హేతువాద ప్రశ్నలు - సత్యవాద జవాబులు 6thOct24 Updated part1
యోగీశ్వరుల వారి రచనల సారాంశము
1) త్రైత సిద్ధాంత గ్రంథములలో అక్షర సముదాయమే, ఆత్మ సమాచారమై ఉన్నది.
త్రైత సిద్ధాంత గ్రంథములలో క్షయ అక్షయ సమాచారము,
పరమాత్మ సమాచారము ఉన్నది.
2) త్రైత సిద్ధాంత సంబంధ గ్రంథములను భౌతికముగా వ్రాసినది యోగీశ్వర్లు.
త్రైత సిద్ధాంత అనుబంధ గ్రంథములలో అభౌతికముగా యోగశక్తి ఉన్నది.
3) త్రైత సిద్ధాంతము ఇందూ (హిందూ) ధర్మములలో విప్లవాత్మకమైనది.
త్రైత సిద్ధాంత గ్రంథములలోని జ్ఞానము సంచలనాత్మకమైనది, చదివి చూడండి.
4) త్రైత సిద్ధాంతము లోకములో అన్నిటికంటే గొప్పది. త్రైత సిద్ధాంత
గ్రంథములు అన్ని గ్రంథములను మించినవి, దాని రచయిత యోగులకు
ఈశ్వరుడైన యోగీశ్వరుడు.
5) త్రైత సిద్ధాంత గ్రంథములు కనిపిస్తే దుష్టశక్తులు భయముతో వణికిపోతాయి.
త్రైత సిద్ధాంత గ్రంథములను దగ్గర ఉంచితే యోగశక్తికి తాళలేక
భయపడిపోతాయి.
6) త్రైత సిద్ధాంత జ్ఞానము భగవద్గీత తరువాత చెప్పబడిన అతి గొప్ప జ్ఞానము.
త్రైత సిద్ధాంత గ్రంథములలో కృష్ణుడు ముందు చెప్పని జ్ఞానమును కూడా
యోగీశ్వర్లు చెప్పారు.
7) త్రైత సిద్ధాంత జ్ఞానము మానవ జీవితమునకు గొప్ప వెలుగు.
త్రైత సిద్ధాంత వెలుగులోనికి పోయిన వానికి అది దైవశక్తి అని తెలియును.
8) త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసినది యోగీశ్వర్లు. అందువలన
త్రైత సిద్ధాంతము అంటే ఏమిటో, అది ఎంత గొప్పదో తెలియబడినది.
9) త్రైత సిద్ధాంతమును గురించి తెలియగలిగితే, యోగీశ్వరుల గ్రంథములను
చదువగలిగితే, ఏ మతస్థుడైనా ఒప్పుకొని తీరును, దానిని ఆచరించును.
10) త్రైత సిద్ధాంతము ప్రత్యక్షముగా భగవంతుడు చెప్పినది. అందువలన అన్ని
మతముల సారాంశము త్రైత సిద్ధాంత గ్రంథములలో కలదు.
11) త్రైత సిద్ధాంత గ్రంథములు వ్యక్తి వ్రాసినవి కావు, వ్యక్తిలోని శక్తి వ్రాసినవి.
అందువలన అన్నీ రహస్యములే చదివి తెలుసుకోండి.
12) త్రైత సిద్ధాంతము భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో కలదు. అయినా
హిందువులకుగానీ, క్రైస్తవులకుగానీ, ముస్లీమ్లుగానీ ఆ విషయము
తెలియదు.
హేతువాద ప్రశ్నలు - సత్యవాద జవాబులు
ముందు ప్రశ్న వుంటే తర్వాత జవాబు ఉంటుంది. ముందు
ప్రశ్న తర్వాత జవాబు ఉండడము న్యాయము అంటాము. ముందు
జవాబు తర్వాత ప్రశ్న ఉండకూడదు. అలా ఉండడము అన్యాయము
అనీ, సరైన పద్ధతి కాదనీ చెప్పవచ్చును. రామాయణము అంతా విన్న
తర్వాత రామునికి సీత ఏమవుతుంది? అని అడిగితే ముందు జవాబు
వెనుక ప్రశ్న అన్నట్లగును. అది అన్యాయమైన ప్రశ్న అని చెప్పవచ్చును.
అట్లని రామాయణము చెప్పకముందే రామునికి సీత ఏమవుతుందని
అడగడము కూడా న్యాయబద్ధమైన ప్రశ్న కాదు. రామాయణమును చెప్పిన
తర్వాత అందులో రాముని విషయముగానీ, సీత విషయముగానీ లేకపోతే
అప్పుడు సీతకు సంబంధించిగానీ, లేక రామునికి సంబంధించిగానీ ప్రశ్నను
అడుగవచ్చును. అప్పుడు అది న్యాయబద్ధమగును. అట్లే రామాయణము
నంతటినీ చెప్పిన తర్వాత రామున్ని గురించిగానీ, లేక సీతను గురించిగానీ
అడిగితే అంతవరకు వినినది వానికి ఏమాత్రము అర్థము కాలేదని
చెప్పవచ్చును. అప్పుడు వానికి గ్రహించుకొను శక్తి లేదని కూడా చెప్ప
వచ్చును. అటువంటి వానికి ఒకమారు చెప్పినా, రెండుమార్లు చెప్పినా
లేక మూడుమార్లు చెప్పినా వాడు గ్రహించుకోలేడు. అందువలన వృథా
ప్రయాసేయగును. గ్రహించుకోలేని దానికి సరైన కారణమున్నప్పుడు,
చెప్పబడిన విషయము ద్వంద్వార్థములతో కూడుకొని యున్నప్పుడు, వేరు
విధముగా గ్రహించుకొను అవకాశము గలదు. అప్పుడు వినేవానిదే పూర్తి
తప్పు కాదు. కొంత భాషది, కొంత చెప్పేవానిది లోపముండవచ్చును.
అటువంటప్పుడు ఎదుటివాడు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వవచ్చును.
వ్రాయబడే వ్రాతలలో కల్పిత పురాణములు గలవు, జరిగిన
చరిత్రలు గలవు, ఆధ్యాత్మిక రహస్యములు, సబద్దతతో కూడుకొన్న
శాస్త్రములు మొదలగునవి గలవు. మేము వ్రాయు ఆధ్యాత్మిక రహస్యములకు
సబద్దతతోకూడిన శాస్త్రమును ప్రమాణముగా చూపుచూ వ్రాయుచున్నాము.
కొన్నిచోట్ల అదేపనిగా మొదట తప్పు చెప్పి, తర్వాత నిజము చెప్పుట
సక్రమమైన పద్ధతిగా యుండును. అలాంటి సమయ సందర్భములలో
అలాగే చెప్పవలసియుంటుంది. అయితే అది కొందరికి తప్పుగా
కనిపించును. అప్పుడు ఆ తప్పును గురించి కొందరు అడుగ వచ్చును.
కొందరు చూచే వారికి, చెప్పిన వానికి సరిగా తెలియదను నట్లు
తెలిసియుందురు. “ముందు అసత్యము తర్వాత సత్యము” అను వరుస
క్రమము వారికి తెలియదు కనుక కొందరు ప్రశ్నించుట సహజమే. చెప్పిన
వానిదీ సక్రమమే, ప్రశ్న అడిగిన వానిదీ సక్రమమే. అయితే ప్రశ్నించిన
వాని ప్రశ్నకు రెండవ మారు జవాబు చెప్పవలసియుండడమే కాక, ముందు
అసత్యమును చెప్పవలసిన అవసరమును కూడా వివరించి చెప్పవలసి
యుంటుంది.
చిన్న పిల్లలకు కొన్ని విషయములలో అసత్యమే చెప్పాలి. తర్వాత
కొంత కాలమునకు వారు వయస్సులో పెద్దవారయినప్పుడు సత్యమును
చెప్పవచ్చును. మొదట అసత్యమును ఎందుకు చెప్పాలి? అంటే వాని
మెదడు అసత్యమును మాత్రము గ్రహించుకొనునదై యుండును. అప్పుడు
సత్యమును గ్రహించుకొనునదై యుండదు. చిన్న పిల్లవాడు ఇల్లు వదలి
బయటికి పోతే బజారులోని రద్దీకి అతను ప్రమాదములో పడును.
బయటికి పోవద్దు ప్రమాదములు జరుగవచ్చునని చెప్పితే, ప్రమాదమంటే
ఏమిటో తెలియని పిల్లవాడు చెప్పిన మాటను అర్థము చేసుకోలేడు.
అందువలన ఆ వయస్సులోని పిల్లలకు “ఇంటి బయట బస్సుల
ప్రమాదములు జరుగవచ్చును బయటికి పోవద్దు" అని చెప్పుటకంటే,
“బయట బూచోడు యున్నాడు. వాడు ఇంటి బయటే పిల్లల కొరకు
కాచుకొని ఉంటాడు. ఎవరయినా పిల్లలు బయటికిపోతే వారిని ఎత్తుకొని
పోతాడు" అని అసత్యమును కథలాగ చెప్పితే పిల్లవాడు అసత్య
సమాచారమును బాగా అర్థము చేసుకొని బయటికి పోవాలని అనుకోడు.
ఈ విధముగా కొన్ని సందర్భములలో ముందు అసత్యమును చెప్పి తర్వాత
సత్యమును చెప్పవలసి వస్తుంది.
బాల్యములో ప్రాథమిక పాఠశాలకు పోయినప్పుడు అక్కడ
అక్షరాభ్యాసము చేయుదురు. మొదట నేర్వవలసిన చదువు యొక్క
అక్షరములను నేర్పింతురు. ఇంగ్లీషు మీడియం స్కూలుకు పోయారను
కోండి, అక్కడ అక్షరాభ్యాసము ఇంగ్లీషు అక్షరములతో మొదలు పెట్టుదురు.
మొదట ఎ,బి,సి,డి అను అక్షరములను నేర్పింతురు. అక్కడ అక్షరములను
నేర్వగలిగి, తిరిగి వ్రాయగలిగితే నేర్పించిన విధానము ప్రకారము ఎ,బి,
సి,డిలను వ్రాయుదురు. వ్రాసినప్పుడు ఎ ప్రక్కన బి, బి ప్రన సి, సి
ప్రక్కన డి అని వ్రాయవలెను. అట్లు నేర్పించినట్లు వ్రాయకుండా ఎ
ప్రక్కన సి వ్రాసి, సి ప్రక్కన బి వ్రాసి, బి ప్రక్కన డి వ్రాస్తే పూర్తి తప్పగును.
నేర్పించినట్లు వరుస క్రమముగా ఎ ప్రక్కన బి వ్రాయవలసియుండును.
అట్లు వ్రాయనందుకు తప్పు చేసినట్లు లెక్కించబడును. తప్పు వ్రాయకుండా
సక్రమముగా వ్రాయాలంటే ఎ, బి, సి, డి అను వరుస వ్రాయడము సరియైన
పద్ధతి.
అప్పటికి అది సరియైన పద్ధతే. నాలుగు సంవత్సరములు గడచిన
తర్వాత అదే ప్రాథమిక పాఠశాలలోనే ఐదవ తరగతిలో ఎ ప్రక్కన బి
వ్రాస్తే తప్పగును. అక్కడ వ్రాయవలసిన పదములో ఎ ప్రక్కన బి కాకుండా
ఏదయినా వ్రాయవచ్చును. అప్పుడు అలా వ్రాయడమే సరియైన
పద్ధతియగును. ఇంగ్లీషులో చీమను గురించి వ్రాయవలసి వస్తే ఎ ప్రక్కన
ఎన్, ఎన్ ప్రక్కన టి వ్రాయవలసి వచ్చును. నాలుగేళ్ళ తర్వాత ఐదవ
తరగతిలో తప్పుకానిది ఒకటో తరగతిలో తప్పయినది. అదే ఇప్పుడు ఎ
ప్రక్కన బి వ్రాస్తే తప్పగును. ఒకటో తరగతిలో నిజమైనది ఐదవ తరగతిలో
తప్పయినది. అప్పుడు చెప్పినది తప్పయితే ఇప్పుడు నిజమైనది. పూర్తి
బాల్యములో సత్యమయినది తర్వాత యవ్వనములో అసత్యమగుచున్నది.
వాస్తవమేదియని చూస్తే యవ్వనములో విన్నదే సత్యము, బాల్యములో విన్న
బూచోడు అసత్యము. ఇది బాల్యమునకు యవ్వనమునకు మధ్యలో బుద్ధి
గ్రహించలేని స్థితిలో సత్యము అసత్యముగా, అసత్యము సత్యముగా యుండ
వచ్చును. అయితే మిగతా కొన్ని విషయములలో బాల్యములోనూ,
యవ్వనములోనూ అసత్యమునే చెప్పితే గ్రహించుకొనువాడు సత్యమును
గ్రహించుకొనును. అప్పుడు సత్యము కొరకు అసత్యమును చెప్పవలసి
వస్తున్నది. మనిషి జీవితములో ఎప్పుడయినా కొన్ని విషయములలో ఉన్న
సత్యమును గ్రహించుకొనుటకు అసత్యమును చెప్పుచున్నారు.
'ఒక మనిషి చాలా గర్వముగాయుండును' అను సత్యమును
చెప్పుటకు ‘అతనికి తలబిరుసుగా యుంది' అని చెప్పుచుందురు. వాని
తల అందరి తలవలె యుండినా 'అతనికి తలబిరుసుతనముంది' అని
చెప్పడము వలన వానికి గర్వము ఉందని అర్థమగుచున్నది. ఉన్న సత్యము
గర్వము. లేని అసత్యము తలబిరుసుతనము. అక్కడ చెప్పేవాడు తప్పు
చెప్పాడని అనుటకు వీలులేదు. అలా అసత్యమైన తలబిరుసుతనమును
చెప్పితే సత్యమైన గర్వమున్నట్లు తెలియును. అలాగే సక్రమముగా
మాట్లాడకుండా హెచ్చుతగ్గులుగా మాట్లాడువానిని 'వీని తల తిరుగుతా
యుంది' అని అంటూవుంటారు. వాని తల తిరగడము అసత్యము. వాడు
సక్రమముగా మాట్లాడలేదు అనేది సత్యము. అయితే సత్యమును చెప్పక
అసత్యమును చెప్పితే సత్యమును గ్రహించుకుంటారు. ఇక్కడ అసత్యమును
వాడితేనే ఎదుటి మనిషి త్వరగా గ్రహించుకోగలడు. అట్లుకాకుండా
సత్యమును చెప్పాలంటే చాలా సమయము పట్టును. ఈ విధముగా చాలా
విషయములలో సత్యము తొందరగా అర్థమగుట కొరకు అసత్యమును
వాడుచుందురు. వేగముగా పనులను చేయువానిని 'మిద్దెల మీద పరుగెత్తే
వాడని' అనుచుందురు. అట్లే ఎక్కువ నష్టపోయేవాడిని 'పడే గోడక్రింద
కూర్చుంటాడు' అనుచుందురు. ఈ విధముగా చెప్పుచున్నా నీవు
అసత్యమును చెప్పుచున్నావని చెప్పేవాడిని అనడము తెలివి తక్కువయగును.
కొన్నిటిని ఎదుటివాడు అర్థము చేసుకోవలసియుండును గానీ, అనేవాడిని
తప్పుపట్టే దానికి కాదు. ఇట్లు సత్యమును ఇతరులు తెలియుటకు
అసత్యమును వాడు సందర్భములు అనేకము గలవు. వాటిని ప్రస్తుతము
క్రొత్తవారు అర్థము చేసుకోవాలిగానీ తప్పుపట్టకూడదు. చెప్పుటకు
(చూపుటకు) అది తప్పే అయినా, చెప్పే విధానము అట్లేయుండును.
మేము ప్రపంచ విషయములను చెప్పకుండా ఆధ్యాత్మిక జ్ఞాన
విషయములను చెప్పుచున్నాము. ఆధ్యాత్మిక విషయములు ఎక్కువగా
అగోచర విషయములు ఉండును. ప్రపంచములో కనిపించే విషయముల
వద్దనే సత్యమును చెప్పక అసత్యమును చెప్పి సత్యమును అర్థమగునట్లు
చేయుచున్నారు. అగోచర ఆధ్యాత్మిక విషయములలో కూడా కొన్నిచోట్ల
ముందు సత్యము చెప్పకూడదు. కృష్ణుడు భగవద్గీతను చెప్పినప్పుడుగానీ,
సూర్యుడు (జిబ్రయేల్) ముహమ్మద్ ప్రవక్తకు జ్ఞానము చెప్పినప్పుడుగానీ
మొదట చెప్పవలసిన అసలయిన జ్ఞానమును చెప్పలేదు. భగవద్గీతలోనూ,
బైబిలులోనూ, ఖురాన్ గ్రంథములోనూ ముఖ్యమైన సారాంశము మూడు
ఆత్మలను గురించి చెప్పడమే. మూడు ఆత్మల విషయము మొదట
భగవద్గీతను చెప్పినప్పుడు మొదటి అధ్యాయములోనే చెప్పక భగవద్గీత
మూడు భాగముల తర్వాత చెప్పడమైనది. భగవద్గీత మొత్తము 18
అధ్యాయములు గలదు. భగవంతుడు చెప్పిన బోధ మొత్తము 17
అధ్యాయములే కలదు. మూడు ఆత్మల విభజన చెప్పినది 15వ
అధ్యాయములో గలదు. మూడు వంతులు భగవద్గీత అయిన తర్వాత
నాల్గవ భాగములో మూడు ఆత్మల విషయము చెప్పడమైనది. అంతవరకు
ఏ ఆత్మకు ఏ జ్ఞానమును వర్తింపజేసుకోవాలో ఎవరికీ తెలియకుండా
పోయినది. భగవద్గీతలో అదేపనిగా భగవంతుడు మూడు ఆత్మల జ్ఞానమును
మొదట చెప్పలేదు. అట్లే బైబిలు గ్రంథములో 66 పాఠములలో 40వ
పాఠములో మత్తయి సువార్తలో చివరిలో మూడు ఆత్మల గురించి
చెప్పడమైనది. అదే విధముగా మూడవ గ్రంథమయిన ఖురాన్ గ్రంథములో
6236 ఆయత్లలో 4491వ ఆయత్లో మూడు ఆత్మల వివరమును
చెప్పాడు. మూడు గ్రంథములలో ముఖ్యమైన సారాంశము మూడు ఆత్మల
విషయమే అయినా దాదాపు సగము గ్రంథము దాటిన తర్వాత గ్రంథ
మూడవ భాగములో ముఖ్యమైన ఆత్మల విషయమును చెప్పారు. అంతవరకు
చెప్పలేదు అంటే ఎప్పుడు చెప్పితే గ్రహించుకోగలమో అప్పుడు చెప్పినట్లు,
అంతవరకు చెప్పనట్లు అర్థమగుచున్నది. ఈ విధముగా దైవ గ్రంథములలోనే
ముందు వెనుక యోచించి జ్ఞానమును చెప్పియున్నారు. అందువలన
మేము కూడా ముందు వెనుక యోచించి ఎప్పుడు ఏమి చెప్పితే బాగుండునో,
ఎప్పుడు చెప్పితే ప్రజలు అర్థము చేసుకోగలరో అప్పుడే ఒక రహస్యమును
బయటికి చెప్పుచున్నాము.
భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగము వరకు తాను
ఎవరయినది కృష్ణుడు అర్జునునికి చెప్పలేదు. అవసరము వచ్చినప్పుడు
విశ్వరూప సందర్శన యోగములో “నేను దేవున్ని” అని అర్జునునికి తెలియ
జేశాడు. అంతవరకు ముందు చెప్పితే అర్జునుడు అర్థము చేసుకోలేక
పోవడమేకాక, అపార్థము చేసుకొను అవకాశము గలదు. అందువలన
తాను ఎవరయినది సమయమొచ్చువరకు కృష్ణుడు అర్జునునకు చెప్పలేదు.
ఈ విధముగా ఉన్న కారణములను ఎదుటివారు అర్థము చేసుకోలేక వారి
బుద్ధికి తోచినది వారు మాట్లాడుచుందురు. వారు అలా మాట్లాడారని
తమ మార్గమును ఎవరూ మార్చుకోరు. కృష్ణున్ని కొందరు నిందించడము
కూడా జరిగినది. జారుడు, చోరుడు అని మాట్లాడిన సందర్భములు కూడా
గలవు. అప్పుడు కృష్ణుడు తొందరపడి తాను దేవుడనని, భగవంతుడనని
చెప్పలేదు కదా!
ఒక మనిషి ఒక ధ్యేయము కల్గియుండవలెను. బయటి సమాజ
వాతావరణమునుబట్టిగానీ, బయటి సమాజ అభిరుచులనుబట్టిగానీ మనిషి
ధ్యేయము మారకూడదు. మేము ఒక ధ్యేయముతో గ్రంథమును వ్రాయు
చుందుము. అప్పుడు దానిని కొందరు మెచ్చుకొందురు. కొందరు
అసహ్యించుకొందురు. కొందరు గొప్పగా చెప్పుకోగా, కొందరు తక్కువగా
చెప్పుకోవడము జరుగుచుండును. ప్రపంచములో ఎవడూ అందరినీ
మెప్పించలేడు. మనుషుల అభిరుచులనుబట్టి మేము వ్రాయు గ్రంథములు
అనేక రకములుగా కనిపించి యుండవచ్చును. ఒక ఆహార పదార్థమును
పది మందికి ఇచ్చి దానిని ఎట్లున్నదని వారిని విడివిడిగా అడిగి చూస్తే
ఒకే ఆహారమును అందరూ అన్ని రకముల చెప్పుదురు. ఒకే పదార్థము
ఒకే రుచి ఉంటుంది. అయితే తినిన పదిమంది పది రకముల చెప్పుటకు
కారణము వారి నాలుకలలో, రుచి గ్రాహిత కణముల తేడా తప్ప ఆహార
పదార్థములో తేడా లేదని తెలియుచున్నది. అలాగే మేము వ్రాసిన ఒక
గ్రంథము సమాజములోని మనుషుల గ్రాహితశక్తిని బట్టి వారికి అర్థమయి
వుండును. హేతువాదులు వారి దృష్టితో చూచుచుందురు. మితవాదులు
వారి ఉద్దేశ్యము ప్రకారము చూచుచుందురు. అతివాదులు వారి
భావమునకు తగినట్లు చూచుచుందురు. అందరినీ మెప్పించాలంటే ఎవరికీ
చేతగాని పనియగును. మేము ఒక సమాచారమును బయటికి వ్రాత
రూపముగా పంపితే, సాధ్యమున్నంత వరకు తక్కువమందికి అర్థము
కాకపోయినా ఫరవాలేదని, ఎక్కువమందికి అర్థమగులాగున ఉండునట్లు
వ్రాసియుందుము. మేము అలా వ్రాసినా ఒక్కొక్కప్పుడు అది ఎక్కువ
మందికి అర్థము కాకుండా పోయి తక్కువ మందికి మాత్రమే అర్థమయి
వుండును. అప్పుడు దానికి నేను ఏమీ చేయలేదు. ఇతరులను చూచి
నేను మారాలనుకోను. ఎందుకనగా! మనకుయున్న ధ్యేయము ప్రకారమే
నడువడము మంచిది. అయినా ఎవని స్వభావము వానికుండును. వాని
స్వభావమును వదలి ఇతరుల స్వభావములోనికి ఎవడూ పోడు.
ప్రతి మనిషికి ఒక స్వభావముండును. ఒకే స్వభావములో కొందరు
మనుషులుగానీ, ఇద్దరు మనుషులుగానీ ఉండడము జరుగదు. మనిషి
మనిషికి స్వభావము వేరువేరుగా యుండును. ప్రతి మనిషికి వేలిముద్రలు
ఎలా వేరుగా యుండునో, ప్రతి మనిషికి వాసన ఎట్లు వేరుగా యుండునో,
ప్రతి మనిషికి రూపురేఖలు ఎలా వేరుగా యుండునో, అలాగే ప్రతి మనిషి
స్వభావము వేరుగాయుండును. ఒకే ఇంటిలో ఒకేతల్లి బిడ్డలకయినా
ఒకరికున్న స్వభావము మరొకరికి ఉండదు. 'స్వభావము' అనగా 'స్వంత
భావము' అని అర్థము. ఇక్కడ కొంత లోతుగా ఆలోచించి తెలుసుకోవలసిన
అవసరమున్నది. ఎందుకనగా! శరీరములో నివసించు జీవునికి ఒక్క
దేవుని విషయములో తప్ప మిగతా విషయములలో ఎక్కడా ఏమీ లేవు.
దేవుని విషయములో మాత్రము 'ఇష్టము' అనునది జీవునికి ఉండును.
అయితే జీవుడు దానిని ఉపయోగించుకోవచ్చును, లేక ఉపయోగించుకోక
పోవచ్చును. దేవుని విషయములో ఇచ్ఛ తప్ప, ఏ విషయములో ఇష్టా
యిష్టముగానీ, స్వభావముగానీ ఏదీయుండదు. జీవుడు అనగా ఏదీ
లేనివాడు, ఏ స్వతంత్రత లేనివాడని అర్థము. శరీరమునకు అంటుకొన్న
దుమ్ములాగ జీవునికి అంటుకొన్న కర్మలుండును. జీవునికి బయట
అంటుకొన్న కర్మలు, లోపల దేవుని మీద ఇచ్ఛ రెండు మాత్రముండును.
లోపల గల ఇష్టము మాత్రము జన్మహక్కుగా జన్మజన్మకు యుండును.
బయట అంటుకొన్న కర్మలు ఒక జన్మలో ఎక్కువ యుండవచ్చును. మరొక
జన్మలో తక్కువ యుండవచ్చును. ఎప్పుడయినా లేకుండా కూడా
పోవచ్చును. అందువలన జీవునికి ఎప్పటికీ ఒకే విధముగా ఉండునది
ఇష్టము ఒక్కటేయని చెప్పవచ్చును.
1) ప్రశ్న :- ఇష్టము తప్ప కర్మలు కూడా తాత్కాలికముగా హెచ్చు
తగ్గులుండునని చెప్పుచున్నారు. అయితే 'స్వంత భావము' అనునది జీవునిది
కాదా! జీవునికి స్వంత భావము లేనప్పుడు స్వభావము అని ఎందుకు
అన్నాము?
జవాబు :- మనిషికి వేలిముద్ర ప్రపంచములో ఇంకొకనిది ఉన్నట్లు యుండక
వేరుగాయుండును. అయితే అది వానికి ఒక్కనికే యున్న వేలిముద్ర అయినా
అది ఆ జీవునిది కాదు. అది ఆ జీవుని శరీరముది. అలాగే వాసనగానీ,
రూపు రేఖలుగానీ జీవునివి కాకుండా జీవుని శరీరమువై యున్నవి. జీవుని
శరీరము కూడా స్వంత శరీరమే అయినా, అది ఆ జన్మకు మాత్రమే.
అందువలన జీవునికి ఒక్క ఇష్టము తప్ప ఏదీ హక్కుగా లేదు. మనిషికిగల
రూపము, వాసన, వేలిముద్ర మూడు జీవునివి కాకుండా జీవునికి యున్న
శరీరమునకు కలవని చెప్పవచ్చును. అట్లే మనిషికి యున్న స్వభావము
జీవునికి లేదనీ, జీవుని వెంటయున్న బుద్ధికి గలదని చెప్పవచ్చును.
మనిషికిగల రూపము, వాసన, ముద్ర, స్వభావము జీవునివి ఏమాత్రము
కావని తెలియుచున్నది. ఈ నాలుగు ప్రతి మనిషికి వేరుగా యుండునట్లే
కర్మ కూడా ఒకటియున్నది. ఒకరికియున్న కర్మ మరొకరికి ఉండక
కొద్దిగయినా తేడాతో యుండును. ఈ విధముగా ప్రతి మనిషికి కర్మ,
రూప, ముద్ర, వాసన, స్వభావములు ఐదు వేరువేరుగా యుండునని
తెలిసిపోయినది. మనిషి పుట్టుకలోనే ఈ ఐదు నిర్ణయించబడును. ఈ
ఐదు పుట్టుకతో వచ్చినవి, జీవితాంతము ఉండునవి. వాటిని ఎవరూ
మార్చలేరు. అయితే స్థూలముగా యున్న ముద్ర, రూపము, వాసనను
వదలి సూక్ష్మముగాయున్న కర్మను, స్వభావమును రెండిటిని గురువు
మార్చగలడు. దేవుడు మనిషిగా అనగా భగవంతుడుగా భూమిమీదికి
వచ్చినప్పుడు ఆయన ఒక్కడు గురువుగా యుండును. అప్పుడు ఎవరికీ
గుర్తింపబడనివాడుగా యున్న గురువు తాను అనుకొంటే ఏ మనిషి
కర్మనయినా మార్చగలడు. అట్లే స్వభావమును మార్చగలడు.
వేలిముద్ర, శరీర వాసన, రూపమును పైనగల మనుషులు
మార్చవచ్చును. కనిపించేవి కావున కనిపించే మనుషులు మార్చవచ్చు.
కనిపించని కర్మను, బుద్ధి స్వభావమును మనుషులు మార్చలేరు.
రెండింటిని మనిషికాని గురువు మార్చగలడు. గురువు అనగా భగవంతుడు.
