్ఞానమును చెప్పుటకు అధిపతిగా యున్నాడు. సాధారణముగా అయితే ''దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదు.'' అందువలన ఆత్మల విషయము ప్రజలకు తెలియదు. సర్వాధికారము గల ఏసు జ్ఞానములో మూడు ఆత్మల విషయము తెలిసినవాడై బోధించుచున్నాడు, కనుక ఆయన దగ్గర ఆత్మల జ్ఞానమును తెలిసిన శిష్యులు పోయి బయట ప్రపంచములోని మనుషులకు ఆత్మ జ్ఞానమును తెలియజేయుమని చెప్పాడు.
(52) మత్తయి సువార్త, 28వ అధ్యాయము, 19, 20 వచనములు.
(19) కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు
(20) నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా యున్నానని వారితో చెప్పెను.
మత్తయి సువార్త 28 అధ్యాయములుగా ఉండగా, అందులో 28వ అధ్యాయమందు చివరి వాక్యములయిన 19, 20 లో ఆధ్యాత్మిక విద్య యొక్క రహస్యమంతయూ చెప్పియున్నాడు. ఇక్కడ 19వ వాక్యములో చెప్పియున్న మూడు ఆత్మల సమాచారము గ్రంథములోకెల్లా ముఖ్యమైన జ్ఞానము అని తెలియవలెను. ఇక్కడ కొంత ఆలోచిస్తేగానీ అర్థము కాకుండునట్లు 'తండ్రి'యను పదమును ముందు చెప్పి, 'కుమారుడు' అను పదమును వెనుక చెప్పియున్నారు. దీనిని గురించి ఆలోచించిన వారికి ముందు కుమారుడు తర్వాత తండ్రి, ఆ తర్వాత తండ్రికి తండ్రి అయిన పరిశుద్ధాత్మ యను వరుసక్రమము తెలియగలదు. దీనిని బాగా వివరించి చెప్పితే కుమారుడు అని చెప్పిన చోట జీవాత్మయనీ, తండ్రియని చెప్పినచోట ఆత్మయనీ, పరిశుద్ధాత్మయని చెప్పినచోట పరమాత్మయనీ తెలియవలెను. ప్రపంచములో మూడు ఆత్మలు తప్ప ఇతర ఆత్మలు ఏవీ లేవు. ఆ మూడు ఆత్మలే సిద్ధాంతము ప్రకారము జీవాత్మ, ఆత్మ, పరమాత్మయని చెప్పవచ్చును.
'బాప్తిస్మము' అనగా ఒక విధముగా ఉపదేశము అని చెప్పవచ్చును. ఉప అనగా ప్రక్కనగలది యని అర్థము. ఉపదేశము అనగా ప్రక్క దేశము అని చెప్పవచ్చును. ఇంకా వివరముగా చెప్పితే ఇప్పుడు ''నీవున్న ఈ దేశమును వదలి పరదేశమునకు పోవుటకు అనుమతిని పొందడమని అర్థము.'' పరదేశమునకు పోవుటకు అనుమతిని మొదట ఒక అధికారిచే పొందవలసియున్నది. ఆ అధికారిని గురువు అని చెప్పవచ్చును. గురువు అనగా పరదేశమునకు లేక పరలోకమునకు అధిపతిగా యున్నవాడు అని అర్థము. భూమిమీద ఎంతమంది గురువులున్నా, పరలోకమునకు అధిపతియైన దేవుడే నిజమైన గురువు అని చెప్పడమైనది. పరలోకమునకు అధిపతియైన దేవుడు భూమిమీదికి మనిషివలె వస్తే ఆయనే నిజమైన బాప్తిస్మమును ఇచ్చు నిజగురువు. భూమిమీద ఎందరో గురువులమని చెప్పుకొనినా వారందరూ పేరుకు మాత్రమే గురువులు. వారు ఇచ్చునది పేరుకు మాత్రమే ఉపదేశము (బాప్తిస్మము).
