నాస్తికులు - ఆస్తికులు. cloud text updated 12sep 2024
నాస్తికులు - ఆస్తికులు.
ఆస్తి అనగా సంపద అని అందరికి తెలుసు. స్థిరాస్థులుగాని, చరాస్తులుగాని కలవానిని ఆస్తిపరుడు లేక
ఆస్తికుడు అంటున్నాము. సంస్కృత భాషలో 'కాడు' అను అర్థమునకు 'న' అను అక్షరమును చెప్పుచుందురు. ఆస్తిపరుడు
కాడు అను అర్థమునకు న ఆస్తికుడు అనెడివారు. న+ఆస్తికుడు అను వాటిని కలిపిపలికితే నాస్తికుడు అగును.
నాస్తికుడు అంటే ఆస్తిలేనివాడను అర్థమగును. ఆస్తికుడు, నాస్తికుడు అనుపదములను నేటికాలములో ధనమున్నవానికి,
ధనము లేనివానికి ఉపయోగించడము లేదు. దైవభక్తి కలవానిని ఆస్తికుడని, దైవభక్తి లేనివానిని నాస్తికుడని
పిలువడము జరుగుచున్నది. ఇంకనూ ఆలోచిస్తే హేతుబద్దముగ, శాస్త్రబద్ధముగ దైవవిషయములను ప్రశ్నించినవానిని
నాస్తికుడని, మూఢ నమ్మకముకలవానిని, గ్రుడ్డిగ ఆచరించువానిని ఆస్తికుడని అనడము జరుగుచున్నది. ఇంకనూ
ఆలోచిస్తే ఎర్రగుడ్డలు వేసుకొన్నవారిని ఆస్తికులని అనడము, ఎర్రజెండాలు ఎత్తుకొన్నవారిని నాస్తికులనడము
జరుగుచున్నది. ఇప్పటికాలములో మనుషులు, ఆస్తికులు నాస్తికులను రెండు తెగలుగ విభజింపబడియున్నారు. మా
తెగ వేరు మీ తెగ వేరన్నట్లు ఆస్తికులు మాట్లాడిన దానిని నాస్తికులు ఖండించడము, అట్లే నాస్తికులు మాట్లాడిన దానిని
ఆస్తికులు ఖండించడము ముఖ్యమైన పనిగ జరుగుచున్నది. ఈ విధముగ ఆస్తికులు, నాస్తికులు ఇద్దరు శాస్త్రబద్దతను
మరచిపోయి ఒకరినొకరు ఖండించుకోవడమే ముఖ్య ఉద్దేశమైపోయినది.
నాస్తికులు మాట్లాడిన మాటలలోగాని, అడిగిన మాటలలోగాని, శాస్త్రబద్దత ఉందా లేదా అని చూడకుండానే
వారి మాటలను ఖండించడము ఆస్తికులకు అలవాటైపోయినది. అలాగే ఆస్తికుల మాటలలోగాని, బోధలలో గాని,
శాస్త్రబద్దతను చూడకుండానే ఖండించడము నాస్తికులకు అలవాటై పోయినది. ఈ రెండు వాదనలలో సామాన్య
మనిషి దేనిని అనుసరించాలో తెలియక కొంత తికమకపడుచున్నాడు. పూర్తిగా ఆలోచించిన వానికి కొన్ని విషయములందు
నాస్తికులలో స్వచ్చత కనిపిస్తున్నది, మరికొన్ని విషయములలో వారి వాదనకు పొంతనేకుదరకున్నది. అలాగే ఆస్తికుల
విషయానికొస్తే కొన్ని విషయములు సత్యమనిపించినా, మరికొన్ని విషయములు పూర్తి అసత్యముగ కనిపిస్తున్నవి.
ఎవరూ చూడని దేవున్ని, ఎవరికీ తెలియని దేవున్ని, మానవజీవితములో ఎవరి అనుభవానికీ రాని దేవున్ని, మేము
చూచాము అను ఆస్తికుల మాటలు పూర్తి అసత్యమని, శాస్త్రబద్దముకాని మాటలని తెలియుచున్నది. ఈ విషయములో
ఆస్తికులను ఖండించి నాస్తికులను సమర్థించవచ్చును. జాదుగర్ ఆనంద్ (మాంత్రికుడు ఆనంద్) జన సమూహము
చూస్తుండగ తన మంత్రశక్తితో ఏనుగును ఒక్క క్షణములో మాయము చేసినపుడు, మంత్రములు లేవు అను నాస్తికుల
వాదనను ఖండించి మంత్రములు ఉన్నాయను ఆస్తికుల వాదనను సమర్థించవచ్చును. ఈ విధముగ రెండు వర్గములలోను
కొంత సత్యము, కొంత అసత్యము ఇమిడి ఉన్నది. రెండు వర్గములలోను ఒకే విధముగ సత్యాసత్యములు ఇమిడి
ఉండుటవలన, చివరకు రెండూ ఒకే ఫలితము లోనికి పోవుట వలన, సమాజమునకు సంశయములేని మార్గమును
చూపక, సంశయమునే కల్పించి, ఎటూ తేల్చుకోలేని సందిగ్ధములో పడవేయుట వలన, రెండు విధానములు ఒకే
వర్గమునకు చెందినవేనని చెప్పవచ్చును.
ఆవుకు పులికి సరిపడదని, ఆహారములోను, జీవనవిధానములోను విభిన్నతను కల్గియున్నవని అందరికీ తెలుసు.
వీటిని వేరువేరు వర్గములని చెప్పవచ్చును. ఒకచోట ఆవు కనిపించినది, మరియొక చోట పులి కనిపించినది. ఆవును
పులిని వర్గభేదముతో చూచినప్పటికి, పులి నిజముగ పులికాదని, అదికూడ పులితోలు కప్పుకొన్న ఆవు అని తెలిసినపుడు
రెండూ ఒకే వర్గమునకు సంబంధించిన ఆవులని చెప్పవచ్చును.
గోవులు, గోముఖ వ్యాఘ్రములు రెండు ఒకటేనని తెలిసినట్లు ప్రస్తుతము ఇప్పుడు సమాజములోనున్నవారు
ఆస్తికులా, నాస్తికులా అని మరియు ఆస్తికులవలెనున్న నాస్తికులా అని యోచించి చూడవలసిన అవసరమున్నది.
ఎవరు ఆస్తికులు? ఎవరు నాస్తికులు? ఇపుడున్న రెండు గుంపులను కలిపి నాస్తికులనాలా? లేక ఆస్తికులనాలా? వీటికి
జవాబు కావాలంటే, నాస్తికులకు ఆస్తికులకు నిర్వచనము చెప్పుకొని, ఆ నిర్వచనము ప్రకారము ఇపుడున్నవారెవరో
తేల్చిచెప్పవచ్చును.
కంప్యూటర్లలో హార్డువేర్, సాఫ్టువేర్ ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. హార్డువేర్ లేని సాఫ్టువేరుగాని,
సాఫ్టువేర్ లేని హార్డువేర్ గాని ఉన్న కంప్యూటర్లు లేవు. అలాగే సూక్ష్మము, స్థూలములేని జగతియే లేదు. సూక్ష్మములేని
మనిషిగాని, అలాగే స్థూలములేని మనిషిగాని జగతిలో లేరు. కంప్యూటరుకు హార్డువేర్ సాఫ్టువేర్ ఉన్నట్లు, మనిషికి
తప్పనిసరిగ స్థూల, సూక్ష్మములుండవలసినదే. మనిషికి స్థూలముగనున్నది శరీరము, సూక్ష్మముగానున్నది ఆత్మ.
స్థూలముగనున్న శరీరము 24 భాగములుగ ఉండగ, సూక్ష్మముగనున్న ఆత్మ మూడు భాగములుగ ఉన్నది. స్థూలము
అనగ కనిపించెడిది, సూక్ష్మము అనగ కనిపించనిదని అర్థము. అలాగే ప్రపంచములో కనిపించెడి ధనము ఉన్నట్లు,
కనిపించని ధనము కూడ కలదు. కనిపించెడి ఆస్తిని బట్టి ఆస్తిపరుడు అన్నట్లు, కనిపించని ధనమును బట్టి కూడ
ఆస్తిపరుడు అనవచ్చును.
పూర్వము కనిపించని ఆస్తి అయిన జ్ఞానధనమునుబట్టి జ్ఞాన ధనమున్న వానిని “ఆస్తికుడు” అనియు, జ్ఞానధనము
లేనివానిని “నాస్తికుడు” అనియు సంబోధించెడివారు. కనిపించెడి ధనమును దొంగలు దోచు కోవచ్చును, పురుగులు
తినివేయవచ్చును. కాని జ్ఞానధనమును దొంగలు దోచుకోలేరు, పురుగులు తినలేవు. ప్రపంచధనము అశాశ్విత
మైనది, చనిపోయినపుడు వెంటరానిది. జ్ఞానధనము శాశ్వితమైనది, చనిపోయిన జీవునితోపాటు పోవునది. అందువలన
పూర్వము జ్ఞానధన విషయముల లోనే ఆస్తికుడు, నాస్తికుడు అని మనిషిని పెద్దలు నిర్ణయించెడి వారు. ఈ లెక్క
ప్రకారము ప్రపంచములో ఎవరు నాస్తికులు, ఎవరు ఆస్తికులు అని లెక్కించితే, దేవుడు లేడనువారికి ఎటూ
జ్ఞానధనముండదు, కావున అటువంటివానిని నాస్తికుడని సులభముగ చెప్పవచ్చును. వారు కూడ మేము నాస్తికులమే
అని ఒప్పుకొంటారు. జ్ఞానధనము కల్గిన ఆస్తికులను గుర్తించడములోనే పెద్దసమస్య గలదు. దేవుడు లేడనువారు
ప్రత్యక్షముగ కనిపించు ఆవులలాంటివారు. ఇకపోతే పులితోలు కప్పుకున్న ఆవులను గుర్తించడములోనే పెద్దసమస్య
గలదు. కనిపించని దేవున్ని చూచామని చెప్పు పీఠాధిపతులు, ఎవరికీ తెలియని దేవున్ని మీకు చూపుతామను గురువులు,
అప్పుడప్పుడు మా శరీరములోనికి దేవుడే వచ్చి మీతో మాట్లాడి, ఆయన చూపును మీమీద ప్రసరింపజేస్తాడని ప్రచారము
చేయుచున్న కొన్ని సమాజముల స్వాములు, స్వామినులు, మేమే సాక్షాత్తు దేవుళ్ళమని చెప్పుకొను బాబాలు, ఎందరో
భక్తులు ఆస్తికులను పేరుతో చలామణి అగుచున్నారు. జ్ఞానధనమునుబట్టి చూస్తే నూటికి తొంబైతొమ్మిదిమంది కూడ
జ్ఞానధనములేనివారే అగుట వలన అందరిని ఆస్తిలేనివారని నాస్తికులని చెప్పవచ్చును. ఆస్తి లేకున్నను ఆస్తికులమని
పేరుపెట్టుకొన్నవారు, పులికాకున్నను, పులితోలు కప్పుకొని పైకి పులిమాదిరి కనిపిస్తున్న ఆవులేనని చెప్పవచ్చును.
వెయ్యికి ఒక్కరు కూడ అరుదుగ జ్ఞానధనము కలవారున్న ఈ కాలములో హేతుపద్దతి ప్రకారము చాలామటుకు
అందరూ నాస్తికులే. స్వాములను, గురువులను, పీఠాధిపతులను, బాబాలను, పెద్దభక్తులను నాస్తికులనడములో కొంత
విచిత్రముగనున్నను ఉన్నవాస్తవము అంతే. నిజమైన జ్ఞానధనము కలవారు లక్షకొకరో, కోటికొకరో ఉండవచ్చును.
అటువంటి వారిని మాత్రమే ఆస్తికులు అనడములో అర్థముగలదు.
“దేవుడేలేడనువారు కనిపించు నాస్తికులైతే, దేవుడున్నాడని చెప్పుచున్న కనిపించని నాస్తికులు ఎందరో ఆస్తికులుగ
ఉన్నారని విూరనుచున్నారు పెద్ద పెద్ద స్వాములను, బాబాలను, పీఠాధిపతులను, గురువులను ఏ ఆధారముతో
నాస్తికులనుచున్నారు? వారివద్ద జ్ఞానధనములేదనుటకు ఆధారమేమిటని” కొందరడుగవచ్చును. దానికి సమాధానమేమనగా!
బ్రతికిన మనిషికి దేవుడు తెలియడను మాటను బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము చెప్పవచ్చును. దేవుడు మనిషికి
తెలియకుండినప్పటికి, దేవుని జ్ఞానమును మనిషికొరకు శాస్త్రబద్ధముగ దేవుడే తెలిపియున్నాడు. బ్రహ్మవిద్యాశాస్త్రమైన
భగవద్గీతలో దైవజ్ఞానము సంపూర్ణముగ తెలుపబడియుండగ, దానిని విస్మరించి శాస్త్రబద్ధతలేకుండ మాట్లాడువారివద్ద
జ్ఞానధనములేదని చెప్పవచ్చును. వేదములు గుణముల ప్రతిరూపములని, వాటిని వదలితేనే సరియైన మార్గము
లభించునని గీతలో చెప్పిన దైవవాక్కును మరచి, వేదములకు ప్రాధాన్యతనిచ్చు వారివద్ద జ్ఞానధనముండదని చెప్పవచ్చును.
బాహ్యయజ్ఞముల వలన, వేదముల ఆధ్యయణము వలన, దానముల వలన, తపస్సుల వలన దేవుడు తెలియబడుటకు
శక్యముకాదని గీతలో చెప్పగ వాటినే గొప్పగ తలచి యజ్ఞములను చేయు స్వాములు, వేదపఠనము గావించు పీఠాధిపతులు,
తపస్సులు చేయు గురువులు, దానములు చేయు భక్తాగ్రగణ్యులు దారితప్పిన వారు కాదా! నిజముగ జ్ఞానధనములేని
నాస్తికులు కారా? బ్రహ్మవిద్యాశాస్త్రమునకు వ్యతిరేఖముగ బోధించువారు, ప్రజలకు సంశయములు తీర్చలేనివారు,
హేతుబద్దముగ జవాబివ్వనివారు ఎంతటి ఆస్తికులుగ కనిపించిన నిజముగ నాస్తికులు కారా? దేవుడులేడని చెప్పువారు
మాత్రమే నాస్తికులని, దేవుడున్నాడని చెప్పువారు ఆస్తికులని చెప్పుట పొరపాటు. జ్ఞానధనములేని వారందరు ఆస్తికులు
కారని, నాస్తికులేనని చెప్పుట సరియైన మాట. జ్ఞానధనములేని వారు పెద్ద స్వామిజీలైన నాస్తికులేనని చెప్పవచ్చును.
