pss :b g p1


త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
శ్రీ భగవంతుడిట్లనియె:-

(1) శ్లో|| 11: అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే|
గతాసూ నగతా సూంశ్చ నానుశోచన్తి పండితాః||
(ప్రకృతి, పరమాత్మ)

భావము: శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి) నెల్లనుపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు.
వివరము: బాధపడతగని విషయమును గురించి బాధపడుచున్నావని ప్రత్యేకముగ అన్నపుడు పరోక్షముగ బాధపడవలసిన విషయమును గూర్చి బాధపడలేదని, నిజముగ బాధపడవలసినదేదో ఉన్నదని తెలియుచున్నది. ఇక్కడ వివరముగ శోకింపతగినదేది? శోకింపతగనిదేది? అని యోచించవలసి వస్తున్నది. దేని కోసము శోకింపకూడదో అనగా బాధపడకూడదో దానిని గూర్చి అదే శ్లోకమునందు "గతాసూ నగతాసూంశ్చ" అని చెప్పబడి ఉన్నది. అనగా గతులుగల్గిన, గతులులేని వాటిని గూర్చి నీవు బాధపడుచున్నావు అంటున్నాడు. అపుడు గతులు ఉన్న గతులులేని వాటికంటే వేరు దానిని గూర్చి బాధపడవలసి యున్నదని సులభముగ అర్థమగుచున్నది ఇపుడు ప్రతి మానవుడు తెలియవలసిన వివరము గతులు ఉన్నదేది? గతులు లేనిదేది? గతులు గల మరియు గతులు లేని వాటికంటే వేరుగానున్నదేది? అన్న విషయము ముఖ్యము. ఎందుకనగా ఆ మూడవ దానికోసము మనము బాధపడవలయును.

  గతి అనగా ఎన్నో అర్థములు గలవు 1) పోక 2) విధము 3) త్రోవ 4) స్థానము 5) ఆధారము 6) ప్రయాణము 7) ఉపాయము 8) చలనము అని ఇన్ని అర్థములు గలవు. ఇక్కడ సందర్భానుసారముగ భౌతిక అర్థమైన "చలనము" అన్న పదము తీసుకొన్నపుడే శ్రీ కృష్ణుని మాటలోని నిజార్థము బయట పడగలదని తెలియవలయును దాని ప్రకారము చలనము కల్గినవి శరీరము గల సమస్త జీవరాసులున్నవి. అట్లే చలనము లేని వస్తుజాలము ప్రపంచములో ఎంతో ఉన్నది. చలనము కల్గిన మానవులు, జంతువులు, క్రిమి, కీటకాదులు, చలనము లేని వస్తువులను మొత్తము కలిపి జ్ఞానము తెలిసిన పెద్దలు "ప్రకృతి" అని పేరు పెట్టారు. చలనము గల చలనము లేని ఈ ప్రకృతికంటె వేరైనదొకటున్నది. అదియే 'దైవము'. ఆ నాడు అర్జునుడు ప్రకృతిలోని మనుజుల గూర్చియే బాధపడ్డాడు కాని ప్రకృతికి అతీతమైన దైవమును గూర్చి బాధపడలేదు. అందువలననే శ్రీ కృష్ణుడు దేనికోసము బాధపడకూడదో దానికోసమే నీవు బాధపడుచున్నావు అని హెచ్చరించాడు. ఆనాటి అర్జునుడే కాక ఈనాటి ప్రతి మానవుడు ప్రకృతి సంబంధ విషయములకే ప్రాకులాడుచున్నాడు. తాము చదివిన గొప్ప గొప్ప చదువులన్ని ఈ ప్రకృతిలోని విషయముల గురించి యోచించుటకే సరిపెట్టుచున్నాడు. నీ ప్రజ్ఞ నెల్ల ప్రకృతి విషయములకే ఉపయోగించి మాట్లాడుచున్నావని అర్జునున్ని శ్రీ కృష్ణుడు హెచ్చరించాడు. అంటే మన ప్రజ్ఞను దేవుని వైపు ఉపయోగించలేదని చెప్పకనే తెలియబడుచున్నది. తెలిసిన జ్ఞానులు ప్రకృతి జనితమైన సమస్త వస్తువులను మరియు జీవజాలములను గూర్చి చింతించరని, వారు దైవమును గూర్చియే చింతింతురని, శోకింతురని చెప్పబడి ఉన్నది.

భగవంతుడు తెలియజేసిన మొట్టమొదటి శ్లోకములోనే కనిపించు సమస్త జీవరాసులు ప్రకృతియేయనని. కనిపించని పరమార్థమొకటున్నదని సూచించాడు. అట్లే మనము ప్రతి నిత్యము బాధపడునది, ఏడ్చునది, చింతించునది, ప్రకృతిలోని విషయములకేనని పరమార్థ విషయమునకుకాదని కూడ సూచించాడు. పండితులైన వారు అనగా జ్ఞానము తెలిసినవారు చరాచర ప్రకృతికోసము ఏమాత్రము బాధపడరని తెలియజేశాడు. అట్లే నీవు చలనము కలిగిన, చలనము లేని వాటికోసము నీ ప్రజ్ఞనంత ఉపయోగిస్తున్నావు. అది సరియైన పని కాదని కూడ తెలియజేశాడు. మొదటి శ్లోకములోనే శోకింప తగినవని, శోకింపతగనివని రెండు భాగములు చేసి చూపడము గొప్ప విశేషము. అందులో మన ప్రజ్ఞను ప్రకృతి వైపు వినియోగించక పరమాత్మ వైపు వినియోగించమని సూచించడము మొట్టమొదటి శ్లోకములోని ప్రత్యేకతయని తెలియాలి.

(చాలామంది వ్రాసిన గీతా గ్రంథములలో ఈ శ్లోకము యొక్క భావమునకు, ఇక్కడ మాచేత వ్రాయబడిన భావమునకు చాలా తేడా ఉన్నది. వారు వ్రాసిన దానిలో కేవలము మానవుల గూర్చి, చనిపోయిన వారిని బ్రతికి ఉన్న వారిని గూర్చి చెప్పియుండగ, మా భావములో మొత్తము ప్రకృతిని గూర్చి, చలనములేని చలనమున్న, జీవములేని జీవమున్న వాటిని గూర్చి చెప్పడము జరిగినది. బ్రతికియున్న, మరణించిన వారిని గూర్చి తెలిసిన వారు చింతింపరని తెలిపితే "వారి మీద మాకేమి బాధలేదు, మాకున్న చింతయంతయు ధనము మీదనే, బ్రతికి ఉన్నవారు ఎట్లున్న ఫరవాలేదు, రుచిలేని తిండి తిన్న ఫరవాలేదు, డబ్బులు మాత్రము ఖర్చుకాకూడదు. బ్రతికినవారు రోగముతో బాధపడుచున్నను ఫరవాలేదు వారిని గూర్చి నాకేమిచింత లేదు. ఆసుపత్రికి పోతే డబ్బు ఖర్చు అవుతుందనేదే నాబాధ" అనువారు గలరు. అట్లే తమవారు చనిపోయిన చింతించరు. అట్లని వీరిని జ్ఞానులందామా! వీరికి డబ్బు బంగారు మీద తప్ప బ్రతికిన, మరణించిన వారి మీద ఏమాత్రము చింత బాధ ఉండదు. పరాయి మగవాడు భార్యను బలవంతము చేసిన, ఆమెకోసము చింతించడు. తన స్వంత కొడుకును ఇతరులు హత్య చేసిన, డబ్బు పోతుందని కేసుపెట్టడు. మిగతా గీతలలో వ్రాయబడిన ఈ శ్లోకార్థము యొక్క ప్రకారమైతే వీరిని పరమ జ్ఞానులని చెప్పవచ్చును. ఇది నిజమాయని యోచించి చూచిన వాడు బంగారు మీద, ధనము మీద ఆశపరుడు తప్ప జ్ఞాని ఏమాత్రము కాదని తెలియుచున్నది. అందువలన ఇంతవరకు అందరు వ్రాసుకున్న భావము సరికాదని చెప్పవచ్చును.)

గతించిన మరియు గతించని వారిని గూర్చి జ్ఞానులు చింతించరని వ్రాసిన వాక్యములు తప్పు, శ్రీ కృష్ణుడు అలా చెప్పలేదు. మనుషులను గూర్చియే చెప్పియుంటే పోయిన వారికొరకుగాని, ఉన్నవారికొరకుగాని చింతించక కేవలము డబ్బు కొరకే చింతించు లోభిని కూడ జ్ఞాని అనవలసివస్తుంది. కావున ఈ శ్లోకములో శ్రీ కృష్ణుడు లోతుగా చెప్పిన జ్ఞానమును గ్రహించితే చర అచర ప్రకృతిని గూర్చి జ్ఞానులైనవారు చింతించరని, ప్రకృతికి అతీతమైన దైవమును గూర్చి చింతించువాడు నిజమైన జ్ఞానియని తెలియుచున్నది. ఇంతవరకు ఈ అధ్యాయమున మొదటి శ్లోక అర్థమును అందరికి భిన్నముగ వ్రాశారే అని కొందరనుకోవచ్చును. ఎందరో స్వాములు, పీఠాధిపతులు, యోగులు చెప్పిన భావమును కాదనవచ్చునా? అని కొందరడగ వచ్చును. అందరికి ఒకే జవాబు చెప్పడమేమనగా! నిజము నిప్పులాంటిది. ఎప్పటికైనా బయటపడగలదు. దాచబడిన సత్యమును బహిర్గతము చేయుటయే నాపని అయినపుడు ఒక్క భగవద్గీతయే కాదు, ఏ మతములోని జ్ఞానమునైన విప్పి చెప్పడము నా కర్తవ్యము. ఈ నా కార్యములో భగవద్గీతలో తర్వాత వచ్చు శ్లోకములకు కూడ భావమార్పిడి తప్పకయుంటుంది. ఇది త్రైతము అను సిద్ధాంతము మీద ఆధారపడి వ్రాయునది, కావున శాస్త్రబద్ధమైనదిగ లెక్కించి చూడవలెను. ఈ శ్లోకముగాని, రాబోవు శ్లోకములుగాని హేతువాదులకు ప్రశ్నలు మిగల్చవని అన్నిటికి అందరికి సమాధానమై ఉంటాయని తెలుపుచున్నాము.

ప్రతి శ్లోకము నాలుగు సూత్రముల ప్రకారము చూడవలయునని ముందే చెప్పియున్నాము. వాటిని మరొక్క మారు గుర్తు చేయుచున్నాము. 1) చదువుచున్న శ్లోకము జీవాత్మకా, ఆత్మకా, పరమాత్మకా, ప్రకృతికా, ఎవరిని గూర్చి చెప్పబడినది. 2) చదువుచున్న శ్లోకము బ్రహ్మయోగమునకా లేక కర్మయోగమునకా దేనిని గూర్చి చెప్పబడినది. 3) చదువుచున్న శ్లోకము సాకారమునకా నిరాకారమునకా, ఎవరిని గూర్చి చెప్పబడినది. 4) చదువుచున్న శ్లోకము శాస్త్రబద్ధమైనదా కాదా! అన్నవి సూత్రములైతే నాల్గవ సూత్రము ప్రకారము శాస్త్రబద్ధమైన శ్లోకములనే మేము వ్రాస్తు శాస్త్రబద్ధము కాని వాటిని వదలివేయుచున్నాము. కావున మీరు ముఖ్యముగా చూడవలసినవి మూడు సూత్రములు మాత్రమే. అవి కూడ మీకు అర్థమగునట్లు ఏ శ్లోకము దేనికి సంబంధించినదో శ్లోకము ప్రక్కన బ్రాకెట్లో తెలుపుచుందుము. అందువలన శ్లోకము ప్రక్కన బ్రాకెట్ లో ఉన్న దానిని ప్రతి ఒక్కరు గమనించ వలసినదిగా తెలుపుచున్నాము.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 12: న త్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః |
నచైవ న భవిష్యామ స్సర్వే వయ మతః పరమ్||
(జీవాత్మ)

భావము: నేను లేకుంటిననుట ఎప్పటికీ లేదు. నీవు ఎప్పటికీ ఉందువు. ఈ ధరణి పాలించు రాజులు కూడ ఎప్పటికీ ఉందురు. ఇక ముందు కూడ మనమందరము లేకపోవుటనునదే లేదు.
వివరము: సమస్త జీవరాసులు లేకుండ పోతాయని నీవు బాధపడుచున్నావేమో! ఎవరూ లేకుండా ఎప్పటికీ పోరు. జీవరాసులైన వారు ఎవరైన కాని, నేను కాని, నీవు గాని, ఈ భూమికి రాజులైన వారుగాని, జీవముగల ప్రతి ఒక్కరు లేకుండ పోవుదురనుట అసత్యము. అందరము ఎప్పటికి ఉండగలము అని శ్రీ కృష్ణుడన్నపుడు మనకొక ప్రశ్న ఉద్భవించగలదు. మనమంతా కొంతకాలముండి చనిపోవుచున్నాము కదా! అటువంటప్పుడు శాశ్వతముగ ఉంటామని, లేకుండాపోవుదుమనుట అసత్యమని ఎలా అనగలము? దానికి సమాధానముగ క్రింది శ్లోకమున ఇలా ఉన్నది.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 13: దేహినోఽ స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తర ప్రాప్తి ర్ధీర స్తత్ర న ముహ్యతి||
(జీవాత్మ)

భావము: దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము,కౌమారము, ముసలి తనము వరుసగ ఎట్లు కల్గునో, అట్లే శరీరమును వదలిపోవడమను మరణము కూడ కల్గుచున్నది.
వివరము: దేహమునందు నివశించు దానిని దేహి అనుచున్నాము. దేహమునందు మూడు ఆత్మలు నివశించుచున్నవి. ఒకటి జీవాత్మ, రెండవది ఆత్మ, మూడవది పరమాత్మ. ఈ మూడింటిని సందర్భానుసారముగ అర్థము చేసుకోవాలి కాని జీవాత్మకు చెప్పినచోట ఆత్మకు, ఆత్మకు చెప్పినచోట పరమాత్మకు, పరమాత్మకు చెప్పినచోట జీవాత్మకు అర్థము చేసుకోకూడదు. చాలా గీతలలో ఈ శ్లోకము జీవాత్మకు చెప్పినదనుకోక దేహి అనగానే ఆత్మ అనుపదమును ఉపయోగించి చెప్పారు. దేహి అనగానే ఒకటవద లేక రెండవద, మూడవద అని పరికించి చూడడము లేదు. ఇటువంటి పొరపాట్లు జరుగునను ఉద్దేశ్యముతోనే మేము ప్రతిశ్లోకము ప్రక్కన బ్రాకెట్లో ఆ శ్లోకములో దేనిని గురించి ఉన్నదో దానిని గుర్తించుచున్నాము. అర్జునుడు మానవులైన జీవాత్మలనబడు వారిని గూర్చియే అడిగాడు, దైవస్వరూపమైన ఆత్మను గూర్చి ఆయన అడుగలేదు. అందువలన ఈ శ్లోకమున జీవాత్మను గూర్చి చెప్పడమే జరిగినది.

జీవాత్మ ఒక శరీరము ధరించినపుడు ఆ శరీరమును బట్టి కొంతకాలము బాల్యమంటాము. కొంతకాలము జరుగగా వయస్సు వచ్చిన తరువాత శరీరమందు గల జీవాత్మకుకాక శరీరమునకు యవ్వనము వచ్చును. అట్లే కొంతకాలము జరుగగా కౌమారము, ఇంకా కొంతకాలము గడువగ ముసలితనము శరీరమునకు ఏర్పడును. కాని శరీరమునకిన్ని జరుగుచున్నను లోపల గల జీవాత్మకు మాత్రము వయస్సు పెరగడము తరగడమనునది లేదు. వయస్సు పెరగడము ఒక్క శరీరమునకే కాక శరీరము నందే బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం మొదలగు దశలు ఏర్పడుచున్నవి.

మనకొక కారు లేక జీపు ఉందనుకొనుము. అది బాగున్న వరకు దానిని ఎక్కి పయణించగలము. కొంతకాలమునకు దానిలోని టైర్లు అరిగిపోవును. అలా టైర్లు పూర్తిగా కారుకు అరుగుచున్నవి కాని అందులో కూర్చున్న వ్యక్తి కాళ్ళు అరగడము లేదు కదా! కొంత కాలమునకు టైర్లు పూర్తీగా అరిగిపోయి అవి దొర్లలేని స్థితికి వచ్చి బండి నిలిచిపోయినపుడు, అందులో పయణిస్తున్న వ్యక్తికి ఏమీకాలేదు కదా! కారుకు అరిగిన టైర్లు పనికిరావని అవి తీసివేసి వేరే క్రొత్త టైర్లు మార్చుకుంటాము. టైర్లు అరుగు కొద్ది అందులో కూర్చున్నవాడెట్లు అరిగిపోలేదో, అట్లే శరీరము ధరించి దానిని వాడుకొనుచున్న జీవాత్మకు శరీరమునకు వచ్చినట్లు వృద్ధాప్యము రాదు. అరిగిపోయిన టైర్లు మార్చి క్రొత్త టైర్లు తగిలించుకొని బండిని నడుపుకొన్నట్లు, పాతబడిన శరీరమును వదిలి క్రొత్త శరీరమును పొంది జీవాత్మ కాలము గడుపుకొనుచున్నాడు. ఎంత కాలము జరిగిన, ఎన్ని సంవత్సరములు జరిగిన జీవాత్మ ఎప్పటిలాగనే ఉండును. వానియందు ఏ మార్పురాదు. ఒక శరీరము ధరించినపుడు పేదగా, మరియొక శరీరము ధరించినపుడు రాజుగా ఉండవచ్చును, కాని వాడు మాత్రము లేకుండ పోవుట అసత్యము. అందువలననే భగవంతుడు నీవుగాని ఈ రాజులుగాని లేకుండా పోవుదురనుట లేదు అన్నాడు. ఇక్కడొక సందేహము కొందరికొచ్చి, ఇది మామూలు జీవాత్మలకు వర్తించు సూత్రము, భగవంతుడైన శ్రీ కృష్ణుడు నేనుకూడ అని పల్కుచు మన అందరము లేకుండపోము అన్నప్పుడు దేవునికి కూడ ఈ సూత్రము వర్తించునా అని అడగవచ్చును. దానికి సమాధానము దేవుడైనవాడు కూడ మామూలు మానవునివలె శరీరము ధరించి ఉన్నాడు. కనుక సర్వ శరీరములకు వర్తించు సూత్రము ప్రకారము తనను కూడ కల్పుకొని చెప్పాడు. అదియును కాక తాను దైవము గనుక ఎప్పటికి ఉండువాడే కావున తాను కూడ ఎల్లప్పుడుండు వానిగా చెప్పాడు.

ఇక్కడ మరియొక ప్రశ్న రాగలదు. జీవాత్మ జ్ఞానము తెలుసుకొని మోక్షము పొంది జీవాత్మగా నశించిపోయి పరమాత్మగా మారినపుడైన జీవాత్మకు నాశనము గలదు గదా! ఆ ఉద్దేశ్యముతోనే కదా జీవాత్మను క్షరుడన్నారు(నాశనమగు వాడన్నారు). అలా పరమాత్మలో చేరిపోయినపుడు జీవాత్మ నాశనమైపోయినవాడే కదా! అప్పుడు వాడు లేకుండా పోవుచున్నాడు కదా! అలాంటపుడు ఎప్పటికి లేకుండా పోవుననుటలేదు అనడములో గొప్పతనమేమిటని అడుగవచ్చును. దానికి మా సమాధానమేమనగా! ఇక్కడ శ్లోకమునందు చెప్పినది జీవులకేయైనప్పటికి, అది కేవలము అజ్ఞానములో ఉన్నవారికి మాత్రము చెప్పుచున్న విషయము. సర్వ సాధారణ జీవుల గురించిన విషయము తప్ప ఇతరము కాదని తెలియాలి. ఎందుకనగ శరీరములు నశించినపుడు అనగా చంపబడినపుడు లేక మరణము పొందినపుడు అందులో గల జీవుడు కూడ నాశనమగునేమోనన్న అర్జునుని అనుమానమునకు తగినట్లు శరీరమార్పిడిలో జీవాత్మ నశించడని చెప్పబడినది. ఇది ఒక శరీర మార్పు ఎడల శరీరము నశించినపుడు జీవాత్మ యొక్క స్థితిని గూర్చి చెప్పినది. ముందు శ్లోకములలో కర్మ నశించినపుడు జీవాత్మ పూర్తి నశించి పోవును గాన జీవాత్మ క్షరుడు అనబడుచున్నాడు.

ఈ శ్లోకములో ముఖ్యముగ మూడు ఆత్మలయందు కేవలము ఒక్క జీవాత్మను గూర్చి చెప్పబడినదని మరియు శరీరపతనము జరిగినపుడు శరీరము మాత్రము పోయి జీవాత్మ పోకుండ ఎక్కడో ఒకచోట ఉండగలడని తెలియబరచ బడినది. ఇది శరీరపతనము ఎడల జీవాత్మ మార్పును గూర్చి చెప్పినది కాని కర్మ పతనము ఎడల చెప్పినది కాదని తెలియాలి. అదియును చాల భగవద్గీతలలో ఎందరో వ్రాసినట్లు ఈ శ్లోకము ఆత్మకు కాదు కేవలము జీవాత్మకని తెలియాలి.

సరే, ఈ విషయము తెలిసిన తరువాత అర్జునుడు లేక మనము కాని ఎదుటివాడు లేక మన ఇంటిలో వానికి శరీర దశలన్ని జరిగి పోయినపుడు వీడు శరీరమును మాత్రము వదలిపోయినాడు, వీడు నాశనము పొందలేదు, వీడు ఉన్నాడు, వాని కోసంఎందుకు ఏడ్వాలి అని తెలిసినప్పటకి మనకు పరిచయమున్న ఈ శరీరము వదలి పోయినాడు కదా అనో లేక వాడు మన దగ్గరలేకుండా ఈ శరీరము వదలి ఎక్కడికో పోయాడు కదా! ఇక వాడున్నప్పటికి వాడు ఎక్కడున్నది మనకు తెలియదు కదా! అని అంతో ఇంతో దుఃఖము పొందుదుము. వాడు చనిపోయాడని కాదు, వాడు దూరమాయెనని ఏడ్చుచున్నామని తెలిసినవారనుట కూడ వినవచ్చును. అందువలన భగవంతుడు తిరిగి ఇంకొక శ్లోకమున ఇట్లనుచున్నాడు.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 14: మాత్రాస్పర్శాస్తు కౌంతేయ! శీతోష్ణసుఖదుఃఖదా: |
ఆగమాపాయినో నిత్యాస్తాం స్తితిక్షస్వ భారత!||
(జీవాత్మ)

భావము: పంచతన్మాత్రలచేత, శీతోష్ణములు సుఖదుఃఖములు మానవులకు కల్గుచుండును. శీతోష్ణములు సుఖదుఃఖములు ఎప్పటికి ఉండునవి కావు. అశాశ్వతములైనవి. వచ్చిపోయెడు వాటిని ఆ కొద్దికాలము ఓర్చుకోవలయును.
వివరము: పంచతన్మాత్రలనునవి మన శరీరములో జ్ఞానేంద్రియములకుండు శక్తులు. జ్ఞానేంద్రియములైదు కావున ఆ ఐదుకు గల శక్తులను ఐదు తన్మాత్రలని అందురు. ఉదాహరణకు జ్ఞానేంద్రియములలో కన్ను కలదు కదా! ఆ కన్ను అందరికి ఉండినప్పటికీ దానికి గల చూపులో మనిషికి మనిషికి తేడా ఉండును. ప్రతి మనిషికి గల కన్ను కనిపించగలదు. కాని ఆ కళ్ళకెంత చూపున్నదో కనిపించదు. ఇంద్రియమైన కన్ను కనిపించినప్పటికి, దానిశక్తియైన తన్మాత్రయను చూపు కనిపించదని తెలియాలి. అనగా కన్ను వేరు, చూపువేరని, కన్ను కనిపించినప్పటికి చూపు కనిపించదని తెలియుచున్నది. అట్లే ఇతరుల చెవి కనిపించినప్పటికి, వారి చెవికి ఎంత వినికిడి ఉన్నదో వాడు చెవిటివాడో కాదో చూస్తూనే చెప్పలేము. ఈ విధముగా కనిపించు 1) కన్ను 2) ముక్కు 3) చెవి 4) నాలుక 5) చర్మము అనువాటికి 1) చూపు 2) వాసన 3) శబ్దము 4) రుచి 5) స్పర్శ అను కనిపించని తన్మాత్రలు గలవు.

ఈ తన్మాత్రల వలననే శరీరములో ఉన్న జీవులకు బయటి ప్రపంచపు విషయములు తెలియుచున్నవి. ఆ విషయములు తెలియుట వలననే వానికి సుఖము దుఃఖములు కలుగుచున్నవి. దేహము ధరించిన ప్రతి జీవికి అనగా వాడు ఏ మతమువాడైనగాని, ఏ జాతివాడైనగాని, ఏ జీవరాశియైనగాని పంచతన్మాత్రల ద్వారానే శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము కలగాలి. ఈ సిద్ధాంతము ప్రకారము మనము కూడ తన్మాత్రల ద్వారా సుఖదుఃఖములు అనుభవిస్తున్నాము.

ఒక మనిషికి దగ్గరైన భార్య వానితో మాట్లాడుట వలన శబ్దము అను తన్మాత్రతో సంబంధపడుచున్నాడు. ఆమెను చూచుచుండుట వలన అతను చూపు అను తన్మాత్రతో సంబంధపడివున్నాడు. ఆమె చనిపోయినపుడు తన్మాత్రలచేత సంబంధము కల్గివున్నవాడు కావున వానికి అంతో ఇంతో జ్ఞానముండిన, ఆమె శరీరము చనిపోయినది కాని ఆమె చనిపోలేదని తెలిసినప్పటికి, తన్మాత్రల ప్రాబల్యము వలన వానికి దుఃఖము ఏర్పడును. ఆ దుఃఖము కొద్దిరోజులకు లేకుండ పోవుచున్నది. ఎందుకనగ తన తన్మాత్రలు వేరు విషయములందు లగ్నమై ఆ విషయసంబంధ సుఖదుః ఖములను కలుగజేయుచుండును. కనుక మొదటి సుఖదుఃఖములు మనిషి మరచి పోగలుగుచున్నాడు. ఇట్లు కొంతకాలమునకు భార్యతో ఉన్న తన్మాత్రల విషయములు మరిచిపోవుట వలన ఆమె జ్ఞప్తికిరాదు, ఆ దుఃఖమురాదు. తన్మాత్రలు బయటి విషయముల సుఖదుఃఖములు కలుగజేయునవి, కావున కాలక్రమమున ఏ సుఖము గాని శాశ్వతముగ ఉండక మారిపోవుచుండును. అందువలన తనవాడు పోయినప్పటికి వాని దుఃఖము కొంతకాలమే, అట్లే తనకు కుమారుడు పుట్టినప్పటికి తనకు సంతోషము కొంతకాలమే. కావుననే గీతయందు ఈ శ్లోకమున "శీతోష్ణ సుఖదుఃఖదా: ఆగమాపాయిన అనిత్యాః" అని అన్నాడు. అంటే రాకపోకలు కలిగినవి, అనిత్యములైనవి, సుఖదుఃఖములని అర్థము. ఇటువంటి అశాశ్వతమైన సుఖ దుఃఖములు, తన్మాత్రలు ఉండుట వలన ఎవరికైన అవి కలుగుచుండును. అయినప్పటికి వాటికి ఆ సమయములో సుఖములకు పొంగక, దుఃఖములకు కృంగక కొంత ఓర్చుకోవలయును.

ఎంతటి జ్ఞానికైన సుఖదుఃఖములు కలుగుట తప్పదు. అట్లు కల్గినప్పటికి వాటినొకింత ఓర్చుకొని వాటి వ్యథ ఎవడైతే పొందడో, అటువంటి వాడు ఎంతటి సమర్థుడు, దేనికి సమర్ధుడన్న విషయము క్రింది శ్లోకమున భగవంతుడు చెప్పుచున్నాడు .

