సిలువ దేవుడా? cloud text updated 13th sep 2024

 


సిలువ దేవుడా?

అందరికీ అన్నిటికీ పెద్ద దేవుడు. అందువలన ఆయనను బ్రహ్మ అని అన్నారు. బ్రహ్మ అనగానే మూడుతలల

బ్రహ్మ అనియో లేక నాలుగు తలల బ్రహ్మ అనియో అనుకోవద్దండి. బ్రహ్మ అంటే పెద్ద అని అర్ధము, కావున దేవున్ని

అందరికంటే గొప్పవానిగా భావించి చెప్పిన పదము బ్రహ్మ. దేవునికి పేరులేదు. బ్రహ్మ అనునది ఆయన విధానమును

తెలుపు బిరుదేగానీ పేరు కాదు. పేరు వేరు, బిరుదు వేరు. దేవునికి బిరుదులు తప్ప పేర్లు ఉండవు. ప్రజ్ఞాశాలి

అనిగానీ, బహుముఖ ప్రజ్ఞాశాలి అని గానీ ఒకనిని గూర్చి చెప్పినపుడు అది వాని గొప్పతనమును సూచించు బిరుదుగా

ఉండును గానీ, అది వాని పేరుగా ఉండదు. అలాగే దేవుని ఎడల చెప్పేటివన్నీ ఆయన యోగ్యతను తెలుపు శబ్దములే

ఉండును పరమాత్మ అని దేవున్ని గురించి అనినా అది ఆయన పేరుకాదు. ఆత్మకంటే వేరుగా ఉన్నవాడని అర్ధము

తెలుపు పదమే పరమాత్మ. అందువలన దేవున్ని పేరులేనివాడనీ నామరహితుడు అన్నారు. అంతేకాక రూప, నామ,

క్రియారహితుడని కూడా అన్నారు. పేరే కాకుండా దేవునికి రూపము కూడా లేదనీ మరియూ పని కూడా లేదనీ పై

వాక్యములో తెలిసి పోవుచున్నది. పేరుగానీ, రూపముగానీ, పనిగానీ లేని వానిని ఎవరైనా చూచారా అంటే, అటువంటి

వాడు భూమిమీద లేడనియే చెప్ప వచ్చును. భూమిమీదనేకాక మరి ఎక్కడ కూడా, ఎవరు కూడా, ఏ కాలములో కూడా

చూచి ఉండరు. ఎవరూ ఎక్కడా ఎప్పుడూ చూడని వానిని గురించి ఎవరికి తెలుసు అంటే, ఎవరికీ తెలియదనియే

చెప్పవచ్చును. ఎవరికి తెలియనప్పుడు దేవుడున్నాడని చెప్పుట ఊహా జనితమా లేక సత్యమా అను ప్రశ్నరాగలదు.

ఊహాజనితమైతే అది నిజమూ కావచ్చు లేక అబద్దమూ కావచ్చు. అట్లుకాక దేవుడున్నాడనుటకు ఏదైనా లేక ఎవరైనా

సాక్ష్యముండాలి. దేవున్ని ఎవరూ చూడనపుడు, దేవున్ని గురించి ఎవరు సాక్ష్యమివ్వగలరు? దేవున్ని గురించి ఎవరూ

సాక్ష్యమివ్వనపుడు దేవుడు లేడనుటకు ఆధారమేర్పడును. అట్లుకాకుండా దేవుడున్నాడని చెప్పుటకు తప్పనిసరిగా

ఒక మనిషి అవసరము. ఒక మనిషి దేవున్ని గురించి దేవుడిలా ఉన్నాడని సాక్ష్యమును ఇచ్చినపుడు, ఆ మనిషి

మాటనుబట్టి దేవుడున్నాడను సత్యము లోకమునకు తెలియగలదు. రూప, నామ, క్రియలు లేని దేవున్ని గురించి

సాక్ష్యమిచ్చు మనిషి ఎవరు? అని ప్రశ్నించుకొని చూస్తే, అటువంటి వాడు సాధారణ మనిషి కాదని తెలిసి పోవుచున్నది.

సాధారణ మనిషికాని ఆ అసాధారణ మనిషి ఎవరు అని వెతికితే, అటువంటివాడు కొన్ని వేల సంవత్సరములకొకమారో,

లేక కొన్ని లక్షల సంవత్సరములకొకమారో భూమి మీద పుట్టి, దేవున్ని గురించి సాక్ష్యమిచ్చి, ఆయనకు సంబంధించిన

సంగతులన్నిటిని తెలిపి పోవునని తెలియుచున్నది.


సాధారణ మనిషి చనిపోయిన వెంటనే తిరిగి పుట్టుచున్నాడు. కానీ ఇక్కడ దేవున్ని గురించి చెప్పి సాక్ష్యమిచ్చువాడు

అలా పుట్టడము లేదు. భూమి మీద దేవుని సాక్ష్యము మనుషులకు అవసరమైనపుడు మాత్రమే పుట్టుచున్నాడు. అలా

పుట్టువాడు ఎవడైవుంటాడు అని యోచిస్తే, భగవద్గీతలో జ్ఞాన యోగమను ఆధ్యాయములో ఏడవ శ్లోకములో "యదా

యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మదర్శస్య తదాత్మానం సృజామ్యహమ్॥ భూమిమీద ఎప్పుడు ధర్మములకు

గ్లాని ఏర్పడి అధర్మములు చెలరేగి దేవుని మీద అనుమానము ఏర్పడునో, అప్పుడు నన్ను నేను మనిషిగా పుట్టించుకొని

వస్తానని దేవుడే చెప్పాడు. కనుక మనిషిగా వచ్చి దేవున్ని గురించి, దేవుని ధర్మములను గురించి తెలిపి, సాక్ష్యముగా

నిలబడువాడు సాధారణ మనిషి కాదనీ, అతను దేవుడేనని తెలియబడుచున్నది. దేవుడు రూప, నామ, క్రియా

రహితుడైనపుడు ఆయన భూమిమీద రూపము ధరించి, దానికి ఒక పేరు పెట్టుకొనీ మరియు ధర్మములను తెలుపు

పనిని పెట్టుకొని పుట్టునా? అని ఎవరైనా అడుగగలరు. దానికి సమాధానము ఏమనగా! దేవున్ని అద్వితీయుడని

చెప్పవచ్చును. అద్వితీయుడనగా! రెండు కానివాడనీ, ఏకముగా ఉన్నాడని చెప్పవచ్చును. అంతేకాక దేవుడు దివ్యమైన


వాడని కూడా చెప్పవచ్చును. అద్వితీయుడున్నా డని చెప్పుటకు అద్వితీయుడే ద్వితీయునిగా లేక దివ్యమైన వానిగా

పుట్టవలసి వచ్చినది. దేవుని వివరము భూమిమీద ఎవరికీ తెలియదు. కావున దేవుడే పుట్టి దేవుని విషయములను

తెలియజేయాలి. దేవుడంటే రూప, నామ, క్రియలు లేనివాడని చెప్పిన మొదటి ధర్మమునకు విరుద్ధముగా కాకుండా

తన ధర్మమునకు భంగము లేకుండా దేవుడు పుట్టుచున్నాడు. అందువలన దేవుని పుట్టుక కూడా శాస్త్రబద్ధముగా

ఉన్నది. ధర్మవిరుద్ధము కాకుండ ఎలా పుట్టుచున్నాడో ఈ చిన్న ప్రతిలో ముందుకు చదివితే అర్ధము కాగలదు.


దేవుడు తన ధర్మములకు వ్యతిరేఖము కాకుండా ధర్మబద్ధముగానే శరీరమును ధరించి మనిషిగా పుట్టుచున్నాడని

తెలియుచున్నది. అలా పుట్టిన వానికి తన ధర్మములను తెలియజేయడమే పనిగా ఉన్నది. అక్కడ కూడా ధర్మవిరుద్ధము

కాకుండా, శాస్త్రబద్దముగా పనిచేయుచున్నాడు. దేవుడు ధర్మ ప్రచారము కొరకు వచ్చి, ఏ పనిని చేసినా వాస్తవానికి

ఆయన చేయనట్లే లెక్కించబడినది. అదెలా సాధ్యము అని మనము అనుకోకుండా ఆయన చేసినట్లు మనముచేసినా

పనిని చేయనట్లేననీ, పని చేసినట్లు లెక్కించబడదనీ, దానికి సూత్రమును కూడా చెప్పాడు. ఆ సూత్రము ప్రకారమైతే

మనము కూడా పని చేయనట్లే అగును. దేవుడు తన ధర్మములకు విరుద్ధము కాకుండా ధర్మబద్ధముగనే పుట్టుచున్నాడు

మరియు పనిని చేయుచున్నాడు. అందువలన ఆయన పుట్టనట్లే, పనిని చేయనట్లే అగుచున్నది. అంత పెద్ద దేవుడు

ఎంతో చిన్న మనిషిగా పుట్టితే, ఆయనను ఎవరు గుర్తించగలరు? కనిపించే మనిషికి కనీస విలువ కూడ ఇవ్వని

మనుషులు, కనిపించే మనిషిగానున్న దేవున్ని గౌరవిస్తారా? ఎవరూ గౌరవించరు. ఆయన గొప్ప దైవ జ్ఞానమును

చెప్పినా, కొందరు మాత్రము కొంత విలువనిచ్చినా, మిగతా వారందరూ పనిగట్టుకొని మనిషిగా వచ్చిన దేవున్ని

అగౌరవముగా చూడడమే కాకుండా, అవమానములపాలు కూడా చేస్తారు. మనిషిగా వచ్చిన దైవాంశ కల్గిన వ్యక్తిని

అవమానిస్తే నిజముగా దేవున్నే అవమానించి నట్లగును. మనిషిగా వచ్చిన ఆయనయందు దేవుడూ, దేవునియందు

ఆయన మిళితమై ఉన్నారు, కనుక ఆయనను (భగవంతున్ని) అవమానిస్తే నిజముగా దేవున్ని అవమానించినట్లేయగును.

అటువంటి వారిని మూఢులని చెప్పవచ్చును. ఇదే విషయమునే భగవద్గీతయందు రాజవిద్యా రాజగుహ్య యోగమున

11వ శ్లోకములో "అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్, పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్",

శరీరము ధరించియున్న నన్ను చూచి, మూఢులైనవారు నేనే సర్వులకు దేవుడనని తెలియక, నన్ను సాధారణ మనిషికంటే

హీనముగా చూస్తూ అవమానించుచున్నారని స్వయముగా దేవుడే చెప్పాడు.


దేవుడు భగవద్గీతలో చెప్పిన వాక్యము ఏదీ అసత్యముకాదు. కనుక ఆయన చెప్పినట్లు మనిషిగా వచ్చిన

దేవున్ని మనుషులు అవమానించడము జరుగుచున్నది. దేవుడే మనిషిగా ఉంటే ఆయనలోని గొప్పతనమును ఏమాత్రము

తెలియని మనుషులు, ఆయన తెలిపెడి ధర్మములను ఏమాత్రము చూడని మనుషులు, ఆయనను సాధారణ మనిషికంటే

హీనముగా లెక్కించి, అవమానముగా మాట్లాడడమూ, ఆయనకు ఇబ్బంది కలిగించి ఆయన గౌరవమునకు లోపము

కల్గించునట్లు పనులు చేయడమూ జరుగుచున్నది. దైవజ్ఞానమును తెలియజేయు మనిషి అంటే మరీ అసూయగా

చూచువారూ, హింసించువారూ ఎందరో ఉన్నారు. కొద్ది రోజులు మాత్రముండు జీవితములో తాము ఏదో గొప్పయని

గర్వముతోనున్న వారు, దేవుడు దైవము, జ్ఞానము ధర్మము అనువాటిని లెక్కచేయక, మాకు అధికారమున్నది ఏమైనా

చేయగలమనీ, మనిషిగానున్న దేవున్ని కూడా అవమానించడమే కాకుండా బాధించడము కూడా జరుగుచున్నది. మా

అనుభవములో ఒక యోగిగానున్న నన్ను అవమానముగా మాట్లాడడము అనేకమార్లు జరిగినది. ఆ ఘనత క్రిందిస్థాయి


పోలీసులకు దక్కింది. యోగము, జ్ఞానము యొక్క విలువ తెలియని మనుషులు అనగా మూఢులు, ఆ విధముగా

చేస్తారని దేవుడు స్వయముగా గీతలో చెప్పాడు కదా! దానివలన ఎంత పాపమొస్తుందో వారికి తెలియదు. ఒక వ్యక్తి

తప్పు చేయకున్నా తప్పు చేసినట్లు చిత్రీకరించి, అతనిని అవమానిస్తే దాని ఫలితముగా వచ్చెడి పాపము వలన, తర్వాత

జన్మలో క్యాన్సర్ రోగము తప్పక వస్తుందని మేము చాలామార్లు చెప్పాము. సాధారణ మనిషిని అనవసరముగా

ముద్దాయిగా చిత్రీకరించితే దాని ఫలితము క్యాన్సరైతే, స్వయముగా దేవుడు శరీరముతోనున్నపుడు, గర్వముతో నిండిన

మనిషి ఆయనను అవమానిస్తే, నిజముగా దేవున్నే అవమానించి నట్లగును. అటువంటి వానికి వచ్చే పాపము ఒక

జన్మకు కాకుండా, రెండు యుగముల కాలము అనుభవించవలసి వచ్చునని దేవుడే ఒక సందర్భములో చెప్పాడు.

కావున మనిషి అజ్ఞానముతో కళ్ళు మూసుకుపోయి ఎదుటి మనిషిలోని గొప్పతనమును గ్రహించక అవమానముగా

మాట్లాడినా, ఇబ్బంది పెట్టినా వారికి తగిన మూల్యము లభించునని చెప్పుచున్నాము.


కొందరికి మతము అను ముసుగు కళ్ళకు అడ్డమురాగా, వారు దేవుని జ్ఞానమును గుర్తించలేక, దైవజ్ఞానమును

తెలుపు వారిని లెక్కించక, అవమానపరచు సందర్భములు కూడా కలవు. మా అనుభవములో మేము దేవుని జ్ఞానమును

చెప్పితే హిందూమతములోని ఛాందసవాదులు కొందరు మమ్ములను పరమత ప్రచారకులుగా చిత్రించి మాట్లాడడము.

మేము వ్రాసిన భగవద్గీతను మా ముందరే అగ్గి పెట్టి కాల్చివేయడము జరిగినది. సంప్రదింపులతో మాట్లాడి తప్పుఒప్పులను

గ్రహించక ఏకపక్షముగా దూకుడుగా ప్రవర్తించువారు, హిందూ అను పేరుతో సంఘములను పెట్టుకొని, హిందూ

మతమును ఉద్దరిస్తామనుకోవడము పొరపాటు. హిందూమతములోని యోగులను, జ్ఞానులను గుర్తించక అవమానిస్తే

మతము మీ వెంట రాదు. మీ వెంట వచ్చేది భయంకరమైన పాపమని జ్ఞప్తికుంచుకోవాలి. ఇక్కడ ఈ చిన్న గ్రంథములో

జ్ఞానపద్ధతిలో, ఇతర మతములలోని లోపమును తెలియజేశాము తప్ప మేము ఎవరినీ ఏ మతమునూ అవమానించునట్లు

గానీ, ఇతర మతములను ప్రచారము చేసినట్లుగానీ అనుకోకూడదు. మతమును కాకుండా జ్ఞానమును, ధర్మమును,

దైవమును జ్ఞప్తిలో ఉంచుకొని ఈ గ్రంథమును చదవమనికోరుచున్నాము.


విశ్వములో గల సముద్రములు, పర్వత శ్రేణులు, వృక్ష లతాదులు, క్రిమికీటక, పశుపక్షి జంతు సమూహములు,

సూక్ష్మ, స్థూల శరీరధారులైన మానవులు మరియు అణువు మొదలుకొని అంతరిక్షము వరకు సమస్తము సృష్ఠించబడినవే.

ఒకమాటలో చెప్పాలంటే ఆకారముగానీ, పేరుగాని ఉన్న ప్రతీదీ సృష్టింపబడినవనియే చెప్పవచ్చును. పేరుగానీ,

ఆకారముగానీ లేనిదంటూ ప్రపంచములో లేదు. అందువలన అన్నియు తయారు చేయబడినవేనని చెప్పవచ్చును.

మార్పుచెందక ఎల్లప్పుడుండు పంచ భూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి అనువాటిని ప్రపంచము

అనియూ, ప్రపంచమందు జీవరాసులుగనున్న అన్నిటిని జగతి అనియూ అంటున్నాము. ప్రపంచమును, జగతిని రెండిటిని

కలిపి విశ్వము అంటున్నాము. ప్రపంచము + జగతి = విశ్వము. విశ్వము సృష్టించ బడినది, కావున దీనిని సృష్టించినవాడు

ఎవడో ఒకడుండాలి. అతనినే సృష్టికర్త అనియూ విశ్వకర్త అనియూ అంటాము.



