మంత్రము-మహిమ (నిజమా అబద్దమా). cloud text updated on 13sep 2024

 


మంత్రము-మహిమ (నిజమా అబద్దమా).


మంత్రశక్తి అనుమాటను కొన్నిచోట్ల వినియున్నాము. కొన్ని సందర్భములలో ఈ మాటను విననివారుండరు.

నవీనకాలములో చదువు కొన్న వారందరికీ మంత్రమంటే ఏమిటో, దానికివుండు శక్తి అంటే ఏమిటో తెలియదు.

మంత్రము యొక్క పుట్టుపూర్వోత్తరములను తెలియనివారూ, నాస్తికవాదులూ, మంత్రమనునది మంత్రశక్తి అనునదీ

లేనేలేదు, మంత్రశక్తి ఉన్నదనుట పూర్తి అసత్యము అంటున్నారు. మంత్రశక్తిని గురించి కొందరు స్వామీజీలను అడిగితే

వారు ఇలా మాట్లాడుచూ “మంత్రమును గురించి ఏమాత్రము తెలియనివారు దానిని గురించి తెలుసుకొందామనుకోకుండా,

ఏకంగా మంత్రమునే లేదంటున్నారు. దానిని గురించి తెలియకపోయినంత మాత్రమున లేదనడము న్యాయమేనా?

వాస్తవానికి మంత్రమూవుందీ, దానికొక మహిమా ఉంది" అని అనడము జరిగినది. కొందరైతే “మంత్రమంటే ఏమిటి,

దానికి శక్తి ఉంటుందా” అని కూడా అడుగుచున్నారు. దీనినిబట్టి మంత్రమును లేదనువారు కొందరూ, ఉందనువారు

కొందరూ, తెలుసుకోవాలనుకొనువారు కొందరూ కలరని తెలియుచున్నది. ఎందరో మనుషులలో కొందరే ప్రజలు

కలరు. ప్రజలలో సత్యమును తెలుసు కోవాలనుకొను అభిలాష కలిగినవారు కొందరు మాత్రము కలరు. సత్యము

కొరకు అన్వేషించు వారికి మాకు తెలిసిన సత్యమును అందించాలను కొన్నాము. అటువంటి ప్రయత్నములో మంత్రమును

గురించి, దాని శక్తిని గురించి చెప్పాలనుకొన్నాము.


మంత్రములు అనేకములు కలవు. అలాగే వాటి శక్తులు అనేకములు కలవు. మంత్రము యొక్క శక్తి స్థూలముగా

ఉన్నది మరియు సూక్ష్మముగా ఉన్నది. ముందు స్థూల, సూక్ష్మములను గురించి తెలుసుకొంటే తర్వాత విషయమంతా

శాస్త్రబద్దముగా అర్థమవుతుంది. ఉదాహరణకు భూమిలోనికి రెండు అడుగుల లోతుగా పాతబడిన ముప్పది అడుగుల

స్థంభమున్నదను కొనుము. భూమిలోనికి పోనూ పైకి ఇరువది ఎనిమిది అడుగుల పొడవున్నది. ఆ స్థంభము పైకొనకు

ఒక తాడును కట్టి లాగితే ఆ స్థంభము క్రిందపడి పోవును. స్థంభము క్రింద పడిపోవడానికి ఎంత బలము అవసరము

అని మొదట తెలియదు. కావున దానిని తెలుసు కొనుటకు సమాన బలమున్న పదిమంది మనుషులతో లాగించితే

వారిశక్తి ఆ స్థంభము క్రిందపడుటకు సరిపోలేదు. స్థంభమును క్రిందికి త్రోయుటకు ఒక్కొక్కరిని ఉన్నవారితో జోడించి

లాగించడము జరిగినది. ఆ విధముగా నలువదిమందిని జమచేసి లాగించినపుడు స్థంభము క్రిందపడింది. అప్పుడు

ఆ స్థంభము క్రిందపడుటకు నలువదిమంది బలము లేక శక్తి అవసరమైనదని తెలిసినది. నలువదిమంది ఎంతశక్తిని

ఉపయోగించి లాగారని ఒక చిన్న యంత్రము (పవర్మీటర్) ద్వారా కొలిచి చూచినపుడు, ఒక్కొక్కరు 50 కేజీల

బరువుకు సమానమైన శక్తిని ఉపయోగించినట్లు తెలిసింది. దాని ప్రకారము 40 మంది 2000 కేజీల శక్తిని

ఉపయోగించినట్లు తెలిసింది. ఈ విధముగా ఒక స్థంభము క్రిందపడుటకు ఎంతశక్తి ఉపయోగపడినది స్థూలముగా

తెలిసిపోయింది.


అదే లోతులో పాతిపెట్టబడిన, అదే పొడవున్న మరొక స్థంభము క్రిందపడిన మొదటి స్థంభమునకు పది

అడుగుల దూరములోనే ఉన్నది. మనుషుల శక్తిచేత మొదట స్థంభము క్రిందపడిన మరుసటి దినమే రెండవ స్థంభము

కూడా క్రిందపడిపోయినది. రెండవ స్థంభము మనుషుల శక్తి వలన క్రిందపడలేదు. గట్టిగా వీచిన గాలిశక్తికి రెండవ

స్థంభము క్రింద పడిపోయినది. ఎవరి వలన పడినా అది మొదట స్థంభము క్రిందపడుటకు ఎంతశక్తి ఉపయోగపడినదో

అంతేశక్తి ఉపయోగపడినదని చెప్పవచ్చును. మొదటి స్థంభము క్రిందపడుటకు 40 మంది శక్తి ఉపయోగపడగా, 40


మంది మనుషులు స్థూలముగా కనిపించుట వలన, మొదటి స్థంభమునకు ఉపయోగపడిన శక్తిని స్థూలశక్తి అని

అంటున్నాము. రెండవ స్థంభము క్రిందపడుటకు కారణమైన గాలి కనిపించదు. కావున ఆ శక్తిని సూక్ష్మశక్తి అని

అంటున్నాము. దీనినిబట్టి బలము లేక శక్తి రెండు విధములుగా స్థూలముగా, సూక్ష్మముగా ఉన్నదని చెప్పవచ్చును.

ఒక కేజీ రాయిని మనిషి ఎత్తితే అది ఏమీ వింతకాదు, అదే కేజీ రాయిని పైకి ఎత్తినవారు కనిపించకుండ ఎత్తితే

దానంతట అదే పైకి లేచినట్లు కనిపించును. అప్పుడు అది వింతగా కనిపించును. ఒకమారు కేజీరాయి పైకి

లేచినప్పుడు మనిషి ఎత్తుట వలన అప్పుడు ఎంతశక్తి ఉపయోగపడిందో, రెండవమారు ఎత్తిన వారి శక్తి కనిపించకున్నా

అప్పుడు కూడా అంతేశక్తి అవసరమైవుంటుందని చెప్పవచ్చును. దీనిప్రకారము ఒక కేజీరాయి పైకి ఒకమారు లేచినప్పుడు

ఎంత బలము అవసరమో, ఆ తర్వాత అది ఎప్పుడు లేచిన, ఎవరు లేపినా దానికి అంతే బలము ఉపయోగపడుచున్నది.

కనిపించే మనిషి ఒక వస్తువును విసరివేస్తే, ఆ వస్తువు మనిషిచేత విసిరివేయబడింది అంటాము. అదే వస్తువు

గాలిచేత దూరముగా వేయబడితే గాలిపీడనము చేత అది ఎగిరి పోయింది అంటాము. అదే వస్తువు మనిషీ కాకుండా,

గాలీ కాకుండా విసరివేయబడితే దానిని వింతగా చెప్పుకుంటాము. అయితే అక్కడ కూడా ఒకే కొలత గల బలము

(శక్తి) ఉపయోగపడిందనీ, ఆ బలము కనిపించని సూక్ష్మబలమని ఏమాత్రము మనుషులు అనుకోరు.


ఒక వస్తువు ఒకచోటనుండి మరొక చోటికి విసరివేయబడితే, ఆ వస్తువును విసరివేసిన బలము కంటికి

తెలియబడే మనిషిదికానీ, స్పర్శకు తెలియబడే గాలిదిగానీ అయినప్పుడు, వస్తువు విసరివేయబడే దానికి బలము లేక

శక్తి ఉపయోగపడిందని ఎవరైనా ఒప్పుకోగలరు. అయితే మనిషికున్న ఐదు ఇంద్రియములకు విసరివేయుటకు కారణమైన

బలము తెలియనప్పుడు, విసరివేయబడిన వస్తువు ఎలా విసరివేయబడిందో తెలియక మనిషి కొంత సందిగ్ధములో

పడుచున్నాడు. మనిషి ఇంద్రియములకు తెలియని శక్తి కూడా ఒకటున్నదని అర్థము చేసుకోలేక పోవుచున్నాడు.

వాస్తవముగా ఇంద్రియములకు తెలిసే బలమూ, ఇంద్రియములకు తెలియని బలమూ రెండు ఉన్నాయని బహుశా

చాలామందికి తెలియదు. కనిపించే మనిషి బలమును స్థూలబలమనీ, కంటికి కనిపించక స్పర్శకు మాత్రము తెలియబడే

గాలియొక్క బలమును సూక్ష్మబలమని రెండు రకములుగా చెప్పుకొన్నప్పుడు, కంటికిగానీ, చర్మమునకుగానీ, ఏ

ఇంద్రియమునకుగానీ తెలియని శక్తిని (బలమును) ఏమని చెప్పాలి? అని ప్రశ్నరాకతప్పదు. దానికి ఈ విధముగా

జవాబు కలదు. బలములు రెండు రకములుగా కలవు. వాటినే ఇంద్రియము లకు తెలియబడే బలములూ, తెలియబడని

బలములూ అని చెప్పుచున్నాము. ఇంద్రియ జ్ఞానమునకు తెలియబడని బలమును ఇంద్రియాతీత శక్తిగా కూడా

చెప్పుకొనుచున్నాము. మనిషి ఇంద్రియములకు తెలియబడే శక్తి (బలము) స్థూల, సూక్ష్మ అని రెండు రకములుగా

ఉండగా, ఇంద్రియములకు తెలియని శక్తిని కూడా రెండు రకములుగా చెప్పుచున్నాము. అందులో ఒకటి మంత్రశక్తి,

రెండవది దైవశక్తి అని చెప్పవచ్చును. మంత్రశక్తిని మనిషి తయారు చేయవచ్చును లేక సృష్టించవచ్చునని చెప్పగలము.

అయితే దైవశక్తిని ఎవరూ సృష్ఠించలేరు. దైవశక్తి సహజముగా విశ్వవ్యాప్తమైవున్నది. అంతటా వున్న శక్తిని మనిషి

ఎంతయినా పొందవచ్చును. ప్రపంచములో నున్న ఎన్నో గ్రహములూ, ఉపగ్రహములూ, భూతములూ, ఉపభూతములూ,

మహా భూతములు దైవశక్తిని పొంది ఉన్నాయి. అటువంటి దైవశక్తిని కూడా మనిషి ప్రయత్నము చేసి పొందవచ్చును.

ఇంద్రియాతీతమైన శక్తులు రెండు ఉన్నాయని నేటికాలములోని మనుషులు తెలియకపోవడమే కాకుండా ఎక్కడైనా

వాటి ప్రస్తావన వచ్చినప్పుడు, అటువంటివి ఏవీ లేవని, వాటిని ఎవరూ నమ్మవద్దని చెప్పుచుందురు.


మంత్రశక్తి ఉందని నిరూపించగలరా అని విజ్ఞానులమను కొన్న కొందరు ప్రశ్నించుచున్నారు. ఇంద్రియములకు

తెలియని శక్తిని ఇంద్రియములకు తెలియునట్లు ఎవరూ నిరూపించుటకు వీలులేదు. అందువలన నిరూపించగలరా

అని ప్రశ్నించువారికి ఎవరూ నిరూపించలేరు. మంత్రశక్తి గానీ, దైవశక్తిగానీ యోచించువారి బుద్ధికి తెలియునదేగానీ,

బాహ్యముగానున్న జ్ఞానేంద్రియములకు తెలియునదికాదు. మనిషి శరీరములోపలనున్న బుద్ధికి, బాహ్యేంద్రియములకు

తెలియని జ్ఞానమును గ్రహించు సామర్థ్యము గలదు. అందువలన మంత్రశక్తి బాహ్యముగా ఎవరికీ నిరూపణకు రాదు.

అంతరంగములో మాత్రము నిరూపణకు వచ్చును. ప్రతి మనిషికీ బుద్ధివున్నా దానిని ఉపయోగించు విధానము మనిషికి

తెలియకుండా పోయినది. నేడు గొప్ప చదువులు చదువుకొన్నవారు, మేము ఎంతో విజ్ఞానులమని చెప్పుకొను వారూ,

ఇంద్రియములకు అలవాటయిన వాటినే తెలియగలుగుచున్నారు. కానీ ఇంద్రియములకు అతీతమైన వాటిని గురించి

ఏమాత్రము తెలియలేక పోవుచున్నారు. అటువంటివారు తమ ఇంద్రియముల చేత తెలియబడిన విషయములనూ,

తమ చదువులలో తెలియబడిన విషయములను మాత్రమే తమ జ్ఞప్తిలో పెట్టుకొనుచున్నారు, వాటిని గురించే

మాట్లాడుచున్నారు. అందువలన ఎంతటి విజ్ఞానులకైనా మంత్రశక్తి యొక్క వివరముగానీ, దైవశక్తియొక్క జ్ఞానముగానీ

ఏమాత్రము తెలియకుండా పోయినదని చెప్పవచ్చును.


ఒక విషయము తనకు తెలియకుండా పోయినంతమాత్రమున దానిని పూర్తిగా లేదు అనకూడదు. ఉదాహరణకు

అమెరికాను చూచినవాడు ఒక్కడుండగా, చూడనివారు వందమంది ఉన్నారనుకొనుము. వందమంది చూడనంతమాత్రమున

ఒక్కడు చూచిన విషయమును కాదనలేము కదా! అదే విధముగా ఒక్కడు చెప్పే విషయమును సత్యమా? అసత్యమా?

అని బుద్ధితో యోచించకుండా లేదు అనడము బుద్ధిలేనితనమగును. అందువలన ఒక విషయమును సత్యమని చెప్పుటకు

ఎంత శాస్త్రబద్దత అవసరమో, అట్లే ఒక విషయమును అసత్యమని చెప్పుటకు అంతే శాస్త్రబద్దత అవసరమని చెప్పుచున్నాము.

