గీటు రాయి. cloud text 3rd Oct 24 Updated single line.

 


యోగీశ్వరుల వారి రచనల సారాంశము

1) త్రైత సిద్ధాంత గ్రంథములలో అక్షర సముదాయమే, ఆత్మ సమాచారమై ఉన్నది.

త్రైత సిద్ధాంత గ్రంథములలో క్షయ అక్షయ సమాచారము,

పరమాత్మ సమాచారము ఉన్నది.

2) త్రైత సిద్ధాంత సంబంధ గ్రంథములను భౌతికముగా వ్రాసినది యోగీశ్వర్లు.

త్రైత సిద్ధాంత అనుబంధ గ్రంథములలో అభౌతికముగా యోగశక్తి ఉన్నది.

3) త్రైత సిద్ధాంతము ఇందూ (హిందూ) ధర్మములలో విప్లవాత్మకమైనది.

త్రైత సిద్ధాంత గ్రంథములలోని జ్ఞానము సంచలనాత్మకమైనది, చదివి చూడండి.

4) త్రైత సిద్ధాంతము లోకములో అన్నిటికంటే గొప్పది. త్రైత సిద్ధాంత

గ్రంథములు అన్ని గ్రంథములను మించినవి, దాని రచయిత యోగులకు

ఈశ్వరుడైన యోగీశ్వరుడు.

5) త్రైత సిద్ధాంత గ్రంథములు కనిపిస్తే దుష్టశక్తులు భయముతో వణికిపోతాయి.

త్రైత సిద్ధాంత గ్రంథములను దగ్గర ఉంచితే యోగశక్తికి తాళలేక

భయపడిపోతాయి.

6) త్రైత సిద్ధాంత జ్ఞానము భగవద్గీత తరువాత చెప్పబడిన అతి గొప్ప జ్ఞానము.

త్రైత సిద్ధాంత గ్రంథములలో కృష్ణుడు ముందు చెప్పని జ్ఞానమును కూడా

యోగీశ్వర్లు చెప్పారు.

7) త్రైత సిద్ధాంత జ్ఞానము మానవ జీవితమునకు గొప్ప వెలుగు.

సిద్ధాంత వెలుగులోనికి పోయిన వానికి అది దైవశక్తి అని తెలియును.

8) త్రైత సిద్ధాంత భగవద్గీతను వ్రాసినది యోగీశ్వర్లు. అందువలన

త్రైత సిద్ధాంతము అంటే ఏమిటో, అది ఎంత గొప్పదో తెలియబడినది.

9) త్రైత సిద్ధాంతమును గురించి తెలియగలిగితే, యోగీశ్వరుల గ్రంథములను

చదువగలిగితే, ఏ మతస్థుడైనా ఒప్పుకొని తీరును, దానిని ఆచరించును.

10) త్రైత సిద్ధాంతము ప్రత్యక్షముగా భగవంతుడు చెప్పినది. అందువలన అన్ని

మతముల సారాంశము త్రైత సిద్ధాంత గ్రంథములలో కలదు.

11) త్రైత సిద్ధాంత గ్రంథములు వ్యక్తి వ్రాసినవి కావు, వ్యక్తిలోని శక్తి వ్రాసినవి.

అందువలన అన్నీ రహస్యములే చదివి తెలుసుకోండి.

12) త్రైత సిద్ధాంతము భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలో కలదు. అయినా

హిందువులకుగానీ, క్రైస్తవులకుగానీ, ముస్లీమ్లకుగానీ ఆ విషయము

తెలియదు.



గీటు రాయి.

(ప్రార్థన)

దీనిని వ్రాయుటకు ముందుగా నేను దేవున్ని ప్రార్థిస్తున్నానని చెప్పి ఆత్మను ప్రార్థిస్తున్నాను. మీతో దేవున్ని ప్రార్థిస్తున్నానని చెప్పాముగానీ దేవున్ని ప్రార్థించలేదు. ప్రార్థించినది ఆత్మను, ఒక విధముగా మీకు అసత్యమును చెప్పినట్లు కనిపించిన మాట వాస్తవమే. నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ దేవున్ని ప్రార్థించలేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ప్రార్థించను. అయినా నేను దేవున్ని ప్రార్థించనని నాకు తెలిసి మీకు అబద్దమును చెప్పుచున్నాను. అలా అసత్యము చెప్పవలసిన అవసరమేమి వచ్చిందని ఇతరులు అడుగవచ్చును. దానికి నా సమాధానము ఇలా కలదు. నేను ఎప్పుడూ దేవున్ని ప్రార్థించలేదు. ఎప్పుడు ప్రార్థించినా నాలోయున్న, నా ప్రక్కనేయున్న ఆత్మను ప్రార్థించుచుందును. అయితే ఆత్మ అణిగియున్న వాడు, బయట తెలియబడువాడు కాదు. అందువలన నేను ఆయన ధ్యేయానికి వ్యతిరేఖముగా చెప్పకూడదు. జీవాత్మ అయిన నాకు ఆత్మయిన ఆయన తండ్రియగును. ఆత్మయిన ఆయనకు పరమాత్మ తండ్రియగును. ఆత్మయిన ఆయన అనగా నా తండ్రి చేసిన పనులనెల్ల తాను చేసినట్లు చెప్పకుండా తన తండ్రి అయిన దేవుడు చేసినట్లు చెప్పుచుండును. తన తండ్రి చేశాడని చెప్పుకోవడము ఆయనకు ఆనందము. తన తండ్రిని మించినవాడు లేడనీ, అన్ని పనుల కీర్తి తన తండ్రికే దక్కవలెనని నా తండ్రియైన ఆత్మకు ఇష్టము. నా తండ్రి అభీష్టమును తెలిసిన నేను నా తండ్రి చెప్పినట్లే నేనూ ఆయన తండ్రిమీదనే చెప్పుచుందును. అనగా నాకు తాతయైన దేవునిమీద చెప్పుచుందును. ఇదేమిటి దేశములో ఎవరూ చెప్పని విధానమును మీరు చెప్పుచున్నారేమిటి? యని మీరు అడుగవచ్చును.


దానికి నేను ఏమి చెప్పుచున్నానంటే ఇప్పుడిది మీకు క్రొత్తదే అయినా నాకు మాత్రము పాతదే. ఈ వావి వరుసల విషయము భగవద్గీతలోనూ, బైబిలులోనూ, ఖురాన్ గ్రంథములోనూ ముందే చెప్పియున్నారు. ఒకమారు భగవద్గీతలో ఏమి చెప్పారో జ్ఞాపకము చేసుకొందాము. రాజవిద్యా రాజగుహ్య యోగము అను అధ్యాయములో 17వ శ్లోకమును చూద్దాము.


 శ్లోకము:

పితాహ మస్య జగతో మాతాధాతా పితామహః |

వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవచ |


భావము :- “అఖిల జగతికి తల్లితండ్రులు నేనేయగుదును. అంతేకాక ధాతను, తాతను నేనే. వేద స్వరూపమైన ఓంకారమును నేనే. ఋగ్యజుర్ స్సామ వేదములలోని వాక్కును నేనే.”


ఈ శ్లోకార్థములో 'తండ్రిని నేను' అని చెప్పడమేకాక 'తాతను కూడా నేనే'యని స్వయముగా దేవుడే చెప్పడమైనది. ఇప్పుడు మీకు బాగా అర్థమయి వుంటుంది. నాకు తండ్రి దేవుని అంశ అయిన ఆత్మకాగా, ఆత్మకు తండ్రి స్వయముగా దేవుడే. నేను దేవుని మీద నా ప్రార్థన చేసినట్లు చెప్పినా, అది కొంత అసత్యమయినా, చెప్పవలసిన విధానము అదియే. నా ఆత్మ స్వయముగా పని చేయుచున్నా తాను ఏమీ చేయనట్లు అంతా దేవుడే చేయునట్లు అసత్యమే చెప్పుచున్నది కదా! అందువలన నా తండ్రియైన ఆత్మ చెప్పిన పద్దతి ప్రకారమే నేను చెప్పవలెను. 'నేను' అనునది నాకుగానీ, నా తండ్రియైన ఆత్మకుగానీ లేవు. ఆధ్యాత్మిక విద్య ప్రకారము ఉండకూడదు. అందువలన ఆత్మ చేసినా దేవుని మీదనే చెప్పవలసి వచ్చినది. ఒక్కమారుగా ఈ విషయములు అర్థము కావు, ఆధ్యాత్మికమును నేర్వంగా నేర్వంగా అసత్యములో సత్యమున్నదని తెలియును.


దీనిని వ్రాయుటకు ముందు నేను దేవున్ని ప్రార్థిస్థున్నానని చెప్పాను కదా! ప్రార్థించినది ఆత్మను, ఆత్మ ఎవరి కోర్కెలు తీర్చదు. ప్రార్థించినా ప్రార్థించకపోయినా జీవుని కర్మనుబట్టి శరీరములో కార్యములు చేయుచుండును. అట్లే కర్మనుబట్టి జీవునికి కష్ట సుఖములు కలుగ జేయుచుండును. కర్మనుబట్టి జీవున్ని అన్ని విధముల నడిపించుచుండును. ఏ జీవుని ఇష్టప్రకారము ఆత్మ పని చేయనప్పుడు ప్రార్థనతో పనే లేదు కదా!యని ఎవరయినా అడుగవచ్చును. దానికి నా సమాధానము ఇలా కలదు. ఆత్మ జీవున్ని కర్మప్రకారమే నడిపించును అనుమాట వాస్తవమే, అయినా ఇక్కడ ప్రపంచ విషయములయితే కర్మప్రకారము ఆత్మ నడుపును. ఏ జీవునికయినా శరీరములో ప్రపంచ సంబంధముగా ఎటువంటి స్వతంత్రము లేదు. ఆత్మ ఆడించినట్లు ఆడవలసిందే. అట్లే ఆత్మ తోలినట్లు నడువవలసిందే. అట్లని ఆత్మ తన ఇష్టప్రకారము జీవున్ని నడుపడము ఉండదు. జీవుని కర్మను అనుసరించి ప్రతీదీ లెక్కాచారము ప్రకారము ఆత్మ చేయుచుండును. మనిషి పుట్టినప్పుడే జీవునితోపాటు ఆత్మ వచ్చి అప్పటినుండి జీవున్ని తన చెప్పుచేతులలో కర్మ లెక్కప్రకారము నడుపుచున్నది. ఆత్మ ఆడించుచుండగా, జీవుడు ఆడుచుండగా, పరమాత్మయనబడు అల్లాహ్ లేక యెహోవా (దేవుడు) చూస్తున్నాడు. దేవుడు ప్రతి శరీరములో సాక్షిగాయుండగా, ఆత్మ పని చేయుచుండగా, జీవుడు అనుభవించుచున్నాడు. ఈ విషయమును అంతిమ దైవ గ్రంథమయిన ఖురాన్ గ్రంథములో సూరా 50, ఆయత్ 21 లో ఇలా వ్రాసియున్నారు. (50-2) “ప్రతి జీవాత్మ ఒక తోలే వాడితో, మరియొక సాక్ష్యమున్న వాడుతో సహా వస్తుంది." ఇంకొక గ్రంథములో (50-21) “ ప్రతి వ్యక్తి తన వెంట తనను తీసుకు వచ్చే వాడొకడు, సాక్ష్యమున్నవాడు ఒకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు (జన్మకు వస్తాడు)." అని కలదు. దీనినిబట్టి శరీరములో మొత్తము మూడు ఆత్మలు కలవని తెలియుచున్నది.


ఈ విధముగా మూడు ఆత్మలు శరీరములో యుండి జీవనయాత్రను సాగించుచున్నవి. కర్మలను చేసుకొన్న జీవుని కొరకు మిగతా రెండు ఆత్మలు శరీరములో ఉండవలసియున్నది. ఇది మానవ శరీరములోని నిర్మాణము. మానవ శరీరమును ధరించి దేవుడు భూమిమీదికి వచ్చినా అతని శరీరములో కూడా ఇదే మూడు ఆత్మల విధానమే ఉండును. నేను అనగా జీవుడను ఏదయినా కోరుకోవచ్చును. నేను కోరినది ప్రపంచ సంబంధమైతే ఎవరూ ఏమీ చేయలేరు. అది కర్మనుబట్టి యుండును, దానిని అడిగినా, గట్టిగా కోరినా నెరవేరదు. నెరవేరని దానికి ఎందుకు అడగాలి? ఆ విషయము మనిషికి తెలియదు. నెరవేరునను నమ్మకముతోనే అడుగుచున్నాడు. ఇవన్నీ తెలిసి నీవెందుకు ప్రార్థించావు? అని మీరు అడుగ వచ్చును. దానికి నా జవాబు ఏమనగా! నేను ఆత్మను కోరినది ప్రపంచ విషయము కాదు. ప్రపంచ విషయములో నాకు ఎలాంటి హక్కు, అధికారము లేదని తెలుసు. అయితే పరమాత్మ విషయములో ఏ జీవునికయినా స్వతంత్రము గలదు. కోరుకునే అధికారము గలదు, నెరవేరే అవకాశము గలదు. దేవుని విషయములో సర్వజీవులకు స్వతంత్రత ఇవ్వబడియున్నది. అందువలన మనిషి దేవున్ని దైవికముగా ఏమయినా కోరవచ్చును, ఎంతయినా కోరవచ్చును.


ప్రశ్న :- అలా అయితే దేవునికున్న అధికారము నాకు కావలెనని మనిషి కోరవచ్చును కదా! అది దైవికమయిన ప్రార్థనే కదా? అలా కోరితే మనిషి కోర్కె నెరవేరుతుందా?


జవాబు :- ఎలా నెరవేరుతుంది? నెరవేరదు. అది మొదటికే దైవికమయిన ప్రార్థనకాదు. ఎందుకనగా! దేవుని అధికారము ప్రపంచము మీదే ఉంటుంది. కావున నీవు ప్రపంచ అధికారమును అడిగినట్లయినది. అందువలన నీ ప్రార్థన ప్రపంచ ప్రార్థన, ప్రపంచ కోర్కె అయినది. దానివలన అది నెరవేరదు. నీవు దేవుని అధికారమును కోరక దేవున్ని కోరవలెను. దేవుని సన్నిధానమును కోరవలెను. దేవునిలోనికి ఐక్యమగు కోర్కెను కోరవలెను. అంతేగానీ నేరుగా దేవుని అధికారమును కోరకూడదు. అది ప్రపంచ సంబంధమైన కోర్కెయగును. దేవుడు తన మీద తనకు అధికారమును ఇతరులకు వదలి, ఇతరుల అధికారమును తాను తీసుకొన్నాడు. వివరముగా చెప్పితే తన మీద అధికారము మనుషుల చేతిలో పెట్టి, మనుషుల మీద అధికారమును తాను కల్గియున్నాడు. అయితే మనుషుల అధికారము దేవునిమీద ఉన్నదని మనుషులకు తెలియదు. దేవుని అధికారము మనుషుల మీద ఉన్నదని దేవునికి బాగా తెలుసు. దేవుని మీద దేవుని జ్ఞానము మీద అధికారమును మనుషులు కల్గియున్నా అది తెలియని దానివలన దేవుని మీద జీవుడు (మనిషి) తన పెత్తనమును చెలాయించలేక పోతున్నాడు. అయితే దేవుని మీద పెత్తనమును చెలాయించ డానికి ముందు అతని చిరునామా (అడ్రస్) మనిషికి అవసరము. దేవుని చిరునామా తెలియవలెనంటే దేవుని జ్ఞానమును తెలియాలి. దేవుని జ్ఞానమును తెలియాలంటే దేవున్ని తెలియాలను శ్రద్ధకావాలి. దానినే ‘జ్ఞానము మీద శ్రద్ధ' అంటారు. జ్ఞానము మీద శ్రద్ధ యున్నప్పుడు జ్ఞానము తెలియును. జ్ఞానమును తెలియగలిగితే దేవుని ఉనికి (అడ్రస్) తెలియును. దేవుని ఉనికిని తెలియగల్గితే మనిషి అనుకొన్నట్లు దేవుని వద్దకు చేరవచ్చును. దేవునికి సంబంధించిన శ్రద్ధ నీ ఇష్టమును బట్టియుండును.



జ్ఞానము మీద శ్రద్ధ ప్రతి మనిషికి జన్మహక్కులాంటిది. అయితే మనిషి తన హక్కును వినియోగించుకోవడము లేదు.


ప్రపంచ విషయముల మీద ఏ మనిషికి స్వతంత్రత లేదు, అట్లే ఏ హక్కు లేదు. ఉన్న స్వతంత్రము మీదికి దృష్టిని సారించకుండా, ఉన్న హక్కును వదలి లేని హక్కును, లేని స్వాతంత్రమునకు మనిషి ప్రాకులాడు చున్నాడు. లేని హక్కు కొరకు, లేని స్వాతంత్రత కొరకు ఎంతగా పోరాడినా మనిషికి ఏమీ ప్రయోజనము లేదు. అందువలన నేను దేవుని మీద దృష్ఠి కల్గి, దేవుని జ్ఞానము మీద ధ్యాస కల్గియుండి నాకు దేవుని జ్ఞానము ఇంకా బాగా తెలియవలెననీ, నాకు తెలిసిన జ్ఞానమును ఇంకా బాగా ఇతరులకు తెలుపవలెనను కోర్కెను కోరాను. ఈ కోర్కె ఎటు చూచినా ప్రపంచ సంబంధమైనది కాదు. అందువలన నేను నా ప్రార్థనగా దానిని నేను కోరడము సర్వ విధముల సమంజసము. నేను కోరినది నా జన్మ హక్కు. నా కర్మకు సంబంధించినది కాదు, ప్రపంచ సంబంధమైనది కాదు. అందువలన నేను కోరినది కోరినట్లు నెరవేరుచున్నది. నేను దేవుని జ్ఞానమును కోరాను కనుక నాకు దేవుని జ్ఞానము దొరుకుచున్నది. నేను దేవుని జ్ఞానమును ఎంత పుష్కలముగా కోరానో అంత పుష్కలముగా నాకు దొరుకుచున్నది. నాకు ఎంత దొరుకుచున్నదో, అంత నేను ఇతరులకు ఇస్తున్నాను. నేను ఎవరికి ఎంత ఇచ్చినా ఇసుమంత కూడా నావద్ద తగ్గక యున్నది. అందువలన నా ప్రార్ధన ప్రకారము నా జ్ఞాన దాహము తీరుచున్నది, అట్లే ఇతరుల దాహము కూడా తీరుచున్నది.


ప్రశ్న :- మీరు హిందూ మతములో పుట్టారు, కావున మీకు దేవుడు హిందువుల జ్ఞానమును ఇవ్వాలి. మీరు హిందువుల జ్ఞానమును తెలియగల్గితే హిందువులకు హిందూ జ్ఞానమునే చెప్పవచ్చును. అట్లు


కాకుండా మీరు మూడు మతముల జ్ఞానమును చెప్పుచున్నారు. మీరు దేవుని జ్ఞానమును అడిగియుందురు గానీ, మూడు మతములలోని దేవుని జ్ఞానమును అడిగియుండరు కదా?


జవాబు :- ప్రపంచమునకంతటికీ ఒకే దేవుడు గలడు. ఆయననే కొందరు 'పరమాత్మ' అంటున్నారు. కొందరు 'ఎహోవా' అంటున్నారు. మరికొందరు 'అల్లాహ్' అని అంటున్నారు. మొత్తానికి అందరూ కలిపి 'దేవుడు' అనే భావముతోనే చెప్పుచున్నారు. అయితే ఇందులో ఈ మధ్య క్రైస్థవ మతము వచ్చిన తరువాత 'ఎహోవా' అను మాట క్రొత్తగా వచ్చినది. సృష్ట్యాదిలో “పరమాత్మ, సృష్టికర్త, అల్లాహ్” అను మూడు బిరుదులు (పేర్లు) మాత్రము ఉండేవి. ఈ మూడు పదములను, అర్థమును బట్టి, భావ సహితముగా ఆదిలో గల తెలుగు భాషలో చెప్పడమైనది. ఎట్లు చెప్పినా విశ్వము అను సామ్రాజ్య చక్రవర్తి ఒక్కడే, ఆయనే దేవుడు. దేవుడు ఒక మతమునకు సంబంధించినవాడు కాడు. మతములు ఈ మధ్య కాలములో కలియుగములో పుట్టుకొచ్చినవి. దేవుడు ఆదిలోనే తన జ్ఞానమును తెలియజేయడమైనది. దేవుడు ఆదిలో తెలియజేసిన జ్ఞానమును మనుషులు వివిధ యాసలలో, వివిధ భాషలలో చెప్పుకొనుచూ, చివరకు వివిధ మతములుగా చీలిపోయి జ్ఞానమును చీల్చుకొన్నారు. ఉన్నది ఒకే దేవుడే, ఒకే జ్ఞానమే. అయితే మనిషిలోని అజ్ఞానముచేత దేవుడు వేరు, జ్ఞానము వేరుగా ఊహించుకొని ఇది మా జ్ఞానము, ఇది మా దేవుడు అని చెప్పడమే కాక ఇది మా మతము అని అంటున్నారు. నాకు మనుషుల అజ్ఞానము ప్రకారము, తయారయిన మతముల ప్రకారము దేవుడు జ్ఞానమును నాకు అందివ్వలేదు. నాకు అందినది ఒకే దేవునికి సంబంధించిన జ్ఞానము. అదే జ్ఞానమే అన్ని మతములలో యుండుట వలన నాకు మూడు మతముల జ్ఞానము సులభమైనది. వారు చెప్పుకొను దేవున్నే నేను చెప్పుచున్నాను. వారు చెప్పుకొను జ్ఞానమునే నేను చెప్పుచున్నాను. వారు అజ్ఞానముతో దేవుని జ్ఞానమును అర్థము చేసుకోలేకపోవడము వలన, దేవుని గ్రంథముల లోని వాక్యములకు తప్పు భావమును చెప్పుకోవడము, వ్రాసుకోవడము జరిగినది. నాకు దేవుడు, దేవుని జ్ఞానము తెలిసిన దానివలన ఏ మతము వారు ఎక్కడ పొరపడినది సులభముగా తెలియుచున్నది. వారు పడిన పొరపాటును సరి చేయుచూ మిగతా మతముల వారికి చెప్పడము చేశాము. అందువలన మూడు మతముల జ్ఞానమును, మూడు మతముల వారికి చెప్పడము నాకు సులభమైనది. అయినా నాకు మాత్రము ఒకే దేవుడే, ఒకే జ్ఞానమే, ఒకే మతముగానే అన్ని మతములు కనిపించుచున్నవి. వారి మతములు వారికి వేరువేరుగా యున్నా, నాకు జ్ఞానము వలన ఏకముగా కనిపించుచున్నవి. మా మతము, మీ మతము, మా దేవుడు, మీ దేవుడు అను వారు వారివారి మధ్యలో అసూయలు పెంచుకొని అవకాశము దొరికినప్పుడంతా ఒకరినొకరు హింసించుకొనుచున్నారు. నేడు జరుగుచున్న మత హింస పోవాలంటే 'అందరి జ్ఞానము ఒక్కటే, అందరి దేవుడు ఒక్కడే'యని అందరూ తెలియాలి. అలా తెలుపడమే నా కర్తవ్యముగా యుండుట వలన నేను మీలాంటి వారికి మూడు మతముల జ్ఞానము చెప్పినట్లు కనిపించుచున్నది. వాస్తవానికి నేను ఒకరకమైన జ్ఞానమునే, ఒక మత జ్ఞానమునే, ఒక దేవుని జ్ఞానమునే చెప్పుచున్నాను.


ప్రశ్న :- “నేను దేవున్ని ప్రార్థించుచున్నాను. నాకు దేవుని జ్ఞానము కావాలని ప్రార్థించుచున్నాను” అని మీరు చెప్పారు. మాలాగ ప్రపంచ కోర్కెలు కోరకుండా దేవున్ని మాత్రము ప్రార్థించుచున్నారు. ఉదాహరణకు క్రైస్థవుల ప్రార్థనకు, ముస్లీమ్ల ప్రార్థనకు ఎంతో తేడా కనిపించుచున్నది.


క్రైస్థవుల ప్రార్థనలో ఎక్కువగా కోర్కెలుండును, వారి కోర్కెలను దేవునికి చెప్పుకోవడము వలన దేవుడే నెరవేర్చునని వారి నమ్మకము. అందువలన కూతురు పెళ్ళివద్దనుండి కొడుకు ఉద్యోగము వరకు, తినే ఆహారము నుండి చేసే ఉద్యోగము వరకు, ఉప్పునుండి పప్పు వరకు మొదలగు కోర్కెలన్నీ కోరి చివరిలో “ఆమీన్” అని అందురు. ఆమీన్ అనగా 'నా ప్రార్థన స్వీకరించు' అని కొందరు అర్థము చెప్పగా, కొందరు 'తథాస్తు’యను అర్థమును చెప్పుచుందురు. తథాస్తు అనగా 'అలాగే'యని అర్థము. ఎవరు ఏ అర్థమును చెప్పుకొనినా “ఆమీన్” అను పదమును క్రైస్థవులు ముస్లీమ్లు ఇద్దరు ప్రార్థన ముగిసిన తర్వాత చెప్పుచుందురు. ఇప్పుడు ముఖ్యముగా అడుగునది ఏమనగా! ముస్లీమ్లు ప్రపంచ కోర్కెలు కోరకుండా ప్రార్థన చేయుచున్నారు. వారి ప్రార్థనలో దేవుని గొప్పతనమును చెప్పుకోవడము లేక పొగడడము తప్ప కోర్కెలు ఏమీ లేవు. మీరు చెప్పినది 'ప్రపంచ సంబంధము కానిది నిజమైన ప్రార్థన' అన్నట్లు. ముస్లీమ్లు చేసేది మీరు చేసే ప్రార్థనలాంటిదే కదా! వారు చేసేది సరైన ప్రార్థనే అయినప్పుడు, ప్రపంచ సంబంధము కానప్పుడు ముస్లీమ్లకు దేవుడు తన జ్ఞానమునే ఇచ్చియుండును కదా! దీనిప్రకారము మిగతా మతములకంటే మంచి మార్గములో యున్నట్లే కదా! దైవజ్ఞానమును వారికి దేవుడు ఇచ్చినట్లే కదా! మూడు మతములను పరిశీలించి చూస్తే మీరు చెప్పిన భావమునకు ముస్లీమ్లు దగ్గరగా యున్నట్లే కదా! దీనికి మీరేమంటారు?


జవాబు :- నేను చెప్పినది దేవుని జ్ఞానము మీద అధికారమును కోరమని చెప్పానుగానీ, దేవున్ని పొగడమని చెప్పలేదు. ప్రపంచ కోర్కెలను లేకుండా చేయమన్నాను. అంతేకాక దేవున్ని తెలియడము కొరకు దేవుని జ్ఞానమును అభ్యర్థించమన్నాను గానీ, దేవున్ని పొగడమని నేను ఎక్కడా చెప్పలేదు.


దేవుడు పొగడ్తలకు లొంగడు. అంతేకాక పొగడ్తలు ఆయనకు సరిపోవు. ఆయనను వశపరచుకొను విధానము ఆయన జ్ఞానమును తెలుసుకోవడము ఒక్కటేయని చెప్పాను. పొగడ్తలు ప్రపంచ సంబంధ కోర్కెలు కాకపోయినా అది ప్రార్థన అనిపించుకోదు. ప్రార్థన యొక్క ముఖ్యమైన అర్థము అర్థించడము, అనగా అడుగుకోవడము. "భిక్షాందేహి” అని అంటే అది అడుగుకొన్నట్లు అవుతుంది. పొగిడితే గొప్పలు చెప్పినట్లవుతుంది. దేవునికి పొగడ్తలు సరిపోవు. ఒకడు పొగడుచున్నాడు అంటే వాడు ఉన్న విషయమును చెప్పేవాడేగానీ దానివలన దేవునికీ ప్రయోజనము లేదు, మనిషికీ ప్రయోజనము లేదు. అడుక్కొనే వాడు తనకు కావలసిన బిక్షమును అడిగినట్లు, మనిషి తనకు కావలసిన జ్ఞానమును అడగాలి. అట్లు కాకుండా అడుక్కోవలసిన వాడు పొగిడితే, వాడు అక్రమంగా ఇతరుల సొమ్మును దోచేసే దానికేనని అర్థమయి వాని పొగడ్తలకు లొంగిపోకూడదని తలచినట్లు దేవుడు కూడా మనిషి పొగడ్తలకు లొంగకూడదనుకొంటాడు. కొందరి మనుషులకు పొగడ్తలు అంటే ఏమాత్రము ఇష్టము లేనివైవుండును. అట్లే దేవునికి కూడా పొగడ్తలు సరిపోవు.