సర్వమును సృష్టించినవాడు, ఎవరి చేతను సృష్టింపబడనివాడై ఉంటాడు. అంతేకాదు ఎవడైతే సృష్టికర్తో

అతనికి ఆకారముండదు, పేరు కూడ ఉండదు. దీనినిబట్టి సర్వజగత్తుతోగానీ, ప్రపంచముతోగానీ పోలిక లేనివాడై,

విశ్వాతీతుడైనవాడు విశ్వమును తయారు చేసిన దేవుడు. దేవుడు సృష్టించువాడే గానీ సృష్టించబడనివాడు. ఇక్కడ

కొందరికొక అనుమానము రావచ్చును. అదేమనగా “అన్నిటిని సృష్టించిన వానికి పేరు, ఆకారము లేనపుడు, అతనిని

దేవుడు అంటున్నాము కదా! అది ఒక పేరు కాదా” అని కొందరడుగవచ్చును. దానికి జవాబు ఏమనగా! దేవుడు అన్న


పదము ఒక పేరు కాదు. అది ఒక అర్థ విధానమును తెల్పు పదము. వెతికినా కనిపించనివాడని అర్థమును సూచించు

పదమును దేవుడు అంటాము. ఒక కంటితో చూస్తే కనిపించనివాడనియే కాక, వెతికే విధానములెన్ని ఉన్నా వాటికి

తెలియనివాడని అర్థము. వెతికేది కంటితోనే కాదు, కన్ను లేనివాడు చేతి స్పర్శతో కూడ వెతుకును. అట్లే చెవి వినికిడితో

కూడ వెతకడము కలదు. నోటి నాలుకతో కూడ చూడడము కలదు. నాలుకకు కన్నులే లేవుకదా! చూడడమేమిటని

కొందరడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఒక పదార్థమును రుచి చూచి చెప్పుటలో ఆ పదార్థములో

నాలుక కూడ రుచి అను దానిని వెదకి చూస్తున్నదని తెలియుచున్నది కదా! ఈ విధముగ విశ్వములో దేనినైన ఐదు

ఇంద్రియముల ద్వార వెదకగలుచున్నాము. మనిషి వెదకగల ఐదు విధానములకు తెలియనివాడే దేవుడు. ఐదు

ఇంద్రియములకు అతీతుడు దేవుడు. అతనినే ఇంద్రియాతీతుడని కూడ అంటున్నాము.


తెలియనిదానిని వెదకలాడడము ఒక విధానము. దేవుడు తెలియని వాడు కనుక వెదకడము అను విధానముతో

గలడు. వెదకడము అను పదము కొన్ని ప్రాంతములలో దేవులాడడము అని కూడ అనుచున్నాము. వెదుకులాడడములో

లేక దేవులాడడములో ఆడడము అను దానిని తీసివేస్తే “వెదుకు” అను పదముకు సమానమైన పదము “దేవు” అనునది.

దేవు అను పదము నుండి వచ్చినదే “దేవుడు”. దేవుడు అనగా తెలియనివాడని, తెలియకుండ ఉన్నవాడని, ఎప్పటికి

వెదకబడేవాడే కానీ తెలియబడేవాడు కాదనీ అర్థమగుచున్నది. ఈ విధముగ “దేవుడు” అను పదము ప్రత్యేకత

కల్గియున్నది. తెలియబడని దేవున్ని తెలుసుకొనుటకు భూమిమీద కొందరు ఒక విధానమవలంబించగా మరికొందరు

వేరొక విధానమును అవలంబించు చున్నారు. వారి వారి ఇష్టానుసారము అవలంబించు విధానములనే మతములు

అంటున్నాము. దేవున్ని వెదుకు విధానమే మతముగానీ, మతము దేవుడు గాదు. మతములో దేవున్ని వెదకు విధానమున్నది,

కావున మతములో దైవ జ్ఞానముండవచ్చును, కాని దైవముండదు. అన్ని మతములకు సమానమైన దూరములోనే

దేవుడు కలడు. ఒక మతమునకు దగ్గర అనిగానీ, మరియొక మతమునకు దూరము అనిగానీ దేవుడు లేడు. తెలుసుకొనే

వానికి తెలుసుకొన్నంతనే తెలియును, కానీ పూర్తి ఎవరికీ తెలియడు. అందువలననే భూమిమీద బ్రతికియున్న వారికెవరికీ

తెలియనివాడు దేవుడు అన్నాము. ఇంతవరకు దేవున్ని చూచినవాడు భూమిమీద ఎవడూ లేడు.


సృష్ఠించబడినవి ఎన్నియైనా వాటిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఆ ఒక్కడిని దేవుడనే ఒక్క పదముతోనే

పిలువాలా లేక దేవుని విలువనూ, అర్థమునూ భంగపరుచక అదే విలువున్న మరికొన్ని పదములతో పిలువ వచ్చునా

అని కొందరడుగవచ్చును. దానికి జవాబుగ, దేవుని విలువకు భంగము కలుగకుండ రూప, నామ, క్రియలకు

అతీతముగ ఏ పదమును ఉపయోగించయినా పిలువచ్చుననుచున్నాము.


ప్రపంచములో జడపదార్థములకంటే చైతన్యము కల్గియున్న సజీవ స్వరూపములు గొప్పవి. కదలిక లేని

నిర్జీవములకంటే చైతన్యవంతమైనవి శరీరములలో రెండు కలవు. ఆ రెంటిటిని ఆత్మ, జీవాత్మ అంటున్నాము. ఆత్మ

జీవాత్మ కాని వాటిని ప్రకృతి అని అంటున్నాము. ప్రకృతి ఐదు భాగములుగ గలదు. ఆకాశము, గాలి, అగ్ని, నీరు,

భూమి అను ఐదు భాగములను ప్రకృతి అంటున్నాము. ప్రకృతికానటువంటి వాటిని ఆత్మ, జీవాత్మ అంటున్నాము.

విశ్వములో ప్రకృతి మరియు ఆత్మ, జీవాత్మలు అను మూడూ దేవుడు కాదు. ప్రకృతికంటే ఆత్మ జీవాత్మలు గొప్పకాగా,

ఆత్మ జీవాత్మకంటే ఆత్మ గొప్పది. శరీరములో శ్రేష్టమైన ఆత్మకంటే దేవుడు గొప్పగ ఉంటూ, ఆత్మకంటే వేరుగ కూడ

ఉన్నాడు. ఆత్మకంటే పరాయిగా వేరుగానున్నాడు కావున మూడవ ఆత్మను పరమాత్మ అంటున్నాము. పరమాత్మ అను

పదము ఆత్మ కూడ కాదనీ, ఆత్మకంటే భిన్నముగా, వేరుగా ఉన్నదనీ భావముకలదే కానీ అది పేరుకాదు. వాస్తవానికి


దేవుడు జడమైన ఒక పదార్థము కాదు, చైతన్యమైన ఆత్మకాదు. అదే విధముగ భౌతికమైన స్త్రీకాదు మరియు పురుషుడు

కాదు. అందువలన దేవున్ని స్త్రీలింగముగా పరమాత్మ ఏదీ కానిదనీ, పరమాత్మ ఏదీ కానివాడనీ పులింగముగ రెండు

రకములుగా చెప్పుకొంటున్నాము.


దేవుడు అను పదమునకు విభిన్నము కానిది పరమాత్మ పదము. అలాగే దేవుని విధానమును తెల్పు

పదములనుపయోగించుకొని ఏ విధముగనైన పిలువవచ్చును. ఉదాహరణకు జగత్కర్త అంటున్నాము. భర్త అనగ

భరించువాడు, భార్య అనగ భరించబడునది అని అర్థము. జగత్తు నంతటిని భరించువాడు పరమాత్మ, కనుక దేవున్ని

జగత్కర్త అంటున్నాము. కానీ అది పేరు కాదు. అలాగే పురుషోత్తమ అనునది కూడ పేరు కాదు. ఆత్మ జీవాత్మలను

పురుషులకంటే ఉత్తమ పురుషుడను అర్థము తప్ప పేరుకాదు. దేవుని హెూదాకు భంగము కాని పదములను ఎన్నిటినైన

ఉపయోగించుకోవచ్చును. అలాంటి పదములలో ముఖ్యమైనది ఒక పదము కలదు. అదియే "ప్రభువు" ప్రభువులో

చాలా గొప్ప అర్థము ఇమిడి ఉన్నది. ప్రభు అను పదమును ఉచ్చరించడములో "ప్రభువు" అని అనవచ్చును. ప్రభువుకు

అర్థమేమనగా! “భు” అనగ పుట్టడము అని చెప్పవచ్చును. “స్వయంభు” అనగ ఇతరుల జోక్యము లేకుండ స్వయముగా

పుట్టినవాడని అర్థము. తన ఇష్టప్రకారము తనకు తానుగ పుట్టువానిని స్వయంభు అంటున్నాము. స్వయంభు అని

ఎవరిని అనవచ్చుననగా! దేవుడు తప్ప స్వయముగా పుట్టిన వారు ఎవరూ లేరు. కావున స్వయంభు అని దేవున్నే

చెప్పవచ్చును. దేవుడు స్వయముగ ఎందుకు పుట్టుచున్నాడని ఎవరైన అడిగితే దానికి జవాబు చెప్పుటకు, ముందు

కొంత విషయము తెలియవలసి ఉన్నది. ఆ విషయమేమనగా!


దేవుడు రూప, నామ, క్రియలు లేనివాడు అని శాసనము కలదు. అటువంటివాడు పుట్టితే ఆయనకు అది ఒక

పని అగును కదా! శాస్త్ర బద్దముగ దైవమునకు పని (క్రియ)యే లేనపుడు ఆయన పుట్టడమూ, స్వయముగా పుట్టడమూ,

స్వయంభు అనిపించుకోవడమూ సత్యమా అని ఎవరికైనా ప్రశ్న రావచ్చును. దానికి జవాబును వివరముగా తెలుసుకొంటే

దేవుడు పుట్టు వాడూ కాదు మరియు గిట్టువాడూ కాదు. ఇదే విషయమునే భగవద్గీత యందు జ్ఞానయోగమను

అధ్యాయమున ఆరవ శ్లోకములో ఈ విధముగా చెప్పారు.


"అజోలి సన్నవ్యయాత్మా భూతాని మిశ్వరోపి సన్,

ప్రకృతిం స్వామధిష్ఠాయ సమ్భవా మ్యాత్మ మాయయా"


ఈ శ్లోకములో “అజోపి” అను పదము యొక్క అర్థము పుట్టుక లేనివాడనీ, అట్లే “న్నవ్యయాత్మా" అను

పదము నాశనములేని వాడని అర్థము నిచ్చుచున్నది. దీనినిబట్టి దేవునికి జననముగానీ, అట్లే నాశనము గానీ రెండూ

లేవని చెప్పవచ్చును. ఈ వాక్యమును అనుసరించి దేవుడు పుట్టడు అని చెప్పవచ్చును. దేవుడు పుట్టడు అను వాదన

ప్రస్తుత కాలములో ఇస్లామ్ సమాజమునందుగానీ, క్రైస్తవ సమాజమునందు గానీ గట్టిగా చెప్పబడుచున్నది. దేవుడు

పుట్టడు అనుమాట వాస్తవమే అయినా అదే శ్లోకములో నేను పుట్టుదును అను అర్థముతో “సమ్భవా” అని చెప్పడము

జరిగినది. అక్కడే ఏడవ (7) శ్లోకములో "సృజామ్యహమ్" అను పదమును వాడి నన్ను నేను పుట్టించుకొంటాను

అన్నాడు. తర్వాత ఎనిమిదవ (8) శ్లోకములో “సమ్భవామి యుగే యుగే” “కొన్ని యుగములకొకమారైన నేను

పుట్టుదును" అని అన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ బాగా గ్రహించవలసినది ఏమనగా! ఆరవ శ్లోకములో "అజుడను”

పుట్టువాడను కాను అనిన దేవుడు, అదే శ్లోకములో “సమ్భవా” పుట్టుదును అని అన్నాడు. తర్వాత ఎనిమిదవ


శ్లోకములో కూడా సమ్భవామి అని పుట్టుదుననియే చెప్పాడు. ఏడవ శ్లోకములో మాత్రము “సృజామ్యహమ్” నన్ను

నేను పుట్టించుకుంటాను అని అన్నాడు. ఆ విధముగానైనా దేవుడు పుట్టినట్లే అగును. ఈ విధముగా రెండు రకములుగా

చెప్పడము వలన మనిషులు అర్థము చేసుకోలేక కొందరు పుట్టడనీ, కొందరు పుట్టునని చెప్పడము జరుగుచున్నది.

రెండు మాటలూ శాస్త్రబద్ధమైనవే, రెండు మాటలూ వాస్తవముగా దైవ వాక్కులే, అయితే ఈ విషయమును మనిషి ఎలా

అర్థము చేసుకోవాలో తెలియకుండా పోయినది. మొత్తానికి దేవుడు పుట్టునా, పుట్టడా అను ప్రశ్నను వేసుకొని చూస్తే

ఇప్పుడు చెప్పిన 6,7,8 శ్లోకములకంటే ముందు ఐదవ (5) శ్లోకములో "బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జునా" అని

అన్నాడు. ఆ మాటకు నేను ఎన్నోమార్లు పుట్టాను, నీవు కూడా ఎన్నోమార్లు పుట్టావు అని అర్ధము. దీనినిబట్టి దేవుడు

పుట్టుచున్నాడని తెలిసినా వెంటనే మరియొక ప్రశ్న రాగలదు. ఇప్పుడు చెప్పినది భగవంతుడు కదా! దేవుడు కాదుకదా!

భగవంతుడు పుట్టునేమోగానీ, దేవుడు పుట్టడు కదా! అని సంశయము రావచ్చును. అయితే వెంటనే జవాబు కూడా

ఈ విధముగా వస్తున్నది. ఆరవ (6) శ్లోకములో చెప్పిన వాడు భగవంతుడే కదా! అప్పుడు అజోపి= పుట్టువాడను

కాను అని చెప్పడమేకాక, భూతానా మీశ్వరోపి = జీవ రాసులకు దేవుడను అని కూడా అన్నాడు. ఈ మాటలను బట్టి

చెప్పిన వాడు దేవుడే అని తెలియుచున్నది. అయితే దేవునికి రూప, నామ, క్రియలు లేనపుడు ఎలా పుట్టును? ఎలా

కనిపించును? ఎలా పని చేయును? అని ప్రశ్నలు రాగలవు. ఈ విధముగా దేవుని విషయములో ఒక ప్రశ్నకు జవాబుండినా,

మరొక ప్రశ్న వచ్చుచుండును.


దేవుని విషయములో సంపూర్ణ జ్ఞానము కలుగనంత వరకు ఎటూ తేల్చలేని స్థితి మానవులలో ఉండును.

అందువలన కొందరు దేవుడు పుట్టడు అంటే, కొందరు మాత్రము దేవుడు పుట్టునని చెప్పుచుందురు. అసలైన సంపూర్ణమైన

దైవజ్ఞానము తెలియనంత వరకు దేనినీ ఒప్పు కొనుటకు వీలుపడదు. దేవునికి సంబంధించిన సమస్త జ్ఞానము తెలిసిన

రోజు, దేవుడు పుట్టును అనుమాట నిజమే అగును. అలాగే పుట్టడు అను మాట కూడా నిజమే అగును. ఇదేమిటి

విడ్డూరము రెండు మాటలు ఎలా నిజమగునని ప్రశ్నవస్తే దానికి జవాబు ఈ విధముగా కలదు.


భూమండలమంతయూ అఖండముగా సముద్రము వ్యాపించి యున్నదని అందరికీ తెలుసు. సముద్రములో

నీరున్నదని కూడా తెలుసు. సముద్రమున్నదొకటే అయినా ప్రాంతీయముగా దానినే కొన్ని పేర్లుగా చెప్పుకొనుచున్నారు.

ఒకే సముద్రమునకు ఐదు పేర్లను పెట్టి ఐదు మహా సముద్రములుగా చెప్పుకొనుచున్నారు. పేర్లు వేరువేరుగా ఉండినా

పేరు చివరిలో సముద్రమనియే పలుకబడుచున్నది. ఉన్నది ఒకే సముద్రమైనా, అది ఎన్ని పేర్లతో పిలువబడినా,

సముద్రములో ఉన్నది మాత్రము ఉప్పు నీరే. నీటికి ముఖ్యమైన ధర్మము ఒకటి గలదు. ధర్మము అనగా ఎప్పటికీ

మారనిదీ, శాశ్వితమైనదీ, సహజముగా ఉండునదనీ అర్థము. నీటికి ఎప్పటికీ అంటుకొనియున్న ధర్మమును పరిశీలిస్తే,

దాని ధర్మము ప్రకారము కనిపించని రెండు వాయువుల కలయికయే నీరు అని తెలియుచున్నది. ఒకటి ఆక్సిజన్

వాయువు, రెండవది హైడ్రోజన్ వాయువుగా గుర్తించబడినది. అదియూ ఆక్సిజన్ వాయువు ఒక శాతమూ, హైడ్రోజన్

వాయువు రెండు శాతములు కలిసియుండుట వలన నీరు ఏర్పడినదని తెలియుచున్నది. నీరు ఎక్కడ ఉండినా అది

ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అను రెండు వాయువుల సమ్మేళనమని తెలియుచున్నది. ప్రాంతాలను బట్టి ఎన్నో పేర్లుగా

చెప్పబడుచున్న సముద్రము భూమండలమంతయూ వ్యాపించియున్నది. సముద్రము లోని నీటిని మేఘములు తీసుకొని

పోయి భూమిమీద అన్ని ప్రాంతములలో వర్షించుచున్నవి. భూమిమీద వర్షింపబడిన నీరు మానవులకు మరియు అన్ని

జీవరాసులకు ఉపయోగపడుచున్నది. అలా కొంత ఉపయోగపబడు చుండగా మిగిలిన నీరు నదుల ద్వారా సముద్రమునే


చేరుచున్నది. సముద్రము చేరనంత వరకు మనిషికి ఉపయోగపడు మంచినీటిగానున్న నీరు, సముద్రమును చేరిన

తర్వాత ఎవరికీ ఉపయోగపడని ఉప్పు నీరుగా మారిపోవుచున్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే.