మూఢముగా లేనిదానిని ఉన్నదని చెప్పడముగానీ, ఉన్న దానిని లేదని చెప్పడముగానీ జరుగకూడదు. అలా అనడము

విజ్ఞతకాదు, విజ్ఞానమూ కాదు. బుద్ధికి తెలియబడే మంత్రశక్తిని బుద్ధిచేతనే చోధించి తెలియాలి. అట్లుకాక కంటితో

చూడాలనీ, బయట ఇంద్రియములకు తెలియాలనీ అనుకోవడము పొరపాటు. బుద్ధికి తెలియునది కంటికి తెలియదు.

కంటికి తెలియని దానిని లేదు అనడము బుద్ధిలోపము అగును.


ప్రతి మనిషి శరీరములో బయటికి కనిపించకుండ లోపలి శరీరములో ముఖ్యమైన శరీర భాగములు రెండు

ఉన్నవి. అందులో ఒకటి మనస్సు, రెండు బుద్ధి. మనస్సు కేవలము మననము చేయునది కావున దానిని మనస్సు

అన్నారు. మనస్సుకు రెండవ పని కూడా ఉన్నది. అది ఇప్పుడు మనకు అవసరములేదు. అలాగే బుద్ది కూడా రెండు

పనులను చేయుచున్నది. అందులో ముఖ్యమైనది యోచించడము, ఆలోచించడము. తలయందుగల గుణచక్రములోని

మూడు గుణములలోని గుణ విషయములను బుద్ధి ఆలోచించడము జరుగును. అలాగే గుణచక్రములోని మూడు గుణ

భాగములకు మధ్యలోనున్న గుణాతీతమైన ఆత్మ భాగములోని జ్ఞానమును గురించి బుద్ధి యోచించడము జరుగును.

దీనినిబట్టి బుద్దియొక్క రెండవ పని రెండు రకములుగా ఉన్నదనీ, అందులో ఒకటి ప్రపంచ గుణ విషయములను

గురించి ఆలోచించుననీ, రెండవది దైవజ్ఞానమును లేక ఆత్మజ్ఞానమును గురించి యోచించుననీ తెలియుచున్నది. ఈ

విధముగా ఆలోచన మరియు యోచన అను రెండు వేరువేరు పనులను తన రెండవ పనిగా చేయుచున్నది. ప్రతి

మనిషిలోను బుద్ధి, మనస్సు వాటివాటి పనులు చేయుచుండినా అవి రెండూ అందరిలో ఒకే సామత్యము కల్గియున్నాయని

చెప్పలేము. మనిషి మనిషికీ ఆకారములో, ముఖవర్చస్సులో కొంతయినా తేడాయున్నట్లు, ప్రతి మనిషిలోనూ అవయవముల


పనియందూ వాటి సామత్యమందూ కొంతకు కొంత తేడావుండును. ఒక మనిషిలో మనస్సు బలముగావుండి జ్ఞాపకశక్తిని

అమితముగా కల్గియుండును. అయితే అదే మనిషిలోని బుద్ధి తక్కువ బలము కలిగియుండి యోచించడములోగానీ,

ఆలోచించడములోగానీ పూర్తిగా వెనుకబడియుండును. కొందరిలో అయితే బుద్ధికి ఆలోచనాబలము కలిగియున్నా

యోచనాబలము లేకుండావుండును. కొందరిలో మనస్సుకు జ్ఞాపకశక్తి తక్కువయుండి బుద్ధికి ఆలోచనా, యోచనా

బలములు రెండు కల్గియుండును.


ఇస్లామ్ మతములో బోధకునిగాయున్న ఒక వ్యక్తిని చూచాను. అతని ఉపన్యాసములను విన్నాను. అతను

పుస్తకములలో చూచిన ప్రతి విషయమును పూర్తిగా జ్ఞాపకము పెట్టుకొని చెప్పుచున్నాడు. విశేషమే మంటే అతను తన

మతగ్రంథముల విషయములనే కాకుండా బైబిల్లోని ఏ వాక్యమునైనా చెప్పగలుగుచున్నాడు. అంతేకాకుండా హిందూ

ధర్మమైన భగవద్గీతలోని శ్లోకములను గానీ, వేదములలోని మంత్రములనుగానీ, ఉపనిషత్లలోని వాక్యములనుగానీ,

ధారాళముగా కంఠాపాటముగా చెప్పెడి వాడు. అంతేకాక ఫలాన గ్రంథములో, ఫలాన పేజీలో ఇదే వాక్యము వ్రాయబడింది

అనిగానీ, ఇదే శ్లోకం వ్రాయబడి ఉంది అనిగానీ, ఎంతో జ్ఞాపకముగా చెప్పెడివాడు. అతని సభలోనున్న ప్రతి ఒక్కరూ

ఆయన జ్ఞాపకశక్తికి ఆశ్చర్య పోయెడివారు. డి.వి.డిల రూపములోనున్న అతని ఉపన్యాసములను చూచిన మాకు

కూడా అతనిలోని జ్ఞాపకశక్తిని చూచి చాలా గొప్పతనమనిపించేది. అలా అతని జ్ఞాపకశక్తి ఇతరులను కూడ ఎంతో

ఆశ్చర్యపరిచెడిది. దీనికంతటికి కారణము అతని శరీరములోని మనస్సుకున్న బలమని చెప్పవచ్చును. అట్లే ఆ వ్యక్తి

శరీరములోని బుద్ధికి స్థూల విషయములైన గుణవిషయములను, ప్రపంచ విషయములను ఆలోచించు శక్తి కూడా

ఉన్నది. అయితే సూక్ష్మములైన ఆత్మ విషయములను గానీ, దైవిక విషయములనుగానీ యోచించు సామత్యము అతని

బుద్ధికి ఏమాత్రము లేకుండెడిది. అందువలన ఆయన ఉపన్యాసములలో అతను యోచించి చెప్పినది ఎక్కడా కనిపించలేదు.

అతను విన్నదానినీ చదివిన దానినీ మాత్రము గుర్తుపెట్టుకొని చెప్పగలుగుచున్నాడు. అలా చెప్పడము మనస్సు యొక్క

బలముచేత జరుగుచున్నది. అతను చెప్పేదంతా స్థూల విషయములే, సూక్ష్మ విషయములు ఒక్కటి కూడా లేవు. దానివలన

సూక్ష్మ విషయములను గ్రహించుకొను శక్తి అతని బుద్ధికి లేదని తెలిసిపోవుచున్నది.


అతని బుద్ధి సూక్ష్మమైన విషయములను గ్రహించుకోవడములో గానీ, యోచించడములోగానీ ఏమాత్రము

బలములేనిదని నాకు కొంత అర్థమైన తర్వాత ఆ విషయములను దృఢపరచుకొనుటకు, ఒక సందర్భము లో అతనితో

కలిసి మాట్లాడడము జరిగినది. ఖురాన్ గ్రంథమునందు ఎన్నో సూక్ష్మమైన దైవవాక్యములు గలవు. అటువంటి

వాక్యములలో 33వ సురా అయిన “అన్అహ్ జాబ్" అను అధ్యాయములో 40వ ఆయత్ ఇలా కలదు. "ప్రజలారా

ముహమ్మద్ (సం||) మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. ప్రవక్తల

పరంపరను పరిసమాప్తము చేసే చివరివాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.” ఈ వాక్యమును గురించి ఆ వ్యక్తిని

అడగడము జరిగినది. నేను నాలుగు ఖురాన్ గ్రంథములలో ఒకే వాక్యమును గురించి చూచాను. ఒక్కొక్క గ్రంథములోని

వాక్యమునందు కొంత తేడా కనిపించినా, భావము మాత్రము ఒకటేనని అర్థమైనది. మీలోని ఏ పురుషునికి ప్రవక్త

తండ్రి కాడు అనినా, మీ మగవారిలో ఎవరికీ తండ్రి కాడనినా ఒకే అర్థము కాగలదు. మూడు గ్రంథములలో “ప్రవక్తల

పరంపరను పరిసమాప్తము చేసే చివరివాడు అని ఉండగా, ఖురాన్ మజీద్ గ్రంథములో అతను అందరు ప్రవక్తలకు

ముద్ర" అని ఉన్నది. ముద్ర అనగా ఏమిటి అని అడిగాము. దానికి అతను “అరబిక్ భాషలోని వాక్యములో ఖాతమున్


అను పదమునకు ముద్ర అని అర్థము. ముద్ర అనేది ఒక ప్రక్రియ పూర్తి అయ్యాక పడుతుంది. ముద్రపడిన తర్వాత

ఆ పని అన్ని విధాల పూర్తయినట్లే లెక్క, కనుక ముహమ్మద్ ప్రవక్త రాకతో ప్రవక్తల పరమరకు సీలు పడిపోయిందనీ

ఆయన తర్వాత ప్రవక్తలెవరూ రారని అర్థము అన్నాడు. దాని తర్వాత ఇలా అడిగాను...


నేను :- ప్రవక్త మీ పురుషులలో ఎవరికీ తండ్రికాడు అని ఉన్నది. ఎవరికీ తండ్రికాడు అను విషయము అక్కడ

చెప్పవలసిన అవసరము ఏమి వచ్చినది. ఆయన ప్రవక్తలకు అందరికి చివరి ప్రవక్త అనుమాట చెప్పి తర్వాత దేవునికి

సర్వమూ తెలుసు అను మాట చివరిలో సరిపోయినది. అయితే మొదటిలో ముహమ్మద్ ప్రవక్త ఏ పురుషునికి తండ్రికాడు

అని చెప్పడములో ఆంతర్యమేమిటి?


అతను :- ఆయన చనిపోయినప్పుడు ప్రవక్తగారి ఇద్దరు కుమారులు ఎవరూ సజీవముగా లేరు. కావున ఆయన ఏ

పురుషునికీ తండ్రికాడు అని చెప్పడము జరిగినది. నలుగురు కుమార్తెలలో ముగ్గురు ముందుగానే చనిపోయారు.

చిన్నకూతురైన పాతిమా ఒక్కతి మాత్రము ప్రవక్తగారు పరమపదించిన తర్వాత ఆరు నెలలకు చనిపోయింది. ఆయన

మరణించిన సమయానికి ఆయన ఏ పురుషునికీ తండ్రికాడు అంటే ఆయనకు కుమారులు లేరని అర్థము.

ఇప్పుడు ఆ బోధకుడు చెప్పినట్లు ఎటుచూచిన అతని మాట సరియైన సమాధానము కాదని తెలియుచున్నది.

తిరిగి మనము ప్రశ్నిస్తే దానికి జవాబు ఎంత వెతికినా ఉండదు. ఒకమారు సంతతిపొందిన వానిని బాహ్యముగా

తండ్రి అనియే అంటాము. కొడుకు బ్రతికియుంటే తండ్రియనీ, బ్రతికియుండకపోతే తండ్రికాడని బాహ్య సమాజములో

ఎవరూ అనరు. అంతేకాక కొడుకులను కనినా, బిడ్డలను కనినా కన్నవారిని తల్లి తండ్రులంటాము, ఇక్కడ ఆడబిడ్డలను

వదలివేసి మగసంతతికి మాత్రమూ తండ్రి అనడము సమాజములో ఎక్కడా వర్తించదు. చనిపోయిన కుమారులకు

తండ్రికాను అని అంటే, అతని భార్యలు తప్పుచేసి సంతతి పొందిన వారిగా సమాజములో లెక్కింతురు. గమనించతగిన

విషయ మేమనగా! వాక్యమును బాగా గమణించితే మీ పురుషులలో ఎవరికీ తండ్రికాడు అని జిబ్రయేల్ దూత

చెప్పినట్లున్నది. జిబ్రయేల్ దైవదూతయే కాక, అత్యంత ఉన్నతమైన జ్ఞానముకలవాడు. ఆయన చెప్పినమాట అత్యంత

విలువకల్గియుండును. ముస్లీమ్ బోధకుడు చెప్పినట్లు ఆ మాట బాహ్య అర్థమునకు వర్తించదు. ఆ మాటలో ఏదో

అంతరార్థమున్నది. బాహ్యర్థముగా చెప్పితే ఆ మాట పూర్తి తప్పగును. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయ మేమనగా!

ముహమ్మద్ ప్రవక్త చనిపోవు సమయములో గానీ, చనిపోయిన తర్వాతగానీ చెప్పిన వాక్యముకాదది. ముహమ్మద్

ప్రవక్త బ్రతికియున్నపుడు, ఆయన ఆరోగ్యముగా ఉన్నపుడు, ఆయన కుమారులు కూడా బ్రతికి యున్నపుడు జిబ్రయేల్

దూత ప్రవక్తను గురించి చెప్పిన వాక్యమది. ఆ వాక్యమును బాహ్యర్థముగా తీసుకొంటే క్రింద చెప్పినమాటకు, పైన

చెప్పిన మాటకు ఏమాత్రము సంబంధమే లేదు. తర్వాత దానికి బాహ్యర్థమును చెప్పితే సమాజము ఏ విధముగా ఆ

మాటను ఒప్పుకోదు.


అన్ని విధముల వివరముగా చూచితే జిబ్రయేల్ చెప్పినమాట పరమార్ధముతో కూడుకొనియున్నది. సూక్ష్మమైన

భావములతో ఖురాన్ కూడుకొనియున్నదని ఖురాన్ గ్రంథములో 3వ సురా, 7వ ఆయత్లో చెప్పినట్లు ఏ మనిషయినా

తన బుద్ధితో యోచించి చూడకపోతే దాని నిజమైన అర్థము తెలియదు. పైన నాతో మాట్లాడిన ముస్లీమ్ బోధకుడు

ఎంతో జ్ఞాపకశక్తికలవాడయినా, అతని బుద్ధి బాహ్య ఆలోచనలను చేయునదైనా, నిగూఢముగానున్న సూక్ష్మమైన



పరమార్థములను యోచించు బలములేనిదని చెప్పవచ్చును. యోచించు బుద్ధి బలమున్నవారు మాత్రమే 33వ సురా

40వ ఆయత్కు అర్థము చెప్పగలరు. ఆ వాక్యములో తన కుమారులకు అని చెప్పక, మీ పురుషులలో అని ఎందుకు

చెప్పాడని కూడా ప్రశ్న రాగలదు. అన్నిటికి సరియైన సమాధానము బుద్ధికి బలమున్నప్పుడే దొరుకునని చెప్పుచున్నాము.

