చెట్టుముందా! - విత్తుముందా cloud text updated on 14thsep 24
చెట్టుముందా! - విత్తుముందా?
మనకు చెట్టు తెలుసు, విత్తనము తెలుసు. చెట్టు నుండి విత్తనము
వస్తున్నది, విత్తనము నుండి చెట్టు పుట్టుచున్నదని అందరికీ తెలుసు. అలాగే
చెట్టు లేనిది విత్తులేదనీ, విత్తు లేనిది చెట్టు లేదని కూడా తెలుసు. అయితే
అందరికీ ఎడతెగని (జవాబు లేని) ప్రశ్న ఒకటి గలదు. అదేమనగా!
సృష్ఠిలో చెట్టు ముందు పుట్టినదా లేక విత్తు ముందు పుట్టినదా? యనునదే
ముఖ్యమైన ప్రశ్నగాయున్నది. అయితే ఈ ప్రశ్నకు ఎటు సమాధానమును
చెప్పినా చివరకు ప్రశ్నయే మిగులును. ప్రపంచములో చెట్టు ముందు
పుట్టినదని చెప్పితే, విత్తనము లేనిది చెట్టు ఎలా పుట్టగలదు? అను ప్రశ్న
రాగలదు. ఒకవేళ విత్తనము ముందు పుట్టినదని చెప్పితే, చెట్టు లేనిదే
విత్తనము ఎలా పుట్టినదను ప్రశ్న రాగలదు? ఈ విధముగా ఎట్లు జవాబు
చెప్పినా చివరకు ప్రశ్న మిగులును జవాబు యుండదు. అందువలన ఇది
అందరికీ కొరుకుడు పడని ప్రశ్నగా మిగిలిపోయినది.
అయితే “త్రైత సిద్ధాంత జ్ఞానము” ప్రకారము ప్రపంచములో జవాబు
చెప్పలేని ప్రశ్న ఒక్కటే ఒక్కటి గలదు. ఆ ఒక్కటి తప్ప మిగతా జవాబు
లేని ప్రశ్న ఏదీ లేదని చెప్పవచ్చును. ప్రతి ప్రశ్నకు జవాబు కలదు.
'ఎక్కడ జవాబున్నదో అది తెలిసినతనము అనియూ, ఎక్కడ జవాబు లేదో
అక్కడ తెలియనితనము అనియు చెప్పవచ్చును. జ్ఞానమున్న ప్రతి చోట
తెలిసినతనమున్నది. అందువలన త్రైత సిద్ధాంత జ్ఞానమును అనగా మూడు
ఆత్మల జ్ఞానము ను తెలిసిన ఎవడయినా ఒక్క ప్రశ్నకు తప్ప మిగతా అన్ని
ప్రశ్నలకు జవాబు చెప్పగలడు. చెట్టుముందా విత్తనము ముందా? అను
ప్రశ్న ఆ ఒక్క ప్రశ్నకంటే వేరయినది కావున ఈ ప్రశ్నకు తప్పనిసరిగా
జవాబున్నదని చెప్పవచ్చును.
ప్రశ్న :- మీరు ఇంతకు ముందే జవాబు లేని ప్రశ్న ఒకటున్నదని చెప్పారు.
మీరు చెప్పినా చెప్పకున్నా జవాబు లేని ప్రశ్న గుడ్డు ముందా కోడి
ముందా? చెట్టు ముందా విత్తుముందా? ఈ ప్రశ్నలు రెండు అయినా
ప్రశ్న నమునా ఒకటే అయిన దానివలన, ప్రశ్నలోని ఉద్దేశ్యము ఒకే
విధముగా యుండుట వలన ఈ రెండు ప్రశ్నలను కలిపి ఒకే ప్రశ్నగా
పరిగణించుచున్నాము. దానినే చెట్టు ముందా, విత్తు ముందా? యని
అందరూ అనడము జరుగుచున్నది. ఇది ప్రపంచములో జవాబు లేని
ప్రశ్నగా అందరూ అనుకొనుచున్నారు. మీరు ఇప్పుడు ఈ ప్రశ్నకు
జవాబున్నదని వింతగా చెప్పుచున్నారు. ఈ ప్రశ్నను గురించి మీరు
పరిశోధన చేశారా? అని నేను అడుగుచున్నాను.
జవాబు :- ప్రపంచములోని ప్రతి ప్రశ్నకు పరిశోధన అవసరము లేదు,
'పరిశీలన'గా చూస్తేచాలు. నేను పరిశీలనగా చూచి జవాబును గ్రహించాను,
అందువలన ఈ ప్రశ్న జవాబున్న ప్రశ్నయే అని చెప్పుచున్నాను. నాకు
దీని జవాబు తెలుసు.
ప్రశ్న :- జవాబు తెలుసని ఏదో ఒకటి చెప్పితే సరిపోదు. ఆ జవాబు
శాస్త్రబద్ధత కలిగియుండాలి, తిరిగి ప్రశ్నరానిదై ఉండాలి. ఈ విషయములో
జవాబు చెప్పుటకు ఎంతో పరిశోధన అవసరము. పరిశోధన చేయగలిగి
నప్పుడు ఏదయితే తెలియబడుచుండునో, దానిని పరిశీలించి చూడగలిగితే
అప్పుడు జవాబు పూర్తి అర్థము కాగలదు. అయితే ఈ విషయములో
పరిశోధించుటకు మార్గమే దొరకదు. ఒక మార్గమును ఎంచుకొంటే
దానికంటే మంచి మార్గము మరొకటియుండును. ఎన్నిమార్లు ఎన్ని
మార్గములు ఎంచుకొన్నా దానికంటే మంచి మార్గము యుండుట వలన
ఈ విషయములో పరిశోధన లేదనియే చెప్పవచ్చును. అటువంటి
విషయమునకు మీరు జవాబు చెప్పెదనని చెప్పినా మేము ఎలా నమ్మాలి?
జవాబు :- నమ్మడము, నమ్మకపోవడము అది నీ ఇష్టాయిష్టముల మీద
ఆధారపడియుండును. ఇంతవరకు మేము దేనినీ 'మీరు నమ్మండి' అని
చెప్పలేదు. మీకు సత్యమనిపించిన దానిని నమ్మవచ్చును. అసత్యమని
పించిన దానిని నమ్మక పోవచ్చును. అయితే మీరు సత్యమనుకొన్నవన్నీ
సత్యము కాకుండా అసత్యముగా యుండవచ్చును. అలాగే మీరు
అసత్యమనుకొన్నవన్నీ, అసత్యము కాకుండా సత్యముగా కూడా యుండ
వచ్చును. శాస్త్రబద్ధత విషయమునకు వస్తే దేనిని ఏ శాస్త్రముతో చూడవలెనో
తెలియకపోతే అసలుకే మోసమొచ్చును. మీరు “పరిశోధన” అను పదమును
వాడారు కదా! తెలియని దానిని తెలుసుకోవాలనుకొన్నప్పుడు 'పరిశోధన'
అవసరము. ఏ పరిశోధన చేయాలని అనుకోకుండానే ఆ విషయము
తెలియబడినప్పుడు పరిశోధన అవసరము లేదు. అప్పుడు 'పరిశీలన’
మాత్రమే అనగా జాగ్రత్తగా చూడడము లేక తెలుసుకోవడము మాత్రమే
అవసరము. చెట్టు ముందా విత్తుముందా? అను విషయములో నేను ఏ
'పరిశోధన' చేయలేదు. పరిశోధన చేయకనే నాకు ఈ విషయము
తెలియబడినది. అందువలన ఈ ప్రశ్నకు జవాబున్నదని చెప్పుచున్నాను.
ప్రశ్న :- చెట్టు ముందా విత్తు ముందా? అను ప్రశ్నకు జవాబు పరిశోధనలకు
కూడా అందని జవాబనీ, అందువలన ఇది జవాబు లేని ప్రశ్నయనీ,
అందరూ అనుచుండగా మీరు పరిశోధన లేకుండానే జవాబు తెలిసిందని
చెప్పడము విడ్డూరముగాయున్నది. అసలు పరిశోధన అంటే ఏమిటో
తెలుసాయని నేను అడుగుచున్నాను?
జవాబు :- "పరిశోధన" అను పదము రెండు భాగములుగా గలదు.
“పరి” అను పదము 'శోధన' అను పదము రెండు గలవు. “పరిశోధన”
పదము యొక్క అర్థము మీకు ఎలా తెలుసునోగానీ, మీరు 'పరిశోధన'
అంటే ఏమిటో తెలుసా?యని నన్ను ప్రశ్నించుచున్నారు. అదే ప్రశ్ననే
నేను తిరిగి సంధించుచున్నాను. పరిశోధన యొక్క నిజమైన అర్థము
మనిషికీ తెలియదనియే చెప్పవచ్చును. ఎందుకనగా! ఆధ్యాత్మిక
అనుబంధముతో దాని అర్థము కూడుకొనియున్నది. ప్రతి ఒక్కరూ
పదమును వాడుచున్నా దాని నిజమైన అర్థము తెలియదనియే చెప్పవచ్చును.
మీకు తెలిసిన అర్థము “పరిశోధన" అంటే 'పూర్తి శోధించడము' లేక
'పూర్తిగా వెతకడము' అని అర్ధము. ఈ అర్థముతోనే మీరు నన్ను ప్రశ్నించారు.
“పరిశోధన లేకుండానే కేవలము పరిశీలనతోనే ఈ విషయము తెలిసింది”
అని నేను అన్నప్పుడు, “వెతకకుండా ఎలా తెలుస్తుంది?” అని మీరు నన్ను
ప్రశ్నించుచూ, పరిశోధన లేకుండా ఎలా తెలుస్తుంది? అనీ, పరిశోధన
అంటే ఏమిటో తెలుసా? యని అడుగడము జరిగినది. నన్ను మీరు
ప్రశ్నించారు బాగుంది. దానికి జవాబు చెప్పే బాధ్యత నాదే అయినందున
నేను జవాబు చెప్పే దానిలో భాగముగానే నిన్ను ఈ ప్రశ్నను తిరిగి
అడుగుచున్నాను.
అడిగిన ప్రశ్నను తిరిగి ప్రశ్నగా అడుగడము జవాబులోని భాగమే
అని మేము చెప్పడము నీకు ఆశ్చర్యముగాయున్నా మేము మాత్రము
విధిగా అదే ప్రశ్నను అడుగవలసి వచ్చినది. దానికి మీరు జవాబు చెప్పితే
వెతకడము, బాగా వెతకడము, పూర్తి వెతకడము అని చెప్పగలరు.
“పరిశోధన” పదములో “వెతకడము' అని అర్థము గలదు. “పరిశోధన”లో
పరి+శోధన అను రెండు భాగములుగా పదమున్నది. అందులో మొదట
యున్న 'పరి' అను పదమును గాలికి వదలివేసి కేవలము 'శోధన' అను
దానికి మాత్రము అర్థమును చెప్పుచున్నారు. 'పరిశోధన' అను పూర్తి
పదమునకు ఎవరూ సరియైన అర్థమును చెప్పలేదు. 'పరిశోధన' అను
పూర్తి పదమునకు అర్థము కావాలంటే ముందు “పరిపాలన” అను
పదమునకు అర్థము తెలిసి యుండాలి. అయితే అక్కడ కూడా “పాలన”
అను పదమునకే అర్థమును చెప్పుచున్నారు తప్ప “పరి” అను శబ్దమునకు
అర్థమును ఎవరూ చెప్పలేదు. “పరిశోధన” అను పదమునకు గానీ,
“పరిపాలన” అను పదమునకుగానీ, “పరిశీలన" అను పదమునకుగానీ
పూర్తి అర్థమును చెప్పక వాటిలో ఒక భాగమైయున్న 'శోధన', 'పాలన',
'శీలన' అను వాటికి మాత్రము అర్థమును చెప్పుకొంటున్నారు. “పరి”
అను పదమును వదలివేశారు. మొదట “పరిపాలన” అను పదమునకు
అర్థమును తెలియగలిగితే మిగతా రెండు పదములకు అర్థము తెలియును.
ప్రశ్న :- మీరు చెప్పవలసిన విషయమును వదలి వేరే విషయములోనికి
పోయారు. 'చెట్టు ముందా విత్తు ముందా' అనునది ముఖ్యమైన
సమాచారము. అయితే మీరు ఆ విషయమును వదలి సంబంధములేని
విషయమును తెరమీదికి తెచ్చారు.
జవాబు :- అసలయిన విషయము కొరకే ఈ విషయమును చెప్పుచున్నాము.
చెట్టు ముందా విత్తు ముందా? యను దానికి జవాబు దొరికినా దానిని
గ్రహించు స్థితిలో మనిషి లేడు. జవాబు దొరకలేదను భ్రమలోనే యుండును.
అందువలన దొరికిన జవాబును జవాబుగా అర్థము చేసుకొనుటకు ముందు
ఎంతో సమాచారమును తెలియవలసి యున్నది. అందువలన ఇప్పుడు
“పరిపాలన” శబ్దమునకు వివరమును తెలుసుకొందాము. రాజు, రాజ్యము
విషయమును చూస్తే రాజ్యములో రాజు అధికారమును సాగించుటకు
ఎందరో పాలకులు అవసరము. రాజు ఒక్కడైతే రాజుక్రింద పాలకులు
అనేకమంది యుంటారు. అయితే రాజు కనిపించే వాడే, పాలకులు కనిపించే
వారే. కనిపించే రాజు క్రింద కనిపించే పాలకులు మంత్రి, సేనాధిపతి
మొదలుకొని సాధారణ భటుని వరకు, ఎందరో పాలకులు ఉండడము
సహజమే! రాజుయొక్క రాజ్యము చిన్నదయితే పాలకులు
తక్కువగాయుందురు. రాజుయొక్క రాజ్యము పెద్దదయితే రాజు మాటను
అమలు జరుపుటకు చాలామంది పాలకులు అవసరమగుదురు.
నేడు భూమిమీద 194+1= మొత్తము 195 దేశములు గలవు.
195 దేశములకు రాజులు యున్నారు, పాలకులు యున్నారు. అయితే
విశ్వమంతటికీ ఒక చక్రవర్తి గలడు. అతడే కనిపించని దేవుడు. దేవుని
అధికారము విశ్వములోని ప్రతి అణువు వరకు వ్యాపించియున్నది. దేవుడు
ఒక్కడే, ఆయన ఏమీ చేయువాడు కాడు. అయితే ఆయన అధికారమును
విస్తరించి పాలించు పాలకులు కోట్ల సంఖ్యలో గలరు. కనిపించే రాజు
క్రింద పనిచేయువారిని పాలకులంటే, కనిపించని చక్రవర్తి అయిన దేవుని
క్రింద పనిచేయువారిని “పరిపాలకులు” అని అంటారు. దేవుని విశ్వ
సామ్రాజ్యములో దేవుడు అధిపతి కాగా ఆయన క్రింద పని చేయు
పరిపాలకులు కొన్ని కోట్ల సంఖ్యలో గలరు. దేవున్ని గురించి ఇతనే దేవుడని,
దేవుడు ఇలాగేయుంటాడని ఎలా చెప్పలేమో, అలాగే విశ్వములో దేవుని
రాజ్యము కొరకు పనిచేయు పరిపాలకులు ఇంతమంది యున్నారని చెప్ప
వీలులేదు. దేవుని పరిపాలకులున్నారను విషయమే చాలామందికి తెలియదు.
దేవుని పాలకులు ఐదు రకములుగా విభజింపబడియున్నారు.
1) మహా భూతములు, 2) భూతములు, 3) ఉప భూతములు,
4) గ్రహములు, 5) ఉప గ్రహములు. 'భూతము' అనగా జీవము
గలదియని అర్థము. 'గ్రహము' అనగా గ్రహించునది యని అర్థము.
అర్థములు వేరయినా రెండు రకములుగాయున్నవి జీవము గలవేయని
తెలియవలెను. దేవుని పాలకులుగా చెప్పబడుచున్న ఐదు రకముల జీవులు
(భూతములు మరియు గ్రహములు) ఆకాశములోనే ఉన్నవి. భూమిమీదకు
అవసరమును బట్టి వచ్చిపోవుచుండును.
