తత్త్వముల వివరము. cloud text updated on 5thoct 2024

 తత్త్వముల వివరము.


రచయిత ప్రబోధానంద యోగీశ్వరుల ముందుమాట.


తత్ అనగ అది అని అర్థము. త్త్వం అనగా నేను అని అర్ధము. తత్త్వం అనగ అది నేను అని చెప్పవచ్చును.

నేను అనువాడు జీవుడు, జీవునికంటే వేరుగ ప్రక్కనే ఉన్నవాడు ఆత్మ (దేవుడు). జీవాత్మ ఆత్మల వివరమే తత్త్వములో

ఉండును. జీవాత్మ ఆత్మల వివరములేనిది తత్త్వము కానే కాదని చెప్పవచ్చును. తత్త్వ జ్ఞానము చాలా విలువైనది.

ఆత్మ జీవాత్మలు శరీరములోనే ఉండును. కావున తత్త్వ వివరమంతయు శరీరములోనే ఇమిడివుండును. అందువలన

తత్త్వ వివరము తెలుపువారు శరీరములోపలే చెప్పాలి. శరీరము విడిచి బయట చెప్పితే అది పూర్తి అసత్యమగును.


అసలు విషయమేమంటే “తత్త్వం” అని పేరు పెట్టిన పాటలుకాని పద్యములుకాని ఎవరికి అర్థముకాని రీతిలో

ఉంటాయి. ఎవరైన తత్త్వము వ్రాస్తే అలాగే వ్రాయాలని ఆనాటి పెద్దలు నిర్ణయించుకొని తీర్మాణించారు. ఆ పద్దతి

ప్రకారమే తత్త్వాలన్ని వ్రాయబడినవి. అలా అర్థముకాని రీతిలో ఎందుకు వ్రాయాలి అని కొందరడుగవచ్చును. దానికి

జవాబు ఏమనగా? మన పెద్దలు కొంత ధనమును సంపాదించారు అనుకొందాము. ధన సంపాదన వెనుక ఎంతో

శ్రమ ఉండును. శ్రమపడి సంపాదించినది కావున ఆ ధనమునకు కూడ ఎంతో విలువ ఉండును. దాని విలువను

గుర్తించిన వారు ధనమును ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెకు ఒక తాళము కూడ వేసి ఉందురు. లోపలి ధనము

కావాలంటే తాళమును తెరచు తాళముచెవి కావాలి. అలా ఉన్నపుడే ధనమునకు విలువవుండును. ఎదుటి వాడు

దాని విలువను తెలుసుకొనును. అలా లేకపోతే ధనము ఆరుబయట ఉంటే దాని విలువను గుర్తించలేరు. ఇష్టమొచ్చినట్లు

వాడుకొని అసలే లేకుండ చేసుకొందురు. పూర్వము పెద్దలు జ్ఞానమను ధనమును సంపాదించి ప్రపంచ ధనమును

దాచినట్లు పెట్టెలో పెట్టి తాళము వేయలేదు. కాని ఒక గుడ్డలో మూటగట్టి ముడివేశారు. ఆ మూటలను మన ఎదుటే

పెట్టి పోయారు. ఆ మూటల ముడి విప్పితే అందులోని జ్ఞానధనము సులభముగ దొరుకును. మూటలు ముందున్న

మనము ముడివిప్పుకోలేని వారమైనాము. కావున వారు కొంత మరుగుపెట్టి వ్రాసినవి తెలియకుండ పోయినవి.

అందువలన తత్త్వముల వివరములు ఎవరు చెప్పుకోవడము లేదు.


అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు కొందరికి తత్త్వములు అర్థము కాక వాటిని తిక్క మాటల క్రిందికి జమకట్టారు.

ఇవి వేదాలుకాదు, ఉపనిషత్తులుకాదు వీటిని ఎందుకు చదవాలని అంటున్నారు. ఎవరు ఏమనిన తత్త్వాలలో ఉన్నది

జ్ఞానము యొక్క సారాంశమను మాట వాస్తవము. పూర్వము బోధకులైన గురువులు జ్ఞానము చెప్పునపుడు కూడ

రహస్య ప్రదేశములోనే చెప్పెడివారు. బయటి అజ్ఞానుల ఎదుటకాని, జ్ఞానము మీద ఆసక్తిలేనివారి ఎదుటకాని

చెప్పెడివారుకాదు. పూర్వకాలములో అందరు అదే పద్దతిని కొనసాగించుచుండిరి. కావున వారు తత్త్వములను కూడ

నిగూఢముగానే వ్రాసి అందరికి అర్థము కాకుండ చేశారు. ఎవరికైతే జ్ఞానము మీద జిజ్ఞాసయుండునో వారికి

మాత్రము అర్థమగునట్లు వ్రాశారు. బయటి చూపును వదలి లోచూపు పెట్టుకొన్న ఎవరికైన తత్త్వములు ఎంత

నిగూఢముగ ఉండినప్పటికి అర్థము కాగలవు.


నేటి సమాజములో ఎందరో గురువులుగ చలామణి అగుచున్న బోధకులు, స్వాములు, పీఠాధిపతులు గలరు

కదా! తత్త్వముల వివరము గురించి వారికి కూడ తెలియదా? అని కొందరడుగవచ్చును. దానికి మా జవాబు ఎవరైతే

తత్త్వములుగ వ్రాయబడిన పాటలలో జ్ఞానము లేదంటున్నారో వారు ఎవరైన వారికి శరీరములోని ఆత్మజ్ఞానము

తెలియదనియే చెప్పవచ్చును. నేడు బోధకులందరు ఎక్కువ శాతము బయటి జ్ఞానమునే బోధిస్తున్నారు. కొందరైతే ఏ

జ్ఞానములేని రామాయణ ఇతిహాసములను చెప్పుకుంటున్నారు. ఈ విధముగ జరిగి పోయిన చరిత్రను జ్ఞానమనుకోవడము

వలన, ఇంతకు ముందు జ్ఞానిగ ఉన్నవాని చరిత్రను చెప్పుకోవడము వలన, మనకు జ్ఞానము కలుగుచున్నదా లేక

కాలక్షేపణ జరుగుచున్నదా అని యోచించక పోవడము వలన ఎవరి దారిని వారు సమర్థించుకొంటున్నారు. అటువంటి

వారికి తత్త్వముల లోని జ్ఞానధనము లభించదు.


“తత్త్వం”ను విడదీసి చూచితే తత్+త్వం అని తెలుసుకొన్నాము. తత్త్వం అన్నది అన్ని మతములలోను గలదు.

ముఖ్యముగ హిందూ (ఇందూ) మతములోను, క్రైస్తవ మతములోను బాగా కనిపిస్తున్నది. అయినప్పటికి ఇటు హిందువులకు

అటు క్రైస్తవులకు దీని అర్థ భావములు తెలియకుండపోయినది. హిందువులలో సంస్కృతమును నేర్చినవారు అర్థము

చెప్పగలుగుచున్నారు. కాని భావము తెలియకుండ పోయినది. ప్రతి పదార్థము చెప్పిన వారికి భావము ఏమిటో

తెలియదు. తత్ అనగ తనకు భిన్నముగ ఉన్న ఆత్మ అని అనుకోవడములో పొరపడుచున్నారు. ఎందుకనగా

భగవద్గీతలోకాని బైబిలులోకాని మూడు ఆత్మలు సిద్ధాంత సహితముగ చెప్పబడియున్నవి. ఆ త్రైతాత్మ సిద్ధాంతమును

ఎవరు గుర్తించని కారణమున తత్ అనబడునది రెండవ ఆత్మనో మూడవ ఆత్మనో తెలియకుండపోయినది. కొందరికి

ఆత్మల వివరమే అర్థముకాక తాను మొదటి ఆత్మనైన జీవాత్మననే తెలియదు. ఇక క్రైస్తవులలోనికి వస్తే మూడవ ఆత్మను

అటుంచితే రెండవ ఆత్మ వివరము కూడ తెలియదు. ఈ విధముగ ప్రపంచములో అతి పెద్దదైన క్రైస్తవమతమందుకాని,

ఇక్కడ ఒక స్థాయిలోనున్న హిందూమతములోగాని రెండవ ఆత్మ వివరము తెలియకుండ పోయినది.


తత్+త్వం = తత్త్వం అని వివరించుకొని చెప్పువారున్నప్పటికి, “త్వం” కు అర్థము తెలిసినప్పటికి ఆ “తత్”

అనేది ఏదో స్పష్టముగ ఎవరికి తెలియకుండ పోయినది. ఒకవేళ కొందరిలో మాకు తెలుసునను ధీమా ఉండినప్పటికి

అది వారి గ్రుడ్డినమ్మకమే కాని అసలైన జ్ఞానదృష్ఠి లేదని చెప్పవచ్చును. అందువలన తత్ అనగ పరమాత్మ అని చెప్పు

చున్నారు. ఒక జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోతే వానికి జన్మ ఉండదు. అలా ఐక్యమైనవాడే కర్మలేనివాడై శరీరముతో

లేకుండును. ఇక్కడ అసలైన వివరానికి వస్తే పూర్వము తనలోని ఆత్మను తెలిసిన జ్ఞానులు ఆత్మతో కలిసి యోగము

పొందినవారైవున్నారు. అటువంటి జ్ఞానులు ఆత్మతో కలియకముందు "తత్త్వం” అన్నవారు ఆత్మతో కలిసిన తర్వాత

“తత్త్వమసి” అన్నారు. దీనిని విడదీసి చూచితే తత్+త్వం+అసి= తత్త్వమసి అనిగలదు. తత్ అనగ ఆత్మ అని, త్వం

అనగ నేను అని, అసి అనగ కలసిపోయాము అని అర్ధము. ఆత్మతో కలసినవాడు భూమి మీద శరీరముతో ఉండి

బ్రహ్మయోగిగ ఉండును. అందువలన శరీరముతో బ్రతికివున్నవాడు “తత్త్వమసి" అనగలిగాడు. అదే పరమాత్మతో

కలసిపోతే వానికి శరీరముండదు కావున వాడు ఏమియు అనే దానికుండదు. అందువలన ఆత్మను అనగ తత్ను

తెలుసుకొన్న జీవుడు త్వం అన్నవాడు తతో కలసిపోయి తత్త్వమసి కాగలడు. ఇప్పటికైన తత్త్వం అను పదమునకు

అర్థము తెలిసి, జీవాత్మ ఆత్మలను తెలుపు పాటలకు, పద్యములకు తత్త్వమని పేరు పెట్టారని తెలిసి, రెండు ఆత్మలు


శరీరములోనే ఉన్నాయని తెలిసి, తత్త్వమునకు శరీరాంతర్గతములోనే అర్థము చెప్పుకోవలెను. ఇదే సూత్రమును అనుసరించి

“తత్త్వముల వివరము ” అను ఈ పుస్తకములో వ్రాసిన పాటలకు పద్యములకు శరీరములోనే వివరించి చెప్పాము.

వేయి పుస్తకములు చదువుటకన్న వేమన పద్యమొకటి చదువుట మిన్న అన్నట్లు, వేయి పాటలు తత్త్వములను

పాడుకొనుటకంటే ఒక్క తత్త్వమునకు వివరమును తెలియుట మిన్న. అందువలన తత్త్వములను పాడుకొనుటలో

ఉపయోగములేదు కాని తత్త్వమును అర్థము చేసుకొంటే అది ఉపయోగమై “తత్త్వమసి” కాగలవు.


ఇట్లు

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.

Q



1. తత్త్వము


సీ || 

కానని భూమిలో కస్తూరి కోనలో

మందరగిరి మీద మర్రి చెట్టు

చెట్టుకు కొమ్మలు చర్చింప పది నూర్లు

కొమ్మ కొమ్మకు కోటి కోతులుండు

నగదరం బైనట్టి నడికొమ్మ మీదను

నక్క యొకటుండు చుక్కవలెను

సుస్థిరం బైనట్టి చుక్కకు తూర్పున

సూర్య చంద్రాదులు తేజరిల్లు


తే॥

దీనికర్థంబు చెప్పు దేశికునకు

నెలలు పండ్రెండు గడువిత్తు నేర్పుతోడ

చెప్పగలిగనేని నేనిత్తు చిన్న మాడ

చెప్పలేకుంటె నేనగుదు చిన్న నగువు.


భావము :- దైవము నిల్వయున్న నిజమైన దేవాలయమైన మన శరీరములో, కంటికి కనిపించని చూడబడని

అంతర్గతములో, ఎముకలచే మరియు వెన్నుపూసలచే పేర్చబడిన శరీర భాగములో ఎత్తైన కపాలస్థాన మందు జీవుల

సారాంశమంతయు ఇమిడి ఉన్నది. ఆ స్థానములోనే జీవరాసులు జరిగిన, జరుగుచున్న, జరుగబోవు చరిత్రలన్ని

దాచబడినవి. శిరో భాగములో మద్యనగల గుణచక్రమందు గుణములు, కర్మచక్రమందు కర్మ, కాలచక్రమందు కాలము

కనిపించక సూక్ష్మముగ ఉన్నవి.


కనిపించు మెదడునుండి ఒకనాడి బయలుదేరి గుదస్థానము వరకు వ్యాపించివున్నది. దీనినే బ్రహ్మనాడి

అందురు. ఈ నాడియందు కాల, కర్మ, గుణచక్రములను నడుపు ఆత్మ నివాసమై ఉన్నది. ఆత్మ కంటికి కనిపించక

బ్రహ్మనాడి పై భాగమునుండి చివరి భాగమువరకు వ్యాపించియున్నది. చిన్న చిన్న నరములు అనేకము శరీర వివిధ

భాగముల నుండి వచ్చి బ్రహ్మనాడితో కలిసియున్నవి. ఈ చిన్న నరముల ద్వారానే శరీరమందు ఏ విషయమైన

బ్రహ్మనాడిని చేరి అక్కడినుండి కపాల స్థానములో నివాసమున్న జీవునకు చేరుచున్నది. ఇంతేకాక బ్రహ్మనాడికి

ముందర భాగములో ఇరువైపుల సూర్య చంద్రనాడులనునవి కలవు. ఈ నాడులు రెండు ముఖ్యముగ ఊపిరితిత్తులతో

సంబంధము ఉన్నవి. మన ముక్కురంధ్రముల ద్వార ఆడుశ్వాస సూర్యచంద్రనాడుల ద్వారానే కదలింపబడుచున్నది.


పై విధముగ శరీర అంతర్భాగమున్నది. ఈ విషయమును యోగులైనవారు పద్యరూపములో చెప్పారు.

లోపలి భాగము కనిపించనిది. కావున కానని భూమిలోనన్నారు. శరీరము ఆత్మ నిలయమైన పవిత్ర స్థానము కావున

పరిమళముగల కస్తూరికోన అన్నారు. శరీర పై భాగమున ఆత్మ, జీవుడు, గుణములు, కర్మలకు నిలయము కావున

శరీరమును పర్వతముగ పోల్చి మందరగిరి అన్నారు. కపాలస్థానము నుండి బ్రహ్మనాడి పుట్టినది కావున దానిని

మర్రిచెట్టుగ చెప్పారు. బ్రహ్మనాడి నుండి ఎన్నో నాడులు చీలిపోయాయి. కనుక నాడులన్నిటిని కొమ్మలుగ పోల్చి

చెట్టుకు చెర్చింప పదినూర్ల కొమ్మలన్నారు. బ్రహ్మనాడితో సంబంధమున్న నరముల ద్వార లెక్కకురాని అనేక విషయములు


బ్రహ్మనాడిని చేరు చున్నవి. కావున కొమ్మకొమ్మకు కోటి కోతులుండు అన్నారు. చిన్న నరములన్నిటికి బ్రహ్మనాడియే

ఆధారము. బ్రహ్మనాడినుండియే శక్తి అన్ని నరములకు ప్రవహించుచున్నది. అందువలన బ్రహ్మనాడిని నగధరం బైన

నడిమికొమ్మ అన్నారు. బ్రహ్మనాడియందే అన్నిటికి సాక్షియైన ఆత్మ నివాసమున్నది. కావున ఆత్మను నక్కగ పోల్చి

నడిమి కొమ్మ మీద నక్క ఒకటి యని అన్నారు. ఆత్మ స్థిరస్థాయిగ ఒక్క చోటుండి తనశక్తి కిరణములను నరముల ద్వార

శరీరమంత వ్యాపింపజేయుచున్నది. అందువలన పగలు రేయి స్థిరస్థాయిగ ఉన్న చుక్కగ ఆత్మను పోల్చి నక్క ఒకటుండు

చుక్కవలె అన్నారు. బ్రహ్మనాడికి కొద్దిగ ముందు ప్రక్కన రెండువైపుల సూర్యచంద్రనాడులున్నాయి. జాగ్రతావస్థయందు

మాత్రము మనస్సుకు స్థానమైవున్న సూర్యచంద్రనాడులను 12 గంటల కాలము కనిపించి 12 గంటల కాలము

కనిపించని సూర్యచంద్రులుగ పోల్చి చుక్కకు తూర్పున సూర్యచంద్రులు తేజరిల్లుయన్నారు.


ఇది నిగూఢ భావముగల పద్యము. శరీర అంతర్గత జ్ఞానము పూర్తిగ తెలిసినవారికే ఈ పద్యము అర్థమగును.

శరీరాంతర్గత జ్ఞానము చాలామందికి లేనిదానివలన దీని అర్థము చెప్పుటకు చాలా కాలము పట్టునను ఉద్దేశముతో

నెలలు పండ్రెండు గడువిత్తునని చెప్పారు.


2. తత్త్వము.



ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము మన బ్రహ్మంగారు చెప్పినది పెద్దమంత్రము.


1)రెక్క ముక్కులేని పక్షి రేయి పగలు తపస్సు చేసి ఒక చెరువు చేపలన్ని ఒక్కటే మ్రింగెను.

“ఆహా”.

2)ఇంటి వెనుక తుట్టెపురుగు ఇంటిలో అందరిని మ్రింగె, చూడవచ్చిన జనులనెల్ల చూచిమ్రింగెను.

“ఆహా”.

3)కాళ్లు చేతులు లేనివాడు కడవ ముంత చేత పట్టి నిండుబావి నీళ్లని ఒక్కడే ముంచెను

“ఆహా”.

4)ఏటిమీద స్వాతికొంగ వేటలాడుచురాగ చాటునున్న వినుపిల్ల అట్టే మ్రింగె

“ఆహా”.

5)చెప్పినాడు వీరదాసు చోద్యముగాను ఆత్మతత్త్వము గొప్పవారు దీని భావము విప్పిచెప్పితే చాలు

“ఆహా”.


దీని అర్థమేమనగా :- శ్వాసను కుంభించి నిలిపి మనస్సును బ్రహ్మనాడి యందు చేర్చ వలయునని అనుకొన్న యోగి

ఒక స్థలమునందు కదలక కూర్చొని మొదట శ్వాసను ఊపిరితిత్తులనిండా ఏమాత్రము ఖాళీ లేకుండ పీల్చును. పీల్చిన

శ్వాసను ఏమాత్రము బయటికి వదలకుండ మూడు లేక నాలుగు నిమిషములుండును. ఇట్లున్న తర్వాత మరియు

బయటి గాలినే లోపలికి పీల్చును. ఇక్కడ గమనింపవలసిన విషయము మొదట ఊపిరితిత్తులు ఏమాత్రము ఖాళీ

లేకుండ గాలి పీల్చినాడుకదా ఖాళీలేని ఊపిరితిత్తులందు తిరిగి గాలి ఎట్లు ప్రవేశించినదని అనుమానము కలుగవచ్చును.

దానికి సమాధానము మొదట ఖాళీలేని ఊపిరితిత్తులందు మూడు నాలుగు నిమిషముల తర్వాత కొద్దిగా ఖాళీ

ఏర్పడియుండును. ఆ ఖాళీస్థలము ఏట్లేర్పడినదనగా ఊపిరితిత్తులయందున్న గాలి మూడు నాలుగు నిమిషములకు

బయటికి రావలయునని ప్రయత్నించును. కాని బయటికి రాకుండ నిరోధించి ఉన్నందువలన ఊపిరితిత్తులలోని

మూలలకు గాలి చేరుట వలన ఊపిరితిత్తులు కొద్దిగా ఖాళీ ఏర్పడి ఉండును. ఆ ఖాళీ పూర్తి అగునట్లు రెండవసారి

యోగి బయటి గాలిని పీల్చి పూరించుచున్నాడు. ఇట్లు రెండవమారు గాలిని పీల్చిన యోగి మూడు లేక నాలుగు

నిమిషముల వరకు శ్వాసను బయటికి వదలక ఉండి, తర్వాత ఇంకా తనయందు గాలి ప్రవేశించునేమోనని మూడవ


మారు పీల్చి చూచును. అపుడు కూడ గాలి కొద్దిగ లోపలికి పోవును. ఇట్లు రెండు మూడుమార్లు శ్వాసను పీల్చి

ఉదరమునందు ఊపిరి తిత్తులందును గాలిని భర్తిగా చేసుకొని బయటికి వదలక ప్రయత్న పూర్వకముగా భిగించి

ఉండును. దీనినే "కుంభకము” అని అందురు. ఈ విధముగా కుంభింపబడిన గాలి బంతియందు బంధింపబడి

ఉన్నట్లుండును.


1) గాలిని ఆధారము చేసుకొని ఆడుచున్న ఊపిరితిత్తులు గాలి కదలక నిలిచిన వెంటనే నిలిచిపోవుచున్నవి.


2) ఊపిరితిత్తులు నిలిచిన వెంటనే ఊపిరితిత్తులను నడుపుచున్న నరము లందు చైతన్యము కూడ నిలిచిపోవును.


3) నరములందు చైతన్యము నిలిచిన వెంటనే ఆ నరములతో సంబంధమున్న సూర్యచంద్రనాడులందుండు చైతన్యము

నిలిచిపోవును.


4) సూర్యచంద్రనాడులందు చైతన్యము నిలిచిన వెంటనే సూర్యచంద్ర నాడులను ఆధారముగా చేసుకొని చలించుచున్న

మనస్సు కదలక నిలిచిపోవును.


5) మనస్సు నిలిచిపోయిన వెంటనే మనస్సును ఆధారముగా చేసుకొని జీవులను నడుపుచున్న ఆరు కేంద్రములలో

చైతన్యశక్తి నిలిచిపోవును. అనగా కుండలీశక్తి ఆటకట్టబడినదన్నమాట. నరకేంద్రముల చైతన్యము నకు ఆధారమై

ఉన్న ఏడవ కేంద్రము ఒక్కటి తన శక్తిని కోల్పోక ఉండును. ఆరు కేంద్రముల చైతన్యశక్తి నిలిచిపోయినను ఏడవ

కేంద్రమందున్న చైతన్యశక్తి నిలిచిపోక ఉండును. ఏడవ కేంద్రమందలి శక్తి అపారమైనది, ఊహించరానిది, చెప్పుటకు

శక్యముకానిది, దానినే ఆత్మ అని యోగులు అంటున్నారు. ఈ ఏడవ కేంద్రమునందలి చైతన్యము జీవుని నిదుర,

మెలుకువ, స్వప్నములందు సమానముగ ఉండును అందువలన ఏడవ కేంద్రమందున్న చైతన్యమునే మూడవస్థలందు

సాక్షిగ ఉన్నదని చెప్పవచ్చును. కుంభకము ద్వారా నిలిచిన మనస్సు బ్రహ్మనాడి యందు ఏడవ కేంద్రము చేరి అందు

ఇమిడి పోవుచున్నది. మనస్సుతో పాటు అంతఃకరణములైన జీవుడు కూడ ఏడవ కేంద్రములో ఉన్న ఆత్మయందే లీనమై

పోవుచున్నాడు. జీవుడు ఆత్మయందు లీనము కావడమునే “యోగము” అంటున్నారు.


కుంభకమునే పూర్వము యోగి అయిన శ్రీ వీరబ్రహ్మంగారు ఒక తత్త్వముగా చెప్పియున్నారు. కుండలీశక్తిని

వేరుగా పోల్చుకొన్న వారు, కుండలీశక్తి నిదురపోతున్నదన్న వారు ఉండుటవలన ఆ తత్త్వమునకు అర్థమే తెలియకపోయి,

ఆఖరుకు భిక్షగాళ్లు పాడుకొనుటకు ఉపయోగపడుచున్నది. గుడ్డివానికి రత్నము ఇచ్చిన వ్యర్థమైనట్లు శ్రీ వీరబ్రహ్మముగారు

ఎంతో జ్ఞానమును ఉపయోగించి చెప్పిన మాటను తెలియని మనము వ్యర్థము చేయుచున్నాము. కుండలీనే పెద్దగ

పెట్టుకొన్న వారు మరియు విన్నవారు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మముగారు చెప్పిన క్రింది తత్త్వమును గ్రహించవలయునని

తెలుపుచున్నాము. గొప్ప మంత్రము బ్రహ్మముగారు చెప్పినది. ఆ మంత్రము మనశ్వాసయే. శ్వాసలోపలికి

ప్రవేశించినపుడు “సో” అను శబ్దముతో, బయటికి వచ్చునపుడు “హం” అను శబ్దముతో చలించుచున్నది. ఈ రెండు

శబ్దములు కలసి “సోహం” అను శబ్దము ఏర్పడినది. ఈ శబ్దము మహిమకలది కావున దీనిని మంత్రము అని

చెప్పాడు. మరియు అక్షర సమ్మేళనములతో కూడుకొన్నది. కావున మంత్రము అని చెప్పబడినది. “సోహం”

అనుమంత్రము ఆదిమంత్రముగా మారుచున్నది. అది ఏ విధముగననగా! “సో" అను శబ్దమునందు చివరిగా “ఓ”

అను శబ్దమున్నది. “హం” అను శబ్దమునందు చివరిగా “మ్” అను శబ్దమున్నది. ఒక్కమారు శ్వాస లోపలికి పోయి

బయటికి వస్తే “సోహం" అను మంత్రము ఏర్పడుచున్నది. అ సోహం మంత్రమునందే “ఓమ్” అను శబ్దము ఇమిడి



ఉన్నది. కావున “సోహం” తల్లి “ఓమ్” శిశువు. “ఓం” ప్రపంచ పుట్టుకలో మొదటపుట్టిన శబ్దము కావున దీనిని ఆది

మంత్రము అనుట సంభవించినది.