బుద్ధి బలములేనిదే సూక్ష్మమైన దైవిక విధానము పూర్తి ఎలా తెలియకుండా పోవుచున్నదో, అలాగే బుద్ధి బలములేనిదే

సూక్ష్మమైన మంత్రముల విధానమూ, దానిశక్తి తెలియకుండాపోవును. ఎంతటి జ్ఞాపకశక్తిగలవారైనా ఖురాన్ గ్రంథములో

33వ సురా 40వ వాక్యములలోని భావమును గ్రహించలేక పోవుటకు కారణము వారి బుద్ధికి యోచించుశక్తి లేకపోవడమే.

వారి మనస్సు బలముకల్గినదై ఎక్కువ జ్ఞాపకశక్తి కల్గియున్నదైనా, వారిలోని బుద్ధి స్థూలముగా ఆలోచించు శక్తికలదైనా,

వారి బుద్ధి సూక్ష్మమైన వాక్యములను యోచించు శక్తిలేనిదైనందు వలన అసలైన నిగూఢ సూక్ష్మ విషయములను

తెలియలేదు.


యోచించు బుద్ధి బలము లేని మనిషి ఎవడైనాగానీ, మంత్రశక్తిని గానీ, దైవశక్తినిగానీ తెలియలేడు, విశ్వసించలేడు.

మంత్రశక్తినీ మరియు దైవశక్తిని అభౌతికము అంటాము. అభౌతికము భౌతిక శరీర అవయవము లకు తెలియదు.

అభౌతికమైన సూక్ష్మవిషయములు సూక్ష్మముగా యోచించు బుద్ధిగలవానికే తెలియును. అందువలన బయట ఎంత

మేధావులైనా, ఎంతటి జ్ఞాపకశక్తిగలవారైనా, దైవవాక్యములోని పరమార్ధము తెలియలేరు. అట్లే మంత్రములోని శక్తిని

గ్రహించలేరు. శక్తి లేక బలము స్థూలము సూక్ష్మమని రెండు రకములున్నది. స్థూలశక్తిని మనిషి బయటయంత్రముల

ద్వారా కూడా సృష్టించుచున్నాడు. మనిషి శరీరమునకున్న శక్తి వందకేజీల బరువును పైకి ఎత్తగల స్థోమత కల్గియుండగా,

మనిషి ద్వారా తయారు చేయబడిన యంత్రబలము ఎన్నో రెట్లు ఎక్కువ ఉండును. తయారు చేయబడిన యంత్రమును

బట్టి దాని బలముండును. ఒక మనిషి ఒక స్థూలమైన యంత్రబలమును సృష్టించినట్లే, సూక్ష్మమైన మంత్రబలమును

కూడా సృష్టించగలడు. ఒక మనిషి శరీర బలముకంటే యంత్రబలము ఎన్నోరెట్లు ఎక్కువకాగా, యంత్రబలముకంటే

మంత్రబలము ఇంకా ఎక్కువ రెట్లు ఉండగలదు. యంత్రము చిన్నదైతే చిన్నబలమూ, పెద్దదైతే పెద్దబలము తయారైనట్లు,

మంత్రముయొక్క విధానమునుబట్టి మంత్రబలము ఎక్కువ తక్కువ ఉండును. యంత్రబలమును గుర్రము యొక్క

బలముతో పోల్చి హార్స్ప్వర్ అని చెప్పుచుందురు. ఒక యంత్రము యొక్క శక్తి పది హార్స్ పవర్ ఉండగా, దానికంటే

పెద్ద యంత్రము యొక్క శక్తి వంద హార్స్వవర్ వరకు ఉండవచ్చును. ఈ విధముగా ఆయా యంత్రములనుబట్టి

వాటివాటి శక్తి ఉన్నట్లు, ఆయా మంత్రములనుబట్టి వాటివాటి శక్తి ఉండును.


ఇప్పటికాలములో స్థూలయంత్రశక్తిని గుర్రపుశక్తిగా (హార్స్పవర్గా) చెప్పినట్లు, పూర్వకాలములో స్థూలశక్తిని

“శస్త్రశక్తియని” చెప్పెడివారు. అలాగే సూక్ష్మమైన మంత్రశక్తిని “అస్త్రశక్తియని” చెప్పెడివారు. పూర్వము యుద్ధ

రంగములలో మాత్రమే అస్త్ర, శస్త్రముల ప్రస్తావన వచ్చెడిది. శత్రువులు ఉపయోగించు స్థూలశక్తిని శస్త్రము అని,

సూక్ష్మశక్తిని అస్త్రము అనెడివారు. పూర్వము యంత్రముల బలమును తక్కువగా, మంత్రముల బలమును ఎక్కువగా

ఉపయోగించెడివారు. నేడు యంత్రబలము తప్ప, మంత్రబలము అంటే ఏమిటో ఎవరికీ తెలియకుండా పోయినది.

పూర్వము యంత్రమును ఉపయోగించువానిని “యాంత్రికుడు” అనెడివారు. అలాగే ఒక మంత్రమును ఉపయోగించు

వానిని “మాంత్రికుడు” అని అనెడివారు. పూర్వము కొన్నిచోట్ల యంత్ర బలము యొక్క అవసరముండగా, అక్కడ

మంత్రబలము యొక్క అవసరము ఏమాత్రము లేకుండెను. అలాగే కొన్ని చోట్ల పూర్తిగా మంత్రబలము యొక్క


అవసరము కూడా ఉండెడిది. యంత్రబలమూ, మంత్రబలమూ రెండూకాక, రెండిటికంటే పెద్దది, బలమైనది దైవబలము

లేక ఆత్మబలము అను మూడవశక్తి కూడా ఒకటున్నది. ఆత్మబలమును పొందినవారు చాలా అరుదుగా ఉందురు.

యాంత్రికులు, మాంత్రికులు ఉన్నట్లే ఆత్మశక్తిగల “తాంత్రికులు” కూడ పూర్వము ఉండెడివారు. ఇప్పటి కాలములో

మాంత్రికులే లేకుండా పోయినపుడు, తాంత్రికులు కనిపించడము చాలా అరుదుగా ఉండును. ఆధ్యాత్మిక విద్యలో

ఆత్మను “తా” అను అక్షరముగా, జీవాత్మను “త” అను అక్షరముగా, పరమాత్మను “గు” అను అక్షరముగా చెప్పుకోవడము

జరుగుచున్నది. ఆత్మకు గుర్తుగా దీర్గముగల “తా” ఉండుటవలన ఆత్మబలము గల వానిని తాంత్రికుడు అనెడివారు.

నేడు భూమిమీద తాంత్రికులు కరువైపోయారు.



ఒక యంత్రమును మంత్రముచేత పని చేయకుండా ఆపివేయ వచ్చును. అలాగే ఒక మంత్రమును తాంత్రికము

చేత పనిచేయకుండా ఆపివేయవచ్చును. దీనినిబట్టి ఒకయంత్రముకంటే మంత్రము గొప్పదనీ, ఒక మంత్రముకంటే

తాంత్రికము గొప్పదనీ తెలియుచున్నది. అయితే నేటికాలములో యంత్రశక్తి పెరిగిపోయి, మంత్రశక్తి అంటే ఏమిటో

తెలియకుండాపోయినది. పూర్వము ఒకప్పుడు ఎంతో పేరు పొందినది మంత్రశక్తి. మంత్రబలము గొప్పదని తెలిసినవారు

మంత్రములను గురించి హేళనగా మాట్లాడేవారు కాదు. మంత్రబలమున్న వారిని చూస్తే గౌరవముగా పలకరించెడివారు.

అయితే నేడు మంత్రములను గురించిగానీ, మంత్ర బలమును గురించిగానీ తెలిసినవారు లేకుండ పోయారు. మంత్రమును

గురించి తెలియకపోవడము వలన మంత్రములను గురించి హేళనగా మాట్లాడువారు తయారయ్యారు. అటువంటి

పరిస్థితిలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అని మంత్రమును గురించి అగౌరవముగా మాట్లాడడము

జరుగుచున్నది. పూర్వము మంత్రాలకు చింతకాయలేకాదు తలకాయలు కూడా రాలేటివి. కానీ నేటికాలములో

మంత్రాలే తెలియకుండా పోయినదానివలన ఎవరేమి మాట్లాడినా చెల్లుబాటు అవుతూవుంది. ఇప్పటి కాలములో

కూడా ఎక్కడో ఒకచోట మాకు మంత్రములు తెలుసుననీ, మాకు మంత్ర విద్యలు వచ్చుననీ, మాకు మంత్రశక్తి ఉన్నదనీ

చెప్పుకొనువారు కలరు. వాస్తవానికి వారికి మంత్రములు అంటే ఏమిటో తెలియదు. అయినా బయట మనుషులలో

గౌరవింపబడుటకు, మంత్రములున్నాయను సాకుతో డబ్బులు సంపాదించుకొనుటకు, ఇతరులను భయపెట్టుటకు

విధముగా చెప్పుచుందురు. అటువంటి వారి మోసములను చూచిన విజ్ఞానులు కొందరు మంత్రములంటేనే మోసమనీ,

అసత్యమనీ అనుకోవడము జరుగుచున్నది. మంత్రముల సాకుతో కొందరు మోసగించినంతమాత్రమున మంత్రములు

అసత్యము కాదు. యంత్రములకు అలవాటుపడిన మనిషి మంత్రములను గురించి తెలుసుకోకుండా పోవడము

దురదృష్టమని చెప్పవచ్చును. ఇక్కడ ఒక సూత్రమును మనిషి జ్ఞప్తికిపెట్టుకోవలెను. తనకు తెలిసినది సత్యము,

తెలియనిది అసత్యము అనడము మంచిది కాదు. ఒక విషయము తెలిసిన తర్వాత సత్యమైనప్పుడు అదే విషయము

తెలియనప్పుడు కూడా సత్యముగానే ఉండును. పూర్వము మంత్రము అందరికి తెలిసిన సత్యము. ప్రస్తుత కాలములో

కొందరికి తెలియకుండా పోయినంతమాత్రమున సత్యము అసత్యముగా మారునా? అలా ఎప్పటికీ మారదు.

మంత్రమునకున్న సత్యము ఎప్పటికీ సత్యముగా ఉండును. పూర్వము మంత్రమునకున్న సత్యమేమిటో, శాస్త్రబద్దత

ఏమిటో మాకు తెలుసు కావున మంత్రమును గురించి చెప్పగలుగుచున్నాను.



యంత్రము స్థూలమైనది, దాని పని మరియు ఫలితము స్థూలమైనది గా ఉండును. ఇక మంత్రవిషయమునకు

వస్తే మంత్రము శబ్ద రూపమైనందున, అది బయటికి తెలియుచుండినా దాని పనితనమూ, అలాగే దాని ఫలితమూ

సూక్ష్మముగా కంటికి కనిపించని విధముగా ఉండును. మంత్రము అనగా మహిమకలది లేక శక్తికలది అని చెప్పుకోవచ్చును.



ఒక్కొక్క శబ్దమును ఒక్కొక్క మంత్రముగా చెప్పవచ్చును. అలాగే కొన్ని శబ్దముల కలయికను కూడా మంత్రముగా

చెప్పవచ్చును. వివిధ తేడాలు గల శబ్దము యొక్క సమ్మేళనములను వివిధ మంత్రములుగా చెప్పవచ్చును. ఈ

సూత్రము ప్రకారము ప్రతిమాటను ఒక మంత్రముగా లెక్కించవచ్చును. అందువలన పూర్వము అనుభవగ్నులైన

పెద్దలు “భూమిమీద ఔషధముకాని ఆకూలేదు, మంత్రముకానీ మాటలేదు" అని అనెడివారు. దీనిప్రకారము మంత్రములు

ఏ భాషలోనున్నా ఆ శబ్దమునుబట్టి ఆ మంత్రమునకు శక్తి ఉండునని తెలియవలెను. మంత్రమును గురించి వివరముగా

తెలియుటకు, ఉదాహరణగా ఒక యంత్రమును పోల్చి వివరిస్తాను బాగా అర్థము చేసుకోండి. కొన్ని పరికరములను

జతచేస్తే ఒక యంత్రము తయారైనట్లు, కొన్ని శబ్దములను జతచేస్తే ఒక మంత్ర మగును. జతచేసిన వేరువేరు

పరికరములనుబట్టి వేరువేరు యంత్రములు తయారైనట్లు, జత కూర్చబడిన వేరువేరు శబ్దములను బట్టి వేరువేరు

మంత్రములు తయారగును. ఉదాహరణకు జతచేయబడిన పరికరములను బట్టి ఒక బస్సు తయారైనదనుకొనుము.

బస్సు తయారైనంతమాత్రమున అది రోడ్డు మీద పరిగెత్తదు. అది రోడ్డుమీద ప్రయాణమునకు ఉపయోగ పడాలంటే

దానికి ఇంధనమైన డీజిల్ కావాలి, తర్వాత దానిని నడిపే డ్రైవర్కావాలి. కొందరు ప్రయాణికులు ఒక ఊరినుండి

మరియొక ఊరుకు ప్రయాణించాలంటే ఒకటి బస్సు, రెండు ఇందనము (నూనె), మూడు నడుపువాడు అవసరమగును.

బస్సు తయారైనట్లు జతచేయబడిన శబ్దములతో ఒక మంత్రము తయారైనదనుకొనుము. బస్సు నడుచుటకు ఇంధనము

ఎట్లు అవసరమో అట్లే మంత్రమునకు ఉచ్ఛాటన సిద్ధి అవసరము. ఉచ్ఛాటన అనగా జపించడమనీ, సిద్ధి అనగా

పనిచేయుటకు అన్ని విధముల సిద్ధముగా ఉన్నదని అర్థము. బస్సు, దానికి ఇంధనము ఉండినప్పటికీ బస్సును నడుపు

వ్యక్తి అవసరము అన్నట్లు, మంత్రము, మంత్రసిద్ధి ఉన్నప్పటికీ ఆ మంత్రమును ప్రయోగించు వ్యక్తి అవసరము.