కనిపించే ముద్ర, వాసన, రూపును కనిపించే మనిషి సులభముగా
మార్చగలడు. నేడు గల వైద్య విధానముల వలన ఆ పనిని చేయగలుగు
చున్నారు. బయట మూడు గుర్తులు మారినా మారకున్నా జీవునికి ఆధ్యాత్మిక
ప్రయోజనము ఏమీ లేదు. అదే లోపలగల కర్మ, స్వభావము మారితే
జీవునకు ఆధ్యాత్మికముగా ఎంతో మంచి జరుగును. ఆధ్యాత్మిక లాభము
కొరకు బయట గురువును "కర్మను, బుద్ధి స్వభావమును మార్చమని”
ప్రార్థించవలసియుండును. అయితే గురువు కనిపించడు (గుర్తింపబడడు).
అందువలన బాహ్య గురువును కోరుటకు అవకాశము లేదు.
అటువంటప్పుడు శరీరము లోపల యున్న ఆత్మను వేడుకోవలసియుండును.
ఆత్మను వేడుకోవడము వలన ఆత్మ కర్మలను లేకుండా చేయగలదు, అట్లే
బుద్ధి స్వభావమును కూడా మార్చగలదు. ఆత్మను వేడుకొంటే ఆత్మ
ఏమయినా చేయగలదు. అయితే ఆత్మను వేడుకొనేదానికి ముందు
ఆత్మజ్ఞానము (ఆధ్యాత్మిక జ్ఞానము) అవసరము. ఆధ్యాత్మిక జ్ఞానమున్నప్పుడు
జీవుడు వేడుకొన్నా, వేడుకోకపోయినా కర్మ, బుద్ధి స్వభావమును మార్చి
వేయగలదు. జీవుడు అడుగకున్నా ఆత్మ తానే స్వయముగా మార్చి
వేయగలదు.
ముఖ్యముగా బుద్ధి స్వభావము మారుకొలది మనిషి మాట్లాడు
విధానము కూడా మారిపోవును. ఒక ప్రశ్నను స్వభావము మారకముందు
అడిగేదానికి, మారిన తర్వాత అడిగేదానికి ఎంతో తేడాయుండును. మొదట
గర్వముతో కూడుకొన్న ప్రశ్న, బుద్ధి స్వభావము మారిన తర్వాత వినయముతో
కూడుకొన్న ప్రశ్నగాయుండును. వినయము కల్గి వినెడి జవాబు మనిషికి
బాగా అర్థము కాగలదు. వినయము లేనప్పుడు అర్థమయ్యేదానికి,
వినయమున్నప్పుడు అర్థమయ్యేదానికి ఎంతో తేడాయుండును. మేము
ఎన్నో విషయములను బయటికి చెప్పాము. వాటిలో చాలామందికి బాగా
అర్థమయినవి. కొందరికి అర్థముతో పాటు సంతోషము కూడా కల్గినది.
కొందరికి విషయములు తెలిసేకొద్దీ కళ్ళకు ఆనంద భాష్పములు వచ్చాయి.
మరికొందరికి మేము చెప్పినది కొంత అర్థమయినా కొంత సంశయముగా
మిగిలిపోయినది. కొందరికి పూర్తి అర్థము కాలేదు. కొందరికి అర్థము
కాకపోవడమే కాక మా మీద అసూయ లోపల పొడ చూపినది.
మరికొందరికి అసూయ వచ్చిన తర్వాత వారి సంశయము ప్రశ్నగా మారి
అడగాలనిపించును. కొందరికి అడగాలని కూడా అనిపించదు. అందులో
ఏమీ లేనప్పుడు అడగడమే వృథా అని అనుకొందురు. వారివారి
బుద్ధిగ్రాహిత శక్తినిబట్టి, బుద్ధి స్వభావమును బట్టి మేము చెప్పిన దానిని
చూచి సంతోషపడువారు కొందరుయుండగా, కొందరు అసూయ పడువారు
కూడా యుండడము సహజమే. ప్రకృతిలో యున్న పరిస్థితియంతయూ
అట్లే యుండును.
భూమిమీద మనుషులందరికీ ఒకే స్వభావముండదని తెలిసిన
మేము దేనినీ గొప్పగా లెక్కించుకోము. ఎదుటి వ్యక్తి నన్ను పొగిడినప్పుడు
కొంత సంతోషము, ఉత్సాహము కల్గినా, ఇతరులు తక్కువగా
మాట్లాడినప్పుడు కొంత నిరుత్సాహము కల్గినా దానిని మేము లెక్కించము.
వారి బుద్ధి స్వభావము అటువంటిదనుకొందుము. వారు ఇంకా బాగా
తెలియు నిమిత్తము వారికి అర్థమగునట్లు చెప్పవలెనని నేను అనుకొంటాను.
చాలామంది హేతువాదులు అడిగిన ప్రశ్నలకు మా గ్రంథములలో
జవాబులున్నా వారి ప్రశ్నలకు రెండవమారు జవాబులు చెప్పదలచాము.
ఇంతకుముందు చెప్పిన విషయమునే ఇప్పుడు ఇంకా బాగా అర్థమగులాగున
చెప్పదలచాము. అందువలన ప్రశ్నలు అడిగినవారు, అడగని వారు
జాగ్రత్తగా చదువవలెనని కోరుచున్నాము.
2) ప్రశ్న :- ఇప్పుడున్న ఆధ్యాత్మిక సిద్ధాంతములు దేవున్ని తెలియజేయలేవనా
మీరు ఒక క్రొత్త సిద్ధాంతమును ప్రతిపాదించారు?
జవాబు :- ఇప్పుడున్న సిద్ధాంతములు దైవత్వమును కొంతవరకు
తెలియజేశాయి. అయితే సంపూర్ణమైన దేవున్ని తెలియజేయలేకపోయాయి.
ఉదాహరణకు చెప్పితే ఖగోళ పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేసి
ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతమును చెప్పి చంద్రున్ని ఉన్నాడని చెప్పారు.
వారి సిద్ధాంతముల ఫలితము వలన చంద్రుడు గ్రహమని, స్వయం ప్రకాశము
లేదనీ, సూర్యరశ్మి వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడని చెప్పారు. అంతేకాక
భూమి నీడ చంద్రుని మీద పడుట వలన శుక్లపక్షమి, కృష్ణపక్షమి, పౌర్ణమి,
అమావాస్య జరుగుచున్నవి. ఇవన్నియూ శాస్త్ర పరిశోధన ఫలితములే.
అయితే చంద్రునిలో నీరు ఉన్నట్లు గత పరిశోధనలు నిరూపించ
లేకపోయాయి. 'చంద్రునిలో నీళ్ళున్నాయి' అని చెప్పుటకు మరికొంత
పరిశోధన అవసరమయినది. చివరికి గతములోకంటే క్రొత్తగా చేసిన
పరిశోధనల వలన ఈ మధ్య కాలములో పది సంవత్సరముల క్రితము
'చంద్రునిలో నీళ్ళున్నాయి' అని తెలిసినది. మొదటి పరిశోధనల వలన,
మొదటి సిద్ధాంతముల వలన తెలియని సత్యము తర్వాత పరిశోధనల
వలన తెలిసినట్లు, అట్లే గతములో అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతముల
వలన దేవుడు ఒక్కడేయని ఒకరు, కాదు ప్రకృతిలో దేవుడు గొప్పవాడని
మరొకరు. ప్రకృతి దేవుడు కాకుండా జీవుడు కూడా యున్నాడని దేవుడు,
జీవుడున్నాడని చివరికి ద్వైత సిద్ధాంతము ద్వారా మధ్వాచార్యులవారు
చెప్పారు. మాకు తెలిసిన ఆధ్యాత్మిక భావములను అనుసరించి భగవద్గీతలో
యున్న ఆధారమును చూపుచూ దానికి త్రైత సిద్ధాంతమను పేరుతో 38
సంవత్సరములుగా ప్రచారము చేయుచున్నాము. ఇది ప్రత్యేక శకముగా
త్రైత సిద్ధాంతము మొదలయినదని ఈ కాలమునకు “త్రైత శకము” అని
పేరు పెట్టాము. త్రైత సిద్ధాంతము ద్వారా ప్రత్యేకముగా జీవునికి, దేవునికి
మధ్యలో ఆత్మయుందని తెలియజెప్పాము. ఎన్నో నిరూపణల ద్వారా
ఆత్మయున్నదని ఆత్మకు ఉనికి, ఆత్మకు పని ఎట్లున్నది త్రైత సిద్ధాంతము
ద్వారా తెలుపబడినది. ఈ సిద్ధాంతమును అనుసరించే వారికి ఆత్మ
ఎట్లున్నది తెలియడమేకాక, ఆత్మ మూడు ఆత్మలలో ముఖ్యమైనదై, దేవునితో
సమానమైనదని తెలియగలదు.
3) ప్రశ్న :- మీరు ప్రతిపాదించిన సిద్ధాంతము కొరకు ప్రజలా? ప్రజల
కొరకు సిద్ధాంతమా?
జవాబు :- ప్రజల కొరకు సిద్ధాంతముండవలెను గానీ, సిద్ధాంతము కొరకు
ప్రజలు ఉండకూడదు. ప్రజలకు ఉపయోగపడునది సిద్ధాంతము.
సిద్ధాంతము అనగా చివరికి తెలియునది, చివరికి పొందునది అని అర్థము.
దేనిని పొందవలెను? దేనిని తెలియవలెను? అను దానికి నీవు ఏమి
తెలియాలని ప్రయత్నిస్తున్నావో, లేక ఏమి పొందాలని ప్రయత్నిస్తున్నావో
దానిని పొందడము లేక దానిని తెలియడము అని అర్థము. సిద్ధి+అంతము=
సిద్ధాంతము. సిద్ధి అనగా పొందడము లేక తెలియడము. అంతము
అనగా చివరిలో యని అర్థము. ఒక విషయమును తెలియాలని ఒక
పరిశోధకుడు పరిశోధన చేయుచుండగా చివరికది తెలియు పద్ధతిని
సిద్ధాంతము అని అనవచ్చును. చివరికి తెలిసినది సత్యమైయుండుట
వలన, సత్యముగా తెలియు వరకు పరిశోధన చేయుట వలన దీనికి శాస్త్ర
పద్ధతి ప్రకారము తెలిసినదని చెప్పవచ్చును. సత్యము తెలియుట వలన
ప్రతి సిద్ధాంతము శాస్త్రబద్ధమై యుండును. శాస్త్రములో సిద్ధాంతము
అంతర్భాగమై యుండును. ప్రపంచ విషయములకు సిద్ధాంతములున్నవి.
అట్లే దైవ విషయములకు సిద్ధాంతములున్నవి. తెలియబడు విషయములను
బట్టి అవి ప్రపంచ సంబంధ ఐదు శాస్త్రములకు సంబంధించిన
సిద్ధాంతములు కావచ్చును, లేక తెలియబడు విషయము దైవికమైనదైతే
అది దైవ సంబంధశాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్ర సంబంధ సిద్ధాంతము
కావచ్చును. న్యూటన్ సిద్ధాంతము, డార్విన్ సిద్ధాంతము ప్రపంచ సంబంధ
మైనవని చెప్పవచ్చును. ఇంకా విడదీసి చూస్తే న్యూటన్ సిద్దాంతము
ఖగోళ శాస్త్ర సంబంధమైనది. త్రైత సిద్ధాంతము బ్రహ్మవిద్యా శాస్త్ర
సంబంధమైనది. ప్రపంచ సంబంధ ఐదు శాస్త్రములు, దైవ సంబంధ
ఒక్క శాస్త్రము మొత్తము షట్ శాస్త్రములు ప్రజల కొరకు వచ్చినవే. ప్రజలను
విజ్ఞానవంతులుగా, జ్ఞానవంతులుగా చేయుటకు వచ్చినవే. అందువలన
'సిద్ధాంతములు ప్రజల కొరకే’యని చెప్పవచ్చును.
4) ప్రశ్న :- దేవుడు అనేది ఒక అభూత కల్పన, లేనిదానిని ఉన్నదని
భావింప చేసే సమ్మోహన క్రీడ. దీనికి మీరేమంటారు? దేవుడున్నాడని
తెలిపేందుకు మీ వద్ద గీటురాయిలాంటి ఆధారమేమయినా ఉందా?
జవాబు :- దేవుని జ్ఞానము అర్థము కాని వారందరూ, దేవుని విషయమును
ఏమాత్రము గ్రహించుకోలేని వారందరూ, తమ బలహీనతను కప్పిపుచ్చు
కునే దానికి వాడే పదములు, చెప్పేమాటలు ఇవే. దేవుడు సత్యబద్దుడు,
శాస్త్రబద్ధుడు అని చెప్పుచున్నా అభూత కల్పన అనడము చూస్తే “తాను
ఆడలేక మద్దెల కొట్టు వానిమీద కోపగించుకోవడము” అనునది ఇట్లే
యుంటుంది. దేవుని విషయములు ఏవి సత్యమైనవో, ఏవి సత్యముకానివో
తేల్చి చెప్పుటకు దైవగ్రంథములను దేవుడే గీటురాయిగా పంపడమైనది.
దేవుడు పంపిన ప్రథమ దైవగ్రంథము (భగవద్గీత), ద్వితీయ దైవగ్రంథము
(బైబిలు), అంతిమ దైవగ్రంథము (ఖురాన్) ఈ మూడు గ్రంథములు
సత్యాసత్యములను తేల్చి చెప్పు శాస్త్రబద్దమైన గీటురాళ్లుగా యున్నాయి
యని అంతిమ దైవగ్రంథములో సూరా 2, ఆయత్ 53లో ఈ విధముగా
చెప్పబడినది చూడండి. (2-53) “జ్ఞాపకము చేసుకోండి! మీరు
సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని
మరియు సత్యాసత్యములను వేరుచేసి చూపే గీటురాయిని
ప్రసాదించాము.”
శాస్త్రము అనగా సత్యము అని అర్థము. ఏది సత్యమో అది
శాస్త్రమగును. ఒక సత్యమైన విషయము ఆరు శాస్త్రములలో ఏదో ఒక
శాస్త్రమునకు సంబంధించియుండును. దేవునికి సంబంధించిన శాస్త్రము
ఉంది అంటే అందులో సత్యమున్నదనేగా అర్థము. షట్ శాస్త్రములలో
ఐదు ప్రపంచ సంబంధ శాస్త్రములుకాగా, ఒకటి దేవుని సంబంధమైన
బ్రహ్మ విద్యా శాస్త్రము గలదు. బ్రహ్మవిద్యా శాస్త్రములో చెప్పిన విషయములు
శాస్త్రమైయుండుట వలన అవి సత్యమైనవిగా యుండునుగానీ అభూత
కల్పనగా ఉండవని తెలియవలెను. దేవుడు కలడుగానీ తెలియడు. దేవుడు
వెతకబడేవాడేగానీ తెలియబడేవాడు కాడు. “దేవులాడబడేవాడు దేవుడు”
అని పెద్దలు చెప్పారు. తెలియని దేవున్ని, కనిపించని దేవున్ని చూచాము
అనేవారు చెప్పేది అభూతకల్పనై యుండవచ్చునుగానీ దేవుని విధానము
గానీ, దేవుని జ్ఞానముగానీ అభూత కల్పన కాదు, సత్యము అని చెప్పవచ్చును.
దేవుడు నామ, రూప, క్రియలు లేనివాడని శాస్త్రము చెప్పుచున్నది. దేవునికి
పేరుగానీ, రూపముగానీ, పనిగానీ లేదని చెప్పుచుండగా దానిని దేవుని
జ్ఞానము అంటున్నాము. దేవుని జ్ఞానమును తెలియకనే కొందరు
అనవసరముగా దేవున్ని గురించి అభూత కల్పనయని అనడము పూర్తి
తప్పగును. దేవుడున్నాడని చెప్పుటకు మా దగ్గర పూర్తి సమాచారమున్నా
ఆయన ఎవరికీ తెలియకుండా స్థబ్దునిగా యున్నాడు అని చెప్పుచున్నాము.
అటువంటప్పుడు దేవుడు తెలియబడడు, ఎవరూ ఆయనను చూడలేదు
అని చెప్పుచున్నాము. దేవుడు తెలియబడును అని చెప్పియున్నా, దేవుడు
కనిపిస్తాడు అని చెప్పియున్నా ఆ మాటలు అభూతకల్పనే యగును. బ్రహ్మ
విద్యా శాస్త్రము ప్రకారము మూడు దైవగ్రంథములు దేవుని విషయములో
దేవుని మీద నెలకొన్న అపొహలను తీసివేయుటకు గలవు. సృష్ఠి
తయారయిన తర్వాత దేవుడు ఏమీ చేయనివాడుగా, ఎవరికీ తెలియని
వాడుగా ఉండిపోయాడు. ఆయన (దేవుని) పేరు ఎవరికీ తెలియదు.
ఆయన రూపు ఎవరికీ తెలియదు. అట్లే ఆయన ఏ పనినీ చేయడు.
కనుక ఆయన ఎప్పటికీ అభూతుడే అట్టి వానిని తిరిగి కల్పన చేయనవసరము
లేదు. అభూతుడనగా జీవము లేనివాడు. జీవము కర్మయున్న జీవునికి
యుండును. ఆయన దేవుడు కావున ఆయన ఎప్పటికీ అభూతుడే. దైవ
జ్ఞానము తెలియనివాడే ఆయనను అభూతుడని కల్పన చేసి చెప్పును.
తెలిసినవాడు కల్పన చేయవలసిన అవసరము లేదు. దేవుడు నిత్యుడు,
సత్యుడు భూతముకాని అభూతుడు.
దేవుడనేది లేనిదానిని ఉన్నదని భావింపజేయు సమ్మోహన క్రీడ
అని దీనికి మీరేమంటారు? అని ప్రశ్నించారు. ఇవన్నీ తెలియకుండానే
మాట్లాడిన మాటలు తప్ప, తెలిసి మాట్లాడిన మాటలు కావని మాకు
అర్థమగుచున్నది. దేవుడు లేనివానిగానే యున్నాడని ఏ విషయములో
గానీ దేవున్ని బాధ్యున్ని చేసి చెప్పకూడదనీ, విశ్వములో ఆయన పాత్రే
లేదనీ, దేవుడు స్థబ్ధునిగా నిలిచిపోయినవాడనీ, కేవలము అక్షిగా యున్నాడు
తప్ప ఆయన లేనివాడే యనీ, లేనివానిని ఉన్నాడని చెప్పడము, ఉన్నాడని
అనుకోవడము అజ్ఞానమనీ, అంతటా ఉండువాడు, అన్నీ చేయువాడు,
నిజముగా నీకు నాకు దేవుడై, అధిపతియై యున్నవాడు ఆత్మేయనీ, దేవుడు
కాదనీ మేము చాలామార్లు చెప్పాము. దేవున్ని గౌరవార్ధము కొన్నిచోట్ల
చెప్పుచున్నాము తప్ప, ఏ విషయము దేవునికి సంబంధము లేదనీ, దేవుడు
ఎక్కడా జోక్యము చేసుకోలేదనీ, దేవుని స్థానములో ఆత్మే అన్నీ చేయు
చున్నాడని “విశ్వ విద్యాలయము" అను గ్రంథములో వ్రాశాము. లేనివానిని
ఉన్నాడని అనుకోవడమే అజ్ఞానమనీ, ఉన్నది ఏదో, లేనిది ఏదో తెలుసుకుని
చెప్పితే బాగుంటుంది గానీ, ఏదో మాట్లాడవలెనని అనుకోవడము
హేతువాదము కాదుగానీ అజ్ఞానవాదము అని అనవచ్చును. మేము
చెప్పునది సత్యము అనుటకు గీటురాయిగా భగవద్గీత, బైబిలు, ఖురాన్
అను మూడు గ్రంథములు గలవని చెప్పుచున్నాము.
5) ప్రశ్న :- దేవుడున్నాడని మేము నమ్మము. అయినా మాకు ఏ కష్టాలు
లేవు, దేవుడున్నాడు అనే వారికంటే మేమే బాగున్నాము. దేవుడున్నాడు
అని నిత్య పూజలు చేయువారే అన్ని విధముల కష్టపడుచున్నారు. మేము
దేవుడంటే భయము లేనివారమై మ్రొక్కను కూడా మ్రొక్కము. మరి దేవుడు
మమ్మల్ని ఎందుకు శిక్షించలేదు, ఎందుకు కష్టపెట్టలేదు?
జవాబు :- దేవునికి, ప్రపంచ కష్టాలకు సంబంధము లేదు. ప్రపంచ
కష్టాలు కర్మనుబట్టి వచ్చునుగానీ, భక్తినిబట్టి వచ్చునవీగావు, పోవునవీ కావు.
దేవుని మీద భక్తి లేనివానికి కష్టాలు వచ్చుననీ, భక్తియున్న వానికి కష్టాలు
రావనీ, ఏ గ్రంథములోనూ వ్రాయలేదు. దేవుడు, దేవుని జ్ఞానము మనిషి
జన్మలు లేకుండా చేయుటకేగానీ, కష్టాల సుఖాల నిమిత్తము కాదు. కష్ట
సుఖములు పాపపుణ్య కర్మలనుబట్టి యుండును తప్ప వేరు విధానము
వలన రావు, పోవు. గతజన్మలో పుణ్యము చేసుకొన్నవారు ఈ జన్మలో
సుఖములు అనుభవించవలెనని తీర్పు తీర్చబడియుండును. గతజన్మలో
పుణ్యము చేసుకొన్నవారు ఈ జన్మలో ఎంత అజ్ఞాని అయినాగానీ, దేవున్ని
నమ్మకపోయినా గానీ, వాడు గత పుణ్యఫలితము వలన సుఖములనే
అనుభవించుచుండును. గత జన్మలో పాపము చేసుకొన్నవాడు ఈ జన్మలో
దేవున్ని నమ్మినా, దేవున్ని ఆరాధించినా గత జన్మ పాపము వలన కష్టములనే
అనుభవించుచుండును. ఇదంతయూ ప్రపంచములో జరుగు సత్యము.
అంతేగానీ దేవుని విశ్వసించని వానికి, దేవుని శిక్షకు సంబంధము లేదు.
విశ్వాసము దైవజ్ఞానమునుబట్టి వచ్చును. పుట్టిన ప్రతి మనిషికి దేవుని
పై విశ్వాసముండవలెనని దేవుడు కూడా ఎక్కడా చెప్పలేదు. దేవుని మీద
విశ్వాసము మనకుగల శ్రద్ధనుబట్టి వచ్చును. శ్రద్ధనుబట్టి భక్తి విశ్వాసములు
ఉండును. కర్మనుబట్టి కష్టసుఖములుండును. భక్తి విశ్వాసములకు కష్ట
సుఖములకు ఏమాత్రము సంబంధము లేదు. అందువలన “భక్తి విశ్వాసము
లేని వారిని దేవుడు శిక్షించును" అని అనుకోవడము పూర్తి పొరపాటు.
6) ప్రశ్న :- మనిషి సంపాదించుకొన్న కర్మ ప్రకారమే ఈ జన్మలో అన్నీ
అవే జరుగును అని చెప్పే కర్మసిద్ధాంతము జనులను సోమరిపోతుల్ని
చేస్తున్నదని మేమంటాము. దీనికి ముక్కసూటిగా జవాబు చెప్పండి?
జవాబు :- ముక్కుసూటిగా చెప్పినా, గోడసూటిగా చెప్పినా సోమరిపోతులగు
టకుగానీ, చురుకుతనము కలవారగుటకు గానీ కర్మే కారణము. కర్మను
అడ్డము పెట్టుకొని ఎవరూ పనులు మానుకొనుటకు వీలులేదు. ఒక్క
క్షణము కూడా ఊరకయుండక కర్మవలననే కదలుచూ, పని చేయుచుండునని
కర్మచట్టములో యున్నప్పుడు మనిషి ధనికుడుగా మారవలెనన్నా, పేదవానిగా
మారవలెనన్నా, సోమరిపోతుగా మారవలెనన్నా అన్నిటికీ కర్మే కారణమై
నప్పుడు స్వతహాగా ఎవడూ సోమరిగా మారడు. కర్మవలన సుఖదుఃఖములు
అవే వస్తాయిలేయని పనులు మానుకొనుటకు ఏ జీవునికి స్వతంత్రము
లేదు. ఎవరూ స్వతంత్రముగా మారుటకు వీలులేదు. ప్రతి క్షణము
కర్మనుబట్టి వాడు నడుచుచుండునని భగవద్గీత కర్మయోగములో ఐదవ
శ్లోకములో ఈ విధముగా చెప్పారు చూడండి.
(2-5) శ్లో॥
నహికశ్చిత్ క్షణ మపి జాతుతిష్ఠత్య కర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మసర్వః ప్రకృతి జైర్గుణైః
వివరము :- “ఏ కర్మ అనుభవించక ఎవ్వడు కూడా ఒక్క క్షణమైనా ఊరక
యుండుటకు వీలులేదు. ప్రకృతి గుణముల వలన కర్మబద్ధులై జనులు కర్మముల
వశులై కార్యములు చేయుచుందురు.”
ఈ విధముగా ప్రతి మనిషి కర్మప్రకారము కార్యములను చేయు
చుండగా ప్రత్యేకించి ఎవడుగానీ తన స్వంతముగా మారిపోవుననిగానీ,
పనులు చేయడనిగానీ, చేయుననిగానీ చెప్పుటకు వీలులేదు. మనిషిని
కర్మ ఎంతో లెక్కాచారముగా క్షణక్షణము నడుపుచుండగా, ఒక్క క్షణము
కూడా కర్మ లెక్కాచారము లేకుండా నడుచుటకు వీలు లేకుండా యుండగా,
మనిషి ఏదో చూచి, ఏదో రకముగా మారునని చెప్పుటకు వీలులేదు.
మనిషి తన ఇష్టమొచ్చినట్లు మారవలెనని అనుకొనినా, ఏదీ వాని
ఇష్టమొచ్చినట్లు జరుగదని అందరికీ తెలుసు. ముందే నియమించబడిన
కర్మప్రకారము అన్నీ జరుగుచుండగా, మనిషి స్వయముగా ఏమీ చేయలేడు.
తాను అనుకొన్నదొక్కటి, కర్మప్రకారము జరుగుచున్నదొకటిగా ప్రతి మనిషి
జీవితములో యుండును. మనిషి ఇష్టమువేరు, మనిషి కర్మవేరు. మనిషి
ఇష్టము ప్రకారము ఏదీ జరుగదు. అన్ని కర్మలు లెక్కాచారము ప్రకారమే
జరుగును. అందువలన “కార్యం కర్మాధీనమ్” అని పెద్దలన్నారు.
7) ప్రశ్న :- మీరు ప్రతిపాదించిన సిద్ధాంతము సుమారు ఎన్ని గ్రంథములుగా
వ్రాయగోరినారు? దీనివలన ఏ విధముగా మీకు లాభము చేకూరుతుంది?
జవాబు :- ఇది అడుగ వలసిన ప్రశ్నే కాదు, అయినా నేను చెప్పవలసిన
జవాబే! కనుక చెప్పుచున్నాను. మనిషి చేయవలసిన పనిని గురించి అంచనా
వేసుకోవడము సహజము. తాను అనుకొన్నట్లే చేయుదునను అజ్ఞానము
వారిలో యుండుట వలన వారు ముందే అది చేయగలను, ఇది చేయగలను
అని అనుకోవడము జరుగుచున్నది. అయితే మా విషయానికి వస్తే నేను
ముందు అనుకోవడము వలన జరుగుతుందని ఏమాత్రము నమ్మకము
లేదు. ఎందుకనగా! జరుగబోయే పనులన్నియూ మనిషి ఇష్టము అయిష్టము
మీద ఆధారపడి లేవు. కార్యములన్నియూ మనిషి యొక్క కర్మమీద ఆధారపడి
జరుగుచుండును. నా కర్మలో ఎన్ని గ్రంథములు వ్రాయాలని నిర్ణయమై
యుండునో దాని ప్రకారము అన్ని గ్రంథములను వ్రాయగలను. అందువలన
నా కర్మ ఎలా ఉన్నదో నాకు తెలియదు, గనుక నేను ఎన్ని గ్రంథములు
వ్రాయగలనో ముందే చెప్పుటకు వీలుపడదు.
కార్యములన్నియూ కర్మనుబట్టి యుండును, కనుక కర్మను తెలియని
నీవు ఫలానా పనిని ఫలానా విధముగా చేస్తానని చెప్పకు. ఒకవేళ నీవు
ఫలానా పనిని చేస్తానని చెప్పినా ఆ పనిని చేయలేవు, ఆ పని జరుగదు.
అందువలన ఈ విషయమై అంతిమ దైవగ్రంథము ఖురాన్లో సూరా 18,
ఆయత్ 23లో ఈ విధముగా చెప్పియున్నారు చూడండి. (18-23) “J
విషయములో కూడా నేను ఈ పనిని రేపు చేస్తాను అని చెప్పకు,
నీవు ఏమీ చేయలేవు." ఇది దేవుడు చెప్పిన జ్ఞానము కనుక రేపు ఏమి
జరుగునో, ఏమి చేస్తామో ఎవరికీ తెలియదు. కార్యముల విషయమే
తెలియనప్పుడు కార్యముల వలన లాభము కల్గునని ఎందుకు అనుకోవాలి?
ఒకవేళ కర్మప్రకారము నష్టము కూడా రావచ్చును. అందరూ లాభము
రావాలని పనులు, వ్యాపారము చేయుచుందురు. అయితే వారికి నష్టము
వచ్చి, ఉన్నది కూడా పోగొట్టుకున్నవారు ఎందరో గలరు. జ్ఞానము
తెలిసిన ఏ మనిషి పనులను గురించిగానీ, పనుల వలన వచ్చే లాభము
గురించిగానీ ముందే మాట్లాడడు. అందువలన నాకు వచ్చే లాభమును
గురించి నేను ఏమీ చెప్పలేను.
