తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము cloud text updated 13sep 2024
తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము.
మనిషి తన జీవితములో సుఖములనే కోరుకుంటాడు. కష్టములను వద్దనుకుంటాడు. తనకు ఏ చిన్న
కష్టమొచ్చిన అది లేకుండా పోవలెనను తలంపు తనలో పుట్టుకవస్తుంది. తను తలచినంత మాత్రమున ఆ కష్టము
పోదని తెలిసిన మనిషి ఇతరుల సహాయము కోరడము సహజము. ఇతర మనుషుల వలన కూడ తొలగని కష్టమును
గురించి మనుషులకంటె గొప్పవాడైన దేవున్ని అర్థించడము మనిషికి అలవాటై పోయినది. అలా కష్టాల్లో ఉన్నవారు
ఉన్న కష్టము పోవాలని కొందరు, ఏ కష్టములేనివారు తమకున్న సుఖముతో సంతృప్తిచెందక క్రొత్త సుఖములు కావలని
కొందరు దేవున్ని కోరుకొనుచుందురు. ఇలా కోరడము రెండు రకములుగ ఉన్నది. ఒకటి మనిషి సాటిమనిషిని
కోరడము, రెండవది మనిషి దేవున్ని కోరడము. కోరే కోర్కెలు కూడ రెండురకములుగ గలవు. ఒకటి ఉన్నది పోవాలని
కోరడము, రెండవది లేనిది రావాలని కోరడము, దీనిని బట్టి మనిషి కోర్కెలు రెండు విధములని, కోరే విధానములు
కూడ రెండు విధములేనని తెలియుచున్నది.
మానవుడు ఆశాజీవి కావున కోరడము వాస్తవమే. తీర్చేవాడైన మరొక మనిషి తర్వాత దేవుడు వాస్తవమా
కాదా అన్నది ప్రశ్న. మనిషి మరియు దేవుడు వాస్తవమే అయినప్పటికి కోర్కెలు తీర్చేవిషయములో ఎవరికెంత పాత్ర
ఉన్నదో చెప్పలేము. మనిషి తన కోర్కెల నిమిత్తము తోటి మనిషిని, ఎదుటి దేవున్ని గౌరవించడము జరుగుచున్నది.
తన పని కోసము లేక కోర్కె కొరకు ఇంకొకరిని గౌరవించడములో కొన్ని పద్ధతులు మనిషి అవలంభించుచున్నాడు.
పద్ధతులలో ఒకటి పొగడడము, రెండు భజనచేయడము, మూడు నమస్కరించడము, నాలుగు ఆరాధించడము
(పూజించడము). ఒక పనినెరవేరుటకు పలానా వాని వలన ఈ పని జరుగునని తెలిసి అతనిని ఆశ్రయించవచ్చును.
అలాగే ఒక కోర్కె నెరవేరుటకు దేవున్ని ఆశ్రయించడములో మనిషి పొరబడుచున్నాడు. ఎందుకనగా! ప్రపంచమునకంతటికి
ఒకే దేవుడుండగ ఆయనను గుర్తించడములో పొరబడి దేవుని స్థానములో చాలామందిని దేవతలుగ మనిషి
భావించుకొన్నాడు. ఒక పని నిమిత్తము ఆ పని ఎవరి చేతనవు తుందో తెలిసి మనుషులను ఆశ్రయించిన మనిషి,
అలాగే ఒక కోర్కె ఎవరి వలన నెరవేరుతుందో తెలియక చాలామంది దేవతలను ఆశ్రయించు చున్నాడు. అందువలన
మనిషికి చాలామంది దేవతలు అవసరమైపోయారు. తన అవసరనిమిత్తము క్రొత్తక్రొత్త దేవతలను మనిషి సృష్టించుకొంటు
పోవుచునే ఉన్నాడు. అన్నిటికి ఆదికర్తయైన పరమాత్మయను దేవున్ని వదలి అనేక దేవుళ్ళను భజించడము పూజించడము
అజ్ఞానమే అనడము ఇప్పుడు సందర్భము కాదు. ప్రస్తుతమున్న విషయముమే ఇక్కడ చర్చనీయాంశము, కావున
మనిషి ఆశను మరియు కోర్కెలను మాత్రము వివరించుకొందాము.
ఒక మనిషి తన కోర్కెనిమిత్తము మరొక మనిషిని ఆశ్రయించ డము చూస్తునే ఉన్నాము. అలాగే మనిషి అనేక
విధములైన దేవతలను ఆశ్రయించడము కూడ చూస్తున్నాము. దేవతలను ఆశ్రయించి ఆరాధించు మనిషికి ఆ దేవుడు
ఏమిస్తున్నాడో, ఏమి చేస్తున్నాడో కనిపించని విషయము. దానిని గురించి మేము ఏమి చెప్పిన నమ్మని పరిస్థితే
మిగులుతుంది. కావున దేవతల విషయము వదలి కేవలము మనుషుల విషయమును మాత్రము వివరించదలచుకొన్నాము.
ఒక మనిషి తనకు నమ్మకమున్న వ్యక్తిని ఆశ్రయించినపుడు అతనిని గౌరవభావముతో చూడడము సహజము.
గౌరవ నిమిత్తము నమస్కరించడము పాదాభివందనము చేయడము జరుగుచున్నది. సాధారణ వ్యక్తులకు చేతులతో
నమస్కరించడము, అసాధారణ వ్యక్తులైన స్వామీజీలకు గురువులకు పాదాభివందనము చేయడము హిందువులలో
పరిపాటైనది. ఈ విధానము పూర్వకాలమునుండి వస్తున్న విషయమే. ఈ విధానకార్యము పూర్వముదే అయినప్పటికి
కార్యములోని భావము తల్లక్రిందులై పోయినదని చెప్పవచ్చును. ఎన్నో ఆచరణలకు అర్థము తెలియకుండ కాలగర్భములో
కలిసిపోయినట్లే పెద్దలను గౌరవించడములోను, వారు దీవించడములోను అర్థము మారిపోయినదనియే చెప్పవచ్చును.
ఒక మనిషి ఒక స్వామికిగాని గురువుకుగాని పాదాభివందనము చేసినపుడు నమస్కరించిన మనిషికి మేలు
చేయునిమిత్తము చెప్పబడు మాటను ఆ స్వామీజీ ఇచ్చిన దీవెన అంటాము. అదే విధముగ చెడు చేయునిమిత్తము
చెప్పబడు మాటలను తిట్లు అంటాము. చెడు జరుగు దూషణలుగాని, మంచి జరుగు దీవెనలనుగాని 'శాపములు'
అంటాము. శాపము అన్నపదము శాసనము అను పదమునుండి పుట్టినది. శాసనము అనగ తప్పనిసరిగ జరిగి
తీరునదని అర్థము. అలాగే శాపము అనగ తప్పని సరిగ జరుగునని అర్థము. చెప్పెడి వ్యక్తి గొప్పవాడైతే ఆ మాట
తప్పనిసరిగ జరిగితీరుతుంది. చెడు దూషణ విషయములలోనే శాప ముండును కదా! మంచి దీవెన విషయములలో
కూడ శాపముండునా! అని కొందరికి అనుమానము రావచ్చును. దానికి సమాధానము ఏమనగా! మంచిగాని చెడుగాని
తప్పనిసరిగ జరుగుదానినే శాపమంటాము గాని ఒక చెడు జరుగు విషయమునకే శాపమును అంటగట్టకూడదు.
కర్మను తల్లక్రిందులు చేయగల శక్తి బ్రహ్మర్షిహోదాలోనున్న ఒకే ఒక గురువుకు మాత్రముండును. అటువంటి
గురువు యొక్క సంకల్పము మంచిదైతే దీవెనగాను, చెడుదైతే కీడుగాను మారగలదు. బ్రహ్మర్షి హోదాగల ఆయన
సంకల్పము తప్పక జరిగితీరును, కావున దానిని శాపమనియే చెప్పవచ్చును. శాపము రెండు రకములని చెప్పుకొన్నాము
కదా! అందులో ఒకటి దూషణ రెండు భూషణ. దూషణలను తిట్లని, భూషణలను దీవెనలని కూడ చెప్పుకోవచ్చును.
తిట్లను, దీవెనలను చాలా చోట్ల, చాలా సందర్భములలో చూస్తునే ఉన్నాము. కాని ముఖ్యముగ ఎవరి మాటలను
దీవెనలుగ, తిట్లుగ లెక్కించుకోవలెనో, ఏ మాటలను తిట్లుగ, ఏ మాటలను దీవెనలుగ భావించుకోవలెనో తెలియక
మానవుడు పొరబడుచున్నాడు. ఎవరి మాటలు శాపములుగ జరిగి తీరునో తెలియక, ఎవరు కర్మను మార్చగల
శక్తిగలవారో తెలియక చాలామందికి పాదాభివందనము చేయడము మానవునికి పరిపాటైనది. వందనము
చేయించుకొనువారు మేము ఏ స్థాయి మనుషులమని ఆలోచించక, తాము దీవించు దీవెనలు జరుగునా అని యోచించక,
మ్రొక్కినవారందరిని దీవించడము జరుగుచున్నది. మంచి చేయువారికంటే చెడు చేయువారు ఎక్కువ కనుక మ్రొక్కకున్న
తిట్టేవారు అడుగడుగున కలరు.
తిట్టు లేక దూషణ అంటే చెడును సూచించునదని, అలాగే దీవెన అంటే మంచిని సూచించునదని
తెలుసుకొన్నాము. మంచి చెడు ప్రాతిపదిక మీద మంచిని దీవెనగ, చెడును దూషణగ (తిట్టుగ) లెక్కించి చూచితే,
మంచివారు శ్రేయోభిలాషులైన గురువులు మంచిని చేకూర్చుటకు దీవెనలను ఇచ్చుట, చెడువారు శత్రువులైన వారు
చెడును చేకూర్చుటకు తిట్లు ఇచ్చుట పద్ధతి అనుకుందాము. ఈ పద్ధతి పూర్వము ఉండెడిది. ప్రస్తుత కాలములో
పూర్వపు పద్ధతికి పూర్తి విభిన్నముగ ఉన్నదనియే చెప్పవచ్చును. ధర్మములు అధర్మములుగ మారుననుటకు ఇది కూడ
ఒక ఉదాహరణ కావచ్చునను కుంటాము.
గురువులుగ స్వాములుగ ఉన్నవారు తమకు పాదాభివందనము చేసినవారికి చెడుకల్గునట్లు శత్రువులవలె
దూషణలివ్వడము, శత్రువులైన వారికి మిత్రులవలె శ్రేయోభిలాషులవలె దీవెనలివ్వడము జరుగునంటే ఎవరికైన
విచిత్రమనిపించును కదా! ఆ విచిత్రమే నేడు భూమి మీద మనకు తెలియకుండానే జరుగుచున్నది. స్వాములు
దూషిస్తున్నారు, శత్రువులు దీవిస్తున్నారు. తిట్లేవో దీవెనలేవో తెలియకపోవడమే దీనికి కారణమని చెప్పవచ్చును. తిట్లు
దీవెనల తారతమ్యము ఎవరికి తెలియక పోవడము వలన స్వాములు తిట్లను, శత్రువులు దీవెనలను ఇస్తున్నారు. ఈ
వక్రపద్ధతి లేకుండ పోవాలంటే తిట్లను గూర్చి, దీవెనల గూర్చి, విశదముగ తెలియవలసిన అవసరము గలదు.
దూషణ, భూషణ వివరమును తెలుపుటకు, తిట్లలోగల జ్ఞానమును దీవెనలలో గల అజ్ఞానమును తెలియ జేయుటకు
“తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము” అను ఈ చిన్న గ్రంథమును వ్రాయడము జరిగినది.
నేటి తిట్లలో జ్ఞానమున్నదనిన, దీవెనలలో అజ్ఞానమున్నదనిన ఇదేమి విడ్డూరమని కొందరనుకోవచ్చును. పూర్వము
జ్ఞానసంబంధమైన దీవెనలు నేడు తిట్లుగ మారినవి. అలాగే పూర్వము అజ్ఞాన సంబంధమైన దూషణలు నేడు దీవెనలుగ
మారినవి. కావున ఈనాటి తిట్లలో ఉన్న సదుద్దేశమేమిటో అలాగే దీవెనలలో ఉన్న దురుద్దేశమేమిటో వివరించుకొని
చూద్దాము.
నీవు నాశనమైపో.
ఎవరైన ఆడవారు పోట్లాడుకొనేటపుడు “నీవు నాశనమైపోనాని” అని ఎదుటివారిని అనడము ఆక్కడక్కడ
వినియే ఉందుము. నేడు ఈ వాక్యము శత్రువును దూషించునపుడు అనుటకు తిట్టుగ వినియోగించు చున్నప్పటికి
ఇది పూర్వకాలము తిట్టుగ కాకుండ దీవెనగ ఉండెడిది. పూర్వము ఈ వాక్యము దీవెనగ ఎట్లుండెడిదో
విశధీకరించుకొందాము.
పూర్వము అవినాశ్ అనబడు ఒక శిష్యుడు గురువువద్ద జ్ఞానము తెలుసుకొనుచుండెను. ఒక దినము
సాయంకాలము ప్రక్కనేవున్న నది ఒడ్డున ఇసుక తిన్నెమీద గురువు కూర్చొని ఉండగ ఆయన ముందర కొందరు
శిష్యులు కూర్చొని ఉండిరి. అందులో అవినాశ్ అను శిష్యుడు కూడ కూర్చొని ఉండెను. అవినాశ్ కొత్తగ వచ్చిన
శిష్యుడు కావున మిగత శిష్యులకు కూడ అతని పేరు తెలియునట్లు నీ పేరేమిటి అని అవినాశన్ను గురువుగారడిగారు.
అపుడు అతను నాపేరు అవినాశ్ అని తెలిపాడు. ఆ పేరు విని చిరునవ్వు నవ్వుకొన్న గురువు ఈ పేరులోని అర్థము
తెలుసా అని మిగతావారినడిగాడు. అపుడు వారిలో కొందరు తెలియునని, అవినాశ్ అంటే నాశనము లేనివాడని
అర్థము చెప్పారు. తర్వాత గురుశిష్యుల మధ్య కొంతసేపు సంవాదము జరిగినది. ఆ సంభాషణలో మొదట గురువు
ఇలా అడిగాడు.
గురువు : ఈ పేరు ఇతను పుట్టిన తర్వాత పెట్టినదా లేక ముందునుంచి ఉన్నదా?
శిష్యులు : ఈ పేరు పుట్టిన తర్వాత పెట్టినదే స్వామి.
గురువు : పుట్టిన తర్వాత వెంటనే పెట్టలేదు కదా! పుట్టిన కొన్ని రోజుల తర్వాత పెట్టిన పేరు కదా!
శిష్యులు : అవును స్వామి
గురువు : పేరు పెట్టకముందు ఇతని పేరునేమని చెప్పాలి?
శిష్యులు : మొదట జీవుడని తర్వాత అవినాశ్ అని చెప్పాలి.
గురువు : అవినాశ్ అనునది శరీరమునకు పెట్టిన పేరే కదా! జీవునకు సరిపోవునా?
శిష్యులు : శరీరమునకు సరిపోదు స్వామి. జీవునకు సరిపోతుంది.
గురువు : శరీరమునకు ఎందుకు సరిపోదు?
శిష్యుడు : శరీరము కొంతకాలముండి నశించి పోవునదే కదా! నశించి పోవునది శరీరము. శరీరము నశించినప్పటికి
నశించకున్నది జీవుడు, కావున జీవునకు అవినాశ్ అన్న పేరు సరిపోవును. కాని శరీరమునకు ఆ పేరు సరిపోదు.
గురువు : భగవద్గీతలో జీవుడు నశించువాడే అని చెప్పారు. అలాంటపుడు ఆ పేరు జీవునికి కూడ సరిపోదు. జీవుడు
కూడ నశించువాడే. శరీరము మరణముతో నశిస్తున్నది. మరణములో జీవుడు నశించడను మాట వాస్తవమే.
