pss ఇందూ సాంప్రదాయములు 25th Oct 24 Updated

 


ఇందూ సాంప్రదాయములు.


విషయ సూచిక.

1.ఇందూ సాంప్రదాయములు

2.శిశువును చేటలో పెట్టడము

3.ఊయలలో పెట్టడము

4.ఉపనయనము

5.ఉపదేశము

6.పెళ్ళి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు

7.తోడు పెళ్లి కొడుకు

8.ఖడ్గం

9.భాషింగము

10. బుగ్గబొట్టు (చుక్కబొట్టు)

11. వడిబియ్యము-ముడిబియ్యము

12. కాలి మెట్టెలు

13. తాలిబొట్టు

14. అక్షింతలు

15. తలంబరములు

16. అరుంధతి నక్షత్రము

17. పందిరి

18. పెళ్లికి ముహూర్తమా!

19. పెళ్లిలో వేదమంత్రములా!

20. శ్రీమతి - శ్రీమతము

21.ముండమోయడము (ముండ మూయడము)

22. నమస్కారము

23. లాభ సాంప్రదాయము

24. కట్టుబొట్టు ఆచరణ

25. తలముడి

26. గుండు గీయించుకొనుట

27. మూడు విభూతిరేఖలు

28. ముక్కు పుడకలు

29. పంచకట్టు - చీరకట్టు

30. శవయాత్ర

31. దింపుడు కల్లము

32. పిండాకూడు (కర్మకాండ)

33. దక్షిణ దిశకు తలపెట్టడము



ఇందూ సాంప్రదాయములు.


సాంప్రదాయములు అను మాట ఒక ఇందూమతములోనే వినిపిస్తున్నది. ఒక గుడికి పోయి పూజలు చేసి

ఇది మా సాంప్రదాయమను వారు కొందరున్నారు. ఒక పెళ్లిచేసి సాంప్రదాయముగ పెళ్లి చేశామనువారు కూడ

కలరు. అలాగే ఒక తెగవారు ఒకే విధమైన దుస్తులు ధరిస్తు ఇది మా సాంప్రదాయమనువారు కూడ కలరు. ఇంకనూ

వివరించి చూస్తే ఇందూమతములో ఒక్కొక్క కులము వారు ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తు ఇది మా కుల

సాంప్రదాయమనుచున్నారు. ఇలా సాంప్రదాయమనుమాట అనేకచోట్ల వినిపిస్తున్నప్పటికి వాస్తవానికి సాంప్రదాయములు

అంటే ఏమిటివో ఎవరికి తెలియకుండ పోయినవి. ఇందూమతము హిందూ మతముగ మారిపోయిన ఇప్పటి కాలములో,

మేము హిందువులమని చెప్పుకొనుచు తన మతము యొక్క నిజ స్వరూపమును తెలియని మనిషి, సాంప్రదాయములంటే

ఏమిటో తెలియక ఇది సాంప్రదాయమని ఎవరు ఏమి చెప్పినా దానిని సాంప్రదాయమని నమ్ముచున్నాడు. ఒక మనిషి

చనిపోతే మృతదేహమును భూమిలో పాతిపెట్టడము సాంప్రదాయమని కొందరంటున్నారు. మరొక ప్రాంతములో

మృతదేహమును కట్టెలతో కాల్చివేయడమును సాంప్రదాయమని కొందరు అంటున్నారు. సాంప్రదాయముల గురించి

మనకు తెలియదు, తెలిసినవారు చెప్పినట్లు వినడము మంచిదని కొందరంటున్నారు. అలా చెప్పినట్లు గ్రుడ్డిగ

వినినప్పటికి ఒకే పని రెండు విధములుగ ఉన్నప్పుడు దేనిని సాంప్రదాయమనాలి? అను ప్రశ్న రాకతప్పదు. కొంత

తెలివైనవారు ఇటువంటి లోపభూయిష్టమైన మాటలను చూచి ఇదంతయు మూఢ నమ్మకమనుచు, అసలయిన

సత్యమును వెదకక హేతువాదులమను పేరుతో సత్యమునకు దూరమైపోవుచున్నారు. ఇటువంటి నేపథ్యములో

సత్యవాదులమను (ఆస్తికులమను) వారు దేనినయిన సాంప్రదాయ మనవచ్చును, హేతువాదులనువారు దేనినయిన

మూఢనమ్మకమనవచ్చును. వీరిరువురి మధ్యలో అసలయిన సాంప్రదాయములు ఏనాడో కనుమరుగై పోయాయి.

సత్యవాదులను పేరుతో అసత్యవాదులున్న ఈ కాలములో, హేతువాదులను పేరుతో నాస్తికులున్న ఈ కాలములో

ఆచరించు ప్రతీది ఆస్తికులకు సాంప్రదాయమైతే, తెలియని ప్రతీది నాస్తికులకు మూఢ నమ్మకమైనది.


ఇటువంటి సమయములో, ఇటు ఆస్తికులకు అటు నాస్తికులకు సాంప్రదాయమంటే ఏమిటో సూత్రబద్ధముగ

తెలియాలి. పూలు విడిగ ఉన్నపుడు వాటికి హారము అని పేరు రాదు. దారము (సూత్రము) చేత కూర్చబడినపుడు,

ఒక పద్ధతిగ, ఒక వరుసగ ఏర్పడిన దానివలన హారము అనుచున్నాము. అలాగే ఎవరు ఇష్టమొచ్చినట్లు వారు

చేయుపనులకు సాంప్రదాయము అను పేరు వర్తించదు. శాస్త్రము అను సూత్రము చేత సంధించినపుడు ఒక

అర్థముతో ఎక్కడయిన ఒకే పద్ధతిగ ఉండుట వలన ఆ పనిని సాంప్రదాయము అనుచున్నాము. పూలు దారము చేత

కూర్చబడక పోతే ఎలా హారము కాదో, అలాగే కార్యము శాస్త్రము చేత కూర్చబడకపోతే సాంప్రదాయము కాదు.

ఒక అంగుళము (ఒక ఇంచు) మందము గల తాడులో సగము సగము తగ్గించుతూ పోతే చిన్నసైజు దారమగును.

అంగుళములో ఆరవ మందమయిన సూది మందముగల దారముతో పూలను హారముగ కూర్చవచ్చును. అలాగే

శాస్త్రములలో ఆరవదైన, ఐదు స్థానములను దాటి ఆరవస్థానములోనున్న బ్రహ్మవిద్యాశాస్త్రముచేత ఒక కార్యమును

నిర్ధేశింపబడినపుడే ఆ పని సాంప్రదాయమగును. సూత్రబద్ధత లేకుండ పోతే పూలు హారము ఎట్లుకావో, అట్లే

బ్రహ్మవిద్యాశాస్త్రబద్ధత లేని కార్యములు సాంప్రదాయములు కావు. హారములో దారము దాగి ఉన్నట్లు కార్యములో

భావము ఇమిడి ఉండవలెను. తెగని దారము లేకుండ హారముండదు, చెడని భావము లేకుండ సాంప్రదాయముండదు.

ఇపుడు కొందరొక ప్రశ్న అడుగవచ్చును. కొందరు పెళ్లి కార్యములో తలంబరములు పోయడము, అక్షింతలు


వేయడము మొదలగు పనులన్ని సాంప్రదాయములని పేరుపెట్టి చేయిస్తున్నారు కదా! అటువంటపుడు సాంప్రదాయములు

ఎవరికి తెలియకుండ పోయినవని మీరెట్లు అనుచున్నారని అడుగవచ్చును. దానికి మాజవాబు ఏమనగా! గంగిరెద్దు

మెడలో పూలహారముండినప్పటికి ఆ ఎద్దుకు ఇది హారమని తెలియదు, దాని విలువా తెలియదు. దాని మెడలో

పూలహారము ఉండినా, లావుపాటి తాడున్నా రెండూ ఒక్కటే. అలాగే వివరము లేని అజ్ఞాని యొక్క పనిలో

సాంప్రదాయముండినప్పటికి వానికి ఇది సాంప్రదాయమని తెలియదు, దాని విలువా తెలియదు. వాని పనిలో

సాంప్రదాయమున్నా అ సాంప్రదాయమున్నా రెండూ ఒక్కటే. పెళ్లి కార్యములో పెళ్లిచేయువారికి కాని, చేయించుకొను

వారికి కాని, చూచువారికి కాని అర్థము తెలియనపుడు అది సాంప్రదాయమైనప్పటికి తెలియని రహస్యమే, కావున

అది సాధారణ పనులలో ఒకపని అగుచున్నది కాని, సాంప్రదాయము ఎవరికి కాలేదు. ఈమధ్య ఒక పెద్ద పెళ్లి

జరిగినది. టి.వి. వాళ్ళు కూడ ఆ దృశ్యాలను టి.విలో చూపారు. అక్కడి పురోహితులు ఆ పెళ్లిలో ప్రతి కార్యమును

సాంప్రదాయముగ చేశామని చెప్పడము విన్నాము. నోటిమాట ఆ విధముగ చెప్పుచున్నారు కాని అక్కడి పురోహితులకు

గాని, వధూవరులకు గాని, పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు గాని సాంప్రదాయము అను మాటకు అర్థమే తెలియదని

చెప్పవచ్చును. అక్కడ ఒక్క పనికి కూడ అర్థము తెలియకుండాపోయినది. అర్థము తెలియని పని వ్యర్థము. కావున

అది సాంప్రదాయము ఏమాత్రము కాదని తెలిసిపోయినది. సాంప్రదాయములు తెలియక పోవడము వలన కొందరు

రిజిష్టరు ఆఫీసుకు పోయి భర్తను భార్య, భార్యను భర్త రిజిష్టరు చేయించుకొనుచున్నారు. ఈ విధముగ కొంత కాలము

గడచి పోతే భావితరములో సాంప్రదాయములను మాటే తెలియకుండ పోతుంది. అటువంటి ప్రమాదము రాకుండ

సాంప్రదాయములంటే సూత్రబద్ధముగ, శాస్త్రబద్ధముగ ప్రతిమనిషి తెలియవలసిన అవసరమున్నది. ఇక

సాంప్రదాయములంటే ఏమిటో చెప్పవలసిన వానినే అడిగి తెలుసుకుందాము.


ప్రతి దినము మనిషి తన జీవన గమణములో ఏదో ఒకపనిని చేస్తూనే ఉన్నాడు. ప్రతి పని వెనుక ఏదో ఒక

ఆదాయముంటుంది. ఆదాయము ఏ రూపములో ఉన్ననూ అది కనిపించెడిదిగ ఉండును. ధనముగాని, ధాన్యముగాని,

బంగారుగాని ఏ రూపములో ఉండిన అది కనిపించెడి ఫలితముగానే లెక్కించబడుచుండును. కార్యమునకు ప్రతిఫలముగ

కనిపించు దానిని ఆదాయము అని చెప్పుచున్నాము. ముఖ్యముగ గమనించవలసినదేమంటే ప్రతి కార్యములో

కనిపించెడు ఆదాయమున్నట్లే కనిపించని ఆదాయము కూడ ఒకటి కలదు. దానినే కర్మఫలితము అంటున్నాము.

కనిపించెడు ఫలితము ధన, ధాన్య, కనక, వస్తువాహన రూపములలో అనేక విధములుగ ఉండగ, కనిపించని ఫలితమైన

కర్మ కేవలము రెండు రకములుగానే ఉన్నది. అందులో ఒకటి పాపము, రెండవది పుణ్యము. దీనిని బట్టి పనిలోవచ్చు

ఆదాయములు రెండు రకములుగ కనిపించెడివి, కనిపించనివని తెలియుచున్నది. కనిపించెడివి చాలా రకములుగ

ఉండగ, కనిపించనివి రెండు రకములు మాత్రమేనని కూడ తెలియుచున్నది. మానవ జీవితములో కనిపించెడి ఆదాయమున

కంటే కనిపించని ఆదాయమే చాలా ముఖ్యమైనది. కనిపించెడి ఆదాయము ఆ జీవితములోనే ఉపయోగపడవచ్చు,

ఉపయోగపడకపోవచ్చు. కనిపించని ఆదాయము తర్వాత జన్మల వరకు వచ్చి తప్పనిసరిగ సంపాదించుకొన్న వానికే

ఉపయోగపడుచున్నది. ఎన్ని విధముల చూచిన కనిపించెడు ఆదాయముకంటే కనిపించని ఆదాయమే చాలా ముఖ్యమైనది.

అందువలన పనిలో వచ్చు కనిపించని కర్మ ఫలితమునకు విశేషతను కల్పించి, "ప్ర" అను శబ్దమును జోడించి

ప్ర.ఆదాయము = ప్రదాయము అన్నారు. దీనిని బట్టి ఆదాయమనగ కనిపించెడి ధన, కనక, వస్తు, వాహనములని,

“ప్రదాయము” అనగా కనిపించని పాపము, పుణ్యము అని తెలియవచ్చును.


ప్రస్తుత జీవితములో ఉపయోగపడు ధనము ఆదాయము కాగ, తర్వాత జీవితములో ఉపయోగపడు కర్మ

ప్రదాయమని తెలియుచున్నది. ఆదాయమైన, ప్రదాయమైన మనిషి అనుభవించునవే. ఒక మనిషి సంపాదించుకొను

సంపాదనలు అనుభవించునవేకాక అనుభవించనివి కూడ ఉన్నవి. దీనిని బట్టి ఆదాయములను మూడు రకములుగ

విభజించవచ్చును. అనుభవించు ఆదాయములు రెండు రకములు, అనుభవించని ఆదాయము ఒక రకము. మొత్తము

మూడు విధముల ఆదాయములు కలవు. మూడవ రకమైన ఆదాయము కూడ కనిపించనిదే అయినప్పటికి, కర్మవలె

తలలో చేరునప్పటికి, కర్మకు వ్యతిరేఖమైనదై కర్మను నాశనము చేయునదై ఉండును. ఈ మూడవ ఆదాయమునే

దైవజ్ఞానము అంటున్నాము. మొదటి దానికంటే రెండవది ప్రాముఖ్యము కాగ, రెండవదానికంటే మూడవది మరీ

ప్రాముఖ్యమైనది. ధనముకంటే విధి (కర్మ) గొప్పది. విధికంటే జ్ఞానము గొప్పది. హిందీభాషలోను సంస్కృత

భాషలోను “స” అనగా భక్తి, జ్ఞానము అను వివరము గలదు. సంత్ అనగా భక్తులు, జ్ఞానులు అనడము కూడ కలదు.

మంచిని, గొప్పతనమును, దైవిక అర్థమును సూచించు “స” “ప్ర” ను దైవజ్ఞానమునకు జోడించి

స+ప్ర+ఆదాయము=సాంప్రదాయము అన్నారు. ఒక పనిలో కనిపించని ఆదాయమైన దైవజ్ఞానము ఇమిడియుంటే,

ఆ పనిలోని అర్థమైన ఆదాయము మన తలకెక్కినపుడు అది మామూలు ఆదాయముకాక, కర్మవలె ప్రదాయముకాక,

కర్మకంటే మించిన సాంప్రదాయమగుచున్నది. ఒకపనిలో దైవజ్ఞానము ఇమిడియుండినప్పటికి అందులోని వివరము

మన తలకెక్కనపుడు అది సాంప్రదాయముగ లెక్కించబడదు. ఒక పని దైవజ్ఞాన అర్థముతో కూడకొన్నదని తెలిసి

చేసినపుడు అది సాంప్రదాయమగును.


ఐదవ శాస్త్రమైన జ్యోతిష్యశాస్త్రము ప్రకారము దైవజ్ఞానమునకు అధిపతి చంద్రుడు. అందువలన జ్ఞానచిహ్నముగ

చంద్రున్నే చూపు చున్నాము. కర్మశేషమున్న యోగి ఆ జన్మలో మోక్షము పొందకపోతే మరుజన్మలో చంద్రతేజస్సు కల్గి

పుట్టునని కూడ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము 25వ శ్లోకములో "చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్యనివర్తతే" అని

స్వయాన భగవంతుడే అన్నాడు. దీనినిబట్టి చంద్రగ్రహము జ్ఞాన చిహ్నమైనదని తెలిసి దైవజ్ఞానముగల మనిషిని

చంద్రునితో సమానముగ పోల్చి ఇందువు అనెడివారు. దైవజ్ఞానము గల పనిని ఇందూ సాంప్రదాయము అని కూడ

అనెడివారు. ఏ మతములోనైన దైవజ్ఞానము కలవాడు ఇందువే, దైవజ్ఞానమున్న ఏ కార్యమైన ఇందూసాంప్రదాయమే.

చంద్రబింబము జ్ఞానమునకు చిహ్నముకాగ, నక్షత్రము మోక్షమునకు (దేవునకు) గుర్తని మా రచనలలోని "దేవాలయ

రహస్యములు" అను పుస్తకములో ముందే తెలియజేశాము. అభివృద్ధి చెందుచున్న చంద్రవంకను తలమీద పెట్టుకొన్న

శంకరుడు నా తలలో దైవజ్ఞానము అభివృద్ధి అగుచున్నదని తెలియజేయునట్లు కనిపిస్తున్నది. చంద్రుని వివరము

తెలిసినవాడు కనుక శంకరున్ని ఇందువని, తలమీద అర్థము తెలిసి చంద్రవంకను పెట్టుకొను పనిని చేశాడు కనుక

ఇందూసాంప్రదాయమును ఆచరించి చూపించాడని చెప్పవచ్చును. ఒక చంద్రవంకను పెట్టుకొన్న శంకరున్నే మనము

ఇందువు అన్నపుడు చంద్రవంకను, నక్షత్రమును పెట్టుకొన్న వారిని ఏమనాలి? ఇందువే అనాలి. వారు ఆ పని

అర్థము విలువ తెలిసి చేసితే అది ఇందూసాంప్రదాయమే అని అనాలి. జ్ఞానము వివరములేని పని సాంప్రదాయము

కాదు. ఈ దినము ఇతర మతములలో కూడ కాలి మెట్టెలు, చంద్రవంక, నక్షత్ర పతాకములు ఉండి అక్కడ కూడ

ఇందూసాంప్రదాయముల ఆనవాళ్ళు కనిపిస్తున్నవి. ఆదివారము సెలవు దినము కృతయుగములోనుండి ఆచరణకు

వచ్చిన స్వచ్ఛమైన ఇందూ సాంప్రదాయము. ఈ దినములలో కూడ ఈ దేశములో, విదేశాలలో ఆదివారము సెలవు

దినముగానే ఉంటూ మీ బుద్ధులకు నా విలువ తెలియకుండినప్పటికి నేను సజీవముగానే ఉన్నానని వెక్కిరించుచున్నది.


మా మతము వేరన్నవారిని వదలి ఇందూదేశములో పుట్టి చివరకు హిందువులైపోయిన మీరు కూడ నన్ను గుర్తించలేకపోతే

మిమ్ములను ఏమనాలి అని ప్రశ్నించుచున్నది.


ధర్మములకు గ్లాని ఏర్పడవచ్చునుగాని నాశనము ఏర్పడదను విషయమును గీతలో భగవంతుడే చెప్పాడు.

అందువలన మనకు తెలియకుండినప్పటికి ఇందూసాంప్రదాయములు చెక్కుచెదరకుండ, నాశనము కాకుండ మన

మధ్యలోనే ఉన్నవి. ఇందూసాంప్రదాయములు విదేశాలలో కూడ కనిపిస్తున్నవి. దీనినిబట్టి పూర్వము ఇందూ

సాంప్రదాయములు విశ్వవ్యాప్తమై ఉండెడివని తెలియుచున్నది. ఈనాడు వాటి వివరము తెలిస్తే దేశవిదేశాలలోని

వారంతా ఇందువులే కాగలరు. ఆ రోజు విశ్వ ఇందుత్వము ఏర్పడగలదు. సాంప్రదాయముల వివరము తెలియకపోతే

దేశ ఇందుత్వము కూడ ఏర్పడదని తెలుపుచున్నాము. అందువలన కొందరైన మన మధ్యనగల సాంప్రదాయములను

తెలిసి మొదట ఈ దేశములో ఇందూత్వమును ఏర్పరచితే తర్వాత విశ్వవ్యాప్తముగ దానంతట అదే అవుతుంది. అట్లు

కాకుండ మేము హిందువులమనిన, విశ్వహిందువులమనిన ప్రయోజనముండదు. మనము మొదట ఇందువులుగ

మారి ఇతరులకు నీవు కూడ ఇందువేనను జ్ఞప్తిని కలుగజేస్తే మంచిది. మనము ఇందువులుగ మారుటకు మన

మధ్యలో పూర్వమునుండి అర్ధము లేకుండ ఆచరణలోనున్న పనులను తెలుసుకొందాము. వాటిలోని అర్థము వివరము

తెలుసుకొందాము. ప్రతి ఒక్కరు కనిపించెడి ఆదాయముకంటే కనిపించని ఆదాయమైన సాంప్రదాయమునకు

విలువనివ్వండి. ఇందువులుగ మారుటకు సాంప్రదాయములు ఏమిటో తెలుసుకోండి.



శిశువును చేటలో పెట్టడము.


మనిషి జీవితము పుట్టుకతో మొదలగుచున్నది. పుట్టుకతో మొదలైన జీవితము మరణముతో అంత్యమగుచున్నది.

పుట్టుకతో ప్రారంభమైన ప్రారబ్ధకర్మ మరణముతో ఆ జన్మలో అయిపోవుచున్నది. పుట్టుకలోను, మరణములోను మధ్య

జీవితములోను ఇందూధర్మములు మానవునితో మేళవించి ఉన్నవి. మొదట పుట్టుకలోని విషయమును చూచెదము.

శిశువు పుట్టిన తర్వాత ప్రాణమొచ్చిన వెంటనే, బొడ్డుతాడును కత్తిరించకనే, చేటలో శిశువును పడుకోబెట్టు ఆచరణ

పూర్వము నుండి ఉండెడిది. ఇప్పటికి ఎక్కడైన ఒక శాతము చేటలో పడుకోబెట్టు సాంప్రదాయమున్నదేమో కాని 99

పాల్లు పూర్తి లేకుండ పోయినదని చెప్పవచ్చును. ఆ సాంప్రదాయము ఇపుడున్నట్లు ఎక్కడ తెలియకున్నా పూర్వము

అందరు పుట్టిన బిడ్డను చేటలో పెట్టెడివారు. అట్లు పడకోబెట్టుట వలన చూచువారికి కొంత జ్ఞానము అర్థమగునట్లు

చేశారు. పూర్వము అందరు ఆ పనికి అర్థము తెలిసి తప్పనిసరిగ అట్లు పడుకోబెట్టెడి వారు. చేటలోనే బొడ్డుత్రాడును

కోసెడివారు. బొడ్డుతాడును కోసిన తర్వాత చేటలోనుండి ప్రక్కకు తీసెడివారు. ఆనాటి వారి సాంప్రదాయమునకు

అర్థమేమిటో ఆ కాలమునకు పోయి చూచిన ఈ విధముగ ఉన్నది.


పూర్వము అందరు వారి వారి ఇళ్ళలో చేటను ఉపయోగించెడి వారు. చేట అంటే ఏమిటో కూడ ఈ

కాలములో కొందరికి తెలియకుండ పోయినది. ఇప్పటికి చిన్నచిన్న గ్రామములలో ధాన్యమును శుభ్రపరుచుటకు

చేటను ఉపయోగించుచుందురు. మనము తిను ఆహార ధాన్యములను మొదట చేటలో పోసి ధాన్యములోని పొట్టువగైరా


పోవుటకు చేటతో చెరిగిన తర్వాతనే వంటకు ఉపయోగించుట ఇప్పటికి అక్కడక్కడకలదు. మనము తిని అనుభవించు

ధాన్యము చివరిగ చేటనుండే వంటపాత్రకు పోవుచున్నవి. మనము బ్రతుకుటకు ఆహార ధాన్యము చేటనుండే వచ్చుచున్నవి.

అలాగే ప్రపంచములో జీవితము సాగించుటకు కావలసిన కర్మలు కర్మనిలయము నుండే వచ్చుచున్నవి. ఒక జీవితము

సాగుటకు కర్మలందించు ప్రారబ్ధ నిలయమును బ్రతుకుటకు ఆహారములందించు చేటగపోల్చి నీవు ప్రారబ్ధ కర్మలో

చేరి ఉన్నావని అర్థమొచ్చునట్లు చేటలో శిశువును పడుకోబెట్టెడి వారు. ప్రారబ్ధకర్మలో గుణములు అను పాశము

(త్రాడు) చేత బంధింపబడి ఉన్నావని తెలియునట్లు బొడ్డుతాడు మెడకు చుట్టి లేక మిద పెట్టి చేటలో పడుకోబెట్టెడి

వారు. ఆ దృశ్యమును అక్కడున్న వారందరు చూచునట్లు చేసి తెలియని వారికి పద్ధతి యొక్క అర్థము చెప్పిన తర్వాత

శిశువుకు బొడ్డుత్రాడును కోసి చేటలో నుండి ఎత్తి ప్రక్కన పడుకోబెట్టెడివారు.


గుణములు అను పాశమును జ్ఞానమను కత్తితో తెంచినపుడే కర్మచయము నుండి బయటపడి ముక్తి పొందగలవను

అర్థము తెలియునట్లు శరీరమునకు చుట్టుకొని ఉన్న బొడ్డుతాడును కత్తితో కోసివేసి చేటనుండి శిశువును బయట

పెట్టుచున్నారు. మనిషి పుట్టుకలోనే ఎంతో జ్ఞానమును తెల్పు ఆచరణలను పెట్టిన పెద్దలకు ధన్యవాదములు చెప్పవలసిందే.

చేటను కర్మకూడలిగ, ప్రేగును గుణపాశముగ పోల్చి జ్ఞానఖడ్గముచే గుణములను త్రెంచి కర్మనుండి బయటపడునట్లు

బొడ్డు త్రాడును కత్తితో కోసి చేటనుండి బయటికి తీయడము గొప్ప అర్థముతో కూడుకొన్న సాంప్రదాయము కాదా!

మానవుని పుట్టుకలోనే చేట కర్మయని, ప్రేగు బంధమని తెలిపి ప్రేగుయను బంధమును త్రెంచునట్లు, చేటయను

కర్మనుండి బయటపడునట్లు కూడ తెలియజేశారు.


ఇప్పటికి ఎక్కడైన ఎవరైన కష్టాలు అనుభవించేటపుడు వానిని చూచి ఇదంతయు చేటలో పడినపుడు వ్రాసిన

వ్రాత అని కొందరనడము వింటుంటాము. బైబిలులో కూడ ఏసుప్రభువు గొప్పవాడని ఆయన కర్మను ఆయనే

నిర్ణయించుకొన్నాడని చెప్పుటకు ఒక వాక్యమును ఉపయోగించారు. అది "ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది”

అన్నారు. ఇందూ అనగ జ్ఞానమని అర్థము కదా! ఇందూ సాంప్రదాయమనగా, మానవుడు దేవుని వైపుకు పోవు

మార్గమును సూచించు అర్థముగలదై ఉండును. కావున మనిషి శిశువుగ పుట్టినపుడే కర్మచయమును, గుణములబంధమును,

వాటిని జయించు జ్ఞానమును, ముక్తి పొందడమును తెల్పు ఆచరణకు గుర్తు అయిన “శిశువును చేటలో పెట్టు

సాంప్రదాయము” దాదాపు నశించి పోయినదనియే చెప్పవచ్చును. ఎంతో గొప్ప సాంప్రదాయము పూర్తి నశించిపోకుండ

వెంటనే అందరు అన్ని మతముల వారు చేట సాంప్రదాయమును అనుసరించ వలయునని, తెలియని వారికి చేట

సాంప్రదాయమును గురించి చెప్పవలయునని, అట్లు చేసినపుడే ఇందూ సాంప్రదాయములను కొంతవరకైన ఆచరించి

రక్షించుకొన్న వారమగుదుమని తెలుపుచున్నాము. అర్థములేని పూజలు, వ్యర్థమగు ఖర్చులు మాని ఇందూ

సాంప్రదాయముల వైపు మీ దృష్టిని మరల్చండి.




ఊయలలో పెట్టడము.


శిశువు జన్మించిన తర్వాత మొదట చేటలో పెట్టి, శిశువుకు ఊపిరి వచ్చిన తర్వాత బొడ్డుతాడు కోసి

చేటనుండి బయటకు తీయడము సాంప్రదాయమన్నాము కదా! అలాగే ఒక మంచిరోజుచూచి డోలా రోహణము

చేయించడము కూడ సాంప్రదాయముగ ఉండెడిది. డోలా రోహణము అనగా ఊయల మీద శిశువునుంచడము.

పుట్టిన బిడ్డను ఊయలలో పడుకోబెట్టడము కూడ ఆచారమేనా! అని కొందరు అడుగవచ్చును. ఈ కాలములో బిడ్డ

ఏడ్పును మాన్పించడము కొరకో లేక సుఖముగా నిద్రపోయేదానికొరకో బిడ్డను ఊయలలో పడుకోబెట్టడము జరుగుచున్నది.

మొదట పడుకోబెట్టడము అర్థముతో కూడుకొన్న పనిగ పూర్వముండెడిది. తర్వాత పడుకోబెట్టడము దేనికైనా కావచ్చును.

చేటలో పడుకోబెట్టి, చేటలోనే బొడ్డుకోయడము మనిషి జీవితములో సాంప్రదాయ ముతో కూడుకొన్న మొదటి

ఘట్టముకాగ, ఊయలలో మొదట పడుకోబెట్టడము రెండవ సాంప్రదాయ ఘట్టముగా భావించెడివారు.


కర్మ ఆవరణములోపల ఉన్న విషయము చేట తెలుపగా, బొడ్డుతాడు గుణముల విషయము తెలుపగా,

ప్రేగుబంధమును తెంచి వేయడమును జ్ఞానఖడ్గముతో గుణములను జయించడమని, కర్మ నుండి ముక్తి పొందడమును

చేటనుండి బయటపడడమని చూపిన పెద్దలు రెండవ సాంప్రదాయమయిన ఊయలకుకూడ అర్థము ఏ విధముగా

చెప్పారో చూస్తాము. మానవుని జీవితము జన్మతో మొదలయి, జీవిత అంత్యము ముక్తితో ముగియుచున్నది. అంతవరకు

చావుతో జాగాలు (స్థలము) మారినప్పటికి జీవితమనునది వరుసక్రమముగ ఉండనే ఉన్నది. అందువలన ఒక

పుట్టుకతో మొదలైన జీవితము ఎన్ని శరీరములు మారినప్పటికి ఎడతెరిపిలేనిదై, చివరకు ఒక ముక్తితో అంత్యమై

పోవుచున్నది. జన్మకు, ముక్తికి మధ్యనున్నదంతయు జీవితమనియే చెప్పవచ్చును. జీవుడు పుట్టింది మొదలు

అంత్యమైపోవువరకు గల జీవితములో కష్టాలు, సుఖాలు రెండు వచ్చిపోతుంటాయు. కష్టాలు మనిషికి ఒకరకంగా

అనుభూతిని కలిగిస్తే, సుఖములు దానికి వ్యతిరిక్త దిశలో అనుభూతిని కల్గిస్తాయి. కష్టసుఖములు తూర్పు పడమరలాగ

ఒకదానికొకటి వ్యతిరిక్తమైనవని అందరికి తెలుసు. జీవునికి మోక్షము వచ్చువరకు కష్టసుఖాలు తప్పవని, నేటినుండి

నీ జీవితము ప్రారంభమైనదని, నేటినుండి కష్టసుఖాల మద్య ఊగిసలాడుచుండ వలసిందేనని, జీవిత ఊగిసలాటను

ఊయల రూపములో చూపారు. కష్టసుఖాలలో, మంచి చెడులలో, పాపపుణ్యములలో ఎప్పటికి ఊగిసలాడునదే

జీవితమని చూచువారికి అర్థమగులాగున డోలా రోహనముంచారు. ఊయల ఒకప్రక్కకు ఊగి అక్కడ గమ్యము

దొరకక మరియొక ప్రక్కకు ఊగుచుండును. దిశ, వ్యతిరేఖ దిశలలో ఊగునది ఊయల. అలాగే దశ, వ్యతిరేఖ

దశలతో ఊగిసలాడునది జీవితము. జీవించు జీవితకాలమంతయు ఈ విధముగ ఉండునని తెలియజేయుటకు

బిడ్డను ఊయలలో పెట్టి ఊపి చూపించు కార్యక్రమమును సాంప్రదాయముగ పెద్దలు పెట్టారు. జ్ఞానముతో కూడుకొన్న

అర్థమునిచ్చునవే సాంప్రదాయములు. కావున రెండవ సాంప్రదాయమైన ఊయల ఊగడమును మనుషులు అర్థము

చేసుకొనిన జీవితములో ఉన్నదేదో తెలియగలదు.


జీవితములో కష్టసుఖముల మధ్య ఊగడము తప్ప ఏమిలేదని తెలియుటకు అందరిని పిలిచి, అందరి ముందర

శిశువును ఊయలలో పెట్టి ఊపడము జరుగుచుండెడిది. ఇప్పటికి ఎక్కడయిన నామమాత్రముగ డోలారోహన

దినముండినప్పటికి అర్ధముతో కూడుకొనిలేదు. డబ్బున్న వారు వారి గొప్పతనమును చాటుకొనుటకు వారి సంతానమునకు


డోలారోహనము చేయుచున్నారు తప్ప సాంప్రదాయ పద్ధతిగ చేయడము లేదు. పూర్వము రాజులు మొదలుకొని

బీదవాని వరకు ఈ సాంప్రదాయమును విధిగ అర్థసహితముగ చేసెడివారు. అందువలన పూర్వకాలములో అందరు

ఆధ్యాత్మికచింతన కల్గి ఉండెడివారు. నేడు సాంప్రదాయములు తెలియవు కావున ఆధ్యాత్మిక చింతన గాని, పాప పుణ్య

భీతిగాని ప్రజలలో లేదు. క్రొత్తక్రొత్త గుళ్లు గోపురములు పెరిగి పోవుచున్నను, ఎంతోమంది స్వామిజీలు పుట్టుకు

వస్తున్నను, వాస్తవానికి మానవునికి కావలసిన దైవజ్ఞానము అందడము లేదు. అనేకముగనున్న దైవజ్ఞానయుక్త

సాంప్రదాయములు అడుగంటి పోవుచున్నవి. ఎంతో మంది స్వామిజీలు మనిషి చేత ఉపన్యాసములలో గొప్పవారనిపించు

కొంటున్నప్పటికి పూర్వకాలపు జ్ఞానము మాత్రము చెప్పలేక పోవుచున్నారు. వంద, రెండువందల సంవత్సరముల

క్రిందట పుట్టిన వారు కూడ దేవతలుగ తయారగుచుండగ, యోగములలో అనేక పేర్లు పెట్టబడిన క్రొత్త విధానములెన్నో

వచ్చుచుండగ, మనిషి దేనివైపు పోవాలో అర్థము కాకుండ పోవుచున్నది. ఈ నేపథ్యములో పూర్వకాలపు జ్ఞానమును,

పూర్వకాలము పెద్దలు తెల్పిన సాంప్రదాయములను మనిషి మరచిపోయాడు. ఇప్పటినుండి మనము క్రొత్త దేవతలను

క్రొత్త యోగధ్యాసలను మాని అసలైన దైవజ్ఞానము తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.


ఉపనయనము.


నయనము అనగా కన్ను అని అర్థము. మనిషికి రెండు కళ్ళున్నాయి. రెండిటిని నయనములనియే అంటాము

అయితే ఒక దానిని కూడ ఉపనయనమని అనము. ఉపనయనమనునది కూడ చూపు గల కన్నేగాని ముఖానికున్న

రెండు కన్నులలాంటిది గాదు. ఉప అనగ వేరొకటని అర్థము చేసుకోవలసి ఉన్నది. రెండు కన్నులతో చూచెడి

విషయములన్ని ప్రపంచ విషయములే, రెండు కన్నులతో చూచిన విషయములనే మనస్సు జ్ఞాపకము పెట్టుకొని తిరిగి

వాటిని చూపించుచుండును. నిన్నటిదినము ఒక సినిమా చూచామనుకొనుము. ఆ సినిమాలో కన్నుల ద్వారా చూచిన

దృశ్యములు కొన్ని మనస్సుకు హత్తుకొని ఉండును. రెండవ రోజు ఇంటిలో కూర్చొని ఉన్నప్పటికి సినిమా జ్ఞాపకము

వచ్చిన వెంటనే చూచిన దృశ్యములు కనిపించినట్లే తెలియుచున్నది. ఈ విధముగ రెండు కన్నుల ద్వార చూచిన

విషయములు మనోజ్ఞప్తి ద్వార తిరిగి చూడడము కూడ జరుగుచున్నది. అలా చూచిన విషయము గాని, విన్న

విషయము గాని, తిన్న పదార్థ రుచి గాని, తిరిగి మనో నేత్రము ద్వార చూపబడుచున్నది. అలా మనోనేత్రము ద్వార

చూడడమును మూడవ కన్నుతో చూడడమని అనుచుందురు. ఒక విషయము చూచినట్లు జ్ఞప్తికి రావడమును

మనోదృష్ఠితో చూచినట్లు చెప్పుకొనుచుందురు. అలా కన్నులు లేకనే ముందు చూచిన సినిమా దృశ్యమును చూడడమును

మూడవ కన్నుతో చూచినట్లు, మనోనేత్రముతో చూచినట్లు చెప్పుచు, దానినే సూక్ష్మదృష్టి అని కొందరు అనుచుందురు.


కొందరన్నట్లు కన్నులతో చూచిన దృశ్యమును మనోనేత్రముతో చూడడము ఉపనయనముతో చూచినట్లు కాదు.

స్థూలకన్నులతో చూచిన విషయమును తిరిగి మనస్సు ద్వార చూచినప్పటికి అది ఉపనయన చూపుకాదు. మనస్సు

ఉపనయనమను నేత్రము కాదు. మనస్సు ద్వార చూపబడు విషయములు మొదట కన్నులు చూపినవే కావున అవి

కన్నుల దృష్టికి సంబంధించిన విషయములే అగును. మనోనేత్రము ద్వార చూస్తు కన్నులతో చూడనప్పటికి

విషయము కన్నులతో చూచినట్లే లెక్కింప బడుచున్నది. మనోనేత్రమునకు స్వయముగ చూపులేదు. కన్ను, చెవి,



ముక్కు, నాలుక, చర్మములకున్న ఇంద్రియశక్తుల ద్వార తిరిగి మనస్సు చూపగల్గుచున్నది కాని వాస్తవముగ మనస్సుకు

చూపించు శక్తి లేదు. ఒకవేళ స్థూలకన్నులు చూపులేనివైతే, ఏ దృశ్యమును చూడలేనివైతే మనస్సు కూడ చూపులేనిదే

అగును. అలాగే అన్ని అవయవములపట్ల మనస్సుండునని తెలియవలెను. దీనివలన మనస్సు ఇంద్రియ విషయములను

తప్ప ఇతరములను చూపలేదని, అలా చూపుటకు దానికి స్వయముగ చూపులేదని తెలియవలెను.


మనోదృష్ఠి ఇంద్రియదృష్ఠిలాంటిదేనని చెప్పుట వలన, మనస్సుకు స్వయం కన్ను లేని దానివలన మనోదృష్ఠిని

మూడవ చూపని చెప్పవచ్చును గాని, మనోనేత్రమును ఉపనయనమని అనుటకు వీలులేదు. మనోదృష్ఠి పెద్దలకంటే

చిన్నపిల్లలకే ఎక్కువగ ఉండును. ఉదాహరణకు కుటుంబము మొత్తము ఒక సినిమా చూచారనుకొనుము. సినిమాలో

చిన్న దృశ్యము మొదలుకొని అన్ని దృశ్యములు చిన్నపిల్లలకు బాగా జ్ఞాపకమొచ్చును. వారికొచ్చినట్లు పెద్దలకు జ్ఞాపకము

రాదు. అదే పెద్దలకు చిన్నలకువున్న మనోదృష్ఠి యొక్క తేడా అని చెప్పవచ్చును. మనోదృష్ఠి పిల్లలకు చిన్నతనమునుండే

ఉండును. కావున వారికి మనోదృష్ఠి ఇంకొకరు కల్గించనవసరము లేదు. ఉపనయనము వేరు, మనోనేత్రము వేరు.

కావున ఉపనయనము అందరికి అవసరము. మనోనేత్రము మొదటినుండి కల్గి ఉన్నాము, కావున అది ఎవరికి

అవసరము లేదు.