కనిపించెడి ధనమును బట్టి వీడు ధనికుడు, వీడు ధనికుడు కాడని చెప్పవచ్చును. కనిపించని జ్ఞానధనమును
బట్టి వీడు నాస్తికుడు, వీడు ఆస్తికుడని ఎలా గుర్తించగలమని కొందరడుగ వచ్చును. దానికి సమాధానమేమనగా!
కనిపించని జ్ఞానధనమును గూర్చి తెలియాలంటే దేవుని యొక్క ధర్మములు తెలియాలి. దేవుని ధర్మములు ఒక్క
భగవద్గీతలోనే గలవు. గీతలోని ధర్మములను తెలిసినపుడే అందులో చెప్పబడిన జ్ఞానాగ్ని విషయము తెలియును.
గీతలో అనేక సందర్భములలో చెప్పబడిన జ్ఞానాగ్నియే మనమనుకొను కనిపించని జ్ఞానధనము. జ్ఞానమను అగ్ని
కలవాడే నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి అని గీతలో చెప్పబడినది. జ్ఞానాగ్నిలేనివాడు ఎంత పెద్దస్వామి అయిన
అబద్దమైన సన్న్యాసి, అబద్దమైన యోగి అనియే చెప్పవచ్చును.
ప్రపంచధనము మనిషికి అవసరాలను తీర్చి సుఖాలను అందివ్వ గలదు. అలాగే జ్ఞానధనము మనిషియొక్క
కర్మలను తీర్చి మోక్షము నివ్వగలదు. దీనిని గురించి "జ్ఞానాగ్ని సర్వకర్మానాం భస్మసాత్" అని గీతలో చెప్పబడినది.
గీతలోని ధర్మములను తెలిసి ఆచరించువాని దగ్గర తప్పక జ్ఞానధనముండును. గీతధర్మములకు వ్యతిరిక్తముగ
నడచువారందరి వద్ద జ్ఞానధనముండదని చెప్పవచ్చును. “గీతను ఎందరో స్వాములు, పీఠాధిపతులు, గురువులు
ఎంతో చక్కగ బోధిస్తున్నారు కదా! వారిని కూడ మీరు నాస్తికులన్నారు కదా! వారికి ధర్మములు తెలియవంటారా” అని
కొందరడుగవచ్చును. దానికి మేము చెప్పునదే మనగా! గీతను చదివినంత మాత్రమున ధర్మములు వారికి
తెలుసుననుకోవడము పొరపాటు. వారు ధర్మములు తెలిసిన వారైతే బాహ్యయజ్ఞములు ఎలా చేస్తున్నారు? దైవ
ధర్మములు తెలిసినవారైతే వేదాధ్యయనమెందుకు చేస్తున్నారు? అన్యదేవతారాధన చేయువారు ధర్మములు తెలిసినవారెలా
అగుదురు? ధర్మములు తెలియనిదే జ్ఞానధనముండదు. ధర్మములు తెలిసినవాడు ధర్మముల ప్రకారమే నడుచుకొనువాడై
ప్రత్యేకముగ కనిపించగలడు. అటువంటివానినే జ్ఞానధనుడని, వానినే ఆస్తికుడని అనవచ్చును. జ్ఞానధనముండాలంటే
దైవ ధర్మములుండాలి. ధర్మములు ఆచరణలో కనిపించునవి, కావున ఆచరణను బట్టి జ్ఞానధనమున్న వానిని
కనిపెట్టవచ్చును. ధర్మాచరణ కల్గినవాడు సమాజములో స్వామికాకున్నను నిజమైన స్వామియే, వాడు నిజమైన
ఆస్తికుడే. అలాగే ధర్మాచరణ లేనివాడు స్వామియైనను వాడు నిజమైన స్వామికాడు, వాడు నిజమైన నాస్తికుడే.
మీరు నాస్తికులను ఆస్తికులను తెలియాలంటే ముందు గీతలోని నిగూఢమైన ధర్మములు తెలుసుకొనండి.
వాటిని తెలిసి ఆచరించి మీరు కూడ జ్ఞానధనముగల ఆస్తికులుగ మారవచ్చును. అంతేకాక దేశములో ఆస్తికుల
ముసుగులో ఉన్నవారిని కూడ నాస్తికులుగ గుర్తించవచ్చును. దేవుడులేడను వారికి నాస్తికముద్రవేసి తాము
ఆస్తికులమనుకొను వారికి కనువిప్పు కల్గించవచ్చును. దైవధర్మము తెలిసి ఆచరించనివాడు ఎప్పటికీ ఆస్తికుడు
కాలేడని, నాస్తికుడుగ ఉండవలసిందేనని చాటి చెప్పవచ్చును.
నేటికాలములో కొందరు హేతువాదులు, తమచుట్టు తమ నిర్ణయము సరియైనదను ఒక కంచెను తయారుచేసుకొని,
ఆధ్యాత్మికము అన్నది భ్రమ అంటున్నారు. ఆధ్యాత్మికమును నమ్మకములతో కూడుకొన్న చిక్కుసమస్య అని
కొట్టివేయుచున్నారు. ఆధ్యాత్మికము సైన్సుకు సంబంధించిన విషయమేకాదంటున్నారు. అటువంటివారందరు తమ
నిర్ణయమును పునరాలోచించుకోవలసియున్నదని మేము కోరుచున్నాము. ఎందుకనగా! ఇంతవరకు ఆస్తికత్వములో
ఎన్నో కల్పితములు పురాణ విషయములనుచూచి వారలా అని ఉండవచ్చును. కాని యోచించి చూచితే ఆధ్యాత్మికమే
ఒక పెద్దసైన్సు. ఆధ్యాత్మికము ఆరుశాస్త్రములలో గొప్పది మరియు ఆరవదైన బ్రహ్మవిద్యాశాస్త్రము. శాస్త్రము
సిద్ధాంతములతో కూడుకొన్నది, సిద్ధాంతములు విజ్ఞానరూపముతోనే ఉండును. కనుక సిద్ధాంతపరమైన ఆధ్యాత్మికమును
సైన్సనియే చెప్పవచ్చును. ఇపుడున్న ఆస్తికులు యజ్ఞములను బయట ఆచరించి ఏదో జరుగుతుందని చెప్పడము
మూఢనమ్మకములతో కూడుకొన్న పని. దానిని హేతువాదులు ఖండించ వచ్చును. అదే యజ్ఞములు శరీరములో
నిత్యము జరుగుచున్నవని చెప్పడము, ద్రవ్యయజ్ఞము అందరిలో నిత్యము జరుగుతుందని చెప్పడము సిద్ధాంత పరమైన
శాస్త్రవచనము. ద్రవ్యయజ్ఞము ఎట్లు జరుగుచున్నదని హేతువాదులు యోచించవలసియున్నది. నిజముగా జరుగుచున్న
ద్రవ్య యజ్ఞమును విజ్ఞానము (సైన్సు) తో కూడుకొన్న విషయమని తెలియకనే మూఢనమ్మకమని కొట్టివేయడము,
మనకు తెలియని సైన్సును సైన్సే కాదన్నట్లుండును. అందువలన విజ్ఞానముతో కూడుకొన్న హేతువాదులు కొంత
పరిశోధన చేసి నిరూపణాత్మకముగ ఖండించడము మంచిది. అట్లుకాక నమ్మకమై ఉంటుంది అని మూఢముగ నమ్మి
కొట్టివేయడము హేతువాదులు లోని మూఢనమ్మకమగును. గ్రుడ్డిగ శాస్త్రబద్ధత లేకుండ ఖండించడమువలన
హేతువాదులనుకొనువారు కూడ ఒక విధముగ మూఢనమ్మకముగలవారే అగుదురు. ఒక సత్యమైన విషయమును
శాస్త్రీయముగ సమర్థించువారు, ఒక అసత్యవిషయమును శాస్త్రీయముగానే ఖండించవలెను. అందువలన ఆధ్యాత్మికమును
సైన్సుకాదని కొట్టి పారవేయక ఆధ్యాత్మికము నుండే సైన్సు పుట్టినదని తెలియాలి. ధర్మము అనునది ఆధ్యాత్మికము
నుండే పుట్టినది, సైన్సు ప్రకారము ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ధర్మము కల్గియున్నదని చెప్పుచున్నాము. సిద్ధాంతము
ఆధ్యాత్మికము నుండే పుట్టినది, సైన్సు ప్రకారము సిద్ధాంతములతో కూడుకొన్నదే శాస్త్రమంటున్నాము. ఆధ్యాత్మికము
నుండే శాస్త్రము పుట్టినది, సైన్సుప్రకారము నిరూపణకు వచ్చునదే శాస్త్రమంటున్నాము.
భూమికి గల ఆకర్షణశక్తి భూమియొక్క ధర్మము అగును. ఆ ధర్మమును కనుగొన్నపుడు అది సిద్ధాంతమగును.
ఆ సిద్ధాంతము ఆచరణరూపముగ జరగడము శాస్త్రమగును. ధర్మము సృష్ట్యాది నుండి ఉండును. కనుగొన్నపుడు
సిద్ధాంతములగును. ఆచరించినపుడు శాస్త్రములగును. భూమ్యాకర్షణ శక్తి మొదటినుండి గల ధర్మమే. దానిని
న్యూటన్ అను వ్యక్తి కనుగొన్నపుడు అది సిద్ధాంతమైనది. ఆ సిద్ధాంతము ఆచరణకు జరుగుచున్నది. అందువలనే
శాస్త్రము జరిగితీరునని, శాస్త్రము యొక్క మొదటి పేరు శాపమని, శాపము తప్పక జరిగి తీరునని, శాపము యొక్క
రూపాంతరమే శాస్త్రమని తెలియాలి. హేతువాదులు జాగ్రత్తగ ఒక విషయమును అనేక కోణముల నుండి పరిశోధించి
చూచాకే మూఢ నమ్మకమా, శాస్త్రబద్దమా అని తేల్చి చెప్పాలి. మరొక ముఖ్యమైన విషయమేమంటే నమ్మకమనునది
ఒక ఆరోపణలాంటిది. ఆరోపణ నిజముకావచ్చును. లేక అబద్దము కావచ్చును. నమ్మకము కూడ సత్యము కావచ్చును,
అసత్యము కావచ్చును. నమ్మకము అసత్యమైనపుడు మూఢనమ్మకమగును, సత్యమైనపుడు శాస్త్రసమ్మతమగును.
అంతే గాని నమ్మకము అంటేనే కొట్టిపారవేయకూడదు. నమ్మకము మీద ఎన్నో సత్యములు ఆధారపడి ఉన్నాయి.
ఉదాహరణకు తల్లి, తండ్రి నమ్మకము అయినప్పటికి అది సత్యము. దానినే శాస్త్రబద్ధము అంటున్నారు. అలాగే
కులము, మతము అనునవి నమ్మకము అయినప్పటికి వాటిని పరిశోధించి చూచితే అసత్యము, కావున వాటిని
మూఢనమ్మకమనవచ్చును. నమ్మకము మూఢనమ్మకముకావచ్చును, హేతుబద్దముకావచ్చును. అందువలన నమ్మక
మన్న వెంటనే దానిని కొట్టివేయవద్దండని, పరిశోధించి నిరూపణకురాని విషయమైనపుడు దానిని ఖండించవచ్చునని
తెలుపుచున్నాము.
మానము అనగ కొలత అని అర్థము. ఒక పదార్థము యొక్క నిర్దిష్టకొలతను పరిమాణము అంటున్నాము.
కాలమును గురించి చెప్పునపుడు కాలమానము అంటున్నాము. కాలమానమనగ కాలము యొక్క కొలత అని అర్థము.
అలాగే మనిషి విషయములో చూస్తే మనిషికి ఒక హోదా లేక గొప్పతనము అనునవి ఉంటాయి. హోదా లేక గొప్ప
తనమనునవి ఒక్కొక్కనికి ఒక్కొక్క కొలతలో ఉండును. మనిషికి మనిషికి గొప్పతనము లేక విలువలో కొంతైన తేడా
ఉండును. ఏదైన ఒక విషయములో తన విలువకు భంగము కల్గినపుడు అక్కడ నా మానము పోయిందంటాము.
ఇక్కడ కూడ మానము పోయిందంటే మనిషి యొక్క విలువకున్న కొలత తగ్గిపోయిందని అర్ధము. ఈ విధముగ అనేక
విషయములలో మానము అన్న పదము ఉపయోగపడుచున్నది. ఒక వ్యక్తికున్న విలువను బట్టి అతనికి ఎదుటి వాడిచ్చు
గౌరవమును మర్యాద అంటుంటాము. మానము మర్యాద లేని మనుషులు కూడ జగతిలో గలరు. మానముంటేనే
మర్యాద ఉండును. మానము లేకపోతే మర్యాద కూడ ఉండదు. మానము యొక్క స్థితి గతులను వివరముగ
తెలుసుకొంటే ఇంకా ఈ విధముగానున్నవి.
ఒక మనిషికున్న మానముకంటే ఎక్కువగ పోల్చుకొని ఎదుటి వాడు గౌరవించడమును ‘అభిమానము' అంటాము.