మరణించిన తర్వాత జీవుడు మరొక శరీరమును ధరించి సజీవునిగానే ఉండును. ఆయుస్సు అయిపోతే శరీరము
నశించును. కర్మ అయిపోతే జీవుడు నశించుననునది సూత్రము. కర్మ అయిపోయినపుడు జీవునికి నాశనము
తప్పదు, కావున అవినాశ్ అనుపేరు అర్థము ప్రకారము జీవునికి కూడ వర్తించదు.
ఈ విధముగ గురువు దగ్గర ఆత్మజ్ఞానము తెలుసుకొంటున్న శిష్యులు కొన్ని సంవత్సరములకు పరిపూర్ణ జ్ఞానులై
గురుసేవ సక్రమముగ చేయుచుండిరి. శిష్యులు జ్ఞానమునందు ఆసక్తి కల్గియుండి జ్ఞానమును తెలుసుకోవడము
మరియు వారు శ్రద్ధగ సేవలు చేయడమును గమనించిన గురువు సంతోషించుచుండెను. ఇలా కొంత కాలము
గడువగ ఒకనాడు అవినాశ్ అను శిష్యుడు భక్తి శ్రద్ధలతో గురువు పాదాలకు సమస్కరించు సమయమున గురువుగారు
ఒక దీవెనను తననోటినుండి పలికెను. ఆ దీవెన విన్న మిగత శిష్యులందరు ఆశ్చర్యపోయారు. ఆ సమయములో
తమకు కల్గిన ఆ ఆశ్చర్య విషయమును గురించి గురువుగారిని అడుగలేదు. తమలో తాము ఆ విషయమును కొన్ని
రోజులు చర్చించుకొన్నారు. చివరకు గురువుగారు ఇచ్చిన దీవెన తప్పని తలచి, ఆ సంశయము గురువుగారే తీర్చవలెనని
ఈ విధముగ అడిగారు.
శిష్యులు : స్వామి మాకొక సంశయము చాలా రోజులనుండి పీడించు చున్నది. ఆ సంశయమునకు మీరే జవాబు
చెప్పగలరని వినయముగ అడుగుచున్నాము.
గురువు : మీ జ్ఞానమునకు అర్థముగాని సంశయమేమిటి?
శిష్యులు : అవినాశు మీరు ఇచ్చిన దీవెనయే మాకు అర్థముకాలేదు స్వామి.
గురువు : అందులో అర్థము కానిదేమున్నది?
శిష్యులు : మీరు అవినాశ్ను దీవిస్తూ “నీవు నాశనమై పోనాని” అన్నారు. మరణముతో జీవుడు నాశనము కాడు. కర్మ
అయిపోయినపుడే నాశనమగు నని చెప్పారు. కర్మఅనుభవించనిదే పోదు. లేక యోగము చేయనిదేపోదు. అటువంటపుడు
మీమాట జరుగునా అన్నదే సంశయము.
గురువు : కర్మ విషయములో మీరు చెప్పిన పద్ధతి సరియైనదే. కాని మరొక పద్దతి కూడ కలదు. జ్ఞానాగ్ని
అమితముగనున్నవారు వారి సంకల్పము చేత ఎదుటివాని కర్మను కాల్చవచ్చును. ఆ విధముగ సంపూర్ణ యోగులై
బ్రహ్మర్షి హోదా కల్గినవారు మాత్రము చేయగలరు. కర్మ లేకుండపోతే జీవుడు నశించి పరమాత్మగా మారగలడు.
అవినాశన్ను నేను దీవించడములో అదే అంతరార్థము గలదు. అవినాశ్ అంటే నాశనములేనివాడని అర్థము కదా!
అపేరు సార్థకమగునట్లు అతడు జీవునిగకాక నాశనములేని దేవునిగ మారిపోవలెనని, జీవాత్మవైన నీవు నశించి పోవాలని
దీవించాను.
శిష్యులు : మీరు దీవించిన తర్వాత కూడ అవినాశ్ మోక్షము పొందక దైవత్వములో కలిసిపోక మాతో సమానముగ
జీవిస్తున్నాడు కదా! దీవెనలోని అర్థము జీవుడు నశించి దేవుడు కావలెననే కదా! అది ఇంతవరకు జరుగలేదు కదా!
గురువు : ఇపుడు వెంటనే జరగలేదను మాట వాస్తవమే. పెద్దల దీవెన వెంటనే ఎందుకు జరగలేదు? ఎప్పుడు
జరుగును? అను ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే దీవెనలను గురించి పూర్తి వివరముగ తెలియ వలెను. దాని
విషయమునే ఇపుడు సవివరముగ తెలిపెదను వినండి. దీవెననే మరియొక పేరుతో 'ఆశీర్వాదము' అని అందరు.
ఆశీర్వాదము ఎవరైన ఇయ్యవచ్చును. కాని నెవవేరునది ఒక్క బ్రహ్మర్షులైన వారి దీవెన మాత్రమేనని తెలియాలి.
బ్రహ్మర్షులు దీవించిన ఆ దీవెన ప్రారబ్ధకర్మ మీద మాత్రము పనిచేయదని తెలియవలెను. ప్రారబ్ధము పుట్టుకతో
మొదలై చావుతో అయిపోవును. అందువలన ఏ దీవెనైన ఆ జన్మ అయిపోయిన తర్వాతనే పనిచేయును. సర్వాధికారియైన
భగవంతుని శరీరమునుండి వచ్చు పరమాత్మ దీవెన తప్ప ఇతరులెంతవారైన ఇచ్చు దీవెన తర్వాత జన్మలో జరగవలసిందే.
కావున ఇపుడు నేనిచ్చిన మాట ప్రకారము అవినాశ్ తర్వాత జన్మలో మోక్షము పొందుటకు తగిన జ్ఞానశక్తికల్గి నాదీవెన
నెరవేరును. ఈ పద్ధతి తెలిసి పూర్వము దీవించెడివారు. ఇప్పుడు తెలియని దానివలననే మీరు ప్రశ్నించారు. ఇంకా
తెలియనివారు మరియు స్థూల శరీరమునే తామనుకొనువారు దీవెనలోని అర్థమును స్థూలమునకే వర్తింపజేసుకొని
“నీవు నాశనమై పోనాని” అను దీవెనను తిట్టుగ భావించుకొని నేను చనిపోవాలని దూషిస్తున్నావా” అంటున్నారు.
స్థూల సూక్ష్మముల వివరము తెలియనపుడు, ఆత్మల వివరము తెలియనపుడు, జ్ఞాన సముపార్జన లేనపుడు దీవెనలు
తిట్లుగ, తిట్లు దీవెనలుగ అర్థమగును. అందువలన “నీవు నాశనమై పోనాని” అను దీవెన నేటి కాలమునకు దూషణగ
మారినది.
దీర్గాయుస్మాన్ భవ.
“దీర్గాయుస్మాన్ భవ” అను దూషణ దీవెనగ మారినది. “దీర్గాయుస్మాన్ భవ” అనగ నీవు చాలకాలము
బ్రతకమని లేక నీకు చాలా ఆయుస్సు కలగవలెనని దీవించడముకదా! ఇందులో చెడుఏముంది? ఇపుడిది దీవెనగనే
కనిపిస్తున్నది కదా! పూర్వము దూషణగ ఎట్లుండెడిదని కొందరికి అనుమానము రావచ్చును. "దీర్గాయుస్మాన్ భవ”
అన్న మాట పూర్వము పెద్దల దృష్ఠిలో ఎలా దూషణగ ఉండెడిదో వివరించుకొని చూస్తాము.
పూర్వము ఒక గురువు ఎంతో కష్టపడి జ్ఞానబోధ సాగించు చుండెను. గురువు ధనికుడుకానందువలన
ఇతరుల దగ్గర ధనమును వడ్డీకి అప్పుగతీసుకొని దానిని వినియోగించి జ్ఞానప్రచారము చేయు చుండెను. ఆ గురువు
దగ్గర లెక్కాచారి అను ఒక భక్తుడు చేరాడు. అతను వ్యాపారము చేసి డబ్బు సంపాదించడమే కాక సంపాదించిన
సొమ్మును వడ్డీకి అప్పులిచ్చి కూడ సంపాదించడము అతని పని. గురువుగారికి డబ్బు అవసరము కదా! ఆయనకు
అప్పుగ డబ్బులిస్తే జ్ఞాన విషయములో సహాయపడినట్లు ఉంటుంది, సులభముగ వడ్డీ కూడ వస్తుంది. రెండు రకములుగ
లాభమే ఉంటుందనుకొన్నాడు. వ్యాపారస్తుడు కావున జ్ఞానము దగ్గర కూడ వ్యాపారదృష్టి ఉండెడిది. గురువుగారు
జ్ఞాన ప్రచారనిమిత్తము ఇరువది మంది శిష్యులతో సహా పర్యటించవలెననుకొన్నాడు. ఆ పర్యటనకు ఒక లక్షరూపాయలు
అవసరమైనాయి. గురువు గారు ఆ లక్షరూపాయలు అప్పుచేసి తర్వాత తీరుస్తామనుకొన్నాడు. విషయము తెలిసిన
లెక్కాచారి నా స్నేహితుని దగ్గర డబ్బులున్నాయి, అతనిని అడిగి నూటికి రెండురూపాయల వడ్డి ప్రకారము లక్షరూపాయలు
అప్పు తెస్తానన్నాడు. అట్లేకానిమ్మని గురువుగారు ప్రాంసరినోటు కూడ వ్రాసిచ్చాడు. నోటుకూడ స్నేహితుని పేరుమీదనే
వ్రాయించుకొన్నాడు లెక్కాచారి.
గురువుగారు ఆరునెలల కాలము తన జ్ఞానప్రచారము సాగించి ఉన్నడబ్బులన్ని అయిపోయిన తర్వాత ఇంటికి
వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన పొలము పనుల మీద దృష్టిసారించాడు. ఒక రోజు గురువుగారి దగ్గరకు
లెక్కాచారి వచ్చి ఆరునెలల కొకమారు వడ్డికట్టునట్లు ఒప్పుకొన్నానని, దానిప్రకారము ఆరునెలలు గడచినది కావున
ఇపుడు అతనికి వడ్డికట్టవలెనని చెప్పాడు. ప్రపంచ విషయములలో ఎక్కువ జోక్యములేని గురువుగారు ఆ మాటకు సరె
అన్నాడు. గురువుగారి దగ్గర డబ్బులేని దానివలన అతనికిచ్చు వెయ్యిరూపాయలు కూడ అప్పు చేయాలనుకొన్నాడు.
ఆ విషయము తెలిసిన లెక్కాచారి వెయ్యిరూపాయలు ప్రస్తుతము వేరేవాని దగ్గర వడ్డీకి తెస్తాను తర్వాత ఇవ్వవచ్చునన్నాడు.
అలాగే తెమ్మన్నాడు గురువుగారు. లెక్కాచారి ప్రస్తుతము వెయ్యిరూపాయలు ఆదుకొన్నట్లు చేసి గురువుగారి వద్ద
అభిమానము సంపాదించవలెననుకొన్నాడు. గురువుగారికి ఈ విధముగ మూడు సంవత్సరముల కాలము
ఆరునెలలకొకమారు చక్రవడ్డీ పడినది.
గురువుగారు కూడ సాధారణ జీవాత్మయే, కావున ప్రపంచములో అప్పుడప్పుడు అక్కడక్కడ మోసపోవలసి
వస్తుంది. జీవాత్మగ మోసపోయిన గురువుగారు ఒక రోజు యోగసమయములో ఆత్మగ మారిపోయాడు. తన శరీరములోని
ఆత్మగ మారడమేకాక సర్వశరీరములోని ఆత్మగ కూడ మారిపోయాడు. అపుడు లెక్కాచారి శరీరములోని ఆత్మకూడ
ఆయనే కావున లెక్కాచారి శరీరములో జరిగిన గుణముల పనులన్ని తెలిసాయి. లెక్కాచారి శరీరములో ఆత్మ అన్నిటిని
చూస్తు సాక్షిగ ఉన్నది కావున అన్ని విషయములు గురువుగారికి తెలిసిపోయాయి. తన డబ్బు ఇచ్చి తన స్నేహితునిదని
చెప్పడము, ఆరునెలలకొకమారు చక్రవడ్డీ లాగడము తెలిసిన గురువుగారు జ్ఞానము యొక్క విలువ లెక్కాచారికి, మిగత
భక్తులకు తెలియాలనుకొన్నాడు. తర్వాత కొంతకాలమునకు గురువుగారి జ్ఞానము తెలియుట వలన శిష్యులు గురువుకు
ఎంతో ఋణపడి ఉంటారని, ఆ ఋణము అన్నిటికంటే పెద్దబాకీ అని, గురు ఋణము తీర్చుటకు ఎన్ని జన్మలైన
చాలవని చెప్పాడు. ఆ మాటవిన్న లెక్కాచారి గురువుగారికి మేము బాకి ఉన్నట్లు నోటు వ్రాసివ్వలేదు కదా! ఆయన
చెప్పు జ్ఞానమునకు మేమెలా బాకీ పడుతాము. పైసా ఖర్చులేకుండ నోటితో చెప్పు మాటలకు మేము బాకీ పడడము
లెక్కాచారములేని మాట అనుకొన్నాడు లెక్కాచారి. లెక్కాచారికి అన్ని కనిపించు లెక్కాచారములే తెలియును, కనిపించని
లెక్కాచారములు తెలియవు. అతని మనోభావమును గ్రహించిన గురువుగారు అతని అజ్ఞానానికి నవ్వుకొన్నాడు.
గురువు అనుకొంటే ఇటైన పంపగలడు అటైన పంపగలడు. గురువు అనుకొంటే మోక్షమునకైన పంపగలడు
లేక జన్మలకైన పంపగలడు. గురువుగారు చెప్పెడిది అందరికి వర్తించు జ్ఞానబోధయే. నూటిమందికి జ్ఞానమును
బోధించినప్పటికి అది కొందరికి మోక్షదారి, కొందరికి జన్మల దారి చూపగలదు. వినెడి మనిషి భావాన్నిబట్టి జ్ఞాన
ప్రభావముండును. అందువలన “నీవు జ్ఞానము ఎడల సిగ్గుపడితే నీయెడల జ్ఞానము కూడ సిగ్గుపడునని” పెద్దలన్నారు.
జ్ఞానము యొక్క లెక్కాచారము తెలియక జ్ఞానమువద్ద మోసము చేసిన లెక్కాచారికి జ్ఞానము కూడ మోసమే చేసింది.
అదెలాగనగా! ఒక రోజు గురువుగారికి శిష్యులందరు నమస్కారము చేయుచుండిరి. ఆ సమయములో లెక్కాచారి
తాను కూడ గురువు ముందర వంగి నమస్కారము చేసాడు. ఆ సమయములో గురువుగారి నోటినుండి ఒక మాట
బయల్పపడినది. ఆమాట విన్న లెక్కాచారి తెలియక సంతోష పడినాడు. డబ్బు విషయములో తన పని తెలియక
గురువుగారు సంతోషడి నాడులే అనుకొన్నట్లు, పలికిన పలుకు విషయము తెలియక సంతోషపడి పోయాడు. తాను
తెలిసి మోసము చేసిన, తెలియకనే తాను మోసపోయినట్లు లెక్కాచారికి తెలియలేదు. ప్రపంచ విషయములలో అతి
తెలివి ఉపయోగించు లెక్కాచారికి జ్ఞానములో కనిపించని ఫలితము తెలియకుండపోయినది. అంతకు గురువుగారి
నోటినుండి వచ్చిన మాటేమిటి అంటే, అదియే “దీర్గాయుస్మాన్ భవ”. దీర్గాయుస్మాన్ భవ అనుమాట నిజముగ
చెడును సూచించు దూషనే అయినప్పటికి అతనికది దీవెనగానే కనిపించినది. నేను డబ్బిచ్చిన దానివలననే నన్ను
దీవించాడనుకొన్నాడు. అక్కడ కూడ లాభమే వచ్చిందనుకొన్నాడు. జీవితములో జ్ఞానము తెలిసినప్పటికి అది తనకు
ఉపయోగపడలేదు. ఎంత జ్ఞానము తెలిసిన అతడు జ్ఞానమునకెంత విలువిచ్చాడో, జ్ఞానము కూడ అతనికి అంతే
విలువిచ్చినది. ఆ జన్మ అయిపోయిన తర్వాత మరుజన్మ లభించు సంధికాలము సెకండ్ల కాలమే ఉండును. ఆ కొద్ది
కాలములోనే జీవితమునకు సంబంధించిన ప్రారబ్ధము ఏర్పడును. అపుడు గురువుగారు పలికిన పలుకు యొక్క
సారాంశము ప్రకారము సంచితకర్మనుండి ప్రారబ్ధమగును. గురువుగారి శాపము ప్రకారము ఆ క్రొత్త జన్మలో దీర్గాయుస్సు
ఏర్పడినది.
