ఆత్మ లింగార్థము cloud text 5thOct 2 Updated

ఆత్మ లింగార్థము.


రచయిత ముందు వ్రాత.


ఈ గ్రంథములోని పద్యములు అచేల సాంప్రదాయమునకు చెందినవి. ఈ అచేల సాంప్రదాయము ఎక్కడిదని కొందరికి

ప్రశ్నరావచ్చును. మేము చెప్పు “అచేలము” పూర్వముండెడిది. ఆనాటి అచలమే ఈనాడు “అచలము” అను పదముగ

మారిపోయినది. అచేలమనగా అర్థము గలదు, కాని అచలము అనగా అర్థమే లేదు. ఈనాడు అచల సాంప్రదాయులు

చాలామంది గలరు. మాది అచలపీఠమని ప్రత్యేకముగ పీఠమునేర్పరచుకొన్నారు. ఒకరోజు అచల పీఠగురువు మాతో

కలసినపుడు ఆయనను పరిచయము చేసుకొనుచు మేము అచల పీఠగురువులమని చెప్పారు. అపుడు అచలము అంటే

ఏమిటని మేము అడిగాము. అచలము అనగా చలనము లేనిదని ఆయన జవాబిచ్చాడు. అట్లయితే అచలనము అనాలి, కాని

మీరు అచలము అంటున్నారు. అచలములో “న” లేకుండ పోయినదని గుర్తుచేశాము. ఆ మాటకు ఆగురువు గారు కొంత

తికమకపడ్డారు. సరైన జవాబు ఆయనవద్ద లేకుండపోయినది. ఒక పెద్ద ఆధ్యాత్మికపీఠము యొక్క పేరే అర్థములేనిదై ఉండడము

మాకు చాలా ఆశ్చర్యమును కల్గించినది. అచలమంటే ఏమిటి? దాని నిజస్వరూపమేమిటను విషయమును ప్రజలకు తెలియబరుచు

ఉద్దేశముతో “ఆత్మలింగార్థము” అను ఈ గ్రంథమును వ్రాయడము జరిగినది. ఈ గ్రంథములోని పద్యములు మేము వ్రాసినవి

కావు. కాని పద్యములకు భావములన్నియు మేము వ్రాసినవే. పద్యములలో కూడ అచలము అను పదమునే వాడియుండుట

ఆశ్చర్యము. మా భావములలో మాత్రము మేము అచలము బదులు అచేలము అని వ్రాశాము. అచేలము అనగ బయలు అని

అర్థము. పరమాత్మను ఏమికాని బయలుగ వర్ణిస్తు చెప్పడమే కొందరి ఉద్దేశమైనందున పూర్వము “బట్టబయలు” అను

పదమునకు సరిపడు అర్థముతో అచేలము అన్నారు. అచలము అను పదము యొక్క అర్థము సారాంశము ఏమిటో సవివరముగ

క్రింద చూస్తాము.


కలియుగములో తయారయిన అనేక దేవాలయములలో శ్రీరంగ పట్టణములోని శ్రీరంగని ఆలయ సమీపములో

చిదంబర రహస్యమనునది కలదట. అక్కడకు పోయినవారు శ్రీరంగని దేవాలయము దర్శించిన తరువాత చిదంబర రహస్యమును

చూచుట పరిపాటి. కాని ఇది రహస్యమని దానిని ఎవరికి చెప్పకూడదని అక్కడి పెద్దలు చెప్పి, మిగత వారికి చూపడము

జరుగుచున్నది. రహస్యమనునది చెప్పకూడనిది చూపకూడనిది ఐనప్పటికీ చెప్పకూడదని చూపడములో ఏమి రహస్యము

గలదో. అక్కడ ఎవరికి తెలియని ఏదో ఒక విషయముండి తీరాలి అందువలననే దానిని రహస్యము అంటున్నాము. చిదంబర

రహస్యమును చెప్పిన బోధపడనిది, చూచిన అర్థము కాని విషయము, కావున దానిని చిదంబర రహస్యమన్నారు. చాలా

మందికి “చిదంబర” మను పేరు వివరము తెలియదు. చిద అనగ వస్త్రము, అంబరము అనగ ఆకాశము. ఈ విధముగ

చిదంబరము అను పదములో వస్త్ర ఆకాశము మరియు బట్ట బయలు అని అర్థము గలదు.చిదంబర రహస్యము బట్ట

బయలు అను వాక్యము కూడ కలదు. శ్రీరంగ పట్టణములోని చిదంబరమేమిటో కొంత తెలుసుకొందాము.


భగవద్గీత సాంఖ్య యోగమను అధ్యాయములో 22వ శ్లోకమునందు భగవంతుడు “వాసాంసి" అను పదమునుపయోగించి

శ్లోకమును చెప్పాడు. "కాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృష్ణాతి నరోపరాణి, తథిశరీరాణి విహాయ జీర్ణా నన్యాని సంయాతి

నవాని దేవా” ఇందులో పాత వస్త్రమును వదలి కొత్త వస్త్రమును ధరించినట్లు, పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును జీవుడు

ధరిస్తున్నాడని చెప్పాడు. ఇక్కడ శరీరమును గుడ్డతో పోల్చి చెప్పాడు. వస్త్రము అనినా, బట్ట అనినా, చేలము అనినా ఒకటే

అర్థము. అలాగే అంబరము అనినా, ఆకాశము అనినా, బయలు అనినా ఒకే అర్థము. అక్కడ దేవాలయములో ఉన్న

చిదంబర రహస్యమనునది ఏమిటని పరికించి చూచిన అక్కడ ఒక ద్వారమునకు అడ్డముగ వస్త్రమును వేలాడ దీసి ఉందురు.

ద్వారములోపల ఏమున్నదో కనిపించనట్లు ఆ వస్త్రము కట్టబడి ఉండును. లోపల ఏమున్నది తెలియదు, కావున అదియే


రహస్యము. లోపల ఏమున్నదో చూడాలనుకొన్నవారు అక్కడున్న వారిని అడిగి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.

చూడాలనుకొనువారికి చూపించు వారుందురు. వారు చూచువారికి ఇక్కడ చూచినది రహస్యము, కావున ఎవరికి చెప్పకూడదని

చెప్పి చూపించుచుందురు.


ఎందరో చిదంబర రహస్యమును చూచినప్పటికి చూడకమునుపు ఉన్న ఆత్రుత చూచిన తర్వాత లేదు. ఎందుకనగ

చూడవలెననుకొనువారు చూడకముందు రహస్యమును, అనగ చూడదగిన దానిని గురించి ఏదో ఊహించుకొని ఉందురు.

ఎవరేమి ఊహించుకొన్నప్పటికీ గుడ్డ తొలగించుతానే ఎవరికి ఏమి కనిపించకపోవడమే ఆశ్చర్యము. అక్కడ ఒక ద్వారము

దానికి అడ్డముగ ఒక గుడ్డ ఉండుననుకొన్నాము కదా! చూడవలసిన వారికి ద్వారము ముందర నిలబెట్టి గుడ్డ తీసి చూపుదురు.

గుడ్డతీసి చూడగనే అక్కడ ఏ వస్తువుగానీ, ఆకారముగానీ లేకపోవడము ఆశ్చర్యమే అగును. పై కప్పులేని ఆకాశము మాత్రము

కనిపించును. గుడ్డ తీసి అక్కడ ఏమి లేదే అన్నట్లు చూపించువారినడగగా, వారు ఆకాశమువైపు చూపించి ఇక్కడ మీరు

చూడవలసింది, కనిపించునది ఇదేనని చెప్పుదురు. ఏమి లేనిదే చిదంబర రహస్యము. ఇక్కడ ఏమి లేనట్లు చెప్పితే ఎవరురారు,

కనుక మీరు దీనిని రహస్యముగవుంచి ఎవరికి చెప్ప కూడదని తెలుపుదురు. చెప్పితే ఏమగునో, ఏ చెడు జరుగునోయని చూచి

వచ్చినవారు కూడ చెప్పకుండుట జరుగుచున్నది. అక్కడ ఆచారమున్నా అర్థము లేకుండ పోయినది. ఆధ్యాత్మిక పరమైన

పరమార్థికమైన అర్థము చెప్పుకోక, ఇక్కడ చూచినది ఎవరికి చెప్పవద్దనడము పొరపాటు. ఎవరు ఎవరికి చెప్పిన చిదంబరము

అనునది రహస్యమను అర్థముతోనే ఉండును. ఇటువంటి రహస్యముందని చూపు విధానమే చిద అంబరము.


జీవుడు శరీరములోనున్నంత వరకు మోక్షమును చెందలేడు. కర్మలేకుండ చేసుకొని శరీరమును పొందకుండ పోయినపుడు

పరమాత్మలోనికి ఐక్యమైపోవును. ఇటు శరీరము అటు మోక్షము రెండే గమ్యములు జీవునికి గలవు అనునది సత్యము.

శరీరమున్నంత వరకు దేవుడు తెలియడు. చావు పుట్టుకలుగల శరీరము దేవునికి నీకు మధ్యలో అడ్డముగనున్నది. పుట్టుకతో

మొదలై చావులో అంత్యమై తిరిగి వెంటనే పుట్టుకతో శరీరము జీవునకు తగులుకొనుచున్నది. శరీరము గుడ్డలాంటిదని

పాతగుడ్డ పోతూనే క్రొత్త గుడ్డ తగులుకొనుచున్నదని గీతలో దేవుడు చెప్పాడు. అందువలన ఆ గుడ్డ లేకపోతే నీవు దేవునివద్దకు

చేరవచ్చని, శరీరమును గుడ్డగ పరమాత్మను బయలుగ చూపించారు. శరీరము బట్ట అనీ, పరమాత్మను బయలుయనీ,

శరీరమును, పరమాత్మను బట్ట బయలుగ పోల్చారు. బట్ట తీసినపుడే బయలు కనిపించునని, శరీరము లేనపుడే దేవుడు

తెలియునని తెలుపునదే చిదంబర రహస్యము. బాహ్యార్థముగ బట్టను బయలును చూచినప్పటికీ శరీరధారులైన జీవులు

పరమాత్మను తెలియకున్నారని చెప్పుటకే, తెలియనిది రహస్యమని చిదంబరమునకు రహస్యమను పదము చేర్చినారు.

వివరము తెలియక ఇది రహస్యము ఎవరికి చెప్పకూడదనుటలో అర్థము లేదు. చేలము అనగ సమత శరీరము అనుకొన్నాము

కదా! చావుతో పోవు శరీరము ఆ క్షణమే పుట్టుకతో జీవునికి తగులుకొనుచున్నది. కావున ఎల్లపుడు బయలుగ పోల్చబడిన

పరమాత్మకు, చేలముగ పోల్చబడిన శరీరము అడ్డముగనున్నదని తెల్పుటకే శ్రీరంగములోని చిదంబరమని తెలియాలి. గుడ్డ

అడ్డముండగ అవతలనున్న బయలు ఎప్పటికి కనిపించదని తెలుపుచు మీకు శరీరమను చేలము అడ్డమునున్నందున, బయలను

పరమాత్మ తెలియడని తెల్పు నిమిత్తము రహస్యమనడములో అర్థముగలదు.


బట్ట తీసితే బయలు, బట్ట తీయకపోతే బయలు లేదు. అలాగే శరీరము పోతేనే మోక్షమని తెల్పుచు, బట్టలేని

స్థితియైన దానిని అచేలము అన్నారు. చేలము అనగ గుడ్డ, అచేలము అనగ శరీరము లేని మోక్షమని చెప్పారు. అజ్ఞానములో

ఉండి శరీరముతో జన్మలెత్తుచున్న వారిని చేలురని, జ్ఞానముకల్గి జన్మలేని స్థితిని కోరుచున్నవారిని అచేలురని పూర్వము

పెద్దలనెడి వారు. శరీరమును చేలమని, మోక్షమును అచలమని పూర్వము అనెడివారు. మోక్షమార్గమును అచేలమని,


అజ్ఞానమును చేలమని కూడ పిలిచెడివారు. జ్ఞానమార్గమైన అచలమను పదము కాలక్రమమున అచలముగ మారినది. జ్ఞాన

మార్గమనుసరించు వారు నేటికి ఉన్నారు. కాని వారు మాది అచలము అనడము అర్థములేని మాట. వారు మాది అచేలము

అని చెప్పవచ్చును కాని అచలమని చెప్పకూడదు.


ఈ గ్రంథములో అచేలమునే కాక ప్రపంచములోని అజ్ఞాన ప్రజలను గురించి, జ్ఞానుల గురించి, గురువుల గురించి

చెప్పడమైనది. అంతేకాక జ్ఞానసాధన పద్ధతులను, జ్ఞానులపట్ల మూర్ఖులుండెడి పద్ధతులను కూడ తెలియజేయడము జరిగినది.

మానవునికి కావలసిన జ్ఞానమును వరుసగ చెప్పుచు చివరికి అచేలమైన పరమాత్మను గురించి వర్ణించి చెప్పడము జరిగినది.

కపట గురువులను, కపట శిష్యులను గురించి చెప్పడమేకాక నిజగురువు యొక్క విలువను కూడ చెప్పడమైనది. ఈ గ్రంథము

జిజ్ఞాసులైన వారికి జ్ఞానమార్గములో అన్ని విధముల ఉపయోగపడగలదని భావిస్తున్నాము.


ఇట్లు,

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.



రచయిత రెండవ మాట.


దేవుడు మనిషి యొక్క గమ్యము. ఆ గమ్యమునే ముక్తి అని కూడ అంటున్నాము. ముక్తి కొరకు మనిషి

దేవుని తెలియు మార్గములను ఏర్పరచుకొన్నాడు. దేవుని అన్వేషించు మార్గములలో ప్రస్తుత కాలములో ఇందూమతములో

అద్వైతము, ద్వైతము అను రెండు పద్ధతులు ప్రచారములో గలవు. వాటితో పాటు వాటికి కొంత విభిన్నమైన “అచలము”

అను పద్ధతి కూడ కొంత ప్రచారములో గలదు. ఒక మనిషి ఆధ్యాత్మికములో ఉన్నాడంటే అతను అద్వైతమును గాని,

ద్వైతమును గాని, రెండు కాకపోతే అచలము గాని అనుసరిస్తుండును. అచలము అను పద్ధతి కొంత అద్వైతమునకు

దగ్గర పోలిక ఉన్నప్పటికీ ద్వైతమునకు పూర్తి విభిన్నముగానే ఉన్నది. మనిషి దేవున్ని తెలియుటకు అనుసరించు మార్గములైన

ద్వైత, అద్వైతములు, అచలముకాక అన్నిటికి ఆశ్చర్యమును కలిగించుచు "త్రైతము” అను మార్గము కనుగొనబడినది.

ద్వైత, అద్వైత, అచలములలో లేని శాస్త్రబద్ధత త్రైతములో ఉండడము విశేషమని చెప్పవచ్చును.


అద్వైతమును ఆది శంకరాచార్యుడు ప్రకటించగ, ద్వైతమును మధ్వాచార్యులు ప్రకటించారు. త్రైతసిద్ధాంతము

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల చేత ప్రకటితమైనది. ఇక అచలము ఎవరు ప్రకటించారో సరియైన సమాచారము

లేదు. అచల సాంప్రదాయ నిర్మాతల పేర్లు రెండు మూడు వినిపిస్తుండడము వలన కచ్చితముగ ఎవరు స్థాపించారో

తెలియకుండ పోయినది. ఇప్పుడే పుట్టిన త్రైతము చిన్న మొక్క స్థితిలో ఉండగ, వందల సంవత్సరముల పూర్వము పుట్టిన

అద్వైత, ద్వైతములు, అచలము వేళ్ళూనిన వృక్షములలాగ ఉన్నవి. ద్వైతమునకు, అద్వైతమునకు కొంత అర్థము

ఆచరణలు గలవు. అద్వైతులు ఆచరణలో విభూతి ధరించగ, విశిష్టా ద్వైతులు మూడు నామములను ధరించుచున్నారు.

అద్వైతులు పంచాక్షరి మంత్రమంటే, విశిష్టా ద్వైతులు అష్టాక్షరి మంత్రమంటున్నారు. అచలములోనికి వస్తే అచలము

అను పదమునకు అర్థముగాని, ఆచరణ గుర్తింపుగాని లేకుండుట వలన కొందరు విమర్శించుటకు అవకాశము గలదు.

పూర్వము అచలమును ప్రతిపాదించిన పెద్దలది మంచి ఉద్దేశమే అయివుండి, ప్రజలు సంపూర్ణజ్ఞానులు కావలెనను తపన

వారికుండెడిది. కాలగమణములో అచలముగ తయారయిన, పదము పూర్వకాలములో అచేలముగ ఉండి ఎంతో

అర్ధముతో కూడుకొని ఉండెడిది. దాని గొప్పతనమును నేటికాలములో కోల్పోవడము కొంత బాధకరమైన విషయము.

కావున దాని అర్థమును దానికి చేకూర్చు ప్రయత్నమే మా ఈ రచనలోని ముఖ్య ఉద్దేశము. మేము త్రైతసిద్ధాంతుల

మైనప్పటికీ అచలము యొక్క పూర్వ ఉద్దేశమేమో మాకు తెలుసును. కావున ఆ విషయమునే ఈ గ్రంథములో

వ్రాయడము జరిగినదని తెలుపుచున్నాము.



ఆత్మ అంటే ఎవరు.


మన శరీరములో మూడు ఆత్మలు గలవు. అవియే క్షరుడు, అక్షరుడు, పురుశోత్తముడు. ఈ గ్రంథములో ఆ ముగ్గురు

పురుషులను జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని చెప్పడము కూడ జరిగినది. ప్రతి పద్యభావము మొదటిలో ఒకటవ ఆత్మయిన

జీవాత్మ, రెండవ ఆత్మయిన ఆత్మను సంబోధిస్తు భావమును మొదలు పెట్టడము జరిగినది. ప్రతి భావములో సంబోధనకు

ముందే ఆత్మయొక్క స్థితి, గొప్పతనము, పద్ధతిని గూర్చి చెప్పుచు ఓ ఆత్మా! వినుము అనడము జరిగినది. ప్రతి సంబోధన

ముందర ఆత్మను గురించి చెప్పిన వాక్యములు ఆత్మ యొక్క నిజస్వరూపమును చూపుచున్నవి. ఇంతవరకు ఆత్మను గురించి

చెప్పిన వాక్యములు ఎక్కడలేనందున ఈ గ్రంథములో ఆత్మ ఔన్నత్యమును పాఠకులు గుర్తించుటకు వాటిని ఇక్కడ ప్రత్యేకముగ

పొందుపరచడము జరిగినది. అన్నిటిని ఒక్కమారు వరుసగ చదువుట వలన ఇంతవరకు ఎక్కడ గుర్తింపబడని రెండవ ఆత్మ

విషయము కొంతయిన అవగాహనకు రాగలదని భావించుచున్నాము.



01. సమస్త జీవరాసులందు కలిసియున్నది ఆత్మ!  వినుము.


02. అఖిల జీవులందు ఒకే చైతన్యముగనున్నది ఆత్మ!  వినుము.


03.గాలిలో గంధము కలిసి కనిపించనట్లు, శరీరములో కంటికి కనిపించక ఉన్నది ఆత్మ!  వినుము.


04. సాక్షియై అన్ని శరీరములందున్న అందరిలో ఉన్నది ఆత్మ!  వినుము.


05. శక్తిరూపములో శరీరమంతయూ వ్యాపించియున్నది ఆత్మ!  వినుము.


06. సమస్త జీవులందు కార్యరూపమై ఉన్నది ఆత్మ!  వినుము.


07. సమస్త జీవులందు చైతన్యముగనున్నది ఆత్మ!  వినుము.


08.మూడు ఆత్మలలో రెండవదైనది మధ్యాత్మ!  వినుము.


09. అఖిల జీవరాసులందు అన్ని పనులు చేయిస్తున్నది ఆత్మ!  వినుము.


10. సమస్త జీవరాసులందు చైతన్యరూపమై ఖండ ఖండములుగా శరీరములో వ్యాపించి ఉన్నది ఆత్మ!  వినుము.


11. సర్వ జీవరాసులందు నివశిస్తూ, ఆయా శరీర ఆకారము కల్గియున్నది ఆత్మ!  వినుము.


12. శరీరమను గుడిలో దీపమై శరీరమంతటికీ వెలుగు నిచ్చుచున్నది ఆత్మ!  వినుము.


13. సమస్త శరీరములలో జీవునితోపాటు ఉంటూ, ఆ శరీరమునకు శక్తినిచ్చుది ఆత్మ!  వినుము.


14. ముగ్గురు పురుషులలో అక్షర పురుషుడై శరీరములోనున్నది ఆత్మ!  వినుము.


15. ప్రతి శరీరములో జీవాత్మలకు సాక్షిగాయున్నది ఆత్మ!  వినుము.


16. ఇంద్రియములకు శక్తినొసగునది ఆత్మ!  వినుము.


17.కొలిమి మంటకు గాలితిత్తి, తిత్తిని కదిలించు కట్టె, కట్టెకు చివర కూర్చొని కదిలించుచున్న వ్యక్తి, ఎలాగ అనుసంధానమై ఉన్నారో, అలాగే శరీరములో ముక్కులలోని శ్వాసకు ఊపిరితిత్తులు, తిత్తులకు బ్రహ్మనాడి, నాడికి చివరలోవుండి అన్నిటినీ కదిలించునది ఆత్మ!  వినుము.


18. శరీరములో శ్వాసను నడిపించునది ఆత్మ!  వినుము.


19. సమస్త జీవులందు ఒకేపని చేయుచున్నది ఆత్మ!  వినుము.


20. రెండవ ఆత్మయై శరీరములో అన్ని పనులూ చేయుచున్నది ఆత్మ!  వినుము.


21. శరీరములో నివాసముంటున్న మూడు ఆత్మలలో అహర్నిశలు జీవున్ని కాచుకొనియుండునది, రెండవది ఆత్మ!  వినుము.


22. ముగ్గురు పురుషులలో మధ్యవాడై, పూజ్యుడైయున్నది ఆత్మ!  వినుము.


23.సమస్త సజీవ శరీరములందు నఖ, శిఖ పర్యంతమూ వ్యాపించి శరీరములోని అన్ని అవయవముల చేత పనులు చేయించుచున్నది ఆత్మ!  వినుము.


24.శరీరములోని జీవునికి సాక్షిగానున్నది ఆత్మ!  వినుము.


25. పూలహారములో ఆధారమై దాగియున్న దారమువలె శరీరములో కనిపించక శరీరములకంతటికీ ఆధారమైయున్నది ఆత్మ!  వినుము.


26.శరీరాంతర్గతములలో ఉండి జ్ఞానము చేత పొగడబడునది ఆత్మ!  వినుము.


27.సమస్త జీవ శరీరములలో మూడు గుణముల మధ్య సాక్షిగా యున్నది ఆత్మ!  వినుము.


28. అఖిల జీవులతో కూడియున్నది ఆత్మ!  వినుము.


29.సమస్త జీవరాసులయందు గల మూడు ఆత్మలలో మధ్యనున్నది ఆత్మ!  వినుము.


30. చిన్న చీమలలోనూ పెద్ద ఏనుగులోనూ ఒకే విధానము కల్గి కర్మను పాలించునది ఆత్మ!  వినుము.


31. శరీరములోని అన్ని భాగములకు శక్తి నిచ్చుచూ ఎవరికీ తెలియకుండా వున్నది ఆత్మ!  వినుము.


32.అందరి శరీరములలో ఎవరికీ తెలియకుండా నిదురలోనూ, మెలుకువలోనూ అందరియందూ పనిచేయుచున్నది ఆత్మ!  వినుము.


33. అద్వైతాది మహా మునులు శరీరములో ఉన్నది నేను ఒక్కడినేనని చెప్పుకొనుచుండినప్పటికీ ఆత్మ మాత్రము వేరుగాయుండి జీవుని  కర్మ ననుసరించి శరీరమును కదిలించుచూ, జరిగెడి ఏ కర్మకూ బాధ్యుడు కానిది ఆత్మ!  వినుము.


34. శరీరములో అణువణువునా వ్యాపించి విధిని అనుసరించి శక్తినిచ్చునది ఆత్మ!  వినుము.


35. శరీరములో బాహ్య ప్రపంచముతో సంబంధము పెట్టుకొని ఎల్లవేళలా పనిచేయుచున్నది ఆత్మ!  వినుము.


36. శరీరములో ఏమాత్రము నిద్రలేకుండా ఎల్లప్పుడూ మేల్కొని పనిచేయుచున్నది ఆత్మ!  వినుము.


37. ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క ఆత్మగా, జీవాత్మకు తోడున్నది ఆత్మ!  వినుము.


38. శరీరాంతర్గతమై బాహ్య దృష్ఠికి కనిపించక, జీవాత్మలైన స్వాములు, మునులు కూడా నేనే ఆత్మనని తలపోయునట్లు చేసి తాను మాత్రము వేరుగానున్నది ఆత్మ!  వినుము.


39. జీవాత్మకు పరమాత్మకు మధ్యనగలది ఆత్మ!  వినుము.


40. చెట్టులో తేమ వ్యాపించినట్లు, శరీరములో శక్తిగా వ్యాపించి యున్నది ఆత్మ!  వినుము.


41. ఇనుముతో కలిసిన అగ్నికి కూడా కొలిమి దగ్గర సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లు, జీవునితో చేరి శరీరమంతా వ్యాపించి అప్పుడప్పుడు ఆకలికి శక్తిహీనత చెందుచున్నది ఆత్మ!  వినుము.


42. శరీరములో బ్రహ్మనాడిని కేంద్రముగా చేసుకొని శరీరమంతా వ్యాపించియున్నది ఆత్మ!  వినుము.


43. జీవాత్మకు పెద్దవాడు, పరమాత్మకు చిన్నవాడయినది ఆత్మ! జీవుని పాత్రదారునిగా ఆడించునది ఆత్మ!  వినుము.


44. సమస్త శరీరములలో నాశనమగు జీవాత్మతో కలిసి నివాసము చేయుచున్నా నాశనముకానిది ఆత్మ!  వినుము.


45. శరీరమందు మాత్రము శక్తిగయున్న రెండవది ఆత్మ!  వినుము.


46. శరీరమందు కర్మానుసారము కదలికలిచ్చుచూ, కర్మానుసారము రోగములు కలుగజేయుచూ, వాటిని అనుభవింపజేయునది ఆత్మ!  వినుము.


47. శరీరములోని మూడు ఆత్మలలో మధ్య ఆత్మయై శరీరమును నడిపించు శక్తియున్నది ఆత్మ!  వినుము.


48.శరీరములో ఎవరూ గుర్తించలేని విధముగా శరీర ఆకృతిని పోలియుండునది ఆత్మ!  వినుము.


49. శరీరములోని బ్రహ్మనాడిని స్థావరముగ ఏర్పరచుకొని శరీర మంతటా నఖ శిఖ పర్యంతము వ్యాపించి శరీరాకృతిని పోలియున్నది ఆత్మ!  వినుము.


50. శరీరము లోపల జరుగు సమస్త కార్యములకు సాక్షియైయున్నది ఆత్మ!  వినుము.


51. అకాల మరణము పొందినవానికి శరీరము పోయినప్పటికీ అదే శరీరాకృతి కల్గి, సూక్ష్మముగా కనిపించక వాని కర్మానుసారము ఆడించునది ఆత్మ!  వినుము.


52.మరణముండి నాశనము లేనిది ఆత్మ!  వినుము.


53. ఆకాశముననున్న సూర్యుడొక్కడే ప్రపంచమంతటినీ తన వెలుగుచే ప్రకాశింపజేసినట్లు, బ్రహ్మనాడియందుండి శరీరమంతటా చైతన్యముగా వ్యాపించియున్నది ఆత్మ! 


54.శరీర గృహములో యజమానియైనది ఆత్మ!  వినుము.


55.హృది మధ్యలో నివాసముజేయుచూ సూత్రధారియైయుండి జీవుని పాత్రదారునిగా ఆడించునది ఆత్మ!  వినుము.


56.సమస్త జీవులందు ఏకకార్య స్వరూపుడయినది ఆత్మ! 


57.పురుషులందు రెండవ వాడయిన అక్షర పురుషుడు ఆత్మ!  వినుము.


58. సమస్త జీవులందు కదలిక శక్తినిచ్చునది ఆత్మ!  వినుము.


59. ముందు తానుండి తన వెనుక జీవున్ని పెట్టుకొనినది ఆత్మ!  వినుము.


60. పరమాత్మ ప్రక్కనుంచుకొని జీవునితో కలిసియుండి శరీరముతో పనులు చేయునది ఆత్మ!  వినుము.


61. అన్ని జీవులందు వేరువేరుగా కలిసియున్నది ఆత్మ!  వినుము.


62. శరీరము వెలుపల ఏమాత్రము లేక లోపల మాత్రము చైతన్యముగానున్నది ఆత్మ!  వినుము.


63. అఖిల జీవులందు కలిసియున్నది ఆత్మ!  వినుము.


64. మూడు గుణములకు వేరుగ వున్నది ఆత్మ!  వినుము.


65. జీవుల ప్రక్కనేనున్నది ఆత్మ!  వినుము.


66. కాగిన ఇనుములో అగ్నియున్నట్లు, సమస్త జీవుల శరీరములందు ఇమిడియున్నది ఆత్మ!  వినుము.


67. సూర్యుడొక్కడు ఈ లోకమును ప్రకాశింపజేయునట్లు, శరీరమంతటినీ తానొక్కడే ప్రకాశింపజేయునది ఆత్మ!  వినుము.


68. నాశరహితుడై నాశనముకాగల జీవాత్మతో కూడివున్నది ఆత్మ!  వినుము.


69. పూసల మధ్యలో దారమున్నట్లు, జీవుల శరీర మధ్యలో శరీరమంతటికీ ఆధారమైయున్నది ఆత్మ!  వినుము.


70. ఎడతెరిపి లేకుండా ఎల్లకాలములందు జీవునితో కలిసియున్నది ఆత్మ!  వినుము.


71. చర ప్రకృతియైన శరీరమంతటా వ్యాపించియున్నది ఆత్మ!  వినుము.


72. పంచభూత నిర్మాణమైన శరీరమునకు ఆధారముగనున్నది ఆత్మ!  వినుము.


73. పరమాత్మయూకాక, జీవాత్మయూకాక కేవలము ఆత్మయై జీవాత్మతో పాటు శరీరములోనున్నది ఆత్మ!  వినుము.


74. మొదటిదయిన జీవాత్మకు, మూడవదయిన పరమాత్మకు మధ్య సంధానమైయున్న రెండవది ఆత్మ!  వినుము.


75. కాగిన ఇనుములో ఇనుమంతయూ అగ్ని వ్యాపించి యున్నట్లు, శరీరమంతా వ్యాపించియున్నది ఆత్మ!  వినుము.


76. పరమాత్మ పాలించు విశ్వమను సామ్రాజ్యములో శరీరమను సామంత రాజ్యమునకు రాజయినది ఆత్మ!  వినుము.


77. ప్రపంచమంతటికీ గల ముగ్గురు పురుషులలోనూ మధ్య పురుషుడుయై అక్షర పురుషుడని పేరుగాంచి, క్షరపురుషునివద్ద నిలచినది ఆత్మ!  వినుము.


78. శరీరములో సకలేంద్రియములకు శక్తినిచ్చునది ఆత్మ!  వినుము.


79. బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములకు ఇరుసుగ నున్నది ఆత్మ!  వినుము.


80. జ్ఞానులయందునూ, అజ్ఞానులయందునూ, మూర్ఖులయందునూ, తెలివైన వారియందునూ, మంచివారియందునూ, చెడువారి యందునూ, అన్ని మతములవారియందునూ ఒకే పద్దతి కల్గి, ఒకే విధముగా రాగము (ప్రేమ) గానీ, ద్వేషముగానీ లేకుండా వర్తించునది ఆత్మ!  వినుము.


81. పురుషాకృతియైన ఈశ్వరలింగము మీద ముగ్గురు పురుషుల గుర్తుగయున్న మూడు విభూతి రేఖలలో మధ్య రేఖగా గుర్తింపబడి యున్నది ఆత్మ!  వినుము.


82.శరీరములోనే దృష్ఠినిల్పి దేవుని తెలియవలెనని ప్రయత్నించు యోగులకు తెలియబడు రెండవది ఆత్మ!  వినుము.


83. పూలమాలకు ఆధారమైన దారమువలె, శరీరమునకు ఆధారమై యున్నది ఆత్మ!  వినుము.


84.సకల శరీరములందు మూడవస్థలలో చైతన్యమునిచ్చునది ఆత్మ!  వినుము.


85.పాపము చేయునపుడు, పుణ్యము చేయునపుడు ఒకే విధముగా శరీరమునకు శక్తినిచ్చి, ఏ కర్మ అంటకుండా ఉండునది ఆత్మ!  వినుము.


86. భువిలో ఎన్ని జీవరాసులున్నాయో అన్నిటిలోనూ అన్ని ఆత్మలుగా విభజించబడి, పరమాత్మ ప్రతినిధిగా ప్రకృతిలో కలిసి శరీరములో పనిచేయుచున్నది ఆత్మ!  వినుము.


87.ఏ విషయముతో సంబంధము లేకుండా శరీరములోని కర్మ ప్రకారము శరీరమును నడిపించునది ఆత్మ!  వినుము.


88. శరీరములోని బ్రహ్మనాడి యొక్క ఏడు ద్వారముల ద్వారా మరియు గ్రంథుల యొక్క ఏడు ద్వారముల ద్వారా శరీరమును పాలించునది ఆత్మ!  వినుము.


89. సమస్త జీవరాశుల బుద్ధికి సమానముగా అర్థమగునది ఆత్మ!  వినుము.


90. అయమాత్మ బ్రహ్మమని సమస్తయోగుల చేత ఉచ్ఛరించబడునది ఆత్మ!  వినుము.


91. జాగ్రత్త, స్వప్న, నిద్రయనబడు మూడవస్థలకు సాక్షిగనున్నది ఆత్మ!  వినుము.


92.మూడు ఆత్మలయందు మధ్య ఆత్మయై, సమస్త యోగులచే ఆరాధింపబడునది ఆత్మ!  వినుము.


93. శరీరములోని 25 భాగములకు అతీతముగాయుండి, శరీరమంతటికీ శక్తినొసగునది ఆత్మ!  వినుము.


94. పరమాత్మకంటే తక్కువవాడై, జీవాత్మకంటే ఎక్కువ వాడైయున్నది ఆత్మ!  వినుము.


95. ఇంటిలో విద్యుచ్ఛక్తిలాగా, శరీరములో చైతన్య శక్తియైయున్నది


96.ఆత్మ!యోగులయందునూ, భోగులయందునూ సమాన వృత్తి కలిగి యున్నది ఆత్మ!  వినుము.


97. శరీరములో అణువణువునా వ్యాపించి శరీరాంతర్గత పనులకు కారణశక్తియై యున్నది ఆత్మ!  వినుము.


98.అండజ, పిండజ, ఉద్భిజములైన మూడు రకముల జీవరాశులలో ఏ జీవరాశియందైనాగానీ, ఒకే సిద్దాంతము, ఒకే నిర్ణయముగా, ఒకే పద్ధతిగా పనిచేయునది ఆత్మ!  వినుము.


99. జీవాత్మ ఏ శరీరములో ప్రవేశించినా, దానివెంట ఆ శరీరములో ప్రవేశించి అక్కడ కర్మరీత్యా ఏమి జరుగవలెనో, ఆ పనులను శరీరము ద్వార చేయించునది ఆత్మ!  వినుము.


100. శరీరములో పని తాను చేసి ఫలితమును జీవాత్మకు అందించేది ఆత్మ!  వినుము.


101. శరీరములోని ప్రాణమునకు ఆధారమై ఆడించుచున్నది ఆత్మ!  వినుము.


102. నేను పుట్టినప్పటినుండి నాలో అన్ని పనులకు సాక్షిగయుంటూ ప్రారబ్ధమును నాచేత అనుభవింపజేయునది ఆత్మ!  వినుము.


103. శరీరమనెడి రథమునకు సారథిగయుండి, ఇంద్రియములనెడి గుఱ్ఱములను త్రోలు సారథియై, శరీర రథమును అధిష్ఠించి యున్న జీవునికి సుఖదు:ఖములనెడి అనేక ప్రదేశములను చూపుచున్నది. ఆత్మ!  వినుము.


104. చెట్టుకు తాట అనుబంధమై ఉన్నట్లు, శరీరములోని జీవాత్మకు శక్తి రూపములో అనుబంధమైయున్నది ఆత్మ!  వినుము.


105. సంసారమను నాటకమునకు పరమాత్మ సూత్రధారికాగా, నాటకమును వీక్షించుచూ నాటకములోని భావములను అనుభవించు ప్రేక్షకుడు జీవుడుకాగా, నాటకమును ఆడునది ఆత్మ!  వినుము.


106. శరీరములో ఆత్మ చేస్తున్నప్పటికీ జీవాత్మ తాను చేసినట్లు తలచితే, ఆ పనిలోని కర్మను జీవునికి అంటగట్టునది ఆత్మ!  వినుము.


107. శరీరములో ప్రారబ్దకర్మ ప్రకారము సుఖదు:ఖములను ఆడించుచూ, అహము పొందిన జీవాత్మ పాలిట చిత్రగుప్తుడుయై, ఆగామి కర్మను అంటగట్టునది ఆత్మ!  వినుము.


108. మంచి చెడు కర్మలను తారతమ్యము లేకుండా ఆచరించుచూ, పాపపుణ్యములకు సంబంధము లేనిది ఆత్మ!  వినుము.


109. అజ్ఞానులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచూ ఆగామి కర్మను అంటగట్టుచూ, జ్ఞానము తెలిసిన యోగులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచూ, ఆగామి కర్మను అంతము చేయుచున్నది ఆత్మ!  వినుము.


110. శరీర యంత్రాంగములో 24 భాగములను ఒక్క జీవుని కొరకు నడిపిస్తూ పరమాత్మకు బంటుగ నిలిచినది ఆత్మ!  వినుము.


