pss book : ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు యోహాన్‌ సువార్త with audio

ద్వితీయ దైవగ్రంథములో రత్నవాక్యములు
part1 part2 part3 part4 part5






☜   యోహాన్‌ సువార్త  

(1) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 1వ వచనము.
యోహాన్‌ సువార్త ఒకటవ అధ్యాయము, ఒకటవ వచనమును మొదలు పెట్టి మూడు వాక్యములకు ఒక్కటిగా వివరమును వ్రాయుచున్నామని తెలియవలెను. యోహాన్‌ సువార్త 21 అధ్యాయములుగా యున్నది. ఇక్కడ నేను యోహాన్‌ సువార్తలోని కొన్ని వాక్యములకే వివరమును వ్రాయుచున్నాను. ఎక్కడయితే మనుషులకు అర్థముకాని వాక్యముండునో, ఎక్కడయితే మనిషి వాక్యమును అర్థము చేసుకోవడములో పొరబడు అవకాశమున్నదో, ఇంకా కొందరు ఎక్కడయితే వాక్యమును తప్పుగా అర్థము చేసుకొన్నారో, అక్కడ ఆ వాక్యమును గురించి వివరించి వ్రాయదలచు కొన్నాము. ఆ విధముగా చేయడము దేవుని సేవలో ఒక భాగమైనందున నేను ఒక కలముగా ఉండగా, దేవుడే నా చేత ఈ పనిని చేయించుచున్నాడని తలచుచూ ఈ సేవ చేయుచున్నాను. ఇంతకుముందు ప్రథమ దైవగ్రంథము భగవద్గీత, తృతీయ దైవగ్రంథము ఖుర్‌ఆన్‌లోని కొన్ని వాక్యములకు వివరమును వ్రాశాము. మూడు దైవగ్రంథములకు వివరమును వ్రాయవలెననునది నా ప్రగాఢ కోర్కె అయినందున ఇప్పుడు ద్వితీయ దైవగ్రంథమయిన ఇంజీలు (బైబిలు) గ్రంథములోని కొన్ని వాక్యములకు వివరమును వ్రాయుచున్నాము. ఇందులో వ్రాయు జ్ఞాన వివరము శాస్త్రబద్దమైనది మరియు సత్యసమేతమైనదని తెలుపుచున్నాను. ఇప్పుడు యోహాన్‌ సువార్తలోని మొదటి అధ్యాయములోని మొదటి వాక్యమును వ్రాయుచున్నాము. యోహాన్‌ సువార్తలోని మొదటి వాక్యమునందు మూడు చిన్న వాక్యములు ఉన్నవి. ఆ మూడు చిన్న వాక్యములకు వివరమును చెప్పితే మొదటి వాక్యమునకు పూర్తిగా జవాబు చెప్పినట్లగును. దానిని క్రింద చూడండి.

1) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 1వ వచనము.

(1) ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునివద్ద యుండెను. వాక్యము దేవుడైయుండెను.

ఇప్పుడు ద్వితీయ దైవగ్రంథములోని యోహాన్‌ సువార్తలోని మొదటి మూడు వాక్యములకు వివరమును చెప్పుకొందాము.

వాక్యము ఆదియందుండెను.
వాక్యము దేవుని యొద్దయుండెను.
వాక్యము దేవుడైయుండెను.

బైబిలు బోధలో ఈ మూడు వాక్యములను ప్రథమ వాక్యములుగా వివరము కొరకు కొంతమార్చి చెప్పుకొంటున్నాము. గ్రంథము ప్రారంభములోని ఆదికాండములో గల వాక్యములను గ్రంథ ప్రథమ వాక్యములుగా చెప్పవలెను కదా!యని ఇతరులు అడుగవచ్చును. అటువంటి అనుమానము రాకుండా ముందే వివరమును చెప్పియున్నాము. మనిషికి అవసరమైన బోధనే గ్రంథముగా తీసుకొని, అందులో మొదటి వాక్యములను చెప్పుకొంటున్నాము. ఆ పద్ధతి ప్రకారము నాలుగు సువార్తలు భగవంతుడైన ఏసు చెప్పినవి. అందులో యోహాన్‌ సువార్త చివరిదయినా మిగతా మూడు అధ్యాయముల కంటే బోధతో ప్రారంభమయినది ఒక్క యోహాను సువార్త మాత్రమే. భగవద్గీతలో కూడా ఇదే సూత్రము ప్రకారము రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగములో 11వ శ్లోకము నుండి ప్రథమ వాక్యములను తీసుకొన్నాము. జ్ఞానబోధ అక్కడినుండే ప్రారంభమగుట వలన సాంఖ్య యోగములో 11, 12, 13వ శ్లోకములను మొదటి మాటలుగా చెప్పుకొన్నాము. అట్లే ఇప్పుడు ఇంజీలు గ్రంథమునుండి గ్రంథము మధ్యలో గల అనగా 43వ పాఠమునుండి ప్రారంభ వాక్యములను తీసుకోవడము జరిగినది. అక్కడ తౌరాతులో మూడు శ్లోకములను మూడు వాక్యములుగా తీసుకొన్నాము. అయితే ఇక్కడ యోహాన్‌ సువార్తలో మూడు వరుస సంఖ్యలోగల మూడు వాక్యములను తీసుకొనక ఒకే వాక్యములోగల సమాచారమును మూడు ప్రథమ వాక్యములుగా తీసుకొన్నాము. వాక్యముల వరుస సంఖ్య ముఖ్యము కాదు. మూడు భావములతో నిండియున్న వాటిని మూడు వాక్యములుగా తీసుకొన్నాము. అందువలన మూడు చిన్న వాక్యములుండినా, అవి మూడు పెద్ద భావములుగల వాక్యములని తెలియవలెను.
ఈ మూడు వాక్యములు ప్రత్యేకమైన సూక్ష్మ భావముతో ఇమిడియున్నవి. భగవద్గీత మొదటి మూడు వాక్యములు జీవాత్మ, ఆత్మను గురించి చెప్పినవిగా యున్నవి. అయితే ఇంజీలు (బైబిలు) గ్రంథములో యోహాన్‌ సువార్తలోని మొదటి వాక్యములు ప్రత్యేకమైన భావమును బోధించుచున్నవి. భగవద్గీత ప్రారంభములో జీవాత్మ, ఆత్మ, శరీరము అను మూడు భాగములను గురించి తెలుపడమైనది. ఇక్కడ యోహాన్‌ సువార్తలోని మూడు ప్రథమ వాక్యములలో జ్ఞానము, ఆత్మ, పరమాత్మయను మూడు అంశములను గురించి చెప్పడమైనది. అయితే ఈ మూడు వాక్యములలో ఎక్కడ ఆత్మ యున్నదో, ఎక్కడ పరమాత్మయున్నదో అర్థము కాకుండా ఇమిడియున్నది. మూడు వాక్యములలో దేవుడు అనుమాట రెండు వాక్యములలో గలదు. అంతతప్ప జ్ఞానము, ఆత్మ అను విషయములు ఎక్కడ గలవో గుర్తించలేని విధముగా యున్నవి. ఇప్పుడు మూడు వాక్యములలో మొదటి వాక్యమును తీసుకొందాము.
మొదటి మాటలో ఆదియందు వాక్యముండెను అని యున్నది కదా! ఇందులో వాక్యము అనగా అది నీకు తెలిసిన భాషలో యుండవచ్చును, యుండకపోవచ్చును. నీకు తెలుగు భాష మాత్రమే వస్తుంది అనుకొనుము. వాక్యము వేరే భాషలో నీకు తెలియని భాషలో యుండవచ్చును. వాక్యము అనగా! వాక్కు ద్వారా వచ్చునది వాక్యము. వాక్కు అనగా! నోటి నుండి వచ్చు శబ్దమును వాక్కు అని అంటున్నాము. శబ్దము అనగా వినిపించునది. వినిపించే శబ్దము పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. వినిపించే శబ్దమునుబట్టి వాక్యము పెద్దదనియో లేక చిన్నదనియో చెప్పవచ్చును. వినిపించే శబ్దము యొక్క వినికిడి పొడవు పొట్టియే కాకుండా శబ్దము పెద్దదిగా యుండవచ్చు లేక చిన్నదిగా యుండవచ్చును. వాక్యము నీకు తెలిసిన భాషలోనే యుండుననిగానీ, వాక్యము ఇంతే పొడవు లేక పొట్టి గలదియనిగానీ, వాక్యము చిన్న శబ్దముతో చెప్పునదియనిగానీ, లేక పెద్ద శబ్దముతోనే చెప్పునదియనిగానీ చెప్పలేము. వాక్యము భాషలోగానీ, పెద్ద చిన్న శబ్దములోగానీ, పొడవు పొట్టిలో గానీ ఉండవచ్చును. ఇట్లే యుండునని చెప్పలేము. వాక్యము ఎలాగయినా యుండవచ్చును. ఇప్పుడు ఆదియందు వాక్యముండెను అను మాటను తీసుకొని చూస్తే వాక్యము ఆదియందుండెను అని చెప్పినా భావము చెడదు, చెప్పినది ఆదిలోయని తెలియుచున్నది. ఆదిలో మనుషులకు ఏ భాషరాదు. అప్పుడు ఏ భాషలో వాక్యము చెప్పబడినదని ప్రశ్న రాగలదు. ఆదిలో జరిగిన యదార్థమును గమనించితే అన్ని ప్రశ్నలకు జవాబు దొరకగలదు.
ఆదిలో శబ్దము ఎక్కడినుండి వచ్చినది? అని ప్రశ్నించుకొని చూస్తే మనిషి చెవుకు వినిపించే శబ్దము ప్రకృతి వలననే కల్గినదని చెప్పవచ్చును. ప్రకృతి ఐదు భూతములుగా గలదు. భూతము అనగా జీవము అని అర్థము. జీవము గల ఆకాశములో ఆదియందు శబ్దము ఏర్పడినదని అక్కడికి పోయి చూస్తే తెలిసిపోవుచున్నది. ఆకాశము శూన్యముగా యున్నది. అది ఎలా శబ్దము చేయును? అను ప్రశ్న కూడా రాగలదు. హేతువాద పద్ధతిలో ఈ ప్రశ్నలు తప్పక రావలసిందే. వాటికి జవాబులు తెలియవలసిందే. అప్పుడే శాస్త్రపద్ధతియగును. బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి చూస్తే, శబ్దమును ఆకాశము స్వయముగా చేసిందా? అని చూస్తే, ఆకాశము ఒక జీవుడే అయినందున జీవాత్మకు ఏదీ చేతకాదు, ఏదీ చేయలేదు అను శాస్త్రవిధి గలదు. దానిని జీవాత్మ ధర్మము అని అనవచ్చును. పరమాత్మకు కూడా ధర్మము గలదు. పరమాత్మ (దేవుడు) నామ, రూప, క్రియ లేనివాడని అదియే దేవుని ప్రథమ ధర్మమని చెప్పవచ్చును. దేవుడు క్రియా రహితుడు అనగా పనిని చేయడు. జీవాత్మ ధర్మము ప్రకారము జీవుడు చేతకానివాడై చేయలేడు, దేవుడు చేతనయినవాడయినా చేయడు. ఈ విధముగా జీవునికి, దేవునికి వ్యతిరేఖమైన ధర్మములు గలవు. ఆదిలో వాక్యము ఆకాశము ద్వారా వస్తే, ఆకాశము ఒక జీవుడే అయినదానివలన ఆకాశము అను జీవుడు ఆ శబ్దమును చేయలేదు. ఆకాశమునుండి శబ్దము వచ్చినది వాస్తవమే. అయినా ఆకాశ జీవుడు శబ్దమును చేయు స్థోమత, బలము లేనివాడు. అందువలన ఆకాశము వెనుక ఎవరో వుండి శబ్దము చేసియుండవచ్చును. అయితే దేవుడు కూడా పని చేయనివాడు, కావున దేవుడు కూడా ఆ శబ్దము చేయలేదు. ఆకాశము నుండి శబ్దము వచ్చినది వాస్తవమే అయినా, ఆ శబ్దమునకు కారణము ఆకాశ జీవుడు కాదు, దేవుడు కాదు. ఇద్దరూ కాక మరొకడు ఎవడో ఇంకొకడు ఉండి ఆ శబ్దమును చేసియుండవచ్చును అని అనుమానము వచ్చినది.
ఈ అనుమానము తీరుటకు విశ్వములో ఎవరెవరు యున్నారో ముందు గమనించవలసిన అవసరమున్నది. దేవుడు మొదట విశ్వమును సృష్ఠించాడు. అప్పుడు దేవుడు దేవునిగానేయుంటూ మొదట తననుండి ప్రకృతియను దానిని తయారు చేశాడు. ప్రకృతి ఐదు భాగములుగా యుండునట్లు సృష్ఠించాడు. తర్వాత అది నిర్జీవమైన దానివలన దానిని చైతన్యముగా చేయుటకు తననుండి ఆత్మను, జీవాత్మను రెండిటినీ తయారు చేశాడు. దేవుడు తనవలె పురుషత్త్వము గల జీవాత్మ, ఆత్మను తయారు చేసి జీవుడు నడుపబడేవాడుగా, ఆత్మ నడిపేవాడుగా యున్నట్లు చేశాడు. సకల కార్యములను చేయుటకు ఆత్మను నియమించాడు. ప్రతి శరీరములోను జీవుడుంటే జీవునితోపాటు ఆత్మయుంటూ శరీరములో అన్ని కార్యములను చేయుచున్నది. ఆత్మ విషయము ఎంతో పెద్ద జ్ఞానులయిన వారికి కూడా తెలియదని దేవుడే తన గ్రంథములో చెప్పాడు. ప్రయత్నించు యోగులకు మాత్రమే ఆత్మ తెలియగలదని భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు పదకొండవ (11) శ్లోకములో చెప్పబడినది. ఆత్మ శరీరములో తెలియకుండా అణిగియున్నదని తెలియవలెను.
దేవుడు పని చేయనివాడు కదా! ఏమీ చేయనివాడు ప్రకృతిని, మిగతా రెండు ఆత్మలను ఎలా చేశాడు? అని కొందరు అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! దేవుడు క్రియారహితుడు పనిచేయడు అనుమాట వాస్తవమే. అది సృష్ఠిని తయారు చేసిన తర్వాత, ఆత్మను జీవాత్మను తయారు చేసిన తర్వాత చెప్పబడిన ధర్మము. సృష్ఠికి పూర్వము దేవుడు పనిచేసేవాడు. అప్పుడు సృష్ఠికి ముందు దేవుడు ఒక్కడే గలడు. దేవుడు తప్ప ఎవరూ లేరు. అందువలన సృష్ఠిని తయారు చేయకముందు దేవుడు కార్యములను చేసెడివాడు. దేవుడు చేస్తేనే ప్రపంచము తయారయినది. ప్రపంచము తయారైన తర్వాత జీవాత్మ, ఆత్మను దేవుడు తయారు చేసిన తర్వాత దేవుని ధర్మము తయారయినది. సృష్ఠి తర్వాత దేవుడు పని చేయనివాడని, సృష్ఠికి పూర్వము పని చేసేవాడని తెలిసినది. దేవుడు క్రియలన్నిటినీ ఆత్మకు కరిపించి, ఆత్మ చేత చేయించునట్లు నిర్ణయించి, తాను ఏమీ చేయనివాడైనాడు. అందువలన ఆత్మను తయారు చేసిన పరమాత్మ తాను పనులు చేయకుండా మానివేసింది. దేవుడు చేయవలసిన పనియంతటినీ ఆత్మే చేయుచున్నది. ఆత్మ పనులు చేయుచుండగా పరమాత్మ ఏమీ చేయక కేవలము సాక్షిగా చూస్తూ ఊరక యున్నాడు.
దేవుడు ఏమీ చేయనివాడు అయినందున, జీవుడు ఏమీ చేత కానివాడయినందున, అన్నీ చేయువాడు ఆత్మ అయినందున, ఆదిలో ఆకాశమునుండి శబ్దము చేసినది ఆత్మయేనని చెప్పవచ్చును. ఆత్మ ఆకాశములో అణిగియుండి ఆకాశమునుండి శబ్దము చేసినది. ఆత్మ చేసిన శబ్దము దేవుని జ్ఞానమైయుండెను. అందువలన ఆ శబ్దమును 'వాక్యము' అన్నారు. వాక్యము అనగా 'భావముతో కూడుకొన్న శబ్దము' అని అర్థము. సృష్ఠ్యాదిలో ఆకాశమునుండి భావముతో కూడుకొన్న శబ్దము వచ్చినది అని చెప్పుచూ ''ఆదియందు వాక్యముండెను'' అని అన్నారు. వాక్యము అంటే ఏమిటి? దానిని చెప్పినది ఎవరు? అని తెలుసుకొన్నాము. జ్ఞానముతో కూడుకొన్నది వాక్యము. వాక్యమును శబ్ద రూపములో చెప్పినది ఆత్మ. ఆత్మ ఆకాశమునుండి చెప్పిన జ్ఞానమే ప్రపంచమునకు మొదటి జ్ఞానము. ఆకాశమునుండి మొదట బయలు దేరి వచ్చిన శబ్దము జ్ఞానమే అయినా, అది ఉరుముల రూపములో పెద్ద పెద్ద శబ్దములుగా యుండెను. అది మనుషులు అర్థము చేసుకొను భాష కాదు. ఉరుముల శబ్దముతో యున్న భాషను ఆకాశములో సూర్యుడు గ్రహించాడు. అది మనుషులకు అర్థముకాని భాషయని తెలిసి, సూర్యుడు మనుషుల భాషలో భూమిమీదగల మనువు అను వ్యక్తికి తాను శబ్దముల నుండి గ్రహించిన జ్ఞానమును తెలియ చెప్పడమైనది.
సృష్ఠ్యాదిలో అర్థము కాని శబ్దము జ్ఞాన రూపములో వచ్చిన దానివలన దానిని ఆదియందు వాక్యముండెను అని యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యములో చెప్పడమైనది. శబ్దము జ్ఞానమని మనుషులకు ఆ రోజు తెలియదు. దానిని సూర్యుడు చెప్పగా కొంత అర్థమయినది. అదే జ్ఞానమునే కృష్ణుడు భగవద్గీతగా చెప్పాడు. భగవద్గీతను చెప్పినప్పుడు ఇది సృష్ఠ్యాదిలో చెప్పబడిన జ్ఞానమని కృష్ణుడు చెప్పినా, మనుషుల దృష్ఠిలో ఆదిలోని శబ్దమయిన ఉరుముల వద్దకు పోలేదు. ఉరుముల శబ్దమే భగవద్గీత జ్ఞానమని ఈనాటికి ఎవరికీ తెలియదు. కృష్ణుడు చెప్పిన జ్ఞానమునే సూర్యుడు మనువుకు చెప్పాడు. సూర్యుడు చెప్పిన జ్ఞానము ఆకాశ ఉరుముల శబ్ద జ్ఞానము. ఆకాశ శబ్దముల జ్ఞానము ఆకాశ ఆత్మవద్దనుండి వచ్చిన జ్ఞానము. ఆత్మవద్దనుండి వచ్చిన ఆత్మజ్ఞానము ఆత్మలోనుండి వచ్చినది. ఆత్మలోనుండి వచ్చిన జ్ఞానమును చూస్తే ఆత్మయే జ్ఞానముగా మారి ఆత్మనుండి బయటికి వచ్చినది. దూదిలోనుండి దారము బయటికి వచ్చినట్లు, ఆత్మలోనుండి జ్ఞానము బయటికి వచ్చినది. దూది దారముగా ఎలా మారి దూదినుండి దారము బయటికి వస్తున్నదో, అలాగే ఆత్మనుండి జ్ఞానము తయారగుచూ బయటికి వస్తున్నది. దూది వేరు, దారము వేరయినా, దూదియే దారముగా మారినదని చెప్పవచ్చును. అలాగే ఆత్మవేరు, జ్ఞానము వేరు అయినా, ఆత్మనుండే ఆత్మజ్ఞానము బయటికి వస్తున్నది. దారమును విడదీసి చూస్తే అందులో దూది పోగులే యున్నట్లు, ఆత్మజ్ఞానమును విడదీసి చూస్తే అందులో ఆత్మ విధానమే యుండును.
ఆదియందు ఆకాశ శబ్దము ద్వారా దేవుడు జ్ఞానమును చెప్పడమైనదని, దానినే ఖురాన్‌ గ్రంథములో దేవుడు జ్ఞానమును తెలియజేయు మూడు విధానములలో ఒకటి ఆకాశవాణి నుండి (వహీ ద్వారా) తెలియజేయబడునని సూరా 42 ఆయత్‌ 51లో చెప్పడమైనది. దేవుడు సృష్ఠ్యాదిలోనే ఆకాశము అను జీవునిలో గల ఆత్మనుండి తన జ్ఞానమును చెప్పించాడు. అప్పుడు ఉరుముల రూపములో వచ్చిన జ్ఞానము మనుషులకు అర్థము కాదు, అది మనుషుల భాష కాదు. అందువలన ఉరుముల జ్ఞానమును గ్రహించిన సూర్యుడు మానవుల భాషలో భూమి మీద ఒక మనిషికి చెప్పగా అది భూమండలమంతా ప్రాకిపోయినది. కాలక్రమమున అధర్మములు చెలరేగి ధర్మములు లేకుండా పోవు సమయములో ఆదిలోని జ్ఞానము మనుషులలో లేకుండా పోయినది. అప్పుడు కృష్ణుడుగా భగవంతుడు వచ్చి సూర్యుడు చెప్పిన జ్ఞానమునే ఇప్పుడు నీకు చెప్పుచున్నానని ద్వాపర యుగములో అర్జునుడికి చెప్పాడు. అది గ్రంథరూపములో ప్రథమ దైవగ్రంథముగా మనముందరున్నా, అది సూర్యుడు చెప్పిన జ్ఞానమని గానీ, సూర్యుడు గ్రహించిన ఆకాశ శబ్దముల జ్ఞానమనిగానీ మన జ్ఞప్తిలో లేదు. వెనుకటి విషయమును అందరూ మరచిపోయారు.
మనుషులు దేవుడు పంపిన జ్ఞానమును మరచిపోయారను ఉద్దేశ్యముతో భగవద్గీతను చెప్పిన తర్వాత మూడు వేల సంవత్సరములకు ద్వితీయ దైవగ్రంథములో యోహాన్‌ సువార్తలో మూడు ప్రథమ వాక్యములను చెప్పడమైనది. ఇక్కడ చెప్పిన వాక్యము ప్రకారము ఆదియందు వాక్యముండెను అనుమాట అర్థమయినది. దాని తర్వాత రెండవ వాక్యమును విడదీసి చూస్తే, ఉరిమి చెప్పిన జ్ఞాన శబ్దము ఆకాశ ఆత్మ వద్దనుండి వచ్చినదని తెలిసినది. అందువలన వాక్యము దేవునివద్దయుండెను అని తెలిసినది. ఇంకా లోతుగా చూస్తే వాక్యము అను శబ్దము ఆత్మలోనుండి పుట్టుకొచ్చినదని తెలిసినది. దూది తంతువులనుండి దారము పురిబడి బయటికి వచ్చినట్లు, ఆత్మ చైతన్యమే శక్తిగా మారి, శక్తి రూపములోని జ్ఞానము శబ్దరూపములో బయటికి వచ్చినది. దారములో దూది పోగులు ఉన్నట్లు, జ్ఞాన శబ్దములో ఆత్మశక్తియే కలదని తెలియుచున్నది. ఆత్మజ్ఞానము ఆత్మ శక్తిగా, ఆత్మగా యున్నదని తెలియుచున్నది. అందువలన ఆత్మజ్ఞానము ఆత్మ రెండూ ఒకటేయని తెలియుచున్నది. దానినే వాక్యము దేవుడై యుండెను అని అన్నారు.
ఇంతవరకు దేవుడు జీవాత్మను, ఆత్మను సృష్ఠించాడని చెప్పాము. సృష్ఠి జరుగకముందు దేవుడు పనిచేసేవాడు. సృష్ఠి జరిగిన తర్వాత పనిని ఆత్మ చేయునట్లు అధికారమిచ్చి, తాను ఉన్నా లేనట్లుగా మారిపోయాడు. దేవుడు ఏ కార్యమును చేయనివాడై తన ఉనికి ఎవరికీ ఏమాత్రము తెలియకుండా చేశాడు. దేవుడు ప్రపంచముతో ఏ సంబంధము లేకుండా పోయిన తర్వాత ఆయన ఉన్నా లేనివానితో సమానమై పోయినది. అప్పుడు దేవుని కార్యములను కూడా ఆత్మే చేయవలసి వచ్చినది. ఇటు జీవాత్మ కార్యములనూ, అటు పరమాత్మ కార్యములనూ ఆత్మ చేయుచూ తాను ఎవరికీ తెలియకుండా మసలుకొనుచున్నది. పై వాక్యములను బట్టి చూస్తే ఆత్మ విధానమంతయూ బయటపడుచున్నది. పరమాత్మ సృష్ఠిని తయారు చేసినప్పుడు మూడు ఆత్మలు ఉండేవి. తర్వాత రెండు ఆత్మలు మాత్రమే తెలియబడుచున్నవి. జీవాత్మ, ఆత్మ ఉనికి ఉండగా, పరమాత్మ ఉనికి లేకుండా పోయినది. అందువలన సృష్ఠి తర్వాత ఆత్మే పరమాత్మగా చలామణి కావలసి వచ్చినది. అందువలన ఆత్మను దేవుడని కూడా చెప్పవలసి వచ్చినది. ఆత్మ, దేవుడు (పరమాత్మ) కాకున్నా, చివరకు దేవుని స్థానములో చేరిపోయి దేవుని కార్యములు చేయుచున్నది.
ఆత్మజ్ఞానము ఆత్మవద్దనుండి వచ్చినది. ఆత్మను దేవుడని చెప్పడము వలన వాక్యము దేవునివద్దయుండెను అని అనవలసి వచ్చినది. ఆత్మను దేవుడని అనుకొన్నప్పుడు ఈ వాక్యము సరిపోవును. ఆత్మ, దేవుడు కాకున్నా దేవుడని చెప్పవలసి వచ్చినది. ఆత్మ, దేవుడుగా యుండు అధికారమును దేవుడే ఆత్మకు ఇవ్వడము జరిగినది. అందువలన వాక్యము (జ్ఞానము) ఆత్మయేయైనప్పుడు అదే జ్ఞానమే అనగా అదే ఆత్మయే దేవుడైయున్నది అని చెప్పవచ్చును. అందువలన యోహాన్‌ సువార్తలో వాస్తవమును చెప్పుచూ వాక్యము దేవుడైయుండెను అని అన్నారు. వాక్యము అంటే ఏమిటి? వాక్యము ఆత్మగా ఎట్లున్నది? ఆత్మ, దేవుడుగా ఎందుకు చెప్పబడుచున్నది? అను వివరమంతా తెలిసిన తర్వాత యోహాన్‌ సువార్త మొదటి అధ్యాయము లోని మొదటి మూడు వాక్యములకు భావము పూర్తిగా అర్థమయి వుంటుందనుకుంటాను. ఇంత వివరముగా చెప్పినా అర్థము కాకపోతే, ఆత్మజ్ఞానము ఎప్పటికీ అర్థము కాదు. ఆత్మజ్ఞానము అర్థము కాకపోతే దేవుని విధానము ఏమాత్రము తెలియదు. దేవుని విధానము తెలియుటకు వాక్యము అను జ్ఞానమునుండి ప్రారంభము కావలెను. జ్ఞానము తెలిస్తే జ్ఞానమే ఆత్మనీ, ఆత్మే దేవుడని తెలియగలదు.

