cloud text దేవుని జ్ఞానము కబ్జా అయ్యింది. 8th oct 24 Updated
దేవుని జ్ఞానము కబ్జా అయ్యింది.
జ్ఞానము రెండు రకములు కలదు. ఒకటి ప్రపంచ జ్ఞానము,
రెండు పరమాత్మ జ్ఞానము అని అంటాము. ప్రపంచ జ్ఞానము నాలుగు
శాస్త్రముల మీద ఆధారపడియున్నది. పరమాత్మ జ్ఞానము ఒకే ఒక శాస్త్రము
మీద ఆధారపడియున్నది. ప్రపంచ జ్ఞానము గణిత, ఖగోళ, రసాయన,
భౌతిక అను నాలుగు శాస్త్రముల మీద ఆధారపడియుండగా, దైవజ్ఞానము
బ్రహ్మవిద్యాశాస్త్రము మీద ఆధారపడియున్నది. జ్ఞానము అనగా
తెలియజేయునదని చెప్పవచ్చును. ప్రపంచ జ్ఞానము ప్రపంచమును గురించి
తెలియజేయును. పరమాత్మ జ్ఞానము దేవున్ని గురించి తెలియజేయును.
పరమాత్మ అనినా, దేవుడు అనినా ఒక్కటే అని తెలియుట జ్ఞానమగును.
అలాగే ప్రకృతి అనినా, ప్రపంచమనినా ఒకటేయని తెలియుట కూడా
జ్ఞానమే అగును. దేవుని విధానమును గురించి తెలుపునది దేవుని జ్ఞాన
మగును. ప్రపంచ విధానమును గురించి తెలుపునది ప్రపంచ జ్ఞానమగును.
ప్రతి మనిషి ఎంతో కొంత రెండు జ్ఞానములతో సంబంధపడియుండును.
బహుశా ఎక్కువమంది ప్రపంచ జ్ఞానముతో సంబంధపడియుందురు.
అటువంటివారు పరమాత్మ జ్ఞానముతో కూడా కొద్దిగా సంబంధపడి
యుందురు. దేవుని జ్ఞానముతో ఎక్కువ సంబంధపడియున్నవారు ప్రపంచ
జ్ఞానముతో తక్కువ సంబంధము కల్గియుందురు. ఎక్కువ దేవుని జ్ఞానముతో
సంబంధమున్నవారు భూమిమీద తక్కువ సంఖ్యలోయున్నారు. మొత్తము
మీద ప్రతి మనిషి రెండు జ్ఞానముల మీద సంబంధపడియున్నాడు.
ఒకే జ్ఞానముతో సంబంధపడియున్నవారు ఎవరూ లేరు. 991
పాళ్ళు ప్రపంచ జ్ఞానముతో నిండియున్నవారైనా కనీసము అర్థ (1/2)
భాగమయినా దేవునిధ్యాస కల్గియున్నారు. పూర్తి నాస్తికుడయినా దేవుడు
లేడనచూ దేవున్ని జ్ఞప్తి చేసుకొంటున్నాడు. ఈ విధముగా ఒకే జ్ఞాన
ధ్యాస యున్నవారు ఎవరూ లేక ఎంతో కొంత రెండు ధ్యాసలు కలవారే
యున్నారు. ప్రతి మనిషి జీవితములో పుట్టినప్పటినుండి చచ్చువరకు
ప్రపంచ విషయములోగానీ, పరమాత్మ విషయములోగానీ సమస్యలు
ఎదురవుచూ యుండును. అయితే ప్రపంచ విషయములో అందరూ
సరైన నిర్ణయము తీసుకొంటారను నమ్మకములేదు. ప్రపంచ విషయములో
తప్పు నిర్ణయములు తీసుకొని ఆ నిర్ణయముల వలన బాధపడువారు
గలరు. అలాగే మంచి నిర్ణయములు తీసుకొని సుఖపడువారూ కలరు.
దేవుని విషయములో కూడా తప్పు నిర్ణయము తీసుకొని దేవునికి దూరమగు
వారు గలరు. మంచి నిర్ణయము తీసుకొని దేవునికి దగ్గరగువారూ గలరు.
అయితే ప్రక్కన చూచువారికి ఇతర మనుషులలోని నిర్ణయములు మంచి
చెడు రెండు రకములుగా కనిపించుచుండినా, నిర్ణయము తీసుకొను
వారికి వారి నిర్ణయములన్నీ మంచివిగానే కనిపించుచుండును.
అందువలన అందరూ తమ నిర్ణయము మంచిదేనని వాదించుచుందురు.
ఒకడు చెడుకార్యమైన దొంగతనము చేసి తన నిర్ణయము
మంచిదేననీ, తన పనిని దేవుడు మెచ్చుకొంటాడనీ, తాను చేసిన పనిని
దేవుడు చూచి ఒప్పుకుంటాడనీ చెప్పును. అటువంటి వానిని “దొంగ
తనము చెడువృత్తి కదా! నీవు చేసిన దానిని దేవుడు ఎలా ఒప్పుకుంటాడు?”
అని అడిగితే వాడు తన పనిని సమర్థించుకొనుటకు తగినట్లు ఆధారము
లన్నీ చెప్పి, దీనినిబట్టి దేవుడు నా పనిని ఒప్పుకొన్నట్లే కదా! అని
అంటున్నాడు. ఇప్పటికి దాదాపు 38 సంవత్సరముల క్రితము 1977వ
సంవత్సరములో ఒక దొంగతో నేను మాట్లాడడము జరిగినది. ఒక గుడి
వద్దకు భజన చేయుటకు వచ్చిన ఒక వ్యక్తితో అతని వృత్తి దొంగతనము
అని తెలిసి మాట్లాడడము జరిగినది. అప్పుడు అతను తన పనిని సమర్థించు
కొనుచూ ఇలా అన్నాడు. “నేను దొంగతనమునకు పోయేముందు గుడికి
పోయి, దేవునికి నమస్కారము చేసి, నేను ఎక్కడికి దొంగతనమునకు
పోయేది చెప్పి, దొంగతనము ఏ ఇబ్బందీ లేకుండా జరిగేటట్లు చూడమని
మ్రొక్కి పోవుచున్నాను. నేను చేసే పని చెడ్డది అయితే దేవుడు నా పనిని
చేయ వద్దని బుద్ధి పుట్టించవచ్చును కదా! ఇంతవరకు నేను చేసిన దొంగ
తనములన్నీ దేవునిదయ వలన సులభముగా జరిగిపోయాయి. ఒక దినము
రాత్రి దొంగతనము చేయుటకు పోవుచున్న సమయములో చీకటిలో
నడుస్తుండగా నా కాలికి పాము చుట్టుకోవడము జరిగినది. అప్పుడు
నేను కదలకుండా నిలబడి దేవున్ని తలచుకొన్నాను. కొన్ని నిమిషముల
తర్వాత ఆ పాము నా కాలును వదలి పోయినది. నన్ను కాటువేయకుండా
వదలి పోవునట్లు దేవుడే చేశాడు. నేను చేయుపని దేవుడు ఒప్పుకోకపోతే
పాము కాటువేసివుండేది కదా! దీనినిబట్టి చూస్తే నేను చేసే పని దేవునికి
కూడా సమ్మతమే కదా!” అన్నాడు. ఈ విధముగా అతను చెప్పిన మాటలు
వినిన తర్వాత ఎవడు చేయుపని వానికి మంచిగానే కనిపించుచుండునని
తెలియుచున్నది. అందువలన ఎవడు ఎంత ఘోరమైన పాపపు పనిని
చేసినా తనది మంచిపనేయని అనుకోవడము జరుగుచున్నది.
మనిషి చేయు కార్యములలో ప్రపంచ సంబంధమైనవి కొన్ని
యుండగా, దైవసంబంధమైనవి కొన్ని యుండును. కార్యములను రెండుగా
విభజించుకోకుండా, ప్రపంచ పనిని పరమాత్మతో, పరమాత్మ పనిని
ప్రపంచముతో కలిపి చూడకూడదు. ప్రపంచ విషయమును ప్రపంచ
జ్ఞానముతోనే పరిష్కరించుకోవాలి. అలాగే పరమాత్మ విషయమును దైవ
జ్ఞానముతోనే పరిష్కరించుకోవాలి. అట్లుకాకుండా ప్రపంచ కార్యమైన
దొంగతనమును దేవునితో సంబంధపెట్టడము సరియైన పద్ధతి కాదు.
దేవుని విధానములో తప్పు చేసినవాడు ప్రపంచ జ్ఞానముతో ప్రపంచ
విధానముతో సరిపోల్చుకొని తాను చేసిన పనిని దేవుడు ఒప్పుకొంటాడు
అనడము కూడా సరియైన పద్ధతికాదు. ప్రతి దినము మనిషి అయిన
వాడు ఎక్కువగా ప్రపంచ విషయములలోనే ఉండును. ప్రపంచ వ్యాపార
విషయములలో కొన్నిటిలో లాభము, కొన్నిటిలో నష్టము రావడము జరుగు
చుండును. అయితే లాభము వచ్చినప్పుడు ప్రతి మనిషీ తన తెలివి
వలన, తాను చేసిన విధానము వలన లాభము వచ్చింది అని అనుకొనును.
ఒకవేళ నష్టము వస్తే తనకు దేవుడు అన్యాయము చేశాడని అనుకొనును.
వ్యాపార విషయములు ప్రపంచ సంబంధమైనవి. అందువలన దేవుడు
అన్యాయము చేశాడని చెప్పడము సరియైన పద్ధతికాదు. అలాగే ఒక
కుటుంబము సంతోషముగా బ్రతుకుచున్నప్పుడు తమను దేవుడు చల్లగా
చూస్తున్నాడని చెప్పుచుందురు. ఒకవేళ కుటుంబములో ఒక వ్యక్తి
అకస్మాత్తుగా చనిపోతే అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చంపాడన్నట్లు దేవుడు
మాకు అన్యాయము చేశాడని అనుచుందురు. ఇక్కడ కూడా బ్రతుకు
తెరువు, చావడము, పుట్టడము ప్రపంచ విషయమగును. అవన్నియూ
కర్మనుబట్టి జరుగుచుండును. దేవునికి ఏమాత్రము సంబంధములేదు.
అయినా మనిషి విచక్షణ లేకుండా ప్రపంచ విషయమును దేవునితో
ముడివేయుచున్నాడు.
భూమిమీద చాలామంది ప్రపంచ విషయమునకు, పరమాత్మ
విషయమునకు తేడా తెలియక రెండింటినీ ఒకే విధముగా పోల్చుకోవడము
వలన మనిషి, దేవుని విషయమును ప్రపంచ విషయముతోనూ, ప్రపంచ
విషయమును దేవుని విషయముతోనూ ముడిపెట్టుకొంటున్నాడు. ఇది
మంచిది కాదుయని ఎవడయినా తెలిసినవాడు చెప్పినా వినని స్థితిలో
మనిషి యున్నాడు. మనిషికి దేవుని విషయమునకూ ప్రపంచ
విషయమునకూ తేడా తెలియకుండాపోయినది. కొన్నిచోట్ల ప్రపంచ
విషయమును దేవుని విషయముగా, దేవుని విషయమును ప్రపంచ
విషయముగా పోల్చుకోవడము కూడా జరుగుచున్నది. తాను ఏది
అనుకొంటే అదే సక్రమము అని మనిషి అనుకొంటున్నాడు. ఎలా
పొరపడుచున్నాడో చిన్న ఉదాహరణతోడు ఎలా “ముద్దు” అను
మాట సర్వసాధారణముగా అందరికీ తెలుసు. ముద్దు అనేది ఒకటే
అయినా దానిని మనిషి రెండు రకములుగా విభజించుకొన్నాడు. ముద్దును
గురించి పూర్తిగా వివరించుకొని చూస్తే దాని వివరము ఇలా కలదు.
మెత్తగా ముట్టుకొనునునది ముద్దు అని చెప్పవచ్చును. నిదానముగా లేక
మెత్తగా లేక చిన్నగా తాకడము ముద్దు అని చెప్పుటకు కారణము కలదు.
ఎక్కడయినా గట్టిగా లేక వేగముగా లేక బలముగా తాకడమును గుద్దు
అంటున్నాము. వేగముగా, బలముగా తాకిన దానిని గుద్దు అనినప్పుడు
దానికి పూర్తి వ్యతిరేఖముగా యుండునది ముద్దు అయినది. గుద్దుకు
దానికి వ్యతిరేఖమయిన ముద్దుకు దగ్గర సంబంధమైన పేర్లు కూడా కలవు.
ముద్దును ముట్టుకోవడము లేక తాకడము అని అనవచ్చును. అలాగే
గుద్దును తన్నడము లేక కొట్టడము అనవచ్చును.
ఒకడు మరొకని శరీరము మీద ఎక్కడకొట్టినా అది గుద్దే
అవుతుంది. అదే విధముగా ఒకడు మరొకని శరీరము మీద ఎక్కడ
తాకినా లేక ముట్టుకొనినా అది ముద్దే అవుతుంది. ఒక మనిషి ఇంకొక
మనిషిని తన చేతితోగానీ, లేక తన కాలితోగానీ బలముగా తాకితే లేక
బలముగా తన్నితే దానిని గుద్దు అంటున్నాము కదా! ఆ విధముగా
శరీరము మీద ఎక్కడ తన్నినా దానిని గుద్దే అంటాము. శరీరము మీద ఏ
భాగముమీద బలముగా తన్నినా అది గుద్దుగా పరిగణించబడినట్లు, ఒకరి
శరీరము మీద మరొకరు మెతగా బడినట్లు, ఒకరి ముట్టుకొనినా అది ముద్దే
అవుతుంది. చేతితోకానీ, కాలితోగానీ ఇతరుల శరీరము మీద తలమీద
తన్నినా, వీపు మీద తన్నినా, ముఖము మీద తన్నినా, కడుపు మీద తన్నినా,
కాళ్ళమీద తన్నినా దానిని గుద్దడము అని చెప్పవచ్చును. అలాగే ఒక
మనిషిని మరొక మనిషి చేతితోగానీ, కాలితోగానీ మెత్తగా తలమీద తాకినా,
ముఖము మీద తాకినా, కడుపు మీద తాకినా, వీపుమీద తాకినా, చేతిమీద
తాకినా, కాళ్ళమీద తాకినా అది ముద్దే అగును. ఒక మనిషిని మరొక
మనిషి బలముగా గుద్దడము కొరకు చేతులు కాళ్లనే ఉపయోగించవలసి
వచ్చును. గుద్దులో బలము ఉపయోగపడుచున్నది కావున అక్కడ కాళ్లను
గానీ, చేతులనుగానీ ఉపయోగించవలసి యున్నది. అదే ముద్దులో అయితే
బలమును ఉపయోగించనవసరము లేదు, కావున కాళ్ళను, చేతులనేకాక
శరీరములోని పెదాలను ఉపయోగించడము కూడా జరుగుచున్నది.
ఒక మనిషి మరొక మనిషిని శరీరములోని ఏ భాగముతో అయినా
మెత్తగా తాకవచ్చును. అలాగే బలముగా కూడా తాకవచ్చును. బలముగా
తాకినప్పుడు మనిషిలోని గుణముల ప్రభావము వేరుగా ఉండును. అలాగే
మెత్తగా తాకినప్పుడు కూడా తాకిన మనిషిలోని గుణప్రభావము వేరుగా
యుండును. కోపము చేతగానీ మరియు అసూయచేతగానీ మనిషిలో
శత్రుత్వము పెరిగి అది గుద్దువరకు ప్రేరణ చేయును. అలాగే మనిషిలో
మోహము, ప్రేమ పెరిగినప్పుడు ఆ గుణ ప్రేరణ ముద్దువరకు పోవును.
తల్లి తన బిడ్డను ప్రేమతో ముద్దాడడము చూస్తూనేయున్నాము. అలాగే
ఒకడు మరొకనిని కోపముతో కొట్టడము చూస్తున్నాము. మొదట మోహము
ప్రేమను పెంచును, అలాగే మొదట అసూయ కోపమును పెంచును.
ఒక గుద్దు వెనక అలాగే ఒక ముద్దు వెనక ఇంతటి సమాచారమున్నది.
ప్రపంచ కార్యమునకు పరమాత్మ కార్యమునకు తేడా తెలియని
మనిషి ప్రపంచ విషయమును కూడా పరమాత్మ విషయముగా పోల్చుకొని,
తన నిర్ణయము సరియైనదేనని, తనకు తెలిసినంత ఇతరులకు తెలియదని
అనుకోవడము జరుగుచున్నది. ముద్దుకు, గుద్దుకు ఎంతో తేడాయున్నట్లు
ప్రపంచ విషయమునకు పరమాత్మ విషయమునకు ఎంతో తేడాయున్నది.
ఇది పరమాత్మ విషయమని తేల్చి చెప్పుటకు దాని వెనుక బ్రహ్మవిద్యా
శాస్త్రము కలదు. అలాగే ఇది ప్రపంచ విషయమని తేల్చి చెప్పుటకు దాని
వెనుక గణిత, ఖగోళ, రసాయన, భౌతిక అను నాలుగు శాస్త్రములు గలవు.
అయితే ఒక మనిషి దైవ విషయమును చెప్పునప్పుడు, ఇది దైవ విషయమా
కాదాయని బ్రహ్మవిద్యాశాస్త్రముతో పోల్చి చూచుకోలేదు. అలాగే ప్రపంచ
విషయమును గురించి మాట్లాడునప్పుడు, ఇది ప్రపంచ విషయమా
కాదాయని చూడకుండా, ఏ శాస్త్రముతోనూ సంబంధము లేకుండా వృథాగా
మాట్లాడుచున్నాడు. ఇటు ప్రపంచ సంబంధము కాకుండా, అటు పరమాత్మ
సంబంధము కాకుండా మాట్లాడు మాటలను వ్యర్థప్రలాపములు అంటాము.
ప్రపంచ విషయములలో అవసరము లేకుండా అనవసరముగా
మాట్లాడు వానిని మూర్ఖుడు అంటాము. అలాగే పరమాత్మ విషయములో
అజ్ఞానముగా మాట్లాడువానిని మూఢుడు అంటాము. రెండిటిలోనూ
శాస్త్రబద్ధత లేకుండా మాట్లాడువానిని మూర్ఖుడు మరియు మూఢుడు అని
చెప్పవచ్చును. ఇంకొక విధముగా చెప్పితే ముద్దుకు గుద్దుకు తేడా తెలియని
వానిని ప్రపంచ సంబంధముగా మూర్ఖుడని చెప్పవచ్చును. అలాగే
జ్ఞానమునకు అజ్ఞానమునకు తేడా తెలియనివానిని జ్ఞాన సంబంధముగా
లేక దైవ సంబంధముగా మూఢుడు అని చెప్పవచ్చును. ఒక కవి తన
పద్యములో ప్రపంచ సంబంధ మూర్ఖుని గురించి చెప్పుచూ “కుందేలు
కొమ్మును వెదకువాడు, ఎండమావిలో నీరును వెదకువాడు, ఇసుకలో
తైలమును తీయవచ్చుననుకొనువాడు పూర్తి మూర్ఖుడని” చెప్పాడు. అలాగే
కొందరు పెద్దలు తమ మాటలలో దైవసంబంధ మూఢులను గురించి
ఇలా చెప్పారు. "దేవతలలో దేవున్ని వెదకువాడు, భజనలో జ్ఞానమున్న
దనుకొనువాడు, బ్రతికినప్పుడే మోక్షము పొందియుండవచ్చుననువాడు
పూర్తి మూఢుడని చెప్పవచ్చును.” నేటికాలములో ఎక్కువగా మూఢులు,
తక్కువగా మూర్ఖులు ఉన్నారని చెప్పుచున్నాము.
దేవుని విషయమును ప్రపంచ విషయముగా లెక్కించి, తనకు
తెలిసిన ప్రపంచ విషయమునే దేవుని విషయముగా లెక్కించువారు
చాలామంది యున్నారు. వారందరినీ మూఢులని చెప్పవచ్చును. కొందరు
ప్రపంచ సంబంధమైన మతమును ఆధారము చేసుకొని దానినే దేవుని
విషయముగా లెక్కించుచున్నారు. మతము అనునది ఎప్పటికీ దేవుని
విషయముకాదు, కావున అట్టివారిని కూడా మూఢులనియే చెప్పవచ్చును.
కొందరు మతమును అనుసరించి దైవజ్ఞానముండవలెనను వాదనను
రేకెత్తించుచున్నారు. మతమునకు దైవజ్ఞానమునకు సంబంధము
పెట్టువారిని మూఢులనియే అనాలి. ప్రపంచములో దేవుడూ ఒక్కడే,
దైవజ్ఞానమూ ఒక్కటే కలదు. అయితే మతమునుబట్టి దేవుడు, దైవ
జ్ఞానమును నిర్ణయించడము పూర్తి తప్పని, పూర్తి అజ్ఞానమని మూఢులయిన
వారికి తెలియదు.
ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త ఒక్కడే గలడు. ఆయననే
దేవుడు అంటున్నాము. దేవుడు మనుషులకు తెలియబడు నిమిత్తము
తనకు కొన్ని ధర్మములను ఏర్పరచుకొన్నాడు. దేవుని ధర్మములను
తెలిసినవాడు దేవున్ని తెలియవచ్చును. దేవుని ధర్మములు తెలియనివాడు
దేవున్ని ఎప్పటికీ తెలియలేడు. అయితే కొందరు మనుషులు దేవుని
ధర్మములను ఏమాత్రము తెలియకుండా దేవుడు ఇతనేననీ, దేవుని జ్ఞానము
ఇదేననీ చెప్పుచున్నారు. వారు ఊహించుకొన్నవాడే దేవుడు, వారికి
తెలిసినదే దేవుని జ్ఞానమని అంటున్నారు. వాస్తవముగా దేవుని
విషయమేదో, ప్రపంచ విషయమేదో, వాటి తేడా ఏమిటో, వారికి
తెలియదనియే చెప్పవచ్చును. అటువంటి వారిని మూర్ఖులనియూ మరియు
మూఢులనియూ చెప్పవచ్చును.
నేడు ప్రపంచ వ్యాప్తముగా పన్నెండు (12) మతములున్నవి.
అందులో ముఖ్యమైనవి మరియు పెద్దవి మూడు మతములు మాత్రమే
గలవు. ఆ మూడు మతములలో సంఖ్యలో పెద్దది క్రైస్తవమతము. రెండవ
స్థానములోయున్నది ఇస్లామ్మతము (ముస్లీమ్మతము), మూడవ
స్థానములోయున్నది హిందూ (ఇందూ) మతము. అన్నిటికంటే ముందు
పుట్టినది ఇందూమతము. తర్వాత పుట్టినది క్రైస్తవము. ఆ తర్వాత
పుట్టినది ఇస్లామ్ మతము. పుట్టుకలో మొదటిది మరియు సృష్ట్యాదినుండి
ఎక్కువ సంఖ్యలోయున్నది ఇందూ మతమే. అయితే నేడు సంఖ్యాబలములో
ఇందూ మతము మూడవ స్థానములోనికి పడిపోయినది. దైవజ్ఞానములో
మొదట పుట్టినది ఇందూ మతమని చెప్పినప్పటికీ మొదట దీనికి మతమను
పేరు లేదు. మొదట ఇందు అని చంద్రుని పేరుతో నెలకొల్పబడిన
జ్ఞానము ఇందూజ్ఞానము. చంద్రుడు జ్ఞానమునకు చిహ్నము మరియు
జ్యోతిష్య శాస్త్రరీత్యా జ్ఞానమునకు అధిపతి. అందువలన సృష్ట్యాదిలో
ఇందూ అని పేరు పెట్టి దేవుని ధర్మములు చెప్పబడినవి. అందువలన
సృష్ట్యాదిలోనే ఇందూధర్మములు బయటికి రాగా, ఈ మధ్య కాలములో
రెండు మూడు వేల సంవత్సరములనుండి మిగతా మతములు పుట్టుకొచ్చి
నవి. మిగతా మతములు పుట్టిన తర్వాత మొదట ఇందూ ధర్మమని
చెప్పబడు దానిని ఇందూ మతమని చెప్పుచూ వచ్చారు. మిగతా మతముల
ప్రక్కలో ఇందూ ధర్మమును కూడా ఇందూమతమని చెప్పడము జరిగినది.