మనోనేత్రము ఉన్నదే కావున అదేమిటో దాని సామత్యమేమిటో అర్థమైనది. ఉపనయనమనగా ఏది? దాని

సామత్యమేమిటన్నది అందరికి ప్రశ్నలాగే ఉండును. కనుక ఉపనయనమనగా ఏమిటో తెలుసుకొందాము. ఉపనయనము

స్థూలమైన రెండు కన్నులకు గాని, మూడవ కన్నయిన మనోనేత్రమునకు గాని సంబంధము లేదు. ఒకటి రెండు

కన్నుల ద్వార స్థూలముగనున్న దృశ్యములను, మూడవ కన్నుద్వార సూక్ష్మముగ అణిగి ఉన్న స్థూల దృశ్యములను

చూడవచ్చును. ఉపనయనము ప్రపంచ ఇంద్రియములకు సంబంధములేని విషయములను చూపగల్గునది. ఐదు

జ్ఞానేంద్రియములకు సంబంధము కల్గిన శబ్ద, రూప, రస, గంధ, స్పర్శల విషయములను చూపునది కాదు. ఉపనయనము

మనము నివశిస్తున్న దేశమును తెలియజేయునది కాదు. దేశము కాని దేశమైన ఉపదేశమును చూపునది ఉపనయనము.

ఉపనయనము ద్వార ఉపదేశమైన ఆత్మస్థలము తెలియబడును. ఉపనయనము ద్వార ఆత్మను అధ్యయనము చేయు

చూపు ఏర్పడును. ఉపనయనము యొక్క చూపు ఆత్మను చూపునది, దానినే ఆత్మజ్ఞాన దృష్ఠి అంటారు. ఆత్మదృష్టి

అయిన ఉపనయనము గురువుల చేతనే కల్గించుకోవాలి. సంపూర్ణ జ్ఞానులైన వారితో ఒక శుభకాలమున జ్ఞానదృష్టిని

కల్గించుకోవడమును ఉపనయనము చేయించుకోవడము అంటారు. మనిషికి కొంతవయస్సు వచ్చిన వెంటనే

ఉపనయనము చేయుట ఇందూసాంప్రదాయములలో మూడవ సాంప్రదాయము. మనిషికి 12 సంవత్సరముల

వయస్సు వచ్చిన తర్వాత బుద్ధికి కొంత బలము చేకూరి ఉండును. కనుక 12 సంవత్సరముల తర్వాత ఎప్పుడయిన

ఉపనయనము చేయించవచ్చును. మొట్టమొదట ఆత్మజ్ఞాన బోధను గురుముఖత బోధించడము చేత ఆ సమయములో

నుండి ఉపనయనము కల్గునని పెద్దలు చెప్పారు. తర్వాత అప్పుడప్పుడు ఆత్మబోధలు తెలుసుకొనుట వలన

ఉపనయనమునకు కొంతకొంత చూపుకల్గించుకొన్నట్లగును. నయనమునకు చూపు ఏర్పడిన తర్వాత చూడవలసినది

ఉపదేశమును. కనుక కొంత జ్ఞానము తెలిసిన వ్యక్తికి ఉపదేశము అవసరము. దృశ్యముకంటే ముందు కన్ను

అవసరము. కావున ఉపదేశముకంటే ముందు ఉపనయనము అవసరము. జ్ఞానబోధల వలన ఉపనయనమును

మొదట పొందవలెను.



మనిషికి 12 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత పూర్వము ఇందూ సాంప్రదాయము ప్రకారము ఒక

శుభముహూర్తమున సోమవార దినమున ఉపనయనము కావించుటకు ఏర్పాటు చేసుకొందురు. నిర్ణయించుకొన్న

దినమున బంధుమిత్రులందరికి ఆహ్వానము పంపి రప్పించుకొని, ఒక గురువు చేత మొట్టమొదటిగ ఆత్మజ్ఞానబోధ

చేయించుదురు. అట్లు మొదటి ఆత్మజ్ఞాన బోధతో ఆ బాలునికి ఉపనయనమేర్పడినట్లు తలచెడివారు. అది ఆనాటి

పూర్వపు ఉపనయన సాంప్రదాయముకాగ, దాని రూపము నేడు వేరు విధముగ మారిపోయినది. కొందరు జంద్యమేసి,

మంత్రము చెప్పి ఉపనయనము చేసామంటున్నారు. కాలక్రమముగ ధర్మము అధర్మముగ మారిపోయినట్లు సాంప్రదాయము

కూడ మారిపోయినది. కొందరైతే చిన్నవయస్సులో జ్ఞానమా అని సాంప్రదాయమునే మరచిపోయారు. ప్రపంచ

చదువులు తప్ప పరమాత్మ చదువు ఏమిటో తెలియని స్థితిలో కొందరు తమ పిల్లలను పెంచుతున్నారు. యాభైసంవత్సరములు

నిండినప్పటికైన వారికి జ్ఞానమును గురించి గుర్తుచేస్తే ఇప్పుడే ఎందుకు పూర్తి ముసలివాడయ్యాక అపుడు చూస్తాము

అనే వారు గలరు. ఎంత వయస్సు వచ్చినప్పటికి ప్రపంచసంబంధము కానటువంటి ఉపనయనమును తెలియక

అజ్ఞాన గ్రుడ్డితనములో మునిగి పోవుచున్నారు. గ్రుడ్డితనము పోయి జ్ఞానదృష్ఠి కలగాలంటే మొదటి ఉపనయనమనబడు

కన్ను అవసరము. తర్వాత శ్రద్ధను బట్టి చూపును మెరుగు పరుచుకోవచ్చును.


ఇందూ సాంప్రదాయములలో ముఖ్యమైనది ఉపనయన కార్యక్రమము. పూర్వము ఉపనయనము చేయనిదే

తమ పిల్లలకు వివాహము చేసెడి వారు కాదు. ఆ పద్ధతి బ్రాహ్మణ, వైశ్య మొదలగు కులములలో ఇప్పటికి ఉన్నప్పటికి

కొంత సాంప్రదాయ పద్ధతిగ లేదనియే చెప్పవచ్చును. ఉపనయనమునకు మూలము ఆత్మజ్ఞానమే కావున ఆత్మజ్ఞానము

తెలుపక మంత్రము చెప్పినా జంధ్యమేసినా ఆ కార్యము ఉపనయనమనిపించుకోదు. ఉపనయనము చేయించుట

ఇందువులకు ముఖ్యమైన ఆచారము. ఇందువులుగనున్న వారంతయు సాంప్రదాయ బద్దమైన ఉపనయనమును కొంత

బుద్ధిగ్రాహితశక్తి పెరిగిన తమ పిల్లలకు చేయించి తీరవలెను. దేవుని జ్ఞానమును పిల్లలకు బోధించడములో క్రైస్తవ,

ఇస్లామ్ మతముల వారే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నది. దేవుని జ్ఞానములో అందరికంటే వెనుకబడిన వారు

హిందువులేనని తెలియుచున్నది. హిందువులలో పెద్దవయస్సు వారు కూడ జ్ఞానమునకు దూరముగ ఉంటూ తమ

పిల్లలను కూడ దూరముగ పెట్టారు. దేవాలయములకు పోయి కోర్కెలు కోరు భక్తి తప్ప జ్ఞానము కల్గు ఆచరణ ఒక్కటి

కూడ లేకుండ పోయినది. వాస్తవము చెప్పుచున్నానని బాధపడక ఇప్పటికయిన కొంతకాలముండి పోవు జీవితము

మీద దృష్టి పెట్టక అంతో ఇంతో దైవజ్ఞానము మీద కూడ దృష్టి పెట్టవలెనని కోరుచున్నాము. ఇందూ సాంప్రదాయములు

దైవసారాంశము కల్గినవని మిగతవారు కూడ తెలియునట్లు ఆచరించవలెను. సారములేని ఆహారము, దైవజ్ఞానములేని

జీవితము నిరర్థకమను పెద్దల వాక్యమును జ్ఞాపకము పెట్టుకొని జ్ఞానము కల్గిన జీవితమును సాగించవలెను.


ఉపదేశము.


మానవ జీవితములో అత్యంత శ్రేష్ఠమైన సాంప్రదాయము ఉపదేశము పొందడము. ఇందూ సాంప్రదాయములలో

నాల్గవదియైన ఉపదేశము తప్పనిసరిగ ఉపనయనము పొందినవారే పొందవలసి ఉన్నది. కన్నులేనిదే చూపులేనట్లు

ఉపనయనము లేనిదే ఉపదేశముండదు. ఉపదేశమనగా మనకు ప్రక్కనున్న దేశమని, ఇంతవరకు మనము చూడని


కనిపించని ప్రదేశమని అర్ధము. ఉపదేశము చూచుటకు పొందుటకు తప్పనిసరిగ దానిని చూడకల్గిన కన్ను కావాలి.

ఆ కన్నునే ఉపనయనము అంటాము. ఉపనయనము కొంత యుక్తవయస్సు వచ్చిన తర్వాత పొంది, క్రమేపి చూపును

అభివృద్ధి చేసుకొని ఒకప్పుడు గురువు ద్వార ఉపదేశమును చూడవలసి (పొందవలసి ఉంటుంది. ఈ కాలమున

ఉపనయనమే తెలియకుండ పోయినది, కావున ఉపదేశము ఏమాత్రము తెలియడము లేదు. కొందరు మేము

మాగురువు దగ్గర ఉపదేశము పొందినామని చెప్పవచ్చును. కొందరు శిష్యులు మాగురువు వద్ద నుండి ఉపదేశమును

ఇప్పించుకొని వచ్చామని కూడ చెప్పవచ్చును. శిష్యులను వారు ఈ విధముగ చెప్పుచుండగ గురువులనువారు ఎవరు

వచ్చిన, ఎప్పుడు వచ్చిన ఉపదేశమిచ్చుటకు తయారుగ ఉన్నారు. ఈ పద్ధతులన్ని చూస్తుంటే ఇందూ సాంప్రదాయములు

ఎంత క్షీణస్థితికి చేరిపోయాయో అర్థమగుచున్నది.


పూర్వపు ఆచారము ప్రకారము ఉపనయనమువలె ఉపదేశమును కూడ పెళ్లి కాక మునుపే పొందవలసియున్నది.

ఉపనయనము లేనివానికి వివాహమునకు పిల్లనిచ్చెడివారు కాదు. ఈ కాలములో మహ్మదీయ మతములో ఖురాన్

చదవని ఆడపిల్లను నిఖా చేసుకోనట్లు పూర్వము ఉపనయనము ఉపదేశము పొందని వానికి తమ ఆడకూతురు

నిచ్చెడివారు లేకుండిరి. అందువలన యుక్తవయస్సు వచ్చేటప్పటికే ఇందూ సాంప్రదాయములలో మూడవదైన

ఉపనయనము, నాల్గవదైన ఉపదేశమును యువకులు తప్పనిసరిగా పొందెడివారు. గురువు ద్వారా మొట్టమొదటి

జ్ఞానబోధతో ఉపనయనము ఏర్పరుచుకోవచ్చునని తెలుసు కొన్నాము. తర్వాత ఉపదేశము ఎలా పొందాలో

తెలుసుకొందాము. ఉపనయనము పొందిన తర్వాత వాని శ్రద్ధనుబట్టి వాడు ఉపదేశమునకు అర్హుడు కావచ్చును.

శ్రద్ధ ఎంత ఎక్కువగ ఉంటే అంత తొందరగ ఉపదేశమును పొందవచ్చును. ఉపనయనమునకు బుద్ధి గ్రాహ్యతశక్తి

ఎట్లు అవసరమో అట్లే ఉపదేశమునకు శ్రద్ధాశక్తి అవసరము. బుద్ధి గ్రాహ్యతతో ఉపనయనమునకు చూపు బాగా

కల్గునట్లు చేసుకొన్న తర్వాత ఆ చూపు ద్వార చూడవలసినది ఉపదేశమునే. అందువలన ఒక అనుకూలమైన

మంగళవార దినమున శుభముహుర్తమును చూచుకొని జ్ఞానమును బోధించి ఉపనయనము చేయించిన గురువు చేత

ఉపదేశము కావించుకొందురు. ఉపదేశమనగా గురువుగారి చేత జ్ఞానశక్తిని లేక జ్ఞానాగ్నిని దానము చేయించుకోవడము.

అంతవరకు జ్ఞానమును బోధించి ఉపనయనమునకు చూపు తెప్పించిన గురువు ఉపదేశదినమున తనలోని జ్ఞానాగ్నిని

శిష్యునిలోనికి ప్రవేశింపజేయును. అంతవరకు జ్ఞానము దానము చేసిన గురువు జ్ఞానాగ్నిని దానము చేయడమును

నిజమైన ఉపదేశమంటాము.


ఉపనయనమనగా ప్రత్యేకమైన చూపుకలదన్నపుడు, ఉపదేశము జరిగినపుడు శిష్యునికి ఏమి కనిపిస్తుందని

కొందరడుగవచ్చును. దానికి సమాధానము ఏమనగా! ఉపదేశము పొందిన సమయమున ప్రత్యేకముగ కనిపించునదేమి

ఉండదు. కన్నుగాని కన్ను జ్ఞాననేత్రము, చూపుకాని చూపు జ్ఞానదృష్టి, దృశ్యము కాని దృశ్యము జ్ఞానశక్తి (జ్ఞానాగ్ని),

దేశము కాని దేశము ఉపదేశము. కావున ఉపదేశము పొందినవానికి కనిపించునదేది ఉండదు. ఉపదేశము పొందినవాడు

తర్వాత గురువు గారు చెప్పినట్లు యోగసాధన చేయవలసియుండును. ఉపదేశము పొందిన తర్వాత యోగసాధన

చేయుట వలన గురువుగారిచ్చిన జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుచుండును. యోగము చేయనివానికి జ్ఞానాగ్ని పెరుగుచుపోదు.

ఉపదేశముతో పొందిన తర్వాత జ్ఞానాగ్ని పెరిగి కర్మలను కట్టెలను కాల్చగల్గు స్థోమత యోగసాధన చేసినపుడే కల్గునని

తెలియవలెను. భగవద్గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుని చేత చెప్పబడిన రెండురకముల యజ్ఞములలో జ్ఞానయజ్ఞమందు

ఉపయోగపడు అగ్ని జ్ఞానాగ్నియేనని మరువకూడదు. అగ్ని కాని అగ్ని జ్ఞానాగ్ని, కట్టెలు కాని కట్టెలను కర్మ కట్టెలను


కాల్చుట వలన కర్మశేషము లేకుండ పోయిన మానవుడు ముక్తి పొందుచున్నాడు. చివరికి ముక్తి పొందుటకు,

దేవునియందు చేరుటకు ఉపదేశము తప్పని సరిగ అవసరము. అందువలన పూర్వము జ్ఞానము తెలిసిన పెద్దలు

ఉపదేశమును సాంప్రదాయబద్దము చేశారు.


మానవుడు కర్మనుండి విడుదల పొందడానికి పెద్దలు చేసిన ప్రయత్నములే ఇందూసాంప్రదాయములు.

కాలగమనమున సాంప్ర దాయములు మాసిపోయి తెలియకుండ పోవుచున్నవి. కొంత వరకు ఎక్కడయిన సాంప్రదాయ

ఆచరణలుండిన వాటికి అర్థము తెలియడము లేదు. నేటికిని గురువులున్నారు, శిష్యులున్నారు, ఉపదేశ కార్యక్రమములు

ఉన్నవి. అయినప్పటికి ఉపనయనములో జ్ఞానము గాని, ఉపదేశములో జ్ఞానశక్తి గాని లేదు. అట్లే శిష్యులు చేయు

యోగములలో కర్మలు కాలడము లేదు. భగవద్గీతలో దేవుడు చెప్పిన యోగములు రెండిటిని వదలి మానవుడు

క్రొత్తపేర్లు పెట్టుకొని, క్రొత్త యోగములను చేయుచున్నాడు. అటువంటి యోగములు ఎన్ని చేసిన కూలిలేని

పనిలాంటివగును. ఫలితములేని సాధన ఎంత చేసిన ఏమి ప్రయోజనమని తెలియలేకున్నారు. మరియొక విచిత్రమేమంటే

కొంతమంది గురువులు మోక్షమార్గమును చూపునవి యోగములని చెప్పక, ఆరోగ్యసూత్రములను చెప్పుచు దద్ద

దమాది యోగములు చేస్తే రోగములు పోవునని, మూతి మీద ధ్యాస పెట్టుకొంటే రోగాలు రావని, నొప్పులు పోవాలంటే

నొప్పిమీద ధ్యాసపెట్టమని అనేక రకముల ఆరోగ్యయోగములు చెప్పుచున్నారు. దైవము చెప్పిన కర్మనిర్మూలన యోగములు

చెప్పక రోగనిర్మూలన యోగములు చెప్పితే మనుషులు దైవమార్గము వైపు ప్రయాణము చేయగలరా?


ఇందూసాంప్రదాయములనగా ఏమిటి? దైవధర్మములంటే ఏమిటి? అన్న చూపులేనపుడు సాంప్రదాయములు

చెడిపోగలవు, ధర్మములు అధర్మములుగ మారిపోగలవు. ఇపుడు సాంప్రదాయములు తెలియక పోవుట వలన, ధర్మము

అధర్మములుగ మారుటవలన ఎక్కడయిన ఆధ్యాత్మిక ఉపదేశము జరిగితే అది పేరుకు ఉపదేశము కాని వాస్తవానికి

ఉపదేశము కాదు. అటువంటి గురు ఉపదేశములలో అష్టాక్షరి, పంచాక్షరి మంత్రములో, సోహం అను మంత్రమో,

రామ అను మంత్రమో దేనినో ఒక దానిని శిష్యునికి చెవులో బోధించడము జరుగుచున్నది. పూర్వము ఇంద్రియాతీత

జ్ఞానాగ్నిని గురువులు శిష్యులకు దానము చేయగా నేడు ఇంద్రియసంబంధ శబ్దమంత్రములను ఉపదేశమని బోధించడము

దైవమార్గమునకు విరుద్ధము కాదా? దైవమార్గములో, సాంప్రదాయ పద్ధతులలో ఎన్నో విధముల చెడిపోయిన మనము

ఇప్పటికైన జాగ్రత్తపడి మన సాంప్రదాయములేమిటివి ఎంత గొప్పవని ఆలోచించు స్థితికి చేరాలి. కొన ఊపిరితోనున్న

ఇందూ సాంప్రదాయములను తిరిగి ఆచరించుటకు ప్రయత్నించాలి. అలా చేయగల్గినపుడు పెద్దలు మనకోసము

చేసిన ప్రయత్నము నెరవేరినట్లగును. మనము కూడ దైవమార్గమును అనుసరించి చివరికి మోక్షమును పొందవచ్చును.

కావున నీవు చిన్నవాడివైతే ఉపనయనము ఉపదేశము పొందుము. పెద్దవాడివైతే నీ పిల్లలకైన ఉపనయన ఉపదేశములు

సంప్రాప్తమగునట్లు చేయుము.



పెళ్లి - పెళ్లికొడుకు, పెళ్లికూతురు.


పెళ్లి అనుపదము బహుశ అందరికి తెలిసినదే. ప్రతి ఒక్కరి జీవితములో పెళ్లి ఒక రోజు తప్పనిసరిగ

వచ్చునదై అది మరుపురాని పర్వదినముగ మిగిలి ఉండును. పెళ్లి అనునది విశేషమైన అర్థమునిచ్చు కార్యక్రమముగ

మన పెద్దలు తీర్చిదిద్దారు. ముఖ్యముగ చెప్పాలంటే గొప్ప గొప్ప అర్థములను తెలియజేయు కార్యములతో కూడుకొన్న

ప్రత్యేక కార్యక్రమమని చెప్పవచ్చును. ఇందులో ముఖ్యముగ మొదట పెళ్లి కొడుకును, పెళ్లికూతును తయారుచేయు

కార్యమును వివరించు కొందాము. అంతవరకు సాధారణముగవున్న వానిని ప్రత్యేకించి పెళ్లి కొడుకుగా తయారు

చేయుట అందరికి తెలిసినదే. అట్లే సాధారణముగ ఉన్న స్త్రీని కూడ ప్రత్యేకమైన అలంకరణ ఆచారములచే పెళ్లికూతురును

చేయడము కూడ తెలిసిన విషయమే. ఇందులో తెలియనిదేమున్నది అందరికి తెలిసిన విషయమే కదా! అని

అనుకొన్నప్పటికి మనకు తెలియని విషయమెంతో ఉన్నదని చెప్పుకోవచ్చును. మగవారినైతే పెళ్లి కొడుకుగా, ఆడవారినైతే

పెళ్లికూతురుగా చేయడము ఇందూ సాంప్రదాయసిద్ధమైన పని. అలాగే పెళ్లికి సంబంధించిన ప్రతి పని

సాంప్రదాయసిద్ధమైనదే.


సాంప్రదాయము అనగా విశేషమైన అర్ధముతో కూడుకొన్న ధర్మము యొక్క ఆచరణ అని అర్థము. ఇందువుల

సాంప్రదాయము లన్నిటిలో ఏ ధర్మము, ఏ అర్థము ఇమిడి ఉన్నదో తెలియకపోయినపుడు సాంప్రదాయము ఆచరించిన

ఆచరించక పోయిన ఒక్కటే. ముఖ్యముగ అర్థము తెలియనపుడు ఆచరించు సాంప్రదాయములు అధర్మయుక్తమై

పోవుటకు అవకాశము గలదు. పూర్వకాలములోని జ్ఞానులు దైవజ్ఞానముతో కూడుకొన్న ధర్మముల ప్రకారము సృష్టించినవే

సాంప్రదాయములు. ఇపుడు పెళ్లి ఆచరణ యొక్క వివరము తెలుసుకొందాము. తల్లిదండ్రులకు పుట్టిన వారిని

పలానావారి సంతతి అందుము. వీడు ఎవడు అని ఒకనిని గురించి అడిగినపుడు వాడు పలానా వాని కొడుకని

మనము సమాధానమిస్తాము. అలాగే స్త్రీలనైతే పలనా వారి కూతురని కూడ చెప్పెదము. ఉదాహరణకు రామయ్య

కొడుకు, రామయ్య కూతురని ఇద్దరు యువతీ యువకులను గురించి చెప్పా మనుకొనుము. ఆ ఇద్దరిలో ఒకరు

అన్నయితే ఒకరు చెల్లెలై ఉందురు. అలాకాకపోతే ఒకరు అక్కయితే ఒకరు తమ్ముడై ఉంటారు. ఇద్దరికీ ఒకరే తండ్రి

అయినపుడు వారిరువురు సోదరి సోదరులై ఉంటారు. ఇపుడు అసలు విషయానికొస్తాము. పెళ్లి కార్యములో పెళ్లి

కొడుకును, పెళ్లి కూతురును తయారు చేయుట అందరికి తెలిసిన విషయమే. ఒకే పెళ్లికి కూతురు కొడుకు కావడములో

పెళ్లికొడుకు పెళ్లికూతురు సోదరి సోదరుల వరుస కల్గి ఉన్నారని సులభముగ తెలియుచున్నది. రామయ్య కొడుకు,

రామయ్య కూతురని ఇద్దరిని గూర్చి ఎలా చెప్పామో, అలాగే ఇక్కడ పెళ్లికొడుకు పెళ్లికూతురు అంటున్నాము. కావున

పెళ్లి తండ్రికాగ, ఆ తండ్రికి సంతతిగ ఒక యువతి ఒక యువకుడు తయారైనారన్నమాట. అంతవరకు ఎవరికో పుట్టి

విడివిడిగ తండ్రిని కల్గినవారు ఒక దినము ఆ తండ్రి పేరు చెప్పక ప్రత్యేకించి పెళ్లికొడుకు పెళ్లికూతురని చెప్పడము

ఆలోచిస్తే అర్థముకాని విచిత్రమే కదా! అర్థముకానపుడు, వివరము తెలియనపుడు విచిత్రముగానే ఉంటుంది.

అటువంటపుడు ఎన్నో ప్రశ్నలు మనముందు ఉద్భవించగలవు. అవి ఏమనగా! పెళ్లి అనునది ఇద్దరి ఎడల ఒకటే

అయినపుడు, పెళ్లికి ఇద్దరు కొడుకు కూతురైనపుడు అన్న చెల్లెలు వరుసే అగును కదా!. అటువంటపుడు ఇద్దరు

ఒకచోట చేరి సంతానోత్పత్తి చేయమని చెప్పడమేమిటి? అంతవరకు విడిగా ఉన్న వారిని ఆ దినము కొడుకు కూతురని


పెళ్లి చేసి తర్వాత పతి పత్ని అనడమేమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానము వెదకవలసి ఉన్నది. పెళ్లికి

సంబంధించిన ధర్మమేమిటని పెద్దల ద్వార తెలియవలసియున్నది. పూర్వము పెద్దలు తెల్పిన వివరము ఇపుడు

తెలుపువారు కరువైనందున పూర్వమేమి చెప్పారో వివరించి తెలుసుకొందాము.


భూమి మీద పుట్టిన ఆడ మగ ప్రతి మనిషి చిన్నతనమునుండి యుక్తవయస్సు వచ్చువరకు దైవజ్ఞానము

తెలియనివారై వారి ధ్యాసయంతయు చదువుల మీద, ఆటల మీద ఉంటూ జీవిత గమ్యమిదియని తెలియనివారై

ఉందురు. అటువంటి వారికి వయస్సు వచ్చిన తర్వాత ఒక పురుషునికి ఒక స్త్రీని తోడు చేసి ఆ దినము నుండి

జ్ఞానమార్గమున నడుచుకొనుచు దైవమును తెలియండని తెలియజేయు కార్యమే పెళ్లి కార్యము. ఇంతవరకు పలానా

వారి కొడుకు కూతురనుకొన్న మీరు నిజముగ వారి సంతతికాదని మీ తండ్రి ప్రత్యేకించి ఉన్నాడని, మీకే కాదు మీలాగే

అందరికి ఒకే తండ్రి కలడని తెలుపు అర్థముతో ఇమిడి ఉన్నదే పెళ్లికొడుకు, పెళ్లికూతురును చేయడము. భగవద్గీతయందు

గుణత్రయ విభాగ యోగములో సర్వ జీవులకు తండ్రి నేను తల్లి ప్రకృతి అని భగవంతుడు చెప్పిన ముఖ్యమైన జ్ఞానము

కలదు. అక్కడ దేవుడు తెలియజేసిన ధర్మము అందరికి తెలియుటకు దాని ఆచరణ కార్యరూపములో తెలియజేయాలన్నదే

పెళ్లిలోని పెళ్లికొడుకు పెళ్లికూతురని తెలియాలి. అందరికి తండ్రి పరమాత్మ, దాని అర్థమే ఆచరణలో "పెళ్లి” అను

పదము ఇద్దరికి తండ్రియైనది.


సర్వ ప్రపంచమును సృష్టించినవాడై, అన్ని మతములకు అధిపతియై అంతట అందరిలో వ్యాపించి పేరు,

ఆకారములేనివాడైన పరమాత్మ గుర్తింపే “పెళ్లి” పదము. పెళ్లి దైవమని దానికి నేటినుండి మీరు జ్ఞానోదయముతో

కొడుకు కూతురని తెలుసుకొమ్మని తెల్పుటకే పెళ్లికొడుకు, పెళ్లికూతురని పేరు పెట్టారని తెలియాలి. అంతవరకు

అజ్ఞానములో ఉన్నవారు కూడ నాటి నుండి దైవమేమిటని, మేమెవరని, మేమెలా ఉండవలెనని తెలుసు కొనునట్లు

అమర్చబడినదియే పెళ్లి కార్యము.


ఉపనయన ఉపదేశములు పొంది కూడ అజ్ఞానములో మునిగి పోయినవారు, ఒకవేళ అంతవరకు ఉపనయన

ఉపదేశములు పొందని వారు, దేవుని జ్ఞానము ఏమిటో తెలియక అజ్ఞానములో బ్రతుకుచున్న వారు, పెళ్లి దినము

నుండి జ్ఞానపరముగ మారకుండ మేమెవరి సంతతని తెలియకపోతే వాని పెళ్లి నిరర్థకమే. జ్ఞానము తెలియని జీవితము

వ్యర్థమగును. బాల్యము నుండి యవ్వనములో ప్రవేశించిన జీవితమే దైవజ్ఞానము తెలుసుకొనుటకు అర్హత పొందివున్నది.

కావున భూమి మీద పుట్టిన ఆడ మగ ఇద్దరు దైవసంతతని తెలుపు మొదటి జ్ఞాన సందేశమే పెళ్లికొడుకు, పెళ్లికూతురన్న

మాట. జ్ఞానముతో కూడుకొన్న ఎన్నో విషయములు తెలుసుకొనుటకు, జగతియంతా దైవసంతతను విషయములను

తెలుసుకొనుటకు మొదటి దినమే పెళ్లి దినము. ఆ దినమే జీవితములో తెలుసుకోవలసిన మిగత జ్ఞాన సందేశములన్నిటిని

కార్యరూపములుగ ఉంచారు. అందువలన పెళ్లి దినమును సంపూర్ణ జ్ఞానసందేశ దినమని అంటారు. ఆ దినమున

ఆచరించవలసిన వాటిలో కొన్నిటిని క్రింద వ్రాశాము చూడండి.



తోడు పెళ్లికొడుకు.


ఇందూసాంప్రదాయముల ప్రకారము వివాహకార్యములో పెళ్లికొడుకు ప్రక్కన తోడుగ మరియొక వ్యక్తి పెళ్లికొడుకుగ

ఉండును. అతనిని "తోడు పెళ్లికొడుకు" అని పేరు పెట్టి పిలువడము జరుగుచున్నది. వివాహ కార్యములన్నియు

ఆత్మజ్ఞానమునకు సంబంధించినవేనని ముందే ఒక నియమమున్నది. కావున తోడు పెళ్లికొడుకు కూడ ఆత్మజ్ఞానములో

అంతర్భాగమేనని తెలియవలెను. వివాహకార్యములో పెళ్లికొడుకు చేయు పనులన్నిటిని చూస్తు తానేమి చేయక ప్రక్కన

కూర్చొనడమే తోడుపెళ్లి కొడుకు యొక్క పని. పెళ్లికొడుకు చేయుపనులను, అతను పలుకు మాటలను (మంత్రములను)

చూస్తు, వినుచు మౌనముగ ప్రక్కనుండడమే తోడుపెళ్లికొడుకు యొక్క విధానము. అర్థములేని పని పెళ్లి కార్యములో

ఉండదు. కావున తాను కూడ పెళ్లి కొడుకనిపించుకొన్న తోడు పెళ్లి కొడుకు ప్రక్కనుండి ఏ ఒక్క కార్యము చేయక

తటస్థముగ ఉండడమునకు కారణమేమై ఉంటుందో వివరించి చూచుకొందాము.


భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఉదయము మొదలుకొని ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటాడు. ఒక మనిషి

అనగ శరీరముతో సజీవముగ ఉన్నవాడని అర్థము. మనిషిని విభజించితే శరీరము వేరు జీవుడు వేరు. ఒక మనిషి

పనిచేయుచున్నపుడు జీవుడు చేస్తున్నాడా, శరీరము చేస్తున్నదా అని పరిశీలించి చూస్తే శరీరము చేయుచున్నట్లు

కనిపిస్తున్నది. శరీరము చేయుచున్న పనిని జీవుడు గమనిస్తు ఆ పనిని తానే చేయుచున్నట్లు భ్రమించుచున్నాడు తప్ప

తాను ఏమాత్రము చేయలేదు. ఇపుడొక ప్రశ్న రాగలదు అదేమనగా! పనిని శరీరము చేయగలిగినపుడు జీవుడులేని

శరీరము పనిచేయగలదా? అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా జీవుడు లేని శరీరమునకు పని

చేయవలసిన అవసరమే లేదు. జీవుడున్నపుడు మాత్రము శరీరము పని చేయుచున్నది. అట్లని జీవుడు పని చేయలేదు.

అటువంటపుడు శరీరము స్వయముగ పని చేయుచున్నదా అను సంశయము కూడ రాగలదు. దానికి జవాబుగ

శరీరము కూడ స్వయముగ పనిచేయలేదని చెప్పవచ్చును. శరీరము కేవలము పని చేయు పరికరములాంటిదే కాని

స్వతహాగ పని చేయలేదు. శరీరము పనిముట్టులాంటిదైనపుడు, కేవలము జడ పదార్థము మాత్రమే అయినపుడు,

జీవుడు కూడ పని చేయనపుడు జరుగుచున్న పనిని ఎవరు చేయిస్తున్నారన్నది ముఖ్యమైన ప్రశ్నకాగలదు.

శరీరములోని జీవుడు కేవలము కష్టసుఖములను అనుభవించే దానికే ఉన్నపుడు, శరీరములో జరుగుచున్న

పనులకు జీవునియొక్క శక్తి ఏమాత్రము ఉపయోగపడనపుడు, పనులను చేయుటకు జీవునికి శక్తి ఏమాత్రము లేనపుడు,

శరీరము కూడ స్వయముగ పని చేయలేనపుడు, ఇటు జీవుడు కాక, అటు శరీరము కాక మరెవరో ఇంకొకరు పనికి

కారణమని చెప్పవచ్చును. సజీవ శరీరములో ఒకటి జీవుడు, రెండు శరీరము కాక మూడవవాడు అన్ని పనులు

జరుగుటకు శక్తియైనవాడు ఒకడు కలడు. వానినే ఆత్మ అంటున్నాము. ఆత్మ శరీరములో నిక్షిప్తమై ఎవరికి తెలియకుండ

ఉన్నది. కనిపించు శరీరములో కనిపించని ఆత్మ కలదు. కనిపించని ఆత్మ బయట శరీరమును కదిలించి పని

చేయించుచున్నది. శరీరములో చైతన్యశక్తియై ఉండి ఎవరికి తెలియని ఆత్మను తెలియబరచబడు ఉద్ధేశ్యమే

“తోడుపెళ్లికొడుకును” చూపించడము. పెళ్లి అనగ దైవము అనియు, పెళ్లికొడుకు అనగ దేవుని కుమారుడని వివరముగ

తెలుసుకొన్నాము. దేవుడు సర్వ జీవరాశులకు తండ్రియని భగవద్గీత గుణత్రయ విభాగయోగములో నాల్గవశ్లోకమున

"సర్వయోనిషు కౌంతేయ! మూర్తయః సంభవంతియాః, తాసాం బ్రహ్మ మహద్యోని: అహం బీజప్రదః పితా." అని చెప్పాడు. ఏ



యోనిలో పుట్టిన జీవరాసికైన తండ్రి పరమాత్మ, తల్లి ప్రకృతి అని పై శ్లోకములో తెలియుచున్నది. కనిపించు

విశ్వమునంతటిని విభజించి చూచితే ఆత్మలు మూడు, ప్రకృతి ఒకటని తెలియుచున్నది. మూడు ఆత్మలలో పరమాత్మ

తండ్రి స్థానములో ఉండగ ప్రకృతి తల్లి స్థానములో ఉన్నది. మిగత రెండు ఆత్మలలో ఒకటి జీవాత్మకా రెండవది

ఆత్మయై ఉన్నది. జీవాత్మనేమో ప్రకృతి పురుషులకు పుట్టిన కుమారునిగ లెక్కించాము. వివరముగ చెప్పుకొంటే దేవుని

పుత్రునిగ, పెళ్లికొడుకుగ తెలుసుకొన్నాము. జీవాత్మ తర్వాత మిగిలియున్నది ఆత్మ ఒక్కటే. జీవాత్మను పెళ్లికొడుకని

చెప్పితే ఆత్మను ఏమని చెప్పాలో ప్రశ్నించి చూచుకొందాము.


జీవుడు జన్మించుచున్నాడు అంటే ఒక శరీరమును చేరి అందులో నివాసముంటున్నాడు. అట్లు చేరిన

శరీరములో ఎంతకాలముండాలి? ఏమి చేయాలి? ఏమి తినాలి? ఏ ఏ కష్ట సుఖములననుభవించాలి? ఎవరెవరితో

సంబంధపడియుండాలి? ఏఏ ప్రాంతములో ఉండాలి అను మొదలగునవన్నిటికి ఒక వివరణ ఆ జీవునితో పాటు

వచ్చియుండును. అది ఒక లెక్కాచారము మాత్రమే, దానినే “కర్మ" అంటున్నాము. ఆ లెక్కాచారము ప్రకారము

జీవుడు శరీరమును నడుపలేడు, శరీరము స్వయముగ నడువలేదు. శరీరములో జీవుడు శక్తిలేనివాడై తలలో

ఒక్కచోట మాత్రము రవ్వంత గుండ్రని ఆకారముకల్గి ఉన్నాడు. శరీరమునకు కూడ స్వయముగ కదలు శక్తిలేదు.

శరీరము అన్ని పనులు చేయుటకు, కర్మ అనబడు లెక్కాచారము ప్రకారము శరీరము కదలి పని చేయుటకు, శరీరములోపల

ఎక్కడో తలలోగల జీవుడు సుఖములను అనుభవించుటకు ఆత్మకారణమై ఉన్నది. ఆత్మ శక్తి స్వరూపమై శరీరమును

కదలించుచున్నది. అందువలన ఆత్మను చైతన్యశక్తి అంటున్నాము. ఇటు శరీరమునకు అటు జీవునికి ఆధారమైన

ఆత్మ జీవునితోపాటు శరీరములలో ఉంటున్నది. జీవుడు ఎక్కడుండునో ఆత్మ అక్కడుండును. దీనిని బట్టి చూస్తే

జీవుడు లేని శరీరముండవచ్చును కాని ఆత్మలేని జీవుడుండడు. ఒక సజీవ శరీరములో జరుగు పనులన్నియు జీవుని

కొరకు ఆత్మ చేయుచున్నాడు. ఆత్మ చేయుచున్నప్పటికి జీవుని అవసరనిమిత్తము చేయబడు పనులు కావున జీవుడే

చేయుచున్నాడని అందరు అనుకొనుచున్నారు. జీవుడు కూడ తానే చేయుచున్నట్లు తలచుచున్నాడు. ఆత్మ మాత్రము

అన్ని చేయుచున్నను, శరీరమంతా వ్యాపించియున్నను బయటికి మాత్రము ఎవరికి తెలియడములేదు.


అన్ని కదలికలను కర్మప్రకారము కదిలించు ఆత్మ తెలియబడక పోవడము, పనులతో సంబంధములేని జీవాత్మ

తానే పనులు చేయుచున్నట్లు తలువడము, జీవునకున్న అజ్ఞానమేనని చెప్పాలి. జ్ఞానము ప్రకారము మనకు తెలియకుండ

మన ప్రక్కనే ఉన్న ఆత్మయొక్క ఉనికిని తెలుపడమే పెళ్లిలో తోడు పెళ్లికొడుకును ప్రక్కలో పెట్టి చూపడమని తెలియవలెను.

జీవుడులేని దేహముండవచ్చును కాని ఆత్మలేని జీవుడుండడని ముందే చెప్పాము. జీవాత్మ ఆత్మ రెండు జోడు

ఆత్మలుగ ఉన్నాయి. ఒక దానిని వదలి ఒకటి ఉండదు. మరణములో శరీరమును వదలినపుడు, జన్మలో శరీరమును

ధరించినపుడు రెండు ఆత్మలు జోడుగ ప్రయాణిస్తున్నవి. అనుభవించుటకు జీవాత్మ, అనుభవింపజేయుటకు ఆత్మ

శరీరములో ఉన్నవి. అందువలన చావు పుట్టుకలు రెండు జీవాత్మ ఆత్మల చేతనే జరుగుచున్నవి. జీవాత్మ కొరకే

ఆత్మను దేవుడు సృష్టించాడు. సృష్ఠిలోని ప్రతి జీవునికి ఒక ఆత్మను తోడుగ ఉంచాడు. జీవాత్మ ఆత్మలను భగవద్గీతలో

క్షరుడు అక్షరుడన్నారు. క్షరాక్షరులిద్దరు కూటస్థులుగ శరీరములో ఉన్నారని కూడ తెలిపారు. క్షరపురుషుడైన జీవాత్మ,

అక్షర పురుషుడైన ఆత్మ పురుషోత్తముడైన పరమాత్మకు పుట్టిన వారేనని చెప్పవచ్చును. అందువలన జీవాత్మను పెళ్లికొడుకు

అన్నప్పుడు ఆత్మను తోడుపెళ్లికొడుకు అని అనవలసివచ్చినది. జీవాత్మతోపాటు ఆత్మ అంటు ఒకటున్నదని తెలుపు

నిమిత్తమే పెళ్లిలో పెళ్లికొడుకుతో పాటు తోడు పెళ్లికొడుకును ఉంచుతున్నాము.