నిజగురువుయైన దేవుడు భూమిమీద మనిషిగా లేకున్నప్పుడయినా జ్ఞాన సాంప్రదాయము ప్రకారము బోధకులు కూడా కొందరిని శిష్యులుగా చేసుకొని ఉపదేశము ఇవ్వవలసి యుండును. ఉపదేశము పరదేశమునకు అనుమతిలాంటిదియైతే, ఉపదేశ కార్యములో శిష్యులకు గురువు నీటితోనో, మంత్రముతోనో, వాక్యముతోనో, విభూతితోనో ఉపదేశము ఇచ్చుచుందురు. ఉపదేశము పరలోక రాజ్యమునకు అనుమతిలాంటిది అయితే వాక్యముగానీ, నీరుగానీ పరదేశ ప్రవేశమునకు అనుమతి పొందినట్లు గుర్తింపుగల టికెట్ లాంటిది. ఎక్కువమంది గురువులు మంత్రమునుగానీ, వాక్యమునుగానీ ఉపదేశ కార్యములలో వినియోగించుచుందురు. అదే విధముగా తన శిష్యులయిన వారికి చెప్పుచూ ''మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి'' అని చెప్పాడు. సమస్త జనులను శిష్యులుగా చేసుకొన్నప్పుడు వారికి బాప్తిస్మము (ఉపదేశము) కూడా ఇమ్మని చెప్పాడు. అయితే ఉపదేశ కార్యములో శిష్యునకు ఇచ్చు టికెట్‌లాంటిది ఇచ్చినప్పుడు ''తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను పేర్లనే వాక్యముగా చెప్పుచూ, మూడు ఆత్మల నామముతో బాప్తిస్మము ఇవ్వుము'' అని చెప్పాడు. జ్ఞాన సాంప్రదాయము ప్రకారము బాస్తిస్మములో అలా చేయవలసి యున్నది. కావున యోహాన్ అను గురువు మనుషులకు బాప్తిస్మము ఇచ్చునప్పుడు నీటితో బాప్తిస్మము ఇచ్చాడు. ఆ విధానము ప్రకారము ఏసు కూడా యోహాన్ దగ్గర ఉపదేశముు పొందాడు. ఆ సమయములో యోహాన్ ఏసును చూచి ఇలా అన్నాడు.
మత్తయి సువార్త, మూడవ అధ్యాయము, 14,15 వచనములలో ఇలా చెప్పాడు చూడండి. యోహాన్ ఏసును చూచి ''నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా వద్దకు వచ్చుచున్నావా?'' అని ఆయనను నివారింపజూచెను. అయితే ఏసు ఇలా అన్నాడు ''ఇప్పటికి కానిమ్ము! నీతి (జ్ఞానము) యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది'' అని అతనికి ఉత్తరమిచ్చెను. జ్ఞాన సాంప్రదాయములో తప్పనిసరిగా గురువువద్ద బాప్తిస్మము పొందవలసి యున్నదని ఏసే చెప్పాడు. అదే విషయమునే నేను కూడా బాప్తిస్మమును గురించి చెప్పాను. ఏసు తన శిష్యులకు బాప్తిస్మమిచ్చు అధికారమిచ్చి 'ఒక వర్గము, ఒక కులము అని కాకుండా సమస్త జనులకు అవసరమైనది బాప్తిస్మము' అని చెప్పి అందరికీ బాప్తిస్మ సమయములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను ప్రవేశ పత్రమును ఇవ్వమని చెప్పాడు. ఎప్పటికీ దేవుడు కనిపించు మనిషిగా భూమిమీద ఉండి ఉపదేశము ఇవ్వలేడు కనుక ఆ కార్యమును తన శిష్యులకు చెప్పాడు. బాప్తిస్మ కార్యముతో ఆగక 'నేను మీకు ఏ సంగతులు చెప్పితినో వాటినన్నిటిని గ్రహించుమని' వారికి బోధించుచున్నాడు.
అలా చెప్పుచూ మేము గురువులము కాదు కదా! యను అనుమానము లేకుండా నేను మీతో కూడా ఎల్లప్పుడును ఉంటాను అన్నాడు. అలా చెప్పడములో విశేషముగా ఏసు ఏమి చెప్పాడనగా ''ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను'' అని వారితో అన్నాడు. ఈ మాటను చూస్తే యుగముల విషయము తెలిసినవారికి ఒక ప్రశ్న రాగలదు. అది ఏమనగా! యుగము అనునది అయిపోవునది కాదు. ఒక యుగము పోతే మరియొక యుగము ఉంటుంది. అటువంటప్పుడు సమాప్తము లేని యుగములను గురించి యుగ సమాప్తియని ఎందుకు చెప్పాడు? అను ప్రశ్న రాగలదు. ఈ ప్రశ్నకు జవాబు వెదకితే ఇలా తెలియుచున్నది. కాలము శాశ్వితమైనది, ఎప్పటికీ జరుగునది, దేవుడు (పరమాత్మ) ఎప్పటికీ ఉండువాడు, అలాగే దేవునికి మారుపేరయిన కాలము కూడా ఎప్పటికీ ఉండునది. కాలము పరమాత్మయై ఉన్నది కావున కాలమునకు మూడు ఆత్మల పేర్లు పెట్టబడినవి. పరమాత్మ మూడు ఆత్మలుగా యున్నాడు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మగా విభజింపబడి యున్నాడు. ఈ మూడు పేర్లు కాలములో వినిపించునట్లు, కాలములో తెలియునట్లు కాలమునకు భూత, భవిష్యత్, వర్తమాన అను మూడు పేర్లు పెట్టారు. దేవున్ని చేరుటకు అవసరమైన యోగము యొక్క పేరును కాలమునకు పెట్టారు. ఈ విధముగా కాలమును నాలుగు పేర్లుగా చెప్పుచూ, ఆ నాలుగు పేర్ల చివర 'యోగము' అను పదమును పెట్టుట వలన దేవున్ని చేరుటకు లేక కాలమై (దేవుడై) పోవుటకు యోగము అవసరము అని తెలియునట్లు కాలము పేరు చివర యోగము అను పేరును ఉంచారు.