8) ప్రశ్న :- “తేలుకుట్టిన వ్యక్తికి కాకుండా, ఆ విషయాన్ని చెప్పిన మరొక
మనిషికి వైద్యము చేయుట వలన తేలుకుట్టిన వ్యక్తికి బాధ తగ్గును" అని
విన్నాము. ఇది ఎట్లు సాధ్యమో వివరించగోరుచున్నాము?
జవాబు :- ఈ విషయమును ఎవరూ చెప్పియుండరు. బహుశా నేనే
చెప్పియుంటాను. ఎందుకనగా! ఆ వైద్యము నా అనుభవములోనిదే. అయితే
ఆ విధానమును నేనే మొదట బయటపెట్టాను. అటువంటి వైద్యము నాకు
ఎలా తెలిసిందో అక్కడనుండి చెప్పితేగానీ ఈ విషయము మీకు అర్థము
కాదు. అందువలన మొదటినుండి చెప్పెదను వినండి. నాకు పది
సంవత్సరముల వయస్సులో నేను నా మేనమామ ఇంటికి పోవడము,
అక్కడే ఒక నెల వరకు ఉండడము జరిగినది. నా మేనమామ అయిన
వ్యక్తికి తేలు కుట్టితే వైద్యము చేసే విధానము తెలుసు. అతను వైద్యుడు
కాకున్నా అతనికి ఆ ఒక్క వైద్యము మాత్రము తెలుసు. రెండు మూడు
రోజులకు ఒకరు తేలుకుట్టిన వారు వస్తే వారికి ఆకు వైద్యము చేసెడివాడు.
తేలుకుట్టిన వ్యక్తి వచ్చిన వెంటనే ఇతను బయటికిపోయి, గుంపుగా చెట్లు
పెరిగిన ఏదో ఆకులను తెచ్చి బాగా ఆకులను నలిపి తేలు విష బాధ
ఎక్కడివరకు ఉందో అడిగి, అక్కడ నలిపిన ఆకును పెట్టి చిన్నగా ఆకును
క్రిందికి జరుపుచుండగా నొప్పి కూడా ఆకువెంట దిగివస్తున్నదని తేలు
కుట్టినవారు చెప్పేవారు. దానిని నేను శ్రద్ధగా చూచెడివాడిని.
చేతికి తేలు కుట్టియుంటే విషబాధ భుజము వరకు యుండును.
భుజము నుండి ఆకును చర్మమునకు తగిలించి క్రిందికి తీసుకురాగా, నొప్పి
ఆకువెంట దిగిరావడము చూచి నాకు చాలా ఆశ్చర్యముగా ఉండేది. ఆ
పనినే ఎంతో ధ్యాసగా చూచేవాడిని. నా శ్రద్ధ ఆ పని మీదనే ఎక్కువగా
యుండుట వలన కొంతకాలానికి ఆయన ఉపయోగించే ఆకును
తెలియగలిగాను. తర్వాత నా వయస్సు 23 సంవత్సరముల సమయములో
నేను వైద్యుడుగా కాలము గడుపవలసి వచ్చినది. బ్రతుకు తెరువుకు
అప్పుడు నేను వైద్యుడను కాలేదు, రోగములు వైద్యము వాటి వెనుకయున్న
రహస్యము తెలియుటకు పరిశోధనా నిమిత్తము వైద్యము చేసెడివాడిని.
అప్పుడు తేలుకుట్టిన వారికి చిన్నప్పుడు నేను చూచిన ఆకును ఉపయోగించి
వైద్యము చేయగా అది బాగా పనిచేసి తేలు బాధ తొందరగా తగ్గిపోయేది.
ముందే చెప్పాను కదా! నేను వైద్యము చేసినది సంపాదన కొరకు కాదు.
రోగములు, వైద్యము రెండింటి మీద పరిశోధన నాకు తెలిసిన పద్ధతిలో
సాగించెడివాడిని. అప్పుడే మనిషి శరీరములో సూక్ష్మ శరీరములు
(దయ్యములు) ఉండుట వలన మందులకు లొంగని రోగములుండునని
తెలియగలిగాను. రోగముల పరిశోధనే కాక వైద్యము మీద కూడా పరిశోధన
సాగించెడి వాడిని. కనుక తేలు కుట్టినప్పుడు కలిగే బాధ చేతిలో భుజము
వరకు ఉండును. తేలు విష బాధ చాలా నొప్పిగా యుండును. అంత పెద్ద
నొప్పి ఇంత చిన్న ఆకుకు ఎలా పోతుంది? యను ప్రశ్నకు జవాబును
వెతికేవాడిని. అనేక కోణములలో ఆకు వైద్యమును గురించి ఆలోచించాను.
చేతిమీద చర్మమునకు తాకించిన ఆకు చేయి లోపలగల నొప్పిని ఎలా
క్రిందికి దించగలుగుచున్నది? అని ఆలోచించాను. అప్పుడు చిన్న యోచన
వచ్చినది. ఆకు కనిపించేదే అయినా ఆకు యొక్క శక్తి పరిధి కొంతదూరము
వరకు ఉండునని అర్థమయినది. ఆకు శక్తి పరిధి కొంతదూరముండుట
వలన చేతి లోపలి విషము క్రిందికి దిగి వస్తున్నదని అర్థమయినది.
ఇదంతయూ నాకు స్వయముగా వచ్చిన యోచనలు. అదే విధానము
ప్రకారము ఆ పరిధి లోపలయున్న ఏ మనిషికి వైద్యము చేసినా, అది తేలు
విషము మీద పని చేయగలదని, లోపలనుండి ఒక ఆలోచన రాగా ఆ
విధముగానే మొదట ప్రయోగము చేసి చూచాము. ఒక వ్యక్తి చేతికి
ఆకును ఉపయోగించగా కొంత దూరములోయున్న వ్యక్తికి తేలు విషము
దిగిరావడము జరిగినది. ఒక వ్యక్తికి ఆకును శరీరము మీద ఎక్కడ
ప్రయోగిస్తే కొంత పరిధి వరకు యున్న మనుషులందరి శరీరము మీద
ప్రయోగించినట్లు ఆకు వైద్యము ఆకులోని శక్తి పని చేయుచున్నది. ఒక
మనిషికి ముక్కులో ఆకు రసము పిండితే అక్కడ కొంత పరిధి వరకు
యున్న మనుషుల అందరి ముక్కులలో ఆకు రసము పిండినట్లే ఆకుశక్తి
అందరి ముక్కుల మీద పని చేయుచున్నది. అదే విధానము ప్రకారము
తేలుకుట్టిన వ్యక్తికే కాకుండా వాని ప్రక్కనగల ఎవనికయినా ఆకును
ప్రయోగించినప్పుడు, ఆకుశక్తి ప్రక్కనేయున్న తేలు విషబాధను అనుభవించు
వ్యక్తిలోని బాధ తగ్గిపోవుచున్నది. ఇదంతా స్వయముగా అంచనా వేయగలిగి
ఇప్పటికి దాదాపు 40 సంవత్సరములప్పుడే ప్రక్క మనిషికి కూడా ఈ
ఆకు పని చేస్తుందని తెలిసినది. ప్రత్యేకించి ఆ ఆకులోనే అటువంటి
శక్తియుందని, మిగతా చెట్ల ఆకులలో అటువంటి శక్తి లేదని తెలిసినది.
ఈ ఆకు వైద్యము బయట చూచేవారికి వింతగా కనిపించినా లోపల గల
విషయము, వివరము రెండు నాకు ముందే తెలుసు. కావున నాకు వింతగా
ఏమీ లేదు. అశ్వర్థ వృక్షము అనబడు రావి చెట్టు కూడా ఒక మీటరు
వరకు శక్తి వ్యాపించియుండును. అందువలన రావిచెట్టు మీటరు
ఆవరణములోనికి పోయి ప్రతి దినము ఉండగా 40 రోజులకు కొన్ని
రోగములు నయమైపోగలవు. ఆ చెట్టులోనే ఆ శక్తి కలదని తెలియుచున్నది.
తేలు విషము తగ్గడము, ఇతర మనిషికి ప్రయోగించినా అది పని చేయడము
నా అంచనాతో చేసిన పని, కావున నేను అది ఎట్లు సాధ్యమో వివరించ
గలిగాను.
9) ప్రశ్న :- యజ్ఞముల వలన, సోమపానము వలన పుణ్యము వస్తుంది
అంటున్నారు. పైగా అధర్మము అంటున్నారు. అధర్మముల వలన పుణ్యము
వస్తే మరి అందులో జరిగిన పశుహింస వలన కూడా పుణ్యము వస్తుందా?
అది కర్మ కాదా?
జవాబు :- బాహ్య యజ్ఞముల వలన పుణ్యము వస్తుంది యని అక్షర పర
బ్రహ్మయోగమున చివరి శ్లోకములో చెప్పియున్నారు. యజ్ఞము అధర్మమైన
దానివలన మోక్షము రాదని విశ్వరూప సందర్శన యోగములో 48వ
శ్లోకములోనూ, 53వ శ్లోకములోనూ చెప్పడమైనది. యజ్ఞముల వలన
పుణ్యము వస్తుంది అనుమాట వాస్తవమే అయినా అది కర్మకు సంబంధించి
నదేగానీ, మోక్షమునకు సంబంధించినది కాదు. యజ్ఞములలో పశుహింస
జరిగితే దానికి తగినంత పాపము కూడా వచ్చును. యజ్ఞము అంటే
అంతా పుణ్యమేయని చెప్పుటకు వీలులేదు. యజ్ఞములలో ఎంత మంచి
జరిగితే అంత పుణ్యము వస్తుంది. అట్లే చెడు జరిగితే, ప్రాణహింస జరిగితే,
జంతుబలులు జరిగితే దానికి తగినంత పాపము కూడా వచ్చును.
పాపపుణ్యములకు సంబంధించిన యజ్ఞములను కర్మతో కూడుకొన్నవని
చెప్పవచ్చును. అందువలన బాహ్యముగా జరుగు యజ్ఞములకంటే
కనిపించకుండా అంతరంగములో అనగా శరీరములో జరుగు యజ్ఞములను
అనగా ద్రవ్యయజ్ఞము, జ్ఞానయజ్ఞమును చేయగల్గితే, అందులో జ్ఞాన
యజ్ఞముల వలన కర్మ లేకుండా పోయి, మోక్షమునకు పోవుటకు దారి
లభించును. అందువలన అంతరంగములో జరుగు జ్ఞానయజ్ఞమును
ఆచరించమని పెద్దలు చెప్పుచుందురు.
10) ప్రశ్న :- ‘జీహాద్' అను పేరుతో ముస్లీమ్లు చేస్తున్న హింసాకూడా
ఒక రకంగా పుణ్యమా? ఎందుకంటే వారు చేస్తున్నది స్వర్గం అనే దానిని
ఆశించే కదా! స్వర్గం అనే భావముతో చేస్తున్నప్పుడు వారికి పాపము
వస్తుందా? పుణ్యము వస్తుందా?
జవాబు :- మనిషి తనది మంచి ఉద్దేశ్యమే అని చేసినా, వాడు అనుకొన్నది
పనికి రాదు. దేవుడు నిర్ణయించినట్లు అది హింస అయితే పాపము
వస్తుంది. స్వర్గమును ఆశించి చేసిన పని మంచిదయితే పుణ్యము వస్తుంది.
చెడు పని అయితే పాపము వస్తుంది. మనిషి సుఖము కొరకు పాపమునే
చేస్తున్నాడు. జీహాద్ అనేది పవిత్రయుద్ధము అని చెప్పేమాట గుణములతో
పోరాడుచూ దేవుని ధర్మములను ఆచరించుటనే పవిత్ర యుద్ధము అని
అంటున్నారు. జీహాద్ అనేది ఇతరులను హింసించునది కాదు. దేవుని
మార్గములో ప్రయాణించుటకు శరీరములోనే గుణములతో యుద్ధము
చేయుటను 'పవిత్ర యుద్ధము' అనీ, జీహాద్ అనీ అంటారు. జీహాద్
పేరుతో బయట అరాచకము సృష్టించి, బయట ప్రపంచములో హింసను
చేయువాడు తనకు తెలియకుండానే పాపమును సంపాదించుకొనుచున్నాడు.
దానివలన వానికి స్వర్గము రాదుగానీ, నరకము మాత్రము తప్పనిసరిగా
వస్తుంది. స్వర్గమును ఆశించువాడు జీహాద్ చేయడు. స్వర్గమును ఆశించి
చేయుట జీహాద్ అనిపించుకోదు. స్వర్గనరకములకు అతీతమైన పరలోకము
కొరకు జీహాద్ చేయడము జరుగుచుండును. పరలోకము అనగా దేవుని
సన్నిధానములోనికి చేరడము. స్వర్గము అనగా సుఖములతో కూడుకొన్నది.
భూమిమీదనే స్వర్గము కలదు. ఇహలోక సౌఖ్యముల కొరకు ప్రాకులాడు
వాడు స్వర్గమునకు ప్రాకులాడువాడుగా యున్నాడు. జీహాద్లో అనగా
పవిత్రయుద్ధములో జ్ఞానసంబంధ విషయములుండును. ఇది ఎవరి
హింసకు కారణము కాదు. జీహాద్ అనునది పవిత్రమైన దేవుని మార్గము
లోనిది, నీచమయిన ప్రపంచ సంబంధమైనది కాదని చెప్పుచున్నాము.
11) ప్రశ్న :- స్వప్నము అనేది నిజము కాదు కదా! మరి మీరు “కృష్ణమూస”
అనే గ్రంథములో కృష్ణుడు మూసాకు కనిపించి చెప్పేది వాస్తవమే అన్నట్లు
చెప్పారు. మరి స్వప్నము కూడా కొన్నిసార్లు వాస్తవముగా మారునా?
జవాబు :- స్వప్నమును గురించి సంపూర్ణముగా చెప్పువారు బహుశా
భూమిమీద ఎవరూ లేరనియే చెప్పవచ్చును. శరీరములోని ఆత్మను ఏ
విధముగా తెలియలేమో అదే విధముగా స్వప్నమును తెలియుట దుర్లభముగా
యుండును. అందువలన స్వప్న రాత్రిని ఆత్మ గుర్తుగా పోల్చి చెప్పాము.
స్వప్నమును సత్యమని చెప్పుటకు ఎంత ఆధారము గలదో, అట్లే స్వప్నము
అసత్యమని చెప్పుటకు అంతే ఆధారము గలదు. ఆత్మను ఎటూ తేల్చి
చెప్పలేనట్లు స్వప్నమును కూడా ఎటూ తేల్చి చెప్పలేము. గత చరిత్రలో
కృష్ణుడు మూసా (మోషే) అను వ్యక్తికి స్వప్నములో కనిపించి గ్రంథమును
ఇచ్చి దాని పేరు 'తౌరాతు' అని చెప్పాడు. ఇచ్చినది భగవద్గీతే అయినా
చెప్పినది తౌరాత్యని చెప్పడము జరిగినది. అది సత్యమనుటకు ప్రతి
దినము రాత్రియందు మూసాకు తౌరాతు గ్రంథము కనిపించేది, దానిలోని
జ్ఞానమును మోషే తెలుసుకునెడి వాడు. ఇదంతయూ స్వప్నములోనే జరిగేది.
అయితే మోషేకు మెలుకువలో యున్నట్లే యుండేది. స్వప్నములో చదివిన
తౌరాతు గ్రంథ విషయములన్నియూ తెల్లవారిన తర్వాత మోషేకు బాగా
జ్ఞాపకము ఉండేవి. రాత్రి చదివిన తౌరాతు గ్రంథమును మోషే (మూసా)
ప్రజలకు చెప్పేవాడు. ఈ విధముగా తౌరాతు గ్రంథము మోషేకు ఒక్కనికే
కనిపించేది. తౌరాతు గ్రంథమును మోషే తప్ప ఎవరూ చూడలేదు.
ఎందుకనగా! బయట ఎక్కడా ప్రజలకు అది కనిపించలేదు. మోషేకు
కూడా రాత్రిపూట మాత్రమే స్వప్నములో కనిపించేది. మోషే తౌరాతు
జ్ఞానమును బయటికి చెప్పగా అది మోషే ధర్మశాస్త్రముగా పేరుగాంచినది.
స్వప్నము సత్యముగా మారును. అట్లే స్వప్నము అసత్యముగా కూడా
ఉండును. స్వప్నమును సత్యమనే దానికి ప్రత్యక్ష ఆధారములు గలవు.
కొన్నిచోట్ల కొన్ని స్వప్నములు నిజమని చెప్పుటకు పరోక్ష ఆధారము కూడా
యుండదు. అందువలన స్వప్నము కొన్నిమార్లు సత్యము కావచ్చును.
కొన్నిమార్లు అసత్యము కావచ్చును. స్వప్న విషయములో ఎవరూ ఎటూ
తేల్చి చెప్పలేరు.
12) ప్రశ్న :- రాగిరేకులు ధరించడము వలన శరీరములోయున్న
Negative Energy (నెగిటివ్ ఎనర్జీ) బయటికి వస్తున్నట్లు తెలియుచున్నది.
అలాగే కొన్ని లోహములు చేతికి ధరిస్తే పాజిటివ్ కిరణాలు లోపలికి ప్రవేశించి
ఆ వ్యక్తిలో సత్వ గుణము పెరిగి కోపము తగ్గినట్లు మా పరిశోధనలలో
తేలింది. అంటే కోపము అనే గుణము ద్వారా పొందే కర్మను
సంపాదించకుండా మేము ఆపినట్లే కదా! మరి మీరు "కర్మ అనుభవించ
కుండా పోదు” అని అంటున్నారు. మేము చేసిన పని ద్వారా కర్మను
ఆపినట్లే కదా!
జవాబు :- ముందే మూటకట్టుకొన్న పాతకర్మను అనుభవించకుండా ఎవరూ
ఆపలేరు. అది జరిగేది జరిగి తీరవలసిందే. మీరు చెప్పునది రాబోయే
క్రొత్త కర్మను నివారించారని చెప్పుచున్నారు. రాబోయే కర్మను రాకుండా
చేసుకొనుటకు అనేక క్రియల వలన క్రొత్త కర్మ రాకుండా చేసుకోవచ్చును.
అందులో నీవు చెప్పిన లోహముల ప్రయోగము వలన కూడా చేసుకో
వచ్చును. అంతేకాదు మౌనముగా యున్నా క్రొత్త కర్మ రాదు. మంత్ర
జపము చేసినా, నిద్రలోనికి పోయినా, కాలములో మనస్సును కథయందు
లగ్నము చేసి వింటూయుండునట్లు చేసినా, గుణములలో లేకుండా చేసినా
క్రొత్తకర్మ రాదు. క్రొత్త కర్మ రాకుండుటకు అనేక ఉపాయములు
చెప్పబడినవి. అయితే ఉన్న కర్మను అనుభవించకుండా తప్పించుకొనుటకు
ఏ విధానము లేదు. రాగి రేకులుగానీ, ఇనుప చువ్వలుగానీ కర్మను
అనుభవించకుండా తప్పించలేవు. జ్ఞానాగ్ని చేత దహించగలిగితే కర్మ
భస్మమై కార్యము కాకుండా పోయి అనుభవమునకు రాకుండా పోవుచున్నది.
అంత తప్ప వేరే ఏ ప్రక్రియ వలన మనిషిని పాత కర్మనుండి తప్పించలేము
తప్పక అనుభవించి తీరవలసిందే.
13) ప్రశ్న :- “గర్భస్థ శిశువుకు ప్రాణము లేదు” అనే వివరణ
విప్లవాత్మకముగా, పరిశోధనాత్మకముగా ఉన్ననూ, ఆ సమాచారము వలన
భ్రూణ హత్యలు (గర్భహత్యలు) ఇంకా ఎక్కువ జరుగునేమోయని నా
అభిప్రాయము. దీనికి మీరేమంటారు?
జవాబు :- జరుగునవి జరుగక మానవు. ప్రతిది కర్మనుబట్టి ముందే
నిర్ణయించబడియుండును. ఈ దినము “గర్భములో శిశువుకు ప్రాణము
లేదు” అన్నంతమాత్రమున దీనివలన ఏమీ జరుగవు. ఒక చిన్న కార్యము
జరుగవలెనన్నా దానికి ముందే కర్మ నిర్ణయము ఉండును. కర్మ నిర్ణయము
ప్రకారమే అన్నీ జరుగుచుండును తప్ప, నేడు మనము చెప్పుకోవడము
వలన జరుగునని అనుకోవడము పొరపాటగును. మనుషులు చేసుకొన్న
పాప, పుణ్య ఫలితముగా ప్రతి పని పుట్టకముందే నిర్ణయించబడియుండును.
దీనినిబట్టి "నేడు మనము గర్భస్థ శిశువుకు ప్రాణము లేదని చెప్పుట వలన
భ్రూణ హత్యలు జరుగును" అని అనుకోకూడదు. ఒకవేళ కర్మప్రకారము
గర్భములోని శిశువును పుట్టకముందే గర్భస్రావము ద్వారా తీసివేసినా దానికి
ప్రాణము లేనిదానివలన అది హత్యయూ కాదు.
14) ప్రశ్న :- అమీబాలాంటి ఏకకణ జీవులు అండజములా?
పిండజములా? ఉద్భిజములా? అయితే వాటి శరీరములో పీయూశగ్రంథి
లేకుండా ఆత్మస్థానము ఎక్కడ ఉండును?
జవాబు :- అండజ, పిండజ, ఉద్భిజములను మూడు రకముల పుట్టుకలు
గలవాటినే ఇంతవరకు చూచాము, విన్నాము. ఈ మూడు రకములు
కానివి కలవు అని ఇంతకుముందు మేము చెప్పలేదు. మనిషి తల్లిగానీ
తండ్రిగానీ లేకుండా మొదట పుట్టాడు. సృష్టి లేనప్పుడు మనుషులే లేనప్పుడు
క్రొత్తగా మనిషి పుట్టాడు. ఆ మనిషికి తల్లి తండ్రి లేరు కదా! భూమిమీద
ఏ విత్తనముగానీ, ఏ చెట్టుగానీ లేనప్పుడు ఎన్నో వృక్షములు పుట్టాయి.
అలాగే ఏ క్రిమికీటకము, ఏ పక్షి జాతి లేని రోజు ఎన్నో పక్షులు వచ్చాయి.
మొదట పుట్టిన మనుషులుగానీ, మొదట పుట్టిన పక్షులు గానీ, మొదట
పుట్టిన వృక్షలతాదులుగానీ వాటికి బాల్యము లేదు. అండజ, పిండజ
ఉద్భిజములుగా పుట్టలేదు. సృష్ట్యాదిలో ఉన్న మనిషికి బాల్యము లేదు.
శిశువుగా తల్లితండ్రుల నుండి పుట్టలేదు. ఒక్క పిండజమేకాదు, మిగతా
అండజములు అండము నుండి పుట్టలేదు. వాటికి బాల్యము లేదు. మిగతా
వృక్షములు తీగలు కూడా అంతే. ఇదంతా వింటూవుంటే విడ్డూరముగా
యుంది కదా! మొదట తల్లి తండ్రులు లేకుండా పుట్టిన వారు అండజములా,
పిండజములా, ఉద్భిజములా? అని అమీబా ఏకకణ జీవిని గురించి
అడిగినట్లే యుండును. ఆనాడు సృష్ట్యాదిలో అందరూ ఎలా పుట్టినది
మరువకుండుటకు దేవుడు ఏకకణ అమీబాను గుర్తుగా యుంచాడు. ఏక
కణ అమీబా అండజముగానీ, పిండజముగానీ, ఉద్భిజముగానీ కాదు.
అట్లే మొదట పుట్టిన మనిషికి తల్లితండ్రులు లేరు. వారు పిండము నుండి
పుట్టలేదు. అట్లే మొదట పుట్టిన పక్షికి తల్లితండ్రి పక్షులు లేరు. అది
అండము నుండి పుట్టలేదు. జీవులు సృష్ఠి తర్వాత మూడు రకములుగా
ఆత్మ చేత పుట్టింపబడుచున్నవి. సృష్ఠి పూర్వము ఆత్మ కూడా లేని రోజులలో
తొలి జీవరాశులన్నీ బ్రహ్మాండమునుండి వచ్చినవి. అండము, పిండము,
కానివి బ్రహ్మాండము నుండి పుట్టినవని చెప్పవచ్చును. సృష్ట్యాదిలో దేవుని
సృష్ఠి బ్రహ్మాండము ద్వారా జరిగినది. బ్రహ్మాండము అనగా పెద్ద గ్రుడ్డుయని
అర్థము. బ్రహ్మాండము నుండి (పెద్ద గ్రుడ్డునుండి) ఒక్కమారుగా జరుగుచున్న
ప్రపంచము, నిలబడిన ప్రపంచము, బాల్యము లేని ప్రపంచము పుట్టినది.
మొదట ఒక్కమారు అలా జరిగిన తర్వాత మనుషులనుండి మనిషి,
జంతువులనుండి జంతువు, పక్షులనుండి పక్షులు, చెట్లనుండి చెట్లు బీజము
వలన తయారగుచూ (పుట్టుచూ వచ్చినవి. తర్వాత నేడు ఎట్లున్నదో అట్లే
తయారవడము మొదలయినది. ఈ విషయమును ఇంతకంటే ఎక్కువ
చెప్పడము అవసరము లేదు. ఏకకణ జీవిలో ఆత్మ కణమంతా వ్యాపించి
యున్నది.
15) ప్రశ్న :- పిచ్చివానిలో ఆత్మ కూడా పిచ్చిదా? జీవుడే పిచ్చివాడా?
జవాబు :- పిచ్చివానిలో ఆత్మయుండుట వాస్తవమే. అట్లే ఒక మనిషిలో
యున్నట్లే మూడు ఆత్మలేకాక మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను
నాలుగు లోపలి భాగములుండుట సహజమే. అయితే పిచ్చివానిలో జీవుడు
పిచ్చివాడు కాదు, ఆత్మ పిచ్చిది కాదు. బుద్ధికి ఒక్కదానికే పిచ్చియుండును.
మిగతా మనస్సు, చిత్తము, అహము అన్నీ సక్రమముగానే యుండును.
బుద్ధి ఒక్కటి సరిగా లేకపోతే వానిని పిచ్చివాడని అంటాము. ఇప్పుడు
కూడా బుద్ధి సరిగా లేనివానిని, సక్రమముగా మాట్లాడక, ముందు వెనుకా
మాట్లాడు వానిని నీకేమయినా పిచ్చిపట్టిందా? అని అంటూయుంటాము.
దీనినిబట్టి పిచ్చి అనునది బుద్ధికి సంబంధించినదేయని తెలియుచున్నది.
16) ప్రశ్న :- కౄరమృగము గల పులిపిల్లను మనిషి సౌమ్యముగా పెంచితే
దాని కౄరత్వము నశించునా?
జవాబు :- పులి కౄరముగా యుండుట దాని స్వభావము. అయితే
పెంచిన వారికి బాగా అలవాటయివుండును. పులి అయినా 'తన' 'పర'యను
భేదము బాగా తెలిసియుండును. అందువలన పాలిచ్చే తల్లియొద్ద పులి
పిల్లలు ఆడుకుంటాయి. ఎందుకనగా! అది తన తల్లియని వాటికి బాగా
తెలుసు. అదే విధముగా పెంచిన వారిని కూడా గుర్తించి వారి ఎడల
స్నేహముగా ఉండును. అయినా 'కౄరత్వము వాటిలో లేదు' అని చెప్పుటకు
వీలులేదు. కుక్కను ఇంటిలో చిన్నప్పటినుండి సాకితే సాకినవారిమీద
పూర్తి ప్రేమను కనబరచును. అదే దొంగ కనిపిస్తే మొరుగును, వీలయితే
కరచును. అలాగే పులి కూడా అంతే. సాకిన వారిమీద ప్రేమను కనబరచినా,
మేక కనిపిస్తే దానిని ఏకముగా చంపును. సాకినవారు కూడా వాటికి
అనుగుణముగా మెలగుచుండవలెను. లేకపోతే తనవారి మీదికి కూడా
దాడి చేయుటకు వెనుకాడవు. వయస్సు వచ్చిన తర్వాత లైంగిక సంబంధ
వాంఛలు తీరకపోతే దాని బుద్ధిలో కొంత తేడాలు రాగలవు. అప్పుడు
'తన' 'పర' అను భేదమును మరచిపోవు అవకాశము గలదు. అప్పుడు
వాటిని ఏకాంతముగా యుండనివ్వడము మంచిది. ఎంతో సాధు
స్వభావముగా మెలగు ఏనుగు కొన్ని సందర్భములలో అసాధారణముగా
ప్రవర్తించును. అప్పుడు సాకినవారు దగ్గరకు పోయినా ఏమాత్రము
లెక్కించక వారిమీద కూడా దాడి చేయును. అందువలన కౄర జంతువులైనా
సాకిన వారివద్ద సాధువుగానే ప్రవర్తించుచుండును. అయినా వాటి ఆరోగ్య
పరిస్థితులనుబట్టి ఎప్పుడయినా అవి తమ కౄరత్వమును ప్రదర్శించవను
నమ్మకము లేదు. అందువలన కౄర జంతువులు అన్నివేళలా ఒకే విధముగా
ఉంటాయను నమ్మకము లేదు. అట్లని అవి అన్ని సందర్భములలో
కౄరముగా ఉంటాయని చెప్పడము కూడా సరికాదు. కౄర జంతువులు
తమను సాకిన వారిమీద ఎక్కువ ప్రేమగానే యుండునుగానీ వాటి
వయస్సునుబట్టి, ఆరోగ్యమునుబట్టి మారుటకు అవకాశముండుట వలన
కొంత జాగ్రత్తగా యుండుట మంచిది.