111. శరీరములో ఆత్మ ఏమి చేయుచున్నది ఎవరికీ తెలియనీయకుండా నిద్రించు సమయములో కూడా శ్వాసను నడుపుచున్నది. అటువంటి ఆత్మ ఉనికిని తెలియక అన్ని నేనే చేయుచున్నానని జీవుడు భ్రమిస్తున్నప్పటికీ ఏ పనినీ జీవునికి వదలక అన్ని పనులనూ ఎంతో ఓర్పుగా చేయుచున్నది ఆత్మ!  వినుము.


112. శరీరములో తప్ప బయట ఎక్కడా ఏ వస్తువందూ లేనిది ఆత్మ!  వినుము.


113. శరీరములో బుద్ధికి తెలియని విద్యలయిన, జంతువు చిన్నతనము లోనే నీటిలో ఈదడమును, దూడ పాలపొదుగును గుర్తించడమును, ఐదు సంవత్సరముల చిన్నవయసు మనిషికి పాండిత్యము కలుగడము మొదలగు వాటిని తెలియజేయుచూ ఏమీ తెలియని దానివలెనున్నది ఆత్మ!  వినుము.


114. జీవుడు ధరించిన శరీరము ఎంత పరిమాణముండునో అంతే లావు, అంతే ఎత్తు కల్గి ఆ శరీర ఆకృతిని కల్గియున్నది ఆత్మ!  వినుము.


115. శరీరములో అంతటా వ్యాపించియుండి, కర్మవుంటే చేతిలోనో, కాలిలోనో శక్తి లేకుండా చేసి, అవిటివానిగా కనిపింపజేయుచూ జీవునికి కర్మను అనుభవింపజేయునది ఆత్మ!  వినుము.


116. శరీరములో ప్రారబ్ధకర్మను జీవుని చేత అనుభవింపజేయు యమధర్మరాజుయై, అహముగల వానికి ఆగామికర్మను తలకు ఎక్కించడములో చిత్రగుప్తుడుయై చలామణి అగునది ఆత్మ!  వినుము.


117. మరణములోనూ, పుట్టుకలోనూ జీవునివెంట వుండి మరణము నుండి పుట్టుక వరకు గుణములనూ, జీవుని కర్మ సముదాయమునూ తీసుకువస్తున్నది ఆత్మ!  వినుము.


118. శరీరములో అన్ని పనులు చేయుచూ, ఏ ఒక్క పనిని కూడా నేను చేశానని బయటికి తెలుపక, ఎన్నో విజ్ఞాన పరికరములను కనిపెట్టించు యోచనను ఇచ్చినప్పటికీ ఏమీ తెలియని జీవుడు నేను కనిపెట్టానని చెప్పుకొనుచున్నప్పటకీ ఊరక చూస్తుండినది ఆత్మ!  వినుము.


119. చావులోనూ, పుట్టుకలోనూ సాక్షీభూతుడుయై ఆ సమయములో ఏమి జరుగుచున్నదో ఎవరికీ తెలియని రహస్యమును తెలిసినది ఆత్మ!  వినుము.


120. చెట్టులో చెట్టు ఆకృతిని పోలియుండి, జంతువులో జంతువు ఆకృతిని పోలియుండి, మనిషిలో మనిషి ఆకృతిని పోలియుండి అనేక శరీరములలో ఆ శరీరములవలె అనేక ఆకారములు కల్గియున్నది ఆత్మ!  వినుము.


ఆత్మ లింగార్థము.


ఈ గ్రంథమునందు ప్రతి పద్యము చివరిలో “అఖిల జీవసంగ ఆత్మలింగ” అని చెప్పబడినది దీని అర్థమేమనగా!

అన్ని జీవరాసులందు కలసి ఉన్న ఓ ఆత్మా అనుటయే. "ద్వా విమౌ పురుషా లోకే" అను గీతా వాక్యము ప్రకారము మన

శరీరములో రెండు ఆత్మలున్నవి. ఒకటి జీవాత్మ, రెండవది ఆత్మ. జీవాత్మ ఒక్క శరీరమునందు మాత్రము వ్యాపించి

ఉన్నది. ఆత్మ అన్ని దేహములందు వ్యాపించి ఉన్నది. ఈ గ్రంథమందు పద్యములు చెప్పినవాడు కూడ మనిషియే, ఆయన

శరీరమందు కూడ ఆత్మ ఉన్నది. తాను చెప్పు విషయములు ఇతరులకు చెప్పనట్లు, తనలో ఉన్న ఆత్మకే చెప్పుకున్నట్లు

పద్యాల చివర “అఖిల జీవసంగ ఆత్మలింగా” అన్నారు. ఇట్లు చెప్పుటవలన ఇతరులకు ఇష్టమైతే ఈ మార్గమును అనుసరింతురు,

కష్టమైతే వదలి పెట్టుదురు, కాని సరిపడనివారు దూషించరు. ఈ గ్రంథములో అజ్ఞానులలోని అందకారమును చూపెట్టుచు

జ్ఞాన మార్గము లను చెప్పడమైనది. అటువంటపుడు ప్రజలను ఉద్దేశించి చెప్పినట్లు కనిపించిన, కొంతమందికి వ్యతిరిక్తముగా

ఉండును. కావున చెప్పు విషయము ప్రజలకే అయినా చివరి వాక్యము తనలోని ఆత్మకే చెప్పుకొన్నట్లు వ్రాయబడినది.


 శ్రీ పరశివ నీదు శృంగార తత్త్వంబు

నీ మహీతలమున నెచ్చుగాను

నేను చెప్పబూన నేర్చితి నీకృప

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : సమస్త జీవరాసులందు కలసియున్న ఓ ఆత్మా! వినుము, మాకంటే పరముగా ఉన్నవాడా! ఆత్మకంటే వేరుగా

ఉన్న ఓ పరమాత్మ! నీ యొక్క మహిమా విశేషమును, అందమైన విధానమును నీ కృపాకటాక్షము వలన నేచెప్పబూనినాను.


నీతి భక్తియోగ నిజమెల్ల గురుమూర్తి

చెప్పి శతకమిట్లు చేసినాడు

రండు దీని జూడ రక్తిగా మీరెల్ల

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : అఖిల జీవులందు ఒకే చైతన్యముగనున్న ఆత్మా! నాలో ఉన్న శ్రీ గురుదేవుడే నాచేత నీతి భక్తి యోగములను

వ్రాయించి శతకముగా జేయించినాడు. మీరందరు సంతోషముతో దీనిని తెలుసుకొనుడు.


శంక పట్టకండి శాస్త్రజ్ఞుడను గాను

వంక లెంచకండి వైరమునను

మనస్సు నిల్పి దీని మర్మంబు దెలియండి

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : గాలిలో గంధము కలసి కనిపించనట్లు, శరీరములో కంటికి కనిపించక ఉన్న ఓ ఆత్మా! వినుము. తప్పు

పట్టకండి శాస్త్రముల తెలిసినవాడనుగాను. నాపైన సరిపోని భావముతో ఇది పనికిరాని విషయమనకండి. మనస్సును ఈ

విషయము మీద లగ్నము చేసి నేను జెప్పు మర్మములను తెలుసుకొనుము.





తప్పు లెంతురయ్య తపసులకైనను

ధరణి జనులకున్న ధర్మమదియ

అందుకొరకు నే నాదినే జెప్పితి

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : సాక్షివై అన్ని జీవులందున్న నాలోని ఆత్మా! వినుము. పెద్ద తపస్వికులనైనను, యోగులనైనను, ప్రజలు తప్పుల

నెదుకుచుందురు. ఏ విషయము వారికి తెలియకుండిన ఇతరులను గూర్చి విమర్శించి తప్పుగా మాట్లాడడము భూమి మీద

ప్రజలకు పెద్ద అలవాటై, అదియే వారికి ముఖ్య ధర్మముగ ఉన్నది. అందువలన నన్ను తప్పు పట్టకండి, మంచి మనస్సుతో

నాబోధను వినుమని ముందుగానే చెప్పుకొనుచున్నాను.


 నాకు భయము లేదు నన్ను మీరేమన్న

నన్నన్న వారు నాకు నాత్మప్రియులు

ఉన్నదున్న యట్లు ఊహించి చెప్పెద

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము : శక్తి రూపములో శరీరమంతయు వ్యాపించినయున్న ఓ ఆత్మా! వినుము. నేను చెప్పిన విషయములు మీకు

సరిపోక నన్ను మీరేమన్నను నాకు భయము లేదు. నన్ను ఎవరు ఏమనిన నాకు వారు ఆత్మప్రియులే. ప్రపంచములోని

వారికి భయపడక ఉన్న సత్యమును ఉన్నట్లు చెప్పుట నా కర్తవ్యము.


వరుసపెట్టి నేను వర్ణింతు పద్యాలు

సరసులైతే దీని జక్కగాను

గన్నవారికెల్ల గల్గును సౌఖ్యంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ



భావము : సమస్త జీవులందు చైతన్యమై ఉన్న ఆత్మా! నామాట వినుము. ఆత్మ విషయములను ఉన్నదున్నట్లు క్రమముగ,

పద్యరూపముగ చెప్పుచున్నాను. దీని మీద అభిలాష కల్గినవారు నేను చెప్పిన విషయములను తెలుసుకొంటే ప్రకృతికంటే

మించిన ఆత్మసుఖము కల్గును.


మొదట జగము లేక మూడు రేకుల చెట్టు

తుదను కొమ్మలైదు తూగులాడి

కొమ్మ కొమ్మలందు కోటి కాయలు కాచె

అఖిల జీవసంగ ఆత్మలింగ


భావము : సమస్త జీవులందు చైతన్యముగనున్న ఓ ఆత్మా! వినుము. ప్రపంచము లేని సమయములో మనకు కనిపించునది

ఏమియులేదు. చివరకు శూణ్యమైన ఆకాశము కూడ లేదు. అది అవ్యక్తమైన పరిశుద్ధ పరమాత్మమాత్రముండు స్థితి. ఆ

స్థితి ఎటువంటిదో ఎవరు ఊహించను గాని, అంచనా వేయడముగాని, యోచించడమునకుగాని సాధ్యము కాదు. అట్టి

అగమ్యముయైన, అగోచరమైన, అవ్యక్తమైన స్థితి నుండి మూడు ఆత్మలు విభజింపబడినవి. అవియే పరమాత్మ ఆత్మ,



జీవాత్మ. తర్వాత పుట్టినది ప్రకృతి. ప్రకృతిని విభజించి చూచిన ఐదు భాగములుగ ఉన్నది. దైవము నుండి పుట్టిన పంచ

భూతములు ఒక్కొక్కటి ఐదు భాగములుగ విభజింపబడి మొత్తము ఇరువదైదు భాగములైనవి. ఆ ఇరువదైదు భాగములకు

శరీరములు తయారై జీవుల నివాసయోగ్యముగ మారినవి. ఎన్నో కోట్ల కొలది గల జీవరాసులకు ప్రకృతి యొక్క శరీరములే

నివాసములైనవి.


ఏమికాని అవ్యక్తమునుండి మూడు భాగముల ఆత్మలు పుట్టినవి. కావున పై పద్యములో మొదట జగములేక

మూడు రేకుల చెట్టు అన్నారు. పరమాత్మ నుండి పంచభూతములు పుట్టినవి కావున తుదను కొమ్మలైదు తూగులాడి

అన్నారు. అసంఖ్యాకములైన సమస్త జీవరాసులు ప్రకృతిచే స్థూలముగ పుట్టుచున్నవి. కావున ఈ పద్యములో కొమ్మ

కొమ్మలం కోటి కాయలు కాచె అని అతి పెద్ద సంఖ్యను చెప్పారు. ఈ పద్య సారాంశమంతయు మూడు ఆత్మల యొక్క

పుట్టుదలను మరియు జగతిని గూర్చి చెప్పబడి ఉన్నదని తెలియవలెను.


ఎమి చిత్రమదియ నెట్లు సృజించెనో

పత్రమొకటి లేదు ఫలము లేదు

వేరు లేదు చూడ వేత్తల కీజాడ

అఖిల జీవసంగ ఆత్మలింగ


భావము : మూడు ఆత్మలలో రెండవదైన ఓ ఆత్మా! వినుము. పరమాత్మ ఎంతో విచిత్రముగ విశ్వమును తయారుచేసి

ప్రపంచములో జగతియైన శరీరములను సృష్టించాడు. పంచభూతములైన ప్రపంచమును, జీవ చైతన్యము కల్గిన శరీరములయిన

జగతిని కల్పి విశ్వము అంటాము. విశ్వము మార్పుచెందని మరణము పొందని పంచభూతములతోను మరియు మార్పు

చెందుచున్న మరణము పొందుచున్న శరీరములతోను నిండిఉన్నది. విశ్వము ఎలా పుట్టిందని చూచితే ఏమాత్రము దాని

జాడగాని ఆధారము గాని దొరకదు. విశ్వము పుట్టుటకు కారణమైన కర్మలేదు కర్మకు కారణమైన కార్యము లేదు. ఎంతో

పెద్దగ ఉన్న భూమి, ఆకాశము వాటి మధ్యలోగల భయంకరమైన గాలి, అగ్ని, నీరు ఏమిలేని ఏమికాని స్థితినుండి

పుట్టడము చాలా విచిత్రము. స్థూలమై కంటికి కనిపించు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఎలా పుట్టాయో యోచించిన

వారికి ఇసుమంతయు అర్థముకాదు. అన్నిటికి మూలపురుషుడైన దైవము నుండి పుట్టిన విశ్వము యొక్క పుట్టుకను

గురించి ఎవరు తెలుసుకోలేరు. విశ్వము పుట్టుకను తెలియుటకు ఏ ఆధారము లేదు. కనుక పత్ర మొకటి లేదు, ఫలము

లేదు, వేరు లేదు, జూడ వేత్తల కీజాడ అని పద్యమందు అన్నారు. ఎంతో బలమైన గాలిని, అన్నిటిని కాల్చివేయు అగ్నిని,

ఎంతో శక్తిగల నీటిని, చిన్న రేణువు నుండి భూమండలము, నక్షత్రమండలము వరకు ఏ సైన్సుకు అందని ఆధారముతో

పరమాత్మ పుట్టించడము ఆలోచించినా అర్ధముగాని గొప్ప విచిత్ర విషయముగనున్నది.


ప్రణవ మందు నైదు ప్రాణాక్షరాల్పుట్టి

జగము లాయెనయ్య జతన మగుచు

అదియు జీవమాయె ఆ పైది శివమాయె

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము : అఖిల జీవరాసులందు అన్ని పనులు చేయిస్తున్న ఓ ఆత్మా! వినుము. ఏమి లేని ఏమి కాని స్థితి నుండి మొదట

ప్రకృతి పుట్టినదని తెలుసుకొన్నాము. ప్రకృతి నుండి ఐదు భాగములు చీలిపోయినవి. అవియే ఆకాశము, గాలి, అగ్ని,


నీరు, భూమి అనునవి. ప్రకృతి విభజింపబడి ప,ర,క,రు,తి అను బీజాక్షరములుగ తయారై, ఆ బీజములకు మరణించని

మార్పు చెందని ఐదు వస్తువులు అచర ప్రకృతి అను పేరుతో ప్రపంచముగ తయారైనవి. ప్రపంచరూపముగనున్న ఆకాశము

“ప” నుండి, గాలి “ర” నుండి, అగ్ని “క” నుండి, నీరు “రు” నుండి, భూమి “తి” నుండి పుట్టినవి. దీనినే మార్పు చెందని

అచర ప్రకృతి అంటున్నాము. మార్పు చెందుచు మరణము పొందు ప్రకృతి మరియొకటి కలదు. దానినే చర ప్రకృతి

అంటున్నాము. అచర ప్రకృతిని ప్రపంచము అను పేరుతో పిలువగ, చర ప్రకృతిని జగతి అని పిలుచుచున్నాము. జగతి

జీవరూపమైన శరీరములుగ నున్నది.


జీవరూపమైన జగతి ప్రకృతి నుండి పుట్టినదే. అదెట్లనిన ప్రకృతి ఐదు బీజాక్షరములుగ విడిపోయి వాటికి

పంచభూతములనబడు ప్రపంచము తయారయినదని తెలుసుకొన్నాము. ప్రకృతి విడిపోయిన ఐదు బీజాక్షరముల నుండి

కొంత మార్పు చెందిన మరియొక ఐదు బీజాక్షరములు పుట్టినవి అవియే న, మః, శి, వా, య. మొదట పుట్టిన ఐదు

బీజాక్షరములయిన “ప” నుండి “న”, “ర” నుండి “మః”, “క” నుండి “శి”, “రు” నుండి “వా”, “తి” నుండి “య” అనునవి

తయారైనవి.


ప ర క రు తి   - అచర ప్రకృతి ( ప్రపంచము )


న మః  శి వా య  :చర ప్రకృతి ( జగతి )


-


అచర ప్రకృతియైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనునవి వేరు వేరు భాగములుగ ఉన్నవి. చర ప్రకృతియైన

జగతి పంచభూతములు కలసి ఏర్పడినది. పంచభూతములయిన ప్రకృతికి పరమాత్మ కలియుట చేత అచర, చరయైన

రెండు ప్రకృతులకు చైతన్యము కల్గినది. రెండు ప్రకృతులలో విడిగా ఉన్న ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమికి చైతన్యము

ఏర్పడగా, అలాగే ఇరువదైదు భాగములుగ విడిపోయి ఒకదానితో ఒకటి కలసియున్న చర ప్రకృతికి చైతన్యముతో పాటు

జీవమేర్పడినది. చర ప్రకృతి శరీరరూపమై అసంఖ్యాకముగ ఉంటూ అనేక జీవరాసులు నివశించుటకు ఆధారముగ

ఉన్నది. పరమాత్మ అంశ ఆత్మగా మరియు జీవాత్మగ విభజింపబడి ప్రకృతి శరీరములలో ఉంటూ ప్రపంచమంతట

జగతిగా వ్యాపించి ఉన్నది. పరమాత్మ జీవరూపమైన శరీరములలోనేకాక మరణములేని ఆకాశము, గాలి, అగ్ని, నీరు,

భూమియందు కూడ వ్యాపించి ఉన్నది. కాని ఇందులో ఒక ప్రత్యేకత కలదు. అది ఏమనగా! శరీరములు కల్గి ఉన్న

ప్రకృతిలో జీవమేకాక ఆత్మ కూడ కలదు. పంచ భూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు భూమిలో ఆత్మయున్నది, కాని

ప్రత్యేకించి మనవలె కర్మగల జీవాత్మ లేదు. అవసరమొచ్చినపుడు వాటిలో కర్మలేని జీవాత్మ తన పాత్ర పోషించగలడు.

జీవరాసుల శరీరములలో అలా కాకుండ ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క కర్మగల జీవాత్మ కేటాయించబడి ఉన్నవి.


శరీరమున్న జీవరాసులకు కర్మ గుణములుండి మరణము కూడ కలదు. మరణములో ఆత్మ కర్మ గుణములను

జీవున్ని మరియొక శరీరమునకు తీసుకొని పోవును. అంతేకాక కర్మ ప్రకారము జీవుడు అనుభవించుటకు అన్ని పనులు

ఆత్మయే చేయవలసి ఉన్నది. కావున శరీరములలో జీవునితోపాటు ఆత్మ ఉండవలసిన అవసరమున్నది. పంచభూతములు

భూమి మీదగల జీవరాసులు పని చేసినట్లు చేయడము గాని, కర్మ సంపాదించుకోవడముగాని ఉండదు. కావున ఐదు

భూతము లందు మనవలె కర్మగల జీవాత్మ ఉండవలసిన అవసరము లేదు. కొన్ని అత్యవసర పరిస్థితులలో మాత్రము

జీవాత్మ తన పాత్రను పోషించగలదు. అందువలన వాటిని భూతములంటున్నాము. భూతము అనగా ఆధ్యాత్మిక పరిభాషలో

జీవుడని అర్థము.




జీవరూపమైన ప్రకృతిలో పరమాత్మ అంశచేత ఆత్మ శరీరములో ప్రత్యేకముగ ఉంటూ, శరీరములో కదలికకు

కారణముగ ఉండగా, ప్రకృతి భాగములలోని ఆకాశముతో పరమాత్మ అంశ కలియుట ద్వార జీవాత్మ ఏర్పడినది. ప్రకృతిలోని

కొంత అంతర్భాగమైయుండుట వలన జీవాత్మ దైవత్వమును కోల్పోయి ప్రకృతి తత్వమును కల్గియున్నది. కొంత దైవత్వము,

కొంత ప్రకృతి తత్త్వము కల్గియుండుట వలన అటు ఇటుగాని నపుంసకత్వమును కల్గియున్నది. జీవాత్మకంటే వేరుగనున్న

ఆత్మ ప్రకృతి భాగములతో కలియక వేరుగ ఉండుటవలన అది దైవముగ భావింపబడు చున్నది. అందువలన పద్యమందు

అదియు జీవమాయె అని ప్రకృతితో కలిసియున్న జీవాత్మను ఉద్దేశించి అన్నారు. ఆపైది దైవమాయె అని జీవాత్మకంటే

భిన్నముగ శరీరమునదిష్టించి శిరోభాగమున నివశిస్తున్న ఆత్మను ఉద్దేశించి అన్నారు. ప్రపంచమును జగతిని రెండిటిని

ఉద్దేశించి ఐదు ప్రాణాక్షరముల్పుట్టి జగములాయెనయ్య జతనమగుచు అన్నారు.


మాయ తెలియరాదు మాయ మూలము లేదు

మాయ వాయు రూపమాయె

మమత తోడ బుట్టె మహదహంకారంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము : సమస్త జీవరాసులందు చైతన్యరూపమై ఖండ ఖండములుగ శరీరములో వ్యాపించి ఉన్న ఓ ఆత్మా! వినుము.

సృష్టి అంతయు పరమాత్మ నిండియుండగ, జగతియంతయు మాయ నిండివున్నది. సర్వ విశ్వము నంతయు పరమాత్మ

సృష్టించగ అందులో జగతియంత మాయను ప్రకృతి సృష్టించినది. ప్రకృతి నుండి పుట్టిన దానిని మాయ అని ఒక

మతములో అనగా, మరియొక మతములో సాతాన్ అనీ, మరియొక మతములో సైతాన్ అనియు అంటున్నారు. కొందరు

మాయను స్త్రీతో సమానముగ పోల్చగ, కొందరు పురుషునిగ పోల్చారు. వాస్తవానికి మాయ స్త్రీ సంబంధమైనదే. ప్రకృతి

అంశయైన దానివలన మాయను స్త్రీ అనుటయే సమంజసము. మాయకు ఒక ప్రత్యేకమైన రూపములేదు. మాయ గుణముల

రూపములో అందరిలోనున్నది. అది ఎవరికి కనిపించునదికాదు. ఎంతటి వారైన దాని విధానమును పూర్తి గ్రహించలేరు.

ఎవరైన దానిని తెలియాలంటే దుస్యాధ్యము, ఎవరికి అర్థము కాదు. మాయ మనుషుల మీద దాడి చేయుచున్నను, పెద్ద

జ్ఞానులు సహితము ఇది మాయపనియని తెలియలేరు. అందువలననే పై పద్యములో మాయ తెలియరాదు, మాయ

మూలము లేదు అన్నారు. మాయ కంటికి కనిపించు రూపము లేనిది, కావున ఈ పద్యములో మాయ వాయు రూపమాయె

అన్నారు. మాయ శరీరములో గుణముల విధానముతో ఉన్నది. అందువలన మమత తోడ బుట్టె మహదహంకారంబు అని

చెప్పారు.


ఐదు యైదు ఇరువదైదైన మాయకు

దొరతనంబు వచ్చె దురిత మెచ్చె

బ్రాంతి యంత మాయ బ్రహ్మండ మంతాయె

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- సర్వ జీవరాసులందు నివశిస్తూ, ఆయా శరీర ఆకారమును కల్గియున్న ఓ ఆత్మా! వినుము. ప్రకృతి రెండు

భాగములై అందులో ఒకటి ఐదు భాగములుగ చీలిపోయి అచర ప్రకృతి కాగా, మరొకటి ఐదు ఐదు భాగములుగ చీలి

ఇరువదైదు భాగములై ఒకదానితో ఒకటి కలిసి చర ప్రకృతిగా తయారైనది. చరించు ఈ ప్రకృతిలోనే ఎట్లు పుట్టాయో

తెలియకుండ, దాని మూలమేమాత్రము అర్థముకాకుండ గుణములు తయారైనవి. గుణములన్నిటిని కలిపి మాయ అని


అంటున్నాము. ఏవిధముగ తయారైనదో తెలియని మాయ శరీరములోనే ఉంటూ దాని ప్రభావమును శరీరము మీద

అందులోని జీవుని మీద చూపుచున్నది. అందువలన ఈ పద్యములో ఐదు ఐదు ఇరువదైదైన మాయకు దొరతనంబు వచ్చె

అన్నారు.


రేపు అనుమాట నిజమేయైనప్పటికీ అది కనిపించదు. రేపు అనుమాట భావముతో తెలుసుకోవలసినదే, కావున

రేపు అనునది భావముతో కూడిన భ్రాంతి అనవచ్చును. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భావించుకోవడమును భ్రాంతి

అంటాము. మాయ ఉండి కంటికి కనిపించకున్నది. కనిపించని మాయను, చూపుకు తెలియని మాయను భావమునకు

ఉన్నట్లు తెలుసుకొనుట భ్రాంతి అంటాము. స్థూలము కాని సూక్ష్మమైన మాయను ఈ పద్యములో భ్రాంతియంత మాయ

అన్నారు. తలలో కొద్దిగ ఉన్న భ్రాంతియుత మాయ అన్ని శరీరములందు ఇమిడి ఉన్నది. అన్ని శరీరములు ప్రపంచమంత

నిండి ఉన్నాయి. ప్రపంచమును బ్రహ్మండమని కూడ అనుచుందురు. పరమాత్మ చేత పుట్టబడినది కావున ప్రపంచమును

బ్రహ్మ అండము అనెడివారు. బ్రహ్మ అనగ పరమాత్మ (పెద్ద) అనీ, అండము అనగ గ్రుడ్డు అని అర్థము. కోడి ఉన్నట్లుండి

ఒక్కమారు గ్రుడ్డునుపెట్టినట్లు, పరమాత్మ లేకున్న ప్రపంచమును ఒక్కమారు కనిపించునట్లు చేశాడు. గ్రుడ్డు కోడికి

పుట్టినది కావున కోడిగ్రుడ్డు అన్నట్లు, ప్రపంచము పరమాత్మకు పుట్టినది, కావున బ్రహ్మ గుడ్డు లేక బ్రహ్మాండము అంటున్నాము.

ప్రపంచమంత నిండియున్న జీవరాసులలో మాయఉండి కనిపించకున్నది కావున మాయ ప్రపంచమంతట జీవరాసులలో

నిండియున్నదని తెలియుచున్నది. ఈ విషయమునే భ్రాంతియంత మాయ బ్రహ్మాండమంతాయె అన్నారు.


వాహ్వ దానిశక్తి వస్తాదుగిరియును

విస్తరించి బ్రహ్మ విష్ణు శివుల బట్టి

భ్రాంతి బెట్టి బలమెల్ల దిగమ్రింగే

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : శరీరమను గుడిలో దీపమై శరీరమంతటికి వెలుగునిచ్చుచున్న ఓ ఆత్మా! వినుము. మాయ యొక్క శక్తి ఎంతటిదో

ఎవరికి అర్థముకాదు. ప్రపంచములో దాని నాయకత్వమునందు అందరిని ఇముడ్చుకొని పెత్తనము చెలాయిస్తున్నది.

మాయ యొక్క శక్తి జగతియంత వ్యాపించి యోగులలో పెద్ద యోగులయిన విష్ణు, ఈశ్వర, బ్రహ్మలను కూడ తన భ్రమలో

ముంచి, వారిని కూడ యోగభ్రష్టులను చేయుచున్నది. త్రిమూర్తులను కూడ తన భ్రాంతిలో పడునట్లు చేసి దేవుని

మార్గములో బలహీనులను చేయుచున్నది. ఎంత పెద్దవారినయిన తాను తలచుకొంటే జ్ఞాన బలమును కోల్పోవునట్లు చేసి

అజ్ఞానమార్గములో నడుపగలదు. అందువలన మాయ యొక్క బలమును ఒక విధముగ ప్రశంసింపవలసినదే. ఎంతటివారినైన

మార్గము తప్పించు మాయ గొప్పదే కదా!


బలము దప్పినట్టి బ్రహ్మాది మూర్తులు

కలత చెంది లేచి కల్వరించి

సృష్ఠిరూపు దాల్చె చింతించి చింతించి

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : సమస్త శరీరములలో జీవునితోపాటు ఉంటూ ఆ శరీరమునకు శక్తినిచ్చు ఓ ఆత్మా! వినుము. విష్ణు, ఈశ్వర,

బ్రహ్మ అనబడు త్రిమూర్తులు కూడ మాయ ప్రభావమునకు తమ యోగబలమును కోల్పోయి, తిరిగి కొంత కాలమునకు



ఎరుక కల్గినవారై, కలనుంచి లేచినవాడు సత్యమును తెలుసుకొన్నట్లు నేను ఇంతవరకు మాయ భ్రమలలో మునిగియుంటినని

తెలిసినవారై, ఇక మాయలోపడక పరమాత్మనే చింతించి చింతించి, సంపూర్ణ యోగులై విశ్వరూపమైన పరమాత్మయందే

కలసిపోయిరి.


ఎంతటి గొప్ప యోగులైన మాయ దాటికి తప్పక యోగ భ్రష్టులగుదురని ఈ పద్యము తెలియజేయుచున్నది.

దైవమార్గము నుండి మాయ ప్రభావమునకు తప్పినవారైనప్పటికీ, తమ పట్టువదలక తిరిగి తెప్పరిల్లుకొని, మాయ ప్రభావానికి

మోసపోయామని తలచి, తప్పిపోయిన మార్గమును తిరిగి ఆశ్రయించి మోక్షమును పొందవలెను. మోక్షమును పై పద్యములో

సృష్ఠిరూపు అన్నారు. సృష్ఠి అనగా విశ్వము సృష్ఠి రూపు అనగా విశ్వరూపము అని అర్థము. విశ్వమంత వ్యాపించినది

పరమాత్మ. పరమాత్మయందైక్యమై పోవుటను విశ్వవ్యాప్తి చెందుటయనీ లేక సృష్టిరూపులో కలిసిపోవడమని అనవచ్చును.

మాయనుండి తేరుకోలేని వాడు మోక్షమును పొందలేడు.


పంచ వన్నెలైన పంజరంబిది యహ

మంచి చిలుక యిందు మటముదీర్చి

మాటలాడు నయ్య మాణిక్యముల మాట

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : ముగ్గురు పురుషులలో అక్షర పురుషుడై శరీరములోనున్న ఓ ఆత్మా! అయిదు భాగములైన ఆకాశము, గాలి,

అగ్ని, నీరు, భూమి చేత తయారయిన శరీరమిది, దీనియందు పక్షి మాదిరి ఎగిరిపోవు వాయువు (శ్వాస)

నివాసముజేయుచున్నది. ఆ గాలి శ్వాసరూపమున ముక్కు రంధ్రముల ద్వారా చలించుచు వింత శబ్దము జేయుచున్నది.

విశేషార్థము : మన శరీరము పంచభూత నిర్మితమైనది. కావున శరీరమునే పంచవన్నెలైన పంజరముయని చెప్పడమైనది.

శరీరమందు గాలి నివాసమై ఉన్నందున శరీరమును పంజరమనుట జరిగినది. ఆకాశముతో (శూన్యముతో నిండియున్న

ముక్కు రంధ్రములందు ఎగురుచున్న శ్వాసను పక్షిగ చెప్పడమైనది. అనేక గ్రంథములందు కూడ శ్వాసను హంసయని

చెప్పియున్నారు. శ్వాస చలించువేళ ఏర్పడు శబ్దము ఎంతో విలువైన అర్థముతో కూడి ఉన్నది. కనుక మాణిక్యముతో

సమానముగ పోల్చడమైనది.


ఆ ॥*

చిలుక పలుకులందు చిత్రమై యున్నవి

పలుకు లోను పలుకు పదిల పరచి

వలపు పుట్టినట్లు వచియింపుచున్నది

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : ప్రతి శరీరములో జీవాత్మలకు సాక్షిగయున్న ఓ ఆత్మా! వినుము. శ్వాస పక్షిలాంటిదన్నాము కదా! ఆ పక్షి చేయు

శబ్దము చాలా చిత్రముగా ఉన్నది. ఆ శబ్దము శరీరములో “సోహం” గా వినిపించుచున్నది. ఆ "సోహం శబ్దము లోపల

“ఓం”యను శబ్దము ఇమిడి ఉన్నది. దాని విషయము తెలిసినవారు ఓం అనుశబ్దము ఆత్మ నుండి వచ్చుచున్నదని ఓం

కారమునకు మూలమైన ఆత్మను పొందవలెనని అనుకొందురు.


విశేషార్థము : “సోహం”యందే “ఓం” ఇమిడి ఉన్నది. కావున “పలుకులోను పలుకు” అని పద్యములో చెప్పియున్నారు.



వలపు జెందిరయ్య వనితలు మగవారు

పరమ చిలుక కొరకు పరుగులెత్తి

పట్టలేక తుదకు భ్రాంతుల పాలైరి

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : ఇంద్రియములకు శక్తి నొసగు ఓ ఆత్మా! వినుము. “ఓం” కారమును తెలిసిన స్త్రీ, పురుషులందరు అది ఏ శక్తిచే

ఉద్భవించుచున్నదో ఆ శక్తిని తెలుసుకొనుటకు ఆశ చెంది ప్రయత్నము చేయుచున్నారు. ఆత్మ శక్తిని తెలుసుకోలేక చివరకు

చాలామంది మాయలోనే మునిగిపోయారు.



పట్ట తరము గాదు పాతాళమునంటి

బ్రహ్మ పట్టనమునకు బారుచుండు

భ్రమలు విడచి దాని ప్రాప్తిని గనవలె

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : కొలిమిమంటకు గాలితిత్తి, తిత్తికి కదలించు కట్టె, కట్టెకు చివర కూర్చోని కదలించుచున్న వ్యక్తి ఎలాగా

అనుసంధానమై ఉన్నారో, అలాగే శరీరములో ముక్కులోని శ్వాసకు ఊపిరితిత్తులకు, తిత్తులకు బ్రహ్మనాడి నాడికి చివరలో

అన్నిటిని కదలించు ఓ ఆత్మా! శ్వాసను చలింపజేయు శక్తి మన శరీరములో బ్రహ్మనాడియందు ఇమిడి ఉన్నది.

బ్రహ్మనాడియందున్న శక్తియే శ్వాసకు కారణము అదియే శ్వాసకంటే వేరై దానికి ఆధారముగ ఉన్నది. కావున దానిని

పరమ చిలుక అని పిలుస్తున్నాము. ఆ పరమ చిలుక అనబడు శక్తి బ్రహ్మనాడి చివరి భాగము మొదలుకొని పైన కపాల

స్థానము వరకు వ్యాపించి ఉన్నది. ఆ శక్తిని తెలుసుకోవలయునంటే ప్రపంచ భ్రమలు విడచి, అన్ని విషయములను

మనసుచే మరపించవలయును. అట్లు చేసినపుడే శ్వాసకంటే పరముగా ఉన్న శక్తి, శ్వాసను నడిపించు ఆ ఆత్మశక్తి

మరియు బ్రహ్మనాడిలో ఆధార కమలము నుండి సహస్రార కమలము వరకు వ్యాపించి ఉండు శక్తి తెలియును. అదియే

ఆత్మదర్శనమని చెప్పవచ్చును.


సాధ్యపడదు ఎంత సామంతుడైనను

సత్యశాంత సమర సాత్ముడైతె

మోహ మొందునయ్య మోక్ష కాంతామణి

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : శరీరములో శ్వాసను నడిపించు ఓ ఆత్మా! వినుము. బ్రహ్మనాడి యందుండు ఆత్మశక్తి మనకున్న ధనికత్వమునకు

గాని, సార్వభౌమత్వమునకు గాని లొంగునది కాదు, తెలియునది గాదు. గుణములన్నింటిని శాంతింప జేసిన వారికి, అన్ని

జీవులందున్న ఆత్మ సమముగా ఉన్నదను భావము కలవారికి, చైతన్యమైన ఆత్మ తెలియును. తర్వాత మోక్షము పొందవచ్చును.

మోక్షమను కన్య ధనికులకు లొంగదు. జ్ఞానులకు మాత్రము తన సుఖమునందివ్వగలదు. వారితోనే కూడి ఉండి పరమ

సుఖముననుభవింపజేయును.




శాంతి మతిని బూని చాదస్తములు మాని

చింతదీర గురుని సేవ జేసి

పంతగించి ముక్తి పడతిని గనవలె

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- సమస్త జీవులందు ఒకే పని చేయుచున్న ఆత్మా జీవుడైన నేను చెప్పుమాట వినుము. మనస్సులో ఆలోచనలను

చేరనీయక ఉపవాసములు, వ్రతములు, యజ్ఞములని చాదస్తముల పని చేయక, శరీరములోని మనస్సుయొక్క చింతలన్ని

పోవునట్లు గురువుచేత జ్ఞానము తెలిసినవాడవై, గురువు యొక్క సేవ చేస్తూ, మాయ దాడికి తట్టుకొని ప్రయత్నమును

గట్టిగ చేయుచు మోక్షమును పొందవలెను. అలాకాక దేవుడు చెప్పినట్లు యోగము ఆచరించక యజ్ఞములనీ,

వేదధ్యాయనములనీ, తపస్సులనీ చాదస్తములైన పనులు చేయుచుండిన ఎప్పటికి మోక్షము పొందలేరు.


