పునర్జన్మ రహస్యము. cloud text 17thsep24 Updated
పునర్జన్మ రహస్యము.
తన జన్మ ఎలా జరిగిందో తెలియనివాడు, పునర్జన్మ విషయమును గూర్చి చెప్పాలంటే కష్టము. మొదటి జన్మ
వివరము తెలిసినపుడు తర్వాత పునర్జన్మ విషయమును తెలియవచ్చును. జీవుడు జన్మించు సమయములో ఏ అనుభూతిని
పొందుచున్నాడో తెలిసినవాడు, పునర్జన్మ అనుభవమును గూర్చి చెప్పగలడు. కానీ మనిషికి జన్మ వివరమే తెలియనపుడు,
అది వానికి రహస్యమగును. తెలియకుండా గోప్యముగా ఉండునది ఏదైనా రహస్యమే. ఏ మనిషి అయినా తాను
జన్మించునపుడు తనకు జ్ఞప్తి ఉన్నదా అని ఆలోచించుకుంటే తనకే తెలిసిపోతుంది. జన్మించిన తర్వాత కొన్ని నెలల
కాలము గడిచిన తర్వాత అయినా జ్ఞాపకము ఉందా అని చూస్తే, అలా ఒక సంవత్సరము గడచిన తర్వాత కూడా
తనకు జ్ఞాపకము లేనట్లే అర్థమగుచున్నది. భూమిమీద మనిషిగా పుట్టిన ఎవరికిగానీ, ఒక సంవత్సరము లోపల
జ్ఞాపకము ఉన్నదని చెప్పుటకు వీలులేదు. ఒక సంవత్సరమే కాదు మరొక సంవత్సరమును కలిపి రెండు సంవత్సరముల
వరకు చూచినా జ్ఞాపకమున్న ఆధారములు కనిపించలేదు. చిన్న వయస్సులో నీ విషయములు నీకే జ్ఞాపకములేనపుడు,
పోయిన జన్మను గురించి చెప్పాలంటే సాధ్యమగునా అని ప్రశ్నించుకొని చూస్తే, సాధ్యము కాదనియే చెప్పవచ్చును.
ఈ మధ్యన ఒక టీ.వీ. ఛానల్లో ఉన్నతమైన చదువు చదివిన ఒక యం.డి. డాక్టరు ఎదుటి మనిషితో ఆ మనిషి యొక్క
గత జన్మ అనుభవములను చెప్పించడము చూచాను. దానిని చూచిన చాలామంది మేధావులు కూడా ఆ విషయములను
సులభముగా నమ్మడము చూచాను. అప్పుడు మాలో పునర్జన్మ రహస్యమును గురించి తొందరగా వ్రాయాలను
సంకల్పము కల్గినది. ముందునుండి వాస్తవముగా పునర్జన్మ రహస్యమును గురించి వ్రాయాలను సంకల్పముండినా,
పనిని చేయుటలో ఆలస్యము ఏర్పడినది. అయితే టీ.వి. ఛానల్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పునర్జన్మ జ్ఞాపకాలను
చెప్పించడము చూచిన తర్వాత మా సంకల్పము కార్య రూపమగుటకు ప్రారంభించినదని చెప్పవచ్చును.
మనిషి ఒకమారు మరణిస్తే, మరొకమారు జన్మించుటకు అవకాశము కలదు. అందువలన మొదట మరణమూ,
తర్వాత మళ్ళీ జననము ఉండును. మొదట మరణమును పొందిన తర్వాత తిరిగి పుట్టడము జరుగుచుండును. ఈ
విధానము ఒక్క ఇందూమతములో తప్ప ఇస్లామ్లో గానీ, క్రైస్తవములోగానీ ఒప్పుకోబడడములేదు. ప్రధానమైన
క్రైస్తవ, ఇస్లామ్ మతములలో మళ్ళీ పుట్టడము లేదనీ, ఒక్కమారు జన్మించి, ఒక్కమారు చనిపోవుదురనీ చెప్పుచుండుట
చూచాము. ఆ రెండు మతాల మూల గ్రంథాలలో కూడా మనిషి చనిపోయిన తర్వాత అతడు తిరిగి జన్మిస్తాడని
మత ప్రవక్తలు చెప్పియుండగా, ఆ విషయము వారికి అర్థము కాకుండా పోవడము వలన, మనిషికి పునర్జన్మ లేదు
అని అంటున్నారు. వాస్తవముగా క్రైస్తవ, ఇస్లామ్ మతగ్రంథములలో కూడా పునర్జన్మలున్నవనియే చెప్పబడినది. ఆ
గ్రంథాలలో పునర్జన్మకు సంబంధించిన విషయములను సందర్భము వచ్చినపుడు ప్రస్తావించి చెప్పగలము. ఇందూ
(హిందూ) మతములోని ముఖ్యగ్రంథమైన భగవద్గీతలో పునర్జన్మ ఉన్నదని శాస్త్రబద్దముగా చెప్పబడి ఉన్నది. ముఖ్యమైన
అన్ని మతాలలోను ప్రవక్తలు మనిషికి మళ్ళీ జన్మ ఉన్నదని చెప్పుట వలన, వారి మాటలనుబట్టి పునర్జన్మగలదని
విశ్వసిస్తున్నాము. ఇక్కడ మత గ్రంథములు చెప్పిన దానినిబట్టి విశ్వాసము ఉన్నదేగానీ, అనుభవములేదని చెప్పుచున్నాము.
విశ్వాసము వాస్తవమూ కావచ్చు లేక అవాస్తవమూ కావచ్చును. ముఖ్యమైన మూడు మత గ్రంథాలలో చెప్పిన పునర్జన్మ
విశ్వసనీయమే అయినా, అది నిజమో, అబద్దమో అని తేల్చి చెప్పుకొనుటకు ముందు, మరణమును గురించి తెలుసుకోవాలి.
మరణమును గురించిన వివరమును తెలుసుకో గల్గితే తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందో లేదోననీ, ఉంటే ఎలా
సంభవించునోననీ తెలుసుకొనుటకు అవకాశమున్నది. అందువలన ముందుగా మరణమును గురించి చెప్పుకొందాము.
మనిషికి మరణము మూడు రకములు కలదు. మనిషికిగల మూడు మరణములను గురించి విపులముగా
“మరణ రహస్యము” అను చిన్న గ్రంథములలో వ్రాయబడినది. ఒక మనిషి చనిపోయినపుడు మూడు మరణములలో
దేనినైనా పొందివుండవచ్చును. కాలమరణము, అకాల మరణము, తాత్కాలికమరణము అనబడు మూడు మరణములలో
మనిషి కాలమరణమును పొందినపుడు మాత్రమే వెంటనే పునర్జన్మకు పోవును. ఒకవేళ మనిషి అకాలమరణము
పొందినా, తాత్కాలిక మరణమును పొందినా తిరిగి కాలమరణము సంభవించు వరకు, మళ్ళీ జన్మకు (పునర్జన్మకు)
పోవుటకు అవకాశము లేదు. మూడు మరణములలో ఒక మనిషి ఒక మరణమునైనా పొందవచ్చును, లేక రెండు
మరణములనైనా పొందవచ్చును. లేక మూడు మరణములనైనా పొందవచ్చును. వివరముగా చెప్పితే ఒక మనిషి
అకాల మరణమును పొంది తర్వాత కొంత కాలమునకు కాలమరణమును పొంది మరుజన్మకు పోవుచున్నాడు. అలాగే
ఒక మనిషి తాత్కాలిక మరణమును పొంది, తర్వాత కాలమరణమును పొంది రెండవ జన్మకు పోవుచున్నాడు. అదే
విధముగా ఒక మనిషి ఒకప్పుడు తాత్కాలిక మరణమును పొంది, తర్వాత అకాలమరణమును పొంది, చివరకు కాల
మరణమును పొందగలిగి పునర్జన్మకు పోవుచున్నాడు. దీనినిబట్టి మనిషి అకాల మరణమును పొందినా, లేక తాత్కాలిక
మరణమును పొందినా, చివరకు కాలమరణమును పొందవలసిందేనని తెలియుచున్నది. ఇంకొక వివరము ఏమనగా!
మనిషి ముందు రెండు మరణములను పొందకుండా ఒకేమారు చివరిదైన కాలమరణమును పొందవచ్చును. వారివారి
కర్మనుబట్టి మరణములు ఎన్ని పొందాలి? ఎప్పుడు పొందాలి? అని ముందే నిర్ణయించ బడి ఉండును. మరుజన్మ
(పునర్జన్మ) రావాలి అంటే ముందు కాలమరణము రావాలి. కాలమరణమే మనిషికి అసలైన మరణము. కాలమరణము
తర్వాతే మనిషికి తిరిగి జన్మ ఉండును. మనిషి ఏ మతములో పుట్టివుండినా, వానికి మూడే మరణములుండును.
అందులో ఒకటి కాలమరణము తప్పకుండా సంభవించి తీరును. మిగతా రెండు మరణములు జరుగవచ్చు లేక
జరుగకపోవచ్చును.
కాలమరణము అనగా పూర్తి ఆయుస్సు అయిపోయిన తర్వాత సంభవించునదని అర్థము. కాలమరణమును
సంపూర్ణ మరణము అని అనవచ్చును. మిగతా రెండు మరణములైన అకాల మరణము, తాత్కాలిక మరణములను
అసంపూర్ణ మరణములని అనవచ్చును. ఎందుకనగా! ఈ రెండు మరణముల వలన వెంటనే రెండవ జన్మరాదు.
అందువలన వీటిని అసంపూర్ణ మరణములని అనవచ్చును. పునర్జన్మ సంపూర్ణ మరణమును పొందిన వానికే కలుగును.
కావున ఇప్పుడు మనము అసలైన మరణమును గురించి తెలుసుకొందాము. ఈ మరణము గురించి "జనన మరణ
సిద్ధాంతము” లోనూ, అట్లే “మరణ రహస్యము” లోనూ చెప్పబడి నప్పటికీ ఇప్పుడు కూడా సందర్భానుసారము కొంత
వివరమును చెప్పు కొందాము. ఒక మనిషి సజీవ శరీరము కొన్ని భాగముల చేత కూర్చబడి ఉన్నది. ఒక భాగము
అనగా ఎంత అనిగానీ, ఒక భాగముగా ఎట్లు చెప్ప గలగుచున్నారనిగానీ, ఎవరైనా ప్రశ్నించగలిగితే వారికి జవాబును
ఈ విధముగా చెప్పవచ్చును. ఒకే ముద్దగా కనిపించు శరీరములో భాగములను గుర్తించుటకు ఒక సూత్రముగలదు.
అదేమనగా! ఒక శరీరములో ప్రత్యేకించి ఒక పనిని చేయు దానిని ఒక భాగముగా గుర్తించవచ్చును. ఆ విధముగా
మన శరీరములో మొత్తము 26 రకముల పనులు చేయు భాగములు కలవు. అందులో పనినిబట్టి కనిపించునవి,
కనిపించనివి అను రెండు రకములు కూడా గలవు. ఇక్కడ ముఖ్యముగా గమనించ వలసిన విషయమేమనగా! ఒక
శరీరములో ఒక భాగము ఒకే పనిని చేయును అను మాటలోని అంతరార్థమేమనగా! శరీరములో ఒక భాగము చేయు
పనులను ఇంకొకటి ఏదీ చేయనపుడు దానిని ఒక భాగముగా లెక్కించవచ్చును. దీనినిబట్టి మనకు అర్థమగునది
ఏమనగా! ఒక పనిగానీ లేక రెండు పనులుగానీ, అంతకంటే ఎక్కువ పనులుగానీ, శరీరములో నియమిత పేరుగలది
ఒక్కటే చేయునప్పుడు, దానిని ఒక భాగముగా లెక్కించవచ్చును. ఈ విధముగా శరీరములో నియమిత పనులను
చేయు నియమిత పేరుగల భాగములు మొత్తము 26 గలవని చెప్పుకొన్నాము. పని చేయని పరమాత్మ కూడ కలదు.
దానితో అయితే 27 భాగములగును. అది పని చేయనిది కావున దానిని భాగముగా తీసుకోవడము లేదు.
ఒక సజీవ శరీరమును 26 భాగముల కూటమి అని చెప్పినపుడు, అందులో కనిపించు మరియు కనిపించని
రెండు రకముల భాగములు ఉన్నవని చెప్పవచ్చును. కనిపించు భాగములను స్థూల శరీరమనీ, కనిపించని భాగములను
సూక్ష్మశరీరమనీ శరీరమును రెండు భాగములుగా విభజించి చెప్పవచ్చును. కనిపించే స్థూల శరీరము పది భాగములుగా
ఉండగా, కనిపించని సూక్ష్మశరీరము పదహారు భాగములుగా ఉన్నది. ఒక శరీరమును స్థూల, సూక్ష్మ రెండు భాగములుగా
విభజించడమేకాక శరీరమును ప్రకృతి భాగములనీ, ఆత్మ భాగములనీ రెండు భాగములుగా విభజించవచ్చును.
శరీరములోని సూక్ష్మ భాగము స్థూలభాగములు రెండు కలిసి 26 కాగా, అందులో 24 ప్రకృతి భాగములుండగా,
కేవలము రెండు మాత్రము ఆత్మ భాగములున్నవి. వాటిని మొత్తము క్రింద వివరముగా చూస్తాము.
1)కన్ను
2)చెవి
3)ముక్కు
4)నాలుక
5)చర్మము
6)చేతులు
7)కాళ్ళు
8)నోరు
9)గుదము
10)గుహ్యము
11)వ్యాన వాయువు
12)ఉదాన వాయువు
13)సమాన వాయువు
14)ప్రాణ వాయువు
15)అపాన వాయువు
16)చూపు
17)వినికిడి
18)వాసన
19)రుచి
20)స్పర్శ
21)మనస్సు
22)బుద్ధి
23)చిత్తము
24) అహము
25)జీవుడు
26)ఆత్మ
27)పరమాత్మ
స్థూల శరీరములో ముఖ్యమైనది కన్ను. "జ్ఞానేంద్రియానామ్ నయనమ్ ప్రధానమ్" అను వాక్యము ప్రకారము
జ్ఞానేంద్రియములలో కన్ను ముఖ్యమైనది. స్థూలశరీరములో ఐదు జ్ఞానేంద్రియములూ, ఐదు కర్మేంద్రియములు గలవు.
స్థూల శరీరము పది భాగములు కాగా, అందులో ఐదు జ్ఞానేంద్రి యములు మరియు ఐదు కర్మేంద్రియములు గలవు.
జ్ఞానేంద్రియములలో కన్ను దృశ్యమును చూపిస్తున్నది. మొత్తము శరీరములో కన్ను బయటి దృశ్యములను మాత్రము
చూపుచున్నది. శరీరములో దృశ్యమును చూపించు పరికరము ఒకేఒక కన్ను మాత్రమే కలదు. శరీరములో కన్ను
చేయు పనిని ఏదీ చేయలేదు. ప్రత్యేకమైన పనిని చేయునది, ప్రత్యేకమైన భాగముగా ఉన్నదను సూత్రము ప్రకారము,
దేహములో కన్ను ఒక భాగముగా లెక్కించ బడుచున్నది. ఈ విధముగా శరీరములో మొత్తము 28 కార్యములు 26
భాగములచేత జరుగుచున్నవి. దేహములోని 26 భాగములలో మనస్సు, ఆత్మ అను రెండు ప్రత్యేకించి ఒక్కొక్కటి
రెండేసి పనులు చేయుచున్నవి. శరీరములోని 24 భాగములు ఒక్కొక్క పనిని చేయగా, మనస్సు రెండు పనులనూ, ఆత్మ
రెండు పనులనూ చేస్తున్నవి. అలా మనస్సు, ఆత్మ ఒక పనిని అధికముగా చేయుట వలన శరీరములో మొత్తము
పనులు 28గా గుర్తించబడినవి. మానవ జీవితమంతా మానవుని శరీరములో కేవలము 28 పనులు మాత్రమే
జరుగుచున్నవి. అయితే ఒక మనిషి బయట వేల వ్యాపారములు, వేల వ్యవహారములను నెరవేర్చు మేధావి అయినా
కూడా తన శరీరములో జరుగు 28 పనులను గుర్తించలేక పోవుచున్నారు. బయట వేల వ్యాపారములను చేసి, వేల
కోట్లు డబ్బును సంపాదించినా, ఎన్నో వ్యవహారములను నడిపి దేశానికి ప్రధానమంత్రి అయినా, ఎవడు ఎంతటి
వాడైనా వాని శరీరములో జరుగునవి 28 పనులు మాత్రమే. కానీ ఆ 28 పనులు తన శరీరములో పుట్టినప్పటినుండి
జరుగుచున్ననూ, ఆ 28 పనులు ఏమిటో, వాటిని ఏ భాగములు చేయుచున్నవో, ఖచ్చితముగా మనిషి చెప్పలేని స్థితిలో
ఉన్నాడు.
నేను యం.డి డాక్టరును. శరీరములో ప్రతి భాగము నాకు తెలుసు, అలాగే శరీరములో ప్రతి భాగము చేయు
పని కూడా నాకు తెలుసు అని ఎవరైనా అనవచ్చును. అంతేకాకుండా వారికి శరీరములో 26 భాగములేకాక వందల
భాగములు కనిపించును. కానీ సూక్ష్మశరీరములోని పదిహేను భాగములు కనిపించవు. అవి ఏ పరికరములకుగానీ,
ఏ స్కానింగులకుగానీ తెలియునవి కావు. ఉదాహరణకు మనస్సు అనునది శరీరములో భాగమే అయినా అది కనిపించదు.
దానిని ఏ పరికరము, ఏ స్కానింగులు, ఏక్స్లు గుర్తించలేవు, చూడలేవు, చూపలేవు. అందువలన వైద్య వృత్తిలో
యం.డి డాక్టర్లకు కూడా తెలియని భాగములున్నవని చెప్పవచ్చును. ఆధ్యాత్మికవిద్యను అభ్యసించి, బ్రహ్మవిద్యాశాస్త్రమును
తెలిసిన వారికి మాత్రమే శరీరములో కనిపించని భాగములు కూడా తెలియగలవు. అట్లే అవి చేయు పనులు కూడా
తెలియగలవు. ఒక డాక్టరు శరీరములోని స్థూల భాగములను గురించి చెప్పగలడు, సూక్ష్మ భాగములను గురించి
చెప్పలేడు. శరీరములో స్థూలముగా జరుగు పనినిబట్టి ఇతడు బ్రతికాడు లేక చనిపోయాడు అని చెప్పగలడు. కానీ
దానికి కారణమైన కనిపించని కర్మను గురించి చెప్పలేడు. ఒక డాక్టరుకు తెలియని ఎన్నో సూక్ష్మ విషయములు ఒక
ఆధ్యాత్మికవేత్తకు తెలియును. అలాగే ఒక ఆధ్యాత్మికవేత్తకు తెలియని ఎన్నో స్థూల విషయములు డాక్టరుకు తెలియును.
ఆత్మల విషయములో, దైవజ్ఞానములో, ఆధ్యాత్మిక రంగములో స్థూలముకంటే సూక్ష్మమునకే ఎక్కువ ప్రాధాన్యత గలదు.
కావున డాక్టరుకు తెలియని రహస్యములు ఆధ్యాత్మికవేత్తలకే ఎక్కువ తెలియునని చెప్పవచ్చును.
ఒక మనిషిని పరీక్షించి చనిపోయాడని చెప్పిన డాక్టరుకు, ఆ మనిషి శరీరము లోపల ఆఖరు నిమిషములో ఏమి
జరిగినదీ, మనస్సు ఏ పని చేయుచున్నదీ, బుద్ధి ఎలా పని చేయుచున్నదీ తెలియదు. భౌతిక శాస్త్రవేత్త లకు స్థూల
అవయవముల పని మాత్రమే తెలియును, కానీ సూక్ష్మమైన జీవాత్మ విషయము తెలియదు. అందువలన శరీరములో
జీవుడున్నప్పటికీ, శ్వాస ఆడనంతమాత్రమున చనిపోయాడని చెప్పిన సంఘటనలు కలవు. అలా చనిపోయాడని చెప్పిన
తర్వాత కొన్ని గంటలకు, కొన్ని దినములకు లేచి వచ్చినవారు కలరు. అలాగే మనిషి పుట్టుకలో శిశువు శరీరము
లోనికి జీవుడు రాకనే ఆ శరీరము కదలనంత మాత్రమున, శ్వాస ఆడనంత మాత్రమున ముందే చనిపోయాడనీ,
గర్భములోనే చనిపోయాడని డాక్టర్లు చెప్పడము చాలాచోట్ల జరిగినది. అటువంటి శిశువులు కొన్ని గంటల తర్వాత
ప్రాణము వచ్చి బ్రతికినవారు కూడా చాలామంది కలరు. ఇవన్నిటిని పరిశీలించి చూస్తే ఒక డాక్టరుకు స్థూల
శరీరమును గురించి సంపూర్ణముగా తెలియును, కానీ సూక్ష్మశరీరమును గురించి తెలియదనియే చెప్పవచ్చును. అట్లే
ఆధ్యాత్మిక విద్యను తెలిసిన వారికి సూక్ష్మశరీరమును గురించి తెలియునుగానీ, స్థూల శరీరమును గురించి సరిగా
తెలియదని చెప్పవచ్చును. ఇకపోతే బ్రహ్మవిద్యలో ఆరితేరిన ఆధ్యాత్మికవేత్తలు కొందరు స్థూలమును గురించి గానీ,
సూక్ష్మమును గురించిగానీ బాగా తెలిసివుందురు. స్థూల, సూక్ష్మములను తెలిసిన బ్రహ్మవిద్యావేత్తలు భూమిమీద అరుదుగా
ఉందురు. అటువంటి వారు మాత్రమే జనన విషయములనుగానీ, మరణ విషయము లనుగానీ తేల్చి చెప్పగలరు.
జనన మరణ రహస్యములను పూర్తిగా తెలిసి వుందురు. వారు తెలియజేస్తేనే ఇతర మనుషులకు ఆ రహస్యములు
తెలియగలవు. అటువంటి బ్రహ్మవిద్యాశాస్త్రవేత్తలు తప్ప భౌతిక శరీర శాస్త్రవేత్తలుగానీ, వైద్యులుగానీ జనన మరణముల
వివరములను తెలియ లేరు. ఒకవేళ తెలిసినట్లు చెప్పినా, వారు చెప్పిన విషయములు సత్యములు కావు, నిరూపణకురావు.
పునర్జన్మ రావాలంటే దానికి ముందు మరణము ఉండితీరాలి. ముందు మరణించకుండా పుట్టువారు ఎవడూ
ఉండడు. సృష్ఠి జరిగినప్పుడు దేవుడే స్వయముగా జీవరాసులను సృష్టించినపుడు మాత్రము అందరి జన్మలు మరణము
లేకుండా జన్మతోనే మొదలగుచున్నవి. తర్వాత పుట్టినవాడు చనిపోక తప్పదు, చనిపోయిన వాడు తిరిగి పుట్టుక
తప్పదు. దీనినిబట్టి సృష్టి తర్వాత భగవద్గీతలో సాంఖ్యయోగము 27వ శ్లోకమున చెప్పినట్లు “జాతస్య హి ధ్రువో
మృత్యో ధ్రువం జన్మ మృతస్యచ" పుట్టినవాడు చావక తప్పదు. చచ్చినవాడు పుట్టక తప్పదు అని కలదు. గీతలో
భగవంతుడు మొదట చెప్పిన పదము “జాతస్య” అనుటలో మొదట పుట్టినవాడు అని అర్థమగుచున్నది. భగవద్గీతలో
భగవంతుడు ఆచి తూచి ఏ మాట ముందు చెప్పాలో ఏ మాటను వెనుక చెప్పాలో అలాగే చెప్పాడు. అందువలన
పుట్టినవాడు చనిపోవుట ధృవీకరించివుంది అని చెప్పాడు. తర్వాత చనిపోయినవాడు జన్మించునట్లు నిర్ణయము
చేయబడినదని చెప్పాడు. ఆ శ్లోకములో మొదటి వాక్యము సృష్టించబడిన తర్వాత జరుగునదనీ, అందులో మొదట
పుట్టుకను గురించి జాతస్య అని చెప్పడము జరిగినది. అలాగే మరణించిన తర్వాత జన్మ జరుగునదనీ రెండవ
వాక్యములో చెప్పబడినది. అందువలన సృష్టించబడిన ప్రతి జీవి చావక తప్పదు, చనిపోయిన ప్రతిజీవి పుట్టుక
తప్పదని చెప్పడమైనది. ఒకడు భూమిమీద మనము చూచునట్లు పుట్టాడు అంటే అతడు ఒక్కక్షణము పుట్టకముందు
చనిపోయివుండవలెను. ఉదాహరణకు ఒకని జననము సాయంకాలము ఐదుగంటల మూడు నిమిషములకైతే, వాని
మరణము కూడా సాయంకాలము ఐదుగంటలా రెండు నిమిషములా యాభై తొమ్మిది సెకండ్లకు జరిగినదని అర్థము.
ఒకడు పుట్టాడు అంటే అంతకంటే ఒక సెకండు ముందు వాడు చనిపోయివుంటాడు. అందువలన చచ్చినవాడు పుట్టక
తప్పదు అని “ధ్రువమ్ జన్మ మృతస్యచ" అని అన్నారు.
ఈ విధముగా బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి చావు పుట్టుకలు గలవు, ఆ విషయము మనకు తెలియదు.
అందువలన కొందరు తమ పుట్టిన రోజు పండుగను చేసుకొనుచున్నారు. కానీ అది వారి చచ్చినరోజని వారికి
ఏమాత్రము తెలియదు. గతములో నా పుట్టిన రోజున చెప్పిన ఉపన్యాసములో “ఇది నాకు పుట్టినరోజే అయినా,
దానికంటే ముందు ఇది నా చచ్చినరోజు, తర్వాత పుట్టినరోజు. అందువలన నేను పుట్టిన దినమున తప్పక చచ్చిన
రోజును కూడా జ్ఞాపకము చేసుకొంటాను.” అని చెప్పాను. కానీ చాలామందికి తమ పుట్టిన దినమే చచ్చిన దినమని
తెలియదు. భూమిమీద ఎవనికైనా పునర్జన్మ ఉన్నది కానీ జన్మ లేదు. జన్మ అనగా మొదట పుట్టినది, పునర్జన్మ అనగా
మళ్ళీ మళ్ళీ పుట్టునది. మనము సృష్ఠి ఆదిలో సృష్టికర్త ద్వారా జన్మను పొందాము. తర్వాత ప్రకృతి ద్వారా
పునర్జన్మించుచున్నాము. కానీ పునర్జన్మ కానటువంటి జన్మను ఎవడూ పొందడములేదు. మొదట సృష్ఠి తయారైనపుడు
జన్మించిన మనము తర్వాత పునర్జన్మించుచున్నాము. దీనినిబట్టి ప్రస్తుత కాలములో భూమిమీద జీవించు ప్రతి ఒక్కరిదీ
పునర్జన్మేనని చెప్పవచ్చును. పునర్జన్మ పొందిన ప్రతి మనిషికీ గత జన్మ విషయము తెలియదు. గత జన్మలో జీవించి
తర్వాత పునర్జన్మ పొందినప్పటికీ, గత జన్మలో ఎన్నో కష్టములు అనుభవించినప్పటికీ, వెనుకటి జన్మ ఎవరికీ జ్ఞాపకము
ఉండదు. అలా జ్ఞాపకము లేకుండా పోవడానికి కారణము వెనుకటి జన్మలోనున్న శరీరము పునర్జన్మలో లేదు. గతజన్మలోని
శరీరము గానీ, శరీర భాగములుగానీ ఏవీ ఈ జన్మలో ఉండవు. జీవుడు మరణించి క్రొత్త జన్మ పొందినపుడు, ఆత్మ
సంబంధమైన భాగములు మాత్రము జీవుని వెంట ఉండగా, ప్రకృతి సంబంధమైన భాగములన్నీ నశించుచున్నవి.
పునర్జన్మలో జీవుని వెంట ఆత్మ పరమాత్మలు రెండూ ఉన్నవి. కానీ ప్రకృతి సంబంధమైన 24 భాగములు పూర్తి నశించి
పోవుచున్నవి. అందులో జ్ఞాపకము అను పనిని చేయు మనస్సు కూడా లేకుండా నశించుచున్నది. జ్ఞప్తిని అందించు
మనస్సు గతజన్మలోని మరణముతో పోవుచున్నది. కనుక గత జన్మ జ్ఞాపకాలు రెండవ జన్మలో లేకుండా పోయినవి.
అలాగే గతజన్మలో మంచి తెలివైనవాడు రెండవ జన్మలో కూడా అట్లే తెలివిగా ఉండుననుటకు వీలులేదు. ఎందుకనగా
ఒక మనిషి తెలివిగా ప్రవర్తించుట, అతని శరీరములోని బుద్ధి యొక్క పనితనమునుబట్టి వుండును. ఒకనికి పదునైన
బుద్ధి (బుద్ధి పొర పలుచగా) ఉంటే, వాని తెలివి గొప్పగా ఉండును. అటువంటి తెలివి గతజన్మలో ఉన్నవానికి ఆ జన్మ
చివరిలో వచ్చిన మరణములో అతని బుద్ధి నశించి పోవుచున్నది. కావున పునర్జన్మలో అతనికి అదే తెలివి ఉంటుందని
చెప్పలేము. పోయిన జన్మలోని శరీర భాగముల పనితనమునుబట్టి గతజన్మ జీవితము జరిగి ఉండును. ప్రస్తుతము
ఉన్న రెండవ జన్మలో (పునర్జన్మలో) క్రొత్త శరీరమూ, క్రొత్త భాగములు వచ్చి వుండుట వలన తెలివిగానీ, జ్ఞాపకశక్తిగానీ
అన్ని తేడాగానే కనిపించు చుండును. గత జన్మలోని శరీరముగానీ, శరీర భాగములుగానీ జీవుని వెంట రెండవ
జన్మలోనికి రావు. కావున రెండవ జన్మలో మొదటి జన్మ జ్ఞాపకములుగానీ, తెలివిగానీ మొదలగునవి లేకుండా పోయి
అన్ని పనులు బేధముగానే ఉండును. మరణములో శరీరములోని 24 ప్రకృతి భాగములకు మాత్రమే నాశనము
కలదు. జీవుడు మరణములో నశించడు. అలాగే ఆత్మ నశించదు. మరణములో ప్రకృతి భాగములైన మొత్తము 24
భాగములు జీవున్నీ, ఆత్మను వదలిపోవుచున్నవి. ఆత్మ భాగములు లేక పురుష భాగములైన జీవాత్మ, ఆత్మ రెండూ
నశించక రెండవ జన్మకు వచ్చుచున్నవి. ప్రకృతి లేక స్త్రీ భాగములైన 24 శరీర భాగములకు పునర్జన్మ ఉండదు. అవి
ఒకేమారు పుట్టి, ఒకేమారు నశించి పోవుచున్నవి. వాటిని ప్రకృతియే తయారు చేయుచున్నది. అందువలన వాటిని
ప్రకృతి భాగములని, స్త్రీ భాగములని అంటున్నాము.
ప్రకృతి భాగములైన శరీరములోని 24 భాగములు ఒక యంత్రము లోని పరికరములవలె పని చేయుచున్నవి.
అందువలన వాటికి పాప పుణ్యములు లేవు, అవి తిరిగి పుట్టవు. తిరిగి పుట్టేది జీవుడు మరియు ఆత్మ. ఆత్మ
శరీరములో రెండురకముల పనిని చేయుచున్నప్పటికీ, ఆత్మకు కూడా పాపపుణ్యములు అంటవు. ఉదాహరణకు
దేశములోని పౌరుడు ఎవడైనాగానీ తన శత్రువును చంపితే, వానికి చట్టములోని 302 సెక్షన్ వర్తించుచున్నది. అలాగే
పూర్తి చంపకుండా కొంత గాయపరచి వదలివేసినా, అతనికి హత్యా ప్రయత్న నేరము క్రింద 307 సెక్షన్ వర్తించుచున్నది.
ఆ సెక్షన్ల ప్రకారము వానికి న్యాయస్థానములో శిక్ష పడుచున్నది. ఇది దేశములోని ఒక పౌరునికి సంబంధించిన
విషయముకాగా, దేశము యొక్క భద్రత కొరకు దేశ సరిహద్దులో పని చేయు సైనికుడు పదిమంది శత్రువులను
చంపినా, అతనికి 302 సెక్షన్ వర్తించదు. ఒకవేళ అతను శత్రువును గాయపరిచినా, అతనికి 307 సెక్షన్ కూడా
వర్తించదు. ఎందుకనగా అతను ప్రభుత్వము కొరకు, ప్రభుత్వ ఆధీనములో పని చేయుచున్నాడు కనుక అతనికి
ప్రభుత్వ చట్టము గానీ, చట్టములోని సెక్షన్లుగానీ వర్తించవు. అలాగే శరీరములో దేవుని ఆధీనములో ఉండి దేవుని
యంత్రాంగములో పనిచేయుచున్న ప్రకృతి శరీర భాగములకు దేవుని చట్టము వర్తించదు. దేవుని చట్టము (ధర్మము)
ప్రకారము వచ్చు పాపపుణ్యములు శరీర భాగములకు అంటవు. వాటికి కర్మాలేదూ, వాటికి అనుభవమూ లేదు.
అందువలన ఒక జన్మలో జీవునితో పాటు శరీరములో ఉండు మనస్సు ఆ జన్మతోనే అంతరించి పోవుచున్నది. జీవుడు
మాత్రము శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించి పునర్జన్మను పొందుచున్నాడు. జీవుడు రెండవ జన్మలో,
రెండవ శరీరములో ఉండినప్పుడు అంతకుముందు జన్మలోని మనస్సుగానీ, బుద్ధిగానీ ఉండవు. రెండవ జన్మలో
జీవునితోపాటు క్రొత్త మనస్సు, క్రొత్త బుద్ధి నివసించుచున్నవి. జీవితములో శరీరమందు జ్ఞాపకాల పనిని మనస్సు
మాత్రమే చేయుచున్నది. గత జన్మలోని జ్ఞాపకాలన్నీ ఆ మనస్సు పోయినపుడే దానివెంటనే పోయివుండును. అందువలన
గత జన్మ జ్ఞాపకాలు ఎవరికీ ఉండవు. మనము గత జన్మనుండి ప్రస్తుతమున్న జన్మలోనికి వచ్చాము. మనకు కూడా
గతజన్మ జ్ఞాపకములేదు. దానికి కారణము గత జన్మలో మన శరీరములో మన వెంటవున్న మనస్సు ఇప్పుడు లేదు.
కనుక గతజన్మలోని జ్ఞాపకాలు ఈ జన్మలో లేకుండా పోయాయి.
ఒక మనిషికి ప్రస్తుత కాలములో ఉన్నది పునర్జన్మ అయినా, గతములో ఇటువంటి పునర్జన్మలు మనిషికి ఎన్ని
కలిగాయి అని ప్రశ్నించుకొని చూస్తే, సృష్ఠి మొదలైనప్పటినుండి ఎన్నో జన్మలు కలిగాయి అని చెప్పవచ్చును. కానీ
ఖచ్చితముగా ఇన్ని జరిగాయి అని చెప్పుటకు వీలులేదు. సృష్టి ఆదినుండి జన్మలు ఉండినప్పటికీ, గతజన్మ జ్ఞాపకాలు
మనిషికి లేనందు వలన ఎన్నిమార్లు జన్మించినదీ చెప్పలేము. అందువలన భగవద్గీతలో జ్ఞాన యోగమునందు ఐదవ
శ్లోకము “బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జునా, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప” అని భగవంతుడు
అన్నాడు. దీనిభావము ఏమనగా! "అర్జునా! ఇంతవరకు నాకు ఎన్నియో జన్మలు కలిగాయి, అట్లే నీకు కూడా ఎన్నో
జన్మలు కలిగాయి. అయితే వానిని వరుసగా నేను తెలిసియున్నాను. కానీ నీవు నీ గత జన్మములను ఏమాత్రము
చెప్పలేవు. అవి నీకు జ్ఞాపకము లేవు". అని భగవాన్ శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పాడు. ఆనాడు అర్జునునికే
తెలియవని చెప్పినట్లు, ఇపుడు మనకు కూడా తెలియవు. మనము సృష్టి మొదలైనప్పటి నుండి ఈ భూమిమీదనే చస్తూ
పుట్టుచున్నాము. ఇప్పటికి ఎన్నో జన్మలు మారి పోయాయి. అయితే నాకుగానీ, నీకుగానీ, మరెవ్వరికైనాగానీ వెనుకటి
జన్మ జ్ఞాపకాలు లేవు. ఉండుటకు అవకాశమే లేదు.
ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! కృష్ణుడు కూడా మనిషే కదా! ఆయనే స్వయముగా
నాకు ఎన్నో జన్మలు కలిగాయి అన్నాడు. అట్లే అర్జునునికి కూడా ఎన్నో జన్మలు కలిగాయి అన్నాడు. అలాంటపుడు
వారి శరీరములలోని మనస్సు ఏ జన్మకున్నది ఆ జన్మలోనే అంతరించి పోయివుండును కదా! అర్జునునికి గతములోని
మనస్సులేదు, కాబట్టి అతనికి ఎన్ని జన్మలు గడచినది చెప్పలేడు. కానీ కృష్ణుడు తనకు ఎన్ని జన్మలు కలిగాయో వాటిని
వరుసగా చెప్పగలను అన్నాడు, కృష్ణుని మనస్సు కూడా గత జన్మలలో మరణముతో లేకుండా పోయినప్పుడు, కృష్ణుడు
తన గతజన్మలను ఎలా చెప్పగలడు? అని ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఏమనగా! అక్కడ కృష్ణుడు చెప్పిన
మాట వాస్తవమే. అయితే ఆయన మాట వాస్తవము అనుటకు ముందు మనస్సును గురించి కొంత విషయమును
తెలుసుకోవలసి ఉన్నది. మన శరీరములో ప్రకృతి భాగములైన వాటిలో సూక్ష్మశరీరమందు మనస్సు అన్ని భాగములకంటే
విభిన్నముగా ప్రత్యేకించి రెండు పనులను చేయుచున్నది. శరీరములో బాహ్యేంద్రియములు, అంతరేంద్రియములని
రెండు భాగములుగలవు. బాహ్యేంద్రియములన్నీ బయటికి కనిపించు స్థూలశరీరముగా ఉన్నవి.
అంతరేంద్రియములన్నియూ కనిపించని సూక్ష్మశరీరముగా ఉన్నవి. బయటి విషయమును సేకరించునవి స్థూలశరీరములోని
ఐదు జ్ఞానేంద్రియములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను ఐదు జ్ఞానేంద్రియములు బయట సేకరించిన
సమాచారమును, శరీరమంతా వ్యాపించివున్న మనస్సు తీసుకొని పోయి లోపలనున్న బుద్ధికి తెలియజేయును. తర్వాత
బుద్ధి చెప్పిన నిర్ణయమును లేక పనిని మనస్సు బయటి కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు, నోరు, గుదము, గుహ్యము
అను బయటి ఇంద్రియములకు తెలియజేయును. ఇది మనస్సు చేయు మొదటి పని. తర్వాత మనస్సు చేయు రెండవ
పనిని గురించి చెప్పుకొందాము.
మనస్సు అను పేరు రావడానికి కూడా ఒక కారణముకలదు. మననము చేయునది మనస్సని పెద్దలు చెప్పుచున్నారు.
మననము అనగా జ్ఞాపకము అని అర్ధము. మానవ జీవితములో క్షణక్షణము ఎన్నో కార్యములు, ఎన్నో సంఘటనలు
జరుగుచుండును. వాటన్నిటిని మనస్సు తనయందు దాచుకొని, తిరిగి అవసరము వచ్చినపుడు వాటిని జ్ఞాపకాలరూపములో
బయటికి తెచ్చును. ఇది మనస్సు యొక్క రెండవ పని అయినా ఇదియే మనస్సుకు ముఖ్యమైన పని. మనస్సును
జ్ఞాపకాల పుట్ట అని కూడా కొందరు చెప్పడము జరిగినది. ఏ జ్ఞాపకమైనా మనస్సునుండే రావలయును. కనుక
జ్ఞాపకాల పుట్ట అన్నారు. ఈ విధముగా శరీరములోని ఏ ప్రకృతి భాగమూ చేయని విధముగా రెండు పనులను
మనస్సు చేయుచున్నది. ఒక వ్యక్తి పామును కన్ను ద్వారా చూడగల్గుచున్నాడు. శరీరములోని కన్ను కేవలము
దృశ్యములను చూపు పనిని మాత్రము చేయుచున్నది. దృశ్యమును చూపు పనిని కన్ను తప్ప శరీరములో ఏ ఇతర
భాగము చేయదు. అందువలన ప్రత్యేకమైన పని చేయుదానిని ప్రత్యేక భాగముగా గుర్తించ వచ్చును అను సూత్రము
ప్రకారము శరీరములో దృశ్యములను చూపే పనిని బట్టి కన్నును ఒక భాగముగా గుర్తించగలుగుచున్నాము. అలా
ప్రత్యేకమైన పనిని చేయు కన్ను తన ద్వారా బయటగల పాము దృశ్యమును చూడగలిగింది. అలా చూచిన తర్వాత
కన్ను ద్వారా చూపు అను విషయ జ్ఞానము ఏర్పడినది. అలా కంటివద్ద ఏర్పడిన విషయజ్ఞానమును శరీరములో
అంతటా వ్యాపించి వున్న మనస్సు, కన్ను వరకు కూడా గల మనస్సు ఆ విషయజ్ఞానమును స్వీకరించి, శరీరము లోపల
గల బుద్ధికి ఆ విషయమును అందించును. మనస్సు అందించిన విషయమును బుద్ధి గ్రహించి అక్కడేనున్న జీవునికి
తెల్పగా జీవుడు తెలుసు కోగల్గుచున్నాడు. జీవునికి విషయము చేరిన వెంటనే అక్కడనేనున్న గుణములు ఆ విషయము
నకు స్పందించగా, ఆ స్పందనను అక్కడేనున్న చిత్తము గ్రహించును. చిత్తము ప్రారబ్ధకర్మ ప్రకారము ఆ స్పందనను
విశ్లేషించి చూడగా అక్కడ కర్మ ప్రకారము చిత్తము ఒక నిర్ణయమునకు వచ్చి ఆ నిర్ణయమును బుద్ధికి తెల్పును.
చిత్తము ప్రక్కనేనున్న బుద్ధి దానిని గ్రహించి వార్తాహరుడైన మనస్సుకు తెల్పును. మనస్సు బుద్ధి అందించిన వార్తను
తీసుకొని బయట ఇంద్రియములైన కర్మేంద్రియములకు తెలియజేయును. అప్పుడు మనస్సు చెప్పిన వార్త ప్రకారము
కర్మేంద్రియములు పని చేయును.
పాము యొక్క దృశ్యము కన్ను ద్వారా కనిపించగా, చూపు అను తన్మాత్ర దానిని ఒక బయట సమాచారముగా
తీసుకొని మనస్సుకు అందించగా, మనస్సు లోపలి ఇంద్రియములకు, బయటి ఇంద్రియములకు మధ్యవర్తిగా పనిచేసి,
బయటి విషయము లోపలి బుద్ధికి, లోపలి బుద్ధి అందించిన సమాచారమును బయటి కర్మేంద్రియములకు తెల్పుచున్నది.
లోపలికి పోయిన పాము విషయమును బుద్ధి జీవునికి తెలుపగా, జీవుని చుట్టూ నివాసమైన గుణములప్పుడు కదలగా,
గుణముల కదలికను చిత్తము కర్మప్రకారము చూచి కర్మ నిర్ణయానికి వచ్చిన దానిని సమాచారముగా మార్చి బుద్ధికి
తెల్పింది. పాము అను విషయము ఈ విధముగా ప్రయాణించి, చివరకు చిత్తము వద్ద పామును చంపివేయమను
సమాచారము తయారై మనస్సుకు అందగా, అదే విషయమును మనస్సు బాహ్య కర్మేంద్రియ ములకు తెల్పింది.
అప్పుడు కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు కదిలి పని చేసి పామును చంపివేశాయి. మన జీవితములో జరుగు ప్రతి
పని ఇదే విధముగా ప్రయాణించి సమాచారముగా బయటికి రాగా, అదే జరుగు చున్నది. ఈ విధముగా ఒక
సమాచారము బయటినుండి లోపలికి పోయి, లోపలనుండి బయటికి వచ్చి పని జరగడములో శరీరములోని మొత్తము
26 భాగములు పని చేయుచున్నవి. కానీ శరీరములో 27వ భాగముగానున్న పరమాత్మ ఏ పనిని చేయకున్నది.
శరీరములో పని చేయు మొత్తము 26 భాగములలో ముఖ్యమైనవీ, ప్రత్యేకత కల్గియున్నవి రెండే రెండు గలవు. అవియే
ఒకటి మనస్సు, రెండు ఆత్మ.
మనస్సు ప్రకృతి భాగముకాగా, ఆత్మ పరమాత్మ భాగముగా ఉన్నది. శరీరములోని జీవునితో సహా 24 భాగములు
శరీరములో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉండగా, ప్రత్యేకించి మనస్సు, ఆత్మ రెండు మాత్రము శరీరమంతా వ్యాపించియున్నవి.
శరీరమంతా వ్యాపించిన మనస్సు శరీరము బయటనున్న జ్ఞానేంద్రియ విషయములన్నిటిని సేకరించగల్గుచున్నది, లోపలికి
తెలుపగల్గుచున్నది. మొత్తము మీద బాహ్యరంగమునకు, అంత రంగమునకు మనస్సు మధ్యవర్తిగా ఉండడమేకాక,
మనస్సు విషయ జ్ఞాపకాల పెట్టెగా లేక పుట్టగా ఉన్నదని చెప్పుకొన్నాము. శరీరములో శరీరమంతటా వ్యాపించిన
మనస్సుయొక్క రెండు పనులను తెలుసుకోగల్గిన మనము, ఇపుడు శరీరమంతా వ్యాపించిన ఆత్మ ఎలా రెండు పనులను
చేయగల్గు చున్నదో తెలుసుకొందాము. శరీరములో పని చేయు ప్రకృతి భాగములు 24 ఉండగా, పరమాత్మ భాగములు
కేవలము రెండే కలవు. పరమాత్మ భాగములైన జీవాత్మ, ఆత్మలలో జీవాత్మ ఒక్కచోట శరీరములో ఉండగా, ఆత్మ
శరీరమంతా వ్యాపించి ఉన్నది. ఇపుడు శరీరమంతా వ్యాపించిన ఆత్మ గురించి పూర్తి వివరముగా తెలుసుకొందాము.
ఆత్మ అనునది శరీరమును ఆవహించి ఉంటుంది. శరీరములలో జీవుడు నివసిస్తు ఉంటాడు. జీవుడు ఎచ్చట
ఉండునో ఆత్మ కూడ అక్కడ ఉండి తీరవలసిందే. ఆత్మలేని చోట జీవాత్మ గానీ, జీవాత్మ లేనిచోట ఆత్మగానీ ఉండుటకు
వీలులేదు. దీనినిబట్టి ఆత్మ, జీవాత్మలు రెండూ జోడు ఆత్మలుగా ఉన్నాయని చెప్పవచ్చును. జీవాత్మ, ఆత్మలేనిచోట
కూడా పరమాత్మ ఉన్నది. కానీ జీవాత్మ, ఆత్మ రెండు ఆత్మలు ఎక్కడున్నా పరమాత్మ అక్కడ కూడా కలదు. జీవాత్మను,
ఆత్మను ఎప్పటికీ వేరువేరుగా ఉన్నట్లు చెప్పుటకు వీలులేదు. ఇవి రెండు అవినాభావ సంబంధముగల ఆత్మలు.
జీవాత్మ ఆత్మ తోడుగా వుంటూ రెండు రకముల శరీరములలో నివసిస్తూ ఉన్నవి. 1) రక్తముండే శరీరములోనూ,
2) రక్తములేని శరీరములలోనూ జీవాత్మ ఆత్మలున్నవి. రక్తప్రసరణ ఉన్న శరీరములు మనుషులు, జంతువులు, పక్షులు
మొదలగు అండజ, పిండజములుగా గలవు. రక్తప్రసరణ లేని శరీరములు ఉద్భిజములైన చెట్లు తీగలు మొదలగునవిగా
గలవు. వృక్ష జాతిలో కూడ జీవుడు, ఆత్మ రెండూ నివసిస్తున్నవి. చెట్టు కూడా జీవుడు నివసించుటకు యోగ్యమైన ఒక
విధమగు శరీరమని చెప్పవచ్చును. రక్తప్రసరణ ఉన్న మనిషి లేక జంతువులోగానీ, రక్తప్రసరణ లేని చెట్టులోగానీ
జీవాత్మ ఒక్కచోట ఉండగా ఆత్మ శరీరమంతా వ్యాపించివున్నది. మనిషి శరీరములో నఖ శిఖ పర్యంతము ఆత్మ
వ్యాపించి ఉన్నట్లు, ఒక చెట్టులో కూడా క్రింది వేరు దగ్గర నుండి పైన కొమ్మ చివరి వరకు ఆత్మ వ్యాపించి ఉన్నది.
రక్తమున్న మనిషిలో శరీరమంతా వ్యాపించిన శక్తిని ఆత్మ అని అంటున్నాము. చెట్టులో వేరునుండి కొమ్మల వరకు
వ్యాపించిన శక్తిని పూర్వము ఆకు అనెడివారు. ఆకు అను పదమును బట్టి ఆత్మశక్తి చెట్టులో ఉన్నదని అందరికి
తెలియునట్లు చెట్టుయొక్క పత్రములను ఆకులు అన్నారు. ఆకులున్న చెట్టులో ఆత్మశక్తి ఉన్నదనీ అదియే ఔషధశక్తి అని
కూడా కొందరు చెప్పారు. ఆకు అను పదము కాలక్రమములో మారిపోయింది. మనిషి శరీరములోనికి వచ్చేటప్పటికి
నేడు అది ఆత్మ అని పిలువబడు చున్నది. 'ఆకు' అను శబ్దము మారుతూపోయి ఆకు నుండి ఆత్మగా మారిపోయినది.
అను అక్షరము అలాగే నిలిచిపోయి 'కు' అను శబ్దము కొందరిలో 'త్మ' అను శబ్దముగా పలుకబడినది. చివరకది
ఆకు నుండి ఆత్మగా మారి పిలువబడుచున్నది. ఇప్పుడు ఆత్మ శబ్దము స్థిరస్థాయిగా నిలిచిపోయినది. ఆకు అనినా,
ఆత్మ అనినా ఒకే అర్థము గల పదములని తెలుసుకొన్నప్పుడు ఆధ్యాత్మికము బాగా అర్థము కాగలదు.
చెట్టునుండి ఆకుగా మొదలైన శక్తి, మనిషి శరీరములో ఆత్మగా గుర్తింపబడినది. చెట్టులోని ఆకుకు మూలికాశక్తి
ఉన్నట్లు చెప్పుచున్నాము. ఆకుకు మూలికాశక్తి, ఔషధీశక్తి ఉన్నదని అంటున్నాము. ఆకులో ఓషధీ శక్తి ఉన్నట్లు
నిరూపణకు కూడా వచ్చినది. ఆ మాటను అందరూ ఒప్పు కొంటారు. ఔషధీ అను శక్తి చివరకు మనిషిలోని ఓంకార
శక్తిగా మారి పోయినది. దీనినిబట్టి చెట్టులోని ఔషధీ శక్తియే మనిషిలోని ఓంకార శక్తి అని తెలియవలెను. అలాగే
చెట్టులోని మూలికా శక్తియే మనిషిలోని మూలశక్తిగా తెలియవలెను. అట్లే చెట్టులోని ఆకు శక్తియే మనిషిలోని
ఆత్మశక్తిగా అర్థము చేసుకోవలెను. చెట్టులో ఆత్మ లేక ఆకు ఎలా వ్యాపించివున్నదో అలాగే మనిషిలో ఆత్మశక్తి
వ్యాపించివున్నది. చెట్టులోనూ, మనిషిలోనూ ఆత్మ వ్యాపించివుండినా చెట్టు నిర్మాణమునకు, మనిషి శరీర నిర్మాణమునకు
ఎంతో తేడా కలదు. చెట్టుకు జ్ఞానేంద్రియములుగానీ, కర్మేంద్రియములుగానీ మనకున్నట్లు లేవు. చెట్టు శరీర భాగములు
ఇన్ని ఉన్నాయని చెప్పుటకు కూడా లెక్క తెలియదు. అందువలన మనకు అర్థమగుటకు మనిషి శరీరమును తీసుకొని
పరీశీలించి చూస్తాము.
మనిషి శరీరములో ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉండడమేకాక రెండు ముఖ్యమైన పనులు చేయుచున్నది.
శరీరములోనున్న పరమాత్మ భాగములు జీవాత్మ, ఆత్మలు రెండేకాగా, అందులో జీవాత్మ ఒక్కచోటే ఉంటూ, ఒకే పనిని
చేయుచుండగా, ఆత్మ శరీరమంతటా ఉంటూ రెండు పనులు చేయు చున్నది. మనిషి శరీరములోని 24 ప్రకృతి
భాగములను ఆత్మ కదలించి పనిని చేయుటకు శక్తినిచ్చి వాటి ద్వారా శరీర యంత్రాంగమును నడుపు చున్నది. అలా
శరీరమునకు చైతన్యమునిచ్చి శరీర భాగములను పని చేయించి మనిషిని జీవింపచేయుచున్నది. మనిషి మాట్లాడాలంటే
ఆత్మ మాట్లాడించుచున్నది. మనిషి చేయి అల్లాడించాలంటే ఆత్మే తనశక్తి చేత అల్లాడింపజేయుచున్నది. అలాగే
కనురెప్ప మూయాలన్నా, తెరువాలన్నా ఆత్మే పని చేయిస్తున్నది. అదే విధముగా శరీరములోని గుండెకొట్టు కోవాలన్నా,
ఊపిరితిత్తులు కదలాలన్నా దానిని ఆత్మ చైతన్యమే చేయిస్తున్నది. మొత్తము శరీరములోని ప్రతి చిన్న పనిగానీ,
శరీరము బయటి ఇంద్రియముల పనిగానీ, శరీరములోని అవయవముల పనిగానీ ఆత్మ చేతనే జరుగుచున్నది. ఆత్మ
కదలించకపోతే శరీరములో కదలికలు ఆగిపోవును. శరీరములో జీవుడున్నాలన్నా, ప్రాణమున్నాలనినా, తినిన ఆహారము
జీర్ణము కావాలనినా, శరీరములోని ప్రతిది ఆత్మయే చేయించుచున్నది. ఆత్మ వలననే అన్నీ జరుగుచున్నవి. శరీరమును
మొత్తము తన ఆధీనమునందుంచుకొని ఆత్మ శరీరమును కర్మప్రకారము ఆడించుచున్నది. శరీరములోని ఒక్కొక్క
భాగమునకు ఒక్కొక్క పని ఉండగా, 24 ప్రకృతి భాగములను కదిలించి పని చేయించుటే ఆత్మకు పనిగా ఉన్నది.
ఈ విధముగా ఆత్మ కూడా శరీరములో ఒక పనిని చేయుచున్నది. ఆ విధముగా 24 గంటలు శరీరమును
మొత్తమును నడిపించుటకు ఆత్మ శరీరమంతా వ్యాపించియున్నది. మనస్సు కూడా శరీరమంతా వ్యాపించి ఉండినప్పటికీ,
మనస్సు నిద్రలో శరీరమంతా లేకుండా ముడుచుకొని పోయి బ్రహ్మనాడిలో చేరిపోవుచున్నది. మనస్సు మెలకువలో
మాత్రము శరీరమంతా వ్యాపించివుండి నిద్రలో మాత్రము బ్రహ్మనాడియందు ఒకచోట చేరి పోవుచున్నది. కానీ ఆత్మ
మాత్రము నిద్రలోనూ, మెలకువలోనూ పని చేయుచు ఎల్లప్పుడు శరీరమంతా నిండి ఉన్నది. మనస్సు నిద్రలో పని
చేయదు. కానీ ఆత్మ నిద్రలోనూ, మెలకువలోనూ రెండు అవస్థలలో పని చేయుచున్నది. మనిషి పుట్టినప్పటినుండి
ఆత్మ ఎడతెరపిలేకుండా పని చేయుచునే ఉన్నది. ఒక్క క్షణము కూడా ఆత్మ విశ్రాంతి తీసుకోలేదు. ఆత్మకు విశ్రాంతి
అనునది ఎప్పటికీ లేదు. ఇట్లు ఎల్లప్పుడు ఆత్మ పని చేయడము ఆత్మకు ఒక పనిగానే లెక్కింపబడుచున్నది. అంతేకాక
ఆత్మకు రెండవ పనికూడా ఒకటికలదు. అది ఏమనగా! మనిషి మెలకువలో ఉన్నప్పుడు మనస్సు బాహ్యేంద్రియముల
విషయములను అంతరేంద్రియము లకు తెలుపుచుండునని చెప్పుకొన్నాము. మనస్సు శరీరములో బ్రహ్మనాడి యందు
నిద్రావస్థలో ఉండిపోవును అని కూడా చెప్పుకొన్నాము. మనిషి నిద్రపోవునపుడు బాహ్యేంద్రియముల విషయము
లోపలికి తెలియబడదు. నిద్రపోయినంతవరకు బయట ఏమి జరిగినది మనిషికి తెలియదు. నిద్రలో మనస్సు
ఇంద్రియముల వద్దలేదు, కనుక బయటి ఇంద్రియముల విషయ జ్ఞానము లోపలి బుద్ధికిగానీ, జీవునికి గానీ తెలియదు.
ఒక మనిషి నిద్రపోవునపుడు వానిని మరొక మనిషి పిలిచాడను కొనుము. అప్పుడు ఆ శబ్దము నిద్రపోవుచున్న
వాని చెవిలోనికి పోయింది. అక్కడ అది వినికిడిగా మారింది. అయితే ఆ వినికిడి విషయమును సేకరించి లోపలనున్న
బుద్ధికి తెలుపు మధ్యవర్తి అయిన మనస్సు నిద్రలో మునిగిపోయి బ్రహ్మనాడిలో ఉన్నది. కనుక వేరే మనిషి పిలిచిన
విషయము లోపలికి తీసుకొని పోవు మనస్సు లేదు కాబట్టి ఆ పిలుపు ఆ జీవునికిగానీ, అతని బుద్ధికిగానీ తెలియదు.
అటువంటి సందర్భములో నిద్రపోయిన వానిని పిలిచినా వాడు మేల్కొనుటకు అవకాశములేదు. వానికి పిలుపు
చేరలేదు, కనుక వాడు నిద్రనుండి లేవడు. అయితే దానికి విరుద్ధముగా నిద్రపోవు వానిని పిలువగానే వాడు లేస్తున్నాడు.
ఎవడో తనను పిలిచాడను విషయము లోపలి బుద్ధికి, జీవునికి చేరుచున్నది. మధ్యవర్తి అయిన మనస్సు లేనప్పుడు
పిలిచిన వార్తను ఎవరు లోపలికి చేర్చారు? అని యోచిస్తే వాస్తవముగా అది మనస్సు చేయవలసిన పనియే అయినా,
అక్కడ మనస్సుకు ఆ విషయము తెలియదు. మనస్సు అక్కడ లేనేలేదు. మనస్సు లేకపోయినా అత్యవసర సమయములలో
మనస్సు చేయు పనిని ఆత్మే చేయుచున్నది. ఆత్మ శరీరమంతా అన్ని అవయవముల వరకు వ్యాపించి ఉండుట వలన
చెవియొక్క శబ్దమును విని ఆ వినికిడి సమాచారమును మనస్సు చేరవేసినట్లు లోపలి జీవునికీ, బుద్ధికీ చేరవేసినది.
అందువలన మనస్సు లేకున్నా మనిషి మెలుకువలోనికి రాగలుగుచున్నాడు. ఈ విధముగా కొన్ని సమయములలో
మనస్సు తన పనిని చేయనప్పుడు, మనస్సు చేయు పనిని కూడా ఆత్మ చేయుచున్నది. అలా చేయడము ఆత్మయొక్క
రెండవ పనియగుచున్నది. ఇక్కడ ముఖ్యముగా పాఠకులు గ్రహించవలసిన విషయమేమనగా! ఇప్పుడు చెప్పిన ఆత్మ
పని మేము కల్పితము చేసి చెప్పినదని అనుకోవద్దండి. మాయ ప్రభావము వలన అలా అనుకొనుటకు అవకాశము
కలదు. అందువలన జాగ్రత్తగా గ్రహించమని చెప్పుచున్నాము. ఆత్మ రెండవ పని పూర్తి సత్యమైనది మరియు
శాస్త్రబద్ధమైనదని తెలియవలెను.
బయట ఎవరో పిలిచారను విషయమును ఆత్మ గ్రహించి లోపల బుద్ధికీ, జీవాత్మకు తెలుపగా, అప్పుడు మనస్సు
బ్రహ్మనాడిని వదలి శరీరమంతా వ్యాపించుకొనుచున్నది. అలా మనస్సు బయటికి రావడమే మనిషి మెలుకువ లోనికి
రావడము. శరీరములో మనస్సు యొక్క పనినీ, అలాగే ఆత్మ యొక్క పనినీ గుర్తించగలిగితే సగము ఆధ్యాత్మికము
మనిషికి అర్థమైనట్లే. నిద్రపోవుచున్న మనిషి తనకు తెలియకుండానే ప్రక్కకు తిరిగి పడుకొను చున్నాడు. నిద్రపోవు
మనిషి తనకు తెలియకుండానే లేచి ఒకచోటనుండి పోయి మరొక చోట పడుకొనుచున్నాడు. ఇటువంటి పనులను ఆత్మ
లోపలి బుద్దికి సమాచారమును అందివ్వకుండా చేయుచున్నది. అందువలన నిద్రలో తాను ఏమి చేసినది నిద్రపోయిన
వానికి తెలియదు. మనిషి నిద్రపోవు చున్నప్పుడు బయటి విషయములను ఆత్మయే స్వీకరించి అవసరమైతే లోపలికి
తెలుపుచున్నది. అవసరము లేకపోతే తానే సరి చేయుచున్నది. ఉదాహరణకు నిద్రపోవువానికి చాలాసేపు ఒకేవైపు
పడుకోవడము వలన చేయి నొప్పి వచ్చిందనుకొనుము. అప్పుడు చర్మము తెలియజేయు నొప్పిని ఆత్మ స్వీకరించి
దానిని లోపలికి పంపకుండా తానే ప్రక్కకు తిరిగి పడుకొనునట్లు చేయుచున్నది. ఈ విధముగా నిద్రావస్థలో ఎవరైనా
పిలిస్తే అవసరమును బట్టి ఆ విషయమును లోపలికి పంపుచున్నది, మనస్సును మెలుకువలోనికి వచ్చునట్లు చేయుచున్నది.
ఈ తతంగము అంతయు మానవ శరీరములో జరుగుచున్నది. ఎవరికీ తెలిసినా, తెలియకున్నా మనిషి శరీరములో
నూటికి నూరుపాళ్ళు ఇదే విధముగా జరుగుచున్నది. మనిషి బయట ప్రపంచములో ఏ మతమునకు సంబంధించినవాడైనా,
లోపల జరుగు యంత్రాంగములో ఏమీ తేడా ఉండదు. ఒక ముస్లీమ్లోగానీ, క్రైస్తవునిలో గానీ, హిందువులోగానీ
అందరిలో జీవుడు, ఆత్మ, మనస్సు మొదలగు 26 శరీర భాగములున్నవి. అవి అందరిలో ఒకేలాగ పని చేయుచున్నవి.
ముస్లీమ్ కన్ను చూడగలిగితే, క్రైస్తవుని కన్ను వినే పనిని చేయదు. అన్ని మతములలోని మనుషుల కన్ను ఒకే పనిని
చేయగల్గుచున్నది. అందువలన మనకు మతాల భేదములున్నా ఆత్మకుగానీ, జీవాత్మకుగానీ, మిగత శరీర భాగములకు
గానీ ఏ మత భేదములు లేవు. అందరిలోను అన్నీ ఒకే పద్దతిగా పని చేయుచున్నవి. కర్మనుబట్టి మనిషి అనుభవము
వేరువేరుగా ఉండవచ్చును. కానీ శరీరములో అవయవముల పని మాత్రము ఒకే విధముగా ఉండును. మనిషి బ్రతికి
ఉన్నపుడే కాకుండా మనిషి చనిపోయినపుడుగానీ, అలాగే మనిషి పుట్టినప్పుడుగానీ, ఒక మనిషిలో ఏ తతంగము
జరుగుచున్నదో, సమస్త మతముల మనుషులలోను అదే జరుగుచుండును. కుల మతములను బట్టి గానీ, పేద
ధనికులను బట్టిగానీ ఆత్మ విషయములో తేడాలుండవు.
మనిషి అజ్ఞానము చేత మతములను సృష్టించుకొని, దేవుడు శరీరములో అమర్చిన విధానమును మరచిపోవుట
వలన, చావుపుట్టుకల విషయములో ఒక్కొక్క మతము ఒక్కొక్క విధముగా చెప్పుకొనుచున్నది. అన్ని మతములలో
దేవుడు ఒక్కడే అని పైకి చెప్పుకొనినా, లోపల మాత్రము మా దేవుడువేరనీ, మా దేవుడు చెప్పిన విధానమువేరని
అనుకొనుచుందురు. దేవుడు ఏ మతస్థునికైనా ఒకే జ్ఞానమును తెలిపాడు కానీ ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క
జ్ఞానమును చెప్పలేదు. సృష్టి ఆదిలో పుట్టిన ఇందూ మతము (హిందూమతము)నకు సంబంధించిన భగవద్గీతలో
దేవుడు భగవంతుని ద్వారా “పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు". అన్నాడు. ఆ మాట శరీరమును
ధరించిన మనుషులందరికీ వర్తించును. కొందరికి వర్తించి కొందరికి వర్తించదనుటకు వీలులేదు. శరీరముల పుట్టుక
గానీ, జీవితముగానీ, మరణముగానీ మానవులందరికీ ఒకే విధముగా ఉండును. వేరువేరు విధములుగా ఉండవని
ముందే చెప్పుకొన్నాము. భగవద్గీతలో దేవుడు ఏమి చెప్పాడో, అదే మిగత మత గ్రంథాలలో కూడా చెప్పబడివుంది.
అయితే దేవుడు అన్ని మతములలో చెప్పిన ఒకే జ్ఞానము మాయ ప్రభావము వలన వేరువేరు మతములలో వేరువేరు
బోధగా కనిపించినది. ఇది మాయ ప్రభావమని తెలియని మనిషి, దేవుడు ఎందుకు అలా చెప్పునని ఏమాత్రము
యోచించక మాయ చెప్పినట్లు మాట్లాడుచున్నాడు.
ఉదాహరణకు మనిషియొక్క జనన మరణ జ్ఞానమును గురించి చూచితే, దేవుడు అన్ని మతములలోను ఒకే
విధముగా చెప్పియున్నాడను విషయమును మనిషి మరచిపోయాడు. ఇందూ (హిందూ) మతములో జన్మలున్నాయని
భగవద్గీతయందు చెప్పియుంటే, ముఖ్యమైన ఇస్లామ్, క్రైస్తవ మతములలో తిరిగి పుట్టడము అన్నది లేనేలేదు అని
చెప్పుచున్నారు. ఎంతో తెలివైన వారు కూడా జన్మల విషయమువద్దకు పోయేటప్పటికి, కొంతైనా యోచించకుండా
గ్రుడ్డిగా మాట్లాడుచున్నారు. ఎంతో ఆత్మజ్ఞానము కల్గిన ప్రవక్తలు చెప్పిన మాటలను అర్థము చేసుకోలేకపోవుచున్నారు.
ప్రవక్తలు చెప్పిన మాటలను బాగా విశధీకరించుకొని అర్థము చేసుకోగల్గితే వారు జన్మలున్నాయనే చెప్పారు గానీ,
జన్మలు లేవని చెప్పలేదు. భూమిమీద పుట్టిన మనుషులందరూ ఒకే జ్ఞానము కల్గియున్నారని చెప్పలేము. కొందరిలో
దైవజ్ఞానమున్నది. కొందరిలో దైవజ్ఞానమను పేరుతో మాయ జ్ఞానమున్నది. ఏది దైవ జ్ఞానమో, ఏది మాయ జ్ఞానమో
మనుషులు గుర్తించలేనప్పుడు, నాది నిజమైన దైవజ్ఞానము అని ఒక మతస్థుడు అంటే, మరియొక మతస్థుడు నీది
మాయజ్ఞానము, నాకు తెలిసినదే నిజమైన దేవుని జ్ఞానము అంటాడు. వారిద్దరి మాటలు వినేవానికి ఎవరిది అసలైన
దైవ జ్ఞానమో అర్థము కాకుండా పోవుచున్నది. ఇటువంటి సందర్భములో అసలైన దైవజ్ఞానమేదో, ఏది సరియైన
జ్ఞానము కాదో అందరికీ దృష్టాంతముగా తెలియునట్లు దేవుడు చేయుచున్నాడు. దానినిబట్టి అసలైన దైవజ్ఞానమును
గుర్తించవచ్చును.
ఇస్లామ్లో పునర్జన్మలు లేవు అని బోధించబడినది. దానిని అందరూ అలాగే చెప్పుకొనుచున్నారు. తిరిగి జన్మలు
లేవు అనుమాట ప్రతి ముస్లీమ్ చెప్పగలుగుచున్నాడు. ప్రతి ముస్లీమ్ తాము విన్నదానిని, లేక తాము తమ మతపెద్దల
ద్వారా తెలుసుకొన్న దానినే పూర్తి విశ్వాసముతో నమ్మి, జన్మలు లేవు అని ధైర్యముగా చెప్పుచున్నారు. తమ మత
పెద్దలు చెప్పిన దానినే వారు చెప్పుచున్నారు. మత పెద్దల మాటమీద విశ్వాసముతో వారి మాటలను నమ్మి చెప్పడము
తప్ప, వారు చూచి చెప్పినది కాదు. ఇక్కడ ఒక సూత్రమును మనము చెప్పుకొంటే ఇలా కలదు. నమ్మకము అనునది
సత్యముకాదు, అట్లని అసత్యమూకాదు. నమ్మకము సత్యమూ కావచ్చును, అసత్యమూ కావచ్చును. మత పెద్దలు
చెప్పిన మాటను ప్రతి ముస్లీమ్ విశ్వసించి జన్మలు లేవు అని చెప్పుచున్నారు. అలా విశ్వసించడములో తప్పులేదు.
ఇస్లామ్ మార్గములో ముఖ్యమైనది విశ్వాసము. దేవున్ని పూర్తి విశ్వసించిన వాడే నిజమైన ముస్లీమ్. అలాగే దేవున్ని
పూర్తి నమ్మినవాడే ఇందువని చెప్పువచ్చును. దేవుడు కనిపించువాడు కాదు. కనుక దేవున్ని చూడకనే నమ్మితీరాలి.
కానీ మనుషులు చెప్పు దైవజ్ఞానమును ఆలోచించి నమ్మాలి. ఆలోచించకుండ నమ్మితే అది మూఢనమ్మకమై,
అసత్యమగుటకు అవకాశము గలదు.
