ప్రవక్తలు ఎవరు?. cloud text updated 13th sep 2024

 



ప్రవక్తలు ఎవరు?.


వక్త అనగా బాగా చెప్పువాడు లేక బాగా మాట్లాడువాడు అని చెప్పవచ్చును. ఒక విషయమును గురించి బాగా

మాట్లాడువానిని వక్త అని చెప్పుచుందుము. అందరూ మాట్లాడలేరు, కొందరు మాత్రము మాట్లాడు స్థోమతకల్గి

మాట్లాడుచుండుట వలన, కొందరిని మాత్రమే వక్తలు అని అనుచున్నాము. పదిమందిలోకానీ, వందమందిలోగానీ

నిర్భయముగా, నిరాటంకముగా మాట్లాడు వక్తలు కొందరుండగా, వారిలో ముఖ్యమైన విషయమును, సారాంశమైన

విషయమును గురించి మాట్లాడువారు అరుదుగా ఉందురు. అటువంటి వారిలో ముఖ్యమైన వాటిలో అతి ముఖ్యమైనదీ,

రహస్యమైన వాటిలో అతి రహస్యమైనదీ ఏదైతేవుందో, దానిని గురించి చెప్పువాడు చాలా అరుదుగా ఉండును. అటువంటి

అరుదైన వ్యక్తిని ముఖ్యమైన వక్తగా గుర్తించి అతనిని ప్రవక్త అనడము జరుగుచున్నది. ఒక విషయమును బాగా

వ్యక్తపరుచువానిని వక్త అని అంటున్నాము. వ్యక్తపరచబడు విషయము సాధారణమైనదిగా ఉండుట వలన, ఆ విషయమును

ఎంత బాగా చెప్పినా వానిని వక్త అనియే అందురు. ఎంతో నైపుణ్యముగా మాట్లాడు స్థోమతయున్నా, ఎంతో తెలివిగా

మాట్లాడినా అతని చేత చెప్పబడు విషయము సర్వసాధారణ విషయమైయుండుట వలన, గొప్ప సారాంశమైన విషయము

కాకపోవడము వలన మాట్లాడిన వ్యక్తిని వక్త అంటున్నాము.


ప్రపంచములో అన్నిటికంటే మించిన విషయమూ, అన్ని రహస్యము లకంటే రహస్యమైనదీ, తెలియదగిన

విద్యల్లోకెల్ల ముఖ్యమైనదీ దేవుని జ్ఞానము మాత్రమే కలదు. సర్వసాధారణముకాక అసాధారణ విషయమైన దైవజ్ఞానమును

చెప్పగలుగు వక్తను ప్రవక్త అంటున్నాము. దీనినిబట్టి అన్నిటికంటే గొప్పదైన ఒక్క దైవ జ్ఞానము తప్ప మిగత

విషయములను ఎలాగ చెప్పినా, ఎట్లు చెప్పినా చెప్పు వానిని వక్త అని అనవచ్చునని తెలియుచున్నది. విన్న దానిని

గానీ, చూచిన దానినిగానీ, చదివిన దానినిగానీ వివరించి చెప్పువానిని బోధకుడు అని అంటాము. తాను ఇతరుల చేత

నేర్వగలిగిన దానిని తిరిగి తెలియని వారికి చెప్పువానిని బోధకుడు అంటాము. తాను ఇతరుల చేత తెలిసినదానిని

తెలియనివారికి చెప్పడమును బోధించడము అని అంటాము. అలా బోధించు వానిని బోధకుడు అంటాము. తనకు

తెలిసిన దానిని తెలియనివారికి చెప్పువానిని వక్త అని కూడా అంటాము. దీనిప్రకారము వక్త అనినా, బోధకుడు అనినా

ఒకటేనని తెలియుచున్నది. బోధకుణ్ణి వక్త అని అనవచ్చును. వక్తను బోధకుడు అని అనవచ్చును. వక్త వ్యక్తపరుచునది

గానీ, బోధకుడు బోధించునదిగానీ అది సర్వసాధారణ ప్రపంచ విషయమై ఉంటుంది.


తాను నేర్చినది, ఇతరుల చేత విన్నది అయిన దేవుని జ్ఞానమును తెలియనివారికి బోధించువాడు బోధకుడే

అయినా అతనిని 'ప్రబోధకుడు' అంటాము. అలాగే గతములో ఇతరులచేత తాను నేర్వగలిగిన దైవజ్ఞాన విషయములను

తెలియనివారికి వ్యక్తపరచు (తెలియజేయు) వక్తను 'ప్రవక్త' అని అంటాము. చెప్పబడు విషయము అన్నిటికంటే

ప్రత్యేకమైనది, అన్నిటికంటే గుహ్యమైనది. కావున చెప్పబడు జ్ఞానమునుబట్టి చెప్పు వానిని ప్రవక్త అని అంటున్నాము.

ప్రపంచ విషయములను ఎంత బోధించినా అతనిని బోధకుడనే అంటాము. దైవ విషయములను కొద్దిగా బోధించినా

వానిని ప్రవక్త అనియే అంటాము. ప్రపంచ విషయములను బోధించువాడు గానీ, దైవ విషయములను బోధించువాడుగానీ,

ఇద్దరూ బోధకులే అగుదురు. అయితే  ప్రపంచ విషయములను బోధించువానిని వక్త అనియూ, పరమాత్మ విషయములను

బోధించువానిని ప్రవక్త అనియూ అనడము జరుగుచున్నది. ఈ పద్ధతి ప్రకారము ఎవరైనా వక్తలూ కావచ్చును.

అలాగే ఎవరైనా ప్రవక్తలూ కావచ్చును. ఇప్పుడు కొందరు ప్రశ్నించుటకు అవకాశము కలదు. వారి ప్రశ్నలు ఇలా

కలవు.




ప్రశ్న :- మాది మారుమూల ఒక పల్లెటూరు. మా ఊరిలో చాలామందికి చదువురాదు. మా ఊరిలో ప్రభుత్వ

పాఠశాల కూడా లేదు. అందువలన మేము స్వయముగా ఒక వ్యక్తిని బోధకునిగా (టీచర్) నియమించుకొని అతని

చేత పగలు సమయములో మా పిల్లలకు బడిలో చదువు చెప్పించుచున్నాము. రాత్రిపూట పెద్దవారమైన మేము అతని

చేత భారత, భాగవత, రామాయణగాథలను చెప్పించుకొనుచుందుము. పగలు బడివలన మా పిల్లలకు ప్రపంచ

చదువు వస్తున్నది. రాత్రిపూట భాగవతమును, రామాయణమును చెప్పించుకొనుట వలన మాకు కొంత దైవభక్తి

ఏర్పడుచున్నది. ఈ విధముగా ఒకవైపు మా పిల్లలూ, ఒకవైపు మేమూ బాగుపడుచున్నాము. అయితే మేము

నియమించుకొన్న టీచర్ను (బోధకుణ్ణి) వక్త అని చెప్పాలా? లేక ప్రవక్త అని చెప్పాలా? ఏమని చెప్పాలి?


జవాబు: మీరు నియమించుకొన్న టీచర్ పగలు పిల్లలకు ప్రపంచ పాఠాలు చెప్పుచుండుట వలన అతనిని బోధకుడు

అని అనాలి. అతను బోధకుడు అయినందున అతనిని వక్త అని అనవచ్చును. ఇకపోతే రాత్రి సమయములో పెద్దలకు

భాగవత, రామాయణములను బోధించుట వలన పెద్దలలో భక్తి భావము పెరిగినది. భక్తి భావము పూర్తి దేవునికి

సంబంధించినది కానందున అది కూడా దేవుని మినహాగాయున్న ప్రపంచ సంబంధమేనని అర్థమగుచున్నది. అందువలన

పెద్దలకు బోధించిన దానివలన కూడా అతను వక్తగానే చెప్పబడుచున్నాడు. ప్రవక్తగా చెప్పబడడము లేదు.


ప్రశ్న :- భక్తి భావమును కల్గించు భాగవత, రామాయణములను గురించి చెప్పినా, అతను ప్రవక్త కానప్పుడు, దేనిని

గురించి చెప్పితే అతను ప్రవక్త కాగలడు?


జవాబు :మీ ఊరిలో పిల్లలకు చదువు, పెద్దలకు భాగవత రామాయణమును చెప్పు టీచర్ కుటుంబము ప్రక్కనేయున్న

నగరములోయుండుట వలన అతను ప్రతి ఆదివారము తన కుటుంబమువద్దకు పోయివస్తున్నాడు. ఆ విధముగా

పోయివచ్చు అతను ఆదివారము రాత్రి 8 గంటలనుండి 10 గంటల వరకు వారింటి ప్రక్కనేయున్న గుడిలో భగవద్గీతను

చదివి చెప్పు కార్యమును చేయుచున్నాడు. అక్కడ భగవద్గీతను చదివి అక్కడున్న వారందరికీ వివరముగా చెప్పుట

వలన అతను ప్రవక్త అగుచున్నాడు. అతనిని ఎవరూ ప్రవక్త అని పిలువకున్నా అతనిని మనము ప్రవక్త అని చెప్పాలి.

అతను 8 నుండి 10 గంటల వరకు చెప్పునది దేవుని జ్ఞానము. భగవద్గీత దేవుని జ్ఞానమైనందున, దానిని చెప్పువాడు

వక్త కాకుండ ప్రవక్త అగునని మనము ముందే చెప్పుకొన్నాము. పల్లెటూరిలో స్కూలులో చదువు చెప్పినా, ఊరిలో

భాగవతమును చెప్పినా, అదియంతయు దేవునికి సంబంధించిన జ్ఞానము కాదు కనుక అక్కడ వక్తగానే చెప్పవలసి

వచ్చినది. ఈ విధముగా ఒకే వ్యక్తి కొన్నిచోట్ల వక్తగా మరికొన్ని చోట్ల ప్రవక్తగా చెప్పబడుటకు కారణము అతను

చెప్పుచున్న బోధయేనని తెలియవలెను.


ప్రశ్న :- ఒక సామాన్య ఉపాధ్యాయుడు (టీచర్) భగవద్గీతను చదివి చెప్పితే, అతనిని ప్రవక్త క్రిందికి జమకట్టి ప్రవక్త

అంటే, ఆ విధముగా ప్రవక్తలు ఎందరో కాగలరు. అప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులనుకల్గిన ప్రవక్తల వరుసలో

సామాన్య మనుషుల పేర్లు చేర్చి చెప్పడము వలన పెద్ద ప్రవక్తలకు అగౌరవము కాదా?


జవాబు :ఒక సూత్రము ప్రకారము ప్రవక్తలు ఎవరు అను విధానమును తెలియజేశాముగానీ, పెద్దప్రవక్తల ప్రక్కన చిన్న

ప్రవక్తలను నిలబెట్టాలను ఉద్దేశ్యముతోకాదు. చిన్న ప్రవక్తలను పెద్ద ప్రవక్తల ప్రక్కన చేర్చి చెప్పినా, చెప్పకపోయినా,

ప్రవక్తలు ప్రవక్తలే, వక్తలు వక్తలే. పెద్ద ప్రవక్తలుగానీ, చిన్న ప్రవక్తలుగానీ దేవుని జ్ఞానమును చెప్పుట వలననే ప్రవక్తలైనారని

మరువకూడదు.


ప్రశ్న :- శ్రీకృష్ణుడు భగవంతుడని మీరే చెప్పారు. గ్రంథములో కూడా భగవంతుడని ఉన్నది. కృష్ణుడు భగవద్గీతను

చెప్పాడు. భగవద్గీత దేవునికి సంబంధించిన జ్ఞానమును బోధించుచున్నది. అందువలన శ్రీకృష్ణున్ని సూత్రము ప్రకారము

ప్రవక్తయని అనవచ్చును. అయితే అదే భగవద్గీతను చదివి చెప్పేవాడూ ప్రవక్తే అయినప్పుడు, గీతను వ్రాసిన కృష్ణునితో

సమానముగా ప్రవక్తయని గీతను చదివినవాడు చెప్పబడడము సమంజసమేనా?


జవాబు: శ్రీకృష్ణుడు గీతను చెప్పాడు, కావున ప్రవక్త అయినాడు. మనిషి గీతను చదివి చెప్పాడు, కావున ప్రవక్త

అయినాడు. ఇక్కడ లేని గీతను సృష్టించి చెప్పినవాడు శ్రీకృష్ణుడు. స్వయముగా జ్ఞానమును చెప్పినవాడు దేవుడేయగును.

అందువలన కృష్ణున్ని దేవుడు అంటున్నాము. ఉన్న జ్ఞానమును తెలియువాడు మనిషియగును. ఉన్న జ్ఞానమును తెలిసి

వివరముగా చెప్పువాడు ప్రవక్తేయని పిలువబడినా అతను మనిషియే అగును. దైవ జ్ఞానమును గీతరూపములో చెప్పినవాడు

దేవుడుకాగా, దానిని తెలిసినవాడు మనిషియగును. అయితే ఇక్కడ దైవజ్ఞానమును చెప్పుట వలన ప్రవక్త అను పేరుతో

ఇటు దేవుడు, అటు మనిషి సమానముగా పిలువబడినా, వారు ప్రవక్త అను పేరులో సమానమైనా, వారి హోదాలో

ఒకరు పరమాత్మ, మరొకరు జీవాత్మయని తెలియవలెను. పరమాత్మ దేవుడుకాగా, జీవాత్మ మనిషి అగుచున్నాడు.

జీవుడు దేవుడు ఇద్దరూ ఆత్మలే అయినా వారిలో తారతమ్యములు గలవు. ఒక ఆత్మ పెద్దదైన పరమాత్మకాగా, మరొక

ఆత్మ చిన్నదైన జీవాత్మగాయున్నది. అందువలన ముఖ్యమైన సమాచారమును చెప్పువారు ఎవరైనా ప్రవక్తలు కావచ్చునుగానీ,

ప్రవక్తలు అయినంత మాత్రమున అందరూ సమానము కారు.


ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థము గుడి బయట వరుసలో నిలుచున్న వారందరినీ

భక్తులనియే చెప్పాలి. అప్పుడు భక్తులను పదము అందరికీ వర్తిస్తుంది. అయితే ఆ వరుసలో ఎందరో పేదవారున్నారు,

ధనికులు ఉన్నారు, అట్లే మధ్య తరగతివారున్నారు. వరుసలోనున్న దానివలన అందరినీ భక్తులనియే చెప్పుచున్నాము.