అలాగే ఒకనికున్న మానమును గుర్తించలేకున్నపుడుగాని లేక మానము ఉందోలేదో తెలియనపుడు వానియెడలగలుగు
దానిని ‘అనుమానము' అంటాము. నిర్ధిష్టముగ తెలియు కొలతను 'పరిమాణము' అనుచున్నాము. ఉన్నదాని కంటే
ఎక్కువగ పోల్చుకోవడమును అభిమానము అంటున్నాము, ఉన్నదానికంటే తక్కువగ పోల్చుకోవడమును అవమానము
అంటున్నాము. మానమును గురించి అంచనా లేనపుడు దానిని అనుమానము అంటున్నాము. ఈ మూడు
విధములైన మానములు ఒక వ్యక్తిపట్ల గాని ఒక వస్తువుపట్ల గాని ఉండుట సహజము. ఇక్కడ కొందరు ఒక ప్రశ్న
అడుగవచ్చును అదేమనగా! మనిషి నడవడికను బట్టి, ప్రవర్తనను బట్టి అవమానము, అభిమానము,
అనుమానముండవచ్చును కాని వస్తువుకెలా ఉండునని అడుగవచ్చును. దానికి జవాబేమనగా!
మానము, అవమానము, అభిమానము, అనుమానములు జీవములేని వాటికి కూడ ఉండునని తెలియుచున్నది.
ఉదాహరణకు ఒక ఆకారమున్న ప్రతిమను గురించి చూచితే, సమాజములో ప్రతిమకు కొంత విలువ ఉండును,
దానినే ఆ ప్రతిమకున్న మానము అనవచ్చును. ఆ ప్రతిమను కొందరు గౌరవించి పూజించుటవలన దానిపట్ల కొందరికి
మర్యాదగలదని చెప్పవచ్చును. 1) ప్రతిమలపట్ల ముస్లీమ్లు తక్కువ అంచనాతో వ్యతిరేఖముగ ఉందురు కావున
వారిదగ్గర ప్రతిమకు అవమానముగలదని చెప్పవచ్చును. 2) కొందరు ఆ ప్రతిమనే చాలా గొప్పగ ఆరాధించుట వలన
దానియెడల వారికి చాలా అభిమాన మున్నదని కూడ చెప్పవచ్చును. 3) ప్రతిమల విలువను ఏమాత్రము అవగాహన
చేసుకోక, వాటి విషయము ఏమాత్రము తెలియక, ఎటూ తేల్చుకోలేక, మొదటికే కొట్టిపారవేయు నాస్తికులలో ప్రతిమలపట్ల
అనుమానమే మిగిలినదని చెప్పవచ్చును. ఈ విధముగనే జీవమున్న మనుషులను వారికున్న విలువను అంచనావేసుకోలేక
అనుమానించడము కూడ జరుగుచున్నది. అట్లే విలువను తక్కువ అంచనా వేసుకోవడము వలన అవమానించడము,
ఎక్కువ పోల్చుకోవడము వలన అభి మానించడము కూడ జరుగుచున్నది. దీనినిబట్టి చూస్తే ఎదుటివారి విలువను
(మానమును) గ్రహించడములోని విధానముల వలననే అవమానములు, అభిమాన, అనుమానములు గలవని
నిరూపణకొస్తున్నది.
తనకంటే వేరుగనున్న ప్రాణముగల, ప్రాణములేని వాటికిచ్చు కొలతగల విలువలనుబట్టి మనుషులను మూడు
విధములుగ విభజించ వచ్చును. ఒకటి అవమానించువారు, రెండు అభిమానించువారు, మూడు అనుమానించువారు.
ఈ ముగ్గురునే దూషణ, భూషణ, తిరస్కారు లంటున్నాము. అవమానించువారిని దూషణులని, అభిమానించు వారిని
భూషణులని, అనుమానించువారిని తిరస్కారులని అనవచ్చును. ఇంకొక విధముగ, అవమానించువారిని దూషించువారిని
నాస్తికులని, అభిమానించు వారిని కీర్తించి ఆరాధించువారిని ఆస్తికులని, అనుమానించి తిరస్కరించు వారిని
విమర్శించువారిని హేతువాదులని లెక్కించవచ్చును. వీరిని మనిషి విషయములో దూషణ, భూషణ, తిరస్కారులని
చెప్పినప్పటికి దేవుని విషయములోనికి వచ్చేటప్పటికి నాస్తికులు, ఆస్తికులు, (విమర్శకులు) హేతువాదులని చెప్పవచ్చును.
నాస్తికులకు ఆస్తికులకు మధ్యలోనున్న వారు హేతువాదులు. ఎందుకనగా దేవుని విషయములో హేతుబద్దతను తెలిసినపుడు
హేతువాదులు ఆస్తికులుగ మారవచ్చును. అలాగే హేతు బద్దతను తెలియనపుడు నాస్తికులుగ మారవచ్చును.
ఒక మనిషి ఉన్నపుడే వానిపట్ల అభిమానము, అవమానము, అనుమానము ఉండును. అలాగే దేవుడు
ఉన్నపుడే ఆయన పట్ల ఆస్తికము, నాస్తికము, హేతువాదము ఉండును. విశ్వములో కనిపించే మనిషిగలడు, అలాగే
కనిపించని దేవుడు గలడు. ఇప్పటి కాలములో మనిషి దేవునిపట్ల తన ఆస్తికత్వమును, నాస్తికత్వమును ఎలాకలిగి
ఉన్నాడో వివరించు కొందాము. ప్రస్తుత కాలములో దేవుని సమాచారము ఏమిటో, దేవుడెవరో, దేవుని గొప్పతనము
ఏమిటో, దేవుడంటే అర్థమేమిటో, దేవుని పరిమాణ మేమిటో తెలియని వారందరు ఆస్తికులుగ చలామణి అగుచున్నారు.
దేవుని స్థానములో ఎందరో దేవతలను సృష్టించుకొని వారినే దేవునిగ చెప్పు కోవడము వలన అసలు దేవుడెవరో
అర్థము కాకుండ పోయినది. షట్ శాస్త్రములలో బ్రహ్మవిద్య శాస్త్రమై నిలచినది భగవద్గీతయని తెలియని వారెందరో
స్వాములుగ చలామణి అగుచు, గీతను ప్రమాణముగ తీసుకోక పోవడము వలన అసలైన దేవుని విషయము
తెలియకుండ పోయినది. దైవవిషయములు శాస్త్రబద్ధత కల్గిన జ్ఞానమని తెలియనివారు, అనేక విధముల వారివారి
బోధలను ప్రచారము చేసుకొనుట వలన, దేవుడు అన్న పదమునకు అర్థము లేకుండ పోయినది. ఒక్కొక్క గురువు
ఒక్కొక్క విధముగ బోధించుట వలన ఒకరికొకరికి పొంతన లేకుండ పోయినది. ఎంతో మంది స్వాములు
వారికిష్టమొచ్చినట్లు, వారికి తోచిన విధముగ శాస్త్రబద్ధత ఉందాలేదా అని చూడకుండ చెప్పుటవలన, దైవత్వమునకు
నిర్ధిష్టమైన ప్రమాణము తెలియకుండ పోయినది. జ్ఞానము అనుపేరుతో అజ్ఞానము, స్వాములు అనుపేరుతో
దైవవ్యతిరేఖమైన మాయ ప్రతినిధులు ఉన్నారని చాలమందికి తెలియదు. మాయకు ప్రతిరూపాలై దైవత్వమను పేరుతో
మాయతత్వమును బోధించువారు, ఆస్తికులమని పేరు పెట్టు కొన్నప్పటికి వారు దైవధనము లేని నాస్తికులే.
ఆలోచనాశక్తి గల కొందరు శాస్త్రసమ్మతముగాని లోపభూయిష్టమైన ఆస్తికత్వమును చూచి ఇదా దైవత్వము?
ఎవరు దేవుడు అని ప్రశ్నించుకొని వారి ప్రశ్నలకు ప్రత్యక్షముగ ఉన్న ఆస్తికులలో జవాబులేదని వారంతకు వారు
ముద్రవేసుకొని, దేవుడేలేడని మేము నాస్తికులమనుకొనుచున్నారు. ఆస్తికత్వము అంటే ఇపుడున్న పద్ధతేనా అని
నాస్తికులు యోచించడము లేదు. ఇపుడున్న వారందరు పైకి ఆస్తికులమని పేరు పెట్టుకొన్నప్పటికి తమవలె నాస్తికులేనని,
వారు ఆచరిస్తున్నది ఆస్తికత్వము కాదని తెలియ కున్నారు. ఆస్తికుడు అంటే నిర్థిష్టమైన అర్థమేమైన ఉందేమోనని
ఆలోచించకుండ, స్వాములను భక్తులను ఆస్తికులనుకోవడము నాస్తికుల పొరపాటు. దేవుడొకడున్నాడని తెలిసినపుడే
ఆయనకు విలువ ఉంటుంది. మనుషులు ఆయన విలువను తెలుసుకొన్నపుడే ఆయనకు మర్యాద ఉంటుంది.
మానమున్నపుడే మర్యాద ఉండునను సూత్రము ప్రకారము దేవుని గొప్పతనము తెలిసినపుడే ఆయన మీద
అభిమానముండును. ఆయనను గురించి తెలియక, ఆయన పేరుమీద తమకిష్టమొచ్చిన వారిని దేవుళ్ళుగ పోల్చుకున్నపుడు
అసలైన దేవునిమీద ధ్యాసయే లేకుండును కదా! దేవుని గూర్చి తెలియని ఆస్తికులు జ్ఞానధనములేని వారేకనుక వారు
కూడ నాస్తికులే. ఒక విధముగ ఆస్తికులు నాస్తికులు ఒక కోవకు చెందినవారే, అనగా జ్ఞానధనము లేనివారే. ఒకరేమో
మట్టిని సంచిలోనింపుకొని ధనమని మురిసిపోవుచు ఆస్తికులమని పేరుపెట్టుకొన్న నాస్తికులు. మరొకరేమో ఖాళీసంచిని
పట్టుకొని మాదగ్గర ధనములేదు, అది మాకు వద్దు అనువారు నాస్తికులు. ఈ విధముగ ఆస్తికులు నాస్తికులు ఒకే
కోవకు చెందినవారు కాగా, హేతువాదులు కొంత విభిన్నముగనున్నారు.
హేతువాదులు ప్రతి విషయమును విజ్ఞానముతో(సైన్సుతో) ముడి పెట్టుచు, తమకు తెలిసినది మాత్రమే
విజ్ఞానమనుచు, తమకు తెలియనిది విజ్ఞానమేకాదంటున్నారు. దేవుని విషయానికి వస్తే నాస్తికులవలె కాకుండ సైన్సు
ప్రకారమైతే ఒప్పుకొంటాము. సైన్సు ప్రకారము కానిదానిని ఒప్పుకోము అని అంటున్నారు. చివరకు ఆధ్యాత్మికము,
దేవుడు సైన్సు కానేకాదు, కేవలము నమ్మకము మీద ఆధారపడిన విషయములని కొట్టివేయుచున్నారు. ముఖ్యముగ
దేవున్ని సైన్సు ప్రకారము నిరూపిస్తే ఒప్పుకుంటామని, అలా మమ్ములను ఎవరు ఒప్పించలేరంటున్నారు. కాని
హేతువాదులు సైన్సు ప్రకారము దేవుడు లేడని ఒప్పించగలమా అని ఆలోచించలేదు. ఒక విధముగ నేటి ఆస్తికులు,
హేతువాదులను ఒప్పించలేని మాట నిజమే. ఎందుకనగా ఆస్తికులకు శాస్త్రమంటే (సైన్సు అంటే ఏమిటో తెలియదు.
అంతమాత్రముననే దేవుడు హేతుబద్దుడుకాదని హేతువాదులు చెప్పుట సరియైన మాట కాదు. నేటి ఆస్తికులు చెప్పు
పుక్కిడిపురాణములు సైన్సుకు నిలబడునవి నిరూపణకు వచ్చునవి కావు. పురాణములు చెప్పు విషయముల ఆధారముతో
ఆధ్యాత్మికము, దేవుడు ఉన్నాడనుమాట విజ్ఞానము (సైన్సు) కాదని హేతువాదుల వాదన సమంజసమే అనిపించినప్పటికి
ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నము కాగలవు. అవేమనగా! ఆస్తికుల మాటలు నిరూపణకురాని నమ్మకములు మాత్రమేనని
చెప్పు హేతువాదులు, తమ పరిశోధనల ద్వార ఆధ్యాత్మికములోని విషయము లను పరిశోధించి పరిశోధనకు తేలనివని
ఎందుకు చెప్పకూడదు? ఎల్లప్పుడు ఆస్తికులు చెప్పిన మాటలను కేవలము నమ్మకములని కొట్టి వేయడము తప్ప,
తమకు తెలియని శాస్త్రబద్దత ఏదైన ఉన్నదేమోనని ఎందుకు చూడకూడదు? 'యోగశాస్త్రే' అని పేరుపెట్టబడిన భగవద్గీతలోని
విషయములను శాస్త్రబద్ధముగ ఎందుకు శోధించకూడదు? షట్ శాస్త్రములని పేరుగాంచిన ఆరుశాస్త్రములు,
శాస్త్రవేత్తలమనుకొను హేతువాదులకు తెలుసునా? శాస్త్రములు నాల్గనని చెప్పుట హేతువాదులలోని మూఢ నమ్మకము
కాదా! తమకు తెలిసినవే శాస్త్రములు తెలియనివి శాస్త్రములు కాదనవచ్చునా? అష్టాదశపురాణములను ఖండించవచ్చును,
కాని షట్ శాస్త్రములను హేతువాదులు ఖండించగలరా? ఆరు శాస్త్రములు ఒకదానితో ఒకటి ముడిబడి ఉండగ,
వాటి అనుసంధానమును సైన్సు ప్రకారము కాదనగలరా? తమకు అర్థము కానంతమాత్రమున భగవద్గీతనే కల్పితమని
చెప్పు హేతువాదులు, గీతలోని విషయములను విజ్ఞానరూపముగ శాస్త్రము కాదని నిరూపించగలరా? తమకు జీవశాస్త్రము
తెలుసునను హేతువాదులు, జీవాత్మ అను విషయమును ఎందుకు కొట్టివేయుచున్నారు? ఎన్నో విషయములకు పూర్తి
సమాధానము తెలియకనే ఏదో ఊహతో చెప్పు హేతువాదులు మూఢనమ్మకము కలవారు కాదా?