ఇక్కడ మనకు నీటికివున్న ధర్మము తెలిసినది. ఒక్క భాగము ఆక్సిజన్ వాయువు, రెండు భాగములు హైడ్రోజన్

వాయువు కలయికే నీరని తెలిసినది. ఈ సూత్రము మారునది కాదు, శాశ్వితముగా ఉండునది. కనుక నీటికి ఒక

ధర్మము కలదని చెప్పవచ్చును. నీటికి ఒక ధర్మమున్నట్లే దేవునికి కూడా ముఖ్యమైన ధర్మము ఒకటి కలదు. అదేమనగా

దేవుడు రూప, నామ, క్రియా రహితుడు అనునదే ఆయన ధర్మము. దేవుని ధర్మము ప్రకారము దేవునికి ఆకారము

లేదు, పేరూ లేదూ, పనియూ లేదని చెప్పవచ్చును. దేవునికి రూపమూ, పేరూ, పనీ లేదనుట బ్రహ్మవిద్యా శాస్త్రములోని

శాసనము మరియు ధర్మము. దేవుడు రూప, నామ, క్రియా రహితుడు అనుట శాసనము, కావున ఈ శాసనమును

అనుసరించి దేవుడు పుట్టడు అని చెప్పవచ్చును. దేవునికి జన్మలేదు అనుట శాస్త్రబద్దమని కూడా చెప్పవచ్చును.

అందువలననే బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలో “అజోపి” పుట్టుక లేనివాడని చెప్పబడినది. దీనినిబట్టి దేవుడు పుట్టడు

అని ఇస్లామ్వర్గము వారు చెప్పు మాట పూర్తి సత్యమైనదే. ఇక్కడ ఇంకొక విషయమును మానవులందరూ గుర్తుంచుకోవాలి.

అదేమనగా దేవుడు ఎవరికీ అంతుబట్టని వాడు. దేవుడు ధర్మయుతుడే కాకుండా ధర్మాతీతుడు కూడా అని చెప్పవచ్చును.

ధర్మాతీతుడు అనుటకు కూడా శాస్త్రబద్దత కలదు. భగవద్గీతలో చివరి మోక్షసన్న్యాస యోగములో 66వ శ్లోకమున

“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అని చెప్పబడి ఉన్నది. దేవునికున్న సర్వ ధర్మములను వదలి దేవున్ని

ఒక్కనినే శరణము పొందినపుడు అని శ్లోకములోని అర్థము. ఈ శ్లోకము ప్రకారము దేవుడు ధర్మమునకు కూడా

అతీతుడని తెలియుచున్నది. అజోపి = పుట్టుక లేనివాడు అనునది ధర్మమే, అయితే ఒక విధముగా ధర్మమునకు కూడా

అతీతునిగా సర్వ ధర్మాన్ పరిత్యజ్య = అన్ని ధర్మములను వదలి చెప్పబడినది. దీనినిబట్టి దేవుడు ధర్మయుతుడే కాక

ధర్మాతీతుడనుటకు కూడా అవకాశమేర్పడినది. అలా ధర్మాతీతుడని చెప్పుటకు కూడా ఒక ముఖ్యమైన కారణము

కలదు. ఆ కారణమేమనగా!


దేవుడు ఎటువంటి వాడో, ఎట్లున్నాడో, ఎవరికీ తెలియదు. దేవుడు ఊహాతీతుడు, ఎవరి ఊహకూ అందడు.

దేవుడు ఇంద్రియాతీతుడు, ఎవరి కంటికి కనిపించువాడూ కాదు, ఎవరి చెవికి వినిపించువాడూకాదు. అందువలన

భూమిమీద ఉన్న యోగులుకానీ, జ్ఞానులుగానీ, తపస్వికులు గానీ, దేవర్షులుగానీ, బ్రహ్మర్షులుగానీ, దేవుడు నాకు

తెలుసు, నేను చూచానన్న ఎవరైనాగానీ దేవున్ని ఇంతవరకు చూడలేదు, దేవుడు ఎవరికీ తెలియడు. దేవుడు అంటే

వెదకబడేవాడని అర్థముగానీ, తెలిసినవాడని అర్థము కాదు. ఎవరికీ అంతుబట్టని దేవున్ని గురించి భూమిమీద ఎవరికీ

తెలియడని చెప్పవచ్చును. ఇదే విషయమునే బైబిలు గ్రంథములో యోహాను సువార్తయందు 18వ వాక్యమున

“ఎవడునూ ఎప్పుడునూ దేవున్ని చూడలేదు” అని వ్రాసియున్నారు. అటువంటి దేవున్ని గురించి వివరములు తెలుసుకొని

దేవున్ని చేరుటకు, దేవుని వివరము (జ్ఞానము) తెలుపువాడు ఒకడుండ వలెను కదా! దేవుని విషయము దేవునికి తప్ప

ఎవరికీ తెలియనప్పుడు, భూమండములో దేవుని జ్ఞానమును అందించువాడు ఎవడూ లేడని చెప్ప వచ్చును. అందువలన

దేవుని జ్ఞానమేమిటో, దేవుని ధర్మమేమిటో తెలియా లంటే దేవుడే తెలియజేయాలి. దేవుని జ్ఞానమును తెలియజేసిన

వాడే గురువు. భూమిమీద దేవుడు ఎవనికీ తెలియనప్పుడు, గురువు అనువాడు లేడనియే చెప్పవచ్చును. అందువలన

తన జ్ఞానమును తెలియజేయుటకు దేవుడే గురువుగా భూమిమీదకు రావలసివున్నది. దైవజ్ఞానము మనుషులకు

తెలియజేయుటకు దేవుడే భూమిమీద పుట్టవలసిన అవసరము ఉన్నది. కావున భగవద్గీతలో జ్ఞానయోగమను అధ్యాయములో


ఇంకనూ

ఐదవ (5) శ్లోకము నందు నేను ఎన్నోమార్లు పుట్టానని చెప్పుచూ "బహునియే వ్యతీతాని జన్మాని" అని అన్నాడు. అలాగే

ఆరవ (6) శ్లోకమున "ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా" నా ప్రకృతితో కూడి నేను శరీరమును

ధరించి ఆత్మతోనూ, గుణములతోనూ (మాయతోనూ) పుట్టు చున్నాను అని చెప్పడము జరిగినది. తర్వాత ఏడవ (7)

శ్లోకమున “సృజామ్యహమ్” నన్ను నేను పుట్టించుకొంటున్నాను అన్నాడు. అంతేకాక ఎనిమిదవ (8) శ్లోకమున

“సంభవామి యుగే యుగే” కొన్ని యుగములకొకమారు పుట్టుచుందునని కూడా చెప్పడము జరిగినది.

తొమ్మిదవ (9) శ్లోకమున "జన్మ కర్మదమే దివ్యమేవం యో వేత్తి తత్తతః త్యక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున" దీని

భావమేమనగా! నేను జన్మించినపుడు నా దివ్యమైన జన్మను తత్త్వవేత్త అయిన ఎవడు తెలుసుకోగలడో, వాడు శరీరమును

వదలి చనిపోయిన తర్వాత తిరిగి పుట్టడు. వాడు నా లోనికి ఐక్యము కాగలడు. ఈ వాక్యమును బట్టి దేవుడు మనిషిగా

పుట్టుచున్నాడని తెలియుచున్నది. అలా పుట్టినవాడే దైవజ్ఞానమును తెలియజేయు గురువు. భూమిమీద సామాన్య

మనుషులెవరూ గురువులు కాదు. ఇదే విషయమునే దేవుడే నీకు గురువు, భూమిమీద మనుషులను గురువని పేరు

పేరుపెట్టి పిలువవద్దని బైబిలు గ్రంథములో చెప్పారు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయమున 10వ వచనములో

“మీరు గురువులని పిలువబడవద్దు" అని చెప్పబడివున్నది. దీనినిబట్టి దేవుడే గురువని పరోక్షముగా చెప్పడమైనదని

అర్థమగుచున్నది. ఈ విధముగ దేవుడు భూమిమీద జ్ఞానమును ధర్మమును తెలియజేయుటకు పుట్టుచున్నాడని శాస్త్రము

ప్రకారము చెప్పవచ్చును.


ఒకచోట పుట్టుననీ, ఒకచోట పుట్టడనీ పరస్పర విరుద్దముగ శాస్త్రము చెప్పునా? అలా చెప్పినది శాస్త్రమగునా?

అని ఎవరైనా ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఇలా ఉన్నది. పరస్పర విరుద్దముగా ఉండునది శాస్త్రము కాదు.

షట్ శాస్త్రములలో పెద్దదైన బ్రహ్మవిద్యా శాస్త్రములో ఏమాత్రము లోపముండదు. ఒక విషయమును సమర్థించుటకు

శాస్త్రబద్ధత ఎంత అవసరమో, అట్లే ఒక విషయమును ఖండించుటకు కూడా శాస్త్రబద్దత అంతే అవసరమగును.

దేవుడు పుట్టడు నాశనము కాడు అనుటలో ఎంత శాస్త్రబద్ధత ఉన్నదో, అంతే శాస్త్రబద్దత దేవుడు పుట్టును అనుటలో

కూడా కలదు. అయితే ఇక్కడ రెండూ శాస్త్రబద్దత ఎలా అయినవో పరిశీలించి చూచితే, సముద్రములోని నీరు మనకు

కనిపించకుండావచ్చి వర్షరూపములో పడుచున్నది. వర్షింపబడిన నీరు మనకు ఉపయోగబడుచున్నది. ఇక్కడ కొంత

యోచించి చూస్తాము, సముద్రపు నీరు పూర్తి ఉప్పునీరు, కావున సముద్రపు నీరు త్రాగుటకు ఎవరికీ ఉపయోగపడదు

అనుమాట పూర్తి సత్యము. అదే సముద్రములోని నీరే వర్షరూపములో వచ్చినపుడు త్రాగుటకు అందరికీ ఉపయోగపడుట

కూడ నిజమే. ఇప్పుడు సముద్రము నీరు త్రాగుటకు ఎవరికీ ఉపయోగపడదు అనుట సత్యమే, అలాగే సముద్రములోని

నీరే మార్పుచెంది త్రాగుటకు అందరికీ ఉపయోగపడుట కూడా నిజమే. సముద్రములోని నీరు ఉప్పునీరుగా మనుషులకు

ఉపయోగపడలేదు. కావున అది ఎవరికీ ఉపయోగపడదు అనుట ఎంత సత్యమో, వర్షమైన సముద్రము నీరు

మంచినీరుగా అందరికీ ఉపయోగపడుచున్నదనుట అంతే సత్యమగును. సముద్రములోనిదీ నీరే, వర్షించి నదిగాయున్నది

కూడా నీరే. సముద్రము లోనిది నీరు అనీ, నదిలోనిది నీరుకాదనీ ఎవరూ అనలేరు. ఎందుకనగా సముద్రము నీటికి

ఏ ధర్మమున్నదో, నదిలోని నీటికి కూడ అదే ధర్మమున్నది. సముద్రము నీటిలో ఆక్సిజన్, హైడ్రోజన్ ఉండినట్లే

నదిలోని నీటికి కూడా ఆక్సిజన్, హైడ్రోజన్ ఉన్నవి. నీటికి సంబంధించిన ధర్మములలో సముద్రము నీటికిగానీ, నది

నీటికిగానీ ఏ మార్పులేదు. అందువలన సముద్రము నీటినీ, నది నీటినీ ఒక్కటే అని చెప్పుటకు ఏ అడ్డంకులు లేవు.

అదే విధముగా దేవుడు సముద్రములాంటి వాడనుకొనుము. దేవుడు తన ధర్మములను తెలియజేయుటకు శరీరము


ధరించి పుట్టినపుడు, ఆ జన్మను భగవంతుడు అందుము. సముద్రములోని ఉప్పునీరు వర్షముగా వచ్చి మంచి నీటి

నదియైనపుడు, నదిని సముద్రము అని ఎలా అనమో, అలాగే దేవుడు భగవంతుడుగా వచ్చినపుడు భగవంతున్ని

దేవుడు అని అనము. సముద్రము వేరు, నది వేరు అయినట్లు, దేవుడు వేరు, భగవంతుడు వేరని తెలియవలెను.

సముద్రములోని నీటిని వందలకోట్ల భాగములుగా విభజించితే అందులోని ఒక భాగమే నదియైనట్లు, దేవునికి గల

కోట్ల అంశలలో ఒక్క అంశమాత్రమే భగవంతుడుగా అవతరించుచున్నది. సముద్రములోని నీరే భూమిమీద నదిగా

మారినా, సముద్రములో ఏ మార్పు కనిపించక యథాతథముగా ఉన్నట్లు, దేవుడు భగవంతుడుగా పుట్టినా దేవునియందు

ఏ లోపముగానీ, మార్పుగానీ లేకుండా యథాతథముగా ఉండును. సముద్రము వేరు, నది వేరైనంతమాత్రమున,

సముద్రముకంటే భిన్నముగా నది కనిపించినంత మాత్రమున సముద్రములోని నీరుకు, నదిలోని నీరుకు ధర్మములో

భేదమూ లేదు. కావున సముద్రము నీటినీ, నది నీటినీ ఒక్కటిగానే చెప్పవచ్చును. నది సముద్రము వేరువేరని చెప్పుట

సత్యమేగానీ, నదిలోని నీరు, సముద్రములోని నీరు వేరువేరని చెప్పుట అసత్యమగును. అలా చెప్పుట జ్ఞానమూ కాదు,

విజ్ఞానము కాదు.


దేవున్ని సముద్రముగా, భగవంతున్ని నదిగా పోల్చుకొంటే నది వలన మనుషులకు దాహము తీరినట్లు,

భగవంతుని వలన మనుషులకు జ్ఞాన దాహము తీరుచున్నది. సముద్రము మానవుల దాహమునకు ఉపయోగపడనట్లు,

దేవుడు మానవులకు ఏ పని చేయనివాడై స్తబ్దతగా ఉండును. ఒకే నీరు ఉప్పునీరుగా సముద్రములో, మంచినీరుగా

నదిలో ఉన్నట్లు, ఒకే దేవుడు కనిపించని పరమాత్మగా మరియు కనిపించే భగవంతునిగా ఉన్నాడని తెలియాలి. పుట్టని

దేవుడే పుట్టిన భగవంతునిగా, పని చేయని దేవుడే పని చేయు భగవంతునిగా, ఆకారములేని దేవుడే ఆకారమున్న

భగవంతునిగా ఉన్నాడని తెలిసినవాడే సంపూర్ణ జ్ఞానియగును. అలా తెలియక పుట్టినవాడు దేవుడు కాదనినా, దేవుడు

భగవంతునిగా పుట్టడనినా, అటువంటివాడు గ్రుడ్డిగా మాట్లాడినట్లగును. బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము దేవుడు

దేవునిగా పుట్టడు. కానీ దేవుడు భగవంతునిగా పుట్టును. దేవుడు వేరు భగవంతుడు వేరు. అయినా దేవుడే భగవంతు

డగును, భగవంతుడే దేవుడగును. ఈ సూత్రమును అనుసరించియే భగవంతుడైన కృష్ణుడు గీతలో సర్వ జీవరాసులకు

ఈశ్వరున్ని (దేవున్ని) అయిన నేను నా ప్రకృతినావహించి ఆత్మతో, గుణములతో కూడి పుట్టుచున్నా నని చెప్పుచూ ఈ

శ్లోకమును చెప్పాడు.