అందరూ భక్తులని పిలువబడినంతమాత్రమున ధనికుడు పేదవాడుకాడు, పేదవాడు ధనికుడు కాడు. లేకపోతే ఇద్దరూ

సమాన ధనికులు కారు. భక్తులను పేరు అందరికీ వర్తించినంతమాత్రమున, వారి ఆర్థిక పరిస్థితులలో మార్పు ఎట్లురాదో,

తర్వాత ఏ విధముగా ధనికుడు ధనికునిగానే, పేదవాడు పేదవానిగానే ఉంటాడో, అదే విధముగా ప్రవక్తలను పేరు

దైవమార్గమును బోధించిన వారికి వచ్చినప్పుడు ప్రవక్తలు అను పేరు ఇటు దేవునికి అటు మనిషికీ ఒకే విధముగా

వర్తించినా, ఆత్మల విషయములో ఎప్పటికీ సమానము కారు. అందరూ సమానముగా ప్రవక్తలని పిలువబడినా,

తర్వాత జ్ఞానములో ధనికుడైన దేవుడు దేవుడే, జ్ఞానములో పేదవాడైన జీవుడు జీవుడే అగును. ప్రవక్తలు

అయినంతమాత్రమున వారు వీరుగా, వీరు వారుగా మారుటగానీ లేక సమానముగా మారుటగానీ జరుగదు. ఏ

విధముగా గుడిముందర భక్తులైన వారందరూ ఎట్లు సమానముకారో, అదే విధముగా బోధించడములో ప్రవక్తలైన

వారందరూ సమానము కారు. బోధించిన వారిలో భగవంతుడైన దేవుడు ఉండవచ్చును. పండితుడైన మనిషి

ఉండవచ్చును.


ప్రశ్న :- ప్రవక్త అంటే చాలా గొప్పవాడనీ, ఎవరికీ తెలియని జ్ఞానము తెలిసినవాడనీ భావించాము. ఇప్పుడు మీరు

చెప్పుమాట ప్రకారము భూమిమీద ప్రవక్తలు ఎవరైనా కావచ్చును. ఎంతమందయినా ఉండవచ్చును. అలాగయితే

ప్రవక్తలు ఒకరిద్దరు కాదు ఎంతమందైనా ఉండవచ్చును అని అర్థమగుచున్నది. ఇంతకుముందు మా భావములో ఒక

మతానికి ఒక ప్రవక్త ఉంటాడనీ, హిందువులకు శ్రీకృష్ణుడు ప్రవక్తయనీ, క్రైస్తవులకు ఏసు ప్రవక్తయనీ, ముస్లీములకు


జవాబు: ముహమ్మద్ గారు ప్రవక్తయనీ అనుకొనియుంటిమి. మీ సూత్రము ప్రకారము హిందువులలో గీతను బోధించువారు,

క్రైస్తవులలో బైబిలు జ్ఞానమును బోధించువారు అందరూ ప్రవక్తలే అని తెలియుచున్నది. అంతేకదా!

సూత్రబద్దముగా గీతను బోధించిన కృష్ణున్ని, అదే గీతను బోధగా చెప్పుచున్న మనుషులను సమానముగా

ప్రవక్త అని అనవచ్చును. అలాగే బైబిలు జ్ఞానమును మొదట బోధించిన ఏసును, తర్వాత బైబిలు బోధను బోధించు

బోధకున్ని సమానముగా ప్రవక్త అని అనవచ్చును. అంత మాత్రమున శ్రీకృష్ణుడు మరియు గీతాబోధకుడు సమానము

కారు. అలాగే ఏసు, బైబిల్ బోధకులు సమానము కారు. ఉప్పు కప్పురము ఒక్క పోలికగా కనిపించినా, వాటి రుచులు

వేరైనట్లు కృష్ణుడు, గీతాబోధకుడు ఇద్దరూ ఒకే పేరుగల ప్రవక్తలుగా కనిపించినా, పురుషులందు పుణ్యపురుషులు

వేరన్నట్లు ప్రవక్తలలో దేవుడువేరు, జీవుడు వేరుగాయున్నారు. దైవ జ్ఞానమును బోధించువాడు ప్రవక్త అను సూత్రము

దైవజ్ఞానమును బోధించువారందరికీ వర్తించినా, ప్రవక్తలలో మనిషివేరు దైవమువేరని తెలియవలెను.


ప్రశ్న :- దేవదూతలు ప్రవక్తలు కారా?


జవాబు: దేవదూతలు అను పదము ప్రస్తుత హిందూమతములో ఎక్కడా లేదు. ఎవరినైనా దేవతలు అనడము తప్ప,

దేవదూతలు అను పదమును వాడడము లేదు. అలాగే ఇతర మతములలో ప్రవక్తలు అను మాటను వాడుచున్నారు,

కానీ హిందూమతములో వాడడము లేదు. హిందూ మతములో కొందరు జ్ఞానులైన వారు దూత, అవదూత అను

పదములను వాడుచున్నారు. మతిస్థిమితము లేనివారినీ, మతిభ్రమించి, తిక్కముదిరి గుడ్డలు తీసివేసి తిరుగువారినీ

దూతలనీ, అవదూతలనీ చెప్పడము జరుగుచున్నది. ప్రస్తుతము నీవు అడిగిన ప్రశ్నకు జవాబును సూటిగా చెప్పితే,

దైవజ్ఞానమును బోధించు దేవున్నయినా ప్రవక్త అని అన్నప్పుడు, జ్ఞానమును చెప్పిన దేవదూతలను కూడ ప్రవక్తలనియే

అనాలి. దేవదూతలు ఒక సమయానికి ప్రవక్తలైనా, తర్వాత వారు ఎప్పటికీ దేవదూతలుగానే యుందురు. చాలామంది

హిందువులకు ప్రవక్తల వివరముగానీ, దేవ దూతల విషయముగానీ తెలియదనియే చెప్పాలి. దూతల విషయానికి వస్తే

హిందువులకు అవదూతలను వారు మాత్రము తెలియును. అవదూతల విషయములో కూడా ఎవరు అవదూతలను

వివరము తెలియక గుడ్డలు ధరించని నగ్న శరీరులను అవదూతలనుకోవడము జరుగుచున్నది.


ప్రశ్న :- దిగంబరులు అవదూతలు కారా?


జవాబు: ముమ్మాటికీ కారు. దిగంబరుల అర్థము వేరు. అవదూతల అర్థము వేరని తెలియవలెను. దూతలు అనగా

సమాచారమును తీసుకొని వచ్చెడి వారు. అవదూతలనగా అవదిలేని పరమాత్మ జ్ఞానమును తీసుకొని వచ్చెడి వాడని

అర్థము. అవది అనగా ఎల్లలు అనీ, హద్దు అనీ అర్థము. పరమాత్మ ఎల్లలు లేకుండా వ్యాపించియున్నవాడు. ఇక్కడి

వరకే పరమాత్మ ఉన్నాడని హద్దు ఏర్పరచి చెప్పలేము. పరమాత్మ అంతటా వ్యాపించి యున్నవాడు, కనుక అటువంటి

దేవుని సమాచారమును తెచ్చువానిని అవధూత అనడము జరిగినది. అవధూత అనగా దేవుని సమాచారమును తెచ్చి

అందించువాడని అర్థముతో చెప్పుకోవలెను. ఇకపోతే దిగంబరులని వేరు, వారి పని వేరు. సహజముగా గుడ్డలులేనివారిని

దిగంబరులు అనడము అలవాటైపోయినది. గుడ్డలు ధరించని వారిని నగ్నముగా ఉన్నవారని చెప్పవచ్చును. గ్న అంటే

దాచుకోవడము అని అర్ధము. న అంటే లేదు అని అర్థము. నగ్న అనగా దాచుకోనివాడని అర్థము. శరీరమును

దాచుకొనుటకు గుడ్డలు ధరించనివానిని నగ్నముగా ఉన్నవాడనీ, నగ్న శరీరుడనీ అనడము జరుగుచున్నది. ఇకపోతే

అంబరము అనగా ఆకాశమనీ, అంబరులు అంటే ఆకాశమందు సంచరించువారనీ, దిగ అనగా దిగివచ్చినవారనీ,


దిగంబరులు అనగా ఆకాశమునుండి దిగివచ్చినవారని అర్థము. ఆకాశము నుండి దిగివచ్చిన గ్రహములు, భూతములు

ఎన్నో మనుషులకు కనిపించకుండా భూమిమీద తిరుగుచున్న మాట వాస్తవమే, అయినా ఆ విషయము ఎవరికీ

తెలియదనియే చెప్పవచ్చును. భూమిమీద మనుషులను హింసించుటకే కొన్ని భూతములు, గ్రహములు అప్పుడప్పుడు

దిగివచ్చి చేయవలసిన కార్యము చేసి తిరిగి పైకి పోవుచుండునని మేము అనేకమార్లు చెప్పాము. అలా వచ్చిపోవు

వారిని దిగంబరులు అని పూర్వము అనెడి వారు. నేడు ఆ వివరము తెలియని దానివలన దిగంబరులు అంటే గుడ్డలు

ధరించని నగ్న శరీరులని అనుకోవడము జరుగుచున్నది. అవధూత అనబడువాడు ఎవరికీ తెలియనివాడై, మనిషి

ఆకారములోనే వచ్చి దేవుని సమాచారమును మనుషులకు చేరవేసిపోవును. దిగంబరులు అనబడు గ్రహములు,

భూతములు ఆకాశమునుండి కనిపించకుండా వచ్చి, కనిపించ కుండావుండి సమయమొచ్చినప్పుడు మనుషులను శిక్షలకు

గురిచేసి పోవుచుందురు. దేవుని జ్ఞానమును తెలియజేయు అవదూత అనబడువాడు అవధూతగా తెలియబడక,

జ్ఞానమును తెలియజేయడము వలన మొదట ప్రవక్తగా తెలియబడును. అయితే అతనే అవదూత అని ఎవరికీ

తెలియదు. భూమిమీద సమాచారమును తెలియజేయుటకు వచ్చినవారిలో ఒక్కొక్కప్పుడు సాక్షాత్తు భగవంతుడు కూడ

ఉండవచ్చును. అయితే ఇతను ఫలానావాడని చెప్పుటకు వీలుపడదు. మరికొన్ని సమయములలో ఖగోళములోని

గ్రహములుగానీ, భూతములుగానీ జ్ఞానమును తెలుపు వారిగా వచ్చినా వారు ఎవరికీ కనిపించక తమకు తెలిసిన

జ్ఞానమును తెలిపిపోవుదురు.


భూమిమీద దేవుడు తన జ్ఞానమును తెలుపు విధానములు మూడు కలవు. అందులో మొదటిది వాణి ద్వారా

(ఆకాశవాణి ద్వారా) తెలియజేయునది. రెండవది తెరవెనుక నుండి కనిపించకయుండి చెప్పడము. మూడవది తన

దూతను పంపి అతని ద్వారా చెప్పించడము. ఈ మూడు విధానములలో దూతద్వారా చెప్పించడమును భగవంతునిద్వారా

చెప్పించడమని అర్థము చేసుకోవలెను. అదే విధానము ప్రకారము కృష్ణుని ద్వారా భగవద్గీతను చెప్పించడము

జరిగినది. వాణి ద్వారా చెప్పించడము సృష్ట్యాదిలోనే జరిగినది. ఇకపోతే తెరవెనుకనుండి చెప్పించడము అనునది

ఖురాన్ గ్రంథమును ముహమ్మద్ ప్రవక్తకు చెప్పినప్పుడు జరిగినది. జిబ్రయేల్ అను కనిపించని దూత (దేవదూత)

ప్రవక్తగారికి చెప్పడము జరిగినది. ఈ విధముగా మూడు విధానములు జరిగిపోయినవి. అంతేగాక ఎప్పుడైనా దేవుని

జ్ఞానము భూమిమీద మనుషులకు తెలియాలంటే ఈ మూడు విధానముల ద్వారానే తెలియబడును.


ప్రశ్న :- ప్రపంచములో ఈ మూడు విధానముల ద్వారానే జ్ఞానము తెలియునని చెప్పుటకు మీ వద్ద ఆధారమున్నదా?

జవాబు : మేము ఎప్పుడూ శాస్త్ర ఆధారములేని విషయమును చెప్పము. పవిత్ర ఖుర్ ఆన్ గ్రంథములో 42వ సురా,

51వ ఆయత్లో దేవుడు మూడు విధముల జ్ఞానమును తెలియజేయు విధానమును తెలుపడము జరిగినది. అది ఇలా

కలదు చూడండి. " ఏ మానవునితోను దేవుడు ప్రత్యక్షముగా (ముఖాముఖిగా) సంభాషించడము జరుగదు. అయితే

వహీ ద్వారా, లేదా తెర వెనుక నుంచీ, లేదా ఒక దూతను పంపడము ద్వారా దేవుడు తన జ్ఞానమును తెలియజేయును.

వచ్చిన దూత అల్లా ఆజ్ఞను అనుసరించి మనుషులు కోరిన సందేశాన్ని అందజేస్తాడు. నిశ్చయంగా ఆయన మహోన్నతుడు,

వివేకవంతుడు.” ఈ విధముగా దేవుడు తన మూల గ్రంథములలో ఒక దానియందు చెప్పియున్నా, ఇది మా

గ్రంథము అని చెప్పుకొను ముస్లీమ్లలో కొందరికి ఈ వాక్యము యొక్క అర్థము సరిగా తెలియకుండా పోయినది.

నిశ్చయముగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు అను మాటలోని నిజమైన అంతరార్థము కొందరికి నేటికినీ

తెలియదనియే చెప్పవచ్చును.


ప్రశ్న :- దేవుడు తెలుపు మూడు మార్గముల జ్ఞానము బోధరూపములోనే ఉండును కదా!

జవాబు: దేవుడు స్వయముగా కాకుండా మూడు పద్ధతుల ద్వారా జ్ఞానమును తెలియజేయుచున్నాడు. ఈ విషయము

చాలామంది హిందువులకు కూడా తెలియదు. ఒక గ్రంథములో చెప్పబడిన విషయము అందరికీ సంబంధించిన దని

తెలియక ఖుర్ఆన్లో చెప్పినది ముస్లీమ్ల కనీ, భగవద్గీతలో చెప్పినది హిందువులకనీ అనుకోవడము జరుగుచున్నది.

దేవుడు ఏ మతములోని మనుషులకైనా పై మూడు విధానముల ద్వారా తన జ్ఞానమును తెలియ జేయుచున్నాడు.

ఎక్కడ ఏ విధానమును ఉపయోగించి చెప్పినా, ఆయన జ్ఞానమంతయు బోధరూపములోనేయున్నట్లు తెలియుచున్నది.

దేవుడు తెలియజేయు బోధ సాధారణ బోధలాగా కాకుండా అది ముఖ్యమైన బోధగా, శాస్త్రబద్ధమైన బోధగా ఉండును.