ప్రార్థన విషయములో క్రైస్థవులు దేవునివద్ద లేనిదానిని అడిగితే, ముస్లీమ్లు తమకు కావలసిన దానిని అడగకుండా ప్రార్థనే కాని దానిని పొగడడమును ప్రార్థనయని అనుకొంటున్నారు. ముస్లీమ్ల ప్రార్థనలో దేవుడు మనుషులకు ఏమి అవసరమో దానిని అడుగలేదు కావున అడగనిదే దేవుడు కూడా ఇవ్వడు. ప్రార్థన అను పదములో రెండు భాగములు కలవు. ప్ర+అర్థన= ప్రార్థన అవుతుంది. అర్థించడము అను పదము నుండి పుట్టినది అర్థన. అందువలన అర్థించడమునకు ఏమి అర్థమున్నదో అదే అర్థమే 'అర్థన' అను పదమునకు కూడా గలదు. ప్ర అనగా ముఖ్యమైన అని అర్థము గలదు. 'ప్రార్థన' అనగా ముఖ్యమైన అర్థన అనియూ, ముఖ్యమైన దానిని అభ్యర్థించడము అనియూ, అన్నిటికంటే గొప్పగా అడుగడము అనియూ అర్థమును చెప్పవచ్చును. క్రైస్తవులు అడుగుచున్నా అది దేవునివద్ద లేనిది, దేవుడు ఇవ్వలేనిదిగా యున్నది. ముస్లీమ్లు అడుగుచున్నామనుకొని అడుగవలసిన దానిని అడుగకుండా, సంబంధము లేని విషయమును మాట్లాడినట్లయినది. అందువలన దేవుని వద్ద నుండి వారికి ఏది అవసరమో దానిని పొందలేక పోవుచున్నారు.


గతములో బుద్ధిహీనత గలవాడు అనగా తెలివి తక్కువ వాడు చీమల కొరకు ఆకాశములో అన్వేషణ చేశాడట. చీమలు కావలసివస్తే భూమిలో వెదకాలిగానీ ఆకాశములో వెదకితే ఎప్పటికీ చీమలు దొరకనట్లు క్రైస్థవులకు దేవుని సాన్నిధ్యము దొరకడము లేదు. దేవుని రాజ్యమంటే ఏమిటో తెలియడము లేదు. అలాగే ఉచిత మజ్జిగ కొరకు రైతు ఇంటికి పోయిన కూలివాడు చెంబును దాచివేసి రైతును చూచి ఈ ఊరిలో నీకున్న ఆవులు ఎవరికీ లేవు, నీయంత గొప్ప ధనికుడు ఎవడూ లేడు, భూమి గలవారిలో నీకున్నన్ని ఎకరములు ఎవరికీ లేవు, నీవు పండించు పంటను ఎవరూ పండించలేరు. నీకంటే గొప్ప రైతు ఎవడూ లేడని పొగిడాడట. అప్పుడు ఆ రైతు తనను ఉచితముగా పొగిడించుకోవడము ఇష్టములేక వాడు తనను పొగిడినందుకుగాను వానికి పాతికో, పరకో ఇచ్చి పంపాడట. రైతు దగ్గర పనిచేసే కూలివానికి అవసరమైనది మజ్జిగ, అయితే వానికి లభించినది పాతిక రూపాయల డబ్బు, కసువు ఊడ్చుకొను చీపురు (పరక). వానికి ఏమి అవసరమో అది దొరకలేదు గానీ తనకు అవసరము లేనివి దొరికినట్లు, ముస్లీమ్లు తమకు కావలసిన అల్లా సాన్నిధ్యమును వదలి స్వర్గమును పొందుచున్నారు. ప్రార్థన వలన వారికి అంతిమ దైవగ్రంథములో చెప్పినట్లు స్వర్గము లభించుచున్నది.



ఈ విధముగా క్రైస్థవులు, ముస్లీమ్లు బోధకుల బోధనల వలన తప్పుదారి పట్టిపోయి, దైవగ్రంథములయిన తమ గ్రంథములలో ఏమున్నదో, దేవుడు ఏమి చెప్పాడో తెలియలేకపోయారు. నిజమైన ప్రార్థనను వదలి పేరుకు మాత్రము ప్రార్థన అయిన దానిని ఆచరించుచున్నారు. క్రైస్తవులలో, ముస్లీమ్లలో 'ఒక దేవుడు' అను నమ్మకమున్నది. వారి బోధకులు గ్రంథములోని వాక్యములకు సరైన అర్థమును బోధించకున్నా “దేవుడు ఒక్కడే, ఒక్క దేవున్నే ఆరాధించాలి, అన్యదేవతారాధన చేయకూడదు” అని బోధించి ఎంతో మంచి చేశారు. హిందువులలో ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతా జ్ఞానమును వారి బోధకులు తప్పుగా చెప్పి, దైవమార్గమును వదలి నడుచునట్లు చేశారు. అది అన్ని మతములలో సహజముగా యున్నదే అయినా, హిందువులలో మాత్రము వారి బోధకులు ఒకే దేవున్ని గురించి చెప్పక అనేక దేవుళ్ళను, దేవతలను వారు ఆరాధించుచూ మిగతా హిందువులను కూడా అనేక దేవతలను ఆరాధించునట్లు బోధించారు. అందువలన హిందూమతములో మొత్తానికి అన్యదేవతారాధన అలవాటై పోయినది. అలా ఆరాధించడమే హిందుత్వము అని వారే చెప్పు కొంటున్నారు. భగవద్గీతా గ్రంథములో వద్దని చెప్పిన ఆచరణలనే హిందూమతములో పెద్దలయిన స్వాములు, సన్న్యాసులు, గురువులు చెప్పడము వలన హిందూ ప్రజలందరూ భగవద్గీతలోని భావమును వదలి, దానిని ఏమాత్రము చూడకుండా, వారి పెద్దలు చెప్పినమాటలనే విని, మార్గము తప్పినవారై అన్యదేవతారాధన చేయుచూ, మేము సరియైన మార్గములో ఉన్నామని అనుకొంటున్నారు. మూడు మతములవారు వారి పెద్దల బోధనల వలన వారు కొంత తప్పుదారి పట్టి నడుస్తున్నారు.


ప్రశ్న :- మూడు మతముల వారికి వారి దైవగ్రంథములయిన భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములలోని వాక్యముల భావము సరిగా తెలియకుండా పోయినదని మీరు చెప్పిన మాటను నేను ఒకమారు ముస్లీమ్ల ముందర ప్రస్తావించగా, వారు తమ పెద్దలు ఏమి చెప్పితే దానినే సత్యమని నమ్ముతామని, వారి మతములో మొదటినుండి వచ్చు ఆచారము ప్రకారము మేము మా ఖురాన్ గ్రంథములోని మాటల అర్థము కొరకు మా పెద్దలు చెప్పిన మాటలకే ఎక్కువ విలువను ఇస్తామని, మా పెద్దలు ఖురాన్లో ఎంతో శోధించి తెలుసుకున్న వాక్యములనే మాకు తెల్పుచుందురని చెప్పారు. మా పెద్దలు చెప్పునది సత్యమైన జ్ఞానమే అయినప్పుడు మేమెందుకు మా పెద్దల మాటను వినకూడదు? అని అంటున్నారు. వారి మాటలకు మీరు ఏమంటారు?


జవాబు :- వారి పెద్దల మాటను వింటామని అనడములో వీరి తప్పులేదు గానీ, వారు చెప్పే మాట సత్యమైనదా! కాదా! యని యోచించకుండా విచక్షణారహితముగా వింటామనడము తప్పగును. వారి పెద్దలు చెప్పే వాక్యములు సరియైన భావము కల్గియుండునవయితే ఫరవాలేదుగానీ, ఒకవేళ భావము తప్పినవైతే గ్రంథములో అల్లాహ్ చెప్పినది ఒకటికాగా మనిషికి అర్థమయినది మరొకటి యగును. అందువలన ఎవరి మతములో అయినాగానీ వారి మత పెద్దలు చెప్పు మాటలు సరియైనవో కావో కొంత యోచించవలసిన అవసరమున్నది. ఈ విషయమై ఖురాన్ గ్రంథములో ఆరవ సూరా 91వ ఆయత్నందు ఇలా వ్రాసియున్నారు.


(6-90) “అల్లాహ్ (దేవుడు) ఏ మానవునిపైనా ఎలాంటి జ్ఞాన విషయాన్ని అవతరింపజేయలేదు అని పలికియున్నప్పుడు ఈ అవిశ్వాస జనులు దేవున్ని అర్థము చేసుకోవలసిన విధముగా అర్థము చేసుకోలేదు. వారిని అడుగు మరి మూసా తెచ్చిన ఆ తౌరాత్ గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్లు? ఆ గ్రంథము ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గదర్శకత్వము. మీరు దానిని వేరువేరు కాగితములుగా (గ్రంథములుగా) విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయములను దాచేస్తున్నారు. మీకు గానీ, మీ పెద్దలకుగానీ తెలియని ఎన్నో విషయములు ఇందు మూలముగా మీకు నేర్పబడ్డాయి. తౌరాతు గ్రంథమును అవతరింపజేసినవాడు అల్లాహ్యే (దేవుడే) అని చెప్పు. ఆ తర్వాత వారిని వారి వ్యర్థ విషయములలోనే ఆడుకోనివ్వు" అని గలదు. ఈ ఆయత్లో ప్రత్యేకించి 'మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియని విషయములు' అనియుండుటను గమనించవచ్చును. ఆ మాట ప్రకారము ఎవరయితే తెలిసిన పెద్దలని అనుకొన్నామో వారు తెలియని వారేనని, గ్రంథములోని విషయములు మీకు తెలియనట్లే వారికి కూడా తెలియవని దేవుడు చెప్పినట్లు గలదు. అందువలన జ్ఞాన విషయములు గల దైవగ్రంథములను స్వయముగా మీరు చదివి అర్థము చేసుకోవలెను. ఇతర పెద్దలు చెప్పిన మాటలను విశధీకరించి చూచి అందులో సత్యముంటే నమ్మవలెను. సత్యము లేకపోతే వాటిని పెద్దలు చెప్పినవయినా, బోధకులు చెప్పినవయినా వదలి పెట్టవలసిందే! "ప్రపంచ విషయములలో పెద్దలు చెప్పినట్లు వినినా ఫరవాలేదుగానీ, దైవగ్రంథ విషయములలో మీరు శ్రద్ధగలిగి యుంటే మీకే నేరుగా జ్ఞానము ఇవ్వబడును" అని దేవుడు ఒక సందర్భములో మధ్య దైవగ్రంథములో చెప్పియున్నాడు. యోహాన్ సువార్త, అధ్యాయము 6, వాక్యము 32లో ఇలా చెప్పి యున్నాడు చూడండి.


(యోహాను 6-32) “పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు. నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు." ఈ వాక్యములో ప్రజలకు దైవజ్ఞానమును ఆత్మయే స్వయముగా అందించుచున్నదని చెప్పుట వలన శ్రద్ధగల్గిన వానికి ఎవనికయినా వాని శరీరములోని ఆత్మయే జ్ఞానమును ఇవ్వగలదని తెలియుచున్నది. పరలోకము నుండి వచ్చు ఆహారము అనగా పరలోక సంబంధ జ్ఞానము అనియూ, పరలోకమును పొందుటకు (మోక్షమును పొందుటకు) తగిన దైవజ్ఞానమని అర్థము. దైవజ్ఞానమును తెలియుటకు దేవుని మీద శ్రద్ధ, భక్తి కల్గియుండవలెను. శ్రద్ధ, భక్తి లేనివానికి దైవజ్ఞానము తెలియబడదు.


ప్రశ్న :- మాకు దైవగ్రంథములోని విషయములు అర్థము చేసుకొను స్థోమత లేదు. ఇంతకుముందు మేము దైవగ్రంథమును చదివినా మాకు అర్థము కాని విషయములెన్నో మీరు విశధముగా తెలియజేయడము వలన మాకు తెలియబడినాయి. మేము మిమ్ములనే మా బోధకులుగా తలచాము. మీ ద్వారానే అన్ని విషయములు తెలియుచున్నవి. మీరు లేని కాలములో అనగా జరుగబోవు భవిష్యత్తు కాలములో కూడా మీరు వ్రాసిన గ్రంథములను చూచి జ్ఞానమును తెలియుటకు అవకాశముగా యున్నది. ఈ లోకములో మీ వలననే ఇప్పుడుగానీ, తర్వాత ఎప్పుడయినా మీ గ్రంథముల వలన గానీ జ్ఞానము తెలియుననీ, మీరు తెలియజేయు జ్ఞానమును ఎవరూ తెలియజేయలేరని నిరూపణగా తెలియుచున్నది. అటువంటప్పుడు మేము మా పెద్దలయిన మీ వలన జ్ఞానము తెలిసిందియని చెప్పుకోగలము.


జ్ఞానమును ఇస్తానని” దేవుడు చెప్పినమాటను చూచి స్వయముగా మీ వలన జ్ఞానమును తెలియగలిగిన మేము ద్వితీయ దైవగ్రంథములోని పై వాక్యమును నమ్మాలా! లేదా!! అను సంశయములో పడుచున్నాము. దేవుడు చెప్పినమాట శాస్త్రబద్ధమైనదైయుండును. అందువలన అది నూటికి నూరు పాళ్ళు సత్యమే. అట్లే మీరు చెప్పిన బోధవలన జ్ఞానము మాకు తెలిసినదీ నూటికి నూరుపాళ్ళు సత్యమే. మీరు చెప్పిన జ్ఞానము శాస్త్రబద్ధమై, సత్యమైనదిగా యున్నది. అందువలన ఇటు మీ బోధను కాదనలేము, అటు దేవుని మాటను కాదనలేము. మాలో నిండిపోయిన ఈ అనుమానమును తీర్చుటకు అన్ని విధముల మీరే సమర్థుడని తలచి, మిమ్ములనే భక్తి పూర్వకముగా అడుగుచున్నాము. దైవగ్రంథములోని దేవుని మాటను నమ్మాలా లేదా మీరే చెప్పండి. ఈ మాటను అడుగుటకు ముఖ్యమైన మరొక కారణము కూడా కలదు. అదేమనగా! దైవ గ్రంథములో కూడా కొంత కాలుష్యము ఏర్పడి మనుషుల మాటలు కూడా అందులో కలిసి యున్నాయని తెలియుట చేత పై వాక్యము దేవుడు చెప్పినదేనాయను సంశయమును కూడా వ్యక్త పరచుచూ అడుగుచున్నాము. దయచేసి వివరముగా జవాబును తెలుపమని కోరుచున్నాము.


జవాబు :- ద్వితీయ దైవగ్రంథములోని (యోహాన్ 6-32) వాక్యము మానవులు కల్పించి వ్రాసినది కాదు. అది దైవాదేశమైన వాక్యమే. అందువలన ఆ వాక్యమును అందరూ గుర్తించవలసినదే. దేవుడు (ఆత్మ) ఏమి చెప్పినా అది సత్యమే అయివుంటుంది. దానివలన ప్రపంచములో పెద్దలకు తెలుసుయని వారు చెప్పినది వింటే ఇతరుల మాటల వలన దేవుని జ్ఞానము నీకు లభించదు. నా వలన మాత్రమే లభించునని చెప్పియున్నమాట ఎప్పటికీ ఆమోద యోగ్యమే. వాస్తవముగా దేవుని గ్రంథములోని దేవుని వాక్యములు పెద్దలనబడు బోధకులకు ఏ మతములోనూ సరిగా తెలియబడలేదు. జ్ఞానము తెలియకున్నా తమకు తెలుసును అన్నట్లు చెప్పువారుండుట చేత వారి మాటల వలన పరలోక ఆహారమైన దైవజ్ఞానము తెలియదని ఆత్మ వాక్యము రూపములో చెప్పియుండుట వాస్తవమే. అయితే కొందరు దేవుని కృపవలన జ్ఞానము అర్థమయిన వారు కూడా కలరు. దైవజ్ఞానము అర్థమయిన వారు అరుదుగా బోధలు చెప్పుచుందురు. అటువంటి వారు చెప్పిన జ్ఞానమంతయూ సత్యసమేతముగా, శాస్త్రబద్దముగా యున్న జ్ఞానముగా యుండును. సంపూర్ణ జ్ఞానమును తెలిసినవారు అరుదుగా యుండడమే కాక వారు అరుదుగా బోధకులై యుందురు.


ఇప్పుడు నన్ను మీరు సత్యమును చెప్పు బోధకుడిగా గుర్తించి మీరు తెలుపు జ్ఞానము సత్యమైనదే కదా! శాస్త్రబద్దమైనదే కదా!యని అడిగారు. దానికి నేను “నేను చెప్పు బోధలు సత్యమైనవే, శాస్త్రబద్ధమైనవే” యని ఒప్పుకొంటున్నాను. మీరు చెప్పునట్లు నేను ఎంత పెద్ద జ్ఞానినయినా, భూమిమీద యున్న ప్రజలందరూ నా మాటనే సత్యమని నన్ను ఆశ్రయించినా, ఈయనే మా బోధకుడుయని మీరు నన్ను గురించి గట్టిగా చెప్పినా, దైవ గ్రంథములోని దేవుని వాక్యము ప్రకారము పరలోకమునుండి వచ్చు ఆహారమైన దైవజ్ఞానము నావలన లభించదు. వాక్యము ప్రకారము ఆత్మ వలన లభించును. ఇక్కడ బాగా లోతుగా అర్థము చేసుకోవలసియున్నది. అది ఎట్లనగా!


ప్రతి మనిషి శరీరములో జ్ఞానమును తెలియవలసిన వాడు జీవుడు. అట్లే ప్రతి శరీరములోనూ జీవునికి అన్ని విషయములు తెలియ జేయువాడు ఆత్మయే. అందువలన జ్ఞానమును తెలియజేయునది ఆత్మయని చెప్పవచ్చును. శరీరములో జీవుడు తెలియువాడుగా యుండగా, ఆత్మ తెలియజేయునదిగా ఉండగా, పరమాత్మ సాక్షిగా (అక్షిగా) చూచువాడై యున్నాడు. ఈ విషయమును అంతిమ దైవగ్రంథములో సూరా 50, ఆయత్ 21లో చెప్పియున్నట్లు మొదటనే చెప్పుకొన్నాము. ఇదే విషయమే అనగా మూడు ఆత్మల విషయమే మిగతా రెండు దైవగ్రంథములలోనూ గలదు. శరీరములో జీవాత్మకు స్వయంశక్తి లేదు. అందువలన అన్ని కార్యములు ఆత్మ వలననే జరుగవలెను. పరమాత్మయిన మూడవ పురుషునిగా యున్న దేవుడు ఏమీ చేయక అన్నిటినీ సాక్షిగా చూస్తూ యుండును. శరీరములోనికి చెవుల ద్వారా, కన్నుల ద్వారా చేరు విషయము లను, అంతేకాక మొత్తము ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా తెలియు విషయములను ఆత్మే బుద్ధికి గ్రహించునట్లు చేయుచున్నది.


ఇప్పుడు అసలు విషయానికి వచ్చి చెప్పితే నేను సత్యమైన జ్ఞానమును చెప్పినా, నీ శరీరములో ఆత్మే కన్ను, చెవి ద్వారా నేను చెప్పిన జ్ఞానమును లోపలికి చేర్చి, లోపల బుద్ధికి అందించునది ఆత్మే. బయట ఎంత పెద్ద సత్యమును చెప్పినా అది లోపల బుద్ధి గ్రహించవలసియున్నది. శరీరము లోపల బుద్ధికి శక్తి నిచ్చి విషయమును గ్రహించునట్లు చేయువాడు ఆత్మే. ఆత్మ యిచ్చు శక్తిని బట్టి బుద్ధి విషయమును గ్రహించగలదు. అందువలన ఎవనికి ఎటువంటి జ్ఞానము తెలియాలన్నా అది ఆత్మ యిచ్చు శక్తి ద్వారా బుద్ధి తెలియగలుగుచున్నది. దీనినిబట్టి దైవజ్ఞానమును మీకు అందించువాడు ఆత్మేనని తెలియునట్లు ద్వితీయ దైవగ్రంథములోని వాక్యములో 'మీ తండ్రియే పరలోకమునుండి వచ్చు ఆహారమును మీకను గ్రహించుచున్నాడు' అని చెప్పాడు.


ధర్మశాస్త్రములోని జ్ఞానమును అనగా పరలోక ఆహారమనబడు జ్ఞానమును ప్రజలకు మోషే తెలిపినప్పటికీ దానిని బుద్ధి నేరుగా గ్రహించ లేదు, గనుక "మోషే మీకు పరలోక ఆహారమును మీకు ఇవ్వలేదు. మీ తండ్రియే మీకు పరలోకమునుండి వచ్చు ఆహారమును మీకందించాడు” అని చెప్పారు. ప్రతి మనిషికి తండ్రి ఆత్మయే. తాత పరమాత్మగా యున్నాడు. జీవునికి ఆత్మ తండ్రికాగా, ఆత్మకు తండ్రిగా పరమాత్మయున్నాడు. అందువలన ఈ విషయమును అర్థము చేసుకొనుటకై ద్వితీయ దైవగ్రంథ మందు ఇలా చెప్పియున్నారు. (యోహాన్ 14-20) “నేను నా తండ్రి యందును, మీరు నాయందును, నేను మీయందునూ ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు” ఈ వాక్యమునకు అర్థమును పరిశీలించి చూస్తే జీవునికి ఆత్మ తండ్రికాగా, ఆత్మకు తండ్రి పరమాత్మయని తెలియడమేకాక, ఆత్మ దేవుడు ఇద్దరు కలిసియుండగా, జీవాత్మ, ఆత్మ ఇద్దరు కలిసియున్నారు. జీవాత్మకు పరమాత్మకు ఆత్మ సంధిలాంటివాడు. ఏ జీవాత్మయిన ఆత్మ ద్వారానే పరమాత్మను చేరవలసి యున్నది. అందువలన 'నేనే మార్గమును' అని ఆత్మ ఒక సందర్భములో చెప్పడమైనది.


దేవుడు భూమిమీద వ్యాపించిన అధర్మములను లేకుండా చేసి దైవధర్మములను స్థాపింపజేయుటకు స్వయముగా మారువేషములో భూమి మీదికి సాధారణ మనిషివలె వచ్చి, తన ధర్మములను తన జ్ఞానము ద్వారా తెలియజేయును. అలా మనిషివలె వచ్చినప్పుడు బోధించు జ్ఞానము సంపూర్ణ జ్ఞానమైయుండును. దైవగ్రంథములలో జ్ఞానముండినా భగవంతుని వేషములో వచ్చిన దేవుడు గ్రంథములలో అంతవరకు అర్థముకాని విషయములను సులభముగా విశధీకరించి తెలియజేయును. అలా తెలియ జేయునప్పుడు ఎందరో మనుషులు జ్ఞానమును భగవంతుని ద్వారా తెలియగల్గినా, అప్పటికే బోధకులుగా యున్న కొందరు పెద్దలు భగవంతుడు చెప్పు బోధలను చూచి అసూయపడి, తమలో గర్వము పొంగిపోగా, తమకంటే మించినవారు లేరని చెప్పుకొనుచుందురు. బయటికి చెప్పక పోయినా లోపల అదే భావమును కల్గియుందురు. అప్పుడు మీకుగానీ మీ పెద్దలయిన బోధకులకుగానీ తెలియని ఎన్నో విషయములను భగవంతుడు తెలియ జేయును. అంతవరకు దైవగ్రంథములలో పెద్దలయిన బోధకులచే దాచిపెట్టబడిన ఎన్నో విషయములను భగవంతుడు బయల్పరచును. అలా గ్రంథములోని సమస్త జ్ఞాన విషయములను భగవంతుని వేషములో వచ్చిన దేవుడు చెప్పగా భూమిమీద సంపూర్ణ జ్ఞానము తెలియబడును. అలా తెలియబడినప్పటికీ కొందరు తమకు తెలిసిన వ్యర్థ ప్రశ్నలకు జవాబులు లేవని జ్ఞానమును బోధించిన భగవంతున్నే తప్పుపట్టుచుందురు.


ప్రథమ దైవగ్రంథము దాదాపు ఐదు వేల (5000) సంవత్సరముల ప్పుడు తయారయినదని భగవంతుడు చెప్పాడనుకో, దానికి అసూయ పడు పెద్దలు ఆయన చెప్పినది సరికాదనీ, ప్రథమ దైవగ్రంథము భగవద్గీత తయారయి (5160) సంవత్సరములయినదనీ, ఈ విషయమును ఇంతకుముందు ఆయనే 160 సంవత్సరములని చెప్పాడు. ఇప్పుడు 5000 సంవత్సరములని చెప్పుచున్నాడు. ఏ మాట నమ్మాలి? అట్లే ఈయన చెప్పు జ్ఞానమును ఎలా నమ్మాలి? యని తప్పును చూపి చెప్పుచుందురు. అంతిమ దైవగ్రంథములోని 6-91 ఆయత్లో చివరగా చెప్పినమాట 'వారిని వారి వ్యర్థ విషయములలో ఆడుకోనివ్వు' అని ఉంది. ఇక్కడ వ్యర్థ విషయములు అనగా! ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత ఎప్పుడు తయారయినదను విషయము వ్యర్థ విషయము. ఆ గ్రంథములో ఏమి జ్ఞానమున్నదో దానిని గురించి మాట్లాడడము సారాంశమైన విషయము.


అయితే వ్యర్థ విషయములను ఆధారము చేసుకొని భగవంతున్నే తప్పు పట్టి తాము అతనికంటే గొప్పయనిపించుకోవాలన్నదే వారి ఉద్దేశ్యము. గ్రంథములోని జ్ఞాన విషయములు మనిషికి అవసరము. గ్రంథము ఎప్పుడు పుట్టినా దాని పుట్టుక ద్వారా మనిషికి ఎటువంటి ప్రయోజన ముండదు. అందువలన వ్యర్థ విషయములలో కొందరు మునిగి తేలుచూ సారాంశ విషయములను వ్యర్థములుగా, వ్యర్థములను సారాంశమైన ముఖ్య విషయములుగా తలచుచుందురు. అటువంటి వారికి దేవుడే దిగివచ్చి చెప్పినా వారు సారంశమైన జ్ఞాన విషయములను చూడక వ్యర్థమైన పనికిరాని విషయములనే పట్టుకొని ప్రశ్నించుచుందురు. అందువలన అటువంటి వారిని (6-91) వాక్యములో “వారిని వారి వ్యర్థ విషయములలోనే ఆడుకోనివ్వు” అని దేవుడు చెప్పడమైనది. ఆ మాటనుబట్టి అటువంటి వానికి ఎప్పటికీ జ్ఞానము తెలియదు. వాని జన్మ వ్యర్థమేయని దేవుడు చెప్పినట్లయినది. అందువలన మేము జ్ఞానులము అని గర్వపడు కొందరికి మేము చెప్పునది ఏమనగా! నీకు, నీ జన్మకు అవసరమైన జ్ఞాన విషయములను ముఖ్యముగా తీసుకో, జన్మ కర్మలతో సంబంధములేని విషయములను పట్టుకొని వ్రేలాడవద్దండి.


ప్రశ్న :- ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతను కృష్ణుడు చెప్పాడని అర్జునుని ద్వారా తెలుసుకొన్న వ్యాసుడు గ్రంథముగా వ్రాశాడు. కృష్ణుడు అర్జునునికి యుద్ధరంగములో సమయానుకూలముగా కొద్ది నిమిషములలోనే భగవద్గీతను చెప్పాడనీ, ఆయన తన వయస్సు దాదాపు 90 సంవత్సరములు ఉన్నప్పుడు భగవద్గీతను అర్జునునికి చెప్పాడనీ, తర్వాత రెండు సంవత్సరములకు గ్రంథముగా వ్రాయబడిందనీ, వ్రాయబడిన గ్రంథము బయటి ప్రజలకు తెలియుటకు దాదాపు నాలుగు సంవత్సరములు పట్టినదనీ, కృష్ణుడు 96 సంవత్సరముల వయస్సులో భగవద్గీతను చెప్పాడనీ మీరు ఒక గ్రంథములో చెప్పారు. తర్వాత మరొక గ్రంథములో కృష్ణునికి 90 సంవత్సరముల వయస్సులో భగవద్గీతను చెప్పాడని చెప్పారు. రెండు గ్రంథములలో ఆరు సంవత్సరముల తేడా వచ్చిందని మీ మాటను ఎలా నమ్మాలని వ్యర్థ విషయమైన దానిని జ్ఞాన విషయము కానిదానిని అడుగగా, దానికి జవాబుగా మీరు కృష్ణుడు భగవద్గీతను చెప్పినది 90 సంవత్సరములకే అయితే అది మనుషులకు తెలిసినది 96 సంవత్సరములకయిన దానివలన అది కనిపించిన సమయమును బట్టి 96 సంవత్సరములకు కృష్ణుడు భగవద్గీతను చెప్పినట్లు వ్రాశామని వివరమిచ్చారు. అయితే ఇది వ్యర్థ విషయమని భగవద్గీతలో గల జ్ఞానము ముఖ్యమైనది గానీ, భగవద్గీత తయారయిన సమయము, నెల, సంవత్సరము ముఖ్యము కాదని కూడా చెప్పారు. అందువలననే అంతిమ దైవగ్రంథములో 6-91లో వ్యర్థ విషయములలో ఆడుకొను వారిని అనవసర విషయములను ప్రాధాన్యముగా తీసుకొను వారిని గురించి చెప్పారని మీరే చెప్పారు.