ఏదో ఒక భక్తి గలవారందరు మేము ఆస్తికులమనుకొని పొర బడినట్లు, ఏవో కొన్ని విషయములను
విజ్ఞానరూపముగ తెలిసినంత మాత్రముననే మేము హేతువాదులమని కొందరు పొరపడుచున్నారు. నిజమైన ఆస్తి
ఏమిటో నేటి ఆస్తికులకు తెలియనట్లు, నిజమైన హేతుబద్ద మేమిటో నేటి హేతువాదులకు తెలియదు. దీనినిబట్టి నేటి
ఆస్తికులు ఆస్తికులు కారు, అట్లే నేటి హేతువాదులు హేతువాదులు కారు వృథావాదులే. నేటి ఆస్తికులను, హేతువాదులను
ప్రశ్నిస్తూ, శాస్త్రబద్దమైన విషయములను తెలిసినపుడే నిజమైన ఆస్తికులు, నిజమైన హేతువాదులు కాగలరని
తెలుపుచున్నాము. సృష్ఠి ఆదిలో మొదటపుట్టిన శాస్త్రము దైవశాస్త్రము. దానినే బ్రహ్మవిద్యాశాస్త్రము మరియు యోగశాస్త్రము
అని అంటున్నాము. మొదట పుట్టిన యోగశాస్త్రము దేవునికి సంబంధించినది, కావున దానిని స్వయముగ దేవుడే
సూర్యగ్రహమునకు చెప్పాడు. సూర్యగ్రహము, కనిపించుటకు మండే గోళము, అది దాని స్థూలాకారము. జీవమున్న
ప్రతిదానికి సూక్ష్మము కూడ ఉండును. విషయమును గ్రహించునది కావున దానిని గ్రహ అన్నాము. ఆనాటి
దైవప్రోక్తమైన మొదటి శాస్త్రమును సూర్యగ్రహము గ్రహించి తర్వాత భూమి మీద ఉన్న మానవులకు తెలియజేసినది.
మొదట భూమి మీదకు సూర్యుని ద్వార వచ్చిన శాస్త్రమే యోగశాస్త్రము. అదియే తిరిగి ద్వాపరయుగ అంత్యములో
శ్రీకృష్ణ భగవంతుని ద్వార తెలియబరచ బడినది. తర్వాత మిగత ఐదు శాస్త్రములు మనిషి స్మృతిలో మెదలి బయటపడినవి.
మనిషినుండి బయటపడిన ఐదుశాస్త్రములు ప్రపంచమునకు సంబంధించినవి మాత్రమే. తర్వాత వేదములు ఉపనిషత్లు,
పురాణములు తయారైనవి. శాస్త్రముల తర్వాత వచ్చిన వేదములు మానవుని తలలోని గుణములకు ప్రతీకలై నిలచినవి.
ఈ వేదములే యోగశాస్త్రమునకు కనిపించని శత్రువులై నిలచినవి. దేవున్ని వేదముల ద్వారానే తెలుసుకోవచ్చునను
భ్రమను కల్గించి మానవున్ని మభ్యపెట్టినవి. మనిషి దైవ జనితమైన యోగశాస్త్రమును వదలి ప్రకృతి జనితమైన
వేదముల వెంటపడ్డాడు. పూర్వకాలమునుండి వేదములను జీర్ణింపచేసుకొని, వాటికంటే మించినవిలేవని, దైవశాస్త్రమును
విస్మ రించాడు. నేటికిని దైవప్రోక్తమైన భగవద్గీతను లెక్కచేయక వేదములను పూజ్యములుగ పెట్టుకొన్న ఎందరో
స్వామీజీలు, పీఠాధిపతులు గలరు.
ఇక్కడొక ప్రశ్న పాఠకులకు రాగలదు, అదేమనగా! వేదములకంటే ముందు పుట్టినవి శాస్త్రములు కదా! వాటిలోను
ముందు పుట్టినది యోగశాస్త్రముకదా! ఆ తర్వాత పుట్టినవి వేదములన్నారు కదా! అటువంటపుడు ముందులేని
వేదములను గురించి గీతలో ఎందుకు చెప్పారు? గీతలో వేదముల ప్రస్తావన వచ్చినది కావున గీతకంటే ముందే
వేదములున్నవని తెలియుచున్నది కదా! దీనినిబట్టి గీత ఆదిలో పుట్టినదని, తర్వాత చాలాకాలమునకు వేదములు
పుట్టినవను మీమాట అసత్యమగును కదా! అని ప్రశ్నించవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! వేదములు
పుట్టకముందు ఆదిలోనే యోగశాస్త్రమైన గీత పుట్టినది. ప్రకృతికి సంబంధించిన ఐదు శాస్త్రములు పుట్టకముందు
మరియు నాల్గు వేదములు పుట్టకముందు పుట్టినది దైవశాస్త్రమైన దేవునిచే చెప్పబడిన యోగశాస్త్రము. ఆదిలో దైవప్రోక్తమైన
శాస్త్రమును యోగశాస్త్రమనెడి వారు. గీత అని, భగవద్గీత అని ఆనాడు యోగశాస్త్రమునకు పేరులేదు. ఎందుకనగా!
ఆనాడు భగవంతుని చేత చెప్పబడలేదు కావున భగవద్గీత అను పేరులేదు. మొదట చెప్పబడిన యోగశాస్త్రములో
వేదముల ప్రసక్తేలేదు. ఆనాడు వేదములే లేవు, కావున వేదముల ప్రసక్తి లేదు. ఆనాడు యోగశాస్త్రములో దేవుని
విషయములు మాత్రము గలవు. వాటి ఔన్నత్యమును గ్రహించలేని మానవులు కాలక్రమమున యోగశాస్త్రము యొక్క
విషయములను వదలి వేదముల వలలో పడిపోయారు. ద్వాపరయుగ అంత్యకాలమొచ్చేటప్పటికి దేవుడు చెప్పిన
యోగశాస్త్రధర్మములకు ముప్పు ఏర్పడినది. మానవుడు వేదములందాసక్తి పరుడై దైవధర్మములను విస్మరించాడు.
ఆనాడు ఋషులు, సన్న్యాసులు, తపస్వికులు దైవమార్గము కాని యజ్ఞములు, దానములు, వేదాధ్యయనములు, తపస్సులను
ఆచరించను మొదలు పెట్టారు. ఆ సమయమున దేవుడు తన ధర్మములను కాపాడుకొనుటకై తిరిగి తన శాస్త్రమును
అందరికి తెలియునట్లు చేయుటకుపక్రమించాడు. ఆ ప్రయత్నముతోనే యోగశాస్త్రమును ద్వాపర యుగమున భగవద్గీత
రూపముతో చెప్పాడు.
ద్వాపరయుగములో చెప్పినది మానవుడైన అర్జునునకు, కావున చెప్పెడివాడు కూడ మానవుడై ఉండాలి.
అందువలన దైవాంశ కృష్ణునిగ పుట్టి భగవంతుడైనది. భగవంతుడు చెప్పినది కావున యోగశాస్త్రమునకు
ద్వాపరయుగములో భగవద్గీత అని పేరు వచ్చినది. ఆదిలో యోగశాస్త్రమును సూర్యునికి చెప్పినపుడు, వేదముల
ప్రస్తావన అందులో లేదు. లేనివాటిని గూర్చి చెప్పవలసిన అవసరము ఆనాడు లేదు. కాలము మారుకొలది వేదములు
పుట్టి వాటి ప్రాబల్యము ఎక్కువ కావడము వలన ద్వాపరయుగ అంత్యములో చెప్పిన భగవద్గీతలో వేదములను గూర్చి
చెప్పవలసి వచ్చినది. వేదములు మాయకు ప్రతిరూపములని చెప్పినప్పటికి మానవులు వినేస్థితిలో లేరని మరియు
చెప్పువాడు దైవాంశగల భగవంతుడైనా, పైకి మానవుడే కావున కృష్ణుణ్ణి కూడ తప్పుపట్టి ఆయన మాటను లెక్కించరని
తలచి, గీతను బోధించునపుడే, చెప్పినవాడు స్వయముగ దేవుడే అని తెలియునట్లు, దైవము తన విశ్వరూపమును
చూపాడు. విశ్వరూపములోనుండి చెప్పిన ముఖ్యమైన మాటలలో వేదముల వలన దేవుడు తెలియబడడను మాట
స్పష్టముగ ఉన్నది. ఆదిలో యోగశాస్త్రమును సూర్యునికి చెప్పినపుడు విశ్వరూపము చూపలేదు. అటువంటి అవసరము
ఆనాడు లేదు కనుక చూపలేదు. అట్లే ఆ రోజు వేదములగూర్చి చెప్పలేదు. అటువంటి అవసరము ఆనాడు లేదు
కనుక చెప్పలేదు.
ఇప్పటికి 5260 సంవత్సరముల పూర్వము ద్వాపరయుగములో భగవంతుని ద్వార రెండవ మారు యోగశాస్త్రము
చెప్పబడినపుడు దానికి 'గీత' అనిపేరు పెట్టబడినది. ఆదిలో చెప్పబడినపుడు గీత అనుపేరు లేదు. అలా 'గీత' అని
పేరు పెట్టుటకు కారణమేమనగా! మొదట యోగశాస్త్రమను పేరుతో చెప్పిన జ్ఞానమును విడచి, తన ఇష్టమొచ్చినట్లు
మానవుడు జ్ఞానమను పేరుతో వేదములను, ఇతర పురాణములను ఆశ్రయించి దారి తప్పిపోతున్నాడని, అట్లు పోకుండుటకు
ఇది నీకు హద్దు అని ఒక అర్థము నిచ్చునట్లు గీత అని పేరు పెట్టారు. మానవుడు దేవుని విషయములో తన
ఇష్టమొచ్చినట్లు నడుచుకోకుండుటకు, ప్రక్కదారులైన మాయ మార్గములలో పోకుండుటకు, ఒక హద్దు ఏర్పరచి, ఈ
హద్దులో నడచుకొన్నపుడే నీవు గమ్యము చేరగలవని చెప్పాడు. అలా ఏర్పరచబడిన హద్దునే గీత అంటున్నాము.
గీయబడినదే హద్దు కావున మానవుని చుట్టూ గీయబడిన హద్దులో ఉన్నపుడు, మానవుని జీవితమునకు
అర్థము,పరమార్థముంటుందని, దేవుడు చెప్పిన హద్దేమిటో, మన చుట్టూ ఏర్పరచబడిన గీత ఏమిటో, ఆ గీతలో
నడుచుకోవాలంటే, ఆ హద్దు మీరకుండా ఉండాలంటే, మనమెలా ఉండాలో తెలియకపోతే జీవితమునకు ఒక నిర్ధేశత
ఉండదని కూడ అందులోనే తెలుపబడినది. వేదములను వృక్షములు, పురాణములను తీగలు, యజ్ఞయాగాదులను
జంతువులు, జపతపములను ఎత్తు పల్లములు గల జీవితమను అరణ్యములో జలాశయముల వైపు జంతువులు నడచిన
పిల్లదారులను వ్రత నియమములను చూచి, ఇవియే దారులని భ్రమించు మానవునికి రాజమార్గమై కనిపించి, జన్మయను
అరణ్యమునుండి బయటపడునట్లు చేయు చక్కని మార్గమే గీత. దేశపటములో హైవే రోడ్డును గీతవలె చూపినట్లు
జీవితపటములో రాజమార్గమువలె గీచి చూపిన జ్ఞానమే గీత. భగవంతుడు గీచి చూపినది కావున భగవద్గీతయైనది.
మీరు ఆస్తికులా - నాస్తికులా!.
పూర్వము ఆదిలోనే దైవజ్ఞానమును మానవులకు తెలిపినప్పటికి కాలము గడచుకొలది, మానవులు
ఉచ్చనీచములను ఆలోచించక, తమ హద్దును తెలుసుకోలేక, హద్దుమీరి నాస్తికులైపోతున్నారని తలచిన దేవుడు, మానవులకు
ప్రత్యేకించి హద్దు(గీత) అను పేరుతో చెప్పినదే భగవద్గీత. గీతను చెప్పినప్పటికి, నేడు గల ఆస్తికులు దేవుడు చెప్పిన
ప్రకారము నడువగల్గుచున్నారా? దేవుడు చెప్పిన గీతను వదలి, మాయ చెప్పిన వేదములు మొదలుకొని అనేకముగయున్న
బోధలలో ఆసక్తికల్గి వాటి వెంటపోవుచున్నారు. కొందరు వైష్ణవమని, కొందరు శైవమని, కొందరు కుమారి
సాంప్రదాయమని, కొందరు అచల సాంప్రదాయమని, కొందరు సిద్ధయోగమని, కొందరు గురుసాంప్రదాయమని,
బోధకులందరు ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయమును బోధిస్తు, గీత యొక్క ఉద్దేశమును ఏమాత్రము ఆచరించడము
లేదు. భగవద్గీత అంటే ఏమిటో తెలియని సమాజము నేడు హిందూమతములో గలదు. కొందరు స్వాములు
చూపాకారమునకు భగవద్గీతలోని శ్లోకములు చెప్పినప్పటికి, ప్రజలకు బోధించునదంత గీతకు వ్యతిరేఖ భావములే.