బస్సును నడిపేవాడు డ్రైవర్ అన్నట్లు, మంత్రమును ఉపయోగించువాడు మాంత్రికుడు అగును. తయారు చేయబడిన

బస్సుకు ఇందనమును ఎవరైనా పోయ వచ్చును. ఇంధనము పోసిన వ్యక్తియే కాకుండా నడిపే విధానము తెలిసిన

ఎవడైనా డ్రైవర్గా బస్సును నడపవచ్చును. అయితే మంత్రము యొక్క విషయములో మంత్రమును ఎవరు

సిద్దింపజేసుకొనివుంటే వారే ఆ మంత్రమును ఉపయోగించాలి. ఇంధనమును పోసినవాడే బస్సును నడపాలి అనుట

మంత్రవిధానములో కలదు. బస్సు, ఇంధనము, డ్రైవర్ మూడు సరిగా ఉన్నపుడు ఫలితముగా ప్రయాణముసాగును.

అదే విధముగా తయారు చేయబడిన మంత్రము దేనికొరకు తయారు చేయబడినదో తెలిసి, దానిని సిద్ధి పొంది,

ఉపయోగించు మాంత్రికుడుంటే ఆ మంత్రము యొక్క ఫలితమును పొందవచ్చును. మాంత్రికుడుండి మంత్రసిద్ధి

లేకున్నా, మంత్రముండి మాంత్రికుడు లేకున్నా ఏమీ ప్రయోజనముండదు.


ఇప్పుడు కొందరికి మంత్రసిద్ధి అంటే ఏమిటి? అను ప్రశ్న రాగలదు. దానికి సమాధానము ఈ విధముగా

కలదు. మొదట మంత్రమును తయారు చేయువాడు జరుగవలసిన పనిని దృష్ఠిలో ఉంచుకొని మంత్రమును తయారు

చేయడము జరుగును. ఒక యంత్రమును మొదట కనిపెట్టిన వాడు ఆ యంత్రమును సృష్టించినవాడగును. తర్వాత

ఆ యంత్రములను ఎవరు తయారు చేసినా వారు మొదటివాడు తయారు చేసిన నమూనాను అనుసరించే చేస్తాడు.

అందువలన ఆ యంత్రమునకు మొదట చేసినవాడు సృష్టికర్తకాగా, తర్వాత అతనిని అనుసరించి చేసిన వారందరూ ఆ

యంత్రమునకు కార్యకర్తలగుదురు. అదే విధముగా ఒక మంత్రమును ఒక పని నిమిత్తము శబ్దములను కూర్చి

తయారు చేసినవాడు ఆ మంత్రము నకు సృష్టికర్తకాగా, అదే మంత్రమును ఎందరు సిద్ధింప చేసుకొనినా వారందరు

మాంత్రికులగుదురు. మొదట ఒక యంత్రమును కనిపెట్టినవాడు ఆ యంత్రమునకు సంబంధించిన పూర్తి


విషయమునంతటిని ఒక సమాచారముగా (మాన్యువల్గా) తయారు చేసి ఇచ్చును. తర్వాత ఎందరు యాంత్రికులు

వచ్చినా మాన్యువల్ ప్రకారమే యంత్రమును నడుపుదురు. అలాగే మొదట మంత్రము తయారైన తర్వాత ఎందరు

మాంత్రికులు వచ్చినా మొదట తయారు చేసినవాడు చెప్పిన నియమ నిబంధన ప్రకారమే ఆ మంత్రమును సిద్ధి

చేసుకోవడముగానీ, ఉపయోగించడముగానీ జరుగును. మొదట మంత్రమును తయారు చేసినవాడు ఆ మంత్రములో

కూర్చబడిన శబ్దముల సంఖ్యనుబట్టి, తర్వాత ఆ మంత్రము దేనికొరకు తయారు చేయబడిందో ఆ పనియొక్క సాంధ్రతను

బట్టి, ఆ మంత్రమునకు అవసరమగు శక్తినిబట్టి, మంత్రమును ఎన్నిమార్లు ఏకదాటిగా జపిస్తే సరిపోతుందో లెక్కగట్టి,

ఆ మంత్రమును ఉపయోగించు మాంత్రికులు ఆచరించవలసిన నియమ నిబంధనలన్నీ చెప్పుదురు. ఉదాహరణకు ఒక

మంత్రమును సిద్ధిచేసుకొనుటకు అమావాస్య పోయిన తర్వాత వచ్చు బుధవారము, ఆకుపచ్చ వస్త్రము ధరించి, ఉ

త్తరముఖముగా కూర్చొని, పూజాద్రవ్యములైన కొబ్బరికాయ, పసుపు కుంకుమలతో కలశము ఏర్పరుచుకొని, ఆ కలశమునకు

తమలపాకులు కాకుండా మోదుగ ఆకులను ఉంచి, మంత్రమును ఏకదాటిగా పదివేలమార్లు జపిస్తే ఆ మంత్రము సిద్ది

అగును. తర్వాత ఆ మంత్రము ఏ పనికొరకు తయారు చేయబడినదో ఆ పనియొక్క అవసరము వచ్చినపుడు మంత్రమును

పదకొండుమార్లు జపించితే ఆ పని నెరవేరునని ఉండును. దానిప్రకారము చేసినపుడు ఆ మంత్రము సిద్ధింపబడును.

ఎవడైతే మంత్రమునకున్న నియమముల ప్రకారము చేయునో వానికి ఆ మంత్రము వశమైపోవును. దానినే సిద్ధి

అందురు. సిద్ధి పొందిన తర్వాత ఆ మంత్రము కొరకు కొన్ని నిబంధనలను ఆచరించ వలసివుండును. అమావాస్య

రోజున అద్దము చూచుకోకూడదు. అన్నము తిన్నప్పుడు రుచిగా ఉందా అని ఎవరైనా అడిగితే అక్కడ రుచి అను

పదము వినబడుట వలన అన్నమును వదిలివేయవలెను. అట్లు వదలకుండా తింటే మంత్రబలము అతనినుండి

వదలిపోవును. అలాగే అమావాస్య రోజున అద్దములో తన ఆకారమును చూచుకొనినా ఆ మంత్ర శక్తి పోవును.

ఇటువంటి నియమ నిబంధనలు ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క రకముగా ఉండును. ఒకమారు సిద్ధిపొందిన తర్వాత

నియమ నిబంధనలను సక్రమముగా ఆచరిస్తే, ఎంతకాలమైనా మాంత్రికునిలో మంత్ర బలము వుండును. ఎప్పుడయితే

నియమములను పాటించకపోతే మంత్ర బలము పోవును. పోయిన మంత్రబలమును తిరిగి పొందాలంటే మొదటివలె

ఆ మంత్రమును పద్ధతి ప్రకారము జపించి సిద్ధి పొందవలసియుండును.


ఒకమారు పూజలో కూర్చొని పైకి లేవకుండా, మంత్రజపమును ఆపకుండా, ఎంత సంఖ్య జపించవలసివుండునో

అంత సంఖ్యను జపించితే, మంత్రము సిద్ధించును, సిద్ధించిన మంత్రము యొక్క బలము సిద్దిపొందిన వాని శరీరములో

నిలిచిపోవును. అలా నిలిచిపోయిన మంత్రబలము ఆ మంత్రమును కొన్నిమార్లు పఠించితే అప్పుడు మంత్రబలము

మాంత్రికుని సంకల్పము ప్రకారము ఉపయోగపడును. కొందరు మాంత్రికులు ఒక మంత్రమును సిద్ధిపొంది తర్వాత

కొద్ది నెలలకే ఆ సిద్ధిని కోల్పోవడము కూడా జరుగుచుండును. అటువంటివారు రెండవమారు ప్రయత్నించి సిద్ధి

పొందడము కూడా జరుగుచుండును. పూర్వము మంత్రముల విధానమును తెలిసినవారు మనుషులకొరకు మంత్రములను

తయారుచేసి ఇచ్చారు. మంత్రములను సృష్టించు స్థోమతగలవారు మంత్రములను సిద్ది పొందరు. వాటిని వాడుకోవలెనని

అనుకోరు. మంత్రములను తయారు చేయు స్థోమత గలవాడు మంత్రబలమును కోరుకోక, ఆత్మబలమును నేర్చి

తాంత్రికుడు అగుటకు ప్రయత్నించును. ఆత్మజ్ఞానము తెలిసినవారు కొందరు మాత్రము మంత్రమును తయారుచేసి,

వాటికుండవలసిన నియమనిబంధనలను ఏర్పరుచుదురు. ఆత్మబలము (దైవబలము) లేనివాడు ఎవడుగానీ మంత్రమును

తయారు చేయలేడు.


మంత్రమంటే ఏమిటో, అది ఎలా ఉండవలెనో, దానికెంత శక్తి ఉండునో దైవబలమున్నవానికే బాగా తెలియును.

దైవబలము (ఆత్మబలము) ఉన్నవాడు మంత్రబలమును తయారు చేయగలడు. అట్లుకాకుండా మంత్రగాడు మంత్రమును

తయారుచేయలేడు. తయారు చేయబడిన మంత్రమునుండి లాభము పొందువాడు మంత్రగాడు. మంత్రమును

శాసించునది ఆత్మజ్ఞానము. అందువలన ఆత్మజ్ఞానమున్నవాడు మాత్రమే మంత్రమును శాశించి తయారుచేయగలడు.

ఆత్మజ్ఞానుల చేత తయారు చేయబడిన మంత్రశక్తి ఆత్మజ్ఞానమునకు లోబడియుండునని బయటికి తెలియుటకు ఆత్మజ్ఞానులు

మంత్రములను తయారు చేయడము జరిగినది. మంత్రశక్తి ఆత్మశక్తి చేత తయారైనది. కావున ఏ మంత్రశక్తులు

కూడా దైవజ్ఞానము ఉన్నవారిని ఏమి చేయలేవు. ఆత్మజ్ఞానము ఉన్నవారిని చూస్తే మంత్రశక్తులు భయపడును. అందువలన

ఏ మంత్ర ప్రయోగము తమ ప్రభావమును జ్ఞానుల మీద చూపలేవు.


మంత్రశక్తికీ యంత్రశక్తికీ ఎంతో తేడా కలదు. యంత్రశక్తి జీవము లేనిది, మంత్రశక్తి జీవముకలది. మంత్రశక్తికి

జీవమున్నదనుమాట కొందరికి ఆశ్చర్యముగా ఉండినా అది పూర్తి సత్యము. రాతితో తయారు చేయబడిన ప్రతిమలో

కూడా జీవము చేరుచున్నది. అట్లే మంత్రము సిద్ధించినపుడు కూడా దానికి జీవము వస్తున్నది. రాయితో తయారుకాబడిన

ప్రతిమ ప్రతిష్ఠించబడిన సమయములో దానియందు జీవము చేరినట్లు, తయారు కాబడిన మంత్రము సిద్ధికాబడినపుడు

దానికి జీవము వస్తున్నది. అప్పుడు మంత్రము శక్తివంతమగుచున్నది. ఒక మంత్రములో ఎంత బలమున్న జీవుడు

చేరవలెనో, ఆ మంత్రములోనున్న శబ్దమునుబట్టి మరియు ఆ మంత్రమును ఉచ్ఛాటన చేయు సంఖ్యనుబట్టి వుండును.

ఒక మంత్రమును సిద్ధి చేయబడిన దినమున అది జీవము పొందునని చెప్పుకొన్నాము కదా! అదే మంత్రమును

ఎందరు సిద్ది చేసుకొనినా, ఆ మంత్రము వేరువేరు జీవములపొందినదై వేరువేరు శక్తులుగా వారియందుండిపోవును.

ఒక మంత్రమును ఒక మాంత్రికుడు సిద్ధి చేసుకొన్నప్పుడు అతనికి ఆ మంత్రశక్తి దాని నియమముల ప్రకారము ఎలా

ఉపయోగపడుచున్నదో, అలాగే ఆ మంత్రమును ఎందరు సిద్ధి పొందినా అందరికీ ఒకే విధముగా ఉపయోగ పడును.

ఉదాహరణకు పాము విషమును హరించు మంత్రమును ఒకడు సిద్ధి పొంది దాని ద్వారా పాముకాటుకు గురియైన

వారిని తన మంత్రముతో కాపాడుచుండెను. మొదట పాము విషమును హరించు మంత్రమును పొందిన వ్యక్తి అదే

మంత్రమును పదిమందికి దాని నియమ నిబంధనతో సహా చెప్పాడనుకొనుము. అప్పుడు ఆ పదిమంది ఆ మంత్రము

యొక్క నియమముల ప్రకారము దానిని సిద్ధింపజేసుకొని వారు కూడా పాము కాటుకు వైద్యమును చేయవచ్చును. ఒకే

మంత్రమును ఎందరైనా సాధించుకోవచ్చును. ఎందరు సిద్ధి పొందితే అన్ని సజీవమంత్రశక్తులుగా ఒకే శబ్దముగల

మంత్రము తయారు కాగలదు, అందరికీ ఉపయోగపడగలదు.


ఖగోళములో కోటానుకోట్ల జీవరాసులు గ్రహముల రూపములలో, ఉపగ్రహముల రూపములో, భూతములు,

ఉపభూతముల రూపములో ఉన్నవని చెప్పుకొన్నాము. వాటిలో కొన్నిటికి స్థూల ఆకారములుండగా, కొన్ని సూక్ష్మాకారముతోనే

ఉన్నవి. సూక్ష్మాకారములోనున్న పెద్ద గ్రహములు గానీ, ఉపగ్రహములుగానీ భూమిమీద తయారు చేయబడిన మంత్రబలము

నకు సమానమైన బలముగలవి ఉండును. ఒక మంత్రము తయారు చేయబడి అది మనిషి చేత సిద్ధిపొందినపుడు ఆ

మంత్రమునకు సరిపడు స్థోమతగల జీవమున్న గ్రహముగానీ, ఉపగ్రహముగానీ మంత్ర ఉచ్ఛాటన జరిగిన స్థలమునకు

ఆకర్షింపబడును. అప్పుడు అక్కడికి వచ్చిన గ్రహము మంత్రశక్తిగా మాంత్రికునియందు చేరిపోవును. ఈ విధముగా

ఒక మంత్రమునకు తగిన గ్రహశక్తి తోడై అది మంత్రశక్తిగా మంత్రగానియందు నిలిచిపోవును. ఈ విధముగా అనేక


రకముల మంత్రములకు మంత్రసిద్ధి సమయములో జీవమున్న గ్రహశక్తులు తోడై ఆయామంత్రశక్తులుగా పిలువబడుచున్నవి.