ఇప్పుడు కొందరు కృష్ణుడు భగవద్గీతను చెప్పలేదు. కృష్ణునికి జ్ఞానమే తెలియదు. కృష్ణుడు తెలివైనవాడు, ధనమున్నవాడు అయినందున ధనమును వ్యాసునికి ఇచ్చి తాను చెప్పినట్లు భగవద్గీతను గ్రంథముగా వ్రాయించుకొన్నాడు. వ్యాసుడే భగవద్గీతను స్వయముగా వ్రాసి డబ్బు కొరకు కృష్ణుడు చెప్పినట్లు అర్జునున్ని అడ్డము పెట్టుకొని ప్రకటించాడని కొందరు వ్యక్తులు ఆరోపణ చేయుచున్నారు. వాస్తవముగా కృష్ణుడు అర్జునునకు చెప్పినది కూడా ఎవరూ వినలేదు, ఎవరూ చూడలేదు. అర్జునుడు వ్యాసుని దగ్గరకు పోయి కృష్ణుడు ఈ విధముగా చెప్పాడని వ్యాసునితో చెప్పినది కూడా ఎవరూ చూడలేదు. కృష్ణుడు అర్జునునకు చెప్పిన సాక్ష్యముగానీ, అర్జునుడు వ్యాసునితో చెప్పిన సాక్ష్యముగానీ లేదు. అటువంటప్పుడు కృష్ణుడే భగవద్గీత చెప్పాడని ఏమి ఆధారమని కొందరు అడుగుచున్నారు. అంతేకాక కృష్ణుని జీవితములో కృష్ణుడు భగవద్గీతను చెప్పినట్లు, దాని జ్ఞానము ప్రకారము నడుచుకొన్నట్లు ఎక్కడా కనిపించలేదు. జ్ఞానము ఆయన ప్రవర్తనలో ఎక్కడా కనిపించలేదు. ఆయన ఆచరణలో ఏ ఆరాధనగానీ, ఏ ధ్యానము గానీ చేయలేదు. నాస్తికునివలె బ్రతికిన కృష్ణుడు భగవద్గీతను చెప్పాడంటే నమ్మదగిన విషయము కాదని కొందరు హేతువాదులు, భౌతికవాదులు అంటున్నారు. దీనికి మీరేమంటారు?


జవాబు :- ఇది వ్యర్థ ప్రస్థావనేయని చెప్పవచ్చును. మనిషికి కావలసింది భగవద్గీత గ్రంథములోని జ్ఞానము మాత్రమేగానీ, వ్రాసిన రచయిత కాదు. వ్రాసిన రచయితది గడచిపోయిన కాలము. ప్రస్తుతము మనముందరున్నది భగవద్గీత. ముందరున్న గ్రంథమును చూడకుండా పోయిన రచయితను గురించి మాట్లాడడము వ్యర్థ ప్రలాపణ, అనవసర విషయమగును. గ్రంథకర్త వలన మనిషికి వచ్చే లాభము ఏమీ లేదు. గ్రంథములోని విషయముల వలననే మనిషికి లాభము చేకూరగలదు. కృష్ణుడు తాను భగవద్గీతను చెప్పినట్లు తెలియకూడదనే ఉద్దేశ్యముతోనే ఆ విధముగా రహస్యముగా భగవద్గీతను ఎవరూ వినకుండా, యుద్ధరంగ మధ్యలో యుద్ధము ప్రారంభముకాక ముందు కొద్ది నిమిషముల కాలములో చెప్పాడని తర్వాత కొంత కాలమునకు తెలిసింది. భగవంతుడే చెప్పాడని స్వయముగా వ్యాసుడు తన గ్రంథములో 'భగవానువాచ' అని వ్రాశాడు. దానివలన కృష్ణుడు చెప్పాడని తెలిసింది తప్ప కృష్ణుడు చెప్పగా ఎవరూ వినలేదు, ఎవరూ చూడలేదు.


వ్యాసునిచేత వ్రాయబడిన భగవద్గీత కృష్ణుడు చెప్పాడని వ్యాసుడు వ్రాసినా, కృష్ణుని ఉద్దేశ్యములో తాను భగవద్గీత జ్ఞానమును చెప్పినట్లు తెలియకూడదనే ఉండేది. అంతేకాక తన జ్ఞానము ఐదువేల సంవత్సరముల వరకు బయటికి తెలియకూడదనేదే ఆయన ఉద్దేశ్యము. ఆయన అనుకున్నట్లే కృష్ణుడు భగవద్గీతను చెప్పినట్లు కొందరు నమ్మలేదని పై ప్రశ్ననుబట్టి తెలియుచున్నది. దీనికంతటికీ ఒక కారణము గలదు. దేవుడు మూడుమార్లు భగవంతునిగా భూమిమీద అవతరించితే, ఒక్కమారు దేవుని అవతారముగా లెక్కించబడును. దేవుని చేత ఒక్కమారు ధర్మసంస్థాపణ జరిగినట్లు లెక్కించబడును. దేవుడు మూడుమార్లు భగవంతునిగా రావలెను. అట్లే తన జ్ఞానము కూడా మూడు గ్రంథములుగా ఉండవలెనని ఆయన (దేవుని) అభిప్రాయము. దానికి కావలసిన ప్రణాళిక ప్రకారము ఇప్పటికి ఆయన బోధలు మూడు దైవగ్రంథములుగా వచ్చాయి. అయినా ఇప్పటికి ఆయన రెండుమార్లే వచ్చాడు. ఇంకొకమారు రావలసియున్నది.


ఇంతవరకు రెండుమార్లు వచ్చిన అవతారములలో ఒకటి శ్రీకృష్ణుడు. రెండు ఏసు అను పేర్లతో వచ్చాడు. మొదట కృష్ణునిగా వచ్చినప్పుడు ఆయనను దేవుని అవతారమని, ఆయన సాధారణ మనిషి కాడనీ, సామాన్య మనిషివలెనున్న భగవంతుడని ఎవరూ గుర్తించ లేకపోయారు. కృష్ణుడు భగవంతుడని తెలియనట్లు జన్మను గడిపిపోయాడు. భగవద్గీతా జ్ఞానమును చెప్పినా, దానిని ఎవరికీ తెలియకుండా రహస్యముగా చెప్పుట వలన, అర్జునునికి ఒక్కనికే చెప్పడము వలన, కృష్ణుడు భగవద్గీత చెప్పినట్లు నిరూపణ కూడా లేకుండా పోయినది. తర్వాత మూడు వేల సంవత్సరములకు ఏసువచ్చి చెప్పిన బోధలు నాలుగు సువార్తల రూపములో వచ్చాయి. రెండవ అవతరణగా వచ్చిన ఏసును ఎవరూ ఆయనను భగవంతుడు అని అనుటకు వీలులేకుండా జీవితమును గడిపాడు. తనను భగవంతుడనుటకు వీలు లేనందున, ఏసు భగవంతునిగా ఎవరికీ తెలియ నందున మూడు సంవత్సరములు తన జ్ఞానమును బోధల రూపముతో చెప్పాడు. అట్లు చెప్పిన మాటలు నాలుగు సువార్తలుగా రూపుదిద్దుకొన్నవి. అయినా రెండవమారు తయారయిన ద్వితీయ దైవగ్రంథములో అరవై ఆరు (66) భాగములుండగా అందులో నాలుగు సువార్తలు మధ్యలో ఉండిపోయాయి. ముందు 39 భాగములుండగా వెనుక 23 భాగములుండగా మధ్యలో 4 సువార్తలున్నవి. మొత్తము 66 భాగముల బైబిలులో ముందు 39 భాగములు (పాఠములు) పాత నిబంధనగా, వెనుక 27 భాగములను క్రొత్త నిబంధనగా చెప్పుచున్నారు.


క్రొత్త నిబంధన 27 పాఠములలో మొదటి నాలుగు పాఠములు నాలుగు సువార్తలుగా యున్నవి. నాలుగు సువార్తలు ముందు కొంత, వెనుక కొంత బైబిలు ఉండగా దాదాపు బైబిలు మధ్యలో నాలుగు సువార్తలు గలవు. నాలుగు సువార్తలకు ముందున్న 39 పాఠములలో, వెనుకయున్న 23 పాఠములలో స్వయముగా ఏసు చెప్పిన బోధలు లేవు. మిగతా వారు వ్రాసిన జ్ఞానము కలదు. వెనుక ముందుయున్న అన్ని పాఠములలో కొన్ని సత్యములుండగా కొన్ని అసత్యములు కూడా యున్నవి. నాలుగు సువార్తలు కాకుండా మిగతా 62 పాఠములలో జ్ఞానము, మాయ రెండు మిశ్రమముగా యుండుట వలన ఏది జ్ఞానమో, ఏది మాయ (సాతాన్)నో తెలియని స్థితిగాయున్నది. అందువలన మా సలహా మేరకు చాలామంది నాలుగు సువార్తలనే చదువుచున్నారు. మిగతా 62 పాఠములలో కొన్ని సత్యములుగా యుండుట వలన మిగతా పాఠములను చదువు వారందరికీ “సత్యమునే గ్రహించండి, అసత్య వాక్యములను వదలి వేయండని” చెప్పుచుందుము.


"సత్యాసత్య వాక్యములను గుర్తించలేని వారు కేవలము నాలుగు సువార్తలను చదివినా, అందులోని ప్రభువు జ్ఞానము వలన ముక్తి పొందవచ్చును” అని కూడా చెప్పాము. నాలుగు సువార్తలలో అత్యున్నతమైన జ్ఞానము యోహాన్ సువార్తలో గలదని చెప్పుచున్నాము. ఈ విధముగా తయారయిన బైబిలు గ్రంథమును ద్వితీయ దైవగ్రంథమని చెప్పడమైనది. అదియే నేడు క్రైస్థవ మత గ్రంథముగా లెక్కించబడుచున్నది.


ద్వితీయ దైవగ్రంథము తయారయిన తర్వాత దాదాపు ఆరు వందల సంవత్సరములకు అనగా ఇప్పటికి 14వందల సంవత్సరముల పూర్వము అంతిమ దైవగ్రంథము తయారైనది. దైవగ్రంథములు మూడేయని చెప్పుచూ భగవద్గీత ప్రథమ దైవగ్రంథమనీ, బైబిలు ద్వితీయ దైవగ్రంథమని, ఖురాన్ గ్రంథము చివరి దైవగ్రంథమని చెప్పుటకు కారణము గలదు. మూడు గ్రంథములు ముందే దేవుడు చెప్పిన విధానము ప్రకారము తయారైనాయి. అవి తయారయిన విధానమును అనుసరించి వాటికి ప్రథమ, మధ్యమ, అంతిమ గ్రంథములని పేరు రావడము జరిగినది. అలా ఒకమారు వచ్చిన పేరును ఎవరూ తీసివేయుటకు సాధ్యము కాదు. అంతిమ దైవగ్రంథములో సూరా 42, ఆయత్ 51లో ఇలా ఉన్నది. (42-5) “దేవుడు ప్రత్యక్షముగా ఏ మానవునితోనూ మాట్లాడడు. దేవునితో మాట్లాడడము మనిషికి సాధ్యమయ్యే పని కాదు. దేవుడు తన జ్ఞానమును వాణి ద్వారా (గ్రహీ ద్వారా) లేక తెరవెనుక నుంచో మనిషికి చేరవేస్తాడు. లేదా తాను కోరినది తన ఆజ్ఞతో సూచించడానికి తన ప్రతినిధిని పంపుతాడు. ఆయన మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు" ఈ వాక్యము ప్రకారము మొదట వాణి ద్వారా పుట్టిన భగవద్గీత రాగా అది మొదటి దైవగ్రంథమయినది. తర్వాత ఇంజీలు గ్రంథము తన ప్రతినిధి ద్వారా చెప్పబడినది. అందువలన బైబిలుకు ద్వితీయ దైవగ్రంథమని పేరు వచ్చినది. దేవుడు చెప్పిన మూడు విధానములలో మొదటిది, రెండవది గడచిపోగా చివరిలో తెరచాటునుండి జ్ఞానము చెప్పబడగా అదే చివరి గ్రంథమను పేరుతో బయటికి వచ్చినది. ఈ విధముగా దేవుడు భూమిమీద చెప్పిన మూడు విధానములను బట్టి, ముందు వెనుకలనుబట్టి ప్రథమ, ద్వితీయ, అంతిమ అను పేర్లతో గ్రంథములు తయారయినవి. అలా వచ్చిన పేర్లను ఎవరూ మార్చలేరు.


ప్రశ్న :- ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతను కృష్ణుడు చెప్పాడు కదా! కృష్ణుడు చెప్పగా అర్జునుడు విన్నాడు అనీ, అర్జునుని ద్వారా వ్యాసునికి చేర్చబడిన జ్ఞానము వ్యాసుని ద్వారా గ్రంథమయినదని విన్నాము. అలా జరిగినప్పుడు దేవుడు తన ప్రతినిధియైన కృష్ణుని ద్వారా జ్ఞానమును చెప్పించినట్లే కదా! రెండుమార్లు దేవుడు అవతరించాడనీ, ఒకమారు కృష్ణునిగా అవతరించగా, రెండవమారు ఏసుగా వచ్చాడనీ, వారు ఇద్దరు దేవుని ప్రతినిధులుగానే లెక్కించబడినారని, ఇద్దరు భగవంతునిగా వచ్చిన వారేనని చెప్పారు. అలా ఇద్దరు భగవంతులే అయినప్పుడు ఇద్దరు చెప్పిన గ్రంథములు రెండు ద్వితీయ దైవగ్రంథములుగానే లెక్కించవలెను గానీ అట్లుకాకుండా భగవంతుడైన కృష్ణుడు చెప్పిన గ్రంథమును ప్రథమ దైవగ్రంథముగా లెక్కించుట తప్పగును కదా! దేవుడు అంతిమ దైవగ్రంథము ఖురాన్ (41-52లో) చెప్పినట్లు మూడు విధానములకు వరుస క్రమముగా మూడు పేర్లు పెట్టవచ్చును. అలా కాకుండా రెండవ విధానములో దేవుని ప్రతినిధిగా యున్నప్పుడు, చెప్పినప్పుడు రెండు గ్రంథములు తయారయినా అవి రెండు వరుస క్రమములో ద్వితీయ గ్రంథములేయగునుగానీ, అందులో ఒకటి ప్రథమ దైవగ్రంథము ఎలా అయినదని ప్రశ్నించుచున్నాము. దీనికి మీ జవాబు ఏ విధముగా ఉంటుందో చెప్పమని కోరుచున్నాము.



జవాబు :- దేవుడు తన మూడు గ్రంథములలో సంపూర్ణ జ్ఞానమును చెప్పాడు. అయితే తన జ్ఞాన గ్రంథములు మూడు విధానముల ప్రకారము వచ్చాయని, ఆ విధానముల ప్రకారము ముందు వెనుక జరిగిన దాని ప్రకారము దైవగ్రంథములకు వరుస క్రమముగా పేర్లు పెట్టబడినవని కూడా చెప్పుకొన్నాము. అయితే ఇక్కడ ప్రథమ దైవగ్రంథ విషయములో సంశయము ఏర్పడినది. దేవుడు చెప్పినది శాస్త్రబద్ధమైన విధానము, కావున ఆయన మాటకు లోటుయుండదు. ఏదయినా లోపము ఉంటే మన అవగాహనలో యుండవచ్చునుగానీ దేవుడు చెప్పిన విధానములో యుండదు. మూడవ మారు చివరగా 'తెరచాటునుంచి చెప్పడము' అను విధానము జరిగినది. అందువలన తెరచాటునుండి చెప్పబడిన జ్ఞానము గ్రంథరూపమైనప్పుడు దానిని చివరి గ్రంథముగా చెప్పుచూ “అంతిమ దైవగ్రంథము” అని చెప్పాము. రెండవ విధానము ప్రకారము తన ప్రతినిధియైన ఏసు చెప్పిన జ్ఞానము గ్రంథరూపమైనప్పుడు దానిని ద్వితీయ దైవగ్రంథమని చెప్పాము. కృష్ణుడు కూడా ఏసువలె భగవంతుడయిన దానివలన కృష్ణుడు చెప్పిన భగవద్గీత కూడా ద్వితీయ దైవ గ్రంథమే కదా! ప్రథమ దైవగ్రంథమని పేరు ఎందుకు పెట్టారు? అన్నది ప్రశ్నయినది. దానికి నేను చెప్పు జవాబు ఈ విధముగా కలదు. భగవద్గీతను ద్వితీయ దైవగ్రంథమని అనకూడదు. ప్రథమ దైవగ్రంథమనియే చెప్పాలి,

ఎందుకనగా!


భగవద్గీత, ఖురాన్ గ్రంథములో అల్లాహ్ (దేవుడు) చెప్పిన మూడు విధానములలో మొదటి విధానము ప్రకారమే తయారయిన దానివలన దానిని ప్రథమ దైవగ్రంథమని చెప్పుట న్యాయమైన పద్ధతి. దేవుడు చెప్పినది, చేసినది గ్రహించుకోలేని మనము తప్పుగా మాట్లాడుచుందుము గానీ, దేవుని మాటలో ఏ లోపము లేదు. అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో దేవుని బోధ విధానము, అట్లే గ్రంథముల వరుస విధానము ఉన్నట్లు చెప్పియున్నారు. దానిప్రకారము భగవద్గీత ప్రథమ దైవ గ్రంథమగును. ఆకాశవాణి చెప్పిన జ్ఞానము గ్రంథమయితే పద్ధతి ప్రకారము ప్రథమ గ్రంథముగా తయారగును. దేవుడు భగవంతుడైన కృష్ణునిగా వచ్చినా, ఆయన భగవంతుడను విషయము ఎవరికీ తెలియకుండా చేశాడు. అంతేకాక కృష్ణుడు అర్జునునకు చెప్పునప్పుడు “ఇది సృష్ట్యాదిలో ఆకాశ వాణి సూర్యునకు చెప్పిన జ్ఞానమును నీకు చెప్పుచున్నానని” కృష్ణుడు అర్జునునకు చెప్పాడు. కృష్ణుడు అర్జునునకు చెప్పాడు అని అంటున్నాము తప్ప కృష్ణుడు అర్జునునకు ఏమి చెప్పాడో, ఎట్లు చెప్పాడో, ఎంతసేపు చెప్పాడో తెలియని స్థితిలో యున్నాము. కృష్ణుడు తాను భగవద్గీతను చెప్పినట్లు ఎక్కడా ప్రకటించుకోలేదు. వ్యాసుడు చెప్పిన దానినిబట్టి ఆకాశ వాణి సూర్యునికి చెప్పిన బోధనే కృష్ణుడు చెప్పాడని యుండుట వలన, కృష్ణుడు భగవంతుడని తెలియకపోవడము వలన, కృష్ణుడు కూడా తాను జ్ఞానమును చెప్పు సమయములో తాను చెప్పు జ్ఞానమంతయూ ఆకాశ వాణి సృష్ట్యాదిలో సూర్యునకు చెప్పినదని చెప్పియుండుట వలన, భగవద్గీత యంతయూ ఆకాశవాణి బోధగా పరిగణింపబడుచున్నది. భగవద్గీత జ్ఞానమంతయూ ఆకాశవాణి బోధగా లెక్కించవలసినదే అయివుండుట వలన, భగవద్గీతను వరుస క్రమములో ప్రథమ దైవగ్రంథముగా చెప్పవలసి వచ్చినది.


కృష్ణుని జీవితములో తాను స్వయముగా జ్ఞానము చెప్పినట్లు ప్రవర్తించలేదు. కృష్ణుడు అర్జునునకు జ్ఞానము చెప్పినది కూడా ఎవరికీ తెలియకుండుట వలన భగవద్గీత ఆకాశవాణి లెక్కలోనికి పోయినది. అందువలన వ్యాసుడు భగవద్గీతను వ్రాసినప్పుడు జ్ఞాన యోగము అను అధ్యాయములో మొదటనే ఈ జ్ఞానమంతయూ సృష్ట్యాదిలో ఆకాశవాణి ద్వారా నేనే సూర్యునకు చెప్పియుంటిని అని చెప్పుట వలన, అది ప్రథమ దైవగ్రంథముగా చెప్పబడుటకు అన్ని అర్హతలు కల్గియున్నది. ద్వాపర యుగములో కృష్ణుడు అర్జునునకు చెప్పుచూ జ్ఞానయోగము మొదటి శ్లోకములోనే ఇలా అన్నాడు చూడండి.


ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్ ।

వివస్వా న్మనవే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవీత్ ॥


భావము :- “ఇది నాశనము లేని యోగము. దీనిని సూర్యునకు చెప్పి యుంటిని. సూర్యుడు మనువుకు చెప్పగా, మనువు వలన ఇక్ష్వాకుడు అను రాజుకు తెలియబడినది." అని గలదు. ఈ శ్లోకములో నేనే సూర్యునకు చెప్పియుంటిని అని కృష్ణుడు చెప్పాడు. మొదట పంచభూతములలో మొదటిదయిన ఆకాశము వలన తెలిసిన జ్ఞానమును నేనే చెప్పానని కృష్ణుడు చెప్పడములో ఆధ్యాత్మిక అర్థము గలదు. ఆకాశములో కూడా ఆత్మ గలదు. ఆత్మ సర్వజీవుల శరీరములయందు గలదు. జీవులను భూతములను పేరుతో కూడా పిలువవచ్చును. భగవంతుడయిన కృష్ణుడు అన్ని శరీరములలో ఆత్మగాయున్నట్లు చెప్పుచూ, ఆ దినము ఆకాశము యొక్క ఆత్మగా కూడా ఆయనే యున్నట్లు చెప్పుచూ, ఆత్మయిన ఆయనే ఆకాశ భూతమునుండి చెప్పడము జరిగినది. అందువలన శ్లోకములో 'ఒకప్పుడు నేనే సూర్యునికి చెప్పియుంటినని' చెప్పాడు. అలా చెప్పడము వలన ఆకాశ భూతము సూర్యునికి జ్ఞానము చెప్పినట్లయినది. అందువలన మొదట ఆకాశములో యున్న సూర్యునికి ఆకాశములోని ఆత్మ బోధించిన బోధ భగవద్గీతగా ద్వాపర యుగములో వ్రాయబడినా, అది ప్రథమ దైవగ్రంథముగా లెక్కించబడుచున్నది. కనిపించని ఆత్మజ్ఞానము తెలియని వారికి ఈ విషయము అర్థము కాదు. ఆత్మజ్ఞానము కొద్దిగా అయినా తెలిసిన వారికి కొంతవరకు అర్థము కాగలదు.


పంచ మహాభూతములలోని ఆకాశము మనుషులవలె మాట్లాడదు. ఆకాశము తన శబ్దము చేత జ్ఞానమును తెలియజేయవలసిందే! ఆకాశము తన శబ్దమయిన ఉరుముల చేత జ్ఞానమును తెల్పినది. ఆకాశము నుండి ఉరుముల శబ్దము వచ్చినా, ఆ శబ్దములో జ్ఞానమును ఇమిడ్చినది. శబ్దము చేసినది ఆకాశములోని ఆత్మయేనని తెలియవలెను. ఆకాశములోని ఆత్మ ఉరుముల రూపమున జ్ఞానమును బోధించగా, ఆ ఉరుముల శబ్దమును ఆకాశములోని సూర్యుడు గ్రహించగలిగాడు. ఆ విధముగా మొదట దైవజ్ఞానము తెలియబడినా, అది సూర్యుని వరకే పరిమితమైన దానివలన దానిని ప్రజలకు తెలుపు నిమిత్తము, మనిషిగా వచ్చిన కృష్ణునిలో నుండి ఆత్మ మొదట సూర్యునకు చెప్పిన జ్ఞానమునే చెప్పడము చేసినది. రెండవ మారు మనిషిగా వచ్చిన కృష్ణుడు చెప్పినా, అప్పుడు కూడా కృష్ణుని శరీరములోని ఆత్మయే చెప్పుట వలన, సూర్యునికి చెప్పిన జ్ఞానమునే చెప్పుచున్నానని చెప్పుట వలన, అప్పుడు క్రొత్తగా చెప్పిన జ్ఞానము కాదనీ, ముందు మేఘముల గర్జన రూపములో వచ్చిన జ్ఞానమునే తిరిగి చెప్పడ మైనదని, అందువలన అది మొదటి జ్ఞానముగానే లెక్కింపబడుచున్నదని చెప్పవచ్చును. మొదటి జ్ఞానమును తెలుగు భాషలో, మనుషుల భావములో చెప్పడము వలన అప్పటికి అది క్రొత్తగా కనిపించినా, ముందు సూర్యునకు చెప్పినదేనని మొదటనే చెప్పడము వలన, దానిని ఆకాశము చెప్పిన పాత జ్ఞానము క్రిందికే జమకట్టబడినది. తర్వాత అది గ్రంథరూపమైనా దానిని ప్రథమ దైవగ్రంథమనియే చెప్పాము. ఆకాశ ఉరుములతో మొదలయిన మొదటి జ్ఞానము మనుషులు మాట్లాడే బోధగా మారిపోయి చివరకు గ్రంథరూపమైనది. అలా తయారయిన గ్రంథము మొదట సంస్కృత భాషలోయున్నా అది మొదట సూర్యుడు వినిన జ్ఞానము, ఆకాశము ఉరుముల రూపములో చెప్పిన జ్ఞానము అయినందున దానిని ప్రథమ దైవగ్రంథమనియే చెప్పుచున్నాము.


నేను తెలుగు భాషలో వ్రాసిన గ్రంథమును ఇంగ్లాండు దేశములో ఆంగ్ల భాషలోనికి వేరొక వ్యక్తి వ్రాశాడు అనుకొనుము. అలా వ్రాయు వ్యక్తి ఇది తెలుగు భాషలోని గ్రంథము, ఈ గ్రంథమును ఫలానా వ్యక్తినయిన నేను ఆంగ్ల భాషలోనికి మార్చి వ్రాయుచున్నానని చెప్పి వ్రాశాడు అనుకొనుము. అప్పుడు అది ఇంగ్లాండు దేశములో కూడా నేను చెప్పిన గ్రంథముగానే అక్కడి ప్రజలకు పరిచయమగును. అట్లు చెప్పి వ్రాయక పోతే అక్కడి మనిషే, ఆంగ్ల భాషలో వ్రాసిన మనిషే ఆ గ్రంథమును స్వయముగా వ్రాసినట్లు లెక్కించబడును. అదే విధముగా ఆకాశము చెప్పగా సూర్యుడు వినిన జ్ఞానమును, ఆకాశ ఉరుముల శబ్దముతో కూడుకొన్న జ్ఞానమును కృష్ణుడు మనుషులు మాట్లాడు భాషలో మార్చి చెప్పినా, కృష్ణుడు చెప్పినప్పుడు ఇది మొదట సూర్యునకు చెప్పిన జ్ఞానమని చెప్పినప్పుడు, భారత దేశములో భారతీయుల భాషలో కృష్ణుడు చెప్పినా, అది మొదట సూర్యునికి చెప్పిన జ్ఞానముగానే లెక్కించబడునుగానీ, తర్వాత కృష్ణుడు చెప్పిన జ్ఞానముగా లెక్కించబడదు. అందువలన మొదట సూర్యునికి ఆకాశ ఆత్మ చెప్పిన జ్ఞానము కొన్ని లక్షల సంవత్సరముల తర్వాత గ్రంథరూపముగా మారినా అది ప్రథమ దైవగ్రంథముగానే పిలువబడినది. ఉరుముల శబ్దము నుండి మనుషులు మాట్లాడు భాషలోనికి చెప్పినది భగవంతుడు అయిన దానివలన, ఆకాశములో ఆత్మగాయున్నది భగవంతుని లోని ఆత్మే అయినందున, భగవంతుడు మనిషి అయినా అన్ని జన్మముల జ్ఞాపకములు ఆయనకుండుట వలన, ఆకాశరూపములో చెప్పిన ఆత్మ కృష్ణ ఆత్మే అయినందున, కృతయుగము మొదటిలో చెప్పినదే తర్వాత ద్వాపర యుగము చివరిలో సులభముగా చెప్పగలిగాడు. కృష్ణుడు ద్వాపర యుగ చివరిలో చెప్పినా, ఆయన భగవంతుడు అయిన దానివలన, భాష అనువాదము చేసి వ్రాసినవాడు ఫలానాయన్నట్లు, భగవంతుడు చెప్పిన దానివలన దానిని భగవద్గీతయని ద్వాపరయుగములో పేరు పెట్టడమైనది. ప్రపంచములో దేవుడు చెప్పిన మూడు విధానములలో మొదటి విధానముగా చెప్పబడిన జ్ఞానము అయినందున దానిని తర్వాత భగవంతుడు చెప్పినా, భవద్గీతయని పేరుపెట్టినా, దానికి ప్రత్యేకమయిన బిరుదులాంటి పేరు ప్రథమ దైవగ్రంథమని చెప్పడమే. మొదట తయారయిన భగవద్గీతకు ప్రథమ దైవగ్రంథమను బిరుదును ఎవరూ తీసివేయలేరు. ఎప్పటికీ శాశ్వితముగా అది ప్రథమ దైవగ్రంథముగానే ఉండును.