అధ్యాయము జ్ఞానయోగము. శ్లోకము ఆరులో "అజోలి సన్నవ్య యాత్మా భూతానా మీశ్వరోపిసన్, ప్రకృతిం

స్వామదిష్ఠాయ సమనామ్యాత్మ మాయయా” ఈ శ్లోకములో దేవునిగా పుట్టననీ, భగవంతునిగా శరీరము ధరించి పుట్టుదుననీ

కృష్ణుడు స్వయముగా చెప్పడమును గమనించవచ్చును. దేవుడు అవతరించునని ఒక్క ఇందూమతము (హిందూమతము)

లోనే కాకుండా, మనిషిగా పుట్టినవాడు దేవుడనుటకు ఆధారముగా క్రైస్తవములోని బైబిలు గ్రంథములో ఏసు చెప్పిన

అనేక సందర్భములలోని అనేక మాటలను బట్టి తెలియుచున్నది. ఉదాహణకు యోహాను సువార్త 5-26 “తండ్రి

(దేవుడు) ఎలాగున తనంతట తాను జీవముగలవాడైయున్నాడో, అలాగే కుమారుడు (భగవంతుడు) ను తనంతట

తానే జీవముగలవాడైయుండుటకు కుమారునికి అధికారమును అనుగ్రహించెను.”


ఈ వాక్యములో దేవుడు ఏ ధర్మముతోయున్నాడో, భగవంతుడు కూడా అదే ధర్మముతోయున్నాడని తెలియుచున్నది.

దేవుడు, భగవంతుడు ఇద్దరు ఒక్కటేననుటకు బైబిలులో కూడా యోహాను 14-8,9,10 వాక్యములలో ఇలా కలదు.

“ప్రభువా! తండ్రిని (దేవున్ని) మాకు కనబరుచుము”. మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ఏసు ఇలా అన్నాడు.


"నేనింత కాలము మీ వద్దయుండిననూ నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని (దేవున్ని) చూచియున్నాడు.

కనుక తండ్రిని (దేవున్ని) మాకు కనపరచుమని ఏల అడుగుచున్నావు. తండ్రియందు నేను, నాయందు తండ్రియు

ఉన్నామని నీవు నమ్ముటలేదా?” అని చెప్పాడు. దీనినిబట్టి భగవద్గీతలో దేవుడు భగవంతునిగా ఉంటాడని చెప్పిన

మాటకు ఈ మాట సమానముగా ఉన్నదని తెలియుచున్నది. ఈ విధముగా ఇతర మతములు కూడా భగవద్గీతలో

చెప్పినట్లు దేవుడు భగవంతునిగా వస్తాడనీ, దేవుడు భగవంతుడు ఒక్కటేననీ, దేవుని ధర్మములు కలవాడే భగవంతుడని

తెలియు చున్నది. అంతేకాక ఏ విధముగా మంచినీటి నది ప్రవహించి చివరకు సముద్రములో కలియుచున్నదో అదే

విధముగా భగవంతునిగా ఉన్నవాడు చివరకు దేవునియందే చేరిపోవును. సముద్రము నుండి వచ్చిన నీరు మంచినీరుగా

ప్రజలకు ఉపయోగపడి, చివరికి ఎక్కడినుండి వచ్చిందో తిరిగి అక్కడికే చేరి సముద్రముగా మారిపోవుచున్నది. అలాగే

దేవుని నుండి వచ్చిన అంశ భగవంతునిగా కనిపించి, తన ధర్మములను బోధించి, తిరిగి దేవునిగానే మారిపోవుచున్నది.

దేవుని అంశ భూమిమీదకు భగవంతునిగా ఒక శరీరము ధరించి వచ్చినపుడు, తమతో పాటు కనిపించు వ్యక్తిని

భగవంతునిగా ఎవరూ గుర్తించలేరు. అందువలన ఇతను భగవంతుడని ఎవరైనా గుర్తించి చెప్పినా ఎవరూ నమ్మరు.

విశేషముగా ఆత్మజ్ఞానము కలవారు భగవంతున్ని గుర్తించుటకు కొంత అవకాశముండినా, ఎన్నో అనుమానములను

మాయ రేకిత్తించును. అందువలన జ్ఞానులు బహు అరుదుగా దైవాంశ అయిన భగవంతున్ని గుర్తించగలరు. శ్రీకృష్ణ

జన్మలో ఒక్క భీష్ముడు తప్ప కృష్ణున్ని భగవంతుడని ఎవరూ గుర్తించలేదు.


రూప నామ క్రియలు లేని పరమాత్మ, ఏదీకాని ఫలానాయని చెప్పుటకు వీలులేని దేవుడు, అప్పుడప్పుడు

భూమిమీద ఒక రూపము ధరించి అవతరించునని చెప్పుకొన్నాము. దేవుని విషయములు మానవునికి తెలియాలంటే

దేవుడే స్వయముగ తన విషయములు తానే చెప్పాలి అని కూడా చెప్పుకొన్నాము. మానవునివలె వచ్చు దేవుడు తన

విషయములను తెలిపి మానవునివలె పోవును. దేవుడు మనుషుల మధ్యలోనికి వచ్చినపుడు, మనుషుల మధ్యలో ఉ

న్నపుడు, మనుషుల మధ్యనుండి పోవునపుడు ఎవరికీ తెలియడు. దేవుని విషయములు ఫలానా అని తెలుపువాడు తానే

దేవున్ని అని తెలుపడు. అందువలన మానవునిగా ఉన్న సమయములో దేవున్ని ఎవరు గుర్తించలేరు. దేవుడు భూమిమీద

తన పనులను తానే నిర్ణయించు కొని వచ్చును. అందువలన ఆయనను “ఖుదా” అని కూడ అనవచ్చును. ఖుదా తన

పనిని తాను చేయువాడు కనుక ఖుదా అనుచున్నాము. తనకు ఇష్టమొచ్చినపుడు తాను ఇతరుల జోక్యము లేకుండ

పుట్టువాడు కనుక ఆయనను స్వయంభు అని కూడ అనుచున్నాము. సాధారణ మానవుడు పుట్టుటకు తండ్రి వీర్యములోని

వీర్యకణము, తల్లి గర్భములోని రజోకణము అవసరము. దేవుడు మానవునిగా పుట్టుటకు తల్లి యొక్క రజోకణముగానీ,

తండ్రియొక్క వీర్యకణముగానీ అవసరము లేదు.


స్త్రీ పుష్పవతి అయినపుడు గర్భకోశములో రజోకణము తయారై గర్భము ధరించుటకు వీలుగ ఉండును. కన్య

శరీరములో రజోకణము ఉన్నప్పటికీ పురుష వీర్యకణముతోనే గర్భము ధరించును. పురుష వీర్యకణము లేనిది సంతతి

జరుగదు. స్వయముగ దేవుడే మానవునిగా పుట్టవలసిన అవసరమొచ్చినపుడు దేవునికి తల్లి రజోకణముతో తండ్రి

వీర్యకణముతో పనిలేదు. కావున కన్య అయిన స్త్రీ శరీరమునుండి అయినా దేవుడు పుట్టగలడు. అలాగే పురుష

సంపర్కము లేని స్త్రీ గర్భమునుండైన పుట్టగలడు. దేవుడు భూమిమీద పుట్టుటకు తండ్రి అవసరమే లేదన్నమాట.

తాను ఇటువంటి వాడినని, స్వయముగ పుట్టగలనని మనుషులు తెలియుటకు అవకాశముగ అందరికి తెలియునట్లు

దేవుడు ఒక జన్మ ఎత్తాడు. దేవుడు పూర్వము కొన్ని జన్మలను ఎత్తినా ప్రత్యేకించి కన్య కడుపున పుట్టడము జరిగినది.


ఆ జన్మయే దాదాపు 2000 సంవత్సరముల పూర్వము ఇజ్రయేలు దేశమున బెత్లహేము నగరమున జరిగినది. సర్వ

లోకములను సృష్టించిన దేవుడు తన్ను తాను సృష్టించుకొన్న జన్మ అది. స్వయంభు అయిన దేవుని జన్మ ధనికునిగ

ఉండవచ్చు లేక బీదవానిగ ఉండవచ్చును. తన శరీరమునకు మనుషులు ఏ పేరైనా పెట్టి పిలువవచ్చును. కానీ

నిజముగ ఆయన పేరు లేనివాడే. ఆ దినములలో ఆయనకు సాధారణ మనుషులు పెట్టిన పేరు “ఏసు” కాగ కొంత

దైవజ్ఞానము తెలిసినవారు, ఆయనలోని దైవ లక్షణములను గుర్తించినవారు "ప్రభువు" అన్నారు.


“భు” అనగ పుట్టుట అని తెలుసుకొన్నాము. “ప్ర” అనగా చాలా విశేషముకలదని అర్థము. ఉదాహరణకు

ముఖ్యము అను పదమునకు “ప్ర” ను కలిపితే ప్రాముఖ్యము అగును. “ప్ర" అను శబ్దము యొక్క గొప్ప తనమును

ముఖ్యమునకు జోడించితే ముఖ్యమునకు మరింత విలువ పెరిగింది. పంచభూతములైన ఆకాశము, గాలి, అగ్ని, నీరు,

భూమికి ప్ర కలిపితే ప్రపంచమైనది. అలాగే ళయమునకు (నాశనము) కు ప్ర కలిపితే ప్రళయమైనది. ళయమునకు,

పంచభూతములకు ప్ర విశేషతను తెలుపుచున్నది. అలాగే విషయమును బోధించడమును బోధ అంటున్నాము. అన్నిటికంటే

గొప్ప విశేషత కల్గిన బోధను ప్రబోధ అంటున్నాము. ఈ విధముగ విశేషతను సూచించు "ప్ర” శబ్దమునకు “భు”

జోడించితే ప్రభు అయినది. ప్రభువు అంటే విశేషత గల పుట్టుకగలవాడని లేక సామాన్య మానవుని జన్మవలెకాక

గొప్పతనము కల్గిన జన్మ అని తెలియుచున్నది. ఇంకనూ వివరముగ నిజార్థముగ చెప్పుకోవాలంటే, అది ఒక ప్రత్యేక

జన్మ అని చెప్పవచ్చును. దేవుడు భూమిమీద జన్మించడము ప్రత్యేకమైన జన్మయే, అందువలన ఆయనను ప్రభు

అన్నారు. ప్రభు అన్నది ఆయన పేరుకాదు, ఆయన గొప్పతనమని తెలియవలెను. పంచభూతములకు అధిపతియై

అణువణువున అంతట వ్యాపించిన దేవుడు స్త్రీ శరీరములో కూడ వ్యాపించి యున్నాడు. తాను పుట్టవలెననుకొన్నపుడు

ఏ స్త్రీ శరీరమునుండైన శరీరమును తయారు చేసుకొని రాగలడు. ఇక్కడ అందరికీ తెలియని మరొక విషయము

కలదు. ఇది తెలియని విషయమే కాదు, తెలిసినా అర్థముకాని విషయమనవచ్చును. ఆ విషయమేమనగా!


దేవుడు ఎక్కడ ఎప్పుడు పుట్టినా స్త్రీ శరీరమునుండి సజీవ శరీరముతో పుట్టును. జీవుడు ఎక్కడ ఎప్పుడు

పుట్టినా తల్లి శరీరము నుండి ప్రసవింపబడిన జడమైన శరీరములో ప్రవేశించి జన్మించును. ఇది ఇంతవరకు ఎవరికీ

తెలియని రహస్యము. ఇదే విషయమును ఖురాన్ గ్రంథములో 6వ సురాలో (అధ్యాయము) 97వ (6.97) ఆయత్

అల్ అన్ ఆమ్లో “నిర్జీవమైన దానిని సజీవమైన దానినుండి విసర్జింప చేసే వాడూ ఆయనే (దేవుడే)” అని చెప్పాడు.

దీనినిబట్టి మానవుడు స్త్రీ శరీరమునుండి సజీవముగా పుట్టలేదని తెలియుచున్నది. దేవుడు స్త్రీ శరీరమునుండి ప్రసవింపబడు

శరీరములో సజీవముగ బయటికి వచ్చుచున్నాడు. దేవుడు తప్ప ఏ జీవరాసి కానీ తల్లి గర్భమునుండి జీవము కల్గి

పుట్టలేదు. ఏ జీవుడైనా, ఏ మనిషైనా పుట్టిన శరీరములో వెంటనే కానీ, కొంతసేపటికి కానీ చేరుచున్నాడు. దేవుడు

అయిన భగవంతుడు అలాకాక, తల్లి గర్భము నుండే సజీవముగ పుట్టుచున్నాడు. మానవుడైన జీవుడు అంతట వ్యాపించి

లేడు. అందువలన ఒకచోట చనిపోయి మరొకచోటికి చేరవలసియున్నది. ఒక శరీరమును వదలిన తర్వాత వేరొక

శరీరమును చేరుచున్నాడు. దేవుడు జీవునివలె ఒకచోట ఉన్నవాడు కాక అంతట వ్యాపించినవాడు. కనుక ఆయన

శరీరమునుండే చైతన్యముగ బయటికి రాగలడు. స్త్రీ భగమునుండి బయటికి వచ్చినవాడు కనుక భగవంతుడని

ఆయనను మనము అనవచ్చును. ఎవరికీ లేని జన్మ విధానము ఒక్క దేవునికి మాత్రమే కలదు. అందువలన ఆయన

శరీరము ధరించినపుడు భగవంతుడైనాడు. విశాలముగ వ్యాపించి ఆకారములేని దేవుడు తాను అంతట ఉంటూనే,


తన అంశను ఒక శరీరములో ప్రవేశింపజేసి పుట్టించడము దేవుని జన్మగా లెక్కించవలెను. దేవుని అంశ జన్మించినపుడు

భగవంతునిగ ఉంటూ, దేవునిగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. దేవుడు నిరాకారుడు, సర్వవ్యాపి, అదే దేవుడు

శరీరము ధరించి సాకారుడు, భగవంతుడౌచున్నాడు. ఈ విధమైన దేవుని జన్మయే “ఏసుప్రభువు" జన్మ, దేవుడు

అంతట ఉండి తానే ఒక మనిషిగ వచ్చినవాడే ప్రభువు.


దేవుడు మనిషిగ వచ్చినపుడు అంతట వ్యాపించిన దేవున్ని గురించి చెప్పుటయే ఆయన కర్తవ్యము. తాను

దేవుడైయుండియూ, విశాలమైన దేవున్ని అనగా విశాలమైన తనను గూర్చి తానే చెప్పుచుండును. దేవుని విషయము

దేవుడే చెప్పవలెను, కానీ మానవులెవరు చెప్పలేరు. మానవుడు ఎంత జ్ఞానియైనప్పటికీ దేవుని విషయము పూర్తి

తెలిసినవాడు కాడు. భగవంతుడైన దేవుడు చెప్పితే తప్ప మానవునికి దేవుని విషయములు తెలియవు. దేవుడు చెప్పిన

విషయములనే మానవుడు వేరొకరికి చెప్పినా, అవి అసంపూర్ణములే గానీ సంపూర్ణములై ఉండవు. అందువలన

మానవుడు దేవుని విషయములను బోధించు బోధకుడు కావచ్చును, కానీ గురువు కాలేడు. ప్రపంచములో భగవంతుడు

మాత్రము దేవుని విషయములను తెలియజేయు గురువు అగును. ఈ సూత్రము ప్రకారము దేవుని జన్మయిన భగవంతుడు

మాత్రమే జగతిలో గురువగును. ప్రభువైన భగవంతుడు లేక భగవంతుడైన ప్రభువు తన నిరాకారమును గూర్చి

చెప్పడములో తండ్రియైన దేవుడొకడున్నాడని చెప్పాడు. శరీరము లేక అంతటా వ్యాపించిన దేవుడు, శరీరముతో ఉన్న

తాను ఇద్దరము ఒకటే అన్నట్లు 'నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే' అన్నాడు. అంతేకాక 'నా మాట నా

తండ్రిమాట ఒక్కటే' అన్నాడు. కొన్ని సందర్భములలో దేవుడు, భగవంతుడు ఇద్దరు ఒకటేనను భావయుక్తమైన మాటలు

కనిపించినా ఆయనను గుర్తించలేనట్లు, పైన మాయ అందరిని మభ్యపెట్టుచున్నది. దేవునికి వ్యతిరిక్త దిశలో నడచు

మాయ, మానవులయందుండి ఎదురుగనున్న భగవంతున్నిగానీ, నిరాకారముగ అంతట వ్యాపించియున్న దేవున్నిగానీ

తెలియకుండ చేయుచున్నది. దేవున్ని గురించి స్వయముగ భగవంతుడు చెప్పిన మాటలను మనుషులకు అర్థముకాకుండ

అపార్థమగునట్లు చేసి, భగవంతుని విలువనుగానీ, దేవుని ఔన్నత్యమునుగానీ గుర్తించలేనట్లు చేయుచున్నది. భూమిమీదకు

వచ్చిన భగవంతుడు సాధారణ మనిషివలె ఉండుట వలన, అతనిని మనుషులకు తప్పుగ అర్థమగునట్లు చేసి, అవమానము

చేయునట్లు మనుషులను ప్రేరేపించుచున్నది. దేవుని దివ్యమైన జన్మను తెలియలేని మనుషులు నరశరీరము ధరించిన

దేవున్ని చూచి, సర్వ జీవరాసులకు దేవుడైనవాడని తెలియక, నాశనములేనివాడని తెలియ లేక మూఢులై భగవంతున్ని

అవమానము పాలు చేయుచున్నారు. ఇదే విషయమును భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగము 11వ శ్లోకమున

ఇట్లు చెప్పారు.


అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।

పరం భావ మజానన్తో మమ భూత మహేశ్వరమ్ ॥


సర్వమునకు సృష్టికర్త అయిన దేవుడు ఒక్కమారు తన ధర్మములను భూమిమీద సంపూర్ణముగా బోధించుటకు

మూడుమార్లు మనిషిగా జన్మించ వలసిన అవసరమున్నది. మూడు ప్రదేశములలో, మూడు ఆకారములలో, మూడు

పేర్లతో దేవుడు వచ్చి చెప్పినపుడు, దేవునికి ఒక సంపూర్ణ అవతారమగును. అణగారిపోయిన ధర్మములను తిరిగి

నెలకొల్పుటకు దేవుడు మూడుమార్లు అవతరిస్తే ఒక్కమారు ధర్మములను రక్షించినట్లుగును. అందువలన దేవుని

మూడు అవతారములను ఒక్క అవతారముగా లెక్కించుకోవలెను. మూడు మార్లు మనిషిగా దేవుడు జన్మించితేనే

ఆయన ధర్మములన్నీ పూర్తిగా బయటికి తెలియగలవు. దేవుడు భూమిమీద మూడు ఆత్మలుగా ఉన్నాడు. సకల


జీవులలోను జీవాత్మగా, ఆత్మగా, పరమాత్మగా ఉన్న దేవుడు, తాను మూడు ఆత్మలుగా అందరిలోను ఉన్నానని తెలుపు

నిమిత్తము ధర్మ సంస్థాపన కొరకు మూడు జన్మలను తీసుకొంటున్నాడు. దేవుడు మూడు ఆత్మలుగా ఉన్నాడనుట

ముఖ్యమైన ధర్మము. కావున క్షర, అక్షర, పురుషోత్తములకు గుర్తుగా దేవుడు ధర్మసంస్థాపనలో మూడుమార్లు

అవతరిస్తున్నాడు. దేవుడు మూడుమార్లు పుట్టితే ఒక్కమారు ధర్మసంస్థాపన పూర్తియగును. గతములో ఎన్నిమార్లు

ధర్మసంస్థాపన జరిగిందో మాకు తెలియదు. కానీ ప్రస్తుతము ధర్మసంస్థాపన జరుగుచున్నదని మాత్రము మాకు

తెలియును. ధర్మసంస్థాపన కార్యములో దేవుడు ఇప్పటికి రెండుమార్లు అవతరించాడని కూడా తెలియును. "శ్రీకృష్ణుడు

దేవుడా? భగవంతుడా?” అను గ్రంథములో కృష్ణుడు దేవుని అవతారమేనని గట్టిగా చెప్పాము. ధర్మసంస్థాపనలో

కృష్ణుని అవతారము ఒకటవది కాగా, ఆయన రెండవ అవతారములో ఏసుగా వచ్చాడని కూడా ఆధారములతో చెప్పాము.

ధర్మసంస్థాపన కొరకు దేవుడు ఇప్పటికి రెండు జన్మలు తీసుకోగా, మూడవ జన్మ ఇంతలో రాబోతుంది అనుకుంటాము.

దేవుడు మూడుమార్లు వేరు వేరు ప్రాంతములలో, వేరువేరు ఆకారములతో, వేరు వేరు పేర్లతో, పుట్టవలసివుండగా,

ఇప్పటికే రెండుమార్లు పుట్టి తన ధర్మములను తెలియ జేయడము జరిగినది. మొదటి జన్మకు రెండవ జన్మకు

మూడువేల సంవత్సరముల కాలము పట్టినది. రెండవ జన్మకు మూడవ జన్మకు ఎంత కాలము పట్టునో ఎవరికీ

తెలియదు. రెండవ జన్మ తర్వాత ఇప్పటికి రెండు వేల సంవత్సరములు గడచినది. ఇంకా ఎంతకాలమునకు మూడవ

జన్మ వస్తుందో తెలియదు. ఆయా జన్మలలో వారు చెప్పిన జ్ఞానముబట్టి భూమిమీద మానవులు కొందరు దేవుని

జన్మను గుర్తించవచ్చును. ఐదువేల సంవత్సరముల పూర్వము వచ్చిన భగవంతునికి (కృష్ణునికి) కొందరు భక్తులుకాగ,

రెండు వేల సంవత్సరముల పూర్వము వచ్చిన ప్రభువుకు (ఏసుకు) కొందరు భక్తులైనారు. ఐదువేల సంవత్సరముల

పూర్వము వచ్చిన దేవుని (భగవంతుని) యొక్క ఆకారమూ, పేరూ వేరుకాగ, రెండు వేల సంవత్సరముల పూర్వము

వచ్చిన ప్రభువు యొక్క ఆకారమూ, పేరూ వేరుగ ఉన్నవి. రెండు జన్మలలోని జీవితములు ఒకదానితో ఒకటి సంబంధము

లేకుండ విభిన్నముగ ఉన్నవి. అందువలన మొదట వచ్చిన భగవంతున్ని విశ్వసించిన వారు రెండవమారు వచ్చిన

ప్రభువును విశ్వసించడము లేదు. అట్లే రెండవమారు వచ్చిన ప్రభువును విశ్వసించిన వారు మొదట వచ్చిన భగవంతున్ని

విశ్వసించడము లేదు. మొదట భగవంతుని ఆకారమైన కృష్ణున్ని చూస్తునే అసూయపడు క్రైస్తవులు కలరు. అదే

విధముగనే రెండవ మారు వచ్చిన ప్రభువు యొక్క చిత్రపటమును చూస్తునే ఆయన మీద అసూయపడు హిందువులు

కూడ కలరు. మొదటి భగవంతున్ని బట్టి మా మతమువేరని కొందరు, రెండవ ప్రభువునుబట్టి మా మతమువేరను

వారు కొందరు గలరు. ఒకే దేవుడు వేరు వేరు కాలములలో, వేరు వేరు ప్రదేశములందు, వేరు వేరు ఆకారములతో,

వేరు వేరు జీవనశైలిలో పుట్టుట వలన మానవుల దృష్ఠిలో అన్నిటియందు వేరువేరై, పోలికలులేని ఆ ఇద్దరు చెప్పినది

ఒకే జ్ఞానమని తెలియలేక పోయారు. ఆ ఇద్దరు ఒక్కరేనని తెలియని మనుషులు మా భగవంతుడు గొప్పంటే, మా

ప్రభువు గొప్పని వారివారి విశ్వాసమును అడ్డము పెట్టుకొని పోట్లాడుకొనుచున్నారు. భగవంతున్ని ప్రభు భక్తులు

దూషించితే, ప్రభువును భగవంతుని భక్తులు దూషించుచున్నారు. ప్రభువును దూషించు భగవంతుని భక్తులు నిజముగ

భగవంతున్నే దూషిస్తున్నామని అనుకోవడము లేదు. అలాగే భగవంతున్ని దూషించు ప్రభు భక్తులు నిజముగ ప్రభువునే

దూషిస్తున్నామని అనుకోవడము లేదు. దీనికంతటికి కారణము దేవుని జ్ఞానమును గురించి పూర్తి తెలియక పోవడమేనని

అర్థమగుచున్నది. దేవుడు నిరాకారమై, సర్వవ్యాపియైయుండి భూమిమీద అధర్మములు పెరిగి పోయినపుడు తన

ధర్మములు నెలకొల్పు నిమిత్తము అవతరించివచ్చును. అది ఎప్పుడైనా ఎక్కడైనా జరుగవచ్చును. అలా వచ్చిన వాడు

తన ధర్మములను తాను చెప్పిపోవును. పుట్టిన దేశమునుబట్టి, పుట్టిన కాలమును బట్టి భగవంతుడు తన ప్రవర్తనను


నిర్ణయించుకొనివచ్చును. అట్లు వచ్చినవాడు మాట్లాడు భాష వేరు కావచ్చును, కానీ చెప్పెడి జ్ఞానమొకటే ఉండును.

అలాగే జన్మ జన్మకు ఎన్నో భేదములుండినప్పటికీ, ఆయన వచ్చిన ఉద్దేశములో భేదముండదు. అలాంటి దేవుని యొక్క

పై ఆకారమును చూచి ఆయన ఫలానా అని మనిషి నిర్ణయించ లేడు, ఏమాత్రము గుర్తించ లేడు.


విశ్వమునకంత ఆదికర్తయైన దేవుడు, మనుషుల నిమిత్తము మనిషిగా భూమిమీదకు ఎన్నోమార్లు వచ్చిపోయాడు.

అంతేకాక మళ్ళీమళ్ళీ వస్తానని కూడ చెప్పి పోయాడు. దీనినిబట్టి ధర్మసంస్థాపనార్థము ఆయన ఎన్ని మార్లయినా

రావచ్చునని తెలియుచున్నది. అలాంటపుడు ఒక భగవంతున్నే దేవుడని నమ్మి, ప్రభువును దేవుడు కాదనవచ్చునా!

అలాగే ప్రభువునే దేవుడని చెప్పి, భగవంతున్ని దేవుడు కాదని చెప్పవచ్చునా! అట్లు చెప్పుటకు నిర్దిష్టమైన ఆధారములేదు.

దేవుని జ్ఞానము సంపూర్ణముగ తెలియనపుడు దేవుని జన్మలను గుర్తించలేకపోయి, బాహ్యసంబంధమైన ఆచారమును,

మతములను అడ్డము పెట్టుకొని, నాది ఫలానా మతమనీ, నా దేవుడు ఫలానావాడనీ చెప్పుకొంటున్నాము. సర్వ

ప్రపంచమునకు సర్వ జగతికి ఉన్నది ఒకే దేవుడే, ఆ దేవుడే ఇస్లామ్, ఇందూ, క్రైస్తవ మతములందు ప్రకటించబడి

ఉన్నాడు. ఎన్ని మతములలో చెప్పబడినా, అన్ని మతములకు అతీతముగ ఉన్నవాడు దేవుడు. మతములు దేవున్ని

తెలుపుదారులే, కానీ మతము దేవుడు కాదు. మతము మనిషి పుట్టుకతో రాలేదు. మనిషి కొంత పెరిగిన తర్వాత నేను

ఫలానా మతస్థుడనని అనుకొనుచున్నాడు. మనిషి పుట్టిన కుటుంబమునుబట్టి కొంత వయస్సు వచ్చిన తర్వాత తెలియబడిన

మతమే తనదని నమ్మి, తన మతములో చెప్పబడిన వాడే దేవుడనీ, ఇతర మతములు సరియైనవి కాదనీ, తన మతమే

సరియైనదని చెప్పుకొనుచున్నాడు. విశ్వమునకంతటికి పెద్ద అయిన దేవున్ని ఒక మతమువాడు ఒక విధముగ,

మరియొక మతమువాడు మరియొక విధముగ ఎట్లు అనుకొంటున్నారో చిన్న కథను ఉదాహరణగా చూస్తాము.


ఒక ఊరిలో కవల పిల్లలైన అనాధ బాలలుండేవారు. తాము కవలలమను విషయము కూడ వారికి తెలియదు.

వారు కొంత పెరిగి పెద్దయిన తర్వాత మా తండ్రి, తల్లి ఎవరను ప్రశ్న వారి ఊహకు వచ్చినది. ఆ ప్రశ్నకు జవాబును

తెలుసుకోవాలనీ, తమ తల్లి తండ్రులు ఫలానావారనీ ఇతరులకు చెప్పాలను ఆకాంక్ష వారిలో పెరిగినది. ఎవరు తమ

మాతా పితరుల ఆచూకి చెప్పెదరని వెదకసాగారు. ఈ విధమైన వారి అన్వేషణలో పెద్ద వానికి ఒక వృద్ధుడు కనిపించి,

నీ తల్లి తండ్రి యొక్క వివరము నాకు మాత్రము తెలుసునన్నాడు. ఆ మాటవిన్న వెంటనే ఆ వృద్ధున్ని ఆశ్రయించి తన

తల్లి తండ్రి వివరము తెలుపమన్నాడు. దానికి ఆ వృద్ధుడు నేను చెప్పినట్లు నడుచుకొంటే నీకు ఆ విషయమును

చెప్పెదనన్నాడు. దానికి అలాగే వింటానని ఆ బాలుడు ఒప్పుకొన్నాడు. కష్టపడితేగానీ తెలుసుకొనే విషయమునకు

విలువుండునని తలచిన వృద్ధుడు, తనకు ఇష్ట మొచ్చిన నియములను కొన్నిటిని చెప్పి, వీటి ప్రకారము నడుచుకొన్నపుడే

నీకు నీ తల్లి తండ్రి విషయము తెలిపెదనన్నాడు. వానికి ఎంత శ్రద్దవున్నదో నని తెలియుటకు ఆ వృద్ధుడు కొన్ని

నియమములనుంచాడు. గుండు గొరిగించుకో, పిలక పెట్టుకో అన్నాడు, ముఖాన బొట్టు పెట్టుకోమన్నాడు. క్రింది

వరకు పంచకట్టుకోమన్నాడు. ఏదో ఒక మంత్రము చెప్పి దానిని ఉచ్చరించమన్నాడు. ఇలా ఎన్నో నియములను

తనకిష్టమొచ్చినట్లు చెప్పాడు. వాస్తవముగ వాని తల్లి తండ్రులకు, ఆ నియమములకు ఏ సంబంధమూ లేదు. వానిలోని

శ్రద్ధను తెలియుటకు ఆ విధముగ చెప్పాడు. ఈ విధముగ నా మాట ప్రకారము ఆచరిస్తువుంటే, నీవు నా మాటవిన్నావని

నాకు నమ్మకము కల్గినపుడు నీకు నీ తండ్రిని తెలియజేస్తానన్నాడు. ఆ ముసలి వాడు చెప్పినట్లే ఆ బాలుడు శ్రద్ధగ

నడుచుకొనుచుండెను.


ఈ విషయమంతా తెలుసుకొన్న రెండవవాడు తానుకూడ తన తల్లి తండ్రులను తెలుసుకోవాలనుకొన్నాడు.

కావున అతను కూడ ఆ వృద్ధున్ని సమీపించి తనకు కూడ తనయొక్క మాతాపితరులను తెలుసు కోవాలని ఉందని,

తప్పనిసరిగ తల్లి తండ్రులను గూర్చి తెలుపనికోరాడు. అప్పుడు ఆ ముసలివాడు మొదటివానికి చెప్పినట్లే తను చెప్పు

నియమముల ప్రకారము నడుచుకొంటే తప్పనిసరిగ తెలిపెదనన్నాడు. మొదటి వానికి తనకిష్టమొచ్చిన నియమములు

చెప్పిన వృద్ధుడు, రెండవవానికి కూడ అప్పుడు తన మనస్సుకు తోచిన నియమములను చెప్పాడు. మొదటి వానికి

చెప్పిన నియమములకు, రెండవవానికి చెప్పిన నియమములకు చాలా తేడా ఉండెను. నా మాట వింటారా లేదా అని

వారిన తన మాటవినునట్లు చేసుకొనుటకు, వారికి వారి తల్లి తండ్రుల మీద శ్రద్ధను పెంచుటకు నియమములను

పాటించవలెనన్నాడు. కానీ వాటికీ తల్లి తండ్రులకు ఏమాత్రము సంబంధము లేదు. చెప్పబడిన నియమములన్ని

ముసలి వానికి సంబంధించినవేనని తెలియాలి. ఆ ఇద్దరు కవల పిల్లలకు తండ్రి ఒక్కడే అయినప్పటికీ, వారు

ఆచరించవలసిన నియమములు వేరువేరుగ ఉన్నవి. మొదటి వానికి గుండు గొరిగించుకొని పిలక పెట్టుకోమని చెప్పితే,

రెండవానికి పిలకే ఉండకూడదన్నాడు. మొదటి వానికి ముఖాన బొట్టు పెట్టుకోమంటే, రెండవ వానికి ముఖము మీద

ఏ గుర్తూ (బొట్టు) ఉండకూడదన్నాడు. మొదటివానికి తూర్పుకు తిరిగి మ్రొక్కమని చెప్పితే రెండవ వానికి పడమటికి

తిరిగి మ్రొక్కమన్నాడు. ఇలా చెప్పబడిన నియమములన్ని మొదటివానికీ రెండవవానికీ ఎంతో తేడా కల్గియుండెను.

వారిరువురు వృద్ధుడు చెప్పిన మాట ప్రకారము ఎవరి నియమములను వారు శ్రద్దగ ఆచరించుచుండిరి.


