ప్రబోధ తరంగాలు cloud text 22ndSep24 Updated

 


ప్రబోధ తరంగాలు



ముందుగా చెప్పనది.


“ప్ర” అను అక్షరమునకు విశిష్టమైన అర్థమున్నది. పంచ భూతములను పంచ అని పిలుస్తు వాటియందు “ప్ర” ను పెట్టడమైనది. దానితో ప్రపంచమయినది. అట్లే లయమునకు ముందు “ప్ర” ను చేర్చడమైనది దానితో ప్రలయము అయినది. ఇట్లు ఉన్నదానికి విశిష్టతను విశేషతను చేర్చునది “ప్ర” అని తెలియుము. అదే పద్ధతిలో ఇచ్చట బోధకు "ప్ర” ను చేర్చడమయినది. దానితో ప్రబోధ అయినది. ప్రబోధ అనగా విశిష్టమైన బోధ అనియు, అన్ని బోధలకంటే ప్రత్యేకత ప్రాముఖ్యత గల బోధ అనియు తెలియుచున్నది. మేము చెప్పు బోధలో ప్రత్యేక త్రైత సిద్ధాంతము ఉండుట వలననే ప్రబోధ అనిపేరు పెట్టడము జరిగినది. మా బోధలలోని సారాంశమైన కొన్ని వాక్యములను "ప్రబోధ తరంగాలు” అని పేరు పెట్టి వ్రాయడము జరిగినది. వేమన పద్యమందు ఎక్కువ అర్ధమిమిడినట్లు ఈ ప్రబోధ తరంగాలలో కూడ విశేష అర్థముండునని తెలుపుచున్నాము.


భాషా ప్రావీణ్యత లేని ఈ వాక్యములలో భావ ప్రావీణ్యత ఎక్కువగా ఉండును. చాలా పుస్తకములలో పది పేజీలు చదివిన అందులో గుర్తింపదగిన విషయముండదు. చదువుటకు ఇంపుగా ఉండినప్పటికి అందులో గ్రహించవలసిన విషయము లేకపోవుటచే ఎంత చదివిన లాభముండదు. మా పుస్తకములలో అలాకాక ప్రతి పేజీలోను కొంత క్రొత్తవిషయమూ, గుర్తింపదగిన సారాంశముండును. అంతేకాక మేము చెప్పువిషయము ఇంకా సులభముగ అర్థమగునట్లు, ఒక్కొక్క సారాంశమును ఒక్కొక్క వాక్యముగ వ్రాయడము జరిగినది. అలా వ్రాసినదే ఈ “ప్రబోధ తరంగాలు” అను గ్రంథము. ఈ గ్రంథములో ఏడు వందలకు పైగా వాక్యములున్నవి. ప్రతి వాక్యము గొప్ప సందేశమై ఉన్నది.


కొందరి మనస్సులో ఎంతో కాలమునుండి ఉన్న సంశయములకు మరియు ఎన్ని గ్రంథములను చదివినప్పటికి తీరని ప్రశ్నలకు, సూటిగా జవాబు చెప్పినట్లు ఇందులో వాక్యములు గలవు. ప్రతి వాక్యము ఒక క్రొత్త విషయమును తెలుపుచు, కొన్ని ప్రశ్నల సమూహమునకు ఒకే జవాబై ఉన్నది. కొన్ని వాక్యములు ప్రత్యేకించి ఒక్కొక్కటి ఒక గ్రంథ సారాంశము కలిగి ఉన్నవి. అందువలన జ్ఞాన జిజ్ఞాసులకు అధికముగ మేలు చేయునని మేము నమ్ముచున్నాము. మా నుండి చెప్పబడు ప్రతి విషయమునకు శాస్త్రబద్ధత ఉండవలెననునది మా ఉద్దేశ్యము. శాస్త్రబద్దత లేని ఎంత గొప్ప విషయమైన అప్పుడు వినేదానికి బాగుండినప్పటికి తర్వాత జీవితములో ఉపయోగపడదు. బత్తాయి (చీనీ) పండు రసము వెంటనే త్రాగుటకు రుచిగ బాగుండును, కానీ ఒక అరగంట తర్వాత చెడిపోయి రుచి మారిపోయి ఉండును. అప్పటికి బాగున్నా భవిష్యత్తులో బత్తాయి రసము త్రాగుటకుపయోగపడదు. తేనె అలాకాక మొదట ఎలాగున్నదో అలాగే ఉండి, ఎంత కాలమైన రుచి మారనిదై ఎల్లప్పుడు ఉపయోగపడును. ఈ విధముగనే మా బోధలు జీవితములో ఎప్పుడైన ఉపయోగపడునవై ఉండును. విన్నపుడు రుచిగ ఉండి తర్వాత జీవితములో ఉపయోగపడని జ్ఞానవిషయములు కాక, ఎల్లపుడు ఒకే జ్ఞాన సారాంశము కల్గి జీవితములో ఉపయోగపడునవే ఈ ప్రబోధ తరంగములని తెల్పుచున్నాము.

ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.




ప్రబోధ తరంగాలు.

1.చెరుకునుండి రసాన్ని ఆస్వాదించి పిప్పిని వదులునట్లు, గ్రంథములోని భావాన్ని గ్రహించి భాషను వదులు వారు పరిశుద్ధ పాఠకులు.

2.నిరంతర ఆత్మచింతనచే నిన్ను నీవు తెలుసుకోవడమే నిజమైన నీ స్వంతపని.

3.జ్ఞాన మార్గమందు ప్రయాణించాలనుకొనే వారికి అజ్ఞానులే కంటక సమానులై అవరోధములు కల్పించుచుందురు.

4.పిచ్చివానికి రత్నమిచ్చినా దానితో వాడు ప్రయోజనము పొందనట్లు మూర్ఖ చిత్తునకు జ్ఞానోపదేశము చేసినా దానితో వాడు ప్రయోజనము పొందడు.

5.ఆహారపదార్థల వలన శరీరమూ, గుణవిషయాల వలన మనస్సూ జీవించుచుండును.

6.జ్ఞానేంద్రియాలతో కూడి మనస్సు విషయములను జీవునకు తెల్పును. జీవుడు అజ్ఞానవశమున అహంకారముతో కూడి ఆ విషయ సుఖదుఃఖములను అనుభవించును.

7.అల్ప సుఖాలకాశించి జీవుడు అజ్ఞానముతో అనంత కష్టాలెన్నో ఎదుర్కొంటున్నాడు.

8.బాహ్యనేత్రాలకగుపించే చీకటి భానోదయము వలన అంతరించును. మనోనేత్రాలకగుపించే చీకటి జ్ఞానోదయం వలన అంతరించును.

9.దేహశుద్ధికి స్నానమవసరము, దేహి (జీవాత్మ) శుద్ధికి జ్ఞానమవసరము.  

10.ఒక జన్మలో శరీరములోనికి జీవుడు ప్రవేశించడము ఒక పర్యాయమే మరల నిష్క్రమించడము కూడ ఒక పర్యాయమే.

11.జీవ శరీరాలు భూమిమీద జన్మించు విధానం అన్నిటికి ఒకేరకంగా ఉంటుంది. కాని మరణించడము మాత్రము నాల్గు విధములుగా ఉంటుంది.

12.జీవునకు కర్మ అనుభవించడము వలన అయిపోతున్నది, కానీ అహంకారము మరింత కర్మను సంపాదించి పెట్టుచున్నది.

13.అజ్ఞానము వలన అహంకారము, అహంకారము వలన ఆగామికర్మ జీవునకు కలుగుచున్నది.

14.పరిశుద్ధమైన ఔషధాన్ని సేవించిన శరీరరోగము వదలిపోవునట్లు, పరిశుద్ధ జ్ఞానశక్తిని పొందిన జీవున్ని కర్మరోగము వదలిపోతుంది. 

15.ఆరోగ్యమియ్యని ఔషధమూ, ఆత్మజ్ఞానమియ్యని బోధ నిష్ప్రయోజనము.

16.కామ, క్రోధ, లోభ, మోహ, మధ మత్సరములను ఆయుధములచే జీవుడు తన్నుతానే హింసించుకొంటున్నాడు.

17.శరీరమనే గృహమందు అజ్ఞానమనే అంధకారములో ఉన్న జీవుడు జ్ఞానదివ్వెను వెల్గించి చూచుకొంటేనే తన్నుతాను తెలుసుకోగలడు. 

18.అహంకారము తొలగక అజ్ఞానము అంతరించదు. అజ్ఞానము అంతరించక ఆత్మదర్శనము కాదు.

19.పంచభూతములచే నిర్మింపబడిన శరీరములు పంచభూతముల వలనే నశిస్తున్నాయి.

20.అష్ట ఐశ్వర్యాలతో తులతూగేవారిని చూచి నేను అలాలేనని అసూయచెందితే ప్రయోజనమేమి? ముందు జన్మలలో వారు చేసుకొన్న పుణ్యఫలమే వారినాస్థితియందుంచినది.

21.అపారమైన సముద్రములోని జలబిందువువంటిది శరీరములోని జీవాత్మ.

22.బాహ్యపూజలకన్నా భావపూజయే దేవునికి ఇష్టము.

23.ఆహారపదార్థముల ప్రభావము వలన గుణప్రభావములు మారవు. కానీ గుణప్రభావము వలన ఆయా ఆహారముల తినుటకు అభిలాషకల్గును.

24.చేప దాని స్వస్థానమైన నీటియందుంటేనే దానికానందము అలాగే మనస్సు దాని స్వస్థానమైన ఆత్మయందుంటేనే దానికానందము.

25.సంకల్పాల రాహిత్యము చేసుకోవడమే సత్యమైన బ్రహ్మయోగము.

26.ఆడంబర పూజలన్ని అజ్ఞానానికి దోహదం చేస్తాయి. కానీ ఆత్మభావాన్ని అందించలేవు.

27.పాత్ర కడిగి చేసిన పాకమూ, పాత్రలెరిగి చేసిన జ్ఞానదానము పరిశుద్ద ఫలమిచ్చును.

28.నీతి, న్యాయము బాహ్యోన్నతికి, జ్ఞాన, ధర్మము ఆత్మోన్నతికి దోహదము చేస్తాయి.

29.మాయ బయటున్నదని భావించకు. అది నీలోనే ఉన్నది. మాయలోపడుట బయటకాదు నీ తలలోనేయని తెలుసుకో. 

30.అపరిమిత వేగముతో తిరిగే నీ మనస్సును స్వాధీనము చేసుకో ఆత్మయంటే ఏమిటో అర్థమౌతుంది.

31.మతాలు, కులాలు మానవులు నిర్మించుకొన్నవే కాని మహాత్ములు నిర్మించినవి కావు. 

32దేహ భావమే మాయపాశము. దేహి భావమే దివ్యజ్ఞానము.

33.సర్వజీవి సమన్వయమౌ శాస్త్రమును బోధించునతడే జగద్గురువు.

34.గారడిలాంటి విద్యలజూచి జ్ఞానమనుకోవడము, ఎండమావులను చూచి నీరనుకోవడము రెండూ ఒక్కటే. 

35.కర్మచేత గుణములు, గుణములచేత మనస్సు, మనస్సుచేత శరీరము చలించుచుండును. అది తెలియకపోతే అజ్ఞానమే అగును.

36.బాహ్య సంసార వ్యామోహమను మధుపాన మత్తునకు సత్యాన్ని తెలుసుకొనే సత్తా ఎక్కడిది?

37.అడ్డాలు తిరిగే మనస్సును అరికట్టక, గడ్డాలు పెంచి తిరిగినా కర్మ తొలగదు.

38.ఉన్నత జ్ఞానం నీలో ఉత్పన్నము చేసుకొనకనే ఉపదేశము కావాలని ఉబలాటపడకు. ఉపదేశాన్ని భరించే శక్తి నీ హృదయానికున్నప్పుడే ఆ ఉపదేశము సిద్ధిస్తుంది. 

39.జ్ఞానమును తెలిసి మనసును జయించినవాడే మహాత్ముడు, కానీ అజ్ఞానపు మాటలు చెప్పువాడుకాడు.

40.అందాలను చూచి ఆనందించు, అంతే! వాటిననుభవించాలని ఆశించావా ఆ తర్వాత కష్టాలు ఎదురౌతాయి.

41.శరీరాన్ని నాశనముచేసి అందులోగల జీవున్ని వేరు చేయగలరు, కానీ ఏ మానవుడు ఒక శరీరాన్ని తయారుచేసి అందులో జీవాన్ని నింపలేడు.

42.అసలైన ఆత్మజ్ఞానము అవగాహనమయ్యే వరకు విషయాల విషవలయము నుండి జీవున్ని విడిపించడము వీలుకాదు.

43.అదుపులేకుండా నీలో ఆవిర్భవించే ఆలోచన తరంగాలకు ఆనకట్టవేయ్, అప్పుడే అలౌకికమైన ఆత్మభావాన్ని అందుకోగలవు.

44.అశయే ఆత్మావగాహనకు అవరోధముకాని ఆలుబిడ్డలుకాదు.

45.మత వైషమ్యాల మాయలోబడక మహోన్నత భావాన్నిమలచుకో ఆత్మశిఖరాన్నధిరోహించగలవు.

46.సమ్మతినుండి ఉద్భవించినవే అన్నిమతాలు, కానీ మతిని నిల్పునట్టి మతమే మహోన్నతమైనది. 

47.అన్ని మతాలు అచలస్థితివరకే. ఆ పైన అన్ని హరిస్తాయి.  

48.సారవంతమైన భూమిలో వేసిన బీజము, సత్యవంతుని హృదయములో నాటిన జ్ఞానము సత్ఫలితమిచ్చును.

49.అజ్ఞానజనితమైన పశుపక్ష్యాదులు ఆహార, నిద్ర, సంభోగ విషయ కార్యకలాపాలలో జీవిస్తున్నాయి. ఎంతో జ్ఞానమున్న మానవుడు అలాగే చరిస్తే వాటికి మానవునకు తేడా ఏమున్నది?

50.అహమును అణచి, కాయమును కర్తవ్యానికి వదిలినవాడే అసలైన కర్మయోగి.

51.విషయమనే గాలానికి సుఖమనే ఎరను తొడిగి ఆశజూపి, కర్మమనే బుట్టలో చేపయనే జీవున్ని బంధించుచున్నది మాయ అను జాలరి.

52.కర్మమనే తప్పుకు ప్రకృతియనే చెరసాలలో జీవుడు శిక్షను అనుభవిస్తున్నాడు. కర్మరహితమైనపుడు జీవునకు మోక్షమను విడుదల లభించును.

53.ఇరుసును ఆధారము చేసుకొని చక్రము చలించురీతిగా ఆత్మనాధారము చేసుకొని కర్మ గుణచక్రములు చలించుచున్నవి.

54.దేవుడుంటే చూపించమని దెబ్బలాటకు దిగకు. కర్మను వదులు, క్షణాల్లో కనిపిస్తాడు. అపుడు నీవే దేవునివి. 

55.గుణాలను ఆజ్ఞాపిస్తాడు గురుదేవుడు, గుణాల ఆజ్ఞలో చరిస్తాడు ధరజీవుడు.

56.గుణాతీతుడైన దేవున్ని గుర్తించాలంటే, నీవు కూడా గుణాతీతుడవైతేనే సాధ్యపడుతుంది.

57.గుణాల ఊబిలోపడి కూరుకుపోవుచున్న జీవా! ఆత్మజ్ఞానాన్ని అందుకో నిన్ను బయటకు అదే లాగుతుంది. 

58.దేవుని శక్తిచే ప్రభవించిన ప్రకృతి శరీర సహాయముతో బ్రతికి బట్టగడుతున్న జీవా! దేవుడులేడని భావించవద్దు.

59.అందాలన్ని ప్రకృతివే, కానీ పరమాత్మ లేనిదే అవి ప్రకాశింపవు.

60.జ్ఞానదృష్టిచే ప్రకృతిని పరిశోధించు! ప్రకృతిలోనే పరమాత్మ తత్త్వాన్ని పరిగ్రహించగలవు.

61.జన్మరహితమే అద్వైతసిద్ధి. ఆలోచన సహితమే మాయసిద్ది.

62.ఆసనాదుల సాధనము వలన అంగారోగ్యమే కల్గును. ఆత్మైక్యత కల్గదు. అవి ఆరోగ్య అసనాలేకానీ యోగాసనాలు కావు.

63.వికలాంగ జీవుల చూచి విచారిస్తున్నావా? వెనుక జన్మలలో వారెంత ఘోరపాపముచేసారో! ఇప్పుడీ విధంగా శిక్షను అనుభవిస్తున్నారు.

64.వృద్ధాప్యములో దైవాన్ని తెలుసుకొందామని ఊహిస్తున్నావా! చింతల చిక్కులలో చిక్కి చితిగిపోయిన మనస్సునకు ఆత్మావగాహన అతుకదు.

65.మోక్షమను గృహములోనికి ప్రవేశించాలంటే మూడు మెటికలు ఎక్కవలసి వస్తుంది. అవియే 1) భక్తి 2) జ్ఞానము 3) యోగము లేక ప్రారబ్ధ, ఆగామి, సంచిత కర్మలను దాటవలసి వస్తుంది.

66.భక్తి వలన జ్ఞానము, జ్ఞానము వలన యోగము, యోగము వలన తత్త్వము, తత్త్వము వలన ముక్తి సిద్ధిస్తుంది.

67.దైవజ్ఞానమంటే ఏమిటోగాదు. ఆత్మవిషయములను (ధర్మములు) తెలుసుకొనడమే.

68.బాహ్యంగా అగ్నితో చేయు యజ్ఞము కట్టెలను, అంతరంగములో జ్ఞానాగ్నితో చేయు యజ్ఞము కర్మలను కాల్చును.

69.కర్మ లేనిదే కనురెప్ప కూడా కదలదు. అహము లేనిదే ఏ కర్మ రాదు.

70.జీవుని కర్మను కార్యరూపముతో కష్టసుఖాలను అనుభవింప చేయుటకే ప్రకృతి శక్తులు లోపల బయట ప్రబలి ఉన్నాయి.

71.జీవుడు అహంకారముతో చేయు అన్ని పనులకు రెండు విధాల ఫలితాలుంటాయి, అవి 1) స్థూల ఫలము 2) సూక్ష్మ ఫలము.

72.జీవుడు వెనుక జన్మలలో సూక్ష్మ ధనము (కర్మ)ను ఈ జన్మలో స్థూలంగా అనుభవిస్తున్నాడు. ఈ జన్మలోని సూక్ష్మఫలమును తరువాత జన్మలలో అనుభవిస్తుంటాడు.

73.జీవుడు సంపాదించుకొనేది పాపమూ, పుణ్యము. అనుభవించేది దుఃఖము, సుఖము.

74.మంచివైనా, చెడువైనా వాటి ఫలితాలమీద ఆశ వదలి కార్యములు చేస్తే వాటి కర్మ జీవులకంటదు.

75.మనస్సనే పశువును జ్ఞానమను ఖడ్గముచే ఆత్మకు బలిచేయుము అప్పుడే అవ్యయానందమనే వరాన్ని ఆత్మ ప్రసాదిస్తుంది.

76.ఆనందమనే ఆశచూపి అన్ని కష్టాలు పెడుతున్నది మాయ, జీవుల మాయాసమ్మోహితమగ్నులజేసి, పంచభూతములను పరికరములచే పరమాత్మ ఇస్తున్న ఇంద్రజాల ప్రదర్శనమే ఈ జగత్ చర్యలు.

77.కుతంత్రాలతో బుద్ధి, మంతనాలతో మనస్సు, నిర్ణయాలతో చిత్తము, జీవుని కీర్తించడములో అహము ఎడతెరపి లేకుండ ఉన్నవి.

78.ఉపవాసాలూ, వ్రతాలతో వళ్ళు జెడుతుందిగాని, జీవా! అవి నిన్ను ఉద్ధరించలేవు. యోగాలతో ఊహించ రాని స్థితిని అందుకోగలవు.

79.మాయను జయించిన వారే మహనీయులు, కానీ మాయతో కూడుకొన్న మాటలు చెప్పువారు కారు.

80.తపస్సుకు తపనకు కాలవ్యత్యాసమే తేడా, తపస్సు పెద్దకోరిక, తపన చిన్న కోరిక.

81.తపనలు, తపస్సులు వదిలినపుడే తత్త్వం గోచరిస్తుంది.

82.మనసును ఒకే విషయముపై నిలిపే అలవాటు చేస్తే తర్వాత అది ఆ విషయమునుండి మరలి వచ్చుట మహా కష్టమగును.

83.మనస్సు అనే చెట్టుకు విషయములను వేర్లు ఆధారము. వేర్లు తెగితే చెట్టు కూలిపోయినట్లు విషయములు ఖండించితే మనస్సు కూలిపోతుంది.

84.ఒక కోర్కె తీర్చుకొనేటప్పటికి పది కోర్కెలు నీలో ఆవిర్భవిస్తుంటే ఇంక కోర్కెలు తరిగేదెప్పుడు?

85.అజ్ఞాన జీవులకు ఆయుస్సు అయిపోతుంటే, ఆశలు పెరుగుతూ పోతున్నాయి.

86.బాహ్య సంసారాన్ని వర్ణించినవాని కంటే లోపల సాంగత్యాన్ని వర్ణించినవాడే సత్యమైన సన్న్యాసి.

87.ఎప్పుడు జ్ఞానం తెలుసుకోవాలని సంకల్పం కల్గుతుందో, ఆ క్షణములోనే ప్రయత్నించు. ఎందుకంటే మనస్సు చంచలమైనది. జీవితం అస్థిరమైనది.

88.సంకల్పాలులేని జ్ఞప్తియే నీకు దేవునికి మధ్యలోగల ఆత్మను గ్రహిస్తుంది.

89.నిన్ను నీవు తెలుసుకోగలిగినంత మాత్రమున నీ బయటనున్న పరబ్రహ్మాన్ని తెలుసుకోలేవు. కర్మ అయిపోయి నీ శరీరము వదలిన తర్వాతే పరబ్రహ్మ తెలియును.

90.విషయములనే విష వృక్షాలతో నిండిన అజ్ఞానారణ్యములో అలమటిస్తున్న జీవా! అందుకో ఆధ్యాత్మికాయుధాన్ని అడుగంటా కూల్చివేయి ఆ అరణ్యాన్ని, అప్పుడే అఖండ పరబ్రహ్మమనే బయలులో సేద తీర్చుకొంటావు.

91.నీచవాంఛలకు నీమదిలో తావీయకు అవి నిన్ను ఆత్మజ్ఞానానికి అతిదూరం చేస్తాయి.

92.సౌఖ్యాలు కల్గించే కర్మలు తన ప్రమేయమని, బాధలు కలిగించే కర్మలు దైవప్రమేయమని భావించుట అజ్ఞానమగును.

93.నీ దేహములో సర్వాంగాలు నావి అంటున్నావు నావి అంటున్న నీవెవ్వరో తెలుసుకోలేకున్నావు.

94.కలిమి కల్గినపుడు కానరాడు దేవుడు, లేమి కలిగినపుడు మాత్రమే జ్ఞాపకానికి వస్తాడు.

95.జగమంతా నిండిన జగన్నాథుడే భగమునుండి ఉద్భవించి భగవంతుడైనాడు. అతడే రాయబారి, అవధూత.