తోడు పెళ్లికొడుకు లేని పెళ్లి పూర్వము చేసెడి వారుకాదు. పెళ్లి కార్యమంతయు అజ్ఞానులకు జ్ఞానము

తెలుపునిమిత్తము తీర్చిదిద్దబడిన తంతులతో నిండియుండును. కావున శాస్త్రబద్ధముగ ధర్మబద్ధముగ చేయు పెళ్లికార్యములో

పెళ్లికొడుకుతో పాటు తోడుపెళ్లికొడుకు ఉండి తీరవలసిందే. పెళ్లిలో పెళ్లికొడుకు చేతనే కార్యములన్ని చేయించినప్పటికి

వీటన్నిటి వెనుక ఆత్మ ఉన్నదని తెలుపుటకు తోడు పెళ్లికొడుకుగ ఒక వ్యక్తిని చూపించుట ధర్మయుక్తమైన పని. జీవాత్మతో

పాటు పుట్టుచున్నది, జీవాత్మతో పాటు చస్తున్నది. కావున ఆత్మ ఎల్లపుడు తోడుగనున్నదని తెల్పుటకు “తోడు” అని

చెప్పడము జరిగినది. పరమాత్మ చేత జీవునితో పాటు ఆత్మ పుట్టింపబడినది కావున దేవునికి జీవాత్మ, ఆత్మ ఇద్దరు

కుమారులేనని చెప్పవచ్చును. దీనిని బట్టి జీవాత్మ పెళ్లి కొడుకు అయినపుడు ఆత్మ కూడ పెళ్లి కొడుకే అగును. కావున

ఆత్మను తోడు పెళ్లికొడుకు అని అనుచున్నాము. జీవాత్మ ఆత్మల ఉనికిని తెల్పుటకు జీవాత్మను పెళ్లికొడుకని చెప్పుచు

ఒక మనిషిని, ఆత్మను తోడు పెళ్లికొడుకని రెండవ మనిషిని వివాహకార్యములో చూపుచున్నాము.


ఖడ్గం.


ఏ దినమైతే పెళ్లికొడుకును చేసి నీవు దైవపుత్రుడని తెల్పుచున్నారో ఆ దినము నుండి నీవు ప్రత్యేకించి ఒకరితో

యుద్ధము చేయవలెనని తెలియునట్లు ఖడ్గము చేతికిస్తున్నారు. అజ్ఞానమునుండి దైవమార్గమున ప్రవేశించినవారు

మాయతో పోరాడవలసియున్నదని, నాటినుండి మాయయే నీకు పెద్ద శత్రువని, అది అనేక రూపములతో ఉండునని,

దానితో పోరాడి జయించుటకు ఎల్లపుడు సైనికునిగ ఉండవలెనని బోధించి అదే అర్థమిచ్చునట్లు పెళ్లికొడుకుకు

ఖడ్గమిచ్చారు. పూర్వకాలము పెద్ద ఖడ్గమిచ్చి సైనికునిగ కన్పించునట్లు పెద్దలు చేయగ కాలక్రమమున మార్పు

చెందుచు వచ్చి ఈనాడు చిన్నకత్తి చేతికిస్తున్నారు. ఆ సాంప్రదాయము పూర్తిగ మాసిపోకుండ కొద్దిగ చిన్నకత్తివరకైన

మిగిలి ఉండినందుకు మనము సంతోషించాలి. పూర్వకాలములో ఆచరణకు అర్థము తెలిసి చేసెడివారు. నేడు

అర్థము మారిపోయినది. ఆచరణ మాత్రము కొద్దిగ మిగిలి ఉంది. ప్రత్యేకించి పసుపు గుడ్డలు తొడిగి పసుపు

పూసుకొని నేను పవిత్రుడనన్నట్లు కనిపించు పెళ్లి కొడుకైనను తనకు తానుగ నేను ఎవరి కొడుకును, నాకు గల

పవిత్రత ఏమిటని యోచించడము లేదు. అట్లే చిన్నకత్తిని చేతబూనిన పెళ్లికొడుకు నేను ఎవరి మీద యుద్ధము

చేయాలని అనుకోవడము లేదు. ఈ విధముగ నేటి నుండి అర్థరహితులుకాక, అర్థసహితులై ఆచరణను అర్థముతో

పూరించండి. ఈ విషయమును తెలిసిన మీరు పెళ్లి దినమున పెళ్లి కొడుకుకు, పెళ్లికూతురుకు తండ్రియైన పరమపిత

ఒకడేనని తెలియజేయండి. అట్లే పెళ్లికొడుకుకు బాహ్యముగ కత్తినివ్వడమేకాక అంతరంగములో జ్ఞానమను పెద్ద

ఖడ్గమునిచ్చి అతనిని మాయతో పోరాడే సైనికునిగా తీర్చిదిద్దండి.


భాషింగము.


పెళ్లికొడుకును గాని, పెళ్లికూతురును గాని చేసిన వెంటనే వారి తలకు నుదుటి భాగములో బియ్యముతో

కూర్చబడిన భాషింగములు కట్టు ఆనవాయితి గలదు. కాలక్రమేపి వాటిలో కూడ మార్పు వచ్చి ఈ కాలములో

భాషింగములు బియ్యముతో తయారు చేసినవి కాక వేరు విధములుగ కూడ తయారైనవి. వాటిలో కొంత మార్పు

వచ్చినప్పటికి కొన్ని చోట్లయిన బియ్యముతో చేసిన భాషింగములుండుట సంతోషము. ఇట్టి స్థితిలో వాటిని గూర్చి

తెలుసుకోవడము అవసరము. పూర్వము ఏ ఉద్దేశ్యముతో భాషింగములను పెద్దలు పెట్టారనగా!


మన శరీరములో ఏడు ముఖ్యమైన నాడీకేంద్రములు గలవు. అవి వెన్నెముక క్రింది భాగము నుండి శిరస్సు

వరకు వెన్నెముక ద్వార వ్యాపించిన నరమునందు గలవు. బ్రహ్మనాడి అనబడు ఆ నాడిలో పైనుండు రెండు

కేంద్రములు చాలా ప్రశస్తమైనవి. కనుబొమల మధ్యనగల నాడీకేంద్రమును భ్రూమధ్య స్థానమని, అలాగే చివర

పైనుండు కేంద్రమును సహస్రారమని ఆధ్యాత్మికములో చెప్పబడుచున్నవి. జ్ఞానదృష్ఠి కల్గుటకు భ్రూమధ్య స్థానము,

జ్ఞానము మరియు జ్ఞానశక్తి నిలువ ఉండుటకు సహస్రారము యోగ్యత కల్గియున్నవి. కనుబొమల మధ్యగల నాడీకేంద్రము

జ్ఞానదృష్టికి కేంద్రమై ఉండగ, భూమి మీద ధాన్యములలో బియ్యము జ్ఞానమునకు గుర్తింపు కల్గినవై జ్ఞానచిహ్నములై

ఉన్నవి. జ్యోతిష్య శాస్త్రరీత్య జ్ఞానమునకు అధిపతి చంద్రుడు, చంద్రుని ధాన్యము బియ్యము. చంద్రున్ని మరియు

బియ్యమును జ్ఞానచిహ్నములుగ ఆధ్యాత్మికములో కూడ చెప్పుచుందుము. ఇక్కడ భాషింగములుగ బియ్యమును పేర్చి

కట్టడము గమనార్హము.


జీవితములో యుక్తవయస్సు వచ్చువరకు జ్ఞానదృష్టిలేని యువత ఉపనయన ఉపదేశములు పొందకుండిన, ఆ

పెళ్లిరోజు నుండి జ్ఞానదృష్ఠి కల్గియుండవలెనని సూచన చేయుచు బియ్యముతో తయారు చేసిన అదియు వడ్లనుండి

చేతితో వలచిన బియ్యముతో తయారు చేసిన భాషింగమునే కట్టెడివారు. చేతితో వడికిన నూలుతో మూడు వరుసలుగ

బియ్యమును పేర్చి కట్టిన వాటినే పూర్వము వధూవరులకు నుదుటి మీద భ్రూమధ్య స్థానమునకు దగ్గరగ కట్టెడివారు.

పెళ్లిరోజు నుండి జ్ఞానదృష్టి కల్గి ఉండవలెనని జ్ఞానమును కొంత బోధించి భాషింగము ధరింప చేసెడివారు. జ్ఞాననేత్రము

ప్రకాశించు స్థానమున ధరింప చేయునది కావున దానినే ప్రకాశ నేత్రమనెడి వారు. పూర్వము సత్ సాంప్రదాయరీత్య

దానినే ప్రకాశాంగమనెడివారు చివరకది భాషింగముగ మిగిలియున్నది. భాషించునది కావున భాషింగమని కూడ

చెప్పుచున్నారు. రూపులోను, పేరులోను కొంత మారి ఉన్నప్పటికి సాంప్రదాయ గుర్తుగ మిగిలి ఉన్నందుకు మనము

సంతోషించాలి. అంతటితో తృప్తిపడక సాంప్రదాయరీత్య ఇకనుండి బియ్యమునే భాషింగములుగ వాడుటకు

ప్రయత్నిద్దాము. పూర్వకాల ధర్మాన్ని ఆచరిద్దాము. జ్ఞాననేత్రము కల్గియుందాము.



బుగ్గ బొట్టు (చుక్కబొట్టు).


పెళ్లికార్యములో పెళ్లికూతురు పెళ్లికొడుకుల ముఖము యొక్క బుగ్గమీద నల్లని చుక్కబొట్టును పెట్టుచుందురు.

దాని వివరము తెలియకుండినప్పటికి అలా పెట్టడము అలవాటైపోయినది. బుగ్గమీద బొట్టును ఈ కాలములో

జిష్టిబొట్టు అని  దానిని పెట్టుట వలన వధూ వరులకు ఎవరి దృష్ఠి తగలదని కూడ కొందరు చెప్పుచుందురు.

అందువలన దీనిని దృష్ఠిబొట్టు అని కొందరు, జిష్ఠిబొట్టు అని కొందరు అనుచుందురు. ఈ కాలములో బుగ్గమీద

బొట్టును గురించి ఎవరేమను కొన్నప్పటికి అది పూర్వము నుండి వచ్చు ఆచారమేనని చెప్పవచ్చును. పూర్వము దీనిని

దృష్ఠిబొట్టు అనికాని, జిష్ఠిబొట్టు అనికాని అనెడివారు కాదు. పూర్వము అర్థముతో కూడుకొన్న విధానము తెల్పుటకు ఆ

విధముగ బుగ్గమీద బొట్టునుంచెడివారు. దృష్టిదోషనివారణకు పెట్టెడి బొట్టుకాదు కనుక దానిని దృష్ఠిబొట్టు అనెడివారు

కాదు. పెళ్లి కార్యములన్నియు దైవజ్ఞానమును బోధించునవేనను నియమము ప్రకారము బుగ్గమీద బొట్టు కూడ

జ్ఞానమునకు సంబంధించిన ఆచరణేనని తెలియవలెను. బుగ్గమీద పెట్టు చుక్కబొట్టును చూడడము వలన చూచినవారు

తెలుసుకోవలసిన జ్ఞానమేమో తెలుసుకొందాము.


మనిషి శిశువుగా పుట్టుచున్నాడు. పుట్టిన ప్రతి శిశువును దేవుడు గుర్తు పెట్టుకొనుచున్నాడు. పుట్టిన ప్రతి

శిశువు శరీరము దేవుని నిలయముగ ఉన్నది. శరీరము ప్రకృతి సంబంధమే అయినప్పటికి శరీరములో పరమాత్మ,

ఆత్మ, జీవాత్మ ముగ్గురు ఉన్నారు. పరమాత్మ విశాలమైనవాడైనను శరీరములలో కూడ ఉన్నాడు కావున "మత్ స్థాని

సర్వభూతాని" అని భగవద్గీతలో రాజవిద్యారాజగుహ్య యోగము నాల్గవ శ్లోకములో చెప్పాడు. “మత్" అనగా నాయొక్క

అని, స్థాని అనగ స్థానము అని అర్థము. పరమాత్మ విశాలముగనున్నాడు మరియు అన్ని జీవరాసులు పరమాత్మయందు

గలవు. అట్లే పరమాత్మ అన్ని శరీరములలో కూడ ఉన్నాడు కనుక ఆయన అందరిలోనున్నాడని చెప్పవచ్చును. దీనిని

బట్టి ప్రతి శరీరము దేవుని చేత గుర్తింపబడియున్నదని, ఆయన దృష్టిలో అందరు కలరని చెప్పవచ్చును. ఈ విషయమును

ప్రతి మనిషి గ్రహించునట్లు ప్రతి మనిషి శరీరము మీద పుట్టుకతోనే ఒక “మత్ ”ను ఉంచాడు. కాలక్రమమున

“మత్” అను పదమును “మత్స” అను పదముగ పలుకుచున్నాము. శరీరము మీద నల్లని మత్లాను పుట్టినపుడే

చూడవచ్చును. శరీరము మీద పుట్టుకతోనే ఎక్కడో ఒకచోట ఉన్న “మతౌను పుట్టుమత్స” అని అనుట జరుగుచున్నది.

పుట్టుకతోనే మత్స పుట్టవలసిన అవసరమేముందని ఎవరు ఆలోచించడములేదు. పుట్టుమత్స శరీరము మీద పుట్టుకతో

ఉండడము వలన నీవు పుట్టినపుడే నాచేత గుర్తింపబడి ఉన్నావని దేవుడు తెల్పినట్లు తెలియుచున్నది. ప్రతి ఒక్కరు

దేవుని స్థానమై ఉన్నారని తెలుపబడు గుర్తే “మత్స” అని చెప్పవచ్చును. పుట్టినపుడు పుట్టుమత్సయే కాక తర్వాత జీవిత

కాలములో శరీరము మీద చిన్నచిన్న మత్సలు వస్తుండును. దీనివలన పుట్టినపుడు, పుట్టిన తర్వాత ఎప్పటికి నీ

శరీరము నా ఆధీనములో ఉన్నదని, నీవు నాచేత గుర్తింపబడి ఉన్నావని తెలుపు నిమిత్తమేనని తెలియుచున్నది.


పుట్టిన స్త్రీ శరీరముగాని, పురుషుని శరీరముగాని మత్సలు కల్గియుండి దేవుని ఉనికిని తెలియజేయుచున్నవి.

ఈ విషయమును తెలియజేయు నిమిత్తము పూర్వము దైవజ్ఞానము తెలిసిన పెద్దలు పెళ్లి కార్యములో పెళ్లికూతురు,

పెళ్లికొడుకు యొక్క ముఖము మీద ప్రత్యేకముగ కనిపించునట్లు బుగ్గల మీద నల్లని బొట్టును పెట్టెడివారు. పెళ్లికొడుకుకు

కుడిప్రక్క బుగ్గమీద నల్లని చుక్కబొట్టునుంచగ, పెళ్లికూతురుకు ఎడమ ప్రక్క బుగ్గమీద నల్లని చుక్కబొట్టు పెట్టెడివారు.


శరీరములో కుడివైపు పరమాత్మకు సంబంధించినదని, ఎడమవైపు ప్రకృతికి సంబంధించినదని పెద్దల యొక్క భావము.

అర్థనారీశ్వర ఆకారము కూడ కుడిప్రక్క ఈశ్వరునిగ ఎడమ ప్రక్క పార్వతిగ చిత్రీకరించి చూపడము ఈ అర్థముతోనే

అని తెలియవలెను. బుగ్గమీది నల్లనిబొట్టు పుట్టు మత్సయొక్క నమూనా కొరకు పెట్టినదేనని తెలియవలెను. ఎంతో

దైవజ్ఞానము తెలియు నిమిత్తము పెట్టిన గుర్తుగ ఉన్న మత్సను దృష్ఠిబొట్టు అనికాని, జిష్ఠిబొట్టు అనికాని అనుకోవడము

తప్పు. పూర్వము పెళ్లికార్యములో ప్రతి కార్యమునకు అర్ధము వధూవరులకు తెలియజెప్పెడివారు. అంతవరకు

తెలియని దైవవిషయము ఆ దినమునుండి వధూవరులకు తెలియాలని తప్పనిసరిగ బుగ్గమీద బొట్టునుంచుట

జరుగుచుండెడిది. ఆ ఆచరణ ఈ దినములలో కూడ మిగిలి ఉండినప్పటికి దైవజ్ఞాన విషయము తెలియకుండపోయినది.

ఇప్పటికైన పూర్వము పెద్దలు చెప్పిన ఇందూ సాంప్రదాయముల ప్రకారము అర్థసహితముగ బుగ్గమీద బొట్టుతో పెళ్లిళ్లు

చేసుకోవలయునని తెలుపుచున్నాము.



వడి బియ్యము-ముడి బియ్యము.


పెళ్లికార్యములో పెళ్లికొడుకుకు ముడి బియ్యము, పెళ్లికూతురుకు వడి బియ్యము కట్టెడి సాంప్రదాయము కూడ

పూర్వముండెడిది. పెళ్లి కొడుకుకు భుజము మీద ఒక తుండుగుడ్డ చివరిలో కొన్ని బియ్యమును ముడివేసి ఉంచెడివారు.

పట్టుశాలువలో బియ్యమును ముడివేసి కుడి భుజము పైనుండి వెనుక ఎడమ భుజము క్రింద తీసుకవచ్చి కుడిభుజము

వెనుక వైపు వ్రేలాడునట్లు ఉంచెడివారు. ముందునుండి కుడిభుజము మీద ఎడమ చంకక్రింద తిరిగి కుడిభుజము

విూదికి శాలువ కనిపిస్తుండును. బియ్యము ముడి మాత్రము కుడి భుజము వెనుక వ్రేలాడి ఉండును. అట్లుంచుటవలన

సద్దిమూట వెనకల వేసుకొన్నట్లుండును. "పెద్దలమాట సద్దిమూట" అని పూర్వపు వాక్యము కలదు. పెద్దల మాట

అనగ “తెలిసినవారు చెప్పిన ఆత్మజ్ఞానమని అర్థము”. దైవజ్ఞానమును పెద్దలమాట అనుట సహజము. దైవజ్ఞానమును

పెద్దలైన జ్ఞానుల వద్దనుండి తెలుసుకొని నేను జ్ఞానమును ఎల్లప్పుడు కల్గియున్నానని తెలుపునిమిత్తము ఆ విధముగ

ముడి బియ్యమును పెళ్లి కుమారునికి కట్టెడివారు. మనిషిలోని జ్ఞానము బయటికి కనిపించకుండయుండును. కావున

ఏ మనిషిలో ఎంత జ్ఞానమున్నది చెప్పలేము. చూస్తూనే జ్ఞానము కనిపించదు అందువలన బియ్యమును జ్ఞాన చిహ్నములుగ

చేసి కనిపించకుండ వెనుక ఉండునట్లు ఉంచెడివారు. ఇది పెళ్లి సమయములో పెళ్లికొడుకుకు కట్టు ముడిబియ్యము

యొక్క సాంప్రదాయము. “స” అనగ మంచి జ్ఞానమని, “ద్ది” అనగ బుద్ధి అని, మంచి జ్ఞానముగల బుద్ధిని సద్ది అని

బోధించు జ్ఞానులను పెద్దలని పూర్వమనెడివారు. అందువలన జ్ఞానమును కల్గియుండడమును సద్దిమూట కల్గినవాడని

చెప్పెడివారు. అటువంటి సద్దిమూటకు సమానముగ పిడికెడు బియ్యమును మూటకట్టి పెళ్లి పెద్దలుంచెడివారని

తెలియాలి. దానినే ముడిబియ్యమనెడివారు.


పెళ్లి కూతురుకు కడుపు ముందర బియ్యమును ముడివేసి యుంచుట కూడ కలదు. అలా బియ్యమును

ఉంచడమును వడి బియ్యము అంటారు. బియ్యము అనగానే జ్ఞానచిహ్నములని తెలియుచున్నది. అలా వడిబియ్యమును

పెళ్లికూతురుకు ఉంచడములో పూర్వము జ్ఞానుల ఉద్ధేశ్యమేమో తెలుసుకొందాము. స్త్రీలలో గర్భోత్పత్తికి స్థానము


కడుపు. స్త్రీ కడుపుపండితే పుట్టు సంతతి దైవజ్ఞానము కల్గియుండవలెననే ఉద్ధేశ్యముతో కడుపుస్థానములో బియ్యమును

కట్టెడివారు. బిడ్డ పుట్టితే వడిలో పెట్టుకుంటాము. వడిలో పెరుగు బిడ్డ జ్ఞానమే కల్గియుండునట్లు పెంచుతానని స్త్రీ

తెలుపుచు, నా కడుపు సంతతి జ్ఞానములోనే పెరిగి జ్ఞానమే కల్గియుండునని తెలుపుటకు స్త్రీ వడిబియ్యమును

ధరించుచున్నది. వడి బియ్యములో బియ్యముతో పాటు ఐదు వస్తువులను ఉంచు పద్ధతి కూడ కలదు. పుట్టిన బిడ్డ

మొదట పంచభూతముల విషయములలో పుట్టినప్పటికి, నా వడిలో పెరుగు కొలది ఐదు ప్రపంచ విషయములు

దైవజ్ఞానములో మునిగిపోవునని తెలియునట్లు ఐదు వస్తువులు మునిగిపోవునట్లు బియ్యమును ఎక్కువగ కట్టుచుందురు.

పెళ్లికొడుకుకు పిడికెడు బియ్యము కట్టితే, పెళ్లికూతురుకు ఐదు వస్తువులు మునిగిపోవునట్లు ఎక్కువ బియ్యమును

కట్టుట ఆచారము కలదు. వడి బియ్యము కట్టుట, వడి బియ్యములో చిన్న చిన్నవిగనున్న ఐదు వస్తువులుంచుట

ఇప్పటికి ఉన్నప్పటికి వాటి అర్థము తెలియదు. వడి బియ్యము యొక్క అర్థము ఏనాడో తెలియకుండ పోయినప్పటికి

వడి బియ్యమును స్త్రీలకు పెళ్లిలోను భర్త ఇంటికి పంపునపుడు కడుపుముందర కట్టుట ఇప్పటికి కలదు. పురుషులకు

పెళ్లి సమయములో కట్టు ముడి బియ్యము యొక్క అర్థము వివరము తెలియకుండ పోయినది. అర్థము

తెలియకుండినప్పటికీ వడి బియ్యము కట్టుట ఇప్పటికి కలదు. ముడి బియ్యము యొక్క ఆచారము ఇప్పుడు కొన్ని చోట్ల

లేదనియే చెప్పవచ్చును. పెళ్లి అంటే దేవుడని, బియ్యమంటే జ్ఞానమని తెలియక పోవడము వలన నేడు పెళ్లి

కార్యములన్నియు అజ్ఞానముతోనే కూడుకొన్నవిగ ఉన్నవి. ఇప్పటికైన పెళ్లి కార్యమంటే దైవత్వమును తెలియజేయు

కార్యముగ భావించి చేసుకొంటే సరియైన ఇందూసాంప్రదాయములను అనుసరించిన వారమౌతాము. నిజమైన

ఆలుమగలవుతాము. అర్థము తెలిసి చేసుకోని పెళ్లి భూటకపు పెళ్లి అవుతుంది, వారు నాటకపు భార్యాభర్తలవుతారు.


కాలి మెట్టెలు.


పుట్టినిల్లు మెట్టినిల్లు స్త్రీలకు మాత్రము గలవు. పురుషునికి పుట్టినిల్లు మాత్రము కలదు. పురుషుడైన

పరమాత్మ ఎప్పటికి ఒకే విధముగ మార్పుచెందనివాడుగ ఉండునని తెలియుటకు పరమాత్మకు గుర్తుగనున్న పురుషునికి

పుట్టినిల్లు మాత్రముండునని తెలిపారు. స్త్రీ అయిన ప్రకృతి ఎప్పటికి ఒకే విధముగ ఉండదని, పుట్టిన తర్వాత మార్పు

చెందుచుండునని తెలియునట్లు ప్రకృతికి గుర్తుగనున్న స్త్రీకి మెట్టినిల్లు కూడ కలదని పెద్దలు తెలిపారు. పుట్టుటకు

గిట్టుటకు మధ్యలో మెట్టుట కూడ కలదు. మెట్టుట అనగ జీవితమును సాగించుట అని అర్థము. ప్రకృతి వలననే

జీవులు జీవిత విధానమును సాగించుచున్నవి. అందువలన మెట్టినిల్లు కలది స్త్రీ అని చెప్పుచువచ్చారు. దీనివలన

పురుషతత్త్వమైన పరమాత్మను (దేవున్ని), స్త్రీతత్త్వమైన ప్రకృతిని తెలియుదురని అలా తెల్పుచువచ్చారు.

పెళ్లి తర్వాత పుట్టినింటిలో కొడుకు కొడుకుగానే ఉంటాడు, ఇంటికి వచ్చిన అమ్మాయి మాత్రము కోడలు

అను కొత్తపేరు కల్గియుంటుంది. పెళ్లిలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు అని పేరు కల్గినవారు పెళ్లి తర్వాత పెళ్లికొడుకు

కొడుకుగ మిగిలిపోవడము, పెళ్లికూతురు మాత్రము కోడలుగ మార్పుచెందడములో ఏదో విశేషత కలదనియే చెప్పవచ్చును.

అది ఏమనగా! కొడుకు, కోడలు అను పదములే ఎంతో ప్రత్యేకమైన అర్థముతో కూడుకొన్నవి. కొడుకు ఏకవచనముతో

కూడుకొన్నది. కోడలు బహువచనముతో కూడుకొన్నది. ఆధ్యాత్మిక అర్థము ప్రకారము కొడుకు పరమాత్మ అంశ,



కోడలు ప్రకృతి అంశ అని చెప్పవచ్చును. దాని ప్రకారము కొడుకు ఏకవచనముతో చెప్పబడు పరమాత్మ అంశయిన

జీవాత్మకాగ, కోడలు బహువచనముతో చెప్పబడు ప్రకృతి అంశయిన గుణములని అర్ధము. గుణములకు, జీవునికి

ప్రతీకగ కోడలు, కొడుకు అనుట జరిగెడిది. శరీరములోని గుణములతో జీవుడు కలసిపోతున్నాడు కావున

కలిసిపోవువానిని లేక కూడిపోవువానిని ఏకవచనముతో కొడుకు అని అనుచున్నారు. అలాగే గుణములు జీవున్ని

తనలో కలుపుకొనుచున్నవి. కావున జీవున్ని కలుపుకొను గుణములను బహువచనముతో కోడలు అన్నారు. కొడుకు

అనగ కూడువాడు, కోడలు అనగ కూడబడునదని అర్థము. కూడువాడు జీవుడు, కూడబడునవి గుణములు అని

జ్ఞానరీత్య అర్థము.


శరీరములో జీవించువాడు జీవుడు అయితే జీవితమును కార్య రూపములో సాగింపజేయునవి గుణములు.

గుణములకు అనగ ప్రకృతికి మారు పేరైన స్త్రీకి మెట్టినిల్లు కలదని చెప్పుచుందురు. మెట్టినిల్లు అనగ జీవితమును

సాగించునదని అర్థము. దానినే బాహ్యముగ ఒక స్త్రీ పుట్టినింటి నుండి మెట్టినింటికి పోతే గిట్టు వరకు అక్కడే ఉండవలెనని

అనుచుందురు. గిట్టువరకు అనగ మరణించువరకు అని అర్థము. మరణము శ్వాస ఆగిపోయినపుడే వచ్చును.

పంచభూతములలో శ్వాస రెండవది. బ్రతికివున్నపుడు శ్వాస ఆత్మశక్తివలన నడుస్తున్నది. మెట్టినింటిలో ఉన్న స్త్రీ తన

మరణము వరకు తనకు శక్తినిచ్చు ఆత్మను మరువకూడదని పెద్దలు తెలిపెడివారు. జీవుడు జీవితమును గుణములతో

సాగించుటకు శరీరములో ఆత్మశక్తి ఉపయోగపడుచున్నది. ఆత్మ శరీరములో శ్వాసను ఆడించినంత వరకే జీవితము

సాగును. శ్వాస నిలిచిపోతే లోపల గుణములు కూడ నిలిచిపోయినవన్న మాట.


జీవితము నడుచుటకు పంచభూతములు పని చేయుచున్నవి అట్లే శరీరమును నడుపుటకు కాలు పనిచేయుచున్నది.

గడచుచున్న జీవితమునకు పంచభూతములున్నట్లు, నడుచుచున్న కాలికి కూడ ఐదు వ్రేళ్లు గలవు. కాలివ్రేళ్లను

పంచభూతములుగ లెక్కించుకొంటే మొదటి పెద్ద బొటనవ్రేలు ఆకాశముగ, రెండవవ్రేలు గాలిగ, మూడవవ్రేలు

అగ్నిగ, నాల్గవవ్రేలు నీరుగ, ఐదవవ్రేలు భూమిగ గుర్తించుకోవలసి వచ్చును. రెండవవ్రేలు గాలిగ లెక్కింపబడి శరీరములోని

శ్వాసకు (ప్రాణమునకు) గుర్తుగనున్నది. శ్వాసనే ప్రాణము అని కూడ అనుచున్నాము. శరీరములో ప్రాణమున్నంతవరకే

జీవుడుండును. ఆత్మ ఉన్నంతవరకే ప్రాణముండును. ప్రాణము అనగ శ్వాస ఆత్మశక్తివలననే జరుగుచున్నదని

మరువకూడదు. మెట్టినింటిలోనున్న స్త్రీకి గిట్టినిల్లు కూడ అదే కావాలి. కనుక ప్రాణమున్నంతవరకు అక్కడే కోడలు

అను పేరుతో ఉండాలి. గడచుచున్న ప్రకృతి జీవితమును నడుచుచున్న కాలుతో పోల్చినపుడు, కాలివ్రేళ్లను

పంచభూతములుగ పోల్చినపుడు, అందులోని రెండవవ్రేలును ప్రాణముగ పోల్చినపుడు, ఆ ప్రాణము ఆత్మవలననే

జరుగుచున్నదని తెలియుటకు స్త్రీ కాలులోని రెండవవ్రేలికి “మెట్టె” అను పేరుతో ఉంగరములాంటి దానిని ఆత్మకు

గుర్తుగ ఉంచుట జరుగుచున్నది. లోహములలో బంగారును పరమాత్మ గుర్తుగ, వెండిని ఆత్మ గుర్తుగ, రాగిని జీవుని

గుర్తుగ పెద్దలు నిర్ణయము చేసి పరమాత్మ గుర్తయిన తాలిబొట్టును బంగారుతోను, ఆత్మగుర్తయిన మెట్టెలను వెండితోను

చేయించెడివారు. ఈనాటికి అదే పద్ధతి సాగుచున్నప్పటికి వెండి మెట్టెలకు, బంగారు తాలికి అర్థము లేకుండ పోయినదని

చెప్పవచ్చును.


మరణము వచ్చువరకు జీవితమును సాగించవలెనని, జీవితము శ్వాసవలన సాగుచున్నదని, ఆ శ్వాస ఆత్మవలననే

జరుగుచున్నదని తెలియుటకు పెళ్లయిన ప్రతి స్త్రీకి కాలి రెండవవ్రేలికి మెట్టెలుంచడము సాంప్రదాయమైనది. మెట్టెల

సాంప్రదాయము నేటికి మిగిలి ఉన్నందుకు సంతోషము కల్గినా, వాటి వివరము తెలియకపోయినందుకు కొంత


చింతింపవలసిందే. జీవితమును మెట్టె అని, అది ఆత్మమయమై ఆత్మవలనే సాగుచున్నదనుటకు వెండితోనే మెట్టెను

ధరించవలెనని, ఆ మెట్టెలు కూడ కోడలు అను పేరుగాంచిన స్త్రీలే ధరించవలెనని తెలియుట ఆత్మజ్ఞానమే అగును.

పెళ్లి కార్యములలో ఆత్మజ్ఞాన సాంప్రదాయములు పెద్దలు పెట్టగ వాటి అర్థము తెలియక పోయినప్పటికి కొన్ని

ఆచారములు మాత్రము మన మధ్యలో మిగిలి ఉన్నాయి. మెట్టెలు ధరించు ఆచారము ఇటు ఇందూ మతములోనే గాక

అటు క్రిస్టియన్ మతములోను మరియు ఇస్లామ్ మతములోను కూడ భారతదేశములో కనిపిస్తున్నది. ప్రత్యక్షముగ

తెలియక పోయినప్పటికి పరోక్షముగ దేవుని జ్ఞానమును తెలుపు సాంప్రదాయము ఇతర మతములలో కూడ ఉండడము

సంతోషింపదగ్గ విషయము. కొడుకుపోతే కోడలు అన్న పదమునకు అర్థములేదు. కావున భర్త చనిపోయిన భార్యకు

మెట్టెలు తీయించడము జరుగుచున్నది. కొడుకు కోడలు ఆధ్యాత్మికయుక్తమైన పదములు. కావున ఆధ్యాత్మిక అర్థముతోనే

కొడుకు పోయిన తర్వాత మెట్టెలు తీయడము జరుగుచున్నది. మెట్టెలు లేని స్త్రీ భర్తలేని భార్య అన్నట్లు ఆత్మలేని ప్రకృతి

అని తెలియవలెను.


తాలిబొట్టు.


సర్వప్రపంచమును సృష్టించినది పరమాత్మ అయినప్పటికి పరమాత్మ కనిపించడు. సృష్టించబడిన ప్రకృతి

మాత్రము కనిపిస్తున్నది. ప్రకృతి స్వతంత్రముగ కనిపిస్తున్నప్పటికి కనిపించకుండ పరమాత్మ ఆధీనములోనే ఉన్నది.

ప్రకృతిలోని అణువు మొదలుకొని భూగోళము వరకు, సూర్యగోళము మొదలుకొని ఎంతో పెద్దవైన నక్షత్ర సముదాయముల

వరకు తన ఆధీనములో పెట్టుకొని నడుపునది పరమాత్మ. ప్రకృతి స్త్రీతత్త్వముకాగ పరమాత్మ పురుషతత్త్వముగ

ఉన్నది. ఈ రెండు ఉన్నాయని తెలియునట్లే జగతిలో స్త్రీ పురుష శరీరములు తయారైనవి. ప్రకృతి పురుషుల వలననే

జగత్తు తయారగుచున్నదను సిద్ధాంతము ప్రకారమే స్త్రీ పురుషులకు సంతానము కల్గుచున్నది. ఎల్లపుడు ప్రకృతి

పరమాత్మ ఆధీనములో ఉన్నదని తెలుపు నిమిత్తమే పెళ్లిరోజు పురుషుడు స్త్రీ మెడలో ఒక తాడును ముడి వేయుచున్నాడు.

నీవు ప్రకృతివి నేను పురుషుడనను అర్థమిచ్చునట్లు ప్రకృతి అను మూడు అక్షరములకు తగినట్లు తాడుతో మూడు

ముడులు వేయుచున్నారు. గుర్తును బొట్టు అనుట కూడ గలదు. ఆనాటి నుండి స్త్రీ పురుషుని ఆధీనములో ఉండవలెనను

భావము కల్గించునట్లు ఆధీనమునకు గుర్తుగ బంగారపు బొట్టును కట్టుట జరుగుచున్నది. ఆధీనమునకు సూచన

కావున దానిని "ఆలిబొట్టు" అనెడివారు కాలక్రమమున ఆలిబొట్టు తాలిబొట్టుగ మారినదని గ్రహించవలెను. ప్రకృతి

మీద (దేవుని ఆధిక్యతను) పురుషునాధిక్యతను తెలియజేయు గుర్తింపే తాలి కట్టడమని గ్రహించాలి.


ప్రకృతి పురుషుల వివరమును తెలియజేయునది తాలిబొట్టు. పరమాత్మ జ్ఞానము ఇమిడి ఉండుటవలన

తాలిబొట్టును లోహములలో విలువైన పవిత్రమైన బంగారుతోనే తయారు చేయుటకలదు. తాలిబొట్టు గుండ్రని

బంగారురేకుతో తయారుచేసి దానికి మధ్యభాగములో చిన్న గుంతనుంచెడివారు. ఒకప్రక్క గుంతను చేస్తే రెండవప్రక్క

మిట్టగ కనిపించును. సాంప్రదాయపద్ధతిలో తయారుచేయు తాలిబొట్టు ఒకవైపు గుంతగ ఉంటూ ఒకవైపు ఎత్తుగ

ఉండును. ఉబ్బెత్తుగ ఉన్న మిట్ట భాగము పురుషుని గుర్తయిన పరమాత్మ గుర్తని, గుంతగ ఉన్న తగ్గు భాగము స్త్రీ

గుర్తయిన ప్రకృతి గుర్తని పూర్వము పెద్దలు తెలిపెడివారు. పెళ్లికొడుకు పెళ్లికూతురుకు తాలిబొట్టు కట్టినపుడు గుంతభాగము





బయటికి కనిపించునట్లు, మిట్టగనున్న భాగము కనిపించకుండ లోపలి వైపుకు ఉండునట్లు కట్టెడివారు. తాలి.

ధరించినపుడు ఎవరైన తాలిబొట్టును చూస్తే తగ్గుభాగము కనిపిస్తుంది. అట్లు కనిపించుట వలన కనిపించునదంతయు

ప్రకృతియేనని, నీకు ఎదురుగ తెలియున దంతయు ప్రకృతి స్వరూపమేనని తెలియు అర్థమిమిడియున్నది. తాలిబొట్టు

వెనుకవైపు కనిపించని ఎత్తు భాగమున్నది. అట్లు ఎత్తు భాగము కనిపించని దానివలన కనిపించని దైవము ప్రకృతి

వెనుక ఉన్నాడని, ప్రకృతిని దాటితేనే దైవము తెలియునని అర్థమిమిడియున్నది. ఈ విధముగ పెద్దలు ప్రకృతి పరమాత్మల

వివరమును తాలిబొట్టులో ఇనుమడింపజేసి ఉంచారు. ఇందూ ధర్మయుక్తముగ దైవజ్ఞానము ప్రకారము దాదాపు ఒక

ఇంచు వెడల్పు గల బంగారు బిళ్ళమీద మధ్యలో కొంతతగ్గు ఒకవైపు కొంత ఎత్తు ఒకవైపు ఉంచి చేసెడివారు. ఇప్పటి

కాలములో కొన్ని ప్రాంతములలో ఒక బిళ్ళ స్థానములో రెండు బిళ్ళలు కూడ వచ్చాయి. ఈ విధముగ రెండు బిళ్ళలు

ధరించడము సాంప్రదాయ విరుద్దము, ధర్మరహితము అగుచున్నది. కొందరేమో కొంత వెడల్పు బిళ్ళమీద మధ్యలో

గుంతనుంచక మొత్తము బిళ్ళనంతయు గుంతగనుంచుచున్నారు. మరికొందరు మధ్యలో గుంతగల బిళ్ళనే ధరించినప్పటికి

గుంతభాగము లోపలి వైపుకుండునట్లు ధరించు చున్నారు. ఆ విధముగ ధరించడము కూడ జ్ఞానవిరుద్దమగును.

ఎక్కువ బిళ్ళలను ధరించడమును, మిట్టభాగము పైకి కనిపించునట్లు ధరించడము అర్థములేని పని అగుచున్నది.

దానివలన ఇందూసాంప్రదాయములు మరుగున పడిపోయి అజ్ఞానము పెరిగిపోవును. ఆలిబొట్టుకు అర్థము తెలిసి

ధరించడము వలన వారిలో ఇందూత్వము కనిపించును. అట్లు కాకపోయిన పేరు ఇందువైనప్పటికి నిజముగ ఇందువు

కాదు.



అక్షింతలు.


క్షయము అనగా నాశనము అని అర్థము. అక్షయము అనగ నాశనముకానిదని అర్థము. క్షయముకానిది

అక్షయమైనది పరమాత్మ, పరమాత్మ జ్ఞానము అక్షయమైనది. అక్షయమైన జ్ఞానము యొక్క గుర్తింపే బియ్యముతో

తయారు చేసిన అక్షింతలు. అక్షింతలనగ నాశనములేని దైవజ్ఞానముతో కూడుకొన్నవని అర్థము. తాలిబొట్టు కట్టిన

వెంటనే పూర్వకాలము వధూవరులకు అక్షింతలు ఇతరులచే వారి తలల మీద వేయించెడివారు. ఇంతవరకు పెళ్లికొడుకు,

పెళ్లికూతురుగ ఉన్న మీరు ఇప్పటినుండి భార్య భర్తలుగ లేక సతీపతులుగ మారినారని, ఇప్పటినుండి మీరు జ్ఞాన

మార్గములో జ్ఞానాభివృద్ధి చేసుకోవలెనని అక్షింతలు వేసెడివారు. పూర్వ కాలమున జ్ఞాననిష్టాపరులై జ్ఞానశక్తి అను

జ్ఞానాగ్ని కల్గిన యోగులు లేక మహర్షులను పెళ్లి దినము ఆహ్వానించి వారి చేతితో అక్షింతలు వేయించెడివారు.

ఇతరులెవరు వేసెడివారు కాదు. అలా చేయడములో జ్ఞానుల, యోగుల హస్తముల నుండి వేయబడు బియ్యము

అక్షింతలను జ్ఞానశక్తి కల్గినవై సతీపతుల శిరస్సులను తాకి ఆ శక్తి వారి తలయందు ప్రవేశించి అదియే ఉపదేశమగును.