అలా వచ్చిన సూక్ష్మమైన మంత్రశక్తులు మనిషి బలము కంటే ఎన్నో రెట్లు పెద్దవైనప్పటికీ, మంత్రసిద్ధి పొందిన వ్యక్తి

ఆధీనములోనే ఉండి, సమయమొచ్చినపుడు మాంత్రికుడు తలచుకొనినప్పుడు అతని సంకల్పమును అనుసరించి పని

చేయును.


ప్రతి మంత్రమునకు సిద్ధికొరకు కొన్ని నియమములుండగా, మంత్రము సిద్ధించిన తర్వాత కొన్ని

నియమములుండును. సిద్ధికొరకు నియమము ప్రకారము ఆచరించి మంత్ర సిద్ధిపొందిన తర్వాత వశము కాబడిన

గ్రహము మాంత్రికుని ఆధీనములో ఉండి పనిచేయుటకు కొన్ని నియమములుండును. అందువలన ప్రతి మంత్రమునకు

సిద్ధికంటే ముందు, సిద్ది తర్వాత రెండు రకముల నియమములుండట సహజమే. మొదటి నియమముల ప్రకారము

ఆచరించకపోతే మంత్రము సిద్ధికాదు, దానికి శక్తిరాదు. ఒకవేళ మొదట నియమములను ఖచ్చితముగా ఆచరించి

మంత్రిసిద్ధి పొందినా, రెండవ నియమముల ప్రకారముండకపోతే వశమైన మంత్రశక్తి మాంత్రికుని ఆధీనము నుండి

వదలిపోవును. అందువలన ఒక మాంత్రికుడు ఎంతో శుచి శుభ్రతగలవాడై, మంత్రముయొక్క నియమము లను

ఆచరించినప్పుడే, ఏ మంత్రమైనా మనిషి ఆధీనములో ఉండును. కొన్ని మంత్రములకు వశమగు గ్రహశక్తులు

కఠినమైవుండును, కొన్ని మాత్రము సౌమ్యముగా ఉండును. అందువలన మంత్రములను కూడా రెండు రకములుగా

విభజించి క్షుద్ర మంత్రములనీ, సౌమ్యమంత్రములనీ చెప్పడము జరిగినది. కఠినమైన వ్యవహారముండు గ్రహములు

మంత్రసిద్ధి సమయములలో మనిషికి వశమైనా అతనినుండి తప్పించుకొని పోవుటకు కాచుకొనివుండును. ఎప్పుడైతే

మాంత్రికుడు నియమములను పాటించలేదో అప్పుడు ఆ సాకుతో గ్రహశక్తులు అతనినుండి వెళ్ళిపోవును. అలా

వెళ్ళిపోవునపుడు ఆ మాంత్రికుడు తిరిగి మంత్రిసిద్ధి పొంది తమను వశపరుచుకోకుండునట్లు అతని శరీరములో

అవయవలోపమేర్పరచిగానీ, లేక అతనిని పూర్తి చంపివేసిగానీ పోవుదురు. ఇటువంటి గ్రహశక్తులచేత చాలామంది

మాంత్రికులు తమ అవయవములను కోల్పోయి కుంటి, గ్రుడ్డివారుగా మారుటగానీ, లేక ప్రాణములను కోల్పోవుటగానీ

జరిగినది.


కొన్ని మంత్రములను మొదట సిద్ధిపొందుటకు చేయు ప్రయత్నము లోనే నియమములను సరిగా

పాటించకపోయినా, మత్తుపాణీయములను త్రాగి మంత్రపఠనము చేసినా, కొన్ని గ్రహశక్తులు ఆగ్రహంకలవై మాంత్రికుని

ఏకంగా చంపివేసిన సంఘటనలు కూడా కలవు. క్షుద్ర మంత్రములను సిద్ధి పొందుటకు చేయు ప్రయత్నములో

కొందరు మాంత్రికులు రక్తమును కక్కి చనిపోయినవారు కూడా కలరు. కొందరైతే కోమాలోనికి (అపస్మారక స్థితిలోనికి)

పోయి తర్వాత బయట జ్ఞప్తిలోనికి రాకుండా రెండు లేక మూడు రోజులకు చనిపోయిన వారు కలరు. ఇదంతయు

చూచిన తర్వాత మంత్రము, మంత్రశక్తి అంటే ఏమిటో తెలియక హేళనగా మాట్లాడడము మంచిదికాదని అర్థమగుచున్నది.

కొందరు చదువుకొన్నవారు విజ్ఞాన శాస్త్రమును కొంత తెలిసినవారై, మంత్రము దానికి మహిమ అనుమాట అసత్యమనీ,

మంత్రమును ఎవరైనా నిరూపించగలరా? అని ప్రశ్నించు చుందురు. అయితే విజ్ఞానమునకు అందని ఎన్నో విషయములు

భూమిమీద ఉన్నవని వారికి తెలియదు.


పూర్వకాలము కలియుగముకంటే ముందు ద్వాపరయుగ చివరి వరకు మంత్రములకు మంచిపట్టు ఉండెడిది.

ఆకాలములో మనిషి నేర్చుకొను విద్యలలో మంత్రవిద్య చాలా ముఖ్యమైనది. అందువలన అప్పటి కాలములో మంత్రమంటే


ఏమిటో, మంత్రశక్తి అంటే ఏమిటో తెలియని వారు లేనేలేరు. ఆ కాలములో యంత్రబలము లేదు, అంతా మంత్రబలమే

ఉండెడిది. నేడు వేగముగా ఆకాశములో ప్రయాణించు విమానము యంత్రముగా ఉండగా, త్రేతాయుగములో రావణబ్రహ్మ

ఉపయోగించిన విమానము మంత్రబలముతోనే ఇప్పటి విమానముకంటే వేగముగ నడిచేదని ఎవరికీ తెలియదు. కాలము

గడచిపోగా మంత్రబలము పోయి యంత్ర బలము అభివృద్ధికావడము వలన, ఇప్పటికాలములో యంత్రములు తప్ప

మంత్రములు తెలియకుండా పోయినవి. తెలియకుండా పోవడమే కాకుండా మంత్రమనునదే అసత్యమని మనిషి

అంటున్నాడు. గడచిపోయిన యుగముల కాలములో మంత్రముల వలన జరిగిన పనులకు వివరణ తెలియని మనిషి

తనకు తెలిసినదే విజ్ఞానమనుకోవడము పొరపాటు కాదా!


ఈనాడు యంత్రశక్తిని అశ్వశక్తిగా (హార్స్వవర్గా) లెక్కించు చున్నాము. ఆనాడు మంత్రశక్తిని అస్త్రశక్తిగా

లెక్కించెడివారు. స్థూలముగా కనిపించు యంత్రము యొక్క శక్తిని అశ్వశక్తిగా చెప్పుకొను మనము, సూక్ష్మముగానున్న

మంత్రశక్తిని అస్త్రశక్తిగా మన పెద్దలు ఎలా చెప్పారో తెలియలేకపోవడమే కాకుండా, వారికంటే మనము తెలివైనవారమను

కోవడము పొరపాటు కాదా! సూక్ష్మభావములను బుద్ధి యోచిస్తుందనీ, స్థూల భావములను బుద్ధి ఆలోచిస్తుందనీ,

ఆలోచనలకు యోచనలకు ఎంతో తేడావున్నదనీ మనము ప్రారంభములోనే చెప్పుకొన్నాము. నేటి కాలములోని మనుషుల

బుద్ధి ఆలోచనలకే పరిమితమైపోయినది. అందరికీ అర్థమయ్యే టట్లు చెప్పాలంటే ఆలోచనలు శరీరము యొక్క బయటి

చూపును కలుగ జేయునవనీ, యోచనలంటే శరీరాంతర్గత దృష్టిని కలుగజేయునవని చెప్పవచ్చును. అందువలన

శరీరము యొక్క గీతను దాటకుండా లోపలి యోచనల దృష్ఠి కల్గిన యోగులు, జ్ఞానులు మంత్రములను వాటి శక్తిని

నేటికినీ గ్రహించగలరు.


ఇప్పటికి ఐదువేల మూడువందల (5300) సంవత్సరముల వెనుకకు వెళ్ళితే ద్వాపరయుగముయొక్క చివరి

కాలములో కౌరవులకు, పాండవులకు జరిగిన భారతయుద్ధమునందు అస్త్రబలము ఉపయోగపడినట్లు తెలియుచున్నది.

ఆ కాలములో మంత్రబలము కల్గిన ఎన్నో అస్త్రములు ఉండెడివి. అన్ని అస్త్రముల వివరములు, పేర్లు మనకు

తెలియకున్నా ముఖ్యమైన కొన్ని పేర్లు మాత్రము తెలుసు. నాకు తెలిసిన వాటిలో ఒకటి బ్రహ్మాస్త్రము, రెండు నాగాస్త్రము,

మూడు పాసుపతాస్త్రము, నాలుగు శబ్ధ భేదనాస్త్రము, ఐదు వరుణాస్త్రము, ఆరు అగ్ని అస్త్రము మొదలగునవి ఉండేవి.

ఇవే కాకుండా ఎన్నో రకముల అస్త్రములు ఉండేవి. అస్త్రములన్నీ మంత్రబలముతో కూడుకొనివున్నవేనని చెప్పుకొన్నాము.

ఆనాటి అస్త్రము లను బుద్ధి బలముగలవారే సాధించెడివారు. వాటిని గురించి బోధించుటకు గురువులు కూడా

ఉండెడివారు. భారతయుద్ధములో అస్త్రబలము కాకుండ తన భుజబలముతోనే ధుర్యోధనుడు యుద్ధము చేసినట్లుండగా,

అదే యుద్ధములో కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు అస్త్రముల బలమును ఉపయోగించి నట్లు తెలియుచున్నది. ఒక్క

అస్త్రము ఎంతో బలముకల్గి కొన్ని వేలమందిని ఒక్కమారుగా సంహరించేది. ఆనాడు యుద్ధములలో సైన్యబలమును

చూచి భయపడేవారు కాదు. ఎదుట శత్రువు వద్ద అస్త్రములున్నాయని తెలిస్తే వారితో యుద్ధము చేయుటకు భయపడెడి

వారు.


గత ద్వాపరయుగములో మంత్రబలమున్న అస్త్రములతో భయంకర యుద్ధము జరిగినది. అంతటి మంత్రశక్తులు

కల్గిన దేశము ఒక్క భారత దేశము తప్ప ఏ దేశములేదని చెప్పవచ్చును. ప్రపంచ దేశములన్నిటికీ భారతదేశము గొప్ప

శక్తికల్గిన దేశమని తెలుసు. ఇతర దేశములలో మంత్రబలమును గురించి సంపూర్ణముగా తెలిసిన ఆత్మజ్ఞానులు లేక


పోవుట వలన వారికి అస్త్రములను గురించి తెలియకుండా పోయినది. భారత దేశముతో సమాన బలమును

పొందుటకు ఇతర దేశములవారు యంత్ర బలమును అభివృద్ధి చేసుకొన్నారు. అలా వారు చేసిన ప్రయత్న కారణముగా

నేడు అస్త్రముల బదులు అనేక రకముల బాంబులు తయారైనవి. ద్వాపర యుగము తర్వాత భారతదేశములో కూడా

మంత్రబలము తగ్గి పోయింది. నేడు భారతదేశము తన అస్త్రబలమును కోల్పోయి చివరకు యంత్రబలమైన బాంబుల

బలమును పెంచుకొన్నది. ఒకప్పుడు మంత్రశక్తికి పుట్టినిల్లయిన భారతదేశములో నేడు మంత్రబలమంటే ఏమిటో

తెలియకుండా పోయినది. గత చరిత్ర తెలియని నేటి భారతీయులు మంత్రములను గురించి హేళనగా మాట్లాడు

స్థితికి వచ్చారు.


పూర్వము కొన్ని రోగములకు ఆకుల ఔషధములున్నా, కొన్ని రోగములకు ఔషధములుండేటివికావు. మందులులేని

రోగములకు మంత్రములను ఉపయోగించి నయము చేయు ప్రక్రియ ఉండెడిది. రోగములతో పాటు దయ్యాలు,

దేవతలు కనిపించకుండా శరీరములో నివాసము ఏర్పరచుకొని రోగములవలె బాధించుటకూడా అనాడు ఉండెడిది.

అనాడేకాక అటువంటి బాధలు నేడు కూడా ఎందరినో రోగమువలె బాధించుచున్నవి. అటువంటి బాధలు రోగములుకావనీ,

ఆ బాధలు ఔషధములకు నివారణకావని చాలామందికి తెలియదు. గ్రహల, దేవతల బాధలున్నవారు ఆ బాధలను

రోగములుగా భ్రమించి వైద్యమునకు లక్షలు ఖర్చుచేసినా, అవిపోక వారికున్న బాధలు నయముకానివారు ఎందరో

ఉన్నారు. అటువంటి వారికి ఔషధము లేకుండా మంత్రబలమును ఉపయోగించి చికిత్స చేస్తే వారి బాధలు

నివారించవచ్చును. అయితే రోగములు ఫలానావని తెలియని స్థితి మనుషులకున్నది. ఒకవేళ తెలిసినా వాటి నివారణకు

ఏ మంత్రముపయోగపడునో తెలియకుండాపోయినది. ఒకవేళ ఫలానా మంత్రము వలన ఆ రోగము పోవునని

తెలిసినా ఆ మంత్రమునే తెలిసినవారు ఎవరూ ఉండరు. ఈ కాలములో కూడా మంత్రములను నమ్మడమేమిటని,

హేళన చేయువారుండుట వలన కొందరు గ్రహముల, దేవతల బాధలతోనే మరణించడము కూడా జరుగుచున్నది. ఈ

కాలములో మంత్రబలము లేనిదానివలన, గ్రహ మరియు దేవతల బాధలున్నవారు చివరకు నివారణ లేక

మరణించవలసినదేనా అని అడుగ వచ్చును. దానికి జవాబుగా ఒకమాటను చెప్పవచ్చును. మంత్రములు లేని మాట

వాస్తవమే అయినా గ్రహాల, దేవతల బాధలనుండి విముక్తి పొందుటకు ఒకే ఒక దారికలదు. అదియే దైవజ్ఞానము.