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 15: యం హి న వ్యథయం త్యేతే పురుషం పురుషర్షభ|
సమ దుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే||
(జీవాత్మ)

భావము: ఎవడు సుఖదుఃఖ భేదములెంచుకొనడో, ఎవనికి వాని వ్యథ కలుగదో వాడే అమృతత్వమునకు అర్హుడగును.
వివరము : కష్టసుఖములు శీతోష్ణములు కలుగుచున్నప్పటికి కొంత ఓర్చుకొనవలెనని చెప్పాడుగా! అట్లు ఓర్చుకొనుటకు అలవాటుపడుట వలన తన్మాత్రల సంబంధము లేకుండా పోవచ్చును. అట్లు అలవాటు పడుచు చూపు,స్పర్శ,వాసన, రుచి శబ్దములతో సంబంధపడక పోవుట వలన వానికి బ్రహ్మయోగము అలవడి మృతములేని, నాశనముకాని పరమాత్మను పొందుటకు అర్హుడగును.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 16: నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయో రపి దృష్టోఽన్త స్త్వనయో స్తత్త్వదర్శిభిః||
(ఆత్మ)

భావము: సత్తు కనుక ఆత్మకు నాశనము లేదు. శరీరము అసత్తుకనుక దానికి నాశనము తప్పదు నిశ్చయమైన ఈ రెండిటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించినవారికి తెలిసివుండును.
వివరము: మన శరీరములో జీవాత్మయే కాక ఆత్మ అనుననదొకటున్నది అది నాశనములేనిది. నాశనముగల జీవాత్మ నివాసమున్న శరీరములోనే నాశనము లేని ఆత్మ కూడ ఉన్నది. జీవాత్మ శరీరములు మారుచు నాశనము కాక ఉండినప్పటికి మోక్షము(శరీరములను జైలు నుండి విడుదల) పొందినపుడు నాశనము కావలసిందే. కావున జీవాత్మను క్షరుడు(నాశనమగువాడు) అనుచున్నారు. జీవాత్మవలెకాక ఆత్మ శరీరములందంతయు సమానముగా ఆవహించివున్నను నాశనము లేదు. కావున దానిని అక్షరుడు(నాశనములేని వాడు) అన్నారు. అమృతుడైన ఆత్మ అన్ని జీవ శరీరములందు వ్యాపించి, ఆయా జీవరాసుల తలలో కేంద్రమేర్పరచుకొని నివసిస్తు, శరీరనాడుల ద్వారా దాని శక్తిని శరీరమంత ప్రసరింపజేయుచున్నది. అన్ని జీవ శరీరములందు అవయవములు పనిచేయుటకు ఈ ఆత్మశక్తి అవసరము. ఆత్మశక్తి లేనపుడు అవయవములు పనిచేయవు. మనకు ఉపయోగపడు రేడియో, ఫ్యాను, లైట్లు వివిధ రకముల పరికరములు పనిచేయుటకు విద్యుత్ అను శక్తి ఎలా అవసరమో, అలాగే మన శరీర అవయవములు పనిచేయుటకు ఆత్మచైతన్యమను శక్తి ఉపయోగపడుచున్నది. ఆత్మచైతన్యములేని సజీవశరీరము భూమి మీద ఉండదని తెలియాలి. జీవుడు సుఖదుః ఖములను అనుభవించుటకు గాని, శరీర అవయవములు కదులుటకు గాని, శరీరాంతర్భాగములు పనిచేయుటకు గాని అన్నిటికి ఆత్మశక్తిలేనిది కుదరదు. సమస్త శరీరములలో సారాంశమైనది ఆత్మ చైతన్యశక్తియే కావున ఆత్మను సత్తు అని పిలిచెడివారు. ఆత్మలేని శరీరము సత్తులేనిది కావున నిస్సత్తువైనదని సత్తు పోయినదని అనెడివారు.

ప్రతి జీవరాశిలోను ఈ సత్తు గలదు. ఆవులో, ఏనుగులో, చీమలో, దోమలో, మనిషిలో అందరిలోనూ ఒకే విధమైన సత్తు(ఆత్మ) గలదని తెలియాలి. సత్తు శరీరమంత వ్యాపించి ఉన్నపుడు అన్ని అవయవములు పనిచేయుచుండును. ఆ సత్తు ఒక చేతిలోకి ప్రసరింపలేదనుకొనుము అప్పుడు ఆ చేయి పని చేయదు. అటువంటి వాడు పూర్వము నా చేయి సత్తుపడి పోయిందని చెప్పెడివాడు. కాలక్రమమున 'సత్తు' అను మాట 'సచ్చు' అను మాటగ మారినది. అందువలన ఇపుడు కూడ చేయి పని చేయనివాడు నాచేయి 'సచ్చు' పడిపోయిందని పలుకుట ప్రత్యక్ష ప్రమాణముగ గలదు. అట్లే నా కాలు సచ్చు పడిపోయిందనుట కూడ వినుచుందుము. ఆ పడిపోయిందని దేనినంటున్నామో అదియే ఆత్మశక్తియని తెలియాలి, అది లేనిది ఏ మతస్థుని శరీరము పనిచేయదు.

నాది ఈ మతము, నీది ఆ మతమని ఎన్ని భేదములు పెట్టుకొన్నను వారందరికి సత్తు ఒక్కటే, అది మనుజులకే కాదు అన్ని జీవరాసులలో కూడ ఉన్నది. ఆవు శరీరములో సత్తుపోయిందనుకుందాము. అప్పుడు దానిని ఆవు సత్తుపోయిందని పూర్వము అనెడివారు. ఈనాడు ఆ మాటనే ఆవు సచ్చిపోయిందని అంటున్నాము. అట్లే గేదె సచ్చిపోయింది, ఎద్దు సచ్చిపోయిందనుచున్నాము. అదేవిధముగా మనిషి కూడ సచ్చిపోయాడంటున్నాము. ఆ సచ్చి అనగా సత్తు ఏమిటని ఎవరు యోచించలేదు. మనయందు గల మనము యోచించని సత్తునే ఆత్మనియు పిలువవచ్చును.

సత్తు అనబడు ఆత్మకు ఒక సిద్ధాంతము గలదు. అది ఏమనగా ! జీవాత్మ ఎచ్చటైతే ఉందో అచట ఆత్మ కూడ ఉండవలయును. అందువలన జీవాత్మ వదలిపోవు శరీరమును ఆత్మకూడ వదలి పోవు చున్నది. జీవాత్మ ఎచట ప్రవేశిస్తున్నదో ఆత్మకూడ అచటనే ప్రవేశిస్తున్నది. మరణములో జీవాత్మతో పాటు పోయిన ఆత్మ, పుట్టుకతో జీవాత్మతో పాటు శరీరమందు ప్రేవేశిస్తున్నది. అందువలననే మరణించిన శరీరమందు కదలికలు నిలిచిపోవడము, పుట్టిన శరీరమున కదలికలు రావడము జరుగుచున్నది. శరీరములకు స్వయం చైతన్యశక్తి లేదు కనుక వాటిని అసత్తు అనుచున్నాము. స్వయం చైతన్యశక్తి గల ఆత్మను సత్తు అంటున్నాము. చైతన్యములేని అసత్తయిన శరీరములు కృశించి నశించిపోగలవని, సత్తయిన ఆత్మ నాశనము కానిదని ఆత్మను తెలుసుకొన్న వారికి పూర్తి అర్థమై ఉండును. సర్వశరీరములకు దీపము లాంటిది సత్తు. అది ఉన్నదాని వలననే కొందరు మంత్రిపదవులు, మరికొందరు కంత్రీపదవులు, కొందరు పోలీసు ఇన్ స్పెక్టర్లు , కొందరు కలెక్టర్లు , కొందరు దొంగలుగా అనేక విధములుగా మానవ జాతి మనగలుగుచున్నది. అది తెలియక నేను పోలీస్ ఆఫీసర్ నని కర్ర చేతితో పట్టుకొని ఆడిస్తు , ఆ ఆడించే శక్తి ఎవరిదో తెలియక విర్రవీగ కూడదు. అట్లు నేను ఒక జడ్జినని నాచేతిలో కలమున్నదని, నేను ఎట్లు వ్రాస్తే అట్లు జరుగునని అనుకోకూడదు. ఆ వ్రాతకు ఉపయోగపడు శక్తి ఎవరిదో తెలియాలి. సర్వసాధారణముగ అందరు నాలో ఉన్నది నాశక్తి కాక ఇంకెవరి శక్తియని అనుకోవచ్చును. ఆత్మ జీవాత్మల విషయము తెలిసిన ఏసును ఒకనాడు ముద్దాయిగ కోర్టులో నిలబెట్టిన దినమున, ఆ జడ్జి 'నేను ఏమి చెప్పితే ఆ శిక్ష అమలు జరుగును' అని చెప్పినపుడు ఏసు ఇలా అన్నాడు 'పై నుండి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు' ఆ మాటయందు ఎవరు స్వతంత్రులు కాదని, అందరికి పై అధికారి ఆత్మ(సత్తు) ఉందని స్పష్టమగుచున్నది. ఇంకనూ పరమాత్మ ఎట్టిదనిన ముందు శ్లోకమున చూడుము.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 17: అవినాశి తు తద్విద్ధి యేన సర్వ మిదం తతమ్|
వినాశ మవ్యయ స్యాస్య న కశ్చి త్కర్తు మర్హతి||
(పరమాత్మ)

భావము: నాశనములేని పరమాత్మ ప్రపంచమంత వ్యాపించి సర్వము ఇమిడి ఉన్నది. ఇది శరీరంలోపల కూడ ఉన్నది. అట్టి దానిని ఎవడు నాశనము చేయలేడు.
వివరము: జీవాత్మతో పాటు ఆత్మ కూడ శరీరమందు నివశించుచున్నది. జీవాత్మ ఆత్మయేకాక పరమాత్మ అనునది కూడ శరీరమందు నివశించుచున్నది. పరమాత్మ, జీవాత్మ ఆత్మవలె శరీరములందే కాక, శరీరముల బయట కూడ అంతట వ్యాపించి సర్వము నిండినదైయున్నది. అవధిలేని పరమాత్మ శరీరము లోపల, బయటనేకాక మిగతా నిర్జీవమైన అన్ని పదార్థములందు కూడ అణువణువున వ్యాపించి ఉన్నది. దానికంటే భిన్నమైనది వేరేదియును లేదు. ఒకచోట ఉండి మరొకచోట లేనిదానినైతే చంపవచ్చును. అట్లుకాక అంతట ఇమిడియున్న దానిని ఎవరు చంపగలరు. చంపుటకు కనిపించునది కాదు, తెలియునది కాదు. శరీరమును ఎవడైన చంపవచ్చును. అందువలన ఆ శరీరములోని ఆత్మ జీవాత్మల జోడి మరొక శరీరమును ఆశ్రయించుచున్నవి. ఆత్మ, జీవాత్మలవలె కాక పరమాత్మ చనిపోయిన శరీరములో కూడ అణువణువున వ్యాపించి ఉన్నది. అందువలన అది ఎవరిచేత చంపబడునది కాదు, ఎవరు దానిని చంపలేరు.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 18: అన్త వన్త ఇమే దేహాః నిత్యస్యోక్తా శ్శరీరిణః|
అనాశినో ఽ ప్రమేయస్య తస్మా ద్యుధ్యస్వ భారత!||
(ఆత్మ, పరమాత్మ)

భావము: శరీరములలో నిత్యము ఉండువాడైన ఆత్మయు, నాశనములేని వాడు అప్రమేయుడు అయిన పరమాత్మయు నివశించు శరీరమునకు ఎప్పటికైన నాశనము తప్పదు కావున యుద్ధము చేయుము.
వివరము: ఒక సజీవ శరీరమును విడదీసి చూచిన అందులో శరీరము కాక జీవాత్మ, ఆత్మ, పరమాత్మలనునవి మూడు ఉన్నాయని తెలియుచున్నది. ఈ శ్లోకములో జీవాత్మను గూర్చి ఏమాత్రము చెప్పక శరీరము ఆత్మ పరమాత్మల గూర్చియే చెప్పారని తెలియాలి. "అంతవంత ఇమే దేహా" అన్న మాటను బట్టి ఈ దేహమునకు నాశనము కలదని అర్థము. ఎప్పటికైన నాశనము కాగల శరీరములో నిత్యుడైన ఆత్మ ఉన్నాడు. ఈ ఆత్మ ఒక్క శరీరమునందు ఒక్క ఖండముగ ఉంటు, సమస్త శరీరములందు ఒకే అంశముగా ఉన్నది. కనుక అన్ని శరీరములందున్న ఆత్మలు ఒక్కటేనని తెలియుచున్నది. అన్ని శరీరములలో ఉన్న జీవాత్మలు కర్మరీత్య వేరు వేరుగ ఉన్నవి. అవి అన్ని ఒకటికావు, అవి ఒకదానికొకటి భిన్నమైనవి, అందువలన జీవాత్మలు అనేకముగా ఉన్నాయి. ఆత్మ అట్లుకాక అనేక శరీరములలో అనేక ఆత్మలున్నప్పటికి అవన్నియు ఒక్కటేనని తెలియాలి. ఒక శరీరములో ఉన్న ఆత్మ హత్య కావింపబడినప్పటికి అన్ని శరీరములలో ఉండు ఆత్మ మిగిలి ఉన్నది. కావున ఆత్మకు నాశనము లేదన్నాము. ఇక్కడ ముఖ్యముగ గ్రహించవలసిన విషయము ఏమనగా! ఒక్క శరీరపరముగ చూచిన నాశనము కాగల ఆత్మ, సమస్త శరీరపరముగ చూచినపుడు నాశనములేనిదని చెప్పవచ్చును. ఈ విషయము ముందు శ్లోకములలో వివరముగ ఉన్నది.

పరమాత్మ విషయానికొస్తే ఎప్పటికి ఎక్కడ నాశనములేనివాడు, దేని చేతను తెలియబడనివాడు, చివరకు యోగముచేత కూడా తెలియబడనివాడు, ఏ ప్రమాణము చేత తెలుపబడని వాడు, ఏ పేరు లేనివాడు అయిన పరమాత్మయు మరియు ఆత్మయూ ఈ శరీరమందు నివశించుచున్నవి. అయినప్పటికి శరీరము ప్రకృతి జనితమైనది కావున దానికి నాశనము తప్పక కల్గును. ఈ దేహము శాశ్వతముగ ఉండునది కాదు. ఎందుకనగా శరీరమునకు బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అను మొదలగు దశలు కలవు. ఒకదాని వెంట ఒకటి అవి నాశనము వైపు ప్రయాణిస్తున్నవి. చివరకు శరీరము శిథిలమై మరణమేర్పడును. కాని శరీరములోని ఆత్మకు పరమాత్మకు శరీరమునకున్నట్లు దశలు లేవు. అందువలన వాటికి నాశనము లేదు. శరీరము కొన్ని భాగములతో కూడుకొనియున్నది. మార్పుచెందు కనిపించు స్థూలశరీరము పది భాగములుగ ఉన్నది. పది భాగములైన స్థూలశరీరము ప్రతి దినము క్షణక్షణము మార్పుచెందుచున్నది. ఎలా అనగా దినమునకు 12 గంటలు పగలు లేక 720 నిమిషములు, సెకండ్లయితే 43,200. స్థూలశరీరమైన పది భాగములు సూక్ష్మముగ కనిపించకుండ మార్పు చెందుచున్నది. అందువలన ఒక దినమునకు పదింతల కాలమును 4,32,000 సూక్ష్మ కాలమంటాము. ఒక దినమునకు కనిపించని 4,32,000 మార్పులు శరీరములో జరుగుచుండుటవలన కొంత కాలమునకు శరీరము ముసలిదగుచున్నది. ప్రత్యక్షముగ కనిపించు శరీరము పరోక్షముగ మార్పుచెందుచున్నదని చాలామందికి తెలియదు. ప్రత్యక్షముగ క్షణక్షణముగ మార్పు చెందుచున్నదని, అట్లే నాశనము గలదని కూడ అందరికి తెలియును. అట్టి శరీరమును గూర్చిలెక్కించక యుద్ధము చేయమన్నాడు. కలియుగము ఆయుస్సు కూడ 4,32,000 సంవత్సరములనుట గమనార్హము.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 19: య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్|
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే||
(జీవాత్మ)

భావము: జీవాత్మను చంపుదునని ఎవడనుకొనునో మరియు అది చంపబడునని కూడ ఎవడనుకొనునో ఆ ఇరువురు ఙ్ఞానశూన్యులని తెలియుము. జీవాత్మ చావునది కాదు, చంపబడునది కాదు.
వివరము: జీవాత్మ చచ్చునది కాదు, చంపబడునది కాదు అనుమాట బహుశ ఈ యుగములో మాదే మొదటి మాటై ఉండవచ్చుననుకొంటాము. జీవాత్మకు చావులేదని బహుశ ఏ భగవద్గీతలోను మీరు చూచి ఉండరనుకొంటాము. ఎంతో మంది పెద్దలు చెప్పలేని దానిని మీరెట్లు చెప్పుచున్నారను ప్రశ్న మీరేయవచ్చును. దానికి సమాధానము ఇంతవరకున్న భగవద్గీతలలో పురుషుడైన పరమాత్మను ముగ్గురు పురుషులుగా విభజించుకోలేదు. ఆ ఒక్క తప్పే అందరిని తప్పుత్రోవ పట్టించింది. గమ్యము తప్పిన దారియై సంశయాలతో కూడుకొని జవాబు లేకుండ చేసినది. ఈ మాటలు చాలా మంది పెద్దలకు బాధకల్గించునని కూడ మాకు తెలుసును. అయినప్పటికి ఒకరికి బాధకల్గించునని సత్యమును దాచకూడదు. అందులోను జ్ఞానవిషయములలో మరీ జాగ్రత్తగా ఉండాలి. వాస్తవమును ధైర్యముగా ప్రకటించాలి. సప్రమాణమైన సత్యమును దాచుటవలన మహాపాపమేర్పడును.

ఒక విధముగ ఇంతవరకు ఈ విషయమును వ్రాయని పెద్దలదేమి తప్పులేదని చెప్పవచ్చును. ఎందుకనగా! మాయ దైవనిర్మితమైనది. ఒక విధముగా దానికి దైవశక్తి ఉందని చెప్పవచ్చును. దైవమును గూర్చి బోధించ వలయుననుకొను వారిమీదనే ఎక్కువ బలముగా పనిచేయును. మాయకు వ్యతిరిక్తమైన వారు బోధకులని, వారిని తప్పుదోవ పట్టిస్తే వారిననుసరించి మిగతావారంతా ఇది మంచిదనుకొని దానివెంటపోగలరని మాయ యొక్క అభిప్రాయము. అందువలన మనము మాయా ప్రభావంలో చిక్కుకొనక, మనకు ఇతరులు చెప్పుట సరికాదను ఈర్ష్యను వదలి బుద్ధికి పదునుపెట్టి చూడగలరని ఆశిస్తున్నాము. ఇంతేకాదు ఇక్కడ జీవాత్మకు చావులేదని చెప్పడము ఒక సంచలనమైతే, తర్వాత ఆత్మకు చావున్నదని చెప్పడము మరియొక సంచలనం. ఇవన్నియు సహేతుకముగా చెప్పబడినవే. హేతువాదులకు జవాబునిచ్చు విషయములే. ఇంతవరకు అగమ్యగోచరముగ ఉన్న విషయములను వివరముగ తెలుసుకొని ఏ ప్రశ్నకైన జవాబిచ్చువారుగ మారి ఇతరులకు ఈ క్రొత్త విషయ వివరమును తెలియజేసి అజ్ఞానమును రూపుమాపుదురని కోరుచున్నాము.

భగవద్గీతయందు ఒక సందర్భములో జీవుడు క్షరుడు, ఆత్మ అక్షరుడు అన్నారు. అటువంటప్పుడు ఇక్కడేమో ఆత్మచావునని(క్షరుడని), జీవుడు చావడని(అక్షరుడని) చెప్పడము కనిపించు పొరపాటు కాదా! అని కొందరడగవచ్చును. దానికి సమాధానము, ఒక ఉద్యోగి ఒక ఊరిలో బదిలీ అయి వేరొక ఊరికి పోయి ఉద్యోగము సాగిస్తున్నాడనుకొనుము. అట్లు ఎన్నో బదిలీలు పొంది ఎన్నో ఊర్లలో ఉద్యోగము చేయుచున్నాడు. ఇక్కడ బదిలీ జరిగినపుడే ఊరు మారినట్లు ఒక జీవుడు ఒక శరీరములో పనిచేయుచు ఉండి, శరీరము మరణము పొందినపుడు ఆ శరీరము వదిలి వేరొక శరీరము చేరుచున్నాడు. ఉద్యోగికి బదిలీలాంటిదే జీవులకు మరణము. బదిలీ అయినంత మాత్రమున ఉద్యోగస్తుడు లేకుండ పోలేదు. అట్లే మరణము పొంది శరీరము మారినంత మాత్రమున జీవుడు లేదనుట తగదు. ఎన్ని ఊర్లు మారిన, చివరకు రిటైర్డు (ఉద్యోగవిరమణ) అయిన తర్వాత వాడు ఉద్యోగి ఎట్లు కాకుండ పోవునో, అట్లే జీవుడు కూడ ఎన్ని శరీరములు మారిన మోక్షము పొందిన తరువాతనే జీవుడు కాకుండ పోవును. రిటైర్డు తో ఉద్యోగి అను పేరు లేకుండా పోయినట్లు, మోక్షముతో జీవితము లేకుండాపోయి జీవుడు కాకుండా పోవును. అందువలన ఇచట గ్రహించవలసినది మరణించుట అనునది నాశనము కాదు. నాశనము అనునది మరణము కాదు. మరణమునకు, నాశనమునకు ఎంతో తేడా ఉన్నదని తెలియాలి. జీవునికి చావు లేదన్నాము, కానీ నాశనము పొందడని చెప్పలేదు. అట్లే ఆత్మ చంపబడును అన్నాము, కాని నాశనమగువాడని చెప్పలేదే! జీవాత్మ ఎట్లు చంపబడదో, ఆత్మ ఎట్లు చంపబడుచున్నదో క్రింద తెలుసుకొందాము.

ఒక సజీవ శరీరమును పరిశీలించి చూచిన ఆ శరీరము ఎన్నో భాగములుగా ఉన్నది. ఒక్కొక్క భాగము ఒక్కొక్క పనిని చేయుచు యంత్రమువలె సాగిపోవుచున్నది. శరీరములో అన్ని భాగములు పని చేయుటకు శక్తి అవసరము. ఆ శక్తిని కుండలీశక్తి అనియు, ఆత్మశక్తిఅనియు అనుచున్నాము, ఆత్మ శరీరములోని తల భాగమును, వెన్నుపామును కేంద్రముగ చేసుకొని శరీరమంతా వ్యాపించి అన్ని భాగములచేత పనిచేయిస్తున్నది. అన్ని శరీరభాగముల వరకు ఆత్మ వ్యాపించివున్నది. ఈ విధముగ శరీరమందు ఆత్మఉండగ, జీవాత్మ మాత్రము శరీరములో ఒక్కచోట మాత్రము ఉన్నది. శరీరముతో తనకెలాంటి సంబంధము లేనిదిగా జీవాత్మ ఉన్నది. జీవాత్మకు తనవరకొచ్చిన కష్టసుఖములను అనుభవించు పని తప్ప ఏమిలేదు. ఆత్మచేత పనిచేయుచున్న కన్ను పంపెడి సమాచారమును బుద్ధి ద్వార జీవుడు అనుభవిస్తు ఆ దృశ్యములోని ఆనందమునో, కష్టమునో అనుభూతి పొందుచున్నాడు. అట్లే జ్ఞానేంద్రియములైన ముక్కు, చెవులు, నాలుక, చర్మములచేత మనస్సు ద్వార పంపబడు విషయములను బుద్ధి ద్వార మాత్రమే జీవుడు అనుభవిస్తున్నాడు. బయటి జ్ఞానేంద్రియాలకు లోపలి జీవునకు మధ్యవర్తిగ మనస్సు ఉన్నది మధ్యలో ఉన్న మనస్సు లేకపోయిన, పనిచేయకపోయిన జీవుడు చీకటిగదిలో ఉండినట్లగును. బయటి ప్రపంచ విషయమేమి తెలియదు. అట్లే బయటి జ్ఞానేంద్రియము ఏ ఒక్కటి లేకున్న దాని విషయము జీవునికి తెలియకుండా పోవును. కన్నుల్లేని శరీరములోనున్న జీవుడు దృశ్యముల సుఖమునుగాని, కష్టమునుగాని అనుభవించలేడు.

శరీరములో బయటి జ్ఞానేంద్రియములు పనిచేయాలన్నా, లేక లోపలి మనస్సు పనిచేయాలన్నా అన్నిటికి ఆత్మయే కారణము. శరీరములోని తల మధ్యలో ఉన్న జీవునికి శరీరమునకు ఏమాత్రము సంబంధములేదని, ఆత్మచేత పని చేయబడు శరీర భాగములనుండియే జీవునకు అన్ని తెలియాలని, అట్లు తెలియకపోతే జీవుడు చీకటి గదిలో ఉన్నవానితో సమానమేననుకోవాలి. ఉదాహరణకు ఒక బావి దగ్గర నీరు తోడి కాలువలో పోయువాడుండగ, కాలువ ద్వారావచ్చు నీరును ఫర్లాంగు దూరములో గట్టుమీద కూర్చొని త్రాగువాడు వేరొకడున్నాడనుకొనుము. తన శక్తిని ఉపయోగించి బావి నుండి నీరు తోడి పోయగా, ఆ వచ్చిన నీరు తియ్యనివి కాని, ఉప్పువికాని, త్రాగేవాడు దూరముగ కూర్చొనియున్నవాడు. తీపుకాని, ఉప్పుకాని అనుభవించువాడు పొలములో గట్టుమీద కూర్చున్నవాడు. ఆ నీరులోని ఉప్పునుగాని తీపునిగాని నీరు తోడువాడు అనుభవించడు. నీరుతోడు వానిది శక్తి మాత్రమే. అనుభవించువాడు పొలములోనివాడు. ఇదేవిధముగ ప్రపంచమను బావి నుండి తన శక్తిచేత శరీరేంద్రియముల ద్వారా కష్టసుఖములనబడు నీరును అందించువాడు ఆత్మకాగా పొలములో కూర్చొని నీరు త్రాగువానిగ శరీరములో ఎక్కడో లోపల కూర్చున్న జీవాత్మ ఉన్నాడు. బావినుండి నీరు తోడు పరికరములు లేకపోయిన లేక తన వరకు వచ్చు కాలువ లేకున్న త్రాగువానికి నీరందదు. అట్లే ఇచట శరీర భాగములైన జ్ఞానేంద్రియములను నీరును తోడు పరికరములుగా, కాలువను మనస్సుగా పోల్చుకొనవలెను. బుద్ధిని నీటిని అందించు పాత్రగ పోల్చుకోవలెను. జ్ఞానేంద్రియములు గాని, మనస్సుగాని, ఏ ఒక్కటి పనిచేయకున్న జీవునికి సమాచారమందదు.

ఇచ్చట ప్రమాదవశాత్తు బావిలోపడి మరణించు అవకాశము నీరు తోడువానికే ఉన్నది, కాని దూరముగ పొలములో కూర్చున్న వానికి ఏమాత్రము లేదు. అట్లే ప్రమాదవశాత్తు హత్య జరిగిన ఎడల మరణించు అవకాశము బయటి వరకు ఉన్న ఆత్మకు కలదు, కాని లోపలయున్న జీవాత్మకు లేదు. ఇట్లు హత్య సమయములో జీవాత్మకు మరణములేదని, ఆత్మకు మరణము కలదని తెలియాలి. ఒకవేళ ఆత్మచావలేదు జీవాత్మయే చస్తున్నదని ఎవరైనా అనిన, బావి దగ్గర నీరు తోడువాడు బావిలోపడలేదు, పొలములో ఉన్నవాడు పడినాడన్నట్లుండును. ఆత్మ జీవాత్మల యొక్క హత్య, ఆత్మహత్యల గురించి క్రింద విపులముగా తెలుసుకొందాము.

ఒక జైలులో శిక్షవేయబడిన ఖైదీకి ఒక కాపలాదారుడుండి, ఆ ముద్దాయి ఎక్కడికి పారిపోకుండ వానిచేతికి వేయబడిన సంకెళ్ళ గొలుసును తన నడుముకు కట్టుకొన్నాడనుకొనుము. అట్లు కట్టుకొనుట వలన ముద్దాయి ఎక్కడికి పోయిన కాపలాదారుడు కూడ వాని వెంటపోవలసివున్నది. ఒకవేళ కాపలాదారుడు పోవలసి వచ్చిన వాని వెంట ముద్దాయి కూడ పోవలసి ఉంది. ముద్దాయిని వేరొక జైలుకు మార్చిన ఎడల వానితోపాటు కాపలాదారుడు కూడా ఆ జైలుకు పోవలసి ఉంది. ఖైదీకి కాపలాదారుని శాశ్వతముగా నిర్ణయించిన దానివలన, ఖైదీ ఏ జైలుకు పోయిన తప్పనిసరిగా వాని రికార్డులతో పాటు కాపలాదారుడు కూడ పోవలసియున్నది. శిక్ష ప్రకారము ముద్దాయికి ఆహారము మొదలగునవి ఇస్తూ, వానిచేత ఏ పని చేయించాలో ఆ పనులనే కష్టములైనవికాని, సుఖములైనవికాని చేయిస్తు, వాడు చేయు అన్ని పనులకు కాపలాదారుడు ప్రత్యక్షసాక్షిగా ఉన్నాడు. జైలులో ఖైదీకి కాపలాదారుడు ఉన్నట్లే, ఒక శరీరమను జైలులో ముద్దాయిగ జీవాత్మ ఉండగ, కాపలా దారునిగా ఆత్మ ఉంటూ వానికి సాక్షిగ కూడ యుండి వానిచేత పనులు అనుభవింప చేయిస్తున్నది. ఒక శరీరము వదలిపోవునపుడు జీవునితో పాటు వాని కర్మయను రికార్డును తీసుకొని వేరే శరీరమునకు ఆత్మ పోవుచున్నది.