1. రెక్క ముక్కులేని పక్షి రేయి పగలు తపస్సు చేసి ఒక చెరువు చేపలన్ని ఒక్కటే మ్రింగెను. “ఆహా”.

ముక్కు పుటములందు ప్రవేశించు శ్వాసకు ఆకారము లేదు కావున రెక్క ముక్కులేని పక్షి అని చెప్పబడినది.

శ్వాస రేయి పగలు విడువక సోహం అను మంత్రమును జపించుచున్నది. కావున పక్షి రేయి పగలు తపస్సు చేసె అని

చెప్పబడినది. ఈ శ్వాసయే శరీరము లోనికి ప్రవేశించి కుంభకము ద్వారా నిలిచి శరీరములోనున్న కదలికల

(చైతన్యముల) అన్నిటిని నిలిపివేయుచున్నది. కావున చెరువులో అనేక విధములుగా చలించు చేపలన్నిటిని మ్రింగెను

అని చెప్పబడినది.


2) ఇంటి వెనుక తుట్టెపురుగు ఇంటిలో అందరిని మ్రింగె, చూడవచ్చిన జనులనెల్ల చూచిమ్రింగెను. “ఆహా”.


శ్వాస ఎల్లవేళల “సోహం” అను శబ్దము చేయుచున్నది కావున 'గీ' మని అరచు తుట్టెపురుగుగా చెప్పబడినది.

శ్వాసకు ఆధారము శరీరములో కనపడక ఉన్న బ్రహ్మనాడిలోని చైతన్యము కావున ఇంటి వెనుక పురుగు అని

చెప్పబడినది. ఇల్లు అనగా శరీరము. శ్వాస కుంభకము ద్వారా శరీరములోనున్న వ్యాన, సమాన, ఉదాన, అపాన

వాయువులన్నియు బంధింపబడుచున్నవి. కావున ఇంటిలోని అందరిని మ్రింగెను అని చెప్పబడి ఉన్నది. శ్వాస

కుంభించిన తర్వాత ఊపిరితిత్తులు ఖాళీవల్ల రెండు లేక మూడుసార్లు కొద్దికొద్దిగా బయటి గాలి లోపలికి ప్రవేశించి,

ప్రవేశించిన గాలి తిరిగి బయటికి రాక నిలుచుటవలన చూడవచ్చిన జనులనెల్ల చూచి మ్రింగెను అని చెప్పబడి ఉన్నది.

3) కాళ్లు చేతులు లేనివాడు కడవ ముంత చేత పట్టి నిండుబావి నీళ్లని ఒక్కడే ముంచెను “ఆహా”.


శ్వాసకు రూపములేదు కావున కాళ్లు చేతులు లేనివాడని చెప్పబడినది. శ్వాస ముక్కురంధ్రములలో ఒక

దానియందు ఎక్కువ ఒక దానియందు తక్కువ లోపలికి బయటికి చలించుచున్నది, ఎక్కువ శ్వాసను కడవ అని,

తక్కువ శ్వాసను ముంతని చెప్పడమైనది. కావున కడవ ముంత చేతపట్టి అని చెప్పడమైనది. శరీరములోని తలంపులన్ని

శ్వాస ఒక్కటి నిలువడము వల్ల నిలిచిపోవుచున్నవి. కావున బావినీళ్లన్ని ఒక్కడేముంచెను అని చెప్పబడి ఉన్నది.

శరీరమును బావిగా పోల్చడమైనది.


4) ఏటిమిద స్వాతికొంగ వేటలాడుచురాగ చాటునున్న మినుపిల్ల అట్టే మ్రింగె “ఆహా”.


శ్వాస శరీరములో నిలిచిపోయిన దాని వలన మనస్సు నిలచి పోవుచున్నది. మనస్సు నిలచిపోవుట వలన

ఊపిరితిత్తులు తర్వాత నరములు, ఆ తర్వాత సూర్యచంద్రనాడులు, షట్ చక్రములు ఒక దాని తర్వాత ఒకటి

తమతమ చైతన్యమును కోల్పోవుచున్నవి. కావున ఏటి మీద స్వాతికొంగ వేటలాడుచురాగ అని చెప్పబడినది. ఒక

దాని తర్వాత ఒకటి తమ చైతన్యములను కోల్పోయినను, ఆఖరున గల ఏడవకేంద్రము మనస్సు వలన తన శక్తిని

కోల్పోక నిలచిన దానివలన అన్నిటియొక్క చైతన్యములను నిలిపి వేసిన మనస్సు ఏడవ కేంద్రము వద్దకు వచ్చి తనశక్తి

చాలక నిలిచిపోయిన దానివలన చాటునున్న చేపపిల్ల కొంగను మ్రింగెను అని చెప్పడమైనది.


3. తత్త్వము.

చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరె చందమామ... 

1) కాయమను పుట్టలోను చందమామ, పాము మాయగానే మెలగుచుండు చందమామ   ||చ||.

2) జంట నాగ స్వరములూది చందమామ, పామును పాదు పెకలింపవలెను చందమామ  ||చ||.

3)తొమ్మిది వాకిల్లు మూసి చందమామ, పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ ||చ||.

4) భక్తియను కట్టుకట్టి చందమామ, పామును యుక్తిచేసి పట్టవలెను చందమామ ||చ||.


5)దేహ దేహములందు చందమామ, పాము తెలియకుండ చుట్టుకొన్నది చందమామ ॥చ.

6) అజప మంత్ర ద్యానము చేత చందమామ, పాము అఖండ కళలతో వెలుగుచునుండు చందమామ ॥చం||.

7)పామును బట్టే యోగి ఎవరు చందమామ, ఓహో అతని పేరు సిద్దగురుడు చందమామ ॥చం||.


వివరము :- ఈ తత్త్వము నేటికిని అక్కడక్కడ పల్లెజనము పాడుచునే ఉన్నారు. దీనిని వారందరికి అర్థమగులాగున

వివరించుకొందాము. ఈ తత్త్వములో మొదటి వాక్యములోనే సంధి తెలిపే జ్ఞానులెవరే అని వ్రాయబడి ఉన్నది. ఇద్దరి

మద్యన ఉండుదానిని సంధి అంటాము. ఉదాహరణకు పగలు రాత్రికి మద్యలో ప్రొద్దుక్రుంకు వేళను సంధికాలము

అంటున్నారు దానినే సంధ్యవేళ అంటున్నాము. రాత్రి పగలును కలుపు కాలమును సంధికాలము అన్నట్లు ఇద్దరు

మనుషులను కలుపు వ్యవహారమును సంధి చేయడము అని కూడ అనుచున్నాము. అలాగే జీవున్ని దేవున్ని కలుపుటకు

మద్యలోనున్న జ్ఞానమును సంధి అని అనుచున్నాము. జీవుడు దేవునితో కలుసుటకు ముందు సంధి చేయవలసి

ఉన్నది. ఆ సంధియను జ్ఞానమును తెలిపేవారు పూర్తి జ్ఞానపరులై ఉండవలెను. తనకు తెలియని జ్ఞానమును

వాక్యము రూపముతో చెప్పుచు ఈ జ్ఞాన వివరము తెలిపే వారెవరు అని అడిగినట్లు ఈ తత్త్వములో గలదు. పూర్వము

ఒక వ్యక్తి పున్నమిరోజున ఆరుబయట పడుకొని తనకు కల్గిన జ్ఞానసంశయములను గూర్చి చందమామను అడగడమును

తత్త్వరూపములో గలదు. చందమామ ఏమి వివరించుతాడో క్రింద చూచెదము.


1) కాయమను పుట్టలోను చందమామ, పాము మాయగానే మెలగుచుండు చందమామ ||చ||.


పాముల నివాసము పుట్టలని చాలామంది అనుకొనుట గలదు. పాముపుట్టలో ఉంటుందని పుట్టకు పూజలు

చేయువారిని కూడ చూచునేయున్నాము. పుట్టలో పాము నివాసము చేయునట్లు మన శరీరము అను పుట్టలో ఆత్మ

అను పాము నివాసము చేయుచున్నది. కావున కాయమను పుట్టలోన అన్నారు. పాముకు బుసకొట్టు స్వభావము

ఉన్నట్లు ఆత్మకు కూడ శ్వాస ద్వార సోహం అను బుసకొట్టు స్వభావము ఉన్నది. మాయం అయిపోయిందని అంటే

కనిపించకుండ పోయిందని అర్థము. మాయగా అంటే ఇక్కడ కనిపించకుండ అని అర్థము. శరీరములో ఆత్మ

కనిపించకుండ ఉన్నది. కావున పాము మాయగానే మెలగుచుండు అని పై వాక్యములో అన్నారు, శరీరములో ఆత్మ

కనిపించకుండ నివాసము చేయుచున్నదను వివరము మొదటి వాక్యములో గలదు.


2)జంట నాగ స్వరములూది చందమామ, పామును పాదు పెకలింపవలెను చందమామ ॥చం||.


శరీరములో గల ఆత్మను పాముగ పోల్చుకొన్నపుడు ఆ పామును పట్టే దానికి కూడ ఉపాయముగలదు.

సహజముగ పాములవారు నాగస్వరమును ఊది చుట్టచేసుకొని పాదుగపడుకొన్న పామును లేపి పట్టుకొనుచున్నాడు.

అలాగే శరీరములోని పామును పట్టుటకు రెండు ముక్కురంధ్రములలో ఆడుచున్న శ్వాసను నాగస్వరముగ ఉపయోగించు

కోవలసియున్నది. ముక్కు రంధ్రములలో ఆడుచున్న శ్వాసమీద ద్యాసను పెట్టకోవడము వలన ఇతర విషయముల

మీదికి మనస్సు పోకుండ నిలచిపోవును. అలా మనస్సును శ్వాసద్వార ఒక స్థాయికి తెచ్చుకొన్న తర్వాత శూణ్యస్థాయికి

చేర్చి ఆత్మ మీదికి సులభముగ మల్లించుటకు వీలుకల్గును. ఈ విధముగ శ్వాస ద్వార ఆత్మను తెలియవచ్చునన్న

ఉద్దేశముతో జంట నాగస్వరము ఊది పామును పాదు పెకలించవలెను అని అన్నారు.


3) తొమ్మిది వాకిల్లు మూసి చందమామ, పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ  ॥చం||.


శరీరమునకు కళ్లు రెండు రంధ్రములు, చెవులు రెండురంధ్రములు, ముక్కు రెండురంధ్రములు, నోరు ఒక

రంధ్రము, అలాగే క్రింద గుదము, గుహ్యము అను రెండు రంధ్రములు మొత్తము కలిపి తొమ్మిది రంధ్రములు గలవు.

అందువలననే శరీరమును తొమ్మిది రంధ్రములుగల పుట్ట అని అన్నారు. తొమ్మిది రంధ్రముల విషయములను మనస్సు

యొక్క ఆలోచనకు తెచ్చుకోకపోతే లోపలయున్న ఆత్మమీద మనోధ్యాస ఏర్పడును. దానివలన ఆత్మ తెలియును.

కావున తొమ్మిది వాకిల్లు మూసి పామును నెమ్మదిగ పట్టవలెనన్నారు. ఒక్క మారుగ మనస్సు ఆత్మ మీదికి పోదు

అందువలన కొంత సాధన ద్వార అది సాధ్యపడును. కావున పామును నెమ్మదిగ పట్టవలెను అన్నారు. సాధన ద్వార

బయటి విషయముల మీదికి మనస్సును పోనీయక లోపలనున్న ఆత్మ మీద నిలుపడమును చెప్పుచు తొమ్మిది వాకిల్లు

మూసి చందమామ పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ అని మూడవ చరణములో అన్నారు.


4) భక్తియను కట్టుకట్టి చందమామ, పామును యుక్తిచేసి పట్టవలెను చందమామ   ॥చం||.


శరీరములోని ఆత్మను దర్శించుకోవాలంటే మనిషికి భక్తియనునది ముఖ్యము. భక్తికి ఆత్మవశమై పోతుంది

కావున భక్తికలవారికి ఆత్మయందైక్యము లభించును. బయట పాములవాడు మంత్రము చేత కట్టుకట్టి పామును

కదలకుండచేసి పట్టుకొనుచున్నాడు. అదే విధముగ లోపలగల ఆత్మయను పామును భక్తియను మంత్రముచేత యోగము

అను యుక్తిచేత పట్టవలెనని నాల్గవచరణములో చెప్పారు.


5)దేహ దేహములందు చందమామ, పాము తెలియకుండ చుట్టుకొన్నది చందమామ ॥చం||.


అన్ని శరీరములలో ఆత్మ తెలియకుండ నివాసము చేయున్నది. కావున దేహదేహములందు పాము తెలియకుండ

చుట్టుకొన్నది అని ఐదవ చరణములో అన్నారు.


6) అజప మంత్ర ద్యానము చేత చందమామ, పాము అఖండ కళలతో వెలుగుచునుండు చందమామ ॥చం॥.


మన శరీరములో ఆడుచున్న శ్వాసయందు ఒక శబ్దము కలదు. శ్వాస ముక్కురంధ్రముల ద్వార లోపలికి

పోవునపుడు “సో” అను శబ్దముతో పోవుచున్నది. బయటికి వచ్చునపుడు “హమ్” అను శబ్దముతో వచ్చు చున్నది.

శ్వాస ఒకమారు లోపలికిపోయి బయటికి రావడములో “సోహమ్” అను శబ్దము ఏర్పడుచున్నది. ఈ సోహమ్


శబ్దములో “ఓం” శబ్దము ఇమిడి ఉన్నది. అదేవిధముగ అనగ లోపలికి పోవునపుడు 'సో' అను శబ్దముతో పోవుచున్నది

కదా! 'సో' అను శబ్దములో చివరిగ 'ఓ' అను శబ్దము వచ్చుచున్నది. అట్లే శ్వాస లోపలినుండి బయటికి వచ్చునపుడు

'హమ్' అను శబ్దముతో వచ్చుచున్నది కదా! 'హమ్' అను శబ్దములో చివరిగ 'మ్' అను శబ్దము వచ్చుచున్నది. శ్వాస

లోపలికి పోవునపుడు చివరిగ వచ్చు 'ఓ' అను శబ్దమును, శ్వాస బయటికి వచ్చునపుడు చివరిగ వచ్చు 'మ్' శబ్దమును

కలిపితే 'ఓమ్' అగుచున్నది. ఒక్కమారు శ్వాసలోపలికి పోయి బయటికివస్తే అందులో 'ఓమ్' కారము ఇమిడియున్నది.

శ్వాస ప్రతినిత్యము ఎల్లవేళల ఆడుచున్నది కావున 'ఓమ్' శబ్దము ఎల్లవేళల మనయందు జపించపడుచున్నది. మనము

ప్రయత్న పూర్వకముగ జపించకనే తానంతటికదే జపించ పడుచున్నది కావున ఓంకారమును అజపమంత్రము అన్నారు.

ముక్కు రంధ్రములలో జపించబడుచున్న 'ఓమ్' శబ్దము ఎల్లపుడు అఖండముగ సాగుచున్నది కావున ఆ మంత్రమును

స్వయముగ ఆత్మ ధ్యానించుచున్నదని ఆ ధ్యానములో అఖండముగ అందరిలో నిలిచియున్నదని ఆరవచరణములో

అన్నారు.


7) పామును బట్టే యోగి ఎవరు చందమామ, ఓహో అతని పేరు సిద్దగురుడు చందమామ ॥చం||.


అటువంటి పామును అనగ ఆత్మను పొందగలిగినవాడు యోగియై సిద్ధిపొందగలడని తెలుపుచు పామును

పట్టేయోగి సిద్దగురుడు అన్నారు.



4. తత్త్వము.


ఊదేతిత్తుల పైగానుండే ఉన్నతి తెలియర ఓరన్నా తిత్తుల నడుమను చక్షుల మీదను చీకటి కొట్టుర ఓరన్నా.


1)చీకటి కొట్టును తోక నాలుక తీసుక లేపర ఓరన్నా - చిఱ్ఱున తీసుక లేపిన కాకకు పాము లేచుర ఓంరన్నా.


2)శంకుచక్రముల నట్టనడుమ ఆది శేషుని లేపర ఓరన్నా - ఓంకారించుక ఉన్నది పాము కొరకక లేచుర ఓరన్నా.


3) ఆరుచక్రముల కావల ఈవల లోపల వెలుపల ఓరన్నా - ఆరుచక్రములు పెనుచుక పాము అదోముఖంబై

ఓరన్నా.


వివరము :- శరీరములో కుడి ఎడమగ రెండు ఊపిరితిత్తులున్నాయని అందరికి తెలుసు. రెండు తిత్తులనుండి వచ్చే

ఊపిరి ముక్కు ద్వారా బయటికి వస్తున్న విషయము కూడ అందరికి తెలుసు. ఊపిరితిత్తులు కదలుతుంటేనే శ్వాస

ఆడుచున్నదని కూడ అందరికి తెలియును. ఊపిరి తిత్తులు ఎలా కదులుచున్నవి, వాటిని ఎవరు కదలించుచున్నారన్న

విషయము ఎవరికి తెలియదు. ఊపిరితిత్తులను కదలించుశక్తి ఏదని తెలుసుకోవడమునే పై తత్త్వములో ఊదేతిత్తుల

ఉన్నతి తెలియర ఓరన్నా అన్నారు. మన శరీరములో రెండు ఊదేతిత్తుల (ఊపిరితిత్తుల) మద్యలోను మరియు పైన

రెండు కన్నుల మద్యలోను క్రింద గుదస్థానము మొదలుకొని పై శిరస్సు వరకు వెన్నుపూసల మద్యలో వెన్నుపాము

అనబడు నరముగలదు. పై తత్త్వములో పాము అన్నట్లు వెన్నుపాము పేరుకు పామువలె పొడవుగ ఆకారమున్నప్పటికి

అది మెదడు నుంచి క్రింది వరకు వ్యాపించిన ఒక పెద్దనరము. శరీరములో అతిపెద్ద నరము వెన్నుపాము ఒక్కటే. ఈ


నరములోనే మనిషిలోని చైతన్యశక్తి ఇమిడియున్నది. దానిని కుండలీశక్తియని కొందరనుచున్నారు. వాస్తవానికి అది

మన శరీరములోని ఆత్మశక్తియే. ఆత్మ అంటే ఏమిటి? దాని శక్తి అంటే ఏమిటి? అని కళ్లుమూసుకొని కళ్లమద్య

స్థానములోనికి చూచితే అంత చీకటిమయముగ కనిపించును. ఆ విషయమునే పై తత్త్వములో తిత్తుల నడుమను

చక్షుల విూదను చీకటికొట్టుర ఓరన్నా అని అన్నారు.


1) చీకటి కొట్టును తోక నాలుక తీసుక లేపర ఓరన్నా - తీసుక లేపిన కాకకు పాము చిఱ్ఱున లేచుర ఓరన్నా.


చీకటిమయముగ ఉన్న ఆత్మను పాముగ కూడ ఒక తత్త్వములో చెప్పుకొన్నాము మన ధ్యాసనంతటిని కన్నుల

మద్యలో భ్రూమద్యమున కేంద్రీకరించిన అది యోగమగును. యోగము యొక్క తీవ్రతకు ఆత్మ తెలియుటకు మొదలిడును.

ధ్యాసనంతటిని భ్రూమద్యన కేంద్రీ కరించడమును తోక నాలుక తీసుక అన్నారు. తోక చివరిది నాలుక అనగ

మొదటిది చిన్న ఆలోచనను, పెద్ద ఆలోచను అన్నిటిని లేకుండ చేసకోవడమును, లేక చివరి ఆలోచనను మొదటి

ఆలోచనను లేకుండ చేసుకోవడమును తోక నాలుక అనడమైనది. అన్ని ఆలోచనలను లేకుండ చేసుకుంటే ఆత్మ

తొందరగ తెలియును. పాము భూమి మీద పడుకొనియున్నపుడు కనిపించకుండ ఉండును. పైకిలేచి పడగెత్తితే

అంతకు కనిపించని పాము కనిపించును. ఆలోచనలు అనచినపుడు యోగమునకు ఆత్మ పైకిలేచిన పాము తెలిసినట్లు

తెలియగలదని మొదటి చరణములో చెప్పారు.


2) శంకుచక్రముల నట్టనడుమ ఆది శేషుని లేపర ఓరన్నా - ఓంకారించుక ఉన్నది పాము కొరకక లేచుర

ఓరన్నా .


శరీరములో వెన్నుపాము అను నరమునకు కుడి ఎడమగ రెండు నరములు గలవు. వెన్నుపామును బ్రహ్మనాడి

అని అనుచు కుడి ఎడమగవున్న రెండు నాడులను సూర్యచంద్రనాడులు అంటున్నారు. సూర్యచంద్రనాడుల నడుమయున్న

వెన్నుపామును ఆదిశేషుడని పై తత్త్వములో అన్నారు. సూర్యచంద్రనాడులను శంకుచక్రములని కూడ అన్నారు.

వెన్నుపాములోని ఆత్మశక్తి ఊపిరితిత్తులను కదలించుట వలన శ్వాస నడుచుచున్నది. శ్వాస నడుపునపుడు ఓంకార

శబ్దము ఏర్పడు చున్నది. ఈ విషయమునే రెండవ చరణములో తెలుపుచు శంకు చక్రముల నడుమను ఆదిశేషుని

లేపర ఓరన్నా - ఓంకారించుకయున్నది పాము అని అన్నారు.


3) ఆరుచక్రముల కావల ఈవల లోపల వెలుపల ఓరన్నా - ఆరుచక్రముల పెనుచుక పాము అదోముఖంబై

ఓరన్నా .


వెన్నుపాములో మొత్తము ఏడు నాడీకేంద్రములున్నవి. పైన ఏడవ నాడీకేంద్రములో ఆత్మ కేంద్రముగ ఉండి

క్రింది ఆరు కేంద్రముల వరకు వ్యాపించియున్నది. క్రింద ఆరు కేంద్రములనుండి శరీరమంత నరముల ద్వార ప్రాకి

శరీరమును చైతన్యవంతముచేసి కదలించుచున్నది. బ్రహ్మనాడిలోని ఆత్మ ఆరు కేంద్రములనుండి శరీరమంత వ్యాపించి

ఉన్నది. ఈ విషయమును తెలియజేస్తు ఆరుచక్రముల ఆవల ఈవల లోపల వెలుపల అన్నారు. పైన ఏడవకేంద్రము

నుండి క్రింది కేంద్రములకు వ్యాపించి యున్నది కావున ఆరుచక్రముల పెనుచుక పాము అదోముఖంబై ఓరన్నా అని

మూడవచరణములో అన్నారు. ఈ తత్త్వములో ఆత్మ వెన్నుపాములో పై నుండి క్రిందికి వ్యాపించి ఆరు కేంద్రముల


ద్వార శరీరమంతటిని కదలించుచున్నదని, శరీరములోని ఊపరితిత్తుల ద్వార శ్వాసను ఏర్పరచినదని తెలియుచున్నది.

శరీరములో తెలియక కనబడకయున్న ఆత్మను మనోధ్యాస ద్వార తెలుసుకోవచ్చునని కూడ పై తత్త్వములో తెలిపారు.

కొలిమితిత్తులవలె శరీరములోని ఊపిరితిత్తులు గలవు కావున వాటిని ఊదేతిత్తులు అన్నారు. ఊదేతిత్తుల ద్వార

శ్వాసను ఎల్లపుడు ఊదువాడు వెన్నుపాములోని ఆత్మని తెలియబడినది.


5. తత్త్వము.


ఈ జన్మమిక దుర్లభమురా ఓరీ సాజన్మ సాకార సద్గురుని కనరా ॥ ఈ జన్మ॥.


1. పంచాక్షరి మంత్రము పఠన చేయరన్న

పఠన చేసిన యముడు పారిపోవునన్నా,

పారిపోతే అంబఫలమిచ్చునన్న

ఫలమునందిన వాడు పరమగురుడన్నా.

||ఈ జన్మ॥.


2.మూడారు వాకిల్లు మూయవలెనన్న

ముక్తివాకిట నిలచి తలుపు తీయన్నా

తలుపు తీసిన అంబతేజమిచ్చన్న

తేజమందినవాడు తాగురుడోయన్నా.

||ఈ జన్మ॥.