ప్రశ్న :- చెరుకును పిండితే రసము వచ్చును. ఆ రసము తీయగా ఉండుట వలన చెరుకు తీయగా ఉండునని పేరుగాంచినది. అలాగే ప్రథమ దైవగ్రంథములో సారాంశము ఏమి గలదు? చెరుకులో తీపి ప్రధానమైనదిగా ఉన్నట్లు భగవద్గీతలో ఏమి ప్రధాన సారాంశముగా యున్నది?


జవాబు :- ప్రపంచమునకే ఆత్మయిన వాడు మొదట ఖగోళములో సూర్య గ్రహము వినునట్లు ఆకాశమునుండి శబ్దరూపములో పెద్దపెద్ద ఉరుముల గర్జనగా వినిపించు శబ్దము చేత చెప్పబడిన విషయము తర్వాత మనుషుల భాషలోనికి కృష్ణుని చేత తర్జుమా చేయబడినది. కృష్ణుని శరీరములోని ఆత్మయే, ఆకాశములోని ఆత్మగా యుండుట వలన, ఆకాశముగా ఒకమారు, మనిషిగా ఒకమారు రెండుమార్లు ఒకే ఆత్మ చెప్పియుండుట వలన, సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమే ద్వాపరయుగము చివరిలో భగవద్గీతగా చెప్పడమైనది. ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో సారాంశ మైనది దైవశక్తియే కలదు. దైవశక్తినే “జ్ఞాన జ్యోతి” అనియూ, “జ్ఞానాగ్ని” అనియూ చెప్పవచ్చును. మనిషి కర్మబద్దమై అస్వతంత్రత కలిగి, స్వతంత్రముగా నడువలేకయున్నాడు. అటువంటి వాడు “జ్ఞానశక్తి” అను బలము చేత కర్మను జయించి స్వయముగా నడువగలడు. కర్మనుండి విడువబడిన వాడై స్వతంత్రత కల్గి స్వయముగా నడువగల శక్తి గ్రంథములో యున్నది. అందువలన మనిషి కర్మబద్ధుడు కాకుండా ఎలా నడువవలెనో, ఎట్లు నడువవలెనో తెలియజేయునది భగవద్గీత. కావున భగవద్గీతలో జ్ఞానమను జ్యోతికలదనీ, అట్లే మనిషి స్వయముగా నడువగల మార్గదర్శినిగా ప్రథమ దైవగ్రంథమున్నదని చెప్పవచ్చును. జ్ఞానము మీద ధ్యాస కలవానికే ఇది ఒక జ్యోతిగాయుండి అజ్ఞాన చీకటిలో మార్గమును కనిపింప జేయుచున్నది. అందువలన ఈ ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతను “జ్యోతి”యనియూ, “మార్గదర్శిని" యనియూ జ్ఞానులు చెప్పుచున్నారు. జ్ఞానులే కాక దైవస్వరూపమైన ప్రవక్తలందరూ కూడా అదే మాటను చెప్పుచున్నారు.


అంతిమ దైవ గ్రంథమయిన ఖురాన్ గ్రంథములో సూరా 5, ఆయత్ 44 యందు ఇలా చెప్పారు చూడండి. (5–44) “మేము తౌరాత్ గ్రంథమును అవతరింపజేశాము. అందులో మార్గదర్శకము, జ్యోతి ఉన్నాయి. ఈ తౌరాతు గ్రంథ ఆధారముగానే ముస్లీమ్ లైన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు యూదుల సమస్యను పరిష్కరించేవారు.” అంతేకాక తౌరాతు గ్రంథమును గురించి మరొకచోట ఈ విధముగా చెప్పారు చూడండి. (62-5) “తౌరాతు గ్రంథము (భగవద్గీత గ్రంథము) ప్రకారము ఆచరించాలని ఆదేశించినప్పటికీ, దానికి అనుగుణముగా ఆచరించనివారు ఎన్ని గ్రంథములను అనుసరించినా, అటువంటి వారిని ఎన్నో గ్రంథములను వీపు మీద మోయు గాడిదలాంటి వారని ఉపమానముగా చెప్పవచ్చును.  దేవుని వాక్యములను ధిక్కరించిన వారి దృష్టాంతము చాలా చెడ్డది. దుర్మార్గపు జనులకు అల్లాహ్ సన్మార్గము చూపడు." ఈ విధముగా తౌరాతు గ్రంథమును గురించి చెప్పడమైనది. తౌరాతు (భగవద్గీత) గ్రంథములో జ్ఞానజ్యోతి యున్నదనీ, అది ప్రతి మానవునికి మార్గదర్శినియని కూడా ఖురాన్ గ్రంథమందు చెప్పబడినది. భగవద్గీత (తౌరాతు) గ్రంథమును గురించి ఖురాన్ గ్రంథము సత్యమని ధృవీకరిస్తున్నది. ఇదే విషయమునే ఖురాన్ గ్రంథములో సూరా 5 ఆయత్ 48న ఇలా వ్రాశారు చూడండి. (5-48) “మేము నీ వైపు ఈ ఖురాన్ గ్రంథాన్ని సత్యసమేతముగా అవతరింపజేశాము. ఇది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను (తౌరాత్, ఇంజీలును) సత్యమని ధృవీకరిస్తుంది. నీ వద్దకు వచ్చిన సత్యమును వీడి వారి మనోవాంఛలను అనుసరించకు" అని వ్రాసియున్నారు. దీనినిబట్టి చివరి దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథము కూడా భగవద్గీతను (తౌరాతును) ధృవీకరిస్తున్నదని తెలియుచున్నది.


ప్రశ్న :- తౌరాతు గ్రంథము మూసా ప్రవక్త ద్వారా వచ్చినదని ఖురాన్ గ్రంథములో అక్కడక్కడ చెప్పబడినది. మూసా ప్రవక్త చెప్పిన తౌరాతు గ్రంథమునే బైబిలులో 'ధర్మశాస్త్రము' అని అన్నారు. అట్లే మూసాను మోషే యని అన్నారు. మోషే ధర్మశాస్త్రము లేక మూసా తౌరాతు గ్రంథమును మీరు భగవద్గీతగా చెప్పుచున్నారు. మీరు చెప్పు తౌరాతు, భగవద్గీత రెండూ ఒక్కటేనంటారా?


జవాబు :- నేను చెప్పునది వాస్తవమే. తౌరాతు గ్రంథము, భగవద్గీత గ్రంథము రెండూ ఒక్కటేయనుమాట క్రొత్తగాయుండినా, నమ్మశక్యము కాకుండాయుండినా నా మాట నూరు శాతము వాస్తవమేయని చెప్పగలను. భగవద్గీతే తౌరాతు గ్రంథమని తెలియుటకు తగిన సమాచారము మా రచనలలోని “కృష్ణ మూస” అను గ్రంథములో గలదు. అక్కడ ఏమి వ్రాసియుందో ఇప్పుడు చూస్తాము.


తౌరాతు గ్రంథము పడమటి దేశమయిన ఇజ్రాయేలు దేశములోనే పుట్టినదని ఖచ్చితముగా చెప్పలేముగానీ, ఇజ్రాయేలు పరిసర ప్రాంతములో పుట్టినదని చెప్పవచ్చును. తౌరాతు గ్రంథము ఏ భాషలో ఉండినదో ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు. తౌరాతు గ్రంథము భాష ఎలా తెలియదో అట్లే ఆ గ్రంథమును ఎవరు వ్రాశారో కూడా తెలియదు. అయితే కొన్ని విషయములను మాత్రము ఖచ్చితముగా చెప్పగలము. భారతదేశములో దాదాపు ఐదువేల సంవత్సరములప్పుడు భగవద్గీత గ్రంథరూపమైనది. సృష్ఠి ఆదిలో దేవుడు తన ఆత్మ ద్వారా ఆకాశమునుండి చెప్పించిన జ్ఞానమును భగవంతుని ద్వారా మనుషులకు చేర్చాడు. భగవంతుడు చెప్పిన జ్ఞానము అన్నట్లు అప్పుడు చెప్పిన జ్ఞానమునకు 'భగవద్గీత' యని పేరు పెట్టి చెప్పడమైనది. భగవద్గీత గ్రంథరూపము కానప్పుడు “జపర” అను పేరుతోయున్న జ్ఞానమే మొట్టమొదటి దైవగ్రంథముగా మారినది. మొదట సంస్కృత భాషలో వ్రాసిన భగవద్గీతను తర్వాత ఏ భాషలో వ్రాసినా అది ప్రథమ దైవగ్రంథముగానే యుండును. భగవద్గీత వ్యాసమహర్షి ద్వారా తయారయినా భారతదేశమునకు పడమర దిశలోయున్న ఇజ్రాయేలు దేశ ప్రాంతములోనికి భగవద్గీత చేర్చబడినది. ఆ ప్రాంత భాషలోనే ఆ ప్రాంతములోనున్న వ్యక్తి దగ్గరకు భగవద్గీతను చేర్చడమైనది. అప్పటికి భారతదేశములో సంస్కృత భాషలో తప్ప ఇతర భాషలో భగవద్గీత లేదు. కృష్ణుడు భారత యుద్ధములో చెప్పిన భగవద్గీతా జ్ఞానమును కృష్ణుని వయస్సు దాదాపు 90 సంవత్సరములప్పుడు అర్జునునికి చెప్పడమైనది.


దేవుడు లేక అల్లాహ్ లేక పరమాత్మ పథకము ఎలా వుండునో ఎవరికీ తెలియదు. ఆయన ముందే నిశ్చయించుకొన్న ప్రణాళికను బట్టి అంతయూ దానంతట అదే జరుగుచుండును. కృష్ణుడు మొత్తము 126 సంవత్సరములు బ్రతుకడము జరిగినది. కృష్ణుడు చనిపోయినప్పుడు తన ఎదురుగా ఉన్న బోయవానికి జరుగబోవు కొన్ని విషయములు చెప్పి, తన రెండవ జన్మను గురించి కూడా చెప్పి చనిపోవడము జరిగినది. అలా చనిపోయిన కృష్ణుడు సాక్షాత్తు దేవుడే అయినా మానవునిగానే ప్రవర్తించాడు. చనిపోయినప్పుడు తిరిగి దేవునిగా మారిపోవలసిన ఆయన అలా మారిపోలేదు. ఇంకా కొంత కాలము మూడు ఆత్మలతోనే పని చేయాలను కొన్నాడు. తాను సృష్ట్యాదిలోని జ్ఞానమును భగవద్గీతగా భారతదేశమును ఎన్నుకొని భారతదేశములోని ఉత్తర ప్రాంతములో చెప్పాడు. అంతవరకు దేవుని జ్ఞానమునకు నిలయముగా యుండి, ఇందూ దేశమని పేరు గాంచిన భారతదేశములో ప్రణాళికబద్దముగా జ్ఞానమును చెప్పి, అట్లే వ్యాసుని చేత గ్రంథరూపము చేయించాడు. అయితే భారతదేశములో పుట్టిన భగవద్గీత ఐదువేల సంవత్సరముల తర్వాత ప్రకాశించులాగున ఆయన నిర్ణయము జరిగినది. అప్పటి వరకు సురక్షితముగా యుండు దేశము భారతదేశమని తెలిసి భగవద్గీతను భారతదేశములోనే చెప్పడమైనది.


భారతదేశము దైవ జ్ఞానమునకు నిలయమనీ, అట్లే అజ్ఞానమునకు కూడా నిలయమని దేవునికి బాగా తెలుసు. తెలిసి ప్రపంచ దేశములు ఎన్ని యున్నా వాటిలో కాకుండా భారతదేశములోనే భగవద్గీతను చెప్పాడు. భారతదేశములో భగవద్గీత మసిగుడ్డలో చుట్టిన మాణిక్యములాగా ఉండునని, తిరిగి తాను వచ్చినప్పుడు తన భగవద్గీతను గురించి చెప్పినా తనను ఎవరూ గుర్తించలేరను ఉద్దేశ్యముతో సృష్ట్యాది జ్ఞానమును భగవద్గీతగా భారతదేశములో వుంచి కృష్ణుడు చనిపోయాడు. కృష్ణుడు చనిపోతూ బోయవానికి చెప్పిన విషయములు చాలా రహస్యమైనవి. ఇతరులకు తెలిసినా ఎవరూ నమ్మరను ధైర్యముతోనే బోయవానికి చెప్పిపోయాడు. ఆయన పోతూ ఇజ్రాయెల్ దేశములో రాబోవు తన జన్మను గురించి తెలిపిపోవడమే కాక, దానికి తగిన ఏర్పాట్లను అప్పటినుండే ప్రారంభించినట్లు కొంత తెలియుచున్నది. కృష్ణుడు చనిపోయిన తర్వాత ఆయన మూడు ఆత్మలుగా మరికొంత కాలముండదలిచాడు అనుకొన్నాము కదా! అదే విధముగా ఇజ్రాయెల్ దేశ సమీపములోని ఒక వ్యక్తి శరీరములో ప్రవేశించి ఆ శరీరము ద్వారా తన భావములను కొన్నింటిని ప్రదర్శించాడు. ఇప్పుడు చెప్పు మాట నమ్మశక్యముగాని మాట. ఎవరూ నమ్మరను ధైర్యముతోనే ఆత్మ సత్యమును తెల్పుచున్నదని అనుకోగలము. అలా మానవ శరీరములో చేరిన కృష్ణ పరమాత్మ తొమ్మిది సంవత్సరములు ఆ శరీరములో గడుపడము జరిగినది. తర్వాత ఆ శరీరములో 135 సంవత్సరములప్పుడు చనిపోవడ మైనది. కృష్ణుడు 135 సంవత్సరములు బ్రతికాడనీ, కృష్ణశరీరములో 126 సంవత్సరములు జీవించగా, తర్వాత తొమ్మిది సంవత్సరములు అధికముగా ఉండుట వలన కృష్ణ జన్మ మొత్తము 135 సంవత్సరములు బ్రతికినట్లయి నది. 1+2+6 = 9 అయినప్పుడు కృష్ణ భగవానుడు శరీరమును వదలగా, అదే సంఖ్య తొమ్మిది అయినప్పుడు అనగా 1+3+5 = 9 అయినప్పుడు కృష్ణుడు చేరిన రెండవ దేహమును కూడా వదలిపోవడము జరిగినది.


ప్రశ్న :- కృష్ణుడు చనిపోయి సూక్ష్మ శరీరముతో మరియొకని శరీరములోనికి చేరడము నమ్మశక్యముగాని మాటగా యున్నది. ఆయన పూర్తి మరణమును పొందలేదా? అకాలమరణమును పొందాడా? దయ్యము ఇతర మనుషులలో చేరినట్లు చేరవలసిన అవసరము భగవంతుడయిన కృష్ణునికి ఎందుకు వచ్చినది? మాలో యున్న అనేక సంశయములకు మీరు జవాబు చెప్పాలి?


జవాబు :- కృష్ణుడు సాధారణమయిన మనిషి కాదు. ఆయన ప్రత్యేకముగా వచ్చిన భగవంతుడు. భగవంతుని శరీరములో మూడు ఆత్మలు యున్నా, ఆత్మ తనపని తాను చేసినా, జీవాత్మ అయినవాడు కర్మ లేనివాడు, ప్రత్యేకమైన వాడు. అతనికి అందరివలె మరణముండదు. 'జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల’ యన్నట్లు ఆయనకు మరణములు వర్తించవు. అట్లే అందరివలె పుట్టుక కూడా వర్తించదు. తండ్రి వీర్య కణముతో సంబంధము లేకుండా పుట్టిన ఆయనకు అందరివలె 'పుట్టుక' ఎట్లు లేదో అట్లే ఆయనకు అందరి వలె 'జీవుడు శరీరమును వదలి చనిపోవడము' లేదు. ఆయన కర్మతో సంబంధము లేనివాడు. ఒక చోట చనిపోయి మరొకచోటికి పోవుటకు అతనికి కర్మలేదు. ఆయన స్వయం నిర్ణయము ప్రకారము పుట్టుక యుండును మరియు చావు వుండును. ఆయన ప్రస్థుతము భగవంతుడయినా ఆయనే మూడవ శక్తి అయిన పరమాత్మ (దేవుడు). అందువలన ఆయనను శాసించు శక్తి ఏదీ లేదు. ఆయన ధర్మసంస్థాపన కొరకు స్వయం నిర్ణయమును తీసుకొనును. భవిష్యత్తు ప్రణాళికను అనుసరించి ఆయన చేయు పనులుండును. తన రెండవ రాకను గురించి బోయవానికి కొంత సమాచారమును తెల్పిన కృష్ణుడు, అదే సమాచార నిమిత్తము ఇజ్రాయెల్ దేశ సమీపములోనున్న ఒక ప్రవక్త శరీరములోనికి ప్రవేశించాడు. అప్పటి కాలములో జ్ఞాన సమాచారమును అందించు వ్యక్తిని ప్రవక్త అనడము సహజము. అది కొంత జ్ఞానమయినా కావచ్చును లేక ఎక్కువ జ్ఞానమయినా కావచ్చును. మొత్తము మీద జ్ఞాన సమాచారమును అందించు ప్రవక్తగా యున్న వ్యక్తికి కృష్ణుని మరణ సమయమునకు అతని మరణము కూడా నిర్ణయింపబడియుండెను. అతని పేరు “మోషే” అని చెప్పబడుచుండెను. మోషే ప్రవక్త ఆ సమయమునకు చనిపోవునను విషయము కృష్ణునికి తప్ప ఎవరికీ తెలియదు. మోషేకు కూడా తెలియదు. మోషే సాధారణ మనిషే అయినందున తన మరణమును గురించి మోషేకు తెలియదు.


సర్వ సృష్ఠికర్తయిన అల్లాయే (దేవుడే) మోషేను ఆ ప్రాంతములో పేరుపొందిన ప్రవక్తగా చేసియుంచాడు. మోషే 54 సంవత్సరములు బ్రతికాడు. మోషే 54 సంవత్సరములు బ్రతుకునట్లు, మోషే చనిపోవు సమయమునకు కృష్ణుడు చనిపోవునట్లు ముందే నిర్ణయము జరిగినట్లు ఎవరికీ తెలియదు. కృష్ణునికి మాత్రము అన్నీ తెలిసే జరిగినవి. ఆయన స్వయముగా దేవుడే అయివున్నందున ఆయనకు అన్నీ తెలుసు. మోషే చనిపోయిన క్షణములోనే కృష్ణుడు చనిపోయి మోషే శరీరములో ప్రవేశించు నట్లు నిర్ణయించుకున్నాడు. మోషే ప్రవక్త చనిపోవడము, కృష్ణ భగవాన్ చనిపోవడము ఒకేమారు జరిగినది. కృష్ణుడు తన శరీరములో లేకుండా పోయి మోషే శరీరములో ప్రత్యక్షమయినాడు. అలా మోషే శరీరములో చనిపోయినట్లు ఎవరూ గుర్తించలేరు. మోషే చనిపోయినా అందులో కృష్ణుడు యుండుట వలన మోషే సాధారణముగా బ్రతికేయున్నాడని అందరూ అనుకొన్నారు. కృష్ణుడు మోషేవలెనేవుండి జ్ఞానమును చెప్పుచుండుట వలన కృష్ణున్ని ఎవరూ గుర్తించలేదు, అందరూ మోషేనే మాట్లాడుచున్నాడని అనుకోవడము జరిగినది. కృష్ణుడు చనిపోయినట్లు భారతదేశములోనున్న వారికి తెలిసినా, అతను మోషేగా ఇతర దేశములో యున్నాడని మాత్రము తెలియదు.


ప్రశ్న :- ప్రపంచములో ఎందరో ప్రవక్తలుండగా మోషే ప్రవక్త శరీరమునే

కృష్ణుడు ఎందుకు ఎంచుకున్నాడు?


జవాబు :- ఇది మంచి ప్రశ్నే. సమయానుకూలముగా అడుగవలసిన ప్రశ్నే. దీనికి నా జవాబు ఏమంటే కృష్ణుడు భగవద్గీతను చెప్పిన తర్వాత వ్యాస మహర్షి కృష్ణుడు చెప్పిన జ్ఞానమును గ్రంథరూపము చేయుటకు దాదాపు రెండు సంవత్సరములు పట్టినది. స్వచ్ఛమయిన కల్తీ లేని భగవద్గీత అప్పుడుండేది. వ్యాసుడు చనిపోయిన తర్వాత కొందరు స్వార్థవరులు వారి స్వార్థముతో కొన్ని శ్లోకములను కలుపడము జరిగినది. మొదట తయారయినది కలుషిత శ్లోకములు లేని భగవద్గీతగా యుండెడిది. కృష్ణుడు 90 సంవత్సరముల వయస్సులో అర్జునునకు సృష్ట్యాదిలోని జ్ఞానమును చెప్పగా, తర్వాత రెండు సంవత్సరముల కాలములో అది గ్రంథరూపముగా మారగా, దాని పేరు 'భగవద్గీత' యని చెప్పుకొన్నాము. మోషే 54 సంవత్సరములు బ్రతుకగా, కృష్ణునికి 92 సంవత్సరముల వయస్సులో భగవద్గీత తయారయినది. భగవద్గీత తయారయిన సమయానికి మోషే వయస్సు సరిగా 20 సంవత్సరములుండును. 20 సంవత్సరముల తర్వాత 34 సంవత్సరములు మోషే బ్రతికాడు. అలాగే కృష్ణుడు కూడా 92 సంవత్సరముల తర్వాత 34 సంవత్సరములే బ్రతికాడు.


మోషేకు ఇరువది (20) సంవత్సరముల వయస్సులో ఒక శుభ దినము ఏర్పడినది. అప్పటినుండి మోషే అప్పుడప్పుడు కొంత జ్ఞానమును చెప్పుచూ మంచి వక్తగా మారిపోయాడు. తర్వాత ఆయనను 'ప్రవక్త' అని అందరూ అన్నారు. 20 సంవత్సరములనుండి ఆయన జీవితములో ఒక క్రొత్త వెలుగు వచ్చినది. 92వ సంవత్సరములో కృష్ణునిలో కూడా ఒక తృప్తి ఏర్పడినది. అప్పుడు జరిగిన విశేషము ఏమి అనగా! మోషేకు 20 సంవత్సరములు గడచు కాలమున ఒక దినము ఆదివారము రాత్రి నడిరేయి గడచిన సమయములో స్వప్నము రావడము జరిగినది. ఆ స్వప్నములో కృష్ణుడు కనిపించి గ్రంథమైన తన భగవద్గీతను మోషేకు ఇవ్వడము జరిగినది. మోషే తన స్వప్నములో కృష్ణున్ని చూచినా కృష్ణుడు ఎవరో తనకు తెలియదు. అయితే స్వప్నములో కనపడిన కృష్ణుడు ఎంతో తేజస్సు కల్గియుండడమును చూచిన మోషే అతను నిజముగా దేవుడని నమ్మాడు. తేజస్సుతో కనిపించిన కృష్ణుడు మోషేకు భగవద్గీతా గ్రంథమును ఇచ్చి ఇది “తౌరాత్” గ్రంథమని చెప్పడమైనది. మోషే స్వప్నములో గ్రంథమును తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. అంతే! అతని మెదడులో మెరుపు మెరిసినట్లయినది. మోషేకు ఒక్కమారుగా మెలుకువ వచ్చినది. మెలుకువ వచ్చిన తర్వాత కూడా గుండె వేగముగా కొట్టుకొనుచుండగా, తలలో ఏదో క్రొత్త అనుభూతిని పొందిన సంతోషము కల్గినది. జరిగినది ఏమిటి? అని కళ్ళు తెరచి చూడగా తన చేతులలో గ్రంథము కనిపించినది. అదియే తౌరాత్ గ్రంథము. దానిమీద అప్పటి భాషలో 'తౌరాత్' యని ఉండడమును మోషే చూచాడు. ఆ విధముగా మోషేకు తౌరాత్ గ్రంథము లభించినది. అక్కడి తౌరాత్ గ్రంథమే ఇక్కడి భగవద్గీత.


'తౌరాత్' యనగా మూడు చీకటి రాత్రులని అర్థము. మూడు కనిపించని ఆత్మల యొక్క జ్ఞానముండుట వలన, మూడు ఆత్మల జ్ఞానము రహస్యమైనదయినందున, మూడు ఆత్మలనుద్దేశించి తౌరాత్యీని భగవద్గీతకు కృష్ణుడే పేరు పెట్టాడని తెలియుచున్నది. ఇదంతా చదివే వారికి ఒక కథలాగ యున్నా, నమ్మశక్యముగానిదైయున్నా ఇది నూటికి నూరుపాళ్ళు జరిగిన సత్యము. నమ్మమని ఎవరినీ బలవంతము చేయడము లేదు. సత్యమును చెప్పక తప్పదు, కావున సమయము ఆసన్నమైనప్పుడు చెప్పక తప్పలేదు. అట్లని పైకి కనిపించు నన్ను ఈ విషయమునకు బాధ్యున్ని చేయవద్దండి. నిజముగా మీకు ఎంత తెలుసో నాకూ అంతే తెలుసు. ఇప్పుడిది మీకే కాదు నాకు కూడా క్రొత్త విషయమే. ఇలా మనకు తెలియని ఎన్నో క్రొత్త విషయములు ఆత్మకు తెలుసు. ఆత్మ అందించితేనే ఇప్పుడు మనకు తెలియుచున్నది.


తౌరాత్ గ్రంథము మోషేకు లభించినదని తెలిసినది కదా! ఇక్కడే ఇంకొక క్రొత్త రహస్యము కలదు. అదేమనగా! తౌరాత్ గ్రంథమును మోషే తప్ప ఎవరూ చూడలేదు. తౌరాత్ గ్రంథము మోషేకు మాత్రమే కనిపించేది, ఇతరులకు కనిపించేది కాదు. ఆ విధముగా తౌరాత్ (భగవద్గీత) గ్రంథము అక్కడి మనుషులకు రహస్య గ్రంథమయినది. ఆ విషయము మోషేకు కూడా అర్థమయినది. గ్రంథములోని జ్ఞానమును రాత్రిపూట చదువుకొని పగలు ఇతరులకు చెప్పెడివాడు. చెప్పేది భగవద్గీతలోని జ్ఞానమయిన దానివలన శాస్త్రబద్దముగా యుండెను. జ్ఞానమునకు 'గీటురాయి'గా (సానరాయిగా) ఉండెను. తౌరాత్ జ్ఞానము వలన ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తేల్చిచెప్పుటకు వీలయ్యేది. అందువలన తౌరాత్ గ్రంథమునకు ‘గీటురాయి’ అను పేరు సార్థకమయినది. అదే గీటురాయియే మన వద్ద గల భగవద్గీత. ఆ దినములలో మోషేకు మాత్రము కనిపించి ఇతరులకు కనిపించని భగవద్గీత నేడు మనముందు జ్ఞానులకు, అజ్ఞానులకు కనిపించుచున్నది. నేడు గ్రంథము కనిపించినా అందులోని జ్ఞానము చాలా మందికి కనిపించడము లేదు. అనగా అర్థము కావడము లేదు.


మోషే చెప్పు జ్ఞానమునకు చాలా మంది ఆకర్షితులై ఆయన చెప్పు జ్ఞానమును తెలియుచుండిరి. మోషే తనకు తౌరాత్ గ్రంథము లభించినప్పటి నుండి 34 సంవత్సరములు గ్రంథములోని జ్ఞానమునే చెప్పాడు. మోషే చెప్పు జ్ఞానము తౌరాత్ గ్రంథములోనిదని ప్రజలకు తెలియదు. మోషేకు 54 సంవత్సరములు గడచిన తర్వాత మోషే శరీరములో లేకుండా పోవడమూ, అందులో స్వయముగా కృష్ణుడే ఉండడము ఇతరులెవరికీ తెలియదు. కృష్ణుడు తొమ్మిది సంవత్సరములు మోషే శరీరములో వుండి, మోషే చెప్పునట్లే నటించి రాబోయే ఏసును గురించి అతని జీవితములో జరుగు కొన్ని సంఘటనలను గురించి చెప్పడము జరిగినది. మోషే (కృష్ణుడు) చెప్పిన సంఘటనలు ఏసు జీవితములో నెరవేరినట్లు నాలుగు సువార్తలలో తెలియుచున్నది. మోషే ఏసును గురించి చెప్పిన కొన్ని సంఘటనలను తెలుసుకొన్న యెషయా అవే సంఘటనలనే తన లేఖనములలో వ్రాశారు. మోషే తౌరాత్ గ్రంథ జ్ఞానమును చెప్పుటవలన అతను ధర్మ శాస్త్రమును చెప్పాడని అందరూ అనుకోవడము జరిగినది. మోషే స్వయముగా ధర్మ శాస్త్రమును చెప్పాడని అనుకున్నారు. మోషేకు ఒక్కనికే తెలిసిన తౌరాత్ను మోషే తర్వాత ఎవరూ దానిని చూడలేదు. మోషే తప్ప తౌరాత్ గ్రంథమును చూచిన రెండవ వ్యక్తి లేడనియే చెప్పవచ్చును.