సృష్ఠి జరిగినప్పుడు దేవుడు (పరమాత్మ) ప్రకృతి ఆత్మ జీవాత్మ

సృష్ఠి జరిగిన తర్వాత (పరమాత్మ) ప్రకృతి ఆత్మ జీవాత్మ

సృష్ఠి జరిగిన తర్వాత ఆత్మ (దేవుడు) ప్రకృతి ఆత్మ జీవాత్మ

సృష్ఠి జరిగినప్పుడు దేవుడు పని చేయువాడైయుండి తననుండి ఒక స్త్రీ తత్త్వముగల ప్రకృతిని, తర్వాత పురుష తత్త్వము గల ఆత్మ, జీవాత్మలను దేవుడు తయారు చేశాడు. దేవుడు పురుషుడిగా యుండి తనవలె పురుష తత్త్వముగల రెండు ఆత్మలను తయారు చేశాడు. వాటినే ఆత్మయని ఒక దానిని, జీవాత్మయని మరొక దానిని చెప్పుచున్నాము. దేవుడు సృష్ఠిని తయారు చేసిన తర్వాత ప్రకృతి, ఆత్మ, జీవాత్మ ఏర్పడిన తర్వాత దేవుడు ఏ పనిని చేయనివాడై అన్నిటికీ అనగా ప్రకృతికీ, ఆత్మకు, జీవాత్మకు సాక్షిగా యుండిపోయాడు. అలా స్థబ్దతగాయున్న దేవుడు ఉన్నా లేనట్లే యగుచున్నది. ఎప్పుడైనా భూమిమీద ధర్మములకు ముప్పుకలిగి, అధర్మములు చెలరేగిపోతే అప్పుడు తన ఆత్మను భగవంతునిగా పంపి ధర్మములను నెలకొల్పును. అప్పుడు కూడా ప్రత్యేకముగా తన ప్రతినిధిని తయారు చేయడము వలన తాను పని చేయనట్లేయుంటున్నాడు. అయితే మిగతా కార్యములన్నియూ ఆత్మయే చేయుచున్నది. సృష్ఠి తర్వాత దేవుని స్థానములో దేవుడు లేకుండా పోవడము వలన దేవునిగా ఆత్మే పని చేయుచూ దేవుడున్నట్లే అందరినీ నమ్మించుచున్నది. వాస్తవముగా సృష్ఠి తర్వాత దేవుడు నిరుపయోగమై, ఏమీ చేయనివానిగా నిలచిపోయాడు. అందువలన దేవుడు లేనట్లేయని చెప్పవచ్చును. దేవుడు లేని లోటును ఆత్మ తెలియకుండా చేయుచున్నది. అట్లు దేవుని విషయము సర్దుపాటు చేయడము కొరకు తానే దేవునిగా మారుచున్నది. అందువలన ద్వితీయ దైవగ్రంథములో వాక్యము దేవుడైయుండెను అని చెప్పారు. దేవుడు వేరు వాక్యము వేరని ఈ వాక్యములో తెలియుచున్నది. వాక్యము దేవుడు కాకున్నా దేవుడయి యుండెను అని చెప్పారు. వాక్యము దేవుడుగా మారినదని ఈ వాక్య మూలముగా తెలియుచున్నది. వివరముగా చెప్పితే వాక్యము ఆత్మకాగా, ఆత్మ, దేవుడు కాగా వాక్యమయిన ఆత్మ, దేవునిగా యున్నాడని చెప్పడమైనది. దేవుడు వేరు, ఆత్మ వేరు అయినా ఎవరు ఆత్మనో, ఎవరు దేవుడో తెలియక అందరూ పొరపడుచున్నారు.
వాస్తవముగా ఇప్పుడు సృష్ఠి తర్వాత దేవుడు లేడు. ప్రపంచములో దేవుడు లేడని బయటికి తెలియకుండా ఆత్మే దేవుని స్థానమును భర్తీ చేయుచున్నది. అందువలన ఆత్మ, జీవాత్మ పనులు చేయుచూ, ఒకవైపు ప్రకృతి పనులు చేయుచూ, మరొకవైపు దేవునివలె తయారై దేవుడను పేరుతోయున్నది. సృష్ఠి తర్వాత దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడుగా యున్నాడు. నామ, రూప, క్రియలు లేనివానిని ఏమీ కానివాడు, ఏమీ చేయనివాడు అని చెప్పవచ్చును. అట్లున్న వానిని ఉన్నాడనుటకంటే లేడని చెప్పడము ఉత్తమమగును. దేవుని స్థానములో దేవుడు లేకపోతే ఆ స్థానము ఖాళీగా యుండిపోవును అని అనకుండా ఆత్మ దేవునిగా మారిపోవుచున్నది. అందువలన పైన మూడవ వాక్యములో ''వాక్యము దేవుడైయుండెను'' అని చెప్పారు. ఈ వాక్యములను చాలామంది వినుచున్నారు, చదువుచున్నారు. అయినా అందులోని నిగూఢమైన రహస్యము సరిగా తెలియలేరనియే చెప్పవచ్చును.
ఇక్కడ దేవుడయిన ఆత్మ వాస్తవమును తెలియజేయు నిమిత్తము వాక్యము దేవుడైయుండెను అని చెప్పడము జరిగినది. దేవుని పాత్రను పోషించు ఆత్మ ఏ పనిని చేసినా, అటు జీవుని మీదనో లేక దేవుడే చేశాడని దేవుని మీదనో చెప్పుచున్నది. దానివలన దేవుడు ఉన్నాడనియే అందరూ నమ్ముచున్నారు. ఇక్కడ కొందరు దేవుడు లేడంటారా, దేవుడు లేకపోతే ఈ విశ్వమునకంతా ఎవరు పెద్ద? మీరు చిన్నగా దేవుని జ్ఞానమును బోధిస్తూ, చివరకు దేవుడే లేడని నాస్తికవాదమును బోధిస్తున్నారే! అని అడుగవచ్చును. కొందరిలో కల్గిన ఈ ప్రశ్నకు నా జవాబు ఈ విధముగా యున్నది. దేవుడు దేవుని స్థానములో లేడని చెప్పుచున్నాము తప్ప, దేవుడు ఏమాత్రము లేడని నేను చెప్పడము లేదు. దేవుడు ఏమి చేయుచున్నాడో తెలియదు. ఆయన పని చేయడు అని చెప్పాము. దేవునికి మనుషులకు ఏమాత్రము సంబంధము లేదు అని చెప్పాముగానీ, దేవుడు అసలుకే లేడని చెప్పలేదు. దేవుడున్నాడు ఆయనకు పేరులేదు, పని లేదు, ఆకారము లేదు. అందువలన ఆయన మనుషులతో సంబంధము లేకుండా యున్నాడు. ఆయన ధర్మములకు హాని కల్గినప్పుడు మాత్రము తన ధర్మములను కాపాడు నిమిత్తము తన ప్రతినిధిని పంపి పని చేయించి ధర్మములను పునరుద్ధరించును. ఆయన తన ప్రతినిధి ద్వారా పనిని చక్కబెట్టును. అప్పుడు కూడా నేను దేవుడనని చెప్పి పని చేయలేదు. దేవుని ప్రతినిధి దేవునితో సమానమైనా దేవుడని చెప్పక భగవంతుడని మారుపేరు చెప్పుచున్నాడు. ఇతను దేవుడనిగానీ, ఇతనికి ఈ లక్ష్యణములున్నవనిగానీ, దేవున్ని గురించి ఇట్లున్నాడని లేక అట్లున్నాడని గానీ చెప్పుటకు వీలులేకుండా యున్నాడు. దేవుడున్నాడు ఎట్లున్నాడో ఎవరికీ తెలియదు. సృష్ఠ్యాదినుండి దేవున్ని చూచిన వాడుగానీ, దేవునితో మాట్లాడినవాడుగానీ ఎవడూ లేడు. ప్రపంచములో దేనిని గురించయినా చెప్పవచ్చునుగానీ, దేవుని గురించి ఎవరూ చెప్పలేరు. అందువలన చేతకాని స్థితిలో దేవుడు అంతులేనివాడు, హద్దు లేనివాడు అని అర్థమొచ్చునట్లు 'అల్లాహ్‌' అని కృతయుగములోనే అన్నారు. దేవుడు అన్నిటినీ ఆడించు ఆత్మకంటే పెద్దయిన దానివలన 'పరబ్రహ్మ' అని అన్నారు. ఆత్మకంటే వేరయిన దానివలన 'పరమాత్మ' యని అన్నారు. వెదకినా కనిపించడు కావున దేవులాడబడేవాడని 'దేవుడని' అన్నారు. జీవాత్మ, ఆత్మలకంటే ఉత్తమ పురుషుడయినందున ఆయనను 'పురుషోత్తముడని' అన్నారు. మొత్తము మీద దేవున్ని గురించి మీకూ తెలియదు, నాకూ తెలియదని ఒప్పుకోవడము మంచిది.



(2) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 9వ వచనము.
(9) నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు అది ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
బయట ప్రపంచములో వెలుగుయున్నదంటే అది మండే అగ్ని మూలముగా ఉండును. అయితే ఇక్కడ వాక్యములో నిజమైన వెలుగును గురించి చెప్పారు. నిజమైన వెలుగు అగ్ని లేకుండా వెలుగుచుండును. అగ్ని లేకుండా ఉండే వెలుగు ప్రతి మనిషిలోనికి వచ్చి అది మనిషినంతటినీ పాదములు మొదలుకొని తలవరకు వెలిగించుచున్నది. అగ్నికాని, అగ్నిలేని వెలుగు ఒకటే కలదు. అది సృష్ఠికర్తయైన దేవుని నుండి వచ్చిన ''ఆత్మ'' దేవునిచే నియమింపబడిన ఆత్మ, మనిషి శరీరములో చేరి మనిషి శరీరమంతా చైతన్యము అను వెలుగు నిచ్చుచున్నది. ఆత్మ శరీరములో ఎప్పుడు ప్రవేశించుచున్నదో అప్పుడే మనిషి శరీరములోని 25 లక్షల కోట్ల ధాతుకణములు ఆత్మ వెలుగుతో నిండుకొనును. ప్రతి ధాతుకణములో అగ్ని లేకుండానే మండుచున్న దీపమున్నది. ఆ దీపము వెలుగు కొంత ఉష్ణోగ్రతను కల్గియున్నది. 98.4 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రత ఆత్మ వెలుగు వలననే కల్గుచున్నది. ఆత్మ యున్న ప్రతి మానవ శరీరము 98.4 ఖీ డిగ్రీల వేడి కల్గియున్నది. ఎప్పుడయితే ఆత్మ శరీరమును వదలి బయటికి పోవునో అప్పుడు శరీరములో ఉష్ణోగ్రత ఏమాత్రము లేకుండా దేహము చల్లబడిపోతున్నది. ఆత్మ వెలుగు లేని దేహము మృత దేహము అనబడును. ''ఆత్మ దీపమని, దేహము చిమ్నీ'' అని అంతిమ దైవగ్రంథములో 24వ సూరా 35వ ఆయత్‌లో కూడా చెప్పబడి యున్నది. దేహమునకు వెలుగును ఇచ్చునది, ఎప్పటికీ వెలుగునది అయిన ఆత్మయనబడు వెలుగును నిజమైన వెలుగుయని చెప్పవచ్చును.

(3) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 10వ వచనము.
(10) ఆయన లోకములో ఉండెను. లోకమాయన మూలముగా కలిగెను గానీ, లోకమాయనను తెలిసికొన లేదు.
లోకము అనగా అనుభవములతో కూడుకొన్నదని అర్థము. ఆత్మ అను ఆయన అనుభవములుగల మనుషులలో ఉండెను. మానవులందరూ ఆత్మచేత తయారు చేయబడినవారే. అయినా మనుషులు ఆత్మను తెలిసి కొనలేదు. ఇక్కడ కొంత వివరముగా తెలియవలసినది ఏమనగా! ఆత్మ వేరు, దేవుడు వేరు. ఆత్మను దేవుడు తయారు చేయగా, ఆత్మ మనుషులను తయారు చేసినది. ఇందుమూలముగా తెలియునది ఏమనగా! దేవుడు నేరుగా మనుషులను తయారు చేయలేదు. దేవుడు సమస్త ప్రపంచమును సృష్ఠించాడు. అయితే అది జీవరాసులు లేని ప్రపంచము. మొదట ప్రకృతిని (ప్రపంచమును) తయారు చేసిన దేవుడు తర్వాత ఆత్మను తయారు చేసి ఆత్మకు మనుషులను పుట్టించుటకు, పాలించుటకు, చంపుటకు అధికారము ఇచ్చాడు. అప్పటి నుండి ఆత్మయే మనుషులను తయారు చేయుచున్నది. మనుషులలో వెలుగై జీవనమును సాగింపజేయుచున్నది. తర్వాత మరణింపజేసి తిరిగి పుట్టించుచున్నది. అయినా మనుషులకు దగ్గరగా యున్న ఆత్మను, మనుషులలో వెలుగైయున్న ఆత్మను, మనుషులకు దైవముగా యున్న ఆత్మను మనుషులు ఎంతమాత్రము తెలియలేకున్నారు. ఆత్మ మనుషులను పుట్టించుచున్నది, కావున ఆత్మ మనుషులకు తండ్రిగాయున్నది. ఆత్మ దేవుని చేత తయారు చేయబడినది, కావున ఆత్మకు దేవుడు తండ్రిగా యున్నాడు. ఆత్మను కొన్ని సందర్భములలో దేవుడని చెప్పినా, ఆత్మకు సృష్ఠికర్త అయినవాడు నిజమైన దేవుడు. అందువలన నిజమైన దేవున్ని పరిశుద్ధాత్మయని, ఆత్మను తండ్రియని మనిషి అంటున్నాడు.

(4) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 11వ వచనము.
(11) ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
స్వకీయులు అనగా స్వయముగా తయారు చేయబడినవారు. ఆయన స్వకీయులనగా ఆయన స్వంతముగా తయారు చేసిన మనుషులు అని తెలియవలెను. ఆత్మ, పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆజ్ఞ చేత మానవులను తయారు చేయగా, ఆత్మ జ్ఞానరూపములో అనగా వాక్యము రూపములో మనుషులవద్దకు వచ్చినది. మనుషులు తనను తెలిసికొందురను ఉద్దేశ్యముతో ఆత్మ వాక్యముగా మనుషులవద్దకు వచ్చినా, మనుషులు వాక్యమును అనగా జ్ఞానమును అంగీకరించక తమకు తెలిసినదే గొప్పదని అనుకొంటున్నారు.

(5) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 12వ వచనము.
(12) తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
ఆత్మ అందించిన ఆత్మజ్ఞానమును తెలిసినవారందరూ ఆత్మను అంగీకరించినట్లేయగును. ఆత్మజ్ఞానమును తెలిసి, ఆత్మ మీద విశ్వాసముంచు వారికి ఆత్మ వారసులగుటకు అవకాశము గలదు. ఆ విషయమును 'దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చెను' అని చెప్పియున్నారు. దేవుని పిల్లలు అనగా ఆత్మజ్ఞానము తెలిసినవారని అర్థము.

(6) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 13వ వచనము.
(13) వారు దేవుని వలన పుట్టినవారేగానీ, రక్తము వలననైననూ, శరీరేచ్ఛవలననైననూ, మానుషేచ్చవలన నైననూ పుట్టినవారు కారు.
మనుషులందరూ ఆత్మ వలన పుట్టిన వారేగానీ, స్త్రీల రక్తము వలనగానీ, పురుషుల ఇచ్ఛవలనగానీ, మొత్తము మీద ఆడ, మగ అయిన మనుషుల ఇచ్ఛవలనగానీ పుట్టినవారు కాదు.

(7) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 14వ వచనము.
(14) ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివశించెను.
ఆత్మజ్ఞానము అనగా ఆత్మయైన దేవుడు శరీరమును ధరించి, మనిషివలె కనిపిస్తూ కృపయు, జ్ఞానము కల్గినవాడై మనుషుల మధ్యలో మనిషిగా నివశించాడు.

(8) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 18వ వచనము.
(18) ఎవడును ఎప్పుడైననూ దేవున్ని చూడలేదు. తండ్రి రొమ్మునయున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.
'దేవుడు' అను పదమును ఆత్మకు, పరమాత్మకు ఇద్దరికీ వాడుచుందురు. అంతిమ దైవగ్రంథములో 'అల్లాహ్‌' అను పదమును ఆత్మ, పరమాత్మయను ఇద్దరు దేవుళ్లకు వాడారు. అందువలన ముస్లీమ్‌లు ఇద్దరు దేవుళ్లను గుర్తించలేకపోయారు. అటువంటి పొరపాటు జరుగకుండా బైబిలు గ్రంథములో ఆత్మను తండ్రియనీ, పరమాత్మను పరిశుద్ధాత్మయనీ అన్నారు. ఇప్పుడు ఈ వాక్యములో 'అద్వితీయ కుమారుడు' అను పదమును చెప్పారు. ఈ పదమును పరిశీలించి చూస్తే ద్వితీయము అనగా రెండవది యని అర్థము. 'ద్వితీయము' అను పదమునకు ముందు 'అ' అను అక్షరము ఉండుట వలన రెండవది కానిది మొదటిదియని అర్థము. అద్వితీయ కుమారుడు అనగా 'దేవుని చేత సృష్ఠింపబడిన ఒకే ఒక కుమారుడు' అని అర్థము. పరమాత్మ లేక పరిశుద్ధాత్మ యనబడు దేవుడు ఎప్పటికీ ఉండు వాడే. సృష్ఠ్యాదిలో ప్రకృతిని సృష్ఠించిన సృష్ఠికర్తయిన పరమాత్మ జీవరూప ప్రపంచమును తయారు చేయుటకై ఒక కుమారున్ని సృష్ఠించాడు. ఆ ఒక్క కుమారుడే ఆత్మ. ఆత్మ, పరిశుద్ధాత్మ ఆజ్ఞ ప్రకారము సర్వజీవరాసులను సృష్ఠించాడు. అందువలన సర్వజీవరాసులకు తండ్రి ఒక్కడే ఆయనే సృష్ఠింపబడిన దేవుడు. సృష్ఠింపబడిన ఆత్మకు తండ్రి పరిశుద్ధాత్మ. పై వాక్యములో ''ఎవడును ఎప్పుడును పరిశుద్ధాత్మ (పరమాత్మ) యను దేవున్ని చూడలేదు'' అని వ్రాశారు. పరిశుద్ధాత్మ అయిన దేవుడు నామ, రూప, క్రియలు లేనివాడుగా యున్నాడు. అందువలన పరమాత్మయను దేవున్ని ఎవరూ చూడలేదు. ఎవరూ చూడని దేవున్ని గురించి దేవుని అద్వితీయ కుమారుడైన ఆత్మ తన జ్ఞానము ద్వారా తెలియబరుస్తున్నాడు. పరమాత్మ యను పెద్ద దేవుని హృదయము నుండి వేరుగా చీలి వచ్చినవాడు ఆత్మ అయిన అద్వితీయ కుమారుడు అని ఆత్మను చెప్పి, ఆయన తప్ప పరిశుద్ధాత్మను ఎవరూ చూడలేదని, ఆయనను గురించి తెలిసినవాడు ఆత్మ ఒక్కడే అయినందున ఆయన తండ్రిని గురించి ఆయన (ఆత్మ) ఒక్కడే తెలియ జేయగలడు. ఆయన తప్ప (ఆత్మ తప్ప) ఆయనను (పరమాత్మను) తెలియజేయువాడు ఎవడూ లేడు.

(9) యోహాన్‌ సువార్త, 1వ అధ్యాయము, 51వ వచనము.
(51) మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపైగా ఎక్కుటయును, దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ఇది ఏసు స్వయముగా 'నతనయేలు' అనునతనితో స్వయముగా చెప్పిన మాట ఇదియని తెలియవలెను. ఈ వాక్యములో మనుష్యకుమారుడు అను వాక్యమును చెప్పారు. ఏసు తనను మనుష్య కుమారుడని చెప్పు కొన్నాడు. అంతకుముందు నతనయేలు ఏసుతో ''బోధకుడా! నీవు దేవుని కుమారుడవు'' అని అన్నాడు. అయితే ఏసు తనను దేవుని కుమారుడు అని చెప్పక మనుష్యకుమారుడు యని తనను తాను తగ్గించుకొని చెప్పాడు. అంతేకాక నతనయేలు అనునతడు మొదలగువారు గొప్ప మహత్యమును చూతురని ఏసు చెప్పాడు. అది ఏమనగా! దేవుని దూతలు ప్రపంచములోని మానవులను పాలించు పాలకులుగా ఉన్నారని గతములో కూడా అనేక మార్లు చెప్పుకొన్నాము. దేవుని దూతలు ఆకాశములోనే కోట్లకొలది యున్నారని వారిని భూతములు, గ్రహములు అంటారని చెప్పుకొన్నాము. ఏసు ఎవరయినది దేవుని దూతలయిన వారికి తెలియుట చేత ఆకాశము నుండి దేవుని దూతలు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారము చేసిపోవుచుందురు. ఏసు ఎవరయినది మనుషులకు ఏమాత్రము తెలియదు. అందువలన మనుషులు నమస్కరించడము లేదు. ఈ విషయమును అంతిమ దైవగ్రంథము ఖుర్‌ఆన్‌లో 15వ సూరాలో 28,29,30 వాక్యములలో గలదు. ఆకాశములో ద్వారము తెరచినట్లు ఆకాశమునుండి భూతములు, గ్రహములు ఏసువద్దకు రావడము పోవడమును చూతురని చెప్పడము జరిగినది. ఎక్కడము దిగడము అనగా పోవడము రావడము అని అర్థము. మనుష్యకుమారుని పైకి అనిన ఏసువద్దకు అని అర్థము. ఆకాశము తెరువబడుట అనగా ఆకాశములో ద్వారము తీసినట్లుయని అర్థము. ఈ వాక్యమును నీవు దేవుని కుమారునివి యని నతనయేలు అన్నప్పుడు, అతను చూచిన వాటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో ఏసు చెప్పాడు. 50వ వాక్యములో ఈ మాట చెప్పిన తర్వాత 51వ వాక్యములో ఈ విధముగా ఏసు చెప్పడము జరిగినది. నతనయేలు కొంతవరకు జ్ఞానదృష్ఠికల జ్ఞాని అయినందున ఏసును దేవుని కుమారునిగా గుర్తించి చెప్పాడు. అప్పుడు ఏసు నతనయేలు సామత్యమును గుర్తించి ఆయన తన జ్ఞాన దృష్ఠిచేత మనుషులు చూడలేని దృశ్యమును చూడగలవని 51వ వాక్యమును చెప్పాడు. అందులో చెప్పినవి జ్ఞానులకు మాత్రము కనిపించు కార్యములు. ఈ వాక్యముతో ఏసు ఎవరయినది గ్రహించువారికి తెలియుచున్నది.

(10) యోహాన్‌ సువార్త, 3వ అధ్యాయము, 3వ వచనము.
(3) ఒకడు క్రొత్తగా జన్మించితేనేగానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ఈ వాక్యమును బాహ్యముగా అర్థము చేసుకోకూడదు. ఇది సూక్ష్మమైన అర్థముతో కూడుకొనియున్నది. దేవుడు కనిపించనివాడు. అలాగే దేవుని రాజ్యము అంటే ఏమిటో అదియు ఎవరికీ కనిపించనిది. కనిపించని దేవుని రాజ్యమును చూడవలెనన్నా, తెలియవలెనన్నా మనిషి క్రొత్తగా పుట్టవలసియున్నదని ఏసే స్వయముగా చెప్పాడు. అయితే మనిషి చనిపోయి క్రొత్తగా జన్మించవలెనని అనుకోకూడదు. అలా అయితే దేవున్ని తెలియాలను వారందరూ చనిపోవలసియుంటుంది. అందువలన అలా అనుకోవడము పొరపాటు. అలా ఆలోచించిన 'నీకొదేము' అను వ్యక్తి ఇలా ప్రశ్నించాడు.

(11) యోహాన్‌ సువార్త, 3వ అధ్యాయము, 4, 5, 6, 7, 8 వచనములు.
(4) ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మించ గలడు? రెండవమారు తల్లిగర్భమందు ప్రవేశించి జన్మించ గలడాయని ఆయనను అడుగగా

(5) ఒకడు నీటి మూలము గాను, ఆత్మ మూలముగానూ జన్మించితేనే గానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

(6) శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.

(7) మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.

(8) గాలి దానికి ఇష్టమైన చోట విసరును. నీవు దాని శబ్దమును విందువేగానీ, అది ఎక్కడినుండి వచ్చినదో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే యున్నాడనెను.
మనిషి చనిపోయి రెండవమారు జన్మించుటను జన్మమారడము అని అంటారు. అలా స్థూలముగా జన్మ మారితే మనిషిలోని అన్ని భాగములు మారిపోవును. అప్పుడు దేవున్ని, దేవుని రాజ్యమును చూడాలను కోర్కె కూడా లేకుండా పోవును. శరీరములోని అవయవములుగానీ, ఆశయములు గానీ మారకుండా ఉండాలంటే శరీరములు చావకూడదు. శరీరములోని జ్ఞానము అజ్ఞానము అను రెండు భాగములలో అజ్ఞానము పూర్తి చనిపోవలసి యుంటుంది. మనిషి అజ్ఞానములో చనిపోయి జ్ఞానములో జన్మించడము అంటే అజ్ఞాన ఆలోచనలు, అజ్ఞాన కోర్కెలను లేకుండా చేసుకోవడము వలన వాడు అజ్ఞాన మరణమును పొంది జ్ఞాన జన్మ ఎత్తినట్లగును. అలా అజ్ఞానము లేకుండా చేసుకొనువాడు జ్ఞానమును పొందినవాడు ఆత్మ మూలముగా జన్మించినట్లగుచున్నది. శరీరములో ఆత్మను తెలియడమే మనిషి యొక్క కర్తవ్యము. ఆత్మను తెలియుటకు ఆత్మజ్ఞానమును తెలియవలసియుండును. అందువలన ఆత్మ మూలముగా అనగా ఆత్మ కొరకు జ్ఞానమును తెలియడమును ఆత్మ మూలముగా పుట్టినట్లగుచున్నది. శరీరము మరణిస్తే శరీరమును పొందవచ్చును. అలా శరీరమును వదలకముందే క్రొత్త శరీరమును చేరకుండానే పాత శరీరములో తన ఇచ్ఛను మార్చు కోవడమునే క్రొత్త జన్మ ఎత్తినట్లగును. గాలి తన ఇష్టమొచ్చినచోట వీస్తున్నది. అది వీచే దానినిబట్టి దాని శబ్దమును వినుచుందుము. అలాగే గాలి తన దిశను మార్చుకొన్నట్లు మనిషి తన ఉద్దేశ్యమును మార్చుకొంటే అతడు క్రొత్త జన్మ ఎత్తినట్లగును. ఆత్మను కోరువాడు అదే జన్మలో, అదే శరీరములోని ఆత్మను తెలియవచ్చును. దానికొరకు ఇంకొక జన్మకు పోవలసిన అవసరము లేదు.

(12) యోహాన్‌ సువార్త, 3వ అధ్యాయము, 13వ వచనము.
(13) పరలోకమునుండి దిగివచ్చినవాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఎవడును లేడు.
ఇహలోకము, స్వర్గలోకము, నరకలోకము, పరలోకము అని అందరూ నాలుగు లోకముల పేర్లను వినియున్నాము. ఇహలోకము అనగా! అందరికీ కనిపించు, అందరూ నివాసమున్న భూలోకమునే ఇహలోకము అని అంటున్నాము. స్వర్గ లోకము, నరక లోకము అనగా! ఆ రెండు లోకములు భూలోకములోనే గలవు. దీనినిబట్టి ఇహ లోకములోనే స్వర్గ, నరక లోకములు గలవని చెప్పవచ్చును. లోకము అనగా! ఒక రాజ్యమో, ఒక భూభాగమో కాదు. లోకము అనగా అనుభవింపబడు స్థలమును అనుభవింపబడు సమయమును రెండిటినీ కలిపి లోకము అని అంటున్నాము. కష్టము అనుభవించు సమయములో గల అనుభవించు స్థలమును యమలోకము అనియూ లేక నరక లోకమనియూ అంటున్నాము. అలాగే సుఖమును అనుభవించు సమయములో ఏ స్థలముండునో ఆ స్థలమును స్వర్గలోకము అని అంటున్నాము. ఈ రెండు అనుభవములు భూ లోకములోనే యుండును కావున ఇహలోకమే స్వర్గ, నరక లోకముగా యున్నదని చెప్పవచ్చును. స్వర్గ, నరక లోకములు రెండూ కానిది పరలోకము అని అంటారు. లోకము అనగా అనుభవములు కలదికాగా, పరలోకము అనగా అనుభవములకంటే వేరుగాయున్న సమయమును అనగా ఏ అనుభవము లేని స్థితిని పరలోకము అని అంటున్నాము. మనిషి కర్మల నుండి బయటపడినప్పుడు సుఖ, దుఃఖ ఏ అనుభవములు లేకుండా పోవును. అటువంటి వారే పరలోకమును పొందుననీ అదే దేవునియందు చేరియుండు స్థితియనీ దానినే ముక్తి లేక మోక్షము అని అంటున్నారు. ఇహలోకములో ఉండువాడు పాపపుణ్య కర్మలతో కూడుకొనియుండును. పరలోకములో యుండు వానికి ఏ కర్మలు ఉండవు. ఇహ లోకములోని వాడు చనిపోతే తిరిగి ఇహ లోకములోనికే వచ్చును తప్ప పరలోకమునకు పోజాలడు. అలాగే పరలోకములో ఉండువాడు ఎప్పుడయినా అవసర నిమిత్తము ఇహ లోకములోనికి వచ్చినా అతను తిరిగి పరలోకములోనికే పోవును. అందువలన పరలోకమునుండి వచ్చిన పరలోక నివాసి తన ఇచ్ఛ ప్రకారము కొంతకాలము ఇహలోకములో ఉండినా అతడు తర్వాత పరలోకములోనికే చేరును. పరలోకమునుండి వచ్చినవాడు మనుష్య కుమారుడుగా భూమిమీద కనిపించినా వాడు తిరిగి పరలోకమునకే చేరిపోవలసి యుండును. అందువలన వాక్యములో ''పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడు లేడు'' అని చెప్పారు. పరలోకములో ఉండువాడు దేవుడేయని చెప్పవచ్చును. అయితే దేవుడయినవాడు మనిషిగా వచ్చి పుట్టినప్పటికీ అతడు తిరిగి పరలోకమునే చేరును. అదే విషయమును (యో, 3-13) లో చెప్పియున్నారు.

(13) యోహాన్‌ సువార్త, 3వ అధ్యాయము, 15వ వచనము.
(15) విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను.
దేవున్ని విశ్వసించు ప్రతివాడు మరణమును పొందక నిత్య జీవనమును పొందును అనుట సత్యమే. అయితే ''ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు'' అని వ్రాయబడియున్నది. అంతేగాక ''మనుష్య కుమారుడు ఎత్తబడవలెను'' అని కూడా చెప్పియున్నారు. బైబిలు గ్రంథము మొదట హెబ్రీ భాషలో వ్రాయబడినది. తర్వాత అది 14 వందల భాషలలో అనువదింపబడినది. చివరిలో తెలుగు భాషలోనికి ఏ భాషనుండి అనువదించారో తెలియదుగానీ అనువాదములో భాషాలోపము బాగా కనిపించుచున్నది. ఉదాహరణకు ఇప్పుడు చెప్పిన (3-15) వాక్యములో కర్త, కర్మ, క్రియ ఏవీ సరిగా లేవు. వాక్యము సంపూర్ణముగా అర్థమగునట్లు లేదు. విశ్వసించు ప్రతివాడు నశించక నిత్య జీవము పొందుట వాస్తవమే అయినా చివరిలో నిత్య జీవము పొందునట్లు అని మరియొక విషయమును చూపుచూ 'మనుష్య కుమారుడు ఎత్తబడవలెను' అని అన్నారు. అట్లు అని చెప్పినప్పుడు దానికి చూపవలసిన ఉదాహరణను సరిగా చూపలేదు. అయినా మనము సవరించుకొని అర్థము చేసుకోవలసి యున్నది. దేవుని మీద, దేవుని జ్ఞానముమీద విశ్వాసమున్నవాడు నిత్య జీవమైన పరలోకమును పొందుట వాస్తవమే. ఆ మాట చెప్పేంతవరకు వాక్యము బాగానే యున్నది. ముందు చెప్పిన ఈ విషయమునకు సంబంధము లేకుండా 'మనుష్య కుమారుడు ఎత్తబడవలెను' అని చెప్పారు. 'మనుష్య కుమారుడు ఎత్తబడవలెను' అనుమాటను 'మనుష్య కుమారుడు ఎత్తబడును' అనిగానీ, 'మనుష్య కుమారుడు ఎత్తబడెను' అనిగానీ చెప్పియుంటే సరిపోయేది. అలా కాకుండా వాక్యమును అసంపూర్ణముగా 'ఎత్తబడవలెను' అని వ్రాయుట సరియైన భాషా విధానము కాదు. అయినా వాక్యమును సంపూర్ణము చేసుకొనుటకు 'మనుష్య కుమారుడు ఎత్తబడెను' అని చెప్పుకొందాము. ఎప్పుడో గతములో మనుష్య కుమారుడుగా వచ్చిన ఏసు మనుష్య లోకము నుండి పరలోకమునకు చేరిపోయాడు కావున 'ఎత్తబడెను' అని చెప్పుకోవడమే సరియైన విధానమగును.