17) ప్రశ్న :- దేవుడు మొదట సృష్టించిన మానవులు ఏ వయస్సులో
ఉండేవారు? అప్పుడు కర్మలేని వారికి గుణచక్రములో మాయను సృష్ఠించి
వారిని మాయలో బంధించి ఆట ఆడడము దేవునికి భావ్యమా? "అడుసు
త్రొక్కనేల, కాలు కడగనేల” అనే సామెతలా వుంది.
జవాబు :- మొదట దేవుడు సృష్టించిన మానవులు ఒక బాల్య అవస్థ
విడిచి పెట్టి తర్వాత గల యవ్వన, కౌమర, వృద్ధాప్య అను మూడు దశలలో
సమానముగా యుండేవారు. మొదట వారికి కర్మలేనిది వాస్తవమే! దేవుడు
మనిషిని తయారుచేసినప్పుడే మనుషులకు సంబంధించిన అన్ని
విధానములను సృష్ఠించాడు. అప్పుడే కర్మ విధానము కూడా తయారైనది.
మొదట మనకి కర్మలేకున్నా జరిగెడి పనులలో తనకు సంబంధము లేదను
వారికి కర్మ అంటుకోకుండా ఉండు కర్మ సిద్ధాంతమును, అట్లే జరిగెడి
పనులతో తనకు సంబంధముంది అనుకోవడము వలన కర్మ అంటుకొను
నట్లు కర్మ సిద్ధాంతమును దేవుడు నిర్మించాడు. ఆ విధానము ప్రకారము
సర్వసాధారణముగా జరుగు పనులను మనిషి 'తానే చేశాను' అని
అనుకొనుట వలన మనిషికి కర్మ అంటుకోవడము జరుగుచున్నది. అలా
మొదలయిన కర్మను మనిషే తన నెత్తిన వేసుకొంటున్నాడుగానీ, దేవుడు
ఎవరికీ ఎటువంటి కర్మను అంటగట్ట లేదు. కర్మసిద్ధాంతమును నిర్మించిన
దేవుడు దానికి విరుగుడుగా జ్ఞానమును కూడా చెప్పాడు.
18) ప్రశ్న :- దేవుడుంటే అందరికీ వినిపించేటట్లు ఆకాశవాణి ద్వారా
“నేనున్నాను” అనే మాటను చెప్పవచ్చును కదా! అప్పుడు మాలాంటి
వారు కూడా నమ్ముతారు కదా! సర్వశక్తివంతమైన దేవుడు ఎందుకు అలా
చేయడు?
జవాబు :- దేవుడుండే మాట నిజమే. అయితే ఆయనకున్న ధర్మము
ప్రకారము ఆయన మనమనుకున్నట్లు తెలియబడకూడదు. దేవునికున్న
ప్రాథమిక ధర్మము రూప, నామ, క్రియలు లేనివాడు దేవుడు. ఈ ధర్మము
ప్రకారము దేవుడున్నా తెలియబడడు. దేవుడున్నాడని ఆయన తెలియకుండా
పోయినా దేవుడున్నాడని అనుకోవడము, మేము చూచామని చెప్పు
కోవడము, మేము దేవునితో మాట్లాడినామని చెప్పుకోవడము చూచి దేవుడే
నవ్వుచున్నాడు. నాస్తికవాదులు తమకు తెలిసో తెలియకో 'దేవుడు లేడు'
అని అనుచున్నారు. అయితే ఆస్తికవాదులు 'దేవుడున్నాడు' అని
చెప్పుచున్నారు. దేవుడున్నమాట వాస్తవమే అయినా ఆస్తికులు చెప్పినట్లు
దేవుడు లేడు. అట్లే 'దేవుడు లేడు' అని నాస్తికవాదులు చెప్పుచున్నా, వారు
అనుకున్నట్లు కూడా దేవుడు లేడు. నిజము చెప్పితే నాస్తికుల ప్రక్కలో
దేవుడున్నాడు. నాస్తికులలో కూడా దేవుడున్నాడు. అయినా దేవుడు లేనట్లే
యున్నాడు. దేవుడు లేడు అనినా ఆ మాట సరిపోతుంది. ఒక విధముగా
దేవుడు లేడు. అయితే దేవుడు లేకుండా యున్నాడు. అందువలన మేము
దేవున్ని గురించి ఒక ప్రత్యేకమయిన మాట చెప్పుచూ “దేవుడు అబద్దముగా
యున్నాడు” అని చెప్పాము. అందువలన నాస్తికులు గ్రుడ్డిగా దేవుడు
లేడు అనుటకంటే వివరము తెలిసి 'శాస్త్రబద్దముగా లేడు' అనడము మంచిది.
అలాగే ఆస్తికులు 'దేవుడు ఉన్నాడు' అనుటకంటే దేవుని నిజస్థితి తెలిసి
ఆయన ఎలా ఉన్నాడో శాస్త్రీయముగా చెప్పితే బాగుండును. శాస్త్రబద్దము
కాకుండా దేవుడున్నాడని ఆస్తికులు చెప్పకూడదు. అట్లే శాస్త్రాధారము
లేకుండా దేవుడు లేడని నాస్తికులు చెప్పకూడదు.
19) ప్రశ్న :- ఉప్పు నీటిని వేడెక్కించి దానిపైన మూత పెడితే మూత
తీసివేస్తే మూతకున్న నీటి ఆవిరి నీరుగా మారితే ఆ నీరు ఉప్పగా ఉండవు.
అదే విధముగా సూర్యుడు సముద్రములో యున్న ఉప్పు నీటిని తగిన
ఉష్ణోగ్రతలో అలా చేయడము వలననే, ఉప్పు నీరు వర్షము పడడము
లేదు అని మేమంటాము, మీరేమంటారు?
జవాబు :- సముద్ర జలమంతయూ ఉప్పుగా ఉండుట నిజమే. సగము
నీళ్ళు, సగము ఉప్పు ఉన్నంత సాంద్రతలో నీరు ఉప్పగాయున్నది. సముద్ర
జలము ఆవిరిగా మారి మేఘములుగా తయారై వర్షించుచున్నవని శాస్త్ర
పరిశోధకులు, శాస్త్రవేత్తలు చెప్పుచున్నారు. నీరు ఆవిరిగా మారి పైకి
పోవుట వలన నీటిలోని ఉప్పంతయూ సముద్రములో యుండిపోయి
ఆవిరి ద్వారా స్వచ్ఛమయిన నీరు పైకి మేఘములలో చేరిపోయి అవి
వర్షించునప్పుడు ఉప్పులేని స్వచ్ఛమయిన మంచి నీటిని వర్షించుచున్నవని
చెప్పుచుందురు. వారు చెప్పినట్లు మేఘములు మంచినీటిని వర్షించుట
వాస్తవమే. అయితే వారు చెప్పిన విధానమును మేము పూర్తి వ్యతిరేఖించి
నాము. నూరు సెంటిగ్రేడు డిగ్రీల వద్ద నీరు ఆవిరి కాగలదు. తక్కువ
ఉష్ణోగ్రతలో నీరు ఆవిరి కాదని చెప్పాము. వాతావరణములో ఎండల
కాలములో కూడా 40 నుండి 50 డిగ్రీల వరకు వేడి రావడము
జరుగుచున్నదిగానీ, నూరు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కడా రావడము లేదు.
అటువంటప్పుడు సముద్రపు నీరు ఆవిరిగా మారి మేఘములగునని
చెప్పడము పూర్తి వ్యతిరేఖము.
మేఘముల విషయమై ఇంతవరకు ఎవరూ లోతుగా ఆలోచించ
లేదని, అందువలన సముద్రము నీరు ఆవిరై మేఘములలో చేరుచున్నదని
కొందరు చెప్పగా అందరూ విన్నారని, అది తప్పా ఒప్పా అని ఆలోచించక
పోవడము వలన నీరు ఆవిరై పైకి చేరుచున్నదని పూర్తిగా నమ్మారు. మేము
ఆ విషయమును "దయ్యాల-భూతాల యదార్థ సంఘటనలు" అను
గ్రంథములో పూర్తిగా వ్యతిరేఖించి నూరు డిగ్రీల ఉష్ణోగ్రత లేనిది నీరెట్లు
ఆవిరైతున్నదని అడిగాము. అంతటితో ఆగక మేఘము సముద్ర నీటిని
నేరుగా తీసుకొంటున్నదని, ఒక్కొక్కప్పుడు సముద్ర నీటిని తీసుకొనునప్పుడు
నీటితోపాటు చేపలను కూడా తీసుకొంటున్నదని, మేఘము సముద్రములో
నీటిని టోర్నడోల రూపములో సముద్రమునుండి నీరును గ్రహించుచున్నదని
చెప్పాము. టోర్నడోలు అనగా మేఘములలో పుట్టు సుడిగాలి వలన
ఏర్పడునవని చెప్పాము. అలా సుడిగాలి మేఘముల వలన సముద్రపు
నీటిని గ్రహించిన మేఘములు అదే నీటినే భూమిమీద వర్షించుచున్నవని
కూడా చెప్పాము. ఈ విషయము అందరికీ తెలిసినా, తెలియకపోయినా
ఇప్పటికీ ఎప్పటికీ జరుగుచున్న సత్యము. ఎప్పుడయినా అరుదుగా
భూమిమీద చెరువులలో నీటిని కూడా మేఘము పీల్చుకొని చెరువును ఖాళీ
చేయుచున్నది. మేము చెప్పిన విధానము సముద్రము మీద జరుగుచున్నదని
చెప్పినది సత్యమని అందరికీ తెలియుటకు అప్పుడప్పుడు భూమిమీద
చెరువులలోని నీటిని మేఘము మనుషులు చూస్తున్నట్లే పైకి లాగుకొనడము,
చెరువు ఖాళీ అయిపోవడమును ప్రత్యక్షముగా చూచిన వారు కలరు.
సృష్ట్యాదినుండి ఇదే విధానము కొనసాగుతున్నా మనుషులు దానిని
ఇంతవరకు తెలియక నీరు ఆవిరై మేఘములలో చేరి, తర్వాత భూమిమీద
వర్షముగా పడుచున్నదని తెలియక పోయినది. ప్రస్తుతము ఆ విషయమును
మేము గ్రంథములో వివరముగా వ్రాశాము. వర్షము ఒక్కటే కాక
మేఘములు చేయు కార్యములన్నిటినీ పూసగ్రుచ్చినట్లు చెప్పాము.
అయితే ఇప్పుడు వర్షపు నీటిలో ఉప్పులేదే, సముద్ర నీరును
మేఘము నేరుగా తీసుకొన్నప్పుడు సముద్రపు నీటిలో ఉప్పు ఉండవలెనని,
అలా లేకపోవడము వలన నీరు ఆవిరై మేఘములలో చేరునను మాట
సత్యముగా కనిపించుచున్నది. మీరు చెప్పేమాట అసత్యముగా కనిపించు
చున్నదని పై ప్రశ్నను అడగడము జరిగినది. మేఘములను గురించి
అనేక విషయములను చెప్పిన నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు
జవాబును చెప్పవలసియున్నది. జవాబు చెప్పడము నా బాధ్యత.
మేఘము సముద్రపు నీటిని నేరుగా పైకి తీసుకొనుట వలన
సముద్రములోని ఉప్పునీరు మేఘములలో చేరిపోవుచున్నది. ఎండ
కాలములోనే కాకుండా ఎప్పుడు అవసరమనిపిస్తే అప్పుడు మేఘములు
సముద్రపు నీటిని తీసుకొనేవి. ఉప్పు నీరును తీసుకొన్న మేఘము
ఆకాశములో అదృశ్యమై పోవును. 20 ఎకరముల విస్తీర్ణము గల ఒక
మేఘము సముద్రపు నీటిని నింపుకొన్న తర్వాత అదే రోజుగానీ, రెండవ
రోజుగానీ దృశ్యరూపముగాయున్న మేఘము అదృశ్య రూపముగా
మారిపోవుచున్నది. కరిగి కనిపించకుండా పోయిన మేఘము తర్వాత
కొంత కాలమునకు ప్రపంచములో ఎక్కడో ఒకచోట కనిపించును. కొన్ని
గంటలుగానీ, కొన్ని దినములుగానీ, కొన్ని నెలలుగానీ కనిపించకుండా
పోయిన మేఘము తిరిగి కనిపించును. కొన్ని గంటలుగానీ, కొన్ని దినములు
గానీ కనిపించకుండాయున్న మేఘము తిరిగి కనిపించే వరకు ఎక్కడున్నది?
ఏమి చేయుచున్నది? అను ప్రశ్నలు రాగలవు. ఈ విషయమంతా
తెలియుటకు మేఘములను గురించి ఇంకా కొంత తెలియవలసి యున్నది.
ఆకాశము ఒక భూతము (ఒక జీవుడు). ఆకాశము అదృశ్య
రూపములో శూన్యముగా యుండినా తన కర్మేంద్రియములయిన చేతులను
అప్పుడప్పుడు కనిపించునట్లు చేయుచుండును. ఆకాశము యొక్క చేతులే
మేఘములుగా ఆకాశములో కనిపించుచుండును. ఆకాశములో
మేఘములుగా కనిపించు ఆకాశ చేతులు కొంతసేపు కనిపించి తర్వాత
కనిపించకుండా పోవుచుండును. ఆకాశమంతా ఒకే మేఘముగా ఎప్పుడూ
కనిపించదు. ఆకాశమునకు కొన్ని కోట్ల చేతులుండును. ఆ చేతులు
మాత్రమే కనిపించుట వలన కొంత ఆకాశము ఖాళీగాయుండి, కొంత
ఆకాశము మేఘముగా యుండును. కొన్ని చేతులను కలిపి ఒక చోట
పెట్టితే అదే పొగమేఘము (క్యుములో నింబస్ మేఘము) అగును. కొన్ని
చేతులు కలిపి తిప్పితే సుడిమేఘము (టోర్నడో) యగును. రెండు చేతుల
ఆకారమే దాదాపు 20 ఎకరముల విస్తీర్ణము వరకు వ్యాపించుకోగలదు.
ఆకాశము యొక్క చేతుల బలము ఎవరి అంచనాకు రాదు. దాని బలము
ఎవరికీ తెలియదు. ఆకాశములో కల్గు వాతావరణ మార్పులను, తుఫానులు,
సునామీలను మేఘములే కల్పించుచుండును. రెండు చేతుల మేఘము
ఎంత ఉపద్రవమునయినా కల్గించగలదు. కొన్ని వేల చేతులు కలిస్తే
ఎంతటి పనినైనా చేయగలవు. ఎంతటి వినాశనమునయినా సృష్టించగలవు.
ఆకాశములో కొన్ని లక్షల చేపలను ఉంచుకొని కొన్నిరోజులు పోషించి
తర్వాత ఒక్క చేప కూడా క్రిందపడి చనిపోకుండా బ్రతికిన చేపలను చిన్న
దెబ్బ తగులకుండా తమ చేతులతో భూమిమీద విడువగలవు. చేపలు
ఆకాశమునుండి వర్షములో క్రిందపడినట్లే కనిపించినా ఆకాశ చేతులు
భూమికి అడుగు ఎత్తులో వదలుచున్నవి. అట్లే వడగండ్ల వాన కురిసినప్పుడు
చిన్నచిన్న ఐసుక్కలను పైనుండి అయినా విసరగలవు. క్రిందనుండయినా
విడువగలవు. కొన్నిచోట్ల పై నుండి వేగముగా విసిరిన వడగండ్ల చేత
పచ్చి అరటి కాయల గెలలకు రంధ్రాలు పడియుండడము కూడా చూచి
యున్నాము. మేఘములు అనుకొంటే ఏమయినా చేయగలవు. గతములో
మేఘముల గురించి కొంతవరకు వ్రాసియుంచాము.
సముద్రపు నీరును గ్రహించిన మేఘము ఒక దినమునుండి కొన్ని
నెలల వరకైనా తనయందే నీరును కనిపించకుండా అదృశ్యరూపములో
పెట్టుకోగలవు. ఎప్పుడు అవసరమైతే, ఎక్కడ అవసరమైతే అక్కడ తనయందు
గల నీరును వర్షరూపములో వదలును. సముద్రమునుండి తీసుకొన్నప్పుడు
మేఘము ఉప్పునీరును తీసుకొనియుండును. ఉప్పునీరు తీసుకొన్న మేఘము
పూర్తి అదృశ్యమైపోవును. అదృశ్యరూపములోయున్న మేఘము తనయందు
గల నీటిలోనున్న ఉప్పును నీటి నుండి విడదీయుచున్నది. నీటియందు
గల ఉప్పును నీటినుండి విడదీసి బయటికి వచ్చిన ఉప్పును అదృశ్య
రూపములోనే తిరిగి సముద్రములో వదలి వేయుచున్నది. ఈ విధముగా
సముద్రముండి వచ్చిన ఉప్పు తిరిగి సముద్రములో కలిసిపోవు చున్నది.
ఉప్పునుండి విడిపోయిన మంచినీరును మేఘము వర్షించుచున్నది. మొదట
సముద్రమునుండి వచ్చిన ఉప్పునీరు మేఘములలో అదృశ్యముగా నీటినుండి
విడదీయబడి ఉప్పు సముద్రములో విడువబడగా నీరు భూమి మీద
వర్షముగా వర్షించుచున్నది. ఈ విధముగా మేఘములు పని చేయుచుండగా
భూమిమీద మంచి నీరు వర్షింపబడుచున్నది.
20) ప్రశ్న :- భూమి అనేది ఒక జీవుడు (ఒక భూతము) అని అంటున్నారు
కదా! మరి మనుషుల, జంతువుల మలమూత్రములను భరించుటకు దాని
కర్మయని అనుకుందామా?
జవాబు :- మలమూత్రములు మనుషులకు అసహ్యముగా యుండినా
పందులకు ఆనందముగా ఉండుట తెలిసిన విషయమే. అలాగే నీకు
అసహ్యముగాయున్న మలమూత్రములు భూమికి కూడా అసహ్యముగా
ఉండునని ఎందుకనుకోవాలి? భూమికి మనుషుల, జంతువుల మల
మూత్రములు ఎరువులుగా ఉపయోగపడుచున్నవి. ఎరువులు వేయబడిన
భూమి బలమైనదని అనడము వినియేయుందుము. మలమూత్రముల
ఎరువులు భూమికి మంచి బలమైన పోషక పదార్థములుగా యుండి అనగా
ఆహార పదార్థములుగాయుండి, అందులోని పోషకముల వలన నేల
బలమైనదని అనిపించుకొంటున్నదంటే భూమికి మలమూత్రములు సరిపోని
పదార్థములుగా ఎందుకు అనుకోవాలి? భూమికి సరిపోవు మంచి
ఆహారములని ఎందుకు అనుకోకూడదు? నీకు సరిపోనంతమాత్రమున
భూమికి సరిపోదు అని ఎందుకు అనుకోవాలి? మనకు రోతగాయున్న
పదార్థములు ఇతర జంతువులకు ఆనందముగా యున్నట్లు, మనకు
అసహ్యముగా యుండునవి భూమికి బలమైన పోషక పదార్థములుగా
యున్నవని తలచవలెను.
21) ప్రశ్న :- భూమి తిరుగుటకు సెంట్రిఫ్యూగల్, సెంట్రిఫెటల్ ఫోర్సు
కారణమని మా సైన్సు చెప్పుతున్నది. మీరేమో భూమి ఒక భూతము అది
ఆత్మ ద్వారా తిరుగుచున్నదని చెప్పుచున్నారు? దీనికి మీరేమంటారు?
జవాబు :- భూమి అను జీవుడు ఆకాశమను జీవుడులో ఒకడుగా యున్నాడు.
పొట్టలో పురుగుండగా అది మనిషిలో ఉండునదే అయినా పొట్టలోని
పురుగువేరు, పొట్టగల మనిషి వేరుగా యున్నారు. అట్లే ఆకాశము విశాల
మైనది, ఆకాశములో భూమి తిరుగుచున్నది. ఆకాశములోని ఆత్మ బయట
సైన్సుకు కనిపించునట్లు సెంట్రి ఫ్యూగల్, సెంట్రిపెటల్ ఫోర్సులను సృష్టించి
భూమిని త్రిప్పుచున్నది. ఆకాశములోని ఆత్మచేత తయారయిన రెండు
ఫోర్సుల చేత భూమి తిరుగుచున్నది. భూమి శరీరములోని ఆత్మ త్రిప్పలేదు.
ఆకాశ ఆత్మ చేత భూమి త్రిప్పబడుచున్నది. భూమిలోనూ ఆత్మయున్నది,
ఆకాశములోనూ ఆత్మయున్నది. ఏ ఆత్మ చేత భూమి తిరుగుచున్నదని
చాలామందికి తెలియదు. బయటి ఆత్మ ఫోర్సుచేత భూమి త్రిప్పబడు
చున్నదిగానీ భూమి తనకు తానుగా తిరగలేదు.
22) ప్రశ్న :- దేవుడు అనేవాడు అణువణువునా ఉండినట్లు, దేవుడు లేని
స్థలము సూదిమొన మోపినంత కూడా ఎక్కడా లేదని మీరు చెప్పుచున్నారు.
అట్లయితే మలమూత్రములలో కూడా దేవుడున్నాడా? మీ సూత్రము
ప్రకారమయితే మలములో కూడా దేవుడున్నాడు అని మీరనవచ్చును. దాని
ద్వారా, మీరట్లు చెప్పుట ద్వారా మీ దేవున్ని అపవిత్ర వస్తువులలో
ఉన్నట్లుగా చెప్పి, మీరే మీ దేవున్ని అవమానించినట్లు కాదా!
జవాబు :- మనిషికి పవిత్రత, అపవిత్రతయుండును. అట్లే శుద్దము,
అశుద్దము యుండును. ఇవే వస్తువులు దేవునికి అన్నీ సమానముగానే
యుండును. ఒకటి మంచిదనిగానీ, మరొకటి చెడుదనిగానీ ఏమీ
యుండదు. దేవుని ఎడల అన్నీ సమానముగా యుండును. మనిషి తన
పట్ల పవిత్రత అపవిత్రత అనుకొన్నట్లు దేవుని పట్ల అనుకోకూడదు. అగ్ని
కణములో, బంగారు అణువులో, ధూళికణములో, మనిషి శరీర కణములో,
పాలయందు, పేడయందు దేవునికి సమ భావముండును. మనిషికున్న
భావము ప్రకారము దేవుని భావముండదు.
23) ప్రశ్న :- తిన్న ఆహారము మొత్తము జీర్ణమై, పోషణ జరిగి శక్తిగా
మారవచ్చును కదా! ఆత్మగా ఉన్నదేదో మానవశరీరములో అశుద్దాన్ని
ఎందుకు తయారు చేయాలి? ఆ వ్యవస్థను ఆపివేయవచ్చును కదా?
జవాబు :- కట్టెను కాలిస్తే అది కాలిపోయి చివరకు బొగ్గు బూడిద మిగిలి
పోవును. అట్లే శరీరములో జఠరాగ్ని వలన కాలిపోవు ఆహారమునకు
కూడా బొగ్గు బూడిదలాంటి కలుషితము ఏర్పడును. ఏ వస్తువైనా ఇంతకు
ముందు ఇది ఉంది అనుటకు ఆనవాళ్ళుగా వాటి అవశేషము మిగులును.
యజ్ఞము చేస్తే యజ్ఞ భస్మము మిగులును. శవమును కాల్చితే చితాభస్మము
మిగులును. యజ్ఞ భస్మమును ల్యాబ్లో పరీక్షిస్తే అందులో కలిసిన
కణములను బట్టి యజ్ఞ భస్మమని చెప్పవచ్చును. అలాగే చితా భస్మమును
పరీక్షించి ఇది చితాభస్మమని చెప్పవచ్చును. ఆహారము జీర్ణమైన తర్వాత
మలమును పరీక్షించి ఆహారములో విషము కలిసియున్నదని చెప్పవచ్చును.
తినిన ఆహారము గుర్తింపునకు వాటి అవశేషములను చూచి ఇది ఫలానా
ఆహారమని గుర్తించవచ్చును. అలాగే ఒక మనిషి భూమిమీద పుట్టి
చనిపోయినా, వాని గుర్తింపుగా వాని మంచి చెడులు మిగిలి ఉంటా
యనుటకు గుర్తుగా, ఆహార జీర్ణ శేషమును దేవుడు మిగిల్చి చూపాడు.
24) ప్రశ్న :- ఒకసారి ఎవరితోనయినా మాట్లాడిన మాటలు ఇంతకుముందు
ఎప్పుడో, ఎక్కడో ఇలాంటి సందర్భము వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ అది
ఎప్పుడూ జరుగలేదు. అట్లు ఎందుకు అనిపించింది?
జవాబు :- ఆ భావము కొందరిలో అరుదుగా రావడము జరుగుచుండును.
అయితే అది ఎప్పుడూ జరుగలేదని తెలిసినా, అది ఈ జన్మలో జరిగినది
కాదు. వెనుకటి జన్మలలో అదే మనిషితో నీవు మాట్లాడిన సందర్భము
జరిగియుండును. కనుక ఆ విధముగా అనిపిస్తుంది.
25) ప్రశ్న :- పాముకు శ్రవణేంద్రియములు కళ్ళలో ఉన్నవన్నారు. అన్ని
పాములలోనా? కొన్ని పాములకేనా? మరి మిగతా పాములు ఎలా
వినగలవు? కళ్ళే శ్రవణేంద్రియములుగా (చెవులుగా) యున్న ఇంకా కొన్ని
జీవులు కలవా?
జవాబు :- పాముల విషయము బాహ్య విషయమగును. అందువలన
వాటి విషయము నాకు పూర్తిగా తెలియదు. అయితే నాకు తెలిసినంత
వరకు, నేను విన్నంతవరకు విషపాములకు చెవులు లేవని విన్నాను.
“కళ్ళలోనే వినికిడి శబ్దముండుట వలన శబ్దము వినిపించినప్పుడు పాముకు
కళ్ళు కనిపించవు” అని విన్నాము. అందువలన విషముగల నాగుపామును
ఆడించువారు బుర్రను ఊపుచూ, శబ్దము చేయుచూ దానికి కళ్ళు కనిపించ
కుండా చేసి పాములను పట్టుచుందురు. అట్లే వాటిని ఆడించుచుందురు.
శబ్దమునుబట్టి పాము తల త్రిప్పుచుండును. అది ఒక ఆటగా పాముల
వాళ్ళు బుర్రను ఊదుచూ చూపుచుందురు. పాముకు కళ్ళలోనే వినికిడి
యుండుట వలన కీటకములు శబ్దము చేయుచూ పాములను ప్రస్తుతము
గ్రుడ్డివిగా యుండునట్లు చేసి తప్పించుకొనగలవు. అందువలన కొన్ని
కీటకములకు, పక్షులకు శబ్దము ఎక్కువ చేయునట్లు వాటి కంఠములు
తయారయినవి. "పిట్టకొంచెము కూత ఘనము” అని పెద్దలు చెప్పునది
సత్యమే. పాములనుండి తప్పించుకొనుటకే పక్షుల కూతను ఘనముగా
ఉండునట్లు దేవుడు చేశాడు. కొన్ని పెద్ద పాములయిన అనకొండ, కొండ
శిలువ పాములకు చెవులు వేరుగాయుండునని విన్నాము. అందువలన
అవి ఎంత శబ్దములో అయినా చూడగలవు. మిగతా అన్ని జీవులకు ఐదు
కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు సమానముగా యున్నవి.
26) ప్రశ్న :- పుణ్యక్షేత్రములకు వెళుతున్నవారు రోడ్డు ప్రమాదములలో,
మిగతా ప్రమాదములలో చనిపోవుచున్నారు కదా! మరి వారిని దేవుడు
ఎందుకు రక్షించలేదు?
జవాబు : పుణ్యక్షేత్రాలకు పోయేవారు అందరూ కాక కొందరు
ప్రమాదముల పాలగుట వాస్తవమే. పుణ్యక్షేత్రాలకు పోయినప్పుడు దానికి
తగిన పుణ్యము లేకపోవడము వలన, పాపము వంతుకు వచ్చిన దానివలన
మనుషులకు ప్రమాదము జరుగుచున్నది. దేవుడు ఎప్పుడుగానీ, ఎక్కడగానీ
రక్షించువాడు కాదు, అట్లే శిక్షించువాడు కాదు. మనుషులు చేసుకొన్న
పాపపుణ్యముల వలన ప్రమాదములు జరుగుచుండును. దేవుడు సాక్షిగా
చూచేవాడే గానీ ఏమీ చేయువాడు కాడు. ప్రపంచ పనులతో దేవునికి
సంబంధము లేదు. అందువలన మనిషియొక్క సుఖదుఃఖములను దేవుడు
విధించువాడు కాదు. కర్మనుబట్టి ఆత్మే అన్నీ చేయుచుండును, జీవాత్మ
అనుభవించుచుండును.
27) ప్రశ్న :- దేవుడు అనేది విశ్వాసమా? మూఢనమ్మకమా?
జవాబు :- దేవుడనేది విశ్వాసము మాత్రమే. దేవున్ని చూచానని చెప్పడము
మూఢనమ్మకమగును. దేవుడు కనపడుతాడనీ, మాట్లాడుతాడని
అనుకోవడము మూఢనమ్మకము.