శరీరము జైలులాంటిది, అందులో ఉన్న జీవుడను ఖైదీ ముందుచేసిన తప్పులకు శిక్షను అనుభవిస్తు ఆ జైలులోనే తిరిగి క్రొత్త తప్పులు చేశాడనుకొనుము, వాని రికార్డులో క్రొత్త తప్పులు రికార్డు చేసి శిక్షను పెంచుదురు. అట్లే ఒక శరీరములో కర్మననుభవించు జీవుడు అదే శరీరములో క్రొత్త కర్మను సంపాదించుకొనిన, తిరిగి క్రొత్త శరీరమను జైలుకుపోయి శిక్షననుభవించవలసి వచ్చును. జీవుడు పాతకర్మను అనుభవిస్తు క్రొత్త కర్మసంపాదించుకొనుట వలన, శరీరములను జైళ్ళను ముద్దాయి అనబడు జీవుడు మారుచూనే ఉన్నాడు. వానితోపాటు కాపలాదారుడైన ఆత్మ కూడ మారుచూనే ఉన్నది. ఈ విధముగ జైలు మార్పిడిని మరణము అందుము. ఒక శరీరములో అనుభవించవలసిన కర్మను పూర్తిగా అనుభవించి వేరొక శరీరమునకు పోవడము మరణమైతే, ఒక శరీరములో అనుభవించవలసి కర్మను పూర్తిగా అనుభవించకమునుపే ఆ శరీరమును వదలి పోవడమును 'అకాల మరణము' అంటాము. ఈ అకాలమరణము రెండు విధములుగా ఉన్నది. ఒకటి హత్య, రెండవది ఆత్మహత్య. అనుభవించవలసిన ప్రారబ్దకర్మను శరీరములో అనుభవించక ముందే ఆ శరీరమును జీవుడు వదలిపోవడము హత్య అంటాము. అట్లే ఒక శరీరములో అనుభవించవలసిన ప్రారబ్దమును అనుభవించక ముందే ఆత్మ ఆ శరీరమును వదలి వెళ్లిన అది ఆత్మహత్య అంటాము. ఇక్కడ గమనించతగిన విషయమేమనగా! జీవాత్మ ఆత్మలలో ఏది ముందు బయలుదేరుచున్నదో దానిని బట్టి హత్యనా, ఆత్మహత్యనా అని నిర్ణయించడము జరుగుచున్నది.

మూడు ఆత్మలలో మొదటిదైన జీవాత్మను భగవద్గీతయందే క్షరుడన్నాము. 'క్షరుడు' అనగా నాశనమగువాడని అర్థము. శరీరము నాశనమైనప్పటికి జీవుడు నాశనము కాడని కూడ ఇదే గీతలోనే చెప్పుకొన్నాము. ఒకచోట నాశనమగువాడని వేరొకచోట నాశనములేనివాడని అనుట విచిత్రమేయైనప్పటికి రెండూ వాస్తవమేనని తెలియాలి. సందర్భానుసారము చెప్పుటలో అలా చెప్పవలసి వచ్చినది. శరీరము నాశనమైనపుడు జీవుడు నాశనము కానిమాట నిజమే. ఎన్ని శరీరములు మారి పోయిన జీవుడు నాశనమగువాడు కాడు, ఇక్కడ నాశనము కానిమాట నిజమే అయినప్పటికి జీవుడు క్షరుడే, నాశనమగువాడే. అది ఎలా అనగా ! జీవాత్మ కర్మలనుండి బయటపడునపుడు తిరిగి పుట్టవలసినది లేదు. పరమాత్మగ మారినపుడు ఇక జీవాత్మ లేడు. అపుడు జీవాత్మ నాశనమైనాడనియే చెప్పవచ్చును. అంతవరకు శరీరమునకు తప్ప జీవాత్మకు నాశనములేదనిన మనమే, ఇపుడు జీవాత్మకు నాశనమున్నదని ఒప్పుకోక తప్పదు. అట్లే ఆత్మను అక్షరుడని గీతయందే చెప్పాము. అక్షరుడనగా నాశనము లేనివాడిని అర్థము. క్షరుడైన జీవున్ని అనగా నాశనము కలవానిని నాశనములేని ఆత్మను కూడ మరణము కలవాడని సందర్భానుసారముగ చెప్పవలసి వచ్చినది. హత్య, ఆత్మహత్య అనడములో ఆత్మహత్య యొక్క అర్థము ఆత్మ చంపబడుచున్నదని. ఆ విషయము అర్థము కావాలంటే అలా చెప్పక తప్పదు. దీనిని ఎవరు అపార్థము చేసుకోకూడదు. పై శ్లోకములో 'హన్తినహన్యతే' అను మాట వచ్చింది. కనుక హత్యను గురించి పూర్తి వివరము ఇచ్చట ఇవ్వవలసి వచ్చింది. హత్య, ఆత్మహత్యల యొక్క వివరము క్రింద చూస్తాము.

హత్య అంటే ఇతరులచేత చంపబడడమని, ఆత్మహత్య అంటే తన్నుతాను చంపుకోవడమని నేడు వాడుకగ అందరికి తెలిసిన విషయమే కదా! అని అనుకొనవద్దండి. ఇక్కడ ధర్మము అధర్మముగా మారిపోయినది. ధర్మము యొక్క స్థానములో అధర్మము, అధర్మము యొక్క స్థానములో ధర్మము నిలబడి ఉన్నాయి. కావున ఈ విషయములో ధర్మమేదో, అధర్మమేదో వివరముగా తెలుసుకొందాము.

జీవులకు మరణము రెండు విధములుగా ఉన్నది. ఒకటి కాలమరణము, రెండవది అకాలమరణము. హత్య, ఆత్మహత్యలు రెండు అకాలమరణమునకు చెందినవి. కాలమరణమును గురించి మా రచనలలోని 'జనన మరణ సిద్ధాంతము' అను పుస్తకములో వివరముగ తెలుపబడినది. జీవుడు కర్మరీత్యా శరీరములో నివాసముండి కష్టసుఖములను అనుభవిస్తున్నాడు. శరీరములో జీవుని యొక్క పని కష్టసుఖములను అనుభవించడము మాత్రమేనని తెలియాలి. జీవుడు కష్టసుఖములను అనుభవించుటకు తగిన కార్యములు చేయుటకు శరీరమును కదిలించుచున్నది ఆత్మయని తెలియాలి. ఆత్మ చైతన్యము చేత శరీరమును కదిలించుచుండగ ఏర్పడు సుఖదుఃఖములు జీవుడు లోపల నుండి అనుభవించుచున్నాడు. దీనిని బట్టి జీవునికి శరీరమును కదలించు శక్తి లేదు. కేవలము ఒక్క ఆత్మకే ఆ శక్తి ఉన్నదని తెలియుచున్నది. ఆత్మయొక్క చైతన్యశక్తి శరీరములోని సకల అవయవములను కర్మ ప్రకారము కదిలించుచు, జీవరాసులను ప్రపంచములో చరించునట్లు చేయుచుండగ , నాచేతనే శరీరము కదలుచున్నదని జీవుడు భ్రమించుచున్నాడు. అజ్ఞానముచేత ఆత్మంటే ఏమిటని, దాని పని ఏమిటని తెలియక జీవుడు తానే అన్ని పనులకు కారణమనుకొనుట సహజముగ నున్నది. వాస్తవమునకు జీవుడు వేరు, ఆత్మ వేరు. కర్మరీత్యా జరుగవలసిన పనులన్నిటిని ఆత్మయే శరీరముచేత చేయిస్తున్నది.

ఇపుడు అసలు విషయానికొస్తాము. సజీవమైన శరీరములో ఆత్మ జీవాత్మ అను రెండు ఆత్మలు ఉన్నాయి. ఇది అన్ని శరీరములకు వర్తించు విషయము. ఉదాహరణకు బల్లి శరీరము తీసుకొందాము. దానియందు రెండు ఆత్మలున్నవి, బల్లి శరీరము గోడమీద కదలుటకు దానిలోని ఆత్మే కారణము. అది కదులుచు పోవుచుండగ పట్టు తప్పి కాలుజారి క్రింద పడింది. అపుడు దాని కొనతోక తెగిపోయింది. బల్లి పూర్తి శరీరమంత ఒక భాగముగ, చివరి కొంత తోకమాత్రము వేరొక భాగముగ విడిపోయాయి. బల్లి పూర్తి శరీరమంతయు సహజముగానే ఉన్నది. కావున అది వెంటనే తిరిగి గోడమీద ప్రాకుచు పోయినది, కాని క్రింద తెగిపడిన తోక ఒక నిమిషము పాటు వంకరలు తిరుగుచు ఎగిరెగిరి పడుచుండును. ఈ సంఘటన చాలామంది చూచియే ఉందురు. తెగిపడిన తోక కదలుటకు ఆత్మచైతన్యమే కారణము. బల్లి శరీరములో తలనుండి తోక వరకు వ్యాపించిన ఆత్మచైతన్యము తోక తెగిపోగ అందులో కొంత మిగిలి పోయింది. ఆ కొంత శక్తి వలన తోక ఎగిరిపడుచు కదిలింది. ఆ శక్తి అయిపోయిన వెంటనే అది నిలిచిపోయి చలనములేనిదైనది. బల్లి శరీరములో మిగతా ముఖ్యమైన భాగములన్ని ఉన్నవి. కావున అందులో ఆత్మ నివాసయోగ్యమేయైనందున, బల్లి శరీరము కదులుచు బ్రతికే ఉన్నది. శరీరమంతా వ్యాపింపబడిన ఆత్మ కొద్దిగ ఖండింపబడినదని ఈ సంఘటన ద్వారా తెలియుచున్నది.

కోడి శరీరము నుండి దాని తలను వేరుచేసినపుడు ఆ కోడి శరీరము కొద్దిసేపు తనకాలాడుట కూడ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ శరీరములోని ముఖ్యమైన భాగములన్నింటిని తలనుండి వేరుచేయడములో తలలోని ఆత్మ ఒక భాగముగను, శరీరమంత వ్యాపించిన ఆత్మ ఒక భాగముగను ఖండింపబడ్డాయి. తలలోని కర్మకనెక్షన్ మరియు ఆత్మచైతన్య ప్రసారము తెగిపోయిన దానివలన ఆశరీరము మృత్యువును పొందినది. శరీరము లేదు కావున తల భాగములోని ఆత్మ జీవాత్మలు ఆ భాగమును కూడ వదలి వెళ్లిపోవుచున్నవి. ఈ సంఘటనలో ఆత్మ రెండు భాగములుగ ఖండింపబడినదని తెలియుచున్నది. ఆశ్చర్యముగ ఉన్నది కదా! ఆత్మ ఆయుధములచేత తెగదు, నీటికి నానదు, అగ్నికి కాలదు అని భగవద్గీతలో చెప్పగా " ఈయనకేమి పిచ్చి పట్టింది ఆత్మ ఖండింపబడుచున్నదంటున్నాడు" అని మీరనుకోవచ్చును దానికి మా సమాధానమేమనగా! భగవద్గీతలో చెప్పినది నిజమే, కాని మనము అవగాహన చేసుకోవడములో పొరపాటుపడ్డాము. అక్కడ ఖండింపబడదని చెప్పినది ఏ ఆత్మను గురించి? జీవాత్మనా? ఆత్మనా? పరమాత్మనా? ఈ మూడు ఆత్మల వివరము తెలియకపోతే మనము పప్పులో కాలువేసినట్లే. అంతెందుకు నేనొక ప్రశ్నవేస్తాను హత్య అంటే చంపబడడమని అర్థమున్నపుడు ఆత్మహత్య అన్నప్పుడు ఆత్మ చంపబడడమనియేగా అర్థము. అవును ఆత్మ ఖండింపబడుచున్నది. ఖండింపబడిన శరీరములోని ఆత్మ కూడ ఖండింపబడుచున్నది. ఖండించబడి ముక్కలైన భాగమములలోని ఆత్మ కదలికలను మనము కళ్ళతో చూడగల్గి కూడ అర్థము చేసుకోలేకపోయాము. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నరికినపుడు, నరకబడిన శరీరములోని ఆత్మ శరీరముతో బాటు చిధ్రమై చలనములేనిదై పోవుచున్నది. అట్లే ఒక జంతువు ఇంకొక జంతువును వేటాడి చీల్చి వేసినపుడు కూడ ఆత్మ అదే స్థితి పొంది చలనములేనిదై పోవుచున్నది. యదార్థ సంఘటన అయిన ఒక ముఖ్య ఉదాహరణను కూడ ఇక్కడ పరిశీలిద్దాము.

రైల్వేవంతెన మీద ఒక విద్యార్ధి తనతోపాటు సైకిల్ ను త్రోసుకుంటు పోవుచు, ప్రమాదవశాత్తు కాలుజారి వంతెన మీద నుండి ముప్పై అడుగుల క్రిందికిపడ్డాడు. పడినపుడు అతనికి ఏమాత్రము రక్తగాయము కాలేదు. కాని క్రిందపడినపుడు వెన్నుముకలోని వెన్నుపాము మధ్యలోనికి తెగిపోయింది. మధ్యలోనికి తెగిపోవడము వలన అతను చూస్తున్నట్లే నడుము నుంచి క్రింది శరీరమైన కాళ్ళు తనకలాడుచుండడము కళ్ళారా చూచాడు. అవి ఎందుకు అలా ఎగిరిపడుచున్నవో అర్థముకాలేదు. గుండెక్రింది వరకు వెన్నుపాము తెగిపోవడము వలన గుండె ఊపిరితిత్తులు పనిచేయుచున్నవి. కానీ క్రింది భాగమును నడిపించు చైతన్యము వెన్నుపాము ద్వారా క్రిందికి ప్రాకలేదు. కావున అతనిలోని జీర్ణాశయము కూడ పనిచేయలేదు. శరీరము తెగకున్నను చైతన్యము ప్రసారమగు నాడి తెగిపోవడము వలన, క్రింది భాగములోని చైతన్యము రెండు నిమిషముల కాలము తనకలాడి నిలిచిపోయినది. సగము శరీరము చచ్చిపోయి, సగము శరీరము మాత్రము మిగిలివున్న అతను, రెండు దినములకు చనిపోవడము జరిగినది. ఈ సంఘటనలో కూడ ఆత్మ రెండు ముక్కలై సగము శరీరము మరణము పొంది, మిగతా సగము రెండు రోజులకు నిలిచిపోయినదని తెలియుచున్నది.

ఇన్ని సంఘటనల యొక్క ఆధారముతో శరీరములోని ఆత్మ ఖండింప బడుచున్నదని, జీవునితోపాటు మరణము పొంది వేరొక శరీరమును చేరుచున్నదని తెలియుచున్నది. దీని ప్రకారము ఒకడు ఇంకొకనిని కత్తితో నరికి చంపినపుడు, శరీర భాగములలో వ్యాపించిన ఆత్మ కూడ నరకబడుచున్నది. కావున దానిని 'ఆత్మహత్య' అనుట సమంజసము. ఒకరిచేత ఇంకొకరు చంపబడుట 'హత్య' అనుట అందరికి తెలిసినదే. కానీ అది హత్యకాదు ఆత్మహత్య అని తెలియాలి. శరీరమంతా వ్యాపించియున్న ఆత్మను ఇంకొకరు బలవంతముగా నిలిపి వేయడమును హత్య అనకూడదు, ఆత్మహత్య అనాలి. ఒక మనిషి ఇంకొక మనిషినిగాని, జంతువు మనిషిని కాని, చంపినట్లయితే అది హత్యకాదు 'ఆత్మహత్య' అని తెలియాలి. ఇంత కాలము హత్య అని దేనిని అనుకుంటున్నామో, అది ఆత్మహత్య అని తెలిసింది కదా! అట్లే ఇంత కాలము ఆత్మహత్య అని దేనిని అనుకుంటున్నామో, అది 'హత్య' అని తెలియాలి . ఇక 'హత్య యొక్క వివరము తెలుసుకుందాము.

శరీరములో జీవాత్మ, ఆత్మ అను ఇద్దరు పురుషులున్నారని భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగములో 16వ శ్లోకమున చెప్పబడివున్నది. ఇందులో ఆత్మ చంపబడడము ఆత్మహత్యయని ఇందాక తెలుసుకొన్నాము. ఆత్మ జీవాత్మలు చావులోను పుట్టుకలోను ఒకదానివెంట ఒకటి పోక తప్పదు. శరీరమును ధరించునపుడుకాని, శరీరమును వదలునపుడుకాని, ఆత్మ జీవాత్మ ఇద్దరు ఒకేమారు రావడము పోవడము జరుగుచున్నది. ఆత్మ శరీరమును ముందుగా వదలాలనుకొన్నపుడు దానివెంటనే జీవాత్మ కూడ పోవును. అదే విధముగా జీవాత్మ శరీరమును వదులునపుడు దాని వెంట ఆత్మ పోవును. వీటి భేదములోనే 'హత్య' 'ఆత్మహత్య' అనుట జరుగుచున్నది. ఆత్మతో పాటు జీవాత్మ పోతే ఆత్మహత్య అనియు, జీవాత్మ వెంట ఆత్మ పోవడమును హత్య అనియు అంటున్నాము. ఇంకొక శరీరము చేత శరీరములోని ఆత్మ చనిపోవడమును ఆత్మహత్య అనుకొన్నాము. ఆ విధముగానే ఒక శరీరములోని ఆత్మచేత అదే శరీరములోని జీవాత్మ చంపబడడమును హత్య అనబడును. ఆత్మ చంపబడడము ఆత్మహత్య అయితే జీవాత్మ చంపబడడము హత్య అగుచున్నది. ఇక్కడ గమనించదగ్గ విషయమేమనగా! జీవాత్మ ఆత్మల తేడా తెలియనప్పుడు హత్య ఆత్మహత్యల తేడా కూడ తెలియదు.

ఒకడు తాడుతో గొంతును బిగించుకొని ఉరివేసుకొన్నాడనుకొందాము, అది ఆత్మహత్య కాదు హత్య అగును. ఆ శరీరములోని ఆత్మ తన చైతన్యము చేతనే జీవుడు ఆ శరీరములో నివసించుటకు వీలుకాకుండా చేయుచున్నది. కావున ఆత్మ జీవాత్మను చంపినట్లగుచున్నది. మరణించినపుడు ఇక్కడ జీవుని వెంట ఆత్మ పోవుచున్నది అందువలన అది హత్య అనబడును. అదే విధముగ మరణశిక్ష చెప్పబడిన ఖైదీని మరణశిక్ష అమలులో వేరొకడు గొంతుకు తాడు బిగించి చంపాడనుకొనుము. అది పై విధముగా హత్యకాదు ఆత్మహత్య అగును. ఇక్కడ ఆత్మతోపాటు జీవుడు పోవుచున్నాడు. ఇక్కడ శాస్త్రబద్ధంగా ధర్మసూక్ష్మమేమనగా! ఇతర శరీరములచేత ఒక శరీరము చనిపోయినపుడు ఆ 'చావు' నేరుగా ఆత్మకు చెందును. అట్లే ఒక శరీరము ఇంకొకరి జోక్యం లేకుండ ఆత్మచేత మరణించినపుడు ఆ 'మరణము' నేరుగా జీవునికి చెందును. అది ఏ విధమనగా! ఒక శరీరములోని జ్ఞానాగ్ని ఇంకొక శరీరములోని కర్మను కాల్చునపుడు అది ప్రారబ్దమునే కాల్చును. అట్లే ఒక శరీరములోని జ్ఞానాగ్ని అదే శరీరములోని కర్మను కాల్చాలంటే అది ప్రారబ్దము కాల్చదు. నేరుగా సంచిత కర్మను కాల్చును. ఒకే జ్ఞానాగ్ని తన శరీరములోనైతే సంచితకర్మ మీద, ఇతర శరీరములలోనైతే ప్రారబ్దము మీద ఎట్లు పనిచేయుచున్నదో, అదే విధముగానే ఒకే 'మరణము' తన శరీరము ద్వారా ఏర్పడితే జీవునికి, ఇతర శరీరము ద్వారా ఏర్పడితే ఆత్మకు చెందునని తెలియాలి. తన శరీర మరణమునకు తానె కారణమైనపుడు అది 'హత్య' అని, ఇంకొకరు కారణమైనపుడు 'ఆత్మహత్య' అని శాస్త్రబద్ధముగా ఉండగ అజ్ఞానము వలన దానికి వ్యతిరిక్తముగ హత్యను ఆత్మహత్య అని, ఆత్మహత్యను హత్య అని అందరు అనుకుంటున్నారు. ఆత్మహత్యగాని, హత్యగాని అకాలమరణములోనివని జ్ఞాపకముంచుకోవలెను.

ఆత్మ ప్రయత్నముతో జీవుడు చనిపోవడము సూత్రబద్దముగ హత్య అగును. దానివలన వచ్చు పాపము ఆత్మను అంటదు. జీవుడు చంపబడుటచేత వచ్చు పాపము ఆత్మకు అహములేదు కావున అది ఆత్మ నంటదు. ఒక శరీరము వేరొక శరీరము యొక్క చావుకు కారణమైనపుడు అది ఆత్మహత్యయగును. అందులో వచ్చు పాపము చాలా భయంకరమైనది. దైవమునే చంపినంత పాపము జీవునికి ఏర్పడుచున్నది. ఒక శరీరములోని ఆత్మ మరణమునకు ఇంకొక శరీరములోని ఆత్మచైతన్యమే కదా కారణము అటువంటప్పుడు ఆత్మహత్య పాపము జీవునికి ఎందుకు అంటును? అను ప్రశ్న రాగలదు. దానికి సమాధానము ఆత్మహత్యకు ఆత్మ కారణమనుట నిజమే, జీవుడు ఏమి చేయనివాడు అను సూత్రము ప్రకారము వానికి ఆత్మహత్యకు సంబంధములేదు. అయినప్పటికి శరీరములోని అహము జీవుని చేత తానే చేసినట్లు ఒప్పించుచున్నది. కనుక అక్కడ వచ్చు పాపము జీవుని కర్మకూడలిలో చేరుచున్నది. సంబంధములేని కర్మను జీవుడు అనవసరముగా తన మీద అహము చేత వేసుకొనుచున్నాడు.

మిగతా ప్రపంచపు పనులలో జీవునకు చిన్నచిన్న కర్మలు అహము చేత వచ్చుచుండును. వాటి ఫలితము అంతపెద్దగా లేకపోయినా మరణవిషయములో వచ్చు కర్మ చాల భయంకరమైనది. అది ఆత్మనే హత్యచేసినది, కావున జీవుడు ఎక్కడ అహము పొందినా చిన్న కర్మ వచ్చును కాని, చావు విషయములో అహము పొందడము వలన భయంకరమైన కర్మ వచ్చును. అందువలన ఆత్మ హత్య మహాపాపమని పెద్దలన్నారు. నేడు భూమిమీద కొంతమంది కిరాయికి చాలామందిని చంపుచున్నారు. హత్య ఆత్మహత్యల వివరము తెలియనివారు తాము హత్య చేశాము అనుకుంటున్నారు. వారు చేసినది ఆత్మహత్య అని వారికి తెలియదు. అందువలన వచ్చుపాపము భయానకరమైనదని కూడ వారికి తెలియదు. ఇప్పుడు ఈ విషయము తెలుసుకున్న పెద్దలు ప్రజలకు ఆత్మ జీవాత్మల భేదములు, హత్య ఆత్మహత్యల భేదములు తెలిపి వారిని అజ్ఞానము నుండి బయట పడునట్లు చేయుదురని కోరుచున్నాము.

ఒకశరీరములో జీవాత్మ ఒకడే ఐనపుడు దానికి కాపలాగా ఉన్న ఆత్మ కూడ ఒకటే. అన్ని శరీరములలో ఒకే నిబంధనతో, ఒకేమాదిరి వేరు వేరు ఆత్మలు ఉండుట వలన ఒక శరీరములోని ఆత్మకు వర్తించినది ఒకేమారు అన్ని శరీరములలో వర్తించదు. కావున ఒక శరీరములో హత్య కావింప బడినప్పటికి అన్ని శరీరములలో ఆత్మ హత్య కావింపబడలేదు. ఆత్మను విశాలముగా చూచినపుడు అది హత్య కావింప బడలేదు. ఆత్మను విశాలముగా కాక శరీరములో ఒక్క ఖండముగా చూస్తే ఆ మరణము ఆత్మహత్య అనబడును. ప్రతి శరీరములోని భిన్నముగా ఉన్న జీవాత్మ నాశనమగువాడైనను సందర్భానుసారముగ మరణములో శరీరమునకేనాశనము, జీవునకు లేదన్నట్లు, అన్ని శరీరములలో ఒకే అంశగ ఉన్న ఆత్మ నాశనమును లేనిదైనను కొన్ని మరణములలో మరణించునదిగా చెప్పబడుచున్నది. నాశనమగు జీవాత్మకు చావులేదన్నను, నాశనములేని ఆత్మకు చావు ఉన్నదన్నను చివరకు జీవాత్మకు నాశనము కలదు, ఆత్మకు నాశనము లేదని తెలియాలి. మరణమునకు, నాశనమునకు ఎంతో తేడా గలదని తెలియవలెను. ఒక్క శరీరములోని ఆత్మను తెలుసుకోగలిగితే అది వానికి ఆత్మ దర్శనమైనట్లే. సకల జీవరాసులలో ఆత్మ ఎట్లు ఉన్నదో తెలుసుకొన్నట్లే అగును. మూడవ ఆత్మయైన పరమాత్మను భూమి మీద బ్రతికివున్న ఏ జీవరాసి కానీ తెలుసుకోలేదు, ఇది శాసనము. రెండవ ఆత్మను తెలుసుకొన్న తర్వాత శరీరమును వదిలినపుడు మూడవ ఆత్మయైన పరమాత్మ అనునది ఏమిటో తెలియును. అటువంటివాడు తిరిగి పుట్టడు అదే విడుదల లేక మోక్షము అంటారు. ఆత్మను తెలిసినవాడు భూమి మీద ఉండవచ్చునుగాని పరమాత్మను తెలిసినవాడు భూమి మీద ఉండడని తెలియాలి.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 20: నజాయతే మ్రియతేవా కదాచి న్నాయంభూత్వా భవితావానభూయః|
అజో నిత్య శ్యాశ్వతో ఽ యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే||
(పరమాత్మ)

భావము: పరమాత్మ పుట్టునది కాదు గిట్టునది కాదు. ఒకప్పుడుండి మరియొకప్పుడు లేదనుటకు వీలుకాదు. నిత్యముండువాడు, పురాణుడు శరీరము చంపబడినను తాను చచ్చువాడు కాదు.
వివరము: ఇపుడు ఈ శ్లోకములో ప్రత్యేకించి మూడవ పురుషుడైన పరమాత్మను గురించి తెలుపుచున్నాడు. దీనితో ముగ్గురు పురుషుల విషయము కొంత అవగాహన కాగలదు. పరమాత్మ అనునది ఆత్మ జీవాత్మల వలె మరణము గాని నాశనముగాని పొందునది కాదు. ఒకచోట ఉండి మరియొక చోట లేనివాడు కాదు. సర్వము నిండి అణువణువున వ్యాపించివున్నవాడు, భూతకాలములో ఉండి భవిష్యత్తులో ఉండడనుటకు వీలులేనివాడు, ఎప్పటి నుండి కలడో తెలియని పురాణుడు, చావుపుట్టుకలు లేనివాడు, బయట బయలులోను, వస్తువు యొక్క అణువణువులోను, శరీరముల లోపలను వ్యాపించి ఉన్న పరమాత్మ, శరీరము మరణించినను దానిలోని అణువణువున కూడ ఉన్నాడు. చంపబడిన శరీరములో ఉండి కూడ చచ్చువాడు కాదని, చనిపోయిన బ్రతికిన శరీరములలో కూడ ఒకే మాదిరి ఉన్నాడని తెలియాలి.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 21: వేదాఽవినాశనం నిత్యం యఏన మజమవ్యయమ్|
కథం స పురుషః పార్థ ! కం ఘాతయతి హన్తికమ్||
(పరమాత్మ)

భావము: నిత్యుడు, నాశనములేనివాడు పరమాత్మయని ఎవడు తెలుసుకొనునో, వాడు అట్టి పరమాత్మను ఎట్లు హింసింపగలడు? హింసచేయుటకునైన ఎట్లు తలచును?
వివరము: జీవాత్మ కాక మరియు ఆత్మవలెనుకాక ఆత్మకంటే వేరైన పరమాత్మ నాశనము చెందనివాడని, అంతట నిండి ఎల్లప్పుడుండువాడని, తెలిసిన వాడెవ్వడైన పరమాత్మను బాధపెట్టుదునని కాని, పరమాత్మ బాధపడునని కాని తలపోయడు. పరమాత్మకు ఏదిలేదు, చావుపుట్టుకలు కాని, కష్టసుఖములుగాని పొందువాడు కాదు. ప్రపంచములో దేనికి తెలియని వానిని ఎవడైన ఎట్లు తాకగలడు? ఇంకను పరమాత్మ ఎట్టిదనిన, ఈ ప్రపంచమంతయు నాశనమైనప్పటికి నాశనము కాక నిలిచివున్నది. పరమాత్మ సృష్టి ఆదిలో ప్రకృతి యొక్క పంచభూతములను తయారుచేసి దాని ద్వార జనితములైన గుణముల నుంచి బుద్ధికి, బుద్ధి నుండి చిత్తమునకు, చిత్తమునుండి మనస్సుకు, మనస్సు నుండి శరీరము బయటనున్న జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మములకు అనుసంధానము ఏర్పరచి, పెద్ద యంత్రాంగము తయారు చేసి పెట్టాడు. మనస్సుకు శరీరములో రెండు పనులను కల్పించి ఒకటి బయటి ఇంద్రియములకు లోపలి ఇంద్రియములకు సమాచారమును చేరవేయు మధ్యవర్తిగను, ఆ పనిలేనపుడు విషయములను మననము చేయడమను రెండవ పనిని నిర్ణయించి పెట్టాడు. మనస్సు విషయములను జ్ఞాపకము చేయగ, విషయమునకు తగిన గుణములు చెలరేగగ, వాటిని బుద్ధి రెండు విధములుగా యోచించగ, యోచించిన రెండు విధానములలో చిత్తము కర్మానుసారము నిర్ణయించగ, ఆ నిర్ణయము మనస్సు ద్వారా బయటి శరీర భాగములైన కర్మేంద్రియములకు చేరగ, మనస్సు ఆదేశము ప్రకారము అవి పనిచేయుచున్నవి. ఈ విధముగా బయటి ప్రపంచమున లోపల చెలరేగిన విషయము కార్యరూపము దాల్చుచున్నది. కార్యములు చేయునట్లు యంత్రాంగము అమర్చినది పరమాత్మయే. కర్మానుసారము కార్యరూపములై జరుగు పనులను తానే చేయునట్లు జీవుడు అహము చేత నేనే అనుకొనుట వలన జరుగు పనులలో పాపముకాని, పుణ్యముకాని తిరిగి ఆ జీవునకు ఏర్పడునట్లు, అట్లు ఏర్పడుటవలన వచ్చిన కర్మను తిరిగి శరీరము ద్వారా అనుభవించునట్లు అమరిక ఏర్పరచినది కూడ పరమాత్మయే. ఇన్ని అనుసంధానముల నేర్పరచిన దానివలన, ప్రపంచమంతయు నిండిన మనుజులందరు తమలోని యంత్రాంగము తెలియక కర్మానుసారము బయటి కార్యములనే చేయుచుండుట వలన, మనము చూస్తున్న గందరగోళ ప్రపంచమేర్పడినది. ఎవరేమి చెప్పిన వినే స్థితిలో లేరు. జ్ఞానము తెలుసుకోమంటే మాకు తీరిక ఎక్కడిదంటున్నారు. పరమాత్మ అలా తీరిక లేని పనులలో ఇరికించడమే కాక, తన జ్ఞానము తెలుసుకొనుటకు శ్రద్ధ అను దానిని కూడ శరీరములో ఉంచాడు. శ్రద్ధ కల్గినవాడు జ్ఞానమును తెలుసుకొనునట్లు కూడ చేశాడు. ఈ విధముగా పరమాత్మ మానవులను మాయలోను ఇరికించాడు. దానినుండి తప్పుకొనుటకు దానిని కూడ ఏర్పరిచినాడు.