కొందరైతే వేదములను ప్రమాణముగ తీసుకోవలెను గానీ, గీతను ప్రమాణముగ తీసుకోకూడదంటున్నారు. దేవుడే
స్వయముగ గీతలో ఒక్క దేవున్ని గురించి చెప్పితే, స్వాములందరు ఎందరో దేవుళ్ళను గురించి చెప్పుచున్నారు. అన్య
దేవతారాధన తగదని, అట్లు చేయుట వలన మోక్షములభించదని, గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమున 23వ
శ్లోకములో భగవంతుడే స్వయముగ చెప్పితే, ఆ మాటను ప్రజలకు బోధించవలసిన స్వాములే స్వయముగ అన్యదేవతలకు
పూజలు చేయుచున్నారు. గీతలో అవసర మొచ్చినపుడు ధర్మములను పునరుద్దరించుటకు అప్పుడప్పుడు భూమి మీద
భగవంతునిగ పుట్టెదనని దేవుడే చెప్పగ, ఇంతకుముందు ధర్మమును ఏమాత్రము చెప్పని రామునిగ పుట్టాడని ప్రచారము
చేయుట ఆస్తికులకు తగునా? తన జన్మ చాలా రహస్యమైనదని, ఎవరికీ అర్థముకాదని గీతలో దేవుడే చెప్పగ, కృష్ణుని
ప్రవర్తన బాగాలేదని, రాముడు సత్ప్రవర్తనుడని స్వాములందరు కృష్ణునికంటే ముఖ్యముగ రామున్ని కొలువడము
ఆస్తికులకు తగునా? దైవత్వమంటే ఏమిటో గీతలో సంపూర్ణముగ చెప్పియుండగ, అందులోని విషయము అర్థముకాక
వ్రతములు చేయువారు ఆస్తికులా? శరీరములో రెండు యజ్ఞములు జరుగుచున్నవని చెప్పగ బయటి యజ్ఞములు
చేయువారు జ్ఞానముగల ఆస్తికులా? యజ్ఞమంటే కాల్చడమని, లేక నాశనము చేయడమని అర్థమగులాగున ద్రవ్యములను
లేకుండ చేయడమును ద్రవ్యయజ్ఞమని, జ్ఞానములను లేకుండ చేయడము జ్ఞానయజ్ఞమని గీతలో చెప్పగ, కొందరు
స్వాములు తమ ఉపన్యాస కార్యములను గీతాయజ్ఞములని పేర్లు పెట్టడము, ఇన్నిమార్లు చేశామని తెలుపుటకు 64వ
గీతాయజ్ఞమని, 100వ గీతాయజ్ఞమని ప్రకటనలు వ్రాసి ప్రచారము చేయుట తగునా? భగవద్గీతలోని అర్ధము
ప్రకారము ఇన్ని మార్లు గీతను కాల్చి లేకుండ చేశామన్నట్లు కాదా! గీతను తమకొరకు దేవుడు ఏర్పరచిన హద్దని, ఏ
స్వాములైన గ్రహించి బోధిస్తున్నారా? గీతలో సమస్తము తెలిసినామని, మేము సర్వజ్ఞులమని చెప్పుకొనువారు, ఇతర
దేవతలకు ఈ విధముగ పూజలు చేయవలెనని చెప్పవచ్చునా? అన్యదేవతల ఆరాధన దారితప్పిన మార్గమని గీత
స్పష్టముగ బోధిస్తుండగ, అన్యదేవతా రాధనలకు పలానా పలానా పద్ధతులు గలవని, వాటి ప్రకారమే పూజలు
చేయవలెనను వారు నిజముగా ఆస్తికులా? వెంకటేశ్వరుని పూజా విధానము వైఖానసము ప్రకారమని, పద్మావతికి
పంచరాత్ర ప్రకారమని, ఆగమ పూజావిధానములు కల్పించినవారు ఆస్తికులా? నన్నొక్కడినే విశ్వసించమని గీతలో
చెప్పగ, నీవేనా దేవుడివన్నట్లు అనేక దేవతలను కల్పించి, వారికి పూజావిధానములు కూడ కల్పించుట ఆస్తికులకు
తగినపనేనా? గీతలో తమ తలవ్రాతను మార్చుకొను విధానము శరీరములో గలదని సూచించి యుండగ, బయట
నదులలో మునిగి పాపము పోతుందనుకోవడము గీతకు వ్యతిరేఖము కాదా! దైవజ్ఞానములో మంత్రముల ప్రసక్తే
లేకుండ గీతను చెప్పగ, ఉపదేశమని గురువులు శిష్యులకు మంత్రములను చెప్పుట గీతకు వ్యతిరేఖము కదా! ఎవరికీ
తెలియనివాడనని గీతలో దేవుడు చెప్పగా, అదే గీతను బోధించు స్వాములు, జీవుడే దేవుడని చెప్పుకోవడము పొరపాటు
కాదా! గీతలో క్షర, అక్షర, పురుషోత్తములని ముగ్గురు పురుషులుగ చెప్పుకొన్న శ్లోకములు పురుషోత్తమప్రాప్తి యోగములో
ఉండగ, ముగ్గురు పురుషులెవరో వివరించలేని స్వాములు ఆస్తికులా? పురుషులెవరో? ప్రకృతేదో గుర్తించలేక, ప్రకృతిని
పట్టుకొని పురుషుడని భ్రమించువారు నాస్తికులు కాక ఆస్తికుల గుదురా! లోపల ఆత్మ జ్ఞానము తెలియక బయటగల
చెట్టుకు, పుట్టకు మ్రొక్కువారు నాస్తికులు కాక ఆస్తికులగుదురా! ఇలా ప్రశ్నిస్తు పోతే సూత్రము ప్రకారము నేడు పెద్ద
స్వాములు మొదలుకొని చిన్న పూజారి వరకు అందరు దైవధనమను ఆస్తిలేని నాస్తిపరులే! దేవుడు, దేవుని భక్తి తమకు
లేదని బయటికి చెప్పుకొనువారు కనిపించు నాస్తికులు కాగా, లేకున్న ఉన్నదని భ్రమిస్తు ఇతరులను భ్రమింపచేయువారు
ఆస్తికముసుగు లేసుకొన్న నాస్తికులని, వీరిపట్ల జాగ్రత్తగ ఉండవలెనని, లేకపోతే వారిని అనుసరించు మిగతవారు
కూడ జీవితమును నాస్తికత్వములో గడుపవలసి వస్తుందని చెప్పుచున్నాము. ఉదాహరణగ ఒక విషయాన్ని చూస్తాము.
పాతిక సంవత్సరముల పూర్వము ఒక ఆశ్రమములో ఒక స్వామీజీ జయంతి ఉత్సవ సందర్భముగ చాలామంది
గొప్పగొప్ప స్వాములు పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన స్వాములందరు సన్న్యాసులే. వారిలో ఒక స్వామీజీ ఉపన్యాసము
చెప్పుచు, సన్యాసత్వము చాలా గొప్ప మార్గమని ఇలా చెప్పసాగెను. "సంసార జీవితములో ఉన్నవారెవరు కూడ
జ్ఞానమును తెలుసుకోలేరు. జ్ఞానార్జన కొరకు ఆదిశంకరాచార్యుడు చిన్న వయస్సులోనే సన్న్యాసత్వము స్వీకరించి
కాషాయ వస్త్రములు ధరించాడు. అలాగే వివేకానందుడు వివాహము చేసుకోకుండ సన్న్యాసత్వము పొందాడు. మేము
కూడ సంసారమును త్యజించి సన్న్యాసత్వము స్వీకరించాము. సన్న్యాస జీవితములో ఏ ఆటంకములేకుండ దైవజ్ఞానము
తెలుసుకోవచ్చును ఆచరించవచ్చును. సంసార జీవితములో దేవుని జ్ఞానము తెలుసు కొనుటకు వీలుపడదు. ఒకవేళ
తెలుసుకొన్నప్పటికి ఆచరించుటకు ఏమాత్రము సాధ్యము కాదు. అందువలననే గొప్పవారందరు సన్న్యాసత్వమును
స్వీకరించారు. సంసారులు జ్ఞానము తెలియలేరు, సన్న్యాసులు మాత్రమే జ్ఞానమును తెలియగలరు. కావున పూర్వము
పెద్దలు “సంసారి ఛీ, సన్న్యాసి సై అన్నారు.” అని ఈ విధముగ చెప్పిన స్వాముల మాటలకు, ఒక యువకుడు
ప్రేరేపింపబడినవాడై తాను కూడ పెళ్లి చేసుకోకుండ సన్యాసత్వము పుచ్చుకొని స్వామీజీవలె మారిపోయాడు.
యువకుడు స్వాముల మాటలువిని కాషాయ వస్త్రములు ధరించితేనే సన్న్యాసులౌతామను కొన్నాడు.
ఈ విషయములో స్వాములు చెప్పిన మాటలను ధర్మమా అధర్మమా అని చూస్తే, భగవద్గీతలో ఆత్మసంయమ
యోగమను అధ్యాయములో మొదటి శ్లోకములోనే భగవంతుడు ఈ విధముగ " జ్ఞానాగ్ని లేనివాడు (జ్ఞానధనము
లేనివాడు), చేయవలసిన పనులు మానుకొన్న వాడు నిజమైన సన్న్యాసి కాడు. కర్మఫలములైన పాపపుణ్యముల మీద
ఆశలేకుండ కార్యములు చేయువానిని నిజమైన సన్న్యాసి, నిజమైన యోగి అనవచ్చును” అని చెప్పాడు. దీనిని బట్టి
కాషాయవస్త్రములకు, సన్న్యాసత్వమునకు సంబంధములేదని తెలియుచున్నది. దేవుడు చెప్పిన మాటకు వ్యతిరిక్త
దిశలో నడుస్తు, వివాహము చేసుకొన్న వారివలె పనులు చేయక, మౌనదీక్షలో ఉన్నామని మాట్లాడని వారుకొందరు,
యోగదీక్షలో ఉన్నామని బయటికి కనిపించని కొందరు గలరు. కాషాయమంటే సన్న్యాసత్వమను అర్థమొచ్చు నట్లుండుట
ధర్మముకాదు అధర్మమేనని తెలియుచున్నది. ఎందరో స్వామీజీలు భగవద్గీతలోని దైవజ్ఞానమును గ్రహించుకోక, తాము
చెడిపోయి ఇతరులను చెడుపుచున్నారు. నేడు హిందువులలో 85% శాతము భగవద్గీత అంటే ఏమిటో తెలియనివారు
గలరు. కేవలము 15% శాతము భగవద్గీతను చూచిన వారు కొందరుండగ, కొందరు గీతను చదివినవారు గలరు.
చదివిన వారిలో స్వాములు కొందరుండగ వారికే గీత అర్థము కాలేదని తెలియు చున్నది. గీత ఆధ్యాత్మిక ప్రమాణగ్రంథమని
చాలామందికి తెలియక ఎందరో స్వామీజీలు పురాణములను, ఇతిహాసములను తమబోధలలో ఎక్కువగ చెప్పుకొనుచున్నారు.
పురాణ ఇతిహాసములు కాలక్షేపమునకేగాని, కర్మక్షేపమునకు పనికిరావని తెలియకున్నారు. జ్ఞానాగ్ని కర్మయను కట్టెలను
కాల్చునది. జ్ఞానాగ్ని గీత జ్ఞానమువలననే లభించును. జ్ఞానాగ్ని అనబడు జ్ఞానధనమున్నవాడే ఆస్తికుడు. గీతను
అనుసరించక, దాని హద్దులో లేకుండ, తన ఇష్టమొచ్చునట్లు నడుచుకొనువాడు జ్ఞానధనము లేని నాస్తికుడని చెప్పవచ్చును.
మొత్తము మీద ఆస్తికత్వమును గూర్చి తెలియనివాడు ఆస్తికుడెలా అగును? అందువలన మొదట ఆస్తికత్వమంటే
ఏమిటో నేడు ఆస్తికులమనుకొనువారు తెలియవలసిన అవసరమున్నది.
మరికొందరు సంస్కృత భాషను నేర్చినంతమాత్రముననే స్వాములై పోయి ఆస్తికులమనుకొనుచున్నారు. సంస్కృత
భాష తెలిస్తేనే జ్ఞానము తెలియునను ఉద్దేశముతో కొందరుగలరు. సంస్కృత భాషాపాండిత్యమునే జ్ఞానమనుకొనువారు
గలరు. భావమును తెలుపునది భాష. ఏ భాష అయినప్పటికి అందులో తెలియవలసిన సమాచారము మాత్రమే
ఉండును. ఏ భాష ద్వారా అయిన జ్ఞానమును తెలియవచ్చును. ఒక్క సంస్కృత భాష ద్వారానే జ్ఞానము
తెలియుననుకోవడము పొరపాటు. దీనిని బట్టి సంస్కృతము తెలిసినవారు ఆస్తికులమనుకోవడము కూడ పొరపాటు.
నేడు బహు భాషా కోవిధుడు కూడ నాస్తికుడుగ ఉండడము, చదువురానివాడు సంపూర్ణజ్ఞానియై ఆస్తికుడుగ ఉండడము
గలదు. జ్ఞానధనము లేనివాడు గొప్ప కులములో పుట్టిసంస్కృత పాండిత్యము న్నప్పటికి నాస్తికుడే, జ్ఞానధనము
గలవాడు నీచకులములో పుట్టి సంస్కృత పాండిత్యములేనప్పటికి ఆస్తికుడే అగును.
కొందరాస్తికులు సంస్కృత శ్లోకములను కంఠస్తము చేసుకొని, అనుష్టానమను పేరుతో నియమములను
ఆచరించుచు, నేర్చుకొన్న శ్లోకములను వల్లిస్తుందురు. ప్రజలకు వారి అనుష్టానము వలనగాని, వారి వేదపఠనము
వలనగాని, ఏమాత్రము జ్ఞానము లభించదు. కొందరికేమో తాము నేర్చుకొన్న శ్లోకములకు అర్థము తెలియదు.
తూర్పుకు తిరిగి మంత్రము చెప్పువారికి తూర్పుకెందుకు తిరగాలో తెలియదు. ముక్కుపట్టు కొని మంత్రశ్లోకము
చదువుచున్నవారికి ముక్కు ఎందుకు పట్టుకోవాలో తెలియదు. మంత్రము చెప్పునపుడు ముక్కును గట్టిగ పట్టుకొని
శ్వాస ఆడకుండునట్లు చేసి మంత్రము పఠించవలెనని నియమముండగ, ఆ విషయము తెలియనందువలన కనిపించునట్లు
ముక్కు మీద వ్రేళ్లు పెట్టుకొని, శ్వాస యధాతథముగ ఆడుచుండగ మంత్రము చెప్పువారు కూడ గలరు. ఇలా మేము
నిష్ఠాగరిష్ఠులైన ఆస్తికులమనుకొనువారు కూడ, తమ నిష్టను గురించి తమకే తెలియకున్నను, ఇతరులను అవహేళనగ
మాట్లాడడము జరుగుచున్నది. ఆస్తికత్వము యొక్క సూత్రము తెలియని కొందరు, వైదిక అనుష్ఠాన పండితులు
ఇతరులను ఎలా హేళనగ మాట్లాడుచున్నారో ఉదాహరణగ ఒక పుస్తకములో వ్రాయబడిన విషయమును క్రింద పేరాలో
చూస్తాము.