28) ప్రశ్న :- భగవద్గీత నాదే సరైన భావము గలది యంటున్నారు.
మీరు సంస్కృత పండితులా?
జవాబు :- భగవద్గీతను జీవుడుగా యున్న నేను వ్రాయలేదు. నేను
మౌనముగా ఉండగా వ్రాసేవాడే వ్రాశాడు. ఆయన పండితులను మించిన
పండితుడు. అందువలన మా ద్వారా వచ్చిన భగవద్గీత ప్రత్యేకముగా
కనిపించుచున్నది. మేము చెప్పినా చెప్పకపోయినా మా త్రైత సిద్ధాంత
భగవద్గీత అందరికీ గొప్పగనే కనిపించుచున్నది.
29) ప్రశ్న :- బొద్దింకకు తల తీసివేసినా పది రోజులు దాని శరీరము
పని చేస్తుంటుంది. అన్ని రోజులు ఆత్మస్థానమైన దాని తల లేకుండా
ఎట్లు బ్రతుకగలదు?
జవాబు :- బొద్దింక తలపోయినా బ్రతుకుట వాస్తవమే! అయితే ఆత్మ
శాశ్వత స్థానము తలయని అనుకోకూడదు. ఏడు నాడీకేంద్రములలో
తల స్వస్థానమని చెప్పినా ఆత్మ తన స్థానమును మిగతా ఆరు స్థానములలో
ఏ స్థానములోనికయినా మార్చుకోవచ్చును. ఒక బొద్దింక శరీరములోనే
అలా ఆత్మ మార్చుకోవడము వలన బొద్దింకే మనకు కనిపిస్తున్నది. ఈ
మధ్య దాదాపు సంవత్సరము క్రితము ఒక కోడికి తల కోసివేస్తే అది
మొండెముతోనే బ్రతికి యున్నట్లు న్యూస్పేపరులో బొమ్మతో సహా వార్త
వచ్చింది. అక్కడ కోడి శరీరములో కూడా ఆత్మ తలను వదలి మిగతా
6వ స్థానములోనికి తన స్థానమును మార్చుకొన్నట్లే కదా! ఇంకా లోతుగా
విషయమును తెలియగలిగితే ఆత్మకు శరీరములో స్వంత స్థానము అంటూ
ఏదీ లేదనీ, ఉన్నది జీవాత్మకేనని తెలియుచున్నది. జీవునితోపాటు ఆత్మ
కదలి పోవలసియుండుట వలన ఆత్మ కూడా జీవాత్మవలె ఏడవ స్థానములోనే
యున్నదని అనుకోవడము జరుగుచున్నది. అంతేగానీ ఆత్మకు స్వంత
స్థానము ఎక్కడా లేదు. జీవుడు పుట్టినప్పటినుండి ఆత్మ శరీరమంతా
వ్యాపించియున్నది. ఆత్మకు ఏడు నాడీస్థానములు కలవు. లెక్కాచారమునకు
పై నాడీకేంద్రమునుండి ఆత్మ శరీరములో శ్వాసను ఆడించు పనిని చేయడము
వలన మొదటి స్థానమును ఆత్మ స్వంత స్థానమన్నారుగానీ పై స్థానమే
స్వంత స్థానము అనుటకు గట్టి ఆధారము ఏమీ లేదు. జీవునికి పొరుగు
వాడని ఆత్మను చెప్పుట వలన కూడా జీవుడున్నచోటే ఆత్మయుండునను
ఉద్దేశ్యముతో అందరూ ఆత్మ స్థానము పైన అని అంటున్నారు తప్ప ఇంకేమీ
కాదు. ఆత్మకు ఒక స్థానమంటూ లేదు.
30) ప్రశ్న :- కోమాలో యున్న వ్యక్తి ఎవరినీ గుర్తుపట్టలేడు. అలా గుర్తు
పట్టకపోవడమునకు కారణము ఏమి? అతనిలో ఆత్మ దేనియందు ప్రసారము
కాలేదు?
జవాబు :- కోమాలోయున్న వ్యక్తికి ఆత్మ అన్ని విధముల సక్రమముగానే
యుంది. శరీరమంతా సక్రమముగానే వ్యాపించియున్నది. అయితే బుద్ధి
ఒక్కటి పని చేయలేని స్థితిలోయుండుట వలన బయటి విషయములను
ఇంద్రియములు తెలుపుచున్నా బుద్ధి గ్రహించుకొనే స్థితిలోయుండదు. ఆత్మే
అదేపనిగా బుద్ధిని పనిచేయనివ్వదు. శరీరములో అన్ని భాగములను
నడిపించునది ఆత్మే. ఆత్మ బుద్ధిని నడిపించని దానివలన మనిషి బయటి
స్థితిని గ్రహించుకోలేడు. అట్లే లోపలి స్థితిని కూడా బుద్ధి తెలుపదు.
శరీరములో బుద్ధి పని చేయని దానివలన మనిషి కోమాలో యుంటున్నాడు.
31) ప్రశ్న :- మనిషి చనిపోతే కాలమరణమా? అకాలమరణమా అని
తెలుసు కొనుట ఎట్లు?
జవాబు :- మనిషి చనిపోయినప్పుడు అవసానదశ ఏర్పడి చనిపోయివుంటే
కాలమరణమగును. అవసానదశ ఏర్పడక అకస్మాత్తుగా చనిపోయిన వాడు
అకాలమరణమును పొందినట్లేగా లెక్కించవలెను.
32) ప్రశ్న :- ప్రబోధాశ్రమములో గల శిష్యగణము ఎందరు గలరు?
జవాబు :- కనిపించేవారు దాదాపు రెండువందలమంది నివాసముంటు
న్నారు. కనిపించని వారు దాదాపు ఐదువందల మంది ఉంటారు. పౌర్ణమి,
అమావాస్య రోజులలో అయితే కనిపించనివారు కొన్ని వేలమంది
యుంటారు, కనిపించేవారు కొన్ని వేలమంది వస్తారు.
33) ప్రశ్న :- శ్రీకృష్ణుడినే జగద్గురువు అంటున్నారు. అట్లే పీఠాధిపతులను
కూడా జగద్గురువు అని అంటున్నారు. దీని ప్రకారము జగద్గురువులు
ఎందరైనా ఉండవచ్చునా?
జవాబు :- ప్రపంచములో జగద్గురువు ఒక్కడే ఉండును. వాడే భగవంతుడు.
ప్రపంచమునకంతటికీ వర్తించు బోధను చెప్పువాడు జగద్గురువు. అనగా
ప్రతి జీవరాసికి వర్తించు బోధను చెప్పువాడు జగద్గురువు. శిష్యుల
సంఖ్యనుబట్టి జగద్గురువు అని చెప్పుటకు వీలులేదు. భగవంతునికి
శిష్యులుండరు అయినా ఆయన జగద్గురువే. చెప్పే బోధనుబట్టి జగద్గురువు
అని చెప్పవచ్చునుగానీ, వినే శిష్యుల సంఖ్యనుబట్టి జగద్గురువు అని
అనకూడదు. శంకరాచార్యుల వారికి శిష్యుల సంఖ్య ఎక్కువ యున్నదని
జగద్గురు శంకరాచార్య అని అన్నారు. అలా చెప్పడము తప్పు. అన్ని
మతములకు వర్తించు బోధను, అన్ని జీవరాసులకు వర్తించు బోధను
చెప్పువానినే జగద్గురువు అని అనాలి. ఒక మతమునకు చెప్పిన బోధ
ఇతర మతములకు వర్తించడము లేదు. అటువంటప్పుడు ఒక మత
గురువును జగద్గురువు అని చెప్పకూడదు.
34) ప్రశ్న :- సృష్ఠిలో ఇంత విచ్ఛిన్నత ఎందుకున్నట్లు?
జవాబు :- కర్మనుబట్టే మనుషులలో విచ్ఛిన్నత ఏర్పడినది. కర్మనుబట్టి
మనుషుల మధ్యలో ద్వేషములు ఏర్పడినవి. మనుషులలో ఎన్ని
విచ్ఛిన్నతలున్నా అవన్నియూ కర్మనుబట్టి ఏర్పడినవేయని తెలియవలెను.
35) ప్రశ్న :- సూక్ష్మశరీరముతో యున్న జీవుడు బ్రతికియున్న వారి
శరీరములో చేరినప్పుడు, శరీరములో ఏదో ఒకచోట ఉండును. ఒకప్పుడు
కడుపులో యున్నది మరొకప్పుడు తలలోనికి, తర్వాత కాలిలోనికి, ఆ తర్వాత
భుజము లోనికి ప్రాకుచుండును. ఆ విధముగా శరీరమంతా ఎక్కడబడితే
అక్కడ ఉండుట సాధ్యమగునా? సూక్ష్మశరీరమునకు గుణచక్రమువుంటే
వారు బ్రతికున్న వారి శరీరములో తలలోనే ఉండాలి కదా! గుణచక్రము
అందులో జీవుడు సూక్ష్మముగా యున్న తల ఇతరుల శరీర భాగములలో
ఎలా ఉండగలుగుచున్నది?
జవాబు :- సూక్ష్మశరీరముతో జీవుడు బ్రతికియున్న వారి శరీరములో
ఎక్కడయినా ఉండవచ్చును. ఒక్కచోటే అయినా ఉండవచ్చును. ఇతర
శరీర భాగములలోనికి కూడా మారవచ్చును. తలలో పాల భాగములో
చేరితే సూక్ష్మశరీరము బ్రతికియున్న వానిని నిద్రమత్తులోనికి పంపించి,
నిద్రలోనికి పోవునట్లు చేసి శరీరములో పైకి వచ్చి మాట్లాడును. శరీరములో
పైకి వచ్చి మాట్లాడలేదు అంటే శరీరములో ఏదో ఒకచోట శరీరములో
ఉంటుందని తెలియవలెను. పూర్తి పైకి వచ్చి మాట్లాడవలెనంటే శరీరములో
ఇతర భాగములయందుండు సూక్ష్మశరీరము తల మధ్య భాగములో
సమానముగా వచ్చి మాట్లాడును.
36) ప్రశ్న :- హద్దులు మీరుచున్న నాగరికత, అశ్లీల నృత్యాలు, వేశ్య
వాటికలు, మితిమీరిన వ్యభిచారము, పాశ్చాత్య నాగరికత ఎంతో
వెగటుగాయుంది. తన సృష్ఠి ఇలా మారినందుకు దేవునికి ఎదురు దెబ్బ
తగిలినట్లుగా మేము భావిస్తున్నాము. దేవుడుంటే ఈ సృష్టిని ఎందుకు
చేశానురా!యని తలపట్టు కొని బాధపడుతాడని అనుకోవచ్చునా?
జవాబు :- 'తన సృష్ఠి ఇలా మారినందుకు' అని మీరు అన్నారు. ఇక్కడ
మనము తెలియవలసినది ఏమనగా! దేవునికి తెలియకుండా ఏదీ
స్వయముగా మారుటకుగానీ, తయారగుటకుగానీ వీలులేదు. అన్నీ దేవునికి
తెలిసే జరుగుచుండును. దేవుని సంకల్పముతోనే ఆత్మ చేయించగా
అందరూ అన్ని పనులు చేయుచున్నారు. తాను చేసిన సృష్ఠిని తానే
నడుపుచున్నాడు కావున దేవునికి ఎదురుదెబ్బ, బయట దెబ్బ తగుల
లేదు. మనుషులు వారివారి కర్మలను అనుభవించుటకు దేవుడే ఆత్మచేత
సమాజమును ఇలా మార్చాడు అని అనుకోవడము మంచిది. జరిగినది
కూడా అంతే!
37) ప్రశ్న :- “సూక్ష్మములు (దయ్యాలు) స్థూలమైన వాటిని గ్రహించి
వాటి పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి” అని మీరు అంటున్నారు. అంటే
దయ్యాలలో కూడా కొన్ని రకముల స్థోమతలు గల దయ్యాలున్నాయా?
జవాబు :- సూక్ష్మశరీరములు అనగా దయ్యాలు ఒక్కటే కాదు. అనేక
దేవతలు కూడా సూక్ష్మముగానే యున్నారు. మనుషులను, దేవతలను దేవుడు
సృష్ఠించాడు. మనుషులు శరీరమును వదలి అకాలమృత్యువు చెందితే
దయ్యాలుగా మారుదురు. తిరిగి వారి ఆయుష్షు అయిపోవు వరకు,
వారికి కాలమరణము వచ్చు వరకు దయ్యాలుగా (సూక్ష్మ శరీరములతో)
యుండవలసిందే. ఇక దేవతల విషయమునకు వస్తే దేవతలు పుట్టినప్పటి
నుండి సూక్ష్మముగానే బయట తిరుగుచున్నారు. వారు గుడిలో ప్రతిమ
యందున్నప్పుడు మాత్రము స్థూలముగా యున్నట్లు, ప్రతిమను వదలి
బయటకి వచ్చి తిరుగునప్పుడు సూక్ష్మముగాయున్నట్లు తెలియవలెను.
ప్రతిమలో ఉండడము ఒక గంట, రెండు గంటలుండగా మిగతా కాల
మంతా బయట తిరుగుటకే దేవతలు ఇష్టపడుచుందురు. కొందరు దేవతలు
రెండు మూడు నెలలకొకమారు గుడికిపోయి అక్కడ ఒక దినముండి
తిరిగి బయటకివచ్చి తిరుగువారు కలరు. దేవతలలో అనేక తరగతుల
శక్తిగలవారు గలరు. దయ్యాలలో జ్ఞానులు, అజ్ఞానులు రెండు రకముల
వారు గలరు. దేవతలలో కూడా జ్ఞానులున్నారు, అజ్ఞానులున్నారు.
దేవతలలో కొందరు స్థూలమును గ్రహించి వాటిని వేరే జాగాలోనికి చేర్చును.
అప్పుడు ముందున్న చోట ఆ వస్తువు లేకుండా పోవును. అదే విధముగా
వస్తువులనేకాక దాన్యమును కూడా తీసుకుపోవు అవకాశముండుట వలన
అటువంటి దేవతలకు ముందే విందు పెట్టినట్లు 'పొలి' అను పేరుతో
వారికి చేయు ప్రక్రియ కూడా కలదు. అదే దయ్యాలలో అయితే స్థూలమును
గ్రహించు స్థోమత అందరికీ యుండదు. ఎక్కడో ఒక్కరికి మాత్రము
స్థూలమును గ్రహించు స్థోమతయుండును. ఇవన్నియూ చెప్పితే అర్థము
కాకపోవచ్చును. ఇవన్నీ సూక్ష్మ విషయములైనందున బయటికి కనిపించు
నిరూపణకు రావు. అందువలన వీటిని అనుభవపూర్వకముగా తెలియ
వలసిందే. మేము మా అనుభవములో ఎన్నో విషయములను చూశాము
కనుక వీటిని గురించి చెప్పుచున్నాము.
38) ప్రశ్న :- చేతబడుల మీద గల గుట్టును మేము ఎన్నోమార్లు రట్టు
చేశాము. మీరు చేతబడులను నమ్ముతారా? మంత్రాలకు చింతకాయలు
రాలుతా యంటారా?
జవాబు :- ‘చేతబడులు’ అనునవి నేడు కనిపెట్టినవి కావు. కృతయుగము
నుండి ఉన్నవని చెప్పుచున్నాము. ఆనాడు వాటి పేరు వేరు, ఈనాడు
వాటి పేరు మారుతూవచ్చి 'చేతబడి' అని అనడము జరిగినది. పేరు
మార్పు చెందినది అనుటకంటే పేరును మరచిపోయి చివరకు చేతబడి
అంటున్నారు. చేతబడి యనునది కలియుగములో మాట. మిగతా ముందు
మూడు యుగములలో 'శస్త్రము'లని చెప్పెడిమాటను నేడు 'చేతబడి' యని
అంటున్నాము. పూర్వము ఒక మంత్రమును నేర్చి ఆ మంత్రమును
శత్రువు మీదికి ప్రయోగించడమును శస్త్రమును ప్రయోగించడము అని
అనెడివారు. మొదట విలువిద్యలో ఈ శస్త్ర ప్రయోగము అమలులో
యుండేది. ఒక పుల్లను మంత్రప్రయోగము చేసి వదలితే అది పెద్ద
బాణముగా తయారయి ఎదుటి మనిషిని చంపేది. దానినే శస్త్రప్రయోగము
అని అనెడివారు. తర్వాత కొంతకాలమునకు ఒక బాణమును శస్త్రముగా
ఉపయోగించకుండా బాణము (పుల్ల) బదులు ఒక బొమ్మను తయారు
చేసి దానిని మంత్ర ప్రయోగములో శస్త్రముగా బొమ్మను ఉపయోగించేవారు.
అప్పుడది బాణమువలె అక్కడికి పోయి సూక్ష్మముగా బాధించేది. ఈ
విధముగా ఒక బాణమునుండి మొదలయిన శస్త్రప్రయోగము బొమ్మగా
తయారయినది. నేడు బొమ్మ ప్రయోగములు మంత్రములతో చేయుచూ
చెడుపు చేశామని అంటున్నారు. వంద సంవత్సరముల పూర్వము ఈ
చేతబడులు ఎక్కువగా యుండేవి. నేడు అవి ఏమాత్రము లేవని
చెప్పవచ్చును. వాటి విద్యను తెలియకపోవడము వలన ఎవరూ చేతబడులు
చేయు స్థితిలో లేరు. అయినా మాకు మంత్రాలు తెలుసుననీ, చేతబడులు
చేస్తామనీ బెదిరించుచుందురు. వాస్తవానికి నేడు ఆ విద్య ఈ రాష్ట్రములో
లేదని చెప్పవచ్చును. పూర్వము మంత్ర ప్రయోగముతోనే ఎన్నో పనులను
సాధించెడివారు. అనేక విషయములలో మంత్రముల పనితనముండేది.
ఆ కాలములో మంత్రాలకు చింతకాయలను రాలగొట్టే వారు. నేడు ఆ
విద్య లేదుగానీ ఉండివుంటే చింతకాయలనే కాదు తుమ్మకాయలు కూడా
రాలిపోగలవు. మంత్రముల విషయము సంపూర్ణముగా తెలియాలంటే,
మంత్రములు తయారు చేయు విధానము తెలియాలంటే మా రచనలలోని
“మంత్రము–మహిమ” గ్రంథమును చదవండి. చేతబడులను కొన్ని
ప్రాంతములలో 'చెడుపులు' అని అంటున్నారు. కొన్ని ప్రాంతములలో
'ప్రయోగములు' అని కూడా అంటున్నారు. తెలంగాణ ప్రాంతములో
'చిల్లంగి' అని అంటున్నారు.
39) ప్రశ్న :- ఉదయము నాలుగు గంటలకు నిద్ర లేవాలంటే, రాత్రి
నిద్రపోయేముందు ఆ విషయమును అనుకుని పడుకొంటే జీవుడైన
నాకు నిజముగానే మరునాడు నాలుగు గంటలకే మెలుకువ వస్తుంది. ఆ
విధముగా నాలోయున్న ఆత్మ ఎందుకు సహకరించాలి? మెలుకువ రాకుండా
చేయవచ్చు కదా! అయితే నాలుగు గంటలకే లేవాలి అని అనుకొన్నది
జీవాత్మనా? ఆత్మనా?
జవాబు :- ఉదయము నాలుగు గంటలకే లేవాలని జీవాత్మ అనుకోలేదు.
ఆత్మ బుద్ధి చేత అనిపిస్తున్నది. ఆత్మ బుద్దిచేత చెప్పించినా మనిషి తానే
అనుకొన్నానని అనుకొనుచున్నాడు. తాను చేయని పనులను జీవుడు
స్వయముగా తన నెత్తిన వేసుకుంటున్నాడు. శరీరములో బుద్ధి చేయు
పనులను తానే చేశానని అనుకోవడము జీవునకు పూర్తి అలవాటై పోయినది.
వాస్తవముగా కర్మప్రకారము జీవున్ని నడిపించి అనుభవింపజేయు ఆత్మ
బుద్ది చేత ఉదయము నాలుగు గంటలకు లేవాలని అనిపించినది. జీవున్ని
నిద్రనుండి లేపేది ఆత్మే అయినందున అనుకొన్న సమయమునకు ఐదు,
పది నిమిషముల ముందో లేక ఐదు పది నిమిషముల వెనుకో లేక సమాన
సమయమునకో లేపుచున్నది. ఆత్మే అనుకొనుచున్నది, ఆత్మే లేపుచున్నది.
40) ప్రశ్న :- ప్రపంచ పరముగా కనిపెట్టిన ఆవిష్కరణలుగానీ, ప్రతి
అంశమును పరిశోధనాత్మకముగా చూడకల్గి, ఎన్నో సైన్సు పరిశోధనలు
చేసే అవకాశము లాటిన్, గ్రీక్ మరియు అమెరికా దేశాలలో గల
మనుషులలోనే ఆత్మ ఎక్కువగా అందిస్తున్నది ఎందుకు?
జవాబు :- ఆ దేశముల వారిని బయట ప్రకృతియందు లగ్నమగునట్లు
చేయుటకు ఆత్మ ఆ విధముగా చేయుచున్నది. అటువంటి పరిశోధకులు
తామే అన్ని చేయునట్లు తలచుచూ దేవున్ని విశ్వసించరు. పరిశోధనలలో
వెనుకయున్న దేశమువారే ఎక్కువగా దేవున్ని విశ్వసించగలరు. పరిశోధనలు
చేసి కొన్ని ఫలితములను పొందినవారు ఆధ్యాత్మికమును నమ్మరు.
పరిశోధనలలో వెనుకయున్న భారతదేశములో ఆత్మజ్ఞానులు కలరని భారత
దేశమును 'ఇందూ దేశము' అని అంటున్నారు.
41) ప్రశ్న :- వెంట్రుక ఆత్మకు గుర్తుగా అర్థమయినది. కానీ 'తల
కొరిగించుకొనుట' అను క్రియలో తలమీద వెంట్రుకలను మాయకు గుర్తుగా,
గుణముల సమూహముగా చెప్పారు. దేవునిగాయున్న సంకేతమును
మాయగా ఎట్లు చెప్పెదరు?
జవాబు :- వెంట్రుక ఆత్మకు గుర్తని నేను ఈ మధ్య కాలములో చెప్పాను
తప్ప ఇంతకుముందు ఎవరికీ ఆ విషయము తెలియదు. “తలలు బోడులైన
తలంపులు బోడులవునా”యని వేమనయోగి తన పద్యములో చెప్పినప్పుడు
కూడా వెంట్రుకలను గుణముల ఆలోచనలుగానే అనుకొని చెప్పాడు.
అట్లే పూర్వము వెంకటేశ్వర గుడిముందరగానీ, మిగతా గుడుల ముందరగానీ
తల వెంట్రుకలను తలలోని తలంపులుగానే (కోర్కెలుగానే) లెక్కించి అదే
భావముతోనే 'మావద్ద కోర్కెలు లేవు' అని చెప్పినట్లు తలలను బోడి చేసి
దేవునికి చూపెడివారు. దేవుని దర్శనములో జ్ఞానులయిన వారు అదే
ఉద్దేశ్యమునే వెలిబుచ్చుచూ మ్రొక్కెడివారు. అయితే అప్పటి ఆచరణ అయిన
తలలు బోడి చేసుకోవడము నేటికీయున్నా ఆనాటి భావము కూడా నేడు
లేదని చెప్పవచ్చును.
42) ప్రశ్న :- పామును మాయకు గుర్తుగా చెప్పారు. వెంట్రుకలేనిది
ఒక్క పామే కాదు, ఏకకణ జీవులు, వానపాములు కూడా కలవు.
అటువంటప్పుడు ఒక్కపామే మాయకు గుర్తని ఎందుకు చెప్పాలి?
జవాబు :- ఏకకణ జీవులను, వానపాములను కొందరు చూచియుండరు.
నేడు కూడా చాలామంది వానపాములను చూడని వారు కలరు.
పాములనయితే అందరూ చూచి యుండుట చేత పామును మాయగా
ఇంజీలు గ్రంథమందే చెప్పియున్నారు. మాయతో కూడుకొన్న మనుషులను
'సర్ప సంతానము' అని చెప్పారు. మాయ మనుషులలోని ఆధ్యాత్మికమును
లేకుండా చేయును. అలాగే పాము విషము మనుషులలోని ప్రాణమును
లేకుండా చేయును. అందువలన మాయకు సమానముగా పామును గుర్తించి
చెప్పారు.
43) ప్రశ్న :- పీయూష గ్రంథి (గ్రంథి రాజము) లేకుండా ఏక కణ
జీవులలో ఆత్మ నివాసమెక్కడ? అలాగే వృక్షజాతిలో ఆత్మ స్థానము (కేంద్ర
స్థానము) ఎక్కడ? ఆత్మ చైతన్యము ఎక్కడనుండి ప్రసారమగును? వేరు
నుండా? కాండము నుండా?
జవాబు :- ఏకకణ జీవిలో ఆత్మ కణమంతా యున్నది. వృక్షజాతిలో
నాడీకేంద్రములుండవు. అలాగే 25 శరీర భాగములుండవు. మొదలు
వరకు నరికినా చెట్టు చనిపోదు కావున దాని ఆత్మస్థానము వేర్ల భాగమందే
యుండును. బహుశా వేరునుండి కాండము ప్రారంభమయిన చోట
కాండము కంటే క్రింద వేరు భాగములో కేంద్ర స్థానముండును. అందువలన
దానికి చైతన్యము కాండము క్రింది వేరు భాగమునుండి ప్రసారమగునని
తలంచు చున్నాము.
44) ప్రశ్న :- భగవద్గీతా శ్లోకములో “అశ్వత్థం ప్రాహు రవ్యయం” అని
ఉండగా మీరేమో ‘అశ్వర్థం ప్రాహు రవ్యయం" అని వివరణ వ్రాశారు?
జవాబు :- సంస్కృతములో “అశ్వత్థం” అనుట వాస్తవమే. అదే తెలుగు
భాషలో “అశ్వర్థం' అనుట సరిపోవును. భాషనుబట్టి కొంత వ్యత్యాస
మున్నది అని తెలియాలి.
45) ప్రశ్న :- అనాగరికులుగా యున్న మొదటి సంతతి ప్రజలలో పెళ్ళి
అనే తంతు లేకుండా, వావి వరుసలు లేకుండా సంభోగాలలో పాల్గొన్నట్లు
చరిత్ర ఉంది. మరి దేవుడు ఆ సమయములో దేవుని ధర్మములు ఎందుకు
తెలుపలేదు?
జవాబు :- సంభోగములు, వావి వరుసలు అన్నీ ప్రపంచ సంబంధమైన
వగును. అవి దేవునికి సంబంధించిన విషయములు కావు. అందువలన
వాటిని గురించి ఏమీ చెప్పలేదు. దేవుని ధర్మములు ప్రపంచ జీవనమునకు
సంబంధించి లేవు. దేవుని ధర్మములన్నియూ ఆధ్యాత్మిక సంబంధమైనవే
యని తెలియవలెను.
46) ప్రశ్న :- సృష్ఠి, పరిణామ సిద్ధాంత పరముగా జరిగినది యని మేము
అంటాము. మీరేమో అంతా ఒకేసారి జరిగిందియని అంటున్నారు. అంతా
ఒకేసారి జరిగింది అనుటకు మీ వద్ద సాక్ష్యముందా?
జవాబు :- పరిణామ సిద్దాంతము ప్రకారము సృష్ఠి తయారు కాలేదు.
అంతా ఒకేమారు పుట్టినదని మేము అంటున్నాము. దానికి సంబంధించిన
సాక్ష్యము కొరకు వెదక వలసిన పనిలేదు. మొదట పుట్టిన వారికి
తల్లితండ్రులు లేరు. మొదట మనుషులను యవ్వన, కౌమారముల నుండి
దేవుడు తయారు చేశాడు (సృష్టించాడు). తర్వాత తల్లితండ్రుల వలన
అందరూ పుట్టడము జరిగినది. మొదట తల్లితండ్రి లేరనుటయే దేవుని
సృష్ఠికి ఆధారము (సాక్ష్యము). మొదట బ్రహ్మాండము నుండి మనుషులు
నేరుగా పుట్టగా తర్వాత అండము నుండి, పిండము నుండి పుట్టారని
తెలియుచున్నది.
47) ప్రశ్న :- స్త్రీ, పురుష, నిర్ధిష్టత లేని ఏకకణ జీవులు ప్రకృతికి గుర్తుగా
ఉన్నట్లా, పురుషునికి గుర్తుగా ఉన్నట్లా?
జవాబు :- పురుషుడైన దేవునికి గుర్తుగాయున్నట్లు. పరమాత్మ అనగా
దేవుడయినా పరమాత్మ యది యని స్త్రీలింగముగా ఒకమారు, వాడు,
ఆయన అని మరొకమారు పులింగముగా పిలువబడుచున్నది. దేవుడు స్త్రీ
లింగముగా పులింగముగా రెండు విధముల పిలువబడుట చేత స్త్రీలింగ,
పులింగ ఏ నిర్ణయము చేయలేనివాడు దేవుడు కనుక ఏకకణ జీవులను
దేవుడయిన పురుషుని గుర్తుగా చెప్పబడుచున్నది. ఏక కణ జీవులే కాకుండా
కొన్ని బల్లిజాతి తొండలు కూడా ఆడ, మగ లేనివి గలవు. అవన్నీ
కనిపించునట్లు కలవు.