ప్రశ్న :- భూమిమీద ఏ దేశములో అయినా, ఎవరూ దేవుని పాలకులున్నారని
గానీ, వారిని ఫలానా పేర్లతో పిలుస్తున్నామనిగానీ చెప్పలేదు. అలా చెప్పిన
వారిలో మీరే మొదటివారు. ముందు, వెనుక ఏ ఆధారము లేని మాటను,
ఇంతవరకు ఎవరూ చెప్పని మాటను మేము ఎలా నమ్మాలి? మేము
నమ్ముటకు ఏదయినా ఆధారముంటే చెప్పండి.
జవాబు :- భూమిమీద ఎవరూ చెప్పని జ్ఞానమును కృష్ణుడు అర్జునునకు
చెప్పాడు. ఎవరూ చెప్పని జ్ఞానము, ఎవరికీ తెలియని రహస్యమని, ఎవరికీ
తెలియని విద్య చెప్పుచున్నానని కృష్ణుడు చెప్పినప్పుడు నీవలె అర్జునుడు
దీనికి ఆధారమేమి? అని అడుగలేదు. అట్లు అడిగినా ఎవరికీ తెలియని
రహస్యము నిగూఢముగానే యుండును గానీ ఆధార సహితముగా
ఉండదు. ఒకమారు జరిగిన తర్వాత అది ఇతరులకు ఆధారమగును.
అలాగే ఒకమారు తెలిసిన తర్వాత దానిని ఆధారముగా చెప్పవచ్చును.
దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఇతర మనుషులకు ఎవనికిగానీ తెలియదని
దేవుడే చెప్పినప్పుడు, దేవుడు తన జ్ఞానమునకు ఆధారమును ఎలా
చూపగలడు? “దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు” కావున
దేవుని జ్ఞానమునకు వాస్తవముగా దేవుడే ఆధారము. దేవుడు ఎవరికీ
తెలియడు, అలాగే దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఎవరికీ తెలియదు.
అలాంటప్పుడు మనిషికి తెలియు ఏ ఆధారము ఉండదు. అట్లని ఆధారము
లేనంతమాత్రమున దేవుడుగానీ, దేవుని జ్ఞానముగానీ అసత్యము కాదు
కదా! అలాగే ఇప్పుడు మేము చెప్పిన మహాభూత, భూత, ఉపభూత,
గ్రహ, ఉపగ్రహములను ఎవరూ చెప్పకున్నా అవి మొదటిమారు
తెలియబడుట చేత వాటికి ఆధారము లేదనియే చెప్పవచ్చును. అయినా
అవి అసత్యములు కావు.
ఈ ఐదు రకములవారు సృష్ట్యాదినుండి యుండుట వలన, వారు
నేడు క్రొత్తగా వినిపించినప్పటికీ వారి ఉనికి పాతదేయని చెప్పవచ్చును.
పాతవాటికి ఎక్కడో ఒకచోట ఆధారము లభించును. దానిప్రకారము
చూస్తే 'కల్పనాచావ్లా' అను ఆమె అమెరికాలో నాసాయందు (అంతరిక్ష
పరిశోధనా కేంద్రమందు) పనిచేయు మహిళ అంతరిక్ష పరిశోధనకు
ఆకాశములోనికి పోయి తిరిగి వచ్చు ప్రయాణములో ఉపగ్రహము ఆమె
ప్రయాణించు రాకెట్కు ఢీకొని ఆమె, ఆమెతోపాటు గల మిగతా ఆరుమంది
చనిపోవడము జరిగినది. ఈ విషయమంతయూ మేము వ్రాసిన “పునర్జన్మ
రహస్యము” అను గ్రంథములో గలదు. అక్కడ వ్రాసిన సమాచారము
క్రింద పొందుపరుచుచున్నాము చూడండి.
మొట్టమొదటి భారతీయ అంతరిక్ష యాత్రికురాలు ‘కల్పనాచావ్లా’
పేరు విననివారుండరు. భారతీయ మహిళా సాహసానికీ, మేథస్సుకూ
చిహ్నముగా నిలిచిపోయిన పంజాబ్ రాష్ట్రమునకు చెందిన కల్పనాచావ్లా,
అమెరికా దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA (నాసా) లో
పని చేసేది. అంతరిక్షములోనికి ప్రయోగించిన కొలంబియా స్పేస్ షిప్ లో
ఇతర పాశ్చాత్య అంతరిక్ష యాత్రికులతోపాటు అంతరిక్ష యాత్రలో
పరిశోధకురాలిగా పాల్గొని అంతరిక్షములోనికి ప్రయాణించింది. ఆకాశము
లోనే కొంతకాలము గడిపి పరిశోధన సాగించిన తర్వాత కొలంబియా
స్పేస్ షిప్ భూమికి తిరుగు ప్రయాణము మొదలు పెట్టింది. 2003వ
సంవత్సరము ఫిబ్రవరి 1వ తేదీన ఇంకో పదహారు (16) నిమిషములలో
భూమిమీద దిగబోతున్న కొలంబియా స్పేస్ షిప్ దురదృష్టవశాత్తు ఊహించని
పరిణామముల వలన ఆకాశములోనే భూమి వాతావరణము లోనికి
ప్రవేశిస్తూనే ప్రేలిపోయింది. దానితోపాటు అందులో ప్రయాణిస్తున్న అంతరిక్ష
యాత్రికులందరూ చిన్నచిన్న ముక్కలై చనిపోయారు. భారతీయ వ్యోమగామి
కల్పనాచావ్లా కూడా ఆ ఘోర ప్రమాదములో ప్రాణాలు కోల్పోవడము
జరిగింది. అయితే ఆమె కొద్ది రోజులకే తిరిగి భూమి మీద పుట్టడము
జరిగింది.
కల్పనాచావ్లా తిరిగి పుట్టిన సమాచారమును (ఎస్.బి.యన్ 7)
ఛానల్ మరియు ఇండియాటుడే పత్రిక, కల్పనాచావ్లా మళ్ళీ జన్మించిన
కథనాన్ని ప్రసారము చేసి ప్రపంచానికి అందించడము జరిగింది. ఆ
వివరాలను చూస్తే, ఉత్తర భారతదేశములో ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోనున్న
బుల్లంద్ షహర్ అనే గ్రామములో రాజ్కుమార్ అనే సాధారణ వ్యవసాయ
కూలీగా పని చేయుచున్న వ్యక్తి కుటుంబములో అతనికి కుమార్తెగా
జన్మించింది. 2003వ సంవత్సరము మార్చి 23వ తేదీన ఉపాసన అను
పేరుతో ఆ కుటుంబమున కల్పనాచావ్లా జన్మించడము జరిగింది. ఉపాసన
(కల్పనాచావ్లా) కు నాలుగు సంవత్సరాల వయస్సులో మాటలు వచ్చాయి.
మాట్లాడడమును ప్రారంభించిన ఉపాసన, తాను గతజన్మలో కల్పనాచావ్లా
అను పేరుగల అంతరిక్ష పరిశోధకురాలిననీ, తన తండ్రి పేరు బనార్సీదాస్
యనీ, నాలుగు సంవత్సరముల క్రితము తాను తోటి అంతరిక్ష పరిశోధకు
లతో కలిసి ఒక విమానములో ఆకాశమునుండి దిగివస్తుండగా, తమ
విమానానికి ప్రమాదము జరిగి తామందరమూ చనిపోయామని చెప్పడము
జరిగింది.
గత జన్మ వివరాలను పూసగ్రుచ్చినట్లు చెప్పుచున్న ఉపాసన
(కల్పనా చావ్లా) యొక్క పేరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా క్రమంగా తెలిసి
పోయింది. ప్రస్తుతము ఉత్తరప్రదేశ్లోని ఎత్వా జిల్లాలోని “పఠా” అనే
గ్రామములో కూలి పని చేసుకొంటున్న తండ్రి రాజ్కుమార్తో పాటు
జీవిస్తున్న ఉపాసన తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ప్రపంచస్థాయి
మీడియా ప్రతినిధులతో మాట్లాడుచూ మేము భూమిమీదకు తిరిగి వస్తున్న
అంతరిక్షనౌకకు ఆకాశములో సంచరిస్తున్న ఒక పెద్ద మంచుగోళము
గుద్దుకున్నదనీ, దానివలన తమ అంతరిక్షనౌక ప్రేలిపోయి అందులోని
తామందరమూ చనిపోయామనీ చెప్పినది. 2003వ సంవత్సరము ఫిబ్రవరి
1వ తేదీన నాసాకేంద్రము వారు అంతరిక్ష నౌకకు బయటప్రక్కన చుట్టు
అమర్చిన ప్లేటు ఊడిపోయిన దానివలన ఆ నౌక భూమి వాతావరణము
లోనికి వస్తూనే వాతావరణ రాపిడి వేడికి ప్రేలిపోయిందని చెప్పారు.
నాసావారనుకొన్నట్లు అక్కడ జరగలేదనీ, ఆకాశములో భూమికి 70
కిలోమీటర్ల దూరములోనే మంచుగోళమునకు అంతరిక్షనౌక గుద్దుకోవడము
వలన ప్రమాదము జరిగిందని ప్రత్యక్ష సాక్షి అయిన కల్పనాచావ్లా చెప్పడము
వలన తెలిసిపోయింది.
కల్పనాచావ్లా ప్రయాణించు అంతరిక్ష విమానము భూమికి 70
కిలోమీటర్ల దూరములోనే మంచుగోళమునకు గుద్దుకోవడము జరిగినదని
విన్నాము కదా! అంతవరకు ఎవరికీ తెలియని మంచుగోళము ఏమిటి?
అని ఎవరయినా ఆలోచించారా? మంచుగోళమును గురించి ఏ శాస్త్రవేత్త
గానీ, ఏ పరిశోధకుడుగానీ చెప్పారా? చెప్పలేదు. మంచుగోళము యొక్క
రహస్యమును విప్పితే అదొక ఉపగ్రహము. దానిపేరు ఎవరికీ తెలియదు.
కొన్ని సమయములలో స్థూలముగా కొన్ని సమయములలో సూక్ష్మముగా
యుండు ఆ ఉపగ్రహము అదే పనిగా స్థూలముగా రాకెట్కు ఎదురుగా
వచ్చినది. అనుకోని పరిణామము వలన జరిగిన దుర్ఘటనలో అంతరిక్ష
యాత్రికులు చనిపోవడము జరిగినది. అయితే చనిపోయిన కల్పనా చావ్లా
తిరిగి పుట్టి ఆమె చెప్పితే ఆ విషయము బయటికి తెలిసినది. ఉప
గ్రహమునకు ఆధారముగా మంచుగోళము కనిపించినా, అది తెలియని
రహస్యమునకు ఆధారమని ఎవరూ అనుకోలేదు. చచ్చి బ్రతికిన మనిషి
ప్రత్యక్ష సాక్ష్యముగా చెప్పినా ఉపగ్రహము యొక్క ఉనికిని గురించి తెలియని
వారు గ్రుడ్డివారితో సమానము కాదా!
బుద్ధి వికాసము కల్గినవారికి భూతముల, గ్రహముల గురించి
ఆధారములు భూమిమీద ఎన్నో గలవు. అయినా మనుషులు వాటిని
గ్రహించలేకున్నారు. మేము చెప్పు గ్రహములు, భూతముల పేర్లు
క్రొత్తవయినా వాటి పనులు భూమిమీద ఎన్నో జరుగుచున్నవి. ఆలోచించి
చూస్తే వాటి పనులే వాటికి ఆధారమని చెప్పవచ్చును. ఆకాశములో
సంచరించు భూతములలో, ఉపభూతములలో ఎన్నో లెక్కలేనన్ని జాతులుగా
విభజింపబడినవి. అందులో కొన్ని వందల జాతులు రోగములుగా
యున్నవి. అందులో క్యాన్సర్ రోగము అను పేరుగల భూతములు ఎన్నో
లక్షలలో గలవు. మనుషులు చేసుకొన్న పాపమును అనుసరించి క్యాన్సర్
రోగము అనుభవించవలసిన పాపమున్న వానిని వెదకి క్యాన్సర్ భూతము
పట్టుకొనును. భూతము అనగా దయ్యమో, పిశాచియో అని అనుకోవద్దండి.
జీవమున్న గ్రహములాంటిదని తెలియవలెను. “రోగము ఒక భూతము”
అను మాట ప్రకారము క్యాన్సర్ రోగము ఒక భూతముగా యుండి
మనుషులను తన రోగము చేత ఒకవైపు పీడించుచున్నా మనుషులు
రోగములను భూతములుగా గుర్తించుకోలేని స్థితిలో యుండి ప్రత్యేకించి
భూతముల, గ్రహముల గురించి ఆధారమున్నదా! అని అడుగడము
విచిత్రముగా యున్నది. కల్పనాచావ్లా మరణానికి కారణమైన మంచుగోళ
ఆకృతితో యున్న ఉపగ్రహము ఆధారము కాదా! అలాగే నేడు అనేక
రోగముల రూపముతో అనేక జాతులుగా భూమిమీద సంచరించు ఎన్నో
భూతములు, ఉపభూతములు ఆధారము కాదా! మనిషి మూడు రకముల
భూతముల, రెండు రకముల గ్రహముల పాలనలో అనేక కష్టసుఖములు
అనుభవించు చున్నాడని చాలామందికి తెలియకుండా పోయినది.
ప్రశ్న :- ఆకాశములో గోళమును గ్రహము అనడములో తప్పులేదు.
అయినా మంచుగోళము ఉంటుందను విషయమును నమ్మలేకున్నాము.
ఎవరో, ఎక్కడో చనిపోయిన వారి పేరు చెప్పి ఉపగ్రహమును గురించిన
ఆధారము అంటున్నారు. దానిని కొంత నమ్మినా కొంత నమ్మము అనియే
చెప్పుదుము. అంతేకాక రోగాలను జీవమున్న భూతములని ఇంతవరకు
భూమిమీద ఎవరూ చెప్పలేదు. అలాంటప్పుడు మీ మాటలను మేము
ఎలా నమ్మాలి? క్యాన్సర్ రోగము అందరికీ తెలిసినదే. అది క్యాన్సర్
కణాలతో కూడుకొన్న రోగము. మన శాస్త్రవేత్తలు కనుగొన్న చికిత్సలలో
రేడియం థెరపీ అనునది ముఖ్యమైనది. రేడియం కిరణముల ద్వారా
క్యాన్సర్ కణాలను కాల్చి వేయడము వైద్యముగా చెప్పబడుచుండగా,
నాగరికత ఎంతో అభివృద్ధియైన ఈ కాలములో దయ్యాలు, భూతాలు
అని రాతియుగము మాటలు చెప్పి నమ్మించాలంటే చాలా పెద్ద పొరపాటు.
ఎంతో విజ్ఞానము పెరిగిన ఈ కాలములో మీ మాటలను నమ్మరుగాక
నమ్మరు. కొంత సైన్సును చదువుకొన్న మేము ఎలా నమ్మాలి? ఈ
కాలములో పశువుల కాపరి కూడా మీ మాటను నమ్మరు.
జవాబు :- పశువుల కాపరికి పెద్దగా బుద్ధి వికాసముండదు, కావున
వాడు నమ్మకపోయినా దానికి ఒక అర్థము గలదు. వాడు తెలివి తక్కువ
వాడులే!యని సవరించుకోవచ్చును. కనపడు సాక్ష్యములు ఎదురుగా
యుంటే రాతి యుగము, ఇసుక యుగము అని హేళనగా మాట్లాడుచూ
విలువైన సమాచారమును తెలియకుండా వదులుకోవడము విజ్ఞానము
కాదు అజ్ఞానమగును. పూర్వము ఒక కవి "తెలిసిన వారికి చెప్పవచ్చును.
తెలియని వారికి చెప్పవచ్చును. సగము తెలిసీ తెలియనివారికి చెప్పడము
బ్రహ్మవశము కూడా కాదు" అని అన్నాడు బహుశా మీలాంటి వారిని
చూచియే ఆ కవి అలా చెప్పియుండవచ్చును. కొంత విజ్ఞానము కలిగి
కూడా ప్రత్యక్షముగా జరుగు విషయములను గురించి ఎందుకిలా జరుగు
చున్నవని ఆలోచించకపోతే మీ తెలివి విజ్ఞానవంతమయినదెలాయగును!