దేవుని మాటను దేవధూత ద్వారా ప్రవక్త విని అదే విషయమును మనుషులకు చెప్పాడు. ప్రవక్త దేవుని మాటను
పూర్తి విశ్వసించి దానిని ఆయన జీర్ణింపచేసుకొని దానినే మనకు చెప్పాడు. ఇస్లామ్ అంటే విశ్వాసము. విశ్వాసము
అంటే ఇస్లామ్ అని చెప్పవచ్చును. దేవుని జ్ఞానమును ధూతద్వారా వినిన ప్రవక్త, దేవుడు తెలిపిన విషయమునే
ప్రజలకు చెప్పాడు. ప్రవక్త చెప్పిన విషయము దేవుడు చెప్పినది కావున నూటికి నూరుపాళ్ళు సత్యము. కానీ ప్రవక్త
చెప్పిన సత్యమును మనిషి అర్థము చేసుకోవడములో పొరపాటుపడినాడు. ప్రవక్త చెప్పిన దేవుని మాటను సైతాన్
(మాయ) మనిషికి వేరు విధముగా అర్థమగునట్లు చేసినది. అంతవరకు సత్యముగానున్న దేవుని వాక్కు అసత్యముగా
ప్రచారమైనది. క్రైస్తవ మతములోనూ సాతాను ప్రభావము వలన ఏసు ప్రవక్త చెప్పిన జ్ఞానమును క్రైస్తవులు సరిగా
అర్థము చేసుకోలేక పోయారు. ఇస్లామ్లోనూ క్రైస్తవములోనూ ప్రవక్తలు చెప్పిన దేవుని వాక్యములను కొన్నింటిని
మాత్రము అర్థము చేసుకోలేక పోయారు. ఇక హిందూ మతములో చూస్తే కృష్ణుడు చెప్పిన దైవవాక్యములు ఒక్కటి
కూడా మనుషులు అర్థము చేసుకోలేక పోయారు. యజ్ఞములు, వేదాధ్యయనములు, దానములు, తపస్సులు దేవుని
మార్గము కాదని చెప్పినా, బహుదేవతారాధనల వలన సృష్ఠికర్తయిన పరమాత్మను చేరలేరని చెప్పినా, ఆ మాటలను
మనుషులు అర్థము చేసుకోలేక, మాయ మార్గమును అవలంభించుచూ, ఇదే దేవుని మార్గ మంటున్నారు. హిందూమతము
మొత్తముగా మాయలో పడిపోతే ఇస్లామ్, క్రైస్తవములు జన్మల విషయములలో మాత్రము ప్రవక్తలు చెప్పిన సూత్రము
లను అర్థము చేసుకోలేక పోయారు.
ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏసు చెప్పిన మాటను తీసుకొని చూస్తాము. ఆయన చెప్పిన
భావము నేటి క్రైస్తవులకు ఎంతవరకు అర్థమైనదో తెలిసిపోతుంది. మత్తయి సువార్త, 12వ అధ్యాయము, 30,31,32,
వాక్యములను గమనిస్తాము. 30) “నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు
చెదరగొట్టు వాడు, 31) కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా! మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణము వారికి
క్షమించబడును. కానీ ఆత్మ విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు. 32) మనుష్య కుమారునికి విరోధముగా
మాటలాడు వానికి పాపక్షమాపణ కలదుగానీ, పరిశుద్దాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైననూ
రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు.
ప్రవక్త ఏసు ప్రభువు చెప్పిన మాటలలో 32వ వాక్యమున స్పష్టముగా ఒకరకమైన పాపములను అనుభవించుటకు
రెండు యుగముల కాలము పట్టునని చెప్పడమైనది. దానిలో ఒక రక పాపమునకే రెండు యుగముల కాలము మనిషి
బ్రతికి పాపమును అనుభవించవలసి వున్నది. ఒకే శరీరముతో, ఒకే జన్మలో ఏ మనిషి ఒక యుగకాలము కూడా
ఉండలేడు. కొన్ని లక్షల సంవత్సరములు ఒక్కొక్క యుగము ఉండగా, రెండు యుగము లంటే ఎంత కాలమో
అర్థమగుచున్నది. ఒక జన్మలో కనీసము నూరు సంవత్సరములు కూడా బ్రతకలేని మనిషి, ఒకే జన్మలో రెండు
యుగములు ఉండగలడా? ఉండలేడు. అతడు ఎన్నో వేల జన్మలు ఎత్తితేగానీ రెండు యుగములు అయిపోవు. దీనినిబట్టి
దైవసంబంధ పాపమును అనుభవించుటకు మనిషి కొన్ని లక్షల జన్మలుగానీ లేక కొన్ని వేల జన్మలుగానీ పొందవలసి
వున్నదని అర్థమగుచున్నది. అయితే ముఖ్యమైన ఈ మాటలు లేక పై వాక్యములు క్రైస్తవులకుగానీ, క్రైస్తవ బోధకులకుగానీ
సాతాన్ ప్రభావము వలన అర్థము కాలేదని చెప్పవచ్చును. పరిశుద్ధ బైబిలులో ప్రభువు మాటలను బట్టి జన్మలున్నాయనియే
స్పష్టముగా తెలియుచుండగా, జన్మలు లేవని క్రైస్తవులు చెప్పడము ప్రభువు మాటను వక్రీకరించినట్లు కాదా?
స్వర్గ నరకములను మాటలు రెండే మనిషిని మాయమార్గములోనికి తోసివేస్తున్నవి. ప్రతి మతములోను స్వర్గ
నరకములనునవి ఉన్నాయని చెప్పుకొనుచున్నారు. కానీ ఈ రెండిటిని ఎవ్వరూ చూడలేదు. ఏ మతస్థునికీ అవి
ఎక్కడున్నదీ, ఎంత దూరములో ఉన్నదీ తెలియదు. స్వర్గ నరకములను వాటిని అన్ని మతముల ప్రవక్తలు చెప్పినా,
నరకములో బాధలు, స్వర్గములో సుఖములున్నవని చెప్పినా, ఏవి ఎక్కడున్నదీ, నీకు ఎంత దూరములోనున్నదీ చెప్పలేదు.
మనిషి వాటి విషయములో ఇంతగా పొరపాటు పడుతాడని తెలిసియుంటే వారు స్వర్గ నరకములను గురించి ఇంకా
వివరముగా చెప్పెడివారు. స్వర్గ నరకముల మాట నిజమే, అవి ఉన్నాయని చెప్పిన మాట నిజమే, అవి ఉండుట కూడా
నిజమే. కానీ అవి ఎక్కడున్నాయను విషయములో అన్ని మతములు మాయలో పడిపోయినవి. స్వర్గ నరకముల
అవగాహనలో బోధకులు సహితము పొరపాటుపడి పోయారు. వారి మాటలు విను మనుషులు కూడా వారి మార్గమునే
పొరపడిపోయారు. ప్రవక్తలు చెప్పినది ఒక ఉద్దేశమైతే మనము అర్థము చేసుకొన్నది మరొక ఉద్దేశము అయినది.
ఇట్లు స్వర్గ నరకములనునవి మొత్తము అన్ని మతములలోను అర్థము కాకుండా పోయాయి. ఒక్క విషయములో దారి
తప్పిపోతే, దానితో అనుసంధానమైన జ్ఞాన విషయములన్నీ దారి తప్పిపోవును. అలా జ్ఞాన విషయముల అవగాహనలో
దారి తప్పిపోయిన మనుషులలో అన్నిటికంటే ముందున్నవారు హిందువులు, తర్వాత క్రైస్తవమతములోనివారు. దాని
తర్వాత ఇస్లామ్ మతములోనివారని చెప్పవచ్చును. ఇస్లామ్ మతములో చాలా వరకు ప్రవక్త చెప్పినట్లే అర్థము చేసుకోగల్గినా,
ఒక్క స్వర్గ నరకముల వద్ద మాత్రమే తప్పుదోవ పట్టి పోయారు.
ప్రవక్తలు చెప్పిన మాటలలో స్వర్గ నరకములు భూమిమీదనే ఉన్నాయని, దేవుడు పుణ్యము చేసుకొన్న వారికి
స్వర్గమును, పాపమును చేసుకొన్న వారికి నరకమునూ ఇక్కడే అనుభవించునట్లు ఏర్పాటు చేశాడనీ, దాని ప్రకారము
కర్మ ఫలితములను మనిషి భూమిమీదనే అనుభవిస్తున్నాడను ఒక్క విషయమును తెలుసుకోగల్గితే, ఆధ్యాత్మికరంగములోగల
ఎన్నో ప్రశ్నలకు జవాబు దొరికిపోవును. లేకపోతే మన జ్ఞానమంతా సంశయాలతో కూడు కొన్నదై, సరియైన జవాబు
లేనిదై ఉండును. అందువలన ఒక్కమారు స్వర్గ నరకములన్నీ ఇక్కడే భూమిమీదనే ఉన్నవనీ, వాటిని మనము నిత్యము
అనుభవిస్తున్నామనీ, కళ్ళ ఎదుటేనున్న స్వర్గ నరకములను అందరము చూడగల్గుచున్నామని గ్రహించగలిగితే, నిజమైన
జ్ఞానము మనిషికి తెలిసి పోవును. అయితే మాయ మాత్రము అలా అర్థము కాకుండ చేయుచూ, ఇప్పుడు మేము
చెప్పుచున్నమాట పూర్తి అసత్యమని నమ్మునట్లు చేయగలదు. స్వర్గ నరక విషయములలో మనుషులను పూర్తి తప్పుదారి
పట్టించిన మాయ కొన్ని మతములలో దైవసన్నిధియైన మోక్షమును లేక దైవమందు ఐక్య మవడమును స్వర్గముగా
భావింపచేసింది. స్వర్గ నరకములు వేరనీ, అవి మానవునికి సుఖదుఃఖములను అందించునవనీ, ముక్తి లేక మోక్షము
అనునది వేరనీ అది సుఖదుఃఖలకు అతీతమైన దైవసాన్నిహిత్యమని తెలియని మనుషులు మోక్షమును కూడా స్వర్గమని
చెప్పుకొంటున్నారు. మనిషిని ఇన్ని తప్పుదారులు పట్టించిన మాయ, చావుపుట్టుకల విషయములో పూర్తిగా మభ్యపెట్టి
పునర్జన్మయే లేనట్లు, ఉన్నది ఒకే జన్మ అన్నట్లు చేసింది. ఇటువంటి రహస్యములు మనిషికి ఏమాత్రము ఎప్పటికీ
తెలియకుండుటకు మనిషి ఆధ్యాత్మిక ధ్యాసనంతా బయట ప్రపంచములోనే లగ్నమగునట్లు చేసింది. శరీర అంతరంగమందు
జీవుడైన తానువేరనీ, ఆత్మ వేరని, అలాగే మనస్సు, బుద్ధి వేరువేరుగా పని చేస్తున్నాయని, అలా అంతరంగమందు
జరుగు విధానము తెలుసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికమనీ, అలా తెలుసు కొన్నపుడే దైవముయొక్క జ్ఞానము, దాని
ధర్మములు తెలియుననీ, అలా శరీరాంతర్గతమును తెలుసుకోగల్గితే, అన్ని ప్రశ్నలకు సంపూర్ణమైన జవాబులు దొరుకునని,
మనిషి తెలుసుకోలేక పోవడము వలన మనిషి మతము అను ఉచ్చులో చిక్కుకొని, మాయ అను దానిని గుర్తించలేక
తన్ను తానుగానీ, తాను దైవమునుగానీ గుర్తించలేక పోవుచున్నాడు.
అన్ని మతములలోని ప్రవక్తలు దైవమును గురించి తెలియజేసినా, వారు చెప్పిన జ్ఞానమును అర్థము చేసుకోలేక
ప్రవక్తలకు కూడా మతమును అంటగట్టి మా మతము వేరు అంటున్నారు. ఇంతవరకు ఏ ప్రవక్త చెప్పినా ఆ దైవ
విషయము విశ్వమానవులకు అందరికీ వర్తించునదిగా చెప్పారు గానీ, వారు మతము అని పేరుపెట్టి చెప్పలేదు.
దేవుడు ప్రవక్తల ద్వారా తన జ్ఞానమును చెప్పించితే, మాయ మనుషులను తన పక్షములో ఉంచు కొనుటకు, దైవమువైపు
ఎవరినీ పోకుండా చేయుటకు, వేరువేరు కాలములలో చెప్పిన ప్రవక్తలు, వేరువేరు మతములను బోధించారని అర్థమగునట్లు
చేసినది. మొదట ఈ విధముగా మొదలైన మాయ ప్రభావము మనిషిని జీవితాంతము తన ప్రభావములోనే చిక్కుకొన్నట్లు
చేసినది. అందువలన మనిషి బాహ్యముగా ఎంత మేధావి అయినా, అంతరంగములో దేవుని విషయమునందు పూర్తి
తెలివి తక్కువవాడై పోయాడు. కొందరు ఆధ్యాత్మిక విద్యలో కూడా మేధావులుగా కనిపించినా, అన్ని మతములలోని
మూల గ్రంథములనూ చదివి ప్రతి పేజీని తమ జ్ఞాపకములో పెట్టుకొనినా, వేదములలోని మంత్రమునూ, గీతలోని
శ్లోకములనూ, పరిశుద్ధ బైబిలులోని వాక్యములనూ, పవిత్ర ఖురాన్లోని ఆయత్లను సులభముగా చెప్పగలిగినా, అటువంటి
వారు కూడా మతముల మాయలో చిక్కుకొన్నారు. కానీ మతాతీతమైన దేవుని జ్ఞానమును గుర్తించలేకున్నారు. శరీర
అంతరంగములో దేవుడు సర్వులకు అమర్చిన విధానమును తెలియలేకున్నారు. తనను గురించి తాను ఎవరు అని
చూచుకోలేక పోవుచున్నారు. నిత్యము మనిషిలో జరుగు తతంగమును నడుపువాడెవరో తెలియలేకున్నారు. శరీరములో
తన పాత్ర స్వల్పమైనదా లేక గొప్పదా అని గుర్తించలేకపోవుచున్నారు. అలా లోపలి విధానము తెలియనపుడు, సృష్ఠి
తర్వాత శరీరములోపల జరుగు చావును గురించి గానీ, సృష్టి ఆదిలో జరిగిన పుట్టుకను గురించిగానీ, తెలియని స్థితిలో
మనిషి ఉండిపోవడము వలన, జగతిలో ఇంతవరకు పునర్జన్మ విషయము రహస్యముగా మిగిలిపోయినది.
దేవుడు తన జ్ఞానమును మనిషికి తెలియజేయాలని ఎన్నోమార్లు భూమిమీద తన జ్ఞానమును ఇందూ మతములో
(హిందూ మతములో) భగవంతుని ద్వారా ప్రకటించాడు. అట్లే మిగతా మతములలో ప్రవక్తల ద్వారా తెలియజేశాడు.
అయినా మాయ మానవున్ని ఎప్పటికప్పుడు దేవుని జ్ఞానమునకు దూరము చేస్తూ పోయింది. అందువలన మనిషి
మొదట తన చావు పుట్టుకలను గురించి తెలుసుకోలేకపోయాడు. ప్రవక్తల ద్వారా పునర్జన్మ రహస్యమును చెప్పించినా,
మనిషి గ్రహించుకోలేక పోవడము వలనా, జన్మల విషయము అత్యంత ప్రాముఖ్యమైన దానివలనా, ఎటు తిరిగి ఆ
విషయమును మనిషికి తెలియజేయు నిమిత్తము, మనిషి శరీరము లోని ఆత్మ తానే స్వయముగా తెలియజేయాలను
విధానమును ఎన్నుకొన్నది. ఆత్మే స్వయముగా పునర్జన్మల విషయమును జీవాత్మలైన మనుషులకు తెలియబరచుటకు
ఒక కారణము ఉన్నది. పరమాత్మ పని చేయడు, విషయమును తెలుపడు. పరమాత్మ అంశ అయిన భగవంతుడు
చెప్పిన మాటను ప్రకృతి జనితమైన మాయ ఖండించి జన్మలు లేవని బోధిస్తుంది. మిగతా దైవజ్ఞాన విషయములన్నియు
బయట అనుభవరీత్యా తెలియబడుటకు అవకాశము కలదు. వాటినన్నిటిని బ్రహ్మవిద్యా శాస్త్రము నిరూపించగలదు.
ఒక్క జన్మల విషయము ఎవరికీ ప్రత్యక్ష ప్రమాణముగా కనిపించదు. అందువలన ఆత్మే స్వయముగా పునర్జన్మల
విషయమును నిరూపణకు తీసుకరావలసిన అవసరము ఏర్పడినది. ఆత్మ శరీరములో రెండు కార్యములను చేయుచున్నదని
మనము ముందే చెప్పుకొన్నాము. శరీరము లోని అంతర్గత భాగములను వాటి కార్యములను తెలుసుకోగల్గినపుడే
అసలైన ఆధ్యాత్మికమగునని కూడ చెప్పుకొన్నాము. అంతేకాక మనిషిలోని మనస్సు, ఆత్మ ప్రత్యేకించి రెండు పనులను
చేయుచున్నవని కూడా చెప్పుకొన్నాము. శరీరములో మనస్సు, ఆత్మ రెండు పనులు చేయడము శాస్త్రబద్ధమూ, వాస్తవమూ
అయినప్పటికీ మనిషి మస్తకములో ఆత్మమీద ఒక ప్రశ్న వస్తున్నది. అదేమనగా! శరీరములో ప్రకృతి సంబంధమైన
మనస్సు, పరమాత్మ సంబంధమైన ఆత్మ రెండూ రెండు పనులను చేయుచున్నపుడు ప్రకృతి సంబంధ మనస్సు కూడా
ఆత్మతో సమానమైన పని చేసినట్లగుచున్నది కదా! అప్పుడు మనస్సుకంటే ఆత్మ ఎక్కువ పని చేయలేదని, మనస్సు
చేయగలిగినన్ని పనులనే చేయుచున్నదనీ, అందువలన మనస్సుతో సమానముగా ఆత్మ, ఆత్మతో సమానముగా మనస్సు
పని చేసినపుడు మనస్సు కంటే ఆత్మ గొప్పదని చెప్పలేము కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చును.
ఆ ప్రశ్నకు జవాబును మనము ఈ విధముగా చెప్పుకోవచ్చును. ప్రకృతికంటే పరమాత్మ పెద్దది లేక గొప్పదని
చెప్పుకొన్నట్లు, ప్రకృతి సంబంధమైన మనస్సుకంటే పరమాత్మ సంబంధమైన ఆత్మ ఎప్పటికైనా గొప్పదే. మనస్సుకంటే
ఆత్మ గొప్పదని చెప్పుటకు ఒక కారణమున్నది, అదేమనగా! ఒకని జీవితములో మనస్సు, ఆత్మ రెండూ రెండు పనులనే
చేయుచున్ననూ, ప్రపంచములో ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు, ఎవనిలోనో ఒకనిలో ఆత్మ ప్రత్యేకించి మనస్సుకంటే
ఎక్కువగా మూడవ పనిని కూడా చేయుచున్నది. మనస్సుకంటే ఎక్కువగా మూడవ పనిని కూడా ఆత్మ చేయడము
వలన ఆత్మ మనస్సుతో సమానమైనది కాదనీ, శరీరములో అన్నిటికంటే గొప్పది ఆత్మనీ చెప్పవచ్చును. అందరి
జీవితములో మూడవ పని అవసరములేదు, కావున ఆత్మ మనస్సుతో సమానముగా రెండు పనులనే చేయుచున్ననూ,
అవసరమొచ్చినపుడు మూడవ పనిని చేయు సామర్థ్యమును కల్గియున్న దానివలన ఆత్మ శరీరములో అన్ని భాగములకంటే
గొప్పదేనని చెప్పవచ్చును.
సర్వసాధారణముగా ఆత్మ శరీరములో పని చేయుచున్నదని గానీ, రెండు పనులను చేయుచున్నదనిగానీ తెలియని
మనుషులు కొందరుండగా, జీవాత్మ, పరమాత్మకాక ప్రత్యేకించి ఒక ఆత్మ ఉన్నదని తెలియనివారు ఎందరో ఉన్నారు.
ఆత్మ ఉన్నదను విషయము 95 శాతము ప్రజలకు తెలియదు. అతి కష్టము మీద ఒక ఐదు శాతముమందికి ఆత్మంటూ
ఒకటున్నదని తెలిసివుండినా, అందులో ఎవరికీ ఆత్మ ఎల్లప్పుడూ రెండు పనులను చేయుచున్నదనిగానీ,
అవసరమొచ్చినప్పుడు మూడవ పనిని కూడా చేయగల్గుననిగానీ తెలియదు. అంత లోతుగా తెలుసుకొనుటకు పెద్దలైన
ప్రవక్తలు కూడా ఆత్మ విషయమును అంతలోతుగా ఎక్కడా చెప్పలేదు. ఒక్క భగవద్గీతలో మాత్రమే భగవంతుడు
చెప్పిన జ్ఞానములో ఆత్మ ఎంత గొప్పదో తెలిసిపోవుచున్నది. అయితే గీత ఎవరికీ అర్థము కాకుండాపోయిన దానివలన
ఆత్మ కూడా ఎవరికీ అర్థముకాలేదు. అలాగే శరీరములో దాని కర్తవ్యమేమిటో కూడా తెలియకుండా పోయినది. ఆత్మ
చేయగలుగుచున్న మూడవ పని ఏమిటో ఇపుడు తెలుసుకొందాము.
ఆత్మ చేయగలుగు మూడు పనులలో మొదటి దానిని ఎల్లప్పుడు ఒక్కక్షణము కూడా తీరిక లేకుండా చేయుచున్నది.
ఆత్మ యొక్క మొదటి పని సృష్టి ఆదిలో (ప్రభవములో) మొదలై సృష్టి అంత్యము (ప్రళయములో) వరకు ఒక్క సెకండు
కాలము కూడా ఊరక ఉండక జరుగుచుండును. ఎడతెరపిలేని కార్యమును ఆత్మ ఒక్కటే చేయగల్గుచున్నది. ఈ
విషయము ఎవరికీ తెలియకున్నా ప్రపంచములో జరుగు ప్రతి కార్యము ఆత్మ చేతనే జరుగుచున్నది. ఆత్మ అన్ని
శరీరములలో ఉండి అహర్నిశలు పని చేయు చున్నది. మీకు తెలిసినా తెలియకపోయినా ప్రపంచములో ఏ జీవరాసి
చేయుచున్న పనిగానీ అది ఆత్మ చేయునదే! జీవరాసులు మేము చేయుచున్నా మనుకొను ప్రతి కార్యము ఆత్మ చేయునదేగానీ,
జీవులు చేయడము లేదు. విశ్వములో జరుగు పని ఏదైనా ఆత్మే చేయుచున్నదని తెలియక పోవడమే పెద్ద
అజ్ఞానమగుచున్నది. ఆత్మ చేయు మొదటి పనిని తెలుసుకోగలిగితే మనిషి కర్మయోగి అయిపోగలడు. ఒక మనిషి
కర్మయోగి అగుటకు ఏ సాధన అవసరములేదు. బ్రహ్మయోగమును సాధించుటకు మనిషికి సాధన అవసరముగానీ,
కర్మయోగమును సాధించుటకు సాధన పనికి రాదు. ఎప్పుడైతే మన శరీరములో జీవునితో పాటు ఆత్మ ఒకటున్నదనీ,
అదియే చిన్న, పెద్ద మరియు శరీరము లోపల, శరీరము బయట పనులను చేయు చున్నదని తెలిసి, ఆ విషయము
ఎల్లప్పుడు జ్ఞాపకము ఉంటే, ఏ మనిషి అయినా కర్మయోగి కాగలడు. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన కర్మయోగ
సూత్రము ఇదియే. కర్మయోగము కొరకు సాధన చేయమనీ, ధ్యానము చేయమనీ గీతలో ఎక్కడా చెప్పబడలేదు.
సాధన చేయవలసినది బ్రహ్మయోగము కొరకు మాత్రమేనని జ్ఞప్తికుంచుకోవలెను. ప్రస్తుతకాలములో ఎందరో ధ్యానము
చేయుచున్ననూ, వారికి యోగములు ఎన్ని విధములో తెలియదు, వారు చేయుచున్న ధ్యానము ఏ యోగమునకు
సంబంధించినదో కూడా తెలియదు. వారు చేయు సాధన విషయమే వారికి సరిగా తెలియదు, ఎవరో చెప్పితే దాని
ప్రకారము చేయుచుందురు. అటువంటి వారికి శరీరము బయట చేయు సాధన విషయమే సరిగా తెలియనపుడు,
లోపలనున్న మనస్సు విషయముగానీ, దానికంటే మించిన ఆత్మ విషయముగానీ ఏమాత్రము తెలియదు. ఆత్మ విషయము
తెలియనపుడు అది ఎన్ని పనులు చేయుచున్నదో, ఎలా ఉన్నదో, ఎలా తెలియగలరు? అందువలన ఆత్మ వలన
ఎల్లప్పుడూ జరుగు మొదటి పనిగానీ, అప్పుడప్పుడు జరుగు రెండవ పనిగానీ, ఎవరికీ తెలియకుండా పోయినది. ఇక
మూడవ పని ఏమిటో కూడా తెలియదనియే చెప్పవచ్చును.
ఇప్పుడు అవకాశము దొరికింది కాబట్టి మీరు నన్ను వేగముగా ఒక ప్రశ్న అడుగవచ్చును. అదేమనగా!
భూమిమీద ఎవరికీ తెలియని ఆత్మ యొక్క మూడవ పని మీకెట్లు తెలిసినది? ఎవరికీ తెలియదని మీరే చెప్పు చున్నప్పుడు,
దానిని మీరెలా చెప్పగలుగుచున్నారు? అని ప్రశ్నించవచ్చును. దానికి నేను సూటిగా చెప్పు సమాధానము ఏమనగా!
ఎవరికీ తెలియని దానిని నేను చెప్పడము కూడా ఒక పనియే కదా! ఆ చెప్పడము అను పనిని చేయుచున్నది నేనని
మీకు పైకి తెలిసినా, నాకు మాత్రము ప్రతి పనినీ చేయునది ఆత్మయనీ, నేను కాదనీ బాగా జ్ఞాపకమున్నది. నేనున్న
శరీరములో నాకు తోడుగా ఒకడున్నాడనీ, వాడే ఈ శరీరమునకు అధిపతియనీ, అతను చేయనిదే ఏ పనీ శరీరములో
జరగదనీ, వాడే నా పొరుగువాడనీ, వానినే ఆత్మ అంటున్నామనీ చెప్పుచున్నాను. నేను చేయని పనిని నేనే చేశానని
చెప్పడము తప్పుకాదా! అటువంటి తప్పును నేను ఎప్పుడూ చేయను. అలా చెప్పితే నా పొరుగు వానిని నేను మోసము
చేసినట్లు కాదా! ఆత్మ చేసిన పనిని జీవాత్మ నేనని అజ్ఞానము చేత చెప్పడము ఆత్మను అవమానపరిచినట్లగును. దానినే
ఆత్మద్రోహము అంటాము. నేను అలా అందరివలె ఆత్మద్రోహిని కాను. ఎవరికీ తెలియని ఆత్మ రహస్యము ఆత్మకే
తెలుసు. కావున ఆత్మే తన మూడవ పనిని చెప్పుచున్నది, కానీ నేను ఎంతమాత్రము కాదు. శరీరములో జరిగెడి
పనులను బుద్ధి ద్వారా చూస్తూ, వాటిని అనుభవించడమే నా పని. అంతే తప్ప మిగతా పనులన్నీ ఆత్మే చేయుచున్నది.
ఆత్మయొక్క మూడవ పనిని కూడా ఆత్మే నేనున్న శరీరము ద్వారా తెలియజేయుచున్నది.
మనిషి సజీవ శరీరములో ఎల్లకాలము జరుగునది ఆత్మయొక్క మొదటి పనికాగా, అప్పుడప్పుడు జరుగునది
ఆత్మయొక్క రెండవపనికాగా, ఎన్నో జన్మలలో ఒకమారు జరుగునది ఆత్మ యొక్క మూడవ పనిగా చెప్పుకొన్నాము.
జీవునికి పునర్జన్మలున్నాయని తెలియజేయు నిమిత్తము ఆత్మ పని చేయడము మూడవ పని అగుచున్నది. ఆత్మ మూడవ
పని చేయకపోతే పునర్జన్మలు ఉన్నాయని చెప్పుటకు ఆధారము లేకుండా పోతుంది. అందువలన ఉన్న సత్యమును
తెలుపుటకు, "ధృవం జన్మ మృతస్యచ" అను శాస్త్రవచనము నిరూపణగా తెలియుటకు ఆత్మ తన శరీరములో మూడవ
పనిని చేసి చూపించింది. అలా ఆత్మ చేసిన మూడవపనిని విశదీకరించుకొని చూస్తాము. భగవద్గీతలో జ్ఞానయోగము
ఐదవ శ్లోకములో “బహూనిమే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప” “అర్జునా!
నాకు ఎన్నో జన్మలు కలిగాయి, నీకు అట్లే ఎన్నో జన్మలు కలిగాయి. నాకు కలిగిన జన్మలన్నీ నాకు తెలుసు, కానీ నీకు
కల్గిన జన్మలు నీకు తెలియవు" అని కృష్ణుడు అర్జునునకు చెప్పాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు ఇద్దరూ మనుషులే
అయినా, ఇద్దరిలోనూ మనస్సు, ఆత్మ రెండూ ఉండి వాటివాటి పనిని అవి చేస్తూ ఉండినా, అర్జునునకు తెలియని గత
జన్మల విషయములు కృష్ణునికి ఎలా తెలిసాయి అని ప్రశ్న రాకతప్పదు. అలా వచ్చిన ప్రశ్నకు జవాబును తెలుసుకొంటే,
అర్జునుని శరీరములోని ఆత్మ ఆ శరీరములో రెండు పనులనే చేయుచున్నదని తెలియుచున్నది. అందరి శరీరములో
చేయు విధముగనే అర్జునుని శరీరములో కూడా ఆత్మ రెండు పనులను చేయుచుండుట వలన, ఎవరికీ తమ గత జన్మ
విషయములు తెలియనట్లు అర్జునునకు కూడా గడచిపోయిన జన్మల విషయము తెలియలేదు. శ్రీకృష్ణుని శరీరములోని
ఆత్మ తన మూడవ పనిని కూడా చేయడము వలన కృష్ణునికి తన గత జన్మ విషయములన్నియు తెలిసి పోయినవి.
అందువలన కృష్ణుడు వెనుకటి జన్మలన్నీ నాకు తెలుసు అన్నాడు.
ఒక మనిషి శరీరములో ఆత్మ ఎల్లప్పుడు పని చేస్తూవుండుట వలన, మనిషి జీవితములోని ప్రతి చిన్న విషయముతో
సహా అన్ని విషయములు ఆత్మకు తెలుసు. మనిషి జీవితములో ఎల్లకాలము అన్ని పనులనూ ఆత్మ చేయుట చేత
మనిషి జీవితములో ఆత్మకు తెలియనిది ఏమీ లేదు. అలా అన్ని విషయములను తెలిసిన ఆత్మ, తనకు తెలిసిన వెనుకటి
జన్మ విషయములను మనిషి జీవితములో తానే స్వయముగా జ్ఞప్తివచ్చినట్లు తెలియజేయుచున్నది. అలా వెనుక జన్మల
విషయములను ఎప్పుడో ఒకప్పుడు, ఎవనికో ఒకనికి ఆత్మ తెలియజేయడమే ఆత్మయొక్క మూడవ పని. కృష్ణుని
శరీరములోని ఆత్మ గతజన్మల విషయములన్నిటిని కృష్ణునకు తెలియజేసినది కావున ఆయన నా వెనుకటి జన్మలనన్నిటిని
నేను చెప్పగలను అన్నాడు. శ్రీకృష్ణుడు అలా అనడము వలన ఆత్మ తన మూడవ పనిని కృష్ణుని శరీరములో
నిరూపించుకొన్నదని అర్థమగుచున్నది. ఆ విధముగా శ్రీకృష్ణుని శరీరములోని ఆత్మ, కృష్ణుని యొక్క గడచిపోయిన
జన్మలను గురించి తెలుపడము వలన, మనిషికి పునర్జన్మలున్నాయను విషయము నిరూపించబడినది. అయితే ఇక్కడ
కొందరికి ఒక అనుమానము రావచ్చును. అదేమనగా! కృష్ణుడు ఇందూ (హిందూ) మతమునకు ప్రవక్తలాంటివాడు.
కావున ఆయన స్వయముగా పునర్జన్మల విషయములో అసత్యమును చెప్పివుండవచ్చును కదా! అని ఎవరైనా అడుగవచ్చును.
ఇతర మతములలో పునర్జన్మలు లేవని చెప్పినపుడు, ఒక్క ఇందూ (హిందూ) మతములోనే ఉన్నాయని చెప్పుట వలన
ఈ ప్రశ్న కొందరికి రావచ్చును. ఇటువంటి ప్రశ్నకు మా సమాధానము ఏమనగా!
మానవుడు ఏ మతములో పుట్టినా ఒక మనిషికి శరీరములోని నిర్మాణమెట్లు ఉన్నదో అట్లే మనుషులకందరికీ ఉ
న్నది. ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క శరీర నిర్మాణముగానీ, శరీర అంతర్గత యంత్రాంగముగానీ లేవు. మనుషులు
సృష్ఠించుకొన్నవే మతములు, దేవుడు మానవజాతిని సృష్టించాడు గానీ, మతములను సృష్టించలేదు. దేవుని సృష్ఠిలో
మనుషులందరు ఒక్కటే. అందువలన ప్రపంచములోని అన్ని మతముల మనుషులు ఒకే విధముగా సృష్ఠింపబడినారు.
ఒకే విధమైన అనుభూతులు మనుషులకున్నాయి. మనిషి పుట్టిన తర్వాత వచ్చిన మతమునకు సంబంధించిన
అలంకారములనూ ఆచరణలనూ ప్రక్కన పెట్టితే, వీడు పలానా మతమువాడని ఎవరూ చెప్పలేరు. దీనినిబట్టి ఒక
మనిషికి ఏ నిర్మాణమున్నదో అదే నిర్మాణము అందరికి శరీరములోపల, బయట ఉన్నదని చెప్పవచ్చును. అట్లే ఒక
విషయము మనిషికి నిరూపణకు వస్తే అది సమస్త మానవజాతికి వర్తించును. అట్లే దేవుడు ఒక మనిషికి చూపిన
ధర్మమే ప్రతి మనిషికి వర్తించును. చావు పుట్టుకలు ఒక మనిషియొక్క జీవిత ధర్మమైనపుడు అవి అందరికీ వర్తించును.
అట్లే యవ్వనమూ, వృద్ధాప్యము ఒక మనిషి యొక్క శరీర మార్పయినపుడు అవి అన్ని శరీరములకు మార్పుగానే ఉ
ండును. ఈ విధముగా అందరికీ ఒకే ధర్మ విధానముండును గానీ, మతములకు సంబంధించిన విధానము అందరికీ
ఒకే విధముగా ఉండదు. అందువలన మతమును ప్రక్కన పెట్టి చూస్తే, దేవుడు చెప్పిన ధర్మములు మనుషులందరికీ
సమానముగా వర్తిస్తున్న వని తెలియుచున్నది. చావు పుట్టుకల విషయములో దేవుడు అందరికీ ఒకే ధర్మమును చెప్పాడు
గానీ, ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క విధానముగానీ, ఒక్కొక్క ధర్మమునుగానీ చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా మా మతములో
వేరు విధానమున్నదని చెప్పితే, వారు దేవుని ధర్మములను సరిగా అర్థము చేసుకోలేదనీ, వారు మాట్లాడునది మతము
యొక్క మాటయేననీ, దేవుని మాటకాదనీ గట్టిగా చెప్పవచ్చును. అలా ఎందుకు చెప్పుచున్నామనగా! ఒక మనిషికి ఉ
న్న ధర్మమే సమస్త మానవాళికి వర్తించునను సూత్రము ప్రకారము దేవుని ధర్మమైతే అందరికి వర్తించుననీ, మత
ధర్మమైతే ఆ మతము వారికే పరిమితమని చెప్పుచున్నాము. మత ధర్మము చెప్పు కొనుటకూ, దానిప్రకారము
అనుసరించుటకూ, ఆ మతస్థులకు మాత్రమే పనికి వచ్చును గానీ, సమస్త మానవాళికి జరిగి తీరునది కాదు. దేవుని
ధర్మము సమస్త మతములలోని వారికి కూడా వర్తించుచున్నది.
భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ధర్మములు సమస్త మతముల వారికి వర్తించును. ఇపుడు కొందరు ఒక ప్రశ్న
అడుగవచ్చును. అదేమనగా! భగవద్గీత హిందూమతమునకు సంబంధించినది కదా! అది కూడా హిందూ మతమునకు
సంబంధించినది అయినప్పుడు దానిలో చెప్పిన ధర్మములు కూడా ఆ మతము వారికే పరిమితి కదా! అని అడుగవచ్చును.
దానికి మా సమాధానము ఏమనగా! హిందూమతము అనునది వాస్తవముగా మతము కాదు. హిందూ అను శబ్దమునకు
ఏ అర్థమూలేదు. అది మధ్యలో వచ్చిన పదము. పూర్వము ద్వాపరయుగములోనూ దానికంటే ముందు యుగములలోనూ
నేడు హిందూగానున్న శబ్దము ఇందూగా ఉండెడిది. ఇందూ అను శబ్దము దైవజ్ఞానమును సూచించు అర్థమునిచ్చునదై
ఉన్నది. జ్యోతిష్యశాస్త్రమును అనుసరించి ఇందూ అను పదమునకు దైవజ్ఞాని అను భావమున్నది. అందువలన
దైవజ్ఞానము తెలిసిన ఎవరైనా ఇందువే అగును. ఏ మతములోని జ్ఞాని అయినా తను ఇందువే అగును. కావున
ఇందూ అనునది మతము కాదు. ప్రస్తుతకాలములో అజ్ఞానము పెరిగి పోయిన దానివలన ఇందూ అను శబ్దము
హిందూగా మారిపోయినది. ఇందూ, హిందూగా మారిపోయినా భగవద్గీతలో చెప్పిన ధర్మములు పూర్తి దైవజ్ఞానమునకు
సంబంధించినవి. కావున మతమునకు సంబంధించినవి కావు. ఇందూ ధర్మములలో మతమునకు సంబంధించిన
నియమముగానీ, ఆచరణలుగానీ ఉండవు. ఏవి ఉన్నా దైవమునకు సంబంధించిన ధర్మములు, వాటి ఆచరణ
ఉండును. భగవద్గీత సంపూర్ణముగా ఇందూ ధర్మములను తెలియజేసినది. అందువలన గీత కూడా మత సంబంధ
గ్రంథముకాదనీ, దైవధర్మములను తెలిపిన గ్రంథమనీ చెప్పవచ్చును. గీతను చెప్పిన కృష్ణుడు తానే స్వయముగా కొన్ని
జన్మలను పొందానని చెప్పడము మత సంబంధముగా చెప్పినది కాదు. విశ్వ వ్యాప్తముగా ఎక్కడైనా అందరికీ జరుగు
పునర్జన్మల విషయమునే నిరూపణముగా చెప్పడమేకాక, తన అనుభవములను ఆధారముగా చెప్పాడు. ఇది ఒక్క
కృష్ణునికేనా జ్ఞప్తికి వచ్చినది? ఎవరికి ఇటువంటి జ్ఞాపకము రాలేదా అని విచారిస్తే, మిగత మనుషులలో కూడా
కొందరు అక్కడక్కడ అప్పుడప్పుడు తన పునర్జన్మ జ్ఞాపకములను గురించి చెప్పారు. అలా చెప్పిన వారిలో ఇందువులున్నారు,
క్రైస్తవులున్నారు ముస్లీమ్లున్నారు మరియు మిగతా మతస్థులు కూడా ఉన్నారు. అందువలన కృష్ణుడు చెప్పినది
విశ్వమానవులందరికీ వర్తించు జ్ఞానమనీ అది అక్కడక్కడా ధర్మముగా నిరూపింపబడుచున్నదని అర్థమగుచున్నది. అందరి
అనుభవమునకు వచ్చునది కావున కృష్ణుడు చెప్పిన జ్ఞానము మతసంబంధము కాదని తెలియుచున్నది.
కృష్ణునికి వెనుక జన్మలు తెలిసినట్లు ఇప్పుడు మనకుగానీ, అప్పుడు అర్జునునికిగానీ ఎందుకు తెలియలేదని
కూడా కొందరు ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా ఉన్నది. ఆత్మ చేయు మూడవ పని వలన
మాత్రమే గతజన్మ జ్ఞాపకములు కల్గునని ముందే చెప్పాము కదా! అట్లే ఆత్మ తన మూడవ పనిని ఏదో ఒక జీవితములో,
ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే చేయునని కూడా చెప్పాము. ఆత్మ అందరి జీవితములలో, అన్ని జన్మలలో పని చేయదు.
కావున అందరకీ వెనుక జన్మ విషయములు తెలియుటకు అవకాశములేదు. ఆ రోజు అర్జునుని శరీరములోని ఆత్మ
మూడవ పనిని చేయలేదని తెలిసిన కృష్ణుడు, నీకు వెనుక జన్మల విషయములు తెలియవని అర్జునునితో అన్నాడు.
ప్రపంచములో పునర్జన్మలున్నాయని తెలుపు నిరూపణ నిమిత్తము, ఎవరిలోనో ఒకరిలో ఆత్మ మూడవ పనిని చేసి,
వెనుక జన్మ విషయములను తెలియజేయుచున్నది. ఒక విషయము నిజమా కాదా అని తెలియుటకు ఒకే సాక్షి
చాలును. అందరి సాక్ష్యము అవసరములేదు. కోర్టులో ఒక్కడు సాక్ష్యము చెప్పినా అది సత్యముగానే లెక్కించబడుతుంది.
ఒక ఊరిలోని హత్యను ఒక్కడు చూచినా వాని సాక్ష్యమునే సత్యముగా లెక్కించగలరు. ఊరిలోని వారందరూ హత్యను
చూడవలసిన పనిలేదు. అందరి సాక్ష్యము అవసరములేదు. అదే విధముగా పునర్జన్మ ఉన్నదని అర్థమగుటకు ఒకనికి
వెనుకటి జన్మ విషయములు జ్ఞప్తికి వచ్చి, అవి నిరూపణకు వచ్చినపుడు, ఆ ఒక్కని సాక్ష్యము తోనే పునర్జన్మ సత్యమని
నిరూపణకు వస్తున్నది. ఆ విధముగా అన్ని దేశములలోనూ ఎన్నో నిరూపణకు వచ్చిన వెనుక జన్మ జ్ఞాపకములున్నవి.
వెనుక జన్మలలో జీవునితో పాటు శరీరములోనున్న ఆత్మ, ప్రస్తుత జన్మలో నేరుగా బుద్ధికి వెనుక జన్మ విషయములు
తెలియజేయడము వలన, బుద్ధి ద్వారా జీవునికి వెనుక జన్మలో జరిగిన విషయములు తెలియుచున్నవి. వెనుక జన్మలో
జీవుడు ఆ విషయములను స్వయముగా అనుభవించినప్పటికీ జ్ఞాపకశక్తి జీవునికి లేని దానివలన, అవి జీవునికి
తెలియకుండా పోయినవి. జీవునికి జ్ఞాపకములేని విషయములను ఆత్మ శరీరములోని మనస్సుకు తెలుపకుండా
నేరుగా బుద్ధికి తెలుపగా, బుద్ధి ద్వారా జీవునికి తెలియు చున్నది. ఈ విధముగా వెనుకటి జన్మ విషయములను
అవసరమొచ్చినపుడు ఆత్మ జీవునికి తెలియునట్లు చేయుచున్నది. అట్లు చేసినపుడు ఆత్మ తెలిపిన విషయములు
మధ్యలో బుద్ధికి తెలిసినా, బుద్ధికి కూడా జ్ఞాపకశక్తి లేని దానివలన తర్వాత బుద్ధి కూడా అన్ని విషయములను మరచి
పోవుచున్నది. శరీరములో ప్రకృతి సంబంధ భాగములలో ఒక్క మనస్సుకు తప్ప జ్ఞాపకశక్తి దేనికీ లేదు. మనస్సుకు
తెలియకుండా ఆత్మయే లోపల జీవునికి తెలియజేసి, ఆత్మయే స్వయముగా కర్మేంద్రియముల ద్వారా
బయటికి చెప్పునట్లు
చేయు చున్నది. బయటి కర్మేంద్రియములకు కూడా ఆత్మే స్వయముగా తెలియ జేయడము వలన, మనస్సుకు
విషయములు ఏమాత్రము తెలియకుండా పోవుచున్నవి. శరీరములో ఆత్మ స్వయముగా గతజన్మ విషయములను
తెలియజేసినంత కాలమే వాటిని మనిషి బయటికి చెప్పగలుగుచున్నాడు. ఎప్పుడైతే ఆత్మ తెలుపడము మానివేసిందో,
అప్పుడు ఆ విషయములు ఆ జీవునికి తెలియకుండా పోవును. ఒక సంవత్సర కాలము వెనుక జన్మ విషయములను
తెలియజేసిన మనిషి తర్వాత ఏమీ చెప్పక పోవుచున్నాడు. ఎవరైనా ఆ విషయములను గుర్తుచేసినా, అవి అతనికి క్రొత్త
విషయములుగా అగుపించును. అందువలన కొంతకాలము వెనుక జన్మ జ్ఞాపకాలను చెప్పినవారు, తర్వాత కాలములో
వాటిని ఏమాత్రము చెప్పలేకపోవుచున్నారు. కొంత కాలమే ఒకనితో గత జన్మ జ్ఞాపకాలను చెప్పించిన ఆత్మ, గతజన్మ
తర్వాత పునర్జన్మలున్నాయని అందరూ గుర్తించుటకు మాత్రమే అలా చేయుచున్నదని తెలియుచున్నది. శరీరములోని
మనస్సుకు తెలియకుండా స్వయముగా ఆత్మే చేసిన పని కావున, మనిషి జ్ఞాపకములో గతజన్మ విషయములు ఎప్పటికీ
ఉండవు.
గత జన్మలున్నాయనీ, గత జన్మల తర్వాత పునర్జన్మలున్నాయనీ గుర్తించు నిమిత్తము ఆత్మ స్వయముగా తెలుపు
విధానమును ఇంతవరకు తెలుసుకొన్నాము. గతజన్మలూ, పునర్జన్మలూ ఉన్నాయని తెలుసుకొనుటకు రెండు
విధానములున్నవి. అందులో స్వయముగా ఆత్మ వ్యక్తి ద్వారా తెలియ జేస్తుందని చెప్పడము ఒక విధానము. రెండవ
విధానములో ఆత్మ చెప్పదు, కానీ మనిషే స్వయముగా తెలుసుకొను నిమిత్తము, శరీరము మీద ఏదో ఒక గుర్తు
ఉండును. ఆ గుర్తు శరీరము పుట్టినపుడే పుట్టుకతోనే వచ్చి యుండును. అటువంటి గుర్తును పుట్టుమచ్చ అంటారు.
పుట్టుకతో వచ్చు మచ్చ కావున దానిని పుట్టుమచ్చ అంటున్నాము. పుట్టుమచ్చ వెనుకటి జన్మ సంబంధమును గుర్తు
చేయుచున్నది. ఉదాహరణకు కృష్ణుడు బాల్యములో పాముకాటుకు గురి అయినాడు, కావున ఆయన తర్వాత జన్మలో
ఆ పాముకాట్లు శరీరము మీద కరిచిన చోట పుట్టుమచ్చగా వచ్చాయి. ఈ విధముగా గత జన్మలను ఒకటి ఆత్మ
తెలియజేయు విధానము, రెండు జీవాత్మ స్వయముగా గుర్తుల ద్వారా తెలియు విధానమూ రెండు రకములు గలవు.
ఈ రెండు విధానములను ప్రత్యక్ష ప్రమాణముల ద్వారా తెలుసు కొందాము. మొదట ఆత్మ మూడవ పనిగా గత జన్మ
విషయములను తెలియజేసే రెండు మూడు విధానములను తెలుసుకొందాము.
ఇపుడు మొదటి విధానములో ఆత్మ గతజన్మలను తెలియజేసిన యదార్థ సంఘటనలను వివరించుకొందాము.
1930వ సంవత్సరము జూన్ లేక జూలై నెల కాలములో లెబనాన్ దేశములో “హాసన్” అనే పేరుగల స్త్రీ జన్మించింది.
పునర్జన్మలు లేవు అను చెప్పుచున్న ఇస్లామ్మతములో హాసన్ జన్మించడము విశేషము. ఆమెకు 20 సంవత్సరముల
యుక్తవయస్సులో “ఫరూక్" అను వ్యక్తితో వివాహము జరిగింది. ఫరూక్, హాసన్ జంటకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.
హాసన్కు “నభీ” అనే సోదరుడు కూడా ఉండేవాడు. అతడు లెబనాన్ దేశములో లెబనాన్ సమాజములో చాలా పేరు
పొందినవాడు. అయితే నఖీ యుక్తవయస్సులో విమాన ప్రమాదములో మరణించాడు. హాసన్ తన రెండవ కూతురుకు
జన్మనిచ్చినపుడు అనారోగ్యముపాలై గుండె సమస్య వచ్చింది. దానివలన ఇక మీదట పిల్లలను కనకూడదని డాక్టర్లు
సలహా ఇచ్చారు. అయితే హాసన్ ఆ సలహాను ఏమాత్రము పట్టించుకోకుండా 1962లో మూడవ మగబిడ్డకు
జన్మనిచ్చింది. 1963లో తన తమ్ముడు నభీ చనిపోవడముతో ఆమె అరోగ్యము మరీ క్షీణించను మొదలు పెట్టింది.
అప్పుడు ఆమె తాను చనిపోవడము ఖాయమని అనుకున్నది. కొంతకాలమునకు 36 సంవత్సరముల వయస్సున్న
హాసన్ వర్జీనియాలో ఉండే “రిచ్మడ్” అనే డాక్టర్ వద్దకు గుండె ఆపరేషన్ కొరకు వెళ్ళింది. ఆపరేషన్కు ముందు తన
పెద్దకూతురు లైలాకు ఫోన్ చేయ బోయింది, కానీ చేయలేక పోయింది. ఆపరేషన్ తర్వాత ఒకరోజు మాత్రము బ్రతికి
చాలా క్లిష్టపరిస్థితులలో హాసన్ మరణించింది.
హాసన్ మరణించిన పది రోజులకు సుజన్నేగానెమ్ అను బిడ్డ ఒక కుటుంబములో పుట్టింది. సుజన్నేగానెమ్ 16
నెలల వయస్సుగల చిన్న బిడ్డగా ఉండి మాటలు వచ్చీరాని సమయములో ఫోన్ తీసుకొని హలో లైలా అని పదేపదే
అంటూ ఉండేది. ఆ కుటుంబము వారికిగానీ, సుజన్నే తల్లికిగానీ లైలా ఎవరో? అంతచిన్న పాప అలా ఎందుకు
ఫోన్లో పిలుస్తున్నదో అర్థము కాలేదు. తర్వాత ఆరునెలలు గడచిన సుజన్నేకు రెండు సంవత్సరములు వయస్సు పూర్తి
అయింది. అప్పుడు మాటలు కూడా బాగా వచ్చాయి. అప్పుడు ఆమె తల్లి లైలా ఎవరు అని అడిగింది. దానికి
సుజన్నేగానెమ్ నాకు ఇద్దరు కూతుర్లున్నారని, వారిలో ఒక కూతురు పేరు లైలా అని చెప్పింది. అంతేకాక తన పేరు
సుజన్నే కాదనీ, తనపేరు హాసన్ అని, తన భర్త పేరు ఫరూక్ అనీ, తన తల్లిదండ్రుల పేర్లు, తమ్ముళ్ళ పేర్లు, మిగత
కుటుంబ సభ్యుల పేర్లు మొత్తము 13 పేర్లు వరుసగా చెప్పింది. ఇంకా తన ఊరు యొక్క వివరాలు అడిగితే ఇప్పుడు
నా తల చిన్నది ఇంకా కొంత కాలమునకు అన్ని విషయములు చెప్పుతానని చెప్పింది.
ఈ విధముగా సుజన్నే చెప్పిన మాటలను విని ఆమె కుటుంబములోని వారు సుజన్నే ముందు జన్మలో హాసన్గా
ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలను కొన్నారు. ఆ వార్తను పత్రికల ద్వారా బయటికి తెలియజేశారు. అప్పుడు హాసన్
కుటుంబములోని వారూ, హాసన్ భర్త ఫరూక్ సుజన్నేను చూడటానికి వచ్చారు. మొదట ఫరూక్ కుటుంబము
చిన్నపాపగానున్న సుజన్నే చెప్పు మాటలను నమ్మలేకపోయారు. హాసన్ బంధువులను సరిగ్గా వారి పేర్లతో సుజన్నే
పిలువడముతో ఫరూక్ కుటుంబము ఆ పిల్లను నమ్మడము మొదలు పెట్టింది. హాసన్ తన నగలనూ, ఇతర ఆభరణములనూ
వర్జీనియాలోని తన తమ్ముడు హెర్కులేక్కు ఇచ్చింది. ఇది సర్జరీకి ముందు జరిగిన సంగతి. ఆ నగలను హెర్కులేకు
ఇస్తూ, వాటిని తన కూతుర్లకు అందజేయ వలసిందిగా చెప్పింది. ఈ విషయము హాసన్కు వారి కుటుంబీకులకు తప్ప
ఇంకెవ్వరికీ తెలియదు. ఇవన్నీ విన్న తర్వాత సుజన్నే గతజన్మలో హాసన్గా ఉండేదని ధృవీకరించబడింది.
చదవడానికిగానీ, వ్రాయడానికిగానీ రాకముందే సుజన్నే పేపరు మీద ఏవో నంబర్లు వ్రాసేది. తర్వాత ఆ
నంబర్లు ఫరూక్ ఇంటి ఫోన్ నంబరని తెలిసింది. సుజన్నేకు ఐదు సంవత్సరముల వయస్సున్నపుడే రోజుకు మూడు
సార్లు ఫరూక్కు ఫోన్ చేసేది. ఫరూక్ ని కలిసినపుడు సుజన్నే అతని ఒడిలో కూర్చొని నిద్రించేది. పోలీస్ ఉద్యోగము
చేసే ఫరూక్, మరణించిన తన భార్య హాసన్ సుజన్నేగా జన్మించిందని అంగీకరించాడు. సుజన్నేకు ఏవైనా ఫోటోలు
చూపిస్తే వాటిలోని వ్యక్తుల్ని గుర్తించడమే కాకుండా, హాసను ఆ ఫోటోలోని వారితో సంబంధాన్ని సుజన్నే వివరించేది.
కొన్ని హాసను తప్ప ఎవరికీ తెలియని వివరాలను సుజన్నే వివరించేది. దీనివలన పోయిన జన్మలోని హాసన్ ఈ
జన్మలో సుజన్నేగా పుట్టినదని పూర్తి నిరూపణకు వచ్చినది. ఈ విషయముతో పునర్జన్మ ఉన్నదనీ నిరూపించబడినది.
40 సంవత్సరముల క్రితము జరిగిన ఈ సంఘటనను ఎవరూ కాదనలేరు మరియు ఖండించనూ లేరు.
జీవుడు శరీరమును వదలి పోవడము మరణము అయితే, అదే జీవుడు మరొక శరీరమును ధరించడము జన్మ
అవుతుంది. దానినే లోతుగా విచారిస్తే పునర్జన్మ అవుతుంది. ఒక మనిషి పాతవస్త్రమును వదలి క్రొత్త వస్త్రమును
ధరిస్తే దానిని వస్త్ర మార్పిడి అనవచ్చును. అలాగే ఒక జీవుడు పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరిస్తే
దానిని శరీరమార్పిడి అనవచ్చును. శరీర మార్పిడిలో జీవునికి పునర్జన్మ ఏర్పడుచున్నది. మనిషి పునర్జన్మను పొందినప్పటికీ,
వెనుకటి జన్మ జ్ఞాపకములు అతనికి లేక పోవడము వలన, దానిని జన్మ అనుకోవడము జరుగుచున్నది. కానీ అది
తనకు పునర్జన్మ అని ఎవరికీ తెలియకుండా పోవుచున్నది. అట్లు తెలియక పోవడము వలన జరుగుచున్న సత్యము
సమాధియై పోగలదు. అందువలన జీవునికి జన్మలలో జరుగు సత్యమును తెలుపు నిమిత్తము, జీవునితో పాటు
శరీరములోనున్న ఆత్మ అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట, వెనుకటి జన్మ జ్ఞాపకమును అందించుచున్నది. వెనుకటి జన్మ
జ్ఞాపకముతో పునర్జన్మ నిరూపణకు వస్తున్నది. మనిషి జీవితములోని ఆధ్యాత్మిక విషయములను దేవుడు తన ప్రవక్తల
ద్వారా చెప్పించాడు. అలా చెప్పించిన వాటిలో జన్మ, పునర్జన్మ విషయములు ముఖ్యముగా చెప్పబడినవి. దేవుడు
భూమిమీద మనిషి కొరకు కొన్ని వేల సంవత్సరములకొకమారు వచ్చి తన జ్ఞానమును మళ్ళీమళ్ళీ చెప్పడము జరిగినది.
మనిషి తన జ్ఞానమును మరచి పోకుండుటకు దేవుడు ఎన్నిమార్లు తన జ్ఞానమును మనుషులకు చెప్పితే, అన్నిమార్లు
మనిషి దేవుని జ్ఞానమును అర్థము చేసుకోలేక, ఒక్కొక్కమారు చెప్పిన దానిని ఒక్కొక్క మతముగా, చెప్పిన వానిని మత
ప్రవక్తగా చెప్పుకోవడము జరిగినది. అందువలన దేవుడు చెప్పినది ఒకే జ్ఞానమైనా అది చెప్పిన జాగావేరు, చెప్పిన
కాలమూ వేరు, చెప్పిన మనిషి వేరు. కావున దేవుడు చెప్పినది ఒకే జ్ఞానమని తెలియక మా మతములో చెప్పినది
వేరు, మీ మతములో చెప్పినది వేరని అనుకోవడము జరిగినది. దేవుడు సత్యవంతుడు, సత్యమునే తెలియజేస్తాడు.
మనిషి దేవుడు చెప్పిన సత్యమును అవగాహన చేసుకోలేక, ఒక్కొక్కమారు ఒక్కొక్క రకముగా చెప్పినట్లు అర్థము చేసుకొని,
దేవుని సత్యమునే తనకు తెలియకుండానే అసత్యముగా చేయుచున్నాడు. అలా దేవుడు చెప్పిన మాటను నేను అసత్యము
చేసి మాట్లాడుచున్నానని తెలియకపోవడమేకాక, తనకు తెలిసినదే సత్యమని, నూటికి నూరుపాళ్ళు నమ్మకముతో
ఉన్నాడు. అలాంటి విశ్వాసముతోనే కొందరు పునర్జన్మలు ఉన్నాయని అంటే, కొందరు పునర్జన్మలులేవు అంటున్నారు.
ఈ విధముగా ఉన్నాయని కొన్ని మతములవారూ, లేవని కొన్ని మతముల వారూ అనుచున్నప్పుడు, సామాన్య మనిషి
దేనిని సత్యమని నమ్మాలో, దేనిని నమ్మకూడదో తేల్చుకోలేకపోవును. అటువంటి చిక్కు సమస్య ఏర్పడకుండా, ఏది
సత్యమో అందరూ తెలియుటకూ, అన్ని మతముల వారు సత్యమును తెలుసుకొనుటకు దేవుడు తన జ్ఞానమును అనుభవరీత్య
అర్థమగునట్లు చేయును. అటువంటి ప్రక్రియలోని భాగమే పైన చెప్పిన హాసన్ పునర్జన్మ సంఘటన.
దేవుడు తాను చెప్పినది సత్యమనీ, ఒకవేళ ఎవరైనా ఆయన మాటను తప్పుగా అర్థము చేసుకొనివుంటే
మించిపోయినది ఏమీలేదనీ, అటువంటి వారు జరిగిన యదార్థమును బట్టి తాము పొరపడిన విషయమును సరిగా
అర్థము చేసుకోవచ్చుననీ, అప్పటికీ వారికి అర్థము కాకపోతే వారివద్ద ఉన్నది మత జ్ఞానమేననీ, దేవునిజ్ఞానము కాదనీ
చెప్పవచ్చును. దేవుడు సర్వమును సృష్టించిన తర్వాత తన ధర్మములను మనిషికి తెలిపాడు. అందులో తిరిగి మనిషి
తనవద్దకు (దేవునివద్దకు) రానంతవరకు భూమిమీద చస్తూ, పుట్టుచూ సుఖదుఃఖములను అనుభవిస్తూ ఉండవలసిందేననీ,
తనవద్దకు వచ్చిన వానికి మాత్రమే జనన మరణముల నుండి ముక్తి లభించుననీ, దానినే మోక్షము అంటామని
చెప్పాడు. అదే విషయమునే అన్ని మతములలోనూ చెప్పాడు. అయితే ఇస్లామ్ మతములో చిన్న అవగాహన లోపము
వలన ప్రవక్త చెప్పిన సత్యమును కొందరు అర్థము చేసుకోలేక పోయారు. దేవుని జ్ఞానము గొప్పది కావున ఎవరైనా
పొరపడుటకు అవకాశము గలదు. ప్రవక్త బ్రతికివున్నపుడే మహమ్మద్ ప్రవక్తగారి నలుగురు భార్యలలో చిన్న భార్యకు
పునర్జన్మల విషయము అర్థముకాక తిరిగి ప్రవక్తను అడిగి తెలుసుకొన్నది. ఈనాడు ప్రవక్తలేడు కనుక అటువంటి
అవకాశము మనకు లేదు. కావున జరిగిన యదార్థమును బట్టి మన పొరపాటును సరిదిద్దుకోవచ్చును. మహమ్మద్
ప్రవక్తగారు తన సతీమణులవద్ద దేవుని ధర్మములను తెలుపుచూ చనిపోయిన మనిషిని ప్రళయ దినాన దేవుడు
సమాధినుండి తిరిగి లేపుననీ, అప్పుడు మనిషి ఇవే ఎముకలు, ఇదే చర్మముతో, ఇదే శరీరముతో తిరిగి సమాధినుండి
వచ్చుననీ, అలా వచ్చిన వాని శరీరము మీద నూలు పోగుకూడా ఉండదని తెలిపాడు. అప్పుడు ప్రవక్తగారి చిన్న భార్య
ఇలా అడిగింది. “మేము స్త్రీలము కదా! దేవుడు మమ్ములను గుడ్డలు లేకుండా నగ్నముగా లేపితే మాకు మర్యాద
పోతుంది కదా! మాకు మానము పోతుంది అవమానము ఏర్పడుతుంది కదా!" అని అడిగింది. అప్పుడు ప్రవక్త ఇలా
చెప్పాడు. “దేవుడు మనిషిని తిరిగి సమాధినుండి లేపినపుడు స్త్రీలకుగానీ, పురుషులకు గానీ ఎటువంటి గుణములుగానీ,
ఎటువంటి ప్రపంచ ధ్యాసగానీ ఉండవు" అన్నాడు. ప్రళయ కాలములో చనిపోయిన వారందరూ సమాధులనుండి
లేపబడుతారని పవిత్ర గ్రంథమైన ఖురాన్లో కూడా అనేక చోట్ల ప్రవక్త చెప్పియున్నాడు. ఈ విషయములో ప్రవక్తకు
దగ్గరగానున్న ఆయన భార్యయే పొరపాటు పడినపుడు ప్రవక్త ఆమెకు ఇంకా కొంత వివరముగా చెప్పాడు.
వివరముతో మనిషికి పునర్జన్మలున్నాయని ఎవరికైనా అర్థము కాగలదు. కానీ కొందరికి ప్రవక్త మాటలు పునర్జన్మలు
లేవనియేనని అర్థమగుటకు కారణములు గలవు. అవి ఏవనగా! సమాధి అంటే ఏమిటో కొందరికి అర్థము కాలేదు.
దేవుడు చనిపోయిన మనిషిని తిరిగి లేపినపుడు ఆ మనిషికి ఎంత వయస్సు? అని అడిగితే సమాధానము లేదు.
మనిషి ఎంతకాలము సమాధిలో ఉంటాడు అని ప్రశ్నిస్తే జవాబులేదు. నీవు అనుకొను సమాధి నీదా లేక నీ శరీరమునదా?
అని అడిగితే దానికి సరిగా ఏమి చెప్పాలో చాలామందికి తెలియదు. నీటిలో మునిగి పోయిన వానికి సమాధి ఉన్నదా?
అగ్నిలో కాలిపోయిన వానికి సమాధి ఎక్కుడున్నది అని అడిగితే సరియైన సమాధానముండదు. ఇన్ని ప్రశ్నలకు సరియైన
జవాబు దొరికినపుడు, దేవుడు చెప్పిన జ్ఞానము మనకు అర్థమైనట్లు, లేకపోతే అర్థము కానట్లేనని తెలుసుకోవలెను.
సృష్ఠికర్త అయిన దేవుడు తన పవిత్రగ్రంథమైన ఖురాన్లోనూ, పరిశుద్ధ బైబిలులోనూ, ఉత్తమమైన భగవద్గీతలోనూ
జనన మరణ విషయములో ఒకే ధర్మమును బోధించాడు. గీతలో చెప్పిన మాటకుగానీ, బైబిల్లో చెప్పిన మాటకుగానీ,
ఖురాన్లో చెప్పిన మాటకుగానీ ఎక్కడా తేడా లేదు. కానీ మనము అర్థము చేసుకోవడములో ఎంతో తేడా వచ్చినది.
అందువలన మీరు బాగా ఆలోచించుకోమని దేవుడు హెచ్చరిక చేసి చెప్పాడు. అటువంటి మాటను ఖురాన్లో ఒకచోట
చూడగలము. అజ్ జుమత్ (బృందములు) అను 39వ సురాలో 42వ ఆయత్లో ఇలా కలదు. “అల్లాయే ఆత్మలను
(ప్రాణులను) మరణ కాలమున వశపరుచుకొనేవాడు. మరణించిన వాని ఆత్మలకు దేనికైతే మరణము నిర్ణయింపబడుతుందో
దానిని తనవద్దే ఆపుకొని, మిగతావారి ఆత్మలను నిర్ణీత సమయము వరకు తిరిగి పంపుతాడు. ఇందులో ఆలోచించేవారికి
గొప్ప సూచనలున్నాయి.” ఈ ఆయత్ ఎవరినైనా ఎంతో ఆలోచింప చేస్తుంది. మిగతా ప్రాణులను తిరిగి పంపుతాను
అన్నపుడు ఎక్కడినుండి ఎక్కడికి పంపుతాడని ప్రశ్నవేసుకొని చూడవలసిన అవసరమున్నది. అంతేకాక స్వయాన దేవుడే
ఇందులో ఆలోచించేవారికి గొప్ప సూచనలున్నాయని చెప్పినపుడు మనిషి ఎంతో ఆలోచించవలసిన అవసరమున్నదనీ,
మనము ఏదో పొరపాటు పడుచున్నామనీ, దానికే దేవుడు అలా చెప్పాడని అర్థము చేసుకోవచ్చును.
దీనికి అనుసంధానముగా పవిత్ర ఖురాన్లో సృష్టికర్త అయిన దేవుడు మరొక మాటను కూడా చెప్పాడు. 53వ
సురా అన్నల్మ్ (నక్షత్రము) 44,45,46 ఆయత్లలో 44) నిశ్చయముగా ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని
ప్రసాదించేవాడు. 45) నిశ్చయముగా ఆడ, మగ జంటలను సృష్టించినవాడు ఆయనే, 46) ప్రవహింపజేసిన వీర్యబిందువు
నుండి మరొక జీవితమును ప్రసాదించడము ఆయనకే (దేవునికే) చెల్లును. ఈ విధముగా ఖురాన్లో మరికొన్ని
వాక్యములు కనిపించగలవు. వాటిని సరిగా అర్థము చేసుకొన్నపుడు పైన చెప్పుకొన్న హాసన్ 36 సంవత్సరములకు
మరణించి తిరిగి పదిరోజులకే సుజన్నేగా జన్మించిన సత్యము అర్థము కాగలదు. హాసన్ మరణించి తిరిగి పుట్టినది
సత్యమైనపుడు పునర్జన్మలు లేవు అను వారి మాటలు అసత్యమగును. అటువంటి అసత్యములను ప్రవక్తలకు అంటగట్టి,
వారి గొప్పతనమునకు ఆటంకము కలిగించకూడదు. ప్రవక్తల మాటలను తప్పుగా అర్థము చేసుకోవడము వలన,
దేవుని మాటలనే అసత్యము చేసినట్లగును. దేవుని మాటలను అసత్యముగా చూపడము వలన, ఎవరికైనా భయంకరమైన
పాపము సంభవించగలదు. అందువలన దేవుని జ్ఞానమును ఏ మతస్తులైనా సరిగా అర్థము చేసుకోవాలని కోరు
చున్నాను. ఖురాన్ను పరిశోధించిన కొందరు పెద్దలు ఖురాన్లో ఇంకా కొన్ని వాక్యములు పునర్జన్మల గురించి
ఉన్నాయని వ్రాశారు. వాటిని క్రింద పొందుపరుస్తున్నాము చూడండి.
1) మరి ఎప్పుడైతే శరీరము నశిస్తుందో, అపుడు ఆత్మ (జీవాత్మ) ఆ యొక్క పాత కవచాన్ని వదలివేసి, అందుండి
విడుదలై క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. మానవ దేహము ఒక వ్యక్తికి ఒక రుతువులాగ కొంతకాలము ఉంటుంది. ఆత్మకు
ఆ సమయము పూర్తికాగానే దాన్ని విడిచి ఇంకో శరీరాన్ని తీసుకొంటుంది.
2) దైవత్వము ఆత్మలను (జీవులను) ఉద్భవింపజేస్తుంది. ఇక్కడికి తిరిగి తిరిగి పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే
ఆత్మ దైవత్వాన్ని తిరిగి చేరుకుంటుందో అపుడా ఆత్మ తిరిగి జన్మించనవసరములేదు.
3) సృష్టికర్తయిన దేవుడు నిన్ను తయారు చేసినా, నీవు చనిపోయినపుడు తిరిగి జన్మింపజేసినా, అలాగే నీవు జన్మించిన
తర్వాత నిన్ను మరణింప జేసినా, ఇలా తనని నీవు చేరే దాకా ఈ జనన మరణ చట్రములో నిన్ను ప్రవేశపెట్టినా
దైవత్వాన్ని, దేవున్ని విస్మరిస్తావు.
4) నిన్ను సృష్టించి నీకొక ఉనికిని తయారు చేసినదీ, నీవు చనిపోతే నిన్ను జన్మింపజేస్తున్నదీ, నీవు జన్మించిన తర్వాత
నిన్ను మరణింపజేస్తున్నదీ ఆ దేవుడు ఒక్కడే.
5)
రాతినుండి గింజను బద్దలుకొట్టుకొని మొలకెత్తించేది, చనిపోయిన వారిని తిరిగి జన్మింపజేసేది, జీవిస్తున్న వారిని
తిరిగి మరణింపజేసేది ఆ దైవత్వమే.
6) ఇప్పుడు మీకు సత్యాన్ని బోధిస్తున్నాను, ఏ ఆత్మలకైతే ఒకదానిపట్ల (దైవముపట్ల) తీవ్ర ఆసక్తి, ఇష్టము ఉంటే ఆ
ఆత్మలు ఎన్ని శరీరములు ధరించినా, ఎన్ని పేర్లు పొందినా సరే అవి దేవునికి దగ్గరవుతాయి.
ఈ వాక్యములు దైవత్వము యొక్క గొప్పతనమును తెలియజేయడమే కాక, మనిషికి జన్మలున్నవని కూడా
తెలియజేయుచున్నవి. మనిషి తాను చేసుకొన్న పాపపుణ్యములను అనుభవించుటకే పుట్టుచున్నాడనునది సత్యము.
దానినే కర్మసిద్ధాంతము అంటాము. ఆ కర్మ సిద్ధాంతమును తెలియజేయు వాక్యములు కూడా పవిత్ర ఖురాన్ గ్రంథములో
ప్రవక్తగారు అక్కడక్కడ తెలియజేశాడు. వాటిలో కొన్ని ఈ విధముగా ఉన్నవి.
1) దైవత్వము లేక దేవుడు ఏ ఆత్మనూ (ఏ జీవిని) తనశక్తికి మించి చేయమని నిర్దేశించడు. ఆ ఆత్మ ఏమి
సంపాదించుకుందో దానినే పొందుతుంది. మరీ దానికి ఏది లభించునన్నది దాని బాధ్యతే.
2) ప్రతి ఆత్మ తాను చేసిన మంచిని తిరిగి పొందుతుంది. అలాగే తాను చేసిన చెడునూ తిరిగి పొందుతుంది.
3)మనము మన కర్మల లెక్కలు చూచుకొన్నపుడు మనమే మనల్ని తీర్మానించుకొంటాము. ఏ ఆత్మగానీ, దేనికిగానీ
దోషికాదు. అయితే ఆవగింజంత అయినా సరే ఆ కర్మను అది పాపమైనా, పుణ్యమైనా మనము తిరిగి పొందుతాము.
మన ఆత్మ క్షేత్రము ఆ లెక్క విషయములో చాలా పక్కాగా ఉంటుంది.
4) "మనము ఇతరులకు ఏమి చేశాము, ఇతరులు మనకేమి చేశారు" అను అన్ని విషయములు చాలా లెక్కగా
మనదగ్గరుంటాయి.
5) విశ్వ మానవుల గురించి ఖురాన్లో అత్యద్భుతమైన వాక్యాలున్నాయి. కానీ మతముల యొక్క సంకుచిత అవగాహనతో
ఈ సత్యాన్ని మనము మరచి పోయాము. ప్రపంచములోని ఏ మతస్థులైనా సరే, ఎవ్వరైతే దైవాన్ని విశ్వసిస్తారో వారికి
చివరి రోజున భయములేదు మరి వారు దుఃఖింపరు. చూచారా! ఈ వాక్యము ఎంత గొప్పగా ఉందో?
కర్మ సిద్ధాంత వాక్యములనుబట్టి ఖురాన్ చాలా గొప్పది. ప్రపంచము లోని సమస్త మానవాళికి వర్తించు సూత్రములను
చెప్పినదని అర్థమగు చున్నది. ఖురాన్ చెప్పిన కర్మ సిద్ధాంతము ప్రకారము మనిషి చేసుకొన్న కర్మకు మనిషే బాధ్యుడు.
మనిషి చేసుకొన్న దానిని అనుభవింపజేయుటకు మనిషిని దేవుడు తిరిగి పుట్టించవలసి వచ్చినది. ఏ కర్మలేని వాడు
తిరిగి పుట్టనవసరములేదు. అటువంటి వారు దేవుని సన్నిధానములోనే ఉండి పోవును. దేవుడు మొదట కర్మలేని
మనిషిని పుట్టించి తానే అతనిని జీవింపజేయగా, మనిషి తనను పుట్టించిన దేవున్ని మరిచిపోయి, తానే బ్రతుకుచున్నానని
అనుకొని లేని కర్మను సంపాదించుకొని మరల మరల పుట్టింపబడుచున్నాడు. మేము ఇంతగా పునర్జన్మలున్నాయని
చెప్పినా నమ్మనివారు ఉండవచ్చును. అందుకని ముస్లీమ్ కుటుంబములో చనిపోయి తిరిగి ముస్లీమ్ కుటుంబములోనే
పుట్టిన ఒక వ్యక్తి యొక్క వాస్తవ సంఘటనను చూద్దాము. ఇంతకుముందు చెప్పినది ఒక ముస్లీమ్ స్త్రీ అయిన హాసన్
యొక్క పునర్జన్మ. ఇపుడు ఒక ముస్లీమ్ అయిన పురుషుని జన్మను గురించి చెప్పుచున్నాము. ఇది కూడా లెబనాన్
దేశములో జరిగినదే.
1943లో లెబనాన్ దేశమందు “ఫర్మాట” అనే నగరములో రషీద్ ఖాదీజ్ అను వ్యక్తి జన్మించాడు. అతను
ఆటోమొబైల్ మెకానిక్గా జీవించే వాడు. అతనికి 25 సంవత్సరముల వయస్సులో ఒకనాడు ఇబ్రహీమ్ అనే స్నేహితుడు
రషీద్ ను కారులో షికారుకు తీసుకెళ్ళాడు. ఇబ్రహీమ్ సముద్రప్రాంతములో కారును వేగముగా నడుపుచుండగా,
మిలటరీ బీచ్ అనే స్థలములో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురియైనది. అప్పుడు రషీద్ కారులోనుండి బయటకు
పడిపోయాడు. అలా పడినపుడు తలకు బలమైన గాయము కాగా రషీద్ అక్కడికక్కడే మరణించాడు. రషీద్
మరణించిన తర్వాత ఒక సంవత్సరమునకు “డానియల్దర్దీ" అనునతడు జన్మించాడు. డానియల్ జర్దీకి మాటలు
వచ్చినపుడు పలికిన తొలిమాట ఇబ్రహీమ్. ప్రమాదము జరిగిన దినమున కారునడిపిన తన స్నేహితుని పేరు ఇబ్రహీమ్.
డానియల్ జర్డీ అలా అనడము ఎవరికీ అర్థము కాలేదు. ఇబ్రహీమ్ అని ఎందుకు అన్నాడో తెలియలేదు. తర్వాత
రెండేళ్ళ వయస్సులో డానియల్ జర్దీ, తనతల్లి “లతీషా” తో నేను ఇంటికెళ్ళాలి అని అన్నాడు. తర్వాత ఆరు నెలలకు,
అనగా రెండున్నర సంవత్సరమునకు ఇది నా ఇల్లు కాదు, నువ్వు నా తల్లీకాదు. నాకు నాన్న లేడు, నా తండ్రి
మరణించాడు అని కొన్ని మాటలు మాట్లాడాడు. అప్పటి తన తండ్రి అయిన యూసఫ్్న నాన్న అని పిలువకుండా
యూసఫ్ అని పేరుతో పిలిచేవాడు. అంతేగాక తన తండ్రి “నయీమ్” అని చెప్పేవాడు. నయీమ్ అనేది రషీద్ తండ్రి
యొక్క పేరు.
డానియల్ జర్దీకి రెండున్నర సంవత్సరముల వయస్సులోనే అతని కుటుంబమంతా పిక్నిక్కు వెళ్ళగా వారితోపాటు
జర్దీ కూడా పోయాడు. అప్పుడు వారి బంధువులలో ఒకరు పర్మాట్లా అను పేరును తప్పుగా ఉచ్చరించగా, జర్దీ
సరిచేసి చెప్పాడు. అప్పుడు జర్దీ తండ్రి అయిన యూసఫ్ ఈ పేరు నీకెలా తెలుసు అని అడుగగా! ఈ నగరము పేరు
నాకు బాగా తెలుసు, ఇది నేను నివసించిన నగరమే అని చెప్పాడు. డానియల్ జర్దీ చెప్పిన మాటలు అతని కుటుంబము
వారికి ఏమీ అర్థము కాలేదు. తర్వాత కొంత కాలమునకు డానియల్ జర్దీ, తన తల్లీ కారులో ప్రయాణిస్తుండగా, వారి
కారు మిలటరీ బీచ్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రదేశాన్ని చూచిన డానియల్ కళ్ళు మూసుకొని, చేతులతో ముఖాన్ని
దాచుకొని ఏడ్వను మొదలు పెట్టాడు. తర్వాత “నేను మరణించింది ఇక్కడే” అని గట్టిగా అరిచాడు. అంతేకాక
గతజన్మలో తాను కారు మెకానిక్ ననీ, తన స్నేహితుడు ఇబ్రహీమ్ కారు నడుపుతుండగా కారు అదుపు తప్పిందనీ,
అపుడు బయటపడిన తాను తలకు గాయమై మరణించానని చెప్పాడు.
స్కూల్లో డానియల్ జర్డీ నర్సరీ చదువుచున్న రోజుల్లో తనపేరు డానియల్ జర్డీ కాదనీ, రషీద్ ఖాదీజ్ అని
చెప్పాడు. అదే స్కూల్లోనే మరొక సందర్భములో యుక్తవయస్సులోనున్న అందమైన లేడీటీచర్ను చిన్నగా గిల్లి నువ్వు
చాలా అందంగా ఉన్నావని చెప్పాడట. ఆ విధముగా మాటలలోనూ, చేతలలోనూ కొన్ని సందర్భములలో విచిత్రముగా
కనిపిస్తున్న డానియల్, చెప్పేది ఎంతమటుకు నిజమోనని తెలుసుకొనుటకు అతని తండ్రి యూసఫ్, పర్మట్టాకు
వెళ్ళి డానియల్ వర్ణించిన విధముగా కారు మెకానిక్ను గురించి, మిలటరీ బీచ్వద్ద ఆక్సిడెంట్ను గురించి విచారించగా
డానియల్ చెప్పినదంతా నిజమని తెలిసింది. ఈ విషయమును తెలుసుకొనిన రషీద్ ఖాదీజ్ యొక్క బంధువులూ,
మిత్రులూ డానియల్ను చూచే దానికి బయలుదేరి పోయారు. అలా పోయిన వారిని చూచిన డానియల్ రషీద్ చెల్లెలు
నజ్లాను వెంటనే గుర్తించి ఆమెను పేరుతోనే పిలిచాడు. మొదట తన బంధువులనందరినీ చూడగానే డానియల్ తన
తల్లి లతీషాతో వారందరికీ అరటి పళ్ళు తెచ్చి ఇమ్మని చెప్పాడు. గత జన్మలో రషీదు అరటి పళ్ళంటే చాలా ఇష్టము.
రషీద్ మరణము తర్వాత రషీద్ గుర్తుకు రాకుండ ఉండడానికి రషీద్ తల్లి అతని చెల్లి ఇద్దరు అరటి పళ్ళు తినడము
మానేశారు. తర్వాత డానియల్ పర్మటకు వెళ్ళగానే తన స్నేహితుడైన ఇబ్రహీమ్ను మరియొక స్నేహితుడైన బజాజ్ను
గుర్తించి మాట్లాడాడు.
రషీద్ కుటుంబము వారంతా రషీద్ తిరిగి డానియల్ జర్దీగా పుట్టాడని అంగీకరించారు. రషీద్ కుటుంబము
డానియల్ ఫోటోను తమ ఇంటిలో ఉంచుకొన్నారు. రషీద్ తన రెండవ జన్మలో కూడా కారు నడపాలంటే భయపడేవాడు.
ఈ విధముగా కారు నడపాలంటే వచ్చు భయముగానీ, వెనుకటి జన్మ జ్ఞాపకముగానీ డానియల్ తెచ్చుకొంటే వచ్చినవి
కావు. డానియల్కు ఏమాత్రము సంబంధము లేకుండా అతని శరీరములోనున్న ఆత్మ చేసిన మూడవ పనిగా మనము
గుర్తించవచ్చును. మనిషి చనిపోతే మళ్ళీ జన్మిస్తాడని మనుషులకు తెలియజేయుటకు ఆత్మ చేసిన పనిగా మనము
చెప్పుకోవచ్చును. ప్రతి మనిషిలో జీవాత్మకు తోడుగా ఆత్మ నివసిస్తూ ఎక్కడో ఒకచోట ఈ విధమైన జ్ఞాపకమును
తెప్పించిన సంఘటనలే పునర్జన్మ వృత్తాంతములు. పునర్జన్మలు లేవు అను వారి వాదన అబద్ధమనీ, ఉన్నాయనడము
శాస్త్రబద్ధమనీ ఆత్మ తెలిపిన ఇటువంటి సంఘటనల వలన తెలియుచున్నది.
మనిషి ఆధ్యాత్మిక విద్యను అరుదుగా తెలుసుకొనును. కొన్ని లక్షల జనాభాలో ఎవడో ఒక్కడు దైవజ్ఞానము మీద
ఆసక్తి కలిగి దానిని తెలియాలని ప్రయత్నించినా, విషయగ్రాహిత లోపము వలనా, భావములు వేరుగా అర్థము చేసుకోవడము
వలనా, హేతుదృక్పదము లేనిదానివలన ఉన్నదానిని లేనట్లు, లేనిదానిని ఉన్నట్లు అర్థము చేసుకొనుచున్నాడు. అందువలన
దేవుని జ్ఞానము ప్రజలలోనికి సత్యరూపములో కాకుండా అసత్యరూపములో ప్రాకింది. భూమిమీద జరిగిన మరియు
జరుగుచున్న పునర్జన్మ సంఘటనల ముందర పునర్జన్మలు లేవు అనడము, దేవుని జ్ఞానము అసత్యముగా కనిపించునట్లు
చెప్పుకోవడమూ పూర్తి మానవుని తప్పిదమగును. పునర్జన్మలు లేవు అని కొన్ని మతముల వారు చెప్పుచున్ననూ ఆ
మత ప్రవక్తలుగానీ, ప్రవక్తల చేత చెప్పించిన దేవుడుగానీ ఎక్కడా పునర్జన్మలు లేవని మాత్రము చెప్పలేదు. స్వర్గనరకములను
చెప్పుకొను వారు నరకములో కష్టమూ, స్వర్గములో సుఖమూ ఉందని చెప్పుచునే దేవుని సన్నిధానమైన పరలోకమును
లేక పరంధామ మును ప్రత్యేకముగా చెప్పకుండా దానిని కూడా స్వర్గముగానే చెప్పుచున్నారు. స్వర్గమునకు, దేవుని
సన్నిధానమునకు నక్కకూ నాగలోకము నకూ ఉన్నంత వ్యత్యాసముందని తెలియక మాట్లాడుచున్నారు. దేవుని సన్నిధానము,
ఇట్లుందని ఎవరూ చెప్పలేనిది. అక్కడికి పోయిన వానికి మాత్రమే తెలియును గానీ ప్రక్కవారికి ఎవరికీ అది ఏమిటో
తెలియదు. అటువంటపుడు దానిని స్వర్గముగా చెప్పుకోవడము పూర్తి తప్పగును. స్వర్గము సుఖాలనిలయము, నరకము
కష్టాలనిలయము. అంతేకాక అవి ఎక్కడో లేవు, ఆ రెండు భూమిమీదనే మనుషుల మధ్యలోనే ఉన్నవి. స్వర్గ
సుఖములను అనుభవించే వారినీ, నరక బాధలను అనుభవించే వారినీ ఇక్కడే చూడవచ్చును. ఆధ్యాత్మికము అనునది
ప్రత్యేకమైన దేవుని రాజ్యము లాంటిది. మతము అనునది ఒక ప్రత్యేకమైన మాయ రాజ్యములాంటిది. నేను జ్ఞానిని
అను వారంతా మత జ్ఞానములో పడిపోయి దేవుని జ్ఞానమును విస్మరించుచున్నారు. అందువలన ఆధ్యాత్మికము
అర్థము కావాలంటే ఏ మనిషి అయినా, ఏ ప్రవక్త చెప్పిన దానినైనా మతమునకు సంబంధము లేకుండా తెలియగలిగితే
దైవగ్రంథములైన ఖురాన్లోను, బైబిలులోను, గీతలోను అసలైన దైవజ్ఞానమే కనబడుతుంది.
బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము పునర్జన్మలు వాస్తవమే అయినా వాటిని కొందరే ఒప్పుకొంటున్నారు. కొందరు
హేతువాదులు, నాస్తిక వాదులు ఒప్పుకోవడము లేదు. వాస్తవముగా హేతువాదమన్నది సత్య పరిశోధన నిమిత్తమే
ఉండినా, హేతువాదులమనువారు మాత్రము సత్య శోధన చేయడము లేదు. తమను తాము మేధావులుగా వర్ణించుకొను
నేటి హేతువాదులు తమకు తెలియని వాటిని మూఢనమ్మకములనీ, మానసిక రోగములనీ కొట్టివేయుచున్నారు. అందువలన
హేతువాదులనువారు నేడు నాస్తికులుగా ఉన్నారని చెప్పవచ్చును. ఎక్కడో ఏ దేశములోనో కాకుండా భారతదేశములో
కూడా "ధృవం జన్మ మృతస్యచ" అనుమాట నిరూపణ నిమిత్తము అనేక చోట్ల అనేక పునర్జన్మలు జరిగాయి. ప్రత్యక్ష
నిరూపణకు వస్తూ సాక్ష్యాధారములు దృఢముగా కనిపిస్తున్నా, కొందరు హేతువాదులు అదొక మానసిక రోగమని,
వాస్తవముకాదని చెప్పిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అయినా ఒక గొప్ప శాస్త్రవేత్త అయిన “ఇయాన్ స్టీవెన్సన్”
అనునతడు ఇటు సైన్సును, అటు విశ్వాసమును అనుసంధానిస్తూ పరిశోధనలు చేసి చివరకు పునర్జన్మలు అనునది
విజ్ఞానపరమై ఒక సిద్ధాంతమని చెప్పాడు. వారు ఎన్నో పరిశోధనలు చేసి 1993లో పునర్జన్మలు సత్యమని చెప్పారు.
అయితే మేము విజ్ఞానముగా ఏ పరిశోధన చేయకుండా, జ్ఞాన పరిశోధన మాత్రము చేసి, 1980 సంవత్సరములోనే
“జనన మరణ సిద్ధాంతము” ను బహిర్గతము చేశాము. తర్వాత ఆ సిద్ధాంతమునకు అను సంధానముగా “మరణ
రహస్యము” ను తెలిపాము ఇప్పుడు "పునర్జన్మ రహస్యము” ను తెలుపుచున్నాము. మా శోధనలో ప్రతి చిన్న ప్రశ్నకు
జవాబునిచ్చాము. అంతేకాక ఇప్పుడు భారతదేశములో ఇక్కడి పరిస్థితిలో కలిగిన పునర్జన్మలను వివరిస్తూ వాటిలోని
ప్రశ్నలకు జవాబును చెప్పదలచుకొన్నాము. ఇతర దేశమైన లెబనాన్లో జరిగిన సంఘటనలు ప్రత్యేకించి ఇస్లామ్
సమాజములో జరిగినవికాగా, ఇక్కడ భారతదేశములో జరిగిన సంఘటనలు ఇందూ (హిందూ) సమాజములో జరిగినవి.
వాటిలో ఒకదానిని క్రింద వివరించుకొని చూస్తాము.
భారతదేశములో ద్వాపరయుగము నుండి పునర్జన్మలను బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీత శాస్త్రీయముగా చెప్పుచూనే
వచ్చింది. అయినప్పటికీ కొందరు దానిని కాలక్షేపమునకు చెప్పుకొనే కథలాగా లెక్కించుకొన్నారు గానీ, అది మానవ
జీవిత చరిత్రలో జరుగుచున్న సత్యమని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కొందరైతే పునర్జన్మ అనునది అసత్యమని
చెప్పిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇటీవల కాలములో భారతదేశానికి సంబంధించిన “విక్రమరాజ్సింగ్ చౌహాన్”
అనే ఫోరెన్సిక్ సైంటిస్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రములోని ఝాన్సీలోనున్న బుందేల్ ఖండ్ యూనివర్శిటీ యందు జరిగిన “నేషనల్
కాన్ఫెరెన్స్ సైంటిస్ట్ ఇన్ ఇండియా” మీటింగ్కు హాజరై, తాను పునర్జన్మలను బలపరుస్తున్నట్లు చెప్పడమే కాకుండ,
పునర్జన్మ జ్ఞాపకాల వివరాలను తెలియజేసే ఒక "కేసుస్టడీ”ని ఆ సమావేశములో సమర్పించాడు. ఆ వివరాలు ఇలా
ఉన్నాయి. తరనిత్సింగ్ అనే ఆరు సంవత్సరముల బాలుడు పంజాబ్ రాష్ట్రములోని “ఆల్నమియానా” అనే గ్రామానికి
చెందినవాడు. అతడు తన తల్లితండ్రులకు తన గత జన్మ వివరాలు చెప్పేవాడు. తాను గతజన్మలో “చక్కేలా” అనే
గ్రామానికి చెందిన నివాసియనీ, తనపేరు సత్లామ్సంగ్లియనీ, తాను 1992 సెప్టంబర్ 10వ తేదిన స్కూల్నుండి తిరిగి
వస్తుండగా ఒక స్కూటర్ తనను వేగముగా తగిలిందనీ, దానివలన తన తలకి గాయమైందనీ, ఆ గాయము కారణముగా
రెండవ రోజు మరణించాననీ, తనను గత జన్మలోని తన బంధువులవద్దకు తీసుకెళ్ళమనీ రోజూ అడిగేవాడు. తరని జిత్ సింగ్
రెండు సంవత్సరముల వయస్సులోనే గత జన్మ జ్ఞాపకాలను గురించి వచ్చీరాని మాటలతో వివరిస్తూ వుండేవాడు.
తరనిత్సింగ్ చిన్న పిల్లవాడైన దానివలన అతని మాటలను ఎవరూ పట్టించుకొనే వారు కాదు. అతనికి ఆరు
సంవత్సరముల వయస్సు వచ్చే టప్పటికీ అతనిలో పూర్వజన్మ జ్ఞాపకాలు ఎక్కువగా వచ్చేవి. దానివలన అతడు తన
తల్లిదండ్రులతో తనను గతజన్మలోని గ్రామానికి తీసుకెళ్ళమని ఏడుస్తూ చెప్పేవాడు. అతని బాధను చూడలేక అతని
తండ్రి రంజిత్ సింగ్ ఆ బాలుడు చెప్పిన చక్కేలా అను గ్రామానికి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ ఆ బాలుడు చెప్పిన
కుటుంబము ఆ ఊరు వదలి పోయిందని తెలిసి అక్కడనుండి ఆ కుటుంబమున్న ఊరుకు పోయారు. అక్కడ తరని జిత్సింగ్
చెప్పిన గతజన్మలోని అతని తల్లి తండ్రులను ఆ బాలుడు గుర్తించాడు. అప్పుడు ప్రస్తుత జన్మ తండ్రి అయిన రంజిత్
సింగ్ వారికి ఆ బాలుని విషయము అంతా చెప్పినప్పటికీ, ఎప్పుడో చనిపోయిన తన కొడుకు మళ్ళీ జన్మించి తమవద్దకు
వచ్చాడంటే వారికి నమ్మకము కుదర లేదు. ఆ బాలుడు పోయిన జన్మలో తమ కొడుకని ఒప్పుకోకపోవడముతో ఆ
బాలునికి విసుగువచ్చి తాను గత జన్మలో యాక్సిడెంటు గురియైనపుడు తన దగ్గరున్న పుస్తకాలపై రక్తపుమరకలు
పడ్డాయనీ, తను ప్రమాదానికి గురియైనపుడు తన జేబులో 150 రూపాయలు డబ్బు ఉన్నదనీ, ఆ డబ్బు ఫలానా
దుకాణాదారునికి ఇవ్వవలసి ఉన్నదని చెప్పాడు.
ఆ మాటలు వినిన ఆ బాలుని గతజన్మ తల్లి అతను తన కొడుకేనని నమ్మి భోరున ఏడుస్తూ ఎండిపోయిన
రక్తపుమరకలున్న స్కూలు పుస్తకాలను తెచ్చి అతనికి చూపించింది. ఈ విధముగా బయటపడిన తరనిత్సింగ్ అను
బాలుని పూర్వజన్మ వృత్తాంతమంతయూ కొద్ది రోజులలోనే ఉత్తర భారతదేశమంతా వ్యాపించిపోయింది. ఈ విషయమంతా
ఫోరెన్సిక్ సైంటిస్ట్ అయిన విక్రమిసింగ్ చౌహాన్ దాకా వెళ్ళింది. మొదట ఆయన కూడా ఈ విషయాన్ని నమ్మలేదు.
అయినా నిజానిజాలను ప్రజలకు తెలియజేయు నిమిత్తము వాస్తవమేమిటో తానే స్వయముగా తెలుసుకోవాలని నిర్ణయానికి
వచ్చి తరనిత్సింగ్్న కలుసుకొన్నాడు. ఆ బాలుడు చెప్పిన గతజన్మ తల్లి తండ్రులను కూడా కలిసి మాట్లాడాడు.
ఫోరెన్సిక్ సైన్స్ ఆధారముగా తరన్ జిత్ సింగ్, పూర్వజన్మ వృత్తాంతములోని నిజనిజాలను తెలుసుకోవాలను కొన్నాడు.
ఆ బాలుడు గతజన్మలో స్కూలు విద్యార్థిగా ఉన్నపుడు వ్రాసిన నోట్ పుస్తకాన్ని తీసుకొన్నాడు. ఆ పుస్తకములోని చేతి
వ్రాతతో ఈ జన్మలోని తరనిత్సింగ్ చేతి వ్రాతను పోల్చి చూచాడు. మనుషులందరి చేత వ్రాత ఒకేలాగ ఉండదు.
అంతేకాక ఏ ఇద్దరి వ్యక్తుల చేతి వ్రాత కూడ ఒకే రకముగ ఉండదు. ఆ కారణముగా ఫోరెన్సిక్ సైన్స్ ఫోర్జరీ
సంతకాలను గుర్తించగలుగుతుంది. సహజంగా ఫోరెన్సిక్ సైంటిస్ట్ అయిన విక్రమరాజ్ తనకున్న శాస్త్రపరిజ్ఞాన ఆధారముగా
తరనిత్సింగ్ గతజన్మ చేతివ్రాత, ఈ జన్మలోని చేతివ్రాత రెండూ అచ్చుగుద్దినట్లుగా ఒకే విధముగా ఉన్నాయని
తెలుసుకొన్నాడు. ఇక్కడ గమనించదగిన విషయమేమంటే! ఈ జన్మలో తరని జిత్సింగ్ ఒక నిరుపేద కుటుంబములో
జన్మించిన దానివలన అతనికి ఏనాడూ స్కూలుకు వెళ్ళి అక్షరాలు నేర్చుకొనే అవకాశమే రాలేదు. ఆ విషయము
విక్రమాజంగ్కు తెలియదు. అతను సాధారణముగా ఆ బాలున్ని కాగితము మీద ఏదైనా వ్రాయమని అడిగినపుడు
ఆ బాలుడు ఇంగ్లీషులోనూ, పంజాబీలోను కొన్ని వాక్యములు వ్రాశాడు. దీనినిబట్టి గతజన్మలో నేర్చుకొన్నదే ఇప్పుడు
కూడా వచ్చిందని అర్థమగుచున్నది.
తరన్సింగ్ అనే బాలుని పునర్జన్మ విషయములో ముఖ్యముగా గమనించదగిన విషయమేమంటే! పూర్వజన్మలు
ప్రతి మనిషికి ఉన్నవి. సృష్టి ఆదిలో దేవుడు మనుషులను సృష్టించాడు. అలా సృష్టించబడినపుడు మనిషి క్రొత్తగా
పుట్టుచున్నాడు. కావున మనిషికి సృష్టి ఆదిలో జన్మ కలిగినదనీ, తర్వాత వచ్చినవన్నీ పునర్జన్మలేనని ముందే చెప్పాము.
ఆ లెక్కప్రకారము మీది, నాది పునర్జన్మయే, కానీ గతజన్మ ఏమిటో మీకు గానీ, నాకు గానీ తెలియదు. తెలియకపోవడానికి
కారణము ఆ జన్మ జ్ఞాపకములు మనకు లేవు కావున తెలియలేదు. పోయిన జన్మ తెలియాలి అంటే దానిని ఆత్మే
తెలియజేయాలి. అలా ఆత్మ తెలుపడమును ఆత్మ యొక్క మూడవ పనిగా చెప్పుకొన్నాము. ఆత్మ సర్వ స్వతంత్రమైనది.
అది ఒకనికి వెనుకటి జన్మ కొన్ని జ్ఞాపకాలను మాత్రము కలుగజేసి వానిది పునర్జన్మ అని తెలియునట్లు చేయుచున్నది.
అంతేకాకుండా ఎవనికో ఒకనికి పూర్వజన్మ జ్ఞాపకాలతో పాటు ఆ జన్మలోని అలవాట్లను కూడా వానికి వచ్చునట్లు
చేయుచున్నది. అలవాట్లనే కాకుండా పోయిన జన్మలోని చదువునూ, వ్రాతను కూడా తరని జిత్
సింగ్కు వచ్చునట్లు
అతని ఆత్మ చేసినది. ఈ విధముగా పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చిన వారందరికి జరుగునా అంటే అలా అన్ని జ్ఞాపకాలను
ఆత్మ అందిస్తుందని చెప్పలేము. కొందరికైతే పూర్వజన్మ జ్ఞాపకము ఏమాత్రము ఇవ్వకుండా గత జన్మలోని విద్యను
మాత్రము అందివ్వగలదు. అలా చేయడము వలన కొందరు అరుదుగా చిన్న వయస్సులోనే తమ సంగీత ప్రావీణ్యతను
చూపుచున్నారు. అలాగే కొన్ని విద్యలను నేర్వకనే వాటిలోని పాండిత్యము కొందరిలో బయటపడచున్నది. దానికి
పూర్వజన్మ సంస్కారము అని కొందరంటుంటారు. గాయకుడైన బాలసుబ్రమణ్యమునకు సంగీతము నేర్వకుండానే
వచ్చింది, నేర్చినవారికంటే అతను ఎక్కువ ప్రావీణ్యత చూపుచున్నాడు. అయితే దానికి కారణము అతని ఆత్మ అని
ఎవరికీ తెలియదు, అతనికి కూడా తెలియదు. ఈ విధముగా ఆత్మ వెనుకటి జన్మలోని ఏ విషయమునైనా తర్వాత
జన్మకు కలుగజేయుచున్నది.
మానవ శరీరములో మూడు భాగములుగానున్న పరమాత్మ, ఆత్మ, జీవాత్మలలో పరమాత్మ (దేవుడు) ఏ పనినీ
చేయడనీ, రూప, నామ, క్రియలు లేనివాడని చెప్పుకొన్నాము. అలాగే చివరిదైన జీవాత్మ కూడా ఏ పనినీ చేయదుగానీ,
అనుభవించేది మాత్రమున్నది. జీవాత్మ అన్ని విధముల గ్రుడ్డివాడే! వానికి ఏమీ తెలియదు, ఏమీ చేయడు. అయితే
జీవాత్మకు ఆకారమున్నది, అనుభవమూ ఉన్నది. ఇక రెండవదైన ఆత్మ యొక్క విషయానికి వస్తే, ఆత్మ శరీరములో
ఉండినా ఎవరూ దానిని గుర్తించకుండా ఉన్నది. శరీరములోని జీవాత్మ, పరమాత్మలు రెండూ పని చేయకున్ననూ
తాను మాత్రము ఒక్క క్షణము కూడ ఊరక ఉండక పని చేయుచున్నది. కొందరు ఆధ్యాత్మికమార్గములో ప్రయాణించు
వారు ఆత్మ అను శబ్దమును అనేకమార్లు తమ మాటలలో పలుకుచున్ననూ, ఆత్మ ప్రత్యేకమైనదని వారికి తెలియకుండా
పోయినది. ఆత్మను చాలామంది అటు పరమాత్మగానో లేక జీవాత్మగానో పోల్చుకొనుచున్నారు తప్ప, ఆత్మ అంటే
శరీరములో జీవాత్మకు ఎల్లప్పుడూ తోడుగానున్న ప్రత్యేకమైన కార్యాచరణ కలదని ఎవరూ తెలియ జేయలేకపోయారు.
ఆత్మ యొక్క కార్యాచరణములు మొత్తము మూడు రకములని కూడ తెలియలేక పోయారు. ఇప్పుడు మనము ఆత్మ
యొక్క మూడవ కార్యాచరణమును గురించి చెప్పుకొంటున్నాము. ఆత్మయొక్క మూడవ పనిలోనే పునర్జన్మ విషయములు
మనిషినుండి బయటపడుచున్న వని కూడా తెలుసుకొన్నాము. ఆత్మ బయట వ్యక్తులతోగానీ, బయటి ప్రదేశములతోగానీ
గతజన్మలలో ఉండిన సంబంధమును తెలియజేసినప్పుడే మనిషికి పునర్జన్మ ఉన్నదనీ అర్థమగుచున్నది. ఒకవేళ ఆత్మ
తన మూడవ పనిలో గత జన్మలోని వ్యక్తులతోనూ, ప్రదేశములతోనూ గల సంబంధము లను తెలియజేయకుండా,
గతజన్మలోని కేవలము శరీర అంతర్గతములోని విద్యలనుగానీ, అలవాట్లనుగానీ, పాండిత్యమునుగానీ, భాషలనుగానీ
మేధా శక్తినిగానీ తెలియజేసినప్పుడు, అటువంటి విషయముల ఆధారముతో పునర్జన్మలుగలవని తెలుసుకోలేక పోవుచున్నారు.
అంతేకాక శరీరములోని విషయములేగాక శరీరము మీద వచ్చిన గుర్తుల వలన కూడా పూర్వ జన్మలున్నాయనీ, ప్రస్తుతము
తనది పునర్జన్మ అని ఎవరూ తెలియలేక పోవుచున్నారు. గత జన్మలు ఉన్నాయని మనుషులు తెలుసుకొనుటకు ఆత్మ
అప్పుడప్పుడు ఎవరిలోనో ఒకరిలో గతజన్మలోని అంతర్గత జ్ఞాపకములనుగానీ, బహిర్గత జ్ఞాపకములనుగానీ
కలుగజేయుచుండును. అట్లు తెలియజేయడమేకాక కొందరికి శరీరము మీద గత జన్మలోని గుర్తులను కూడా మళ్ళీ
జన్మలో వచ్చునట్లు చేయుచున్నది. అటువంటి సంఘటనను క్రింద వివరించుకొందాము.
ఇంగ్లాండ్లోని “హెక్స్ హేమ్” అను నగరములో నివాసమున్న జాన్ పోల్లాక్ మరియు ఫ్లోరెన్స్ అను దంపతులకు
ఇద్దరు ఆడ పిల్లలు ఉండేవారు. పెద్దమ్మాయి పేరు జున్నా, రెండవ అమ్మాయి పేరు జాక్విలిన్ పెద్దమ్మాయి జున్నా
వయస్సు 11 సంవత్సరములు, చిన్నమ్మాయి జాక్విలిన్ వయస్సు 6 సంవత్సరములు. ఆనందముగా సాగిపోతున్న
జానోపోల్లాక్ కుటుంబములో ఉన్నట్లుండి ఒక విషాదము జరిగిపోయింది. 1957 సంవత్సరము, మే 5వ తేదీన ఇద్దరు
అమ్మాయిలూ స్కూలుకు బయలుదేరిపోయారు. అలా పోయిన వారు తిరిగి ఇంటికి రాలేదు. రోడ్డు ప్రమాదములో
జున్నా, జాక్విలిన్ ఇద్దరూ మరణించారు. అప్పటికి పోల్లాక్ కుటుంబములో అది కోలుకోలేని విషాధమైనది. కొన్ని
నెలలు ఆ విషాదము నుండి ఆ కుటుంబము బయటపడలేక పోయింది. తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరమునకు
అనగా 1958, అక్టోబర్ 4వ తేదిన ప్లోరెన్స్కు కవలపిల్లలు జన్మించారు. పుట్టినవారు ఇద్దరూ ఆడపిల్లలు కావడము
విశేషముకాగా, వారిలో మరొక విచిత్రము కనిపించింది. అదేమనగా పుట్టిన ఇద్దరు కవలలలో చిన్నమ్మాయికి నుదిటి
మీద చిన్నగాటు (గాయము మానిన గుర్తు) ఉండడము కనిపించింది. జాన్ రెన్స్ కుటుంబములో చనిపోయిన ఇద్దరు
ఆడపిల్లల్లో చిన్నమ్మాయి జాక్విలిన్కు సరిగ్గా నుదుటి మీద గాయము మానిన గుర్తు ఉండేది. ఒకప్పుడు చిన్నమ్మాయి
జాక్విలిన్ సైకిల్ త్రొక్కుచు క్రిందపడినప్పుడు నుదుటి మీద గాయమైవుండేది. ఇప్పుడు పుట్టిన చిన్నమ్మాయికి కూడా
నుదుటి మీద అదే ప్రాంతములో గాయము యొక్క గాటు రావడము గుర్తింపదగిన విషయము. అలా వచ్చిన గాయము
యొక్క మచ్చ ఆమె గత జన్మలోనిదని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు. ఆ మచ్చలో గతజన్మ సంబంధ మర్మమున్నదని
తెలుసుకోలేక పోయారు.
పుట్టిన కవలపిల్లలకు నాలుగునెలల వయస్సు వచ్చినపుడు పొల్లాక్ కుటుంబము తాము నివసిస్తున్న హెకేహేమ్
నగరమును వదలి అక్కడికి 40 కిలోమీటర్ల దూరములోనున్న “వైటికిబే” అను గ్రామానికి పోయారు. తర్వాత నాలుగు
సంవత్సరములు వారు తిరిగి హెక్సేమ్ నగరమునకు రాలేదు. తర్వాత ఒకరోజు పొల్లాక్ కుటుంబము ఇద్దరు
పిల్లలతో సహా హెక్సా హేమ్ నగరానికి వచ్చారు. అలా వారు వచ్చిన వెంటనే నాలుగు సంవత్సరముల వయస్సున్న
ఇద్దరు పిల్లలు గతజన్మలో తాము నివసించిన ఇంటిని గుర్తుపట్టారు. అందులో తామున్న గదులనూ, తాము ఆడుకున్న
చోటును గుర్తించారు. అంతేకాకుండా వారు చదుకున్న స్కూల్ను కూడా గుర్తించి చెప్పారు. దానితో వారు ఇద్దరూ
గతజన్మలోని తమ బిడ్డలేనని తల్లిదండ్రులు తెలుసుకొన్నారు. ఇక్కడ ఈ సంఘటనలో చిన్నమ్మాయికి గతజన్మలో
తగిలిన గాయము యొక్క గుర్తు రెండవ జన్మలో అదే చిన్నమ్మాయికి రావడమును మనము విశేషముగా గుర్తించవచ్చును.
ఇటువంటి సంఘటననే మరొక దానిని వివరిస్తాము చూడండి.
స్టీవెన్సన్ అను అమెరికా శాస్త్రవేత్త భారతదేశములో ఒక బాలుని పునర్జన్మను గురించి పరిశోధించడము జరిగింది.
ఆయన పరిశీలించిన దానిలో ఒక వ్యక్తి గతజన్మలో సైనికుడుగా పని చేశాడట. ఒక సందర్భములో శత్రువులు అతన్ని
షాటన్తో చాలా దగ్గరనుండి కాల్చారట. అప్పుడు అతని ఛాతినుండి బుల్లెట్ దూసుకపోయి మరణించాడట.
విధముగా చంపబడిన వ్యక్తి తిరిగి మహారామ్ అనే వ్యక్తిగా జన్మించాడు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే తిరిగి
జన్మించిన మహారామ్ అనే బాలుని ఛాతి మధ్య భాగములో షాన్ యొక్క బుల్లెట్ దిగితే ఎలా ఉంటుందో, అలాంటి
ఆకారములో విచిత్రమైన పెద్దపుట్టు మచ్చ ఉన్నది. స్టీవెన్సన్ మహారామ్ అనే బాలుని వృత్తాంతమును లోతుగా
పరిశీలించి మహారామ్ చెప్పిన గతజన్మ విషయములన్ని నిజమేనని అతనిది పునర్జన్మ అని రుజువు చేసుకొన్నాడు.
ఇదే విధముగా స్టీవెన్సన్ థాయ్లాండ్ దేశములో పూర్వ జన్మ జ్ఞాపకములు వచ్చిన ఒక బాలున్ని కలుసుకొని, అతని
వెనుక జన్మ జ్ఞాపకాలను పరిశీలించాడు. ఆ బాలుడు గతజన్మలో తన చిన్నాన్న చేత తల వెనుక భాగములో పిడికత్తితో
పొడువబడి దారుణముగా హత్య చేయ బడ్డాడని తెలుసుకొన్నాడు. అలా అతను చనిపోయిన దానివలన అతను పుట్టిన
రెండవ జన్మలో అతని శరీరము మీద తల వెనుక భాగములో పెద్ద గాయము ఆకారములో పుట్టుమచ్చలాంటి ఆకారము
ఏర్పడి ఉండడము స్టీవెన్సన్ గమనించాడు. ఈ విధముగా పునర్జన్మల పరిశోధకుడైన స్టీవెన్ చాలామందికి గతజన్మలలోని
ఏదో ఒక గుర్తు రెండవ జన్మలోనికి మచ్చల రూపములో రావడమును చూచాడు. ఒక శరీరములో ఒక కారణము చేత
ఏర్పడిన మత్స ఆ కారణమును సూచించు గుర్తులాగా, తర్వాత వచ్చు జన్మలలో శరీరము మీద కొన్ని జన్మల వరకు
గానీ లేక అనేక జన్మల వరకు గానీ ఏర్పడుచూ వచ్చునట్లు ఆత్మ చేయగలదు. ప్రతి శరీరము నకు పుట్టుకతోనే ఏదో
ఒక మత్స ఉండును. మత్స లేక మచ్చ అనునది ఆత్మ తెలియజేయు జీవుని యొక్క గతజన్మ గుర్తుయేకాక, శరీరము
దేవుని (పరమాత్మ) స్థానమై ఉన్నదని తెలియజేయు గుర్తుగా కూడా ఉన్నది. మత్స అనునది ఒక విధముగా గతజన్మలోని
ప్రకృతి యొక్క శరీరమును గుర్తు చేయునదికాగా, ఒక విధముగా పరమాత్మ యొక్క ఉనికి శరీరములో కూడా ఉన్నదని
తెలుపుచున్నది.
పునర్జన్మలో మరొక ముఖ్యమైన విషయమును పరిశీలించి చూస్తాము. అదేమనగా! ఒకవ్యక్తి చనిపోయిన
తర్వాత కొంత కాలమునకు తిరిగి పుట్టినట్లు కొందరికి వచ్చిన పునర్జన్మ జ్ఞాపకాల వలన తెలిసిపోయింది. అయితే
చనిపోయిన తర్వాత ఎంత కాలమునకు వారు తిరిగి పుట్టారు? అలా కొంతకాలము తర్వాత పుట్టుటకు కారణమేమి?
చనిపోయిన తర్వాత తిరిగి పుట్టిన కాలము అందరికి ఒకేలాగ ఉన్నదా? అని ప్రశ్నించుకొని చూస్తే ఇంకా కొంత
ఆసక్తికరమైన జ్ఞానము తెలియగలదు. ఇంతవరకు మనము తెలుసుకొన్న కొందరి పునర్జన్మల సమాచారములో వారు
తిరిగి పుట్టిన కాలము ఒక పరిమితిగా లేదు. ఒకరు సంవత్సరము తర్వాత పుట్టితే, ఇంకొకరు ఐదు సంవత్సరముల
తర్వాత పుట్టారు. ఇట్లు ఒక కాలపరిమితి అనునది లేకుండా, అనేకమంది అనేక రకముల కాలములలో పుట్టారు.
ఇప్పుడు కాలపరిమితి మీద దృష్టిపెట్టి వేరువేరు కాలములలో తిరిగి జన్మలు తీసుకొన్న వారిని గురించి వివరించుకొని
చూస్తాము.
ప్రఖ్యాత అమెరికన్ పారా సైకాలజిస్ట్ స్టీవెన్ సన్ సహచరుడు అయిన ప్రొఫెసర్ హెచ్.ఎన్. బెనర్జీ భారతదేశములో
తొలి పారా సైకాలజిస్ట్ అని చాలామందికి తెలియదు. అటువంటి హెచ్.ఎన్. బెనర్జీ స్వయముగా పరిశోధించి పూర్వజన్మ
జ్ఞాపకములు వచ్చిన ఒక బాలిక వృత్తాంతమును ప్రపంచమునకు తెలియజేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రములోని ఛత్రాపూర్
పట్టణములో ఒక సాంప్రదాయ మరియు సంపన్న బ్రాహ్మణ కుటుంబము నందు స్వర్ణలత మిశ్రా అనే పేరుగల
అమ్మాయి 1948లో జన్మించింది. ఆమెకు మూడు సంవత్సరముల వయస్సున్నపుడు ఇమె తండ్రి ఆమెను తీసుకొని
అక్కడికి 160 కిలోమీటర్ల దూరములోనున్న వారి స్వంత ఊరైన కాట్నె అను పట్టణమునకు వెళ్ళడము జరిగింది.
అప్పుడు స్వర్ణలత మిశ్రా కాట్నే పట్టణ శివారు ప్రాంతమునుండి ఒకవైపు వెళ్ళే రహదారిని తన తండ్రికి చూపి, ఆ రోడ్డు
వెంట వెళ్ళితే “జురుకుటియా” అనే గ్రామము వస్తుందని చెప్పింది. ఎన్నడూ ఇల్లుదాటి ఎరుగని తన కుమార్తె,
అందులోనూ మూడు సంవత్సరముల వయస్సు కూడా పూర్తికాని పసిపిల్ల తన ఊరికి 160 కిలోమీటర్ల దూరములోనున్న
ఇంకో ఊరికి వెళ్ళే మార్గమును ఎలా తెలుసుకొన్నదని ఆశ్చర్యపోయాడు.
తండ్రి ఏదో మాట్లాడాలని నోరు తెరిచేలోగా స్వర్ణలత తన తండ్రితో తాను గతజన్మలో జురుకుటియా గ్రామములో
జీవించేదాన్ననీ, తన పేరు బియాపాఠక్ అనీ, తనకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారనీ, తన భర్తపేరు చింతామణి పాండే
అనీ, తనకు గొంతులో వచ్చిన తీవ్రమైన నొప్పికి జబల్ పూర్ పట్టణములోని ఎస్.సి. భారత్ అనే డాక్టరు వైద్యము
చేశాడనీ, కానీ తనకు రోగము ఎక్కువై 1939లో మరణించాననీ వచ్చీరాని మాటలతో చెప్పింది. ఆమె చెప్పిన
మాటలను చాలా ఆసక్తిగా విన్న ఆమె తండ్రి ఆమె చెప్పిన మాటలలోని నిజనిజాలను తెలుసుకోవాలని జురుకుటియాకు
వెళ్ళాడు. స్వర్ణలత చెప్పినట్లుగానే ఆమె గతజన్మ భర్త అయిన చింతామణి పాండేను కలిసి తన కుమార్తె స్వర్ణలత
మిశ్రాకు వచ్చిన పూర్వజన్మ జ్ఞాపకాలను ఆయనకు తెలియజేశాడు. అప్పుడు చింతామణి పాండే తన భార్య బియాపాఠక్
1939లోనే చనిపోయిందని స్వర్ణలత తండ్రికి తెలియజేశాడు. అయితే పాండే, 12 సంవత్సరముల క్రిందట చనిపోయిన
తన భార్య మరలా స్వర్ణలతగా జన్మించిందంటే నమ్మలేకపోయాడు. తర్వాత ఈ విషయము మధ్యప్రదేశ్ అంతటా
ప్రాకిపోయింది. చివరకు ప్రఖ్యాత భారతీయ సైకాలజిస్ట్ హెచ్.యన్.బెనర్జీ దాకా వెళ్ళింది. స్వర్ణలత యొక్క పూర్వజన్మ
వృత్తాంతములోని నిజానిజాలను తెలుసుకోవాలనుకొన్న హెచ్.యన్. బెనర్జీ మొదట స్వర్ణలతను కలిసి, ఆమె గత జన్మలోని
పూర్వజన్మ కుటుంబీకుల వివరాలనూ, ఆమె గతజన్మలో జీవించిన ఇల్లు ఎలా ఉంటుంది మొదలగు విషయములనూ
తెలుసుకొని, తర్వాత జురుకుటియా గ్రామానికి వెళ్ళి స్వర్ణలత చెప్పిన వివరాలతో పోల్చి చూచుకొని, స్వర్ణలత చెప్పినవన్నీ
నిజమేననీ, గత జన్మలోని బియాపాఠక్ ఇప్పుడు స్వర్ణలతగా పుట్టినదనీ నిర్ణయానికి వచ్చాడు. కొంతకాలము గడచిపోగా
స్వర్ణలతకు పది సంవత్సరముల వయస్సు వచ్చినది. ఆ వయస్సులో గత జన్మ జ్ఞాపకముల వలన స్వర్ణలతకు మనశ్శాంతి
లేకుండా పోయినది. ఆ సమయములోనే డాక్టర్ స్టీవెన్ సన్ ఇండియాకు రావడము జరిగింది.
స్టీవెన్సన్ తన మిత్రుడైన బెనర్జీ ద్వారా స్వర్ణలత పునర్జన్మను గురించి తెలుసుకొని ఎంతో ఉత్తేజితుడయ్యాడు. ఆ
విషయము మీద ఆసక్తి కల్గిన స్టీవెన్, స్వర్ణలత గతజన్మ భర్త అయిన చింతామణి పాండేను వెంటబెట్టుకొని స్వర్ణలత ఉ
ంటున్న ఛాత్రాపూర్కు వచ్చి స్వర్ణలతను కలుసుకొన్నాడు. స్వర్ణలత తన గతజన్మ భర్తను చూడగానే గుర్తుపట్టి సిగ్గుతో
తలవంచుకొన్నది. అప్పుడు స్టీవెన్ సన్ పాండేను స్వర్ణలతకు పరిచయము చేశాడు. స్వర్ణలత ఎన్నో గుర్తులను
చెప్పినప్పటికీ, పాండే ఆమెను గతములోని తన భార్యగా అంగీకరించలేదు. దానితో ఆమె అతనిని ఒక విషయమును
అడిగినది. ఆమె పాండేతో "నేను నా బీరువాలో బట్టల అడుగున పెట్టిన 1200 రూపాయలను ఫలానా రోజున మీరు
దొంగిలించలేదా” అని అడిగింది. దానితో పాండే ఖంగుతిన్నాడు. కేవలము తమ దంపతులకు ఇద్దరికీ మాత్రమే
తెలిసిన రహస్యము పది సంవత్సరముల పాపకు ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాడు. దానితో చిన్నపిల్లగానున్న
స్వర్ణలత గతములోని తన భార్యయేనని చింతామణి పాండే ఒప్పుకొన్నాడు. దానితో స్వర్ణలతది పునర్జన్మ అని డాక్టర్
స్టీవెన్సను రుజువైంది. ఈ విధముగా స్వర్ణలత పునర్జన్మ వృత్తాంతము 1950 నుండి 1960 మధ్యకాలములో
ప్రపంచ వ్యాప్తముగా ఎంతో సంచలనమును సృష్టించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రములో పుట్టిన స్వర్ణలత చావుకు పుట్టుకకూ మధ్య కాలము తొమ్మిది సంవత్సరములు గడిచింది.
బియాపాఠక్ 1939లో చనిపోయిన ఆమె 1948లో స్వర్ణలతగా జన్మించింది. ఒకచోట లేకుండా పోయి మరియొక
చోటికి వచ్చిన ఆమె, తొమ్మిది సంవత్సరముల మధ్య కాలములో ఎక్కడున్నది? అని ప్రశ్నరాక తప్పదు. బియాపాఠక్
చనిపోయి స్వర్ణలతగా పుట్టుటకు పట్టిన కాలమే అందరికీ చావు పుట్టుకల మధ్య ఉన్నదా అని చూస్తే అలాగా కూడా
లేదు. బయటపడిన పునర్జన్మలను పరిశీలిస్తే ఒకరికి రెండు సంవత్సరములు, మరియొకరికి మూడు సంవత్సరములు
కాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలవ్యవధి ఉండడమును మనము గమనించ వచ్చును. ఉదాహరణకు మరియొక పునర్జన్మ
సమాచారమును వివరించుకొని చూస్తాము.
మొట్టమొదటి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు కల్పనాచావ్లా పేరు విననివారుండరు. భారతీయ మహిళా
సాహసానికీ, మేధస్సుకూ చిహ్నముగా నిలిచిపోయిన పంజాబ్ రాష్ట్రమునకు చెందిన కల్పనాచావ్లా, అమెరికా దేశానికి
చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA (నాసా) లో పని చేసేది. అంతరిక్షములోనికి ప్రయోగించిన కొలంబియా
స్పేస్ షిప్ లో ఇతర పాశ్చాత్య అంతరిక్ష యాత్రికులతోపాటు అంతరిక్ష యాత్రలో పరిశోధకు రాలిగా పాల్గొని
అంతరిక్షములోనికి ప్రయాణించింది. ఆకాశములోనే కొంతకాలము గడిపి పరిశోధన సాగించిన తర్వాత కొలంబియా
స్ఫేర్షిప్ భూమికి తిరుగు ప్రయాణము మొదలుపెట్టింది. 2003వ సంవత్సరము ఫిబ్రవరి 1వ తేదీన ఇంకో పదహారు
(16) నిమిషములలో భూమిమీద దిగబోతున్న కొలంబియా స్పేన్షిప్ దురదృష్ట వశాత్తు ఊహించని పరిణామముల
వలన ఆకాశములోనే భూమి వాతావరణము లోనికి ప్రవేశిస్తూనే ప్రేలిపోయింది. దానితోపాటు అందులో ప్రయాణిస్తున్న
అంతరిక్ష యాత్రికులందరూ చిన్నచిన్న ముక్కలై చనిపోయారు. భారతీయ వ్యోమగామి కల్పనాచావ్లా కూడా ఆ ఘోర
ప్రమాదములో ప్రాణాలు కోల్పోవడము జరిగింది. అయితే ఆమె తిరిగి కొద్ది రోజులకే తిరిగి భూమి మీద పుట్టడము
జరిగింది.
కల్పనాచావ్లా తిరిగి పుట్టిన సమాచారమును (ఎస్.బి.యన్ 7) ఛానల్ మరియు ఇండియాటుడే పత్రిక, కల్పనాచావ్లా
మళ్ళీ జన్మించిన కథనాన్ని ప్రసారము చేసి ప్రపంచానికి అందించడము జరిగింది. ఆ వివరాలను చూస్తే, ఉత్తర
భారతదేశములో ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోనున్న బుల్లంద్ షహర్ అనే గ్రామములో రాజీకుమార్ అనే సాధారణ వ్యవసాయ
కూలీగా పని చేయుచున్న వ్యక్తి కుటుంబములో అతనికి కుమార్తెగా జన్మించింది. 2003వ సంవత్సరము మార్చి 23వ
తేదీన ఉపాసన అను పేరుతో ఆ కుటుంబమున కల్పనాచావ్లా జన్మించడము జరిగింది. ఉపాసన (కల్పనాచావ్లా)కు
నాలుగు సంవత్సరాల వయస్సులో మాటలు వచ్చాయి. మాట్లాడడమును ప్రారంభించిన ఉపాసన, తాను గతజన్మలో
కల్పనాచావ్లా అను పేరుగల అంతరిక్ష పరిశోధకురాలిననీ, తన తండ్రి పేరు బనార్సీదాస్ యనీ, నాలుగు సంవత్సరముల
క్రితము తాను తోటి అంతరిక్ష పరిశోధకు లతో కలిసి ఒక విమానములో ఆకాశమునుండి దిగివస్తుండగా, తమ
విమానానికి ప్రమాదము జరిగి తామందరము చనిపోయామని చెప్పడము జరిగింది.
గత జన్మ వివరాలను పూసగ్రుచ్చినట్లు చెప్పుచున్న ఉపాసన (కల్పనా చావ్లా) యొక్క పేరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా
క్రమంగా తెలిసి పోయింది. ప్రస్తుతము ఉత్తరప్రదేశ్లోని ఎత్వా జిల్లాలోని “పఠా” అనే గ్రామములో కూలి పని
చేసుకొంటున్న తండ్రి రాజ్కుమార్తో పాటు జీవిస్తున్న ఉపాసన తనను ఇంటర్యూ చేయడానికి వచ్చిన ప్రపంచస్థాయి
మీడియా ప్రతి నిధులతో మాట్లాడుచూ మేము భూమిమీదకు తిరిగి వస్తున్న అంతరిక్షనౌకకు ఆకాశములో సంచరిస్తున్న
ఒక పెద్ద మంచుగోళము గుద్దుకున్నదనీ, దానివలన తమ అంతరిక్షనౌక ప్రేలిపోయి అందులోని తామందరమూ
చనిపోయామనీ చెప్పినది. 2003వ సంవత్సరము ఫిబ్రవరి 1వ తేదీన నాసాకేంద్రము వారు అంతరిక్ష నౌకకు బయటప్రక్కన
చుట్టు అమర్చిన ప్లేటు ఊడిపోయిన దానివలన ఆ నౌక భూమి వాతావరణము లోనికి వస్తూనే వాతావరణ రాపిడి
వేడికి ప్రేలిపోయిందని చెప్పారు. నాసావారను కొన్నట్లు అక్కడ జరగలేదనీ, ఆకాశములో భూమికి 70 కిలోమీటర్ల
దూరములోనే మంచుగోళమునకు అంతరిక్షనౌక గుద్దుకోవడము వలన ప్రమాదము జరిగిందని ప్రత్యక్ష సాక్షి అయిన
కల్పనాచావ్లా చెప్పడము వలన తెలిసిపోయింది.
ఇక్కడ గమనించవలసిన విషయమేమనగా! మనము ముందు చెప్పుకొనిన స్వర్ణలతమిశ్రా యొక్క పునర్జన్మ
సమాచారములో స్వర్ణలత గతజన్మలో 1939 సం॥ లో చనిపోయి తర్వాత 1948 సంవత్సరములో పుట్టినది. దీనినిబట్టి
స్వర్ణలత తిరిగి పుట్టేదానికి తొమ్మిది సంవత్సరములు వ్యవధి కాగా, కల్పనాచావ్లా, ఉపాసనగా పుట్టుటకు కేవలము ఒక
నెల 22 రోజులు మాత్రమే పట్టినది. ఈ విధముగా ఇంతవరకు మనము చెప్పుకొన్న పునర్జన్మ సమాచారములలో
వారు చనిపోయిన కాలమునకు తిరిగి పుట్టిన కాలమునకు మధ్యలో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరములు సమయము
పట్టినది. 29 సంవత్సరముల వయస్సుగల అమెరికన్ నావీఫైటర్ పైలెట్ జేమ్స్ స్టన్ రెండవ ప్రపంచయుద్ధములో
జపాన్తో పోరాడుతుండగా, 1945 మార్చి 3వ తేదీన పసిఫిక్ సముద్రము మీద ఎగురుతున్న అతని విమానాన్ని జపాన్
అర్సెరీ విభాగమునకు చెందిన వారు కూల్చివేశారు. దానిలో జేమ్స్ హాస్టన్ తను నడుపుచున్న యుద్ధవిమానముతో సహా
ముక్కలు ముక్కలుగా మారిపోయి పసిఫిక్ సముద్రములో కలిసిపోయాడు. తర్వాత 1998లో జేమ్స్ హాస్టన్ తిరిగి
జేమ్స్ లెనింజర్గా జన్మించాడు. హాస్టన్ చనిపోయి లెనింజర్ పుట్టడానికి మధ్య గడచిన కాలము ఏకంగా 53
సంవత్సరములు పట్టినది. కల్పన చావ్లా కేవలము 52 రోజులలో తిరిగి ఉపాసనగా పుట్టగా, స్వర్ణలత 9 సంవత్సరములకు
పుట్టగా, లెనింజర్ కేమో 53 సంవత్సరములు పట్టినది. లెబనాన్ దేశములో హాసన్ మరణించిన తర్వాత 10 రోజులకే
సుజన్నే గానెమ్ పుట్టినదని మొదటి సంఘటనలో చెప్పుకొన్నాము. రెండవ జన్మకు రాకముందు మధ్యకాలములో
వీరు ఏమైనారు? ఎక్కడున్నారు? అని యోచిస్తే దానికి మానుండి వచ్చు సమాధానము ఏమనగా!
మానవ శరీరము రెండు భాగములుగా ఉన్నదనీ, ఆ రెండు భాగములు స్థూలభాగము, సూక్ష్మభాగములుగా
గలవనీ ముందే చెప్పుకొన్నాము. దీనికి సంబంధించిన విషయము "మరణ రహస్యము” “జనన మరణ సిద్ధాంతము”
అను గ్రంథములలో కూడా వ్రాసివున్నాము. వాటిలోని సమాచారము ప్రకారము ఒక మనిషి స్థూలముగా చనిపోయి
నప్పటికీ అతను సూక్ష్మముగా బ్రతికేవుండును. అతడు పూర్తిగా చనిపోలేదని అతను పూర్తిగా చనిపోవుటకు
మరికొంతకాలము పట్టునని తెలిసియున్నము. అంతేకాక ఒక మనిషి చనిపోయినప్పటికీ, అది స్థూలమరణము
అయినప్పటికీ, అది తాత్కాలిక మరణమై ఉండుట వలన అతను తిరిగి స్థూలముగా అదే శరీరముతో బ్రతికే అవకాశము
కలదు. అలా ఎందరో చచ్చిపోయిన తర్వాత మూడు నాలుగు రోజులకు లేచినవారున్నారు. ఒక మనిషి సూక్ష్మశరీరమునూ,
స్థూలశరీరమునూ రెండిటినీ వదిలి పోయినప్పుడే అది పూర్తి మరణము క్రిందికి జమకట్టవచ్చును. పూర్తి మరణము
పొందిన వాడు ఒక్కక్షణము (ఒక్క సెకండు) కూడా ఆలస్యము చేయక తిరిగి వెంటనే పుట్టును. ఈ విధానము
బహుశా చాలామందికి తెలియదు. మరణములు మూడు రకములనీ, అందులో ఒకటి అకాలమరణముకాగా, రెండవది
తాత్కాలిక మరణముకాగా, మూడవది పూర్తిమరణమగును. స్థూల శరీరము చనిపోయి సూక్ష్మశరీరము మిగిలివుంటే
అది అకాలమరణమగును. స్థూల, సూక్ష్మశరీరములు రెండూ పోయినపుడు అది మరణమగును. జీవాత్మ శరీరములో
ఉన్నట్లే శరీరములోని ఆత్మ తన పనిని ఆపివేస్తే ఊపిరి నిలిచి పోవును. కానీ అది కూడా మరణము కాదు. ఆత్మ
అనుకొంటే ఎప్పుడైనా అతను లేచి నడువగలడు.
స్వర్ణలతగానీ, జేమ్స్ లెనింజర్గానీ, కల్పనాచావ్లాగానీ, హాసన్గానీ మొదట చని పోయినప్పుడు వారు పూర్తి
మరణమును పొందలేదు. వారు చనిపోయిన ప్పటికీ స్థూలశరీరము పోయి, సూక్ష్మశరీరము మిగిలిపోవడము వలన
అది అకాలమృత్యువైనది. అందువలన వారికి పూర్తిగా చావు వచ్చుటకు వారివారి కర్మనుబట్టి కొన్ని దినములుగానీ,
కొన్ని నెలలుగానీ, కొన్ని సంవత్సరములు గానీ పట్టవచ్చును. అదే విధముగనే స్వర్ణలత చనిపోయిన తర్వాత 9
సంవత్సరములకూ, లెనింజర్కు 53 సంవత్సరము లకూ, కల్పనాచావ్లాకు 52 దినములకు, హాసన్కు 10 దినము లకు
పూర్తి మరణము వచ్చి, అప్పుడు తిరిగి వెంటనే పుట్టారు. అంతవరకు వారు తమ మొదటి జన్మలో ఉన్నట్లే లెక్కించబడును.
మేము ఆధ్యాత్మికవేత్తలమనువారు కొందరు, మనిషి చనిపోయిన వెంటనే పుట్టడనీ, అతను చేసుకొన్న పాపమును
అనుభవించుటకు నరకమునకు, అలాగే పుణ్యమును అనుభవించుటకు స్వర్గమునకు పోయి అక్కడ అనుభవించిన
తర్వాత బ్రహ్మదేవునివద్దకు పోయి, ఆయనవద్ద క్రొత్త వ్రాత వ్రాయించుకొని పుట్టుచున్నారనీ, అందువలన చనిపోయిన
వెంటనే పుట్టక ఆలస్యముగా పుట్టడము జరుగుచున్నదనీ చెప్పుచున్నారు. వీరు చెప్పిన దానికి వారు ఆలస్యముగా
పుట్టిన దానికి వినుటకు సరిపోయినా అది సత్యమూ కాదు, శాస్త్రబద్ధమూకాదు. స్వర్గనరకములు మనిషి యొక్క
జీవితములోనే ఉన్నవి, కానీ మనిషి చనిపోయిన తర్వాతలేవు. చాలామంది ఆధ్యాత్మికవేత్తలందరూ పొరపాటుపడునది
ఇక్కడే. ఒక్క ఇందూ (హిందూ) మతములోనే కాకుండా, మిగతా మతములలో కూడా స్వర్గ నరకములవద్ద అందరూ
తప్పుదారి పట్టిపోయారు. ఇక్కడ అందరూ కొంత ఆలోచించ వలసిన అవసరమున్నది. పోయిన జన్మలోని విషయములను
చెప్పు మనుషులున్నారు గానీ, చనిపోయిన తర్వాత స్వర్గానికిగానీ, నరకానికిగానీ పోయివచ్చామని చెప్పువారు ఎవరూ
లేరు. కల్పనాచావ్లాగానీ, స్వర్ణలతగానీ, జేమ్స్ నింజర్గానీ మరణించిన తర్వాత ఒకరికొకరు ఎంతో వ్యత్యాసముతో
పుట్టారు. అయినా వారిలో 53 సంవత్సరములకు పుట్టిన లెనింజర్ గానీ, 9 సంవత్సరములకు పుట్టిన స్వర్ణలతగానీ,
కేవలము ఒక నెల 22 రోజులకు పుట్టిన కల్పనాచావ్లాగానీ, 10 రోజులకే పుట్టిన హాసన్గా గానీ తాము స్వర్గానికి
పోయినట్లు గానీ, నరకానికి పోయినట్లుగానీ ఎక్కడా చెప్పలేదు. ప్రతి విషయమును గ్రుడ్డిగా నమ్మకుండా కొంత
యోచిస్తే సత్యము తెలిసిపోతుంది. మరణము తర్వాత స్వర్గ నరకములు అసత్యము అని చెప్పుటకు ఆధారమున్నది.
అలాగే స్వర్గ నరకములను మనిషి జీవితములోనే అనుభవిస్తున్నాడనుటకు కూడా ఆధారము గలదు.
నాకు పదిలేక పదకొండు సంవత్సరముల చిన్నవయస్సులోని ఒక సంఘటన బాగా జ్ఞాపకమున్నది. అదేమనగా!
ఒక వ్యక్తి మానసికముగా అన్ని రకముల బాగున్నప్పటికీ అమావాస్యకు, పౌర్ణమికి అతనికి మతి స్థిమితముగా
ఉండేది కాదు. ఆ దినము ఇంటిలో లేకుండా పోయి, బజారులో ఊరకనే కేకలు వేస్తూ తిరిగేవాడు. అతని బంధువులు
అతనిని ఇంటిలో బలవంతముగా ఉంచినా, ఆ రెండు దినములలో ఏమాత్రము ఇంటిలో ఉండేవాడు కాదు. అతను
అలా అరుస్తూ తిరిగేటప్పుడు అతని నోటినుండి ఎక్కువ జొళ్ళు కారేది. అతను ఒక దినము అనారోగ్యముతో
అమావాస్య రోజే బజారులో చనిపోవడము జరిగినది. అతను చనిపోయిన సమయానికి అతనున్న వీధిలోనే వేరేవారి
ఇంటిలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడ శిశువుకు అరగంటవరకు ప్రాణము రాలేదు. ఆ బిడ్డ తల్లి గర్భములోనే చని
పోయిందని వారు అనుకొని ఆ శిశువును పూడ్చిపెట్టేదానికి ఇంటి బయటికి తెచ్చారు. అదే సమయానికి మతిస్థిమితములేని
వ్యక్తి చనిపోవడము జరిగింది. అతను చనిపోయిన వెంటనే అంతవరకు కదలికలు లేని శిశువుకు ప్రాణము వచ్చి
ఏడ్వను మొదలుపెట్టింది. అప్పుడు శిశువు బ్రతికిందని వారు ఇంటి లోనికి తెచ్చుకోవడము జరిగింది. ఇదంతా నేను
ప్రత్యక్షముగా చూచిన విషయమే. తర్వాత ఆ శిశువుకు నాలుగు సంవత్సరముల వయస్సులో మాటలు వచ్చినతర్వాత,
తాను గతజన్మలో ఇదే వీధిలో ఉండేవాడిననీ, తాను అప్పుడు మతిస్థిమితములేని మనిషిననీ, తాను బ్రతికివుండగా ఈ
ఇంటి దగ్గరకు కూడా వచ్చేవాడిననీ చెప్పడమేకాక గతములోని తన ఇంటిలోని వారి పేర్లన్ని చెప్పింది. అప్పుడు
ఆడపిల్ల అలా చెప్పడము ఆమె తల్లిదండ్రులకు ఇష్టములేదు. తమ బిడ్డ పలానా అని తెలిస్తే తమకు గానీ, తమ
బిడ్డకుగానీ గౌరవము ఉండదని ఆ విషయమును ప్రక్కన ఎవరికీ తెలియకుండా చేశారు. అదే ఇంటి ప్రక్కన ఉన్న
నాకు మా ఇంటిలోని వారికి ఆ విషయము తెలుసు. ఒక ఐదారు నెలలు గతజన్మ జ్ఞాపకాలు ఆ అమ్మాయికి
అప్పుడప్పుడు వచ్చేవి. అంతేగానీ అన్ని సమయములో ఆ విషయములు జ్ఞప్తికి వచ్చేవికావు. ఆరునెలలు గడచి పోయిన
తర్వాత ఆమెకు గతజన్మ జ్ఞాపకాలు రాకుండా పోయాయి. ఆమె ఇంటిలోని వారు మతిస్థిమితములేని వ్యక్తి చనిపోయి
దయ్యమై తమ పిల్లలో దూరుకొని అలా చెప్పుచున్నాడని అనుకొనేవారు తప్ప, అతను మళ్ళీ తమ ఇంటిలో పుట్టాడని
అనుకొనేవారు కాదు. అప్పుడు నేను కూడా ఆ చిన్నపిల్లకు మతిస్థిమితము లేని వ్యక్తి ఆవహించి చెప్పుచున్నాడని
అనుకొన్నాను. అయితే నాకు కొంత ఆత్మజ్ఞానము కల్గిన తర్వాత ఇప్పుడది దయ్యముకాదనీ, నిజముగా పునర్జన్మయేననీ
చెప్పుచున్నాను. ఇదంతా చెప్పుటకు కారణమేమనగా! మతిస్థిమితములేని వ్యక్తి చనిపోయిన క్షణములోనే అతను అదే
వీధిలో శిశువుగా జన్మించాడని గుర్తుంచుకోవాలని ఈ విషయమును చెప్పాను. దీనితో, ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే
తిరిగి జన్మిస్తున్నాడనీ అర్థమై పోతున్నది.
భగవద్గీతలో భగవంతుడు చినిగిన వస్త్రమును వదలి క్రొత్త వస్త్రమును ధరించునట్లు, ఒక జీవుడు పాత శరీరమును
వదలి క్రొత్త శరీరమును ధరిస్తున్నాడని చెప్పాడు. అక్కడ ఆయన చెప్పిన మాట శాస్త్రబద్ధమైనది మరియు జీవునికి
ధర్మయుక్తమైనది. భగవంతుడు చెప్పినట్లు పునర్జన్మ జ్ఞప్తికి వచ్చిన వారి విషయములలో శరీర ధర్మములు నిరూపణకు
వచ్చినవి. పాతవస్త్రమును వదలి క్రొత్త వస్త్రమును ధరించినట్లు, పాత శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించినట్లు
అని చెప్పడము, నూటికి నూరు పాళ్ళు మనిషికి పునర్జన్మగలదని చెప్పడమే కదా! గీతలోని అక్షర పర బ్రహ్మయోగమునందు
ఐదు, ఆరు శ్లోకములలో “మరణించు చివరి సమయములో ఎవడైతే నన్నే స్మరించుకొంటూ చనిపోవునో వాడు నన్నే
చేరిపోగలడు. మనిషి ఏయే భావమును స్మరించు కుంటూ చనిపోవునో తర్వాత అదే భావమును పొందుచున్నాడు.