కాలమును నాలుగు భాగములుగా చేసి, నాలుగు పేర్లు వరుసగా కృత్, త్రైతా, ద్వాపర, కలి అని పేర్లు పెట్టడమేకాక అన్ని పేర్ల చివరిలో యోగము అను మాటను ఉంచుట వలన కృతయుగము, త్రైతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని చెప్పబడుచున్నవి. కృత అని అనగా చేయునది ఆత్మ అని అర్థము. త్రైతా అనగా మూడు అని అర్థము. అలాగే ద్వాపర అనగా రెండు కానిది మూడు అని అర్థము. కలి అనగా నాశనమగు నది జీవాత్మయని అర్థము. క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని ప్రథమ దైవగ్రంథములో చెప్పారు. క్షరుడు అనగా నాశనమగువాడు జీవాత్మయని, అక్షరుడు అనగా నాశనము కానివాడు ఆత్మయని, పురుషోత్తముడు అనగా క్షర, అక్షరులకంటే ఉత్తమ పురుషుడు పరమాత్మ యని అర్థము. ఈ ముగ్గురు పురుషులనే ''తోలబడేవాడు, తోలేవాడు, చూచేవాడు'' అని అంతిమ దైవగ్రంథములో సూరా 50, ఆయత్ 21లో చెప్పియున్నారు. అలాగే ''కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ'' యని ద్వితీయ దైవగ్రంథములో చెప్పియున్నారు. ఈ ముగ్గురు పురుషులను తెలియుటకు యోగము అవసరము. అందువలన నాలుగు కాలముల పేర్ల చివరలో యోగము అని చెప్పియున్నారు. యోగము వలన జీవాత్మ తనను తాను తెలియ గలడు, అందువలన కలియోగము అని అన్నారు. యోగము వలన ఆత్మను తెలియవచ్చును, అందువలన కృతయోగము అని అన్నారు. యోగము వలన పరమాత్మను చేరవచ్చును, అందువలన త్రైతాయోగము అనియు, ద్వాపర యోగము అనియు చెప్పియున్నారు. ఇది అంతయు జ్ఞాన సంపన్నులయినవారు ఏర్పరచిన విధానము వలన పెట్టబడిన పేర్లు. అయితే కాలక్రమమున త్రైత అను పదము త్రేతా అని పలుకబడుచున్నది. అట్లే యోగము అను మాట నేడు యుగము అని చెప్పబడుచున్నది. అందువలన పై వాక్యములో 'యోగ సమాప్తి' అని వ్రాయవలసిన చోట 'యుగ సమాప్తి' అని వ్రాశారు. వాస్తవమైన పదమును చెప్పుకొంటే యోగ సమాప్తి అగువరకు నేను ఎల్లకాలము మీతోనే యుంటానని చెప్పాడు. దానిని వివరించి చెప్పుకొంటే యోగ సమాప్తి వరకు మీతోనే ఉంటానని చెప్పడము కదా! ఒక మనిషి (జీవుడు) యోగ సమాప్తిని పొందినప్పుడు దేవునిలోనికి ఐక్యమైపోవును. దేవునిలోనికి ఐక్యము కాకుండా దేవుడు వేరు, జీవుడు వేరుగా యున్నప్పుడు దేవునిలోనికి కలియుటకు యోగము అవసరము. యోగము పరిసమాప్తి చెందినప్పుడు జీవుడు దేవుడు కలిసి పోవుదురు. అలా కలియనంతవరకూ జీవునితో పాటు దేవుడుండును. జీవుడు దేవునితో కలిసిపోయినప్పుడు యోగము పూర్తి అయినదని అర్థము. అప్పుడు జీవునితో పాటు దేవుడు ఉండవలసిన అవసరము లేదు. అప్పుడు ఇద్దరూ ఒకటై పోయి ఉందురని తెలియవలెను. అందువలన వాక్యములో ''యుగ సమాప్తి'' వరకు అని చెప్పియున్నారు.