3.ఆరునదుల మీద అంబయున్నదన్న

అంబతో దుర్గాంబ ఆటలాడునన్నా

ఆట్లాటలో మంచి అర్థమున్నాదన్న

అర్థమెరిగినవాడు తాహరిగురుడన్నా.

॥ఈ జన్మ॥.


4.నాసికముపై దృష్ఠి నడిపించుమన్న

నడిపించి హరిని నీవు నమ్మియుండన్నా

నమ్మి నవరత్నముల పీఠమెక్కన్న

పీఠమెక్కిన అంబ పిలుచునోయన్నా.

॥ఈ జన్మ॥.


5.జంట త్రోవల రెండింటి ఊదన్న

అంటి యూది మేన్మరచి యట్టే నిలువన్నా

మేను మరచి ఘంటానాదము వినుమన్న

నాదమువిని పోతులూరిని నమ్మియుండన్నా.

॥ఈ జన్మ॥.


వివరము :- భూమి మీద ఎన్నో జీవరాసులు గలవు. వాటి అన్నిటిలో తెలివైనది మానవజన్మ. ప్రపంచ జ్ఞానములో

తెలివైనదైనప్పటికి పరమాత్మ జ్ఞానములో తెలియనిదే. అందువలన తెలివైన మానవజన్మలోనే తెలియని దైవజ్ఞానము

తెలుసుకోవాలి. ఎంత తెలివియున్నవాడైనప్పటికి పరమాత్మ జ్ఞానము తెలియాలంటే తప్పనిసరిగ గురువు అవసరము.


చాలా సూక్ష్మమైన జ్ఞాన విషయములు వివరించి చెప్పుటకు సద్గురును వెదకి ఆయనవద్ద జ్ఞానము తెలుసుకోవాలి.

కావున పై తత్త్వములో ఈ జన్మమిక దుర్లభమురా ఓరీ సాజన్మ సాకార సద్గురుని కనరా అన్నారు.

1.పంచాక్షరి మంత్రము పఠన చేయరన్న

పఠన చేసిన యముడు పారిపోవునన్నా,

పారిపోతే అంబఫలమిచ్చునన్న

ఫలమునందిన వాడు పరమగురుడన్నా.

||ఈ జన్మ॥.


పంచాక్షరి అంటే ఐదు అక్షరములతో కూడుకొన్న మంత్రమని అందరు అనుకొంటారు. అందరు అనుకొను

మంత్రము “ఓం నమః శివాయ”. ఈ మంత్రములో ఐదు అక్షరములుకాక ఆరు అక్షరములు గలవు. కావున ఈ

మంత్రము యొక్క అసలైన వివరమును తెలుసుకొందాము. అక్షరము అనగ నాశనముకానిదని అర్థము. క్షరము

అనగ నాశనము అని అర్థము. ఐదు అనగ ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అను పంచభూతములని తెలుసుకోవలెను

జ్ఞానము ప్రకారము ఐదు పంచ భూతములకు సర్వ జీవరాసులు నశించిపోవుచున్నవి. పంచభూతముల వలన జీవులు

పుట్టుచున్నవి, అలాగే జీవరాసులన్ని పంచభూతములలోనే లయమైపోవుచున్నవి. పంచభూతములకు నాశనముకానిది

ప్రపంచములో ఒకటే గలదు అదియే దేవుడు. దేవున్ని 'ఓం' అని ఒక గుర్తుగ మన పెద్దలు పెట్టారు. మిగత

పంచభూతములకు కూడ అలాంటి గుర్తులనే ఉంచారు. ఆకాశమునకు 'న' అనియు, గాలికి ‘మః' అనియు, అగ్నికి ‘శి’

అనియు, నీరుకు 'వా' అనియు, భూమికి 'య' అనియు గుర్తులు కల్పించారు. పంచభూతములకు కల్పించిన ఐదు

గుర్తులను భీజాక్షరములన్నారు. పంచభూతములకు భీజాక్షరములు వరుసగ 'నమః శివాయ అని ఉండగ

పంచభూతములకు నాశనముకాని దేవునికి 'ఓం' అను భీజాక్షరముగలదు. దేవుడు పంచభూతములకు నశించడు

కావున పంచఅక్షరి అని ఓం ను అన్నారు. పంచాక్షరి అనగ ఐదుకు నాశనము కానిదని అర్ధము. పంచాక్షరి

మంత్రములో ఐదు భూతములైన ప్రకృతి, వాటికి నాశనముకాని పరమాత్మను కలిపి చెపారు. దానినే “ఓం నమః

శివాయ" అన్నారు. పంచాక్షరి మంత్రము యొక్క అర్థము తెలిసి దానినే ధ్యానించుచున్నవాడు ఎరుక కల్గియుండును.

ఆ ధ్యానము చేత యోగము ఏర్పడును. యోగము వలన కర్మలు నశించుచుపోవును. కర్మలున్నపుడు కదా యముడు

మనలను బాధించేది. బాధపడు కర్మలు యోగముచేత కాలిపోవుట వలన యముడు కూడ ఏమి చేయలేడు. అందువలన

ఈ తత్త్వములో పంచాక్షరిమంత్రము పఠనచేయరన్న పఠనచేసిన యముడు పారిపోవునన్నా అని మొదటి చరణములో

చెప్పారు. ఎపుడు కర్మలు లేకుండపోవునో అపుడు పరమాత్మ మోక్షమను పండును ఇచ్చును. మోక్షము పొందినవాడు

పరమగురుడని చెప్పారు. మోక్షమును పండు అని వర్ణించినవారు పరమాత్మను అంబ అని వర్ణించారు. పరమాత్మ

ఇచ్చునదే పరమపదము కావున అంబ ఫలమిచ్చునన్నారు.



2. మూడారు వాకిల్లు మూయవలెనన్న

ముక్తివాకిట నిలచి తలుపు తీయన్నా

తలుపు తీసిన అంబతేజమిచ్చన్న

తేజమందినవాడు తాగురుడోయన్నా.

||ఈ జన్మ॥.


మన శరీరమునకు మొత్తము తొమ్మిది రంధ్రములు గలవు. వాటినే తొమ్మిది వాకిల్లు అన్నారు. శరీరము మీద

ద్యాసలేకుండ చేయడమును తొమ్మిది వాకిల్లు మూసివేసినట్లన్నారు. అజ్ఞానమునుండి జ్ఞానములో ప్రవేశించుటకు

కనిపించని ఒక వాకిలి గలదు. దానినే ముక్తివాకిలి అన్నారు. ఒక మనిషి తన శరీరము మీద ద్యాసలేకుండ చేసుకొని

తన జ్ఞానము ద్వార యోగములోనికి ప్రవేశించడమును పై తత్త్వములో మూడారు (మూడు ఆరు మొత్తము తొమ్మిది)

వాకిల్లు మూయవలెనన్న ముక్తివాకిట నిలిచి తలుపుతీయన్నా అని అన్నారు. ఆ విధముగ శరీరము మీదకూడ ద్యాసలేకుండ

జ్ఞానము ద్వార ముక్తివాకిలి తెరచి బ్రహ్మయోగము లోనికి పోయిన వానికి ఆత్మ తెలియును. ఆత్మ తెలియడము ద్వార

జ్ఞానశక్తి లభించును. ఆత్మ ద్వార ఆ జ్ఞానాగ్నిని కల్గినవాడు తనకున్న కర్మలను కట్టెలను పూర్తిగ కాల్చివేసుకొని

మోక్షము పొందును. అందువలన తలుపుతీసిన అంబ తేజమిచ్చునన్నా తేజమందినవాడు తాగురుడోయన్నా అని రెండవ

చరణములో రెండవవాక్యమునందు చెప్పారు. మూడారు వాకిల్లు శరీరములోని తొమ్మిది రంధ్రములని, తలుపు

తీయడమంటే యోగము పొందడమని, అంబతేజమును జ్ఞానాగ్ని వెలుగని, అంబ అనగ ఆత్మని, కర్మ కాలిపోయి

మోక్షము పొందినవానిని గురుడని పై చరణములో తెలిపారు.


3. ఆరునదుల మీద అంబయున్నదన్న

అంబతో దుర్గాంబ ఆటలాడునన్నా

ఆట్లాటలో మంచి అర్థమున్నాదన్న

అర్థమెరిగినవాడు తాహరిగురుడన్నా.

||ఈ జన్మ॥.


మన శరీరములో అతిపెద్దనాడి బ్రహ్మనాడి. దానినే సుసుమ్ననాడి అని కూడ అంటుంటారు. ఈ నాడిలో

మొత్తము ఏడుకేంద్రములు గలవు. ఆరు కేంద్రములకు పైన ఏడవకేంద్రములో ఆత్మ నివాసము చేయుచున్నది.

అందువలన మూడవ చరణములో క్రింది ఆరు నాడి కేంద్రములను ఆరు నదులుగ పోల్చి, పైన ఏడవ కేంద్రములోనున్న

ఆత్మను అంబ అని, ఆరు నదుల మీద అంబ ఉందన్నారు. ఆత్మ పరమాత్మ స్వరూపమైన 'ఓం' అను పంచాక్షరితో

శ్వాసను నడుపుచున్నది కావున శ్వాసనడుచుటను ఆట అని, శ్వాసలో ఇమిడియున్న 'ఓం'ను మంచి అర్థమని, ఓంకారమును

తెలిసినవాడు ఆటలోని అర్థము తెలిసినవాడని, పరమాత్మలోనికి ఐక్యమైనవానిని హరిగురుడని కూడ ఈ చరణములో

చెప్పారు.



4.నాసికముపై దృష్ఠి నడిపించుమన్న

నడిపించి హరిని నీవు నమ్మియుండన్నా

నమ్మి నవరత్నముల పీఠమెక్కన

పీఠమెక్కిన అంబ పిలుచునోయన్నా.


||ఈ జన్మ॥.


నాశికము అనగ ముక్కు. ఈ తత్త్వములో నాశికముపై అన్నారు. నాశికాగ్రము (నాశికము పై) అంటే ఏమిటో

తెలియక చాలామంది సాధకులు తికమకపడుచున్నారు. పై భాగమును అగ్రభాగము అని అంటాము. ముక్కు పై

భాగమును నాశికాగ్రము అని ఆధ్యాత్మిక విద్యలో చాలా చోట్ల చెప్పారు. నాశికాగ్రముపై దృష్టి నిలుపమని పెద్దలు

చెప్పితే అది అర్థముకాక, తమ మనోద్యాసను ముక్కు పై భాగమునగల ఏడవ కేంద్రములో నిలుపవలెనని తెలియక,

బయటి దృష్టిని ముక్కు క్రిందికొన భాగములో నిలిపి చూచువారు కొందరు గలరు. మరి కొందరు ముక్కు పై భాగమైన

కనుబొమల మధ్య భాగములో చూపును నిలిపి చూచువారు గలరు. పై చూపుతో చూచు ఈ రెండు విధానములు

తప్పని, చూపు అనగ మనోదృష్ఠి అయిన ధ్యాస అని, నాశికాగ్రము అనగ లోపల గల ఏడవ నాడీకేంద్రమని తెలియదు.

ఏడవ నాడీ కేంద్రములో ఆత్మ నివాసమున్నది. ఏడవ కేంద్రములో మనో దృష్ఠిని నిలుపగా కొంతకాలమునకు ఆత్మ

తెలియును, ఆత్మను తెలిసిన తర్వాత పరమాత్మను పొందవచ్చును. ఈ విషయమును తెలియజేయుచు పై తత్త్వములోని

నాల్గవ చరణములో నాశికముపై దృష్టి నిలుపన్నా అన్నారు. ఆత్మ నివాసమును నవరత్న పీఠముగ వర్ణిస్తు, సప్తస్థానము

చేరినవానిని పీఠమెక్కినవాడని అన్నారు. అంబ అనగ ఆత్మయని, ఆత్మద్వార పరమాత్మను చేరడమును అంబపిలుపని

ఈ చరణములో చెప్పారు. ఈ విధముగ ఏడవకేంద్రములో మనస్సును నిలిపి బ్రహ్మయోగము పొందడమును గురించి

చెప్పారు.


5.జంట త్రోవల రెండింటి ఊదన్న

అంటి యూది మేన్మరచి యట్టే నిలువన్నా

మేను మరచి ఘంటానాదము వినుమన్న

నాదమువిని పోతులూరిని నమ్మియుండన్నా

॥ఈ జన్మ॥.



శరీరములోని పెద్దనాడి అయిన బ్రహ్మనాడినుండి వచ్చు ఆత్మ చైతన్యము ఊపిరితిత్తులకు చేరి వాటిని కదలించి

శ్వాస ఆడునట్లు చేయుచున్నది. శ్వాస రెండు ముక్కురంధ్రముల ద్వార ఆడుచున్నది. రెండు ముక్కురంధ్రములలో

ఆడుచున్న శ్వాసను ప్రయత్నము చేసి కుంభకము అను సాధన ద్వార నిలబెట్టగలిగినపుడు శరీరములో అన్ని కదలికలు

నిలిచిపోవును. శరీరమునంతటిని మరచి మనస్సు ఒకే ధ్యాసలో నిలిచిపోవును. అపుడు శరీరములోని ఆత్మ తెలియును.

గంటానాదము ఏకస్థాయి శబ్దము కల్గియున్నట్లు ఒకే స్థాయిలో ఆత్మను తెలియువాడు నిజయోగి అగును. ఈ విషయమును

చెప్పుచు రెండు ముక్కురంధ్రములలో శ్వాసను లోపలికి పీల్చినిలుపడమును జంటత్రోవల రెంటినంటి ఊదన్నా

అన్నారు. శరీరము మీద ద్యాసలేకుండ మనస్సు నిలచి పోవడమును మేనుమరచి అట్టే నిలువన్నా అన్నారు. ప్రపంచ

విషయములను వదలి నిలచిపోయిన మనస్సు ఆత్మను తెలియగల్గు చున్నది. కావున గంటానాదము వినుమన్నా

అన్నారు. ఇట్లు శ్వాసద్వార బ్రహ్మయోగమును పొంది ఆత్మను తెలియు విధానమును ఈ తత్త్వములో వర్ణించి

చెప్పారు.




6. తత్త్వము

చిల్లర రాళ్ళకు మ్రొక్కుచువుంటే చిత్తము చెడునుర ఒరేయొరే

చిత్తమునందు చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే.



1.ఒక్క ప్రొద్దులని ఎంచుచుయుంటే ఒనరుగ చెడుదువు ఒరేయొరే

ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే  .


2.నీల్లలో మునిగి గొనుగుచుయుంటే నిలకడ చెడునుర ఒరే యొరే

నీలోయుండే నిర్మల జ్యోతిని చూచుచునుండుట సరే సరే .


3.బాధ గురువుల పంచను జేరితే భావము చెడునుర ఒరే యొరే

భావమందున బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే .


4.భూములు అడవులు తిరుగుచునుంటే బుద్దులు చెడునుర ఒరేయొరే

బుద్దిలోయుంటే పున్నమిచంద్రుని చూచుచునుండుట సరే సరే  .


5.వీరయ్య చెప్పిన వాక్కును నమ్మితె వివరము తెలియును ఒరేయొరే

వివరమందుండె విగ్రహమూర్తిని చూచుచునుండుట సరే సరే.



వివరము : 5160 సంవత్సరముల పూర్వము చెప్పిన ఇందూమత గ్రంథమైన భగవద్గీతలోను, 2005 సంవత్సరముల

పూర్వము చెప్పిన క్రైస్తవ మతగ్రంథమైన బైబిలులోను మరియు దాదాపు 1420 సంవత్సరముల పూర్వము చెప్పిన

ఇస్లామ్ మతగ్రంథమైన ఖురాన్లోను ఏకేశ్వరోపాసన చెప్పబడినది. అందరికంటే మించిన దేవుడొకడున్నాడని, అతనినే

ఆరాధించవలెనని మత గ్రంథములన్నియు ఘోషిస్తున్నవి. అయినప్పటికి మానవులు అందరికంటే గొప్పవాడైన

పరమాత్మను ఆరాధించక అన్యదేవతారాధనలలో మునిగిపోయారు. అసలైన దేవున్ని మరచి చిల్లర దేవుల్లను మ్రొక్కను

మొదలు పెట్టారు. అందరిలోను, అన్ని స్థలములలోను ఎల్లవేళల అంతట వ్యాపించివున్న పరమాత్మ జ్ఞానము తెలియక

మిగత చిల్లర దేవుల్లను గొప్పగ పెట్టుకొన్నారు. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నియమము ప్రకారము పూజలు చేయుచున్నారు.

తనలోనే ఉన్న పరమాత్మను గుర్తించలేక కొందరు తీర్థయాత్రలు, కొందరు వ్రతక్రతువులు, కొందరు యజ్ఞయాగాదులను

చేయుచున్నారు. చివరకు ఇవన్ని వృథాప్రయాసలని తెలుసుకొన్నవారు దేవుని జ్ఞానమును పొందు చున్నారు. ఈ

విధముగ అసలైన దేవుని జ్ఞానము తెలిసిన పెద్దలు జ్ఞానము తెలియనివారిని గూర్చి తత్త్వరూపములో చెప్పిన దానిని

క్రింద వివరించుకొందాము.


చిల్లర రాళ్ళకు మ్రొక్కుచువుంటే చిత్తము చెడునుర ఒరేయొరే

చిత్తమునందు చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే .


సర్వ సృష్టికి మూలకర్త అయిన పరమాత్మ విశ్వమంత వ్యాపించి అణువణువున నిండియున్నాడు. మానవజన్మ

యొక్క అంతరార్థము పరమాత్మను తెలుసుకోవడమే, అయినప్పటికి ఆ దేవున్ని తెలుసుకొను జ్ఞానము తెలియకుండ

పోయినది. జ్ఞానము తెలియక మాయలో మునిగియున్న మానవులు తమలోని భక్తిని దేవుడైన పరమాత్మ మీద కాక


మాయయైన చిల్లర దేవుల్ల మీద చూపుచున్నారు. దేవుడు కానటువంటి మాయయైన చిల్లర దేవుల్లను మ్రొక్కడము

వలన మనిషిలోని చిత్తము అనేక భ్రమలలో మునిగిపోవుచున్నది. అనేక దేవుల్లలో ఏ ఒక్క దేవుని మీదను కాక అనేక

దేవుల్లను పండుగలను బట్టి, కోర్కెలను బట్టి పూజించుట వలన చిత్తములో ఏమాత్రము శాంతి ఏర్పడక మనిషి

అశాంతితో మునిగిపోవుచున్నాడు. కావున జ్ఞానము తెలిసిన పెద్దలు పై తత్త్వములో చిల్లర రాల్లకు మ్రొక్కుచుయుంటే

చిత్తము చెడునుర అన్నారు. దైవజ్ఞానము తెలిసినవారు చిల్లర దేవుల్ల వ్యామోహములో పడక, కనపడిన ప్రతి బొమ్మకు

మ్రొక్కక, శరీరములోనే దేవుడున్నాడని, మిగతవారు అసలైన దేవుడు కాలేరని, శరీరములోనే దేవున్ని తెలుసుకొనుటకు

ప్రయత్నంచు చుందురు. అటువంటివారు చిత్తములోని చిన్మయజ్యోతిని చూచుకోవడమే మంచిదని తెలిపారు.


1. ఒక్క ప్రొద్దులని ఎంచుచుయుంటే ఒనరుగ చెడుదువు ఒరేయెరే

ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే.


శరీములోని పరమాత్మను తెలుసుకొను జ్ఞానములేనివారు శరీరము నకు బయటగల ప్రతిమలను అనేక దేవుళ్ల

పేరుతో ఆరాధించుచుందురనుకొన్నాము కదా! అటువంటి ఆరాధనలలో ఉపవాసములు ఉండుట కూడ కొందరు

చేయుచుందురు. ఉపవాసముల వలన ఆరోగ్యమే చెడునుకాని శరీరములోని దేవుడు తెలియడు. ఉపవాసముల వలన

ఆత్మకు శక్తిలేకుండపోవును. ఆత్మ బలహీనపడును. అందువలన ఆత్మను ఇబ్బంది పెట్టినవారమగుదుము. ఇదే

విషయమునే భగవద్గీతలో శ్రద్ధాత్రయయోగమను ఆధ్యాయములో 4,5,6వ శ్లోకములలో ఇతర దేవతల పూజచేయువారు

అశాస్త్రీయపద్దతులను ఆచరించుచు, వారు బాధపడునది కాక వారిలోపలనుండు నన్ను కూడ బాదింతురని దేవుడు

అన్నట్లు కలదు. కావున ఉపవాసముల వలన తానైన జీవాత్మ బాధపడునదే కాక లోపలయున్న ఆత్మను కూడ

బాధించినవారమగు చున్నాము. అందులన ఉపవాసముల వలన ఏమి ప్రయోజనములేదని తెల్పుచు ఒక్కప్రొద్దులని

ఎంచుచువుంటే ఒనరుగ చెడుదువు అని పై తత్త్వములో చెప్పారు. అంతేకాక అంతట వ్యాపించివున్న పరమాత్మను

తెలియడమే మంచిమార్గమని తెలుపుచు ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే అన్నారు.


2. నీల్లలో మునిగి గొనుగుచుయుంటే నిలకడ చెడునుర ఒరే యొరే

నీలోయుండే నిర్మల జ్యోతిని చూచుచు నుండుట సరే సరే.



కొందరు మంత్రోపదేశములను పొంది ఆ మంత్రములను నియమము ప్రకారము జపించుచుందురు. అటువంటి

నియమములలో నీటిలో గొంతువరకు దిగి లేక నడుముల వరకు దిగి జపించవలెనను పద్దతులుండును. అట్లు

జపించుటవలన మంత్రము మీద ద్యాస పెరుగునని వారి నమ్మకము. ఈ విధముగ నీటిలో దిగి మంత్రజపము

చేయుట వలన, నీటిలో మునిగి శివుని జపము చేయుటవలన లేని ఆస్తమ (ఉబ్బస) రోగము వచ్చును కాని మనసు

కుదుటపడదు. ఏమాత్రము జ్ఞానము అభివృద్ధిచెందదు. అట్లు బయటి పూజలకు జపములకు అలవాటుపడుట వలన

మన శరీరములో ఉండే నిర్మల జ్యోతియైన పరమాత్మను తెలియలేము. దేవుడు తెలియాలంటే నిజమైన భక్తి అవసరము.

ఆ నిజమైన భక్తి మన శరీరములోని దైవము మీద చూపడమే సరియైనది. అట్లుకాక బాహ్యాచరణ వలన, అన్యదేవతల

ఆరాధనల వలన ఎవరికి అంతరంగములోని దేవుడు తెలియడు. అందువలన ఈ తత్త్వములో నీల్లలో మునిగి

గొనుగుచువుంటే నిలకడ చెడునుర అన్నారు. అంతేకాక నీలోయుండే నిర్మల జ్యోతిని చూచుచు నుండుట సరే సరే

అన్నారు.


3.బాధ గురువుల పంచను జేరితే భావము చెడునుర ఒరే యొరే

భావమందున బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే.


ఇప్పటి కాలములో భూమి మీద రెండు రకముల గురువులు గలరు. ఒక రకము బాధ గురువులు, రెండవ

రకము బోధ గురువులు. శరీరమునకు పని కల్పించి దానిద్వార దేవున్ని తెలుసుకోవచ్చునని తెల్పెడివారు బాధ

గురువులు. శరీరమునకు బాధను కల్పించు వారందరు బాధ గురువులే. ఉదాహరణకు దేవుని ప్రతిమకు ప్రదక్షణలు

చేయమని చెప్పెడి గురువులు బాధగురువులే అగుదురు. అట్లు ప్రదక్షణము చేయడము పని అగుచున్నది దానివలన

శరీరమునకు శ్రమ ఏర్పడు చున్నది. ఈ విధముగ శరీరముతో చేయు ఆరాధనలను చెప్పువారు కాని, మంత్రము

చెప్పు గురువులుకాని బాధగురువులే అగుదురు. ఈ విషయమునే వేమనయోగి తన పద్యములో,


కర్మల చెప్పువాడు కడగురుడు

మంత్రము చెప్పువాడు మద్యమ గురుడు

ఊరుండుమనువాడు ఉత్తమ గురుడు

విశ్వదాభిరామ వినరవేమా.


అన్నాడు. శరీరశ్రమను కల్గించు బోధనలు చేయువారందరు బాధగురువు లని చెప్పడమే ఈ పద్యములోని అంతరార్థము.

భక్తిలో పనులు చెప్పువారు తక్కువ గురువని, అలాగే మంత్రము చెప్పి దాని పనిలో ఉండమనువాడు మద్యమ గురుడని

వేమనయోగి అన్నాడు. అట్లే శరీరముతో ఏ పనులు లేకుండ, మనస్సుతో కూడ పనిలేకుండ, ఏ సంకల్పము లేకుండ

ఉండమని బోధించువాడు ఉత్తమగురుడని అతనే బోధ గురువని అట్లు చెప్పకుండ మనస్సుతోకాని శరీరముతోకాని

పని కల్పించు బోధ చేయు వారందరు బాధ గురువులని చెప్పారు. అందువలన ఈ తత్త్వములో బాధ గురువుల

పంచను చేరితే భావము చెడునుర అన్నారు. మనస్సును నిలిపి ఆత్మదర్శనమును చేసుకోవడము సరియైనపద్దతని

తెలుపుచు భావమందున బ్రహ్మకాంతిని చూచుచునుండుట సరే సరే అన్నారు.