ఎత్తబడెను అనగా ప్రత్యక్షముగా స్థూల అర్థము ప్రకారము పైకి ఎత్తడము కాదు. మనుషులు నివశించు ఇహలోకము అయిన భూలోకము కంటే ఉత్తమమైనది పరమపదము లేక పరలోకము అని అంటాము. ఉత్తమమైనది కనుక భూలోకముకంటే ఉన్నత స్థానములో గలదని అంటారు. భూలోకములో చనిపోయినవాడు మోక్షమును (పరలోకమును) పొందితే వానిని పైకి ఎక్కిపోయాడని చెప్పుచున్నాము. వాస్తవముగా ఎవడూ స్థూలముగా పైకి పోవడము లేదు. భావమును అర్థము చేసుకొను నిమిత్తము మోక్షము ఇహలోకముకంటే ఉన్నతమైనది, కావున దానిని పైన కలదియని గౌరవ భావముతో చెప్పారు తప్ప మోక్షము ఎక్కడో పైన లేదు. శరీరములోను, శరీరము బయట అణువణువునా పరమాత్మ వ్యాపించియున్నాడు. పరమాత్మయందు జీవాత్మ కలిసిపోవడమునే జీవాత్మ పరలోకమును పొందడమని చెప్పవచ్చును. దానినే నిత్య జీవనమును పొందడమని కూడా చెప్పవచ్చును. వాస్తవము అంతేగానీ ఇంతకంటే వేరు అర్థము ఏమీ లేదు. పరలోకమును దేవుని రాజ్యము అని కూడా చెప్పుచున్నారు. 'దేవునియందు విశ్వాసమున్న వాడు చివరకు కర్మలు లేనివాడై నిత్య జీవమును పొందును' అని వాక్యములో కూడా చెప్పియున్నారు. నిత్య జీవనమైన పరలోకము నీవు ఎక్కడున్నావో అక్కడే కలదు. అందువలన ఎవడయినా మోక్షము పొందువాడు అతని శరీరములోయున్న పరిశుద్ధాత్మ అయిన పరమాత్మ యందు ఐక్యమైపోవుచున్నాడు. అంతేగానీ ఎక్కడో పైకియనిగానీ, ఆకాశము లోనికి ఎక్కిపోవును అనిగానీ చెప్పడము తప్పగును.

(14) యోహాన్‌ సువార్త, 3వ అధ్యాయము, 17వ వచనము.
(17) లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గానీ, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు.
ఇహలోకమైన భూలోకములోనికి దేవుడు తన కుమారుడైన ఒక వ్యక్తిని పంపును. ఆ వ్యక్తి ద్వారా మనుషులు రక్షణ పొందుదురేగానీ దేవుని కుమారుడైన వాడు మనుషులకు తీర్పు తీర్చడు. దేవుడు తన కుమారుడుగా వచ్చిన వ్యక్తిని మనుషులకు రక్షణ నిమిత్తము పంపాడుగానీ, తీర్పు తీర్చుటకు పంపలేదు. దేవునివద్ద నుండి వచ్చిన వ్యక్తి యొక్క కర్తవ్యము మనుషులకు దైవజ్ఞానమును బోధించి వారి పాపములనుండి రక్షణ పొందునట్లు చేయును. అట్లుకాకుండా మనుషుల పాప పుణ్యములకు తీర్పు తీర్చుటకు ఆయన రాలేదు. తీర్పు తీర్చు నిమిత్తము దేవుడు తన ప్రతినిధిని భూమిమీదికి పంపలేదు. దేవుడు మనుషులకు రక్షణ నిమిత్తమై వచ్చాడు తప్ప తీర్పు తీర్చుటకు రాలేదు. బైబిలు గ్రంథములో ఈ వాక్యము చాలా ముఖ్యమైనది. తీర్పు తీర్చడము అను పనిని మనిషి చనిపోయినప్పుడు శరీరములోని ఆత్మే చేయుచున్నది. మనుషులకు తీర్పు తీర్చు పనిని ఆత్మ చేయగా, దేవునివద్ద నుండి వచ్చినవాడు కర్మలనుండి రక్షణ పొందు ఉపాయమును తెలియజేయును.

(15) యోహాన్‌ సువార్త, 3వ అధ్యాయము, 18వ వచనము.
(18) ఆయనయందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు. కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.
ఈ వాక్యములో 'ఆయనయందు విశ్వాసముంచు వానికి' అని చెప్పారు. ఆయన అనగా కనిపించని దేవుడు అని అర్థము చేసుకోవచ్చును. లేక దేవునివద్ద నుండి వచ్చిన కనిపించే దేవుని ప్రతినిధి కావచ్చును. అయితే ఆ వాక్యము చివరిలో 'దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచని వానికి' అని చెప్పబడియుండుట వలన దేవునివద్ద నుండి వచ్చిన దేవుని ప్రతినిధియైన మనిషి రూపములోయున్న వ్యక్తిని గురించి చెప్పాడని అనుకోవచ్చును. దేవుడు భూమిమీద మనుషులకు జ్ఞానమును తెలియజెప్పుటకు మనిషివలె మారువేషములో తానే వచ్చును. అయితే ఆ విషయము ఎవరికీ తెలియకుండునట్లు తన 'అద్వితీయ కుమారున్ని' అని ఒకచోట, 'దేవుని కుమారుడని' ఒకచోట, 'మనుష్య కుమారుడని' మరొక చోట చెప్పుచూ వచ్చాడు. అలా దేవుని మారువేషమైన వానిని హిందువులు 'భగవంతుడు' యని అన్నారు. అలా వచ్చినవాడే కృష్ణుడు అని చెప్పుచూ ఆయన చెప్పిన భగవద్గీతలో 'భగవానువాచ' అని కృష్ణున్ని భగవంతుడు అని చెప్పారు. ఇక్కడ ఏసుగా పుట్టిన వ్యక్తి దేవుని కుమారుడై మనుష్య కుమారునివలె కనిపించుచున్నా ఆయనను కూడా భగవంతుడని చెప్పక తప్పదు. హిందువులు 'భగవంతుడు' అని ప్రత్యేకముగా చెప్పుచున్నా, క్రైస్థవులు 'మనుష్య కుమారుడు'యని ప్రత్యేకముగా చెప్పుచున్నారు. అంతిమ దైవగ్రంథములో కూడా 'దేవుడు తన ప్రతినిధిని తన ఆత్మను ఊది పంపును' అని 15వ సూరా, 28, 29, 30 ఆయత్‌లలో చెప్పియున్నా వారు ''దేవుడు మనిషిగా రాడు'' అని అంటున్నారు. దేవుని ప్రతినిధియైన మనుష్యకుమారుని యందు విశ్వాసము లేనివానికి ముందే తీర్పు తీర్చబడెను.

(16) యోహాన్‌ సువార్త, 3వ అధ్యాయము, 19, 20, 21 వచనములు.
(19) ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

(20) దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్‌క్రియలుగా కనపడకుండునట్లు వెలుగువద్దకు రాడు.

(21) సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగువద్దకు వచ్చును.
పరమాత్మ ఎవరికీ తెలియని కటికచీకటిగాయున్నా ఆయన చేత సృష్ఠింపబడిన ఆత్మ నిజమైన వెలుగుగాయుండెను. పరమాత్మ చేత (పరిశుద్ధాత్మ చేత) సృష్ఠింపబడిన శరీరములలో వెలుగుగా యున్న కనిపించని ఆత్మ మరియు శరీరముతో యుండి మనుషుల మధ్యలో మనిషిగా తిరిగే ఆత్మ రెండూ పరిశుద్ధాత్మకు కుమారులుగా యున్నవి. శరీరములో కనిపించక శరీరమునకు వెలుగుగాయున్న ఆత్మను కుమారుడు అనినా, మనిషివలె కనిపించుచూ వచ్చు దేవుని కుమారున్ని అద్వితీయ కుమారుడు అని ప్రత్యేకించి చెప్పియున్నారు. అద్వితీయ కుమారుడైన ఏసు భూలోకము లోనికి వచ్చెను. అయినా తమ క్రియలు అనగా తమ కార్యములు చెడ్డవైనందువలన మనుషులు జ్ఞాన వెలుగు అయిన ఏసువద్దకు రాకుండా తమకు ఇష్టమైన అజ్ఞాన చీకటినే ప్రేమించుచూ దానివైపే ఉండిరి.

అజ్ఞానులయిన ప్రతి మనిషి లోకమునకు జ్ఞానవెలుగును ఇచ్చు దేవుని ప్రతినిధియైన వానిని ద్వేషించుచుందురు. దైవజ్ఞానమును బోధించు దేవుని ప్రతినిధియైన వానివద్దకు వస్తే తమ చెడు పనులు బయటపడునని తలచిన అజ్ఞానులు తమ కార్యములు కనపడకుండునట్లు వెలుగువద్దకు రారు. భూలోకములో మనిషి రూపముగా యున్న దేవుని వెలుగు తమ చీకటి చెడు కార్యములను బయటికి కనిపించునట్లు చేయునని దానివలన తాము భూలోకములో చెడువారిగా మిగిలిపోవుదుమని తలచిన అజ్ఞానులు దేవుని కుమారుడుగా భూమిమీదికి వచ్చిన వానివద్దకు రారు. సత్యవర్తనులై దేవుని జ్ఞానము ప్రకారము నడుచుకొనుచూ తమ పనులన్నీ శరీరములోని ఆత్మ మూలముగా జరుగుచున్నవని తెలిసి, తమ కార్యములు దేవుని వెలుగులో అనగా జ్ఞానపద్ధతిగా ఉండుట వలన అటువంటి వారందరూ దేవుని కుమారుని వద్దకు చేరుదురు. దేవుని చేత అనగా ఆత్మచేత కార్యములు జరుగుచున్నవని తెలిసినవారు భూమిమీద అరుదుగా ఉన్నారు. అందువలన దేవుని పుత్రుడు భూమిమీదికి వచ్చినప్పుడు ఆయన వద్దకు వచ్చినవారు అరుదుగానే ఉందురు. అనగా స్వల్పముగానే ఉందురు. జరుగుచున్న కార్యములన్నీ తామే చేయుచున్నామని తలచువారు భూలోకమంతా నిండియుండుట వలన వారు భగవంతుడయిన దేవుని కుమారుని వద్దకు రారు. రానివారు అంతటితో ఊరక ఉండక ఎప్పుడో అరుదుగా భూమిమీదికి వచ్చిన దేవుని ప్రతినిధిగా యున్న దేవుని కుమారున్ని అజ్ఞాన ప్రజలు ద్వేషించడమే కాక, అవమానించుచుందురు. అవమానించడమే కాక అనేక కష్టములకు గురియగునట్లు చేయుచుందురు.

(17) యోహాన్‌ సువార్త, 5వ అధ్యాయము, 19వ వచనము.
(19) తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అదేకాని తనంతట తాను ఏదీ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును.
ఈ వాక్యములో 'తండ్రి, కుమారుడు' అని చెప్పడమేకాక 'తండ్రి చేయు పనులనే కుమారుడు చేయును' అని ఉన్నది. ముఖ్యముగా 'తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు?' అను విషయమును చూడవలసియున్నది. ఎందుకనగా దేవుడు అయిన పరిశుద్ధాత్మ ఒక్కడే గలడు. అయితే ఆయనకు శాశ్విత కుమారుడు ఒక్కడే అయినా, కుమారుడను పేరుగలవాడు మరియొకడు అప్పుడప్పుడు అరుదుగా భూమిమీదికి వచ్చుచుండును. ఇద్దరి కుమారులలో ఎవరిని గురించి ఎప్పుడు చెప్పాడోయని గమనించ వలసిన అవసరమున్నది. (యో 3-17) వాక్యములో దేవుడు తన కుమారున్ని అనగా భూమిమీద మనిషిగా వచ్చిన కుమారున్ని గురించి చెప్పుచూ ''లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగానీ, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు'' అని చెప్పియున్నాడు. ఇప్పుడు ఈ వాక్యములో చెప్పబడిన కుమారుడు లోకములోని మనుషుల శరీరములో వెలుగై ఆత్మగా యున్న కుమారున్ని గురించి చెప్పుచున్నారు. ఆత్మ అందరి శరీరములలో 'చైతన్యము' అను వెలుగు నిచ్చుచూ భూమిమీద శాశ్వితముగా యున్నాడు. ఇప్పుడు ఆత్మగాయున్న కుమారున్ని గురించి (యో 5-19) వాక్యములో చెప్పియున్నారు. దీనినిబట్టి ముఖ్యముగా వాక్యమును చదువునప్పుడు పరిశుద్ధాత్మయిన దేవుడు తనకు గల ఇద్దరు కుమారులలో ఏ కుమారున్ని గురించి వాక్యములో చెప్పారు? అని చూడవలెను. ఈ వాక్యములో తన శాశ్విత కుమారుడయిన ఆత్మయొక్క విషయమును చెప్పుచూ పరిశుద్ధాత్మ ఏది చేయునో ఆత్మ కూడా అదే చేయుననీ, ఆత్మ తనంతట తాను ఏదీ చేయక తండ్రి చేసిన కార్యములనే వారసత్వముగా చేయుచున్నాడు అని చెప్పారు.

(18) యోహాన్‌ సువార్త, 5వ అధ్యాయము, 20వ వచనము.
(20) తండ్రి కుమారున్ని ప్రేమించుచూ, తాను చేయు కార్యములనెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడు నట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.
''పరమాత్మ అయిన పరిశుద్ధాత్మ తన కుమారుడయిన ఆత్మను ప్రేమించుచూ తాను చేయు పనులనెల్లను ఆత్మకు తెలియజేయుచున్నాడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని ఎవరు చెప్పారని మనము ప్రశ్నించుకొని చూస్తే దేవుని రెండవ కుమారుడైన ఏసు ఈ విషయమును తన శిష్యులకు భూమిమీద తానున్నప్పుడు తెలియజేశాడు. దేవుని కుమారుడు మనిషిగా భూమిమీద ప్రత్యక్షముగా యున్నా ఆయనను ఫలానాయని గ్రహించువారుండరు. ఆయనను ఎవరయినది గ్రహించక పోగా ఆయనను అనేక బాధలకు గురిచేసి, అవమానించి ఆయన మరణమునకు కారకులైన మనుషులుగలరు. అటువంటి వారి మధ్యలో ఏసు అను పేరు కల్గియున్న దేవుని అద్వితీయ కుమారుడు ఇంకా ఈ విధముగా చెప్పుచున్నాడు. అదేమనగా!, ''మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు (ఆత్మకు) అగపరచుచున్నాను'' అని అన్నాడు. దేవుడు ఆత్మకు జీవున్ని పాలించుటకు ఆదేశమివ్వడమేకాక అంతకంటే గొప్ప కార్యములను కూడా చెప్పియున్నాడు. అవి ఏవనగా! ఇప్పుడు చూస్తాము.

(19) యోహాన్‌ సువార్త, 5వ అధ్యాయము, 21, 22, 23 వచనములు.
(21) తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును.

(22) తండ్రి ఎవనికి తీర్పు తీర్చడుగానీ, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు.

(23) తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని, కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.
ఇక్కడ గమనించవలసిన విషయము ఏమనగా! ఖుర్‌ఆన్‌ గ్రంథములో 'ఇద్దరు అల్లాహ్‌లను' గురించి వ్రాసినా ముస్లీమ్‌లు కనుగొన లేకపోయారు. అలాగే బైబిలు గ్రంథములో 'ఇద్దరు కుమారులను' గురించి చెప్పినా క్రైస్థవులు గ్రహించలేక ఒకే కుమారున్ని చెప్పుకొంటున్నారు. ఈ మూడు వాక్యములలో 'కుమారుడు' అను పదము వచ్చినది. అయితే ఇక్కడ చెప్పినది ఇద్దరు కుమారులలో ఏ కుమారున్ని గురించి చెప్పారో చూడవలసి యున్నది. ఒక్కమారు ఒక్క కుమారున్నే చెప్పుట వలన రెండవ కుమారుడున్నాడను విషయమును చాలామంది గ్రహించలేకపోవుచున్నారు. (యో 3-17) ''తన కుమారుడు లోకమునకు రక్షణ నిమిత్తమే వచ్చాడుగానీ, తీర్పు తీర్చుటకు పంపలేదని'' చెప్పిన దేవుడు (యో, 5-22) లో ''తీర్పు తీర్చు అధికారము కుమారునికి అప్పగించియున్నాడని'' చెప్పియున్నారు. దీనినిబట్టి దేవుని ఇద్దరు కుమారులను తప్పక గ్రహించవలసియున్నది.

దేవుడు ఆత్మయైన కుమారునికి తండ్రియైన పరిశుద్ధాత్మ 'మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడు మృతులను లేపి బ్రతికించును' అని చెప్పియున్నాడు. దీనినిబట్టి శరీరములలో వెలుగై కనిపించకయున్న ఆత్మరూపమైయున్న కుమారుడు తండ్రి ఎలాగ చనిపోయిన వారిని తిరిగి పునర్జన్మ ఇచ్చి బ్రతికించుచున్నాడో అలాగే ఆత్మగా యున్నవాడు మనిషి చనిపోయిన తర్వాత వానికి గతజన్మలో చేసుకొన్న పాపపుణ్యములను బట్టి తర్వాత జన్మలో అనుభవించవలసిన వాటిని నిర్ణయించి తిరిగి పుట్టించుచున్నాడు. 'తండ్రివలె కుమారుడు తనకిష్టమైన వారిని బ్రతికించును' అన్నారు. 'తనకిష్టమైనవారు' అనగా తనదృష్ఠిలో 'కర్మ నిర్ణయింపబడిన వారిని' అని అర్థము. కర్మను ఆత్మే నిర్ణయించుచున్నది. కావున ఆత్మే మనిషిని తిరిగి పుట్టునట్లు చేయుచున్నది. పుట్టిన వానిని కర్మను అనుభవించునట్లు చేయువాడు కూడా ఆత్మే అయినందున 'తాను తీర్పు తీర్చిన వానిని తిరిగి బ్రతికించును' అని చెప్పియున్నారు. తిరిగి బ్రతికించడము అనగా పునర్జన్మ కలుగజేయడము.

సృష్ఠికర్త అయిన పరిశుద్ధాత్మను అందరూ గొప్ప దేవుడని ఘనముగా చెప్పుకొన్నట్లు తన కుమారుడైన ఆత్మను కూడా అందరూ గొప్పగా చెప్పుకొనునట్లు చనిపోయిన వారిని తీర్పు తీర్చి తిరిగి బ్రతికించునట్లుగా దేవుడు చేశాడు. మనిషి చనిపోయిన క్షణమే అతని శరీరములో వెలుగైయున్న ఆత్మ చనిపోయిన మనిషి చేసుకొన్న పాపపుణ్యములనుబట్టి రెండవ జన్మలో జీవుడు అనుభవించవలసిన కర్మలను నిర్ణయించి వెంటనే రెండవ జన్మ ఎత్తునట్లు చేయుచున్నాడు. మనిషి చేసుకొన్న కర్మలనుబట్టి రెండవ జన్మను నిర్ణయించి మనిషిని తిరిగి పుట్టునట్లు చేయుచున్నాడు. ఆత్మ ఇంతగొప్ప పనిని చేయుచున్నాడని తెలియనివారు ఆత్మను గొప్ప భావముతో చూడరు. ఆత్మను గౌరవించనివాడు ఆత్మను పంపిన దేవున్ని కూడా ఘనముగా చూడడు. అటువంటి అజ్ఞాన జీవుడు శరీరములోని ఆత్మనుగానీ, శరీరము బయట లోపల యున్న పరమాత్మనుగానీ గౌరవ భావముతో చూడడు.

(20) యోహాన్‌ సువార్త, 5వ అధ్యాయము, 24వ వచనము.
(24) నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాస ముంచువాడు నిత్య జీవముగలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఇంతకుముందు చెప్పిన 21, 22, 23 వాక్యములలో 'శరీరములో చైతన్యముగా యున్న ఆత్మను' గురించి చెప్పియున్నారు. ఇప్పుడు 24వ వాక్యమునందు మనిషి ఆకారములో వచ్చిన అద్వితీయ కుమారుడైన ఏసు శరీరములోని ఆత్మను గురించి చెప్పి, పరిశుద్ధాత్మయిన దేవుడు ఆత్మకు ఇచ్చిన అధికారములను గురించి చెప్పి, తర్వాత తనను పంపిన పరిశుద్ధాత్మను విశ్వసించినవాడు తప్పక మోక్షము పొందునని, అతడు మరణము పొందిన వెంటనే తీర్పులోనికి రాడని, అతడు నేరుగా మోక్షమును చేరునని చెప్పియున్నాడు.

(21) యోహాన్‌ సువార్త, 5వ అధ్యాయము, 26వ వచనము.
(26) తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.
పరిశుద్ధాత్మయిన దేవుడు ఎప్పటికీ నిత్యజీవము గలవాడై యున్నాడు. పరమాత్మ ఎలా శాశ్వితముగా యుండువాడో అలాగే ఆయన కుమారునిగా చెప్పబడుచున్న ఆత్మ కూడా ఎప్పటికీ శాశ్వితముగా యుండులాగున ఆత్మకు అధికారము ఇవ్వబడినది. అధికారము ఇచ్చినవాడు ఆత్మకు తండ్రియైన పరిశుద్ధాత్మయని తెలియవలెను. అందువలన శరీరములోని జీవునితో ఆత్మను పోల్చితే జీవుడు నాశనము చెందువాడు, ఆత్మ నాశనము చెందని వాడని చెప్పుచూ జీవున్ని క్షరుడని, ఆత్మను అక్షరుడని ప్రథమ దైవగ్రంథములో చెప్పియున్నారు. క్షరుడు అంటే నాశనము చెందువాడని, అక్షరుడు అంటే నాశనము లేనివాడని అర్థము.

(22) యోహాన్‌ సువార్త, 5వ అధ్యాయము, 37వ వచనము.
(37) మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు.
ఇక్కడ 'ఆయన' అని చెప్పబడినవాడు పరమాత్మయిన 'పరిశుద్ధాత్మ' యని తెలియవలెను. పరమాత్మయనబడు దేవునికి రూపము లేదు, అలాగే పేరు లేదు. అలాగే ఆయనకి పనులు లేవు. అటువంటి దేవున్ని ఎవరూ చూడలేదు. ఆయనకు రూపమే లేనప్పుడు ఎలా చూడగలరు? అందువలన ప్రపంచములోని మనుషులు దేవున్ని ఎప్పుడుగానీ చూడలేదు. దేవుడు పని చేయనివాడు అయినందున ఆయన ఎవరితోనూ మాట్లాడువాడు కాదు. దీనినిబట్టి దేవున్ని బ్రతికియున్న మనిషి ఎవడూ చూడలేదని చెప్పవచ్చును. ఎవడయినా నేను దేవున్ని చూచాను అని చెప్పితే వాడు పూర్తి అసత్యమును చెప్పినట్లు లెక్కించవలెను. దేవుడు కనిపించువాడు కాదు అట్లే వినిపించు వాడు కాదు.

(23) యోహాన్‌ సువార్త, 5వ అధ్యాయము, 38వ వచనము.
(38) ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు, కనుక మీలో ఆయన వాక్యము నిలిచి యుండలేదు.
మొదటి సృష్ఠికర్తయైన పరమాత్మ లేక పరిశుద్ధాత్మ పని చేయని వాడైనా తనకంటూ కొన్ని పనులున్నాయి. అయినా ఆయన పనులు చేయువాడు కాడు. అయితే ఆయన చేయవలసిన పనులను చేయుటకు పరమాత్మయిన దేవుడు తన దూతలను నియమించుకొన్నాడు. దేవుని పాలనలో భాగముగా యున్న కోట్లాదిమంది దేవుని దూతలు దేవుడు చేయవలసిన ప్రతికార్యమును చేయుచూ, దేవునికి పని లేకుండా చేయుచున్నారు. దేవుడు పని చేయనివాడైనా ఆయన చేయవలసిన పనులన్నియూ ఆయన సేవకులయిన దూతల ద్వారా జరిగిపోవుచున్నవి. పరమాత్మ ముఖ్యముగా చేయవలసిన పని ఒకటి గలదు. అదే దేవుడు స్వయముగా జ్ఞానమును బోధించవలసియున్నది. అయితే ఆ పనిని దేవుడు తప్ప దేవదూతలు చేయునది కాదు. 'దేవుని జ్ఞానమును దేవుడే చెప్పును అని, దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదని, ఎవరికీ తెలియదని' అంతిమ దైవగ్రంథములో కూడా చెప్పియున్నారు. అటువంటప్పుడు జ్ఞానమును బోధించడము ఎవరూ చేయలేని పనియైనందున దేవుడే తాను కాదు అన్నట్లు మారువేషములో వచ్చి చెప్పి పోవుచున్నాడు. మారువేషములో దేవుడే చెప్పినా, ఆ వచ్చిన వేషములో ఎవరున్నది తెలియకపోవడము వలన దేవుడు చెప్పినట్లే యుండును. దేవుడు తన జ్ఞానమును తానే చెప్పినా, అది దేవుడు చెప్పనట్లు గుర్తింపునకు రావడము లేదు. అందువలన దేవుడు వివేకవంతుడు అయినందున తనను ఎవరూ గుర్తుపట్టనట్లు 'భగవంతుడు' అను మారువేషములో వచ్చి జ్ఞానమును చెప్పి పోవుచున్నాడు.

దేవుడు స్వయముగా మారువేషములో భూమిమీదికి మనిషివలె వచ్చి జ్ఞానమును బోధించి పోయినా ఆ విషయమును ఎవరూ తెలియకుండునట్లు దేవుడు తనవద్ద నుండి ప్రత్యేకమైన మనిషిని పంపును. 'దేవుని వద్ద నుండి వచ్చినవాడే దేవుని జ్ఞానమును బోధించును' అని దేవుడే స్వయముగా తన గ్రంథమయిన దైవగ్రంథములలో చెప్పియున్నాడు. దీనినిబట్టి అందరూ దేవునివద్ద నుండి పంపబడినవాడే దేవుని జ్ఞానమును చెప్పును అని అనుకొంటున్నారు. దానివలన దేవుని అవతరణ ఎవరికీ తెలియకుండా పోవుచున్నది. త్రేతాయుగములో దేవుడు మనిషిగా వచ్చినా ఆయనను ఎవరూ గుర్తించలేదు. ద్వాపర యుగములో దేవుడు మనిషిగా వచ్చి భగవద్గీతను బోధించి, భగవద్గీతలో ''నేనే దేవున్ని'' యని చెప్పియున్నా ఎవరూ వచ్చిన భగవంతున్ని గుర్తించలేదు. కలియుగములో ఏసుగా దేవుడే వచ్చియున్నా ఆయనను ఎవరూ దేవుడని గుర్తించలేకపోవడమేకాక, ఏసును అనేక ఇబ్బందులపాలు చేశారు. ఆయనను అసలయిన దేవుడని ఎవరూ గ్రహించలేకపోయారు. కొందరు మేము దేవుని విశ్వాసులము అన్నవారు సహితము ఏసు నిజముగా దేవుడని తెలియక కొందరు ఆయనను మనుష్య కుమారుడుయని అన్నారు. కొందరు దేవుని కుమారుడుయని అన్నారు. అంతేగానీ దేవుడని గుర్తించలేకపోయారు.

ఏసు స్వయముగా దేవుడైయుండి ఈ వాక్యములో తాను బయట పడనట్లు ''ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు'' అని అన్నాడు. ఆయన పంపించిన వానిని మీరు నమ్మలేదని చెప్పాడు. దీనినిబట్టి మనిషి దేవుడు అను మాటను ఎవరూ నమ్మడము లేదు. దేవుడు పంపిన మనిషియందు మీకు నమ్మకము లేదు. కనుక ''దేవుని వాక్యము మీలో నిలిచియుండలేదు'' అని అన్నాడు. దేవుడు పంపిన మనిషి మీద నమ్మకము లేకపోతే దేవుని వాక్యము ఎందుకు మనుషులలో యుండలేదు? అని ఆలోచిస్తే వచ్చినవాడు దేవుడే, చెప్పినవాడు దేవుడే కనుక ఆయనను నమ్మని వానిలో దేవుని వాక్యము నిలిచియుండలేదని తెలియుచున్నది.

(24) యోహాన్‌ సువార్త, 6వ అధ్యాయము, 25, 26, 27 వచనములు.
(25) బోధకుడా, నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగగా!

(26) మీరు సూచనలను చూచుట వలన కాదు గానీ, రొట్టెలు భుజించి తృప్తిపొందుట వలననే నన్ను వెదకుచున్నా రని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

(27) క్షయమైన ఆహారము కొరకు కష్ట పడకుడిగానీ నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్ర వేసియున్నాడని చెప్పెను.
ఈ వాక్యములలో 'క్షయమైన, అక్షయమైన ఆహారము' అని ఆహారమును రెండు రకములుగా చెప్పియున్నారు. భూమిమీద ఉన్న మనుషులు ఎక్కువగా క్షయమైన ఆహారము కొరకే ప్రాకులాడుచుందురు. అందుకే ఏసు తనను వెదకుచూ వచ్చి ''నీవు ఎప్పుడు వచ్చావు?'' అని అడిగిన వారిని ''మీరు దేవుని జ్ఞానమును వినుటకు నన్ను అడుగుట లేదు. మీరు నేనిచ్చు రొట్టెలను ఆశించి నన్ను వెదకుచున్నారని'' చెప్పాడు. అంతేకాక క్షయమైన ఆహారము కొరకు కష్టపడవద్దండి యని చెప్పాడు. క్షయము అంటే నాశనము అని అర్థము. క్షయమైన ఆహారము అనగా! ప్రతి దినము మనము భుజించు ఆహారము అని తెలియవలెను. మనుషులు తిను ఆహారము తినిన తర్వాత మూడు గంటలలో జీర్ణమైపోవుచున్నది. జీర్ణము అనగా నాశనము అని అర్థము. మనుషులు తిను ఏ ఆహారమైనా అది జీర్ణాశయములో జీర్ణము కాక తప్పదు. జీర్ణాశయము అనగా నాశనము చేయుటే ఆశయముగా కల్గిన శరీర భాగము. జీర్ణాశయములో నాశనము కానిది ఏదీలేదు. జీర్ణాశయములో నాశనమైన ఆహారము కట్టెలు కాలి బూడిదయైనట్లు వ్యర్థపదార్థముగా మారిపోవుచున్నది.