ఇంత పెద్ద ప్రపంచమునే సృష్ఠించిన పరమాత్మ ఈ ప్రపంచమంతయు తిరిగి నాశనమగునట్లు, తరువాత కొంతకాలమునకు సృష్ఠింపబడునట్లు కూడ ఏర్పరిచి పెట్టాడు. ఈ ప్రపంచమంతయు నాశనమైనపుడు కూడ పరమాత్మ నిలిచివున్నాడు. దీనిని బట్టి పరమాత్మకు మరణముగాని, నాశనముగానిలేదని తెలియుచున్నది. ప్రపంచమునే సృష్ఠించి దానిలో ఎవరెవరు వారివారి పనులను చేసుకొనునట్లు అమర్చిన మేధావి పరమాత్మ. స్వయంగా తానే మనుజుల మధ్యకు వచ్చి, నేను మిమ్ములను తయారు చేసినవాడినని చెప్పినప్పటికి, నమ్మనట్లు యంత్రాంగమును తయారు చేసిన మేధావి పరమాత్మ. మనుజులనే కాక సకల జీవులను, భూగోళమును, చంద్రగోళమును, సూర్యగోళమును, నక్షత్రములను తన శక్తి చేతనే ఆడించుచున్నాడని తెలిసినవాడెవడైన, అట్టి వానిని చంపుదునని కాని ఆయన చంపబడునని కాని ఎట్లు తలచును.

ఇంతవరకు మూడు ఆత్మల వివరము తెలియజేయుచు, చావులో ఒకదాని కొకటి ఎలా భేదములున్నవో తెలియజేయుచు, మూడు ఆత్మల వివరములలో మరణము గూర్చియే తెలిపిన భగవంతుడు ఆ మూడు ఆత్మలను అర్థము చేసుకొనునట్లు వాటి విధానమును గూర్చి ఇంకనూ తెల్పుచు జీవాత్మ ఎలా దేహమును పొందుచున్నదో మరియు వదలుచున్నదో క్రింది శ్లోకములో తెలియజేయుచున్నాడు.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 22: వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో ఽ పరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి||
(జీవాత్మ)

భావము : మానవుడు పాతవస్త్రమును వదలి క్రొత్తవస్త్రమును ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకొచ్చిన పాతదేహమును వీడి క్రొత్త శరీరములో ప్రవేశించుచున్నది.
వివరము : భగవంతుడు ఈ శ్లోకమున చెప్పిన భావము నూటికి నూరుపాల్లు చాలా మందికి అర్థము కాలేదని మేము తెలుపుచున్నాము. ఎందుకనగా ఈ శ్లోక భావమునకు వ్యతిరేక వివరము తమకు తెలియకుండానే వారియందు నిలిచి పోయినది. భగవంతుడు ఈ శ్లోకమున ఉదాహరణగ పాతవస్త్రము, క్రొత్త వస్త్రమని చెప్పి పాతదేహము, క్రొత్తదేహమని కూడ వివరించాడు. కాని ఇక్కడ క్రొత్త దేహమంటే ఏమిటో తెలియక చాలామంది పై శ్లోక భావమునే హత్య చేశారని చెప్పవచ్చును. విచక్షణ , వివరణ చూపులేని వారందరు గీతలో క్రొత్త దేహమన్నప్పుడు తలూపారు. మరికొన్ని పుస్తకములలో గర్భమందే పూర్తి తయారుకాని అసంపూర్ణ శరీరములో జీవుడు ఆరు నెలలకే ప్రవేశించునన్నపుడు కూడ తలూపారు. అట్లే పాతగృహము వదలి క్రొత్త గృహములో ప్రవేశించుచున్నాడన్నపుడు తలూపారు. ఆ క్రొత్త గృహమునకు పైకప్పుబడకనే తలుపులుంచకనే సగము కూడ తయారుకాని దానిలోనికి ప్రవేశించుచున్నాడన్నప్పుడు కూడ తలూపారు. క్రొత్త ఇల్లంటే పూర్తి తయారైనది కదాయని, క్రొత్త శరీరమంటే పూర్తి రూపురేఖలు దిద్దుకొన్నది కదాయని, యోచించలేక పోయారు. ఎవరెట్లనుకొనిన భగవంతుడు చెప్పుమాట ఏమంటే! పాతశరీరమును వదలిన ఆత్మ, పూర్తి తయారైన క్రొత్తదనిపించుకొనిన శరీరములో చేరుచున్నదని తెల్పుచున్నాడు. జీవాత్మ ఎచట గలదో ఆత్మకూడ దానితో కూడి ఉన్నది. కావున జీవాత్మ జన్మించితే దానితో పాటు ఆత్మకూడ మరుజన్మమున ప్రవేశిస్తున్నది. జీవాత్మ ఎలా శరీరములు మారుచున్నదో తెలిస్తే, ఆత్మకూడ క్రొత్తదేహమునెలా చేరుచున్నది తెలియును. కావున దానికి కావలసిన పూర్తి సవివరము ఆధ్యాత్మికరీత్యా, విజ్ఞాన (సైన్సు) రీత్యా మరియు సిద్ధాంతరీత్యా క్రింద వ్రాయుచున్నాము చూడండి.

స్త్రీ పురుష సంయోగములో పురుషుని వీర్యము స్త్రీయోని మార్గమున ప్రవేశించి గర్భకోశమును చేరి, అందు శరీరముగ తయారగుటకు ప్రారంభమగు చున్నది. పురుషుని వీర్యము స్త్రీ గర్భములో పూర్తి శరీరముగా తయారగుటకు దాదాపు తొమ్మిది నెలల కాలము పట్టుచుండును. స్త్రీగర్భములో మావి అను తిత్తియందు పూర్తిగా తయారైన శిశుశరీరము జీవములేనిది. చాలామందికి తెలియని విషయము కూడ ఇదియే. ఆరవనెలయందు శిశుశరీరమునకు ప్రాణము వచ్చునని చాలామంది పొరబడుచున్నారు. తల్లి గర్భములోనున్న శిశువునకు ప్రాణము రావడము అబద్దము. గర్భమున పూర్వజన్మ జ్ఞప్తికలిగి వాపోవుట పూర్తి అబద్దము. ఇక్కడ కొందరికొక పెద్ద సంశయమేర్పడవచ్చును. అది ఏమనగా? శిశు శరీరములోనికి ప్రాణము రాకపోయినచో, గర్భములోని శిశువు కదులుచుండునటుల తెలియుచున్నది కదా! అది ఎట్లు జరుగును? ఒక వేళ ఆరవ నెలయందు ప్రాణము రాకపోయినట్లయితే, శిశువు గర్భములో కదలకుండును కదా! ఆరవ నెలనుండియే కదలిక జరుగుచున్నది. కావున శిశు శరీరమునకు ప్రాణము గర్భములోనే వచ్చినట్లు మేము నమ్ముచున్నామని అడుగవచ్చును. దానికి మా సమాధానము తెలిపెదము. దూరము నుండి చూచి చింతచెట్టులాగయున్న జమ్మిచెట్టును చింతచెట్టనుకొన్నట్లు, గర్భములో శిశువు కదలికకు కారణము తెలియని మనము గర్భములోనే శిశువుకు ప్రాణమొస్తుందనడములో విశేషమేమున్నది. దగ్గరకు పోయి చూచిన కదా చింతచెట్టులాగయున్న జమ్మిచెట్టు, చింతచెట్టుకాదని తెలిసేది. నిజముగా గర్భములో జరుగుచున్న మార్పులను గమనించిన కదా! మనకున్న సంశయము తీరునది. కావున గర్భములో శిశుశరీరము పొందు మార్పులను గురించి తెలుసుకొందాము.

స్త్రీ గర్భము ధరించిన మొదటి నెలనుండి దాదాపు ఆరు నెలల వరకు శిశు శరీరము తయారై ఆకృతిని చేరుకొనును. ఆరునెలల వరకు శిశుశరీరము తయారగునట్లు తల్లి శరీరములోని నాడులే చేయుచున్నవి. తల్లి శరీరములోని బ్రహ్మనాడి నుండి బయలుదేరిన కొన్ని నరములు గర్భకోశమును ఆక్రమించి, శిశు శరీరముతో బొడ్డు ద్వార సంబంధము కలిగి, ఆ శరీరమును పెరుగునట్లు చేయుచున్నవి. తల్లి శరీరములో భాగములుగా జీర్ణాశయము, గుండె, కాలేయము మొదలగు అవయవములున్నట్లే, గర్భమును కూడ ఒక భాగముగా లెక్కించుకోవలెయును. జీర్ణాశయము, గుండె మొదలగు అవయవములను నాడులు ఆక్రమించి ఏవిధముగా కదలించుచున్నవో, ఆ విధముగనే ఆరునెలల తరువాత గర్భములోని శిశువును కూడ అప్పుడప్పుడు నాడులు కదలించుచుండును. కుమ్మరివాడు కుండను ఒక ఆకృతి వచ్చువరకు ఒకే స్థితిలో తయారుచేసి, ఒక ఆకృతి ఏర్పడిన తరువాత కుండను త్రిప్పిత్రిప్పి కొట్టి పూర్తికుండగా ఎట్లు తయారుచేయునో, అట్లే ఆత్మ బ్రహ్మనాడి ద్వారా ఆరునెలల వరకు శిశుశరీరమును ఒక ఆకృతి వచ్చునట్లు చేసి, ఆ తరువాత ఆ శరీరమును తలక్రిందులుగను, అడ్డముగను మరియు ఇతర స్థితులుగా మావియందు అప్పుడప్పుడు త్రిప్పుచు, పూర్తి ఆకృతి వచ్చి జీవుడు చేరుటకు తగిన రీతిగా శరీరమును తయారుచేయును. నాడులు కదిలించు కదలికను బట్టి కొందరు గర్భములో ఆరవ నెలయందే శిశు శరీరమునకు ప్రాణము వచ్చినదని భ్రమించుచున్నారు .

తల్లి గర్భములో నాడులు శిశుశరీరముతో సంబంధము కల్గియుండి, తొమ్మిది నెలల పర్యంతము జీవునికి నివాసయోగ్యముగా శరీరమును తయారగునట్లు చేసి, పూర్తి శరీరము తయారైన వెంటనే ఒక్కక్షణము కూడ గర్భములో శిశువు శరీరమును ఉంచక, గర్భకోశమును ముకుళింపజేసి, యోని ద్వారము వికసింపజేసి, శిశు శరీరమును బయటికి త్రోసివేయుచున్నవి. శిశుశరీరము బయటపడుదాక తల్లి గర్భములోని నాడులు శిశుశరీర సంబంధము కల్గియుండును. ఎప్పుడైతే గర్భము నుండి శిశుశరీరము బయటకు వచ్చునో, అప్పుడే గర్భములోని నాడుల సంబంధములు నిలిచిపోవుచున్నవి. గర్భము నుండి బయటపడు శిశుశరీరము శవమువలె బయటపడును. శరీరము బయటపడు వరకు ప్రాణముండదు. కావున దానిని శవములాగనే చెప్పుకోవలయును. ఇప్పుడు కొందరు 'గర్భములోని శిశువుకు ప్రాణము లేకపోతే అది కుళ్ళి తల్లి ప్రాణమునకే హాని కల్గించును కదా! ఆరు నెలల తరువాత ఎప్పుడైతే గర్భములో పిండము కదలక నిలిచిపోవునో అప్పుడే తల్లికి అపాయము సంభవించుచున్నది కదా! పిండము కదలిక ఎప్పుడైతే నిలిచిపోయి తల్లికి బాధ కల్గుచున్నదో, అప్పుడు వైద్యశాలకు తీసుకుపోతే అక్కడ వైద్యుడు ఈమెకు పిండము లోపలనే చనిపోయినదని చెప్పి, ఆలస్యము చేసినచో ప్రమాదమని ఆపరేషన్(శస్త్రచికిత్స)చేసి పిండమును బయటికి తీసివేయడము కూడ జరుగుచున్నది కదా! ఏమి తెలియని మొరటువారు కూడ పిండము కదలికతో శిశువుకు ప్రాణము వచ్చినదని, పిండము యొక్క కదలిక నిలిచిపోయిన వెంటనే శిశువుకు ప్రాణము పోయినదని తెలుసుకొనుచున్నారే! మీ మాట ఎట్లు నమ్మదగును? అంతేకాక పిండములో ప్రాణము లేకపోయిన వెంటనే తల్లికి ప్రమాదము జరుగుట కూడ తెలిసిన విషయమే. ఈ విధముగ ప్రత్యక్షముగా తెలియుచుండుట వలన గర్భములోనే శిశువుకు ప్రాణమొస్తుందని మేము నమ్ముచున్నాము' అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా!

గర్భములో ఆరవ నెలయందు కదలిక వచ్చు మాట నిజమే. ఆ కదలిక నిలిచి పోయిన వెంటనే తల్లికి ప్రమాదము సంభవించు మాటకూడ నిజమే. కాని అంత మాత్రమున శిశువుకు ప్రాణమొచ్చినదని, పోయినదని అనుకోవడము చాలా పొరపాటు. ఆరవ నెలలో ప్రాణము వచ్చినదనిన, అంతవరకు ప్రాణములేదనియే కదా అర్థము. ప్రాణములేని సమయములో తల్లికి ప్రమాదము సంభవించవచ్చును కదా! నిజము తెలియక అందరు అక్కడే పొరపడుచున్నారు. వాస్తవ విషయము ఏమనగా! మన శరీరములో కొన్ని అవయవములున్నను మనకు ఏ హాని కలుగకుండునట్లు, గర్భస్థ శిశువు తల్లి శరీరములో ఒక భాగముగా ఉండి, తల్లికి ఏ హాని కలిగించకుండ ఉండును. తల్లి శరీరములోని నాడులే శిశుశరీరమును కూడ ఆక్రమించి ఆ శరీరమును పెంచుచున్నవి. అందువలన శిశుశరీరము తల్లి శరీరములో ఒక భాగముగా ఉన్నదని చెప్పవచ్చును. ఆరవ నెలనుండి నరముల వలన పిండము కదిలినను తల్లికి ఏ విధమైన బాధయుండదు. ఈ విధముగా ఉండి తొమ్మిదవ నెలయందు శిశుశరీరము పూర్తిగా తయారైన వెంటనే నరముల ఒత్తిడి వలన తల్లి ప్రసవించుచున్నది. ఈ విధముగా కాక ఎవరికైన శరీరములో ఆరోగ్యలోపము వలన ఆరవ నెలకంటే ముందు బ్రహ్మనాడి నుండి బయలుదేరిన నరముల సంబంధము గర్భకోశముతో తెగిపోయిన ఆ గర్భము తల్లి శరీరములో వేరు పదార్థమై అక్కడ నిలువకుండ స్రవించిపోవును. దీనినే 'గర్భస్రావము' అని అందురు. ఇది చాలా మంది స్త్రీలకు ఆరునెలల లోపల జరుగుచుండును. ఆరునెలల లోపల శిశుశరీరము ఒక స్థాయికి వచ్చియుండదు. కాబట్టి రక్తముగానో, రక్తపు ముద్దగానో బయటికి పోవును. రక్తముగాను, మెత్తని రక్తపుముద్దగాను ఉండుట వలన బయటికి పోవుటకు అనుకూలముగా ఉండును. ఒకటి రెండు నెలల గర్భస్రావము ఎక్కువ బాధను కలిగించదు. నెలలు ఎక్కువ అయిన కొద్ది గర్భస్రావములో బాధ ఎక్కువగును.

ఆరవ నెల తరువాత పిండము ఒక ఆకృతి ధరించి స్రవించుటకు వీలుకాక ఉండును. తల్లి అనారోగ్యము వలన ఆరవనెల తరువాత గర్భకోశములో నాడులు గర్భముతో సంబంధము లేకుండా పోయిన ఎడల, ఆ గర్భము స్రవించుటకు వీలులేనందు వలన, ఆ గర్భస్థ శిశుశరీరమునకు తల్లి శరీరముతో సంబంధము లేక వేరు పదార్థముగ అక్కడనే నిలిచిపోవును. నరముల ఒత్తిడి గర్భకోశము మీద లేనందువలన శిశుశరీరము ఇతర పదార్థముగా గర్భకోశములోనే నిలిచిపోయి కుళ్ళుటకు మొదలుపెట్టును. శిశుశరీరము ఉబ్బుకొలది దానిని ఆనుకొను ఉండు అవయవములకు ఒత్తిడి ఏర్పడును. ఆ స్థితిలో ఉబుకుచున్న శిశుశరీర ఒత్తిడికి మిగిలిన సున్నితమైన అవయవములు ఒకదానికొకటి ఒత్తిడి కలుగజేసుకుంటుపోయి చివరకు గుండెకు ఒత్తిడి కల్గించును. గుండెకు కొద్ది మాత్రము ఒత్తిడి తగిలిన వెంటనే నిలిచిపోవు ప్రమాదము కలదు. అదృష్టవశాత్తు వెంటనే వైద్యుల దగ్గరకుపోయి చెడిపోవుచున్న శిశుశరీరమును బయటకు తీసివేసినట్లయితే తల్లి బ్రతుకుటకు వీలుకల్గును. ఈ విషయమిట్లుండగా మనము వేరువేరు విధములుగ పోల్చుకొని గర్భములోనే ప్రాణము వచ్చినది పోయినది అనుకొనుట జరుగుచున్నది.

తల్లి ఆరోగ్యము సరిగా ఉండి పూర్తిగా తయారైన శిశుశరీరము తొమ్మిది నెలలకు గర్భకోశములోని నరముల ఒత్తిడి వలన బయటపడుచున్నది. ఒక తాను లోని వస్త్రము దర్జీవాని వలన కుట్టబడి ఒక వ్యక్తి ధరించుటకెట్లు యోగ్యమైయున్నదో, అట్లే గర్భకోశము నుండి బయటపడు శరీరము కూడ జీవుడు నివాసము చేయుటకు అనుకూలముగ నరముల చైతన్యము చేత తయారు చేయబడి బయటకి వచ్చుచున్నది. ఆ విధముగా బయటికి వచ్చిన శరీరమునందు జీవుడు ప్రవేశించుచున్నాడు. చనిపోయిన వెంటనే జీవుడు ఏ మాత్రము ఆలస్యము లేక బయటికొచ్చిన క్రొత్త శరీరమును ధరించుచున్నాడు. దీనినే గీతాశాస్త్రములో 'పాతవస్త్రమును విడిచి క్రొత్తవస్త్రమును ధరించునట్లు, జీవుడు నాశనమైన పాతశరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నాడు' అని పరమాత్మ అన్నాడు. జీవుడు క్రొత్త శరీరమును ధరించుట వాని కర్మానుసారముగా ఉండును. జీవుడు చేసుకొన్న పాపపుణ్యములను అనుసరించియే క్రొత్త శరీరము కూడ లభ్యమగును. ఒక తల్లిగర్భము నుండి బయటపడిన శరీరమును ధరించుటకు తగిన జీవుడు వేరొక శరీరము నుండి వచ్చి ప్రసవింపబడిన శరీరములో ప్రవేశించుచుండును. తల్లిగర్భము నుండి బయటపడు శరీరము యొక్క తల బయటికి వచ్చినంత మాత్రముననే ఆ శరీరములో జీవుడు ప్రవేశించుటకు అవకాశము కలిగియుండును. అందువలన కొద్ది మాత్రము బయటికి వచ్చిన శరీరము కూడ ప్రాణము కలిగి అరుచుట మొదలుపెట్టును. కొన్ని చోట్ల ఒక నిమిషము మొదలుకొని గంట రెండుగంటల వరకు శిశుశరీరములోనికి ప్రాణము రాకుండుట సంభవించుచున్నది. దానికి కారణము ఆ శరీరములో ప్రవేశించు జీవుడు పాతశరీరమును వదలడములో ఆలస్యమై ఉండవచ్చును. అనగా ఆ శరీరములో ప్రవేశించు జీవుడు వేరొక చోట మరణించుట ఆలస్యమైనదన్న మాట. అందువలన ఇక్కడ కూడ శిశుశరీరము బయటికి వచ్చిన తరువాత ఆలస్యముగానే జీవుని ప్రవేశము జరుగుచున్నది. కొన్ని చోట్ల శిశుశరీరము బయటికి వచ్చిన తరువాత ప్రాణము వచ్చుటకు కొన్ని గంటల కాలము జరిగిన సందర్భములు కూడ కలవు. 12 గంటల తర్వాత ప్రాణము వచ్చిన సంఘటనను 6. అమ్మా నే బ్రతికే ఉన్నా! అను శీర్షికన ఇవ్వబడినది చూడగలరు.

ప్రసవింపబడిన శరీరములోనికి జీవుడు ఆలస్యముగా ఎందుకు చేరు చున్నాడని తెలియని గ్రామీణ ప్రాంత మంత్రసానులు, మావియందు ప్రాణమున్నదని మావిమీద నీళ్ళుపోసి తట్టుచుందురు. తెలియనితనముతో ఇక్కడ మంత్రసానులు మావిని నీటితో తట్టుచుండగా, జీవుడు వేరొక చోటినుండి వచ్చి శరీరములోనికి ప్రవేశించుచున్నాడు. జీవుడు ప్రవేశించినపుడే శ్వాస శరీరములోనికి ప్రవేశించు చున్నది. అందువలన మొదటి శ్వాసతో జన్మకలుగుచున్నదని చెప్పవచ్చును. శిశు శరీరములో జీవుడు ప్రవేశించగానే అరుచుటకు మొదలు పెట్టును. అప్పుడు మంత్రసానులు మావిలోని ప్రాణము శిశువులోనికి వచ్చినదని బొడ్డుకోయుదురు. ప్రాణము రాకముందు బొడ్డును కోసిన మావిలోని ప్రాణము శరీరములోనికి రాలేదని వారి నమ్మిక. అందువలన ప్రాణము రాకముందు బొడ్డుకోయరు. ప్రాణము రాకముందు బొడ్డుకోసిన ఎడల, ఆ శిశుశరీరములోనికి ప్రాణము రాకపోవు మాట నిజమే. మావి నుండి ప్రాణము వస్తుందనడము మాత్రము అబద్దము.

బొడ్డు కోసిన తరువాత ప్రాణము రాకుండా పోవుటకు కారణమేమనిన, క్రొత్తగా మొలకెత్తు చింత మొలకకు, విత్తనపు బేడలు ఏ విధముగా ఆహారబలము ఇస్తున్నవో, ఆ విధముగానే క్రొత్తగా బయటపడిన శరీరమునకు, జీవుడు ప్రవేశించు వరకు మావి ఆధారమై శిశుశరీరములోని రక్తము గడ్డకట్టకుండునట్లు చేయుచున్నది. ఆ విధముగా కొంతసేపు మాత్రమే చేయగలదు. జీవుడు ప్రవేశించిన వెంటనే శ్వాస రక్తప్రసరణము జరుగుచున్నవి. కావున మావితో అవసరములేదు. అందువలన బొడ్డుత్రాడును కోసివేసి మావిని వేరు చేయుచున్నాము. జీవుడు శరీరములో ప్రవేశించక ముందే బొడ్డును కోసిన, రక్తము చల్లారి శరీరములో గడ్డకట్టుకుపోయి జీవుడు ప్రవేశించుటకు శ్వాస జరుగుటకు అయోగ్యమగును. అందువలన ముందే బొడ్డుకోయు పద్ధతి మంచిదికాదు. ఒకవేళ తెలియనివారు ముందే బొడ్డుకోసిన ఆ శరీరములోని రక్తము చల్లారక ముందే ఒక నిముషము లోపల జీవుడు వచ్చి చేరినా చేరవచ్చును. ఆ నిమిషములోనే వచ్చి చేరలేకపోతే ఆ శరీరములో రక్తము గడ్డకట్టి పనికిరానిదై పోవును. అందువలన తెలిసిన వారుకాని, తెలియని వారుకాని, ప్రాణము రాకముందే బొడ్డుకోయరాదు. బొడ్డు ముందు కోయని కారణమున మావినుండే ప్రాణమొస్తున్నదని చాలామందికి నమ్మికయున్నది. ఆ నమ్మికయున్న మంత్రసానుల మాటవిని 'ఏమమ్మా మీరు ఆరవ నెలలో శిశువుకు ప్రాణమొచ్చినదని అంటుంటారే, అట్లయిన తల్లి ప్రసవించినపుడు శిశు శరీరములో ప్రాణమొచ్చినది శిశువుకా? లేక మావికా? శిశువుకు ప్రాణమొచ్చియుంటే అది శిశువులో ఉండక మావిలోనికి ఎందుకు పోయినది, తిరిగి శరీరరములోనికి ఎందుకు వస్తున్నది? అని అడిగితే వారు ఏ మాత్రము సమాధానము చెప్పలేరు.