అటువంటి బోధకు “ప్ర” అను అక్షరమును కలిపి ప్రబోధయని చెప్పవచ్చును. ప్ర అను అక్షరము విశేషతను చూపుచున్నది.

కావున దేవుని బోధను జ్ఞానులు ప్రబోధయని చెప్పడము జరిగినది. ప్రబోధను బోధించిన దూతకు కూడా ప్ర అను

అక్షరమును చేర్చి “ప్రదూత" అనికూడా అన్నారు. ప్రదూత చెప్పినది ప్రబోధయనీ, ప్రజ్ఞానమనీ చెప్పవచ్చును. “ప్ర”

ప్రత్యేకతను సూచించునది కావున, దేవుని బోధను ప్రబోధయనీ, దేవుని జ్ఞానమును ప్రజ్ఞానమని చెప్పడము జరిగినది.


ప్రశ్న :- భగవద్గీతను చెప్పిన కృష్ణుడు ప్రవర్తనా, కాదా?


జవాబు: దైవజ్ఞానమును బోధించువారెవరైనా సూత్రము ప్రకారము ప్రవక్తలే అగుదురు. కృష్ణున్ని కూడా ప్రవక్త అనవచ్చునని

ముందే చెప్పాము. తాత్కాలికముగా ఆయన ప్రవక్త అనబడినా ఆయన శాశ్వితముగా ప్రవక్త కాడు. మనుషులకు

జ్ఞానము తెలియజేయు మూడు విధానములలో దేవుని చేత పంపబడిన దూతగా వచ్చినవాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు

వచ్చిన దూతయే అయినా, కృష్ణుడు పంపబడినవాడే అయినా, సత్యాన్వేషణ చేసి చూస్తే, వాస్తవముగా ఆయన

పంపబడినవాడు కాడు. అలాగే ఆయన దూతయూ కాడు. కృష్ణుడు పంపబడినవాడైనా, దూతగా వచ్చినవాడైనా

అతను పంపబడలేదు, దూతగారాలేదు. అక్బర్ చక్రవర్తి స్వయముగా పురపౌరునిగా వేషము ధరించి బాటసారివలె

కొన్ని ఊర్లు తిరిగి స్వయముగా తన పాలనను గురించి తెలుసుకొన్నాడు. అక్బర్ చక్రవర్తి పౌరుని వేషము ధరించినది

నిజమే, బాటసారిగా తిరిగినది నిజమే. ఆ విషయము వాస్తవమే అయినంత మాత్రమున పురపౌరుని వేషములోనున్న

వానినీ, బాటసారి అయిన వానినీ అక్బర్ కాదనుటకు వీలులేదు. పౌరుడు, బాటసారి తాత్కాలికమే. అక్బర్ శాశ్వితము.

అదే విధముగా కృష్ణుడు దూతగా వచ్చినా, పంపబడిన వాడైనా సత్యానికి ఆయన దూత గాడు, పంపబడినవాడు కాడు.

వాస్తవానికి ఆయన పంపినవాడు అయినా దేవుడేనని చెప్పవచ్చును. ఎలాగైతే వచ్చినవాడు పౌరుడు, బాటసారి కాడుయనీ,

వచ్చినవాడు స్వయముగా అక్బర్ చక్రవర్తియేననీ ఎలా చెప్పగలుగుచున్నామో, అలాగే దూతగా వచ్చినవాడు, దూతగా

పంపబడినవాడు స్వయముగా దేవుడేనని చెప్పుచున్నాము.


అలా చెప్పుటకు ఆధారమేమి అనీ, మీరు ఎలా చెప్పగలుగుచున్నా రనీ ఎవరైనా అడిగితే, దానికి మా జవాబు

ఇలా కలదు. దేవుడు అంటే వెదుకబడేవాడుగానీ దొరికేవాడుకాడు. అటువంటి దేవుడు ఎక్కడున్నా ఒక్కడే ఉంటాడు.

అట్లుకాకుండా తానున్న చోట తనకు తోడుగాయుండుట కనియో, తనకు సేవచేయు నిమిత్తమనియో వేరొకనిని

ఉంచుకొనివుంటే, ఆయనకు దేవుడు అను పేరు వర్తించదు. ఎందుకనగా ప్రక్కవానికి తెలిసినవాడై పోవును. మరియు

ప్రక్కనున్న వాని ద్వారా తాను ఎక్కడున్నదీ ఇతరులకు తెలిసిపోవును. అప్పుడు సులభముగా దేవుడు ఎవరికైనా

దొరికిపోగలడు. వారందరూ తనను చూడగలరు. ఇంతవరకు దేవుడు ఎవరికీ కనిపించక రహస్యముగా ఉన్నాడంటే,

ఆయన ఎవరినీ నమ్మి తన సేవకునిగా ఒక్కనిని కూడా నియమించుకోలేదు. దేవున్ని ఎంత పొగిడినా ఆయన


మాత్రము ఎక్కడా ఎవరికీ మోసపోకుండాయున్నాడు. ప్రపంచములో అత్యంత సన్నిహిత భక్తుడెవడైనా ఉండినా

ఒక్కనిని కూడా నమ్మి తనవద్ద చేర్చుకోలేదు. దేవుడు మనుషుల యెడల ఎందుకంత జాగ్రత్తగాయున్నాడని ఎవరైనా

అడిగిన, దానికి దేవుడయితే ఇలా జవాబు చెప్పగలడు. “మీరు మనుషులు, నేను దేవున్ని కనుక, మీరు కనిపించేవారు,

నేను కనిపించనివాడిని కనుక, మీరు పుట్టారు, నేను పుట్టలేదు గనుక, మీకు అవయవములున్నవి, నాకు లేవు కనుక,

మీకు కర్మలున్నవి నాకు కర్మలులేవు కనుక, అని” అనేక సమాధానములు వదలకుండా చెప్పగలడు.అలా

ఇదంతయు గమనించితే దేవునివద్ద ఒక్కరు కూడా లేరు. ఆయన ఏకాకిగా ఒక్కడేయున్నాడు. అందువలన

నేను నా దూతను పంపుచున్నాననీ, నా దూత నా జ్ఞానమే చెప్పుననీ ఆయన చెప్పినా, జ్ఞానము తెలిసినవాడు ఆయన

మాటలోని సత్యమును తెలుసుకోగలడు. ఆయన వద్ద ఎవరూ లేరు కావున, ఆయనే వచ్చాడని తెలుసుకోగలడు.

తనను ఎవరూ గుర్తించకుండాయుండుటకు దేవుడలా చెప్పాడనీ, జ్ఞాని అయినవాడు తెలుసుకోగలడు.

తెలియగల్గినవాడు దేవుని జ్ఞానములోని రహస్యములన్నీ తెలియగల్గును. అంతవరకు అర్థము కాకుండావుండి తప్పు

దారి పట్టుటకు అవకాశమున్న జ్ఞాన సంశయములన్నియు తీరి పోవుచూ వచ్చును. అలా తెలియగలిగినవాడు

అనతికాలములోనే దేవుని జ్ఞానమునూ, రహస్యమును తెలియగల్గి, దేవునివద్దకు చేరిపోవును. అటువంటి వానిని

మోక్షము పొందాడని, పరమ పదము చేరాడని చెప్పవచ్చును.


ప్రశ్న :- ఇంతవరకు మీరు చెప్పిన దానిని నమ్మి, సత్యమే చెప్పుచున్నారను కొన్నాము. అయితే ఇప్పుడు మీమాట మీద

కొంత అనుమానము వస్తున్నది. దానికి కారణమేమంటే ఇంతవరకు దేవునివద్ద ఎవరూ లేరు అని చెప్పారు.

కనీసము ఒక్కడంటే ఒక్కడు కూడా లేడని చెప్పారు. దేవుడు మనుషులను నమ్మడనీ తనవద్దకు చేర్చుకోడని కూడా

చెప్పారు. మేము మీరు చెప్పినవన్నీ వింటూ వచ్చాము. ప్రస్తుతము ఇప్పుడు మీరు చెప్పిన మాటతో మాకు కొంత

సంశయము ఏర్పడుచున్నది. దేవున్ని గురించి సత్యము తెలిసినవాడు మోక్షము పొంది దేవునివద్ద చేరిపోవునని

ఇప్పుడు మీరు చెప్పారు. ముక్తిపొందినవాడు దేవుని సన్నిధానములో చేరిపోయి జన్మకు పోడని ఇతరులు కూడా

చెప్పగా విన్నాము. మొత్తము మీద దేవుడు ఎవనినీ తనయొద్ద చేర్చుకోకున్నా, మనిషే మోక్షము పొంది ఆయన (దేవుని)

వద్దకు పోవుచున్నాడు కదా! దీనికేమంటారు. మా మాటకు మీరు ఏమి సమాధానము చెప్పగలరు?


జవాబు: సరియైన సమయములో సరైన ప్రశ్న అడిగి నన్ను చిక్కుల్లోనికి త్రోయాలని చూస్తున్నారు. అయినా ఫరవాలేదు.

ఇలాంటి ప్రశ్నలనే నేను కోరుకుంటున్నాను. మీరడిగిన ప్రశ్నకు జవాబు ఇలా కలదు. సంపూర్ణ జ్ఞానము తెలిసినవాడు

తన కర్మలన్నీ లేకుండాపోయినప్పుడు, అతడు మోక్షము పొంది దేవునివద్దకు చేరునను మాట సత్యమే. అయితే దేవుడు

తనవద్దకు వచ్చినవానిని చూచి, వీడు బయట నా ప్రక్కనేయున్నా మంచిది కాదని తలచి, అక్కడికిపోయిన వానికున్న

ముక్కు, చెవులు కోసివేసి, రూపము లేకుండా చేసి, కాళ్ళు చేతులు విరగగొట్టి చలనము లేకుండా చేసి, నేను జీవుడనను

జ్ఞాపకము లేకుండా తలమీద కొట్టి, చివరకు తనవలె నిరాకారున్ని చేసి, పేరు, పని ఏమీ లేకుండా చేసి తనవలె రూప,

నామ, క్రియారహితుడైన తర్వాత తనలోనికి చేర్చుకొనును. అప్పుడు మోక్షము పొందినవాడు ఎవడూ దేవునికంటే

బయట లేకుండాపోయి, దేవునిలోపలే దేవునివలె ఉండిపోవుదురు. వాడే తాను, తానే వాడు అయిన తర్వాత అంతా

ఒక్కటిగానే ఉండిపోవునుగానీ, తనకంటే వేరువాడు ఎవరూ ఉండడు. ఆ విధముగా ఎవరు చేరినా, ఎందరు చేరినా,

వారందరు దేవుని లోపల ఐక్యమైయుండి పోయి, ఏమాత్రము వేరుకాక కలిసిపోయారు. రెండు అని చెప్పుటకు


వీలులేక అంతా ఒక్కటిగా మారిపోయారు.  అందువలన అక్కడ ఎవరూ లేరు, దేవుని దూతగా ఎవడూ రాడు.

పేరుమార్చుకొని దూతగా వచ్చేవాడు దేవుడే. ఇందులో ఏమాత్రము సంశయము లేదు.



దేవుడు తన మూలగ్రంథమైన ఖుర్ఆన్లో, ఏదైనా ముఖ్యమైన జ్ఞానవాక్యము వచ్చినప్పుడు, ఆ వాక్యము

చివరిలో ఏదో ఒక గుర్తింపును పెట్టియుంటాడు. అది ఖుర్ఆన్లో ఉండే గొప్పతనము. 42వ సురా 51వ ఆయత్లో

కూడా చివరిలో ఒక మాట చెప్పాడు. అక్కడ ఆయన చెప్పిన మూడు విధానములలో చివరి దానియందు తన దూతను

పంపి దేవుని ఆజ్ఞమేరకు దూతద్వారా కోరిన జ్ఞానమును తెలియజేయును అని కలదు. అంతటితో ఆ వాక్యమును

ఆపక “నిశ్చయముగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు" అని చెప్పడము జరిగినది. అక్కడ చెప్పినమాటను

జిబ్రయేల్ తెరచాటునుండి కనిపించక చెప్పుచుండగా, ముహమ్మద్ ప్రవక్తగారు వినడము జరిగినది. అప్పుడు జిబ్రయేల్

ఎవరిని ఉద్దేశించి నిశ్చయముగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడని అన్నాడు అని ప్రశ్నించుకొని చూస్తే ముస్లీమ్

సమాజమంతా దూతను పంపి తన జ్ఞానమును తెలియజేయు దేవున్ని గురించే ఆ మాట జిబ్రయేల్ అన్నాడని చెప్పుచున్నారు.

అక్కడున్న పరిస్థితినిబట్టి అందరూ అలాగే అనుకొనుటకు అవకాశమున్నా, జిబ్రయేల్ సృష్ట్యాదినుండి దేవుని సేవలోయుండి,

దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలిసినవాడు కనుక, జిబ్రయేల్ మనమను కొన్నట్లు చెప్పలేదనీ, అక్కడ చెప్పినది

వచ్చిన దూతను గురించి అనీ తెలియుచున్నది. దేవుని జ్ఞానము తెలిసినవాడు దేవున్ని వదలి, దేవుని చేత పంపబడిన

దూతను పొగడునా అను ప్రశ్న కొందరిలో రావచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! ఇక్కడ బాగా గమనించితే,

కనిపించకుండా తెరచాటునుండి చెప్పిన మహాజ్ఞాని జిబ్రయేల్, తనకున్న జ్ఞానము ప్రకారము దూతగా వచ్చిన వ్యక్తిని

“నిశ్చయముగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు" అని అన్నాడు. దేవున్ని తెలివైనవాడనీ (వివేకవంతుడనీ)

మహోన్నతుడనీ చెప్పనవసరము లేదు. ఎందుకనగా! కనిపించు దూతగా వచ్చిన మనిషిని ప్రక్కవారితో పోల్చి,

వారికంటే ఈయన తెలివైనవాడని తెలుపు నిమిత్తము, దూతను ఉద్దేశించి చెప్పియుండవచ్చును. అలాగే నీచము

ఉన్నతము అని చెప్పినప్పుడు, నీచమైన మనుషులతో మనిషిగానున్న దూతను పోల్చి చెప్పినప్పుడు, దూతను మహోన్నతుడు

అని చెప్పియుండ వచ్చును. అంతేగానీ కనిపించని దేవున్ని కనిపించే మనుషులతో పోల్చి చెప్పనవసరముండదు.