ముక్తికాంత ఎంత మూర్ఖురాలో గాని

చిక్కు బెట్టునెట్టి సిద్దునైన

జిక్కదయ్య అల్పచీకాకు మతులకు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- రెండవ ఆత్మవై శరీరములో అన్ని పనులు చేయుచున్న ఓ ఆత్మా! వినుము. మోక్షమను దానిని చాలామంది

ఆశిస్తుంటారు. కావున మోక్షమును ఒక ముక్తికాంతలాగ పోల్చి చెప్పుకుందాము. ఒక స్త్రీ స్నేహము కావాలంటే సినిమాల్లో

హీరోల్లాగా ఎన్నో తంటాలు పడవలసి ఉన్నది. అట్లని హీరోయిన్లాగా సులభముగ ముక్తికాంత చిక్కునది కాదు. ఎన్నో

సత్ప్రవర్తనలుండినా, ఎన్నో భక్తి పనులు చేసి చూపించినా, నీవు తప్ప నా దృష్టిలో ఎవరు లేరనినా, ముక్తి అంత సులభముగ

వచ్చునది కాదు. అందువలన చాలామంది దైవమార్గములో నడచి తాము అనుకొన్నట్లు ముక్తి లభించలేదని చీకాకు పడి,

అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు దైవాన్ని నిందించిన వారు కూడ కలరు.


దేవున్ని తెలుసుకోవడమే ముక్తి, దేవునియందైక్యమవడమే ముక్తి. దేవున్ని తెలుసుకోవడము అంత సులభము

కాదు. దేవాలయములో ప్రతిమ చుట్టు మాయ ఆవరణము యొక్క గుర్తుగ సింహతలాటమున్నట్లు దేవుని చుట్టు మాయ

గలదు. దేవుని చేరాలనుకొన్న వారినందరిని, దేవుని చుట్టువున్న మాయ, ఎన్నో చిక్కులు పెట్టి చివరకు వానిలోని ఓపిక

నశించునట్లు చేయును. అటువంటపుడు కొందరు అల్పచికాకులు విసుగు చెంది దేవుని మార్గమునే వదిలి వేయుదురు.

అందువలన ముక్తి అనునది సులభముగ దొరుకునది కాదని పెద్దలు చెప్పారు. ఎన్ని కష్టములొచ్చినా, ఎన్ని మనోచోదనలొచ్చినా

పట్టువదలక ప్రయత్నించు వానిని మాయ ఏమి చేయలేదు. ముక్తి తప్పక లభించును.



తామసంబు విడక తత్వంబు గనరాదు

రాజసంబు విడక రాదు ముక్తి

సాత్వికంబు మోక్ష సాధనంబైయుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో నివాసముంటున్న మూడు ఆత్మలలో అహర్నిశలు జీవున్ని కాచుకొనియుండు ఓ రెండవ ఆత్మా!

వినుము. ఇస్లాం మతములో సైతాన్ అని చెప్పబడునది మరియు క్రైస్తవమతములో సాతాన్ అని చెప్పబడినది,




ఇందూమతములో మాయ అనుపేరుతో చెప్పబడుచున్నది. సర్వసృష్టికి అధిపతియైన పరమాత్మయే మాయను సృష్టించాడు.

జగత్తులోని సర్వజీవరాసులను వాటి కర్మానుసారము నడుపుటకు మాయను పరికరముగ దేవుడు పెట్టుకొన్నాడు. సర్వ

జగత్తును నడిపించు యంత్రాంగములో మాయ పాత్ర కొంత మరియు ఆత్మపాత్ర కొంత శరీరములో ఉండునట్లు దేవుడు

చేశాడు. ఆత్మ శరీరమునకు శక్తి ఆరోగ్యమును కర్మప్రకారమివ్వగా, మాయ మనిషి సామాజిక జీవనములో లగ్నమగునట్లు,

దేవునివైపు ఆధ్యాత్మిక జీవనమువైపు లగ్నముకానట్లు చేయుచున్నది. మాయ మన శరీరములో ఎట్లున్నదనగా!

మాయ మూడు భాగములై, మూడు గుణములను పేర్లతో ఉన్నది. మూడు గుణభాగములలో ఒక్కొక్క భాగము

108 భాగములుగ విభజింపబడి ఉన్నది. ఆ గుణభాగముల పేర్లు ఒకటి తామసము, రెండు రాజసము, మూడు

సాత్త్వికము అని గలవు.


మాయకు సంబంధించిన మూడు గుణభాగములను వదలినపుడు మోక్షమును పొందుటకు సాధ్యమగును.

సాత్త్వికమనునది మిగత రెండు గుణభాగములకంటే కొంత ఉత్తమమైనదిగ ఉండి భక్తి మార్గమును కలుగజేయును.

సాత్త్విక చింతనతో కొంత భక్తిమార్గము కల్గించి నేను మోక్షమార్గములోయున్నానని భ్రమింపచేయును. అసలయిన దేవుని

మార్గము చూపునది ఏ గుణము కాదు. కావున సాత్త్విక గుణము వలన కలిగిన విశ్వాస మార్గము పరమాత్మది కాక, మిగత

అన్యదేవతలదై ఉండును. అది భక్తిమార్గమే ఐనప్పటికీ సృష్ఠికర్త అయిన పరమాత్మ యొక్క మార్గము కాదని తెలియాలి.

సాత్త్వికము మోక్షసాధనమైనట్లు భ్రమింపచేయుచుండును. అలాగే రాజసములోని గుణములను, తామస గుణములను

వదలనిదే నిజదైవమార్గము తెలియదు.

కొందరు తపస్సులకు, సిద్దులకు సాత్త్విక గుణములుండి అన్య దేవతారాధకులైయుండుట వలన, మరికొందరు

సాత్త్విక భ్రమలో పడి యజ్ఞములు చేయుటవలన పూర్తి మోక్షము పొందలేక పోవుచున్నారు. సాత్త్వికము మోక్షసాధనమని

భ్రమింపచేయుట వలన మరియు రాజసము పేరు ప్రఖ్యాతుల మీద భ్రమ కల్గించుట వలన, తామసము అన్నిటికి తక్కువ

గుణమైయుండుట వలన, మూడు గుణభాగములు మాయకు ప్రతిరూపమైనిలిచియున్నవి, అందువలన వాటిని విడువక

ముక్తి దొరకదు.


మనసు జారవిడచి మమకారమనచక

మునులు కొందరు బ్రమ మునిగినారు

నరుడు స్థిరము గనుట నమ్మరాదా మాట

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- ముగ్గురు పురుషులలో మధ్యవాడవై పూజ్యుడవైవున్న ఓ ఆత్మా! వినుము. నరుడు తన శరీరములోని తతంగమును

తెలియక, తన శరీరములోని అంతరంగ భాగములను గుర్తించక, బయటి ప్రపంచపు పనులలో లగ్నమైపోయాడు. సాధారణ

మనిషికాక కొంత జ్ఞానమున్న మునులు కూడ తమలోని మనస్సుయొక్క వివరము పూర్తిగా తెలియక తమ పట్టునుండి

మనసును జారవిడుచుకొనుచున్నారు. మనస్సు చలించు స్వభావము గలది. దాని చలనమంతయు గుణవిషయాలమీదికే

ఉండును. ఎన్నో గుణవిషయములను రేకెత్తించు మనసును జయించలేక మరియు నేను అను అహము కలిగి, నాది

నావారను విషయముల వదలక, గుణముల భ్రమలలో మునిగి పోయారు. శరీరములోని మనస్సును అహమును ముఖ్యముగ

జయించవలసి ఉన్నది. ఎందుకనగా మనస్సు గుణ విషయముల మీదికి పోయి జ్ఞాపకము తేవగా, అహము వాటిలోని


కర్మను అంటగట్టుచున్నది. వీటిని జయించితే గీతలో చెప్పబడిన బ్రహ్మయోగము, కర్మయోగము రెండు ఆచరించినట్లగును.

కాని ఇవి అంతసులభమైనవి కావు, పెద్ద మునులు సహితము వీటి వివరము తెలియక భ్రమలో మునిగి పోయారు, ఇక

సాధారణవ్యక్తి మనసును జయించినాడంటే ఆమాటను నమ్ముటకు వీలులేదు.


మొదట మనసు జయము ముఖ్యయోగంబని

తెలియలేక ధరణు దిరిగెనేని

కుదర కక్కసించి కుక్కలాగ చలించు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- సమస్త సజీవ శరీరములందు నఖ శిఖ పర్యంతము వ్యాపించి, శరీరములోని అన్ని అవయములచేత పనులు 

చేయించుచున్న ఓ ఆత్మా! వినుము. మనస్సును జయించడము వలన యోగము లభించునని, ఆత్మ తెలియునని ముఖ్యమైన

కార్యమదియేనని, మన శరీరములో మనతో పాటు ఆత్మ పరమాత్మ నివాసమున్నవని, ముందు ఆత్మను తెలియడము

వలన కర్మనాశనమై పరమాత్మ తెలియును. ఈ విధానము తెలియక మనస్సు జోలికిపోక, తన శరీరములో వెదకక,

భూమి మీద దేవుని తెలుసుకొను నిమిత్తము, ఎన్ని తీర్థ యాత్రలు జరిపిన, ఎన్ని పుణ్య క్షేత్రములు సందర్శించిన,

మనలోని మనస్సు మాత్రము నిలువక కుక్కవలె నిలకడ లేనిదై చలించుచునే ఉండును. మనస్సు నిలువనిది ఆత్మ యొక్క

అనుభూతి ఎవరికి తెలియదు.


కుక్కవంటి మనసు కుదురగ జేసియు

నిటల మద్య దృష్ఠి నిలిపెనేని

పటుతరైక్య బ్రహ్మ భావంబు కల్గును

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- శరీరములోని జీవునికి సాక్షిగనున్న ఓ ఆత్మా! వినుము. మనస్సు యొక్క విషయము దాని మీద ధ్యాస

లేనివారికి తెలియదు. మనస్సు మీద బుద్ధి లగ్నము చేసి చూచినపుడు, మనస్సు ఏ విషయము మీద నిలబడక

విషయములను మార్చి మార్చి బుద్ధికి చూపుచుండును. ఇంద్రియ విషయములు వద్దని, కొంతసేపు ప్రపంచపు విషయములను

చూపవద్దని మనస్సుకు బుద్ధి ఎంత చెప్పినా, మనస్సు మాత్రము తన అలవాటు ప్రకారము పంచభూతములకు,

పంచేంద్రియములకు సంబంధించిన విషయములనే మననము చేయుచుండును. అనేక విషయముల మీదికి సంచరించుట

వలన మనస్సును చంచలము కల్గిన కుక్కతో సమానముగ పోల్చి చెప్పారు. కుక్కవంటి చలనము కల్గిన మనస్సును,

అభ్యాసము చేత విషయచింతనల మీదకు పోకుండ చేసి, మనోదృష్టిని కనుబొమల మధ్య తలలోపలి మధ్యభాగమున

నిలుపగలిగితే, అక్కడ గల బ్రహ్మనాడిలోని ఆత్మ యొక్క విషయము తెలియును. మనస్సు యొక్క కర్తవ్యము అహర్నిశలు

బుద్ధికి ఏదో ఒక విషయమును తెలియజేయడము. దానికి మొదటి నుండి బయట ప్రపంచ విషయములను తెలియజేయడము

అలవాటైనది. మనస్సు యొక్క ఆ అలవాటును మాన్పి లోపలి ఆత్మ విషయముల మీదకు మళ్ళించడమే యోగము

అంటాము.





అప్పుడాత్మాయందు అధిక విశ్రాంతియు

గల్గి చంచలంబు గట్టి పోయి

గాలి లేని దివ్వెగ ప్రకాశించు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము

-

పూలహారములో ఆధారమై దాగియున్న దారమువలె, శరీరములో కనిపించక శరీరమునకంతటికీ ఆధారమైయున్న

ఓ ఆత్మా! వినుము. మనస్సు యొక్క చంచలము ఆగిపోయినపుడు గాలి లేని చోట దీపము కదలక వెలిగినట్లు, మనస్సుకు

ఒక్క కుదుపు కూడ లేక కదలికలు శూన్యమైపోవును. అటువంటి సమయములో బయటి జ్ఞానేంద్రియముల నుండి వచ్చు

సమాచారమును మనస్సు స్వీకరించడముగాని, లోపలి బుద్ధికి చేర్చడముగాని జరుగుదు. అలా మనోస్తబ్ధత ఏర్పడినపుడు

బుద్ధి ద్వార జీవుడు అనుభవించు విషయము లేకుండపోయి, మిక్కిలి విశ్రాంతి ఏర్పడుచున్నది. మెలుకువలో ఎల్లపుడు

ఏదో ఒకటి అనుభవించుచు, ఏమాత్రము విశ్రాంతి లేని జీవునికి విశ్రాంతి కల్గడము, మనో నిలకడ కల్గిన ఒక్క

బ్రహ్మయోగములోనే సాధ్యమగును. పద్యములో ఆత్మకు అర్థము మొదటి ఆత్మ అయిన జీవాత్మయని చేసుకోవలెను.


చూపు నిల్వకున్న సుఖమెందు గనరాదు

మనసు నిల్పకున్న మమత విడదు

చూపు మనసు నంటి చూచుర సుజ్ఞాని

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- శరీరాంతర్గతములలో ఉండి జ్ఞానము చేత పొగడబడు ఓ ఆత్మా! వినుము. మన శరీరములో ఐదు చూపులు

గలవు. కంటికి మాత్రము ఒక్క చూపున్నది. మిగత నాలుగు చూపులెక్కడున్నాయని ఆశ్చర్య పడనవసరము లేదు. కంటికి

దృశ్యమును చూచే చూపుంటే, నాలుకకు రుచిని చూచే చూపుగలదు. ముక్కుకు వాసనను చూచే చూపుగలదు. అలాగే చెవి,

చర్మములకు శబ్ద, స్పర్శలను గ్రహించే చూపు కలదని తెలియవలెను. ఐదు జ్ఞానేంద్రియములకున్న ఐదు గ్రాహితశక్తులను

ఐదు చూపులుగ పై పద్యములో చెప్పారు. చూపు నిల్వకున్న సుఖమెందుగనరాదు అనడములో ఐదు ఇంద్రియములను

అణచివేయకపోతే యోగవిషయము తెలియదని అర్థము. ఐదు ఇంద్రియములను ఆధారము చేసుకొని తిరుగుచున్న

మనస్సును, లోపలి గుణముల మననము నుండి నిలుపక పోతే, నేను అను అహము విడువదు. అందువలన బ్రహ్మజ్ఞానము

తెలిసిన సుజ్ఞాని బయటి ఇంద్రియ విషయములను, లోపలి గుణముల విషయములను రెండింటిని మనస్సుకు చేరనీయక,

మధ్యలోనున్న బ్రహ్మనాడిలోని ఆత్మను చూచునట్లు చేయుచుండును. అటు బయటి ఇంద్రియములను, ఇటు లోపలి

గుణములను రెండింటిని అంటుకొని, వాటి వరకు వ్యాపించి ఉన్న ఆత్మను తెలియుట వలన, పద్యములో చూపు మనసునంటి

చూచుర సుజ్ఞాని అన్నారు.



రెండు గిరుల మధ్య రేవతియను చుక్క

చుక్క నడుమ నుండు సుధపురంబు

పురమువంటి చూడ పురుహరుడచటుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- సమస్త జీవ శరీరములలో మూడు గుణముల మధ్య సాక్షిగా యున్న ఓ ఆత్మా! వినుము. మన శరీరములో



సూర్యచంద్రనాడుల మధ్య బ్రహ్మనాడి కలదు. ఆ బ్రహ్మనాడియందు నాశనరహితమైనశక్తి ఇమిడి ఉన్నది. మనస్సును

బ్రహ్మనాడియందలి శక్తిలో ఐక్యము చేసిన నిజమైన ఆత్మ తెలియగలదు.


విశేషార్థము :- రెండు గిరులనగా మన శరీరములోని సూర్యచంద్రనాడులని తెలియవలెను. శరీరములోని మిగత

నాడులన్నిటికంటే ఇవి పెద్దవిగా యున్నవి. కావున వీటిని కొండలుగ పోల్చి చెప్పారు. సూర్యచంద్రనాడుల పై భాగము

నుండి వ్యాపించిన బ్రహ్మనాడిని కొండలపైన నక్షత్రముగ చెప్పడమైనది. నక్షత్రములలో రేవతియను నక్షత్రము ఎక్కువ

ప్రకాశము కలది. అలాగే బ్రహ్మనాడి నాడులన్నిటిపై ప్రశక్తి కలది. కావున బ్రహ్మనాడిని రేవతి చుక్కగ పోల్చడమైనది.

బ్రహ్మనాడి లోపల చైతన్యశక్తియున్నది. అదియే నాశనము లేని ఆత్మశక్తి అందువలన దానిని అమృత పురముగ పోల్చడమైనది.

ఆ శక్తిలో ఐక్యమైన వానికి ఆత్మయంటే ఏమిటో ఎవరో తెలియును. అందువలన పురమునంటి చూడ పురహరుడచటుండుయని

ఆత్మను అన్నారు. బ్రహ్మనాడిలోని చైతన్యమునకు కారణమైనవాడే ఆత్మ. అందువలన ఆత్మ పురహరుడని పిలువబడుచున్నాడు.


మనసు నిల్పి యముని మర్మంబు దెలిసితే

తన పురాకృతంబు తప్పిపోయి

పరమ యోగమునకు బాటయు గల్పించు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- అఖిల జీవులతో కూడియున్న ఓ ఆత్మా! వినుము. అతి ధృడమైన, బలమైన, నీచమైన మరియు చంచలమైన

మనస్సును నిలుప గలిగి జగతికి యముడైన ఆత్మను తెలుసుకొంటే, తన పూర్వజన్మలలో చేసుకున్న కర్మమంతయు

తొలగిపోయి మరు జన్మము లేకుండ పోవును. జన్మకు కారణమైనది కర్మ, కర్మయనగ పాపపుణ్యములు. పుణ్యము వలన

సుఖము, పాపము వలన కష్టములు సంభవించుచుండును. పాప పుణ్యములు మిశ్రమముగయున్న యెడల జీవితములో

కష్ట సుఖములు మిశ్రమముగ సంభవించును. కావున యమలోకమెక్కడున్నది, యముడు ఎక్కడున్నది, యమకింకరులు

ఎక్కడున్నారను విషయము తెలుసుకొంటే, ముందు జన్మలో చేసుకొన్న పాప పుణ్యములను అనుభవింపక తప్పించు

కోవచ్చును.


మనస్సును నిలిపినచో ఆత్మను తెలుసుకొనుటకు వీలగుచున్నది. ఆత్మను తెలుసుకొను అవకాశము లభించిన

తర్వాత దాని మహత్యము తెలియును. అపుడు ఆత్మయే యముడుగానున్నదను యదార్థము తెలియును. మనస్సు నిల్పి

ఆత్మ మర్మము తెలుసుకొన్న వానికి జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లును. ఆ అగ్ని పూర్వజన్మలలో చేసుకొన్న కర్మలనన్నిటిని కాల్చివేయును.

కర్మములన్నిటిని కాల్చి వేసుకొన్నవాడు యోగమును వీడి పరయోగములో చేరుచున్నాడు, అనగా శరీరమును వదలి

పరమాత్మలో ఐక్యమైపోవును.


విశేషార్థము :- శరీరములో కాలచక్రమున గల నవగ్రహములను కర్మకు అనుగుణముగ చలింపజేస్తు, జీవుల మీద

నవగ్రహముల ద్వార కర్మను అనుభవింపజేయువాడు ఆత్మ. అందువలన ఆత్మను యమునిగా పోల్చడమైనది. ఆత్మను

తెలియడమే యముని మర్మము తెలియడమని పోల్చిచెప్పారు.

జీవుడు శరీరములో ఉన్నపుడే యోగము చేయనగును. శరీరమును వదలిన తర్వాత పరమాత్మలో ఐక్యమైపోవును.

శరీరము లేకుండ దేవునియందు ఐక్యమగు దానిని పరయోగమని (పరమ యోగమని) చెప్పబడినది. పరయోగమంటే


యోగముకంటే వేరైనదని అర్థము. ఆత్మకంటే పరముగయున్న పరమాత్మలో ఐక్యమగుటనే యోగముకంటే పరముగనున్న

పరమయోగమనుచున్నాము.



మండలముల మూటి మధ్య షోడశ

కళను పూర్ణ చంద్రకాంతియుండు

కాంతియందు మనసు కలసిన యోగంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- సమస్త జీవరాసులయందుగల మూడు ఆత్మలలో మధ్యనున్న ఓ ఆత్మా! వినుము. ప్రపంచములో జనాభా

ప్రాతిపదికగ గాని లేక విస్తీర్ణ ప్రాతిపదిక ఆధారముగ గాని మండలము అని కొంత ఏరియాను అంటున్నాము. శరీరముతో

నివశించు మనము ఫలాన మండలములో ఉన్నామని చెప్పుకొనుటకు అడ్రసు గలదు. శరీరముతోనున్న మనకు భూమి

మీద ఫలానా ప్రదేశమని చెప్పుకొన్నట్లు, శరీరము లోపల జీవాత్మ యైన మనము నివశించు అడ్రసు కూడ కలదు. పైన

ఫలానా మండలములో నివశిస్తున్నామన్నట్లు, లోపల కూడ ఫలానా మండలములో నివశిస్తున్నామని చెప్పవచ్చును.

జనాభా సంఖ్యను బట్టి, విస్తీర్ణమును బట్టి బయట మండలములను నిర్ణయించి ఏర్పరచినట్లు, శరీరము లోపల కూడ

గుణముల సంఖ్యను బట్టి, అవి గల విస్తీర్ణమును బట్టి, మూడు మండలములు ఏర్పరచబడినవి. 108 గుణముల

సంఖ్యను బట్టి వాటికి కొంత విస్తీర్ణము నిర్ణయించబడి ఉన్నది. దానినే శరీరములోని మండలము అంటున్నాము.

ఇటువంటి మండలములు మూడు గలవు. ఈ మూడు మండలములు ఒకదాని తర్వాత ఒకటి చక్రమువలె చుట్టుకొలత

కల్గి ఉన్నవి. వీటినే త్రిగుణమండలములని అంటున్నాము. ఈ మూడు మండలముల మధ్యలో ఆత్మ నివాసముంటున్నది.

ఆత్మ నివాసమైన స్థలమును, గుణములు నివాసమైన మూడు మండలముల స్థలమును, నెమలిపింఛములో నాల్గు గుండ్రని

భాగములుగ చూడవచ్చును. శరీరము లోని గుణములను ఆత్మయొక్క ప్రత్యేకతను తెల్పు అమరిక ఒక్క నెమలిపింఛమునకు

మాత్రమే గలదు. కావున శ్రీకృష్ణుడు నెమలిపింఛమును తన తలమీద ధరించి, ఇవి తలలోగలవని చూపించాడు.


మూడు గుణముల మధ్యలో ఆత్మ నివాసమైయున్నది. మూడు గుణముల మధ్యనున్న ఆత్మ ప్రకాశవంతమై తన

ప్రకాశమును శరీరమంతట వ్యాపింపజేయుచున్నది. జ్ఞానమునకు కేంద్రము ఆత్మని పెద్దలు చెప్పినట్లు జ్ఞానము వలన

తెలియబడునది కూడా ఆత్మయే. అందువలన ఆత్మను జ్ఞానమునకు చిహ్నమైన చంద్రునితో పోల్చి ఆత్మ వ్యాపించిన శక్తిని

చంద్రకాంతితో పోల్చారు. ప్రకాశించు రత్నము పదహారు మెరుపులతో ఉండును. పూర్వము రత్నమును సానబట్టితే

పదహారు పచ్చములుగా (సమతలముగ) సానబట్టెడివారు. రత్నమును ఎటు తిప్పిన మెరిసేది. దానివలన షోడశ కళల

రత్నమనెడివారు. పదహారు మెరుపులను పూర్తి కాంతిగ చెప్పెడివారు. అలాగే ఆత్మయొక్క జ్ఞానము కూడా పూర్ణ

ప్రకాశము కల్గిన చంద్రకాంతితో సమానముగ చెప్పబడినది. శరీరము లోపలి ఆత్మలో మనసు లగ్నము చేసినపుడు

బ్రహ్మయోగమగును. ఆ విషయమును చెప్పుచు కాంతియందు మనసు కలిసిన యోగంబు అన్నారు. మూడు గుణములకంటే

ముఖ్యమైనది వాటి మధ్యనున్న ఆత్మని, దానియందే లగ్నముకావలెనని, దానినే తెలియవలయునని తెలుపు నిమిత్తమే

నెమపింఛములో మూడు ఆవరణముల మధ్యలో గల రంగు చాలా గాఢముగ, నల్లగ కనిపిస్తు గుర్తింపుగనున్నది. పై

పద్యము బ్రహ్మయోగమును గురించి చెప్పినదని తెలియవలెను.


మూడు యేర్లు పొంగి ముల్లోకములు కృంగ

ముంచి వేయు సంగమూల మేమో

గాంచలేని యోగి ఘనుడెట్టులాయెరా

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- చిన్న చీమలోను, పెద్ద ఏనుగులోను ఒకే విధానము కల్గి కర్మను పాలించు ఓ ఆత్మా! వినుము. తామసము,

రాజసము, సాత్త్వికము అను మూడు పెద్ద నదులు మన శరీరములోనే గలవు. మూడు లోకములుగ విభజింపబడిన

తామసులు, రాజసులు, సాత్త్వికులు అను ప్రజలు గుణములను నదీ ప్రవాహములకు తాళలేక వాటియందు మునిగి

పోవుచున్నారు. అందరిని ముంచివేయు మూడు గుణములనెడి మాయను ముంచివేయు ఆత్మ కూడ అక్కడే అన్నిటికి

మధ్యలో గలదు. మూడు గుణములలో మునిగి పోయిన వారెవరికైనా జ్ఞానము ద్వార తెలియునది మధ్యలోగల ఆత్మయే.

ఎవరైన మూడు గుణములను వదిలితే చేరు చోటు ఆత్మయే. అందువలన అందరికి సంగమూలము ఆత్మయై ఉన్నది.

ఆత్మ మూడిటికి మధ్యనున్న త్రివేణి సంగమములాంటిది. సూర్య, చంద్ర, బ్రహ్మనాడులు కలియుచోటున్న ఆత్మను

తెలియలేనివాడు ఎప్పటికీ బ్రహ్మయోగి కాలేడు. శరీరములోని ఆత్మను తెలియనివాడు ఘనుడు కాలేడు.


 మాటలు బహునేర్చి మర్మజ్ఞులను గాంచి

వారితోను భేద వాద మాడ

కరిని గాంచి కుక్క కరువబోవు చందంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- శరీరములోని అన్ని భాగములకు శక్తి నిచ్చుచు ఎవరికీ తెలియకుండవున్న ఓ ఆత్మా! వినుము. మర్మజ్ఞులు

అనగ మర్మమును తెలిసినవారు లేక రహస్యమును తెలిసినవారని చెప్పవచ్చును. ప్రపంచములో అన్నిటికంటే పెద్ద

రహస్యము, తన శరీరములో దాగియున్న ఆత్మను తెలియడమే. తాను తన శరీరములోనే వెదకి, తనకు తెలియకుండ

తనకంటే భిన్నముగ లేక తనకంటే వేరుగ శరీరములో ఉంటూ, శరీర కార్యములన్ని తనకు తెలియకుండానే చేయుచున్న

ఆత్మను తెలియడము, ప్రపంచములో అన్నిటికంటే పెద్ద రహస్యమును తెలిసినట్లగును. అజ్ఞుడు అనగా తెలిసిన వాడు

అని అర్థము. మర్మజ్ఞుడు అనగా ఆత్మను తెలిసినవాడనియే చెప్పవచ్చును. తనకంటే వేరుగ ఎవరికీ తెలియకుండ

జన్మజన్మలకు తన వెంటనున్న ఆత్మను తెలిసిన వారిని చూచి, కొందరు మాటలు ఎక్కువగా నేర్చినవారు, కవులు, భాషా

పండితులు తమ వాక్చాతుర్యము చేత ఆత్మజ్ఞులతో బేధవాదము చేయుచుందురు. మాటల నైపుణ్యత లేని యోగుల వద్ద

తమలోని పాండిత్యమునంతయు ఒలక పోయుచుందురు. వేయిమంది పండితులు తెలియని ఆత్మను ఊహించుకొని,

చివరికి తానే ఆత్మయని, సాధన ఫలితమదియేనని, ఒకరు తర్వాత మరొకరు చెప్పుచున్నారు. సత్యము తెలియనివారు

ఎలా ఎంత చెప్పినా, వారికి ఆత్మ రహస్యమైనదే అగుచున్నది. ఆత్మను తెలిసినవాడు ఒక్కడున్నను వాడు వేలమంది

వాదననైన ఒప్పుకోడు. తనకు రహస్యము తెలిసిన దానివలన ఒక్క బ్రహ్మయోగికి తప్ప ఆత్మ ఎవరికీ తెలియదని

తెలిసినవాడు, తాను వేరు ఆత్మవేరుగ శరీరములో ఉన్నానని, శరీరము లోపల జరిగెడి పనులను తాను ఏమాత్రము

చేయలేదని, శరీరమంత ఆత్మ వ్యాపించి ఉండగ శరీరములో సూది మోపినంత జాగాలో మాత్రమే తానుగలనని చెప్పగలడు.

అటువంటి మర్మజ్ఞులవద్ద పండితులు చూపు పాండిత్యము, ఏనుగు ముందర కుక్క మొరిగినట్లని తెలియవలెను.



మాటలాడినట్లు మరి వేద సిద్ధాంత

మార్గమందు మనసు మనుపలేని

మాట కుమ్మరింట మసికుండ చందంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- నా శరీరములో నాకు తెలియకుండ నిదురలోను, మెలుకువ లోను నాయందు పని చేయుచున్న ఓ ఆత్మా!

వినుము. కొందరు కొన్ని పుస్తకములు చదివియో, లేక కొందరి బోధకుల మాటలు వినియో, ఆధ్మాత్మికమును కొంత

తెలిసి దానిని మాటల రూపముగ మాట్లాడు చుందురు. ఎదుటివాని నోరు మూయించు స్థోమత తన మాటలలో

ఉండినప్పటికీ, తనది నిజమైన జ్ఞానమే అయినప్పటికీ, దానిని ఆచరణలో పెట్టినపుడే జ్ఞానమార్గమందు నడచినట్లగును.

ఉదాహరణకు జ్ఞాన విషయములలో ప్రపంచమునకంతటికీ, ప్రజలందరికి అధిపతియైన దేవుడు ఉన్నాడని, ఆ దేవుని

తప్ప మిగత వారిని ఆరాధించకూడదని, మాటల రూపములో వాదించి శాస్త్రబద్దమైన జ్ఞానమనిపించుకొన్నవాడు, తాను

మాత్రము అసలయిన దేవుని ధ్యాస మరచి చిన్నచిన్న చిల్లర దేవతలను పూజించడములో పాలుపంచుకోవడము, ఊరి

పెద్దను కాబట్టి మొదటి పూజ నాద్వారానే జరుగవలెనని అనుకోవడము, లేకపోతే చిల్లర దేవుళ్ళ పూజలకు చందాలివ్వడము

మొదలగునవి చూస్తే, వానికి తెలిసిన జ్ఞానము సరియైనదయినప్పటికీ, అది మాట్లాడు వరకే గాని ఆచరణవరకు లేదని

తెలియుచున్నది. ఒక వంటను వండు విధానము తెలిసినంత మాత్రమున మన ఆకలి తీరదు. తెలిసిన విధానము

ప్రకారము వండినపుడు దానిని తినగలము ఆకలి తీరగలదు. అట్లుకాక బియ్యమును నానబెట్టి రుబ్బి సోడాపొడి కలిపి

వెడల్పు పెనము విూద వెడల్పుగ రుబ్బిన పిండిని పోసి నెరపితే, పొయ్యి అగ్నికి పెనము శాకమెక్కి పిండి కాలి దోశ

అగునని తెలిసి, రుబ్బడములోను సోడాపొడి కలపడములోను, చివరికి పెనము మీద కాల్చడములోను అనుభవమున్నపుడే

దోశ తయారయి తినగలము. అట్లుగాక మాటల వరకే దోశ అయితే దానిని తిని అనుభవించలేము. వేదాంత విషయములో

కూడ ఆచరణలేని జ్ఞానము కుమ్మరింటి కుండ వాగినట్లు వాగుటకు పనికి వచ్చును కానీ జీవితము నుండి విముక్తి

పొందుటకు పనికి రాదు.


దారుణాది యోగంబు దారెరింగిన యోగి

మేరునందు చేరి మేను మరచి

తాను తాను యనెడి తలపేమి లేకుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- అద్వైతాది మహామునులు శరీరములో ఉన్నది నేను ఒక్కడినేనని చెప్పుకొనుచుండినప్పటికీ, నీవు మాత్రము

వేరుగయుండి జీవుని కర్మను అనుసరించి శరీరమును కదలించుచు, జరిగెడి ఏ కర్మకు బాధ్యుడు కాని ఓ ఆత్మా! వినుము.

శరీరములోని మనస్సుకున్న తన రెండు రకముల కార్యములను నిలిపివేయునట్లు చేసి, మూడు యోగములలో బ్రహ్మ

యోగమును బాగ తెలిసినవాడై ఆచరించి, దానిప్రకారము శరీరమును మరచిపోయిపుడు తలలోని బుద్ధి మాత్రము పని

చేయుచుండును. మనస్సు ద్వార వచ్చు బయటి ఇంద్రియ విషయములుగానీ, లోపలి నుండి వచ్చు గుణపరంపరలుగానీ,

లేకపోవడము వలన అసలు శరీరమే పనిచేయదు. పనిచేయని దానివలన తన వలనే అన్ని పనులు జరుగుచున్నవని

తాను తానని బోధించు అహముకు పనిలేక అది అణిగిపోవును. అపుడు బుద్ది కేవలము శరీరములోని ఆత్మను


చూడగల్గుచున్నది. శరీరము యొక్క ధ్యాస కలుగజేయు మనస్సు పనిచేయుచుండినను, తాననెడి అహము పని చేయుచుండినను

తలలోని బుద్ధికి ఆత్మ తెలియదు.


దారుణాది యోగము      -బ్రహ్మయోగము.

మేరు నందు చేరి - శిరస్సులోని బ్రహ్మనాడిలో చేరి.

తాను తాను యనెడి                                                             -            నేను నేననిపించు అహము.

మూడు యోగములు                                                            -          బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగము.

మనస్సుకు గల రెండుకార్యములు                                    -         బయటి ఇంద్రియముల, లోపల గుణముల సమాచారమును బుద్ధికి చేర్చడము.

 నేను మరచి                                                                           -            శరీరమును ధ్యాసలోయుంచు మనస్సును అనచి.


విశేషార్థము :- శరీరములోని వెన్నుపాము అనెడి ముఖ్య నరములో ఏడు నాడీకేంద్రములు గలవు. తలనుండి క్రింద

గుదస్థానము వరకు వ్యాపించియున్న వెన్నెముక మధ్యగల వెన్నుపాములోని ఏడు నాడీ కేంద్రములను ఆధ్యాత్మిక విద్యలో

ఏడు పర్వతములుగ పోల్చిచెప్పారు. అన్నిటికంటే పైన తలలో గల నాడీకేంద్రమును మేరు శిఖరమన్నారు. అన్ని

నాడీకేంద్రములకంటే ఎత్తులోయుండుట వలన మరియు అన్నిటి కంటే పెద్దనాడీ కేంద్రమైన దానివలన, పర్వతములలో

పెద్దదయిన ఎత్తుయిన మేరు పర్వతముతో సమానముగ తలలోని మెదడును పోల్చి చెప్పడమైనది.


 అట్టి యోగి మరల నవని జనించడు

బట్టబయలు తనకు పట్టమాయె

కొలను విడిచి హంస గోతికి చేరునా

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- శరీరములో అణువణువున వ్యాపించి విధిని అనుసరించి శక్తినిచ్చు ఓ ఆత్మా! వినుము. మనసును అణచి

బుద్ధి ద్వార ఆత్మను తెలిసిన యోగికి జ్ఞానాగ్ని అనబడు శక్తి ఉద్భవించుచున్నది. భగవద్గీతలో చెప్పినట్లు కర్మలను

కాల్చునది జ్ఞానాగ్ని. కావున బ్రహ్మయోగము ద్వార లభించెడి అగ్ని యోగి శరీరములోని సంచిత కర్మను కాల్చుటకు

మొదలుపెట్టును. బ్రహ్మయోగి పట్టు వదలకపోతే తన సంచిత కర్మనంత కాల్చుకొని కర్మశేషము లేకుండ చేసుకోగలడు.

కర్మశేషము లేనివాడు అనుభవించవలసినది లేదు. కనుక శరీరముతో పుట్టవలసిన పనేలేదు. అట్టివాడు జన్మలు,

మరణములు లేని పరమాత్మయందైక్యమగును. శరీరములో బ్రహ్మయోగము తెలిసి ఆత్మయొక్క అనుభవము బుద్ధికి

తెలిసిన తర్వాత, ప్రపంచములోని అన్ని ఆనందములకంటే అతీతమైన ఆనందము ఆత్మానందమని తెలియును. హంస

కొలను విడచి గుంతకు చేరనట్లు బ్రహ్మయోగి తన యోగమును వీడి ప్రపంచములో లగ్నము కావాలనుకోడు. ఆత్మానందము

తెలిసినవానికి కర్మ ముగిసిన తర్వాత శరీరములోనున్న ఆత్మను కూడ వీడి, శరీరము బయట బయలులోకూడనున్న

పరమాత్మలోనికి ఐక్యమగును.


 వేల్పు లెందుకు వేదంబులెందుకు

సాధనంబు లేని చదువులెల్ల

భేద మిడక మనసు బేజారియై యుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- శరీరములో బాహ్య ప్రపంచముతో సంబంధము పెట్టుకొని ఎల్లవేళల పనిచేయుచున్న ఓ ఆత్మా! వినుము.

మనిషి ఎంత జ్ఞానము తెలుసుకొనినా, తెలిసిన దానిప్రకారము నడువకపోతే ఏమి ప్రయోజనము లేదు. జ్ఞానము

ప్రకారము ఆచరించని మనిషికి దేవతలెందుకు, వేదములెందుకు? వేల్పులు వేదములు మనస్సుకు శాంతిని చేకూర్చలేవు.