మన జన్మను గురించి మనమే తెలుసుకోలేని అజ్ఞాన అంధకారములో ఉండి చీకటిలోనున్న వస్తువును గురించి ఊహించి చెప్పినట్లు, తెలియని పుట్టుకను గురించి కొందరు ఆరవనెలయందు జీవుడు తల్లిగర్భములో ప్రవేశించి పూర్వ జన్మలను తలచుకొని బాధపడుననుట ఎట్లున్నదో మీరే ఆలోచించండి. పూర్వ కాలములో పుట్టిన తరువాతనే ప్రాణమొస్తుందని విశ్వసించేవారు. ధర్మములన్ని అధర్మములుగా మారిపోవునని పరమాత్మ చెప్పినట్లు, ఇప్పుడు ప్రాణము పుట్టక పూర్వమే ఉన్నదని అంటున్నారు. పూర్వము పుట్టిన శరీరములోనికి ప్రాణమొచ్చినపుడు జీవునకు జన్మ కలిగినట్లు లెక్కించుకొని, ఆ లెక్క ద్వారా జాతకచక్రము గీచి చూచెడివారు. ఇప్పటికి ఆ పద్ధతి ఉన్నది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారము కూడ శరీరములో మొదట శ్వాస ఎప్పుడు ప్రవేశించుచున్నదో, అప్పుడే జన్మ అని గ్రహించెడివారు. ఈ కాల జ్యోతిష్యములో ప్రసవము జరిగిన సమయమునే జన్మగా లెక్కించుకొనుచున్నారు. నిజమైన జన్మ శ్వాస శరీరములో ప్రవేశించినపుడే అవుచున్నది. కాబట్టి లెక్క ప్రకారము జ్యోతిష్యము చక్కగా తెలిసెడిది. ఇపుడు ప్రసవ సమయమునే జన్మగా లెక్కించుచున్నారు. కావున భవిష్యత్తు చక్కగా తెలియకున్నది. ఆరవనెల యందు జీవుడు క్రొత్త శరీరమును చేరియుండిన జ్యోతిష్యులు దానినే జన్మగా లెక్కించుకోవలయును కదా! అట్లుకాక ప్రసవించిన తరువాత లెక్కించుకొనుచున్నారంటే ధర్మము పూర్తి నాశనముకాక ఇంకను కొద్దిగ మిగిలి ఉన్నదని అర్థమగుచున్నది.

నేటి శరీర శాస్త్రజ్ఞులకు మరియు వైద్యులకు (డాక్టర్స్) ఈ విషయములో చాలా అనుమానములు ఉండవచ్చును. ఎందుకనగా వారు చదివిన చదువులో పురుషుని శరీరములో తయారైన వీర్యమునందు వీర్యకణములకే ప్రాణమున్నట్లు తెలియబరచబడియున్నది. అందువలన ఒక వైద్యుడు మా బోధ విన్న ఒక వ్యక్తితో కలిసి "ఆయన చెప్పునది పూర్తి శాస్త్రవిరుద్ధము. శరీర శాస్త్రజ్ఞులుగాను, వైద్యులుగాను ఉన్న మాకంటే ఆయనకు ఎక్కువగా తెలిసియుండునా? ప్రసవించిన తరువాత శరీరానికి ప్రాణము రావడము పూర్తిగా అసత్యము. ఆరవనెలలో ప్రాణమొస్తుందని మిగతా వేదాంతులు చెప్పుమాట కూడ అసత్యమే. పురుష వీర్యములోనే వీర్యకణములు జీవము కలిగియున్నవి. జీవము గల వీర్యకణము స్త్రీ శరీరములో రజోకణముతో కలిసి శరీరముగా మార్పుచెంది, తొమ్మిది నెలల తరువాత జీవముతోనే తల్లిగర్భము నుండి బయటికి వస్తున్నది. జీవము లేకుండ వస్తున్నదను మాట చాలా పొరపాటు. వీర్యములో వీర్యకణమునకు జీవమున్నట్లు మేము ఎన్నో నిదర్శనములు చూపగలము. ప్రాణము గల జంతు శరీరములో నుండి వీర్యమును తీసి, కొంత కాలము బయట తగిన వాతావరణములో ఉంచి, అవసరమేర్పడినపుడు ఆ వీర్యమును స్త్రీ జంతువు యొక్క యోనిలో వదలి దానికి గర్భమేర్పరుచుచున్నాము " అని పలుకుచున్నారు. వీర్యమునకు ప్రాణమున్నదని ఆ వ్యక్తి పూర్తిగా నమ్ముటకు మిక్కిలి చల్లని వాతావరణములో అనగా 0° నుండి 4° సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఒక ఫ్లాస్కునుండి టెస్టుట్యూబు మాదిరి ఉండిన ఒక గాజు గదిలో భద్రపరచి ఉన్న పశు వీర్యమును తీసి వెంటనే గాజు పలకమీద ఉంచి, మైక్రోస్కోపు(సూక్ష్మదర్శిని)నందు చూపినపుడు, ఒక చుక్క వీర్యములో తలతోక కలిగిన వీర్యకణములు అసంఖ్యాకములుగా ఉండి, అవి చలనము కలిగి తోకను కదలించుచు ముందుకు ఈదుచున్నటుల కనిపించుట వలన, ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయి వీర్యములోని వీర్యకణములకే ప్రాణమున్నదని పూర్తి విశ్వసించుచున్నాడు. వీర్యములోని వీర్యకణము యొక్క చిత్రమును క్రింద పటములో చూడవచ్చును.  వీర్యములో వీర్యకణములు కదులుచుండుట చూచిన ఆ వ్యక్తి వీర్యమునకే జీవముండగా, ప్రసవింపబడిన తరువాత జీవమొస్తుందనడము అబద్దమైయుండ వచ్చునని భావించి, ఆయన మమ్ములను కలిసి "స్వామిగారు! జీవుడు జన్మపొందు విషయమై మీరు చెప్పిన బోధ విన్న నేను, ఒక పరిశోధనలో వీర్యమునకు ప్రాణమున్నట్లు చూచాను. వీర్యములో వీర్యకణములకు ముందే జీవముండగ ప్రసవింపబడిన తరువాత జీవమొస్తుందన్న మీ మాట మాకు సంశయముగా ఉన్నది. ఒకవేళ ప్రసవానంతరము జీవమొచ్చినట్లు భావించిన వీర్యకణము కదలుట కళ్ళార చూచాము కదా! అను సంశయమొక వైపు ఏర్పడుచున్నది. అందువలన మీరు చెప్పిన బోధ నిజమా? లేక వైద్యులు చెప్పి చూపించినది నిజమా? ఏది నిజము ఏది అబద్దము అను సందిగ్ధావస్థలో ఉన్నాను. దీని విషయమై మీరేమందురు" అని ఆయన మమ్ములను ప్రశ్నించాడు.

ఇంతకు ముందు ఆధ్యాత్మిక గ్రంథములలో ఆరునెలలకు జీవమొస్తుంది అన్న విషయము నిజముకాదని? ప్రసవింపబడిన తరువాత జీవమొస్తుందని ఆ సిద్ధాంతమును తెలియజేసాము. ఇప్పుడు వైద్యులు వీర్యమునకే జీవమున్నట్లు వారి ఉద్ధేశ్యమును తెలియబరచుచున్నారు. కావున వారి సంశయము తీరునట్లు క్రింద విజ్ఞానరూపముగా తెలుపుచున్నాము శ్రద్ధగా గ్రహించుము.

జీవుడు కనిపించువాడు కాదు. జ్ఞాననేత్రమునకు మాత్రము జీవుడు కనిపించగలడు. జ్ఞాననేత్రములేని వైద్యులు కదలుచున్న వీర్యకణములో జీవము ఉన్నట్లు భావించుకొనుచున్నారే కాని జీవమును చూడలేదు. కదలుచున్నంత మాత్రముననే జీవమున్నట్లు ఎందుకు భావించుకోవలమును? కణమునకు కదలిక ఉండుట వలన జీవమున్నట్లు ఊహించితే, బస్సులు రైళ్ళు కదలుచున్నవి కదా! వాటికి జీవమున్నదా? మనుష్యులు లేకుండానే అంతరిక్షములో ప్రయాణించు రాకెట్లకు జీవమున్నదా! లేదు. కదలుచున్న యంత్రములకు జీవమెట్లు లేదో, ఆ విధముగానే కదలుచున్న వీర్యకణమునకు జీవములేదని చెప్పుచున్నాము. జీవము లేకుండిన వీర్యకణము ఎందుకు కదులుచున్నదని కొందరిలో సంశయమేర్పడవచ్చును. ఆ సంశయము తీరుటకు వీర్యములోని వీర్యకణము పురుష శరీరములో ఏ విధముగా తయారగుచున్నదో సంపూర్ణముగ తెలుసుకోవలసియున్నది. అందువలన నేటి శరీర శాస్త్రజ్ఞులకు మరియు వైద్యులకు తెలియని జనన సిద్ధాంతమును ఈ కాల శరీర శాస్త్రముననుసరించియే తెలుపుచున్నాము.

పురుష శరీరములో అంగమునకు ప్రక్కలయున్న బీజములలో (వృషణము లలో) వీర్యము తయారగును. బీజములు జంతువులకు పెద్దవిగాయుండును. మానవులకు చిన్నవిగ ఉండును. జంతువులకు మానవులకు అనగా పిండము నుండి ఉద్భవించు అన్ని జీవులకు వీర్యము తయారగును. మానవుని బీజములలో 200 లకు పైగా లాబ్యూలులు అను సూక్ష్మభాగములుండును. ప్రతి లాబ్యూలు అను సూక్ష్మభాగములోను మడతలుగ ఒక కట్ట మాదిరియున్న నాళములున్నవి. వీటినే వీర్యోత్పత్తి నాళములని అనుచున్నాము. ఈ మడతలుగల నాళములలోనే వీర్యాణువులు ఉత్పత్తి అగుచున్నవి. వీర్యోత్పత్తి నాళములన్ని ఒకటిగా చేరి ఎపిడైడిమిస్ అను ఒక పెద్ద గొట్టముగా ఉదరభాగములోనికి ప్రవేశించి అక్కడ ఒక తిత్తిగా విస్తరించి ఉండును. వీర్యము ఈ తిత్తిలో నిలువ ఉండును. అందువలన దీనిని వీర్యాశయమని అనుచున్నాము. రెండు బీజములనుండి వచ్చు నాళములు రెండు వీర్యాశయములుగా విస్తరింపబడి ఉండి, వీర్యాశయముల నుండి నాళములు బయలుదేరి ప్రోస్టేటు అను గ్రంథిలోనికి పోయి, అచటి నుండి మూత్రనాళములోనికి తెరుచుకొని ఉన్నవి. మానవుని బీజనిర్మాణము క్రింది పటములో చూడవచ్చును.  బీజములలో తయారైన వీర్యకణములు ఎపిడైడిమిస్ చేరి, అక్కడి నుండి వీర్యనాళము ద్వారా వీర్యాశయములోనికి పోయి, కొంతకాలము నిలువయుండి స్కలన కాలములో ప్రోస్టేటుగ్రంథి ద్వారా వచ్చినపుడు, అది స్రవించిన పాలవంటి పలుచని ద్రవముతో కలసి మూత్రనాళములోనికి వచ్చి అక్కడ కౌపర్ అను చిన్న గ్రంథులు తయారు చేసిన ద్రవమును మరియు మూత్రనాళములో మ్యూకస్ అను పొర స్యంధించిన మ్యూకస్ అను జిగురు పదార్థమును కలుపుకొని వీర్యము తెల్లని జిగురు పదార్థముగా బయటికి వస్తున్నది. దీనినే వీర్యము అంటాము. ఇంగ్లీషులో స్పెర్మ్(Sperm) అంటారు.

వీర్యములో గల వీర్యకణములు తల (శిరస్సు) కంఠము (మెడ) తోక (వాలము) అను మూడు భాగములుగా ఉండును. బీజవీర్యనాళములో తయారైన వీర్యకణము చలనరహితమైనది. బీజవీర్యనాళములో తయారై వీర్యకణము పూర్తి పరిమాణము పొందియుండదు. ఎపిడైడిమిస్ లోను, వీర్య నాళములోను మరియు వీర్యాశయములోను వీర్యకణము యొక్క పూర్తి ఆకారము తయారగును. వీర్యకణము పూర్తి పరిమాణము పొందిన తరువాతనే చలనము కలిగియుండును. పూర్తి ఆకారము తయారుకానంత వరకు చలనము ఉండదని ముఖ్యముగా గ్రహించవలయును. పూర్తిగా తయారైన వీర్యకణము ద్రవపదార్థములో ఒక నిమిషానికి నాలుగు మిల్లి మీటర్ల వేగముతో ఈదుతూ ఉండును. వీర్యకణము యొక్క తోక పాముతోక కదిలినట్లు కదులుచుండుట వలన వీర్యకణము ముందుకు కదిలిపోవుచుండును. వీర్యకణములు ఆమ్లగుణ ద్రవపదార్థములో చలించలేవు. క్షారగుణ ద్రవ పదార్థములో చలించగలవు. పురుష శరీరములో వీర్యకణములు కొన్ని వారాలపాటు చలనశక్తి కలిగి ఉంటాయి. స్కలితమైన తరువాత కొన్ని గంటలకాలము మాత్రమే స్త్రీ దేహశీతోష్ణస్థితిలో చలించగలవు.

ఇపుడు వీర్యకణము చలించుటకు కారణమేమిటను విషయము పరిశీలించినట్లయితే వీర్యాశయము లోపల గ్లూకోజ్ అధికముగాయున్న ద్రవము స్యంధింపబడుతుంది. వాలము కలిగిన వీర్యకణమునకు గ్లూకోజ్ తగిలిన వెంటనే వాలము చలించును. వీర్యాశయములోని ద్రవములో గ్లూకోజ్ స్యంధనము మామూలుగా ఉండును. కావున వీర్యకణము ఎన్ని రోజులైన పురుష శరీరములో చలనము కలిగియే ఉండును. ద్రవములో గ్లూకోజ్ లేని ఎడల వీర్యకణము చలించలేదు. సున్నపురాయికి నీరు తగిలిన వెంటనే ఏ విధముగా చలనము పుట్టుచున్నదో, నిమ్మరసమునకు సోడా తగిలిన వెంటనే ఏవిధముగా చలనము వచ్చునో, పాదరసమునకు వేడి తగిలిన ఏ విధముగ చలించుచున్నదో ఆ విధముగనే వీర్యకణ వాలమునకు గ్లూకోజ్ తగిలిన వెంటనే వాలములో కదలిక ఏర్పడును. గ్లూకోజ్ వీర్యకణవాలమునకు సరిపడదు. కావున వీర్యకణవాలమునకు ఎప్పుడు గ్లూకోజ్ తగులునో అప్పుడు రసాయనిక క్రియ ఏర్పడును. ఆ క్రియయే వీర్యకణ వాల చలనము. వీర్యకణవాలము కదలుట వలన వీర్యకణమంతయు కదులును. అంతమాత్రమున వీర్యకణమునకు జీవమొచ్చినదనడము పొరపాటు. శాస్త్రజ్ఞులందరు ఇక్కడే పొరపడుచున్నారు. ఎప్పుడైతే గ్లూకోజ్ లేకుండ పోవునో అపుడు వీర్యకణ చలనము నిలిచిపోవునను విషయము ముఖ్యముగా గ్రహించవలెను.

శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారము వీర్యకణము జీవము కలదియే అయితే దాని చలనము ముందుకు మాత్రమేయుండక వెనుకకు ప్రక్కలకు కూడ ఉండవలయును. దానికి జీవములేనిదాని వలన ప్రక్కలకు వెనుకకు చలించలేదను విషయము ముఖ్యముగా గమనించవలయును. గ్లూకోజ్ కు వాలమునకు సరిపడని కారణమున, వాలము చలించుట వలన, వీర్యకణము ముందుకే పోవుచుండునని గ్రహించుము. వీర్యకణవాలచలనమనెడి రసాయనిక క్రియ వలన గ్లూకోజ్ ఖర్చయి పోవుచుండును. గ్లూకోజ్ ఖర్చయి వీర్యద్రవములో లేకుండా పోయినపుడు, వీర్యాశయము గ్లూకోజ్ ను స్యంధించుచునేయుండును. అందువలన వీర్యకణ చలనమునకు లోపల ఏ ఆటంకములేదని చెప్పవచ్చును.

సంయోగ సమయములో వీర్యము స్త్రీయొక్క యోనిలో విడువబడును. వీర్యములోని వీర్యకణము స్త్రీగర్భములోని రజోకణముతో కలిసినపుడే స్త్రీ గర్భము ధరించుటకు వీలున్నది. వీర్యకణము గర్భాశయములో ఉన్న రజోకణముతో కలియుటకు చాలా దూరము పోవలసియుండును. వీర్యకణవాల చలనము వీర్యకణమును ముందుకే తీసుకొని పోవును. వీర్యకణము కొంతదూరము ప్రయాణించిన తరువాతే రజోకణముతో కలియుటకు వీలుకలదు. వీర్యకణ చలనము రజోకణముతో కలియుటకే నిర్మింపబడినది. లేకపోతే చలనముతో అవసరమేలేదు. స్త్రీయోనియందు స్కలనము జరిగిన వీర్యములో గ్లూకోజ్ ఉన్నంతవరకు వీర్యకణములు చలించి ముందుకు పోవును. గ్లూకోజ్ అయిపోయిన వెంటనే నిలిచిపోవును. వీర్యకణము కదులుచు ఎంత ముందుకు పోగలదు అన్న విషయము వీర్య ద్రవములో ఉన్న గ్లూకోజ్ ను బట్టి నిర్ణయించవచ్చును. స్కలన కాలములో ప్రోస్టేటు గ్రంథి తన స్యంధనములో ఎక్కువ గ్లూకోజ్ ను స్యంధించగలదు. అందువలన వీర్యకణము యోనిలో చలనము కలిగి ముందుకు పోగలదని చెప్పవచ్చును.

ఆమ్లగుణ ద్రవములో గ్లూకోజ్ ఉండినప్పటికి రసాయనిక క్రియ జరుగక వీర్యము చలనములేనిదవును. క్షార గుణద్రవములో మాత్రమే గ్లూకోజ్ సంయోగము వలన చలనము కలిగి ముందుకు పోగలదు. స్త్రీ యోనిలో ద్రవములు ఆమ్లగుణము కలవిగా ఉన్నాయి. అందువలన యోనిలో వీర్యకణములు చలనరహితమైపోయి ముందుకు సాగలేని స్థితి ఏర్పడుచున్నది. స్త్రీయోనిలో పడిన వీర్యము ఆమ్లద్రవ ప్రభావము వలన నిర్వీర్యమై పోకుండ ప్రోస్టేటు గ్రంథి క్షారగుణము గల తెల్లని ద్రవమును స్కలనకాలములో స్యంధించును. స్కలితమైన వీర్యములో క్షారగుణ ద్రవము ఉండుటవలన వీర్యము స్త్రీయోనిలోని ఆమ్లద్రవములో నిలిచిపోకుండ రెండు మూడు గంటల కాలము వరకు చలించగలుగును. వీర్యము తెల్లగా ఉండుటకు ప్రోస్టేటు గ్రంథి కారణమేనని తెలియుము.

స్త్రీ పురుషులు సంయోగము చేసిన ప్రతిసారి వీర్యకణము స్త్రీ రజో కణముతో చేరలేదు. ప్రతి సంయోగము లోను వీర్యకణ చలనమునకు కావలసిన గ్లూకోజ్ అయిపోవడమో లేక యోనియందు ఆమ్లగుణ ద్రవ ప్రభావము ఎక్కువ కావడమో ఉండును. ఒకవేళ వీర్యములో గ్లూకోజ్ సంపూర్ణముగావుండి క్షారగుణ ద్రవము కూడ ఎక్కువయుండిన వీర్యకణము పూర్తి ముందుకు పోయినప్పటికి గర్భకోశములో ఆ సమయానికి రజోకణము లేకపోయినట్లయితే ఆ సంయోగము నిష్ప్రయోజనమగును. ఎప్పుడో ఒకప్పుడు అన్ని అనుకూలములు ఏర్పడితే వీర్యకణము రజోకణముతో కలుస్తుంది. ఏ ఒక్క అనుకూలము లేకపోయిన ఆ సంయోగము ఫలించదు. అందువలన మానవుల అన్ని సంయోగములు ఫలించవని చెప్పవచ్చును. దీని కారణముననే కొందరికి సంతానము ఆలస్యముగా జరుగుచుండును. పిండజములైన జంతువులు ఒక్క పర్యాయము సంయోగించిన అది సఫలమై సంతతి జరుగును. దీనికి కారణము జంతు వీర్యములో క్షారగుణ ద్రవము ఎక్కువగా ఉండుటయు మరియు వీర్యములో గ్లూకోజ్ కూడ అధికముగా ఉండునని తెలుసుకొన్నాను. స్త్రీ జంతువులో రజోకణము తయారైనపుడే ఆ జంతు శరీరములో మార్పులు కనిపించి పురుష జంతువును ఆకర్షించును. ఆ మార్పును చూచినపుడే పురుష జంతువులలో కామగుణము పుట్టును. స్త్రీ జంతువులలో కూడ రజోగుణము తయారు అయినపుడే కామవాంఛకల్గును. అపుడే పురుష జంతువు కోసము ప్రాకులాడును. ఆ స్థితినే ఎద (మనసైనదని) అయినదని మనము అంటూవుంటాము. రజోకణము తయారైనపుడే సంయోగము జరుగుచున్నది. మరియు ఆ వీర్యములో కణములు ముందుకు పోవు అనుకూలతలు ఉన్నాయి. అందువలన జంతు సంయోగము ఒక్క పర్యాయము జరిగిన వెంటనే అది సఫలమగును. మనుష్య సంయోగము లో వీర్యమునకు ఎన్నో ఆటంకములు ఉన్నవి. కావున మానవుల సంయోగము ఎన్ని మార్లు జరిగిన అది సఫలము కాకపోవచ్చును.

వీర్యకణము శరీర ఉష్ణోగ్రతలో గ్లూకోజ్ కలయికతో రసాయనిక క్రియ వలన చలించగలదు. వీర్యకణ గ్లూకోజ్ రసాయనిక క్రియకు ఉష్ణోగ్రత అవసరమని ఇక్కడ తెలియుచున్నది. శరీర ఉష్ణోగ్రతకంటె కొద్దిపాటు ఎక్కువ ఉష్ణమైన ఫరవాలేదు. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలో రసాయనిక క్రియ జరుగదు. మరియు వీర్యకణము చెడిపోవును. అదే విధముగా శరీర ఉష్ణోగ్రతకంటే కొద్దిగా ఉష్ణోగ్రత తగ్గిన వీర్యకణ గ్లూకోజ్ రసాయనిక క్రియ జరుగును. కాని పూర్తి శీతలము ఏర్పడినచో రసాయనిక క్రియ జరుగదు. ఎక్కువ శీతలములో వీర్యకణము చెడిపోదు. ఇప్పటి ఉష్ణోగ్రత కొలత ప్రమాణములో 0° సెల్సియస్ శీతలములో ఉంచిన వీర్యము చెడిపోదు. ఆ శీతలములో వీర్యమునందు రసాయనిక క్రియ జరుగక నిలిచిపోవును. కాని వీర్యకణములు చెడిపోవు. రసాయనిక క్రియ జరుగనందున వీర్యములోని గ్లూకోజ్ ఖర్చుకాక అట్లేయుండును. అందువలన ఈ కాలములో వీర్యమును బయట "0° సెల్సియస్" శీతల ప్రదేశములో నిలువయుంచుచున్నారు. నిలువ ఉంచిన వీర్యమునకు తిరిగి వేడి తగిలిన వెంటనే రసాయనిక క్రియ జరిగి చలించుటకు మొదలుపెట్టును. కావున వీర్యమును అవసరమొచ్చినపుడు సంతాన కార్యమునకు వాడుకొనుచున్నారు. ఈ కార్యము పశువుల ఎడల ఎక్కువగా చేయుచున్నారు.

ఈకాల శాస్త్రజ్ఞులకు జ్ఞాననేత్రము గాని, సూక్ష్మదృష్ఠిగాని ఉండవు. కావున వారి భావనలన్నియు స్థూల పరిశోధనల మీద ఆధారపడియుండును. వీర్యకణము కదులుచున్నదంటే దానికి ప్రాణము ఉన్నట్లేనని వారి అంచనాయుండును. వారికి జీవుని విషయము తెలియదు. జీవుడు ఒకచోట నివశించుటకు వానితోపాటు ఎన్ని భాగములు (శక్తియుత భాగములు) ఉండవలయునను విషయము వారికి తెలియదు. జీవుడు ఒక వీర్యకణములోనే కాక, ఏ శరీరములో నివసించిన అక్కడ పంచభూతములు ఉండవలయును. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమితో తయారైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను మొదలగు ఇరువది నాలుగు భాగములు ఉండు చోటునే జీవుడు నివాసము చేయగలడు. అట్లు కాక 24 భాగములులేని చోట జీవుడు ఉండడని తెలియవలెయును. జీవుడు మరణములో పాతశరీరమును వదలి, జన్మలో క్రొత్త శరీరమును ధరించునని పరమాత్మ గీతయందు తెలిపియున్నాడు. మరియు క్రొత్త శరీరములో బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అను దశలు ఉండునని తెలిపినాడు. కాని వీర్యకణముగా గర్భములో వృద్ధి చెందునట్లుగా తెలిపియుండలేదు. జీవుడు ధరించు శరీరము స్థూలము, సూక్ష్మము అని రెండు భాగములుగ ఉండును. ఈ రెండు భాగములలో స్థూలభాగము లేకపోయినప్పటికి, సూక్ష్మభాగముండిన దానియందు జీవుడు నివాసము చేయగలడు. కాని సూక్ష్మము లేకపోయిన జీవుడు నివాసము చేయలేడు. జీవుడు నివాసము చేయు విధానము సాంఖ్యయోగము తెలిసిన యోగులకు మాత్రమే తెలియును. ఈనాటి డాక్టర్లకు, శాస్త్రజ్ఞులకు తెలియదు. జీవమును జ్ఞాననేత్రమున్న యోగులు మాత్రము చూడగలరు. డాక్టర్లు, శాస్త్రజ్ఞులు తమ స్థూలనేత్రములతో చూడలేరు.

వీర్యకణము తోక, తల కలదిగా తెలిపియున్నాము. తోక చలనము కలిగి తలగాయున్న దానిని ముందుకు తోసుకొనిపోవును. వాలము వీర్యకణ తల భాగమును ముందుకు తీసుకుపోవు వాహనముగానే ఉన్నది. వీర్యకణములోని తలయే సంతానమునకు కారణమని తెలియుచున్నది. ఇంతకు ముందు వీర్యకణ వాలము గురించియే తెలుసుకొన్నాము. ఇపుడు దాని తలను గురించి తెలుసుకొందాము. వీర్యకణ తల లోపలి భాగమున ఒక గుండ్రని భాగమున్నది. అది బంతివలె ఉండును. ఆ గుండ్రని కణము ఒక విధమైన ప్రకాశము కలిగి ఉండును.

పరిశోధించి గుండ్రని భాగములోని ప్రకాశమును చూడవచ్చును. ఈ గుండ్రని భాగము స్త్రీగర్భములో రజోకణముతో కలసి శరీరముగా మారుటకు అనుకూలముగా నిర్మాణమైయుండును. ఇదియే పురుష వీర్యములోని బీజమని చెప్పవచ్చును.

స్త్రీ గర్భకోశములో ఓవరీ (Ovary) అన్న భాగము నుండి రజోకణము తయారగును. రజోకణము ఓవరీలో నెలకొక్కటి తయారగుచుండును. రజోకణమునే ఇంగ్లీషులో ఓవం (Ovum) అని కూడ అందురు. ఈ రజోకణము ప్రొటోప్లాజము అను పదార్థముతో తయారైయుండును. బాదము గింజ ఆకృతి గల ఓవరీలు స్త్రీగర్భకోశములో గర్భశయానికి రెండువైపుల రెండు వుండును. ఓవరీలో తయారైన రజోకణము గర్భాశయానికి దగ్గరగాయున్న నాళములోనికి పోయి నిలిచియుండును. పురుష వీర్యములోని వీర్యకణము సంయోగము చెందిన తరువాత యోనిలో ముందుకు చలించుచు పోయి, వికసించుకొన్న పుష్పపు ఆకృతి కలిగిన భాగములో ప్రవేశించి, అందుగల నాళము ద్వారా గర్భకోశమునకు పోయి, గర్భాశయ మొదటి భాగములో ఉన్న నాళమందలి రజోకణముతో కలియుచున్నది. రజోకణము వీర్యకణము కలియడమునే గర్భధారణయని అందురు. రజోకణముతో కలిసిన వీర్యకణము తిరిగి గర్భాశయములోనికే వచ్చి, అందులోగల జిగురు పదార్థముతో తయారైన పొరలలో చొచ్చుకొని పోయి స్థానమేర్పర్చుకొని శిశువుగా వృద్ది పొందును.