4. భూములు అడవులు తిరుగుచునుంటే బుద్దులు చెడునుర ఒరేయొరే

బుద్దిలోయుండే పున్నమిచంద్రుని చూచుచునుండుట సరే సరే.



ఎంతోమంది దైవభక్తి కల్గినవారు గలరు. వారికి దైవభక్తి ఉంది కాని దేవుడెవరని తెలియదు. అట్లు తెలియక

పోవడము వలన తీర్థయాత్రలను పేరుతో ఎందరో దేవుల్లను దర్శించుచుందురు. ఎన్నో పుణ్యక్షేత్రములను చూచుచుందురు.

ఈ విధముగ చేసినప్పటికి అసలైన జ్ఞానము తెలియదు, అసలైన దేవుడు తెలియబడడు. తీర్థయాత్రలచే పుణ్యక్షేత్రములను

దర్శించుట వలన పుణ్యమొచ్చునేమోకాని జ్ఞానము మాత్రము రాదు. అవి కేవలము పుణ్యక్షేత్రములు మాత్రమే, కాని

జ్ఞాన క్షేత్రములు కాదుకదా! భూమి మీద కొన్ని క్షేత్రములను దర్శించి దైవదర్శనము చేసుకొన్నామనుకొనుట శుద్దపొరపాటు.

నిజదైవము కొన్ని పుణ్యక్షేత్రములలోనే కాక భూగోళమంతయు నిండియున్నాడు. దేవుడు బాహ్యముగ తెలియువాడు

కాడు, కనుక శరీరమను క్షేత్రములోపలే దర్శించుకోవలసియున్నది. ఆ విషయము మనకు తెలియుటకు ఈ తత్త్వములో

భూములు అడవులు తిరుగుచువుంటే బుద్దులు చెడునుర ఒరే ఒరే అన్నారు. శరీరములోనే దైవము తెలియునని

చెప్పుటకు బుద్దిలోవుండే పున్నమి చంద్రుని చూచుచునుండుట సరే సరే అన్నారు. ఈ తత్త్వమును చూచిన తరువాతయైన



మనము బాహ్యముగనున్న భక్తిని వదలి అంతరంగములో భక్తిని కల్గి లోపలేయున్న దేవున్ని తెలియవలెనని

తెలుపుచున్నాము.



7. తత్త్వము.


నేజూచినానే బ్రహ్మమునాలో నేజూచినానే సద్గురునాలో నేజూచినానే

నేజూచినానే తలలో తారకయోగమందు రంజిల్లు నాగురుని నేజూచినానే.


1.కన్నుల నడుమను సన్నపు దిద్దిన తిన్నగా వెలిగేటి పున్నమి చంద్రుని నేజూచినానే.

2.పాలభాగమందు నీలజ్యోతులనడుమ నోలలాడుచున్న పరలింగ మూర్తిని నేజూచినానే.

3.చూపులోపల పాపల నడుమను వ్యాపించి వెలిగేటి ఆపరంజ్యోతిని నేజూచినానే.

4.చక్షురాగ్రమునందు పశ్చిమవీథిని నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని నేజూచినానే.

5.చందమామకు నడుమను కుండలాకృతిని ఆనందముగనున్న హరి గోవిందుని నేజూచినానే.



వివరము : ఇంతకుముందున్న తత్త్వములో బాహ్యముగ దేవున్ని తెలియ లేము అని తెలుసుకొన్నాము. ఆ విషయము

తెలిసిన కొందరు అంతర్ముఖ జ్ఞానమును సంపాదించి బయటి చింతలు వదలివేసి శరీరము లోపలనే ఆత్మను దర్శించుకొన్న

విధానమును ఇప్పటి తత్త్వములో తెలియజేశారు. వారు శరీరములో తెలుసుకొన్న విధానమును గురించి ఏమంటున్నారో

క్రిందచూచెదము.


బ్రహ్మ అనగా పెద్ద అని అర్థము, బ్రహ్మము అనగా ప్రపంచములో అన్నిటికంటే పెద్దది దైవము. కనుక

దేవున్ని బ్రహ్మము అని పిలుచు చున్నాము. బ్రహ్మ అనగా త్రిమూర్తులలో ఒకరైన మూడుతలల బ్రహ్మని ఇక్కడ

అనుకోకూడదు. అలాగే గురువు అనిన దేవుడనియే ఇక్కడ అర్థము చేసుకోవలెను, కాని మంత్రోపదేశమిచ్చు గురువు

అని అనుకోకూడదు. శరీరములో యోగము ద్వారానే ఆత్మను తెలియవచ్చును. శరీరములో ధ్యాసనుంచి ఆత్మను

తెలియు విధానమును యోగము అంటున్నాము. ఈ విధముగ యోగము ద్వార లోపలి ఆత్మను నే తెలుసుకొన్నానని

ఒక యోగి చెప్పుచు నేజూచినానే నాలో బ్రహ్మము నేజూచినానే అన్నాడు.


1. కన్నుల నడుమను సన్నపు దిద్దిన తిన్నగా వెలిగేటి పున్నమి చంద్రుని నేజూచినానే॥నేజూ॥

రెండు కన్నుల నడుమ శరీరము లోపల మూడు నాడుల కలయిక కలదు. శరీరము లోపల మూడులక్షల

యాభైవేల నాడులలో ముఖ్యమైనవి సూర్య, చంద్ర, బ్రహ్మనాడులు. ఈ మూడునాడులలో సూర్య, చంద్రనాడులు

బ్రహ్మనాడితో కన్నుల మద్యలోనే కలసిపోవుచున్నవి. దీనినే త్రికూట స్థానము అంటున్నాము. ఈ స్థానములోనే మనిషి

ఎరుక (జ్ఞప్తి) అంతయువుండును. ఈ ఎరుకనే ఆత్మ అంటున్నాము. మనిషి యోగముచేత మనస్సు యొక్క సంకల్పములను

లేకుండ చేసుకొనిన ఏ ఆలోచనలేని ఎరుక మాత్రము మిగిలిపోవును. ఆలోచనలేని ఎరుకను చూచుచుయుండడమే

నిజమైన యోగమగును. అపుడు తెలియబడు ఆత్మను పున్నమి చంద్రునిగ పోల్చి ఈ తత్త్వములో కన్నుల నడుమను

సన్నపుదిడ్డిన తిన్నగా వెలిగేటి పున్నమి చంద్రుని నేజూచినానే అన్నారు. ఇక్కడ సన్నపుదిడ్డి అనగా బ్రహ్మనాడిలో

సూక్ష్మముగ ఉన్న అని అర్థము. వెలిగేటి పున్నమి చంద్రుడు అంటే త్రికూట స్థానములోనున్న ఆత్మ అని అర్థము.



2.

పాలభాగమందు నీలజ్యోతులనడుమ నోలలాడుచున్న పరలింగ మూర్తిని నేజూచినానే॥ నేజూ॥

ఇదే విషయమునే క్రింది చరణములో కూడ చెప్పుచున్నారు. తల పాలభాగమునందు లోపల రెండు నాడుల

నడుమనున్న బ్రహ్మనాడిలో ఆత్మ నివశిస్తువున్నది. కావున పాలభాగమున నీలజ్యోతుల నడుమ నోలలాడుచున్న

వరలింగమూర్తిని నేజూచినానే అన్నారు. ఇక్కడ లింగమూర్తి అనగ ఆత్మ అనియు, నీలజ్యోతుల నడుమ అనగ సూర్యచంద్ర

నాడుల మద్య అని అర్థము.


3. చూపులోపల పాపల నడుమను వ్యాపించి వెలిగేటి ఆపరంజ్యోతిని నేజూచినానే ||నేజూ||

శరీర మద్యలో గల బ్రహ్మనాడిలో ఆత్మ నివాసముంటు శరీరమంత వ్యాపించియున్నది. ప్రపంచ వస్తువులను

చూపించు కల్లలో గల చూపుకు కాంతినిచ్చునది ఆత్మయే. అందువలన చూపులోపల పాపలనడుమను వ్యాపించి

వెలిగేటి పరంజ్యోతిని నేజూచినానే అన్నారు. పరం జ్యోతి అనగ ఆత్మ అని అర్థము.


4.చక్షురాగ్రమునందు పశ్చిమవీథిని నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని నేజూచినానే॥ నేజూ॥

ఇదే విషయమునే క్రింది చరణములో కూడ చెప్పారు. కన్నులకొనలకు ముందుగల స్థానములో నివాసమున్న ఆత్మను

చూచానని చెప్పుచు చక్షురాగ్రమున పశ్చిమ వీధిని నిక్షేపమై వెలుగు సాక్షిభూతుని నాలో నేజూచినానే అన్నారు.


8. తత్త్వము.


మూడుకాల్వలు దాటలేరయ్యా ఇల మూఢజనులు మూడుకాల్వలు దాటలేరయ్యా

మూడుకాల్వలతోను కూడుచు ఇడపింగళ మద్యమంబున చేరివుండని మూడు లెల్లరు.


1.ఓడ లేకను ఈద బొయ్యేరు - సంసారవారధిలో జాడ తెలియక మునిగిపొయ్యేరు

ఆత్మజ్ఞానమను ఓడనెక్కి - ఏడుకొండలు దాటలేని మూఢులెల్లరు.

॥మూడు కాల్వలు॥.


2. బండరాల్లకు మ్రొక్కబొయ్యేరు - అజ్ఞానపూజలు చేయపూనెరు

చేతిలోని జ్ఞానమెరుగక - చేతులెత్తి మ్రొక్కు మూఢులెల్లరు.

॥మూడు కాల్వలు||..


3. బాధగురువుల పంచచేరేరు - బోధనెరుగక ఘోరముగ మోస పొయ్యేరు

బోధలోని జ్ఞానమెరుగక - తత్త్వమంత తెలుసునను మూఢులెల్లరు.

॥మూడు కాల్వలు|.


4.వేదమంత్రములు గొనుగ నేర్చేరు - బాహ్యయజ్ఞములు చేయపూనేరు

మంత్రములోని మర్మమెరుగక - యజ్ఞములోని చావ తెలియని మూఢులెల్లరు  ॥మూడు కాల్వలు|.


5. ఉపదేశమంటు ఊర్లు తిరిగేరు - సన్యాసమంటు భార్యపిల్లల వదలిపొయ్యేరు

ఉపదేశములోని ప్రదేశము తెలియక - సన్యాసములోని సారము తెలియని మూఢులెల్లరు ॥మూడు కాల్వలు||.


6.రాగముల భజన చేయపూనేరు - సన్మార్గులను లెక్కచేయక మాటలాడేర

భజనలోని మర్మమెరుగక - సన్మార్గులలోని జ్ఞానమెరుగని మూఢలెల్లరు.

॥మూడు కాల్వలు||.


వివరము : మూడు కాల్వలేమి ఆరు కాల్వలైన దాటగలమనువారు గలరు. బాహ్యముగ ఉన్న కాల్వలైతే ఎన్ని అయిన

దాటవచ్చును. కాని ఇక్కడ చెప్పినది బయటి కాల్వలు కాదు. అంతరంగములోనున్న కాలువలు. మనిషి ఎప్పుడు

బయటి విషయములనే చూస్తుంటాడు, యోచిస్తుంటాడు. తన శరీరములోపలికి ఎప్పుడు ఆలోచించడు, కావున

అంతరంగము యొక్క విషయము చాలామందికి తెలియకుండపోయినది. బయట ఒక పేరుకల్గి సంచరించు మనిషి

తన శరీరమును చూచుకొని శరీరమే తానని భ్రమించుచున్నాడు. వాస్తవానికి శరీరము వేరు నేను వేరని తలవడము

లేదు. నేను అనుకొనువాడు జీవుడు కాగ, శరీరము జీవుడు నివశించుటకు ఇల్లువలె ఉన్నది. శరీర గృహములో

నివశించు జీవుడు కొంత జ్ఞానము తెలుసుకొన్నపుడే తాను వేరు శరీరము వేరని తెలియగలడు. తాను వేరని తెలిసిన

తరువాత శరీరములో తానెట్లు నివశిస్తున్నది, ఎలా వ్యవహరించుచున్నది తెలియగలడు. అపుడు తాను నివశించు

శరీరము ఒక యంత్రములాంటిదని, యంత్రములో ఎన్నో భాగములున్నట్లు శరీరములో కూడ ఎన్నో భాగములున్నవని

తెలియు చున్నది. అంతేకాక శరీరములోని భాగములు ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగ పనిచేయుట వలన తాను శరీరములో

నివశించగల్గుచున్నానని కూడ తెలియుచున్నది. ఇలా తెలుసుకొంటూపోతే ఎన్నో రహస్యములు తెలియగలవు.


మన శరీరములో మూడు విధములైన గుణ భాగములున్నవని, ఒక్కొక్క భాగములో పండ్రెండు గుణములు

గలవని వాటి ప్రభావము వలన యోచించగల్గుచున్నామని తెలియగలడు. మానవుడు దేవుని వైపు పోకుండుటకు ఈ

మూడు గుణభాగములే పెద్ద ఆటంకము. వీటినే మాయ అనికూడ అందుము. ప్రయాణికునికి దాటలేని కాలువలు

అడ్డమైనట్లు, దైవమార్గములో పయణించు వానికి మూడు గుణములు దాటలేని మూడు కాల్వలుగ అడ్డమైవున్నవి.

మూడు గుణములను జయించడము దుస్సాధ్యమైన పనియని భగవద్గీతలో కృష్ణుడు కూడ " గుణమయి మమ మాయా

దురత్యయా ” అన్నాడు. గుణరూపములో ఉన్న మాయను దాటడము దుస్సాధ్యమైన పని అని దీని అర్థము. తామస,

రాజస, సాత్త్వికమను మూడు గుణములనే ఈ తత్త్వములో మూడు కాలువలన్నారు. కొంత జ్ఞానమున్నవారే దాటుటకు

సాధ్యముకాని గుణములను జ్ఞానములేని మూఢులు ఏమాత్రము దాటలేరు. కావున మూడు కాల్వలు దాటలేరయ్యా

ఇల మూఢజనులు మూడు కాల్వలు దాటలేరయ్యా అన్నారు.




1. ఓడ లేకను ఈద బొయ్యేరు - సంసారవారధిలో జాడ తెలియక మునిగిపొయ్యేరు

ఆత్మజ్ఞానమను ఓడనెక్కి - ఏడుకొండలు దాటలేని మూఢులెల్లరు

॥మూడు కాల్వలు||.


ఒక నదిని దాటుటకు చిన్న తెప్ప అవసరము. అట్లే సముద్రమును దాటుటకు ఓడ అవసరము. సంసారమను

అతిపెద్ద సముద్రమును దాటుటకు బలమైన జ్ఞానమను ఓడ అవసరము. ఇప్పటి కాలములో ప్రజలు ఏమాత్రము

జ్ఞానములేనివారై సంసారసాగరమును ఈదబోయి దానిలోనే మునిగిపోవుచున్నారు. సంసారమునుండి గట్టెక్కవలయునంటే

ఆత్మజ్ఞానమను ఓడ అవసరము. ఆత్మజ్ఞానమును తెలిసిన వాడు సంసారములో ఉండినప్పటికి దాని చిక్కులలో

చిక్కుకొనక అంతరంగము లోని ఏడుకొండలనబడు సప్తనాడీకేంద్రములను దాటి అవతలనున్న ఆత్మను తెలియగలడు.

ఈ విషయమును తెలియజేయుటకు పై తత్త్వములో “ఓడలేకను ఈదబొయ్యేరు సంసారవారధిలో జాడ తెలియక

మునిగి పొయ్యేరు ఆత్మజ్ఞానమను ఓడనెక్కి ఏడుకొండలు దాటలేని మూఢులెల్లరు మూడుకాల్వలు దాటలేరు ” అన్నారు.



2. బండరాల్లకు మ్రొక్కబొయ్యేరు - అజ్ఞానపూజలు చేయపూనెరు

చేతిలోని జ్ఞానమెరుగక - చేతులెత్తి మ్రొక్కు మూఢులెల్లరు.

॥మూడు కాల్వలు||.


ప్రపంచములో కృతయుగములోనే మనుషులకు జ్ఞానము తెలియ జేయు నిమిత్తము ప్రతిమలనువుంచి

పూజించారు. అలా మొట్టమొదట తయారైన ప్రతిమ శివలింగము, తరువాత పాండురంగని ప్రతిమ. ఒకటి

నిరాకారమును తెలియజేయుటకు లింగము పెట్టగా, రెండవది సాకారమును తెలియజేయుటకు ఉంచినది రంగని

ప్రతిమ. ఈ రెండు దేవాలయములే సాకార, నిరాకార అర్థముతో కూడుకొన్నవి. ఈ రెండు దేవాలయములు మినహా

ఏ దేవాలయములు పూర్వము ఉండెడివి కావు. కాలక్రమమున అజ్ఞానము పెరిగిపోయి ఎన్నో దేవాలయములు

తయారైనవి. నిరాకార పరమాత్మకు సాకార భగవంతునికి చిహ్నములైన రెండు దేవాలయములను ఎవరు

గుర్తించలేకపోయారు. అర్థమున్న దేవాలయములను అర్థములేని దేవాలయములలోనికి కలిపివేశారు. జ్ఞానము

తెలిసిన పెద్దలు ఇప్పటికి మొదటి రెండు ఆలయములే జ్ఞానముతో కూడుకొన్నవని తర్వాత తయారైనవన్ని

జ్ఞానభావములేనివని చెప్పు చుందురు. అందువలననే కనిపించిన రాయికంత మ్రొక్కవద్దని చిల్లర రాల్లకు మ్రొక్కుచువుంటే

చిత్తము చెడునుర అన్నారు. నేటి పూజలు కూడ అర్థములేనిపై అందరు ఎట్లు చేస్తుంటే అట్లు చేయవలెనని చేస్తున్నారు

తప్ప వాటి అర్థము పూర్తి తెలియదు. అందువలన అర్థములేని అజ్ఞాన పూజలు చిల్లర దేవుల్లకు చేస్తుపోతున్నారు.

అందువలన ఈ తత్త్వములో “ బండరాల్లకు మ్రొక్కబొయ్యేరు, అజ్ఞాన పూజలు చేయపూనేరు ” అని అన్నారు.


పరమాత్మ నిరాకారమును భగవంతుని సాకారమును తెలియజేయు నిమిత్తము, పూర్వము తెలిసిన జ్ఞానులు

ముక్కుముఖము ఆకారములేని లింగమును, ముక్కుముఖమున్న ప్రతిమను తయారుచేసియుంచినట్లు, అంతరంగములోని

జీవాత్మ, ఆత్మ, పరమాత్మల వివరము తెలియునట్లు, దేవుడే మానవుని అరచేతిలో మూడు రేఖలు అమర్చి పుట్టించాడు.

ప్రతిమ ఆకారమున్న నామాల దేవుడైన ఆలయములలో ఇదే విషయమును తెలియజేయునట్లు హస్తమును చూపుచు

ప్రతిమ ఆకారముండును. హస్తములో ఎంతో జ్ఞానమున్నదని పూర్వము పెద్దలు కూడ చెప్పెడివారు. అందువలన

ఉదయము నిద్రలేస్తూనే ఎవరి ముఖము చూడక ముందే తన హస్తములోని రేఖలను చూచుకొమ్మని చెప్పెడివారు.

చేతులలో ఆత్మ పరమాత్మల జ్ఞానమున్నదని తెలియక, చిల్లర దేవుల్లకు హస్తము లెత్తి మ్రొక్కుచున్నారు. అందువలన

ఈ తత్త్వములో "చేతిలోని జ్ఞాన మెరుగక చేతులెత్తి మ్రొక్కు మూఢలెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా" అన్నారు.

అందువలన పెద్దల మాట ప్రకారము హస్తములోని ఆత్మ పరమాత్మల వివరము తెలిసి, అట్లే గుడులలోని సాకార

నిరాకార గుర్తులైన రెండు గుడులను తెలిసి పూజలు చేస్తాము.


3. బాధగురువుల పంచచేరేరు - బోధనెరుగక ఘోరముగ మోస పొయ్యేరు

బోధలోని జ్ఞానమెరుగక - తత్త్వమంత తెలుసునను మూఢులెల్లరు

॥మూడు కాల్వలు||.


దేశములోని గురువులందరు ఏదో ఒక బోధ చెప్పుచున్నప్పటికి అందరిని బోధగురువులనుటకు వీలులేదు.

బోధలు చెప్పు గురువులలో కూడ బోధగురువులు, బాధగురువులని రెండు రకములు కలరు. బాహ్యముగ శరీరమునకు,

అంతరంగమున మనస్సుకు పనిని కల్పించు ఎటువంటి బోధలు చెప్పువారైన బాధగురువులే అగుదురు. శరీరమునకు

మనస్సుకు పనిలేని బోధలు చెప్పువారే బోధగురువులగుదురు. శరీరము, మనస్సు పనులలో లగ్నమైనపుడు ప్రపంచమే


తెలియును కాని ఆత్మ తెలియదు. బయట శరీరము, లోపల మనసు పనిని మానుకొన్నపుడే ఆత్మ తెలియబడు

బ్రహ్మయోగమగును. అట్లుకాక వ్రతక్రతువులు, యజ్ఞ యాగములు, వేదపఠనములు, దానములు, మంత్రబోధతో

కూడిన తపస్సులను బోధించువారు బాధగురువులే అగుదురు. అందువలననే భగవద్గీతలో కూడ యజ్ఞముల వలన,

వేదాధ్యాయణము వలన, దానము వలన, తపస్సుల వలన దేవుడు తెలియబడడని విశ్వరూప సందర్శన యోగమను

ఆధ్యాయములో 48వ శ్లోకమున మరియు 53వ శ్లోకమున చెప్పబడియున్నది.


ఈ విధముగ బాధ బోధ గురువులుండగ జ్ఞానమును తెలుసు కోవాలనుకొన్న ప్రజలు గురువులను గుర్తించలేక,

జ్ఞానములోని తారతమ్యములు తెలియక ఆధ్యాత్మికవిద్యలో ఘోరముగ మోసపోవుచున్నారు. అట్లు మోసపోయినవారు

తాము తెలుసుకొన్నది బాధబోధ లేక ఆత్మబోధ అని తెలియక, తమకు అంతా తెలుసునను అహముతో దేవున్ని దేవుని

జ్ఞానము పూర్తిగ తెలుసునని చెప్పు కొంటున్నారు. ఇటువంటివారు ఎప్పటికి తమలోని ఆత్మను తెలియలేరు. అందువలన

ఈ తత్త్వములో “బాధ గురువులు పంచచేరేరు, బోధ తెలియక ఘోరముగ మోసపొయ్యేరు, బోధలోని జ్ఞాన మెరుగక

తత్త్వమంత తెలుసునను మూఢులెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా " అన్నారు.


4. వేదమంత్రములు గొనుగ నేర్చేరు - బాహ్యయజ్ఞములు చేయపూనేరు

మంత్రములోని మర్మమెరుగక - యజ్ఞములోని చావ తెలియని మూఢులెల్లరు

॥మూడు కాల్వలు|.


దైవ పూజలలో ఆధ్యాత్మికవిద్యలో మంత్రమునకు యజ్ఞమునకు విశేషమైన విలువగలదు. అందువలన ఎన్నో

మంత్రములు నేర్చి దైవపూజలు, ఎన్నో యజ్ఞములు చేసి దైవశాంతులు చేయుట నేటి సమాజములో అదియు కొందరిలో

పాదుకొని పోయిన ఆచారములు. ఏమి చేయక పూర్తి అజ్ఞానముతో చాలామందివుండగ వారికంటే మేము గొప్పయని,

జ్ఞానులమని మంత్రపఠనములు, యజ్ఞములు చేయువారు కలరు. ఏ పూజలు చేయని వారికంటే మంత్రములతో

పూజచేయువారు యజ్ఞములు చేయువారు గొప్పగ కనిపిస్తున్నప్పటికి దానివలన దైవము తెలియబడదని భగవద్గీతలో

కూడ చెప్పారని పైన వ్రాసుకొన్నాము. అటువంటపుడు యజ్ఞములకు మంత్రములకు విలువలేదా అని అడుగ వచ్చును

దానికి మా సమాధానము ఏమనగా!


యజ్ఞములకు మంత్రములకు ఎంతో విలువ ఉన్నది. కాని అవి మీరనుకొన్నట్లు అందరు చేయు యజ్ఞములు

కావు, అట్లే మంత్రములు కూడ అందరు అనుకొన్నట్లు పఠించునవి కావు. బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము మంత్రమునకు

యజ్ఞమునకు ప్రత్యేక అర్ధము అనుభవము కలదు. మంత్రమనగా తనకు తాను పఠించబడునది, యజ్ఞమనగా తనను

తాను జరుగబడునది. మనిషి పఠించకనే ఉచ్చరించబడునది మంత్రము, అలాగే మనిషి చేయకనే చేయబడునది

యజ్ఞము. ఇదెక్కడి వింత అనుకోవద్దండి, ఉన్న సత్యము అంతే. ఈ విషయము తెలియకనే అందరు పొరబడుచున్నారు.