వారి శ్రద్దను గమనించిన వృద్ధుడు వారి తల్లి తండ్రులను గురించి తెలియజేయాలనుకొన్నాడు. ఒకరోజు

సాయంకాలము మొదటివానిని పిలిచి, నీ తండ్రిని చూపెదనని ఒక ప్రదేశమునకు తీసుకపోయి, నిజముగా వాని

తండ్రిని చూపించాడు. కవల పిల్లలలో మొదటివాడు తన తండ్రిని ఎదురుగ చూచాడు. తండ్రిని ముందువైపు నుండి

చూచిన దానివలన వానికి తండ్రి ముఖములోని భాగములన్ని కనిపించాయి. తండ్రి ముఖములోని కన్నులు, ముక్కు

అన్నియు అందముగ కనిపించాయి. తండ్రిని చూచిన అతనికి తండ్రి పేరు తెలియదు. తండ్రి పేరు తాను అడిగినా

ఆ ముసలి వాడు చెప్పలేదు. తనకు తెలిసిన గుర్తులనుబట్టి తండ్రికి ఒక గుర్తింపు పేరు పెట్టుకొన్నాడు. తండ్రి

ముఖములో ముక్కు అందముగ ఉండుట వలన తన తండ్రిని "ముక్కోడు" అని అనుకొన్నాడు. అ విషయమునే నా

తండ్రి మక్కోడని ప్రచారము చేసుకొన్నాడు. కొంతకాలమునకు రెండవ వానికి కూడ తండ్రిని చూపాలనుకొన్న వృద్ధుడు,

రెండవ వానిని ఒక దినము ఉదయమే పిలుచుకొని పోయి, ఒక ప్రదేశములో వాని తండ్రిని చూపించాడు. మొదటి

వానికి ముందువైపునుంచి చూపిన వృద్ధుడు, రెండవ వానికి వెనుకవైపు నుండి చూపాడు. తండ్రిని వెనుక నుండి

చూచిన రెండవ వానికి తండ్రి వెనుక భాగము మాత్రము కనిపించినది. తల వెనుక అందమైన పొడుగాటి జుట్టు

కనిపించింది. రెండవవాడు దానినే బాగా గుర్తు పెట్టుకొన్నాడు. తాను చూచిన దానినిబట్టి తన తండ్రిని “జుట్టోడు”

అని గుర్తించుకొన్నాడు. మొదటివాడు, రెండవవాడు ఇద్దరూ కవల పిల్లలైన దానివలన ఇద్దరికీ తండ్రి ఒక్కడే.

ఒక్కనినే వృద్ధుడు ఇద్దరికి చూపించాడు. కానీ చూపించినది ఒక్క తండ్రినే అయినా, చూపించిన సమయములువేరు,

దిశలు వేరు.


చూచినది ఒక్కనినే అయినా, ఆ ఒక్కనికి రెండు పేర్లొచ్చాయి. మొదటి వాడు తన తండ్రిని ముక్కోడు అనియూ,

రెండవ వాడు తన తండ్రిని జుట్టోడు అనియూ చెప్పుకొనుచుండిరి. ఒకరోజు ఆ ఇద్దరు ఒకరి నొకరు కలిసినపుడు,


మొదటి వాడు నేను తండ్రిని చూచాను అన్నాడట. వెంటనే రెండవవాడు నేను కూడ చూచానన్నాడట. ఎట్లున్నాడని

మొదటి వాడడిగాడు. అపుడు రెండవ వాడు చూచిన ప్రకారము అందమైన జుట్టున్న జుట్టోడు నా తండ్రి అని చెప్పాడు.

మొదటి వాడు నా తండ్రి అందమైన ముక్కున్న ముక్కోడు అన్నాడట. ఈ విధముగ వారు ఒకరి తండ్రి జుట్టోడనీ,

మరియొకరి తండ్రి ముక్కోడని చెప్పుకొన్నారు. కాని చూచినది ఒక్కనినేననీ, ఇద్దరికి ఒకే తండ్రి అనీ వారికి తెలియకుండ

పోయినది. అంతటితో వారు ఊరుకుండక మొదటివాడు రెండవవానిని చూచి, నీ తండ్రి జుట్టోని కంటే నా తండ్రి

ముక్కోడు గొప్పవాడు అన్నాడట. వెంటనే రెండవవాడు స్పందించి నీ నాయన ముక్కోనికంటే నా నాయన జుట్టోడే

గొప్పవాడు అని గట్టిగ చెప్పాడు. ఈ విధముగ మా నాన్న గొప్ప, మా నాన్న గొప్ప అని వాదమునకు కూడ దిగినారు.

ఈ వాదన ముదురుచు పోయి చివరకు ఒకరునొకరు కొట్టుకొనువరకు పోయినది. అంతటితో ఆగక ఒకరినొకరు

చంపుకొను వరకు పోయింది. ఈ విషమపరిణామమును గ్రహించిన వృద్ధుడు ఇద్దరిని కలిపి మీ ఇద్దరికీ తండ్రి ఒక్కడే

అని, ఒకరు ముందునుంచి, ఒకరు వెనుక నుంచి చూచిన దానివలన కనపడిన రూపమును బట్టి మీరలా వాదించుచున్నారని

చెప్పినప్పటికీ వారు వినలేదు.


వృద్ధుడు అ యిరువురికి పోట్లాట పెట్టవలెనను ఉద్దేశముతో ఒకరికి ముందునుంచి ఒకరికి వెనుకనుంచి

చూపలేదు. ఆ రోజు వారికలా చూపడమునకు కారణము గలదు. వారి తండ్రి చాలాకాలమునుండి ఒక మర్రి

చెట్టుతొర్రలో కూర్చొని తపస్సు చేసుకొనుచు బయటి ధ్యాసలేకుండ ఉండెను. చెట్టు తొర్రలో కూర్చున్న అతను ఆరు

నెలలు ముఖము బయటి వైపుకు పెట్టి, మరొక ఆరు నెలలు ముఖము లోపలివైపుకు పెట్టి కూర్చొను చుండెను. మొదటి

వానిని పిలుచుకొని పోయినపుడు తొర్రలోనున్న వాని తండ్రి ముఖమును బయటికి పెట్టి కూర్చొని ఉండుట వలన

వానికి ముఖమే కనిపించినది. మొదటి వాడు దానినే అసలు రూపమనుకొన్నాడు. తర్వాత కొంత కాలమునకు రెండవ

వానిని పిలుచుకొని పోయినపుడు వాని తండ్రి లోపలి వైపుకు తిరిగి కూర్చొని ఉండెను. కనుక రెండవ వానికి

తెలిసినది తల జుట్టు మాత్రమే, అదే నిజమైన రూపమని వాడనుకొన్నాడు. ఇద్దరూ తండ్రియొక్క పూర్తి రూపమును

చూడలేదు. ఇద్దరూ ఒకనినే కొంత చూచినవారైనప్పటికి మేమంతా చూచినామని, మేమంతా తెలిసినామను కొనుట

వలన భేదాభిప్రాయములు వచ్చినవి. నిజానికి ఎవరికీ తమ తండ్రియొక్క సంపూర్ణ ఆకారము తెలియదు. ఓపికతో

సంవత్సరమాగి రెండు వైపుల తిరిగి కూర్చొన్నపుడు చూచి ఉంటే ఇద్దరి సంశయములు తీరిపోయేవి. అలాకాక కొంత

కాలము ఆగి నిజా నిజాలు తెలుసుకోక, తెలిసిన కొద్ది దానినే అంతా తెలిసినట్లు భ్రమించితే జరిగేవి అనర్థములే.


ఈ కాలములో ఒకే సృష్ఠిలో ఒకేమారు పుట్టిన కవల పిల్లలవంటి మానవులు భూమిమీద గలరు. అన్ని జీవ

రాసులకు తండ్రి పరమాత్మయని వృద్ధునిలాంటి మతములు బోధిస్తున్నవి. మతము ఒక దేవున్నే చూపిస్తునప్పటికీ

(బోధిస్తున్నప్పటికీ) బోధించిన కాలమును బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగ దేవుడు అర్థమైనాడు. అర్థమైన దానినిబట్టి

మా దేవుడే గొప్ప అని అనుకోవడము జరుగుచున్నది. మనము తెలుసుకొన్న దానిలో లోపమేమైన ఉన్నదేమో అని

ఎవరూ అనుకోవడము లేదు. దేవున్ని ఒక మతమువైపునుండి చూస్తే ఈ విధముగ అర్థమైనాడు, మరియొక మతమువైపు

నుండి చూచినపుడు ఏ విధముగ అర్థమౌతాడో అని యోచించడము లేదు. అన్ని మతముల గమ్యము, అన్ని మతములు

చూపునది ఒక్క దేవున్నే అను విషయము తెలియడము లేదు. అలా తెలియని వారు తమ మతమువైపు నుండి తమకు

తెలిసిన పద్ధతి ప్రకారము, దేవుని మీద తమ విశ్వాసమును గొప్పగయుంచి, దేవున్ని గొప్పగ పొగడుచున్నారు. తనది

కాని ఇతర మతము మీద ద్వేషము కల్గినవారై, ఆ మతము తెల్పు దేవుని మీద విశ్వాసము లేనివారై, ఆ మత దేవున్ని


గొప్పగ ద్వేషించుచున్నారు. ఈ విధముగ అన్ని మతములకు దేవుడైన వానినీ నీవు ఆరాధించే నీ దేవున్నీ, ముందువైపు

పొగడుచున్నావు వెనుకవైపు నుండి తిడుచున్నావు. ఇదెట్లున్నదంటే దేవుని ఒక ప్రక్క రూపము మాత్రము తెలిసి

ప్రక్క శ్రీగంధము పూయుచున్నావు, మరొక ప్రక్క రూపము చూచి అసూయపడి పేడ పూయుచున్నావు. ఒకే దేవున్నే

నీవు ఆరాధిస్తున్నావు మరియు నీవే దూషిస్తున్నావు.


ఒకవేళ సంపూర్ణ జ్ఞానము తెలిసి, కథలో పొరపడినట్లు పొరపడక, ముక్కోడు జుట్టోడు వేరువేరనుకోక, ఇద్దరు

ఒకటేనని తెలిసి, ఐదువేల సంవత్సరముల ముందు తెలియబడిన కృష్ణుడూ, రెండువేల సంవత్సరముల ముందు తెలియబడిన

ప్రభువూ ఇద్దరు ఒకటేనని ఎవరైనా చెప్పినప్పటికీ, వినని పరిస్థితి ఉండడమేకాక చెప్పిన వానిని రెండు వర్గముల వారు,

రెండు మతముల వారు విమర్శించి రెండువైపులనుంచి ఇబ్బందులు కలుగజేతురు. ఉదాహరణకు మా బోధలున్న

గ్రంథములలో ఎక్కడైన ప్రభువు చెప్పిన బోధకాని, ప్రభువు బొమ్మగాని చూచిన హిందువులు ఇది మాకు సరిపోదు, ఇది

మా మతమునకు సంబంధించినది కాదని చెప్పడమే కాక, మమ్ములను అనేక రకముల ఇబ్బందుల పాలు చేశారని

చెప్పక తప్పదు. ఒక దశలో మాకు విలువ ఇవ్వని హిందూమతములో ఉండే దానికంటే ఎంతో క్రమశిక్షణ కల్గిన

ఇస్లాం మతములోనికి పోవలెనన్న ఆలోచన కూడ కల్గినది. ఇక క్రైస్తవమతములోని వారు మా బోధలలో కృష్ణుడని

పేరు వచ్చిన గ్రంథములలో శ్రీకృష్ణుని బొమ్మ ఉండినా ఇది మాకు సరిపోదు. మా ప్రభువు చెప్పిన దానిని, ప్రభువును

తప్ప ఇతరులు చెప్పిన దానిని వినము అంటున్నారు. భగవంతుడు (కృష్ణుడు) ప్రభువు ఇద్దరు ఒకటే అని మేము

తెలిపితే, ఎంత తిక్కవాడన్నట్లు దీనాతిదీనముగ చూచు క్రైస్తవులు, ఎంత అజ్ఞాని అని దూషించు హిందువులు గలరు.

అంతటితో ఊరకుండక మమ్ములను చెడబెట్టుటకు ఈయన వచ్చాడంటున్నారు. ఎవరేమనిన ఎవరి ద్వార ఏ

ఇబ్బందులెదురైన మాకు తెలిసిన సత్యము అందరికి దేవుడొక్కడే, ఆయన ఏ రూపముతో, ఏ పేరుతో భూమిమీదకు

వచ్చినా ఆయన బోధ ఒక్కటేనని చెప్పుచున్నాము. వినగలిగితే దేవుని వాస్తవికత తెల్పుటకు హిందు, ఇస్లామ్, క్రైస్తవులు

దేవుని విషయములో ఏ సంశయమును అడిగినా విశదముగ జవాబివ్వగలము. అయినా మతములను అడ్డము

పెట్టుకొని ద్వేషించువారే గానీ, అడిగి వివరము తెలుసుకొందామనుకొను వారు ఎవరుగానీ కనబడుటలేదు. "సిలువ

దేవుడా?” అను పేరుగల ఈ గ్రంథమును ప్రభువు యొక్క గొప్పతనమును తెలియునట్లు వ్రాయడమే కానీ మరియే ఉ

ద్దేశము కాదు. ప్రభువును గురించి వ్రాశాడని హిందువులు, వ్రాసినవాడు హిందువని క్రైస్తవులు నా మీద అసూయపడక

వాస్తవ జ్ఞానమును తెలుసుకోవలెనని కోరుచున్నాము. మీకు తెలుసునో తెలియదో నేను అన్ని మతములకు సంబంధించిన

ఇందువును (హిందువును). ఇందూ మతములోనివే అన్ని మతములు, కావున నేను అన్ని మతములకు సంబంధించిన

వానిని.


పరమాత్మ, పరలోకతండ్రి, జగన్నాథుడు, పురుషోత్తముడు అయిన దేవుడు తన విషయమును తెల్పుటకు

భూమిమీదకు వచ్చిన అవతారములు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కానీ తెలిసినవి రెండేనని ముందే చెప్పుకొన్నాము.

ద్వాపరయుగ అంత్యములో శ్రీకృష్ణునిగ జన్మించిన దేవుడు కలియుగ ప్రథమములో ఏసుగ జన్మించాడు. కృష్ణుని జీవిత

ప్రవర్తన ఏసు జీవిత ప్రవర్తనకు ఎంతో విభిన్నముగ ఉండును. కృష్ణుని జీవితములో అసత్యములు, అన్యాయములు,

అక్రమసంబంధములు, బహుభార్యా లోలత్వము, ఎందరినో హత్య చేయించడము మొదలగునవెన్నో చోటు చేసుకొన్నాయి.

అయినప్పటికీ ఆయన భగవంతుడే. తర్వాత వచ్చిన ఏసు జీవితము జరిగినది ఎంతో సౌమ్యముతో. ఆయన జీవితములో

ఏ అక్రమాలు, అన్యాయములు లేవు. సంఘపరముగ ఎంతో మంచి ప్రవర్తన కల్గి ఇతరుల బాధలను సహితము


లేకుండ చేసి చివరకు మనుషుల చేతిలో నిర్భలుడై దీనాతిదీనముగ హింసింపబడిన ఏసు కూడ భగవంతుడే. మనుషుల

చేతికి చిక్కక మనుషులనే హింసించిన కృష్ణుడూ, మనుషుల చేతికి చిక్కి హింసింపబడిన ఏసు ఇద్దరూ భగవంతులే

అంటే చాలా విచిత్రముగనే ఉండును. కానీ ఇద్దరూ ఒకే దేవుని అవతారమే అన్న మా మాట నూటికి నూరుపాళ్ళు

సత్యము.


ఇక్కడ కొందరికొక ప్రశ్నరావచ్చును. అది ఏమనగా! క్రైస్తవులు విగ్రహారాధన చేయరు. మొదటినుంచియున్న

హిందువులు విగ్రహారాధన చేస్తున్నారు. ప్రభువే దేవుడని ప్రభువునొక్కనినే నమ్మి ఆరాధించు వారు క్రైస్తవులుకాగ,

అనేక దేవుళ్ళను ఆరాధించువారు హిందువులు. అటు వంటపుడు ఇద్దరి దేవుడు ఒక్కడేనని ఒకే తాటికి, ఒకే గాటికి

ఇద్దరిని కట్టివేయడము సమంజసమేనా అని అడుగవచ్చును. దానికి మా జవాబేమనగా! క్రైస్తవ సమాజమునకు

మూలగ్రంథము, ముఖ్యమైన గ్రంథము పరిశుద్ధ బైబిలు. అలాగే హిందువులకు ముఖ్యమైన గ్రంథము భగవద్గీతని

కొందరంటున్నారు. మొదట సృష్ఠి ఆదిలో స్వయముగ దేవుని చేత మనుషుల కొరకు సూర్యునికి చెప్పబడినది భగవద్గీతలోని

జ్ఞానము. తర్వాత ద్వాపరయుగము చివరిలో అదే జ్ఞానము భగవంతుడైన కృష్ణుని చేత చెప్పబడినది. స్వయముగ

భగవంతుడు చెప్పిన విషయము భగవద్గీత. భగవద్గీతలో విగ్రహారాధన చేయమని ఎక్కడా చెప్పలేదు. విగ్రహారాధన

చేస్తే దేవునివద్దకు చేరరని కూడ చెప్పాడు. అజ్ఞానులు చేయు విగ్రహారాధన భగవద్గీతలో ఉందని అనుకొనుట కేవలము

అవివేకము. దేవుడు ఒక రూపము ధరించి కృష్ణునిగ వచ్చినపుడు ఏమి చెప్పాడో, అదే విధమును ఆయన తిరిగి

ప్రభువుగ వచ్చినపుడు తెలియజేశాడు. భగవంతుని బోధనే ప్రభువు బోధలనీ, ప్రభువు చెప్పినవే కృష్ణుడు కూడ

చెప్పాడనీ తెలియక పోవడము భూమిమీదకు వచ్చిన దేవున్ని గుర్తించలేకపోవడమే అగును. ఇక్కడ మరికొందరు

మరొక ప్రశ్న అడుగవచ్చును. మేము క్రైస్తవులము విగ్రహారాధన చేయము, కనుక ప్రభువు ఫోటోను కూడ చర్చిలో

ప్రార్థన వేదిక మీద ఉంచక కేవలము సిలువను మాత్రముంచుకొన్నాము. మీరు విగ్రహారాధన లేదంటూనే కృష్ణుని

ప్రతిరూపము పెట్టుకొని పూజిస్తున్నారు కదా! అని క్రైస్తవులు అడుగవచ్చును. దానికి మా జవాబేమనగా!