ప్రశ్న :- ఈ మధ్యకాలములో ఒక జాండీస్ రోగము (కామెర్ల రోగము)
గల వ్యక్తి డాక్టరువద్దకు పోయి చికిత్స చేసుకోకుండా కామెర్లకు మంత్రము,
అంత్రము వేస్తానని చెప్పిన వ్యక్తి దగ్గరకు పోయాడు. అతడు మంత్రాల
వలనగానీ, అంత్రముల వలనగానీ బాగు కాలేదు. కామెర్లు తీవ్రస్థాయికి
చేరడము వలన చివరకు హాస్పిటల్కు పోవడము జరిగినది. హాస్పిటల్లో
డాక్టర్లు రోగము ముదిరి పోయినందున 20 రోజులు చికిత్స చేసి రోగమును
శరీరములో లేకుండా చేశారు. రోగము భూతమయినప్పుడు (జీవుడయి
నప్పుడు) ఆ మాంత్రికుని మాట విని వ్యక్తిలోని రోగము వ్యక్తిని వదలి
ఎందుకు పోలేదు? మీరు చెప్పుమాట అక్కడేమయినది? మీరు చెప్పున
దంతా వృథాప్రయాస కాదా?
జవాబు :- మనిషికి ఆరోగ్యము బాగా లేకపోతే, అది రెండు కారణముల
వలన జరుగును. 'రోగముల వలన' శరీరములో ఆరోగ్యము సరిగా లేకుండా
పోవచ్చును. రెండవది శరీరములోని 'లోపముల వలన' శరీర ఆరోగ్యము
సరిగా ఉండకపోవచ్చును. ఉదాహరణకు ముసలితనము వలన శరీరములో
అవయవములు బలహీనపడిపోయి దానివలన శరీరములో జరుగవలసిన
పనులు సరిగా జరుగకపోతే అనారోగ్యముతో బాధపడడము జరుగు
చుండును. ఇది సహజ సిద్ధముగా జరుగు కారణము. వృద్ధాప్య కారణము
వలన శరీరములోని అవయవములు తమతమ కార్యములను సరిగా
చేయలేకపోవును. అప్పుడు శరీరములో అనేక సమస్యలు ఏర్పడును.
అవన్నియూ రోగములు కాదు. రోగముల వలన ఆ సమస్యలు రాలేదు.
జీర్ణాశయములో వృద్ధాప్య కారణము వలన ఆకలి తగ్గిపోవడము, తిన్న
ఆహారము జీర్ణము కాకపోవడము జరుగుచుండును. దీనిని 'శరీర లోపము’
క్రిందికి జమకట్టాలిగానీ, దానిని 'రోగము' అని అనకూడదు. వృద్ధాప్యము
రాని కాలములో, వయస్సులో కూడా శరీరములో అవయవ సమన్వయము
తప్పిపోవుట వలన, రసాయనిక చర్య హెచ్చు తగ్గులు కావడము వలన,
ఇతర కారణముల వలన కొన్ని అవయవములు బలహీనమగుట వలన,
ఆహారము వలనగానీ, మత్తుపాణీయముల వలనగానీ, శరీరములో విష
ప్రభావము ఏర్పడుట వలనగానీ అనారోగ్యము జరుగవచ్చును. వాటిని
రోగముల క్రిందికి జమకట్టకూడదు. ఇప్పుడు మీరు చెప్పిన కామెర్లు
(జాండీస్) రోగము కాదు. ఇట్లు అనేకములు రోగములు కాని
అనారోగ్యములు గలవు.
శరీరములో ఎటువంటి లోపములు లేకున్నా బయటనుండి
ప్రవేశించు క్రిముల ద్వారా ఏర్పడు అనారోగ్యములను రోగముల వలన
జరిగిన పనియని చెప్పవచ్చును. రోగక్రిముల వలన వచ్చు అనేకమయిన
రోగములు గలవు. వాటిలో కొన్నిటిని మనము చూచిన వాటిని, మనకు
తెలిసిన వాటిని గురించి చెప్పుకున్నా కొన్ని పదులు రోగములు గలవు.
మనకు తెలియని రోగములు ఇంకా క్రొత్తగా రాబోవు రోగములు ఇంకా
కొన్ని పదుల సంఖ్యలో గలవు. రోగములు శరీరములోనికి ఎప్పుడయినా
చేరవచ్చును. శరీరములోనికి రోగములు రావచ్చును తిరిగి పోవచ్చును.
అయితే శరీరములోని లోపములు ఒకమారు వస్తే తొందరగా పోవు. కొన్ని
లోపములు స్థిరస్థాయిగా ఉంటాయి. కొన్ని లోపములను తొందరగా సరి
చేసుకోవచ్చును. కొన్ని లోపములు సరిచేసుకొనుటకు కూడా వీలు
పడవు. ఇట్లు కొన్ని విధములైన లోపములు శరీరములో సహజముగా
ఏర్పడుచుండును.
కళ్ళలో వచ్చు కన్నుచూపు లోపము వలన ఏర్పడిన సమస్యను
కంటి బయట అద్దములు వాడి సరిచేసుకోవచ్చును. గుండెలోని రక్త
నాళములు పూడిపోయి గుండెకు రక్తము సరిగా సరఫరా కాక వచ్చు
గుండెనొప్పిని రక్తనాళములు శుభ్రము చేసి సరిచేసుకోవచ్చును. కాలేయము
(లివర్) పనిలో సమన్వయ లోపము వలన కామెర్లు (జాండీస్) వచ్చు
అవకాశము గలదు. లివర్ను సరిగా పనిచేయునట్లు చేయడము వలన
కామెర్లు లేకుండా పోగలవు. ఈ విధముగా శరీరములో ఏర్పడు
లోపములను కొన్నింటిని సరిచేసుకోవచ్చును. కొన్నింటిని సరిచేసుకొనుటకు
వీలుపడదు. ఉబ్బసము (ఆస్తమా) ఇది రోగము కాదు. మనిషి మెదడులో
ఒక భాగమందు ఏర్పడిన బలహీనత వలన ఉబ్బసము వచ్చును. ఈ
లోపమును సరిచేసుకొనుటకు వీలుపడదు.ఇది ఒకమారు ఏర్పడిన
జీవితాంతము ఉండును. తాత్కాలముగా కొంత ఉపశమనమును మందుల
ద్వారా పొందవచ్చును. అంతేగానీ శాశ్వతముగా నయము చేసుకొనుటకు
వీలుపడదు.
ఈ విధముగా శరీరములో ఆరోగ్య, అనారోగ్యములను కల్గించునవి
ఒకటి రోగములు, రెండు శరీర లోపములు గలవు. అయితే ఈ విషయము
తెలియని మనుషులు అన్నిటినీ రోగములనియే చెప్పుచున్నారు. శరీర
లోపములను కూడా రోగముగా లెక్కించుచున్నారు. శరీర లోపమయిన
కామెర్లను రోగముగా లెక్కించుచున్నారు. అట్లే శరీర లోపమయిన
ఉబ్బసమును (ఆస్తమాను) ఉబ్బస రోగము అంటున్నారు. గుండెలో కలుగు
లోపములను గుండెవ్యాధి అని అంటున్నారు. ఈ విధముగా చాలా
లోపములను మనుషులు రోగములుగా చెప్పుకోవడము జరుగుచున్నది.
క్రిమి సముదాయము వలన కలుగు ఎయిడ్స్, కలరా, మశూచి, ప్లేగు,
డెంగీఫీవర్, క్రొత్తగా వచ్చిన ఎబోలా, జికా, క్యాన్సర్, కళ్లకలక, అతిసారము,
క్షయ మొదలగునవన్నీ రోగములని చెప్పవచ్చును. రోగములు మంత్రము
లకు, యంత్రములకు కూడా పోవు. శరీర లోపమయిన కామెర్లు శరీర
లోపము అయినందున మంత్రాలు, యంత్రాలు కామెర్లను బాగు చేయలేవు.
శరీర లోపాలను జ్ఞానముగానీ, జ్ఞానమును తెలిసిన యోగులు గానీ బాగు
చేయలేరు. రోగములను యోగులు చెప్పి నయము చేయగలరు. మందులు
లేని రోగములను సహితము యోగుల మాటను వినును.
దేశములో కొన్ని రోగములు చాలా ప్రమాదమైనవికాగా, కొన్ని
సాధారణముగా బాధించుచుండును. కొన్ని రోగములకు మందులున్నాయి,
కొన్ని రోగములకు మందులు లేవు. మందులు లేని ఎయిడ్స్ రోగము
సహితము యోగుల మాటను వినగలుగును. రోగమునకు యోగము
వ్యతిరేఖమైయినది. అందువలన ఏ రోగమయినా యోగుల మాటను
అతిక్రమించిపోదు. ప్రతి రోగము యోగుల మాటలను గౌరవించును.
భూమిమీద ఒక్క యోగులను తప్ప ఎవరినీ రోగములు లెక్కచేయవు.
ప్రశ్న :- రోగమునకు యోగమునకు ఏమి సంబంధము గలదు. రోగములు
యోగుల మాటను ఎందుకు గౌరవించును?
జవాబు :- భూమిమీద పాపము చేసుకొన్న మనుషులను పీడించి
బాధించుటకు రోగములు ఏర్పరచబడినవి. 'రోగము ఒక భూతము' అని
ముందే చెప్పుకొన్నాము. భూతములు, గ్రహములు రెండూ మనుషులు
చేసుకొన్న పాపములను అనుభవింపజేయుటకు గలవు. మనుషులు
పాపపుణ్యములను అనుభవించుటకు జన్మలు పొందుచున్నారు. మనుషుల
పాపపుణ్యములను అనుభవింపజేయుటకు దేవుని పాలకులుగా భూతములు
గ్రహములు గలవు. భూతములు గ్రహములు దేవుని పాలనలో భాగముగా
ఉన్నాయి. దేవుడు ఏమీ చేయువాడు కాడు. దేవుడు ఏమి అనుకొంటాడో
అనుకొన్న దానిని గ్రహములు భూతములు గ్రహించుకొని దేవుని
సంకల్పమును అనుసరించి కార్యములను చేయుచుండును. అందువలన
దేవుని పాలనలో పాలకులుగా భూతములు గ్రహములు పనిచేయుచున్నవని
చెప్పుచున్నాము. పాప పాలనలో తమ కర్తవ్యమును నిర్వహించు
భూతములు, గ్రహములు ఒక్క దేవుని ఆదేశమునకు తప్ప ఎవరి మాట
వినవు.
ప్రశ్న :- ఒక్కమాట! మీరు ఇంతకుముందే “రోగములు యోగుల మాటలను
వినును” అని అన్నారు. రోగము ఒక భూతమని కూడా చెప్పారు. అయితే
"భూతములు ఏ రోగమయినా యోగుల మాటను గౌరవించును” అని
చెప్పినందుకే, రోగములు యోగుల మాటను ఎందుకు వినును? అని
అడిగాను. రోగ భూతములు యోగుల మాటలను వినునని చెప్పిన మీరే
ఇప్పుడు “భూతములు, గ్రహములు ఒక్క దేవుని మాటను తప్ప ఎవరి
మాటను వినవు” అని చెప్పారు. ఇంతకుముందు ఒక రకము, ఇప్పుడు
మరొక రకముగా చెప్పడమునుబట్టి ఇందులో ఏదో ఒకటి అసత్యమని
తెలియుచున్నది. అలా అసత్యమును మీరు చెప్పవలసిన అవసరమేమి
వచ్చినది?
జవాబు :- సమయమును సందర్భమును దృష్టిలో పెట్టుకొని నీకు
అర్థమగుటకు నేను చెప్పవలసిన విధానము ప్రకారము చెప్పుచున్నాను.
ఒక్కమారుగా ఎవరూ ఏదీ గ్రహించుకోలేరు. “అన్నప్రాసన రోజు ఆవకాయ
అన్నమా!” అను సామెత ప్రకారము మొదట ఒక్కమారు సత్యమును
అంత చెప్పకూడదు. సత్యమును ఒక్కమారుగా కాకుండా అంచెలంచెలుగా
చెప్ప వలెననునది పెద్దల అభీష్టము. అందువలన అన్నప్రాసన రోజు అనగా
మొదటి అన్నమును తినిపించురోజు రుచికరమైన ఆవకాయను పెట్టకూడదని
చెప్పారు. అంతేకాక చిన్నవయస్సులోయున్న పిల్లలకు లేని బూచి వానిని
గురించి చెప్పి భయపెట్టుదురు. బూచివాడు అనుమాట పూర్తి అసత్యమే
అయినా అప్పుడు అలా చెప్పడము అవసరము. అందువలన భూతములు,
గ్రహములు యోగుల మాటను గౌరవించుననునది సత్యమే. అయితే
దానినే విశదముగా ఇప్పుడు చెప్పుచుండుట వలన “దేవునిమాటను తప్ప
ఎవరి మాటను భూతములు లెక్కచేయవు" అని చెప్పవలసి వచ్చినది. అట్లు
లెక్కచేయనివి తర్వాత సమయము వచ్చినప్పుడు యోగుల మాటలను
గౌరవించుటకు తగిన విధానమేదో చెప్పుట వలన సత్యము వరుస
క్రమములో అర్థమగును. అందువలన నేను వరుస క్రమములో దేవుని
మాటను తప్ప భూతములు ఎవరి మాటను వినవు" అని చెప్పాను. నేను
అంతటితో ఆగియుంటే నీవు ప్రశ్న అడిగినా తగినట్లు యుండేది. నేను
నా మాటలను ఆపకముందే ఇంకా చెప్పేది యున్నట్లే నీవు ప్రశ్నించడము
ఒక విధముగా తొందరపాటు యని అనవచ్చును. మరొక విధముగా
అసందర్భ ప్రలాపము అనికూడా అనవచ్చును. నీవు అడిగినా అడుగకున్నా
నేనే పూర్తి విషయమును చెప్పదలచుకొన్నాను. అందువలన చెప్పబోయే
విషయమును జాగ్రత్తగా వినమని చెప్పుచున్నాను.
మనుషులు కర్మలను అనుభవించుటకు భూమిమీద జన్మించు
చున్నారు. జరిగిపోయిన జన్మలలో మనిషి తాను స్వయముగా చేసుకొన్న
కర్మలను అనుభవించుటకు మాత్రమే పుట్టవలసి వచ్చినది. గత జన్మలలో
మనిషి ఏ పాపములను, ఏ పుణ్యములను చేసినది మనిషికి జ్ఞాపకముండదు.
జ్ఞాపకమున్నా లేకున్నా మనిషియొక్క కర్మలు ఎన్నియున్నది మనిషికి
తెలియవు. గతజన్మలలో చేసుకొన్న కర్మలను జీవించియున్న జన్మలో
అనుభవించ వలసియుండును. మనిషి పుట్టినప్పుడే జీవితములో ఎప్పుడు
ఏమి అనుభవించవలసినది ప్రారబ్ధకర్మయను పేరుతో ఆ జన్మలోని
జీవితమునకు కేటాయించబడును. పుట్టిన సమయములోనే కేటాయించ
బడు కర్మను మన పెద్దలు, జ్యోతిష్య పండితులు “జాఫతకము” అని
అంటారు. 'జ' అంటే పుట్టుటయనీ, ఫతకము అంటే వ్యూహము అని
చెప్పవచ్చును. వ్వూహము అనగా 'ముందే నిర్ణయింపబడినదని' అర్థము.
పుట్టినప్పుడే ఆ జన్మకు కావలసిన ప్రారబ్ధకర్మను నిర్ణయించి పెట్టడమును
“జా ఫతకము” అని అంటున్నాము. ఎవని జాఫతకములో ఏమి నిర్ణయించ
బడినది ఎవనికీ తెలియదు. జాఫతకము అనుమాట కాలక్రమమున
మార్పుచెంది చివరకు జాతకముగా నిలిచిపోయినది. నేడు 'జాఫతకము’
అను పేరును ఎవరూ పలుకడము లేదు. అందరూ 'జాతకము' అను
పేరుతోనే పలుకుచున్నారు. అయినా ఎవరి జాతకములో ఏమున్నదో
ఎవరికీ తెలియదు.