అందువలన గీతలో కూడ బాహ్య యజ్ఞముల వలనకాని, బాహ్యమంత్రముల వలన కాని దేవుడు తెలియబడడని తేల్చి

చెప్పారు. యజ్ఞములకు మంత్రములకు ప్రత్యేక అర్ధము విలువ ఉన్నదని చెప్పారే అని మమ్ములను ప్రశ్నించితే ఆ

మాట వాస్తవమే. యజ్ఞములు మన శరీరములో మన ప్రమేయము లేకుండనే ప్రతి నిత్యము జరుగుచున్నవి. అలాగే

మంత్రము ప్రతి నిత్యము మన శరీరములో మన ప్రమేయము లేకుండ జపించబడుచున్నది. శరీరములో రెండు

రకముల యజ్ఞములు జరుగుచున్నవి. అనేక మంత్రములు మ్రోగుచున్నవి. యజ్ఞములలో శ్రేష్టమైన యజ్ఞము ఒకటి,


మంత్రములలో శ్రేష్టమైన మంత్రమొకటి కలదు. యజ్ఞములలో జ్ఞానయజ్ఞము, మంత్రములలో ఓం శబ్దము శ్రేష్టమైనవి.

ఏ మనిషి అయినకాని జ్ఞానయజ్ఞమును చేయుట వలన, ఓం మంత్రమును స్మరించుట వలన కాని ముక్తి పొందవచ్చును.


బాహ్యయజ్ఞముల చేత, బాహ్యమంత్రముల చేత పొందని మోక్షమును అంతరంగమున స్వయముగ ఆత్మ

చేయు జ్ఞానయజ్ఞములో నీవు (జీవుడు) ఆత్మతో కలసి చేసితే కర్మ కాలిపోవును. అలాగే అంతరంగమున స్వయముగ

ఆత్మ జపించు ఓం అక్షరము నీవు (జీవుడు) ఆత్మతో కలిసి జపించుట వలన ముక్తి పొందవచ్చును. ఈ రహస్యము

తెలియక మంత్రములోని మర్మమును, యజ్ఞములోని సారాంశమును తెలియనివారు మూడు గుణములలోనే చిక్కుకొని

కర్మ సంపాదించుకొనుచుందురు. మంత్రము మనలోనే గలదని తెలియక స్వార్థముకొరకు బయటి మంత్రములకు

అలవాటుపడినారు. స్వార్ధముతోనే పఠించుచున్నారు. ఎన్నో కోట్ల సంవత్సరముల నుండి విశ్వమును స్థాపించి నడిపించు

దేవున్ని మరచిపోయి, కొద్ది కాలము ఉండిపోవు జీవితమును గొప్పగ ఎంచుకొని, దానిలోని బ్రతుకే విలువైనదని

బ్రతుకుట కొరకు, బ్రతుకు తెరువులో లాభము కొరకు, మంత్రములుచ్చరించడము యజ్ఞములు చేయడము జరుగుచున్నది.

వ్యాపారస్తుడు అంగడికి (కొట్టుకు) వేయబడిన తాళముకు మ్రొక్కుచున్నాడు, వాకిలికి మ్రొక్కుచున్నాడు, లోపలికి పోయి

అన్య దేవతలకు మ్రొక్కుచున్నాడు. అసలైన దేవున్ని, అన్నిటికి ఆధారమైన దేవున్ని, తనను నడిపించు దేవున్ని

మరచిపోవుచున్నాడు. ప్రజలు దేవున్ని మరచి చేయు అజ్ఞాన పనులను స్వార్థపనులను చూచిన పెద్దలు ఈ తత్త్వములో

"వేదమంత్రములు గొనుగ నేర్చేరు, బాహ్యయజ్ఞములు చేయ పూనేరు, మంత్రములోని మర్మమెరుగక యజ్ఞములోని

చావ తెలియని మూఢులెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా” అన్నారు. మంత్రముల విషయము తెలియని వారు

యజ్ఞముల వాస్తవమును తెలియనివారు మూడు గుణములను జయించలేక ముక్తిపొందలేక జనన మరణచక్రము లోనే

చిక్కుకొందురని దీని అర్థము.

5.

ఉపదేశమంటు ఊర్లు తిరిగేరు - సన్యాసమంటు భార్యపిల్లల వదలిపొయ్యేరు

ఉపదేశములోని ప్రదేశము తెలియక - సన్యాసములోని సారము తెలియని మూఢులెల్లరు ॥మూడు కాల్వలు||.


మనుషులలో కొందరు తాము గురువు కావాలని కాంక్ష కలిగి యుందురు. అందువలన కొంత జ్ఞానము

తెలిసిన వెంటనే, పూర్తి జ్ఞానమును సంపాదించకనే గురువులుగా మారిపోవుచుందురు. అంతటితో ఊరుకోక శిష్యులను

సంపాదించుకోవడములో మునిగిపోవుదురు. తాలి కట్టితే భార్య అయినట్లు ఉపదేశమిచ్చితే శిష్యులయ్యె విధానముంది

కాబట్టి అడిగిన అడగకున్న ఉపదేశమిచ్చి శిష్యులను చేసుకోవడము పనిగ పెట్టుకొందురు. ఉపదేశమిచ్చు గురువుల

పోటి కూడ ఎక్కువగ ఉండుట వలన గురువులే ఊరూరు తిరిగి అక్కడి ప్రజలకు ఉపదేశ మిచ్చుట జరుగుచున్నది.

ఒక ఇంటిలో ఒకరు గురు ఉపదేశము మీద అసక్తి కనబరిస్తే చాలు ఆ ఇంటికి పోయి ఇంటిలోని వారందరికి

బలవంతముగ ఉపదేశమిచ్చు వారు కూడ గలరు. పూర్వకాలము గురువులను వెదకుచు శిష్యులు పోవుచుండెడివారు.

ఈ కాలములో గురువులే శిష్యులను వెదకుచు వచ్చుచున్నారు. ఈ విధముగ ఉపదేశమని ఊర్లూర్లు తిరుగుచు

గురువులమను భ్రమలో కొందరు గలరు.


అలాగే సన్యాసమంటే మరియు సంసారమంటే అర్థము తెలియని వారు, భార్యపిల్లలే సంసారమనుకొని, వారిని

వదలడమే సన్యాస మనుకొని, ఎందరో భార్యపిల్లలను వదలిపోయారు. పూర్వకాలములో గౌతమ బుద్ధుడు ఒక

సంవత్సరము కొడుకును, చిన్న వయస్సుగల భార్యను సన్యాసమని వదలిపోయాడు. ఆదిశంకరాచార్యులు, వివేకానందుడు


సన్యాసమని పెళ్లే చేసుకోలేదు. అప్పటి కాలములోను ఇప్పటి కాలములోను సన్యాసము అంటే సంసారమును వదలడమను

అర్ధము గాఢముగ ఉన్నది. అందువలన ఇప్పటి స్వాములందరు కషాయగుడ్డలు కట్టి పెళ్లి చేసు కోకుండ కొందరు,

ముందే చేసుకొన్నవారు విడిచిపెట్టిన వారు కొందరు గలరు. ఈ విధముగ సన్యాసము తీసుకోవడముగాని, గురువులుగ

మారి ఉపదేశమిచ్చుటగాని మంచి పద్ధతంటామా అని అడిగితే కొందరు పెద్దలు ఒప్పుకోకుండ ఉపదేశమందు

మర్మము, సన్యాసమందు సారము తెలియక పోతే మూడు గుణములు దాటలేవు మాయను జయించలేవు అంటున్నారు.

యజ్ఞములు మంత్రములు ఉన్నట్లే గురువులు, గురూపదేశములు రెండు రకములు కలవు. మనుషులు గురువులుగ

మారినవారు ఒక రకముగ, దేవుడే భగవంతునిగ వచ్చి గురువుగా మారడము రెండవరకము. మనిషి గురువుగ

మారితే గురువు అనవచ్చును దేవుడు గురువుగ వస్తే జగద్గురువు అనవచ్చును. ప్రపంచ మంతటికి దేవుడొక్కడే

నిజగురువు. అతను మోక్షమునుండి మనిషిగ వచ్చి తిరిగి మోక్షమునకే పోగలడు. కాని మనిషి గురువుగ తయారైనప్పటికి

మోక్షమునకు పోతాడను నమ్మకము లేదు. మనుష్య గురువు తాను మోక్షమునకు పోలేని స్థితిలో ఉండి కూడ ఇతరులకు

మోక్షము కల్గిస్తానని ఉపదేశమిచ్చి శిష్యులుగ చేసుకోవడము చాలా వింతగ ఉంటుంది. దైవము భూమి మీదకు

గురువుగ వస్తే ఎవరికి మంత్రోపదేశము చేయడముగాని, శిష్యులను చేర్చుకోవడముగాని చేయడు. తాను చెప్పవలసిన

ధర్మములను మానవాళికి చెప్పిపోవును తప్ప తాను గురువునని కూడ చెప్పుకోడు. ఇట్లు మానవ గురువునకు దైవ

గురువునకు ఎంతో వ్యత్యాసముండును. అందువలన ఈ తత్త్వములో ఉపదేశమని ఊర్లూర్లు తిరగవద్దని, ఉపదేశములోని

మర్మమును తెలుసుకొమ్మని తెలిపారు.


సంసారము కూడ రెండు రకములుగ కలదు. ఒకటి బయటి సంసారము, మరొకటి లోపలి సంసారము.

బయటి సంసారములో సభ్యులు ఇద్దరు నుండి పదిమందివరకు కాని పదిహేను మంది వరకు కాని ఉండగలరు.

సామాన్యముగ నలుగురైదుగురు గల చిన్న సంసారములే ఎక్కువగ ఉండును. మనిషి అజ్ఞానములో ఉండినపుడు,

శరీరమే తాననుకొన్నపుడు, భార్యపిల్లలనే సంసారమునుకోవడము సహజము. అజ్ఞానుల దృష్ఠిలో భార్యపిల్లలే సంసారము

కావున ఇది ఒక రకమైన బయటి సంసారము. ఈ సంసారమును వదలుకోవడము వలన సన్యాసమైతుందని అనుకోవడము

పొరపాటు. ఎందుకనగా మనిషి అజ్ఞానములో ఉండి, అజ్ఞానముతో దేహమే నేనను అహముతో, భార్యపిల్లలే సంసారము

అని ఊహించుకొన్నది కావున ఇది దేవుని లెక్కలో సంసారము కాదు.


దేవుని లెక్కలోని సంసారము సన్యాసము వేరుగ ఉన్నవి. సజీవ మనిషిలో జీవుడు శరీరములో నివశిస్తున్నాడు.

సంసారము జీవునికే కావున జ్ఞానము ప్రకారము శరీరములోపల జీవుడు 24 మందితో కాపురము చేయుచున్నాడు.

అనగ రెండు డజన్ల సహచరులతో జీవుడు కాపురము చేయుచున్నాడు. బయటి కాపురము ఎంతమంది ఉండిన లోపలి

కాపురము మాత్రము 24 మందితోనే అని చెప్పవచ్చును. శరీరములో తనతోపాటు కాపురమున్నవారే జీవునికి నిజమైన

సంసారము. అంతరంగములోని సంసారమును వదలడమే నిజమైన సన్యాసమని భగవద్గీతలో కూడ తెలియబరచబడినది.

శరీరములోపల మనస్సు, బుద్ధి, చిత్తము, అహము, అలాగే ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు

వాయువులు, ఐదు తన్మాత్రలు అని మొత్తము 24 తోటి జీవుడు ఉంటూ జీవయాత్ర సాగిస్తున్నాడు. శరీరాంతర్గతములో

గల 24 భాగములతో జీవుడు సంబంధము పెట్టుకోకపోవడమే నిజమైన సన్యాసము. దీనివలన యోగప్రాప్తి మోక్షప్రాప్తి

కల్గును. అట్లుకాక బయటి వారిని వదలితే లోపలి కర్మతెగదు, మోక్షము లభించదు. పూర్వము స్వాములుగాని, నేటి

స్వాములుగాని బాహ్య సంసారమును వదలడము వలన మూడు గుణములు వదలవు. కావున వారు సన్యాసులు కాదని


తెలియుచున్నది. అందువలన ఈ తత్త్వములో "సన్యాసమంటు భార్య పిల్లలు వదలి పొయ్యేరు, సన్యాసమందు సారము

తెలియని మూఢులెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా" అని అన్నారు. ఇప్పటికైన తత్త్వములోని అర్థము తెలిసి

నిజమైన సన్యాసము తీసుకొందాము.


6. రాగముల భజన చేయపూనేరు - సన్మార్గులను లెక్కచేయక మాటలాడేరు

భజనలోని మర్మమెరుగక - సన్మార్గులలోని జ్ఞానమెరుగని మూఢలెల్లరు.

॥మూడు కాల్వలు||.



గ్రామీణప్రాంతములో భజన చేయడమే ముఖ్యమైన భక్తిగ ఉన్నది. గుడిలో గుంపుగ కూడి అనేక దేవుల్ల

కీర్తనలను భజన చేసి అదియే భక్తి అని తృప్తి చెందుచుందురు. గ్రామీణులకు భజన తప్ప ఏ జ్ఞానము తెలియదు.

ఎవరైన గురువులు తోడైనప్పటికి వారు జ్ఞానమును తెలుపక భజనకే ప్రాముఖ్యతనిచ్చుట వలన భజన తప్ప జ్ఞానము

తెలియని స్థితిలో వారుండిపోయారు. భజన చేయువారికి ఎందరో దేవుళ్లు తప్ప అందరికి అధిపతియైన దేవుడు

తెలియడు. మత్తుత్రాగు వారికి అది అలవాటైనట్లు భజన చేయువారికి కూడ అది ఒక అలవాటైపోవును. భజన

చేయువానికి తప్పనిసరిగ భజనకు పోవాలనిపిస్తుంది. ఒక్క రోజుపోకపోయిన అసంతృప్తిగ ఉంటుంది. ముఖ్యముగ

వారికి మనమెవరము? ఎవరిని భజించాలి? అసలు భజన అంటే ఏమిటి? అను వివరము తెలియదు. ఇటువంటివారు

తమకే నిజమైన భక్తికలదను భావముతో సన్మార్గులను జ్ఞానులను లెక్కచేయక హేళనగా మాట్లాడు చుందురు. ఈ

విషయమునే తత్త్వములో "రాగముల భజన చేయ పూనేరు, సన్మార్గులను లెక్కచేయక మాటలాడేరు" అన్నారు.


భజన రాగములతో కూడుకొన్నది కాదని, పాటలభజనకంటే అంతరంగములో జ్ఞానముతో భజించడము గొప్ప

అని తెలియదు. పూజించడము భజించడము అను పదములలో మొదటి అక్షరము మాత్రము వేరుగ ఉన్నది.

పూజించడము అని పలుకకూడదు, పూజ చేయడము అని పలుకడము సరియైనది. అలాగే భజించడము అని

పలుకకూడదు, భజన చేయడము అని పలకాలి. పూజ, భజన అనునవి వాస్తవ పదములు. పూజ అనగా బాహ్యముగ

చేయు ఆరాధన క్రమము. భజన అనగ అంతరంగమున చేయు ఆరాధన అని అర్ధము. ఇంకను వివరముగ

చెప్పుకొంటే పూజ, భజన అను రెండు పదములలోను "జ" కలదు “జ” అనగ పుట్టునదని అర్ధము. జ్ఞానము తెలిసి

ఆ అర్థముతోనే దేవున్ని బాహ్యముగ ఆరాధించడము వలన అందులో జ్ఞానాగ్ని లేక జ్ఞానశక్తి పుట్టగలదు. అలాగే

జ్ఞానము తెలిసి అంతరంగమున ఆరాధించడము వలన అందులో కూడ జ్ఞానశక్తి పుట్టగలదు. కంటికి కనిపించని

జ్ఞానశక్తిని బాహ్యముగ పొందడమును పూజ అనియు, అదే శక్తిని అంతరంగమున పొందడమును భజన అనియు

పూర్వము అనెడివారు. ఈ కాలములో పూజకు భజనకు అర్థము తెలియకపోయిన దానివలన పూజలు భజనలు అనేక

దారులు పట్టిపోయినవి. సన్మార్గులైన జ్ఞానులు జ్ఞానశక్తిని పొందియుందురు. అటువంటి జ్ఞానుల జ్ఞానముగాని,

వారిలోని శక్తినిగాని తెలియక హేళనగ మాట్లాడడము వలన తప్పక కర్మ చేకూరును. అందువలన జ్ఞానులలో

తెలియకుండ ఉన్నదేదో తెలియనివారు, భజనలో నిజ భజన ఏదో తెలియనివారు మూడు గుణములను దాటలేరు. ఈ

విషయమునే తత్త్వములో "భజనలోని మర్మమెరుగక, సన్మార్గులలోని జ్ఞానమెరుగని మూఢులెల్లరు మూడు కాల్వలు

దాటలేరయ్యా” అన్నారు.


ఈ తత్త్వమును చూచిన తరువాత గురువులలో బాధ గురువులెవరో, బోధ గురువులెవరో, చిల్లర దేవతలెవరో,

దేవ దేవుడెవరో, మంత్రములేవో, యజ్ఞములేవో, ఉపదేశమేదో, సన్యాసమేదో, పూజ ఏదో, భజన ఏదో, అసలు జ్ఞానమంటే

ఏమిటో తెలుసుకొనుటకు ప్రయత్నించవలెను.


9. తత్త్వము.


శ్రీగురు చరణారవిందములు నమ్మికొలుతుము అనుదినమూ ఇదే రీతిగ అదే బోధగ అనుదినమూ కోరితివి.


1) ఆగర్భశత్రువుల ఆర్గురిని చంపేవిధమూ తెలియని మాకూ

తేజమైన కత్తుల నిమ్మని కోరితివి.

॥ శ్రీ గురు ॥


2)ఐదు పడగల పాము విషముతో బాధపడే మాకూ

బోధామృతమనే మందిమ్మని కోరితివి.

॥ శ్రీ గురు |


3)ఏడు కొండలు ఎక్కే మార్గము తెలియని మాకూ

కంటకములు లేని మార్గము తెలుపమని కోరితివి.

॥ శ్రీ గురు ॥


4)అండ పిండ బ్రహ్మండము తెలియని మాకూ

అంతా నిండియుండే వానిని తెలుపమని కోరితిమీ.

॥ శ్రీ గురు |


5)

పుట్టలోని పామును బట్టే విధము తెలియని మాకూ

పామును పట్టే కట్టుమంత్రము తెలుపమని కోరితివి.

॥ శ్రీ గురు ॥


వివరము : పరమాత్మ సాకార ఆకారమైన భగవంతుడే నిజమైన గురువు. అతనే జగద్గురువు. జగత్తుకంతటికి

వర్తించు బోధ తెలియజేయువాడు కనుక ఆయనను జగద్గురువు అంటున్నాము. శరీరములో నివశించు జీవునికి

శరీరములో నివశించక పరమాత్మలో కలిసిపోవు జ్ఞానమును తెలుపు గురువు యొక్క పాదములకు నమస్కరించుచు

మోక్షము పొందు జ్ఞానమును తెలుపమని కోరుచు ఒకరు “శ్రీగురు చరణారవిందములు నమ్మి కొలుతుము అనుదినమూ,

ఇదేరీతిగ అదే బోధగ అనుదినము కోరితిమి" అన్నారు.


1) ఆగర్భశత్రువుల ఆర్గురిని చంపేవిధమూ తెలియని మాకూ తేజమైన కత్తుల నిమ్మని కోరితివి ॥ శ్రీ గురు ॥

పుట్టుకతోనే మొదలైన శత్రుత్వమును ఆగర్భశత్రుత్వము అంటాము. మొదటి నుండి ఉన్న శత్రువును ఆగర్భశత్రువు

అంటాము. మన పుట్టుకతోనే మన శరీరములోనే మనలను పాపములలో ముంచి కష్టముల పాలుచేయు ఆరు చెడు

గుణములు గలవు. అట్లే పుణ్యములను అంటగట్టి సుఖములందు ముంచు ఆరు మంచి గుణములు గలవు. పుణ్యమును

తగిలించు మంచి గుణములను మిత్రులుగా లెక్కించినపుడు పాపములను తగిలించి కష్టముల పాలుచేయు చెడు

గుణములను శత్రువులుగ లెక్కించ వలసియున్నది. 1) కామ 2) క్రోధ 3) లోభ 4) మోహ 5) మధ 6) మత్సరమను

ఆరు గుణములు మన శరీరములోనే శత్రుపాత్ర వహించుచున్నవి. ఇవి జీవుని పాలిట భీకరమైన బలమైన శత్రువులు.

ఈ ఆర్గురు శత్రువులను జయించవలెనంటే జీవునికి జ్ఞానము అవసరము. లోకములో జ్ఞానమను కత్తుల చేతనే

గుణములనబడు శత్రువులను జయించవచ్చును. అందువలన ఈ తత్త్వములో "ఆగర్భశత్రువులు ఆర్గురిని చంపే

విధము తెలియని మాకు తేజమైన కత్తులనిమ్మని కోరితివి” అని ఒక జిజ్ఞాసి అడిగినట్లు గలదు.


2)ఐదు పడగల పాము విషముతో బాధపడే మాకూ బోధామృతమనే మందిమ్మని కోరితివి || శ్రీ గురు ||.


భూమి మీద ఎక్కడైన ఒక పాముకు ఒక తలమాత్రముండును. కాని మన శరీరములో మనస్సు అను

పాముకు ఐదు తలలు గలవు. ఒక్కో తలలో ఒక్కో విధమైన విషయమున్నది. మనస్సు ఒకటే అయిన అది జీవునికి

అందించు విషయములు ఐదు రకములుగ ఉన్నవి. మనస్సుకు గల ఐదు తలలు వరుసగ 1) కన్ను 2) చెవు 3) ముక్కు

4) నాలుక 5) చర్మము. శరీరములోని ఈ ఐదు ఇంద్రియములు ఐదు రకముల విషయములను జీవునికి అందించుచున్నవి.

ఈ ఐదు విషయములతో జీవుడు ఆహర్నిశలు విలవిలలాడి పోవుచున్నాడు. విషమునకు ఏ మనిషైన బాధపడక

తప్పదు. అలాగే మనిషిలోని ఐదు పడగల విషమునకు తప్పక బాధపడవలసి వస్తున్నది. విషమునకైతే బాధపడవచ్చునుగాని

విషయమునకు ఎందుకు బాధపడవలెనని కొందరు అనుకోవచ్చును. దానికి మా వివరమేమనగా విషము అనునది

అందరికి తెలిసినదే. ఆహారమునకు విషమును చేర్చితే విష ఆహారమగును. అట్లే పాణీయమునకు విషమును చేర్చితే

విష పాణీయమగును. రెండు పదములలోను “విష" అని చెప్పి విషము అని ఎందుకు చెప్పలేదనగ విష అను

రెండక్షరములే పూర్తి అర్థమునిచ్చుచున్నవి. ఒక అర్థముతో కూడిన అక్షరములకు పదము సంపూర్ణమగుటకు “ము”

అను అక్షరమును కలుపు కొనుచుందుము. అందువలన విష అను అర్థమునిచ్చు రెండక్షరములను పదము చేయుటకు

“ము” ను కలిపి విషము అంటున్నాము.


అలాగే యమ బాధలు అను పదములో యమ అను అర్థమునిచ్చు అక్షరమునకు డు కలిపి యముడు అంటున్నాము.

నిజానికి ఈ పదము యమడు అని పలుకవలెను కాని యముడు అని పలుకుట అలవాటై పోయినది. విషము వలన

యమలోకమునకు చేరవలసిందే అనగ అక్కడ బాధలు అనుభవించవలసిందే. కావున బాధలను చూచించు యముడు

అను పదమును హానిని కలుగజేయు విషము అనుపదమును తీసుకొని విష+యము అను వాటిని కలిపితే విషయము

అగుచున్నది. విషయము అను పదములో హానికరమైన బాధలు కలుగజేయునదని అర్థము కలదు. మనస్సను పాము

ప్రపంచ విషయమును ఐదు విధములుగ కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనువాటి ద్వార తెలియజేయుచున్నది.

విషయములోనే హానికరమైన బాధలతో కూడుకొన్న అర్థముండుట వలన ఐదు ఇంద్రియములను ఐదు పాముతలలుగ

మనస్సును పాముగ వర్ణించి వాటినుండి హాని కలుగుచున్నదని తెలుపుటకు ఈ తత్వములో “ఐదు తలల పాము

విషముతో బాధపడే మాకు” అన్నాడు.


విషమునకు విరుగుడు ఔషదము. మనస్సనెడి పాము పడగల విషమునకు మామూలు మందు సరిపోదు

దానికి జ్ఞానమనే మందే విరుగుడు కావున " బోధామృతమనే మందిమ్మని కోరితిమి" అని అన్నారు. దీనిని బట్టి

విషయములలో విషమున్నదోయన్న అని కొందరన్నారు. ఇప్పటినుండి విషయములపట్ల బహు జాగ్రత్తగ ఉండవలెను.


3) ఏడు కొండలు ఎక్కే మార్గము తెలియని మాకు

కంటకములు లేని మార్గము తెలుపమని కోరితిమీ

॥ శ్రీ గురు||.