ఆచరణలేని జ్ఞానము కూడ మనోశాంతిని కల్గించలేదు. భగవంతుడు తెల్పిన జ్ఞానము ప్రకారము ఆచరించక వినేదానిని,

చెప్పేదానిని జ్ఞానమను కొంటే మనలోని మనస్సు రెండిటిని విడువదు. ఒకటి భేదము, రెండవది భేదము అని రెండు

మన శరీరములో గలవు. భేదము అనగ సంతోషమును కలుగచేయుటకు కారణమైనవి. దాన, దయ, ఔదార్య వైరాగ్య,

వినయ, ప్రేమలు పుణ్యమును తెచ్చిపెట్టి దాని కారణమున సుఖములు సంతోషములు కల్గునట్లు చేయును. శరీరములో

మంచి గుణము ఒకటుంటే దానికి విభిన్నముగ మరియొక గుణముండును. విభిన్నముగనుండు దానిని భేదము

అంటాము. మంచికి చెడు బేధముగ ఉండును, అలాగే చెడుకు మంచి భేదముగ ఉండును. ఒక దానికొకటి వ్యతిరిక్తదిశలో

ఉండు దానిని భేదము అంటాము. ఆశకు భేదము దానము, కోపమునకు భేదము దయ. ఒకదానికొకటి భేదమయిన

గుణములయొక్క సంకల్పములు జ్ఞానమును ఆచరించని మనిషికి తగులుచునే ఉండును. వాని మనస్సు గుణముల

ప్రభావమునకులోనయి బేజారయి పోవుచుండును. అందువలన మనస్సు గుణములకు లొంగకుండ ఉండవలయునంటే,

మనము నేర్చుకొన్న జ్ఞానమును అనుభవమునకు తెచ్చుకొన్నపుడు, సుఖములకు పొంగక దుఃఖములకు కృంగక, విసుగు

లేకుండ సమతుల్యముగ ఉండగలము. ఈ పద్యములో భేదము అన్నపదమును అన్ని గుణములకు వర్తించు అర్థముతో

చూడవలెను.



తోలుకొండ దీని తొమ్మిది వందల

గండుపులులు చుట్టు గాచి యుండు

కొండ శిఖరమందు కోమలి యొకతుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో ఏమాత్రము నిద్రలేకుండ ఎల్లపుడు మేల్కొని పనిచేయు ఓ ఆత్మా! వినుము. శరీరము వెడల్పు

ఎత్తు కల్గి, కాళ్ళు పీటముగ శిరస్సు శిఖరముగ ఉన్నది. మన శరీరము ఒక విధమైన కొండలాగ ఉన్నదని పోల్చి

చెప్పవచ్చును. శరీరమంతా చర్మమను తిత్తిచే కప్పబడి ఉన్నది, కావున దేహమును తోలుకొండయని ఇక్కడ చెప్పారు.

శరీరమునకు ఆరు జ్ఞానేంద్రియరంద్రములు, మూడు కర్మేంద్రియముల రంద్రములు గలవు. అందువలన వేదాంతులు

కొందరు తోలుతిత్తియిది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయమని శరీరమును గురించి అన్నారు. ఇక్కడేమో శరీరమును

తోలుకొండయని, దానికున్న తొమ్మిది రంధ్రముల సమస్యలను తొమ్మిదివందల గండు పులులుగ వర్ణించి చెప్పారు.

శరీరము కొండకాగ, దానికున్న రంధ్రములు వందల పులులుకాగ, శరీరము యొక్క శిరస్సును కొండ శిఖరముగ వర్ణించి

చెప్పారు. తలలోనే బ్రహ్మనాడి యొక్క ముఖ్య కేంద్రముండుట వలన, ఆ కేంద్రమే ఆత్మ నివాస కేంద్రమైనందు వలన,

ఆత్మను యువతిగ పోల్చి కొండశిఖరమందు కోమలి యొకతుండు అన్నారు.


కామరూపి దాని కామించి జనులెల్ల

కొండకొచ్చి పులుల కొరతబడిరి

ధీరుడైతె పులుల ద్రుంచి కొండెక్కును

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క ఆత్మగ జీవాత్మకు తోడున్న ఓ ఆత్మా! వినుము. కొంత జ్ఞానదృష్ఠి కల్గిన

వారికంతయు శరీర శిఖరము నందు గల ఆత్మ కామరూపిగ తెలియును. పూర్తి దృష్టిలేని వారికి ఏమి తెలియకున్నా,

కొంత జ్ఞానమున్న వారందరు తమ శరీరములోని ఆత్మను తెలియవలెనని అనుకొందురు. పొందవలెనని అనిపించు

ఆత్మను కామరూపి అన్నారు. ఆత్మ పొందుకోరిన జనులను కామించిన జనులు అన్నారు. జీవాత్మ కోరుకున్న ఆత్మ

శరీరశిఖరమున గలదు, కావున శరీరములోనే ఆత్మను తెలియవలెనని అనుకొన్న వారందరు శరీరములో శిరోశిఖరమున

తమ ఆత్మను వెదకుటకు మొదలుపెట్టి, జ్ఞాన కర్మేంద్రియముల రాకపోక విషయములకు చిక్కి, ఆ విషయములందే

చిక్కుకొని ఆత్మను తెలియలేకపోయారు. ఇక్కడ ఇంద్రియ విషయములను పులులుగ పోల్చి, కామించిన జనులెల్ల

కొండకొచ్చి పులుల కొరతబడిరి అన్నారు. విషయేంద్రియములను జయించి శిరస్సునందు మనోదృష్టిని నిల్పినవాడు

ఆత్మను తెలియును. కనుక అటువంటివానిని గూర్చి ధీరుడైతే పులులద్రుంచి కొండెక్కును అన్నారు.


 జంటనాగ స్వరము జాడ తెలిసూదితే

పుట్టలోయున్న భుజగమపుడు

పట్టుబడును మంచి పరమ యోగైతేను

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరాంతర్గతమై బాహ్య దృష్ఠికి కనిపించక, జీవాత్మలైన స్వాములు, మునులు కూడ నేనే ఆత్మనని తలపోయినట్లు

చేసి, నీవు మాత్రము వేరుగనున్న ఓ ఆత్మా! వినుము. శరీరమనునది తొమ్మిది రంధ్రములు గల పుట్టతో సమానము.

శరీర పుట్టలో నాగుపాములాంటి ఆత్మ నివాసము చేయుచున్నది. పుట్టలోని పాము బుసకొట్టినట్లు శరీరములోని ఆత్మ

ఉస్వాస నిస్వాస అను శ్వాసల ద్వార బుసకొట్టుచున్నది. పాము యొక్క శబ్దమును నాగస్వరము అన్నాము. నాగస్వరము

ఉస్వాస నిస్వాసములందు ప్రత్యేక శబ్దము కల్గి ఉన్నది. ఆ శబ్దములనే "సోహం” అని అంటున్నాము. “సోహం”

శబ్దమునకు కారణమేమిటని ఆ శబ్దము బయలుదేరు జాడను తెలిసితే, చివరకు ఆ శబ్దము చేయు పాము అనబడు ఆత్మ

తెలియును. ఈ పద్యమందు పామును ఆత్మ అనియు, రెండు ముక్కు రంధ్రములలోని శ్వాసలను జంటనాగస్వరములనియు,

ముక్కు రంధ్రముల శ్వాస నుండి బ్రహ్మనాడిలోని ఆత్మవరకు ఆత్మశక్తి ఎలా ప్రవహిస్తున్నదో తెలియడమును స్వరము జాడ

తెలియడమనీ, అలా శరీరాంతర్గత పరిశోధన చేసిన వానిని పరమయోగియనీ చెప్పడము జరిగినది.



 ఘంటనాదము హృదయ గగనంబుపై మ్రోగు

గగనమున్న చోటు గానరాదు

పరమ గురుని కరుణ బడయని నరులకు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము: జీవాత్మకు పరమాత్మకు మధ్యన గల ఓ ఆత్మా! వినుము. హృదయమనునది మనశరీరములో గలదు.

హృదయమును శరీరములోని గుండెగ కొందరు చెప్పుకొన్నప్పటికీ అది వాస్తవము కాదు. శరీరమధ్యలో గల బ్రహ్మనాడియే

హృదయమను పేరుతో గలదు. హృదయములో ఆత్మగలదు. కొందరు జీవాత్మగలదని కూడ అనుకొనుచుందురు.

జీవాత్మ ఎప్పటికి హృదయములో ఉండదు. జీవాత్మ గుణచక్రములో ఉండును. ఆత్మ మాత్రము హృదయములో ఉండి

శరీరమంతయు వ్యాపించుచున్నది. హృదయము (బ్రహ్మనాడి)లో గల ఆత్మ తన చైతన్యమును నరముల ద్వార ఊపిరితిత్తుల


వరకు వ్యాపింపచేసి వాటిని కదలించుచు శ్వాస ఆడునట్లు చేయుచున్నది. శ్వాస హృదయగగనంబు నుండి వచ్చుచున్నది.

గగనము అనగ కనిపించని శూన్యమని అర్థము. హృదయములోగల ఆత్మ కనిపించని శూన్యముగనున్నది, కనుక ఆత్మను

హృదయగగనము అన్నారు. ఆత్మచైతన్యము నుండి వచ్చు శ్వాసయొక్క సోహం శబ్దమును గంటానాధముగ వర్ణించారు.

శరీరములోని ఆత్మ జీవాత్మకు తెలియాలంటే, కనిపించు గురువుకంటే వేరుగనున్న పరమ గురుని కరణ లేనిది సాధ్యము

కాదు. జీవాత్మకు ఆత్మ తెలియాలంటే, పరమాత్మ కరుణ అవసరము. గుణచక్రములోని జీవునికి హృదయాంతరాలములో

నుండి శరీరమంత వ్యాపించిన ఆత్మ తెలియాలంటే, శరీరములోపల, శరీరము బయట వ్యాపించియున్న పరమాత్మ కరుణ

అవసరమని మన పెద్దలు నొక్కి వక్కానించారు.


చెవులు మూసుకొన్న చతురతలవి గావు

మాంస పిండ తనువు మరిచినట్లు

ప్రణవ మంత్ర సిద్ధి ప్రాప్తిని గనవలె

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- చెట్టులో తేమ వ్యాపించినట్లు శరీరములో శక్తిగ వ్యాపించియున్న ఓ ఆత్మా! వినుము. ప్రస్తుత కాలములో

దైవజ్ఞానమును బోధించు బోధకులెందరో వచ్చారు. అటువంటి వారు తమకు తెలిసిన పద్ధతిని వారి శిష్యులకు

బోధించుచున్నారు. అలా మంచి మార్గమును బోధించడములో తప్పులేదు. కాని తాము బోధించు విధానములో ఏదయిన

లోపముందో లేదోయని ముందే యోచించక, తాము చెప్పునది బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీతకు విభిన్నముగనున్నదేమో

ఆలోచించక, తమకు తోచింది చెప్పుచుపోతే ఒకవేళ తాము చెప్పునది ధర్మవిరుద్ధమైతే మంచికంటే కీడే ఎక్కవ జరుగును.

ఉదాహరణకు మనస్సును ఏకాంతపరచుకొమ్మని ఉందనుకొండి, దానిని యోగమంటాము అని వివరించుటలో తప్పులేదు.

ఆ వివరమును చెప్పుచు ప్రపంచములోని అన్ని విషయములను విడచిపెట్టి వాటిని మనస్సుకు చేరనీయవద్దని, ప్రపంచ

విషయములు మనస్సుకు చేరకుండుటకు మనస్సు యొక్క ధ్యాసను శ్వాసమీద పెట్టమనో, లేక "ఓం నమః శివాయ”

అను పంచాక్షరి మంత్రము మీద పెట్టమనో, లేక "సోహం" అను మంత్రము శ్వాసకు చేర్చి చూడమనో, ఏదో ఒక పనిని

పెట్టి అదియే గురోపదేశమని, అటువంటి సాధన చేయడమే యోగమని చెప్పడము పెద్ద తప్పగును. వినేవానికి మార్గభ్రష్టత,

చెప్పేవానికి బ్రహ్మవిద్యా పాపము లభించును. అందువలన బోధకులందరు కడు జాగ్రత్తగ బోధించ వలసియున్నది.


ఈ పద్యములో కూడ తప్పుగ అర్థము చేసుకొని పొరబడుటకు అవకాశము గలదు. ఏ బోధకుడు అటువంటి

పొరపాట్లు పడకుండుటకు ఒక సూత్రము గలదు. అనేకము అనగ ఎన్నో ఎక్కువ సంఖ్య అనియు లేక ఒకటికంటే ఎక్కవ

అనియు చెప్పవచ్చును. ఏకము అనగ ఒకటి అని చెప్పవచ్చును. ఏకాంతము అనగ ఒకటి కూడలేనిది శూన్యము అని

చెప్పవచ్చును. దానినే ఏకాగ్రత అని కూడ చెప్పవచ్చును. ఏకాగ్రత అనగ ఒకటి పైన అని అర్థము, ఒకటి క్రింద రెండు

మూడు మొదలుకొని ఎన్నియైన ఉండవచ్చును. ఒకటి పైన ఏమి ఉండదు. ఒకటి పైన సున్న ఉండును అనగ ఏమి

లేదని అర్థము. ఒకటి క్రింద రెండునుండి ఎన్నయిన ఉండవచ్చును. ఆధ్యాత్మిక విద్యలో మనస్సును ఏకాంతము

చేసుకొమ్మనీ, ఏకాగ్రత పరచుకొమ్మనీ, చెప్పుచుందురు. మనస్సుకు ఏకాంతమన్నా, ఏకాగ్రత అన్నా ఏ ఆలోచనలు, ఏ

జ్ఞాపకాలు లేకుండ చేసుకొమ్మని అర్ధముండగ కొందరు బోధకులు, స్వాములు ఏకాగ్రత అని చెప్పుచు మనస్సుకు ఏదో

ఒక మంత్రమునో లేక ధ్యాసనో తగిలించడము న్యాయము కాదు, ధర్మము కాదు. అలా చెప్పువారు మేము పెద్ద

గురువులమని తమను తాము గొప్పగ చెప్పుకొనినా దేవుని దృష్టిలో మాత్రము వారు అధర్మపరులు గానే గుర్తించబడుదురు.


వారు చెప్పు ఉపదేశము ద్వార సాధకుని మనస్సు ఏకాగ్రత పొందక పోవడమేకాక, ఏకమునకు గట్టిగ అతుక్కపోవును.

దాని ద్వార భవిశ్యత్తులో ఎప్పటికీ ఏకాగ్రత పొందు అవకాశమే లేకుండ పోవును. సాధారణ మనిషి ఎప్పటికైన అసలైన

జ్ఞానము తెలిసి మనస్సును ఏకాగ్రత పరుచుకొనుటకు అవకాశముండును, కాని మంత్రోపదేశము పొందిన వారికి

మాత్రము ఏకాగ్రత పొందుటకు అవకాశమే ఉండదు.


సాధారణ మనిషి యొక్క మనస్సు శరీరములోని గుణముల వలన అనేక ఆలోచనలను పొందుచుండును. మనస్సు

దినములో లేక ఒక గంటలో ఎన్ని ఆలోచనలు పొందినప్పటికీ సూత్రము ప్రకారము మనస్సుకు ఒక్క సమయములో, ఒక్క

ఆలోచన మాత్రముండును. ఒక ఆలోచన పోయిన తర్వాత మరియొక ఆలోచన వచ్చుచుండును. మనస్సు ఒక దాని

తర్వాత ఒకటిని ఆలోచించుచుండును. ఏక సమయములో ఏక ఆలోచన చేయుచుండుట మనస్సుకు సహజపని. ఒక్క

సమయములో ఒక్క ఆలోచన కూడ చేయకుండ చేయడమే నిజమైన సాధన అనబడును. దానినే ఏకాగ్రత అనికూడ

అందుము. మనస్సుకు అనేక విషయములు మారుచు ఒక్క విషయము మీద స్థిరత్వము ఏర్పడకుండినపుడు, దానిని

సాధన ద్వార ఏ విషయము మీద లేకుండ చేయవచ్చును. అలాకాక మనస్సు ఒక విషయము మీద బాగా లగ్నమగుటకు

అలవాటు పడినపుడు దాని నుండి ఏకాగ్రత పరచడము అనగా దానిని కూడ లేకుండ చేయడము సాధ్యము కాని

పనియగును. ఏ ఒక్క విషయము మీద స్థిరత్వము లేని మనస్సునే ఏకాగ్రత పరుచుటకు చాలా కష్టమైన పనిగయుండగ,

సాధన ద్వార గురుపదేశమని ఒక మంత్రమను విషయమును మనస్సుకు అంటించు కొనిన తర్వాత, దానిని విడిపించి

మనస్సుకు ఏమి లేకుండ చేయడము కష్టమైన పని అగును. అందువలననే భగవద్గీతలో ఇంద్రియార్థ విషయముల విూద

మనస్సును లగ్నము చేయవద్దని దేవుడు చెప్పాడు. ఇంద్రియార్థ విషయములనగా ఐదు జ్ఞానేద్రియములకు సంబంధించిన

విషయములని అర్ధము. గురువు ద్వార ఉపదేశము మంత్రరూపముతో చెప్పించుకొన్నపుడు, అది చెవి అను ఇంద్రియము

ద్వార వచ్చు విషయమగును. కావున ఆ గురూపదేశ విషయము కూడ దేవునికి సంబంధములేని ఇంద్రియార్థ విషయమగును.

ఏ ఒక్క ఇంద్రియ విషయము లేనిదే నిజమైన యోగమగును.


ఆ విషయమును తెల్పునదే పై పద్యము. ఈ పద్యములో చెవులు మూసుకొన్న చతురతలవి గావు అన్నారు.

తాత్కాలితముగ చెవులు మూసుకొన్నను ప్రయోజనము లేదనీ, అది జ్ఞానసాధనకాదనీ తెలిపారు. చెవులను మూసుకొని

అంతకుముందు వినిన విషయమును జ్ఞాపకము చేసుకొనుటను ఈ పద్యములో ఖండించారు. మూడుగుణములను వదలి

నాల్గవదైన యోగమును పొందడమును చతురత అంటారు. చెవులు మూసుకొన్న చతురత కాదనడము అది యోగపద్ధతి

కాదని తెల్పడమేనని అర్థము చేసుకొండి. ఐదు ఇంద్రియముల విషయములను మరువడమును సూచిస్తు మాంసపిండ

తనువును మరచినట్లు అన్నారు. శరీరమును మరవడము అనగా ఇంద్రియ ధ్యాసలన్ని మరవడమని అర్ధము. శ్వాస

మీద ధ్యాసగాని, ముక్కుమీద ధ్యాసగాని లేక మంత్రము మీద ధ్యాసగాని ఇంద్రియ ధ్యాసలే అగును. శ్వాస ధ్యాస

చర్మమునకు సంబంధించిన స్పర్శ అగును. అలాగే మంత్రము ధ్యాస చెవితో విన్న వినికిడి విషయమగును, కావున ఈ

ధ్యాసల వలన శరీరమును మరచినట్లు కాదు. ప్రణవ మంత్రము మన శ్వాసలోనే ఉన్నదని, ప్రణవ మంత్రమైన “ఓం”

సో చివరిలో “ఓ” గాను, హం చివరిలో “మ్" గాను ఇమిడి ఉన్నదని తెలుసుకొన్నాము. ప్రణవ మంత్రసిద్ధి అనగా

ఓంకారము కూడుకొన్న ఉస్వాస నిస్వాసలు పుట్టు చోటు అని అర్థము. సిద్ది అనగ లభించునదనీ, ప్రణవ మంత్ర సిద్ది

అనగ ఓంకారమును పుట్టించు ఆత్మ అని తెలియవలెను. ప్రణవ మంత్రసిద్ధి ప్రాప్తిగనవలెననగ, ప్రణవ మంత్రమైన ఓం

కారమును పుట్టించు ఆత్మను పొందవలెనని అర్థము. శరీరములో అన్నిటికి శక్తి నిచ్చు ఆత్మవలననే ఊపిరితిత్తులు కదలి


శ్వాస ఏర్పడి, సోహం శబ్దముగ తయారై, అందులో ఓం తయారగుచున్నది. ఓం ను పుట్టించు ఆత్మను పొందవలెనంటే

చెవులు, కన్నులు మూసుకొంటే జ్ఞానముకాదని, శరీరము లోని ఐదు జ్ఞానేంద్రియములను మరచి లోపలనున్న ఆత్మను

తెలియవలెనని పై పద్యములో చెప్పారు. అందువలన ఇప్పటికైన శరీరము మీద, మంత్రము మీద ధ్యాసలు వదలి,

ప్రణవమునకే కారణమైన ఆత్మను శరీరమును మరచి తెలియవలెను.


 నల్ల తామరాకు నడుమ రంధ్రములోను

కుండలియను పాము గ్రుడ్డు పెట్టి

రెండు పిల్లలీని రేయిబగలరచెన్

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- ఇనుముతో కలిసిన అగ్నికి కూడ కొలిమి దగ్గర సమ్మెట దెబ్బలు తప్పవన్నట్లు, జీవునితో చేరి శరీరమంత

వ్యాపించి అప్పుడప్పుడు ఆకలికి శక్తి హీనత చెందుచున్న ఓ ఆత్మా! వినుము. నీటి ఉపరితలము మీద తామరాకు

కనిపించునట్లు, మనిషి శరీరము యొక్క ఉపరితలము మీద తల భాగమున వెంట్రుకలు కప్పబడి నల్లగ కనిపించుట

వలన తల పైభాగమును పై పద్యమందు నల్లతామరాకు అన్నారు. కొందరు ముసలివాళ్ళకు తెల్ల వెంట్రుకలుండును

కదాయని అడుగవచ్చును. అటువంటి వారి తలలను తెల్లతామరాకు అనవచ్చును. ఎక్కువ శాతము నల్ల తలలుండుట

వలన నల్లతామరాకు అని చెప్పారు. ప్రతి ఒక్కరికి తల మధ్యభాగములో బ్రహ్మనాడి ఉండును. బ్రహ్మనాడి యొక్క

స్థానము పునక అని చిన్న పిల్లలపుడు అంటుంటాము. తల మధ్యభాగములో ఎముకల మధ్యన ఒక రంద్రముండుట

శిశుదశలో అందరికి కనిపించుట సహజమే. దానినే నల్లతామరాకు నడుమ రంధ్రము అన్నారు. తల మధ్యభాగమున

గల బ్రహ్మనాడిలో ఆత్మనివాసమైయుండి శరీరమునకు చైతన్యము నిచ్చుచున్నది. అంతేకాక జీవుడు శరీరములో

చేరినప్పటినుండి శరీరమును వదలిపోవు వరకు శ్వాసను కదలించుచున్నది. బ్రహ్మనాడిలోని ఆత్మను కుండలి అనిపేరు

పెట్టి పాముగ పోల్చారు. కుండలి అనగ పెద్దల యొక్క భావములో శక్తి అని అర్ధము. శక్తిని పాముగ చెప్పడములో ఒక

అర్థము కలదు. అదేమనగా! శరీరములోని శక్తి ఒకప్పుడు ఎక్కువ ఒకప్పుడు తక్కువ ఉపయోగపడుచున్నది. ఉదాహరణకు

పదిమైళ్ళు నడిచేవాడు ఒక సమయములో ఒకమైలు కూడ నడువలేడు, అలాగే ఒకమైలు కూడ నడువలేని వాడు ఒక

సమయములో అవలీలగ పదిమైళ్ళు నడువగలడు. ఈ విధముగ శరీరములోని ఆత్మశక్తి పొడవు పొట్టిగా ఉపయోగపడుచున్నది.

కావున చుట్టచేసుకొన్నపుడు చిన్నగ, ప్రాకునపుడు పొడవుగ కనిపించు పాముతో పోల్చి చెప్పారు. ఒకప్పుడు చిన్నగ

ఒకప్పుడు పెద్దగ కనిపించు పామును, ఆ విధముగనే ఉపయోగపడు ఆత్మతో పోల్చి కుండలియను పాము అన్నారు. తల

మధ్య భాగమునుండి ప్రారంభమగు బ్రహ్మనాడిలో ఆత్మ నివాసమున్నది. కావున నల్లతామరాకు నడుమ రంధ్రములోను

కుండలి అను పాము అన్నారు. బ్రహ్మనాడిలోని ఆత్మ తన శక్తి ద్వార రెండు ముక్కు రంధ్రములలో శ్వాసను రెండు

ఊపిరితిత్తుల ద్వార నడిపించుచున్నది. ఆ విషయమునే పరోక్షముగ చెప్పుచు బ్రహ్మనాడి నుండి ఊపిరితిత్తులకు వచ్చునాడిని

గ్రుడ్డుగ వర్ణించి, రెండు ఊపిరితిత్తులను రెండు పిల్లలగ వర్ణించి, ఇరువది నాల్గు గంటలు ఎల్లపుడు ఆడు శ్వాస శబ్దమును

పిల్లల అరుపుగ వర్ణించి, "గ్రుడ్డు పెట్టి రెండు పిల్లలీని రేయిపగలరచెన్” అన్నారు.



అట్టిరోధంబు యఖిల వేదాంతంబు

సకల మునుల సురుల సన్నుతంబు

నిరతమైన యోగ నిష్ఠయనంబడు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో బ్రహ్మనాడిని కేంద్రముగ చేసుకొని శరీరమంత వ్యాపించియున్న ఓ ఆత్మా! వినుము. బ్రహ్మనాడిలో

ప్రారంభమగు కదలిక చివరకు శ్వాసరూపముగ బయటపడుచున్నది. శ్వాస శబ్దముతో కూడుకొన్నది, కావున దానిని

రెండు పిల్లల అరుపన్నారు. రెండు శ్వాసలు చేయు శబ్దములో విశేషార్థము ఇమిడియున్నది. సకల వేదవంతమైన

“ఓం” అందులో ఇమిడియుండుట వలన ఆ శబ్దము సకల సురుల మునుల సన్నుతంబు అన్నారు. ఓం శబ్దము వచ్చు

మూలమును తెలియుటయే అసలైన బ్రహ్మయోగమగును. సకల వేదాంతంబు మరియు సురులు మునులు సమ్మతింపదగిన

ఓం కారమూలము, శరీరములోని మధ్యనాడిలో గలదని తెలిసి, మనోదృష్టిని మధ్యనాడిలో చేర్చి శరీరములో కదలికకు

కారణమైన శక్తిని వెదకుటయే ముఖ్య యోగనిష్టయగును.


సాంఖ్యయోగ మెరిగి సకలేంద్రియంబులు

సంచరించుచున్న సంజ్ఞగాంచి

పంచి యెంచి పైన పరమాత్మ గనవలె

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- జీవాత్మకు పెద్దవాడు, పరమాత్మకు చిన్నవాడయిన ఓ ఆత్మా! వినుము. మనము నివశించు శరీరము ఎన్ని

భాగములుగనున్నదని తెలియడమును సాంఖ్యమంటాము. శరీరములో జీవుని మినహా మొత్తము 24 భాగములున్నవని

తెలియడమును సాంఖ్యము. శరీరములో జీవునితో సహా అన్నిభాగములు ఎలా పనిచేయుచున్నవో, అన్ని అవయవములు

కదలుటకు ఏ శక్తి అవసరమో తెలిసి, అన్నిటికీ చైతన్యమైనది ఆత్మయేనని, ఆత్మకదలిక చేతనే శరీరము సజీవమైనదని,

అది లేకపోతే శరీరములో జీవుడు కూడ ఉండుటకు వీలులేదని, శరీరములోని అన్నిటికి కారణమైనది ఆత్మని, దానిపైన

గలది పరమాత్మయని తెలియవలెను. శరీరమును సాంఖ్యసూత్రము ప్రకారము విడదీసి చూచి 24 ఇంద్రియములు

గలవనీ, వాటిపైన జీవాత్మ గలదనీ, దానిపైన ఆత్మగలదనీ, అన్నికంటే మించి ఆత్మ మీద పరమాత్మగలదని తెలియవలెను.


 పంచతత్వములను పంచీకరించక

మంచియతుల మన్న మాటలన్న

కుంచమందు గజము గ్రుడ్డు పెట్టిన విధంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- సమస్త శరీరములలో నాశనమగు జీవాత్మతో కలసి నివాసము చేయుచున్న నాశనము కాని ఓ ఆత్మా!

వినుము. పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఎట్లు సృష్టింపబడినవీ, అవి ఒక్కొక్కటి ఏ విధముగ

ఐదు భాగములు విభజింపబడినదీ. అలా విభజింపబడిన 25 భాగములు ఒకదానితో మరొకటి కలసి ఎలా శరీర భాగములు

ఏర్పడినది తెలియడమే సాంఖ్యము అంటాము. పంచతత్త్వములను పంచీకరించి సాంఖ్యమును తెలియనివారు మరియు

శరీరములోని ఆత్మ తన శక్తిచేత శరీర భాగములను ఎలా పనిచేయించుచున్నది తెలియకనే మేము జ్ఞానులమని అనుకొంటే,


గంపక్రింద ఏనుగు గ్రుడ్డు పెట్టినట్లుండు నంట. ఏనుగును గొలుసులుతో బంధించి గంపక్రింద నిలబెట్టినప్పటికి అది

గ్రుడ్డుపెట్టదు. దీనినిబట్టి చూస్తే ఏనుగు గంప క్రింద గుడ్డు పెట్టడము ఎంత అబద్దమో, అలాగే శరీర అవయవముల

వివరము తెలియనివాడు జ్ఞాని అనుట కూడ అంతే అబద్దమగును.



మాకు తెలిసినంత మర్మంబు ధరలోను

మరియు లేదటంచు మనుజులెల్ల

నొకరితోను ఒకరు వాధించుచున్నారు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరమందు మాత్రము శక్తిగయున్న ఓ రెండవ ఆత్మా! వినుము. ప్రస్తుత కాలములో మనుషులు దేవుని

విషయములో కొన్ని వర్గములుగ చీలిపోయి మా వర్గమునకే దేవుడు దేవుని విషయములు తెలియుననీ, మిగత ఎవరికీ

దేవుడు దేవుని విషయములు తెలియవని పల్కుచున్నారు, ఒక వర్గముతో మరియొక వర్గము వారు ఈ విధముగ

వాధించుచు దేవుడు మాకు మాత్రమే తెలుసు అంటున్నారు. ఒకరి విధానమును ఒకరు ఒప్పుకోక పూర్తి విభేదించుట

వలన చివరకు ఘర్షణలు, పెద్ద యుద్ధములు ఏర్పడుచున్నవి. దేవుని విషయములో వర్గములుగ చీలి పోయిన మనుషులు

వారి వారి వర్గములకు మతముల పేర్లు పెట్టుకొని, మతముల మాయలో పడిపోయి దేవుని వాస్తవికతను తెలియలేక, ఒక

మతముతో మరియొక మతము వారు వాధించుకొనుచున్నారు.


తెలిసినామటంచు తేటగా బల్కిరి

ఏమి తెలసినారో ఎందుకొరకో

తర్క వాదమునకో ధరకీర్తి కోసమో

అఖిల జీవసంగ ఆత్మలింగ.




భావము :- శరీరములో కర్మానుసారము కదలికలిచ్చుచు, కర్మానుసారము రోగములు కలుగజేయుచు వాటిని

అనుభవింపజేయు ఓ అత్మా! వినుము. భూమి మీద ప్రజలలో దేవుడు దేవుని విషయములో మాది సరియైన మార్గమని

కొందరు, మీది కాదు మాదే సరియైన మార్గమని మరి కొందరు వాధించుకొనుట జరుగుచున్నది. ఇదంతయు చూస్తే

వీరికి దేవుని విషయము కొంతయిన తెలసునా అని అనుమానము రాక తప్పదు. దేవుని జ్ఞానము తెలిసినవారయితే అలా

వాధించుకొనరు. ఇతరుల మాటలలోని సత్యమును గ్రహింతురు. ఎదుటి వ్యక్తి మాటలలోని సత్యమును గ్రహించని

వారు అర్థములేని, శాస్త్రబద్దత లేని వాదము చేయుచునే ఉందురు. అటువంటివారు భూమిమీద తమ గొప్పతనమును

చాటుకొనుటకే ప్రయత్నించుచుందురు గాని సత్యమును గ్రహించలేరు. ఇతరుల మాటలలోని ఎంతటి గొప్ప సత్యమునైన

గ్రహించలేని స్థితిలో తాము గొప్పవారమనీ, తమ మత గ్రంథములే గొప్పవనీ, గోడ కట్టుకొని కూర్చొని ఉందురు. అటువంటి

వారికి ఎదుటివారు ఏమి చెప్పిన ఆ గోడదాటి వారికి వినిపించదు మరియు కనిపించదు.


తనదు నెత్తిమీద దన్నెడు కర్మంబు

వెడలుటకు గురుని వెదకి వెదకి

పూజ చేయ ముక్తి పొందుట కొరకయా

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- శరీరములోని మూడు ఆత్మలలో మధ్య ఆత్మయై, శరీరమును నడిపించు శక్తి కల్గియున్న ఓ ఆత్మా! వినుము.

మనము గత జన్మలలో సంపాదించుకొన్న ఆగామికర్మ సంచితకర్మయై తలలో నిలువయుండి, అందులో నుండి ప్రారబ్ధకర్మ

మను పేరుతో ఈ జన్మలో అనుభవానికి వచ్చి, దానిప్రకారము అనుభవింపజేయుచుండును. కర్మను లేకుండ

చేసుకోవలయునంటే, లేక దాని అనుభవమును పొందకుండ ఉండలవయునంటే, తప్పనిసరిగ గురువు అవసరము.

జన్మలనుండి తప్పించి ముక్తి కలుగజేయువాడు గురువు. అటువంటి గురువు కొరకు వెదక వలసియుండును. వెదక

వలసిన పనేముంది గురువులే మన ఇంటివద్దకు వచ్చి ఉపదేశమిచ్చి పోవుదురు కదా! అని కొందరనుకోవచ్చును. ఇక్కడ

చాలామందికి తెలియని పొరపాటొకటి కలదు. అది ఏమనగా! గురువును భూమి మీద గుర్తించుట చాలా అరుదైన పని.

గురువువలె కనిపించు బోధకులను చాలామందిని మనము చూడగలము. వీరిలో గురువెవరు? బోధకుడెవరు? అని

గుర్తించుట కష్టమైన పనియే. అందువలన గురువు అనగా అర్థమేమిటో తెలుసుకొని గురువును వెదకవలసి ఉంటుంది.

పరమాత్మ అంశతో పుట్టినవాడే గురువు. ఆయన స్వయముగ జ్ఞానమును బోధించగలడు. గురువు తానెప్పుడు ఇతరులు

చెప్పిన బోధలు చెప్పడు. ఇతరులు చెప్పిన వాటిని చెప్పువాడు బోధకుడగును. తాను స్వయముగ నిర్ణయించిన జ్ఞానమును

తెలియజేయువాడు గురువగును. అటువంటివాడు అరుదుగ దొరుకును, కనుక గురువు అనువానికొరకు వెదకవలసి

యుండును. కొన్ని మతములలో గురువు అవసరము లేదు, అతనిని పూజించుట కూడ మంచిది కాదు. నీ భక్తి నేరుగ

దేవుని విూదనే ఉండవలెనను వాదన కలదు. వారి వాదనలో సత్యమున్నప్పటికీ, ఆ దేవుడే మనిషిరూపములో వచ్చుననుట

వారికి తెలియదు. సాధారణ మనుషులను గాని, బోధకులను గాని మ్రొక్కడము మంచిదికాదని మేము కూడ అనగలము,

కాని అరుదుగ దేవుడే మనిషైనపుడు ఆ మనిషిని గురువుగ గుర్తించి మ్రొక్కడములో తప్పులేదు. దేవుడు సర్వశక్తిమయుడు,

కావున మనతల విూద గల కర్మను తీసివేసి ముక్తిని కలుగజేయు శక్తి అతనికుండును. అందువలననే ఈ పద్యములో

గురుని వెదకి వెదకి పూజచేయ ముక్తి పొందుటకయా అన్నారు. గురువులయిన వారు అంత సులభముగ గుర్తింపబడరు.

గుర్తింపబడిన సులభముగ మ్రొక్కించుకొనరు. దగ్గరచేరిన వారికి జ్ఞానమును ఎక్కించకమానరు. తమజ్ఞానము వలన

కర్మను లేకుండ చేయక మానరు.



అందుకొరకు గాని ఆత్మజ్ఞానంబు

ఆట గాదు బొమ్మలాట గాదు

వాట మెరిగి మాయ మాతను దాటుము

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో ఎవరు గుర్తించలేని విధముగ శరీర ఆకృతిని పోలియుండు ఓ ఆత్మా! వినుము. కొందరు గురువు

అంటే నీచవృత్తిపరునిగ, జ్ఞానమును తెలిసినవారిని బుద్ధిహీనులుగ పోల్చుకొని హేహ్యభావము కల్గియుందురు. ప్రపంచ

విషయములలో మునిగి ధనార్జన తప్ప ఏది గొప్పపని కాదని తలపోసి, చివరి దశలో తాను సంపాదించినదంత ఒదులుకోలేక,

తమ స్థితి తమకే అర్థముకాక, అగమ్య గోచర పరిస్థితిలో చనిపోవు వారికంటే, జీవితానికి ఒక ధ్యేయము కల్ని దేవుడే

తమకు గమ్యమని తెలిసి, ఒక ఉద్దేశముతో చనిపోవు వారు గొప్పకదా! మనకు తెలియకుండ ప్రపంచములో అనేక

అగచాట్లు కలుగజేయు మాయ ఏమిటో తెలిసి, దాని పర్యవసాన రూపములే గుణములని, కార్యములని, సుఖ దుః

ఖములని గ్రహించి, వాటిని వదలి దైవమును చేరుటే జ్ఞానోపాసన. అది కొందరునుకొన్నట్లు ఆటగాదు బొమ్మలాటగాదు,

ఎంతో తెలివితో కూడుకొన్నపని. సర్వ జనులను మూడు సూత్రములతో ఆడించు మాయను తెలిసి, దాని చేతికి


చిక్కకుండడమే జ్ఞానోపాసన. ఈ పని సాధించుటకు జగతిలోని ఇంజనీర్ల తెలివికంటే, డాక్టర్ల తెలివికంటే, విజ్ఞాన

పరిశోధకుల తెలివికంటే అధిక తెలివి అవసరము. ఎంతో గొప్ప పరిజ్ఞానముతో కూడుకొన్న దైవాన్వేషణ మార్గమును

తెలివి తక్కువ పనిగ తలచువారికి ఎంత తెలివివుంటుందో, వారు ఏ కోవకు చెందినవారో మీరే ఆలోచించండి.