ఇందూ అనునది మతము కాకపోయినప్పటికీ మతమని పిలువబడడము
చింతించతగ్గ విషయము కాగా, పూర్తి ఏడ్వతగ్గ విషయము మరొకటికలదు.
ఇందూ ధర్మము ఇందూ మతముగా మారిపోవడమేకాక ఇందూమతమని
పిలువబడు పేరు కూడా పోయి చివరకు నేడు హిందూమతముగా
మారిపోయినది. ఒక మారేమో ఇందూ ధర్మములో ధర్మముపోయి
మతముగా మారిపోగా, తర్వాత కాలక్రమములో ఇందూమతములో
'ఇందూ' పోయి 'హిందూ' అయినది. ఈ మధ్య వంద, రెండు వందల
సంవత్సరముల క్రితము ఇందూ శబ్ధము హిందూ శబ్ధముగా
మారిపోయినది. మొదట పుట్టిన ఇందూధర్మము యొక్క పేరుకే భంగము
వాటిల్లినది. నేడు చరిత్ర తెలియని హిందువులు ఏమాత్రము వెనుతిరిగి
చూడకుండా తమది హిందూ మతమని చెప్పుకొంటున్నారు. అర్థముతో
కూడుకొన్న ఇందూ ధర్మము నేడు అర్థహీనమైన హిందూమతముగా
మిగిలిపోయినది.
చరిత్రను వెనుకకు తోడి, నేడు గల హిందూమతము పూర్వము
ఇందూ ధర్మముగా ఉండెడిదని చెప్పినా, మూర్ఖముగా కొందరు వాదిస్తూ
లేదు హిందూమతము అనడమే సరియైనదని అంటున్నారు. కనీసము
హిందూమతములోని అర్థములేని హిందూశబ్ధమును తీసివేసి చివరకు
ఇందూమతమని చెప్పుకోండి అని చెప్పినా, మరికొందరు మూఢముగా
మాట్లాడుచూ హిందుమతము అనడమే ముఖ్యము, హిందూ మతము
అను పేరు సనాతనమైనదని అంటున్నారు. కలియుగములో రెండు మూడు
వేల సంవత్సరములు గడచువరకు మతము అను పేరే లేకున్ననూ,
హిందూమతము సనాతమైనదని కొందరనడము విచిత్రముగా కనిపిస్తున్నది.
వాస్తవానికి హిందూ అనుపదమునకు అర్థమేలేదు. ఇందూ అను
పదమునకు చంద్రుడనీ, జ్ఞానమనీ అర్థము కలదు. అర్థమున్న పేరును
వదలి, అర్థములేని పేరును సనాతన ధర్మమనుటలో ఏమి ఆంతర్యమున్నదని
చూస్తే, తమ మాటను నెగ్గించుకోవాలన్న వాదన తప్ప అందులో ఏమీ
లేదని తెలియుచున్నది. "నేను హిందువును నా మతము హిందూమతము”
అని చెప్పడములో హిందూమతము మీద తన పెత్తనమున్నదనీ,
హిందూమతము తనదనీ నిరూపించుకోవడము తప్ప ఏమీ లేదు. ఇక్కడ
చిన్న ఉపమానమును చెప్పుకొందాము. దాని వలన విషయము
సులభముగా అర్థము కాగలదు.
పూర్వము కలియుగ ప్రారంభములో భారతదేశములో అడవి
ప్రాంతము ఎక్కువగా ఉండేది. అడవులలో జంతువులు కూడా ఎక్కువగా
ఉండేవి. ప్రస్తుత కాలములో అడవులు కనిపించకుండాపోయినా, పూర్వము
మాత్రము ప్రతి వంద కిలోమీటర్లకు కనీసము ఐదారు చదరపు కిలోమీటర్ల
విస్తీర్ణము గల అడవి ఉండేది. జనాభా తక్కువయున్న ఆ కాలములో
ప్రజల వలన అడవులకు ఏ ముప్పు లేకుండెడిది. ఇప్పటి కాలములో
జనాభా పెరిగిపోయి, అడవులు తగ్గిపోయి, అడవులలోని జంతువులు కూడా
లేకుండా పోయాయి. పూర్వము భారతదేశములోని చాలా అడవులలో
సింహములు సహితము ఉండేవి. మధ్యప్రదేశ్లో ఇప్పటికీ భారతదేశము
లోనే పెద్ద అడవి కలదు. దక్షిణ భారతదేశములో నేటికీ తూర్పుకనుమలు,
పడమర కనుమల పేరుతో అడవులు ఎన్నో వందల కిలోమీటర్లు
విస్తరించియున్నవి. ఇప్పటికీ అడవులలో కొన్ని జంతువులు, పక్షులుండినా
పూర్వము ఉన్నట్లు అన్ని జాతులు లేవు.
పక్షులలో కొన్ని శాఖాహారులుండగా, కొన్ని మాంసాహారులు
శాఖాహారులు కూడా కలవు. జంతువులలో కొన్ని మాంసాహారులుగా
ఉండగా, కొన్ని శాఖాహారులుగా కూడా కలవు. పక్షులలో రామచిలుక
శాఖాహారికాగా, కాకి మాంసాహారి మరియు శాఖాహారిగా ఉన్నది. అలాగే
జంతువులలో సింహము మాంసాహారి కాగా, చింపాంజి కోతులు శాఖాహారి
మరియు మాంసాహారిగా యున్నవి. పక్షులలో చిలుకలు, కాకులు
తెలివైనవిగా ఉన్నవి. కొన్ని విషయములలో మనిషికంటే ఎక్కువ తెలివిగా
ఉన్నవని చెప్పవచ్చును. అలాగే జంతువులలో సింహాలు, చింపాంజి కోతులు
రెండూ తెలివైనవని చెప్పవచ్చును. కొన్ని విషయములలో మనిషికంటే
తెలివిగా ప్రవర్తించగలవు. వాటి జీవన విధానములో అవి మనిషికంటే
ఎక్కువ తెలివైనవనియే చెప్పవచ్చును. అయితే నేడు మనిషి అన్ని
జీవరాసులకంటే తెలివైనవాడని అందరూ అంటున్నారు. వాస్తవానికి మనిషి
పక్షులలోని కాకి చిలుకకంటే, జంతువులలోని సింహము చింపాంజి కంటే
ఎక్కువ తెలివైనవాడు కాడని చెప్పవచ్చును. మనిషి తాను బ్రతికే దానికి
యుక్తవయస్సు వచ్చేవరకు తర్ఫీదు పొందుచున్నాడు. జంతువులు
తర్ఫీదులేకుండానే తమ పెద్దలను చూచి నేర్చుకొని యుక్తిగా బ్రతుకుచున్నవి.
నేడు మనిషి తెలివైనవాడని పేరుపొందినా అది వాస్తవము కాదు.
సింహాలు మాట్లాడుకోకుండా, సైగలు చేసుకోకుండా ఎరను యుక్తిగా
పథకము ప్రకారము వేటాడగలవు. ఆ చాకచక్యము మనుషులలో లేదనియే
చెప్పవచ్చును. ఒక పథకమును తయారు చేసి ఇచ్చినా దానిని సరిగా
అమలుచేయలేని తెలివితక్కువతనముతో మానవుడున్నాడు. అలాగే పక్షుల
విషయములోనికి వస్తే చిలుకకు, కాకికియున్న తెలివి కూడా మనిషికి
లేదని చెప్పవచ్చును. కాకి చిలుకకంటే, అలాగే సింహము చింపాంజికంటే
మనిషి తెలివి తక్కువ వాడు అయినా, మనిషి నేడు అన్ని జీవులకంటే
తెలివైనవాడని ఎందుకు చెప్పబడుచున్నాడని ప్రశ్న రాగలదు. దానికి
మా జవాబు ఈ విధముగా గలదు. జంతువులవద్ద, పక్షుకులవద్దలేనిది
మనిషి దగ్గర ఒకటి కలదు. దానివలన మనిషి నేను తెలివైనవాడినని
చెప్పుకొంటున్నాడు. వాస్తవానికి అది తెలివికాదు. ఇతర జీవరాసుల
వద్దలేనిది, మనుషులవద్దయున్నది ఒకే ఒక 'మోసము'. జీవరాసులవద్ద
'ఇతరులను నమ్మడము’ కలదు. అదే మనుషులవద్ద 'మోసము’ కలదు.
మనుషులలో కూడా ఇతరులను నమ్ము మనుషులున్నారు. అటువంటివారిని
తెలివితక్కువ వారిగా లెక్కించి వారిని మోసము చేయువారున్నారు.
నమ్మకము ఒక విధానముకాగా, దానికి వ్యతిరేఖమైనది మోసము. మనిషిని
నమ్మే జీవరాసులను మనిషి మోసము చేయుచున్నాడు. మనిషి తన
తెలివితో జంతువులను పక్షులను జయించడము లేదు. తనవద్దయున్న
మోసముతో వాటిని జయించుచున్నాడు. నేటికాలములో మోసము
చేయువానిని తెలివైనవాడని అంటున్నారు తప్ప తెలివున్నవానిని
తెలివైనవాడని ఎవరూ అనడము లేదు. వాస్తవానికి మోసగాళ్ళు
తెలివితక్కువవారే. తెలివైనవాడు తాను ఇతరులనుగానీ, ఇతర
జంతువులనుగానీ ఇతర పక్షులనుగానీ మోసము చేయడు.
బుద్ధిబలమైన తెలివి వేరు, ఇతరులను మోసము చేయు పనులు
వేరు. ఒక సైంటిస్టును ఒక సాధారణ మనిషిని ఒకచోట నిలబెట్టి చూస్తే,
ఎంతో చదువు చదివి ఎన్నో విషయములను పరిశోధించిన విజ్ఞానవేత్తను
తెలివైనవాడని చెప్పవచ్చును. సాధారణ మనిషి, చదువులేని మనిషి అయిన
వానిని విజ్ఞానవేత్తకంటే తెలివైనవాడని చెప్పలేము. అప్పుడు సాధారణ
మనిషిని తెలివితక్కువవాడనీ, విజ్ఞానవేత్తను తెలివైనవాడనీ ఎవరయినా
చెప్పగలరు. విజ్ఞానవేత్త తెలివైనవాడయినప్పటికీ సాధారణ మనిషిని
మోసము చేయవలసిన అవసరము లేదు. అయితే సాధారణ మనిషి తన
అవసరనిమిత్తము ఇతరులను మోసముచేయు అవకాశము గలదు.
మోసము చేయుటకు ఎదుటివాడు తెలివైనవాడా కాదా అని చూడవలసిన
పనిలేదు. తెలివైనవాడుగానీ, తెలివిలేనివాడుగానీ ఎవడైనా కావచ్చు.
తన మాటలను నమ్మేవాడిని సులభముగా మోసము చేయవచ్చుననేదే ఇక్కడ
సూత్రముగానీ, ఎదుటివాడు తెలివైవాడా కాదా అనునది సూత్రముకాదు.
ఉదాహరణకు తెలివైన విజ్ఞానవేత్తను తెలివితక్కువయిన సాధారణ మనిషి
ఎలా మోసము చేశాడో ఇక్కడ గమనించగలిగితే, తెలివి ముఖ్యముకాదు
అనీ, మోసపోవుటకు నమ్మకమే ముఖ్యమనీ తెలిసిపోవుచున్నది.
కోపము అంటే ఏమిటో అందరికీ తెలుసు, అయితే కోపమునకు
వ్యతిరేఖమైనదేది అంటే 'కోపము లేకుండడము' అని చాలామంది చెప్పు
చున్నారు. అలాగే కామము అంటే కూడా అందరికీ తెలుసు, అయితే
కామమునకు వ్యతిరేఖ పదమును గురించి అడిగితే 'నిష్కామము'
అంటున్నారు. కోపమునకు, కామమునకు వ్యతిరేఖ పదమును వాస్తవముగా
ఎవరూ చెప్పకుండా దానిని లేకుండడమును నిష్కామమని, నిష్కోపమని
చెప్పుచున్నారు. అది సరియైన జవాబుకాదు. దయ్యము అని చెప్పి
దానికి వ్యతిరేఖపదము చెప్పమంటే దయ్యమునకు వ్యతిరేఖము దేవుడు
అని ప్రత్యేకముగా చెప్పాలిగానీ, దయ్యము లేదు అని చెప్పడము జవాబు
కాదు. నలుపు అన్నప్పుడు దానికి వ్యతిరేఖముగా తెలుపు అని ప్రత్యేకమయిన
మరొక రంగును చెప్పుచున్నాము కదా! అలాగే ప్రతి దానికీ వ్యతిరేఖమైనది
ప్రత్యేకముగా ఉండును. ఆ పద్దతి ప్రకారము కామము అనగా ఆశ అని
అర్థము, దానికి వ్యతిరేఖమయినది దానము అని చెప్పవలసియున్నది.
అక్కడ నిష్కామము అని అనకూడదు. అలాగే క్రోధము అనగా కోపము
అని అర్థము, దానికి వ్యతిరేఖ పదమును చెప్పవలసివచ్చినప్పుడు
కోపమునకు పూర్తి వ్యతిరేఖముగాయున్న దయను గురించి చెప్పాలి, అలాగే
ఇక్కడ నమ్మకము అను పదమునకు పూర్తి వ్యతిరేఖ పదముగా మోసము
అని చెప్పాలిగానీ, అపనమ్మకము అని చెప్పకూడదు.
కోపమున్న వానిని కోపిష్ఠి అంటాము. అలాగే మోసమున్న వానిని
మోసగాడు అని అంటాము. కోపమునకు వ్యతిరేఖమయిన దయగల
వాడిని దయామయుడు అని అంటాము. అలాగే మోసమునకు వ్యతిరేఖ
మయిన నమ్మకము గలవానిని నమ్మకస్తుడు అని అంటాము లేక విశ్వాసి
అని కూడా అంటాము. మోసగాడు ఇతరుల విశ్వాసమును (నమ్మకమును)
ఆసరాగాచేసుకొని ఇతరులను మోసగించుచుండును. అటువంటివాడు
ఎవరినీ విశ్వసించడు. విశ్వసించినట్లు నటించవచ్చునుగానీ, వానివద్ద
మోసము తప్ప విశ్వాసము ఉండదు. అలాగే విశ్వాసి అయినవాడు
ఇతరులను విశ్వసించి తాను మోసపోగలడుగానీ, అతనివద్ద విశ్వాసము
తప్ప మోసముండదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాము. ఒక
విజ్ఞాని, ఒక సాధారణ మనిషి ఇద్దరూ ఒక ప్రయాణములో ఒకరికొకరు
పరిచయమయ్యారు. ఒక తీర్థయాత్రకుపోతూ వారు ఒకరితో ఒకరు
కలుసుకోవడము జరిగినది. ఇద్దరూ చేరవలసిన గమ్యము చేరిన తర్వాత
మధ్యాహ్నము హోటలుకు పోయి భోజనము తిని రావలసియున్నది.
అప్పుడు సాధారణ మనిషి విజ్ఞానితో ఇలా అన్నాడు. "నేను ఇక్కడికి
ఇంతకుముందు చాలామార్లు వచ్చాను. ఇక్కడ ఒక హోటల్లో భోజనము
చాలా బాగుంటుంది. అయితే భోజనము రేటు కాస్త ఎక్కువగానే
ఉంటుంది. చివర ఐస్క్రీమ్ కూడా ఇస్తారు. అన్నీ కలిపి 300 రూపాయలు
రేటు ఉంటుంది. అయితే 30 రూపాయలతోనే 300 రూపాయల
భోజనము తినే అవకాశము కూడా ఆ హోటల్వారు కలిగించారు. 15000
రూపాయలను ఒకేమారు చెల్లించి భోజన టికెట్ తీసుకొన్న వారికి భోజనము
తిన్న తర్వాత మనకిచ్చిన చించిన టికెట్ను కౌంటర్లో చూపిస్తే కేవలము
30 రూపాయలు పట్టుకొని మిగతా డబ్బు వాపస్ ఇస్తారు. నేను ఎప్పుడు
వచ్చినా వారి నియమము ప్రకారము 15000 డబ్బులు కట్టి 300
రూపాయల భోజనమును 30 రూపాయలకే తినడము జరుగుచున్నది.”
అని చెప్పాడు.
అతని మాటలను వినిన విజ్ఞాని వాడు చెప్పినది నిజమేనని నమ్మి
“దీనివలన వారికి నష్టమే కదా! లాభము ఏమి వస్తుంది?” అని అడిగాడు.
దానికి అతను "దానివలన వారి వ్యాపారము పెంచుకోవడమే ధ్యేయమై
ఉంటుంది. వచ్చిన అందరివద్దా 15000 ఉండవు కదా! ఇదంతా
వ్యాపారములో ట్రిక్కులు” అని చెప్పడము జరిగినది. అతను చెప్పినదంతా
విని అంతా నిజమేనని విజ్ఞాని నమ్మడము జరిగినది. తర్వాత హోటల్కు
పోయినప్పుడు ఇద్దరూ ఒక టేబుల్ ముందర కూర్చొని అంతవరకూ చెప్పిన
సాధారణ వ్యక్తి తనవద్దయున్న 15000 డబ్బు తీసి చేతిలో పట్టుకొని
భోజనము టికెట్ తెస్తానని లేచి “నీకు కూడా భోజనము టికెట్ కావాలి
కదా! నీకు కూడా టికెట్ తెస్తాను” అన్నాడు. అప్పుడు విజ్ఞాని అయినవాడు
తాను కూడా 15000 డబ్బులు ఇచ్చి తనకు కూడా భోజనము టికెట్టు
తెమ్మన్నాడు. సాధారణ వ్యక్తి కౌంటర్ వద్దకు పోయి 600 మాత్రము
ఇచ్చి రెండు టికెట్లు తెచ్చాడు. ఇద్దరూ కలిసి భోజనము చేశారు. విజ్ఞాని
కంటే ముందు తినిన సాధారణ వ్యక్తి ముందుగా లేచి చేయి కడుక్కొని
వచ్చుటకుపోయి తిరిగి రాలేదు. విజ్ఞాని కూడా భోజనము ముగించుకొని
వచ్చినా ముందు పోయినవాడు రాలేదు. అప్పుడు విజ్ఞానికి అనుమానము
వచ్చి హోటల్ కౌంటర్ దగ్గరకుపోయి అడిగాడు. అప్పుడు తాను మోస
పోయానని అర్థమయినది. ఈ విధముగా తెలివైన వానిని తెలివితక్కువ
వాడు మోసము చేయగలడని తెలియుచున్నది. ఇది కల్పిత విషయము
కాదు, వాస్తవముగా తమిళనాడుయందు మద్రాసు పట్టణములో జరిగిన
సంఘటననే చెప్పాము.
మనుషులలో మోసము అనునది కొంత, నమ్మకమనునది కొంత
ఉండును. అయితే అందరూ ఒకే విధముగా ఉండరు. కొందరు ఎక్కువ
నమ్మకముగలవారు ఉండగా, కొందరు ఎక్కువ మోసము చేయు
వారుండడము సహజమేయని చెప్పవచ్చును. మోసము ఎప్పుడో ఒకమారు
బయటపడుచుండును. అప్పుడు మోసగాని మర్యాద పోవుచుండును.
అయినా వాని పనిని వాడు చేయుచునే ఉండును. నమ్మకమునకు
మోసమునకు తేడా తెలిసినప్పుడు ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పవచ్చును.
అయితే కొన్ని చోట్ల ఇది మోసపుపని అని తెలియకపోవడము వలన,
కొందరు తాము మోసము చేయుచున్నా, తమ పనే మంచి పనియని
తెలుపుట వలన మోసము చేయువారి పెత్తనమే చెలామణి అగుచున్నది.
మోసము చేయువారు ఎక్కువమంది యున్నప్పుడు మోసపోవువారు
మోసము చేయువారి చేత మోసపోతూ, అది మోసమని తెలియక మోసము
చేయు వారినే సమర్థించునప్పుడు, ఎక్కడో ఒకరు లేక ఇద్దరు ఇది మోసము
అని చెప్పుచూ, మోసగాళ్ళ మోసమును బయటపెట్టినా దానివలన ఏమీ
ప్రయోజనముండదు. పైగా సత్యము చెప్పిన వానినే తప్పని అందరూ
అణచివేయుదురు. కొన్ని విషయములలో మోసమే పూర్తి చలామణి
అగుచున్నది. అయినా దానిని మోసము అని ఎవరూ అనడము లేదు.
దీనినిబట్టి కొన్ని విషయములలో మాత్రము మనిషి మోసమును
గుర్తించగలడుగానీ, మరికొన్ని విషయములలో మోసమును పూర్తిగా
గుర్తించలేడని తెలిసినది. ప్రపంచ విషయములలో మోసమును
గుర్తించవచ్చునుగానీ, పరమాత్మ విషయములలో మోసమును గుర్తించుట
దుర్లభమయినది. కొన్ని ప్రపంచ విషయములలో కూడా మోసమనునది
గుర్తించబడడములేదు. కొన్ని ప్రపంచ విషయములలో పూర్తిగా
మోసపోయిన తర్వాత కొంతకాలమునకు కూడా ఇది మోసము అని
గుర్తించలేకపోవుచున్నారు. దేవుని విషయములోనికి వస్తే చాలామంది
తాము మోసపోతున్నామని తెలియకుండా మోసపోతున్నారు. ఎంత తెలివైన
వారయినా దేవుని విషయములో పూర్తిగా మోసపోతున్నారు. తాము ఎంత
కాలము మోసపోయినా, తాము మోసపోయాము అని తెలియకున్నారు.
దేవుని విషయములో మోసము చేయువారు తమది మోసము
కాదనీ, తమది చెడుపని కాదు మంచిపనేననీ వాదించుచున్నారు. తమను
గొప్పగా ప్రకటించుకొనుచున్నారు. ఈ విషయమును ఒక ఉపమానము
ద్వారా వివరించుకొందాము. పూర్వము అడవులలో సింహముండేదని
ముందు చెప్పుకొన్నాము కదా! సింహము అంటే కౄరమృగమని చాలా
మందికి తెలుసు. పెద్ద జంతువులను సహితము చంపు సింహము మనిషిని
ఏమాత్రము వదలక చంపును. అయితే మనిషికంటే తెలివైనవి సింహాలు
అని చెప్పుకొన్నాము. ఆకలికొన్నప్పుడే జంతువులను వేటాడు సింహము
ఆకలిగా లేనప్పుడు తనముందరే ఆహార జంతువున్నా దానిని ఏమీ చేయక
ఊరకుండడము జరుగుచున్నది. కౄరజంతువుగా చెప్పుకొను సింహము
ఆకలిగా లేనప్పుడు ఏ జంతువు తన ముందున్నా వేటాడదు. సింహము
తెలివైన జంతువు కాబట్టి భవిష్యత్తును ఊహించి తన సంతతిని ప్రేమగా
పెంచుకోగలదు. ఇతర సింహముల సంతతిని తన సంతతికి పోటీకి
రాకుండా చిన్నపిల్లలను సహితము చంపివేయును. తన పిల్లలేవి?
ఇతర పిల్లలేవి? యని విచక్షణ కల్గియుండును. తన సంతతి విషయములో
ఆడ సివంగులకు లేని విచక్షణా జ్ఞానము మగ సింహములకు ఉండును.
సింహజాతిలో మగవాటిని సింహములని, ఆడవాటిని సివంగులని
అంటాము.