కృష్ణుడు మోషే శరీరములో తొమ్మిది సంవత్సరములుండి ఏసును గురించి ముందే చెప్పడము, ఆ విషయములను తర్వాత తెలిసిన ప్రవక్తలు లేఖనములుగా వ్రాయడము జరిగినది. కృష్ణుడు 34 సంవత్సరముల ముందే భగవద్గీతను మోషేకు ఇవ్వడము వలన, అతని శరీరములోనికి వచ్చి మాట్లాడవలెనని నిర్ణయించుకొన్నాడు. మోషేలోయున్న తొమ్మిది సంవత్సరముల తర్వాత కృష్ణుడు శరీరమును వదలి మూడు ఆత్మలు ఏకమై దేవునిగా మారిపోయాడు. అదే దేవుడే మూడు వేల సంత్సరముల తర్వాత ఏసుగా రావడము జరిగినది. అయితే ఆయనను ఫలానా వాడని ఎవరూ గుర్తించలేక పోయారు. కొందరు దేవుని కుమారుడు అన్నారు. కొందరు దేవుని దూతయని అన్నారు. అంత తప్ప శరీరముతో వచ్చిన వాడే దేవుడని, ఎవరూ తెలియలేకపోయారు. ఏసు తర్వాత ఏసు చెప్పిన మాటలను బట్టి తయారయిన గ్రంథము ఇంజీలు. ఇంజీలు గ్రంథమును బైబిల్ గ్రంథమంటారు. ఇంజీలు గ్రంథము తౌరాత్ గ్రంథమును అనుసరించి తయారయినది. ఇంజీలులోని జ్ఞానము తౌరాత్లోని జ్ఞానమేయని చెప్పవచ్చును. ఈ విషయమును అంతిమ దైవ గ్రంథము ఖురాన్ సురా 5, ఆయత్ 46లో కలదు. (5-46) “మేము మర్యమ్ కుమారుడు ఈసాను (ఏసును) పంపాము. అతను తనకు పూర్వము వచ్చిన తౌరాత్ గ్రంథమును సత్యమని ధృవీకరించేవాడు. మేము అతనికి ఇంజీలు (బైబిల్) గ్రంథాన్ని ఇచ్చాము. అందులో మార్గ దర్శకము, జ్యోతి ఉండేవి. అది తనకు ముందున్న తౌరాత్ గ్రంథమును ధృవీకరించేది. అంతేకాక అది దైవభీతి కలవారికి మార్గదర్శినిగా ఉండేది"


భారతదేశములో పుట్టిన భగవద్గీత ఇతర దేశములో తౌరాత్ చెప్పబడినది. అయితే అది మోషేకు ఒక్కనికి తప్ప అందరికీ అందని పండయినది. అందువలన తౌరాత్ గ్రంథము పేరు విన్నవారే గానీ, దానిని చూచిన వారు ఎవరూ లేరు. ఇంజీలు గ్రంథములో తౌరాత్ జ్ఞానమున్నదని ఖురాన్ గ్రంథములో వ్రాయబడి యుండటము చూచాము. అంతేకాక తౌరాత్ గ్రంథము తర్వాత వచ్చిన ఇంజీలుకే కాక ఖురాన్కు కూడా ఆదర్శముగా యున్నదను విషయము అంతిమదైవ గ్రంథములోనే గలదు. సూరా 5, ఆయత్ 44ను చూడండి (5-44) “మేము తౌరాత్ గ్రంథమును అవతరింపజేశాము. అందులో మార్గదర్శకము, జ్యోతి ఉన్నాయి. తౌరాత్ గ్రంథ ఆధారముగానే ముస్లీమ్లయిన ప్రవక్తలు, రబ్బానీలు, ధర్మవేత్తలు, యూదుల సమస్యను పరిష్కరించేవారు." (5-48) “మేము నీ వైపునకు ఈ గ్రంథమును (ఖురానాను) సత్యసమేతముగా అవతరింపజేశాము. ఇది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది. నీవద్దకు వచ్చిన సత్యమును వీడి వారి (మనుషుల) మనోవాంఛలను అనుసరించకు." (5-68) “మీరు తౌరాతాను, ఇంజీలును (భగవద్గీత, బైబిల్) మీ ప్రభువు తరుపున మీ వద్దకు పంపబడిన ఖురాన్ గ్రంథమును మీ జీవితాలలో నెలకొల్పువరకు మీరు ఏ ధర్మముపైనా లేనట్లే.”


'అంతిమ దైవగ్రంథము ఖురాన్' లో వ్రాసిన వాక్యములను బట్టి తర్వాత వచ్చిన రెండు దైవ గ్రంథములలో మొదటి దైవగ్రంథము యొక్క జ్ఞానమే ఉందని అర్థమగుచున్నది. అందువలన మూడు దైవ గ్రంథములను చదవనిదే ఏ ధర్మములో లేనట్లేయని కూడా చెప్పారు. తౌరాత్ గ్రంథము యొక్క పేరును మోషే కూడా బయటికి చెప్పలేదు. అది రహస్యముగా నిలిచిపోయిన గ్రంథమని చెప్పాడు. తౌరాత్ గ్రంథము మోషేకు ఇచ్చినప్పుడు గ్రంథము పేరు తౌరాత్యని మోషే విన్నాడు. ఆ గ్రంథము స్వప్నములో దొరికిన గ్రంథము. మోషేకు తప్ప ఇతరులకు కనిపించని గ్రంథము. 'తౌరాత్'ని గురించి మోషే ధర్మశాస్త్రమని చెప్పారు తప్ప పేరు చెప్పలేదు. అతి రహస్యమైన తౌరాత్ గ్రంథము పేరును ఖురాన్ గ్రంథము బయల్పరచినది. ఖురాన్ గ్రంథము తౌరాత్ గ్రంథము పేరును చెప్పకపోతే ఆ పేరు ప్రపంచానికి తెలిసేది కాదేమో! అయితే తౌరాత్ గ్రంథమే భగవద్గీతయని తెలియని రహస్యముగా యున్నది. సమయము ఆసన్నమయ్యే కొద్దీ తెలియని రహస్యములను ఆత్మే తెలుపవలసియున్నది.


ఈ విషయములన్నియూ బాగా గమనించిన తర్వాత తౌరాతు గ్రంథమే భగవద్గీతయనీ, భగవద్గీతే తౌరాతుయని తెలియడమైనది. అంతేకాక కృష్ణుడే మోషేయనీ లేక మూసాయనీ తెలియడమైనది. కృష్ణుడు 126 సంవత్సరములు 'కృష్ణ' అను పేరుతో యుండి, తర్వాత తొమ్మిది సంవత్సరములు 'మోషే’'యను పేరుతో చెలామణి అయినట్లు కూడ తెలియు చున్నది. కృష్ణునిగా యున్నప్పుడే తన రెండవ జన్మ అయిన ఏసు జన్మకు కావలసిన ప్రణాళికను సిద్ధము చేసుకొన్నాడని తెలియుచున్నది. రాబోయే ఏసు జన్మను గురించి మోషేగాయున్నప్పుడే చెప్పడమేకాక, ఏసు జీవితములో జరుగబోవు సంఘటనల గురించి చెప్పియున్నాడు. కృష్ణుడు మోషేగా యున్నప్పుడు తన భగవద్గీతను తౌరాత్గా చెప్పాడు. అలా చెప్పడమునకు కారణము చూస్తే భగవద్గీతను తాను చెప్పినట్లు తెలియకూడదనే తన అభిప్రాయమని తెలియుచున్నది. భగవద్గీతను ఆకాశము చెప్పినట్లే ఆకాశమునకు గౌరవము దక్కులాగున, ఆకాశము చెప్పినందుకు దేవుని మొదటి విధానము ప్రకారము భగవద్గీతను ప్రథమ దైవగ్రంథమనుటకు అవకాశముండునట్లు చేశాడు. కృష్ణుడు మోషేకు స్వప్నములో ఇచ్చిన భగవద్గీతకు తౌరాత్యీని పేరుమార్చి ఇవ్వడమునకు కూడా ఎక్కువగా అదే కారణము కనిపించుచున్నది. తౌరాత్ గ్రంథము మోషేవద్ద యుండేదని కొందరికి అరుదుగా తెలుసుకానీ దానిని ఎవరూ చూడలేదు. అందువలన తాము చూడని గ్రంథమునకు ప్రజలు ధర్మశాస్త్రమనీ, మోషే ధర్మశాస్త్రమనీ చెప్పడమైనది.


ప్రశ్న :- కృష్ణుని తర్వాత జీవితము మోషేగా ప్రజలకు కనిపించాడు. తర్వాత కృష్ణుడు మోషే శరీరమును వదలి మూడు వేల సంవత్సరములు దేవునిగా యుండిపోయాడు. దేవునిలో యున్న ఆత్మ తిరిగి మూడు వేల సంవత్సరముల తర్వాత ఏసుగా వచ్చినదని మీరు చెప్పారు. కృష్ణునిగా యున్న ఆత్మయే, ఏసుగా వచ్చినదని చెప్పుటకు ఏదయినా ఆధారము కలదాయని అడుగుచున్నాము?


జవాబు :- పరమాత్మ తన ధర్మములకు ముప్పు కల్గినప్పుడు అధర్మములను అణచివేసి ధర్మములను స్థాపించుటకు అప్పుడప్పుడు భూమిమీద మనిషి వలె అవతరించి మనుషులకు తన జ్ఞానమును గురించి చెప్పి ధర్మములను స్థాపించును. అలా వచ్చినదే కృష్ణుని జన్మ మరియు ఏసు జన్మయని చెప్పవచ్చును. కృష్ణునిగా వచ్చిన దేవుడే తిరిగి ఏసుగా వచ్చాడు. అనగా కృష్ణునిగా మొదట వచ్చిన ఆత్మయే తిరిగి ఏసుగా వచ్చినదని తెలియవలెను. దేవుడు భగవంతునిగా మానవ శరీరములోనికి వచ్చినప్పుడు కూడా దేవుడు దేవునిగానే యుంటాడు గానీ అప్పుడు దేవుని స్థానము ఖాళీకాదు. దేవుడు మనిషి ఆకృతి బొమ్మను చేసి అందులోనికి తన ఆత్మను ఊది పంపుచున్నాడు. అలా వచ్చినవాడు దేవుని ప్రతినిధియని చెప్పవచ్చును. దేవుని ప్రతినిధియైన వానినే భగవంతుడు అనీ, దేవుని అవతారము అనీ అంటున్నాము. దేవుడు మొదట కృష్ణునిగా వచ్చాడు. అదే కృష్ణుడే మోషేగా కనిపించాడు. మోషేగా కనిపించిన కృష్ణుడే తర్వాత ఏసుగా వచ్చాడు. మధ్యలోనున్న మోషేనే ఖురాన్ గ్రంథములో మూసాగా చెప్పబడ్డాడు. అలాగే బైబిలులో మోషే ఖురాన్లో మూసాగా చెప్పబడినట్లు, బైబిలులో ఏసుగా పిలువబడినవాడు ఖురాన్ గ్రంథములో ఈసాగా పిలువబడినాడు. అట్లే భగవద్గీతలో కృష్ణుడే ఖురాన్ మూసా, బైబిలులో మోషేగా తెలియవలెను.


కలియుగములో ఏసు శరీరములో వచ్చాడు. ద్వాపర యుగము చివరిలో కృష్ణుడు, ఆయన తర్వాత జీవితములో మోషే తొమ్మిది సంవత్సరములున్నాడు. కృష్ణుడు మోషే ఇద్దరు ఒక్కటే అయితే, తర్వాత మోషే ఏసు ఇద్దరు ఒక్కటే అయినారు. అందువలన మేము ఒకచోట 'కృష్ణ మూసా, ఏసు ఈసా' అని అన్నాము. మొదట కృష్ణునిగా వచ్చిన వాడే మోషేగా కొన్నాళ్లు, ఏసుగా కొన్నాళ్ళు యున్నాడని అర్థమగుచున్నది. కృష్ణుడు మోషేగా (మూసాగా), మోసేనే ఏసుగా (ఈసాగా) ఉన్నాడని చెప్పుటకు బైబిలులో క్రొత్త నిబంధనయందు యోహాన్ సువార్త ఐదవ అధ్యాయమున 46, 47 వచనములలో ఇలా కలదు చూడండి. (యోహాన్ 5-46, 47) "అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయిన నన్నున నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలా నమ్ముదురనెను".


ఈ వాక్యములను బాగా పరిశీలించి చూడగలిగితే మోషే, ఏసు ఇద్దరు ఒక్కటేయని తెలియుచున్నది. ఏసు తనను మోషేతో పోల్చి చెప్పుకోవడము వలన ఏసు మోషే ఇద్దరు ఒక్కటేయని దృఢముగా అర్థమగు చున్నది. మోషే ఏసు ఇద్దరు ఒక్కటేయని తెలియుట వలన మోషేగా యున్నది కృష్ణుడే గనుక, కృష్ణుడు మోషేగా యున్నప్పుడే ఏసును గురించిన లేఖనములను వ్రాశాడు గనుక, ఏసు 'మోషే' పేరు చెప్పినా అది కృష్ణునికే వర్తించును గనుక, ఏసు కృష్ణుడు ఇద్దరు ఒక్కటేయన్నట్లు ఏసు మాటలలోనే తెలియుచున్నది. కృష్ణుడు ఏసుగా వచ్చినప్పుడు చెప్పిన బోధలు గ్రంథరూపమైనాయి. ఆ గ్రంథము దేవుడు చెప్పిన విధానములలో తన ప్రతినిధి చేత చెప్పిస్తానని చెప్పినట్లు, తన జ్ఞానమును మనిషిగాయున్న ఏసు చేత చెప్పించడము వలన, అది రెండవ విధానముగా నెరవేరిన దానివలన, బైబిలు గ్రంథమును 'ద్వితీయ దైవగ్రంథము'గా చెప్పుచున్నాము. ద్వితీయ దైవ గ్రంథములో నాలుగు సువార్తలయందు ఏసు చెప్పిన జ్ఞానముండుట వలన, నాలుగు సువార్తలనే 'ద్వితీయ దైవగ్రంథము' అని అనాలి. అరవై ఆరు పాఠములుగాయున్న బైబిలు గ్రంథములో ఏసు చెప్పినది నాలుగు సువార్తల రూపములో యుండుట వలన, కేవలము నాలుగు సువార్తలనే 'ద్వితీయ దైవగ్రంథము' అనుటకు అర్హత కల్గియున్నది. నాలుగు సువార్తలు తప్ప మిగతా 62 పాఠములను బైబిలు అనవచ్చునుగానీ ద్వితీయ దైవగ్రంథమని అనకూడదు. బైబిలు గ్రంథములోగల 62 పాఠములకు రెండవ దైవగ్రంథమను మాట సరిపోదని చెప్పవచ్చును. దైవ ప్రతినిధియైన వాడు చెప్పినదే దైవగ్రంథమగును. మనుషులు చెప్పినది దైవగ్రంథము కాజాలదు.


కృష్ణుడు వచ్చి ఆకాశము చెప్పిన జ్ఞానమును ఆకాశ భాషనుండి మనుషుల భాషలోనికి అనువాదవము చేసి చెప్పాడు. తర్వాత ఏసుగా వచ్చి నాలుగు సువార్తల జ్ఞానమును చెప్పాడు. అది ద్వితీయ దైవగ్రంథము కాగా తర్వాత ఆరువందల సంవత్సరములకు అనగా ఇప్పటికి 1400 సంవత్సరములకు పూర్వము మనువుకు చెప్పిన సూర్యుడే, జిబ్రయేల్ అను పేరుతో పూర్వము మనువుకు చెప్పిన జ్ఞానమునే అప్పుడు కొంత, అప్పుడు కొంత ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పుచూ వచ్చాడు. 23 సంవత్సరములు సూర్యుడు (జిబ్రయేల్) ప్రవక్తగారికి బోధించగా అది చివరకు గ్రంథరూపమైనది. జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తగారికి కనిపించక తెరచాటునుండి బోధించడము వలన దేవుడు తన జ్ఞానమును మనుషులకు బోధించు మూడు విధానములలో రెండు విధానముల ప్రకారము ముందే బోధించగా, తర్వాత మిగిలిన చివరి విధానమైన తెరచాటునుండి బోధించడము వలన, అప్పుడు జిబ్రయేల్ ద్వారా చెప్పబడిన బోధల గ్రంథమును 'అంతిమ దైవగ్రంథము' లేక 'చివరి దైవగ్రంథము' అని చెప్పడమైనది. దేవుడు చెప్పిన మూడు విధానముల ప్రకారము తెలియజేయ బడిన బోధలకు మూడు దైవగ్రంథములని చెప్పడమే కాక ముందు వెనుక బోధించిన విధానమునుబట్టి వాటికి ప్రథమ, ద్వితీయ, అంతిమ దైవ గ్రంథములని పేరు వచ్చినది.


ప్రశ్న :- మూడు దైవ గ్రంథములను మూడు విధముల బోధించడమైనది కావున మూడు దైవగ్రంథములుగా చెప్పుచున్నాము. అయితే మూడు దైవ గ్రంథములలో ఒకే జ్ఞానమున్నదా? లేక కొంత తేడాతో ఏమయినా ఉన్నదా?


జవాబు :- మూడు దైవగ్రంథములలో యున్నది సృష్ట్యాదిలో మొదట ఆకాశ వాణి చెప్పిన జ్ఞానమే కలదు. ఆకాశవాణి తన శబ్దమైన ఉరుముల ద్వారా చెప్పిన జ్ఞానమే మొదట భగవద్గీతగా తయారయినది. భగవద్గీతనే మిగతా గ్రంథములలో తౌరాతు గ్రంథము అంటున్నాము. తౌరాతు గ్రంథము (భగవద్గీత) లోని జ్ఞానమే ఇంజీలు (బైబిలు) గ్రంథములోనూ, ఖురాన్ గ్రంథములోనూ యున్నట్లు ఖురాన్ గ్రంథమే సాక్ష్యము చెప్పుచూ ఐదవ సూరాలో 44, 46, 48, 68 ఆయత్లలో వ్రాయడమైనది. అందువలన మూడు గ్రంథములలో ఒకే జ్ఞానమున్నదని చెప్పవచ్చును.


ప్రశ్న :- ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతను 'తౌరాతు' అను పేరుతో మూసాకు (మోషేకు) ఇవ్వడము జరిగినది. అయితే మహాజ్ఞాని అయిన జిబ్రయేల్ ముహమ్మద్ ప్రవక్తకు చెప్పిన బోధలో సూరా 2, ఆయత్ 53లో ఇలా చెప్పాడు (2-53) “జ్ఞాపకము చేసుకోండి. మీరు సన్మార్గులవు తారని మేము మూసాకు గ్రంథాన్ని మరియు సత్యాసత్యములను వేరుచేసే గీటురాయిని ప్రసాదించాము." అంతేకాక మరొకచోట సూరా 25, ఆయత్ 1 లో ఇలా చెప్పాడు. (25-1) “సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా ఈ గీటురాయిని తన దాసునిపై క్రమ క్రమముగా అవతరింపజేసిన ఆయన ఎంతో శుభకరుడు" అని కూడా కలదు. ఇక్కడ గీటురాయి అనబడు తౌరాతును మూసాకు ఇచ్చినది వాస్తవమే అనుకొందాము. అయితే అదే గీటురాయిని అంచెలంచెలుగా ముహమ్మద్ ప్రవక్తగారికి అల్లాహ్ ఇచ్చినట్లు ముస్లీమ్లు చెప్పుచున్నారు. దానినిబట్టి ఖురాన్ గ్రంథమే గీటురాయి అని అర్థమగుచున్నది. అక్కడ ముసాకు ఇచ్చిన తౌరాతు గ్రంథము గీటురాయా, లేక ఇక్కడ ముహమ్మద్ ప్రవక్తగారికి ఇచ్చిన ఖురాన్ గీటురాయా అని సంశయము ఏర్పడుచున్నది. అసలు 'గీటురాయి' అంటే అర్థము ఏమి? ముసాకు ఇచ్చిన తౌరాతు, ప్రవక్తకు ఇచ్చిన ఖురాన్ రెండూ ఒకే గ్రంథములు కాకున్నా రెండిటికి గీటురాయి అని ఎందుకు అన్నారు? కొంత మాకు అర్థమయ్యే విధముగా చెప్పవలెనని కోరుచున్నాము.


జవాబు :- సృష్ట్యాదిలో ఆకాశము తన వాణి ద్వారా జ్ఞానమును తెలియజేసి నది. వాణి అనగా 'శబ్దము' అని అర్థము. ఆకాశము యొక్క వాణి మాటల రూపములో ఉండదు. మనుషుల వాణి మాటల రూపములో ఉంటుంది. ఆకాశవాణి ఉరుముల రూపములో ఉంటుంది. గర్జించి ఉరిమిన ఉరుముల జ్ఞానమును ఆకాశములోనున్న పెద్ద గ్రహమైన సూర్యుడు గ్రహించాడు. సూర్యుని వలన ఇటు భూగోళముల మీద మనుషులకు, అటు ఖగోళములోని గ్రహములకు, భూతములకు జ్ఞానము తెలియబడినది. సూర్యుడు నిత్యము భూగోళమును అంతటినీ, అన్ని ప్రాంతములను, అన్ని ప్రాంతములలోని మనుషులను చూచుట వలన అన్ని ప్రాంతములలోని ప్రజలు మాట్లాడు భాషను గుర్తించి నేర్వగలిగాడు. ఎవడయినా ఆరు నెలలు ఒక ప్రాంతములో యుంటే ఆ ప్రాంత భాషను నేర్వవచ్చును. సూర్యుడు కొన్ని సంవత్సరములపాటు భూగోళములో అన్ని ప్రాంతముల మీద తన వెలుగును ప్రసరింపజేసినప్పుడు అక్కడి భాషను సులభముగా నేర్వగలిగాడు.


భూమిమీద మొదట భారతదేశములో దక్షిణ భాగమునగల శ్రీలంక ప్రాంతములో తెలుగు భాష తయారయినది. తెలుగు భాష తయారయినప్పటి నుండి భాషను మాట్లాడు వారిని ప్రతి దినము చూచి చూచి తాను తెలుగు భాషను సులభముగా నేర్వగలిగాడు. అంతకుముందు ఆకాశము తన శబ్దము ద్వారా తెలియజేసిన జ్ఞానమును గ్రహించిన సూర్యుడు తనకు తెలిసిన జ్ఞానమును భూమిమీద తెలియజేయాలని అనుకోవడము జరిగినది. అప్పుడు దక్షిణ భారతదేశములో కలిసియున్న లంకలోని మనువు అను వ్యక్తికి తనకు తెలిసిన జ్ఞానమును తెలుగు భాషలోనే చెప్పాడు. ఇక్కడ ఒక గమనిక పైకి సూర్యుడు జ్ఞానమును భూమిమీద చెప్పినా, సూర్యునికి ఆకాశము తన వాణి ద్వారా చెప్పినా, దీనికంతటికీ కారణము మరియు ఇదంతయూ ఎవరికీ తెలియకుండా చేసినవాడు ఆత్మయేనని మరువకూడదు. ఆత్మ అన్నీ చేయుచున్నా తనపాత్రను ఎక్కడా బయటపడకుండా ఉండగలదు. అదే విధముగా ఒక ప్రక్క ఆకాశములో ఆత్మగాయుండి జ్ఞానమును చెప్పినది. అట్లే మరోప్రక్క సూర్యునిలో ఉండి భూమిమీద మనువుకు జ్ఞానము చెప్పినది. సృష్టికర్త అయిన దేవుడు ఏమీ చేయక సాక్షిగా చూస్తుండును. అయితే ప్రపంచములో అన్ని కార్యములను చేయువాడు ఆత్మయే అని తెలియవలెను. మూడు ఆత్మలలో దేవుడు సృష్టికర్తగా ఉండగా, ఆత్మ కార్యకర్తగా యున్నది. జీవాత్మ జీవితములో జరుగు సుఖదుఃఖముల భోక్తగాయున్నాడు. అనగా భోగిగాయున్నాడు. భోగిగాయున్న జీవుడు యోగిగా మారుటకు దైవజ్ఞానము అవసరము. మొదట ఆకాశములోని ఆత్మ ద్వారా దేవుడు (పరమాత్మ లేక అల్లాహ్) సూర్యునికి వాణిద్వారా జ్ఞానమును అందివ్వగా, సూర్యుడు భూమిమీద ఒక మనిషి అయిన మనువునకు జ్ఞానమును అందించాడు.




ఎప్పటికీ శాశ్వితముగా దేవుడు మారువాడు కాదు. దేవుడు ఎప్పటికీ ఒక్కడే అట్లే దేవుని జ్ఞానము ఒక్కటే. కాలమునుబట్టి దేవుడుగానీ, దేవుని జ్ఞానముగానీ మారునది కాదు. అందువలన సృష్ట్యాదిలో ఆకాశమునుండి చెప్పబడిన జ్ఞానమే భూమిమీద స్థిరస్థాయిగా ఉండును. మొదట చెప్పిన జ్ఞానమే నేడు అనేక మతములుగా చీలిపోయిన ప్రజలలో, మూడు మతములలో గలదని చెప్పవచ్చును. మూడు మతముల వారిది వేరువేరు జ్ఞానమని చాలామంది అనుకొనియుండవచ్చును. ఆయా మతస్థులు కూడా 'మాది వేరు జ్ఞానము ఇతర మతస్థులది వేరు జ్ఞానము' అని అనుకొనియుండ వచ్చును. అయితే అది వారి పొరపాటేగానీ అన్ని మతములలోని జ్ఞానము ఒక్కటేయని చెప్పవచ్చును. ప్రపంచములో దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే. ఎన్ని యుగములు మారినా దేవుడు మారువాడు కాదు, అట్లే దేవుని జ్ఞానమూ మారునది కాదు. అయితే కాలానుగుణముగా మనిషి అనేక రంగుల దుస్తులు ధరించినట్లు, మనుషులు దేవునికి అనేక రంగులు పూచి చూపుచున్నారు. ఎన్ని రంగులు పూసినా దృశ్యముల భేదము రంగులదే గానీ, దేవునిది కాదని తెలియవలెను. సృష్ట్యాదిలో చెప్పిన జ్ఞానమే నేడు ముఖ్యమైన హిందూ, క్రైస్థవ, ఇస్లామ్ అను మూడు మతములలో గలదు. అయితే ఆ విషయము మనుషులు తెలియక అజ్ఞానముతో 'మా దేవుడు వేరు, మా జ్ఞానము వేరు' అని అంటున్నారు. అది పూర్తి పొరపాటని చెప్పవచ్చును.


తౌరాతు గ్రంథము అంటే భగవద్గీతయని తెలుసుకొన్నాము. భగవద్గీతయంటే మొదట ఆకాశవాణి చెప్పిన జ్ఞానమని తెలుసుకొన్నాము. దీనినిబట్టి ఆకాశము చెప్పిన ఒకే జ్ఞానమే భగవద్గీతగా తౌరాతుగా యున్నదని తెలియుచున్నది. ఇంకా వివరముగా తెలియగలిగితే సూర్యుడు ఆకాశ వాణి జ్ఞానమును మనువుకు చెప్పాడు. అదే సూర్యుడే పేరు మార్పుతో జిబ్రయేల్గా వచ్చి ముహమ్మద్ ప్రవక్తగారికి చెప్పాడు. కృతయుగములో సూర్యుడు భూమిమీద జ్ఞానమును చెప్పినప్పుడు “మ” అను అక్షరముతో పేరున్న వ్యక్తినే ఎంచుకొని మనువుకు జ్ఞానము చెప్పాడు. అలాగే జిబ్రయేల్ అను పేరుతో కలియుగములో కూడా “మ” అను అక్షరముతో పేరున్న వ్యక్తిని ఎంచుకొని మహమ్మద్ (ముహమ్మద్ ప్రవక్తగారికే జ్ఞానము చెప్పాడు. చెప్పబడే జ్ఞానము ఒక్కటేయని తెలియునట్లు కృతయుగములోనూ, కలియుగములోనూ ఒకే అక్షరముగల పేరున్న వ్యక్తినే ఎన్నుకొన్నాడు. చెప్పినవాడు ఒక్కడే అయినా కలియుగములో సూర్యుడు తనను గుర్తించకుండా జిబ్రయేల్ అని పేరు పెట్టుకొన్నాడు. భగవద్గీతను చెప్పినవాడు, ఖురాను చెప్పినవాడు ఒకే సూర్యుడేయని ఎవరికీ తెలియదు. ఇతరులకు తెలిసినా తెలియక పోయినా చెప్పినవాడు ఒక్క సూర్యుడే, చెప్పిన జ్ఞానము ఒక్కటే. ప్రపంచ మున్నంత వరకు దేవుడు, దేవుని జ్ఞానము ఒక్కటేయుండును. ఎప్పుడయినా అధర్మములు ఎక్కువయి ధర్మములకు ముప్పుగలిగితే, దేవుడు ప్రత్యేకముగా అవతరించి తిరిగి ధర్మసంస్థాపన చేసిపోవును. అప్పుడు కూడా తిరిగి ముందున్న ధర్మములనే తెలియజేసిపోవును. కనుక సృష్ట్యాదినుండి జ్ఞానము మారకుండా ఒకే జ్ఞానమున్నది.