జ్ఞానశక్తి లేక జ్ఞానాగ్నిని దానముగ పొందడమే ఉపదేశమని తెలిసిన పెద్దలు పూర్వకాలము జ్ఞానాగ్ని కల్గిన జ్ఞానులు,

యోగుల చేతనే అక్షింతలు వేయించెడివారు. యోగికి లేక మహర్షికి తప్ప వేరెవరికి అక్షింతలు ఇచ్చెడివారు కారు.

నేటి కాలములో అక్షింతలంటే ఏమిటి? అవి ఎవరి చేత వేయించవలెనని తెలియక, వాటి అర్థము ప్రాముఖ్యత

తెలియనివారమై అందరి చేత వేయిస్తున్నాము. అదియు ఎవరు ఎవరికి వేస్తున్నారో తెలియని స్థితిలో వచ్చిన వారందరి


నెత్తి మీద అక్షింతలు పడుతున్నాయి. ఈ లెక్క ప్రకారము అక్షింతలు వేయు సాంప్రదాయము నేటికి మిగిలి ఉండినప్పటికి

దాని అర్థము నూటికి నూరుపాల్లు పోయినదని తెలియవలెను. ఎక్కడైన గుడి గోపురము మీద లక్ష్మి విష్ణువులకు పెళ్లి

జరుగు సంఘటన బొమ్మలరూపములో ఉండుట చూచి ఉందుము. అక్కడ నారద తుంబురులు మొదలగు వారు

ప్రక్కన నిలబడి ఉండగ, ఒకే ఒక మహర్షి వారికి అక్షింతలు వేయునట్లు చిత్రించి ప్రతిష్ఠించి ఉండినప్పటికి దాని

అర్థము తెలియకుండ పోయినది. పురాతనమున తయారైన దేవాలయముల మీదైన ఒక్కరే అక్షింతలు వేయు

సాంప్రదాయము బొమ్మలరూపములో మిగిలి ఉన్నందుకు సంతోషిస్తాము. అలా అని ఊరకుండక ఇది మన

సాంప్రదాయమని ఇతరులకు తెలిపి ఇందూ ధర్మ ఆచరణ జరుగునట్లు చూస్తాము. జ్ఞానాన్ని కల్గిన యోగుల చేతనే

అక్షింతలు వేయించి అంతవరకు ఉపదేశము లేనివారికి అదే మొదటి ఉపదేశముగా తెలియజేస్తాము. ముందే ఉపనయన

ఉపదేశములు పొందిన వారికి జ్ఞానాభివృద్ధి కలుగునట్లు చేస్తాము.


తలంబరములు.


పెళ్లి వరకు బాధ్యత లేకుండ పెరిగిన యువతీ యువకులకు పెళ్లి నుండి ప్రపంచములో మునిగి ప్రపంచ

ధనమునే సంపాదించుకొంటు బ్రతకమని తెలిపినట్లు అర్థహీనమైన పెళ్లి నేటి కాలములో చేయుచున్నారు. పూర్వకాలమలా

కాక ధర్మయుక్తమైన సాంప్రదాయముల ఆచరణతోనే పెళ్లి చేసెడివారు. పెళ్లి అనునది మహోత్తర జ్ఞానోపదేశముగ

భావించెడి వారు. అక్షింతలనెడి జ్ఞానకిరణములు మహాత్ముల నుండి తమ శిరస్సులను తాకిన తర్వాత, బ్రతికెడి

జీవితకాలమంత జ్ఞాన సముపార్జనములోనే బ్రతుకుచు దాంపత్య జీవితమును గడపమని ఆనాటి పెద్దల సందేశము.

దాంపత్య జీవితములో భార్యకు జ్ఞానము లేకపోతే భర్త అందించాలని, ఒకవేళ భర్తకే జ్ఞానము లేకపోతే భార్య అందించాలని

ఆనాటి పెద్దల సందేశము. భర్త భార్య తలకు జ్ఞానము చేర్చాలని, అట్లే భార్య భర్త తలకు జ్ఞానము చేర్చాలని

చూపించడమే తలంబరములు ఒకరినెత్తిన ఒకరు పోసుకోవడమని తెలియవలెను.


బియ్యము జ్ఞానచిహ్నములని ముందే తెలుసుకొన్నాము. అంబరము అనగ ఆకాశము. తలంబరము అనగ

ఆకాశమునుండి తలకు చేరునదని అర్ధము. జ్ఞానము ఆకాశము నుండి శబ్దరూపముగ చేరుచున్నది. బయలు నుండి

వచ్చు శబ్దము చెవుల ద్వార తలలో చేరుచున్నది. కనుక జ్ఞానమును తలంబరము అన్నారు. భార్య నుండి భర్తకు, భర్త

నుండి భార్యకు జ్ఞానము ప్రాకవలెనని, ఒకరి సహకారముతో ఒకరు ఉపదేశము పొంది తర్వాత జ్ఞానమును

పెంపొందించుకోవాలని తెలియజేయడమే ఒకరి నెత్తిన ఒకరు తలంబరములు పోసుకోవడమని పూర్వీకుల భావము.

ఎంతో పెద్ద అర్థముతో కూడుకొన్న ఆచారము ఈ కాలంలో అర్థహీనమైనప్పటికి ఆ కార్యమైన మిగిలి ఉన్నందుకు

సంతోషిస్తాము. ఇంతటితో సంతోషించి ఊరకుండక ఇది ధర్మయుక్తమైన ఆచరణయని, ఈ ఆచరణ అర్థముతో

కూడుకొన్నపుడే ప్రయోజనమని, అలా చేయలేకపోతే పెళ్లి చిన్న పిల్లలాడుకొను బొమ్మలాటతో సమానమని

గుర్తుంచుకోవాలి.




అరుంధతి నక్షత్రము.


తాలి కట్టిన తర్వాత, మహాత్మునిచే అక్షింతలు వేయించుకొన్న తర్వాత, తలంబరములు శిరస్సుల మీద పోసుకున్న

తర్వాత, చివరిగ అరుంధతి నక్షత్రమును చూపుట కలదు. ఈ ఆచరణ కూడ పెళ్లిలో ముఖ్యమైన చివరి సాంప్రదాయమై

ఉన్నది. దానిని గురించి కొద్దిగ వివరించుకొని చూద్దాము. చంద్రుడు జ్ఞానచిహ్నముకాగ, నక్షత్రము మోక్షచిహ్నమై

ఉన్నది. సూర్యుడు చంద్రుడు మిగిలిన కొన్ని నక్షత్రములు మనకు తూర్పు పడమరలుగ ఉన్నారు. కావున పగలు,

రాత్రిళ్లు కొన్ని కనిపించుట, కొన్ని కనిపించక పోవుట జరుగుచున్నది. ఉత్తర, దక్షిణముల వైపు గల నక్షత్రములు

మాత్రము మనకు ఎల్లపుడు కనిపిస్తూనే ఉన్నవి. అలాగే ఉత్తరము వైపు ఎల్లపుడు కనిపించు నక్షత్రములలో అతి పెద్ద

నక్షత్రము అరుంధతి నక్షత్రము. అది రాత్రింబవళ్ళు ఒకే కోణములో ఉండి కనిపిస్తూనే ఉన్నది. పగలు సూర్యుని

వెలుతురు ముందర అది మన దృష్ఠికి కనిపించక పోయినప్పటికి అరుంధతి నక్షత్రము అహర్నిశలు ఉత్తర కోణములో

ఉన్నది. పూర్వము రాత్రిపూట పెళ్లి జరిగితే నవ దంపతులకు ఆ నక్షత్రమును చూపెడివారు. ఒకవేళ పగలు పూట

పెళ్లి జరిగితే ఆ నక్షత్రము కనిపించదు. కావున ఆ కాలములో నేల వెంపలి చెట్టును తెప్పించి భూమి మీద పరచి

దానిమీద దంపతులను నిలబెట్టి నక్షత్రమును చూపెడివారు. నేలవెంపలి చెట్టును త్రొక్కి నిలబడితే సూర్యరశ్మి

కనిపించకుండపోయి రాత్రివలెవుండి పగలే నక్షత్రములు కనిపించును. దానివలన పూర్వము నేలవెంపలి చెట్టును

పెళ్లిళ్లలో తెప్పించెడివారు. అలా చూపించుట వలన ప్రయోజనమేమిటని కొందరికి సంశయమురావచ్చు దానికి

సమాధానము క్రింద చూస్తాము.


పెళ్లి ఆచరణలో భూమి మీద పుట్టిన ఆడ మగ అందరు దైవ సంతతని కూతురు కొడుకను పిలుపు ద్వార

తెలుసుకొన్నవారు, ఆ దినము నుండి జ్ఞాననేత్రము యొక్క చూపు కల్గి ఉంటామని భాషింగము కట్టినవారు, జ్ఞానదృష్ఠి

కల్గి మాయయొక్క బంధములను త్రెంచు వేయుదునని, మాయతో పోరాడు సైనికుడుగ ఉందునని ఖడ్గము పూనినవారు,

మొదటిసారి మహాత్ములచే అక్షింతలు వేయించుకొని జ్ఞానాగ్నిని వెలిగించుకొన్నవారు, ఆ జ్ఞానాగ్ని ఆరిపోకుండ భార్య

భర్తచేత, భర్త భార్యచేత రగుల్చుకొందుమని తలంబరములను తల మీద పోసుకొని చూపి వారు చివరకు మేము చేరు

మోక్షపదమిదేనని మనకు తెలియ చేయునట్లు చివరిగ నక్షత్రమును చూస్తున్నారు. ఈ విధముగ జీవుడు దైవమునుండి

విడివడి ఉన్నాడని అతడు తిరిగి దైవమును చేరి జన్మ రాహిత్యము చేసుకొనుటకు అనుసరించవలసిన మార్గములను

ఆచరణలో భావయుక్తముగ చూపడమే పెళ్లి ఆచరణ యొక్క అర్థము.  


పందిరి.


జీవుడు పంచభూత నిర్మితమైన దేహమునందున్నపుడు ఈ విధానమంతయు ఆచరించవలసి ఉన్నదని తెలుపు

నిమిత్తము ఐదు గుంజల పందిరి లోపలనే పెళ్లి జరిపెడివారు. ఇక్కడ నాలుగు గుంజల పందిరేగాని ఐదుగుంజల

పందిరెక్కడున్నదని కొందరడుగవచ్చును. దానికి జవాబేమనగా! పంచభూతములనగ ఆకాశము, గాలి, అగ్ని, నీరు,

భూమి. వీటిలో అగ్ని, నీరు, భూమి కంటికి కనిపించునట్లుండగ గాలి స్పర్శ ద్వార తెలియుచున్నది. ఆకాశము


మాత్రము ప్రత్యేకముగ ఉంటు మిగతావాటివలె తెలియకుండ ఉన్నది. అందువలన కనిపించు నాలుగు గుంజలను

నాలుగు దిక్కుల పాతి వాటి ఆధారముతో పైన వేయు పందిరి మధ్యభాగము మాత్రము గోపురమువలె మొన పైకి

ఉండునట్లు పూర్వము నిర్మించెడివారు. అప్పటికి భూమి మీద ఆనియుండిన కొనలు నాలుగుకాగ ఐదవకొన పైకి

చూపినట్లుండును. పందిరి మధ్యలో పైన ఉన్న మొనకు ఆకాశమని, క్రింద ముందువైపు ఉన్న కుడి ప్రక్క మొనకు గాలి

అనియు, ఎడమ ప్రక్క మొనకు అగ్ని అనియు, అట్లే వెనకున్న వాటికి నీరు భూమి అని గుర్తించుకొని గాలి అగ్ని

ఒక్కప్రక్క నీరు భూమి ఒక ప్రక్క మధ్యలో ఆకాశమనునట్లు అర్థముతో పందిరి నిర్మించెడివారు. అలా నిర్మించిన

పందిరిచుట్టు చూచెడివారికి అర్ధచంద్రాకృతిగ కనిపించెడిది. ఇలాంటి పందిరి ఇప్పుడెవరు వేయడము లేదు.

తలంబరములు వరకు పందిరి క్రిందనే అన్ని కార్యములు జరిగిన తర్వాత ఒక అరుంధతి నక్షత్ర దర్శనమునకు

మాత్రమే పందిరి బయటికి వచ్చేవారు. అంతటితో పెళ్లి అయినట్లు భావము అనగా మోక్షము పొందినట్లు. మోక్షము

పొందిన వారికి తిరిగి జన్మలేదు. కావున పెళ్లి పందిరి క్రిందనుండి బయటికి వచ్చిన తర్వాత వధూవరులు పందిరి

క్రిందకు పోయెడివారు కాదు. అంతటితో పెళ్లి కార్యము భావయుక్తముగా ముగిసినట్లగును.


పూర్వము పెళ్లి ఇందువుల సాంప్రదాయమై దేశమంతా వ్యాపించి ఉండెడిది. ఇందువులనగ జ్ఞానులని అర్థము.

పూర్వమిది జ్ఞానుల దేశమైనందువలన ఇందూదేశమనెడి పేరు కల్గినది. కాలక్రమేపి ఆలిబొట్టు తాలిబొట్టయినట్లు

అజ్ఞానము పెరిగి పోయి ఇందూదేశము హిందూ దేశమైనది. మనము హిందువులుగ మారిన, మరి కొందరు ఇతర

మతముల వారుగ మారిన అందరిలోను ఇందూసాంప్రదాయములు ఇప్పటికి కొద్దో గొప్పో మిగిలి ఉండడము చూస్తే

ధర్మములు ఇంకనూ కొన ఊపిరితో బ్రతికి ఉన్నవనుటకు నిదర్శనము. ఇప్పటికైన దైవజ్ఞానము తెలిసినవారమై

నిర్భలముగ ఉన్న ధర్మములను భావయుక్త ఆచరణలతో తిరిగి కోలుకొనునట్లు చేస్తాము. ధర్మములు ఎప్పటికీ నశించవు.

ధర్మములకు గ్లాని మాత్రము కాలక్రమమున ఏర్పడుచుండును. అవి తిరిగి పునరుద్ధరింపబడుతాయి.



పెళ్లికి ముహూర్తమా!.


పెళ్లి కార్యములకు ముహూర్తములను నిర్ణయించడము, ముహూర్తములలో పెళ్లిచేయాలనడము అందరికి

తెలిసిన విషయమే. ముహూర్తము అంటే ఏమిటో తెలియకుండినప్పటికి పురోహితులు నిర్ణయించిన కాలమును

అందరు ముహూర్తము అనడము జరుగుచున్నది. ముహూర్తములంటే ఏమిటో తెలియని ప్రజలను మభ్యపెట్టుచు

మీ కొరకు చాలా కష్టపడి ముహూర్తమును వెదకినానను పురోహితులు కూడ కొందరు కలరు. పెళ్లిచేసుకొను వారి

అవసరమునుబట్టి ఎక్కువ డబ్బులు తీసుకుని లేని ముహూర్తమును నిర్ణయించువారు కూడా కలరు. కొందరు పురోహితులు

ఈనెలలో ముహూర్తము లేదని సత్యమును చెప్పిన, నీవు అడిగినంత డబ్బిస్తాము కష్టపడి వెదకి పెట్టమని ప్రాధేయపడు

ప్రజలు గలరు. మేము చెప్పిన కాలమునకు ముహూర్తమును పెట్టమని బెదిరించు వారు కూడ కలరు. లేని ముహూర్తమును

పెట్టలేక ఇబ్బందిపడు పురోహితులు కొందరుండగ, ఒకే దినము నాలుగు సమయములలో నాలుగు ముహూర్తములను

పెట్టి అన్ని ముహూర్తములకు హాజరై మంత్రాలు చదివి డబ్బులు పుచ్చుకొను పురోహితులుకూడ గలరు. వీటన్నిటిని

చూస్తే యోచించు ఏ మనిషికయిన ముహూర్తమంటే ఏమిటి అను ప్రశ్నరాక తప్పదు.


ఒక్క ఇందూ (హిందూ) మతములోనే పంచాంగమని ముహూర్తములని చెప్పువారు గలరు. కొన్ని

పంచాంగములలో ముందే ముహూర్తములు నిర్ణయించియుండును. కొన్ని పంచాంగములలో నిర్ణయించిన ముహూర్తములు

లేకున్నను పురోహితులు కొన్ని నియమముల ప్రకారము ముహూర్తమును నిర్ణయించుచుందురు. గ్రహముల గతులకు

వాటి స్థానములకు నియమములను ఏర్పరచి పలానా కాలములో, పలానా గ్రహములు, పలానా చోట ఉన్నపుడే

ముహూర్తమనుట ఇప్పటి కాలములో సహజముగ ఉన్న విషయము. గ్రహములు వాటి స్థానములనుబట్టి నిర్ణయింపబడిన

కాలమునే ముహూర్తము అను నియమమును బట్టి ముందే ముహూర్తములను పంచాంగములలో నిర్ణయించియుందురు.

పంచాంగములలో ముహూర్తములుండునని చాలామందికి తెలుసు. దీనిని బట్టి ముహూర్తములంటే పంచాంగములని

పంచాంగములంటే ముహూర్తములు అనువారు, ముహూర్తము పంచాంగములో అంతర్భాగమనువారు కలరు.

ముహూర్తములు ఒక్క పెళ్లికేకాక గృహారంభమునకు, గృహప్రవేశమునకు, డోలారోహణకు, కేశఖండనకు, శోభనమునకు,

నామకరణమునకు, మొదలగు చాలావాటికి గలవు. అన్నిటికి పంచాంగములోనే ముహూర్తములు దొరుకుచున్నవి.

పంచాంగము తెలిసిన ఎవరైన ముహూర్తమును నిర్ణయించుచున్నారు. ఇదంతయు చూచిన తర్వాత ఇందూమతములో

సాంప్రదాయమను పేరుతో పాదుకపోయిన ముహూర్తమును గురించి కొంతతెలుపాలనుకున్నాము. శాస్త్రములలో

నాల్గవదైన ఖగోళశాస్త్రము ప్రకారము పుట్టినది పంచాంగము. ఐదవదైన జ్యోతిష్యశాస్త్రము ప్రకారము పుట్టినది

ముహూర్తము. పంచాంగ కర్తలు ఖగోళశాస్త్రము అనుసరించి పంచాంగములు వ్రాయుచుందురు. ముహూర్తమును

నిర్ణయించువారు జ్యోతిష్యశాస్త్రమును అనుసరించి పోవలసియుండును. ప్రస్తుత కాలములో పంచాంగము తెలిసిన

వారందరు జ్యోతిష్యులవలె చలామణి అగుచున్నారు. వాస్తవానికి జ్యోతిష్యులు శాస్త్రబద్ధత లేని జ్యోతిష్యమును చెప్పుచున్నారు.

ఒకచోట జ్యోతిష్యశాస్త్రము ప్రకారము చెప్పిన విషయమును అదే శాస్త్రము ప్రకారము మరొకచోట మొదట చెప్పిన

దానికి వ్యతిరేఖముగ చెప్పుచున్నారు. శాస్త్రము అనగ ఒకే విధానమును సూచించునదై, శాసనములతో కూడుకొన్నదై,

ఎప్పటికి ఖండింపబడనిదై, శాపమువలె తప్పక నెరవేరునదై ఉండునదని అర్థము. శాసనము అన్న పదమునుండి

పుట్టినది శాస్త్రమైనపుడు అది ఎప్పటికి మారునదికాదు. ఒకవేళ ఎప్పటికయిన మారునదైతే అది శాస్త్రము కాదు.

అసలయిన ఖగోళశాస్త్రము ప్రకారము తిథులను, నక్షత్రములను, వారములను, గ్రహముల గతులను చెప్పవచ్చును.

భవిష్యత్తును చెప్పుటకు వీలు కాదు. భవిష్యత్తును చెప్పుటకు ప్రత్యేకమైన ఐదవ శాస్త్రమయిన జ్యోతిష్యశాస్త్రమును

తెలిసియిండవలెను. ఖగోళశాస్త్రము ప్రకారమున్న పంచాంగములో గ్రహముల గతులను చూచి జ్యోతిష్యశాస్త్రము

ద్వార భవిష్యత్తును చెప్పవచ్చును. జ్యోతిష్యులకు ఖగోళశాస్త్రము తెలిసి యుండవలసిన పని లేదు. ఖగోళశాస్త్రము

ప్రకారము వ్రాయబడిన పంచాంగములను చూచి గ్రహముల గతులను తెలుసుకొని జ్యోతిష్యులు కావలసిన భవిష్యత్తును

గురించి తెలుసుకోవచ్చును.



పంచాంగము ప్రకారము గ్రహముల గతులుండునని అనుకొన్నాము కదా! గోళమైన భూమి దినమునకు

ఒకమారు తనచుట్టు తాను తిరుగుచుండుట వలన సూర్యుడు భూమిని ఒకమారు చుట్టివచ్చినట్లు భూమి మీదున్న

మనకు తెలియుచున్నది. దానివలన భూమిని పండ్రెండు భాగములుగ విభజించి ఒక దినమునకు సూర్యుడు పండ్రెండు

భాగములను దాటినట్లు లెక్కించుచున్నాము. ఉదాహరణకు మనము ఒక రైలులో ప్రయాణిస్తున్నామనుకొందాము.

రైలుబండికి పండ్రెండు బోగీలున్నాయను కొనుము. రైలు రోడ్డు ప్రక్కన ఒక పెద్ద మర్రిచెట్టు ఉందనుకొనుము. రైలు

చెట్టు ప్రక్కన ప్రయాణించునపుడు రైలులో కూర్చొని చూచువానికి దారిప్రక్కన ఉన్న మర్రిచెట్టు వేగముగ వెనుకకు

పోయినట్లు కనిపించును. కాని వాస్తవానికి చెట్టు కదలలేదు, రైలు కదలుచున్నది. అయిన చెట్టు కదలినట్లు కనిపిస్తున్నది.


ఆవిధముగ ఖగోళములో సూర్యుడు దారి ప్రక్కన కదలని మర్రిచెట్టువలె కదలకుండనున్న గ్రహము. భూమి కదులుచున్న

రైలువలె మర్రిచెట్టును దాటిపోయినట్లు సూర్యుని చుట్టూ ప్రయాణిస్తున్నది. రైలులోకూర్చున్న వారికి చెట్టు కదలిపోయినట్లు

కనిపించినమాదిరి భూమిమీదున్న మనకు సూర్యుడే కదలిపోయినట్లు కనిపిస్తున్నది. వాస్తవానికి సూర్యుడు కదలలేదు.

రైలుకు పండ్రెండు బోగీలనుకొన్నాము కదా! ఒక్కొక్క బోగీపొడవు, రైలువేగమును, చెట్టు స్థానమును లెక్కించి చూచితే

రైలు మొత్తము చెట్టునుదాటుటకు ఎంత కాలము పట్టునని, ఒక బోగీదాటుటకు ఎంతకాలము పట్టునని తెలియును.

అట్లే భూమికున్న పండ్రెండు భాగముల పొడవును భూమివేగము లెక్కించి చూచితే ఒక్కొక్క భాగము సూర్యుని దాటుటకు

ఎంత సమయము పట్టునని తెలియును. దీని ప్రకారము భూమి ఒక్కొక్క భాగము సూర్యున్ని దాటుటకు సగటుకు

రెండుగంటలు పట్టుచున్నది. పండ్రెండు భాగములు దాటుటకు 24 గంటలు పట్టుచున్నది. మనము భూమి

విదున్నవారము గనుక సూర్యుడే ప్రయాణించునట్లు లెక్కించుకొన్నట్లయితే సూర్యుడు భూమి ఒకభాగమును దాటుటకు

రెండు గంటల కాలముపట్టునని తెలియుచున్నాము. ఆ రెండు గంటల కాలమును లగ్నము అంటున్నాము. సూర్యుడు

భూమియొక్క ఒక భాగము మొదలునుండి చివరవరకు ప్రయాణించునపుడు పట్టుకాలమును లగ్నము అని చెప్పుట

వాస్తవము.


ఉదాహరణ ప్రకారము మనమనుకొన్నరైలుకున్న ఒక్కొక్క బోగీ ఒక కిలోమీటరు పొడవున్నదనుకొనుము.

రైలువేగము గంటకు అరకిలోమీటరనుకొనుము. ఒక కిలోమీటరు పొడవున్న బోగీ చెట్టును దాటుటకు రెండుగంటల

కాలము పట్టును. ఒక బోగీచెట్టును దాటు రెండుగంటలలో ఆ బోగీనుండి ఒకమూట క్రిందికి పడిపోయినదనుకొనుము.

ఆ రెండు గంటలలో మూటపడిపోయిన సమయమును ప్రత్యేకించి చెప్పుదుము. రైలునుండి ఒకమూట పడిపోయిన

సమయమును ప్రత్యేకముగ గుర్తించినట్లు సూర్యున్నిదాటు రెండుగంటల లగ్నములో ఒక కార్యము జరిగిన సమయమును

ప్రత్యేకించి చెప్పుచున్నాము. ఆ సమయమునే ముహూర్తము అంటున్నాము. దీనిని బట్టి ఒకలగ్నములో ముహూర్తము

ఉంటుందని, ముహూర్తము వేరు, లగ్నము వేరని తెలియుచున్నది. లగ్నము ఖగోళ సంబంధమైనది. ముహూర్తము

జ్యోతిష్య సంబంధమైనది.


మానవ జీవితములో ఎప్పుడు ఏకార్యము జరుగవలసినది ప్రారబ్ద కర్మ ప్రకారము ముందే నిర్ణయింపబడివుండును.

మూట ప్రయాణములో పడిపోయినది ఒక సమయమైనట్లు జీవితములో ఒక కార్యము జరిగినది ఒక

ముహూర్తమగుచున్నది. మానవ జీవితములో ఏకార్యము ఎప్పుడు జరుగవలెనను నిర్ణయము మనిషి పుట్టినపుడే

నిర్ణయించబడియుండును. దానినే జ్యోతిష్యశాస్త్రము ప్రకారము జాతకము అంటున్నాము. ఎవరి జాతకములోనయిన

అన్నికార్యములకు ముహూర్తములు ముందే నిర్ణయించబడియుండును. దాని ప్రకారమే జరిగితీరును. ప్రారబ్ద కర్మ

నిర్ణయము మనిషి పుట్టినపుడే జరుగునని, దానినే జాతకమని, అది ఎవరయిన అనుభవింపక తప్పించుకొనుటకు

వీలుకాదని ఆరవశాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము కూడ తెలుపుచున్నది. జ్యోతిష్యము ద్వారా జరుగబోయే కార్యమును

తెలుసుకోవచ్చును, కాని ఆకార్యమును తప్పించుకొనుటకు వీలుకాదు. దీనినిబట్టి మనిషి ముహూర్తములు నిర్ణయించలేడు,

ప్రారబ్ధకర్మ ముందే అన్ని ముహూర్తములను నిర్ణయించి పెట్టినదని తెలియుచున్నది.


లగ్నమంటే ఏమిటి? ముహూర్తమంటే ఏమిటి? అని తెలుసుకొన్న తర్వాత, లగ్నమునకు గ్రహములు,

ముహూర్తమునకు ప్రారబ్ధకర్మ కారణమని తెలిసిన తర్వాత, పలానా కార్యమునకు ముహూర్తము నిర్ణయిస్తానని,

ఆసమయములోనే ఆ పనులు జరుగవలెనని చెప్పుట అజ్ఞానమే అగును. బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో


సాంఖ్యయోగము 47 వ శ్లోకమున "కర్మణ్యే వాధికారస్తే" అను శ్లోకము ప్రకారము పాప పుణ్యకర్మలను

సంపాదించుకోవడములో నీకు అధికారమున్నది, కాని వాటిఫలితమైన కార్యములు చేయడములో నీకు ఏ మాత్రము

సంబంధములేదని భగవంతుని వాక్యమున్నది. భగవంతుని మాటకు వ్యతిరేఖముగ ఎవడైన పలానా సమయములోనే

పలానా పనిచేస్తాననుట అజ్ఞానమే అగును. పనులకు మానవుడు స్వతంత్రుడు కానపుడు మనిషి ఒక పనికి ముందే

ముహూర్తమును నిర్ణయించడము ఎంతో తెలియనితనమగును. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము పని జరుగునని ముందే

చెప్పవచ్చును. కానీ జరుపుదుమని చెప్పడము తెలియనితనమగును. బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము ఒక పెళ్లి ఎప్పుడు

జరుగుతుందో ముందే కర్మనిర్ణయములో ఉండును. జ్యోతిష్యశాస్త్రము ప్రకారము కర్మనిర్ణయములో జరుగబోవు పెళ్లి

కార్యము యొక్క వివరమును తెలుసుకోవచ్చును. రెండూకాదని కర్మను దృష్టిలో పెట్టుకోకుండ కర్మకు కర్తలమైనట్లు

పెళ్లికి ముహూర్తములుంచకూడదు. అట్లుచేయుట అధర్మమగును. అందువలన పూర్వకాలములో పెళ్లికి

ముహూర్తములుంచెడి వారు కాదు. ముహూర్తము లేకుండ పెళ్లిచేసుకోవడము ఆనాటి సాంప్రదాయము. కొన్ని

స్థలములలో ముహూర్తము లేకుండ ఈదినములలో కూడ పెళ్లిళ్ళు జరుగుచున్నవి. అలా ముహూర్తము లేకుండ పెళ్లి

జరుగుచుండడము వలన ఇందూసాంప్రదాయములు నేటికిని నశించక నిలిచియున్నవని చెప్పుటకు ఆధారమైనది.

పెళ్లికి ముహూర్తములు ఉండకూడదను భావముతో పూర్వపు జ్ఞానులు ఒక వాక్యమును ప్రచారము చేశారు. “నిత్య

కల్యాణము పచ్చతోరణము” అని అన్నారు. పచ్చతోరణమును కట్టి నిత్యము కల్యాణము చేయవచ్చునని, కల్యాణమునకు

ముహూర్తములు ఉండవని వారి భావము. కర్మ అమలుకు వస్తే అమావాస్య రోజునయిన పెళ్లి జరుగుతుందని వారి

భావము.


నేటి కాలములో కూడ తిరుపతి క్షేత్రములలో, మరికొన్ని దేవస్థానములలో ముహూర్తములు లేకుండ నిత్యము

పెళ్లిల్లు జరుగుచున్నవి. మేము మా ఆధ్వర్యములో జరిపించిన పెళ్లిళ్ళన్నిటికి ముహూర్తమును నిర్ణయించకుండ చేశాము.

ముహూర్తము లేకుండ కార్యమును కర్మకు వదలివేయడము జ్ఞానమగును. అందువలన ముహూర్తములేని పెళ్లి

ఇందూసాంప్రదాయమగును. ధర్మముల స్థానములో అధర్మములు వచ్చిచేరుట వలన తాత్కాలికముగ ధర్మములకు

గ్లాని ఏర్పడినదని తెలియుచున్నది. తెలియకుండ పోయిన ధర్మములు తిరిగి తెలియబడి ధర్మసంస్థాపన జరుగునని

చెప్పబడిన భగవంతుని వాక్కు ప్రకారము అన్ని ఇందూ (జ్ఞాన) సాంప్రదాయములు మనకు తెలియబడునని ఆశిస్తాము.


పెళ్లిలో వేదమంత్రములా!


మానవ జీవితములో జరుగు అన్ని శుభకార్యములకంటే పెళ్లి అత్యుత్తమమైనది. ఎంతటి అజ్ఞాని

జీవితములోనయిన దైవ సూచనలిచ్చు ఒకే ఒక పెద్ద కార్యము పెళ్లి. భూమి మీద ఏజాతి జీవరాశికి లేని పెళ్లి

ఒక్కమానవ జీవితములోనే ఉండడము చాలా గొప్ప విషయము. మనిషి దైవమార్గములో ప్రవేశించడానికి ద్వారములాంటిది

పెళ్లి. దైవ సూచనలు తప్ప వేరు ఏ సమాచారములేని పెళ్లికార్యము పవిత్రమైనది. పూర్వము ఎంతో మంచి ఉద్దేశ్యముతో

ప్రారంభించిన పెళ్లి నేడు మాయా ప్రభావములో చిక్కుకొనిపోయినది. మానవుని తలలోనున్న మాయ మానవునికి పెళ్లి

పవిత్రతను తెలియకుండ చేసినది. మాయ యొక్క ప్రభావముతో పెళ్లి అర్థములేని కార్యముగ మారినది. అంతేకాక


వేదమంత్రములు పెళ్లికార్యములో చోటుచేసుకున్నాయి. పెళ్లి కార్యములో వేదమంత్రములు ఉండడము మంచిదే కాని

మాయ ఎట్లగునని చాలామందికి సంశయము రాగలదు. ఈమాటలు వ్రాసిన ఈయనకు వేదముల యొక్క గొప్పతనము

తెలియదనుకోవచ్చును. హిందువులకు వేదములు పవిత్రగ్రంథములు కదా అని అడుగవచ్చును. ఈవిధముగ ఎవరు

ఏమనుకొనిన మన మాటలు శాస్త్రీయమైనవా అశాస్త్రీయమైనవా అని, వేదములు బ్రహ్మవిద్యాశాస్త్రమునకు సంబంధించినవా

కాదా అని, వేదముల వలన దైవత్వము లభిస్తుందా లేదా అని యోచించవలసిన అవసరమున్నది.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీత సాంఖ్యయోగములో 45 శ్లోకమందు "త్రైగుణ్య విషయా లేదా” అను వాక్యము

ప్రకారము, తర్వాత గీతలోనే విజ్ఞానయోగము 14 శ్లోకములో "గుణమయి మమ మాయా" అను వాక్యము ప్రకారము,

తర్వాత విశ్వరూప సందర్శనయోగములో 48వ శ్లోకమున "న వేద ఏవం రూపశ్శక్య" అను వాక్యము ప్రకారము, 53వ

శ్లోకములో "నాహం వేదై శక్య ఏవం విదో" అను వాక్యము ప్రకారము విశదీకరించుకొని చూస్తే వేదములంటే ఏమిటో

తెలిసిపోతుంది.


దేవుని వ్యతిరేఖదిశలో ఉన్నది మాయ. మాయను ఇతర మతములలో సాతాన్ అని సైతాన్ అని పేర్లుపెట్టి

చెప్పుకొన్నారు. ఇతర మతములలో దేవుని మార్గమునకు మాయ పూర్తి శత్రువులాంటిదని దానికి వ్యతిరేఖముగ దేవుని

మీద విశ్వాసము కలవారుండవలెనని చెప్పుకొనుచుందురు. వెనుక వచ్చిన మతములలో కూడ దేవుని మార్గములో

నున్న వారు మాయను వ్యతిరేఖిస్తుండగ సృష్టి ఆదినుండి ఉన్న ఇందూ మతములో కూడ మాయకు విలువ లేకుండెడిదని

గీత శ్లోకములను బట్టి తెలియుచున్నది. ఇందూమతములో భగవద్గీత ప్రకారము చూస్తే "గుణమయీ మమమాయా,

"త్రైగుణ్య విషయా లేదా" అనుటను చూస్తే మాయ గుణముల రూపములోనున్నదని, గుణవిషయములే వేదములని

తెలియుచున్నది. దీనిప్రకారము మాయ = గుణములు = వేదములు అని అర్థమగుచున్నది. మాయ తలలో గుణముల

రూపములో ఉండి బయట వేదముల రూపములోనున్నదని స్పష్టముగ తెలియుచున్నది. దీని ప్రకారము మాయ అనిన

వేదములనిన ఒక్కటేనని, వేదములలో మాయతప్ప దేవుడు లేడని తెలియుచున్నది. సంస్కృత భాష నేర్చిన పండితులు,

పూర్వము ఋషులు మొదలయిన వారు వేదములను పెద్దగ చెప్పుచుండగ, ప్రతి శుభకార్యములోను వేదమంత్ర పఠన

జరుపుచుండగ, నేడు విదేశాలలో కూడ వేదములు పూజింపబడుచుండగ, హిందూ సంస్కృతి అంత వేదములతో

కూడుకొన్నదై ఉన్నదని గొప్పవారందరు చెప్పుచుండగ, నాడు నేడు ఆధ్యాత్మిక పీఠములనదిష్ఠించిన శంకరాచార్యులు,

రామానుజాచార్యులు మొదలగు ఆచార్యులందరు వేదములను పఠిస్తు అందరి చేత పఠింపజేయు చుండగ,

హిందూమతమునకే తలమానికములవంటివి వేదములని ఏక కంఠముతో పండితులందరు చెప్పుచుండగ, ఆస్తికులందరు

వేదములనే అనుసరిస్తుండగ, పురాణ ఇతిహాసములలో వేదములు గౌరవ స్థానములో ఉండగ, చతుర్ముఖబ్రహ్మ

వేదములను రచించాడని ప్రచారముండగ, చాలామంది హిందువుల హృదయాలలో గొప్పస్థానమును ఏర్పరచుకొన్న

వేదములను మీరు మాయ అంటున్నారేమిటి అని చాలామంది మమ్ములనడుగవచ్చును. దానికి మా జవాబేమనగా!

వేదములు గొప్పవని మనుషులు అంటున్నారు, దేవుడు వాటిని మాయ అంటున్నాడు అని నేను చెప్పానుగాని నేను

స్వయముగ చెప్పినది కాదు. అందరిలోను గొప్పస్థానమును వేదములు సంపాదించుకొన్నవి. కాబట్టి అందరికి దేవుడు

తెలియబడలేదు. భగవంతుడే స్వయాన గీతలో వేదములు మాయ అన్నాడు. అంతేకాక విశ్వరూప సందర్శన యోగములో

48 శ్లోకములోను 53 శ్లోకములోను వేదముల వలన నేను తెలియబడను, వాటివలన నన్ను తెలుసుకొనుటకు


శక్యము కాదు అన్నాడు. ఋషులు చెప్పారు సంస్కృత పండితులు చెప్పారు, పీఠాధిపతులు చెప్పారు అనడము

ముఖ్యము కాదు. దేవుడే చెప్పినది ముఖ్యము. మనిషిలోని మాయ బయట వేదములవలె నున్నదని, అది అందరిని

మభ్యపెట్టినదని, "మాయా దురత్యయా" మాయను తెలుసుకొనుట ధుస్సాధ్యమని అందువలననే అందరు నన్ను నమ్మక

దానినే నమ్ముచున్నారని దేవుడనుచున్నాడు. ఎవరయిన గ్రుడ్డిగ వాదించకుండ సత్యమును తెలుసుకోవాలంటే దేవుడు

చెప్పిన మాటను వినవలసిందే.


మాయకు దూరముగ దేవునికి దగ్గరగా ఉండాలంటే మాయ పనులను వదలి దేవుని పనులను చేయాలి.

దేవుని పనులను చేయాలంటే మాయ పనులేవో వివరించి చూచుకోవాలి. అలా వివరించి చూచుకుంటే దేవుని

జ్ఞానమయిన పెళ్లికార్యములలోనే జ్ఞానమును కప్పివేయునట్లు మాయ వేదమంత్ర పఠనరూపములోనున్నది.

దైవజ్ఞానరూపమైన పెళ్లిలో మాయరూపమైన వేదమంత్రములుండవచ్చునా అని యోచించక తప్పదు. అలా యోచిస్తే

పెళ్లిలో దైవజ్ఞాన సంబంధమంత్రములుండవచ్చును. కాని మాయ మహిమగల వేదమంత్రములుండకూడదని

తెలియుచున్నది. పూర్వము పెళ్లిలో పెళ్లి విలువ తెలిసిన జ్ఞానులు దైవసంబంధ మంత్రములనే చదివెడివారు. వేద

సంబంధమంత్రములను ఏమాత్రము పఠించెడివారు కాదు. కాలక్రమేపి ధర్మములకు గ్లాని ఏర్పడి దైవమంత్రముల

స్థానములో మాయ మంత్రములు వచ్చి చేరిపోయాయి. ఇప్పటి కాలములో ఏ పెళ్లిలోనయిన వేదమంత్రములే ఉన్నాయి.

అయినప్పటికి ఇప్పటికాలములో కూడ మా ఆధ్వర్యములో జరుగు పెళ్లిళ్ళలో వేదమంత్రములుండవు. మేము చేయించు

పెళ్లికార్యము ఇందూసాంప్రదాయబద్ధముగ, దేవుని సంబంధ మంత్రములతో, అర్థముతో కూడుకొన్న ఆచరణలతో

కూడుకొనునట్లు తీర్చిదిద్దాము. ఇందువు పెళ్లి జ్ఞానసంబంధముగ ఇట్లుండునని తెలియునట్లు దైవజ్ఞాన సంబంధ

మంత్రములే పఠించులాగున ఏర్పాటు చేశాము.


ఇప్పటికయిన కళ్ళుతెరచి మేము చెప్పునది దేవుని పక్షమని మాయ పక్షము వారు మాయను కూడ సృష్టించిన

దేవునికే విలువ ఇచ్చునట్లు పెళ్లిలో వేదమంత్రములను వదలి దైవమంత్రములను పఠించుట ఆచరించవలెనని

తెలుపుచున్నాము. అలా చేయడము వలన ఇందూ సాంప్రదాయ పరిరక్షణలో మనము భాగస్థులమౌతాము.