మనిషి నోటి ద్వారా కడుపులోనికి వేయు ఆహారమును క్షయమైన ఆహారము యని చెప్పవచ్చును. అట్లే మనిషి చెవుల ద్వారా జ్ఞానమును తలలోనికి వేయుచున్నాడు. తలలో మాటల రూపములో శరీరములోనికి చేరిన జ్ఞానమును అక్షయమైన ఆహారము అని అంటున్నారు. అక్షయమైన అనగా 'నాశనముకాని ఆహారము దేవుని జ్ఞానము ఒక్కటే'యని చెప్పవచ్చును. ఎవడయితే దేవుని జ్ఞానమును చదవగల్గినా, వినగల్గినా వాడు అక్షయ ఆహారమును తన తలలోనికి వేసినట్లేయగును. అక్షయమైన ఆహారము మనుష్య కుమారుడైన వాడు మీకిచ్చును. అందుకే ''తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసి యున్నాడు'' అని వాక్యములో గలదు. 'ముద్ర' అనగా 'ఒప్పుదల'యని లేక 'నిర్ణయము' అని చెప్పవచ్చును. దేవుడు తన అద్వితీయ కుమారుడైన వాడు తన జ్ఞానమును చెప్పునట్లు నిర్ణయము చేసి పంపాడు. అందువలన దేవుని నిర్ణయమును లేక దేవుడు ఒప్పుకోవడమును ముద్ర యని వాక్యములో వ్రాసియున్నారు. ''దేవుడు తన జ్ఞానమును ఏ మానవుని మీద అవతరింపజేయలేదు'' అని చెప్పియున్నారు. దీనినిబట్టి దేవుని జ్ఞానమును చెప్పువాడు సాధారణ మనిషికాడని తెలిసిపోవుచున్నది. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతరులకు ఎవరికిగానీ తెలియదు అని దేవుడే చెప్పియున్నాడు. అందువలన అద్వితీయ కుమారునిగా వచ్చి చెప్పువాడు దేవుడేగానీ వేరుకాదని తెలియుచున్నది. 'దేవుని కుమారుడు' అన్నది మనుషులను మభ్యపెట్టుటకు చెప్పునదేగానీ కుమారుడు అన్నది 'దేవుని మారువేషము' అని చెప్పవచ్చును. దేవుడు దేవునిగా వచ్చి మనుషులతో మాట్లాడకూడదు, కావున దేవుడే కుమారునిగా వచ్చాడని చెప్పవచ్చును. నేను చెప్పుమాట సత్యము అనునట్లుగా క్రింద వాక్యము గలదు చూడండి.

(25) యోహాన్‌ సువార్త, 6వ అధ్యాయము, 32వ వచనము.
(32) పరలోకము నుండి వచ్చు ఆహారమును మోషే మీకియ్యలేదు. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు.
''పరలోకము నుండి వచ్చు జ్ఞానము అను ఆహారమును మోషే మీకివ్వలేదు'' అన్నప్పుడు మోషే చెప్పిన ధర్మశాస్త్రము అంతయూ అసత్యమేనా? అందులో ధర్మయుక్తమైన జ్ఞానము లేదా? మోషే చెప్పినది నిజమైన దేవుని ఆహారము కానప్పుడు ఆయన చెప్పిన జ్ఞానమును మోషే ధర్మశాస్త్రము అని ఎందుకు అన్నారు? అను మొదలగు ప్రశ్నలన్ని వచ్చును. మోషే చెప్పినది ధర్మశాస్త్రము కాదు అన్నమాట ఒక విధముగా అసత్యమే అయినా మరొక విధముగా దేవుడు చెప్పినట్లు మోషే చెప్పినది ధర్మశాస్త్రము కాదు అని చెప్పవచ్చును. ''మోషే పరలోకము నుండి వచ్చు అక్షయమైన ఆహారమును మీకు ఇవ్వలేదు'' అనుమాట కూడా వాస్తవమే. అయితే ఈ వాక్యము వద్ద అనేక ప్రశ్నలు, అనేక అనుమానములు (సంశయములు) కలుగడము వాస్తవమే. ఇక్కడ కల్గిన సంశయములన్నిటికీ పరిష్కార జవాబులు దొరికినప్పుడు వాస్తవమైన జ్ఞానము అర్థము కాగలదు.

క్రైస్థవులకు మోషే ప్రవక్త సుపరిచయమే. బైబిలు గ్రంథములో చెప్పబడిన 'మోషే' తర్వాత 1400 సంవత్సరములకు కాలక్రమములో 'మోషే' అను పదము మార్పు చెంది 'మూసా'గా మారిన విషయము చాలామంది ముస్లీమ్‌లకు కూడా తెలియదు. దానివలన మోషే, మూసా ఇద్దరూ ఒక్కటే యని తెలియవలెను. మోషే ధర్మశాస్త్రమును ప్రజలకు చెప్పలేదా?యని అడిగితే ఆ మాట నిజమేయని చెప్పవచ్చును. అంతే కాకుండా ఆ మాట అసత్యము అని కూడా చెప్పవచ్చును. ఇట్లు రెండు విధములా చెప్పుటకు ఎవరికీ తెలియని బలమైన కారణము గలదు. ఆ కారణమును చూస్తే కొందరు తప్పక ఆశ్చర్యపడుదురు. కొందరు మా మాటను వ్యతిరేఖించి అసత్యమని కూడా అనవచ్చును. ఏది ఏమయినా సత్యము సత్యమే, అసత్యము అసత్యమే. కొన్ని వేల సంవత్సరముల పూర్వము మోషే ప్రవక్త యున్న మాట వాస్తవమే. దాదాపు ఐదువేల సంవత్సరములప్పుడు మోషే ప్రవక్త తనకు తెలిసిన జ్ఞానమును చెప్పుచుండెను. దైవజ్ఞానమును చెప్పు వారిని ప్రవక్తయని అనడము సహజమే. అందువలన మోషే ప్రజల చేత ప్రవక్త యని చెప్పబడుచుండెను. అలా చిన్నవయస్సు నుండే దైవ భావములు గల మోషేకు 20 సంవత్సరముల వయస్సులోనే ప్రథమ దైవగ్రంథమయిన 'తౌరాతు' గ్రంథమును స్వయముగా అప్పుడు భూమిమీదికి వచ్చిన భగవంతుడు ఇచ్చాడు. అప్పటి నుండి ఆ గ్రంథములోని జ్ఞానమును చెప్పుచుండెను.

మోషే చెప్పిన జ్ఞానమంతయూ ధర్మసమ్మతముగా యుండుట వలన మోషే చెప్పినదంతయూ ధర్మశాస్త్రము అనుచూ ''మోషే ధర్మశాస్త్రము'' అని అన్నారు. అలాగే మోషే 54 సంవత్సరములు జీవించి చనిపోగా, ఆయన చనిపోయిన వెంటనే ఆయన శరీరములోనికి భగవంతుడు చేరుకొని తర్వాత తొమ్మిది సంవత్సరములు మోషే చెప్పని ధర్మములను కూడా చెప్పాడు. 63 సంవత్సరముల తర్వాత భగవంతుడు కూడా శరీరమును వదలిపోవడము జరిగినది. ఈ విషయమంతా ప్రజలకు తెలియని దానివలన మోషే ప్రవక్త 63 సంవత్సరములు బ్రతికాడు అని అనుకొన్నారు. అట్లే మోషే ప్రవక్తయే స్వయముగా ధర్మములను బోధించాడని అనుకొన్నారు. వాస్తవముగా మోషేకు దైవగ్రంథము ఇవ్వబడినదిగానీ నేరుగా దేవుడు జ్ఞానమును ఇవ్వలేదు. అందువలన పై వాక్యములో ''పరలోకము నుండి వచ్చు ఆహారమును మోషేకు ఇయ్యలేదు.'' అని అన్నారు. వాస్తవముగా దేవుడే మోషే ద్వారా అనగా మోషే శరీరములో నుండి ధర్మములను బోధించుట వలన ఆయన చెప్పిన జ్ఞానమునకు మోషే ధర్మశాస్త్రము అని అన్నారు. అయితే పరలోక తండ్రియైన పరిశుద్ధాత్మయే నిజమైన ఆహారమును ఇచ్చాడని కూడా గ్రంథములో వ్రాశారు. మోషే జీవితము 54 సంవత్సరములు కాగా, అది 63 సంవత్సరముల వరకు దేవుడే పొడిగించిన విషయము ఎవరికీ తెలియదు. ఈ విషయములన్నియూ అనగా పూర్తి రహస్యములుగా యున్న ఈ విషయములన్నియూ మా రచనలలోని ''కృష్ణమూస'' అను గ్రంథములో వ్రాయబడియున్నవి.

(26) యోహాన్‌ సువార్త, 6వ అధ్యాయము, 47వ వచనము.
(47) దేవునివద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచియుండలేదు.
ఈ వాక్యమును చదివిన వెంటనే అర్థమగుచున్నది. ఇందులో నిగూఢముగా వ్రాసినది ఏమీ లేదు. భగవద్గీతను, బైబిలును, ఖుర్‌ఆన్‌ అను మూడు దైవగ్రంథములను పూర్తిగా చదివి చూస్తే మూడు దైవ గ్రంథములలో అంతిమ దైవగ్రంథములో ఉన్న వాక్యములు ఎవరికీ అర్థము కాని నిగూఢ అర్థముతో కూడుకొని యున్నవి. ఖుర్‌ఆన్‌ గ్రంథములో ఉన్నంత నిగూఢత్వము మిగతా గ్రంథములలో లేదనియే చెప్పవచ్చును. బైబిలులో వాక్యములన్నీ సులభముగా అర్థమగునట్లే గలవు. వాక్యము సులభమే అయినా అందులోని వాస్తవికతను చాలామంది తెలియ లేకపోయారు. అందువలన మా ద్వారా దేవుడు ప్రతి వాక్యమునకు వివరమును ప్రజలకు తెలియజేయుచున్నాడు.

పరిశుద్ధాత్మయిన దేవుడు సృష్ఠి పూర్వము, సృష్ఠి తర్వాత రెండు కాలములలోనూ గలడు. ఆయనే మొదటి దేవుడు. దేవుడు ఎటువంటి వాడో, ఎట్లున్నాడో ఏ మానవునకూ తెలియదు. అంతిమ దైవగ్రంథమయిన ఖుర్‌ఆన్‌లో మొదటి దేవున్ని 'అల్లాహ్‌' అని చెప్పారు. రెండవ దేవుడయిన ఆత్మను కూడా 'అల్లాహ్‌' అన్నారు. దానివలన పరమాత్మ యనబడువాడు ఒక అల్లాహ్‌ కాగా, ఆత్మ రెండవ అల్లాహ్‌గా చెప్పబడుచున్నాడు. అదే ద్వితీయ దైవగ్రంథమయిన బైబిలులో పరమాత్మయిన వానిని దేవుడు అని చెప్పుచున్నారు. తర్వాత రెండవ దేవునిగా యున్న ఆత్మను తండ్రియని సంబోధించి చెప్పారు. ఆత్మకు తండ్రి పరిశుద్ధాత్మకాగా, మనిషికి తండ్రి ఆత్మగా యున్నవాడని తెలియవలెను. పరమాత్మను, ఆత్మను ఇద్దరు దేవుళ్లని ఖుర్‌ఆన్‌లో చెప్పియున్నారు. బైబిలు గ్రంథములో ఒకరిని దేవుడని రెండవవానిని తండ్రియని మనిషి చెప్పుచున్నాడు. మనిషికి తండ్రి ఆత్మకాగా, ఆత్మకు తండ్రి పరిశుద్ధాత్మయని తెలియవలెను. ఇక్కడ ఈ వాక్యములో మనిషి అయిన వాడెవడయినా తన తండ్రిని చూచియుండలేదు. మనిషికి తండ్రి అనబడు ఆత్మంటే ఏమిటో తెలియదు. మనిషి ఆత్మను ఎప్పుడూ చూచియుండలేదు. వాక్యములో ''దేవునివద్ద నుండి వచ్చిన వాడు తప్ప'' అని అన్నప్పుడు దేవునివద్దనుండి వచ్చినవాడు ఆత్మ ఒక్కడే అయినందున ''ఆత్మ పరిశుద్ధాత్మయను తన తండ్రిని చూచియున్నాడు. జీవాత్మ అయినవాడు తన తండ్రియగు ఆత్మను చూచియుండలేదు'' అని చెప్పియున్నారు.

(27) యోహాన్‌ సువార్త, 7వ అధ్యాయము, 37, 38 వచనములు.
(37) ఎవడయినను దప్పికకొనిన ఎడల నావద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను.

(38) నాయందు విశ్వాస ముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను.
ఈ వాక్యము కొంచెము సూక్ష్మభావముతో కూడుకొనియున్నది. దప్పిక లేక దాహము అయినవాడు నీరు త్రాగుట సహజము. అయితే ఇక్కడ చెప్పిన దప్పికను గురించి చూస్తే నీరు కావాలని తపన పొందడమును దప్పిక అన్నట్లు, జ్ఞానము కావాలను జిజ్ఞాస కల్గినవానికి కల్గిన తపనను దప్పికగా పోల్చి చెప్పారు. జ్ఞానము కావాలను జ్ఞాన దప్పిక కల్గినవాడు నావద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెనని వాక్యములో చెప్పారు. ఏసు వద్దకు పోయి ఆయనవద్ద జ్ఞానమును తెలియగల్గితే ఏసువద్ద జ్ఞాన దాహమును తీర్చుకొన్నట్లేయగును. ఏసుయందు విశ్వాసముంచు వానికి జ్ఞానము సంపూర్ణముగా కల్గునని, వాడు జ్ఞాన నిధివలె తయారై జ్ఞానమును ఇతరులకు బోధించు స్థితికి వచ్చునని తెల్పుచూ వాని కడుపులో జీవ జల నదులు పారునని చెప్పాడు. జీవ జలము అనగా 'దైవజ్ఞానము' అని అర్థము. జ్ఞానము మోక్షమును కల్గించి ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంచునది అయినందున జ్ఞానమును జీవజలము అని అన్నారు. జలమును నోటితో త్రాగి కడుపులో నింపితే, జ్ఞానమును చెవుల ద్వారా విని బుద్ధిలో నింపవలెను.

(28) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 12వ వచనము.
(12) నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను.
దేవుడు అనగా పరిశుద్ధాత్మ అయినవాడు తన పాలన సాగించుటకు, తన కార్యములను తాను చేయకుండా ఇతరుల చేత చేయించుటకు తాను ప్రత్యేకముగా ఆత్మను సృష్ఠించి, ఆత్మను తన కుమారునిగా ప్రకటించి, తన పనులను చేయు అధికారమును తన కుమారుడైన ఆత్మకు ఇచ్చినట్లు ప్రకటించాడు. దేవుడు ఇచ్చిన అధికారము వలన కుమారుడయిన ఆత్మ మనుషులను చంపుటకు, చంపిన తర్వాత బ్రతికించుటకు, బ్రతికించునప్పుడు వెనుకటి జన్మ కర్మలనుబట్టి తీర్పు తీర్చుటకు అధికారము కల్గియున్నాడు. తీర్పు తీర్చు అధికారము కల్గిన ఆత్మ మనిషి కర్మను అనుసరించి ప్రవర్తించుచుండును. మనిషి కర్మలయందే చిక్కుకొని కర్మల గురించి నీ గుణముల ఆలోచనలు చేయుట వలన మనిషికి ఆత్మ కర్మల సంబంధించిన పనులనే చేయించుచుండును. మనిషి అజ్ఞానమును కోరుట వలన ఆత్మ మనిషికి అజ్ఞానమునే ఇచ్చుచున్నది. అందువలన కొంత కాలమునకు భూమిమీద అధర్మములు పెరిగిపోవుచున్నవి. ఆత్మ మనిషికి బోధించు అజ్ఞానము వలననే భూమిమీద అధర్మములు ఏర్పడుచున్నవి.

మనిషి ఇష్టము వలన ఆత్మ అందించిన అజ్ఞానము వలన అధర్మములు ఉద్భవించగా, అధర్మములను అణచివేసి ధర్మములను బోధించుటకు పరిశుద్ధాత్మ అయిన దేవుడు భూమిమీదికి మనిషివలె రావలసియున్నది. అలా మనిషి రూపములో వచ్చిన దేవున్ని 'భగవంతుడు' అని అనుచున్నాము. భూమిమీదికి మారువేషములో దేవుడే వచ్చి తన జ్ఞానమును తానే బోధించిపోవును. అలా వచ్చినవాడు దేవుడు అని తెలియకుండుటకు మనిషి రూపములో వచ్చిన వానిని కూడా కుమారుడని, దేవున్ని తండ్రియని చెప్పడము జరిగినది. దీనినిబట్టి సృష్ఠికర్త అయిన దేవుడు ఒక్కడే అయినా ఆయనకు ఆత్మరూపములో ఒక కుమారుడు, మనిషి రూపములో వచ్చిన వాడు మరియొక కుమారుడుగా యున్నారు. శాశ్వితముగా మనుషులలో యున్న ఆత్మయను కుమారుడు అధర్మములను రేకెత్తించగా, రెండవ కుమారుడయిన తాత్కాలిక కుమారుడు అనగా అరుదుగా వచ్చు మనిషి ఆకారములో యున్న కుమారుడు ధర్మములను బోధించును. దేవుడు ఒక్కడే అయినా ఆయన సృష్ఠించిన కుమారులు ఇద్దరు అని తెలిసినది. అందులో మనిషిగా వచ్చిన కుమారుడు 'ఏసు' అను పేరుతోయుండి ప్రజలకు బోధించునప్పుడు ఇలా చెప్పాడు. ''నేను లోకమునకు వెలుగును'' అని అన్నాడు. జ్ఞానము అగ్ని స్వరూపమై మనుషుల కర్మలను కాల్చుచున్నది. అటువంటి జ్ఞానాగ్ని సంపూర్ణముగా కల్గినవాడు ఏసు. ఏసు సంపూర్ణ జ్ఞాన వెలుగు కల్గియున్నాడు. అందువలన 'నేను లోకమునకు వెలుగును' అని అన్నాడు. ఏసు లోకములోని మనుషులకు జ్ఞానమును తెలియజేయుటకు వచ్చాడు. కనుక ఆయనను అనుసరించి, ఆయన జ్ఞానమును తెలియగల్గినవాడు అజ్ఞానములో నడువక జ్ఞానములోనే నడుచును. అందువలన నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కల్గియుండునని చెప్పాడు. ప్రజలకు జ్ఞాన వెలుగునిచ్చు వాడు, ధర్మములను నెలకొల్పువాడు, మనిషి ఆకారములో వచ్చిన దేవునివలననే సాధ్యమగును.

(29) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 14వ వచనము.
(14) ఏసు ''నేను ఎక్కడినుండి వచ్చితినో, ఎక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును. గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.
ఏసు సాధారణ మనిషివలె కనిపించుచుండును. పైకి చూచేదానికి ఏ మనిషిలో ప్రత్యేకత కనిపించదు. అందరు ఎట్లు ఉందురో అట్లే ప్రకృతి శరీరము ధరించిన ప్రతివాడు ఉండును. ఏసు ఒక వ్యక్తి కనుక ప్రపంచములో అందరివలె సర్వసాధారణముగా కనిపించు మనిషిగా ఏసు యున్నాడు. 'ఏ పుట్టలో ఏ పామున్నదో' అని పెద్దలన్నట్లు ఏ శరీరములో ఏ జీవుడు ఉండేది ఎవరికీ తెలియదు. పుట్టే ప్రతి జీవుడు శరీరమును ధరించి పుట్టుచున్నాడు. శరీరములోనికి వచ్చి చేరిన ప్రతి జీవుడు ఏదో ఒకచోట నుండి వచ్చి పుట్టుచుండుట సత్యము. భూమిమీదనే ఏదో ఒకచోట కర్మతీరి చనిపోయిన జీవుడు తిరిగి క్రొత్త శరీరములో ప్రవేశించుచున్నాడు. జీవుడు కర్మనుబట్టి ఎక్కడ పుట్టవలెనను విషయమును నిర్ణయించునది శరీరములోని ఆత్మేయని తెలియవలెను. సాధారణ జీవుడు ఆత్మచేత తీర్పు తీర్చబడి, తీర్పు తీర్చబడిన దానిప్రకారము ఆత్మ చేతనే తీసుకరాబడి మరియొక క్రొత్త శరీరములో చేర్చబడడము జరుగుచున్నది. ఒక జీవుడు మనిషి శరీరములో ప్రవేశించి బ్రతుకగలిగినా, అతడు ఎక్కడి నుండి వచ్చి పుట్టినది అతనికే తెలియదు. ఒక వ్యక్తికి ఇప్పుడు 40 సంవత్సరముల వయస్సు. అతడు సృష్ఠి ఆదినుండి భూమిమీద ఉన్నాడు. సృష్ఠ్యాది నుండి అతను ఎప్పుడు ఎక్కడయున్నది అతనికే తెలియదు. గతములోని జన్మల విషయము లన్నియూ అతనికి జ్ఞాపకము ఉండవు. మనిషిలో ప్రతి విషయమును జ్ఞాపకము పెట్టుకొను అవయవము శరీరములోని మనస్సు. మనస్సు అనగా 'మననము చేయునది' అని అర్థము. మనిషి శరీరమును వదలి చనిపోయినప్పుడే జ్ఞాపకము చేయు మనస్సు కూడా చనిపోవుచున్నది. అందువలన ఏ జన్మ జ్ఞాపకము ఆ జన్మతోనే అంతరించి పోవుచున్నది. ప్రస్తుతము 40 సంవత్సరముల వయస్సున్న వ్యక్తి సృష్ఠ్యాది నుండి ఉన్నాడు. అయితే అతడు అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక జన్మలు మారుచూ వచ్చాడు. అలా జన్మలు మారుట వలన, అతని మనస్సు ఎప్పటికప్పుడు పోవుట వలన జన్మల జ్ఞాపకములు లేకుండా పోయినవి. ప్రస్తుతము ఇప్పుడున్న జన్మలోని 40 సంవత్సరముల జ్ఞాపకము మాత్రము ఇప్పుడు కలదు. ఈ జన్మ మారితే ఇప్పటి జ్ఞాపకము కూడా లేకుండా పోగలదు.
మనిషికి ఒకనికే అలా జరగడము లేదు. ప్రతి జీవరాసికీ అలాగే జరుగుచున్నది. అయితే ఏసు కూడా చూచుటకు ఒక మనిషే అయిన దానివలన అతనికి కూడా ఇదే పద్ధతి కొనసాగుచుండునని ఎవరయినా అనుకోవచ్చును. ఏసు ఒకచోట పుట్టాడు అని అంటే అతడు మరియొక చోటనుండి రావలసియుంటుంది. ఏసు అలాగే ఒకచోటి నుండి వచ్చి ఇజ్రాయెల్‌ దేశములో పుట్టడము జరిగినది. ఏసు ఎక్కడినుండి వచ్చాడు అన్న విషయము ఆయనకు బాగా తెలుసు. అందువలన వాక్యములో ''నేను ఎక్కడినుండి వచ్చితినో నాకు బాగా తెలుసు'' అని అన్నాడు. అట్లే ఒక మనిషి చనిపోతే అతను ఎక్కడికి పోయి జన్మ ఎత్తునో ఆ మనిషికి ఏమాత్రము తెలియదుగానీ, ఏసు చనిపోతే ఆయన ఎక్కడికి పోవునో ఆయనకు బాగా తెలుసు. అదే సాధారణ మనిషికి ఏసుకు ఉన్న తేడాయని చెప్పవచ్చును. అలా జరుగుటకు ఏసులో ఏమి ప్రత్యేకత కలదని ప్రశ్న రాక తప్పదు. ఆ ప్రశ్నకు జవాబును తెలియగలిగితే అదే ఉత్తమమైన జ్ఞానమగును. ఆయనను గురించి తెలియగలిగితే ఏసు సర్వసాధారణ మనిషి కాదని, ఆయన ప్రత్యేకమయిన కారణ జన్ముడని తెలియుచున్నది.
పుట్టుకముందే ఒక కారణమును కల్గి, ఆ కారణము కొరకు పుట్టువానిని 'కారణ జన్ముడు' యని అనుచున్నారు. అలా ముందే ఉద్దేశ్యము కల్గి దానికొరకు ఏ మనిషీ పుట్టడు. దేవుడు మాత్రము 'భూమిమీద ధర్మములను ప్రతిష్ఠించుట' అను ఉద్దేశ్యము అను కారణముతో పుట్టుచున్నాడు. భూమిమీద ధర్మ ప్రతిష్టాపన చేయువాడు దేవుడు తప్ప ఎవరూ లేరు. దేవుడు ఎప్పటికీ ఒకే స్థితిలోయున్నాడు. ఆయనకు జన్మలు లేవు, ఆయన పుట్టువాడు కాడు. అందువలన ఆయనకున్న జ్ఞాపకశక్తి, ఆయనకు అలాగే యుండును. దేవుడు భూమిమీదికి మారువేషములో మనిషిగా వచ్చి ధర్మములను బోధించి పోవుచున్నాడు. ఎప్పటికీ ఉండువాడు అయినందున దేవునికి చావు పుట్టుకలు రెండూ లేవు. దేవుడు మనిషిగా మారువేషములో వచ్చుచున్నాడు గానీ, మరణించి పుట్టలేదు. మరణించే మనిషికి మనస్సు పోతుంది. దేవుడు మరణించలేదు మరొకచోట పుట్టలేదు. ఆయన మనిషివలె ప్రత్యేకమయిన వేషములో వచ్చి ఏమి చేయాలనుకొన్నాడో అది చేసి తిరిగి వచ్చిన చోటికే పోవుచున్నాడు. అందువలన వాక్యములో ''ఎక్కడికి వెళ్లుదునో నేను ఎరుగుదును'' అని అన్నాడు.
దేవుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో మనుషులయిన ఎవరికీ తెలియదు. దేవుడు మనిషిగా వచ్చుచున్నాడు అంటే ఆయన ఎక్కడినుండి వచ్చుచున్నాడో ఎవరికీ తెలియదనియే చెప్పాలి. దేవుడు జన్మించినట్లు కనిపించినా ఆయన మనిషివలె జన్మించడము లేదు. అందరివలె ఎక్కడో చచ్చి, ఎక్కడో పుట్టడము లేదు. అంతటా అణువణువునా వ్యాపించియున్న దేవుడు, తల్లిగర్భములో కూడా యున్న దేవుడు తన రూపము మార్చుకొని శిశురూపములో పుట్టుచున్నట్లు కన్పించుచున్నాడు. ఎక్కడ పుట్టాడో అక్కడే యున్న దేవున్ని ఎక్కడ నుండి వచ్చాడని చెప్పగలము? అంతటా ఉన్నాడను విషయము కూడా తెలియని మనుషులు ఏసు ఎక్కడనుండి వచ్చాడని తెలియనివారుగా యున్నారు. అలాగే ఆయన తన రూపము మార్చుకొని ఎక్కడికి పోవునో తెలియనివారుగా యున్నారు. అందువలన వాక్యములో ''నేను ఎక్కడినుండి వచ్చుచున్నానో, ఎక్కడికి పోవుచున్నానో మీరు ఎరుగరు'' అని ఏసు చెప్పాడు.