ప్రశ్న :- ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలోని జ్ఞానము, అంతిమ దైవ గ్రంథమయిన ఖురాన్లోని జ్ఞానము ఒక్కటేనంటారా? ఒక్కటే అయితే వేరువేరు మతాలు ఎందుకు ఏర్పడినాయి? భగవద్గీతను అనుసరించు హిందువులు, ఖురాన్ గ్రంథమును అనుసరించు ముస్లీమ్లు వేరు ఆచరణలు, వేరు ఆరాధనలు, వేరువేరు అలంకరణలు ఎందుకు కల్గియున్నారు? రెండు మతములలోనున్న పద్ధతులనుబట్టి రెండు జ్ఞానములు ఒక్కటి కాదని తెలియుచున్నది కదా! ప్రత్యక్షముగా కనిపించే దానిని చూచి కూడా ఇద్దరిది ఒకే జ్ఞానము అనడము ఎలా కుదురుతుంది? జవాబు :- ముందు నీవు దగ్గరదగ్గర ఇదే భావమున్న ప్రశ్నను అడిగావు. దానికి నేను సమాధానము చెప్పుచున్నాను. అది ఇంకా పూర్తి కాలేదు. మధ్యలోనే అలాంటి ప్రశ్నే అడిగావు, దేనికయినా కొంచెము ఓపిక అవసరము. ఉడకబెట్టిన శెనగలు రోటిలో రుబ్బితే పూర్ణమయ్యేదానికి కనీసము అరగంటయినా పట్టుతుంది. అలాగే నీ ప్రశ్నకు జవాబు సంపూర్ణము కావాలంటే కనీసము అరగంటయినా చెప్పాలి. అందువలన నా జవాబు అయిపోవునంతవరకు ఓపికగా వినవలెనని కోరుచున్నాము. ఎప్పుడయితే నీవు అడిగిన ప్రశ్నలకు సంపూర్ణముగా జవాబు వచ్చునో అప్పుడు నా జవాబు అయిపోవునట్లు తలచవలెను.


ఒకే సూర్యుడే కృతయుగములో సూర్యునిగా, కలియుగములో జిబ్రయేల్గా పూర్వము మనువుకు చెప్పిన జ్ఞానమునే తిరిగి ముహమ్మద్ ప్రవక్త గారికి చెప్పడమైనది. ఒకే సూర్యుడే వేరువేరు కాలములలో, వేరువేరు మనుషులకు ఒకే జ్ఞానమునే చెప్పాడు. వేరువేరు కాలములలో, వేరు వేరు మనుషులకు, వేరువేరు పేర్లతో ఒకే సూర్యుడు, ఒకే జ్ఞానమును చెప్పియున్నా, అది మనుషుల బుద్ధికి ఒకే విధమైన గ్రాహిత శక్తి లేనందున వేరువేరు విధములుగా అర్థమయినది. అందువలన ఒకే జ్ఞానమునే వేరు వేరు తెగలుగా చెప్పుకొని వేరువేరు మతములుగా, వేరువేరు ఆచరణలుగా చెప్పుకొనుచున్నారు. మనిషి బుద్ధికి గ్రహించు శక్తి ప్రపంచ విషయములవైతే కర్మనుబట్టి యుండును. దైవిక విషయములవైతే వాని శ్రద్ధనుబట్టి యుండును. మనిషి వేరువేరు శ్రద్ధలు కల్గియుండుట వలన, దైవ విషయముల మీద ఒకే శ్రద్ధ లేనందున, మనిషికున్న శ్రద్ధ స్థాయినిబట్టి జ్ఞానము వాని బుద్ధికి అర్థమగును. అందువలన దేవుడు ఒక్కడే అయినా, ఆయన జ్ఞానము ఒక్కటే అయినా, మనుషుల శ్రద్ధనుబట్టి మనుషుల బుద్ధికి వేరువేరు విధముల గ్రహింపు గల్గుచున్నది. ఒకే వాక్యమే అనేకమందికి అనేక విధముల అర్థమగుటకు కారణము వాని బుద్ధియొక్క శ్రద్ధా భేదమే యని తెలియవలెను. ఒకే భగవద్గీత హిందువులకు ఒక రకము, క్రైస్తవులకు మరొకరకము, ముస్లీమ్లకు ఇంకొక రకముగా అర్థము కాగలదు. అట్లే ఒకే గ్రంథములోని వాక్యము మతమునుబట్టి, మనుషులనుబట్టి వేరువేరు విధములుగా అర్థమగుటకు అవకాశము గలదు. ఈ వ్యత్యాసములను బయట ప్రపంచములో ప్రత్యక్షముగా చూడవచ్చును.


భగవంతుడు చెప్పినదని భగవద్గీతయని వ్యాసుడు వ్రాసిన గ్రంథమునకు పేరు పెట్టబడినది. అయితే దానిని భగవంతుడు ఆకాశ శబ్దము నుండి అనువాదము చేసి మనుషుల భాషలో చెప్పాడు. భగవంతుడు ఆకాశవాణి చెప్పిన జ్ఞానమును ఆకాశ భాషనుండి మనుషుల భాషకు అనువదించి చెప్పాడే తప్ప స్వయముగా చెప్పలేదు. అందువలన భగవద్గీత యను పేరు కృష్ణునకు ఇష్టము లేదు. మోషేకు యుక్తవయస్సు వచ్చినప్పుడు కృష్ణుడే స్వయముగా స్వప్నములో భగవద్గీతా గ్రంథమును ఇచ్చాడు. అప్పుడు గ్రంథము పేరు ‘భగవద్గీత’యని చెప్పక 'తౌరాతు' అని చెప్పాడు. గ్రంథములో ముఖ్యముగా మూడు కనిపించని ఆత్మలను గురించి చెప్పియుండుట వలన మూడు చీకటి రాత్రుల పేరును భగవద్గీతకు పెట్టి “తౌరాత్” యని చెప్పడమైనది. తౌరాతనగా 'మూడు రాత్రులను' తెలుగు అర్థమేనని తెలియవలెను. ఆకాశవాణి మూడు ఆత్మల బోధను మొదట విశ్వమునందు మేఘముల గర్జన రూపముతో చెప్పియుండుట వలన, భగవద్గీతయను పేరుకంటే తౌరాతు అను పేరే ఆ గ్రంథమునకు తగినదని కృష్ణుని అభిప్రాయము. కృష్ణుడు ప్రత్యక్షముగా కాకుండా స్వప్నములో మోషేకు ఇచ్చుట వలన అది సూక్ష్మగ్రంథమై ఇతరులకు కనిపించనిదై మోషేకు మాత్రము కనిపించునదైయుండెను. మోషేకు కళ్ళు తెరచితే ప్రపంచము కనిపించినట్లే రాత్రిపూట కళ్ళుమూసితే తౌరాతు గ్రంథము కనిపించేది. రాత్రిపూట నిద్ర పోవువరకు తౌరాతు గ్రంథమును మోషే చదివెడివాడు. తాను తౌరాతు గ్రంథములో చదివినదే బయట ప్రపంచములోని మనుషులకు చెప్పెడివాడు. అట్లు చెప్పుట వలన మోషే వలన జ్ఞానము వినిన వారంతా మోషే చెప్పిన దానిని మోషే ధర్మశాస్త్రమనెడివారు. ఈ విధముగా మోషే తప్ప ఇతరులు ఎవరూ తౌరాతు గ్రంథమును చూడలేదు. మోషేకు 54 సంవత్సరములు గడచిన తర్వాత, తొమ్మిది సంవత్సరములు మోషే శరీరములో కృష్ణుడే స్వయముగా నివశించి, తన భగవద్గీత జ్ఞానమును చెప్పడమేకాక, రాబోవు ఏసు జన్మను గురించిన సంఘటనలను గురించి

చెప్పుచుండెను.



కాలము గడువగా మోషే చరిత్ర 63 సంవత్సరములకు ఆగిపోయినది. అయినా ఆయన చెప్పిన జ్ఞానము, వ్రాసిన లేఖనములు ఏసు వచ్చు వరకు ఉండేవి. తర్వాత ఏసు జీవితములో లేఖనములు నెరవేరినవి. భగవద్గీతను చెప్పిన కృష్ణుడే మోషేగా అదే జ్ఞానమును చెప్పుట వలన, తర్వాత ఏసుగా వచ్చినప్పుడు కూడా భగవద్గీతకు సంబంధమైన జ్ఞానమునే చెప్పుట వలన, భగవద్గీత, నాలుగు సువార్తల జ్ఞానము వేరని చెప్పుటకు వీలులేదు, రెండూ ఒక్కటేయని చెప్పవచ్చును. అంతేకాక కృత యుగములో మనువుకు చెప్పిన సూర్యుడు, కలియుగములో ముహమ్మద్ ప్రవక్తకు చెప్పిన జిబ్రయేల్ అనునతడు ఇద్దరు ఒక్కరే అయిన దానివలన, ప్రథమ దైవగ్రంథమయిన తౌరాతులోయున్న జ్ఞానమే అంతిమ దైవ గ్రంథమయిన ఖురాన్లో గలదు. అప్పుడు చెప్పినవాడు, తర్వాత చెప్పిన వాడు ఇద్దరు ఒకే జ్ఞానమునే బోధించుట వలన, భగవద్గీత (తౌరాతు) గ్రంథములోనూ, ఖురాన్ గ్రంథములోనూ ఒకే జ్ఞానమున్నదని చెప్పవచ్చును. భగవద్గీత (తౌరాతు) గ్రంథములో శోక్లములుంటే ఖురాన్ గ్రంథములో ఆయత్లను వాక్యములున్నవి. చెప్పిన వాక్యములలోనూ, వ్రాసిన భాషలోనూ తేడా యుండవచ్చునుగానీ, చెప్పిన జ్ఞానము రెండిటిలోనూ ఒక్కటే కలదు. లోతుగా చూడగలిగితే కొంత కూడా తేడా కనిపించదు.


మనుషులు మూడు గ్రంథములను అవగాహన చేసుకోవడములో అవగాహన లోపము వలన గ్రహించుకొను శక్తిలేక, వేరువేరు విధముల అర్థము చేసుకొని వేరువేరు గ్రంథములుగా, వేరువేరు మతములుగా చెప్పు కొంటున్నారు. ప్రథమ దైవగ్రంథమును చెప్పిన సూర్యుడే అంతిమ దైవగ్రంథమును చెప్పాడు. దానివలన తౌరాతు (భగవద్గీత), ఖురాన్ రెండు ఒకే జ్ఞానమని చెప్పవచ్చును. ప్రథమ దైవగ్రంథమయిన ఆకాశవాణి చెప్పిన ఉరుముల భాషను మనుషుల భాషలో అనువదించి చెప్పిన కృష్ణుడే కలియుగములో ఏసుగా వచ్చి ప్రథమ దైవగ్రంథములోని జ్ఞానమునే చెప్పి యుండుట వలన, ఏసు చెప్పిన ద్వితీయ దైవగ్రంథమయిన బైబిలులోనూ తౌరాతు (భగవద్గీత) బైబిలు గ్రంథములలో ఒకే జ్ఞానమున్నదని చెప్పవచ్చును. ఈ విధముగా మూడు గ్రంథముల పూర్వాపరాలను విశధీకరించి చూస్తే ఒక దానితో మరొకటి సంబంధపడియుండుట వలన అన్నిటియందు ఒకే జ్ఞానమున్నదని తెలియుచున్నది. మూడు గ్రంథములలో ముఖ్యముగా మూడు ఆత్మలను గురించి చెప్పిన జ్ఞానమే గలదు. అయితే 'మతము’ అను అధర్మము కలియుగములో ప్రత్యేకముగా వచ్చియుండుట వలన మూడు గ్రంథముల జ్ఞానము ఒక్కటేయని తెలియకుండా పోయినది.


అంతిమ దైవగ్రంథము ఖురాన్ గ్రంథములో రెండవ సూరా 53వ ఆయత్నందు 25వ సూరా 1వ ఆయత్నందు 'గీటురాయి' అను పదమును ఉపయోగించి గీటురాయి అయిన ఖురాన్ గ్రంథమును మీకు ఇచ్చాను అని అల్లాహ్ (దేవుడు) చెప్పియున్నట్లు గలదు. గీటురాయి అంటే ఏమిటి? అను సంశయము చాలామందిలో గలదు. అయితే సూరా రెండు ఆయత్ 53లో చెప్పినప్పుడు ఇది సత్యాసత్యములను తేల్చి చెప్పునదియని ఒకమాట చెప్పాడు. దానినిబట్టి మనిషి శరీరములోనున్న షుగర్ను కొలుచుటకు (చూపించుటకు) డయా మీటర్ ఉన్నట్లు, మనిషి శరీరములో వేడిని కొలుచుటకు (చూపుటకు) లేక తెలుపుటకు థర్మామీటరున్నట్లు, నీటిలోని ఉప్పు శాతమును చూపుటకు వాటర్ మీటరున్నట్లు, ఒక వాక్యములోని జ్ఞానమును కొలుచుటకు ఒక గీటురాయి అను సత్యాసత్య వివేకిని గలదు.


వాస్తవముగా బంగారు వస్తువులో బంగారు సాంద్రత ఎంతయున్న దని చూచుటకు గీటురాయిని ఉపయోగించి చూస్తారు. గీటురాయిని సానరాయి అని కూడా అంటారు. కరుకుదనముతో కూడుకొన్న నల్లని రాయిని గీటురాయి లేక సానరాయి అని అంటారు. ఒరుపురాయి అని కూడా అంటారు. ఎలా చెప్పినా ఆ రాయితో బంగారును కొద్దిగ అరగదీసి అరిగిన బంగారులో బంగారు ఎంత శాతమున్నదియని చూచి చెప్పగలరు. గీటురాయితో గీచి చూచి చెప్పగల నైపుణ్యము కంసాలి పనిచేయు వారికి మాత్రముండును. కంసాలి పని చేయువారు గీటురాయి ఆధారముతోనే బంగారును గీచి చెప్పగలరు. అలా గీయడము వలన బంగారు వస్తువులోపల దాగియున్న కాలుష్యము లేక ఇతర లోహముల కల్తీ బయటపడును. బంగారు వస్తువు లోపల దాగియున్న ఇతర లోహములను గుర్తించుటకు గీటురాయితో గీచి చూడవలసియున్నది. బంగారును ఎలా పరీక్షించగలుగు చున్నామో అలాగే ఒక గ్రంథములో ఎంత జ్ఞానమున్నదని తెలియుటకు గీటురాయిలాంటి శాస్త్రబద్ధత గల్గిన గ్రంథముతో చూడవచ్చును. బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి ఏ గ్రంథములో శాస్త్రీయమైన జ్ఞానముగలదో, ఏ గ్రంథములో అశాస్త్రీయమైన జ్ఞానముగలదో చెప్పవచ్చును. శాస్త్రమును 'గీటురాయి' అంటున్నాము. గీటురాయిని గురించి వివరముగా తెలియ గలిగితే ఇలా కలదు.


భూమిమీద షట్ శాస్త్రములని ఆరు శాస్త్రములుగలవు. ఆరు శాస్త్రములు గీటురాళ్ళలాంటివే అయినా అందులో ఐదు శాస్త్రములు ప్రపంచ విషయములకు సంబంధించినవి. వాటి పేర్లు గణిత, ఖగోళ, రసాయన, భౌతిక, జ్యోతిష్య శాస్త్రములు అని అంటాము. చివరిలో ఆరవ శాస్త్రము అన్నిటికంటే పెద్ద శాస్త్రము. 'పెద్ద' అనుమాటను 'బ్రహ్మ' అని అంటాము. అందువలన ఆ శాస్త్రమును 'బ్రహ్మవిద్యా శాస్త్రము' అని చెప్పవచ్చును. పెద్ద శాస్త్రము ద్వారా ఏ గ్రంథములో ఎంత జ్ఞానమున్నదో, ఏ మాటలో ఎంత జ్ఞానమున్నదో, ఏ వాక్యములో ఎంత జ్ఞానమున్నదో చెప్పవచ్చును. అయితే అంతిమ దైవగ్రంథమయిన ఖురాను దేవుడు 'గీటురాయి' అని చెప్పాడు, అంటే అది పెద్ద శాస్త్రము అని అర్థము. పెద్ద శాస్త్రము అనగా బ్రహ్మశాస్త్రము అని అర్థము. దానినే బ్రహ్మవిద్యాశాస్త్రమని కూడా అంటున్నాము. ఖురాన్ బ్రహ్మవిద్యా శాస్త్రము అయితే అది ఆదిలో పుట్టిన జ్ఞానమయిన ప్రథమ దైవగ్రంథములోని జ్ఞానమే అయివుండుట వలన తౌరాతు అనబడు భగవద్గీత మొదటి బ్రహ్మశాస్త్రము. తర్వాత అదే ద్వితీయ గ్రంథముగా వచ్చినది. తర్వాత అదే జ్ఞానమే తృతీయ గ్రంథముగా వచ్చినది. తృతీయ దైవగ్రంథము గీటురాయి అయినప్పుడు మిగతా రెండు గ్రంథములు కూడా గీటురాయిగానే ఉన్నాయని చెప్పవచ్చును. మూడు గ్రంథముల శాస్త్రబద్ధమైన జ్ఞానముతో మనుషులు ఆచరించు భక్తి విధానములు సరియైనవో కాదో చెప్పవచ్చును. మనుషులలోయున్న జ్ఞానము సరియైనదో కాదో చెప్పుటకు గీటురాయివలెనున్న మూడు దైవగ్రంథములు పనికి వచ్చును. ఈ మూడు గ్రంథములు మూడు గీటురాళ్ళుగా, మూడు బ్రహ్మ విద్యా శాస్త్రములుగా యున్నవి. అందువలన వాటితోనే మనుషుల జ్ఞానమును, మనుషులు ఆచరణను, మనుషుల మతములను గీటురాయితో గీచి జ్ఞానమున్నదో కాదో చూచి చెప్పవచ్చును. మూడు గ్రంథములు శాస్త్రబద్దమైన జ్ఞానమేయని చెప్పుచూ, గ్రంథములలోని జ్ఞానము అర్థము కాక అజ్ఞానముగా నడుచువారి ఆరాధనలు, ఆచారములు జ్ఞానవంతమైనవో కాదో తూకము వేసి చెప్పవచ్చును.


మనుషులు మూడు మతములలో మూడు రకముల ఆరాధనలు, ప్రార్థనలు కల్గియున్నారు. మూడు మతముల వారు చేయు ప్రార్థనలను 'గీటురాయి' అను మూడు గ్రంథములను అందులోని శాస్త్రసూత్రములను అనుసరించి అవి సక్రమమైనవో కాదో తేల్చి చెప్పవచ్చును. ముందు హిందూమతములో సాధారణ మనుషులు కాకుండా మిగతా స్వాములు, సన్న్యాసులు, పండితులు మొదలయిన వారు చేయు ఆరాధనల గురించి గీటురాయితో గీచి సానబట్టి చూస్తాము. హిందువులలో 'జ్ఞానులు' అని పేరుగాంచినవారే దేవుని ఆరాధనలు చేయుచుందురు. వారు చేయు ఆరాధనలలో యజ్ఞములు మొదటి రకము. యజ్ఞములు చేయుటకు వేదపఠనము అవసరము. యజ్ఞములు చేయుచున్నప్పుడు వేదములు చదువుచూ, సంస్కృత భాషలోని వేదమంత్రములు చెప్పుచుందురు. వాటిని దేవుడు ఖండించుచున్నాడు. భగవద్గీతయను గీటురాయిని ఉపయోగించి చూస్తే బాహ్యయజ్ఞములు ఏమాత్రము జ్ఞానము కాదని తెలియుచున్నది.


ఈ గ్రంథము మొదటిలోనే ప్రార్థన గురించి కొద్దిగా వ్రాసియున్నాము. అయితే అట్లు ఎంత వివరముగా, ఎంత సత్యముగా చెప్పినా మా మాట వినకుండా వారి అలవాటు ప్రకారము వారు చేయుచూ, వారికి తెలిసినదే సత్యమని అనుకోవడము జరుగుచున్నది. అలా వారు అనుకోవడము వలన మాకు వచ్చిన నష్టము ఏమీ లేదుగానీ, వారు దేవుని మాటకు వ్యతిరేఖముగా నడచినవారగుచున్నారు. దానివలన దేవుని మాటకు లోటు ఏర్పడుచున్నది. దేవుని గౌరవమునకు భంగము కల్గుచున్నందువలన దేవుడే ఏది నిజమైన జ్ఞానమో, ఏది నిజమైన జ్ఞానము కాదో తెలియునట్లు, జ్ఞానములో సత్యాసత్యములను తేల్చి చెప్పుటకు గీటురాయిని అందజేశాడు. అదే తన జ్ఞానములోని శాస్త్రబద్దత, శాస్త్రబద్ధత కల్గిన తన గ్రంథము ద్వారానే సత్యాసత్యములను తెలియవచ్చును.


ఇప్పుడు మా స్వయముగా ఏమీ చెప్పక దైవగ్రంథములలోని గీటురాయిలాంటి జ్ఞానముతో జ్ఞానము యొక్క సత్యాసత్యములను తేల్చి చెప్పుచున్నాము. ప్రజలనందరినీ దేవుని భావము ప్రకారము నడుపుటకే ఇంత ప్రయత్నము చేయుచున్నాము. మతబేధము లేకుండా స్వచ్ఛమయిన జ్ఞానమును తెల్పుటే మా కర్తవ్యముగా తలచుచున్నాము. నేడు మతము అను రోగము ప్రతి మనిషికి అంటుకొనియున్నది. మతమను రోగము ఒక జాఢ్యములాగా తయారయి మనిషిలో నర నరాలలోను జీర్ణించుకు పోయినది. ఎట్లు జీర్ణించినది తెలియుటకు చిన్న ఉదాహరణగా ఒక విషయమును ప్రస్తావిస్తాము చూడండి. ఈ విషయమును గమనించితే నేడు మతము అనునది మనుషులలో ఎంత లోతుగా పాతుకొని పోయినదో అర్థము కాగలదు. నేడు మూడు మతములవారు మా గ్రంథములని చెప్పు భగవద్గీత, బైబిలు, ఖురాన్ గ్రంథములను మేము దైవగ్రంథములుగా చెప్పుచున్నాము. మూడు దైవగ్రంథములు ఎలా తయారయినవో మాకు తెలుసు. మూడు గ్రంథములలో ఒకే జ్ఞానమున్నదనీ, అది సృష్ట్యాదిలో దేవుడు చెప్పిన జ్ఞానమేయనీ, తెలియుట వలన మూడు గ్రంథములను సమానముగా గౌరవించుచున్నాము. మా ఉద్దేశ్యమునకు సరిపడు విధముగా అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ గ్రంథములో సూరా 5, ఆయత్ 68లో అల్లాహ్ (దేవుడు) ఈ విధముగా చెప్పియున్నాడు. (5-68) “ఓ గ్రంథ వాహకులారా! మీరు తౌరాతును, ఇంజీలును, మీ ప్రభువు తరపున మీ వద్దకు పంపబడిన దానిని (ఖురాన్ గ్రంథమును) మీ జీవితాలలో నెలకొల్పు వరకు మీరు ఏ ధర్మము పైనా లేనట్లే" అని యుండుట వలన మేము అందరికీ మూడు గ్రంథములను చదువమని చెప్పుచున్నాము. మూడు గ్రంథములలోనూ దేవుని విషయములే యుండుట వలన మత భేదము లేకుండా ఏ మతము వాడయినా మిగతా రెండు మతముల గ్రంథములని పేరుగాంచిన వాటిని అసూయ లేకుండా చదువమని చెప్పుచున్నాము. మేము మూడు గ్రంథములను సమానముగా గౌరవిస్తూ ఆ మాట చెప్పాము.


మాట మంచిదే కదా!యని కొందరు హిందువులు భగవద్గీతను గౌరవముగా చదివినట్లు బైబిలును కూడా చదివారు. అలాగే కొందరు క్రైస్థవులు వారి బైబిలును గౌరవించినట్లే భగవద్గీతను కూడా గౌరవించుచూ భక్తితో భగవద్గీతను చదివారు. ఇక ఇరువురూ కలిసి ఖురాన్ గ్రంథము చదువాలనుకొన్నారు. ఖురాన్ గ్రంథమును ముస్లీమ్లందరూ అరబ్బీ భాషలోనే చదువాలని నియమమును వారు పెట్టుకొన్న దానివలన, ఖురాన్ గ్రంథములు ఎక్కువగా అరబ్బీ భాషలోనే తయారయివుండును. అయితే ఈ మధ్య కాలములో హిందువులు కూడా తమ ఖురాన్ గ్రంథమును చదవాలను ఉద్దేశ్యముతో ముస్లీమ్లు తెలుగు భాషలో ఖురాన్ గ్రంథమును తయారు చేసి ఉచితముగా ఇస్తాము అని ప్రకటనలు కూడా చేయడము జరిగినది. ఆ ప్రకటనలు చూచిన మేము "ఖురాన్ గ్రంథము మాకు అవసరము మేము చదవాలి మాకు ఇవ్వండి" అని అడిగాము. అప్పుడు వారు మొదట లేని నియమాలను (కండీషన్లను చెప్పారు. అన్నిటినీ ఇక్కడ చెప్పడము అనవసర విషయమవుతుంది. వారు చెప్పిన ముఖ్యమైన మాటను ఒక దానిని చెప్పితే ఇలా కలదు. చివరిగా వచ్చిన గ్రంథమయిన ఖురాన్ గ్రంథమే అన్నింటికంటే ముఖ్యమైనది. ఇది వచ్చిన తర్వాత మిగతా గ్రంథములతో పని లేదు. అందువలన మిగతా గ్రంథములను వదలివేసి, ఖురాన్ గ్రంథమే గొప్పయని విశ్వసించిన వారికి మేము గ్రంథములు ఉచితముగా ఇస్తామని చెప్పారు. అప్పుడు మేము అలా అయితే వద్దు. మేము అన్ని మతములను, అన్ని గ్రంథములను సమానముగా చూస్తున్నాము. అట్లుకాకుండా ఒక గ్రంథమే గొప్పది. మిగతా గ్రంథములు గొప్పవికావు అని మేము చెప్పలేము. అలా చెప్పితే మత బోధలవుతుందిగానీ, జ్ఞాన బోధలు అనిపించుకోవు. మేము మూడు గ్రంథములు చదువాలని ఖురాన్ గ్రంథములో వాక్యము ప్రకారమే చెప్పాముగానీ మేము స్వయముగా చెప్పలేదు. మేము ఖురాన్ గ్రంథమునకు, అల్లా మాటకు విలువనిచ్చి అక్కడ చెప్పిన (5-68) ఆయత్ ప్రకారము చదువాలి అనుకొన్నాముగానీ, ఖురాన్ ఒక్క గ్రంథమే గొప్పది మిగతా రెండు గ్రంథములు గొప్పవి కావు అని చెప్పడము మా జ్ఞానమునకు, మా ధ్యేయమునకేగాక ఖురాన్ గ్రంథములోని (5-68) వాక్యమునకు కూడా వ్యతిరేఖమగును. అందువలన మేము మీ నియమముల ప్రకారము ఉండలేము. మాకు తప్పనిసరి అయినప్పుడు డబ్బుపెట్టి కొని చదువుతాము, మీ ఉచిత గ్రంథము మాకు వద్దని చెప్పాము.