పూర్వము వేయి సంవత్సరముల క్రితము ఒక మనిషి మరొక
మనిషిని మోసము చేత బానిసగా తయారు చేసుకొని బ్రతికెడివాడు.
తెల్లజాతి ప్రజలు నల్లజాతి ప్రజలను బానిసలుగా చేసుకొని, బానిసలతో
పశువులచేత పనులు చేయించినట్లు పనులు చేయించుకొనెడి వారు. కొన్ని
దేశములలో నల్ల జాతీయులనే కాకుండా, పేదవారిని బానిసలుగా చేసుకొని
వారిమీద పెత్తనము చేసెడివారు. ఆ దినము బానిసలుగాయున్న వారిలో
కూడా ఎంతో తెలివైనవారున్నా, వారు తమ యజమానుల చేతిలో బానిస
బ్రతుకు బ్రతికెడివారు. ఒక మనిషి మరొక మనిషిని మోసము చేత
బానిసగా వశము చేసుకొని పెత్తనము చెలాయించెడివాడు. అంత తప్ప
ఆనాడు యజమానులు తెలివైనవారు, బానిసలు తెలివితక్కువ వారేమీ
కాదు. ఆ దినములలో ఒక యజమాని తన బానిసను ఎంత హింసించి
పనిచేయించినా పని చేయడమే బానిసల వంతుగా ఉండేది. ఎవరయినా
బానిస తన యజమానిని ఎదిరించి మాట్లాడితే అనేకముగా
హింసించెడివారు. బానిసలను సంతలో పశువులవలె ఇతరులకు అమ్మెడి
వారు, అలాగే కొనెడివారు. నేడు పశువుల సంతలు జరిగినట్లు
దినములలో బానిసలను అమ్మెడి మరియు కొనెడి సంతలు జరిగెడివి.
అటువంటి అనాగరిక కాలములో ఒక బానిస తన యజమాని చేయించు
పనులను చేయలేక, పెట్టెడి హింసలను అనుభవించ లేక ఎక్కడయినా
అడవిలోనికి పారిపోయి కౄరజంతువులకు ఆహారముగా చనిపోవడము
మంచిదని తలచి తన యజమానివద్దనుండి ఒక రోజు రాత్రి పారిపోవడము
జరిగినది.
యజమానులను వదలి పారిపోయిన బానిసలు పట్టుబడితే వారికి
ఆ కాలములో మరణశిక్షను వేసెడివారు. పారిపోతే మరణశిక్ష ఉండుట
వలన ఎవరూ పారిపోయే ప్రయత్నము చేయక ఎంత కష్టమయినా అలాగే
చేసెడివారు. ఇప్పుడు యజమాని వద్దనుండి పారిపోయిన బానిస తాను
కౄరమృగమునకు ఆహారముగా మారి చనిపోవాలనుకొన్నాడు కాబట్టి
మరణశిక్షకు భయపడకుండా పారిపోయాడు. చనిపోవాలని పోయిన
బానిస అడవిలోనికి పోయిన తర్వాత సింహము నివసించు గుహను చూచి
అందులోనికి ధైర్యముగా పోయాడు. గుహలో సింహమునకు ఆహారముగా
మారిపోవాలని నిర్ణయముతో గుహలోనికి పోవడము జరిగినది. గుహలో
నుండి సింహము గాండ్రింపు శబ్ధమును విని సింహము గుహలో
ఉన్నదని నిర్ధారించుకొని బానిస గుహలోనికి పోవడము జరిగినది.
సమయములో సింహము గుహలోయున్నా దాని కాలికి బలమైన ముల్లు
గ్రుచ్చుకొనియుండగా అది నడువలేని స్థితిలోయున్నది. ఆ దినమే కాలిలో
ముల్లు విరిగినది, అందువలన సింహము ఎక్కువ బాధపడుచుండెను. ఆ
బాధలో అది మనిషిని చూచినా మౌనముగా ఉండెను. అప్పుడు దాని
పరిస్థితిని చూచిన బానిస దానికి కాలిలో ముల్లు యున్నదానివలన తనను
ఏమీ అనలేదనీ, కాలిలో ముల్లు తీసివేస్తే అప్పుడు కాలును కదలించి నా
మీదికి రాగలదని తలచి సింహము ముందుకు పోయి దాని కాలును
పట్టుకొని బలముగానున్న ముల్లును కష్టపడి పెరికివేశాడు. ముల్లు పెరికిన
తర్వాత కూడా సింహము తనను ఏమీ అనని దానివలన దాని కాలికి
ముల్లు పోయినా నొప్పి పోలేదని గ్రహించి, నొప్పి తగ్గితే లేచినిలబడి
తనను చంపగలదని తలచిన బానిస, వెంటనే గుహ బయటికి పోయి
నొప్పి తగ్గుటకు ఉపయోగపడు ఔషధ మ్రొక్కను తెచ్చి దాని ఆకులను
నలిపి ముల్లు గ్రుచ్చుకొన్న గాయమునకు పసరును పిండి తర్వాత
తనవద్దనున్న పంచెను కొంత చించి దాని కాలుకు ఆకును పెట్టి కట్టు
కట్టాడు. అప్పుడు ఔషధ ప్రభావమునకు సింహము కాలిలోనున్న బాధ
పూర్తిగా కనిపించకుండా పోయినది. రెండవ రోజే సింహము లేచి నిలబడ
గలిగినది. అయినా సింహము మనిషిని ఏమీ అనలేదు.
సింహము నిలబడినా అది నడువలేని స్థితిలోయున్నదని అనుకొన్న
బానిస అది నడువగలిగితే తనను చంపగలదని అనుకొని, దానికి నడిచే
బలము వచ్చునట్లు కొంత ఆహారమును సింహమునకు పెట్టాలనుకొని
గుహ బయటకు పోయి కష్టపడి ఒక కుందేలును తెచ్చి దాని ముందర
పెట్టాడు. అప్పుడు సింహము కుందేలును తిని కొంత ఆకలిని తగ్గించు
కొన్నది. అయితే మనిషికి సింహము కౄరమృగముగానే తెలిసినా, అది
ఎంతో తెలివైన జంతువని మాత్రము తెలియదు. తనను ఆపదలో ఆదుకొని
కాలికి ముల్లుపెరికి, గాయమునకు ఔషధమును పూసి, తర్వాత ఆహారమును
కూడా పెట్టిన మనిషికి ఏ హానీ చేయదలచుకోలేదు. పైగా అది బానిసకు
దగ్గరయుంటూ అతనితో స్నేహము చేయసాగినది. ఒక నెలరోజులు
అలాగే సాగిపోయినది. ఒకే గుహలో నివసించు మనిషీ సింహమూ
గుహ బయటికి పోయి ఆహారమును సంపాదించుకొని తిని తిరిగి
గుహలోనికి వచ్చి యుండెడివారు. అయితే ఆ దినములలో బానిసలు
పారిపోతే వారిని తప్పక వెదికి పట్టుకొని అందరూ చూచునట్లు
బహిరంగప్రదేశములో మరణ శిక్షను వేసెడివారు. అలా చేస్తే ఇతర
బానిసలు దానిని చూచి తాము పారిపోకుండా భయపడి ఉండగలరని
అలా చేసెడివారు.
పారిపోయిన బానిసను వెదకెడి బృందము అడవిని కూడా వదలక
గాలించుట వలన, ఆహారముకొరకు గుహ బయటికి పోయిన బానిస
వారి చేతికి దొరికాడు. అప్పుడు బానిసను ఆ రాజ్యము రాజు ముందర
హాజరుపరుచగా అక్కడి రాజు బానిసను మూటగట్టి సింహమునకు
ఆహారముగా వేయండి అని శిక్ష విధించడము జరిగినది. బహిరంగముగా
అమలు జరుగు ఆ శిక్షకు ఒక మైదానములో ఒక తీగకంచెను ఏర్పాటు
చేసి, అందులో జరుగునది అందరూ చూచునట్లు చేయాలని వారు అదే
విధముగా ఇనుపతీగతో ఐదు ఎకరముల విస్తీర్ణముగల కంచెను తయారు
చేసి, ఒక దినము బానిసను మూటలోవేసి అతను మూటలో కదలుచుండగా,
ఆకలిగొన్న సింహమును బోనులో తెచ్చి కంచెలోనికి వదిలారు. అప్పుడు
ఆకలితోయున్న సింహము కదలుచున్న మూటవద్దకు వచ్చి మూటను వాసన
చూచి తన గోర్లతో మూటను చించివేసింది. అయితే లోపలయున్న మనిషికి
ఏమాత్రము గోర్ల గాయములు కాకుండా మూటను మాత్రము చించివేసి
మనిషిని బయటకు వచ్చునట్లు చేసినది. ఆకలిగా యున్న సింహము
బానిస మీద ఏమాత్రము దాడిచేయక బయటికి వచ్చిన బానిసతో
స్నేహముగా తన నాలుకతో నాకను మొదలుపెట్టింది. బానిస అడవిలోనికి
పోయినప్పుడు గుహలో కనిపించిన సింహమే బోనులో చిక్కి అక్కడికి
వచ్చియుండుట వలన ఆ సింహము మూటను వాసన చూచి తన
ఘ్రాణశక్తితో బానిసను గుర్తించగలిగింది. అడవిలో ఆపదలో తనకు
సహాయపడిన మనిషిమీద ఆకలిలో కూడా తన స్నేహమునే కనపరచింది.
ఈ సంఘటనతో సింహము కౄరజంతువు అయినా తెలివైన
జంతువని తెలిసిపోయినది. అదే విధముగా నిజము తెలియని మనిషి
తనకు తెలిసినదే వాస్తవము అనుకోకుండా, తనకు తెలియని సత్యములు
ఎన్నో ఉన్నవని తెలియవలసియున్నది. అయితే దేవుని విషయములో
నిజము తెలియక మనిషికంటే జంతువులు తెలివితక్కువవని అనుకొన్నట్లు
తనకు తెలిసినదే సత్యమని అనుకోవడము జరుగుచున్నది. ఇక్కడ ఒక
సంఘటనతో మనిషికంటే జంతువులే తెలివైనవని అర్థమయినట్లు,
ఎప్పుడయినా మనిషికి తెలిసినది సత్యముకాదనీ, తెలియని సత్యము ఎంతో
ఉన్నదని తెలియగలదు. అందువలన పెద్దలు ఒకమాటను ఈ విధముగా
చెప్పారు. "నీకు ఏమీ తెలియదని నీకే తెలియదు. అందువలన అన్నీ
తెలుసునని అనుకుంటున్నావు. వాస్తవానికి నీవు ఎవరో కూడా నీకు
తెలియదు.” దీనినిబట్టి మనిషి అసత్యమయిన దానినే పూర్తి సత్యమని
అనుకొంటున్నాడనీ, సత్యమైన దానిని అసత్యమనుకొంటున్నాడనీ తెలిసినది.
ఒక మనిషి బలవంతుడు అయినప్పుడు, అతడు అనుకొన్నదే సత్యమనీ
తలచి, తన ఉద్దేశ్యమునే ఇతరుల మీద కూడా దిద్దును. బలవంతుని
ఉద్దేశ్యము తప్పు ఉద్దేశ్యమనీ, అతను అనుకొన్నది సత్యముకాదని తెలిసినా,
బలహీనుడు బలవంతునితో వాదించలేడు. అందువలన బలవంతుని
మాటయే అక్కడ అమలు జరుగును. అతని మాటనే అందరూ
వినవలసివచ్చును.
ఈ విధముగా బలవంతుని భావమును బలహీనులు ఇష్టము
లేకపోయినా వినవలసివచ్చుచున్నది. అటువంటప్పుడు బలహీనుని
సత్యమైన భావమును బలవంతుని అసత్యభావము ఆక్రమించినదనియే
చెప్పవచ్చును. అందువలన బలహీనుని భావము అణిగిపోయి బలవంతుని
భావమే కనిపించుచున్నది. ఉదాహరణకు బలహీనుని స్థలమును
బలవంతుడు కబ్జా చేసినట్లు, బలహీనుని భావమును బలవంతుడు కబ్జా
చేశాడని చెప్పవచ్చును. భార్య బలహీనమై, భర్త బలవంతుడు అయినప్పుడు
భార్య మాటను భర్త వినడు. భర్త మాటనే భార్య వినవలసివస్తుంది.
దాని పర్యవసానము సంసారము చెడిపోతుందనీ, తాము పేదవారమయి
పోతామని తెలిసినా, భర్త చేతిలో భార్య కబ్జా అయిపోవుటవలన తప్పని
సరిగా భర్త చెప్పినట్లే భార్య వినవలసి వచ్చును. జూదమాడితే డబ్బులు
వస్తాయని భర్త చెప్పితే, బలహీనమైన భార్య అతనిని ఎదిరించి జూదమాడితే
డబ్బులు పోతాయని చెప్పలేదు. ఈ విధముగా ప్రపంచ విషయములలో
ఎన్నో కబ్జాలు జరుగుచున్నవి.
ఒకడు తన భూమిలో అనుకూలముగాపండు పంటను వేసి
పండించుకొనెడి వాడున్నాడనుకొనుము. వానికంటే అన్ని విధములా
బలవంతుడు వచ్చి వాని భూమిని కబ్జా చేశాడనుకొనుము. అప్పుడు
వానికి ఇష్టమొచ్చిన పంటను వాడు భూమిలో వేయును. అప్పుడు మొదటి
వాని పెత్తనము భూమిమీద ఏమీ ఉండదు. ఆక్రమదారుని ఇష్టము
ప్రకారము భూమిలో పంట వేయబడునుగానీ భూమిగలవాని ఇష్టము
ప్రకారము ఆ భూమిలో పంట ఉండదు. ఇక్కడ కబ్జాదారులు అనుకొన్నదే
జరుగుచున్నది. కబ్జాదారుని నిర్ణయము తప్పు నిర్ణయమైనా వాడు
బలవంతుడైనప్పుడు మిగతావారందరూ ఆ తప్పు నిర్ణయమునే సమర్థించు
చున్నారు. బలహీనుని భూమిని బలవంతుడు కబ్జా చేయుచుండుట బయట
ప్రపంచములో జరుగుచున్నది. ఒక మనిషి ఆస్తిని కబ్జా చేసినట్లే, కొందరి
భావములను కాదని తమ భావములనే ఇతరుల మీద ప్రయోగించి,
తమ మాట ప్రకారము తమ భావములనే గొప్పవని చెప్పించువారు గలరు.
ఇతరుల ఆస్తులను, ఇతరుల ఉద్దేశ్యములను భూమిని కబ్జా చేయు
వారున్నట్లే, దైవ విషయములను కూడా కబ్జా చేసి దైవ విషయములు ఇట్లే
ఉండవలెనని శాసించువారు కూడా కలరు. నేడు దేవుని జ్ఞానమునే కబ్జా
చేసినవారు చాలామంది గలరు.
దేవుడు దేవునిగా కాకుండా భగవంతునిగా భూమిమీదికి వచ్చి
తన జ్ఞానము ఈ విధముగా ఉన్నదని చెప్పిపోయినప్పుడు, కొందరు
భగవంతుడు చెప్పిన జ్ఞానమును ఆశ్రయించి, అసలయిన దైవజ్ఞానమును
తాము తెలిసి, ఇతరులకు కూడా తెల్పునప్పుడు, జ్ఞానమును బోధించు
వారిని ప్రజలు గౌరవపూర్వకముగా చూచుటను గమనించిన కొందరు,
ఆ గౌరవము తమకే దక్కవలెనని, ఇతరుల దృష్ఠిలో తామే గొప్ప జ్ఞానులుగా
కనిపించవలెనని తలచి, దేవుడు చెప్పిన జ్ఞానమును కబ్జా చేసి, అదే
జ్ఞానమునకే తమ మనోభావములను చేర్చి, తమకు ఇష్టమొచ్చిన పద్ధతిలో
చెప్పి ఇదే అసలయిన జ్ఞానమని చెప్పుచున్నారు. అలా చెప్పడమేకాక
తాము చెప్పిన జ్ఞానమును కాదనిన వారందరినీ అజ్ఞానులుగా లెక్కించి
ప్రచారము చేయుచున్నారు. దానితో నిజమైన జ్ఞానులు ప్రజల దృష్ఠిలో
అజ్ఞానులుగా, జ్ఞానమును కబ్జాచేసి అజ్ఞానమును బోధించువారు నిజమైన
జ్ఞానులుగా తెలియబడుచున్నారు. ఎవరు ఏమి చెప్పుచున్నారను విచక్షణ
లేని మనుషులు, బలవంతులు చేయు చెడు ప్రచారమునే నమ్మి అజ్ఞానమునే
జ్ఞానమనుకొనుచున్నారు. అటువంటప్పుడు నిజమైన దైవజ్ఞానమును
బోధించువారిని, అసలయిన జ్ఞానులను, ప్రజలు నమ్మక వారు చెప్పునది
జ్ఞానముకాదని తలచి జ్ఞానులనే దూషించుచున్నారు. బలవంతులు చేయు
బోధలను విన్నవారు దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పిన మాటలను
కూడా ఖాతరు చేయక, ఇంపుగా చెప్పు బలవంతుల మాటలనే
నమ్ముచున్నారు.
నేడు దేవుని ధర్మములన్నీ అధర్మములుగా మారిపోయాయి. దేవుని
ధర్మములను కబ్జా చేసినవారు తాము నిజమైన జ్ఞానులమని ప్రకటించుకొని
జ్ఞానుల స్థలమును ఆక్రమించుకొన్నారు. వేషములో, భాషలో, ఆచరణలో
అన్ని విధములా నిజమైన జ్ఞానులవలె కనిపించుచు, జ్ఞాన కబ్జాదారులు
జ్ఞానమునకు తామే పెద్దలమని చెప్పుకోవడము వలన, నేడు ప్రతి మతము
లోనూ మా పెద్దలు చెప్పినట్లు మేము నడుచుకొంటామని ప్రజలు
అంటున్నారు తప్ప, దేవుడు చెప్పిన జ్ఞానము ప్రకారము నడుచుకుంటామని
చెప్పువారు ఎవరూ లేరు. ఇప్పటి పరిస్థితినిబట్టి చూస్తే ధర్మములు పూర్తి
అధర్మములుగా మారిపోయాయనీ, ధర్మములకు గ్లాని ఏర్పడినదనీ, దేవుని
జ్ఞానమునకు ముప్పు ఏర్పడినదనీ చెప్పవచ్చును. దేవుని జ్ఞానమును కబ్జా
చేసినవారు మాత్రము ఇంతకుముందుకంటే ఇప్పుడే జ్ఞానము బాగుందనీ,
అందరూ సక్రమముగా తాము చెప్పినట్లు నడుచుకొంటున్నారనీ,
అందువలన అందరూ దేవుని మార్గములో సక్రమముగా యున్నారని
చెప్పుచున్నారు. వాస్తవముగా దేవుని దృష్టిలో ధర్మములు అధర్మములుగా
మారిపోయాయి.
జ్ఞానము వక్రమార్గము పట్టిపోయి, ధర్మములు అధర్మములుగా
మారిపోయినప్పుడు, తిరిగి ధర్మములను నెలకొల్పుటకు దేవుడు
భగవంతునిగా భూమిమీదికి వచ్చి, తన ధర్మములను తెలియజేయవలసిన
అవసరమొచ్చినదని మేము అంటున్నాము. కొన్ని సూచనలనుబట్టి దేవుడు
భగవంతునిగా ఇప్పటికే భూమిమీదికి వచ్చియున్నాడని కొంత అర్థమగు
చున్నది. భూమి మీద ఎవరు ఎంత అజ్ఞానమును బోధించినా, చివరకు
అది దేవుని చేత సవరింపబడి, అసలయిన జ్ఞానము బయటివచ్చునని
దృఢముగా చెప్పవచ్చును. అణిగిపోయిన ధర్మములను దేవుడు నెలకొల్పుట
తథ్యమే అయినా, మా ఆధ్వర్యములో జ్ఞానము స్వచ్ఛముగా ఉందని కబ్జా
దారులు చెప్పుచున్నారు. తమకు ప్రజలలోయున్న పట్టు, గౌరవము ఎక్కడ
పోతుందోనని భయపడు కబ్జాదారులు దేవుడురాడు, జ్ఞానమును చెప్పడు,
మేము చెప్పునదే నిజమైన జ్ఞానమని ప్రజలను నమ్మించుచున్నారు.
భూమిమీద జ్ఞానమునకు ముప్పు ఏర్పడినప్పుడు తప్పక నేను వచ్చి నా
జ్ఞానమును నేనే చెప్పెదననీ ఇంతకుముందు దైవగ్రంథములో దేవుడు
చెప్పియున్నా, కబ్జాదారులు ఆ మాటను పూర్తి ఖండించుచున్నారు. దేవుడు
రాడని ప్రచారము చేయుచున్నారు.
దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికీ తెలియదనీ,
అందువలన తన జ్ఞానమును తానే చెప్పవలెననీ, దేవుడు ఒకవైపు వాక్యము
రూపములో చెప్పియున్నా, ఆ మాటను వక్రమార్గము పట్టించి దేవుడు
రాడని తమ ఉద్దేశ్యమునే తాము చెప్పుచున్నారు. దైవగ్రంథములలో 'నేను
వస్తాను' అని ప్రత్యక్షముగా నొక్కి వక్కాణించిన దేవుని మాటను పట్టు
పట్టి కొట్టివేయుచున్నారు. అంతిమ దైవగ్రంథములో దేవుని జ్ఞానము
దేవునికి తప్ప ఏ మానవునకూ తెలియదని చెప్పిన వాక్యము సూరా 3
ఆలీ ఇమ్రాన్ 7వ ఆయత్నందు ఉన్నా ఆ మాటను మనిషి ఖాతరు
చేయలేదు. మనుషులలో ఒక మనిషినయినవాడు నాకు దేవుని జ్ఞానము
తెలియదని ఒప్పుకోవడము లేదు. ఏ మనిషికి తెలియదను వాక్యము
దైవగ్రంథములో యున్నా అన్నీ తనకు తెలిసినట్లే మాట్లాడుచున్నాడు.
మనిషి దేవుని జ్ఞానము ప్రకారము ఇట్లే ఉండవలెనని చెప్పుచున్నాడు.
ఇదే సరియైన జ్ఞానమని తానే స్వయముగా చెప్పుచున్నాడు. మనిషినయిన
నేను చెప్పు జ్ఞానము సరియైనదికాదని అనుకోవడము లేదు. చివరికి
మనిషి దేవుని జ్ఞానమునే ధిక్కరించి, దేవుడు తనను మ్రొక్కమని చెప్పిన
చోట ఎవరినీ మ్రొక్కకూడదన్నాడు. తాను చెప్పినవానికే మ్రొక్కమని మనిషి
నిర్ణయించి చెప్పుచున్నాడు. తాను చెప్పినదే నిజమైన జ్ఞానమనీ, అలా
ఆచరించిన వానినే దైవభక్తునిగా, దేవుని మీద విశ్వాసమున్న వానిగా
లెక్కించుతామనీ, తాము చెప్పిన పద్ధతిని అమలు చేయనివానిని అజ్ఞానిగా,
దైవద్రోహిగా, అవిశ్వాసిగా లెక్కించుతామనీ చెప్పుచున్నాడు. అదంతయూ
వినిన మనుషులు తమను సమాజమునుండి వెలివేస్తారను భయముతో
వారికి పెద్దలుగాయున్న వారిమాటలనే వింటున్నారు. ప్రతి సమాజము
లోనూ ఆ సమాజమునకు పెద్దలు ఏర్పడియుండి, సమాజమును వారి
చెప్పు చేతలలో పెట్టుకొన్నారు. వీరినే మేము కబ్జాదారులు అంటున్నాము.
మేము అందరినీ కలిపి అలా అనలేదుగానీ దైవజ్ఞానమునకు వ్యతిరేఖముగా,
దైవగ్రంథమునకు విరుద్ధముగాయున్న వారిని తప్పక జ్ఞానమునే కబ్జా చేసిన
వారని చెప్పవచ్చును.