48) ప్రశ్న :- పెళ్ళిలో మంగళ వాయిద్యములు దేనికొరకు ఉన్నవి?
జవాబు :- నాశనమునకు ముందు శబ్దము తప్పనిసరిగా ఉండును. కర్మ
నాశనము చేయు చక్రము కుడిచేతిలో ధరించిన విష్ణువు, తన ఎడమ
చేతిలో శంఖును ధరించాడు. చక్రము కర్మనాశనమయినది కాగా, శంఖు
కర్మనాశనమునకు ముందు తెలియు జ్ఞాన శబ్దమునకు గుర్తుగా యుందని
చెప్పుకొన్నాము. ఇప్పుడు పెళ్ళిలో అదే సూత్రమును అనుసరించి పెళ్ళి
తంతు అంతయూ జ్ఞాన ఆచరణకు గుర్తుగా కర్మనాశనమునకు గుర్తుగా
యుండుట వలన దానికి తోడు జ్ఞానమునకు గుర్తుగా మంగళ ధ్వనులను
ఉంచడమైనది. జ్ఞానము శబ్దముతో కూడుకొన్నది, కావున శబ్దముతో
కూడుకొన్నదని ధ్వనులను పెళ్ళివద్ద, గుడివద్ద పెట్టడమైనది.
49) ప్రశ్న :- నేల వెంపలి చెట్టు పరచితే దానిమీద నిలుచున్న వ్యక్తికి
నక్షత్రములు కనిపిస్తాయన్నారు. నేల వెంపలి చెట్టులో ఏ పదార్థము కనులకు
చీకటిని కల్పించుచున్నది?
జవాబు :- ఆ విషయము లోతుగా నాకు తెలియదు. అదియునుగాక
పూర్వము చేయుచున్న పద్ధతియని వినడము తప్ప నా స్వ అనుభవము
కూడా లేదు. నేలవెంపలి అను పేరును కొన్ని వైద్య గ్రంథాలలో చూడడము
తప్ప ప్రత్యక్షముగా చూడలేదు. అది ఎట్లున్నదో కూడా తెలియదు. పూర్వము
జరిగెడిదని పెద్దలు చెప్పగా వినిన విషయమును మీకు అందించాను తప్ప
దానిలో ఏ పదార్థము అలా చీకటి చేయుచున్నదో తెలియదు.
50) ప్రశ్న :- సూర్యుడు నక్షత్రమా? గ్రహమా? నక్షత్రమని సైన్సు
చెప్పుతుంటే జ్యోతిష్యులు గ్రహమంటారు. సైన్సు ప్రపంచమంతా అది
నక్షత్రమని నిరూపించినా కొందరు సూర్యున్ని గ్రహమే అంటున్నారు. దానికి
గల కారణమేమి?
జవాబు :- సూర్యుడు నక్షత్రము అనుటకు నావద్ద ఏ ఆధారము లేదుగానీ,
గ్రహము అనుటకు ఆధారము గలదు. నక్షత్రము మోక్షమునకు గుర్తు.
అవి దేవునికి గుర్తుగాయున్న నక్షత్రములలో జీవము ఉండదు. గ్రహములుగా
యున్న వాటిలో జీవము గలదు. సూర్యునిలో జీవము గలదు కావున
సూర్యున్ని గ్రహము అనుచున్నాము. సూర్యుడు ఆకాశము చెప్పిన శబ్దముల
లోని జ్ఞానమును గ్రహించి తిరిగి భూమిమీద మనుషులకు చెప్పాడు.
సూర్యుడు జ్ఞానమును గ్రహించు శక్తి గలవాడయిన దానివలన సూర్యున్ని
గ్రహము అని అంటున్నాము. ఒకవేళ సూర్యుడు నక్షత్రమే అయివుంటే
ఆకాశశబ్ద జ్ఞానమును గ్రహించలేక దేవునివలె స్థబ్దతగా యుండునదని
చెప్పవచ్చును. నక్షత్రము నాశనము చేయగలదుగానీ, జ్ఞానమును గ్రహించ
లేదు. గ్రహించు స్థోమత సూర్యునికి ఉండడము వలన సూర్యున్ని గ్రహము
గానే మన తత్త్వవేత్తలు చెప్పుచున్నారు. ఈనాడు సైన్సు ఏ సూత్రమును
ఆధారము చేసుకొని సూర్యుడు నక్షత్రమని చెప్పినదో నాకు తెలియదు.
51) ప్రశ్న :- మంత్రరహితముగా, శాస్త్రబద్దముగా జరిగిన పెళ్ళి తరువాత
వారి ప్రారబ్దములో పెళ్ళికూతురు చనిపోయే కర్మో, ఇద్దరు చనిపోయే కర్మో
ఉంటే, ఆ కార్యము (చనిపోవటము) ఆగిపోతుందా? అర్థము తెలియక
చేసిన పెళ్ళి కార్యములు ప్రారబ్ధమును తప్పించలేదు. భావము తెలిసి
చేసిన పెళ్ళిలో కూడా ప్రారబ్దమును తప్పించలేమా?
జవాబు :- మంత్రరహితముగా శాస్త్రబద్దముగా జరిగిన పెళ్ళి ప్రారబ్దమును
తప్పించుట చేయలేదు. అలా చేయడము వలన ప్రారబ్దము పోతుందని
చెప్పుటకు వీలులేదు. భావముతో కూడిన పెళ్ళిని భావము తెలిపి చేయుట
వలన పెళ్ళి చేసుకొనువారు వారి జీవితములో జ్ఞానమును తెలిసి జ్ఞాన
జీవితమును గడుపవలెననీ, అజ్ఞాన జీవితమును గడుపకూడదను
ఉద్దేశ్యముతో భావమును చెప్పి చేయుచున్నారు తప్ప, కర్మలు పోవునను
ఉద్దేశ్యముతో చేయలేదు. మరణములు ముందే నిర్ణయించబడియుండును.
వాటిని ఎవరూ మార్చలేరు. దంపతులు జ్ఞాన జీవితమును గడిపితే వచ్చిన
జ్ఞానశక్తి ద్వారా వారు అనుభవించే కర్మనుండి కొంత తప్పించుకొనుటకు
వీలుకలదు గానీ, మరణమునుండి తప్పించుకొనుటకు వీలుపడదు. పెళ్ళి
జ్ఞాన జీవితము గడుపుటకు తెలియజేయు వేదికేగానీ మంత్రరహితముగా
చేయు పెళ్ళిలో కర్మ పోతుందనిగానీ, మరణము తప్పిపోతుందనిగానీ ఎక్కడా
చెప్పలేదు.
52) ప్రశ్న :- వినాయక విగ్రహాలు పాలు త్రాగడము ఎంత విడ్డూరమో
అలాగే బ్రహ్మముగారి విగ్రహము కళ్ళనుండి నీరు కారటము అంతే విడ్డూర
మగును. వాస్తవముగా భారతీయులను సెంటిమెంటల్ ఫూల్స్ అంటాను.
మీరేమంటారు?
జవాబు :- వినాయక విగ్రహాలు పాలు త్రాగడము ఆశ్చర్యమేమీ కాదు.
ఆరిపోయిన ప్రతిమ తడిని పీల్చుకోవడము వలన వినాయకుడు పాలు
త్రాగాడని అందరూ అనుకొనియుండవచ్చును. చెంబు నీళ్ళను బండమీద
పోస్తే కొద్దిసేపటికి నీళ్ళు బండమీద లేకుండా పోవుచున్నవి. అప్పుడు
నీటిని బండ త్రాగిందని అంటామా! లేక గాలి త్రాగిందని అంటామా!
ఉన్న నీరు లేకుండా పోవుట సులభముగానీ, లేని నీరు బండమీదికి
రావడము జరుగదు. అలాగే ఉన్న పాలను గానీ నీరునుగానీ ఆరిపోయివున్న
విగ్రహము తేమను పీల్చుకొనుట వలన విగ్రహము నీరు త్రాగిందని
అంటున్నాము. వినాయకుడుగానీ, మరి ఏ విగ్రహమయినాగానీ నీరును
గ్రహించవచ్చును కానీ నీటిని విడుదల చేయలేదు. నీరును విడుదల
చేయుటకు ప్రతిమలో ముందే నీరుండవలెను. అందువలన యోచించు
వారికి వినాయకుడు పాలను త్రాగడము విచిత్రముగాదు. అయితే
ఆరిపోయిన రాతి ప్రతిమనుండి అనగా బ్రహ్మముగారి విగ్రహమునుండి
ఒక కంటిలోనే నీరు కారడము విచిత్రమేయగును. వినాయకుడు పాలు
త్రాగడమును, బ్రహ్మము గారి ప్రతిమకు కన్నీరు రావడమును ఒకే విధముగా
పోల్చకూడదు. రెండింటిలోనూ ఎంతో వైవిధ్యము కలదు. వినాయకుడు
పాలు త్రాగడము ఎక్కడయినా జరుగవచ్చును, ఎవరయినా త్రాపవచ్చును.
బ్రహ్మముగారి ప్రతిమనుండి కుడికంటిలో నీరు కారడము నేను స్వయముగా
చూచాను. అక్కడ అజ్ఞానము పనికి రాదు. కేవలము జ్ఞానము మాత్రము
పనికి వచ్చును. బ్రహ్మముగారి కుడికంటిలో నీరు కారుటకు గల కారణము
జ్ఞానము వలన తెలియనగును.
53) ప్రశ్న :- మీ గ్రంథము చర్మమునకు బాధయున్న చోట అంటుకొన్నట్లు
చెప్పుకొంటున్నారు. బాధలేకపోయినా మీ గ్రంథములు చర్మమునకు
అతుక్కోవడము జరుగుచున్నది. దానికి మీ సమాధానము ఏమిటి? మీ
గ్రంథములే కాకుండా వేరే గ్రంథములు కూడా అలా కరచుకొనుటను
గమనించాము. ఆ గ్రంథములు సైన్సు పుస్తకాలు. మరి అవి ఎందుకు
కరచుకొన్నట్లు వివరించగలరా?
జవాబు :- మా గ్రంథములలో ఆత్మజ్ఞానము గలదు. అంతకు మించి
ఏమీ లేదు. కర్మతో బాధపడు మనుషులకు మా గ్రంథములు అంటుకొని
వారి కర్మలను లేకుండా చేసినట్లు కర్మలనుండి బయట పడినవారే చెప్పగా
విన్నాము. మా గ్రంథములు అంటుకొనియున్నది ప్రత్యక్షముగా చూడకున్నా,
కొన్ని ఫోటోలలో చూచాను. గ్రంథముల మీద విశ్వాసమున్న వారికి
అతుక్కోవచ్చు అని అనుకొన్నాము. కాలము జరుగగా చాలాచోట్ల
చాలామందికి గ్రంథములు అతుక్కొని క్యాన్సర్, ఎయిడ్స్ మొదలగు దీర్ఘ
కాల రోగములను కూడా లేకుండా చేసినట్లు విన్నాము. మా అంచనా
ప్రకారము గ్రంథములలో ప్రత్యేకించి ఆత్మ విధానము, ఆత్మజ్ఞానము
ఉండుట వలన నమ్మకము గల జీవాత్మల శరీరములలోని ఆత్మ తన జ్ఞాన
గ్రంథములను ఆకర్షించుకొని గ్రంథములోని ఆత్మజ్ఞానము వలన కర్మ
కాలిపోవునట్లు చేయుచున్నదని అనుకొన్నాము. గ్రంథములు మనిషిని
అంటుకోలేదనీ మనిషిలోని ఆత్మే గ్రంథములను ఆకర్షించుకొంటున్నదని
ఇదంతయూ ఆత్మ చేయు పనేయని అనుకొంటున్నాము. ఇతర గ్రంథము
లను పెట్టుకొన్నా, అతుక్కోలేదని చాలామంది చెప్పారు. ఇప్పుడు మీరు
బాధ లేకున్నా గ్రంథములు అతుక్కున్నాయని అన్నారు. అది జరిగి యుండ
వచ్చును. బాధలు తెలియకున్నా కర్మలు లోపలయుండుట వలన
గ్రంథములు అతుక్కొని యుండవచ్చును. ఇప్పుడు మీరు సైన్సు గ్రంథములు
కూడా అతుక్కున్నాయి అన్నారు. ఆ విషయము మాకు తెలియదు. అతుక్కొని
కర్మను పోగొట్టాయా లేదాయని చెప్పలేదు. కొందరిని దేవుడే తప్పు
మార్గములో పంపునని దైవగ్రంథములో వ్రాసియుండుట చూచియున్నాను.
దేవుని మీద శ్రద్ధయున్న వారిని దైవమార్గములో పంపుదుననీ, శ్రద్ధలేని
వారిని అపమార్గములో పంపుదుననీ తెలిపియున్నాడు. అందువలన
కొందరిని తప్పు మార్గములో పంపుటకు ఆ విధముగా ఆత్మే చేసి యుండ
వచ్చును. ఏది ఏమయినా మేము ప్రత్యక్షముగా సైన్సుకు సంబంధించిన
గ్రంథములు అతుక్కున్నప్పుడు చూడగల్గితే వెనుకయున్న సత్యమును
చెప్పగలను.
54) ప్రశ్న :- “కథల జ్ఞానము” అను గ్రంథములో దయ్యాల కోన ప్రాంతము
దేశములో ఎక్కడున్నది? ఇప్పటికీ అది వుందా? కల్పితమా?
జవాబు :- ఆ గ్రంథములో ఆ పేరు కల్పితమే కానీ ఉప్పలపాడు కోన
అనునది ఉన్నది వాస్తవమే. ఆ గ్రంథములో ఒక మహర్షి చెట్టు దిగివచ్చి
కోన నీటిలో స్నానము చేసి మర్రిచెట్టు క్రింద గుడిముందర తపస్సు చేసేవాడు
అని వ్రాశాము కదా! అదే ఉప్పలపాడు కోన. అయితే వాస్తవ విషయములనే
కల్పిత కథలతో చెప్పడమైనది. దయ్యాలకోన యనునది గ్రంథములో
చెప్పిన విధముగా ఎక్కడా లేదు. అయినా కథలలో చెప్పినవన్నీ వాస్తవమే
యని తెలియవలెను.
55) ప్రశ్న :- కథల జ్ఞానములోని భేతాళుని కథలో ఉన్న మూడు ప్రశ్నలకు
సమాధానము ఎంత యోచించినా జవాబులు అందటము లేదు. ఏవో
సమాధానములు వచ్చినా వాస్తవము కాదేమో అనిపిస్తుంది. కనుక దయచేసి
ఆ కథ వివరమును ప్రశ్నలకు జవాబులను చెప్ప ప్రార్థన?
జవాబు :- మీలో అనగా చదువుచున్న వారిలో చురుకుదనము తెప్పించుటకు
ఆ కథను చెప్పాము గానీ, అందులో వాస్తవముగా జవాబులు ఉండవు.
ఆలోచించినా జవాబులు దొరకకూడదనే ఉద్దేశ్యముతోనే వ్రాశాము.
56) ప్రశ్న :– ఎనిమిది అడుగుల విగ్రహములో ఆ విగ్రహమంతా ఆవహించి
ఆ దేవత ఆత్మయుండునా? ఒకవేళ అన్ని అడుగులుగా ఉన్న దేవతలు
విగ్రహమునుండి బయటికి వచ్చి సంచరిస్తే దానిని చూడగలిగే వారికి
అంత ఎత్తులోనే (పొడవుగా) కనిపించునా?
జవాబు :- విగ్రహము ఎంత ఎత్తు ఉండునో అంత ఎత్తు సూక్ష్మములు
కనిపించుట వింతేమీ కాదు. విగ్రహములు లేని సూక్ష్మములు కొండ
ఎత్తు, పర్వతము ఎత్తు కనిపించిన సంఘటనలు గలవు. దానిని బట్టి
చూస్తే ఎనిమిదడుగుల సూక్ష్మము కనిపించుట వింతకాదు.
57) ప్రశ్న :- మీరు ఇన్ని క్రొత్త విషయములు ఏ గ్రంథములో చూచి
చెప్పుచున్నారు?
జవాబు :- గ్రంథములు చదివే అలవాటు నాకులేదు. నేను ఏ గ్రంథములో
చూడలేదు. నాలోని ఆత్మ తెలిపితే నేను మీకు మధ్యవర్తిలాగ తెలుపు
చున్నాను. అంతతప్ప నేను స్వయముగా చెప్పిన క్రొత్త విషయములు
ఏమీ లేవు. ఏమి చెప్పినా నా ఆత్మ చెప్పవలసిందే.
58) ప్రశ్న :- ఒకడు దొంగతనము చేస్తున్నప్పుడు ఏ భావముతో చేస్తున్నాడో,
ఆ భావమునకు తగిన కర్మ వస్తుంది కదా! నేను చేస్తున్నది పాపకర్మ
అనుకోకుండా, ఏ పని దొరకక కరువు వలన ఒక ధనికుని ఇంటిలో
దొంగిలించి తింటే తప్పేమిటి? అని “రాబిన్ హుడ్”ను అనుసరిస్తే వారికి
పాపము రాకూడదు కదా! ఇంతకీ పాపపు పనులు ఇవియని లిస్టు
ఉందా? ఉంటే ఎక్కడ ఉంది. మంచి ఆడిటర్ ఆడిట్ చేయిస్తాము.
జవాబు :- అటువంటి లిస్టు ఏదీ లేదు. ఇవి చెడు పనులని దేవుడు
చెప్పలేదు కదా! మనిషి చేసే పని ద్వారా పాపము రాలేదు. అతడు
అహము ద్వారా "నేనే ఈ పనిని చేయుచున్నాను” అని అనుకోవడము
వలన జరిగిన పనిలో పాప పుణ్యములు ఏర్పడుచున్నవి. అంతతప్ప దేవుని
దృష్టిలో మంచి చెడు కార్యములు లేవు.
59) ప్రశ్న :– వ్యభిచారము చేసేవాడి భావములో నేను పాపము చేస్తున్నాను
అనే భావము ఉండదు కదా! 'నేను ఆనందించుచున్నాను' అనే భావనేయుంటే
పాపము అనే కర్మ ఎట్లు తగులుతుంది? ఎందుకంటే పనికంటే పనిలోయున్న
భావమే ముఖ్యము కదా! “మోహపు చూపుతో ఒక స్త్రీని చూచిన వ్యభిచరించి
నట్లే కదా!” అని ప్రభువు అన్నారు. పని లేకుండా పనిలోయున్న భావమే
కదా! ముఖ్యము. పై పనులలో జీవుని భావనలు 'ఆనందిస్తున్నాను' అనే
కదా! మరి పాపము అనేది మధ్యలో ఎక్కడి నుండి మొలిచింది?
జవాబు :- "నేను ఆనందించుచున్నాను” అనేదానికంటే ముందు ఆనందము
పని చేస్తేనే వచ్చినదని వానికి తెలుసు. పనిని నేను చేస్తున్నానని ఇతరులతో
చెప్పకున్నా ఆనందము పొందే కార్యము చేయుటకు ముందు కొంత
ప్రయత్నించి కార్యము చేయుటకు మొదలు పెట్టును. అప్పుడు కొంత
బుద్ధిని, కొంత మనస్సును, కొంత కర్మేంద్రియముల పనిని చేయవలసి
వచ్చును. అప్పుడు ఆ పనిని తాను చేయుచున్నానను భావము అందరిలో
అంటుకొని యుండును. ఎప్పుడు బుద్ధి పని చేయునో అప్పుడు అహము
పనిచేయును. అహము నా చేతులు పని చేస్తున్నాయను ధ్యాసతోనే చేయును.
అహము అనునది జరిగెడి ప్రతి పనిలోనూ భాగమైయుండుట వలన
కార్యము చేయగా సుఖమును అనుభవించానను భావముండును. సుఖము
గాలిలో వచ్చి అతనిని చేరలేదు. అలా వచ్చి చేరేదే అయితే అక్కడ
కార్యము లేదు, అహము లేదు. అప్పుడు పాపము లేదు. వ్యభిచారము
చేయుట అనేది కార్యముతో కూడుకొన్నదే కదా! చిన్న కార్యముతో
కూడుకొన్నదయినా వాడు నూరు శాతము 'నేను' అనే భావముతోనే
చేయుచున్నాడు. 'నేను' అనే భావముతోనే అనుభవించుచున్నాడు. ఒకవేళ
ఎవడయినా కర్మయోగ పద్ధతి తెలిసి కార్యము చేయగలిగితే అనుభవము
జీవుడు పొందినా కర్మను జీవుడు పొందడు. అట్లుకాకుండా చేయువానికి
కర్మ తప్పక అంటును. కర్మను కాల్చుతూ కర్మయోగమను దానిని యజ్ఞముగా
ఆచరించుచూ చేయుట వలన యజ్ఞములో కర్మ దహించి వేయబడుచున్నది.
ఈ విషయమై భగవద్గీత కర్మయోగములో తొమ్మిదవ శ్లోకమున ఇట్లు చెప్పారు
చూడండి...
శ్లో॥ యజ్ఞార్థాత్కర్మణో న్యత్ర లోకోయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ! ముక్త సంగస్సమాచరం ॥
భావము :- “యజ్ఞ సంబంధమైన కర్మను ఆచరించుటకంటే ఇతరముగా
చేయుట వలన కర్మము అంటుకొనును. కార్య ఫలమునందు ధ్యాసను వదలి
కార్యములు చేయుట యజ్ఞ కర్మయగును. అనగా కర్మ కాలిపోవును. లేకపోతే
కర్మ బంధనములు కల్గుచుండును." అని చెప్పబడడమైనది. అగ్నికి
ధూమము అంటుకొని యుండునట్లు ప్రతి కార్యమునకు అహము అను
దానివలన కర్మ అంటుకొనియుండును. దానిని యజ్ఞ సంబంధముగా
అనగా కర్మను దహించి లేక కర్మను అంటని విధముగా కార్యమును
చేయుము అని చెప్పారు. అట్లు కాకుండా సుఖము మీద ఆశతో పనిచేస్తే
ఆసక్తిగా చేయు కార్యమే కర్మగా మారుచున్నది. ప్రతి కార్యమునకు
కర్మయుండడము సహజము. అయితే కొందరు యజ్ఞ పద్ధతిలో (కర్మయోగ
పద్ధతిలో) పొందకుండా యున్నారు.
60) ప్రశ్న :- బాహ్య యజ్ఞములు చేస్తే తప్పేమిటి?
జవాబు :- బాహ్య యజ్ఞములు అంతర్ యజ్ఞములకు నమూనాలు. అయితే
అంతర్ యజ్ఞములయిన ద్రవ్య, జ్ఞాన అను రెండు యజ్ఞములలో ద్రవ్య
యజ్ఞమును అందరూ చేయుచున్నారు గానీ, జ్ఞానయజ్ఞమును ఎవరూ
చేయడము లేదు. జ్ఞాన యజ్ఞమును చేయగల్గిననాడు ఎవడయినా
కర్మలనుండి బయటపడును. అట్లు కాకుండా సుఖము మీదే ధ్యాసతో
చేయుట వలన ఆ చేసినదే పాపముగా మారును. ఈ విషయము
తెలియుటకు కన్ను చూస్తుంది, చెవు వింటూయుంది అని తెలిసినట్లు
అంతరేంద్రియములయిన మనస్సు, బుద్ధి, చిత్తము, అహము యొక్క పని
తెలియగల్గినప్పుడు యజ్ఞముల విలువ తెలియును. అప్పుడు బాహ్య
యజ్ఞములు నాలుగు అధర్మములలో ఒక అధర్మమని తెలియుచున్నది.
బాహ్యయజ్ఞములు చేస్తే తప్పులేదు గానీ అధర్మమును ఆచరించినట్లగును.
61) ప్రశ్న :- ఈ మధ్య కనిపించకుండా పోయిన (MH-370) కానీ,
(N-32) విమానముగానీ కనిపించకుండా పోయిన విధానములో బెర్ముడా
ట్రయాంగిల్లో ఉన్న శక్తి ప్రమేయమే అంటారా?
జవాబు :- అవి కనిపించకుండా పోయిన రోజే నాకు ఏమి తెలియకనే
దీనికి కారణము బెర్ముడా ట్రయాంగిల్ శక్తియని చెప్పడమైనది. ఎటువంటి
ఆధారము లేకుండా చెప్పిన ఆ మాటలు నిజమైనాయి. ముమ్మాటికి
శక్తే కారణము అని చెప్పవచ్చును. విమానములో పోయిన వారందరూ
ఒక విధముగా అదృష్టవంతులే ఖర్చు లేకుండా మరొక గ్రహములో దిగి
అక్కడ దైవజ్ఞానము తెలియగల్గుట అదృష్టమనియే చెప్పవచ్చును.
62) ప్రశ్న :- క్రీస్తు పూర్వము 1వ శతాబ్దమునుండి క్రీస్తు శకము 14,
15 శతాబ్దముల వరకు రాజులు, చక్రవర్తులు పరిపాలించారు. రాజులు,
రాజ్యాలు పోయి ఇప్పటికి ఇలా వుంది. ఇప్పుడు అన్ని దేశములకు
రాజ్యాంగ వ్యవస్థ వుంది. ఈ విధమైన రాజ్యాంగము తర్వాత ఎటువంటి
పరిణామం రాబోతుంది? మీరేమో వేయి సంవత్సరముల అనంతరము
అందరూ జ్ఞానులగుదురు అన్నారు. రాకెట్ మిసైల్ యుగములో ఇంకా
నాగరికత అభివృద్ధి చెందుతున్న భవిష్యత్ కాలములో జ్ఞానమును ప్రజలు
పట్టించు కుంటారా?
జవాబు :- ఏ యుగములో అయినా, ఏ కాలములో అయినా జ్ఞానము
అజ్ఞానము రెండూ ఉంటాయి. భూమిమీద నాగరికత కాలములోగానీ,
అనాగరికత కాలములోగానీ, జ్ఞానమునుండి అజ్ఞానమువైపు మనుషులు
పోవుచుందురు. జ్ఞానమునుండి అజ్ఞానము వైపు మారుచూరాగా ఉన్న
ప్రజలలో రెండు శాతము జ్ఞానము వరకు చూస్తున్న దేవుడు అప్పుడు
ధర్మములకు ముప్పు ఏర్పడినదని ధర్మప్రతిష్టాపనకు పూనుకొనును. దేవుడు
భగవంతునిగా వచ్చి ధర్మ ప్రచారమునకు పూనుకొనునప్పటికి భూమిమీద
ఒక శాతము జ్ఞానము మిగిలియుండును. భగవంతుడు తిరిగి ధర్మములను
నెలకొల్పి, ధర్మములను తెలియజెప్పి వచ్చిన దారినే పోవును. భగవంతుడు
చెప్పిన జ్ఞానము ప్రజలలోనికి పోయే దానికి కొన్ని వందల సంవత్సరములు
పట్టును. అప్పుడు ధర్మములు ఒక శాతమునుండి అర్థ శాతమునకు తగ్గి
పోవును. భగవంతుని జ్ఞానము ప్రజలలోనికి పోయి ప్రజలకు తెలియుటకు
మొదలు పెట్టిన తర్వాత ధర్మములకు బలము చేకూరి అలా కొంత
కాలమునకు అనగా వేల సంవత్సరములకు 90 శాతము ధర్మములు పెరిగి
అధర్మములు క్షీణించి పోవును. అయినా అప్పటికీ పది శాతము అధర్మములు
మిగిలియుండి తర్వాత క్రమేపీ అవి పదిశాతము నుండి తిరిగి తమ
బలమును పెంచుకొనుచూ వచ్చును. అట్లు తిరిగి కాలము జరుగు కొలది
అధర్మములు పెరుగుతూ వచ్చి ఒక యుగము కాలమునకు అనగా కొన్ని
వేల సంవత్సరములకు తిరిగి అజ్ఞానము ప్రజలలో నిండిపోయి అధర్మముల
శాతము 90 వరకు పెరిగిపోవును. అట్లే రెండు శాతమునకు దిగి
పొయినప్పుడు తిరిగి భగవంతుడు రావలసియున్నది. భగవంతుడు వచ్చి
మొదటివలె ధర్మములను బోధించిపోవును. బోధించిన ధర్మములు కొంత
కాలమునకు ప్రజలలోనికి ప్రాకడము అధర్మములు 90 శాతము పెరగడము
జరుగుచుండును. ఇదే విధముగా ధర్మాధర్మముల స్థితి భూమిమీద
ఉండును. అప్పుడప్పుడు భగవంతుని రాకయుండును. ఇదంతయూ
ఒక గొలుసువలె జరుగుచుండును. ఏ కాలములో నయినా ధర్మములకు
ముప్పు కల్గును. ఏ కాలములో అయినా ధర్మముల ప్రతిష్టాపన జరుగును.
ఇదంతయూ బండిచక్రము తిరుగుచున్నట్లు జరుగుచుండును. ఎంత
నాగరికత కాలములో అయినా ధర్మములు లేకపోతే భగవంతుని ద్వారా
తిరిగి తెలియబడును.
63) ప్రశ్న :- ఈ విశ్వములో భూమిలాంటి వేరే గ్రహము ఉండి వుంటే
అక్కడి ప్రజలకు జ్ఞానాన్ని బోధించేందుకు భగవంతుడు వచ్చునా? అక్కడ
కూడా భగవంతుని రాక మూడుమార్లు యుండునా?