స్త్రీ రజోకణముతో వీర్యకణము కలిసినపుడు వీర్యకణ తల భాగములోని గుండ్రని కణము అనేక కణములుగా విభజనచెంది (Mitosis), ఆ కణములన్నియు కలిసి ఒక శరీరముగా తయారగుటకు మొదలుపెట్టును. వీర్యకణము అనేకముగ విభజింప బడుట కూడ రసాయనిక ప్రక్రియయేనని తెలుసుకొనుము. వీర్యకణము స్త్రీ శరీర జనిత ప్రోటోప్లాజ రజోకణముతో కలిసినపుడే ఈ రసాయనిక క్రియ జరుగును. వీర్యకణ తలలోని గుండ్రని భాగము మరియు స్త్రీ రజోకణము రసాయనిక క్రియకు అనుకూల పదార్థములతో తయారైనవని తెలుసుకొనుము. ఈ రెండు పదార్థములు జీవరహితములేనని జ్ఞప్తికుంచుకొనుము. ఈ రెండు పదార్థముల యొక్క కలయిక వలన ఏర్పడిన రసాయనిక క్రియలో వీర్యకణము అనేక కణములుగా చీలిపోవుచు, ఆ కణములన్నియు ఒక గుంపుగ చేరుచు, శిశుశరీరము తయారగును. గర్భోత్పత్తి అయిన మూడవ నెలనుండి గర్భశయములో వీర్యకణ అభివృద్ది జరుగుచున్న పొరను అంటి రక్తపుష్కలమైన ఒక సంచివంటి పొర నిర్మితమగును. దీనిలో యుండే రక్తనాళములకు తల్లిలో ఉండే రక్తనాళ శాఖలు కలిసివుంటాయి. ఈ రక్త నాళముల నుండి బయలుదేరే నాడులు బొడ్డుత్రాడుగా ఏర్పడి శిశునాభిని అంటివుండును. శిశుశరీరములో జరిగే కార్యకలాపములకు కావలసిన ఆక్సిజన్, ఆహార పదార్థములు, విటమినులు బొడ్డు ద్వారానే సరఫరా అగును. గర్భధారణ జరిగిన తరువాత 280 రోజులకు శిశుశరీరము పూర్తిగా తయారగును.

గర్భధారణ జరిగిన తరువాత ఓవరీనందు ఒక భాగములో గర్భరక్షక రసము తయారై రక్తములో కలిసిపోవును. ఆ రసములో 'ప్రొజెస్టిరాన్ ' అను హార్మోను ఉన్నది. ఈ హార్మోను గర్భకోశము మీద పనిచేయు నాడులకు బలము కలిగించి గర్భస్రావము కలుగకుండ కాపాడును. ప్రొజెస్టిరాన్ బాగుగా తయారగుటకు తల్లి తన శరీర ఆరోగ్యమును జాగ్రత్తగ చూచుకోవలయును. ప్రొజెస్టిరాన్ సక్రమముగా తయారుకాని తల్లి శరీరము, గర్భము పెంచుటలో అనారోగ్యమైనదిగా ఉండును. ప్రొజెస్టిరాన్ తయారుకాని శరీరములో గర్భస్రావము జరుగుచుండునని తెలుసుకోవలయును. అటువంటి వారు గర్భస్రావము జరుగకుండ ప్రొజెస్టిరాన్ హార్మోనును ఇంజక్షన్ రూపములో తీసుకోవచ్చును.

తల్లి శరీరములో బ్రహ్మనాడి నుండి బయలుదేరిన కొన్ని నాడులు గర్భకోశమును ఆశ్రయించియుండును. ఆ నాడులు వీర్యకణము శరీరముగా మార్పుచెందుటలో ఏ ఆకృతిగా తయారుకావలసినది నిర్ణయించును. ఆ నాడులే శరీరమును ఏ విధముగా పెంచవలయునో ఆ విధముగా పెంచి ప్రసవింప జేయును. బ్రహ్మనాడినుండి బయలుదేరిన నాడులే శిశుశరీరమును గర్భాశయములో కదలునట్లు చేయుచున్నవి. ఆ నాడులలో చైతన్యము తక్కువగా ప్రసరింపబడి గర్భాశయము తక్కువగా కదులుచుండిన, శిశుశరీరము క్రమపద్ధతిగా పెరుగదు. తల్లి అనారోగ్య కారణమున గర్భములో శిశు కదలికలు తక్కువయుండిన, ఆ శిశువు క్రమపద్ధతిగ పెరుగక నడుము నుండి పైకి ఎక్కువ పెరిగి కాళ్ళు తక్కువగా పెరిగియుండును. కొందరికి నడుము నుండి కాళ్ళు ఎక్కువ పెరిగి నడుముపై శరీరము తక్కువ పరిమాణము పెరిగియుండును. కొందరికి తల లావుగ ఉండును. నడుము పెద్దదిగాను, చిన్నదిగాను, చేతులు కురచగాను, పొడవుగాను ఇట్లు అనేక విధముల మార్పులు కనిపించిన శిశుశరీరము సక్రమముగా పెరగలేదని తెలియుము. అవయవములు క్రమబద్దముగా పెరుగుటకు బ్రహ్మనాడి చైతన్యము అవసరము. బ్రహ్మనాడి చైతన్యము లేకపోతే శిశుశరీరము పెరుగదు, కదలదు మరియు ఆకృతి ఏర్పడదు.

ఇప్పటి శరీర శాస్త్రజ్ఞులు పురుష వీర్యకణమును, స్త్రీరజోకణమును పరిశోధనశాలలో కలిపి వాటికి కావలసిన వాతావరణమును, అభివృద్దికి కావలసిన పోషక పదార్థములను, రక్తమును సరఫరా చేయగా వీర్యకణము రజోకణముతో కలిసి రసాయనిక క్రియ వలన విభజన జరిగి మాంసకణములు ముద్దగా కొంత పెరిగి నిలిచి పోవును. శరీరము పూర్తిగా పెరగలేదు, తయారైన శరీరము ఒక మాంసపు ముద్దగా ఉండి పోయినది. ఏ ఆకృతి ఏర్పడలేదు. ఆ పరిశోధన వలన తల్లి శరీరములోనే శిశువు ఆకృతిగా పెరుగునని, అట్లుకాక పోయినచో శరీరమునకు ఆకృతి రాదని తెలియుచున్నది. బ్రహ్మనాడి స్పర్శలేనిదే శరీరము తయారు కాదని తెలియని శాస్త్రజ్ఞులు పరిశోధన జరిపి అందు విఫలమై మాకంటే మించిన దేవుడు ఒకడున్నాడని చివరకు అంగీకరించుచున్నారు. ఒకవేళ వారి పరిశోధనలలో శిశువు ఒక ఆకృతిగా తయారై అందు జీవమే ప్రవేశించియుంటే, మాకంటే వేరే దేవుడు లేడని అనేవారేమో?

  ఇంత విన్న తరువాత కూడ కొందరికొక సంశయము పుట్టి "హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు, తల్లిగర్భములోనే నారాయణ మంత్రమును నారదుని ద్వారా విన్నాడు కదా! తల్లిగర్భములో ప్రహ్లాదునికి జీవములేని ఎడల నారాయణ మంత్రమును ఎట్లు వినెను" అని అడగవచ్చును. దానికి మా సమాధానమేమనగా! ఒక వేళ వారి మాట ప్రకారమే ప్రహ్లాదునికి గర్భములోనే జీవమున్నదని అనుకొనిన బయటి మాటలు గర్భములోపలికి ఎట్లు వినిపించును? అట్లు వినిపించుననుకొనిన ఇపుడు కూడ గర్భములోనున్న శిశువులకు బయటి వారు బోధించిన బోధ తెలియవలయును కదా! అట్లు లోపల విన్నామనువారు కాని, వినినవారు కాని ఎవ్వరు లేరే! పరికించి చూచిన అనుభవానికిరాని కవులు పల్కిన మాటలని ప్రహ్లాదుని విషయము తెలియుచున్నది. బ్రహ్మవిద్య ఒక్క యోగులకు మాత్రమే తెలియును. భాషాపండితులు, కవులు బ్రహ్మవిద్యను గురించి ఏమాత్రము చెప్పలేరు. అందువలన జ్ఞాన దృష్టి లేని కవులు వ్రాసిన మాటలు పూర్తి అసత్యము.

  ప్రహ్లాదుని విషయము పురాణములలోనిది. పురాణములు కేవలము కల్పితము. విష్ణువును గురించి వ్రాయుటకు పూనిన కవులు, వారి ఇష్టానుసారము అల్లిన కథయే ప్రహ్లాద విషయము. ఇటువంటి కొన్ని కథలు చూచి, అంత పెద్దవారు వ్రాసిన విషయములు నిజముకాక అసత్యముండునాయని, మిగతా కవులందరు ఆ విధముగనే వ్రాయుటకు మొదలు పెట్టి శాస్త్రమునకు పూర్తి హాని చేసినారు. నేనింత వరకు చెప్పినప్పటికి నా మాట వినక ధర్మమేది? అధర్మమేది? అని గ్రహించక అధర్మవాదనే చేయువారు పరమాత్మ గీతయందు తెలియజేసిన విషయమునకు వ్యతిరేకులు.

  మేము తెలియజేయు బోధ జీవునకు, ఆత్మకు సంబంధించిన విషయము, కావున జీవముగల సమస్త జీవరాసులకు వర్తించును. జన్మ అనునది ఒక్క మానవునికే కాక అన్ని జీవరాసులకున్నది. అందువలన క్రిమి, కీటక, పశు, పక్షి, మృగాదులకు కూడ మా బోధ వర్తించును. ఈ మా మాటలువిన్న కొందరికి ఒక సంశయమేర్పడి "కోడి గ్రుడ్డునకు గర్భములో జీవము రాక బయటికి వచ్చిన తరువాత వస్తుందను కొనుటకు అది చలన రహితమైనదిగా ఉన్నది. చలనములేని కోడిగ్రుడ్డుకు ప్రాణము లేదనుకొనుటకు గ్రుడ్డులోనే పిల్ల ప్రాణము కలిగి బయటకు వచ్చుట చూచుచూనే ఉన్నాము. గ్రుడ్డునుండి పుట్టు జీవులకు మీరు చెప్పిన బోధ ఎట్లు వర్తించును? గ్రుడ్డులో జీవమున్నట్లా లేక గర్భము నుండి బయటకు వచ్చిన గ్రుడ్డునందు జీవుడు చేరినట్లా" అని అడుగ వచ్చును. ఈ అనుమానమును తెలుసుకొనిన అండజముల విషయమంతయు అర్థమగును. అందువలన కోడిగ్రుడ్డు విషయము తెలుసుకొందాము.

   గ్రుడ్డు నుండి పుట్టు ప్రాణులకు, పిండములనుండి పుట్టు ప్రాణులకు జన్మ విషములో కొద్దిగా మార్పు గలదు. జన్మ విషయములో అండజ, పిండజములకు భేదముండిన, సిద్ధాంతము మాత్రము అన్నిటికి ఒకటిగానే ఉండును. అండజములకు, పిండజములకు, భూజములకు (చెట్లు) మొదలగువాటికి మొదటి శ్వాసతోనే జన్మ కలుగుచున్నదను సిద్ధాంతము వర్తించును. కోడి జన్మను వివరించుకొనిన కోడికి యుక్తవయస్సు వచ్చిన వెంటనే శరీరములో కొన్ని పదార్థములు తయారై గుండ్రని ఆకృతి ధరించుచు దిన దినము పెరిగి అండాకృతికి చేరుకొనును. కోడి శరీరములో అండమునకు అవసరమైన పదార్థములు తయారవుతున్న సమయములో కోడిపెట్ట పుంజులతో సంబంధము ఏర్పరచుకొనును. పుంజుతో సంపర్కము జరిగినపుడు ఆ సంపర్క ఫలితముగా ఒక పదార్థమును పెట్టకోడి శరీరములో అండము కోసము తయారవుతున్న పదార్థములతో కలుసుకొనును. ఈ విధముగా కోడి శరీరములో తయారైన పదార్థములు కొన్ని అండముగా మారి బయటికి వచ్చును. కోడి ప్రతి దినము ఒక అండమును తయారుచేయును. బయటికి వచ్చిన అండమును పరిశీలించిన అందులో తెల్లసొన, పచ్చసొన అను పదార్థములు కనుపించును. ఈ పదార్థములలో ఏమాత్రము ప్రాణములేదు. అందువలన గ్రుడ్డుకు ప్రాణము లేదని చెప్పవచ్చును. పిండము బయటికి వచ్చిన వెంటనే ప్రాణమొచ్చినట్లు అండము బయటికి వచ్చిన వెంటనే ప్రాణము అందులో ప్రవేశించదు. ఇదియే అండజములకు, పిండజములకు గల భేదము. అండములోని పదార్థములు నిర్జీవములైనవై, ఆ పదార్థములు తగిన వాతావరణములో మార్పుచెందునవై ఉండును. కోడిగ్రుడ్డు 40° సెంటిగ్రేడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మార్పు చెందునదై ఉండును. మిగతా వేరు వేరు జాతి గ్రుడ్లుకు వేరు వేరు ఉష్ణోగ్రత అవసరమై ఉండును. తగు ఉష్ణోగ్రతకు పదార్థములలో రసాయనిక మార్పు జరుగునట్లు అండములు నిర్మింపబడియుండును. అండములో కోడిపిల్ల శరీరము తయారగుటకు అవసరమైన పోషక పదార్థములు, విటమినులు మరియు ఇతర పదార్థములతో నిర్మింపబడి ఉండును. చేతిబాంబులో రసాయనిక పదార్థములు నింపబడియున్నట్లు, కోడిగ్రుడ్డులో కూడ రసాయనిక పదార్థములు నింపబడివున్నవి. చేతిబాంబుకు ఎప్పుడు ఒత్తిడి కలుగునో అప్పుడది ప్రేలునట్లు, గ్రుడ్డుకు కూడ ఎప్పుడు తగిన వేడి తగులునో అప్పుడు పిల్లగా మారుటకు మొదలిడును.

తల్లి కోడి గ్రుడ్ల మీద పొదిగినపుడు కోడి శరీరములోని వేడి గ్రుడ్లకు తగులుట వలన గ్రుడ్దునందు పదార్థములు మార్పు చెందుచు పిల్లగా తయారగును. గ్రుడ్డులో పచ్చసొన భాగములో మధ్యన ఒక గుండ్రని పదార్థముండును. అది వేడి తగిలిన వెంటనే మార్పు చెందుటకు మొదలిడును. మధ్య భాగములోని పదార్థమునే మనము పురుష బీజముగా లెక్కించుకోవలయును. పచ్చసొన తెల్లసొన వినియోగము వలన ఈ పదార్థము పెరుగుచున్నది. కావున తెల్ల పచ్చసొనలను స్త్రీకణములుగా లెక్కించుకొనుచున్నాము. తగిన వేడి తగిలినపుడే గ్రుడ్డులో ఇమిడియున్న పురుషకణము స్త్రీకణ పదార్థములు కలిసిపోయి, పురుషకణము వృద్ది చెందుచుపోయి, కొద్ది రోజులకు పూర్తి పిల్లగా తయారగును. మానవులకు పురుషకణము గర్భాశయములోనే స్త్రీకణముతో కలియును. కోడిగ్రుడ్డుకు వేడిమి తగిలిన వెంటనే గ్రుడ్డునందు బీజకణము మార్పు చెందుటకు మొదలిడును. గ్రుడ్డులో పూర్తి పిల్ల శరీరము తయారగుటకు 21 దినముల కాలము పట్టును . పిల్లగా మార్పు చెందు కాలము అన్ని జాతి గ్రుడ్లకు ఒకే మాదిరి యుండదు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క కాల పరిమితి యుండును. 40° సెంటిగ్రేడు ఉష్ణముకంటే ఎక్కువ వేడిలో గ్రుడ్డులోని పదార్థము చెడిపోవును. అందువలన ఎండా కాలము కోడిగ్రుడ్లు పిల్లలుగా మారుట తక్కువగా ఉండును. గ్రుడ్లు కోడి క్రిందనేకాక వాటికి తగిన వాతావరణములో ఎక్కడైన పిల్లలుగా మారగలవు. ఈ కాలములో గ్రుడ్లను పిల్లలుగా తయారుచేయు యంత్రములు కలవు. ఆ యంత్రములలో గ్రుడ్డుకు కావలసిన వేడిని అందజేయుదురు. కావున గ్రుడ్డు పిల్లగా మార్పు చెందుచున్నది. వీటినే Incubators అందురు. కొన్ని చోట్ల కుండలోవుంచిన గ్రుడ్డు కూడ పిల్లగా మార్పుచెందిన సంఘటనలు ఉన్నాయి. పుంజుకోడితో సంబంధములేని పెట్టకోళ్ళు కూడ గ్రుడ్లు పెట్టును. ఆ విధముగా పెట్టబడిన గ్రుడ్లు పొదగవేసినప్పటికి పిల్లలుగా తయారుకావు. కారణమేమనిన ఆ గ్రుడ్డునందు పురుష బీజములేదు. గ్రుడ్డులో తెల్లసొన, పచ్చసొన, మిగతా అన్ని స్త్రీ పదార్థములుండును. కాని పచ్చసొన మధ్య భాగములో పురుష కణముండదు. పురుషకోడి సంపర్కము చెందిన కోడిగ్రుడ్డు మాత్రమే పురుష బీజము కలదిగావుండును. ఒక్కొక్క గ్రుడ్డుకు ఒక్కొక్క సంపర్కముండవలెను. ఒక సంపర్కమే అన్ని గ్రుడ్లలో బీజము కాదు. అందువలన గ్రుడ్లు పెట్టు కోడి ఒక విధముగా ఈల వేయుచు పుంజుకోడిని ఆకర్షించుచు ప్రతి దినమొ త్రొక్కుల్లు (సంపర్కము) పడుచుండును.

  మానవులకు గర్భకోశములో మావియందు శిశువు తయారైనట్లు, అండజము లకు గ్రుడ్డునందు పిల్ల తయారగును. మావియందు తయారైన శిశువుకు ప్రాణము లేనట్లు, గ్రుడ్డునందు తయారైన పిల్లకు ప్రాణముండదు. ఇక్కడ ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనగా? మావినుండి ప్రసవింపబడిన శిశువుకు బయట ప్రాణము వస్తున్నది. కాని అండములో తయారైన పిల్ల శరీరమునకు గ్రుడ్డునుండి బయటకి రాకమునపే గ్రుడ్డునందే ప్రాణమొస్తున్నది. పిండజములకు మొదటి శ్వాసతోనే ప్రాణమొస్తున్నది. అండజములకు కూడ మొదటి శ్వాసతోనే ప్రాణమొస్తున్నది. నిర్జీవమైన పిల్ల గ్రుడ్డు యొక్క పెంకును చీల్చుకొని రాలేదు. పెంకును పగులగొట్టుకొనుటకు అవసరమైన శక్తి ప్రాణముండినపుడే లభ్యమగును. అందువలన పెంకును పగులకొట్టుకొని బయటకు వచ్చు నిమిత్తము, పిల్లకు లోపలనే ప్రాణమొచ్చు ఏర్పాటు దేవుడు చేసియుంచాడు. జీవుడు నివాసము చేయుటకు యోగ్యముగ శరీరము ఎప్పుడు తయారైనదో, అప్పుడు ఆ శరీరమునందు వేరొక జీవుడు మొదటి శ్వాసతో ప్రవేశించునను సిద్దాంతము అందరికీ తెలిసినదే. ఆ ప్రకారము గ్రుడ్డులో తయారైన పిల్ల శరీరములోనికి జీవుడు మొదటి శ్వాసతో ప్రవేశించుచున్నాడు. ఇక్కడ కొందరికి ఒక సంశయమేర్పడవచ్చును. శ్వాస జరుగుటకు గాలి అవసరముకదా! బయటి గాలి లోపలికి రాకనే కోడిపిల్ల ఎట్లు శ్వాసించగలదని అడుగవచ్చును. దానికి సమాధానమేమనగా! తల్లి కోడి శరీరములో గ్రుడ్డు తయారైనపుడే గ్రుడ్డునందు పిల్లగా మారుటకు అవసరమైన పదార్థములన్నియు నింపబడి, ఆ పదార్థములన్నియు ఒక పొరలో బంధింపబడియుండును. ఆ పొరకు పెంకుకూ మధ్య ఒక ప్రక్కన కొద్దిగా ఖాళీ స్థలముండును. దానియందు గాలి నింపబడియుండును. గ్రుడ్డులో గాలి ఎక్కడున్నది తర్వాత పేజీ పటములో చూడవచ్చును.

  అండమునందు పూర్తిగా తయారైన పిల్లయందే జీవుడు ప్రవేశించును. పిల్ల తయారైన చివరి సమయములో పలుచని పొర చినిగిపోయి గ్రుడ్డు అంతయు పిల్ల శరీరము ఆక్రమించియుండును. పొర చినిగిన తరువాత గాలి గ్రుడ్డంతయు వ్యాపించియుండును. గ్రుడ్డులో గాలియుండుట వలన జీవుడు పిల్ల శరీరములోనికి మొదటి శ్వాసతో ప్రవేశించుచున్నాడని తెలుసుకొనుము. పిల్ల శరీరములోనికి ప్రవేశించిన జీవుడు గ్రుడ్డు లోపలయుండిన గాలిని శ్వాసించుచుండును. అట్లు కొన్ని నిమిషములు శ్వాస జరిగిన తరువాత ఆ గాలిలోని (ఆక్సిజన్) ప్రాణవాయువు అయిపోవును. అప్పుడు శ్వాస జరుగుచుండినప్పటికి ఆ శ్వాసలో ప్రాణవాయువు లభించనందు వలన పిల్ల ఉక్కిరి బిక్కిరగును. తన్నుకొనుటకు ప్రారంభించును. దిక్కుతెలియక పెంకును ముక్కుతో పొడుచును. పిల్ల తన్నుకొనునపుడు ముక్కుతో పొడచినపుడు పెంకు చిన్న రంధ్రముపడి తరువాత పగిలిపోవును. అప్పుడు బయట గాలిలో పిల్ల బ్రతుకుసాగించును. ఇదే విధముగా అండజములన్నిటికి జన్మ కలుగుచున్నదని తెలుసుకొనుము. స్త్రీలకు గర్భము వ్యర్థమైపోయినట్లే గ్రుడ్లు కూడ వ్యర్థమైపోగలవు. గ్రుడ్డు తయారు కావడములో పదార్థములు ఎక్కువ తక్కువ ఉండు దోషమువల్ల కాని, గ్రుడ్డు బయటకు వచ్చిన తరువాత వేడి లభ్యము కావడములో ఎక్కువ తక్కువల దోషము వలనగాని, గ్రుడ్డు ముర్రుగ్రుడ్డుగా వ్యర్థమైపోవుట జరుగుచుండును. ఇంతవరకు అండజముల యొక్క జన్మను గురించి తెలుసుకొన్నాము. అండజముల విషయములో అండమునకు ప్రాణములేని విషయము తెలిసిపోయినది. ఇపుడు భూమి నుండి పుట్టు జీవులకు జన్మ ఎట్లు కలుగుచున్నది తెలుసుకొందాము    భూమి నుండి పుట్టు వృక్షలతాదులన్నింటిని భూజములని అందురు. కోడి గ్రుడ్డు నుండి పిల్ల పుట్టినట్లు, విత్తనముల నుండి భూజములు పుట్టును. తల్లి కోడి శరీరములో తయారైన గ్రుడ్డుకు ప్రాణములేనట్లు, చెట్ల నుండి తయారైన విత్తనమునకు కూడ ప్రాణములేదు. విత్తనమునకు ప్రాణములేదను మాట కొందరికి చాలా విచిత్రముగాయుండును. ప్రజలలో విత్తనమునకు ప్రాణమున్నదను నమ్మిక పూర్తిగా జీర్ణించిపోయినది. అందువలన మా మాట విన్నంతనే చాలా ఆశ్చర్యము కలుగ వచ్చును. కొందరు మా మాట అబద్దమని పుస్తకము చదువక మూసివేయుదురేమో! ఎవరు నమ్మిన నమ్మకపోయిన విత్తనములకు ప్రాణములేదను మాట సత్యము.

  కోడి శరీరములో గ్రుడ్డు తయారగునట్లు, వృక్షములోనే విత్తనములు తయారగును. వృక్షములకు పెరుగు కాయలలో విత్తనములు తయారగును. ప్రతి జాతి విత్తనము రెండు భాగములుగా విభజింపబడియుండును. విత్తనము మొలకెత్తుటకు కావలసిన కొన్ని పదార్థములు కాయలయందే తయారై విత్తనమందు నింపబడి ఉండును. విత్తనము యొక్క రెండు బేడలయందు మొలకలకు కావలసిన ఆహారపదార్థములు, మరికొన్ని రసాయనిక పదార్థములు తయారైయుండును. గ్రుడ్డుకు పెంకు ఏవిధముగా ఉన్నదో, ఆ విధముగా విత్తనముకు ఒక పొర కప్పబడి ఉండును. ఈ పొరయందు ఒక చోట చిన్న ముడి కలిగియుండును. ఆ ముడి విత్తనము లోపలనున్న బేడలను పొరను కలిసియుండును. విత్తనపు బేడలు పై పొర కలియు ముడియందు 'మొన' అను ఒక చిన్న భాగముండును. ఈ మొన విత్తనములో ముఖ్యమైనది. ఈ మొనయందే పురుషకణము ఇమిడి ఉండును. విత్తనములో మొన మినహాయున్న బేడలను స్త్రీకణములుగా లెక్కించు కోవలయును. స్త్రీపురుష కణములను కాపాడుచు ప్రతిజాతి విత్తనమునకు ఒక పొరయుండును. దీనిని బీజరక్షక పొరయని అందురు. పొట్టులేని విత్తనములు రక్షణలేనివై కణములు చెడిపోవును. అందువలన పొట్టుపోయిన విత్తనములు మొలకెత్తవు. విత్తనమునకు ఒకచోట ముడి ఉన్నదని తెలుసుకొన్నాము కదా! ఆ ముడివద్ద పై పొర చిన్న రంధ్రము కలిగియుండును. ఈ విధముగా ఉన్న విత్తనము పూర్తి తయారైనదని చెప్పవచ్చును. బేడ ముదరనటువంటిది, పొర తయారుకానటువంటిది, పొరకు రంధ్రము లేనిది పూర్తి తయారుకాని విత్తనమని తెలుసుకొనుము. అటువంటి విత్తనము జన్మకు అయోగ్యమైనది. పూర్తిగా తయారైన విత్తనము నీరు తగిలిన వెంటనే మార్పు చెందునట్లు యుండును. భూమియందు పడిన విత్తనమునకు తేమ తగిలిన వెంటనే అది మొక్కగా మొలుచుటకు ప్రారంభమగును. విత్తనమున గల ముడివద్దనున్న రంధ్రము ద్వారా నీరు విత్తనము లోపలి భాగమందున్న మొనకు తగులును. నీరు తగిలిన వెంటనే మొనయందు మార్పువచ్చును విత్తనపు బేడలయందు కూడ మార్పువచ్చును. బేడలు మెత్తగా తయారగును. విత్తనపు మొన రెండు బేడలను ఆధారము చేసుకొని పెరుగుట ప్రారంభించును. అపుడు విత్తనపు పై పొర మెత్తబడి చినిగిపోవును. మొన నుండి పెరుగుటకు బయలుదేరిన ఒక భాగము భూమిలోనికి పోవును. రెండవ భాగము భూమి పైకి పెరుగును. గ్రుడ్డునందు పిల్లకు ప్రాణములేనప్పటికి ఏ విధముగ పెరుగుచున్నదో, అదే విధముగనే విత్తనమునందు ప్రాణములేనప్పటికి మొనయందలి పురుషకణము పెరుగుచున్నది. ఇది అంతయు విత్తనమునందలి రసాయనికచర్యయని తెలియవలెను. అట్లు పెరుగు సమయములో విత్తనముయందలి పదార్థములు మొలకకు వినియోగింపబడును. పురుషకణము విత్తనములోని పదార్థములను వినియోగించుకొని మొక్కగా మార్పు చెందుచుండును. భూమిపైకి పెరిగిన భాగములో చిన్న చిన్న ఆకులు తయారగును. భూమిలోపలికి పోయిన వేరు భాగములో చిన్న చిన్న వేర్లు తయారగును. ఈ విధముగా తయారైన మొక్కకు కూడ ప్రాణము లేదు. అంతవరకు విత్తనమందలి పోషక పదార్థములతోనే మార్పు చెందిన రసాయనిక క్రియ అని తెలియవలెను.