ఎందుకనగా! దేవునికి మనుషులకున్నట్లు తల వుండదు, దానిలో తెలివివుండదు. అలాంటప్పుడు ఆయన అందరికంటే

వివేకవంతుడని చెప్పుటకు వీలులేదు. అంతేకాక దేవుడు ఎంతటి వాడో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు మనుషులతో

పోల్చి మహోన్నతుడు అని చెప్పుటకు వీలులేదు. ఏ విధముగా దేవున్ని చూడనివారు, ఆయనను ఇతరులతో పోల్చి

చెప్పడమంటూ జరుగదు. అందువలన జిబ్రయేల్ దేవున్ని గురించి ఏమీ చెప్పక, అక్కడున్న దూతను గురించి మాత్రము

చెప్పాడని తెలియుచున్నది. దూతను గురించి మహోన్నతుడు, వివేకవంతుడని చెప్పినమాట సరిపోవును. ఈ విధముగా

ఖుర్ఆన్లోని వాక్యములను సరిగా అర్థము చేసుకొన్నప్పుడే అందులోని నిజమైన జ్ఞానము అర్థము కాగలదు.


జిబ్రయేల్ ఖగోళములో సృష్ట్యాదినుండి దేవుని పరిపాలనలోనున్న ఒక గ్రహము. గ్రహము అంటే ఏదో

తక్కువగా లెక్కించుకోకూడదు. జిబ్రయేల్ గ్రహరూపములోనున్న సంపూర్ణజ్ఞాని అని తెలియవలెను. దేవుని

పరిపాలనలోనున్న వాడు జిబ్రయేల్ కావున, ఆయనను దేవుని సేవకుడు అని అనవచ్చును. దేవుని సేవకుడు దేవుని

తరపున పనిచేయువాడు కావున, ఆయనను (జిబ్రయేల్) దేవుని దూత అని కొందరనియుండవచ్చును. అయితే

ఆయనను దేవుని చేత పంపబడిన దూత అని చెప్పుకోకూడదు. జిబ్రయేల్ అటువంటిదూతకాడనీ, ఎప్పుడైనా దూత

వస్తే అతను దేవుని ప్రతినిధిగా వచ్చిన కనిపించే భగవంతుడనీ తెలియవలెను. శరీరమున్న వానిని దేవుడు అని

చెప్పకూడదు. కావున అట్లు వచ్చిన వానిని దూత, అవదూతయని చెప్పవచ్చును. తల్లి గర్భము నుండి (భగమునుండి)

పుట్టి వచ్చినవాడు కనుక, అతనిని భగవంతుడని కూడా అంటున్నాము. దేవుడు స్వయముగా భూమిమీద అవతరిస్తే

దూత, అవదూత, భగవంతుడు అని అంటున్నాము. జిబ్రయేల్ దేవుని జ్ఞాని మాత్రమేగానీ దేవుడు కాడు. అందువలన

కనిపించని జిబ్రయేల్ను తెరవెనుక నుండి చెప్పిన వానిగా లెక్కించుచున్నాము. కనిపించి జ్ఞానము చెప్పిన కృష్ణున్ని

దూతగా చెప్పుచున్నాము.


కనిపించి దైవజ్ఞానము చెప్పు దూత మనిషిగాయున్నాడు. అతనికి తలయున్నది, అందులో అమితమైన

బుద్ధియున్నది. అందువలన దూతగా వచ్చిన దేవుడు సామాన్యుడుకాడని తెలిసిన జిబ్రయేల్, తనబోధలో దూతను

నిశ్చయముగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు అని అన్నాడు. ప్రపంచములో దేవుడు మొదటివాడైతే, దేవుని

ప్రతినిధియైన దూత రెండవ వాడగును. కనిపించనివాడు దేవుడు, కనిపించే దేవున్ని దూత (అవదూత) అని చెప్పవచ్చును.

భూమిమీద దేవునికంటే మించిన మహోన్నతుడు ఎవడూ లేడు. కావున మహోన్నతుడు అను మాటను దేవుని దూతను

గురించి చెప్పడము జరిగినది. మహోన్నతుడు, వివేకవంతుడు అని నేరుగా కనిపించని దేవున్ని గురించి చెప్పడము

ధర్మవిరుద్ధమగును. అదే మాటలనే దేవుని దూత విషయములో చెప్పడము తప్పుగాదు. ఖుర్ఆన్ గ్రంథములో దేవుని

బోధ మూడు విధముల భూమిమీద మనుషులకు తెలియబడును అని చెప్పిన ప్రకారము రెండవ విధానముగా కనిపించక

తెరచాటునుండి చెప్పినవాడు జిబ్రయేలియనీ, జిబ్రయేల్ దూతకాదనీ, దూత అయినవాడు మూడవ రకమైన బోధకుడగుననీ

తెలియవలెను. దూతయే నిజ దైవమని తెలిసిన జిబ్రయేల్, దూతను గురించి మహోన్నతుడు, వివేకవంతుడని అన్నాడు.


ప్రశ్న :- ఖుర్ఆన్ జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్తగారికి మొదట చెప్పిన జిబ్రయేల్ కనిపించనివాడైతే, ఆయనను

ఏమని చెప్పాలి. ముహమ్మద్ గారు ప్రవక్త అయినప్పుడు, జిబ్రయేల్ ఏమగును?

జవాబు: ఖుర్ఆన్ను ముహమ్మద్కు చెప్పిన జిబ్రయేల్నుగానీ, తాను విన్న ఖుర్ఆన్ను ప్రజలకు చెప్పిన ముహమ్మద్రిని

గానీ, ఇద్దరినీ సూత్రము ప్రకారము ప్రవక్తలనియే చెప్పాలి. అయితే జిబ్రయేల్గారు ఖగోళములోనున్న గ్రహము,

ముహమ్మద్రు భూమిమీదున్న ఒక మనిషి. జిబ్రయేల్ సృష్ట్యాదినుండి ఉన్నవాడు, సృష్ఠి ఉన్నంతకాలము ఉండువాడు.

ముహమ్మద్ ప్రవక్త రాక ముందూ, ముహమ్మద్ ప్రవక్త పోయిన తర్వాత కూడా జిబ్రయేల్ ఉన్నాడు. జిబ్రయేల్ దేవుని

పాలనలోని ఒకడు. దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలిసిన జ్ఞాని. ముహమ్మద్ ఖుర్ఆన్ జ్ఞానమును చెప్పుట వలన

ప్రవక్త అయినా, ఆయన సాధారణ మనిషియే. మనవలె జనన మరణములు, కష్టసుఖములుగల ఒక వ్యక్తి ముహమ్మద్గారని

తెలియవలెను.


ప్రశ్న :- చాలామంది ముస్లీమ్ సోదరులకు ప్రవక్త బాగా తెలియునుగానీ, జిబ్రయేల్ ఎవరో తెలియదు. ప్రవక్తకు

తెలిసిన ఖుర్ఆన్ పై నుండి వచ్చిన దైవసందేశమని చెప్పుచున్నారు. దీనికి మీరేమంటారు?


జవాబు: పైనుండి వచ్చిన దైవ సందేశమును వాణి లేక వహీ అంటారు. ముహమ్మద్ ప్రవక్తగారికి వినిపించిన ఖుర్ఆన్

సందేశము అప్పుడు పై నుండి వచ్చినది కాదు. క్రింద తనకు ఎదురుగా కనిపించకయున్న జిబ్రయేల్ చెప్పినదని

ఖుర్ఆన్ గ్రంథములోనే తెలియుచున్నది. పై నుండి వచ్చిన శబ్దము లేక వాణిని, దేవుడు చెప్పిన మొదటి రక జ్ఞాన

ప్రచారమని తెలియవచ్చును. అయితే ఖుర్ఆన్ దేవుడు 42వ సురా, 51వ ఆయత్లో తెల్పిన ప్రకారము దేవుని



జ్ఞానము తెరచాటునుండి చెప్పబడును అను రెండవ రక జ్ఞాన ప్రచారమని తెలియుచున్నది. అందువలన ఖుర్ఆన్

గ్రంథము దేవుడు తెల్పిన రెండవ రక జ్ఞాన ప్రచారమని తెలియవలెను.


ప్రశ్న :- ఖుర్ఆన్ గ్రంథములో దేవుని జ్ఞానము భూమిమీద మనుషులకు మూడు విధములుగా బోధించబడునని

కలదు కదా! అందులో ఒకటి వాణి (వహీ) ద్వారా చెప్పబడును అనియూ, రెండు తెరచాటునుండి చెప్పబడును

అనియూ, మూడు పంపబడిన దూత ద్వారా చెప్పబడును అనియూ మూడు విధముల గలదు కదా! ఈ మూడు

విధానములలో ఏ విధానము ఉత్తమమైనది?


జవాబు: దేవుని జ్ఞానము భూమిమీద మనుషులకు చెప్పబడు ఏ విధానమైనా గొప్పదే. జ్ఞానము తెలియబడడమే గొప్ప.

అందువలన అన్ని విధానములు గొప్పవే అని చెప్పవచ్చును. మూడు విధానములలో ఇది గొప్ప, ఇది గొప్ప కాదు అని

చెప్పుటకు వీలులేదు. బాగా ఆలోచిస్తే మొదటి విధానము వాణి ద్వారా జ్ఞానమును తెలుపడము అని ఉన్నది. వాణి

అనగా శబ్దము అని అర్థము. దేవుని జ్ఞానము శబ్దము ద్వారా వినిపించడము అని మనకు తెలిసినప్పుడు, ఆ శబ్దము

ఎక్కడనుండి వస్తున్నదని ప్రశ్నించితే, శబ్దము గాలి ద్వారా వచ్చినా, అది ఆకాశమునుండి పుట్టినదని తెలియుచున్నది.

దేవుని సృష్ఠిలో భూతములు, గ్రహములు, జీవరాశులు అని మూడు భాగములు కలవు. మహా భూతములు కేవలము

ఐదు మాత్రమే కలవు. దేవుని నుండి మహా భూతములు మొదట పుట్టినవి. వాటి తర్వాత గ్రహములు, జీవరాసులు

పుట్టినవి. మొదట పుట్టిన మహాభూతములు మొత్తము ఐదు కలవు. అవి వరుసగా 1) ఆకాశము 2) గాలి 3) అగ్ని

4) నీరు 5) భూమి. ఈ ఐదు భాగములనే ప్రకృతియని కూడా అంటున్నాము, అలాగే పంచభూతములు అంటున్నాము.

దేవుని జ్ఞానము గాలి ద్వారా శబ్దరూపములో రాగా, ఆ శబ్దములోని జ్ఞానము పుట్టినది ఆకాశములోనని తెలియవలెను.

ఆకాశము శూన్యమైనది, శూన్యమునుండి పుట్టిన జ్ఞానము గాలి ద్వారా శబ్దమై, మొదట సూర్య గ్రహమునకు వినిపించినది.

ప్రపంచము లో మొట్టమొదట దైవజ్ఞానము సూర్యునికి తెలియగా, అదే జ్ఞానము తెలిసిన రెండవ గ్రహము జిబ్రయేల్.

దైవజ్ఞానము తెలిసిన మొదటివాడు సూర్యుడు, రెండవవాడు జిబ్రయేల్ అని చెప్పవచ్చును. అయితే సూర్యుడు మొదట

భూమిమీద మనువు అను వ్యక్తికి తెలియజేశాడు. మనువు ద్వారా ఇతర మనుషులకు తెలియబడినది. దీనినంతటిని

గమనించితే భూతములు, గ్రహములు, మనుషులు అను మూడు జాతులలో మొదట భూతములకు తెలియబడిన

జ్ఞానము తర్వాత గ్రహములకు తెలియబడగా, గ్రహముల ద్వారా భూమిమీద మనుషులకు తెలియబడినది.


ప్రకృతిలో భాగమైన ఆకాశమునుండి మొదలైన జ్ఞానము, చివరికి మనుషులకు చేరడము అంతయు ఒక

జాడగా తెలియుచున్నది. ఒక దారిగా (ఒక జాడగా) కనిపించు ఈ విధానమును రెండు భాగములుగా

విభజించుకోవచ్చును. అదెలాయనగా! దేవుని నుండి మనుషులకు జ్ఞానము తెలియు మూడు విధానములలో, వాణి

ద్వారా తెలియజేయడము ఒక విధానమని తెలియుచున్నది. తెరచాటునుండి తెలియజేయడము మరొక విధానమని

అర్థమగుచున్నది. ఒక విధానము ద్వారా దేవుడు సృష్టించిన గ్రహముల గుంపుకు జ్ఞానము తెలియగా, రెండవ

విధానము ద్వారా గ్రహములనుండి భూమిమీద మనుషులకు తెలియబడినది. ఆకాశమునుండి సూర్యగ్రహమునకు

తెలియబడడము ఒక విధానమైతే, సూర్య గ్రహమునుండి మనుషులకు తెలియబడడము రెండవ విధానమైనది. ఆకాశములో

నున్న గ్రహములు తమ స్థూలమును వదలి, సూక్ష్మముగా భూమిమీదికి వచ్చినప్పుడు, అవి ఎవరి కంటికీ కనిపించవు.

ఆ విధముగా కనిపించక, మనుషులకు తెలిసిన భాషలో చెప్పడమును తెరచాటునుండి చెప్పడము అని అన్నారు.

తెరచాటునుండి అనగా! చెప్పేవాడు అక్కడ ఎదురుగాయున్నా కనిపించడని అర్థము. అట్లు కనిపించకుండా మనుషులకు



సూర్యుడు చెప్పాడు. అట్లే జిబ్రయేల్ కూడా చెప్పాడు. సూర్యుడు చెప్పినది భగవద్గీతయైనది. జిబ్రయేల్ చెప్పినది

ఖుర్ఆన్ అయినది. ఇటు సూర్యుడు చెప్పిన జ్ఞానమునే జిబ్రయేల్ కూడా చెప్పాడు. సూర్యునకు తెలిసిన జ్ఞానమే

జిబ్రయేలు కూడా తెలుసు. కావున ఇటు సూర్యుడు చెప్పినది, అటు జిబ్రయేల్ చెప్పినది రెండూ ఒకటే జ్ఞానమేనని

చెప్పవచ్చును.


ముఖ్యముగా తెలియవలసినది ఏమనగా! సూర్యుడు మనువుకు చెప్పిన దినమున చెప్పబడిన జ్ఞానమునకు

భగవద్గీతయని పేరు లేదు. అప్పుడది దేవుని జ్ఞానము అని మాత్రమే చెప్పబడినది. అలాగే జిబ్రయేల్ మొదట

ముహమ్మదు చెప్పినప్పుడు దైవజ్ఞానమునకు ఖుర్ఆన్ అని పేరులేదు. ఆ దినము జిబ్రయేల్ తాను చెప్పిన జ్ఞానమును

దేవుని జ్ఞానముగానే చెప్పాడు. మనుషులకు తెలిసిన జ్ఞానమును గ్రంథరూపముగా వ్రాసుకొన్నప్పుడు సూర్యుడు

చెప్పిన జ్ఞానమునకు భగవద్గీతయనీ, జిబ్రయేల్ చెప్పిన జ్ఞానమునకు ఖుర్ఆన్ అని పేరు పెట్టడము జరిగినది. భగవద్గీత,

ఖుర్ఆన్ అను గ్రంథములు రెండూ నేడు మనముందరున్నా, రెండిటిలోనూ ఒకే జ్ఞానమును గుర్తించలేకపోవుచున్నాము.