(30) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 19వ వచనము.
(19) వారు నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయనను అడుగగా! ఏసు ''మీరు నన్నైననూ, నా తండ్రి నైననూ ఎరుగరు. నన్ను ఎరిగియుంటిరా నా తండ్రిని కూడా ఎరిగియుందురు'' అని వారితో చెప్పెను.
దేవుడు అనువాడు ఉన్నాడా? ఉంటే ఎలాగున్నాడు? ఎక్కడ యున్నాడు? అని తెలిసియుంటే తండ్రి అంటే ఏమిటి?, కుమారుడు అంటే ఏమిటి? అను విషయము తెలియగలదు. ఉన్నవాడు దేవుడు ఒక్కడే అయినప్పుడు కుమారుడు అనువాడు ఎక్కడినుండి వచ్చాడో తెలియవలసి యుంటుంది. తండ్రి, కుమారుడు అను మాటలు బైబిలులో ఎక్కువగా చెప్పబడినాయి. తండ్రి అనగా దేవుడు అని అర్థము చేసుకోవలెను. బైబిలులో దేవున్ని తండ్రియను పదముతో చెప్పగా! ఖుర్‌ఆన్‌లో దేవున్ని అల్లాహ్‌ యని చెప్పారు. భగవద్గీతలో పరమాత్మయని చెప్పారు. భాషలు వేరయినా 'దేవుడు' అను భావము ఒక్కటేగలదు. దేవుడను భావమును తండ్రియను పదమువద్ద చూడవలసియున్నది. ఏసు భూమిమీద యున్నప్పుడు సర్వసాధారణముగా నీ తండ్రి ఎక్కడున్నాడని అడుగగా! ఏసు ఏకముగా ''మీరు నన్నైనను నా తండ్రినైనను చూచియుండలేదు'' అని అన్నాడు. ప్రజలు ఏసును చూచామని ఏసును గురించి అడుగలేదుగానీ, ఏసు తండ్రి ఎవరని తెలియు నిమిత్తము ప్రపంచ సంబంధ అర్థముతో అడిగారుగానీ తండ్రి అంటే దేవుడు అను భావముతో వారు అడుగలేదు. దానికి జవాబుగా ఏసు తనను గూర్చి, తన తండ్రిని గూర్చి ఒక్కమారుగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడముతో వారికి ఆశ్చర్యము కలిగియుండవచ్చును. ప్రత్యక్షముగా కనిపించు ఏసును వారు చూస్తున్నాము అని అనుకొన్నారు. తెలియని ఏసు యొక్క తండ్రి ఎవరో తెలుసుకొందామని అడిగారు. అప్పుడు ఏసు ''నన్నుగానీ, నా తండ్రినిగానీ చూచియుండలేదు'' అని అన్నాడు. ఆ మాట యొక్క అర్థమును మనము తెలియవలసి యున్నది.
ఏసు తండ్రి పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కుమారుడు ఆత్మ సర్వ శరీరములలో యుంటూ శరీరములను నడుపుచున్నాడు. దేవుడయిన పరిశుద్ధాత్మకు ఆత్మయను కుమారుడు ఒకడున్నాడు. పరిశుద్ధాత్మ, ఆత్మ అనగా! తండ్రి, కుమారుడు ఇద్దరూ సనాతనులు. అనగా ఎల్లప్పుడూ ఉండువారు. పరిశుద్ధాత్మ అయిన పరమాత్మ ఎల్లకాలము ఉండువాడే. పరమాత్మ సృష్ఠికంటే ముందునుండీ యున్నాడు. పరిశుద్ధాత్మ కుమారుడు అనిపించుకొన్న ఆత్మ సృష్ఠి తర్వాత ఎప్పటికీ శరీరములలో యున్నాడు.
పరిశుద్ధాత్మయిన దేవునికి ఆత్మయను శాశ్విత కుమారుడు కాకుండా అప్పుడప్పుడు ''అద్వితీయ కుమారుడు'' అను పేరుతో మరియొక కుమారుడు భూమిమీదికి వచ్చి పోవుచుండును. దేవుని కుమారుడయిన ఆత్మకు, తాత్కాలిక కుమారుడయిన అద్వితీయ కుమారునికి శాశ్విత తేడాలు గలవు. ఉదాహరణకు ఆత్మ సాధారణ మనిషి శరీరముతో వచ్చినా, అందులో ప్రత్యేకమైన జీవాత్మ కూడా ఉండును. శరీరము మొత్తము ఆత్మదే అయినా, ఆత్మే శరీరమునకు అధిపతి అయినా, శరీరములో జీవాత్మ కూడా ఆత్మతో పాటు నివాసము చేయుచూ, శరీరము నాదేయని జీవాత్మ అనుకొనుచుండును. తాత్కాలిక కుమారుడయిన అద్వితీయ కుమారుడు శరీరముతో వచ్చియున్నా, ఆయన శరీరములో జీవాత్మ ఉండదు. ఆత్మ కుమారుడుగా యున్న సాధారణ మనిషి శరీరములో దేవుడు వేరు, ఆత్మ వేరుగాయుండి దేవుడు పని చేయకున్నా అన్ని కార్యములను ఆత్మే చేయుచున్నది. అయితే అద్వితీయ కుమారుని శరీరములో పరమాత్మే (దేవుడే) ఆత్మవలె ఉంటూ ఆత్మ రూపములో కార్యములను చేయుచున్నాడు. అద్వితీయ కుమారుని శరీరములో జీవాత్మ లేనందున ఆత్మవలెయున్న వాడే జీవాత్మవలె కూడా ఉండవలసి వచ్చినది. మొత్తానికి అద్వితీయ కుమారుని శరీరములో వాస్తవానికి ఆత్మవలె ఉన్నవాడు దేవుడే అయినా ఆయనే జీవాత్మవలె నటించుచున్నాడు. అద్వితీయ కుమారుడువలె మారువేషములో వచ్చినవాడు పరిశుద్ధాత్మయిన దేవుడే. ఆ దేవుడే జీవాత్మవలె భ్రమింప చేయుచున్నాడు. వాస్తవానికి దేవుని శాశ్విత కుమారునికి, దేవుని తాత్కాలిక కుమారుడయిన అద్వితీయ కుమారునికి ఎన్నో తేడాలు గలవు.
మొత్తానికి దేవునికి శాశ్విత కుమారుడున్న విషయముగానీ, అద్వితీయ కుమారునిగా అప్పుడప్పుడు వచ్చు కుమారుడుగానీ ఇలా ఉన్నాడను వాస్తవ విషయము చాలామందికి తెలియదనియే చెప్పవచ్చును. జ్ఞాన సముపార్జన చేత దేవుని కుమారుడయిన ఆత్మ ఉనికిని, ఆత్మజ్ఞానమును తెలియవచ్చునుగానీ, అద్వితీయ కుమారునిగా వచ్చిన వానిని తెలియుట కష్టము. అనేకముగా యున్న మానవులలో అద్వితీయ కుమారున్ని గుర్తించడము కష్టము. అందువలన అద్వితీయ కుమారునిగా వచ్చిన వానిని త్రేతాయుగములోనూ, ద్వాపర యుగములోనూ, కలియుగములోనూ ఎవరూ గుర్తించలేకపోయారు. కలియుగములో దేవుని తాత్కాలిక కుమారుడయిన అద్వితీయ కుమారునిగా వచ్చినవాడు ఏసు అయినా ఆయనను నిజముగా దేవుని రెండవ కుమారుడని ప్రజలు గుర్తించలేకపోయారు. గుర్తించక పోవడమేకాక నేను దేవుని కుమారున్నియని ఆయనే చెప్పినా లెక్కించక, అనేక అవమానముల పాలు చేయడమేకాక హింసలకు కూడా గురి చేశారు. త్రేతాయుగములో వచ్చినవాడు తప్ప మిగతా ద్వాపర, కలియుగములలో వచ్చినవారు నేను దేవుని కుమారున్ని అని చెప్పినా ప్రజలు గుర్తించ లేకపోయారు. త్రేతాయుగములో వచ్చినవాడు ఫలానా వాడు అని నేడు చెప్పుటకు కూడా భయపడవలసి వస్తున్నది. ఆనాడు దేవుడే మారువేషములో కుమారునివలె వచ్చి భూమిమీద జ్ఞానమును చెప్పిపోయాడు. ఆనాడు ఆయన బ్రహ్మజ్ఞాని అని పేరుగాంచినా, దైవజ్ఞానమును బోధించినా ఆయనను అమిత దుర్మార్గుడుగా చిత్రించి ప్రజలలో ప్రచారము చేయడము వలన నేను కూడా ఆయన భగవంతుడు అని చెప్పుటకు కూడా భయపడవలసి వచ్చినది. అయినా నేను భయపడక 'రావణబ్రహ్మయే ఆనాటి అద్వితీయ కుమారుడని' చెప్పుచున్నాను.
ద్వాపర యుగములో కృష్ణుడు భగవంతునిగా వచ్చాడు. భగవంతుడనగా అద్వితీయ కుమారుడు అని తెలియవలెను. అయితే ఆయనను కూడా జారుడు, చోరుడు క్రిందికి జమచేసి, అలాగే చిత్రించి చెప్పుట వలన, ఆనాటి నుండి నేటివరకు ఆయనను గురించి తెలియువారే లేరు. దేవుడు మనిషిగా మారువేషములో కుమారునిగా వచ్చి దైవ ధర్మములను తెలియజెప్పినా, ఆయన చెప్పిన జ్ఞానమును చూడకుండా అప్పటికి తగినట్లు చేసిన ప్రపంచ పనులనే చెప్పుచున్నారు. ఆయన చెప్పిన జ్ఞానము కొన్ని కోట్లలో కొందరు మాత్రమే గుర్తించి ఆయన దేవుడే యని అంటున్నారు తప్ప, మిగతా వారందరూ చెడుగానే చెప్పుచున్నారు. ద్వాపర యుగములో వచ్చిన కృష్ణుని అవతారమును తెలియనివారు, కలియుగములో వచ్చిన ఏసును దేవుని కుమారునిగా ఏమాత్రము గుర్తించలేకపోయారు. ప్రజలు తమను గుర్తించక పోవడముతో, తాము చెప్పు జ్ఞానమును కూడా గుర్తించరను భావముతో తాము ఫలానాయని చెప్పడము వలన తమ జ్ఞానమును గుర్తించగలరను నమ్మకముతో అటు కృష్ణుడు, ఇటు ఏసు ఇరువురూ తమ మాటల సందర్భములో ''మేమే దేవుళ్లము'' అని చెప్పారు. అదే విధానములో తమను గుర్తించవలెనను ఉద్దేశ్యముతో, దేవుడు నేను ఇద్దరూ ఒక్కటేయని తెలియజెప్పు నిమిత్తము పై వాక్యములో ''మీరు నన్నైనను, నా తండ్రినైనను తెలియరు'' అని అన్నాడు.
దేవుని మీద మాకు భక్తి ఉందనువారే తమకంటే ఎక్కువగా జ్ఞానము కలవారు కనిపించితే వారిని హేళనగా మాట్లాడుచుందురు. అదే భావముతో ఏసును మాట్లాడడము జరిగినది. ఏసు తండ్రి లేకుండా మరియమ్మ అను ఆమెకు పుట్టాడని తెలిసినవారై ఏసును ఒక్కమారుగా ''నీ తండ్రి ఎక్కడున్నాడని'' అడిగారు. వారు అడిగినది భక్తి భావముతో కాదు హేళన భావముతోయని అర్థమగుచున్నది. వారు అలా అడుగగా అర్థము చేసుకొన్న ఏసు వారికి దిమ్మ తిరిగిపోయే సమాధానము ఇచ్చాడు. ''మీరు నన్నైనను, నా తండ్రినైనను ఎరుగరు'' అన్నాడు. ఆ మాటను అర్థము చేసుకోగలిగితే కనిపించే ఏసు, కనిపించని దేవుడు ఇద్దరూ ఒక్కటేయని తెలియగలడు. అంతేకాక రెండవ మాటలో ''నన్ను ఎరిగియుంటిరా నా తండ్రిని కూడా ఎరిగియుందురని'' వారితో చెప్పెను. ఆ మాట విన్నవారు ఆయన చెప్పినది ఏమాత్రము గ్రహించుకోలేదని చెప్పవచ్చును. ఎందుకనగా! వారు ఆయన మాటను గ్రహించుకొనియుంటే ఆయన ఎవరో అప్పుడే వారికి అర్థమయ్యేది. ఆయన సాధారణ మనిషి కాదని తెలిసిపోయేది. అయితే ఏసు ఆ మాట చెప్పినప్పటికీ ఆయనను సాధారణ మనిషిగానే ప్రజలు చూచారంటే, వారికి ఏసును గురించి ప్రత్యేకముగా ఏమీ తెలియదని అర్థమగుచున్నది.

(31) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 21వ వచనము.
(21) నేను వెళ్లిపోవుచున్నాను. మీరు నన్ను వెదుకుదురు గానీ మీ పాపములోనే యుండి చనిపోవుదురు. నేను వెళ్లు చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.
ఏసు ప్రజలతో తనను గురించి తెలియుటకు అవకాశమున్న మాటలను అనేకము చెప్పాడు. అటువంటి మాటలలో పై వాక్యము కూడా ఒకటి. అందులో ''నేను వెళ్లిపోవుచున్నాను, మీరు నన్ను వెదకుదురుగానీ నేను వెళ్లు చోటికి మీరు రాలేరని'' ప్రజలతో అన్నాడు. ఇంతవరకు యున్న ఈ వాక్యములో గొప్పతనము ఏమీ లేదు. ఒక మనిషి చెప్పకుండా ఎక్కడికయినా పోవునప్పుడు అతను ఎక్కడికి పోయినది తెలియదు. అతనిని వెదకినా ఫలానాచోట యున్నాడని తెలియలేము. అలా తెలియలేనప్పుడు అతను వెళ్లిన చోటికి మనము పోలేమనియే కదా! అర్థము. ఇది సర్వ సాధారణమే కదా! ఇందులో జ్ఞానము ఏమీ లేదు కదా!యని చెప్పవచ్చును. ఇదే విషయమునే ఇంకొక కోణములో చెప్పుకొంటే బాగా అర్థమవుతుంది చూడండి. చిన్న వయస్సులో దొంగ, పోలీస్‌ ఆట ఆడేవారము. అందులో దొంగ పోయి ఎక్కడో ఒకచోట దాచిపెట్టుకొంటాడు. అప్పుడు రెండు నిమిషముల తర్వాత బయలుదేరిన పోలీస్‌ దొంగను వెదకి పట్టుకోవలెను. అయితే దొంగ పోయిన చోటికే పోలీస్‌ పోవలసియుండును. అట్లు పోలీస్‌ పోకపోతే ఎన్నిచోట్ల ఎంత వెదకినా దొంగను కనుగొనలేరు. నా వయస్సు పది సంవత్సరములప్పుడు నేను దొంగ పోలీస్‌ ఆట ఆడేవాడిని. ఒకరోజు నేను దొంగ, మిగతావారు పోలీస్‌. నేను రెండు నిమిషములముందు బయలుదేరి పోయేటప్పుడు ''నేను పోతున్నాను మీరు నన్ను వెదకినా కనుగొనలేరని'' చెప్పాను. అప్పుడు వారు ''ఎందుకు కనుగొనలేము పది నిమిషములలో పట్టుకొంటామని'' అన్నారు. అప్పుడు ''నేను పోయే చోటికి మీరు రాలేరని'' మరీ చెప్పిపోయాను.

రెండు నిమిషముల తర్వాత పోలీస్‌ వేట ప్రారంభమయినది. అయితే వారు అరగంట వరకు నన్ను కనుగొనలేకపోయారు. వారు అన్ని జాగాలలో వెదకినా నేను వారికి కనిపించలేదు. నేను దాగిన చోటుకు వారు రాలేకపోయారు. నేను ఆ దినము ఒక ఇంటిలోని దేవుని గదిలో కూర్చొని, గది తలుపులు వేసుకొన్నాను. పోలీస్‌గా యున్నవారు అన్నిచోట్ల వెదికారు. నేను దాగిన ఇంటిలోనికి కూడా వచ్చి చూచారు. అయినా నేనున్న దేవుని గదివద్దకు వారు రాలేదు. ఆ గది వాకిలి వేయబడియుండుట చేత వారు దానిని చూడలేదు. పై వాక్యము దొంగ, పోలీస్‌ ఆటకు సమానముగా యుండుట చేత ఈ వాక్యములో ఏమి గొప్పతనము కలదని అనుకొన్నాను. గొప్పతనముగానీ, జ్ఞానముగానీ ఏమీలేని వాక్యమును ఏసు ఎందుకు చెప్పాడని కొంత ఆలోచించగా! ఈ వాక్యములో ''మీ పాపము లోనే యుండి చనిపోవుదురు'' అన్నమాట ప్రత్యేకముగా కనిపించినది. అప్పుడు ఈ వాక్యమును గురించి ఆలోచించగా అది దొంగ పోలీస్‌ ఆటవలెయున్నా అందులో గొప్ప జ్ఞానము కలదని తెలిసినది. అప్పుడు ఈ వాక్యమును గురించి సమగ్రముగా తెలుసుకొన్నాను. అది ఏమనగా! ఇలా కలదు.

ఏసు కొంతకాలము భూమిమీద అందరికీ కనిపించులాగ యున్నాడు. అప్పుడు ఏసును ఎవరూ విశ్వసించలేదు. అయినా తాను సాధారణ మనిషిని కాదన్నట్లు ఏసు మనుషుల మధ్యలో అనేక మహత్యము లను చూపాడు. తాను పాపములను క్షమించగలవాడనని తెలియునట్లు గ్రుడ్డివానికి చూపును, కుంటివానికి నడకను ఇచ్చాడు. కుష్టు రోగికి రోగము లేకుండా చేశాడు. చనిపోయిన వారికి ప్రాణము వచ్చునట్లు చేశాడు. అయినా ప్రజలు ఆయన గొప్పతనమును గుర్తించలేకపోయారు. ఆయన ఉన్నప్పుడు గుర్తించలేని వారు ఆయన పోయిన తర్వాత వారి బాధల నివారణ కొరకు వెదకేదానికి మొదలు పెట్టుదురు. అప్పుడు ఏసు ఎవరికీ కనిపించక పోవడముతో ఆయనను వెదకినా ప్రయోజనముండదు. ఏసును ఎవరూ అడుగకున్నా ఆయనే వారి పాపములను లేకుండా క్షమించి వేశాడు. దానివలన అనేకులకు కర్మ నివారణ అయినది. తర్వాత కూడా వారి పాపములను లేకుండా చేసుకొనుటకు ఏసును వెదకినా ఆయన కనిపించడు. అప్పుడు వారి పాపములు క్షమించబడవు. అందువలన వారి పాపములలోనే యుండి వారు చనిపోవడము జరుగును. అనుభవించే పాపముల వలన ప్రజలు చనిపోవుదురు. అలా చనిపోయినా తర్వాత జన్మలో అయినా వారు ఏసు ద్వారా పాపములను లేకుండా చేసుకొనుటకు వీలుబడదు. ఎందుకనగా! ఏసు ఎక్కడికి పోయాడో ప్రజలకు ఎవరికీ తెలియదు. ఆయన ప్రజల మధ్యలో యున్నప్పుడు ఆయనను గుర్తించలేనివారు తర్వాత ఏసు గొప్పవాడని, ఏసే దేవుడని అనుకొనినా ఏమీ ప్రయోజనముండదనీ, అప్పుడు ఆయన వలన మనుషుల పాపములు పోవనీ ఈ వాక్యము ద్వారా తెలియుచున్నది. ఈ విషయములన్నియూ ఏసు ముందే ప్రజలతో చెప్పియున్నాడు. ''నేను వెళ్ళిపోవుచున్నాను'' అని అన్నాడు. అయినా ఆయనను నీవు పోవద్దు కొంతకాలము మావద్దే యుండమని ఎవరూ ఆయనను అడుగలేదు. అడుగక పోగా ప్రజలే ఆయన మా మధ్యలో ఉండకూడదని కేకలువేసి చెప్పి శిలువ మీద చనిపోవునట్లు చేశారు.

(32) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 23, 24 వచనములు.
(23) అప్పుడాయన మీరు క్రిందివారు నేను పైనుండు వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను.

(24) కాగా మీ పాపములలోనే యుండి మీరు చనిపోవుదురని వారితో చెప్పెను.
ఈ రెండు వాక్యములలో 24వ వాక్యము, 21వ వాక్యములో చెప్పినట్లే యున్నది. 23వ వాక్యము మాత్రము ప్రత్యేకత కల్గియున్నది. ఏసు ప్రజలతో తాను సాధారణ మనిషిని కాను అని తెలియునట్లు రెండవ అవకాశము ఇచ్చి ''మీరు క్రిందివారు నేను పైనుండువాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను'' అని చెప్పాడు. ఈ వాక్యము రెండు భాగములుగా కలదు. ఒకటి ''మీరు క్రిందివారు నేను పైనుండువాడను'' అనునది కాగా, రెండవది ''మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను''. ఇప్పుడు ఏసు ప్రజలను ఉద్దేశించి మీరు క్రిందివారు నేను పై నుండువాడను అని చెప్పిన మొదటి భాగమును చూస్తే పూర్వము కృతయుగము నుండి ప్రజలలో క్రిందివారు, పై వారు అను మనుషులున్నారని చెప్పుకొనెడివారు. పై వారు క్రిందివారు అను పేర్లు ప్రజలలో ఎందుకొచ్చాయో ఆలోచించితే దానికి ఒక చరిత్ర గలదు. పూర్వము పైవారు క్రిందివారు అనెడి విభజన ఎలా జరిగినదంటే!
కృతయుగము యొక్క ఆయుష్‌ కాలము 17,28,000 సంవత్సరాలు. కృత యుగము మొదటి వేయి సంవత్సర కాలములోనే ప్రజలలో జ్ఞానులు అజ్ఞానులు అను రెండు తెగలు ఏర్పడ్డాయి. అప్పుడు భూమిమీద జ్ఞానులు అనువారు అరుదుగా యుండేవారు. అజ్ఞానులు అసంఖ్యాకముగా ఉండేవారు. ఆ యుగములో ప్రపంచ జనాభా దాదాపు మూడు కోట్లు మాత్రమే యుండేది. అందులో భారత దేశ జనాభా దాదాపు మూడు లక్షలకంటే మించియుండేది కాదు. మూడు లక్షల మందిలో భూమిమీదికి సూర్యుని ద్వారా వచ్చిన జ్ఞానమును మనువు చెప్పగా ఇద్దరు లేక ముగ్గురు తెలిసియుండేవారు. ఆ ఇద్దరు లే ముగ్గురు జ్ఞానులను ప్రజలందరూ గౌరవించి వారి ద్వారా తాము కూడా దైవజ్ఞానమును తెలియవలెనని అనుకొనెడివారు. అప్పుడు జ్ఞానులుగా యున్నవారిని అమితముగా గౌరవించుచూ జ్ఞానమును బోధించు వారిని ఉన్నతమైన ఆసనము మీద కూర్చోబెట్టి ప్రజలు క్రింద కూర్చొని జ్ఞానమును వినెడివారు. గురువులకు ఉన్నతాసనము ఇచ్చి తాము క్రింద కూర్చోవడము ఆనాడు అలవాటుగా యుండేది, అదే సాంప్రదాయముగా చెప్పుకొనెడివారు. ఈ విధముగా జ్ఞానమును బోధించు బోధకులను పైన కూర్చోబెట్టి ప్రజలు క్రింద కూర్చొనెడివారు. ఆ విధానము ప్రకారము ఏసు ప్రజలను ఉద్దేశించి మీరు క్రిందివారు నేను పైనుండు వాడను అని అన్నాడు. దాని అర్థము ''నేను మీ అందరికీ బోధకుడను (గురువును)''అని అర్థము.
పైన బోధకులు క్రింద బోధను తెలియు ప్రజలు ఉండుట సహజముగా ఉండేది. దానిప్రకారము బోధించు బోధకులు ప్రజలను ఉద్దేశించి మీరు మా దిగువవారు, మేము మీకు ఎగువవారము అనెడివారు. ఆనాడు దైవజ్ఞానమును బోధించు బోధకులను బ్రహ్మవిద్యను బోధించేవారు అని చెప్పెడివారు. బ్రహ్మ అనగా పెద్దయని అర్థము. బ్రహ్మవిద్య యనగా పెద్ద విద్యయని అర్థము. బ్రహ్మ విద్యను తెలిసిన బోధకులను బ్రాహ్మణులు అని చెప్పెడివారు. ఆ దినములలో బ్రాహ్మణులు అనగా బోధకులు. భారత దేశమంతా వెదకినా ఇద్దరు లేక ముగ్గురు ఉండేవారు. ఆ ముగ్గురిని బ్రాహ్మణులు అని చెప్పగా, ఆ బ్రాహ్మణులుగా యున్నవారు మిగతా ప్రజలనందరినీ మా దిగువవారు అనెడివారు. జ్ఞానము తెలియని వారందరినీ దిగువవారని చెప్పగా దేశమంతా మా దిగువవారు అనబడు వారు ఉండేవారు. కొంతకాలమునకు కులవ్యవస్థ అక్కడే ప్రారంభమయినది. కులవ్యవస్థ ప్రారంభమయినప్పుడు బ్రహ్మజ్ఞానము తెలిసినవారు 'మేము బ్రాహ్మణులము' అని చెప్పుకోసాగారు. అలాగే అజ్ఞానులుగా యున్న వారందరినీ 'మా దిగువవారు' అని చెప్పెడివారు. ఈ విధముగా ఎగువవారు, దిగువవారు అని రెండు తెగలు ఏర్పడినాయి. ఆనాడు 'మాదిగువ వారు' అని చెప్పిన పదము నేడు కూడా యున్నా దాని భావము ఏమాత్రము ప్రజలకు తెలియలేదు. అంతేకాక మా దిగువవారు అనునది కొంత కాలమునకు 'మాదిగవారు' అను పదముగా మారిపోగా దానిని ఒక కులముగా లెక్కించు కోవడము జరిగినది.
కులవ్యవస్థ తయారయిన ఆ రోజులలో బ్రాహ్మణులు, మాదిగ వారు అను రెండే కులములుగా చెప్పబడినవి. ఈనాడు జ్ఞానము తెలియని అజ్ఞానులను అందరినీ మాదిగ వారుగా చెప్పవలసిందే! అయితే జ్ఞానము తెలియనివారు కూడా అనేక పేర్లు గల కులములుగా విభజింపబడి పోగా పోగా చివరకు అలాగే మిగిలియున్నవారు మాదిగ వారుగానే చెప్పబడుచున్నారు. వెనుక జరిగిన చరిత్రలోనికి పోయి చూస్తే మాదిగ వారు అనేది ఒక కులమే కాదు. అజ్ఞానులు అను అర్థమును తెలుపు నిమిత్తము ఆనాడు ఇద్దరు లేక ముగ్గురు బోధకులు పెట్టిన పేరు మాత్రమేయని తెలియవలెను. ఆ లెక్కప్రకారము నేడు కూడా జ్ఞానము తెలియని అన్ని కులముల వారిని మాదిగ వారుగానే చెప్పవచ్చును. అయితే నేడు గతచరిత్ర తెలియని దానివలన కులములుగా చీలిపోగా, మిగిలిన వారందరూ మాదిగ అను ఒక కులముగా చెప్పడము అజ్ఞాన విషయమేకాక, అన్యాయ విషయమని కూడా చెప్పవచ్చును. నేడు ఎలాయున్నా ఏసు యున్న 2017 సంవత్సరముల పూర్వము కూడా ఏసు ఎగువవారు, దిగువవారు అను పదములను ఉపయోగించి అజ్ఞానులను ''మీరు క్రిందివారు నేను పైనుండు వాడను'' అని అన్నాడు. ''నేను జ్ఞానిని మీరు అజ్ఞానులు'' అని చెప్పు నిమిత్తము ఏసు ''దిగువవారు, ఎగువవారు'' అను పదములను వాడారు అని అర్థము చేసుకోవలెను.
ఏసు చెప్పిన రెండవ వాక్యములో మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడను కాను అని అన్నాడు. లోకము అనగా అనుభవించేది అని చెప్పుకొన్నాము. అనుభవించే అనుభవములనుబట్టి రెండు తెగలుగా చెప్పవచ్చును. అనుభవములున్న వారిని ఈ లోకపు వారనీ, అనుభవములు లేనివారిని ఈ లోకము వారు కారని చెప్పవచ్చును. సాధారణ మనుషులు ప్రపంచములోని ప్రతి అనుభవమును అనుభవించుచుందురు. అందువలన ఈ లోకపువాసులుయని అన్నారు. ఏ అనుభవము పొందని ఏసు తనను ఈ లోకమువాడను కాను అని చెప్పాడు. ఏసు మనిషివలెయున్నా మనుషులవలె అనుభవములను అనుభవించువాడు కాడు. ఏసు మానవ శరీరములో యున్నా ఆయన అందరివలె జీవాత్మ కాదు. జీవాత్మ కానప్పుడు కర్మయుండదు. కర్మకు తగిన అనుభవములు ఉండవు. ఏసు పరమాత్మ చేత ప్రత్యేకముగా పంపబడిన వాడు అని చెప్పినా, మరొక విధముగా పరిశుద్ధాత్మయే మారువేషములో వచ్చిన అవతారమే ఏసుయని చెప్పవచ్చును. అయినా ఆధ్యాత్మిక ధర్మము ప్రకారము ఆ విధముగా చెప్పకూడదు. పరమాత్మ ప్రత్యేకముగా తయారు చేసి పంపబడినవాడు ఏసు. అందువలన ఏసును పరిశుద్ధాత్మ కుమారుడు యని చెప్పవలెను. ఏసు జీవాత్మ కాదు కావున ''అతను అనుభవములు లేనివాడు'' యని చెప్పవచ్చును. ఏసు జీవాత్మ అయివుంటే పరిశుద్ధాత్మయిన దేవునికి కుమారుడు అని చెప్పబడడు. జీవాత్మ ఆత్మకు మాత్రము కుమారుడు. ఆత్మకు తండ్రి పరిశుద్ధాత్మ. అందువలన జీవాత్మ పరిశుద్ధాత్మకు మనువడి వరుసయగును. దేవుని చేత దేవుని వద్దనుండి పంపబడిన వాడు అయినందున ఏసును దేవుని కుమారుడు యని అంటున్నాము. ఏసును ప్రత్యేకించి అద్వితీయ కుమారుడుయని కూడా చెప్పడము జరిగినది. ఆత్మ పరిశుద్ధాత్మ కుమారుడు, అలాగే తాత్కాలికముగా భూమిమీద అవసరమొచ్చినప్పుడు మాత్రమే వచ్చు కుమారుడు అద్వితీయ కుమారుడు. దేవుని చేత పంపబడిన వాడు ఆత్మవలె అద్వితీయ కుమారుడేయగును గానీ మనువడివలె జీవాత్మ కాడు. జీవాత్మ అనుభవములు పొందువాడు. అందువలన జీవాత్మ అయినవాడు అనుభవములు గల ఇహలోక వాసులే యగుదురు. ఆత్మవలెయున్న అనుభవములు లేని ఏసు ఈ లోక సంబంధుడు కాడు. ఆయన పరలోక సంబంధుడు.
ఏసు సాధారణ మనిషికాడు అని ప్రజలు తెలియుటకు ఏసు ప్రజలకు రెండవ అవకాశమును ఇచ్చి (యో, 8-23,24) వాక్యములను చెప్పాడు. అయినా మనుషులు ఏసు యొక్క గొప్పతనమును గుర్తించ లేకపోయారు. ఏసును సాధారణ మనిషిగానే లెక్కించుకొన్నారు. అందువలన అటువంటి వారు తమ పాపములను ఏసు ద్వారాగానీ, ఏసు జ్ఞానము ద్వారాగానీ పోగొట్టుకోలేరు. పరిశుద్ధాత్మ కుమారుడయిన ఏసు మనుషుల మధ్యలోనికి వచ్చినప్పటికీ, తనను గుర్తించుటకు ఎన్నో వాక్యములు చెప్పినప్పటికీ ఏసును కనుగొనలేనివారు, ఏసును విశ్వసింపని వారు తమ పాపములలోయుండి చనిపోవుదురని ఏసు రెండవమారు చెప్పియున్నాడు. మొదటి అవకాశమిచ్చి (యో, 8-21) వాక్యమును చెప్పాడు. రెండవ అవకాశమిచ్చి (యో, 8-23,24) వాక్యములను చెప్పాడు. తర్వాత మూడవ అవకాశమును కూడా ఇచ్చి చివరిగా చెప్పిన వాక్యము గలదు. ఏసు ఎవరయినది ప్రజలు గుర్తించుటకు మూడుమార్లు మూడు వాక్యములను చెప్పాడు. అప్పటికి కూడా గుర్తించని వారికి వారి పాపములు క్షమించబడవు అని హెచ్చరించి చెప్పడమయినది. మూడవమారు ఏమి చెప్పాడో క్రింది వాక్యములో చూస్తాము.