96.భక్తుల హృదయాల్లోని ఆత్మచిహ్నమే బండరాతి గుళ్ళల్లోని ప్రతిమ ఆకారము. 

97.అష్టసిద్ధులను అభిలషించేవారు అచలసిద్ధిని అందుకొనజాలరు.

98.మతిభ్రష్టులను చూచి అవధూతలనుకొనేవారే నిజమైన మతిభ్రష్టులు.

99.నదీ ప్రవాహం దాటుటకు పటిష్టమైన పడవ ఎంత అవసరమో సంసారమనే నదిని దాటుటకు శుద్ధమైన జ్ఞాననౌక అవసరము.

100.జ్ఞానమను కలపతో నిర్మింపబడిన పడవలో జీవుని చేర్చి, సంసారమను సాగరమును దాటించి, మోక్షమను తీరమును చేర్చగల నావికుడే సద్గురువు.

101.విషయ చింతనమనే విషజాడ్యము నుండి జీవున్ని విముక్తి కల్గించు శక్తి ఒకే ఒక ఔషధానికుంది ఆ ఔషధమే సద్గురు ప్రబోధామృతము. 

102.ఆశా భూతగ్రస్తమై ఆత్మశాంతి లేక అలమటిస్తున్న జీవా! అది వదలాలంటే గురుప్రబోధన మంత్రమే శరణ్యము.

103.సంశయ రహితమే సంపూర్ణ జ్ఞానము. 

104.ఇటు ప్రకృతి, అటు ఆత్మ రెండింటియందు సంబంధములేని జీవాత్మ పరమాత్మగ మారిపోగలడు.

105.శరీరమను ప్రమిదలో కర్మయను తైలము వేసి అందులో వత్తియను ఎరుకనుంచి జ్ఞానమను జ్యోతిని వెల్గించి ఆ వెలుగులో ఆత్మను దర్శించుటయే అసలైన దీపారాధనార్థము.

106.జీవుడు కర్మను అనుభవించుటకు కాలమే ఆధారము.

107.అన్ని సమస్యలు కాలమే పరిష్కరిస్తుంది. ఆ కాలం వచ్చేవరకు జీవులు వేచి ఉండాల్సిందే.

108.స్త్రీల యవ్వన సౌందర్యానికి చిత్తచాంచల్యము బొందెడి జీవులు ఆ శరీరాలలోని చైతన్యశక్తియే ఆ సౌందర్యమని అర్థం చేసుకొనలేకున్నారు.

109.అనిత్యమైన శరీరాలను ప్రేమించి ఆనందిస్తున్న జీవులు అవి నశించినప్పుడు ఆవేదన పొందుతారు. ఆ శరీరాలకు ఆధారమైన ఆత్మ నిత్యమైనది. దాన్ని గుర్తించితే అసలు దుఃఖమే లేదుగదా!

110.సూర్యున్ని మేఘము గప్పినట్లు జ్ఞానాన్ని కామము కప్పియున్నది. వాయు తరంగాల ధాటికి మేఘము చెదిరిపోయినప్పుడు సూర్యప్రకాశము గోచరించినట్లు, ప్రబోధ తరంగాల తాకిడికి కామము చెదిరిపోయినప్పుడే జ్ఞానం ప్రకాశిస్తుంది.

111.నీలో జ్ఞానము నీకు తెలిపేనిమిత్తమే గురువు నిన్ను పరీక్షిస్తాడు.

112.కాలము తీరినప్పుడు కాయము. కర్మదీరినప్పుడు జీవము కడతేరుచుండును.

113.పాదరక్షలు ధరించినవారు కంటకావృతమైన మార్గములో నిర్భయంగా ఎలా నడువగలరో, తద్విధముగా జ్ఞానరక్షలు ధరించినవారు సంకటావృతమైన సంసారమార్గమున ధైర్యంగా సాగిపోగలరు.

114.జ్ఞానమను కవచాన్ని ధరించిన జీవునకు అరిషడ్ వర్గములు వేయు విషయములనే విషబాణములు తగిలినప్పటికి అవి ఏమి చేయజాలవు.  

115.విషయచింతనము వీడి పరమార్థ చింతనము పట్టుబడిన నాడే మానవుడు స్వచ్ఛమైన జీవితము గడుపగలడు.

116.నిన్ను నీవు తెలుసుకొంటే నీలోని అహమేమిటో తెలియును.

117.మంచిని ఆలోచించినా, చెడును ఆలోచించినా ఏది జరగాలో అదే జరిగితీరుతుంది.

118.భోగాలన్నీ అనుభవించిన తరువాత యోగసిద్ధి పొందవచ్చునని యోచించకు, అప్పుడు రోగసిద్ధి కలుగవచ్చును.

119.ప్రతి జీవికి భక్తి ఉంటుంది. అది ప్రకృతి భక్తి కాకుండ పరమాత్మ భక్తి అయితేనే మంచిది.

120.కామ్యార్థపూజలకు కారణము దేవాలయాలు కాదు. ఆత్మార్థమరయుటకే ఆర్యులు దేవాలయములు నిర్మించారు.

121.సుజ్ఞానము లేని నరుని బ్రతుకు, సుగంధము లేని పుష్పము యొక్క అందము ప్రయోజనము లేదు.

122.తలలోని తలపులు దైవానికర్పిస్తే తరిస్తారు కాని తలకురులర్పిస్తే తరిస్తారా?

123.కర్పూరం అగ్నిచే కాలి నిశ్శేషమైన తరువాత కర్పూరముమరియు అగ్ని లేకుండా శూన్యములో ఎట్లులయింప బడునో, అట్లే జ్ఞానమను అగ్నిచే కాల్చబడుతున్న కర్మ నిశ్శేషమైన తరువాత కాలుచున్న కర్మ మరియు కాల్చుచున్న జ్ఞానము రెండుపరమాత్మలో లయించిపోవుచున్నవి.

124.ఆత్మస్థితినందుకొనువరకు అనుక్షణము ఆరాటపడుము అదే నీ జీవిత లక్ష్యము.

125.విభిన్న రూపాలుగల ప్రకృతి యొక్క పంచభాగాలలో ఏకత్వంగా ఇమిడి ఉన్న పరమాత్మను ఆకళింపుచేసుకో, అప్పుడే నీ అంతరంగములోనున్న అజ్ఞానము నీకందనంత దూరంగా పారిపోతుంది.

126.నీ శరీరము స్త్రీ, అందులోవున్న నీవు పురుషుడవు, మీఇరువురి కలయిక వలన నీ శరీరము చైతన్యవంత మౌతున్నది.

127.అనుభవము లేని ఆత్మబోధ, ఆకర్షణలేని అందములాంటిది.

128.నరక, స్వర్గలోకాలన్నీ నరలోకములోనే ఉన్నాయి. ఏస్థలములో జీవుడు కష్టమనుభవిస్తున్నాడో ఆ ప్రదేశమే వానిపాలిట నరకలోకము. ఏస్థలములో జీవుడు సౌఖ్యమనుభవిస్తున్నాడో ఆ స్థలమే వానిపాలిట స్వర్గధామము.

129.కర్మవర్జితుడే అసలైన స్వతంత్రుడు.

130.ఆత్మజ్ఞానానికి ఉపయోగించని ఐశ్వర్యం, అంగబలం, ఆయుస్సు ఊరులో గాచిన వెన్నెలవలె వ్యర్థమైనవగును.

131.మొదట అమృతంలావుండి చివర విషంగా పరిణమించేవే ప్రపంచ విషయాలు. మొదట విషంలావుండి, చివర అమృతంలాగ ఉండేవి జ్ఞానవిషయాలు.

132.సూర్యోదయం కూడ పోగొట్టజాలని చీకటి ఒకటుంది అదే అజ్ఞానము. అది జ్ఞానోదయముతోనే పోవును.

133.జ్ఞానం తెలియని సాధన దారి తెలియని నడకవంటిది.

134.భార్యా మోహమనే సంకెళ్లు తగిలించి, పుత్రవ్యామోహమను చీలలుబిగించి, ప్రకృతియనే చెరసాలలో జీవున్ని బంధించి కర్మయను శిక్షను అనుభవింపజేస్తున్నది మాయ.

135.మనస్సు ఎక్కడుందో తెలుసా? అది నీవలె శరీరములో ఒక చోట లేదు. మెలుకువలో శరీరమంతా వ్యాపించి యున్నది.

136.కర్మల ఆధారముగ చేయించేది ఆత్మ, చేసేది కాయము, అనుభవించేది జీవుడు. 

137.ప్రపంచములోని ప్రతిమనిషి సుఖం కలుగుతుందను ఆశతోనే కష్టాల పూజలు చేస్తున్నాడు.

138.మాయ అనే అద్దంలో ప్రతిబింభిస్తున్న జీవాత్మల యొక్క చావు పుట్టుకల స్వరూపమే ఈ జగత్తు.

139.బలమైన ప్రకృతి శక్తులను తన వశం చేసుకొని పరవశించాలని పరవళ్లు ద్రొక్కుతున్న మానవుడు చివరకు ప్రకృతి శక్తులచేతనే భంగపడక తప్పదు.

140.దేని ఆధారముతో అన్ని నావనుకొంటున్నావో ఆ జ్ఞప్తిని అరక్షణములో అంతము చేయగల అజ్ఞాతశక్తి ఒకటుంది. అదే నీ మృత్యువు.

141.నేను అనుకొంటే నీవు నీవుగానే ఉంటావు. నేను అనుకుంటే నీవు అంతటా ఉంటావు అంటాడు పరమాత్మ.

142.అజ్ఞానులు సంసారం కోసమై కర్మ చేస్తారు. జ్ఞానులు కర్మకోసమై సంసారము చేస్తారు.

143.జన్మ జన్మకూ తనువు వేరు. తనువు తనువుకూ కర్మ వేరు. కర్మ కర్మకూ మనసు వేరు. మనసు మనస్సుకు బుద్ది వేరు.

144.జ్ఞానం, అజ్ఞానం రెండూ, నీలోనే ఉన్నాయి. కాని అజ్ఞానపు సంచిలో జ్ఞానం మూట గట్టబడి ఉంది.

145.దైవ సేవకై మనముండవలెను. కానీ మన ప్రయోజనముకై దైవముండకూడదు.

146.ఫలమాశించే కార్యము బంధము కలిగిస్తుంది. ఫలమాశించని కార్యము ముక్తిని కలిగిస్తుంది.

147.తల్లిగర్భము నుండి తనువు, బ్రహ్మగర్భము నుండి ప్రకృతి ఉద్భవించినది.

148.ప్రకృతి సంబంధమైన ప్రతి శరీరములందు, పరమాత్మ సంబంధమైన పురుషులిద్దరుంటారు. వారే క్షరాక్షరులు.

149.పురుష సంయోగ ఫలము దేహకారణము. పాప పుణ్య సంయోగ ఫలము జీవకారణము.

150.నీవు నీ కర్మమనుభవించుటకై నీ శరీరము పుట్టింది కాని నీ శరీరం కర్మ అనుభవించుటకై నీవు పుట్టలేదు.

151.కర్మంటే ఏమిటో తెలుసుకొంటే కర్మనుండి విముక్తుడవు కాగలవు. మనస్సంటే ఏమిటో తెలుసుకొంటే మనస్సును జయించగలవు. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకొంటే ఆత్మను చేరగలవు.

152.అన్ని పనులు నీ ఇష్టప్రకారము జరుగుతున్నాయనుకొంటున్నావు. నిజమేకానీ నీ ఇష్టం కర్మ ప్రకారం కలుగుతున్నది.

153.ఆత్మజ్ఞానం కలుగకపోవడమే జీవులకు అసలైన శిక్ష

154.ఆత్మజ్ఞానమే కర్మలను సమిధల కాల్చు అగ్ని, ఆత్మజ్ఞానమే కర్మ జాడ్యాన్ని తీర్చు అమోఘ ఔషధము, ఆత్మజ్ఞానమే కర్మ మాలిన్యాన్ని కడుగు పరిశుద్ధజలము.

155.మధురమైన విషఫలాల వంటివి విషయసుఖాలు, అవి అనుభవించేటప్పుడు అతి మధురంగా ఉన్నా ఆ తరువాత అతి దారుణ ఫలితాలు కలిగిస్తాయి.

156.పుణ్యం కొరకు దానం చేస్తే సుఖం కొరకు జన్మ వస్తుంది.

157.నీవు చేయు దానం, యజ్ఞము, వేదపఠనము, తపస్సు అను నాలుగు విధానములవలన దేవున్ని తెలియుటకు సాధ్యముకాదని భగవద్గీతలో భగవంతుడు, మరియు పరమాత్మ తెలిపాడు. 

158.ఇంద్రియాగోచరున్ని ఇంద్రియాతీతునివై గుర్తించాలి.

159.జ్ఞానము తెలిసేకొద్ది మనలో ఉన్న అజ్ఞానమెంతటిదో తెలియును.

160.మనిషికి గృహములాంటిదే జీవునికి శరీరము.

161.పిందె కాయగ, పండుగ మార్పు చెందినట్లు నీశరీరము కూడా యవ్వన, కౌమార, వృద్ధాప్యములలో మార్పు చెందుచున్నది.

162.చెట్టుఆకు రంగు మారిపోయినట్లు నీ శరీరము కూడా వృద్దాప్యములో రంగు మారిపోతుంది.

163.నీవు జాగ్రత్త, స్వప్న, నిద్రయను మూడవస్థలలో ఖైదీగా ఉన్నావు.

164.నీవు స్థూల, సూక్ష్మ, కారణమనెడి మూడు వస్త్రముల మధ్య చుట్టబడి ఉన్నావు.

165.ఆత్మ యోగసాధనకుతప్ప మిగతా వ్రత క్రతువులకు, తపస్సులకు, వేదపారాయణకు మరి ఏ ఇతర ఆచరణకు తెలియదు.

166.ఆత్మను తెలుసుకొన్నంత మాత్రముననే ముక్తిలేదు. కర్మనాశనము అయినపుడే ముక్తి.

167.అహమొక్కటియే కర్మ రహితమునకు, కర్మ సహితమునకు కారణము.

168.మనసొక్కటియే గుణ రహితమునకు, గుణ సహితమునకు కారణము.

169.భగవంతుడు సాకారుడు, పరమాత్మ నిరాకారుడు.

170.ప్రతికార్యము గుణము వలన, ప్రతి గుణము కర్మ వలన, ప్రతికర్మ కార్యము వలన కల్గుచున్నది. అందువలన జీవుడు చావు పుట్టుకలను చక్రమందు తిరుగుచున్నాడు.

171.జ్ఞానేంద్రియ విషయాల జ్ఞప్తియే నీలోని మనస్సు.

172.శరీరములోనికి జీవుడు ఎట్లు వచ్చునది తెలియని వారికి శరీరములోనుండి జీవము ఎట్లు పోవునది కూడా తెలియదు.

173.శరీరములో ఉన్నంత కాలము ఎంతటి యోగికాని పరమాత్మను తెలియలేడు.

174.ప్రకృతి కార్యములు స్వధర్మమనుకోకు, ఆత్మ కార్యములే స్వధర్మమని తెలుసుకో.

175.పాపములలో క్షమించబడు పాపము, క్షమించరాని పాపము అని రెండు విధములు గలవు.

176.లింగమొక్కటే అయినా అది మూడు విధములు. అంగమొక్కటే అయినా అది ఐదు విధములు.

177.తండ్రి శరీరానికి పుట్టేవారు పుత్రులు. గురువు జ్ఞానముతో తయారగువారు జ్ఞానపుత్రులు.

178.అయిన పనులకు నేను, కాని పనులకు కర్మయనకు. అన్నిటికి కర్మే కారణము.

179.ధర్మార్థ కామ మోక్షములనుట అసత్యము. కామార్థ ధర్మమోక్షములనుట సత్యము. ధర్మము వలన డబ్బు కామము వలన మోక్షము వచ్చుట అసత్యము. 

180.ధర్మము వలన మోక్షము, కామము వలన ధనము లభ్యమగును.

181.నీ శరీరములో ప్రతి కదలిక ఆత్మదైనా అది కర్మననుసరించియే ఉండును.

182.ఆత్మ బయట లేదు. శరీరములందు ఉన్నదని గ్రహించు.

183.మరణములో ఆత్మ, జీవాత్మలు పోయిన శరీరములో మిగిలియున్నది పరమాత్మ ఒక్కటియేనని గ్రహించు.

184.“ధనమూల మిదమ్ జగత్" అంటారు. ఆ ధనమునకు కూడ కారణము కర్మే కావున "కర్మమూల మిదమ్ జగత్" అను మాట సత్యమైనది మరియు సరియైనది.

185.బిడ్డకు తండ్రి ఎవరో తల్లికి తెలిసినట్లు, జీవునకు దేవుడెవడో గురువుకు మాత్రము తెలియును.

186.ఆహారము వలన శరీరారోగ్యము, విషయాహారము వలన మనో ఆరోగ్యము ఉండును.

187.ఆహారము గుణములకు కారణముగాదు. గుణములే ఆహారమునకు కారణమని తెలుసుకో.

188.అజ్ఞానముచేత లోకాలెక్కడో ఉన్నాయనుకోకు. అన్ని లోకాలు నీ తలలోనే ఉన్నాయి.

189.పుట్టను చూచినంత మాత్రముననే పుట్టలోని పామును గుర్తించలేరు. అట్లే శరీరమును చూచినంత మాత్రముననే శరీరములోని జీవాత్మను గుర్తించలేరు.

190.ప్రమిదలో చమురు అయిపోతూనే దివ్వె ఆరిపోయినట్లు శరీరములో కర్మ అయిపోతూనే జీవాత్మ అంతరించిపోవును.

191.జీవునకు సంకల్ప వికల్పములు కలిగించి, వాటి యోచనల ప్రకారం పనులజేయించి, అప్పటికప్పుడు సుఖదుఃఖ భావాలకు గురిచేస్తున్నదే ప్రారబ్ధకర్మము.

192.నీవెంత తాపత్రయపడినా నీ కర్మమునకు మించిన ఫలము కలుగబోదు.

193.జీవుల కర్మ తీరాలంటే రెండే రెండు మార్గాలు కలవు. అనుభవించడమో లేక జ్ఞానాగ్నికి ఆహుతి చేయడమో.

194.నీకంటే వేరుగానున్న ప్రకృతియే నీ శరీరము.

195.నీకంటే వేరుగానున్న ప్రకృతిని (శరీరమును) నీవుగా భావిస్తున్నంతవరకు నీలోని అజ్ఞానం అంతరించదు.

196.కర్మ తీరకపోతే కాయమే నీవు, కర్మ తీరిపోతే కాలమే నీవు.

197.రాత్రి గూటిలో నిద్రించి పగలు మేతకై విహరించే పక్షిలాంటిది మనస్సు. సుషుప్తిలో ఆత్మ అనే గూటిలో నిద్రించి ఎరుకరాగానే విషయాలకై విహరిస్తుంటుంది. 

198.నీకు ఆత్మయే మిత్రుడు, కానీ అజ్ఞానముతో శత్రువుగా మార్చుకొన్నావు. నీకు ప్రకృతియే శత్రువు, కానీ అజ్ఞానముతో మిత్రునిగా భావిస్తున్నావు.

199.ఆకలి లేనివానికి అన్నముబెట్టుట, అయిష్టునకు ఆత్మజ్ఞానము చెప్పుట ప్రయోజనములేని పనియగును.

200.విషయాలకు నీవు దూరమైతే విశ్వేశ్వరుడు నీకు దగ్గరౌతాడు. 

201.అహంకారముతో ఆత్మనారాధించకు. అహంకారం వదిలివేసి ఆత్మను ఆరాధిస్తే పరమాత్మను చేర్చగలదు.

202.నీ శరీరం చేసే పనులకూ, నీకూ, సంబంధము కల్గిస్తున్నదేదో తెలుసుకో! అదే అహంకారము.

203.అన్నింటితోనూ సంబంధము పెట్టుకో, కానీ అహంకారముతో మాత్రం వద్దు. 

204.గుణాలు ఒక్కొక్కటి ఏనుగంత బలమైనవే కానీ జ్ఞానమనే అంకుశానికి గజగజలాడుతాయి.

205.నీ శరీరములోనుండి నీకు కనిపించకున్న ప్రకృతికి (గుణములు) శరీరం బయట నీకు కనిపిస్తున్న ప్రకృతికి అవినాభావ సంబంధమున్నది. వాటి సంఘర్షణ ఫలితమే నిన్ను సతమతపరుస్తున్నాయి.

206.ద్రవ్యయజ్ఞానికై పెట్టుబడి కర్మను సంపాదించుకొంటున్నావు. కర్మయజ్ఞానికై జ్ఞానం సంపాదించుకో కడతేరుతావు.

207.అన్ని జీవులు పాలాక్షులే, కానీ కొన్ని జీవులకు మాత్రమే ఆ కంటికి చూపుంటుంది. 

208.గుణాలు నీతలలోనూ, గుణాల పనులు నీకళ్ళముందున్నాయి గుర్తుంచుకో. 

209.అహంకారము నీకు కర్మను కలిగిస్తే ఆ కర్మ సుఖదుఃఖములను కలిగిస్తుంది. గురుసేవ నీకు జ్ఞానమును కలిగిస్తే, ఆ జ్ఞానము నీ కర్మను తొలగిస్తుంది.

210.కర్మ ఎలా కలుగుతుందో తెలుసుకో, ఎలా తొలుగుతుందో సులభముగ తెలుస్తుంది.

211.ఆశలు నీజ్ఞప్తిని అలలుగొట్టించి చలింపజేస్తున్నాయి.

212.జరిగే భవిష్యత్తును గురించి తెలుసుకొనడమువలన నీకు ఒరిగేదేమీ లేదు. జరిగేది నీవు తెలుసుకొన్నా తెలుసుకోకున్నా జరిగి తీరుతుంది.

213.నీకు అపజయం కలిగే శకునాన్ని విజయం చేకూర్చే వరకు ఆహ్వానించు.

214.శరీరం చలిస్తున్నా మనస్సు చలింపకుండా జేయువాడే మహాత్ముడు. శరీరం చలింపకుండా మనస్సును చలింపజేయువాడు మందాత్ముడు.

215.గుణములను విషకోరలుగల మాయయను సర్పము నిన్ను కాటు వేయుచున్నది. ఆ విషయమునకు సరియైన మందు ఆత్మ జ్ఞానమేనని తెలుసుకో.

216.కామరహితమైన దృక్కులచే ప్రకృతిని వీక్షిస్తే అది నీచేత శోధింపబడుతుంది. కామసహితమైన దృక్కులచే ప్రకృతిని వీక్షిస్తే అదే నిన్ను బాధింపజేస్తుంది.

217.ఆశ నీకు తెలియకుండా నీలోని తృప్తిని బలి తీసుకొంటున్న మహాశక్తి.

218.ఆశను తృప్తి పెట్టాలని ఆశించడములోనే నీ ఆయుస్సు హరించిపోతున్నది. కానీ అది మాత్రం తృప్తి పొందడము లేదు.

219.ఆశ తమకాన్ని తీర్చాలంటే ఆత్మోఫలభ్యంతోనే సాధ్యమౌతుంది కానీ మరిదేనితోడను సాధ్యం కాదు.

220.అవకాశం ఉంటే ఆకాశము కన్నా పెద్దదౌతుంది ఆశ. 

221.కోరేది ఈ జన్మలో! తీరేది మరు జన్మలో!