దానికి కారణము నేడు మానవునిలోనున్న సంకుచిత భావములేనని తెలియుచున్నది.


ఇంతవరకు మనము చెప్పుకొన్నవి రెండు విధానములే ఉన్నాయి. దేవుని జ్ఞానము భూమిమీద మనుషులకు

తెలియు రెండు విధానములలో మహాభూతములైన ప్రకృతిపాత్ర కొంత, గ్రహముల పాత్ర కొంతయున్నట్లు అర్థమైనది.

ఈ రెండు విధానములు కాకుండా మూల గ్రంథములలో మరియొక విధానము కూడా ఉన్నట్లు చెప్పారు కదా! అదియే

దూతను పంపడము ద్వారా తన జ్ఞానమును తెలియజేయడమని కూడా చెప్పారు. ఇప్పుడు దూత విషయము ముఖ్యముగా

మనము తెలియవలసియున్నది. దూత భూతముల ద్వారా (ప్రకృతి ద్వారా) రాలేదు. అలాగే గ్రహముల ద్వారా

రాలేదు. దూత ప్రకృతిలో భూతమూకాదు, గ్రహములలో గ్రహమూ కాదు. అలాగని జీవులలో జీవుడూ కాడు.

వివరముగా చెప్పుకొంటే దేవుని సృష్టిని ముఖ్యముగా మూడు భాగములుగా చెప్పవచ్చును. అవియే ఒకటి భూతములు,

రెండు గ్రహములు, మూడు జీవులు. వీటిని విభజించు కొంటే భూతములు రెండు రకములు, గ్రహములు రెండు

రకములు, జీవులన్ని ఒకే రకము. మొత్తము ఐదు విభజనలుగాయున్న సృష్ఠిని ముఖ్యముగా భూతములు, గ్రహములు,

జీవులని మూడు రకములుగా చెప్పవచ్చును. అయితే దేవుని జ్ఞానము మనుషులకు తెలియదు. ముందు చెప్పుకొన్న

రెండు విధానములలో భూతముల ద్వారా గ్రహములకు ఒక విధానముకాగా, గ్రహముల ద్వారా జీవులకు రెండవ

విధానమైనది. ఇప్పుడు చెప్పుకోబోవు మూడవ విధానములో ఒక్క దూత పాత్ర తప్ప భూతములపాత్రగానీ, గ్రహముల

పాత్రగానీ ఏమాత్రము లేదు.


దూత ద్వారా జీవులకు దేవుని జ్ఞానము భూమిమీద ఇప్పటికే తెలియబడినది. కావున ఆ విధానమును

విశ్లేషించి చూడగలిగితే, మనకు కొంత క్రొత్త విధానము అర్థమగుచున్నది. అదేమనగా! మూల గ్రంథములలో తన

దూత ద్వారా జ్ఞానము చెప్పబడును అనియున్నా, ఆ దూత ఎవరు అన్నది ముఖ్యమైన ప్రశ్నగాయున్నది. దూత

భూతముకాదు, గ్రహమూ కాదు. కావున మనతో ప్రత్యక్షముగా మాట్లాడిన మనలాంటి వ్యక్తియే అయివుండడము

విశేషము. అయితే దూతను గుర్తించుటకు ఎవరికీ సాధ్యము కాలేదు. దూత సాధారణ మనిషియైయుండడమే దానికి

ముఖ్యకారణము. దూత అను వ్యక్తి సాధారణ వ్యక్తియా కాదా అను విషయమును గురించి మనము ముందే

చర్చించుకొన్నాము. దూత అనువాడు ఎవరో కాదు, రూపము మార్చుకొని వచ్చిన దేవుడేనని తేలిపోయినది. కొందరు

ప్రత్యేకించి కొన్ని మతములలో దేవుడు జన్మించడు అని అంటున్నారు. మేము కూడా దేవుడు జన్మించడనియే చెప్పుచున్నాము.




అయితే దేవుడు దేవుడుగా జన్మించలేదు. వేషము మార్చుకొని మారు రూపములో, మారు పేరుతో జన్మించుచున్నాడని

అంటున్నాము. అలా పేరు మార్చుకొని, రూపము మార్చుకొని పుట్టాడనుటకు కొన్ని ఆధారములు గలవు.

ఏవనగా! భగవద్గీతలో రాజవిద్యా రాజగుహ్య యోగమున 11వ శ్లోకమందు భగవంతుడు ఇలా చెప్పియున్నాడు.


“అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్

పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్”


భావము :- “సర్వ జీవరాసులకు దేవుడనైన నేను మానవ శరీరము ధరించి భూమిమీదికి రాగా, మానవాకారములోనున్న

నన్ను చూచిన మనుషులు శ్రేష్టత్వమును తెలియలేక, నేను అందరికీ అధిపతినని తెలియక మూఢులై నన్ను

అవమానించుచున్నారు”.


భగవద్గీత జ్ఞానయోగము॥ 6వ శ్లోకము...


“అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా”


భావము :- “దేవునిగానున్న నాకు నాశనములేదు, అట్లే దేవునిగా నేను పుట్టను. సకల జీవరాసులకు నియామకుడను

అయిన నేను, మాయతో కలిసి ఎవరూ గుర్తించని భగవంతునిగా, సాధారణ మనిషి శరీరము ధరించి పుట్టుచున్నాను.”


ఈ విధముగా భగవద్గీతయందు దేవుడు భగవంతునిగా ఉన్నప్పుడు చెప్పియుండగా, పవిత్ర ఖుర్ఆన్ గ్రంథమందు

89వ సురాలో 22వ ఆయత్ నందు "దేవదూతలు బారులు తీరియుండగా నీ ప్రభువు (దేవుడు) అవతరిస్తాడు

(ఏతెంచుతాడు)” అని జిబ్రయేల్ చెప్పాడు. ఈ విధముగా భగవద్గీత, ఖుర్ఆన్, బైబిల్ గ్రంథములలో దేవుడు భూమిమీదికి

వస్తాడనియున్నది. భగవద్గీతలో స్పష్టముగా దేవుడనైన నేను మనిషిగా అవతరిస్తానని చెప్పడము జరిగినది. దేవుడు

దేవుడుగా ఎప్పటికీ భూమిమీదికి రాడు, కానీ దేవుడు మరొక రూపముతో దూత లేక భగవంతుడు అను వానిగా

వస్తాడని చెప్పవచ్చును. అప్పుడు కూడా నేను దూతననిగానీ, భగవంతుడననిగానీ ఎక్కడా ఎవరితో చెప్పడు. దేవుడు

భూమిమీద అవతరించాడను విషయము ఎవరూ పసిగట్టలేరు. అందువలన దేవుడు మనిషిగా భూమిమీదకు వచ్చి

స్వయముగా జ్ఞానము చెప్పిపోయినా, ఆయన వచ్చినట్లుగానీ, పోయినట్లు గానీ ఎవరికీ తెలియదు. భగవద్గీతలో నేను

ఎన్నోమార్లు వచ్చానని జ్ఞానయోగమున ఐదవ శ్లోకమందు చెప్పినా ఆ విషయమును ఎవరూ గ్రహించుకోలేక దేవుడు

మనిషిగారాడని, అవతరించడని చెప్పుచున్నారు. అటువంటి వారికొరకు భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగమున

పదకొండవ శ్లోకమునూ, జ్ఞానయోగమున ఆరవ శ్లోకమునూ చెప్పడము జరిగినది. అంతేకాక ఆయన (దేవుడు)

భూమిమీదకు ఏ పని నిమిత్తము వస్తున్నాడో ఆ పనిని వివరిస్తూ జ్ఞానయోగమున 7,8 శ్లోకములలో ఇట్లు చెప్పుచున్నాడు...


7)శ్లోకము :యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత! |

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥


8)శ్లోకము  :పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥



భావము :- “ఎప్పుడెప్పుడు ధర్మమునకు ముప్పుకలిగి భూమిమీద అధర్మము చెలరేగునో, అప్పుడు నన్ను నేను మనిషిగా

నిర్మించుకొని భూమిమీద పుట్టుచున్నాను.”


“అలా మానవునిగా పుట్టిన నేను ధర్మములను తెలియజేసి అధర్మ వరుల సంఖ్యను తగ్గింతును. ఈ విధముగా

ధర్మములను తెలియజేయు నిమిత్తము, యుగ యుగములో అనగా ఏ యుగములోనైనా నేను భూమిమీదికి వచ్చుచుందును.”


ఇప్పుడు ఈ మాటతో భూమిమీద నేను నేరుగా మీకు జ్ఞానము చెప్పుతాననియున్నా, దూత ద్వారా జ్ఞానము

తెలియజేతును అని మెలిక పెట్టి చెప్పాడు. ముందే గీతలో నేను మనిషిగా వచ్చి ధర్మములను (దేవుని జ్ఞానమును)

తెలియజేతునని ఏ మెలిక లేకుండా నేరుగా చెప్పాడు. అయినా నా దూత ద్వారా దేవుని జ్ఞానమును తెలియజేస్తానని

గుట్టుగా 14 వందల సంవత్సరముల క్రితము చెప్పినమాట ఎవరికీ (ముస్లీమ్లకు) అర్థము కాలేదు. అలాగే నేనే వచ్చి

జ్ఞానమును ధర్మమును తెలియజేస్తానని రట్టుగా ఐదువేల సంవత్సరముల క్రిందట చెప్పినమాట మనుషులకు అర్థముకాక,

దేవుడు భూమిమీదికి రాడు. దేవుడు ఆరు ఆకాశముల ఆవల ఏడవ ఆకాశములోయున్నాడని చెప్పుచున్నారు. ఉన్నది

ఒకే ఆకాశమని తెలియని వారు స్థూలముగా ఏడు ఆకాశములు లేవని తెలియక, ఏడు ఆకాశములను సూక్ష్మ అర్థమును

గ్రహించలేక, స్థూలముగానే పైన ఏడు ఆకాశములున్నా యని అంటున్నారు.


దేవుడు భూమిమీద మనుషులకు జ్ఞానమును మూడు విధముల తెలియజేస్తానని, చెప్పినమాట ప్రకారము

భూతములు, గ్రహములకు వాణి ద్వారా తెలియజేయడము ఒక రకముకాగా, గ్రహములు మనుషులకు కనిపించక

తెరచాటునుండి తెలియజేయడము రెండవరకమయినది. ఈ రెండు రకములను ఒక కోవకు చెందినవిగా, దేవుని

పరిపాలన వలన జరుగు విధానముగా చెప్పవచ్చును. మొదటి రెండు రకములు ఒకే కోవకు చెందినవికాగా, మూడవ

విధానము మాత్రము స్వయముగా దేవుడే దూతగా (భగవంతునిగా) వచ్చి చెప్పడము ప్రత్యేకత కల్గియున్నది. తన

పరిపాలనలో నున్న భూతములనూ, గ్రహములనూ దేవుని సేవకులుగా, దేవుని పనిని చేయువారుగా లెక్కించి చెప్పవచ్చును.

అటువంటి దేవుని సేవకులైన భూతముల, గ్రహముల కార్యము వలన, భూమిమీదికి జ్ఞానము చేరవేయ బడుచున్నది.

ఎక్కడో దూరప్రాంతములోనున్న సామాగ్రిని వాహనముల ద్వారా గమ్యస్థానమునకు చేర్చినట్లు, ప్రజలకు దూరముగా

ఎక్కడోనున్న జ్ఞానమును భూతములు మరియు గ్రహముల ద్వారా మనుషుల వరకు చేరవేయడము రెండు విధములుగా

ఉండగా, అట్లు రవాణా చేయకుండా మనుషులవద్దనే సామాగ్రిని తయారుచేసి ఇవ్వడము మరొక ప్రత్యేక రకముగా

యున్నది. మనుషులవద్దకే దేవుడు మనిషిగా వచ్చి, అప్పటికి అవసరమైన జ్ఞానమును ప్రత్యక్షముగా అందివ్వడము

ప్రత్యేక రకమని తెలియుచున్నది.


మనుషులవద్దకు దేవుని జ్ఞానము చేరునది చివరకు రెండు విధములని తెలియుచున్నది. ఒకటి కనిపించని

గ్రహముల ద్వారా, రెండు కనిపించే మనిషిగాయున్న దేవుని ద్వారా అని చెప్పవచ్చును. ఈ ప్రక్రియ కొన్ని వేల

సంవత్సరములకో లేక కొన్ని లక్షల సంవత్సరములకో ఒకమారు జరుగుచుండును. ఇట్లు ఒకమారు భూమిమీద

తెలియబడిన జ్ఞానమును తర్వాత కాలములో కొన్ని వేల సంవత్సరముల వరకు మనుషులలో కొందరు బోధకులుగా

ఏర్పడి మిగతా ప్రజలకు చెప్పుచుందురు. బోధకులు గురువుల మనుకొని చెప్పుచూపోయిన జ్ఞానము, కొంత కాలమునకు

పూర్తిగా దేవుడు చెప్పిన మాటలకు అర్థమూ, భావమూ మారిపోయి ధర్మములు అధర్మములుగా మారిపోవుచున్నవి.