(33) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 24వ వచనము.
(24) నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పెను.
ఈ వాక్యము ఏసు ప్రజలకు తెలియుటకు మూడవ అవకాశమిచ్చిన వాక్యమని తెలియుచున్నది. ఈ వాక్యములో ఏసు తాను ఎవరయినది నేరుగా ప్రజలు తెలియునట్లు చెప్పాడు. ''నేను సృష్ఠికర్తయిన పరిశుద్ధాత్మనే నని విశ్వసింపనివాడు పాపములో యుండి చనిపోవును'' అని అన్నాడు. ఏసే స్వయముగా తాను ఎవరయినది ప్రకటించుకొన్నాడు. మొదటి ఒక వాక్యములో ''నేను వెళ్ళిపోవుదును నేను పోయిన చోటికి మీరు రాలేరు'' అని కొంత అవకాశమిచ్చి చెప్పాడు. రెండవ వాక్యములో ''మీరు ఈ లోక సంబంధులు, నేను మీవలె ఈ లోక సంబంధుడను కాను'' అని చెప్పాడు. రెండవ వాక్యములో మరికొంత వివరముగా అర్థమగునట్లు చెప్పాడు. రెండవ వాక్యముతో ఏసు పరిశుద్ధాత్మయేనని తెలియవచ్చును. అప్పటికీ తెలియనివారికి ఇంకా బాగా అర్థమగునట్లు మూడవ వాక్యములో ''నేనే ఆయననని విశ్వసింపనివాడు పాపములో నుండి బయట పడలేడని'' చెప్పాడు. మూడవ వాక్యములో ఏసు ''నేనే దేవుడనని'' ప్రకటించినట్లయి నది. అయినప్పటికీ ఏసును సాధారణ మనిషివలె ప్రజలు గుర్తించారు గానీ ఆయనే దేవుడని ఏమాత్రము గ్రహించలేకపోయారు. అయితే కొందరు ఏసు చెప్పు మాటలకు ఆశ్చర్యపడి, లోపల ఏమాత్రము నమ్మక పైకి మాత్రము నీవు ఎవరని ఏసును అడిగారు. ఏసు 'తాను సాధారణ మనిషిని కాదు' అని ప్రజలు తెలియుటకు (యో, 8-21,23,24) మూడు వాక్యములలో తనను గుర్తించునట్లు చెప్పినా, ఆయనను గ్రహించనివారై ''నీవు ఎవరవు?'' అని ఎదురు ప్రశ్న వేసి అడిగారు. అప్పుడు మొదటి నుండి అనగా ఈ మూడు వాక్యములలో మొదటి వాక్యము నుండి ''నేను మీతో ఎవడని చెప్పియుంటినో వాడనే'' అని అన్నాడు.

అంతేకాక నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయనవద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. అయినా తండ్రిని గురించి (పరిశుద్ధాత్మను గురించి) చెప్పాడని వినిన ప్రజలు గుర్తించ లేకపోయారు. అంతగా చెప్పినా ప్రజలు తనను గుర్తించక సాధారణ మనిషిగా కొందరు, సాధారణ మనిషికంటే హీనముగా కొందరు ఆయన ఎడల ప్రవర్తించుచుండిరి. అటువంటి మనుషులతో తనను గురించి మరియొక మాట ఇలా చెప్పాడు చూడండి.

(34) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 28వ వచనము.
(28) మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియూ, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.
ఈ వాక్యములో కొంత తికమకపడు అవకాశము గలదు. ఎందుకనగా! మీరు 'మనుష్య కుమారున్ని పైకెత్తినప్పుడు' అని చెప్పబడుట చేత అక్కడ కొంత అర్థము కాకుండుటకు అవకాశము గలదు. అది ఏమనగా! ప్రజలు ఏసును పైకెత్తినప్పుడు అనగా ఏసును పైకి ఎత్తడమేమిటని అర్థము కాకపోవచ్చును. ఆ మాటను అర్థము చేసుకొంటే ''ప్రజలు ఏసును తలమీదికి ఎక్కించుకొన్నప్పుడు'' అని చెప్పుటకు 'ఏసును పైకెత్తినప్పుడు' అని అన్నారు. అదయినా ''ఏసును తలమీదికి ఎత్తుకోవడమేమిటి'' యని కొందరు అడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! ఏసును మన శరీరమునకు పైనగల 'తలతో అర్థము చేసుకొన్నప్పుడు' అని తెలియుచున్నది. ఏసును గురించి ఎవని బుద్ధికి అర్థమయినదో వాడు ఏసే పరిశుద్ధాత్మయని తెలియగలడు. అంతేకాక ఏసు చెప్పు జ్ఞానమంతయూ ఏసు స్వయముగా చెప్పునది కాదనీ, పరిశుద్ధాత్మ ఎలా చెప్పదలచుకొన్నాడో అలాగే ఏసు చెప్పుచున్నాడని ప్రజలు గ్రహించగలరని ఈ వాక్యములో తెలియుచున్నది.
ఏసును మనుషులు పైనగల తలలోని బుద్ధిచేత గ్రహించు కొన్నప్పుడు అని చెప్పుటకు బదులు ఏసును ప్రజలు పైకి ఎత్తినప్పుడుయని చెప్పారని తెలిసిపోయినది. శరీరమునకు ఊర్థ్వములో గల బుద్ధిచేత ఏసును అర్థము చేసుకోగలిగితే, ఏసు పరమాత్మ (పరిశుద్ధాత్మ)యని తెలియగలరు. ఏసు దేవుడని తెలియనంత కాలము ప్రజల బుద్ధికి ఏసు అర్థము కాలేదని, అందువలన 'ప్రజలకున్న పాపములు క్షమించబడక, ఎవరి పాపములో వారు చనిపోవుదురని' ముందు మూడు వాక్యములలో చెప్పారు. ఒకవేళ ఏసును గ్రహించగలిగితే ఏసు చెప్పినట్లు దేవుడే ఆయనయని తెలిసిపోవును. దేవుడు అనగా పరిశుద్ధాత్మ తన జ్ఞానమును మనుషులకు తెలియజేయు నిమిత్తము మనిషిగా వచ్చునను రహస్యమైన విషయము తెలిసిపోవును. అలా ఏసే దేవుడని తెలిసినప్పుడు ఏసు చెప్పు జ్ఞానమంతయూ ఏసే స్వయముగా చెప్పుచున్నాడని ఎవరయినా అనుకోవచ్చును. అయితే కొందరు అనుకున్నట్లు ఆ విధముగా చెప్పుటకు అవకాశము లేదు. ఎందుకనగా! ఈ వాక్యములో ''నేనే ఆయనననియు'' అని చెప్పిన తర్వాత మరొకమాట కూడా చెప్పాడు. అది ఏమనగా!
''నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు'' అని అన్నాడు. అట్లు చెప్పుట వలన తండ్రి వేరు, ఆయన వేరని చెప్పినట్లు కనిపించుచున్నది. అలా ఎందుకు రెండు విధముల చెప్పాడని చాలామందికి ప్రశ్న రాగలదు. దానికి సమాధానము ఏమనగా! ఏసు ఒక వ్యక్తిగా యున్నాడు. దేవుడు శక్తిగాయుండి కనిపించక యున్నాడు. కనిపించని శక్తి అయిన దేవుడు కనిపించే వ్యక్తిగా వచ్చియుండడము వాస్తవమే. దేవుడు మనిషిగా వచ్చిన వాస్తవమును మనిషి బుద్ధిచేత గ్రహించగలిగితే పరిశుద్ధాత్మ, ఏసు ఒక్కరేయని తెలియగలరు. అయితే మనిషిగా యున్నవాడు ఎవడూ నేనే దేవున్నియని ఆధ్యాత్మికరీత్యా చెప్పకూడదు. మనుషులు కనిపించే మనిషే దేవుడని తెలియవచ్చును. అంతేగానీ తెలిసిన సత్యమును బహిర్గతముగా చెప్పకూడదు. ఎందుకనగా! ఆధ్యాత్మిక చట్టము ప్రకారము మనిషిని దేవునిగా తెలియ వచ్చునుగానీ బయటికి చెప్పకూడదు. ఆ నిబంధనము ప్రకారము ఏసు కూడా అలాగే చెప్పాడు. దేవుడే ఏసులో ఉండి చేయుచున్ననూ ఏసు మాత్రము ఆధ్యాత్మిక చట్ట విరుద్ధము కాకుండా ఇలా అన్నాడు. ''నా యంతట నేనే ఏమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్లుగా ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహింతురు.''
తండ్రి చెప్పినట్లే నేను చెప్పుచున్నాను. నాయంతకు నేను ఏమియు చేయలేదని చెప్పినా, దేవుడే అన్నీ చేయుచున్నాడని మనము తెలిసినా, ఆయన చెప్పినా రెండూ ఒకే అర్థము నిచ్చుచున్నవి. పరిశుద్ధాత్మే ఏసుయని తెలియడము వలన మనుషులకున్న పాపము క్షమించబడును. అయితే మనుషులు ఏసును పరిశుద్ధాత్మేయని తెలియడము జ్ఞానమే అయినా, ఆయనే ఈయన అని చెప్పడము ఆధ్యాత్మికములో తప్పుయగును. అందువలన స్వయముగా ఏసే ''నేనే దేవుడని తెలియనంతవరకు మీ పాపములు పోవని చెప్పినా'', ''నేనే ఆయననని'' మనుషులు తెలియు నిమిత్తము చెప్పినా, చివరకు ఆధ్యాత్మిక చట్టము ప్రకారము నేను చేయు పనులన్నియూ నా తండ్రి చెప్పినట్లే చేయుచున్నానని చెప్పాడు. అందువలన ఈ వాక్యములో రెండు విధముల చెప్పారేయని అనుకోకూడదు. వాక్యములో 'నేనే దేవున్ని' అని చెప్పినా, 'నేను దేవుడు చెప్పినట్లు చేయుచున్నానని' చెప్పినా రెండూ ఒకే అర్థము నిచ్చునవని తెలియవలెను. ఈ విషయము అర్థముకాకపోతే ఏసు రెండు నాల్కల ధోరణిలో మాట్లాడాడని అనుకొను అవకాశము గలదు. జ్ఞానము తెలిసినవాడు దేవుడు మనిషిగా వచ్చునని తెలియవచ్చును. అయితే ఇతనే దేవుడని బహిర్గతము చేసి చెప్పకూడదు. అందువలన ఏసు కూడా ఒకచోట 'నేనే దేవున్ని' అని అందరూ తెలియునట్లు చెప్పినా, రెండవ మాటలో 'దేవున్ని తండ్రియని' చెప్పడమైనది. రెండూ సత్యమే. అంతేకాక ఏసు ప్రజలతో ఇలా అన్నాడు ఆ విషయమును క్రింది వాక్యములో చూస్తాము.

(35) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 29వ వచనము.
(29) నన్ను పంపినవాడు నాకు తోడై యున్నాడు. ఆయన కిష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడు చేయుదును. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.
ఏసు, పరిశుద్ధాత్మ ఇద్దరూ ఒక్కటేననీ, ఆయనే ఈయనని తెలియు నిమిత్తము ఈ వాక్యము చెప్పబడినది. దానికి బలముగా ''నన్ను పంపిన వాడు నాకు తోడైయున్నాడు.'' ఈ మాటలో నన్ను పంపిన దేవుడు నాలోనే ఉన్నాడు, ఆయన నేను ఒక్కటేయని అర్థము కదా! మనిషి శరీరములో 'ఇష్టము' అనేది ఒకటుంది. అది మనిషి శరీరములో దేవుని ఇష్టము ప్రకారము పనులు నేనెల్లప్పుడు చేయుదును అంటే దేవుని ఇష్టమే నాలో పని చేయుచున్నది అని అనడములో దేవుడే నాయందున్నాడని చెప్పుటకు సాక్ష్యముగా యున్నది. అంతేకాక ఆయనను ఒంటరిగా వదలిపెట్టలేదు అని అన్నాడు. ఆ మాటలో దేవుడు నాలో తోడైయున్నాడని, దేవుడే నేనై యున్నానని చెప్పినట్లగుచున్నది. ఈ మాటలన్నియూ అప్పటి మనుషులు ఏసును దేవుడని గుర్తించుటకు ఏసే చెప్పిన మాటలు. వాస్తవముగా కలియుగములో దేవుడు 'ఏసు' అను మనిషిగా వచ్చినా ప్రజలు గుర్తించ లేకపోయారు. అందువలన ఏసు జ్ఞానమును మనుషులు గ్రహించరని ఏసు యొక్క గొప్పతనమును గుర్తించు నిమిత్తము ఈ వాక్యములను చెప్పవలసి వచ్చినది. ఈ విధమైన వాక్యములను చెప్పడము వలన ఆ మాటలను విన్న కొందరు ఆయనను నమ్మగలిగారు.

(36) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 53, 54 వచనములు.
(53) నిన్ను నీవు ఎవడవని చెప్పుకొంటున్నావని ఆయనను అడిగిరి.

(54) అందుకు ఏసు ''నన్ను నేనే మహిమ పరచు కొనిన ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు.''
ఏసు ఎంతో వివరముగా ప్రజలు తనను అర్థము చేసుకొనునట్లు చెప్పినా, ప్రజలకు ఏసును గురించి అర్థము చేసుకొను గ్రాహితశక్తి లేక ఆయనను ''నీవు ఎవరు?'' అని ప్రశ్నించారు. అందులకు ఏసు ఇలా అన్నాడు. ''నన్ను నేనే మహిమ పరచుకొని గొప్పగా చెప్పుకొనిన ఎడల నా గొప్ప తనము వట్టిదగును, నేను అసత్యము చెప్పినట్లగును.'' నేను మీతో ఇంకొక విధముగా చెప్పుదును నేను ఇంతవరకు ఐదుమార్లు నన్ను గురించి చెప్పుకొన్నాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పుకొనిన ఎడల నేను చెప్పినది కేవలము అసత్యమన్నట్లగును. మరొక మారు ఇప్పుడు చెప్పిన దానికంటే వేరుగా చెప్పితే, మా దేవుడని మీరు ఏ దేవున్ని గురించి అనుచున్నారో ఆ దేవుడే నా తండ్రియని, ఆయనే నన్ను గొప్పగా మహిమపరచుచున్నాడని చెప్పగలను. నా తండ్రియని నేను ఎవరిని గురించి చెప్పుచున్నానో, మీరు దేవుడని ఎవరిని గురించి చెప్పుచున్నారో ఆయనే నేననునది వాస్తవమే. అయినా ఆత్మను అధ్యయనము చేయు విధానములో వ్యక్తిగా కనిపించువాడు ఎవడూ 'నేను దేవున్ని' అని చెప్పకూడదు. అందువలన మీరు అర్థము చేసుకొనుటకు 'నేను దేవున్నే' అని చెప్పినా తర్వాత దేవున్ని నేను తండ్రియని చెప్పుచున్నాను. నేను రెండు విధముల చెప్పుట వలన మీరు తికమక పడిపోకుండా నన్ను సత్యసమేతముగా అర్థము చేసుకోవలెనని అన్నాడు.

(37) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 55వ వచనము.
(55) మీరు ఆయనను ఎరుగరు. నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీవలె నేనును అబద్దికుడనైయుందును గానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.
ఏసు ప్రజలను గూర్చి ''మీరు దేవున్ని తెలియరు, నేను దేవున్ని ఎరుగుదును'' అని అన్నాడు. ఏసును అందరూ మనిషివలె లెక్కించుట వలన ఏసు ఆ విధముగా చెప్పవలసి వచ్చినది. ప్రజలు మనుషులే, ఏసు మనిషియే అయినప్పుడు ప్రజలకు దేవుడు తెలియనప్పుడు ఏసుకు ఎలా తెలిసాడు? అని ప్రజలలో కొందరికి ప్రశ్న వచ్చినది. ఆ ప్రశ్నకు జవాబుగా మనము చెప్పుకొంటే ఇలా చెప్పవచ్చును. ఏసు మరియు ప్రజలు శరీరము ధరించినవారై కంటికి కనిపించు వ్యక్తులుగా యున్నారు. ఏసువలె మనుషులు, మనుషులవలె ఏసు యున్నప్పుడు ఏసుకు ప్రత్యేకముగా దేవుడు తెలియడమేమిటి? అని ప్రశ్న రావడము సమంజసమే. అయితే ఇక్కడ మనము గ్రహించవలసినది ఏది? అని ఆలోచిస్తే మొదటి నుండి ఏసు ''నేనే ఆయననని'' మూడుమార్లు మూడు రకముల వాక్యములతో తెలిపాడు. ఆయన తెలిపిన పద్ధతి ప్రకారము చూస్తే ఏసు మనిషి అయినా ఆయన శరీరములో అందరివలె జీవాత్మ లేడు. ఉన్నది ఒకే ఆత్మ, ఆయనే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏసు శరీరములో యుండి ఆత్మవలె నటిస్తూ అన్ని పనులు చేయుచున్నది. శరీరములో జీవాత్మ ఎవరో, ఆత్మ ఎవరో ఎవరికీ తెలియదు. అందువలన ఆత్మనే జీవాత్మయని ప్రజలు అనుకోవడము వలన ఏసుకు దేవుడయిన పరమాత్మ తెలియడని అనుకొన్నారు. వాస్తవానికి ఏసు శరీరములో స్వయముగా పరమాత్మే యుండుట వలన బయటికి కనిపించు ఏసుకు పరమాత్మ తెలియునని చెప్పవచ్చును. ఎరుక తెలియడము, జ్ఞాపకముతో తెలియడమును, ఎరుకగా ఉండి తెలియడము అని చెప్పవచ్చును. ఏసు శరీరములో పరమాత్మే ఎరుకగా యున్నాడు కాబట్టి ఆయన ప్రత్యేకముగా తెలియునది ఏమీ లేదు. ఆయన దేవున్నే ఎరుకగా యున్నాడు. మనుషులు తమ శరీరములో యుండు మనస్సు అను ఎరుకను కల్గియున్నారు గానీ ఆత్మయొక్క ఎరుకగానీ, పరమాత్మ యొక్క ఎరుకగానీ లేదు. పరమాత్మ యొక్క ఎరుక లేనందున మనుషులు దేవున్ని ఎరిగియుండ లేదు. ఏసు దేవున్నే ఎరుకగా యుండుట వలన ఏసు దేవున్ని ఎరిగి యున్నాడని చెప్పవచ్చును.

ఒకవేళ ఏసు నేను దేవున్ని ఎరుగను అని చెప్పితే మనుషులవలె శరీరములో దేవుని ఎరుక లేనివాడని చెప్పవలెను. అట్లు చెప్పితే ఏసు అసత్యమును చెప్పినట్లగును. అందువలన నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీవలె నేనునూ అబద్దికుడనై యుందును అని అన్నాడు. అయితే ఏసు శరీరములో పరిశుద్ధాత్మ యుండుట వలన జోడు ఆత్మలయిన ఆత్మ, జీవాత్మ రెండూ లేవు. పనిని చేయించు ఆత్మగానీ, అనుభవించు జీవాత్మగానీ రెండూ ఏసు శరీరములో లేవు. ఉన్నది ఒకే పరిశుద్ధాత్మ (దేవుడు) అయినందున ప్రతి మాటయూ స్వయముగా పరిశుద్ధాత్మే చెప్పుచున్నాడు. అందువలన ఏసు ''నేను ఆయన ఎరుకలో యున్నాను'' అని చెప్పుచూ, ''నేను ఆయనను ఎరుగుదును'' అని చెప్పుటయేగాక, ''నేను ఆయన మాటను గైకొంటున్నాను'' అని అన్నాడు. ఏసు మాట్లాడినప్పుడు అందరివలె మాట్లాడినా ఆ మాటలు ఆయనవేయని చెప్పడమైనది. ఎవరి దృష్ఠికయినా ఏసు కనిపించుటకు సాధారణ మనిషే అయినా ఆయనకు తెలియనిది ఏదీ లేదు. అందువలన పూర్వకాలము గతించిపోయిన అబ్రహామును గురించి ఏసు చెప్పగా ప్రజలు ఆశ్చర్యపడి ఒక ప్రశ్న అడిగారు దానిని క్రింద చూడండి.

(38) యోహాన్‌ సువార్త, 8వ అధ్యాయము, 57, 58 వచనములు.
(57) నీకింకనూ ఏబది సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా!

(58) అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ఏసు ఈ మాటలను చెప్పునప్పుడు ఆయన వయస్సు పూర్తి 32 సంవత్సరములు అయిపోయి 33వ సంవత్సరము గడుస్తున్నది. అబ్రహాము ఎంతో పూర్వకాలము మనిషి, అందరికీ ముత్తాతలాంటివాడు. అబ్రహాము విషయమును ఏసు చెప్పగా నీవు ఇప్పటివాడవు, అబ్రహాము పూర్వమున్న మనిషి నీకంటే ఎంతో ముందు పుట్టి చనిపోయిన వ్యక్తిని గురించి నీవు ఎలా చెప్పుచున్నావు? అని అక్కడి యూదులు ప్రశ్నించగా, అబ్రహాము పుట్టకముందు నుండి నేను ఉన్నానని ఏసు చెప్పడము బయట చూచువారికి ఏసు చెప్పినది పూర్తి అసత్యముగా కనిపించుచున్నది. ఏసు ఇప్పటివాడు అబ్రహాము ఎప్పటివాడోయని అందరికీ తెలుసు. అందువలన ఆయన చెప్పిన మాట పూర్తి నమ్మశక్యము కాకుండా యున్నది. ప్రత్యక్ష సత్యము ప్రకారము అయితే ఏసు చెప్పినది అసత్యముగా యున్నది. పరోక్ష సత్యము ప్రకారము చూస్తే ఏసు చెప్పినది పూర్తి సత్యముగా యున్నది.
ఎలా సత్యము? అని ఆలోచిస్తే ఏసు శరీరము 32 సంవత్సరముల క్రితము పుట్టినది. అయితే ఏసు శరీరములో యున్నది జీవాత్మ కాకుండా నేరుగా పరమాత్మయే యున్నది. జీవాత్మ అయివుంటే అతనికి జరిగిపోయిన జన్మల కాలములోని ఏ విషయము జ్ఞాపకము ఉండదు. అందువలన ఎన్నో సంవత్సరముల పూర్వము జరిగిపోయిన విషయము తెలిసియుండేది కాదు. ఏసు శరీరములో ఉన్నది పరమాత్మ అయినందున ఆయన సనాతనుడు. ఎల్లకాలము ఉండువాడు. ప్రపంచములేని సమయము నుండి యున్న వాడు. ప్రపంచమునే సృష్ఠించినవాడు. పరమాత్మ ఆజ్ఞతోనే ఆత్మ జీవులను పుట్టించినది. ఒకానొకప్పుడున్న అబ్రహాము కూడా ఒక వ్యక్తి అయినందున ఆయన పుట్టినది, ఆయన పెరిగినది, ఆయన జీవించినది, ఆయన చనిపోయినది, అన్నిటినీ దేవుడయిన పరిశుద్ధాత్మ సాక్షిగా చూస్తూనే యున్నాడు. అబ్రహామును పుట్టించినది ఆత్మకాగా, సాక్షిగా చూస్తూ యుండినవాడు పరమాత్మయిన దేవుడు. దేవుడు సాక్షిభూతుడు కాగా, ఆత్మ కార్యకర్త కాగా, జీవాత్మ జన్మను అనుభవించినది. అబ్రహాము అను జీవుడు ఆత్మ చేత పుట్టింపబడినా, ప్రక్కనే సాక్షిగా చూస్తున్న దేవునికి అబ్రహాము విషయమంతా పూర్తిగా తెలియును. అంతేకాక అబ్రహాము అంతకుముందు ఎన్ని జన్మలు పొందినది, తర్వాత ఎన్ని జన్మలలోనికి పోయినది సాక్షి అయిన పరమాత్మకు అన్నీ తెలుసు. అందువలన ఏసు శరీరములోని పరమాత్మ ''అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను'' అన్నాడు.

(39) యోహాన్‌ సువార్త, 9వ అధ్యాయము, 39వ వచనము.
(39) చూడనివారు చూడవలెను. చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను.
ప్రజలలో కొందరు ఏసును పాపియని చెప్పగా, ఆ మాటను వినిన వ్యక్తి ఏసు ద్వారా కర్మను తీసివేయబడినవాడై యుండుట వలన అతను వారితో ఈ విధముగా చెప్పాడు. అతను వారితో చెప్పిన సమాచారమును వాక్యముల రూపములోనే వ్రాశాము చూడండి.

(యో, 9-25 నుండి 38 వరకు) వాడు ఇలా చెప్పాడు ''ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఒకటి మాత్రము నేనెరుగుదును. నేను గ్రుడ్డివాడనై యుండి ఇప్పుడు చూచుచున్నాననెను.'' అందుకు వారు ''ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరలా వానిని అడుగగా!'' వాడు ''ఇందాక మీతో చెప్పితినిగానీ, మీరు వినకపోతిరి. మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి'' అని వారితో అనెను. అందుకు వారు ''నీవే వాని (ఏసు) శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాటలాడెనని ఎరుగుదుము గానీ వీడు ఎక్కడినుండి వచ్చెనో ఎరుగమని చెప్పి ఏసును దూషించిరి.'' అందుకు ఆ మనుష్యుడు ఇలా అన్నాడు ''ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన (దేవుడు) వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డివాని కన్నులెవరయినా తెరచినట్లు లోకము పుట్టినప్పటినుండి వినపడలేదు. ఈయన దేవునివద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.'' అందుకు వారు వానిని ఇలా దూషించారు ''నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా'' అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. ఈ విషయమంతా తెలిసి పరిసయ్యులు వానిని వెలివేసిరని, వానివద్దకు పోయిన ఏసు వానితో ఇలా అన్నాడు. ''నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా'' అని అడిగెను. అందుకు వాడు ''ప్రభువా నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడో నాకు తెలియదే'' యని అడుగగా! ఏసు ''ఇప్పుడు నీవు ఆయనను చూచుచున్నావు. నీతో మాటలాడుచున్న వాడు ఆయనే'' అనెను. అంతట వాడు ''ప్రభువా, నేను విశ్వసించుచున్నాను'' అని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు ఏసు ''చూడనివాడు చూడవలెను. చూచువారు గ్రుడ్డివారుకావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని'' చెప్పెను. ఈ వాక్యమును ఏసు ఏ ఉద్దేశ్యముతో చెప్పాడో ముందు జరిగిన సమాచారమును బట్టి సులభముగా తెలియుచున్నది.
అది ఏమనగా! దేవునిమీద విశ్వాసమున్నవారు నన్ను చూడగలరు. నేను ఎవరో తెలియకున్ననూ దేవునిమీద విశ్వాసమే నేను ఫలానాయని వారికి తెలుపగలదు. దేవుని మీద విశ్వాసము లేనివారు ప్రతి దినము నా భౌతిక దేహమును చూస్తున్ననూ, నాతో మాట్లాడుచున్ననూ నేను ఎవరో వారికి తెలియబడను. అందువలన చూచువారు గ్రుడ్డివారుగా యుండుటకు నేను ఫలానాయని తెలియని విశ్వాసులకు నేను దేవుడనేనని కనిపించునట్లు చేయుటకు నేను ఈ లోకములోనికి వచ్చానని ఏసు చెప్పాడు. ఏసు చెప్పిన దానినిబట్టి విశ్వాసమున్న వానికి ఏసు తెలిసిన దానినిబట్టి చూస్తే విశ్వాసము లేనివాడు దేవుడు మనిషిగా వచ్చి ప్రక్కలోయున్నా తనతో మాట్లాడినా గుర్తించలేనంత అజ్ఞాన అంధత్వము కల్గియుండును. అనగా అజ్ఞానమనే గ్రుడ్డితనము కల్గియుండును. అందువలన మనిషిగా వచ్చిన దేవుడు ఎవరో వారికి తెలియబడదు. ''భక్తి విశ్వాసములున్న వాడు దేవుని అవతారమును చూచియు బయట చూపుకు తెలియకపోయినా అంతర్‌ దృష్ఠికి వానికి ఈయనే దేవుడని తెలియబడును.'' అని ఏసు చెప్పినప్పుడు కొందరు ఆ మాటను విననివారు మేము ఇప్పుడు నిన్ను చూచుచున్నాము కదా! మేము నిన్ను చూడలేని గ్రుడ్డివారమా? మేము చూస్తున్నాము కదా! అని అన్నారు. దానికి ఏసు వారితో ఇలా అన్నాడు.

(40) యోహాన్‌ సువార్త, 9వ అధ్యాయము, 41వ వచనము.
(41) మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గానీ, చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.
పైన చెప్పిన 39వ వాక్యములో దైవ భావమున్న వారికి, దైవ భావము లేనివారికి యున్న వ్యత్యాసమును ఏసు చెప్పాడు. దైవ భావము ఉన్నవాడు గ్రుడ్డివాడైనను తనను చూడగలడనీ, దైవ భావము లేనివాడు తనను చూస్తున్న చూపుగలవాడైనను తనను గ్రహించని గ్రుడ్డివాడని చెప్పియున్నాడు. అయితే ఇప్పుడు 41వ వాక్యములో ప్రపంచ భావముతో మాట్లాడిన వారిని గురించి చెప్పడములో వివరముగా అర్థమగునట్లు చెప్పాడు. ప్రపంచ భావమున్న వాడు ''నేను చూస్తున్నాను'' అని అంటున్నాడు. అందువలన ఆ విషయములోని కర్మ వానికి అంటుకొనుచున్నది. దేవుని విషయములో మనిషి చూడవచ్చును, చూడకపోవచ్చును. ఆ విషయములో మనిషికి దేవుడు చూపునిచ్చాడు. అయితే కొందరు ఆ చూపును వినియోగించుకొని దేవున్ని తెలియగలుగుచున్నారు. కొందరు ఆ చూపును వినియోగించుకో లేక చూపున్నప్పటికీ గ్రుడ్డివారై యున్నారు. అదే ప్రపంచ విషయములోనికి వచ్చి చూస్తే ప్రపంచ విషయములో ప్రతి మనిషి గ్రుడ్డివాడే. వాస్తవముగా ప్రపంచ విషయములు ఎవడూ చేయడము లేదు. వానికి తెలియు చూపుగానీ, వినికిడిగానీ ఏదీ లేదు. వాస్తవముగా ఏదీ లేకున్ననూ తనకు చూపున్న వానిలాగా ''నేను చూస్తున్నాను'' అని అంటున్నాడు. అందువలన ఆ విషయములోని పాపము వానికి అంటుకొనుచున్నది. వాస్తవముగా గ్రుడ్డివాడై యుండియు నేను చూస్తున్నానని అనుకోవడము వలన అతనికి పాపము చేకూరుచున్నది. ప్రపంచ విషయములలో తన గ్రుడ్డితనమును తాను తెలిసి ''నేను ఏమీ చూడలేదను సత్యము తెలియగలిగితే అనగా వారు గ్రుడ్డివారైతే పాపము లేకపోవును'' అని చెప్పడము జరిగినది.