దైవజ్ఞానమును కబ్జా చేసినవారు కొంతకాలమే బ్రతుకు తమ
జీవితమునకు సమాజములో హోదా కల్గునట్లు, తమను తాము పెద్దలుగా
ప్రకటించుకొని, దేవుని జ్ఞానమును శాసించువారిగా ఉంటూ, తనకంటూ
తమ సమాజములో ఒక సామ్రాజ్యమును సృష్టించుకొన్నారు. మతము
అనబడు సామ్రాజ్యమునకు తాము పెద్దగాయుంటూ, దేవునికంటే గొప్పగా
గౌరవమును పొందాలనుకొంటున్నారు. దేవుడు మూడు దఫాలుగా, మూడు
చోట్ల, మూడు సమయములలో జ్ఞానము చెప్పగా, దానినే అదనుగా మలచు
కొని, మూడుమార్లు చెప్పిన జ్ఞానమును మూడు మతములుగా మనిషి
మలచుకొన్నాడు. దేవుడు మూడుమార్లు జ్ఞానమును భూమిమీద
అందించగా, అందులో రెండుమార్లు స్వయముగా దేవుడే భగవంతుడను
మారువేషముతో జ్ఞానమును చెప్పడము జరిగినది. జ్ఞానమును మూడవ
మారు చెప్పినప్పుడు తాను స్వయముగాగానీ, భగవంతుడను
మారువేషములో గానీ చెప్పక, తన జ్ఞానమును తెలిసిన జ్ఞానితో చెప్పించాడు.
మొదట భారతదేశములో భగవంతుడుగా చెప్పిన జ్ఞానము 'భగవద్గీత'
గ్రంథ రూపములో ప్రథమ దైవగ్రంథముగా ప్రజల మధ్యన ఉండగా,
రెండవ మారు ఇజ్రాయెల్ దేశములో చెప్పిన జ్ఞానము నాలుగు సువార్తల
రూపములో మధ్యదైవగ్రంథముగా 'బైబిలు' గ్రంథములో గలదు.
మూడవమారు దేవుని జ్ఞానము తెలిసిన మహాజ్ఞాని అయిన జిబ్రయేల్
చెప్పిన జ్ఞానము అంతిమ దైవగ్రంథముగా 'ఖుర్ఆన్' గ్రంథములో గలదు.
మూడు గ్రంథములలోనిది ఒకే దేవుని జ్ఞానమే అయినా, అది మూడుగా
చీల్చబడి మూడు మత సామ్రాజ్యములుగా ఏర్పడినది. దైవజ్ఞానమును
కబ్జా చేసిన మతపెద్దలు మత సామ్రాజ్యములను సృష్టించి ప్రజలను మూడు
గుంపులుగా చీల్చి వేశారు. ఆయా మతపెద్దలుగా వ్యవహరించువారు
దైవగ్రంథములలో ఏమాత్రము చెప్పని మతములను సృష్టించుకొని, ఆ
మతములలోని వారు తమ ఆధీనములో ఉండునట్లు, మత నియమములను
స్వయముగా ఏర్పరచారు. మత నియమములను కూడా దేవుని జ్ఞానముగా
ప్రచారము చేసి, దానిని జవదాటకూడదనీ, దానిని అతిక్రమించినవాడు
దేవుని మాటను అతిక్రమించినట్లేననీ చెప్పి భయమును ఏర్పరచారు.
మతనియమములనే వారి జీవితములో ఆచరించునట్లు చేసి, వాటినే దేవుడు
చెప్పిన జీవన విధానములని చెప్పారు. వాస్తవానికి దేవుడు తన
గ్రంథములలో మతమును గానీ, మత విధానమునుగానీ ఎక్కడా చెప్పలేదు.
భగవద్గీతలో హిందువులను పిలక పెంచమనిగానీ, ఖుర్ఆన్లో ముస్లీమ్లు
గడ్డము పెంచమనిగానీ చెప్పలేదు. అలాగే బైబిలులో క్రైస్తవులు ఆదివారమే
ప్రార్థన చేయమనిగానీ చెప్పలేదు. దేవుడు తన మూడు గ్రంథములయిన
ప్రథమ, మధ్య, అంతిమ దైవగ్రంథములలో చెప్పని విషయములను మత
నియమములలో ఏర్పరచుకొన్నారు. మనిషి సృష్టించిన మత నియమము
లను దేవుని మాటలుగా చెప్పి, దైవగ్రంథములలో చెప్పిన జ్ఞానముకంటే
మత నియమములే ముఖ్యమని మతపెద్దలు ప్రచారము చేయడము
జరిగినది.
ప్రపంచములో మొత్తము పన్నెండు మతములుండగా, అందులో
మూడు పూర్తి దైవసంబంధమైనవని చెప్పవచ్చును. ఈ మూడింటిలో
రెండు గ్రంథములను స్వయముగా భగవంతుడు చెప్పగా, అంతిమ దైవ
గ్రంథమును దైవజ్ఞాని చెప్పడము జరిగినది. మిగతా తొమ్మిది మతములను
మనుషులే సృష్ఠించుకొన్నారు. అందువలన ఆ తొమ్మిది మతముల ప్రసక్తిని
మనము తీసుకోవడములేదు. దేవుని జ్ఞానము ఇమిడి యున్న మూడు
మతములను గురించి మాత్రమే చెప్పుకొంటున్నాము. మూడు దైవ
గ్రంథములలోని దైవజ్ఞానము మూడు మతములుగా మార్పుచెంది, పూర్తి
మత పెద్దలచేత కబ్జా అయినది. ఒక మతము ఎక్కువ ఒక మతము
తక్కువ అనకుండా మూడూ దైవవాక్కులకు వ్యతిరేఖముగా వ్యవహరించు
చున్నవి. అంతేకాక దైవజ్ఞానము ప్రకారము నడుచుకొను వానిని మూడు
సమాజములు వెలివేయడమే కాకుండా, అటువంటి జ్ఞానిని చాలా
ఇబ్బందుల పాలు చేయుచున్నారు. పరమత జ్ఞానమును అనుసరిస్తున్నా
వను నెపముతో అనేక రూపములలో బాధించుచున్నారు. ఒక నిజమైన
జ్ఞాని భగవద్గీతలో ఉన్న జ్ఞానమును చెప్పితే, అట్లు చెప్పకూడదను
హిందువులు కలరు. ఇలానే చెప్పవలెననీ, వారి ఉద్దేశ్యము ప్రకారము
చెప్పవలెనని శాసించువారు గలరు. వారు చెప్పినట్లు వినకుండా దేవుడు
చెప్పిన జ్ఞానమును ఉన్నదున్నట్లు చెప్పుతానని అంటే, అటువంటి నిజమైన
జ్ఞానిని ఆ మతమువారే భౌతికముగా, మానసికముగా హింసించను మొదలు
పెట్టుదురు.
అసలయిన జ్ఞానికి మూడు మతములలోనూ పరాభవమే ఎదురవు
చుండును. భగవద్గీతలోని జ్ఞానమును ఉన్నది ఉన్నట్లు చెప్పితే, హిందూ
మతపెద్దలు ఒప్పుకోరు. అలాగే బైబిలులోని నాలుగు సువార్తలలోని
జ్ఞానమును ఉన్నది ఉన్నట్లు చెప్పితే, క్రైస్తవ మతపెద్దలు ఒప్పుకోరు. అదే
విధముగా అంతిమ దైవగ్రంథమయిన ఖుర్ఆన్ గ్రంథములోని జ్ఞానమును
ఉన్నది ఉన్నట్లు చెప్పితే, ముస్లీమ్ పెద్దలు ఒప్పుకోరు. ఇక్కడ కొందరికి
ఒక ప్రశ్న రావచ్చును. హిందువు అయినవాడు భగవద్గీతను చెప్పితే
స్వామీజీలు, గురువులు ఎందుకు ఒప్పుకోరు? వారు చెప్పునది కూడా
భగవద్గీతయే కదా! అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా
కలదు చూడండి. హిందువులలోని పెద్దలు భగవద్గీతను ఒప్పుకొనినా
గీతలోని అసలయిన భావములను ఒప్పుకోరు. భగవద్గీతలో ఒక
శ్లోకమునకు వారు చెప్పిన భావమునే ఇతరులు కూడా చెప్పవలెను, అలా
చెప్పకపోతే వానిని జ్ఞాని కాదంటారు. గీతలోని శ్లోకములో దేవుడు ఏమి
చెప్పాడననుది వారికి ముఖ్యము కాదు. వారు ఏమి నిర్ణయించారో అదే
చెప్పవలెను. అలా చెప్పకపోతే ఎంతటి జ్ఞానినయినా అజ్ఞాని క్రిందికే
జమకట్టుదురు. ఉదాహరణకు భగవద్గీతలో ఆరవ అధ్యాయమయిన ఆత్మ
సంయమ యోగమున మొదటి శ్లోకమును చూస్తే అందులో “ననిరగ్ని”
అను పదము కలదు. శ్లోకమును చూడండి.
అనాశ్రిత: కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |
ససన్న్యాసీ చ యోగీచ ననిరగ్ని ర్నచాక్రియ:
ఈ శ్లోకమునకు హిందూమతములోని ఎందరో పండితులు,
స్వామీజీలు, గురువులుగాయున్నవారు, పీఠాధిపతులుగాయున్నవారు
మరియు శంకరాచార్య, రామానుజాచార్య మొదలగు సిద్ధాంతకర్తలు వ్రాసిన
భావములో వారి ఉద్దేశ్యము ప్రకారము 'అగ్నిహోత్రము చేయనివాడు,
అగ్నితో యజ్ఞములు చేయనివాడు' అని వ్రాసుకొన్నారు. అయితే నిజమైన
జ్ఞాని అయినవాడు అందరికీ వ్యతిరేఖముగా "దేవుని జ్ఞానమునకు, అగ్ని
హోత్రమునకు, యజ్ఞములకు సంబంధములేదని చెప్పుచూ, దేవుడు చెప్పిన
భావము అది కాదనీ, జ్ఞానమను అగ్ని లేనివాడనుటయే నిజమైన భావమనీ”
చెప్పుచుండును. నేటి భగవద్గీతలన్నిటిలో “ననిరగ్ని” అను పదమునకు
యజ్ఞములు చేయనివాడనియే వ్రాశారు. అది అట్లున్నప్పుడు ఎవడయినా
ఒక్కడు జ్ఞానాగ్ని అని అర్థము చెప్పితే, వానిని ఎవరూ ఒప్పుకోక అందరూ
కలిసి అలా చెప్పినవానిని హిందూమతమునుండి గెంటివేయుదురు.
అంతేకాక వానిని పరమతమును బోధిస్తున్నాడను సాకుతో హింసించుదురు.
ఇక్కడ వాస్తవమును గ్రహించితే అందరూ వ్రాసినట్లు అగ్ని హోత్రము
చేయనివాడు అనుట తప్పు, జ్ఞానాగ్ని లేనివాడు అనుట సత్యము. అయినా
హిందూమతములోని పెద్దలందరూ ఈ సత్యమును ఒప్పుకొంటారా అంటే
ఒప్పుకోరు. వారు చెప్పినదే సత్యమనీ, వారు చెప్పినదే నిజభావమనీ
చెప్పుటకే ప్రయత్నిస్తారు. నిజము చెప్పిన వానిని నిందిస్తారు.
మిగతా రెండు గ్రంథములకు మాతృగ్రంథముగాయున్న
భగవద్గీతలోనే ఇంత గందరగోళము ఉంటే దానికి అనుబంధ జ్ఞానముగా
యున్న బైబిలు, ఖుర్ఆన్ గ్రంథములలో కూడా అలాగేయుండును. ఒక
విధముగా చెప్పితే మిగతా రెండు గ్రంథములలో లేని గందరగోళము,
మిగతా రెండు మతములలో లేని అనిశ్చితి హిందూమతములోని
భగవద్గీతలో కలదని చెప్పవచ్చును. మిగతా రెండు మతములవారు మేము
ఫలానా మతము వారమని స్పృహకల్గియుండి వారి మతమునూ, వారి
మతస్థులనూ వారు గౌరవించుచుండగా, హిందూమతములో 'మేము పెద్ద
మేము పెద్ద' అను పోటీ తత్త్వము కల్గినవారుండి, వారి మతస్థులనే వారు
కించపరచు కొంటున్నారు. తమకు వ్యతిరేఖముగా మాట్లాడినవానిని
హిందూ మతస్థుడే కాదంటున్నారు. హిందూమతము అన్నిటికంటే
ముందునుంచియున్నా, పూర్వము సంఖ్యలో ఎక్కువ పెద్దదయినా, నేడు
వెనుక పుట్టిన క్రైస్తవ మతముకంటే, ముస్లీమ్ మతముకంటే వెనుకబడి,
సంఖ్యలో మూడవ స్థానములోయున్నది. హిందూ మతములో ఒక వర్గము
వారే ఎక్కువ పెత్తనము కల్గి, అందరికంటే మేమే గొప్ప జ్ఞానులమని
చలామణి అగుటగలదు. అలా చలామణి అగు వర్గము తమకుగానీ,
తమ ఆచరణలకుగానీ, తాము చెప్పిన జ్ఞానమునకు గానీ వ్యతిరేఖముగా
మాట్లాడినవారిని తమ మతమునుండి వెలివేయుట వలన, ఆ వర్గమువారు
మిగతా ప్రజలమీద చూపు వివక్ష వలన, మిగతా వారందరినీ అంటరాని
వారిగా చూచుట వలన, హిందూ మతములోని సంఖ్య తగ్గిపోతూ వచ్చినదని
చెప్పవచ్చును.
ఉదాహరణకు గౌతమబుద్ధుడు భారతదేశములో హిందూ
మతములో పుట్టినవాడే అయినప్పటికీ, గౌతముడు తమకు వ్యతిరేఖమైన
జ్ఞానమును ప్రచారము చేశాడని హిందూమతములో పెద్దలుగా చలామణి
అగువారు గౌతమబుద్ధున్ని హిందూమతమునుండి వెలివేసి, అతను ఇతర
మతమును బోధిస్తున్నాడని ప్రచారము చేశారు. అప్పటినుండి గౌతమ
బుద్ధునిది బౌద్ధమతముగా చెప్పబడినది. నాడు హిందువులే బుద్దునిది
ప్రత్యేకమయిన మతమని హిందూమతము కాదని చెప్పడము వలన,
ఆనాడు ప్రత్యేకమయిన బౌద్ధమతము తయారయినది. తర్వాత కాలములో
హిందూ మతములోని అంటరానితనము, కొందరు మేమే మత పెద్దలమని
ప్రవర్తించు తీరు, ఇతరులెవరికీ జ్ఞానమును తెలియకుండా చేయడము
వలన, మేము తప్ప ఎవరూ జ్ఞానులుగా ఉండకూడదను అసూయ మొదలగు
కారణములు హిందూమతమును క్షీణింపజేసినవి. హిందూమతములో
ఒకే కులవర్గమునకు చెందినవారు తాము తప్ప ఇతరులు జ్ఞానులుగా,
గురువులుగా ఉండకూడదను వివక్షయే హిందూమతమునుండి బౌద్ధ
మతమును చీలునట్లు చేసినది. ఆనాడు గౌతమబుద్ధుడు క్షత్రియుడయిన
దానివలన కులవివక్షతో హిందూమతమునుండి వెలివేయడము జరిగినది.
నేటికీ అదే విధానముతో ఇతర కులస్థులు ఎవరయినా జ్ఞానులుగా మారితే
వానిని హిందువే కాదను పరిస్థితి హిందువులలో నెలకొనియున్నది. ఈ
మాట మా స్వయం అనుభవముతో చెప్పుచున్నాము. అద్వైతము, ద్వైతము
అను ఆధ్యాత్మిక సిద్ధాంతములు కొంతకాలమునుండి హిందూ మతములో
గలవు. అయితే నేడు త్రైత సిద్ధాంతమును అసలయిన ఆధ్యాత్మిక
సిద్ధాంతముగా నేడు మేము చెప్పుచున్నాము. అయితే హిందూమతములో
జ్ఞానమును కబ్జా చేసినవారు మమ్ములను హిందువే కాదనీ, త్రైతమంటే
క్రైస్తవమనీ, హిందూ ముసుగులో క్రైస్తవము ప్రచారము చేయుచున్నారనీ
హిందువుగాయున్న మమ్ములను కూడా క్రైస్తవమతములోనికి కలిపి మాట్లాడు
చున్నారు.
ఈ విధముగా హిందూమతములోని హిందువుల సంఖ్య క్షీణించి
పోవుచున్నది. నేడు హిందూ మతము క్షీణించిపోవుచున్నదని గ్రహించిన
కొందరు మతరక్షణ గుంపులుగా, సంఘములుగా తయారయినా వారికి
భగవద్గీతలోని జ్ఞానమేదో తెలియదు. జ్ఞానము తెలియని మతసంఘములు
జ్ఞానమును కబ్జాచేసిన వారి మాటలనే వినుట వలన, వారు కూడా కబ్జా
కాబడి కబ్జాదారుల చేతిలో ఉన్నామని తెలియక వారు ఎలా నడిపిస్తే
అలా నడుస్తున్నారు. మతరక్షణ అను పేరుతో ఎవరిని కొట్టమంటే వారిని
కొట్టుచున్నారు. ఏమి మాట్లాడమంటే అది మాట్లాడుచున్నారు. కబ్జాదారులు
ఆడించినట్లు ఆడుచున్న హిందూరక్షణ సంస్థలు హిందువులయినా, హిందూ
జ్ఞానము తెలియని స్థితిలోవుండి, తమ హిందువులనే గుర్తించక, హిందువుల
మీదనే హిందువులు దాడి చేయుచున్నారు.
హిందువులలో ఎంతో తెలివైనవారున్నారు. ఎంత తెలివైనవాడైనా
ఇతరులను నమ్ముట వలన వారిచేతిలో సులభముగా మోసపోవుచున్నాడు.
ఎంతో పెద్ద చదువులు చదివినవారు సహితము, ఎంతో విజ్ఞానమున్నవారు
సహితము జ్ఞాన కబ్జాదారుల చేతిలో సులభముగా మోసపోవుచున్నారు.
మిగతా ప్రపంచ విషయములలో ఎంతో తెలివిగా ప్రవర్తించువారు దేవుని
జ్ఞానవిషయములో ఏమాత్రము విచక్షణ లేకుండా ప్రవర్తించుచున్నారు.
ఈ పని ఇలానే చేయాలని కబ్జాదారులు చెప్పినట్లు వింటున్నారు. ఎక్కడ
వంగమంటే అక్కడ వంగుచున్నారు. ఎక్కడ లేవమంటే అక్కడ లేచుచున్నారు.
ఇది ఎందుకు చేయాలి? దీని అర్థమేమి? దీని వివరమేమి? అని ఏమాత్రము
ప్రశ్నించకుండా ఎలా చెప్పితే అలా చేయుచున్నారు. అలా చేయడానికి
ఒకేవొక కారణము కలదు. వారు తెలిసినవారని వీరు నమ్మడము వలన
వారు సులభముగా మోసము చేయుచున్నారు. ప్రజలు తెలివైనవారే అయినా
ప్రజలలోని నమ్మకమును ఆసరాగా చేసుకొని కబ్జాదారులు ప్రజలను
మోసము చేయుచున్నారు. మోసమును గురించి మనము ముందే
చెప్పుకొన్నాము. నమ్మకమున్నప్పుడు ఎంత తెలివైనవాడయినా మోసపోక
తప్పదు. మోసపోయిన తర్వాత వారిలోని తెలివినిబట్టి కొందరు తాము
మోసపోయామని గ్రహించవచ్చును. అయితే కొన్ని విషయములలో
మోసము తొందరగా బయటపడును. కొన్ని విషయములలో మోసము
తొందరగా బయటపడదు. దేవుని జ్ఞాన విషయములలో ప్రజలకు విచక్షణ
గానీ, వివరముగానీ తెలియకపోవడము వలన ఎంత తెలివైన వారయినా
దేవుని విషయములో తాము మోసపోయామని గుర్తించలేరు. మనిషికి
ప్రపంచ విషయములలో తెలిసినంత, జ్ఞాన విషయములలో తెలియక
పోవడమే ఇక్కడ ముఖ్య కారణమగుచున్నది. ఈ కారణము చేతనే ఎంత
తెలివైనవాడయినా జ్ఞానమును కబ్జాచేసిన వారి చేతిలో మోసపోయానని
తెలియలేక పోవుచున్నాడు.
దేవుడు భగవద్గీతలో చెప్పిన జ్ఞానము ప్రజలకు తెలియదు. అది
తెలియాలంటే ఇతర పండితులు చెప్పినదే వినాలి. వారు చెప్పిన దానినే
నమ్మాలి. ఇక్కడే మోసమునకు అవకాశము వస్తున్నది. భగవద్గీతలో
జ్ఞానమును చెప్పితే అక్కడ కూడా జ్ఞానములో అనుభవమున్నవారు తమ
మాటను వినకపోవచ్చని, తిరిగి ప్రశ్నించవచ్చునని, అప్పుడు ఇతరులు
మోసపోకుండుటకు అవకాశముండునని భగవద్గీతయే మనిషికి ముఖ్యము
కాదని, భగవద్గీతకంటే ముందు పుట్టిన వేదములే ముఖ్యమైనవని
కబ్జాదారులు అంతా జ్ఞానమే అయిన భగవద్గీతను ప్రక్కనపెట్టి, జ్ఞానము
అజ్ఞానము అన్నీ కలిసియున్న వేదములనే ముఖ్యముగా చెప్పుచుందురు.
భగవద్గీత అన్నిచోట్లా దొరుకును. అయితే వేదములు ఎక్కడుంటాయో
ఎవరూ చూడలేదు. అందరికీ వేద పరిచయములేని దానివలన వేదములు
కేవలము అందరికీ తెలియని సంస్కృత భాషలో ఉండుట వలన వాటి
వివరము అందరికీ తెలియకపోవుట వలన జ్ఞాన కబ్జాదారులు
హిందువులకు వేదములే ముఖ్యమైన ప్రమాణ గ్రంథములని చెప్పుచున్నారు.
అందువలన హిందువులలో చాలామంది హిందువుల గ్రంథములు
వేదములనియే చెప్పుచుందురు.
వేదములు భగవద్గీతకంటే ముందు వ్యాసుని చేత వ్రాయబడి
యున్నాయి. ద్వాపరయుగములో తయారయిన నాలుగు వేదములను
ప్రచారము చేయుటకు పదునెనిమిది పురాణములను వ్యాసుడే వ్రాశాడు.
అప్పటికే దైవజ్ఞానము క్షీణించియుండగా వేదముల, పురాణముల రాకతో
జ్ఞానము పూర్తి కనుమరుగైపోయి ధర్మములన్నీ అధర్మములుగా మారి
పోయాయి. అప్పుడు ధర్మములను తిరిగి ప్రతిష్ఠించుటకు దేవుడు
భగవంతునిగా రావలసి వచ్చినది. దేవుడు ధర్మసంస్థాపన చేయుటకు
బోధించినదే భగవద్గీత. భగవద్గీతలో సాంఖ్యయోగము అను అధ్యాయమున
45వ శ్లోకమున “త్రైగుణ్య విషయా వేదా” అని మూడు గుణముల
విషయములే వేదములు అని భగవంతుడు చెప్పడము జరిగినది. అంతేకాక
భగవద్గీతలోనే విజ్ఞానయోగమను అధ్యాయమున 14వ శ్లోకమందు
“దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా” అని కూడా చెప్పాడు.