మొక్కకు ఆకులు వచ్చి వికసించుకొనుదాక దానియందు ప్రాణములేదని చెప్పవచ్చును. మొదటి శ్వాసతోనే జీవుడు ప్రవేశించునను సిద్ధాంతము ప్రకారము చెట్టుకు మొదటి శ్వాస జరుగు వరకు ప్రాణమురాదు. మొలకెత్తిన మొక్క ఆకులయందు పత్రరంధ్రములు తయారైనపుడు జీవుడు ప్రవేశించుటకు యోగ్యత కలిగిన మొక్కగాయుండును. మొక్క ఆకులు, కాండము పూర్తి తయారైన తరువాత, ఆకులయందు పత్రరంధ్రములు ఏర్పడిన తరువాత, మొదటి శ్వాసతో జీవుడు మొక్కయందు ప్రవేశించును. ఆకుల క్రింద గల పత్రరంధ్రముల ద్వారా మొక్క శ్వాసించునని తెలుసుకొనుము. పత్రరంధ్రములలో ఎప్పుడు శ్వాస ప్రవేశించుచున్నదో అపుడు జీవుడు చెట్టునందు ప్రవేశించునట్లు లెక్కింపబడుచున్నది. అండజములకు, పిండజములకు ప్రాణమొచ్చిన తర్వాత వాటికి ప్రాణమొచ్చినట్లు మనము సులభముగా గుర్తించగలము. కాని మొలకకు ప్రాణమొచ్చినను శ్వాస ఎప్పుడు ప్రవేశించినది ఎవరూ కనుగొనలేరు. మొలకెత్తిన విత్తనములకు ప్రాణమొచ్చిన వెంటనే గాలి నుండి ఆకుల ద్వారా శ్వాసించుచు, భూమి నుండి వేర్ల ద్వార పోషకపదార్థములను తీసుకొనుచు, ఆకుల పై భాగమున సూర్యరశ్మి చేత పిండి పదార్థమును తయారుచేసుకొనుచు, ఆహారమును సంపాదించుకొనుచు, జీవిత కార్యమును సాగించును.

  స్త్రీలకు గర్భస్రావము జరిగినట్లు, గ్రుడ్డు మురుగ్రుడ్డుగా చెడిపొయినట్లు విత్తనములు కూడ చెడిపోగలవు. ఎక్కువ వేడి తగులుట వలన, విత్తనమందలి తేమ ఆరిపోవుట వలన పదార్థములు చెడిపోయి విత్తనము మొలకెత్తలేక పోవును. పొట్టు తీసివేసిన విత్తనములు, పుచ్చిన విత్తనములు, చిరకాలము గడచిన విత్తనములు మొలకెత్తలేవు. విత్తనములో పదార్థములు అనుకూలముగా లేనందువలన పురుష భాగమైన మొన మొలకెత్తలేదు.

  భూమిమీద గల సమస్త విత్తనములకు జన్మ పైన చెప్పిన విధముగా మొదటి శ్వాసతోనే కలుగుచున్నట్లు తెలుసుకొనుము. సముద్రములోని జీవరాసులు నీటిని మొదటి శ్వాసగా పీల్చును. ఈ విధముగా జీవరాసులన్నియు క్రొత్త శరీరము ధరిస్తున్నవి. జీవాత్మతో పాటు ఆత్మ ఉన్నది కావున ఆత్మ కూడ జీవాత్మతో పాటు క్రొత్త శరీరమును చేరుచున్నదని తెలియాలి. క్రొత్తశరీరమేదో, ఆత్మ దానినెపుడు చేరుచున్నదో తెలిసింది కదా! ఆత్మ ఇంకనూ ఎట్టిదనగా క్రింది శ్లోకమును చూడుము.

  గమనిక: 'వాసాంసి జీర్ణాని' అను భగవద్గీత శ్లోకమునకు మేము చెప్పిన వివరము సరిక్రొత్తది. కావున దీని విషయమై బాగా యోచించి అర్థము చేసుకోగలరని కోరుచున్నాము .అయినప్పటికి ఇందులో ఎన్నో అనుమానములు ఉత్పన్నమై ఇది సత్యమా అను ప్రశ్న బయలుదేరును. అటువంటి అనుమానములు పోవుటకు కొన్ని వాస్తవ సంఘటనలు తెలుపుచున్నాము. దాదాపు ఇరవై ఐదు సంవత్సరముల క్రితము ఈనాడు దినపత్రికలో టూకీగా అను శీర్షిక క్రింద 'గడుగ్గాయి' అను పేరుతో ప్రచురితమైనది. అది ఏమనగా! ఇంగ్లాండునందు పెద్ద అస్పత్రిలో ఒక స్త్రీకి ప్రసవము జరుగగ, పుట్టిన ఆడ శిశువుకు గంటసేపైనప్పటికి కదలిక రాకపోవడముతో, అక్కడున్న డాక్టర్లు పరీక్షించి ఆ శిశువు గర్భమునందే చనిపోయినదని చెప్పారు. తర్వాత ఆ శిశువుకు అవ్వగారైన వృద్ధురాలు వచ్చి శిశువును గురించి అడిగింది. అపుడామెకు శిశువు తల్లి ప్రక్కనున్న వారు శిశువు గర్భమునందే చనిపోయినదని, దానిని శవాలగదిలో ఉంచారని చెప్పారు. ఆ వృద్ధురాలు చనిపోయిన శిశువు ముఖమునైన చూచి వస్తానని శవాలగదిలో తొట్టిలో పెట్టి గుడ్డకప్పిన శిశువు దగ్గరకు పోయి ముఖము మీద గుడ్డ తీసి చూడగా, శిశువు బ్రతికివున్నట్లు ఆమెకు తెలిసి ఎత్తుకు వచ్చి, అరుస్తున్న ఆ శిశువును అందరికి చూపి తల్లి దగ్గరకు చేర్చింది. ఆ విషయము తెల్సిన డాక్టర్లు వచ్చి శిశువును పరీక్షించి చూచి తెల్లముఖము వేశారు. తరువాత వారి సంరక్షణలోనే నెల రోజులు ఆ శిశువును పెట్టుకొని తరువాత డిశ్చార్జి చేసి పంపారు.

  ఇటువంటి సంఘటనే తిరుపతి గోస్ అస్పత్రిలో కూడ జరిగినది. అక్కడ పొరపడిన లేడి డాక్టరు నేనెలా పొరబడినాను, అన్ని పరీక్షలు చేసిన తర్వాత శిశువుకు ప్రాణములేదని నిర్ణయించాను కదా! శిశువు గంట తరువాత ఎలా బ్రతికిందని ఏదొ ఎక్కడో పొరబడినాననుకొన్నది. ఆమె మా 'జనన మరణ సిద్ధాంతము' అను పుస్తకము చదివిన తరువాత నాతో కలిసి తాను ఎక్కడ పొరబడినానో తెలిసిపోయినదని, ఈ విషయము మా చదువులలో ఎక్కడా లేదని, అందువలననే పొరపాటు జరిగినదని ఒప్పుకొన్నది. అప్పుడు నేనిలా ప్రశ్నించాను. 'కదలికలు లేనపుడు శిశువు ఏ స్థితిలో ఉందనుకొంటారు?' దానికామె జవాబు 'అది మూర్ఛస్థితిలో ఉందనుకొంటాము. అప్పుడు కాళ్ళు పట్టుకొని తలక్రిందులుగా వేలాడబెట్టి వీపు మీద తట్టుతాము. అప్పటికి కదలిక రాకపోతే రెండు రకముల ఇంజెక్షన్లు వాడుతాము. అప్పటికి కదలిక రాని ఎడల ఆ శిశువు గర్భములో మరణించినట్లు నిర్ణయించుతాము'. అన్నది అప్పుడు నేను శ్వాస ఆడుచు తెలివి తప్పియుంటే దానిని మూర్ఛ అనవచ్చును. శ్వాస ఆడకుండ తెలివి తప్పియుంటే దానిని మూర్ఛ అనకూడదు కదా! కదలికలు లేని శరీరములో శ్వాస ఆడుచున్నదో లేదో ముందు పరిశీలించిన ఎడల మీకే తెలియునన్నాను. ఇట్లు ఎన్నో నిదర్శనములను జనన మరణ సిద్ధాంతమునకు అనుకూలముగా మీరు చూడవచ్చును.
1). శిశువు బ్రతికే ఉన్నా.... మరణించాడని చెప్పిన డాక్టర్లు

(ఈనాడు, హైదరాబాద్) సీతాఫల్ మండి, నవంబరు 30,2001 (న్యూస్ టుడే):

  నవమాసాల కలల పంట కాసేపట్లో భూమ్మీద పడబోతోందని ఆ తల్లి సంబరపడింది. ఇన్నాళ్ళు కడుపులో ఉండి కితకితలు పెట్టిన బిడ్డ కొద్ది సేపట్లో చేతుల్లో ఉంటాడని ఆ తల్లి కన్న కలలు ఎన్నో, తీరా ఆ సమయం రానే వచ్చింది. పుట్టగానే బిడ్డ మృతి చెందాడని డాక్టర్ చేప్పేసరికి ఆమె గుండె బద్దలయింది. బిడ్డ శవాన్ని డాక్టర్ ఓ సంచిలో వేసి ఇచ్చి అప్పచెప్పినట్టుగా వారితో సంతకం తీసుకుని చేతులు దులుపుకున్నాడు. అక్కడితో కథ ముగిసేదే. కానీ ఆ బిడ్డ తండ్రి రావడంలో జరిగిన కొద్దిపాటి ఆలస్యం కథను మరో మలుపు తిప్పింది. శిశువు తండ్రికోసం అంతా ఎదురు చూస్తుండగా సంచిలో కదిలినట్లయింది. ఇది వింతా! డాక్టర్ల నిర్లక్ష్యమా! ఇదేదో ఏ మారుమూల కుగ్రామంలోనో జరిగినది కాదు. రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన గాంధీ హాస్పిటల్లో జరిగిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే... గూడూరులో ఉండే ప్రకాష్(25), రేణుక(20) లకు సంవత్సరం క్రిందట పెళ్లయ్యింది. రేణుక గర్భవతి అయ్యాక, తొలి కాన్పు కావడంతో ఖర్చుకు, శ్రమకు వెరవక ప్రతిసారి గాంధీ అసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకొనేవారు. ప్రసవ సమయం దగ్గరపడడంతో గురువారం సాయంత్రం గూడూరు నుంచి వచ్చి గాంధీ ఆసుపత్రిలోనే అడ్మిట్ అయ్యారు. సాయంత్రం ఏడు గంటలకు రేణుక మగబిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్లు పరీక్షించి పిల్లవాడు బలహీనంగా పుట్టడంవల్ల చనిపోయాడని చెప్పారు. దాంతో రేణుక శోకదేవతే అయ్యింది. ఆమె తల్లి వీరమ్మకు చనిపోయాడని చెప్పి బిడ్డను ఓ గోనె సంచిలో వేసి అస్పత్రి సిబ్బంది అప్పగించారు. సంచి అప్పగించినట్లు అమె చేత సంతకాలూ చేయించుకున్నారు. రేణుక భర్త ఆ సమయంలో బయటికి వెళ్ళాడు. వీరమ్మ రేణుకను ఓదారుస్తూ బిడ్డ శవాన్ని పెట్టుకు కూర్చుంది. అల్లుడి కోసం ఎదురు చూస్తోంది. గంట సమయం గడచిపోయింది. ఇంతలో గోనె సంచిలో కదలికలు మొదలయ్యాయి. పక్కనే ఉన్న మహిళలు ఆ విషయం గమనించి వీరమ్మకు చెప్పారు. సంచి విప్పి చూడగా బిడ్డ కదులుతున్నాడు. దాంతో వీరమ్మ, రేణుకల సంతోషానికి అవధుల్లేవు. అంతలోనే మళ్ళీ కదలికలు ఆగిపోయాయి. ఈ విషయాన్ని డాక్టర్లకు చెబితే వాళ్ళు వీరమ్మను బెదిరించి పంపేశారు. మళ్ళీ కొద్ది సేపటికి బిడ్డ ఏడుపులంకించుకున్నాడు. అప్పటికిగానీ డాక్టర్లకు తెలివిరాలేదు. వెంటనే బాబుని ప్రీమెచ్యూర్ యూనిట్ కి తరలించారు. ప్రస్తుతం బాబు ఆ యూనిట్లో చికిత్స పొందుచున్నాడు. అల్లుడు రావడం ఆలస్యం కాకపోయి ఉంటే ఏం జరిగేదో తల్చుకోవడానికే భయంగా ఉందని వీరమ్మ రోదిస్తూ చెప్పింది. ఆ కాసేపూ నరకయాతన అనుభవించామని రేణుక, వీరమ్మలు అన్నారు. బాబు బతకలేదని తెలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా అంటూ రేణుక కళ్ళనీళ్ళ పర్యంతమైంది. ఒక వేళ అదే జరిగుంటే రెండు నిండు ప్రాణాలు ఉత్త పుణ్యానికే బలయ్యేవి. అప్పుడా పాపం ఎవరిదో డాక్టర్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి.
2). ప్రాణము రాక ముందే వచ్చినది, పోయినదని చెప్పిన డాక్టర్లు
తండ్రి పేరు: E. రామ మోహన్ గౌడ్
తల్లి పేరు : E: వాసవి
హాస్పిటల్: గంగ హాస్పిటల్
తేది: జూలై, 22,2004
టైం: 6.30 AM

  గర్భవతిగ ఉన్న శ్రీమతి వాసవిగారు గంగ హాస్పిటల్(దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి) లో లేడీ డాక్టర్ గారితో పరీక్ష చేయించుకున్నది. గర్భస్థ శిశువు ఆరోగ్యముగానే ఉన్నదని ఆమె భర్త రామ్మోహన్ గౌడ్ గారికి డాక్టర్ తెలియపరిచారు. తరువాత కొద్ది రోజులకు నెలలు నిండి గర్భవతియై వాసవి గారికి నొప్పులు ప్రారంభమైనవి. డెలివరి అవుతుందని గంగ హాస్పిటల్ కు వెళ్ళి డాక్టరును కలిశారు. గర్భములో శిశువు కదలికలు బాగానే ఉన్నవని, శిశువు బాగానే ఉందని చెప్పిన డాక్టర్ల మాటలు విని రామ్మోహన్ గౌడ్ సంతోషంగా ఉన్నారు. కొంత సమయమునకు వాసవిగారు ప్రసవించడము జరిగినది. ప్రసవించిన 15 నిమిషముల తర్వాత తండ్రి రామ్మోహన్ గౌడ్ కు శిశువును చూపించారు. అపుడు శిశువుకు కదలిక గాని, శ్వాస ఆడినట్లు గాని కనిపించలేదు. ఆ విషయమై లేడీ డాక్టరును అడుగగ శిశువు హార్టు సమస్యతో(ప్రాబ్లమ్ తో ) పుట్టినదని, కొద్ది కొద్దిగ శ్వాస తీసుకొంటున్నదని, అందువలన పైకి కనిపించలేదని చెప్పినది. అప్పుడు రామ్మోహన్ గౌడ్ శిశువు కొద్దిపాటు కూడ మెదలలేదు, అరవ లేదు కదా అని అడిగాడు. దానికి సమాధానముగ హార్టు ప్రాబ్లమ్ ఉన్న శిశువు అలాగే ఉంటుందని, భవిష్యత్తులో శిశువు పెద్దదయిన ఇటువంటి పరిస్థితే ఉంటుందని, ఇటువంటి శిశువుతో తల్లిదండ్రులకు చాలా కష్టముగ ఉంటుందని, అన్ని పనులూ శిశువుకు చేయవలసి ఉంటుందని, చెప్పడము జరిగినది. ఆ మాటకు శిశువు మీద తండ్రికి కొంత విరక్తి కల్గినది. అప్పటికి ఉండలేక గర్భముతో ఉన్నప్పటినుండి మీ వద్దకు తీసుకువచ్చి పరీక్షలు చేయించాము కదా! అప్పుడు కడుపులో శిశువు ఆరోగ్యము బాగా ఉందని చెప్పారు కదా! అని అడిగాడు. అన్ని ప్రాబ్లమ్స్ పరీక్షలతో తేలవు అని చెప్పి, I.C.U కి శిశువును పంపుచున్నామని, ఒకవేళ శిశువు బ్రతకవచ్చు లేక చనిపోవచ్చు అని వేరే హాస్పిటల్ కు ఫొన్ చేసి వ్యాన్ ను రప్పించి శిశువు యొక్క ముక్కులకు ఆక్సిజన్ పెట్టి అక్కడి నుండి పంపించినది. ఇదంతయు జరుగుటకు దాదాపు 45 నిమిషములు పట్టినది. శిశువు మీద ఆశ వదులుకున్న రామ మోహన్, తన భార్య ఆరోగ్యముగ ఉంటే చాలునని భార్యకు శిశువు విషయము ఏమాత్రము చెప్పక ప్రక్కగదిలో పరీక్షల నిమిత్తము డాక్టర్లు పెట్టుకొన్నారని చెప్పి మభ్యపరిచాడు. తర్వాత అరగంటకు మీ శిశువు చనిపోయిందని డాక్టరు చెప్పడము జరిగినది. ఆ విషయము తల్లికి తెలిస్తే షాక్ కు గురి అవుతుందని భర్త ఏమాత్రము భార్యకు తెలియనివ్వకుండ దాదాపు 20 రోజులు గడిపాడు.

  ఇక్కడ జరిగిన అసలు విషయమేమంటే 15 నిమిషముల తర్వాత కూడ కదలని, అరవని శిశువును చూచి డాక్టరుకు ఏమి అర్థము కాక, శ్వాస ఏమాత్రములేని శిశువుకు కొద్దికొద్ది శ్వాస బయటికి కనిపించని విధముగ ఆడుచున్నదని చెప్పడము మొదటి తప్పు. ఆ తప్పును సమర్థించుకొనుటకు హార్టువీక్ గ ఉన్న శిశువు ఇలాగే ఉంటుందని, పెద్దయిన తర్వాత కూడ కదలక మెదలక ఉంటుందని చెప్పడము రెండవతప్పు. శ్వాసయే లేని శిశువుకు ఆక్సిజన్ పెట్టి వేరే హాస్పిటల్ లోని I.C.U కు పంపించి శిశువు చనిపోయిందని వారి ద్వార చెప్పించడము మూడవ తప్పు. ఎప్పుడో ఒకపుడు కొన్ని శిశువులకు మాత్రము, ప్రాణము ఆలస్యముగా వస్తుందని డాక్టర్లకు తెలియకపోవడము అన్నిటికంటే పెద్దతప్పు.

  అరగంటకుగాని, గంటకుగాని, రెండు మూడు గంటలకుగాని, అంతకంటే ఎక్కువ సమయమునకుగాని, శిశువుకు ప్రాణమొచ్చితీరునను సత్యము తెలియకపోవడము వలన, గంగ హాస్పిటల్ లోని శిశువుకు ప్రాణము రాకమునుపే కొద్దిగ శ్వాస ఉందని తర్వాత పోయిందని చెప్పడము జరిగినది. ఈ సంఘటనలో ఎన్నో ఆశలతో, ఊహలతో తమ బిడ్డను చూచుకొంటామనుకొన్న తల్లిదండ్రులకు బిడ్డను దూరము చేసినట్లయినది. జీవిత ప్రథమాంకములోనే శిశువులను డాక్టర్లు తమకు తెలియకుండానే పరోక్ష హత్యలు చేయుచున్నారు. హత్యలు అనాగరికమని హత్య చేసిన వారిని శిక్షించగలిగిన న్యాయవ్యవస్థ తల్లిదండ్రులకు దుఃఖమును కల్గించుచున్న పరోక్ష శిశు హత్యలను ఆపగలదని, శిశవువుకు ప్రాణము ఎప్పుడొస్తుందో తెలియని లోపభూయిష్టమైన వైద్యచదువులను, లోపరహితముగా మార్చుటకు ఆదేశాలిచ్చి, ఎందరో శిశువులను రక్షించి పుణ్యము కట్టుకోవలసిందిగ కోరుచున్నాము.
3). శిశువుకు ప్రాణము రాకనే చనిపోయినదని చెప్పిన డాక్టర్లు
తండ్రి పేరు: మల్లేష్
తల్లి పేరు : రజిత
హాస్పిటల్: విజయ నర్సింగ్ హోమ్, (కర్మన్ గాట్)
తేదీ : ఆగష్టు 26, 2004
డాక్టర్లు : సత్యనారాయణ మరియు ఒక గైనకాలజిస్టు

  కూలినాలి చేసుకొని బ్రతికే పేదదంపతుల కుటుంబము మల్లేష్ గారిది. భార్య గర్భవతి కాన్పు అయ్యే సమయములో ఆమెకు నొప్పులు వచ్చాయి. వెంటనే దగ్గరలో ఉన్న గాయత్రీ నగర్ రోడ్డు నెం. 19 లో ఉన్న విజయ నర్సింగ్ హోమ్ కి తీసుకొని వెళ్లారు. ప్రసవం కాగానే ఆ మగ శిశువును డాక్టర్లు పరీక్షించి శిశువుకు ప్రాణములేదని చెప్పారు. చనిపోయినదని చెప్పి శిశువును తీసుకెళ్లమని డాక్టర్లు చెప్పగ, ఆ సమయములో శిశువు తండ్రి లేనందున, దాదాపు ఒకటిన్నర గంట తరువాత శిశువు తండ్రి మల్లేష్ తదితరులు నర్సింగ్ హోమ్ కు వచ్చి, శిశువు చనిపోయినదని డాక్టర్లు చెప్పిన సమాధానము విని బాధపడ్డారు.

  ప్రాణము లేని పసిబిడ్డను పూడ్చి పెట్టాలని అనుకొన్నారు. అనుకొన్న వెంటనే గుంత త్రవ్వడానికి శిశువు తండ్రికి సంబంధించినవారు వెళ్లారు. హాస్పిటల్ నుంచి ఆ పసికందు శవాన్ని స్మశానానికి తరలించాలనుకొన్నపుడు, రక్తపు మరకలు ఆరని పసికందును తండ్రి చివరిసారిగా తన స్వంత హస్తాలతో తీసుకొన్నాడు. తన చేతులలోకి తీసుకొన్న శిశువును చూసి తండ్రి మల్లేష్ సంతోషముతో 'నా బిడ్డ బ్రతికే ఉన్నాడు' అని బిగ్గరగా అరిచాడు. ఈ హఠాత్ పరిణామానికి అక్కడివారు ఆశ్చర్యపోయారు. నా బిడ్డ శ్వాస పీల్చుకుంటున్నాడని మల్లేష్ చెప్పాడు. అప్పటికీ శిశువు యొక్క బొడ్డుత్రాడు వేరు చేయబడలేదు. శిశువు చనిపోయిందని అలా ఎందుకు చెప్పారు అని డాక్టరును నిలదీయగా, డాక్టరు సత్యనారాయణ సమాధానము చెపుతూ నాతో పాటు గైనకాలజిస్టు కూడ పరీక్షించారు ఏదో ఫీటల్ హార్టు లోపమని చెప్పారు అన్నాడు. శిశువు బొడ్డుత్రాడు తొలగించి వెంటనే ఓవైసీ హాస్పిటల్ కు తీసుకుపొమ్మని డాక్టరు చెప్పారు. వెంటనే వారు ఓవైసీ హాస్పిటల్ కు తీసుకెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకొని తర్వాత శిశువు ఆరోగ్యముగానే ఉన్నదని తెలుసుకొన్న దంపతులు సంతోషించారు.

  తండ్రి చేతులలో ప్రాణము పోసుకున్న ఆ శిశువు కొన్ని నిమిషములు కల్లు తెరువకుంటే గుంతపాలై పోయేవాడు. దంపతులు దుఃఖముతో ఏడ్చేవారు. ప్రాణముండగానే లేదని ఎందుకు చెప్పారని దంపతుల బంధువులు స్థానిక పెద్దలు, అక్కడి విజయ నర్సింగ్ హోమ్ డాక్టరును నిలదీసి అడుగగా డాక్టరు ఏదో సమాధానము చెప్పి పంపివేశారు.

  ఈ విషయము రెండు మూడురోజులకు E .TV వారికి కూడ తెలియబడింది. E .TV విలేఖరి రెహమాన్ స్థానిక విజయ నర్సింగ్ హోమ్ కు వెళ్లి వాకబు చేయగ డాక్టరుగారు మొదట బుకాయించి తరువాత తన తప్పేమీ లేదని గైనకాలజిస్టుతో పరీక్షించానని చెప్పాడు. ఈ సంఘటన E .TV న్యూస్ లో ఆగష్టు 29 వ తేదీన ప్రసారము చేయడము జరిగినది.
4). 12 గంటలకు పైన స్మశానంలో బ్రతికిన శిశువు
తల్లి పేరు: సుమతి
హాస్పిటల్: గాయత్రీ క్లినిక్(కల్వకుర్తి)
తేది: 5 -10 -2004
డాక్టర్లు: డా|| మువ్వా రామారావు మరియు డా|| హిమబిందు.

   ఎన్నో పరిశోధనలు చేసి భౌతిక విషయములన్నీ తెలుసు కొన్నామనుకొను శాస్త్రజ్ఞులకు, ఇంకా తెలియని విషయములెన్నో ఉన్నవి. మాకు తెలియనిదిలేదనుచు, తమకు తెలిసినదే సత్యమనుకొను భౌతికశాస్త్రవేత్తలు ఇంకా పరిశోధించి తెలుసుకోవలసింది ఎంతో ఉందని వెక్కిరించు విషయములు కోకొల్లలు గలవు. అందులో ఒక్క విషయమును కూడ పరిశీలించి చూడక ఉన్నత విద్యావంతులమని పైనరంగు పూసుకోవడము సమాజద్రోహమని తెలియునట్లు, ఎన్నో సంఘటనలు గలవు. ఒక మేక రెండు పిల్లలీనిన తర్వాత, వాటికి ప్రాణములేదని ప్రక్కన పారవేసిన తర్వాత, మూడు గంటలకు ఆ రెండు పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి ప్రాణము పోసుకోవడము విచిత్ర సంఘటనే, అయిన అవి జంతువులు కాబట్టి వాటిని ఎవరు పట్టించుకోవడములేదు. అట్లని మనుషుల విషయములో అదేవిధముగ జరిగినప్పటికి పట్టించుకోక పోవడమును ఏమనవచ్చునో అర్థము కావడములేదు. మన పరిశోధనల ఫలితము మానవ సమాజము నాగరికతవైపు పయనించుటకే గాని అనాగరికతవైపుకు పోకూడదు. మానవుని మనుగడకు ఉపయోగపడవలసిన విజ్ఞానము(సైన్స్) ప్రథమాంకమైన బాల్యములోనే మానవున్ని హతమార్చడము విడ్డూరము కాదా! ఒక్క ఆంధ్రరాష్ట్రములోనే సంవత్సరమునకు కొన్ని వందల సంఖ్యలలో, శిశుదశలోనే మానవజాతి పరోక్ష హత్యకు గురి అవుతున్నదని చెప్పుటకు ఎన్నో ఉదాహరణలు గలవు. వాటిలో మహబూబ్ నగర్ జిల్లా, కల్వకుర్తిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రియందు జరిగిన సంఘటనను వివరించుకొందాము.

  "జడ్చర్ల మండలము నజురుల్లాబాద్ గ్రామానికి చెందిన సుమతి, పురుటి నొప్పులతో 2004 అక్టోబర్ 5 వ తేదీన మంగళవారము కల్వకుర్తి ప్రైవేటు ఆసుపత్రిలో చేరడము జరిగినది. సాయంత్రము 5 గంటలకు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఆడశిశువును బయటికి తీసిన డాక్టర్లు, శిశువును కొంతసేపు క్షుణ్ణంగా పరీక్షించి మరణించినట్లు ధృవీకరించారు. మరణించిన శిశువు పుట్టిందని చెప్పిన డాక్టర్ల మాటలకు కొంత బాధపడిన తల్లితండ్రులు శిశువును ఇంటికి తీసుకుపోయారు. శిశువు పుట్టిన మంగళవారం గడచిపోగా బుధవారము పసికందును ఖననము చేయడానికి స్మశానానికి తీసుకెళ్లారు. గోతిలో శిశువును పరుండబెట్టి పైన మట్టి వేయునపుడు శిశువు కదలి ఏడవడము మొదలు పెట్టింది. ఆశ్చర్యపడిన తండ్రి మొదలైనవారు బిడ్డ బ్రతికిఉందని గ్రహించి ఇంటికి తెచ్చుకున్నారు. అన్ని విధముల పాప ఆరోగ్యముగా ఉన్నది. అన్ని పరీక్షలు జరిపిన తర్వాత కూడ మరణించిన శిశువు పుట్టినదని డాక్టర్లు చెప్పడముతో ఆ కుటుంబము పడిన ఆవేదన ఆగ్రహముగ మారింది. ఆసుపత్రిపై దాడిచేసి తాళాలు వేయడానికి ప్రయత్నించారు. శిశువు మరణించినట్లు ధృవీకరించిన డాక్టర్లు పరారైపోయారు.