“సరియైన మార్గము దొరకక, సదాచార్యుడు లభించక సత్సాంగత్యములేక, శాస్త్రీయపరిచయములేక, కుమత
ప్రవిష్ణులై ప్రాకులాడుచు మరియొక తెగవారున్నారు. 1) చూడచక్కని చిన్నది కడ మేడగదిలోనున్నది. ఏడురంగుల
మడుగులో జలక్రీడలాడుచున్నది. 2) రెక్కముక్కులేని పక్షి రేయిబగలు తపసుపట్టి ఒక్క చెరువు చేపలన్ని ఒకటే
మ్రింగెరా. 3) పోగా పోగా గోడుంది, గోడకు తగ్గ గూడుంది, గూడుకు తగ్గ ప్రమిదుంది. 4) చెప్పులోని రాయి
చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు ఇంతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమ.
5) పన్నెండు గొమ్మల పటామర్రి, దానిపై పంచవన్నెల రామచిలుక, దానిమీద నక్కవలె ప్రకాశించు చుక్క, దానిలోనే
రహస్యముండు. 6) గుంటూరి కవతాలనున్న చింతలకాడ గుఱ్ఱపు కడుపున గొట్టె పుట్టెనయా నందామయా గురుడ
నందామయా ఆనందదేవికి నందామయా. ఇవి వీరి ఉప నిషత్సూక్తులు తత్త్వ వాచకములు. వీటికేమో అంతరార్థమట
వీరి శ్రాద్దమట”
పై విషయము చూస్తే వ్రాసిన గ్రంథకర్త ఎదుటివారి యొక్క విలువను, వారు చెప్పిన విధానమును గ్రహించక
కేవలము అను మానముతో అవమానముగ మాట్లాడిన మాటలని తెలియుచున్నది. శరీరము దేవాలయము, శరీరములోని
ఆత్మే దేవుడు అని శాస్త్రము చెప్పియుండగ, అది తెలియక బయటగల వైదికనిష్ఠను పట్టుకొని ప్రాకులాడు వారికి
ఆత్మజ్ఞానము కల్గిన వారియొక్క వాక్యములు అర్థము కావు. కల్లెము వేసిన గుఱ్ఱమునకు కన్నులకు ప్రక్క చూపులేకుండ
ముందుచూపు కనిపించునట్లు కళ్లచిప్పలు కట్టబడియుండును. కళ్ళ చిప్పలు గల గుఱ్ఱము ఎదురుగనున్న దారితప్ప
ప్రక్క చూపులేకుండుట వలన ప్రక్క దృశ్యములను చూడలేదు. అలాగే వైదికనిష్ఠలనబడు కళ్లగంతలుండుట వలన
అనుష్ఠానములు తప్ప మిగతా ఆత్మజ్ఞానులను గ్రహించలేని స్థితి కొందరికుండును. అటువంటి వారు వ్రాసినవే పై
వ్యాఖ్యలు. శరీరాంతర్గత వివరమును అందులోని దైవమును పోల్చి వ్రాసిన విశేష జ్ఞానమును గ్రహించక, హేళనగ
మాట్లాడిన గ్రంథకర్త గొప్పపేరున్న వేదవేత్త, అయినప్పటికి ఆస్తికుడు కాడని జ్ఞానధనము లేని నాస్తికుడని చెప్పవచ్చును.
కొందరు కాశీకిపోయి సంస్కృత విద్యను నేర్చి వేదపారాయణము చేసి భాషా పాండిత్యము గల స్వాములుగ
తయారగుచున్నారు. వేదములు చదివినవాడే స్వామి గురువను ఉద్దేశము వారిలో ఉండుట వలన వేదపాండిత్యము
లేనివారిని తక్కువగ చూస్తుందురు. వారిమాటలందే వేదములు గొప్పవని చెప్పుచు వేదములు అపౌరుషేయములు
అంటున్నారు. వేదములు మనుషులు వ్రాసినవి కావు, దేవుడే వాటిని సృష్టించాడని వారి వాదనలోని అర్థము.
వేదములు అపౌరుషములు అనడములో వేదములను పురుషుడైన దేవున్ని గురించి చెప్పలేదు, స్త్రీ అయిన ప్రకృతిని
గురించి చెప్పినవని అర్థమెందుకు తీసుకోకూడదని మా వాదన. అలాగే వేదములు పురుషుడైన పరమాత్మ చెప్పలేదు.
స్త్రీతత్వమైన ప్రకృతినుండి చెప్పబడినవని ఎందుకు అర్థము చేసుకోకూడదని అడుగుచున్నాము. బ్రహ్మవిద్యకు ప్రమాణమైన
భగవద్గీత శాస్త్రములో గుణత్రయ విభాగయోగమునందు 5వ శ్లోకమున "సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః
” సత్త్వ గుణము, రజో గుణము, తమోగుణము అను మూడు గుణములు ప్రకృతికి పుట్టినవి. "త్రైగుణ్య విషయా వేదా
నిస్ట్రె గుణ్యో” వేదములలో మూడుగుణముల విషయములే గలవు, వాటిని విడువుము అని గలదు. గుణములు ప్రకృతి
సంభవములు అవియే వేదములని దేవుడే చెప్పగ, దేవుని జ్ఞానమును వదలి వేదములను గొప్పగ చెప్పుకొనువారు
ఆస్తికులగుదురా? ప్రకృతిని కూడ నేనే పుట్టించాను. అది గుణరూపమైన మాయగనున్నదని కూడ గీతలోనే చెప్పబడినది.
ఇన్ని విధముల చెప్పినప్పటికి బ్రహ్మవిద్యకే ప్రమాణమైన దేవుని గీతను వదలి మాయకు ప్రతిరూపములైన గుణమయమైన
వేదములనా శ్రయించువారు ఆస్తికులగుదురా? ఇలా వివరిస్తూ పోతే నేడు ఆస్తికులన బడువారిలో నాస్తికత్వము తప్ప
ఆస్తికత్వము కనిపించడములేదు. ఇక హేతువాదులను వివరించుకొందాము.
మీరు హేతువాదులా? అహేతువాదులా?.
ఒక విషయమును గూర్చికాని, ఒక పదార్థమును గురించికాని సంపూర్ణముగ తెలిసినపుడు, ఆ విషయమును
వివరించి చెప్పుటకు వీలగును. వాటిలోని లాభనష్టములను, తప్పొప్పులను విశధీకరించి చెప్పుటకు వీలగును.
ఉదాహరణకు ఒకడు నాలుగు రకముల మొక్కలను చూపించి, ఇది పలానా మొక్క అని పేరు చెప్పి, ఈ మొక్క ఆకులు
పలానా రోగమును నయము చేయుటకు ఉపయోగపడునని తెలిపాడను కొందాము. అపుడు అది సత్యమా అసత్యమా
అని తేల్చిచెప్పుటకు ఆ మొక్కల విషయము తెలిసిఉండాలి. మొక్కల పేరును మునుపెన్నడు విననివాడు, మొక్కల
ఆకారమును ముందెపుడు చూడనివాడు, ఇవి పలాన మొక్కలు కాదని చెప్పుటకు వీలులేదు మరియు పలానా మొక్కలేనని
చెప్పుటకు కూడ వీలులేదు. అలాగే వాటియొక్క పనితనమును గురించి కూడ చెప్పలేడు. విషయము యొక్క
అవగాహన లేనపుడు దానిని గురించి మాట్లాడే హక్కు లేదనియే చెప్పవచ్చును. విషయజ్ఞానము తెలిసినవాడే ఆ
విషయమును గురించి మాట్లాడాలి. తెలియనివాడు విషయజ్ఞానమును గురించి తెలుసుకోవాలి.
కొందరు కొన్ని విషయములను సంపూర్ణముగ తెలిసియుండి మిగతా విషయములను తెలియకుండిన, తెలిసినట్లే
మాట్లాడుచుందురు. ఉదాహరణకు రాయిని గురించి తెలిసినవాడు రత్నములను గురించి తెలియకున్నను దానిని
గురించి మాట్లాడడము అవివేకము కాదా! అట్లే ప్రపంచ చదువులు సంపూర్ణముగ చదివినవారు పరమాత్మ చదువును
గురించి మాట్లాడుట సరియైన పనేనా? యం, ఎ. ఫిలాసఫి (M.A.Ph.D) చదివినంత మాత్రమున దేవుని జ్ఞానమును
గురించి మాట్లాడుటకు తగుదుమా? ఈ విధముగ యోచిస్తే ఒక విషయమును గురించి సంపూర్ణముగ తెలిసినపుడే
దానిని గురించి సహేతుకముగ మాట్లాడ వచ్చునన్నది సూత్రము. తెలియకుండ మాట్లాడినపుడు ఆ విషయము
హేతుబద్దముగ ఉండదు. దేనినైన అవగాహన లేకుండ మాట్లాడినపుడు అది అనుమానమే తప్ప ప్రమాణముకాదని
చెప్పవచ్చును. దేనినైన ప్రమాణము లేకుండ, అనుమానముతో మాట్లాడడము దానిని అవ మానించినట్లే అగును.
హేతువు అనగ కారణము. హేతువాదము అనగ వాస్తవ కారణమును గూర్చి అడగడము, అనగ ఒక
విషయములోని కారణమును అడగడమని అర్థము. కారణమునకు ఉన్న వివరమును చెప్పడమే ప్రశ్నకు తగ్గ
జవాబనవచ్చును. ఏ ప్రశ్ననైన శాస్త్రముననుసరించి అడిగినపుడు సహేతుకమవును. అట్లే జవాబు కూడ శాస్త్రసమ్మతముగ
ఉన్నపుడే హేతుబద్దమగును. అందువలన ప్రశ్నించునపుడుకాని, జవాబు చెప్పునపుడు కాని, శాస్త్రబద్ధత ఉందోలేదో
చూచుకోవలసి ఉన్నది. శాస్త్రమంటే ఏమిటని కొందరికి ప్రశ్నరావచ్చును. శాపము అన్నపదము నుండి శాస్త్రము
అనుపదము, శాసనము అన్నపదములు పుట్టినవి. చెప్పినట్లు జరిగితీరునది శాసనము లేక శాస్త్రము లేక శాపము
అనవచ్చును. దీనినే విజ్ఞానము అనవచ్చును. ఉదాహరణకు బెంగుళూరు నుండి హైదరాబాద్కు 565 కిలోమీటర్ల
దూరముగలదని ఒక బోర్డు మీద వ్రాయబడి ఉన్నది. దానిని చదివి, ఇంతదూరమున్నదని తెలియడము జ్ఞానమగును.
565 కిలోమీటర్లు ప్రయాణము చేసి హైదరాబాద్ను చేరి బోర్డుమీద చెప్పబడిన హైదరాబాద్ను చూడడమును లేక
అనుభవపూర్వకముగ తెలుసుకోవడమును విజ్ఞానము అంటాము. జ్ఞానమును వివరమని, అనుభవమును విజ్ఞానమని
చెప్పవచ్చును. బెంగుళూరునుండి హైదరాబాద్ ఎంత దూరమున్నదని ప్రశ్నించడము ఒక ప్రశ్న. దానికి బదులుగ
565 కిలోమీటర్లు దూరమున్నదని వాస్తవమును చెప్పడము ఒక జవాబు. ప్రశ్నకు ఆ జవాబు సరియైనదో కాదో ఒక
మారు ఆ దూరమును అనుభవరీత్య ప్రయాణించినవాడు మాత్రమే తేల్చి చెప్పగలడు. దానినే విజ్ఞానము అంటాము.
విజ్ఞానమున్న వానికి ప్రశ్న మరియు జవాబు సరియైనదో కాదో తెలియును. విజ్ఞానము అన్నదానిని వివరించుకొంటే
ఈ విధముగనున్నది.
విజ్ఞానమును విభజించుకొని చూస్తే అందరికి తెలియునట్లు ఐదు రకములుగ ఉన్నది. అందరికి తెలియకుండునట్లు
ఒక రకము కూడ ఉన్నది. మొత్తము మీద విజ్ఞానములు ఆరురకములని చెప్పవచ్చును. అందరికి తెలియబడునట్లు,
అందరు ఒప్పుకొనునట్లుండిన ఐదు విజ్ఞానము లను కలిపి ఇంగ్లీషులో ఒక పేరు పెట్టారు, అదియే సైన్సు. ఆంగ్లభాషలో
సైన్సు అనిన, తెలుగుభాషలో విజ్ఞానమనిన రెండు ఒక్కటే. ప్రయోగము ద్వార నిరూపింపబడునది సైన్సు. అలాగే
చేసినపుడు అనుభవానికి వచ్చునది సైన్సు. ఐదురకముల సైన్సు కంటే వేరుగ ఆరవ రకము సైన్సు గలదు. దానినే
సైన్సులలోకెల్ల సైన్సు అని అంటాము.
ఆరవ సైన్సునే యోగశాస్త్రము లేక బ్రహ్మవిద్యాశాస్త్రము అంటాము. ఇంగ్లీషు భాషలో ఫిలాసఫి అని కూడ
అందురు. ఫిలాసఫి అంటే ఆల్ సైన్స్ ఆఫ్ సైన్స్ అని కూడ అందురు. ఇప్పటి కాలములో ఐదు విజ్ఞానములలో ఏదో
ఒక దానియందు, ఒక యదార్థ విషయములను విజ్ఞానబద్దముగ కనుగొని నిరూపించగలిగినపుడు, కనుగొన్నవానికి
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫి (Ph.D) అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంతటితో అతను మేధావులలోనికి చేరిపోయానని
అనుకొనుచున్నాడు. కాని కనుగొన్నది ఒక శాస్త్రములోని ఒక భాగమే అని తెలియక, శాస్త్రములన్ని తెలిసినట్లు
పట్టాపొందుచున్నారు. ఏ శాస్త్రములో ప్రావీణ్యతయుండి ఆ శాస్త్రములో క్రొత్తవిషయమును కనుగొనియుంటే, డాక్టర్
ఆఫ్ అని చివర ఆ శాస్త్రము పేరు పెట్టాలి. కాని ఏకముగ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫి అని పెట్టడము లేనిదానిని
పెట్టుకొన్నట్లుగునని మా అభిప్రాయము. ఫిలాసఫి అనునది ప్రత్యేకమైనది. కనుగొన్న విషయమునకు దానికి
సంబంధములేదు. అయినప్పటికి మేధావులు ఎందుకు ఆ పేరు పెట్టుకొన్నారో తెలియదు. ఒక విధముగ ప్రకృతికి
సంబంధించిన ఐదుశాస్త్రములలో దేనిని పరిశోధించి ఒక క్రొత్త సిద్ధాంతమును కనుగొన్నప్పటికి, పేరు చివర పిహెచ్.డి
(Ph.D) అని పెట్టుకోవడము అసమంజసమేనని చెప్పవచ్చును. ఒక్క యోగశాస్త్రము తెలిసినవారు, అందులోని క్రొత్త
సిద్ధాంతములను కనుగొని వివరించ గలిగినపుడు వారిని మాత్రము డాక్టర్ ఆఫ్ ఫిలాసఫి అనవచ్చును.