జవాబు :- భగవంతుని రాక, భగవంతుడు ధర్మములను బోధించుట
భూమిమీద మాత్రమే జరుగుచుండును. వేరే గ్రహములో పరిస్థితి వేరుగా
యుండును. అక్కడ కాలక్రమములో అజ్ఞానము పెరుగదు. ఎప్పటికీ
జ్ఞానము ఒకే విధముగా ఉండును. భూమిమీద భగవంతుని వలననే
జ్ఞానము తెలియబడుచుండును. ఇతర గ్రహములలో గురువు వలన జ్ఞానము
బోధించబడుచుండును. అక్కడున్న వారందరూ జ్ఞానులుగానే యుందురు.
అందువలన వారికి గురువు అవసరము లేదు. గురువులకు బోధించు
పని ఉండవలెనని భూమినుండి కొంతమంది మనుషులను ఇతర
గ్రహములలోనికి చేర్చుట వలన అక్కడ వారికి జ్ఞానమును బోధించెదరు.
గురువులుగా యున్నవారు ఆ గ్రహము మీద అజ్ఞానులను జ్ఞానులుగా
మార్చు చుందురు. అయితే అక్కడ భగవంతుని రాక యుండదు.
64) ప్రశ్న :- కృష్ణుడు విశ్వరూపాన్ని అర్జునునకు చూపించినట్లు, ఏసు
ప్రభువు కూడా తన జీవితములో విశ్వరూపాన్ని చూపించెనా? మూడవమారు
వచ్చే భగవంతుడు కూడా తన విశ్వరూపాన్ని చూపించే సన్నివేశము
ఉండునా?
జవాబు :- విశ్వరూపము గారడి విద్య ప్రదర్శనలాంటిది కాదు. “దేవుడు
విశ్వరూపుడు” అని తెలియజేయు నిమిత్తము ఒకమారు కృష్ణుడు అర్జునునకు
విశ్వరూపము చూపడము జరిగినది. తర్వాత రెండవమారు విశ్వరూపము
చూపబడలేదు. తర్వాత కాలములో ఎప్పుడుగానీ విశ్వరూప ప్రదర్శన
యుండదు. విశ్వరూపము సాక్ష్యము కొరకు చూపినదేగానీ తర్వాత రెండవ
మారు చూపునది కాదు.
65) ప్రశ్న :- కొన్ని వృక్షములలో ఉన్న జీవాత్మలు కొన్ని వేల సంవత్సరములు
జీవించుచుందురు. అనగా నాలుగువేలు, ఐదువేల సంవత్సరములు
జీవించుచుండును. అట్లే చెట్లలో ఉండే జీవాత్మలవలె జంతువులలో,
మనుష్యులలో ఎందుకు ఎక్కువ ఆయుస్సు ఉండలేదు?
జవాబు :– జంతువులు, మనుషులు మాంసముతో కూడుకొన్న శరీరములు
గలవారుగా యున్నారు. అందువలన వారి శరీరములు వాతావరణ
మార్పులకు, శీతోష్ణమునకు తొందరగా శిథిలావస్థకు వస్తున్నవి. అందువలన
మనుషులు, జంతువులు తొందరగా చనిపోవడము జరుగుచున్నది.
మనుషులు, జంతువులు స్థూలముగా ఎక్కువ కాలము బ్రతకడము లేదు.
చనిపోయిన మనుషులు, జంతువులు సూక్ష్మముగా ఎక్కువ కాలము బ్రతుకు
చున్నవి. వృక్షమునకు సూక్ష్మశరీరముతో బ్రతికే సదుపాయము లేదు.
ఎంత కాలమయినా వృక్షములు స్థూలముగా బ్రతుకవలసినదే. మనుషులు
జంతువులు చాలావరకు స్థూలముగా తక్కువ కాలము బ్రతుకుచున్నవి.
సూక్ష్మముగా ఎక్కువ కాలము బ్రతుకుచున్నవి. మనుషులు చాలావరకు
అకాల మరణమునే పొందుచున్నారు. అరుదుగా కాల మరణమును పొందు
చున్నారు. అకాల మరణము పొంది సూక్ష్మముగా బ్రతుకువారిని
చాలామందితో నేను మాట్లాడడము జరిగినది. 250 సంవత్సరములుగా
బ్రతికియున్న మనిషితో (సూక్ష్మ శరీరముగల మనిషితో) మాట్లాడడము
జరిగినది. అప్పుడు నాకు ఆశ్చర్యము కలిగినా నేడు అది సహజమే
అనుకొంటున్నాను. దాదాపు 600 సంవత్సరములు బ్రతికిన మనుషులతో
మాట్లాడాను. వారిని కొన్ని ప్రశ్నలడిగి తెలుసుకొన్న విషయములలో
మనుషులు రెండువేల సంవత్సరముల వారు కూడా బ్రతికేయున్నట్లు
తెలిసినది. జంతువులు కూడా దాదాపు మూడు వందల సంవత్సరములు
బ్రతికినవి కూడా ఉన్నట్లు తెలిసినది. స్థూలముగా 20 సంవత్సరములు
బ్రతుకు జంతువులు మూడు వందల (300) సంవత్సరములు
బ్రతికియుండడము వలన స్థూలముగా తక్కువ కాలము బ్రతుకు మనుషులు
కూడా సూక్ష్మముగా వేల సంవత్సరములు బ్రతుకుచున్నారని తెలియుచున్నది.
66) ప్రశ్న :- జంతువుల కొరకు కొంత ఆయుష్సు నిర్ధిష్టత యున్నట్లు
చెట్లకు నిర్ధిష్టత లేదా?
జవాబు :- మనుషులకుగానీ, జంతువులకుగానీ ఆయుష్షు నిర్దిష్టతయనునది
లేనేలేదు. ఆయుష్షు నిర్ధిష్టత కర్మప్రకారము ఎంతయున్నదో ఎవరికీ
తెలియదు. స్థూలముగా బ్రతుకుచున్న ఆయష్షునుబట్టి చెప్పుటకు వీలు
పడదు. మనిషికిగానీ, జంతువుకుగానీ 12 గ్రహముల దశలు ఒకమారు
అయిపోవుటకు 120 సంవత్సరములు పట్టును. దానిని మనుషుల
ఆయుష్షని కొందరనుకోవడము జరుగుచున్నది. కృష్ణుడు 126
సంవత్సరములు బ్రతికినట్లు గలదు. వ్యాసుడు స్థూలముగానే 380
సంవత్సరములు బ్రతికినట్లు చెప్పుచున్నారు. విక్రమార్కుడు రెండువేల
సంవత్సరములు బ్రతికినట్లు చరిత్రగలదు. అందువలన మనిషి యొక్క
నిర్ధిష్ట ఆయుష్షుగానీ, జంతువుల యొక్క నిర్ధిష్ట ఆయుష్షుగానీ ఇంతయని
ఎవరూ చెప్పలేరు.
67) పంట పొలాలలో ఉండే పైరును (వరి లేదా గోధుమ) కొడవలితో
కోసినప్పుడు వాటిలోయుండే ఆత్మను మన రైతు శరీరములో యుండే
చైతన్యముతోనే కోసివేస్తే అది హత్యయగును కదా! అప్పుడు పైరులో
యుండే జీవాత్మల మరణము అకాల మరణమగునా? లేక కాలమరణ
మగునా?
జవాబు :- మొక్కల జీవాత్మ వేరునందుండుట వలన మొక్కలు చనిపోవు.
కోసిన తర్వాత రెండు, మూడు దినములకు మొక్క చనిపోవును. అప్పుడు
కాలమరణమును పొందుచున్నది.
68) ప్రశ్న :- స్థూలముగా మన కడుపు నిండినంత ఆహారమును తీసుకొంటే
ఆకలి తీరిపోవును. కడుపు నిండిపోవును. అయితే దేవతలకు ఒకే రోజు
వేల గొర్రెలు, మేకలు కొళ్లను బలి ఇస్తే సూక్ష్మముగా దేవతలు గ్రహించును
కదా! విగ్రహాలలో ఉండే దేవతలకు అంతపెద్ద మొత్తములో వుండే ఆహారము
సూక్ష్మముగా అయినా కడుపులో పట్టునా?
జవాబు :- సూక్ష్మముగా ఉండే దేవతలు వేల గొర్రెలను, మేకలను, కోళ్ళను
ఒకేమారు ఆహారముగా తీసుకోవు. వాటి కడుపులో పట్టినంతమాత్రమే
తినగలవు. మిగతా వాటిని తీసుకోవు. బయట స్థూలముగా ఎంత
ఆహారమున్నా తమకు అవసరమైనంత ఆహారమును మాత్రము తీసుకొన
గలవు. అంతటిని తీసుకోవు.
69) ప్రశ్న :- కాలజ్ఞానములో వీరబ్రహ్మముగారు చెప్పిన 'ప్రబోధాశ్రమము’
మీదేయని సాక్ష్యమేమిటి? ప్రబోధాశ్రమము భవిష్యత్తులో రావచ్చును కదా!
మీ గ్రంథములో మీదే ప్రబోధాశ్రమమని ఉన్నట్లు తెలిసినది. అందువలన
అడుగుచున్నాము.
జవాబు :- బ్రహ్మముగారు బ్రతికియున్నప్పుడు ఆయనకు రహస్య గురువు
ఉండేవాడు. తన గురువు ఆజ్ఞప్రకారము బ్రహ్మముగారు జీవ సమాధి
చెందియుండెను. గురువు గారు తన సమాధి దగ్గరకు వచ్చి చూచినప్పుడు
బ్రహ్మముగారు సమాధినుండి బయటికి వచ్చి జన్మ తీసుకోవలెనని గురువు
ఆజ్ఞ కలదు. ఆ ఒప్పందము బ్రహ్మముగారు పది జన్మల క్రిందటే పొంది
యున్నాడు. పది జన్మల క్రిందట తన గురువుగారు చెప్పిన మాటను
బ్రహ్మముగారు పాటించి జీవసమాధిలోనికి పోవడము. ఆయన గురువుగారు
తన సమాధి వద్దకు వచ్చినప్పుడు బ్రహ్మముగారు శరీరమును వదలి
బయటికి వచ్చి జన్మను తీసుకోవడము జరిగినది. ప్రస్తుతము బ్రహ్మముగారు
36 సంవత్సరముల వయస్సులో యున్నా నేను గతములో బ్రహ్మముగారినను
జ్ఞాపకము కలుగలేదు. ఆయనకు జ్ఞాపకము వచ్చినప్పుడు కొంత
సాక్ష్యమును తెలియజేయగలడు.
70) ప్రశ్న :- అర్జునా! శరీరము నశ్వరము, క్షణ భంగురము. నీ
సామర్థ్యమునకు హస్తినాపురము క్షణ కాలములో మట్టిలో కలిసిపోగలదు.
ప్రపంచ విషయములు తుచ్ఛమైనవి. యుద్ధము చేయకపోతే క్షత్రియుడు
యుద్ధభూమిని వదలిపోయాడని లోకులు నవ్వెదరు. అయితే ఎవరు నిజమైన
జ్ఞానులో వారు నిందలకు ప్రశంసలకు చలించరు. “తుల్య నిందా స్థుతిర్మౌనీ
సంతుష్టోయేన కేనచిత్" అను శ్లోకాన్ని నీవు ఏమి గ్రహించావు.
హిమాలయములకు వెళ్ళి, బ్రహ్మయోగము చేసుకో అని కృష్ణుడు బోధించక,
యుద్ధానికి పురిగొల్పాడు. ఇంత జరిగినా గీతలో అహింస, వైరాగ్యము
ఉందంటారు. దీనిని సక్రమ బుద్ధి అనాలా? వక్రబుద్ధి అనాలా? మీరే
చెప్పండి.
జవాబు :- భగవద్గీతలో చెప్పిన జ్ఞానము రెండు విభాగములుగా యున్నది.
పది అధ్యాయముల వరకు రెండు యోగముల జ్ఞానమును కృష్ణుడు చెప్పాడు.
ఒకటి బ్రహ్మయోగము, రెండు కర్మయోగ జ్ఞానము. భక్తియోగ జ్ఞానములో
మీరు చెప్పిన స్థుతియు నిందయు సమముగా చూడడము కలదు. ఈ
విషయము భక్తియోగము అను అధ్యాయములో 19వ శ్లోకమున చెప్పి
యున్నారు. రెండవదయిన కర్మయోగములో బయటి విషయములను
సమానముగా చూడక నిందకు స్పందించి యుద్ధము చేసినా కర్మయోగ
పద్ధతిలో చేయమని చెప్పాడు. కర్మయోగములో అన్ని కార్యములను
గుణముల ప్రకారము కర్మ అంటని విధానముగా చేయవలెనని చెప్పాడు.
రెండు యోగములను వేరుగా అర్థము చేసుకోనివారు అక్కడ నిందను
చూచి మౌనముగా యుండమని చెప్పి, ఇక్కడ నిందను చూచి యుద్ధము
చేయమన్నారేమిటి? యని ప్రశ్న రాగలదు. బ్రహ్మయోగములో మౌనముగా
ఉండడము సక్రమ బుద్ధే. అట్లే కర్మ యోగములో యుద్ధము చేయడము
సక్రమ బుద్దేయని చెప్పవచ్చును. అక్కడ సందర్భమునుబట్టి, యోగమునుబట్టి
నడువకపోతే అట్టివారిదే సక్రమ బుద్ధి కాదు.
71) ప్రశ్న :- దుఃఖములలో ఏడవకుండా, సుఖములలో పొంగిపోకుండా,
రాగ, భయ, కోపరహితుడై యుండే వాడే స్థిత ప్రజ్ఞుడని చెప్పిన కృష్ణుడు
యుద్ధములో భీష్ముని మీద కోపముతో బండిచక్రమును పట్టుకొని కొట్టుటకు
బయలుదేరితే అతను భయ కోపరహితుడగునా? "చెప్పేవి శ్రీరంగ నీతులు
దూరేది దొమ్మర గుడిసెలు" అను సామెతలాగ ఉంది. దీనికి మీరేమంటారు?
జవాబు :- కృష్ణుడు స్థితప్రజ్ఞునకు చెప్పిన విధానము ప్రకారము ప్రపంచ
సంబంధ ఏ ధ్యాసలు లేనివాడు స్థితప్రజ్ఞుడు. స్థిత ప్రజ్ఞుడు బ్రహ్మయోగ
విధానములో ఉండవలసిన పద్ధతియది. అయితే కృష్ణుడు తాను
కర్మయోగమును అనుసరిస్తున్నానని ముందే చెప్పాడు. కర్మయోగములో
ఏ సమయములో ఎట్లు ప్రవర్తించవలెనో అట్లే ప్రవర్తించవలసియుండును.
యుద్ధరంగములో కత్తిపట్టి యుద్ధము చేయనని ముందే చెప్పిన కృష్ణుడు
మాట తప్పి భీష్ముని మీదికి పోయాడు. కృష్ణుడు కర్మయోగి అయిన
దానివలన ఆ పని చేయడము అతనికి చెల్లుతుంది. ఆయనను అర్థము
చేసుకోలేనిది మనమే.
72) ప్రశ్న :- శరీరము అశాశ్వితము అందువల్ల యుద్ధము చెయ్యి. ఆత్మకు
మరణము లేదు కనుక యుద్ధము చెయ్యి. క్షత్రియుడివైనందున యుద్ధము
చెయ్యి. యుద్ధము చేయకపోతే నిందలపాలగుదువు. కావున యుద్ధము
చెయ్యి. ఇదే భగవద్గీతలో కనిపిస్తుంది. మరి ఇందులో జ్ఞానము ఉంది.
మనోతత్వ శాస్త్రము ఉంది. పర్సనాలటీ డెవలప్మెంట్ ఉంది అంటారు.
నన్ను అడిగితే అలా చెప్పడము గుడ్డి ఎద్దు చేలో పడినట్లున్నది.
జవాబు :- వినింది అర్థము కాకపోతే అట్లేయుంటుంది. గ్రుడ్డును చేతిలో
పట్టుకొని పరుగెత్తాలి. కూర్చున్నప్పుడు జోబిలో పెట్టుకోవాలని చెప్పితే అర్థము
కాక గ్రుడ్డును నిక్కరు జోబిలో పెట్టుకొని పరిగెత్తి గ్రుడ్డు పగిలి పోయిందే!
అంటే పరుగెత్తితే గ్రుడ్డు పగలక ఏమవుతుంది? అలాగే మీ ప్రశ్న వుంది.
భగవద్గీతలో రెండు రకముల జ్ఞానము గలదు.
73) ప్రశ్న :- క్షత్రియుడు యుద్ధము నుండి పారిపోరాదు అని చెప్పుచూ
జరాసంధునితో యుద్ధము చేయలేక ద్వారకకు పలాయనం చిత్తగించాడు
ఇదేమి విచిత్రమో?
జవాబు :- తాను ఎవరో బయటపడకూడదని కృష్ణుడు అలా చేశాడు.
ఇప్పుడు కృష్ణుడు భగవంతుడంటే ఎవరయినా నమ్మగలరా? నమ్మరు.
నమ్మకూడదనే అలా చేశాడు.
74) ప్రశ్న :- అగ్గిపుల్ల వెలుగుటకు అగ్గిపెట్టె అవసరము, దాని ద్వారా
అగ్గి పుట్టును. ఈ రెండు రసాయన చర్యలే కదా! ఈ రెండింటికి ప్రాణము
లేదు కానీ రసాయన చర్యవలననే మంట పుట్టింది. అలాగే కణాల మధ్య
జరిగే రసాయన చర్యవలననే జీవి కదలుచున్నది, జీవనము జరుగుచున్నది.
అంతేగానీ ప్రాణం అనే భాగము లేదు. మీరందరూ అన్నట్లు ఆత్మలేదు,
జీవుడూ లేడు. అంతా రసాయన క్రియ ప్రక్రియల ప్రభావము వలననే
జరుగుచున్నది. మా మాట నిజమనుటకు అనాటమిస్ట్లు, భౌతిక
శాస్త్రవేత్తలు, వైద్య పండితుల సాక్ష్యము గలదు. మీరు చెప్పే ప్రాణం,
ఆత్మ, జీవాత్మలను మీరు చూపించలేరు. అలాంటప్పుడు మీ మాట
నిజమనుటకు ఆత్మ, జీవాత్మలను చూపించే పరికరమును దేవున్ని అడిగి
తీసుకరావచ్చు కదా?
జవాబు :- కొంత విజ్ఞానము తెలిసినవారు దేవుని మీద విశ్వాసము లేని
శాస్త్రవేత్తలు ఈ మాటను పెద్ద ఆయుధముగా చేసుకొని అడుగుచుందురు.
జీవాత్మను, ఆత్మను చూపించే పరికరమైన జ్ఞానమును దేవుడు ఎప్పుడో
ఇచ్చాడు. ఈనాడు క్రొత్తగా అడుగవలసిన అవసరము లేదు. నిమ్మకాయను
గ్యాస్ల సోడాను కలిపితే రసాయన చర్యవలన బసబస పొంగిపోవును.
200 మిల్లీ లీటర్ల సోడా 2000 వేల మిల్లిలీటర్ల వరకున్నట్లు పొంగును.
అలాకావడము రసాయన చర్యయని చెప్పవచ్చును. అలాగే సున్నము,
నవాసాగ్రము కలిస్తే కార్బన్స్డ్ ఆక్సెడ్ వాయువు వచ్చును. అది కూడా
రసాయన చర్యే. అయితే ఈ రసాయన చర్యను ఎవరూ ఆపలేరు. దానిని
ఆపగల పద్ధతిని, అవసరమైనప్పుడు ఉపయోగపడునట్లు చేయు విధానమును
బుద్ధిచేత తయారు చేయవచ్చును. రసాయన చర్యను పరిమితి చేయునది,
రసాయన చర్యను అవసరమొచ్చినప్పుడు ఉపయోగపడునట్లు చేయగల
శక్తి ఒకటి గలదు అదియే బుద్ధి. బుద్ధి వలన నిమ్మరసమును ద్రవ పదార్థము
నుండి ఘన పదార్థముగా మార్చినాము. అట్లే సోడాను కూడా ద్రవము
నుండి పొడిగా మార్చినాము. రెండింటినీ కలిపి మాత్రగా తయారు చేయించి
ఎప్పుడు నీళ్ళు కలిపితే అప్పుడు నిమ్మరసము సోడాగా తయారగునట్లు
రసాయన చర్యను బుద్ధి చేత నియంత్రించి పెట్టాము. అప్పుడు రసాయన
చర్యను నియంత్రించు బుద్ధి ఎవరికీ కనిపించకయున్నది. రసాయన
చర్యకంటే దానిని నియంత్రించు బుద్ధి గొప్పదియని ఎందుకు
అనుకోకూడదు? శరీరములో కణముల మధ్య రసాయన చర్య వలన
జీవనము సాగినా ఆ జీవనమును నియంత్రించు బుద్ధి యుండుట వలన
జీవనము క్రమబద్దముగా సాగుచున్నది. బుద్ది పని చేయకపోతే వానిని
తిక్కవాడు అని అంటాము. వాని జీవితము వృథా అంటాము. తిక్క
వానిలో కూడా రసాయన చర్య జరుగుచున్నది కదా! అయినా బుద్ధి
పనిచేయకపోతే వాని జీవితము వృథా అన్నప్పుడు రసాయన చర్యకు
విలువ లేదని దానిని నియంత్రించు బుద్ధికే విలువయున్నదని తెలియు
చున్నది. బుద్ధికి శక్తి నిచ్చునది ఆత్మ. బుద్ధి ద్వారా అనుభవమును
పొందునది జీవాత్మ. ఆత్మ, జీవాత్మలకంటే క్రిందయుండు బుద్ధే ఎట్లుండేది
భౌతిక శాస్త్రవేత్తలకు, వైద్యులకు తెలియనప్పుడు బుద్ధికంటే శ్రేష్టమయిన
ఆత్మగానీ, జీవాత్మగానీ తెలియాలనుకోవడము ఆశేయగును. ఎవరయినా
దైవజ్ఞానము తెలియగలిగితే శరీరముతో గల రసాయన చర్యను కూడా
కలుగజేయు ఆత్మలు తెలియుటకు అవకాశముండును.
75) ప్రశ్న :- పేదల ఆకలి తీర్చలేని మూఢజనుల పూజలు, దేవుడు
అనుచూ కోట్లు గుమ్మరించి డబ్బుగల దేవతలను పోషించువారు గలరు.
నిజంగా దేవుడుంటే నాకు డబ్బు అవసరము లేదు. నా హుండీలో డబ్బులు
వేయవద్దండి. నాకు ఇచ్చు డబ్బులు పేదలకు ఖర్చు పెట్టండియని కలలోనైనా
చెప్పవచ్చును కదా! అట్లు చెప్పని దేవునికి, ప్రస్తుత రాజకీయ నాయకులకు
ఏమీ తేడా లేదని నేను అంటాను. మీరేమంటారు?
జవాబు :- సామాజిక న్యాయమును గురించి మాట్లాడితే మేము కూడా
మీరు చెప్పినట్లు చెప్పవలసిందే. అయితే దేవుని జ్ఞానములో కర్మ సిద్ధాంతము
తప్ప సామాజిక న్యాయముండదు. ఎవని పని వానిది, ఎవని కర్మ వానిది.
కర్మను నిరోధించుకోవడానికి జ్ఞానము గలదు. జ్ఞానములో అన్యాయము
నుండి బయటపడవచ్చును. అలాంటప్పుడు అందరూ జ్ఞానమును తెలిస్తే
సామాజిక న్యాయము జరిగిపోవును కదా! మేము ఇలానే కష్టపడుతాము,
మాకు జ్ఞానము వద్దు అనేవారిని దేవుడు ఏమీ చేయలేడు. మనుషులు
ఏమీ చేయలేరు. రాజకీయ నాయకులు డబ్బును సంపాదించాలని
రాజకీయములోనికి వచ్చారు. దేవుడు అట్లు డబ్బు సంపాదించాలని
అనుకోలేడు కదా! అలాంటప్పుడు రాజకీయ నాయకులకు దేవునికి ఏమి
తేడా లేదని ఇద్దరిని ఒకటిగా కలుపడము అజ్ఞానమగును.
76) చర్మాసనములు వేసుకొని బ్రహ్మయోగము చేస్తే మంచిదని
చర్మాసనముల ఉపయోగము చెప్పారు. అది బాగానే ఉందిగానీ, దానిని
చెయ్యాలని తాపత్రయపడే భక్తులు చర్మాలకై పులిని, సింహాలను వేటాడి
వాటి చర్మాలకై ప్రాకులాడితే బ్రహ్మయోగానికి ముందే కారాగార యోగము
పొందే అవకాశమున్నదని నేనంటాను. దీనికి మీరేమంటారు?
జవాబు :- “చర్మాసనములు బ్రహ్మయోగములో ఉపయోగించడము వలన
కొంత వరకు శక్తిని పొందవచ్చును” అని చెప్పాను. అంతేగానీ పులి
చర్మమే వాడాలనిగానీ, లేక సింహం చర్మమునే వాడాలనిగానీ చెప్పలేదు.
ఏ చర్మమైనా ఒకే విధానము కల్గియున్నదని చెప్పాము. ఏ పేచీలు లేని
ఎద్దు చర్మములు, బర్రెల చర్మములు బజారులో దొరుకును వాటిని
వాడవచ్చును కదా! అనవసరముగా పులి, సింహము చర్మములను ఎందుకు
వాడాలి? కారాగార యోగము ఎందుకు పొందాలి? నేను చెప్పినట్లు
సులభముగా దొరుకు చర్మములను వాడి బ్రహ్మయోగములో శక్తిని
నష్టపోకుండా చూచుకోవలెనని కోరుచున్నాము.
77) ప్రశ్న :- మీరు చెప్పే దయ్యాలు నాస్తికులమైన మావద్దకు రావు. మీ
దేవునికంటే మేమంటేనే వాటికి ఎక్కువ భయమేమో! ఈ రాకెటుగములో
దయ్యాలు, దేవుళ్ళు అనువారు కొందరు కలరు. మీరు నమ్మిన దయ్యాలను
మేము కూడా నమ్మాలని మీరు ప్రయత్నించుచున్నారు. దయ్యాలు భయపడి
మావద్దకు రాకపోతే వాటిచేత దూరమునుండయినా వీడియో కాన్ఫరెన్సు
పెట్టించండి. మేము దయ్యాలున్నాయని నమ్మితే మా చేత దేవుడున్నాడని
సులభముగా నమ్మించవచ్చును. దీనికి మీరేమంటారు?
జవాబు :- దయ్యాలున్నాయని నమ్మించవలసిన అవసరము నాకు
ఏమాత్రము లేదు. పైగా దయ్యాలు మీకు భయపడి మావద్దకు రాలేదని
చెప్పారు. దయ్యాలు మీవద్దకు రాలేదని మీరు ఎలా చెప్పగలరు? దయ్యాల
విషయము ఏమాత్రము మీకు తెలియనప్పుడు అవి మీవద్దకు వచ్చినా
అవి వచ్చినట్లు మీకు తెలియదు కదా! దయ్యాలు పదిమందిలో ఆరు లేక
ఏడు మంది దగ్గరికి చేరి వారిలో ప్రవేశించి ఎవరికీ తెలియకుండా వుండును.
అవి తెలియనంతమాత్రాన అవి లేవని చెప్పలేము. వాటివలన కలుగు
బాధలను అనుభవించుచున్నా కొందరు వాటిని గుర్తించలేరు. దయ్యములు
లేవను వారిలో చాలామందికి వారికి తెలియకుండానే దయ్యములున్నవని
వారికే తెలియదు. దయ్యాలచేత వీడియో కాన్ఫరెన్సు పెట్టమన్నారు.
అటువంటి అవసరము మాకు ఏమీ లేదు. ఇక్కడ మావద్ద ఐదునెలలనుండి
దేవతలు వచ్చి మా బోధలు వింటున్నారు. వారు ఇతరుల శరీరము
మీదికి వచ్చి మాట్లాడుచున్నారు. వారి దగ్గరకు వచ్చి మీ అనుమానములను
అడగండి.
78) ప్రశ్న :- భార్యా పిల్లలను వదలుకొన్న బుద్ధుడు అజ్ఞాని అని మీరు
ఒక గ్రంథములో వ్రాయగా చూచాను. ఇంకొక గ్రంథములో బుద్ధుడు
జ్ఞానము కొరకు సర్వసంగ పరిత్యాగము చేశాడు. ఆయనకంటే మనము
గొప్పవారమా? అని అన్నారు. ఈ రెండింటిలో ఏది నిజము?
జవాబు :- రెండు సందర్భములలో చెప్పిన రెండు మాటలు నిజమే.
జ్ఞానరీత్యా చూస్తే శరీరము లోపల గుణములను వదలుకోవలసియుండగా,
శరీరములోపల గల తన పరివారమయిన వారు 24 మంది యుండగా
వారిని వదలక, శరీరము బయట భార్యాపిల్లలను వదలడము అజ్ఞానము.
భార్యా పిల్లలను వదలమని ఏ దేవుడు చెప్పలేదు. ఇంకొక సందర్భములో
బయట వస్తువు మీద, ధనము మీద, బంగారుమీద ధ్యాసను పెంచుకొని
వాటి కొరకు మనము నిత్యము ప్రాకులాడుచున్నాము. బుద్ధుడు బయట
ధనము, బంగారుకంటే గొప్పగాయున్న భార్యాపిల్లలనే వదలినప్పుడు
బయట ఏదీ వదులుకోని మనము, ఆయనకంటే గొప్పవారమా అనుమాట
సత్యమే. బయట విషయములలో మనతో పోల్చుకుంటే ఆయనే గొప్ప.