తర్వాత జన్మ పురుషజన్మే కల్గడము మరియు ఆచారి కులములోనే పుట్టడము విశేషము. పోయిన జన్మలో
బంగారు ఆభరణముల పనిచేయగ ఈ జన్మలో రాతి ప్రతిమలను చేయుపని కల్గినది. యుక్తవయస్సు తర్వాత
శిల్పాచారియైన లెక్కాచారి యాభైసంవత్సరములకే చూపులోపము వలన పనిచేయలేక పోయెను. పనిచేయగల్గిన
కొడుకులు సంపాదించలేదని తండ్రిని చులకనగ మాట్లాడజొచ్చిరి. ఐదు సంవత్సరముల తర్వాత మధుమేహ
(సుగర్) వ్యాధితో ఆహారము కడుపునిండ తినకూడని పరిస్థితి ఏర్పడినది. తిన్న కొద్ది ఆహారము కూడ రుచిలేని తిండి.
కాఫీలు తాగకూడదు. మత్తు పాణీయములకు అలవాటుపడ్డ దానివలన తాగకుండ ఉండలేడు. ఇలా యాబైఐదు
సంవత్సరములకే జీవితము దుర్భరముగ తోచినది. అరవై సంవత్సరములకు సుగర్ వ్యాధివలన ఒక కాలును తీసివేయడము
జరిగినది. కుంటి బ్రతుకు మరీ దుర్భరమైనది. కొన్నాళ్ళకు కొడుకులు కోడల్లు ఇంటిలోనికి రానివ్వక ఇంటిబయటే
ఉంచిరి. వాళ్ళు పెంచుకొను కుక్కనైన అప్పుడప్పుడు ఇంటిలోనికి రానిచ్చిన తనను మాత్రము రానివ్వకుండిరి. ఇలా
కుక్కకంటే హీనముగ తనవారు చూడగ, శరీరము అశుభ్రతలో పందికంటే హీనముగ తయారైనది. 70 సంవత్సరముల
వయస్సుకు శరీరము నరముల బలములేక మూత్ర విసర్జనకు పోకమునుపే గుడ్డలోనికి మూత్రమురావడము వలన ఆ
వాసనకు సాటిమనుషులు తనవద్దకు పలకరించను కూడ రాకుండిరి. ఇటువంటి బ్రతుకు శత్రువుకు కూడ కలుగకూడదని
తనకు మరణమొస్తే మంచిదని తలచుచుండెను. అందరు బ్రతికేదానికి దేవున్ని కోరుతుంటే తాను మాత్రము చచ్చేదానికి
దేవున్ని కోరుచుండెను.
ఆచారి వయస్సు 80 సంవత్సరములైనది. వృద్ధాప్యమంటే ఏమిటో, అనారోగ్యమంటే ఏమిటో బాగా అర్థమైనది.
చివరికి జీవితమంటే ఏమిటో అర్థమైనది. మానవునికంటే పశు, పక్షుల జన్మలే మేలనిపించింది. ఈ విధముగ
బ్రతకలేక చావురాక దినమొక యుగముగ గడుపుచున్నపుడు వారి ఇంటికి ఒక స్వామీజీ వచ్చాడు. కొడుకుల ఆహ్వానము
ప్రకారము ఇంటికి వచ్చిన స్వామీజీ గొప్ప జ్యోతిష్యుడు కూడా. ముఖము చూచినంతనే జరిగినది జరుగబోవునది
చెప్పగల దిట్ట. ఆ స్వామీజీ విషయము తెలుసుకొన్న లెక్కాచారి స్వామి బయటికి పోవునపుడు ఆయన కాళ్ళను గట్టిగ
పట్టుకొని నేను తొందరగ చనిపోవునట్లు దీవించమన్నాడు. ఎందుకని స్వామి అడుగగ, వృద్ధాప్యము చాలా దుర్భరమైనదని
తాను బ్రతకలేకున్నా నని, నేనుండి చేయునదేమి లేదని, చస్తామనుకొంటే చావురావడములేదని, నాకు కావలసినది
చావు కావున అది వచ్చేటట్లు ఈ శరీరము వీడి పోయేటట్లు దీవించమన్నాడు. అందులకు ఆ స్వామి నవ్వి “మానవ
జీవితము కొంతకాలమే అందమైనదని తర్వాత దుర్భరమైనదని తెలియక, పోయిన జన్మలో పరమార్థమును బోధించిన
గురువుకే మోసము చేశావు. ధనము విలువ తప్ప జ్ఞానధనము విలువ తెలియని నీకు ఆ గురువుగారు ఇచ్చిన
దీవెనయే నీపాలిటి శాపమైనది. ఆ దినము నీకు దీవెనగ అర్థమైన అది నీకు దుశ్శకునమే. దైవజ్ఞానమునకు
విలువివ్వక జీవితములో ధనమునకే విలువిచ్చి గురువునే మోసగించిన నీకు 'దీర్గాయుస్మాన్ భవ' అని శపించడము
జరిగినది. ఆ వాక్కు ఫలితమే ఎంతరోగమున్న సంపూర్ణముగ నూరు సంవత్సరములు బ్రతుకవలసి ఉన్నది. ఇదియే
నీ భవిష్యత్తు” అని చెప్పాడు. ఆ మాటతో లెక్కాచారికి పోయిన జన్మ లెక్కాచారమేమిటో తెలిసినది. తనకు పరిష్కారమే
లేదా అని స్వామీజీని అడిగాడు. దానికి స్వామీజీ “నీకు వాక్కు ఇచ్చినవాడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు భగవంతుని
మాట అది, కావున దానికి పరిష్కారమే ఉండదు. సాటిమనిషిగ కనిపించినందువలన ఆనాడు ఆయనమాటలను
లెక్కించక ఆయనను గురించి ప్రక్కన హేళన మాట్లాడుకొన్నందుకు రోగము వచ్చింది. ఆయన వద్దకు భక్తితో పోవు
వారిని చూచి వీరంతా మోక్షానికి పోయేవాళ్ళని అసూయతో మాట్లాడినందుకు నీవు ఎక్కడ పోకుండ కాలుపోయినది.
గురువుగారి జ్ఞానమును తెలిసి విలువివ్వక పోవడము వలన నీకు స్వంత కొడుకు కోడళ్ళ వద్దనే విలువలేకుండ
పోయినది. గురువుకే అబద్దము చెప్పి డబ్బు విషయములో మోసము చేసినందుకు నీవు సంపాదించిన డబ్బును నీవు
అనుభవించేదానికి లేకుండ ఏమిలేనివానికంటే హీనముగ బయటపడి ఉన్నావు. ఇంత జరిగిన దైవజ్ఞానము కావాలనుకోక
చావు కావాలనడము మూర్ఖత్వము కాదా! చావు నీ ఇష్టాయిష్టముల మీద ఆధారపడి ఉండదు. కావున అది ఎప్పుడు
రావాలో అప్పుడే వస్తుంది” అని చెప్పి వెళ్లిపోయాడు.
దీనిని బట్టి చూస్తే 'దీర్గాయుస్మాన్ భవ' అను మాట దీవెనవలె ఉన్నప్పటికి అది దీవెనకాదు దూషణయేనని
తెలియుచున్నది. అట్లే నీవు నాశనమైపోనాని అనుమాట దూషణవలె ఉన్నప్పటికి అది దూషణకాదు దీవెనయేనని
తెలియుచున్నది. అందువలన తిట్లలో జ్ఞానము, దీవెనలలో అజ్ఞానమున్నదని తెలుపుచున్నాము. తిట్లు దీవెనలను
రెండురకములు ఉన్నప్పటికి దీవెనరూపములో చెడును సూచించు తిట్లు, తిట్ల రూపములో మంచిని సూచించు
దీవెనలుగలవని తెలియుచున్నది. ఇపుడు తిట్ల రూపములోనున్న దీవెనలను వివరించుకొందాము.
నీవు ముండమొయ్యనాని.
“నీవు ముండమొయ్యనాని” అను మాట కూడ తిట్లరూపములో నున్న దీవెనయే. పూర్వము ఈ మాట
దీవెనగ చెప్పబడినది. నేడు దాని అర్థము తెలియని అజ్ఞానమనుషులు ఈ మాటనే తిట్టుగ మాట్లాడు చున్నారు.
పూర్వము జ్ఞానధనమున్న గొప్ప గురువుల వద్దకుగాని, మహర్షులవద్దకు గాని సాధారణ మనుషులు పోయి, అక్కడ
వారివద్ద వినయవిధేయతలు కల్గి జ్ఞానజిజ్ఞాసులై ఉన్నపుడు, వారికి జ్ఞానముకల్గి మోక్షమును పొందవలెనను మంచి
ఉద్దేశముతో “నీవుముండమోయనాని” అని దీవించెడివారు. బయటి ప్రపంచములో ముండమోయడము అంటే భర్త
చనిపోయినపుడు భార్యకు పసుపుకుంకుమలు, గాజులు, తాలిబొట్టు మెట్టెలు తీసి వేసిడమును ముండమోయడమని
అనుచుందురు. పూర్వము జ్ఞాన సంబంధమైన అర్థముతో నీవు ముండమొయ్యనాని అనుమాటను బాహ్యార్థముతో
పోల్చి చూచుకొంటే తిట్టుగానే కనిపించును. నేడు ఆ మాటను అనేవారు కూడ బయటి అర్థముతోనే అనుటవలన పూర్తి
దూషణ క్రిందికి మారి పోయినది. నీవు ముండమొయ్యనాని అను ఒకే మాట జ్ఞానము ప్రకారము దీవెన అజ్ఞానము
ప్రకారము తిట్టుగనున్నది. అజ్ఞానము ప్రకారము ఆడవారిని తిట్టునపుడు నీ భర్త చనిపోవలెనను అశుభమును
సూచించునట్లును, మగవారిని తిట్టునపుడు నీ భార్య చనిపోవలెనను అశుభమును సూచించునట్లును, అర్థమొచ్చునట్లు
నీవు ముండమొయ్యనాని అనుచున్నారు.
జ్ఞానము ప్రకారము దీవెనగా ఎట్లున్నదంటే! జగతిలో చపలత్వముగ స్త్రీని ముండ అనడము సహజము.
వ్యభిచరించు స్త్రీని లంజముండ అనడము కూడ జరుగుచున్నది. శరీరములో చపలత్వము గల మనస్సును ముండతో
సమానముగ పోల్చి చెప్పుచున్నాము. మూయడము అనగా కనిపించకుండ, లేకు * మూయనాని అనగా
లేకుండ చేయడమని అర్థము. మూయనాని అను పదము కాలక్రమమున మోయనాని అయినది. ముండమోయనాని
అనగా వ్యభిచరించు మనస్సును అణచి వేయడమని అర్థము. చంచల మనస్సు ఎపుడు నిలచిపోవునో అపుడు
బ్రహ్మయోగము లభించును. బ్రహ్మయోగము లభించవలెనన్న మనస్సు లేకుండ పోవలెను. మనస్సును అణచివేయుట
చాలా కష్టమైనపని. మనోసంకల్పమును లేకుండచేసి మనుస్సును అణచి వేయడము గాలిని మూటగట్టినంత పనిగ
ఉండును. ఎంతో దుర్లభమైన మనోనిలకడ కల్గుటకు ఒక గురువు శిష్యుని దీవించిన దీవెనయే 'నీవు ముండమోయనాని'.
ముండ అనగ మనస్సు, మోయనాని అనగ లేకుండ చేయడమని అర్థము తీసుకొంటే, నీవు మనస్సును జయించమని
దీవించడమే అగును. జ్ఞానపరముగ ముండమోయడము దీవెనైనది. ఈ మాటనే ఇంకొక విధముగ కూడ దీవెంచెడివారు.
'నీవు మూడుదోవలు కలిసే చోటముండమొయ్య' అనడము కూడ జరిగెడిది. ఇక్కడ మూడుదోవలు కలిసేచోట
అనడము విశేషము. శరీరములోని మనస్సును లేకుండ చేసుకొని బ్రహ్మయోగమును పొందడము దీవెనలోని ముఖ్య
ఉద్దేశము అయినందువలన మూడు దోవలు కూడ శరీరములోనే ఉండునని ఆలోచించవలసిన అవసరమున్నది.
విధముగ ఆలోచిస్తే మన శరీరములో ముఖ్యమైన మూడునాడులు కలయుచోటు కలదు. ఇడ, పింగళ, సుషుమ్న
అనబడు మూడు ముఖ్యమైన నాడులు శరీరములో గలవు. వీటినే సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడి అను పేర్లు గల
మూడునాడులుగ చెప్పుకొనుచున్నాము. ఈ మూడునాడులు తలమద్య భాగములో కలియుచున్నవి. తలలోపల
కలియు మూడునాడు లను బయటికి కనిపించునట్లు ముక్కుకు పైన నుదుటి భాగమున మూడు నామములుగ తీర్చిదిద్దడము
నేటికి జరుగుచున్నది. పూర్వము మూడు నాడుల విషయము తెలిసిన జ్ఞానులు వాటిని బయటికి కనిపించునట్లు
పెట్టారు. నేడు పూర్వపు పద్ధతిని కొందరు అనుసరించి నుదిటిమీద నామములు దిద్దుకొన్నప్పటికీ వాటి అర్ధము
తెలియదు. నామము పెట్టుకొన్నవారు వైష్ణవులని అనుకోవడము జరుగుచున్నది. లోపలి నాడుల ఉనికిని తెలియజేయుటకే
నామములు పెట్టడమని ఎవరికి తెలియకుండ పోయినది. మూడునాడులలో సూర్యచంద్రనాడులనబడు రెండు నాడుల
యందు మనస్సు జాగ్రత్తావస్థలో ఉండును. బ్రహ్మనాడిలో ఉన్నపుడు నిద్రావస్థలో ఉండును. మూడునాడులు పైన
కనిపించు కనుబొమలకు మధ్యభాగమున తలమద్యలో కలిసియుండును. ఈ మూడునాడులు కలియుచోటును
త్రివేణిసంగమమని, గంగ యమున సరస్వతి కలియు చోటని అనుటగలదు.