  ఇది జరిగిన సంఘటన కాగ ఇందులో డాక్టర్లకు తెలియని విషయము ఉన్నదని స్పష్టముగ కనిపిస్తున్నది. శిశువు బయటపడిన తర్వాతనే ప్రాణము పోసుకుంటుందను విషయము జగమునకు తెలియని సత్యము. తర్వాత రెండవరోజు ప్రాణమొచ్చిన విషయము అర్థముకాక, తమదే తప్పనుకొన్న డాక్టర్లు పారిపోవడము జరిగినది. శిశువుకు మొదట ప్రాణములేని మాట వాస్తవమే, అయినప్పటికి ఆ విషయము తెలియని డాక్టర్లు తమదే పొరపాటనుకోవడము వారి చదువులకే అవమానము. ఈ ఒక్క విషయముతోనే డాక్టర్లకు తెలియని విషయమెంతో కలదని తెలియుచున్నప్పటికి, మేము గత 30 సంవత్సరములుగ చెప్పుచున్నప్పటికి మాకు తెలియనిది మీకు తెలుసునా అని మొండిగా మాట్లాడు వారినేమనాలో మీరే యోచించండి.

  డాక్టర్లు శిశువు చనిపోయిందని చెప్పిన వెంటనే శిశవును తల్లితండ్రులు వదలిపోయి ఉంటేనో, లేక శిశువును పారవేసి ఉంటేనో, లేక వెంటనే భూమిలో పూడ్చిపెట్టి ఉంటేనో, ఆ శిశువును పరోక్షముగా హత్య చేసినట్లు కాదా! దానికి డాక్టర్లు కారకులు కాదా! డాక్టర్లను తయారుచేసిన మెడికల్ బోర్డు ఈ విషయములన్నిటికి బాధ్యత వహించి సమాధానము చెప్పాలి."

  తన పుట్టుకను తానే తెలియని మనిషి, తన సంతతి పుట్టుకలో కూడ పొరపడుచున్నాడు. ఎందరో తల్లిదండ్రులు తమ శిశువులకు ప్రాణము రాకముందే గర్భములోనే చనిపోయాడని అపోహపడుచున్నారు. పుట్టిన తరువాత కదలని శిశువును చనిపోయినదని డాక్టర్లు చెప్పడము వలన, మొదటికి ప్రాణమేరాని శిశువును చనిపోయిందని డాక్టర్లు చెప్పడము వలన, మొదటికి ప్రాణమేరాని శిశువును చనిపోయినదని పూడ్చిపెట్టిన వారు కొందరుండగ, ఆ శ్రమ కూడ లేకుండ నిర్జన ప్రదేశములోనో, కంపచెట్లయందో, మురికి కాల్వలయందో పారవేసినవారు కూడ చాలామంది గలరు. ఇటువంటి సంఘటనలు ఎన్నో వేలసంఖ్యలో జరిగినవి కలవు. వాటిలో ఉదాహరణకు అనంతపురం ఆంధ్రజ్యోతి వార్తా పత్రికలో సోమవారం, 13 వ తేది, సెప్టెంబరు 2004 న అనంతపురం జిల్లా స్పెషల్ ధర్మవరం జోన్ లో ప్రచురితమైన వార్త ఈ విధముగ వున్నది.
5). అనాధ పసికందును అక్కున చేర్చుకున్న దంపతులు
ధర్మవరం, సెప్టెంబరు, 12 , 2004 (ఆన్ లైన్)

  ఓ తల్లి కనిపారవేసిన పసికందును అక్కున చేర్చుకున్న దంపతుల సంఘటన ఇది. అనంతపురం జిల్లా, ధర్మవరం పట్టణములోని గూడ్సుషెడ్డు కొట్టాలకు వెళ్లే రహదారిలో రైల్వేగేటు వద్ద, లోకము ఎరుగని అప్పుడే పుట్టిన ఒక పసికందును ఎవరో పారవేయడముతో, విషయము తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి, ఆ పసికందు ప్రాణాలతో ఉండడము చూచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసికందు ముళ్లపొదల్లో అరుస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులలో సి.ఐ విక్టర్, ఎస్.ఐ శ్రీనివాసులు, ఎ.ఎస్.ఐ భీమప్ప ముళ్లపొదల్లోని పసికందును బయటికి తీశారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగ వైద్యులు చికిత్సలు నిర్వహించారు. ఆ పసికందు వయస్సు కేవలము కొన్ని గంటలే అని వైద్యులు తెలిపారు. ఆ బిడ్డను అక్కున చేర్చుకోవడానికి పలువురు దంపతులు పోటీపడగ, చివరకు అన్ని వివరాలు తెలుసుకొని చిన్నారిని పోషించగల ఆర్థిక స్థోమత ఉండి సంతానములేని దంపతులకు అప్పగించడము వల్ల, ఆ చిన్నారికి న్యాయము చేసినవారౌతామని సి.ఐ విక్టర్, ఎస్.ఐ శ్రీనివాసులు భావించారు. దీనితో గుంతకల్లుకు చెందిన వి. దేవదానము, సరోజ అను దంపతులకు ఆ పసికందును అప్పజెప్పారు. వారికి సంతానములేక పోవడముతో ఆ చిన్నారిని తమ బిడ్డగా చూచుకొంటామని చెప్పి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దేవదానము గుంతకల్లు పట్టణమునకు చెందిన వ్యక్తి కాగ, కల్లూరు ఎ.పి ట్రాన్స్ కో లో లైన్ మేన్ గా ఉద్యోగము చేయుచున్నాడు. దీనితో సి.ఐ విక్టర్ వారికి పసికందును అప్పజెప్పి దంపతుల వివరాలు తీసుకొన్నారు.

  ఇదేదో అక్రమ సంబంధము వలన కనిన శిశువును పారవేశారని చాలామంది అనుకొనుటకు అవకాశము గలదు. అటువంటిది ఏమీలేదు. అక్రమ సంబంధము వలన గర్భము వస్తే అబార్షన్ చేయుటకే రెడీగా ఎందరో డాక్టర్లు గల ఈ నవీన కాలములో, అందరికి కనిపించేటట్లు తొమ్మిది నెలలు కడుపును పెంచుకొనువారు ఎవరూలేరు. కనేవారు అంతకూ లేరు. కావున శిశువును పారవేసిన కేసులన్నీ చనిపోయినవని, పారవేసినవేనని తెలియుచున్నది. పారవేసిన తరువాత శిశువు సురక్షితముగావుండి ప్రాణమువస్తే, ఎవరో ఒకరు చూసి తెచ్చి పెంచుకొన్నవారు కూడ ఎందరో కలరు. ఎవరూ చూడకపోతేనో, కుక్కల కంటపడితేనో ఆ శిశువు అంతమైపోయినట్లే.

  సమాజములో ఇటువంటి పరోక్ష శిశుహత్యలు కోకొల్లలుగా జరుగుచున్నవి. మేము గత ముప్పై సంవత్సరములుగా చెప్పుచున్నను, మమ్ములను హేళన చేయువారు తప్ప సత్యమును గ్రహించువారు లేరు. ఆదిలోనే అంతమై పోవువారిని కాపాడుటకు ఈ పరోక్ష హత్యలను నివారించుటకు న్యాయస్థానముల న్యాయాధీశులు ముందుకు రావాలని కోరుచున్నాము.

జనన మరణ సిద్ధాంతమునకు మరొక ఉదాహరణ మీరు చూడవచ్చును.

6). అమ్మా నే బ్రతికే ఉన్నా!
బ్రతికున్న బిడ్డ చనిపోయాడని గుడ్డలో చుట్టేసిన వైద్యులు!
సెప్టెంబరు, 21 ,2005 (న్యూస్ టుడే, సుల్తాన్ బజార్) కోఠి, హైదరాబాద్.

  అప్పుడే కళ్ళు తెరచిన పసికందు, అమ్మ ఒడి వెచ్చనేంటో తెలియదు. అమ్మ పాలరుచీ చవిచూడలేదు. ఎన్నో రంగులు, అందాలు చూడాల్సి ఉంది. కాని నిర్ధయ గల వైద్యులు నువ్వు బతకలేదన్నారు, మృతశిశువన్నారు. గుడ్డలో చుట్టి ఓ మూలకు విసిరేశారు. బిడ్డ పుట్టిందని తెలిసి మధురానుభూతితో ఉన్న ఆ మాతృమూర్తికి తన ప్రేగుబంధం ఏమైందో తెలియదు. బంధువులు బయటకెళ్ళేసరికి బ్రతికున్న ఆ బిడ్డను మృతశిశువుగా ముద్రవేసి పక్కన పెట్టారు. నిర్లక్ష్యం.. నిర్లజ్జ..అనాగరికం..ఈ పదాలకు మించి నిఘంటువులో ఏదైనా పెద్ద పదముంటే.. దాన్ని సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రి సిబ్బందికి అన్వయించాలి. మంగళవారంనాడు (అ) ధర్మాసుపత్రిలో జరిగిన సంఘటన తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మానవతను ప్రశ్నిస్తుంది. వైద్యలోకానికే మాయని మచ్చగా మిగులుతుంది.

   జీడిమెట్ల సమీపంలోని సూరారం గ్రామానికి చెందిన సురేష్ యాదవ్, రేవతి(27) దంపతులు. వీరికి ఒక పాప. గతంలో రేవతి రెండు సార్లు అబార్షన్ అయింది. ఆమె మళ్ళీ గర్భం దాల్చడంతో కుటుంబీకులు సుల్తాన్ బజార్ లోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నారు. ఏడునెలల గర్భవతి అయిన రేవతికి హై బి.పి ఉండటంతో, ప్రసవ సమయంలో ఇబ్బందులతో పాటు పుట్టబోయే శిశువు బలహీనంగా జన్మించడం, లేదా శిశువు మరణించే అవకాశాలున్నాయని, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆమె కుటుంబీకులకు వారంరోజుల క్రితమే సూచించారు. రేవతి ఈనెల 8 న సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే ఆమెకు సోమవారం సాయంత్రం పురిటినొప్పుల కోసం ఇంజెక్షన్ ఇవ్వడంతో, రాత్రి ఒంటి గంట సమయంలో నొప్పులు ప్రారంభమయ్యాయి. డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (DMO) సంధ్యాదీక్షిత్ కు ఆ సమాచారం అందించారు. మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయములో రేవతికి సాధారణ ప్రసవము జరిగి ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవము సమయములో రేవతి తల్లి యాదమ్మ ప్రసవము జరిగే వార్డు వద్ద ఉండగా, ఆమె భర్త సురేష్ మందుల కోసం బయటికి వెళ్ళాడు. అయితే రేవతిని వెంటనే ఆపరేషన్ థియేటర్ కు తరలించారు. ఆరు గంటల సమయములో అక్కడ పనిచేసే ఆయా వచ్చి పుట్టిన శిశువు మరణించాడని ఓ గుడ్డ తీసుకురావాలని చెప్పింది. దీంతో రేవతి తల్లి యాదమ్మ గుడ్డను తీసుకువచ్చి ఇచ్చింది. శిశువును గుడ్డలో చుట్టి ఓ ప్లాస్టిక్ కవర్లో ఉంచి పక్కన పెట్టేశారు. డబ్బులు ఇస్తే ఇక్కడే ఉండే ఓ వ్యక్తి మృతశిశువును తీసుకెళ్లి పూడ్చేస్తాడని సలహా కూడా ఇచ్చారు. అయితే రేవతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో, ఆమె అత్తామామలు వచ్చేదాకా ఉండమని చెప్పడముతో, సిబ్బంది శిశువును అక్కడే ఓ ప్రక్కన పెట్టేశారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయములో రేవతి మామ శివయ్య, మరి కొందరు బంధువులు వచ్చి మృతశిశువును ఇవ్వాలని కోరడంతో, ప్రక్కన పడేసిన శిశువు ఉన్న కవర్ ను వారికి అందించారు. దీంతో వారు ఆసుపత్రి ఆవరణలో ఉన్న సందర్శకుల గదివద్దకు వెళ్లి, ఓసారి ఎవరి పోలికో ముఖం చూద్దామని కవర్ లో ఉన్న శిశువును బయటికి తీశారు. అంతే శిశువు ఊపిరి పీల్చుకుంటూ కాళ్ళు చేతులు ఆడిస్తూ కనిపించింది. వెంటనే వారు డ్యూటీలో ఉన్న డాక్టర్ రాజేశ్వరి దృష్టికి తీసుకెళ్లగా, శిశువు ఊపిరితో ఉన్నాడని వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ప్రాణాలతో ఉన్న శిశువు మృతి చెందాడని చెప్పి తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్న వైద్యులు, 12 గంటల తర్వాత శిశువు ప్రాణాలతో ఉన్నాడనే విషయం తెలిసినా తగిన విధంగా స్పందించలేదు. ప్రస్తుతం ఆ శిశువు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంచలనం సృష్ఠించిన ఈ సంఘటన ప్రభుత్వాసుపత్రుల వైఖరిని మరోసారి తెరమీదికి తెచ్చింది.

ఇట్లు ఎన్నో నిదర్శనములను జనన సిద్ధాంతమునకు అనుకూలముగా మీరు చూడవచ్చును. ఈ విషయములో నేను మీకు కొన్ని ప్రశ్నలను ఇస్తున్నాను. వీటికి మీరు జవాబులు చెప్పగలరేమో చూడండి. 1 . వెనుకటి జన్మ జ్ఞప్తికల్గి చెప్పిన వారినైన మనము భూమిమీద చూడవచ్చును. కాని గర్భస్థ స్థితిని గూర్చి చెప్పినవారున్నారా? అసలు మీకు ఆ జ్ఞప్తి ఉందా?

2 . జ్యోతిష్య శాస్త్రరీత్యా తల్లి గర్భము నుండి బయటపడిన తర్వాతనే లెక్కించి దశా శేషమును తెల్పుచున్నారు. దశలు తల్లి గర్భము చేరినప్పటి నుండి ఎందుకు లెక్కించలేదు? దశా భుక్తిని గత జన్మ భుక్తి అని వ్రాయుచున్నారు. ఎందుకు? (గర్భ భుక్తి అని కొందరంటారు. గర్భములో సంవత్సరముల తరబడి ఉండరు కనుక గర్భ భుక్తి అనకూడదు గత జన్మ భుక్తి అనాలి.)

3 . తల్లి గర్భమునుండి బయటపడిన శిశువుకు కొన్ని నిమిషములు, కొన్ని గంటల పాటు శ్వాస, రక్త ప్రసరణము, కదలిక, చైతన్యము ఎందుకు లేవు.?

4 . మంత్రసానులు కొందరు మావిలో ప్రాణమున్నది, శిశువులోనికి రావాలని అంటుంటారు. అసలు గర్భములో ప్రాణమొచ్చినది మావికా, శిశువుకా?

5 . కొన్ని ఆసుపత్రులలో ప్రసవింపబడిన శిశువులు చనిపోయినారని డాక్టర్లు నిర్దారణ చేసిన కొంతసేపటికి ఎలా ప్రాణము పొందినాయి?

6 . గర్భస్థ శిశువుకు ప్రాణము లేనిదే పెరగదని, శిశువు తల్లి శరీరములో మరణిస్తే తల్లికి ప్రమాదమని అంటారు. గర్భము నిలిచినప్పటి నుండి ప్రాణము రాని ఆరు నెలల కాలము ఎలా పెరుగగలిగింది. ఆ ఆరు నెలల కాలములో శిశువుకు ప్రాణములేనట్లయితే తల్లికెందుకు ప్రమాదము జరగలేదు?

7 . యోగశాస్త్రమైన గీతలో జీవుడు శరీరమును పొందినప్పటి నుండి బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్య మరియు మరణావస్థలన్నారు కాని గర్భస్థావస్థ అని చెప్పలేదెందుకు?

8 . గీతలో పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును జీవుడు ధరిస్తున్నాడన్నాడు. క్రొత్తదంటే పూర్తి తయారైనదా? లేక ఆరు నెలలకు అసంపూర్ణముగ ఉన్నదా?

9 . భగము(యోని) నుండి ప్రాణముతో పుట్టినపుడు అందరు భగవంతులే అవుతారు కదా! అలా అందరమూ భగవంతులుగ ఎందుకు లేము?

ఇక్కడ మేము కొద్దిగ చెప్పు జవాబు ఏమంటే మన శరీరములో పంచ భూతములలో ఒకటైన వాయువు (గాలి) ఉన్నది. అది ఐదు భాగములుగ ఉన్నది. వాయువును ప్రాణము అనవచ్చును. అందువలననే పంచవాయువులను పంచ ప్రాణములు అన్నారు. మన ముక్కురంధ్రములో గాలి ఉన్నపుడే ప్రాణమున్నదని, గాలిలేనపుడు ప్రాణములేదని చెప్పడము కూడ పరిపాటి. శరీరములో ప్రాణమున్నపుడే జీవుడు కూడ ఉండును. ప్రాణములేనపుడు జీవుడుండడు. ముక్కురంధ్రములలో శ్వాస ఆడనంత వరకు శిశువుకు ప్రాణములేదని గ్రహించవలయును. తల్లి గర్భములో మావి అను తిత్తియందు ఉమ్మి నీరు అను ద్రవములో శిశువు మునిగి ఉండును. అందువలన శ్వాస ఆడుటకు అవకాశమే లేదు. జీవుడసలే లేడు. జననము గురించి మేము అడిగిన ప్రశ్నలకు జవాబులు మీరు వెదకండి. సత్యా సత్యములు మీకే అర్థమవుతుంది.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో||23: నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః|
న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః||
(జీవాత్మ)

భావము:- జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు.
వివరము:మూడు ఆత్మలలో మొదటిదైన జీవాత్మకు చెప్పబడిన ఈ శ్లోకములో అగ్నికి, గాలికి, నీటికి అట్లే కత్తికి దొరకనిది జీవాత్మ అన్నారు. జీవాత్మ శరీరము లోపల ఎక్కడో మారుమూల ఉన్నది. అందువలన బయటి ప్రకృతిలోని భాగములైన అగ్ని, నీరు, గాలి, భూమి జీవాత్మను ఏమి చేయలేవు. ఆయుధముల చేత కూడ నరకబడుటకు వీలులేదు. ఆయుధములు కాని, అగ్ని, నీరు, భూమి కాని బయటి శరీరమునే తాకగలవు. బయటి శరీరమునే అగ్ని కాల్చ గలదు, కత్తి తెంపగలదు. కాని లోపల ఉన్న జీవాత్మను తాకలేవు. శత్రుదుర్భేద్యమైన కోటలో రాజున్నట్లు జీవుడున్నాడు. ఎంత మంది శత్రువులోచ్చిన కోట బయటినుండి తమ సైనికులతో యుద్ధము చేయవలసిందే. ఒక వేళ కోటలోని సైనికులు ఓటమిపాలై, కోట గోడలు కూలిపోయి, శత్రువులు కోటలోనికి ప్రవేశించు అవకాశమొస్తే, కోటలోని రాజు రహస్యమార్గము ద్వారా బయటికిపోవును. శత్రువులకు దొరకడు. ప్రతి కోటకు రహస్యద్వారములుండి అపాయకాలములో రాజు పారిపోవుటకు వీలగునట్లు చేసి ఉందురు. అట్లే జీవుడు కూడా కోటలోని రాజువలె ఉండి శరీరమునకు అపాయకాలములో ఎట్లు పోతున్నదని ఎవరికి తెలియకుండ, కంటికి కనిపించకుండ శరీరము నుండి బయటికిపోవును. దీనిని బట్టి కోటలోని రాజును ఎవరు ఎట్లు చంపలేరో, శరీరములోని జీవున్ని కూడ ఎవరు చంపలేరని తెలియుచున్నది. ఈ విధముగనే యోచిస్తే బయటి ప్రపంచములోని అగ్ని, నీరు, గాలి జీవున్ని తాకలేవని అవి తాకుటకు వీలైనది శరీరము మాత్రమేనని తెలియుచున్నది.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 24: అచ్ఛేద్యో ఽ య మదాహ్యో ఽ య మక్లేద్యో ఽ శోష్య ఎవచ|
నిత్యస్సర్వగత స్థ్సాణు రచలో ఽ యం సనాతనః||
(పరమాత్మ)

భావము: నిత్యముండువాడు, సర్వ జగత్తంతయు వ్యాపించినవాడు, నిలకడగ ఉండువాడు, చలనము లేనివాడు అయిన సనాతనమైన పరమాత్మ ఛేదింపబడడు, కాలడు, తడుపబడడు, త్రోయబడడు.
వివరము: కొందరు ఇక్కడొక ప్రశ్నను తెలివిగా నన్నడుగవచ్చును, ఏమయ్యా! పై శ్లోకములో చెప్పబడిన విషయమే క్రింద చెప్పబడినది కదా! అదేమో జీవాత్మకన్నావు. ఇదేమో పరమాత్మకన్నావు. ఒకే విషయము ఇక్కడ పరమాత్మకైనది అక్కడ జీవాత్మకెందుకయినది? అని అడుగవచ్చును. దీనికి మా సమాధానము ఏమనగా? పై శ్లోకములో చెప్పిన విషయమే క్రింది శ్లోకములో చెప్పనవసరము లేదు కదా! పైన చెప్పినదే క్రింద చెప్పడములోనే క్రింది దానికి ప్రత్యేకత ఉన్నదని తెలియుచున్నది. పైన చెప్పినపుడు ఆయుధములచేత ఛేదింపబడదు అని చెప్పి, క్రింద ఛేదించబడునది కాదు అన్నారు. పై విషయము క్రింద విషయము ఒకటే అయినప్పటికి రెండవ మారు చెప్పుటలో ఆంతర్యమువేరని యోచన రాక తప్పదు. ఆ యోచనతోనే పై శ్లోకమును, క్రింది శ్లోకమును పరిశీలించి చూచిన పై శ్లోకములో ఆయుధము చేత తెగదు, అగ్ని చేత కాలదు, నీటి చేత నానదు, గాలి చేత త్రోయబడదు అని మాత్రమే అన్నవారు క్రింది శ్లోకమున ఈ ఆత్మ, తెగదు, కాలదు, నానదు, త్రోయబడదు అని చెప్పి విశేషముగా ఈ ఆత్మ నిత్యుడు, సర్వము వ్యాపించినవాడు, చలనములేనివాడు, సనాతనుడు అని కూడ చెప్పారు. సర్వవ్యాపి, సనాతనుడు పరమాత్మయే కావున ఈ క్రింది శ్లోకము పరమాత్మకే చెప్పారని తెలియుచున్నది. పై శ్లోకమున జీవాత్మకున్న విధానము మాత్రమే చెప్పారు. కావున అది జీవాత్మకు మాత్రమేనని తెలియుచున్నది.

   చెప్పబడిన విషయము జీవాత్మకు పరమాత్మకు రెండిటికి వర్తించునది. రెండు ఆత్మలకు వర్తించు విషయము రెండు శ్లోకములలో చెప్పబడినపుడు ఏ శ్లోకము ఎవరికను అనుమానము రాక తప్పదు. ఇక్కడ క్రింది శ్లోకము ప్రత్యేకించి పరమాత్మకే చెప్పుట వలన పై శ్లోకము జీవాత్మకేనని సులభముగా తెలిసిపోవుచున్నది. ఈ సారంశామును బట్టి జీవాత్మ పరమాత్మలు రెండును బయటి ప్రకృతికి గాని, ఆయుధములకు గాని దొరుకునవి కావు. దొరుకునది మధ్యలో ఉన్న ఆత్మ మాత్రమేనని తెలియుచున్నది.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో||25: అవ్యక్తో ఽ య మచిన్త్యో ఽ య మవి కార్యో ఽ య ముచ్యతే|
తస్మాదేవం విది త్వైనం నానుశోచితు మర్హసి||
(ఆత్మ)

భావము:- ఆత్మను తెలియచెప్పుటకు, చింతించి తెలుసుకొనుటకు సాధ్యము కాదు. ఆత్మను ఏ వికారములు అంటవు. అందువలన దానికోసము దుఃఖ పడవలదు.
వివరము: మన శరీరమందు మనతోపాటు నివాసముంటున్న ఆత్మను ఎవరైనా తెలుసుకొన్నప్పటికి దానిని బయటికి చెప్పలేరు. దానిని వ్యక్తపరచి చెప్పుటకు మాత్రమూ చేతకాదు. ఎందుకనగా! ఇట్లుంటుందని దానితో పోల్చి చెప్పుటకు ప్రపంచములో ఆత్మను పోలినదేదీలేదు. అందువలన తనయందుండు ఆత్మను తెలుసుకొన్నవారు, దానియొక్క అనుభూతిని బయటికి చెప్పలేక పోవుచున్నారు. మనస్సు చేత యోచించి తెలుసుకొనుటకు కూడ సాధ్యముకాదు. ఎందుకనగా! మనస్సుకు యోచనలొస్తున్నంత వరకు ఆత్మ తెలియదు. మనో యోచనలు స్థంభించినపుడే ఆత్మ తెలియును. కావున 'మాచింతోయ' అని చింతలకందని వాడని తెలిపారు. ఒక వేళ మనస్సు ప్రపంచ విషయములను యోచిస్తే ఆత్మ తెలియక పోవచ్చును. అట్లుకాక మనోచింతన ఆత్మ మీదే పెట్టుకుంటే ఆత్మ ఎందుకు తెలియదని కొందరడగవచ్చును. వారి మాట ప్రకారము మన మనస్సు ప్రపంచ విషయముల మీద లేకుండా చేసుకొని ఆత్మ మీదే పెట్టితే ఆత్మ తెలియగలదు. అయితే మన మనస్సు దాని మీద పెట్టుటకు ఆత్మ పలానిదని ముందు తెలిసి ఉండాలి కదా! ఆత్మ తెలియనపుడే కదా దానిని తెలుసుకోవాలని ప్రయత్నించేది. అందువలన తెలియని వాడు మనోచింతననే తెలియలేడు. చింతనచే తెలియునది ప్రపంచమే తప్ప ఆత్మ కాదు. అంతేకాక ఆత్మను ఏ వికారములు అంటవు. గుణముల వలన కలుగు భావములను వికారములంటారు. గుణముల వలన కలుగు మంచి చెడు భావ అనుభూతులు ఆత్మకు అంటవు. అటువంటి ఆత్మకు ఏదైన బాధ కలుగుతుందేమోనని, దానిని గూర్చి నీవుగాని, ఎవరుగాని దుఃఖ పడవలసింది లేదు.

  ఒక వేళ నేను ఆత్మను గూర్చి బాధపడడము లేదు. జీవాత్మను గూర్చి బాధపడుచున్నాననుకొనిన ఆ జీవాత్మను గూర్చి భగవంతుడిట్లనుచున్నాడు.

త్రైత సిద్ధాంత
భగవద్గీత

☜   సాంఖ్య యోగము 
   ☞
(1) శ్లో|| 26: అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం|
తథా పి త్వం మహాబాహో! నైవం శోచితు మర్హసి||
(జీవాత్మ)

భావము:- అట్లు కాకుండ వాడు నిత్యము పుట్టి నిత్యము చచ్చునని తెలిసితివేని, ఆ విధంబునైన వాని కొరకు నీవు ఏల దుఃఖపడవలయును.
వివరము:- ఆత్మ కొరకు కాదు నేను దుఃఖించునది, ప్రతి నిత్యము పుట్టుచున్న మరియు మరణించుచున్న జీవాత్మల గురించి నేను దుఃఖిస్తున్నానని అనుకొనిన, జీవాత్మ ఒకచోట పుట్టి మరియొక చోట మరణించుచున్నాడు. ఆ విధముగనైన వాడు ఎక్కడ పోకుండ మనముంటున్న భూమి మీదనే మనగలుగుచున్నాడు గదా! వాడు లేకుండాపోతే కదా వానికోసము ఏడ్వాలి. ఒకవేళ వాడు లేడని కాదు, వాడు మనవద్ద ఉంటూ ఉన్నట్లుండి శరీరము వదలి వేరే శరీరము ధరించి వేరేచోట ధనికుని ఇంట పుట్టినప్పటికైన, వాడు సుఖముగా ఉండినప్పటికైన, నా వద్దనుండి పోయెను కదా! ఇక వాని విషయము నాకు తెలియదు కదా! అని దుఃఖము వస్తున్నదనిన దానిని గూర్చి క్రింది శ్లోకమున భగవంతుడు ఇట్లనుచున్నాడు.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024