ప్రశ్న :- నేడు జ్యోతిష్యమును తెలిసినవారు ఎందరో కాకపోయినా
కొందరయినా సక్రమముగా జాతకములు వ్రాయువారు కలరు. మనిషి
పుట్టిన సమయమును బట్టి, అప్పటి గ్రహ పరిస్థితులనుబట్టి జాతకములు
వ్రాయువారున్నారని అందరూ అనుచుండగా విన్నాము. పుట్టిన సమయము
లో గ్రహముల స్థానములనుబట్టి అనగా జాతకమునుబట్టి జరుగబోవు
కార్యములను అనుభవించబోవు కర్మలను సుఖదుఃఖములను గుర్తించగలుగు
చున్నారని విన్నాము. అటువంటప్పుడు జాతకము (జాఫతకములో)
యున్న కర్మలు తెలిసినట్లే కదా! మీరేమో ఎవరి జాతకములో ఏమున్నదో
ఎవరికీ తెలియదని చెప్పారు. ఇక్కడ మీ మాటను నమ్మాలా? లేక జ్యోతిష్యులు
చెప్పు మాటను నమ్మాలా? అసలు జాతకము అనునది వాస్తవమేనా?
జవాబు :- ‘జాతకము' అని జాఫతకములోని ఒక అక్షరమును వదలివేసి
పలికినా జాతకమనునది వాస్తవమే. పుట్టిన సమయమునుబట్టి, జాఫతకము
అను వ్యూహరచనలో సంచిత కర్మలు ప్రారబ్ధకర్మలుగా నిర్ణయింపబడుట
సత్యమే. అయితే జాఫతకమును అనుసరించి చూస్తే కర్మలను పాలించు
పన్నెండు గ్రహములు, పన్నెండు జీవిత రాశులలో ఎక్కడ ఎలా ఉన్నవో
తెలియును. జ్యోతిష్య శాస్త్రమును తెలిసినవారు గ్రహాల స్థితి గతులను
బట్టి అతడు జీవితములో ముఖ్యముగా ఏమి అనుభవించునో సూచాయగా
కొంత గుర్తించగలరు. అంతమాత్రమున జాతకమును అంతటినీ
గుర్తించినట్లు కాదు కదా? జాతకము అనునది ఒక చలన చిత్రమున్న C.D
లాంటిది. C.Dలో చలన చిత్రమంతాయున్నా అది పైకి కనిపించదు. ఒక
D.V.D లో రెండువందల పాటలున్నా D.V.Dని చూస్తే ఒక్క పాట కూడా
తెలియదు. C.Dగానీ, D.V.D గానీ ప్లేయర్ ప్లే అయినప్పుడు మాత్రమే
దాని లోపల ఇమిడియున్న సినిమాగానీ, పాటలుగానీ తెలియును. C.D
ప్లే అగుచున్నప్పుడు జరిగే ఆటలో లేక కనిపించే ఆటలో కష్టసుఖములు
ప్రత్యక్షముగా కనిపించును. C.D ప్లే కాకముందు సాధారణముగా తెల్లగా
కనిపించు C.D లో ఒక కష్టముగానీ, ఒక సుఖముగానీ తెలియలేదు. అదే
ప్లే అయినప్పుడు అందులో ఏమున్నదో ప్రత్యక్షముగా తెలియును. అలాగే
జాతకము తెల్లగా కనిపించు ఒక C.D లాంటిది. జాతకములో నిక్షిప్తమై
యున్న సుఖదుఃఖములు ఏమీ కనిపించవు. C.D మీద వెనుకవైపున్న
కొన్ని గుర్తులను చూచి ఇది పాటల C.D, ఇది సినిమా C.D యని గుర్తించి
చెప్పినట్లు ఈ జాతకము బాగుంది అనియో, లేక ఈ జాతకము బాగా
లేదనియో గుర్తించగలము. గుండ్రని ప్లేటు మీద C.D అనియో, D.V.D
అనియో వ్రాసియుండడము, అందులో సినిమాయున్నదో, పాటలున్నవో,
మరేదయినా యున్నదో గుర్తుగా వ్రాసియుండడమునుబట్టి అది పాటలదో,
పద్యములదో, చలనచిత్రముదో చెప్పగలిగినట్లు జాతకములో యున్న
గ్రహముల గుర్తులను చూచి ఈ జాతకము మంచిగా జరుగునదో, మంచిగా
జరుగనిదోయని కొంత గుర్తించి చెప్పుటకు వీలగును. అదియూ పన్నెండు
గ్రహములను గుర్తించగలిగిన జాతకములో మాత్రము సాధ్యమగును. ఇప్పటి
కాలములో తొమ్మిది గ్రహములు తప్ప పన్నెండు గ్రహములు తెలియవు.
కావున జాతకమును చెప్పలేరు.
ఒక మనిషి జీవితములోని ఒక సమస్యను గురించి ప్రశ్నించి
నప్పుడు జ్యోతిష్యుడు ఆ సమస్య ఝటిలమైనదో లేక సులభమయినదో
జ్యోతిష్యము ప్రకారము జాతకములో చూచి ఏదో ఒక దానిని చెప్పుదురు.
అంతేగానీ ఆ సమస్యను పూర్తి వివరముగా చెప్పలేరు. ఒకని జీవితములో
చదువును గురించి చూడవలసి వచ్చినప్పుడు విద్యకు అధిపతియైన చంద్ర
గ్రహమును, విద్యాస్థానమైన ఐదవ ఇంటిని (రాశిని) చూచి విద్య వస్తుందనో,
విద్య రాదనో చెప్పవచ్చును. అయితే విద్యను గురించి పూర్తి వివరముగా
సాంగోపాంగముగా (చిన్న పెద్ద సమస్యలను గూర్చి) చెప్పలేము. ఎవడయినా
పూర్తి వివరముగా చెప్పుతానని చెప్పితే అది అసత్యమేగానీ సత్యము కాదు.
అట్లే జీవితములో సమస్యలకు కొద్దిపాటి వివరమును అవునో కాదో
చెప్పవచ్చును. అయితే ఈ కాలములో 12 గ్రహముల జ్యోతిష్యము లేదు.
కేవలము నవగ్రహముల జ్యోతిష్యము మాత్రముండుట వలన కొద్దిపాటి
జ్యోతిష్యమును కూడా సక్రమముగా చెప్పలేకున్నారు. అవునన్నది కాకుండా
పోవుచున్నది. కాదన్నది సక్రమముగా నెరవేరుచున్నది. దీనినిబట్టి
జ్యోతిష్యమును ఎవరూ సరిగా చెప్పలేని స్థితి కలదని చెప్పవచ్చును. ఆరు
శాస్త్రములలో జ్యోతిష్యము ఒక శాస్త్రము అయినప్పటికీ, దానిలో సరిగా
పరిశోధనలు జరుగలేదు. మిగతా శాస్త్రములు అభివృద్ధి అయినంతగా
జ్యోతిష్యశాస్త్రము అభివృద్ధి కాలేదు. అందువలన జ్యోతిష్యమును ఎవరూ
సరిగా చెప్పలేకపోవుచున్నారు.
ప్రశ్న :- C.D లో సినిమాయున్నట్లు పూర్తిగా ఎవరికీ తెలియకుండా ఒక
మనిషి జీవితము అంతయూ వాని కర్మపత్రములో అనగా జాతకములో
ఇమిడియున్నదని బాగా అర్థమయ్యే ఉపమానముతో చెప్పారు, సంతోషము.
C.D లోని సినిమా తెలియనట్లు అది C.D ప్లేయర్లో ప్లే అయినప్పుడే
సినిమా పూర్తి వివరముగా కనిపించినట్లు, ఏ మనిషి జాతకములోని
కర్మయినా అది వాని జీవితములో అమలగునప్పుడు పూర్తిగా తెలియును.
C.D ని చూచి సినిమాలోని పూర్తి సంఘటనలను ఎలా చెప్పలేమో,
జాతకమును చూచి కష్టసుఖములను పూర్తి వివరముగా చెప్పలేము. అయితే
ఇప్పుడు చెట్టు ముందా విత్తు ముందా?, గ్రుడ్డు ముందా కోడి ముందా?
అన్నట్లు, C.D ముందా సినిమా ముందా? యని ప్రశ్నించవచ్చును కదా!
ఈ ప్రశ్నకు మీరు ఏమి జవాబును చెప్పగలరు?
జవాబు :- ఈ ప్రశ్నలన్నీ ఒకటి జవాబయితే మరియొకటి ప్రశ్నగా మిగులు
చుండును. వీటన్నిటికీ సరియైన వివరణ వచ్చినప్పుడే ప్రశ్నలేని జవాబుగా
నిలిచిపోవును. అంతవరకూ ప్రశ్నయున్న జవాబుగా యుండును.
వివరమును చెప్పుటకే ముందుగా కర్మ జన్మలను గురించి ఇంత
ఉపోద్ఘాతమును చెప్పవలసి వచ్చినది. ఇంతవరకు C.D సినిమాను గురించి
చెప్పినా అది చెట్టు ముందా విత్తు ముందా? యను వివరణ కోసమేయని
తెలియవలెను. కర్మ జన్మలను గురించి చెప్పినప్పుడు తెలివైన కొందరికి
కర్మముందా? జన్మముందా? యను ప్రశ్న రాగలదు. వాస్తవముగా
విత్తు చెట్టుకంటే, గ్రుడ్డు కోడికంటే, C.D సినిమాకంటే, కర్మ జన్మకంటే
ముందా? యను ప్రశ్న మనుషులయిన మనకు చాలా దగ్గరగాయున్న
ప్రశ్నయని తెలియుచున్నది. 1) చెట్టుముందా విత్తుముందా? 2) గ్రుడ్డు
ముందా కోడిముందా? 3) C.D ముందా సినిమా ముందా? 4) కర్మ
ముందా జన్మ ముందా? అను ఈ నాలుగు ప్రశ్నలు ఒకే కోవకు చెందినవి
అయినందున ఇందులో ఒక దానికి జవాబు సరియైన విధానముగా
తెలియగలిగితే మిగతా మూడు ప్రశ్నలకు జవాబు దొరికి పోవును.
ప్రశ్న :- నాలుగు ప్రశ్నలు ఒకే విధముగా యున్నవని మీరు చెప్పినా, ఆ
మాట వాస్తవమే అయినా, ఒక ప్రశ్నకు వివరము దొరికితే మిగతా
మూడు ప్రశ్నలకు సరియైన జవాబు దొరికినట్లేయని చెప్పుచున్నారు కదా!
ఇందులో మాకు అనుమానము ఏమంటే మీరు ఒక ప్రశ్నకు జవాబు
చెప్పినా, దానిని వివరముగా చెప్పినా, చివరకు అది శాస్త్రబద్దముగా
యుండునా? అని నేను ప్రశ్నించుచున్నాను. ఎందుకనగా! ఈ ప్రశ్నలలో
రెండువైపుల శాస్త్రమున్నది. రెండు ప్రక్కల శాస్త్రబద్దత కల్గిన ప్రశ్నలకు
ఒకవైపు సమాధానము శాస్త్రబద్దముగా యున్నదని చెప్పడము
పొరపాటగునేమో? దీనికి మీరు ఏమంటారు?
జవాబు :- అన్నము శాస్త్రబద్ధమైన సత్యమే, ఆకలి కూడా సత్యమే.
అన్నమును తిన్నప్పుడు ఆకలి లేకుండా పోవును. రెండూ సత్యమైనవయి
నప్పుడు అన్నమును తింటే ఆకలి ఎక్కడికి పోతుంది? అని ప్రశ్న అడుగడము
సమంజసము అనిపించుకోదు. అలాగే ఒక జవాబు దొరికినప్పుడు రెండవ
ప్రశ్న కూడా సత్యమే అయినప్పుడు అది లేకుండాపోవును అనుట
మంచిదా!యని అడిగినట్లున్నది. కర్మ, జన్మ సత్యమే అయినప్పుడు అందులో
జవాబుగా ఒకటే నిలుచును. అలాగే విత్తనము చెట్టు రెండూ సత్యమే
అయినప్పుడు అందులో ఒకటే జవాబుగా నిలుచును. ఒకటి ప్రశ్నగా
నిలువగా మరొకటి జవాబుయైపోవును. ఎందుకనగా! ప్రపంచములో
ప్రతీదీ జవాబుగల ప్రశ్నయే గలదు. జవాబు లేని ప్రశ్న ఏదీ లేదు.
జవాబు లేని ప్రశ్న ఒక్కటే ఒక్కటి గలదని ముందే చెప్పుకొన్నాము. అది
తప్ప అన్నీ జవాబున్న ప్రశ్నలే గలవు. ఎక్కడ ప్రశ్నకు జవాబులేదో
అక్కడ అజ్ఞానమున్నదని చెప్పవచ్చును. జ్ఞానమున్నచోట ప్రశ్నకు జవాబు
తప్పకయుండును. విత్తుముందా చెట్టుముందా? గ్రుడ్డు ముందా కోడి
ముందా? C.D ముందా సినిమా ముందా? కర్మముందా జన్మముందా?
అను నాలుగు ప్రశ్నలు జవాబులేని ప్రశ్నలుగా కనిపించినా జ్ఞానము వలన
వాటి జవాబు ఛేదించి చెప్పవచ్చును.
ప్రస్తుతము ఈ నాలుగు ప్రశ్నలలో బాగా అర్థమగుటకు ఒక ప్రశ్నను
తీసుకొని వివరించుకొని చూస్తాము. ఈ ఒక్క ప్రశ్నకు జవాబు అర్థమయితే
మిగతా మూడు ప్రశ్నలకు సులభముగా జవాబులు తెలియగలవు. C.D
సినిమా విషయమును తీసుకొని చూస్తాము. C.D లో సినిమా ఉండును.
సినిమా మొదట తయారైయుంటే దానిని C.D లో వ్రాసియుంచవచ్చునని
అందరూ అనుకుంటారు. అలాగే ఏ సినిమానయినా C.D లో
వ్రాసుకొంటున్నాము. అందువలన ముందు సినిమా తర్వాత C.D లలో
నిలువ యున్నదని చెప్పవచ్చును. ఒక సినిమా ఉందంటే దానిని ఎన్ని
C.D లలో నయినా వ్రాసియుంచుకోవచ్చును. అంతవరకు అది సత్యమేయని
మేము కూడా ఒప్పుకుంటాము. అయితే మొదట సినిమా యున్నదా?
అని ప్రశ్న వేసుకొంటే మొదట సినిమా లేదు. సినిమాను తయారు
చేయవలెనను సంకల్పము మనిషిలో వచ్చియుండుట జరిగినది. తర్వాత
కొంత కాలముగా సినిమా తయారు చేయబడినది. సినిమా ఒక్కమారుగానీ,
ఒక గంటలోగానీ తయారు కాలేదు. సినిమాలోని అనేక సంఘటనలను
అనేక భాగములుగా, అనేక దినములు శ్రమించి తయారు చేయడము
జరుగుచున్నది. ఒక దినము కొన్ని గంటలు శ్రమిస్తే ఒక పది లేక
పదిహేను నిమిషముల సినిమా మాత్రము తయారు కాగలదు. అలా
తయారు చేసిన దానిని ఒక భాగముగా ఫిల్ములోగానీ, లేక కెమెరా చిప్లోగానీ
రికార్డు చేయబడును. సినిమా పూర్తిగా తయారు కాకముందే C.Dలోగానీ
C.D లాంటి పరికరములో గానీ నిలువ చేయబడుచున్నది.
ఈ విధముగా అనేక ముక్కలుగా ఒక సినిమాలోని అనేక
సంఘటనలు, అనేక దినములు కెమెరాలోగానీ మరి ఇతర పరికరములో
గానీ నిలువ చేయబడును. ఇప్పటి కాలములో చిన్న ముక్కగా యున్న చిప్
అను దానిలో సినిమాగా తయారు చేయబడిన ముక్కలన్నీయుండును.
నంబరు వారిగా వరుసక్రమములో నిలువయుంచిన ముక్కలన్నిటినీ సినిమా
అంతా తయారయిన తర్వాత ఒక్కమారు ప్రదర్శించి అనేక చిత్రములుగా
C.D లలోగానీ, C.D లాంటి పరికరములోగానీ వ్రాయడము లేక నమోదు
(రికార్డు) చేసిపెట్టడము జరుగు చున్నది. అలా తయారు చేసిన సినిమాలను
అనేకచోట్ల, అనేకమంది, అనేక C.D లనుంచి చూస్తున్నారు. సినిమాను
ఒక్కమారు చూచినట్లు అది ఒక్కమారు తయారుకాలేదు. అందువలన
మొదట సినిమా లేదని చెప్పవచ్చును. సినిమా ముక్కలున్నాయి, సినిమా
ముక్కలు సినిమా అనిపించుకోదు. ముక్కలన్నిటినీ తనయందు ఇముడ్చు
కున్న C.D గానీ, చిప్ గానీ ఒకమారు సినిమా ముక్కలన్నిటినీ కలిపి
ప్రదర్శించినప్పుడు అది సినిమా అగుచున్నది. సినిమాను తయారు
చేసినప్పుడు తయారు చేయువారి అనుకూలములనుబట్టి సినిమా కథలోని
చివరి ముక్కను ముందు, ముందు ముక్కను చివరిలోను ఎట్లుబడితే అట్లు
తయారు చేసియుందురు. కథను వరుసగా కూడా తయారు చేసియుండరు.
తయారు చేసిన ప్రతి ముక్క ఒక నంబరుతో గుర్తించబడియుండును.
చివరిలో అన్ని ముక్కలను కలుపుకొని రికార్డు చేసిన పరికరమునుండి
మొదటి సినిమా తయారయి బయటికి వచ్చుచున్నది. సినిమాకంటే ముందు
దానిని దాచుకొన్న పరికరమే ముందుయున్నది. సినిమా ముక్కలను
దాచుకొన్న C.D లాంటి పరికరము నుండి మొదట సినిమా బయటికి
వస్తున్నది. కావున C.D (సి.డి) లాంటి పరికరముగానీ, C.Dగానీ మొదటిదనీ
తర్వాత, సినిమాయనీ చెప్పవచ్చును. ఒకమారు రికార్డు చేయబడిన
పరికరము ద్వారా సినిమా బయటికి వస్తే దానిని నేరుగా మొత్తము సినిమాను
ఎన్ని కాపీలుగానయినా ఎన్ని సి.డిలలో నయినా వ్రాయవచ్చును. మొదట
నేరుగా సినిమా తయారయి రికార్డు కాలేదు. రికార్డునుండి మొదటి
సినిమాను బయటికి తీయడము జరుగుచున్నది. కావున ఇక్కడ C.D
(సి.డి) ముందా సినిమా ముందా యను ప్రశ్నకు జవాబుగా సిడినే ముందని
చెప్పవచ్చును. ఎక్కడయినా రికార్డు పరికరమే ముందు కనుక ఆ విధముగా
జవాబును చెప్పక తప్పదు.
ప్రశ్న :- C.D (సి.డి) సినిమాను గురించి మీరు చెప్పినది సత్యమే అయినా
ఏదో మాయ చేసి చెప్పినట్లున్నది. ఈ విషయములో కొంత అర్థమయినట్లు,
కొంత అర్థము కానట్లు యున్నది. ఈ విధానము మాకు వద్దుగానీ, చెట్టు
ముందా? విత్తుముందా? అనే ప్రశ్నకు నేరుగా జవాబును విశధీకరించి
చెప్పమని అడుగుచున్నాము. మాకు చెట్టు విత్తు విషయమును గురించే
తెలుసుకోవాలనియుంది. మేము ముందు అడిగిన ప్రశ్న అదియే తర్వాత
మీరు గ్రుడ్డు ముందా కోడిముందా?, కర్మముందా జన్మముందా? యను
ప్రశ్నలను తెచ్చారు. ముందు మేము అడిగిన దానికి సమాధానము చెప్పండి.
తర్వాత మిగతా రెండు సులభముగా అర్థము కాగలవు. చెట్టు ముందా
విత్తు ముందా? యను ప్రశ్నే ప్రపంచమంతా జవాబు లేని ప్రశ్నగా
కనిపించుచున్నది. అందువలన దానినే చెప్పండి.
జవాబు :- “చెట్టు అయినప్పుడు వంగనిది మానయినప్పుడు వంగుతుందా!”
యని కొందరనుట విన్నాము. ఇదే మాటనే మరొక ప్రాంతములో కొంత
తేడాతో "చెట్టయి వంగనిది మానయి వంగునా!” యని కూడా
అనుచుందురు. “చిన్నపిల్లప్పుడే మాట విననప్పుడు పెద్దయిన తర్వాత
మాట వింటాడా!” అనుమాట కొరకు అదే సందర్భములో 'చెట్టు', 'మాను'
అనుమాటలు వాడుదురు. ఈ మాటల సందర్భముగా 'చెట్టు' అంటే
చిన్నదియనీ, మాను అంటే పెద్దదియనీ అర్థము కాగలదు. చెట్టంటే మొక్క
దశలోయుండునది అనియూ, 'మాను' అంటే వృక్ష దశలో యుండునది
అనియూ తెలియుచున్నది. ఒక చెట్టు ఒక విత్తనమునుండి పుట్టుచున్నదని
అందరికీ తెలుసు. విత్తనము నుండి పుట్టిన చెట్టు కొంతకాలముగా పెరిగి
కొన్ని సంవత్సరములకు వృక్షముగా మారుచున్నది. 'చెట్టు' వృక్షదశకు
మారిన తర్వాత, అనగా కొంత వయస్సు వచ్చిన తర్వాత, 'మాను (వృక్షము)
అనిపించుకొన్న తర్వాత, ఆ మానుకు ముందు పూవులు పూయును.
పూలు స్వపరాగ సంపర్కము ద్వారాగానీ, పరాగసంపర్కము ద్వారాగానీ,
పర పరాగసంపర్కము ద్వారా గానీ ఫలదీకరణ చెంది పూవు కాయగా
మారును. పూవు కాయగా మారుటకు కొన్ని దినములు పట్టును. పూవు
కాయగా మారిన తర్వాత కొన్ని దినములకు కాయ పూర్తిగా పెరిగి
పరిపక్వమునకు వచ్చి కాయ పండుగా మారును. అప్పుడు కాయలో
కొద్దిగా తయారయిన విత్తనములు పండులో పూర్తిగా పెరుగును. పండు
పూర్తిగా పండి రాలిపోయిన తర్వాత విత్తనములు పూర్తి స్థాయికి
ఎదిగియుండును. రాలిపోయిన లేక పండిపోయిన పండులో విత్తనములు
తయారై బయటపడును. పండునుండి బయటపడి పూర్తిగా తేమ ఆరిపోయిన
తర్వాత విత్తనము పూర్తి తయారయినట్లు తెలియవలెను. ఒక చెట్టునుండి
తయారయిన విత్తనములో ఆ చెట్టుకు సంబంధించిన రసాయణములు
నింపబడియుండును. చెట్టుయొక్క రసాయణములే కాక విత్తనము చెట్టుగా
మారినా, చెట్టు కొన్ని దినముల వరకు లేక కొన్ని గంటల వరకు
ఆహారమును సంపాదించుకోలేని స్థితిలో యుండును. కనుక విత్తనము
మొక్కగా పుట్టినప్పుడు దానికి కావలసిన ఆహారమును విత్తనమునందే
లభించును. విత్తనము మొక్కగా మార్పు చెందినప్పుడు రెండు మూడు
రోజుల వరకు ఆ మొక్కకు కావలసిన ఆహారము విత్తనమునందు
నిలువయున్నదే ఉపయోగపడును.
ఇంకా వివరముగా చెప్పుకొంటే విత్తనమునందు కుడి ఎడమగా
రెండు బేడలుండును. కంది గింజయందుగానీ, శెనగ గింజయందుగానీ,
వేరు శెనగ విత్తనమందుగానీ, చిక్కుడు గింజయందుగానీ ఇట్లు అనేక
విత్తనములు రెండు బేడలు కల్గియున్నవి గలవు. కొన్ని ద్విదళ బీజము
(విత్తనము)లు కాగా కొన్ని ఏక దళ బీజములు కూడా కలవు. వడ్లగింజ,
కొర్ర గింజ, జొన్న గింజ మొదలగునవి ఏకదళ బీజములుగా యున్నవి.
ఇప్పుడు మనకు బాగా అర్థమగుటకు వేరు శెనగ గింజను తీసుకొని
చూస్తాము. గింజ అనినా, విత్తనము అనినా, బీజము అనినా అన్నీ తెలుగు
భాషలో అర్థ సహితమయిన పేర్లని తెలియవలెను. నేడు ఇంగ్లీషు మీడియమ్
చదువుచున్న తెలుగువారికి కూడా తెలుగులో పేర్లు తెలియకుండా పోవడము
పెద్ద లోపముగా చెప్పవచ్చును. అన్ని భాషలకు తెలుగు భాష తల్లివంటిది.
తెలుగు భాషలోని చాలా పదములు ఇతర భాషలుగా చెప్పబడుచున్నవని
తెలుగువారికి తెలియకుండా పోవడమేకాక, బెల్లపు చెరుకును వదలి
జొన్నదంటును నమిలినట్లు ఎంతో రుచిగల తెలుగు భాషను వదలి రుచిలేని
ఇతర భాషలవెంట తెలుగువారు పోవడము తేనెను వదలి పానకమును
త్రాగినట్లున్నది.
తెలుగు భాషలో 'గింజ' అనగా గింజుకొని పుట్టినదని అర్థము
గలదు. గింజుకొని అనగా లాగుకొనియని అర్థము. లాగుకొనుట
అనుమాటను కొన్ని ప్రాంతములలో 'గుంజుకొని' అనుచుండగా, కొన్ని
ప్రాంతములలో 'గింజుకొని' అని అంటున్నారు. విత్తనమునుండి బయటికి
వచ్చు మొక్క పై భాగము ఎవరో పట్టి లాగినట్లు విత్తనమునుండి భూమి
యొక్క పై భాగమునకు వచ్చుచుండగా, అంతే బలముగా మొక్క యొక్క
రెండవ కొన అయిన వేరు భాగము క్రిందికి భూమిలోనికి పోవుచున్నది.
అక్కడ ఏ శక్తి ఉపయోగపడుచున్నదో ఎవరికీ తెలియదుగానీ గింజుకొని
విత్తనమునుండి బయటికి చెట్టు వస్తున్నది కావున విత్తనమును 'గింజ'
అని అన్నారు. “జ” అనగా పుట్టుటయని అర్థముండగా, గిం లేక గుం
అనగా ‘బలముగా’ అని అర్ధము. బలముగా మొక్క పై భాగము బయటికీ,
బలముగా మొక్క క్రింది భాగము భూమిలోనికి విత్తనమునుండి రావడము
వలన “గింజ” అని కొందరు అనుచున్నారు. తాటికాయలనుండి బయటికి
తీయు తాటి గింజలను కొందరు "తాటిగుంజలు” అని అనుచుండుట
మనము వినయే యుందుము. అట్లే కొందరు కొన్ని ప్రాంతములలో తాటి
గింజలని కూడా అనడము వినియేయుందుము. విత్తనమును 'గింజ'
అనుటయే ఎక్కువగా యున్నది. తాటి కాయల వద్ద మాత్రము తాటి
గుంజలని కొందరనడము వినుచున్నాము. దీనినిబట్టి 'గింజ' అనగా
బలముగా బయటికి త్రోయునది. విత్తనమునుండి మొక్క కొన బయట
పడడమును చూస్తే ఏదో శక్తి బయటికి నెట్టినట్లు యుండడము చేత
బయటికి గుంజివేయునది 'గింజ' అని చెప్పవచ్చును.
విత్తనమునకు మరియొక పేరు “బీజము” అని కలదు. 'బీజము’
అను పదములో బీ జ అను రెండు అక్షరములే ప్రథమ దైవగ్రంథమయిన
భగవద్గీతలోని గుణత్రయ విభాగయోగమను అధ్యాయమున నాల్గవ
శ్లోకమందు వ్రాయబడియున్నది. "అహం బీజ ప్రదః పితా” అని శ్లోకములో
చెప్పబడియున్నది. “బీజ” అనుమాట సంస్కృత శ్లోకమునందు ఉన్నందున
ఈ మాట సంస్కృత భాషలోనిదని అందరూ అనుకోవడము జరుగుచున్నది.
మేము మొదటనే "బీజము” అను పదము తెలుగు భాషలోనిదియని
చెప్పాము. ప్రపంచములోనే మొదట పుట్టిన భాష తెలుగు భాషయనీ,
తెలుగు పదములే తర్వాత అనేక భాషలలో చేరిపోయినవని చెప్పాము.
అయితే అవి ఎక్కడున్నా తెలుగు పదములే. మిగతా భాషలలో వాటికి
సరియైన అర్థము లేదు. తెలుగు భాషలోనే ఆ పదములకు సరియైన
అర్థము గలదు. 'బీజము' అను పదములో బీ జ అను రెండు అక్షరములే
అర్థముతో కూడుకొనియున్నవి. 'ము' అను అక్షరము ముగింపు అక్షరముగా
యున్నది. బీజ అను రెండు అక్షరములలో 'జ' అనగా పుట్టునదని అర్థము
గలదు. 'బీ' అనగా జరుగబోవు దానిని తెలియజేయునది 'బీజ' అనగా
పుట్టబోవునది అని అర్థము లేక జన్మించునదని చెప్పవచ్చును. బీ అనగా
భవిష్యత్తును తెలియజేయునదని తెలుగు భాషలో అర్థముండగా ఇదే 'బీ'
ఇంగ్లీషు భాషలో చేరిపోయి అక్కడ కూడా తెలుగు భాషలోని అర్థమునే
తెలియజేయుచున్నది.
'గింజ', 'బీజము' అను రెండు పదములకు తెలుగు భాషలోనే
అర్థమును తెలుసుకొన్నాము. 'విత్తనము' అను మరియొక పేరుకున్న
అర్థమును తెలుసుకొందాము. 'విత్తనము' పదములో నాలుగు అక్షరములలో
చివరి అక్షరము ముగింపు అక్షరముగా యుండుట వలన దానికి
అర్థముండదు. చివరి అక్షరము “ము” బయటికి పోగా మిగిలిన మూడు
అక్షరములకు అర్థము గలదు. “ద్రావిడ బ్రాహ్మణ" గ్రంథములో రెండు
గుడులు గల “వి” ఆత్మకు గుర్తుగా యున్నదని చెప్పుకొన్నాము. ఇప్పుడు
కూడా అదే అర్థమును 'వి' కలిగియున్నదని చెప్పుచున్నాము. రెండవ
అక్షరమయిన “త్త” అను అక్షరము ఇక్కడ జీవాత్మ భావమును తెలియ
జేస్తున్నది. దీనిప్రకారము 'విత్త' అను రెండు అక్షరములకు ఆత్మ, జీవాత్మయని
అర్థము. మూడవ అక్షరమయిన “న” అంటే కాదు, లేదు అని అర్ధము
గలదు. “విత్తన” అనగా ఆత్మ, జీవాత్మ రెండూ లేనిదని అర్ధము. విత్తనములో
అర్థము ప్రకారము పరమాత్మ మాత్రముండగా ఆత్మ, జీవాత్మ రెండు లేనిది
విత్తనమని చెప్పవచ్చును. రెండు లేవు అంటే రెండు చేరబోతాయని అర్ధము.
సజీవమైన దేనియందుగాని మూడు ఆత్మలు ఉండవలెను. ప్రస్తుతము
జీవములేని విత్తనముయందు ఆత్మ, జీవాత్మ రెండూ లేవని, తర్వాత ఆ
రెండు రాగలవని, విత్తనము చెట్టుగా సజీవమగునని అర్థమును విత్తనము
తెలుపుచున్నది. విత్తనము అను పదములో ఆత్మ, జీవాత్మలు ఇప్పుడు లేవు
అని చెప్పుచూ రెండూ రాబోతాయను సూచనను తెలుపుచున్నది. ఈ
విధముగా గింజ, బీజము, విత్తనము అను మూడు పదములకు అర్థము
గలదు.
ప్రశ్న :- చెట్టు ముందా విత్తనము ముందా? అను ప్రశ్నకు మీరు అసంపూర్ణ
మైన సమాధానమును చెప్పారు. మాకు సంశయములేని పూర్తి
సమాధానమును చెప్పవలసినదిగా కోరుచున్నాము. ఇంతకుముందు చెప్పిన
జవాబులో స్వపరాగ, పరాగ, పరపరాగ సంపర్కములని మూడు విధానము
లను చెప్పారు. ఆ పేర్లనే మేము ఎప్పుడూ వినలేదు. అందువలన ఆ
మాటలు మాకు అర్థము కాలేదు. అందువలన ఆ మూడింటిని వివరముగా
తెలుపమని కోరుచున్నాము.
జవాబు :- విత్తనము చెట్టుగా మొలకెత్తు విధానమును మాత్రము చెప్పాను
గానీ, చెట్టు ముందా విత్తు ముందా? అను ప్రశ్నను తేల్చి చెప్పలేదు.
వృక్షములో పూవునుండి విత్తనము ఎలా తయారగుచున్నదో చెప్పు
సందర్భములో పరాగ సంపర్కము, స్వపరాగసంపర్కము, పరపరాగ
సంపర్కము అను మూడు విధానములను చెప్పడమైనది. దానిని వివరముగా
చెప్పితే ఇలా గలదు. సంపర్కము అనగా సంయోగము అనియు లేక
కలయిక అనియు చెప్పవచ్చును. ఏది, దేనితో కలియునని ప్రశ్నించుకొని
చూస్తే, స్త్రీ కణముతో పురుష కణము కలిసిపోవుచున్నదని తెలియుచున్నది.
ఒక పూవును విభజించితే మూడు ముఖ్యమైన భాగములుండును.
పూవుచుట్టూ పుష్పపు రేఖలుండును, పూవు రేఖలు రంగులతో కూడుకొని
యుండును. పూవు రేఖల మధ్యలో పుప్పొడి కల్గిన చిన్నచిన్న పుల్లలు
ఉండును. పూవు మధ్యలో, పుప్పొడి పుల్లల మధ్యలో కొద్దిగ పొడవు కల్గిన
కీలము అను పుల్లయుండును. కీలము పై భాగమును “కీలాగ్రము” అని
అంటాము. కీలాగ్రములో స్త్రీ కణముయుండును, పుప్పొడియను ధూళిలో
(పొడిలో) పురుషకణములు ఉండును. పుప్పొడిలో యుండు పురుషకణము
కీలాగ్రములోయుండు స్త్రీ కణమును కలియుటను 'సంపర్కము' అని
అందుము. ఎప్పుడయితే పూవులోయుండు, పుప్పొడి యందు గల పురుష
కణము కీలాగ్రములో యున్న స్త్రీ కణముతో కలియునో, అప్పుడు ఆ
పుష్పము ఫలదీకరణ చెందినట్లగును. ఫలదీకరణ చెందిన పూవుయొక్క
రేఖలు రాలిపోయి కాయగా తయారగుచూ వచ్చును.
ఒక మామిడి చెట్టు పూత పూసినప్పుడు పూతంతయూ కాయలుగా
మారదు. ఫలదీకరణ చెందిన పూవులు (పూతలు) మాత్రము కాయలుగా
మారును. ఏ చెట్టు పూవు అయినా ఎన్నో కీటకములకు, చిలుకలకు,
గువ్వలకు తేనెటీగలకు, తుమ్మెదలకు అందముగా కనిపించుచూ వాటిని
ఆకర్షించుచుండును. వచ్చిన కీటకములు పూవుమీద వాలును. పూవు
మీద కూర్చున్నప్పుడు కీటకముల కాళ్ళకు పుప్పొడి రేణువులు
తగులుకొనును. అలా తగులుకొన్న పుప్పొడి రేణువులు అదే పుష్పము
యొక్క కీలాగ్రమునయున్న స్త్రీకణమునకు అంటుకొనవచ్చును. లేక వేరే
చెట్టు లేక మాను యొక్క పుష్పము మీద కీటకములు వాలినప్పుడు ఆ
పుష్పము యొక్క కీలము పైన యున్న కీలాగ్రములోని స్త్రీ కణమును
చేరవచ్చును. కీటకముల కాళ్ళకు అంటుకొనిన ఒక పుష్పములోని పుప్పొడి
అను మగ కణములు కీటకము వలన అదే పుష్పము యొక్క కీలాగ్రమును
గానీ, లేక అదే జాతియొక్క మరొక పుష్పము యొక్క కీలాగ్రమునుగానీ,
చేరి ఫలదీకరణ చెంది పుష్పము కాయగా మారవచ్చును. ఒక్కొక్కప్పుడు
కీటకములు ప్రక్కనేయున్న మరొక జాతి చెట్టు పుష్పములోని కీలాగ్రమును
చేరవచ్చును. అప్పుడు ఒక జాతి పురుషకణము వలన మరొక జాతి
చెట్టు స్త్రీ కణము ఫలదీకరణ చెందడము జరుగును. ఈ విధముగా
పుష్పములోని పుప్పొడి అనబడు పురుష కణములు అదే పుష్పమును
చేరవచ్చును లేక అదే జాతి వేరొక పుష్పమును చేరవచ్చును. అట్లుకాక
పోతే వేరేజాతి చెట్టు యొక్క పుష్పమును చేరి ఫలదీకరణ చెందవచ్చును.
ఈ విధముగా ఫలదీకరణ మూడు రకములు కలదు.
ఒక పుష్పములోని పుప్పొడి రేణువులు అదే పుష్పము కీలమును
చేరి ఫలదీకరణ చెందడమును “స్వపరాగ సంపర్కము” అని అంటారు.
ఒక పుష్పములోని పుప్పొడి రేణువులు అదే జాతి వేరొక పుష్పమును చేరి
ఫలదీకరణ చెందడమును “పరాగ సంపర్కము” అని అంటారు. ఈ
రెండు విధానములు కాకుండా ఒక పుష్పములోని పుప్పొడి రేణువులు
వేరొక జాతి చెట్టుయొక్క పూవులోని కీలాగ్రమును చేరి ఫలదీకరణ చెందితే
దానిని తప్పనిసరిగా “పర పరాగ సంపర్కము” అని చెప్పవలెను. ఈ
మూడు విధానములు బహుశా కొంత చదువు చదువుకొన్న వారికందరికీ
తెలిసేయుండును. ఒకపూవు కాయగా ఎట్లు మారుతున్నది అనునది
ముఖ్యము కాదు గానీ, విత్తనముకు చెట్టు కారణమా, చెట్టుకు విత్తనము
కారణమా?యని తెలియడము ముఖ్యము.
పుష్పము వాటి భాగములను కీలాగ్రము,కీలము,పసుపు పచ్చనిపుప్పొడి రేణువులు, కాడ,యొక్క చిత్రమును పేజీ 44 లో చూడగలరు.
ఈ ప్రశ్నకు జవాబును తెలియుటకు ఒక వేరు శెనగ విత్తనమును
తీసుకొని చూస్తాము. అట్లే మొలకెత్తబడిన తర్వాత రెండు నెలల వయస్సున్న
వేరు శెనగ చెట్టును కూడా గమనిద్దాము. వేరు శెనగ విత్తనము ద్విదళ
బీజముగా యున్నది. ద్విదళ బీజము అనగా రెండు బేడలు గల విత్తనమని
అర్థము. ఒక వేరు శెనగ విత్తనమును తీసుకొని పైనగల ఎర్రని పొట్టును
కొంత తొలగించగా రెండు బేడలు ఒకదాని ప్రక్కలో మరొక బేడ అతుక్కొని
యున్నట్లు కనిపించును. రెండు బేడలను చిన్నగా ప్రయత్నము చేసి
విడదీయగా ఒక బేడ క్రింది భాగములో అనగా మొన భాగములో విరిగిపోయి
ఊడివచ్చును. మరొక బేడకు క్రింది భాగమున విత్తనము యొక్క కొన
చివరిలో చిన్న ఉంటలాగ ఉండి, ఆ ఉంటలో నుండి ఒక వేరు శెనగ చెట్టు
పుట్టియున్నట్లు కనిపించును. వేరు శెనగ విత్తనము నుండి మొదట బయటికి
వచ్చిన మొక్క ఆకారముతోనే ఆ చెట్టు కనిపించును. మొన భాగములో
చిన్నగా వేరు శెనగ చెట్టుయున్నట్లు ఆకులు ఒక దానిలో మరొకటి పేర్చి
పెట్టినట్లు, ఆకుల వీనెల గుర్తులతో సహా చెట్టు పూర్తిగా కనిపించును.
వేరు శెనగ విత్తనములోనే వేరు శెనగ చెట్టు అమరియున్నట్లు చెట్టు
ఆకుల ఆకారము కనిపించుచున్నది. విత్తనమునకు తేమ తగిలినప్పుడు
అనగా విత్తనము కొన భాగములో తేమ తగలగానే విత్తనములో రసాయన
మార్పు జరిగి విత్తనములో కనిపించు చెట్టు భూమినుండి బయటికి వచ్చును.
విత్తనము బలవంతముగా బయటికి త్రోసినట్లు ఎవరో బయటికి లాగినట్లు
చెట్టు మొన బయటికి పెరుగుచూ వచ్చి లోపల కనిపించిన ఆకులు బయటికి
వస్తున్నవి.
లోపల కనిపించిన ఆకులు తెలుపు రంగులో కనిపించగా బయటికి
వచ్చిన ఆకులు చిలుక పచ్చ రంగులో గ్రీన్ కలర్లో కనిపించుచున్నవి.
అలా విత్తనమునుండి బయట పడిన వేరు శెనగ చెట్టును రెండు నెలలు
గమనించినా అందులో వేరు శెనగ విత్తనము యొక్క నమూనా ఎక్కడా
కనిపించలేదు. వేరు శెనగ చెట్లలో రెండు రకములు గలవు. అందులో
మూడు నెలలకే పంటవచ్చునది ఒకటికాగా, ఐదు నెలలకు పండునది
కూడా కలదు. మూడు నెలలకు పండు దానిని గుత్తు వేరు శెనగ అనియూ,
ఐదు నెలలకు పండు దానిని తీగ వేరు శెనగ అని పిలుస్తున్నారు. రెండు
రకముల విత్తనములలో ఇంతకుముందు మేము చెప్పినట్లే విత్తన కొన
భాగములో వేరు శెనగ చెట్టు ఆకారము కనిపించీ కనిపించనట్లు చాలా
చిన్నగా యుండును. చెట్టు పెరిగి పెద్దయిన తర్వాత పూవులు (పూత)
వచ్చిన తర్వాత ఫలదీకరణ అను రసాయన క్రియ జరిగి విత్తనముగా
మారిపోవును. తర్వాత విత్తనము మ్రొక్కగా మారిపోవుచున్నది. విత్తనములో
చెట్టున్నదిగానీ, చెట్టులో విత్తనము లేదు. కొన్ని నెలలకు తయారయిన
పంట కూడా చెట్టు బయటే వస్తున్నది గానీ చెట్టులోపల పంటలేదు.
అందువలన విత్తనములో చెట్టున్నదిగానీ, చెట్టులో విత్తనము లేదని
చెప్పవచ్చును. విత్తనములోపల ముందే ఆకారముతోయున్న చెట్టు బయటికి
వస్తున్నది. చెట్టు నుండి విత్తనము బయటికి రాలేదు. చెట్టు తయారయిన
మూడు నెలలకు గాని విత్తనము కనిపించలేదు. అదే విత్తనములో ఎప్పుడు
గమణించినా చెట్టు నమూనా ముందేయున్నది. అందుకొరకు చెట్టుకంటే
విత్తనమే ముందుగలదని చెప్పవచ్చును.
చిన్నగయుండు కొన్ని మొక్కలను పెద్దవయినా చెట్లని చెప్పడము
జరుగుచుండును. వేరు శెనగ చెట్టును మాను అనిగానీ, వృక్షమనిగానీ
అనుటకు వీలులేదు. ఎందుకనగా! ఈ చెట్లు అర్ధ అడుగు లేక అడుగు
మాత్రమే పెరుగ గలవు. మూడు నుండి ఐదు నెలలు మాత్రమే బ్రతుక
గలవు. అందువలన వీటిని చెట్లని చెప్పడము జరుగుచున్నది. చెట్టులో
విత్తనము నేరుగా రాలేదు. మొదట పూలు, తర్వాత కాయలు వచ్చును.
కాయలు పరిపక్వమునకు వచ్చి పండయిన తర్వాత, పండు కూడా పూర్తి
ఎండిపోయిన తర్వాత పండునుండి విత్తనములు బయటపడును. కొన్ని
పండ్లు పండ్లగానే నిలిచిపోయి వుండగా వాటినుండి మనుషులు ప్రయత్నము
చేసి విత్తనములను బయటికి తీయవలసి యుంటుంది. అలా తీయకపోతే
ఎంత కాలమయినా విత్తనము కనిపించక పండ్లయందే కనిపించక
యుండును. చెట్టు బ్రతికియున్నప్పుడు ఏ దశలోనూ చెట్టులో, కాయలు
వరకు కనిపించును గానీ విత్తనములు కనిపించవు. అదే విత్తనమునందు
ఎప్పుడయినా చెట్టు నేరుగా బయటికి రాగలదు. ఎప్పుడు విత్తనమును
పగులగొట్టి చూచినా లేక చీల్చి చూచినా అందులో చెట్టు చిన్నగా
కనిపించును. అందువలన విత్తనమునందు చెట్టు గలదు. అయితే
చెట్టునందు ఏ దశలో కూడా విత్తనము లేదు. అందువలన చెట్టుకంటే
విత్తు ముందని సాక్ష్యమును చూపుచూ చెప్పవచ్చును.
ప్రశ్న :- చెట్టుముందా విత్తుముందా? అను విషయములో సాక్ష్యముతో
సహా విత్తనమే ముందుయని తెలియుచున్నది. అయితే చెట్టుకు బీజమైన
విత్తనము మొదట ఎక్కడనుండి వచ్చినది? విత్తనమునుండే నేరుగా చెట్టు
వస్తున్నదని మీరు చెప్పిన తర్వాత అనుమానము లేకుండా తెలిసి పోయినది.
అయినా మొదటి విత్తనము చెట్టునుండి రాలేదా? యను ప్రశ్న కొందరిలో
అయినా మిగిలియుండును. వారిలో మిగిలిన అనుమానమునకు మీరే
నివృత్తిని చూపవలెను?
జవాబు :- సృష్ఠి సృష్టించబడినదని చెప్పుచున్నాము. సృష్ఠించిన వాడు
సృష్టికర్తయిన దేవుడు. దేవుడు ఈ ప్రపంచమును మొదట ఒకమారు
సృష్ఠించాడు తర్వాత సృష్ఠి కొనసాగింది. చెట్టునుండి విత్తనము
వస్తూయుంటే దేవుడు దేనినీ సృష్టించనవసరమే లేదు. దేవుడు మొదట
విత్తనమును సృష్ఠించగా, విత్తనమందే చెట్టును అమర్చి సృష్ఠించడము
వలన విత్తనమునుండి చెట్టు తయారయి, తర్వాత చెట్టునుండి విత్తనములు
తయారైనవి. ఈ విధముగా మొదట దేవుడు విత్తనమును తయారు చేయగా
దానినుండి చెట్టు పుట్టినది. అంతేగానీ ముందు దేవుడు చెట్టును తయారు
చేయలేదు. చెట్టు ఇమిడియున్న విత్తనమును తయారు చేసిన దేవుడు
విత్తనమునుండి చెట్టును పుట్టునట్లు చేశాడు. విశాలముగా కనిపించు
చెట్లు విత్తనములనుండి పుట్టాయిగానీ దేవుడు సృష్టించలేదని నాస్తికులు
అనుచుందురు. అయితే చెట్టుకు కారణమయిన విత్తనము మొదట ఎలా
వచ్చిందని ఎవరూ అలోచించక చెట్టునుండి విత్తనము వచ్చింది అని
అనుకొంటున్నారు. అలా ఒకదానినుండి మరొకటి వస్తుంటే దేవుడు దేనినీ
సృష్ఠించలేదని చెప్పవచ్చును.
దేవుడు మొదట తన మనస్సు ద్వారా అనగా సంకల్పము ద్వారా
సృష్ఠిని తయారు చేయాలనుకొన్నాడు. ఆయన అనుకొన్న వెంటనే సృష్ఠి
తయారయిపోయినది. దేవుడు స్థూలమైన సృష్ఠిని ఒక్కమారు తయారు
చేయలేదు. మొదట సూక్ష్మమైన ఊహతో సృష్టికి బీజమును తయారు
చేశాడు. ఆయన తలంపే స్థూల సృష్ఠికి సూక్ష్మమైన బీజమని తెలియవలెను.