ప్రతిమకు, విగ్రహాకు చాలా తేడా గలదు. ప్రపంచమున దేవుడు మానవునిగా వచ్చిన రూపమును భగవంతుడు

అంటున్నాము. దేవుని ప్రతిరూపము భగవంతుడుకాగ, భగవంతుని ప్రతిరూపమును ప్రతిమ అంటున్నాము. దేవుని

ప్రతిరూపము కాకుండ ఇతర చిల్లర దేవతలెవరి రూపమునైన విగ్రహా అంటాము. దేవుని ప్రతిరూపమును విగ్రహా

అనకూడదు. శ్రీకృష్ణప్రతిమ భగవంతుని ప్రతిరూపమే కానీ చిల్లర దేవుళ్ళ విగ్రహము కాదు. అలాగే ఏసుప్రభువు

రూపము ఎక్కడుండినా, అది ప్రభువు ప్రతిరూపమే కాని వేరు కాదు. దేవుడు ప్రపంచమంతా వ్యాపించిన వాడు కనుక

ఆయన ఎప్పటికీ విగ్రహా కాడు. దేవుడు ప్రతిమ, దయ్యము విగ్రహా అను నానుడి కలదు. విగ్రహా అనగా రూపమును

గ్రహించునదని అర్థము కూడ కలదు. దేవుని ప్రతిమలో తప్ప మిగతా ఏ రూపములలో నైన విగ్రహా చేరగలదు.

సాధారణ జీవుడు గ్రహా అయితే క్షుద్రదేవతలన బడు జీవుడు విగ్రహా అనబడును. సర్వవ్యాపి అయిన దేవున్ని చిల్లర

దేవుళ్ళగ పోల్చకూడదు.


మేము ఏ ఇతర దేవుళ్ళను ఆరాధించక దేవదేవుడైన శ్రీ కృష్ణుని ప్రతిరూపమును ఆరాధిస్తున్నాము. మీరు

దేవుని రూపమైన ప్రభువు ఆకారమును కూడ ఉంచుకోక, శిలువను ముందర పెట్టుకోవడమేమిటని మేము ప్రశ్నిస్తున్నాము.

నన్ను చూచిన వాడు నా తండ్రిని (దేవున్ని) చూచినట్లేనని ఏసుప్రభువు అనిన మాటను గౌరవించక, ఆయన ఆకారమును

కూడ చూడకుండ సిలువ ఆకారమును చూడడమేమిటి అని ప్రశ్నిస్తున్నాను. చెప్పేది ప్రభువు పేరూ, వినేది ప్రభువు


జ్ఞానమూ, ఆరాధించేది చూచేది సిలువను. ఇదేమైన మంచి పద్ధతా అని అడుగుచున్నాము. నన్ను వదలి సిలువను

ఆరాధించమని దేవుడు ఎక్కడైన చెప్పాడా? అని నేను ప్రశ్నించుచున్నాను. ఈ విషయమై ఇంకా వివరముగ ఒక

విషయమును చూస్తాము. ఒకనికి అత్యంత ప్రీతికరమైన తండ్రి ఉన్నాడనుకొనుము. తాను శ్రమపడి కొడుకు సుఖము

కోరిన తండ్రిమీద, ఆ కొడుకుకు అమిత ప్రేమ భక్తి ఉందనుకొనుము. వాని తండ్రి వానికి ఎంత మంచివాడైనా

ఇతరుల దృష్ఠిలో చెడ్డవానిగ కనిపించాడు. శత్రువులు అతని తండ్రిని చంపాలని పథకము వేసుకొన్నారు. ఫలానా

ఆయుధముతో హత్య చేయాలనుకొన్నారు. గొడ్డలిని పదునుగ నూరిపెట్టుకొన్నారు. సమయము చూచి గొడ్డలితో

కాళ్ళు చేతులు నరికి పోయారు. ఆ సమయములో అడ్డుపోతే నన్ను కూడ చంపెదరని కొడుకు వారికి తెలియకుండ

ఉండిపోయాడు. అతని తండ్రిని చంపిన వారు అట్టహాసముగ పోతూ చంపే దానికి ఉపయోగించిన గొడ్డలిని అక్కడే

వదలి పోయారు. ఆ గొడ్డలిని కొడుకు తీసి పెట్టుకొన్నాడు. వాని నాన్న జ్ఞాపకార్థము గొడ్డలినే ఉంచుకొన్నాడు. వాడు

అనుభవించేది తండ్రి ఇచ్చిన ఆస్తినే అయినప్పటికీ, వాని తండ్రి ఫోటోను కూడ పెట్టుకోలేదు. సంవత్సరమునకొకమారు

పెద్దల పండుగ వచ్చినపుడు వారి నాన్నకు ఆరాధన చేయవలసియుండును. ఆ ఆరాధన దినమునందు తండ్రి పటమును

కూడ పెట్టుకోక, తమ ముందర గొడ్డలినుంచుకొని ఆరాధించాడు. ఆ దినము వాని తండ్రి మాటలనే గుర్తు చేసుకొన్నాడు,

కానీ తండ్రి జ్ఞాపకము కొరకు తండ్రిని చంపిన ఆయుధమును ఉంచుకొన్నాడు. ఎవరైన అడిగితే తండ్రి మీద అభిమానమును

తెలియజేస్తాడు, కానీ తండ్రి చివరిసారిగ దేనిచేత చనిపోయాడో దానినే ఆరాధిస్తున్నాడు.


ఈ విషయమును చూస్తే భక్తి తండ్రి మీద, ఆరాధన గొడ్డలి మీద ఉండడము మంచిదా అన్నది ప్రశ్న. నిజముగ

తండ్రిమీద భక్తిగలవాడు తండ్రిని చంపిన ఆయుధమును చూస్తునే దానిమీద కోపము కలగాలి. దానిని తన కంటపడకుండ

చేసుకోవాలి. ఎందుకనగా గొడ్డలిని చూచినపు డంతా తన తండ్రి చావు జ్ఞప్తికి వస్తుంది. చనిపోయినపుడు ఆయన

బాధపడిన దృశ్యము జ్ఞప్తికి వస్తుంది. అలా ఆయన చనిపోయిన దృశ్యమును చూచుట మంచిదా! లేక ఆయన

ఆనందముగ ఉన్న దృశ్యము జ్ఞాపకము వస్తే మంచిదా? మీరే ఆలోచించండి. తండ్రి జ్ఞాపకార్థము కంటికి కనిపించ

వలసిన దృశ్యము తండ్రియొక్క చిత్రపటము, కంటికి కనిపించకూడని దృశ్యము ఆయన మరణము. ఉదాహరణకు

మన ఇంటిలో తల్లితండ్రులు బ్రతికి ఉన్నపుడు తీయించిన ఫోటోలను గోడకు తగిలించుకొని చూచుకొను చున్నాము

గానీ, వారి శవాల ఫోటోలను గోడకు తగిలించుకొన్నామా? ఎవరి ఇంటిలోనైన ఫోటో ఆల్బమ్లో మంచి దుస్తులు

ధరించి చిరునవ్వుతో ఉండిన ఫోటోలు ఉండును. కానీ జ్వరము వచ్చి దుప్పటి కప్పుకున్న ఫోటోలుగానీ, మంచము

మీద దీనస్థితిలో చనిపోవుచున్నపుడు తీసిన ఫోటోలు కానీ ఉండవు. తనవారిని బాధగ చూడాలని ఎవడూ అనుకోడు.

మనవారిని సంతోషముగనే చూడాలని అనుకుంటాము. ఏసుప్రభువును నీవు దైవముగ భావించితే, ఆయన మీద భక్తి

విశ్వాసముకలవాడైతే, ఆయనను నీ కుటుంబములోని వారికంటే ఎక్కువగా ఇష్టపడితే, ఆయన పుట్టిన రోజున ఆయన

చనిపోయిన సిలువను మనముందు పెట్టుకోవడము, భక్తిగ చూడడము మంచిదా? అని అడుగుచున్నాను. నిజముగ

ప్రభువు మీద భక్తికలవారు, ప్రభువునే దేవునిగా ఆరాధించువారు కొంతయిన ఆలోచించ వలసిన విషయమిది.

జగతిలో చాలా బలమైనది మాయ (సాతాన్). సాతాను దేవుడే సృష్ఠించుకొని భూమిమీద తనకు ప్రత్యర్థిగ

ఉండునట్లు చేశాడు. దేవుని చేతనే తయారు చేయబడిన సాతాన్ లేక మాయ చాలా గొప్పదనియే చెప్పవచ్చును.

మనుష్యులను దేవునివైపు పోకుండ చేయడమే ముఖ్యమైన పనిగవున్న సాతాన్ దైవ భక్తులమనుకొన్న వారినందరిని తన

మార్గములో నడిపిస్తూ దేవుని మార్గములోనే ఉన్నామనుకొనునట్లు భ్రమింప చేయుచున్నది. నిజమైన ప్రభు భక్తులను


మభ్యపెట్టి చివరకు ప్రభువుకంటే సిలువనే గొప్పగ చూపించుచున్నది. దేవుని ప్రార్థనామందిరములైన చర్చీల మీద

మొదటనే సిలువను కనిపించునట్లు చేయుచున్నది. ప్రతి క్రైస్తవుని మెడలోను సిలువ గుర్తే కనిపించుచున్నది. దీనినంతటిని

చూచి వాస్తవ జ్ఞానముతో యోచించితే వీరంతా ప్రభువు భక్తులా? సిలువ భక్తులా? అను ప్రశ్న రాగలదు. హిందువులవలె

విగ్రహారాధన చేయకూడదను ఒకే ఒక నియమమును పెట్టి క్రైస్తవులను సాతాన్ తనవైపు లాగుచున్నదే కాని వేరుకాదని

తెలియు చున్నది. సాక్షాత్ ప్రభువునే వంచింప జూచిన సాతాన్ మనుషులను లెక్క బెట్టునా! సాతాన్ అంటే ఏమిటో,

దాని ప్రభావమేమిటో, దాని బలమెంతో తెలియనివారు దాని మార్గములోనే నడుస్తూ మేము దేవుని మార్గములోనే

పోతున్నామనుకుంటారు. కావున సాతాన్ను గురించి కొంత తెలుసుకొంటే గానీ దాని ఎడల జాగ్రత్తపడలేము.


పరిశుద్ధ బైబిలు గ్రంథములో లూకా సువార్త 3వ ఆధ్యాయము 7వ వాక్యమందు మరియు మత్తయి సువార్త

3వ ఆధ్యాయము 7వ వాక్యము నందు సాధారణ మానవులను ఉద్దేశించి “సర్ప సంతానమా” అని చెప్పబడి ఉన్నది.

ఈ వాక్యములో ప్రజలనుద్దేశించి సర్ప సంతానమని చెప్పడములో చాలా విశేష భావమున్నది. మనుషులకు ముఖ్యమైన

దైవ గ్రంథములో (బైబిలులో) మనుషులను ఉద్దేశించి సర్పజాతి అని అనడములో అర్థమేమిటో వివరించు కొందాము.

సర్పము అనగా పాము అని అందరికి తెలుసు. దాన్ని చూస్తునే అందరు భయపడుతారు. పాము ఎంతో చిన్నదైనా

మనిషి దానికి భయపడడము జరుగుచున్నది. ఎందుకనగా! పాము తలలో విషమున్నది. అది కరిస్తే మనిషి

నిమిషాలు లేక గంటలలో చనిపోవును. పాము వలన హాని తప్పదని అందరు దానికి దూరముగ ఉండవలెనను

కొంటారు. సర్పము అందరికి తెలిసిన ప్రమాదకర జీవరాసి, పాము వలన మనిషికి ప్రమాదమే అని తెలిసినప్పటికీ

కొందరు పామును పట్టుకొని, దాని విషకోరలను పెరికివేసి, దానికి భయపడక దానినే ఆడించుచుందురు. ఎందరో

పాముకు భయపడుచుండగ బహుకొద్దిమంది మాత్రము దానిని వారి చేతిలోనికి తీసుకొని దానినే ఆడిస్తూ తమ

ఆధీనములో పెట్టుకొన్నారు. దీనినిబట్టి చూస్తే మనిషి ఆధీనములో పామువుంటే దానివలన సంభవించు ప్రమాదముండదు.

పాము మనిషి ఆధీనములో లేకపోతే పాముకే మనిషి భయపడవలసి వస్తుంది. పాములను ఆడించువాని ఆధీనములోనున్న

పాము వాని చేతినుండి తప్పించుకొని పోతే, తిరిగి వానినే కాటువేసి చంపగలదు. మొదట కోరలు పెరికేశాడు కదా!

తర్వాత వానినెట్లు కాటువేయునని కొందరడుగవచ్చును. దానికి జవాబు పాముకు కోరలు పెరికినప్పటికీ కేవలము

పదినుండి పదిహేను రోజులలో దాని కోరలు తిరిగి పెరగగలవు. అందువలన పాములవాడు తన ఆధీనములోనున్న

పామునైన పది రోజులకొకమారు కోరలను గీకి వేయవలసి ఉండును. దీనినిబట్టి చూస్తే ఎల్లపుడు పామును తన

ఆధీనములో పెట్టుకొంటే దాని కోరలు పెరుకుతుండవలెను. అలాకాక పోతే మనిషి దానికి భయపడక తప్పదు, దాని

వలన హాని తప్పదు.


విషమునకు గుర్తు పాము. అమృతమునకు గుర్తు దేవుడు. విషము మనిషిని మృతుని చేయగలదు. మృతము

అనగ మరణము. అమృతము అనగ మృతములేనిది చావులేనిదని అర్థము. విషమునకు నిలయము సర్పము.

అమృతమునకు నిలయము దేవుడు. అందువలననే దేవుని జ్ఞానమును బైబిలులో జీవజలము అన్నారు. పాము వలన

విషము, విషము వలన మరణము కలదు. అట్లే దేవుని వలన జీవజలము (అమృతము) జీవజలము వలన మరణమును

జయించడము కలదు. దీనినిబట్టి సర్పము దేవునికి వ్యతిరేఖమైన సాతాన్తో సమానమని తెలియుచున్నది. భూమిమీద

ప్రజలు దేవుని ధ్యాసలేక సాతాన్ ప్రభావములో మునిగి ఉన్నారు కావున మనుషులను సర్పసంతానము అని అన్నారు.

దేవుని జ్ఞానము కల్గిన వారంతయు దైవ సంతానమని, సాతాన్ గుణములు కల్గిన వారినందరిని సర్ప సంతానమని


చెప్పవచ్చును. దేవుని జ్ఞానము కల్గియున్నామనుకొను వారిలో కూడ సాతాన్ ప్రవేశించి దాని వశములో మనిషిని

పెట్టుకొనుచున్నది. సాతాన్ బలము చాలా అపారమైనది. ఎవరినైన తనవైపు సులభముగా లాగుకొనగలదు. అందువలన

సాతాను బలమైన సర్పముగ పోల్చి దాని వశములోనున్న మనషులనందరిని సర్పసంతామని పరిశుద్ధ గ్రంథమందు

చెప్పబడినది.


భూమిమీద బలమైన సర్పమును కొండసిలువ అంటాము. అన్ని సర్పములకంటే బలమైన సర్పము కొండసిలువని

చాలామందికి తెలుసు. సిలువ అంటే పామని కొండసిలువ అంటే పెద్దపామని అర్థము. పాము మనిషి ఆధీనములో

ఉంటే ప్రమాధముండదు. పాము మనిషి ఆధీనములో లేకపోతే ప్రమాదమని తెలుసుకొన్నాము. దైవజ్ఞానము తెలియువాడు,

దైవ మార్గములో పయనించువాడు సాతానున్ను తన ఆధీనములో ఉంచుకోవలెను. ఈ విషయము తెలియజేయుటకు

పరిశుద్ధ బైబిలు గ్రంథములో లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యమునందు “ఎవడైనను తన సిలువను

మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు.” అన్నాడు. అట్లే మరియొక చోట మత్తయి సువార్త

16వ అధ్యాయము 24,25 వాక్యములందు “ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని

తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును.

నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును” అన్నాడు. ఈ వాక్యములలో నిగూఢమైన

అర్థమేమనగా! ఎవడైన జీవితములో దైవమార్గమున నడువాలంటే తనను ఆటంకపరుచు, తనను హింసించు సాతాన్

అనబడు పామును (సిలువను) తన ఆధీనములో పెట్టుకొని దానిని జ్ఞానమను బుట్టలో బంధించి నెత్తిన పెట్టుకొని

దేవున్ని అనుసరించవలెను. దేవుని నిమిత్తము పామును (సిలువను) నీవు దక్కించుకొని నీ ఆధీనములో ఉంచుకోవలెను.

దేవుని నిమిత్తము కాకుండ తను హాయిగ లోకములో బ్రతుకుటకు సాతానును వ్యతిరేఖించవలసిన పనిలేదు. జీవితములో

అన్ని సుఖములు అందించి మనిషినే తన ఆధీనములో సాతాన్ పెట్టుకోగలదు. కావున తన ప్రాణమును రక్షించుకొనువాడు

సిలువను వదలునని చెప్పాడు. ఇక్కడ దేవుని కొరకైతే సిలువను నీ చేతిలో పట్టుకొనమని, నీ కొరకైతే దానిని వదలి

దాని ఇష్టమొచ్చినట్లు పోనిత్తువని చెప్పాడు.


సిలువ అంటే పాము అని, కొండ సిలువ అంటే బలమైన పెద్దపాము అని అనుకొన్నాము. సాతాన్ (మాయ)

పామువలె మనిషిని చుట్టుకొని బాధ పెట్టుచున్నది. ప్రతి మనిషికి సిలువ గలదని చెప్పవచ్చును. ప్రతి మనిషి తన

సిలువను తాను తన ఆధీనములో ఉంచుకొన్నపుడే దైవ మార్గమున ప్రయాణించగలడు. నీ జీవితములో దైవమార్గమలో

అడుగడుగున ఆటంకము కల్గించు సాతాను సిలువ అంటాము. మనిషిగ వచ్చిన ప్రభువును కూడ ఎన్నో ఆటంకములు

కల్గించిన సాతాన్కు మారుపేరే “సిలువ". ప్రభువును ముఫ్ఫైమూడు సంవత్సరములకు చనిపోవునట్లు చేసినది కూడ

సాతానే. మీకు జ్ఞానము చెప్పిన ప్రభువు కూడ నాచేత చిక్కి, నా ద్వారానే చనిపోయాడని తెల్పుటకే సిలువ అని పేరు

పెట్టబడిన కట్టెల మీద ప్రభువు చనిపోవునట్లు జరిగినది. ప్రభువు సాతాన్ మాట వినకుండ ప్రాణత్యాగము చేశాడు.

ఆయన మరణము మనకు మీ ప్రాణము పోయినా సాతాన్ మాటవినవద్దని తెల్పు గొప్ప సందేశము. జీవితములో

ఎంతో జ్ఞానము తెల్పి తన జ్ఞానశక్తి చేత ఎందరో రోగములను సహితము పోగొట్టిన ప్రభువు అడుగడుగున సాతాన్

శోధనకు గురియై దానికి వ్యతిరిక్త దిశలో నడిచి మనలను అలాగే నడువమన్నాడు. దైవమార్గమునకు వ్యతిరేఖమైతే నీ

శరీర భాగములను కూడ ఖండించివేయమన్నాడు. కానీ మానవులు సాతాన్ అంటే ఏమిటో తెలియక, దాని ప్రతిరూపమంటే

ఏమిటో తెలియక పోయారు. సాతాన్ మారుపేరు సిలువ అని తెలియక ప్రభువును కాక సిలువనే మెడలో ధరించారు.


ప్రభువును పొట్టన పెట్టుకొన్న సిలువను, ప్రభువు రక్తముతో తడిసిన సిలువను, ప్రభువు రక్తమును రుచి చూచిన

సిలువను, మానవుడు ప్రభువుకంటే ఎక్కువగ ఉంచుకొన్నాడంటే సాతాన్ ప్రభావము ఎంతటిదో అర్థమై ఉంటుంది.


క్రైస్తవ సమాజములో సిలువకు ఎంతో ప్రాధాన్యత కలదు. అది సాతాన్ ప్రభావమే. సాతాన్ నిజస్థితి బయటికి

అర్థమగునట్లు చెప్పిన మా మీద తన ప్రభావమును చూపి, తన సంతానమైన (సర్ప సంతానమైన) ప్రజల చేత

ఇబ్బందులు కలుగజేయునని తెలిసి, దైవమార్గములో అన్ని కష్టములకు ఓర్చుకోవలసిందేనని నిశ్చయించుకొన్నాము.

కావున ధైర్యముగ సిలువంటే సాతాన్ అని తెల్పుచున్నాము. మేము చెప్పడమేకాక “కరుణా మయుడు”, “దయామయుడు”

అను ప్రభువు సినిమాలలో కూడ సాతాన్ను కొండసిలువగ చూపడము జరిగినది. దేవుడే ఆ విధముగ ఆ దృశ్యమును

ఆ సినిమాలలో వచ్చునట్లు చేసి, ఈ రోజు మేము చెప్పిన మాటకు బలమును చేకూర్చాడు. పామువంపులు తిరుగుటకు

అనుకూలమైన శరీరము గలది. పామును నాలుగు వంపులుగ చేస్తే ఈ రోజు మనము చూస్తున్న చెక్కతో చేసిన సిలువ

ఆకారము వచ్చును.


(కొండ సిలువ) సిలువ చిత్రములను 23 పేజీ  చూడండి .


క్రైస్తవులలో చాలామంది ప్రభువును తలచుకొంటున్నట్లు కుడి చేతితో రెండు భుజములను పైన తలను క్రింద

హృదయ స్థలమును తాకుట అక్కడక్కడ చూస్తుంటాము. అది సిలువ గుర్తును సూచిస్తూ నాలుగు కొనలను చేతితో

చూపడమే అగుచున్నది. పాము నాలుగు కొనల గుర్తులను చేతితో చూపుచూ, అది దైవభక్తి అనుకొనునట్లు సాతాన్

మనుషులను మభ్యపెట్టు చున్నది. ఇంతవరకు ప్రభువు మీద భక్తికలవారు పరోక్షముగ సాతాన్నే సిలువ రూపముతో

ఆరాధిస్తున్నారు. ప్రత్యక్షముగ ప్రభువును గురించి చెప్పుకొనుచుండినప్పటికీ, పరోక్షముగ సాతాన్నే పొగడుచున్నారు.

హిందువులు మేము భక్తిపరులనుకొని, దేవున్ని ఆరాధిస్తున్నామనుకొని, దేవుడు కానటువంటి క్షుద్రదేవతలను

ఆరాధిస్తున్నారు. ఉదయము స్నానము చేసి ఏదో ఒక ఫోటోకు నమస్కరించిన తర్వాత నిత్యకృత్యము చేయు అలవాటు





కొందరికున్నది. కొందరు ఏదో ఒక దేవాలయమునకు పోయి గంటకొట్టి అర్థములేని ఆచారములు చేస్తున్నారు. ఈ

విధముగ ఎందరో ఆచరిస్తూ మేము చేయు భక్తియే సరియైనదనుకొనుచుందురు. అది సరియైన పద్ధతి కాదనీ, ఆ

విధముగ చేయడము విశ్వమునకు అధిపతియైన దేవునికి ఇష్టముండదనీ ఎవరికీ తెలియదు. సామాన్య మానవులేకాక

పెద్దపెద్ద స్వామీజీలు, పీఠాధిపతులు తాము చేయునదే సరియైన పద్ధతిని అనుకొనుచు, మాయ (సాతాన్) పనినే

చేయుచున్నారు. మాయ ఆ విధముగ అందరిని మభ్యపెట్టుచూ, దేవుడు చెప్పినట్లు చేయకుండ చేయుచున్నది.

దేవుడు భగవద్గీతయందు మాయ యొక్క ఆరాధనల గురించి చెప్పి, ఆ విధ ఆరాధన వలన నన్ను చేరలేరు అన్నాడు.

“యజ్ఞముల వలననూ, దానముల వలననూ, వేదపారాయణము వలననూ, ఉగ్రమైన తపస్సుల వలననూ నన్ను

తెలుసుకొనుట, నా వద్దకు చేరుటకు ఎవరికీ శక్యము కాదు” అని పరమాత్మగ ఒకమారూ, భగవంతునిగ ఒకమారూ

గీతయందు చెప్పడము జరిగినది. స్వయముగ దేవుడే చెప్పినప్పటికీ ఆయన మాటను తెలియకుండ మాయ అందరిని

మభ్య పరచి వద్దనిన పనులనే (ఆరాధనలనే) అందరి చేతను చేయిస్తున్నది. నేడు దేవుడే దిగివచ్చి చెప్పినా వినేస్థితిలో

లేనట్లు మాయ (సాతాన్) వారిని తీర్చిదిద్దినది.


క్రైస్తవ సమాజములోనున్నవారు హిందువుల సమాజముకంటే మేము మేలనుకొని, వారి మాదిరి అనేక దేవతలను

విశ్వసించక మేము ప్రభువునే విశ్వసించామనుకొనుచున్నారు. మేము చేయు ఆరాధన సరియైనదనుకొనుచున్నారు.

హిందువుల మాదిరి వారిని కూడ సాతాన్ మభ్యపెట్టినదని ఎవరికీ తెలియదు. మాయ (సాతాన్) ప్రభువు భక్తుల చేత

ప్రభువునే ఆరాధిస్తున్నట్లు నమ్మించి తనచుట్టు తిరుగునట్లు చేసుకొన్నది. మాయ తన నిజస్వరూపమేమిటో ఎవరికీ

తెలియకుండ అందరిలో ఇమిడిపోయినది. తన గుర్తుయిన సిలువనే అందరు ధరించునట్లు చేసినది. ప్రభువు ప్రార్థనా

మందిరముల మీద తన గుర్తులనే స్థిరస్థాయిగ ఉండునట్లు చేసుకొన్నది. ఈ దినము ప్రభువే స్వయముగ వచ్చి మీరు

ఈ విధముగ తప్పు చేయుచు సాతానవశమైనారని చెప్పినా వినేస్థితిలో లేరు. హిందువులలో మాయ అనబడునది,

క్రైస్తవులలో సాతాన్ అనబడునది రెండు ఒక్కటే. దేవుడు కృష్ణునిగ పుట్టినపుడు ఆయనను కూడ ఎన్నో ఇబ్బందులు

పెట్టిన మాయ అదే దేవుడే ప్రభువుగ పుట్టినపుడు కూడ ఎన్నో ఇబ్బందులు పెట్టి చివరకు సిలువ మీద హత్య

చేయించినది. అంతేకాక ప్రభువు చనిపోయిన దినమును శుభముగ అర్థమగునట్లు చేసి, ఆయన బాధపడి మరణించిన

దినమును శుభశుక్రవారముగ ప్రభువు భక్తులనే నమ్మించినది. ఒక దుర్మార్గుడు చనిపోతే ప్రజలు సంతోషముతో

పండుగ చేసుకొన్నట్లు, క్రైస్తవుల చేతనే గుడ్డే పండుగ చేయిస్తున్నది. పైకి దేవుని పేరు చెప్పుచూ మాయ తన

మార్గమున అందరిని నడుచునట్లు చేయుచున్నది. అందరిని మభ్యపెట్టి నీవు నడుచునదే సరియైన దేవుని మార్గమని

నమ్మించి వెనుతిరిగి చూడకుండునట్లు చేయుచున్నది.


సాతాన్ ప్రభావములో మునిగి సిలువను ధరించిన క్రైస్తవులకు తెలియని ముఖ్యమైన రహస్యమొకటి గలదు.

సిలువ వేసినపుడు ఏసుప్రభువు చనిపోయాడనీ, ఆయన మూడవదినమైన ఆదివారము తిరిగి లేచాడనీ చెప్పు చుందురు.

కానీ సిలువ మీద ఏసు మరణించలేదు. ఆయన చనిపోయినట్లు కనిపించాడు తప్ప ఆయన పూర్తి మరణమును

పొందలేదు. ఒక విధముగా ఆయన మరణించిన మాట వాస్తవమే అయినా, ఏసు కాలమరణమును పొందలేదు.

కాల మరణమూ, అకాల మరణమూ, తాత్కాలిక మరణమను మూడు విధముల మరణములలో అప్పుడు ఆయన

తాత్కాలిక మరణమును పొందాడు. ఈ మూడు మరణముల విషయములు తెలియాలంటే మా రచనలలోని “మరణ

రహస్యము” అను గ్రంథమును చదవాలి. ఏసుప్రభువు శుక్రవారము తాత్కాలిక మరణమును పొంది, శనివారము


విశ్రాంతి తీసుకొని, ఆదివారము తిరిగి లేవడము జరిగినది. తాత్కాలిక మరణమును పొందినవారు ఉదయము

చనిపోయి సాయంకాలము లేచిన వారు కూడా కలరు. రెండు రోజులకు, మూడు రోజులకు లేచిన సంఘటనలు ఎన్నో

ఉన్నాయి. ఏసు మూడవ రోజు లేచి తిరిగి తన శిష్యులవద్దకు పోయాడు. అయితే అప్పటికే వారు సాతాను ప్రభావములో

పడియుండుట వలన ఏసును వారు నమ్మలేదు. అతను చనిపోయాడని అతని ఆత్మ దయ్యముగా వచ్చినదని అనుకొన్నారు.

ఏసు నలభై రోజులు తన శిష్యులకు కొన్ని మాటలు చెప్పి వారి ప్రవర్తనను గమనించాడు. తర్వాత వారిని వదిలి

భారతదేశమునకు రావడము జరిగినది. అలా రావడమునకు కారణము తన గతజన్మ భారత దేశములోనే జరిగినది.

కావున తన శేష జీవితమును భారత దేశములోని గుజరాత్ రాష్ట్రములో గడిపి చివరకు ద్వారక ప్రాంతములో చనిపోవడము

జరిగినది.


ఏసు తన మరణమునుండి లేచిన తర్వాత నలభై రోజులు తన శిష్యులను గమనించాడు. అప్పటికే వారిలో

మాయ (సాతాన్) ప్రభావమున్న దని గ్రహించి వారిని వదలి వచ్చాడు. అప్పుడు ప్రారంభమైన మాయ (సాతాన్)

ప్రభావము చివరకు ఏసు ఆకారమును చూడకుండా, ఏసు ఆకారమును ఆరాధించకుండా చేసి సిలువను ఆరాధించునట్లు,

గౌరవించు నట్లు, ధరించునట్లు చేసింది. ఈ దినము అన్ని దేశములలోనూ క్రైస్తవు లందరూ ముఖ్యముగా సిలువను

ధరిస్తున్నారు. మూడు సంవత్సరములు జ్ఞానమును బోధించిన ప్రభువును వదలి ఆయన మరణించిన సిలువను

ధరించడము న్యాయమా? ధర్మమా? అని అడుగుచున్నాము. సిలువ దేవుడా? అని సూటిగా ప్రశ్నించుచున్నాము.

ఒక్కమారు క్రైస్తవ మతములోని జ్ఞానులందరూ యోచించి చూడమని కోరుచున్నాను.

క్రైస్తవ సోదరులారా! ఇప్పటికైన మించిపోయినది లేదు. ఎంతో కొంత జీవితము ఇంకా మిగిలి ఉన్నది.

ఇక్కడినుండి మిగిలిన జీవితములోనైన ప్రభువు ఎవరు? సాతానెవరు? ప్రభువు మార్గమేది? సాతాను మార్గమేది?

ప్రస్తుతము నేను ఏ మార్గములో ఉన్నాను? అని ప్రశ్నించుకొని, నిన్ను నీవు వెనుదిరిగి చూచుకొని, అసలు దేవుడైన

ప్రభువును విశ్వసించి, సాతాన్ మార్గమున ప్రవేశించకుండ జాగ్రత్తపడుము. అట్లు యోచించని ఎడల నేను చెప్పినవన్ని

కల్పితములనీ, సిలువనే కించపరిచాడనీ సాతాన్ నిన్ను ప్రేరేపించి నా మీదకు పంపగలదు. దేవుని విషయమును

తెల్పడము లో మేము ఇబ్బందులపాలైన పరవాలేదు. దేవుని అవతారము కొరకు పని చేశానను తృప్తి మాకు కలుగుతుంది.

నీవు మాత్రము సర్పసంతానము కావద్దు, కొండ సిలువ చేతిలో చిక్కుకొనవద్దు. దేవుడు మీకు తన వాస్తవ జ్ఞానము

అందివ్వాలని కోరుచు ముగిస్తున్నాము.



ప్రభువు =  ప్రత్యేకముగ జన్మించిన వాడు (దేవుడు)

సిలువ = పాము (సాతాన్ )

సర్పసంతానము =  సాతాన్ ప్రభావమున్న ప్రజలు (అజ్ఞానులు)


-



అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యము కాదు,

సత్యమును వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.

ఒక విషయమును సమర్ధించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే

ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.


ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024