దీని భావము ప్రకారము “దైవనిర్మితమైన గుణములతో కూడుకొన్న
మాయను జయించుట దుస్సాధ్యము” అని చెప్పబడినది. అయితే నేడు
వేదములు ముఖ్యమని, వేదములు సనాతనమైనవని, వేదములను అందరూ
పఠించవలెనని దేవుని మాటకు వ్యతిరేఖముగా జ్ఞాన కబ్జాదారులు చెప్పడము
జరుగుచున్నది. సాధారణ ప్రజలు వారిమాటనే నమ్మి మోసపోవుచున్నారనీ,
వేదముల వలననే దేవుడు తెలియబడుతాడని చెప్పి మోసము చేయుచున్నా
రనీ, దేవుడు ప్రజల కనువిప్పుకొరకు జ్ఞాన విషయములో మోస
పోకుండుటకు విశ్వరూప సందర్శన యోగము అను అధ్యాయములో 48వ
శ్లోకమున మరియు 53వ శ్లోకమున వేదపఠనము వలన, యజ్ఞములు
చేయుట వలన, దానముల వలన, తపస్సుల వలన దేవుడు తెలియబడడని
చెప్పడము జరిగినది. ఐదువేల సంవత్సరముల క్రితమే ఈ మాట చెప్పినా
నేటివరకూ మనిషి మోసపోతూనే ఉన్నాడు. యజ్ఞ యాగాదులు చేస్తూ,
వేదములను పఠించుచునే ఉన్నాడు. ప్రజలందరూ అదే గొప్ప కార్యమని
అనుకొంటున్నారు. దేవుడు భగవద్గీతలో వేదములను గురించి అవి దేవున్ని
తెలుసుకొనుటకుగానీ, దైవారాధనలోగానీ పనికిరావు అని చెప్పినా, కబ్జా
దారులు వేదములే ముఖ్యమని చెప్పుచున్నారు. దీనినిబట్టి చూస్తే జ్ఞాన
విషయములో మోసము ఏ స్థాయిలో ఉన్నదో, ప్రజలు ఎంతగా
మోసపోవుచున్నారో అర్థమయినది.
ప్రపంచ విషయములలో ఎంతో తెలివైన మనిషి, ప్రపంచ
విషయములలో మోసపోయినా, తాను మోసపోయానని తొందరగా
గ్రహించ గలుగుచున్నాడు. అయితే జ్ఞానవిషయములో మోసపోయిన
మనిషి తాను మోసపోయానని, మోసపోతున్నానని ఏమాత్రము
గ్రహించకున్నాడు. సృష్ట్యాదిలోనే ఇందూ ధర్మములను దేవుడు చెప్పాడు.
ఏ మతములేని కాలమునుండి ఇందూ ధర్మములు ఉన్నాయి. మనిషి
కాలక్రమేపీ ఆధ్యాత్మిక విద్యలో మోసపోతూ రావడము వలన ఇందూ
ధర్మము కాస్త హిందూ మతమయిపోయినది. అట్లు ఇందూ ధర్మములు
క్షీణించకూడదను, ఉద్దేశ్యముతో దేవుడు భగవంతునిగా వచ్చి, ద్వాపర
యుగము చివరిలో మరియు కలియుగము మొదటిలో భగవద్గీతను
చెప్పిపోయాడు. అలా చెప్పిన భగవద్గీత జ్ఞాన కబ్జాదారులకు పెద్ద
ఆటంకముగా నిలిచింది. అయితే కబ్జాదారులు భగవద్గీతను కాదని
వేదములను ముందు తెచ్చారు. అయినా భగవద్గీతను చూచువారు
కొందరుండుట వలన అది కూడా వారికి మ్రింగుడుపడలేదు. అందువలన
సంస్కృతములోని భగవద్గీతకు వివరము మేము తప్ప ఇతరులు చెప్పలేరని
ప్రకటించుకొని, గీతలోని శ్లోకములకు తప్పు భావమును అందించి,
భగవద్గీత యొక్క జ్ఞానమును కూడా ఆక్రమించుకొన్నారు. ప్రజలను
భగవద్గీతపట్ల తప్పుదారి పట్టించి ఇది ఇట్లే ఉండవలెనని చెప్పారు.
విగ్రహారాధన వలన ప్రపంచ కోర్కెలు తప్ప జ్ఞానము తెలియబడదని దేవుడు
భగవద్గీత విజ్ఞానయోగమందు 20, 21, 22, 23 శ్లోకములలో చెప్పితే,
విగ్రహారాధన చేయనివాడు హిందువేకాదనీ, దేవతలను పూజించడము
హిందువుల సనాతన ధర్మమనీ బోధించారు. ఈ విధముగా ప్రత్యక్షముగా
భగవద్గీతకు వ్యతిరేఖముగా జ్ఞానమును కబ్జా చేసినవారు బోధించినా అదే
సత్యమని ప్రజలు నమ్ముచున్నారు. భగవద్గీతలో విజ్ఞానయోగమున దేవుడు
చెప్పిన మాటను గాలికి వదిలివేశారు.
అంతిమ దైవగ్రంథము అయిన ఖుర్ఆన్ గ్రంథములో 15వ సూరా
29,30 ఆయత్లలో దేవుని ప్రతినిధిగా వచ్చిన వానికి సాష్ఠాంగ
నమస్కారము చేయమని చెప్పియున్నా, ఆ మతములోని జ్ఞాన కబ్జాదారులు
ఖుర్ఆన్లోని దేవుని మాటకు వ్యతిరేఖముగా ఎవరికీ మ్రొక్కకూడదనీ,
అలా మ్రొక్కితే అజ్ఞానమవుతుందనీ, దేవుడు ఒప్పుకోడని చెప్పి వ్రాశారు.
దేవుడు చెప్పిన మాటను దేవుడే ఒప్పుకోడని చెప్పినట్లు, హిందూమతములో
కూడా భగవద్గీతయందు చెప్పిన దేవునిమాటకు వ్యతిరేఖముగా విగ్రహారాధన
ప్రతి హిందువు చేయవలెననీ, విగ్రహారాధన చేయనివాడు హిందువేకాదని
హిందువులలో పెద్దలనువారు బోధించుచున్నారు. దేవుని జ్ఞానము దేవునికి
తప్ప మనుషులకు తెలియదని దేవుడు తన గ్రంథములలో చెప్పినా,
మనుషులు దేవుడు చెప్పిన గ్రంథములలోని విషయములను కూడా ఖాతరు
చేయకుండా, దేవుని మాటలకు వ్యతిరేఖముగా బోధించుచూ, దేవుని
జ్ఞానమును కబ్జా చేసి, తాను చెప్పినట్లే దేవుని జ్ఞానముండవలెనని చెప్పు
చున్నారు. హిందూ సమాజమునకు భగవద్గీత గ్రంథమునిచ్చి దీని ప్రకారము
నడుచుకొమ్మంటే, పండితులని పిలువబడువారు దానికి వ్యతిరేఖముగా
ప్రజలకు బోధించుచున్నారు.
భగవద్గీతలో తాను పురుషుడననీ, తనకు సతిగా ప్రకృతియున్నదనీ
గుణత్రయ విభాగయోగమున మొదటనే దేవుడు చెప్పాడు. తర్వాత వచ్చిన
పురుషోత్తమ ప్రాప్తి యోగమున పురుషుడయిన తాను ముగ్గురుగా విభజింప
బడియున్నానని తనకంటే వేరుగాయున్న ఇద్దరు పురుషులు ఒకరు క్షరుడు
మరొకడు అక్షరుడని కూడా చెప్పాడు. అయితే ఆ విషయమును ఏమాత్రము
బయటికి తెలియకుండా పండితులమని పిలువబడు జ్ఞాన కబ్జాదారులు
చేశారు. ఒకటి ప్రకృతియని ప్రకృతియే క్షరుడనీ, స్త్రీతత్త్వము కల్గియున్న
ప్రకృతిని పురుషునిగా చెప్పడము జరిగినది. దేవుడు క్షరుడు, అక్షరుడు,
పురుషోత్తముడు అని తనను ముగ్గురు పురుషులుగా చెప్పితే అందులో
అక్షరున్ని ప్రకృతియని చెప్పి, ప్రజలను మోసము చేసి దైవత్వము ప్రజలకు
అర్థము కాకుండా చేశారు. ఒకవైపు ప్రజలకు మంచి చెప్పినట్లే నటిస్తూ,
తమ పెత్తనము కొరకు దైవజ్ఞానము ఎవరికీ అర్థము కానట్లు చేసి, ప్రజలను
మోసము చేశారు. ప్రపంచములోని ఆధ్యాత్మిక జ్ఞానములో ముఖ్యమైన
విషయము ముగ్గురు పురుషుల జ్ఞానము. అయితే దానిని ఏ భగవద్గీతలోనూ
తెలియకుండా చేశారు. మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత”లో
పురుషోత్తమప్రాప్తి యోగమున 16,17 శ్లోకములలో చెప్పిన ముగ్గురు
పురుషులను వివరించి చెప్పితే, మమ్ములను క్రైస్తవ మత ప్రచారకుడని
అనడము జరిగినది. త్రైత సిద్ధాంతమును ఉపయోగించి అద్వైత, ద్వైత
సిద్ధాంతములను అతిక్రమించి మేము భగవద్గీతను వ్రాస్తే, జ్ఞానములో
అందరినీ మోసము చేసినవారు మమ్ములను భగవద్గీత ముసుగులో
బైబిలును ప్రచారము చేయుచున్నారని పూర్తి అన్యాయముగా మాట్లాడి,
తమ గొప్పతనమును కాపాడుకోవాలని చూచారు. అయినా వారి
ప్రయత్నము నెరవేరలేదు. త్రైత సిద్ధాంత భగవద్గీతకంటే మించిన జ్ఞానము
లేదనీ, ఆ భగవద్గీతకంటే మించిన భగవద్గీత లేదనీ ప్రజలకు తెలిసి
పోయినది.
మేము ఎంతో కష్టపడి భగవద్గీతా జ్ఞానమును కబ్జాదారులనుండి
విడిపించాలని ప్రయత్నము చేయుచున్నాము. ఇక్కడ ఒక హిందూ
మతమునందేకాక మిగతా రెండు మతములుగా పిలువబడుచున్న క్రైస్తవ
మునందు మరియు ముస్లీమ్ మతమునందు ఆయా మతగ్రంథములలోని
వాస్తవ జ్ఞానమును మూసిపెట్టి చెప్పడము జరుగుచున్నది. దీనినిబట్టి
దైవ గ్రంథములయిన మూడు గ్రంథములలోని జ్ఞానము కబ్జా చేయబడిన
దని అర్థమగుచున్నది. ఇక్కడ నన్ను కొందరు కొన్ని ప్రశ్నలను
అడుగవచ్చును. నీవు ఇందు (హిందు)వు కదా! అటువంటప్పుడు
భగవద్గీతను గురించి మాట్లాడవచ్చునుగానీ, మిగతా రెండు గ్రంథముల
విషయమును గురించి మీరెందుకు మాట్లాడుచున్నారని ప్రశ్నించవచ్చును.
వారి గ్రంథములలోని జ్ఞానము కబ్జా అయినా మీకు ఏమీ సంబంధము
లేదు కదా! అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఈ విధముగా
కలదు. సృష్టికంతటికీ దేవుడు ఒక్కడే కలడు. ఇద్దరు లేక ముగ్గురు
దేవుళ్ళున్నారని ఏ దైవ గ్రంథములోనూ చెప్పలేదు. దైవ గ్రంథములు
మూడు భాగములుగాయున్నా, మిగతా రెండు గ్రంథములు మొదటి దానిలో
భాగములే తప్ప ఇతరము కావని ఆ మిగతా రెండు గ్రంథములలోనే
వ్రాయబడియున్నది. అంతిమ దైవగ్రంథములో 5వ సూరాలోని 46,48,68
ఆయతులను (వాక్యములను), 62వ సూరాలోని 5వ ఆయన్ను
చూచినవారు రెండు గ్రంథములు భగవద్గీతలోని భాగములే అని చెప్పక
తప్పదు. సర్వ సాధారణముగా ముందు ఒక పేరుండి తర్వాత భాగములుగా
చెప్పబడినది ఏదయినా మొదటి దాని భాగములే అని చెప్పక తప్పదు
కదా! ఉదాహరణకు భారతము అను గ్రంథము ముగ్గురు కవులచేత మూడు
భాగములుగా తెలుగులో వ్రాయబడినది. అప్పుడు ముగ్గురు కవులు
వ్రాసినా, మూడు కాలములలో వ్రాసినా, మూడు వేరువేరు భాగములుగా
వ్రాసినా, వాటినినన్నిటినీ కలిపి భారతము అనియే అంటున్నాము.
నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ అను ముగ్గురు కవులు వేరువేరు కాలములలో
ఒకరు చనిపోయిన తర్వాత మరొకరు వ్రాయడము జరిగినది. అ
వ్రాసిన భారతమును నన్నయ కవి వ్రాసిన దానిని మొదటి భారతమనీ,
తిక్కన వ్రాసిన దానిని రెండవ భారతమని లేక మధ్య భారతమనీ, ఎర్రాప్రగడ
వ్రాసిన దానిని మూడవ భారతమనీ లేక అంతిమ భారతమనీ పేరు పెట్టినా
అవి మూడూ ఒకే భారతమగును కదా! అంతిమ భారతము ఉన్నప్పుడు
తప్పక ప్రథమ భారతముండును కదా! అంతిమ భారతము ప్రథమ
భారతమునకు చెందినదే కదా! అలాగే అంతిమ దైవగ్రంథము అని పేరు
పెట్టబడినప్పుడు దానికి ముందు ప్రథమ దైవగ్రంథము తప్పక ఉండును.
దైవగ్రంథము ఎన్ని భాగములుగాయున్నా ఆ భాగములన్నీ ఒకే
దైవగ్రంథములోనివని చెప్పవచ్చును.
భారతమును వ్రాసినవారు ముగ్గురు కవులయినా వ్రాయబడినది
ఒకే భారతమేననీ, భారతము మూడు భాగములుగా, మూడు కాలములలో,
ముగ్గురు వేరువేరు కవులు వ్రాసినా అది అంతయూ ఒకే భారతమని
చెప్పబడినట్లు, దైవ గ్రంథమును ముగ్గురు వేరువేరు ప్రవక్తలు చెప్పినా,
ప్రథమ, మధ్య, అంతిమ అని మూడు వేరువేరు భాగములుగాయుండినా,
మూడు వేరువేరు కాలములలో వ్రాయబడినా, చివరికి దానిని ఒకే దైవ
గ్రంథముగా చెప్పవచ్చును. ఎలాగయితే మూడు భాగములుగాయున్న
భారతమును ఒకే భారతముగా చెప్పుచున్నామో, అలాగే మూడు
భాగములుగాయున్న దైవ గ్రంథమును ఒకే దైవ గ్రంథముగా చెప్పవచ్చును.
వాస్తవముగా ఉన్న సత్యము కూడా అంతే. ఒకే పాండవుల సమాచారము
భారతము యొక్క మూడు రచనలలోయున్నట్లు, ఒకే దేవుని సమాచారము
దైవ గ్రంథము యొక్క మూడు రచనలలోయున్నది. అటువంటప్పుడు
ప్రథమ దైవ గ్రంథమయిన భగవద్గీత హిందువులదనీ, అంతిమ దైవ
గ్రంథమయిన ఖుర్ఆన్ ముస్లీమ్లదనీ అనుకోవడము అజ్ఞానమగును.
భగవద్గీత, బైబిలు, ఖుర్ఆన్ అను మూడు పేర్లతోగల దైవగ్రంథము
ఒక్కటేయగుట వలన, మూడు గ్రంథములలో ఒకే దేవుని జ్ఞానముండుట
వలన, మూడు గ్రంథములు సర్వమానవులకూ సంబంధించినవే
అయినందున భగవద్గీత వేరు, ఖుర్ఆన్ వేరని మేము అనుకోవడము
లేదు. దైవగ్రంథములోని జ్ఞానము మూడు మతములలోని మతపెద్దలను
వారిచేత, మతరక్షకులను వారిచేత కబ్జా చేయబడినది. మతమునకు
దైవజ్ఞానమునకు ఏమాత్రము సంబంధముండదు. జ్ఞానమంతా
మతమునకు వ్యతిరేఖముగా ఉండును. అందువలన మతమును అభివృద్ధి
చేయాలనుకొను మత ఛాందసులు మతముకొరకు జ్ఞానమును కబ్జాచేసి,
ఉన్న జ్ఞానమును మూసివేసి, తాము చెప్పినదే జ్ఞానమని అంటున్నారు.
దైవ గ్రంథములోని జ్ఞానమును శాసించి, ఈ జ్ఞానము ఇట్లే ఉండవలెనని
చెప్పి, అదే నిజమైన జ్ఞానమని చెప్పి ప్రజలను తమ మాటను వినునట్లు
చేసుకొంటున్నారు. దేవుడను పేరుతో మతజ్ఞానమును బోధించుచున్నారు.
నేడు ప్రపంచములోని మొత్తము జనాభా జ్ఞానవిషయములో వారివారి
మతపెద్దల చేత ఘోరంగా మోసపోయారని చెప్పవచ్చును.
దైవజ్ఞాన విషయములో మోసపోయినా తాము మోసపోయామను
జ్ఞాపకము ఎవరికీ రాలేదు. ప్రపంచములో ఎంతో పెద్ద మేథావులున్నా
ఎవరికి తగినట్లు వారు మోసపోయారు. క్రైస్తవులకు మీరు మోసపోయారని
దేవుడే దిగివచ్చి చెప్పినా వారు వినేటట్లు లేరు. ఎవరిమాటా వినకూడదు,
ఎవరి గ్రంథములూ చదువకూడదు, ఎవరు ఏమి చెప్పినా అవి సాతాను
మాటలేయగునని వారి పెద్దలు చెప్పుట వలన, ఏసు తిరిగి వచ్చి నేను
చెప్పినది ఈ జ్ఞానము కాదు అని చెప్పినా, ఆయన మాటలను కూడా
సాతాను మాటలనువారున్నారు. హిందూమతములోనికి వచ్చి చూస్తే
ధర్మములు అధర్మములుగా మారినప్పుడు వచ్చి ధర్మములు తెలియజేస్తానని
చెప్పి భగవద్గీతను కృష్ణుడు బోధిస్తే, ఆయనను భగవంతుడుగా వచ్చిన
వాడని తలువక సాధారణ మనిషికంటే హీనముగా లెక్కించి జారుడు,
చోరుడు అని అన్నారు. అంతటితో ఆగక భగవద్గీతలో విశ్వరూప సందర్శన
యోగమను అధ్యాయములో 48, 53 శ్లోకములలో ఏ పనులు అధర్మమని
చెప్పాడో, ఏ పనుల వలన దేవుడు తెలియబడడని చెప్పాడో అవే పనులనే
దేవుని ఆరాధన కార్యములుగా ప్రజలను నమ్మించి చేయించుచున్నారు.
ఇటువంటి పెద్ద మోసములు ఒక్క హిందూమతమునకే పరిమితము
కాకుండా మొత్తము మూడు మతములలోనూ వ్యాపించి పోయినవి.
అటువంటి సందర్భములో కళ్ళ ఎదుట జరుగు మోసమును చూడలేక
దైవగ్రంథములోని నిజమును బయటపెట్టాలను ఉద్దేశ్యముతో మేము మూడు
గ్రంథములలోని విషయములను ప్రస్తావించవలసి వచ్చినది. మూడు
గ్రంథములు ఒక్క దైవ గ్రంథమునకే సంబంధమయిన దానివలన, దైవ
విషయములను దృష్ఠితో చెప్పాముగానీ, మత విషయములను ఉద్దేశ్యముతో
చెప్పలేదు. దైవ గ్రంథము మూడు భాగములుగాయున్నా, ముగ్గురు
ప్రవక్తలచే వ్రాయబడినా, అది మానవులందరి సమస్యల జ్ఞానముతో
సంబంధపడియుండుట వలన, ప్రతి మనిషికీ మూడు గ్రంథముల మీద
సమానమైన హక్కుగలదు. అందువలన ఇది మీది, అది మాది అనుటకు
అవకాశమే లేదు. ఈ కారణముల చేతనే సాటి మనిషిగా జ్ఞాన
విషయములలో ఎవరూ మోసపోకూడదను ఉద్దేశ్యముతో నేను హిందువుగా
పుట్టినా, మత కట్టుబాట్లు లేకుండా మిగతా మత గ్రంథములని అందరూ
అంటున్నా నేను అలా అనకుండా అన్నీ నా గ్రంథములనే, అందరూ
నాలాంటి మనుషులనే ఉద్దేశ్యముతో మూడు గ్రంథముల వివరమును
వ్రాయడము జరిగినది.
ఒకప్పుడు కొన్ని లక్షల సంవత్సరముల పూర్వము భారతదేశము
ప్రపంచములోకెల్లా ఆధ్యాత్మిక కేంద్రముగా ఉండేది. భారతదేశములో
ఆధ్యాత్మిక విద్యయే కాకుండా ఆధ్యాత్మిక విద్యకున్న దైవశక్తి కూడా ఎక్కువగా
ఉండేది. దేవుడు కనిపించకున్నా దైవశక్తి ప్రత్యక్ష అనుభవమునకు వచ్చేది.
కాబట్టి అందరూ దైవమును విశ్వసించెడి జ్ఞానులుగా ఉండేవారు. అయితే
నేడు ఆనాటి ఆధ్యాత్మిక విద్య ఏమాత్రము లేకుండా, అంతా కలుషితమై
పోయి జ్ఞానము కబ్జా చేయబడి, ఇలాగే ఉండాలి అని కొందరి చేత జ్ఞానము
శాసించబడుట చేత దైవశక్తి ఎక్కడా కనిపించకుండా పోయినది.
అటువంటి పరిస్థితిలో క్రొత్తగా పుట్టుకొచ్చినవారికి దేవుడంటే ఎవరు?
అను విషయము ఏమాత్రము తెలియకుండా పోయినది. పుట్టిన ప్రతివానికీ
మతము అంటే ఏమిటి? తన మతము ఎంత గొప్పదని చూచుకొంటున్నాడు
తప్ప మనిషికి కావలసినది మతముకాదు దేవుడు అని తెలియలేక
పోవుచున్నాడు. చిన్నతనమునుండి మతధ్యాసలోయున్నవాడు మతము
వలననే దేవున్ని తెలియవచ్చునని, తమ మతపెద్దలు చెప్పగా విని అదే
నిజమని తలచుచున్నాడు. మతము వలన దేవుడు తెలియబడడను
విషయము పూర్తి తెలియకుండా పోయినది. ఒక మనిషి ఏ మతములో
పుట్టియుంటే ఆ మతమే గొప్పదనీ, ఆ మతములోని దేవునికంటే మిగతా
ఏ దేవుడూ గొప్పకాదనీ తమ మతస్థుల చేత విని, అదే నిజమైన విధానమనీ
పూర్తిగా నమ్మియున్నాడు. తమ మతము వేరనీ, తమ దేవుడు వేరనీ ప్రతి
మతస్థుడు తమ మత పెద్దలచే తెలుపబడిన మాట పూర్తి సత్యమని నమ్మి
అదే ఉద్దేశ్యమును కల్గియున్నాడు. ఇదే ఉద్దేశ్యమే ప్రతి మతములో పుట్టిన
వారియందు ఉండుట వలన మత భావములు ప్రతి మనిషిలోనూ
చిన్నప్పటినుండి నాటుకొనిపోయాయి అని చెప్పవచ్చును.