పుట్టినప్పటినుండి ఉన్న మాయమార్గమును వదలి నేడు తెలిసిన దైవమార్గమును అనుసరిద్దాము.


శ్రీమతి - శ్రీమతము.


ఇందూ సాంప్రదాయములలో పెళ్లి కార్యము గొప్ప ఆధ్యాత్మిక సందేశముతో నిండుకొన్నదై పరమాత్మకు దగ్గరగ

చేర్చునదై ఉన్నది. పెళ్లి కార్యములో తలంబరముల అర్థము ప్రకారము నడుచుకొన్నపుడు నిజమైన భార్య భర్తలుగ

లెక్కించవచ్చును. తలంబరముల ప్రకారము నడుచుకొను భర్త పేరుకు ముందు శ్రీ అనియు, భార్య పేరుకు ముందు

శ్రీమతి అని వ్రాయుట ఇందూ ధర్మ సాంప్రదాయము. జ్ఞాన సంపన్నులైన భార్య భర్తలు పవిత్రమైన జ్ఞానమునకు

పరమాత్మకు చిహ్నములని కూడా తెలియ బడుచున్నది. శ్రీ అను శబ్దము పరమాత్మకు సూచనకాగ, శ్రీమతి అను


శబ్దము పరమాత్మ జ్ఞానమునకు చిహ్నమని తెలియవలెను. వరుస క్రమములో భార్య భర్తలని పిలువడము వలన

మొదట పరమాత్మ జ్ఞానము ద్వారానే తర్వాత పరమాత్మను చేరవచ్చునని తెలియబడుచున్నది. జ్ఞానము శబ్దరూపమైనది

కనుక శబ్దమును ప్రకృతియనియే చెప్పవచ్చును. శబ్దము ప్రకృతియగుట వలన జ్ఞానమును ప్రకృతి గుర్తయిన స్త్రీతో

పోల్చి, భార్యను దైవజ్ఞానము యొక్క అర్థమునిచ్చు శ్రీమతి అని పెద్దలు చెప్పారు. పెళ్లయిన స్త్రీని ఇప్పటికి శ్రీమతి

అనుట ఆచారము గలదు. పరమాత్మ జ్ఞానమున్న స్త్రీని మాత్రము శ్రీమతి అని పూర్వము చెప్పగ ఈ కాలములో

ఏమాత్రము జ్ఞానములేని స్త్రీని శ్రీమతి అనుచున్నారు. ఇందూ ధర్మము ప్రకారము దేవుని జ్ఞానము లేని భార్యలు

ఆడవారే కాని శ్రీమతులు కారు. అలాగే బ్రహ్మ జ్ఞానము తెలియని భర్త కేవలము మగవాడే గాని శ్రీ శబ్దము అతనికి

తగదు. మొత్తానికి భార్యాభర్తలు ప్రకృతి పురుషులు కారు కాని వారి గుర్తింపునకున్నవారని తెలియాలి.


మతి అనగ ఎరుక లేక జ్ఞానము అనవచ్చును. శ్రీమతి అనగా దైవజ్ఞానము కలదని అర్థము. భగవద్గీత

ఆత్మసంయమయోగములో దైవమార్గములో యోగమాచరిస్తున్నవారు చనిపోతే తర్వాత జన్మ ఎట్లుండునని అర్జునుడు

అడుగగా శ్రీమతుల ఇండ్లలో పుట్టుదురని "శ్రీమతాంగేలి యోగ భ్రష్ణోభిజాయతే" అని శ్రీకృష్ణుడు చెప్పాడు. శుభకరమైన

దైవజ్ఞానము కలవారి ఇండ్లలో పుట్టుదురని చెప్పడములో విశేషత కలదు. ఈ విషయమై పూర్వము నుండి ఇప్పటి

వరకు ఒక ఆచరణ కలదు. పూర్వము సాంప్రదాయరీత్యా తలంబరముల అర్థము తెలిసి భార్యాభర్తలు ఒకరి ద్వారా

ఒకరు జ్ఞానము కలిగి మసులుకొనెడి వారు. అటువంటి వారికి సంతానప్రాప్తి కలిగి గర్భము నిలిచినపుడు ఏడవ నెలనుండి

తొమ్మిదవ నెలవరకున్న మధ్యకాలములో శ్రీమతము అను పేరుతో ఒక కార్యమును చేసెడి వారు. కొందరు ముతైదువుల

సమక్షములో చేసెడి ఈ కార్యమునకు పూర్వము శ్రీమతము అను పేరుండిన, కాలగర్భములో రూపాంతరముచెంది

నేటికి శ్రీమంతము అను పేరుగమారినది. గర్భము ధరించినపుడే శ్రీమంతము చేయడములో అర్థమేమిటనగా! గర్భము

ధరించిన స్త్రీని నీవు శ్రీమతివి, నీవు దైవజ్ఞానము కలదానివి, నీ గర్భము నుండి పుట్టు బిడ్డకూడ జ్ఞానవంతుడు

కావలెనని ముత్తయిదువలు దీవించడము జరిగెడిది. పోయిన జన్మలో ప్రయత్నము చేస్తూ మోక్షము పొందకనే మరణించిన

యోగి నీ గర్భమందు గీతలో దేవుడు చెప్పినట్లు జన్మించునని తెలియజేస్తు జరిపించు కార్యమును శ్రీమతమని పిలిచెడివారు.

పూర్వము దైవజ్ఞానము తెలిసిన స్త్రీలకు మాత్రమే ఈ కార్యక్రమమును నిర్వహించెడి వారు. అజ్ఞానులైన వారికి చేసెడివారు

కారు. నేటి కాలములో వీరికి చేయవలెనను నియమము లేకుండా చేయడము జరుగుచున్నది. ఆచారముండి అర్థము

లేకుండా పోవుట వలన ఆ కార్యములోని జ్ఞానసందేశము ఎవరికి తెలియకుండ పోయినది. ఒక కాయ కాయుటకు

ఒక పుష్పముండవలెను. పుష్పముండినపుడే కాయ తయారు కాగలదు. ఒక బాలిక పెద్దదై మరొక బిడ్డకు జన్మనిచ్చు

స్థితికి రావడమును పుష్పవతి అయిందంటాము. పుష్పవతి అయిందంటే సృష్టికి అనువగు స్థితికి వచ్చినదన్నమాట.

అనగా ప్రకృతితో సమానమన్నమాట. పురుష బీజముతో ప్రకృతి స్వరూపమైన స్త్రీ మరొకరికి (జగతికి) జన్మనిచ్చునదై

ఉన్నది. పరమాత్మ ప్రకృతి సామెతలే స్త్రీ పురుషులని తెలియవలెను. ఒక బాలికకు యుక్తవయస్సు వచ్చి మొదటి

రుతుస్రావముతో ప్రకృతి స్వరూపిణిగా మారుచున్నది. కనుక ప్రకృతి సృష్టికి ఆధారమైయున్నదని అందరు తెలియునట్లు

పుష్పవతిగా మారిన స్త్రీకి “పేరంటమను” పేరుతో కార్యము చేయుట కూడా ఇందూ సాంప్రదాయములో కలదు. సృష్ఠి

స్వరూపిణి ప్రకృతియని తెల్పు కార్యమే పేరంటము. పేరంటము స్త్రీలందరికి చేయవచ్చును, అలాగే పెళ్లికూడ స్త్రీలందరికి

చేయవచ్చును, కాని శ్రీమతము (శ్రీమంతము) అందరికి చేయకూడదు. పేరంటము, పెళ్లి, శ్రీమంతము వరుసగా  స్త్రీ


జీవితములో జరిగెడివైన వాటిలో ఎంతో జ్ఞానమునిమిడ్చి పెద్దలు సాంప్రదాయ రూపములలో మన సమాజములో

పెట్టారు.


పేరంటముతో పుష్పవతియైన స్త్రీ పెళ్లితో శ్రీమతిగా మారవలసి ఉన్నది. పేరంటము పెళ్లియైనప్పటికి జ్ఞానము

తెలియనివారు భార్యాభర్తల లెక్కింపులోని వారు కాదని, ప్రకృతి పురుషుల చిహ్నములు కాదని తెలియాలి. వారిది

అక్రమసంబంధమేయగునని తెలియవలయును. పెళ్లిరోజున చేసి చూపించిన కార్యములకు విలువనివ్వని వారిని, పెళ్లి

రోజున ఆచరించిన పనులను నెరవేర్చని దానివలన వారు అర్థముల ప్రకారము సాంప్రదాయ బద్దులైన భార్యాభర్తలుకాదని

చెప్పవచ్చును. అందువలననే వారిది అక్రమ సంబంధమని, అటువంటి వారిలో జ్ఞానము లేనందువలన వారికి

కలుగు సంతతిగూడా అజ్ఞానులే అగుదురని తెలియవలెను. దైవ జ్ఞాన సంపన్నుల దేశముగ పేరు పొంది ఇందువుల

(జ్ఞానుల) దేశమని పేరుగాంచిన ఈ భూమిమీద, జ్ఞానులే ఉద్భవించవలెనని తలచిన పెద్దలు పూర్వము పేరంటము,

పెళ్లి, శ్రీమంతము అను కార్యములలో జ్ఞానమును నింపి ఆచరింపచేశారు. ఆ కార్యములలోనే జ్ఞానము తెలియుట

వలన భార్యాభర్తలు ప్రకృతి పురుషులతో సమాన చిహ్నములై వారికి కల్గు సంతతి జ్ఞాన సంతతి కావలెనని పెద్దల

ఉద్దేశ్యము.


ఆచారములుండి అర్ధములు మంటగలసిపోయిన ఈ సమాజమును తిరిగి అర్థవంతముగ చేయాలంటే

ఆచారములలో అర్థముల నిమిడ్చి భావముతో చేయాలి. తెలియని వారికి పనులలోని భావమును తెలిపి మనము కూడా

పెద్దల భావముల ప్రకారమే ఆచరించినపుడు ఇందూ ధర్మములు తిరిగి సజీవము కాగలవు. ప్రపంచమునకంతటి కి

అధిపతియైన దేవున్ని తెలుసుకొనుటకు మార్గము ఏర్పడగలదు.



ముండ మోయడము (ముండమూయడము).


పెళ్లయి కొంతకాలము భర్తతో కాపురము చేసిన తర్వాత భర్త చనిపోయినపుడు, అంతవరకు భార్యగ ఉండిన

స్త్రీ, భార్య అను పేరు కోల్పోయి ముండమోపిగ (విధవగ) ఉండడము జరుగుచున్నది. పూర్వము మనము ఇందువులుగ

ఉన్నపుడు భార్యనుండి ముండమోపిగ మారడము కూడ సాంప్రదాయముగ ఉండెడిది. ఈనాడు ఇందూమతము

హిందూమతముగ మారిపోయి ఆనాటి సాంప్రదాయములలోని అర్థము తెలియకుండ పోయినది. ముండమోపిగ

మారడమను ఆచరణ ఇప్పటికి ఉన్ననూ, ఆనాటి అర్థము ఈనాడు లేదు. ఆనాటి అర్థము నేడు అపార్థముగ మారిపోయినది.

ఇటువంటి సందర్భములో ఆనాటి మన ఇందూ సాంప్రదాయములలో ముండమోయడము అంటే ఏమిటో

తెలుసుకుందాము. మా రచనలలోని “తిట్లజ్ఞానము” అను గ్రంథములో ముండమోపి అను పదమును గురించి కొంత

చెప్పడము జరిగినది. అక్కడ ముండ అనగ చలించు మనస్సు అని ప్రస్తావించడమయినది. వాస్తవానికి “ముండమూసి”

అనుపదము తర్వాత కాలగమనములో “ముండమోసి” అనుపదముగ మారినదనికూడ చెప్పుకొన్నాము. ముండ అనగ

వ్యభిచారి అని, ముండాకొడుకు అనగ వ్యభిచారికొడుకని అర్ధము. ముండమూసి అనుపదములో మూసి అనగ

మూసివేయడము లేక లేకుండ చేయడము అని భావము. ముండమూసి అనగ వ్యభిచారము లేకుండచేయడము అని


అర్థము. ఇక్కడ మన శరీరములో ముండవలెనున్నది మనస్సు, మనస్సు విషయ వ్యభిచారము కలది, కావున దానిని

ముండగ చెప్పడము జరిగినది. ముండమూసి అనగ విషయములమీద చలించు మనస్సును లేకుండ చేయడమని

అర్థము. “ముండమూసి” అను పదము కాలక్రమమున “ముండమోసి” అను పదముగ మారిపోయినది.


భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ప్రకారము మనిషి దేవున్ని చేరుటకు రెండుమార్గములు కలవు. ఒకటి

కర్మయోగము, రెండు బ్రహ్మయోగము. మనస్సు తన పనిని తాను చేయుచున్ననూ, అన్ని విషయములతో సంబంధపడి

పని చేయుచు ఆచరింపదగినది కర్మయోగము. మనస్సును ఏమాత్రము పనిచేయకుండ చేసి, ఒక్క విషయముతో

కూడ సంబంధము లేకుండ ఆచరింపదగినది బ్రహ్మయోగము. ఈ రెండు యోగములు దేవున్ని చేరుమార్గములే

అయినప్పటికి భర్త ఉండినపుడు స్త్రీ అన్ని సంబంధములు కల్గియుండి కర్మయోగమును ఆచరించవలెనని, భర్త మరణించిన

తర్వాత ఒంటరియైనపుడు ఏ సంబంధము లేకుండ మనస్సును నిలిపివేసి బ్రహ్మయోగమును ఆచరించవలెనని పూర్వము

పెద్దలు చెప్పెడివారు. భర్తపోయిన స్త్రీ బ్రహ్మయోగమును ఆచరించవలెనని, బయటి సంబంధములను వదులుకోవాలని

తెలియజేయు సాంప్రదాయమే ముండమూసి (ముండమోసి) అను కార్యము. మొదటి ముండమూసి అనుపదము

కొంతకాలమునకు ముండమోసి అనుపదముగ మారిపోయినది. తర్వాత కొంతకాలమునకు ముండమోసి అనుపదము

ముండమోపి అనుపదముగ మారిపోయినది. ప్రస్తుత కాలములో భర్తలేని స్త్రీని ముండమోపి అంటున్నాము. ఇలా

పదములు మారిపోయిన దానివలన, వాటి పూర్వాపరాలు చెప్పెడివారు లేకపోవడము వలన, ముండమోసి (ముండమూసి)

కార్యము జ్ఞానముతో కూడుకొన్న సాంప్రదాయమని తెలియకుండ పోయినది. మనుషులకు అర్థము తెలియకుండినప్పటికి,

పదముల రూపము కాలగమణములో మారినప్పటికి, మనుషుల మధ్యలో ఆచరణరూపములలో కొన్ని

ఇందూసాంప్రదాయములు సజీవముగ ఉన్నవి. ఆరవశాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము మనిషి దేవున్ని

చేరుటకు సూచించిన రెండుమార్గములయిన కర్మయోగము, బ్రహ్మయోగములలో దాంపత్య జీవితమంతయు

కర్మయోగమునకు సంబంధించినదిగ గడుపుటకు, దాంపత్య జీవితము తర్వాత బ్రహ్మయోగమునకు సంబంధించినదిగ

గడుపుటకు యోగ్యముగ ఉన్నదని పెద్దలు తెలిపారు. భర్త చనిపోయిన భార్యకుగాని, భార్య చనిపోయిన భర్తకుగాని

బ్రహ్మయోగము యోగ్యమన్నట్లు ముండమోసి కార్యమును గుర్తింపుగ ఉంచారు.


ముండమూసిన (ముండమోసిన) తర్వాత అతను లేక ఆమె మనస్సును జయించినవారని తెలియునట్లు వారిని

ప్రత్యేకముగ కనిపించునట్లు చేయుదురు. అట్లు కనిపించుట వలన సాటిమనుషులలో వారికి ప్రత్యేకమయిన విలువ

ఉంటుందని, వారివలన బ్రహ్మయోగము యొక్క ఉనికి మానవులకు తెలియునని పెద్దల ఉద్దేశ్యముండెడిది. పూర్వము

ముండమోసిన వారిని చూస్తే శుభప్రదముగ తలచెడివారు. వారిని బాహ్యవిషయములను త్యజించిన బ్రహ్మయోగులుగ

పలకరించెడివారు. నేటి కాలములో పూర్వభావములు ఏమాత్రము లేకుండపోయినవి. ముండమోసిన (ముండమూసిన)

వారిని చూస్తే అపశకునముగ, అశుభముగ తలచుచున్నారు. మంగళము అనగ శుభము అని అర్థము. మంగళవారు

అనగ శుభులు అని అర్థము. పూర్వము మంగళవారిని శుభశకునముగ, శుభసూచనగ తలచెడివారు. నేడు మంగళవాల్లు,

ముండమోసినవారు ఇరువురు అపశకునులుగ అశుభులుగ లెక్కించబడుచున్నారు. నేడు అజ్ఞానము పెరిగిపోయిన

దానివలన, ఆత్మజ్ఞానము అసలు తెలియని దానివలన, దైవవివరమును తెలియజేయు సాంప్రదాయములు అర్థములేని

ఆచరణలయిన దానివలన ముండమోసిన వారిని ప్రజలు అశుభులుగ తలచుచున్నారు. పూర్వము శుభకార్యములు


జరుగునపుడు బ్రహ్మ యోగులుగనున్న మరియు బ్రహ్మయోగులకు గుర్తింపుగనున్న ముండమోసిన వారితో ఆశీర్వాదములు

పొందెడివారు. పెళ్లి మొదలగు శుభకార్యములలో ముందు వరుసలోనే వారికి స్థానము కల్పించెడివారు. నేడు

అదంతయు మారిపోయినది. ముండమోసిన ఆడవారిని శుభకార్యములకు చాలాదూరముగ ఉంచుతున్నారు.

ముండమోసినవారు కూడ బ్రహ్మయోగము యొక్క విషయము ఏమాత్రము తెలియక అజ్ఞానులై, వాస్తవానికి

అశుభులైపోయారు.


భార్య చనిపోయిన భర్త, భర్త చనిపోయిన భార్య ఇద్దరు ముండమూసిన (ముండమోసిన) వారే అయినప్పటికి

పురుషున్ని వెధవ అని, స్త్రీని విధవ అని అనడము జరుగుచున్నది. పురుషుడు ముండమోసిన తర్వాత బయటికి

కనిపించునట్లు గుర్తింపుగ ఎక్కడ లేకపోయినప్పటికి స్త్రీ మాత్రము బయటికి కనిపించునట్లు, ఈమె విధవ అని

అందరికి తెలియునట్లు అగుపిస్తున్నది. భర్త చనిపోయిన తర్వాత మూడు దినములకో, ఐదుదినములకో, పదకొండు

దినములకో ముండమోసెడి కార్యము చేయుచున్నారు. ముండమోసెడి దినమున స్త్రీకి అలంకారమైనటువంటివి,

సౌభాగ్యమైనటువంటివి తీసి వేయుచున్నారు. స్త్రీకి అలంకారమైనటువంటి తలమీద పూలు, నుదుటి బొట్టు, చేతి

గాజులను తీసివేయుచున్నారు. చిన్నతనమునుండి ధరించబడుచు వచ్చిన వాటిని అలంకారమైనవని అనుచున్నాము.

వివాహమై భర్తవచ్చినప్పటినుండి ధరించబడుచు వచ్చిన తాలిని, మెట్టెలను సౌభాగ్యమైనవని అనుచున్నాము. భర్త

చనిపోయాడని సూచన తెలియునట్లు సౌభాగ్యమైన తాలి, మెట్టెలు తీసివేయడము సాంప్రదాయము. ముండమోసిన

స్త్రీకి అలంకారమైన పూలు, బొట్టు, గాజులు ఉండవచ్చును. కాని సౌభాగ్యమైన తాలి, మెట్టెలు ఉండకూడదు. పూర్వము

ఆచారము ప్రకారము నేటికిని కొందరు స్త్రీలు భర్త పోయిన తర్వాత తాలి, మెట్టెలు లేకుండ కనిపిస్తున్నారు.


షట్శాస్త్రములలో ఐదవ శాస్త్రము జ్యోతిష్యశాస్త్రము, ఆరవ శాస్త్రము బ్రహ్మవిద్యాశాస్త్రము అని తెలుసుకొన్నాము.

జ్యోతిష్యశాస్త్రము ప్రకారము గ్రహములు రెండుభాగములుగ ఉన్నాయి. ఒకటి గురుపార్టి, రెండు శనిపార్టి. ఈరెండు

గుంపులలోను సౌభాగ్యజీవితముమీద ప్రభావమును చూపు గ్రహములు ఒకటి కుజగ్రహము, రెండవది శుక్రగ్రహము.

ఈ రెండు ఒకదానికొకటి బద్ధశత్రుత్వము కల్గిన గ్రహములు. కుజగ్రహము యవ్వనమునకు సంబంధించినది,

శుక్రగ్రహము యవ్వన సుఖమునకు సంబంధించినది. ముండమోసిన వారు యవ్వనమునకు గాని, యవ్వన

సుఖమునకుగాని సంబంధించినవారు కాదు అన్నట్లు ఆ గ్రహముల స్వంతరంగుల చీరలను స్త్రీలు ధరించెడివారు.

జాతకరీత్య గురు లగ్నములలో పుట్టినవారు ముండమోసిన తర్వాత కుజుని రంగయిన ఎర్రని దుస్తులు ధరించెడివారు.

శని లగ్నములలో పుట్టినవారు శుక్రుని రంగయిన తెల్లని దుస్తులు ధరించెడివారు. పూర్వము విధవలంత ఎర్రని

దుస్తులలో కొందరు, తెల్లని దుస్తులలో కొందరు కనిపించెడివారు. కాలము జరుగుకొలది వాస్తవము మరుగున

పడిపోయి ఎర్రని చీరలు బ్రాహ్మణస్త్రీలు, తెల్లని చీరలు మిగితా కుల స్త్రీలు ధరించను మొదలు పెట్టారు. అలా

కొంతకాలము గడువగ ఎర్రచీర కట్టు బ్రాహ్మణులు, తెల్లచీర కట్టు శూద్రులు కనిపించకుండ పోవుచున్నారు. ఈవిధముగ

కొన్ని సాంప్రదాయములు మార్పుచెంది కనుమరుగైపోవుచున్నవి. వీటి వివరము తెలియజేయు పెద్దలు లేనిదాని

వలన, అర్థము తెలియని ఆచరణలైన దానివలన, వాటిని ఆచరించుటకు చాలామంది ఆసక్తి చూపడములేదని

తెలియుచున్నది. ఇంకా కొంత కాలమునకు ముండమోసినవారు చీరల విషయమును పూర్తి మరిచిపోవు స్థితికి

రాగలరు. ఇప్పటికి ఇంత మార్పువచ్చినా తాలి, మెట్టెలు తీసివేయడములో మార్పు రాలేదు. ముండమోసినవారు

వాటిని తీసివేయడము వలన సాంప్రదాయములు కొంతమిగిలి ఉన్నవని చెప్పవచ్చును.


ఇప్పటికయిన ఇందూసాంప్రదాయములు ఇవి అని తెలిసి, ముండమోసిన వారు శుభులని అశుభులుకాదని

తెలియవలెను. వారిని మంగళప్రధులుగ గౌరవించవలెను. తెలియని వారికి మీరు ఈ రకమైన చీరలే కట్టుకోవాలి

అని తెలిపి వాటికి అర్ధము వివరము తెలపాలి. ఆవిధముగ చేసినపుడు మనలోనున్న మనస్సును గురించి, దానికి

సంబంధించిన బ్రహ్మయోగమును గురించి తెలియగలరు. మొత్తము మీద ముండమూసి (ముండమోసి) కార్యము

సాంప్రదాయబద్ధమైనదని తెలియగలదు.


సాంప్రదాయముల ప్రకారము ముండమోసినవారు ఏ రంగు చీర ధరించాలనుటకు వారికి ముందే మేము

పలానా జాతకములో పుట్టినవారమని తెలిసియుండాలి. అట్లు జాతకము తెలిసియుండాలంటే పుట్టినపుడు వారి

పెద్దలు శిశువు అరచిన లేక కదలిన కాలమును వ్రాసిపెట్టుకోవాలి. ముఖ్య గమణిక ఏమంటే! శిశువు పుట్టిన

కాలమును ఏమాత్రము గుర్తించుకోకూడదు. శిశువు కదలిన లేక అరచిన కాలమునే వ్రాసిపెట్టుకొని తర్వాత పురోహితులకు

చూపితే, పుట్టిన శిశువు ఇటు శుక్రగ్రహమునకు సంబంధించినదా లేక కుజగ్రహమునకు సంబంధించినదా అని

తెలియును. శుక్రగ్రహ జాతకులకు తెలుపురంగు, కుజగ్రహ జాతకులకు ఎరుపురంగు యోగ్యమని తెలియవలెను.

బ్రహ్మవిద్యకు అనగ దైవజ్ఞానమునకు దగ్గరగనున్నది జ్యోతిష్యము అందువలన కొన్ని సాంప్రదాయములు జ్యోతిష్యశాస్త్రముతో

తగులుకొని ఉన్నవని తెలియవలెను.


నమస్కారము.


దైవత్వమును మానవులలో మిళితము చేసి, దైవజ్ఞానమును ఎప్పటికి మరచిపోకుండునట్లు మనుషులలో పెట్టిన

ఎన్నో ఆచరణలలో నమస్కారము చేయుట ఒక మంచి సాంప్రదాయము. ఏ ఇతర మతములు లేని కాలములో,

ఇందూమతమొకటున్న కాలములో, దైవజ్ఞానము తెలిసిన పెద్దలు ఏర్పరచిన నమస్కార సాంప్రదాయము ఇందూ

మతము అనేకముగ చీలిపోయినప్పటికి అన్ని మతములలోను కొంత వరకు మిగిలి ఉన్నది. అన్ని మతములలోను

నమస్కార సాంప్రదాయమున్నప్పటికి అందులో పూర్వమున్న అర్థముకాని, భావము గాని లేదు. ఒక్కొక్క మతములో

ఒక్కొక్క భావము ఇమిడిపోయి ఏది సరియైన భావమో అర్థము కాకుండ పోయినది. ఒక్కొక్క మతమువారు ఒక్కొక్క

రీతిలో అర్థము చెప్పుకుంటూ ఇతర మతముల వారిని తప్పు పట్టడము పరిపాటైనది. ఇటువంటి సమయములో

ఎవరిది శాస్త్రబద్ధమైన అర్థమో, ఎవరిది దైవసంబంధమైన నమస్కారమో, ఎవరిది ప్రపంచ సంబంధ నమస్కారమో

తెలియవలసిన అవసరమున్నది. ప్రతిది హేతుబద్దమైన అర్థముతో, శాస్త్రబద్ధమైన ఆచరణతో ఉండినపుడే మనిషి

చేసిన పనికి సార్థకముంటుందనుట మా వాదన. కనుక మొట్టమొదట గల ఇందూ (జ్ఞాన) సాంప్రదాయమేమిటన్నది

మనము చూడాలి.


ప్రపంచమునకంతటికి దేవుడు ఒక్కడేననుట సత్యము. ఎవరు ఏ మతములో ఉండినప్పటికి ఆ మత

సారాంశము దేవున్ని తెలుపునదేయై ఉంటుంది. కావున ప్రతి మతములోని గ్రంథములను, ఆ మత పెద్దలను

గౌరవించుట మంచి పద్ధతిగానే భావిస్తాము. అటువంటి భావముతోనే ఇస్లాం మత పెద్దలతో ఒకమారు మేము


కలవటం జరిగినది. హైదరాబాద్ నగరములో ఇస్లామ్మతములోని హదీస్ పండితులతో, పవిత్ర ఖురాన్ను తమయందు

పూర్తి జీర్ణింపచేసుకున్న పెద్దలతో కలవడము మాకెంతో సంతోషదాయకమైన సంఘటనగానే తలుస్తాము. అటువంటి

దైవజ్ఞాన సంపన్నులు, దేవునికి ముద్దుబిడ్డలయిన వారిని కలిసినపుడు వారికి నమస్కారము చెప్పాము. తిరిగి అక్కడి

నుండి బయలుదేరి వచ్చునపుడు కూడ నమస్కారము చెప్పాము. మొదట నమస్కారము చెప్పినపుడు వారేమి అనలేదు.

కాని బయలుదేరి వచ్చేటపుడు చెప్పిన నమస్కారమునకు కొంత అభ్యంతరము తెలిపారు. వారికి దేవుని మీద గల

అపార విశ్వాసము ఆ మాటలలో మాకర్థమైనది. వారు మాతో మాట్లాడిన విషయమీలాగ ఉన్నది.


ఇస్లామ్ మత పెద్దలు :- "హిందూమతములో మిగత వారందరికంటే మీరు మాకు బాగా నచ్చారు. తౌహీద న్ను

(ఏకేశ్వరోపాసనను) గురించి మీరు చెప్పినట్లు హిందూమతములో ఎవరు చెప్పలేదు. తౌహీద్ జ్ఞానమును గురించి

ఇంతగా చెప్పగల్గిన మీరు సాటి మనుషులమైన మాకు నమస్కారము చెప్పడము మంచిది కాదు. మనము నమస్కరించ

వలసినది ఒక్క దేవునికి మాత్రమే. ఆయన ఒక్కడే నమస్కారమునకు అర్హుడు. మనిషి మనిషికి గాని, మరిదేనికి గాని

నమస్కారము చెప్పడము దేవున్ని కించబరిచినట్లగును. అందరికి పెద్ద, అందరిని సృష్టించిన దేవున్ని వదలి సాధారణ

మనిషికి నమస్కరించడము మా లెక్కలో తప్పుగా భావిస్తాము. మనిషి చేయు నమస్కారమునకు దేవుడొక్కడే అర్హుడు.

కావున ఆయనకు తప్ప ఇతరులకు నమస్కరించడము సరియైన పద్ధతికాదు అన్నారు.


మా మాట :- “నమస్కారమునకు అర్హుడు దేవుడొక్కడే అను మాటను మేము అంగీకరిస్తున్నాము. ఇతరులకు ఎందుకు

నమస్కరించుచున్నామో నేను తర్వాత చెప్పెదను. దానికంటే ముందు నేను మిమ్ములను అడుగునదేమనగా! మీరు

ఇతరులకు “సలామ్ లేకుమ్” అని అంటూ చేతిని తలవైపు చూపుచు అంటుంటారు ఎదుటి వ్యక్తి కూడ “వలేకుమ్

సలామ్” అంటారు. అది ఇతరులకు నమస్కారము కాదా! దేవునికి తప్ప మనుషులకు నమస్కారము చెప్పకూడదను

హదీసు (నీతి) ప్రకారము సలామ్ ఇతరులకు చెప్పుట తప్పు కాదా” అన్నాము.


ఇస్లామ్ పెద్దలు :- “సలామ్ చెప్పు విధానములో తప్పులేదు. అది ఇతరులకు నమస్కరించినట్లు కాదు. సలామ్ చెప్పు

విధానము హజరత్ మహమ్మద్ ప్రవక్తగారే తెలియజేశారు. “సలామ్ లేకుమ్” అనగా నీకు శుభమగుగాక అని

అర్ధము. ఎదుటి వ్యక్తి సలామ్ చెప్పిన వ్యక్తికి “వలేకుమ్ సలామ్” అని చెప్పుట ప్రతి సలామ్ చేసినట్లగును.

“వలేకుమ్ సలామ్” అనడములో నీకు కూడ శుభమగుగాక అని అర్థము గాని ఒకరు కొరకు నమస్కరించు కొన్నట్లు

కాదు. మా మతములో ఒకరి కొకరు శుభమును తెలుపుకొను నిమిత్తము సలామ్ చెప్పుకొనుట గలదు. కాని సలామ్

చెప్పుట నమస్కార విధానము కాదు” అన్నారు.


మా మాట :- ఇందూ విధానములో పూర్వకాలములోనే జ్ఞానులైన పెద్దలు నమస్కారమును ప్రవేశపెట్టారు. ఆనాటి

పెద్దలు చెప్పిన దాని ప్రకారము రెండు చేతులెత్తి నమస్కరించడము నమస్కారము చేసినట్లగును. నమస్కారము

పూజ్యభావమైనది మరియు గౌరవసూచకమైనదని చెప్పుటలో సత్యము కలదు. మీరు చెప్పిన సలామ్ శుభకరమున్నట్లు

ఇందూ విధానములోని నమస్కారములో పూజ్యభావమున్నదనియే చెప్పవచ్చును. దేవుని మీద తప్ప ఇతరుల మీద

పూజ్యభావము చూపడము మంచి పనికాదని చెప్పవచ్చును. అయినప్పటికి ఇక్కడ మనము కొంత ఆలోచించవలసిన

అవసరమున్నది. పూర్వము దైవజ్ఞానులలో అగ్రగణ్యులైన వారు, దైవమంటే ఎవరు దాని గొప్పతనమంటే ఏమిటో

తెలిసిన వారు, పవిత్రమైన పూజ్యభావమైన నమస్కారమును మనుషుల మధ్యలో ఎందుకు కల్పించారని యోచించవలసి


ఉన్నది. అప్పటి వారి భావమేమిటో, జ్ఞానరీత్య వారి ఉద్దేశ్యమేమిటో వివరించుకొని చూచినట్లయితే ఈ విధముగ

ఉన్నది.


ఈ ప్రపంచము సృష్ఠింపబడిన తర్వాత మొదట ఏ మతములు లేవు. మతమను పేరులేని ఆ కాలములో

దైవజ్ఞానమును తెలిసిన పెద్దలు ఇతరులు కూడ దైవజ్ఞానమును తెలుసుకొనునట్లు అర్థముతో కూడుకొన్న కొన్ని ఆచరణలను

మనుషులలో ప్రవేశపెట్టారు. ఆ ఆచరణలలో నమస్కారము కూడ ఒకటి. ఆనాడు విశ్వవ్యాప్తమైన మనుషులలో

ఇతర మతమంటు లేదు. ఉన్నదంత ఇందూత్వమే (జ్ఞానమే) ఇందూత్వము మనుషుల ఆచరణలలో ముఖ్యమైన

భాగమై ఉండెడిది. అందువలన ప్రపంచవ్యాప్తముగ నమస్కార విధానము ఆచరణలో ఉండెడిది. ఆదివారము సెలవు

దినముగ ప్రపంచమంతట అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నదో అలాగే నమస్కారము ప్రపంచమంతాట ఉండెడిది.

ఈనాటికి ఆదివారము సెలవుదినముగ ప్రపంచములోని అన్ని దేశములలో ఉన్నప్పటికి ప్రత్యేకించి ఆ దినముననే

సెలవునెందుకు కేటాయించారో తెలియకుండ పోయినట్లు, ఈనాటికి ప్రపంచవ్యాప్తముగ నమస్కారము ఆచరణలో

ఉన్నప్పటికి పూర్వకాలమున నమస్కారమును ఏ ఉద్దేశ్యముతో పెట్టారో తెలియకుండ పోయినది. జ్ఞానముతో కూడుకొన్న

అర్థముతో, దైవత్వభావముతో రెండుచేతులతో చేయు నమస్కారము కొన్ని దేశములలో ఒక్క చేతివరకే పరిమితమై

పోయినది.


ముఖ్యముగ గమనించవలసిన విషయమేమనగా! విశ్వవ్యాప్తమైన నమస్కార సాంప్రదాయములో ఆచరణ

లోపమేర్పడి ఒక్క చేతి నమస్కారమైనప్పటికి ఆ ఒక్క చేతిని అందరు తలవైపు చూపడము మాత్రము మాసిపోకుండ

నిలచిపోయినది. ఇందూసాంప్రదాయము ప్రకారము రెండుచేతుల హస్తములు కలిపి తలవైపు చూపుట సరియైన

నమస్కార సాంప్రదాయము. అలాంటి సంపూర్ణ నమస్కారము ప్రస్తుత కాలములో భూమిమీద ఎన్ని మతములు

ఉద్భవించినప్పటికి అన్ని మతములలోను కొంతకు కొంతయిన మిగిలి ఉన్నది. అన్ని మతముల నమస్కారములోను

తలకే ప్రాధాన్యతుండడము, కొన్ని మతములలో నమస్కారము ఒంటిచేతికే పరిమితి కావడము చూస్తుంటే నమస్కార

మనునది మాత్రము పూర్తి నశించకుండ ఉన్నదని తెలియుచున్నది. ఏది ఏమైనప్పటికి పూర్వము ఇందువులు పెట్టిన

సాంప్రదాయములలో నమస్కారము అర్థము చెడినదై అన్ని దేశములలో ఇప్పటికి నిలచివున్నది. ఒక్కొక్క మతములో

ఒక్కొక్క అర్థముతో ఉండినప్పటికి దానిని పూర్వపద్ధతి ప్రకారము నమస్కారమనియే చెప్పవచ్చును. అంతకు పూర్వము

ఇందువులు నమస్కారములో ఇమిడ్చిన అర్థమేమిటి? నమస్కారము రెండు చేతుల హస్తములతోనే ఎందుకు చేసెడివారు?

హస్తముల వ్రేళ్లకొనలను తలవైపు ఎందుకు పెట్టేడివారు? అను మొదలగు ప్రశ్నలకు జవాబులు తెలుసుకొనిన నమస్కార

సాంప్రదాయము పూర్తి అర్థము కాగలదు.


నేడు గల అన్ని మతములకు, పూర్వముగల ఒకే ఇందూ మతమునకు దేవుడు ఒక్కడే. ఒక్క దేవుడే

ప్రపంచమంతాటిని సృష్టించిన సృష్టికర్త. దేవునికి వాస్తముగ పేరులేదు, ఆకారములేదు, ఒక స్థలమంటు లేదు.

ఒకపేరు ఒక ఆకారము, ఒక స్థలములేని దేవుడు విశ్వవ్యాప్తముగ అణువణువున వ్యాపించి ఉన్నాడు. పేరుకాని

పేర్లనబడు పరమాత్మ, పురుషోత్తమ, ఖుదా, సృష్టికర్త, పరంధామ అను గుర్తులతో చెప్పబడుచున్నాడు. అటువంటి

దేవుడు ప్రకృతియంతయు ఆవహించి ఉండడమే కాక జీవరాసులు శరీరములు లోపల కూడ ప్రతి అణువులో వ్యాపించి


ఉన్నాడు. పరమాత్మ ఆత్మగ శరీరములో చైతన్యమును కల్గించి శరీరములను కదలించి పనిచేయిస్తున్నది. పరమాత్మ

భాగమైన ఆత్మ ప్రతి జీవరాసి శరీరములలోను తలయందు కేంద్రీకృతమై శరీరమంతా వ్యాపించి ఉన్నది. దేవుడు

ఆత్మరూపముతో మనుషులకు తెలియు చైతన్యమై తలయందుడుట వలన, ఆ విషయము అందరికి తెలియునట్లు

దేవుడు తలలో ఉన్నాడను విషయము ఎవరు మరువనట్లుండుటకు తనకంటే గొప్పవారు కనిపించునపుడు నమస్కారము

చెప్పుట గలదు. ఎదుటి మనిషికి నమస్కారము పెట్టినపుడు ఎదుటివానియందు తలలోని ఆత్మను గుర్తు చేయునట్లు

రెండుచేతులు కలిపి తలవైపు నమస్కారము పెట్టెడివారు. కుడి ఎడమ రెండు చేతుల హస్తములు కలుపడములో

ఆధ్యాత్మికమైన అర్థము గలదు. కుడి ఎడమ భాగములుగనున్న శరీరమందు ఒకే ఆత్మ రెండువైపుల వ్యాపించి ఉన్నదని

తెలుపు నిమిత్తము రెండుచేతులను ఒక్కటిగ చేసి చూపుచున్నాము. శరీరమంత వ్యాపించిన ఆత్మకు తల కేంద్రమగుట

వలన తలవైపు చేతుల కొనలను చూపడము జరుగుచున్నది. పూర్వము పెద్దలు నిర్మించిన నమస్కారములో దైవము

పట్ల పూజ్యభావము ఇమిడి ఉండెడిది. ఒకరు శరీరములోని దైవమును నమస్కారరూపముతో ఎదుటి వ్యక్తికి తెలియజేయగ,

ఎదుటి వ్యక్తి కూడ అదేలాగున రెండు చేతులతో నమస్కరించెడి వాడు. అలా చేయునప్పుడు నీలో నాలో ఒకే అంశయైన

దేవుడున్నాడని, అతను నీలో ఎలా ఉన్నాడో నాలో కూడ అలాగే ఉన్నాడని తెలుపు అర్థము కల్గి ప్రతినమస్కారము

చేసెడివారు. ఎంతో ఉన్నతమైన దైవభావముతో ఆనాడు నమస్కారము, ప్రతి నమస్కారములుండెడివి.



అంతేకాక ఇందూ సాంప్రదాయములందు నమస్కార విషయములో మరియొక ఘట్టము కూడ కలదు.