దైవజ్ఞానమును తెలియుట వలన గ్రహములుగానీ, దేవతలుగానీ వదలిపోక తప్పదు. మంత్ర బలముకంటే జ్ఞానబలము

గొప్పది. మంత్రబలము కూడా జ్ఞానులనుండి పుట్టునదే. ప్రస్తుతానికి రోగమునకు తగిన మంత్రము లేనందున,

మంత్రమున కంటే మించిన దైవజ్ఞానమును తలకు ఎక్కించుకొని శరీరములోనికి జీర్ణింపచేసుకొంటే అటువంటివానికి

గ్రహాల, దేవతల బాధలు లేకుండా పోవును.


ఇప్పుడు కొందరు ఒక ప్రశ్న అడుగుటకు అవకాశము కలదు. అదేమనగా! పూర్వము గ్రహాలబాధలను,

దేవతలబాధలను లేకుండ చేయుటకు మంత్రబలమును ఉపయోగించెడివారని మీరు చెప్పుచున్నారు కదా! అటువంటపుడు

గ్రహములు రోగములరూపములో వ్యక్తిని బాధించకుండ మంత్రములను ఉపయోగించి వాటిని లేకుండా చేయగలిగి

నపుడు, అటువంటి మంత్రములను ఉపయోగించి గ్రహబాధలు లేనివారికి కూడా రోగముల రూపముగానున్న గ్రహబాధలను

కలిగించవచ్చును కదా! మంత్రబలముతో కొన్ని బాధలను నివారించగలిగినపుడు, అదే మంత్రబలముతోనే కొన్ని

బాధలను కల్గించుటకు అవకాశము కలదు కదా! అని అడుగ వచ్చును. దానికి మా జవాబు ఇలా కలదు. పూర్వము


మాంత్రికులైన వారు కొన్ని గ్రహబాధలను తమ మంత్రబలముతో లేకుండా చేయగలుగు స్థోమతకలవారు, అదే విధానమును

అనుసరించి తమ మంత్రబలముచేత గ్రహములను ప్రేరేపించి కొందరిలో చేరునట్లు చేసి వారిని బాధించునట్లు

చేసెడివారు. కొందరు మాంత్రికులు మంచితనముగలవారై తమకు ఇష్టమైన వారికి మంత్రములకు తొలగు బాధలను

లేకుండా చేయగా, కొందరు మాంత్రికులు మాత్రము ఇతరులకు హానిచేయు చెడు బుద్ధిగలవారై, మంత్ర బలమును

ఉపయోగించి ఇతరులకు మంత్ర ప్రయోగము (బాణామతి, చిల్లంగి) చేసి, తమకు సరిపోనివారిని, తమకు శత్రువులుగా

ఉన్నవారిని బాధించెడివారు. దీనినిబట్టి పూర్వము మంత్రములను నేర్చిన మాంత్రికు లలో మంచి, చెడు రెండు

రకముల వారూ ఉండెడివారనీ, మంచి స్వభావమున్న వారు ఇతరులకు తమ మంత్రబలముతో మంచిచేయగా, చెడు

స్వభావమున్నవారు ఇతరులకు చెడును చేసెడివారు. ఇప్పటి కాలములో మంత్రబలమే లేకుండా పోయినది, కావున

మంత్రములతో మంచి చేసేవారూ లేరూ, చెడు చేసేవారూ లేరు.


ప్రస్తుతకాలములో మంత్రగాళ్ళే కరవైపోయారు. ఎక్కడా ఎవరూ కనిపించడము లేదు, అని మేము చెప్పిన

తర్వాత భూమిమీద మంత్రములు ఏమాత్రము లేవా? అని కొందరు ప్రశ్నించవచ్చును. దానికి మా జవాబు ఈ

విధముగా కలదు. ప్రతి ఆకు ఔషధమే, ప్రతి మాట మంత్రమే అని చెప్పిన పెద్దలమాట ప్రకారము, ప్రపంచమున్నంత

వరకు ఆకుల ఔషధములు ఉంటాయి. అలాగే మాటల మంత్రములు ఉంటాయి. అయితే అనుకొన్న పనులను

సాధించగలుగు బలముగల మంత్రములు లేవని చెప్పుచున్నాము. ఎన్నో విధమైన మాటలు ఎన్నో రకముల మంత్రములుగా

నేటికీ భూమిమీద ఉండినప్పటికీ, వాటిని సిద్ధింపజేసుకొనువారు లేరు. సిద్ధి లేకపోతే మంత్రమువున్నా నిరర్థకమే

అగును. భూమిమీద ఆకులన్నీ ఔషధములే అయినా వాటిని ఉపయోగించు విధానము తెలియకపోవడము వలన

ఔషధములన్నీ వ్యర్థమే అయినట్లు, మాటలన్నీ మంత్రములే అయినా వాటిని మంత్రబలముగా మార్చు సిద్ధి

లేకుండాపోవడము వలన మంత్రములు వ్యర్థమైపోవుచున్నవి. ప్రతి రోగమును లేకుండా చేయు ఔషధములైన ఆకులు

భూమిమీద సమృద్ధిగా ఉండినప్పటికీ, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియనట్లు, మంత్రములైన మాటలు ఎన్నో

ఉండినప్పటికీ, వాటిని సిద్ధింపజేసుకొను విధానము నేటి మనిషికి తెలియకుండాపోయినది. మేము భూమిమీద

మంత్రములు లేవు అనడము లేదు. మంత్రముల బలము లేకుండా పోయినదని అంటున్నాము.


పూర్వము మంత్రబలములు ఎన్నో రకములుగా ఉండెడివి. వాటి బలము వలన ఎన్నో రకముల పనులు

జరుగుచుండెడివి. ఇప్పటి కాలములో కూడా ఎన్నో మంత్రములను మనము చూడగలుగుచున్నాము. ఇప్పటికీ

అప్పటికీ మంత్రము మంత్రమే అయినా, వాటి ఉపయోగము ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేడిది. పూర్వకాలములో

మంత్రములు ఎన్నో రకములుగా ఉపయోగపడినా, వాటి ఉపయోగమంతా ప్రపంచమునకు సంబంధించినదే గానీ,

పరమాత్మకు సంబంధించినది కాదు. ఇప్పటికాలములో కొందరు స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ

మాటల రూపములో నున్న లేక శబ్దరూపములోనున్న మంత్రములనే ఆధారము చేసుకొని తాము దైవ మార్గములో ఉ

న్నామని చెప్పుచుందురు. అయితే ఏ మంత్రముగానీ దైవము దగ్గరికి చేర్చలేదనీ, ఏ మంత్రము వలన దేవుడు

తెలియడనీ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటను అందరూ మరచిపోయారు. పూర్వముగానీ, నేడుగానీ మంత్రములు

ఎన్నివున్నా అవి అన్నియు ఉపయోగపడితే, ఆ ఉపయోగమంతా ఉప ప్రక్క) యోగమేగానీ యోగము ఏమాత్రము

కాదు. అందువలన మంచి జ్ఞానులైన పెద్దలు “మంత్రములన్నీ ప్రపంచ సంబంధ లాభమును ఇచ్చునవేగానీ, పరమాత్మ

సంబంధమైన మోక్షమును కల్గించునవి కావు” అని చెప్పారు.


విశ్వమును రెండు రకములుగా విభజించవచ్చును. ఒకటి స్థూలమూ, రెండు సూక్ష్మము అను రెండు భాగములుగా

విశ్వమున్నదని చెప్పవచ్చును. స్థూలభాగము అందరికి కనిపించుచున్నది. కంటికి కనిపించు సర్వజగత్తు స్థూలముకాగా,

కంటికి కనిపించని కోట్లాది మనుషులు, పశు పక్షి, క్రిమి కీటకాదులను సూక్ష్మములని చెప్పవచ్చును. అలాగే గ్రహములు,

ఉపగ్రహములు మొదలుకొని ఉపభూతములు, భూతములు, మహాభూతముల వరకు కోట్లాది సూక్ష్మ విశ్వమున్నదని

చెప్పవచ్చును. కంటికి కనిపించని వాటిలో తక్కువ స్థాయి గ్రహములు మొదలుకొని, కొంత స్థాయి వరకు బలమున్న

గ్రహముల వరకు మంత్రములను ఆశ్రయించి ఉందురు. మంత్రములలో చిన్న పెద్ద అనేక రకముల మంత్రములు

గలవు. మంత్రముల స్థోమతకు లేక పనితనమునకు తగిన బలమున్న గ్రహములు ఆయా మంత్రములకు అధిపతులుగా

వచ్చి చేరును. ఏ మంత్రమునకు ఏ గ్రహము అధిపత్యము వహించవలెనో ఆ గ్రహము యొక్క ఆత్మ నిర్ణయించును.

ఈ విధముగా అనేక స్థాయి మంత్రములకు తగిన స్థాయిగల గ్రహములు బాధ్యత వహించునని తెలియుచున్నది. ఇట్లు

ప్రపంచములోని మంత్రములన్నిటికీ గ్రహములు బాధ్యత వహించినా, లెక్కలేనన్ని కోట్ల గ్రహముల సంఖ్యలో కొన్ని వేల

గ్రహములు మాత్రమే మంత్రముల బాధ్యత కల్గి, మంత్రములకు బలముగా ఉన్నవి. మంత్రములకు శక్తిగా (బలముగా)

చేరిన గ్రహములు కాకుండా ఎన్నో కోట్ల గ్రహములు ఖగోళములో ఉన్నవి. ఖగోళములోనున్న గ్రహములలో

మంత్రగ్రహములకంటే చిన్న గ్రహములు, పెద్ద గ్రహములు ఎన్నో ఉన్నవి. ఖగోళములోనున్న గ్రహములు, భూతములు

అన్నీ 99 శాతము దైవజ్ఞానము కల్గినవే ఉన్నవి. వాటిలో ఒకటి లేక రెండు శాతము గ్రహలు, భూతములు మాత్రమే

జ్ఞానములేనివై ఉండును. మంత్రమహిమగల గ్రహములకు జ్ఞానములేని గ్రహములు, భూతములు మాత్రమే భయపడును.

దైవజ్ఞానమున్న గ్రహములు, భూతములు మంత్రబలమున్న గ్రహములకంటే చిన్నవైనప్పటికీ పెద్దమంత్రబలమునకు

కూడా భయపడవు. దైవజ్ఞానమున్న చిన్న గ్రహమునకు పెద్దమంత్రశక్తిగా నున్న గ్రహము కూడా భయపడును.

దైవబలము ఏమాత్రము లేకుండా కేవలము మంత్రబలమున్న గ్రహములకు దైవజ్ఞానమున్న ఏ గ్రహముగానీ, ఏ

భూతముగానీ భయపడదని తెలియవలెను.


మాంత్రికులు ఎవరైనా తమ అజ్ఞానముతో, తాము మాంత్రికుల మను గర్వముతో దైవజ్ఞానమున్న వారిని

గౌరవించక పోయినా, హేళనగా మాట్లాడినా, తక్కువ భావముతో చూచినా జ్ఞానులు లేక యోగులయందు ఉండు

దైవశక్తికి మంత్రశక్తి నిర్వీర్యమైపోవును. అంతవరకు మంత్ర బలమున్న మాంత్రికుడు అప్పటినుండి ఏమాత్రము

మంత్రబలములేని వాడై పోవును. జ్ఞానులు, యోగులు మాంత్రికులకు చెడు చేయాలని అనుకోకుండినా పొరపాటుగా

ఒకవేళ మాంత్రికుడు జ్ఞాని లేక యోగి యొక్క సముఖమునకు వచ్చినపుడు మాంత్రికునిలోని గ్రహశక్తి యోగి లేక

జ్ఞానులలోని జ్ఞానశక్తికి తాళలేక మాంత్రికుని వదలి పారిపోవును. అంతటితో మాంత్రికుడు ఎంతో కష్టపడి సిద్ధిచేసుకొన్న

మంత్రబలము అతనికి లేకుండా పోవును. ఈ విధముగా ఎందరో మాంత్రికులు తమ శక్తులను యోగులవద్ద,

జ్ఞానులవద్ద పోగొట్టుకోవడము జరిగినది. దీనినిబట్టి మంత్రశక్తి దైవశక్తికంటే చాలా చిన్నదనీ, దైవశక్తి సన్నిధిలో

మంత్రశక్తులు నిలువజాలవనీ తెలిసిపోవుచున్నది. కొన్ని మంత్రశక్తులు మాంత్రికుల ఆజ్ఞ ప్రకారము కొందరి మనుషులలో

చేరి ఆ మనుషులను బాధించుచుండును. మంత్రశక్తిచేత బాధింపబడు మనుషులు యోగులవద్దకు వచ్చినపుడు

యోగులలోని దైవశక్తిని చూచి భయపడి ఆ మనుషులను వదలి పారి పోవడము కూడా జరుగుచుండును. దైవశక్తికి

భయపడు మంత్రశక్తులు దైవజ్ఞానము కల్గిన గ్రహములకు, భూతములకు కూడా భయపడును. అందువలన మంత్ర

బలము లేక మంత్రశక్తి దైవజ్ఞానమున్న మనుషులను గానీ, గ్రహములనుగానీ, భూతములనుగానీ ఏమీ చేయలేదని

తెలియుచున్నది.



పూర్వము ఎంతో ప్రాబల్యముగా మనుషులలో వ్యాపించియున్న మంత్రశక్తి, నేడు భూమిమీద మచ్చుకైన

కనిపించకుండా పోవుటకు, యంత్రశక్తి ఎక్కువగా మనుషులలో వ్యాపించిపోవుటకు కారణమేమి అని కొందరడుగ

వచ్చును. దానికి జవాబును వివరముగా చెప్పుకుంటే ఇలా కలదు. మంత్రములు మాటల రూపములో నేడు కూడా

కలవు. వేదములలో ఎన్నో మంత్రములు చెప్పబడినవి. అలాగే కొందరి దేవతలవద్ద కొన్ని మంత్రములను అక్కడక్కడ

చెప్పుచునే ఉన్నారు. నిత్యము ఎందరో దేవాలయములలోనూ, కొన్ని ఆరాధనలలోనూ మంత్రోచ్ఛాటన చేయు చున్నారు.