పూర్వకాలములో మొట్టమొదట తయారైన దేవాలయము శివలింగము కలది. తరువాత రెండవది రూపము

కల్గిన నామాలప్రతిమ. ఒకటి నిరాకారమైన పరమాత్మకు గుర్తు, రెండవది సాకారమైన భగవంతునికి గుర్తని 'దేవాలయ

రహస్యములు' అను పుస్తకములో తెలుసుకొన్నాము. మనిషిలో దైవజ్ఞానము వృద్ధి అగుటకు ఈ రెండు దేవాలయములు

అవసరమని ఆనాటి జ్ఞానులు వీటిని నిర్మించారు. దైవజ్ఞానము తెలియుటకు ఆనాడు ఎంతో యోచించి సూత్రబద్దముగ,


శాస్త్రబద్దముగ తీర్చిదిద్ది తయారు చేయబడినవే రెండు దేవాలయములు. పూర్వము విభూతి రేఖలున్న లింగము,

మూడు నామములున్న ప్రతిమ దేవాలయములు తప్ప ఇతర దేవాలయములుండేవి కావు. తర్వాత కొంత కాలమునకు

ఈ రెండు దేవాలయముల యొక్క జ్ఞానము వివరము తెలియకుండ పోయినది. వాటి విశేషతను గురించి చెప్పువారు

లేకుండపోయారు. ఇటువంటి పరిస్థితిలో మాయకు మంచి అవకాశము ఏర్పడినది. మాయ ప్రేరణతో మనుషులలో

అజ్ఞానము పెరిగిపోయినది. అటువంటపుడు రాముని దేవాలయము తర్వాత ఆంజనేయుని దేవాలయము తయారైనవి.

వీటి తర్వాత అనేకమైన దేవాలయములు తయారైనవి.


ఆధ్యాత్మిక విద్యలో భారత దేశము మొట్టమొదటిది. ప్రపంచములో అన్ని దేశములకంటే దైవజ్ఞానములో

భారతదేశమే ప్రథమ స్థానములో ఉన్నది. మనము నివశించు దేశమునకు మొదట ఇందూదేశమను పేరుండేది. ఆ

పేరు కొంత మార్పుతో హిందూదేశమని ఈ రోజుకు పిలువబడుచున్నది. అయినప్పటికి హిందూదేశమునకు

భారతదేశమను రెండవ పేరు కూడ కొంతకాలమునకు ఏర్పడినది. వ్యవహరములలో హిందూదేశము అను పేరుకంటే

భారతదేశమను పేరే ఎక్కువగలదు. మన దేశము అన్ని దేశములకంటే ఆధ్యాత్మిక జ్ఞానములో మొట్టమొదటిది. కావున

ఈ దేశమునకు ఇందూ అని అర్థముతో కూడుకొన్న పేరును కల్గియున్నట్లు ఇందూదేశము అన్నారు. ఆనాటి జ్ఞానులుంచిన

మొదటి పేరైన ఇందూ అను అర్థముకాని పదముకాని ఈనాడు లేదు. దైవ జ్ఞానములో ఆనాటికి ఈనాటికి ప్రథమ

స్థానములోనే మనమున్నాము. ఇంకను కొంత వివరమును తెలుసుకొంటే ఈ విధముగ గలదు. భారత దేశము

ఉత్తరభారతము, దక్షణభారతమను రెండు భాగములుగ ఉండెడిది. ఉత్తర భారతములోని వారికి సంస్కృత విద్యలో

పాండిత్యము ఎక్కువగ ఉండెడిది. దక్షణభారతములో ఉన్నవారికి చదువుకాని సంస్కృత పాండిత్యముకాని లేకుండెడిది.

కాని ఆధ్యాత్మిక విద్యలో గొప్పగొప్ప జ్ఞానులు దక్షణదేశములో ఉండెడివారు. దక్షణదేశము వారివలననే ఈ దేశమునకు

ఇందూదేశమని పేరు వచ్చినది. ఇందూ దేశమంటే జ్ఞానుల దేశమని ఆనాటి అర్థము. ఈనాడు ఆ అర్థము ఏమాత్రము

లేకుండ పోయినది. దక్షణ భారతములో ఆనాటి జ్ఞానులు ఆధ్యాత్మికమునకు సంబంధించినట్లుగ బ్రహ్మవిద్యను

అనుసరించి దేవాలయములు నిర్మించారు. అందువలన శాస్త్రపద్దతిగ ఉన్న దేవాలయములు దక్షణ భారతదేశములోనే

కనిపించును. గాలి గోపురము, ధ్వజస్తంభము, ఏడు ద్వారములు, గర్భగుడి ఇవన్నియు దక్షణదేశములోని దేవాలయము

లలో కనిపించును. ఉత్తరదేశములో ఆత్మజ్ఞానులు లేకుండిరి కావున అక్కడ దేవాలయములున్నప్పటికీ వాటియందు

గాలిగోపురముకాని, ధ్వజస్తంభముకాని, ఏడు ద్వారములుకాని, గర్భగుడికాని ఉండవు. దక్షణ దేశములో

ఆత్మజ్ఞానులుండెడివారు, ఉత్తరదేశములో విద్వాంసులుండెడి వారు. కావున ఉత్తరదేశములో సంస్కృతము పాండిత్యము,

దక్షణములో ఆత్మజ్ఞానము ఇప్పటికి గలవు. ఇప్పటికి శాస్త్రబద్ధమైన పురాతన దేవాలయములు దక్షణదేశములో గలవు.

కాలక్రమేపి అజ్ఞానము పెరుగుచు పోవుచున్నది, కావున పురాతన దేవాలయముల అర్థము దక్షణదేశములో కూడ

తెలియకుండ పోయినది. అందువలన ప్రస్తుత కాలములో దక్షణ దేశములో కూడ తయారగు దేవాలయములు

శాస్త్రబద్దత లేకుండ తయారగుచున్నవి.


దక్షణ దేశములోని ఇందువులు పూర్వము పూర్తి జ్ఞానము కల్గి ఉండుట చేత వారు తయారుచేసిన ఆలయములు

జ్ఞాన చిహ్నములై ఉండెడివి. అట్లే వారు చెప్పెడి బోధలు పూర్తి జ్ఞానముతో నిండుకొని ఉండెడివి. అదేవిధముగ వారు

వ్రాసిన తత్త్వములను పాటలు ఆత్మజ్ఞానముతో మూర్తీభవించి ఉండెడివి. ఇప్పుడు మనము చెప్పుకొను ఈ తత్త్వము

పూర్వపు జ్ఞానులచేత వ్రాయబడినది కావున అందులో ఆత్మజ్ఞానముతో కూడుకొన్న వివరములు గలవు. ఇక్కడ


“ఏడుకొండలు ఎక్కే మార్గము తెలియని మాకు కంటకములులేని మార్గము తెలుపమని కోరితివి" అని గలదు.

పూర్వకాలము జ్ఞానుల ఉద్దేశము ప్రకారము ఏడుకొండలు అనగ మన శరీరములోని ఏడు నాడీకేంద్రములని అర్థము.

శరీరములోనే ఆత్మలు నివశిస్తున్నవి. అందులన శరీరములోనే ఆత్మజ్ఞానము కలదు. ఆత్మజ్ఞానము ప్రకారము ఏడు

నాడీకేంద్రములను ఏడు ద్వారములుగ, ఏడు కొండలుగ పోల్చి చెప్పారు. శరీరములోని ఆరు నాడీకేంద్రములను

అతిక్రమించి ఏడవ నాడీకేంద్రమైన మెదడు భాగములో గల ఆత్మను తెలియవచ్చును. శరీరములో మనస్సును నిరోధించి

బ్రహ్మయోగము చేయు యోగులకు అది సాధ్యమైన పని. శరీరములోని ఏడు కొండలైన ఏడు నాడీకేంద్రములను ఎక్కే

విధము వివరము తెలియని అజ్ఞానులైన మాకు పూర్తి జ్ఞానము కల్గించి సంశయములను ముల్లులులేని మార్గములను

తెలుపమని గురువును కోరినట్లు ఈ వాక్యములోని వివరము.


4) అండ పిండ బ్రహ్మాండము తెలియని మాకు అంతనిండియుండే వానిని తెలుపమని కోరితివి.


అండము అనగ గ్రుడ్డు, పిండము అనగ గర్భము. కనిపించెడి కదలుచున్న జీవరాసులలో కొన్ని అండమునుండి

పుట్టుచున్నవి, కొన్ని గర్భమునుండి పుట్టుచున్నవి గలవు. భూమి మీద చరించు జీవరాసులను అన్నింటిని కలిపి

అండజములు, పిండజములు అని అంటున్నాము. అంతేకాక కనిపించని జీవరాసులైన సూక్ష్మక్రిములు చలించని

జీవరాసులైన చెట్లు ఎన్నో గలవు. మొత్తము విశ్వమంతటిని లెక్కించి చూచితే ఈ జీవరాసులే కాక ప్రకృతి అయిన

మహా భూతములనబడు ఐదు పెద్ద జీవులు కూడ కలరు. చిన్న జీవరాసులైన చలించు జీవరాసులను అండ పిండమని

పిలుస్తు, అతి పెద్దవైన బలమైనవైన ఐదు జీవుల్లను బ్రహ్మాండమని పిలుస్తున్నాము. మొత్తము విశ్వమంతటిని ఒక్క

మాటలో అండ, పిండ, బ్రహ్మాండమని అంటున్నాము. చాలామందికి కొన్ని జీవరాసులు తెలుసు కొన్ని తెలియవు.

కొందరికి అండపిండమైన జీవుల్లు తెలిసిన బ్రహ్మాండమైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి కూడ జీవుల్లని

తెలియదు. అందువలన అండ పిండ బ్రహ్మాండము తెలియని మాకు అని ఈ వ్యాకములో చెప్పబడియున్నది.


అండ పిండ బ్రహ్మాండమని విశ్వమంతటిని కలిపి అంటున్నాము. విశ్వమంత వ్యాపించియుండి విశ్వమంతటికి

ఆధారమై కనిపించనిది ఒకటున్నది. దానినే దైవము అంటున్నాము. వెతికిన కనిపించనిది కావున దేవుడు అంటున్నాము

అది స్త్రీలింగము కాదు పురుషలింగము కాదు కావున కనిపించనిదని కనిపించనివాడని రెండు రకములుగ అంటున్నాము.

అండ పిండ బ్రహ్మాండమును సృష్టించి పోషించువాడు దేవుడు. దేవుని చేత సృష్ఠింపబడిన అండ పిండ బ్రహ్మాండమే

మనకు అర్థము కాలేదు. ఇక దానిని సృష్టించిన దేవుడు ఎంతటి వాడో, ఎటువంటివాడో ఎవరికి తెలియదు. అండ

పిండ బ్రహ్మండము ఏమిటో, దానిని సృష్టించిన వాడెటువంటివాడో, కొంత వివరము తెలుపమని గురువును కోరినట్లు

పై చరణములో గలదు.


5) పుట్టలోని పామును పట్టే విధము తెలియని మాకు పామును పట్టే కట్టు మంత్రము తెలుపమని కోరితివి.


పాము బుసకొట్టే స్వభావము కలది. పాము పుట్టలలో నివాసముంటాయని అందరికి తెలుసు పుట్టలోని

పామును పట్టాలంటే కొంత నేర్పరితనము కావాలి. ఆ నేర్చుకోవడము అంతకు ముందు నేర్చుకొన్న వాని దగ్గరనుండే

నేర్చుకోవాలి. పామును పట్టుకోవాలంటే దానిని కట్టడి చేయు మంత్రమును తెలుసుకోవలసియున్నది. ఆ మంత్రమును

నేర్చుకొనుటకు ఒక మంత్రగానిని ఆశ్రయించవలసిందే. ఇదే విధానము ఆత్మజ్ఞానములో కూడ కలదు. అదేమనగా

పుట్ట అనగ శరీరమని తెలియవలెను. పుట్టలోని పాము అనగ శరీరములోని ఆత్మ అని తెలియవలెను. శరీరమను


పుట్టలో రెండు రకముల పాములు గలవు. ఒకటి చలాకిగవుండి పుట్టంతయు తిరుగుచు బుసకొట్టుపాము, రెండవది

మజ్జుగ ఒక చోటనేవుంటు బుసకొట్టని పాము. రెండు పాములను రెండు ఆత్మలని అనవచ్చును. ఒకటి చురుకుతనము

కల్గి కదలుచున్న బుసకొట్టు నాగుపాము. రెండవది చురుకుతనము లేకుండ కదలకుండ బుసకొట్టకుండ ఉండే

పూడుపాము. బుసకొట్టే పాము చైతన్యముగల ఆత్మ అనియు, బుసకొట్టని పామే చైతన్యములేని జీవాత్మ అనియు

చెప్పవచ్చును. బయట గల మట్టిపుట్టలో ఒకపాము ఉండవచ్చును, కాని శరీరమను పుట్టలో ఎప్పటికి రెండుపాములే

ఉండును. మట్టి పుట్టకు రంద్రములెన్ని అయిన ఉండవచ్చును, కాని శరీరమను పుట్టకు తొమ్మిది రంధ్రములు

మాత్రమే ఉండును. ఈ విధముగ బయటి మట్టి పుట్టకు శరీరమను పుట్టకు తేడాలు గలవు.


ఆధ్యాత్మిక విద్యరీత్యా ఇక్కడ విశేషమేమిటంటే రెండవదైన బుస కొట్టని పూడుపాము మొదటిదైన బుసకొట్టు

నాగుపామును అదిమి పట్టాలి. అనగ కదలని పాము కదిలెడి పామును జయించాలి అని అనుకొందాము.

పూడుపాములమైన మనము అనగ శరీరములోనే నివశించు జీవాత్మలము. జీవాత్మతోపాటు శరీరములోనే ఉండి

శ్వాస అను శబ్దముతో బుసకొట్టు ఆత్మను తెలుసుకోవాలి. కదలికలేని జీవాత్మ కదలికయున్న ఆత్మను జ్ఞానము అను

మంత్రోపదేశము ద్వార తెలియవచ్చును. జ్ఞానమును తెలియజేయు గురువు దగ్గర ఆత్మను తెలియుటకు అడిగిన

విధానమే పై చరణములోని పామును పట్టే విధము తెలియని మాకు పామును పట్టే కట్టు మంత్రము తెలుపమని

కోరితిమి అన్నారు.


10. పద్య తత్త్వము.


ఆదిద్యయంబు వృక్షంబు

మీదట రెండక్షరములు మేధినిచరితా

ఆదియు అంత్యము కూడిన

వేదాంతం దీని తెలియు వేద వేద్యుల్.


వివరము :- మన శరీరములో ప్రతి ఒక్కరికి శ్వాస ఆడుచున్నది. శ్వాసను బట్టి ప్రాణమున్నదని లేదని చెప్పవచ్చును.

కావున శ్వాసను ప్రాణము అన్నారు. అనగ గాలి అని అర్థము మన శరీరములో ఐదు రకముల గాలులు గలవు. అవి

వరుసగ వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాణ వాయువులంటాము. వాటినే పంచప్రాణములని కూడ అనుచున్నాము.

వీటిలో ప్రాణవాయువు శరీరములో ఊపిరితిత్తులనుండి ముక్కురంద్రముల వరకు వ్యాపించివున్నది. ప్రాణవాయువు

రెండు ఊపిరితిత్తుల నుండి ముక్కురంధ్రముల ద్వార బయటికి లోపలికి చలించుచున్నది. మనిషి పుట్టుకలో బయటినుండి

శ్వాస లోపలికి ప్రవేశిస్తున్నది, చావులో లోపలి నుండి బయటికి వెళ్లిపోవుచున్నది. శ్వాస బయటినుండి పోయిన,

లోపలినుండి బయటికి వచ్చిన రెండుగానే బయలుదేరుచున్నది. రెండు ఊపిరితిత్తులనుండి బయలుదేరిన శ్వాస

రెండు చీలికలుగానే బయటికి వస్తున్నది. కావున శ్వాసను వృక్షముగ పోల్చి, మొదలులో రెండుకొమ్మలు పుట్టిన

వృక్షమని అన్నారు. దానినే ఆది ద్వయంబు వృక్షము అన్నారు. శ్వాస లోపలికి బయటికి చలించడములో రెండు

శబ్దములు పుట్టుచున్నవి. అవి సో, హం అను శబ్దములు, శ్వాస వలన కలుగు శబ్దములు కావున మీదటి రెండక్షరములని

అని అన్నారు. లోపలికి పోవునపుడు ఒక శబ్దము బయటికి వచ్చునపుడొక శబ్దము పుట్టుచు ప్రత్యేకత కల్గియున్నవి.

లోపలికి పోవు “సో” శబ్దమును బయటికి వచ్చు “హం" శబ్దములను రెండిటిని కలిసి చూస్తే “ఓం” అను శబ్దము


పుట్టుచున్నది. మొదటిదైన సో శబ్దములో 'ఓ' శబ్దము చివరిగ వినిపిస్తున్నది. అలాగే రెండవదైన హం శబ్దములో 'మ్'

శబ్దము వినిపిస్తున్నది. రెండిటిని కలిపితే ఓం అను శబ్దము తయారగుచున్నది. కావున ఆదియు అంత్యము కూడిన

అని మూడవ చరణములో అన్నారు. ప్రతి జీవరాసి శరీరములోను శ్వాసలో 'ఓమ్' అను శబ్దము ఇమిడి ఉన్నది.

ఆధ్యాత్మికములో అత్యంత ప్రాముఖ్యమైనది కావున వేద వేద్యులకు వేదాంతమని చెప్పారు.


11. తత్త్వము.


శ్రీ గురు రాయుడు మాయమర్మము తెలిపినాడే మాయలో ఉంటూ లేనివాడు కమ్మన్నాడే

1)ఆరును ద్రుంచి ఆరును నరకమన్నాడే 

ఆరును ఆరును చేరక ఉండమన్నాడే  .॥ శ్రీ గురు ॥


2)తొమ్మిది వాకిల్ల కొంపకు ఎందుండి వస్తివన్నాడే

ఎందు తిరిగినా ముందుచోటుకే పొమ్మన్నాడే  ॥ శ్రీ గురు |


3)ఆరు శిఖరములపైన వెయ్యికాల్ల మంటపమన్నాడే

ఆరు శిఖరముల ఎక్కి ఎగచూడమన్నాడే ॥ శ్రీ గురు |


4)మూడు నదులు కలియుచోటు తెలియమన్నాడే


మూటిలోయుండే మూల పురుషుని చూడమన్నాడే ॥ శ్రీ గురు |.


వివరము :- విశ్వమంత వ్యాపించియున్నవి రెండే రెండు అవియే ప్రకృతి పురుషుడు అని అంటాము. ప్రకృతికి మారు

పేరు మాయ అని కూడ కలదు. అలాగే పురుషున్ని దేవుడు అని కూడ అనుచున్నాము దేవుడు పుట్టించినదే మాయ.

దేవుని ఆజ్ఞప్రకారము నడుచుకొనునదే మాయ. తనకు వ్యతిరేఖముగ వ్యవహరించమని దేవుడు మాయను ఆజ్ఞాపించాడు.

కావున మాయ ఎప్పటికి దైవమార్గమునకు వ్యతిరేఖమే. ఒక విధానములో మాయను భార్య అని, దేవున్ని భర్త అని

చెప్పవచ్చును. భర్త అయిన దేవునికి తన భార్య అయిన మాయ యొక్క వివరమంతయు తెలియును. కావున మాయ

వివరము తెలియజెప్పవలయునంటే అది దేవునికొక్కనికే సాధ్యము. దేవుడు తన శక్తిలో కొంత భాగమును భూమి

మీద మనిషిగ తన ప్రతినిధిగ పుట్టించును. అతనినే గురువు అంటున్నాము. భూమిమీద దేవుని అవతారము తప్ప

ఎవరు గురువగుటకు అర్హులు కారు. దేవుని అంశ అయిన గురువు తనను విశ్వసించిన వారికి మాయ యొక్క

మర్మము తెలుపును. అలా మాయ యొక్క మర్మము తెలిసిన వారు తామరాకు నీటిలో ఉన్నప్పటికి తేమ అంటనట్లు

మాయలో ఉన్నప్పటికి కర్మ అంటని వారైవుందురు. అందువలన ఈ తత్త్వములో మొదటనే శ్రీగురు రాయుడు

మాయమర్మము తెలిసినాడే మాయలో ఉంటూ లేనివాడు కమ్మన్నాడే అన్నారు.


1) ఆరును ద్రుంచి ఆరును నరకమన్నాడే ఆరును ఆరును చేరక ఉండమన్నాడే ॥ శ్రీ గురు ||.


మన శరీరములో దేవుడు నివశిస్తున్నాడు కావున శరీరమును దేవాలయము అన్నాము. దేవాలయమునందు

గర్భగుడిలో భగవంతుని ప్రతిమ ఉన్నప్పటికి దాని చుట్టు వికృతాకారములో ఉన్న సింహ తలాటము లేక ప్రభావలి

అనునది తప్పకయుండును. అదే విధముగనే శరీరములో దేవుడున్నప్పటికి మాయ కూడ కలదు. దేవుడు ఆత్మరూపములో




ఉంటూ శరీరమును నడుపు శక్తిగ శరీరమంత వ్యాపించి ఉండగ, మాయ గుణముల రూపముతో తలయందు

గలదు. మనిషి తలయందు గల గుణములను మాయజనితములని లేక మాయయుక్తములని చెప్పవచ్చును. అందువలన

భగవద్గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు గుణమయీ మమ మాయా " అన్నాడు. దీని ప్రకారము మాయ ప్రతి

శరీరములోను గుణముల రూపములో ఉన్నదని తెలియుచున్నది. గుణములు లేనివాడు ఎవడు లేడు, కావున మాయలో

లేనివాడు ఎవడు లేడనియే చెప్పవచ్చును. మనిషి తలలోని మాయ యొక్క స్థానము ఎక్కడున్నదని పరిశీలించి చూచితే,

తలలో సూక్ష్మరూపముగ ఉన్న నాలుగు చక్రములో క్రింది చక్రమైన గుణచక్రములో సాత్విక, రాజస, తామసమను

మూడు భాగములు గలవు. ఆ భాగములలో ఒక్కొక్క భాగమునందు ఆరు ఒక రకము, ఆరు మరొక రకము మొత్తము

పండ్రెండు గుణములు గలవు. ఈ రెండు రకములైన గుణములను జయించగలిగితే మాయను జయించి నట్లగును.

అందువలన పై చరణములో ఆరును ద్రుంచి ఆరును నరకమన్నాడే అని వర్ణించి చెప్పారు.


మాయ గుణమయమైయుండినప్పటికి ఆరు ఒక రకము ఆరు మరొక రకమైన గుణములుగ ఉన్నదని

చెప్పుకొన్నాము. ఆరు మరియు ఆరు వివరమును పరిశీలించి చూచితే ఆరు చెడు గుణములు, ఆరు మంచి గుణములుగ

ఉన్నవి. ఆరు చెడు గుణములు వరుసగ 1) కామ (ఆశ) 2) క్రోధ (కోపము) 3) లోభ (పిచునారితనము) 4) మోహ

(నాది, నావారు) 5) మధ ( గర్వము) 6) మత్సర (అసూయ). ఈ ఆరు గుణములనే మనిషికి శత్రువులాంటివని

అరిషట్ వర్గము అన్నారు. అలాగే మనిషికి మిత్రునిలాంటి మంచి గుణములు కూడ ఆరు గలవు. అవి వరుసగ 1)

దాన 2) దయ 3) ఔధార్య 4) వైరాగ్య 5) వినయ 6) ప్రేమ అనునవి. ఈ గుణములను బట్టి మనిషి సమాజములో

మంచివాడని లేక చెడ్డవాడని లెక్కించబడుచున్నాడు. ఈ గుణముల వలననే పాపము పుణ్యములను కర్మలు కలుగుచున్నవి.

మాయ యొక్క రెండు రకముల గుణములు జీవునకు కర్మలను అంటగట్టి జన్మను కలుగజేయునవే. కనుక కర్మలను

బంధనములు అన్నారు. మాయకు వ్యతిరేఖము దైవము. మాయయొక్క గుణములకు వ్యతిరేఖము దైవము యొక్క

జ్ఞానము. గుణములచేత తయారగు కర్మలకు వ్యతిరేఖము జ్ఞానము వలన తయారైన జ్ఞానాగ్ని. అందువలన మనషి

దైవజ్ఞానమును తెలిసి జ్ఞానాగ్నిని సంపాదించుకొంటే మాయ గుణముల ప్రభావమైన కర్మ కాలిపోవునని తెలుపుచు

ఆరును, ఆరును చేరకయుండమన్నాడని వ్రాశారు.


2. తొమ్మిది వాకిల్ల కొంపకు ఎందుండి వస్తినన్నాడే ఎందుతిరిగినా ముందు చోటికే పొమ్మన్నాడే

మనము నివశించుదానిని ఇల్లు లేక గృహము అంటాము. మనిషి తన ఆర్థిక స్థోమతను బట్టి పూరిగుడిసెనుండి

పెద్దమేడలలో వరకు నివశిస్తున్నాడు. మనిషి ఎటువంటి ఇంటిలో నివశించినప్పటికి ఆ ఇంటికి ఒక ద్వారము

(వాకిలి) నుండి అనేక ద్వారముల వరకు ఉండవచ్చును. చిన్న గుడిసెకైతే ఒక వాకిలి ఉంటుంది. పెద్ద మేడలకైతే

ఇరువై లేక ముప్పై వరకు ఎన్నైన ఉండవచ్చును. గృహములన్నియు వానివాని కర్మానుసారము ఉండునని చెప్పవచ్చును.