ఇంతకుముందు సంవత్సరము క్రితము హైదరాబాద్లో తిరుమలేసు అను వ్యక్తి ఉచిత ఖురాన్ కొరకు బస్సుమీద ప్రకటన చూచి అడిగితే వారు ఇస్తాము రమ్మని చెప్పి, అతను పోయిన తర్వాత మసీద్ కూర్చోబెట్టి నలుగురు ముస్లీమ్లు ఇస్లామ్ మతమును గురించి రెండు గంటలు బోధించి, చివరకు అతనితో నమాజ్ చేయించి, ఈ దినమునుండి నీవు ముస్లీమ్ అయిపోయావని చెప్పి ప్రతి దినము ఖుర్ఆన్ చదువమని, నమాజ్ చేయమని చెప్పి పంపారు. అలా చేయడము వలన ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టము తెలుసుకోకుండా మతములోనికి చేర్చడము కాదా? విలువ తెలియని మనుషులకు అల్లాహు గురించి చెప్పడము, భక్తి విశ్వాసాలు లేనివారికి ఖురాన్ గురించి చెప్పడము అల్లా గౌరవానికి భంగము చేసినట్లు కాదా? మా లెక్కలో అన్ని మతములలోని జ్ఞానము ఒక్కటే, అన్ని మతములకు దేవుడు ఒక్కడేయని చెప్పుచుందుము. ఖురాన్ గ్రంథము దైవగ్రంథమని తెలిసి అందులోని (5-68) ఆయత్లోని మాట దేవుని మాటగా తలచి ఖురాన్ గ్రంథమును చదువమని, హిందువులకు భగవద్గీతను గౌరవించినట్లు ఖురాన్ గ్రంథమును గౌరవించమని చెప్పాము. అట్లే క్రైస్తవులకు వారు బైబిలును గౌరవించినట్లే ఖురాన్ గ్రంథమును గౌరవించమని చెప్పాము. అంతేగానీ అది పెద్ద, ఇది చిన్న అని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఒకే మతమును, ఒకే దేవున్ని గౌరవించువారికి ఆ దేవుడొక్కడే అన్ని మతములకు పెద్దయని ఎందుకు అనుకోకూడదు? దేవుడు తన గ్రంథములలో ఎక్కడయినా మనుషులు చెప్పినట్లు చెప్పాడా? చెప్పండి. ఖురాన్ గ్రంథము తనకంటే ముందు వచ్చిన గ్రంథములను సత్యమని ధృవీకరించుచున్నదని (5-48)


వాక్యములో అల్లాహ్ చెప్పియున్నాడు. అంతేకాక ఆ వాక్యము చివరిలో “నీవద్దకు వచ్చిన సత్యమును వీడి మనుషుల మనోవాంఛలను అను సరించకు” యని వుంది. మూడు గ్రంథములలో సత్యమున్నదని సత్య సమేతముగా వచ్చిన ఖురాన్ గ్రంథము చెప్పుచుండగా దానికి విరుద్ధముగా, అల్లా మాటకు వ్యతిరేఖముగా మాట్లాడు వారి మాటలు వినవద్దని వాక్యము చివరిలో చెప్పియున్నారు. ఈ వాక్యములను అనుసరించి అల్లాహ్ మాటను గౌరవిస్తూ మేము మూడు గ్రంథములు సత్యసమేతముగా వచ్చినవేయని నమ్ముచున్నాము. అందువలన మూడు గ్రంథములను గీటురాయిగా తీసుకొని మూడు మతముల వారు 'మతము' అను ముసుగులో తప్పటడుగు వేయవద్దని చెప్పుచున్నాము. మనిషి మనిషిగా యుండవలెను. మతము అను రంగు పూసుకుంటే అల్లాహ్ శిక్షించేవాడుగా యుంటాడు. అల్లాహ్ (దేవుడు) 'నా బోధలు సర్వమానవాళికి హితోపదేశము' అని చెప్పాడు. ఒకమారు (81-27) వాక్యమును చూడండి. “ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశము”. ఇక్కడ సర్వమానవులకు అని చెప్పాడు తప్ప ముస్లీమ్లకని చెప్పలేదు కదా! దేవున్ని విశ్వసించినవాడు ఏ మతములో యున్నా వాడు ముస్లీమేయగును. 'ముస్లీమ్' అనుమాటకు ‘విశ్వాసము’ అని అర్థము. విశ్వాసము ఎవరికుంటే వారు ఏ మతములోయున్నా వాడు విశ్వాసియేయగును. అనగా ముస్లీమేయగును. ఇదే ఖురాన్ గ్రంథములో ఆరవ సూరా, 90వ ఆయత్లో ఏమి చెప్పియున్నారో ఒకమారు చూడండి.


(6-90) “ఇలాంటి వారే (దేవున్ని విశ్వసించినవారే) అల్లాహ్ మార్గదర్శకత్వమును పొందినవారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు. వారితో ఇలా అను “నేను దీనికి బదులుగా మీనుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడుగను. ఇది సర్వలోకాలవారి కొరకు ఒక హితోపదేశము మాత్రమే" అని కలదు. ఇక్కడ అల్లాహ్ మాటప్రకారము దేవునికి విశ్వాసిగా ఉండమని, అలా ఉండడము వలన దేవుని మార్గదర్శకత్వము మనిషికి లభించునని చెప్పాడు. అంతేకాక 'విశ్వాసిగాయున్న వానినుండి ఏ ప్రతిఫలాన్ని అడుగను’ అని గలదు. దానిప్రకారము దేవునికి విశ్వాసిగా యుండమని చెప్పవచ్చును గానీ, నీ మతమును వీడి ఈ మతము లోనికి రమ్మని చెప్పడము ప్రతిఫలాన్ని అడిగినట్లగును కదా! అలా అడగమని దేవుడు చెప్పలేదు. ఇది ఒక మతమునకే పరిమితి కాదు. అన్ని మతముల ప్రజలకు ఖురాన్ హితోపదేశిని అని కలదు. బాగా గమనించితే ఈ వాక్యము చివరి మాటలో ఇలా కలదు. "ఇది ఒక హితోపదేశము మాత్రమే" అని కలదు. దీనినిబట్టి ఇది ఒక గ్రంథమేకాక మిగతా గ్రంథములు కూడా అందరి కొరకు హితోపదేశముగా ఉన్నాయనేగా అర్థము. 'సర్వ లోకవాసులకు' అనగా 'అన్ని మతముల వారికి' అని అర్థము. 'ఒక హితోపదేశము మాత్రమే’ అనగా ఇది ఒకటేగాక ఇంకా హితోపదేశములు ఉన్నాయనేగా అర్థము. ఖురాన్ గ్రంథము తనకంటే ముందు వచ్చిన గ్రంథములను సత్యమని ధృవీకరించుచున్నదని ఐదవ సూరా 48వ ఆయత్లో చెప్పిన మాటను మరువకూడదు.


దేవుడు 'జ్ఞానము' అను పుణాది మీద తన బోధను చెప్పితే మనుషులు ఆ మాటను కాదని మతము అను పుణాది మీద దేవుని బోధలను చూపుచున్నారు. అందువలన ఏది సత్యమో, ఏది అసత్యమో నిగ్గు తేల్చుటకు తన గ్రంథములనే శాస్త్రములను గీటురాయిగా చేసి మనకిచ్చాడు. శాస్త్రబద్దత యను గీటురాయిగాయున్న దైవగ్రంథములను కూడా మనుషులు మతము అను మసి పూసి ఓటురాయిగా మార్చవలెనని చూస్తున్నారు. ఎవరు ఎంత అజ్ఞానమును కలిపినా గీటురాయి గీటురాయి గానే ఉంటుంది తప్ప ఓటురాయిగా మారదు. గీటురాయితో మేము మనుషుల ఆచరణలలోనూ, మాటలలోనూ, ఆరాధనలలోనూ ఎంత అజ్ఞానమున్నదో చూపపూనినాము. గీటురాయిగా యున్న గ్రంథమును ఉచితముగా ఇస్తామని పైకి చెప్పినా లోపలి వారి ఉద్దేశ్యము మతప్రచారము తప్ప ఏమీ లేదని వారు చెప్పిన నియమములలోనే స్పష్టముగా కనిపించు చున్నది. ముస్లీమ్లందరూ అరబ్బీ భాషలోనే ఖురాన్ను చదువవలెనని చెప్పుచున్నవారు, అరబ్బీ భాషరాని ముస్లీమ్లను అరబ్బీ భాష నేర్చుకొని చదవమనీ, తెలుగులో చదవరాదని చెప్పుచున్నారు. నేడు భారతదేశములోని ముస్లీమ్లు అరబ్బీ భాష రాని కారణముగా 80 శాతము మంది ముస్లీమ్లు ఖురాన్ గ్రంథమును చదువలేదు. ఖురాన్ గ్రంథములో ఏమున్నదో వారికి తెలియదు. వచ్చిన ప్రాంతీయ భాషలోగానీ, తెలుగు భాషలోగానీ చదువుతా మనుకొంటే అలా చదువకూడదు, ముస్లీమ్ అయిన వాడు అరబ్బీ భాషలోనే ఖురాన్ను చదువవలెనను, మత నియమమును తమ మత పెద్దలు చెప్పుచుండుట వలన వారు చదువలేకపోవుచున్నారు.


తెలుగు భాష వచ్చిన ఎందరో ముస్లీమ్లు అరబ్బీ భాషలోనే చదువవలెనను మత నియమముతో దైవగ్రంథమునకు దూరము చేయబడి అరబ్బీ భాషలో చదువలేకయున్నారు. అయితే నేడు తెలుగు భాషలో ఎన్నో అనువాద ఖురాన్ గ్రంథములు తయారైనాయి. తెలుగు భాష వచ్చిన ఎందరో ఇస్లామ్ పండితులు ఖురాన్ గ్రంథమును తెలుగులో అనువదించి వ్రాసి గ్రంథములను తయారు చేశారు. అయినా తెలుగు గ్రంథములను ముస్లీమ్లు చదువకూడదు అను నియమము ప్రకారము చదవకూడదు.


అలాంటప్పుడు తెలుగు భాషలో ఖురాన్ గ్రంథమును ఎందుకు వ్రాశారు? ఎవరు చదువాలని వ్రాశారు? అలా వ్రాయడములో వారి ఉద్దేశ్యము ఏమి? అని ఆలోచించిన వారి భావము స్పష్టముగా బయటికి కనిపించుచున్నది. తెలుగు భాష వచ్చిన హిందువుల కొరకు తెలుగు ఖురాన్ గ్రంథమును తయారు చేశారు. హిందువులు ఖురాన్ గ్రంథమును చదివి తమ మతము వైపు రావాలను ఆలోచన తప్ప అందులో ప్రత్యేకించి ఏమీ లేదు. అందువలన ఖురాన్ గ్రంథము కావాలను హిందువులకు ముందు తమ మతమును గురించి చెప్పుచున్నారు. తమ మతమును స్వీకరించిన వారికే దేవుని దారి దొరుకునని చెప్పుచున్నారు. మత ప్రచారమునకు క్రైస్థవులు ఎటువంటి నియమములు లేకుండా వారి గ్రంథమని చెప్పుకొనుచున్న బైబిలును హిందువులకు ఉచితముగా ఇచ్చుచున్నారు. అదే ఉద్దేశ్యముతోనే ముస్లీమ్లు ఖురాన్ గ్రంథమును ఉచితముగా ఇస్తామని చెప్పినా ముందు తమ మతములోనికి చేరాలనో, తమ మతము గొప్పదనో, చివరిగా వచ్చిన ఖురాన్ తర్వాత ఏ గ్రంథము అవసరము లేదని, ఇంతవరకు చదువుచున్న మీ గ్రంథములకంటే ఖురాన్ గ్రంథమే గొప్పదని, ఇది రాకముందు భగవద్గీతకు, బైబిలుకు విలువ ఉండేదని, ఖురాన్ అంతిమ దైవగ్రంథముగా వచ్చినదనీ, అంతిమంగా వచ్చిన ఈ గ్రంథము తర్వాత ఏ గ్రంథము ముఖ్యము కాదనీ, అందువలన ఖురాన్ గ్రంథమును విశ్వసించి ఇస్లామ్ మతములో చేరమని చెప్పుచున్నారు.


ఇదంతా చూస్తే పవిత్రమైన ఖురాన్ గ్రంథము సర్వమానవాళికి అని స్వయముగా అల్లాహ్ (దేవుడే) చెప్పియుండగా, మనుషులు ఇది ముస్లీమ్లకే మీరు కూడా ముస్లీమ్లుగా మారండని చెప్పుచున్నారు. ఖురాన్లో దేవుని బోధలకు వ్యతిరేఖముగా మతమును ఖురాన్ గ్రంథము చాటున ప్రచారము చేయుచున్నారు. సర్వమతములు దేవునికి సమానమే, 'ఖురాన్ సర్వమానవులకు హితబోధిని' అను మాటను మేము చెప్పుచుండగా ‘కాదు ఇది ముస్లీమ్లకే’ అన్నట్లు వారు చెప్పుచున్నారు. చివరకు మాలాంటి వారికి కూడా మతమును అంటగట్టుటకు చూస్తున్నారు. ఈ మతము అను జాఢ్యము ఒక్క ముస్లీమ్లలోనే కాదు, అన్ని మతములలో తక్కువ లేకుండాయున్నది. అయితే క్రైస్థవులు మతము అని చెప్పకుండా బైబిలును హిందువులకు ఇస్తున్నారు. మత ప్రచారమునకే ఇస్తున్నారని బయట పడకుండా ఓపికగా ఇస్తున్నారు. ముస్లీమ్లు కూడా ఖురాన్ ఉచితముగా ఇస్తామంటున్నారు. అయితే అది మత ప్రచారమునకే అన్నట్లు బయటపడు చున్నారు. క్రైస్థవులు మతప్రచారమునకే బైబిలు గ్రంథములు ఉచితముగా ఇస్తున్నా వారు తమ ఉద్దేశ్యము బయటపడకుండా జాగ్రత్తగా ఇస్తున్నారు. ముస్లీమ్లు క్రైస్థవులకంటే తక్కువగా గ్రంథములను ఉచితముగా ఇచ్చినా వారు ఎందుకిచ్చుచున్నది, వారి ఉద్దేశ్యమును బయటపడునట్లు మాట్లాడు

చున్నారు.


దేవుని భావములో మతము అను మాటకు తావేలేదు. అందువలన ఏ మతములో పుట్టినవాడు ఆ మతములోనేయుండి మతమును మారవలెనను ఉద్దేశ్యము లేకుండా జ్ఞానము తెలియుటకు తనబోధ సర్వ మానవులకు అనీ, అన్ని మతముల వారికి ఏకముగా చెప్పాడు తప్ప, ఫలానా మతము నాకు ముఖ్యమని ఎక్కడా చెప్పలేదు. దేవుని జ్ఞానమును చూస్తే మతములు మారడము, మతములను ప్రచారము చేయడము ఏమాత్రము సరిపోదనీ, అది పూర్తి అజ్ఞానమని అర్థమగుచున్నది. అందువలన మేము మా రచనలలో “మత మార్పిడి దైవద్రోహము మహాపాపము" అను గ్రంథమును వ్రాశాము. దేవుడు మత ప్రసక్తి లేకుండా తన బోధలను మనిషి అను వానికి ఉపయోగపడులాగున చెప్పాడు. అదే విధానమునే మేము అనుసరించుచూ, మూడు మతముల మీద ఏమాత్రము అసూయ లేకుండా జ్ఞానమును చెప్పుచున్నాము. అందువలన అన్ని మతముల వారు నావద్ద దైవజ్ఞానమును తెలియగల్గుచున్నారు.


దేవునికి వ్యతిరేఖమైన అధర్మములలో కృత, త్రేతా, ద్వాపర యుగముల వరకు నాలుగు అధర్మములే ఉండేవి. ఇప్పుడు కలియుగములో ఐదవ అధర్మము 'మతము' అనునది వచ్చి చేరినది. గీటురాయితో గీచి ధర్మమను అధర్మము ఎలా మనుషులలో యున్నదో ఉదాహరణగా చెప్పు కొన్నాము. ఖురాన్ గ్రంథమును గీటురాయిగా ఉపయోగించుకొని, ఆ గ్రంథములో ఐదవ సూరా 48, 68 ఆయత్లను చూపుచూ మనుషులలో మతము దేవునికి ఎట్లు వ్యతిరేఖముగా యున్నదో చెప్పుకొన్నాము. దేవుడు ఆకాశవాణి ద్వారా చెప్పించిన జ్ఞానము భూమిమీద మూడు గ్రంథములుగా తయారైనది. ఆ మూడు గ్రంథములు అజ్ఞానమును, జ్ఞానమును తేల్చి చెప్పు గీటురాళ్ళుగా యున్నాయి. గీటురాయిగాయున్న అంతిమ దైవ గ్రంథము ఖురాన్లోని జ్ఞానము కలుషితమై 'మతము' అను గడ్డితో నిండుకొని అందులోని జ్ఞానమునకు ముప్పు ఏర్పడినప్పుడు అదే గ్రంథమును గీటురాయిగా ఉపయోగించుకొని జ్ఞానమును, అజ్ఞానమును తేల్చి చెప్పవచ్చును. ఇప్పుడు ఖురాన్ గ్రంథమును అడ్డము పెట్టుకొని దాని పేరు చెప్పుచూ, దానిలో లేని మతమును ప్రచారము చేయుచున్నారు. తాము అంతిమ దైవగ్రంథమయిన ఖురాన్ ప్రకారము, దానిలోని జ్ఞానము ప్రకారము మాట్లాడుచున్నామని చెప్పుచూ, తమ మతమును గొప్పయని చెప్పుచూ, తమదే నిజమైన జ్ఞానమని అంటున్నారు. వారు ఖురాన్ గ్రంథమును గొప్పగా చెప్పుచూనే, దాని సాకుతో మతమును ప్రవేశ పెట్టుచున్నారు. దానికి విరుగుడుగా గీటురాయిగా ఖురాన్ గ్రంథమును నేను ఉపయోగించుకొన్నాను. అందులోని 81-27, 6-90 ఆయత్లను ఉపయోగించి ఖురాన్లో మతబోధ లేదని చెప్పాము. అట్లే 5-48 మరియు 5-68 ఆయత్లను ఉపయోగించుకొని "ఖురాన్ గ్రంథము మిగతా రెండు గ్రంథములు సత్యమని చెప్పుచున్నదనీ, మూడు గ్రంథములు చదవని వాడు ఏ మతములో, ఏ ధర్మములో లేనట్లేయని” చెప్పుచున్నదని తెలిపాము. ఖురాన్ గ్రంథము గీటురాయి కాగా, అందులోని 81-27, 6-90 రెండు ఆయత్లతోనూ మరియు 5-48, 5-68 ఆయత్లతోనూ గీచిచూచి వారి మాటలలోని జ్ఞానమును, అజ్ఞానమును బయటపెట్టాము. ఈ నాలుగు ఆయత్ల ప్రకారము వారు చెప్పిన మాటలలో మతమను అజ్ఞానమున్నదనీ, దేవుడు అను జ్ఞానము లేదనీ తేల్చివేశాము. ఈ సంఘటనతో దేవుడు చెప్పినట్లు 'ఖురాన్ గ్రంథము జ్ఞానములో సత్యాసత్యములు తెలుపు గీటురాయి” యని తెలిసిపోయినది. ఖురాన్ గ్రంథమును తీసుకొని గొప్పగా చెప్పి దాని చాటున మతమును ప్రచారము చేయాలనుకొన్న వారిని ఖురాన్ గ్రంథమునే గీటురాయిగా ఉపయోగించి వారిలోని అజ్ఞానమును బయటకు కనిపించునట్లు చేశాము. దానివలన ఖురాన్ గ్రంథము గీటురాయిగా నిరూపణకు వచ్చినది.


నేడు భగవద్గీత లేక తౌరాత్ గ్రంథమునే 'ప్రథమ దైవగ్రంథము’ అని అంటున్నాము. ఆ గ్రంథములోని జ్ఞానమే మిగతా రెండు గ్రంథములుగా వచ్చినది. దేవుడు చెప్పిన జ్ఞానము ఒక్కటే అయినా అది మూడు గ్రంథములుగా తయారయినది. మూడు గ్రంథములను అడ్డము పెట్టుకొని మూడు మతములు తయారయినాయి. మూడు గ్రంథముల నీడలో మూడు మతములు తయారయినా, ఆ మతములు ఏ ఒక్కటిగానీ గ్రంథముల ప్రకారము నడువలేదు. వారి మత పెద్దలు చెప్పినట్లు నడుస్తున్నాయే తప్ప గ్రంథముల జ్ఞానము ప్రకారము నడువలేదు. మూడు మతములు నేడు తమ మతములను అభివృద్ధి చేసుకొను పనులలో పడిపోయాయి గానీ జ్ఞానమును అనుసరించడము లేదు. మూడు మతములలోనున్న అజ్ఞానమును ఆయా మత గ్రంథములనే గీటురాయిగా ఉపయోగించి వారికి జ్ఞానమును, అజ్ఞానమును తేల్చి చెప్పవలసి యుంటుంది. ఒక హిందువు అజ్ఞానముగా మాట్లాడితే వాని గ్రంథమయిన భగవద్గీతను గీటురాయిగా చేసుకొని వారిలోని జ్ఞానము ఎంత, అజ్ఞానము ఎంతయని తేల్చి చెప్పవచ్చును. ఏ మతస్థునికి ఆ మత గ్రంథమునే గీటురాయిగా ఉపయోగించవలెను. హిందువులకు భగవద్గీతను గీటురాయిగా చేయవలెను గానీ, బైబిలునో, ఖురాన్ గ్రంథమునో చెప్పకూడదు. అందువలన దేవుడు మూడు మతముల అజ్ఞానమును బయటపెట్టుటకు మూడు గ్రంథములను గీటురాళ్ళుగా ఇచ్చాడు.


ఉదాహరణగా ఖురాన్ గ్రంథము నిజమైన గీటురాయిగా ఎలా ఉపయోగపడినదో, మతము అనువారు నోరు మెదపకుండా తన వాక్యములతో ఎలా కట్టివేసినదో చూచాము. అదే విధముగా ఏ మతములోని అజ్ఞానమునయినా ఆ మత గ్రంథముతోనే వారి మత గ్రంథ వాక్యములతోనే తేల్చి చెప్పవచ్చును. మూడు మత గ్రంథములు మూడు గీటురాళ్ళుగా ఉన్నాయి, కనుక ప్రతిచోట ఈ మూడు గ్రంథములతో ఆ మతములలోని అజ్ఞానమును, జ్ఞానమును బయటపెట్టవచ్చును. ఇంతవరకు మత ప్రచారము, స్వమత ప్రేమ, పరమత అసూయ అను అజ్ఞానమును తేల్చి చెప్పుకొన్నాము. అదే విధముగా మనుషులు ఆచరించు ప్రతి ఆచరణను సానబట్టి చూచి చెప్పవచ్చును. ఇప్పుడు మనుషులు చేయు ప్రార్థనలో లేక ధ్యానములో, లేక నమాజ్లో ఎంత జ్ఞానమున్నది, ఎంత అజ్ఞానమున్నది తెలియుటకు  మూడు మతముల వారికి మూడు గ్రంథములను ఉపయోగించి చూస్తాము. గీటురాయిని ఉపయోగించి చూచిన తర్వాత, గీటురాయిని ఉపయోగించి సత్యాసత్యములను తేల్చిన తరువాత, ఏ మతము వారికి ఆ మత గ్రంథమునే గీటురాయి చేసి, జ్ఞానాజ్ఞానములు తేల్చిన తరువాత కూడా, తమది అజ్ఞానమని తెలిసిన తర్వాత కూడా, గీటురాయిని లెక్కచేయక తమదే నిజమైన జ్ఞానమనీ, తమ ఆచరణే సరియైన ఆచరణయని చెప్పు వారిని మొండివాదులు అని చెప్పవచ్చును. అటువంటి వారికి దైవగ్రంథములు పెద్దగ కనిపించవు. తమ గురువులు, తమ పెద్దలు చెప్పిన మాటలే గొప్పగా కనిపించుచుండును. పైకి మాటలలో అన్నిటికీ దేవుడే పెద్దయని చెప్పుచూ, దేవుడు చెప్పిన మాటలను లెక్కచేయక మనుషుల మాటలను అనగా వారి పెద్దల మాటలను వినువారు దేవుడే పెద్దయని చెప్పుట భూటకము కాదా!


ప్రశ్న :- సందర్భము వచ్చింది కావున అడుగుచున్నాను. దేవుడిచ్చిన గ్రంథమును కాదని మనుషులు వ్రాసిన గ్రంథములను గొప్పగా చెప్ప వచ్చునా? కొందరు ఒకవైపు దేవుని గ్రంథమును గొప్పగా చెప్పుచూ దానికి సమానముగా వారి పెద్దలు వ్రాసిన గ్రంథములను కూడా చదువుచూ దేవుని గ్రంథములోని విషయములను వదలి మనుషుల గ్రంథములోని విషయములనే ఆచరించుచుందురు. వారు మనుషులను దేవునితో సమానముగా చూడకూడదని చెప్పుచూ దేవుడు చెప్పిన మాటలకంటే మనుషులు చెప్పిన మాటలనే ఎక్కువగా ఆచరించుచుందురు. అలా చేయడము తప్పుకాదా! దేవుడు తన ప్రతినిధి ద్వారా, తెరచాటునుండి, ఆకాశవాణి నుండి మూడు విధముల జ్ఞానము చెప్పగా దానిని కూడా హైజాక్ చేసి తమ ఆధీనములోనికి తెచ్చుకొని వారు చెప్పినట్లు నటించు వారు కూడా కలరు. గీటురాయిని ఉపయోగించి చూచితే వారిని ఏమనాలి?


జవాబు :- ఇది ఒక మతములోనే కాకుండా ప్రతి మతములోనూ ఉన్నది. అయితే కొన్నిచోట్ల బయటికి కనిపించునట్లు కలదు. కొన్నిచోట్ల అనగా కొన్ని మతములలో బయటికి కనిపించకుండా యున్నది. హిందూ మతములో హిందువులకు భగవద్గీతయని చెప్పుకొన్నా అది మాటల వరకే పరిమితమై పోయినది. భగవద్గీతను చదువకూడదని చెప్పుకొను వారు కూడా స్వచ్ఛమైన హిందువులుగా చలామణి అగుచున్నారు. భగవద్గీతను ఇంటిలో ఉంచుకోకూడదను వారు కూడా హిందువులలో ముఖ్యులుగా యున్నారు. భగవద్గీత హిందువుల గ్రంథమే కాదు అనువారు హిందూ మత పెద్దలుగా యున్నారు. ఈ విధముగా హిందువులకు భగవద్గీత మూల గ్రంథమని తెలియని స్థితిలో చాలామంది కలరు. భగవద్గీత విషయము తెలియనివారు హిందువులలో సగానికి పైగా కలరు. ఎవడయినా భక్తివరుడు ఉన్నాడంటే వాడు రామాయణము, భారతము చదివిన వాడుంటాడు తప్ప భగవద్గీతను చదివినవాడు లేడు. ఈ విధముగా దేవుడిచ్చిన దైవగ్రంథమును కాదని ఇతర గ్రంథములనాశ్రయించు వారు గలరు. రామాయణము నుండి అనేక గ్రంథములు, పురాణములు, వేదములు, ఉపనిషత్తులు చదువడము వలన అసలయిన దేవున్ని వదలి దేవుడు కాని దేవతలను ఆరాధించడము మొదలుపెట్టారు. ఈ విషయమును భగవద్గీత గ్రంథమును గీటురాయిగా చేసి చూస్తే ఆ గ్రంథములో అనేకచోట్ల అనేకమార్లు అన్యదేవతారాధన తగదని చెప్పాడు. అన్యదేవతారాధన వలన మనిషి మార్గము తప్పి నడచిన వాడగుచున్నాడని రాజవిద్యా రాజగుహ్య యోగములో 23, 24, 25 శ్లోకములలో చెప్పియున్నారు. ఆ శ్లోకములను గీటురాయిగా చేసి చూస్తే మనుషులు చేయు తప్పు తెలియుచున్నది. అన్యదేవతారాధన అజ్ఞానమని తెలియుచున్నది.


శ్లోకము|| 23. యేప్యన్య దేవతాభక్తా యజస్తే శ్రద్ధయా న్వితాః |

తేపి మామేవ కౌంతేయ! యజ్యక్ష్య విధిపూర్వకమ్ ॥


భావము :- “ఎవడయితే శ్రద్ధగలిగి అన్యదేవతారాధన చేస్తున్నాడో అతడు

అంతటాయున్న నన్నే ఆరాధించినట్లైనా, వాడు మార్గము త్రప్పి నడుస్తున్నాడు.

వాని భక్తి నావద్దకు చేరదు.”


శ్లోకము|| 24.

అహంహి సర్వ యజ్ఞానాం భోక్తాద ప్రభురేవచ |

నతుమా మభిజానన్తి తత్త్వేనా తశ్చ్యవన్తితే ॥


భావము :- “సర్వదేవతలకు చేయు ఆరాధనలయందు, యజ్ఞములందు భోక్తను నేనే మరియు ప్రభువును నేనే. నన్ను యదార్థ స్థితిలో తెలియని వారందరికి సుఖము కల్గును తర్వాత అదిపోయి కష్టమును కల్గును, అంతేగానీ ముక్తి దొరకదు."


శ్లోకము॥ 25. యాన్తి దేవవ్రతాన్ దేవాన్, పితౄన్ యాన్తి పితృవుతాః |

భూతాని యాన్తి భూతేజ్యాః యాన్తి మధ్యాజినోపి మామ్ ॥


భావము :- “దేవతా పూజ వలన దేవతలనే చేరుదురు, పితృదేవతలను పూజింప వారివద్దకే చేరుదురు. చెట్లను, పాములను, పశువులను మొదలగు జీవరాసులను పూజించితే వాటియందే చేరిపోవుదురు. నన్ను పూజించు వాడు మాత్రము నావద్దకు చేరగలడు. అనగా జన్మలకు పోకుండా ముక్తి పొందగలడు."