అట్లు మారిన ధర్మములను సరి చేయుటకు దేవుడు గ్రహముల ద్వారానైనా చెప్పించవలసియుంటుంది, లేక తానే



స్వయముగానైనా రావలసియుంటుంది. ఎలాగైనా దేవుడు మనిషిగా (భగవంతునిగా) వచ్చిన సమయములో,

భూమిమీదయుండి ఆయన ద్వారా స్వయముగా జ్ఞానమును తెలుసుకొన్నవారు, నిజముగా అదృష్టవంతులనియే

చెప్పవచ్చును. అయితే వచ్చినవాడు, చెప్పువాడు ఎవడైనదీ తెలియక తమవలెనున్న దేవున్ని కూడా, కొన్ని సమయములలో

హేళన చేయడము జరుగుచున్నది. అటువంటి వారు నిజముగా దురదృష్టవంతులేనని చెప్పవచ్చును. భూమిమీద

దైవజ్ఞానము పూర్తి అజ్ఞానముతో కప్పబడి, బోధకులందరూ అధర్మములను బోధించునప్పుడు, కొన్ని సందర్భములలో

దేవుడు తానే భూమిమీదికి వచ్చి తన జ్ఞానమును తెలియజేయును. అప్పుడు అంతవరకు బోధకులుగాయున్నవారికీ,

అజ్ఞానమునే జ్ఞానముగా బోధించు వారికీ, ఇందూ ధర్మములను పేరుపెట్టుకొని హీనధర్మములను బోధించు బోధకులందరికీ

ఒక మానవుడు, ఏ గురు పరంపర లేనివాడు, ఏ గురు పీఠమునకు సంబంధములేనివాడు వచ్చి, తమకు వ్యతిరేఖముగా

జ్ఞానమును బోధించడమును ఓర్చుకోలేని వారు కొందరు, మనిషిగా వచ్చిన వానికి వ్యతిరేఖముగా మాట్లాడడమూ,

వేధించడము జరుగుచుండును. అటువంటి వారిని గూర్చియే నా శ్రేష్టత్వమును తెలియని మూఢులు నన్ను అవమానింతు

రని భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగమున పదకొండవ శ్లోకమందు చెప్పాడు. దేవుడు స్వయముగా భూమిమీదికి

వచ్చినా, వచ్చినట్లు ఏ ఆధారమూ దొరకదు. అందువలన చాలామంది పొరబడుటకు అవకాశము కలదు. అటువంటి

పొరపాటు పడకుండ మనిషిగా వచ్చినవాడు, మనిషి కాకున్నా మనిషిగాయున్నవాడు తెలుపు జ్ఞానమును శ్రద్ధగా

గ్రహించిన వారు ధన్యులగుదురు. అటువంటి మంచికాలములో ఆయనతో మాట్లాడిన వారు, ఆయన సేవలో పాల్గొన్నవారు,

ఆయనను చూచినవారు, వారికి తెలియకుండానే వారు అదృష్టమును పొందినవారని చెప్పవచ్చును. ఎన్నో కోట్లమందిలో

తమకు మాత్రము అటువంటి అవకాశము లభించినందుకు వారు పూర్తి అదృష్టవంతులే. అయినా ఆ విషయము

తెలియుటకు ఎవరికీ అవకాశము లేదు. అయితే దేవుని జన్మను తెలిసి తాను ఎంతో అదృష్ట వంతుడనని అనుకొన్నవాడు,

అతని చేతిలో తన చావును కోరుకొన్నవాడు, చనిపోవునప్పుడు కూడా ఆయననే చూడాలని అడిగినవాడు, నీవు నాకు

మోక్షమును ప్రసాదించమని నేరుగా మారువేషములోనున్న దేవున్ని కోరిన వాడు చరిత్రలో ఒకేఒక భీష్ముడు కలడని

మరచిపోకూడదు.


ఇటువంటి ప్రత్యేకతలను కల్గియున్నటువంటి దూతద్వారా జ్ఞానము చెప్పిస్తానని దేవుడు చెప్పిన విధానమును

గొప్పదిగా చెప్పవచ్చును. దూత అను పదమును సేవ చేయువారిపట్ల, తమ కార్యములను చేయువారిపట్ల, తన

సందేశమును తీసుకొనిపోయి ఇతరులకు చేర్చివచ్చువారిపట్ల వాడుచుండుట వలన, ఇక్కడ జ్ఞానమును చెప్పు దూతను

కూడా ఒక కార్యము చేయు పనిమనిషిగా కొందరు లెక్కించుకొనుచున్నారు. అట్లు పొరబడకుండా దూత అంటే ఏ

దూతగాయున్నాడో అర్థము చేసుకోవాలి. 89వ సురా 22వ ఆయత్లో దేవదూతలు బారులు తీరియుండగా నీ

ప్రభువు అవతరిస్తాడు అని ఉన్నది కదా! అక్కడ దూతలను ఆయన సేవకులుగా లెక్కించాలి. ఇట్లు సందర్భానుసారము

భావించాలి.


ప్రశ్న :- ఒకే దేవుని జ్ఞానమునే ఐదువేల సంవత్సరముల పూర్వము గీతగా, పదునాలుగువందల సంవత్సరముల

పూర్వము ఖుర్ఆన్గా చెప్పబడినప్పుడు రెండిటిలో ఒకే జ్ఞానముండవలయును కదా! అట్లు కాకుండా గీతను ఆశ్రయించిన

హిందువులు ఒక విధముగా జ్ఞానమును అర్థము చేసుకోగా, ఖుర్ఆన్ను ఆశ్రయించిన ముస్లీమ్లు అదే జ్ఞానమునే

మరొకరకముగా చెప్పుకొనుచున్నారు. దేవుడు ఒకడే అయినప్పుడు, జ్ఞానము ఒకటే అయినప్పుడు, మనుషులందరూ

ఒకే జాతియైనప్పుడు, ఒకే జ్ఞానము వేరువేరుగా మనుషులకు ఎందుకు అర్థమైనది. ఒకే భావముతో ఎందుకు అర్థము

కాలేదు?



జవాబు: దేవుడు ఒక్కడే, దేవుని జ్ఞానము ఒక్కటే అయినా, మనుషులంతా ఒకటేనను భావము మనుషులలోనే లేదు.

మనుషులను మాయ ఆవహించి, అజ్ఞానమును వారిలో పెంచి, మతము అను అస్త్రమును ప్రయోగించి, మీరు ముస్లీమ్లు

మేము హిందువులము అను భావమును హిందువులలోనూ, మీరు హిందువులు మేము ముస్లీమ్లము అను భావము

ముస్లీమ్లలోను కల్గించి ఉండుట వలన, వారి వర్గ బేధము జ్ఞానమును కూడా వేరువేరుగా అర్థమగునట్లు చేసినది.

అట్లని ఒకరికి సక్రమముగా అర్థమై, మరొకరికి సక్రమముగా అర్థము కాలేదని మేము చెప్పడము లేదు. వారివారి

ధ్యాసలు వారివారి మతముల మీద ఉండుట వలన, మత ధ్యాసయున్న ఎవరికిగానీ, మతాతీతముగాయున్న దేవుని

జ్ఞానము అర్థము కాలేదు. భగవద్గీత సంపూర్ణముగా దేవుడు చెప్పిన భావముతో హిందువులకు అర్థము కాకపోగా, అట్లే

ఖుర్ఆన్ గ్రంథములో చెప్పబడిన జ్ఞానము సంపూర్ణముగా ముస్లీమ్లకు కూడా అర్థముకాలేదు. వారివారి మతమును

అనుసరించిన భావములను ఇరువురు చెప్పుకొనుచుండుట వలన, అసలైన భావము మరుగునపడిపోయి, రెండు ప్రక్కల

రెండు వర్గముల వారికి జ్ఞానము అర్థము కాకుండా పోయినది. మా మాట నిజమని తెలియుటకు ఉదాహరణగా

రెండు గ్రంథములలోనున్న ఒకే విషయమును తీసుకొని ఇరువర్గముల వారికి ఎలా అర్థమైనదో చూద్దాము.


దేవుడు ఆత్మస్వరూపుడు, సృష్టికి పూర్వము ఏకముగాయున్న దేవుడు సృష్ఠి తర్వాత మూడు ఆత్మలుగా విడిపోయాడు.

తన సృష్టినంతటినీ ఎక్కువగా మూడు సంఖ్యతోనే ముడివేశాడు. మూడు ఆత్మలుగా విభజించి మూడవ ఆత్మయిన

పరమాత్మగా తానువుంటూ తన శక్తిని నింపిన ఆత్మను రెండవ దానిగా, కర్మను తగిలించిన ఆత్మగా మొదటి జీవాత్మను

ఉంచాడు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మయని వరుసగా చెప్పబడు మూడు ఆత్మలు మినహా, ప్రపంచములో ఉన్నదంతా

ఆత్మల స్వరూపముకాని ప్రకృతియని తెలియవలెను. ప్రకృతి మనిషిలో మూడు గుణములుగాయుంటూ, మిగత ప్రపంచ

మంతా నిండియున్నది. ప్రపంచములో మూడు ఆత్మలు కాకుండ మిగిలిన సమస్తమును ప్రకృతియని చెప్పవచ్చును.

ప్రకృతియైన సమస్త వస్తు జాలమును మూడవ ఆత్మ అయిన పరమాత్మ ఆవహించి అణువణువున వ్యాపించియున్నది.

ఈ విధముగా సృష్ఠియంతయు పరమాత్మ వ్యాపించియున్నది. మిగత జీవాత్మ, ఆత్మలలో కూడా పరమాత్మ

వ్యాపించియున్నదని చెప్పవచ్చును.


పరమాత్మకు, ఆత్మకు, జీవాత్మకు గణితశాస్త్రములో సంఖ్యలను కేటాయించడము జరిగినది. జ్ఞానులైన పెద్దలు

ఎంతో యోచించి జీవాత్మకు మూడు (3) సంఖ్యనూ, ఆత్మకు (6) సంఖ్యనూ, పరమాత్మకు తొమ్మిది (9) సంఖ్యను

గుర్తుగాయుంచుకొన్నారు. 36 9 అనగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మయను మూడు ఆత్మలని అర్థమగునట్లు చేశారు.

ఒకవేళ 9 6 3 అని చెప్పినా పరమాత్మ, ఆత్మ, జీవాత్మయని అర్థమగునట్లు చేశారు. ఈ సంఖ్యలను ఎలా గుర్తించినదీ,

ఏ పద్ధతిని అనుసరించి గుర్తించినదీ మా రచనలలోని “హేతువాదము-ప్రతివాదము” అను గ్రంథములో కలదు.

విధముగా సంఖ్యలను గుర్తించునట్లు చేసినది దేవుడేనని, దేవునికి తెలియకుండ, దేవుని ఆజ్ఞ లేకుండా ఏమీ జరుగదని

జ్ఞాపకముంచు కోవలెను. సృష్ఠియంతయు మూడు ఆత్మలు ఒక ప్రకృతి నిండియున్నది. ప్రకృతిని కూడా మొదట

దేవుడు తననుండే సృష్ఠించాడు. సంఖ్యలలో పెద్ద సంఖ్య ఎప్పటికీ విలువ మారని సంఖ్య తొమ్మిదిగా వుండుట

వలన తొమ్మిదిని పరమాత్మగా గుర్తించడము జరిగినది. పరమాత్మ ఆత్మకంటే వేరుగాయున్నాడు. కావున

పరమ+ఆత్మ=పరమాత్మయని పిలువబడుచున్నాడు. పరమాత్మ అనునది అర్థమును తెలుపు పదమేగానీ పేరుకాదు.

అలాగే దేవుడు అనగా దేవులాడ (వెతుకులాడ) బడేవాడని అర్థముగానీ అది పేరు కాదు. ఈ విధముగా దేవునికి పేరు

ఏమాత్రము లేదు. పేరు లేని దేవుడు ప్రత్యేకముగా ఉన్నాడు. పేరున్న ఆత్మ, జీవాత్మలు రెండు ఒకేచోట, ఒకే



శరీరములో కలిసియున్నవి. అందువలన ఈ రెండు ఆత్మలను జోడు ఆత్మలని అంటాము. పరమాత్మ ప్రపంచమంతా

అణువణువున వ్యాపించియుండగా, జీవాత్మ ఆత్మలు ఒక శరీరమును ఆశ్రయించి ఉన్నాయి. అలాయున్న రెండు

ఆత్మలలో జీవాత్మ ఏమీ చేయలేనిదిగా, శరీరములో ఒక్కచోట మాత్రమున్నది. అయితే రెండవదైన ఆత్మ శరీరమంతా

వ్యాపించి, శరీరమునకు శక్తినిచ్చి కదిలించి పని చేయిస్తూ నడిపించుచున్నది. ఆత్మ చేయగా జరిగిన పనిలో ఉన్న కష్ట

సుఖములను జీవుడు అనుభవించడము తప్ప, వేరు పనంటూ ఏదీ జీవునకు లేదు. శరీరములో కూడా దేవుడైన

పరమాత్మ అణువణువున వ్యాపించియుండగా, ఆత్మ శరీరమంతా వ్యాపించియున్నది. జీవుడు ఒక్కచోట రవ్వంతగా

యున్నాడు. దేవుడు (పరమాత్మ) శరీరము లోపల, శరీరము బయట సృష్ఠి అంతట వ్యాపించియుండగా, ఆత్మ

కేవలము శరీరములలో మాత్రము వ్యాపించియుండగా, జీవాత్మ శరీరములో ఒక్కచోట సూదిమోపినంత జాగాలో

రవ్వంతగాయున్నది. జీవునికి శరీరములో కర్మను అనుభవించడము తప్ప వేరు పనంటూ ఏమీ లేదు. అలాగే పనిలేనివాడు

దేవుడు. దేవుడు సర్వప్రపంచము వ్యాపించియుండి సాక్షిగా అంతటినీ చూస్తున్నాడు తప్ప ఏ కార్యమును చేయలేదు.

అందువలన దేవున్ని రూప, నామ, క్రియలు లేనివాడని చెప్పవచ్చును.


జీవాత్మ, పరమాత్మ (జీవుడు, దేవుడు) ఇద్దరూ పని లేనివారుకాగా, మధ్యలోనున్న ఆత్మ మాత్రము ఒక్క క్షణము

కూడ ఊరక ఉండకుండ శరీరములో ఎల్లకాలము పని చేయుచున్నది. మెలుకువ, స్వప్నము, నిద్ర అను మూడు

స్థితులలో ఆత్మ పని చేయుచునేయున్నది. నిద్రలో కూడా శ్వాసను ఆడించుట, జీర్ణము చేయుట మొదలగు శరీర

కార్యములను ఎన్నిటినో చేయుచూ క్షణకాలము కూడ ఊరకయుండలేదు. శరీరములో జీవుడు చేయకున్ననూ అన్ని

కార్యములను ఆత్మే చేయుచూ జన్మనుండి మరణము వరకు, నిద్రనుండి మెలుకువ వరకు, అట్లే మరణమునుండి జన్మ

వరకు, మెలుకువ నుండి నిద్రవరకు జీవున్ని నడిపించి అన్నిటినీ బలవంతముగా అనుభవింపజేయుచున్నది. ఈ

విధముగా ఆత్మ జీవుని వెంటవుండి నడిపించుచున్నది. ప్రపంచములో ఏ శరీరము ఎట్లు నడుస్తున్నదీ, ఆత్మ ఎట్లు

నడిపిస్తున్నదీ, జీవుడు అన్నీ అనుభవిస్తూ ఏ భావముతోయున్నదీ, అన్నిటినీ దేవుడు ప్రతి శరీరములోనూ గమనించు

చున్నాడు. అందువలన గీతలో దేవుడు సాక్షిగాయున్నాడని అర్థమగునట్లు చెప్పబడినది. శరీరములో జీవుడు గ్రుడ్డివాడు,

చెవిటివాడు, కుంటివాడు, మూగవాడు మొత్తము కదలని మెదలని అవిటివాడుగాయుండగా, శరీరమునకు పెద్దయై

శరీరమంతటా వ్యాపించియున్న ఆత్మ శరీరమునకున్న అవయవములను ఉపయోగించుకొని శరీరమును అందులోని

జీవున్ని నడుపుచున్నది. శరీరమునకు అధిపతి, అధికారి ఆత్మకాగా జీవాత్మ, ఆత్మ అందించు సమాచారముతో

బ్రతుకుతున్నది. ఆత్మను, జీవాత్మను చూస్తున్న వాడు దేవుడు (పరమాత్మ).