మూడునాడులు కలయుచోటునే మూడు దోవలు కలిసిన చోటని అనడము జరుగుచున్నది. శరీరములోని
మనస్సును మూడునాడులు కలియు భృకుటి స్థానములోనే లగ్నము చేసి బయటి చింతలు లేకుండ చేయడమునే
బ్రహ్మయోగము అంటున్నాము. మనస్సు మెలుకువలోను నిద్రలోను లేకుండ లోపల జ్ఞప్తికల్గి బ్రహ్మనాడిలో
సూర్యచంద్రనాడులు కలయు చోట తలమద్యలో నిలువడమును బ్రహ్మయోగమంటాము. కావున 'మూడుదోవలు
కలియుచోట ముండమోయనాని' అని పూర్వము దీవించెడి వారు. జ్ఞానపద్ధతి ప్రకారము గొప్ప ఉద్దేశముతో దీవించిన
దీవెన నేడు అజ్ఞానముతో దూషించు తిట్టుగ మారిపోయినది. పూర్వము గొప్ప జ్ఞానులైన గురువులు మహర్షులు
తమవద్దకు జ్ఞాననిమిత్తము వచ్చినవారికి తొందరగ జ్ఞానము కలుగవలెనని, వారు తొందరగ మోక్షము పొందవలెనని
దీవించెడివారు. బ్రహ్మయోగము లభ్యము కావలెనని దీవించిన మాటయే 'నీముండమోయనాని' అని తెలుసుకొన్నాము.
నీ తాడు తెగ.
మనమనుకొన్న వాటిలో మరికొన్ని దీవెనలు గలవు. అందులో ఒకటి “నీ తాడు తెగనాని” అనునది. తాడు
కట్టివేయుటకు పనికి వచ్చునది. తాడు బంధించునది కావున బంధము అంటున్నాము. బంధింపబడు దానిని బంధీ
అంటున్నాము. ఆధ్యాత్మికము ప్రకారము కర్మ అనునది బంధనము అనుతాడుగ, జీవుడు బంధింపబడిన బంధీగా
ఉన్నాడు. పాపపుణ్యములను కర్మబంధనము జీవుని బంధించి జన్మలకు పంపుచున్నది. ఎపుడైతే కర్మలేకుండపోవునో
అపుడు జీవుడు మోక్షము పొందగలడు. మోక్షము అనగ విడుదల అని అర్ధము. కర్మబంధనము నుండి విడుదల
పొందడమునే ముక్తి, విముక్తి అంటున్నాము. జ్ఞానము తెలుసుకొనువాడు తొందరగ ముక్తి పొందవలెనని పెద్దలు
దీవించు మాటను పూర్వము “నీతాడు తెగనాని” అనెడివారు. నేడు ఆ మాట యొక్క అర్థము తెలియక పోవడము
వలన కోపముతో ఎవరినైన తిట్టునపుడు దూషణ “నీతాడు తెగనాని” అనడము జరుగుచున్నది. ఆనాడు దయతో
పలికిన పలుకు దీవెనకాగ, నేడు కోపముతో పలుకుచున్న అదేమాట తిట్టుగ చలామణి అగుచున్నది.
నీ ఆకు చినగ.
ఇదే విధముగ పూర్వము దయతో దీవించిన దీవెన మరొకటి గలదు. అదియే “నీ ఆకు చినగనాని” ఈ
మాటలో పూర్వపు జ్ఞానుల ఉద్దేశమేమిటో వివరించుకొందాము. కొన్ని వేలు వందల సంవత్సరముల పూర్వము
వ్రాయుటకు కాగితములులేని కాలములో ఆనాడు వ్రాతను తాటి ఆకులమీద వ్రాసెడివారు. వ్రాత అనునది ఆకులమీదనే
ఉండెదని అప్పటికాలములో అందరికి తెలియును. జీవుని కర్మకూడ లిఖించబడి ఉన్నదని, కర్మవాత తెల్లటి పత్రము
మీద వ్రాయబడినదని పూర్వము పెద్దలు చెప్పెడివారు. తాటి ఆకుమీద బయటి వ్రాతలు వ్రాయబడినట్లు లలాట
పత్రము మీద కర్మవ్రాతలు గలవని, దానిప్రకారమే జరుగునని అనాటి జ్ఞానుల ఉద్దేశముండెడిది. కర్మవ్రాత లేకుండ
పోతే దేవునియందైక్య మగుదురని చెప్పెడివారు. కర్మ వ్రాతలేకుండ పోవాలంటే కర్మ లిఖితమే కాకూడదని, కర్మలిఖితము
కాకుండ ఉండవలెనంటే కర్మ వ్రాయబడు పత్రమే ఉండకూడదని ఆనాటి వారి భావము. అందువలన తమశిష్యులను
దీవించునపుడు కొందరు గురువులు దీవెనగ “నీ ఆకు చినగనాని” అనెడివారు. తమ శిష్యులకు కర్మలేకుండపోయి
మోక్షము లభించవలెనను ఉద్దేశముతో నీ ఆకు చినగనాని అని శుభము కల్గునట్లు చెప్పుచుండిరి. కర్మవిముక్తిగావించు
అర్థములలో నీ ఆకు చినగనాని అనుమాట దీవెనలలో చేరియున్నది. నేటికది మిగత దీవెనలవలె అర్థము తెలియకుండ
పోయి చివరకు తిట్లలోనికి చేరిపోయినది. కొందరు అజ్ఞానులు నీ ఆకు చినగనాని అని శాపనార్థముగ దూషించుకొనుట
పల్లెప్రాంతములలో చూస్తునే ఉన్నాము.
నీ తలపండు పగల.
పూర్వము జంబుకేశ్వరుడను ఒక మహర్షి ఉత్తరదేశమున హిమాలయ ప్రాంతములో నివసిస్తుండెను. ఆయన
చాలా గొప్ప జ్ఞాని. యోగపురుషుడని తెలిసి అనేకమంది ఆయన వద్దకు వచ్చి కొందరు జ్ఞానమును ఆశించగ,
కొందరు ప్రపంచవిషయములను అడుగుచుండిరి. ప్రపంచవిషయములకు ఏమాత్రము విలువివ్వని జంబుకేశ్వరముని
జ్ఞాన జిజ్ఞాసులను తన వద్దయుంచుకొని మిగత వారిని అక్కడినుండి పంపి వేయుచుండెను. జ్ఞానము మీద ఆసక్తి
కల్గిన వారిని కూడ ఎన్నో కష్టములకు గురిచేసి అన్నిటికి ఓర్చుకొని తన సేవ చేసిన వారికి మాత్రము జ్ఞానమును
బోధించుచుండెను. జ్ఞానమును బోధించిన తర్వాత దాని ప్రకారము నడుచుకోని వానిని తిరిగి వెనకకు పంపుచుండెను.
ఆయన దగ్గర జ్ఞానము తెలుసుకొనుటకు చాలామంది ప్రయత్నించుచుండినప్పటికి ఆయన శిక్షణకు చాలామంది
నిలువజాలకుండిరి. జంబుకేశ్వర మహర్షి గురువులందరికంటే గొప్పవాడని, ఆయనవద్ద గొప్ప జ్ఞానము కలదని
తెలిసినవారు కొందరు దక్షణదేశము నుండి బయలుదేరిపోయారు. వారిలో ఇద్దరు ఒక ఇంటి నుండి బయలుదేరిన
అన్నదమ్ములుండిరి. హిమాలయములలో జంబుకేశ్వరమునిని చేరుకొన్న దక్షణదేశస్థులు కొందరు చివరి వరకు
నిలువలేకపోయారు. జంబుకేశ్వరుడు చెప్పు జ్ఞానము గొప్పదే, పెట్టు పరీక్షలు గొప్పవే. ఆయన పెట్టు జ్ఞాన సంబంధ
పరీక్షలలో వారిగుణములు బయటపడడము వారికి అక్కడ స్థానము లేకుండపోవడము జరిగినది. చివరకు అన్నదమ్ములు
మాత్రము గట్టిగ నిలువగలిగినారు. వారిలోనున్న పట్టుదలకు జంబుకేశ్వరు నికి సంతోషము కల్గినది. ఇద్దరు
భక్తులలో పెద్దవాడు చిన్నవానికంటే ఎక్కువ జ్ఞానాసక్తి కల్గియుండడము గ్రహించిన జంబుకేశ్వరుడు ఒకరోజు అతను
పాద నమస్కారము చేసుకొన్నపుడు “నీ తలపండు పగలనాని” అని దీవించాడు. ఆ దీవెనలోని భావము సోదరులకిద్దరికి
అర్థము కాలేదు. అయినప్పటికి పెద్దవాడు గురువుమీద గొప్పనమ్మకము గలవాడు, కావున ఆయన ఏమిచెప్పిన అది
నాకు శుభమును కల్గించునదే అయిఉండునను కొన్నాడు. చిన్నవాడు మాత్రము ఇదేదో అశుభమును కల్గించుమాటని
అనుకొన్నాడు. వారి మనసులోని ఉద్దేశములను గ్రహించిన జంబుకేశ్వరుడు ఒకరోజు ఇద్దరిని పిలచి నేను దీవించిన
దీవెనను గురించి ఒకరు మంచిభావము కల్గియుండడము, మరియొకరు చెడు భావము కల్గి యుండడము నాకు
తెలిసినదని చెప్పాడు. ఈ విధముగ మీ మనస్సులలో ఉండడము వలన కొంతకాలమునకు అశుభమును శంకించినవారు
అజ్ఞానములో పడి, మాయప్రేరణతో నానుండి దూరమై పోవుటకు అవకాశము గలదు. కావున మీకు తెలియని నా
వాక్కును గురించి మీకు వివరముగ తెలియజేయదలచుకొన్నాను అని ఇలా చెప్పసాగాడు.
'మేము చెప్పుమాటలను కనిపించు ప్రపంచ అర్థముతో మరియు కనిపించని దైవ అర్థముతో రెండురకముల
చూచుటకు అవకాశముగలదు. జ్ఞాని జ్ఞానవిధానముతో, అజ్ఞాని ప్రపంచవిధానముతో అర్థము చేసుకొనుచుందురు.
మీలో ఒకరు ప్రపంచార్థముతో చూచుట వలన నామాట చెడుగా అర్థమైనది. ఒకరు జ్ఞానార్థము తెలియకున్నను నా
మీదున్న గొప్పభావముతో మంచిగానే ఊహించుకొన్నాడు. ఊహ నిజము కావచ్చును అబద్దముకావచ్చును. కావున
ఖచ్చితముగ తెలిసినదని చెప్పలేము. మరియొకరికి తల ముక్కలైపోవునట్లు శపించానని అర్థమైనది. ఆ విధముగ
అర్థమగుట వలన జ్ఞానమునకే దూరమగుటకు అవకాశము గలదు. ఒకరికి దీవెనేమోనని మరియొకరికి దూషణగ
అర్థమగుటకు పూర్వమున్న జ్ఞానము నేడు లేకపోవడమే కారణము. పూర్వము "నీ తలపండు పగలనాని” అనుమాట
సంపూర్ణ దీవెనగ ఉండెడిది. ఈ వాక్యము దీవెనగ ఎట్లుండెదిదో వివరించి తెలిపెదను. పండు అనగ తినుటకై
పరిపక్వమునకు వచ్చిన ఫలము అని అర్థము. పండులో తిని అనుభవించుటకు కావలసిన పదార్థము కనిపించక
నిలువయుండును. అలాగే తలలో కంటికి తెలియకుండ కర్మయను పదార్ధము అనుభవించుటకు తయారు గనున్నదను
భావముతో కర్మను తలపండు అనెడివారు. ఒక పండు చెక్కు చెదరకుండ మరియు శుభ్రముగ ఉన్నపుడు తినుటకు
యోగ్యముగ ఉండును. పండుకు రంద్రములు పడికాని, లేక పండు చీలిపోయి అందులోనికి దుమ్ముధూళి పోయి,
క్రిమికీటకములు చేరినపుడు తినుటకు యోగ్యముగ లేకుండా వృథా అయిపోవును. అలాగే కర్మఫలము కూడ జ్ఞానమను
పురుగుచే తొలచబడినపుడు, గురుదీవెన అనెడి చీలిక ఏర్పడినపుడు అది చెడిపోయి కర్మఫలము అనుభవించుటకు
యోగ్యముగ లేకుండపోవును. కర్మఫలము లేనపుడు మానవునికి ముక్తి లభించునని తెలిసిన పెద్దలు తమకు ప్రియమైన
జ్ఞానశిష్యులను "నీ తలపండు పగలనాని” అని దీవించెడివారు. కర్మయను పండు పగిలిపోయి నశించి పోవలెనని,
దానివలన ముక్తి కలుగవలెననుట మంచి శుభమైన ఉద్దేశము, కావున ఈ మాటను దీవెన అనుట సమంజసము.
అజ్ఞానము తో అర్థము చేసుకోలేక అశుభమైన తిట్టుగ అను కోవడము అసమంజసము. ప్రతి మాటను జ్ఞానవివరముగ
యోచించినపుడే అందులోని సారాంశము అర్థమగును” అని చెప్పిన జంబుకేశ్వరుడు దీవెనను దూషణగ అర్థము
చేసుకొన్న చిన్న శిష్యుని గురించి యోచించి అతనిలో ఇంకా జ్ఞానము వృద్ధి కావలసివుందని అనుకొన్నాడు. అతనికి
కూడ జ్ఞానము సంపూర్ణముగ కల్గి జ్ఞానములోని సూక్ష్మమైన అర్థములను గ్రహించునట్లు చేయాలనుకొన్నాడు.
నీ శిరస్సున దీపమెలగ.
గురువుగారు జ్ఞానబోధలు చేస్తు కొంతకాలము గడిపాడు. అప్పటికి కొంత జ్ఞానలోపమున్నదని గ్రహించిన
జంబుకేశ్వరుడు ఒక శుభ సమయమున చిన్న శిష్యునికి కూడ ఒక దీవెన ఇచ్చాడు. అది “నీ శిరస్సున దీపమెలగనాని”
ఇది జ్ఞానపరముగ దీవెన అయినప్పటికి అజ్ఞాన అర్థముతో దూషణగ లెక్కిచంబడుచున్నది. ఒక ఇంటిలో ఎవరైన
చనిపోయినపుడు శవము తలదగ్గర దీపము పెట్టడము ఒక సాంప్ర దాయముగ జరుగుచున్నది. నీ శిరస్సున దీపమెలగ
అనగానే మీ ఇంటిలో ఎవరో ఒకరు చనిపోవలెనని దూషించినట్లు అర్థమగుట వలన పై దీవెనను జ్ఞానము తెలియనివారు
దూషణగనే లెక్కించుదురు. జ్ఞానార్థముతో చూచినట్లయితే ఈ విధముగనున్నది.
జ్ఞానము పొంది దానిప్రకారము ఆచరించినపుడు జ్ఞానాగ్ని మానవునందుత్పత్తి అగును. జీవుడు జన్మించుటకు
జన్మించి కష్ట సుఖములనుభవించుటకు కారణమైన కర్మను జ్ఞానాగ్నియే కాల్చి వేయును. మానవుడు జన్మకర్మలనుండి
బయటపడవలయునంటే అది జ్ఞానాగ్ని వలననే సాధ్యమగును. పాపపుణ్యములను కర్మను కాల్చి వేయుటకు ఒక
జ్ఞానాగ్ని తప్ప ప్రపంచములో వేరేది లేదు. అందువలన భగవద్గీతయందు జ్ఞానయోగములో 37వ శ్లోకమున "యథైధాంసి
సమిద్దాగ్నిర్ధ్భస్మసాత్కురు తేజర్స్చున, జ్ఞానాగ్ని సర్వ కర్మాణి భస్మసాత్కురుతే తథా" అని శ్రీకృష్ణ భగవానుడు కూడ అన్నాడు.