ఈ విషయమై భగవద్గీతలో విభూతి యోగమందు ఆరవ శ్లోకమందు ఇలా
కలదు చూడండి.
శ్లోకము :-
మహర్షయ స్సప్త పూర్వే చత్వారో మనవస్థథా ।
మధ్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః||
ఈ శ్లోకములో చాలామంది భావమును తప్పు వ్రాసుకొన్నారు.
దేవుడు మొదట సప్త ఋషులను, నలుగురు మనువులను సృష్టించాడని,
మొదట పుట్టిన పదకొండుమంది ద్వారా మిగతా ప్రజలందరూ పుట్టారని
వ్రాసుకొన్నారు. దేవుడు ఎప్పుడూ స్థూల ప్రపంచమును నేరుగా తయారు
చేయలేదు. స్థూల ప్రపంచమునకు కారణమయిన సూక్ష్మమైన కారణమును
(విత్తనమును) తయారు చేశాడు. దానిద్వారా స్థూల ప్రపంచమంతా
తయారయినది. ఈ ప్రపంచమునకు ఆయన తలంపే మొదటి విత్తనమని
తెలియవలెను. పై శ్లోకములో దేవుని భావములోని మనో సంకల్పమే
మొదటి ఏడు మహర్షయలు, నాలుగు మనువులు తయారయినవని చెప్పాడు.
ఏడు మహర్షయలు అనగా ఏడు నాడీకేంద్రములు, మనస్సు మొదలగు
నాలుగు అంతఃకరణ భాగములే సమస్త ప్రపంచమునకు మూల కారణమైన
విత్తనముగా యున్నవి. ప్రతి జీవరాశి వెనుక ఏడు మరియు నాలుగు
బీజముగాయుండి సమస్త జీవకోటి తయారయినది. చెట్టుయొక్క విత్తనములో
గానీ, మనిషియొక్క వీర్యకణములోగానీ, గ్రుడ్డు యొక్క మధ్య కణములోగానీ
దేవుడు చెప్పిన ఏడు మరియు నాలుగే (ఏడు నాడీ కేంద్రములు, నాలుగు
అంతఃకరణములే) బీజముగాయున్నవి. అండజ, పిండజ, ఉద్భిజ అను
మూడు రకముల సృష్ఠికి ఏడు మరియు నాలుగు మొత్తము పదకొండు
విత్తనముగా యున్నవి. పదకొండు పైకి కనిపించక యున్నా విత్తనములో
ఏడు అణిగియున్నవి. విత్తనము ద్వారా పుట్టిన చెట్టులో కనిపించని ఏడు
నాడీకేంద్రములు, మనో, బుద్ధి, చిత్తము, అహము అను నాలుగు ఇమిడి
యున్నవని తెలియవలెను.
ప్రశ్న :- మీరు భగవద్గీత ఆధారముతో దేవుని 'మనోభావము’ బీజముకాగా
సమస్త మానవులు పుట్టారని చెప్పుచున్నారు. మిగతా మతములవారు
వారి గ్రంథములలో ఇంకొక రకముగా చెప్పుచూ దేవుడు మొదట ఒక
స్త్రీని, ఒక పురుషున్ని సృష్టించి భూమిమీద వదిలాడనీ, తర్వాత వారు
దేవుడు చెప్పిన నియమ నిబంధనలు ఉల్లంఘించారనీ, దానికి దేవునికి
కోపము వచ్చి వారికి సంతానోత్పత్తి కలుగునట్లు శపించాడని విన్నాము.
అలా శాపము పొందినవారు ప్రపంచములోని మనుషుల ఉత్పత్తికి
కారణమయ్యారని విన్నాము. నేటి జనులందరూ ఆదామ్ సంతతేనని
కొందరు చెప్పగా విన్నాము. ఈ విషయమును ఒక మతమువారే కాకుండా
ఇస్లామ్ మతమువారు, క్రైస్తవ మతము వారు ఇద్దరూ ఆదామ్, అవ్వను
గురించి చెప్పి మొదట వారి సంతతే నేటి జనాభాయని చెప్పుచుండగా,
మీరు హిందూ మతమువారే మరొక రకముగా చెప్పుచున్నారు. మిగతా
రెండు మతములవారు ఒక విధముగా చెప్పగా, ఒక్క హిందూమతము
వారు మాత్రము అలా చెప్పడము వలన మేము సందిగ్ధములో పడిపోయాము.
"కర్మముందా జన్మముందా?” అను ప్రశ్నకు వివరము తెలియకుండా
పోవుచున్నది. ఈ విధానము సక్రమముగా తెలిస్తే చెట్టుముందా
విత్తుముందా? అను విషయములో మీ సమాధానము మీద నమ్మకము
ఏర్పడగలదు. దయచేసి మాకు అర్థమగునట్లు వివరముగా చెప్పగలరని
కోరుచున్నాము.
జవాబు :- నాకు తెలిసిన వివరమును తప్పక తెలియజేతును శ్రద్ధగా
వినుము. దేవుడు మొదట సృష్ట్యాదిలోనే తన జ్ఞానమును ఆకాశవాణి
ద్వారా అందించాడు. దేవుడు వాణి ద్వారా అందించిన జ్ఞానమును
గ్రహించగలిగిన వాడు సూర్యుడు గ్రహించాడు. సూర్యుడు గ్రహించిన
జ్ఞానమును మొదట భూమిమీదికి తెచ్చి 'తెలుగు' భాషలో చెప్పిపోవడము
జరిగినది. అలా భూమిమీదికి మాటల రూపములో వచ్చిన జ్ఞానము
గ్రంథరూపములో ఐదు వేల సంవత్సరముల పూర్వము తయారైనది. అలా
తయారైన గ్రంథమే ప్రథమ దైవగ్రంథముగా పేరుగాంచినది. ఆ ప్రథమ
దైవగ్రంథమే నేడు “భగవద్గీత”గా మనముందరున్నది. తర్వాత కొంత
కాలమునకు ఇంకొక దేశమయిన ఇజ్రాయేల్ దేశములో ద్వితీయ
దైవగ్రంథముగా వ్రాయబడినది. ఇప్పటికి రెండు వేల సంవత్సరముల
క్రిందట తయారయిన ద్వితీయ దైవగ్రంథమునే కొందరు “ఇంజీలు”
గ్రంథమని అంటున్నారు. దానినే కొందరు “బైబిలు” గ్రంథమని అంటున్నారు.
రెండు గ్రంథములుగా దైవజ్ఞానము బయటికి వచ్చినా, మనుషులు అజ్ఞాన
స్థితిలో యున్నారను భావముతో దేవుడు తన జ్ఞానమును మూడవ
గ్రంథరూపము చేశాడు. అలా తృతీయ దైవగ్రంథముగా తయారయినదే
“ఖురాన్” గ్రంథము. మొదట భూమిమీదికి వచ్చిన దైవజ్ఞానమే మూడు
గ్రంథములుగా తయారయినా మూడు గ్రంథములలోయున్నది ఒకే
జ్ఞానమని మనిషి తెలియలేక వేరువేరు జ్ఞానములుగా లెక్కించుకొని, వేరువేరు
మతములుగా తయారు చేసుకొన్నాడు. మనిషిలోని అజ్ఞానమును తీసివేసి
మతాలకు అతీతముగా జ్ఞానమును తెలియగలిగితే సృష్టికంతటికీ ఒకే
జ్ఞానము, ఒకే దేవుడు కలడని తెలియగలదు. అలా తెలియగలిగినప్పుడే
దేవుడు తన జ్ఞానమును మూడు గ్రంథములుగా వ్రాయించినా, అన్నిటిలో
యున్నది ఒకే దేవుని జ్ఞానము అని అందరికి రూఢిగా తెలియగలదు.
అలా తెలియగలిగినప్పుడు మొదట దైవగ్రంథముగా భగవద్గీతలో
చెప్పిన జ్ఞానమే మిగతా గ్రంథములలో యున్నదని తెలియును. అప్పుడు
మూడు గ్రంథములలో ఒకే జ్ఞానము కనిపించును. నాకు మూడు
గ్రంథములలో ఒకే జ్ఞానమున్నదని అర్థమగుట వలన నేడు నేను “త్రిమత
ఏకైక గురువు”గా ప్రజల చేత చెప్పబడుచున్నాను. నేను మూడు
గ్రంథములలో ఒకే జ్ఞానమును చూపుట వలన ప్రజలు అలా నన్ను
పిలువడము జరుగు చున్నది. అంతేగానీ వాస్తవముగా నేను గురువును
కాను. భగవద్గీతలో విభూతి యోగమున ఆరవ శ్లోకమున చెప్పిన విధానమే
మిగతా గ్రంథములలో చెప్పియున్నా దానిని మనుషులు సరిగా అర్థము
చేసుకోలేక పోయారు. వివరముగా చెప్పితే అంతిమ దైవగ్రంథములో
సూరా 2, ఆయత్ 117లో ఇలా కలదు చూడండి. (2-117) “ఆయనే
ఆకాశాలను మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన
(సృష్టించిన) వాడు. మరియు ఆయన ఏదయినా చేయాలని నిర్ణయించు
కొన్నప్పుడు దానిని కేవలము “అయిపో” అని ఆజ్ఞాపిస్తాడు. అంతే
అది అయిపోతుంది.” అని కలదు. ఇంకా సూరా 36, ఆయత్ 82లో
ఇలా కలదు చూడండి. (36-82) “నిశ్చయముగా ఆయన విధానమేమి
టంటే ఆయన ఏదయినా చేయదలచు కొన్నప్పుడు దానితో “అయిపో”
అని అంటాడు, అంతే! అది అయి పోతుంది”.
ఇక్కడ చెప్పే విధానము వేరయినా విషయము మాత్రము అంతా
ఒక్కటే అవుతున్నది. భగవద్గీతలో కూడా మనసులో వచ్చిన తలంపు
ద్వారా సమస్తము పుట్టుచున్నదని “మద్భావా మానసా జాతా” అని చెప్పాడు.
ఇక్కడ ఖురాన్ గ్రంథములో కూడా “దేవుడు అయిపో అంటే అయిపోవుచున్న
దని” చెప్పారు. దేవుడు తన మనస్సులో అనుకొన్న సంకల్పము ద్వారానే
సమస్తము పుట్టుచున్నదని చెప్పాడు. భగవద్గీతలో చెప్పినమాట, ఖురాన్లో
చెప్పిన మాట రెండూ ఒకటే అయినవని బాగా చూచు వారికి తప్పక
తెలియును. గ్రుడ్డిగా చూచువారికి అది వేరుమాట ఇది వేరుమాటగా
కనిపించుచుండును. దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే అయినందున
రెండు గ్రంథములలో చెప్పిన మాట ఒకటేయని అర్థమగుచున్నది. అంతేకాక
ఇదే మాట మరొక విధముగా ద్వితీయ దైవగ్రంథమయిన ఇంజీలులో
(బైబిలులో) ఇలా కలదు. (యోహాను 1-1,2) "ఆదియందు వాక్యము
ఉండెను. వాక్యము దేవుని వద్దయుండెను. వాక్యము దేవుడై యుండెను.
ఆయన ఆదియందు దేవునివద్దయుండెను. సమస్తమును ఆయన
మూలముగా కలిగెను" అని ఉన్నది. ఇక్కడ చెప్పిన భాషనుబట్టి భగవద్గీతలో,
ఖురాన్లో, బైబిలులో వేరువేరుగా చెప్పియున్నట్లు కనిపించుచున్నా చివరకు
భావము ఒక్కటేయని తెలియుచున్నది. "ఆయన ఆదియందు దేవునివద్ద
యుండెను”. అన్నప్పుడు 'ఆయన' అనగా దేవుని మనస్సనియు, (దేవుని
భావమనియు), ఎవరూ గ్రహించలేకపోయారు. “సమస్తమూ ఆయన
మూలముగా కలిగెను” అని చెప్పారంటే 'దేవునియొక్క మనో సంకల్పము
ద్వారా కలిగెను' అని అర్థము చేసుకోలేక పోయారు. ఈ విషయము
బైబిలులో యోహాన్ సువార్తయందు మొదటి అధ్యాయమందే ఒకటి మరియు
రెండు వాక్యములలోనే ఈ మాటను చెప్పినా ఎవరూ ఈ విషయమును
గ్రహించలేకపోయారు. మూడు గ్రంథములలో ఒకే విషయమును మూడు
రకములుగా కనిపించునట్లు చెప్పియుండుట వలన మనుషులు దానిని
గ్రహించలేకపోయారు. సమస్తము ఆయన సంకల్పము ద్వారానే జరిగినదని
మూడుచోట్ల చెప్పడమైనది. మూడు చోట్ల ఆయన మాటయే సమస్తమునకు
మొదట విత్తనముగా పని చేసినది. దేవుడు సంకల్పించిన వెంటనే ఆయన
సంకల్పమే మనుషుల జన్మలకు కారణమైన "కర్మ”గా తయారయినదని
అర్థమగుచున్నది. మనిషి జన్మకు దేవుని సంకల్పమే కర్మయను విత్తనముగా
తయారగుచున్నది. కావున కర్మ జన్మకంటే ముందు కలదని తెలియుచున్నది.
ఇదే యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయమందు 10వ వచనమున ఇలా
కలదు చూడండి. (యోహాన్ 1-10) “లోకము ఆయన మూలముగా
కలిగెను. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు”. దేవుడు చెప్పినట్లు
దేవుని మాటయే మనుషులకు కర్మయైనదనీ, చెట్టుకు విత్తనమైనదని
తెలియలేక పోయారు. ఇప్పటికయినా చెట్టుముందా విత్తుముందా? అను
ప్రశ్నకు విత్తనమే ముందని తెలిసిందా? ప్రకృతిలోని ప్రతి ప్రశ్నకు
జవాబున్నట్లు ఈ ప్రశ్నకు కూడా జవాబు దొరికిపోయినది.
ప్రశ్న :- చెట్టునుండి తయారయిన విత్తనము చేత తిరిగి క్రొత్త చెట్టు
తయారగుట కన్పించుచున్నది. తండ్రి వీర్యకణము చేతనే మరొక శిశు
జన్మ కల్గుచున్నట్లు తెలియుచున్నది. ఈ కనిపించే విషయములను వదలి
కనిపించని మీ మాటను నమ్ముట చాలామందికి కష్టముగా యుండవచ్చును.
ప్రస్తుతము జరుగుచున్నదే మనుషులు చూస్తారుగానీ, ఎప్పుడో పూర్వము
అన్నిటికంటే ముందు విత్తనమే అని చెప్పినా కనిపించే సత్యమును వదలి,
కనిపించనిది సత్యమో కాదో యన్నట్లుందురు. అటువంటి వారిని
నమ్మించుటకు ఇంకా ఏమయినా వివరముగా చెప్పగలరా?
జవాబు :- ఇంతవరకు వివరముగానే చెప్పాము. ఇంకా వివరముగా
అంటే దానికి హద్దు పద్దూ ఏమీ లేదు. ప్రాణమున్న వానికి ప్రాణము
ఉందో లేదో మేము ఎలా నమ్మాలి? బయటయుండే దానిని, కనిపించే
దానిని నమ్ముదుముగానీ, లోపలయుండే దానిని కనిపించని దానిని మేము
ఎలా నమ్మాలి? అని అడిగితే దానిని నమ్మించుటకు చెప్పేవాడు చచ్చిపోయి
చూపించినా, బ్రతికియుండి చెప్పియుంటే నమ్మేవాడిని చచ్చిపోయిన తర్వాత
నేనెందుకు నమ్మాలి? అను వారికి చెప్పేదానికంటే ఊరకయుండడము
మంచిది. అటువంటి వారికి ఇతరులు ఏమి జవాబు చెప్పలేకున్నా, నీకు
మాత్రము నేను కొంత వరకు జవాబును చెప్పగలను. ఈ మారు నేను
చెప్పు జవాబు నీకు ప్రశ్నార్థకమయిపోయి ఇంకొకమారు ఇటువంటి
ప్రశ్నే అడుగకూడదనిపించును. ఇప్పుడు నేను చెప్పబోవు జవాబును
జాగ్రత్తగా విని ఇంకా ఏమయినా ప్రశ్నవస్తే అడుగవచ్చును.
యోగి :- ఎప్పుడో పూర్వమున్న జవాబును మేము ఎలా నమ్మాలి?