ఈ విధముగా సృష్ఠిలోని సర్వ జీవరాసుల శరీరములలో జీవాత్మ ఆత్మలు జోడు ఆత్మలుగా ఉండగా, వాటితో

ఎలాంటి సంబంధము లేకుండా, ఏ సలహా ఇవ్వకుండ కేవలము సాక్షిగా పరమాత్మ కలడని తెలిసిపోయినది కదా! ఇదే

విధానమునే తెలుపునట్లు దేవుడు ప్రతి మనిషి హస్తములోనూ మూడు ఆత్మల గుర్తుగా మూడు రేఖలను ఉంచాడు.

అరచేతిలో క్రిందగల రెండు రేఖలు ఒక చివరిలో ఒకదానితో ఒకటి కలిసియున్నవి. అలా కలిసియున్నట్లు రెండు

జోడు రేఖలను జీవాత్మ ఆత్మలుగా పెద్దలు గుర్తించారు. క్రింద మొదలైన క్రిందిరేఖ జీవాత్మగానూ, ప్రక్కన మొదలైన

లేక మొదటి దానికంటే పైనున్న రేఖ ఆత్మగానూ లెక్కించబడుచున్నది. ఈ రెండు రేఖలు బొటన వేలికి పై భాగమున

ఒకదానితో ఒకటి కలిసి లేక దగ్గరగాయుండి జోడు ఆత్మలుగా పేరుగాంచినవి. ఈ రెండు రేఖలకంటే పైన

ప్రత్యేకముగాయున్న ఒక రేఖ దేనితో కలియకుండ ఉండడము విశేషము. అట్లు విశేషముగాయున్న మూడవరేఖయే



శరీరములోని పరమాత్మగా చెప్పబడుచున్నది. శరీరమునందు కార్యములు చేయు కర్మేంద్రియములలో ముఖ్యమైనది

హస్తము. హస్తములో (అరచేతినందు) మూడు రేఖలు మూడు ఆత్మలకు గుర్తుగాయుండుట వలన, పూర్వము

ఉదయము నిద్ర లేస్తూనే ఎవరి ముఖము చూడకుండ, తన హస్తమును చూచుకోమని పెద్దలు చెప్పి, చాలామందికి

అలా చూచుకోవడమును అలవాటు చేశారు. మేము చిన్న వయస్సులో ఉన్నప్పుడు కూడా ఉదయము నిద్రనుండి

లేస్తూనే అరచేయిని చూచుకొనువారిని చాలామందిని చూచాము. ఎందుకలా చేయుచున్నారని కూడా కొందరిని

అడిగాము. అయితే వారు ఆ రోజు సరైన సమాధానము చెప్పలేదు. మొదట తన చేతులను చూచుకోవడము ద్వారా

తర్వాత ఇతరులను చూచినా, వారి వలన కలుగు చెడు పోతుందని చెప్పారు. అప్పటికదే నిజమని నమ్మాము. ఈ

రోజు అది అసత్యమని తెలిసినది. ఉదయము ముందుగా హస్తములోని మూడు రేఖలను చూచుట ద్వారా తాను

జీవాత్మననీ, తనను ఆత్మ నడిపిస్తున్నదనీ, పరమాత్మ అన్నిటినీ గమనించు సాక్షిగాయున్నాడను జ్ఞానము జ్ఞాపకము

రాగలదనీ, దేవుడు గుర్తు వచ్చునట్లు పెద్దలు అలా చేతులను చూచుకొమ్మని చెప్పియుండగా, కొంత కాలమునకు దాని

వివరము మరచిపోయి చివరకు అర్థము పోయి మనుషులవద్ద కార్యాచరణ ఒకటి మిగిలినది. ఇప్పటి కాలములో

చేతులను చూచుకొను కార్యాచరణ కూడా పోయినది.


శరీరములోని ఐదు కర్మేంద్రియములలో హస్తము ప్రధానమైనది. అందువలన మూడు ఆత్మల గుర్తును మూడు

రేఖలుగా హస్తమునందు దేవుడుంచి చూపించాడు. అలాగే "జ్ఞానేంద్రియానాం నయనం ప్రధానమ్” అన్నట్లు ఐదు

జ్ఞానేంద్రియములలో కన్ను ప్రధానమైనది. అందువలన హస్తములోవలె కన్నులో కూడా మూడు ఆత్మల గుర్తును

దేవుడుంచాడు. కంటిలో కనుగ్రుడ్డును పరిశీలించి చూచితే మొదట తెల్లకన్ను, తెల్లకన్నులో నల్లకన్ను, నల్లకన్నులో

పూర్తి చిన్నదిగాయుండి కనుపాప అను పేరుతో పెసరగింజంత లేక ఆవగింజంత నల్లకన్ను ఉండును. మొదట తెల్లగా

యుండు తెల్ల కన్నును పరమాత్మగా, దాని తర్వాత తెల్లకన్ను మధ్యలో గుండ్రముగా నల్లగా అర్ధ అంగుళమునకు తక్కువ

విస్తీర్ణముగల నల్లగ్రుడ్డును ఆత్మగా, నల్లగ్రుడ్డు మధ్యలో ఆవగింజంత నలుపుగల చిన్న గుండ్రని భాగమును జీవాత్మగా

పెద్దలు లెక్కించి జ్ఞానము తెలియనివారికి చూపించి నీ కన్నులో జీవాత్మ, ఆత్మ, పరమాత్మల గుర్తుకలదనీ, ప్రతి

దినము వీలున్నప్పుడు, అద్దము చూచుకొన్నప్పుడు చూపులో చూపును పెట్టిచూడు అని చెప్పారు. మరికొందరు

జ్ఞానులు రూపును చూపును ఏకముగా చూడమని చెప్పారు. ఈ విధముగా నీ చూపుతో నీ కన్నును చూడమనీ, అలా

చూచుట వలన దేవుడు, జీవుడు, మధ్యలో ఆత్మకలదని తెలియునని చెప్పారు. అలా పెద్దలు చెప్పడము వలన పూర్వము

తన కన్నును తానే అద్దమునందు చూచుట చేసెడివారు. అద్దము లేని కాలములో ఎదురుగా నున్న మనిషి కంటిలోనికి

నేరుగా చూచెడివారు. దానినే పూర్వము చూపులో చూపునుంచి చూడడము అనెడివారు. ఈ విధముగా శరీరములోని

మూడు ఆత్మలను కర్మేంద్రియమైన హస్తములోనూ, జ్ఞానేంద్రియమైన కన్నులోనూ పెద్దలు గుర్తించి చూపారు. ప్రస్తుత

కాలములో మనుషులందరూ హస్తమునూ, కన్నునూ కల్గియున్నా వాటిలోనున్న మూడు గుర్తులను తెలియకయున్నారు.


ప్రతి శరీరములోనూ మూడు ఆత్మలున్నవని అందులో నడిపింప బడే జీవాత్మ ఒకటని, నడిపించే ఆత్మ రెండవదనీ,

రెండిటినీ చూస్తూ ఊరక యుండు పరమాత్మ మూడవదనీ ఆధ్యాత్మిక విద్యలో ముఖ్యముగా తెలియబడుచున్నది. ఇదే

మూడు ఆత్మల విషయమునే బ్రహ్మవిద్యా శాస్త్రములైన భగవద్గీతయందూ, ఖుర్ఆన్ గ్రంథమునందు చెప్పబడినది.

భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతయందు పురుషోత్తమ ప్రాప్తియోగమున 16,17 శ్లోకములందు మూడు

ఆత్మలను ముగ్గురు పురుషులుగా పోల్చి చెప్పడమైనది.



16 శ్లోకము:

ద్వావిమౌ పురుషాలోకే క్షరశ్చాక్షర ఏవ చ |

క్షర స్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ॥


17 శ్లోకము: ఉత్తమ: పురుషస్త్వన్య: పరమాత్మేత్యుదాహృత:

యో లోకత్రయమావిశ్య బిభర్యవ్యయ ఈశ్వర:


భావము :- “లోకములో రెండు రకముల పురుషులు (ఆత్మలు) ఉన్నారు. వారిని క్షరుడు, అక్షరుడని చెప్పుచున్నాము.

క్షరుడు అనబడువాడు సర్వ జీవరాసులు శరీరములలో కలడు. అక్షరుడనువాడు క్షరునితో కలిసి అదే శరీరమునందు

నివసించుచున్నాడు.” “క్షరుడు అక్షరుడు అను ఇద్దరు పురుషులకంటే వేరొక పురుషుడు కలడు. మూడవ పురుషుడు

క్షరునికంటే మరియు అక్షరునికంటే ఉత్తముడు. అందువలన అతను పురుషోత్తముడనీ, పరమాత్మయనీ పిలువబడుచున్నాడు.

మూడవ ఆత్మయిన పరమాత్మయే ముల్లోకములు అణువణువున వ్యాపించి ఈశ్వరుడని పిలువబడుచున్నాడు.”


ఈ విధముగా మూడు ఆత్మలను గురించీ భగవద్గీత బోధించుచుండగా, ఖుర్ఆన్ గ్రంథములో 50వ సురాలో

17, 18, 21వ ఆయత్లందు ఇలా చెప్పబడినది (17) ప్రతి వ్యక్తి దగ్గర ఇద్దరుంటారు. ఒకరు కుడి ప్రక్కన; మరొకరు

ఎడమ ప్రక్కన గలరు. (18) నోటిమాట వెలువడక ముందే అతని వద్దయున్న పర్యవేక్షకుడు దానిని నమోదు చేసి

భద్రపరచ టానికి సిద్ధంగా ఉంటాడు. (21) ప్రతి వ్యక్తీ ఒక తోలేవాడితో, ఒక సాక్ష్యమిచ్చే వాడితో సహా హాజరవుతాడు.


17వ వాక్యములో ప్రతి వ్యక్తిలో ముగ్గురున్నట్లు తెలియుచున్నది. 18వ వాక్యములో వారిలో జీవుడు ఏ

తప్పుచేసినా వానిని నమోదు చేసుకొను పర్యవేక్షకుడు ఒకడున్నాడని చెప్పడము వలన ఆ పర్యవేక్షకుడే అన్ని పనులు

చేయు ఆత్మయని తెలియుచున్నది. మరొకరయిన పరమాత్మ ఏమీ చేయని వాడని తెలియుచున్నది. 21వ వాక్యములో

ప్రతి వ్యక్తీ (ప్రతి జీవుడు) ఒక తోలేవాడితో (ఒక నడిపే ఆత్మతో) ఒక సాక్ష్యమిచ్చేవాడితో (ఒక పరమాత్మతో) హాజరవుతాడు

(భూమిమీద జన్మిస్తాడు) అని కలదు. దీనినంతటినీ గమనించితే, భగవద్గీతలో చెప్పినట్లు ఒక శరీరములో మూడు

ఆత్మలు కలవని చెప్పడమే ముఖ్య ఉద్దేశ్యమని తెలియుచున్నది. ప్రతి శరీరమును నడిపేవాడు ఆత్మని, సాక్షిగాయున్నవాడు

పరమాత్మని ముందే చెప్పుకొన్నాము. ఏదో ఒక విధముగా సురా 50లో 17, 18, 21 వాక్యములలో మూడు ఆత్మలను

గురించి చెప్పియుండగా, దానిని ముస్లీమ్లు ఏమాత్రము అర్థము చేసుకోకుండా మరియొక రకముగా అర్థము చేసు

కోవడము ఆశ్చర్యము. అలాగే హిందువులైన వారిలో స్వాములు, గురువులైన వారికి కూడా మూడు ఆత్మల విషయము

అర్థము కాకపోవడము మరీ ఆశ్చర్యము. మేము గీతలో చెప్పిన ముగ్గురు పురుషులను (మూడు ఆత్మలను) గురించి

చెప్పుచూ త్రైత సిద్ధాంతమును ప్రతిపాదించితే, క్రైస్తవులలోని త్రిత్వమును (త్రినిటిని) బోధిస్తున్నామని హిందువులైన వారే

మమ్ములను క్రైస్తవులుగా ఆరోపణ చేయడము విడ్డూరము.


సృష్ట్యాదిలో దేవుడు మహాభూతమైన ఆకాశము ద్వారా శబ్ద రూపముతో తెల్పిన జ్ఞానమును ఆదిలోనే సూర్యుడు

మనువుకు తెల్పగా, అదే జ్ఞానమునే ఐదువేల సంవత్సరముల పూర్వము భగవంతుడు అర్జునునికి తెల్పాడు. ఈ

విధముగా భారతదేశములో దేవుని జ్ఞానము తెలియబడగా, అదే దేవుని జ్ఞానమే జిబ్రయేల్ ద్వారా ముహమ్మద్ ప్రవక్తకు

చెప్పబడినది. ఒకే దేవుని జ్ఞానము చెప్పబడుట చేత అదే జ్ఞానమే భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16, 17

శ్లోకములలో ముగ్గురు పురుషులుగా చెప్పబడగా, ముగ్గురు పురుషుల జ్ఞానమే ఖురాన్లో 50వ సురాయందు 17, 18,

21 ఆయత్లలో చెప్పుచూ, ప్రతి మనిషివద్ద ఒకడు పాపమును వ్రాసుకొను వానిగా, మరియొకడు సాక్షిగాయున్నట్లు



చెప్పారు. అయినా సృష్ట్యాదినుండి దేవుడు ఫలానా ముగ్గురు పురుషుల గురించి (మూడు ఆత్మల గురించి) చెప్పుచున్నాడని

ఇటు హిందువులుగానీ, అటు ముస్లీమ్లుగానీ తెలియలేకపోయారు. ఈ విషయము చివరికి క్రైస్తవులకు కూడా

తెలియకుండా పోయినది. త్రిత్వమని వారి సమాజములో ఉన్నా వారు దేవుని జ్ఞానమునకు వేరుగా చెప్పుకొన్నారు.