సమాజములోని మనుషులందరూ ఒకే అవయవములు కల్గి
పుట్టియున్నా, ఆహారము ద్వారానే బ్రతుకుచున్నా, ఆలోచనలతోనే ప్రతి
విషయమును ఆలోచించుచున్నా, ఒక్క మత విషయము వద్ద మాత్రము
ఎంత మేధావులైనా ఏమాత్రము తమ బుద్ధితో ఆలోచించకుండా, తమ
బుద్ధిని ఇతరులు కబ్జా చేసినట్లు తమ మత పెద్దలు చెప్పిన మాటలనే
మాట్లాడుచున్నారు తప్ప, తమ స్వంత బుద్ధి ప్రకారము ఏమాత్రము
యోచించడములేదు. అటువంటప్పుడు వశీకరణ చేయబడినవాడు వశము
చేసుకొన్నవాని బుద్ధి ప్రకారమే మాట్లాడినట్లు, తన బుద్ధి ప్రకారము
మాట్లాడనట్లు మాట్లాడడము జరుగుచున్నది. కొన్ని విషయముల గురించి
టీ.వీ ఛానళ్ళలో చర్చా వేదికలు జరుగుచుండుట అప్పుడప్పుడు చూచాము.
మిగతా ప్రపంచ విషయములలో తమ తెలివినంతటినీ ఉపయోగించి
మాట్లాడువారు ఒక్క దేవుని జ్ఞాన విషయములలో తమ తెలివి ప్రకారము
మాట్లాడక ముందే నిర్ణయము చేయబడిన తమ పెద్దల భావముల ప్రకారము
మాట్లాడుచున్నారు. అటువంటప్పుడు వారి మేధస్సు అనునది ముందే
వారి మత పెద్దల చేత కబ్జా చేయబడినదని అర్ధమ పోవుచున్నది.
ఒక చర్చా వేదికలో ముగ్గురు మతస్థులుగానీ, ఇద్దరు మతస్థులుగానీ కలిసి
మాట్లాడినప్పుడు వారి మత భావముల ప్రకారమే వారు మాట్లాడుచున్నారు
గానీ, వారి దైవ గ్రంథముల ప్రకారము వారు మాట్లాడడము లేదు.
ముందే నేర్పింపబడిన తమ మత విధానము ప్రకారము మాట్లాడుచున్నారు
గానీ, దేవుడు స్వయముగా గ్రంథరూపములో ఇచ్చిన జ్ఞానము ప్రకారము
మాట్లాడడము లేదు.
మనిషిలో మత విధానము ఎప్పుడు చొప్పించబడినదో అప్పుడే
మనిషి దానికి వశమైపోయి, తన బుద్ధి స్వతంత్ర్యమును కోల్పోయి విచక్షణ
లేకుండా మాట్లాడుచున్నాడు. బుద్ధియొక్క విచక్షణ లేనప్పుడు తమ
పెద్దలు ఎవర్ని దేవునిగా చెప్పియుంటే వానినే దేవుడందురు. ఎవర్ని
దుర్మార్గునిగా చెప్పియుందురో వానినే దుర్మార్గుడు అని చెప్పుదురు. హిందూ
మతమునందుగల రావణ బ్రహ్మ విషయములో అదే జరిగినది. ప్రపంచ
జ్ఞానములో త్రికాల జ్ఞాని, దైవవిషయములో అపరబ్రహ్మ అయిన రావణ
బ్రహ్మ చివరికి ఒక దుర్మార్గునిగా పోల్చబడి ప్రచారము చేయబడితే,
అందరూ అదే అన్నారు తప్ప తమ బుద్ధితో ఏమాత్రము ఇది నిజమా,
అబద్దమా అని యోచించలేదు. పండితులు, పామరులు, బుద్ధియున్నవారు,
బుద్ధి లేనివారు రావణ బ్రహ్మను సాధారణ మనిషికంటే హీనముగా మాట్లాడు
చున్నారు. ఈ విషయమును ఉదాహరణగా చెప్పుకొన్నట్లు మిగతా జ్ఞాన
విషయములలో అదే విధముగా మాట్లాడుచున్నారు. మత భావములు
తలకెక్కినవాడు జ్ఞానమును అజ్ఞానముగా, అజ్ఞానమును జ్ఞానముగా పోల్చు
కొంటున్నాడు. అటువంటప్పుడు తాను తెలియవలసిన జ్ఞాన విషయము
లను వదలివేసి, తనకు అవసరములేని అజ్ఞాన విషయములను తెలుసు
కొంటున్నాడు. ఈ విధముగా పుట్టిన ప్రతి మనిషి అతను పుట్టిన మతములో
చిక్కుకొని అజ్ఞాన భావములలోనికి వెళ్ళిపోవుచున్నాడు. తనకున్న
భావముల ప్రకారమే మాట్లాడుచున్నాడు. అలా మాట్లాడువాడు నేను
ఎంతో తెలివిగా మాట్లాడుచున్నానని అనుకొనుచున్నా, మతాతీతులయిన
వారికి వారి మాటలలోని అజ్ఞానము ప్రత్యక్షముగా కనిపించుచున్నది.
నా మతములో నేను గొప్పవాడినని అనుకొను మనిషి తాను
గొప్పగా మాట్లాడుచున్నానని అనుకొని , అతని బుద్ధిహీనత బయటికి
ఎలా కనిపించుచున్నదో ఉదాహరణకు ఒక ప్రత్యక్ష సంఘటనను తీసుకొని
చూస్తాము. ఒక టీ.వీ ఛానల్లో ముగ్గురు మూడు మతముల ప్రతినిధులు,
ఒక హేతువాది మరియు ఒక సమన్వయకర్త మొత్తము ఐదుగురు
పాల్గొన్నారు. సమన్వయకర్త టీ.వీ న్యూస్ అనౌన్సర్ కాగా హిందూమతము
వైపునుండి హిందూ పరిషత్ కార్యకర్త ఒకరు రాగా, క్రైస్తవుల తరపునుండి
ఒక పాస్టర్ రాగా, ముస్లీమ్ల తరపునుండి ముస్లిము మతపెద్ద రావడము
జరిగినది. వారి సంభాషణ క్రింది విధముగా కొనసాగింది.
సమన్వయ కర్త :– ప్రస్తుతము ప్రదర్శింపబడుచున్న “పి.కె.” చలన చిత్రము
మీద కొంత వివాదము ఏర్పడినది. ఆ సినిమాలో హిందువుల మనో
భావములను కించపరిచే విధముగా దృశ్యములున్నాయని, అలాగే కొన్ని
మాటలు కూడా హిందువులకు వ్యతిరేఖముగా ఉన్నాయని హిందువులు
ఒకవైపు చెప్పుచుండగా, మరోవైపు ముస్లీమ్లు కూడా కొంత
అభ్యంతరమును తెలిపారు. ఏది ఏమయినా హిందూసంస్థలు సినిమాను
నిషేధించాలని అంటున్నాయి. ముస్లీమ్లు మసీద్ సీన్ ను మొత్తము తీసి
వేయాలంటున్నారు. క్రైస్తవులు ఏమీ మాట్లాడక తటస్థముగాయున్నారు.
ఇప్పుడు “పి.కె” సినిమాను గురించి చర్చకొనసాగుతుంది. ప్రస్తుతము
క్రైస్తవులు ఈ సినిమా విషయములో ఎందుకు నోరు మెదపలేదు? సినిమాలో
వారికి నచ్చని విషయములు ఉన్నాయా లేక లేవా? అని మొదట క్రైస్తవుల
తరపున మాట్లాడవలసిందిగా పాస్టర్గారిని కోరుచున్నాము.
పాస్టర్ :- మా మతము శాంతితో కూడుకొన్న మతము. మా ప్రవక్త
కరుణామయుడు, మేము ఎవరినీ తిరస్కారముగా, దూషణగా మాట్లాడము.
ఎవడయినా ఎడమ చెంపమీద కొట్టితే కుడి చెంప చూపమని మా ఏసు
చెప్పాడు. అందువలన మమ్ములను ఎవరు ఏమనినా మౌనముగానే
ఉంటాము.
సమన్వయకర్త :- మీరు మౌనముగా ఉండడము మంచిదేగానీ, “పి.కె.”
సినిమాలో మీకు ఇబ్బందికరమైనదేదయినా ఉన్నదా లేదా? అని అడుగు
చున్నాము. దానికి మాత్రము సమాధానము చెప్పండి.
పాస్టర్ :- మా చర్చికి పూలు, కొబ్బరి కాయ మొదలగు పూజాద్రవ్యములను
తీసుకురావడమే తప్పు. చర్చిలో కొబ్బరికాయ కొట్టడము మాకు
వ్యతిరేఖముగా, మా ఆరాధనకు వ్యతిరేఖముగా చేయడమే కదా! ఆ
సినిమాలో గమనిస్తే చర్చిలోనికి పోయి కొబ్బరికాయను కొట్టువరకు మా
క్రైస్తవులు ఏమీ అనలేదు. కొబ్బరికాయను కొట్టిన తర్వాత కూడా అతనిని
చర్చి బయటకు తీసుకవచ్చి వదిలివేశాము తప్ప అతనిని ఏమీ అనలేదు.
చర్చిలోనికి పోవడము తప్పే అయినా మేము ఓర్పుతో ఆ సినిమాను గురించి
ఏమీ మాట్లాడలేదు. అదే సినిమాలో మసీద్ దగ్గరికి పోయినవానిని
ముస్లీములు మసీద్ లోపలికి పోకముందే కోపముతో తరిమివేసినది మీరు
చూచారు కదా! మా చర్చిలోనికి వచ్చి కొబ్బరికాయ కొట్టినా మేము
సర్దిచెప్పి చర్చి బయటికి పంపాము. అంతతప్ప సినిమాలో కూడా
కోపగించుకోలేదు, అతన్ని తరమలేదు.
సమన్వయ :- ఇప్పుడు ఈ విషయములో ముస్లీమ్లు కూడా ఈ సినిమా
మీద కొంత వ్యతిరేఖతను చూపడము జరిగినది. అందులో మీకు ఇబ్బంది
కరమైన దృశ్యములు ఏమి ఉన్నాయి? దీనికి ముస్లీమ్ తరపున వారి
మత పెద్ద సమాధానము చెప్పుతారు.
ముస్లీమ్ :- అది సినిమా కాబట్టి మేము అందులోని విషయములను
పెద్దగా పట్టించుకోలేదు. అందులో హీరోగాయున్న వ్యక్తి బ్రాందీ బాటిల్
తీసుకొని మసీదుకు రావడము ముస్లీములకు ఎవరికీ మ్రింగుడుపడని
విషయము. సినిమాలో ముస్లీమ్లు ఎలా స్పందించాలో అలాగే స్పందించి
నట్లు చూపారు. మసీద్ దగ్గరనుండి తరిమివేయడము మా కర్తవ్యము.
అంతతప్ప అతనిని కొట్టినట్లుగానీ, గాయపరచినట్లుగానీ లేదు కదా!
మొదట మేము ఈ సినిమాను గురించి కొంత ఆందోళన చేసినా తర్వాత
అది సినిమా కాబట్టి అందులో ఏమీ తెలియని ఒక అమాయకుడు చేసేపని
కాబట్టి తర్వాత మేము దానిని గురించి ఏమీ మాట్లాడలేదు, ఆందోళన
చేయలేదు.
సమన్వయ :- సినిమాలో హీరోగా ఉన్న వ్యక్తి ముస్లీమ్ మతస్థుడయిన
దానివలన ప్రత్యేకించి హిందువులకు వ్యతిరేఖముగా ఈ సినిమా
ఉన్నదని కొందరంటున్నారు. ముస్లీమ్లుగా మీరేమంటారు?
ముస్లీమ్ :- సినిమాలో హీరో పాత్ర పోషించినది ముస్లీమ్ అను మాట
వాస్తవమే. అయితే సినిమా తయారు కావడము డైరెక్టర్నుబట్టి, కథను
వ్రాసిన వానినిబట్టి యుండును. హీరోగాయున్నవాడు డైరెక్టర్ చెప్పినట్లు
చేయును తప్ప తన స్వంతముగా ఇష్టము వచ్చినట్లు చేయడు కదా!
సినిమా నిర్మాత, డైరెక్టర్ (దర్శకుడు), స్టోరీ వ్రాసినవాడు ముగ్గురూ
హిందువులే. ఆ ముగ్గురినిబట్టి "పి.కె.” సినిమా తయారయినదిగానీ
హీరోనుబట్టి తయారు కాలేదు. అటువంటప్పుడు సినిమాలోవున్న హిందూ
వ్యతిరేఖతను హీరో మీదికి నెట్టడము మంచిదికాదు. హీరోకు ఏమాత్రము
సంబంధములేని విషయము అయినందున సినిమాను తయారు చేసిన
నిర్మాతకు, దర్శకునికే సంబంధమయిన దానివలన ఎవరూ హీరోను
నిందించేదానికి అవకాశము లేదు.
సమన్వయకర్త :- “పి.కే” సినిమాలో హిందూ వ్యతిరేఖ వాక్యములు,
దృశ్యములు ఉన్నాయని హిందువులు గత రెండు మూడు రోజులుగా
ఆందోళన చేయడము సినిమాను కొన్ని థియేటర్లలో నిలిపివేయడము
జరుగుతాయున్నది. అలావున్నా కొందరు ఆ సినిమాను ఆసక్తిగానే
చూస్తున్నారు. అందరికీ నచ్చిన సినిమా కొందరు హిందువులకు మాత్రము
ఎందుకు నచ్చలేదు? అందులోని లోపము ఏమున్నదో తెలుపమని
హిందువుగాయున్న మిమ్ములను అడుగుచున్నాము.
హిందువు :- ఈ సినిమా మొత్తము హిందూ సాంప్రదాయములకు
వ్యతిరేఖముగాయున్నది. హిందూదేవుళ్ళను కించపరచడము జరిగినది.
త్రిమూర్తులలో ఒకడైన శివున్ని బజారులో పరుగెత్తించి కించపరచడము
జరిగినది. శివున్ని బాత్రూమ్లో బంధించి ఇంకెక్కడికి పోతావని
అడగడము వలన హిందువుల మనోభావములు దెబ్బతిన్నాయి. అందువలన
హిందువులమయిన మేము ఆందోళన చేయవలసి వచ్చినది.
హేతువాది :- మనోభావములు అంటే ఏవి? ఎవరికిష్టమొచ్చిన భావములు
వాని మనోభావములు అయితే, దొంగలకు, వ్యభిచారులకు కూడా వారి
మనోభావములుండును కదా! దొంగతనము చేయవద్దు అంటే మా మనో
భావములు దెబ్బతింటాయని దొంగలంటారు. అలాగే వ్యభిచారము
చేయవద్దు అంటే మా మనోభావములకు వ్యతిరేఖము అని వారంటారు.
అందువలన మనకున్న మనోభావములు మంచివో చెడ్డవో ముందు
నిర్ణయించుకొంటే బాగుంటుంది. ఏ దానికయినా ఒక శాస్త్రబద్ధత
యుండడము బాగుంటుంది.
హిందువు :- హిందువులు దేవతలను ఆరాధించడము సనాతన ధర్మము.
హిందువులు తమ దేవుళ్ళ మీద భక్తి కల్గియుండడము వలన దేవతలను
అవమానపరిస్తే హిందువుల మనోభావములు దెబ్బతిన్నట్లు కాదా!
హిందువుల భక్తిని విశ్వాసమును మంచి భావములు కాదంటారా? ఒక
హిందువుగా సినిమాలో శివున్ని అవమానించినందుకు నా మనస్సు
బాధపడింది. కావున హిందువుల మనోభావములు దెబ్బతిన్నాయని
చెప్పాను. దీనిని శాస్త్రము కాదంటారా?
హేతువాది :- ఇందూ శాస్త్రము ప్రకారము అలాంటి మనోభావములు
తప్పని మా హేతువాదులకే తెలిసినప్పుడు మీకెందుకు తెలియదు?
హిందువులకు ఐదువేల సంవత్సరముల పూర్వమే ధర్మసంస్థాపన కొరకు
భగవద్గీత చెప్పబడినది. భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమను
అధ్యాయములో పదకొండవ శ్లోకమందు “మయి చానన్య యోగేన భక్తి
రవ్యభిచారిణీ" అని కలదు. తెలుగులో దాని అర్థము ప్రకారము “నన్ను
కాదని, నా యోగమును కాదని అన్యమైన దేవతల మీద ధ్యాస
పెట్టుకోవడము భక్తి భావములో వ్యభిచరించినట్లేయగును” అని దేవుడే
చెప్పియున్నాడు. అంతేకాకుండా విజ్ఞాన యోగము అను అధ్యాయములో
23వ శ్లోకమున...
అన్తవత్తు ఫలం తేషాం తద్భవ త్యల్ప మేధసామ్ ।
దేవాందేవ యజోయాన్తి మద్భక్తా యాన్తి మామపి
భావము :- "తక్కువ మేధస్సుగలవారు తక్కువ ఫలితములనే పొందు
చుందురు. అటువంటి తెలివితక్కువ వారు ఇతర దేవతలను ఆరాధించగా,
నా భక్తులు మాత్రము నన్ను ఆరాధించుదురని” చెప్పియున్నాడు. అంతేకాక
రాజవిద్యా రాజగుహ్య యోగమను అధ్యాయమందు 23వ శ్లోకమున ఈ
విధముగా గలదు చూడండి.
యేప్యన్య దేవతాభక్తా యజస్తే శ్రద్ధయాన్వితాః ।
తేపి మామేవ కౌంతేయ! యజ్యన్త్య విధి పూర్వకమ్ |
భావము :- “ఎవడు అన్యదేవతలను శ్రద్ధతో పూజించుచున్నాడో వాడు
కూడా నన్నే పూజించినట్లగుచున్నది. అయినా వాడు మార్గము విడచి
నడచినవాడగుచున్నాడు.” ఇక్కడ దేవుడు చెప్పిన మాటలో ఎవరు ఇతర
దేవుని లేక దేవతలను పూజించినా ఆ దేవతలలో కూడా వ్యాపించియున్న
వాడు అసలయిన దేవుడే అయినందున పూజించువాని పూజ అసలయిన
దేవునికే చెందుచున్నది. అయినప్పటికీ వాని ఉద్దేశ్యములో భక్తి భావము
వేరే దేవతల మీద ఉండుట వలన, అసలయిన దేవునిమీద లేనిదానివలన,
వాడు దారితప్పినవాడై దేవున్ని చేరలేడు. భగవద్గీతలో ధర్మములను కాపాడు
నిమిత్తము చెప్పిన మాటలలో ఇతర దేవతలను ఆరాధించిన వాడు దారితప్పి
నడచినవాడనీ, తెలివితక్కువవాడనీ, దేవున్ని వదలి అన్య దేవతలను
ఆరాధించడము భక్తిలో వ్యభిచారమనీ చెప్పినప్పుడు మీ మనో భావములు
తప్పు అని తెలియలేదా! దేవుడు భగవద్గీతలో దేవతలను వేరు చేసి, తనను
మాత్రము వేరుగా ప్రకటించుకొని రాజవిద్యా రాజగుహ్య యోగమను
అధ్యాయమున 25వ శ్లోకములో ఇట్లన్నాడు.
యాన్తి దేవవ్రతాన్ దేవాన్, పిత్యస్యాన్తి పితృవుతా: |
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజి నోపి మామ్॥
భావము :- “దేవతలను పూజించువారు దేవతలనే పొందుదురు. పితృ
దేవతలయిన పెద్దలను, తల్లితండ్రులను, తాతముత్తాతలను పూజించువారు
వారిలోనికే చేరిపోవుదురు. జీవరాసులయిన జంతువులను, పాములను,
చెట్లను పూజించువారు వాటియందే కలిసిపోవుదురు. నన్ను పూజించు
వాడు మాత్రము నాలోనికి ఐక్యమగును" అని దేవుడే చెప్పియున్నాడు
కదా! అప్పుడు ఆ విధముగా చెప్పిన దేవుడు మనిషి మంచి మార్గములో
నడువ వలెననీ, దేవున్ని తప్ప ఇతరులను పూజించుట వలన వాడు దేవున్ని
చేరలేడనీ చెప్పాడు కదా! అటువంటప్పుడు దేవుడయిన తనను తప్ప ఇతర
దేవతలను పూజించవద్దనేగా చెప్పినది. అప్పుడు కృష్ణుడు మీ
మనోభావములను దెబ్బతీసినట్లేనా! చెడుమార్గమున పోవద్దు మంచి
మార్గమున పొమ్మని చెప్పిన వారి మాటలు మంచివి కావా?
సమన్వయకర్త :- హేతువాదన ప్రకారము ఆయన అడిగిన దానికి మీరు
సమాధానము చెప్పండి.
హిందువు :- మాకు భగవద్గీత ముఖ్యము కాదు. మాకు అది ప్రమాణ
గ్రంథమే కాదు. హిందువులకు నాలుగు వేదములు ప్రమాణ గ్రంథములు
ముందు పుట్టిన వేదములుండగా వెనుక పుట్టిన భగవద్గీతను చెప్పుకోవడము
పొరపాటగును. వేదములలో సనాతన ధర్మమున్నది. హిందువులకు
ముఖ్యమైన వేదములలో సర్వ దేవతలను పూజించవచ్చును అని ఉన్నది.
దానిప్రకారము నేను ఒక మూర్తిని దేవుడని ఆరాధించితే మీకేమయినా
ఇబ్బందా?
హేతువాది :- నీవు అలా చేస్తానంటే నాకు ఏమి ఇబ్బంది? దొడ్డికి
కూర్చొని మలవిసర్జన చేస్తూ రొట్టెను తినడము మంచిదికాదు అని చెప్పితే
నీ మాట మాకు ముఖ్యముకాదు నేను అద్దుకొని తింటాను నీకేమయినా
ఇబ్బందా అంటే మాకేమి ఇబ్బందగును? అలా చేయడము వలన నీకే
రోగాలొస్తాయి, నీకే ఇబ్బంది అవుతుంది. ఎవరి ఇష్టము వారిది.
సమన్వయకర్త :- “పి.కె” సినిమాలో హిందువుల మనోభావములు దెబ్బతిను
లాగ శివుని వేషమును చూపించారని హిందువులు వాదించుచున్నారు.
ఒక ముస్లీమ్ ఈ విషయములో మీరేమంటారు?
ముస్లీమ్ :- దేవున్ని కించపరచడము ఎవరిదయినా తప్పే అగును. అయితే
ఇక్కడ శివుడు దేవుడా? అన్నదే ప్రశ్నగాయున్నది. శివుడు దేవుడయితే
సినిమా తీసిన వారిది తప్పేయని చెప్పవచ్చును. దేవుని ధర్మము ప్రకారము
మా ఖుర్ఆన్ గ్రంథములో దేవుడు ప్రత్యక్షముగా ఎవరితోనూ మాట్లాడడు.
అలాగే ఎవరికీ కనిపించడు అనియున్నది. హిందువుల భగవద్గీతలో
కూడా “రూప, నామ, క్రియలులేనివాడు దేవుడు" అని ఉన్నది.
అటువంటప్పుడు కనిపించు శివుడు దేవుడేనా? అని ప్రశ్న రాగలదు.
కనిపించని వాడు దేవుడు అయినప్పుడు ఆయనను ఎవరూ అవమానించ
లేరుకదా!
హిందువు :- వేదములలో చెప్పినట్లు దేవుడు సర్వధారి, సర్వవ్యాపి
అయినందున ఏ రూపములో ఎక్కడయినా కనిపించవచ్చునని వేదములు
ఘోషిస్తున్నవి. అందువలన శివున్ని కొందరు దేవుడని నమ్ముచున్నారు.
కొందరు విష్ణువును దేవుడని నమ్ముచున్నారు. మా భావముల ప్రకారము
శివున్ని దేవుడేయని నమ్ముచున్నాము. అటువంటప్పుడు మేము దేవుడని
నమ్మిన శివున్ని సినిమాలో చూపించి ఆయనను ప్రశ్నించడము, ఆయన
జవాబు చెప్పలేక పారిపోయినట్లు చూపించడము హిందువులను అవమాన
పరచినట్లు కాదా! ఒక్క హిందూ దేవుళ్ళు తప్ప ఇతర మతముల దేవుళ్ళ
జోలికి ఎందుకు పోలేదు? హిందువుల దేవుళ్ళను చూపినట్లే ఇతర మతముల
దేవుళ్ళను కూడా చూపవచ్చును కదా!