ఇప్పుడున్న దానిని, కనిపించు దానినే మేము నమ్ముతాము అన్నావు కదా!
ఇప్పుడు నీకు కనిపించినదేదో చెప్పగలవా? నీవు ఎవరి కొడుకువో
చెప్పగలవా?
భోగి :- ఇదేమి ప్రశ్న! నేను ఎవరి కొడుకునో నాకు తెలుసు. మిగతా
వారికి కూడా తెలుసు. నా తల్లి తండ్రులు ఎదురుగా కనిపిస్తూయుంటే
నా తల్లి తండ్రులెవరో ఇతరులకు నేను చెప్పకనే తెలియుచూయుంటే
మీరు ఈ ప్రశ్న అడుగడము హాస్యముగా కనిపించుచున్నది. ఈ ప్రశ్నను
వింటూనే ఎవ్వరయినా నవ్వగలరు.
యోగి :- నా ప్రశ్నకు అందరూ నవ్వినా ఫరవాలేదు, నీవు జవాబు
చెప్పగలవా? చెప్పగలిగితే నీ తండ్రి ఎవరో చెప్పగలవా? అట్లే నీ తల్లి
ఎవరో చెప్పగలవా?
భోగి :- ఎదురుగా కనిపించు వెంకయ్యయే నా తండ్రి. అలాగే ఇక్కడే
కనిపించు మంగమ్మయే నా తల్లి. ఇంకేమి సరిపోయినదా? ఇంకా
ఏమయినా చెప్పాలా?
యోగి :- సరిపోలేదు. నీవు ఇంకా చెప్పవలసిన జవాబు మిగిలేయుంది.
వెంకయ్యనే నీ తండ్రియని ఎలా చెప్పగలవు? మంగమ్మనే నీ తల్లియని
ఎలా చెప్పగలవు? వారే నీ తల్లి తండ్రులని చెప్పుటకు నీవద్ద ఆధారము
ఏమయినా కలదా?
భోగి :- ముందునుండి నా చిన్నతనమునుండీ వీరినే తల్లి తండ్రులుగా
పిలుచుచున్నాను. ఈ విషయము అందరికీ తెలుసు. అంతకంటే ఆధారము
ఇంకేమి కావలెను?
యోగి :- నీవు నీ చిన్నతనమునుండీ నీవు తల్లి తండ్రి అనుకొన్న వారే తల్లి
తండ్రి అయితే కృష్ణుడు కూడా చిన్నతనమునుండి యశోధను తల్లిగా,
నందున్ని తండ్రిగా పిలిచాడు. అలా పిలిచినంతమాత్రమున యశోధ,
నందులు కృష్ణుని తల్లి తండ్రి కాలేదు కదా! వారు తల్లి తండ్రి కాదని
తెలిసినది కదా! నీవు నీ తల్లితండ్రియని అనుకొన్న వాళ్ళు కొన్నాళ్ళకు నీ
తల్లి తండ్రి కాదని తెలిసిపోవచ్చును కదా! ఎంతోమంది తల్లి తండ్రులకు
సాకుడు కొడుకులున్నది నీకు తెలుసు కదా! అలాంటప్పుడు వీరే నీ తల్లి
తండ్రియని నీవు చెప్పినా మేము ఎలా నమ్మాలి?
భోగి :- నేను చెప్పే మాటను నమ్మలేకపోతే నా తల్లితండ్రులను ఇతను
మీ కుమారుడేనా? యని అడగండి. వారే మీకు కావలసిన సత్యమును
చెప్పుదురు కదా! అప్పుడయినా మీరు నమ్మవచ్చును కదా!
యోగి :- మీ తల్లి తండ్రి ఇతనే మా కుమారుడని చెప్పినా మేము ఎలా
నమ్మాలి? నిజముగా వారికి నీవు పుట్టావో లేదో, వారు నిన్ను ఇతరులనుండి
తెచ్చుకొని పెంచియుండవచ్చును. ఆ విషయమును బయటికి చెప్పితే
ఇంతవరకూ యున్న తమ కుమారుడు వారిని వదలి పోవునేమోయని
భయముతో వారు కూడా అబద్దమునే చెప్పవచ్చును కదా!
భోగి :- అయితే నీకు తిరుగులేని ఒక సాక్ష్యమును చెప్పెదను. ప్రసవ
సమయములో మా అమ్మది కష్ట కాన్పు అయినందున ఆస్పత్రి ఆపరేషన్
థియేటర్లో జరుగునదంతా వీడియో తీయడము జరిగినది. తర్వాత
ఆమె చనిపోయినా తమ తప్పు ఏదీ లేదని ఇతరులకు తెలియజేయుటకు,
డాక్టర్లు పై ఆఫీసర్కు చూపుటకు వీడియో తీయడము జరిగినది. దేవుని
దయ వలన ప్రసవము ప్రమాదము లేకుండా జరిగినది. నేను పుట్టినప్పుడు
దాదాపు అరగంట వరకు స్పృహలోనికి రాలేదట. అందువలన పుట్టిన
వెంటనే అరవలేదని నన్ను కూడా వీడియో తీశారు. అంతేకాక నా
శరీరములో కడుపు మీద రూపాయి వెడల్పు గల పుట్టుమచ్చను అప్పుడే
చూచి దానిని కూడా వీడియో తీయడము జరిగినది. అప్పుడు అందరూ
చూచిన పుట్టుమచ్చయే నేడు నా కడుపు మీద చూడవచ్చును. పూర్తి
వీడియో దృశ్యము సాక్ష్యముగా యుండుట వలన మీరు అనుమానించుటకు
అవకాశమే లేదు. వీడియో దృశ్యముల వలన వెంకయ్య, మంగమ్మగారే
నా తల్లి తండ్రియని నేను ధైర్యముగా చెప్పుచున్నాను. ఇప్పుడు నా మాటను
కాదనలేరు కదా!
యోగి :- వీడియో దృశ్యమును సాక్ష్యముగా చూపి నీవు నీ తల్లిని
చూపవచ్చును గానీ, నీ తండ్రి ఎవరో ఖచ్చితముగా చెప్పలేవు. ఫలానా
వాడు నీ తండ్రియని చెప్పుటకు సాక్ష్యము ఎవరివద్దా లేదు. అందువలన
ఇప్పుడు కూడా నీ తండ్రి ఎవరు? అని నేను నిన్ను ప్రశ్నించుచున్నాను.
నేను ఎంతో వివరముగా విత్తనమును గురించి, చెట్టును గురించి చెప్పినా,
సంపూర్ణ జవాబున్నా నీవు అదే పనిగా ప్రశ్నించావు. ఇప్పుడు నేను అట్లు
కాకుండా సంపూర్ణమైన జవాబు దొరికినప్పుడు తప్పక నేను ఒప్పుకుంటాను.
తిరిగి అనవసరముగా ప్రశ్నించను. అయితే నీవు సరియైన జవాబు
చెప్పేంతవరకు నేను ప్రశ్నించక తప్పదు. నీ తండ్రిని గురించిన సంపూర్ణ
జవాబు నీవద్ద గలదా?
భోగి :- బిడ్డకు తండ్రి ఎవరు? అను విషయము తల్లికి మాత్రము తెలుసునని
పెద్దలంటుంటారు. నా తండ్రి ఎవరో నా తల్లిని ఇప్పుడే అడిగి తెలుసు
కుంటాను. నా తండ్రి ఎవరయినది నా తల్లి చెప్పు మాటయే ప్రపంచానికి
పూర్తి సాక్ష్యము. అందువలన నీకు సరియైన జవాబును ఇప్పుడే చెప్పగలను.
రెండు నిమిషములలో సత్యము తెలిసిపోవును కదా!
యోగి :- మీ చూపులు, మీ యోచనలు అన్ని తప్పుద్రోవలో నడుస్తున్నప్పుడు
సరియైన జవాబు దొరుకుతుందని చెప్పడము హాస్యాస్పదముగాయుండును.
సరే సత్యమేమిటో చెప్పగలిగితే సంతోషము, చెప్పండి చూద్దాము.
భోగి :- నా విషయములో నా తల్లి అసత్యము చెప్పనవసరము లేదు.
ఉన్న సత్యము ఆమెకే తెలుసు కావున ఆమె నా తండ్రి వెంకయ్యేనని
చెప్పినది. మా అమ్మ కళంకము లేని జీవితమును గడిపినది. ఆమె నా
తల్లియని చెప్పుకొనుటకు నేను గర్వించుచున్నాను. మాఅమ్మ ఉత్తమురాలని
మంచి పేరును తెచ్చుకొన్నది. ఇప్పుడు మా అమ్మ చెప్పినది సత్యమని
వెంకయ్య నా తండ్రియని మా అమ్మవలన తెలుసుకొని చెప్పుచున్నాను.
ఎవరయినా వారి తండ్రిని గురించి ఇతడే మీ నాన్నయని తల్లియే చెప్ప
వలసియుండును. అందువలన అందరికీ తల్లి మాటే ఆధారము. ఇప్పుడు
మీకు సంపూర్ణమైన జవాబు దొరికిందని అనుకుంటాను.
న
యోగి :- వెంకయ్య నీ తండ్రియని నీవు నమ్మవచ్చును. నీ తండ్రిని
గురించిన సత్యము తల్లి తప్ప ఎవరూ చెప్పలేరు అనుమాట సత్యమే!
అయితే నీ తండ్రి ఎవరో ముందే నాకు తెలిసియుండుట వలన నీవు నీ
తండ్రి వెంకయ్య అని చెప్పినా నేను నమ్మనుగాక నమ్మను. ఒకవేళ నీ
మాటను నేను ఒప్పుకొంటే నేను దేవుని మాటను లెక్కచేయని
వానినగుదును.
భోగి :- నీవు విచిత్రముగా మాట్లాడుచున్నావు. తండ్రిని గురించి తల్లి
చెప్పిన సత్యమును అందరూ వినవలసియుండగా, నీవు అదే పనిగా అడ్డముగా
మాట్లాడుచున్నావు. అసలు నీ ఉద్దేశ్యము ఏమిటి? నా తండ్రి ఎవరో నీకు
ముందే తెలుసు అని చెప్పడము ఏమిటి? తండ్రి రహస్యము తల్లికి తప్ప
ఎవరికీ తెలియదన్నప్పుడు మధ్యలో నీకు తెలియడము ఏమిటి?
యోగి :- నీవు కనిపించే వానినే తండ్రియని నమ్ముచున్నావు. ఒక మనిషి
పుట్టితే వానికి బీజదాతయైన వాడే తండ్రియగును. ఇది అందరూ ఒప్పుకొను
సత్యమే. కనిపించే వెంకయ్యనే నీవు తండ్రియని అనుకొంటున్నావు.
వెంకయ్య బీజమునకే నీవు పుట్టావా? అని నిన్ను అడిగితే నీ తల్లి చెప్పిన
దానినిబట్టి వెంకయ్యయే నా తండ్రియని చెప్పుచున్నావు. అయితే
వెంకయ్యకు బీజమే లేనప్పుడు అతడు నీ తండ్రి ఎలా అగును? ఈ
ప్రపంచములో పురుషుడు ఒక్కడే గలడు. అతడే పరమాత్మ లేక అల్లా లేక
ఎహోవాయని ఏ పేరుతో అయినా చెప్పవచ్చును. శరీరము పురుషా
కారములో యున్నంతమాత్రమున వెంకయ్య పురుషుడు కాడు. వెంకయ్య
ప్రకృతితో తయారయిన శరీరముతో యున్నాడు కావున అతన్ని స్త్రీ కిందికే
జమ కట్టాలి.
భోగి :- తండ్రి వీర్యకణముతోనే శిశువు జన్మించుచున్నదని నేడు విజ్ఞానము
(సైన్సు) చెప్పుచుండగా, పురుషులు ఎవరూ కాదు అని చెప్పడమేమిటి?
నేను వెంకయ్య వీర్యకణము వలన పుట్టాను కావున అతన్ని సైన్సు ప్రకారము
తండ్రియని చెప్పుచున్నాను.
యోగి :- ప్రపంచమునకంతటికీ పురుషుడు ఒక్కడే గలడు. అతడే అందరికీ
నిజమైన తండ్రి. బయట కనిపించే మనిషిని తండ్రిగా లెక్కించుకోవడము
పొరపాటగును. ఎవరికయినా తండ్రి పరమాత్మ (అల్లా) లేక ఎహోవాయే
అని చెప్పవచ్చును. ఎవడుగానీ తండ్రి వీర్యకణముతో పుట్టలేదు. అట్లు
చెప్పితే పురుష స్పర్శ లేని స్త్రీలు చాలామంది గర్భము ధరించడములో
జవాబు లేకుండా పోవును. నేడు ఎందరో పరిశోధకుల పరిశోధనలలో
కూడా పురుషుని వీర్యకణము లేకుండానే చాలామందికి సంతతి కల్గుచున్న
దనీ తేల్చి చెప్పారు. పెళ్ళికానివారు, భర్త సంబంధము లేనివారు చాలామంది
గర్భము ధరించి పిల్లలను కనిన చరిత్రలు గతములో గడిచిపోయాయి.
ప్రవక్తయైన ఏసు కూడా కన్యకు పుట్టిన వాడేయని మరువకూడదు.
ప్రపంచములో అందరి పుట్టుకకు నేనే కారణమనీ, నేనే బీజదాతయనీ
చెప్పినమాట భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగమందు మూడు, నాలుగు
శ్లోకములందు ఇదే విషయము గలదు చూడండి.
3వ
మమ యోని ర్మహద్మహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్।
సంభవ స్సర్వ భూతానాం తతో భవతి భారత!
భావము :- “ఈ ప్రకృతి నా యొక్క భార్యకాగా నేను బీజదాతయైన భర్తగా
యున్నాను. మా వలననే సకల జీవరాశులు ఉద్భవించుచున్నవి”.
3వ శ్లో॥
సర్వయోనిషు కౌంతేయ! మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మ మహాద్యోనిః అహం బీజప్రదః పితా||
భావము :- “సర్వ గర్భములయందు జన్మించు సకల జీవరాశులకు తల్లి
ప్రకృతికాగా, తండ్రిని బీజదాతనైన నేనేయని (దేవుడేయని తెలియవలెను"
భగవద్గీతలోని ఈ మాటలను చూచిన తర్వాత అందరికీ తండ్రి
దేవుడేనని చెప్పక తప్పదు. ఈ ఆత్మజ్ఞానము తెలియనివాడు కనిపించే
వారినే తల్లితండ్రులుగా లెక్కించి అసలయిన తల్లి తండ్రులను మరచి
పోయారు. దైవజ్ఞానము తెలిసినవారికే నిజమైన తల్లి తండ్రులను గూర్చి
తెలియును. నీకు దైవజ్ఞానము తెలియని దానివలన కనిపించే తల్లిని
తండ్రిని చెప్పుచున్నావు. వారు నీకు నిజమైన తల్లి తండ్రులు కారని
తెలియదు. నీ తల్లి తండ్రులు ఎవరయినది నాకు తెలుసును కావున నీవు
ఏమి చెప్పినా నేను వినలేదు. ప్రపంచమునకంటే ముందే దేవుడు
ఉన్నాడు, కావున సృష్ఠికి బీజము అయిన దేవుడు ముందు ఉండగా సకల
సృష్ఠి తర్వాత తయారయినది. అందువలన దేవుడు విత్తనముకాగా,
ప్రపంచము మొక్కలాగ (చెట్టులాగ) పుట్టినది. అందువలన చెట్టుకంటే
ముందు విత్తనమేయని చెప్పవచ్చును. ఎన్ని విధముల చూచినా చెట్టుకంటే
విత్తనమే ముందుగా యున్నట్లు తెలియుచున్నది. అందువలన చెట్టుముందా
విత్తుముందా? అను ప్రశ్న కొందరికి కొరకరాని కొయ్యగా యున్నా మాకు
మాత్రము మ్రింగుడుబడే వెన్నగా యుందని చెప్పుచున్నాము. ఇప్పుడు
నీకు విత్తనమైన (బీజమైన) వాడు ఎవడో చూచుకొని వానినే నీవు
ఆశ్రయించినట్లయితే నీ జీవితమునకు సార్థకత ఏర్పడును.
ఇట్లు,
ప్రబోధానంద యోగీశ్వరులు,
అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.