వారు చెప్పుకొన్న త్రిత్వము దేవుడు చెప్పిన మూడు ఆత్మలకు సంబంధము లేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయని

వారు చెప్పినా తండ్రి, పరిశుద్ధాత్మ ఇద్దరూ ఒక్కరేయగుట వలన అది ద్విత్వమేయగును. వారి బోధలో ముగ్గురు

పురుషులనిగానీ, మూడు ఆత్మలను భావము గానీ ఎక్కడాలేదు. మొత్తము మీద ప్రపంచములోనే మూడు ఆత్మల

జ్ఞానము తెలియకుండా పోయినది.


సృష్ట్యాదినుండి ఒకే జ్ఞానముండగా, మధ్యలో మతములు వచ్చి వేరువేరు జ్ఞానము, వేరువేరు దేవుడు అన్నట్లు

చేసినందున మేము నిజమైన దైవ భక్తులమని కొందరనుచుండగా, మాదే నిజమైన మతము, మాదే నిజమైన జ్ఞానమని

మరికొందరంటున్నారు. మత బేధములు వచ్చి చివరకు దేవుడు చెప్పిన జ్ఞానమును మరచిపోయి, వారివారి స్వంత

జ్ఞానమును దేవుని జ్ఞానముగా చెప్పుకొంటున్నారు. లేని నరక స్వర్గములను కల్పించుకొని ఎక్కడో స్వర్గమున్నది, ఎక్కడో

నరకమున్నదని భ్రమించుచున్నారు. దేవుడు చెప్పని స్వర్గ, నరకములను మనిషి ఊహించుకొనుచున్నాడు. దేవుడు

చెప్పిన స్వర్గ, నరకములు ఇక్కడే ప్రత్యక్షముగా ఉన్నా తెలియలేక పోవుచున్నాడు. స్వర్గమూ, నరకమూ ఎదురుగాయున్నా

గ్రహించలేని గ్రుడ్డివానిగా మనిషి మారిపోయాడు. దేవుని జ్ఞానమును దాని ప్రత్యేకతను తెలియకపోవడమే కాక,

దేవుడు దిగివచ్చి చెప్పినా, చెప్పేవాడు నాలాంటి మనిషియని హేళన చేసి, అతను చెప్పినదానికంటే నాకు తెలిసినదే

గొప్పయనుకొంటున్నాడు. అందువలన అసలైన జ్ఞానము అన్ని మతములలోనూ కరువైపోయినదని చెప్పవచ్చును.

ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు తిరిగి తన జ్ఞానమును పునరుద్ధరించును. అలా పునరుద్ధరించుటకు

మరొకమారు తెరచాటునుండి తన సేవకులైన (దూతలైన) గ్రహముల ద్వారానైనా చెప్పించును. లేకపోతే తానే స్వయముగా

వేషము మార్చుకొని మానవునిగా వచ్చి ఎక్కడో ఒకచోట తన జ్ఞానమును చెప్పిపోవును. అలా చెప్పబోవు జ్ఞానమే

ఈనాడు భూమిమీదగల అన్ని మతములకు సరియైన జ్ఞానమగును. ఎవరికీ తెలియకుండావచ్చి ఎక్కడో ఒకచోట

చెప్పబడు జ్ఞానమే సర్వ ప్రపంచమునకు దారి చూపగలదు. కొందరు దేవుని జ్ఞానమును తొందరగా గ్రహించినా,

గ్రహించనివారు చాలామందియుండినా, చివరకు వారందరూ ఒకే దారిలోనికి వచ్చి ఒకే జ్ఞానమును విశ్వసింప

వలసివస్తుంది. క్రొత్తగా చెప్పబడిన దేవుని జ్ఞానమును ఎవడైనా ఈ జన్మలో ఒప్పుకోకపోయినా, తర్వాత జన్మలోనైనా

వేరుదారిలేక ఒప్పుకొనితీరును. మతములుగా చీలిపోయి వేరువేరు జ్ఞానులుగా విభజింపబడిన వారందరు ఒకే జ్ఞానమును

ఆశ్రయించబోవు కాలము వస్తుందని అనుకొంటున్నాను.


ప్రశ్న :- భూమిమీద ధర్మములు అధర్మములుగా మారినప్పుడు, మాయ ప్రభావమువలన అజ్ఞానము జ్ఞానముగా చలామణి

అగుచున్నప్పుడు నేను అవతరించి అసలైన దైవ ధర్మములను జ్ఞానరూపములో తెలియజేస్తానని చెప్పాడు కదా! అటువంటి

పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందంటారా? దేవుడే భగవంతునిగా వచ్చి చెప్పిన భగవద్గీత ఉండగా, అలాగే బైబిలు గ్రంథముండగా,

మహాజ్ఞాని జిబ్రాయేల్ చెప్పిన ఖుర్ఆన్ గ్రంథముండగా, అవన్నియు దేవుని జ్ఞానమునే దేవుని ధర్మములనే బోధిస్తుండగా

మరియొక మారు దేవుడు వచ్చి జ్ఞానము చెప్పునను మీ మాట సరియైనదేనా?


జవాబు:దేవుడు చెప్పిన గీతలోనూ, మిగత గ్రంథములలోనూ దేవుని ధర్మములు లేవని నేను చెప్పడములేదు. దేవుడు

సృష్ట్యాదిలోనే ధర్మములను చెప్పి ప్రతిష్ఠించాడు. అయితే ఉన్న ధర్మములు తెలియకుండ పోయి వాటి స్థానములో



అధర్మములు వృద్ధి చెందినప్పుడు, తిరిగి తన ధర్మములను తెలుపు నిమిత్తము, అధర్మములను లేకుండా చేయు

నిమిత్తము దేవుడు వస్తానని చెప్పాడు. అంతేగానీ తన ధర్మములను బోధించు గ్రంథములు లేవని ఆయన కూడా

చెప్పలేదు. ఆయన గ్రంథములున్నా, ఆ గ్రంథములలోని ధర్మములు మనుషులకు తెలియకుండాపోయి, వాటి స్థానములో

అధర్మములు ధర్మములుగా చలామణి అగుచున్నప్పుడు వస్తానని చెప్పాడు. దేవుడు ఈమారు తిరిగివస్తే ఇంతకు

ముందు చెప్పిన ధర్మములనే తెలియజేస్తూ అప్పుడు చెప్పక వదలివేసిన వాటిని కూడా తెలియజేస్తాడు. బైబిలు

గ్రంథములో కూడా ఇదే విషయమును చెప్పుచూ ఆదరణకర్తగా వచ్చు వాడు ఇప్పుడున్న జ్ఞానమునేకాక ఇంకా చెప్పక

వదిలివేసిన సమస్త జ్ఞానమును తెలియజేయునని యోహాన్ సువార్త 16 అధ్యాయములో 12, 13, 14 వాక్యములందు

చెప్పియున్నారు. ఆ మాట ప్రకారము రాబోవు దేవుడు ఎప్పుడు వచ్చినా ముందు గ్రంథములలోని విషయములనేకాక

ఇంకా అప్పుడు చెప్పని వాటిని కూడా చెప్పిపోవును. అప్పుడు సమస్త జనులు అన్ని మతములవారు ఏక జ్ఞానములోనికి

రాక తప్పదు. ఇది జరుగబోవు సత్యము.


ప్రశ్న :- మీరు ఎప్పుడో జరుగబోవు విషయమును చెప్పుచున్నారు. ఒకవేళ అటువంటి సమయమొస్తే, అందరూ ఏక

జ్ఞానములోనికి వస్తే, అంతకంటే మంచికాలము మరియొకటి ఉండదు. అయితే కొన్ని మతములలో ఇదే ఆఖరి

బోధయని చెప్పుచున్నారు. ఇస్లామ్ మతములో ముహమ్మద్ ప్రవక్త ఆఖరి ప్రవక్తయనీ, ఖుర్ఆన్ గ్రంథము అంతిమ

దైవగ్రంథమని చెప్పుచున్నారు కదా! ఖుర్ఆన్ అంతిమ దైవగ్రంథమైనప్పుడు, ముహమ్మద్ ప్రవక్త ఆఖరి ప్రవక్త అయినప్పుడు,

తర్వాత దేవుడు మనిషిగా రావలసిన పనిలేదు కదా! అలా వస్తే ముహమ్మద్ ఆఖరి ప్రవక్త అనుటకు భంగమేర్పడును

కదా! అట్లే ఖుర్ఆన్ గ్రంథము అంతిమ గ్రంథము కాకుండా పోవును కదా! దీనికి మీరేమంటారు?


జవాబు:ఖుర్ఆన్ ఎప్పటికీ అంతిమ దైవగ్రంథమే, ఆ మాటను ప్రపంచములో ఎవరూ కాదనలేరు. భూమిమీద

తెలియకుండాపోయిన ధర్మములు తిరిగి తెలియబడుటకు దేవుడు మనిషిగా (దూతగా) వచ్చినా, భూమిమీద ధర్మములు

పునరుద్ధరించబడినా, తెలియకుండాపోయిన ధర్మములు తెలియబడి మనిషి సంపూర్ణ జ్ఞానిగా మారినా, ఖుర్ఆన్

అంతిమ దైవ గ్రంథమనుటలో ఏ మార్పూ ఉండదు. ఖుర్ఆన్ శాశ్వతముగా అంతిమ దైవ గ్రంథమని గొప్ప జ్ఞానులు

కూడా అనవలసిందే. ఎందుకనగా! సృష్ట్యాదిలో వాణి ద్వారా దేవుడు జ్ఞానము తెలియజేయగా ఆనాడు గ్రహములైన

సూర్యుడు, జిబ్రయేల్ దేవుడు తెలియజేసిన జ్ఞానమును తెలియగలిగారు. సూర్యుని ద్వారా సృష్ట్యాదిలోనే భూమిమీద

జ్ఞానము తెలియబడినది. సూర్యుడు మొదట భూమిమీదగల మనువుకు జ్ఞానము తెలుపగా, మనువు ద్వారా ఇక్ష్వాకుడు

అను రాజు తెలుసుకోగలిగాడు. ఇక్ష్వాకుని ద్వారా మిగత ప్రజలు తెలుసుకోగలిగారు. ఇట్లు భూమిమీద మొదట

మనుషులందరికీ జ్ఞానము తెలియబడినది. అలా తెలియబడిన మొదటి జ్ఞానమే ఐదువేల సంవత్సరముల పూర్వము

శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి చెప్పబడినది. అదియే వ్యాసుని ద్వారా భగవద్గీతగా వ్రాయబడినది. అందువలన

భగవద్గీత ప్రపంచములో మొదటి దైవగ్రంథమైనది. మాటల రూపములో తెలుపబడిన గీతను అక్షర రూపములో వ్రాసి

ప్రజలకు తెలియజేసిన వ్యాసున్ని మొదటి ప్రవక్తయని చెప్పవచ్చును. ఇకపోతే ఇప్పటికి పదునాలుగు వందల సంవత్సరముల

పూర్వము జిబ్రయేల్ దూత హీరా గుహలో ముహమ్మద్ ప్రవక్తగారికి దైవజ్ఞానమును అందించాడు. జిబ్రయేల్ అందించిన

జ్ఞానమును ముహమ్మద్ ప్రవక్తగారు ప్రజలకు ఖుర్ఆన్ రూపములో అందించాడు. అలా జిబ్రయేల్ చెప్పిన జ్ఞానము

ఖుర్ఆన్ అను గ్రంథ రూపమైనది. మొదట చెప్పిన జ్ఞానమే ఖుర్ఆన్లో ఉండుట వలన, భగవద్గీత తర్వాత వచ్చిన

జ్ఞానము ఖుర్ఆన్ అగుట వలన, గీత మొదటి దైవగ్రంథమైనప్పుడు, ఖుర్ఆన్ అంతిమ దైవగ్రంథమైనది. మొదట



చెప్పినది ఎప్పటికీ మొదటిదే. తర్వాత మొదటి దానితో సమానముగా చెప్పినది ఖుర్ఆన్ తప్ప ఏ గ్రంథమూ లేదు కనుక

ఖుర్ఆన్ అంతిమ దైవగ్రంథమైనది. మొదటిది మరియు చివరిది ఒకే జ్ఞానమైనందున మొదట చెప్పబడినది ప్రథమ

దైవగ్రంథమనీ తర్వాత చెప్పబడినది అంతిమ దైవగ్రంథమనీ పేరుగాంచియున్నది. ఈ రెండిటికీ సమన్వయమున్నది

కావున అలా చెప్పడము జరిగినది. సురా 12లో 111వ ఆయత్నందు “ఖురాన్లో చెప్పబడుతున్న ఇవన్నీ కల్పిత

విషయములు కావు. వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంథాలకు ధృవీకరణ" అని కలదు. ఈ మాట వలన

భగవద్గీతలోని జ్ఞాన విషయములు ఖుర్ఆన్ గ్రంథములో కూడా కలవని తెలియుచున్నది. దేవుడు చెప్పిన భగవద్గీతను

అనుసరించియే ఖుర్ఆన్ కలదనీ, రెండిటిలోనున్నది సృష్ఠి ఆదిలో దేవుడు చెప్పిన జ్ఞానమేనని తెలియుచున్నది. రెండు

గ్రంథములలోని జ్ఞానము ప్రజలు అర్థము చేసుకోలేనప్పుడు, దేవుడు అవతరించి గ్రంథములలోనున్న ధర్మములనే

పునరుద్ధరించి పోవునుగానీ వీటిని కాదని వేరు జ్ఞానము చెప్పడు. దేవుడు మొదట చెప్పిన జ్ఞానము ముందు వెనుక

తెలియబడడము వలన వాటికి మొదటి గ్రంథము చివరి గ్రంథము అని పేరు వచ్చినదిగానీ, అందులోని జ్ఞానము

వేరనుకోకూడదు. దేవుడు ఎప్పుడు వచ్చి చెప్పినా తాను ముందు చెప్పిన వాటినే తిరిగి ప్రతిష్ఠించుటకు వచ్చునుగానీ

తాను ముందు చెప్పిన జ్ఞానమును కాదనుటకు కాదు. దేవుడు వచ్చి ధర్మములను సంస్థాపించుట వలన పూర్వపు

గ్రంథములైన మొదటి చివరి గ్రంథములలోని ధర్మములు బాగా అర్థము కాగలవు. అందువలన ఎంతకాలము జరిగినా

ఆది అంత్య దైవగ్రంథములు ఎప్పటికీ శాశ్వతముగా ఉండగలవు. తిరిగి దేవుడు వచ్చి తెల్పునది ఈ ఆది అంత్య

గ్రంథముల జ్ఞానమేనని తెలియవలెను.



ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే

ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.


అసత్యమును వేయిమంది చెప్పినా అది సత్యమును

సత్యము కాదు, వేయిమంది కాదనినా అది అసత్యము కాదు.



Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024