కొందరు గాయిత్రీ మంత్రమును నిత్యము పఠించుచున్నారు. అయితే వాటియందున్న శక్తి మానవునికి ఎటు

ఉపయోగపడలేదు. ఇలా ఎన్నో మంత్రములను మనుషులు ప్రతి దినము జపించుచున్న అవి ఎందుకు

ఉపయోగపడడములేదు అని యోచిస్తే ఇలా తెలియుచున్నది. పెద్దలు ఒక సామెతను చెప్పెడివారు. అదేమనగా

“అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో నాలుక లేదు” అని అనెడివారు. సకల తినుబండారములను అత్తగారు తెచ్చి అల్లుని

ముందరయుంచితే, అల్లుడు అన్నిటిని తినినా తిన్నవి ఏ రుచి ఉన్నవో చెప్పలేకపోయాడట. అదే విధముగా మనముందర

నిత్యము పఠించు ఎన్నో మంత్రములుండినా వాటిబలమును నిర్ణయించు సిద్ది లేకుండ పోవడము వలన ఆ మంత్రములు

దేనికీ పనికిరాకుండా పోయాయి. కొన్ని ఇటుకలను ఒకచోట కుప్పగా పోస్తే, ఆ కుప్ప ఇల్లుకాదు. ఆ ఇటుకలనే

క్రమబద్దముగా పేర్చితే మొదట గోడలగును చివరకు ఇల్లగును. అలా కాకుండ ప్రతి దినము ఇటుకలను తెచ్చి

కుప్పవేసినా, కొన్ని సంవత్సరముల వరకు కొన్ని లక్షల ఇటుకలను వేసినా ఆ ఇటుకలు పెద్దకుప్ప అగును. కానీ

మనిషికి ఆ కుప్ప ఏ విధముగా ఉపయోగపడదు. ఇటుకల కథవలె ప్రస్తుతకాలములో ఎందరో అర్చకులు గుడులలోనూ,

ఎందరో ఆరాధకులు గృహములోనూ, మరెందరో ఉపాసకులు గాయిత్రీ మంత్రమును పఠించు చున్నప్పటికీ, దారమునకు

కూర్చనిపూలు గాలికిపోయినట్లు వారి ఆరాధనలు, ఉపాసనలు వృథా అగుచున్నవి. అలా అగుటకు కారణము ఆ

మంత్రము లను తయారు చేసినవారు వాటికి కావలసిన నియమమును ఏర్పరచి, ఆ మంత్రములకు సిద్ధి సూత్రమును

చెప్పలేదు. అందువలన ఆ మంత్రములన్నీ ఏదీ హారము కాకుండా విడిపూలై పోయాయి.


ఔషధమునకు దానిని శుద్ధి చేసుకొను విధానము ఎంత ముఖ్యమో ఒక మంత్రమునకు దానిని సిద్ధి చేసుకొను

విధానము కూడా అంతే ముఖ్యము. ఔషధములలో పెన్నేరు దుంపను ఆవుపాలతో ఉడికించితే అది శుద్ధి అయి దానికి

ఔషధగుణము వచ్చి ఔషధమగును. అలాగే నేపాలము గింజను ఆవుపేడ రసముతో ఉడికించితే అది శుద్ధి అయి

ఔషధమగును. అలాగే నాలుగు అక్షరముల కడుపునొప్పి నివారణ మంత్రమును పదివేలమార్లు ఏకదాటిగా జపించితే,

ఆ మంత్రము సిద్ది అయి దానికి మంత్రశక్తి వచ్చును. రెండక్షరముల కాలునొప్పి నివారణ మంత్రమును ఎనిమిదివేలమార్లు

ఏకదాటిగా జపించితే అది సిద్దించి దానికి మంత్రశక్తి చేరిపోవును. ఈ విధముగా ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క

నియమమును దానిని తయారు చేసిన క్రమమునుబట్టి ఏర్పరచివుందురు. మంత్రమును సృష్టించినవాడు ఏర్పరచిన

నియమమును అనుసరించి మత్రోచ్ఛాటన జరిపినపుడు అది సిద్ధి అగును. ఒక ఔషధమునకు శుద్ధి ఎంత అవసరమో,

అట్లే ఒక మంత్రమునకు కూడా సిద్ధి అవసరము. శుద్ధిలేని మందు పనిచేయనట్లు, సిద్ధిలేని మంత్రము పనిచేయదు.

ఈ విధానము నేడు పూర్తిగా తెలియకుండా పోయిన దానివలన పూర్వకాలపు మందులుగానీ, పూర్వకాలపు మంత్రమలుగానీ

నేడు లేకుండా పోయాయి.


ఒక మాంత్రికుడు పాము విషమును నివారించు మంత్రమును నేర్చి నియమము ప్రకారము సిద్ధి

పొందియున్నాడనుకొనుము. ఆ మంత్రము సిద్ధి పొందినవాడు సిద్ధిపొందిన తర్వాత కూడా ఒక నియమము పాటించ

వలసివుండును. ఒక మందును తయారుచేసి వాడిన తర్వాత ఆ మందుకు ఒక పత్యమున్నట్లు మరువకూడదు.

మంత్రమును సిద్ది పొందినవాడు తర్వాత ఉండవలసిన నియమమును మరువకూడదు. పాము విషమును నివారించు

మంత్రసిద్ధి పొందినవాడు తర్వాత ఏ విష సర్పమునుగానీ, తేలునుగానీ చంపకూడదను నియమమును పాటించాలి.

అలా పాటించక పోతే ఎప్పుడైనా చిన్న తేలును చంపినా ఆ మంత్ర సిద్ధి రద్దయిపోయి, ఆ మంత్రము ప్రయోజనము

లేనిదైపోవును. ఈ విధ నియమమును పాటించని ఎందరో మాంత్రికులు మంత్రబలమును కోల్పోయామని తెలియక,

తమ మంత్రమును ప్రయోగించి అది పనిచేయనపుడు అవమానము పాలైపోవుట వలన, దానిని చూచిన తర్వాత వారికి

కూడా మంత్రముల మీద ఆసక్తి లేకుండపోవుట వలన, ఇప్పటి కాలమువారు స్థూల చదువులు చదువుట వలన, సూక్ష్మ

విద్యలు యోచించు బుద్ధి సామత్యము లేకుండ పోవుట వలన, విజ్ఞానమంటూ అసలుకు జ్ఞానమునే మరచిపోయిన

వారుండుట వలన, పూర్వము కాలము యొక్క చరిత్రలో మందులు మంత్రములు ఎటువంటి పాత్రలు పోషించాయో

తెలియని మనుషులుండుట వలన, నేడు మంత్రవిద్యను బోధించువారుగానీ, మంత్రవిద్యను అభ్యసించువారుగానీ లేకుండా

పోయారు.



మనుషులలో విశ్వాసులు, అవిశ్వాసులు అను రెండు రకముల మనుషులున్నారు. విశ్వాసులలో జ్ఞాన విశ్వాసులు,

మూఢ విశ్వాసులు అని రెండు రకముల వారు ఉండగా, అవిశ్వాసులలో కూడా ఒక విషయమును అన్ని విధముల

చూచిన తర్వాత అందులో నమ్మదగినది లేనప్పుడు పద్ధతిగా నమ్మనివారు కొందరుండగా, ఒక విషయమును పూర్తిగా

చూడకముందే, అందులో నమ్మదగినది ఉందో లేదో గ్రహించకముందే, మూర్ఖముగా నమ్మని మూఢ అవిశ్వాసులు

కొందరున్నారు. అటువంటి వారిలో పద్ధతిగా నమ్మని వారిని హేతువాదులనీ, మూఢ అవిశ్వాసులను నాస్తికవాదులని

అనవచ్చును. ఒక పద్ధతిని అనుసరించి వారి ప్రశ్నకు జవాబులులేనప్పుడు ఒక విషయమును నమ్మని హేతువాదులను

ఒప్పుకోవచ్చును. కానీ ఏ పద్ధతి లేకుండా మూర్ఖముగా నమ్మని నాస్తికులను మేము కూడా ఒప్పుకోము. ఏ విధముగా

విశ్వాసులలో మూఢ నమ్మకముగలవారున్నారో, అదే విధముగా అవిశ్వాసులలో మూఢ అవిశ్వాసులు (నాస్తికులు)

కూడా ఉన్నారని చెప్పు చున్నాము. నాస్తికులు మూర్ఖముగా వాదించువారైనందువలన వారికి జవాబు చెప్పకున్నా

ఫరవాలేదు. కానీ హేతువాదుల ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబు చెప్పవలసివుంటుంది. అలా చెప్పలేనప్పుడు

విషయమును గురించి మొదటి వానికే తెలియదని చెప్పవచ్చును. మొదటి వానికే దానిని గురించి పూర్తిగా తెలియనప్పుడు

ఆ విషయము రెండవవానికి తెలియకుండా పోవుటకు అవకాశము కలదు. మంత్రముల విషయములలో సరిగా అదే

జరిగినదని చెప్పవచ్చును. ఒక మాంత్రికుడు మంత్రమును గురించి పూర్తిగా తెలియనప్పుడు రెండవవాడు ప్రశ్నించిన

ప్రశ్నకు జవాబు చెప్పలేకపోవును. అటువంటపుడు హేతువాదులు మంత్రములను గురించిగానీ, మాంత్రికులను

గురించిగానీ నమ్మరు. నమ్మకపోవడమే కాకుండా మా ప్రశ్నకు జవాబు లేదని చెప్పుట వలన ఆ విషయము

జవాబులేనిదని అందరికి తెలిసి పోవును. అటువంటపుడు ఆ విషయము పూర్తిగా లేకుండా పోవుటకు అవకాశము

కలదు. మంత్రముల విషయములో నేడు హేతువాదుల ప్రశ్నలకు జవాబు లేకుండా పోవడము వలన, దానిని నమ్మదగిన

విషయము కాదని హేతువాదులు చెప్పుట వలన, నేడు మంత్రవిద్య అడుగంటిపోయి ఎవరికీ తెలియని స్థితికి చేరుకొన్నది.



మంత్రవిద్య సత్యమైనపుడు మంత్రగాడు జవాబు చెప్పలేని స్థితిలో ఎందుకున్నాడు? అను ప్రశ్న ఎవరికైనా రాక

తప్పదు. ఇటువంటి ప్రశ్నతో మంత్రవిద్య శాస్త్రబద్ధమైనది కాదా? మంత్రవిద్య సత్యమైనపుడు అందులో శాస్త్రీయత

లేకుండా పోవుటకు అవకాశమే ఉండదు కదా! అటువంటపుడు ఇతరులు అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకులేదు?

జవాబు చెప్పలేని స్థితికి ఎందుకు వచ్చినది? అని సత్యాన్వేషకులకు ప్రశ్న రాకతప్పదు. అటువంటి స్థితి ఎందుకు

వచ్చినదో మనము చెప్పుకొందాము. ఒక మాంత్రికుడు పాముకాటుకు తన మంత్రముతో పాము విషమును

నివారించుచున్నాడనీ, పాముకాటుకు గురియైనవారు ఎవరూ అతనివద్దకు పోయిన తర్వాత చని పోలేదనీ చెప్పుకోవడము

వినిన ఒక వ్యక్తి తాను కూడా మంత్రవిద్యను నేర్వాలనుకొన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి పాము విషనివారణ మంత్రమును

నేర్చిన సర్పమాంత్రికునివద్దకు పోయి తాను మంత్రవిద్యను తమ వద్ద నేర్వాలని వచ్చానని చెప్పాడు. ఆ మాటవినిన

సర్పమాంత్రికుడు తన విద్యను నేర్చుకోవాలని వచ్చినవానికి నేర్పాలనుకొన్నాడు. పాము విష నివారణ మంత్రమును

నేర్చుకోవాలనుకొన్నవాడు, తనకు మంత్రవిద్యను నేర్పించు వ్యక్తి తన మంత్రమును ఉపయోగించి, పాముకాటుకు

గురైన ఒక మనిషికి వైద్యము చేయడము ప్రత్యక్షముగా చూచాడు. అలా ప్రత్యక్ష ముగా చూచినప్పుడు విద్యార్థి అయిన

వ్యక్తికి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలను ఒక్కొక్కటిగా గురువుగానున్న మాంత్రికున్ని అడగడము జరిగింది.


విద్యార్థి :- గురువుగారూ మీరు పాముకాటుకు గురైన మనిషి ముందర కూర్చొని, మంత్రమును కొన్నిమార్లు జపించి

నోటితో గాలిని అతని మీదకు ఊదారు. అంతతప్ప మీరు ఏమీ చేయలేదు. మంత్రమును జపించి గాలిని ఊదితే,

అప్పుడు తమ మంత్రము ఏ విధముగా పనిచేసి ఎదుట కూర్చున్న వాని శరీరములోని విషమును హరించినది? మీరు

మంత్రమును ఎన్నిమార్లు జపిస్తున్నారు?


మాంత్రికుడు :- పాము విషనివారణ మంత్రమును మొదట సిద్ధి పొందిన ప్పటినుండి నేను కొన్ని వందలమందికి

మంత్రమును ఉపయోగించి కాపాడ గలిగాను. పాముకాటు పొందినవాడు వచ్చినపుడు సిద్ధి పొందిన మంత్రమును

పదకొండుమార్లు జపించి అతని మీదికి ఊదడము జరుగు చున్నది. అలా మంత్రమును జపించి ఊదడము వలన

ఎదుటి వ్యక్తిలోని విషమంతయు పని చేయకుండా పోయి ఆ వ్యక్తి బ్రతకగలుగుచున్నాడు.



విద్యార్థి :- మంత్రమును సిద్ది పొందడము అంటే ఏమిటి?


మాంత్రికుడు :- ప్రతి మంత్రమునకు ఒక నియమముండును. అలాగే పాముమంత్రమునకు కూడా నియమము

కలదు. ఆ నియమము ప్రకారము పాముమంత్రము విషమును హరించు శక్తి పొందాలంటే దానికి సిద్ధి అవసరము.