అదేమనగా! మనిషి శరీరములో నీచమైనవి కాళ్లని, కాళ్లకు తొడుగు చెప్పులు కూడ నీచమైనవని తలచుట గలదు.

చెప్పులు తొడిగిన కాళ్లుగాని, తొడగని కాళ్లు గాని ఇతర వ్యక్తులకు పొరపాటుగ తగిలినపుడు, తగిలినది ఎదుటి

మనిషికే అయిన, వానిని అంటుకొని ఉన్న దేవునికే తగిలినట్లు పూర్వము తలచెడివారు. అలా తలచుటవలన

వెంటనే తనది తప్పన్నట్లు తగిలిన వ్యక్తిని చేతితో తాకి తలవైపు చేయి పోనిచ్చి నమస్కరించెడివారు. ఎదుటి వ్యక్తి

ఎటువంటివాడైన కాలుతగిలిన వెంటనే నమస్కరించు ఆచరణ పూర్వపు జ్ఞానులే ఉంచారు. అలా చేయుట వలన

తమ శరీరములోనే కాక ఎదుటి శరీరములో కూడ దేవుడున్నాడని, ఆ దేవునిపట్ల గొప్ప భక్తి కల్గియున్నానని తెలియు

నిమిత్తము పూర్వము చేసెడివారు. పూర్వపు ఆచరణ ఈనాడు అక్కడక్కడ కలదు. బస్సులోనో లేక రైళ్ళలోనో ఎదుటి

మనిషికి పొరపాటుగ కాలు తగిలితే చేతితో ఆ వ్యక్తిని తాకి మ్రొక్కడము అప్పుడప్పుడు చూస్తునే ఉన్నాము. పూర్వపు

పెద్దలు ఎంతో జ్ఞానముతో దైవభక్తి ఇమిడి ఉండునట్లు ఇమిడ్చిన సాంప్రదాయమే నమస్కారము.


పూర్వము దైవము పట్ల వినయ విధేయతలు కల్గియుండునట్లు, దైవజ్ఞానము అందరికి తెలియునట్లు, ఎవరు

ఎవరికి నమస్కారము చేసిన అది దేవునికి చేరునట్లు అర్థమిమిడ్చి పెద్దలు పెట్టిన మంచి పనియే నమస్కారము.

అంతగొప్ప భావముతో ఇమిడియున్న నమస్కారము ఈనాడు దేవుని పట్లకాక మనుషుల పట్ల అనుకోవడము పూర్తి

పొరపాటు. నమస్కారమునకు అర్హుడు ఒక్క దేవుడే తప్ప ఇతరులు కారు, కారాదు, పూర్వమున్న జ్ఞానసాంప్రదాయములకు

అర్థము తెలియక పోగా ఆచరణలను చూచి ఎవరిష్టమొచ్చినట్లు వారనుకోకూడదు. ప్రస్తుతము నేను పెట్టిన నమస్కారము

మీకు కాదు మీలోనున్న అల్లాకు (దేవునికి). దేవునికి పూజ్యభావముతో నమస్కరించడము తప్పెట్లగును. సలామ్

ప్రతిసలామ్ చేయడములో శుభమగుగాక అని దీవించినట్లగును గాని దైవభావము గాని, ఇతరులకు దేవున్ని గురించి

తెలుపు విధానముగాని లేదు కదా! అల్లా అందరిలో వ్యాపించి ఉన్నాడను అర్థముతో నమస్తే అనడము మంచిది కదా!

మీరే చెప్పండి.


ఇందువుల జ్ఞానములో దైవము నిమిత్తము ఏర్పరచిన నమస్కారము ఈనాటికి కలదు. అదే సాంప్రదాయమే

కాలము జరుగు కొలది, మతములు తయారైన కొలది అనేక రూపములుగా మారిపోయినది. ఇందువులు హిందువులుగా,

ముస్లీమ్లుగా, క్రైస్తవులుగ మారిపోవుట వలన ఆనాటి ఇందువులలో గల అర్ధము లేకుండ పోయినది. హిందువులలో

అక్కడక్కడ రెండు చేతుల నమస్కారము మిగిలి ఉన్నను ఆనాటి ఇందువుల భావము లేదు. అందువలన హిందువులలో

కూడ అధర్మయుక్తమైన ఒంటి చేతి నమస్కారములు అక్కడక్కడ కనిపిస్తున్నవి. ఆదిలోగల ఇందువులు కాలక్రమేణ

హిందువులుగ, ముస్లీమ్లుగ, క్రైస్తవులుగ మారిపోయి వారిలో నమస్కారము కూడ రూపము అర్థము మారిపోయినది.

ఆంగ్లదేశములలో సెల్యూట్ల, అరబేశాలలో సలామ్, భారతదేశములో నమస్తేగా మారిపోయినది. హిందూ,

ఇస్లామ్, క్రైస్తవులందరు ఇందూమతములోని భాగస్వాములే కావున నమస్కారమును ఎవరెట్లు ఆచరించిన అది దేవుని

కొరకై ఉండాలి. ఇప్పుడు చెప్పండి నేను మీకు పెట్టిన నమస్కారములో ఏమైన తప్పుందా?" అన్నాము.


ఇస్లామ్ పెద్దలు :- " ఈవిధముగ దేవుని మీద భక్తితో గౌరవముతో పెట్టునదేయైతే ఏమి తప్పుకాదు. మీమాటలలో

నమస్కారము దేవునికే అనుట మాకు సంతోషమేకాని మీరన్నట్లు అందరు అలా కాక కనిపించిన ఆఫీసర్కో, తన

అవసరమునకు పనికి వచ్చువానికో, వారి స్వార్థముతో పెడుతున్నారు కదా! దానికేమంటారు” అన్నారు.


మా మాట :- "నేను ముందే చెప్పానుగ నమస్కారము అన్ని రకముల అర్థము చెడినదై, దాని నిజార్థము తెలియకుండ

పోవుట వలన దానిలో కూడ స్వార్థమిమిడి పోయినది. అందువలన ఏ మతస్తుడైన గాని దేవునిపట్ల విధేయత భక్తి

కల్గినపుడే నిజమైన ఇందువు కాగలడు. అట్లు కాకపోతే ఎంతో తెలివితో మానవునికి దైవజ్ఞానము కల్గించాలని పెట్టిన

పెద్దల ఆచరణలన్ని వృథా అగును. ఇందూ సాంప్రదాయమైన నమస్కార ఆచరణే అర్థము లేనిదగును. ఇందువులంటే

జ్ఞానులని, ఒక మతము వారు కాదని, దైవమార్గములో గలవారెవరైన ఇందువులేనని మొదటి నుండి చెప్పుచున్నాము.

కావున మీరు కూడ దేవుని బిడ్డలే కావున దైవజ్ఞానమును గురించి ఇతరులకు బోధించండి ఇందూ సాంప్రదాయము

ప్రకారము అర్థము కల్గి ఇతరులకు నమస్కరించండి, ఇతరులకు కాలు తగిలిన దైవమునకు తగిలినట్లు భావించి

నమస్కరించండి. అట్లు చేయుట వలన మాయమార్గము వదలి దైవమార్గమును అనుసరించినట్లగును. కాలక్రమమున

సమసిపోయిన నమస్కార సాంప్రదాయమను ధర్మమును ఉద్ధరించినట్లగును.


లాభ సాంప్రదాయము.


ప్రతి మనిషికి, ప్రతి జీవరాసికి అరిషట్ వర్గములని పేరొందిన గుణములు ఆరు గలవు. జీవునికి శత్రువులాంటివి

గుణములని అరిషట్ అని చెప్పారు. ఆరును ఒక గుంపుగ చెప్పుట వలన వాటిని వర్గము అని కూడ అన్నారు.

శత్రుగుణములు ఆరు ఒక గుంపుగ ఉన్నాయన్నపుడు మరియొక గుంపు కూడ ఉండాలి. అట్లుండునపుడే వర్గము

అనిపేరు వచ్చును. ఒక గుంపుగుణములు పాపమునకు కారణము కాగ, మరియొక వర్గము పుణ్యమునకు కారణమైనవి.

పుణ్యమునకు కారణమైన గుణములను ఎవరు ఎక్కడ చెప్పుకోలేదు. కాని పాపమును సంపాదించు గుణములైన

శత్రువర్గమును గురించి చాలా చెప్పుకోవడము జరిగినది. అరిషట్ వర్గము యొక్క పేర్లు చాలామందికి తెలుసును


కాని మిత్రవర్గము యొక్క పేర్లు ఎవరికి తెలియవు. ఎక్కడయితే అపాయముండునో అచ్చటనే హెచ్చరిక బోర్డులుండును.

అపాయము లేని చోట బోర్డు అవసరములేదు. అట్లే ఏ గుణముల చేత ముప్పుగలదో వాటిని గూర్చి తెలుపు బోర్డులాంటి

పద్ధతులు మన పెద్దలు నిర్ణయించి పెట్టారు. మంచి గుణముల గూర్చి ఎక్కడ చెప్పలేదు. చెడు గుణముల గురించి

తెలుపు పద్ధతులలో మనకు తెలిసిన ఒక పద్ధతిని వివరించుకొందాము.


శత్రు గుణముల గురించి సాంప్రదాయపద్ధతిగ పెట్టిన ఆచరణ పూర్వము అందరికి తెలిసియుండెడిది. ఏదైన

ధాన్యమును కొలుచునపుడు, సంఖ్యను ఎంచునపుడు, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు అని

అనవలసిన సంఖ్యయుండగ అట్లు ఎప్పుడు ఎంచెడివారు కాదు. సాంప్రదాయపద్ధతిగ లెక్కించెడివారు. మొదటి ఒకటి

అని మొదలు పెట్టక లాభమ్ అని మొదలు పెట్టెడివారు. లాభము అన్న తరువాత రెండు, మూడు అని ఆరు వరకు

ఎంచి తర్వాత ఏడు అని అనక ఆరున్నొకటి అని పలుకుట కలదు. తర్వాత ఎనిమిది అని ఎంచడము (లెక్క

పెట్టడము) జరుగుచున్నది. ఈ పద్ధతి ప్రకారము ఎంచడము పూర్వమేకాక ఈ దినములలో కూడ జరుగుచున్నది.

ఈనాడు కొలతకొలుచు కొందరు పూర్వపు పద్ధతి ప్రకారము లెక్కించుచున్నప్పటికి పూర్వముంచిన భావము తెలియదు.


మనుషులలోని ఆరు శత్రు గుణములలో మొదటిది ఆశ అను గుణము కలదు. ఆశ ఎపుడు లాభమును

కోరుచుండును. అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే ఎక్కువ మనిషిని పీడించునది ఆశ అనుగుణము. అందువలన

అది అందరికి తెలియునట్లు ఎంచుకొనునపుడు సంఖ్యలో మొదటిదైన కామగుణమును లాభము అని పూర్వము ఒకటి

బదులు చెప్పుచుండెడివారు. కామముతో మొదలు అసూయతో అంత్యమగు గుణముల గుంపును ప్రత్యేకముగ

గుర్తించునట్లు, చెడుగుణములు ఆరే గలవని తెలియునట్లు ఆరు తర్వాత ఏడు అని చెప్పక ఆరున్నొకటి అనుచుండిరి.

ఈ విధముగ శత్రు గుంపులోని గుణముల సంఖ్య ఇంతేనని తెలియునట్లు, మరియు అందులోని మొదటి గుణము

మారుపేరు లాభము అని తెలియునట్లు, మొదట లాభమని వరుసక్రమములో ఆరు వద్దనే నిలిపి రెండుమార్లు ఆరును

పలుకుచుండెడి వారు. వరుస క్రమములో ఆరు అని పలికి తర్వాత కూడ ఆరు ఒకటి అని పలకడము వలన ఆరును

రెండుమార్లు ఉచ్చరించినట్లయినది. అట్లు పలుకుట వలన మొదటిదైన అశను గురించి చివరిదైన అసూయను

గురించి జ్ఞాపకము చేసినట్లయ్యెడిది. మనిషికి అన్ని గుణములకంటే ఎక్కువ బాధించునవి రెండుగుణములు మాత్రమే

గలవు. అవి ఒకటి మొదటిదైన ఆశగుణము తర్వాత ఆరవదైన అసూయగుణము. ఈ రెండుగుణముల గురించి

అందరికి తెలియవలసిన అవసరమున్నది. కావున సంఖ్యను ఎంచునపుడు లాభము అని మొదలు పెట్టి ఆరు తర్వాత

ఆరున్నొకటి అని పల్కుట గలదు. పూర్వము పెద్దలు చెప్పిన సాంప్రదాయములలో ఆధ్యాత్మికత ఉట్టిపడెడిది. నేడు

ఆచరణలున్నప్పటికి అర్థములు తెలియకపోవడము వలన సాంప్రదాయము లకు విలువలేకుండ పోయినది. ఇప్పటినుండి

మనము పూర్వపు సాంప్రదాయము ప్రకారము చెడుగుణములు తెలియునట్లు మొదట లాభము అని సంఖ్యను

లెక్కించునపుడు పల్కి ఇది మనలోని మొదటి గుణమని ఇతరులకు తెల్పవలెనని కోరుచున్నాము.



కట్టు బొట్టు ఆచరణ.


ఇందూమతము నుండి చీలిపోయినవి హిందూ, క్రిష్టియన్, ఇస్లామ్ మొదలగు మతములు కలవు. దాదాపు

ఏడుకోట్ల సంవత్సరముల పూర్వము నుండి ఇందూమతము కలదు. ఇప్పటికి ఇందూమతముండినప్పటికి మార్పుచెందిన

పేర్లు కల్గియున్నది. ఇందూమతము నుండి చీలిపోయిన మతములన్నిటిలోను ఇందుత్వము కలదు. కాని మతముల

పిచ్చిపట్టిన మనుషులు వేరువేరు మతముల పేర్లు పెట్టుకొని ఆయా మతములవారమని వాదించుచున్నారు తప్ప తమ

మతములో దైవ జ్ఞానమున్నదని కనుకనే తమది ఇందూమతమని తెలుసుకోలేక పోవుచున్నారు. చివరకు హిందువులు

కూడ తాము మొదట ఇందువుల మేనని తెలుసుకోలేకపోవుచున్నారు. ఈ రోజు భూమి మీద ఎన్ని మతములు గలవో

అవి అన్నిటికి మూలస్థానము ఇందూమతము. క్రొత్త పేరు పెట్టుకొన్నంత మాత్రమున వారు వేరు కాదు. దేవుని

జ్ఞానమును బోధించు ఏ మతమైన ఇందూమతమే. ఇందూ అనగా దేవుని జ్ఞానమని అర్థము. ఆ లెక్క ప్రకారము అన్ని

మతములు తేడాలేకుండ ఇందూమతములోని భాగములనియే చెప్పవచ్చును. ప్రపంచమునకంతటికి దేవుడొక్కడే కలడు.

అలాగే ప్రపంచమంతటికి ఇందూమతమొక్కటే గలదు. ఉన్న ఒక్క దేవున్ని అనేక మతముల వారు అనేక రకములుగ

పిలుచుకొనుచున్నారు. అలాగే తమవి వేరు మతములని భ్రమిస్తున్నారు. చివరకు అందరి గమ్యము ఒక్క దేవుడే.

ఏడుకోట్ల సంవత్సరముల నుండి ఇందూమతము అనేక మతములుగ రూపాంతరము చెందుచు వచ్చి ప్రస్తుత కాలమునకు

2000 సంవత్సరముల పూర్వము నుండి క్రైస్తవమతముగ, 1400 సంవత్సరముల పూర్వమునుండి ఇస్లామ్ మతములుగ,

ఇంకా అనేక మతరూపములలో నిలిచియున్నది. మార్పు చెందుచుపోగా మిగిలిన ఇందూమతము కొంత తన పేరును

కోల్పోయి హిందూమతముగ మారిపోయినది. ఏది ఏమైన అన్ని మతముల సారాంశములలో ఇందూత్వము నిగూఢమై

ఉన్నను దానిని గ్రహించలేని మనుషులు నేను హిందువునని నామతము వేరని, మాదేవుడు వేరని అనుకొనుచుండగ,

అట్లే కొందరు మేము ఇస్లామ్ మతస్థులమని మాదేవుడు వేరని అనుకొనుచున్నారు. మరి కొందరు మేము క్రైస్తవులమని

మామతము మాదేవుడు వేరని చెప్పుకొనుచున్నారు. అంతేకాక మేము వేరు అని తెలియుటకు, మేము పలానా

మతస్థులమని ఇతరులు తెలియుటకు, వారివారి జీవనశైలిలో మార్పులు చేసుకోవడమే కాక ఆకార అలంకారము

లోను మార్పులు చేసుకున్నారు.


మేము పలానా మతమువారని గుర్తించునట్లు ముస్లీమ్లు, హిందువులు, క్రైస్తవులుండుట అందరికి తెలిసిన

విషయమే. గుర్తింపునకే తమ ఆకారములని వారు కూడ చెప్పుచున్నారు. పూర్వము అన్ని మతములకు ఆధారమైన

ఇందూమతములో కూడ కొన్ని కట్టు బొట్టు అలంకరణములుండెడివి. ఇందూమతములో ఏ ఆచరణ ఉండిన అది

దైవజ్ఞాన సంబంధమైయుండును, కనుక వాటన్నిటికి అర్ధముండెడిది. అర్ధమున్న ఆచరణలు గల ఇందూమతము

కొంత మార్పుచెంది హిందూమతముగ మారినప్పటికి పాత ఆచరణలు కొంతకాలము ఉండెడివి. తర్వాత అన్ని

మార్పు చెందిపోయినవి, మనుషులు కూడ ఇందువుల నుండి పూర్తి హిందువులుగా మారిపోయారు. పూర్వమున్న

ఇందూ సాంప్రదాయములలోని అర్థముగల కట్టు బొట్టు అలంకరణ విషయములను గురించి ఇప్పుడు తెలుసుకొందాము.



తలముడి.




పూర్వము స్త్రీలు పురుషులు అందరు తలమీద వెంట్రుకలు పెంచెడివారు. పెంచిన వెంట్రుకలను తల

మధ్యభాగములో ముడి వేసెడివారు. మనస్సు యొక్క తలంపులకు శిరస్సు స్థానము. తలలోని తలంపుల వికారములు

లెక్కలేనన్ని ఉన్నవి. కావున తలంపులను తలవెంట్రుకల సంఖ్యగ తలచి వాటిని ముడివేయడము జరిగినది. తల

మధ్యభాగములో బ్రహ్మనాడి కలదు. తలమీద దీని స్థానమును “పునక” అంటారు. మనలోని తలంపులను విచ్చలవిడిగా

పోకుండ బంధించడము వలన మనోనిలకడకల్గి ఆత్మ తెలియబడును. తలంపులు చెలరేగుచున్నంత వరకు శరీరములోని

ఆత్మ తెలియబడదు. అనేక తలంపులను వెంట్రుకల సంఖ్యగ పోల్చి తలంపులను చెలరేగకుండ చేయు అర్థమొచ్చునట్లు

వెంట్రుకలను ముడివేసెడి వారు. తలంపులు నిలుచుటవలన తల మధ్యలోని ఆత్మ తెలియును, కావున వెంట్రుకలను

కూడ తల మధ్యభాగములో ముడివేసెడివారు. పూర్వము స్త్రీలు పురుషులు అందరు తలపైన వెంట్రుకలను కుప్పగా

కట్టెడివారు. వెంట్రుకల “కుప్ప” అనుపదము కాలక్రమమున కొద్దిగా మారిపోయి “కొప్పు” అయినది. జ్ఞానార్థము

కల్గిన కొప్పు పూర్వము పురుషులకు స్త్రీలకు ఉండెడిది. తల మధ్యస్థానము ఆత్మస్థానమని, ఆ స్థానమునకు పూజ్య

భావముతో సువాసనగల తెల్లని మల్లెపూలనుంచెడివారు. పూర్వము స్త్రీలు పురుషులందరు తమ తమ కొప్పులమీద

పూలనుంచెడివారు. పురుషులు పూలు పెట్టుకొనెడివారంటే విచిత్రముగ ఉంది కదా! జ్ఞాన చిహ్నమైన చంద్రబింబము

తెల్లనయినది. అలాగే తెల్లని మల్లెపూలు కూడ జ్ఞానార్థము నిచ్చునవే. తమ తలలో స్వచ్ఛమైన జ్ఞానము కలుగవలెనని

పూజ్యభావముతో స్వచ్చతకు మారు పేరు అయిన తెలుపురంగు మల్లెపూలనే ధరించెడివారు. ఈ విధముగ పూర్వము

ఇందువులు ఎంతో భావముతో కూడుకొన్న తలముడి తల మధ్యభాగములో ఉంచుకొనెడివారు.


నేటి కాలములో పురుషులలో తలమీద కొప్పు మాయమై పోయినది. స్త్రీలలో కూడ క్రాపులు జడలు వచ్చి

కొప్పు కట్టువారే కరువైపోయారు. ఎక్కడైన ఎవరైన కొప్పు కట్టువారుంటే ఆ కొప్పు తలమీద లేకుండ తలవెనుక

ఉంటుంది. ఆడవారు అందరు పూలు పెట్టుకోవడం ఈనాటికి ఉన్నప్పటికి అవి దేవునికి కాదు. పెట్టెడి పూలుకూడ

అలంకారమునకు ఆకర్షణకు మాత్రమే పెట్టుచున్నారు. పూర్వము ఎంతో జ్ఞానముతో కూడుకొన్న ఆచరణా సాంప్రదాయము

నేడు అర్థహీనమై పోయినది. కొప్పుకట్టి పూలు పెట్టడము జ్ఞాన సాంప్రదాయమన్నమాటే తెలియకుండా పోయినది.

ఇప్పటికి వంద సంవత్సరముల క్రితము కూడ మగవారికి కొప్పులుండెడివి. పంజాబ్ రాష్ట్రములో సిక్కులు ఇప్పటికి

తలమీదనే వెంట్రుకలను ముడివేసి పెట్టడము చూస్తే పూర్వ సాంప్రదాయము అక్కడ మాత్రమే మిగిలి ఉన్నదని

తెలియుచున్నది. అక్కడ కూడ మగవారు పూలుపెట్టు సాంప్రదాయము లేదు.


ఇప్పుడయిన జ్ఞానము తెలిసి సాంప్రదాయము ప్రకారము పురుషులు కొప్పుకట్టి పూలు పెట్టుకోవచ్చును. కాని

మిగతవారికి సాంప్రదాయవిలువ తెలియదు కావున పూలు పెట్టుకొన్న వానిని నపుంసకుడు అనుకొను ప్రమాదము

కలదు. అందువలన మొదట ఇందూసాంప్రదాయములను గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైన  

ఉన్నది. అందరికి తెలిసినపుడు ఆచరణకు అర్థమేర్పడగలదు. లేకపోతే అపార్థము చేసుకొను ముప్పు గలదు. ఇందూ



సాంప్రదాయములలో తలమీద ముడి వేయడమును స్త్రీలయిన ముఖ్యమైన పనిగ పెట్టుకోవలెనని కోరుచున్నాము.

అట్లు కాకపోతే ముడి సాంప్రదాయము మన తరముతోనే అంత్యమైపోగలదు.



గుండు గీయించుకొనుట.


పూర్వము నాయి బ్రాహ్మణులనువారు (మంగళవారు) గుడి దగ్గర మంగళవాయిద్యములు వాయించుటకు

ఉండెడివారు. అలాగే ఎవరైన భక్తులు గుండు గీయించుకొను మ్రొక్కుబడి ఉంటే ఆ మ్రొక్కుబడి చెల్లింప చేయుటకు

తలవెంట్రుకలను తీసి గుండు చేసెడివారు. మంగళకత్తిని గుండు గీయు నిమిత్తమే వాడెడివారు. దైవసేవ నిమిత్తము

బ్రాహ్మణులు, నాయిబ్రాహ్మణులు దేవాలయముల వద్ద కనిపించెడివారు. గర్భగుడిలో పని బ్రాహ్మణులకు, గర్భగుడి

బయటిపని నాయిబ్రాహ్మణులకు ఉండెడిది. బ్రాహ్మణులు నాయిబ్రాహ్మణులు ఒకే తండ్రికి పుట్టిన వారైనప్పటికీ

తల్లులు వేరు వేరు. కావున గుడిలోని పనిని, పెళ్ళి దగ్గర పనిని, మరణించినవాని కర్మకాండ పనిని ఇద్దరు పంచుకుని

చేయుచుందురు. నాయి అనగ కుక్క అని చాలా భాషలలో అర్థము గలదు. తెలివైన బ్రాహ్మణులు తమ సవతితల్లి

కొడుకులకు కుక్క బ్రాహ్మణులని పేరుపెట్టారు. తమ సోదరులు తమను తక్కువ చేయుటకు పెట్టిన పేరని తెలియక

మంగళవారు ఇప్పటికి మేము నాయిబ్రాహ్మణులని చెప్పుకొనుచుండుట చూచియే ఉన్నాము. మంగళ మనగ శుభమని,

మంగళవారమనగా శుభకరమైనవారని అర్థముండగా మంగళవాల్లంటే ఏదో తక్కువైనట్లు నాయి బ్రాహ్మణులంటే ఏదో

గొప్పయినట్లు చెప్పుకోవడము, నాయి బ్రాహ్మణులని బోర్డులు పెట్టుకోవడము చూస్తే విచిత్రముగ ఉంటుంది కదా!


పూర్వము శ్రీరంగని దేవాలయమునకు ఒక జ్ఞానిపోయి, అక్కడ జ్ఞానము ప్రకారము తన ఉద్ధేశ్యమును

తెలియజేయుటకు నేను తలంపులన్నిటిని లేకుండ చేసుకొన్నానని, తలమీద తలంపుల సంఖ్యకు గుర్తయిన వెంట్రుకలను

పూర్తిగ లేకుండ చేసుకొని, వెంట్రుకలు లేని గుండును ప్రతిమ ముందర చూపించాలనుకొన్నాడు. అది ఒక శుభకరమైన,

మంగళకరమైన పని కావున పవిత్రమైన బ్రాహ్మణుల చేత ఆ పనిని చేయుంచుకోవాలని గుడి బయటి పనులు పంచుకొన్న

బ్రాహ్మణులను చూచి తన ఉద్ధేశ్యమును తెల్పెను. దేవాలయము వద్ద దేవుని సేవ చేయు బయటి బ్రాహ్మణులు ఆ

పనికి ఒప్పుకొని ఒక పదునైనకత్తితో తలమీద గల వెంట్రుకలన్ని తీసివేసిరి. మొదట ఇలాగ దేవాలయములో మొదలైన

వెంట్రుకలు గొరుగుపని నేటికి బజారులలో షాపులలోనికి మారినది. దైవసేవరూపములో మొదలైన పని నేడు వారికి

జీవితాధారమైనది. యోగసంపన్నుడయిన జ్ఞాని తన జ్ఞానమును సాంప్రదాయ పద్దతిగ, ఆచరణ పద్దతిగ తెలియచేయుటకు

తలమీద వెంట్రుకలన్ని తీసివేయించెను. ఆత్మజ్ఞానమును తెల్పు శుభకరమైన ఆ పనిని చేసినందుకు తలవెంట్రుకలు

గొరిగిన బ్రాహ్మణులను మంగళము చేసినవారు కనుక మంగళవారని ఇచ్చిన బిరుదు నేటికిని ఉన్నను అదేదో చెడ్డదిగ,

నాయిబ్రాహ్మణులనుట ఏదో గొప్పదిగ తలచుచున్నారు.


ఆనాడు అలా మొదలిడిన తల గొరిగి చూపించు సాంప్రదాయము ఈనాటికి తిరుపతిలో నిత్యము జరుగుచున్నది.

కాని ఆనాటి అర్థము ఏమాత్రము లేదు. దేవునికేదో మన వెంట్రుకలతో పని ఉన్నట్లు నాకు ఈ కోర్కెనెరవేర్చు నీకు

నాతలవెంట్రుకలిస్తానని మ్రొక్కుచున్నారు. జ్ఞాన సాంప్రదాయమైన తలముడిగాని, అలాగే తలంపులను లేకుండ


చేశానని తెల్పు బోడితలను చూపుటలోని అర్థముగాని లేకుండ పోయినది. గుడి దగ్గర తలగొరిగించుకొనుటకు

పూర్వమువలె ఈ ఆచారము తల వెంట్రుకలు పెంచి మంగళవారిచేతనే కత్తిరించుకొనుట నేటికిని ఉన్ననూ,

వెంట్రుకలు పెంచడములో అర్థము లేదు, గొరిగించుకొనుటలోను అర్థము లేదు. పూర్వము ఈ ఆచారముండెడిదని

చెప్పుకొనుటకు నేటికిని గుడుల వద్ద తలవెంట్రుకలు సమర్పణ ఉండుట సంతోషింపదగ్గ విషయము. గుండు గీయించుకొను

ఎంతో జ్ఞానార్థముగల సాంప్రదాయములు అర్థరహితమై పోవడమే కాక దానిని అమలుచేసిన బ్రాహ్మణులు చివరకు

కుక్క బ్రాహ్మణులని పేరు చెప్పుకొనుచు శుభకరమైన మంగళవారమని చెప్పుకోక పోవడము శోచనీయము.



మూడు విభూతి రేఖలు.


పూర్వము పరమాత్మ జ్ఞానమును తెలుపు పనులనే సాంప్రదాయముగా ఎంచుకొని ఆచరించుట వలన

క్రొత్తగా పుట్టి పెరుగు వారికి పరంపరగ జ్ఞానమును అందించవచ్చుననేది ఆనాటి పెద్దల ఆశయము.  ఆ పద్ధతిలోనే

నుదిటి మీద మూడు విభూతి రేఖలను తీర్చిదిద్దడము జరిగినది. మూడు తెల్లని రేఖలు పెట్టడమే కాక వాటిలో

మధ్యరేఖకు సింధూరముతో బొట్టునుంచెడివారు. అలా మధ్యరేఖకు సింధూరము బొట్టునుంచుట వలన మూడు రేఖలలో

మధ్యరేఖకు ప్రత్యేకత ఏర్పడుచున్నది. ఇంత తతంగము చేయుటలో ఏదో ఒక ఉద్ధేశ్యము ఉండవలయును కదా!

ఆనాటి వారి ఉద్దేశ్యమేమిటో తెలుసుకొందాము.


మనిషికి ముఖ్యమైన శరీర భాగము తల ముఖము. ఎవరిని గుర్తించవలయుననిన వారి ముఖమును చూచియే

గుర్తింతుము. ఎవరి మనోభావాలు తెలుసుకోవలయుననిన ముఖమును చూచి తెలియవచ్చును. ముఖము అందరికి

ఒక గుర్తింపు కార్డులాంటిది. అందువలన ఎవరిని గుర్తించవలెననిన ముఖమును చూడవలసిందే. బయటి వ్యక్తి

యొక్క గుర్తింపుకు, లోపలి వ్యక్తిత్వ మనోభావముల గుర్తింపుకు ముఖము ముఖ్యమైన ప్రతిబింబము. కావున పూర్వము

పెద్దలు ముఖము మీదనే అతి ముఖ్యమైన దేవుని విషయమును ఒక గుర్తుగ తెలియజేశారు. ముఖముమీద గుర్తుగ

ఉంచి తెలియజేసిన చిహ్నమే మూడు విభూతిరేఖలు. ముఖమున నుదిటి భాగములో అందరికి కొంత స్థలముండును.

ముక్కు పైభాగమున ఉండుట చేత మెదడుకు సమానభాగములో నుదుటి భాగము కలదు. శిరస్సు దైవనిలయము

మరియు మాయనిలయము. మన తలలోనే దేవుడు గలడు, మాయయు గలదు. మాయకు ప్రతిరూపము గుణములు.

మాయ గుణముల రూపములో ఉన్నది. కావున మాయ యొక్క అంతులేని వికారములకు తలమీదగల అసంఖ్యాక

వెంట్రుకలను గుర్తుగ చెప్పుకొన్నాము. వాటిని ముడివేయడము, కత్తిరించి లేకుండ గుండు చేసుకోవడము, మాయను

జయించు గుర్తింపులని తెలుసుకొన్నాము. మనిషి మాయనుండి బయటపడగలిగితే తెలియబడునది దేవుడు. అందువలన

ముందు మాయకు గుర్తింపుగ లెక్కలేనన్ని వెంట్రుకలను తలమీద ఉండునట్లు చేసి, క్రింద ఖాళీ నుదుటి భాగమును

దేవుడు సృష్టించాడు. తలమీద అనేక చీలికల రూపముతోనున్న మాయను జయించగలిగితే తర్వాత దేవుడు ఈ

విధముగ ఉన్నాడని తెలియగలడనుటకు గుర్తింపుగ దైవస్థానమైన నుదుటిభాగములో దేవుని వివరము తెలియజేయు

మూడు విభూతి రేఖలనుంచారు.


దేవుడు కల్మషములేని స్వచ్ఛమైనవాడని తెలియచేయుటకు, సంపూర్ణజ్ఞానయుతుడని తెలియజేయుటకు స్వచ్ఛమైన

తెలుపురంగును ఎంచుకొని తెల్లని రేఖలను నుదుటిమీద తీర్చిదిద్దారు. పైన మాయ క్రింద దేవుడున్నట్లు గుడిలోని

ప్రతిమల పైభాగమున మాయ గుర్తింపయిన వికృతాకారమును పెట్టియుంచడము మనము చూచియే ఉందుము.

అలాగే మన తలలో కూడ మాయపైన క్రింద దేవుడున్నట్లు అర్థముతో పైన అసంఖ్యాక వెంట్రుకలు క్రింద నుదురు

భాగము కలదు. అలా మూడు రేఖలను ఎందుకు ఉంచారను సంశయము కొందరికి రావచ్చును. దానికి జవాబు

ఏమనగా! దేవుడు ప్రతి శరీరములోను మూడువిధములుగ ఉన్నాడు. ఒకటి జీవాత్మ, రెండవది ఆత్మ, మూడవది

పరమాత్మ. మూడు విధములుగనున్న దేవున్ని మూడు విభూతిరేఖల గుర్తుగ నుదుటి మీద ఉంచారు. పైన ఉన్న రేఖ

పరమాత్మ అనియూ, మధ్యలోగల రేఖ ఆత్మ అనియూ, క్రింద గల రేఖ జీవాత్మ అనియూ ఆనాటి పెద్దల భావము.

మూడురేఖలలో క్రింద రేఖయిన జీవాత్మ పరమాత్మ యొక్క అంశయే అయినప్పటికి కర్మబద్ధుడై ఉన్నాడు. జీవుడైన

వాడెవ్వడు మొదటి పైరేఖ గుర్తయిన పరమాత్మను కర్మ ఉన్నంతవరకు తెలియలేరు. సజీవముగ భూమిమీద ఉన్నంతవరకు

పరమాత్మను ఎవరు తెలియలేరు. పరమాత్మను తెలియుటకు కర్మ లేకుండ పోవాలి. కర్మను లేకుండ చేసుకొనుటకు

ఆరాధించవలసినది, తెలియవలసినది రెండవ ఆత్మను. ఆత్మజ్ఞానమును తెలియుటచేత జ్ఞానాగ్ని ఏర్పడి కర్మను

కాల్చివేయును. కర్మ సశేషముగ అయిపోయినపుడు పరమాత్మను చేరవచ్చును. అందువలన మనము తెలియవలసినది

రెండవ ఆత్మనని నుదుటిమీద రెండవ రేఖను సింధూరముతో బొట్టుపెట్టి గుర్తించారు. నుదుటి మీద విభూతిరేఖలు

ధరించిన పూర్వీకులు రెండవ రేఖమీద సింధూరముతో బొట్టుపెట్టుకొని, మనము తెలిసి ఆరాధించవలసినది ఇదియేనని

తెల్పెడివారు.


ఇందూ సాంప్రదాయమైన విభూతి రేఖలను నేటికిని పెట్టుకొనెడి వారు గలరు. విభూతి ధరించువారుండినప్పటికి

స్పష్టముగ మూడు రేఖలను తిక్కుకొనక నొసలంత విభూతి పూసుకొంటున్నారు. ఒకవేళ ఎక్కడయిన మూడు రేఖలను

విడివిడిగ కనిపించునట్టు ధరించు వారున్నప్పటికి వారు మధ్యరేఖకు సింధూరపు బొట్టు పెట్టడము లేదు. మూడురేఖలను

వదలి క్రింద బొట్టుపెట్టుచున్నారు. విభూతిని మూడు రేఖలుగ కాక కలిపి త్రిక్కడము, రేఖలుండిన మధ్యరేఖను

గుర్తించక పోవడము సాంప్రదాయ విరుద్ధమగును. సక్రమ ఆచరణ లేకపోవడమునకు కారణము విభూతి రేఖల

యొక్క అర్థము తెలియక పోవడమే. విభూతి రేఖల అలంకరణ సాంప్రదాయమని దాని అర్థమిలా ఉందని తెలియక

పోవడమువలన విభూతిధారణ ఇతరులకు వ్యర్థమైనదిగ తెలియుచున్నది. ఈ కాలములో విభూతిధారణ స్వాములకు

మాత్రమే పరిమితమైపోయినది. స్వాములు కూడ విభూతిధారణను సాంప్రదాయ బద్దముగా ధరించడము లేదు.

కొందరు విభూతి ధరించినప్పటికి రేఖలైన ఉండవు, రేఖలుంటే మధ్యరేఖకు బొట్టయిన ఉండదు. ఇట్లే కొంతకాలము

జరుగగా చివరకు విభూతి ధరించెడి సాంప్రదాయమే లేకుండ పోవు ప్రమాదము గలదు.



ముక్కు పుడకలు.


తలమీద జుట్టుముడి, నుదుటి మీద విభూతిరేఖలు, ముక్కులకు ముక్కుపుడకలు పెట్టడము ముఖము మీదగల

మూడు ముఖ్యమైన సాంప్రదాయములుగా పూర్వము తలచెడివారు. ఇందువులలో ముఖము మీద గల మూడు

ఆచరణలలో రెండు పురుషులు, రెండు స్త్రీలు సాంప్రదాయబద్దముగ ఆచరించుచుండిరి. తలముడి, విభూతి రేఖలు

పురుషులు ఆచరణచేయగా, తలముడి ముక్కుపుడకలు ధరించెడి ఆచారము స్త్రీలకుండెడిది. స్త్రీలు భూృమధ్యస్థానమున

ముక్కు పైకొనమీద కుంకుమబొట్టు ఉంచెడివారు. కనుబొమల మధ్యభాగమున ఆత్మ నివాసమై ఉన్నదని, ఆత్మను

పూజిస్తున్నామను ఉద్దేశ్యముతో కుంకుమబొట్టు పెట్టెడివారు. మగవారు కూడ విభూతి రేఖలలో ఆత్మనే గుర్తించి

సింధూరముబొట్టు పెట్టెడివారు. మగవారు సింధూరముతో ఆత్మను, ఆడవారు కుంకుమతో ఆత్మస్థానమును పూజ్య

భావముతో గుర్తించెడివారు. ఆడవారికి విభూతి ధరించడముండెడిది కాదు. మగవారికి ముక్కు పుడకలు

ధరించడముండెడిది కాదు.


ఆడవారికి ముఖ్యసాంప్రదాయమైన ముక్కుపుడకలు ధరించడము నేటికి కొంతవరకు మిగిలి ఉన్నది.

అయినప్పటికి ముక్కు పుడకలలోని సాంప్రదాయ అర్థము తెలియదు. పూర్వము ఆడవారిలోని ముక్కు పుడకల

సాంప్రదాయము ఏమిటో తెలుసుకొందాము. మన శరీరములో దాదాపు మూడున్నర లక్షల నాడులు కలవు, వాటిలో

ఆత్మచైతన్యశక్తి ప్రవహిస్తూ శరీరములోని అణువణువును కదిలించి పని చేయిస్తున్నది. లక్షల నాడులలో ప్రవహించు

ఆత్మ చైతన్యశక్తి ఒక కేంద్రము నుండి వస్తున్నది. ఆ కేంద్రము బ్రహ్మనాడిలో గలదు. దీనిని బట్టి ఆత్మ బ్రహ్మనాడిలో

నివాసమై ఉన్నదని తెలియుచున్నది. బ్రహ్మనాడి నుండి ఆత్మ మొదట రెండు నరముల ద్వారా శరీరమంతటికి

వ్యాపించుచున్నది. మొదటి ఆత్మ ప్రవేశద్వారములైన రెండు నాడులను తెలుపడమే “ముక్కు పుడకలు ధరించెడి

సాంప్రదాయము”. శరీరములో జన్మ ప్రారంభమైనపుడు బ్రహ్మనాడి నుండి ఆత్మ మొదట కుడి ఎడమలుగానున్న

రెండునాడులలో ఒక్కమారుగ ప్రవేశిస్తున్నది. కుడిప్రక్క నాడిని సూర్యనాడి అనియూ, ఎడమప్రక్క నాడిని చంద్రనాడి

అనియు అంటున్నాము. మధ్యలో గల బ్రహ్మనాడిని సుషుమ్ననాడి అనియూ, కుడిప్రక్క గల సూర్యనాడిని ఇడనాడి

అనియూ, ఎడమప్రక్క గల చంద్రనాడిని పింగళనాడి అని కూడ చెప్పుచున్నాము.