అంతరాత్మనెరిగి ఆనందమొందక

భ్రాంతి దయ్యములచే పట్టుబడిన

చింతతీరదయ్య చీకాకు విడదయ్య

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములోని బ్రహ్మనాడిని స్థావరముగ ఏర్పరుచుకొని శరీరమంతట నఖ శిఖ పర్యంతము వ్యాపించి

శరీరాకృతిని పోలియున్న ఓ ఆత్మా! వినుము. మనిషి నేను దైవజ్ఞాన విషయములలోనున్నానని పొరపడి, మతముల

భ్రమలోనో, దేవతల భ్రమలోనో మునిగి నా దేవుడు గొప్పయనో, నామతము గొప్పయనో, నామార్గము గొప్పయనో

వాధించు కొనుచుండిన ప్రయోజనము లేదు. జీవాత్మ అయినవాడు తనలోని ఆత్మ విషయమును తెలియనిది, ఆత్మను

తెలిసి దాని ఆనందమేమో తెలియనిది లోపల గుణముల చింతలు తీరవు. గుణముల చింతలు తీరనిది చీకాకులు బాధలు

వీడవు. అందువలన ఏ మతస్థుడయిన కాని కొంత ఆలోచించవలసి యున్నది. దేవుడు సర్వవ్యాప్తి అయినపుడు మన

శరీరములో కూడ ఉన్నాడనీ, శరీరములోనే దేవున్ని తెలియవలసి ఉన్నదనీ, శరీరములోని దేవున్ని తెలియాలంటే దేవునికి

నీకు మధ్యగల ఆత్మను తెలియవలసి ఉన్నదనీ, ఆత్మను తెలియాలంటే శరీరములోని స్థితిగతులు తెలియవలెననీ, శరీరములోని

స్థితి గతులను తెలియనిది మాయ అను దయ్యము వదలదనీ, మాయ అను దయ్యము సర్వోన్నతుడయిన దేవున్ని

తెలియనియ్యదనీ, మాయ వివరము తెలిసి దానిని వదలించుకొన్నపుడే మొదట ఆత్మ, ఆ తర్వాత దైవమయిన పరమాత్మ

తెలియగలడని గ్రహించవలెను.


బాహ్యదృష్ఠి విడచి బైలందు లక్షించి

లక్ష్యమందు మూడు లక్షణములు

తెలిసినట్టి వాడు దేవుడనంబడు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము : శరీరము లోపల జరుగు సమస్త కార్యములకు సాక్షియైయున్న ఓ ఆత్మా! వినుము. బయట మాటల

రూపములో వాధించుట మాని శరీరములోని దేవున్ని కనుగొనాలంటే, శరీరములోని స్థితిగతులు తెలుసుకోవాలన్నాము

కదా! ఆ విధముగ శరీరములోని అంతరేంద్రియముల విషయము తెలిసినవాడు, అంతరేంద్రియములలోని ముఖ్యమైన

మనస్సుకు బాహ్యచింతలు చేరనీక, మనోదృష్టిని ఏ విషయము మీదికి కేంద్రీకరించక, ఏక అంతమయిన శూన్యములోనికి,

ఏక అగ్రమైన సున్నలోనికి, ఏమికాని ఏదికాని కాళీలోనికి లగ్నము చేసిచూచితే చివరకు సాధ్యపడునది ఆత్మ. మనోదృష్ఠికి

లక్ష్యపడు లేక తెలియపడు ఆత్మను పూర్తిగ పరిశీలించితే ఒకే ఆత్మ ముందు జీవాత్మ, వెనుక పరమాత్మ కలదని తెలియుచున్నది.

శరీరములోని మనోదృష్ఠిని బాహ్యమందుకాక లోపల పెట్టితే తెలియబడు ఆత్మవలన ఆత్మ మూడు విధములుగనున్నదని

తెలియుచున్నది. అదియే భగవద్గీతలో చెప్పబడిన ఒకటి క్షరుడు, రెండు అక్షరుడు, మూడు పురుశోత్తముడని తెలియవలెను.

అక్షరుడయిన ఆత్మను తెలియుట వలన దానికంటే కొంత భేదము కల్గిన క్షరుడయిన జీవాత్మ యొక్క విషయము తెలియబడును.


అలాగే అక్షరుడయిన ఆత్మకంటే ఎంతో భేదము కల్గిన పరమాత్మ గొప్పతనము తెలియబడును. మనోనిగ్రహత వలన కల్గు

బ్రహ్మయోగము అనబడు సాధన వలన ఆత్మను తెలిసినవాడై, ఆత్మకంటే వేరుగ తానయిన జీవాత్మనున్నానని గ్రహించి,

జీవాత్మ ఆత్మలకంటే వేరుగనున్న అన్నిటికంటే పెద్దదయిన పరమాత్మను తెలియువాడు ముక్తి పొంది దేవునిలోనికి కలసిపోవును.

అట్లు ఐక్యమైన వానిని దేవుడని చెప్పవలసి ఉన్నది. ఐక్యమైనవాడు శరీరమును వదలి తిరిగి పుట్టక శూన్యముగ మారిపోయాడు

గనుక వానిని దేవుడనియే చెప్పవలెను. శరీరములోనున్న మనము శరీరములేకుండ ఆకారముగాని, పేరుగాని లేని

దేవునిలోనికి కలిసిపోవాలంటే, దైవము మూడు ఆత్మలుగనున్నదనీ, అవి కలసితే ఒకే పరమాత్మగా మారగలదని తెలియాలి.


విషయ గుణములెల్ల విడువని నరులకు

విశదపడదు విమల మోక్షదృష్ఠి

విషయ గుణములందు విషమున్నదోయన్న

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- అకాల మరణము పొందిన వానికి శరీరము పోయినప్పటికీ అదే శరీరాకృతి కల్గి సూక్ష్మముగ కనిపించక,

వాని కర్మానుసారము ఆడించు ఓ ఆత్మా! వినుము. లోపలి అంతరాత్మ మీద దృష్టి నిలుపక బయటి విషయగుణముల

మీదనే లగ్నమగు వారికి జ్ఞానము గానీ, దేవుడు గానీ, మోక్షమనునది గానీ ఏమాత్రము అర్థము కాదు. పరిశుద్ధమైన

ఆత్మజ్ఞానము వారికి విలువ లేనిదిగా కనిపించుచుండును. అపరిశుద్ధమైన కర్మలతో కూడుకొన్న ప్రపంచ విషయములు

ఎంతో విలువున్నవిగ కనిపించును. కొందరు అజ్ఞానులకు విలువనిచ్చి వారితో సహవాసము పెంచుకోవడము, జ్ఞానులైన

వారికి విలువివ్వక వారిని నీచముగ చూడడము కూడ ప్రపంచము లో జరుగుచున్నది. అలా బయట ప్రపంచములోని

విషయములకు, తన దేహములోని గుణములకు విలువిచ్చిన వాడు, చివరకు వాటి వలన బాధ పడవలసివచ్చును. బాధకు

ప్రతిరూపము విషము. విషము మనిషిని బాధించుటకే ఉన్నదనీ, విషము ఎప్పటికి సంతోషము నివ్వదనీ, బాధించడమే

దాని సహజ ధర్మమనీ పెద్దలు చెప్పుచుందురు. విషము నుండి పుట్టిన పదమే విషయము, విషమునకు చాలా దగ్గర

పోలికలున్న పదము విషయము. విషయము అనుపదములో “య ” తీసివేస్తే విషము అగును. విషము మనిషిని బాధించి

చంపగలదు. విష (య)ము మనిషిని చంపకుండ బాధిస్తునే ఉండును. విషమునకు, విషయమునకు దగ్గర సంబంధముండి

కొంత మాత్రము తేడా గలదు. విషము చంపగలదు, విషయము చంపకుండ బాధించగలదు. అందువలన ఈ పద్యములో

విషయములను దగ్గర పోలికగల విషముతో సమానముగ పోల్చి, విషయ గుణములందు విషమున్నదోయన్న అన్నారు.

కావున విమలమైన మోక్షము విశద పరుచుకోక విషమున్న విషయగుణములలో పడువాడు, జన్మ జన్మలకు

బాధపడవలసియుండును జాగ్రత్త.


విషయభ్రమలు గెలిచి విజ్ఞానమును దెలిసి

యసి పదార్థమెరిగి యాత్మ గలిసి

బసవుడైన వెనుక భయమేమి యున్నది

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- మరణముండి నాశనము లేని ఓ ఆత్మా! వినుము. ప్రపంచలోని విషయములను, శరీరములోని గుణ

వివరములను గ్రహించి, వాటివలన ముప్పు తప్ప మంచి జరుగదని తలచి, తెలియవలసినదేదో అర్థము చేసుకొని,


దైవజ్ఞానమును పూర్తిగ తెలిసినవాడై, దానివలన తనలోని ఆత్మను తెలిసి కర్మలను అంటక, ఏ విషయమునకు చలించక

బసవునివలె అన్నిటికి సమానత్వము కల్గిన వానికి జన్మల కర్మల భయము లేకుండపోవును. దేవుని తెలియుటకు

ఆయనయందైక్యమగుటకు గల బ్రహ్మ, కర్మ యోగములనబడు వాటిలో ఈ పద్యము బ్రహ్మయోగమును గూర్చి

చెప్పినటువంటిదని తెలియవలెను.


పంచరంగులున్న పాప మధ్యంబున

మంచి బ్రహ్మ కళయు మెరియుచుండు

గాంచి దానియందు కలసిన శివయోగి

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- ఆకాశముననున్న సూర్యుడొక్కడే ప్రపంచమంతటిని తన వెలుగుచే ప్రకాశింపజేసినట్లు బ్రహ్మనాడియందుండి

శరీరమంతట చైతన్యముగ వ్యాపించియున్న ఓ ఆత్మా! వినుము. పంచ భూతములచే తయారయిన శరీరమునందు మధ్య

భాగములో బ్రహ్మనాడియున్నది. దానిలో చైతన్య ప్రకాశమైన ఆత్మయున్నది. ఆత్మను తెలిసి దానియందు లగ్నమైన వాడే

శివయోగి.


విశేషార్థము :- మన శరీరము ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములచే తయారయినది. శరీరములో

రంధ్రములు గల గొట్టములందు ఆకాశము, శ్వాస ద్వార గాలి, వేడిమి ద్వార అగ్ని, మూత్ర చెమటల ద్వార నీరు, ఎముక

కండల ద్వార భూమియున్నట్లు ప్రత్యక్షముగ తెలియుచున్నది. అందువలన ఈ శరీరమును పంచరంగులున్న పాప యని

అన్నారు. శరీరము మధ్యలో బ్రహ్మనాడియందు ఆత్మ నివసించు చున్నది. అందువలన ఆత్మను పాప మధ్యంబున

బ్రహ్మకళయని చెప్పియున్నారు. ఆత్మశక్తి చైతన్యము ద్వార శరీరమంతట వ్యాపించి యున్నది. అందువలన ఆత్మను

దీపముగ పోల్చి శరీరమంతయు వ్యాపించిన శక్తిని కాంతిగ పోల్చి, మెరయుచుండు అన్నారు. ఆత్మను తెలుసుకొని

దానియందే లగ్నమైన వారికి ఆత్మకు భేదముండదు. కావున దానియందు కలిసినవాడే శివయోగి అన్నారు.


 దినము నిర్వికల్ప నిష్ఠ సమాధిచే

తనదు పూర్వకర్మ దొలగిపోవు

గాని వేరు విధంబున గనరాదు మోక్షంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరగృహములో యజమానియైన ఓ ఆత్మా! వినుము. ప్రతి దినము కొంత కాలమైనను సంకల్పములు

లేకుండ యోగమందుండిన కర్మ నశించిపోవును. జన్మకు కారణమయిన కర్మ తొలగి పోవుటచే జన్మలు లేని మోక్షము

కల్గును. అట్లుగాక వేరు విధమున మోక్షము లభించదు.


విశేషార్థము :- మనస్సు ఎల్లవేళల సంకల్పములు కలుగజేయుచుండును. సంకల్పములు కలుగుచు ఎరుకగ (జ్ఞప్తి) యున్న

స్థితిని జాగ్రత్తావస్థ యందురు. సంకల్పములు లేకుండ ఎరుకగయున్న స్థితిని యోగమని అందురు. నిష్ఠయనగా ఒక

పద్ధతియని భావము. సమాధియనగ బుద్ధికి సమముగయున్నది ( ఆత్మ ) అని అర్థము. ఎవడయితే ఆలోచనలు లేని ఒకే

స్థితిలోయుండి ఆత్మను గ్రహిస్తు తన ఆత్మ బుద్ధికి సమముగ మారియుండునో, వాడు పూర్వజన్మలలో సంపాదించిన కర్మను

లేకుండ చేసుకొనును. యోగము చేయు సమయములో యోగశక్తి లభించును, యోగశక్తి కర్మను కాల్చు ప్రభావముగలది.


ఆ శక్తి యోగి శిరస్సున చేరి అక్కడ కర్మచక్రములోనున్న కర్మను కాల్చివేయును. ఒక్క యోగశక్తి వలననే కర్మ లేకుండ

పోవును. వేరు ఏవిధముగ కర్మ పోదు. కర్మ లేనపుడే జీవుడు శరీరమందు బందింపబడక అంతట వ్యాపించి పోవును.

యోగము లేనిదే కర్మపోదు, కర్మ పోనిదే మోక్షము రాదు. అందువలన వేరు విధమును గనరాదు మోక్షమని చెప్పియున్నారు.


నరుడు గురుని జేరి నాలుగు సేవలు

జేసెనేని నిజము జెప్పునయ్య

జెప్పగానె మాయ చప్పుడు చల్లారు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- హృది మధ్యలో నివాసముజేయుచు సూత్రదారివైయుండి జీవుని పాత్రదారునిగా ఆడించు ఓ ఆత్మా! వినుము.

నరుడు గురువును ఆశ్రయించి భక్తి భావముగలవాడై, గురువును పెద్దగ భావించుకొని స్థాన, అంగ, భావ, ఆత్మ అను

నాలుగు రకముల సేవలు జేయుచుండిన గురువు ఆత్మ జ్ఞానమును భోదించును. ఆత్మజ్ఞానము వలన మాయబలము

తగ్గిపోవును.


విశేషార్థము :- మానవుడు బ్రహ్మవిద్యాన్వేషుడై ఆ విద్యగల గురువువద్దకు పోయి శాస్త్రనుసారముగ వినయ విధేయతలతో

మెలగుచు, సాష్టాంగ దండ ప్రమాణము లాచరించుచు, నాలుగు సేవలు చేయుచుండిన ఆత్మజ్ఞానము ప్రాప్తించును.

నాలుగు సేవలు 1) స్థాన 2) అంగ 3) భావ 4) ఆత్మ సేవలు.

1) స్థాన సేవ : గురువు నివసించు ప్రాంతమును శుభ్రముగనుంచుచు, ఆ స్థలమును గురువు మనస్సుకు

అనుగుణముగనుండుటకు తగిన కార్యముల చేయుట స్థానసేవయగును.

2) అంగ సేవ : గురువు శరీరమునకు సేవలు చేయుట అనగ శరీరమునకు కావలసిన ఆహార పానీయములు మొదలుకొని,

దుస్తులు మొదలుకొని శరీర పోషణ, శరీర జీవనములో ఆరోగ్యముగ చూచుట మొదలగు కార్యములన్నిటిని అంగ సేవ

అందురు.

3) భావ సేవ : గురువును తనకంటే పెద్దలయిన, పూజ్యులయిన తల్లి, తండ్రి దైవముగ భావించి, వారికిచ్చు గౌరవమునే

గురువుకు ఇచ్చు చుండుటను భావ సేవయని అందురు.

4) ఆత్మ సేవ : గురు శరీరము నుండి వచ్చు ఆజ్ఞలను శిరసా ఆచరించుటయే ఆత్మ సేవయనబడును.

సేవలు చేయు శిష్యులను జూచి, గురువు వారి బ్రహ్మవిద్యా జిజ్ఞాసత్వమును పరిశీలించి పరిపక్వమైన దశలోనే

చెట్టు నుండి కాయలు కోసినట్లు సేవలందు పరిపక్వదశ కొచ్చిన వారికి ఆత్మజ్ఞానమును బోధించును. దానివలన మాయ

యొక్క వైపరీత్యము తగ్గి శిష్యుడు మాయతీతుడగును.

ఈ కాలములో గురువులే ముందు బోధ చేసినప్పటికి శిష్యులు సేవలు చేయకున్నారు. సేవలేని బోధ గురువుకు

బాకీ పడునట్లుజేయును. ఆ రుణము తీర్చుటకు తిరిగి జన్మలెత్త వలసివచ్చును. అందువలన సేవలు చేయని వారికి

జన్మరాహిత్యము రాక జన్మసాహిత్యము కల్గును.

పూర్వము పెద్దలు గురు సేవలు ఎంత చేసిన తీరనిదేయగునను భావముతో ప్రాణ, ధన, దేహములు గురువుకు

సమర్పణయని, అన్నియు గురువుకు అర్పించి తాను తనదియను భావన లేకుండయుండెడి వారు.



ఏమి జేసితేమి యేకాగ్రచిత్తంబు

జేసెనేని తనకు జెల్లునయ్య

జెల్లుననుచు దుష్ట చెడువృత్తులు చేయునా

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- సమస్త జీవులందు ఏక కార్య స్వరూపుడయిన ఓ ఆత్మా! వినుము. అర్థము తెలియని మనుజులు ఈ

పద్యమును ఆధారము చేసుకొని సద్గురువులను కూడ ఎదిరించి మాట్లాడుచున్నారు. అందువలన ఈ పద్యమనకు పూర్తి

వివరము తెలుసుకొనుట ప్రాముఖ్యము.


"అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః

సర్వం జ్ఞానప్లవేనైన వృజినం సన్తరిష్యసి"


"పాపాత్ములలో నీవు అధమ పాపుడవైనను, నీవు చేయు సర్వ కార్యములు పాపకార్యములే అయినను అన్నిటిని

జ్ఞానమను తెప్పచేత దాటగలవు” అను గీతా వాక్యము ప్రకారము ఏమి చేసితేమి ఏకాగ్రచిత్తము జేసెనేని తనకు

జెల్లునయ్య అన్నారు. ఏకాగ్రచిత్తమనగ ఏకమునకు అగ్రములోనున్న ఆత్మలో చిత్తమును కలుపడమని అర్థము. అంటే

యోగమని భావము. యోగి అయిన వాడు పూర్వ కర్మములను కూడ లేకుండ చేసుకొనును. కర్మల నశింపజేయు శక్తి

తనకుగలదని యోగి అయినవాడు అదే పనిగ చెడు కార్యములను చేయడు. ఎందుకనగా! చెడుకార్యములనైన, మంచి

కార్యములనైన మన ఇష్టప్రకారము జరుగవని యోగికి బాగ తెలియును. ఏది జరిగిన కర్మ ప్రకారమేనని నిశ్చయముగ

తెలియును. అందువలన కర్మల నశింపజేయుశక్తి ఉండినప్పటికీ జరిగెడి పనులు మాత్రము తన చేతిలో లేనపుడు

అదేపనిగ చెడువృత్తులు ఎట్లు చేయును.



గీతయందు కృష్ణుడు కూడ అర్జునునితో "ఏ పని నీ చేతిలో లేదు. నీవు యుద్ధము చేయనని పట్టుబట్టినా,

జరగవలసినదియుంటే తప్పక జరిగితీరును. నీ గుణములే నిన్ను ప్రేరేపించి యుద్ధము చేయించునని తెలియజేసాడు.

యోగులకు ఈ విషయము బాగుగ తెలియును. ప్రతి పనికి కర్మవలన ప్రేరేపితమైన గుణములే కారణమని తెలియును.

అటువంటపుడు చెడువృత్తులు గానీ, మంచివృత్తులు గానీ నేను చేయుచున్నానను ఉద్దేశముతో చేయడు.

సద్గురువుల వద్ద చేరిన మూర్ఖులు ఏ తప్పు దొరుకునాయని గురువును చూచుచుందురు. చిన్న తప్పు

కనిపించిన విమర్శకులై పొందవలసిన జ్ఞానమునకు దూరమగుదురు. అందువలననే కొందరు పెద్దలు ఈ విధముగ

"ఖ్యాతిగ సద్గురువు జేరియు జ్యోతిని గనలేక, బాహ్య చోద్యములచే కోతులవలె చరియించెడు పాతకులకెట్లు కల్గు భవ్య

గుణంబుల్” అన్నారు.


యోగి అయిన గురువుకు పాపపుణ్య వ్యత్యాసముండదు. వెనుక కర్మవలన సంభవించెడు సమస్త కార్యములను

చేయుచుండును. తాము ఆచరించుచూ అట్లే కర్మలనంటని విధానమును శిష్యులకు బోధించును. అదియే కర్మయోగము.

కర్మయోగ రహస్యము తెలియని శిష్యులు గురువు చేయుపనులయందు చిన్న చెడు కార్యము కనిపించిన వెంటనే బయటపడి

పోవుదురు. గురువులనే హేళనగా మాట్లాడుదురు. కాని కర్మయోగమును బోధించిన కృష్ణుని గీతనే ఆశ్రయించి, మేము

ఆ గురువుకంటే గొప్ప వారమెయనుచుందురు. గీతను చెప్పిన కృష్ణుడు ఎటువంటివాడని ఎవరయిన అడిగిన ఆయనకన్ని

చెల్లునని అందురు. తనకొక పద్ధతి ప్రజలకొక పద్ధతి కృష్ణుడు చెప్పలేదుగదా! అందరికి ఒకే సిద్ధాంతము గదా! ఆయన


మానవునిగానే నటించి ఆ సిద్ధాంతముల మీదనే నడిచాడు గదా! అని ఎవరయిన వివరముగ అడిగిన అర్థము తెలియని

మనుజులు ఆయన దేవుడయాయని సర్దుకొందురు.


గత జన్మ కర్మలననుసరించెయే కార్యములు జరుగుచున్నవని, తాను తలయందు సాక్షిగా చూస్తున్నానని, ఏ

కార్యము చేయలేదను భావన యోగికుండును. కావున తాను స్వయముగ కార్యములను చేయగలనను భావన యోగికి

ఉండదు.



అతడు బ్రహ్మ విష్ణు ఆనంద రూపుడు

అతని కేమి బాధ యాత్ర బోధ

సకల భూతసాక్షి సంపన్నుడై యుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పురుషులందు రెండవ వాడయిన ఓ అక్షర పురుషుడా! వినుము. యోగి అయినవాడు బ్రహ్మ, విష్ణువు

అనుభవించు ఆత్మానందమును అనుభవించుండును. అతనికి పాప పుణ్యముల బాధయుండదు. సుఖ దుఃఖములందు

చలించక జీవిత కాలమును ఆత్మబోధలయందే గడుపును. మరియు సకల జీవరాశుల శరీరములందు సాక్షిగనున్న

ఆత్మయందు కలసియుండును.


విశేషార్థము :- యోగము చేయు వేళ లభించు శక్తిని బట్టి దేవతల పదవులు నిర్ణయింపబడినవి. దేవతలు యోగులందే

యున్నారు. ఎక్కువ యోగశక్తి యున్న వాడిని విష్ణువని, రెండవ వానిని శివుడనీ, మూడవ వానిని బ్రహ్మయనీ ఈ

విధముగ వారి పదవులు నిర్ణయింపబడినవి. మానవులందే గొప్ప యోగులుగనున్నవారే త్రిమూర్తులు. గొప్ప యోగులు

అనుభవించు ఆత్మానందమును గురువు అనుభవించుచున్నాడు. కావున బ్రహ్మ, విష్ణు ఆనందరూపుడని యోగిగనున్న

గురువుల గురించి పై పద్యములో చెప్పి యున్నారు. అలాగే తన ఆత్మను తాను అనుభవము పొందుచున్నాడు గనుక

సాక్షియైన ఆత్మ సంపన్నుడన్నారు.



నేను నీవుయనుచు నిర్ణయం బెంచడు

భావమందు బ్రహ్మ భావమెరిగి

సావధానమతిని చక్కగ విహరించు

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- సమస్త జీవులందు కదలిక శక్తి నిచ్చు ఓ ఆత్మా! వినుము. యోగి అయినవాడు నేను నీవు అనెడి భేద భావము

లేక, ఆత్మ అన్నిటియందు ఒక్కటే విధముగ గలదను భావముతో జాగ్రత్త గల మనస్సుగలవాడై చరించును.


విశేషార్థము :- "విద్యా వినయ సమ్పన్నే బ్రహ్మణే గవి హస్తిని, శుని దైవశ్వపాకేద పండితా స్సమ దర్శిన:"



“విద్యయు వినయముగల్గు బ్రాహ్మణులయందు, గోవులందు, ఏనుగులందు, కుక్కలయందు, కుక్కలను తిను చండాలునియందు

పండితులు సమ భావమునయుందురు” యని గీతా వాఖ్యమున్నట్లు నీవు నేనుయను నిర్ణయంబెంచడుయని పై పద్యమునందు

చెప్పబడినది. ఈ మాట విన్నంతనే అందరిని ఒకే విధముగ గౌరవించవలయునని, ఒకరిని ద్వేషముతో ఒకరిని ప్రేమతో

చూడకూడదని, మంచివారిని చెడ్డవారిని ఒకే విధముగ మాట్లాడించవలయునని అనుకొందురు. పై పద్యమందు గాని,


గీతయందు గాని ఆ విధభావములో చెప్పియుండలేదని గ్రహించవలయును. ఆవును గౌరవించినట్లే పులిని గౌరవించిన,

పులి ఊరకయుండక మనకే హాని జేయును. సత్పురుషుని దగ్గరకు చేరినట్లే దుర్మార్గుని దగ్గర చేరిన, వాడు వెంటనే తన

దుష్టబుద్ధిని ప్రయోగించి మనకే కీడు చేయును. మిత్రుని గౌరవించినట్లే శత్రువును గౌరవించిన, శత్రువు మనకు

ప్రాణహాని చేయును. అందువలన సమభావమనునది ఆత్మపట్ల చూపవలెను. ఆత్మ సమానముగ నున్నదని తెలియువాడే

పండితుడని గీత భావము. ఆత్మ అన్ని జీవరాసులందు సమమే, అయినప్పటికీ జీవుల గుణములు వేరువేరుగ నున్నవి.

కావున జీవులను సమానముగ చూచుట అవివేకమగును. గీత యందు పరమాత్మయే చెడ్డ గుణములు గలవారిని

రాక్షసులుగ వర్ణించి, వారికి అధోగతి జన్మలు కలుగునని, తనను తెలుసుకొను జ్ఞానము వారికి ఏమాత్రము లభించదని

తెలిపియున్నాడు. అన్ని విధములుగనున్న జీవులను సమానముగ జూడక, అన్ని రకముల జీవరాసులందు సమానవృత్తి

కల్గి యున్న ఆత్మను సమానముగ చూచువాడే యోగి, పండితుడని పద్య భావము. అందువలననే భావమందు బ్రహ్మభావమెరిగి

అని చెప్పబడినది.


మతి యనగా మనస్సు. సావధాన మనగ జాగ్రత్తయని అర్ధము. ఆత్మ సమానత్వమను మనోజ్ఞప్తి గలిగి చరించువానినే

సావధానమతి చక్కగ జరించువాడని చెప్పడమైనది.



మంత్ర సిద్ధుడతని మార్గంబు మార్గంబు

జగతియందు అతని జన్మ జన్మ

అతని వెంట దిరుగు అమిత దేవగణంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- ముందు నీవుండి నీవెనక జీవున్ని పెట్టుకొనిన ఓ ఆత్మా వినుము. గురువు మహిమగలవాడై ఆయన నడిచిన

జ్ఞానమార్గమే అన్ని మార్గములకంటే గొప్పది. ప్రపంచములో గురువు పుట్టిన జన్మయే అందరి జన్మలకంటే ఉత్తమమైనది.

ఆయన వెంట దేవతలు గుంపులు గుంపులుగ తిరుగుచుందురు.


విశేషార్థము :- "ద్వౌభూత సర్గా లోకేస్మిన్ దైవ అసుర ఎవచ" "దేవతలు రాక్షసులు అను రెండు రకముల జీవులు భూమి

మీద పుట్టుచున్నారు.” అను గీతాచార్యుని వాక్యము ప్రకారము భూమి మీదనే సమస్త దేవతలు ఉన్నారు. యోగులందరిని

దేవతలనే చెప్పవచ్చును. వారికున్న యోగశక్తిని బట్టి వారికి దేవతాపదవులు నిర్ణయింపబడినవి. గురువుల వెంట

దిరుగువారు యోగసాధకులు, యోగులైవుందురు. అందువలన గురువు వెంటనుండు వారిని దేవగణములనుచు అతని

వెంట దిరుగు అమిత దేవగణంబుయని పద్యములో చెప్పినారు.


శరీరములో ఉద్భవించు “ఓం” కార మంత్రమును సిద్ధి పొందిన వాడు గురువు. మంత్ర సిద్ధి అనగ “ఓం”

కారము ఏ శక్తి వలన ఉద్భవించుచున్నదో ఆ శక్తిని పొందడము, లేక ఆ శక్తిలో ఐక్యమవడమని అర్థము. శ్వాసకు

మహిమను చేర్చు ఆత్మశక్తిలో ఐక్యమైన గురువును మంత్రసిద్ధుడని చెప్పడమైనది. అతను అనుసరించు మార్గము గొప్పది,

కావున అతని మార్గమే మార్గమని చెప్పడమైనది. ఆత్మను తెలుసుకొనుటయే జీవిత సాఫల్యముగావున్న అతని జన్మయే

జన్మయని చెప్పడమైనది.


అతని దర్శనమున అడవిలో జనులకు

పాపమెల్ల బాసి పరమగతికి

త్రోవ వెదుకుటకును దోచును మనసందు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పరమాత్మ ప్రక్కనుంచుకొని జీవునితో కలసియుండి శరీరముతో పనులు చేయు ఓ ఆత్మా! వినుము.

అడవిలోయున్న జనులకైనను గురు దర్శనము వలన కొంత పాపము నశించిపోయి, వారి మనసున మోక్షము పొందుటకు

తగిన జ్ఞానమార్గము వెదుకవలయునను ఆలోచన పుట్టును.


విశేషార్థము :- గురువుయొక్క చూపు అజ్ఞానుల మీద ప్రాకినపుడు, గురువు తలంపు వలన ఆయనందుండు యోగశక్తి

ఆయన చూపుద్వార ప్రసరించి, అజ్ఞానుల కర్మచక్రములోని జ్ఞానమార్గమున కాటంకమైన కర్మమంతటిని కాల్చివేయుట

వలన అజ్ఞానులలో కూడ జ్ఞాన జిజ్ఞాస కలుగును. గురు దర్శనము వలన కర్మలు పోవునను భావముతోనే "సాదుదర్శనమ్

పాపనాశనమ్" అని పెద్దలన్నారు.



సజ్జనులనుగాంచి సాష్టాంగ పడలేక

మొగ్గి తగ్గి కోడి ముదిసినట్లు

టఱ్ఱ గఱ్ఱ పెద్దడాబు బడైచూపు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- అన్ని జీవులందు వేరు వేరుగా కలిసియున్న ఓ ఆత్మా! వినుము. గురువులను చూచి నమస్కరించక, కోడి

పందెములోని కోడి మెడ చుట్టు ఈకలన్నిటిని పైకిలేపి తల పైకి క్రిందికి ఆడించుచు, డంబము చూపునట్లు మూర్ఖులు

కూడ గురువుల ఎడల తమ పెద్ద డంబమును చూపుచుందురు. వాడు కూడ నామాదిరి మనిషే కదా! నాకంటే వాడేమి

పెద్దయని పెద్దబడాయి కల్గి అసూయచూపు చూచుచుందురు.


వద్దు వద్దు యికను వస్తాదు తనములు

ప్రొద్దుపోయే జగతి పొంత మాయే

కొద్ది గడయు దీని గుట్టెల్ల జెడిపోయే

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరము వెలుపల ఏమాత్రము లేక లోపల మాత్రము చైతన్యముగనున్న ఓ ఆత్మా! వినుము. నీవు విడచు

ప్రతి శ్వాసకు కాలము గడిచిపోవుచున్నది. దిన దినము నీ ఆయుస్సు తగ్గిపోవుచున్నది. శరీరమును వదలిపోవు కాలము

ఆసన్నమవుతున్నది. ఇక ప్రపంచపు పెద్దరికముల వదలిపెట్టి ఆత్మజ్ఞానముచే నిన్ను నీవు తెలుసుకొనుము. ఆత్మజ్ఞానమే

అతిరహస్యము. కొద్దిగ మిగిలియున్న జీవిత శేషము అయిపోయిన, తెలియవలసిన రహస్యము తెలియకపోవును.

అందువలన నీజీవితమే వృధాయగును. ఇప్పటికైన వస్తాదు తనము వీడి వినయము కల్గి జ్ఞానము యొక్క గుట్టు తెలియుము.


పర్వతంబుకంటే భారమై యుండును

శుభకరంబు మోక్ష శోభనంబు

గురుని భక్తి లేని కుచ్చితులకెల్లను

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- అఖిల జీవులందు కలిసియున్న ఓ ఆత్మా! వినుము. గురుభక్తి లేని శిష్యులకు గురువు బోధించు మోక్షమార్గము

చాలా కష్టముగా యుండును.


విశేషార్థము :- కొందరు గురువులవద్ద చేరియు వారికున్న కపట గుణములను వదలక, మనస్సున భక్తి లేకున్నను పైకి

భక్తియున్నట్లు నటించుచు, గురువు బోధించు నిజమోక్ష జ్ఞానమార్గమును పెద్ద భారముగ మోయుచుందురు, ఎన్నాళ్ళు

బరువు మోయగలరు? ఏదో ఒకరోజు క్రింద వేయవలసిందే. కనుక అటువంటి కుచ్చితబుద్ధి గల భక్తులు గురువును

వదలిపోవు మార్గమును వెదకుచుందురు.



అల్ప సంశయంబు లర్థ విరోధముల్

తనకు లేని తత్త్వ ధర్మములను

గూర్చి ప్రశ్న జేయు కుమతుల ధరలోన

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- మూడు గుణములకు వేరుగవున్న ఓ ఆత్మా! వినుము. గురుభక్తి లేని వారు గురువు చెప్పు విషయములను

అర్థము చేసుకోలేక  అల్ప సంశయములతో కూడుకొని వాటిని గురించి వినయముగ అడిగి తెలుసుకొనక విరోధభావముతో

ఆచరణలేని ఆత్మ విషయములను ప్రశ్నించు చుందురు.


విశేషార్థము :- భక్తి లేని జనులు గురువు సాన్నిధ్యమును బంధనముగ దలచి, కేవలము ప్రపంచ విషయములతో

గురువును పోల్చుకొనుచు గురువుకంటే మనమేమిటియందు తక్కువగయున్నామనుకొని, తనకు మాలిన ధర్మములను

గురించి ప్రశ్నించుచుందురు. గురువు చెప్పిన విషయములు సాధన ద్వార అనుభవమునకువచ్చును. కాని సాధన చేయకనే,

అనుభవమునకు రాకనే, ఆ విషయములను గురించి ప్రశ్నించుచుందురు.


ఉదాహరణకు శ్వాస బ్రహ్మనాడీ ఏడు కేంద్రముల శక్తి ద్వార ఆడుచున్నదని, ఒక్కొక్క నాడీకేంద్రము నుండి కొన్ని

వందల శ్వాసలు జరుగుచుండునని, శ్వాస జరుగుటకు బ్రహ్మనాడీలోని శక్తి ఏడు భాగములుగనున్నదని, ఒక్కొక్క భాగములో

గల శక్తిని బట్టి శ్వాసలు జరుగుచుండునని గురువు చెప్పిన ఆ విషయములను కపట భక్తుడు ఆచరించకనే, అనుభవమును

పొందకనే గురువు చెప్పిన మాట మీద నమ్మకము లేనివాడై, అనుమానముగల వాడై, విరోధ భావము మనస్సులో

యుంచుకొని బ్రహ్మనాడిలోని శక్తి ద్వారనే శ్వాస జరుగునని ఏమి నమ్మకమని ప్రశ్నించును. ఆ ప్రశ్నకు గురువు జవాబు

చెప్పాడనుకొనుము, తర్వాత ఏడు కేంద్రములలో ఒక్కొక్క దానియందు కొన్ని వందల శ్వాసలే అన్నారే అన్నియే

ఎందుకాడవలయునని ప్రశ్నింతురు. అందులకు గురువు సమాధానము చెప్పిన తిరిగి ఏడే కేంద్రములున్నట్లు నీకే విధముగ

తెలియునని, ఒక కేంద్రములో ఇన్నియే శ్వాసలాడుటకు ఆధారమేమియని ప్రశ్నింతురు. ఈ విధముగ అనుభవించితే

కాని తెలియని విషయములను ఆచరణలేకయే అడుగువానిని చూచి గురువు ఏమి చెప్పకపోతే క్రింది విధముగ అనుకొందురు.



అట్టి ప్రశ్నలకు ఆ ఈశ్వరుండైన

చెప్పకూరకుంటే చపలులెల్ల

చప్పగానున జూచి చప్పట్లు జరుతురు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- జీవుల ప్రక్కననేనున్న ఆత్మా! వినుము. చెప్పిన మాట మీద నమ్మిక లేనివారికి, భక్తి భావము లేనివారికి,

సేవలు చేయని వారలకు ఆత్మబోధ చెప్పకూడదను భావముతో, తనకు మాలిన, పనికి మాలిన ప్రశ్నలుజేయువారికి ఆ

ఈశ్వరుడే సమాధానము చెప్పకుండిననూ, చపల బుద్ధిగల భక్తులు చిన్నతనముగ జూచి హేళనగ మాట్లాడుదురు. గొప్ప

గురువులను కూడ తమ నీచత్వముతో హీనముగ ప్రచారము జేయుదురు.