ముస్లీమ్ :- మా మతములో దేవుళ్ళు లేరు ఉన్నది ఒక్క దేవుడే. ఆయన
కనిపించువాడు కాడు. అందువలన మా దేవున్ని సినిమాలో చూపలేరు.
నాకు తెలియక ఒక ప్రశ్న అడుగుతాను. మా దేవున్ని చూపించి అవమాన
పరచారు అంటున్నావు కదా! మీ దేవున్ని చూపించి సినిమా తీసినది మీ
హిందువే కదా! ఇతర మతస్థులు ఎవరూ మిమ్ములను అవమానపరచలేదు
కదా!
హేతువాది :- నేను హేతువాదిని, అన్ని మతములు నాకు సమానమే.
సినిమాలో హీరో ప్రశ్నకు జవాబు దొరకనప్పుడు, దేవుడే జవాబు చెప్పాలి
అను నిర్ణయముతో ఉన్నప్పుడు, శివుని వేషములో యున్న వ్యక్తి కనిపిస్తే
అతను వేషధారి అని తెలియక, అతనే నిజమైన దేవుడని నమ్మి శివున్ని
ప్రశ్నిస్తే అతను జవాబు చెప్పలేక పారిపోయాడు. హీరో గ్రహాంతరవాసి
అయినందున ఎవరు మనిషి? ఎవరు దేవుడు? అని తెలియక మనిషిని
దేవుడని నమ్మి ప్రశ్నించడము తప్పుకాదు గానీ నిజమైన తప్పు అన్నీ
తెలిసిన హిందువులే చేయుచున్నారు. నిలదీసి ప్రశ్నించినదే తప్పయితే
అంతకంటే పెద్దతప్పు హిందువులే చేయుచున్నారు. అంతేకాక హిందువులే
వారి దేవతలను వారు తమకు తెలియకుండానే అవమానించుచున్నారు.
చేయరాని తప్పు మొదట హిందువులే చేయుచూ ఇతరులను సాకుగా
చూపడము మంచిదికాదు. గొప్పగా తమ దేవుళ్ళని చెప్పుకొను దేవతలను
పోలిన వేషములు ధరించడమే హిందువులు చేయుచున్న మొదటి తప్పు.
దేవతల వేషము ధరించడమే తప్పయితే, వారి వేషములో బజారునందు
మనుషుల ముందర డబ్బులు అడుక్కోవడము మరీ పెద్ద తప్పగును. నేను
చూచిన దృశ్యములో సీత, రాముడు, ఆంజనేయుడు మరియు అర్థ
నారీశ్వరుడు వేషములను ధరించి, నిజముగా వారే వచ్చారన్నట్లు మేకప్
చేసుకొని, పగటి వేషగాళ్ళమని చెప్పుకొనుచు బజారులో అంగడి అంగడి
తిరుగుచూ డబ్బులు అడుక్కోవడమును ప్రత్యక్షముగా చూచాను. ఒక్కొక్క
రోజు ఒక్కొక్క దేవతా వేషములో మూడు లేక నాలుగు రోజులు వరుసగా
అడుక్కోవడము చూచిన తర్వాత హిందువుల లెక్కలో దేవతలు పవిత్రులా
అపవిత్రులా? అని అనుమానము వచ్చినది. నేనూ హిందువునే
అయినందున హేతువాదినయినా నాకే ఆ దృశ్యము నచ్చలేదు.
ఈ దినము ఎంతో బాధపడి మా మనోభావములు దెబ్బతిన్నాయి
అనువారు, దేవతలను బజారులో తిప్పి అడుక్కునేటట్లు చేస్తే అప్పుడు
మనోభావములు దెబ్బతినలేదా? ఈ రోజు సినిమాలో కనిపిస్తే
హిందువులను కించపరిచారు అను వారు, ఆ రోజు బజారులో అడుక్కొన్నట్లు
చూసినప్పుడు అప్పుడు వారినెందుకు అడుగలేదు? హిందూ దేవుళ్ళ
వేషములు వేసినది హిందువులే కదా! అప్పుడు లేని అవమానము సినిమాలో
కనిపించినప్పుడే వచ్చిందా! హిందువులు శివుని వేషధారణలో బజారునందు
అంగళ్ళ ముందు నాట్యము చేసి డబ్బులు అడుక్కొన్న రోజు దానిని
ఖండించియుంటే, ఇప్పుడు మీరు మాట్లాడే మాటకు విలువయుండేది.
బజారులో శివుని, రాముని, ఆంజనేయుని వేషమును చూచినరోజు ఏమీ
మాట్లాడక ఈ రోజు మాట్లాడడము తగునంటారా?
సమన్వయకర్త :- హిందువులు చేయుచున్న తప్పును గురించి చర్చించడము
లేదు. ఒక సినిమాలో వచ్చిన అభ్యంతరములను గూర్చి మీరేమంటారు?
దానికి జవాబు చెప్పమంటున్నాను.
హేతువాది :- మనము చిన్నప్పటినుండి ప్రతి విషయమును ప్రశ్నించి
అడిగి తెలుసుకొంటూ నేటికి కొంత పరిజ్ఞానము కల్గినవారమయినాము.
ప్రశ్నలేనిది ఏ మనిషికీ మనుగడేలేదు. ప్రశ్నించినప్పుడే దేనికయినా
జవాబు దొరుకును. సినిమాలోయున్నది ప్రశ్నే కాబట్టి అందులో ఏమీ
తప్పులేదు. గాంధీ బొమ్మయున్న కాగితమును చూచి డబ్బుగా భావించుకొన్న
వ్యక్తి శివుని వేషమును చూచి శివునిగా భావించుకొని దేవుడే జవాబు
చెప్పగలడను ఉద్దేశ్యముతో ఎక్కడ దొరికితే అక్కడే అడిగాడు. వాస్తవానికి
అందులో ఏమీ తప్పులేదుగానీ, తమ ఉనికిని చాటుకొనే దానికే ఏ గుర్తింపు
లేనివారు తాము గుర్తింపుకు రావాలని చేయుచున్న తతంగము తప్ప
వేరుగా ఈ అందోళనను చూడకూడదు. మీరు బాగా గుర్తించుకోండి
హిందువులలో ముఖ్యమైనవారు ఎవరూ ఈ సినిమాను గురించి తప్పుగా
మాట్లాడలేదు. బి.జె.పి నాయకులలో అగ్రనాయకుడయిన లాల్కిషన్
అద్వానీగారు ఈ సినిమాను గురించి గొప్పగా చెప్పారు. ఆధ్యాత్మిక
స్వామీజీలలో పెద్దవాడయిన అగ్నివేష్ స్వామీజీ ఈ సినిమాకు ప్రభుత్వము
ట్యాక్సు రద్దు చేసి తక్కువ రేటు టికెట్టుతో అందరూ చూచేటట్లు చేయాలని
కోరాడు. అంతేకాక పదిరోజులలో హిందువులుగాయున్నవారు ఎక్కువగా
చూడడము వలన ఏ సినిమా వసూలు చేయనంత డబ్బు వసూలయినది.
కేవలము పదిరోజులలో 100 కోట్లు డబ్బును వసూలు చేసిన మొదటి
సినిమాగా నిలిచినది. దీనినంతటినీ గమనిస్తే అందరికీ కనిపించని
తప్పు కొందరికే కనిపించినదనీ, ఈ ఆందోళన ఒక కుట్రయని నేను
అంటున్నాను.
ఈ విధముగా ఒక చర్చా వేదిక ముగిసింది. తర్వాత పదిలేక
పదిహేను రోజులకే అన్ని టీ.వీ ఛానళ్ళలో షిరిడీసాయిబాబా హిందువే
కాదు అను చర్చ మొదలయింది. ఉత్తర దేశములో ఒక పెద్ద స్వామీజీ
షిరిడీ సాయిబాబా ఒక ముస్లీమ్ వ్యక్తి అయినందున అతనిని హిందూ
దేవాలయములలో పెట్టుకోకూడదనీ, అతను హిందూ దేవుడే కాదనీ షిరిడీ
సాయి ప్రతిమను దేవాలయములలో నుండి బయట పెట్టవలెనని చెప్పడము
పెద్ద సంచలనమయినది. ఈ విషయము మీద అనేకమంది అనేక
రకములుగా చర్చించారు, అనేక విధములుగా వారి అభిప్రాయములను
తెలిపారు. మేము చూచిన చర్చావేదికలో సాయిభక్తులు ఒకరు ఉండగా,
సాయిబాబాకు వ్యతిరేఖముగా మాట్లాడిన స్వామివారి శిష్యులు మరొక
రున్నారు. హేతవాద సంఘమునకు సంబంధించిన వ్యక్తి ఒకరున్నారు.
టీ.వీ ఛానల్వారు ఒకరున్నారు.
ఛానల్వారు :- నేడు దేశములో ఎందరో భక్తుల విశ్వాసమునకు
వ్యతిరేఖముగా ఒక స్వామీజీ షిరిడీసాయి దేవుడు కాడు. అతను ఒక
ముస్లీమ్ వ్యక్తి. అతనిని హిందువుల గుళ్ళలో ఉంచకూడదు. హిందువులు
పూజించకూడదు అని చేసిన వాక్యాలకు చాలామంది షిరిడీసాయి భక్తుల
నుండి నిరసన వచ్చినది. ఈ విషయమై ఇక్కడ చర్చలో పాల్గొన్నవారు
తమ అభిప్రాయములను తెలుపవలసినదిగా కోరుచున్నాము. ముందుగా
ఈ విషయమై సాయి భక్తులను అడుగుచున్నాము. దీనిని గురించి మీరు
ఏమంటున్నారు?
సాయిభక్తులు :- సాయిబాబా దేవుడని నమ్మినవారు ఎందరో కుల
మతరహితముగా దేశ వ్యాప్తముగా భక్తులున్నారు. ఎన్నోచోట్ల గుడికట్టి
పూజించుచున్నారు. ఇటువంటి సందర్భములో సాయి దేవుడు కాదు అని
ఒక స్వామీజీ అనడము వలన దేశవ్యాప్తముగాయున్న సాయి భక్తులందరూ
బాధపడవలసి వచ్చినది. సాయికి జరుగు వైభవమును చూచి ఓర్వలేక
ఈ విధముగా కొందరంటున్నారని మేము అనుకొంటున్నాము.
సాయిబాబాకున్న గౌరవము తమకు లేదను అసూయ తప్ప ఇందులో
ఏమీ లేదని తెలియుచున్నది.
స్వామి భక్తులు :- ప్రజలు సాయిబాబా మహత్యములను చూచి ఆయనవైపు
పోయి ఆయనకు కొందరు భక్తులయిన మాట వాస్తవమే అయినా ఆయనలో
దైవత్వము లేదని ప్రజలకు తెలియదు. ఆయన చేసే మహత్యములు
మాత్రమే వారికి కనిపించాయిగానీ, ఆయన సాధారణ మనిషేగానీ దేవుడు
కాదను విషయమును మరచిపోయారు.
సాయిభక్తులు :- సాయి సాధారణ మనిషి అయినప్పుడు, సాధారణ మనిషి
దేవుడు కాడు అన్నప్పుడు, రాముడు కూడా దశరథునికి పుట్టిన ఒక మనిషే
కదా! అందరి దృష్ఠిలో మనిషి అయిన రాముడు ఎలా దేవుడు అయ్యాడని
మేము అడుగుచున్నాము. ఒకరికి వర్తించు సూత్రము మరొకరికి కూడా
వర్తించును కదా! మా సాయిబాబా ఎన్నో మహత్యములు చేశాడు. రాముడు
ఒక్క మహత్యమును కూడా చేయలేదు కదా! రాముడు హిందువులకు
మాత్రమే దేవుడయితే, మా సాయిబాబా హిందువులకే కాక అన్ని మతముల
వారికి దేవుడుగాయున్నాడు. అది చూచి ఓర్వలేకనే కొందరు సాయిని
దేవుడు కాదు అంటున్నారు తప్ప అందరూ అనడము లేదు. ఇంతకాలము
లేనిది ఇప్పుడే ఈ విధముగా మాట్లాడుచున్నారంటే ఇది అసూయ అని
తెలిసిపోవుచున్నది.
ఛానల్వారు :- ఇటు సాయి భక్తులు, అటు స్వామి భక్తుల వాదనలను
విన్న తర్వాత హేతువాదిగా మీరేమంటారు?
హేతువాది :- వాస్తవానికి మనిషి దేవుడుకాడు అను సూత్రము ప్రకారము
మనిషి అయిన ఎవరూ దేవుడు కాలేడు. అయితే దేవుడు మనిషిగా
రావచ్చును అను సూత్రము ప్రకారము, దేవుడు మనిషిగా వచ్చి దేవుని
జ్ఞానము తెలియజేయును. దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునకూ
తెలియదను వాక్యముండుట వలన, దేవుని జ్ఞానమును దేవుడే మనిషిగా
వచ్చి చెప్పవలసియున్నది. అందువలన దేవుడు మనిషిగా రావచ్చునుగానీ,
మనిషి ఎప్పటికీ దేవుడు కాడని చెప్పవచ్చును. దేవుడు మనిషిగా వస్తే
దైవజ్ఞానమునే చెప్పును. కావున ఎవనినయినా దేవుడు అని అన్నప్పుడు
అతడు దైవజ్ఞానమును చెప్పువాడుగా మరియు అణగారిపోయిన ధర్మము
లను తెలియజేయువాడుగా ఉండాలి. సాయిబాబాగానీ, రాముడుగానీ
దైవజ్ఞానమును చెప్పలేదు, కావున వారు సాధారణ మనుషులుగానే
లెక్కించాలి. అయితే వారిలో యున్న ప్రత్యేకతల వలన వారు పూజ్యులుగా
యుండవచ్చునుగానీ దేవుళ్ళు అని చెప్పుటకు వీలులేదు.
స్వామీజీ భక్తులు :- దేవుడే లేడని చెప్పు హేతువాదులు, దేవున్నే నమ్మని
హేతువాదులు ఎవరినీ దేవుడని ఒప్పుకోరు. అసలుకు దేవుడే లేడని
చెప్పుచుందురు. అంతేకదా మీ వాదన?
హేతువాది :- మేము సూత్రబద్ధముగా, హేతుబద్ధముగా, శాస్త్రబద్ధముగా
మాట్లాడుతాము తప్ప అన్నిటినీ మూర్ఖముగా ఖండించుతూ పోము. అలాగే
అన్నిటినీ మూర్ఖముగా నమ్ముతూ పోము. మనిషి దేవుడు కాడుగానీ,
దేవుడు మనిషిగా రాగలడు అని చెప్పాము. ఆ సూత్రము ప్రకారము
మనిషిగా వచ్చిన దేవుడు తన జ్ఞానమును చెప్పును తప్ప తన జీవితములో
దేనికీ ప్రాధాన్యత ఇవ్వడు. ఆ సూత్రము ప్రకారము మేము అందరినీ
దేవుడు కాదని చెప్పలేదు. మనిషిగా వచ్చిన దేవుడు కృష్ణుడని మేము
సహితము చెప్పుచున్నాము. శాస్త్రము కూడా శ్రీకృష్ణున్ని దేవునిగా
నిరూపించుచున్నది.
ఛానల్వారు :- ప్రస్తుతము మన చర్చ సాయి హిందూ దేవుడు కాదు
అంటున్నారు. ఆ విషయమై సాయి భక్తులు తమ అభిప్రాయమును తెలియ
జేయవలసిందిగా కోరుచున్నాము.
సాయి భక్తులు :- సాయి దేవుడు కానిది గొప్ప మహత్యములను ఎలా
చూపగలడు? ఆయన జీవితములో చూపిన మహత్యములనుబట్టి షిరిడీ
సాయి దేవుడేయని మేము చెప్పుచున్నాము.
స్వామీజీ భక్తులు :- షిరిడీ సాయి నేను దేవుడు కాదు అని ఆయనే
చెప్పినట్లు, ఆయన నోటితో చాలామార్లు "అల్లామాలిక్” అనేవారు.
ప్రపంచానికంతటికీ దేవుడే యజమాని అని దాని అర్ధము. తాను
దేవుడయితే అల్లాను గురించి అల్లానే యజమాని అని ఎందుకంటాడు?
అంతేకాక అతను ఒక ముస్లీమ్ పుట్టి ముస్లీమ్ ఆచరణలు
ఆచరించుచుండెడివాడు, ఆయన చనిపోయేవరకు ముస్లీమ్లు పెట్టుకొను
గడ్డమునే పెట్టుకొన్నాడు. అల్లానే దేవుడని అల్లామాలిక్ అని అన్నాడు.
అల్లా అంటే ముస్లీమ్ దేవుడు. మా దేవుడు అల్లా అనీ చెప్పుచున్నాడు
గానీ, తాను దేవుడని చెప్పలేదు కదా! అటువంటప్పుడు సాయిబాబాను
దేవుడు అనడము పొరపాటగును.
హేతువాది :– మీరు ఎవరు మాట్లాడినా శాస్త్రమును అనుసరించి మాట్లాడితే
బాగుంటుంది. దేవుని విషయములకు ప్రత్యేకించి ఒక శాస్త్రము కలదు
కదా! శాస్త్రబద్ధత లేని మాటలను మేధావులు ఎవరూ ఒప్పుకోరు. అల్లా
అంటే ముస్లీమ్ల దేవుడు అనడము పూర్తి అశాస్త్రీయమైన మాటయగును.
ఒక వస్తువుకు తెలుగు భాషలో ఒక పేరుంటే, మరొక భాషలో మరొక
పేరుండును. భాషనుబట్టి పేరు మారినా వస్తువేమో ఒక్కటే కదా! అలాగే
నీరును తెలుగుభాషలో నీళ్ళు అంటున్నాము. అదే నీరునే హిందీలో పానీ
అంటున్నాము. ఇంగ్లీషు భాషలోనికి పోయి చూస్తే నీరునే వాటర్
అంటున్నాము. భాషలో పేరు మారినంతమాత్రమున నీరు మారలేదు
కదా! ఒకే నీరునే వేరు వేరు భాషలలో వేరువేరు పేర్లతో పిలుస్తున్నాము.
అదే విధముగా ఒకే దేవున్ని ఇంగ్లీషులో గాడ్ అని అంటున్నాము. ఉర్దూ,
అరబ్బీ భాషలో అల్లా అంటున్నాము. తెలుగులో దేవుడు అని అంటున్నాము.
నీళ్ళను వేరువేరు భాషలలో, వేరువేరు పేర్లతో పిలిచినా నీళ్ళే అయినట్లు
దేవున్ని కూడా వేరువేరు భాషలలో, వేరువేరు పేర్లతో పిలిచినా దేవుడు
ఒక్కడేయగును. అల్లా అంటే ముస్లీమ్ దేవుడు అని అనుకొంటే, పానీ
అంటే ముస్లీమ్ల నీళ్ళు అనుకోవలసియుంటుంది. నీళ్ళలో హిందువుల
నీళ్ళు ముస్లీమ్ల నీళ్ళు వేరువేరుగా ఉండనట్లు, దేవుడు కూడా హిందువుల
దేవుడు, ముస్లీమ్ల దేవుడు ప్రత్యేకముగా లేడు. ప్రపంచమునకంతా
నీరు ఒక్కటే అయినట్లు మొత్తము విశ్వమునకంతా దేవుడు ఒక్కడే ఉ
న్నాడు. ఎవరయినా ఈ విషయమును ఒప్పుకొని తీరవలసిందే.
అట్లుకాకుండా అల్లా అంటే ముస్లీమ్ దేవుడు అనడము పూర్తి
అనాగరికమగును మరియు పూర్తి అజ్ఞానమగును.
ఈ విధముగా రెండు చర్చావేదికలు దేవుని విషయమై చూచిన
తర్వాత మతములవారు చెప్పినదంతా పూర్తి తప్పని హేతువాది చెప్పినది
మాత్రము సత్యమని అర్థమయినది. మొత్తము మీద ప్రజలను తప్పుదారి
పట్టించి తమ మోసమును గుర్తించకుండా చేయుటకు మతము అను
దానిని బాగా అడ్డము పెట్టుకొన్నారని తెలియుచున్నది. దేశములో పెద్ద
ఎత్తున కుంభకోణము జరిగినప్పుడు దానిమీద ఎవరూ దృష్టి పెట్టకుండుటకు
దేశ సరిహద్దులో యుద్ధసన్నాహాలు చేసి కొంత కాల్పులు జరిపితే యుద్ధము
జరుగుచున్నదని ప్రజల దృష్టియంతా యుద్ధము మీదికి పోవును. దేశములో
కొన్ని సమస్యలను కప్పిపుచ్చుకొనుటకు ప్రభుత్వమును నడుపుచున్న
రాజకీయనాయకులు మరొక పెద్ద సమస్యను సృష్టించి అందరి దృష్టినీ
ప్రక్కకు మరల్చుచుందురు. అదే విధముగా కొందరు మతపెద్దలు దైవ
జ్ఞానమును కబ్జా చేసి ఆ విషయమును ఎవరూ పసిగట్టనట్లు దేశ
సరిహద్దులో యుద్ధవాతావరణమును సృష్టించినట్లు, మతములో మత
ఘర్షణలను సృష్టించుచుందురు. యుద్ధవాతావరణములో అందరి దృష్ఠి
యుద్ధము మీదికి పోయినట్లు, మత ఘర్షణలలో అందరి దృష్టీ మతము
మీదికే పోవును. ఆ విధముగా మతములో ధ్యాస కల్గినవారు దేవుడు
చెప్పిన జ్ఞానమును గురించి యోచించక మనుషులు చెప్పిన మతము
గురించే ఆలోచింతురు.
అదే ఉద్దేశ్యముతోనే కొందరు మత పెద్దలు అనవసర
రాద్ధాంతములు సృష్టించి, ప్రజల దృష్టిని ఆ రాద్ధాంతముల మీదికి మరల్చు
చుందురు. బాగా ఆలోచిస్తే “పి.కె.” సినిమా విషయములో ఇదే జరిగింది.
అప్పుడే సాయిబాబా విషయము కూడా వెలుగులోనికి వచ్చింది. ఈ
రెండు విషయములలోనే ప్రజలు పూర్తి లగ్నమైపోయి ప్రజలు కూడా
మతము తరపున మాట్లాడుచున్నారు, అలా మతములో లగ్నమైన వారికి
దైవగ్రంథములలోని జ్ఞానము చెప్పినా అది ఏమాత్రము వారికి పట్టుపడదు.
ఈ విధముగా అప్పుడప్పుడు మతఘర్షణలు వచ్చుట వలన, మనుషులకు
మతము తప్ప దేవుని జ్ఞానము ఏమాత్రము తెలియకుండా పోయినది.
కొందరు మతపెద్దలు రెచ్చగొడితే, పనీపాటా లేని మనుషులు కొందరు
అనవసరముగా మత విషయములో గొడవపడుచుందురు. కొన్నిచోట్ల
కొన్ని మత ఘర్షణలు పెద్ద యుద్ధముగా మారిపోయి ఎందరో ప్రాణములు
కోల్పోయిన సంఘటనలు కూడా కలవు. ఇదంతా జ్ఞానమును కబ్జా
చేసినవారు తమ పెత్తనమును చెలాయించుటకు చేసినవి తప్ప వేరు ఏమీ
కాదని తెలియవలెను.