దైవజ్ఞానము తెలియనివారు ప్రపంచ విషయములలో తమకు చూపు లేదు. కేవలము దేవుని విషయములలో మాత్రమే దేవుడు దృష్ఠినిచ్చాడని తెలియనివారుగా ఉండుట వలన వారికి ఏసు చెప్పిన పై వాక్యము ఏమాత్రమూ అర్థము కాలేదని చెప్పవచ్చును. ఈ వాక్యము అర్థము కావాలంటే ముందు ప్రతి మనిషిలోని జీవుడు శరీరములో గ్రుడ్డివాడుగా యున్నాడా లేక చూపున్నవాడుగా యున్నాడా తెలియవలసి యుంటుంది. ఆ లెక్కప్రకారము చూస్తే ప్రతి శరీరములోని జీవుడు పూర్తి అన్ని విషయములలో గ్రుడ్డివాడుగా యున్నాడు. శరీరములో ప్రతి జీవుడు శరీరము నాదేయని అనుకొనుచూ, అన్నీ నేనే చేయుచున్నానని అనుకొంటున్నాడు. వాస్తవముగా చూస్తే, వాస్తవమును చెప్పితే శరీరములో జీవునకు ఏ స్వతంత్రతా లేదు. శరీరమునకు అధిపతి (యజమాని) శరీరములో ఆత్మ యున్నాడు. ఆత్మ ఎల్లప్పుడూ శరీరములో పని చేయుచున్నది. వాస్తవముగా జీవుడు శరీరములోని ఏ ఒక్క పనిని కూడా చేయలేదు. అలాగే జీవునకు చూపులేదు, వినికిడి లేదు. అన్ని విధములా గ్రుడ్డివాడు, చెవిటివాడు, అవిటివాడు. శరీరములో బుద్ధి ప్రక్కనే నివాసముండుట వలన బుద్ధికి చేరు ప్రతీ విషయము తనకు తెలియుచున్నది తప్ప జీవుడు స్వయముగా దేనినీ తెలియలేడు. తనకు బుద్ధి ద్వారా తెలిసిన విషయమును తానే స్వయముగా తెలిసానని అనుకొంటున్నాడు. తాను స్వయముగా దేనినీ చూడకున్నా అన్నిటినీ నేను చూచాను అని అనుకొంటున్నాడు. అలాగే ఆత్మ ప్రతీ పనిని శరీరములో చేయుచుండగా జీవుడు ఆ పనులన్నిటిని నేనే చేయుచున్నానని అంటున్నాడు. అప్పుడు ఆ పనిలో యుండు కర్మను తానే చేసినట్లు ఒప్పుకోవడము వలన ఆ పనిలో వచ్చిన పాపమును తానే అనుభవించవలసి వస్తున్నది.

(41) యోహాన్‌ సువార్త, 10వ అధ్యాయము, 18వ వచనము.
(18) ఎవడును నా ప్రాణము తీసికొనడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము గలదు. దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిననెను.
సాధారణ మనిషిలోని ప్రాణము ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ప్రాణము పోతే తిరిగిరాదు. ఇది అందరి మరణములో చూస్తూ యున్నాము. ప్రాణము పోతే జీవుడు కూడా శరీరమును వదలిపోవును. ఇక్కడ చాలామందికి తెలియని విషయము ఏమనగా! మనిషిలో ప్రాణము వేరు, జీవుడు వేరని తెలియదు. జీవుడే ప్రాణము అని చాలామంది అనుకోవడము జరుగుచున్నది. పైన చెప్పిన వాక్యములో ''ఎవడును నా ప్రాణము తీసికొనడు'' అని ఉన్నది. 'నా ప్రాణమును' అన్నప్పుడు ఏసు వేరు, ఏసు యొక్క ప్రాణము వేరని తెలియుచున్నది. ఏసు శరీరములో వలె ఎవరి ప్రాణము వారికియుండగా, మనిషి స్వతంత్రముగా ప్రాణమును ప్రక్కన పెట్టడముగానీ, తిరిగి తీసుకోవడముగానీ చేయలేదు. శరీరములో ప్రాణము, బుద్ధి, మనస్సు ఎన్నో అంతరేంద్రియములు గలవు. శరీరము లోపల యున్నదేదిగానీ, మనిషి ఆధీనములో లేకుండా, ఆత్మ ఆధీనములో ఉండును. అందువలన మనిషి ప్రాణమును ప్రక్కన పెట్టడముగానీ, తిరిగి దానిని ఎక్కడకు పంపవలెనను విషయమునుగానీ ఆత్మ తన పనిగా చేయును. జీవునికి వాని శరీరములోని ప్రాణమునకు ఏ సంబంధము ఉండదు. అట్లే ప్రాణమునకు ఆత్మకు సంబంధముండును.

ఏసు సాధారణ జీవుడు కాడు. ఆయన ఆత్మయై యున్నాడు. అందువలన తన ప్రాణమును తానంతట తానే ప్రక్కన పెట్టుచున్నాడు. ఆయన ప్రాణమును ఎవడును తీసుకొనలేడు. అందువలన 'ఏసు ఎవరి చేతిలోనూ చావడు' అను విషయము తెలియుచున్నది. ఏసు చనిపోతే తన ప్రాణమును తానే ప్రక్కన పెట్టవలసియుండును. శరీరములోనే ఒక ప్రక్కన పెట్టిన ప్రాణమును తిరిగి ఆయనే తీసుకొనును. జీవుడు ఎవడూ ఈ పనిని చేయలేడు. ఆత్మ మాత్రము ఈ పనిని చేయగలడు. ఆ పనిని చేయు అధికారమును పరిశుద్ధాత్మయైన దేవుడు ఆత్మకు ఇచ్చియున్నాడు. అందువలన ఈ వాక్యములో ''ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు. నా యంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము గలదు. దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిననెను.'' ఈ విధముగా ముందే చెప్పియున్నాడు గనుక ఏసును శిలువ వేసిన సమయములో తన ప్రాణమును శరీరములోనే అణగియున్నట్లు చేసి, బయటి మనుషులకు ఏసు చనిపోయినట్లు కనిపించాడు. శుక్రవారము సాయంకాలము చనిపోయినట్లు కనిపించిన ఆయన ఆదివారము వేకువజాములోనే బ్రతికి బయటికి వచ్చాడు. ఆ విధముగా ప్రాణము లేకుండా చేసుకొనుటకు అనగా ప్రక్కన పెట్టుటకుగానీ, తిరిగి తీసుకొనుటకు గానీ, ఆయనకు పరమాత్మ అధికారము ఇచ్చినది. ఇతరుల ప్రాణమును తీయుటకు, రెండవ జన్మకు పంపుటకు ఆత్మకు అధికారము కలదు. ఏసు ఆత్మ అయివుండుట వలన ఆయన తన ప్రాణమును ప్రక్కన పెట్టి మరణించుటకుగానీ, తిరిగి అదే శరీరములో బ్రతికి లేచుటకుగానీ అధికారమును పొందియున్నాడు. ఆ అధికారము తన తండ్రియైన పరిశుద్ధాత్మ చేత కుమారుడైన ఆత్మకు ఏర్పడినది.

(42) యోహాన్‌ సువార్త, 10వ అధ్యాయము, 30వ వచనము.
(30) నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
జీవుడు పుట్టుటకు ఆత్మ తండ్రిగా యున్నది. అలాగే ఆత్మ పుట్టుటకు పరమాత్మ కారణమైయున్నది. అందువలన మనుషులకు తండ్రి ఆత్మకాగా, ఆత్మకు తండ్రి పరమాత్మయని చెప్పవచ్చును. ఏసు ఆత్మయై యుండుట వలన ఆయనను దేవుని కుమారునిగా చెప్పవచ్చును. అయితే కుమారుడుగా యున్నవాడు ఎల్లప్పుడూ తండ్రి మీద ధ్యాస కల్గియుంటే అప్పుడు కుమారుడు తండ్రితో ఏకమైయున్నాడని చెప్పవచ్చును. ఇక్కడ ఏసు తన తండ్రియైన పరిశుద్ధాత్మ మీద ధ్యాస కల్గియుండుట వలన ఆయన 'నేనూ నా తండ్రి ఏకమైయున్నామని' చెప్పాడు.

(43) యోహాన్‌ సువార్త, 11వ అధ్యాయము, 25వ వచనము.
(25) పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును.
పునరుత్థానము అనగా జన్మించుట. జీవము అనగా జన్మించక మోక్షము పొందుట అని అర్థము. జననము, మోక్షము రెండూ ఆత్మయే అయివుండుట వలన ''ఏసుయందు విశ్వాసముంచువాడు మరణించిన తర్వాత తిరిగి జన్మించక మోక్షమును పొందును'' అని చెప్పాడు.

(44) యోహాన్‌ సువార్త, 11వ అధ్యాయము, 26వ వచనము.
(26) బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.
ఒకమారు మోక్షము పొందినవాడు ఎప్పటికీ శాశ్వత జీవనములో ఉండునుగానీ, అతడు ఎప్పటికీ చనిపోవడము జరుగదు. అందువలన ''దేవుని మీద విశ్వాసముంచు ప్రతివాడును మోక్షము పొంది తిరిగి చనిపోవడముండదని'' చెప్పాడు.

(45) యోహాన్‌ సువార్త, 12వ అధ్యాయము, 25వ వచనము.
(25) తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టు కొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
'ఇహలోక జీవనమును ప్రేమించువాడు తన ప్రాణమును పోగొట్టు కొనును' అని ఉన్నది కదా! దాని వివరము ఏమనగా! మనిషి అనగా జీవుడు ప్రాణముతో జీవించుచున్నాడు. ఇహ లోకములో జీవనము కొరకు తన ప్రాణమును ఎవడు ప్రేమించునో వాడు ఇహ లోకములో శాశ్వతముగా బ్రతుకలేడు కావున వాని ప్రాణమును వాడు పోగొట్టుకొనుచున్నాడు. ఇంకా వివరముగా అర్థము కావాలంటే మనిషి భూమిమీద పుట్టి కొన్ని సంవత్సరములు మాత్రము బ్రతుకగల్గుచున్నాడు. అలా బ్రతికే దానికి అతనికి అతని శరీరములో 'ప్రాణము' అను గాలి అవసరముగా యున్నది. మనిషి చనిపోయినప్పుడు అతనిలోని ప్రాణము పోవుచున్నది. ప్రాణము పోయినప్పుడే అతడు చనిపోయాడు అని అంటున్నారు. ఒకమారు పోయిన ప్రాణము బయట గాలిలో కలిసిపోవును గానీ తిరిగి అది రాదు. మనిషి మొదటి జన్మను వదలి రెండవ జన్మకు పోతే అప్పుడు వానికి క్రొత్త ప్రాణము వచ్చుచున్నది గానీ, పాత ప్రాణము రాదు. అందువలన లోకములో జీవించాలనుకొని తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టు కోవడము జరుగుచున్నది. ప్రతి మనిషి అన్నిటికంటే ఎక్కువ తన ప్రాణమునే ప్రేమించుచున్నాడు. దానివలననే నేను ఇంకా కొంత కాలము బ్రతకాలను కొంటాడు గానీ, చావాలని అనుకోడు. అందువలన ప్రతి మనిషికీ వాని ప్రాణము మీద వానికి ఎక్కువ ప్రేమయుండుట సహజము.

ఈ లోకములో బ్రతుకకూడదని మోక్షమును పొందాలనుకొనువాడు తన ప్రాణమును ద్వేషించువాడుగా యున్నాడు. ఎవడయితే ఇహ లోక జీవితమును ఇష్టపడడో వాడు తన ప్రాణమును ద్వేషించినవాడుగా యుండును. అనగా వానికి ప్రాణప్రీతి ఏమాత్రము ఉండదని అర్థము. అటువంటివాడు జన్మ జన్మకు ఊడిపోవు ప్రాణము లేనివాడై, మోక్షమును పొంది స్థిరస్థాయిగా యుండు ప్రాణమును పొందును. అనగా మరణము లేని జీవితమును పొందునని అర్థము. అటువంటి వాడు తన ప్రాణమును ఎల్లప్పుడూ కాపాడుకొనునని వాక్యములో చెప్పాడు. బ్రతికియున్న వానికి యున్నట్లు ప్రత్యేకముగా ప్రాణము లేకపోయినా మనకు అర్థమగుటకు శాశ్వత ప్రాణమున్నట్లు చెప్పారు. మోక్షము పొందినవాడు లేక పరలోకమును పొందినవాడు జనన మరణములు లేకుండా శాశ్వతముగా ఒకే స్థితిలో ఉండునని తెలియవలెను.

(46) యోహాన్‌ సువార్త, 12వ అధ్యాయము, 40వ వచనము.
(40) వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థ పరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి, వారి హృదయమును కఠినపరచెను.
దేవుడు మనిషిగా వచ్చి ప్రజలకు అవసరమైన జ్ఞానమును చెప్పితే చెప్పువానిని కన్నులతో చూచి, చెప్పబడు మాటలను హృదయముతో గ్రహించి మారు మనస్సుపొంది, ఆయన వలన కర్మలను పోగొట్టుకొని బాధల నుండి విముక్తి పొందకుండునట్లు శరీరములో దేవుడయిన ఆత్మ వారి కన్నులకు అంధత్వమును, వారి హృదయమునకు కఠినత్వమును కలుగజేసాడు. ఈ వాక్యములో ముఖ్యముగా తెలియవలసినది ఏమనగా! సృష్ఠికర్తయైన పరిశుద్ధాత్మ (పరమాత్మ) యుండగా, ఆయన సృష్ఠించిన ఆత్మ అందరి శరీరములలో వుండి, అందరినీ నడుపుచున్నది. సృష్ఠికర్తయైన పరిశుద్ధాత్మకు ఆత్మ కుమారుడులాంటి వాడే అయినా మనిషికి జ్ఞానమును బోధించుటకు మనిషిగా పరిశుద్ధాత్మయే వచ్చి పుట్టుచున్నది. అలా పుట్టిన వాడు పరిశుద్ధాత్మయే అయినా ఆయనను దేవుడు అనక దేవుని కుమారుడుగా చెప్పడమైనది. దీనినిబట్టి శరీరములో ఆత్మగాయున్నవాడు పరిశుద్ధాత్మకు కుమారుడేయగును. అట్లే మనిషిగా వచ్చిన పరిశుద్ధాత్మ అవతారము కూడా పరిశుద్ధాత్మ కుమారునిగానే చెప్పబడుచున్నది. మనిషిగా వచ్చినవాడు చెప్పిన మాటలను చూచినా, వినినా ఆయన మాటలను గ్రహించకుండునట్లు మనస్సు మార్చుకొని, కర్మ నిర్మూలనము చేసుకోనట్లు శరీరములో ఆత్మగా యున్నవాడు అజ్ఞాన మనిషి కన్నులకు అంధత్వమును, వాని హృదయము కఠినత్వమును కలిగియుండునట్లు చేయుచున్నాడు.

పరిశుద్ధాత్మ సృష్ఠికర్తయైన దేవుడయి ఉండియు మనిషికి శరీరములోనే ఆత్మరూపములో ఉండు కుమారున్ని సృష్ఠించి మనిషియందు ఉంచడమేకాక అజ్ఞానములో యున్న మనిషికి జ్ఞానమును తెలుపు నిమిత్తము మనిషిగాయున్న ఆత్మను మరియొక కుమారునిగా సృష్ఠించాడు. మనిషి శరీరములో యుండు ఆత్మ ఎల్లప్పుడు ఉండగా, మనిషి రూపములో ఉండు ఆత్మ అప్పుడప్పుడు భూమిమీద జ్ఞానమును బోధించుటకు వచ్చుచుండును. పరిశుద్ధాత్మ మీద శ్రద్ధ లేనివానికి, పరిశుద్ధాత్మయిన దేవుని మీద అసూయ భావమున్న వానికి మనిషిగా వచ్చిన ఆత్మ దైవజ్ఞానమును చెప్పినా, వినిన జ్ఞానము మీద శ్రద్ధలేని మనిషికి అర్థము కానట్లు వాని హృదయము (బుద్ధి) గ్రహించకుండునట్లు శరీరములోయున్న ఆత్మ చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మీద శ్రద్ధ, భక్తి కలవానికి శరీరములో యున్న ఆత్మ, శరీరముగా యున్న ఆత్మ చెప్పిన మాటలను అర్థమగునట్లు, వాని హృదయము గ్రహించునట్లు చేయును. పరిశుద్ధాత్మయైన దేవుని చేత సృష్ఠింపబడిన శరీరములోని ఆత్మగాయున్న కుమారున్ని, శరీరముగా ప్రత్యేకముగా వచ్చిన రెండవ కుమారున్ని తెలియకపోతే దేవుడయిన పరిశుద్ధాత్మ యొక్క నిజ జ్ఞానము అర్థము కాదు.

(47) యోహాన్‌ సువార్త, 12వ అధ్యాయము, 47, 48 వచనములు.
(47) ఎవడయినను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదుగానీ, లోకమును రక్షించుటకే వచ్చితిని.

(48) నన్ను నిరాకరించి, నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు గలడు. నేను చెప్పిన మాటయే వానికి అంత్య దినమున తీర్పు తీర్చును.
ఈ వాక్యమును చెప్పినవాడు మనిషి రూపములో యున్న ఆత్మని చెప్పవచ్చును. దేవుడు మనిషిగా వచ్చినప్పుడు ఆయన చెప్పిన జ్ఞానమును వినియు, జ్ఞానమును గ్రహించక అశ్రద్ధతో వదలివేసిన వానికి, వాడు మరణించినప్పుడు పాపపుణ్యములను నిర్ణయించి జన్మను కలుగజేయు పనిని మనిషి రూపములో వచ్చిన వాడు చేయడు. మనిషి రూపములో వచ్చి జ్ఞానమును తెలుపు ఆత్మ చనిపోవు మనుషులకు జన్మను నిర్ణయించు తీర్పును తీర్చుటకు రాలేదు. మనిషి రూపములో వచ్చిన దేవుడు (ఆత్మ) ప్రజలకు తన జ్ఞానమును తెలియజేసి రక్షించుటకు వచ్చాడు. మనిషిగా వచ్చిన ఆత్మ చెప్పే మాటలను విని అంగీకరింపని వానిని, మనిషిగా వచ్చిన వానిని చూచి ఆయనను గొప్పవాడని అంగీకరింపని వానిని, వాని మరణములో తీర్పు తీర్చి జన్మను నిర్ణయించి పంపువాడు మరొకడు గలడు. అలా తీర్పు తీర్చువాడు శరీరములో ఎల్లప్పుడూ ఉండు ఆత్మయని తెలియవలెను. మనిషి రూపములో వచ్చిన ఆత్మ చెప్పిన జ్ఞానమునుబట్టి మనిషి శరీరములోయున్న ఆత్మ మరణ దినమున జన్మల నిర్ణయమును నిర్ణయించి పంపును. శరీరములోని ఆత్మ కార్యమును, శరీర రూపములో వచ్చిన ఆత్మ (భగవంతుని) కార్యమును తెలియకపోతే పరిశుద్ధాత్మయిన దేవుడు తెలియబడడు.

(48) యోహాన్‌ సువార్త, 12వ అధ్యాయము, 49, 50 వచనములు.
(49) ఏలయనగా! నా యంతట నేనే మాటలాడ లేదు. నేను ఏమనవలెనో, ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి యున్నాడు.

(50) మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవనమని నేనెరు గుదును. కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాననెను.
ఇక్కడ చెప్పిన ఈ వాక్యమును శరీర రూపములో మనిషిగా వచ్చిన ఆత్మ (భగవంతుడు) చెప్పిన మాటయని తెలియవలెను. మనిషి రూపములో వచ్చిన దేవుడు అయిన ఏసు ఈ సమాచారమును చెప్పియున్నాడు. దేవుడు మనిషిగా ఎప్పుడు వచ్చినా ఆయన చెప్పు జ్ఞానమంతయూ పరిశుద్ధాత్మదే అయివుండును. అనగా పరిశుద్ధాత్మ తన చేత చెప్పించు జ్ఞానమని మనిషి రూపములో వచ్చినవాడు చెప్పుచున్నాడు. మనిషి రూపములో వచ్చిన ఆత్మ అనగా భగవంతుడు చెప్పు జ్ఞానము నిత్య జీవనము అయిన మోక్షమును కల్గించునదై ఉండును. ఇందులో రహస్యమేమనగా! మనిషి రూపముగా వచ్చినవాడు దేవుడుగా తెలియబడకున్నా మాట్లాడువాడు పరిశుద్ధాత్మయే యని తెలియునట్లు మనిషిగా వచ్చినవాడు ''నేను చెప్పు సంగతులన్నియు నా తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానని'' అనడమైనది. ఈ మాటతో మాట్లాడువాడు పరిశుద్ధాత్మయేనని తెలియవచ్చును. అయినా ఆధ్యాత్మిక సిద్ధాంతము ప్రకారము పరిశుద్ధాత్మ తండ్రియని, మనిషిగా వచ్చిన ఆత్మ కుమారుడని చెప్పక తప్పదు.

(49) యోహాన్‌ సువార్త, 14వ అధ్యాయము, 7వ వచనము.
(7) మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగి యుందురు. ఇప్పటినుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
ఈ వాక్యము ఇంతకుముందు చెప్పిన (యో,12-49, 50) వాక్యము ప్రకారమే యున్నది. అక్కడ నేను చెప్పినట్లు తండ్రి, కుమారుడని వేరువేరుగా చెప్పియున్నా, ఆధ్యాత్మికరీత్యా అలా మాట్లాడవలసిందేగానీ ఇద్దరూ ఒక్కటే యని చెప్పాను. నేను చెప్పినట్లే ''నన్ను తెలిసియుంటే నా తండ్రిని తెలిసి యుందురు'' అన్నాడు. దేవుడు మనిషిగా వస్తే వచ్చినవానిని దేవుని కుమారుడు అనినా, వాస్తవానికి తండ్రే కుమారుడుగా యున్నాడని, 'కుమారున్ని తెలిస్తే తండ్రిని తెలిసినట్లే'యని వాక్యములో చెప్పారు.

(50) యోహాన్‌ సువార్త, 14వ అధ్యాయము, 8, 9 వచనములు.
(8) ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మా కంతే చాలునని ఆయనతో చెప్పగా

(9) నేనింత కాలము మీ వద్ద యుండిననూ నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి యున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఏల చెప్పుచున్నావు?
ఈ వాక్యములో కనిపించు ఆకారమున్నవాడు పరిశుద్ధాత్మయని తెలియునట్లు గలదు. అందువలన ''నన్ను చూచువాడు తండ్రిని చూచి యున్నాడు'' అని చెప్పెను.

(51) యోహాన్‌ సువార్త, 14వ అధ్యాయము, 10వ వచనము.
(10) తండ్రియందు నేనును, నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుట లేదు. తండ్రి నాయందు నివసించుచూ తన క్రియలు చేయుచున్నాడు.
ఒక వ్యక్తి మారువేషములో యున్నప్పుడు అతను మరియు అతనితో పాటు వేషము కలిసియున్నది కదా! ఆ విధముగా చూస్తే ఒక ధనికుడు బిక్షగాని వేషములో యున్నప్పుడు ధనికుడు + బిక్షగాడు కలిసియున్నారు. లోపల ధనికుడుయున్నా బిక్షగాని వేషము పైన ఉండుట వలన పైకి ధనికుడు కనిపించకుండా బిక్షగాడే కనిపించుచుండును. బిక్షగాడు బజారులోనికి పోయి బిక్షమడిగినా ఆ మాటలతో అడుగువాడు ధనికుడే. కనిపించని ధనికుడు కనిపించే బిక్షగానియందుండి ధనికుడు తన పనిని తాను చేయుచున్నాడు. బిక్షగాని లోపల ధనికుడు, ధనికుని లోపల బిక్షగాని మాటలు ఉండుట వలన ధనికునియందు బిక్షగాడు, బిక్షగానియందు ధనికుడు కలిసియున్నారని చెప్పవచ్చును. పైకి కనిపించువానికంటే లోపల యుండేవాడే ముఖ్యము గనుక పైకి కనిపించువాని పనులన్నియూ లోపలి వానివేయని చెప్పవచ్చును. పైకి కనిపించువానిది వేషమేగానీ వాడు లోపలి వాడే. వాస్తవముగానే బిక్షగానిని ఒక విధముగా ధనికుడేయని చెప్పవచ్చును. అట్లే 'మానవ ఆకారము' అను వేషమును వేసుకొన్న పరమాత్మయే నిజమైన వాడనీ, పై ఆకారము తాత్కాలికమేయని, లోపలి ఆత్మే శాశ్వతమని తెలియవలెను. అర్థమయ్యేటట్లు చెప్పితే 'ఏసు అను మనిషిలో యున్నవాడు పరిశుద్ధాత్మయే'నని చెప్పవచ్చును. అందువలన ఆయన స్వయముగా ''నాయందు తండ్రియు, తండ్రియందు నేను కలిసియున్నామని'' చెప్పాడు.

(52) యోహాన్‌ సువార్త, 14వ అధ్యాయము, 6వ వచనము
(6) నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాడు.
ఉదాహరణముగా చెప్పుకుంటే ధనికున్ని తెలియుటకు మార్గము బిక్షగాడే. బిక్షగానిని పట్టుకోగలిగితే ధనికుడు తెలియును. ధనికున్ని తెలియగలిగితే ధనికుని వద్దయున్న ధనము దొరుకును. అలాగే దేవున్ని తెలియుటకు ఆధారము లేక మార్గము మనిషిగా వచ్చినవాడు. మనిషిగా వచ్చిన వానిని తెలియగలిగితే వానిలోపలయున్న దేవుడు తెలియును. దేవున్ని తెలియగలిగితే ఆయనయందు గల నిత్య జీవనము లభించును. అందువలన ఏసు ఒక సందర్భములో ''నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము'' అన్నాడు. 'నేనే మార్గము' అనగా నా ద్వారానే దేవున్ని తెలియవలెనని ఏసు చెప్పాడు. అలాగే 'నేనే సత్యము' అనగా నేనే నిజమైన దేవున్ని అని కూడా చెప్పాడు. అంతేగాక 'నేనే నిత్య జీవనము' యని కూడా చెప్పాడు. అలా చెప్పుటకు కారణము ఏమనగా! నిజ దేవుడు ఏసు పేరుతో శరీరము ధరించియుండి నన్ను తెలియగలిగితే తప్పక పరలోకము లభించుననీ, లోకముకాని పరలోకమందు శాశ్విత జీవితముండుననీ, మరణము ఉండదనీ చెప్పాడు.

(53) యోహాన్‌ సువార్త, 14వ అధ్యాయము, 16వ వచనము.
(16) నేను తండ్రిని వేడుకొందును. మీవద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును.
పరిశుద్ధాత్మ శాశ్వతముగా మనిషి రూపములో ప్రజల మధ్యలో ఉండడు. అప్పుడప్పుడు అవసరమొచ్చినప్పుడు తన వేషమును మార్చుకొని తిరిగి ప్రజల మధ్యలోనికి వచ్చుచుండును. ఏసుగా వచ్చినప్పుడు ప్రజల మధ్యలో కేవలము ముప్పదిమూడు సంవత్సరములు జీవించియుండగా, అందులో ప్రజలకు జ్ఞానమును బోధించినది కేవలము మూడు సంవత్సరములే. మూడు సంవత్సరములు కూడా పూర్తికాకముందే రెండు సంవత్సరముల మూడు నెలలకే ఆయన ప్రజల మధ్యలో లేకుండా పోవడము జరిగినది. అట్లుకాకుండా రెండవమారు ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు ఏసు జీవించిన కాలముకంటే ఎక్కువ కాలము ఉండి జ్ఞానమును బోధించునట్లు తండ్రిని వేడుకొందును అని అన్నాడు. వచ్చేవాడు ఆయనే, వచ్చేవానిని వేడుకొందునని చెప్పేవాడు ఆయనే. వేరొక సత్యస్వరూపియైన ఆత్మను మీవద్దకు పంపుదునని చెప్పువాడు ఆయనే. ఉన్నది ఒక్కడే ఒక్కడు. చెప్పువాడు ఒక్కడే, అడుగువాడు ఒక్కడే, వచ్చువాడు ఒక్కడే. ఒక్కడేయను విషయము తెలియకపోతే చెప్పేవాడు వేరు, అడిగేవాడు వేరు, వచ్చేవాడు వేరు అనునట్లు వేరువేరుగా కనిపించును. అన్ని పాత్రలు ఒక్కనివేయని తెలియకపోతే ఎదురుగా మనిషిరూపములో యున్న దేవుడు తెలియడు, వేడుకొనే దేవుడు తెలియడు, వచ్చే దేవుడు ఏమాత్రము తెలియడు. తండ్రిని వేడుకొను కుమారుడైన ఏసు ఎవడో వాడే, వాడే రాబోయే ఆదరణకర్తయనీ, వచ్చే ఆదరణకర్తే పరిశుద్ధాత్మయైన సత్యస్వరూపియైనవాడని తెలియవలెను.

(54) యోహాన్‌ సువార్త, 14వ అధ్యాయము, 17వ వచనము.
(17) లోకము ఆయనను చూడదు. ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును.
లోకము అనగా భూమిమీద కర్మలను అనుభవించువారు యని చెప్పవచ్చును. కర్మలను అనుభవించు మనుషులు దేవుడు మనిషిగా వస్తే ఆయనను చూడరు. ఆయనను తెలియలేరు. ఆయనను ఏమాత్రము గుర్తించనివారు ఆయనను పొందలేరు. దైవజ్ఞానమును మనిషిగా వచ్చిన దేవున్ని ఏమాత్రము గుర్తించలేరు. తెలుసుకోవాలను ప్రయత్నమును కూడా చేయరు. నా తర్వాత ఆదరణకర్తగా వచ్చు మనిషి రూపములో యున్న దేవున్ని మీరు మాత్రము తెలియగలరు. ఎందుకనగా! ఇప్పుడు నా ద్వారా తెలిసిన జ్ఞానము కొంత మీవద్ద యుండుట వలన మీరు ఆయనను తెలియగలరు. ఆయనను తెలియగలిగినా మీతో ఆయన నివసించును. ఆదరణకర్తను తెలియగలిగిన మీరు ఆయనతో నివాసము ఉండడమేకాక ఆయన మీ లోపల ఆత్మగా యున్నాడని తెలియగలదు.