(పై మూడు పద్యములు కపట శిష్యులను గురించి చెప్పినవి. ఇక కపట గురువులను గురించి చెప్పు పద్యము

క్రింద గలదు.)



దాసు లధికమాయే దండముల్మెండాయే

కాసులకుపదేశ కాలమాయే

యేమి జెప్పనాయే ఈశ్వర తత్త్వంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- కాగిన ఇనుములో అగ్ని ఉన్నట్లు, సమస్త జీవుల శరీరములందు ఇమిడియున్న ఓ ఆత్మా! వినుము. కొందరు

కపట గురువులు బయలుదేరి ఆత్మ ధర్మము తమకు తెలియకున్నప్పటికీ, వాటిని గురించి శిష్యులకు ఏ విధముగ

తెలియజేయకనే, ఉపదేశము ముఖ్యమని చెప్పుచు, ఉపదేశము ఇచ్చుటకే గురువుండేదనుచు, ఆ ఉపదేశము కోసమే

గురువువద్దకు ప్రజలు రావలయునని బోధించుచు, వ్యాపారము చేసినట్లు డబ్బుకు ఉపదేశ మిచ్చుచు, శిష్యుల సంఖ్య

పెంచుకొనుటయే తమ ధ్యేయము అనుకొను వారున్నారు. అటువంటి కపట గురువు చేతిలోని బ్రహ్మజ్ఞానము హీనదశకు

వచ్చి విలువలేనిదై, శాస్త్రబద్ధతలేనిదై పోయినది.



రత్నగనులయందు రాజహంసున్నట్లు

తత్త్వవేత్త యల్ప తలపు లేక

నిత్య మొక్క రీతి నిజ సమాధిని యుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము: సూర్యుడొక్కడు ఈ లోకమును ప్రకాశింప జేయునట్లు శరీరమంతటిని నీ ఒక్కనివే ప్రకాశింపజేయు ఓ ఆత్మా!

వినుము. రత్నములు అధికముగ లభించు గనులలో రాజహంసయుండి రత్నమునే తినుచు వేరే ఏ పదార్థములను

తినకయున్నట్లు, ఆత్మను ( తత్త్వము) తెలుసుకొన్నవాడు ప్రక్క విషయముల ఆలోచనలు లేకుండ ఎప్పటికి శరీరమున

యోగమునే అనుభవించుచు, కర్మ అంటని విధానములో బుద్ధిని అహర్నిశలు సమానత్వము కల్గించియుండును.



మాట లధికమాడ మౌనికి మరిపుండు

కోట చెడిన రాజు కోతిపుండు

పేదవాని బ్రతుకు పెక్కు విధముల పుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- నాశరహితునిపై నాశనముకాగల జీవాత్మతో కూడివున్న ఓ ఆత్మా! వినుము. పేదవాని బ్రతుకు అనేక

విధముల బాధలతో కూడియున్నట్లు, కోతిపుండు మానని రీతిగ రాజ్యము పోయిన రాజు బాధ పడినట్లు, మౌనము కల్గిన

యోగికి మనస్సు చలించుటకు మొదలిడిన ఆయన మిక్కిలి బాధపడును.


విశేషార్థము : = మనస్సు యొక్క సంకల్పములధికమగుటను మాట లధికమాడయని చెప్పబడినది. మనస్సు నిలిచిపోవుటనే

మౌనమని తలంచవలయును. మనస్సును నిల్పువాడే మౌని (యోగి). పోయిన రాజ్యమును గురించి రాజు బాధ పడినట్లు,

బీదవాడు తాను పొందుతున్న కష్టలములను ఓర్వలేక తనకు ధనము లేకపోయేనని బాధపడినట్లు, యోగి అయినవాడు

యోగ భ్రష్టుడయితే, కోల్పోయిన తన యోగమును గురించి చాలా బాధపడును.


 గురువులందు మంచి గుణవంతులందు

కోరచూపు మనసు కోపరూపు

చపలు డిట్టులుండు చిరవానరము రీతి

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పూసల మధ్యలో ధారమున్నట్లు, జీవుల శరీర మధ్యలో శరీరమంతటికి ఆధారమైయున్న ఓ ఆత్మా! వినుము.

కోతిపిల్ల ఇతరులను ఊరకనే వెక్కిరించుచున్నట్లు, చపలతత్త్వముగల మూఢులు గురువుల ఎడల మరియు మంచి

గుణవంతుల ఎడల క్రోధము కల్గియుందురు. మరియు వారి ఎడల నీచముగ ప్రవర్తించుచుందురు. వారు చపల

చిత్తులైయుండి తమవలెనె అందరిని తలచుచుందురు.



మంచివారు లేరు మహినీస్థలంబున

మనకు వలదు దుష్టమతుల చెల్మి

మంచి కొరకు నీదు మౌనంబు బూనుము

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- ఎడతెరిపి లేక ఎల్లకాలములందు జీవునితో కలిసియున్న ఓ ఆత్మా! వినుము. దైవత్వముగలవారు భూమి

మీద తక్కువగయున్నారు రాక్షసత్వముగల వారు ఎక్కువగనున్నారు. రాక్షసులు చెల్మిచేయక దైవత్వము కొరకు నీవు

యోగముజేయుము.


విశేషార్థము :- యోగము చేసిన యోగశక్తి లభించును. ఆ శక్తిని బట్టి దైవత్వము నిర్ణయింపబడును. విష్ణు, ఈశ్వర,

బ్రహ్మ మొదలుకొని మిగత దేవతల పదవులన్నియు ఆత్మశక్తిని బట్టియుండును. ఆ శక్తియే దైవత్వము నకు కారణమనుటకు

దేవతా చిత్రపటములందు వారి తల భాగమున వెలుగుగ ఆత్మశక్తిని చిత్రించియున్నారు. దైవత్వమును పొందుటకు

యోగము చేయవలయునను సందేశమును తెల్పుచు మౌనముగ యుండుమని పద్యములో చెప్పియున్నారు.



మౌన మనుచు భ్రమసి మాటల మానిన

మౌన మదియుగాదు మాయ విడదు

మనసు కల్మసంబు మానిన మౌనంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- చర ప్రకృతియైన శరీరమంతట వ్యాపించివున్న ఓ ఆత్మా! వినుము. మౌనముగ ఉండవలయునని కొందరు

మాటలు మానివేసి నిశ్శబ్ధముగనున్నారు. మౌనమనగ మాటలు మానివేయడము గాదు. మాటలు మానివేసినంతమాత్రమున

మాయ విడదు. మనస్సు గుణ సంబంధ విషయములను జ్ఞప్తికి తెచ్చుచునేయుండును. గుణములు చెలరేగుచునే

ఉండును. అందువలన మౌనమనగ మాటలు మానుటగాదని, మౌన మనగ మనస్సు ఏ విషయములను జ్ఞప్తికి తేకుండ

ఉండడమని తెలియవలయును.



కాయసిద్ధికోరి గగనంబులనుజేరి

వాయు భక్షనమున వనరెనేని

మాయ తనువు తుదకు మట్టిపాలైపోవు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పంచభూత నిర్మాణమైన శరీరమునకు ఆధారముగనున్న ఓ ఆత్మా! వినుము. స్థిరకాలము బ్రతుకవలయునను

ఉద్దేశముతో గాలిని శ్వాస ద్వార కుంభించుచు, శరీరమును గాలియందు తేల్చివేయుచు, ఇదియే పెద్ద యోగమనువారు

కలరు. ఎంతకాలము బ్రతికిన గుణములతో కూడుకొన్న శరీరము చివరకు మట్టిపాలైపోవును.


విశేషార్థము :- శ్వాసను కుంభించుట వలన ఆయుస్సును పెంపొందింప జేయవచ్చును. అందువలన కొందరు శరీరమును

తొందరగా వదలకుండ చాలాకాలము బ్రతుకుటకు వాయుభక్షనజేయుచున్నారు. వాయువును కుంభించి శరీరమును

భూమి నుండి 4 లేక 5 అడుగుల ఎత్తవరకు ఆకాశమున తేలునట్లు ఆత్మయందు ఆసక్తి లేనివారు ప్రాణాయామము చేసి

ఇది యొక యోగమనుచున్నారు. విద్యనేర్చి గాలిని కుంభించినప్పటికీ మోక్షము రాదు, అది యోగము కాదు. అట్లు

జేయుటవలన ఎన్నాళ్ళు బ్రతికిన చివరకు "జాతస్య హిధులో మృత్యు" అను వాక్యము ప్రకారము శరీరము

విడువవలసినదేయగును.


యోగములను రాజయోగంబు మరి హెచ్చు

మంత్రములను ప్రణవ మంత్రమెచ్చు

పంచముద్రలందు పరమ శాంభవి హెచ్చు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పరమాత్మవూకాక, జీవాత్మవూకాక, కేవలము ఆత్మవై జీవాత్మతో పాటు శరీరములోనున్న ఓ ఆత్మా! వినుము.

దేవున్ని తెలియుటకు మోక్షమును పొందుటకు అనేకమార్గములున్నవని ఎందరో అనుచుండుట వినియే ఉన్నాము. ఈ

మాట సత్యమా అని చూచితే అన్ని విధముల అసత్యముగనే కనిపిస్తున్నది. ఎందుకనగా అన్నికంటే ముఖ్యము బ్రహ్మవిద్యలో

ప్రామాణిక గ్రంథము, స్వయముగ దేవుడే తెలియజేసినది భగవద్గీత గ్రంథము. అందులో దేవున్ని తెలియుటకు దేవుడే

తెల్పిన మార్గములు మూడే మూడు గలవు. దేవుడు సుస్పష్టముగ తెల్పినవి మూడు మార్గములు మాత్రమే. ఆయన తెల్పిన


మూడు మార్గములు మినహా ఏ మతములోను మరియొక మార్గములేదు. ఇస్లాం, క్రైస్తవమతములలో కూడ ఈ మార్గములకు

మినహ దేవుడు చెప్పలేదు. గీతలో దేవుడు చెప్పిన మూడుమార్గములలో ఒకటవదైన బ్రహ్మయోగము, రెండవదైన

రాజయోగము ఇందూమతములో ఎక్కువ ప్రచారముండగ మూడవదైన భక్తియోగము క్రైస్తవ, ఇస్లాంమతములలో ఎక్కువగ

గలదు. భగవద్గీతను చదివిన వారికే దేవుని చేరుటకు మూడు మార్గములున్నవని తెలియనిస్థితి ప్రస్తుత కాలములో గలదు.


దేవున్ని తెలియడములో లేక దేవుని వద్దకు చేరడములో రాజ యోగము మనిషికి చాలా అవసరమైనది. మనిషి

నిత్య జీవితములో కర్మలు ఆచరిస్తూ, అనుభవిస్తూ క్రొత్తకర్మను సంపాదించకుండ చేయునది రాజయోగము (కర్మయోగము).

కావున పై పద్యమందు యోగములందు రాజయోగంబు హెచ్చు అన్నారు. అదే విధముగ శబ్దముతో కూడుకొన్న మంత్రములు

కూడ గలవు. మంత్రములు దైవసంబంధమైనవి మరియు ప్రపంచ సంబంధమైనవి రెండువిధములు గలవు. వాటిలో దైవ

సంబంధమైన మంత్రములలో అన్నికంటే ముఖ్యమైనది “ఓం” కార శబ్దము గలది. ప్రతి మనిషి యొక్క శ్వాసలో ఇమిడియున్న

ఓం శబ్దమును ప్రణవమని అనుచున్నారు. ఈ శబ్దము శరీరములోని ఆత్మచేత పలుకబడుచున్నది, కావున పరమాత్మను

తెలియుటకు ముఖ్యమైనది ఓం కారమని చెప్పారు. ఇది మనిషియైన ప్రతి ఒక్కరిలోనున్నది, కావున కుల మత ప్రసక్తి

లేకుండ దీనిని అనుసరింపవచ్చును. అందువలననే పై పద్యములో మంత్రములలో ప్రణవమంత్రమెచ్చు అన్నారు.


ఇందూమతములో పంచముద్రలని కొందరు పేర్లు పెట్టుకొన్నవి గలవు. ఇవి ఏవి భగవద్గీతలో దైవ ప్రోక్తములు

కావు. అందువలన వీటిని గురించి పూర్తి మాకు తెలియదు. కొందరు ప్రజల భావము ప్రకారము ఖేచరి, భూచరి,

మధ్యలక్ష్మి, షణ్ముఖి, శాంభవీ అను ఐదు ముద్రలు గలవు. తల చక్కగ పెట్టుకొని కంటిలోని నల్లగ్రుడ్డును సాధ్యమున్నంతవరకు

పైకి త్రిప్పిచూస్తు ఉండిపోవడమును ఖేచరిముద్ర అని అందురు. రెండవది నల్లగ్రుడ్డును పూర్తి క్రిందికి త్రిప్పి చూస్తు

కదలకుండ ఉండమును భూచరి ముద్ర అందురు. చూపును పైకి క్రిందికి కాక సమాంతరముగ మధ్యలో పెట్టి

చూస్తుండమును మధ్యలక్ష్మి ముద్ర అందురు. ఈ మూడు విధములుగాక 1) పైకి 2) క్రిందికి 3) మధ్యలోనికి 4) కుడి

ప్రక్కకు 5) ఎడమ ప్రక్కకు 6) పూర్తి చుట్టుగ కన్నును త్రిప్పు చుండడము యొక్క ఆరు విధములను షణ్ముఖి అందురు.

ఇవన్నియుకాక ముక్కు కొన భాగమును చూడడమును శాంభవీ ముద్ర అందురు. ఈ ఐదు ముద్రలలో శాంభవీ

ముఖ్యమైనదని కొందనుచుందురు. వీటిలో శాంభవీ ముద్రకంటే వేరు విధానమును పరమ శాంభవీ అంటారు. పరమ

అనగ వేరయినది, వేరుగనున్నదని అర్ధము. పరమ శాంభవి అనగ శాంభవీ ముద్రలకంటే వేరయినదని అర్ధము. అనగా

ఐదు ముద్రలు కానటువంటి యోగము అని అర్ధము. చూపునిల్పు విధానముల అన్నిటికంటే మనస్సును నిల్పు

బ్రహ్మయోగము ముఖ్యమైనది. కావున ముద్రలలో పరమ శాంభవి హెచ్చు అన్నారు. ముద్ర అనగ కలదక కూర్చోవడమని

అర్థము. కదలక కూర్చోని చూపు నిల్పుటకంటే మనసు నిల్పు బ్రహ్మయోగము ముఖ్యమగుట వలన పరమ శాంభవి

హెచ్చు అన్నారు.


 రాజయోగ మోక్ష రాజ్యాభిషిక్తుడై

తనదు గృహమున నున్న ధర్మమెల్ల

పాలనంబు చేసి పరవశుడై యుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- మొదటిదయిన జీవాత్మకు మూడవదయిన పరమాత్మకు మధ్య సంధానమైయున్న ఓ రెండవ ఆత్మా! వినుము.


కదలక కూర్చోని మనస్సు నిల్పునది బ్రహ్మయోగముకాగ దానికంటే ఉత్తమమైనది కర్మయోగము. ఈ రెండు యోగములలో

పెద్దది శ్రేష్టమైనది కర్మయోగము కావున గొప్ప తనమును సూచించు రాజ పదమును చేర్చి కర్మయోగమును రాజయోగము

అనడము కూడ జరిగినది. రాజయోగములో అందరివలె పనులు చేయుచు, శరీరములోని బయట అవయవముల పనుల

ప్రకారము పనులు చేయుస్తు, అలాగే లోపలి మనో బుద్ధి చిత్తములను వాటి ధర్మము ప్రకారము పనులు చేయుస్తు,

అహము యొక్క పని తెలిసినవాడై శరీరములోని అనుభవములను అనుభవించడము జీవుని ధర్మమని తెలిసి, అన్నిటికి

అతీమైనది మోక్షమని, దానికొరకు శరీర ధర్మపాలన చేయు రాజయోగి తన వశములోకలదేది లేదని, అంతయు పరవశమని

తెలిసి పరవశుడైయుండును.



బంటులింద్రియంబులు పనులెల్ల జేయంగ

మనసు మంత్రిగాను మసలుచుండు

తన్ను తాను గన్న తత్వంబు తద్రూపు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- కాగిన ఇనుములో ఇనుమంతయు అగ్ని వ్యాపించినట్లు శరీరమంత వ్యాపించియున్న ఓ ఆత్మా! వినుము.

శరీరమును ఒక రాజ్యముగ పోల్చుకొని చూచినట్లయితే ఇంద్రియములు బంటులుగ పని చేయుచున్నవి. మనసు మంత్రిగ

కార్యముల జ్ఞాపకము చేయుచుండగ, ఆత్మ రాజుగయుండి తన పరివారమునకు శక్తి అను జీతమిచ్చి పని చేయించుచున్నది.

పనుల ఫలితమును ఆత్మ అనురాజు పరిపాలనలోని జీవుడు అను ప్రజలు అనుభవించుచున్నారు. తన ఆత్మను చూచుకొన్న

జీవుడు యాదారాజా ప్రజా అన్నట్లు తాను కూడ ఆత్మవలె చిన్న రూపమున్న జీవాత్మనని తెలియును. తాను కూడ శరీర

రాజ్యమునకు అధిపతిగనున్న ఆత్మవలె మారవలెనని ప్రయత్నించును. చివరకు సామంతరాజుయిన ఆత్మవలె మరియు

సామంత రాజులకు పెద్దయిన చక్రవర్తివలె మారవలెనని ప్రయత్నించును. జీవునికి చక్రవర్తి అయిన పరమాత్మగ

మారిపోవలెనను ఉద్దేశముకలుగవలెనంటే మొదట తన రాజ్యములోని సామంత రాజయిన ఆత్మరాజును చూచి రాజరికమంటే

ఏమిటో తెలియవలెను.


 పంచవింశ కుండు పాపపుజీవుండు

సంచి తాగమాది సకల కర్మ

లోలుడగుచు తిరుగు లోవెలి గురితప్పి

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పరమాత్మ పాలించు విశ్వమను సామ్రాజ్యములో శరీరమను సామంత రాజ్యమునకు రాజయిన ఓ ఆత్మా!

వినుము. పంచ భూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి చేత తయారయిన శరీరముతో కూడుకొన్న జీవుడు

కర్మత్రయమైన సంచిత, ఆగమ, ప్రారబ్ధకర్మలచే నిండుకొన్నవాడై ప్రారబ్ధమును అనుభవిస్తు ఆగమకర్మను ఆహ్వానించువాడై

ఉన్నాడు. ప్రపంచములో నిత్యము కర్మలోలుడయిన జీవుడు బయట ప్రపంచ దృష్టికల్గి జీవనమును గురించి ఆలోచించువాడై,

సమయమునంతటిని దానికే వినియోగించుచున్నాడు. తన శరీరము లోపల అంతట వ్యాపించిన ఆత్మను గురించికానీ,

శరీరము బయట అంతట వ్యాపించిన పరమాత్మను గురించి గానీ, ఏమాత్రము ధ్యాసగానీ, ఆలోచనగాని లేనివాడై

జీవితానికి ధ్యేయమంటు లేక తిరుగుచున్నాడు.



విత్తుచేత చెట్టు వెలసిన రీతిగా

కర్మచేత జన్మ కల్గుచుండు

కర్మ భ్రాంతి విడదు కలియుగాత్ముల కెల్ల

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- ప్రపంచమంతటికి గల ముగ్గురు పురుషులలోను మధ్య పురుషుడవై అక్షర పురుషుడని పేరుగాంచి, క్షరపురుషుని

వద్ద నిలచిన ఓ ఆత్మా! వినుము. భూమిమీద విత్తనము చేత చెట్టు పుట్టుచున్నది. అదే విధముగ కర్మ కారణము చేత

జీవునికి జన్మ కల్గుచున్నది. ఇది సర్వధా సహజముగ జరుగుచున్న పని. మనిషి పుట్టుచున్నపుడు సంతోషించువారు,

చనిపోవునపుడు బాధపడువారు, చావు పుట్టుకలకు కారణమైనదొకటున్న దని, అదియే కర్మ అని తెలియలేకున్నారు.

కలియుగాత్ములకు కర్మ భ్రాంతి విడచి కర్మయొక్క నిజరూపము తెలిసినపుడు మోక్షము పొందగలడు. కర్మంటే ఏమిటో

తెలియక కర్మను వేరు విధముగ ఊహించుకొని, అన్ని కార్యములకు తన నిర్ణయమేనని తాను అనుకొన్నట్లే చేయగలనని,

అనుకొనువారికి భ్రాంతి విడువదు, జ్ఞాన సత్యము తెలియదు, మోక్షము రాదు.


సకల సంకటంబు సంసార సంకుల

జంక డొంక వంక రంకు బొంకు

చాలునయ్య దీని చప్పుడీ చొప్పున

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో సకలేంద్రియములకు శక్తినిచ్చు ఓ ఆత్మా! వినుము. మనిషికి రెండు రకముల సంసారములు

గలవు. సంసారము అనగ సారము లేనిదని పెద్దలు చెప్పుచుందురు. సంసారము కుటుంబముతో కూడుకొన్నదని కూడ

చెప్పుచుందురు. మనిషి బ్రతకడమే సంసారమని కూడ కొందరనుచుందురు. ఎవరేమనుకొనిన నాకు తెలిసినంతవరకు

మనిషికి బయట సంసారము మరియు లోపలి సంసారమని రెండురకములు గలవు. బయటి సంసారము తనచుట్టుయున్న

మనషులతో కూడుకొని యుండును. బయటి సంసారము బయటి ప్రజలతో కలిసి చేయుపనులతో ఉండును. వ్యభిచారము,

దొంగతనము, అసత్యము, జూదము, మోసము, పలు విధముల పనులతో కూడుకొనియుండును. అట్లే కొన్ని మంచి

పనులతోను, కొన్ని చెడుపనులతోను, ఎన్నో ఒడుదుడుకులతోను, బయటి సంసారముండగ, లోపలి సంసారము మరియొక

విధముగ ఉండును. జీవుడు శరీరగృహములో నివశిస్తు మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను అంతఃకరణములతోను,

జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను అవయవములతోను, కలసి కాపురము చేయడమని తెలియవలెను. లోపలి గుణములనుబట్టి

లోపలి ఇంద్రియములు బయటి ఇంద్రియములు పని చేయుచుండగ, ప్రపంచములో అవి మంచి చెడు కార్యములుగ

పరిగణింపబడగ, జీవుడు సారములేని జీవితమును గడుపుచున్నాడు. శరీరము లోపలి ఇంద్రియములతోను, బయటి

పనులతోను జరుగబడునవి రెండురకముల సంసారములు. సంసారములో సారము లేదు అన్నట్లు చేయుచున్నాడు,

శరీరము బయటగల సంసారమును సత్ సారముగ మార్చుకొను విధానము గలదు. శరీరము లోపల మంచిసారముగ

సంసారమును మార్చుకొనుటకు క్రింద చెప్పిన పద్యమును చూచెదము.



త్రిగుణ రూపమాయే త్రిపురంబు లెల్లను

త్రిగుణ మందు జగము తిరుగుచుండు

త్రిగుణమిడిచి ముక్తి తెరవును గనవలె

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములకు ఇరుసుగనున్న ఓ ఆత్మా! వినుము. శరీరము బయట జరుగు

సంసారమునకు, లోపలగల సంసారమునకు మూడు గుణములే కారణము. సాత్త్విక, రాజస, తామసమనబడు మూడు

గుణముల ప్రభావము అందరిలో నిండిపోయి మనుషులను మూడు విధములుగ విభజింపచేసినవి. త్రిగుణ రూపమైన

జగత్తంతయు మాయా సంసారమైపోయినది. మూడు గుణములచేతనే శరీరము లోపలి ఇంద్రియములు పనిచేయగ

బయట కార్యరూపమై చివరకు జీవుడు కర్మబద్ధుడగుచున్నాడు. మానవుడు జ్ఞానము తెలిసినవాడై ముల్లోకములుగ చెప్పబడు

మూడు గుణముల వలన వచ్చు కర్మలను అంటనపుడు త్రిగుణసహిత సంసారమును విడచి సత్సారమైన ముక్తిని పొందగలడు.

మూడు గుణములను జయించకపోతే సంసారము దుస్సాధమైపోవును.



నాల్గు విధములుగను నరులకందరికి

బోధచేసినట్లు బుదజనములు

శాస్త్రరీతిగాను చాటిరి వినరేమో

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- జ్ఞానులయందును అజ్ఞానులయందును, మూర్ఖులయందును తెలివైనవారియందును, మంచివారియందును

చెడువారియందును, అన్ని మతములవారియందును ఒకే పద్ధతికల్గి ఒకే విధముగ రాగము (ప్రేమ) గాని ద్వేషముగాని

లేకుండ వర్తించు ఓ ఆత్మా! వినుము. భూమి మీద జ్ఞానులైనవారు అజ్ఞానులకు నాల్గు విధముల బోధచేసి ముక్తులగునట్లు

చేశారు. ప్రతి పనికి ఒక శాస్త్రపద్ధతి ఉండవలెనను సూత్రము ప్రకారము జ్ఞానము తెలిసి దైవమును పొందుటకు నాల్గు

విధానముల వరుస తెలియజేసారు. అవియే వరుసగా 1) భక్తి 2) జ్ఞాన 3) యోగ 4) ముక్తి అన్నారు. ఈ వరుస

విధామును తెలియనివారు కొందరు కొంత భక్తి కల్గిన వెంటనే గురు ఉపదేశములు పొంది కొంత సాధన చేసి యోగులమను

కొంటున్నారు. జ్ఞానము తెలియనిదే ఉపదేశము గానీ, యోగసాధన గానీ పనికిరాదని తెలియక జ్ఞానముతో పనేలేదు

సాధన ఉంటే చాలంటున్నారు. శాస్త్రపద్ధతిగ జ్ఞానము తెలియని సాధన గమ్యము తెలియని ప్రయాణము లాంటిదని

తెలియక పోయారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన "శ్రీయోలి జ్ఞానమభ్యపాత్" అనుమాటను మరచిపోయి శాస్త్రవిరుద్దముగ

జ్ఞానములేని సాధన చేయుచున్నారు. ఆ విధముగ అశాస్త్రీయ పద్ధతిలో ఎంతసాధన చేసినప్పటికి చివరికి అది యోగము

కాదు, దాని వలన ముక్తి లభించదు.


మూడు తనువులకు మూడవస్తలకును

ముఖ్యమైన సాక్షి మూర్తియేదో

గానలేని యోగి ఘనుడెట్టులాయెరా

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పురుషాకృతియైన ఈశ్వర లింగము మీద ముగ్గురు పురుషుల గుర్తుగయున్న మూడు విభూతి రేఖలలో


మధ్యరేఖగ గుర్తింపబడియున్న ఓ ఆత్మా! వినుము. మన శరీరము స్థూలముగ పైకి కనిపిస్తున్నప్పటికి మొత్తము మూడు

భాగములుగనున్నదని కొందరుచెప్పుచున్నారు. అవియే వరుసగ 1) స్థూల శరీరము 2) సూక్ష్మ శరీరము 3) కారణ

శరీరము అంటున్నారు. స్థూలశరీరము ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియము లుగ పైకి కనిపించునదిగ ఉన్నది.

సూక్ష్మశరీరము జీవుడు, బుద్ధి, చిత్తము, అహము, మనస్సు అనబడు ఐదు భాగములు. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ,

అపాణ అను ఐదు వాయువులు. చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ అను ఐదు ఇంద్రియ విషయములుగను మొత్తము

పదిహేను భాగములుగ ఉన్నది. కారణ శరీరమనగ జన్మలకు కారణమైన పాపపుణ్యములని తెలియాలి.


శరీరములోని ఆత్మ శరీర మధ్యలోగల బ్రహ్మనాడిలో నివశిస్తు శరీరమును కదలించి పని చేయించుచు శరీరము

చివరి అంచు వరకు వ్యాపించి ఉన్నది. కనుక ఎల్లవేళల ఆత్మ స్థూలశరీరమునకు సాక్షిగ ఉన్నదని చెప్పవచ్చును. అదే

విధముగ సూక్ష్మశరీరములోని అన్ని భాగములకు శక్తినిచ్చి కదలించి పనిచేయించుట వలన శరీరమునకు కూడ ఆత్మ

సాక్షిభూతమై ఉన్నది. కర్మచక్రమునకు ఇరుసుగనున్న బ్రహ్మనాడిలో ఆత్మ నివాసమై ప్రతికర్మను చూస్తు స్థూల సూక్ష్మ

రెండు శరీరముల ద్వార అనుభవింపచేయుట వలన మూడవదైన కారణశరీరమునకు కూడ ఆత్మ సాక్షిగనున్నదని చెప్పవచ్చును.

ఈ విధముగ మూడు శరీరములకు ఆత్మ సాక్షిగ ఉండడమేకాక నిద్ర మెలుకువ స్వప్నములనబడు మూడు అవస్థలందు

కూడ ఆత్మసాక్షిగనున్నదని చెప్పవచ్చును. ఆత్మ జాగ్రత్తావస్థలో మనస్సుకు చైతన్యము నిచ్చుట వలన అప్పుడు కూడ

సాక్షిగనున్నదని చెప్పవచ్చును. అలాగే నిద్రపోయినపుడు మనస్సు లేకున్నను నిద్రలో ఆడు శ్వాసకు చైతన్యమునిచ్చుచు,

మిగత శరీరములోపలి కార్యములకు కూడ శక్తి నిచ్చుటవలన, అపుడు కూడ నిద్రకు సాక్షిగ ఆత్మగలదని చెప్పవచ్చును.

స్వప్నావస్థలో జరుగు స్వప్నములందు మనస్సును పనిచేయించుచు, అక్కడి విషయములు మనస్సు ద్వార జీవుని అనుభమునకు

తెస్తున్నది. కావున స్వప్నములో కూడ ఆత్మ సాక్షిగనున్నదని తెలియుచున్నది. ఈ విధముగ మనలోగల మూడు శరీరములకు,

మూడు అవస్థలకు, ఆత్మ సాక్షిగనున్నదని తెలియనివారు జ్ఞానులనిపించుకోలేరు, తర్వాత యోగులుకాలేరు. జ్ఞాని కానివాడు

యోగికాడు, యోగికానివాడు ముక్తి పొందలేడు.



అట్టి బ్రహ్మపథము పట్టుగా గన్నట్టి

పరమ యోగి చరిత భావమెల్ల

నరులకు శక్యమగునే పరికించి చూడంగ

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- శరీరములోనే దృష్టినిల్పినిన్ను తెలియవలెనని ప్రయత్నించు యోగులకు తెలియబడు ఓ రెండవ ఆత్మా!

వినుము. భూమి మీద మానవుల జీవితములో రెండే మార్గములు గలవు. అవి ఒకటి ప్రకృతి మార్గము రెండవది

పరమాత్మ మార్గము. నూటికి తొంభై తొమ్మిది పాళ్ళ మనుషులు ప్రకృతి మార్గములో నడుస్తున్నారు. కేవల ఒక్క భాగము

మాత్రము దైవ మార్గములో నడువవలెనని ప్రయత్నించుచున్నారు. అటువంటి వారిని కొన్ని వేలమందిని పరిగణలోనికి

తీసుకొంటే వారిలో ఎవడో ఒకడు అరుదుగ బ్రహ్మపథము అను దైవమార్గములో పట్టుగల్గి ముందుకు పోవకల్గుచున్నాడు.

బ్రహ్మపథములో పట్టుగల్గి యోగియైనవాడు తనస్థితి తనకు తెలిసినవాడై ప్రపంచములో జీవితమును సాగించుచుండును.

అటువంటి వాని ప్రవర్తన అజ్ఞాన నరులకు ఏమాత్రము అర్థము కాదు. అటువంటి సంపూర్ణ యోగి భావమందు వేరు

భావము కల్గివుండును. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన ధర్మము తెలుపడమేకాక ఆచరించి చూపించాడు. ఆయన

సవ్యమైన అపసవ్యమైన పనులు చేసి యోగులకు నేను మార్గదర్శకుడనని తెలియజేశాడు. పనులు చేస్తున్న నాకు ఏ కర్మలు


అంటవు. నామాదిరి కర్మరీత్య కార్యములు చేయుచు తామరాకుకు నీరంటనట్లుండము యోగుల యొక్క లక్ష్యమన్నారు.

ప్రారబ్ధకర్మ మన ఇచ్చ ప్రకారముండదు. మనమే కర్మ ఆధీనములో ఉండి దానిప్రకారము నడువవలసియుండును. అందువలన

కర్మ ఆచరణలో మంచి పనులు రావచ్చును, లేక చెడు కార్యములు రావచ్చును. అటువంటపుడు ఒక దానిని చేయడము,

మరియొక దానిని మానుకోవడము తగదు. కర్మ దాని ఇష్టప్రకారము అది ఆడిస్తూ పోవుచుండును. కర్మ ఆధీనులమై చేసెడి

కార్యములలో లోపలి భావమందు మార్పుకలిగి అహమును లేకుండ చేసుకోవలెను. అట్లు చేయుట వలన పనులలోని

పాపపుణ్యములు అంటవు. ఈ సూత్రమును అనుసరించి యుద్ధము చేయుము, పాపమురాదని కృష్ణుడు అర్జునునకు

చెప్పాడు. నిజమైన యోగి లోపల భావమందు మార్పుకల్గి చేసెడి పనులలో పై కార్యములే కనిపించును, కాని లోపలి

భావము కనిపించదు. జ్ఞానము తెలియని వారికి పై చూపే ఉండును. కావున యోగుల భావము తెలియదని ఈ పద్యములో

తెలియజేసారు.


బాలమత్తరీతి బలుపిశాచము భాతి

భావమందు భేద భావమిడచి

దిరుగుచుందురయ్య గురువులు ధరలోన

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పూలమాలకు ఆధారమైన దారమువలె శరీరమునకు ఆధారమైయున్న ఓ ఆత్మా! వినుము. చిన్న వయస్సులోని

పిల్లలు మంచి చెడుపనులు జేసియు నేనుయను అహము పొందకుందురు. లాభనష్టములకు చింతించకుందురు. వారికి

మంచి, చెడు, లాభనష్టములనెడి బేధముండదు. అట్లే గురువులకు కూడ బేధభావము లేకయుందురు. ఇంకను పెద్ద

పిశాచి ఆవహించినవాడు ఏమి తెలియని స్థితిలో నిలిచిపోయినట్లు, పిశాచి ఆవహించిన సమయములో చేసిన పనిని తాను

ఏమాత్రము చేయలేదను భావము కల్గియున్నట్లు, యోగులకు కూడా తాను శరీరముకంటే వేరని, శరీరములో జరిగిన

పనులకు తాను కర్తను కాదను భావముతోయుండును.


విశేషార్థము :- చిన్న వయస్సులోని వారికి వారి అంతఃకరణములు కూడ చిన్నవిగానే ఉండును. జీవుడు ఎప్పటికీ ఒకే

విధముగనున్నను, మరణములో పాత అంతఃకరణములు పోయి జన్మలో క్రొత్తవి వచ్చుచున్నవి. క్రొత్తవికూడ శరీరముతో

పాటే పెరుగుచుండును. చిన్నవయస్సులోని వారికి అహంకారము కూడ చిన్నదిగనేయుండును. చిన్నవయసులో జరిగిన

పనులకు అహంకారము నేనను భావమును జీవునికి బోధించు శక్తి లేకున్నది. కాలములో జరిగిన పనులకు జీవుడు

నేను చేసానను భావము లేనివాడైయుండును. అందువలన చిన్నవయస్సులోని వారికి ఏ కర్మరాదు. కావున గురువులను

చిన్న పిల్లలుగ పోల్చి చెప్పడమైనది.


పిశాచము పట్టినవాడు సమయములోజేసిన పనులను జ్ఞప్తికి వచ్చిన తర్వాత జూచి పిశాచమువేరని, తానువేరని

జరిగిన పనులు పిశాచమేజేసినది, నేను చేయలేదనుకొన్నట్లు, గురువులు శరీరమువేరని తామువేరని అనుకొందురు.

శరీరముతో జరిగిన పనులను జూచి 24 భాగములుగయున్న శరీరమే పనులకు కర్తయని నేను ఏపనిని జేయలేదనుకొనును.

అందువలన గురువులు ఏ కార్యములు ఆచరించినా కర్మ బేధము వదిలివుందురు.


ఘట జలంబులందు గగనచాయ యున్నట్టు

కుటిల జగముతోడ గూడియున్న

అతి విలక్షనార్థస్థితిని జరించును

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- సకల శరీరములందు మూడవస్థలలో చైతన్యమునిచ్చు ఓ ఆత్మా! వినుము. పైనయున్న విశాల ఆకాశము

కుండనీటిలో ప్రతిభింబించి కనిపించురీతిగా ఆత్మయందు కూడియున్న గురువులు కూడ మూర్ఖపు మనుష్యులలో యున్నట్లే

కనిపించుదురు. కుండలోని ఆకాశము కంటికి కనిపించినను నిజముగ అది కుండలో లేనట్లు, మూర్ఖుల మధ్యలో

యోగులు కనిపించినను నిజముగ వారు వేరు భావముతో ఉందురు.


విశేషార్థము :- పైకి తలెత్తి చూడలేని వానికి కుండ నీటియందు ఆకాశము మరియు మేఘములెన్నియో కనిపించినపుడు

వాడు చూస్తున్నది ఆకాశము మేఘములను మాట నిజమే. ఎందుకనగ వాడు నిజముగ కంటితో చూడగల్గుతున్నాడు.