దేవున్ని స్మరించుకొంటూ చనిపోయిన వాడు తిరిగి జన్మించక దేవున్నే చేరిపోవును. ప్రకృతి విషయము లను స్మరించుకుంటూ
చనిపోయినవాడు తిరిగి ప్రపంచములో జన్మించును” అని భగవంతుడు చెప్పినట్లు అర్థమగుచున్నది. ఇట్లు భగవద్గీతలో
అనేకచోట్ల మనిషి పునర్జన్మలను గురించి వ్రాసిన విషయములు గలవు. ఈ విధముగా పునర్జన్మలున్నవని తెలియడమే
కాకుండా మనిషి చనిపోయిన వెంటనే పుట్టుచున్నాడను విషయమును కూడా గీతలో అనేకమార్లు భగవంతుడు చెప్పినట్లు
కలదు.
బ్రహ్మవిద్యా శాస్త్రమైన భగవద్గీత ప్రకారము ఒక జీవుడు చనిపోయిన తర్వాత ఆ క్షణమే జన్మించుచున్నాడనీ,
అలా జన్మించిన తర్వాత పాప పుణ్యములను కష్టసుఖముల రూపముతో జీవితమునందు అనుభవిస్తున్నాడనీ అర్థమగుచున్నది.
గీతను చెప్పిన భారతదేశములోనూ మరియు బైబిలు, ఖురాన్ చెప్పబడిన దేశములలోనూ, అంతేకాక ప్రపంచము
మొత్తము దేశములలోనూ గీతలో చెప్పినట్లే పునర్జన్మలు జరిగినట్లు తెలియడము జరిగినది. దీనివలన గీతమాట
ప్రపంచము మొత్తమునకు వర్తించుచున్నదని తెలియుచున్నది. జరిగిన ప్రత్యక్ష సత్యమునుబట్టి బైబిలులోనూ, ఖురాన్లోనూ
పునర్జన్మలు లేవని చెప్పలేదనీ, అలా చెప్పియుంటే దేవుని మాటకు విరుద్ధముగా జరుగుటకు వీలులేదనీ, జరిగిన ప్రత్యక్ష
ప్రమాణమునుబట్టి, అన్ని మతగ్రంథములలోను చెప్పించిన వాడు ఒక్కడేననీ, ప్రవక్తలు వేరువేరైనా చెప్పబడిన జ్ఞానము
ఒక్కటేననీ, అందువలన చెప్పినదే జరిగినదనీ, జరిగిన దానినిబట్టి పునర్జన్మలున్నవని తెలిసిపోయినది. అంతేకాక
పునర్జన్మలనునవి ఏ మతము వారికీ వ్యతిరేఖమైనవికావు అనుటకు నిదర్శనముగా, అన్ని మతములలోనూ పునర్జన్మలు
జరిగినట్లు, వారిలో కొందరికి గతజన్మ జ్ఞాపకములు వచ్చినట్లు, అవన్నిటిని విచారించగా సత్యమే అయినట్లు తెలిసి
పోయింది. అంతేకాక ఒక ముస్లీమ్ మరొక ముస్లీమ్ ఇంటిలో పుట్టినట్లు, ఒక క్రిష్టియన్ అదే మతమునకు సంబంధించిన
మరొక క్రిష్టియన్ ఇంటిలో పుట్టినట్లు, ఒక ఇందువు (హిందువు) మరొక ఇందువు ఇంటిలో పుట్టినట్లు నిరూపణకు
వచ్చినది. అంతేకాక ఇందువులు, ముస్లీమ్ మరియు క్రైస్తవుని ఇంటిలో పుట్టినట్లు తెలిసినది. దీనినిబట్టి మతము
అనునది బ్రతికిన మనిషికే గానీ, చనిపోయిన వారి వెంట మతము రావడములేదనీ, ఒక మతస్థుడు చనిపోయిన
తర్వాత ఏ మతమునందైనా పుట్టవచ్చనీ, తాను పుట్టిన కుటుంబము ఏ మతమునకు చెందినదో తాను, ఆ మతస్థునిగా
అనుకోవడము జరుగుచున్నదనీ, మతము మనిషి ఏర్పరచుకొన్నదే గానీ, దేవుడు ఏర్పరచినది కాదనీ తెలియుచున్నది.
పరమత ద్వేషము అనునది ఒక మనిషిలో ఉంటే ఆ మనిషి ఏ మతములో పుట్టినా తన మతమును గొప్పగా
చెప్పుకోవడమూ, పరమతమును ద్వేషించడము జరుగుచుండును. ఉదాహరణకు ఒక హిందువు క్రైస్తవ మతమును
ద్వేషించేవాడైతే, అతను పునర్జన్మలో క్రైస్తవునిగా పుట్టితే తన క్రైస్తవమతమును గొప్పగా చెప్పుకొనుచూ, హిందూమతమును
ద్వేషించుచుండును. గతజన్మలో హిందూమతమును గొప్పగా చెప్పుకొని క్రైస్తవమును దూషించినవాడు చనిపోయి,
తిరిగి క్రైస్తవునిగా జన్మించి క్రైస్తవమును పొగడుచు హిందూత్వమును దూషించడము నకు కారణము అతనిలోని పరమత
ద్వేషము అను గుణ ప్రభావమేగానీ వేరుగాదు. దీనినిబట్టి మతములు మనిషి జీవితమునకు హద్దులను ఏర్పరచు
చున్నవిగానీ, మనిషి జన్మలకు హద్దులను ఏర్పరచలేవని తెలియుచున్నది. అందువలన ఒక జీవితమునకే పరిమితమైన
మతమును వదలి, అన్ని జన్మలకు సంబంధమైన దేవున్ని తెలుసుకోమని తెలుపుచున్నాము.
పునర్జన్మను గురించి కొంత వివరమును ఇంతవరకు తెలుసు కొన్నాము. ఎవనికైనా వాని పునర్జన్మ విషయము
తెలియాలంటే వానిలోని ఆత్మ తెలుపవలసిందేగానీ, ఆత్మ తప్ప ఎవరూ తెలుపుటకు వీలులేదు. ఎవనిలోని ఆత్మయినా
వాని మాట వినదు. ఎవనిలోని ఆత్మయినా వాని కర్మనుబట్టి స్వయముగా పని చేయగలదుగానీ, జీవాత్మ చెప్పినట్లుగానీ,
మనస్సు కోరినట్లుగానీ నడుచుకోదు. శరీరములో ఆత్మ స్వతంత్రమైనది. ఆత్మ తన ఇష్టముతో తెలియజేస్తే గతజన్మ
వివరము తెలియగలదు. అట్లుకాక జీవుడు కోరితే ఆత్మ ఏమాత్రము తెలియజేయదు. నీవు నీ శరీరములోని ఆత్మను
పూజించి అడిగినా, నమస్కరించి అడిగినా, ఆత్మ జీవాత్మ యొక్క మాట వినదు, నీ ఆత్మకు నీ వెనుకటి జన్మలు బాగా
తెలిసివుండినా ఏమాత్రము వెనుకటి జన్మను గురించి నీకు తెలియజేయదు. ఆత్మ నీ మాటనే విననప్పుడు, ఎవడో
ప్రక్కనోడు చెప్పితే వాని మాట వింటుందా? నీ ప్రక్కనోడు దేశానికి రాజైనా, ప్రపంచానికి ప్రాముఖ్యుడైనా ఎవని మాటా
వినదు. అందువలన ఎవడుగానీ తమ ఇష్టము ప్రకారముగానీ, ఇతరుల ఇష్టప్రకారముగానీ తమ గతజన్మను గురించి
తెలుసుకొనిన వాడులేడు. అయితే ఇప్పుడు కొందరు ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! ప్రస్తుతకాలములో
కొందరు ఉన్నత చదువులు చదివిన డాక్టర్లు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి అను విధానముతో కొందరి గతజన్మ విషయములను
వారి ద్వారానే చెప్పించుచున్నారు కదా! దానిని గురించి మీరు ఏమంటారు అని అడుగవచ్చును. దానికి మా
సమాధానము ఇలా ఉంది. ఈ మధ్య కాలములో "మా" టీవి ఛానల్లో కొంతకాలము, ఎం.డి చదివిన డాక్టరు
ఒకాయన కొందరి చేత వారికి తెలియకుండానే వారిచేత వారియొక్క గత జన్మ విషయములను చెప్పించడమును నేను
కూడా చూచాను. ఆ డాక్టరుగారు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరఫి ద్వారా ఇతరుల పూర్వజన్మల విషయములను వారి ద్వారానే
చెప్పించవచ్చునని చెప్పడము కూడా విన్నాను. ఆయన పెద్ద చదువు చదివిన ఎం.డి. డాక్టరు కనుక ఆయన చెప్పే
మాటను ఎవరైనా సులభముగా నమ్మగలరు. ఒక రోగము యొక్క నివారణకు గల వైద్య విధానమును థెరపి అంటారు.
మనిషికి అనేక రక రోగములున్నవి. అలాగే వాటిని నివారణ చేయుటకు అనేక మెడికల్ థెరపీలు కూడా ఉన్నవి.
గతజన్మ విషయములను మనిషి చేత చెప్పించడము కూడా ఒక విధానము, కావున డాక్టర్లు దానిని థెరపి అనడము
జరిగిందేమో! హైదరాబాద్లో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు పాస్ట్ఫ్ రిగ్రేషన్ థెరపిస్టులుగా ఉన్నారు. అటువంటి బోర్డు
పెట్టుకొన్న ఒక డాక్టరు వద్దకు పోయి వారి థెరపిలోని వివరమేమిటో తెలుసుకోవాలనుకొన్నాము. వెంటనే అతనికి
ఫోన్ చేసి నాకు నిద్రరావడములేదు మీరు మీకు తెలిసిన పద్ధతిలో నాకు నిద్ర వచ్చేటట్లు చేయగలరా అని అడిగాను.
అప్పుడు ఆయన తప్పకుండా చేయగలను, కానీ నా ఫీజు మీకు తెలుసా అని అడిగాడు. మీరు చెప్పితే తెలుస్తుంది అని
చెప్పాము. అప్పుడు 5 వేలు ఇమ్మని చెప్పాడు. మరుసటి దినము ఐదువేలు తీసుకొని పోయి అతనికి ఇచ్చి, అక్కడ
ఆయన ఏ విధానమును ఉపయోగిస్తున్నాడో గమనించాము. సాధారణ వ్యక్తిగా పోయిన నన్ను చూచి మీరు వారము
దినముల వరకు వస్తే మీకున్న నిద్రలేమి పోవునని చెప్పాడు. ఆ దినము అక్కడ ఆయన దగ్గర ఉదయము 11
గంటలనుండి మధ్యాహ్నము రెండు గంటల వరకు ఉండడము జరిగింది. అప్పుడు మా సమక్షములో చాలామంది
అనేక సమస్యలతో వచ్చారు. అందులో గతజన్మ విషయములను ఒకరి ద్వారా చెప్పించడము మేము దగ్గరనుండి
చూడడము జరిగింది. అంతేకాక ఆ డాక్టరు గారు ఎలా చెప్పించగలుగుచున్నాడో కూడా చూడగలిగాము.
అప్పుడు మాకు అర్థమైన దానినిబట్టి మేము ఆ డాక్టరుగారిని కొన్ని ప్రశ్నలు అడిగాము. మేము సర్వసాధారణ
జ్ఞాన విషయాలకు సంబంధించిన ప్రశ్నలను మాత్రమే అడిగాము. గతజన్మ విషయములను గురించి అడగ లేదు.
ఆయన చెప్పిన సమాధానములను బట్టి సర్వసాధారణ జ్ఞానము కూడా ఆయనకు తెలియదని మాకు అర్థమైనది.
ఆత్మంటే ఏమిటో, ఆత్మ జ్ఞానమంటే ఏమిటో తెలియని ఆయనగారు వెనుకటి జన్మ సమాచారమును ఇతరుల చేత
చెప్పించడము మాకు ఆశ్చర్యమును కలిగించింది. ఇప్పటికే ఎందరో స్వామీజీల వేషముతో ప్రజలను మోసము చేస్తుండగా,
స్వామీజీగా కాకుండా డాక్టరుగా ఉంటూ సరిక్రొత్తగా పాన్టైప్ రిగ్రేషన్ థెరపి అను పేరుతో ప్రజలను మభ్యపరచడమూ,
తాము గొప్ప అనుపించుకోవడమూ, మాకు వింతగా కనిపించింది. వారికి తాము చేయుచున్నది దైవజ్ఞాన విరుద్ధమైనదనీ,
ప్రజలను మోసగించడమనీ తెలుసో, తెలియదో, కానీ ప్రజలు మాత్రము నూటికి నూరుపాళ్ళు మోసపోవుచున్నారు.
వారు చేయుచున్నది ప్రజలను మభ్యపరచుచున్నారని ఎలా చెప్పుచున్నామనగా! మనుషులలో మనస్సు అనునది
ఒకటున్నదనీ, దానికి రెండు పనులున్నాయనీ తెలుసు కొన్నాము కదా! అటువంటి మనస్సు కొందరిలో బలముగా,
కొందరిలో బలహీనముగా ఉండును. అటువంటి మానసిక బలహీనులను సైకాలజిస్ట్ అయిన డాక్టర్లు గుర్తించగలరు.
వారి మనస్సును తమ ఆధీనములోనికి తెచ్చుకొందురు. తమ ఆధీనములోనికి ఇతరుల మనస్సును తెచ్చుకోవడమునే
నేడు నవీన భాషలో హిప్నటైజ్ చేయడము అంటాము. ఒక మనిషిని హిప్నటైజ్ చేయగల వ్యక్తి ఎదుటి మనిషియొక్క
మనస్సు తమమాటకు పలుకునట్లు, తమ ప్రశ్నలకు జవాబును చెప్పునట్లు చేసుకొందురు. ఇక్కడ ప్రతి ఒక్కరూ
గమనించతగిన విషయమేమనగా! ఏమాటకైనా జవాబు చెప్పు స్థోమత, విజ్ఞత శరీరములో ఒక్క బుద్ధికి మాత్రమే
ఉండును. మనస్సుకు జవాబుచెప్పు స్థోమత లేదు. అటువంటపుడు హిప్నటైజ్ అయినవారు హిప్నటైజ్ చేసిన వ్యక్తులు
అడిగిన ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్పగలుచున్నారని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. దానికి జవాబు ఏమనగా!
ఇటువంటి ప్రశ్నరావాలనే నేను కూడా అనుకొంటున్నాను. ప్రశ్న వచ్చినపుడే ఆ విషయము శ్రద్ధగా చూడగలరు.
హిప్నటైజ్ అను ఆంగ్లభాషకు తెలుగులో సమ్మోహనము అను అర్ధము రాగలదని అనుకుంటాను. ఒక మనిషి
చేత హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి హిప్నటైజ్ చేసిన వ్యక్తి ఎలా చెప్పితే అలా వినును. ఇక్కడ జీవునికి ఏమాత్రము
సంబంధముండదు. సమ్మోహనము (హిప్నటైజ్) చేయబడిన వాని మనస్సు మాత్రము, హిప్నటైజ్ చేసిన వాడు చెప్పే
మాట ప్రకారము లేక అతను తలచే ఉద్దేశము ప్రకారము ప్రవర్తించగలదు. జీవున్ని ఏమీ తెలియని నిద్రలాంటి
స్థితిలోనికి పంపి, మనస్సును మాత్రము తమ స్వాధీనములోనికి తెచ్చుకోవడమును హిప్నటైజ్ అని విశదీకరించుకొని
చెప్పవచ్చును. శరీరములోని ఒక్క మనస్సు మాత్రమే హిప్నటైజ్ కావడము వలన హిప్నటైజ్లో జరిగేవి ఏవీ జీవునికి
తెలియవు, అలాగే బుద్ధికి కూడా తెలియవు. హిప్నటైజ్ చేయబడిన వ్యక్తి యొక్క మనస్సు హిప్నటైజ్ చేసిన వ్యక్తి
ఆధీనములో ఉండుట వలన, అతడు బయటికి వినుపించునట్లు చెప్పే మాట ప్రకారముగానీ, లోపల వినిపించకుండా
చెప్పే మాట ప్రకారముగానీ నడుచుకొనును. ఇక్కడ బాగా అర్థము చేసుకొనుటకు ఒక ఉదాహరణను తెలియజేస్తాను
చూడండి. హిప్నటైజ్ చేసిన వ్యక్తి హిప్నటైజ్ అయిన వ్యక్తితో ప్రక్కనున్న వారంతా వినునట్లు పోయిన జన్మలో నీవు
ఎంతకాలము బ్రతికావు అని అడిగాడు. అప్పుడు హిప్నటైజ్ అయిన వ్యక్తి కళ్ళు మూసుకొనివుంటూ, అడిగిన ప్రశ్నకు
నేను గతజన్మలో 60 సంవత్సరములు బ్రతికాను అని చెప్పాడు. ఎలా చనిపోయావు అని అడిగితే దానికి జవాబుగా
నేను నీటిలో మునిగి చనిపోయానని చెప్పాడు. ఇక్కడ అడిగిన రెండు ప్రశ్నలకు రెండు జవాబులను హిప్నటైజ్ అయిన
వ్యక్తి చెప్పాడు. ప్రక్కనుండి చూచిన వారికి హిప్నటైజ్ చేసిన వ్యక్తి అడిగిన ప్రశ్నలు తెలుసు, హిప్నటైజ్ అయిన వ్యక్తి
చెప్పిన జవాబులు తెలుసు. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని రహస్యము ఒకటున్నది. అదేమనగా! మనస్సుకు
జవాబు చెప్పు స్థోమత లేదని ముందే చెప్పాము కదా! దానిప్రకారము హిప్నటైజ్ అయిన వ్యక్తి జవాబును స్వయముగా
చెప్పలేదు. అయితే మనము చూస్తున్నట్లే జవాబు వచ్చింది. అయితే ఎలా జవాబు వచ్చిందనగా ! ఎవరైతే ప్రశ్నించారో
అతనే ఎదుటి మనిషి శరీరములోని మనస్సు ద్వారా జవాబును చెప్పునట్లు చేశాడు. ప్రశ్నించిన వ్యక్తి తన మనస్సులో
ఏ జవాబును అనుకొనుచున్నాడో అదే జవాబు హిప్నటైజ్ అయిన వ్యక్తి ద్వారా వచ్చుచున్నది. ఇదంతా ఎలాగున్నదనగా!
మిమిక్రి చేసే వ్యక్తి, నోరు కదలాడే ఒక బొమ్మను అందరికి కనిపించునట్లు తనవద్దవుంచుకొని, నీవు ఏమి తిన్నావు అని
అందరికి వినిపించేటట్లు బొమ్మను ప్రశ్నించును. అప్పుడు ఆ బొమ్మ తన నోరును మెదిలిస్తూ బ్రెడ్ తిన్నాను అని
జవాబు చెప్పును. అక్కడ చూచేవారికి అతను అడిగిన ప్రశ్నకు బొమ్మ జవాబు చెప్పిందని అనుకొందురు. కానీ
వాస్తవానికి ఎవడైతే ప్రశ్నించాడో, ఆ ప్రశ్నకు జవాబును కూడా అతనే చెప్పాడు. అయితే ఆ విషయము ఎవరికీ
తెలియనట్లు తాను నోరు మూసుకొని జవాబును మనము వినేటట్లు చెప్పుట వలన నోరు కదిలించు బొమ్మే చెప్పిందని
ఎవరైనా అనుకోగలరు. మిమిక్రీ ఆర్టిస్టు వద్ద బొమ్మ మాట్లాడము ఎంత సత్యమో, హిప్నాటిస్ట్వద్ద కళ్ళు మూసుకొన్న
మనిషి మాట్లాడము కూడా అంతే సత్యమగును.
ఇప్పుడు సూత్రము తెలిసిపోయింది. దానిప్రకారము ఎన్ని లెక్కలైనా చేయవచ్చునన్నట్లు మిమిక్రీ ఆర్టిస్టు పనిని
పోలికగా తీసుకొని హిప్నటైజ్ చేయువారు ఇతర మనిషి చేత మాట్లాడించుచున్నారు. మిమిక్రీ కళాకారుడు చేయుపనిలో
ప్రశ్న జవాబు మిమిక్రి చేయువానివే అయివున్నట్లు, హిప్నటైజ్ అయినవారిలో కూడా ప్రశ్న జవాబు హిప్నటైజ్ చేయువానివే
అయివుండును. మిమిక్రి చేయువారివద్ద నోరు మెదిపి మాట్లాడునది గుడ్డబొమ్మకాగా, హిప్నాటిస్ట్ వద్ద మాట్లాడునది
తోలుబొమ్మ. మిమిక్రీ ఆర్టిస్టు తన ప్రశ్నను బహిరంగముగా అడిగి, జవాబును మాత్రము గోప్యముగా చెప్పినట్లు ఒక
హిప్నాటిస్ట్ కూడా తన ప్రశ్నను బహిరంగముగా అడిగి జవాబును మాత్రము గోప్యముగా, కళ్ళుమూసుకొనివున్న వ్యక్తి
చేత చెప్పించుచున్నాడు. ఎదుటి వ్యక్తి కళ్ళుమూసుకొని మాట్లాడుటకు కారణమేమి అని ఎవరూ యోచించడములేదు.
అంతేకాకుండ, ప్రశ్నించు మనిషియొక్క మనో భావమునకు సంబంధించిన జవాబులు ఎదుటి మనిషిలో రావడమును
ఎవరూ గమనించడము లేదు. ప్రశ్నలు అడుగువ్యక్తి గొప్ప డాక్టరు అయిన దానివలనా మరియు వారు చేయు
మోసమునకు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి అని పేరు పెట్టివుండడము వలనా అందరూ దానిని నమ్మడము జరుగుచున్నది.
పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి చేయగలమని చెప్పుచున్న డాక్టర్లకు ఏమాత్రము ఆత్మజ్ఞానము లేనిదానివలన, వారి
జవాబులను బట్టి వారి అజ్ఞానము బయటపడిపోవుచున్నది. ఆత్మజ్ఞానములేని వారిని ఎందరినైనా నమ్మించవచ్చునేమోగానీ,
ఆత్మజ్ఞానమున్న ఎవరినీ, వారు తమ థెరపినీ చూపి నమ్మించలేరు. దానికి ఒక ఉదాహరణగా మేము చూచిన
విషయమును చెప్పెదము చూడండి. మాటీవి లో ప్రసారమయ్యే పాస్ట్ఫ్ రిగ్రేషన్ థెరపిని చూచాను. ఒక ఎం.డి
డాక్టరు ఒక మహిళను బల్లమీద పడుకోమని చెప్పి ఆమెను మనము చూస్తున్నట్లే హిప్నటైజ్ చేశాడు. అప్పుడు ఆమె
అపస్మారకస్థితిలోనికి వెళ్ళి పోయింది. కానీ ఆమె మనస్సు మాత్రము ఆమె శరీరమునుండి మాట్లాడగలుగుచున్నది.
అప్పుడు ఆ డాక్టరుగారు ప్రశ్నిస్తుండడము, జవాబు కళ్ళుమూసుకొన్న ఆ మహిళ చెప్పడము టీవిలో కనిపిస్తున్నది.
ఆమె జవాబులో గతజన్మలో ఆమె ఒక లంబాడీ (సుగాలీ) ఇంటిలో జన్మించినదనీ, పెళ్ళైన తర్వాత భర్త త్రాగుబోతని,
ఆమెను ప్రతి దినము హింసించేవాడనీ, ఒక దినము ఆమె చిన్న శిశువుగానున్న కొడుకు ఏడుస్తుంటే పాలు ఇచ్చే దానికి
పోయినపుడు, పిల్లవానికి పాలు ఇవ్వకుండా ఆమె భర్త కామవాంఛ తీర్చుకొనేదానికి లాక్కెళ్ళాడని, అటువంటి భర్తతో
కాపురము చేయలేక ఇల్లు వదలి పారిపోయిందనీ, అలా పారిపోయినది ఒక మామిడితోటలో తలదాచుకొన్నదనీ చెప్పింది.
డాక్టరుగారు అడిగే ప్రశ్నలకు ఆమె జవాబు చెప్పుచున్నది. కానీ ఆ కథయంతా డాక్టరుగారు అల్లినదేనని అర్థమైనది.
చిన్న బిడ్డ పాలు త్రాగేదానికి ఐదు నిమిషములు కూడా పట్టదు. ఆ అయిదు నిమిషములు కూడా ఓపికపట్టలేని కసాయి
తండ్రి ఎవరూ ఉండరు. ఇలా ప్రపంచములో జరుగని విషయములను కూడా అల్లి చెప్పడము వలన అది అంతా
కట్టుకథ అని అర్థమై పోయినది. ఆ కథలో చివరికి ఆమె చనిపోవు సమయానికి ఆమె కొడుకు పెళ్ళికాని యువకుడుగా
ఉన్నాడట. తర్వాత ఆమె చనిపోయి ఇక్కడ పుట్టి దాదాపు యాభైసంవత్సరముల వయస్సులో ఉన్నది. ఆమె భర్త కూడా
అక్కడే ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అయితే ఆమె చెప్పిన గతజన్మ కథలో ఆమె చనిపోయినపుడు యువకునిగానున్న
ఆమె కొడుకు ప్రస్తుత జన్మలో ఆమెకు భర్తగా ఉన్నాడని చెప్పడము జరిగింది. ఈ మాట వినేదానికి విడ్డూరముగా
ఉండడమే కాకుండా పూర్తి అసత్యమని కూడా తెలియుచున్నది. ఎందుకనగా! ఆమె చనిపోయినపుడు ఆమె కొడుకు
యువకునిగా, ఆరోగ్యవంతునిగా ఉన్నాడు. ప్రస్తుత జన్మలోనున్న భర్త ఆమెకంటే కొంత పెద్దవయస్సులో ఉన్నాడు.
ఆమె చనిపోయినపుడు బ్రతికేవున్న ఆమె కుమారుడు ఆమెకంటే ముందు చనిపోలేదు కదా! అటువంటపుడు ఆమెకంటే
పెద్దవయస్సు భర్తగా ఆమె కొడుకు ఎలా పుట్టగలడు? ఆమెకంటే ముందు పుట్టేదానికే అవకాశము లేనివాడు, ఆమెకంటే
ఎక్కువ వయస్సు భర్తగా ఎలా ఉండగలడు? అతను చెప్పించిన మాట పూర్తి అసత్యమైనదని చిన్న పిల్లవాడుకూడా
చెప్పగలడు. ఇటువంటి కట్టుకథల వలన పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి అనునది పూర్తి అసత్యమని తెలియుచున్నది.
అదే డాక్టరుగారు మరియొక వ్యక్తిచేత అతని గతజన్మ జ్ఞాపకమును చెప్పించినపుడు పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి
అను పేరుతో అసత్యమును ప్రచారము చేయుచు తాను గొప్ప విధానమును తెలిసిన వ్యక్తిగా ప్రచారమై పోవుచున్నాడని
అర్థమౌవుచున్నది. అటువంటి సంఘటన ఇంకొకటి ఉన్నది చూడండి. ఒక సినీ నటుని చేత గతజన్మ వివరములను
చెప్పించు సమయములో ప్రశ్నించే డాక్టరు, జవాబు చెప్పే సినీ నటుని కొన్ని ప్రశ్నలను అడుగుచూ చివరకు ఒక ప్రశ్న
అడిగాడు ఆ ప్రశ్న సర్వసాధారణముగా ఉండినా జవాబు మాత్రము పూర్తి అసత్యమైనదని ఎవరికైనా అర్థము కాగలదు.
ఆ జవాబులో ఆ సినీనటుడు గత జన్మలో క్రైస్తవప్రవక్త అయిన ఏసుప్రభువుగా ఉంటినని చెప్పాడు. ఆ మాటను
సాధారణమైన మనుషులు నమ్మవచ్చునేమో గానీ, మాకు మాత్రము అది అసత్యమైన మాట అని ప్రత్యక్షముగా తెలిసి
పోయింది. ఏసుప్రభువు ఒక మతమునకే ప్రవక్తగా ఉండి ఎంతో జ్ఞానమును బోధించాడు. అటువంటివాడు తిరిగి
పుట్టితే అతనిలో పూర్తి జ్ఞానము కనిపించును. కానీ దైవధర్మములు అంటే ఏమిటో తెలియని వ్యక్తి తాను ఏసుప్రభువునని
చెప్పుకోవడము ఎలా ఉందంటే మాంసము తినే పులి నేను గడ్డిని తినే ఆవునని చెప్పుకొన్నట్లున్నది. ప్రభువు అందరి
వలె జన్మకు వచ్చువాడు కాదు. ఒకవేళ వస్తే భూమిమీద జ్ఞానమును బోధించే దానికే వస్తాడుగానీ, బ్రతుకుతెరువు
కొరకు సినిమాలలో నటించే దానికిరాడు. సినిమాలలో నటించే వ్యక్తి చేత ఏసుప్రభువు యొక్క గొప్ప తనము తెలియని
డాక్టరుగారు తాను ఏసుప్రభువునని తనమాటను సినీ నటుని చేత చెప్పించడము పెద్ద పొరపాటు. దానితో అతని
మాట అబద్దమని తెలిసిపోవడమేకాక, అతను ఏమాత్రము దైవసూత్రములు తెలియని వ్యక్తి అని కూడా తెలిసిపోయింది.
ఇలాంటిదే నాకు తెలిసిన పూర్తి అసత్యము మరొకటి హిప్నటైజ్ చేయు డాక్టరుగారిచేత బయటపడింది. ప్రశ్నించువాడే
జవాబును చెప్పించు చుండును. కావున తనకు తెలిసిన దానినే హిప్నటైజ్ అయిన వ్యక్తిచేత చెప్పించడము జరుగుచున్నది.
అలాంటపుడు చెప్పించువారి నిజస్వరూపము బయటపడగలదు. చెప్పేవాడు చెప్పిన మాటలన్నీ అడిగే వానివే అని
తెలియకపోవడవడము వలన ప్రతి ఒక్కరూ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి అను దానిలో మభ్యపడిపోవుచున్నారు. ఇప్పుడు
నాకు అసత్యముగా తోచిన మాట అందరికీ సత్యముగా ఒప్పుకొను విషయమును చూస్తాము. ఇందులో ఆ డాక్టరుగారి
మాట అసత్యముగా కనిపించదు గానీ, నా మాటయే అసత్యముగా కనిపించును. అటువంటిది ఏదనగా! సర్వ
సాధారణముగా ప్రజలందరూ ఒక అసత్యమును సత్యముగా నమ్ముచున్నారు. మేధావులూ, విజ్ఞానులూ, భౌతికశాస్త్రవేత్తలము
అనిపించుకొన్నవారూ అందరూ ఒక జన్మ విషయములో ఉన్న సత్యము గమనించక, లేని అసత్యమును సత్యమను
కోవడము జరుగుచున్నది. మనిషి జన్మించు క్షణములలో ఏమి జరుగు చున్నదో తెలియలేక తప్పుగా అసత్యమును
సత్యముగా నమ్మడము జరుగుచున్నది. జనన సమయ విషయములో మాత్రము ఒక విధముగా అందరూ పప్పులో
కాలు వేశారనే చెప్పవచ్చును. అందరూ గర్భస్థ శిశువుకు ప్రాణమున్నదని అనుకోవడము జరుగుచున్నది. కానీ గర్భస్థ
శిశువుకు ప్రాణము లేదనుమాట సత్యమను విషయము బహుశా ఎవరికీ తెలియదు. ఇదే విషయమునే మేము “జనన
మరణ సిద్ధాంతము” అను గ్రంథములో శాస్త్రబద్ధమైన నిరూపణలతో సిద్ధీకరించి వ్రాయడము జరిగినది.
మనిషి యొక్క జననములో ఏమి జరుగుచున్నదో ప్రత్యక్షముగా తెలిసినా దానిలోని సత్యము కనిపిస్తూవుండినా,
తల్లి గర్భములోనే ఐదవ నెలలో ప్రాణము వస్తున్నదని ఆధ్యాత్మిక వాదులు కొందరనుచుండగా, విజ్ఞానము తెలిసినవారు
కొందరు వీర్య కణములోనే ప్రాణమున్నదనీ, తల్లి గర్భము ధరించినప్పటినుండి శిశువుకు ప్రాణమున్నదని అనుచున్నారు.
ఈ విధముగా విజ్ఞానులూ, జ్ఞానులూ పొరపడిపోవడము వలన మనిషి యొక్క జనన సమయము జగమెరుగని సత్యమనీ,
ఈ విషయములో అందరూ అసత్యమునే సత్యమనుకోవడము జరుగుచున్నదనీ మేము జనన సిద్ధాంతములో తెలియజేశాము.
ఆ విషయములో అందరూ ఎలా పొరపడుచున్నారో విశదముగా తెలియజేశాము. మేము చెప్పుచున్న మాట సరియైన
దని అందరికీ తెలియుటకు శాస్త్రబద్ధమైన నిరూపణలను చూపించాము. ఇదే జనన విషయమును పాస్ట్ లైఫ్ రిగ్రేషన్
థెరపి అను దాని ప్రకారము హిప్నటైజ్ చేయబడిన వ్యక్తిచేత హిప్నటైజ్ చేసిన వ్యక్తి చెప్పించునపుడు చెప్పుమనిషి,
ఉన్న సత్యమును చెప్పక అసత్యమును చెప్పుచున్నాడంటే అది చెప్పించు వ్యక్తి యొక్క లోపమనీ, అతనికి సత్యము
తెలియకపోవడము వలన అలా చెప్పించడము జరిగినదని తెలిసిపోవుచున్నది. పాస్ట్ లైఫ్ (గతజన్మ) లో ఏమి జరిగినది,
ఆ మనిషి యొక్క ఆత్మకు తెలుసుగానీ, ప్రస్తుత జన్మలోనున్న మనస్సుకు తెలియదని చెప్పకొన్నాము. ఆత్మ గత జన్మలో
కూడా జీవుని వెంట ఉన్నది, మనస్సు గతజన్మలో లేదు. కావున గతజన్మ విషయముగానీ, గతజన్మలో చనిపోయిన
సమయములోని విషయముగానీ, అలాగే ప్రస్తుత జన్మలో పుట్టిన సమయములో జరిగిన విషయమునుగానీ, అన్నిటినీ
ఆత్మ చెప్పగలదు. ఆత్మ ఎవరి మాట వినదు, అందువలన ఎవరి మాటకూ జవాబును చెప్పదు. ఎదుటి మనిషియొక్క
ప్రశ్నకు హిప్నటైజ్ అయిన మనిషిలోని మనస్సు మాత్రము జవాబు చెప్పును. ఆ మనస్సుకు గతజన్మ విషయములు
తెలియకుండపోవడము వలనా, అలాగే జనన సమయములో జ్ఞప్తి లేని దానివలనా, ఆ విషయములను మనస్సు
చెప్పలేదు. అటువంటపుడు ఎదుటి మనిషి చెప్పించినట్లు ఏమి చెప్పితే దానినే చెప్పగలదు.
ఒక దినము హిప్నటైజ్ చేసిన వ్యక్తి, హిప్నటైజ్ అయిన వ్యక్తిని కొన్ని ప్రశ్నలడుగుచూ ఒక సమయములో. “నీవు
తల్లి గర్భమునందు ఉన్నప్పుడు ఐదవనెలలో ఏమి చేశావు? ఎలాగుండేది? అని అడిగాడు. అప్పుడు కళ్ళుమూసుకొని
పడుకొనివున్న వ్యక్తి తాను తల్లిగర్భములో చాలా ఇబ్బంది పడినట్లు, అప్పుడు గతజన్మలోని కొన్ని విషయములు జ్ఞాపకము
వచ్చినట్లు, రాబోవు జన్మలో ఎలా ఉండవలెనో ముందే నిర్ణయించుకొన్నట్లు చెప్పడము జరిగినది. అలా చెప్పడము
మాకు ఒక విధముగా ఆశ్చర్యమైనా అది చెప్పే మనిషి యొక్క మాట కాదనీ, అడిగే మనిషి యొక్క మాటేనని అర్థమైపోయినది.
ఎందుకనగా! చెప్పే మనిషికి గర్భస్థ జీవనము అసలుకు లేదు. లేనిదానిని ఉన్నదని ఆ మనిషి ఎలా చెప్పగలడు?