222.మాయకు మనస్సుకు మధ్య పోరాటము పెట్టి మనసుచేత మాయను జయింపజేయుట మానవుడు చేయవలసిన  యోగసాధన.

223.మనిషి యొక్క జీవన ప్రయాణములో రెండు మార్గములు గలవు. అందులో ఒకటి (ప్రకృతిమార్గము) మాయమార్గము, రెండవది దైవమార్గము (పరమాత్మమార్గము).

224.ఒక కథలో గల మంచి చెడులలో మంచిని గ్రహించు, చెడును విసర్జించు.

225.ఒక మనిషిలో గల జ్ఞాన అజ్ఞానములలో జ్ఞానమును గ్రహించు అజ్ఞానమును విసర్జించు.

226.మనిషి చెప్పు మాటలలో అన్నీ నిజమని నమ్మకు, దేవుడు చెప్పిన మాటలలో అన్నీ నిజమేనని తెలుసుకో!

227.భూమిమీద మిత్రులు శత్రువులున్నట్లు, శరీరమునందు జీవునకు మిత్రులను గుణములు, శత్రువులను గుణములు రెండురకములు గలవు.

228.పులుపుకు ఉప్పు, చేదుకు తీపి ఎట్లు వ్యతిరిక్తముగ ఉన్నవో అట్లే శరీరములో కామమునకు దానము, కోపమునకు దయ, లోభమునకు ఔధార్యము, మోహమునకు వైరాగ్యము, మదమునకు వినయము, మత్సరమునకు ప్రేమ అనునవి వ్యతిరిక్తము.

229.ఉప్పు నీటిలోకరిగి తెలియకుండా ఉండినట్లు, మాయ శరీరములో ఇమిడి ఉన్నది.

230.ఆదేశము అధికారముతో కూడుకొన్నట్లు ఉపదేశము అనధికారముతో కూడుకొన్నదై ఉన్నది.

231.దృష్టికి దేశము ప్రదేశము కనిపించునట్లు, జ్ఞానదృష్టికి ఉపదేశము అప్రదేశము తెలియును.

232.కంటికి దృష్టి గలదు, అట్లే బుద్ధికి జ్ఞానదృష్టి గలదు. 

233.రోగానికి ఔషధము, మాయరోగానికి దివ్య ఔషధము అవసరము.

234.ఔషదము వస్తువులతో కూడుకొన్నది కాగా, దివ్యఔషదము జ్ఞానముతో కూడుకొన్నది.

235.రోగము శరీరమునకు, బాధ జీవునకు, మూలుగుడు ఆత్మకు, తటస్థత పరమాత్మకు గలదు.

236.పెద్దదైన ఏనుగు శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఉన్నట్లే చిన్నదైన చీమలో కూడ జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గలవని తెలియువాడే నిజమైన జ్ఞాని.

237.నిమ్మకు నీరెక్కినట్లు కొమ్మకు పామెక్కలేదు. అలాగే మనిషికి అజ్ఞానమెక్కినట్లు జ్ఞానమెక్కలేదు.

238.వానకు మాత్రము వానపాము బయటికొచ్చును. నీటికి మాత్రము కప్పలు బయటికొచ్చును. జ్ఞానమునకు మాత్రము జిజ్ఞాసులు బయటకొస్తారు.

239.నేత్రమునకు దృశ్యమున్నట్లు జ్ఞాననేత్రమునకు జ్ఞానమే దృశ్యమగును.

240.భూమిమీద గురువులలో మాయ తిష్టవేసి ఉన్నది జాగ్రత్త!

241.భగవంతుడు చెప్పినది దేవుని జ్ఞానము. మనుషులు చెప్పినది దైవజ్ఞానము కాదు. 

242.మాయ భగవంతునివలె జగతిలో ప్రకటితమగుచున్నది.

243.దేవుడు మాయవలె జగతిలో ప్రకటితమగుచున్నాడు.

244.జగతిలో మాయ దేవునివలె, దేవుడు మాయవలె కనిపించుట సహజము.

245.జగతిలో మాయ ఏదో, దేవుడెవరో తెలియాలంటే గొప్ప జ్ఞానమవసరము.

246.భగవంతుడు మాయవలె కనిపించినా, చివరకు దైవజ్ఞానమునే బోధించును. మాయ దేవునివలె కనిపించినా, చివరకు దేవుని మార్గమును విడుచునట్లు తనమార్గమును అనుసరించునట్లు బోధించును.

247.దేవుడు మతాలను కులాలను సృష్ఠించలేదు.

248.మాయను, మనుషులను సృష్ఠించినది దేవుడొక్కడే.

249.మతాలను బట్టి అనేక విధానములుగా, అనేక పేర్లుగా, వేరువేరుగా పిలువబడు వాడు ఒక దేవుడే.

250.సర్వజగత్తుకు అధిపతిగా, సర్వ ప్రపంచమునకు సృష్టికర్తగా, విశ్వమంతటికి మూలకర్తగా ఉన్నది ఒకేదేవుడు.

251.దేవునికి పేరుగాని ఆకారముగాని ఉండదు.

252.దేవుడు తనవిషయమును తానే చెప్పవలెను, ఇతరులకు తన విషయము తెలియదు.

253.దేవుడు తన విషయమును తెల్పుటకు భూమిమీదకు వచ్చినపుడు భగవంతుడనబడును. భగవంతునికి పేరు ఆకారము ఉండును.

254.మూఢనమ్మకము, మూఢజ్ఞానము రెండు ఒకజాతికి చెందినవే.

255.మనిషికి ఆరోగ్యములాంటిది నమ్మకము, కాని మనిషికి రోగములాంటిది మూఢనమ్మకము. 

256.నీతల్లీ తండ్రీ నమ్మకమే, కానీ నీమతమూ నీకులమూ మూఢనమ్మకము.

257.శాస్త్రము నమ్మకము, పురాణము మూఢనమ్మకము.

258.శాస్త్రబద్ధమైన నమ్మకము ఎప్పటికీ వమ్ము కాదు. హేతుబద్ధము కాని మూఢనమ్మకము ఎప్పటికీ సత్యము కాదు.

259.దేవున్ని ఆరాధించడము నమ్మకము కానీ, చిల్లర దేవుళ్ళను ఆరాధించడము మూఢనమ్మకమగును.

260.నమ్మకములుండవచ్చును, ఉండకపోవచ్చును. కానీ మూఢనమ్మకములు ఏమాత్రముండకూడదు.

261.జ్యోతిష్య శాస్త్రములో నమ్మకమున్నది, వాస్తు శాస్త్రములో మూఢనమ్మకమున్నది.

262.అజ్ఞాన మనుషులను సేవించవద్దు, జ్ఞానులను సేవించడములో జీవితమునకు జ్ఞానము లభ్యమగును.

263.మనస్సుకు ఆకారమున్నది, కానీ దాని పనికి హద్దులేదు.

264.లోచనము అనగా కన్ను . లోపలి కన్నును ఆలోచన అంటారు.

265.బయటి కన్నులు రెండు కలసి ఒకదృశ్యమును చూపును. లోపలి కన్నులు రెండు కలవవు. 

266.మనిషికి పుట్టుకతో వచ్చునవి రెండు కన్నులు, పెరుగుతా వచ్చునవి రెండు కన్నులు.

267.లోపలి కన్నులు రెండు విభిన్నమైనవి. ఒకటి ప్రపంచ విషయములను చూపును. రెండవది దేవుని విషయమును చూపును. మొదటిది మనోనేత్రము, రెండవది జ్ఞాననేత్రము.

268.ప్రతి జీవునికి కర్మవలన సంభవించునవి మూడు కన్నులు కాగ శ్రద్ధవలన సంభవించునది ఒకేఒక కన్ను అదే జ్ఞాననేత్రము.

269.మానవునికి మనోనేత్రము తెరుచుకొంటే జ్ఞాననేత్రము మూసుకొనును. జ్ఞాననేత్రము తెరచుకొంటే మనోనేత్రము  మూసుకొనును.

270.ఏది జ్ఞాన నేత్రమో, ఏది మనో నేత్రమో మానవుడు సులభముగా గుర్తించలేడు.

271.జ్ఞాననేత్రము, మనోనేత్రము రెండు భగవంతునికి మాత్రము ఒకే సమయములో పనిచేయుచుండును.

272.దేశములో అత్యుత్తమమైన జ్ఞానము, అత్యుత్తమమైన అజ్ఞానము గలవు. ఏది ఎవరికి ఇష్టమో అదే లభించును.

273.దేశములో బోధకులెందరో కలరు. బోధకులందరూ గురువులవలె కనిపించుచుందురు. అయినప్పటికి దేశములో గురువు ఒక్కడే ఒకప్పుడే ఉండును.

274.ఒక్క రూపాయికి నూరు పైసలున్నట్లు దేశములో పైసా స్థాయినుండి 99 పైసల స్థాయి వరకు బోధకులుందురు. 100 పైసల (రూపాయి) స్థాయిలో గురువుండును.

275.గురువును గర్తించుట చాలా కష్టము. ఎందుకనగా ఒక్క పైసా స్థాయి నుండి 99 పైసల స్థాయివరకు కనిపించుచుండును.

276.గురువు బోధకునివలె, బోధకులు గురువువలె కనిపించుట సహజము. అయినప్పటికీ గురువు గురువే, బోధకుడు బోధకుడే!

277.భగవంతుడే నిజగురువు కావున గురువు కొంతకాలము భౌతికముగా, కొంతకాలము అభౌతికముగా ఉండును.

278.నిజగురువైన భగవంతుడొక్కడే జగతిలో జగద్గురువు. శిష్యులెక్కువ కలవాడు జగద్గురువు కాదు.

279.జగత్తులో సకలజీవులకు వర్తించు జ్ఞానమును తెలియజేయువాడు జగద్గురువు.

280.జగద్గురువైన భగవంతుడు తండ్రివీర్యముతో కాక తన సంకల్పముతోనే పుట్టును.

281.భగవంతునికి భూమిమీద తల్లి ఉండవచ్చును, కానీ తండ్రి ఉండడు.

282.పరమాత్మ ప్రతినిధి భగవంతుడు. భగవంతుడు సాకారుడు. పరమాత్మ నిరాకారుడు.

283.ప్రపంచములో భగవంతుని ద్వారా పరమాత్మను (దేవున్ని) తెలుసుకొనుటకు వీలుకలదు.

284.భగవంతుడు తప్ప మరియే ఇతర మానవుడు దేవున్ని గురించి తెలుపలేడు.

285.భగవంతుడు దేవుని (పరమాత్మ) అంశయే కావున దేవుని విషయము భగవంతునికే తెలియును. 

286.దేవుడు భూమిమీద ఎప్పుడు, ఎక్కడ, ఎట్లు, ఏరూపముతో పుట్టునో ఎవరికి తెలియదు. అందువలన ఆయన అవతారమును ప్రజలు విభిన్నముగా చూస్తున్నారు.

287.మానవునిగా వచ్చు దేవుడు ఒకజన్మలో బికారిగా, ఒకజన్మలో ధనికునిగా ఉండవచ్చును. అలాగే ఒకజన్మలో బ్రహ్మచారిగా మరొకజన్మలో బహు భార్యలుగల విలాస పురుషునిగా ఉండవచ్చును. అంతమాత్రమున చాలామంది భగవంతున్ని గుర్తించలేకపోతున్నారు.

288.దేవుడు మానవునిగా భూమిమీదకు వచ్చినపుడు, ఆయనను గుర్తించని జ్ఞానులు అదే దేవుడు ముందు జన్మలో చెప్పిన మాటలనే ఆయనకే చెప్పి తమకంటే తక్కువవానిగా లెక్కింతురు.

289.దేవుడు భగవంతునిగా గతములో చెప్పిన మాటలను విశ్వసించినవారు, ఆ మాటలకు సరియగు అర్ధములు తెలియక, ఆయన రెండవమారు వచ్చినపుడు ఆయననే గుర్తించలేక పోవుచున్నారు.

290.జీవుడు దేవున్ని చేరితే అదియే జీవదైవఐక్య సంధానమని, అంతటా వ్యాపించి పోవుచున్నాడని తెలియక, మోక్షమనబడు పరలోకమును ఒక స్థలమని, ఒకవిశాలమైన భవనమని అనుకొనుట అజ్ఞానము.

291.దేవుని చేరినవాడు దేవుని కంటే వేరుగా ఉండడు. కనుక వానికొక స్థలము, ఒకఊరు, ఒక ఇల్లు ఏది ఉండదు.

292.దేవుని చేరినవాడు దేవుడే తానై, తానేదేవుడై విశాలముగా అణువణువున వ్యాపించి ఉన్నాడు.

293.మాయ (సైతాన్) లేక సాతాన్ మానవున్ని మతాల పేరుతో మభ్యపెట్టుచున్నది.

294.మతము దేవున్ని తెలుపలేదు. జ్ఞానమే దేవున్ని తెలుపును.

295.దైవము ఒకమతమునకు సంబంధించినవాడు కాడు.

296.మతము చాటున దేవున్ని ఊహించుకొని, మతమునకు దేవున్ని పరిమితి చేసి మాట్లాడడము అజ్ఞానమే అగును. అన్ని మతములకు అధిపతి ఒకే దేవుడని తెలియడమే జ్ఞానమగును.

297.దేవుడెప్పుడయినా భూమిమీదకు వస్తే భగవంతునిగానే వస్తాడు. అనగా పురుష ఆకారముతోనే వస్తాడు, స్త్రీ ఆకారములో రాడు.

298.స్త్రీ పురుషులలో స్త్రీ ప్రకృతికి, పురుషుడు పరమాత్మకు ఆనవాలని తెలియాలి.

299.దేవుడు భగవంతునిగా భూమిమీదకు వస్తే ప్రకృతి కూడ పురుషజన్మ తీసుకొని తానే భగవంతుడనని నమ్మిస్తున్నది.

300.భూమిమీదకు వచ్చిన దేవుడుగాని, ప్రకృతిగాని తాము పలానాయని తెలియకుండా జాగ్రత్తపడుదురు.

301.భూమిమీదకు వచ్చిన దేవుడు తాను భగవంతుడనని చెప్పడు. అట్లే ప్రకృతి తాను మాయనని చెప్పదు.

302.దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలియనివారు భగవంతున్ని సామాన్యమానవునిగా, మాయను భగవంతునిగా పోల్చుకొందురు.

303.భూమిమీద పుట్టిన ప్రతిజీవి ఆత్మ అంశయే అయినప్పటికి ప్రకృతి లక్షణములను కల్గి ఉన్నది. 

304.జీవాత్మ పురుషుని అంశయే అయినప్పటికి ప్రకృతి అంశయైన నపుంసకత్వము కల్గి ఉన్నది.

305.శరీరములో మూడు రకముల ఆత్మలు, ఐదు రకముల ప్రకృతి గలదు.

306.పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అనబడు మూడు ఆత్మలు ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనబడు ఐదు ప్రకృతులు కలసి సజీవ శరీరము ఏర్పడినది.

307.శరీరము ఐదురకముల పరికరము కాగా, పరికరములను ఉపయోగించి ఆత్మ పని చేయుచుండగా, పరమాత్మ చూస్తుండగ, జీవాత్మ అనుభవించుచున్నది.

308.శరీరములో కనిపించు అవయవములు, కనిపించని గుణములు మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములు అన్నియూ ఎన్నో భాగములై ప్రకృతి జనితములు కాగ పరమాత్మ జనితములైనవి కేవలము ఆత్మ జీవాత్మ రెండుమాత్రము గలవు!

309.శరీరమంతా వ్యాపించి పనులన్ని చేయు ఆత్మ ఎవరికి తెలియనిదై తెరచాటున ఉండగ, శరీరములో ఒక్కచోట నివాసమున్న జీవాత్మ ఏమి చేయకున్నను, తనకేమి తెలియకున్నను, అన్ని చేయుచున్నట్లు అన్ని తెలిసినట్లు భ్రమిస్తూ తెరమీదికొచ్చాడు.

310.శరీరమంతా ప్రకృతి కాగా, శరీరములో మూలసూత్రధారి పరమాత్మ కాగా, అన్ని సమయములలో పాత్రధారిగ ఆత్మఉండగా,సూత్రధారి పాత్రధారి కాని జీవాత్మ మొత్తము శరీరమే తానని భ్రమిస్తు తనవెనుకనున్న ఆత్మ పరమాత్మను గాని ప్రకృతిని గాని తెలియలేకపోవుచున్నాడు.

311.శరీరములో ఆత్మ ఎల్లపుడు ఒక్క క్షణము కూడ ఊరకుండక మేల్కొని పనిచేయుచుండగా, జీవాత్మ జరుగుచున్న దానిని కొంతసేపు చూచి అనుభవించి, కొంతసేపు చూడకుండ ఊరకున్నది. చూచి అనుభవించు కాలమును మెలుకువని, చూడక ఊరకుండు కాలమును నిద్రయని అంటున్నాము.

312.శరీరములో జీవాత్మ ఏమి తెలియని అన్నిరకముల అంధుడు కాగా, వానికి పంచ జ్ఞానేంద్రియములు అన్ని విషయములను తెలియజేస్తున్నవి.

313.శరీరములో తన నిజస్థితి తెలియని జీవాత్మ అన్నీ తానే తెలుసుకొనుచున్నట్లు, అన్నీ తానే చేయుచున్నట్లు భ్రమలో మునిగి ఉన్నాడు.

314.పరమాత్మ, ఆత్మ, జీవాత్మలను వరుస క్రమములో జీవాత్మ చివరిదైనా, మొదటి దానివలె భ్రమించుచున్నది.

315.ప్రతి మానవుని హస్తములో జీవాత్మ ఆత్మలనబడు రేఖలు కలిసియుండునట్లు, రెండిటికి పైన పరమాత్మ అనుబడు రేఖ ప్రత్యేకముగ ఉండునట్లు గర్భములోనే ముద్రించబడి ఉన్నవి.

316.పరమాత్మ విశ్వమంతట, ఆత్మ శరీరమంతట, జీవాత్మ తలలోని నుదుటి భాగములో సూది మొనంత వ్యాపించి గలవు.

317.ఆత్మ జీవాత్మలు రెండు జోడు ఆత్మలుగ ఉన్నవి. జీవాత్మను వదలి ఆత్మ, ఆత్మను వదలి జీవాత్మ ఉండజాలదు. 

318.శరీరములో సూది మోపినంత జీవాత్మ ఉండగ, సూది మోపినంత కూడ వెలితి లేకుండ పరమాత్మ విశ్వమంత వ్యాపించి ఉన్నది. 

319.జీవాత్మకు ఒకే ఆకారముండగ ఆత్మకు అనేక ఆకారములుండగ పరమాత్మకు ఆకారమే లేదు.

320.జీవాత్మకు ఆత్మకు స్థానము, ఆకారము, పేరు, పని ఉండగ పరమాత్మకు అవేవి లేవు.

321.భూమి మిూద ప్రచారమైన గుణములు ఆరే. వాటినే ఆరు శత్రుగుంపు (అరిషట్ వర్గము) అనుచున్నాము. ప్రచారములేని గుణములు మరొక ఆరుగలవు వాటినే ఆరు మిత్రగుంపు (మైత్రి షట్ వర్గము) అంటాము. మైత్రిషట్ వర్గము గుణములను గురించి ఎవరికి తెలియదు. వాటిని మనమే (శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులే) మొదట చెప్పుకొన్నాము.

322.గుణములు శత్రువర్గముగ ఆరు, మిత్రవర్గముగ ఆరు మొత్తము పండ్రెండు గలవు. వాటి ప్రతిరూపమే మాయ.

323.దేవుడు సృష్టించిన మాయ, గుణముల రూపముగ మనుషుల తలయందేగలదని చాలామందికి తెలియదు.

324.పరమాత్మ ప్రపంచమంత, ఆత్మదేహమంతట వ్యాపించి ఉన్నప్పటికి, తలయందు గుణరూపమై ఒక్క చోటున్న మాయ, జీవున్ని తనవైపే లాగుకొనుచున్నది.

325.శరీరములో జీవాత్మకు కాపలాగ తోడుగ ఉన్న ఆత్మ బలముకంటే మాయబలము (గుణములు) 108 రెట్లు ఎక్కువ కావున జీవాత్మను తమవైపు లాగుకొను పందెములో శరీరములోని ఆత్మకంటే మాయయే ముందంజలో కలదు.

326.ఒక్కింత బలమున్న ఆత్మ, నూట ఎనిమిదింతలు బలముగల గుణముల ముందర ఓడిపోక తప్పదు.

327.ఆత్మ మార్గమును దైవమార్గమని, గుణమార్గమును మాయమార్గమని చెప్పిన వారు, దైవమార్గము ఇరుకైనదని, మాయమార్గము విశాలమైనదని చెప్పారు.

328.దైవమార్గము నీ సైజంతే కలదు. అందువలన ఇరుకైనది. మాయమార్గము (సాతాన్ మార్గము) నీ సైజుకంటే 108 రెట్లు ఎక్కువ కలదు. అందువలన విశాలమైనది.

329.మనిషిలో గుణములున్నవని అందరికి తెలుసును. కాని ఏ గుణము ఎప్పుడు ఎట్లు పని చేయుచున్నదో ఎవరికి తెలియదు. అందువలన కామమునకు మోహమునకు వ్యత్యాసము తెలియక రెండిటిని ఒకే విధముగ పోల్చుకొనుచున్నారు.

330.మనిషికి వయస్సు పెరుగుచు ముసలివాడగు కొలది శరీరబలము తగ్గిపోవుచుండును. కాని గుణముల బలము ఎక్కువగుచునే ఉండును. అందువలన వృద్ధులకు గుణముల ప్రభావమెక్కువ.

331.వృద్ధులు యువకులవలె శరీర శ్రమ (పని) చేయలేకున్నను యువకులకంటే ఎక్కువ ఆలోచించుచుందురు.

332.మనిషికి శత్రువులుగ మిత్రులుగ ఉన్న గుణములను మంచి చెడు గుణములంటున్నాము. 

333.శరీరములో చెడు గుణములు పనిచేసినట్లు మంచి గుణములు పనిచేయవనియే చెప్పవచ్చును.

334.మంచయిన చెడు అయిన రెండు మాయయే. మంచీ చెడూ కానిదే దైవము. 

335.చెడు గుణముల వలన పాపము, మంచి గుణముల వలన పుణ్యము సంభవించును. మంచి చెడు గుణముల పనిలేనపుడే కర్మ అంటకపోవును.

336.శరీరములోని గుణముల వలననే ఆలోచనలు వస్తున్నవి. ఆలోచనల వలననే పనులు, పనులవలననే కర్మ కల్గుచున్నది.

337.గుణముల వలన విషయము మనస్సుకు జ్ఞాపకము రాగ, దాని మంచి చెడులను రెండు విధములుగ బుద్దియోచించగ, ప్రారబ్ధకర్మ ప్రకారము చిత్తము నిర్ణయింపగ, ఆ విధముగనే ఇంద్రియములు పని చేయుచున్నవి.

338.పనులతో గానీ, గుణములతో గానీ ఏ సంబంధములేని అహము జీవునితో కలసి అన్నిటికి నేనే కర్తననునట్లు జీవున్ని భ్రమింప చేయుచున్నది.

339.అహము అనునది గుణము కాదు, జీవునకు అంటుకొని ఉన్న ఒక పొర.

340.అహమునకు శరీరములో ప్రత్యేకమైన స్థానము లేదు. అది జీవునిలోని ఒక భాగమే.

341.అహము బుద్ధికి చిత్తమునకు ఆనుకొని వాటి వెనుకున్నది. కావున బుద్ధి యోచించిన దానిని, చిత్తము నిర్ణయించిన దానిని నీవే నిర్ణయించావు, నీవే యోచించావని జీవునికి తెలుపుట వలన అన్నీ నేనే అనుకొన్న జీవుడు అన్నీ నేనే చేయుచున్నాను అనుకొనుచున్నాడు.

342.శరీరములో గల 24 ప్రకృతి భాగములలో జీవాత్మను అంటుకొని ఉన్నవి మూడు గలవు. అవియే అహము, చిత్తము, బుద్ధి.

343.అహము ఎవరికి అర్థము కాని జీవుని స్వరూపము. అందువలన చాలామంది అహమును గర్వమను కోవడము జరుగుచున్నది. 

344.అహమును ఒక గుణమనుకొను వారు జ్ఞానశూణ్యులు. 

345.శరీరము స్థూల సూక్ష్మములుగ ఉన్నది. అందరికి స్థూలము తెలియును కాని సూక్ష్మము తెలియదు.

346.స్థూల శరీరము బయటికి పదిభాగములుగ ఉన్నప్పటికి లోపల కనిపించు గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండములు మొదలగు అవయవములెన్నో గలవు.

347.సూక్ష్మ శరీరము 15 భాగములైనప్పటికి లోపల కనిపించని గుణములు, కర్మలు మొదలగునవెన్నో గలవు.

348.జీవుడు జీవించు శరీరము స్థూల సూక్ష్మములుగ లెక్కించబడి ఉన్నప్పటికీ, వాటికి అనుసందానమైనవి స్థూలముగ సూక్ష్మముగ ఎన్నో గలవు.

349.భౌతికముగ శరీరము యొక్క బయటి లోపలి అవయవములను తెలిసిన డాక్టర్లకు సూక్ష్మముగనున్న మనోబుద్ధులు గుణకర్మలు ఏమాత్రము తెలియవు.

350.జ్ఞాని అనువానికి స్థూల సూక్ష్మ శరీరములు తెలిసి ఉండవలెను. 

351.దేవున్ని తెలియవలసినది ఆరాధించవలసినది శరీరములోనే కావున జ్ఞానులకు పూర్తి శరీరమును గురించి తెలియవలసి ఉన్నది.

352.దేహమునందు నివశించు దానిని దేహి అంటాము. దేహములో నిండియున్నది ఆత్మ, దేహములో ఒక్క స్థానములో ఉన్నది జీవాత్మ.

353.ఆత్మ చైతన్యమైనది కావున ఆత్మ శరీరములో ఉన్నంతసేపు శరీరము కూడ చైతన్యమగుచున్నది.

354.ఆత్మ విడచి వెళ్లిన శరీరము చైతన్యము లేనిదై పోవును.

355.జీవాత్మ స్వయముగ శరీరమును విడచి వెళ్ళడము గాని, శరీరములోకి చేరడము గాని చేయలేదు.

356.జీవాత్మను శరీరములోకి చేర్చడము మరియు శరీరమునుండి బయటికి తేవడమును ఆత్మే చేయుచున్నది.

357.జీవాత్మకు, పరమాత్మకు మధ్యలో ఉన్నది ఆత్మ.

358.జీవాత్మకు ఆత్మకు, ఆత్మకు పరమాత్మకు, పరమాత్మకు ప్రకృతికి ప్రకృతికి జీవాత్మకున్న సంబంధములను తెలియజేయునదే నిజమైన దైవజ్ఞానము.

359.ప్రకృతీ పరమాత్మ శరీరధారులయిన జీవాత్మలకు తల్లి తండ్రులని తెలియడమే నిజజ్ఞానము.

360.పురుషుడెవడో, ప్రకృతి ఏదో తెలియనంతవరకు నీవూ, నీ శరీరమూ నీకు అర్థము కాదు.

361.పురుషతత్వముతో నిండినవాడు పరమాత్మ, స్త్రీ తత్వముతో నిండినది ప్రకృతి, నపుంసతత్వముతో నిండినవాడు జీవాత్మ అని తెలియవలెను.

362.ప్రకృతిని, పురుషున్ని, కర్మతో కూడిన జీవున్ని తెలుపుటకే, భూమి మీద స్త్రీ జన్మలు, పురుష జన్మలు, నపుంసక జన్మలు కల్గుచున్నవి.

363.పరమాత్మ అంశయైన జీవుడు ప్రకృతి అంశయైన శరీరముతో కూడుకొన్నపుడు వాడు నపుంసకుడే అగును. ఆ లెక్క ప్రకారము ఆధ్యాత్మికరీత్యా మనమంతా నపుంసకులమే!

364.దైవజ్ఞానమను మందుతిని, నపుంసతత్వమును పోగొట్టుకొని, పురుషతత్వమును సంపాదించుకోవడమే జీవుడు దేవునిగా మారడమని తెలియుము.

365.పదార్థములు ప్రకృతికాగా, వంటచేయువాడు ఆత్మ,కాగా, చేసిన దానిని తినువాడు జీవాత్మకాగా, చేయించునది పరమాత్మ. అయినప్పటికి అన్నిటికి తానే కర్తనని జీవుడనుకొనుచున్నాడు.

366.పరమాత్మ సంకల్పము చేతనే పంచభూతములైన ప్రపంచము మరియు చావు పుట్టుకలు కల్గిన జగతి కల్గినది.

367.అన్నిటికీ ఆధారము, అన్నిటికీ పెద్ద, అన్నిటికీ మూలము ప్రకృతి కాదు. ఆత్మ, జీవాత్మ కాదు. అన్నిటిని ఆడించునది మాయకాగ దానిచేత ఆడించువాడు పరమాత్మ. కావున అన్నిటికి ఆధారమూ, పెద్దా, మూలము పరమాత్మయే.

368.జీవుని దైవారాధనకు మరియు శరీర పోషణకు యజ్ఞములు ముఖ్యమైనవి. 

369.శరీరములో రెండు రకముల యజ్ఞములు చేయవచ్చును. అందులో ఒక దానిని నిత్యము అందరు చేయుచున్నాము. దానిపేరే ద్రవ్యయజ్ఞము.

370.శరీరము రెండు రకముల యజ్ఞములకు వేదిక అయినది. కడుపులో జరుగు ద్రవ్యయజ్ఞముకంటే తలలో జరుగు జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది.

371.యజ్ఞము అనగ ఉన్నదానిని లేకుండ చేయడమని లేక కాల్చివేయడమని నిజార్థము. నోటి ద్వార తినబడు ఆహార ద్రవ్యములను కడుపులోని జఠరాగ్ని ద్వార కాల్చివేయడమును ద్రవ్యయజ్ఞము అంటున్నాము.

372.శరీరములో జరుగు యజ్ఞమునకు నమూనాగా చేసి చూపడమే బయటి యజ్ఞములు. యజ్ఞములో అగ్ని ద్వార కాల్చు విధానమే శరీరములో జరుగు రెండు యజ్ఞములలో గలదు.

373.శరీరమందు జరుగు జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞముకంటే శ్రేష్టమైనది. ఎందుకనగా జ్ఞానయజ్ఞములో ప్రపంచ సంబంధ పంచ జ్ఞానములు కాలిపోవుచున్నవి.

374.ద్రవ్యయజ్ఞములో నాలుగు రకములైన ద్రవ్యములు కాలిపోవుచుండగ వాటిని కాల్చునది జఠరాగ్ని. అలాగే జ్ఞానయజ్ఞములో ఐదు రకములైన ఇంద్రియ జ్ఞానములు కాలిపోవుచున్నవి. వాటిని కాల్చు అగ్ని జ్ఞానాగ్ని,

375.శరీరములో జరుగు రెండురకముల యజ్ఞములలో ద్రవ్యయజ్ఞము ఆత్మకు సంబంధించినది. జ్ఞానయజ్ఞము జీవాత్మకు సంబంధించినది.

376.ద్రవ్యయజ్ఞము ఆత్మకుపయోగపడునది కావున ఆత్మ ద్రవ్యయజ్ఞమును సక్రమముగ నెరవేర్చుచున్నది.

377.జ్ఞానయజ్ఞము జీవునకుపయోగపడునది కావున జీవాత్మ జ్ఞానయజ్ఞము చేయవలెను. కాని జీవాత్మ జ్ఞానయజ్ఞము చేయడము లేదు.

378.ద్రవ్యయజ్ఞము ప్రతి జీవరాసియందు జరుగుచుండగ, జ్ఞానయజ్ఞమును కోటికొక్కడు కూడ చేయడము అరుదుగా ఉన్నది.

379.జ్ఞానులు, స్వాములు, పీఠాధిపతులు, లోపలి జ్ఞానయజ్ఞమును గురించి తెలియక, బయటి అగ్నితో పుల్లలను కాల్చు యజ్ఞములు చేయుచున్నారు.

380.ద్రవ్యయజ్ఞము ద్వార సంప్రాప్తమగునది పాప పుణ్యములనబడు కర్మకాగా, జ్ఞానయజ్ఞము ద్వార సంప్రాప్తమగునది పరమపదమనబడు మోక్షము.

381.శరీరములోని ఐదు జ్ఞానేంద్రియముల వలన సంభవించునది కర్మ కాగా, కర్మ మూడు విధములుగ గలదు. 

382.ప్రారబ్ధ, ఆగామి, సంచితములనబడు మూడు కర్మలలోప్రారబ్ధము ఈ జన్మలో పుట్టినప్పటి నుండి చనిపోవువరకు  జరుగునది.

383.ఆగామికర్మ అనగా పుట్టినప్పటి నుండి చనిపోవువరకు క్రొత్తగ వచ్చునది.

384.జీవితములో సాధారణ మనిషి చేయుచున్న పనిలో ప్రారబ్ధము ఆగామికము రెండు గలవు. ఎలాగంటే ప్రారబ్ధము అయిపోవుచున్నది. ఆగామికము తయారగుచున్నది. 

385.జన్మ జన్మలకు అనుభవించగా మిగులుచు వస్తూ కుప్పలాగా పేరుకుపోవుచున్నది సంచితము.

386.శాస్త్రములు ఆరు, పురాణములు పదునెనిమిది కాగ అజ్ఞానులు భక్తిమార్గమున ప్రవేశించుటకుపయోగపడునవి పురాణములు, జ్ఞానులు మోక్షమార్గమున ప్రవేశించుటకుపయోగపడునవి శాస్త్రములు.

387.పదునెనిమిది పురాణములలో భక్తికి భాగవతము ముఖ్యము కాగా, ఆరు శాస్త్రములలో దైవజ్ఞానమునకు ముఖ్యమైనది యోగశాస్త్రము.

388.నూటికి నూరుపాల్లు యోగశాస్త్రమైనది భగవంతుడు చెప్పిన భగవద్గీతయే.

389.పురాణము పుక్కిడినుంచి, శాస్త్రము బొడ్డు దగ్గర నుండి వచ్చునను నానుడి కలదు. అందువలన అసత్యములతో కూడుకొన్నది పురాణము. సత్యములతో కూడుకొన్నది శాస్త్రము అని చెప్పవచ్చును.

390.శాసనములతో కూడుకొన్నది శాస్త్రము, కల్పనలతో కూడుకొన్నది పురాణము.

391.విషయమును మననము (జ్ఞాపకము) చేయునది మనస్సు.

392.మనస్సును చంచలమైన కుక్కతో, నీచమైన పందితో, బలమైన ఏనుగుతో పోల్చి కొందరు పెద్దలు చెప్పినారు. కావున మనస్సు ఒక విషయము మీద నిలకడ లేనిది. నీచాతి నీచమైన విషయములను ఆలోచించునది, మరియు కట్టడి చేయాలనుకొన్న వానికి లొంగక బలమైనది.

393.మనస్సు మెలుకువలో ఒక ఆకారమును, నిద్రలో మరొక ఆకారమును కల్గి ఉన్నది.

394.మెలుకువలో శరీరాకృతిని పోలిన మనస్సు నిద్రలో ధూళి కణమంతయిపోవుచున్నది.

395.మనస్సు అజ్ఞానులలోకంటే సాధన చేయు వారిలో ఎక్కువ వేగముగ చలించుచుండును. 

396.శరీరములో మనస్సు రెండు విధముల పని చేయుచున్నది. ఒకటి విషయములను జ్ఞాపకము తేవడము, రెండు బుద్ధి చెప్పిన దానిని బయటి ఇంద్రియములకు చేర్చడము, బయటి ఇంద్రియములు చెప్పిన దానిని లోపలి బుద్దికి తెలుపడము.

397.మనిషికి నిద్ర మెలుకువలు మనస్సును బట్టియే ఉండును. శరీరమంతా మనస్సు వ్యాపించినపుడు (సూర్య చంద్రనాడులలో ఉన్నపుడు) మెలుకువ అని, బ్రహ్మనాడిలో అణగిపోయినపుడు నిద్ర అని అంటాము.

398.మనిషి మనస్సును జయించితే బ్రహ్మయోగము (జ్ఞానయోగము) అగును.

399.మనస్సుకు నేత్రమూ దృష్టికలదు. దానినే మనోనేత్రమనీ మనోదృష్ఠి అని అంటుంటాము.

400.మనస్సుకు చివరి మరుపునే మరణము అంటాము.

401.మనస్సుకు బుద్ధికి, బుద్ధికి మనస్సుకు నిత్యము అనుబంధముండును.

402.బుద్ధి గుణములకు అద్దములాంటిది.

403.ప్రతి గుణమును రెండు విధముల యోచించునది బుద్ధి.

404.శరీరములో జీవునితో సంబంధము గలది, కష్టసుఖములను అందించునది ఒక బుద్ధియే.  

405.శరీరములో అన్నిటికంటే గొప్పది బుద్ధియే.

406.శరీరమందున్న ఆత్మవిషయమును జీవాత్మకు తెలియజేయునది బుద్ధి మాత్రమే.

407.జీవునికి అత్యంత సమీపములో ఉన్నది బుద్ధి మాత్రమే.

408.బుద్ధికి ఆకారముగలదు. ఒక్కొక్క శరీరములో ఒక్కొక్క మందము గల గుండ్రని పొరగ బుద్ధిగలదు.

409.ఆసక్తిని బట్టి బుద్ధియొక్క పని తీరుండును. అందువలన ఒక విషయములో పనిచేసినట్లు మరొక విషయములో పని చేయలేదు.  

410.మహిమ గలది మంత్రము. కాని దాని పూర్తి విధానము తెలియని వారు మంత్రములే లేవనుచున్నారు.

411.ప్రతిమాట ఒక మంత్రమను నానుడి గలదు. అందువలన ఉచ్చాటనను బట్టి మంత్రము మహిమగలదగును.

412.మాటలోని అక్షరములను బట్టి మంత్రములోని మహిమ ఉండును. మాటను క్రమబద్దీకరిస్తే మంత్రమగును.

413.మంత్రశక్తి సూక్ష్మమైనది అయినప్పటికి అది స్థూల సూక్ష్మముల రెండిటి మీద పనిచేయును.

414.కనిపించు ఏనుగును క్షణములో లేకుండ మాయము చేసిన మాంత్రికున్ని, కనిపించని జంతువును క్షణములో కనిపించునట్లు చేసిన మాంత్రికున్ని చూచినపుడు ఆ పనులు మంత్రమహిమ అని చెప్పక తప్పదు.

415.ధర్మము దైవసంబంధమైనది. దానము ప్రపంచసంబంధమైనది.

416.దానమడుగు ప్రతివాడు ధర్మము చేయండి అనడములో ధర్మమును ఆచరించమని చెప్పడమే అగుచున్నది.

417.దానము చేస్తే పుణ్యము వస్తుంది, పుణ్యమువస్తే మరుజన్మ వస్తుంది. అందువలన దానము చేస్తే నేను తెలియనని గీతయందు భగవంతుడు చెప్పాడు.

418.ధర్మము చేస్తే పుణ్యము రాదు, మరు జన్మరాదు. అందువలన ధర్మమును ఆచరించమని గీతయందు భగవంతుడు చెప్పాడు.

419.దానధర్మముల వ్యత్యాసము తెలియనివాడు దైవమార్గమును తెలియలేడు.

420.ఆత్మకున్న విధానములు ధర్మములు, దైవమును తెలియుటకు ఆచరించవలసినవి ధర్మములు. అందువలన ధర్మములు జ్ఞానముతో కూడుకొన్నవి.

421.ఎచట అజ్ఞాన విధానములున్నవో అచట అధర్మములున్నవని తెలియవచ్చును.

422.అణువణువున వ్యాపించియున్న పరమాత్మను తెలియక మరి ఏ విధానమును ఆచరించినా, ఏ దేవతలను ఆరాధించిన అది అధర్మమే అగును.

423.భగవద్గీతలో శరీరము ధరించిన భగవంతునిగ మరియు శరీరమే లేని పరమాత్మగ (విశ్వరూపములో) ఒక ముఖ్యమైన ధర్మము తెలియజేశాడు. అది ఏమనగా! "బాహ్యయజ్ఞముల వలనను, దానముల వలనను, వేదాధ్యాయనముల వలనను, ఉగ్రమైన తపస్సుల వలనను నేను తెలియబడను” అన్నాడు. 

424.వేదపారాయణము, యజ్ఞములు చేయుట, దానములు, తపస్సులు ధర్మయుక్తములు కావని భగవంతుని మాటలలో తెలియుచున్నది.

425.పనిచేయు ప్రతివాడు తనది ధర్మమే అనుకొనుచున్నాడు. అసలు ధర్మమంటే ఏమిటో ఆలోచించలేదు.

426.వేదములు చెప్పువాడు వేదములలోనే ధర్మములున్నవని అంటున్నాడు, యజ్ఞములు చేయువాడు వాటిలోనే ధర్మములున్నవి అంటున్నాడు. కాని దేవుడు ఆమాటను అనలేదు.

427.ధర్మమునకు దైవమార్గము తెలుపు సామత్యమున్నది. ధర్మము పవిత్రమైనది, కానీ మాయ ప్రభావము వలన అధర్మములు ధర్మములుగ, ధర్మములు అధర్మములుగ గోచరించుచున్నవి.

428.ధర్మమునకు ముప్పుకల్గితే వాటిని దేవుడే రక్షిస్తానన్నాడు. మానవుడు ధర్మములను ఆచరించుటకు యోగ్యుడే కాని రక్షించుటకు యోగ్యుడు కాదు.

429.ధర్మమంటే ఏమిటో తెలియకనే వాటిని గురించి వక్రీకరించి చెప్పితే అది దైవవ్యతిరేఖమగును.

430.ధర్మమెచట గలదో అధర్మము అచటనే పుట్టినది. వేదాంత మెచట గలదో వేదములచటే గలవు. వేదాంతము గుణాతీతముకాగ వేదము గుణమయమయినది.

431.ధర్మమునకు వ్యతిరిక్త పదము అధర్మము కాదు. జ్ఞానమునకు వ్యతిరేఖ పదము అజ్ఞానము కాదు.

432.ధర్మమునకు వ్యతిరేఖము గుణములు, జ్ఞానమునకు వ్యతిరేఖ పదము మాయ, పరమాత్మకు వ్యతిరేఖ పదము ప్రకృతి.

433.ధర్మము, జ్ఞానము పరమాత్మమయమైనవి. గుణములు, మాయ ప్రకృతిమయమైనవి.

434.జ్ఞానము ధర్మయుక్తమైతే, ధర్మము పరమాత్మయుక్తమైనది. అన్యదేవతలను గురించి బోధించు వారు, వేదముల గురించి బోధించువారు ప్రకృతి యుక్తులే అగుదురు.

435.పురుషార్థములు నాలుగని అంటుంటారు. అది అసత్యము పురుషార్థములు రెండు మాత్రమే గలవు.

436.పురుషార్థములలో ఒకటి స్థూలార్థము నిచ్చునది, రెండవది సూక్ష్మార్థము నిచ్చునది.

437.కనిపించు తండ్రిని చూపునది తల్లి, తల్లి వలననే తండ్రి తెలియును కనుక తల్లి-తండ్రి అనుమాట ఒకటి.

438.కనిపించని తండ్రియైన దైవమును తెలుపువాడు గురువు. గురువు వలననే దైవము తెలియును. గురువు-దైవము రెండవది.

439.తల్లీ-తండ్రీ, గురువూ దైవము అర్థక్రమమే, కానీ వరుస క్రమము కాదు. కొందరు ఈ మాటను వక్రీకరించి మొదట తల్లిని పూజించవలెనని, తర్వాత తండ్రిని పూజించవలెనని, తర్వాత గురువని, ఆ తర్వాత దైవమనిచెప్పుచుందురు.

440.సర్వ ప్రపంచమునకు అధిపతి ఆదికర్త అయిన దైవమును చివరికి తోసి, కనిపించు మనుషులకు మొదటి పూజలివ్వడము అజ్ఞానమగును,

441.అవధి లేని పరమాత్మను తెల్పువాడు అవధూత, కానీ బజారులో తిరుగు తిక్కవాల్లు అవధూతలు కాదు. 

442.కనీసము ప్రపంచ జ్ఞానము కూడ లేకుండ బుద్ధిచెడి తిక్కపట్టి మురికిలో తిరుగు వారిని చూచి ప్రజలు వారిని గొప్ప మహాత్ములుగ భావించుచుందురు. అట్టివారిని బుద్ధి ఉన్న తిక్కవారిగ లెక్కించవచ్చును

443.అవధులులేని పరమాత్మ సమాచారమును తెలుపుటకు వచ్చిన దూతలాంటి వాడే నిజమైన అవధూత.

444.ఒక విషయమును మోసుకొచ్చిన వానిని దూత అందుము. ఎల్లలులేని పరమాత్మ విషయమును మోసుకొచ్చినవాడు నిజమైన గురువు. అటువంటి వానినే అవధూత అనవచ్చును.

445.సంపూర్ణ పరమాత్మ జ్ఞానము తెలిసినవాడు గురువు లేక అవధూత. కాని ఏజ్ఞానము లేని పిచ్చివాడు అవధూత కాలేడు.

446.దేవుడు మనుషులను తయారు చేశాడు, కానీ కులములను తయారుచేయలేదు.

447.చాతుర్వర్ణ మయా సృష్టమ్ అని గీతలో దేవుడు చెప్పితే నాలుగు వర్ణములను నాలుగు కులముగ ఎందుకనుకోవాలి?

448.ఇతర దేశములో లేని కులములు ఈ దేశములోనే ఎందుకున్నాయంటే జవాబులేదు.

449.గుణములున్నవి మూడు, గుణములు లేనిది ఒకటిని కలిపి నాలుగువర్ణములని దేవుడు అంటే గుణములతో సంబంధములేని కులములను మానవుడు పెట్టుకొన్నాడు.

450.పుట్టుకలో కులము లేదు, చావులో కులము లేదు. కానీ పుట్టుకలో గుణమున్నది, చావులో కూడ గుణమున్నది.

451.ఏ గుణములో మరణిస్తే అదే గుణములో పుట్టుచున్నావని గీతలో దేవుడు చెప్పాడు. కాని ఏ కులములో చస్తే ఆ కులములో పుట్టుదువని చెప్పలేదు.