కట్టెలను కాల్చుటకు ఒక్క అగ్నికే సాధ్యమైనట్లు కర్మను కాల్చుటకు ఒక్క జ్ఞానాగ్నికే సాధ్యమగును. మానవునికి తల
భాగములో గల కర్మచక్రమందు కర్మనిలువయుండును. కర్మనిలయమెక్కడ కలదో అక్కడే జ్ఞానాగ్ని కూడ ఉండి కర్మను
కాల్చవలయును. కావున జ్ఞానాగ్ని కూడ తలలో గల కర్మచక్రము వద్దనే నివాసముండును. అందువలనే గొప్ప
యోగుల మరియు దేవతల తల వెనుక భాగమున ప్రకాశమున్నట్లు చిత్రించిన ఎన్నో చిత్రపటములను మనము
చూచుచున్నాము. కర్మను కాల్చు జ్ఞానాగ్నిని సంపాదించుకొమ్మని, అట్లు సంపాదించుకొన్నపుడు మాత్రమే కర్మనాశనమై
మోక్షము పొందగలరని పెద్దలు కూడ తెలుపుచున్నారు. ఈ విధానమును అనుసరించియే తమ శిష్యునికి జ్ఞానము
సంపూర్ణముగ కలుగవలెనని, జ్ఞానాగ్ని శిరస్సులో వెలుగవలెనని, జంబుకేశ్వరుడు తలచి తన పాదములకు
నమస్కరించునపుడు 'నీ శిరస్సున దీపమెలగనాని' అని దీవించాడు. జ్ఞానదీపము తలయందు ప్రకాశించి అజ్ఞానము
తొలగి కర్మకాలి పోవలయునని ఆనాటి వారిభావము. కాని ఈనాడు అది తిట్టుగ పరిగణించబడుచున్నది. ఆడవారు
కొందరు పల్లెప్రాంతములలో ఈ వాక్యమును తిట్టుగ నేటికిని వాడుచున్నారు. తిట్లుగ వాడుచున్న చాలా వాక్యములు
జ్ఞాన సంబంధమైనవని చాలామందికి తెలియకుండ పోయినది.
నీ పాపము కూల.
ఇలా ఎన్నో దీవెన వాక్యములు దూషణలుగ మారియున్న ఈ కాలములో కూడ ఒకే ఒక దీవెన తిట్టుకాక
దూషణగకాక మద్యలో మిగిలిపోయినది. “నీ పాపము కూల” అను వాక్యము స్వచ్చమైన దీవెనే అయినప్పటికి అది
ఊత పదముగ మిగిలిపోయినది. ఇప్పటికి కొన్ని పల్లెప్రాంతములలో కొన్ని ప్రాంతీయ భాషలందు “నీ పాపము కూల”
అనియు, అదేపదమునే "నీ పాసుకూల” అనియు అనుట వినుచున్నాము. ఇంతకుముందు చెప్పిన ఏడు దీవెనలను
ఎక్కువగ ఆడవారే తిట్లరూపములో ఉపయోగిస్తుండగ, నీపాసుకూల అనే వాక్యమును మగవారే ఎక్కువగ వాడుచున్నారు.
పూర్వము గురువులు, స్వాములు, మహర్షులు తమ శిష్యులను, భక్తులను పాపమునుండి విముక్తి గావించుటకు వాడిన
దీవెనయే “నీ పాపము కూల” అనుమాట. నీ పాపము కూల అనుమాట కాలక్రమమున ‘నీపాసుగూల' అను మాటగ
కూడ మారిపోయినది.
నా చవితి.
ఒక భర్తకు ఇద్దరు భార్యలున్నపుడు మొదటి భార్య, రెండవ భార్యను నాచవితి అని అంటుంది. అలాగే రెండవ
భార్య, మొదటి భార్యను నాచవితి అని అంటుంది. ఈ విధముగ ఇద్దరు భార్యలు లేక ఎక్కువమంది భార్యలున్న చోట
భార్యలందరు ఒకరుకొకరు చవితి, నాచవితి అనుకోవడము పరిపాటిగా ఉన్నది. ఇక్కడ ఒక విశేషమేమంటే,
భార్యలందరు ఒకరుకొకరు ప్రేమగా ఉండు సమయములలో అక్కా, చెల్లీ అని చిన్న పెద్దను బట్టి ప్రేమగా
పిలుచుకొనుచుందురు. ఒకవేళ వారిమధ్యలో వైషమ్యాలూ, అభిప్రాయబేధములూ ఉన్నపుడు వారిమధ్యలో ప్రేమ
ఉండదు. ఒకరుకొకరు అసూయ కల్గియుందురు. అటువంటి సమయములలో ఆమె నాకు అక్క అనిగానీ, ఈమె
నాకు చెల్లి అనిగానీ చెప్పుకోరు. అది నాచవితి అనీ, ఇది నా చవితి అని అంటుంటారు. ఇంకా కొందరు పోట్లాడుకొను
సమయములో నీవు నాచవితివే అనియో, లేక నాచవితి అని తిట్టుకొనుచుందురు. ఈ విధముగా “నాచవితి” అనుమాట
తిట్ల జాబితాలోనికి చేరిపోయినది.
పూర్వము కృతయుగము, త్రేతాయుగములలో “నా చవితి" అను మాట గొప్ప జ్ఞానముతో కూడుకొని ఉండెడిది.
పూర్వము దైవజ్ఞానముగా ఉన్నమాట ఈ కాలములో తిట్టుగా మారిపోయినది. కావున తిట్టులో జ్ఞానమున్నదని
మనము ఈ రోజు చెప్పుకోవలసి వచ్చినది. తిట్లజ్ఞానములో నా చవితి అను పదమునకు ఏమి జ్ఞానమున్నదో అని
యోచిస్తే మరియు ఆలోచిస్తే, ఆ రహస్యము ఈ విధముగా తెలియబడుచున్నది. చాతుర్వర్ణమ్ అను పదము భగవద్గీత
జ్ఞానయోగములో 13వ శ్లోకమున చెప్పబడినది. చాతుర్వర్ణమ్ అను పదములో చతుర్, వర్ణమ్ అను రెండు పదములు
కలిసి యున్నవి. చతుర్ అనగా నాలుగు అని అందరికి తెలుసు. ఇకపోతే వర్ణమ్ అను పదమును గురించి యోచిస్తే,
వరస అను శబ్దము నుండి వర్గము, వర్ణము అను పదములు ఏర్పడినవి. వీటన్నిటికి అర్థము వరసలు అనగ వేరు వేరు
క్రమముగా కనిపించుచున్నవివని, వర్గములు అనగా వేరు వేరు గుంపులని, వర్ణములు అనగా వేరువేరు రంగులని
చెప్పవచ్చును. వర్ణమ్ అను పదమునకు ముందు చతుర్ అని చెప్పుటవలన నాలుగు రంగులని చెప్పవచ్చును.
సందర్భానుసారము ఇంకా వివరముగా చెప్పుకొంటే నాలుగు వేరు వేరు విధములుగా ఉన్నవని చెప్పవచ్చును. ఇప్పుడు
తిట్టుగా చెప్పుకొన్న పదములో “చవితి” అను పదము ఉండుటవలన దానిని గురించే విశేషముగా చెప్పుకోవలసియున్నది.
'విదియ' అనగా రెండవదని, 'తదియ' అనగా మూడవదని, చవితి అనగా నాల్గవదని అర్థము చేసుకోవచ్చును.
ముందు యుగములలో “చవితి” అను శబ్దము ఆత్మజ్ఞానము కల్గినదై ఉండుట వలన దాని వివరము ఇలాగున్నది.
భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమందు మొట్టమొదటి శ్లోకమున మొదటనే “ఊర్ధ్వమూలమ్” అను
పదము గలదు. జీవితమునకు గల మూలము శరీరమునకు పైన గల తలయందున్నదని, ఆ పదమునకు అర్థము.
శరీరమునకు పైన శిరస్సుగలదు. ఆ శిరస్సులోపల కనిపించే మెదడుయందు కనిపించని మూలమున్నదని భగవంతుడు
చెప్పాడు. ఇటు భౌతికశాస్త్రవేత్తలకు, అటు విజ్ఞానులకు తలయందు కనిపించే మెదడున్నదని తెలుసు, కానీ కనిపించని
మూలమేమిటో తెలియదు. ఆ మూలమునే భగవద్గీత జ్ఞానయోగములో 13వ శ్లోకమున “చాతుర్వర్ణమ్” అని చెప్పాడు.
శిరస్సు మధ్యభాగములో కనుబొమల మధ్యభాగమునుండి దాదాపు ఒకటి నుండి ఒకటింపావు అంగుళము పొడవుతో
నాలుగుచక్రములు బ్రహ్మనాడి శక్తిని ఇరుసుగ (ఆధారముగ) చేసుకొని తిరుగుచున్నవి. ఆ నాలుగు చక్రములలో
క్రిందిచక్రమైన గుణచక్రము బ్రహ్మనాడియందు ఆరవ నాడీకేంద్రమైన ఆగ్నేయస్థానమున ఉన్నది. ఆగ్నేయ నాడీకేంద్రము
మెదడు మధ్యలో కనుబొమల మధ్యన గలదు. పై చక్రమైన బ్రహ్మచక్రము, మెదడు పై భాగమైన సహస్రార నాడీకేంద్రమున
గలదు. మిగత రెండు చక్రములైన కర్మచక్రము, కాలచక్రములు ఆగ్నేయ కేంద్రమునకు, సహస్రార కేంద్రమునకు
మధ్యలో గలవు. జ్ఞాననేత్రమునకు తెలియబడే ఆ చిత్రము ఈ విధముగ ఉన్నది. క్రింది పటములలో (15 పేజీ ( చూడుము.
మనిషి మెదడులో గల గుణ, కర్మ, కాల, బ్రహ్మచక్రములనబడు నాల్గుచక్రములలో క్రింది చక్రము గుణచక్రము.
ఆ గుణచక్రమును వివరించుకొని చూస్తే, అందులో గుణములున్న భాగములు మూడు, గుణములులేని భాగము ఒకటి
గలదు. మొత్తము నాలుగు గదులుగా గుణచక్రము విభజింపబడి ఉన్నది. అందులో బయటినుండి లోపలికి మొదటది
తామస గుణభాగము, రెండవది రాజస గుణభాగము, మూడవది సాత్త్విక గుణభాగము, నాల్గవది గుణములేని ఆత్మ
భాగము. భూమిమీద పుట్టిన జీవుడు ఎవడైనాగానీ ఈ నాలుగు భాగములలోనే ఉండును. మొదటి భాగములో ఉన్న
జీవున్ని ఆ గుణభాగమునుబట్టి తామసుడనీ, రెండవ భాగములోనున్న జీవున్ని రాజసుడనీ, మూడవ భాగములోనున్న
జీవున్ని సాత్త్వికుడనీ, నాల్గవ భాగములోనున్న వానిని యోగి అని అనుచుందురు. మొదటి మూడు భాగములలో
గుణములుండగ, చివరి నాల్గవ భాగములో ఆత్మ గలదు. అందువలన ఆత్మస్థానములో చేరిన జీవున్ని యోగి అని
అనుచున్నాము. గుణచక్ర నాల్గు భాగములను క్రింది పటములలో ( గుణచక్రములోని జీవుళ్ళు చిత్రములను 15 పేజీ )చూడుము.
యోగి అయినవాడు గుణచక్రములోని నాల్గవస్థానములో ఉంటాడు. కావున వానిని నాల్గవవాడని, చవితియని
అనడము పూర్వముండెడిది. ప్రథమ (పాడ్య), విదియ, తదియ, చవితి అను నాలుగు పేర్లు వరుసగ తామస, రాజస,
సాత్త్విక, యోగులకు వర్తించెడివి. గుణచక్రములో మొదట తామసుడు అజ్ఞాని, అందువలన వానిని మౌడ్యముగలవాడని
అనెడివారు. మౌడ్యము అను పదము ఎలా వచ్చినదనగా? ప్రథమ అను శబ్దము పాఢ్యమి అను శబ్దముగా మారినది.
తర్వాత పాడ్యమి అను శబ్దము మౌడ్యము అను శబ్దముగా మారిపోయినది. మౌడ్యము అనగా అజ్ఞానము అని
అర్థము. పంచాంగములోని పదిహేను తిథులలో మొదటిది పాడ్యమి, చివరిది పౌర్ణమి. పాడ్యమి అజ్ఞానమునకు
గుర్తు, పౌర్ణమి సంపూర్ణ జ్ఞానమునకు గుర్తు. తిథులలో పాడ్యమిగా ఉన్నదే మనుషులలో మౌడ్యముగా ఉన్నది.
గుణచక్రములోని లోపలి నాల్గవభాగములో జీవుడుంటే యోగి అవుతాడు. అటువంటి యోగిని పూర్వము
జ్ఞానము తెలిసినవారు నాల్గవ వానిగా గుర్తించి చవితి అని సంబోధించి పిలిచెడివారు. మిగత మూడు గుణములలోని
మనుషులు ఎవరైనా ఎదుటివాడిని గౌరవిస్తూ వాడు యోగి కాకున్ననూ, వానికి గౌరవ ప్రథముగా యోగియొక్క
విలువనిచ్చి చవితి అనెడి వారు. ఈ విధముగా యోగులనుగానీ, యోగులతో సమానమైన వారిని గానీ, గౌరవముగా
పలకరిస్తూ నా చవితీ బాగున్నావా అని అనెడివారు. తామసుడుగానీ, రాజసుడుగానీ, సాత్త్వికుడుగానీ మూడు
రకములవారు యోగస్థానములోని వానిని చవితి అనుట ఆనాటి జ్ఞానపుమాట. ఈనాడు, ఆనాటి జ్ఞానము తెలియని
దానివలన ఆ మాటను దూషణగా వినియోగిస్తున్నారు. అది ఈనాటి తిట్టుగా ఉండినా, వివరించు కొని చూస్తే
అందులో జ్ఞానమున్నది. దానిని తిట్ల జ్ఞానముగా మనము చెప్పుకొంటున్నాము.
ఇంకా కొంత వివరముగా చెప్పుకొంటే నాల్గవస్థానమైన ఆత్మ స్థానములో ఉన్నవానికి అక్కడ గుణములు లేవు.
కావున వాని బుద్ధి యోచించవలసిన పనిలేదు. గుణములున్నపుడే బుద్ధికి పని ఉండును. గుణములు లేనపుడు బుద్ధికి
ఏమాత్రము పని ఉండదు. అందువలన యోగికి బుద్ధితో పనిలేదు అనియు, బుద్ధిలేదు కావున యోచించడు అనియు
పూర్వము పెద్దలు వివరించారు. యోగి అయినవాడు గుణములున్న వారివలె యోచించడు అని తెల్పుటకు, ఆ
రోజులలో “నా చవితికి బుద్ధిలేదు” అనెడి వారు. అంతేకాక “నా చవితీ! నీకు బుద్ధి ఉందా” అని అడిగినట్లు
మాట్లాడేవారు. ఆ విధముగా అనడము వలన ఎదుటి వానిని యోగిగ వర్ణించునట్లు అర్థమయ్యేది. అంతేకాక యోగి
అయినవాడు తొందరగా మోక్షమును పొంది లేకుండ పోతాడు అను ఉద్దేశముతో, ఎదుటివాని యోగమునకు విలువనిస్తు
“నా చవితీ నీవు తొందరగా నాశనమై పోతావు” అని అనెడి వారు. ఈ మాటలన్నియు పూర్వము మంచి జ్ఞాన
ఉద్దేశమును కల్గియుండగా, అవే మాటలు అన్నియు నేడు తిట్ల జాబితాలోనికి చేరిపోయినవి.
ఒకమాట యొక్క అర్థము, దానివిలువ తెలిసి మాట్లాడితే అది జ్ఞానమవుతుంది. తెలియక మాట్లాడితే
అజ్ఞానమవుతుంది. ఈ సూత్రము ప్రకారము 'నా చవితి' అను మాట తెలిసినవానికి జ్ఞానము, తెలియనివానికి
అజ్ఞానముగా ఉన్నది. ఈ విషయము బాగా అర్థమగుటకు చిన్న ఉదాహరణను చెప్పుకొందాము. ఈ కాలములో
బాగా కష్టాలలో కూరుకుపోయిన పుల్లయ్య అను వ్యక్తి నారాయణస్వామి దేవాలయమునకు పోయి, అక్కడ విశ్రాంతిగ
కూర్చొని, తన మిత్రునితో ఈ విధముగా అంటున్నాడు.