ఈ విధముగా దేవుడు తన గ్రంథమున చెప్పిన మాటలను బట్టి ఎవరిని పూజించితే వారివద్దకు చేరిపోవుదురని చెప్పాడు. దేవున్ని వదలి దేవుడు కాని వారిని ఆరాధిస్తే తిరిగి జన్మలకు పోవలసిందేనని తెలియు చున్నది. ఇది ఒక్క హిందువులకే కాదు మనుషులయిన ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము. దైవగ్రంథము ఏదయినా మనుషులందరికీ వర్తించును. అర్థమగుటకు హిందువులకు భగవద్గీతలోనే చూపితే తొందరగా అర్థము కాగలదని భగవద్గీతను తీసుకొని చెప్పడమైనది. మూడు దైవ గ్రంథములు ఒకే గీటురాయిగా యున్నాయి. అందువలన ఒకే దైవగ్రంథము నుండి అన్ని మతముల ప్రజలలోని అజ్ఞానమును ఎత్తి చూపవచ్చును. అట్లు చెప్పితే ‘అది మా గ్రంథము కాదు' అని అనుటకు అవకాశమున్నది. 'మా గ్రంథములోని విషయమైతే వింటాము' అని తప్పించుకొనువారు కూడా ఉండుటవలన మనిషి ఏ మతములో యున్నాడో, ఏ గ్రంథమును నమ్ము చున్నాడో ఆ గ్రంథమునుండే గీటురాయి అయిన బోధలను చూపవలసి యుంటుంది. అలాగని హిందువులకు భగవద్గీతను తప్ప ఇతరము చెప్పకూడదని ఏమీ లేదు. ఒకవేళ ఆ విషయమునకు సంబంధించిన బోధ భగవద్గీతలో లేనప్పుడు ఇతర దైవగ్రంథము నుండి కూడా చెప్పవచ్చును.


క్రైస్థవుల విషయములోనికి వస్తే దేవుడు మనిషి రూపములో చెప్పినది, మనుషులు దేవుని గురించి చెప్పినది రెండు రకముల బోధలు గలవు. ద్వితీయ దైవగ్రంథమని పేరుగాంచినది ఇంజీలు గ్రంథము. ఇంజీలు అనగా జీవము గలది అనీ, జీవింపజేయునదియనీ అర్థమును చెప్పవచ్చును. ఈ గ్రంథములో జీవ జలము, జీవము అని అంటే 'జ్ఞానము' అని భావించ వలెను. అలా అనుకోవడము ఈ గ్రంథములో మాత్రము గలదని చెప్పవచ్చును. దేవుడు తన జ్ఞానమును మూడు విధముల తెల్పునని ఖురాన్ గ్రంథములో 42వ సూరా, 51వ ఆయత్లో చెప్పడమైనది. అందులో “దేవుడు తన ప్రతినిధిని పంపి తన జ్ఞానమును చెప్పించును" అని గలదు.


మూడు విధానములలో రెండు వేరు విధానములు కాగా, ఒకటి మాత్రము తన ప్రతినిధిని మానవునిగా మానవులలోనికి పంపి అతని ద్వారా జ్ఞానమును చెప్పించును అని గలదు. అయితే విధానము అదే అయినా మనిషిగా వచ్చిన వాడు దేవుని ప్రతినిధియైనందున, ఆయన వేరు దేవుడు వేరు కాదు ఇద్దరు ఒక్కరేయని చెప్పుటకు అవకాశము గలదు. అది తర్వాత విషయము అయినా దేవుడు పంపిన వాడు దేవుని ప్రతి రూపము లేక ప్రతినిధియని చెప్పియుండుట వలన అతనిని దేవునిగానే భావించాలి. సత్యమును చెప్పితే దేవుని మారువేషమే మనిషిగా వచ్చినదని తెలియవలెను. అతడు సాధారణ మనిషివలె కనిపించినా అతడు మనిషి కాదు. అందువలన అతనికి ప్రత్యేకమైన పేరు పెట్టి పిలుస్తున్నాము. ఆ పేరే భగవంతుడు. దేవుడు అంటే కనిపించని శక్తి, భగవంతుడు అంటే కనిపించే శక్తియని అర్థము. 'దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతర మానవులకు ఎవరికీ తెలియదని' చెప్పడము జరిగినది. ఈ విషయమును అంతిమ దైవగ్రంథము ఖురాన్లో సూరా మూడు ఆయత్ ఏడు (3-7) లో చెప్పియున్నారు.


ఆ విధముగా దేవుని అవతారమై లేక దేవుని ప్రతినిధియై వచ్చిన వాడు ఏసు. ఏసుగా వచ్చిన దేవుని ప్రతినిధి తన జీవితమును సాగించుచూ తాను దేవుని అవతారమని ఎవరికీ తెలియకుండా ఉంటూ తాను ప్రజలకు చెప్పవలసిన జ్ఞానమును చెప్పిపోవును. అదే విధముగా ఏసుగా వచ్చిన దేవుడు తనను ఎవరూ గుర్తించనట్లు జీవించి తన జీవిత కాలములో చెప్పవలసిన జ్ఞానమును చెప్పిపోయాడు. ఆయన ప్రజల మధ్యలో ఉన్నది కేవలము మూడు సంవత్సరములే. ఆ మూడు సంవత్సరములలో కొంత జ్ఞానమును చెప్పి చనిపోయినట్లు నటించి, ప్రజల మధ్యలోనుండి తప్పుకొని దూరముగా వచ్చి తన జీవిత కాలమును పూర్తి చేశాడు. ఆయన మనిషి రూపములోయున్న దేవుడైయుండి దేవుని గురించిన బోధలు చెప్పాడు. దేవుని జ్ఞానము దేవునికే తెలుసు, కావున ఆయన తన జ్ఞానమును ప్రజలకు సులభముగా బోధించడమైనది. మనిషిగా ఆయన చెప్పిన బోధలు బైబిలు గ్రంథములో నాలుగు సువార్తలుగా ఉన్నాయి. బైబిలు గ్రంథము మొత్తము 66 పాఠముల రూపములోయుండగా నాలుగు సువార్తలకు ముందు 39 పాఠములు వెనుక 23 పాఠములు గలవు. మధ్యలో నాలుగు పాఠములు ప్రత్యేకమైనవిగా యుంటూ ప్రత్యేకమైన 'సువార్తలను' పేరును కల్గియున్నవి. నాలుగు సువార్తలను దేవుడు చెప్పియుండగా మనుషులు వ్రాశారు. మిగతా 62 పాఠములను మనుషులే దేవున్ని గురించి వ్రాశారు. అయితే అందులో కొన్ని సత్యము, కొన్ని అసత్యముతో కూడుకొనియున్నవి. నాలుగు సువార్తలు స్వయముగా దేవుడు మారువేషములో ఉండి చెప్పినవైనందున అందులో అంతా జ్ఞానమేయున్నది. మనుషులు చెప్పిన వాటిలోనే దేవుని జ్ఞానమును గురించి చెప్పిన మాటలే అయినా అవి మనుషులు చెప్పినవగుట వలన సత్యాసత్యములతో కూడుకొనియున్నవి.


బైబిలు గ్రంథమంతయూ మూడు భాగములుగా విభజింపబడినది. ముందుగల 39 పాఠములను పాతనిబంధన అంటున్నాము. తర్వాత ‘క్రొత్త నిబంధన’ అను పేరుతో 27 పాఠములున్నవి. పాతనిబంధన, క్రొత్త నిబంధన అని రెండు భాగములుగా అందరూ బైబిలు గ్రంథమును చెప్పుచున్నారు. అయితే మేము 'సువార్తలు' అను నాలుగు పాఠములను వాటిలో కలుపకుండా ప్రత్యేకముగా చెప్పితే బైబిలును మూడు భాగములుగా చెప్పవచ్చును. బైబిలు గ్రంథమును రెండు భాగములుగా చెప్పుటకంటే మూడు భాగములుగా చెప్పడమే న్యాయము. ఎందుకనగా! దేవుని మాటలను ఒకవైపు, మనుషుల మాటలను మరొకవైపు చేసి చెప్పితే బైబిలు మూడు భాగములగును. దేవుడు మనిషిగా యున్నా దేవుడు దేవుడే. మనుషుల మాటలను దేవుని మాటలను కలుపకుండా వేరుగా చెప్పుకొంటే దేవున్ని గౌరవించినట్లగును. అలా కాకుండా మనుషుల మాటలతో దేవుని మాటలను కలిపితే దేవున్ని గుర్తించనట్లు, గౌరవించనట్లు అగును. వాస్తవముగా మనిషిగా వచ్చిన దేవున్ని అప్పుడు ఆయన ఉన్న సమయములో ఎవరూ గుర్తించలేరు. ఆయన పోయిన తర్వాత ఆయన చెప్పిన జ్ఞానమును బట్టి దేవున్ని గుర్తించవచ్చును. అయితే ఆయన చెప్పిన మాటలనే గ్రంథముగా వ్రాస్తూ, ఆయన జ్ఞానమును గుర్తించకుండా మనుషుల మాటలలో కలుపడము దేవుడు మరియు మనుషులు చెప్పిన మాటలను కలిపి చదువుకోవడము చూస్తే దేవుని జ్ఞానమును మనిషి ఏమాత్రము గుర్తించలేదని అర్థమగుచున్నది.


బైబిలు గ్రంథములో ఏసు మనిషిగా యున్నప్పుడు కేవలము మూడు సంవత్సరములు మాత్రమే బోధను చెప్పాడు. ఆ మూడు సంవత్సరములలో చెప్పిన మాటలన్నియూ దైవజ్ఞానముతో కూడిన మాటలే. ఆ మాటలను గ్రహించగలిగితే సంపూర్ణ జ్ఞానము లభించును. మనిషి జన్మలనుండి బయట పడి దైవము వద్దకు చేరుటకు సరిపడు జ్ఞానమును ఏసుగా యున్నప్పుడు దేవుడు బోధించాడు. అయితే మనుషులు అప్పుడు గానీ, తర్వాత కాలములోగానీ దేవుని జ్ఞానమును గుర్తించనివారై మనుషులు చెప్పిన మాటలను, దేవుడు చెప్పిన మాటలను కలిపి చదువుకొనుచున్నారు. వాస్తవముగా దైవగ్రంథములో దేవుడు చెప్పిన జ్ఞానమే ఉండాలి. అయితే మూడు దైవగ్రంథములలో దేవుడు చెప్పినది మాత్రమే ఉండక అందులో మనుషులు చెప్పినది కూడా కలిసియుండును. బైబిలు గ్రంథమును గమనించితే దేవుడు చెప్పినది నాలుగు పాఠములయితే మనుషులు చెప్పినది 62 పాఠములున్నవి. అట్లే భగవద్గీతలో ఏడువందల శ్లోకములుంటే, కొన్ని పదుల సంఖ్యలో కల్పిత శ్లోకములు కలిసియున్నవి. ఇక ఖురాన్ గ్రంథ విషయములోనికి వస్తే అంతా దేవుడు చెప్పినదే యున్నట్లుండినా అంతా దేవుని జ్ఞానమే యున్నదని చెప్పలేము. ప్రతి గ్రంథములోనూ మనుషులు చెప్పినది ఎంతో కొంత కలిసియుండును. దేవుడే అలా వుండునట్లు నిర్ణయము చేశాడు. గ్రంథములో దేవుని మాటలు కొన్ని, మనుషుల మాటలు కొన్ని యుండుట వలన దేవునికి ఇష్టమైన వానికి దేవుని జ్ఞానము, దేవునికి ఇష్టము లేనివానికి మాయ జ్ఞానము కనిపించునట్లు తన గ్రంథములలో మనుషులు కల్పించి వ్రాసిన అజ్ఞానము కూడా కొంతయుండు నట్లు దేవుడే చేశాడు. దేవునికి తెలియకుండా ఏదీ జరుగదు. దైవ గ్రంథములలో అజ్ఞానము చోటు చేసుకొనియున్నదంటే అది దేవుని ఇష్టముతోనేయుండును.


మనిషి శ్రద్ధనుబట్టి గ్రంథములలోని జ్ఞానము లభించుచుండును. దేవుడు మనిషిగా యున్నప్పుడు బోధించు బోధ స్వచ్ఛమయినదిగా యుండును. తర్వాత ఆ బోధ గ్రంథరూపముగా మారునప్పుడు దానిని మనుషులే వ్రాయవలసియుండును. అప్పుడు గ్రంథము కలుషితమగుటకు అవకాశము గలదు. మొదట వ్యాసుడు కృష్ణుడు చెప్పిన జ్ఞానమునే భగవద్గీతగా వ్రాసినా తర్వాత కొందరు తమ భావములను శ్లోకముల రూపములో తయారుచేసి భగవద్గీతలోనికి చేర్చారు. బైబిలు విషయానికి వస్తే ప్రత్యక్షముగా కనిపించునట్లు ఏసు చెప్పిన జ్ఞానము నాలుగు సువార్తలుగాయుండగా, మనుషులు వ్రాసినది 62 పాఠములుగా యున్నది. ఖురాన్ విషయమునకు వస్తే దానిని గురించి ఇలాగ అని చెప్పలేముగానీ, దేవుడే “నేను మనుషులను తప్పుదారి పట్టిస్తాను” అని చెప్పుట వలన దానికొరకు దేవునికి తెలిసే కొంతయినా కలుషితము చేరియుండవచ్చునని అనుకొంటున్నాము.


శ్రద్ధ బుద్ధి గలవాడు సక్రమమైన జ్ఞానము తెలిసి కలుషిత జ్ఞానము వైపు పోకుండాయుండుటకు ఇది నిజమైన జ్ఞానము, ఇది అసత్య జ్ఞానము అని తెలియుటకు తన గ్రంథములోని వాక్యములనే గీటురాయిగా చేసి పెట్టాడు. అందువలన మనుషులు చెప్పిన జ్ఞానమును, దేవుడు చెప్పిన జ్ఞానమును సులభముగా గ్రహించవచ్చును. ఇప్పుడు ఖురాన్ గ్రంథములోని జ్ఞానమును గీటురాయిగా దేవుడు చూపడము వలన దానితో బైబిలుయందు గానీ, ఖురాన్ గ్రంథమందు గానీ యున్న మనుషుల కలుషిత జ్ఞానమును గుర్తించవచ్చును. బైబిలు గ్రంథములో 62 పాఠములు కలుషితముగా యున్నవనీ అందులో జ్ఞానమును అజ్ఞానమును, సత్యాసత్యములను గీటురాయితో తెలుసుకోవచ్చని చెప్పాము. బైబిలుకు, ఖురాన్కు ఖురాన్ గ్రంథములోని గీటురాయి వాక్యములనే ఉపయోగించి సత్యాసత్యములను తేల్చవచ్చును. బైబిలు గ్రంథములోని నాలుగు సువార్తలలోని వాక్యములందు లేని విషయమును ప్రథమ దైవగ్రంథమందుగానీ, అంతిమ దైవగ్రంథమందు గానీ చూడవచ్చును.


‘ప్రార్థన లేక ఆరాధన' విషయములో భగవద్గీతయందు గీటురాయిని మూడు శ్లోకములలో చెప్పుకొని ఉపయోగించి చూచుకొని తప్పును తెలుసు కొన్నాము. ఇప్పుడు అదే ప్రార్థన విషయము క్రైస్థవులలో చూచినట్లయితే క్రైస్తవుల ప్రార్థన ఒకే దేవుని మీద ఉన్నదయినా అది బహిరంగ ప్రార్థనగా యున్నది. హిందువుల బహు దేవతారాధనను ఖండించి ఒకే దేవునివైపు చూపు మరలునట్లు రాజవిద్యా రాజగుహ్య యోగములోని మూడు శ్లోకముల ద్వారా తెలుసుకొన్నాము. ఇప్పుడు ప్రార్థన విషయములో సత్యాసత్యమును తెలుయుటకు సువార్తలలోని గీటురాయిని ఉపయోగించి చూస్తాము. ఈ విషయమై మత్తయి సువార్త 6వ అధ్యాయములో 5 నుండి 8వ వాక్యము వరకు చూడండి. (మత్తయి 6-5,6,7,8) "మీరు ప్రార్థన చేయు నప్పుడు వేషధారులవలె ఉండవద్దు. మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలోనూ, వీధుల మూలలలోనూ నిలచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది  యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి, రహస్య మందున్న నీ తండ్రిని ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయు నప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు. మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా యున్నవేవో ఆయనకు తెలియును."


ఈ వాక్యములు సులభముగా అర్థమగులాగున పైకి కనిపించుచున్నా ఇందులో అర్థము చేసుకోవలసినది ఎంతోయున్నది. ఈ వాక్యములు స్థూల విషయమును గురించికాక సూక్ష్మ విషయమును బోధించుచున్నవి. “నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి' అని చెప్పు వరకు స్థూల విషయముగా అందరికీ అర్థము కాగలదు. తర్వాత “రహస్యమందున్న నీ తండ్రిని ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును” అని వ్రాసినదంతా సూక్ష్మ విషయమైయున్నది. ఇక్కడ 'రహస్యమందున్న నీ తండ్రిని ప్రార్థన చేయుము' అని యున్నది కదా! 'నీ తండ్రిని ప్రార్థన చేయుము' అని యుండడమేగాక 'రహస్యమందున్న'యని ఉన్నది. ఇక్కడ చాలా సూక్ష్మముగా యున్న విషయము ‘తండ్రి మరియు రహస్యము.' రహస్యమనగా ఏమి? తండ్రియనగా ఎవరు? అను ప్రశ్నలకు జవాబు తెలిసియుండవలెను. అయితే చాలామంది మనకు కనిపించకయున్న దేవుడు అని భావించుకొని కనిపించకయున్న దేవున్ని ప్రార్థించడమే కదా! యని అనుకొనుచుందురు. 'రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును' అని యున్నది. తండ్రి అయినవాడు రహస్యమందు చూచుటయని అంటే ఎక్కడనుండి చూచుచున్నాడు? రహస్యము అంటే ఎక్కడయున్నది? అక్కడనుండి నిన్ను ఎలా చూచుచున్నాడు? అని ప్రశ్నించుకొని, ఆ ప్రశ్నలకు జవాబులను తెలియవలెను. తండ్రియంటే దేవుడేనా? అను ప్రశ్నను కూడా వేయవలసి యుండును. 'రహస్యమందు చూచు' అని వాక్యములో గలదు. 'రహస్య మందు చూచు నీ తండ్రి' అని కలదు కదా! రహస్యమందు ఎవరిని చూచుచున్నాడు? అని ప్రశ్నించుకొంటే నిన్నే చూచుచున్నాడని జవాబు వచ్చును. అప్పుడు నీవు కూడా రహస్యమందు ఉన్నావా? అను ప్రశ్న రాగలదు. అంతేకాక ప్రార్ధన కోసము గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి అని చెప్పడములో అర్థమేమిటి? అని కూడా ఆలోచించవలసియుంటుంది. గది లేనివాళ్ళు, గదియున్నా గదికి తలుపులు లేనివాళ్ళు చాలామంది గలరు. అటువంటి వారు ప్రార్థన చేయుటకు అవకాశముండదా? అను ప్రశ్న కూడా రాగలదు. ఒక ఇంటిలో ఎక్కువ జనాభా వున్నవారు గలరు. కొన్ని ఇండ్లలో గదులే ఉండవు. అటువంటి వారు ప్రార్ధన ఎలా చేయాలి? గదియంటే ఏమిటి? గదిలో దూరి తలుపులు వేస్తే నీవు రహస్యములో ఎవరికీ కనిపించక యుండినట్లే కదా! అసలు గదియంటే స్థూలముగా యుండునదా? సూక్ష్మముగాయుండునదా? గది నీ శరీరమునకా? నీకా? నీకయితే నీవు గదిలోయున్నావా? శరీరములో యున్నావా? అని ప్రశ్నించు కొని చూచి ఇన్ని ప్రశ్నలకు జవాబు తెలిసినప్పుడే నీ ప్రార్థన సరియైనదగును. దేవుడు చెప్పిన ప్రార్థన చేసినట్లగును. అట్లు కాకుండా ఈ ప్రశ్నలకు జవాబు లేకుండా ప్రార్థన చేస్తే అది ప్రార్ధన అనిపించుకోదు. నేను నీకు చెప్పినది ఏమి? నీవు చేసినది ఏమి? అని దేవుని నుండి ప్రశ్న రాగలదు.


క్రైస్థవులు నేడుగానీ, పూర్వముగానీ ఇప్పుడు మేము చెప్పినంత లోతుగా ఆలోచించడము లేదు. ప్రార్థన విషయములోనే కాకుండా మిగతా అన్ని విషయములలోను లోతుగా ఆలోచించడము లేదు. ఏసుప్రభువు ఏమి చెప్పాడని ఆలోచించక తమకు తోచినదే చెప్పాడని, తమకు అర్థమయినదే చెప్పాడని అనుకోవడము జరుగుచున్నది. ఈ విధముగా బైబిలును సరిగా అర్థము చేసుకోలేక పోవడము వలన బైబిలులోని విషయములు ఒక్కటి కూడా సరిగా అర్థము కాకుండా పోయాయి. గీటు రాయిని ఉపయోగించి చూచినప్పుడు మనిషి అర్థము చేసుకొన్న దానిలోని జ్ఞానము, అజ్ఞానము బయటపడుచున్నది. ఏసుప్రభువు చెప్పిన ‘జ్ఞానము’ అను గీటురాయితోనే బైబిలునుండి మనము అర్థము చేసుకొన్న దానిని పరీక్షించి చూచుకోమని చెప్పుచున్నాము. గీటురాయి ప్రకారము నీది జ్ఞానమయితే ఫరవాలేదు. అజ్ఞానమయితే సరైన ఆలోచన చేసి సరైన జ్ఞానమును తెలియమని చెప్పుచున్నాము.


ఇంతవరకు రెండు మతముల ప్రార్థన విషయములో హిందువులు దేవున్ని వదలి, దేవుడు ఎవరో తెలియక, దేవుడు వేరు దేవతలు వేరు అను విషయము తెలియక ఎందరినో దేవతలను ఆరాధించుచుండగా భగవద్గీత లోని గీటురాయితో వారి అజ్ఞానమును బయటికి చెప్పడమైనది. తర్వాత క్రైస్థవుల విషయములో ప్రార్థన విధానమును చూస్తే వారు దేవుడు ఒక్కడేయని ఒక్క దేవున్నే ఆరాధించుచుండినా, ప్రార్థన చేయు విధానము తెలియని దానివలన, బైబిలు గ్రంథములోని మత్తయి సువార్తయందలి గీటురాయితో, వారు ఆచరిస్తున్న విధానములో సత్యాసత్యమును చెప్పడమైనది. ప్రార్థనయందు జ్ఞానపద్ధతిలో ఎలా ఆలోచించాలో గీటురాయి ద్వారా తెలుపడమైనది. అలా చెప్పడము వలన ప్రార్థన విషయములో వారు జాగ్రత్తగా వ్యవహరించు అవకాశము గలదు. ఇప్పుడు తదుపరి విషయముగా అంతిమ దైవగ్రంథము ఖురాన్లోని ప్రార్థనా విషయమును చూస్తాము.


ఒకే దేవున్ని ఆరాధించు వారిలో మొదటివారు ముస్లీమ్లేనని చెప్పవచ్చును. అంతేగాక ప్రపంచములో దేవున్ని ఎక్కువగా ఆరాధించు వారు, ప్రార్థించువారు ముస్లీమ్లేనని కూడా చెప్పవచ్చును. అసూయ లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పితే, వారితో పాటు ప్రార్థన చేయువారు ప్రపంచములో ఎవరూ లేరని చెప్పవచ్చును. అత్యధిక ప్రార్థనలు చేయువారు ముస్లీమ్. వారి బాహ్య జీవితములో ఎలాగున్నా దేవుని విషయములో దేవుని ప్రార్థన విషయములో కడు జాగ్రత్తగా మసలుచుందురు. దేవుని ప్రార్థన విషయములో తమ పెద్దలు చెప్పినట్లు తప్పక ఆచరించుచుందురు. దేవుని విషయములో ఎటువంటి అశ్రద్ధగానీ, సోమరితనముగానీ వారిలో ఎంతమాత్రము కనిపించదు. దేవుని ప్రార్థన విషయములో అందరు ఏకాభిప్రాయము కల్గియుండడమే కాక ప్రపంచ విషయములన్నిటికంటే ప్రార్థనకే ఎక్కువ విలువనిచ్చుచున్నారు. అంతిమ దైవగ్రంథములో వారి ప్రార్థనను 'నమాజ్' అను పేరుతో పిలుస్తున్నారు. నమాజ్ విషయమును ఖురాన్ చదివిన వారి పెద్దలు ఎట్లు ఆచరించుచున్నారో మిగతా వారు కూడా అట్లే ఆచరించుచున్నారు. ముస్లీమ్లు ప్రార్థనలో మొదటివారుగా యున్నా, ఖురాన్ గ్రంథములో అల్లాహ్ ప్రార్థన విషయములో ఏమి చెప్పాడో తప్పనిసరిగా చూడవలసిన అవసరమున్నది. దేవుడు తన జ్ఞానమును ఒకే గ్రంథముగా మనుషులకు ఇచ్చాడు. చివరికది మూడు గ్రంథములుగా మారినది. దేవుడు మొదట తన జ్ఞానమును గీటురాయి రూపములో ఇవ్వగా, అదే మూడు గ్రంథములుగా మనముందరున్నది. అందువలన చివరిలో తయారయిన ఖురాన్ గ్రంథము కూడా సత్యా సత్యములు తేల్చి చెప్పుటలో గీటురాయిగా యున్నదని తెలియుచున్నది. ఇదే విషయమునే ఖురాన్ గ్రంథములో సూరా 2, ఆయత్ 53లోనూ, మరియొక చోట సూరా 25 ఆయత్ 1 లోనూ ఈ విధముగా చెప్పడమైనది. (2-53) “మేము మూసాకు మీ మార్గదర్శకత్వము నిమిత్తము గ్రంథాన్ని గీటురాయిని ప్రసాదించాము" అని కలదు. (25-1) “సమస్త లోకాలను హెచ్చరించేవానిగా ఉండటానికి గాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు.”


అంతిమ దైవగ్రంథము గీటురాయిగా ఉన్నదనుటకు అల్లాహ్ చెప్పిన పై ఆయతులే ఆధారము. గీటురాయి అనగా సత్యాసత్యములు తెల్పునది యని అర్థము. గీటురాయిని ఉపయోగించి గ్రంథములోని వాక్యములనే గీటురాయిగా చేసుకొని, మనుషులు దేవుని ఎడల చేయు కార్యములు సరియైనవో కాదో తేల్చి చెప్పుకొన్నాము. ఇప్పుడు ఖురాన్ గ్రంథములో దేవుడు ఇచ్చిన గీటురాయిని ఉపయోగించుకొని ముస్లీమ్లు చేయు ప్రార్థనలో సత్యము ఎంత ఉంది? అసత్యము ఎంతయుంది? అని సరిచూచు  కొందాము. ఒకవేళ దేవుడు చెప్పిన విధానము మనుషులకు సరిగా అర్థముకాకపోయినా, గీటురాయి వలన లోపములు సరిచేసుకొని ముందుకు పోవు అవకాశమును పొందవచ్చును. గీటురాయి మనుషుల అభిప్రాయమును తెలుపక దేవుని అభిప్రాయమును జ్ఞాన రూపముతో చెప్పుచుండుట వలన ప్రతి ఒక్కరూ గీటురాయి జ్ఞానమును అనుసరించ వలసియుండును. ఇప్పుడు ప్రార్థన విషయములో గీటురాయిని ఉపయోగించి సత్యాసత్యములను తెలుసుకొందాము.


‘ప్రార్థన' దేవుని విషయములో చాలా ముఖ్యమైనది. అందువలన ప్రార్థన గురించి గ్రంథము మొదటిలోనే కొంత చెప్పుకొన్నాము. 'ముఖ్యమైన అభ్యర్థనను ప్రార్థన' అని అంటాము. దేవున్ని ప్రపంచ విషయములలో ఏదీ అడుగవలసిన పనిలేదు. అవి అన్నియూ కర్మనుబట్టి యుండును. మనము అడుగవలసినది కర్మకు సంబంధము లేనిది, దైవికమయినది. తనను దేవుని వద్దకు చేర్చుకొమ్మని అడుగడమే అన్నిటికంటే ముఖ్యమైన అర్థన. అందువలన ముక్తిని గురించి అడుగడమే ప్రార్థన అంటాము. మూడు మతములలో ముక్తిని అడుగడము కొరకే ప్రార్థన తయారు చేయబడినది. అయితే అజ్ఞానము వలన ప్రార్థన గాడితప్పి ప్రపంచ విషయములలోనికి పోయినది. ముస్లీమ్ మతము ప్రార్థనలో ప్రత్యేకమయిన దనీ, ప్రార్థన ఆచరించడములో ముస్లిమ్ మొదటివారనీ, ముస్లీమ్ల తర్వాతనే మిగతా వారని చెప్పవచ్చని చెప్పాము. అయితే ముస్లీమ్లు ప్రార్థన విషయములో ఎంత దృఢ విశ్వాసముతోయున్నారో అంత ఫలితమును పొందుచున్నారా? యని లెక్కించి చూచాము.  ఫలితము విషయములో మూడు మతములను గురించి చెప్పు కొందాము. హిందూ మతమున ప్రార్థనయున్నది. అందరూ చేయకున్నా


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024