ఆధ్యాత్మిక విద్యలో ఆత్మల వివరమే చెప్పబడుచున్నది, కావున ఇక్కడ జీవాత్మ వివరమునే మనము ప్రస్తావించుకోవాలి.


మనిషికి గృహమెలాగలదో జీవాత్మకు కూడ గృహము కలదు. అదియే శరీర గృహము. మనుషులు

నిర్మించుకొన్నవి బయటికి మిద్దెలు మేడలైతే, దేవుడు నిర్మించి ఇచ్చిన గృహము శరీరము. బయటి ఇంటికి వాకిల్లు

ఎన్నైన మనము పెట్టుకోవచ్చును గాని దేవుడు ఇచ్చిన శరీర గృహమునకు కేవలము తొమ్మిది వాకిల్లు మాత్రము తప్పక

ఉండును. జీవాత్మ శరీరమను గృహములో కొంతకాలము నివాసము చేసి ఆ శరీర గృహమును వదలి పోవడము


కూడ జరుగుచున్నది. మనము నిర్మించుకొన్న బయటి గృహము కొంతకాలమునకు శిథిలమై నివాస యోగ్యముకానట్లు

శరీరగృహము కూడ శిథిలమై పోవుచున్నది. జీవాత్మ శిథిలమైన శరీరమును వదలి మరొక క్రొత్త శరీర గృహములో

చేరుచున్నాడు. మొట్టమొదట జీవాత్మ పరమాత్మ నుండి వచ్చినదే. అలా వచ్చిన జీవాత్మ నివశించుటకు శరీరము

తప్పనిసరి అయినది. మొదట పరమాత్మనుండి వచ్చిన జీవాత్మ తర్వాత శరీర గృహములు మారుచు భూమి మీదనే

ఉండిపోయినది. ఈ తత్త్వములో జీవాత్మకు కావలసిన జ్ఞానమును చెప్పుచు తొమ్మిది వాకిల్లకొంపకు ఎందుండి

వస్తివని ప్రశ్నించారు. తర్వాత ఎన్ని శరీరములు మారిన మొదటి పరమాత్మలోనికి పొమ్మని చెప్పుచు ఎందుతిరిగిన

ముందు చోటికే పొమ్మన్నాడు. గురువు శిష్యునకు బోధించవలసినది ఆత్మజ్ఞానము కావున జీవాత్మకు తన మొదటి

స్థానమును జ్ఞాపకము చేసి తిరిగి అక్కడికే పొమ్మని హితము ఈ చరణములో చెప్పారు.


3. ఆరు శిఖరములపైన వెయ్యికాల్ల మంటపమన్నాడే ఆరు శిఖరములు ఎక్కి ఎగచూడమన్నాడే

శిఖరము అనగ కొండ అగ్రభాగమని అర్థము. ఆరుకొండలు పూర్తి ఎక్కిన తర్వాత పైన ఏడవకొండ మీద

వెయ్యికాల్లమంటపమున్నదట. వేయిస్థంభాల మంటపములో దేవుడు తప్ప ఎవరుంటారు. కావున దేవున్ని చూడాలంటే

ఆరు శిఖరములను ఎక్కి పైన ఉన్న దేవున్ని ఎగ చూడమన్నారు. ఇదే విషయమును తెలియజేయుటకు ఏడుకొండల

మీద వెంకటేశ్వరుడున్నాడని చెప్పుచుందురు. కొండల మీద దేవుడుంటే ఏడుకొండలేమిటి ఏకంగా ఎనభై కొండలైన

ఎక్కి చూడవచ్చును. ఏడు కొండలు ఎక్కిన, ఎనభైకొండలు ఎక్కిన అక్కడ కనిపించేది శిలాప్రతిమ తప్ప ఏమి ఉండదు.

అది ప్రతిరూపమైన ప్రతిమే తప్ప దేవుడు కాదు.


దేవుడు ఆత్మరూపములో ఉంటాడు కాని ప్రకృతి రూపమైన రాల్లు, నీల్లరూపములో ఉండడని పెద్దలంటుంటారు.

అందువలన చిల్లరరాల్లకు మ్రొక్కుచుయుంటె చిత్తము చెడునురు అన్నారు. అట్లయితే ఈ తత్త్వములో ఏడు శిఖరములు

ఎక్కి ఎగచూడమని ఎందుకన్నారని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి సమాధానము ఏమనగా! మన శరీరమే

దేవాలయము అందులోని ఆత్మే దేవుడని కొందరు పెద్దలు అన్నారు కదా! దాని ప్రకారము శరీరములోని ఆలయ

అమరికను గురించి చెప్పినదే ఈ తత్త్వము చరణము. మన శరీరములో మూడు లక్షల యాభైవేల నాడులు గలవని

ప్రతీతి. అందులో అన్నిటికంటే పెద్దవి మూడని, అవియే ఇడ, పింగళ, సుషుమ్ననాడులని వాటినే సూర్య, చంద్ర,

బ్రహ్మనాడులని అంటున్నాము. వాటిలో ముఖ్యమైనది సుషుమ్న అనబడు బ్రహ్మనాడి. ఈ బ్రహ్మనాడి శరీరములోని

వెన్నెముక మధ్యభాగములో గుదస్థానము మొదలుకొని కపాల స్థానము వరకు వ్యాపించివున్నది. అట్లు వ్యాపించివున్న

బ్రహ్మనాడి ఏడు నాడీకేంద్రములుగ విభజింపబడి ఉన్నది. ఆరు కేంద్రముల పైనగల ఏడవ నాడీకేంద్రము ఆత్మకు

స్థానమై ఉన్నది. బ్రహ్మనాడిలో ఏడవ నాడీకేంద్రమైన మెదడులో ఆత్మ నివాస ముండుట వలన ఆత్మను దైవముగ

లెక్కించుటవలన ఆరు నాడీ కేంద్రములను ఆరు శిఖరములుగ పోల్చి ఏడవ దానిమీదికి ఎగచూడ మన్నారు. శరీరములోని

ఆత్మను తెలుసుకొనుటకు చేసిన ప్రయత్నమే ఈ తత్త్వము యొక్క ఉద్దేశము. కావున శరీరములోని నాడీకేంద్రములను

కొండలుగ పోల్చి ఏడవకొండ మీద దేవుడున్నాడని ఏడవ నాడీ కేంద్రమునకు దృష్ఠిమరలునట్లు చేశారు.



4. మూడు నదులు కలియుచోటు తెలియమన్నాడే మూటిలోయుండే మూల పురుషుని చూడమన్నాడే.


ఇంతకు ముందు శరీరములోని మూడునాడుల గురించి చెప్పు కొన్నాము. ఈ మూడునాడులు విడివిడిగ

ఉండి క్రింది వరకు వ్యాపించి ఉన్నప్పటికి ఆ మూడు కలియుచోటు ఒకటి కలదు. అదియే మెదడు స్థానము. దానిని

ఏడవ పెద్దనాడీ కేంద్రమని కూడ చెప్పుకొన్నాము. ఈ కేంద్రములో మూడునాడులు కలియుచున్నవి. ఈ ఏడవ

కేంద్రములోనే ఆత్మ నివాసమని చెప్పుకొన్నాము. ఆత్మయే శరీరమంతటికి అన్ని నాడీ కేంద్రములకు మూలాధారమైవున్నది.

ఈ విషయమును వివరించుటకు మూడునాడులను మూడునదులుగ పోల్చి మూడు నదులు కలియుచోటు తెలియమన్నారు.

మనలోని మనస్సును బాహ్యచింతలయందు లగ్నము చేయక మన తలయందు త్రికూట స్థానములో ధ్యాసనుంచితే

అక్కడున్న ఆత్మ తెలియునని పెద్దల ఉద్దేశము. కావున మూటిలోవుండే మూల పురుషుని తెలియమన్నారు. శరీరములో

మూడునాడులు కలియు త్రికూట స్థానమున మనస్సు నిలుపనివాడు, బాహ్యముగ ఆత్మను వెతుకువాడు ఎప్పటికి

బ్రహ్మవేత్త కాలేడని నాల్గవ చరణములోని భావము.


12. తత్త్వము.


గుట్టు తెలిసి మసులుకొనరే సుజ్ఞానులార బట్టబయలు దీని భావమెల్లను గుట్టు తెలిసి నడుచుకొనరే.


1)గండుపిల్లి లోకమెల్ల పారజూచి ఏలగాను,

కొండ ఎలుక లొక్క రెండు కొలువు జేసేరా.

॥ గుట్టు||.


2)అండబాయక చిలుకలైదు అడవిగాచుచుండగాను,

పండు కోతులొక్క రెండు ప్రహరి తిరిగేరా.

|| గుట్టు||.



3)ముట్టు తప్పి గొడ్డురాలు మహిళకొక్క కొడుకు పుట్టి

గొప్పకొండలేడు మ్రింగి గురకపెట్టెరా.

॥ గుట్టు||.


4)గుట్టు చప్పుడనక నొక్కడు ఉరికి మింటి కెగయగాను,

కుప్పిగంతులేసి పాము కరచి మ్రింగేరా.

॥ గుట్టు||.


5)భువిని నోరులేని మిడత పులిని మ్రింగేను,

ఆ వార్త తెలిసి మేక యొకటి పకపక నవ్వేరా.

॥ గుట్టు||.


6)ఈ వివరము అరసి చూడ అలవిగాదు ఎవరికైనను,

తెలివిగల యాగంటి గురుడు తానె తెలియురా.

|| గుట్టు||.


ఇక్కడ ఆరవ చరణములో ఈ తత్త్వ వివరము తెలుసుకొనుటకు ఎవరికి అలవిగాదు. తెలివిగల యాగంటి

గురుడు తానే తెలియురా అన్నారు. ఇపుడు ఈ తత్త్వ వివరమును తెలిసి మేము వ్రాయాలంటే యాగంటి గురుడుగ

మారి పోక తప్పదు. అలా మారి ఆయనకు ఏ వివరము తెలిసిందో మనము తెలుసుకొందాము.


1)గండుపిల్లి లోకమెల్ల పారజూచి ఏలగాను, కొండ ఎలుక లొక్క రెండు కొలువు జేసేరా.



మన శరీరములో కదలికశక్తి ఉన్నది. ఆ శక్తిని చైతన్యశక్తి అంటున్నాము. ఆ శక్తి శరీరములో ఎక్కడున్నదో

ఎట్లున్నదో ఎవరికి తెలియదు. దానిని ఎవరు చూడలేదు. మనిషి శరీర బరువుకంటే ఎక్కువున్న బరువును కూడ

శరీరములోని శక్తి కదలించుచున్నది. బయటి వస్తువులను కదలించు శక్తి మన శరీరములోని శ్వాసను కూడ

ఆడించుచున్నది. చైతన్యమును నమ్మలేనివారు కూడ శ్వాస కదలిక చూచి నమ్మవలసి వస్తున్నది. కనిపించని చైతన్యమును

ఒక పేరు పెట్టి పిలువడము జరిగినది. ఆ పేరే “ఆత్మ”. ఆత్మ ఒక్క చోట కేంద్రముగ ఉండి శరీరమునంతటిని తన

చైతన్యము చేత నడుపుచున్నది. కనిపించని ఆత్మ శరీరములో ఉందా లేదా అని చూచుటకు శ్వాసను బట్టి చూడవలసిందే.

శ్వాస ముక్కు రంద్రములలో ఆడుచువుంటే లోపల ఆత్మ ఉందని, శ్వాస ఆడకపోతే లోపల ఆత్మలేదని తెలియగలుగు

చున్నాము. ఆకాశములోని సూర్యుడు తన కిరణముల చేత లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు శరీరములోని

బ్రహ్మనాడి ఏడవ కేంద్రములోవున్న ఆత్మ తన చైతన్యము చేత శరీరమునంతటిని ప్రకాశింపజేయుచున్నది. శరీరములో

ఆత్మ ప్రకాశమున్నదా లేదా అనుటకు బయటకు కనిపించు శ్వాసే ఆధారము. దీనిని బట్టి రాజువలె ఆత్మ శరీర

సామ్రాజ్యమును ఏలుచున్నప్పటికి ఆత్మ అనెడి రాజు కనిపించలేదు. కాని ఆత్మకు ఎన్నో రెట్లు తక్కువయున్న, ఆత్మచేత

కదలుచున్న రెండు శ్వాసలే శరీరమునకు ప్రకాశమనుకొన్నట్లు భ్రమింపజేయుచున్నవి. ఈ విధముగ స్పర్శకు కనిపించే

శ్వాసే శరీరమునకు జీవనాధారమని కొందరనుకొని, దానిని మించినది లేదనుకొనుటయే జ్ఞానమనుకొని, లోపలగల

ఆత్మను మరచి శ్వాసమీదే ధ్యాస పెట్టుకొమ్మంటున్నారు. ఆత్మ మీద ధ్యాస పెట్టక శ్వాస మీద ధ్యాస పెట్టితే గండుపిల్లిని

వదలి చిట్టెలకలను నమ్ము కొన్నట్లుంటుంది.


మన శరీరములోని ఆత్మ గండు పిల్లిలాంటిది. ఆత్మ బలమును అంచనా వేయలేము, కనుక ఆత్మను ఈ

తత్త్వములో గండుపిల్లితో సమానముగ పోల్చుచున్నాము. ఆత్మ తన చైతన్యముచేత శరీరమంత వ్యాపించియున్నది.

కావున ఇక్కడ గండుపిల్లి లోకమెల్ల పారచూచి ఏలెరా అన్నారు. లోకమంటే శరీరమని అర్థము చేసుకోవలెను.

లోపలున్న రాజు తెలియడుగాని బయటున్న భటులు మాత్రము తెలుసునన్నట్లు లోపలగల ఆత్మ తెలియదుగాని, బయటున్న

శ్వాసలు మాత్రము తెలియు చున్నవి. అదే విధముగ లోపలున్న బలమైన గండుపిల్లిలాంటి ఆత్మ తెలియదుగాని

బలములేని చిట్టెలుకలలాంటి రెండు శ్వాసలు తెలియు చున్నవి. అందువలన అందరికి తెలిసినట్లు రెండు కొండ

ఎలుకలు కొలువు చేసెరా అన్నారు. నిజమైన కొలువు లోపల పిల్లిదైన కనిపించెడి కొలువు ఎలుకలదే అన్నట్లున్నది

కదా! అందువలన గండుపిల్లి విషయము తెలియని కొందరు మా ధ్యాస శ్వాసమీదే అని రెండెలుకలను పట్టుకొని

ఊగులాడుచున్నారు. గండు పిల్లి సింహాసనము తల మద్య భాగములో ఉన్న ఏడవ నాడీకేంద్రమైతే, చిట్టెలుకలు రెండు

ఊపిరితిత్తుల వరకు లోపలికి పోయి వచ్చుచున్నవి. ఏది ఏమైన గండుపిల్లి దయాదాక్షిణ్యముతోనే రెండు ఎలుకలు

బ్రతుకుచున్నవి. పిల్లి తన స్థానము వదలి వచ్చినదంటే రెండు ఎలుకలను నోటకరుచుకొని పోతుంది. ఆత్మ బయటికి

వస్తే శ్వాసలుండవని అర్థము.


మీరు బాగా అర్థము చేసుకొనుటకు మరొక మారు చెప్పడమేమంటే పిల్లి అనగ ఆత్మ అని, లోకమెల్ల అనగ

శరీరమంత అని అర్థము, పారజూచి ఏలడము అనగ గోర్లు వెంట్రుకల వరకు తన శక్తిని వ్యాపింపజేయడమని

అర్ధము. కొండ ఎలుకలు అనగ శ్వాసలు, ఒక రెండు అనగ రెండు ఒక్కటిగ బయటికి కలసి వస్తున్నవి, కలిసి లోపలికి


పోవుచున్నవని అర్థము. కొలువు చేసేరా అనగ శ్వాసలే శరీరమునంతటికి ఆధారమన్నట్లు కనిపిస్తున్నవని అర్థము ఈ

విధముగ అర్థము చేసుకొంటే ఈ మొదటి చరణములోని భావమంత బట్టబయలే అని చెప్పారు.

2)అండబాయక చిలుకలైదు అడవిగాచుచుండగాను,

పండు కోతులొక్క రెండు ప్రహరి తిరిగేరా.


శరీర నిర్మాణము ప్రకృతియైన పంచభూతముల చేత నిర్మాణమై ఉన్నది. శరీరము పంచభూతములైన ఆకాశము,

గాలి, అగ్ని, నీరు, భూమి అను ఐదు పదార్థముల చేత తయారైనది. శరీరమంత ఐదు పదార్థములే నిండివున్నవి.

ఆత్మ తల మద్య భాగములో ఉండి ఈ ఐదు భాగములంతటికి తన శక్తిని ప్రసారము చేయుచున్నది. దీనిని బట్టి

పంచభూతముల రాజ్యములో ఆత్మ రాజుగ ఉన్నాడని తెలియుచున్నది. ఇంటికి కాపలా కాయమని ఇంటి యజమాని

చెప్పితే ఇంటిలోని గుమస్తాలు యజమాని చెప్పిన పని చేసినట్లు ఆత్మ చెప్పిన పని పంచభూతములు చేయుచున్నవి.

పంచభూతములు ఒక్కొక్కటి ఐదు భాగములుగ విభజించబడి మొత్తం ఇరువది ఐదు భాగములుగ విస్తరించివున్నవి.

ఆత్మ అను యజమానిననుసరించి పంచభూతముల నిర్మితమైన అవయవములు పని చేయుచున్నవి ఈ విధానమును

రెండవ చరణములో చెప్పుచు పంచభూతములను ఐదు చిలకలుగ వర్ణించారు. పంచభూతములన్ని ఒక చోట

కలిసివున్నాయి కనుక అండబాయక అన్నారు. పంచభూతములు కనిపించెడి పది అవయవములుగ, కనిపించని

పదిహేను అవయవములుగ శరీరమంత వ్యాపించివున్నవి. కావున చిలుకలైదు శరీరమను అడవిని కాచుచున్నవని

చెప్పారు.


శరీరమును అడవిగ పోల్చుకొంటే దానికి ప్రహరి గోడలాంటిది చర్మము. చర్మము దాటి శరీరముండదు.

చర్మములోపలనే శరీరమంత ఉండును. గోర్లు వెంట్రుకలు కూడ చర్మములోని భాగములే అని గుర్తుంచుకోవలెను.

శరీరమను అడవిలో ఇరువదైదు అవయవములనబడు జంతువులు కలవని చెప్పుకోవచ్చును. వాటిలో ఎప్పుడు

చలనము కలిగినవి కోతులు. అందులోను తిరిగే దానిలో బాగ అలవాటుపడినవని అర్థమగుటకు పండుకోతులని

కూడ చెప్పారు. ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాస అను రెండు కోతులు శరీరము బయటికి కూడ వస్తున్నవి. కావున ప్రహరి

దాటిపోయి తిరిగి వస్తున్నవని చెప్పవచ్చును. రెండు ముక్కురంధ్రముల శ్వాసలను రెండు కోతులుగ లెక్కించి చూచితే

శరీరమను అడవినుండి చర్మమను ప్రహరి దాటిపోయి తిరిగి వచ్చుచున్నవి. అందువలన పండు కోతులొక్క రెండు

ప్రహరి తిరిగేరా అన్నారు.


అండబాయని ఐదు చిలకలనగ ఒక్క చోట కలసియున్న పంచ భూతములని, శరీరమును అడవియని, ఒక్క

రెండు అనగ ఒక్క శ్వాసే రెండు భాగములుగ ఉన్నదని, పండుకోతులనగ తిరుగుటలో పండిన రెండు రకముల

శ్వాసలని, ప్రహరి అనగ శరీరమును చుట్టియున్న చర్మమని అర్థము చేసుకొన్నపుడు రెండవ చరణములోని రహస్యము

సులభముగ అర్థము కాగలదు. చూచుటకు విచిత్రముగ చిలకలు, కోతులు, అడవి అని వ్రాసిన ఈ వాక్యములో ఎంతో

జ్ఞానము ఇమిడి ఉన్నది.


3)

ముట్టు తప్పి గొడ్డురాలు మహిళకొక్క కొడుకు పుట్టి

గొప్పకొండలేడు మ్రింగి గురకపెట్టెరా.


మానవులలో పూర్వము వెయ్యింటికొకడు అదియు అరుదుగ జ్ఞానము మీద ఆసక్తి కల్గియుండెడివారట. నేటి

కాలములో లక్షమందిలో ఒక్కనికి జ్ఞానము మీద ఆసక్తియుండడము అరుదే అని చెప్పవచ్చును. రెండు మూడు

లక్షలకు ఒకడు జ్ఞానము మీద ఆసక్తియున్నవాడు దొరికినప్పటికి వాడు చివరి వరకు జ్ఞానము తెలుసుకుంటాడను

నమ్మకము లేదు. దీనిని బట్టి చూస్తే కడవరకు జ్ఞానాసక్తి కల్గియుండువాడు కొన్ని లక్షలకు ఒకడు దొరుకునని

తెలియుచున్నది. బహుశ పదిలక్షలకు ఒకడు దొరికితె పదిలక్షలమంది అజ్ఞానులుంటారన్నమాట. అంతమందిలో

జ్ఞాని అయినవాడు కర్మయోగము, బ్రహ్మయోగము అను రెండు యోగములలో ఏ యోగమునైన అనుసరించవచ్చును.

ఒక వేళ బ్రహ్మయోగమును అనుసరించాడని అనుకొందాము. అతడు బ్రహ్మయోగి అగును. ఇంత వరకున్న వివరమును

పై చరణములో ఏ విధముగ వివరించారో చూద్దాము. గొడ్డురాలు అనగ పిల్లలు పుట్టనిదని అందరికి తెలియును.

గొడ్డురాలుకు పిల్లలు పుట్టకున్న ముట్టు అనునది ప్రతి నెల ఉండనే ఉండును. అజ్ఞానికి జ్ఞానము కలుగుట దుర్లభము,

పది లక్షలమందికి కూడ ఒకడు దొరుకుట అరుదు అనుకొన్నాము కదా! అజ్ఞానిని గొడ్డురాలుగ పోల్చి వారికి జ్ఞానము

అను సంతతి కలుగదు అన్నారు. సంతతి కలగాలంటే వారిలో జ్ఞానమనే భీజము పడాలి. జ్ఞానమనేది టీవిలలోను,

రేడియోలలోను ఎక్కడైన గురువులవద్దను విన్నప్పటికి ఆసక్తిలేని వారికి అది ఫలించదు, అనగ బుర్రకెక్కదు. ఎంతో

మంది అజ్ఞానులలో ఒక్కడైన జ్ఞానుల సాంగత్యములో జ్ఞానమును విని దానిమీద ఆసక్తి పెంచుకొంటే వానికి

జ్ఞానభీజముపడినట్లే. అటువంటివాడు కొంత కాలమునకు యోగి కాగలడు. అజ్ఞానమనే గొడ్డుతనము కల్గి యోగమనే

సంతతిలేనివానికి జ్ఞానభీజము పడినపుడు అజ్ఞానము అను ముట్టు నిలిచిపోవును. జ్ఞానభీజము పడినవానికి కొంతకాలము

వరకు గర్భము పెరిగినట్లు జ్ఞానము పెరిగి యోగము అను పుత్రున్ని పొందగలడు. పుట్టిన వారిలో కొడుకు పుట్టవచ్చు

లేక కూతురు పుట్టవచ్చు. జ్ఞానము కల్గినవాడు కొంతకాలమునకు కర్మయోగి అయితే కూతురు పుట్టినట్లే అట్లుకాక

కొడుకు పుట్టినట్లయితే బ్రహ్మయోగిగా లెక్కించుకోవలయును.


భూమి మీద బ్రహ్మయోగి అయినవాడు మనస్సును జయించు సాధన చేసి మనస్సును జయించును. ఎన్నో

సంకల్పములతో కూడుకొన్న మనస్సును ఏ ఒక్క ఆలోచన చేయనీక శూన్యముగ ఉంచడమును బ్రహ్మయోగము

అంటాము. శరీరమునకున్న ఐదు జ్ఞానేంద్రియములైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము యొక్క ప్రస్తుత

విషయములనుగాని, జరిగిపోయిన, జరుగబోవు విషయములనుగాని యోచించకుండ ఉండడమును బ్రహ్మయోగము

అంటాము. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అదేమనగా ఒక గురువువద్ద ఉపదేశమంత్రమును తీసుకొని

దానిని ధ్యానించుచున్నపుడు, అది ఇంతకు ముందు విన్నదగును కదా! జరిగిపోయిన చెవుకు సంబంధించిన

విషయముకదా! ఇది ఇంద్రియ విషయమగుట వలన చేసేది ధ్యానము కాదంటామా? అని అడుగవచ్చును. దానికి

మా జవాబు ఏమనగా! ఇంద్రియములకు సంబంధించిన ఒక్క విషయము మీద ధ్యాస పెట్టి జపించడము వలన

అతడు అనేకము నుండి ఏకములోని వచ్చి మనస్సును ఒక్క దానిమీద పెట్టాడు కావున అది యోగము కానేరదు.