పుల్లయ్య :- నేను పది సంవత్సరములనుండి క్రమము తప్పకుండ ఈ గుడికి వచ్చి నారాయణస్వామికి మ్రొక్కి
పోతున్నాను. అయినా నాకు వరుసగా కష్టములు వస్తూనే ఉన్నాయి. చివరికి పూర్తి దరిద్రున్నయి పోయాను. నేను
ఈయనను మ్రొక్కుట వలననే దరిద్రున్నయి పోయాను, కాబట్టి నేను దినము మ్రొక్కే దేవుడు దరిద్రపు నారాయణ అని
తెలిసి పోయింది.
మిత్రుడు :- నీకు దరిద్రము వస్తే నారాయణస్వామి కూడ దరిద్ర నారాయణగా కనిపించాడా?
పుల్లయ్య :- లేకపోతే ఏ మని చెప్పాలి? ఇప్పుడు నేను చెప్పేమాటే కాదు. పూర్వము నేను చిన్నప్పుడు కొందరు
దరిద్రపు నారాయణ అని కష్టాలు వచ్చిన వానిని అనేవారు. ఆ సామెత నాకు నిజమైనది. అందువలన నేను మ్రొక్కే
నారాయణను దరిద్రపు నారాయణ అన్నాను.
మిత్రుడు :- అలా అనడము మంచిది కాదేమో! మనము దరిద్రులమైతే నారాయణను దరిద్రము అనడము మంచిది
కాదు కదా!
పుల్లయ్య :- అలా అనక ఏమనాలి? నేను ఇంతకాలము మ్రొక్కినా ఏమీ ప్రయోజనము లేదు. దేవుని దగ్గర నీతిలేదు,
న్యాయములేదు. ఆయనకు కొంచెమైనా దయ కూడ లేదు, నాకు తెలిసింది అంతే. ఈ విధముగ మాట్లాడిన ఇద్దరి
మిత్రుల మాటలను రామయ్య, ఈరయ్య అను మరొక ఇద్దరు మిత్రులు విన్నారు. ఆ మాటనువిన్న రామయ్య, ఈరయ్య
ఈ విధముగా మాట్లాడుకొనుచున్నారు.
రామయ్య :- పుల్లయ్య మాట్లాడములో తప్పేముంది? ఆయనకు కష్టాలు ఎక్కువైనాయి, కాబట్టి దేవుని దగ్గర నీతి,
న్యాయములేదు, కొంచెమైనా దయలేదు అన్నాడు. ఎక్కువ కష్టాలు వస్తే ఇంతకాలము మ్రొక్కిన దేవుని మీద కోపము
రాక ఎవరిమీద వస్తుంది.
ఈరయ్య : - పుల్లయ్యకు కోపమువచ్చి దేవున్ని “దరిద్రపు నారాయణ” అన్నాడు. అది నీకూ, పుల్లయ్యకు తిట్టుగా
ఉండవచ్చును. కానీ అతను ఆ మాటను చెప్పడములో కొంత మార్చి తేడాగా చెప్పాడు. కానీ ఆ తేడాను సరిచేసి
పలికితే, ఆ మాట వాస్తవమైనదేనని చెప్పవచ్చును. ఆ మాటను పూర్వము దరిద్రపు నారాయణ అని పలికెడివారు
కాదు, “దరిదాపు నారాయణ" అని పలికెడివారు. దరిదాపు అను పదము కొంత పలకడములో మారిపోయి “దరిద్రాపు”
అని పలకడము జరిగినది. మొదట “దా” కు “ర” వత్తు వచ్చినది. తర్వాత కొంత కాలమునకు 'ద్రా' దీర్గము పోయి
“ద్ర”గ మిగిలిపోయినది. చివరకు “దరిద్రపు” అని నేడు పిలువబడుతున్నది. పూర్వము జ్ఞానుల ఉద్దేశము “దరిదాపు”
అని కలదు దాని అర్థము దరి అనగా సమీపమున అని, దాపు అనగా దూరముగా అని తెలియవలెను. నారాయణ
అనగా నాశనము లేని దేవుడని అర్థము. నాశనములేని దేవుడు మనకు దగ్గరలోనున్నాడు, మరియు దూరములో కూడ
ఉన్నాడు. దీనినిబట్టి దేవుడు అంతటా అణువణువున వ్యాపించియున్నాడని తెలియుచున్నది. దగ్గర, దూరము,
అంతటా ఉన్నాడనుటకు, ఇందుగలడు అందులేడు అనుటకు వీలుకాకుండ, దరిదాపులో ఉన్నాడని పెద్దలు పూర్వము
చెప్పినమాట “దరి దాపు నారాయణ. కొందరు భక్తులు ఈ విషయము ఒక పాటగా పాడుట చూచాను.
1. దరి దాపు నారాయణ. నీకు తెలియంది లేదు నారాయణ!
2. ముందు వెనుక నారాయణ! నీవులేని బాగాలేదు నారాయణ!
3. పైన క్రింద నారాయణ! నీవు చూడంది లేదు నారాయణ!
అని పాట పాడెడివారు. పూర్వపు జ్ఞానులు పోయారు, వారి జ్ఞానము పోయింది. నేడు దరిదాపు నారాయణ అను
పదము దరిద్రపు నారాయణగా మారిపోయింది. పూర్వము జ్ఞానము కల్గినవారు దేవున్ని కీర్తించే దానికి ఆ పదము
వాడితే, నేడు అజ్ఞానముతో దేవున్ని దూషించేదానికి ఆ పదమును కొంత మార్చి వాడుతున్నారు.
రామయ్య :- అరే! ఈ మాటలో ఇంత అర్థము దాగి ఉన్నట్లు ఎవరికీ తెలియదే! కాలక్రమేపి మాట కొంత మారిపోయి
ఎంత అజ్ఞానములో పడి పోయాము.
ఈరయ్య :- అవును రామయ్య! మననోటివెంట వచ్చే మాటలు ఎంతో అర్థముతో కూడుకొనియున్నా, వాటి భావము
మనకు తెలియకుండ పోయిన దానివలన మంచి మాటను చెడ్డమాటగా, చెడ్డమాటను మంచి మాటగా
లెక్కించుకొనుచున్నాము. మనకు చెడును కల్గించు వాక్యములను దీవెనలని, మంచిని సూచించు వాక్యములను దూషించు
తిట్లని అనుకొనుచున్నాము. ఇప్పుడు పుల్లయ్య కూడ తనకు తెలియని దానివలన మంచి వాక్యములనే పలుకుచు,
దేవున్ని నిలదీసి అడిగినట్లు దేవునికి దయలేదు, నీతిలేదు, న్యాయములేదు అన్నాడు కదా! పుల్లయ్య ఏ భావముతో
చెప్పినా ఆయన అన్నవన్ని సత్యమైన వాక్కులే. పుల్లయ్య దేవున్ని నిందించు భావముతో అనినా, వాస్తవముగా దేవుడు
దయలేనివాడే. దేవునికి గుణములుండవు, దేవుడు గుణరహితుడు. కోపము అను గుణమునకు వ్యతిరేఖమైనది
దయా గుణము. దేవుడు గుణరహితుడు కావున ఆయనకు మంచి గుణమైన దయగానీ, చెడు గుణమైన కోపముగానీ
ఉండవు. అందువలన పుల్లయ్య చెప్పినమాట వాస్తవమైనదే. అంతేకాక పుల్లయ్య తన స్నేహితునితో దేవుని వద్ద నీతి,
న్యాయములేదని అన్నాడు. ప్రపంచములో నీతి, న్యాయము లేని వానిని అవినీతి పరునిగా, అన్యాయపరునిగా మొత్తము
మీద చెడ్డవానిగా లెక్కించుకొంటాము. పుల్లయ్య దేవుని మీద కోపముతో దేవుడు నీతి న్యాయము లేనివాడనినా ఆ
మాట వాస్తవమే.
ప్రపంచములో పుట్టిన మనిషి సక్రమముగా నడుచుకొనుటకు నీతి, న్యాయము అవసరము. కానీ దేవునికి
నీతి, న్యాయము అవసరము లేదు. దేవునివద్ద ఉండునవి జ్ఞానము, ధర్మము. దేవునికి ప్రపంచము నీతిగానీ, ప్రపంచపు
న్యాయముగానీ అవసరములేదు. దేవుడు నీతి, న్యాయము ఆధారము చేసుకొని ఉండడు. దేవుడు జ్ఞానము, ధర్మములను
కల్గి యుండును. అందువలన మనిషి కూడ జ్ఞానము, ధర్మములను తెలుసు కొంటేనే దేవుని వద్దకు పోగలడు.
అట్లుకాక ప్రపంచములోని నీతిని, న్యాయమును ఆధారము చేసుకొని ఎవరు దేవునివద్దకు పోలేరు. నీతి, న్యాయము
వలన మనిషికి పుణ్యము, అవినీతి అన్యాయము వలన పాపము వస్తాయి, కానీ ముక్తిరాదు. అందువలన నీతి,
న్యాయము లోక సంబంధమైనవి. జ్ఞానము ధర్మము దైవసంబంధమైనవని చెప్పవచ్చును. పుల్లయ్య తెలియక చెప్పినప్పటికి
దేవునికి నీతి న్యాయము లేదు అనునది సత్యమైన మాటయే. ఈ విధముగా అనేక విధములుగా మంచిని చెడుగా,
చెడును మంచిగా మనిషి అర్థము చేసుకోవము వలన తిట్లేలో దీవెనలేవో తెలియక, తిట్ల స్థానములోనికి దీవెనలు,
దీవెనల స్థానములోనికి తిట్లు చేరిపోయినవి. ఉన్న సత్యమును ఆలోచిస్తే పూర్వమున్న భావమునకు, ఇప్పటి భావమునకు
ఎంతో తేడా వచ్చినదని చెప్పవచ్చును. ఆ తేడాలనే ఈ గ్రంథములో విప్పి చెప్పడమైనదని గ్రహించవలెను. అట్లుకాక
మేము ఏవో కల్పితములు చేసి వ్రాసినాడని అనుకోవద్దండి. ఇవి కల్పితమైన కవిత్వముగాదు, యదార్థమైన, మార్పు
చెందిన విషయములని తెల్పు చున్నాము.
మూడు విడచిన వాడు.
ఇదే విధముగ పూర్వము బ్రహ్మయోగిని గురించి చెప్పిన మాట నేడు హేళనగ మాట్లడునట్లు మారిపోయినది.
దైవమును చేరుటకు గీతలో బోధించబడిన మార్గమును రెండు యోగములుగ ఉన్నవి. అవియే ఒకటి బ్రహ్మయోగము,
రెండు కర్మయోగము. కర్మయోగము బయటి ప్రపంచముతో సంబంధము పెట్టుకొని పనులు చేయుచు సాధారణ
మనిషి ఉండునట్లు కనిపించునదికాగ, బ్రహ్మయోగము బయటి ప్రపంచముతో సంబంధము పెట్టుకోక ఏ పనులు
చేయక లోపల నిశ్చలతగ ఉండునది. బ్రహ్మయోగికి ఐదు జ్ఞానేంద్రియములు పనిచేయవు. ఒక వేళ పనిచేసిన ఆ
విషయములను గ్రహించు మనస్సు ఉండదు. అతని ముందర బంగారపు ముద్దపెట్టిన, గుండ్రని రాయిపెట్టిన సమానమే.
అలాగే అతనిని పొగడిన దూషించిన అవేవి ఆయనకు తెలియవు, కావున ఏ దానికి స్పందన ఉండదు. అందువలన
బ్రహ్మయోగి విషయము తెలిసినవారు అతనితో ఎవరు మాట్లాడలేరని, ఎవరైన మాట్లాడిన అతను తిరిగి మాట్లాడడని,
కనుక అతనితో ఎవరు మాట్లాడుతారని అనెడివారు. బ్రహ్మయోగి తన శరీరములో మూడు గుణవిషయములతో
సంబంధము లేకుండ ఉండును. కావున మూడు విడచినవాడని అతనిని అనెడివారు. లోపల మూడు గుణములు
విడచినవాడు మరియు బయట ఎవరితోను సంబంధములేనివాడు కావున "మూడు విడచిన వానితో ఎవరు
మాట్లాడుతారని” బ్రహ్మయోగిని గురించి అనెడివారు. బ్రహ్మయోగి యొక్క గొప్పతనమును గూర్చి చెప్పిన మాటను
మూడు విడచినవాడని అనగ ఈనాడు ఆ మాటను ఇతరులను హేళనగా మాట్లాడుటకు ఉపయోగించుచున్నారు.
చెప్పిన మాటను వినని వానిని, ఒప్పుకోనివానిని అవహేళనగ మాట్లాడునపుడు మాట్లాడువారు మూడంటే ఏమిటి?
మూడిటిని విడువమంటే ఏమిటి? అని ఆలోచించడము లేదు. పాపము గూల అనుమాట దూషణలోనికి చేరకుండ
మధ్యలో ఊతపదము లాగ నిలచిపోగా, బ్రహ్మయోగిని సూచించు వాక్యము హేళన వాక్యమై నిలచిపోయినది.
కాల అనగ హిందీభాషలో నలుపు అని అర్థము. కాలము అనగ తెలుగు భాషలో కనిపించనిదని మరియు
కనిపించకుండ పోవడమని అర్థము. కాలమును పరమాత్మ స్వరూపమని చెప్పవచ్చును. కాలము మనముందరే గడచి
పోవుచున్నప్పటికి ఇది పలానయని ఎవరు గుర్తించ లేరు. చీకటిలో కలిసిపోతే ఏది తెలియదు మరియు అన్నిటిని
కనిపించకుండ తనలో కలుపుకొనుచున్నది కావున నల్లని చికటిని కాలమని చెప్పుకొనుచున్నాము. కాలము భవిష్యత్తును
వర్తమానముగ చేస్తున్నది, వర్తమాన కాలమును భూతకాలముగ చేస్తున్నది. కంటికి కనిపించని కాలము కంటికి
కనిపించు వాటిని, చెవుకు వినిపించు వాటిని ఏమాత్రము వినిపించకుండ కనిపించ కుండ చేస్తున్నది. ఆ విధానముతోనే
ఎంతో జ్ఞానము కాలక్రమమున తెలియకుండపోయినది. అదే విధముగనే జ్ఞానముతో కూడుకొన్న దీవెనలు అజ్ఞానముతో
కూడుకొని దూషణలుగ మారిపోయినవి. అలా మారిపోయి అందరికి మద్యలో ఉన్న వాటిని కూడ తిరిగి లేకుండ
చేయడము కాలము యొక్క పని. కావున దూషణలుగనున్న దీవెనలు చివరకు దూషణలుగ కూడ లేకుండ పోవుటకు
ప్రారంభించాయి. ఎక్కడైన పల్లెప్రాంతములలో మిగిలియుండి, అదియు ఆడవారి నోటిలో మెదలుచున్న కొన్ని దూషణలను
జ్ఞానము ప్రకారము దీవెనలని చెప్పుకొని, వాటికి తిరిగి క్రొత్తగ అర్థము తెచ్చుకొన్నాము. అలాగే కొన్ని దీవెనలను
జ్ఞానము ప్రకారము దూషణలని చెప్పుకొని వాటికి నిజమైన అర్థము ఏమిగలదో తర్వాత పేజీలో చూస్తాము.
కామ్యార్థ ఫలసిద్ధిరస్తు.
దూషణరూపములో మిగిలియున్న దీవెనలను ఎక్కడైన కుగ్రామము లలో స్త్రీలు వాధించుకొనుపుడు తిట్లరూపములో
వాడుచుండగ, దీవెనల రూపములోనున్న దూషణలను మాత్రము స్వాములుగనున్న పురుషులే ఎక్కువగ వాడుచున్నారు.
వాటిలో అక్కడక్కడ వినిపించు కొన్ని వాక్యములను వివరించుకొందాము. మనిషికి గల గుణములు పండ్రెండు.