ఆకాశ మేఘమనగ వర్షము కురియు స్వభావము కలది. కాని కంటికి కనిపించు కుండలోని మేఘము వర్షము కురియు

స్వభావములేనిది. అట్లే మామూలు మనిషిగ మూర్ఖులుచేయు పనులనే గురువులు చేయుచున్నప్పటికీ, కనిపించుదానిని

బట్టి గురువులను కూడ మూర్ఖులుగనే లెక్కించిననూ వారు కర్మలనుభవించు స్వభావము లేనివారై ఉందురు. కర్మమును

భస్మీపటలము చేయు స్వభావముకలవారై యుందురు. వర్షము కురిసిన మేఘమును మేఘమని, కర్మల కాల్చువారిని

గురువులని అనుభవపూర్వకముగ తెలియనగును. కాని చూపుతో తెలియదగినది కాదు. ఎండమావులందు నీరున్నట్లే

కంటికి తెలియును. కాని నిజముగ అక్కడికి పోయి చూచిన నీరుండదు. ప్రతి మానవుడు సత్యాన్వేషణ చేసినపుడు సత్యము

తెలియును. పైకి కనిపించునది సత్యము కాదు.


ఘటజలంబులందు కనిపించు ఆకాశము చేతికి దొరకదు. చేతి తాకిడికి కనిపించక పోవును. అట్లే గురువులు

అజ్ఞానుల మాదిరే వర్తించుచున్నప్పటికీ, కర్మ వారిని బంధించలేదు. కర్మ తాకిడికి వారు దొరకరు.


ఆ॥

ద్వంస కవులు ధరను దండెత్తి యున్నారు

బుదుల పైన యుద్ధ బుద్ధి బూని

ఓర్వలేని భేద వాధ యుద్ధమునకు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పాపము చేయునపుడు, పుణ్యము చేయునపుడు ఒకే విధముగ శరీరమునకు శక్తినిచ్చి ఏ కర్మ అంటకుండ

ఉండు ఓ ఆత్మా! వినుము. ప్రపంచములో కవులు ఉన్నారు మరియు జ్ఞానులు ఉన్నారు. కవులు ఊహాజనితములైన ఎన్ని

వ్రాతలైన వ్రాయగలరు మరియు చెప్పగలరు. కవుల మాటలలో వ్రాతలలో మాట పొందింపు, వ్రాతల సొంపు ఉండును.

జ్ఞానులైన వారు ఏ విషయమును ఊహలతో చెప్పరు. జ్ఞానులు చెప్పు మాటలకు శాస్త్రబద్ధత ఉండును. కవులు

కవిత్వమునుపయోగించుచు జ్ఞానులరూపములో ఉండవచ్చును గానీ, జ్ఞానులు మాత్రము కవిత్వమును ఉపయోగించు

కవులుగ ఉండలేరు. కవులవద్ద లేని జ్ఞానశక్తి జ్ఞానులవద్ద యుండవచ్చును. అందువలన జ్ఞానుల మాటలను, వ్రాతలను

కవులు భాషాదోషమనో, ఉచ్ఛాటన దోషమనో తప్పులు పట్టుచుందురు. ముఖ్య విషయమేమనగా జ్ఞానులు భాషాపండితులు

కారు, కాబట్టి వారిమాటలలోను వ్రాతలలోను చిన్నచిన్న తప్పులుండవచ్చును. వాటిని వదిలి భావమునే ముఖ్యముగ


చూడవలెను. భావమును చూడక ఓర్వలేని బుద్ధికల్గి జ్ఞానులతో వాధ భేదమాడుచు యుద్ధ బుద్ధి కల్గియుందురు. అటువంటి

వారికి జ్ఞానము ఎప్పటికి కలుగదు. కవులు ఎప్పటికి జ్ఞానులతో భాషయందు పోటీ పడకూడదు, భావము తెలుసుకొని

బాగుపడవలెను.

ఆ॥

భూసమాధి కొరకు భువిలోను జనులెల్ల

బుద్ధి యందు ఆశబూని వారు

బుదుల కికను దిక్కు బుట్టదుగాబోలు

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- భువిలో ఎన్ని జీవరాసులున్నాయో అన్నిటిలోను అన్ని ఆత్మలుగ విభజింపబడి, పరమాత్మ ప్రతినిధిగ ప్రకృతిలో

కలసి శరీరములో పనిచేయుచున్న ఓ ఆత్మా! వినుము. బ్రతికియుండగనే సమాధి అని భూమిలో పూడ్చిపెట్టించుకొని

పేరు తెచ్చుకోవలెనని కొందరు యత్నించుచుందురు. మరికొందరు చనిపోయిన తరువాత సమాధి కట్టించుకొని, పూజలు

చేయించుకోవలెనని ఆశపడువారు గలరు. సమాధి అనగ ఏమిటో అర్థము తెలియనివారు, సమాధి యొక్క విలువ

తెలియనివారు, ఈ విధముగ ఆశ పెట్టుకొంటే దానికి పవిత్రత ఏమి ఉండును. జ్ఞానులై యోగమాచరించి, యోగశక్తి

పొందిన వారికి కేటాయించబడిన సమాధుల మీద అజ్ఞానులు ఆశ పెంచుకొన్నారు. అందరు సమాధియైతే జ్ఞానము

తెలిసిన యోగులకేమి ప్రత్యేకత ఉండును. అజ్ఞానులు సమాధి చేయించుకోవడము మంచిదికాదు.


తగదు భూసమాధి తత్త్వ జ్ఞానము లేని

నరులు కోరి రేని నరకమగును

బుదుల కొరకదియు పూజ్యత కల్గియుండే

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- ఏ విషయముతో సంబంధము లేకుండ శరీరములోని కర్మ ప్రకారము శరీరమును నడిపించు ఓ ఆత్మా!

వినుము. ఏ మాత్రము ఆత్మ జ్ఞానము తెలియనివారు భూసమాధి కావలెనని, అదియు జీవసమాధి కావలెనని కోరుకుంటే

వారికి అది నరకమేయగును. భూసమాధి తత్త్వ జ్ఞానము తెలిసి, బ్రహ్మయోగము పొంది శరీరముతో ఏ పని లేకుండ

యోగములో నిలిచి పోవువారికి అది అవసరము. సమాధి అనగా బుద్ధికి సమముగ తెలియునది ఆత్మని అర్ధము.

బ్రహ్మయోగములో మాత్రము మనస్సు నిలిచిపోవుట వలన బుద్ధికి ఏ విషయము తెలియక, దానికి సమాంతరములో

ఎదురుగనున్న ఆత్మయే తెలియును. స్థితినే సమాధి అని కూడ అందురు. బ్రహ్మయోగములో బుద్ధి వలన జీవాత్మ

ఆత్మను అనుభవిస్తున్నది కావున దానిని జీవసమాధి అని అందురు. జీవుడు తనకు సమముగ ఆత్మను అనుభవించడము

జీవసమాధి అనవచ్చును. ఇదేదో కొత్త నిర్వచనమనుకోవద్దండి. ఏనుగు బ్రతికిన వెయ్యి రూపాయలే, చచ్చిన వెయ్యి

రూపాయలే అన్నట్లు, బ్రహ్మయోగి బ్రతికినా సమాధి పొందినవాడే చచ్చినా సమాధి పొందినవాడే. గుర్తింపు కొరకు

యోగులను భూసమాధి చేసి చూపించవలసియున్నది. ఈ విషయము తెలియని అజ్ఞానులు కొందరు ప్రజలలో కొంత

గుర్తింపు పొందినంత మాత్రముననే భూసమాధి కావాలను కోవడము మంచిది కాదు. జీవసమాధి కావలెనని, వారి

గుంత వారే తవ్వించుకొని, అందులో కూర్చొని మూయించుకొని, పూజలు పొంద వలెననుకోవడము పొరపాటు. అలా

కూర్చుంటే పైన మూసివేసిన తర్వాత ఐదు నిమిషములకు ప్రాణవాయువు అందక ఊపిరాడక నరకయాతనపడి ఇరువది


నిమిషముల లోపల చనిపోవుదురు. బయటగాని, లోపలగాని శ్వాస మీద ధ్యాసలేని, శ్వాసతో పనిలేని బ్రహ్మయోగులే

భూసమాధికి అర్హులు.

ఆ॥

ఆత్మ జ్ఞానమనెడి అగ్నిచేత కాలిన

తత్త్వవేత్త తనువు తప్పకుండ

భూసమాధి చేసి పూజింపవలె నరులు

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- శరీరములోని బ్రహ్మనాడి యొక్క ఏడు ద్వారముల ద్వారా మరియు గ్రంథుల యొక్క ఏడు ద్వారముల ద్వార

శరీరమును పాలించు ఓ ఆత్మా! వినుము. యోగము చేసి జ్ఞానాగ్నిని సంపాదించి, జ్ఞానాగ్నిచే శరీరములోని కర్మలను

కాల్చివేసిన తత్త్వవేత్త (యోగి) మరణించిన తర్వాత, ఆయన శరీరమును భూస్థాపితము చేసి మానవులు పూజింపవలయును.


విశేషార్థము :- యోగులు జ్ఞానాగ్ని సంపన్నులై ఉందురు. అటువంటి యోగులు బ్రతికి ఉన్నపుడు వారి నుండి జ్ఞానాగ్ని

కిరణములు బయటికి వచ్చుచుండును. గొప్ప యోగులైన ఎడల వారినుండియే కాక, వారి యొక్క చిత్రపటముల నుండి

కూడ శక్తి కిరణములు వచ్చుచుండును. అటువంటి వారు మరణించిన వెంటనే వారి పటము నుండి కిరణములు వచ్చుట

నిలిచిపోవును. ఇంకను గొప్ప యోగులైన ఎడల వారి మరణానంతరము వారి పటము నుండి, వారి శరీరమును స్థాపితము

చేసిన స్థలము నుండి కిరణములు కొంతకాలము వరకు వచ్చుచుండును. యోగుల గొప్పతనమును బట్టి చనిపోయిన

తరువాత కిరణములు వచ్చు కాలముండును. మన చరిత్రలో 100 సంవత్సరముల వరకు వారి సమాధులనుండి శక్తి

బయటికి వచ్చిన యోగులున్నారు.


ఆత్మజ్ఞానమనెడి అగ్ని సంపాదించిన యోగుల శరీరములను భూసమాధి చేసి పూజించుచుండిన, అక్కడి నుండి

ఆత్మకిరణములు బయలుదేరి వచ్చుచుండును, కాబట్టి పూజించువారి కర్మలు కూడ కాలిపోవును. ప్రత్యక్ష సాక్షముగ

దేశములో కొన్ని సమాధుల వద్ద కర్మల నివారణ ఇప్పటికి జరుగుచున్నది.


నిద్రమాని వేసి నెగడి గూర్చుండిన

భద్రమనిరి మూఢ బద్ధ జనులు

నిద్రలోను యోగ నిద్రనుగనలేక

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- సమస్త జీవరాసుల బుద్ధికి సమానముగ అర్థమగు ఓ ఆత్మా! వినుము. నిద్రను జయించినవాడు యోగి

అనుమాట విని, దాని భావము పూర్తి అర్థముకాక కొందరు నిద్రలోని యోగమును తెలసుకొనక నిద్ర పోవుట మానివేసి

మేము యోగులమనుచున్నారు.


విశేషార్థము :- యోగులు నిద్రను జయించిన వారు, నిద్రనే నిద్ర పుచ్చువారు యను మాటలు కొందరు విని నిద్రపోకుండ

మేలుకొనుటకు అలవాటు పడుచున్నారు. 12 గంటలు నిద్రపోవువాడు 6 గంటలు నిద్రపోయి, 6 గంటలు నిద్ర

జయించినాడనుకొనుము. వానికి ఎప్పటికి 6 గంటల నిద్ర వచ్చును. 6 గంటల నిద్రరాదు. నిద్రరాకుండ అలవాటు

చేసుకొన్న సమయములో, నిద్రరావలయునని ప్రయత్నము చేసినను అలవాటు ప్రకారము నిద్రరాదు. తన నిద్ర తనయిష్ట

ప్రకారము రాకున్నపుడు నిద్ర తనమాట ఎట్లు వినినట్లగును. అట్టి వానికి నిద్ర తనవశము కాలేదని, నిద్రను వాడు


జయించలేదని చెప్పవచ్చును. నిద్రను జయించడమనగ నిద్రను మానివేయడముగాదు. నిద్ర పోయినప్పటికి ఎరుక

కల్గియుండడమని అర్థము, నిద్రయనగ మనస్సును మరపించునది. నిదురించువేళ మనస్సు మరపుకు పోకుండ, జాగ్రత్తగ

యుండడమే (యోగము) నిద్రను జయించడము. శరీరము నిద్రపోయినప్పటికి మనస్సు ఎరుగక ఉండటమే యోగము.

అందువలన పై పద్యమందు నిద్రలోను యోగనిద్రయని యోగమును సంబోదించారు.


ఆ॥

నిద్రమానరాదు నిద్ర పూనగరాదు

నిద్రలోను యోగ నిద్ర తెలిసి

ముద్రలోను బ్రహ్మమూర్తిని చూడరా

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- అయమాత్మ బ్రహ్మమని సమస్త యోగుల చేత ఉచ్చరించబడు ఓ ఆత్మా! వినుము. నిద్రమానివేసి జాగ్రత్తావస్థలో

ఉండకూడదు. మరియు నిద్రపోయినప్పటికి నిద్రలోనే యోగనిద్రగ ఉండవలయును. యోగనిద్ర స్థితిలోనే ఆత్మను చూడవలెను.

విశేషార్థము :- శరీరములోని 24 భాగములలో ముఖ్యమైనది మనస్సు. సూర్య చంద్ర నాడుల మీద సంచరించు మనస్సు,

విషయములను జ్ఞప్తికి తెచ్చు మనస్సు, బాహ్యేంద్రియములకు అంతరేంద్రియములకు మధ్యవర్తిగ యున్న మనస్సు, సూర్య

చంద్ర నాడుల విూదయుండి తనపని చేయు స్థితినే జాగ్రత్తయనుచున్నాము. మనస్సు సూర్య చంద్ర నాడులను వదిలి

బ్రహ్మనాడిలో తనకు తానుగ చేరిపోవడమే నిద్రయని అందుము. నిద్ర సమయములో మనసు తన సహజశక్తి అయిన

జ్ఞాపకశక్తిని కోల్పోయి విశ్రాంతిగా యుండును. అందువలన నిద్ర సమయములో ఏ విషయమును తెలియక జీవుడు

అంధకారములో ఉండును. మనస్సు బ్రహ్మనాడిని వదలి సూర్యచంద్ర నాడులను చేరినపుడు, బయటి ప్రపంచ విషయములు

మరియు జ్ఞాపకశక్తిచే జరిగినవి జరుగబోవు విషయముల ఆలోచనలు జీవునికి తెలియజేయుచుండును. ఈ స్థితినే

జాగ్రత్తావస్థయని అందురు. మనస్సు బ్రహ్మనాడిని చేరి అచట కూడ ఎరుక కలిగియుండి బ్రహ్మనాడిలోని ఆత్మను

జీవునికి తెలియజేయడమే యోగము. అపుడు జీవుడు ఆత్మానుభవములో ఉండును. మనస్సు బ్రహ్మనాడిలోయుండియు

ఎరుక కల్గియున్నది, కావున స్థితిని నిద్రయనకూడదు. మనస్సు ఎరుకయుండి బ్రహ్మనాడిని చేరియుండడము యోగనిద్రయని

అందురు. మనస్సు సూర్య చంద్రనాడు లలో ఉండడము యోగముకాదు. కావున పై పద్యములో నిద్ర మానగ రాదన్నారు.

మనస్సు బ్రహ్మనాడిలో ఎరుక లేకుండ ఉండడము యోగము కాదు. కావున నిద్రపూనగరాదన్నారు. మనస్సు బ్రహ్మనాడిలో

కూడ జ్ఞప్తి కలిగియుండడమే యోగము. అందువలన నిద్రలోను యోగముద్ర తెలిసి అన్నారు. యోగనిద్ర సమయములోనే

ఆత్మ తెలియును. కనుక ముద్రలోను బ్రహ్మమూర్తిని చూడరా అన్నారు.


యోగముద్రగన్న యోగీంద్రుడతి గాఢ

నిద్రనున్న నేమి నిశ్చలుండు

నిద్రగాదు యదియే నిర్వికల్ప సమాధి

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- జాగ్రత్త, స్వప్న, నిద్రయనబడు మూడవస్థలకు సాక్షిగనున్న ఓ ఆత్మా! వినుము. యోగనిద్రను తెలిసిన యోగి

అతిగాఢనిద్రలోయున్ననూ యోగములో మునిగియుండును. బయట చూచువారికి నిద్రయే కనిపించినా లోపల మనస్సు

ఆత్మయందు ఎరుక కల్గియున్నది. కావున దానిని నిర్వికల్ప సమాధియని చెప్పవచ్చును.


మాయ మబ్బు గ్రమ్మి పై చీకటై పోయే

చీకటందు జగము చిక్కి పోయే

యేమి తోచదాయె యెరుకకు మరుపాయే

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- మూడు ఆత్మలందు మధ్య ఆత్మవై సమస్త యోగులచే ఆరాధింప బడు ఓ ఆత్మా! వినుము. మూడు గుణముల

ప్రభావము వలన తమలోని ఆత్మ ఏమాత్రము తెలియకున్నది. మూడు గుణముల ప్రభావమునందే జీవులందరు చిక్కియున్నారు.

గుణములందు చిక్కుకొన్న మొదటి ఆత్మయగు జీవాత్మకు రెండవదయిన ఆత్మ ఏమి తెలియడము లేదు.


విశేషార్థము :- తామస, రాజస, సాత్త్వికమను మూడు గుణములనే “మాయ” అని పెద్దలు చెప్పచున్నారు. "గుణమయీ

మమ మాయ" గుణముల కూడికయే నా మాయ అని గీతయందు దేవుడు కూడ అన్నాడు. గుణభాగములందు

ఇమిడియున్న కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనెడి గుణములనే మాయ అనెడి మబ్బు (చీకటి) గ చెప్పినారు.

మూడు గుణభాగములందే జగములోని జీవులందరు చిక్కి ఉన్నారు. కావున చీకటందు జగము చిక్కిపోయేనని చెప్పారు.

గుణములందు చిక్కిన జీవుడు ఆత్మను తెలుసుకోలేకున్నాడు. కావున ఏమి తోచదాయె అన్నారు. జ్ఞాపకశక్తి అయిన

మనస్సు బ్రహ్మనాడిలో నిద్రావస్థగాయున్నపుడు జ్ఞాపకశక్తిని కోల్పోవుచున్నది. అందువలన ఎరుక మరుపాయె అని చెప్పారు.


 తాడు భుజగ భ్రాంతి దారుచోరభ్రాంతి

గగనమందు కుసుమ గట్టిభ్రాంతి

గలిగినట్లు జగము గలుగుచు తొలుగును

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములోని 25 భాగములకు అతీతముగయుండి శరీరమంతటికి శక్తినొసగు ఓ ఆత్మా! వినుము. చీకటిలో

తాడు పాముగ కనిపించినట్లు, దారి ప్రక్కననున్న పైకి కొట్టి వేయబడిన చెట్టు మొదలు మొద్దు దొంగలాగ కనిపించునట్లు,

ఆకాశములోని పొగరూపమైన మేఘము గట్టిగ (ఘనపదార్థముగ) కనిపించినట్లు, జీవుడు యోగము పొందని సమయములో,

ఆత్మను తెలియని కాలములో, జగమును అర్థము చేసుకొనలేక జీవుడే శరీరముగయున్నాడనుకొనును. ఆత్మను తెలిసిన

తర్వాత జగము యొక్క నిజ స్వభావము తెలిసినవాడై, జీవుడు చైతన్యము లేనివాడని, అన్నిటికీ ఆత్మయే చైతన్యమైయున్నదని

తెలుసుకొనును.



వట్టి సంశయంబు వచ్చింది వచ్చింది

మొట్ట మొదట లేని మూర్ఖతనము

పట్టి చూడ పోతే పసలేకపోయెరా

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- పరమాత్మకంటే తక్కువవాడై, జీవాత్మకంటే ఎక్కువ వాడైయున్న ఓ ఆత్మా! వినుము. ప్రకృతి, పరమాత్మ

రెండుగలవని ముందే తెలుసు కొన్నాము. ప్రకృతి పరమాత్మచేత సృష్టించబడినదే, కాని స్వయముగ పుట్టినది కాదు.

ప్రకృతి పరమాత్మను ఆధారముగ ఇరుసుగ చేసుకొని తిరుగుచున్నది, కాని అది స్వయముగ చలామణి కావడములేదు.

ఇక్కడ విచిత్రమేమంటే ప్రకృతి కనిపిస్తుంది, వినిపిస్తుంది మరియు అన్ని ఇంద్రియములకు గోచరమగుచున్నది. పరమాత్మ


ఎవరికి కనిపించునది, వినిపించునది కాదు మరియు ఇంద్రియాగోచరమైనది. పరమాత్మ శాశ్వితమైనది, ప్రకృతి

అశాశ్వితమైనది. ఉన్న సత్యమిది కాగా భూమి మీద మనిషికి ఉన్నది లేనట్లు, లేదిని ఉన్నట్లు తెలియజొచ్చి పెద్ద సంశయము

ఏర్పడినది. ఆసంశయమే దేవుడున్నాడా అను ప్రశ్న. లేని ప్రకృతిని ఉన్నట్లు, ఉన్న పరమాత్మను లేనట్లు తెలియడమే

మానవుని మూర్ఖత్వమైనది. ఆదిలో అందరు జ్ఞానులుగ ఉండెడివారు, అపుడు సంశయము లేక నిజ జ్ఞానము

తెలిసియుండెడివారు. కాలక్రమమున జ్ఞానము లేకుండ పోయి మొదట లేని మూర్ఖత్వము మనిషిలో ఏర్పడినది. చీకటిలో

తాడును పాముగ ఊహించినట్లు, మాయ చీకటిలో ప్రకృతియే దైవముగ మనిషికి కనిపిస్తున్నది. భ్రమచేత ప్రకృతిని

ప్రాముఖ్యముగ పెట్టుకొని పరమాత్మను విస్మరించిన వారికి ఎంత కాలము గడచిన ప్రకృతి మార్గములో శాంతి దొరకదు.

ప్రకృతికి ఆధారమైన పరమాత్మయే అసలైన సారాంశముకలవాడని తెలియకున్నంత వరకు, ప్రకృతిని ఆరాధించుచున్నంత

వరకు మాయ ప్రభావము విడువదు.


మాయ ఎరుగ బట్టి మర్దించలేనట్టి

మానవులకు యోగమార్గములను

జెప్పినాను యిందు చిత్రంబుగా ముందు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- ఇంటిలో విద్యుశ్ఛక్తిలాగ శరీరములో చైతన్య శక్తియైయున్న ఓ ఆత్మా! వినుము. మాయ అను పదమును

అందరము వినియే ఉందుము. నీవు మాయలో పడినావు అంటున్నారు. మాయ అంటే ఏమిటి? మాయ ఎక్కడున్నది?

మాయలో ఎక్కడ పడుచున్నాము? అని ప్రశ్నించుకొని చూస్తే, మాయ అనగా గుణముల సమూహమే అని తెలియుచున్నది.

గుణములైన మాయ మనతలలోనే ఉన్నది. గుణముల మధ్యలో ఎల్లపుడు జీవుడుండుట వలన మాయలో ప్రత్యేకించి

పడడము ఏమిలేదు, ప్రతి మనిషి తన తలలోపలే మాయలో పడి ఉన్నాడనియే చెప్పవచ్చును. జన్మించినప్పటి నుండి

తలలోని మాయలో మునిగియున్న మానవులకు మరియు గుణరూపములోనున్న మాయను కొంతమాత్రమైన తెలుసుకోలేని

మానవులకు, మాయను జయించలేకపోవుచున్న మనషులకు, ఎంతో చిత్రముగ యోగమార్గములు అర్థమగులాగున

తెల్పినాను. యోగమార్గము అర్థమైపోయి మాయను జయించుటకు వీలుగ బోధించాము.


చిత్త శుద్ధి లేని చీకాకు మతులకు

భక్తి యోగ జ్ఞాన భావమెల్ల

జెప్పవలెను యిట్లు చెప్పక తీరదు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- యోగులందును భోగులందును సమాన వృత్తి కల్గియున్న ఓ ఆత్మా! వినుము. ఎల్లపుడు మాయ గుణములందు

చిక్కి, ప్రపంచ పనులయందే లగ్నమై, వాటిలో ఏమాత్రము తృప్తిలేక, చిత్త శుద్ధి లేక, చీకాకు మతితో జీవితము సాగించు

అజ్ఞాన ప్రజలకు, వారు మాయనుండి కడతేరునట్లు భక్తి, జ్ఞాన, యోగములను బోధించవలెను. మనిషి మాయ నుండి

బయటపడుటకు కావలసిన ముఖ్యపరికరములు భక్తి, జ్ఞాన యోగములు. భక్తి అనగా ఎన్నో విధముల గలదు. ప్రకృతి

మీద గల భక్తిని, దేవతల మీద భక్తినికాక, దేవ దేవుడైన పరమాత్మ మీద భక్తిని ఏర్పరచవలెను. తర్వాత పరమాత్మ

జ్ఞానమే తెలుపవలసియుండును. భక్తి, జ్ఞానములలో పరిపక్వుడైన వానికి యోగమును గూర్చి చెప్పవలసి ఉండును. ఈ



వరుస క్రమముకాక భక్తిరాకనే జ్ఞానము బోధించిన ప్రయోజనము లేదు. అలాగే జ్ఞానమును తెలియకనే యోగమును

బోధించిన ప్రయోజనము లేదు. అందువలన అజ్ఞానులను జ్ఞానపథముల నడిపించవలెననుకొన్నపుడు, మొదట దేవతల

దేవుడైన పరమాత్మ విషయము కొంత తెల్పి, ఆయన మీద భక్తి పుట్టునట్లు చేయవలెను. ప్రాథమికముగ భక్తిని ఏర్పరచడములోనే

కొంత కష్టముండును. ఎందుకనగా ముందే ప్రతి మనిషి ఏదో కొంత భక్తికల్గి భక్తిని దేవతల మీదనో, ప్రకృతి శక్తుల

మీదనో చూపుచుందురు. భక్తి కోర్కెలు నిమిత్తమేనని వారి హృదయములలో నాటుకొని పోయి ఉండును. అటువంటి

భక్తిని లేకుండ చేసి పరమాత్మ మీద భక్తి కలుగజేయడము చాలా కష్టము. ఒకవేళ అసలయిన భక్తి కల్గిన తర్వాత

జ్ఞానము లేకనే యోగము చేస్తామనువారు చాలామంది ఉందురు. అది కూడ మంచిదికాదనీ, మొదట తెలియవలసినది

జ్ఞానమనీ, పూర్తిగ జ్ఞానమును తెల్సిన తర్వాత యోగమాచరించునట్లు చేయవలెను. ఈ పద్ధతి ప్రకారమైతే అజ్ఞానులు

కూడ ముక్తి పొందవచ్చును.



రాతినేల చెట్టు రసహీనమైనట్లు

కఠిన చిత్తముండు కారులకును

అచల బోధ తగుదు ఆర్యులు చెప్పరు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో అణువణువున వ్యాపించి శరీరాంతర్గత పనులకు కారణశక్తియైయున్న ఓ ఆత్మా! వినుము.

రాతినేల వర్షపు నీరింకదు తేమ ఉండదు. అటువంటి నేలలో విత్తనము వేసిన అది మొలకెత్తదు. ఒకవేళ మొలకెత్తిన

దానికి తేమ దొరకక బలహీనమై చివరకు ఎండిపోవును. మొదటిదైన భక్తి భావము లేని కఠినాత్ములకు, ఎప్పుడూ

విమర్శనాదృష్టితో చూచు అవిశ్వాసులకు, పరమాత్మ బోధ ఒంటబట్టదు. అటువంటి వారికి దైవజ్ఞానము చెప్పినా, దానిని

అర్థము చేసుకోక, విపరీతార్థ భావముతో చూచుకొనుచు, చెప్పెడి వారినే హేళనగా మాట్లాడజొచ్చుదురు. అందువలన

గురువులైన వారు అటువంటి రాతినేలతో సమానమైన మూర్ఖులకు నిర్వికారమైన అచల బోధ చెప్పరు.


పుచ్చు విత్తనము భూమిలో వేసినా

జచ్చు గాని మొలకసాగ దెందు

కుచ్చితాత్మలకు కుదరదు తత్త్వంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- అండజ, పిండజ, ఉద్భిజములైన మూడు రకముల జీవరాసు లలో ఏ జీవరాసియందైనాగాని ఒకే సిద్ధాంతము,

ఒకే నిర్ణయముగ, ఒకే పద్ధతిగ పనిచేయు ఓ ఆత్మా! వినుము. విత్తనము వేయబడు నేల సారములేనిదిగానీ, రాతినేలగానీ,

తేమలేనిదిగానీ ఐతే వేయబడిన మంచి విత్తనము కూడ వృధా అగును. అలాగే బోధను గ్రహించలేని మూర్ఖునికి ఎంత

మంచి బోధ చెప్పినా అది వ్యర్థమే అగును. ఒకవేళ భూమి మంచి సారవంతమైనదై, తేమగలదైన అందులో మంచివిత్తనము

పడక పుచ్చిన విత్తనము పడితే అది మొలకెత్తలేదు. అలాగే బోధను తెలియువాడు మంచి భక్తి విశ్వాసములుండి,

గ్రహించుకొను శక్తి కల్గియుండినప్పటికీ, బోధను చెప్పు బోధకుడు సరియైన బోధ చెప్పలేకపోతే, బోధ వానిని ముక్తి

మార్గమున నడిపించనూలేదు. అందువలన బోధ చెప్పించుకొను వాడు గానీ, బోధను చెప్పువాడు గానీ, ఇద్దరు సక్రమముగ

ఉన్నపుడే భూమి, విత్తనము రెండు బాగుండి పంట పండినట్లు మోక్షము లభించగలదు. అందువలన వినేవారందరు

శిష్యులు కారు, చెప్పేవారందరు గురువులుకారని కొందరన్నారు.


నిజము చెప్పెనేని నిష్ఠూరమొచ్చును

చెప్పరాదు నిజము జగతి రొష్టు

అధిక పరమ రహస్యమచల సిద్ధాంతంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.

99భావము :- జీవాత్మ ఏ శరీరములో ప్రవేశించినా, దానివెంట శరీరములో ప్రవేశించి, అక్కడ కర్మరీత్యా ఏమి

జరుగవలెనో పనులను శరీరము ద్వార చేయించు ఓ ఆత్మా! వినుము. ప్రపంచములో నిజమును తొందరగ అర్థము

చేసుకొనువారు చాలా తక్కువ. వారికి అర్థముకానపుడు సత్యము చెప్పిన వానిని నిష్టూరముగ జూచెదరు. ప్రపంచ

విషయములలో ఎట్లు చెప్పిన ఫరవాలేదుగానీ, జ్ఞానబోధలలో మాత్రము నిజమే చెప్పవలసి ఉన్నది. నిజము చెప్పితే

అర్థము కానివారికి విరోధిగా నిష్టూరముగ ఉండవలసినపని ఏర్పడును. అందువలన యాదార్ధమును అర్థము చేసుకొను

స్థోమత గల మనుషులు దొరకు వరకు పరమ రహస్యమైన బట్టబయలు (అచేల) సిద్ధాంతమును చెప్పరాదు.

||

అచలమంటే కొందరతి కోపగింతురు

అందు పరమసందు యందలేక

అంధకార బందురాత్ములై యుందురు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో నీవు పని చేసి, ఫలితమును జీవాత్మకు అందించే ఓ ఆత్మా! వినుము. ప్రపంచములోని

మనుజులందరు మాకు భక్తివున్నదని ఏదో ఒక పూజచేయుచు, తమ్ము తాము గొప్ప భక్తులుగ తలచుకొను చుందురు.

ఏమాత్రము ఆత్మజ్ఞానము లేనివాడు ఉదయము స్నానముచేసి ముఖాన బొట్టుపెట్టుకొని, ఇంటిలో ఏదో ఒక దేవుని

చిత్రము ముందర అగర్బత్తి ముట్టించి నమస్కరించి, నాకెంతో భక్తికలదని నిత్యము పూజ చేయనిదే బయటికి పోనని

అనుకొనుచుండును. అటువంటివాడు గొప్ప బ్రహ్మజ్ఞానులను సహితము నిందించు స్వభావము కల్గియుండును. తాను

మ్రొక్కుచున్నది దేవున్నో, దయ్యమునో తెలియనివాడు, ఏకముగ బ్రహ్మ జ్ఞానము తెలిసిన శక్తివంతులను సహితము లెక్కచేయని

స్థితిలో ఉండును. అటువంటి వారికి తాము చేయు పూజకంటే మిగతాదేది గొప్పగ ఉండదు. కనుక పరబ్రహ్మ స్వరూపము,

పరిపూర్ణము, నిర్వికారము అయిన అచేలమును గురించి చెప్పితే, దాని గొప్పతనముగానీ, వివరముగానీ తెలియని

అంధకారబందురాత్ములైన వారు కోపగించుకొందురు. బట్ట బయలును గురించి తెలుపాలనుకొంటే చెప్పేవారు వారికి

భూటకపు మనుషులవలె కనిపింతురు.

భావము :-

-

 సాధనంబు చేత సాధ్యంబుగానిది

పట్టతరము గాని బట్టబయలు

పట్టినామటంచు బల్కిరి కొందరు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


శరీరములోని ప్రాణమునకు ఆధారమై ఆడించుచున్న ఓ ఆత్మా! వినుము. నీవు శరీరమును నడిపించు

రెండవ ఆత్మవు. నీతో పాటు శరీరములో జీవాత్మ గలదు. జ్ఞానముగానీ, అజ్ఞానముగానీ రెండవ వాడయిన నీకు

అవసరము లేదు. కావలసినదంతా జీవాత్మకే. జీవాత్మ రెండవవాడైన ఆత్మ సహకారముతో మూడవవాడైన పరమాత్మలోనికి



చేరడమును ముక్తి అంటున్నాము. మూడవ పురుషుడైన పరమాత్మలోనికి చేరినపుడే, అదేదో ఎట్లుండునో జీవుని అనుభవానికి

వచ్చును. జీవుడు శరీరమును వదలి, ఎన్నో జన్మలనుండి వెంటవచ్చు ఆత్మను కూడ వదలి, పరమాత్మలోనికి చేరినపుడే

పరమాత్మ ఏమిటో తెలియును. బ్రతికి ఉన్నపుడు ఎంత సాధన చేసిన అది రెండవ ఆత్మను తెలియుటకు మరియు తన

కర్మను పోగొట్టుకొనుటకు ఉపయోగపడునుగానీ పరమాత్మ ఏమిటో తెలియదు. సాధన అంతయు కర్మను లేకుండ చేసి

ముక్తి మార్గమును ఏర్పరచునదే, కానీ సాధన వలన పరమాత్మ తెలియదు. సాధనపరుడు తన సాధనలో ఉత్పన్నమగు

జ్ఞానాగ్ని చేత కర్మనంతటిని కాల్చివేసి, కర్మశేషము లేనివాడైనపుడు మరణము పొంది, మరణము తర్వాత జన్మకు

పోకుండ పరమాత్మయందైక్యమగును. అట్లు కర్మలేనివాడై మరణము పొందితే, అపుడు దేవుడెవడో తెలియును. అంతవరకు

సజీవముగనున్న వానికి ఎంత యోగియైనా, ఎంత సాధకుడైనా, ఏ పద్ధతి అనుచరించినా, చివరకు బ్రహ్మర్షి అయిన

పరమాత్మ ఎటువంటిదో ఎవరికి తెలియదు. సాధనంబు చేత సాధ్యపడని బయలైన పరమాత్మను తెలిసినామని కొందరునుట

హాస్యాస్పదముగ ఉండును. బ్రతికియుండి మేము దేవున్ని తెలిసినామంటే, వారి అజ్ఞానమును వారి అమాయకత్వమును

చూచి దేవుడే నవ్వగలడు. సాధనముల చేత, బ్రహ్మయోగము చేత శరీరములోని ఆత్మ జీవాత్మకు తెలియగలదు. అంతేగాని

సజీవముగనున్న జీవాత్మకు పరమాత్మను తెలుపు సాధనగాని, పద్ధతిగాని ఏదీ భూమిమీద లేదు.

||

నామరూపు లేదు నానార్థములు గాదు

కామ లోభ మోహ కాంక్షగాదు

పంచ కళలు గాదు పంచాక్షరియు గాదు

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- నేను పుట్టినప్పటి నుండి నాలో అన్ని పనులకు సాక్షిగయుంటు ప్రారబ్ధమును నాచేత అనుభవింపజేయు ఓ

ఆత్మా! వినుము. భూమి మీద నాస్తికులు, ఆస్తికులు రెండురకములు గలరు. ఒక విధముగ ఆస్తికులకంటే నాస్తికులే

మేలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్తికులు దేవుడెవరో తెలుసుకోలేక దయ్యాలను పూజిస్తున్నారు. వారు నిజదైవమైన

పరమాత్మ మార్గములోనికి వస్తారను నమ్మకము లేదు. నాస్తికులు ఎప్పటికయిన మారితే పరమాత్మ మార్గములోనికి

రావచ్చనే నమ్మకమున్నది. నాస్తికులు, హేతువాదులు శాస్త్రబద్ధమైన పరమాత్మను తప్ప చిన్న దేవతలను విశ్వశించరు.

ప్రజలు విశ్వసించు దేవతలందరు దేవదేవుడు అయిన పరమాత్మకు సాటిరారు. మిగత దేవతలందరు పరమాత్మ సృష్ఠిలోనివారే.

దేవుని చేత పుట్టించబడినది ఏదైన రూపము పేరు కల్గియుండును. అంతేకాక దైవసృష్ఠిలోని సజీవ ప్రజలలో గానీ,

జంతువులలో గానీ, కామ, క్రోధ, లోభ, మోహది గుణములు కూడ తయారు చేయబడి ఉన్నవి. మానవులతో సహా ఎన్నో

లెక్కలేనన్ని అనుసంధానముగ సృష్టించబడ్డాయి. సృష్టించిన వాడు వేరు, సృష్టించబడిన వస్తువులు పదార్థములు వేరు.