ఈ విధముగ మన శరీరములో ఆత్మ వ్యాపిస్తున్నదని తెలియజేయు సాంప్రదాయమే ముక్కుపుడకలు ధరించెడి

ఆచరణగ ఉండెడిది. స్త్రీల ముక్కు రంధ్రములలో కుడి ముక్కుపుటమునకు సూర్యబింబమును పోలు గుండ్రని ఆకారముగల

ముక్కుపుడక ఉండెడిది. అలాగే ఎడమ ముక్కు పుటమునకు చంద్రబింబము పోలు అర్ధచంద్ర ఆకృతి కల్గిన ముక్కుపుడకను

ఉంచెడివారు. పూర్వము ముక్కుపుడకలు ఉన్నవంటే అవి సూర్య చంద్ర ఆకారముతో తప్ప వేరువిధముగ ఉండెడివి

కాదు. ఈ కాలములో వాటి ఆకారములు పూర్తి మారిపోయి రకరకముల ముక్కుపుడకలు తయారైనవి. పూర్వము

ముక్కుపుడకలు ఉండెడివనుటకు ఆధారముగ అక్కడక్కడ ఆకారము మారిన ముక్కుపుడకలైన కలవు. పూర్వము సూర్య

చంద్ర ఆకారము కల్గిన ముక్కుపుడకలనే కాక బ్రహ్మనాడిని తెల్పుచు రెండు రంధ్రములకు మధ్యలో ముక్కు కొనభాగమున

“బులాకీ” అనుపేరు గల ఒక రింగులాగ బంగారపు కొండిని తగిలించి దానికి ఒక ముత్యమును వేలాడదీసెడివారు.

రెండు రంధ్రముల మధ్యన గల కొండిలాంటి దానిని బ్రహ్మనాడి అని పూర్వము గుర్తుంచెడివారు. బ్రహ్మనాడిలో


స్వచ్ఛమైన ఆత్మ గలదు కావున ఆత్మను తెల్లని ముత్యముగ చూపుచు మధ్యలో వేలాడదీశారు. ఈ అలంకారము వలన

సూర్య చంద్రనాడులు మరియు వాటి మధ్యన గల బ్రహ్మనాడి తెలియును. ఆ విధముగ తెలియుటకు ముక్కుపుడకలు

ధరించెడి ఆచారముండెడిది. ఇప్పటికి భరతనాట్యము చేయువారి అలంకరణలో ముక్కుపుడకలు రెండు వేరు ఆకారములో

ఉన్నప్పటికి మధ్యలోగల బ్రహ్మనాడి గుర్తు ముత్యముతో పద్ధతి ప్రకారమున్నది. ఎంతో అర్థము గల ముక్కుపుడకలు

మరియు బులాకీ ఇందూ సాంప్రదాయములలో ముఖ్యమైన అలంకరణ ఆచారమని తెలియాలి. ఇప్పటినుండైన మన

ఇళ్లలోని స్త్రీలచేత సూర్య చంద్ర ముక్కుపుడకలను ధరింపచేసి సాంప్రదాయమును కాపాడుకొందాము.


పంచకట్టు, చీరకట్టు.


మగవారు నడుము చుట్టూ కట్టుకొను పంచకట్టులోను, ఆడవారు కట్టు చీరకట్టులోను కూడా జ్ఞానమును

ఇమిడ్చిన ఆచరణను పూర్వము పెద్దలు పెట్టారు. ఈ కాలములో ట్రవుజర్లు వచ్చి మగవారికి పంచకట్టుట కరువైనది.

అలాగే పంజాబీ డ్రస్సులు వచ్చి ఆడవారికి చీరకట్టు కరువైపోయినది. కొంత కాలమునకు పంచ అంటే ఏమిటో

మగవారికి, చీర అంటే ఏమిటో ఆడవారికి తెలియకుండా పోవు కాలము రాగలదు. ఇప్పటికి అక్కడక్కడ పంచకట్టెడి

మగవారు, చీరకటెడ్జి స్త్రీలు గలరు. పంచ చీర కట్టెడి ప్రజలెక్కడైన ఉన్నప్పటికీ వాటిలోని అర్థము తెలియదనియే

చెప్పవచ్చును. పూర్వముండి ఇప్పుడు లేని పంచకట్టు, చీరకట్టు యొక్క ఆచార అర్థమేమిటో తెలుసుకొందాము.


మగవారు పంచకట్టునప్పుడు కడుపు ముందర కుచ్చెల్లు పోసి కట్టుకొనెడివారు. కుచ్చెల్లు అనగా పంచను

మడతలు పెట్టడము. పంచను నడుము చుట్టూ కట్టినప్పటికి, మిగులు పంచను ఏడు మడతలు పెట్టి కడుపు ముందర

చెక్కెడివారు. అలాగే ఆడవారు కొంత చీరను ఏడుమడతలు కుచ్చెల్లు పోసి నడుము వెనక చెక్కెడివారు. ఆడవారు

వెనక, మగవారు ముందర కుచ్చెలు చెక్కడము ఈనాటికి కర్నాటక ప్రాంతములో మిగిలి ఉన్నది. కొన్ని సాంప్రదాయ

బ్రాహ్మణ కుటుంబములలో కూడ కలదు. కర్నాటక గ్రామీణప్రాంతములలో ఇప్పటికి ఆడ మగవారు మడతలు పెట్టి

కట్టడము గలదు. అక్కడ ఆచారము కొంత మిగిలి ఉన్నప్పటికి ఏడుమడతల పద్ధతి వారికి తెలియదు. ఏడు

మడతలను పెట్టక ఎక్కువ తక్కువ మడతలు పెట్టుచున్నారు.


మన శరీరమును కదిలించి నడిపించు ఆత్మ ఏడు కేంద్రములలో వ్యాపించి ఉన్నదని, ఏడు కేంద్రములనుండి

వచ్చు శక్తి వలననే మన శరీరములో శ్వాస ఆడుచున్నదని తెలియుటకు శరీరమునకు చుట్టిన గుడ్డను ఏడు మడతలు

పెట్టడము జరిగెడిది. ఒక్కొక్క నాడీకేంద్రము ద్వార కొంతసేపు శరీర శ్వాసను ఆత్మ నడుపుచున్నది. ఒక్క కేంద్రము

యొక్క శ్వాస మొదలును అంత్యమును ఒక మడతగ లెక్కించి, దినమునకు ఏడుకేంద్రముల ద్వారా ఆడుశ్వాసతోనే

శరీరము బ్రతుకుచున్నది కావున శరీరమునకు చుట్టు గుడ్డను ఏడుమడతలు పెట్టి ఏడు నాడీకేంద్రములు అందరికి

తెలియునట్లు చేశారు. పూర్వము మగవారు పంచలు, ఆడవారు చీరలు కట్టుచు వారి వస్త్రములకు ఏడుమడతలనే

అర్థముతో పెట్టుకొనెడి వారు. అలా చేయుట వలన ఈ శరీరము ఆత్మ యొక్క ఏడు నాడీకేంద్రముల ద్వారానే

జీవించగల్గుచున్నదని జ్ఞాపకము చేసుకొనెడి వారు. పూర్వము జ్ఞానము కల్గిన ఆచరణలనే పెద్దలు నిర్ణయించి పెట్టారు.


వాటిని ఆచరించుచు జ్ఞానమును అభివృద్ధి చేసుకొనెడివారు పూర్వముండిరి. కాలగమనములో అర్థము పోయిన

ప్పటికి ఆచరణలు కొన్ని ప్రాంతములలో మాత్రము మిగిలి ఉన్నవి. అర్థములు లేని ఆచరణలు ఊపిరిపోయిన

శరీరములాంటివి. కొంతవరకు కట్టుబొట్టు సాంప్రదాయములను మనము ఆచరించి, వాటికి ప్రాణము పోసి ఇతరులు

ఆచరించునట్లు చేస్తాము.


ఇందూసాంప్రదాయములలో మనిషి తన శరీరమునకు తగిలించు కొన్న ఆచారములలో కొన్నిటి ని

తెలుసుకోవలసినవి గలవు. అటువంటి వాటిలో ఎన్నో ఆచరణలు అర్థములను మా రచనలలోని "దేవాలయ

రహస్యములు” అను గ్రంథములో గలవు. జిజ్ఞాసులు దేవాలయ రహస్యములు చదివి తెలుసుకోవలసినదిగా కోరుచున్నాము.


శవయాత్ర.


ప్రపంచములో ప్రతి జీవి నిర్ణయింపబడిన వాయువు (ఆయువు) ప్రకారము జీవయాత్ర సాగించి మరణించుట

సహజము. ఈ జీవయాత్ర నిర్ణీత వాయువు ప్రకారము ఒక శరీరమందు సాగుచున్నది. శరీరమను బండిలో

నిర్ణయింపబడిన వాయువు కొలత దూరము ప్రయాణంచి, ఎక్కడ వాయువు కొలత అయిపోవుచున్నదో అక్కడ శరీరము

నుండి జీవుడు దిగి పోవలసిందే. దానినే మరణము అంటుంటాము. ఇది ప్రతి ఒక్క జీవికి జరుగుచున్న విషయమే.


మనము ఒక ఊరికి బయలుదేరినపుడు ఆ ఊరు ఎంత దూరమున్నదో, మనము ఎక్కడ దిగవలయునో,

అన్నియూ జ్ఞప్తిలో పెట్టుకొని ప్రయాణిస్తూ ఉంటాము. గమ్యము చాలా దూరమైతే దానికి తగిన ఖర్చు నిమిత్తము

ఎంత డబ్బుకావాలో అంతే దగ్గర పెట్టుకుంటాము. అట్లే ఆ ప్రయాణములో ఎవరితో స్నేహము చేసినప్పటికి దిగిపోవునంత

వరకే ఆ స్నేహముండునని తెలిసి అంతవరకే పరిచయమేర్పరచు కొంటాము. ఇది గమ్యము తెలిసిన ప్రయాణము

గనుక ఈ ప్రయాణములో బంధాలు అనుబంధాలు ఏమి పెట్టుకోము.


జీవిత ప్రయాణములో మరణమను “గమ్యము” అందరికి ఉన్నదని తెలుసు. కాని ఆ గమ్యము ఎంత దూరమున్నది

తెలియదు. అది ఎప్పుడొచ్చునది తెలియదు. 50కి.మీ వేగము గల వాహనములో ప్రయాణించిన, ఢిల్లీ వెళ్ళాలంటే

ఎనిమిది దినములు, అమెరికా వెళ్ళాలంటే నెలరోజులు ప్రయాణ కాలమని తెలిసినా సాటి ప్రయాణీకులతో అంటీ

అంటని స్నేహమే చేస్తాము. కాని శరీరమనెడి వాహన ప్రయాణము "ఇంత కాలమని” తెలియనప్పటికిని మన సాటి

ప్రయాణీకులతో పూర్తి సంబంధాలు ఏర్పరచుకోవడము జరుగుచున్నది. మన ప్రయాణము దినమో, అర్థదినమో

తెలియకున్నపుడు బంధాలు ఏర్పరచుకోవడములో అర్థము లేదు. ఢిల్లీ ప్రయాణము తప్పనిసరి వారము దినములని

తెలిసినప్పటికి సాటి ప్రయాణికులతో బంధము పెట్టుకోము. మన దేహ ప్రయాణ కాలము వారము రోజులని కూడ

నమ్మకములేనపుడు బంధాలు ఏర్పరచుకోవడము జ్ఞానరహితమని తెలియాలి. జ్ఞానసహితముగ యోచిస్తే సాటి

ప్రయాణికులుగ శరీరములందు జీవితము సాగించుచున్నప్పటికి ఎవరి గమ్యము వారిది. ఏ గమ్యమునకు ప్రయాణమో

అంతవరకే నిలిచిపోవును. నీవెంట ఖచ్చితముగ నీ గమ్యము వరకు ప్రయాణించువారు ఎవరు ఉండరు.

విషయము అందరూ ఒప్పుకోవలసిందే. కాని ఇది కొంత వరకు వాస్తవమే. అయితే మనకు తెలియని వాస్తవము


మరియొకటి ఉన్నది. అది ఏమనగా సహజముగ కనిపించు నీసాటి నీతోటి ప్రయాణికులు నీ గమ్యము వరకు

రాకున్ననూ నీకు కనిపించకుండ నీతో ప్రయాణము చేయువారు మరి “ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు పేరున్నవాడు

మరియొకడు పేరులేనివాడు. ఒకని పేరు “ఆత్మ” రెండవ వానికి పేరు లేదు కనుక “ఆత్మ”కు పరముగ (వేరుగ)

ఉన్నవాడు అను అర్థముతో “పరమాత్మ” అనియూ, అతనినే "ఈశ్వరుడు" (అధిపతి) అనియు, “శివుడు” అనియు,

“దేవుడు” అనియు, అనేక విధములుగ పిలుచుచున్నాము.


నీవు “జీవాత్మ”వని నీకు కూడ తెలుసు. కాని నీవు శరీరములో ప్రయాణిస్తున్నావని మరచినావు. మరి నీతో

కూడ ఎల్లకాలము మరో “ఇద్దరు ఉన్నారని కూడ తెలియదు. నీ శరీరములో “ముగ్గురు” ప్రయాణిస్తున్నారను

విషయమే ఎవరికి తెలియదు.


అట్లే అన్ని జీవరాసుల శరీరములోను ముగ్గురి "ప్రయాణము" జరుగుచున్నది. శరీరములో “ఆత్మ” పరమాత్మ”ల

తోటి నీకు (జీవాత్మకు) ఉన్న “బంధ” మేమిటి? వారితో ఎంత స్నేహముగ ఉన్నావని యోచిస్తే జీవాత్మ ఏమాత్రము

వారితో సంబంధాలు పెట్టుకోవడము లేదు. ఇపుడు ఇది చదివేవానికి నీకున్నాయా! అంటే ఏమాత్రము లేవనియే

చెప్పవచ్చును. ఉన్నదంతా మన ముందర పోయే వారితోనో, మన తర్వాత పోయే వారితోనో బంధాలు పెట్టుకొని,

వారితోనే కాలమంతా గడచి పోతూంటే, లోపలి ఆత్మ, పరమాత్మలను వారితో బంధాలు ఏర్పరచుకొనే తీరిక ఓపిక

ఎవ్వరికీ లేవు. నీవుకాని ఎవరుకాని లోపల ఉన్న వారివైపు చూడకున్ననూ వారి బంధము ఎల్లవేళల నీతో ఉన్నది.

వారి బంధము లేకపోతే శరీరములో మనము ఒక్క నిమిషము కూడ ఉండలేము. శరీర వాహనములో జీవాత్మ, ఆత్మ,

పరమాత్మలు ప్రయాణిస్తూ “గమ్యము” చేరుకోగానే శరీర బంధము నుండి జీవాత్మ దిగిపోవును. అతనొక్కడే కాదు

అతనితో పాటు ఆత్మ కూడ దిగిపోవును. నీతో ప్రయాణము మొదలిడి నీతో పాటు గమ్యములో దిగి పోవువాడు ఆత్మ

ఒక్కడే. ఈ విషయము భగవద్గీత "పురుషోత్తమప్రాప్తి యోగము" అను అధ్యాయము 8వ శ్లోకములో చెప్పబడినది.


నీ గమ్యములో నీతో ప్రయాణించు ఆత్మ పరమాత్మలనబడు ఇద్దరిలో ఒకరు మాత్రము దిగిపోవుదురు. పరమాత్మ,

ఆత్మకంటే వేరుగ ఉన్నాడు కనుక పరమాత్మ అట్లే శరీరములో ఉండును.


సజీవయాత్రలో జీవుడు సుఖదుఃఖములను అనుభవించు చుండును. ఆ సుఖదుఃఖముల అనుభవములకు

కావలసిన కార్యాచరణలకు చైతన్యమునిచ్చి శరీరమును కదిలించినవాడు ఆత్మ. మూడవవాడు సాక్షిగ అన్నింటిని

చూస్తూ ఏమి చేయక మౌనముగ ఉండును. "జీవుడు" శరీరములో ఉన్నప్పుడు మరియు లేనప్పుడు స్తబ్దతగ ఉండువాడు

మూడవ వాడైన శివుడు లేక ఈశ్వరుడు లేక పరమాత్మ. ఏమియూ కాని ఈ మూడవ వానిని పరమాత్మ అనడములో

అంతరార్థమును తెలుసుకొన్నాము కదా! అట్లే ఈశ్వరుడని ఎందుకంటున్నామో వివరముగ తెలుసుకుందాము.

అధిపతి అనగ మించినవాడు, పెద్దవాడు అని గొప్పవాడని అర్థమగుచున్నది. అట్లే లక్షాధిపతి అనగ లక్షకు

అధిపతి అనియు, లక్షకు మించినవాడనియు, లక్షకలవాడనియు అర్థమగును. ఆ విధముగ లక్షాధీశ్వరుడు, కోటీశ్వరుడు

అనడములో కోటికి, లక్షకు అధిపతియని వాటికంటే గొప్పవాడని తెలియుచున్నది. ఈ ప్రపంచములో లక్ష, కోటి,

అది, ఇది అనకుండ అన్నింటికి సమస్తమునకు అధిపతియైన వాడు “పరమాత్మ” ఒక్కడే. కావున ఫలానాదానికి

ఈశ్వరుడనకుండ మొత్తము మీద ఏకైక పదముగ ఈశ్వరుడు అనడము జరిగినది. ఎక్కడా గుర్తించ లేనిదానిని,


అంతటా ఉన్నదానిని, దేనికి తెలియని దానిని, బ్రతికి ఉన్నవానికి జ్ఞానులకు, యోగులకు కూడ తెలియనిది,

అగమ్యగోచరమైనది, కావున దానిని “శివము” అని పేరు పెట్టాము. శివం అనగ తెలియనిదని అర్ధము. జ్ఞానులకు

యోగులకు “శివము” అన్నదొకటున్నదని తెలుసు. అది ఏది అని మాత్రము తెలియదు. జీవుడు జ్ఞానయోగము చేత

శరీరమందున్న ఆత్మను తెలియవచ్చు, కాని “శివము” ను మాత్రము తెలియలేడు. కర్మ అయిపోయిన తర్వాత జన్మలేని

స్థితిని చేరు యోగులు "శివము”నందు ఐక్యమై పోవుదురు. అదేదో అపుడే తెలుస్తుంది కాని ముందు తెలియదు.


శరీరమందు జీవయాత్రలో “మరణమను గమ్యములో ఆత్మ, జీవాత్మలు శరీరము నుండి నిష్క్రమించగ చివరకు

శరీరములో మిగిలి పోవునది శివము”. బ్రతికి ఉన్నపుడు నీచమైన గుణములతో సంబంధమున్న “జీవుడు” శరీరములో

లేడు. జీవుడు ఆత్మలేని శరీరములో ఏ నీచ భావాలు లేవు. అపుడది శుద్ధ “శివ” నిలయము. పరమాత్మ తప్ప

మరెవ్వరూ లేరు. కనుక ఆ విషయము తెలిసిన జ్ఞానులు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ శరీరమునకు

అంత్యక్రియలకు ముందు పూర్తి భక్తిగ పూజించెడివారు. మృతదేహమునకు దైవ సంబంధములైన విభూతి నామములతో

అలంకరించి, గోవింద నామస్మరణతో పూజించి, ఎల్లవారిని మ్రొక్కమనెడివారు. అటువంటి సాంప్రదాయము ఇప్పటికి

ఉన్నప్పటికి అది అర్థము తెలియని ఆచారమైనది. ఇపుడు మ్రొక్కెడివారు భక్తితోగాక భయముతో మ్రొక్కుచున్నారు.

ఒకవేళ మ్రొక్కని ఎడల చనిపోయిన వారు తిరిగి దయ్యముగ వస్తారని, వాని పీడ ఇంటి చుట్టూ ఉంటుందని, మ్రొక్కితే

వాని పీడ అంతటితో పోతుందని మ్రొక్కుచున్నారు.



పూర్వము అలా చేయలేదు. వారు ప్రతి పని అర్థము తెలిసి చేసెడివారు. జీవుడు పోయిన తర్వాత శరీరములో

చివరిగ మిగిలినది “శివము” అని వారికి తెలుసు. అందువలన మరణించబడిన శరీరమును (మృతదేహమును)

“శివము” అని పిలిచెడివారు. కాలక్రమేపి భావము పోయినది. చివరకు “శివము” “శవము” అను పేరుగా

మారిపోయినది. శివము శవము అయినప్పటికి పూర్వము నుండి ఉండు పూజలు మొదలగు ఆచరణలు అలాగే

ఉన్నవి. కావున దాని నిజమైన అర్థము నేడు మాసి పోయినదని తెలియుచున్నది.


కర్మ నిశ్శేషముగ అయిపోయిన యోగులు మరుజన్మకు పోక మూడవ పురుషుడైన పరమాత్మలోనికి ఐక్యమై

పోవుదురు. అట్టివారు మరణించు సమయములో తమ శరీరమును వదలిపోరు. శరీరమందే గల శివములోనికి

ఐక్యమై పోవుదురు. అట్టివారి శరీరమును చివరి దినములో పూజ చేయడమేకాక సమాధిలో ఉంచి చిరకాలము

పూజలు చేయడము కూడ పెద్దల నిర్ణయమే. అలా చేయడము వలన సాక్షాత్తు పరమాత్మనే ఆరాధించినంత

ఫలితముండునని వారికి తెలుసు.


శవము విషయములో ఇపుడు మనము కొంత తెలుసుకొన్నాము. అది శవము కాదు, శివము అని నిజము

తెలిసినది. కావున శవమును శుభ సూచకముగ భావించవలయును. అందరివలె పీడ, పిశాచి అనుకోకూడదు.

పూజ విధానములో పాల్గొన లేకపోయిననూ పరవాలేదు. శవమును "శివము”గా చూడండి. అంత్యక్రియలు చేయలేని

వారికి సహాయపడండి. ముస్లిం మతములో ఏమీ తెలియని వారైనా శవమును చూస్తూనే పనులన్నీ వదలిపెట్టి పోయి

పోటీపడి శవపేటికను మోయుట చూచియే ఉందురు. అదే క్రిస్టియన్ మతములో అయితే మత గురువు బైబిలు

చదువుచు భక్తిగ అంత్యక్రియలు చేయుట చూస్తూనే ఉన్నాము. అన్నిటికంటే ముందు పుట్టిన (ఇందూ) హిందూమతములో


నామమాత్రపు ఆచారముతో ఇంటిలోని వారే ఇష్టములేక పోయినా మృతదేహమునకు స్నానము చేయించి బొట్టుపెట్టి

పంపిస్తూ ఉన్నారు. అర్థము తెలియని ఆచారముతో పూజ చేస్తూ “శివము”ను శవము అంటున్న వారందరూ శవమును

శివముగా చూచి నిజమైన భక్తితో చనిపోయిన వానికి కాదు వానిలో ఉన్న దేవునికి అను భావముతో అంత్యక్రియలు

చేయాలి. చనిపోయిన వారు యోగి అయితే అటువంటి శరీరము దొరకడమే అదృష్టమనుకొని ప్రత్యేకమైన చోట

సమాధి చేసి నిత్య పూజలు చేయడము చాలా మంచిది. అటువంటి శరీర సమాధి దైవశక్తి నిలయమై ఉండును. ఆ

సమాధిని పూజించుకొను వారి కర్మలు కాలిపోవుచుండును.


దింపుడు కల్లము.


శవమును శివముగ భావించి పూజించి గోవిందనామ స్మరణతో స్మశానవాటికకు తీసుకుపోవుట పూర్వము

జరిగెడిదని తెలుసుకొన్నాము. నిత్యము మనముందర ఉన్న వ్యక్తి అకస్మాత్తుగ చనిపోవుట వలన, ఆ వ్యక్తిని ఒక్కమారు

శవముగ చూచుట వలన, ఆ శరీరమును చూచి పలాన వ్యక్తి అని అనుకొనుచుందురే గాని ఉన్నతమైన శివముగ

కొందరు పోల్చుకోలేరు. అటువంటివారు చనిపోయిన వ్యక్తి మీద గల మోహగుణము చేత నాకొడుకని కొందరు,

నాతమ్ముడని కొందరు, నాబంధువని కొందరు దుఃఖించుచునే ఉందురు. మమకారము వీడని మనుషులు తమ

గుణముల వలన గతములను గుర్తుకు తెచ్చుకొని రోదించుచునే ఉందురు. మృతదేహమును సాంప్రదాయము ప్రకారము

శివముగ తలచి అలంకరించి, పూజించి, నమస్కరించి శవయాత్ర చేయుచుండినప్పటికి కొందరికి పోయిన వానిమీద

మమకారము వీడక మృతదేహమును గొప్పభావముతో చూడలేకున్నారు. స్మశానము వరకు తీసుకుపోవు దారిలో

ఒకచోట మృతదేహమును దించి తిరిగి ఎత్తుకొని పోవుట గలదు. అట్లు ఒక చోటదించు స్థలమును “దింపుడు

కల్లము” అని అంటారు. ఇంటి వద్దనుండి దింపుడు కల్లము వరకు శవయాత్ర ఒక భాగముగ, తర్వాత దింపుడు

కల్లమునుండి స్మశానము వరకు ఒక భాగముగ తలచెడివారు. పోయిన వ్యక్తి మీద మమకారమిడువని మనుషులు

దింపుడు కల్లము వరకు వచ్చెడివారు. దింపుడు కల్లములో శవమును దించి ముఖమునకు కట్టిన గుడ్డతీసి అందరిని

చూడమనెడివారు. ఐదు నిమిషములు చూచిన తర్వాత అట్లే కప్పిపెట్టి మిగత శవయాత్రను సాగించెడివారు. రోదిస్తున్నవారు

దింపుడు కల్లము వరకు మాత్రమే వచ్చెడివారు. తర్వాత భాగములో వారు పాల్గొనక ఇంటికి పోయెడివారు.


శవమును పూర్తి శివముగ తలచి, మమకారము విడచి, మనస్సులో పూర్తి దైవముగ తలచిన వారు మాత్రమే

దింపుడు కల్లము తర్వాత శవయాత్రలో పాల్గొనెడివారు. శవమును మధ్యలో దించి తిరిగి ఎత్తుకొను జాగాను “దింపుడు

కల్లము” అని పేరు పెట్టడములో పూర్వయొక అర్థముండెడిది. పొలములో పండిన పంట కంకుల రూపముతో

ఉండును. కంకుల రూపములోనున్న పంట గింజలరూపము లోనికి మారునది కల్లములోనే. గింజ కంకికి కరుచుకొని

ఉన్నంతవరకు కంకి ఆధీనములోనే ఉండును. కంకిలోని పొరలకు అతికించబడిన గింజ పొరనుండి కల్లములో వేరు

చేయబడుచున్నది. ఒక మారు వేరు చేయబడిన గింజ తిరిగి ఎప్పటికి కంకి ఆధీనములోనికి పోదు, దాని పొరలలో

చిక్కుకొనదు. ఒక గింజ తనతో పాటు గల ఎన్నో గింజలలో కంకిలో చిక్కుకొని ఉన్నది. కల్లములో గుండుక్రింది

కంకిపొర నలిగినపుడు ఆ పొరనుండి గింజ బయటపడగల్గుచున్నది. అలా బయటపడిన గింజ తిరిగి కంకిలోనికి


చేరలేదనుట అందరికి తెలిసిన విషయమే. అలాగే కంకి అనబడు కర్మ పొరలలో జీవుడు చిక్కుకొని ఉన్నాడని తెలుపు

నిమిత్తము పూర్వము పెద్దలు గింజల కంకిని చూపారు. కర్మనుండి విడువడిన జీవుడు తిరిగి కర్మలో చిక్కుకొనక

స్వంతంత్రుడై పోవునని తెలుపునిమిత్తము కల్లమును ఉదాహరణగ చూపారు.


పూర్వము జ్ఞానము చేత కర్మను నిశ్శేషముగ లేకుండ చేసుకొన్న వారు మరణించినపుడు, అతను మోక్షము

పొందాడని తిరిగి జన్మకురాడని తెలిసిన పెద్దలు శవయాత్రలో దింపుడు కల్లమని పేరు పెట్టి ఒక చోట దించెడివారు.

అలా దించి తర్వాత ఎత్తుకొని పోవుట వలన చనిపోయిన వ్యక్తి తిరిగి జన్మకురాడని, అతను కర్మ అను కంకి నుండి

యోగము అను కల్లము చేత విడివడిపోయాడని అందరికి తెల్పెడివారు. అంతవరకు అతనికోసము ఎవరైన

రోదిస్తున్నప్పటికి ఆ పనితో అతను దేవుడై పోయాడని, అతని మీద ప్రపంచ సంబంధమైన మమకారములుండకూడదని

తెల్పెడివారు. దింపుడు కల్లము వరకు ఎవరైన ఏడ్చిన పరవాలేదు కాని దింపుడు కల్లము తర్వాత ఎవరు ఏడ్వకూడదు.

అప్పటి వరకు వేరు భావముండిన అప్పటినుండి పూర్తి భావమార్పుచెంది శవమును పూర్తి శివముగ భావించుకోవలసి

ఉంటుంది. అందువలన ఏడ్చేవారు అక్కడినుండి వెనక్కు వచ్చేవారు. తర్వాత శివమను భావము కల్గిన వారు

మాత్రము స్మశానము వరకు పోయి ముక్తి పొందిన వాని శరీరమును భూస్థాపితము చేసెడివారు.



దింపుడు కల్లమను పేరు పెట్టిన స్థలము ప్రత్యేకముగ ఉండదు. మధ్యలో ఎక్కడయిన ఒక చోటదించి దాని

అర్థము ఇతరులకు తెల్పి తిరిగి ఎత్తుకొనిపోయెడివారు. ఈ పద్ధతి మోక్షము పొందిన ఒక్క యోగులకు మాత్రము

చేయుట సాంప్రదాయము. అలా చేయుట వలన యోగుల యొక్క విలువ, మోక్షము యొక్క పద్దతి ఇతరులకు

తెలిసెడిది. దింపుడు కల్లము యొక్క సాంప్రదాయము యోగులకు తప్ప ఇతరులకు చేయకూడదు. ఇతరులు

కర్మబంధములో ఉండేవారే కనుక కల్లమునకు రాని కంకులతో సమానమే. ఈ కాలములో దింపుడు కల్లము యొక్క

సాంప్రదాయము కొన్ని ప్రాంతములలో గలదు. దింపుడు కల్లము అని పేరు పెట్టి యోగులు కాని సామాన్య ప్రజలను

కూడ దించి ఎత్తుచున్నారు. అలా చేయడములో దింపుడు కల్లము యొక్క ఉద్దేశ్యము చెడిపోయినదై అర్ధము లేనిదై

పోయినది. కొన్ని ప్రాంతములలో యోగులకు కూడ దింపుడు కల్లము లేదు. దీనికంతటికి కారణము సాంప్రదాయములలో

గల దింపుడు కల్లము యొక్క సాంప్రదాయము తెలియకపోవడమేనని తెలియుచున్నది. ఇపుడు తెలుసుకొన్నాము

కదా! ఇప్పటి నుండైన సాంప్రదాయమును సక్రమముగ ఆచరించి చనిపోయినది మోక్షము పొందిన యోగులైతే

మధ్యలో దించడము, యోగులు కాకపోతే దించకుండ తీసుకుపోవడము చేయాలి.


పిండాకూడు (కర్మకాండ).


పిండాకూడు అనుమాట బహుశ అందరము వినియే ఉందుము. పిండాకూడును గురించి మనకు తెలిసినది

ఏమనగా! ఒక మనిషి చనిపోతే కర్మతంత్రములను పేరుతో చనిపోయినవాని ఆకలి తీర్చుటకు పెట్టు ఆహారమును

పిండాకూడని చెప్పుచుందురు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క రకముగ ఈ కర్మతంత్రములు బ్రాహ్మణుల చేత చేయించు

చుందురు. కొందరు మనిషి చనిపోయిన మూడు దినములకు, పదకొండు దినములకు, సంవత్సరమునకు పిండాకూడు


పెట్టుట చేయుచుందురు. కొందరు నెలకొకమారు నెల మాసికలను పేరుతో పిండాకూడు పెట్టుట కూడ జరుగుచున్నది.

మరికొందరు సంవత్సరమునకు ఒకమారు పుణ్యక్షేత్రములలో తర్పణమని, తద్దినమని రకరకముల పేరుతో ఈ కార్యములు

చేయుచుందురు. ఈ విషయమై కొందరిని అడుగగ వారు చెప్పు సమాధానమేమనగా! చనిపోయిన వానిని యమదూతలు

వెంటపిలుచుకొని పోవుచుందురని, అలా సంవత్సరకాలము వారిని నడిపిస్తు తీసుకపోవడము వలన ఆ జీవుడు

ఆకలితో బాధపడుచుండునని, నెలకొకమారు కూడు పెట్టుటవలన జీవుని ఆకలి తీరునని చెప్పుచున్నారు. చనిపోయిన

జీవుడు ఒక సంవత్సరమునకు యమలోకమునకు చేరునని, ఆ దినము సంవత్సరదినమని పిండాకూడు పెట్టుటవలన

వాని ఆకలి తీరి యమలోకానికి పోవునని కొందరు చెప్పుచున్నారు. యమలోకానికి పోవుదారిలో దూతలతో బంధింపబడి

పోవువాడు మనము పెట్టు పిండాకూడునెట్లు తినగల్గునని ప్రశ్నించిన చనిపోయినవాడు కాకి రూపముతో వచ్చి తినిపోవును.

అదీ అడుగుచున్నావు అంతమటుకు తెలియదా! నీవు మీ నాన్నకుగాని, మీ తాతకు గాని పిండాకూడు పెట్టలేదా?

కాకులు తినిపోయేది చూడలేదా? అని మాట్లాడుచున్నారు.


గుంటూరు పొగాకు గూటిలోనున్న ఒక్కటే నోటిలోనున్న ఒక్కటే అన్నట్లు కొందరు ఏ విషయమును తెలుసుకోక

తెలుసుకొనుటకు ప్రయత్నము కూడ చేయక ఎక్కడున్నా ఎట్లున్నా చప్పగ రుచిలేని పొగాకు మాదిరి ఉందురు.

గుడివాడ పొగాకు గూటిలోనున్నా ఘాటే నోటిలోనున్నా ఘాటే అన్నట్లు కొందరు ప్రతిది తెలుసుకోవాలను ఘాటైన

చురుకుదనము కల్గియుందురు. అటువంటివారి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉద్భవించు చుండును. ప్రతిది తెలుసుకోవాలను

తపన వారికుండును వారి ప్రశ్నల పరంపరలు ఇలా ఉన్నవి. 1) పిండాకూడంటే అర్థమేమిటి? 2) పిండా కూడనకుండ

కూడు అనవచ్చును కదా! 3) చచ్చినవారు పిండాకూడు తింటారా? 4) వెంటతీసుకుపోయే యమకింకరులు పిండాకూడు

తినే దాని కొరకు మన పోలీసుల మాదిరి ఏదైన లంచము తీసుకొని వానిని వదలి పెట్టెదరా? 5) చచ్చినవాడు వారి

కొడుకులు పెట్టే పిండాకూడు కొరకు కాకి అవతారముతో ఎందుకొస్తాడు? 6) అలా కాకి అవతారమెత్తి వచ్చి

తినిపోతాడనే దానికి నేను నిత్యము చూచే కుంటికాకి స్మశానములో ఎందరి పిండాకూడునో తిన్నది, ఈ కుంటికాకిని

ఎవరిగ చెప్పవలెను? 7) ప్రతి దినము ఎన్నో లక్షల మనుషులు కొన్ని కోట్ల జీవరాసులు చనిపోతున్నాయి. వారిని

తీసుకుపోయేదానికి ఒక జీవునికి ఇద్దరు యమకింకరుల ప్రకారమైన యమకింకరులు ఎన్ని కోట్లమంది ఉండవలెను?

8) తీసుకుపోయేవారే ఎన్నో కోట్లమందైతే యమలోకములో పాపములను అనుభవింపజేయు వారు ఇంకెన్ని కోట్లమంది

ఉండవలెను? 9) అక్కడున్న యమకింకరులు ఇక్కడి నుండి పోయిన వారు అందరు ఎన్ని కోట్లవుతారు?

10) యమలోకము అంత విశాలముగ ఉందా? 11) యమకింకరులు జీవున్ని తీసుకుపోయేటపుడు దారిలో జీవునికి

ఆకలవుతుందన్నారు. 12) జీవునికి ఆకలైతే యమభటులకు ఆకలి కాకుండునా? 13) వారికి ఆకలైతే సద్ది ఏమైన

తెచ్చుకొని ఉంటారా? 14) లేకపోతే జీవునితోపాటు వారు కూడ క్రిందికి వచ్చి ఏ కూడైన తినిపోతారా?

15) పిండాకూడు పెట్టేవారు చనిపోయినవాడు త్రాగుబోతయితే వానికొరకని సారాకాని, బ్రాందీ కాని పెట్టి రావడము

చూచాము. పితరులు కాకులైవస్తే అక్కడ పెట్టిన సారాను ఎందుకు త్రాగలేదు? 16) మన పెద్దలు పిండాకూడు తినే

దానికి కాకిరూపములో వస్తే వారి మీద ప్రేమున్న మనము ఎలాగో ఆ కాకిని పట్టుకొని మా నాయనే కదా! అని

ప్రీతితో ఆ దినము మంచి భోజనము పెట్టవచ్చును కదా! అలా పట్టుకొని మన దగ్గరే ఉంచుకొంటే వానికి యమలోకానికి

పోవుబాధ, అక్కడ పాపము అనుభవించు బాధలు అన్ని తప్పిపోవును కదా! ఎవరూ అట్లెందుకు చేయకున్నారు?

17) బ్రతికినపుడు అన్నముపెట్టని కొడుకు చనిపోయిన తర్వాత పిండాకూడు పెట్టకపోతే ఏమి? 18) తండ్రి ప్రాణముతో


ఉన్నపుడు అతనిమీద లేని ప్రేమ దినాలనాడు ఎందుకు వస్తున్నది? 19) పూర్వము జ్ఞానము తెలిసిన పెద్దలు ఈ

సాంప్రదాయములుంచారా? ఉంచితే ఏ ఉద్దేశ్యముతో ఉంచారు? 20) పిండాకూడు ఎందుకు పెట్టాలి? 21) ఎన్ని

దినములకు పెట్టాలి? 22) ఈ కార్యములో అసలు సారాంశమైన విషయమేమైనా ఉన్నదా? 23) ఇది వాస్తవానికి

ఇందూ సాంప్రదాయమా? అలా ఈ విధముగ అనేకమైన ప్రశ్నలు చురుకైన తెలివిగలవారిలో ఉద్భవించుచుండును.

నిజముగ ఇటువంటి ప్రశ్నలకు జవాబులున్నాయా? అని మనము యోచించవలసిన పని ఉన్నది. యోచించితే ఏమి

సమాధానము దొరుకుతుందో చూద్దాము.


పిండము అనగా శరీరమని చెప్పవచ్చును. ఎందుకనగా తల్లి గర్భములోనున్న దానిని పిండము అంటాము.

తల్లి గర్భములో పిండము అడ్డము తిరిగిందను మాట కూడ వింటుంటాము. తల్లి గర్భమునుండి ప్రసవింపబడిన

శరీరములో ఆత్మ చైతన్యముండి పెరిగి పెద్దదై అనేక కర్మలను ఆచరించడము, క్రొత్తగ అనేక కర్మలను

సంపాదించుకోవడము రెండు జరుగుచున్నవి. జరుగుచున్న పనిలో ఎంతకర్మ వచ్చుచున్నదని తెలియక పోయినప్పటికి

అప్పటి పనిలో అనుభవించేది మాత్రము తెలియుచున్నది. అనుభవించేటపుడు కొందరు ఇది నాకర్మ అని తెలియకనే

అంటుంటారు. గత జన్మలలో చేసుకొన్న కర్మలను అనుభవించే దానికే మనము పుట్టి ఉన్నాము. క్షణక్షణము

అనుభవించేదంతా కర్మయే. ఉన్న కర్మను లేకుండ అయిపోగొట్టుకోవడమును లేక అనుభవించడమును కర్మానుభవము

అంటుంటాము. ఆహార పదార్థములను తిని లేకుండ చేసినట్లు కర్మలను అనుభవించి లేకుండ చేయుచున్నాము. తినే

అన్నమును అచ్చ తెలుగు భాషలో “కూడు” అంటాము. తినుటను “కుడుచుట” అంటాము. కూడు కుడచడము అనగా

అన్నము తినడము అని అర్థము. అన్నమును తిని అయిపోచేసినట్లు కర్మలను కూడ అనుభవించి అయిపో చేయుచున్నాము.

కావున జీవుడు ప్రతి నిత్యము కర్మల కుడుచుచున్నాడని పూర్వము అనెడివారు. మనము తిని అయిపోచేయు అన్నముతో

పోల్చి కర్మను కూడు అనెడివారు. కర్మలన్నిటిని సజీవమైన శరీరమే అనుభవించ వలసి ఉన్నది కావున శరీరమును

పిండమని, అనుభవించు కర్మలను కూడు అని, ఒక మనిషి యొక్క కర్మను పిండాకూడని అనెడివారు. శరీరముతో

అనుభవించు కర్మను తెలిసిన పెద్దలు పిండాకూడు అనెడివారు. ఈ కాలములో కూడ సందర్భానుసారము నీ పిండాకూడు

అనడము జరుగు చున్నది. నిత్యము ప్రతి జీవి అనుభవించు కర్మనే పిండాకూడు అనడము జరిగెడిది. ఇప్పటికి

అప్పుడప్పుడు అది నీ కర్మ అనుటకు బదులు నీ పిండాకూడు అని స్వయాన మేమే అనుచుందుము. కొందరు తెలియకుండిన

పలుకుచునే ఉందురు.


ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత బాహ్యార్థముగ పిండాకూడు పెట్టడము పూర్వము నుండి జరిగెడి సాంప్రదాయమే.

కాని పూర్వము చనిపోయిన వ్యక్తులందరికి పిండాకూడు పెట్టెడివారు కాదు. భగవద్గీతలో చెప్పినట్లు చనిపోయినవాడు

తన జీవితములో యోగిగ ఉంటూ మోక్షాసక్తుడై ఉంటే, భగవద్గీత చెప్పినట్లు వాని మరణము పగలు, శుక్ల పక్షము,

ఉత్తరాయణమై సూర్యరశ్మి కల్గినపుడు జరిగియుంటే, అపుడు మరణించిన యోగి తిరిగి పుట్టడని, వాడు మోక్షము

చెంది దేవునియందు ఐక్యమైనాడని భావించెడి వారు. అటువంటివానికి కర్మలేదని, వాడు ఇక పుట్టడని తెలుపు నిమిత్తము

కర్మతంత్రము అనుపేరుతో పిండాకూడు పెట్టడము జరిగెడిది. సజీవముతో నున్న ప్రతి జీవికి నవగ్రహముల వలననే

కర్మ ఆచరణకు వచ్చుచున్నది. మోక్షము పొందిన వానికి నవగ్రహములతో సంబంధము లేకుండపోవును. బ్రతికి

ఉన్నపుడు కర్మను అందించు నవగ్రహములు మోక్షము పొందిన వానికి కర్మ లేకపోవడముచే గ్రహములు వానిని ఏమి


చేయలేవు, జన్మకు తీసుకురాలేవు. అందువలన కర్మనుండి విడువబడినవాడని తెలుపు నిమిత్తము మోక్షము పొందినవానికి

తొమ్మిదవ దినమున కర్మతంత్రములు చేసెడివారు.


మోక్షము పొందిన వానికి కర్మ లేదని తెలుపు నిమిత్తము చనిపోయిన దినము నుండి సరిగ తొమ్మిదవ దినమున

కర్మతో సమానమైన అన్నమును అనగా పిండాకూడని పేరు పెట్టబడిన అన్నమును బయలు ప్రాంతములో పెట్టి,

జంతువులుగాని, పక్షులుగాని తినునట్లుంచి, పెట్టబడిన పిండాకూడును లేకుండ చేయుచుండెడివారు. అలా చేయడములో

పిండాకూడు అనబడు కర్మ ఇకలేదని బాహ్యార్థముగ తెలియబడుటకు పిండాకూడును లేకుండ చేసెడివారు. మోక్షము

పొందిన వానికి పెట్టబడిన కూడును ఇతరత్ర ఏ జీవరాసులైన తినవచ్చును. ఒక కాకులే తినవలెనని చెప్పుకోవడము

తప్పు. పూర్వము పెద్దలు పెట్టిన ఆచారములన్ని గాడితప్పి అధర్మములైనట్లు ఈ విషయము కూడ కాలగమనములో

తెలియకుండ ఇతర భావములలోనికి పోయినది. చనిపోయిన పెద్దలు కాకుల రూపములో వచ్చి ఆహారము తిని

పోవుదురనుట ఒట్టి కట్టుకథ తప్ప అందులో సత్యము లేదు. చనిపోయిన వాడు తిరిగి కాకిగ రావడము అసంభవము,

అసత్యము. ఈ విషయమై వేమన యోగి కూడ వ్యతిరేఖిస్తూ ఇలా అన్నాడు.


పిండములను జేసి పితరుల దలపోసి

కాకులకు బెట్టు గాడ్గెలార

పియ్య తినెడు కాకి పితరుడెట్లాయెరా

విశ్వదాభిరామ వినుర వేమా.


ఈ కాలములో చనిపోయిన పెద్దలను కాకులుగ పోల్చడము, ఆ కాకులకు పిండాకూడు పెట్టడమును చూచి,

అటువంటి వారిని గాడిదలారా అని తిట్టుచు మలమును తిను కాకి పితరులెట్లగుదురని ప్రశ్నించాడు. ఈ పద్దతి

తప్పని వేమనయోగి కూడ తన పద్యములో చెప్పాడు. కర్మను సూచించు కూడును లేకుండ చేయడము పద్ధతికాని

కాకులే తినవలెననునది పద్ధతికాదు. అక్కడుంచిన ఆహారమును పక్షులు తినవచ్చు, జంతువులు తినవచ్చు. ఈ పద్ధతి

బయలు ప్రాంతములో ఆచరించువారికి కాగ, నది ఒడ్డున కర్మతంత్రములు చేయువారు నదిలో కలిపెడివారు. అపుడు

నదిలోని జలచరములు ఆ కూడును తినెడివి. పిండమనగా శరీరమన్నాము కదా చచ్చినవాడు మోక్షము పొంది

ఉన్నాడు. అట్టి వానికిక శరీరము అవసరము లేదని పిండాకూడని పేరు పెట్టి చేయుట మంచిదే. కాని చనిపోయినవాడు

మోక్షమునకు పోకున్నను, వాడు అజ్ఞానియైనను, వానికి కర్మతంత్రము చేయుట విడ్డూరము కాదా! నవగ్రహముల

జోక్యమితని మీద ఉండదని తొమ్మిదవరోజు కర్మ తంత్రములను పూర్వము చేయగా, నేడు ఒక పద్ధతంటు లేకుండ

పదకొండవరోజని కొందరు, పదవరోజని కొందరు, ఐదవరోజని కొందరు మూడవరోజని కొందరు, అన్నిటికంటే

ముఖ్యము సంవత్సర దినమని కొందరు చేయుట విచిత్రము కాదా! శరీరమనుభవించు కర్మను పిండాకూడని పేరుపెట్టి

బాహ్యార్థముగ పూర్వము చేయగ ఈనాడు పిండాకూడని సారా, బ్రాందీలు, బీడీ, సిగరెట్లు పెట్టడము విచిత్రము కాదా!

తిరిగి జన్మ పొందని స్థితికి చేరుకొన్నాడని మోక్షము పొందిన వానికి చేసిన విధానమును మరచి యమలోకానికి

యమభటులచేత కొనిపోబడునని చెప్పడము అజ్ఞానము కాదా! బయలులో అయితే ఇతర జంతువులు, పక్షులు

పిండాకూడును తినడము, నీటిలో అయితే జలచరములు తినడము జరిగి అక్కడ పెట్టినది లేకుండ పోవుచున్నది.


శరీరమునకున్న కర్మ పోయినదని పిండాకూడు పెట్టగ ఎవని పేరుతో పెట్టామో వాడే తిరిగి వచ్చి తింటాడనడము

సమంజసముకాదు.


శరీరమును పిండమని, శరీరమనుభవించు కర్మను పిండాకూడని, కర్మ శేషములేకుండ అయిపోవడము

పిండాకూడు లేకుండ పోవడమని, నవగ్రహముల ఆధీనమిక లేదని తెల్పడము చనిపోయిన దినము నుండి తొమ్మిది

దినములకు దినాలు చేయడమను అర్థముతో పూర్వము చేసెడివారు. చేయవలసినది మోక్షము పొందిన వానికని,

చేయువారు జ్ఞానము తెలిసినవారు ఎవరైన కావచ్చని పెద్దలు తెల్పియుండగ కొడుకులే ఈ తంతు చేయవలెనని,

కొడుకులచేత వంశీకులచేత చేయించడము అజ్ఞానమే అగును. పోయినవాడు మోక్షమునకు పోయాడని తెల్పుటకు

అంతో ఇంతో జ్ఞానము తెలిసినవారు ఈ విధానమిదియని చేసి ఇతరులకు తెల్పుచు పోతే ఈ సాంప్రదాయము

అందరికి తెలిసియుండేది. ఈ కాలములో పిండాకూడు కార్యము చేయవలయుననునది ఉన్నది, కాని ఎందుకు

చేయవలెను? ఎట్లు చేయవలెనను వివరము పూర్తి లేకుండ పోయినది. ఇప్పటికైన జీవితములో జ్ఞానము, యోగము

తెలిసి మోక్షము పొందవలెనను ఉద్దేశ్యము కలవారు చనిపోతే, భగవద్గీతలో చెప్పినట్లు కాల సూత్రము వారికి వర్తిస్తే,

అటువంటివారికి కొంత జ్ఞానము తెలిసిన వారిచేతగాని, బ్రహ్మణులుగాని, యోగులుగాని అయినవారిచేతగాని ఈ

విధానము చేయించవలెను. వాడు ఇటువంటి మోక్షస్థితికి చేరుకొన్నాడని బయటికి తెలియజేయవలెను. అట్లుకాక

సాధారణ అజ్ఞానులకందరికి దినాలు చేయడము, పిండాకూడు పెట్టడము చేయకూడదు. చేయకపోతే వీని పీడ

మాకంటుకొనునని తప్పనిసరిగ చేసి ఈ పీడ ఇంతటితో పోనీ అని స్నానము చేసి రావడము సాంప్రదాయ విరుద్దమగును.

పూర్వపు పెద్దలు ఈ కార్యమును పవిత్రముగ ఆచరించవలెనన్నారు, గాని అపవిత్రము, పీడ పిశాచి అని చేయకూడదు.

ఇంత చెప్పిన కొందరికి అనుమానము పీడిస్తు ఇది నిజమేనా? ఇప్పుడున్న ఇంతమందికి, ఎంతో మంది స్వాములకు ఈ

విషయము తెలియకుండునా! అనుకొంటే మేమేమి చెప్పలేము.


ఇందూసాంప్రదాయములలో మనిషి తన శరీరమునకు తగిలించు కొన్న ఆచారములలో కొన్నిటి ని

తెలుసుకోవలసినవి గలవు. అటువంటి వాటిలో ఎన్నో ఆచరణలు అర్థములను మా రచనలలోని "దేవాలయ

రహస్యములు” అను పుస్తకములో గలవు. జిజ్ఞాసులు దేవాలయ రహస్యములు చదివి తెలుసుకోవలసినదిగ కోరుచున్నాము.


దక్షిణ దిశకు తలపెట్టడము.


భగవద్గీతలో యోగులైనవారు ఎప్పుడు మరణిస్తే మోక్షము పొందుదురో, ఎప్పుడు మరణిస్తే జన్మకు పోవుదురో

తెలియజేశారు. యోగులు కానివారు సర్వసాధారణముగా ఎప్పుడు మరణించిన జన్మకే పోవుచుందురు. యోగులైనవారు

మాత్రమే మోక్షము పొందుటకు అవకాశమున్నది, కావున వారిలో ఎవరు మోక్షము పొందారో తెలుసుకొనుటకు కాలము

యొక్క గతులను గీతలో చెప్పారు. దాని ప్రకారము మోక్షము పొందినవానిని సులభముగ గుర్తించవచ్చును. అట్లు

మోక్షము పొందినవానిని పూర్వము 'కాలమైపోయాడు' అనెడివారు. కాలమైపోయాడు అంటే పరమాత్మలోనికి కలిసి

పోయాడు, జన్మలకు పోలేదని అర్ధము. పరమాత్మ కాలస్వరూపుడు. గీతలో “కాలోస్మి” కాలమే నేను అన్నాడు.


అందువలన ముక్తి పొందినవానిని కాలమై పోయాడనుట సరియైన మాట. మోక్షము పొందినవానిని మరణించాడని,

చనిపోయాడని అనకూడదు. సర్వసాధారణ వ్యక్తులకు, మరియు మోక్షము పొందని యోగులకు చనిపోయాడను

మాట వర్తించును. ముక్తి (మోక్షము) పొందినవారికి, పొందనివారికి ఉన్న తేడాను అందరు గుర్తించునట్లు చనిపోయినపుడు,

కర్మకాండ చేయునపుడు, స్మశానములో పూడ్చి పెట్టునపుడు తేడాలు కల్పించారు.


చనిపోయాడని మోక్షము పొందని వారిని గురించి చెప్పితే, కాలమైపోయాడని ముక్తి (మోక్షము) పొందినవానిని

గురించి చెప్పెడివారు. అట్లే ముక్తి పొందని వానికి పిండాకూడు పెట్టెడి కార్యము చేసెడివారు కాదు. మోక్షము

పొందినవానికి మాత్రమే పిండాకూడు పెట్టెడివారు. కర్మ నుండి విడువడి ముక్తి పొందినవానికి మాత్రమే శవయాత్రలో

దింపుడుకల్లము ఉండెడిది. చనిపోయిన వానికి దింపుడుకల్లము ఉంచెడివారు కాదు. అట్లే మృతదేహమును భూమిలో

పూడ్చి పెట్టునపుడు కూడ సాధారణముగ చనిపోయినవారిని గుంతలో దక్షిణదిశకు తల పెట్టి పడుకోబెట్టితే, కాలమై

ముక్తి పొందిన వారిని ఉత్తరదిశకు తలపెట్టి పూడ్చెడివారు. ఈ విధముగ చనిపోయిన వారిలో అన్ని పద్ధతులలోను

తేడాలు కల్పించి మోక్షమునకు గుర్తింపు విలువను చేకూర్చారు. పూర్వము పెద్దలు ఎంతో అర్థభావములతో ధర్మయుక్తముగ

కల్పించిన పనులు కూడ పూర్తి అర్థహీనమైపోయి అధర్మ ఆచరణగ తయారైనవి. పూర్వము సాంప్రదాయబద్దముగ

పెట్టిన ఆచరణలన్నిటిలో కొన్ని నేటికిని ఉన్నప్పటికి ఎందుకు చేయాలి? ఎవరికి చేయాలని తెలియకుండా పోయినవి.

ఇప్పటివరకు మనిషి మృతమైన తర్వాత శవయాత్రకు, దింపుడు కల్లమునకు ఇందూ సాంప్రదాయము ప్రకారము

అర్థము చెప్పుకొన్నాము. ఇప్పుడు మృతదేహము యొక్క ఖననము గూర్చి తెలుసుకొందాము.


భూమిమీద సూర్యోదయము తూర్పుదిశన జరుగుచున్నది. తూర్పుదిశతో మొదలుపెట్టి చూచితే తూర్పుకు

పూర్తి వ్యతిరేఖ దిశను పడమరదిశ అనుచున్నాము. అలాగే తూర్పుకు తిరిగి చూచినపుడు వెనుక ఉన్నది పడమర కాగ

కుడిప్రక్క దక్షిణదిశయని, ఎడమప్రక్క ఉత్తరదిశ అని చెప్పుచున్నాము. తూర్పుకు దక్షిణమునకు మధ్యగల మూలను

ఆగ్నేయదిశ అనియు, దక్షిణమునకు పడమరకు మధ్యగల మూలను నైరుతిదిశ అనియు, పడమరకు ఉత్తరమునకు

మధ్యనగల దిశను వాయువ్యదిశ అనియు, ఉత్తరమునకు తూర్పుకు మధ్యనగల మూలను ఈశాన్యదిశ అనియు

అంటున్నాము. మొత్తము ఎనిమిది దిశలలో దక్షిణము ఉత్తరము రెండుదిశలు మనిషి చనిపోయిన తర్వాత చూడవలసిన

ముఖ్యమైన దిశలు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ముఖ్యముగ గమనించవలసిన దిశలు తూర్పు పడమరలు. ప్రతినిత్యము

ఉదయించు సూర్యుడును, అస్తమించు సూర్యుడును చూచి మనిషి యొక్క పుట్టుక ఉదయించు సూర్యునితో సమానముగ,

అలాగే మనిషి చావును అస్తమించు సూర్యునితో సమానముగ పోల్చి చెప్పుకొనెడివారు. ప్రతి నిత్యము జరిగెడి సూర్యోదయ

సూర్యాస్తమము జనన మరణములను సూచిస్తుండగా ఆ దిశలైన తూర్పు మనిషి పుట్టుకకు, పడమర మరణమునకు

ప్రతీకగానున్నవి. అట్లే ఉత్తరదిశ మనిషి మోక్షమునకు, దక్షిణదిశ మనిషి జన్మకు ప్రతీకగా నిలిచినవి.


దక్షిణమున యమపురి కలదని, దక్షిణ దిక్కున యమధర్మరాజు కలడని అక్కడక్కడ కొందరు పురాణములలో

కూడ చెప్పుకొనుచుందురు. వాస్తవానికి దక్షిణదిశలో యమపురిగాని, యమధర్మరాజుగాని లేడు. కాని దక్షిణదిశన

యమధర్మరాజు ఉన్నాడని చెప్పుటలో కొంత అర్థము కలదు. “దండనాధికారులలో యముడనునేను" అని గీతయందు

భగవంతుడు తెలియజేశాడు. పరమాత్మ ఆత్మరూపముగ శరీరములో నివశిస్తున్నదని ముందే తెలుసుకొన్నాము. ఆత్మ

శరీరములో యమునిగ, ఇతరుల శరీరమునుండి యమకింకర్లుగా చలామణి అగుచున్నదని కూడ మారచనలలోని

“ప్రబోధ” గ్రంథములో తెలియచెప్పుకొన్నాము. దీనిని బట్టి శరీరములో నివశిస్తున్న రెండవ ఆత్మయే యమధర్మరాజని


తెలియాలి. ఇక్కడ అందరికి తెలియని మరొక విషయము కూడ కలదు. అది ఏమనగా! శరీరమంతా వ్యాపించిన ఆత్మ

బ్రహ్మనాడిలోని ఏడవ కేంద్రమున తలలో కేంద్రీకృతమై ఉన్నది. ఆత్మ తలలో కేంద్రీకృతమై తన శక్తిని శరీరమంతా

వ్యాపింపజేయుచున్నది. తల మధ్యలో ఉన్న ఆత్మ పూర్తి మధ్యలో కాకుండా కొంత కుడిప్రక్కన ఎక్కువగ ఉండుట వలన

శరీరబలములో కూడ కుడిప్రక్క కొంత తేడా ఏర్పడినది. కుడి ఎడమల బలము (శక్తి) లో భేదము అందరికి తెలిసిన

విషయమే. ఆత్మ సాధారణముగ అందరికి కుడిప్రక్క కొంత ఎక్కువగ ఉండుటవలన ఆత్మకు "దక్షిణుడని”, యముడని

పేరు గలదు. కుడిప్రక్క ఎక్కువగా నివాసముండుట వలన యమపురి దక్షిణమున కలదని పూర్వమనెడివారు. దక్షిణమంటే

శరీరము బయట అనుకోకూడదు. శరీరము లోపలనే దక్షిణదిశలో (కుడిప్రక్క) అని అర్థము చేసుకోవలెను.


కర్మ మిగిలి మరుజన్మ కల్గినవారందరికి ఆత్మతో సంబంధముండనే ఉండును. జీవుడు శరీరధారి అయినంతవరకు

ఆత్మ తోడుగా ఉండి చేయు కర్మలను కర్మ ఖాతాలో ఎక్కించుకోవడము, తిరిగి వాటిని కాలానుగుణముగ

అనుభవింపచేయడము ఆత్మ చేయుచున్నది. శరీరములో యమునిగ కర్మను అనుభవింపచేయడములోను, కర్మను

నమోదు (రికార్డు) చేసిపెట్టడములో చిత్రగుప్తునిగను పని చేయుచున్నది. ఈ తతంగము శరీరము గలవారికే జరుగును.

కావున మరణించినవాడు తిరిగి జన్మకు పోవునని తెలుసుకొన్నపుడు, వీడు మోక్షము చెందలేదు, వీడు ఆత్మతో కలసి

జన్మ తీసుకొంటున్నాడని తెలియునట్లు దక్షిణదిశకు తలపెట్టి పూడ్చెడివారు. ఆత్మ వైపు పోవువానిని దక్షిణమునకు,

పరమాత్మ వైపుకు పోవువానిని ఉత్తరము వైపుకు తలపెట్టి పూడ్చెడివారు. గీతలో చెప్పిన కాలము ప్రకారము యోగులు

చనిపోయినపుడు, వారు మోక్షమునకు అర్హులయితే, అటువంటి వారిని దక్షిణదిశగ తల పెట్టి పూడ్చరు. మోక్షము

పొందిన యోగుల శరీరములను ఉత్తరదిశగ తలపెట్టి పూడ్చడము జరిగెడిది. ఈ కాలములో అందరిని దక్షిణవైపుకు

పూడ్చడము జరుగుచున్నది. పూర్వము ఎంతో గొప్ప అర్థముతో నిర్మించిన శరీరమును పూడ్చు సాంప్రదాయము

తెలియకుండా పోయి ఆచరణ మాత్రము గాడితప్పి మిగిలి ఉన్నది. జన్మకు పోవువారిని దక్షిణదిశకు, మోక్షమునకు

పోయిన వారిని ఉత్తరదిశకు తలపెట్టి పూడ్చడములో ఉన్న జ్ఞానమును మనము తెలుసుకొంటే ఎంతో మంచిది.

ఇతరులకు తెలిపితే జ్ఞానసేవ చేసిన వారమగుదుము.


ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.


హిందూ రక్షణా! హిందూ భక్షణా!!.

భగవద్గీతయే చదవనివాడు హిందూ రక్షకుడా?.

హిందూ ధర్మమే తెలియనివారు హిందూ రక్షకులా?.

హిందువులు నేడు కులాలుగా చీల్చబడి, అందులో హెచ్చుతగ్గు కులములుగా వర్ణించబడియున్నారు అనుట

అందరికీ తెలిసిన సత్యమే. దేవుడు మనుషులందరినీ సమానముగా పుట్టించితే కొందరు మనుషులు తమ స్వార్థ

బుద్ధితో హిందూ (ఇందూ) సమాజమును ముక్కలు ముక్కలుగా చీల్చి బలహీనపరచి హిందూసమాజమునకంతటికీ

తామే గొప్పవారమనీ, తాము చెప్పినట్లే అందరూ విని అన్ని కార్యములు చేసుకోవాలని ప్రచారము చేసుకొన్నారు. ఎన్నో

కులములుగాయున్న హిందూసమాజములో తమ కులమే అగ్రకులమని చెప్పుకోవడమే కాకుండా, ఇతర కులముల

వారందరికీ తామే మార్గదర్శకులమనీ, గురువులమని ప్రకటించుకొన్నారు. భవిష్యత్తులో తమకు ఎవరూ అడ్డు

రాకుండునట్లు, అన్ని కులములను అంటరాని కులములను చేసి, హిందూ సమాజమునకు తీరని అన్యాయము చేశారు.

అంతటితో ఆగక నేటికినీ హిందూ సమాజ రక్షకులుగా చెప్పుకొనుచూ, హిందూ సమాజమును సర్వనాశనము చేయుచూ,

హిందూ సమాజము ఇతర మతములుగా మారిపోవుటకు మొదటి కారకులగుచున్నారు. అటువంటి వారు హిందూ

సమాజమునకు చీడపురుగులుగాయున్నా, మిగతా కులముల వారందరూ వారి నిజ స్వరూపమును తెలియక వారు

చెప్పినట్లే వినుట వలన, హిందూ సమాజమును పూర్తిగా అజ్ఞాన దిశవైపుకు, అధర్మ మార్గమువైపుకు మళ్ళించి,

ప్రజలకు ఏమాత్రము దైవ జ్ఞానమును తెలియకుండా చేసి, తాము చెప్పునదే దైవబోధయని నమ్మించారు.


అటువంటి స్థితిలో నేడు త్రైత సిద్ధాంతకర్తగా ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు అజ్ఞాన దిశవైపు

నిలిచిపోయిన హిందూసమాజమును సరియైన దారిలో పెట్టుటకు, భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమను

అధ్యాయమున బోధింపబడిన క్షర, అక్షర, పురుషోత్తమ అను ముగ్గురు పురుషుల విషయమును త్రైత సిద్ధాంతము అను

పేరుతో ప్రతిపాదించి దైవజ్ఞానమును అందరికీ అర్థమగులాగున గ్రంథరూపములో వ్రాయడము, బోధించడము

జరుగుచున్నది. దానివలన నేడు ప్రజలు అసలైన జ్ఞానము తెలియుచున్నదని సంతోషపడుచున్నారు. అగ్రకులముగానున్న

వారిలో కూడా ఎందరో తమ అజ్ఞాన చీకటులను వదలి, ఇంతవరకూ తమకు తెలియని జ్ఞానము యోగీశ్వరుల ద్వారా

ఇప్పుడు తెలియుచున్నదని సంతోష పడి శిష్యులుగా చేరిపోవుచున్నారు. అయితే అగ్రకులములో కొందరు మాత్రము

యోగీశ్వరులు తెలియజేయు జ్ఞానవిషయములను చూచి ఈ జ్ఞానము వలన ప్రజలు జ్ఞానములో చైతన్యులై, జ్ఞానము

తెలియని తమను గౌరవించరని భావించి, దానివలన సమాజము మీద తమ ఆధిపత్యము లేకుండా పోవునని తలచి,

యోగీశ్వరులు తెలుపుచున్న త్రైత సిద్ధాంతము గానీ, త్రైత సిద్ధాంత భగవద్గీతగానీ హిందువుల జ్ఞానమే కాదనీ, అది

క్రైస్తవ మతమునకు సంబంధించినదనీ, దానిని ఎవరూ చదవకూడదని ప్రచారము చేయను మొదలు పెట్టారు. అంతేకాక

తాము హిందూధర్మరక్షకులమని, కొంత రాజకీయరంగు పూసుకొని, మా జ్ఞాన ప్రచారమునకు అక్కడక్కడ అడ్డు

పడడము జరుగుచున్నది. తమ మాట విను ఇతర కులముల వారికి కూడా ప్రబోధానందయోగీశ్వరులు చెప్పు జ్ఞానము



హిందూ జ్ఞానము కాదు, క్రైస్తవుల జ్ఞానమని హిందువుల ముసుగులో క్రైస్తవ మత ప్రచారము చేయుచున్నారని

చెప్పడమేకాక, అటువంటి వారిని ప్రేరేపించి మా ప్రచారమునకు అడ్డు తగులునట్లు చేయుచున్నారు.


యోగీశ్వరులు నెలకొల్పిన హిందూ (ఇందూ) జ్ఞానవేదిక ఇటువంటి ఆగడాలను కొంతకాలముగా ఓర్పుతో

చూడడము జరిగినది. మాలో ఓర్పు నశించి మమ్ములను అన్యమత ప్రచారకులుగా వర్ణించి చెప్పు అగ్రకులము వారిని,

వారి అనుచరులను మేము ఎదురుదిరిగి ప్రశ్నించడము జరిగినది. మేము ప్రశ్నించిన ఒక్క ప్రశ్నకు కూడా వారు

సరియైన సమాధానము ఇవ్వలేదు. ఆ జవాబులు ఎలా ఉన్నాయో పాఠకులుగా మీరు చూడండి.

మా ప్రశ్న :- ఇంతవరకు ఏ హిందువూ చేయని విధముగా ఊరూరు తిరిగి, ఊరులో ఇల్లిల్లూ తిరిగి హిందూ

ధర్మములను ప్రచారము చేయుచున్నాము కదా! అటువంటి మమ్ములను మీరు అన్యమత ప్రచారకులుగా ఎందుకు

చెప్పుచున్నారు?


వారి జవాబు :- హిందూమతములో ఎందరో స్వామీజీలున్నారు. వారు ఎవరూ ఇల్లిల్లు తిరిగి ప్రచారము చేయలేదు.

హిందువులు అట్లు ఎవరూ ప్రచారము చేయరు. క్రైస్తవులయితేనే బజారు బజారు, ఇల్లిల్లు తిరిగి ప్రచారము చేస్తారు.

మీరు హిందువుల ముసుగులో ఇల్లిల్లు తిరిగి క్రైస్తవమును ప్రచారము చేయుచున్నారు.


మా ప్రశ్న :- మేము క్రైస్తవులమయితే భగవద్గీతను ఎందుకు ప్రచారము చేస్తాము?

వారి జవాబు :- మీరు ప్రచారము చేయునది త్రైత సిద్ధాంత భగవద్గీత. అది క్రైస్తవులది. బైబిలుకే మీరు అలా పేరు

పెట్టారు.


మా ప్రశ్న :- క్రైస్తవులు తమను క్రైస్తవులుగానే చెప్పుకుంటారు. అలాగే బైబిలును బైబిలుగానే చెప్పుకొంటారు. వారి

ప్రచారము క్రైస్తవము, బైబిలు అయినప్పుడు అదే పేరుమీద ప్రచారము చేస్తారు తప్ప హిందువులుగా భగవద్గీత

పేరుతో ఎందుకు ప్రచారము చేస్తారు? ఇంతవరకు అట్లు ఎక్కడా జరుగలేదు. ఏ మతము వారు ఆ మతము పేరు

చెప్పుకొంటారు గానీ ఇతర మతము పేరు చెప్పరు. అంతెందుకు మీరు మా భగవద్గీతను తెరచి చూచారా? అందులో

భగవద్గీత శ్లోకములున్నాయా? బైబిలు వాక్యములున్నాయా?


త్రైత సిద్ధాంతమని యున్నది కదా! త్రైతము అంటే త్రిత్వము అని త్రినిటి అని మాకు బాగా తెలుసు.


మా ప్రశ్న :- హిందూ ధర్మములలో అద్వైత సిద్ధాంతమును ఆదిశంకరా చార్యుడు ప్రతిపాదించాడు. విశిష్టాద్వైతమును

రామానుజాచార్యులు ప్రతి పాదించాడు, ద్వైతమును మధ్వాచార్యులు ప్రకటించాడు. ఇప్పుడు ఆచార్య ప్రబోధానంద

యోగీశ్వరులు త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. సిద్ధాంతకర్తలు, సిద్ధాంతములు వేరయినా అందరూ హిందువులని

మీరు ఎందుకు అనుకోలేదు?


వారి జవాబు :-మీ త్రైత సిద్ధాంత భగవద్గీతలో యజ్ఞములను చేయకూడదని వ్రాశారు కదా! నిజముగా భగవద్గీతలో

అలా లేదు కదా!


మా ప్రశ్న :- మీరు హిందువులలో ముఖ్యులుగా వుండి అంత మూర్ఖముగా మాట్లాడితే ఎలా? ప్రపంచమునకంతటికి

ఒకే భగవద్గీతయుంటుంది గానీ, మీ భగవద్గీత, మా భగవద్గీతయని వేరుగా ఉండదు. భగవద్గీతకు వివరము



ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారికి అర్థమయినట్లు చెప్పియుండవచ్చును గానీ, అందరికీ భగవద్గీత మూల గ్రంథమొక్కటేనని

గుర్తుంచుకోండి. త్రైత సిద్ధాంత భగవద్గీత అన్నిటికంటే సరియైన భావముతో యున్నదని చదివిన జ్ఞానులందరూ

పొగడుచూయుంటే, మీ కులములో ఎందరో ప్రశంసించుచూ యుంటే, మీకు కొందరికి మాత్రము వ్యతిరేఖముగా

కనిపించిందనడము అసూయతోనే అని మాకు అర్థమగుచున్నది. యజ్ఞములు చేయవద్దని మేము ఎక్కడా చెప్పలేదు.

యజ్ఞముల వలన పుణ్యము వస్తుంది, స్వర్గము వస్తుంది అని చెప్పాము. యజ్ఞముల వలన మోక్షము రాదు, దేవుడు

తెలియడని చెప్పాము. అంతెందుకు మీరు మేము అన్ని కులములకంటే స్వచ్ఛమయిన హిందువులమని చెప్పుకొంటున్నారు

కదా! భగవద్గీతలో చెప్పిన ఒక్క హిందూ ధర్మమును చెప్పండి.


వారి జవాబు :-అవన్ని మాటలు వద్దు... మీరు హిందువులు కాదు.


మా ప్రశ్న :- మొండిగా మాట్లాడవద్దండి మీరు అగ్రకులము వారమని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి. మేము

హిందువులము కాము అనుటకు ఆధారము ఏమైనా చూపగలరా? మా కథ అట్లుంచి మీరు సరియైన హిందువులే

అయితే భగవద్గీతలో విశ్వరూప సందర్శనయోగమను అధ్యాయములో 48వ శ్లోకములోనూ, 53వ శ్లోకములోనూ

భగవంతుడు ఏమి చెప్పాడో మీరే చెప్పండి.


వారి జవాబు :-మేము ఇంతవరకు భగవద్గీత చదువలేదు. మీకు కావలసి వస్తే సంపూర్ణానందస్వామితో చెప్పిస్తాము.

మా ప్రశ్న :- కనీసము భగవద్గీతను కూడా చదువని మీరు యోగీశ్వరులయిన ప్రబోధానందస్వామిని దూషించడము

మంచిదా? ఒక్క హిందూ ధర్మమును కూడా తెలియని మీరు హిందూ ధర్మ రక్షకులమని చెప్పడము మంచిదా?

యోగీశ్వరులవారు వ్రాసిన ఒక్క గ్రంథము కూడా చదువకుండ మేము తప్ప పూజ్యులుగా, గురువులుగా ఎవరూ 

ఉండకూడదను అసూయతో ఇలాగ మాట్లాడితే దేవుడు ఓర్చుకోడని చెప్పుచున్నాము.


వారి జవాబు :- హిందూ మతములో ఎందరో దేవుళ్ళున్నారు. శివుడు దేవుడే, శివుని కొడుకు గణపతి దేవుడే,

రాముడు దేవుడే, రాముని సేవకుడు ఆంజనేయుడు దేవుడే. అలాంటి హిందూమతములో దేవుడు ఒక్కడే అని

చెప్పడము మీది తప్పు కాదా?


మా మాట :- మేము మతమును గురించి చెప్పలేదు. హిందూమతములో ఎందరో దేవుళ్ళుండడము నిజమే, అయితే

హిందూ జ్ఞానములో, హిందూ ధర్మము ప్రకారము విశ్వమునకంతటికి ఒకే దేవుడని చెప్పాము. భగవద్గీతలో దేవుడు

చెప్పినదే చెప్పాము తప్ప మేము దేవతలను గురించి లేరని చెప్పలేదే! దేవతలకందరికీ అధిపతియైన దేవుడు ఒక్కడున్నాడని,

ఆయనే దేవదేవుడనీ, అతనిని ఆరాధించమని చెప్పాము.


వారి జవాబు :- మీరు రాముని పేరు చెప్పరు, శివుని పేరు చెప్పరు, వినాయకుని పేరు చెప్పరు. ఎవరి పేరు

చెప్పకుండా దేవుడు అనీ, సృష్టికర్తయనీ అనేకమార్లు పేర్కొన్నారు. దేవుడు అను పదమునుగానీ, సృష్టికర్తయను

పదమునుగానీ క్రైస్తవులే వాడుతారు. హిందువులు వాడరు. అందువలన మిమ్ములను హిందువులు కాదు క్రైస్తవులు

అంటున్నాము.


మా ప్రశ్న :- క్రైస్తవ మతము పుట్టి రెండువేల సంవత్సరములయినది. సృష్ఠిపుట్టి ఎన్ని కోట్ల సంవత్సరములయినదో

ఎవరూ చెప్పలేరు. సృష్ట్యాది నుండి సృష్టికర్త అను పదమును దేవుడు అను పదమును హిందూ సమాజము



వాడుతూనేయున్నది. మొదటినుండి హిందూసమాజములో యున్న దేవుడు, సృష్ఠికర్త అను పేర్లను హిందువులు

క్రైస్తవులకేమయినా లీజుకిచ్చారా? లేక పూర్తిగా వారికే అమ్మేశారా? అని అడుగుచున్నాము. సృష్టికర్త అనిగానీ, దేవుడు

అనిగానీ హిందువులయిన వారు అనకూడదని ఎక్కడయినా ఉన్నదా అని అడుగుచున్నాము?


వారి జవాబు :- మీరు హిందూమతమును కాకుండా అన్యమతమును బోధించుచున్నారనుటకు, మిమ్ములను మీరు

హిందువులుగా చెప్పుకోలేదు. హిందువులుగా కాకుండా ఇందువులుగా చెప్పుకొంటున్నారు. అటువంటప్పుడు మీరు

హిందూమతమును చీల్చినట్లు కాదా! ప్రత్యేకించి ఇందూమతము అను దానిని ప్రచారము చేసినట్లు కాదా! మీరు

హిందువులే అయినప్పుడు మీ గ్రంథములలోగానీ, మీ బోధలలోగానీ ప్రత్యేకించి ఇందువులు అని ఎందుకు చెప్పుచున్నారు?


మా మాట :- మేము సూటిగా ఒక ప్రశ్నను అడుగుతాము జవాబు చెప్పండి. హిందువు, ఇందువు అను పదములో

కొద్దిపాటి శబ్దము తప్ప ఏమి తేడాయుందో మీరే చెప్పండి. తెలుగు భాషను వ్రాసే వారందరూ హిరణ్యకశ్యపున్ని

చంపినది నరశింహస్వామి అని చెప్పుచుందురు అలాగే వ్రాయుచుందురు. ప్రస్తుతకాలములో నరశింహులు అని

పేరున్నవాడు కూడా వాని పేరును నరశింహులు అని వ్రాయడము అందరికీ తెలుసు. అయితే ఆ మాట తప్పు అలా

వ్రాయకూడదు దానిని నరసింహ అని వ్రాయవలెను అని చెప్పుచున్నాము. అడవిలో మృగరాజును సింహము అని

అంటాము తప్ప శింహము అని అనము అనికూడ చెప్పుచున్నాము. సింహము అంటే అర్థమున్నది గానీ, శింహము

అంటే అర్థము లేదు అని కూడా చెప్పాము. అలా ఉన్నది ఉన్నట్లు చెప్పితే ఇందువు అనే దానికి అర్థమున్నదిగానీ

హిందువు అనే దానికి అర్థములేదు అని చెప్పాము. సృష్ట్యాదిలో పుట్టినది ఇందూ సమాజమనీ, అది మధ్యలో పేరుమారి

దృష్ఠి జిష్ఠి అయినట్లు ఇందూ అను శబ్దము హిందూ అని పలుకబడుచున్నదని చెప్పాము. ఇందూ పదము ఎందుకు

వాడాలి హిందూ పదమును ఎందుకు వాడకూడదని కూడా వివరముగా మా గ్రంథములలో గలదు. ఉన్న సత్యము

మీకు తెలిసినా మీరు మాకంటే పెద్ద ఎవరూ ఉండకూడదను అసూయతో మాట్లాడుచున్నారు.


అగ్రకులములో ఎందరో పెద్దలు మా జ్ఞానమును తెలిసి సంతోషించుచుండగా, కొందరు మాత్రము వీధిరౌడీలలాగా

తంతాము, పొడుస్తాము, కాలుస్తాము మీరు ప్రచారము చేయవద్దండని చెప్పడము మంచిది కాదు. మా గ్రంథములు

ఏదీ చదువకుండా మాట్లాడడమూ, మేము చెప్పిన మాటలను వినకుండా ఇవన్నీ డ్రామాలు, నాటకాలు అనడము

మంచిది కాదు. మీరు ఎవరైనా మా గ్రంథములలో ఇతర మతములను ప్రచారము చేసినట్లుగానీ, ఫలానా మతములోనికి

చేరమని చెప్పినట్లుగానీ ఉంటే నిరూపణ చేయండి, అలా నిరూపించినవారికి ఇందూ జ్ఞానవేదిక తరపున పది లక్షల

రూపాయలను ఇవ్వగలము. నిరూపించ లేకపోతే మీరు లక్ష రూపాయలు ఏ ఊరిలో శ్రీకృష్ణుని గుడికయినా ఇవ్వవలెను.

ఈ షరతుకు ఎవరైనా ముందుకు వస్తారా? అని అడుగు చున్నాము.

ఇట్లు,

ఇందూ జ్ఞానవేదిక మరియు,

ప్రబోధ సేవాసమితి.



Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024