అందులో ఆరుగుణములు చెడువి, ఆరుగుణము మంచివి గలవు. మంచి గుణములు పుణ్యమును, చెడుగుణములు
పాపమును ప్రాప్తింపజేయును. పాపమును సంపాదించి పెట్టు చెడుగుణములలో ముఖ్యమైనది, మొదటిది ఆశ
అనుగుణము. ఆశ అనుగుణము తన ప్రభావముతో మానవుని చేత ఏపనినైన చేయించును. ఆశ అనుగుణమును
కామమని కూడ పిలుతురు. కామమును ఒక్క శృంగార విషయములో మాత్రము పనిచేయు గుణమనుకో కూడదు. ఏ
విషయములలో అయిన ఆశ పుట్టితే దానిని కామమనవచ్చును. ధనము కావాలనుకోవడము కూడ కామమే అగును.
ఆశ అనుగుణము చేత ధనము మీద కోర్కెకలుగడమును కామ్యార్ధము అనికూడ అందురు. మొదట 'కామ్యార్థ
ఫలసిద్ధిరస్తు' అనువాక్యము మానవునికి పాపమును చేకూర్చునదై చెడును ఆచరింప జేయు దూషణగ ఉండెడిది.
అదెట్లనగా!
పూర్వము ఒకానొక ఊరిలో గుణంజయ అను వ్యక్తి ఉండెను. అతని పేరు గుణంజయ అయినప్పటికి
అతనేమి గుణములు జయించిన వాడుకాదు. అట్లని సాధారణ వ్యక్తి కూడ కాదు, గుణములలో లోతుగ కూరుకుపోయిన
మనిషి అతను. ఆశ అను గుణము మరి తీవ్రముగ పనిచేయుచుండెను. ఎల్లపుడు తనకు ఇతరుల సొమ్ము సులభముగ
కావాలని కోరుకునే మనిషి. అతనికి దైవజ్ఞానమంటే ఏమిటో తెలియదు. దైవజ్ఞానముగల ఒక పెద్ద స్వామీజీ
గుణంజయగల ఊరికి వచ్చాడు. ఆ ఊరిలోని వారందరు ఆస్వామీజీ దర్శనమునకు పోయి ఆయన వద్ద కొంత
జ్ఞానము తెలుసుకొని వచ్చుచుండిరి. ఆ స్వామీజీ మహత్యమును కొందరు గొప్పగ చెప్పుకొనుచుండగ గుణంజయ
స్వామీజీని గురించి విన్నాడు. గుణంజయ వినుచుండగ ఒకడు మరొకనితో ఈవిధముగ అనుచుండెను. “నాకు
ఎంతో కాలమునుండి జ్ఞానము తెలుసుకోవాలను కోర్కె ఉండెడిది. స్వామిగారి దగ్గరకు పోయిన వెంటనే నన్నుచూచి
నీకోర్కె నెరవేరుతాదని దీవించాడు. ఆయన దీవించినట్లే ఆయన ద్వారా నాకు తెలియనిది తెలిసిది. నాకోర్కె నెరవేరినది”
అని చెప్పాడు. ఆ మాటలువిన్న గుణంజయ కూడ స్వామి వద్దకు పోతే తనకున్న కోర్కెలు నెరవేరుతాయనుకొన్నాడు.
వెంటనే స్నానము చేసి ముఖాన విభూది మెడలో పూసలమాల వేసుకొని, భక్తునివలె కనిపించు ఎర్రగుడ్డలు కట్టుకొని,
స్వామి వద్దకు పోయి సాష్ఠాంగదండ ప్రమాణము చేశాడు. అతనిని చూచిన స్వామీజీ “కామ్యార్థ ఫలసిద్ధిరస్తు” అని
దీవించాడు. జ్ఞానము తెలియని గుణంజయ అది దీవెనే అనుకొన్నాడు. సంపూర్ణ జ్ఞానియైన స్వామీజీ అతని
అంతరంగములో గల కోర్కెను గ్రహించి ఆమాట చెప్పాడు. స్వామిగారి దగ్గరకు వచ్చినపుడు గుణంజయ మనస్సులో
ఎవడైన చాలాధనము తీసుకొనిపోవు యాత్రికుడు ఒంటరిగ కనిపిస్తే వానిని ఏమర్చి వాని ధనమును సులభముగ
కొట్టివేసి తాను ధనికుడు కావాలని కోర్కె ఉండెడిది. నీవు కోరుకున్న కొర్కె ఫలితము నెరవేరవలెనని స్వామీజీ
దీవించాడు. గుణంజయ కోరుకొన్న కోర్కె తనకు మంచిగ తోచినప్పటికి పాపము తెచ్చిపెట్టునదే కావున అది చెడు
కోర్కె చెడే జరగవలెనని చెప్పిన స్వామీజీ వాక్యము గుణంజయకు దీవెనగ కనిపించినప్పటికి అది నిజముగ దూషణయేనని
అతనికి తెలియదు.
కోరుకొన్న కోర్కెలు జన్మాంతరమున నెరవేరునని చెప్పినట్లు గుణంజయ కోర్కె స్వామీజీ వాక్యము ప్రకారము
మరుజన్మలో నెరవేరినది. అది ఏవిధముగ నెరవేరిందంటే! గుణంజయ మరుజన్మలో ధనంజయ అను పేరు కల్గియుండెను.
ఒకరోజు అతను రైలు ప్రయాణము చేయుచుండెను. తనతో ప్రయణము చేయువారిలో ఒకరితో ధనంజయకు రైలులో
పరిచయమేర్పడినది. వారు చాలాదూరమునుండి ఒకరోజంత ప్రయాణము చేయుటవలన మరియు ఒకే స్టేషన్లో
ఇద్దరు దిగవలెను కావున కొంత ఎక్కువ స్నేహముగ ఉండిరి. సాయంకాలము ఆరుగంటల సమయములో రైలుమార్గమున
గల వంతెనలో లోపమేర్పడుట వలన రైలును వంతెన ఇవతలనే ఆపివేశారు. మార్గము రిపేరు చేయుటకు ఆరాత్రంత
సరిపోవునని తెల్లవారిన తర్వాతనే రైలు బయలుదేరునని రైల్వే సిబ్బంది తెలిపారు. ధనంజయ అతని సహప్రయాణికుడు
దిగవలసిన స్టేషన్ తర్వాత వచ్చు స్టేషన్ అగుటవలన మరియు వారి గమ్యము కేవలము నాలుగు కిలోమీటర్లే అగుట
వలన వారు ఆ కొద్ది దూరమును నడచి చేరుకోవాలను కొన్నారు. వారు నడువవలసిన మార్గము కాలిత్రోవ అగుటవలన,
అదియు అడవి మార్గమగుట వలన తోటి ప్రయాణికుడు ధనంజయతో నావద్ద ఐదులక్షల డబ్బున్నది దారిలో దొంగలుండరు
కదా అని అడిగాడు. మనమొస్తామని ఎవరికి తెలుసు? నీ దగ్గర డబ్బున్నదని ఎవరికి తెలుసు? చీకటి పడకముందే
ఊరు చేరవచ్చును అని జవాబుగ ధనంజయ అన్నాడు. దగ్గర కదా వెళ్లి పోవచ్చును లేకపోతే రాత్రంత రైలులో
జాగారము తప్పదని అనుకొన్నవారు చివరకు కాలినడక పోవాలనుకొన్నారు. ఇద్దరు రైలుదిగి నడువను ప్రారంభించారు.
ఒక కిలోమీటరు నడచిన తర్వాత ధనంజయ తలలో ఆలోచనలు మెదలసాగెను. పూర్వము కోరుకున్న కోర్కె ప్రకారము
స్వామీజీ ఇచ్చిన దీవెన ప్రకారము అతనిలో ప్రేరేపణ మొదలైనది. ఇతని దగ్గర డబ్బున్నది నాకొక్కనికే తెలుసు,
ఈమార్గములో ఇతను నావెంట వచ్చునది నాకొక్కనికే తెలుసు, ఇతని నుండి డబ్బును ఎదోవొక విధముగ లాగేసుకుంటే
ఒక్కమారుగ ధనికుడునై పోవచ్చుననుకొన్నాడు. దాని కొరకు నడుస్తూనే ప్రణాళికను తయారుచేసుకోసాగాడు. అంతలోనే
అతనికొక ఆలోచన తలలో మెరిసింది. అది అడవి మార్గము కావున చాలారకముల చెట్లుగలవు వాటిలో విషముష్ఠి
చెట్లు దానికి కాయలుండడము కనిపించిది. ఎర్రగ అందముగ కనిపించు ఆ కాయను అతనిచేత తినిపిస్తే తనపని
నెరవేరుతుందనుకొన్నాడు. వెంటనే ధనంజయ తోటి ప్రయాణికునికి కాయను చూపి ఈ కాయ ఇక్కడ తప్ప ఎక్కడ
దొరకదు, ఈ కాయ పేరు ముష్ఠికాయ, దీనిని తినుట వలన ముష్ఠిబలమేర్పడుతుంది. వృద్ధాప్యము వరకు మగతనము
తరగక ఉంటుంది. దీనివలన సంపూర్ణ ఆరోగ్యము ఏర్పడుతుంది. మన అదృష్టముకొలది ఈ చెట్టు కనిపించింది,
దీనిని తప్పక తిందామని చెప్పగ ఆమాటకు ప్రయాణికుడు కూడ ఒప్పుకొన్నాడు. మిగతవారికంటే నాలో మగతనము
తక్కువ ఉందని ఆ ప్రయాణికునికి మొదటినుండి అనుమానముండుట వలన మగతనమును గురించి చెప్పగనే సరేనని
కాయను తినుటకు ఆసక్తిని కనబరిచాడు.
ఇదే మంచి సమయమని తలచిన ధనంజయ వెంటనే చెట్టెక్కి బాగా ఎర్రగ కనిపించిన ఒక కాయను త్రుంచి
క్రిందికి వేశాడు. తాను కూడ మరొక కాయను తీసుకొని క్రిందికి దిగివచ్చి ముందు ఒక కాయను పగలగొట్టి
అందులోని విత్తనములను తీసివేసి గుజ్జును ప్రయాణికుని చేత తినిపించాడు. తర్వాత తానుకూడ కాయను పగులగొట్టి
తినునట్లు నోటిలో పెట్టుకొని మూత్రవిసర్జన కొరకు ప్రక్కకు పోయి నోటిలోని గుజ్జును క్రిందకి మూసివేసి తిన్నట్లు
నోటిని కదలించుచు ప్రయాణికుని ముందుకు వచ్చెను. ధనంజయ తింటున్నాడా లేదా అని గ్రహించని ప్రయాణికుడు
తాను మాత్రము కాయనంతటిని తినెను. తిన్నతర్వాత తిరిగివారు ప్రయాణము సాగించిరి. ఒక కిలోమీటరు కూడ
నడువకనే ప్రయాణికునికి మత్తు మొదలైనది. సారాత్రాగిన మత్తువలె ఉండుటవలన అతను తూలుతూ నడువసాగెను.
కొద్దిసేపటికే మత్తు ఎక్కువై నడువలేక కూర్చుండెను. ధనంజయకూడ మత్తున్న వానివలె నటిస్తు క్రొత్తగ తిన్న వారికి
మొదట కొంత ఎక్కువ మత్తుకనిపిస్తుంది ఏమి పరవాలేదు ఐదునిమిషములు కూర్చొని పోదామని చెప్పి అతనిని
కూర్చండబెట్టెను. పాపము ప్రయాణికునికి మరిమత్తు ఎక్కువగుట వలన కూర్చున్న చోటునే పడుకొనెను. పడుకొన్న
వాడు నిద్రలోనికి జారుకోగా ధనంజయ కోర్కెనెరవేరింది. అదే అదనుగా ప్రయాణికుని వద్దగల సూట్కేసు తీసుకొని
దాని తాళములను కూడ అతనివద్ద వెదకి తీసుకొన్నాడు. వెంటనే సూట్కేసు తెరచి అందులోని డబ్బును తీసుకొని
తనవద్దగల సంచిలో వేసుకొని తిరిగి సూట్కేస్ ను మూసి అతనివద్దనే పెట్టి తాళములు కూడ అతని జేబులో వేసి
అక్కడినుండి పోయెను. ప్రయాణికుడు విషముష్ఠి కాయను తినుటవలన మత్తు ఎక్కువై అపస్మారకస్థితిలో కొంతసేపుండి
అరగంటలోపలే చనిపోయెను.
గుణంజయ కోరుకొన్న కోర్కె స్వామి దీవించిన దీవెన ప్రకారము మరుజన్మమున ధనంజయరూపములో
నెరవేరింది. కాని జరిగిన కార్యములో పాపము కర్మరూపమై ధనంజయ తలలో కర్మమందు చేరి పోయినది.
గుణంజయరూపములో పొందినది దీవెనరూపములోనున్న చెడును చేకూర్చు తిట్టని తెలిసినది. ఇక్కడ జ్ఞానము లేకపోవుట
వలన తిట్టును దీవెనగ అర్థము చేసుకోవడము జరిగినదని తెలియుచున్నది.
ఇష్టార్థ ఫల సిద్ధిరస్తు.
ఈ పద్ధతి ప్రకారమే మరికొన్ని తిట్లు నేడు దీవెనలరూపములలో అక్కడక్కడ వినిపిస్తున్నవి. వాటిలో "ఇష్టార్థ
ఫలసిద్ధిరస్తు” అను ఒకదానిని వివరించుకొందాము. మానవునికి ఇష్టము రెండురకములుగ ఉండును. ఇష్టము
అనునది మానవునికున్న గుణము కానేకాదు. అట్లని జ్ఞానము కాదు. గుణములపట్ల ఉన్న శ్రద్ధను ఇష్టము అంటున్నాము.
గుణములు ప్రపంచవిషయములకు సంబంధించినవి, కావున గుణములలోనున్న శ్రద్ధను విషయశ్రద్ధని అంటున్నాము.
అదే విధముగ గుణముల సంబంధము లేకుండ దైవజ్ఞానము మీదగల ఇష్టమును జ్ఞానశ్రద్ధ అంటున్నాము. ఈ విధముగ
ఒకటి విషయశ్రద్ధ, రెండు జ్ఞానశ్రద్దని మొత్తము రెండు రకములు గలవు. మనిషికి 'శ్రద్ధ' లేక 'ఇష్టము' అనునది
గుణము కాదు, కావున అది కర్మననుసరించి వచ్చునదికాదు. మానవునికి జన్మతః కల్గిన హక్కు శ్రద్ధ. మనిషి
విషయశ్రద్ధనుగాని లేక జ్ఞానశ్రద్దనుగాని స్వతహాగా ఏకర్మప్రమేయము లేకుండ కల్గియుండ వచ్చును. జ్ఞానశ్రద్దను
బట్టి జ్ఞానము లభించును, కావున 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీతలో చెప్పారు. జ్ఞానశ్రద్ధ ఉన్నవానికి శ్రద్ధను
బట్టి జ్ఞానము లభించునుగాని, విషయశ్రద్ధను బట్టి విషయములు నెరవేరుననుకోకూడదు. కర్మలిఖితములో జ్ఞానముండదు,
కావున శ్రద్ధయున్నంత జ్ఞానము లభించును. కర్మలిఖితములో విషయ ప్రాప్తము అప్రాప్తములుండును, కావున శ్రద్ధయున్నంత
మాత్రమున విషయములు నెరవేరుననుటకు వీలులేదు. ఉదాహరణకు ఒకనికి ఆహారపదార్థములలోకెల్ల లడ్డుమీద
ఎక్కువ ఇష్టముండవచ్చును. అయినంత మాత్రమున లడ్డువానికి లభించునని చెప్పుటకు వీలులేదు. ఏపూట ఏ
ఆహారము తినవలెనని కర్మప్రకారము వ్రాసిపెట్టబడియుండునో ఆ విధముగనే వానికి ఆహారము లభించును. దీనినిబట్టి
శ్రద్ధ రెండు రకములున్నప్పటికి ఒకటి కర్మాతీతమై నెరవేరునదై ఉన్నది, రెండవది కర్మాధీనమై నెరవేరునని చెప్పుటకు
వీలులేనిదై ఉన్నది. ఇష్టార్థము అన్నపుడు శ్రద్ధను బట్టి అను అర్థమొచ్చును. “ఇష్టార్థ ఫలసిద్ధిరస్తు” అన్నపుడు శ్రద్దను
బట్టి ఫలము సిద్ధించవలెనని చెప్పడము. నీశ్రద్ధను బట్టి ఫలము కలుగవలెనని పెద్దలు చెప్పినప్పటికి ఆ వాక్యము
దీవెనగ మారవచ్చును లేక దూషణగ మారవచ్చును. ఒకే వాక్యము దీవెనగ మరియు దూషణగ ఎట్లు మారుచున్నదనగా!