(55) యోహాన్‌ సువార్త, 14వ అధ్యాయము, 20వ వచనము.
(20) నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు.
ఈ వాక్యము తెలియుటకు ముందు దేవుని వాస్తవ రూపమును తెలియవలసియుండును. దేవుడు మూడు భాగములుగా విభజింపబడి ప్రపంచమంతా వ్యాపించియున్నాడు. ఉన్నది ఒక్క దేవుడే అయినా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ యను మూడు ఆత్మల విభజనగా యున్నాడు. జీవాత్మ సర్వ జీవరాసుల శరీరములలో ఒక్కచోట యుండగా, ఆత్మ అన్ని శరీరముల యందు శరీరమంతటా వ్యాపించియున్నది. పరమాత్మ శరీరముల లోపల, శరీరముల బయట అణువణువునా అంతటా వ్యాపించియున్నది. ఈ విషయమును ఎవడయితే తెలియగల్గునో వాడు సంపూర్ణ జ్ఞాని అయినట్లే యని చెప్పవచ్చును. పరమాత్మయనబడు సృష్ఠికర్త అయిన దేవుడు తన జ్ఞానమును ప్రజలకు తెలుపు నిమిత్తము మనిషి రూపములో వచ్చి తనను కుమారునిగా, పరమాత్మను తండ్రిగా చెప్పుచున్నాడు. ఇదియంతయూ విభజన లెక్క కోసము చెప్పునదేగానీ కుమారునిగా యున్నవాడు, తండ్రిగా యున్నవాడు ఇద్దరూ ఒక్కడేయని చెప్పవచ్చును. దేవుడు జ్ఞానమును బోధించు నిమిత్తము 'కుమారుడు' అను వేషములో రాగా, వచ్చినవాడు ఒక జీవిత కాలము భూమిమీద ఉండి జ్ఞానమును బోధించి పోతాడు. ఇది జ్ఞానమును బోధించు పద్ధతికాగా, మరియొక పద్ధతి ప్రకారము జీవులను పుట్టించుటకు, మరణింపజేయుటకు, జీవింపజేయుటకు ఒక ఆత్మను తన నుండి పంపియున్నాడు. అట్లు జీవరాసుల శరీరములను నడుపు ఆత్మను కూడా ఒక విధముగా దేవునికి (పరిశుద్ధాత్మకు) కుమారుడు అనియే చెప్పుచున్నారు. ఆత్మయిన వాడు పరమాత్మయందు ఉండగా, జీవాత్మయిన వాడు ఆత్మయొక్క ఆవరణములో యున్నాడు. ఇదే విషయమునే చెప్పుచూ ఆత్మగా యున్న నేను 'నా తండ్రి అయిన పరమాత్మయందు ఉన్నానని' చెప్పుటకు బదులుగా 'నేను నా తండ్రియందు ఉన్నానని' చెప్పాడు. జీవుడు ఆత్మ ఆవహించిన శరీరములో ఉండుట వలన జీవాత్మలయిన మీరు ' ఆత్మయిన నాయందు ఉన్నారని' వాక్యములో చెప్పారు. అట్లే ఆత్మగా శరీరమంతా వ్యాపించి శరీరములో ఒకచోట యున్న మీయందు కూడా వ్యాపించి యున్నానని చెప్పుచూ ''నేను మీ యందును ఉన్నానని మీరు ఆత్మల జ్ఞానమును తెలిసిన రోజు తెలియగలరని'' చెప్పాడు. మూడు ఆత్మల విషయము తెలియకపోతే ఎవరు ఎవరియందు ఉన్నారో తెలియదు. అందువలన మనిషి జీవితములో ముఖ్యముగా దేవుడు మూడు ఆత్మలుగా యున్న త్రైత సిద్ధాంతమును తెలియవలెను.

(56) యోహాన్‌ సువార్త, 14వ అధ్యాయము, 25, 26 వచనములు.
(25) నేను మీ వద్ద యుండగానే ఈ మాటలు మీతో చెప్పితిని.

(26) ఆదరణకర్తయనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.
ఏసు ఒక సందర్భములో తన శిష్యులకు చెప్పుచూ, నేను మీవద్ద యుండగానే ఈ మాటలు చెప్పితిని అన్నాడు. అంతేగాక ఏసు గతించి పోయిన తర్వాత ఇంకొక ఆదరణకర్త మీవద్దకు వచ్చునన్నాడు. ఏసువలె వచ్చిన ఆదరణకర్త ఏసు చెప్పిన సంగతులన్నీ తిరిగి జ్ఞాపకము చేయడమే కాక ఏసు చెప్పని విషయములను కూడా సమస్త జ్ఞానమును బోధించును అని చెప్పాడు. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా! 'ఆదరణకర్త' యను పేరును ఏసే చెప్పాడు. అంతలో ఆదరణకర్త యనగా ఏమియని దానికి వివరమును చెప్పుచూ తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మయని చెప్పాడు. ఇక్కడ బాగా గమనించితే ఆయన చెప్పిన వాక్యములో మొదట తండ్రియని ఉన్నది మరియు చివర పరిశుద్ధాత్మయని ఉన్నది. ఏసు తండ్రి పరిశుద్ధాత్మయనియే చెప్పవచ్చును. అదియు మారువేషములో యున్నవానిని కుమారుడని, వేషము లేనివానిని తండ్రియని అంటున్నాము. వాస్తవానికి ఇరువురూ ఒక్కరేయగుదురు. 'నా నామమున పంపబోవు' అని మధ్యలో చెప్పియున్నాడు. ప్రజలను జ్ఞానముతో ఆదరించి వారి కర్మలను లేకుండా పోవునట్లు చేయు వానిని ఆదరణకర్త యని అనుచున్నాము. దేవుడు ఆదరణకర్త యను పేరుతో పంపునది దేవున్నే యని చెప్పు వాక్యమే ''తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ'' యని అన్నాడు. దేవుడు రూపమును తగిలించుకొని ''ఆదరణకర్తయను పేరు గల ముసుగులో దేవుడే వచ్చి ఆయన జ్ఞానమును ఆయనే చెప్పుచున్నాడు'' అని తెలియుచున్నది. ఈ విషయము తెలియనివారికి కూడా తెలియునట్లు ఈ వాక్యమును చెప్పాడు అని తెలియవలెను.

(57) యోహాన్‌ సువార్త, 15వ అధ్యాయము, 23వ వచనము.
(23) నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు.
నేను మొదటినుండి చెప్పుచూనే యున్నాను. ఏసు వేరు, ఏసు ఆకారము దేవునికి ఒక వేషము, వేషమునకు పేరులాంటిది. వాస్తవముగా మనిషి రూపములో వచ్చి ఏసుగా పిలువబడువాడు పరిశుద్ధాత్మ తప్ప ఎవరూ కారు. అందువలన ఏసును దూషించితే దేవుడయిన పరమాత్మను దూషించినట్లేయగును. ఆదరణకర్త ఏసు తర్వాత రాబోయేవాడే కాదు. ఏసు కూడా ఆదరణకర్తయే. దేవుడు ఎప్పుడు మనిషి అవతారములో వచ్చినా ఆయనను ఆదరణకర్త అనియే చెప్పాలి. కర్మ నిర్మూలన చేయు జ్ఞానమును బోధించుచూ, ప్రజలను ఆదరించువాడు ఆదరణకర్త యగును. కర్మలను కాల్చు బోధలు చెప్పువాడు దేవుడే అయినందున ఆదరణకర్త ఎవడయితే వాడు పరిశుద్ధాత్మయే యని చెప్పవచ్చును. అయితే భూమిమీదికి మనిషిగా వచ్చిన దేవున్ని తెలియుట చాలా కష్టమైన పని. అందువలన క్రైస్థవ మతములో నేడు మేము జ్ఞానులము అనువారు కూడా నేడు ఏసును సోదరునిగా చెప్పుచున్నారు. ఆయన ఎవరికీ సోదరుడు కాడు. ఏసుగా వచ్చినా, ఇంకా ఏ పేరుతో వచ్చినా ఆయన పరిశుద్ధాత్మయే యగుట వలన అందరికీ తండ్రియగును గానీ సోదరుడు కాడు.

(58) యోహాన్‌ సువార్త, 15వ అధ్యాయము, 24, 25 వచనములు.
(24) ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయ కుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే నన్నును, నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు.

(25) అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి.
భూమిమీద ఎవడును చేయని పని ఏదనగా! 'ఒక మనిషి యొక్క పాపమును క్షమించి లేకుండా చేయడము.' అందరికి సాటి మనిషిగా కనిపించు నేను ఇతరుల కర్మలను క్షమించు కార్యములను చేయకుండి నట్లయితే వారికి పాపము వచ్చేది కాదు అని ఏసు చెప్పాడు. అందరికి తెలియునట్లు కొందరి పాపములను ఏసు క్షమించుట వలన అది చూచి ఓర్వలేని మనుషులు, ఆయన గొప్పతనమును గుర్తించలేనివారు ఏసును ద్వేషించడము జరిగినది. ఏసును ద్వేషించడము వలన పరిశుద్ధాత్మను ద్వేషించినట్లగుచున్నది. ప్రజలు సరియైన కారణము లేకుండానే ఆయనను ద్వేషించుట వలన వారికి పాపము రావడము జరిగినది.

(59) యోహాన్‌ సువార్త, 15వ అధ్యాయము, 26, 27 వచనములు.
(26) తండ్రి యొద్ద నుండి మీవద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి వద్దనుండి బయలుదేరు సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్య మిచ్చును.

(27) మీరు మొదటి నుండి నావద్ద యున్నారు గనుక, మీరును సాక్ష్యమిత్తురు.
ఆదరణకర్త (భగవంతుడు) గా వచ్చినవాడు ఏసు. ఏసు తండ్రి యొద్దనుండి మనుషులవద్దకు మరియొక ఆదరణకర్తను పంపునని చెప్పియున్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక విధానము ప్రకారము చెప్పవలసినది చెప్పారుగానీ వాస్తవము చెప్పితే తండ్రి వద్ద మరియొక ఆదరణకర్త యనువాడు ఎవడూ లేడు. ఉన్నది ఒకే దేవుడే. ఆయనే అప్పుడప్పుడు ఆదరణకర్తగా మారువేషములో వచ్చిపోవుచున్నాడు తప్ప ఈయన పంపేది లేదు, ఆయన వచ్చేది లేదు. ఈయన ఆయన ఇద్దరూ ఒక్కరే అయినప్పుడు పంపేవాడు ఆయనే వచ్చేవాడు ఆయనే. వాక్యములో ''సత్యస్వరూపియైన ఆత్మ ఆదరణకర్తగా వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యమిచ్చును'' అని ఏసు అన్నాడు. వచ్చినవాడు పోయినవాడే అయినప్పుడు, వచ్చినవాడు పోయిన వానిని గురించి చెప్పడములో ఆశ్చర్యము లేదు. వచ్చిన ఆదరణకర్త ఏసును గురించి చెప్పినప్పుడు ఏసువద్దయున్న శిష్యులకు ఏసు తప్పక జ్ఞాపకము వచ్చును. కనుక ఏసువద్ద యుండిన ఆయన శిష్యులు కూడా ఏసు గురించి ఏసు ఉన్నది వాస్తవమేయని, ఆయన జ్ఞానము చెప్పిపోయినది వాస్తవమే యని చెప్పుదురు.

(60) యోహాన్‌ సువార్త, 16వ అధ్యాయము, 7వ వచనము.
(7) నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్లని ఎడల ఆదరణకర్త మీవద్దకు రాడు. నేను వెళ్లిన ఎడల ఆయనను మీవద్దకు పంపుదును.
ఒక నాటకములో ఒకే వ్యక్తి రెండు పాత్రలను పోషించి నటించుచుండును. ఒక పాత్ర పోయిన తర్వాత మరొక పాత్ర రంగస్థలము మీదికి రావలసియున్నది. అయితే రెండు పాత్రలలో ఒక్కరే నటించుచుండుట వలన ఒక పాత్ర తెరవెనుకకు పోతే ఆ పాత్రలో యున్న వ్యక్తే మరొక పాత్రలో తెర ముందుకు రాగలడు. మొదటి పాత్ర లోపలికి పోనిదే రెండవ పాత్ర వచ్చేదానికి వీలు ఉండదు. రెండు పాత్రలు ఒకే వ్యక్తివి అయినందున అలా జరుగవలసిందే. అదే విధముగా ఏసుపాత్రలో వచ్చినవాడే తిరిగి రెండవ పాత్రగా భూమిమీదికి రావలసియున్నది. అందువలన మనుషుల ముందునుండి ఏసు కనిపించకపోతే తిరిగి రెండవ పాత్రగా ఏసుపాత్రలో వచ్చినవాడే రావలసియుండును. పరిశుద్ధాత్మయిన వాడు 'ఏసు' అను పాత్రలో ప్రజల ముందుకు వచ్చి యుండుట వలన ఆయన ప్రజలతో కలిసి యుండుటకు మరియొకమారు రావలసి వస్తే ఏసుగా కనిపించకుండా ప్రజల ముందునుండి పోయి క్రొత్త పాత్రలో, క్రొత్త పేరుతో, క్రొత్త వేషముతో ఆయనే తిరిగి రావలసియుండును. అందువలన ఏసు ప్రజలతో ఈ విధముగా అన్నాడు. ''నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనము కలుగును. నేను వెళ్లని ఎడల ఆదరణకర్త మీవద్దకు రాడు'' యని అన్నాడు. నేనే తిరిగి ఆదరణకర్తగా వస్తానని చెప్పకుండా 'నేను వెళ్లిన తర్వాత రాబోవు ఆయనను మీవద్దకు పంపుదును' అని అన్నాడు. బుద్ధి విచక్షణ కల్గినవాడు పోయేవాడు తిరిగివచ్చేవాడు ఇద్దరూ ఒక్కరేయని సులభముగా ఈ వాక్యము వలన తెలియగలడు.

(61) యోహాన్‌ సువార్త, 16వ అధ్యాయము, 8వ వచనము.
(8) ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
ఏసుగా వచ్చిన పాత్ర తెరవెనుకకు కనిపించకుండా పోయిన తర్వాత రెండవ వేషములో, రెండవ అవతారములో ఆదరణకర్తగా వచ్చును. ఆదరణకర్తయనునది దేవుని అవతారమును తెలియజేయు పదమేగానీ, వచ్చిన వాని పేరు కాదు. ఆదరణకర్తగా వచ్చినవాడు ప్రపంచములో ఏ పేరుతో అయినా ఉండవచ్చును. అందువలన ఈయనే దేవుని అవతారమనీ, ఈయనే ఆదరణకర్తయనీ ఎవరూ కనుగొని చెప్పలేరు. ఆదరణకర్తగా వచ్చే వాని ఆకారముగానీ, పేరుగానీ ఎవరికీ తెలియదుగానీ, ఆయన క్రియలను చూచి తెలుసుకొనుటకు కొంత అవకాశము గలదు. ఆదరణకర్త భూమిమీదికి వస్తే ఆయన మనుషుల పాపమును గూర్చి చెప్పును. మనిషి పాపమును ఎలా సంపాదించుకొనుచున్నాడో అది మరణ కాలము వరకు ఎక్కడ నిలువయుండునో, పాపము వలన కలుగు ఫలితమేమో మొత్తము కర్మ విధానమంతయూ తెలియజేయును. మనిషి సంపాదించుకొన్న పాపము పోవాలంటే దైవజ్ఞానము ఒక్కటే అవసరమగుననీ, పాపములు కట్టెలలాంటి వనీ, జ్ఞానము అగ్నిలాంటిదనీ జ్ఞానము వలన మాత్రమే పాపములను అనుభవించకుండా తప్పించుకోవచ్చుననీ, దైవజ్ఞానమును ఎలా పొంద వచ్చునో దానిని గురించి సంపూర్ణముగా తెలియజేయును. జీవితములో దైవజ్ఞానమును సంపాదించుకోని వానికి చేసుకొన్న పాపమంతయూ మరణము వరకు అలాగేయుండును. వాడు మరణించిన తర్వాత అదే రోజే, అదే నిమిషమే, అదే క్షణమే తిరిగి పుట్టవలసియుండును. మరణించిన దినమును అంతిమ దినము అంటాము. జీవితములో ఏది అంతిమ దినమో అదే ప్రథమ దినముగా కూడా మారును. మరణించిన సెకండులోనే రెండవ జన్మకు పోవలసియుండును. అప్పుడు మరణమునకు పుట్టుకకు సంధికాలము ఒక సెకనులో పదవవంతు కాలమేయని చెప్పవచ్చును. ఆ కొద్దిపాటి కాలములో చనిపోయిన వానికి వాడు చేసుకొన్న పాపపుణ్యములను బట్టి ఆత్మ తీర్పు తీర్చును. ఆ తీర్పులో వాడు రెండవ జన్మలో ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి అనుభవించాలి అను విషయములను క్షణ క్షణము జరుగవలసిన దానిని ఆత్మ నిర్ణయించి పంపును. మరణములో జరిగిన తీర్పునుబట్టి పుట్టిన వాని జీవితము గడచుచుండును. ఎవడు ఎలా బ్రతకాలో అంతిమ దిన తీర్పులో నిర్ణయము చేయబడును. చనిపోయిన వానితో యున్న ఆత్మయే మనిషి చిన్నప్పటినుండి చేసుకొన్న కర్మలనుబట్టి న్యాయబద్దముగా తీర్పుతీర్చును. అప్పుడు ఉన్నది ఉన్నట్లే లెక్కించబడి జరుగవలసినవి నిర్ణయము చేయబడును. ఆ నిర్ణయమును ఎవరూ అతిక్రమించుటకు సాధ్యముకాదు. దానిని అందరూ ఒప్పుకొని తీరవలసిందే.

(62) యోహాన్‌ సువార్త, 16వ అధ్యాయము, 12వ వచనము.
(12) నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు గలవుగానీ, ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు.
దేవుడు మనిషిగా వచ్చినా, వచ్చి జ్ఞానమును ప్రజలకు బోధించినా ప్రజల మనోభావమునుబట్టి ఆచి తూచి బోధించవలసియున్నది. దైవ జ్ఞానమునయినా సమయము, సందర్భమునుబట్టి బోధించవలసియుండును. కాబోవు భార్యవద్దకు పోయి నీవు నా భార్యవు అంటే ఆమె ఒప్పుకోదు. ఒప్పుకోకపోవడమేకాక పోట్లాటకు వచ్చును. అదే విషయమును పెళ్లి అయిన తర్వాత నీవు నా భార్యవు అంటే ఆమె సంతోషపడునుగానీ పోట్లాటకు రాదు. జరుగబోవు సత్యమును ముందు చెప్పినా సహింపని వారు దైవ జ్ఞానమును చెప్పితే వారు అర్థము చేసుకోలేక తిరిగి ఎదిరించి మాట్లాడు అవకాశము కలదు. అందువలన దేవుడు మనిషిగా భూమిమీదికి వచ్చినా ఆయన కూడా సత్యమును ఆచి తూచి చెప్పవలసి వచ్చినది. ఉదాహరణకు రావణబ్రహ్మ దేవుని అవతారమే అయినా ఆ మాటను ఇప్పుడు చెప్పితే కొంతవరకు వినేవారుగలరు. అదే విషయమునే యాభై సంవత్సరముల ముందు చెప్పియుంటే ప్రజలు ఒప్పుకొనేవారు కాదు. రావణుడు దుర్మార్గుడనీ, రాక్షసుడనీ ఎదురు చెప్పేవారు. అందువలన జ్ఞానమును కూడా ముందు వెనుకా చేసి చెప్పవలసియుండును. ఏసు కూడా తన శిష్యులతో ''నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు గలవు. ఇప్పుడు వాటిని మీరు సహింపరు'' అని అన్నాడు. ఏసుకు తాను మనుషుల మధ్యలోనుండి పోవలసిన కాలము దగ్గర పడిందని తెలిసినవాడై నేను చెప్పని విషయములను రాబోవు ఆదరణకర్త చెప్పునని ముందే తన శిష్యులకు చెప్పాడు.

(63) యోహాన్‌ సువార్త, 16వ అధ్యాయము, 13వ వచనము.
(13) ఆయన అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
ఇది ఏసు రాబోవు ఆదరణకర్తను గురించి ముందే చెప్పిన వాక్యము. 'సత్యస్వరూపి అయిన ఆత్మ' అనగా 'జ్ఞాన స్వరూపమైన దేవుడు'యని అర్థము. ఏసు పోయిన తర్వాత వచ్చే దేవుడు 'సర్వసత్యములోనికి నడిపించును' యని అన్నాడు. అన్నీ సత్యమైన విషయములనే చెప్పునని చెప్పాడు. అంతేకాక మనిషిగా వచ్చిన దేవుడు మనిషిగానే ప్రవర్తించును. అందువలన మనిషిగా తాను 'స్వయముగా ఏమీ బోధింపక, తాను వినిన సంగతులనే బోధించును' అని అన్నాడు. ఎవరు చెప్పగా వినినవని ప్రశ్నించికొని చూస్తే ఉన్నది ఒక్కడే, వచ్చినవాడు ఒక్కడే కావున చెప్పవలసిన వాడు కూడా ఒక్కడే. అందువలన దేవుడు చెప్పిన విషయములనే బయట కనిపించు మనిషి కూడా చెప్పునని తెలియుచున్నది. దేవుని జ్ఞానము దేవుడే చెప్పవలసి యున్నది. మనుషులు చెప్పలేరు అను మాటకు అనుగుణముగా వినిన విషయములనే చెప్పునని అన్నాడు.

(64) యోహాన్‌ సువార్త, 16వ అధ్యాయము, 14, 15 వచనములు.
(14) ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమ పరచును.

(15) తండ్రికి కలిగియున్న వన్నియు నావి. అందు చేత ఆయన నావాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయు నని నేను చెప్పితిని.
ఈ వాక్యమును చూస్తే కొంచెము అర్థమయి, కొంచెము అర్థము కాక మనుషులతో దోబూచులాట ఆడినట్లున్నది. ఆయన అనగా క్రొత్తగా వచ్చిన 'సత్యస్వరూపియైన ఆత్మ తాను విన్నవే బోధించునని' చెప్పాడు. అంతలోనే 'నా వాటిని తీసుకొని మీకు తెలియజేయును' అని అన్నాడు. ముందేమో 'నేను చెప్పని వాక్యములు కూడా చెప్పునని' చెప్పాడు. ఇప్పుడేమో 'నా వాటిలోనివే తీసుకొని మీకు తెలియజేయును' అని అన్నాడు. సక్రమముగా చెప్పితేనే అర్థముగాని ప్రజలకు ఇలా తికమక చేసి చెప్పితే సత్యమును గ్రహించుకోగలరా? అని చూస్తే అలా చెప్పుటకు కూడా ఒక కారణము కలదని తెలియుచున్నది. అదేమనగా! దేవుని జ్ఞానమును తెలియాలను వారికే తన జ్ఞానము అర్థము అగునట్లు, జ్ఞానము మీద శ్రద్ధ లేనివానికి అర్థము కానట్లు ఇలా తికమక చేసి చెప్పుచున్నాడని అర్థమగుచున్నది. ఏసును మహిమపరచుటకు రాబోయే ఆదరణకర్త ఏసు చెప్పిన విషయములనే చెప్పునని అన్నాడు. అంతలోనే ''తండ్రికి కలిగియున్న వన్నియు నావేయని'' చెప్పాడు. తండ్రి యనగా దేవుడు అయిన పరిశుద్ధాత్మ యని అర్థము. దేవుడు చెప్పు జ్ఞానమంతయూ నాదేయని, నా వాటినే వచ్చిన ఆయన చెప్పునని చెప్పుట చేత పరిశుద్ధాత్మయే ఏసు అనియు, ఏసే పరిశుద్ధాత్మయనియు తెలియుచున్నది. 'నేనే దేవున్ని' అనకుండా ఇంకొక విధముగా 'దేవుని మాటలన్నీ నావేయని' చెప్పడమైనది.

(65) యోహాన్‌ సువార్త, 16వ అధ్యాయము, 16వ వచనము.
(16) కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు. మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.
ఏసు తన శిష్యులతో కొంతకాలము తర్వాత 'మీరిక నన్ను చూడరు' అని అన్నాడు. ఆ మాటకు అర్థము ఆయన ప్రజల మధ్యలో లేకుండా పోవునని, అందువలన ఆయన కొంతకాలమైన తర్వాత కనిపించడని అర్థ మగుచున్నది. 'మరికొంత కాలమైన తర్వాత నన్ను చూచెదరని' చెప్పాడు. ఏసు తాను ఏసుగా కనిపించడని, ఏసు శరీరమును వదలిపోవుననీ అందువలన ఆయనను చూడలేరని అర్థమగుచున్నది. అయితే వెంటనే కొంత కాలము తర్వాత తిరిగి నన్ను చూచెదరని చెప్పడములో అర్థమేమో తెలియక తలపట్టుకోవలసిందే. 'నేను కనిపించకుండా పోవుదునని' చెప్పిన తర్వాత 'తిరిగి నన్ను చూస్తారు, నేను కనిపిస్తాను' అనడములో ఆయన కొంత కాలము ఎక్కడయినా దాచిపెట్టుకొని కొంత కాలము తర్వాత బయటికి వచ్చి కనిపించునాయని కొందరు అడుగగలరు. ఏసు ఇంతకుముందు కూడా ''నేను పోతాను, నేను పోవనిదే క్రొత్తగా వచ్చు ఆదరణకర్త మీవద్దకు రాడు. నేను పోయి ఆయనను పంపుదును'' అని అన్నాడు. సరే! అదే మాటప్రకారము ఏసు పోయాడు అనుకొందాము. అందువలన కొంత కాలమైన తర్వాత నేను కనిపించను అన్నాడు. వచ్చే ఆదరణకర్త కూడా ఏసే అగుట వలన కొంతకాలము తర్వాత నన్ను చూడగలరు అని అన్నాడు. పోయేవాడు, తిరిగివచ్చేవాడు ఇద్దరూ ఒక్కరేయని చెప్పితే పై వాక్యమునకు అర్థము సరిపోవునుగానీ, పోయేవాడు అయిన ఏసు, వచ్చేవాడయిన ఆదరణకర్త ఇద్దరూ ఒక్కరేయనీ, అందువలన ఎవరిని చూచినా ఒక్కనిని చూచినట్లే యగుననీ, అందువలన ఏసు పై వాక్యమును చెప్పాడని తెలియుచున్నది.

(66) యోహాన్‌ సువార్త, 16వ అధ్యాయము, 17, 18, 19, 20, 21, 22, వచనములు.
(17) అప్పుడు ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు. మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు. నేను తండ్రివద్దకు వెళ్లుచున్నా ననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకనితో మరియొకరు చెప్పుకొనిరి.

(18) కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి.

(19) వారు తన్ను అడుగకోరుచుండిరని ఏసు ఎరిగి వారితో ఇట్లనెను. ''కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు. మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించు కొనుచున్నారా?

(20) మీరు ఏడ్చి ప్రలాపింతురుగానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురుగానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

(21) స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆవేదనను మరి జ్ఞాపకము చేసుకోదు.

(22) అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గానీ మిమ్ములను మరల చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడునూ మీవద్దనుండి తీసివేయడు.
ఇక్కడ చెప్పిన ఆరు వాక్యములను చూస్తే ఏసు కొంచెము కాలమైన తర్వాత ''మీరు నన్ను చూడరు. మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని'' చెప్పినమాట అక్కడి ప్రజలకు అర్థము కాకపోగా అది గ్రహించిన ఏసు వారి అనుమానమును లేకుండా చేయుటకు ప్రసవించు స్త్రీని ఉపమానముగా చెప్పి ఆమెవలె మీరు కూడా తిరిగి నేను మీవద్దకు వచ్చానని చెప్పాడు. నేను లేకుండా పోవుట మీకు కొంత బాధ అయినా తర్వాత నా రాకతో ఆ బాధను మరచిపోవుదురని ఏసు అక్కడున్న వారితో చెప్పాడని పై వాక్యములలో తెలియుచున్నది.

(67) యోహాన్‌ సువార్త, 16వ అధ్యాయము, 25వ వచనము.
(25) ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. అయితే ఎన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రిని గూర్చి స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది.
ఇంతకుముందు చెప్పిన వాక్యములు నిగూఢముగా యున్నవని, మనుషులు వాటిని అర్థము చేసుకోలేక తికమకపడిపోవుదురని చెప్పియున్నాము. అదే మాటనే ఏసు చెప్పుచూ తాను నిగూఢముగా అర్థము కాకుండా చెప్పినది నిజమేనని ఒప్పుకొనుచూ ''రాబోవు కాలములో నేను అలా చెప్పను. మీకు ప్రతీదీ స్పష్టముగా తెలియునట్లు చెప్పుదును'' అని అన్నాడు. వాస్తవముగా ఈ వాక్యము కూడా నిగూఢముగానే యున్నదని చెప్పవచ్చును. నేను కొంత కాలమునకు పోవుచున్నానని తర్వాత పరిశుద్ధాత్మతో కూడిన ఆదరణకర్త వచ్చుననీ, ఆయన ప్రతీదీ విశధపరచి చెప్పునని చెప్పిన ఏసు, నేను పోనిదే ఆదరణకర్త రాడని చెప్పిన ఏసు, నా పోకడ మీకు బాధగా యున్నా, తర్వాత వచ్చినవానిని చూచి సంతోషపడుదు రని చెప్పిన ఏసు, ''ఇప్పుడు కూడా నేను ఇంతవరకు నిగూఢముగా చెప్పాను. తిరిగి నేను వచ్చిన తర్వాత అన్నిటినీ అర్థమగునట్లు స్పష్టముగా తెలియ జేతును'' అని అంటున్నాడు. ఈ మాటలను బట్టి వచ్చేవాడు వేరొక ఆదరణకర్తనా లేక ఈయనే తిరిగి వస్తాడా? యను అనుమానము కల్గుచున్నది. ఇక్కడ ఈ వాక్యము కూడా సందిగ్దమునే కలుగజేయుచున్నది.

సమాప్తము.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024