అంతరంగ జ్ఞాన విషయములో జ్ఞానరీత్యా బ్రహ్మవిద్యా శాస్త్రం ప్రకారము
చూస్తే బయట భార్యా పిల్లలను వదలిన ఆయన అజ్ఞానియేనని చెప్పవచ్చును.
79) ప్రశ్న :- అర్జునునిలో ప్రేమ, గౌరవము, పెద్దలంటే పూజ్యత
ఉండేది. యుద్ధరంగములో పెద్దలయిన భీష్మ, ద్రోణుల వారి మీదికి చేయి
ఎలా ఎత్తేది? అని సందేహించాడు. వారిమీద గౌరవభావముతో
ధనుర్బాణములు క్రిందవేశాడు. అయితే మత్తు కల్గించే సారాయి త్రాగిన
మనిషి మారిపోయినట్లు కృష్ణుడు ఇచ్చిన గీతారసమును త్రాగిన అర్జునుడు
మారిపోయి పెద్దల మీద గౌరవమును వదలి వారి మీదికే చేయి ఎత్తి
యుద్ధము చేశాడు. అప్పటి విషయముకంటే ఇప్పుడు పాకిస్థాన్ వాళ్ళు
నేర్పే ఉగ్రవాదము చిన్నది కాదా? కృష్ణుడు అర్జునునికి నేర్పినది మంచిదా,
చెడ్డదా? ప్రేమనా, ఉగ్రవాదమా?
జవాబు :- మీరు చెప్పే పద్ధతి ప్రకారమైతే కృష్ణుడు చెప్పినది, నేర్పినది
హింసను గురించియనియే చెప్పవలెను. ఇప్పుడు ఉగ్రవాదము నేర్పి ఒక
మనిషిని ఉగ్రవాదిగా మార్చుటకు కనీసము ఆరునెలలైనా పట్టును. కృష్ణుడు
ఆరు నిమిషములలో ఆర్జునున్ని ఉగ్రవాద భావములలోనికి మార్చివేశాడు.
ఈ కాలములో నేర్పే ఉగ్రవాదముకంటే కృష్ణుడు నేర్పిన ఉగ్రవాదమే
గొప్పదియని చెప్పవచ్చును. అయితే ఆ దినములలో రాబోయే భవిష్యత్తు
లోని ప్రజలకు జ్ఞానమును అందించుటకు అర్జునునకు కర్మయోగమును
బ్రహ్మ యోగమును చెప్పాడు. అర్జునుడు ఆచరించుటకు కర్మయోగము
యోగ్యమయినదని చెప్పాడు. కర్మయోగమును అర్థము చేసుకోకపోతే
అది ఉగ్రవాదములాగనే కనిపించును. కర్మయోగమును అర్థము చేసుకొంటే
మనిషి కర్మలనుండి బయటపడి దేవునియందైక్యమై పోవును. అర్థము
కాకపోతే కర్మలను సంపాదించు ఉగ్రవాదములాగా కనిపించును. ఎవరి
దృష్ఠి వారిది. ఎవరి గ్రాహిత శక్తి వారిది.
80) ప్రశ్న :- “వాసాంసి జీర్ణాణి" అనే శ్లోకము చెప్పి “మనిషి చినిగిన
దుస్తులు వదలుకొని, క్రొత్త దుస్తులు ఎలా ధరిస్తాడో, అదే విధముగా
జీవాత్మ జీర్ణించిన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరిస్తుంది” అని
చెప్పి వేదాంతమును బోధిస్తారా? ముసలివారైన భీష్మ, ద్రోణ, కృపా
చార్యులకైతే వృద్ధులయిన దానివలన శరీరము జీర్ణమైనదని కొంత వరకు
చెప్పవచ్చును. అభిమన్యుడు, దుశ్శాసన, కర్ణుడులాంటి వారి లాగినా
లాగబడని శరీరము కల్గిన వారికి పై శ్లోకము ఎలా వర్తించును? శరీరము
ఎంతో దృఢముగాయుంటే ఆత్మ ఎందుకు బయటపడాలి? దానికి ఏమయినా
తెగులా? ఎందుకులెండి, లేని ఆత్మను ఉందని చెప్పే ప్రయత్నము?
జవాబు :- వస్త్రము దానంతట అది పాతబడి చినిగిపోవునది గలదు.
బలవంతముగా చించితే చినిగిపోవునది గలదు. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల
వారి దేహములు పాతబడినవే. అయితే యుద్ధములో ఎదురైన వారిలో
అభిమన్య, కర్ణ, దుశ్శాసన మొదలగు వారందరిది క్రొత్త శరీరమే. చేయునది
యుద్ధము, యుద్ధములో పాతదేహము, క్రొత్త దేహము అని అనుకోకూడదు.
శత్రువు పెద్దవయస్సువాడుగానీ, చిన్నవయస్సు వాడుగానీ తప్పక ఎదుర్కొన
వలసిందే. యుద్ధములో బలవంతముగా దేహము చినిగిపోయినప్పుడు
ఆత్మ అందులో ఉండలేదు. పాత శరీరము ఎట్లు నివాస యోగ్యముకాదో
అట్లే చినిగిన వస్త్రముగా యున్న శరీరము పాతవస్త్రమువలె మారి
యుండును. కావున ముసలివాడయినా, వయస్సువాడయినా శరీరము
పాతది సహజముగా అయినా, బలవంతముగా అయినా అవి నివాస
యోగ్యములు కావు. అందువలన వృద్ధులకుగానీ, యువకులకుగానీ
మరణము తప్పదు. శరీర విషయములో వయస్సు గడచుకొలది పాతది
అగుట గలదు. యువకులుగా యున్నప్పుడే పాతదగుట గలదు. అప్పటికి
కర్మ అయిపోయి వుండును. కావున తర్వాత జన్మకుపోయి అక్కడ ఏదీ
జ్ఞప్తిలేని దానివలన వెనుకటి జన్మతో సంబంధము లేకుండా బ్రతుకుదురు.
ఇదంతా సర్వసాధారణముగా జరుగునదే.
81) ప్రశ్న :- ఎవరు ఏ పని చేసినా ఏదో ఒక కోర్కె ప్రేరణతో చేస్తారు.
అన్ని కోర్కెలు త్యజించుకోవడము కూడా కోర్కెయగును కదా! 'నిష్కామ
కర్మ' అనడములో అర్థము ఏముంది?
జవాబు :- 'ఏ కోర్కె ఉండకూడదు' అని అనుకోవడము కూడా ఒక
కోర్కేయగును. అయితే ఇక్కడ చెప్పినది కోర్కె లేకుండాయని కాదు. కోర్కె
వలన వచ్చే కర్మను లేకుండా చేసుకొమ్మన్నాడు. కోరి చేసే పనులలో
వచ్చే కర్మను లేకుండా చేసుకొమ్మన్నాడు. ముందు అనుకోనిది, పూనుకోనిది
ఏ పనిని చేయలేము. ఇక్కడ పనిని చేయకుండా మానుకోవడము లేదు.
అయితే పనిని చేయట వలన వచ్చెడి కర్మను లేకుండా చేసుకొమ్మన్నాడు.
దానినే 'నిష్కామకర్మ' అని అనడము జరిగినది.
82) ప్రశ్న :- “భ్రామయన్ సర్వభూతాని యంత్రా రూఢాని మాయయా”
(గీత 18-61) “నా మాయ ప్రభావముతో జీవులను కీలుబొమ్మలుగా
ఆడిస్తున్నాను” అని చెప్పిన భగవద్గీత ఒక శ్లోకము తర్వాత శ్లోకములో
(18-63) ‘యధేచ్ఛసి తథాకురు” “నీకు ఎలా ఇచ్చ కలిగితే అలా చేయి”
అనే మాట ఎందుకన్నట్లు?
జవాబు :- మనిషి ఇష్టము ప్రకారము చేసినా అది వాని ఇష్టమునుబట్టి
జరగడము లేదు. మనిషిలోని ఇచ్చ కూడా ఆత్మదేయై యుండుట వలన
మనిషికి ఒక పనిని చేయాలను ఇచ్చను కల్గించి, ఆ ఇచ్ఛ ప్రకారము
పనిని చేయించుట వలన మనిషి నా ఇష్టము ప్రకారము పని జరుగు
చున్నదని భ్రమించుచున్నాడు. వాస్తవముగా లోపలికి పోయి చూస్తే అన్ని
పనులు ఆత్మ ఫతకము ప్రకారము నడుపుచున్నది. తాను గుర్తింపుకు
రాకుండా ఆత్మ చేయు పనులు స్వయముగా జీవుడు చేయునట్లు భ్రమింప
జేయుచున్నది. ఆత్మ తన మాయ చేత మనిషిని బొమ్మను ఆడించునట్లు
కర్మప్రకారము ఆడించడము జరుగుచున్నది. మనిషి (జీవుడు) ఆత్మ చేతిలో
ఆడింపబడుచున్నా ఆడించునది ఆత్మ, ఆడింపబడువాడు మనిషి (నేను)
అని గ్రహించలేక పోవుచున్నాడు. జ్ఞానము ప్రకారము ఆత్మ మనుషులను
బొమ్మలవలె నడుపు విధానమును 61వ శ్లోకములో చెప్పి ప్రక్కనే 63వ
శ్లోకములో అజ్ఞానము ప్రకారము మనిషి ఇచ్ఛ ప్రకారము పనులు చేయునట్లు
చెప్పడము జరిగినది. జ్ఞానులకు 61వ శ్లోకము సత్యము. అజ్ఞానులకు
63వ శ్లోకము సత్యము అనునట్లు చేశాడు.
83) ప్రశ్న :- “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం
త్వా సర్వ పాపేభ్యోః మోక్షయిష్యామి మాశుచః" ఈ ఒక్క శ్లోకము చెప్పితే,
దానినే పరిగణిస్తే, మిగతా శ్లోకములు చెప్పే అవకాశము లేదు కదా! అని
నేనంటాను. మీరేమంటారు?
జవాబు :- భగవద్గీతలో చెప్పినవి ముఖ్యముగా మూడు ధర్మములని
చాలామార్లు చెప్పాము. అందులో ఒకటి బ్రహ్మయోగ ధర్మము, రెండు
కర్మయోగ ధర్మము. ఈ రెండు కానిది భక్తి యోగము. మొదటి రెండు
యోగములు ధర్మములతో కూడుకొనియుండగా మూడవ భక్తి యోగము
ధర్మములకు అతీతముగా యున్నది. రెండింటిని మించినది భక్తియోగము.
మొదట ధర్మముల ప్రకారము రెండు యోగములను తెలియగల్గిన తర్వాత
ధర్మాతీతముగాయున్న భక్తియోగమును తెలియవచ్చును. మొదట రెండు
యోగములను తెలియనిదే చివరిదయిన భక్తియోగము అవగాహనకు రాదు.
అందువలన బ్రహ్మ, కర్మయోగములను తెలియగల్గితే తర్వాత భక్తి
యోగమును తెలియవచ్చును. ముందు గల రెండు యోగములను తెలియ
గల్గిన తర్వాత రెండు యోగములకున్నట్లు ధర్మములు లేని భక్తి యోగమును
తెలియగల్గితే అటువంటి వానికి మిగతా శ్లోకములతో పనేలేదు. ముందే
ధర్మములు లేని శ్లోకము చెప్పుటకు వీలులేదు. ధర్మములను తెలిసిన
తర్వాత ధర్మము లేని స్థితిలోనికి రావచ్చును. అందువలన ముందు
భగవద్గీతలో 17 అధ్యాయములు చెప్పి ఆఖరున 18వ అధ్యాయము చివరిలో
భక్తి యోగమును గురించి చెప్పాడు. మొదట ధర్మములులేని భక్తియోగమును
చెప్పిన అది వరుస క్రమము కాదు. అట్లు చెప్పినా భగవద్గీత జ్ఞానము
అర్థము కాదు. అందువలన ముందు ధర్మములతో కూడుకొన్న జ్ఞానమును
చెప్పడమైనది. ధర్మయుక్తమైన రెండు యోగముల ద్వారానే మనిషి ముక్తిని
పొందవచ్చును. ఆ రెండు విధానములను ఆచరించడము వలన
శరీరములోని ఆత్మ తెలియబడును. ఈ రెండు విధానములు కాని భక్తి
యోగమును తెలియుట వలన మనిషికి ముక్తియే లభించినా భక్తి యోగము
వేగవంతమైనది. ముందు రెండు యోగములు వలన కర్మ కాలిపోయిన
తర్వాత ముక్తి లభించును. వాటివలన ముక్తి లభించినా యోగము చేయు
కొలది కర్మ కాలుతూ వచ్చును. ఇదంతయూ పద్ధతి ప్రకారము జరుగు
చుండును. ధర్మాతీతమైన భక్తి యోగములో కర్మలు కాలిపోవడము చాలా
వేగముగా జరుగును. అయితే ముందు బ్రహ్మ, కర్మయోగములను
తెలియనిదే భక్తియోగము అర్థము కాదు. బుద్ధిలో శ్రద్ధయున్న వారు రెండు
యోగములను తెలియగల్గును. ఇంకా శ్రద్ధ గలవాడు భక్తియోగమును
కూడా తెలియగల్గును. ముందు బ్రహ్మ, కర్మయోగములను తెలియువాడు
యోగ భ్రష్టుడు అనుటకు అవకాశము తక్కువగాయుండును. భక్తి
యోగమును అనుసరించువాడు యోగభ్రష్టుడు అగుటకు అవకాశము ఎక్కువ
గలదు. అందువలన భక్తియోగములో ఎక్కువ కాలము ఎవడూ కొనసాగ
లేడు. ఒకవేళ భక్తియోగములో కొనసాగితే తక్కువ కాలములోనే మోక్షము
పొందు అవకాశము గలదు.
84) ప్రశ్న :- శివగీత, రామగీత, గోపిగీత అలాగే భగవద్గీత గలవు.
ఇవన్నీ కవి కల్పన. కవికి కావ్య చమత్కారము ప్రదర్శించటానికి ఏదో ఒక
ఆధారము కావాలి. అందువలన ఈ పేర్లు పెట్టి ఆ పేర్ల ఆధారముతో
కావ్యమును వ్రాశారు. అందులో కవి చమత్కారము తప్ప ఏమీ లేదని,
కవి కల్పన తప్ప ఏమీ లేదని అంటాను. మీరేమంటారు?
శివగీత, రామగీత, గోపిగీత, గురుగీత అను గ్రంథములను
కవులు వారి భావములను అందులో ఇరికించి వ్రాశారు. వాటిని చదివితే
వాటి విషయము కవులు వ్రాసినదని తెలిసిపోవును. అందులో మనుషులకు
తెలిసిన ఆధ్యాత్మికముంది గానీ, దేవుడు చెప్పిన, మనుషులకు తెలియని
ఆధ్యాత్మికము లేదు. భగవద్గీత అటువంటిది కాదు. దేవుడు అందించిన
ఆధ్యాత్మికము ఇందులో గలదు. అందువలన మిగతా గీతలతో సమానముగా
పోల్చి భగవద్గీతను చెప్పకూడదు. భగవద్గీత ప్రత్యేకమైన బ్రహ్మవిద్యా
శాస్త్రము. మిగతా గీతలలో శాస్త్రీయత ఉండదు. పురాణ కల్పితములు
మిగతా గ్రంథములలో కన్పించును. అయితే భగవద్గీతలో కర్మ రహస్యము,
యోగ వివరములు గలవు. భగవద్గీత బ్రహ్మవిద్యలో శాస్త్రబద్ధమైన గ్రంథము.
85) ప్రశ్న :- “తస్మాత్ యుద్ధ్యస్య భారతా” అని పదేపదే చెప్పాడు. అదే
భగవద్గీత యొక్క ఆంతర్యం అని కొందరి భావన. మీరు ఏమనుకొంటారు?
జవాబు :- అప్పుడు ఎదురుగా యున్నపని యుద్ధము చేయడమే,
కర్మయోగము ప్రకారము యుద్ధము చేయమన్నారు తప్ప యుద్ధము చేయడమే
ముఖ్యమని చెప్పలేదు. కర్మయోగము ప్రకారము పని చేయుట మేలు
త్యజించుటకంటే అన్నారు. సమయమునుబట్టి కర్మ ప్రకారము ఎదురైన
కార్యమును చేయమని చెప్పడమే భగవద్గీత యొక్క ఆంతర్యముగానీ, యుద్ధమే
చేయమనడము గీత ఆంతర్యము కాదు.
86) ప్రశ్న :- గతులు కల్గిన గతులు లేనియని (ప్రకృతి,మాయ) చర,
అచర ప్రకృతి గురించి మీ గీతలో “గతాసూ నగతాసూంశ్చ నాను శోచన్తి
పండితాః" అనే శ్లోకాన్ని గురించి చెప్పారు. అర్జునుడు అడిగిన ప్రశ్న
ఒకటైతే కృష్ణుడు చెప్పిన జవాబు ఇంకోలాగవుంది. ఎల్.కె.జి చదివే వానికి
ఫిలాసఫీ చెప్పితే అర్థమగునా?
జవాబు :- అతను ఏడ్చుచున్నాడు కావున ప్రస్తుత పరిస్థితిని బట్టి ఆ
శ్లోకముతోనే మొదలు పెట్టడము మంచిదయినది. సందర్భానుసారము
ఆ శ్లోకము చెప్పడము సమంజసముగానే యున్నది. అదే నిజమైన దారియని
మేము అనుకొంటున్నాము.
87) ప్రశ్న :- స్థూలముగా యున్న దుస్తులు ధరిస్తే వాటి ద్వారా శరీరమునకు
స్పర్శ, మెత్తదనము, వెచ్చదనము లేక చల్లదనము పొందవచ్చును. మరి
సూక్ష్మశరీరముగా ఉండే వారికి శరీరము, చర్మము లేనందున సుఖానుభూతిని
ఎట్లు పొందుదురు?
జవాబు :- సూక్ష్మశరీరమునకు స్థూలమైన చర్మము లేకున్నా స్పర్శ అను
ఇంద్రియశక్తి పని చేయుచుండును. అందువలన చర్మము వలన కలుగు
అన్ని అనుభూతులను సూక్ష్మ శరీరముల వారు పొందుచున్నారు. సూక్ష్మ
శరీరమునకు ఐదు జ్ఞానేంద్రియ శక్తులు ఉండుట వలన అన్ని
అనుభవములను సూక్ష్మ శరీరముల వారు పొందుచున్నారు. మనవలె
చూస్తున్నారు, తింటున్నారు. మిగతా అన్ని అనుభవములను స్థూల శరీరము
లేకున్నా పొందుచున్నారు.
88) ప్రశ్న :- జూదము ఆడి సర్వము కోల్పోయిన ధర్మరాజు చివరకు
భార్యను కూడా జూదములో పెట్టినా ధర్మరాజును తప్పుయని కృష్ణుడు
దండించలేదు. అలా ముందే దండించియుంటే ద్రౌపదికి వస్త్రాపహరణ
జరిగెడిది కాదు కదా! అర్జునునికి గీతోపదేశము చేసిన కృష్ణుడు ధర్మరాజుకు
నీతోపదేశము ఎందుకు చేయలేదు?
జవాబు :- పేరుకు ధర్మరాజు పెను చేపవిత్తు అనుమాట ఇక్కడ బాగా
తెలుస్తుంది. ఒక మనిషి తనకున్న రెండు ఎకరములలో ఒక ఎకరమును
జూదములో పోగొట్టుకొంటే వానిని అందరూ నిందిస్తారు. బంధువులు
నిందించడమే కాక ఇతరులు కూడా వానిని జూదరియని హేళన
చేయుదురు. అయితే తమ్ముళ్ళను, చివరికి భార్యను జూదములో పెట్టి
ఆడిన ధర్మరాజు, ఎకరము భూమి పోగొట్టుకొన్న వానికంటే ఎంతో నీచముగా
కనిపించుచున్నా అతనిని ఎవరూ దండించలేదు. అదేమో మనకు అర్థము
కాదు. బహుశా ఉన్నవానికి లేనివానికి ఉండే తేడా ఇదేనేమో! కృష్ణుని
విషయమునకు వస్తే ఆయన మనకు తెలిసినా తెలియకున్నా భగవంతుడే.
భగవంతుడు ప్రపంచ విషయములను గూర్చి చెప్పడు. తాను చెప్పునది
ఒక్క దైవికమయిన విషయములనే అయినందున అర్జునునికి భగవద్గీతను
చెప్పినా, ధర్మరాజుకు చిన్న నీతి కూడా చెప్పలేదు. నీతి, న్యాయము
ప్రపంచ సంబంధమైనవి. అట్లే జ్ఞానము, ధర్మము దైవ సంబంధమైనవి.
అందువలన దైవ సంబంధ జ్ఞానమును చెప్పు కృష్ణుడు ప్రపంచ సంబంధ
నీతిని గురించి చెప్పలేదు.
89) ప్రశ్న :- ద్రౌపదికి వాస్తవముగా ఐదుగురు భర్తలా? అటువంటి
సాంప్రదాయము ద్వాపర యుగములో ఇంకెవరి చరిత్రలో కనిపించలేదు.
“అమ్మా పండును తెచ్చాము అంటే ఐదుగురు పంచుకోండి” అనే మాటను
ఒక వ్యక్తి విషయములో నిర్ణయము తీసుకోవడము ఏ తల్లి అనుమతించ
కూడదు. కనీసం కృష్ణుడైనా వారించాలి కదా?
జవాబు :- ఈ విషయము తక్కువ జాతి మనుషులలో కూడా ఇంతకు
ముందు లేదు, ఇప్పుడూ లేదు. అమ్మా కోడలును తెచ్చానని అర్జునుడు
చెప్పియుండవచ్చును కదా! అట్లు కాకుండా పండును తెచ్చానని ఎందుకు
చెప్పాలి? ఇది ముందే చేసిన తప్పును కప్పిపుచ్చుకొనే దానికి చెప్పిన
మాటయనీ, వారు తల్లివద్దకు రాకముందే ద్రౌపదిని ఒకరికి తెలియకుండా
ఒకరు అనుభవించారని, చివరికది తెలిసి ఒక ఒడంబడికకు వచ్చారని,
అదియే ఐదుమంది ఆమెతో కాపురము చేయడమనీ, తమ తప్పును
కప్పిపుచ్చుకొనే నిమిత్తము 'అమ్మా పండు' మాటను పైకి తెచ్చారని
తెలియుచున్నది. వారేమో తల్లి మాటను జవదాటని వారిగా కనిపించుటకు
అట్లు చెప్పారు తప్ప అందులో నిజము లేదు. ఇది వారు మొదట చేసిన
తప్పేననీ, వారి అమ్మ తప్పు కాదనీ తెలియుచున్నది. సామాజిక నీతి
కూడా వారిలో లేదని తెలియుచున్నది. అంతేకాక జూదములో భార్యను
పెట్టారు అంటే వారు ఎంత నీతిమంతులో చెప్పకనే తెలియుచున్నది.
కృష్ణునికి వారిని గురించి బాగా తెలుసు. అయినా వారిని పట్టుకొని
నాటకమాడాడు తప్ప వారి పట్ల గౌరవము లేదు.
90) ప్రశ్న :- కౌరవులు నూర్గురు అని సమాచారము. అందరూ గాంధారికే
పుట్టారా? పిండ విచ్ఛేదనము వలన వందల ముక్కలు బయట కుండలో
పెరిగెను అన్నారు. దానిని ఇప్పుడు క్లోనింగ్ పద్ధతిలాంటిది అప్పుడున్నదా?
లేదంటే అందులో ఏదయినా దైవరహస్యము ఉన్నదా?
జవాబు :- ఇది ఆధ్యాత్మికము కాదు, అమ్మాపండు అని పాండవులు
ఇతరులను నమ్మించినట్లు, కుండలో గర్భవిచ్ఛేదనము అదియు నూరు
భాగములు పెరిగినదని చెప్పడము చాకచక్యమే అగును. క్లోనింగ్ పద్ధతి
ఆ రోజులలో వీరికొక్కరికే ఉండేదా? వారందరూ ఇతర స్త్రీలకు పుట్టిన
పిల్లలయివుంటారు. అంతేగానీ ఒక గర్భములో పుట్టినవారుండరు.
91) ప్రశ్న :- ఉత్తర భారతదేశములో మేనమామ కూతురు చెల్లెలుతో
సమానముగా చూస్తారు. దక్షిణ భారతదేశములో పెళ్ళి చేసుకొని భార్యగా
చెప్పుకొంటారు. వావి వరుసల విషయములు దేవుడు బ్రహ్మవిద్యా
శాస్త్రములో ఎందుకు వివరించలేదు? వావి వరుసలు తెలియకపోతే మనకు
పశువులకు ఏమి తేడా? ముస్లీమ్లు చిన్నాన్న కూతురును పెళ్ళి
చేసుకొంటారు. దేవుడు అసలైన విషయములను వివరించకుండా దేవున్ని
చేరే మార్గమే చెప్పితే అది అసంపూర్ణమేయగును. దీనికి మీరేమంటారు?
జవాబు :- దేవుడు ప్రపంచ విషయములలో జోక్యము చేసుకోకూడదని
ఒక హద్దును ఏర్పరచుకొన్నాడు. నీతి, న్యాయములను గురించి ఏమాత్రము
ఆయన జోక్యము చేసుకోడు. అట్లు నీతి, న్యాయముల గురించి చెప్పితే
ప్రపంచ సంబంధ పెద్ద మనిషిగా దేవుడు తయారయినట్లేయగును. దేవుడు
దైవిక విషయములలోనే జోక్యము చేసుకొనును. అదియూ భగవంతుని
వేషధారణలో, దేవుడు దేవునిగానే యుంటూ సాక్షిగా అన్నిటినీ చూస్తున్నాడు
తప్ప ఆయన ఏమీ చేసే స్థితిలో, చెప్పే స్థితిలో లేడు.
92) చంద్రుడు ఉపగ్రహము అయినా జ్యోతిష్యములో చంద్రున్ని గ్రహముగానే
చెప్పారు. సూర్యుడు గ్రహమే కాదు మీరు గ్రహము అని అంటున్నారు.
అది ఎట్లు చెప్పుచున్నారు?
జవాబు :- భూమిమీద వస్తువుల విషయములను గ్రహించడము తిరిగి
మనుషులకు లభించునట్లు చేయడము రెండు పనులను చంద్రుడు,
సూర్యుడు చేయుచున్నారు కావున జ్యోతిష్యము ప్రకారము సూర్య చంద్రులను
గ్రహములు అని అనుచున్నారు. చంద్రుడు కొన్ని విషయములను గ్రహించి
తన ఆధీనములో పెట్టుకొన్నాడు. ఉదాహరణకు నీటికి సంబంధించిన
సమాచారమును చంద్రుడు గ్రహించి భూమిమీద మనుషులకు నీరు ఎవరికి
లభ్యము కావాలో, ఎవరికి లభ్యము కాకూడదో తెలిసి కొందరికి నీరును
అనుకూలము చేసి వానికి బాగా లభ్యమగునట్లు చేయుచున్నాడు. కొందరికి
సరిగా లభ్యముకానట్లు, కొందరికి నీటి విషయములో అనేక చిక్కులు,
బాధలు కల్గునట్లు చేయుచున్నాడు. జ్యోతిష్యము ప్రకారము చంద్రుడు
అనుకూలము లేనివారికి ఈ బాధలు తప్పవని చెప్పవచ్చును. చెప్పినట్లే
నీటి బాధలు వారు పొందుట సత్యముగా, సాక్ష్యముగా కనిపించుచున్నది.
అందువలన చంద్రుడు గ్రహమే అంటున్నాము. అట్లే సూర్యుడు కూడా
గ్రహమని నిరూపింపబడుచున్నది. భూమిమీద గల వస్తు సముదాయము
యొక్క అధికారమును గ్రహించి వారి ఆధీనములో ఉంచుకొన్నాడు. కావున
వారిని గ్రహించువారు గనుక గ్రహములు అని అంటున్నాము.
93) ప్రశ్న :- ఆవలింతలు ఒకరికి వస్తే ప్రక్క వారికి కూడా ఎందుకు
వస్తాయి?
జవాబు :- ఆవలింతలు అంటు రోగములాంటివి. అందువలన ప్రక్కవారికి
కూడా రోగమువలె వ్యాపించుచున్నవి.
94) “పితృదేవతలను కొలిచేవారు (ఆరాధించే వారు) పితృ దేవతలనే
చేరుదురు” అని భగవద్గీత చెప్పుచున్నది. పితృదేవతల విగ్రహాలున్నాయా,
పితృదేవతలు విగ్రహాలను ఆవహిస్తారా?
జవాబు :- పితృ దేవతలు విగ్రహాల రూపములో లేరు. అకాల మరణము
పొంది సూక్ష్మ శరీరములతో యున్నవారినే పితృదేవతలని అంటున్నాము.
వారిని పూజించగా వారు కూడా అకాల మరణమునే పొంది వారి పెద్దల
వద్దకు పోయి సూక్ష్మముగానే ఉందురని అర్థము చేసుకోవలెను.
95) ప్రశ్న :- అకాల మరణము పొందిన వ్యక్తికి శ్రాద్ధాది కర్మలు
కొన్నాళ్ళు చేసి, జ్ఞానమార్గములోనికి వచ్చిన తర్వాత మనము వారికి ఆ
కర్మలు చేయకుండా మానివేసి ఆహారము పెట్టడము, క్రొత్త గుడ్డలు
చూపించడములాంటివి మానివేస్తే వారు ఏమవుదురు? మనపైన కోపగించు