ఒక మనిషికి జ్ఞానము మీద శ్రద్ధయున్నపుడు పెద్దలు అతనికిచ్చిన వాక్యము దీవెనగ మారును. ఎందుకనగ వానికి
లభించునది జ్ఞానము, కనుక శుభమును చేకూర్చు వాక్యము కావున దానిని దీవెన అనవచ్చును. జ్ఞానమును గురించి
దీవించకున్నను అతనికెట్లయిన జ్ఞానమేలభించును. దీవించితే వానికి దీవెన బలము కూడ చేకూరును. ఒకవేళ
మనిషికున్న శ్రద్ధ విషయశ్రద్ధ అయితే, అది నెరవేరవలెనని దీవించినప్పటికి అది మరుజన్మమున నెరవేరినప్పటికి,
ప్రపంచ విషయము లలో కూరుకపోయేదే, కావున అది దీవెనగ కనిపించి నప్పటికి వాస్తవముగ దానిని దూషణ
అనియే చెప్పవచ్చును. “ఇష్టార్థ ఫలసిద్ధిరస్తు” అను వాక్యము ఒక్కటి మాత్రము ఒకప్పుడు దీవెనగ, మరొకప్పుడు
తిట్టుగ మారుటకు అవకాశము గలదు. ఇష్టము అనిన శ్రద్ధ అనిన రెండు ఒక్కటే, అలాగే ఆశఅనిన కామము అనిన
రెండు ఒక్కటే. కావున ఇష్టార్థమునకు కామ్యార్థమునకు ఎంతో తేడాగలదు. ఇష్టము జీవునికిగల స్వంత హక్కు కాగ,
ఆశ గుణచక్రములో గల మొదటిగుణము. గుణములకు సంబంధించిన వాక్కు ఏదైన వాస్తవముగ దూషణ అగును.
అలాగే జ్ఞానమునకు సంబంధించిన వాక్కు ఏదైన వాస్తవముగ దీవెన అగును. గుణములకు సంబంధించినవేవైన
విషయసుఖములలో ముంచునని, మానవునికి చెడును చేకూర్చునవి, కర్మను మూట గట్టునవి కావున వాటిని దూషణలనియే
చెప్పవచ్చును. జ్ఞానమునకు సంబంధించినవేవైన విషయములనుండి కడతేర్చునవి, మానవునికి శుభమును చేకూర్చునవి,
కర్మలనుండి విముక్తి కల్గించునవై ఉండును. కావున వాటిని దీవెనలనియే చెప్పవచ్చును. గుణ విషయములకు
సంబంధించి దీవెనలవలెనున్న దూషణలలో మరొక దానిని క్రింద చూస్తాము.
కళ్యాణ ప్రాప్తిరస్తు.
మానవ జీవితములో వివాహము ఒక పెద్ద మలుపులాంటిది. ఒక విధముగ యోచిస్తే మరొక మనిషితో కలసి
బ్రతుకుటకు ఒప్పందముతో కూడుకొన్న దినము వివాహము. మరొక విధముగ యోచిస్తే తన స్వేచ్ఛకు
ఆటంకములనుకొనితెచ్చుకొను దినము వివాహము. ఇంకొక విధముగ యోచిస్తే మాయాసర్పమును తన మెడలో
తగిలించుకొను మొదటిదినమే వివాహము. జీవితములో ఒడు దుడుకుల ప్రయాణమునకు ప్రారంబమే వివాహము.
మనిషి ఎన్నో విషయములలో రక్తి విరక్తిని పొందుటకు అవకాశమున్న సంసార జీవితమునకు ఆరంబమే వివాహము.
అజ్ఞాన జీవితమునకు నాంది పలుకుటయే వివాహము. కావున వివాహదినమున మనిషికి కావలసిన దైవసందేశములన్ని
తెలిపి వానిని జాగృతపరచడము జరుగుచున్నది. వివాహమును పెళ్లి అని పిలువడము కూడ జ్ఞానసందేశమే. పెళ్లి
అను పేరుపెట్టి ఆ దినము చేయు ప్రతికార్యము దైవజ్ఞానముతో సమ్మేళనమై ఉండునట్లు పూర్వము పెద్దలు తీర్చిదిద్దారు.
అయినప్పటికి మాయ ప్రభావమువలన దైవజ్ఞానము తెలియకుండపోయినది, కొన్ని కార్యములు మాత్రము అర్థహీనమై
నిలచియున్నవి. మానవజీవితములో అతి ముఖ్యమైన పెళ్లిదినమున జ్ఞానము మీద ధ్యాసలేకుండ పోవడము ఖగోళములో
గ్రహములరూపములలోనున్న వారికి ఆగ్రహమును కల్గించు చున్నది. అందువలన పెళ్లి ప్రయాణము చేయు వాహనములను
ప్రమాదము నకు గురిచేయుచున్నారు. మానవుని హృదయములో జ్ఞానమును పెళ్లి కార్యముల ద్వార
ప్రతిష్ఠించుకోవలసియుండగ ఆ దినమును విలాసముగ గడపుట, నగలు, ఖరీదైన దుస్తులు ధరించి ధర్పముచూపుట
జ్ఞానమువిలువ తెలిసిన సూక్ష్మగ్రహములకు సరిపోలేదు. కావున వివాహకార్యములో కాని ప్రయాణములో కాని
ప్రమాదములు కల్గించుటకు గ్రహములు పొంచియుందురు. అందువలననే బాగా పరిశీలిస్తే పెళ్లి వాహనములే ఎక్కువ
ప్రమాదమునకు గురియగుచుండును.
పెళ్లిదినమున పెళ్లికార్యములలో జ్ఞానమును తెలిపిన, తెలుప కుండిన మానవుడు అజ్ఞానమువైపు
ప్రయాణించుచున్నాడు. ఆ దినము నుండి మాయలో పూర్తిగా మునిగిపోవుచున్నాడు. కావున వివాహము మానవునికి
అశుభమును చేకూర్చునదే అవుతున్నది. కావున “కళ్యాణ పాప్తిరస్తు” అని ఎవరైన నేటికాలములో దీవించిన అది
చెడును చేయునదే అయియుండుట వలన దానిని వాస్తవముగ దూషణక్రిందికే లెక్కించవలసి యున్నది. 'శ్రీఘ్రమేవ
కళ్యాణ ప్రాప్తిరస్తు' అనుటలో తొందరగ వివాహము కావలెనని అర్థముగలదు. వివాహమగుట వలన అశాంతి
ప్రారంభమగును, కావున నేడుగల ఆ దీవెనను తిట్లలోనికి లెక్కించ వలసినదే. కొందరి జీవితములలో వివాహజీవితము
మొదట సంతోషముతో కూడుకున్న జీవితముగనే కనపించినప్పటికి అది దైవమునకు దూరముచేయునదై చివరకు
జీవితమునకే అనర్థమును చేకూర్చుచున్నది. అందువలన పెళ్లిదినముననే ఎంతో జ్ఞానముతో కూడుకొన్న పెళ్లి,
బాషింగములు, తలంబ్రాలు, అక్షింతములు, తాళి, పందిరి, అరుంధతి నక్షత్రము మొదలగు కార్యములలో అంతరార్థమును
తెలిసి వైవాహిక జీవితము ప్రారంభించితే ఆ జీవితము శుభప్రదమగును. పెళ్లి దినమున అటువంటి జ్ఞానపద్దతి
చెప్పువారుగాని, వినువారుగాని లేకుండ పోయినారు. కావున వైవాహిక జీవితము అశుభముతో కూడుకొన్నదై, పెళ్లికాలము
ప్రమాదములతో పొంచివున్నదై, ఎన్నో రోడ్డు ప్రమాదములు, అగ్ని ప్రమాదములు పోట్లాటలు జరుగుచుండుట అందరికి
తెలిసినవిషయమే. ఏదో ఒక ఆటంకము ప్రమాదము కలుగజేయు వివాహముల గురించి ఇప్పటికైన యోచించ
వలసియున్నది.
జీవితములో దేవుని జ్ఞానమునకు దూరమగుటకు, దైవమార్గము నకు అడ్డమగు వారిని వివాహసమయమునుండి
భార్యరూపములో భర్త పొందుచున్నాడు. అదే విధముగ భర్తరూపములో భార్య కూడ పొందు చున్నది. భార్య తలకు
జ్ఞానమును నింపుతానని బియ్యమును తలంబరాలు అను పేరుతో భార్య తల మీద పోసిన భర్త భార్యకు జ్ఞానమును
అందివ్వడము లేదు. అదేవిధముగ భర్త తలకు జ్ఞానమును అందిస్తానని జ్ఞానచిహ్నమైన చంద్రుని ధాన్యమును
జ్ఞానముతో సమానముగ తలచి భర్త తలమీద బియ్యమును పోసిన భార్య భర్తకు జ్ఞానమును అందివ్వడము లేదు.
పెళ్లిదినమున కార్యరూపములో చేసిన పనులకు అర్ధము తెలియక మానవుడు ఆ దినమునుండి మరీ అజ్ఞానములో
కూరుకు పోయాడు. మనిషికి వివాహజీవితము అశుభముతో కూడినదై కర్మను సంపాందిచుకొనుటలోనే సరిపోవుచున్నది.
సంతానప్రాప్తిరస్తు.
అశుభజీవితము గడుపుటలో లగ్నమైనవానికి మరొక అశుభమును సూచించు తిట్టు దీవెనరూపములో గలదు.
అదియే “సంతానప్రాప్తిరస్తు లేక శ్రీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు" వీటి అర్థము నీకు సంతానము కలుగుగాక అనడము.
భార్యరాకతో దైవమార్గమంటే ఏమిటో తెలియక దాని ధ్యాసలేకుండ పోయిన భర్తకు, అదే విధముగ భర్తరాకతో దేవుని
విషమేమిటో తెలియక దాని ధ్యాసకూడ లేకుండ పోయిన భార్యకు సంతానముతో కాలమంత వారికే వినియోగమగుట
చేత ఏమాత్రము దైవమును తెలుసుకొను అవకాశమే లేకుండ పోవును. భార్యకు లేక భర్తకు సంతానము వలన
ప్రపంచములో లగ్నమగుటకు అవకాశము ఎక్కువగుచున్నది. అందువలన కొందరు జ్ఞానులు తమ పాటలలో ఆలు
మాయ, పిల్లలు మాయ అన్నారు. మాయ దేవునికి వ్యతిరిక్త దిశలో నడిపించునది. ఆలు పిల్లలు దైవమార్గ మునకు
ఆటంకములే కావున వారిని మాయ అన్నారు. సంతాన ప్రాప్తిరస్తు అనగా నీవు ఇంకా మాయలో కూరుకపొమ్మని
చెప్పినట్లున్నది, కావున ఈ వాక్యమును దూషణ పక్షములోనికే చేర్చడమైనది. "పుత్ర ప్రాప్తిరస్తు" అనిన "సంతాన
ప్రాప్తిరస్తు” అనిన రెండు ఒకే విధానమును తెల్పుచున్నవి. ఈ వాక్యములు సంతానములేని వారికి గాని, పుత్రుడు
లేనివారికి గాని సంతోషమును కల్గించును. అయినప్పటికి దైవజ్ఞానరీత్య అంత సంతోషింపదగిన విషయములేమి
కావు.
పైకి మేలు చేసినట్లు కన్పించు వాక్యములు దీవెనలరూపములో అప్పటికి సంతోషమును కలుగజేయునవై
ఉన్నప్పటికి వాటివలన అశుభమే చేకూరును. కావున దీవెనలవలె కన్పించు వాక్యములను దూషణలుగ చెప్పుచున్నాము.
అలాగే పైకి కీడుచేయునట్లు కన్పించు వాక్యములు ఇప్పటి కాలములో దూషణలుగా కన్పించుచున్నప్పటికి వాటివలన
శుభమే చేకూరును. కావున దూషణలుగా కన్పించు వాక్యములను దీవెనలుగ చెప్పుచున్నాము. దైవజ్ఞానమున్నపుడే
దూషణలేవి, దీవెనలేవని తెలియ గలదు. జ్ఞానములేని వారికి వాటి తారతమ్యము తెలియదు, కనుక ఇపుడు మేము
చెప్పిన తిట్లలో గల జ్ఞానమును, దీవెనలలో గల అజ్ఞానమును వారు అర్థము చేసుకోలేక పోవచ్చును. కొంత జ్ఞానము
తెలిసి చూడగలిగితే తిట్ల జ్ఞానము దీవెనల అజ్ఞానము సులభముగ అర్థము కాగలదు. ఈ పుస్తకములో కొన్ని దీవెనలను,
కొన్ని దూషణలను మాత్రమే తెలియజేసాము. ఇంకను మనము చెప్పుకోని మరికొన్ని దీవెనలు మరికొన్ని దూషణలు
కూడ గలవు. వాటిని కూడ జ్ఞానముతో యోచించి చూచినపుడే వాస్తవముగ అవి ఏవో తెలియగలదు.
నేటికాలములో తిట్లను కొంత పరిశీలించితే వాటి స్థానములో వాటివలెనున్న కొన్ని వాక్యములు చోటు
చేసుకొని ఉన్నాయి. వాస్తవముగ అవి తిట్లు కాక పోయిన తిట్లవలె చలామణి అగుట చోద్యముగనున్నది. భూతుమాటలను
కొన్నింటిని దూషణలుగ కొందరు వాడుటవలన వాస్తవమైన దూషణలను కూడ భూతులుగ, భూతులను దూషణలుగ
తలచుటకు అవకాశము గలదు. అర్థముండునవి దూషణలని, అర్థములేక కేవలము భూతులతో కూడుకొన్న మాటలు
దూషణలుకావని గుర్తించవలెను. పూర్వము దూషణలను కాని, దీవెలను కాని జ్ఞానము కల్గిన గురువులు చెప్పెడివారు.
కాలక్రమేణ పద్దతులు మారిపోయి దీవెనల స్థానములో దూషణలు దూషణ స్థానములో దీవెనలు నిలచిపోయి వాటిని
జ్ఞానములేనివారు కూడ చెప్పడము జరుగుచున్నది. అంతేకాక పూర్వకాలము దీవెనలు నేటికాలపు తిట్లుగ చలామణి
అగుచుండగ వాటి స్థానములో భూతులు కూడ స్థానము చేసుకొని అజ్ఞానుల నోటిలో నానుచున్నవి. జుగుప్సాకరముగ,
అసహ్యముగ ఉన్న భూతుమాటలను కొన్ని పల్లె ప్రాంతములలో తిట్లుగ వాడుచున్నారు. భూతుమాటలే తిట్లు, అసలైన
తిట్లు శాపనార్థములుగ కొందరి లెక్కలోనున్నవి. నేటి కాలములోనున్న భూతుమాటను, దూషణలను, దీవెనలను
వివరించి చెప్పి వాటికి సరియైన అర్థమిదని చెప్పడమే ఈ గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశము. కనుక పాఠకులందరు
సదుద్దేశముతో చదివి అర్థము చేసుకోవలెనని కోరుచున్నాము.
ఇట్లు,
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.