గుంపులో గోవింద అన్నట్లు, నలుగురితో పాటు నారాయణ అన్నట్లు పేరు చివరలో (Ph.D) పెట్టుకొనిన
పరవాలేదు. కాని అన్ని శాస్త్రములు తెలుసునని, ఇతర శాస్త్రములలోని విషయములను విమర్శించడము పొరపాటు.
శాస్త్రములకెల్ల శాస్త్రమైన, విజ్ఞానముల యొక్క విజ్ఞానమైన బ్రహ్మవిద్యాశాస్త్రము (యోగశాస్త్రము)ను గురించి విమర్శించి
మాట్లాడడము మరీపొరపాటు. ఒక దానిని గూర్చి సంపూర్ణముగ తెలిసినపుడే దానిని గురించి ప్రశ్నించే హక్కు
కలిగియుందుము. తెలియకున్నను ప్రశ్నించినపుడు, దూడ మూరడు, దంటు బారడు కదా అన్నట్లు చొప్పదంటు ప్రశ్న
అగును. నేటి కాలములో మేధావులమనుకొన్న వారు చాలామంది హేతువాదులమను కొని తమకు తెలియని
యోగశాస్త్రమును గూర్చి ప్రశ్నించుచున్నారు. వారి వాదనలో ముఖ్యసూత్రము, నమ్మకమనునది సైన్సుకాదని, యదార్థముగ
కనిపించునదే సైన్సని, సైన్సు ప్రకారమున్న వాటినే ఒప్పుకుంటామని, నమ్మకమును ఒప్పుకోమని అంటున్నారు.
కనిపించునవన్ని సత్యముకాదని, కనిపించకుండ నమ్మకము మీద ఆధారపడినవి కూడ కొన్ని సత్యమని వారికి
తెలియదు. ప్రత్యక్షముగ కనిపించువాటిలో కూడ కొన్ని అసత్యములు దాగియున్నవని, కొన్ని కనిపించని నమ్మకములలో
కూడ సత్యములున్నవని చెప్పడమే నిజమైన హేతువాదమని హేతువాదులమనుకొను వారికి తెలియదు. కనిపించున
వన్ని సత్యము కాదు, నమ్మకములన్ని అసత్యములు కాదనడము హేతు వాదములోని ముఖ్యసూత్రము కాగ, ఆ
సూత్రమునకు విభిన్నముగ తమ మనసులో ఒక హద్దును ఏర్పరచుకొని, నమ్మకము అనుదానిని ఖండించడమే
హేతుబద్ధతలేని హేతువాదుల పనియైనది.
కళ్ళకు కనిపించునవి అసత్యమెలా అగునని కొందరికి ప్రశ్న రావచ్చును. దానికి జవాబేమనగా! చంద్రుడు
అందరికి ఒక అడుగు వెడల్పే కనిపిస్తున్నాడు. అయినప్పటికి అది నిజముకాదు. ఎండాకాలమున కిలోమీటరు
దూరములో నీరు సమగ్రముగ ఉండునట్లు కనిపించుచుండును. అలా అందరికి కనిపించినప్పటికి అది నిజము
కాదు. భూమి అంచునకు ఆకాశము అంటుకొన్నట్లు కనిపిస్తుండును అయినా అదియు నిజము కాదు. అలాగే
వినేటివన్ని నిజము కాదనుటకు ఉదాహరణగా నేతిబీరకాయలో నెయ్యి లేదు, పచ్చకర్పూరములో పచ్చదనములేదు.
ప్రత్యక్షముగ అందరికి కనిపించు, అందరికి వినిపించు వాటిలో కూడ సత్యములేదని తెలియు చున్నది. ఈ విధముగనే
మనుషులకున్న నమ్మకములలో అన్నియు సత్యముకాదు మరియు అన్నియు అసత్యమునుగాదు. కాకి గూటిలోనున్న
పిల్లలన్నిటిని కాకి పిల్లలను కోవడము సహజమే అయినప్పటికి, ఆ పిల్లలలో కొన్ని కోకిల పిల్లలు కూడ ఉండవచ్చును.
చిన్న తనములో అన్ని ఒకే లాగుండిన కొంతకాలమునకు అవి మనమనుకొన్నట్లు అన్ని కాకులే కాదని తెలియగలదు.
అలాగే నేడు కొందరు హేతువాదులుగ కనిపిస్తున్నప్పటికి అందరూ నిజమైన హేతువాదులుకారు. వారిలో కొందరు
హేతువులేని వాదులు కూడ గలరు. ఆ విధముగనే నమ్మకములలో అన్ని మూఢ నమ్మకములు గావు, వాటిలో కొన్ని
గొప్ప సత్యములు కూడ ఉండును. కావున నమ్మకమును ఒప్పుకోము అను హేతువాదులు సూత్రము అసలు సిసలైన
మాలాంటి హేతువాదులు ఒప్పుకోరు. నమ్మకమును ఒప్పుకోము అను సూత్రము కొట్టివేయబడుచున్నది. కొన్ని
నమ్మకములను తప్పక ఒప్పుకోవలసి కూడ ఉన్నది. హేతువాదము శాస్త్రబద్దమైనది, కావున గ్రుడ్డిగ ఖండించువారిని
హేతువాదులనకూడదు.
నాస్తికులు దేవుడేలేడంటున్నారు. హేతువాదులు కనిపించని దేవుడు నమ్మకముమీద అధారపడి ఉన్నాడని,
సైన్సుప్రకారము నమ్మకమునకు చోటులేదని, కావున దేవుడు ఆస్తికులు కల్పించుకొన్న భ్రమయేగాని
నిజముగలేడంటున్నారు. అంతేగాక ఆరవశాస్త్రమైన యోగశాస్త్రము అని పేరుగాంచిన భగవద్గీతను కల్పితము
అంటున్నారు. ఆరోపించడము వరకే పరిమితమైన హేతువాదులమనుకొనువారు, అసలు నిజమును ఏమాత్రము
పరికించిచూడడములేదు. దేవుడున్నాడను వారితో వాదనకు దిగము అంటున్నారు. వాదనలోనికి దిగితే చిక్కులో
ఇరుక్కొన్నట్లని, వారిని ఒప్పించలేమని, తెలుసుకొన్న హేతువాదులు ఎక్కడా కూడ శాస్త్రబద్ధముగ దేవుడులేడని నిరూపించక,
తగిన కారణములను చూపక, ఆస్తికులకు విరుద్దముగ మాట్లాడడమే తమ పనిగ పెట్టుకొన్నారు. హేతువాదులు
మాట్లాడునవన్ని ప్రశ్నల రూపముగ, విమర్శలరూపముగ ఉండునే కాని, ఏవీ జవాబు రూపముగగాని, వివరణరూపముగ
గాని ఉండవు. వారి ప్రశ్నలు 1) ఎవరైన దేవున్ని చూచియుంటే మాకు చూపండి ఒప్పుకుంటాము. 2) దేవుడుంటే
మాకెందుకు కనిపించడు. 3) దేవుడు దయ్యము అనునవి ఆస్తికులు కల్పించుకొన్న నమ్మకములు మాత్రమే! నిరూపణకు
రావు. 4) మ్రొక్కిన వారికి కోర్కెలు తీర్చుదేవుడు మ్రొక్కని వారిని ఏమిచేయుచున్నాడు. 5) మేము దేవున్ని ఒప్పుకోనపుడు
మమ్ములను శిక్షించలేదే. 6) దేవుడున్నాడని చెప్పువారు ప్రజలను త్రప్పుదోవ పట్టించినట్లు కాదా! 7) వారి నమ్మకమును
అందరి మీద దిద్దడమే బోధల రూపములో చెప్పడము. ఈ విధముగ ఎన్నో విమర్శలు చేయుచుందురు.
ఆరవ శాస్త్రమైన యోగశాస్త్రము ఏమిటో, దాని వాస్తవికత ఏమిటో, ఆస్తికులమనుకొనువారికే సరిగ తెలియని
కాలములో హేతువాదులకు జవాబు చెప్పువారుండకపోవచ్చును. హేతువాదులకు దేవుని విషయము అర్థము కావాలంటే,
ఫిలాసపి అనునది ఏమిటో తెలియాలంటే స్థూల సూక్ష్మములనునవి తప్పనిసరిగ అర్థము కావాలి. ఉదాహరణకు
కొంత వివరించుకొందాము. ఒక ఇంటిలో ప్యాన్లు తిరుగుచున్నవి, టి.విలో బొమ్మకనిపిస్తున్నది, మోటరు పనిచేయుచున్నది.
ఇంటిలో పనిచేయు పరికరములన్నియు అనేక రూపములలో అనేక విధములగు పనులు చేయుట అందరికి తెలిసిన
విషయమే. అన్ని పరికరములు పనిచేయుటకు ముఖ్యముగ విద్యుశ్చక్తి అవసరము. స్థూలముగ పరికరములు కనిపించు
చున్నప్పటికి, కనిపించక సూక్ష్మముగనున్న కరెంటు, పని జరుగుటకు అవసరమని తెలియుచున్నది. ఎంతో బలమైన
పరికరము మరియు పెద్దయిన పరికరము కదలుటకు ఒక శక్తి అవసరమని, అదియే విద్యుశ్చక్తి అని అందరికి తెలిసిన
విషయమే. పనిచేయుచున్న స్థూలముగనున్న యంత్రము కనిపిస్తున్నది, కాని యంత్రమును కదలించు విద్యుత్తు
ఎవరికి కనిపించడము లేదు. కరెంటు తీగను మనము చూడవచ్చును, గాని దానిలో ప్రయాణించు కరెంటును
చూడలేము. కరెంటు సూక్ష్మమైనది కావున కనిపించదు. కనిపించనంత మాత్రమున కరెంటును ఎవరు లేదనలేరు.
కనిపించ కుండినప్పటికి ఉన్నదని దానిని తప్పనిసరిగ నమ్మితీరవలసిందే. ఇక్కడ కరెంటు వలన పనిజరుగుచున్నదని,
అది ఉన్నట్లు నిరూపింపబడుచున్నదని, కావున కనిపించకుండినా, దాని పనితనము తెలియుటవలన అది సైన్సుకు
అందువిషయమని హేతువాదులు చెప్పవచ్చును. హేతువాదులు ఇక్కడ కనిపించని కరెంటును నమ్ముచున్నట్లే కదా!
భూమి మీద గల చిన్నవి, పెద్దవి అయిన అనేక రక శరీరములు స్థూలముగ కనిపించుచున్నవి. ఆయా
శరీరములలో కదలించు శక్తి కూడ ఉన్నది. శక్తి ఉన్నంతసేపు శరీరములు కదలుచుండును. కరెంటున్నంతసేపు
తిరిగిన ఫ్యాన్, కరెంటు పోయిన వెంటనే ఆగిపోయినట్లు శరీరములో శక్తి ఉన్నంతసేపు కదలి తిరుగాడిన శరీరము శక్తి
పోయిన వెంటనే చైతన్యము లేనిదై పోవుచున్నది. ఫ్యానును త్రిప్పుశక్తికి మనమొక పేరు పెట్టుకొన్నాము అదియే
విద్యుశ్ఛక్తి. అలాగే శరీరమును కదిలించు శక్తికి కూడ ఒక పేరు పెట్టుకొన్నాము అదియే ఆత్మశక్తి. శక్తుల యొక్క
పేరులో మార్పులు గలవు. కాని రెండూ చేయుపని కదలించడమే. కరెంటును గూర్చి తెలుసుకొనుటకు ఎంతో వివరము
సేకరించి పెట్టుకొన్నాము. కరెంటు అంటే ఏమిటి? దాని ఓల్టేజ్ అంటే ఏమిటి? అది ప్రయాణము చేయుటకు
ఏలోహము అవసరము? ఏ విధమైన పరికరముల మీద పనిచేయును? అది ఎలా ఆఫ్ ఆన్ అవుచున్నది? మొదట
అది ఎలా పుట్టుచున్నది? అను ప్రశ్నలకంతటికి జవాబుగలదు. ఇదంతయు పరిశోధనల ద్వార తెలుసుకుంటేనే
తెలిసింది. కరెంటు (విద్యుత్తు) ప్రపంచము పుట్టినప్పటి నుండి ఉన్నప్పటికీ, అది ఎవరికీ తెలియదు. ఎన్నో యుగములు
గడచి పోయినప్పటికీ తెలియని కరెంటును గురించి ఈ మధ్య కొన్నివందల సంవత్సరముల పూర్వము కనుగొన్నాము.
కరెంటులో పాజిటివ్, నెగిటివ్ అని రెండున్నట్లు, పూర్వమునుండి ధనధృవము, ఋణధృవమని రెండుగలవు. ఆకాశములో
ధనధృవము, భూమిలో ఋణధృవమున్నవని, ఎండాకాలము వచ్చు తొలకరి వానలపుడు ధనరుణ ధృవములు
కలయికతోనే, మెరుపులు పెద్దశబ్దము కల్గిన ఉరుములు పుట్టుచున్నవని కూడ చెప్పుచున్నారు. పెద్దవెలుగు, పెద్ద శబ్దము
ప్రత్యక్షముగ కనిపించుట వలన, మరియు పిడుగు అనుపేరుతో షాక్ తగులుట వలన, మనుషులు, జంతువులు
చనిపోవడము కూడ జరుగుట వలన దానిని కరెంటని, దానినే ఆకాశ కరెంటని పూర్వమునుండి చెప్పడము జరుగుచున్నది.