452.పుట్టిన తర్వాత కొంతకాలమునకు తెలియునట్టి కులము, మతము మనుషులు కల్పించుకొన్నవే కాని జన్మతః వచ్చినవి కావు.

453.కులాలు కుచ్చితముతో, మతాలు స్వార్ధముతో కూడుకొన్నవి. కులాలకు మతాలకు దేవుడు అతీతముగ ఉన్నాడని తెలిసి నీవు ఆ విధముగ మారినపుడే దేవుడు తెలియును.

454.ఉపనిషత్తులను దేవుడు చెప్పలేదు. మనుషులు వ్రాసుకొన్నవే ఉపనిషత్తులు. అందులో కూడ కొన్ని లోపములు గలవు.

455.ఉపనిషత్తులలో కూడ లేని విషయములను (ధర్మములను) దేవుడు తెలిపి తనదే గొప్ప జ్ఞానమనిపించుకొన్నాడు.

456.మొత్తము ఉపనిషత్తులు 1108 కాగ అందులో ముఖ్యమైనవి 108 మాత్రమేనని కొందరనుచున్నారు. ముఖ్యమైన ఆ 108 ఉపనిషత్తులలో కూడ భగవంతుడు చెప్పిన భగవద్గీత లేదు.

457.దేవుడు చెప్పిన జ్ఞానమును వదలి మనుషులు చెప్పిన ఉపనిషత్తుల మీద భ్రమపెంచుకోవడము చూస్తే దైవజ్ఞానము మీద నమ్మకము లేనట్లే!

458.బాహ్యములో ఇతరులతో సంబంధము లేకుండ అనుభవించ వలసిన కర్మలను స్వప్నములో అనుభవింతురు.

459.బాహ్యములో విచిత్రమైనవి, జరుగుటకు వీలులేనివి జరుగు అవస్థయే స్వప్నావస్థ. 

460.మనిషి జీవితములో కాలగమనము ఎక్కువ మూడవస్థలుగ జరుగుచున్నది. అవియే ఒకటి జాగ్రత్తావస్థ,రెండు స్వప్నావస్థ, మూడు నిద్రావస్థ.

461.జీవితములో సాధారణముగ జరుగునవి మూడవస్థలే. అయినప్పటికి కొన్ని లక్షలమందిలో ప్రయత్నించు వారికి మాత్రము జరుగు మరియొక అవస్థ గలదు. అదియే యోగావస్థ. 

462.మన ఇష్టము ప్రయత్నము లేకున్నా జరుగు అవస్థలు నిద్ర, మెలుకువ, స్వప్నములు. నీ ఇష్టముంటే, నీ ప్రయత్నముంటే బహు అరుదుగా జరుగునది యోగావస్థ.

463.మనిషి ప్రారబ్ధకర్మము వలన నీ ఇష్టము లేకున్నా జరుగు అవస్థలుఇష్టము లేకున్నా జరుగు అవస్థలు నిద్ర, మెలుకువ, స్వప్నములు. ప్రారబ్ధకర్మకు సంబంధములేనిది నీ ఇష్టము మీద ఆధారపడినది ఒకే ఒక అవస్థగలదు. అదియే యోగము.

464.దేవుడు తనను తెలుసుకొనుటకు మనుషులకు మూడు యోగములను తెలియజేశాడు.

465.మూడు యోగములలో రెండు ధర్మయుక్తమైనవి గలవు. ఒకటి ధర్మములకు అతీతమైనది.

466.ఒకటి బ్రహ్మయోగము (జ్ఞానయోగము), రెండవది కర్మయోగము (రాజయోగము) అనునవి ధర్మయుక్తమైనది. భక్తియోగము మాత్రము ధర్మములకు కూడ అతీతమైనది.

467.ఓంకార శబ్దము నోటితో పలికితే వస్తుంది. అదే శబ్దము నోటితో పలుకకుండానే సూక్ష్మముగ శరీరము లోపల మ్రోగుచున్నది.

465.ఏ మతమునకు చెందిన మనిషిలోనైన ముక్కురంధ్రములలో కదలే శ్వాసలో “ఓమ్” శబ్దము ఇమిడి ఉన్నది.

469.“ఓమ్” ఒక మతమునకు సంబంధించినది కాదు. మనుషులందరికి, జీవరాసులందరికి సంబంధించినది.

470.ఓమ్ శబ్దమునకు శ్వాస కారణము, శ్వాసకు కారణము ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచములు కారణము, ఊపిరితిత్తుల కదలికకు శరీరమధ్యలోనున్న బ్రహ్మనాడిలో గల స్పందన కారణము. బ్రహ్మనాడిలోని స్పందనకుఅక్కడున్న ఆత్మ కారణమై ఉన్నది. 

471.ఇంద్రియార్థమైన శబ్దముతో కూడి మంత్రమైన “ఓం నమః శివాయ” అను మంత్రమును పంచాక్షరి అంటున్నారు.

472.పంచాక్షరిలో ఐదు అక్షరములు గలవని గుర్తించాలి. “ఓం” ను అక్షరముగ గుర్తించుకోకూడదు, ఓంనుమినహా ఉన్నది ఐదక్షరములే కదా అని సమర్థించుకొన్నట్లయితే “ఓం నమోనారాయణాయ” అను మంత్రమును అష్టాక్షరి మంత్రము అనకూడదు. ఎందుకనగా ఓంను తీసివేసి చూస్తే ఏడు అక్షరముల మంత్రమేఅగును.

473.అద్వైతుల పంచాక్షరియందో, విశిష్టాద్వైతుల అష్టాక్షరియందో ఏదో ఒక దానియందు తప్పుండునట్లు తెలియుచున్నది.

474.అద్వైతమునకు, విశిష్టాద్వైతమునకు, ద్వైతమునకుమించినది, శాస్త్రబద్దమైనది త్రైతసిద్ధాంతము. 

475.విష్ణు, ఈశ్వర, బ్రహ్మలైన త్రిమూర్తులకు కూడ ఆకారములు పేర్లు గలవు. ఆకారముగాని, పేరుగాని లేనివాడే దేవుడు.

476.రూపనామ క్రియలులేని దేవుడు రూపనామక్రియలున్న త్రిమూర్తులను కూడ సృష్టించాడు. కావున మనకుదేవతలకు తండ్రి ఒక్క దేవుడే.

477.దేవుని దృష్ఠిలో దేవతలు, మానవులు అందరు సమానమే. దైవజ్ఞానము లేక పోతే దేవతలు కూడ దేవునికి దూరము కాగలరు.

478.దేవతలు గానీ, మనుషులు గానీ మహర్షి పదవినుండి బ్రహ్మర్షి హోదావరకు పోతేనే చివరకు దేవుడు తెలియును.

479.జ్ఞానమును బట్టి మానవునికి దైవమార్గములో గల హోదాలు మహర్షి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి కాగ అజ్ఞానమును బట్టి ఒకే ఒక హోదాగలదు. అదియే బేవర్షి అనుపేరు.

480.మరణములు రెండు విధములు ఒకటి అకాలమరణము, రెండు కాలమరణము. అకాలమరణము పొందితే అదే జన్మమందు సూక్ష్మశరీరముతో జీవుడుండును. కాలమరణము పొందితే క్రొత్త శరీరమునుమరుజన్మయందు పొందును.

481.భూమి మీద మనుషులు గ్రహములుగ (దయ్యములుగ) గుడిలోని దేవతలు విగ్రహములుగ ఉన్నారు.

482.దేవాలయముల ప్రతిమలలో దేవతలను జీవుళ్ళుండగ మనుష శరీరములలో సాధారణ జీవుళ్ళు గలరు.

483.దేవాలయములో స్థూలముగనున్న ప్రతిమలుపు పరమాత్మను తెలుపు చిహ్నములని తెలియక అక్కడున్న దేవుళ్ళను ప్రజలు ఆరాధిస్తు దేవదేవుడైన పరమాత్మను గుర్తించలేక పోవుచున్నారు.

484.దేవాలయములు భావ సహితమైన కట్టడములుగ, పరమాత్మ జ్ఞానమును బహిర్గతము చేయునవిగ, గురుబోధనకు సమానమైనవిగ ఉండవలెను.

485.పూర్వము పెద్దలచే నిర్మింపబడిన దేవాలయములు రెండే. అవి ఒకటి నిరాకార ప్రతిమయైన లింగము గల గుడి. రెండవది ఆకారముతో కూడుకొన్న రంగని గుడి.

486.లింగము మీద మూడు ఆత్మలను సూచించు మూడు విభూతి రేఖలను, రంగని ప్రతిమ మీద శరీరములో బ్రహ్మనాడియందే దేవుడున్నాడని సూచించు మూడునాడుల గుర్తయిన నామమును తీర్చిదిద్దారు.

487.కాలక్రమమున లింగము శైవుల దేవుడని, రంగడు వైష్ణవుల దేవుడని భావించబడి నేటికి శైవుల ఆధీనములో లింగము వైష్ణవుల ఆధీనములో రంగడు గలడు.

488.రూపము లేని దేవుడు, రూపముగల భగవంతునిగ వచ్చునని తెలుపుటకు రూపములేని గుండును లింగముగ, రూపమున్న రంగని ప్రతిమగ పూర్వము చూపించారు.

489.దేవునికి అందరు సంతానమేనని తెలియునట్లు, వైవాహిక జీవితము యొక్క అర్థము మొదటిలోనే తెలియునట్లు,పెళ్లి కూతురు పెళ్లికొడుకు అని ఆ కొద్దిసేపు అంటున్నాము. 

490.పెళ్లి జీవితములో ఒక పెద్ద జ్ఞానసందేశమైన కార్యము. పెళ్లిలో చేయబడు ప్రతి కార్యమునందు విశేషమైనజ్ఞాన అర్థము ఇమిడి ఉండును.

491.పెళ్లి జరిగిన తర్వాత పెళ్లిలో చేసిన కార్యములకు అర్థము తెలియక, వారి జీవితములో జ్ఞానము తెలియక ప్రవర్తించితే, వారు భార్యాభర్తలు కారు. అది స్త్రీపురుషుల అక్రమ సంబంధమగును. పెళ్లి కార్యముల అర్థములకుఅనుగుణముగ నడుచుకొనువారే నిజమైన భార్యాభర్తలు.

492.పెళ్లిలో తాళికట్టక ముందు పెళ్లికి కొడుకు కూతురై, సోదరి సోదరులైన స్త్రీపురుషులు పెళ్లి తర్వాత వారి జ్ఞాన ఆచరణతో భార్య (భరించబడునది) భర్త (భరించువాడు) సమానమైన బాధ్యతలు కలిగి ఆలుమగలు కావలెను.

493.యమలోకము స్వర్గలోకము రెండు మానవుని జీవితములో మిళితమై ఉన్నవి. యమ స్వర్గలోకములు పైనో క్రిందో లేవు. రెండు భూమిమీదనే గలవు.

494.సుఖముల రూపముతో స్వర్గలోకము, దుఃఖముల రూపముతో యమలోకము ఇక్కడే గలవు.

495.శరీరములోపల వచ్చు రోగము, మనోరోగము స్వయముగ యముడు (ఆత్మ) విధించు బాధలని, శరీరము బయటినుండి వచ్చు బాధలు యమకింకర్లు (బంధువులు, శత్రువులు) విధించు బాధలని తెలియవలెను.

496.జీవితములో జరుగు బాధలుగాని, సుఖములుగాని అన్నిటికి మూలకారణము శరీరములోనున్న కర్మయే కారణమని  తెలియాలి.

497.సుఖ దుఃఖములు అనుభవించుటకు కారణమైన కర్మ నీతలలోని కర్మచక్రము నుండి ప్రారబ్దరూపముగ వచ్చుచున్నది. అలాగే చేయుచున్న పనులలో సంభవించెడి క్రొత్త కర్మయిన ఆగామి కర్మకర్మచక్రములోనే చేరుచున్నది.

498.జీవితమునకే కారణమయినది మరియు మరణములో శరీరము నుండి సూక్ష్మముగ పోవుచు జననములో ఎవరికి కనపడకుండానే శరీరములోనికి వచ్చుచున్నది ఒక ఆకారము గలదు. అదియే బ్రహ్మ, కాల, కర్మ,గుణచక్రముల చట్రము. ఈ నాల్గుచక్రములలోనే ఆత్మ, జీవాత్మ, ప్రారబ్ధ సంచిత కర్మలు, కర్మలు అనుభవించు కాలము, ఆ కాలములో చరించు నవగ్రహములు గలవు. ఈ నాల్గు చక్రములను తెలుసుకొని వాటి స్థానమైననుదుటి భాగములో ధరించడము గొప్ప జ్ఞానమగును.

499.సాధారణ స్థితిలో ఉన్నవాడు త్రైతములో గలడు జ్ఞానయోగములో ఉన్నవాడు ద్వైతములో గలడు. మోక్షము పొందినవాడు అద్వైతములో గలడు.

500.అన్నదానము ఆత్మకు, జ్ఞానదానము జీవాత్మకు చెందుతుంది. నము కరును బట్టి501. అన్నదానము కర్మను బట్టి ఉండును. జ్ఞానదానము శ్రద్ధను బట్టి ఉండును.

501.అన్నదానము కర్మను బట్టి ఉండును. జ్ఞానదానము శ్రద్ధను బట్టి ఉండును.

502.ఆకలి బాధకు అన్నము అవసరమైనట్లు, విషయబాధకు జ్ఞానము అవసరము.

503.కడుపులో ఆకలిబాధ ప్రతి మనిషికి ఉన్నట్లే, తలలో విషయబాధ ప్రతి మనిషికి ఉండును.

504.కడుపులేని జీవరాసిలేనట్లు, తలలేని జీవరాసి కూడ లేదు. 

505.కడుపు తల ఉన్నవారికందరికి ఆహారమును జ్ఞానమును దేవుడు తయారు చేసి ఉంచాడు.

506.మనిషి కడుపుకొరకు అన్నమునే వెదుకుకొనుచున్నాడు. కాని తలకొరకు జ్ఞానమును వెదుకుకోవడము లేదు.

507.రోమములు, ఈకలున్న మనుషులు, పక్షులు ఆత్మకు గుర్తుగ రోమములు, ఈకలులేని పాములు చేపలు మాయకు గుర్తుగ ఉన్నవి.

508.పెళ్లి అనగా దైవము అని అర్థము కాగా, వివాహము అనగా ఇద్దరికి వర్తించునదని అర్థము. ఈ అర్థములు ప్రపంచక నిఘంటులో ఉండవు. కేవలము పరమాత్మిక ఘంటులో ఉండును.

509.ఘంటు అనగ మూట, నిఘంటు అనగా ఉత్త మూట అని తెలుసుకో!

510.ఒక మనిషిని దేవుడంటుంటారు కాని మనిషిలో దేవుడున్నాడని, దేవునిలో మనిషున్నాడని చాలామందికి తెలియదు.

511.అంతులేని ప్రకృతి పరమాత్మ హద్దులో ఉన్నది. అలాగే ప్రకృతి స్వరూపమైన స్త్రీ, పరమాత్మ స్వరూపమైన పురుషుని హద్దులో ఉండడము ధర్మము.

512.ఏ సిద్ధాంతమైన మనిషిలోపల ఊహకందినదే, మనిషిలోపల ఊహకందించినవాడే సిద్ధాంతకర్త. అటువంటపుడు సిద్ధాంతకర్తగ లోపలి వానిని చెప్పకుండ బయట మనిషి పేరు చెప్పుకోవడముఅధర్మము కాదా!

513.పెళ్లంటే నూరేళ్ళపంట అంటారు. జీవితమంటే మూన్నాళ్ళ ముచ్చట అంటారు. దీనినిబట్టి జీవితముకంటే పెళ్ళే పెద్దదని తెలియుచున్నది.

514.నాలుక అంటే భయములేనిదని అర్థము. అలాగే నీవు కూడ తలలోని నాలుకవలె ఉండవలెను.

515.ధనమున్నవాడు తనవద్ద ధనము లేదని చెప్పడము, జ్ఞానము తెలియనివాడు తనకు జ్ఞానము తెలుసునని చెప్పుకోవడము సహజము.

516.ఊహ ఒక్కమారు మాత్రము వస్తుంది. ఆలోచన అనేకమార్లు వస్తుంది. 

517.ఊహ ఆత్మది, ఆలోచన మనస్సుది. మనస్సు ఊహించిందని, ఆత్మ ఆలోచించిందని అనకూడదు.

518.ముందే నిర్ణయించుకోవడమును “పథకము” అంటాము. పుట్టినపుడు నిర్ణయించబడిన దానిని “జాపథకము” అంటాము. జాపథకము అనునదే నేడు జాతకము అను పేరుతో కలదు.

519.అద్వైతులు విశిష్టాద్వైతులు, ద్వైతులు ఆత్మను మరిచారు. పరమాత్మను జీవాత్మను గురించే మాట్లాడారు.

520.పరమాత్మనూ జీవాత్మనూ కాక, ఆత్మ కూడ ఒకటి కలదని చెప్పినది ఒకేఒక త్రైతసిద్ధాంతము.

521.అద్వైతులు పరమాత్మను మాత్రము చెప్పగ విశిష్టాద్వైతులు పరమాత్మను కొంత విశిష్టముగ చెప్పారు. ద్వైతులు పరమాత్మను జీవాత్మను గురించి చెప్పారు.

522.ఆత్మను గురించి ప్రత్యేకించి చెప్పినది త్రైతసిద్ధాంతము ఒక్కటే. 

523.ఒకే పరమాత్మను గురించి చెప్పినవారు అద్వైతులు, విశిష్టాద్వైతులు కాగ, పరమాత్మ, జీవాత్మ అను ఇరువురిని చెప్పినవారు ద్వైతులు కాగ, పరమాత్మనూ, జీవాత్మనూ, ఆత్మనూ ముగ్గురిని గురించి చెప్పినవారుత్రైతులు.

524.అవధులులేని సమాచారమును మోసుకొచ్చినవాడు అవధూత ఒక్కడే. అతను ఎప్పుడో ఒకపుడు భూమిమీదకు వస్తాడు. అతనే భగవంతుడు.

525.తామసులు, రాజసులు, సాత్త్వికులు, యోగులని మనుషులను నాల్గు తెగలగా గీతలో భగవంతుడు చూపగా, అదే మనుషులు అజ్ఞానులుగ, జ్ఞానులుగ, యోగులుగ, భగవంతునిగా నాల్గురకములుగా ఉన్నారనిత్రైతసిద్ధాంత ఆదికర్త తెలుపుచున్నాడు.

526.గుణములలోని అరిషట్వర్గములోని మొదటి ఆశా చివరి అసూయా రెండూ ప్రత్యేకముగ మనిషిలో పని చేయుచున్నవి.

527.అంతఃకరణములలోని మొదటి మనస్సు చివరి అహము రెండూ ప్రత్యేకించి పని చేయుచున్నవి.

528.శరీరములోని మనస్సును గుఱ్ఱముగ, అహమును కాకిగ పోల్చవచ్చును.

529.మనో విషయములను గుఱ్ఱపునాడగ, అహంకార పనులను కాకినాడగ చెప్పవచ్చును.

530.గుఱ్ఱపునాడను లేకుండ చేసుకొంటే బ్రహ్మయోగమూ, కాకినాడను లేకుండ చేసుకొంటే కర్మయోగమూ లభ్యమగును.

531.ఆధ్యాత్మికమనునది శరీరము బయటలేదు. శరీరములోపలే ఉన్నది.

532.పక్షి పగలు ఎంత ఎగిరినా సాయంకాలమునకు తిరిగి తన గూడును చేరినట్లు, మనసు ఎన్ని విషయములలో తిరిగినా చివరకు తిరిగి తన గూడు అయిన బ్రహ్మనాడినే చేరును.

533.నీవు అందరికి మామ అవ్వాలంటే చందమామకావాలి. చందమామ కావాలంటే దైవజ్ఞానము తెలియాలి.

534.'న' అంటే కాదు అని అర్థము. 'మమ్' అంటే నేను అని అర్ధము. 'నామమ్' అంటే నేను కాదు అని అర్థము.

535.'సం' అంటే జ్ఞానము, ‘అంతకమ్' అంటే ఏమాత్రములేనిది అని, అంతమైపోయినదని అర్థము. సంతకము అంటే జ్ఞానములేనిదని అర్థము.

536.'దస్' అంటే పది అనీ, 'కత్' అంటే విషయములతో కుడుకొన్న జాబులని అర్ధము. 'దస్ కత్' అంటే పది విషయములతో కూడుకొన్నదని (దశేంద్రియముల సమాచారముతో కూడుకొన్నదని) అర్థము.

537.'సిగ్' అనగ గుర్తు అని, 'నేచర్' అనగ ప్రకృతి అని అర్థము. 'సిగ్నేచర్' అనగ ప్రకృతికి గుర్తు అని అర్థము.

538.ఆత్మను గురించి చెప్పుకొంటే ఆధ్యాత్మికము అవుతుంది. జీవాత్మను గురించిగానీ, పరమాత్మను గురించి చెప్పుకొంటే ఆధ్యాత్మికము గాదు.

539.ఒకే పరమాత్మను గురించి చెప్పు అద్వైతులుగానీ, విశిష్టాద్వైతులు గానీ, జీవాత్మ పరమాత్మలను ఇద్దరిని గురించి చెప్పు ద్వైతులుగానీ, ఆత్మను గురించి చెప్పనిదే ఆధ్యాత్మికులు కాలేరు.

540.ఆత్మను గురించి సవివరముగ చెప్పుచున్న త్రైతులు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికులు.

541.తెలియని దానిని తెలుపునది ఆత్మ మాత్రమే. అందువలన పరిశోధన ఆత్మదే! సిద్ధాంతమూ ఆత్మదే!!

542.ఈశ్వరుడు అనగా అధిపతి అని అర్థము. జీవేశ్వరుడు అనగా ఆత్మ, పరమేశ్వరుడు అనగా పరమాత్మ, ఏ ఈశ్వరుడుకాని వాడు జీవాత్మ.

543.అయమాత్మ బ్రహ్మ అనుమాట పూర్తి తప్పు. నీ ఆత్మ ఆత్మేకానీ బ్రహ్మకాదు.

544.అయమాత్మ బ్రహ్మ అంటే ఆత్మకంటే వేరుగనున్నానను పరమాత్మ మాటయొక్క అర్థమే తప్పగును.

545.నీ ప్రక్కనున్నవాడు ఆత్మ, నీ చుట్టూ ఉన్నవాడు పరమాత్మ, ఒక్కచోటున్న నీవు జీవాత్మవు.

546.నఖలు, శిఖలు రెండు ఆత్మకు చిహ్నములు, ముఖము ఒక జీవాత్మకు గుర్తు.

547.భయమూ ధైర్యమూ రెండూ శరీరములోనే ఉన్నాయి. రెండూ గుణములలాంటివే.

548.భయమును శరీరములోపల నీవే లేకుండ చేసుకోవలెను. అంతేకానీ బయటి దేవతలు నీ భయమును లేకుండ చేయలేరు.

549.గుడిలో దేవతలు హస్తమును చూపునది నీ హస్తమును నీవు చూచుకొమ్మని. కానీ అది అభయహస్తము కాదు.

550.వాయువుతో కూడుకొన్నది ఆయువు. అందువలన వాయువైన శ్వాస ఉన్న కాలమునే ఆయువు అంటున్నాము.

551.నీ తల్లి ప్రకృతి, నీ తండ్రి పరమాత్మ నీతోపాటు పుట్టినవారందరు జీవుళ్ళు. అందువలన అందరు నీకు సోదరులు సోదరీలుగా ఉన్నారు. ఈ విషయమునే అందరికి తెలియునట్లు పెళ్లి దినము నిన్ను పెళ్లికొడుకుఅట్లే నీ భార్యను పెళ్లి కూతురు అంటున్నారు.

552.పుస్తకము, మస్తకము (తల) రెండు సమాచార నిలయములే.

553.పుస్తకములో ఏ సమాచారమైన ఉండవచ్చును. అట్లే మస్తకములో ఏ సమాచారమైన ఉండవచ్చును.

554.పుస్తకములోని సమాచారమును బట్టి ప్రకృతికి సంబంధించినదిగ, పరమాత్మకు సంబంధించినదిగ విభజించవచ్చును.

555.పుస్తకములోని సమాచారము కావ్యములుగ, పురాణములుగ, చరిత్రలుగా, శాస్త్రములుగ వ్రాయబడి ఉన్నది.

556.మస్తకములోని విషయములు కూడ తామసముగ, రాజసముగ, సాత్త్వికముగ, యోగముగ పేర్చబడియున్నవి.

557.నోటి నుండి వచ్చుమాట నీతితో(న్యాయముతో) కూడుకొని ఉండాలని, అట్లుకాకపోతే జ్యోతితో(జ్ఞానముతో) కూడుకొనియైన ఉండాలన్నారు. జీవితములో అటు ప్రపంచ న్యాయములోకానీ, ఇటు దైవజ్ఞానములోగానీఖ్యాతి గడించాలని అందరికి జ్ఞప్తియుండులాగ మూతి, నీతి, జ్యోతి, ఖ్యాతి అన్నారు.

558.చావులో 24 భాగములతో కూడుకొన్న శరీరము నిన్ను వదలి పోవుచున్నది. అదియే వర్ధంతి. 

559.పుట్టుకలో 24 భాగములతో కూడుకొన్న శరీరము నీకు తగులుకొనుచున్నది. అదియే జయంతి.

560.చావుతర్వాత, పుట్టుక ముందు నీకు శరీరములేదు. కానీ అపుడు నీవు, నీ ఆత్మ, నీ కర్మ, నీ గుణములు నాల్గుచక్రముల చట్రములో ఇమిడియున్నాయి.

561.ఆ చక్రముల చట్రము బ్రతికిన శరీరములో నుదిటి భాగములో ప్రతిష్ఠింపబడి ఉన్నది.

562.నీవు, నీ ఆత్మ, నీ కర్మ, నీ గుణములు రహస్య ప్రదేశములో రహస్యముగ ఉన్నవి. ఎవరికి తెలియవు.

563.నీలోని నీరహస్యమును తెలుపు నిమిత్తము త్రైతులు బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములనబడు నాలుగుచక్రముల గుర్తును నుదిటి మీదనే ధరిస్తున్నారు.

564.బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల వివరమును తెలిసిననాడు తన యొక్క రహస్యమును తెలిసినట్లగును.

565.బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల వివరము తెలియనివాడు ఎవడైన అటు ఆత్మజ్ఞానముకానీ, ఇటు జీవాత్మ జ్ఞానముకాని తెలియనివాడే.

566.తనలోని నాల్గుచక్రములను తెలియనివారు అద్వైతులుకానీ, విశిష్టాద్వైతులు కానీ, ద్వైతులుకానీ ఆత్మజ్ఞానులు కాలేరు.

567.మనో యోచనలు అందరికి తెలుస్తున్నవి. కాని అహంకారము ఎవరికి తెలియకుండ పని చేయుచున్నది.

568.తెలియకుండ పనిచేయు అహమును నల్లని కాకిగ, తెలిసేటట్లు పనిచేయు మనస్సును తెల్లని గుఱ్ఱముగ పోల్చి చెప్పవచ్చును.

569.కాకిని (అహమును) వశము చేసుకోవడమును కర్మయోగముగ గుఱ్ఱమును (మనస్సును) అదుపు చేయడమును బ్రహ్మయోగముగ వర్ణించవచ్చును.

570.శరీరములోపలి జ్ఞానము తెలియనివాడు ఎప్పటికి దైవజ్ఞానమును తెలియలేడు. మోక్షమును పొందలేడు.

571.లోపలి జ్ఞానము తెలియకనే, బుద్ధుడు బయటి భార్యా పిల్లలను వదలి పెట్టి పోయాడు.

572.నీ అన్న ఆత్మ, నీ తండ్రి పరమాత్మ ఉన్నది నీశరీరములోనే అని మరువద్దు.

573.భౌతిక శాస్త్రమును తెలిసినవారికి శరీరములోని ఎముకలు,కండలు, మెదడు, రక్తము మాత్రమే కనిపించును. కానీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహములు ఏమాత్రము కనిపించవు.

574.శరీరములో భాగములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అనునవే ఎవరికి కనిపించనపుడు, శరీర భాగములుకానటువంటి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఎలా కనిపించును?

575.వ్యాసుడు 18 పురాణములను, 6 శాస్త్రములను వ్రాశాడు. కాని వాటిలో కొన్నిటిని చెప్పి వ్రాయించినవాడు వ్యాసుని శరీరములోని ఆత్మని తెలియవలెను.

576.వ్యాసుని శరీరము నుండి ఆత్మ 18 పురాణములను, 5 శాస్త్రములను మాత్రమే వ్రాయించినది. ఆరవ శాస్త్రమును ఆత్మ స్వయముగ వ్రాయలేదు.

577.పరమాత్మ తెలుపగ ఆత్మగ్రహించి శరీరముతో దానినే వ్రాయించినది. అదియే ఆరవ శాస్త్రమైన బ్రహ్మవిద్యాశాస్త్రము.

578.ఆత్మకు కూడ తెలియని ఆరవ శాస్త్రమును మనిషి నాకు తెలుసుననుకోవడము అజ్ఞానము కాదా?

579.ఆత్మ నుండి తెలిసిన సిద్ధాంతమును నేను కనిపెట్టానని చెప్పుకోవడము అహము కాదా? 

580.ఏ సిద్ధాంతమైన మనిషిది కాదు, వానిలోని ఆత్మది. న్యూటన్ సిద్ధాంతమును న్యూటన్ కనిపెట్టలేదు. అతని ఆత్మ చెప్పినది.

581.ఊరు అనగ ఊరునదని, లేక ఊట కల్గినదని అర్ధము. నీ ఊరు ఏదో తెలుసునా?

582.ఏడు ఊటలు కల్గినది నీ ఊరు. ఏడు ఊటలున్న ఊరు నీ శరీరమేనని తెలుసుకో.

583.శరీరమనే ఊరులో 24 మంది సహచరులతో నీవు నివసిస్తున్నావని మరువద్దు!

584.ఊరులో నీవున్నా ఊరంతా నీవులేవు. ఊరులోపల ఒక ఇంటిలో మాత్రము నీవున్నావు. ఆ ఇల్లు ఒక్కటే నీది.

585.నీవున్న శరీరమంతా నీది కాదు. శరీరములోపల ఒకచోట మాత్రము నీవున్నావు. ఆ చోటు మాత్రమే నీది.

586.ఊరికి ఒక పెద్ద ఉంటాడు అతనిని ఇపుడు సర్పంచ్ అని, పూర్వము పాలెగాడు అని అనెడివారు. అలాగే శరీరమునకు ఒక పెద్ద ఉన్నాడు. అతనే ఆత్మ. ఊరును పూర్వము పాలెము అని దాని పెద్దను పాలెగాడుఅని అనెడివారు.

587.నేరస్థుడు తన పని ఫలితమైన పాపమును పొందినవాడు. రోగస్థుడు తన పాపఫలితమైన శిక్షను పొందినవాడు.

588.తప్పు ఏదైన నేరము అవుతుంది. ప్రపంచములో అన్యాయముగ ప్రవర్తించినవాడు ఎవడైన నేరస్థుడే అవుతాడు.

589.నేరము ఏదైన దానిఫలితము పాపమే అవుతుంది. పాపము ఏదైనా దాని ఫలితముగ జీవునకు బాధ కలుగుచునే ఉండును.

590.జరిగిపోయిన కాలములోని నేరస్థుడు, జరుగుచున్న కాలములో రోగస్థుడు. జరుగుచున్న కాలములోని నేరస్థుడు, జరుగబోవు కాలములో రోగస్థుడు అవుతాడు.

591.చేయుచున్న నేరము ముందే ప్రకృతిచే నిర్ణయమైన పతకములోనిదే. ఎవడు స్వయముగ చేయలేదు. కానీ తానే చేశానని అనుకోవడము వలనే రోగమును పొందవలసివచ్చినది.

592.“జాగ్” అనగ మేలుకోవడము లేక మెలుకువ కల్గియుండడము, 'గత్" అనగ గడచిపోయినదని అర్థము. జాగ్+గత్=జాగ్గత్ అయినది. కాలక్రమమున రూపాంతరము చెంది జాగ్రత్ అయినది. దానినే జాగ్రత్తఅనికూడ ఉచ్ఛరించుచున్నాము. 

593.గడచిపోయిన పుట్టుకను గురించి తలచుకొని, రాబోవు చావును గురించి మెలుకువ కల్గియుండవలెను.

594.తన చావును తాను జ్ఞప్తి చేసుకొనువాడు జాగ్రత్త కల్గినవాడు. తన చావును మరచినవాడు అజాగ్రత్తపరుడు.  

595.నాకు ఎన్నో పుట్టుకలు, ఎన్నో మరణములు గడచిపోయాయి. అవన్ని నాకు తెలియవు. నాకు తెలిసినది, ప్రస్తుతము నేను జన్మించియున్నాను. ఇక వచ్చేది మరణమే. దానిని గురించి నేను మెలుకువగానే ఉన్నాననిజ్ఞాని అనుకొనుచుండును.

596.స్త్రీ అవివాహితగా ఉన్నపుడు ఇద్దరు భర్తలు కల్గియుంటుంది. వివాహమైన తర్వాత ముగ్గురు భర్తలు కల్గియుంటుంది. అందువలన స్త్రీకి కనిపించే భర్త ఒకడు, కనిపించని భర్తలు ఇద్దరు కలరని చెప్పవచ్చును.

597.శరీరములో గుణములు వేరు, ఆత్మవేరుగ ఉన్నాయి. జీవుడు గుణములను వదలినపుడే ఆత్మ తెలియును.

598.ఏ గుణముచేత ఆత్మను తెలియలేము. అందువలన ఆత్మ జ్ఞానమునకు ప్రేమ అను గుణము, దయ అను గుణము, దానము అను గుణము పనికిరావు.

599.చాలామంది అహమును ఒక గుణము అనుకొనుచున్నారు. కానీ అహము గుణముకాదు. శరీరములోని ఒక భాగమే అహము.

600.గుణములు శరీరములోని భాగములుకావు. శరీరములోనే శరీరమునకు అతీతముగ ఉండి, శరీరముకానటువంటి బ్రహ్మ కాల, కర్మ, గుణచక్రములను నాల్గుచక్రముల సముదాయములో క్రిందగల గుణచక్రములో గుణములు కలవు. 

601.శరీరముకాని గుణములు మొత్తము 36, శరీరములోన అంతఃకరణములు నాలుగు, వాటిలో అహము ఒకటి.

602.శరీర అంతర్భాగములైన అహము వలన కర్మయోగము, మనస్సు వలన బ్రహ్మయోగము, బుద్ధి వలన భక్తియోగము కల్గుచున్నవి.

603.దేవునికి దయలేదు. దయయేకాదు మరి ఏ గుణములేదు.

604.దేవునికి ప్రేమ లేదు. అసూయలేదు. కానీ ఇష్టము అయిష్టము గలవు.

605.ఇష్టమును ప్రేమ అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రేమ వేరు, ఇష్టమువేరు.

606.కామమును మోహమును రెండింటిని ఒకటే అనుకుంటారు. కానీ కామము వేరు, మోహము వేరు.

607.ఒక దేవున్ని పొగడడము భక్తి, జ్ఞానము అనుకుంటారు. కానీ అది భక్తి కావచ్చును, కానీ జ్ఞానము ఏమాత్రము కాదు.

608.ఏదో ఒక దేవతనుగూర్చిగానీ దేవున్ని గూర్చిగానీ పాడడము కీర్తన అవుతుంది. కీర్తనవేరు, ధ్యానము వేరు.

609.ఒకరిని కీర్తించడము బయటి ప్రజలకు తెలుస్తుంది. ధ్యానించడము లోపలి ఆత్మకు మాత్రమే తెలుస్తుంది.

610.నీచము, ఉన్నతము వానివాని బుద్ధిని బట్టియుండును. పందికి బచ్చలిగుంత ఉన్నతము, అది మనిషికి

611.నీచము. ఒకని బుద్ధికి దైవజ్ఞానము ఉన్నతముగ కనిపిస్తే, ఇంకొకని బుద్ధికి దైవజ్ఞానము నీచముగ, ప్రపంచ జ్ఞానముఉన్నతముగ తోచును. 

612.లోపల బుద్ధి మారినపుడు బయట నీచము ఉచ్ఛముగా మారగలదు. అపుడే మనిషికి అంతవరకు నీచముగ కనిపించిన జ్ఞానము ఉన్నతముగ తోచును.

613.నీవు చెప్పే జ్ఞానము ఇంకొకనికి నీచముగ కనిపిస్తుందంటే, అది వాని బుద్ధిలోపమే అని గ్రహించాలి.

614.అన్నముతో ఆకలి తీరుతుంది. జ్ఞానముతో కర్మతీరుతుంది. 

615.ఆకలి కడుపులో బాధ కలిగిస్తుంది. కర్మ తలలో బాధ కలిగిస్తుంది.ధనికుడు వస్తుదానము చేయుట, జ్ఞాని జ్ఞానదానము చేయుట మంచిది. 

616.ధనికుడు వస్తుదానము చేయుట, జ్ఞాని జ్ఞానదానము చేయుట మంచిది.

617.ధనికుడు జ్ఞానదానము చేయుట, జ్ఞాని వస్తుదానము చేయుట ధర్మవిరుద్ధము.

618.శాస్త్రమును పురాణమనడము, పురాణమును శాస్త్రమనడము ఏనుగును ఎలుకయనీ, ఎలుకను ఏనుగుయనీ అన్నట్లుండును.

619.నీకు సరిపోనంత మాత్రమున మంచి చెడుకాదు. అలాగే నీకు నచ్చినంతమాత్రమున చెడు మంచికాదు.

620.కర్మ అంటే అజ్ఞానులకు అర్థముకాదు. కర్మలేనిది ఎవనికి క్షణము కూడ గడవదు.

621.క్షణము గడచినదంటే కర్మలో తృణము తీరి పోయినట్లేనని తెలుసుకో. 

622.నీకు వచ్చునవన్ని కర్మనుబట్టి వచ్చును. నీకున్నవి అన్ని కర్మను బట్టి ఉన్నవి. నీకు పోయినవన్ని కర్మనుబట్టిపోయినవి.

623.నాది అనుకొను నీ కులము ఏదో నిజముగ నీకు తెలుసునా? మధ్యలో ఏమైనా మారిందేమో! 

624.నాది అనుకొను నీ మతమేదో నీకు నిజముగ తెలుసునా? మధ్యలో ఏమైనా మారిందేమో!

625.నీకు తెలియకుండానే ఎప్పటికి మారని మతములో, ఎప్పటికి మారని కులములో నీవున్నావు.

626.నీవు ఎప్పటికి మారని జీవకులములో ఉన్నావు. అలాగే ఎప్పటికి మారని దైవమతములో ఉన్నావు.

627.నీ గోత్రము ఎప్పటికి ప్రకృతియే. నీ ఇంటిపేరు ఎప్పటికి కర్మయే. 

628.ఇంటి పేరులేనివాడు నిజమైన నీతండ్రి పరమాత్మయే.

629.ఇంటి పేరున్న తండ్రి నీ ఒంటికి సంబంధించినవాడేనని తెలుసుకో.

630.హద్దులేని మనస్సు పద్దులేని కర్మవలన పరుగెడుచున్నది.

631.దంచుతున్న దంతముల మధ్యలో భయములేని నాలుక ఏ విధముగ మసలుచున్నదో, అదే విధముగ కష్టపెట్టు కర్మల మధ్యలో నిర్భయముగ జీవుడుండవలెను.

632.తాను జీవుడైయుండి తన శరీరములోని తన అడ్రస్ ఏ జీవునికి తెలియకుండ పోయినది.

633.శరీరమను ఊరిలో తన ఇల్లుగాని, తన పొరుగువానిని గాని తెలియకుండ బ్రతుకుచున్నవాడు జీవుడు.

634.ప్రపంచ జ్ఞానములో రాజుకు పేదకు ఎంత తేడా కలదో, పరమాత్మ జ్ఞానములో బ్రహ్మర్షికి బేవర్షికి అంత తేడా గలదు.36  

635.ఎంతటి చెట్టుకైన గాలిపోటు తప్పదు. ఎంతటివానికైన కర్మపాటు తప్పదు.

636.ఎంత జ్ఞానికైనా మనో చలన బాధతప్పనట్లు ఎంతటి దేవతకైనా కష్టాలూ బాధలు తప్పవు.

637.మనుషులలో ధనికులు బీదవారున్నట్లు దేవతలలో కూడ ధనికులు బీదవారు కలరు.

638.మనుషులందరికి ఒకే దేవుడు ఎవడైతే ఉన్నాడో, దేవతలకందరికి కూడ అతనే దేవుడు.

639.ఎవడైన కష్టాలనుండి సుఖములలోనికి వచ్చినా లేక సుఖాలనుండి కష్టాలలోనికి పోయినా అది వాని బుద్ధిని బట్టి కాదు, వాని కర్మనుబట్టియని తెలియవలెను.

640.నీరు భూమిలోపల, భూమి మీద ఉంటుంది. అలాగే పరమాత్మ శరీరములోపల, శరీరము బయటకలడు.

641.పండులోని రసము పండులోపల అంతటా ఉంటుంది, కానీ పండు బయట ఉండదు. అలాగే ఆత్మ శరీరము లోపలనే ఉంటుంది, కానీ శరీరముబయట ఉండదు.

642.చెవిటి, మూగ, కుంటి, గ్రుడ్డివాడైన బిక్షగాడు దేవాలయ ఆవరణములో ఒక్కచోట మాత్రము ఉంటాడు, కానీ దేవాలయమంతా తిరగడు. అలాగే ఏ చూపులేని జీవుడు శరీర ఆవరణములో ఒక్కచోట మాత్రమే ఉంటాడు.

643.పక్షి ఆకాశములో పైకి ఎగిరినట్లు ఉన్నతస్థితిని యోగము ద్వారా ఆత్మ జీవునికి అందివ్వాలనుకొంటుంది.

644.పాము భూమి రంధ్రములలోనికి దూరినట్లు మాయ కార్యముల ద్వారా జీవున్ని నీచస్థితిలోనికి చేర్చాలను  కొంటుంది.

645.ఊహ ఆత్మ ద్వారా పుట్టితే, ఆలోచన మనస్సు ద్వారా పుట్టుతుంది.

646.ఊహాత్మకమైనది సిద్ధాంతము, అనగా ఒక సిద్ధాంతమును మొదట ఆత్మే అందిస్తుంది.

647.సిద్ధాంతము ఆత్మద్వారా పుట్టితే, రాద్ధాంతము మనస్సు ద్వారా పుట్టుచున్నది.

648.ఊహకానీ, ఆలోచనగానీ లోపలనుండి వచ్చునవే. అందువలన ఏది ఊహనో, ఏది ఆలోచనో తొందరగ గుర్తించలేరు.

649.చాలామంది ఊహను ఆలోచనగా, ఆలోచనను ఊహగా లెక్కించుచుందురు.

650.అహము ఎక్కడినుండి మొదలు పెట్టి పని చేయుచున్నదో ఎవరికి తెలియదు. అందువలన అహమును నల్లని కాకిగ లెక్కించవచ్చును.

651.ఎవడు ఎరుకలో ఉండి నిద్రలోనికి పోలేడు. అలా పోగలిగితే వాడే బ్రహ్మయోగి అగును.

652.కాలికి ఎంత గాయమైనదన్నది ముఖ్యము కాదు. గాయము ఎంత బాధిస్తున్నదీ, జీవుడు ఎంత అనుభవిస్తున్నాడు అన్నదీ ముఖ్యము. అదియే కర్మానుభవము!

653.యోగాసనములు ఎన్ని ఉన్నా అవి శరీర వ్యాయామమునకు సంబంధించినవే, కానీ యోగమునకు సంబంధించినవి కావు.

654.యోగాసనములకు, యోగములకు ఏమాత్రము సంబంధములేదు. 

655.యోగాసనములను నేర్చినవాడు యోగికాలేడు.

656.ప్రాణాయామము నేర్చినవాడు బ్రహ్మయోగికావచ్చును. కానీ కర్మయోగి కాలేడు.

657.కర్మయోగిని ఎవరు గుర్తించలేరు. కానీ బ్రహ్మయోగిని అందరు సులభముగ గుర్తిస్తారు.

658.బ్రహ్మవిద్యను డబ్బుతోకొనలేము. కానీ ఒక్క శ్రద్ధతో మాత్రమే దానిని సంపాదించవచ్చును.

659.జ్ఞానము కల్గిన పుస్తకములను డబ్బుతో కొనవచ్చును. కానీ ఆ పుస్తకములోని జ్ఞానమును శ్రద్ధతో తప్ప డబ్బుతో తలకు ఎక్కించుకోలేము.

660.దుస్తులు శరీరమునకు అందమును చేకూర్చినట్లు ఆత్మజ్ఞానము జీవునకు ఆనందమును చేకూర్చగలదు.

661.తినేదానికి బ్రతకడము, బ్రతికేదానికి తినడము జీవితముకాదు. 

662.దైవజ్ఞానము కల్గిన జీవితము గొప్పకార్యములాంటిది. దైవజ్ఞానము లేని జీవితము వృథాకార్యములాంటిది.

663.ఆత్మానందమును తప్ప మరి ఏ ఇతర ఆనందములను గొప్పగ తలవవద్దు.

664.దినములో ఉదయకాలము, మధ్యకాలము, సాయంకాలము ఉన్నట్లు మనిషి జీవితములో పుట్టడము, పెరగడము, చావడము కలవు.

665.భూమి మీద ఎవరైన గురువులుగ, స్వామిజీలుగ, బాబాలుగ చలామణి కావచ్చును. వీరిని ఎవరూ కాదనరు. కానీ భగవంతుడు భూమిమీదకు వచ్చినపుడు వారి స్థోమత ఏమిటో భగవంతుడు చెప్పు జ్ఞానమువలన బయటపడగలదు.

666.గురువులుగ, స్వామిజీలుగ, బాబాలుగ, పీఠాధిపతులుగ చలామణి అగువారిలో అసలైన ఆధ్యాత్మికత ఉందో లేదో చెప్పువాడు ఒక్క భగవంతుడే.

667.గురువులకు, స్వామీజీలకు, బాబాలకు, పీఠాధిపతులకు విభిన్నముగనున్న భగవంతుని ఎవరు గుర్తించలేరు.

668.దేవుడు భూమిమీదకు వేల సంవత్సరములకొకమారు ఎవరికి తెలియకుండ భగవంతుడిగ వచ్చును. భగవంతుడు వేల దినములకొక మారు ఎవరికి తెలియకుండ దేవునిగా ప్రవర్తించును.

669.ఆదరణకర్త అయిన భగవంతుడు మానవులను తన జ్ఞానముతోనే ఆదరించును. అట్లుకాక ధన, కనక, వస్తు, వాహనములనిచ్చి ఆదరించడు.

670.మనిషి భూమిమీద దైవజ్ఞానము ద్వారా తప్ప ఏ దాని చేత నిజమైన ఆదరణ పొందడు.

671.దేవుడు భూమిమీదకు వచ్చునపుడు పలానా మతములో, పలానా కులములో వస్తాడని ఎవరు చెప్పలేరు.

672.శృతి ఉంటే లయ ఉంటుంది, శృతి అంటే జ్ఞానము, లయ అంటే మోక్షము.

673.శృతి లయలు కల్గిన దానిని “సంగీతము” అంటున్నాము. “సం” అనగ మంచి “గీత” అనగ హద్దు. సంగీతము మంచి జ్ఞానము కల్గినదని అర్థము.

674.సం అంటే మంచిదనీ, సారము అనగ రుచి అని అర్థము. దీనిప్రకారము సంసారము అనగ మంచి రుచిగలదని అర్థము.

675.సంసారము దేహములోపల ఉన్నది. దేహములోని సంసారములో సంగీతమును కల్గినవాడు ధన్యుడు.

676.సంసారము సంగీతమయము కావాలి కానీ సాగరమయము కాకూడదు.

677.“సంసారము సంగీతము” అను వాక్యము "సంసారము సాగరము” అను వాక్యము రెండూ కలవు. అందరికి సంసారము సాగరమనే తెలుసు. కానీ సంసారము సంగీతమని తెలియదు.

678.సంసారము ఎవరికి బయటలేదు. అందరికి దేహములోపలే సంసారముగలదు.

679.నీవు నీకన్ను వెనుకలనుండి దృశ్యములను చూస్తున్నావు. నీకన్ను వెనుకల నీవు ఎంతదూరములో ఉన్నావో చెప్పుకోగలవా?

680.మానవున్ని తనవైపు లాగుకొనుటకు మాయకు మొదటి ఆయుధము “ఆకలి”.

681.కడుపులో కలుగు ఆకలివలన ధనికుడుగాని, బీదవాడుగాని, జ్ఞానిగాని, అజ్ఞానిగాని బయట ప్రపంచములో ఏమైన చేయుచున్నాడు.

682.మానవున్ని తనవైపు లాగుకొనుటకు మాయకు రెండవ ఆయుధము ఆలోచన.

683.ఆకలి, ఆలోచన రెండు మాయయొక్క ప్రియపుత్రికలు, నిన్ను వీడని చెల్లెండ్లు.

684.నీకు తండ్రి పరమాత్మకాగ, తల్లి ప్రకృతి (మాయ) కాగా, ఆత్మ అన్నగ ఉండగ, ఆకలి పెద్దచెల్లెలుగ, ఆలోచన చిన్న చెల్లెలుగ ఉండగ, జ్ఞానము మేనమామగ ఉన్నది.

685.పెద్ద చెల్లెలైన ఆకలికి ఆహారము ఇస్తే కొంతసేపైన ఊరక ఉంటుంది. కానీ చిన్న చెల్లెలైన ఆలోచన మాత్రము ఏమిచ్చినా క్షణము కూడ ఊరకుండక నిన్ను వేధిస్తూనే ఉంటుంది. 

686.నీ చెల్లెళ్ళ బాధ తప్పాలంటే నీ మామతో చెప్పుకో. నీ చెల్లెండ్రను ఓదార్చు బాధ్యతగానీ, స్థోమతగానీ నీమామకే గలదు. అందుకే నీ మామను చందమామ అంటున్నాము.

687.నీఅన్న ఇంటిలో,  అన్న పనిమనుషుల మధ్యలో నీవు నీ కుటుంబ సభ్యులతో కాపురముంటున్నావు. అది తెలియక అంతా నీ సంసారమే అనుకొంటున్నావు.

688.అండజ, పిండజ, ఉద్భిజములని జీవుల శరీరములు మూడు రకములుగ ఉన్నవి. అందులో అండజ పిండజములు ఆకలి కలవిగా ఉన్నవి. ఉద్భిజములు ఆకలి లేనివిగా ఉన్నవి.

689.ఆకలిగల అండజ పిండజముల వలన రోగములు వ్యాపిస్తున్నవి. ఆకలిలేని మొక్కల వలన ఔషధములు తయారగుచున్నవి. అందువలన శరీరములు మాయకు గుర్తు, మొక్కలు జ్ఞానమునకు గుర్తు.

690.మాయ నీకు చెడును చేస్తుందని తెలుపుటకు శరీరములు దుర్గంధమును, జ్ఞానము నీకు మంచిని చేస్తుందని తెలుపుటకు చెట్లు సుగంధమును కల్గియున్నవి.

691.మాయకు గుర్తయిన శరీరములు క్రిందికి పెరిగి అధోగతిని సూచించగ, జ్ఞానమునకు గుర్తయిన వృక్షములు పైకి పెరిగి ఉన్నత గతిని సూచించుచున్నవి. 

692.నిజంగా లేని దేవున్ని లేడు అనువారు నాస్తికులు. అబద్దముగ ఉన్న దేవున్ని ఎలా ఉన్నాడు అనువారు హేతువాదులు.

693.లేని దేవున్ని లేడు అనడములో నాస్తికుల వాదన సరియైనదే అవుతుంది. కానీ ఉన్న దేవున్ని ఎలా ఉన్నాడు.అని ప్రశ్నించక లేడు అను హేతువాదము సరికాదు.

694.నాస్తికవాదము, హేతువాదము విడివిడిగ ఉండాలి. కానీ హేతువాదులమను వారికి హేతువాదమేదో తెలియక నాస్తికవాదులవలె మాట్లాడడము హేతువాదమనిపించుకోదు.

695.భౌతికము, అభౌతికము రెండు వాస్తవమే. అవి ఏ దేశములోనో లేవు నీ శరీరములోనే ఉన్నాయి.

696.తెలియని విషయమును క్షుణ్ణముగ ప్రశ్నించుకొని పరిశోధించి జవాబు తెలుసుకొనువారు నిజమైన హేతువాదులు. తెలియని అభౌతికమును లేదనువారు అజ్ఞానులేకాని హేతువాదులుకారు.

697.సైన్సును అడ్డము పెట్టుకొని అడ్డముగ మాట్లాడు అబద్దపు హేతువాదులూ, సైన్సుతో తెలియని వానిని తెలుసుకొను నిజమైన హేతువాదులూ. రెండు రకములవారు భూమి మీద కలరు.

698.ఉంటేనే ఏదైన తెలియబడేది. ఒకటి తెలియబడాలి అంటే మనలో ఉన్న అనేక ప్రశ్నలకు జవాబు దొరకాలి. అలాకాకుండ జవాబులను వెదకకనే తెలియని దానిని లేదనువాడు హేతువాది ఎలా అవుతాడు?

699.మూఢనమ్మకము గలవారిని, గాఢనమ్మకము గలవారిని వదలి, వారి మాటను నమ్మక, స్వయముగ దేవుడు అబద్దముగ ఎలా ఉన్నాడని ప్రశ్నించుకొని, పరిశోధన చేసి కనిపెట్టినవాడు నిజమైన హేతువాది.

700.మామగార్లందరు చందమామ కాలేరు. అలాగే దేవతలందరు దేవుడు కాలేరు. ఎంతమంది మామగార్లున్నా భూమిమీదనే ఉంటారు. కానీ చందమామ ఆకాశములోనే ఉంటాడు. అలాగే ఎందరు దేవతలున్నా వారంతాభూమి మీదనే ఉంటారు. కానీ దేవుడు శరీరములోనే ఉంటాడు.

701.జరుగబోవు తన బ్రతుకు తెరువును గురించి చింతించుట వలననే మనిషిలో భయము ఏర్పడుచున్నది.

702.తన భయమును తీర్చుటకు మనిషి దేవతలను సృష్టించుకొన్నాడు. కానీ తనను ముందే దేవుడు సృష్టించాడని అనుకోవడము లేదు.

703.తనను సృష్టించిన దేవున్ని మరిచి తాను సృష్టించుకొనిన దేవతలను ఆరాధించడము మనిషికి ముఖ్యమైన పని అయినది.

704.మనుషులు సృష్టించుకొన్న దేవుళ్ళను గురించి నాస్తికులు మూఢనమ్మకమని వాదిస్తున్నారు. కానీ మనుషులనే సృష్ఠించిన దేవున్ని గురించి వారు ఆలోచించడములేదు.

705.ఎద్దు ఈనిందంటే గాటికి కట్టివేయమన్నట్లు, దేవుడు అంటేనే నాస్తికులు మూఢనమ్మకమనుచున్నారు. ఎద్దు ఈనదు, ఆవు ఈనుతుంది అని వివరము తెలిసినవాడు ఎద్దు ఈనడమును ఖండించి, ఆవు ఈనుతుంది అనిసమర్థించును. 

706.ఆవు, ఎద్దు వివరము తెలియనివాడు ఎద్దు ఈనిందంటూనే దూడను కట్టివేయమంటున్నాడు. అలాగే దేవుడు దేవతల వివరము తెలియని నాస్తికులు భక్తి అను పదము వినిపిస్తూనే మూఢనమ్మకము దానినికొట్టి వేయమంటున్నారు.

707.దూడ అంటూనే ఆవుకు పుట్టినదా? ఎద్దుకు పుట్టినదా? అని ఆలోచించక కట్టివేయిమనువారూ, భక్తి అంటూనే దేవుని ఎడల పుట్టినదా? దేవుళ్ళ ఎడల పుట్టినదా? అని ఆలోచించక కొట్టివేయమను ఇద్దరూమూఢనమ్మకము కలవారే!

708.నాస్తికులు "ఏ దేవుళ్ళను" ఖండించి మాట్లాడాలో, ఆస్తికులు “ఏ దేవున్ని” ఆరాధించి పూజించాలో తెలియనంత వరకు ఇద్దరూ మూఢనమ్మకస్తులే!

709.మొదట పుట్టినపుడు మనిషిగ ఉన్నవాడు, కొంత చదివిన తర్వాత తాను బి.ఎస్.సి అనో, యం. ఎ అనో అనుకొనును. తర్వాత ఉద్యోగము చేయుచున్నపుడు తాను కమీషనర్ననో, సూపరెంటెండెంట్ అనో అనుకొనుచుండును. వాస్తవానికి నేనొక జీవుడనను మాట మరచి పోవుచున్నాడు.

710.ఏ రోగమూ నీ హోదాను కానీ, నీ ఉద్యోగమునుగానీ చూడదు. ఏ రోగమైన నిన్ను ఒక సాధారణ మనిషిగానే లెక్కించి బాధించునని మరువద్దు.

711.నీకు ఎంతో సన్నిహితముగనున్న నీ భార్యగానీ, నీ బంధువుగానీ నీవు రోగముతో బాధపడుచుంటే ప్రక్కనే ఉండి చూడగలరు. కానీ నీ బాధను కొద్దిగ కూడ వారు తీసుకోలేరు.

712.బయటి విద్యలలో ఎంతటి స్పెషలిస్టులైనాగానీ శరీరములోని తుస్సువలెనున్న మనస్సునుగానీ తస్సువలెనున్న అహమునుగానీ తెలియలేకున్నారు.

713.గాజు అద్దము బయటి నీ శరీరమును మాత్రము చూపుతుంది. కానీ అహమను అద్దము లోపల ఏకంగా నీ భావమును చూపుచున్నది. దానితో నేను మాత్రమున్నాననుకొంటున్నావు.

714.పాటను బాగా పాడితే నేను గాయకుడిననీ, బొమ్మను బాగా గీస్తే నేను చిత్రకారుడిననీ అనుకొను నీవు నిన్ను పాట పాడించింది, నీతో బొమ్మ గీయించింది మరొకడని తెలియకున్నావు.

715.ఒక మనిషి ఒక విద్యలో ప్రావీణ్యుడైనాడంటే ఆ ప్రావీణ్యత వానిదికాదు. శరీరము లోపలనున్న వాని ప్రక్కవానిది.

716.శరీరమను ఊరులో నీ ప్రక్కనే నివాసమున్న వాడే నిజమైన నీ పొరుగువాడు. అయినా నీవు వానితో స్నేహము చేయడములేదు.

717.ఉన్నతమైన ఉద్యోగములో ఉండేవాడే నీతో మాట్లాడక వాని హోదాకు తగినట్లుండును. అయినా స్వప్నములో ప్రధానిమంత్రియే స్వయముగ నీతో మాట్లాడును. స్వప్నములో ఆ సంఘటన ఎలా సాధ్యమైనదో నీకు తెలుసా?

718.వి.సీ.డీ ప్లేట్ను గమనిస్తే అందులో ఏమి కనిపించదు. కానీ అది ప్లేయర్లో తిరుగుచున్నపుడు అందులో ఉన్న దృశ్యములూ మాటలూ బయటపడును. అలాగే తలలో కనిపించకుండిన కర్మ జీవితములో జరుగుకొలదిబయటపడును. 

719.ఒక డి.వి.డి ప్లేట్లో తొమ్మిది గంటలకాలము మూడు సినిమాలు నిక్షిప్తమై ఉన్నవి. అలాంటపుడు స్పెషల్ డి.వి.డి లాంటి నీ తలలో ఎంత కాలము? ఎంత సమాచారము ఇమిడియున్నదో.

720.మానవుని చేత తయారు చేయబడిన కంప్యూటర్ లోని చిన్న భాగమైన హార్డ్ డిస్క్ లో వేయి పేజీల పుస్తకములువేయికంటే ఎక్కువ ఇమిడి ఉన్నపుడు, దేవుడు చేసిన కంప్యూటర్ అయిన మానవుని తలలో కోట్ల సంవత్సరముల సమాచారముండగలదు.

721.నీలో ఐదు ప్రాణములున్నవి. వాటిలో ఒక్క ప్రాణము కూడ నీవు కాదు. నీవు వేరు, నీప్రాణము వేరు. నీవు జీవాత్మవు.

722.ఏదయిన దేవుని సొమ్ముగ లెక్కించినపుడు దానిలో ఎంత భాగము కూడ పంచుకోకూడదు. అలాచేస్తే దేవున్ని కూడ భాగస్తునిగ లెక్కించినట్లగును.

723.మనము చేసే వ్యాపారములో మనుషులను భాగస్తులుగ పెట్టుకోవచ్చును. కానీ దేవున్ని భాగస్థునిగ పెట్టుకోకూడదు. అలాచేస్తే దేవుని గొప్పతనాన్ని తగ్గించినట్లగును.

724.దేవునికి ఎవడైన సేవకునిగానే ఉండవలెను, అట్లున్నపుడే దేవున్ని గౌరవించినట్లగును. అందువలన నీ వ్యాపారములో దేవునికి ఎప్పుడు వాటా పెట్టవద్దు.

725.ఒక మనిషి సొమ్మును మరియొక మనిషి వాని అనుమతి లేకుండ తీసుకొంటే లేక దోచుకుంటే అది పాపమవుతుంది. దేవుని సొమ్మును మనిషి తీసుకొంటే అది ఎంతపాపమౌనో.

726.ఒక గుడిలోని ఉండిలోనికి నీ డబ్బులు వేసి తర్వాత దానిని నీవు తీసుకుంటే ఆ గుడిలోని దేవునికి నీ మీద కోపము వస్తుంది. అలా జరిగిన సంఘటనలున్నాయి. కావున అసలైన దేవాది దేవుని విషయములో జాగ్రత్తగఉండాలి.

727.ఇప్పటికి 60 సంవత్సరముల పూర్వము తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో ఉండీలో డబ్బులు వేసి కొంత మిగుల్చుకొన్నందుకు ఆ వ్యక్తిని అరగంట తర్వాత వెంకటేశ్వరుడే శిక్షించాడు.

728.బయటి చదువులకు ఫీజులు చెల్లిస్తాము. లోపలి చదువు అయిన జ్ఞానమును దేవుడు అందిస్తే, చేతనైనది చేసేదో, ఇచ్చేదో చేయవలెను. లేకపోతే నీవు ఎన్ని జన్మలకైన ఆయనకు బాకీ ఉందువు.

729.విషము శరీరములోని ఆత్మనూ, విషయము శరీరములోని జీవాత్మనూ ఇబ్బంది పెట్టును. విషమును ఔషధము, విషయమును జ్ఞానము నిరోధించగలవు. విషములోని ప్రభావమును, ఔషధములోని నిరోధకశక్తి రెండు ఒకేపరమాత్మ వలన కలుగుచున్నవి.

730.దేవుడు ఇటు విషములోనూ అటు ఔషధములోను. ఇటు అగ్నిలోనూ అటు కట్టెలోనూ, ఇటు దేవతలోనూ అటు రాక్షషునిలోనూ, ఇటు జ్ఞానములోనూ అటు మూఢత్వములోనూ, ఇటు ఆత్మలోనూ అటు మాయలోనూఅంతటా సమానముగా ఉన్నాడు. అయినా ఆయన గొప్పతనమును ఎవరు గుర్తించలేకున్నారు.

731.ఆహార పోషక పదార్థములు నాల్గురకములని గీతలో చెప్పాడు. అవికాక ఏమి తినినా త్రాగినా అవి రెండురకముల పదార్థములుగా ఉన్నవి. ఒకటి విషము, రెండవది ఔషధము. 

732.కడుపులోనికి వేయు మూలపదార్థములు మొత్తము ఆరు కాగా, వాటిని పోషకపదార్థములనీ, విషపదార్థములనీ, ఔషధ పదార్ధములనీ మూడు రకములుగ విభజించవచ్చును. ఈ మూడురకముల పదార్ధములు ఆత్మమీదనేపని చేయుచున్నవి.

733.మనిషి పదార్థములను తింటున్నాడు, కానీ ఏది ఏ పదార్థమైనది కొన్నిటిని తెలిసి తింటున్నాడు. కొన్నిటిని తెలియక తింటున్నాడు. అవన్ని వాని కర్మానుసారమే లభిస్తున్నాయి. తినేది త్రాగేది ఏదైనా కర్మానుసారమేదొరుకుచున్నవి.

734.ఒకే పదార్థమే రోగమున్నపుడు తింటే ఔషధముగ, రోగము లేనపుడు తింటే విషముగ పని చేయుచున్నది. కొన్ని పదార్థములు రోగమున్నపుడు తింటే విషముగ, రోగములేనపుడు తింటే పోషకముగ పనిచేయుచున్నవి. ఇంకొక విచిత్రమేమిటంటే ఒకే పదార్థము ఒకనికి ఔషధముగ, మరొకనికి విషముగ పనిచేయుచున్నది. దీనినిబట్టి చూస్తే అన్నిటికి కర్మేకారణమని తెలియుచున్నది.

735.ప్రపంచ కార్యముల మీద శ్రద్ధ కర్మప్రకారమే ఉండును. కానీ పరమాత్మ సంబంధ (దైవసంబంధ) కార్యముల మీద శ్రద్ధ నీ ఇష్టప్రకారమే ఉండును. అనగా జ్ఞానములో నీవు స్వతంత్రునివన్న మాట. అజ్ఞానములోఎప్పటికి అస్వతంత్రునివేనని తెలుసుకో.

736.జీవితము సుఖ దుఃఖ సంగమము. అయినా మనిషి సుఖాలనే కోరుకుంటాడు. దుఃఖాలనువద్దనుకుంటాడు. కానీ అవేవీ నీ ఇష్టప్రకారము రావు, పోవు. 

737.ఎంత జ్ఞానము వినినా మనిషి అజ్ఞానము వైపే మాట్లాడుతాడు. మనిషి ఎంత అజ్ఞానము వైపు మాట్లాడినా గురువు ఓర్పుగా మనిషిని జ్ఞానమువైపు పోవునట్లే చేయవలెనని ప్రయత్నించుచుండును.

738.అహము అద్దములాంటిది, మనస్సు సినిమాలాంటిది. మనస్సు ఎప్పుడు చూపినా బయటి విషయములనేచూపుచుండును. అహము ఎప్పుడు చూపినా నిన్ను నీకే చూపుచుండును. అహములో నీవు తప్ప ఎవరు కనిపించరు. మనస్సులో అన్ని రకముల విషయములు కనిపిస్తుండును.

739.స్త్రీలింగము, పుంలింగము అని అంటున్నాము. ఈ రెండు పదములలో లింగము అనునది సాధారణముగ ఉన్నది. దీనినిబట్టి స్త్రీలలోనైనా, పురుషులలోనైనా పరమాత్మ (లింగము) సాధారణముగా ఉన్నదనితెలియుచున్నది.

740.ఏనుగు ఎంత పెద్దదైనా శిక్షకుని మాటను బుద్ధిగా వింటున్నది. మనిషి ఎంత చిన్నవాడైనా గురువుమాటను బుద్ధిగా వినకున్నాడు.

741.అహము అద్దములాంటిదే, ఎదురుగున్న వాని దృశ్యమును వానికే చూపును. తనముందు ఉన్నవానిని ఉన్నట్లే చూపునది సాధారణ అద్దము. కానీ అహమనెడి అద్దము సాధారణ అద్దముకాదు, అది ఒక అసాధారణఅద్దము.

742.అహమనెడి అసాధారణ అద్దము తనముందున్న దృశ్యమును చూపదు. తనముందున్న వాని లోపలి దృశ్యమును చూపుతుంది. ఎవడినైన వానిలోపలి భావమును బట్టి ఏవిధముగానైనా చూపగలదు. ఒక మనిషిని రాజుగా గానీ, మంత్రిగా గానీ, మాంత్రికునిగా గానీ, ఆఫీసర్గా గానీ, గుమస్తాగా గానీ, వ్యాపారిగా గానీ,బికారిగా గానీ, ధనికునిగా గానీ, రైతుగా గానీ, డ్రైవర్గా గానీ, క్లీనర్గా గానీ ఎట్లయిన చూపగలదు.

743.ప్రపంచములో బయట ఎక్కడలేని విచిత్ర అద్దము మనలోపల ఉంది. ఎక్స్-రేలు మనిషి లోపలి ఎముకలను చూపినట్లు అహం-కారాలు మనిషి లోపలున్న భావాలను వానికే చూపును.

744.లోపలి అద్దము యొక్క పనితనమును చూచినా, వినినా ఎవడైనా “ఆహా” అనక తప్పదు. ఆహా అనిపించుకొన్న అది లోపల ఎట్లుందంటే! ఎవడికైన లేని దీర్గాలు కరిపించి చూపించే తాను మాత్రము తనకున్న దీర్గాలనుతీసివేసుకొని నేను కేవలము “అహ” మునే అంటున్నది.

745.శరీరములోపల అహము ముందర వరుసగా చిత్తము, బుద్ధి, జీవుడు ఉండుట వలన బుద్ధి యొక్క యోచనలను, చిత్తము యొక్క నిర్ణయములను కలిపి జీవునిలో చూపుచున్నది. అందువలన జీవుడు నాయోచనా, నా నిర్ణయము అని అంటున్నాడు.

746.అహము ముందర చిత్తము బుద్ధి ఉన్నవనీ, ఆ తర్వాత నేనున్నాననీ, అహము ముగ్గురిని కలిసి చూపుతున్నదనీ, మా ముగ్గురికి ఎదురుగ అద్దముగావున్న అహములో బుద్ధి చిత్తము యొక్క భావములు నాయందున్నట్లుకనిపిస్తున్నవనీ, నిజముగ బుద్ధివేరు, చిత్తమువేరు, నేను వేరని ఏ జీవుడు తెలియకున్నాడు.

747.అహమను అద్దమునకు ఎదురుగా లేని మనస్సుయొక్క ఆలోచనలను మనిషి తనవనుకోలేదు. కానీ బుద్ధి చిత్తము యొక్క పనులను తనవే అనుకొంటున్నాడు. అందుకు కారణము అహము ముందర వరుసగాచిత్తము, బుద్ది, జీవుడు ఉండడమే.

748.మనస్సు చూపు ఆలోచనా దృశ్యాలను జీవుడు తాను ప్రక్కనుండి చూచినట్లే అనుభూతి పొందును. కానీ బుద్ధి చిత్తము పనులలో మిళితమైపోయి అవి తనవే అనుకొన్నట్లు మనోదృశ్యాలను అనుకోడు.

749.మనో ఆలోచనా దృశ్యాలను జీవుడు తనవేననీ, తానేనని అనుకోకుండుట వలన స్వప్నములో మనస్సు చూపు దృశ్యములను తాను ప్రక్కనుండి చూచినట్లుండును. అందువలన మనస్సు చూపువాటిని “ఆలోచన” అంటున్నాడు,కానీ “నాలోచన” అనలేదు.

750.లోచన అనగా చూచుట అని, ఆలోచన అనగా దూరముగా చూచుట అని అర్ధము. నీవు మనోభావమును ఎప్పుడు దూరముగానే చూస్తున్నావు. కావున మనస్సు అందించువాటిని ఆలోచనలే అంటున్నావు.

751.పరమతమును గురించి మాట్లాడాలనుకుంటే ముందు నీ మతమును గురించి నీవు యోచించు. 

752.పరమతములోని లోపమేమిటో? నీ మతములోని గొప్పతనమేమిటో? న్యాయముగా, నీతిగా నిర్ణయించుకో.పరమతమును గానీ, నీ మతమును గానీ, స్వార్థబుద్ధితో గానీ, రాజకీయముగా గానీ, సమాజపరముగా గానీ యోచించవద్దు.

753.ఒకవేళ నీ మతము గొప్పగా, పరమతము నీచముగా కనిపిస్తే, మతమును గురించి వదలివేసి, మతము యొక్క ప్రసక్తి లేకుండ కేవలము దేవున్ని గురించే బోధించు, దేవుడు అన్ని మతములకు పెద్ద కావున ఏమతస్థుడైనా నీ మాట వినగలడు. 

754.ఒకవేళ పరమతము గొప్పగా, నీ మతము నీచముగా కనిపిస్తే, నీవు మతమును మాత్రము మారవద్దు. నిన్నుఈ మతములోనే దేవుడు ఎందుకు పుట్టించాడో యోచించు. అపుడు మత చింతపోయి దైవ చింత కల్గుతుంది.

755.మతము అన్న పేరు ప్రతి వర్గములోను ఉన్నది. నీది ఒక పేరు కల్గిన మతమైతే, మరొకనిది ఇంకొక పేరు కల్గిన మతమైయుండును. మతములో నిన్ను దేవుడే పుట్టించాడు. కానీ నీవు కోరి ఏ మతములో పుట్టలేదు.

756.నిన్ను ఒక మతములో పుట్టించి, ఇంకొకనిని మరొక మతములో దేవుడే పుట్టించాడు. అలా నిన్నూ ఇంకొకన్నీ పుట్టించినది ఒకే దేవుడే! నీవు పుట్టిన తర్వాత దేవునికి నీవే పేర్లు పెట్టుచున్నావు. నిజముగా దేవునికి పేరులేదు,ఆకారము అంతకూలేదు.

757.మతాలకు అతీతముగా, పేర్లకు అతీతముగా, రూపములకు అతీతముగా, క్రియలకు అతీతముగా ఎవడైతే ఉన్నాడో వాడే నిజమైన దేవుడు. అతనే నిన్ను ఈ ప్రపంచమును సృష్టించినవాడు.

758.దేవుడు మనిషిని మాయలో పుట్టించి తర్వాత తనవద్దకు వస్తాడో రాడో, తనను గుర్తిస్తాడో లేదో చూడాలనుకొన్నాడు. ఆ ప్రక్రియలో మొదటిదే నిన్ను ఒక మతములో పుట్టించడము. బాగా చూచుకొంటేనీవు ప్రస్తుతము మాయలో ఉన్నావు, దేవుని వైపుపో. 

759.మనము ఎక్కడినుండి ఎక్కడకు పోవాలని ప్రశ్నిస్తే మాయవైపు నుండి దేవునివైపు పోవాలన్నది జవాబు. అనగా నీవు ముందే మాయవైపు ఉన్నావని అర్ధము. నేను పలానా మతస్థుడనని అనుకోవడము మాయ. నా దేవుడుపలానా వాడనుకోవడము మరీ పెద్ద మాయ. సృష్టికి అంతా ఒకే దేవుడు అధిపతి.

760.నీకు ఒక పేరునూ, నీకు ఒక కులమునూ, అలాగే ఒక మతమునూ ఇతరులే నీకు మొదట కరిపించారు. దేవునికి పేరుందా? కులముందా? మతముందా? అవి ఏవి లేవు. అవి లేని వానిని తెలుసుకోవాలంటే నీవునీ పేరునూ, కులమునూ, మతమునూ దేవుని విషయములో దూరముగా పెట్టుకో.

761.దేవునికి శరీరముకానీ, ఆకారముగానీ లేదు. అటువంటి వానిని ఒక ఆకారముతో ఊహించుకోవద్దు.ఊహించుకొంటే నీ ఊహ తప్పు అవుతుంది. ఆకారమున్నది ఏదైన అది దేవుడు కాదు.

762.దేవునికి ఒక ఆకారమే కాదు. నిద్ర, మెలకువ, ఆకలి, దప్పిక ఏవి లేనివాడు దేవుడు. సర్వమును వ్యాపించివాడు, అన్ని వేళల ఉన్నవాడు, అందరిని గమనిస్తున్నవాడు దేవుడు. ఆ దేవున్నే నీవు తెలుసుకో.

763.యజ్ఞముల మీద, వేదపఠనముల మీద, దానముల మీద, తపస్సుల మీద దేవునికి అయిష్టత కలదు. బ్రహ్మయోగమూ,కర్మయోగమూ, భక్తి యోగముల మూడిటి మీద దేవునికి పూర్తి ఇష్టము కలదు.

764.దేవునికి ఇష్టములేని యజ్ఞములను, దానములను, వేదాధ్యయనములను, తపస్సులను నాల్గింటిని వదలి దేవునికి ప్రీతిని కల్గించు బ్రహ్మయోగము, కర్మయోగము, భక్తియోగములను మూడిటిని ఆచరించుటకు ప్రయత్నిద్దాము.

765.నేటి కాలములో స్వాములూ, పీఠాధిపతులూ, బాబాలూ మొదలగువారందరు యజ్ఞాలు చేస్తున్నారు, వేదములను పఠిస్తున్నారు. ధనికులందరు దానములు చేస్తున్నారు. మెడిటేషన్ అను పేరుపెట్టి తపస్సులు చేయుచున్నారు.ఈ విధముగ చేయడమేనా భక్తి?

766.దేవుడు భగవద్గీతయందు విశ్వరూప సందర్శనయోగమను అధ్యాయములో 48,53 శ్లోకములలో యజ్ఞ,దాన, వేదాధ్యయణ, తపస్సుల వలన నేను తెలియనని చెప్పగా, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేఖముగా చేయువారినిస్వాములనాలా? బాబాలనాలా? పీఠాధిపతులనాలా? విశిష్ట జ్ఞానులనాలా? ఏమనాలో మీరే చెప్పండి?

767.నీ అధికారము, నీ హోదా, నీ పలుకుబడి, నీ ఉద్యోగము మధ్యలోవచ్చి మధ్యలో పోవునవే. వాటిని చూచి మిడిసిపడకు నీ శరీరము కూడా నీ మాటవినని రోజుంది జాగ్రత్త!

768.అందరికి అధికారి ఒక్కడు కలడు. అతను చెప్పకనే నడిపించును, చూపకనే చేయించును, కనిపించకనే నీ వెంట ఉండును. అతనే ఎవరికి తెలియని దేవుడు.

769.దేవుడు దేవులాడబడేవాడు (వెదకబడేవాడే) ఎప్పటికి కనిపించే వాడు కాడు. మనిషి దేవులాడేవాడు (వెదికేవాడు), ఎప్పటికీ కనుగొనలేడు.

770.ప్రపంచవిషయములలో మునగనిది, దైవజ్ఞానమును చూచి అసూయ పడనిది, మనిషికంటే బుద్ధిలో తక్కువ, జ్ఞానములో ఎక్కువగా ఉన్నది, మనిషికంటే పాపసంపాదన తక్కువ గలది (గుడ్డలులేని జంతువు).

771.దైవజ్ఞానము అంటే ఏమిటో తెలియని మనిషి, దేవుడెవరో, దేవతలెవరో తెలియని మనిషి, దైవజ్ఞానమును చూచి అసూయపడు మనిషి, ప్రపంచ విషయములలో మునిగిపోయి తన చావును మరచిన మనిషి(గుడ్డలున్న జంతువు).

772.ఇందూమతములోని “మాయ”, ఇస్లాంమతములోని “సైతాన్”, క్రైస్తవమతములోని “సాతాన్” అన్నీ ఒక్కటే.దైవమార్గమునకు ఆటంకమును చేయునదే మాయ.

773.అరచేతిలో అతిపెద్ద రహస్యం కలదు. కనుకనే గుడిలోని ప్రతిమ తన హస్తమును చూపుచుండును. అది అభయహస్తము కాదు. అతి రహస్యమైన మూడు ఆత్మల త్రైతము.

774.సిరి అనగా సంపద, మగసిరి అనగ జ్ఞానసంపద. పురుషుడు అనగా పరమాత్మయనీ, మగవాడైనపరమాత్మజ్ఞానము కలవానిని మగసిరి కలవాడని అందురు.

775.స్త్రీలను రమింపజేయడము మగసిరికాదు. ప్రకృతి జ్ఞానమును అతిక్రమించు జ్ఞానమును కల్గియుండడమే నిజమైన మగసిరి కల్గియున్నట్లు తెలియుము.

776.జ్ఞానములు రెండు రకములు గలవు. ఒకటి ప్రకృతివైపు నడిపించును, మరొకటి పరమాత్మవైపు నడిపించును. నీవు ఏ జ్ఞానములో ఉన్నావో చూచుకో.

777.దినమునకు 12 గంటల పగటికాలము లేక 720 నిమిషములు, సెకండ్లయితే 43,200 అగును. ఒక సెకనుకు పదింతల ఎక్కువ కాలమును 4,32,000 సూక్ష్మకాలము అంటాము. ఒక దినమునకు కాలముతోపాటు శరీరములో 4,32,000 మార్పులు జరుగుచుండుటవలన కొంత కాలమునకు నీ శరీరము ముసలిదగుచున్నది.

778.మనిషికి గల బుద్ధి, ప్రపంచ సంబంధ వివరమునూ, పరమాత్మ సంబంధ వివరమునూ అందించుచుండును. 

779.మనిషికి గల బుద్ధి కర్మను బట్టి ప్రపంచవిషయమును అందించగా, శ్రద్ధనుబట్టి దైవ విషయమును జీవునకుఅందించుచుండును. భూమి మీద కొన్ని వేల మంది బోధకులుండవచ్చును. కానీ అంతమందిలో గురువులేకుండవచ్చును,ఉండవచ్చును.

780.గురువు అరుదుగా భూమిమీదకు వస్తాడు. కావున ఆయన ఏ కాలములో ఉంటాడో చెప్పలేము. 

781.కొంత తెలిసిన మనిషి, తాను ఇతరులకు బోధించి బోధకుడు కావలెననుకొనును. కొంత బోధ చెప్పుచున్న బోధకుడు తాను ఇతరులకు ఉపదేశమిచ్చి గురువు కావలెనని అనుకొనును.

782.మనిషి బోధకుడు కావచ్చును, కానీ గురువు ఎప్పటికి కాలేడు. ఎందుకనగా మనిషి నుండి గురువురాడు, గురువు నుండి మనిషి రాగలడు.

783.దేవుడు ఒక్కడే భూమిమీద గురువుగ ఉండగలడు. కాని మనిషి గురువుగా ఎప్పటికి ఉండలేడు. మనిషి బోధకునిగా ఉండవచ్చును.

784.ఈ దినములలో భూమిమీద ఉన్న స్వామిజీలందరిలో ఎవడైన గురువు ఉన్నాడా? అని ప్రశ్నిస్తే నిజం చెప్పాలంటే చాలా కష్టము.

785.పుస్తకములన్ని శాస్త్రములుకావు. కొన్ని చరిత్రలు, కొన్ని పురాణములు, కొన్ని కావ్యములుగా ఉన్నవి. అలాగే మనుషులందరు జ్ఞానులుకారు. వారిలో కొందరు రౌడీలు, కొందరు దొంగలు, కొందరు జూదరులున్నారు.

786.దేవున్ని తప్ప ఇతర దేవతలనుగాని, మాయనుగాని ఆరాధించవద్దని చెప్పునది అసలైన జ్ఞానము.

787.మనుషులు దేవుని జ్ఞానమును అర్థము చేసుకోలేకపోవడము వలననే అన్ని అనర్థములకు కారణమైన హింసలు, దోపిడీలు అవినీతి అక్రమములు మనుషులలో చెలరేగుచున్నవి.

788.హింసతోగానీ, భయపెట్టిగానీ ఎవరిని మార్చలేము. జ్ఞానమును బోధించి ఎవరినైన, ఎంతటి మూర్ఖున్ని అయిన మార్చవచ్చును.

789.భయపెట్టి బయట మార్చగలము కాని లోపల మార్చలేము. భయముతో ఎవడైన బయట మారినట్లు నటించును కాని లోపల తన స్వభావమును వదిలిపెట్టడు.

790.ఎవడైన తన స్వభావమును మంచిదనే అనుకొనుచుండును. ఎదుటివాని భావమును చెడుదనియే అనుకొనుచుండును.

791.ఎంత అజ్ఞాని అయినా ఇతరులతో నేను జ్ఞానిననే చెప్పుకొనుచుండును. అదే విధముగా ఎంత ధనికుడైన ఇతరులతో నేను బీదవాడినేనని చెప్పుకొనుచుండును.

792.సమాజసేవ అని కొందరనుచుందురు. సమాజమంటే ఏమిటో తనకు తెలిసినది సమాజమో కాదో మొదట ఆలోచించుకోవాలి.

793.మనిషికి బయట సమాజమని లోపలి సమాజమని రెండు సమాజములు కలవు. ఒకటి నీకవసరము, రెండవది నీకనవసరము.

794.కన్ను తెరిస్తే దృశ్యము (వెలుగు) కన్ను మూస్తే చీకటి కన్ను వెనుకల వెలుగు చీకట్లను చూచేవాడెవడు? చూపేవాడెవడు? తెలుసా? 

795.ఏ ఊరికి పోయినా నీ ఊరిలోని భూమి, గాలి ఉన్నట్లు అక్కడ కూడా అవియే కలవు. అదే విధముగా ఏ శరీరమును చేరి చూచినా ముందున్న శరీరములోనివే కలవు.

796.ఎలుక పిల్లిని చూస్తే భయపడుతుంది. పిల్లి కుక్కను చూస్తే భయపడుతుంది. కుక్క పులిని చూస్తే భయపడుతుంది. పులి మనిషిని చూస్తే భయపడుతుంది. ఇలా అందరిలోను భయము పాదుకొని ఉంది.

797.భయము పరధర్మమైన ప్రకృతిధర్మము, ధైర్యము స్వధర్మమైన పరమాత్మ ధర్మము.

798.ఆకాశానికి అంతులేదు అనుచుందుము. అకాశానికే అంతు లేనపుడు దానిని పుట్టించిన వాడు మరీ అంతులేనివాడు మరియు అంతుబట్టనివాడు.

799.“నీ ప్రాణానికి నా ప్రాణమిస్తా" అంటారు. కానీ అలా ఎవరికైనా సాధ్యమవుతుందా? నీ ప్రాణము నిజానికినీదేనా? నీదికాని దానిని ఎలా యివ్వగలవు? అందువలన మాట అనినా ఎవరూ ప్రాణము ఇవ్వలేక పోతున్నారు.

800.శీలము పోయిందంటారు. శీలము అంటే ఏమిటో తెలుసా? శీలము నీవు ఉంచుకున్నది కాదు, ఎవరైన తీసుకొంటే పోయేది కాదు. అది నీ తలలోనిది.

801.పోలీసులు లాఠీలతో దొంగను భయపెట్టవచ్చును. కానీ వాని తలలోని బుద్ధిని మార్చలేరు. చేతితో చేయలేనిదానిని నోటితో చేయవచ్చునని పెద్దలన్నారు. కావున పోలీసులు లాఠీలను వదలి మాటలతోనేచెప్పాలి.

802.దొంగలు మాటలతో వినరు. వారికి కావలసినవి లారీల దెబ్బలేనని కొందరు అనుకోవచ్చును. కానీ అది సరియైన పద్ధతి కాదు.

803.మాటలు మంత్రములాంటివి. ఏ మంత్రము ఏ రోగమునకు తెలియకపోతే మంత్రము వృధాఅగును. అలాగే దొంగకు కావలసిన మాటలు చెప్పకపోతే చెప్పిన మాటలు వృధా అగును.వాడు మారడు.

804.ప్రతిమాట మంత్రమేనని యోగి వేమన కూడ అన్నాడు. దొంగతనమను రోగమును నయముచేయుటకు తగిన మాటలనే ఉపయోగించాలి.

805.దేనికి ఏ మంత్రము ఉపయోగించాలో మాంత్రికునికే తెలుసు. అలాగే ఎవరికి ఏ జ్ఞానపు మాటలు చెప్పాలో గురువుకే తెలుసు.

806.ఏ పోలీసుకైన గురువుంటే మంచిది. గురువువలన లభించిన జ్ఞానము వలన కరడుకట్టిన నేరస్తుడినైన మార్చవచ్చును.48 

807.నీవు గురువు వలన జ్ఞానము పొంది, దానివలన నీ జీవితములో ఒక్కడినైన మార్చగలిగితే నీ జీవితమునకు సార్థకత చేకూర్చినట్లే..

808.జ్యోతివలన కటికచీకటైనా పోతుంది. జ్ఞానము వలన కటిక మూర్ఖుడైనా మారగలడు.

809.దీపము అప్పుడు ఎదురుగావున్న వస్తువులోని అందమును తన వెలుగు ద్వారా తెలియచేస్తుంది. అలాగే జ్ఞానము అప్పుడు ఎదురైన సమస్యలోని సత్యమును తన వివరముద్వారా తెలియజేస్తుంది.

810.హారములో దారము దాగివుంది. శరీరములో ఆత్మ దాగివుంది. హారములోని దారమును స్థూలముగా వెదికితే కనిపిస్తుంది. అలాగే శరీరములోని ఆత్మను సూక్ష్మముగా వెదికితే కనిపిస్తుంది.

811.దేవుడు భూమిమీదకి భగవంతునిగా వస్తే ఎవరు గుర్తించలేరు. అయినా గుర్తించుటకు అవకాశము సూక్ష్మముగ వున్నవారికే ఎక్కువగలదు. తర్వాత జ్ఞానులకు గలదు.

812.పాము తనలావుకంటే పదింతలు పెద్దయిన జంతువునైన సులభముగ మ్రింగును. అలాగే మాయ పది సంవత్సరముల జ్ఞాన అనుభవము కల్గినవారినైన సులభముగ తనలో కలుపుకొనును.

813.దేవుడిలో కలిసిపోవాలనుకున్న నీవు ఎవరిలో కలుస్తున్నావో చూచుకో. దేవునిలోనికి ఐక్యము కావడానికి ముందే మాయలో ఐక్యమగు అవకాశము ఎక్కువ కలదు జాగ్రత్త!

814.జీవుడు రవ్వంత! ఆత్మ శరీరమంతా!! పరమాత్మ బ్రహ్మాండమంతా!!! మాయ గుణమంత కలదు.

815.గుణ అనగా హెచ్చింపు. సందర్భమునుబట్టి అవసరమును బట్టి మాయ తన్నుతాను హెచ్చించుకొని ఎంత ఎక్కువగానైన పెరుగగలదు.

816.తన్నుతాను ఎంతైనా హెచ్చించుకొనును కాబట్టి మాయను “గుణ” అని అంటాము. "గుణ” అనునది 12 విధములుగా ఉన్నది. అందువలన మనిషికి 12 గుణములున్నవని అంటున్నాము.

817.మ్రొక్కేవాడుంటే ఎవడైన స్వామి, గురువు అవుతాడు కానీ ఎవరు మ్రొక్కాలి? ఎవరు మ్రొక్కించుకోవాలి? అని తెలియని స్వామిజీలు భూమి మీద ఉన్నారు.

818.భూమిమీద కదలని వృక్షములని, కదిలే వృక్షములని రెండు రకములు కలవు. కదలని వృక్షమునకు కాయలున్నట్లే, కదిలే వృక్షమునకు కూడ కాయలు కలవు. కదలని వృక్షమునకు ఒకే జాతి ఒకే రకముకాయలు కాస్తే, కదిలెడి వృక్షమునకు అనేక జాతుల అనేక రకముల కాయలు కాస్తున్నవి.

819.కదలని వృక్షమైన వేపచెట్టుకు ఒకే పేరుగల వేపకాయలే కాయును. అవి అన్నీ చేదుగా ఒకే రుచి కల్గియుండును. కదిలెడి వృక్షమైన మనిషికి వేరువేరు పేర్లుగల కాయలు కాస్తున్నాయి. ఒక కాయపేరు గుండెకాయ అయితే,మరొక కాయపేరు తలకాయ!

820.దేశ పరిధిలోని రాజ్యాంగమును తెలుపునది చట్టము. శరీర పరిధిలోని యంత్రాంగమును తెలుపునది ధర్మము.

821.నాస్తికులను శరీరము మీద గుడ్డలులేని పిచ్చివారిగా పోల్చ వచ్చును. హేతువాదులను అప్పుడప్పుడు ఎవరివద్దనైన గుడ్డలులేని వేశ్యలుగా పోల్చవచ్చును. ఆస్తికులను భర్తను వదలి ఎవరికి తెలియక ఇతరులతో కూడు కులటలుగాపోల్చవచ్చును. ఆత్మవాదులను తన భర్తతో మాత్రమే కాపురము చేయు పతివ్రతలుగా పోల్చవచ్చును.

822.కన్న తండ్రివలన ధనమును హక్కుగ పొందవచ్చును. కానీ అది నీ మరణములో నీవెంటరాదు. గురువువలన జ్ఞానధనమును హక్కుగ పొందవచ్చును. అది చావులో నీతోపాటు వచ్చును.


ఇట్లు ఇందూ ధర్మప్రదాతసంచలనాత్మత రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024