మనస్సుకు ఏక విషయము కూడ లేకుండ చేసి ఏకము విదగల సున్న మీదికి పోయినపుడు ఏకాగ్రత చెందిన

వాడగును. అపుడు అతని మనస్సులో ఒకటి కూడ లేకుండ సున్న స్థితిలో ఉన్నాడని తెలియుచున్నది. ఏకాగ్రత

చెందినవాడే బ్రహ్మయోగి అగును. అట్లుకాక మనస్సులో ఏదో ఒక దానిని ధ్యానించువాడు ధ్యాని లేక తపస్వి అగును,


కాని యోగి కాలేడు. ఒక్క దానిని తపించుచు జపించు వానిని తపస్వి అంటారు. తపస్వికంటే ఏ ఒక్కటిలేని యోగి

గొప్ప అని గీతలో కూడ “తపస్వి భ్యోధికో యోగీ” అన్నారు.


గొడ్డురాలువలెవున్న అజ్ఞాని జ్ఞానమను గర్భము ధరించి బ్రహ్మయోగమను పుత్రుని కన్న తర్వాత ఎట్లుండుననగా!

తాను యోగము నాశ్రయించి బ్రతుకుటకు మొదలు పెట్టును. బ్రహ్మయోగము చేయునపుడు శరీరములోని మనస్సు

అన్ని పనులను వదలి ఏ ఒక్క ఆలోచనగాని ధ్యాసగాని లేకుండ ఉండును. అపుడు శరీరములో ఏడు నాడీకేంద్రములందున్న

శక్తి క్రింది కేంద్రమునుండి స్థంభించిపోవుటకు ఆరంభించును. ఒకదాని తర్వాత ఒకటి స్థంభించి చివరకు ఆరు

కేంద్రములు నిలచిపోవును. చివరి ఏడవకేంద్రములో ఆత్మశక్తంతయు కేంద్రీకృతమైపోవును. ఏడవకేంద్రము క్రింది

ఆరు కేంద్రములవలె నిలిచి పోదని జ్ఞాపకముంచుకోవలెను. పైన శిరస్సులోగల ఏడవ కేంద్రములో ఆత్మ నిలచిపోయినపుడే

పూర్తి యోగమగును. క్రింది ఆరు నాడీ కేంద్రములలో ఆత్మ చైతన్యము లేకుండ పోయినది కావున శరీరములోని

పనులన్నియు నిలిచిపోయివుండును. జీర్ణాశయము పనులుగాని, ఊపిరి తిత్తుల కార్యముగాని, గుండెయొక్క కదలికగాని,

రక్తప్రసరణగాని ఏమి లేకుండ స్థంభించి పోయివుండును. అపుడు యోగి శరీరములో నిద్రలో కదలనట్లుండును.

ఊపిరి కూడ లేదు కావున ఒక విధముగ మృతదేహము వలె కనిపించును. కాని లోపల ఆత్మ జీవాత్మ రెండు ఉన్నాయి

కనుక ఆ స్థితిని యోగనిద్ర అని కూడ అనుచున్నాము. ఈ యోగవిషయమును ఈ తత్త్వములో ప్రస్తావిస్తు గొప్ప

కొండలేడు మ్రింగి గురుకపెట్టెర అన్నారు. దీనిని వివరించుకొంటే యోగమును కొడుకనుకొన్నాము కదా! యోగము

క్రిందినుండి ఆరు కేంద్రములనెక్కి ఏడవకేంద్రము చేరుచున్నది. కావున ఏడు నాడీకేంద్రములను గొప్ప కొండలుగ

పోల్చి చెప్పి గొప్ప కొండలేడు మ్రింగెర అన్నారు. అక్కడ చేరిన యోగము ఆత్మయందు చేరి నిలిచిపోవుచున్నది. శరీర

ధ్యాస మరియు పనులు అన్ని నిలిచి నిద్ర పొందిన వానిలాగ కనిపిస్తున్నాడు, కావున అది యోగనిద్రగ లెక్కించి

కొండలేడుమ్రింగి గురక పెట్టెర అన్నారు. మీకు బాగ అర్థమగుటకు మరొక మారు ఈ చరణములోని పదముల

పోలికను గురించి చెప్పుచున్నాము. గొడ్రాలు మహిళ అనగ అజ్ఞాన మానవుడు అని అర్థము. ముట్టు తప్పడము అనగ

జ్ఞానము మీద ఆసక్తికల్గి తన తలలో జ్ఞానమును వేసుకోవడము అని అర్ధము. కొడుకు పుట్టడమంటే జ్ఞానము

పొందినవాడు కొంత కాలమునకు యోగి అగును అని అర్థము. గొప్ప కొండలేడు మ్రింగి అనగా శరీరములోని ఏడు

నాడీకేంద్రములనెక్కి ఏడవ దానిలోని ఆత్మయందు చేరడమని అర్ధము. గురక పెట్టెర అనగ ఆత్మయందు చేరిన

జీవాత్మ యోగము అను స్థితిలో ఉన్నాడు. కనుక అది కదలని మెదలని స్థితి కావున దానిని యోగనిద్ర అని గాఢనిద్రలో

గురక వచ్చినట్లు గాఢమైన యోగములో జీవాత్మ లగ్నమైవున్నాడని అర్థము.


4) గుట్టు చప్పుడనక నొక్కడు ఉరికి మింటి కెగయగాను,

కుప్పిగంతులేసి పాము కరచి మ్రింగేరా.


మనిషి నిత్యము తన మనస్సులో అనేక విషయములను చింత చేయుచుండును. అనేక విషయములలోనున్న

మనిషి ఏ విషయము తన ఆలోచనలో లేకుండ చేసుకొను ప్రయత్నమే యోగసాధన. విషయ చింతనలలోనున్నపుడు

మనిషి సంతగోలలోవున్నట్లు గందరగోళములో ఉండును. దానిలో మనస్సుకు విశ్రాంతిగాని, జీవునకు శాంతిగాని

ఉండదు. మనస్సుకు ఒక్క పని కూడ లేకుండ పోయినపుడే దానికి విశ్రాంతి లభించును, అపుడే జీవునకు శాంతి

దొరుకును. అదియే యోగము. యోగము చేయువేళ మనస్సుకు ఆలోచన అను చప్పుడు లేకుండ పోవుచున్నది.

దానినే ఈ వాక్యములో గుట్టు చప్పుడనక అన్నారు. ఏ యోచన లేకుండ మనస్సు గుట్టుగ నిలిచిపోవడమని దాని


అర్థము. అటువంటి సమయము యోగము ఎట్లగుచున్నదనగా! అపుడు క్రిందగల ఆధారమను ఒకటవ

నాడీకేంద్రమునుండి బయలుదేరి పైనగల సహస్రారము అను ఏడవ నాడీకేంద్రమునకు మనస్సు చేరి పోవును. ఈ

విషయమునే ఒక్కడు ఉరికి మింటికెగయగాను అన్నారు. మనస్సు యొక్క ధ్యాస ఏడవ కేంద్రములో చేరిపోయినపుడు

క్రింద ఒకటవ కేంద్రములోనున్న చైతన్యము ఎగిరి రెండవ కేంద్రము చేరుచున్నది. అక్కడ నుండి మూడవ కేంద్రము

చేరుచున్నది. ఇట్లు ఒక్కొక్క కేంద్రమును వదలి చివరకు ఏడవ కేంద్రమును చేరి అక్కడున్న మనస్సును అసలు లేకుండ

చేయుచున్నది. క్రింద ఆరు కేంద్రములలోనున్న ఆత్మశక్తి ఏడవ కేంద్రమునకు వచ్చి మనస్సును మాయము చేసినపుడు

జీవుడు ఆత్మలో చేరిపోవుచున్నాడు. అదియే నిజమైన బ్రహ్మయోగము. మనస్సు ఏడవ కేంద్రములో ఏక అగ్రతగ

నిలిచిపోయినపుడు శరీరమంత వ్యాపించి ఉన్న ఆత్మచైతన్యము శరీరభాగములనుండి ముకులించుకొని బ్రహ్మనాడి

లోని కేంద్రములకు చేరిపోవుచున్నది. అట్లుచేరిన ఆత్మచైతన్యము క్రింది నుండి గబగబ పై కేంద్రములకు

ప్రాకుచువచ్చుచున్నది. అలా ప్రాకుచు చివరకు ఏడవకేంద్రము చేరి అక్కడున్న మనస్సును లేకుండ చేయుచున్నది.

అలా మనస్సు ఎప్పుడైతే లేకుండ పోవుచున్నదో అపుడు జీవుడు ఆత్మతో కలియుచున్నాడు. వేరుగనున్నవి ఒకటిగ

కలిసి పోవడమును యోగము అంటాము. ఒకటిగనున్నవి వేరుగ విడి పోవడమును వియోగము అంటాము. విడి

విడిగనున్న జీవాత్మ ఆత్మ రెండు ఒకటిగ కలసిపోవుచున్నవి కావున దానిని ప్రత్యేకించి బ్రహ్మయోగము అంటున్నాము.


బ్రహ్మనాడినుండి కేంద్రముల ద్వార శరీరమునకు ప్రాకు ఆత్మ చైతన్యమును కుండలీశక్తి అనికూడ అంటున్నారు.

కుండలిని పాముగ పోల్చి చాలామంది చెప్పుచుందురు. ఎందుకనగ పాముకు బుసకొట్టు స్వభావముండును కదా!

కేంద్రములోని కుండలీశక్తి ఊపిరితిత్తులను కదలించి బుసబుసమను శబ్దముతో కూడిన శ్వాసను నడుపుచున్నది కనుక

బుసకొట్టు పాముగ చెప్పారు. మనస్సు పైకి చేరిన వెంటనే కేంద్రములకు చేరిన శక్తి ఒక్కొక్క స్థానమునుండి పైకి

ప్రాకుచు పోవుచున్నది. దానినే ఈ చరణములో కుప్పిగంతులేసి అన్నారు. పైకి ఎగసి పోయిన పాము అనబడు శక్తి

పైన చేరిన మనస్సును లేకుండ చేయుచున్నది. దానినే పాముకరచి మ్రింగెరా అన్నారు. అప్పటివరకు జీవాత్మకు

ఆత్మకు మద్యన అడ్డముగనున్న మనస్సు లేకుండ పోవుటచేత జీవాత్మ ఆత్మలో చేరిపోవుచున్నాడు. ఆత్మ జీవాత్మల

సంధానమను యోగము ఈ చరణములో చెప్పబడినది. మీకు బాగ అర్థమగుటకు మరొకమారు వివరించడమేమనగా!

ఒక్కడు అనగ మనస్సని అర్థము. గుట్టు చప్పుడనక అంటే ఏ యోచనలు లేకుండ ఏకాగ్రతగ అని అర్థము.

ఉరికి మింటికెగయ అనగా తొందరగ క్రిందినుండి పైకి ఎక్కిపోగ అని అర్ధము. పాము అనగ చైతన్యశక్తి లేక ఆత్మశక్తి

అని అర్థము. కుప్పించి గంతులేసి అనగ ఒక్కొక్క కేంద్రమును ఎగరుచు దాటి పోయినదని అని అర్ధము. కరచి

మ్రింగెర అంటే అడ్డమున్న మనస్సును లేకుండ చేసినదని అర్థము.


5)

భువిని నోరులేని మిడత పులిని మ్రింగేను,

ఈ వార్త తెలిసి మేక యొకటి పకపక నవ్వేనురా.

|| గుట్టు||

ప్రపంచములో మిడుత చాలా చిన్నది. పులి మిడుతకంటే చాలా పెద్దది. పులి ఎంత పెద్దదైన క్రిందనే

సంచరించుచుండును. మిడుత ఎంత చిన్నదైన పైపైన ఎగిరి పోగలదు. పులివలె నడువడము మిడతకు రాదు.

పెద్దపులిని చిన్న మిడుత మ్రింగడమంటే చాలా విచిత్రము కదా! అదియు నోరులేని మిడతంట. పులికి మేకకు

శత్రుత్వమున్నట్లే బలమైన పులి బలహీనమైన మేకను సులభముగ చంపివేయగలదు. అటువంటి పులి చనిపోయిందంటే


మేకకు సంతోషముకాక ఏమగును. అందుకే పులిని మిడత మ్రింగిందను వార్త తెలుస్తునే మేక సంతోషము పట్టలేక

పక పక నవ్విందంట. ఇదంత వింటుంటే ఒక కట్టు కథలాగుంది కదా! మమ్ములనడిగితే ఇది కట్టుకథకాదు సత్యమైన

కథే అంటున్నాము. ఇందులో ఇమిడియున్న సత్యమేమిటో వివరించుకొందాము.


భూమి మీద అజ్ఞానము ఎంతగానో విస్తరించియున్నది. కొన్ని లక్షల మందిలో ఒక జ్ఞాని కూడ ఉండుట

అరుదు అనుకొన్నాము. పది లక్షలమందికి ఒక జ్ఞాని ఉన్నప్పటికి దాని ప్రకారము జ్ఞానముకంటే అజ్ఞానము పది

లక్షలంత పెద్దదని కొలత పెట్టుకోవచ్చును. జ్ఞానమును చిన్న మిడతగ లెక్కించుకొంటే అజ్ఞానమను పులి కొన్ని

లక్షలరెట్లు పెద్దదనియే చెప్పవచ్చును. నేటి సమాజములో అజ్ఞానము ముందర జ్ఞానము చాలా చులకనగా, చాలా

చిన్నగ కనిపిస్తునే ఉన్నది. చిన్న మిడతలాగ జ్ఞానముంటే, పెద్ద పులిలాగ అజ్ఞానము ఉండనే ఉన్నది. సమాజ దృష్ఠిలో

జ్ఞానము ఎంత చిన్నదైన అజ్ఞానము ఎంత పెద్దదైన పెద్దదైన అజ్ఞానమును చిన్నదైన జ్ఞానము జయించివేస్తున్నది. అది

ఎలాగంటే తత్త్వములో చెప్పినలాగేనని చెప్పవచ్చును. నోరులేని మిడత అన్నారు కదా. మిడతకు తినేదానికి నోరులేదుగాని

అరిచేదానికి కంఠమున్నది. మిడతలకు తినే నోరుకంటే అరిచే కంఠమే గొప్పగ ఉండును. మిడత నోరు కనిపించదుకాని

కంఠము బాగా వినిపించును. ఎక్కువ శబ్దము చేయు చిన్న మిడత గొప్పదైన పులి చెవులో దూరిందనుకో పులి దానిని

ఏమి చేయలేదు. చెవులో దూరిన మిడత పులిని ఏమైన చేయగలదు. చెవులోపలికి చేరి మెదడు దగ్గరకు పోయి

కంఠమునకు పని పెట్టితే పెద్దపులి కూడ గిరగిర తిరిగి చనిపోవలసిందే. ఏనుగునైన కదిలేటట్లు చేయగల సామత్యము

చిన్న దోమకున్నట్లు, కరిచే చోట కరిచి మనిషిని నిలువున ఎగిరిపడునట్లు చేయ సామత్యము చిన్న చీమకున్నట్లు పులిని

కూడ చంపు స్థోమత మిడతకున్నదని చెప్పవచ్చును. అందువలన ఈ తత్త్వములో నోరులేని మిడత పులిని మ్రింగెరా

అన్నారు. చిన్నదైన జ్ఞానము మనిషి చెవిలో దూరి మెదడుకు చేరితే ఎన్నో సంవత్సరములనుండి మనిషిలో పేరుకొనిపోయిన

పెద్ద అజ్ఞానము పటాపంచలగునని పోల్చి చెప్పడమే మిడత పులిని మ్రింగెను అని అన్నారు.


అజ్ఞానముతో కూడిన అజ్ఞానులు, జ్ఞానముగల జ్ఞానులు సమాజములో ఉన్నారు. సమాజములో అజ్ఞానులదే

సంఖ్య ఎక్కువ. జ్ఞానుల సంఖ్య తక్కువ. అజ్ఞానులకు జ్ఞానులు ఎప్పుడు భయపడుచునే ఉందురు. జ్ఞానులను లేకుండ

చేయాలని అజ్ఞానులు చూస్తునే ఉందురు. తమకు ఆటంకము చేయు అజ్ఞానులు జ్ఞానులుగ మారిపోతే మంచిదని

జ్ఞానులు అనుకొనుచుందురు. ఎప్పుడైన ఒక గొప్ప అజ్ఞాని జ్ఞానముచేత మార్చబడి, అజ్ఞానిగ లేకుండ మారిపోయాడంటే

ఆ వార్త సుజ్ఞానులకు సంతోషమును కల్గించేదే అగును. అందువలన సాధు జంతువులైన మేకవలెనున్న జ్ఞాని పులిలాంటి

అజ్ఞాని నాశనమయ్యాడంటే, జ్ఞానిగా మారాడంటే సంతోషపడునని చెప్పడమే ఈ చరణములో ఆ వార్త తెలిసి మేక

యొకటి పకపక నవ్వేరా అన్నారు.


నా చివరి మాట.


నేటి సమాజములో తత్త్వములు అనువాటికి ఏమాత్రము విలువ లేకుండపోయినది. భిక్షగాల్లు తాము భిక్షాటలో

పాడుకొనుట మేము చిన్నతనములో చూచాము. ఇప్పటి కాలములో భిక్షగాల్లు కూడ భక్తిరూపములోనున్న సినిమా

పాటలు పాడుచున్నారు. తత్త్వములను పాడు భిక్షగాల్లు కూడ చాలా అరుదుగా ఉన్నారు. ఉన్నవారు చనిపోతే వాటిని

పాడేవారే కనిపించరనుకుంటాము. ఆత్మ జ్ఞానములో అత్యంత ఉన్నతమైన తత్త్వములు చివరకు భిక్షగాల్లపాలై చివరకు

అక్కడ కూడ లేకుండ పోవు స్థితికి చేరుకొన్నవని చెప్పవచ్చును. ఇకపోతే బ్రహ్మముగారి మఠమువారు కొన్ని తత్త్వములను

అవియు బ్రహ్మముగారి పేరున్న వాటని కొంత ప్రచారములో పెట్టుకొన్నారు. అయినప్పటికి అవి అందరికి రుచించడము

లేదు. ఇంటింట టీవిలలో చాలామంది స్వాముల చేత జ్ఞానము చెప్పబడుచున్నది. వారు కూడ తత్త్వములను ఎక్కడ

ప్రస్తావించడములేదు. దక్షణ భారతదేశములో తెలుగుభాషలో పూర్వము ప్రసిద్ధిగాంచినవి తత్త్వములు. అటువంటి

తత్త్వములు నేడు మచ్చుకైన కనిపించకుండ పోయినవి. తెలుగునాట అచ్చు యంత్రములులేని నాడు తమిళనాడైన

మద్రాసులో అచ్చుపరిశ్రమలు ఎక్కువ ఉండేవి. సి.వి. కృష్ణాబుక్ డిపోవారు, ఎన్.వి. గోపాల్ బుక్ డిపోవారు నూరు

సంవత్సరముల పూర్వమునుండి పాత వ్రాతపతులను సేకరించి అచ్చువేసి వ్యాపారరీత్య అమ్ముకొనెడివారు. దాదాపు

నలబై సంవత్సరముల క్రితము వరకు ఆంద్రప్రదేశ్లో క్యాలెండర్లు కూడ వారివే ఉండెడివి. వారు సేకరించి అచ్చువేసిన

తత్త్వముల, పద్యముల పుస్తకములు ఎక్కడైన కనిపించిన అవి శిథిలావస్తలో ఉన్నాయి. మేము స్వయముగ సి.వి.

కృష్ణాబుక్ డిపోవారితో మద్రాసులో కలసి ఒక పుస్తకమును గురించి అడిగితే అది స్టాకులేదని చెప్పుచు వారి

తండ్రికాలములో చేసినవి ఆ పుస్తకములని చెప్పారు. వాటిని ఎవరు కొనడము లేదని, అందువలన వాటిని అచ్చు

వేయడములేదని కూడ చెప్పారు. మా తండ్రి ఆధ్యాత్మికవేత్త మరియు గడికోట సచ్చిదానంద శిష్యుడైన దానివలన

ఆత్మలింగ శతకము, వేమన పద్యములు, కాలజ్ఞాన తత్త్వములు, ఆత్మబోధామృత తత్త్వములు, తారకామృత తత్త్వములు

అను పుస్తకములను అప్పటికాలములో అచ్చువేశాము ఇప్పటికి కొన్ని ఉన్నవి. అందువలన అటువంటి పుస్తకములను

మేము చేయమన్నాడు.


ఈ విధముగ తత్త్వాల పుస్తకములు కరువైపోయినవి. ఇప్పటికి ఎక్కడైన తత్త్వము పాడుకొను పాతవారుంటే

వారికి పాడేవరకు వస్తుంది కాని దాని అర్థము ఏమాత్రము తెలియదు. నేటికి కాలజ్ఞాన తత్త్వములను పుస్తకములు

ఎక్కడైన కనిపించినప్పటికి అందులో తత్త్వాలు గలవుగాని వాటికి అర్థమును ఎవరు వ్రాయలేదు. బాగ అర్థమయ్యే

పుస్తకాలను కూడ చదివే ఓపికలేదను మనుషులు అర్థముకాని అర్థములేని వాటిని చదవరు. కొందరు సంస్కృతమును

నేర్చిన స్వామిజీలు ఏ పాండిత్యములేని తత్త్వములను చూచి వాటిని మతి స్థిమితములేనివారు వ్రాసిన తిక్క వ్రాతలు

అంటున్నారు. ఇట్లు ఎన్నో విధముల ఆధ్యాత్మిక విద్యలో ఆణిముత్యములైన తత్త్వములకు ఏమాత్రము గుర్తింపు

లేకుండపోయినది. కొన ఊపిరితో మరణశయ్యమీదున్న వానిలాగ తత్త్వములు అంత్యదశకు చేరుకొనుట మాకు

కొంత భాద అనిపించింది. అవి తిక్క వ్రాతలుకాదు, మన పెద్దలు సంపాదించి ముడివేసిన పెట్టిన జ్ఞానధనము యొక్క

మూటలని చెప్పదలచుకొన్నాము. అవి జ్ఞానధన నిలయములని అందరు గుర్తించలాంటే ఆ మూటలలో ఏముందో

విప్పిచూపితేకాని అర్థముకాదనుకొన్నాము. అందువలన అందరికి వాటిలోని అర్థమును వివరించాలనుకొని ఆ కార్యమును

గ్రంథరూపములోనికి తెచ్చాము ఆ చిన్న గ్రంథమే ఈ " తత్త్వముల వివరము ”.


తత్త్వములన్నిటిని వ్రాయాలంటే చాలా కష్టమైన పని కావున వివిధ రూపాలలో పద్దతులలోనున్న వాటిని

ఏరుకొని వివరించి మీ ముందుంచుతున్నాము. వీటిలో సులభమైనవి కష్టమైనవి రెండు రకముల తత్త్వములు గలవు.

అంతేగాక వీటిని ఎవరైన అర్థము చెప్పగలరా అని సవాలు చేసినవి, చెప్పగలనంటే సంవత్సరమైన గడువిస్తామని

సవాలు విసిరిన వాటిని ఏరుకొని వ్రాశాము. వారి సవాల్లు మాకు పౌరుషమును పోసి వ్రాయించినవి. తత్త్వములన్ని

శరీరములోపలి జ్ఞానమును సూచించునవి అను సూత్రము మాకు బాగా తెలుసు. కనుక ఆ సూత్రమును అనుసరించి

ఎంత కష్టముగ కనిపించిన తత్త్వమునకైన సులభముగ వివరమును వ్రాయగలిగాము. ఈ మావ్రాతతో అవసానదశలో

మరణశయ్యపైనున్న తత్త్వములు క్రొత్తగ యవ్వనరూపముపొంది అందరిని ఆకర్షించగలవని అనుకొంటున్నాము. ఈ

తత్త్వాలను మీరు చదివి తత్త్వములు ఇటువంటివని, దేవుని దగ్గర చేర్చునవని, ఇతరులకు తెల్పుటవలన మీరు కూడ

దేవుని సేవలో పాలుపంచుకొన్నవారగుదురు. లాభాలు రావాలని మొక్కి అక్రమార్జనలచే హుండీలలో లక్షలు వేసివచ్చిన

ఏమాత్రము ఉపయోగము లేదు. నీకున్న స్థోమతతో కొన్ని పుస్తకములనుకొని ఆసక్తియున్నవారికి దానము చేస్తే

జ్ఞానదానమగును. దానివలన విశేషమైన ఫలితము నీకు తెలియకుండనే చేరును. దేవుడుకాని దేవుల్లకు డబ్బులు

వృథాగా ధారపోయుటకంటే దైవ స్వరూపములై, దైవజ్ఞానము నింపాదిగ అందించు పుస్తకములను ఇతరులకు దానము

చేయుట వలన దేవుని పని ఎంతో చేసినట్లగును. ఇదే విషయమునే భగవద్గీతలో “మదర్థమపి కర్మాణి కుర్వాన్ సిద్ది

మవాప్యసి” అన్నారు. నాకొరకు పని చేసితే నీకు సిద్ధి లభించగలదని దీని అర్థము. ఇప్పటి నుండైన నిజమైన దేవుని

సేవ చేయమని, తత్త్వాలలోని రహస్యములను తెలుసుకోమని తెలుపుచు ముగించుచున్నాము.


ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత.


సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024