దానివలన లేనిదానిని చెప్పించడము జరుగుచున్నదనీ, అందులోని అసత్యము, చెప్పించే మనిషిదేనని అర్థమగుచున్నది.
గర్భస్థ జీవన విషయములో అందరూ పొరపడినట్లే హిప్నటైజ్ చేసిన వ్యక్తి కూడా పొరపడివుండడము వలన అతని
ఉద్దేశమునే ఎదుటి మనిషి చేత చెప్పించాడని తెలిసిపోయినది. ఇక్కడ కొందరు ప్రశ్నలు అడుగుటకు అవకాశము
గలదు, అదేమనగా! అలా ఎందుకు చెప్పించుచున్నారు? అలా చెప్పించడము వలన వారికేమి లాభము? అని కొందరు
ప్రశ్నించవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా!
ఈ విధముగా “పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి" అని వైద్య వృత్తిలోనున్న డాక్టర్లు మాత్రము చేయడము గమనించదగిన
విషయము. అలా చేయడము ప్రస్తుత జన్మలోని రోగమునకు వెనుకటి జన్మలోని ఏదో ఒక కారణమును చెప్పించి,
దానివలన ఈ రోగము వచ్చిందని నమ్మించి, వెనుకటి జన్మలోని కారణమునకు తగినట్లు చికిత్స చేస్తే ఆ రోగము
నయమై పోగలదని చెప్పి, అలా వెనుకటి కారణమును తెలుసుకొని చికిత్స చేయుట అందరి వైద్యుల చేతకాదనీ,
తాముమాత్రము అలా చేయగలమని ప్రచారమగుచున్నారు. అంతేకాక అలా వెనుకటి జన్మలోని కారణములను తెలియక
చికిత్స చేసినా
ఆ రోగములు నయముకావనీ, అవి దీర్ఘకాల రోగములుగా ఉండిపోవుననీ చెప్పుచున్నారు. అట్లు
చెప్పుట వలన చాలామంది ఆ డాక్టరును ప్రత్యేక వైద్యునిగా గుర్తించడమేకాక, ప్రతి ఒక్కరూ తమ వెనుకటి జన్మ
ఎటువంటిదో కొంతైనా తెలుసుకోవలెనని అభిలాష కల్గి, అటువంటి డాక్టరుగారినే ఆశ్రయించడము జరుగుచున్నది.
దానివలన “పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపి” అని పేరు పెట్టుకొన్న డాక్టర్లకు విలువ పెరిగి పోవుచున్నది. కొందరు డాక్టర్లు
మాత్రము ఈ విధానమును ప్రచారము చేసుకొనుట మనము గమనించవచ్చును. ఈ విధానము సరియైనదికాదని
కొందరు సైన్సు తెలిసిన విజ్ఞానులు, హేతువాదులు చెప్పడము జరుగుచున్నది. మేము సత్యమును సత్యముగా, అసత్యమును
అసత్యముగా చెప్పుచున్నాము. ఈ విషయములో మేము కూడా హేతువాదులతో ఏకీభవించుచున్నాము. అట్లని
అన్నిటిని ఒకే గుంజకు కట్టివేసి నేటి హేతువాదులతో అన్ని విషయములలోను ఏకీభవించము.
సృష్ఠిలో తయారైన మనిషి అప్పటినుండి చస్తూ పుట్టుచూ శరీరములను మార్చుకొనుచున్నాడు. మరణములో
శరీరము నశించినా జీవుడు మాత్రము నశించక క్రొత్త దేహమును ధరించుచున్నాడు. జీవాత్మ (జీవుడు) సృష్ట్యాది
నుండి శరీరమును ధరిస్తూ పాపపుణ్యములను అనుభవిస్తూ ఇప్పటి వరకు కొనసాగుచున్నాడనీ, ఎప్పుడైతే దైవజ్ఞానమును
తెలుసుకొని కర్మలను లేకుండా చేసుకోగలడో ఆ దినము దైవములోనికి చేరిపోయి తర్వాత పుట్టకుండా పోవునని
బ్రహ్మవిద్యాశాస్త్రము చెప్పుచున్నది. ఆరు శాస్త్రములలో పెద్దదైన దైవశాస్త్రమైన బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రతి మనిషికి
వర్తించునదై ఉన్నది. స్వయముగా దేవుడు తెల్పినది బ్రహ్మవిద్యాశాస్త్రమైన దానివలన, అది సర్వమానవులకు వర్తించును.
అది దైవశాస్త్రమైన దానివలన దానికి కులమూ, మతమూ అను వ్యత్యాసములుండవు. మూడు భాగముల కన్ను, ఏడు
భాగముల హస్తము ఉన్న మానవులందరికి వర్తించును. దేవుడు తన జ్ఞానమును తెలుపు నిమిత్తము తన బోధకులను
(ప్రవక్తలను) పంపగా, వారు చెప్పిన జ్ఞానమును మనిషి సరిగా అర్థము చేసుకోలేక ప్రవక్తల బోధలకు మతము అను
పేరును తగిలించుకొన్నారు. వాస్తవానికి ఏ ప్రవక్తా మత బోధలు చెప్పలేదు, వారు సర్వ మానవులకు వర్తించు దైవ
సూత్రములనే చెప్పారు. ప్రవక్తలు బోధించిన దైవసూత్రములను మనిషి అర్థము చేసుకోలేక మాయ ప్రభావమువలన
మతములను సృష్టించుకొన్నాడు. అంతేకాక శాస్త్రము శాసన రూపమైనదని తెలియక బ్రహ్మ విద్యాశాస్త్రములో చెప్పిన
సూత్రములకు వ్యతిరేఖముగా కొన్ని మాటలను మనిషి సృష్టించుకొన్నాడు. అటువంటి వాటిలో పునర్జన్మలు లేవు అని
చెప్పడము బ్రహ్మవిద్యాశాస్త్రమునకు వ్యతిరేఖమైన మాట. ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రములో ఉన్న ధర్మమునకు
విరుద్ధమైన మాటను చెప్పుకోవడము అజ్ఞానమగును. అంతేకాక దైవధర్మమునకు విరుద్ధమైనది అధర్మమగును.
ఇప్పటికి రెండువేల సంవత్సరముల పూర్వము పుట్టిన క్రైస్తవములో ప్రవక్త అయిన ఏసుప్రభువు పునర్జన్మలేదని
చెప్పకున్ననూ, అక్కడక్కడ పునర్జన్మలున్నవని అర్థమగునట్లు చెప్పియున్ననూ అర్థము చేసుకోలేని మనిషి, ప్రభువు
చెప్పిన దానిని ఒక మతముగా ఏర్పరచడమేకాక, పునర్జన్మలు తమ మతములో చెప్పలేవనీ ప్రచారము చేసుకొన్నాడు.
ఆ విధముగా క్రైస్తవమతములో ఏసు మాటను ఆ మతస్థులందరూ వక్రీకరించుకొని చెప్పుకోగా, తర్వాత కొంత కాలమునకు
అనగా దాదాపు 14 వందల సంవత్సరముల పూర్వము మహమ్మద్ ప్రవక్తగారు పుట్టి తనకందిన దైవ సందేశమును
ప్రజలకు తెలిపాడు. ఇస్లామ్ (విశ్వాసము) అను పునాది మీద ప్రవక్త తన బోధను తెలుపగా, దేవునిమీద విశ్వాసము
(ఇస్లామ్) అందరికి అవసరమైనది అయినా చివరకది కూడా ఒక మతముగా మారిపోయినది. సాతాన్ లేక సైతాన్
అనబడు మాయ మనిషిలో ఉంటూ ప్రవక్తలు చెప్పిన దైవసందేశమును కూడా మనిషికి తప్పుగా అర్థమగునట్లు
చేయడము వలన ఇస్లామ్లో కూడా పునర్జన్మలు లేవని చెప్పినట్లు మనిషి ప్రచారము చేసుకొన్నాడు. ఇస్లామ్లో
చెప్పిన దైవసూత్రము అర్థము కాకుండా పోయిన దానివలన చివరకు అందరూ జన్మల విషయములో పొరపాటు పడి
పోయారు. ఇస్లామ్లో పునర్జన్మలు లేవని చెప్పడానికి దానికంటే ముందు పుట్టిన క్రైస్తవమే కారణమనవచ్చును. క్రైస్తవ
మతములోనే పునర్జన్మలు లేవని ప్రచారమగుట వలన దానిలోని సాతాన్, ఇస్లామ్లో సైతాన్గా మారి వారిని కూడా
భ్రమింపచేసింది.
మరణ విషయమును వివరముగా చెప్పుకొంటే ఒక మనిషిని విభజించి చూస్తే మొత్తానికి రెండు భాగములుగా
చెప్పవచ్చును. ఒకటి ప్రకృతి భాగముకాగా, రెండవది పరమాత్మ భాగము. ప్రకృతి భాగములో మొత్తము శరీరముండగా,
పరమాత్మ భాగములో జీవాత్మ, ఆత్మ గలవు. అదే విధముగా రెండు భాగములకు నాశనము కలదు. ప్రకృతి భాగమైన
శరీరము నాశనమగునదే, అట్లే పరమాత్మ భాగమైన జీవాత్మ నాశనమగునదే, జీవునితో పాటువుండు ఆత్మ నాశనము
కానిదని జ్ఞప్తికుంచుకోవలెను. శరీరము నాశనమగుటను మరణము అంటాము. జీవుడు నాశనమగుటను మోక్షము
అంటాము. ఎలాగైతే శరీరమునకు కలుగు మరణమును చావు అంటామో అలాగే జీవునకు కలుగు మోక్షమును ముక్తి
అంటాము. జీవుడు ధరించు శరీరము ఎన్నోమార్లు నాశనమగుచున్నది, ఎన్నోమార్లు జన్మించు చున్నది. కానీ జీవుడు
ఒక్కమారే పుట్టాడు, ఒక్కమారే నశిస్తాడు. దీనిని బట్టి శరీరమునకు ఎన్నో చావుపుట్టుకలున్నవి, కానీ జీవునకు జన్మ
ఒక్కటే, అలాగే ముక్తి ఒక్కటే. శరీరము మారి కొత్త శరీరమును జీవుడు ధరించి నపుడు దానిని పునర్జన్మ అంటున్నాము.
కానీ దానిని జన్మ అనడము లేదు. శరీర విషయములో జన్మ అంటున్నాము. జీవుడు క్రొత్త శరీరము ధరిస్తే దానిని
సందర్భానుసారము జన్మించడము అనినా లేక జన్మ అనినా అది శరీర నిమిత్తము చెప్పబడినదేగానీ జీవుని నిమిత్తము
చెప్పబడినది కాదు. ఈ విధముగా ఒక మనిషి శరీరమునకు జనన మరణములు, మనిషిలోని జీవునికి జన్మ,
మోక్షముగలవని తెలియవలెను. ఇంతకు ముందు చెప్పిన జనన మరణ సిద్ధాంతముగానీ, మరణ రహస్యముగానీ
శరీరమును ఉద్దేశములో పెట్టుకొని చెప్పినవేనని తెలియవలెను.
ఒక మనిషి భూమిమీద సృష్టి మొదటిలోనే జన్మించాడు. తర్వాత శరీరములు చనిపోగా చనిపోగా క్రొత్త శరీరములను
ధరిస్తూ వస్తున్నాడు. ఏ శరీరములోని జ్ఞప్తి ఆ శరీర మనస్సుకు ఉండును. కావున వెనుకటి శరీరములలోని జ్ఞాపకము
జీవునికి తెలియకుండా పోయినది. ఇప్పటి శరీరములోని జ్ఞాపకము మాత్రము ఇప్పటి శరీరములోని మనస్సు అందించు
చుండును. కావున ప్రస్తుత జన్మ జ్ఞప్తి మాత్రమే మనిషికి తెలియుచున్నది. అందువలన మనిషి తనకు ఎన్ని పునర్జన్మలు
కల్గివున్నవో చెప్పలేడు. అలాగే గతజన్మ విషయమును కూడా చెప్పలేడు. ఇది మనిషి శరీరము యొక్క చావు పుట్టుకల
విధానము. జీవుని యొక్క జన్మ, ముక్తి (మోక్షము) యొక్క విషయానికి వచ్చి చూస్తే జీవుడు జన్మించాడు కానీ అతడు
శరీరములు మారుతూనే ఉన్నాడు తప్ప మోక్షమును పొందలేడు. ఒకమారు భూమిమీద జన్మించిన జీవుడు అనేకమార్లు,
అనేక శరీరములను ధరిస్తూ, అనేక పేర్లతో చలామణి అగుచూ కాలమును ఇంతవరకూ గడుపుచూ వచ్చాడు. అయితే
జ్ఞప్తి లేని దానివలన ఇప్పటి వరకు ఎన్ని శరీరములను ధరించినదీ, ఎన్ని పేర్లతో చలామణి అయినదీ ఎవనికీ
తెలియదు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవనికైనా వాని ఆత్మ గతజన్మ విషయమును ఒక్క దానిని తెలియజేస్తే దాని
ఆధారముతో మనిషి తిరిగి పుట్టుచున్నాడని చెప్పుకొనుటకు ఆధారము ఏర్పడుచున్నది. అంతేకాక బ్రహ్మవిద్యాశాస్త్రము
ప్రకారము మనిషికి పునర్జన్మలున్నాయనుటకు సాక్ష్యము దొరుకుచున్నది.
ఒక మనిషి ఎన్నిమార్లు పునర్జన్మించినా ఆ మనిషిలోని జీవుడు జన్మించినది ఒక్కమారేనని, ఆ మనిషి ఎన్నిమార్లు
మరణించినా ఆ మనిషిలోని జీవునికి నిజముగా మరణము (ముక్తి) రాలేదని చెప్పవచ్చును. జీవుడు జన్మించి కొన్ని
లక్షల సంవత్సరములైనా, అతనికి ఇంతవరకు రాని మరణము ఎప్పుడు వస్తుందో చెప్పలేము. జీవుడు మరణించాలంటే
లేక ముక్తి పొందాలంటే దానికి ముందుగా దైవజ్ఞానమును జీవుడు తెలిసి వుండాలి. జీవుడు నివసించు శరీరమునకు
నాశనము (మరణము) జీవునికి తెలియకుండానే జరుగుచున్నది. ఏ జీవుడూ తన శరీరము వదలి పోతామని
అనుకోకముందే, శరీరము తనను వదలి నశించి పోవుచున్నది. జీవుడు సాధారణముగా ఏ ప్రయత్నము చేయకుండానే
తాను ధరించిన శరీరము నశించిపోవుచున్నది. అయితే జీవుడు ఎంతో తీవ్రప్రయత్నము చేస్తేగానీ తనకు నాశనము
ఏర్పడగలదు. జీవుడు తాను నాశనమగుటకు ఎంతో దైవజ్ఞానమును సంపాదించి దాని ప్రకారము నడిచినపుడు తన
ఆరోగ్యము నకు కారణమైన కర్మ లేకుండా పోవును. జీవుడు భూమిమీద జీవించుటకు కర్మ దివ్యమైన ఔషధముగా పని
చేయుచున్నది. జీవున్ని ఎన్నో యుగముల నుండి జీవింపజేయు ఔషధములాంటి కర్మనుమించినది, దానికి విషము
లాంటిది అయిన దైవజ్ఞానమును మనిషి జీర్ణింప చేసుకొంటే అప్పుడు కర్మ నశించిపోయి జీవునికి మరణము (ముక్తి)
ఏర్పడును. ఇదే విషయమునే మరికొందరు వేరు విధముగా చెప్పుకొన్నారు. శరీరముతో వుండి శరీర మరణములను
పొందు జీవున్ని మృత జీవుడనీ, శరీరములను వదలి ముక్తి పొంది ఎప్పటికీ శరీరములలో చిక్కుకోకుండా శరీర
మరణములనుండి తప్పించుకొనిన జీవున్ని అమృత జీవుడని వర్ణించారు. అందువలన భగవద్గీతలో గానీ, బైబిలులోగానీ
మోక్షము (ముక్తి) పొందిన వానిని అమృతుడనీ, ముక్తి పొందని వానిని మృతుడనీ అనడము జరిగినది. దాని అర్థము
ప్రకారమే దైవజ్ఞానము తెలిసిన వానిని అమృతమును స్వీకరించువాడని కూడా చెప్పారు. ఇదే అర్థముతోనే భగవద్గీతలో
రాజవిద్యా రాజ గుహ్య యోగమున "అమృతం చైవ మృత్యుశ్చ" మృత్యువుకు అమృతముగా నున్నాను అని అన్నాడు.
అంతేకాక అదే గీతలోనే గుణత్రయ విభాగ యోగమున చివరిలో 27వ శ్లోకమందు "అమృతస్యా వ్యయస్య” వ్యయము
నకు అనగా శరీర నాశనమునకు లేక శరీర మృత్యువుకు అమృతముగా ఉన్నాను అని కూడా చెప్పాడు.
ఇది ఇట్లుండగా బైబిలులో ఇదే అర్థముతో రెండవ భాగమైన క్రొత్త నిబంధనలో ఎఫెసేయులకు వ్రాసిన పత్రిక
రెండవ అధ్యాయములో 11,12,13 వాక్యములలో ఇలా గలదు. "మునుపు శరీర విషయములో అన్యజనులైవుండి,
శరీరమందు చేతితో చేయబడిన సున్నతిగలవారు అనబడినవారిచేత, సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు
ఇజ్రయేలులో సహ పౌరులుకాక, పరదేశులునూ, వాగ్దాన నిబంధనలేని పర జనులనూ, నిరీక్షణ లేనివారునూ, లోకమందు
నిర్దేవులునైవుండి, క్రీస్తుకు దూరస్థులునై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనండి. ఆయనకు మునుపు దూరస్థులైన
మీరు ఇప్పుడు క్రీస్తు ఏసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు.” బైబిలులో వ్రాయబడిన కొన్ని పదములు
మంచి అర్థముతో కూడుకొన్నవైనప్పటికీ చాలామంది క్రైస్తవ బోధకులకు కూడా వాటి నిజార్థము తెలియకపోవడము
వలన బైబిలులోని భావము సరిగా అర్థము కాకుండా పోయినది. క్రీస్తు రక్తము అనగానే క్రైస్తవులందరికీ శిలువ మీద
శిక్షింప బడిన ఏసుప్రభువు రక్తము గుర్తు వస్తుంది. కానీ ఆ భావము సరియైనది కాదని ఎవరికీ తెలియదు. ఏసురక్తము
వలన మనుషులకు పాపపరిహారమున్నదనీ, క్రైస్తవ మతములోనికి చేరిన వారికి ఏసు కార్చబడిన రక్తము చేత మీ
పాపములు పోవుననీ చెప్పుచున్నారు. వినే వారందరూ వారి మాటలు సత్యమేనని నమ్ముచున్నారు. కానీ క్రీస్తు అంటే
దేవుడు అనీ, క్రీస్తు రక్తము అంటే దేవుని జ్ఞానము అని తెలియలేక పోవుచున్నారు. దైవ జ్ఞానములో ఎక్కువగా అన్ని
పదములు సూక్ష్మ అర్థములతో కూడుకొని వుండును. స్థూలభావములతో జ్ఞానముండదు. ఏసు బ్రతికివున్నప్పుడు
కూడా నా నిబంధన రక్తము అని చెప్పాడు గానీ, శరీరములోవుండే సాధారణ రక్తమని ఎక్కడా చెప్పలేదు.
పైన చెప్పిన 11,12,13 వాక్యములలోని సారాంశమును నిజ భావముతో చూస్తే “పూర్వము ఇజ్రాయేలు
దేశములో అజ్ఞానులుగాయున్న మీరు దేవునికి దూరస్థులై ఉంటారనీ, దేవునికి దూరముగానున్న మీరు ఇప్పుడు దేవుని
విషయములలో దేవుని జ్ఞానము వలన దేవునికి దగ్గరగా ఉన్నారు.” అని చెప్పడము జరిగినది. ఈ వాక్యముల వలన
మనకు ముఖ్యముగా తెలియునదేమనగా! పూర్వము రెండువేల సంవత్సరముల ముందు ఇజ్రాయేలు దేశములో
అజ్ఞానులుగా, దేవుని జ్ఞానము తెలియని వారుగా, దేవునికి దూరముగానున్న మనుషులు ఇప్పుడు ప్రస్తుత కాలములో
దేవుని జ్ఞానము తెలిసిన దానివలన దేవునికి దగ్గరగా ఉన్నారని తెలియుచున్నది. దీనినిబట్టి అజ్ఞానముగా పూర్వమున్న
కొందరు మనుషులు ఇప్పుడు జ్ఞానులుగా ఉన్నారని తెలియుచున్నది. పూర్వము అజ్ఞానిగా దేవునికి దూరముగా ఉన్న
మనిషి జన్మలు మారుచూ వచ్చి ఇప్పటికి జ్ఞానమును తెలిసినవాడై దేవునికి దగ్గరగా ఉన్నాడనీ, అలా జన్మలు మారుట
వలన ఇంతకాలమునకు దైవజ్ఞానము వలన (క్రీస్తు రక్తము వలన) మనిషి దేవునికి దూరముగానున్నవాడు దగ్గరయ్యాడని
తెలియుచున్నది. ఇందులోని జ్ఞానము వలన మనిషికి పునర్జన్మలున్నాయని బాగా అర్థమగుచున్నది. అదే రెండవ
ఆధ్యాయములో మొదటి వాక్యములోని పదములను చూస్తే చెప్పబడిన జ్ఞానము సూక్ష్మమైన అర్థములతో కూడుకొని
ఉండునని తెలియగలదు. “మీ అపరాధముల చేతనూ, పాపముల చేతనూ మీరు చచ్చినవారై ఉండగా, ఆయన
మిమ్ములను కూడ బ్రతికించెను.” ఈ వాక్యములో ఆయన అనగా దేవుడని సులభముగా అర్థమై పోగలదు. కానీ
చచ్చినవారై ఉండగా అనుమాట అందరినీ తప్పుదోవ పట్టించు అవకాశముగలదు. దూరము వారు దగ్గరయ్యారు అని
చెప్పినట్లు, చచ్చినవారు బ్రతికారు అని చెప్పారు. చచ్చినవారనగా దైవజ్ఞానములేనివారని అర్థము. మనిషి ఎన్నో
పాపములను చేసి ఆ పాపముల మధ్యలోవుండి, దైవత్వము అను చైతన్యము లేకుండడమును జ్ఞానరీత్యా చచ్చినవాడని
చెప్పబడినది. అటువంటి మనిషిని దేవుడు తన ప్రవక్తల ద్వారా తన జ్ఞానమును తెలిపి దైవత్వము (క్రీస్తు) తో
బ్రతికించాడని, జ్ఞానముచేత చైతన్యవంతులను చేశాడని చెప్పవచ్చును.
భగవద్గీతలో జ్ఞానయోగమున 37వ శ్లోకములో చెప్పబడిన “యథై ధాంసి సమిద్దోగ్ని ర్భస్మసా త్కురు తేర్జున,
జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసా త్కురుతే తథా” ఏ విధముగా అగ్నిలో కట్టెలు కాలిపోవుచున్నవో, అదే విధముగా
జ్ఞానమను అగ్నిలో సర్వకర్మలు (సర్వ పాప పుణ్యములు) కాలి పోవుచున్నవి.” అని భగవంతుడు తెల్పినట్లు, బైబిలులో
కూడా క్రీస్తు రక్తము చేత పాపములు హరించబడును అని చెప్పడము జరిగినది. గీతలో దేవుని జ్ఞానముచేత అని
చెప్పగా, బైబిలులో క్రీస్తురక్తము చేత అని చెప్పడమును గ్రహిస్తే రెండు చోట్ల దేవుని వాక్యము ఒక్కటిగానే ఉన్నదని
తెలియుచున్నది. క్రీస్తు అనగా దేవుడనీ, రక్తము అనగా జ్ఞానము అనీ అర్థము చేసుకోగలి గినపుడే దేవుని వాక్యము
ఎప్పటికీ మారదని అర్థము కాగలదు. అట్లుకాక సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని తెలియక ఒక్కొక్క మతమునకు
ఒక్కొక్క దేవుడున్నాడని అనుకొనుచూ, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అనుకోవడము అజ్ఞానమగును. అన్ని
మతములకు అధిపతి ఒక్కడేనని తెలిసిననాడు ఆయన చెప్పిన జ్ఞానము అంతా ఒక్కటేనని తెలియగలదు.
క్రైస్తవ మతములో పునర్జన్మలు లేవు అనుట విన్నాము. కావున బైబిలులో దేవుడు అలా చెప్పలేదు అనుటకు
మరియొక ఉదాహరణను బైబిలునందే, చూపుచున్నాను చూడండి. బైబిలులో అన్నిటికంటే ఉత్తమ మైనది యోహాను
సువార్త అని చెప్పవచ్చును. దానిలో 15వ ఆధ్యాయము నందు చివరిలోనున్న 26,27 వాక్యములలో “తండ్రియొద్దనుండి
మీవద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రివద్దనుండి బయలుదేరు సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినపుడు,
ఆయన (ఆదరణకర్త) నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటినుండి నావద్దనున్నవారు గనుక మీరునూ సాక్ష్యమిత్తురు.”
ఈ వాక్యములో ప్రజలు ఏసుప్రభువు ఉన్నప్పుడు ఏసును చూచినవారు, ఆయన బోధలు వినినవారు కొన్ని వేలు,
వందల సంవత్సరములు గడచిన తర్వాత ఆదరణకర్త వచ్చినపుడు కూడా పుట్టి వుందురనీ, ఆదరణకర్త చెప్పిన ఏసు
మాటలను వారు కూడా సులభముగా గుర్తు పట్టగలరని తెలియుచున్నది. మీరు మొదటినుండి ఉన్నవారు అనుట
వలన మనుషులైన మనము సృష్ఠిఆదినుండి పునర్జన్మలు ఎత్తుచూ ఉన్నామని తెలియుచున్నది. పునర్జన్మలను గురించి
బైబిలులో ఇంతకంటే మించిన సాక్ష్యము అవసరము లేదు. ఇటువంటిదే మరియొకచోట మత్తయి సువార్తలో 12వ
ఆధ్యాయమునందు 31,32 వాక్యములలో "ప్రతి పాపమును, దూషణము మనుష్యులకు క్షమించబడునుగానీ, ఆత్మ
విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణగలదు
కానీ, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైననూ, రాబోవు యుగ మందైననూ పాపక్షమాపణ
లేదు" అని ఉన్నది. ఈ వాక్యములో ఈ యుగమందైననూ, రాబోవు యుగమందైననూ అని చెప్పబడుట వలన ఒక
యుగములో ఉన్న మనిషే తర్వాత యుగములో కూడా ఉండునని అర్థము కదా! ఒక యుగము కొన్ని లక్షల సంవత్సరముల
కాలముండును. అలాంటపుడు రెండు యుగముల కాలము పాపమును మనిషి అనుభవించాలంటే, మనిషి ఎన్నోమార్లు
చచ్చి తిరిగి పుట్టవలసి ఉన్నది. ఈ మాట ప్రకారము కూడా పునర్జన్మలున్నట్లు బైబిలు ద్వారా తెలియుచున్నది.
ఈ విధముగా దేవుడు తన ప్రవక్తల ద్వారా అన్నిచోట్ల మనిషికి పునర్జన్మలున్నట్లే చెప్పించాడు. అయితే చెప్పబడిన
జ్ఞానమును సరిగా అర్థము చేసుకోలేని మనిషి పునర్జన్మల విషయములో దేవుని జ్ఞానమును తప్పుగా అర్థము చేసుకొన్నాడని
చెప్పవచ్చును. మేము ఈ విషయమును చెప్పగా కొందరు క్రైస్తవులూ, మరికొందరు హిందువులూ ఈ విధముగా
నన్ను ప్రశ్నించారు. ఇటు భగవద్గీతలోగానీ, అటు బైబిలులోగానీ పునర్జన్మ విషయము చెప్పబడివున్నదని ఒప్పుకోగలము.
కానీ నీవు చెప్పుచున్న మరణ సిద్ధాంతముగానీ, మరణ రహస్యముగానీ ఏ గ్రంథములోనూ లేవు గదా! మూల
గ్రంథములైన బైబిలు, భగవద్గీతలో చెప్పని విషయములు నీవు ఎలా చెప్పుచున్నావు? అని అడిగారు. దానికి మేము
సమాధానమును ఇలా చెప్పగలిగాము. దేవుడు మూల గ్రంథములైన బైబిలు, భగవద్గీతలో చెప్పిన జ్ఞానమునంతటిని
జ్ఞాపకము చేయుచూ, ఆ గ్రంథములలో చెప్పని సమస్తమును మీకు తెలియబరచబడునని ముందే చెప్పివున్నాడు.
దేవుడు చెప్పిన మాట ప్రకారము మా నుండి మూల గ్రంథములలో చెప్పని ఎన్నో విషయములు బయటికి వచ్చాయి
అనుకుంటాను. క్రొత్తగా చెప్పబడిన సమస్త జ్ఞానము నేను చెప్పినది ఏమాత్రము కాదు. ఇక్కడ ముఖ్యముగా గమనింపతగిన
విషయమొకటున్నది. ఈ మధ్యన ఒక వ్యక్తినన్ను ఒక ప్రశ్న అడిగాడు. అదేమనగా! మీరు రచించిన గ్రంథము
చదివాను. అందులో చాలాచోట్ల మేము చెప్పునదేమనగా! అని బహువచనములో చెప్పుకొన్నారు. ఒక్కొక్కచోట మీరు
నన్ను అడిగినపుడు అని ఏక వచనమును చెప్పారు. ఏకవచనముగా నన్ను నేను అని అనవచ్చును. కానీ మిమ్ములను
ఎవరైన సంబోధించునపుడు బహువచనముగా సంబోధించవచ్చును. అట్లుకాక మీరంతకు మీరు బహువచనమును
చెప్పుచూ మేము చెప్పున దేమనగా, మా జవాబు ఏమనగా అని వ్రాశారు. అట్లు వ్రాయుటలో మీరు, మీ ఆశ్రమము
వారందరూ కలిసి చెప్పినట్లు అని మాకు అర్థమగు చున్నది. ఆ విధముగా అనేకచోట్ల తమను తాము బహువచనముగా
చెప్పుకొనుచు ఎక్కడో ఒకచోట నేను, నన్ను అని వ్రాయడములో అంత రార్థమేమిటి? ఎదుటి వారు గౌరవ సూచనగా
మీరు అని సంబోధించవచ్చును గానీ, మేము అని మీరు చెప్పుకోవడము నిన్ను నీవు గొప్పగా చెప్పుకొన్నట్లు కాదా!
అలా చెప్పుకోవడము అహమునకు గుర్తుకాదా?” అని అడిగారు.
దానికి జవాబుగా మీకు కనిపించు నేను చెప్పడము ఏమనగా! భగవద్గీత, బైబిలు మొదలగు మూల గ్రంథములలో
చెప్పని సమస్త జ్ఞాన విషయములను మేము వ్రాయడము జరిగినది. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ వచ్చి సమస్తమును
మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని జ్ఞాపకము చేయును అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడివున్నది.
కానీ నా గ్రంథములలో వ్రాయబడిన సమస్త జ్ఞాన విషయములను మేము వ్రాశాము అని చెప్పడము జరిగినది. మీకు
అది అహముగా కనిపించినా నేను మాత్రము ఎరుకలోవుండి జ్ఞానమును జ్ఞప్తిలో పెట్టుకొని, నన్ను నేను మరువకుండా
అట్లే నా ప్రక్కననున్న వానిని జ్ఞప్తిలో పెట్టుకొని వ్రాసినదని తెలుపుచున్నాను. నేనున్న శరీరములో నేను ఏమీ
తెలియనివాడను. నేను ఐదు రకముల అంధుడనే. చూడలేను, వినలేను, అట్లే మిగతావి ఏవీ తెలియవు. అటువంటి
నాకు ఏ జ్ఞానము తెలియదు. కానీ నాతో పాటు శరీరములోనున్న నా స్నేహితుడు మరియు నాకు పొరుగువాడైన
ఆత్మకు సమస్తము తెలియును. అన్నిటిని తెలిసిన నా పొరుగువాడు తెలిపితే నాకు తెలియును తప్ప స్వయముగా నాకు
ఏదీ తెలియదు. నా ఆత్మ నాకు హితుడుగావుండి నా చేత సమస్తమును వ్రాయించుచున్నది. కావున నేను వ్రాసేవాడిని,
నా స్నేహితుడు చెప్పేవాడు. ఒక విషయమును మీ లెక్కలో మీకు కనిపించునట్లు నేను వ్రాసినా, అది నా లెక్కలో నా
ఆత్మ చెప్పినది. నేను ఒక్కనిని చెప్పిన విషయము ఏదీ లేదు. అందువలన ప్రతి ప్రశ్నకు జవాబును వ్రాయునపుడు
మేము చెప్పునది ఏమనగా అని వ్రాస్తాము తప్ప, నేను వ్రాయునది అని ఎప్పటకీ వ్రాయను. కొందరికి అంతర్ ముఖ
జ్ఞానము తెలియని దానివలన, వారికున్న అజ్ఞాన చూపునకు నేను అహంకారిగా కనిపించినా నేను అహముతో ఏ పనీ
చేయలేదు. ఆత్మ చేయిస్తుందని చెప్పుచున్నాను. ఆత్మ, నేను (జీవాత్మ) ఇద్దరమూ కలిసి చేయడము వలన మేము
అంటున్నాము. మేము అంటే నేను, బాహ్యముగా నా చుట్టు ప్రక్కల ఉన్నవారనుకోవడము మీ తప్పే కానీ, నా తప్పు
కాదు.
మీ దృష్ఠిలో నా శరీరము ఒక్కటే కనిపిస్తుంది. కావున మీరు అడుగుచున్నపుడు నన్ను మీరు అడిగినట్లు అని
ఏకవచనముతోనే వ్రాశాము. నేను ఒక్కనినే మీ లెక్కలో ఉండడము వలన కొన్ని సందర్భములలో అక్కడక్కడ ఏకవచనమును
చెప్పవలసి వచ్చినది. మీరెట్లు అనుకొనినా నాకు తెలిసింది ఏమీ లేదు. కానీ మాకు సమస్తము తెలిసినదని వ్రాయ
గలుగుచున్నాము. ఎంత గొప్ప జ్ఞాన విషయమును చెప్పినా, మూల గ్రంథములలో లేని జ్ఞానమును శాస్త్రబద్దముగా
చెప్పినా, అది నా పనితనము కాదు. దానిని ఆత్మే చెప్పగలిగిందని నాకు బాగా తెలుసు. అదే ఆత్మకు గతజన్మ
విషయము లన్నీ తెలుసు. అందువలన సమస్త జ్ఞాన విషయములను తెలియజేయగలుగు ఆత్మకు వెనుకటి జన్మ
జ్ఞాపకములను కలుగజేయడము ఏమంత గొప్ప పని కాదు. భూమిమీద దైవజ్ఞానము సంపూర్ణముగా నిలబడుటకు
అప్పుడప్పుడు, అక్కడక్కడ పునర్జన్మ జ్ఞాపకములను ఆత్మ తెలియజేయు చుండునను విషయమును మరువకూడదు.
ఆత్మ ఎంత గొప్ప జ్ఞాన విషయమునైన తెలుపగలదు. ఎంత గొప్ప జ్ఞాపకమునైనా చేయగలదు. అలాగే దైవజ్ఞానము
యొక్క నిదర్శనమునకు సాక్ష్యముగా దేనినైనా ఆత్మ చేయించి చూపగలదు. అటువంటి ఆత్మ ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలకు
కూడా తెలియకపోవడము విచిత్రము. ఇంతవరకు మనము చెప్పుకొన్న పునర్జన్మ విషయములను ఆత్మే కొందరిలో
జ్ఞాపకము తెప్పించి నిరూపించిందని గ్రహించగలము. స్వయముగా ఆత్మే తెలియజేసిన విషయము కావున పునర్జన్మ
విషయములను అందరము శాస్త్రబద్దముగా తెలుసుకొందాము. పునర్జన్మలున్నవని ఇతరులకు కూడా తెలుపుదాము.
ఇట్లు,
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.
9.