కావున పై పద్యములో పరమాత్మను గురించి చెప్పుచు దానికి నామము రూపము లేదు అన్నారు. దానికి ఇతర

అర్థములు లేనే లేవు అన్నారు. సృష్టించబడిన గుణములు గానీ, కళలు గానీ, పంచాక్షరి అయిన పరమాత్మశక్తిగానీ కానే

కాదన్నారు. అన్నిటికి అతీతమైనది పరమాత్మ పరమాత్మనునది పేరు కాదు. ఆత్మకంటే పరముగనున్నదని, ఆత్మ కూడ

కాదని, పరముగనున్నదని పరమాత్మ అన్నారు. పేరు ఆకారము లేని దైవము ఇంకా ఎట్లున్నదో క్రింది పద్యములలో

చూచెదము.


||

ఆది లేదు దాని కాధారమెవ్వరో

నడుమ లేదు దాని నామమేమో

తుదయు లేదు మొదలు లేదు తుర్యంబు తాగాదు

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- శరీరమనెడి రథమునకు సారధిగయుండి, ఇంద్రియములనెడి గుఱ్ఱములను త్రోలుసారధియై, శరీర రథమును

అదిష్ఠించియున్న జీవునికి సుఖదుఃఖములనెడి అనేక ప్రదేశములను చూపుచున్న ఓ ఆత్మా! వినుము. పరమాత్మకంటే

ముందేది లేదు. దానిని పుట్టించినది మరేది లేదు. అది అగమ్యగోచరమైనది, దానిని స్వయంభు అని చెప్పేదానికి కూడ

వీలు లేదు. ఎందుకనగా ఒకప్పుడు లేకుండ వుండి తర్వాత తనకు తానుగ పుట్టినది కూడా కాదు. దానికి పుట్టుకయే

లేదు, మొదలు అని గానీ, మధ్య అని గానీ, తుదయని గానీ ఏ స్వరూపము లేదు. దానికి ఆధారము ఆది లేనిది, తనకు

తాను ఆధారమైనది. మనుషులకున్న నిద్ర మెలుకువ స్వప్నముకాక తురీయమను మూర్ఛలాంటి స్థితియు కాదు మరియు

ఏ యోగము కాదు. ఏది కాని స్థితి అనిన స్థితియు కాదు, మాటలతో చెప్పుటకు భాషయే లేనిది, సమాచారమే కానిది

మరియు సంచారము లేనిది ఇంకనూ ఎట్లున్నదనగా!


గాఢ నిద్రయు గాదు ఘనజ్ఞప్తియు గాదు

ఊరుకొనుట గాదు ఊహగాదు

పగలు రేయిగాదు. పరమాత్మ రూపంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- చెట్టుకు తాట (బెరడు) అనుబంధమై ఉన్నట్లు, శరీరములోని జీవాత్మకు శక్తి రూపములో అనుబంధమైయున్న

ఓ ఆత్మా! వినుము. మూడవ ఆత్మయైన పరమాత్మను నిద్రతో పోల్చి చూచితే గాఢనిద్రయు గాదు, మెలుకువతో పోల్చి

చూచితే ఘన జ్ఞప్తియుగాదు. ఏమి చేయక ఊరకుండుటేమోనని ఊరకుండిన అదియు కాదు. చేస్తే పనియు గాదు.

మనస్సు కాదు, మనో ఊహ అనుకొనే దానికి ఊహయు గాదు. కాలమును కొలచు పగలు రేయితో పోల్చి చూచినట్లయితే

పగలు గాదు, రేయిగాదు. పరమాత్మ ఇటువంటిదని చెప్పుటకు ఏ దానికి పోలిక లేనిదై, ఎటువంటి నమూనాలకు

ఊహలకు అందనిదై ఉన్నది. ఇంకా వివరముగ చూచినట్లయితే క్రింద పద్యము గమనించుము.

||

ఆది విరాటుయు గాదు యానందమును గాదు

ఆత్మగాదు అంతరాత్మ గాదు

చింతనొందబోదు చిత్కళత్వము గాదు

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- సంసారమను నాటకమునకు పరమాత్మ సూత్రదారి కాగ, నాటకమును వీక్షించుచు నాటకములోని భావములను

అనుభవించు ప్రేక్షకుడు జీవుడు కాగ, నాటకమును ఆడు ఓ ఆత్మా! వినుము. సృష్టికర్త అయిన దేవుడు ఎటువంటివాడో

అని ఏ విధముగ విడదీసి చూచిన ఏదిగాని అగమ్యగోచరునిగ ఉన్నాడు. ఆది విరాటని కొందరనుచున్నారు, మాట

నిజమేమో అని చూచిన అదియు నిజముగాదు. ఆనంద స్వరూపుడని కొందరు వర్ణించారు, మాట సత్యమా అనిచూచిన

అదియు నిజముగాదు. కొందరు అంతరాత్మయని ఆత్మయని అనేక విధములుగ చెప్పడము జరిగినది, మాటలు


నిజమేమో అని పరికించి చూచినట్లయితే అదియు నిజము కాదు. కొందరు చింతయని చిత్కళయని చెప్పారు, కానీ

అందువాస్తవముందా అనుకోంటే చింతయు గాదు చిత్కళయు గాదు. పరమాత్మ ఉన్నదని చెప్పుటకు ఏ ప్రమాణము

చూపలేము, అట్లే లేదు అని చెప్పడానికి కూడ ఆధారము చెప్పలేము. ఆది విరాటుగాని ఆనందము గాని ఆత్మగాని

అంతరాత్మయిన జీవుడు గాని మనోచింత గాని మనోదృష్ఠి యొక్క చిత్కళయు గాని పరమాత్మను గూర్చి చెప్పుటకు మన

చేత ఏమాత్రము గాదు. మానవులమైన మనచేత గాదు, అట్లే మిగత దేనిచేతగాని, ఎవరి చేత గానీ కాదని క్రింద

చెప్పుచున్నారు.


 శ్రుతులు మూర్చనొందె చింతించి చింతించి

వెతలు చెందిరయ్య వెల్పులెల్ల

ఘన సనాతనాత్మ గానంగ లేకను

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో ఆత్మ చేస్తున్నప్పటికీ జీవాత్మ తాను చేసినట్లు తలచితే, పనిలోని కర్మను జీవునికి అంటకట్టు ఓ

ఆత్మా! వినుము. పరమాత్మను తెలియుటకు మనుషులేకాక దేవతలు కూడ ప్రయత్నము చేసి, వారికి కూడ ఏమాత్రము

అర్థముకాక వెతలుజెంది ఊరకున్నారు. శ్రుతులు కూడ దైవమును గురించి పరిశోధించి పరమాత్మ విషయములో ఏమి

తెలుపలేక పోయాయి. అందువలన పరమాత్మను తెలియుటకు శ్రుతులను ఆశ్రయించినా, దేవతలను ఆశ్రయించినా,

ఏమి ప్రయోజనము లేదు. అన్నిటికి అతీతమై ఎవరికి తెలియని, ఏది కాని పరమాత్మను తెలిసినామని కొందరు బహిరంగముగ

చెప్పుకొనుట నవ్వదగిన విషయమే కదా!



తనువునందు పంచ తన్మాత్రలున్నట్టి

తలుపు లేదు సాక్షి తానుగాదు

తన్ను తాను గనదు తానేది గనబోదు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో ప్రారబ్ధకర్మ ప్రకారము సుఖదుఃఖములందు ఆడింపబడుచు, అహము పొందిన జీవాత్మ పాలిట

చిత్రగుప్తుడవై ఆగామికర్మను అంటగట్టు ఓ ఆత్మా! వినుము. పరమాత్మ మన శరీరమునందు కలదనుకొంటే శరీరము

బయట కూడ ఉన్నది. పంచ భూతములందున్నదనుకొంటే పంచభూతములు లేని చోట కూడ కలదు. అన్నిటికి సాక్షిగ

ఉన్నదనుకొంటే దానికి అక్షియు లేదు. ఇతరులను చూడదు, తన్నుతాను చూచుకోదు. పరమాత్మకు తనువు లేదు

మరియు తలపు లేదు, అదియొక పరికరము గాదు, దానికి పరిమితి లేదు, పరిమానమున్న శక్తియు గాదు,

ప్రపంచములోపలున్నది గాదు. తాను అన్న భావము లేదు, తానేదో ఎవరికి తెలియదు. పరమాత్మ అంచులు లేనిది,

అంచనాలకు అందనిది. బ్రతికియున్న మహర్షులకుగానీ, రాజర్షులకుగానీ, దేవర్షులకు గానీ, బ్రహ్మర్షులకుగానీ,

బ్రహ్మయోగులకుగానీ, కర్మయోగులకుగానీ తెలియనిది. అందరిచేత ఉన్నదని చెప్పించుకొనునది పరమాత్మ.



మూర్చనొందబోదు మూర్ఖుల కందదు

సాధనంబు కష్టసాధనంబు

పట్టు విడుపు లేని పరిపూర్ణ యోగంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- మంచి చెడు కర్మలను తారతమ్యము లేకుండ ఆచరించుచు పాప పుణ్యములకు సంబంధము లేని ఓ ఆత్మా!

వినుము. పరమాత్మ ఒక జీవమున్న పదార్థము గాదు, కనుక అది మూర్చపోతుందని చెప్పుటకు అవకాశమే లేదు.

తెలియుటకు సాధనము గాదు, కష్టసాధనము గాదు. పట్టు విడుపులేనిది చేతికి దొరకనిది మరియు ఏరుచిలేనిది. ఏమి

కాని పరమాత్మను ఏమని చెప్పవలెనో ఎవరికి అర్థముకాక ఆత్మకంటే వేరుగ యున్నదని పరమాత్మ అన్నారు. అలాగే

పురుషులకంటే వేరయినదని మరియు ఉత్తమమైనదని పురుశోత్తముడన్నారు. కర్మనాశనమయిన తర్వాత జీవుడు జన్మలను

పొందక విడుదలగా పొందునది గాన విముక్తి, మోక్షము అన్నారు. పరమాత్మ అంటే ఏమిటో, ఏమికాదో క్రింద

పద్యములో కూడ చూస్తాము.



విష్ణు శివుడు గాదు వీర వైష్ణవము గాదు

బ్రహ్మనిష్ఠ గాదు భక్తి గాదు.

ప్రాణ రూపు గాదు ప్రజ్ఞానమదియ గాదు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- అజ్ఞానులలో ప్రారబ్ధమును అనుభవింపజేయుచు ఆగామికర్మను అంటగట్టుచు, జ్ఞానము తెలిసిన యోగులలో

ప్రారబ్ధమును అనుభవింప జేయుచు, ఆగామికర్మను అంతము చేయుచున్న ఓ ఆత్మా! వినుము. దేవతలలో పెద్దవాడయిన

విష్ణువుగాగాని, శివునిగాగాని, చెప్పుటకు ఒకరికి పుట్టినవాడు గాదు. పేరు కల్గిన వాడు కాదు, విష్ణువు ఈశ్వరుల మాదిరి

దేవుడు కాడు. ఒకప్పుడు అది అనియు మరియొకప్పుడు వాడు అని పిలువబడు పరమాత్మను పురుషుడని చెప్పలేము, స్త్రీ

అని కూడ చెప్పలేము. భక్తియే పరమాత్మ అనుకొనేదానికి భక్తియు గాదు, భక్తి వలన ఏర్పడు బ్రహ్మనిష్ఠయు కాదని

తెలిపారు. జ్ఞానమే దైవస్వరూపమని చెప్పుటకు వీలులేదు. జ్ఞానముగాని, ప్రజ్ఞానము గాని దేవుడుకాదనియే చెప్పవచ్చును.

పలానాయని చెప్పుటకు ఏదారి లేని పరమాత్మను గూర్చి కొందరు ఏమన్నారంటే.


పరమ శివ కళలనుచు బల్కిరి కొందరు

ముక్తి కాంతయనుచు మ్రొక్కి కొంత

వెతకి కానలేక విసిగిరి కొందరు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరయంత్రాంగములో 24 భాగములను ఒక్క జీవునికొరకు నడిపిస్తూ, పరమాత్మకు బంటుగ నిలిచిన ఓ

ఆత్మా! వినుము. పరమాత్మ ఇదియని నిర్ణయించలేక ఎందరో ఎన్ని విధములుగనో చెప్పుకొన్నారు. విధముగ

చెప్పుకోవడములో పరమశివ కళయని కొందరు జ్ఞానులు చెప్పగా, మరికొందరు ముక్తికాంతయని మ్రొక్కినారు. ఇంకా

కొంతమంది దేవుని మీద ఎన్నో పరిశోధనలు చేసి చివరికి ఏమి నిర్ణయముకాక విసిగి పోయారు. పరమాత్మ బ్రతికియున్న


శరీరధరులకు తెలియడను సూత్రము తెలియక, ఎందరు ఏ విధముగ చెప్పుకొనిన అన్వేషించిన చివరకు చెప్పుకొన్న వారి

మాటలు, అన్వేషించిన వారి అన్వేషణ వృధా అగుచున్నది.



జపము తపము చేసి జడలు బిగించినా

జాడ తెలియరాదు జపితులకును

చూడనలవి గాదు సుఖదుఃఖమును గాదు

అఖిల జీవసంగ ఆత్మలింగ.



భావము :- శరీరములో నీవు ఏమి చేయుచున్నది ఎవరికి తెలియనీయకుండ నిద్రించు సమయములో కూడ శ్వాసను

నడుపుచున్నావు. అటువంటి నీ ఉనికిని తెలియక అన్ని నేనే చేయుచున్నానని జీవుడు భ్రమిస్తున్నప్పటికీ, ఏ పనిని

జీవునికి వదలక అన్ని పనులను ఎంతో ఓర్పుగ చేయుచున్న ఓ ఆత్మా! వినుము. భూమి మీద సజీవులైన వారు దేవున్ని

తెలియాలని తలలోని వెంట్రుకలు జడలుగ మారిన వాటిని ముడివేసి, జపము తపము చేసి వయస్సంత వెతకడములోనే

ఖర్చుచేసి, చివరి వృద్ధాప్యములో కూడ పరమాత్మ జాడ తెలియక మాట బయటికి చెప్పితే మిగతవారు విలువివ్వరని,

మేము తపము చేసి దేవున్ని తెలుసుకొన్నామని బొంకు చున్నారు. తాము అంతశ్రమ పడినామనుటకు నిదర్శనము కొరకు

తలకు బరువైన జడలను మాత్రము కత్తిరించక అలాగే మోయుచున్నారు. నాకు ప్రకాశవంతముగ కళ్లు చూడలేనంత

కాంతిగ దేవుడు కనిపించాడని కొందరు, పరమాత్మను తాము తాకి వచ్చాము దూదికంటే మెత్తగ ఉన్నాడని కొందరు,

మాకు ఆకాశములో తెల్లగ కనిపించాడని కొందరు, తెలియని ప్రజలకు ఏమి చెప్పిన తమ ఆకారము చూసి నమ్మెదరని

తలచి అందరికి నమ్మపలుకుచున్నారు. కొందరు వారు చెప్పెడి మాటలు నిజమేనేమో నని నమ్మినా, పరమాత్మ మాత్రము

ఎవరికి కనిపించువాడు కాదు, వినిపించువాడు కాదు. ఎవరు ఏమి చెప్పిన దానికి కొంత దూరముగానే ఉన్నదని, వారు

చెప్పునది సరికాదని తెలియాలి. అంత అగమ్యగోచరమైన పరమాత్మను గురించి బ్రతికియున్న వారు తెలియలేరను

సూత్రము తెలియక తమ గొప్పతనమును చాటుకొనుటకు దేవున్ని చూచినామనీ, చూస్తున్నామనీ చెప్పడము విచిత్రము.


జలదులింకి పోయిన జగములు గ్రుంకినా

జడియబోదు దాని జనతమేమో

బ్రతుకు చావులనెడి భ్రాంతులు లేనిది

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో తప్ప బయట ఎక్కడ ఏ వస్తువుయందు లేని ఓ ఆత్మా! వినుము. ప్రపంచములోని సముద్రములన్నియు

ఇంకిపోయిన, జగములన్నియు కృంగిపోయి లేకుండ పోయినా, ప్రపంచమంతటికి ప్రళయమే వచ్చినా, ఉన్న సమస్తము

లేకుండ పోయినా, జీవాత్మ నాశనమైనా, ఆత్మ ఉనికి కనిపించకుండ పోయినా, పరమాత్మ మాత్రము ఎల్లప్పుడుండినట్లే

ఉండును. పరమాత్మకు చావు బ్రతుకు అనెడి రెండు సంఘటనలు లేవు. ఏ దానికి పరమాత్మ బయపడునది కాదు.

అంతట విస్తరించి, అంతా తానై అన్నిటియందు అణువణువు వ్యాపించియున్న పరమాత్మను ఎవరు గానీ, ఏ ప్రళయము

గానీ ఏమి చేయలేవు. అన్నిటికి ఆదికర్త అందరికి సూత్రదారి అయిన పరమాత్మ చావునది కాదు పుట్టునది కాదు.

త్రిమూర్తులకుగానీ, ఇంద్రాది దేవతలకుగానీ పరమాత్మ తెలియువాడు కాడు.



నాలుగాశ్రమములు నాలుగు యోగముల్

నమ్మి జేసినట్టి నరులకెల్ల

నచల మిడదు వాటి నమ్మరు చపలులు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో బుద్ధికి తెలియని విద్యలయినప్పటికీ జంతువు చిన్నతనములోనే నీటిలో ఈదడమును, దూడ

పాల పొదుగును గుర్తించడమును, ఐదు సంవత్సరముల చిన్నవయసు మనిషికి పాండిత్యము కలుగడము మొదలగు

వాటిని తెలియజేయుచు ఏమి తెలియని దానివలె నున్న ఓ ఆత్మా! వినుము. మనిషి తన జీవితములో బ్రహ్మచర్య, గృహస్థ,

వానప్రస్థ, సన్యాసాశ్రమములనెడి నాలుగాశ్రమముల ధర్మములను చక్కగ నిర్విర్తించి, నాలుగాశ్రమలలో   నాలుగు

యోగములను నమ్మినట్టి నరులకు అచేలమంటే ఏమిటో తెలియదు. (ఇక్కడ నాలుగు ఆశ్రమ ధర్మములలో లగ్నము

కావడమే నాలుగు రకముల యోగములుగాని దైవ జ్ఞానమునకు సంబంధించిన బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు కాదని

తెలియవలెను.) యోగములు రెండు రకములనీ, ప్రపంచ సంబంధమైన జీవిత దశలకు సంబంధించినవి నాలుగు యోగములు

ఒకరకమని, పరమాత్మను తెలియుటకు మార్గములైన మూడు రెండవ రకమని తెలియవలెను. నాలుగాశ్రమ ధర్మముల

ప్రకారము నాలుగు యోగములు కల్గిన వారికే పరమాత్మ అంటే ఏమిటో దాని ధర్మములంటే ఏమిటో తెలియదు. అటువంటి

వారికే తెలియనిది చపల చిత్తులైన మనుషులకు ఏమాత్రము తెలియదు మరియు వారికి నమ్మకము ఉండదు. ఎంతో

గొప్ప వారికే తెలియని పరమాత్మ సాధారణ మనుషులకు అదొకటి ఉన్నదని కూడ తెలియదు.


 కారణంబు శివుడు కార్యంబు జీవుడు

కార్య కారణంబు కాని బయలు

గాన లేరు జనులు ఘన గురు కృప లేక

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- జీవుడు ధరించిన శరీరము ఎంత పరిమాణముండునో అంతే లావు అంతే ఎత్తు కల్గి శరీర ఆకృతిని

కల్గియున్న ఓ ఆత్మా! వినుము. బ్రతికి ఉన్నపుడు తెలియలేని మనుషులు మరణించిన తర్వాత పరమాత్మను తెలియుటకు

ఒక అవకాశము గలదు. చచ్చినవాడు తిరిగి పుట్టునను భగవద్గీత వాక్కు ప్రకారము జీవుడు వెంటనే మరొక జాగాలో

పుట్టుచుండగ, మరణించిన తర్వాత పరమాత్మను ఎలా తెలియగలమని ప్రశ్నరాక తప్పదు. దానికి సమాదానము

ఏమనగా! బ్రతికి ఉన్నపుడే మనిషి తన కర్మను లేకుండ చేయుటకు మొదలు పెడితే కొంతకాలమునకైనా లేక కొన్ని

జన్మలకైన కర్మలేని మరణము ఏర్పడును. అపుడు తిరిగి జన్మించనవసరము లేక పరమాత్మలోనికి ఐక్యమగును.

ఐక్యమయినపుడు పరమాత్మంటే ఏమిటో తెలియగలదు. దానికొరకు ఇప్పటినుండి కర్మనులేకుండ చేసుకొనుటకు

ప్రయత్నించవలెను. కర్మను లేకుండ చేసుకొను పద్ధతి ఒక్క గురువు మాత్రము తెలియజేయగలడు. గురువు సాధారణ

వ్యక్తికానపుడే అసలైన బోధలు తెల్పి అసలైన మార్గములో నడుపగలడు.


పనులలో కర్మ పుట్టుకొస్తున్నది. కర్మే పనులకు కారణమగుచున్నది. పనికి కారణమైన కర్మను ఆత్మ ఆచరిస్తు

అనుభవింపజేయుచుండగ కార్యమును జీవుడు అనుభవిస్తున్నాడు. ఈ అసలు రహస్యము ఘన గురువు తప్ప ఎవరు

తెలుపలేరు. ఎవరు తెల్పినా మంత్ర జపములనో, విగ్రహ పూజలనో తెల్పుచుందురు. పనులలో చిక్కుకొనిన కర్మ


వీడదు, పరమాత్మ మార్గము లభించదు. మనిషి నమ్మిన అన్ని ప్రకృతి పనులను వదలించి జ్ఞానాగ్ని చేత కర్మను

కాల్పించుశక్తి ఒకే ఒక గురువుకుండునని మరువకూడదు. బోధకులందరు గురువులు కారు అను సూత్రము ప్రకారము

గురువును జాగ్రత్తగ గుర్తించవలెను.

||

పూర్ణ బోధకొరకు పురుషుండు బహుజన్మ

పుణ్యవశము చేత పుట్టవలయు

అట్లు గాకపోతే అతి కష్ట సాధ్యంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో అంతట వ్యాపించియుండి కర్మవుంటే చేతిలోనో, కాలిలోనో శక్తి లేకుండ చేసి, అవిటివానిగ

కనిపింపజేయుచు జీవుని చేత కర్మను అనుభవింపజేయు ఓ ఆత్మా! వినుము. భూమి మీద దేవతల భక్తిగాని, మంత్రముల

జపముల ధ్యాసగాని లేకుండ పోవాలంటే, పరమాత్మను పొందుమార్గము తెలియంటే సంపూర్ణమైన బోధ దొరకాలి.

అసలుసిసలైన బోధ తెలియాలంటే మానవుడు ఎన్నో జన్మల నుండి జ్ఞానము మీద అభిలాష కల్గి, జ్ఞాన సంస్కారమైన

జన్మలు పొందుచు రాగ, ఎన్నో జన్మల చివరకు పూర్ణబోధ లభ్యమగుటకు కావలసిన గురువు దొరుకును. అట్లు జ్ఞాన

సంస్కారములేని వారికి పరమాత్మను చేరుటకు ఉపయోగపడు బోధ దొరకుట చాలా దుర్లభమగును. అటువంటి వారికి

వారి సంస్కారము నకు తగినట్లు గురువులు లభించుదురు. వారు చెప్పుబోధలే గొప్పగ కనిపించును.


 బాధలేని బోధ బ్రతికి నన్నాల్లు యీ

భావమెరిగి తిరుగు భాగ్యశాలి

హరి హరాదులకును యధి కుండు తానయా

అఖిల జీవసంగ ఆత్మలింగ.

భావము :- శరీరములో ప్రారబ్ధకర్మను జీవుని చేత అనుభవింపజేయు యమధర్మరాజువై, అహముగల వానికి అగామి

కర్మను తలకెక్కించడములో చిత్రగుప్తుడవై చలామణి అగు ఓ ఆత్మా! వినుము. కర్మబాధలను లేకుండ చేయు కర్మరాహిత్య

బోధను తెలిసినవాడు అదే భావములో తన జీవితమంత గడుపును. జీవితమంత గురువు ద్వార తెలుసుకొన్న పరమాత్మ

మార్గమును అనుసరించుట వలన కర్మంతయు నశించిపోయి చివరికి మరణము పొందును. తర్వాత వాడు పుట్టడు

కనుక అదే వానికి చివరి మరణము అగును. చివరి మరణము పొంది వాడు అపుడు పరమాత్మలోనికి ఐక్యమైపోవును.

అప్పుడు పరమాత్మ ఏమిటో ఎలాగుందో దాని భావము ఏమిటో తెలియును. పరమాత్మలోనికి చేరువరకు ఎవరికీ

పరమాత్మ ఏమిటో తెలియదనుకొన్నాము కదా! పరమాత్మ మార్గము కూడ ఒక్క గురువుకు తప్ప మిగత బోధకులకు

తెలియదన్నాము. మిగత బోధకులు గురువులవలె నటించవలెననుకొన్ననూ, వారి నోటినుండి స్వచ్ఛమైన పరమాత్మ

జ్ఞానము రాక దేవతలకు సంబంధించినది మరియు పురాణములకు సంబంధించిన జ్ఞానము, మతములకు సంబంధించినది

మొదలగు విషయములే వచ్చుచుండును. గురువువద్ద అటువంటి విషయములుకాక జీవుడు ప్రక్క మార్గమును చూడనట్లు

బోధలుండును. అటువంటి దేవతాతీత బోధలు తెలిసినవాడు దేవతలకంటే అధికుడై హరి హరాదులను మించి

ఉండును.


జనన మరణమనెడి జాడ్యంబు మాన్పంగ

మందు యింతకంటే మరియు లేదు

దిన్న వారికెల్ల దీరును రోగంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- మరణములోను పుట్టుకలోను జీవుని వెంటవుండి, మరణము నుండి పుట్టుక వరకు గుణములను, జీవున్ని,

కర్మసముదాయమును తీసుక వస్తున్న ఓ ఆత్మా! వినుము. జనన మరణమనెడి కర్మతంత్ర రోగమును నయము చేయడానికి

సద్గురు బోధయే శరణ్యము. ప్రపంచకోర్కెలతో నిండుకొన్న దేవతారాధనలను మాన్పించి, కోర్కెలకు అతీతమైన మరియు

దేవతల భక్తికి అతీతమైన కర్మనివారణ బోధను మించినది లేదని చెప్పు గురుబోధను మించినదిలేదు. ఏమి ఏది కాని

పరమాత్మను తెలియుటకు మార్గమును ఏర్పరచునది సద్గురువు యొక్క కర్మనివారణ బోధయని తెలియవలెను. ఇంతవరకున్న

అన్ని ఆరాధనలను వదలి, అన్ని ప్రకృతి జ్ఞానములను వదలి, ఎవరికి తెలియని పరమాత్మను తెలియుటకు అవసరమైన

సద్గురు బోధను తెలియుట వలన చావు పుట్టుకలనెడి రోగము లేకుండ పోయి పరమాత్మలోనికి కలసిపోగలరు.


సద్గురుండు యనెడి మంచి వైద్యని జేరి

పరమ భక్తి యనెడి పత్యముండి

దీక్షయనెడి మందు దినవలె మనుజుండు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- శరీరములో అన్ని పనులు చేయుచూ, ఏ ఒక్క పనిని కూడ నేను చేశానని బయటికి తెలుపక ఎన్నో విజ్ఞాన

పరికరములను కనిపెట్టించు యోచనను ఇచ్చినప్పటికీ, ఏమి తెలియని జీవుడు నేను కనిపెట్టానని చెప్పుకొనుచున్నప్పటికీ,

ఊరక చూస్తుండిన ఓ ఆత్మా! వినుము. ప్రజలలో కొంత ఆధ్యాత్మిక చింతనకలవారు జ్ఞానమును తెలుసుకోవలెనని

గురువులను ఆశ్రయించుచున్నారు. ముఖ్యమైన ఘట్టము ఇక్కడే మొదలవుతుంది. గురువు అంటే బోధలు చెప్పువాడని

మాత్రము ప్రజలకు తెలియుట వలన ఎవరు బోధలు చెప్పిన వారిని గురువుగానే నమ్ము చున్నారు. రామాయణము,

భారతములను చదివి చెప్పువాడు కూడ గురువుగనే లెక్కించబడుచున్నాడు. తమకేమి తెలియకుండిన ఇతర పుస్తములలోని

విషయములను చెప్పువారు కూడ గురువులుగనే లెక్కించబడుచున్నారు. ఈ దేవునికిలా పూజ చేయవలెనని నియమము

చెప్పువాడు కూడ గురువే అగుచున్నాడు. కొందరు తలవెంట్రుకలు గడ్డము పెంచినంతమాత్రముననే గురువులగుచున్నారు.

కొందరేమో కాషాయ గుడ్డలు ధరించి ఆశ్రమములు కట్టించుకొంటే గురువులై పోవుచున్నారు. మరికొందరు పేరుండి

చనిపోయిన వీరబ్రహ్మముగారి ఫోటో పెట్టుకొని ఆయన పేరుతో గురువులై పోయినవారు కూడ గలరు. జ్యోతిష్యము

చెప్పువారు, బావిలో నీటిని గురించి చెప్పువారు, చివరకు లేని వాస్తును గురించి చెప్పువారు కూడ గురువులుగ చలామణి

అగుచున్న ఈ కాలములో నిజ గురువు ఎవరనే విషయము ప్రశ్నార్ధకము. నిజ గురువును వెదకండి అని చెప్పినప్పటికీ,

మాకు ఇంటి దగ్గరుండు గురువును వదలి ఎక్కడోనున్న గురువుతో మాకేమి పని అనువారు కూడ గలరు. మనము వినే

బోధ ఏమిటి, ఏ కోవకు చెందినది ఆలోచించిక, అప్పటి అనుకూలతను చూచుకొనెడివారు కూడ గలరు. అన్నిటిని మించి

ప్రపంచ విషయములలో లాభమొచ్చునట్లు, కోర్కెలు నెరవేరునట్లు, మంత్రమో తంత్రమో చెప్పు వారిని పెద్దగురువులుగ

ఆరాధించడము నేడు చూస్తూనే ఉన్నాము. బాబాల దగ్గరకు పోతూనే మా సంసారాలు బాగుపడుచున్నాయి, ఆయనను

మించిన గురువే లేడుపో అనువారుండుట కూడ చూస్తూనే ఉన్నాము. ఇంతమంది గురువులలో ఏ ప్రపంచలాభమును


గూర్చి చెప్పని నిజ గురువును ఎవరు లెక్కించెదరు. అందరి గురువుల మార్గములకు అన్యమార్గమైన నిజగురువు బోధ

ఎవరికి రుచించును. అదియును గాక మిగత గురువులు కొదవ లేకుండ భూమిమీద అన్ని వేళల అన్ని కాలములలో

ఉందురు. కాని నిజ గురువు అట్లుకాక కొన్ని వేలసంవత్సరములకు ఒకమారు జన్మతీసుకొని వచ్చును. ఏ కాలములోనో

ఒకప్పుడు భూమిమీదకు వచ్చి తన యదార్థబోధ తెల్పినప్పటికీ, మొదటి నుండి పరంపరలుగ వేళ్ళూదుకొన్న బోధల

ముందర అది పెద్దగ ప్రచారములోనికిరాదు. ఒకవేళ తెలిసినా ఎందరో గురువులు చెప్పినది కాదని ఈయన వేరు

మార్గములో చెప్పుచున్నాడు, ఈయన బోధ ఎవరు వినవద్దండి, చదవవద్దండని చెప్పుకొందురు. స్వార్థగురువులు నిజగురువు

యొక్క బోధలను బయటికి రాకుండ జాగ్రత్త పడుదురు. వాటిని గురించి దుష్ప్రచారము కూడ చేయుదురు. అన్ని

విధాల ఎవరు సమర్థించని నిజ గురువు యొక్క బోధల మీద ఆసక్తి పెంచుకొని వాటిని తెలుసుకొను వాడు ధన్యుడగును.

సద్గురు యొక్క బోధలనెడి దైవ విషయములను భక్తికల్గి పట్టుదలతో తెలియుట వలన ఏదికాని పరమాత్మను చేరుటకు

మార్గము ఏర్పడును. దైవమును తెలుసుకోవాలని జ్ఞానమును తెలుసుకొని మార్గములో నేనున్నామనుకొను వారంతా

ఆశ్రయించినది గురువునా లేక బోధకుడినా అని ఒకమారు తిరిగి చూచుకోవలెను. కర్మలను నాశనము చేయు విధానము

తమ మార్గములో ఉందో లేదో ఆలోచించు కోవలెను. ప్రపంచకోర్కెలు ఆయుస్యుండు వరకేననీ, వాటివలన సుఖము

తప్ప మోక్షము రాదనీ, దైవము తెలియడని తెలిసి నిజగురువు కొరకు అన్వేషణ చేయవలెను.


 దినము దినము తిన్న వారికెల్ల

నొంటబట్టి రోగ మొదలగొట్టి

కపట జన్మ వ్యాది కానరాక జేయును

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- చావులోను పుట్టుకలోను సాక్షిభూతుడవై, సమయములో ఏమి జరుగుచున్నదో ఎవరికి తెలియని

రహస్యమును తెలిసిన ఓ ఆత్మా! వినుము. బట్టబయలై కూడ ఎవరికి తెలియని పరమాత్మ బోధను గురించి ప్రత్యేకముగ

లోకములోనికి వచ్చిన గురువు మాత్రమే తెల్పును. చెప్పువాడు సామాణ్యుడు కాదు, చెప్పబడునది కూడ సామాణ్యమైనది

కాదు. బోధను బట్టి బోధించువాడెవడో తెలియవచ్చును. పరమాత్మ అంశతో వచ్చిన వాడు వేషములోగాని, బోధలోగాని

మిగత ఏ గురువును పోలియుండడు. ఆయన బోధను గ్రహించి అందరి గురుబోధలవలె ఒకమారు ఉపదేశము

ఇప్పించుకొనినంత మాత్రమున సరిపోదని తెలిసి, ప్రతి దినము జ్ఞానము తెలుసుకొంటూ కొన్ని సంవత్సరములు క్రొత్త

జ్ఞానమును తెలుసుకొని దానిని నెమరువేసుకొనుచు ఒంటబట్టించుకొనిన, మనకున్న జన్మల వ్యాధి పోయి మోక్షమను

ఆరోగ్యము కల్గును. అదియే పరమ రహస్యమైన అచేలము, అదియే ఎవరికీ తెలియని బట్టబయలు, అదియే జీవుని

గమ్యస్థానము. పరమపదమను గమ్యమును చేరువరకు జనన మరణములనెడి ప్రయాణము తప్పదని తెలియవలెను.


ఇట్టి పరమ గోప్య మెవ్వరెరుంగరు

ఎరిగినట్టి వారు తిరిగి రారు

తిరిగి రాని మరుగు తెలియుట కష్టంబు

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- చెట్టులో చెట్టు ఆకృతిని పోలియుండి, జంతువులో జంతువు ఆకృతిని పోలియుండి, మనిషిలో మనిషి ఆకృతిని


పోలియుండి అనేక శరీరములలో శరీరములవలె అనేక ఆకారములు కల్గియున్న ఓ ఆత్మా! వినుము. ప్రపంచ

సంబంధము లేకుండ పరమాత్మను తెలియునట్టి బోధ తెల్పు గురువు దొరుకుట దుర్లభము. ఒకవేళ దొరికినా మనము

తెలుసు కొనుట మరీదుర్లభము. ఎందుకనగ మాయ అడగడుగున అడ్డుతగిలి బోధలకు దూరము చేయు ప్రమాధము

కలదు. ఎంతో పరమగోప్యమైనటు వంటి దుర్లభమైన అతి కష్టమైన బోధను సామాన్యముగ ఎవరు తెలియలేరు. తెలిసినవారు

మరుజన్మలేక తిరిగి పుట్టరు. తిరిగి జన్మించక పరమాత్మలోనికి ఐక్యమగుటకు కావలసిన రహస్యము తెలియుట ఏటికి

ఎదురీతలాంటిది. అయినప్పటికీ పట్టుదలగ తెలిసినవాడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను త్రైతమును వదలి పరమాత్మ

అను ఏకముగ మారిపోవును.


మంగళము మీకు మద్గురు చంద్రమా

మంగళంబు మీకు మహి ప్రకాశ

మంగళంబు జేసి మరి మరి మ్రొక్కెద

అఖిల జీవసంగ ఆత్మలింగ.


భావము :- ఒకటవ ఆత్మనయిన జీవాత్మను నేను, లెక్కకు మూడవ ఆత్మయిన పరమాత్మను తెలియుటకు, రెండవ

ఆత్మయిన నిన్ను అడ్డము పెట్టుకొని ప్రతి భావము మొదటిలో ఓ ఆత్మా! అని సంబోధించి చెప్పడము ఒక విధముగ

మంచిది కాకున్నను తప్పలేదు. అందులకు క్షమించి ఇపుడు చివరిలో కూడ నీకే చెప్పు విషయము వినుము. నీవు

నీహృదయములో జ్ఞాన ప్రకాశమును కల్గిన చంద్రునివై అన్ని విషయములను నీవే చెప్పి నాచేత వ్రాయించి, నాయందు

గురువుగయుండి జీవుడైన నన్ను శిష్యునిగ జేసుకొనిన నా గురువును నేను శుభకరమైన ఆఖరు స్థితిని, మంగళకరమైన

మోక్షమును కోరుచున్నాను. కర్పూర హారతికి మంగళ హారతి అనుచున్నారు. కర్పూరము అగ్నికి కరిగిపోయినట్లు నా

కర్మ జ్ఞానాగ్నికి కరిగిపోయి నేను శూన్యమై పోవునట్లు దీవించమని మంగళము మద్గురు చంద్రమా అంటున్నాను.

శుభకరము, మంగళకరము, శ్రీయుతము అని పోల్చబడు పరమాత్మా! నన్ను నీయందు చేర్చుకొనుటకు ఈ వ్రాతలు

ఉపయోగపడాలని చివరిగ మంగళము చెప్పి మరి మరి మ్రొక్కుచు ముగించుచున్నాను.


సమాప్తము .

ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.



Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024