పాముమంత్రములు ఎన్నో కలవు. వాటిలో నేను సిద్ధి పొందిన మంత్రము ఏడు బీజాక్షరముల మంత్రము. అందులో

ఒక్క “శ్రీం”, నాలుగు “హ్రీం”లు రెండు “క్లీం”లు కలవు. ఏడు బీజాక్షరముల మంత్రమును ఏడు వేలు మొదటిరోజు,

నాలుగువేలు రెండవరోజు, ఒక వెయ్యి మూడవ రోజు జపించవలెను. నేను అలా మూడు రోజులు జపించి సిద్ధి

పొందాను. సిద్ధి పొందిన తర్వాత పాముకాటు పొందిన వానిని రక్షించడానికి మంత్రమును పదకొండు మార్లు

జపించుకొంటే ఆ మంత్రశక్తి ఉత్తేజము పొందును. తర్వాత పాము విష బాదితుని మీదకు గాలిని ఊదగా కొద్ది

నిమిషములలోనే ఆ వ్యక్తిలోని విషము పనిచేయకుండ వ్యర్థమైపోవును.


విద్యార్థి :- మంత్రము సిద్ధి కావడము అర్థమైనది. తర్వాత అవసరమొచ్చినపుడు పదకొండుమార్లు మంత్రమును

పఠించితే అది చురుకుదనము పొందడము అర్థమైనది. తిరిగి పదకొండుమార్లు జపించినపుడు ఉత్తేజమైన మంత్రము


ఎదుటి మనిషిలోని విషము మీద ఎలా పని చేసినదో నాకు అర్థముకాలేదు. ఆ విషయమును గురించి వివరముగా

చెప్పండి.


మాంత్రికుడు :- మంత్రమును చదివి ఊదవలెనని నాకు మంత్రమును నేర్పించినవారు చెప్పారు. అలాగే నేను

చేయుచున్నాను, తర్వాత ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో తెలియదు. కానీ ఎదుటి మనిషిలోని పాము

విషము లేకుండా పోవుచున్నది.


విద్యార్థి :- మంత్రములోని శక్తి ఎదుటి మనిషి మీద ఎలా పనిచేయునది తెలియనప్పుడు, ఆ మంత్రము ఎప్పుడైనా పని

చేయకుండాపోతే దానిని ఎలా పనిచేయించాలో తెలియకుండా పోతుంది కదా! అలాగే మంత్రములోని శక్తి ఎలా

ఉంటుందో? అది ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలని ఉన్నది.


మాంత్రికుడు :- మంత్రమును సిద్ధి చేసుకోవడము, తర్వాత దానిని వాడడము తెలుసు, కానీ మంత్రశక్తి ఎలా

ఉంటుందో, అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. అది పని చేయనప్పుడు దానిని తిరిగి ఎలా పని చేయించాలో

కూడా తెలియదు. నాకు ఈ మంత్రమును నేర్పినవారు విషయములన్నిటిని పూర్తి వివరముగా చెప్పలేదు.

విద్యార్థి :- ఒక మంత్రమును గురించి సమగ్రముగా తెలియాలంటే ఎవరి వద్దకు పోయి అడగాలి?


మాంత్రికుడు :- నాకు మంత్రమును నేర్పిన వ్యక్తికి కూడా ఈ విషయము లన్నియు పూర్తిగా తెలియవు. కానీ ఆయన

ఒకమాట చెప్పెడివాడు. మంత్రములూ, వాటి శక్తులూ, వాటి పనితనమూ అన్నీ సూక్ష్మముగానే ఉండును. సూక్ష్మ

విషయములు ఒక్క యోగులకు తప్ప ఎవరికీ తెలియవని అనెడివాడు.


ఈ విధముగా జరిగిన వారి సంభాషణలో మంత్రముల విషయము లు యోగులకు తెలియునని తెలిసింది.

మేము కూడా దైవశక్తియున్న వారే మంత్రశక్తిని తయారు చేయగలరని చెప్పాము. మంత్రశక్తిని సృష్ఠించు వారికే

మంత్రముల సూక్ష్మత అంతా తెలియును. ఇప్పుడు వారికి అందని జవాబులను గురించి మనము తెలుసుకొందాము.

వారు పాము విషమును నివారించు మంత్రము గురించి ప్రశ్నించుకొన్నారు. అటువంటిదే అయిన తేలు విషమును

గురించి పూర్తి వివరముగా తెలుసుకొందాము. దీనినిబట్టి మంత్రముల సూక్ష్మత అంతా తెలిసిపోవును.

అనుభవములో తేలు విష నివారణ మంత్రమును చూచాను. మంత్రము మొదలవునపుడు దైవ సంబంధమైన “ఓం”

ఉండును. చివరిలో మంత్రము ముగియునపుడు ఎప్పటికైన అంత్యమైపోవు క్షరుడైన జీవుని గుర్తుగా “స్వాహా”

ఉండును. సృష్టిని ప్రారంభించిన దైవము యొక్క గుర్తు ఓం మొదట ఉండగా, అంత్యమై పోవు జీవుని గుర్తుగా స్వాహా

చివరిలో ఉండగా మధ్యలోనున్నవంతయు ఆత్మశక్తికి సంబంధించిన గుర్తుగా బీజాక్షరములుండును. దీనిప్రకారము

తేలు మంత్రములో పరమాత్మ, ఆత్మ, జీవాత్మల త్రైతసిద్ధాంతము ఇమిడి యున్నది. తేలు మంత్రము ఓం చహ్ ఫట్

స్వాహా అని ఉండగా అందులో (ఓం) (చప్ ఫట్) (స్వాహా) అను మూడు భాగములున్నవి. ఏ మంత్రములో అయినా

ఓం కు స్వాహాకు మధ్యలోనున్నదంతయు ఒక భాగముగా గుర్తించ వలెను. మంత్రములో ఇటు మొదటిదైన పరమాత్మ,

అటు చివరిదైన జీవాత్మలు రెండూ ఏమీ చేయునవి కావు. ఇవి రెండు చూపాకారమునకు ఉండునవి మాత్రమే.

జగతిలో మొత్తము అందరిని ఆడించునది ఆత్మ మాత్రమే. అందువలన ఆత్మశక్తి మధ్యలోనున్న అక్షరములందు

ఇమిడి వుండును. మంత్రము సిద్ధి అయినపుడు ఆత్మశక్తి మంత్రశక్తిగా మారి అక్కడ ఏమి చేయవలెనో దానినే


చేయును. ఒక మంత్రము త్రైత సిద్ధాంతమును కల్గియున్నదంటే, అది మూడు ఆత్మలు కలిసియున్న సజీవ శక్తియై

ఉండాలి. అందువలన మంత్రము సిద్ధించినపుడు ఖగోళములోని ఆ మంత్రమునకు సరిపోవు గ్రహము వచ్చి

మాంత్రికునియందు చేరిపోవును. వచ్చిన గ్రహము సజీవమైన దానివలన దానియందు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ

మూడు ఉన్నాయని తెలియవలెను.


తేలు మంత్రములో మొదటి ఓంను చివరి స్వాహాను తీసి వేస్తే (ఓం) చప్ ఫట్ స్వాహా) మధ్యలో చహ్ ఫట్

అను శబ్దము మాత్రము మిగులును. మంత్రమును సృష్టించిన వారి దృష్ఠిలో చహ్ అనగా తేలు విషము. ఫట్ అనగా

పగిలిపోవడము, లేకుండా పోవడము నాశనమై పోవడమని అర్ధము. చహ్ ఫట్ అనగా విషము లేకుండా పోవడమని

అర్థము. విషము లేకుండ పోవడము అను కార్యమును చేయునది ఆత్మ మాత్రమే. పరమాత్మ, జీవాత్మ రెండు ఏ పని

చేయునవి కాదు అను విషయమును జ్ఞప్తిలో పెట్టుకోవలెను. ఏ పని చేయవలసినది మంత్రము మధ్యలో ఉన్నది.

మంత్రమునకు అధిపతిగా వచ్చిన గ్రహములోని ఆత్మశక్తి మంత్రశక్తిగా మారి తేలు విషమును లేకుండా చేయుచున్నది.

తేలు మంత్రమును తయారు చేసినవారు, ఆ మంత్రము సిద్ధించుటకు పదివేలమార్లు జపించవలెనను నియమమును

ఉంచారు. అలా జపించిన వారికి ఆ మంత్రము సిద్ధించును. సిద్ధించిన మంత్రమును అవసరమొచ్చి నపుడు వాడుకొనే

దానికి ఆ మంత్రమును తొమ్మిది లేక పదునెనిమిది మార్లు జపించవలెను. అప్పుడు తేలు విషముతో బాధపడు వారికి

ఆ మంత్రశక్తిని ఉపయోగించవచ్చును. మంత్రమును తొమ్మిదిమార్లు జపించి గ్లాసులోని నీటిలోనికి మంత్రశక్తి పోవాలని

సంకల్పించుకొంటే అప్పుడు మంత్రశక్తిగాయున్న గ్రహము నీటిలోనికి ప్రవేశించును. ఆ నీటిని తేలు విషముచేత

బాధపడువానికి త్రాగించినపుడు నీటిలోని మంత్రగ్రహము విషబాధితుని శరీరములోనికి ప్రవేశించి, తేలు విషబాధవున్న

శరీర భాగములోనికి పోయి ఆ విషమును నిర్వీర్యము చేయును. నీరును త్రాగిన రెండు మూడు నిమిషములలో ఆ పని

మొత్తము జరిగిపోయి విషబాధ లేకుండా పోవును.


ఇదేదో కట్టుకథలాగ వుంది, నమ్మశక్యము కాలేదని ఎవరైనా అనవచ్చును. ఎందుకనగా మాంత్రికునికి కూడా

తెలియనిది, ఎవరి కంటికి కనిపించని దానిని ఇలాగున్నదని విన్నపుడు, ఎవరికైనా ఇది నిజమేనా అని అనుమానము

రాగలదు. సూక్ష్మ విషయములను ఎవరో ఒకరు చెప్పాలి కదా! ఈ మంత్రమునకే కాదు ఏ మంత్రమునకైనా, ఆ

మంత్రశక్తిగా యున్న గ్రహము చేయవలసిన పనిని చేయును. గ్రహములోనున్న ఆత్మశక్తి ఆ పనిని చేయుచున్నదని

తెలియవలెను. తేలు విషము హస్తమునుండి భుజము వరకు బాధించునపుడు, శరీరములోనికి పోయిన గ్రహము

చేతిలోని బాధను లేకుండా చేసి బయటికి వచ్చి మాంత్రికునియందు చేరిపోవును. తేలు విషము కాకుండా తలనొప్పితో

బాధపడువాడున్నాడనుకొనుము. తలనొప్పిని నివారించు మంత్రమున్న మాంత్రికుడు మంత్రము ప్రయోగించి నపుడు,

మంత్రశక్తి బాధితుని శరీరములో ప్రవేశించి తలనొప్పిని తొలగించాలని చూచినపుడు, అక్కడ తలనొప్పికి కారణమైన

ఒక సూక్ష్మ శరీరమైవుంటే మంత్రగ్రహ పోతూనే, అది మంత్రగ్రహమునకు దొరకకుండ బయటికిపోవును. సూక్ష్మశరీరము

కాకుండా ఒక దేవత అయివుంటే, ఆ దేవతకూడా తలలో లేకుండా శరీరములోనే ప్రక్కకు పోయివుంటూ తప్పించు

కోవాలని ప్రయత్నము చేయును. అయినా మంత్రశక్తి దానిని వెంటాడుట వలన శరీరములోనే జాగాలు మారుచూ

తప్పించుకోవాలని ప్రయత్నించును. చేతకాకపోతే చివరకు శరీరమునుండి బయటికి పోవును. ఒకవేళ శరీరములో

బాధకు కారణము బలమైన దేవతగానీ, దయ్యముగానీ ఉన్నప్పుడు ఆ దేవత మంత్రశక్తితో తలపడి ఓడిపోతే బయటికి


పోవును. ఒకవేళ మంత్రబలము తక్కువ అయి దేవత బలము ఎక్కువ అయినపుడు మంత్రబలము శరీరములోని

బాధను తొలగించలేదు. అప్పుడు మాంత్రికుడు ఆ విషయమును గ్రహించి, తన మంత్రమునకు బలము తక్కువైనదని

తెలియవలెను. తనవద్ద ఇంకా పెద్దమంత్రముంటే దానిని ప్రయోగించ వలెను. లేకపోతే తనచేత కాదని వదలివేయవలెను.


మంత్రములన్నీ ఒకే బలము కలిగివుండవు. ప్రయోగించిన మంత్రముకంటే రోగము యొక్క శక్తి పెద్దదైనపుడు

మంత్రము పని చేయదు. అందువలన మంత్రములన్ని శక్తివంతమైనవి కావు. మంత్రశక్తి దైవశక్తిని ఏమీ చేయలేదు.

ఒక మనిషి శరీరములో ఒక యోగి ప్రవేశించి ఉన్నపుడు మంత్రగాడు తన మంత్రముతో ఆ యోగిని ఏమాత్రము

బయటికి లాగలేడు. దీనినిబట్టి అన్ని మంత్రములు అన్ని సమయములలో పని చేయవని తెలియుచున్నది. రోగములకు,

మంత్రములకు అన్నిటికి దైవశక్తి పెద్దది. దైవశక్తి ముందర ఏ దేవతలుగానీ, ఏ రోగములుగానీ నిలువజాలవు.

అందువలన యోగి అయిన వానిని ఏ మంత్రముగానీ ఏమీ చేయలేవు. యోగి అనుకుంటే మంత్రశక్తులు మాయమైపోవును.

రోగములు భయముతో వణుకును. యోగి అయిన వాడు అన్ని విధముల మంత్రములకు తాను పెద్దయని తెలిసివుండుట

వలన ఏ మంత్రమును అభ్యశించడు. భూమిమీద ఏ మంత్రములను చదువువారైనా యోగికంటే చిన్నవాడని తెలియవలెను.

మంత్రములోనున్న శక్తి దైవశక్తి అయిన ఆత్మశక్తి అనీ, ఆత్మశక్తియే మంత్రశక్తిగా మారియున్నదని తెలిసి, మంత్రశక్తిని

వదలి ఆత్మశక్తిని చేకూర్చుకొనువాడు అందరికంటే గొప్పవాడగును. అటువంటి యోగిని ఏ మంత్రశక్తి ఏమీ చేయలేదు.

మంత్రము దానికి మహిమ ఉండడము వాస్తవమే అయినా, మంత్ర మహిమను అతిక్రమించి వుండునది దైవశక్తి అని

తెలిసి, దానిని పొందినవాడు భూమిమీద అందరి కంటే గొప్పవాడని చెప్పవచ్చును.


ఇట్లు,

ఇందూ ధర్మప్రదాత,


సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త,

శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.


Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024