జ్ఞానమును కబ్జా చేసినవారు అసలు జ్ఞానమును మూసివేసి తమ
స్వంత జ్ఞానమును ప్రకటించుకొనుచుందురు. తమ స్వంత జ్ఞానము
ప్రచారమగుటకు, అసలయిన దైవజ్ఞానము బయటికి రాకుండుటకు, తమ
జ్ఞానమునకు ఒక మతము పేరుగానీ, మతములోని చీలిక పేరుగానీ పెట్టి
ప్రచారము చేయుచుందురు. ఆ విధముగా తయారయిన మతములు
తొమ్మిది యున్నవి. భూమిమీద మొత్తము మతములు పన్నెండు యుండగా,
అందులో పూర్తిగా మనుషులు తయారు చేసిన మతములు తొమ్మిదిగలవు.
దేవుని తరపున వచ్చిన ఒకే జ్ఞానమును కూడా మనుషులు తమ పెత్తనమును
చెలాయించుటకు మూడు మతములుగా చీల్చి మూడు పేర్లు పెట్టారు.
దానివలన మొత్తము పన్నెండు మతములుగా భూమిమీద చెప్పబడుచున్నవి.
ఎలా చెప్పుకొన్నా హిందూ, ఇస్లామ్, క్రైస్తవ అను మూడు మతములకు
మూడు గ్రంథములున్నాయి. ఆ మూడు గ్రంథములే భగవద్గీత, బైబిలు,
ఖుర్ఆన్ అను పేర్లతో పిలువబడుచున్నవి. వాస్తవముగా మూడు మతము
లనీ, మూడు గ్రంథములనీ చెప్పబడినా, మూడు గ్రంథములలో ఒకే దేవుని
విషయము కలదు. కావున వాటికి ప్రథమ దైవగ్రంథమనీ, మధ్య దైవ
గ్రంథమనీ, అంతిమ దైవగ్రంథమనీ పేర్లు పెట్టబడినవి. దేవుడు చెప్పిన
జ్ఞానమే దైవగ్రంథములలో కలదు.
తొమ్మిది మతముల జ్ఞానమును మనుషులే స్వంతముగా చెప్పు
కొన్నారు. కావున అది వారి జ్ఞానమే. దేవుడు చెప్పిన జ్ఞానము మాత్రము
వారిది కాదు. వారిది కాని దానిని ఆక్రమించినప్పుడే కబ్జా చేసినట్లగును.
దేవుడు చెప్పిన జ్ఞానమును మూడు మతములలోని పెద్దలు కబ్జా చేశారు.
దేవుని జ్ఞానము ఖాళీగాయున్న స్థలముతో సమానమైనది. కబ్జా చేయబడిన
తర్వాత కబ్జాదారులు వారి ఇష్టమొచ్చిన కట్టడములు కట్టుకొన్నట్లు, ఏ
నియమ నిబంధనలు లేని జ్ఞానమునకు అనేక నియమ నిబంధనలు ఏర్పరచి
వాటిని తమ సాంప్రదాయములు అంటున్నారు. దేవుని జ్ఞానములో
సాంప్రదాయములు లేవు, దేవుని పేరుతో జ్ఞానము చెప్పబడుచున్నప్పటికీ
మతము అను తమ స్వంత పట్టా పేపరు చూపుచున్నారు. దేవుడు చెప్పిన
జ్ఞానమునకు తమ ఆధిపత్యమును జోడించి హిందూమతములో దేవుడు
చెప్పని యజ్ఞ యాగాదులనూ, వేదాధ్యయనములనూ, దానములనూ,
తపస్సులనూ చేర్చి యజ్ఞయాగములు, వేదాధ్యయనములు తపస్సులు
దానములు తమ స్వంతమనీ తమకే చెందుతాయనీ చెప్పుచుందురు.
భగవద్గీతలోని జ్ఞానము సృష్ట్యాదిలో తయారై వచ్చియుండుట వలన కృత,
త్రేతాయుగములలోనే జ్ఞానము కబ్జా చేయబడి దేవుని జ్ఞానమను స్థలములో
యజ్ఞ, దాన, వేద, తపస్సులను కట్టడములను కట్టుకొన్నారు.
దానిని గమనించిన దేవుడు ధర్మములు అధర్మములుగా
మారిపోయాయనీ, దేవుని జ్ఞానములో కాలుష్యము ఏర్పడినదనీ, దేవుని
జ్ఞానము కొందరిచేత కబ్జా చేయబడి తమ ఇష్టమొచ్చినట్లు నాలుగు
అధర్మములను జ్ఞానములోనికి ప్రవేశ పెట్టారనీ తెలిసి, తిరిగి తన స్వచ్ఛమైన
జ్ఞానమును ప్రజలకు తెలియజేయాలని తలచి, ద్వాపరయుగము చివరిలో
భగవంతునిగా వచ్చి భగవద్గీతను చెప్పిపోయాడు. ద్వాపరయుగములో
చెప్పిన భగవద్గీతయందు నాలుగు అధర్మములను ఖండించి, మూడు
ధర్మములను నెలకొల్పిపోయాడు. ఈ విధముగా కబ్జా చేయబడిన తన
జ్ఞానమను స్థలమును శుభ్రము చేసి ఇవి నా కట్టడములు కాదని చెప్పినా,
ప్రజలు గ్రహించలేకపోయారు. దేవుని సందేశమును జ్ఞాన కబ్జాదారులు
ప్రజల వరకు రాకుండా జాగ్రత్తపడినారు. అందువలన నేటికినీ దేవుని
జ్ఞానములో నాలుగు అధర్మములు బాగా కనిపిస్తున్నవి. మూడు ధర్మములు
ఎవరికీ కనిపించకుండా పోయాయి. నేడు ఈ విషయమునంతటినీ
గ్రహించిన మేము, దేవుడు మనిషిగా వచ్చి చెప్పిన మాటలు వృథా
కాకూడదని తలచి, దేవుని జ్ఞానమును కబ్జాదారులనుండి విడిపించి ప్రజలకు
ఇవ్వాలని ప్రయత్నము చేయుచున్నాము.
ఇతరులు ఆక్రమించుకొన్న దానిని తిరిగి పొందాలంటే ఎంత
కష్టముంటుందో, అలాగే మేము చేయు కృషికి ఎన్నో ఆటంకములు ఏర్పడి
నాయి. జ్ఞానమును ఆక్రమించినవారు మమ్ములను పూర్తి వ్యతిరేఖించడమే
కాక మేము చెప్పునది హిందూ మతమునకు సంబంధించినది కాదనీ,
హిందూ ముసుగులో క్రైస్తవ మతమును ప్రచారము చేయుచున్నామనీ
ఆరోపించారు. మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత”ను బైబిలుకు
సంబంధించినదని చెప్పారు. ఎన్నోచోట్ల మతరక్షణ అను పేరుపెట్టుకొని
మా భక్తులమీద దాడులు కూడా చేశారు. అయినా అన్నిటికీ ఓర్చుకొని
అసలయిన దైవజ్ఞానమును బయటికి తేవాలనుకొన్నాము. కబ్జాదారుల
నుండి దేవుని జ్ఞానమును పూర్తి విడిపించాలనుకొన్నాము. ఆ విధముగా
మేము చేయు ప్రయత్నములో ఈ చిన్న గ్రంథమును వ్రాయడము జరిగినది.
ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. దేవుడే చేయలేని పనిని
మీరు చేయగలరా? అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఈ
విధముగా కలదు. దేవుడు చేయలేని పని అంటూ ఏదీలేదు. అయినా
స్వయముగా దేవుడు దేనినీ చేయడు. దేవుడు ఏది అనుకొంటే అది జరిగే
టట్లు ఏర్పాటు చేస్తాడు. అంతతప్ప స్వయముగా దేవునిగా దేనినీ చేయడు.
దేవుడు క్రియారహితుడు అను సూత్రము ప్రకారముండును. భగవంతుడు
క్రియాసహితుడు అను సూత్రము ప్రకారము పని చేయవలసియున్నది.
భగవంతుడు మనిషిగానే వస్తాడు. దేవుని జ్ఞానము దేవునికే తెలియునను
దైవ గ్రంథము లోని వాక్యము ప్రకారము మనిషిగా వచ్చినవాడు దేవుడేయని
చెప్పవచ్చును. అయితే పద్ధతి ప్రకారము కనిపించు ఆకారమున్న వానిని,
ప్రత్యక్షముగా మాట్లాడు వానిని దేవుడు అని అనకూడదు. అందువలన
మనిషిగా వచ్చిన దేవున్ని భగవంతుడు అంటున్నాము. దేవుడు
భగవంతునిగా అనగా మనిషిగా ద్వాపరయుగము చివరిలో వచ్చి సృష్ట్యాదిలో
చెప్పిన జ్ఞానములో ఏర్పడిన కాలుష్యమును తీసివేసి, జ్ఞానమును ఆక్రమణ
దారులనుండి విడిపించాలని తాను చెప్పిన భగవద్గీతలో నాలుగు అధర్మము
లను రెండుచోట్ల చెప్పి, తన మూడు ధర్మములను భగవద్గీతలో అనేకచోట్ల
చెప్పాడు. మనిషిగా మనము ఏమీ చేయలేకపోయినా, మనిషిగా వచ్చిన
భగవంతుని మాటలనే ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయవచ్చును. అదే
ప్రయత్నము నేను చేయుచున్నాను తప్ప దేవునికి చేతగానిది నాకు
చేతనవుతుందని నేను ఎక్కడా చెప్పలేదు. దేవుడు మనిషిగా వచ్చి
ధర్మములను అధర్మములను తెలియజేశాడు. వాటినే జ్ఞాపకము చేయడము
వలన ధర్మములేవో, అధర్మములేవో కొంత కాలమునకయినా అందరికీ
తెలియగలవు.
పుట్టిన మనుషులందరికీ దేవుని జ్ఞానము మీద ధ్యాసలేదు. దేవున్ని
గానీ, దేవుని జ్ఞానమునుగానీ తలచెడివారు అరుదుగా ఉందురు. జీవిత
కాలములో తమ బ్రతుకుతెరువును గురించి ఆలోచించువారే ఎక్కువగా
యుందురు. అటువంటివారు ఆశకు లోనై తాము ఎవరి వలన లాభము
పొందుదామా! అని చూచుచుందురు. అలా ఆశయందు మునిగినవారు
దేవుని జ్ఞానమును ఏమీ తెలియకుండా తమకు లాభమును చేకూర్చువారు
ఏ దేవుడు అని చూచుచుందురు. అటువంటివారు జ్ఞాన కబ్జాదారుల
చేతిలో సులభముగా చిక్కిపోవుదురు. ఈ యజ్ఞము చేస్తే ఈ లాభము
వస్తుంది, ఈ యాగము చేస్తే ఈ కోర్కె నెరవేరుతుంది. ఈ తపస్సు చేస్తే
ఈ కార్యము నెరవేరుతుంది అని చెప్పడము వలన వారి మాటలను విని
వాటినే ప్రజలు ఆచరించుటకు ప్రారంభించుచున్నారు. ఈ విధముగా
ప్రజలు తమ కోర్కెల నిమిత్తము తమకు తెలియకుండానే అధర్మముల
లోనికి పోయి చిక్కుకుంటున్నారు. ఒక్కమారు ప్రపంచ కోర్కెల నిమిత్తము
అధర్మములలో ఇరుక్కొన్నవాడు వాటినుండి తిరిగి బయటపడలేడు.
మనుషులలోని గుణముల వలన మనిషి దేవునిమార్గమును వదలి అజ్ఞాన
మార్గమును అవలంబించుచున్నాడు. మనుషులలోని గుణములనే మాయ
అని అంటున్నాము. పన్నెండు గుణముల సమ్మేళనము మాయగాయున్నది.
మాయ మనిషిని అహర్నిశలు దేవునికి దూరముగా పంపవలెననీ, దేవునికి
మనిషి దగ్గరగా రాకూడదనీ ప్రయత్నించుచుండును. గుణముల మాయ
చాలా బలమైనది. కావున మాయబారినుండి ఎవరూ బయటపడలేరు.
పుట్టిన ప్రతి మనిషీ అధర్మములనే ఆచరించుటవలన దేవుని
ధర్మములు తెలియకుండాపోయినవి. దేవుని ధర్మములు తెలియకుండా
పోయిన దానివలన జ్ఞానమును కబ్జా చేసినవారిని మనిషి గుర్తించలేక
పోవుచున్నాడు. అందువలన దేవుని జ్ఞానము కొందరి చేతులలో కబ్జా
అయిందని అందరికీ తెలియకుండా పోయినది. దేవుని జ్ఞానము కబ్జా
అయిందా లేదా? అని తెలియాలంటే ముఖ్యముగా మూడు భాగములుగా
యున్న దైవ గ్రంథమును చదువవలెను. దైవ గ్రంథము మూడు పేర్లతో
మూడు మతములకు సంబంధించినదిగాయున్నా, అది ఒకే దేవునికి
సంబంధించినదే, ఒకే జ్ఞానమునకు సంబంధించినదే. దైవగ్రంథము
చదివిన తర్వాత దేవుని జ్ఞానము కబ్జా చేయబడిందని ప్రతి ఒక్కరికీ తెలియ
బడును. అప్పుడు నిజమైన జ్ఞానమును మనిషి తెలియగలడు. ప్రతి
మనిషీ కబ్జా జ్ఞానమును వదలి, అసలయిన దేవుని జ్ఞానము తెలిసిన
రోజు, దేవుని ధర్మములు పూర్తిగా నెలకొల్పబడి అధర్మములు లేకుండా
పోవును.
ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. మనిషి అధర్మము
లను తెలియడము వలన, ఆచరించడము వలన అతనికి ఏమి నష్టము
కలుగును? ధర్మములను తెలియడము వలన ఆచరించడము వలన మనిషికి
ఏమి లాభము కల్గును? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము
ఈ విధముగా గలదు. మనిషి కర్మలను సంపాదించుకొని వాటిని
అనుభవించుటకు పుట్టుచున్నాడు. జీవితములో కర్మలను అనుభవించలేక
బాధపడుచున్నాడు. కర్మలనుండి వచ్చు బాధలను తప్పించుకొనుటకు
తిరిగి మాయలోపడిపోయి బాధలనుండి తప్పించుకోవాలను ఉద్దేశ్యముతో
అధర్మములను ఆచరించుచున్నాడు. అధర్మముల వలన కర్మల బాధలనుండి
బయటపడవచ్చునని అనుకొంటున్నాడు. అయితే అధర్మముల వలన కర్మ
బాధలు పోవడములేదు. బాధలనుండి బయటపడవచ్చునని అధర్మములను
ఆచరించితే పాతకర్మ పోకపోవడమేకాక, అధర్మముల వలన క్రొత్త కర్మ
వచ్చి చేరుతున్నది. అసలయిన దేవుని ధర్మములను ఆచరించినప్పుడు
కర్మల బాధలు లేకుండా పోవునను విషయము చాలామందికి తెలియదు.
దేవుడు మనిషిగా వచ్చి ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతను చెప్పినప్పుడు
అందులో జ్ఞానయోగమును అధ్యాయమున 37వ శ్లోకమందు కర్మలను
గురించి ఈ విధముగా చెప్పియున్నాడు.
యథైధాంసి సమిద్ధోగ్ని ర్భస్మసాత్కురుతేర్జున |
జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తథా||
భావము :- “అగ్నిలో ఎన్ని కట్టెలయినా కాలి బూడిద అయినట్లు జ్ఞానమను
అగ్నిలో సర్వకర్మలు కాలి బూడిదగా మారిపోవును.”
పై వాక్యమును చూచిన తర్వాత దైవజ్ఞానము చేత మనము
అనుభవించే కర్మలు లేకుండా పోతాయని తెలియుచున్నది. దీనినిబట్టి
ప్రపంచ కర్మలన్నీ దైవజ్ఞానములో లేకుండా పోవుట వలన కర్మలనుండి
తప్పించుకోవచ్చునని తెలియుచున్నది. దేవుడు చెప్పినట్లు ధర్మయుక్తమైన
జ్ఞానమువలన మనిషి అనుభవించు అనుభవములనుండి తప్పించుకోవచ్చు
నని తెలియుచున్నది. ఇక్కడ కొందరు ఒక ప్రశ్నను అడుగుటకు అవకాశము
కలదు. అదేమనగా! మనిషి వృద్ధాప్యమునుండి దైవజ్ఞానము వలన తప్పించు
కోగలడా? అలాగే దైవజ్ఞానము వలన మనిషి మరణమునుండి తప్పించు
కోగలడా? అని అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా!
మనిషికి జీవితములో వచ్చు కర్మలను మాత్రము జ్ఞానము లేకుండా
చేయగలదని చెప్పాముగానీ, మనిషి జీవితములో సర్వసాధారణముగా వచ్చు
జీవిత దశలను లేకుండా చేయగలదని చెప్పలేదు. బాల్యము, యవ్వనము,
కౌమారము, వృద్ధాప్యము, మరణము అనునవి అందరి జీవితములో
సమానముగా వచ్చు దశలేగానీ కర్మలు కాదు. కొందరి జీవితములో
ఉన్న కర్మలు మరికొందరి జీవితములో ఉండవు. అందువలన కర్మలు
అందరి జీవితములో సమానముగా ఉండవు. ఒక్కక్కరికి ఒక్కొక్క రకముగా
కర్మలుండునుగానీ, జీవిత దశలు మాత్రము దేవుడు అందరికీ సమానముగా
ఉంచాడు. జ్ఞానమను అగ్ని కర్మలను లేకుండా చేయగలదుగానీ, ప్రకృతి
సిద్దముగాయున్న దశలను లేకుండా చేయలేదు. జీవిత దశలకు జ్ఞానాగ్నికి
సంబంధము లేదు.
మనిషి జీవితములో వచ్చు కర్మ బాధలను జ్ఞానాగ్ని లేకుండా
చేయగలదని భగవద్గీతలో చెప్పడము జరిగినది. ఉదాహరణకు రోగము
లలో పెద్ద రోగముగా పేరుగాంచిన ఎయిడ్స్ రోగము ఒక మనిషికి వచ్చి
దానివలన అతను బాధపడుచున్నాడనుకొనుము. అటువంటివాడు
దైవజ్ఞానమును పొందితే లేక పొందియుంటే తనకున్న జ్ఞానము చేత తనకు
రోగరూపములోయున్న కర్మను లేకుండా చేసుకోవచ్చును. దేవుని జ్ఞానము
అనగా దైవగ్రంథములో దేవుడు చెప్పిన జ్ఞానమును తెలియుట చేత మనిషి
జ్ఞానిగా మారిపోగలడు. మనిషి జ్ఞానిగా మారిపోయిన తర్వాత వానిలో
జ్ఞానాగ్ని అనబడు జ్ఞానశక్తి నిలువయుండును. జ్ఞానాగ్ని నిలువయున్న
వానికి ఎంతటి కర్మయినా కాలిపోవును. అటువంటివారికి ఎయిడ్స్ రోగము
సహితము పూర్తి నయమైపోవును. అలాగే ఎంతటి భయంకరమైన
కర్మయినా మనిషికి తెలియకుండానే మాయమైపోవును, అనుభవమునుండి
తప్పిపోవును. ఇది ఒక రోగరూపములోయున్న కర్మయేగాక ఏ విధ
సమస్యగాయున్న కర్మయినా దైవజ్ఞానమునకు కరిగి లేకుండా పోవును.
ఈ విధముగా దేవుడు చెప్పిన ధర్మయుక్తమైన జ్ఞానముచేత మాత్రము
జరుగగలదు.
అధర్మములతో కూడుకొన్న జ్ఞానముచేత ఏ చిన్న కర్మ కూడా
పోదు. దేవుడు చెప్పిన ధర్మములతో కూడుకొన్న జ్ఞానము శక్తివంతమైనది.
అయితే మనిషి తాను సృష్టించుకొన్న జ్ఞానములో ఏ విధమైన శక్తి లేదు.
మూడు గ్రంథములుగాయున్న దైవగ్రంథములోని జ్ఞానము శక్తివంతమైనదే
అయినా, నేడు మనిషి దైవజ్ఞానమును ఉన్నది ఉన్నట్లు తెలుసుకోక
దైవజ్ఞానములోనికి తన భావములను చేర్చి చివరకు జ్ఞానమునే కబ్జా చేశాడు.
అటువంటి జ్ఞానములో శక్తియుండదు కావున కర్మలు కాలిపోవు. నేడు
ఎందరో భగవద్గీతను హిందువులుగా యున్నవారు చదువుచున్నారు అయితే
వారు చదివేది భగవద్గీత అయినా, అందులోని జ్ఞానమునకు మనిషి
భావములను చేర్చి వ్రాయడము వలన అతను చదివిన భగవద్గీతలో
జ్ఞానశక్తి లేదనియే చెప్పవచ్చును. ఉదాహరణకు భగవద్గీతయందు
జ్ఞానయోగమను అధ్యాయములో “చాతుర్వర్ణము” అను శ్లోకమునకు నాలుగు
వర్ణములుగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అని నాలుగు కులముల
పేర్లు చెప్పు మనుషుల జ్ఞానము కలదు. అలాగే దేవుని జ్ఞానము ప్రకారము
మూడు గుణముల జాతులు, ఒక గుణములేని జాతి అని నాలుగు విధముల
మనుషులను చెప్పిన జ్ఞానము కలదు. ఈ రెండు భావములలో ఒకటి
మనుషుల భావముకాగా, రెండవది దేవుని భావముగానేయున్నది.
మనుషుల భావముతో కూడుకొన్న భగవద్గీతను చదివినా అందులో జ్ఞానశక్తి
లభించదు. అదే దేవుని భావముతో కూడుకొన్న భగవద్గీతను చదవడము
వలన మనిషికి దైవశక్తి లేక జ్ఞానాగ్ని లభించును. దానివలన కర్మలు
కాలిపోవును. అలాగే మధ్య దైవగ్రంథమయిన బైబిలుయందు, అంతిమ
దైవగ్రంథమయిన ఖుర్ఆనాయందు గల దేవుని జ్ఞానము మనుషుల చేత
కబ్జా చేయబడి యున్నది. అందువలన దైవ గ్రంథములుగా యున్న
వాటిని చదివినప్పటికీ ప్రజలకు అందులోని శక్తి లభించడము లేదు.
జ్ఞానము వలన వారి కర్మలు పోవడము లేదు. అలా జరుగుటకు కారణము
మనుషుల అదుపులో యున్న జ్ఞానమును తెలియుటచేత ఎవరికీ జ్ఞానశక్తి
లభించలేదని అర్థమగుచున్నది. మనుషులు శాసించిన జ్ఞానము కాకుండా
దేవుడు చెప్పిన జ్ఞానమును తెలియగలిగితే తప్పక మనుషుల కర్మలు
కాలిపోగలవు. అసలయిన ధర్మములతో కూడిన, దేవుని భావముతో
కూడుకొన్న గ్రంథములు మాకు లభించడములేదు అని ఎవరూ
చింతించవలసిన పనిలేదు. అసలయిన దేవుని ధర్మములను తెలుపు
నిమిత్తము, మతములకు అతీతముగా, మనుషుల భావములకు దూరముగా
మూడు దైవగ్రంథములను మేము వ్రాయడము జరిగినది. అవి “ప్రథమ
దైవగ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత”, “ద్వితీయ దైవగ్రంథము సువార్త
జ్ఞాన వాక్యములు”, “అంతిమ దైవ గ్రంథము ఖుర్ఆన్అని జ్ఞాన
వాక్యములు” అను పేర్లతో వ్రాయబడినవి. ఈ మూడు గ్రంథములలోనిది
స్వచ్ఛమైన దైవజ్ఞానమని చెప్పుచున్నాము. వీటిలో మనిషి కబ్జా చేసిన
జ్ఞానము ఏమాత్రము లేదు. అందువలన ఈ మూడు గ్రంథముల జ్ఞానము
కర్మలను కాల్చగలుగుచున్నది. ఇప్పటికయినా మనుషులు దేవుని
జ్ఞానమును మతములకు అతీతముగా తెలుసుకొని దైవశక్తిని పొందగలరని
ఆశిస్తూ ఇంతటితో ముగించుచున్నాము.
సమాప్తము.
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.