హిందీభాషలో ఆస్మాని బిజిలి అనికూడ అనుచున్నాము. ఇంత పెద్ద కరెంటు తయారగుటకు కారణము భూమికి గల
అయస్కాంత శక్తియే మూలము. అయస్కాంతమునకు ఉత్తర దక్షిణ ధృవములు రెండు ఉండును. ప్రపంచము
మొత్తము మీద అయస్కాంతశక్తి ఉత్తర, దక్షిణ ధృవములుగ ఉంటూ, రాత్రిపూట పాలపుంత రూపముగ కనిపిస్తున్నది.
ఈ ఉత్తర దక్షిణ ధృవముల వలననే కరెంటు ధన ఋణ (పాజిటివ్ నెగిటివ్) ధృవములుగ తయారవుచున్నది. కనిపించని
అయస్కాంతశక్తినుండి కనిపించని కరెంటు తయారవుచున్నది. ఈ సూత్రము మీదనే నేడు అయస్కాంతముల ద్వార
కరెంటును తయారు చేయుచున్నారు. ఇంతవరకు కరెంటు వివరము కొంత తెలుసుకొన్నాము. ఇపుడు కరెంటులాగే
ఉన్న ఆత్మను తెలుసుకొందాము.
యంత్రమును కదలించునది విద్యుత్తు, శరీరమును కదలించునది ఆత్మ. విద్యుత్కున్న శక్తిని విద్యుశ్ఛక్తి
అంటున్నాము. ఆత్మకున్న శక్తిని ఆత్మశక్తి అంటున్నాము. విద్యుత్ కనిపించని అయస్కాంతశక్తి ద్వార తయారైనది.
ఆత్మ కనిపించని ఒక ఆది, అంత్యము లేని శక్తి ద్వార తయారైనది. అనంతశక్తి ద్వార తయారైన శక్తి హేతువాదులము,
నాస్తికవాదులమనుకొనువారిలో కూడ గలదు. హేతువాదులు శరీరములోని అన్ని భాగములకు అనంతశక్తి ద్వారా
తయారైన ఆత్మశక్తియే ఉపయోగ పడుచున్నది. ఏ శక్తితో తాము కదలుచున్నారో ఆ శక్తిని, దానికి మూలమైన ఆది
అంత్యరహితశక్తిని హేతువాదులు కూడ కాదనలేరు. శరీరములో శక్తి ఉన్నదని ఒప్పుకొనువారు ఆ శక్తికి ఆత్మశక్తి
అనిపేరు పెట్టితే ఒప్పుకోక పోవడమేమిటి? అలాగే ఆత్మశక్తికి మూలమై, ఆత్మకంటే పరము (వేరు) గనున్న శక్తిని
పరమాత్మ అనగా అదేదో అలర్జిలాగ మాకు ఆ మాట సరిపోదు, మేము ఒప్పుకోము అంటే దానిని హేతువాదమంటామా?
శరీరములో చైతన్యశక్తిని దైవశక్తి అని చెప్పితే ఎందుకు కాదనాలి? భగవద్గీతలో భగవంతుడు చెప్పినదంత శరీరములో
కరెంటులాగ పనిచేయు శక్తిని కాదా! గీతలో శరీరాంతర్గతముగనున్న శక్తి అంటే ఏమిటో, అది ఎట్లున్నదో, అది
అందరి ఎడల ఎట్లు పనిచేయుచున్నదో వివరముగ చెప్పబడినది. యంత్రములో పనిచేయు శక్తి అయిన కరెంటును
వివరముగ విజ్ఞానము (సైన్సు) ద్వార చెప్పినట్లు శరీరయంత్రములో పనిచేయుశక్తి అయిన ఆత్మను వివరముగ విజ్ఞానము
(సైన్సు) ద్వారానే చెప్పియున్నారు. యంత్రముల శక్తిని సైన్సు అన్నపుడు శరీరముల శక్తిని సైన్సని ఎందుకు అనకూడదు?
1) కరెంటు కనిపించని శక్తియే, ఆత్మయు కనిపించని శక్తియే. 2) కరెంటు ఒకచోట పుట్టినదే అదేవిధముగ ఆత్మయు
ఒక కేంద్రమునుండి పుట్టినదే. 3) కరెంటు యంత్రమును కదలించుచున్నది, ఆత్మ శరీర యంత్రమును కదలించుచున్నది.
4) కరెంటు ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణించు చున్నది. అలాగే ఆత్మ ఒక చోటనుండి మరొక చోటికి
ప్రయాణించుచున్నది. 5) కరెంటు ప్రయాణించుటకు లోహము అవసరము, అలాగే ఆత్మ ప్రయాణించుటకు శూణ్యము
(ఆకాశము) అవసరము. 6) కరెంటుకు రెండు ధృవములు గలవు, అలాగే ఆత్మకు రెండు ధృవములు గలవు.
7) కరెంటుకు ప్లస్ (+) మైనస్ (-) ధృవములుకాగ ఆత్మకు ఉత్తర దక్షణములు ధృవములుగనున్నవి. 8) కరెంటు
అయస్కాంతము నుండి పుట్టగ, ఆత్మ అయస్కాంతమునకే అయస్కాంతమైన శక్తినుండి పుట్టినది. 9) కరెంటు రెండు
ధృవములను కలిపితే అగ్గి పుట్టును. అలాగే ఆత్మయొక్క ఉత్తర, దక్షిణ ధృవములను కలిపితే అనగా కుడి ఎడమ
శ్వాసలను కలిపి నిలిపితే జ్ఞానాగ్ని పుట్టును 10) కరెంటురీడింగు మీటర్లలో ఉండగ, ఆత్మరీడింగ్ తలలోగల కర్మచక్రములో
ఉన్నది. 11) కరెంటురీడింగ్ యూనిట్లలో ఉంటే ఆత్మరీడింగ్ పాపపుణ్యములనే యూనిట్లలో ఉండును. 12) కరెంటుకు
మెయిన్స్టేషన్ సబ్ స్టేషన్ఘయున్నట్లు, ఆత్మకు పెద్దస్టేషన్ మెదడుకాగ చిన్న స్టేషన్లుగ ఆరునాడీ కేంద్రములు ఉన్నవి.
13) కరెంటు సప్లై ఆగిపోతే యంత్రములో కొంతభాగము పనిచేయనట్లు, శరీరములో ఒక నాడీకేంద్రమునుండి ఆత్మశక్తి
ఆగిపోతే ఆ కేంద్ర ఆధీనములో ఉండు అవయవములు కాళ్ళుగాని, చేతులుగాని పనిచేయవు. 14) కరెంటుశక్తిని
తెలియవచ్చును, కాని అయస్కాంతశక్తి ఎట్టిదో దాని పుట్టుపూర్వోత్తర మేమిటో తెలియదు. అలాగే ఆత్మను తెలియవచ్చును
గాని దానికి మూలమైన పరమాత్మ ఎట్టిదో అదేమిటో కూడ ఎవరికి తెలియదు. ఇట్లు ఎన్నో విధముల బయటి
కరెంటుకు సమానముగ శరీరములోనున్న ఆత్మగలదు. శరీరములోనున్న శక్తిని ఆత్మ అని, దాని ఉత్పత్తి స్థానమును
పరమాత్మ అనిపేరు పెట్టుకొన్నాము. శరీరములోనున్న ఆత్మ అందరియందు ఒకే విధముగ నున్నది. కావున హేతువాదులు
తమ శరీరములోని శక్తిని గురించి ఆలోచించి దానిని కాదనగలిగితే, దేవున్ని కూడ కాదనవచ్చును.
శాస్త్రబద్దమైనది, హేతుబద్దమైనది భగవద్గీత! ఆస్తికులమనుకొని యజ్ఞయాగాదులు, వేదాధ్యయనములు, తపస్సులు
చేయువారిని భగవద్గీత పూర్తిగా ఖండించినది. మీరనుకొన్న మార్గములలో దేవుడు లభించడని కూడ చెప్పినది.
ఎవడైనకాని శరీరములో పరిశోధనచేస్తే ఆత్మ తెలియ బడునని, ఆత్మకు మూలకారణమైన పరమాత్మ ఎవరికి తెలియదని
కూడ చెప్పినది. ఇంతవరకు ఎవరుగాని ఏ మానవుడుగాని దేవున్ని చూచినవారు లేరని కూడ చెప్పినది. దేవున్ని
తెలుసుకోవాలంటే శరీర ములోగల ఆత్మను తెలియమని, అదియే ఆత్మజ్ఞానమని కూడ చెప్పినది. బయట దేవాలయము
శరీర నిర్మాణముననుసరించి తయారుచేసినదని, గుడిలోని ప్రతిమ శరీరము లోని ఆత్మను అనుసరించి చేసినదని,
బయట గుడిని, అందులోని ప్రతిమను చూచినపుడు శరీరము, అందులోని ఆత్మ జ్ఞప్తికి వచ్చునట్లున్నవని చెప్పినది.
దేవాలయములోని ఆరాధనలు శరీరములోని ఆత్మను తెలుసుకొను సాధనల రూపమని తెలియవలెను. ఆస్తికత్వము
పూర్తిగ భగవద్గీతలో ఇమిడియుండగ, శరీరములో పరిశోధించక గీతకు వ్యతిరిక్తముగ యజ్ఞయాగాదులు వేదపఠనములు
తపస్సులు చేయువారు ఆస్తికులుగారు. అలాగే శాస్త్రీయత, హేతుబద్దత పూర్తిగ భగవద్గీతలో ఇమిడియుండగ, భగవద్గీతనే
కల్పితమని దానికి వ్యతిరిక్తముగ ఆత్మ, పరమాత్మలేదనువారు నాస్తికులుకారు, హేతువాదులు కారు. ఇప్పుడున్న
ఆస్తికత్వమునకు, నాస్తికత్వమునకు భగవద్గీత వ్యతిరేఖముగ ఉన్నదని, విజ్ఞానములలోకెల్ల విజ్ఞానమైన గీత ఈనాటి
హేతువాదులను, ఆస్తికవాదులను ఏమాత్రము ఒప్పుకోదని తెలియవలెను. ఇప్పటికైన తమకున్న విశ్వాసమేమిటో
(నమ్మకమేమిటో) ఆస్తికులు, అలాగే తమకున్న అవిశ్వాసమేమిటో హేతువాదులు పునరాలోచించుకోవలెనని కోరుచున్నాము.
నిజమైన ఆస్తికత్వమునకు, నిజమైన హేతువాదమునకు, సరియైన వేదిక శరీరమని, దానిలోని పరిశోధనే నిజమైన
విజ్ఞానమని (సైన్సని) తెలుపుచున్నాము.
రచయిత చివరి మాట.
ద్వాపరయుగములో దేవుని ధర్మములకు ముప్పు ఏర్పడినది. ఆనాడు గల మునులు మహర్షులు దైవమార్గములను
వదలి మాయ ధర్మములైన యజ్ఞయాగాదులు, జపతపములు, వ్రతక్రతువులలో లగ్నమై పోయారు. దైవభక్తి అంటే
మహర్షులు మునులు చేయు ఆచరణలేనని, ప్రజలు నమ్మి వారినే అనుసరించారు. ఇది సరియైన మార్గమని చెప్పువారు
లేకుండపోయారు. అట్టి పరిస్థితిలో మానవునికి హద్దు(గీత) అను పేరుతో ధర్మములను దైవము తెలియజేశాడు. ఆ
విధముగ తెలియజేసినప్పటికి నేటి మానవుడు గీతను కూడ అతిక్రమించి పూర్వము పరిస్థితికంటే ఎక్కువగ
దిగజారిపోయాడు. విశ్వమంతటికి మూలకారణ మైన దేవున్ని విస్మరించి, తమ కిష్టమొచ్చిన దేవతలను తయారు
చేసుకొంటున్నాడు. 5260 సంవత్సరముల పూర్వము ద్వాపరయుగములో లేని మతములు నేడు తయారైనవి. ఎవరి
మతమును వారు, ఎవరి దేవున్ని వారు గొప్పగ చెప్పుకోవడము జరుగుచున్నది. అటువంటి వారికి అందరికి దేవుడొక్కడేనని
చెప్పినా వినేస్థితిలో లేరు. ఈ విధముగ దైవవ్యతిరేఖమైన మాయ, మానవులలో చోటుచేసుకొని మీదే అసలైన భక్తి అని
వారిలో గాఢముద్రవేసింది. ఈ విధముగ కొందరిని దైవ విశ్వాసులమని భ్రమింపజేసి దేవునికి దూరము చేసింది.
అలాగే మరి కొంతమందికి దేవుని మీద విశ్వాసమే లేకుండ అనుమానములను రేకెత్తించి, కొందరిని నాస్తికులుగ
కొందరిని హేతువాదులుగ మార్చివేసింది. ఇలా మానవులు దేవుని పట్ల విశ్వాసులు అవిశ్వాసులు అను రెండు
రకములుగ కనిపిస్తున్నప్పటికి, దేవుని లెక్కలో అందరు అవిశ్వాసులే అయ్యారు. ఇటువంటి పరిస్థితి వస్తుందనే నేను
అప్పుడప్పుడు భూమి మీదకు వచ్చి తిరిగి ధర్మములను నెలకొల్పవలసిన అవసరమున్నదని దేవుడు ముందే చెప్పాడు.
దేవుని ధర్మములకు అతి ప్రమాదము ఏర్పడిన ఈ సమయములో, అన్ని మతములలో జ్ఞానులమను పేరుతో మాయ
ప్రతినిధులున్న ఈ కాలములో, దేవుడే వచ్చి చెప్పినప్పటికి వినేస్థితిలో మానవుడు లేడు. దేవుని మాటనే లెక్కించని వారు
మా వ్రాతను లెక్కిస్తారని నమ్మకము లేదు. అయినా సత్యము తెలుపుట నా కర్తవ్యము. మాయకు అతీతులైనవారు
గ్రహించగలరని నమ్ముచున్నాము.
ఇట్లు,
ఇందూ ధర్మప్రదాత,
సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు.