ఉపనిషత్తులలో లోపాలు cloud text 29thsep24 Updated
ఉపనిషత్తులలో లోపాలు.
గతములో “వేదములు మనిషికి అవసరమా?” అను గ్రంథమును
దానిని చదివినవారిలో తొంభైశాతము మేము వ్రాయడము జరిగినది.
మంది వేదముల పుట్టుపూర్వోత్తరమును గురించి తెలిసినందుకు సంతోషించి
మమ్ములను ప్రశంసించగా, కొందరు మాత్రము విమర్శించడము జరిగినది.
అలా విమర్శించినవారిలో కేవలము ఒక కులమువారు ఉండడము
గమనించదగిన విషయము. వారు అలా విమర్శించడములో వారిదేమయినా
న్యాయముందా అని చూస్తే ఏమాత్రము న్యాయము లేదనీ, పూర్తి
అన్యాయముగా మమ్ములను విమర్శించుచున్నారని తెలియుచున్నది. న్యాయ,
అన్యాయములు ప్రపంచ సంబంధమైనవని, వాటిని వదలి దైవ
సంబంధముగా బ్రహ్మవిద్యాశాస్త్రమునకు ఏమయినా వ్యతిరేఖముగా
ఉన్నదాయని మరొక కోణములో ఆలోచించి చూచాము. అట్లు కూడా
బ్రహ్మ విద్యాశాస్త్రమునకు ఏమాత్రము విభిన్నముగా మా బోధలు లేవని
తెలిసినది. ఆధ్యాత్మికమునకు ఎటువంటి తప్పుదారి లేకుండా సక్రమమైన
దారిలో మేము ప్రతి గ్రంథమును వ్రాశాము, అలాగే ప్రతి బోధను చెప్పాము.
అయినా కొందరు మాత్రము దైవజ్ఞానమును గురించి అలా మాట్లాడడము
ఆశ్చర్యకరమైన విషయమే కాకుండా పూర్తి అజ్ఞాన విషయమని చెప్పు
చున్నాను.
1) ప్రశ్న :- మీరు చెప్పిన బోధలను, వ్రాసిన గ్రంథము
లను ఎందరో ఇష్టముగా తెలుసుకొంటున్నప్పుడు
సమాజములో కేవలము ఒక కులమువారే ఎందుకు
మిమ్ములను విమర్శించుచున్నారు? వారు ఏ కులము
వారు?
జవాబు :- నాకు మనుషులంతా ఒక్కటేయనీ, కులాలు మతాలు మనుషుల
అజ్ఞానమునకు చిహ్నములనీ, అన్ని మతములవారు, అన్ని కులముల వారు
ఒకే దేవుని సృష్ఠి అని అనేకమార్లు చెప్పాను. అయినా హిందూ మతములో
ఒక కులమువారు నన్ను విమర్శించడము జరుగుచున్నది. వారిది ఏ
కులము అని నేను ప్రత్యేకించి చెప్పనుగానీ, బ్రహ్మవిద్యా శాస్త్రములో
వేదములు, యజ్ఞములు మనిషికి పనికిరావు అని చెప్పినా, బ్రహ్మవిద్యా
శాస్త్రమయిన భగవద్గీతను కూడా కాదని వేదములను, యజ్ఞములను గొప్పగా
చెప్పుకోవడమును చూస్తే, వాటి వలన వీరికి లాభముందని తెలియుచున్నది.
కేవలము వారి లాభము కొరకు ప్రజలనందరినీ తప్పుత్రోవ పట్టించడము
ప్రజలకు మంచి చేసినట్లా, చెడు చేసినట్లాయని అడుగక తప్పదు.
వాస్తవముగా తప్పును వారు చేయుచూ, తమ తప్పును కప్పిపుచ్చుకొనుటకు
నన్ను విమర్శించడము తగునా? యని ప్రశ్నించుచున్నాను.
2) ప్రశ్న :- "హిందువులలో ఇంటి దొంగలు" అని
భారత్లుడే T.V చానల్లో నలుగురు మాట్లాడుచూ
వారి చర్చా వేదికలో ప్రబోధానంద స్వామియని
మిమ్ములను, రమణానంద మహర్షియను మరొక
స్వామిని హిందూధర్మమును నాశనము చేయువారిగా
పేర్కొన్నారు. దానికి మీరు ఏమంటారు?
జవాబు :- ఆ T.V చానల్లో ఒక ఆడమనిషి, నలుగురు మగవాళ్ళు కలిసి
చర్చించడము జరిగినది. అందులో మీరన్నట్లు నన్ను మరియు రమణానంద
మహర్షిని కలిపి హిందూమతములో ఇంటి దొంగలు అనీ, ముందు వీరిని
హిందూమతములో లేకుండా చేయవలెనని చెప్పడము కూడా జరిగినది.
మేము వేదములను, యజ్ఞములను కించపరుస్తున్నామని కూడా అన్నారు.
అక్కడ మాట్లాడినవారు అందరూ ఒక సమాజమునకు చెందిన వారేయని,
వారి మాటలను బట్టి చెప్పకనే అర్థమగుచున్నది. వారు మాట్లాడిన మాటలు
ఎంత కుటిల కుతంత్ర భావముతో కూడుకొన్నవో వారి మాటల ధోరణిని
బట్టి తెలియుచున్నది. పాఠకులు ముఖ్యముగా గమనించవలసిన విషయము
ఏమంటే నేను “యజ్ఞములు, వేదములు మనిషికి పనికి రావు, అవి దేవున్ని
తెలియుటకు ఏమాత్రము ఉపయోగపడవు" అని చెప్పాను.
రమణానంద మహర్షిగారు నేను చెప్పినట్లు కాకుండా వేదములను,
యజ్ఞములను గౌరవించుచూ వాటిని ఆచరించుచున్నాడు. ఇతరుల చేత
కూడా ఆచరింపజేయుచున్నాడు. నేను వేదములకు, యజ్ఞములకు
దూరముగా ఉంటే రమణానందగారు మాత్రము వాటికి దగ్గరగా యున్నారు.
అటువంటప్పుడు మమ్ములను ఇద్దరినీ కలిపి మేము హిందూమత
ముసుగులో యున్న దొంగలని ఏ విధముగా చెప్పారో వారికే తెలియాలి.
వారు మమ్ములను ఇద్దరిని కలిపి చెప్పడములో ప్రత్యేకమయిన దురుద్దేశ్యము
కలదని తెలియుచున్నది. వాస్తవముగా నాకు రమణానంద మహర్షితో
ఇంతవరకు ఎటువంటి పరిచయము లేదు. ఆయన బయట మనుషులకు
కనిపించే స్వామి. నేను మాత్రము ఎక్కడా బయట కనిపించను. నా
దర్శనము కొరకు దాదాపు ఐదు సంవత్సరముల నుండి కాచుకొన్నవారు
కూడా కలరు. ప్రజలకు దూరముగా ఉండడము నాకు అలవాటు.
గ్రంథములు చాలామందికి పరిచయమే గానీ, నేను మాత్రము చాలామందికి
తెలియదు. వారు నన్ను చూడలేదు. నాకూ రమణానంద మహర్షికి ఆచార
వ్యవహారములలో అనేక తేడాలున్నా, నన్ను ఆయనను కలిపి నిందించి
మాట్లాడడము వెనుక ఒకే ఒక కారణము గలదు. మేము ఇద్దరమూ
బ్రాహ్మణేతరులము. నేను కమ్మకులములో పుట్టినవాడను. ఆయన వాల్మీకి
కులములో పుట్టినవాడు. ఈ కారణము చేతనే చర్చావేదికలో ఇద్దరినీ
విమర్శించడము జరిగినది.
నేను వేదములకు, యజ్ఞములకు శాస్త్రబద్ధమైన వ్యతిరేఖిని. కావున
నేను వారి పనులకు అడ్డమొచ్చేవానిగా లెక్కించి నన్ను దూషించవచ్చును.
అయితే రమణానంద మహర్షిగారు వేదములకు, యజ్ఞములకు వ్యతిరేఖి
కాదు కదా! అటువంటప్పుడు ఆయనను ఎందుకు దూషించినట్లు? అని
ప్రశ్నించక తప్పదు. ఇదంతయు గమనించితే నేను, రమణానంద స్వామి
గారు ఇద్దరము బ్రాహ్మణేతరులము. నేడు స్వాములందరిలో బ్రాహ్మణులే
యున్నారు. ఎక్కడ ఏ స్వామీజీయున్నా అతడు బ్రాహ్మణుడు గానే
యుండును. తమ సమాజము వారే స్వాములుగా, గురువులుగా యుండ
వలెనను సంకుచితబుద్ధి వారిలో యుండుట వలన రమణానంద,
ప్రబోధానంద అని మా ఇద్దరి పేర్లే చెప్పుచున్నారు.
3) ప్రశ్న :- మిమ్ములను వారు బ్రాహ్మణ వ్యతిరేఖులు
అంటున్నారు. దానికి మీరేమంటారు?
జవాబు :- నేను కుల, మత భేదములు లేకుండా అందరూ సమానమని
బోధిస్తున్నాను. అంతేకాక నావద్ద అన్ని కులములవారు సమాన భావముతో
కలిసిమెలసియున్నారు. నేను బ్రాహ్మణులకు వ్యతిరేఖిని అయితే బ్రాహ్మణ
సంఘమును ఎందుకు స్థాపిస్తాను? “ద్రావిడ బ్రాహ్మణ సంఘము”లో
ఎందరో బ్రాహ్మణులు సభ్యులుగా యున్నారు. మాతో సంబంధముగా
యున్న బ్రాహ్మణులందరూ మా జ్ఞానమును తెలిసి సంతోషముగా నన్ను
గౌరవిస్తున్నారు. ద్రావిడ బ్రాహ్మణ సంఘమునకు నన్ను గౌరవ అధ్యక్షునిగా
పెట్టుకున్నారు. అంతేకాక పంచాంగమును వ్రాయు బ్రాహ్మణులు,
క్యాలండరు వ్రాయు బ్రాహ్మణులు, జ్యోతిష్యమును చెప్పు బ్రాహ్మణులు
ఎందరో నాకు పరిచయముగా యుంటూ ద్రావిడ బ్రాహ్మణ సంఘములో
సభ్యులుగా కొనసాగుచున్నారు. జ్ఞానులయిన బ్రాహ్మణులు ఎవరూ నన్ను
విమర్శించలేదు, నన్ను తప్పుగా మాట్లాడలేదు. ఆధ్యాత్మిక జ్ఞానము
ఏమాత్రము తెలియని బ్రాహ్మణులు, తాను పట్టిన కుందేలుకు మూడే
కాళ్ళన్నట్లు, తమకు తెలిసిన జ్ఞానమే నిజమైన జ్ఞానమని తలచి ఆధ్యాత్మిక
వేత్తనయిన నన్ను అసూయతో మాట్లాడుచున్నారు. వారు నా మీద చేయు
ఆరోపణలకన్నిటికీ నావద్ద గలవారు, నా జ్ఞానము తెలిసిన బ్రాహ్మణులే
వారికి సమాధానము చెప్పగలరు. ఎందరో బ్రాహ్మణులు ఎన్నో రంగములలో
పనిచేయువారు నన్ను గౌరవించుచున్నారు. నా జ్ఞానమును తెలిసి
సంతోషపడుచున్నారు. అయితే కొందరు మాత్రము అసూయతో నన్ను
మాట్లాడుచున్నారు.
4) ప్రశ్న :- ఇప్పుడు మీరు “ఉపనిషత్తులలో లోపాలు" అని
చిన్న గ్రంథమును వ్రాయుచున్నారు కదా! అది బ్రాహ్మణు
లకు వ్యతిరేఖముగా వ్రాసినట్లే కదా! బ్రాహ్మణులు ఉప
నిషత్తులు ఎంతో గొప్పవని చెప్పుచుండగా, మీరు ఇలా
వ్రాయడము బ్రాహ్మణులకు వ్యతిరేఖముగా కనిపించు
చున్నది కదా!
జవాబు :- నేను ఉపనిషత్తులన్నీ తప్పు అనివుంటే మీరు అలా అనినా
సరిపోతుంది. అయితే నేను ఉపనిషత్తులలో కొన్నిటిని మాత్రము తీసుకొని
వాటిలో మాత్రమున్న లోపములను చూపడము జరిగినది. బియ్యములో
ఉన్న రాళ్ళను మాత్రము తీసివేస్తున్నా గానీ, బియ్యమన్నీ తినకూడదని
చెప్పలేదు కదా! ఉపనిషత్తులలో ఎక్కడయితే లోపాలు ఉన్నాయో, వాటిని
చాలామంది గుర్తించలేకపోవడము వలన, నేను తప్పక వాటిని వేలు ఎత్తి
చూపవలసి వచ్చినది. అలా చూపకపోతే ప్రజలు అర్థరహితము, లోప
సహితము అయిన ఉపనిషత్తులను చదివి, జ్ఞానమును తప్పుగా అర్థము
చేసుకొని, అజ్ఞాన మార్గములో పోవు అవకాశము కలదు. అందువలన
కొందరికి వ్యతిరేఖమయినా ఫరవాలేదు, ఉపనిషత్తుల విషయములో
సత్యమునే చెప్పుటకు ఈ గ్రంథమును వ్రాయుచున్నాను. నేను ఒక్క హిందూ
మతములోనే కాకుండా, మిగతా మతములయిన క్రైస్తవ, ముస్లీమ్లలో
కూడా దేవుడు చెప్పిన దైవగ్రంథములలోని విషయములను అక్కడక్కడ
వివరించి చెప్పడము జరిగినది. దేవుని బోధలోని సత్యమును తెలుపడమే
నా కర్తవ్యముగా పెట్టుకొన్నాను గానీ, ఇతరులకు వ్యతిరేఖమును చెప్పాలని
కాదు.
5) ప్రశ్న:- మీరు చెప్పునదే సత్యమని, ఇతరులు చెప్పినది
అసత్యమని మీరు ఎలా చెప్పగలరు?
జవాబు :- దేవుడు తన జ్ఞాన విషయములో సత్య అసత్యములను
తెలియుటకు ఒక శాస్త్ర విధానమును తయారు చేసియుంచాడు. ఆ శాస్త్రము
పేరే బ్రహ్మవిద్యా శాస్త్రము. బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి ఏ
మతములోని జ్ఞానములో అయినా సత్యాసత్యములను తెలియవచ్చును.
నేను శాస్త్ర విధి విధానమును అనుసరించి జ్ఞానాజ్ఞానములను తేల్చి
చెప్పుచున్నాను. అట్లుకాకుండా నా ఇష్టమొచ్చినట్లు నేను ఎక్కడా చెప్పలేదు.
బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరిస్తూ మూడు మతములలోనూ కొన్నిటికి
మాత్రము వివరమును వ్రాశాను. శాస్త్ర ప్రమాణము లేకుండా నేను ఏదీ
చెప్పలేదు.
6) ప్రశ్న :- మీరు కొన్నిచోట్ల ఎవరూ చెప్పని విషయము
లను క్రొత్తగా చెప్పారు. వాటికి ఏ ప్రమాణము ఉండదు.
ఉదాహరణకు మూసా ప్రవక్తయే మోషే ప్రవక్తయని
చెప్పడమే కాక అతను ఇన్ని సంవత్సరములే బ్రతికాడని,
తర్వాత ఆయన శరీరములో అనగా మరణానంతరము
కూడా తొమ్మిది సంవత్సరములు ఆయన శరీరములో
ఇతర వ్యక్తి జీవించాడని చెప్పారు. అది ఎవరికీ తెలియని
విషయము. దానికి ఏ ప్రమాణము లేదు. అటువంటప్పుడు
దానికి ప్రమాణము ఏదని చెప్పాలి?
జవాబు :- మొదట చెప్పబడినది తర్వాత ప్రమాణమవుతుంది. మొదట
పుట్టినది ఏదీ ప్రమాణముగా చెప్పబడదు. మొదట భగవద్గీతను శ్రీకృష్ణుడు
చెప్పాడు. తర్వాత అది మిగతా గ్రంథములకు ప్రమాణమైనది. మొదట
భగవద్గీతకు ప్రమాణము ఏది? అని అడిగితే దానిని చెప్పిన కృష్ణుడే
ప్రమాణము అని చెప్పక తప్పదు. అలాగే ఏ విషయమైనా మొదట పుట్టనదే
అది ప్రమాణము కాదు. నేను చెప్పిన కొన్ని క్రొత్త విషయములకు నేనే
ప్రమాణము. నా మాట సత్యమైనదియైతే, నా మాట శాస్త్రబద్దమైనదియైతే
అది ఎప్పటికీ ప్రమాణముగా ఉపయోగపడుతుంది. నా మాట సత్యము
కాదనుటకు ఎవరివద్దయినా ఆధారము ఉంటే నా మాట హేతుబద్దమైనది
కాదని, నా మాట ప్రమాణము కాదని చెప్పవచ్చును. నేను చెప్పిన అనేక
సంఘటన విషయములు ఎన్నో రహస్యముగా బయటపడినవే. ఉదాహరణకు
1980వ సంవత్సరములో “తల్లిగర్భములోని శిశువుకు ప్రాణము లేదు”
అను విషయమును “జనన మరణ సిద్ధాంతము” అను గ్రంథములో
వ్రాశాను. అట్లే “మరణ రహస్యము” అను గ్రంథములో మనిషికి
మరణములు నాలుగు రకములు అని చెప్పాము. ఈ విషయము కూడా
రహస్యమైనందున ఇది భవిష్యత్తులో జరుగు మరణములకు ప్రమాణముగా
నిలబడగలదు. అట్లే జరుగబోవు జననములకు ప్రమాణముగా “జనన
మరణ సిద్ధాంతము” నిలువ గలదు. ఇట్లు ఒకమారు చెప్పబడిన మొదటి
విషయము, తర్వాత ప్రమాణము కాగలదు. “మొదటి విషయమునకు
మొదట చెప్పినవాడే ప్రమాణము” అని తెలియవలెను.
ఎక్కడయితే అసత్య విషయములు చెప్పబడినవో, అవి భవిష్యత్తులో
జరుగబోవు విషయములుగా ఉండవు. అందువలన అటువంటి అసత్య
విషయములను ప్రమాణములుగా చెప్పబడవు. ఉదాహరణకు మనుషుల
పుట్టుకలు నాలుగు రకములుగా యున్నవనీ, విష్ణువు ముఖము నుండి
పుట్టినవారు బ్రాహ్మణులు అనీ, బాహువులనుండి పుట్టినవారు క్షత్రియులనీ,
తొడల నుండి పుట్టినవారు వైశ్యులు అనీ, పాదములనుండి పుట్టిన వారు
శూద్రులు అనీ కొందరు చెప్పుచుందురు. అటువంటి అసత్య విషయములను
బుద్ధియున్న ఏ మనిషీ ఒప్పుకోడు. ఈ విషయమును 10 టీవీ "మల్లన్న
ముచ్చట్లు”లో ప్రసారము చేయడము జరిగినది దానిని తర్వాత పేజీలో
చూడండి.
10TV
NEWS IS PEOPLE
“మల్లన్న ముచ్చట్లు"
(10 టీవీ చానల్లో ప్రసారమైనది)
యాంకర్ :- ఈ భూమిమీద ఏ జీవి అయినా సరే, బ్రతికి బట్ట కట్టాలంటే
ఆహారం సంపాదించుకోవాలె. ఆ ఆహారము లేకపోతే ఎవరూ బ్రతకలేరు.
కానీ భారతదేశములో మాత్రము అన్ని జీవులు ఆహారాన్ని కష్టపడి
సంపాదించుకుంటాయి. ఒక్క జీవి మాత్రమే పైలకెల్లి చెమట చుక్క
రాలకుండ బ్రతుకుతావుంటది. ఆ జీవిని చూస్తరా, పట్టుకొచ్చినా చూడురి.
బ్రాహ్మణుడు :-బాధపడే దానికి చాలా దోషాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకు మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా, బ్రాహ్మణుడు అంటే
భగవంతుని స్వరూపుడు అని వేదము చెప్పుతావున్నది. ఈ కాలములో
ఏమయిపోయింది అంటే ఈ రకరకాల సంఘాలు అన్నీ వచ్చి, బ్రాహ్మణుల
గురించి విమర్శించడం మొదలు పెట్టాయి. దయచేసి మీరు ఆ విమర్శల
లోపలకు మాత్రము వెళ్ళవాకండి. ఎందుకంటే బ్రాహ్మణుని విమర్శించినా,
బ్రాహ్మణుని దూషించినా, బ్రాహ్మణుని బాధ పెట్టినా, బ్రాహ్మణుల యొక్క
ద్రవ్యాన్ని దొంగిలించినా, లేక బలాత్కారము చేసినా, బ్రాహ్మణ స్త్రీని మనము
చెడు అభిప్రాయంతో చూసినా, జన్మజన్మల మన వంశాలన్నీ కూడా
నిర్మూల్యము అయిపోతాయి.
యాంకర్ :- వింటిరా! వీని ముచ్చట. పైలకెల్లి చెమట చుక్క రాల్చకుండ
బ్రతుకుతున్న జీవి ఇగో ఇదే. మాటలు చెప్పి పూటలు గడుపుకునేతందుకు
మాత్రమే వీళ్ళు పుట్టిండ్రు. వీళ్ళట భగవత్ స్వరూపులట. బ్రాహ్మణులను
ఏమన్నా అంటే అన్నోళ్ళ వంశాలు నాశనము అయిపోతాయట. అదే
బ్రాహ్మణుడు ఎవల్నైనా ఏమైనా అనొచ్చు అనేది సారు వారి మాట.
బ్రాహ్మణుడు :- “బ్రహ్మణ్యో సుముఖ మాసి”. ముఖము నుంచి
వెలుబడినంటివాడు. నా విగ్రహంలో, విగ్రహము అంటే మనిషి, రాయి
కాదండి. నా ముఖము నుంచి వచ్చినటువంటివాడు బ్రాహ్మణుడు. నా
బాహువుల నుంచి వచ్చినటువంటివాడు క్షత్రియుడు. నా తొడల నుంచి
వచ్చినటువంటి వాడు వైశ్యుడు. నా పాదాల నుంచి మిగతా వర్ణాలన్నీ
కూడా వచ్చాయి అని చక్కగా, మళ్ళీ ఆ మంత్రము మేము చెప్పినాము
అనుకోండి. మీ బ్రాహ్మణులే రాశారు కదా! ఈ మంత్రము కూడా అంటారు.
యాంకర్ :- అరే! గాడిద. ఎవడైనా తల్లిగర్భంకెల్లె కదరా పుట్టేది.
బ్రాహ్మణుడు ముఖములకెల్లి, క్షత్రియుడు భుజాలకెల్లి, మా BC, SC, ST
లంతా పాదాలకెల్లి పుట్టినారు? ఎందుకు రా ఈ బట్టెవాజు మాటలు.
ఎన్ని ఒద్దులు చెప్పుతారు మాకు? ఓ నాగలి కట్టినోనివా? నట్టు తయారు
చేసినోనివా? కరువు పనిలో తట్ట మోసినోనివా? చెరువులు నింపినోనివా?
ఏ పని చేయకుంట, పెయ్యి అలసి పోకుంట, ముచ్చట్లు చెప్పుకుంట
ఇంకా ఎన్ని ఒద్దులు రా! మా ప్రజలను భ్రమలలో ముంచుతారు మీరు?
ప్రజల్లారా! మనల్ని కులాలుగా విడగొట్టింది వీళ్ళే. మనము
విడిపోకపోతే వీళ్ళకు బ్రతుకుతెరువే దొరకదు అన్నట్లు, నాలుగు వేల
యేండ్ల కింద విడగొట్టి ఇప్పటికీ మన ఉసురు పుచ్చుకుంటానే వున్నారు.
మీరు ఒక్కటి గమనించురి. పంచాంగం రాసేటోళ్ళు ఎవలు? ఈ బాపనోళ్ళే,
దానిని చదివేటోళ్ళు ఎవలు? ఈ బాపనోళ్ళే. మనకు దోషం ఉన్నదని
చెప్పేటోళ్ళు ఎవలు? ఈ బాపనోళ్ళే. ఆ దోషానికి నివారణ చేసేది ఎవలు?
మల్లా ఈ బాపనోళ్లే. పంచాంగములో మన పాత్ర ఏమన్నా ఉన్నదా! ఇది
ఎవని బ్రతుకు తెరువుకోసం రాసుకున్న పంచాంగం చెప్పుర్రి. మనల్ని
మనుషులుగా చూడని మను ధర్మశాస్త్రము ఎట్ల గొప్పది అయితది. మనకు
సమాన హక్కులు ఇచ్చిన భారత రాజ్యంగము కదా గొప్పది! అందుకే
వీళ్ళ మోసాలకెల్లి బయటకు రాండ్రి. అసలైన భారతదేశము అప్పుడు
నిర్మాణము అయితది.
భూమిమీద ఎందరో సత్యమైన విషయములను చెప్పారు. అట్లే
ఎందరో అసత్యమైన విషయములను చెప్పారు. అయితే అందులో సత్యమైన,
హేతుబద్ధమైన విషయములే ప్రమాణములుగా నిలబడి యున్నవని
తెలియవలెను.
7) ప్రశ్న :- ఇప్పుడు మీరు వ్రాయుచున్న “ఉపనిషత్తులలో
లోపాలు" అను గ్రంథములో అసత్యమైన విషయములు
కనిపించినప్పుడే కదా! మీరు దానిని లోపము అని చెప్పు
చున్నారు. వేదములు, వేదముల చివరిలోని ఉప
నిషత్తులు ఆధ్యాత్మికములో హిందువులకు ప్రమాణ
గ్రంథములని చాలామంది అంటున్నారు. ఒక మతము
నకు ప్రమాణములని చెప్పుచున్న ఉపనిషత్తులలో
కొన్నిటిని మీరు తప్పుబట్టి చెప్పుచున్నారంటే అందులో
మీకు మొదట ఏ విధమైన లోపము కనిపించినదో
చెప్పగలరా? మీరు సత్యమును అసత్యముగా చెప్పరను
నమ్మకముతో మేము మిమ్ములను అడుగుచున్నాము.
మీరు హిందువైయుండి హిందువులకు ఆధ్యాత్మిక
ప్రమాణములని చెప్పబడుచున్న వాటిని తప్పు అని ఎలా
చూపించగలరో చెప్పండి?
జవాబు :- నేను 1975వ సంవత్సరము గడికోట సచ్చిదానంద
యోగీశ్వరులు వ్రాసిన “జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతము” అను
గ్రంథములో కొన్ని పేజీలు చూచాను. అప్పుడు ఆయన “యోగ చూడామణి”
ఉపనిషత్తునుండి తీసి వ్రాసిన ఒక శ్లోకమును చూచాను. ఇలా
కలదు చూడండి.
యోగ చూడామణ్యుపనిషత్తు.
జ్ఞాన కర్మేంద్రియైః, ప్రాణాది పంచవాయు
మనోబుద్ధిశ్చ సూక్ష్మ లింగ మిత్యుచ్యతే
దీని వివరమును చూస్తే ఈ విధముగా వ్రాయబడియున్నది.
"కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు, ప్రాణ అపాన మొదలగు
వాయువులు ఐదు, మనస్సు, బుద్ధి రెండును కలిపి మొత్తము పదిహేడు
శరీర భాగములను సూక్ష్మ శరీరము అని అంటారు” అని కలదు.
మొట్టమొదట ఈ ఉపనిషత్తులలోని శ్లోకములను చూచినప్పుడు నాకు కొంత
ఆశ్చర్యమయినది. అప్పటికి నా వయస్సు 26 సంవత్సరములు. అంతకు
పూర్వమే పది సంవత్సరములనుండి ఆధ్యాత్మికమును శోధించుచూ
వచ్చినందువలన సూక్ష్మశరీరము అంటే ఏమిటో, స్థూల శరీరము అంటే
ఏమిటో కొంతవరకు తెలిసియున్న దానివలన “యోగ చూడామణి”
ఉపనిషత్తులోని శ్లోకము పూర్తి అసత్యముగా కనిపించినది. అంతకుముందు
ఆకుల గురుమూర్తి వ్రాసిన “ఆత్మ లింగ శతకము”ను చూచాను. అందులో
ఒక పద్యము ఇలా కలదు.
పంచ తత్త్వములను పంచీకరించక
మంచి యతులమన్న మాటలన్న
కుంచమందు గజము గ్రుడ్డుపెట్టిన విధంబు
అఖిల జీవసంగ ఆత్మలింగ!
భావము :- సమస్త శరీరములలో నాశనమగు జీవాత్మతో కలిసి నివాసము
చేయుచున్న నాశనము లేని ఓ ఆత్మా! వినుము. పంచభూతములైన
ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఎట్లు సృష్ఠింపబడినదీ, అవి ఒక్కొక్కటి
ఏ విధముగా ఐదు భాగములుగా విభజింపబడినది, అలా విభజింపబడిన
25 భాగములు ఒకదానితో మరొకటి కలిసి ఎలా శరీర భాగములు
ఏర్పడినది తెలియడమే 'సాంఖ్యము' అంటాము. పంచతత్త్వములను
పంచీకరించి సాంఖ్యమును తెలియనివారు మరియు శరీరములోని ఆత్మ
తనశక్తి చేత శరీర భాగములను ఎలా పని చేయించుచున్నది తెలియనివారు
మేము జ్ఞానులము అని అనుకొంటే, గంపక్రింద ఏనుగు గ్రుడ్డు
పెట్టినట్లుండునంట! ఏనుగును గొలుసులతో బంధించి పెద్ద గంపక్రింద
నిలబెట్టినప్పటికీ అది గ్రుడ్డు పెట్టదు. దీనినిబట్టి చూస్తే ఏనుగు గంపక్రింద
గ్రుడ్డు పెట్టడము ఎంత అసత్యమో, అలాగే శరీర అవయవముల
వివరములను తెలియనివాడు 'నేను జ్ఞాని' అనుట అంతే అసత్యమగును.
ఈ పద్య భావములో ఉన్నదానిని బట్టి చూస్తే జ్ఞాని అయినవాడు
ఎవడయినా గానీ, అతను తాను నివశించుచున్న శరీరము రెండు
భాగములుగా ఉన్నదనీ, ఒకటి స్థూలశరీరము రెండు సూక్ష్మశరీరముగా
విభజింపబడియున్నదనీ, స్థూలశరీరము ఎన్ని భాగములుగా యున్నదీ,
సూక్ష్మశరీరము ఎన్ని భాగములుగా యున్నదీ, రెండు శరీర భాగములు
కలిసి మొత్తము ఎన్ని భాగములుగా యున్నది తెలిసియుండవలెను.
ఆధ్యాత్మిక జ్ఞానములో ప్రాథమిక జ్ఞానము శరీరమును గురించి తెలియడమే.
అట్లు తెలియకపోతే వాడు జ్ఞానియే కాడు అని పై పద్యములో చెప్పియున్నారు.
అందువలన మేము సంపూర్ణముగా శరీరము, శరీర భాగములను తెలిసి
యుండుట వలన “యోగ చూడామణి” ఉపనిషత్తులో వ్రాసినది తప్పని
తెలిసి, ఇదొక్కటే కాకుండా ఉపనిషత్తులలో ఇంకా ఎన్ని లోపములున్నవని
చూడగా, అక్కడక్కడ కొన్ని అసత్య విషయములున్నట్లు తెలిసినది. ప్రజలలో
కొందరు ఉపనిషత్తులు పూర్తి ఆధ్యాత్మికమును బోధించునవేయని
నమ్మియున్నప్పుడు వారికి తెలియకుండానే వారు ఆధ్యాత్మికము అని నమ్మి
అజ్ఞాన మార్గములోనికి పోవు అవకాశము గలదు. అందువలన అట్లు
జరుగకుండా, ఉపనిషత్తులలోని సత్య విషయములను తెలియునట్లు, అసత్య
విషయములను వదలివేయునట్లు, అన్నీ కాకున్నా కొన్ని అసత్యములనయినా
తెలియజేయాలనుకొన్నాను. శాస్త్రబద్ధతను అనుసరించి, నా అనుభవమును
మేళవించి ఈ చిన్న గ్రంథములో ఉపనిషత్తులలోని లోపములను అందించు
చున్నాను.
“యోగ చూడామణి” ఉపనిషత్తులోని ఒక శ్లోకమును పైన చెప్పి
యున్నాను కదా! అందులో సూక్ష్మ శరీరమును గురించి చెప్పియున్నారు.
మనిషి శరీరము కంటికి కనిపించు స్థూల శరీరముగా, కంటికి కనిపించని
సూక్ష్మశరీరముగా ఉండుట వాస్తవమే. రెండు శరీరములలో స్థూల శరీరము
అయిన పది భాగములు కనిపించుచున్నది. పదిహేను భాగములు సూక్ష్మ
శరీరముగా ఉన్నది వాస్తవము. అయితే పదిహేడు భాగములు సూక్ష్మ
శరీరమని పై శ్లోకములో వ్రాసియున్నారు. అది పూర్తి అసత్యమని చెప్పుటకు
బలమైన ఆధారము గలదు. అది ఏమనగా! కంటికి కనిపించు పది
భాగముల స్థూలశరీరమును పై శ్లోకములో సూక్ష్మ శరీరముగా పేర్కొన్నారు.
స్థూలముగా కనిపించుచున్న ఐదు జ్ఞానేంద్రియములను, ఐదు
కర్మేంద్రియములను కలిపి "జ్ఞాన కర్మేంద్రియైః" అని శ్లోకములో
జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను కలిపి సూక్ష్మ శరీరము అని
చెప్పడము జరిగినది. కనిపించే పది భాగముల శరీరమును కనిపించని
సూక్ష్మ శరీరముగా చెప్పడము పచ్చి అబద్దముకాక ఏమవుతుంది? ఇటువంటి
అసత్యములను మాత్రము బయట పెట్టి జ్ఞాన జిజ్ఞాసులను అప్రమత్తము
చేయడమే ఈ గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. నేను తప్పులను
మాత్రమే తప్పులుగా చెప్పుచున్నాను తప్ప ఉపనిషత్తులన్నీ తప్పని చెప్పలేదు.
అందువలన “ఉపనిషత్తులలో లోపాలు” అని వ్రాశాను తప్ప
‘ఉపనిషత్తులు లోపాలు' అని వ్రాయలేదని గ్రహించగలరు.
ఉపనిషత్తులను గొప్పగా చెప్పుకొనువారు, ఉపనిషత్తులే దైవ
జ్ఞానమునకు ప్రమాణ గ్రంథములని చెప్పువారు, ఉపనిషత్తుల పరిశోధకుల
మని చెప్పుకొనువారు, ఆధ్యాత్మిక విద్యలో సంపూర్ణ జ్ఞానులమని
చెప్పుకొనువారు ఎందరో భూమిమీద గలరు. అటువంటివారికి ప్రత్యక్షముగా
కనిపించు అసత్యమైన శ్లోకములు ఎందుకు కనిపించలేదు? అని నేను
ప్రశ్నించుచున్నాను. వారికి కనిపించకపోయినా నాకు కనిపించినవి కాబట్టి
నేను చెప్పక తప్పలేదు. నా ఉద్దేశ్యము మంచిదని గ్రహించి నన్ను
విమర్శించకుండా ఉండవలెనని తెలుపుచున్నాను. కొందరు ఇతరులను
విమర్శించు పనినే ముఖ్యముగా కల్గియుందురు. కావున అటువంటి వారికి
ఇది దైవ విషయమని, దేవుని విషయములో ఆటంకములు కలుగజేయ
కూడదని, అలా కలుగజేయడము వలన పాపము సంభవించునని ముందే
తెల్పుచున్నాము.
వేదముల చివరయుండునవే ఉపనిషత్తులు, వేదములను వదలి
ఉపనిషత్తులు లేవు, ఉపనిషత్తులను వదలి వేదములు లేవు. వేదమును
గురించి ఇంతకుముందు గ్రంథములో వ్రాశాను. దానిపేరు “వేదములు
మనిషికి అవసరమా?”. వేదములు ఎట్లున్నా వాటి చివరిలోని ఉపనిషత్తులు
అందరికీ అవసరమే అని కొందరు అంటుంటారు. అయితే అవసరము
లేదు అని నేను అనడము లేదు. ఆలోచించి సత్యమైన వాటిని స్వీకరించి
అసత్యమును వదలమని చెప్పుచున్నాను.
8) ప్రశ్న :- స్థూల, సూక్ష్మశరీరములని రెండు రకములు
మనిషికి ఎందుకు గలవు? ఒకే శరీరము ఉండవచ్చును
కదా?
జవాబు :- మనిషికి కర్మలు రెండు రకములు గలవు. రెండు రకముల
కర్మలను బట్టి రెండు విధముల శరీరములు మనిషికి లభించుచున్నవి.
స్థూల కర్మప్రకారము స్థూల శరీరము, సూక్ష్మ కర్మప్రకారము సూక్ష్మ శరీరము
లభించును. స్థూల కార్యములో వచ్చునది స్థూల కర్మ, అలాగే సూక్ష్మ
కార్యములో వచ్చునది సూక్ష్మ కర్మ అని తెలియవలెను. ఒక మనిషి
సహజముగా రెండు కర్మలను కల్గియున్నాడు. కావున వాటి అనుభవము
కొరకు స్థూల సూక్ష్మ అను రెండు రకముల శరీరములను కల్గియున్నాడు.
కనిపించు స్థూల శరీరముతో అనుభవించునది బయట అందరికీ తెలియు
కష్ట సుఖములుగా యున్నవి. అలాగే బయటికి కనిపించని మానసిక
బాధలుగానీ సంతోషముగానీ సూక్ష్మశరీరము చేత అనుభవించుచున్నాము.
9) ప్రశ్న :- త్రైత సిద్ధాంతము ప్రకారము జీవాత్మ, ఆత్మ,
పరమాత్మ అను మూడు ఆత్మలు గలవు కదా! ఈ మూడు
ఆత్మలు శరీరములోనే ఉన్నాయి కదా! ఈ మూడు ఆత్మలు
కనిపించవు కాబట్టి మూడు ఆత్మలను సూక్ష్మ శరీరముగా
లెక్కించవచ్చునా?
జవాబు :- నేను చెప్పుచున్నది ప్రకృతితో తయారయిన శరీరములను
మాత్రము చెప్పుచున్నాను. ఆత్మలు మూడు పురుష సంబంధమైనవి.
సంబంధమైన ప్రకృతిలోనికి పురుష సంబంధమైన ఆత్మలు కలవు. ప్రకృతి
చేత పుట్టినది స్థూల, సూక్ష్మ అను శరీరము. ప్రకృతికి ఆధారముగా దిక్కుగా
యున్నవి మూడు ఆత్మలు. దీనినిబట్టి ప్రకృతి వేరు, ఆత్మలు వేరని తెలియు
చున్నది. అందువలన ఆత్మలు సూక్ష్మశరీరముగా చెప్పబడవు.
10) ప్రశ్న :- మీరు చెప్పుచున్న స్థూల, సూక్ష్మ శరీరములే
కాకుండా, కారణ శరీరమనునది మరొకటి కలదని
కొందరు ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. వారిమాట
ప్రకారము 'కారణ శరీరము' అంటూ మరొకటి ఉన్నదా?
జవాబు :- 'కారణ శరీరము' ఉన్నదను మాటను నేను కూడా విన్నాను.
అయితే ఆ మాటను అనువారు ఆధ్యాత్మిక వేత్తలమని పేరు పెట్టుకొన్నవారు
చెప్పుచున్న మాటలేగానీ, వాస్తవముగా ఆత్మను ఆధ్యాయనము చేసినవారు
చెప్పుమాటలు కావు. కారణ శరీరమనునది బ్రహ్మవిద్యా శాస్త్రములో ఎక్కడా
లేని మాట. అటువంటి లేనిమాటను వారు ఎందుకు చెప్పుచున్నారో
వారికే తెలియాలి. ఏదో ఒకటి చెప్పి శాస్త్రము ఇలా చెప్పుచున్నదని
అంటున్నారు. వాస్తవముగా ఏ శాస్త్రము అలా చెప్పుచున్నదో దాని పేరును
మాత్రము వారు చెప్పరు. అలా చెప్పువారి మాటలు అశాస్త్రీయమైనవి.
అందువలన వారి మాటలను నమ్మకూడదు. పాపపుణ్యములను వారు
కారణ శరీరముగా చెప్పుచున్నారు. వాస్తవానికి పాపపుణ్యములనునవి
ప్రతి మనిషికీయున్నా, అవి ప్రకృతి సంబంధమైనవి కావు. అందువలన
వాటిని శరీరముగా పోల్చి చెప్పకూడదు. పాపపుణ్యములు జన్మకు
కారణమగుచున్నవి కావున వాటిని కారణ శరీరమని కొందరు చెప్పడము
జరిగినది. అయితే వాస్తవముగా అవి రెండూ జన్మకు కారణమయినా
వాటిని శరీరముగా చెప్పడము తప్పగును. ఎందుకనగా! పాపపుణ్యములు,
మూడు భాగములుగా యున్న 12 గుణములు, పన్నెండు గ్రహములు
ఇవన్నియూ ఆత్మకు అనుసంధానమై యుండి పని చేయుచున్న ప్రకృతి
జనిత శరీరమును పాలించు పాలనా విభాగములని తెలియవలెను.
గుణములు ప్రకృతి చేత తయారు చేయబడినవిగా యున్నా గ్రహములు,
గుణములు, కర్మలు అన్నీ ప్రకృతి జనితమైయున్నా అవి ప్రకృతితో
సంబంధము లేకుండా ఆత్మ పరిపాలనలో భాగముగా పని చేయుట వలన
శరీర భాగముగా చెప్పకూడదు. గ్రహములు, గుణములు, పాపపుణ్యములు
అన్నీ శరీరముతో సంబంధము లేకుండా శరీరము నాశనమయినా ఈ
మూడు భాగములు నాశనము కానివిగా యుంటూ, ప్రత్యేకమయిన కాల,
కర్మ, గుణచక్రములలో ఇమిడి యున్నవి. అందువలన పాపపుణ్యములను
కారణ శరీరమని చెప్పకూడదు. అవి శరీరమునకు అతీతముగా యున్న
స్థానములో యుండి ఆత్మతో సహా ఎల్లప్పుడూ ఉండునవై ఉన్నవి.
అందువలన ఆత్మకు అనుసంధానమై పని చేయుచున్నవని, ఆత్మ వెంట
ఉండునవని, బ్రహ్మవిద్యా శాస్త్రబద్దముగా చెప్పవచ్చును.
11) ప్రశ్న :- ఆత్మ అంటే అక్షరమైనదని బ్రహ్మవిద్యా
శాస్త్రమైన భగవద్గీతలో చెప్పారు. అక్షరమైనది అనగా
క్షరము లేనిది అని అర్థము మీరే చెప్పారు. దానినిబట్టి
నాశనము లేనిది ఆత్మయని తెలియుచున్నది. ఆత్మకు
ఒక అర్థము ఉన్నట్లే, ఆత్మ నివశించు శరీరమునకు కూడా
ఏదయినా నిర్ధారణ చేయబడిన (నిర్ధిష్టమైన) అర్థము
కలదా?
జవాబు :- ఆత్మ అను పదము మనుషులలో ఒక రకము, జంతువులు,
పక్షులలో మరొక రకము, వృక్ష సంబంధమైన వాటిలో ఇంకొక రకముగా
చెప్పబడుచున్నది. చెట్లలో ఆకుగా, మనుషులలో ఆత్మగా, జంతువులు,
పక్షులలో 'త' కు కొమ్మును చేర్చిన పేరుతో పూర్వము చెప్పెడివారు. నేడు
'ఆత్మ' అను ఒకే ఒక పేరుతో పిలువబడుచున్నది. మిగతా రెండు పదములు
యున్నా అవి ఆత్మ పేర్లేయని ఎవరికీ తెలియకుండా పోయినవి. ఆత్మకు
మూడు పేర్లు యున్నా ఆత్మ నివశించు దానిని శరీరము అనియే చెప్పు
చున్నారు. శరీరమును దేహము అని చెప్పినా, అది వేరు అర్థము కల్గి
దేహి (ఆత్మ) నివశించునది దేహము అని చెప్పబడుచున్నది. అయితే
శరీరము అను దానికి ప్రత్యేకమైన అర్థము కలదు. శరీరము అను నాల్గు
అక్షరములలో చివరిలో యున్న 'ము' ముగింపు శబ్దముగా యుండి దానికంటే
ముందుగల “శరీర” అను మూడు అక్షరములు ప్రత్యేకమైన అర్థము
కల్గియున్నవి. అవి ఏమనగా! “శ” అనగా స్థూలమనియు, “రీ” అనగా
సూక్ష్మమనియు, “ర” అనగా నాశనము కలదియని పూర్వము పెద్దలు
చెప్పారు. కాలక్రమమున ఆ అర్థము నేడు పూర్తిగా తెలియకుండా పోయినది.
శరీరము అనగా "స్థూల, సూక్ష్మములు నశించునది" యని అర్థము.
దీనినిబట్టి శరీరము పూర్తి నాశనము కలదియని చెప్పవచ్చును.
12) ప్రశ్న :- నాశనము చెందే శరీరముతో నాశనము
లేని ఆత్మ కలిసియుంటే దానిని జీవితము అని
అంటున్నాము. ఆత్మ యున్నంత వరకు నాశనము కాని
శరీరము, ఆత్మ లేకుండా పోయిన వెంటనే నాశనము
చెందుతున్నది. జీవన సమయములో నాశనము కల
శరీరముతో నాశనము లేని ఆత్మ ఎందుకు యున్నది?
ఆత్మతో పాటు జీవాత్మ శరీరములో మరణము వరకు
యున్నది. ఆత్మ, జీవాత్మ అను రెండు జోడు ఆత్మలు
శరీరమును వదలిపోయినా మూడవ ఆత్మయిన
పరమాత్మ నాశనము చెందు శరీరములో కూడా
యున్నదని చెప్పుచున్నారు. అలా పరమాత్మ, మరణించిన
శరీరములో ఎందుకు యున్నది? దానికి బలమైన
కారణము ఏమయినా ఉన్నదా?
జవాబు :- జీవాత్మ, ఆత్మ అను రెండు ఆత్మలు ప్రకృతిలో నివశించుచున్నవి.
అందువలన జీవాత్మ ఆత్మ అను రెండు ఆత్మలు ప్రకృతికి సంబంధించిన
సూక్ష్మ శరీరములో ఉంటున్నవి. సూక్ష్మ శరీరము, స్థూల శరీరములో
ఇమిడి కొంతకాలమున్నా, కొంత కాలము స్థూల శరీరమును వదలి కూడా
వేరుగా ఉండడము జరుగుచున్నది. స్థూల శరీరము మాత్రము కోల్పోయిన
మనిషి అకాల మరణమును పొందుచున్నాడు. అతనికి పూర్తి మరణము
రాలేదని చెప్పవచ్చును. సూక్ష్మ శరీరమును కోల్పోయినప్పుడు మరణము
అనబడును. ఇటువంటి రెండు మరణములు రెండు శరీరములనుబట్టి
ఉన్నాయి. పూర్తి మరణమును పొందిన శరీరము కూడా పరమాత్మ
యనబడు మూడవ ఆత్మయందు కలదని చెప్పవచ్చును. ఎందుకనగా!
పరమాత్మ ప్రపంచములో అణువణువునా వ్యాపించి యున్నాడు.
అందువలన మరణించిన దేహములోని అణువులలో కూడా పరమాత్మ
యున్నాడని పూర్వమే మన పెద్దలు తెలిసియున్నారు. అందువలన
మరణించిన శవమును చివరిగా పూజచేసి పరమాత్మను గౌరవిస్తున్నట్లు
తెలియజేయుచున్నారు. పరమాత్మ కనిపించని శక్తిగాయుంటూ ప్రతిచోట
యుండుట వలన ప్రతి వస్తువు బయట, ప్రతి వస్తువు లోపల యున్నాడు.
అందువలన వస్తువు ఒక పదార్థముతో కూడుకొని యుండుట వలన ఆ
పదార్థమునే పరమాత్మ యని అంటున్నాము. పద + అర్థమును కలిపి
పదార్థము అని అంటున్నాము. పదము లేక పద అనగా అణువు అని లేక
అణువులతో కూడుకొన్న వస్తువు అని అర్ధము. అర్థము అనగా 'అణువులోని
విలువైన దైవము' అని చెప్పవచ్చును. అర్థము అనగా ధనము లేక
‘విలువ కల్గిన’యని చెప్పవచ్చును. ధనముగా ప్రతి అణువులోను పరమాత్మ
యున్నదని చెప్పవచ్చును. వస్తువు అయినది ఏది అయినా కావచ్చును.
అనగా! పచ్చి శరీరమయినా, ఎండుకట్టే అయినా, రాతిబండ అయినా,
బంగారు లోహమయినా, వజ్రమయినా సమస్త ప్రపంచములో పరమాత్మ
ఉన్నది ఏదిగానీ దానియందు పదార్థమున్నది. పదార్థము కానిది ఏదియు
లేదు. అందువలన ప్రతి పదార్థము పరమాత్మకు మారురూపముగా
యున్నదని చెప్పవచ్చును. ఈ విధముగా యున్న పరమాత్మను చేరుటకు,
కావలసిన జ్ఞానమును పొందుటకు, ఉపనిషత్తులు పనికి వస్తాయని కొందరు
అంటున్నారు. అయితే ఉపనిషత్తుల అన్నిటినీ ఒకే కోణములో చూడవద్దనీ,
అందులో కొన్నిటి యందు మాత్రమే లోపములున్నవని మేము
చెప్పుచున్నాము.
13) ప్రశ్న :- నచికేతుడు అను ఒక రాజు మృత్యువును
పొందినప్పుడు అతనిని యమదూతలు యమలోకానికి
తీసుకపోయారని, అప్పుడు నచికేతుడు యమ ధర్మ
రాజును అనేక ప్రశ్నలను అడిగాడు. అప్పుడు యమ
ధర్మరాజు అతని ప్రశ్నలకు జవాబు చెప్పుచూ ఉప
నిషత్తుల జ్ఞానమును చెప్పాడని కఠోపనిషత్తు యందు
చెప్పారు. యమధర్మరాజు చెప్పిన జ్ఞానము కఠోపనిషత్తు
యందు చెప్పియున్నారు. కఠోపనిషత్తులో చెప్పిన
దంతయూ నచికేతునికి యమ ధర్మరాజు చెప్పిన జ్ఞాన
మని అంటున్నారు. అలా యమ ధర్మరాజు చెప్పిన
కఠోపనిషత్తులో కూడా లోపములున్నవని మీరు
అనుకొంటున్నారా?
జవాబు :- ఒక విధముగా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అనియే అని
చెప్పవచ్చును. ఒక హిందూమతములోనే కాకుండా మిగతా రెండు
మతములయిన క్రైస్థవ, ముస్లీమ్ మతములలో యమలోకము, స్వర్గ లోకము
లేక నరకలోకము, స్వర్గలోకము అని చెప్పడము జరుగుచున్నది. పన్నెండు
మతములవారు స్వర్గ, నరక లోకములను నమ్ముచునేయున్నారు. అయితే
వేదాలలో చెప్పారని కొందరు, మత గ్రంథాలలో చెప్పారని కొందరు చెప్పుట
వాస్తవమే అయినా బ్రహ్మవిద్యా శాస్త్రము ప్రకారము స్వర్గ నరకములు
ఉన్నాయా అని పరిశీలించి చూస్తే, ఆధ్యాత్మికమును అనుసరించి స్వర్గ,
నరక లోకములు అనునవి ప్రత్యేకముగా లేవని చెప్పవచ్చును. మనిషిగానీ,
ఏ జీవిగానీ గతములో తాను చేసుకొన్న పాపపుణ్య ఫలితములనే తిరిగి
వచ్చిన జీవితములో కష్టసుఖముల రూపములో ప్రత్యక్షముగా భూమిమీదనే
అనుభవించుచున్నాడు. మనిషి చనిపోతే మనిషి శరీరములోని జీవుడు
అదే సెకండులోనే క్రొత్త శరీరమును పొందుచున్నాడు తప్ప ఇంకొక
లోకములోనికి పోతాడని చెప్పడము పూర్తి అసత్యము. లోకము అనగా
‘అనుభవములను ఇచ్చు స్థలము' అని అర్థము. సుఖము భూమిమీదనే
మనిషికి కల్గుచున్నది, కావున మనిషి ఎక్కడ సుఖమును అనుభవించు
చున్నాడో అక్కడే స్వర్గము కలదని చెప్పవచ్చును. సుఖముల అనుభవమునే
స్వర్గలోకము అంటున్నాము గానీ, అదేదో ఎక్కడో యున్న ప్రత్యేక దేశమని
అనుకోకూడదు.
అలాగే యమలోకము లేక నరకలోకము అనినా మనిషి కష్టములు
అనుభవించు స్థలమేయని చెప్పవలెను. అంతేగానీ యమలోకము ప్రత్యేక
మైన లోకమనీ, దానికి ఒక రాజు యున్నాడనీ, ఆ రాజు పేరే యమ
ధర్మరాజు అనడము పూర్తి తప్పు. యమలోకమే ప్రత్యేకముగా లేనప్పుడు
చనిపోయిన వారందరూ అక్కడికి పోతారని, యమభటులు తీసుకొని
పోతారని చెప్పడము పూర్తి అభూత కల్పనయే యగును. మనిషి చేసుకొన్న
పాపపుణ్యములను మనిషి భూమిమీదనే అనేక సంఘటనల రూపములో
అనుభవించుచుండుట వాస్తవము. మనిషి శరీరములోని ఆత్మయే
యముడుగా పేరుగాంచియున్నాడు అనుటకు సాక్ష్యముగా భగవద్గీతలో
విభూతి యోగమందు “దండనాధికారులలో యముణ్ణి నేను” అని ఆత్మ
చెప్పినట్లు కలదు. ఈ విధముగా చెప్పితే మనిషి శరీరములోనే స్వర్గ
నరకములను జీవుడు అనుభవించుచున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానరీత్యా ఉన్న
సత్యము అంతే! అయితే 'కఠోపనిషత్తు' అను పేరుతో ఒక ఉపనిషత్తును
వ్రాస్తూ, అందులో నచికేతుడు అనునతడు చనిపోయి నరకములో యమ
ధర్మరాజుతో మాట్లాడాడు అని చెప్పడము ఉపనిషత్తులో పూర్తి అసత్యమున్న
దని చెప్పుటకు తార్కాణముగా యున్నది. కఠోపనిషత్తులో చెప్పిన నచికేతుడు
అసత్యమే. యమధర్మరాజు అసత్యమే. అంతేకాదు కఠోపనిషత్తులో వ్రాసిన
శ్లోకము ఏ విధముగా అసత్యముగా యున్నదో ఆధ్యాత్మికము ప్రకారము
వివరించి చెప్పెదను చూడండి.
కఠోపనిషత్తు
శ్లోకము :- ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ద్యేవాక్షరం పరమ్,
ఏతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్ (2-16)
భావము :- అక్షరమైన అదియే బ్రహ్మము. అదియే అన్నిటికంటే గొప్పది.
ఈ అక్షరమగు బ్రహ్మను తెలుసుకొన్నవాడు దేనిని కోరినా దానిని
పొందగలడు.
నా వివరము :- మనిషికి కోర్కెలు గుణముల నుండి పుట్టుచున్నవి. కోర్కెలకు
పుట్టుకలయిన గుణములు ప్రకృతి నుండి పుట్టినవి. ప్రకృతి జనిత
గుణములను అన్నిటినీ కలిపి 'మాయ' అని కూడా బ్రహ్మవిద్యా శాస్త్రములో
చెప్పబడినది. అనగా బ్రహ్మవిద్యా శాస్త్రమునకు గుర్తుగా యున్న భగవద్గీత
విజ్ఞాన యోగములో 14వ శ్లోకమందు “గుణమయి మమ మాయా” అని
చెప్పబడినది. దీని ప్రకారము గుణములనుండి వచ్చు కోర్కెలు మాయకు
గుర్తుగాయున్నాయి. కోర్కెలను త్యజించమని, గుణములను అధిగమించమని
కూడా భగవద్గీతలో చెప్పబడినది. మనిషి దేనిని కోరినా అది వాని కర్మను
బట్టి నెరవేరడము, నెరవేరకపోవడము జరుగుచుండును. కోర్కెలు గుణముల
నుండి పుట్టగా, కర్మనుబట్టి అవి తీరేది లేనిది ఉండును. అంతేగానీ
మనిషి యందు గల ఆత్మకు కోర్కెలకు ఏమాత్రము సంబంధము లేదు.
అటువంటప్పుడు బ్రహ్మను (ఆత్మను) తెలిసినవాడు దేనిని కోరినా అవి
నెరవేరుననుట పూర్తి అసత్యము.
మనిషి పుట్టినప్పటినుండి కోర్కెలలోనే జీవించుచున్నాడు. మనిషికి
దైవజ్ఞానము లేకున్నా కోర్కెలు మాత్రము అనేకము ఉండును. మాయలో
ఉన్న వానికి కోర్కెలుండడము, వాటిలో కొన్ని నెరవేరడము జరుగుచుండును.
ఆత్మజ్ఞాని అయినవానికి గుణముల ప్రభావము తగ్గి కోర్కెల వేగము
కొద్దికొద్దిగా తగ్గుతూ వచ్చును. అట్లే జ్ఞాని అయినవాడు కోర్కెల నుండి
బయటపడినాడు, గుణములను జయించాడు అంటే సరిపోవును గానీ,
వాడు దేనిని కోరినా అవి నెరవేరుననడము బ్రహ్మవిద్యకే విరుద్ధము.
ఇటువంటి అసత్యవచనములను వ్రాసి వాటిని ఉపనిషత్తులనడము
ఎంతమాత్రము సమంజసమో మీరే ఆలోచించండి. కృతయుగము,
త్రేతాయుగము, ద్వాపరయుగములలో మేము జ్ఞానులము అనుకొన్న
వారందరూ తమకు తెలిసినది, తమకు తోచినది వ్రాసి వాటినే వేదములు,
ఉపనిషత్తులు అని అన్నారు. ఆనాడు ఎందరో వ్రాసిన పదివేల వ్యాసములలో
కొన్ని వాస్తవము కాగా, కొన్ని అవాస్తవముగా, అజ్ఞానముగా కనిపించేవి.
అలా అజ్ఞానముగా కనిపించినవాటిని వదలి, వేయిన్ని నూట ఎనిమిదిని
మాత్రము సరైనవని గుర్తించి, ఆ వ్యాసములను వేదములుగా వ్రాయడము
వలన వ్రాసినవానికి 'వేదవ్యాసుడు' అని పేరు రావడము జరిగినది.
అందులో కొన్ని వ్యాసములే సక్రమమయినవని నూట ఎనిమిదిని (108)
గుర్తించగా, వాటిలో ఇంకా ఉత్తమమైనవని పది ఉపనిషత్తులను ఎన్నుకొని
వాటిని 'దశోపనిషత్తులు” అని అన్నారు.
14) భగవద్గీత అనగా ‘భగవంతుడు చెప్పిన హద్దు'యని
తెలియుచున్నది. రామాయణము అనగా రాముని
ఆయణము (రాముని ప్రక్క చెప్పినది) అని అర్థమగు
చున్నది. అలాగే వేదములు అనగా వేదనలతో
కూడుకొన్నవని తెలియుచున్నది. అదే విధముగా
ఉపనిషత్తులనగా నిజమైన అర్థమేమో తెలుపమని
అడుగుచున్నాము?
జవాబు :- కఠోపనిషత్తుయను గ్రంథములో ఉపనిషశ్శబ్దార్థమును గురించి
ఈ విధముగా చెప్పియున్నారు. కొందరు శాస్త్రకారులు 'ఉపనిషత్తు' అను
పదమునకు ఈ ప్రకారము అర్థము చెప్పుచున్నారు. సమస్త సంసారక్లేశము
నశించునట్టి ఉపాయమును చూపించి సంసారక్లేశమును మిగుల
నాశనమొనర్చునది అని చెప్పుచున్నారు.
మరికొందరు ఇలా అంటున్నారు. "వేదములన్నిటి ద్వారా నేనే
తెలియదగినవాడను” అను మొదలగు వాక్యముల చేత, ఆయా దేవతా
ప్రతిపాదకత్వమును సాక్ష్యాత్తుగా విని, బ్రహ్మమునే ప్రతిపాదించుచున్నవను
అభిప్రాయము చేత, సాక్ష్యాత్తుగా పరబ్రహ్మ ప్రతిపాదనలో ఉంటున్నది కనుక
ఉపనిషత్తు అని చెప్పారు.
నవీనులు కొందరు ఇలా అంటున్నారు. గురువు దగ్గర కూర్చున్న
శిష్యుల చేత గ్రహింపతగిన తత్త్వము గనుక ఉపనిషత్తులని అంటున్నారు.
ఉపనిషత్ అను పదము యొక్క అర్థమును శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల
వారు అచ్చటచ్చట సంబంధ భాష్యములందు సంగ్రహముగా వివరించి
యున్నారు. ఆయన చెప్పినది ఇలా కలదు. ఏ ముముక్షువులు (మోక్షమును
కోరువారు) ఇహలోక పరలోక విషయములందు ఇచ్చలేని వారై, విద్యను
పొంది తటస్థులై నిశ్చయముగా యున్నారో, అట్టివారి యొక్క సంసారమునకు
కారణమైన అవిద్యాదులను నశింపజేయుచున్న విద్యను ఉపనిషత్తని
చెప్పుచున్నారు.
ముండక సంబంధ భాష్యమును ఇలా చెప్పారు. ఎవరయితే ఈ
బ్రహ్మవిద్యను పొంది ఆత్మ భావమును కల్గి, శ్రద్ధా భక్తులతో కూడుకొన్న
వారైయున్నారో, వారియొక్క జన్మ జరా రోగాది సముదాయము లేకుండా
చేయునది మరియు పరబ్రహ్మమును బోధించునది, ఇంకనూ సంసార
కారణ భూతమగు అవిద్యను సమూలముగా నశింపజేయునది కనుక అట్టి
దానిని ఉపనిషత్తు అని అంటున్నారు.
ఇట్లు అనేకమంది అనేక విధముల ఉపనిషత్తుకు అర్థమును
చెప్పియున్ననూ, వారి దృష్ఠిలో వారి అర్థములు సరియైనవే అయినా, ఇంకా
ఏదో అర్థము అందులో దాగియున్నట్లు నాకు అనిపించుట చేత, ఇంకా
నిశితముగా పరిశీలించి చూడాలని అనుకొన్నాను. నా పరిశీలనలో నాకు
ఆత్మ ద్వారా కొంత వివరము తెలిసినది. అది ఏమనగా! ఉపనిషత్ అను
పదము పూర్వము ద్వాపరయుగములో కూడా 'ఉపనిశత్' అను శబ్దముగా
ఉండేది. అయితే ఏ విధముగా పూర్వమున్న యుగాది పదము ఉగాదిగా
మారిపోయినదో, పూర్వమున్న ఇందువు అను పదము నేడు హిందువుగా
అక్షర మార్పు చెందియున్నదో, ఏ విధముగా పూర్వము దృష్ఠిగాయున్న
పదము జిష్ఠిగా మార్పు చెందియున్నదో, అదే విధముగా ఉపనిశత్ కొంత
మార్పు చెంది, ఒక అక్షరమును కొంత తేడాగా వ్రాసుకోవడము జరిగినది.
అటువంటి ఉపనిషత్ అను పదమునకు ఖచ్చితముగా ఇదే అర్థము కలదని
చెప్పకుండా ఎవరికి త్రోచినది వారు చెప్పారు. అయినా వారి భావములోని
వివరము కవిత్వమును పోలియున్నది గానీ, వాస్తవమైన అర్ధముగా లేదు.
అలాంటప్పుడు నాకు కల్గిన అనుమానము లేకుండా పోవునట్లు నా ఆత్మ
ప్రబోధము సంపూర్ణ అర్థము నిచ్చుచున్నదిగా యున్నదని దానిని మీతో
చెప్పుచున్నాను.
ఉపనిషత్ యొక్క వాస్తవ రూపము 'ఉపనిశత్' అని తెలియుచున్నది.
ఉపనిశత్ అను పదమును విభజించి చూస్తే మూడు భాగములుగా యున్నది.
ఉప+ని+శత్ అను మూడు శబ్దములను కలిపి ఉపనిశత్ అని అన్నారు.
ఈ మూడు శబ్దములకు అర్థమును చూస్తే 'ఉప' అనగా ప్రక్కన అనియు,
‘ని’ అనగా లేదు అనియు, 'శత్' అనగా నూరు అనియు తెలియుచున్నది.
ఈ శబ్దములను ముందు వెనుక మార్చి చెప్పుకొంటే ఇంకా బాగా అర్థము
కాగలదు. 'ఉప' అనగా ప్రక్కన లేక దగ్గర, 'శత్' అనగా నూరు లేక
వంద, ‘ని’ అనగా లేదు లేక తెలియదు అని చెప్పవచ్చును. అందులో
వాస్తవముగా ఇమిడియున్న అర్థమును చెప్పుకొంటే ఇలా గలదు.
“నీ ప్రక్కన నూరు గా యున్న మూడు అంకెలు లేవు”
అని చెప్ప వచ్చును. నూరు సంఖ్య ఇక్కడ విశేష అర్థమును ఇచ్చుచున్నది.
నీవు అనగా జీవుడవు అని అర్ధము. నూరు లేక వంద అనగా మూడు
అంకెల గుర్తుగా యున్నది. దానిని వ్రాసి చూస్తే ఒకటి, దాని ప్రక్కన
రెండు సున్నాలు గలవు. తెలుగు సంఖ్యల ప్రకారము ౧౦౦ ఇలా కలదు.
దానిని బాగా చూడగలిగితే మొదట ఒక అర సున్నా ఒకటిగా కలదు.
దాని తర్వాత రెండు పూర్తి సున్నాలు రెండు కలవు. మూడు అంకెలు
మూడు ఆత్మలకు గుర్తుగా యున్నవని చెప్పవచ్చును. ఆధ్యాత్మిక అర్థము
ప్రకారము రెండు సంపూర్ణమైన సున్నాలు ఆత్మ, పరమాత్మగా యుండగా,
సంపూర్ణముకాని అర్థ సున్నా జీవాత్మగా యున్నదని చెప్పవచ్చును.
భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమున 16, 17, 18 శ్లోకముల
సారాంశములో చెప్పియున్నట్లు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను మూడు
ఆత్మల గుర్తును ౧౦0 (నూరు) అను మూడు అంకెలు ఎలా గుర్తు
చేయుచున్నవని చూస్తే, శరీరములో ఆత్మ, పరమాత్మకంటే ముందు
తెలియువాడు జీవాత్మ అయినందున జీవాత్మకు గుర్తుగా యున్న అర సున్నాను
ముందు వ్రాసి, తర్వాత ఆత్మకు గుర్తయిన సున్నాను, ఆ తర్వాత పరమాత్మకు
గుర్తయిన మరియొక సున్నాను వ్రాయుచున్నాము.
శత 39 చిత్రమును పేజీ లో చూడండి .
సింహము అనగా మృగరాజు అని అంటున్నారు. దానిని వ్రాతలో
వ్రాయునప్పుడు నరశింహ అని వ్రాయుచున్నాము. సి అనే అక్షరము
ఇక్కడ శి అనే అక్షరముగా మారిపోయినట్లు, ఉపనిశత్ అను పదములోని
శ కాస్తా ష గా మారిపోయినది. అయినా అర్థమును శ అనే అక్షరముతోనే
తీసుకొంటున్నాము. కనపించని ఆత్మ, పరమాత్మలను కనపడవన్నట్లు,
మనిషికి తెలియని రెండు ఆత్మలను విలువలేని సున్నాలుగా చూపడమైనది.
ఆత్మకంటే తక్కువదయిన జీవాత్మను తక్కువగా యున్నట్లు సున్నాలో సగ
భాగముగానే చూపడమైనది. ముందు ఒకటి రెండు సున్నాలు వెనుక
యుండడము వలన రెండు సున్నాలు విలువయినవిగా తెలియుచూ మొత్తము
మూడు ఆత్మలయినవి. జీవుడు అయిన నీవు మూడు ఆత్మలలో ఒకనివిగా
యున్నావు అనునది వాస్తవము. అందువలన నీవు మూడు ఆత్మలకు
దగ్గరగా లేవు అనుటను ఉపనిషత్ అని అన్నారు. ఇంకొక విధముగా
చెప్పినా “మూడు ఆత్మల ప్రక్కన నీవు లేవు” అని పూర్తి అర్థముగా యున్నది.
ఈ పదము యొక్క అర్థము ఆనాడు వేదములను, ఉపనిషత్తులను వ్రాసిన
వారికి తెలియకున్నా దేవుడు అసలయిన త్రైత సిద్ధాంతమునకు గుర్తుగా
ఉపనిషత్ అను పేరును స్ఫురణకు తెచ్చాడు. త్రైతము ప్రక్కన నీవు లేవు,
వాస్తవముగా త్రైతములో (మూడు ఆత్మలలో) నీవు భాగముగా యున్నావను
గొప్ప అర్థమును తెలుపు నిమిత్తమే ఉపనిషత్ (ఉపనిశత్) అని చెప్పడమైనది.
గతములో చాలామంది ఈ పదమునకు అర్థమును చెప్పినా వాటికంటే
నేడు మనకు ఆత్మ ద్వారా తెలిసిన అర్థము గొప్పగా యున్నదని చెప్పవచ్చును.
15) ప్రశ్న :- ఆత్మను గురించి యమ ధర్మరాజు
నచికేతునికి అనేక విషయములను చెప్పాడు. యమ
ధర్మరాజు చెప్పిన తర్వాత ఆత్మజ్ఞానము నచికేతుడు
తెలియగలిగాడు అని అనుకొందాము. అయితే
నచికేతుడు శరీరముతో యమ లోకమునకు ఎలా
వచ్చాడు? నచికేతుడు యమలోకానికి వచ్చినప్పుడు,
యముడు ఇంటివద్ద లేడని, యముడు వచ్చు వరకు
రెండు రోజులు నచికేతుడు యముని ఇంటిముందు
యముని దర్శనము కోరుచూ, దర్శనార్థము రెండు
రోజులు నిరాహార దీక్ష చేశాడని కఠోపనిషత్లో
వ్రాశారు. ఒక మనిషి శరీరముతో యమలోకానికి
పోవడము, అక్కడ కూడా నిరాహార దీక్ష చేయడము
సాధ్యమా?
జవాబు :- కఠోపనిషత్తు అనునది దశోపనిషత్తులలో ఒకటని చెప్పడము
వలన చాలా ముఖ్యమైనదని తెలియుచున్నది. వాస్తవానికి మనుషులు
కల్పించి వ్రాసిన కథ 'నచికేతుడు యమలోకానికి పోయాడు' అని చెప్పడము.
మనుషులు కథలను ఎలాగయినా కల్పించి వ్రాయగలరు. అందువలన
నచికేతుని చరిత్ర వాస్తవముగా జరిగిన చరిత్ర కాదు. నిజానికి యమలోకమే
లేనప్పుడు నచికేతుడు మరణించకుండా శరీరముతో యమలోకానికి
పోవడము దుస్సాధ్యము. అందువలన కఠోపనిషత్తుగానీ, కఠోపనిషత్తులో
జరిగిన సంఘటనలు గానీ కేవలము కల్పితములు అని మొదట గ్రహించ
వలసియున్నది. అలాగే అందులో చెప్పిన జ్ఞానము కూడా కల్పిత జ్ఞానముగా
యున్నది.
16) యమధర్మరాజు నచికేతునికి ఆత్మజ్ఞానమును
బోధించాడు కదా! అందులో ఆత్మ అనునది శరీరములో
యున్నా సర్వము వ్యాపించియున్నదనీ, అన్నివైపుల వెళ్ళ
గలదని క్రింది శ్లోకములలో చెప్పుచున్నారు. ఆత్మ అలా
అన్నివైపులకు వెళ్ళగలదా?
జవాబు :- యముడు చెప్పిన శ్లోకములను చూస్తే ఇలా గలవు. ఈ
శ్లోకములు ఆధ్మాత్మికమునకు సంబంధించినవిగా కనిపించినా, వాస్తవానికి
అవి ఆధ్యాత్మికమునకు సంబంధము లేనివిగా కనిపించుచున్నవి.
1) శ్లోకము :-ఆసీనో దూరం ప్రజతి శయనో యాతి సర్వతః (2-21)
2) శ్లోకము :-అశరీరం శరీరేష్వనవస్థే ష్వవస్థితమ్
మహాన్తం విభుమాత్మానం మత్వా ధీరోన శోచతి (2-22)
భావము :- ఆత్మ ఒకచోట యున్ననూ దూరముగా పోగలదు. మనిషి
పరుండి యున్నప్పటికీ అన్నివైపులా వెళ్లగలదు. అశాశ్వితములైన శరీరము
లలో ఉన్నప్పటికీ ఈ ఆత్మ శరీరము లేనిది, చాలా గొప్పది. సర్వవ్యాపి.
అట్టి ఆత్మను తెలుసుకొని ధీరుడగువాడు దుఃఖింపడు.
సమస్త జీవరాసుల శరీరములలో ఆత్మ నివశించుట వాస్తవమే.
ఒక మనిషి శరీరములో జీవాత్మ ఉన్నట్లే మరొక మనిషి శరీరములో జీవాత్మ
యుండును. ప్రతి శరీరములోను జీవాత్మలు వేరువేరుగా యుండును.
ఒక శరీరములో యున్న జీవాత్మవలె, మరొక శరీరములో జీవాత్మ
ఉండదు. ప్రతి జీవునికి కర్మలో తేడాలు యుండును. అందువలన అనేక
శరీరములలో అనేక జీవాత్మలు గలవని చెప్పవచ్చును. మనిషి శరీరములో
జీవాత్మకు తోడుగా ఆత్మ ఉంటున్నది. శరీరములు ఎన్నియున్నా అందులో
కూడా జీవునివలె ఆత్మ భిన్నముగా యుండును. ఎన్ని శరీరములు గలవో
అన్ని శరీరములలో అన్ని ఆత్మలు కలవని చెప్పవచ్చును. అయితే అన్ని
శరీరములలో ఆత్మ వేరువేరుగా ఖండఖండములుగా యున్నది. ప్రతి
జీవాత్మకు ఒక ఆత్మ యుండుట వాస్తవమే అయినా, ఆత్మ ఎన్ని శరీరములలో
యున్నా, జీవాత్మవలె కాకుండా ఆత్మ ఒక్కటిగా యున్నది. ఆత్మ అనేకులలో
అనేక ఖండములుగా యున్నా ఆత్మను ఒక్కటేయని చెప్పవచ్చును. అన్ని
శరీరములలో జీవాత్మకు జోడు ఆత్మగా, తోడు ఆత్మగా యున్నప్పటికీ అన్ని
శరీరములలోని ఆత్మ మాత్రము ఒక్కటేయని ఏకాత్మగా యున్నదని చెప్పుట
సత్యము.
పై శ్లోకములో ఆత్మ ఒక చోట శరీరములో యున్నా దూరముగా
పోగలదని చెప్పారు. అంతేకాక మనిషి పరుండియున్నప్పటికి శరీరము
వదలి అన్నివైపులా వెళ్ళగలదని చెప్పారు. ఇక్కడ చెప్పిన విషయమును
బట్టి కొందరు ఆధ్యాత్మిక జ్ఞానము తెలియనప్పటికీ ఆత్మ శరీరమును
వదలి ఎలా బయటికి పోవుచున్నది, తిరిగి అదే శరీరములోనికి ఎలా
వచ్చుచున్నది, చిత్రపటముల రూపములో గీచి చూపించారు. మనిషి
శరీరములోని ఆత్మ బయటికి పోవునప్పుడు, బొడ్డు నుండి బయటికి
పోవుననీ, బొడ్డు నుండి ఒక త్రాడులాంటిది తనకు అంటించుకొని
పోవుచున్నదని చూపించడము, చెప్పడము జరుగుచున్నది. ఆత్మ శరీరము
నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరముగా పోయినా, బొడ్డు నుండి అంటుకొని
యున్న త్రాడు పొడువు పెరుగుచూ ఆత్మకు అనుసంధానమై యుండునని
కూడా చెప్పారు. అలా మనిషి శరీరము నుండి త్రాడులాంటిది ఆత్మకు
అంటుకొని ఆత్మ ఎంతదూరము పోతే అంత దూరము పొడవు పెరుగు
చుండునని చెప్పారు. మనిషి శరీరములోని ఆత్మ మనిషి నిదురించు
సమయములో బయటికి వేలు, లక్షల కిలోమీటర్ల దూరము పోయి తర్వాత
తనకు శరీరమునకు అంటుకొని యున్న త్రాడు ఆధారముగా తిరిగి అదే
శరీరమును చేరుచున్నదని చెప్పుచున్నారు.
ఇదంతయూ కఠోపనిషత్తులోని పై శ్లోకము ఆధారముతో ఊహించు
కొని, కల్పించి చెప్పినది తప్ప ఏమాత్రము సత్యము కాదని చెప్పుచున్నాము.
ఆత్మను ఆధ్యాయణము (ఆధ్యాత్మికము) చేసిన తర్వాత వాస్తవముగా ఉన్న
సత్యము తెలియబడును. నాకు తెలిసిన సత్యము ప్రకారము కఠోపనిషత్తులో
వ్రాసిన ఈ విషయము బ్రహ్మవిద్యా శాస్త్రమునకు పూర్తి వ్యతిరేఖముగా
యున్నదని చెప్పవచ్చును. ఆధ్యాత్మికము ప్రకారము బ్రహ్మవిద్యా శాస్త్రమును
అనుసరించి ఆత్మను తెలిసియుంటే, ఆత్మ రాత్రిపూట మనిషి నిద్ర
పోయేటప్పుడు శరీరమును వదలి బయటికి పోవునని ఎవరూ చెప్పరు.
ఎందుకనగా! ఆత్మ శరీరమును వదలిపోతే అది మరణమగును. ఒకమారు
బయటికి పోయిన ఆత్మ తిరిగి అదే శరీరములోనికి ప్రవేశించదు. ఒకమారు
బయటికి పోయిన ఆత్మ తిరిగి ఆ శరీరములోనికి రావడము ధర్మవిరుద్ధ
మగును. ఒక శరీరములోనికి ఆత్మ ఒకమారే ప్రవేశించును, దానినే జన్మ
అంటున్నాము. అట్లే ఒక శరీరము నుండి ఆత్మ ఒకమారే బయటికి
పోవును, దానినే మరణము అంటున్నాము. జననములో శరీరములో
చేరడము, మరణములో శరీరమును వదలడము తప్ప మధ్యలో శరీరమును
వదలిపోవడముగానీ, తిరిగి అదే శరీరములోనికి రావడముగానీ జరుగదు.
ఆత్మ జీవాత్మకు తోడుగా శరీరములో యుండును. "జీవుడుతో
కలిసియుండు ఆత్మను కూటస్థుడు” అని భగవద్గీతలో పురుషోత్తమ
ప్రాప్తి యోగమున 16వ శ్లోకములో చెప్పియున్నారు. ఎప్పటికీ శాశ్వితముగా
జీవాత్మ ఆత్మలు రెండూ కలిసి యుండును. కావున జీవాత్మ ఆత్మలను
జోడు ఆత్మలుగా చెప్పియున్నారు. అంతేకాక “జీవాత్మకు ఆత్మ పొరుగు
వాడుగా (ప్రక్కవాడుగా)” యున్నాడని ద్వితీయ దైవగ్రంథములో మత్తయి
సువార్త 22వ అధ్యాయములో 39వ వచనమున చెప్పియున్నారు. అంతేకాక
అంతిమ దైవగ్రంథము (ఖురాన్)లో రెండవ సూరా 186వ ఆయత్ యందు
"నీకు ఆత్యంత సమీపమున నీ ఆత్మ (అల్లా)” ఉన్నాడని చెప్పి
యున్నారు. ఈ విధముగా మూడు దైవగ్రంథములలో ఆత్మ యొక్క
ఉనికిని గురించి చెప్పియున్నారు.
జీవాత్మ శరీరమును వదలినా ఆత్మ జీవాత్మ వెంటపోవును. ఒకవేళ
ఆత్మ శరీరమును వదలినా జీవాత్మ ఆత్మ వెంటపోవును. ఇట్లు ఒకదానితో
మరొకటి విడిచియుండని బంధమును జీవాత్మ, ఆత్మ కల్గియున్నవి. జీవాత్మ
శరీరమును వదలితే దానివెంట ఆత్మపోతే అది 'మరణము' అగును. అట్లు
కాకుండా ఆత్మ ముందు శరీరమును వదలితే దానివెంట జీవాత్మ పోతే
అది 'అకాల మరణము' అగును. మరణములో అయినా, అకాల
మరణములో అయినా జీవాత్మ ఆత్మలు రెండూ కలిసేయుండును. ఈ
విధముగా ఆత్మ జీవాత్మతో పాటు శరీరములో నివసించుచుండగా, రాత్రి
నిద్రపోవు సమయములో ఆత్మ శరీరమును వదలి దూరముగా పోయి
రాగలదు అని చెప్పడము కఠోపనిషత్తులో లోపము కాదా? శుద్ధ అబద్దము
కాదా!
ఈ శ్లోకములో అశరీరం అని ఆత్మ శరీరములో ఉన్నప్పటికీ
శరీరము లేనిది, సర్వవ్యాపి అని వ్రాశారు. జన్మించినది మొదలు చనిపోవు
వరకు ఆత్మ ఒక్కక్షణము కూడా శరీరమును వదలి లేదు. అటువంటప్పుడు
ఆత్మకు శరీరము లేదు అనడము "గుడ్డలు కట్టినవాడు నగ్నంగా ఉంటాడు”
అని చెప్పినట్లున్నది. శరీరములో ఉన్నా, శరీరము లేనివాడు మరియు
సర్వవ్యాపి పరమాత్మ యగును గానీ ఆత్మ కాదు. ఈ శ్లోకములో ఆత్మ
పేరు చెప్పుచూ కొంత ఆత్మకు, కొంత పరమాత్మకు వర్తించునట్లు చెప్పడము,
గ్రుడ్డివాడు ఒక గురి లేకుండా రాయిని విసరినట్లు, ఒక పద్ధతి అంటూ
ఏమీ లేకుండా, ఏ ఆత్మకు చెప్పుచున్నామో ఆలోచించకుండా చెప్పడమును
చూస్తే, 1108 ఉపనిషత్తులలో ముఖ్యమైనవని 108, వాటిలో అతి
ముఖ్యమైనవని పది ఉపనిషత్తులను ఎన్నుకోగా, ఆ దశోపనిషత్తులలో ఒకటైన
కఠోపనిషత్తుయందు ఇట్లుండడము శోచనీయము. ఆత్మ ఒక శరీరమంతా
వ్యాపించి నఖ శిఖ పర్యంతము ఉండును. పరమాత్మ అయితే శరీరము
లోపల, శరీరము బయట అణువణువునా వ్యాపించి ఉండును. ఆత్మకు
శరీరమున్నది గానీ పరమాత్మకు శరీరముండదు. పరమాత్మను 'అశరీరి'
అని అనవచ్చునుగానీ, ఆత్మను అలా అనుటకు వీలులేదు. ఆత్మ
శరీరమునకు అధిపతిగా యుండి శరీరమును నడుపుచున్నది. జీవాత్మ
శరీరములో ఒకచోట రవ్వంతగా ఉండగా, ఆత్మ శరీరమంతయూ వ్యాపించి
యున్నది. పరమాత్మ శరీరములోను, శరీరము బయట అణువణువునా
వ్యాపించి యున్నాడు. పరమాత్మకు శరీరమంటూ ఏదీ లేదు. ఈ విధముగా
జీవాత్మ, ఆత్మ, పరమాత్మ విషయములను తెలియకుండా వ్రాయడము వలన
కఠోపనిషత్తు వ్రాసిన వారికి సత్యాసత్యములు తెలియవు అని చెప్పవచ్చును.
అటువంటి వారు ఉపనిషత్తులు అని పేరుపెట్టి వ్రాసినా, అందులో
లోపములు ఎన్నో కనిపించుచున్నవి. వాటిలో కొన్నింటినే సాక్ష్యము కొరకు
తెలుపుచున్నాము.
ఈ శ్లోకములలో "ఆత్మను తెలియువాడు దుఃఖపడడు” అని
వ్రాశారు. ఆత్మను తెలియవచ్చునుగానీ, పరమాత్మను తెలియుటకు ఎవరికీ
సాధ్యపడదు. ఒకవేళ ఆత్మను తెలిసినా దుఃఖములు కర్మలోయుంటే వానిని
వదలిపోవు. ఆత్మను తెలిసిన వారు కూడా దుఃఖములను పొందవలసిందే.
ఆత్మను ఆధ్యాయణము చేసి తెలియవచ్చును. అంతమాత్రమున అనుభవించే
కర్మలు పోవు. దుఃఖములు పోవాలంటే మనిషికున్న పాపకర్మలు లేకుండా
పోవాలి. అలా మనిషి కర్మలు పోవాలంటే, వాటిని క్షమించువాడు లేకుండా
చేయువాడు పరమాత్మ. మనిషి సరియైన జ్ఞానమార్గములో యుంటూ
ఆత్మను తెలిసియున్నాడని పరమాత్మకు తెలిస్తే ఆయన అనుభవించవలసిన
వాటిని క్షమిస్తే, అప్పుడు మనిషి కొన్ని దుఃఖముల నుండి బయటపడగలడు.
ఈ విషయము తెలియక ఆత్మను తెలిసినవాడు దుఃఖములను పొందడు
అనుట పూర్తి తప్పు. ఒక శ్లోకములోనే ఇన్ని తప్పులుంటే, పూర్తి ఉప
నిషత్తులలో ఎన్ని లోపములుండునో చెప్పలేము గానీ, కొన్నిటిని మాత్రము
మీకు చూపుచున్నాము, విచక్షణతో గ్రహించవలెను.
17) ప్రశ్న :- శరీరములో గల ఆత్మ బొటనవ్రేలు
పరిమాణముగా యున్నాడని ఒక శ్లోకములో చెప్పారు.
కఠోపనిషత్తులో చెప్పిన ఈ శ్లోకము వాస్తవమైనదేనా,
ఇందులో లోపములు లేవా?
శ్లో॥ అంగుష్ట మాత్రః పురుశోమధ్య ఆత్మని తిష్టతి,
ఈశానో భూత భవ్యస్య నతతో విజుగుప్సతే ఏతద్వైతత్ (4-12)
శ్లో॥ అంగుష్టమాత్రః పురుశో జ్యోతిరివాధూమకః
ఈశానో భూత భవ్యస్య స ఏవాద్య స ఉశ్వః ఏతద్వైతత్ (4-13)
భావము :- బొటనవ్రేలి పరిమాణము గల పురుషుడు శరీరములో ఉన్నాడు.
ఈ పురుషుడు భూత కాల భవిష్యత్కాలములకు అధిపతియగుటచే ఇక
ఎవరికీ భయము లేదు. ఈతడే ఆ ఆత్మ.
బొటన వ్రేలి పరిమాణము గలిగి భూత, భవిష్యత్కాలములకు
అధిపతియగు పురుషుడు పొగలేని అగ్నివంటివాడు. ఈనాడు రేపు కూడా
భేద రహితుడై ఈతడే గలడు. ఈతడే ఆ ఆత్మ.
జవాబు :- ఆత్మ శరీరమంతా వ్యాపించి శరీర ఆకృతిని పోలియుండగా,
జీవాత్మ శరీరములోని తలయందు గల కాల, కర్మ, గుణచక్రములలో క్రింద
గల గుణచక్రమందు గుణముల మధ్యలో నివశించుచున్నాడు. జీవుని
పరిమాణము రవ్వంతయని చెప్పవచ్చును. ఆత్మ శరీరమంతా వ్యాపించి
శరీర ఆకృతిని పోలియున్నది. ఏనుగులోయున్న ఆత్మ ఏనుగు శరీరమంత
పరిమాణములో ఉందని చెప్పవచ్చును. మనిషి శరీరములోని ఆత్మ మనిషి
శరీర పరిమాణములో యుందని చెప్పవచ్చును. ఈ విధముగా ఏ
శరీరములో ఆత్మయుంటే ఆ శరీరమంతా నిండియుండి ఆ శరీర ఆకృతిని
పోలియుండును. పరమాత్మకు పరిమాణము లేదు. ఆయన కొలతలు
లేనివాడు.
ఇట్లు మూడు ఆత్మలు ఉండగా బొటనవ్రేలి పరిమాణములో ఆత్మ
యుందని చెప్పడము బ్రహ్మవిద్యా శాస్త్రమునకు విరుద్ధము. బొటనవ్రేలి
పరిమాణము అని భగవద్గీతలోగానీ, మరి ఏ ఇతర దైవగ్రంథములో గానీ
చెప్పలేదు. ఆధ్యాత్మికమునకు శాస్త్రబద్ధత యున్నది. ఏదయినా ఆత్మను
గురించి చెప్పితే బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి చెప్పాలి. అంతేగానీ
పురాణములను వ్రాసినట్లు కల్పించి వ్రాయకూడదు. అలా వ్రాస్తే ప్రజలను
తప్పుదారిలో పంపినట్లగును. శాస్త్రప్రమాణము లేని మాటలను వదలి
భగవంతుడు చెప్పిన జ్ఞానమును అనుసరించి ఆత్మను గురించి చెప్పడము
మంచిది.
18) ప్రశ్న :- జ్ఞానము గల మనిషియొక్క ఆత్మ బ్రహ్మమే
యగుచున్నదని క్రింది శ్లోకములో చెప్పారు. దాని
ప్రకారమయితే జ్ఞానము లేని అజ్ఞాన మనిషి యొక్క ఆత్మ
బ్రహ్మము కాదా?
(4-15)
యథోదకం శుద్దే శుద్ధమాసికం తాదృగేవ భవతి,
ఏవం మునే ద్విజానత ఆత్మాభవతి గౌతమ
భావము :- నచికేతా! నిర్మలమగు జలము నిర్మలమగు జలమందు పడి
దానితో ఏకమయినట్లు జ్ఞానముగల మనిషి ఆత్మ కూడా బ్రహ్మమే అగును.
జవాబు :- శరీరములో మూడు ఆత్మలు కలవు. అవి వరుసగా జీవాత్మ,
ఆత్మ, పరమాత్మగా యున్నవని చెప్పవచ్చును. జీవాత్మకంటే ఆత్మ అన్ని
విధములా పెద్దది అయినందున ఆత్మను బ్రహ్మయని అన్నారు. బ్రహ్మ
అనగా 'పెద్ద' యని అర్థము కలదు. జీవాత్మకంటే ఆత్మ పెద్దది కాగా,
ఆత్మకంటే పరమాత్మ చెప్పలేనంత పెద్దదిగా యున్నది. అందువలన దానిని
పరబ్రహ్మ యని అంటున్నాము. బ్రహ్మయని ఆత్మను చెప్పుచున్నాము.
జీవాత్మను జీవుడు అని, ఆత్మను దేవుడు లేక బ్రహ్మయని అంటున్నాము.
మనిషి జ్ఞానిగానీ, అజ్ఞానిగానీ ఎవడయినా కావచ్చును. అతని శరీరములో
యున్న ఆత్మను 'బ్రహ్మ’యనియే చెప్పవలెను. పై శ్లోకములో జ్ఞానముగల
మనిషి శరీరములోని ఆత్మను బ్రహ్మయని అనవచ్చును అని చెప్పియున్నారు.
దాని ప్రకారమైతే జ్ఞానములేని మనిషి శరీరములో గల ఆత్మను బ్రహ్మయని
అనకూడదని అర్థమగుచున్నది. మనిషి అజ్ఞానిగానీ, జ్ఞానిగానీ ఎవరయినా
కావచ్చును, అతని శరీరములో గల ఆత్మను 'బ్రహ్మ' అనియే చెప్పాలి.
అంతేకాక తెలివియున్న మనిషిలోగానీ, తెలివిలేని జీవరాసులలో గానీ
ఉన్న ఆత్మను బ్రహ్మ లేక దేవుడుయని చెప్పుచున్నాము. అటువంటప్పుడు
కేవలము జ్ఞానము గల మనిషి శరీరములోని ఆత్మను మాత్రమే బ్రహ్మయని
చెప్పడము కఠోపనిషత్తులో లోపమే యగును.
19) ప్రశ్న :- బ్రహ్మ అనబడు ఆత్మను అజుడు అని అవసర
మొచ్చినప్పుడు చెప్పవచ్చును. అజుడు అనగా జన్మ
లేనివాడు యని అర్థము. అజుడు అయిన ఆత్మ
నివశించు శరీరమును అజుని పురము అని చెప్ప
వచ్చును. అజని పురమునకు గల దారులను గురించి
చెప్పుచూ క్రింది శ్లోకములో పదకొండు యని అన్నారు.
వాస్తవముగా పదకొండు దారులే ఉన్నాయా లేక
ఎక్కువగానీ, తక్కువగానీ ఉన్నాయా అని అడుగు
చున్నాము. క్రింది శ్లోకమును చూడండి.
జవాబు :- కఠోపనిషత్తులో చెప్పిన ఈ శ్లోకమును క్రింద చూడండి.
పుర మేకాదశ ద్వార మజస్యావక్ర చేతసః
అనుష్టాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే ఏ తద్వైతత్ (5-1)
భావము :- నిత్యుడు, చైతన్య స్వరూపుడుయగు ఈ అజుని పురమునకు
పదకొండు ద్వారములు గలవు. ఈ అజుని ధ్యానించినవానికి శోకము
లేదు.
“అతడు అజ్ఞాన సంబంధము నుండి విడుదల పొంది
స్వాతంత్ర్యమును పొందును. అతడే ఈ ఆత్మ" అని భావములో
వ్రాసియున్నారు. “ఆత్మను ధ్యానించినవాడు స్వాతంత్య్రమును పొందును
అనుట వాస్తవమే అయినా ఆత్మ పురమునకు పదకొండు ద్వారములు అని
వ్రాయడము, పెద్ద లోపముగా కనిపించుచున్నది. ఆత్మ నివశించు
శరీరమును ఆత్మ పురము అని చెప్పుటలో తప్పులేదు. దానినే అజుని
పురము అన్నారు, అందులో కూడా తప్పు లేదు. ఆత్మకు జన్మ లేదు, ఆత్మ
జీవునితో పాటు శరీరములను మారుచున్నప్పటికీ, కర్మగల జీవునికి మాత్రము
అది జన్మయని చెప్పబడును. జీవునితో పాటు యున్న ఆత్మకు అది జన్మ
కాదు. అందువలన ఆత్మను 'జన్మ లేనివాడు'యని చెప్పుటకు బదులుగా
‘అజుడు' అని అన్నారు. అజుడు అనగా జన్మ లేనివాడు అని మాత్రమే
అర్థము గలదు. బ్రహ్మవిద్యా శాస్త్రమునకు ప్రతి రూపముగాయున్న ప్రథమ
దైవగ్రంథమయిన భగవద్గీతలో జ్ఞానయోగము అను అధ్యాయమున ఆరవ
శ్లోకమందు ‘అజోపి' అని ఆత్మను సంబోధించియున్నారు. 'అజోపి' అనగా
జన్మలేనివాడు అజుడు అని అర్థము. అదే పదమునే కఠోపనిషత్తులో
కూడా చెప్పడము మంచిదే. అయితే అజుని పురమునకు ద్వారములు
పదకొండు అనుటలో కొంత ఆలోచించవలసియున్నది.
శరీరమును అజుని పురము అంటున్నాము. అజుని పురమైన
శరీరమునకు ఏ విధముగా చూచినా తొమ్మిది రంధ్రములు మాత్రమే గలవు.
రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు ముక్కులు, ఒక నోరు, ఒక గుదము,
ఒక లింగము అను తొమ్మిది అవయవముల వద్ద మాత్రము రంధ్రములు
గలవు. ఆరు జ్ఞానేంద్రియములు, మూడు కర్మేంద్రియముల వద్ద మాత్రమే
రంధ్రములు గలవు. తొమ్మిది రంధ్రములనే తొమ్మిది ద్వారములుగా
చెప్పుచున్నాము. శరీరములో ఈశ్వరుడుగా యున్న ఆత్మను ఆరు
సంఖ్యతోనూ, జీవున్ని మూడు సంఖ్యతోను గుర్తించుచున్నాము. ఆత్మ
అనగా '6' అనియూ, జీవాత్మయనగా '3' అనియు, రెండిటినీ కలిపితే
తొమ్మిది యగును. కావున పరమాత్మ గుర్తుగా '9' ని చెప్పుచూ, 9, 6, 3
యని గతములో కూడా చెప్పియున్నాము. జీవుడు కర్మతో కూడుకొన్నవాడు
కావున జీవాత్మను కర్మేంద్రియములకు గుర్తుగా మూడు సంఖ్యగా చెప్పి
యున్నాము. అలాగే ఆత్మజ్ఞానముతో కూడుకొని యున్నవాడు, జ్ఞానమునకు
నిలయము అయినందున జ్ఞానేంద్రియముల సంఖ్య అయిన ఆరుగా పోల్చి
చెప్పాము. జీవుడు ఆత్మయందు కలిస్తే, ఆత్మ పరమాత్మ యందు కలిసి
జీవుడు పరమాత్మగా మారిపోవుచున్నాడు కావున మూడు ఆరును కలిపిన
వచ్చు తొమ్మిది సంఖ్యను పరమాత్మకు గుర్తుగా చెప్పియున్నాము.
గణిత శాస్త్రమును అనుసరించి జీవాత్మను మూడుగా, ఆత్మను
ఆరుగా, పరమాత్మను తొమ్మిదిగా చెప్పుచూ “దేవుని గుర్తు 9 6 3”
యని ఒక చిన్న గ్రంథమును కూడా వ్రాశాము. ఈ లెక్కలన్నియూ
శరీరమునకు యున్న రంధ్రములతో లెక్కించి చెప్పినవేయని తెలియవలెను.
దీనిప్రకారము శరీరమునకు రాజు, అధిపతి, ఈశ్వరుడు అని చెప్పబడు
ఆత్మను అజుడు అనియు, శరీర రంధ్రములను అజుని పురమునకు
ద్వారములని చెప్పుచున్నాము. జీవాత్మ ఆత్మకంటే చిన్నవాడు కనుక, జీవునికి
సంబంధించిన మూడు ద్వారములు నోరు, గుదము, లింగము అనునవి
మూడు, ఆత్మ గుర్తులుగా పోల్చియున్న చెవులు, కళ్లు, ముక్కులకు క్రింది
భాగములో యున్నవి. ఆత్మ అన్ని విధముల జీవునికంటే ఎగువవాడే
కనుక, ఆత్మ గుర్తుగా చెప్పిన జ్ఞానేంద్రియములు మూడు, కర్మేంద్రియముల
కంటే పైన గలవు. శరీరము మొత్తము ఆత్మ ఆధీనములోయుండుట
వలన శరీరమునకున్న రంధ్రములన్నిటినీ ద్వారములుగా చెప్పితే తొమ్మిది
ద్వారములనియే చెప్పవలెను. అందువలన అజుని పురమునకు పదకొండు
ద్వారములనుట అన్ని విధములా తప్పుగా యున్నదని చెప్పవచ్చును.
20) ప్రశ్న :- బొటనవ్రేలి పరిమాణము గల అంతరాత్మ
యను పురుషుడు సదాప్రాణుల హృదయాలలో
వసించును. ముంజ గడ్డి నుండి దర్భను వేరు చేసినట్లు,
మనుజుని శరీరము నుండి దీనిని వేరు చేయవలెను.
ఇదియే శుద్ధము, అమృతము అని తెలుసుకొనవలెను
(ఈ భావమునకు చెప్పియున్న కఠోపనిషత్తులోని
శ్లోకమును చూడండి)
అంగుష్టమాత్రః పురుషోన్తరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః
తం స్వాచ్ఛరీరాత్ర వృహేన్ము ఇది వేషీకాం ధైర్యేణ
తం విద్యాచ్ఛుక్ర మమృతం తం విద్యాచ్ఛుక్ర మమృత మితి (6-17)
ఈ శ్లోక భావము పైన గలదు కదా! ఆధ్యాత్మికరీత్యా ఇది వాస్తవమైన
జ్ఞానమేనా?
జవాబు :- శరీరములోని ఆత్మ బొటనవ్రేలి పరిమాణముగా యున్నదనుట
అసత్యమని ఇంతకుముందే చెప్పియున్నాను. ఇక్కడ ముఖ్యముగా గమనించ
వలసినది ఏమనగా! హృదయము అంటే మనిషిలోని గుండెయని
చాలామంది చెప్పడము జరుగుచున్నది. ఆత్మ హృదయములో నివశించుట
సత్యమే అయినా హృదయమును గుండె అని అనుకోవడము పెద్దపొరపాటని
చెప్పవచ్చును. గుండెకు హృదయమునకు ఏమాత్రము సంబంధము లేదు.
రక్తమును పంపు చేయుచూ, శరీరమంతా రక్తమును ప్రాకునట్లు చేయునది
గుండె. ఆత్మకు నిలయమైనది హృదయము. హృదయము నుండి ఆత్మ
తన శక్తిని శరీరమంతా ప్రసరింపజేయుచున్నది. హృదయము అనగా
పెద్దనాడి లేక బ్రహ్మనాడియని చెప్పవచ్చును. శరీరములోని అన్ని నాడులలో
అతి పెద్దనాడులు మూడు గలవు. వాటినే ఇడా, పింగళ, సుషుమ్న నాడులని
అంటారు. వాటినే సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడియని అంటారు.
మూడు నాడులలో బ్రహ్మనాడియే పెద్దది. బ్రహ్మనాడి వెన్ను ఎముకలో
వెన్ను పాముగా యుందని అంటారు. వెన్నుపామునే మనము హృదయము
అని కూడా అంటున్నాము.
వెన్నుపాము శిరస్సు మొదలుకొని గుదస్థానము వరకు వ్యాపించి
యున్నదని చెప్పవచ్చును. వెన్నుపాము అనే పెద్ద నరము వీపు వెంబడి
తల నుండి క్రింద గుదస్థానము వరకు వ్యాపించియున్నదని అందరూ
తెలియాలి. వెన్నుపాము అనే నరములో ఆత్మ నివశించుచున్నది. సూర్యుడు
ఒక్కచోట యుండి ప్రపంచమంతయూ ప్రకాశించునట్లు, ఆత్మ వెన్నుపాములో
యుండి తన శక్తిని శరీరమంతా వ్యాపింపజేయుచున్నది. ఇదే విషయమునే
భగవద్గీతయందు క్షేత్రక్షేత్రజ్ఞ యోగము అను అధ్యాయములో 34వ శ్లోకమున
చెప్పియున్నారు.
యథా ప్రకాశయత్యేకం కృత్స్నం లోకమిమం రవిః
క్షేతం క్షేత తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥
భావము :- ఎట్లు సూర్యుడు ఒక్కడే ఈ లోకమును ప్రకాశింపజేయు
చున్నాడో, అట్లే ఆత్మ తనదు దేహమంతయు తన శక్తిని వ్యాపింపజేయు
చున్నది.
“సూర్యుడు వెలుగు కిరణములను ప్రపంచమంతా ప్రసరింపజేయు
నట్లు, ఆత్మ తనశక్తి అలలను మనిషి శరీరములో వ్యాపింపజేయుచున్నది”
అని భగవద్గీతలో కూడా చెప్పియున్నారు కదా! ఆత్మ బ్రహ్మనాడియంతా
నివాసముండి అక్కడినుండి శరీరమంతా వ్యాపించిన నరముల ద్వారా తన
శక్తిని శరీరమంతా ప్రసరించుచున్నది. దీనినిబట్టి ఆత్మ శరీరమంతా నిండి
యున్నదని చెప్పవచ్చును. బ్రహ్మనాడి నుండి తన సామ్రాజ్యమును
శరీరమంతా విస్తరించియుండుట వలన శరీరమెంత యున్నదో ఆత్మ అంత
యున్నదని చెప్పవచ్చును. అటువంటి ఆత్మను శరీరము నుండి ఎవడయినా
వేరు చేస్తే దానిని 'ఆత్మహత్య' అని చెప్పవచ్చును. అందువలన ఆత్మను
శరీరము నుండి వేరు చేయడము పెద్ద తప్పగును. అయితే పై శ్లోకములో
శరీరము నుండి ఆత్మను వేరు చేయవలెనని అదియే శుద్ధము, అమృతము
అని అన్నారు. అది ఏమోగానీ వాస్తవముగా శరీరము నుండి ఆత్మను
వేరుచేస్తే అది ఆత్మను హత్య చేసినట్లగును, శుద్ద పాపము ఏర్పడును.
అందువలన ఈ శ్లోకమును చెప్పిన వ్యక్తికి ఆత్మ యొక్క జ్ఞానము ఏమాత్రము
తెలియదని చెప్పవచ్చును. ఒక ముఖ్యమైన ఉపనిషత్తులో ఇలా ఉండడము
పెద్ద లోపము.
ప్రశ్నోపనిషత్తు.
21) ప్రశ్న :- ఇప్పుడు ప్రశ్నోపనిషత్తులోని ఒక శ్లోకమును
చూచి, అందులో చెప్పిన విషయము లోప
భూయిష్టముగా యున్నదని నాకర్థమగుట చేత నా
భావము సరియైనదా, కాదాయని మిమ్ములను అడుగు
చున్నాను. నేను చూచిన శ్లోకము, దాని భావమును
క్రింద వ్రాయుచున్నాను. చూచి చెప్పమని కోరు
చున్నాను?
అథోత్తరేణ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా
విద్యయాత్మాన మన్విష్యాదిత్య మభిజయన్త, ఏతద్వై
ప్రాణానామాయతన మేత దమృత మభయ మేతత్ప
రాయణ మే తస్మాన్న పునరావర్తంత
(1-10)
భావము :- కొందరు మహానీయులు ఉత్తమమార్గమును అవలంభించి
తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ, విద్య అను వానిచేత ఆత్మను తెలిసి, సూర్య
లోకమును జయింతురు. ఈ ఆత్మరూప సూర్యుడే ప్రాణాధారము. ఇది
అమృతము, భయరహితము. అన్నిటికంటే శ్రేష్ఠమైన గతి. ఇచట నుండి
తిరిగి మరల వచ్చుట లేదు. అనగా పునర్జన్మ లేదు.
జవాబు :- పునర్జన్మ లేదు అంటే అతడు మోక్షమును పొంది దేవునియందు
ఐక్యము అయిపోవును అని చెప్పడమే. అయితే మోక్షమును పొందాలి
అంటే, దేవున్ని చేరాలి అంటే “తపస్సుల వలన, వేదముల వలన,
యజ్ఞముల వలన సాధ్యము కాదని” భగవద్గీతలో విశ్వరూప సందర్శన
యోగము అను అధ్యాయమున 48, 53 శ్లోకములలో చెప్పియున్నారు.
అలాంటప్పుడు తపస్సుచే పునర్జన్మ లేకుండా మోక్షమును పొందుదురు
అనుట పూర్తి ధర్మ విరుద్ధము. ప్రశ్నోపనిషత్తులో బ్రహ్మవిద్యా శాస్త్రమునకు
విరుద్దముగా వ్రాయబడి యుండడమును చూస్తే ఈ ఉపనిషత్తును వ్రాసిన
వారికి ఆధ్యాత్మిక జ్ఞానము తెలియదనియే చెప్పవచ్చును. భగవద్గీతలో
తపస్సులను గురించి ఏమి చెప్పారో చూడండి.
భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము :
శ్లో॥ 48: నవేదయజ్ఞ ద్యయనైర్న దానైర్న చక్రియా భిర్నతపోభిరు రై
ఏవం రూపశ్శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురువ్రవీరా||
భావము :- భూమిమీద నీవు తప్ప నా రూపమును చూచినవాడు ఎవడూ
లేడు. వేదాద్యయణము వలనగానీ, యజ్ఞముల చేతగానీ, దానముల
చేతగానీ, గొప్ప తపస్సుల వలనగానీ ఎవరికీ నన్ను చూడ శక్యము కాదు.
శ్లో॥ 53:
నాహం వైదైర్న తపసా నదానేన నచేజ్యయా !
శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యాథా ॥
భావము :- తపస్సుల చేతగానీ, దానముల చేతగానీ, యజ్ఞముల చేతగానీ,
వేదముల చేతగానీ ఇప్పుడు నీవు చూచిన ఈ రూపమును చూచుట
దుర్లభము.
ఈ విధముగా ప్రథమ దైవగ్రంథమయిన భగవద్గీతలో స్వయముగా
భగవానుడే చెప్పియుండగా, ఆయన మాటకు వ్యతిరేఖముగా,
ధర్మవిరుద్ధముగా తపస్సు వలన పునర్జన్మ రాదు అనడము తప్పు కాదా!
“తపస్వి భ్యోదికో యోగీ” అని భగవద్గీతలో ఆత్మ సంయమ యోగము
అను అధ్యాయమున 46వ శ్లోకమందు చెప్పియుండగా, భగవద్గీతకంటే
ముందు వ్రాసిన ఉపనిషత్తులో అలా తప్పు వ్రాశారని తెలియుచున్నది.
తపస్సుకంటే యోగము గొప్పదని, యోగము వలన మోక్షము లభించునని
భగవద్గీతలో చెప్పియున్నారు. దానిప్రకారము యోగము చేయండి, తపస్సు
వదలండి. అప్పుడు మీకు మోక్షము లభించునని చెప్పవలసినది పోయి
తపస్సు వలన మోక్షము లభించునని చెప్పడము పూర్తి తప్పుయని చెప్ప
వచ్చును.
బృహదారణ్యకోపనిషత్తు.
22) ప్రశ్న :- బృహదారణ్యకోపనిషత్తులో ఒకమాట
వ్రాయబడియున్నది. అది ఏమనగా! "ఆత్మైవేద సమగ్ర
ఆసీత్" దాని భావము ఇలా కలదు. సృష్టికి పూర్వము
ఆత్మ ఒకటియే కలదు. ఈ మాట వాస్తవమేనా?
జవాబు :- సృష్ఠికి పూర్వము ఒకే ఒక పరమాత్మ మాత్రము కలదు.
పరమాత్మ ఎవరికీ తెలియనిది. అందువలన పరమాత్మను అంతిమ
దైవగ్రంథములో 97వ సూరా 1, 2, 3, 4, 5 ఆయత్లయందు చీకటి
రాత్రిగా వర్ణించి చెప్పారు. ఎవరికీ కనిపించని వాడు, ఎవరికీ తెలియని
వాడు, ఏమాత్రము ఊహకు కూడా అందనివాడు అయిన పరమాత్మ తన
సంకల్పము చేత మొదట ప్రకృతిని తయారు చేశాడు. అనగా జీవరాసులు
లేని ప్రపంచమును తయారు చేశాడు. తర్వాత జీవరూప ప్రపంచమును
తయారు చేయు నిమిత్తము ఆత్మను సృష్టించాడు. ఆ తర్వాత జీవాత్మను
సృష్టించడము జరిగినది. ఇదంతయూ సృష్టి రహస్యమును తెలిసిన వారికే
అర్థమగును. నేను “ఘనమైన రాత్రి” అను వ్యాసమును అంతిమ దైవ
గ్రంథములో 128వ వాస్యముగా వ్రాసియున్నాము. దానిని చదివితే సృష్ఠి
ఎలా తయారయినదీ, సృష్ఠి పూర్వము ఎవరున్నది తెలియును. ఆత్మ,
జీవాత్మ, ప్రకృతి సృష్ఠింపబడినవిగా యున్నవి. అందరినీ అన్నిటినీ సృష్టించిన
సృష్ఠికర్త అయిన పరమాత్మ ఒక్కడే సృష్ఠి పూర్వమున్నాడని తెలియవలెను.
పరమాత్మ సృష్టికర్తకాగా, ఆత్మ సృష్ఠింపబడినవాడు. అటువంటప్పుడు
ఆత్మ సృష్టికి పూర్వము ఎలా ఉండగలదు? మనిషికి తండ్రి ఆత్మకాగా,
ఆత్మకు తండ్రి పరమాత్మయని మూడు దైవగ్రంథములలో చెప్పబడియున్నది.
అటువంటప్పుడు ఏ ఆధారము లేకుండా, ఏమీ తెలియకుండా, ఆత్మ సృష్ఠి
పూర్వమే యున్నదనుట శుద్ధ అబద్దము. ఇది ఉపనిషత్తులోని లోపము
కాదా? ఈ విషయము ఉపనిషత్తులు గొప్పవని చెప్పేవారికి కనిపించలేదా?
23) ప్రశ్న :- ఈ క్రింది శ్లోకము యొక్క భావము
వాస్తవమేనా ధర్మసమ్మతముగా యున్నదా?
(1-4-10)
బ్రహ్మవా ఇద మగ్ర ఆసీత్తదాత్మాన మేవవేత్
అహం బ్రహ్మస్మితి తస్మా త్సర్వ మభవత్
భావము :- సృష్ఠికి పూర్వము ఈ ప్రపంచము బ్రహ్మముగా యుండెను.
“నేనే బ్రహ్మమునై యున్నాను” అని బ్రహ్మము తలచగా అప్పుడు బ్రహ్మము
సమస్తము అయినది.
జవాబు :- ఈ మాట పచ్చి అబద్దము. సృష్ఠికి పూర్వము బ్రహ్మముకంటే
వేరుగా యున్న పరబ్రహ్మము ఉండేది. అనగా ఆత్మ కాకుండా ఆత్మకంటే
వేరుగాయున్న పరమాత్మ ఉండేదని ముందే చెప్పు కొన్నాము. పరమాత్మ
చేత (పరబ్రహ్మము చేత) సృష్టి మొదలయినప్పుడు ముందు ప్రకృతి పుట్టగా
ఆ తర్వాత బ్రహ్మ అనబడు ఆత్మ సృష్టింపబడినది. బ్రహ్మ, ప్రకృతి తర్వాత
సృష్టికర్తయిన పరబ్రహ్మముచే సృష్ఠింపబడినది. బ్రహ్మకంటే ముందే ప్రకృతి
సృష్ఠింపబడియుండగా సృష్ఠి పూర్వము బ్రహ్మ ప్రపంచముగా యుండెను
అనుట పూర్తి అసత్యమగును. ఇది బృహదారణ్య కోపనిషత్తుయందలి
లోపము కాదా!యని నేను వేలెత్తి చూపుచున్నాను.
24) ప్రశ్న : శ్లోకము :- ఆత్మై వేద మగ్ర ఆసీత్ (1-4-1)
భావము :- “ఆదియందు ఆత్మ ఒకటియే కలదు” అని ఇంకొక చోట
కూడా చెప్పియున్నారు కదా! ఇది సత్యము కాకపోతే ఇన్నిమార్లు ఒకే
విషయమును ఎందుకు చెప్పుతారు? వారు అన్నిమార్లు చెప్పినది
అసత్యమని మీరు అంటున్నారు కదా! మీరు చెప్పేదే సత్యమని మేము
ఎలా నమ్మాలి?
జవాబు :- ఏ విషయమునయినా నమ్మేది, నమ్మకపోయేది మీ యొక్క ఇష్ట
అయిష్టము మీద ఆధారపడి యుంటుంది. నేను చెప్పిన ప్రతి విషయమును
నమ్మమని నేను చెప్పడము లేదు. నేను చెప్పునది సత్యము అనుటకు నా
మాట వెనుక బ్రహ్మవిద్యా శాస్త్రమున్నది. నేను ప్రతి విషయమును
బ్రహ్మవిద్యా శాస్త్రమును అనుసరించి చెప్పుచున్నాను. శాస్త్రబద్ధతతో
కూడుకొన్న ఆధ్యాత్మికములో ప్రతీ విషయము ప్రమాణముతో కూడుకొని
యుండును. గణిత శాస్త్రములో ఏ విధముగా లెక్కాచారము ఉండునో ఆ
విధముగా ప్రతి దానికి లెక్కప్రకారముగా జవాబు ఉండును. సత్యముతో
కూడుకొన్నది శాస్త్రము. శాస్త్రముతో కూడుకొన్నది సత్యము. అందువలన
నేను చెప్పు ప్రతి మాట పూర్తి సత్యముగా యున్నది. శాస్త్రీయ ఆధ్యాత్మికము
కంటికి కనిపించు దృశ్యములాగ ఉండును. ఏ విషయము ఊహించి
చెప్పునది కాదు. అలా ఊహించి చెప్పునది చీకటితో కూడుకొన్న విషయమై
యుండును. అందువలన అది సత్యము కావచ్చు లేక అసత్యము కావచ్చు.
నేను శాస్త్రబద్దత అను వెలుగులో చెప్పుచున్నాను. అందువలన నా
మాటలోని ప్రతి విషయము సత్యమే అయివుండును. అసత్యము అనుటకు
అవకాశమే ఉండదు. ఇప్పుడు పై శ్లోకములో చెప్పిన “ఆదియందు ఆత్మ
ఒక్కటే యున్నది” అనుట అసత్యమని ప్రత్యక్షముగా తెలియుచున్నది. మొదట
ప్రకృతి పుట్టిన తర్వాత జీవులను పరమాత్మ తయారు చేయనెంచి, జీవునకు
తోడుగా యుండుటకు ఆత్మను సృష్టించి, ఆత్మచేత జీవరాసులను
సృష్ఠించునట్లు పరమాత్మ ఏర్పాటు చేశాడు. ఆత్మను సృష్టించినవాడు
పరమాత్మకాగా, జీవులను సృష్టించినవాడు ఆత్మయని తెలియవలెను. దీని
ప్రకారము ఆత్మకు తండ్రి పరమాత్మకాగా, ఆత్మ జీవులకు తండ్రిగా యున్నది.
అందుచేత ఇటు జీవాత్మ, అటు ఆత్మ ఇద్దరూ సృష్టింపబడిన వారేగానీ
సృష్ఠి పూర్వము ఆత్మలేదు, జీవాత్మ లేదు. సంపూర్ణ జ్ఞానియై యోగమా
చరించువాడు బ్రహ్మవిద్యా శాస్త్రమును బాగా తెలిసియుండును. అందుచేత
ప్రతి విషయములోని ప్రతి ప్రశ్నకు సులభముగా జవాబును చెప్పగలడు.
జ్ఞానము తెలియనివాడు, యోగికానివాడు చీకటిలో తాడును పామనుకొన్నట్లు
అసత్యమును మాట్లాడుచూ తనకు కనిపించిన తాడునే పామన్నట్లు, తనకు
తెలిసిన అజ్ఞానమునే జ్ఞానమని చెప్పుచుండును. బృహదారణ్యకోపనిషత్తును
వ్రాసినవారు లోపములతో కూడిన వాక్యములను చెప్పారని తెలియుచున్నది.
25) ప్రశ్న :- మనిషి శరీరము స్థూల సూక్ష్మములను
రెండు భాగములుగా యున్నదని మీరు చెప్పారు. సూక్ష్మ
శరీరములో కంటికి కనిపించని శరీర భాగములు
పదిహేను గలవని కూడా చెప్పారు. అందులో మనస్సు
అనునది ముఖ్యపాత్రను పోషించుచూ శరీరములో
యున్నదని కూడా చెప్పారు. ఇప్పుడు మనస్సును
గురించిన విషయమును బృహదారణ్య అను
మహర్షియో లేక మునియో తన శ్లోకములో తన ఉప
నిషత్తులో ఇలా చెప్పాడు చూడండి.
శ్లో :- కామ సంకల్పో విచికిత్సా శ్రద్ధా శ్రద్ధా ధృతిరధృతిః
ఫ్రీ ర్భీరిత్యే తత్సర్వం మన ఏవ
(1-5-3)
భావము :- కామము, సంశయము, సంకల్పము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము,
అధైర్యము, లజ్జ, బుద్ధి, భయము ఇవి అన్నియు మనస్సు అయివున్నవి
(మనోరూపములయి ఉన్నవి) అని చెప్పారు. ఈ మాట వాస్తవమా అని
ప్రశ్నించుచున్నాము.
జవాబు :- భూమిలో పండే బంగాళాదుంపను (ఉర్లగడ్డను), తీగకు వ్రేలాడే
బీరకాయను, చిరుధాన్యములయిన రాగులు, వండిన బియ్యము అన్నము,
ఆవు నుండి పిండిన పాలు, బావిలోని నీరు అన్నిటినీ మాంసము అని
చెప్పవచ్చుననీ, మాంసము యొక్క రూపములే ఇన్ని విధములుగా ఉన్నవనీ
ఒకడు చెప్పితే, వానిని ఏమాత్రము ఆలోచించకుండా పిచ్చివాడు అని
చెప్పవచ్చును. ఎందుకనగా! మాంసము జంతు శరీరము నుండి వచ్చునది,
బంగాళాదుంప భూమిలోపల పండేది. బీరకాయ చెట్టు తీగకు కాసేది.
అన్నము బియ్యమును ఉడికించితే వచ్చునది. ఇవన్నీ వేరు వేరు
పదార్థములుగా యున్నవి. అవి పుట్టే స్థానము వేరు, పెరిగే స్థానము
వేరు. ఇవన్నిటినీ ఆలోచించకుండా ఇవన్నీ మాంసము యొక్క రూపములు
అంటే అంతకంటే తప్పుమాట, అంతకంటే అసత్యమైన మాట లేదని
చెప్పవచ్చును. ఆ మాటను చెప్పిన వ్యక్తిని పూర్తి తెలివి తక్కువవాడని,
పిచ్చివాడని చెప్పవచ్చును.
పైన చెప్పిన విధముగా శరీరము లోగల ఆరు చెడుగుణములలో
మొదటిదయిన ఆశ (కామము), అట్లే గుణము కాని గుణమయిన సిగ్గు
(లజ్జ), శరీర భాగములలో అతి ముఖ్యమైనది బుద్ధి, మనిషికి సహజముగా
యుండు శ్రద్ధ, అశ్రద్ధ ఇవన్నియు కలిపి శరీరములోని ఒక భాగముగా
చెప్పబడుచున్న మనస్సు అని చెప్పడము పూర్తి తప్పు అగును. అలా
చెప్పిన వానిని అజ్ఞానియని చెప్పవచ్చును. పై శ్లోకములో చెప్పిన విధానము
కూడా అట్లే యుండుట వలన ఇది పూర్తి అసత్యమైన మాటయని
చెప్పవచ్చును. వివరముగా చెప్పితే కామము అనునది శరీరమునకు
సంబంధించిన భాగములలో చేరదు. గుణములన్నియు ప్రత్యేకముగా గుణ
చక్రములో ఉండును. బుద్ధి మరియు మనస్సు రెండు సూక్ష్మ శరీరములోని
వేరు వేరు భాగములుగా యున్నవి. బుద్ధి శిరస్సులో జీవుని వద్ద యుండగా,
మనస్సు శరీరమంతా వ్యాపించియున్నది. దాని స్వస్థానము బ్రహ్మనాడి
కాగా, నిద్రలో బ్రహ్మనాడియందు, మెలుకువలో శరీరమంతా వ్యాపించి
యుండును. ఇట్లు ప్రత్యేక కార్యము కలిగి ప్రత్యేకముగా యున్న మనస్సును
అన్ని భాగములుగా మనోరూపములే అలా ఉన్నాయని చెప్పడము, కాయ
కూరలన్నిటిని కలిపి మాంసము అన్నట్లున్నది. విడివిడిగా వేరువేరు పేర్లు
కల్గియున్న కాయకూరలను ఇవన్నీ మాంస రూపములే అంటే ఎంత
అసత్యమో, అలాగే వేరు వేరు అవయవములుగా, వేరువేరు పేర్లతో యున్న
శరీర భాగములను కలిపి మనస్సు అనడము అంతే అసత్యమగును.
కామము అనగా ఆశ అని అర్థము. ఆశ అనునది మనిషికున్న
గుణములలో చెడు గుణములయిన షట్ వర్గము (ఆరు గుంపు) లో ఒకటిగా
యున్నది. గుణములు మనిషి చనిపోయినప్పుడు శరీరమును వదలి ఆత్మతో
పాటు వేరే జన్మకు పోవుచున్నవి. అందువలన మనిషి శరీర అవయవము
లకు ఆశ అను గుణమునకు ఎటువంటి సంబంధము లేదు. శరీర
అవయవములన్ని మరణములో నశించి పోవుచున్నవి. అలాగే శరీర
అవయవములలో ఒక భాగమయిన మనస్సు కూడా మరణములో నశించి
లేకుండా పోవుచున్నది. గుణములు మరణములో నశించక క్రొత్త శరీరము
నకు ఆత్మ, జీవాత్మతో సహా పోవుచున్నవి. మరణములో నశించు మనస్సును
ఎప్పటికీ నశించని గుణములతో పోల్చడము ఆధ్యాత్మికములో పూర్తి
తప్పగును. శరీరము మరణించినప్పుడు అనగా శరీరము శిథిలావస్థకు
వచ్చినప్పుడు శరీర అవయవములయిన 24 భాగములు పూర్తిగా నశించి
పోవడము వాస్తవము. అయితే అంతవరకు శరీరములో కాల, కర్మ, గుణ
చక్రములలో యున్న జీవాత్మ, గుణములు మరియు ఆత్మ అన్నియు కలిసి
కాల, కర్మ, గుణచక్రములతో కలిసి వేరు జన్మ వరకు పోవుచున్నవి. మనస్సు
నశించి పోవునది, ఆశ నశించనిది. మనస్సు, ఆశ వేరువేరు స్థానములలో
వేరు వేరు కార్యములను చేయుటకు శరీరములో నియమింపబడియున్నవి.
గుణములు కర్మ ఆధీనములో ఉండగా, మనస్సు ఆత్మ ఆధీనములో
ఉండును. ఈ విధముగా వేరువేరు కార్యముల నిమిత్తము, వేరు వేరు
స్థానములలో యున్న మనస్సును, ఆశను కలిపి మనస్సే ఆశగా యున్నదని
చెప్పడము ఆధ్యాత్మికమునకే పూర్తి విరుద్ధము. ఇటువంటి పెద్ద లోపమును
బృహదారణ్య అనునతడు వ్రాయడము చూస్తే, అతనిని పూర్తి ఆధ్యాత్మికము
తెలియనివానిగా చెప్పవచ్చును. అట్లే ఈ విషయము ఈ ఉపనిషత్తులో
గల లోపములన్నిటిలో పెద్దదని చెప్పవచ్చును.
26) ప్రశ్న :- బృహదారణ్యకోపనిషత్తునందు మరొక పెద్ద
లోపముగా జీవునికి సంబంధించిన విషయము గలదు.
దానికి సంబంధించిన శ్లోకము, భావము రెండూ క్రింద
వ్రాయుచున్నాము చూడండి. ఈ శ్లోకములో చెప్పిన
బృహదారణ్య మహర్షి అనునతడు వ్రాసినది సత్యమా,
అసత్యమా తేల్చి వివరించి చెప్పమని కోరుచున్నాను.
యదా సర్వే ప్రముచ్యన్తో కామా యేస్య హృది శ్రితాః
అథమర్త్యోమృతో భవ త్యత్ర బ్రహ్మ సమశ్నుతే (4-4-7)
భావము :- ఎప్పుడు జీవుని హృదయమందుగల కోరికలన్నియు నశించి
పోవునో, అప్పుడు మనుజుడు అమృతుడగుచున్నాడు. ఇచటనే బ్రహ్మమును
పొందుచున్నాడు.
జవాబు :- జీవుడు గుణచక్రములో గల మూడు భాగములలో ఏదో ఒక
భాగములో నివశించుచుండును. ఆ మూడు భాగములను సాత్విక గుణ
భాగము, రాజస గుణభాగము, తామస గుణభాగము అని అంటారు.
ఒక గుణ భాగములో కామాది చెడు గుణములు ఆరు, దానాది మంచి
గుణములు ఆరు మొత్తము పన్నెండు గుణములుండగా మూడు భాగములలో
మొత్తము 36 గుణములు గలవు. జీవుడు ఒక భాగములోనే ఉండును
కనుక మంచి చెడు 12 గుణములను చెప్పుకోవచ్చును. హృదయము
అనునది బ్రహ్మనాడి యగును. బ్రహ్మనాడియను హృదయములో ఆత్మ
నివశించుచుండును తప్ప గుణములు అక్కడ ఉండవు. జీవుడు గుణ
చక్రములో గుణముల మధ్యలో ఉండును. అందువలన జీవునికి
హృదయమునకు, గుణములకు హృదయమునకు ఏమాత్రము సంబంధము
లేదని చెప్పవచ్చును. గుణచక్రమును గుణచక్రములో గుణములను క్రింది
పటములో చూడవచ్చును.
గుణచక్రము భాగములను చిత్రమును 66 పేజీ లో చూడండి .
గుణచక్రములో గుణముల మధ్యగల జీవున్ని కూడా తర్వాత పేజీ పటములో
చూడవచ్చును.
గుణచక్రము తామసము లో ఉన్న జీవుడు చిత్రమును 67 పేజీ లో చూడండి .
ఈ విధముగా గుణచక్రము మూడు భాగములుగా ఉండగా, ఆ
మూడు భాగములలో ఏదో ఒక భాగములో జీవుడు ఉండును. ఒక
జీవుడు తామసములో ఉండగా, మరొక శరీరములోని మరొక జీవుడు
వాని కర్మ బలమును బట్టి రాజసములోనో లేక స్వాత్తికములోనో యుండును.
ఏ గుణములో జీవుడు ఉంటే ఆ గుణ భాగము పేరుతో వానిని సాత్త్వికుడనో,
రాజసుడనో, తామసుడనో పిలుచుచుందురు. గుణ భాగములో జీవుని
ఆకారము మూడు పొరలతో కూడుకొనియుండును. ఆ మూడు పొరల
పేర్లు బుద్ధి, చిత్తము, అహముగా చెప్పబడుచున్నవి. ఇవన్నియు పూర్తిగా
అర్థమగుటకు జీవుని చిత్రపటమును ప్రక్క పేజీలో చూపుచున్నాము
చూడండి. వాస్తవముగా నీ ఆకారముగానీ, అట్లే జీవుడనైన నా
ఆకారముగానీ చిత్రపటములో చూచినట్లే ఉండును. నీది నాది అనునదే
కాదు ప్రతి జీవరాశి వానివాని శరీరములో ఇలాగే యుండునని
తెలియవలెను.
జీవుడు మరియు బుద్ది, చిత్తము, అహం పొరలు చిత్రమును 67 పేజీ లో చూడండి .
ఇది వాస్తవమైన జీవుని ఆకారము. జీవుని చిత్రపటమును మేము
తప్ప ఇంతవరకు ఎవరూ చూపిన వారు లేరు. హృదయము అను బ్రహ్మ
నాడిలో ఆత్మయుండగా, బ్రహ్మనాడిని ఆధారము చేసుకొని కాల, కర్మ,
గుణ చక్రములు గలవు. గుణచక్రములో జీవుడు ఆశ మొదలగు గుణములు
ఉండగా, హృదయము అను బ్రహ్మనాడి గుణములకు జీవునికి ఆధారముగా
మధ్యలో కలదు. అందువలన హృదయమందు కోరికలు అను గుణములు
ఉండవు అని చెప్పవచ్చును. కోర్కెలకు హృదయమునకు ఎంతో దూరము
గలదు. ఈ విషయము అర్థమగుటకు హృదయముతో సహా కాల, కర్మ,
గుణచక్రములు గల చిత్రము తర్వాత పేజీలో చూడండి.
ఈ నాలుగు చక్రముల చట్రము శరీరములో జీవుని జీవితమున్నంత
వరకు ఉండును. మరణములో ఈ నాలుగు చక్రములు అందులోని
ఆత్మ, జీవాత్మ, కర్మలు, గుణములు అన్నియు వేరు క్రొత్త శరీరమును
చేరును. శరీరమునకు నాశనము కలదుగానీ, ఆత్మ, జీవాత్మ, కర్మలు,
గుణములకు నాశనము లేదు. అందువలన పై శ్లోకములో చెప్పినట్లు
కోర్కెలను గుణము నశించిపోదు. శరీరము నశించినా గుణములు నశించక
కాలచక్రము
కర్మచక్రము
గుణచక్రము
హృదయము (బ్రహ్మనాడి) చిత్రమును 69 పేజీ లో చూడండి .
జీవునితో పాటు వేరు శరీరమును చేరుచుండును. జీవుడు హృదయమందు
ఉన్నాడనుట, అట్లే గుణములు కూడా హృదయములో ఉన్నాయనుట
అజ్ఞానమగును. ఇటువంటి అజ్ఞానముండుట వలన ఈ ఉపనిషత్తులో
లోపమున్నదని శాస్త్రబద్దముగా చెప్పుచున్నాము.
కైవల్యోపనిషత్తు.
27) ప్రశ్న:- ఇక్కడ కైవల్యోపనిషత్తు యందు ఒక
శ్లోకమును ఇప్పుడు చూస్తాము.
శ్లో॥ అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవ నాశనమ్ తస్మా దేవం
విదిత్వైనం కైవల్యం పదమశ్నుతే, కైవల్యం పదమశ్నుతఇతి (25)
భావము :- కాబట్టి ఈ పరమాత్మను తెలుసుకొని జీవుడు సంసార
సముద్రమును నశింపజేయునట్టి జ్ఞానమును పొందుచున్నాడు. దానిచే
మోక్షమును చేరుచున్నాడు. శాశ్విత సుఖమును పొందుచున్నాడు.
ఈ భావములో జీవుడు పరమాత్మను గురించి తెలుసుకొని
జ్ఞానమును పొందుచున్నాడు. దానిచే మోక్షమును పొందుచున్నాడు అని
చెప్పారు. మొదట పరమాత్మను గురించి తెలియుటకు జ్ఞానముండవలెను
గానీ, పరమాత్మను తెలిసిన తర్వాత జ్ఞానమును పొందడమేమిటని అడుగు
చున్నాము. పరమాత్మను గురించి తెలిసిన తర్వాత జ్ఞానము పొంది మోక్షము
చేరును అని చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానములో ఈ ఉపనిషత్తులో చెప్పినట్లు
కలదా? లేక ఇంకా వేరు విధానమున్నదా?
జవాబు: మేము గతములో దాదాపు నలభై సంవత్సరముల క్రిందట
ఒక వాక్యమును వ్రాసియుంటిని. అది ఏమనగా! "భూమి మీద
నివశించుచున్న జ్ఞానులుగానీ, కర్మయోగులుగానీ, బ్రహ్మ యోగులు
గానీ, పరమహంసలుగానీ, తత్త్వవేత్తలుగానీ, తపస్వికులుగానీ,
నిత్యము యోగము చేయువారుగానీ, ఎవడయినా గానీ పరమాత్మను
తెలియరు” అని చెప్పాము. ఇదే విషయము బ్రహ్మవిద్యా శాస్త్రమున
కూడా బ్రతికియున్న ఎవడుగానీ పరమాత్మను తెలియలేరని చెప్పియున్నారు.
మనిషి ఎంత పెద్ద జ్ఞాని, యోగి అయినా అతడు ఆత్మను తెలియవచ్చునుగానీ,
పరమాత్మను తెలియుటకు అవకాశము లేదు. పరమాత్మ భూమిమీద
శరీరముతో బ్రతికి యున్న ఏ జీవునికి తెలియబడదు. శరీరమునకు
అధిపతిగా యున్న ఆత్మను ఆత్మజ్ఞానముచే (ఆధ్యాత్మిక జ్ఞానముచే)
తెలియవచ్చునుగానీ, పరమాత్మను తెలియుటకు పరమాత్మ జ్ఞానమంటూ
ప్రత్యేకముగా లేదు.
ప్రపంచమంతా అణువణువునా వ్యాపించి యున్న పరమాత్మ ఎవరికీ
తెలియబడువాడు కాడు. పరమాత్మ ఇట్లుండునని ఏ అంచనాతో కూడా
చెప్పుటకు సాధ్యపడదు. దేవతలకుగానీ, మనుషులకుగానీ తెలియనివాడు
పరమాత్మ. ఆయన ఆకారముగానీ, ఆయన విస్తీర్ణముగానీ ప్రపంచములో
ఎవరికీ తెలియదు. ఏమాత్రము ఎవరికీ అంతుచిక్కనివాడు పరమాత్మ.
భగవద్గీతలో అర్జునుడు పరమాత్మను చూడవలెనని కోర్కెకలదని చెప్పినప్పుడు
భగవంతుని శరీరములో యున్న పరమాత్మ “నన్ను చూచుటకు నీ
కన్నులు పనికి రావు" అని అన్నాడు. దేవతలు, ఋషులు నన్ను
చూడవలెనని యున్నా ఎవరికీ నా దర్శనము లభించలేదని చెప్పాడు.
వాస్తవముగా మనిషి ఎన్ని సాధనలు చేసినా చివరకు ఆత్మను తెలియవచ్చును,
పరమాత్మను తెలియలేరు. మనిషి యోగము చేత తన కర్మలనన్నిటినీ
లేకుండా చేసుకొన్నప్పుడు, అతడు తిరిగి రెండవ జన్మకు పోకుండా
పరమాత్మయందు చేరిపోవును. దానినే 'మోక్షము' అని అంటున్నాము.
అలా మోక్షము పొందిన జీవుడు మాత్రమే పరమాత్మయందు ఐక్యమైపోవుట
వలన అప్పుడు జీవునికి పరమాత్మ అంటే ఏమిటో తెలియును. మనిషి
ఆఖరీ మరణమును పొంది తిరిగి జన్మించనివాడు మాత్రమే పరమాత్మను
తెలియగలుగును. అట్లు మోక్షము పొందినవాడు తప్ప పరమాత్మను ఎవడూ
తెలియుటకు అవకాశము లేదు.
ఈ విధముగా పరమాత్మ ఎవరికీ తెలియనివాడుగా ఉన్నప్పుడు
ఈ కైవల్యోపనిషత్తులో జీవుడు పరమాత్మను తెలిసి, సంసార సముద్రమును
నశింపజేయునట్లు అనగా దాటునట్టి జ్ఞానమును పొందుచున్నాడు అని
వ్రాయడము ధర్మవిరుద్ధముగా, పూర్తి అసత్యముగా యున్నది. భగవద్గీతలో
విశ్వరూప సందర్శన యోగమున 47వ శ్లోకములో “ఆద్యమును,
విశ్వమయము, అనంతమైన తేజము గల నా రూపమును ఎవరూ చూడలేరు”
అని స్వయానా భగవంతుడే విశ్వరూపము నుండి చెప్పాడు. స్వయానా
దేవుడే అలా చెప్పియుండగా జీవుడు పరమాత్మను తెలిసికొని జ్ఞానమును
పొందును అని చెప్పుమాట ఉపనిషత్తులోనిదైనా శుద్ధ అబద్దమని
చెప్పవచ్చును.
శ్వేతాశ్వతరోపనిషత్తు.
28) ప్రశ్న :- యోగము చేసి యోగాగ్ని లేక జ్ఞానాగ్ని
పొందిన వానికి రోగముగానీ, ముసలితనము గానీ,
మరణముగానీ ఉండదు అని శ్వేతాశ్వతరోపనిషత్తులో
క్రింది శ్లోకములో చెప్పారు. ఎంత పెద్ద యోగి అయినా
చివరికి చనిపోతే కదా! మోక్షమును పొందునది.
యోగికి మరణము లేదు అంటే వారు శరీరము తోనే
ఎల్లకాలము బ్రతుకవలెనా?
నతస్య రోగో నజరా నమృత్యుః
ప్రాప్తస్య యోగాగ్ని మయం శరీరమ్
(2-12)
భావము : యోగాగ్నిమయమయిన శరీరము(జ్ఞానాగ్నితో కూడుకొన్న
శరీరము) కలవానికి రోగముగానీ, ముసలితనముగానీ, మరణముగానీ
ఉండదు.
జవాబు :- ఎంతపెద్ద యోగి అయినా, అతని శరీరములో ఎంత జ్ఞానాగ్ని
యున్నా అతనికి వయస్సు పెరుగుకొలది ముసలితనము వచ్చుచుండును.
యోగి అయినవాడు మోక్షము పొంది దేవునిలోనికి (పరమాత్మలోనికి)
ఐక్యము కావాలంటే అతడు శరీరమును వదలవలసిందే, మరణమును
పొందవలసిందే. శరీరమును వదలుటకు “నిందలేనిది పొందె పోదు”
అను సామెత ప్రకారము ఏదో ఒక రోగము కారణముగా మరణము
వచ్చును. ఇవన్నియూ చూస్తే యోగి అయినవానికి, యోగాగ్ని
సంపూర్ణముగా యున్నవానికి ముసలితనము, రోగము, మరణము వచ్చుట
తప్పదని తెలియుచున్నది.
అంతేకాక శరీరమును ధరించినవాడు తప్పక దానిని వదలిపోవలసి
యున్నది. మరణమును పొందిన తర్వాత అతనికి కర్మయుంటే వేరు
జన్మకు పోవును. ఒకవేళ కర్మ లేకపోతే అతడు మోక్షమును పొందును.
"ప్రతి మనిషికి జన్మము తప్పదు, జన్మించిన వానికి మరణము తప్పదు”
అని భగవద్గీతలో సాంఖ్యయోగమున 27వ శ్లోకమందు ఈ విషయమునే
చెప్పియున్నారు.
శ్లో॥ 27.
జాతస్య హిధ్రువో మృత్యుర్థువం జన్మ మృతస్యచ ।
తస్మాద పరిహార్యే ర్థే నత్వం శోచితు మర్వసి ॥
భావము :- జన్మించడము ఎప్పటికయినా మరణించుట కొరకే,
మరణించడము తిరిగి పుట్టుట కొరకే. అనివార్యమైన ఈ సంగతి గురించి
జ్ఞానియైనవాడు శోకించడు.
‘యోగి అయినవాడు చనిపోయిన తర్వాత తిరిగి జన్మింపడు' అను
విషయమును భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగమున 15వ శ్లోకములో
చెప్పియున్నారు చూడండి.
శ్లో॥ 15.
మా ముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్ ।
నా ప్నువంతి మహత్మాన సంసిద్ధిం పరమాం గతాః ||
భావము :- శ్రేష్ఠమైన యోగసిద్ధి పొందినవాడు నాలోనికి ఐక్యమై
మోక్షమును పొంది, తర్వాత పునర్జన్మములను పొందడు.
ఇట్లు యోగి పరమాత్మలోనికి ఐక్యమైన తర్వాత తిరిగి పుట్టడని
చెప్పియున్నారు. అయితే యోగి అయినవాడు ఒకమారు చనిపోతేనే కదా!
వాడు దైవములోనికి ఐక్యమగుట జరుగును. శరీరమును వదలనిదే మోక్షము
రాదు. శరీరమును వదలుటకు శరీరము ముసలిది కావలసియుండును.
అట్లే శరీరమునకు రోగము రావలసియుండును. దీనినిబట్టి ఎంత పెద్ద
యోగికి అయినా మరణము తప్పదని తెలియుచున్నది. అందువలన
శ్వేతాశ్వతరోపనిషత్తుయందు యోగికి రోగముగానీ, ముసలితనముగానీ,
మరణముగానీ రావు అనుట పూర్తి అసత్యము, ప్రకృతి ధర్మమునకు
విరుద్ధమగును. ఈ విషయము ఈ ఉపనిషత్తులో కనిపించే అసత్యముగా
యున్నది. ఇటువంటి అసత్యములు అందులో గల లోపములు కావా?
29) ప్రశ్న :- మీరు చెప్పిన ఆధ్యాత్మిక బోధలో ఆత్మవేరు,
పరమాత్మ వేరని చెప్పారు. ఆ రెండిటికి ఎంతో తేడాను
చూపించారు. అట్లే పరమాత్మకు, భగవంతునికి గల
వ్యత్యాసమును చూపించి బోధించారు. అయితే నేడు
దేవునికి, భగవంతునికి తేడా తెలియని ఆధ్యాత్మిక వేత్తలు
మేము సంపూర్ణ జ్ఞానులమని చెప్పుకొంటున్నారు. అట్లే
ఆత్మకు పరమాత్మకు బేధము తెలియనివారు బ్రహ్మవిద్యా
శాస్త్రమును తెలిసిన యోగులమని చెప్పుకొంటున్నారు.
అట్లే తపస్సుకు, యోగమునకు తేడా తెలియనివారు
సర్వజ్ఞానమును తెలిసినవారుగా చలామణి అగు
చున్నారు. ప్రతి దానికి వివరమును చెప్పుచున్న
మిమ్ములను హిందూ మతములో ఇంటి దొంగలు అని
ఆరోపించుచున్నారు. అటువంటివారికి బుద్ది చెప్పునట్లు
మీరు ఉపనిషత్తులలో లోపాలను ఎత్తి చూపించారు.
అయినా వారి తప్పును వారు గుర్తించక, ఉపనిషత్తులు
గొప్పవి అని అంటున్నారు. అయితే మీకేకాక మాకు
కూడా కొంత తప్పుగా శ్వేతాశ్వతరోపనిషత్తుయందు ఒక
శ్లోకము కనిపించుచున్నది. అది తప్పో ఒప్పో మీరే తేల్చి
చెప్పండి?
సర్వాననశిరోగ్రీవ స్సర్వభూత గుహాశయః
సర్వవ్యాపీ స భగవాన్ తస్మాత్సర్వగత శ్శివః
(3-11)
భావము :- ఆ భగవంతుడు సమస్త ప్రాణుల యొక్క ముఖములను,
శిరస్సులను, కంఠములను గలవాడైయున్నాడు. సర్వ జీవుల యొక్క
హృదయ గుహలయందు నివశించుచున్నాడు. అతడు సర్వవ్యాపి, మంగళ
స్వరూపుడు అయి ఉన్నాడు.
జవాబు :- ఈ శ్లోకమును వ్రాసినవాడు వ్యాసుడే అయినా వ్యాసుడు
శ్వేతాశ్వతుడు వ్రాసిన వ్యాసమునకు తగినట్లు శ్లోకమును వ్రాశాడు.
ఇందులోని సత్య అసత్యముల బాధ్యత మొదట వ్రాసిన వానిదేగానీ వ్యాసునిది
ఏమాత్రము కాదు. ఇందులో చెప్పినది కొందరికి సత్యముగానే కనిపించినా,
వాస్తవానికి ఈ శ్లోకము యొక్క భావములో ఎంతో తప్పు కలదని
చెప్పవచ్చును. ఇందులోని సత్యాసత్యమును వివరించి చూస్తే ఈ విధముగా
యున్నది. పరమాత్మ ప్రజలకు జ్ఞానమును తెలియజేయు నిమిత్తము
అప్పుడప్పుడు మనిషివలె అవతరించి, మనుషుల మధ్యలో నివశించి సమయ
సందర్భమును బట్టి జ్ఞానమును బోధించి పోవును. దైవజ్ఞానమును దేవుడే
చెప్పవలసియున్నది. దైవజ్ఞానము మనుషులకు తెలియదు కావున దేవుని
జ్ఞానమును దేవుడే వచ్చి చెప్పును. దేవుడు మనిషిగా వస్తేనే మనుషులతో
మాట్లాడి తన జ్ఞానమును చెప్పగలడు. అలా మనిషిగా వచ్చిన దేవున్ని
ఎవరూ గుర్తు పట్టకపోయినా, ఆయన ప్రత్యేకమయినవాడు అయినందున,
అతను అందరివలె సాధారణ మనిషి కానందువలన దేవుని అవతార జన్మ
అయిన మనిషిని 'భగవంతుడు' అను ప్రత్యేకమైన పేరుతో పిలుస్తున్నారు.
భగవంతుడు మనిషిగానే యున్నా అతడు సాధారణ మనిషి కాడు.
మనుషులందరూ తల్లిగర్భము నుండి పుట్టిన తర్వాత జీవమును
పొందుచున్నారు. తల్లిగర్భములో సాధారణ మనుషుల శరీరము పెరుగు
చున్నది. అలా తల్లి గర్భములో శిశువుగా పెరుగుచున్నప్పుడు ఎవరికిగానీ
జీవముండదు. ఏమాత్రము ప్రాణము గానీ, జీవము గానీ లేని శిశు
శరీరము తల్లిగర్భములో పెరిగి చివరికి ప్రసవము జరిగినప్పుడు తల్లిగర్భము
నుండి బయటపడిన శరీరములోనికి మొదటి శ్వాసగా ప్రాణము చేరడము,
ఆ ప్రాణముతో పాటు ఆత్మ, జీవాత్మ, గుణములు, కర్మలు అన్నియు చేరును.
సాధారణ మనిషి పుట్టినప్పుడు శరీరము గర్భము నుండి బయట పడిన
తర్వాతనే ప్రాణము, జీవము శిశు శరీరములోనికి చేరుచున్నవి.
సాధారణ మనిషి కాకుండా దైవము (పరమాత్మ) మనిషిగా
అవతరించినప్పుడు ఆయన కూడా తల్లిగర్భము నుండి శిశువుగా పుట్ట
వలసిందే. అయితే సాధారణ మనిషి పుట్టినట్లు భగవంతుడు పుట్టడు.
దేవుడు భగవంతునిగా పుట్టినప్పుడు ఆయన తల్లిగర్భము నుండి సజీవముగా
పుట్టును. భగము నుండి సజీవముగా పుట్టినవాడు గనుక ఆయనకు
'భగవంతుడు' అను గుర్తింపు కల్గిన ప్రత్యేకమైన పేరును పెట్టడము జరిగినది.
పరమాత్మ అంశ కొంత భగవంతునిగా పుట్టినప్పటికీ, పరమాత్మలో
ఎటువంటి మార్పు లేకుండా ఆయన అంతటా అందరి లోపల, అందరి
బయట అణువణువునా వ్యాపించి యున్నాడు. భగవంతుడు దేవుని అంశయే
అయినా ఆయన ఒక శరీరములో మాత్రము గలడు. భగవంతుడు తాను
ధరించిన శరీర పరిధిలోనే యుండును. అందువలన భగవంతునికి దేవునికి
ఎంతో తేడా కలదని చెప్పవచ్చును.
భగవంతునికి పరమాత్మకు (దేవునికి) ఎంతో తేడా గలదను
విషయమును మేము 1980లో “జనన మరణ సిద్ధాంతము” అను
గ్రంథములో వ్రాసి యుంచాము. అయినప్పటికీ నా మాటను సత్యమని
ఎవరూ నమ్మలేక పోయారు. గర్భస్థ శిశువుకు ప్రాణము లేదు అని అంటే
డాక్టర్లు కూడా ఒప్పుకొనే వారు కాదు. అందువలన చాలామంది
ప్రజలకుగానీ, పెద్దపెద్ద స్వామీజీలకు గానీ ఈ విషయము తెలియదు.
'భగవంతుడు' అనుమాటలోని సత్యమును తెలియని చాలామంది
"భగవంతుడు అందరిలో వ్యాపించి యున్నాడు. అందరినీ చూస్తున్నాడు”
అని అంటున్నారు. వారి మాట పూర్తి అసత్యమని తెలియకనే వారు ఆ
విధముగా మాట్లాడుచున్నారు. అదే విధముగనే ద్వాపరయుగము కంటే
ముందే శ్వేతాశ్వతుడు అను మహర్షి తన ఉపనిషత్తులో “భగవంతుడు
సమస్త ప్రాణుల యొక్క ముఖములను, శిరస్సులను కంఠములను గలవాడై
యున్నాడు” అని చెప్పాడు. అయితే ఆయన అనుకొన్నట్లు దేవుడు
ఉండవచ్చునుగానీ, భగవంతుడు ఉండేదానికి అవకాశము లేదు.
ఎందుకనగా! భగవంతుడు తాను ధరించిన శరీర పరిధిలోనే ఉండునుగానీ,
బయట ఏమాత్రము లేడు. భగవంతునికి దేవునికి తేడా తెలియని అజ్ఞానులు
చెప్పుమాటను ఉపనిషత్తులో వ్రాయడము పెద్ద తప్పు. అందువలన ఇది
ఉపనిషత్తులో లోపముగా యున్నదని చెప్పుచున్నాను. ఒక శరీరములో
భగవంతుడుండగా ఆయన సర్వ జీవుల యొక్క హృదయ గుహలయందు
నివశించుచున్నాడు అనుట ఎటువంటి విధానమో మీరే చూడండి. దేవుడు
అనగా పరమాత్మ అందరియందు, అందరి బయట అణువణువునా వ్యాపించి
విశ్వ వ్యాపకముగా యున్నాడు. పూర్వముగానీ, నేడుగానీ భగవంతునికి,
దేవునికి తేడా తెలియని వారున్నారని చెప్పుచున్నాము. సర్వవ్యాపి అని
భగవంతున్ని ఈ శ్లోకములో చెప్పియున్నారు. అట్లే అందరూ అనుకోవడము
జరుగుచున్నది. భగవద్గీతలో భగవంతునికి దేవునికి గల వ్యత్యాసము
చెప్పబడి యున్నది. అయినా దానిని స్వామీజీలు కూడా గ్రహించలేదు.
30) ప్రశ్న :- దైవజ్ఞానము సంపూర్ణముగా పొంది
యోగియై యోగాగ్ని చేత తన కర్మలన్నిటినీ లేకుండా
చేసుకొన్న వానికి జన్మ లేకుండా పోవునా లేక మరణము
లేకుండా పోవునా?
జవాబు :- జన్మ లేకుండా పోవును. జన్మ లేకుండా పోయినప్పుడు తిరిగి
మరణమంటూ యుండదు. అటువంటి వాడు జననము మరణము లేని
వాడని చెప్పవచ్చును. జ్ఞానము తెలిసిన యోగికి మొదట మరణము తప్పదు.
అందువలన నీ ప్రశ్నకు జవాబుగా జన్మ లేకుండా పోవునని చెప్పాము.
31) ప్రశ్న :- అయితే మీరు చెప్పిన దానికి వ్యతిరేఖముగా
మరణము ఉండదని శ్వేతాశ్వతరోపనిషత్తుయందు
ఒక శ్లోకములో ఇలా చెప్పారు చూడండి.
శ్లోకము :-
అంగుష్టమాత్రః పురుషోంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః,
హృదామనీషీ మనసా భిక్లుప్తో య ఏతద్విదు రమృతాస్తే భవన్తి (3-13)
భావము :- పరమాత్మ అంగుష్టమాత్ర పరిమాణముతో హృదయ గుహయందు
నివాసమున్నాడు. అతడు పరిపూర్ణుడు, సమస్త ప్రాణుల హృదయము
లందుండి మనస్సుచే కప్పబడియున్నాడు. అతడు జ్ఞానమునకు ప్రభువు
అని తెలిసినవాడు మరణములేనివాడగుచున్నాడు.
ఈ శ్లోక భావమును చూస్తే దైవజ్ఞానము పొందిన వానికి, దేవున్ని
గురించి తెలిసినవానికి మరణము లేదని చెప్పారు. ఒక జ్ఞాని యోగియై
మరణించక అట్లే స్థిరస్థాయిగా భూమిమీద ఉండునా యని ప్రశ్న వచ్చు
చున్నది. మీకు తెలిసిన ప్రకారము పై శ్లోకములో చెప్పినమాట వాస్తవమా?
జవాబు :- మనిషి తన జీవితములో ఆత్మజ్ఞానమును బాగా తెలిసినవాడై
పరమాత్మను చేరి మోక్షము పొందవలెను అని అనుకొన్న వానికి మోక్షము
లభించవచ్చును. మోక్షము అనగా కర్మ సంబంధ జన్మలు లేకుండా పోయి
దేవునియందు చేరిపోవడము అని అర్ధము. అటువంటి వానికి మరణము
వచ్చి ఉన్న శరీరమును వదలిపోయినప్పుడు కదా! అతడు దైవమును చేరేది.
మరణము సంభవించకపోతే అంతవరకూ ఉన్న శరీరము అట్లే ఉండును
కదా! మోక్షము పొందువాడుగానీ లేక మోక్షమును పొందనివాడుగానీ
తప్పక ఆ జీవితమునకు సంబంధించిన శరీరమును వదలి మరణమును
పొందవలసిందే. మనిషి జ్ఞానిగానీ, అజ్ఞానిగానీ పుట్టినవాడు మరణించ
వలసిందేయని భగవద్గీతలో సాంఖ్యయోగమున 27వ శ్లోకమందు చెప్పారు.
“జాతస్య హి ధృవోమృత్యు” అని భగవంతుడు చెప్పడము జరిగినది. దాని
అర్థము ప్రకారము “పుట్టినవాడు తప్పక మరణము పొందవలసిందే” యని
కలదు. అలాగే "ధ్రువం జన్మ మృతస్యచ” అని కూడా అన్నాడు. దాని
అర్థము “చచ్చినవాడు తిరిగి పుట్టవలసిందే” యని చెప్పవచ్చును. “అజ్ఞాన
జీవితము గడుపువాడు పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక
తప్పదు అని ఇది అనివార్యమైన కార్యము” అని చెప్పారు.
మనిషికి మరణములు నాల్గు రకములుయని గతములో “మరణ
రహస్యము” అను గ్రంథములో చెప్పియున్నాము. అందులో ఒకటి
అకాల మరణము, రెండు కాల మరణము, మూడు తాత్కాల మరణము,
నాల్గు ఆఖరీ మరణము అని చెప్పాము. మనిషి కాల మరణమును పొందితే
అతడు పూర్తి చనిపోయినట్లేయనీ, అతడు క్రొత్త శిశు శరీరములో
జన్మించునని చెప్పాము. అలాగే ఆఖరీ మరణము పొందు మనిషి తిరిగి
జన్మించక మోక్షమును పొందును. వాడు తిరిగి పుట్టేదిగానీ, మరణించేది
గానీ ఉండదు. జ్ఞానమార్గములో జీవితము గడుపువాడు సంపూర్ణ యోగియై
కర్మరహితుడై తిరిగి పుట్టడు కావున అతను పొందు మరణమును చివరి
మరణము అని అంటాము. ఏ విధముగా అయినా మనిషి పుట్టిన తర్వాత
మరణించవలసిందే. ప్రత్యేకించి జ్ఞాన జీవితమును గడిపినవాడు
మరణమును పొంది తిరిగి జన్మించడు. అందువలన దైవమును
పొందాలనుకొను వానికి జన్మ ఉండదు అని చెప్పాలిగానీ, మరణము
ఉండదు అని చెప్పకూడదు. అందువలన ఉపనిషత్తులో ఈ విషయమును
వ్రాసిన అతనికి మరణమును గురించిగానీ, ఆఖరీ మరణము గురించిగానీ
తెలియదు అని అనుకొంటాను. అలాగే అతనికి చావు పుట్టుకల రహస్యము
గానీ, చావుపుట్టుకల తేడాగానీ తెలియదని అనుకొంటాను. ఇది ఉపనిషత్తులో
లోపము కాదా!యని అడుగుచున్నాను.
అంతేకాక పరమాత్మ సమస్త శరీరముల హృదయములందుండి
మనస్సుచే కప్పబడియున్నాడు అని చెప్పడము కూడా పూర్తి తప్పగును.
ఇది ఆత్మకు పరమాత్మకు తేడా తెలియనివారు మాట్లాడిన మాటగా యున్నది.
ఆత్మ శరీరములో నివాసముంటుంది, పరమాత్మ నివాసము ఎవరికీ
తెలియదు, ఫలానాయని చెప్పలేము. శరీరములో ఆత్మ అన్నిటిని కప్పియున్న
దని చెప్పినా సరిపోవునుగానీ, పరమాత్మను మనస్సు కప్పియుండడమేమిటి?
శరీరమునకు అధిపతిగా ఆత్మ యున్నదిగానీ మనస్సు కాదని తెలియవలెను.
32) ప్రశ్న :- పరమాత్మను తెలియకపోతే దుఃఖము
నాశనము కాదు అని శ్వేతాశ్వతరోపనిషత్తుయందు
వ్రాసియున్నారు. ఇంతకు ముందు ఈ విషయమునే
మీరు తేల్చి చెప్పారు. అయినా అనేకచోట్ల ఇదే
విషయమునే ఈ ఉపనిషత్తుయందు వ్రాయడము వలన
మాకు సంశయము కల్గుచున్నది. ఈ విషయమును
మరొక్కమారు వివరించమని కోరుచున్నాము.
యదా చర్మవదాకాశం వేష్టయిష్యన్తి మానవాః
తదా శివ మవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. (6-20).
భావము :- ఆకాశమును చర్మమువలె చుట్ట చుట్టుటకు ఎట్లు శక్యము
కాదో అట్లే పరమాత్మనెరుగక దుఃఖము యొక్క నాశనము కానేరదు.
జవాబు :- వాళ్ళు చెప్పిన భావములో "పరమాత్మను తెలియనిదే” అని
వ్రాశారు. అయితే శ్లోకములో “శివ మవిజ్ఞాయ” అని వ్రాసియున్నారు.
శివ అనగా ఆత్మయని, పరమశివ అనగా పరమాత్మయని అర్థము గలదు.
అక్కడ శ్లోకములో చెప్పినది శివయని ఆత్మను గురించి చెప్పారుగానీ,
పరమాత్మను గురించి చెప్పలేదు. వారు అనుకొన్నట్లు పరమాత్మను
తెలియకనే దుఃఖ నాశనముకాదు అని అనుకొనుట ఆధ్యాత్మికములో దారి
తప్పి చెప్పినట్లుగును. మనిషి ఎవడయినాగానీ ఆత్మను ఆరాధించవచ్చును,
ఆత్మను తెలియవచ్చును. ఎట్టి పరిస్థితిలో పరమాత్మను తెలియుటకుగానీ,
ఆయనను ఆరాధించుటకుగానీ సాధ్యపడదు. పరమాత్మ ఫలానా చోట
ఉన్నాడని, ఫలానా ఆకారములో యున్నాడనిగానీ, ఫలానా పేరుతో
యున్నాడని గానీ, ఫలానా పని చేయుచున్నాడనిగానీ ఎవరికీ తెలియదు.
ఆయన రూప, నామ, క్రియలు లేనివాడు. అందువలన పరమాత్మను
బ్రతికియున్న మనిషి ఎవడు గానీ తెలియలేడు. శివ అను ఆత్మకు రూప,
నామ, క్రియలు గలవు కావున ఎవడయినా ఆత్మను తెలియవచ్చును,
ఆత్మను ఆరాధించవచ్చును. ఆత్మను గురించే శ్లోకములో చెప్పారుగానీ,
పరమాత్మను గురించి చెప్పలేదు. శరీరములోని ఆత్మను తెలియనిదే
శరీరములో కల్గు దుఃఖము నాశనము కాదు అని చెప్పుట సక్రమమగును.
'పరమాత్మను తెలియనిదే' అని చెప్పుట సక్రమము కాదని తెలియవలెను.
భావము ప్రకారము ఈ విషయము ఎంతో లోపముతో కూడుకొనియున్నది.
భూమిమీద సజీవముగా యున్నవాడు ఎవడుగానీ సృష్టి ఆదినుండి
పరమాత్మను తెలియలేదు. మరణించిన తర్వాత ముక్తిబొందినప్పుడు
పరమాత్మను తెలియవచ్చును. మనిషి శరీరముతో బ్రతికియున్నప్పుడు
పరమాత్మను తెలియును అనుట పూర్తి అసత్యమగును.
గర్భోపనిషత్తు.
33) ప్రశ్న :- గర్భస్థ శిశువుకు ప్రాణము లేదు అనీ, అట్లే
జీవుడు కూడా లేడు అని చెప్పియున్నారు. అయితే
ఇప్పుడు గర్భోపనిషత్తులో వరుసగా నాలుగు శ్లోకములను
చూస్తే మీ మాటకు వ్యతిరేఖముగా చెప్పినట్లు కలదు.
క్రింద చూడండి.
నానాయోని సహస్రాణి దృష్ట్యాచైవ తతో మయా,
ఆహారా వివిధా భుక్తాః పీతాశ్చ వివిధాఃస్తనాః. (4)
(అపుడు గర్భస్థ జీవుడు ఈ ప్రకారముగా చింతన చేయుచున్నాడు)
భావము :- నేను అనేక స్త్రీ యోనులను చూచినాను. అనేకములైన
ఆహారములను భుజించితిని. అనేక స్తనముల ద్వారా క్షీరమును పానము
చేసితిని.
జన్మ భూమిర్షి సర్వాభూ శ్శ్మశానమపి మే పురా,
చతరశీతి లక్షేషు యోని భేదేషు చాభవమ్. (5)
భావము :- నాకు సమస్త భూమియు జన్మ భూమియే, సమస్త భూమియు
స్మశానమే, నేను ఎనుబది నాలుగు లక్షల యోని భేదములందు జన్మించితిని.
జాతశ్చాస్మి మృతశ్చాస్మి సంసార్యస్మి పునః పునః,
జన్మ మృత్యూ పునర్జన్మ పునర్మృత్యుః పునర్జనిః.(6)
భావము :- ఎన్నియోసార్లు పుట్టితిని, ఎన్నియోసార్లు చచ్చితిని.
ఎన్నియోసార్లు సంసారియైయుంటిని, పుట్టుట, చచ్చుట, మరల పుట్టుట,
మరల చచ్చుట, ఈ ప్రకారముగా నాకాలము గడచిపోయినది.
గర్భవాసే మహాద్దుఃఖం, మోహో దుఃఖం చ జన్మసు,
బాల్యే దుఃఖం తథా శోకః పారవశ్యం చ మూఢతా.
(7)
భావము :- గర్భవాసము మహా దుఃఖమయినది. జన్మించుటయందలి
మోహము మహా దుఃఖమైనది. బాల్యమునందు దుఃఖము, శోకము,
పరవశత్వము, మూఢత్వము కల్గుచున్నవి.
జవాబు :- గర్భములోని శిశువు గర్భములోనే ఉంటూ, నాల్గు శ్లోకముల
భావములలో చెప్పినట్లు తలచుచున్నాడని చెప్పడము వాస్తవానికి పూర్తి
వ్యతిరేఖముగా యున్నది. వీరు చెప్పినట్లు గర్భములో శిశువు సజీవముగా
ఉండునని అందరూ అనుకోవడము జరుగుచున్నది. అలా అనుకొనుటకు
ఇటువంటి వ్యాసములను వ్రాసినవారందరూ తల్లిగర్భములోని శిశువుకు
ప్రాణమున్నదని చెప్పడము వలన అందరూ దానినే నమ్మారు. దానికి
తోడు పురాణములు కూడా అదే విషయమునే చెప్పడము వలన అందరూ
గర్భస్థ శిశువుకు ప్రాణమున్నదని నమ్మడమైనది. భాగవత పురాణములో
ప్రహ్లాద పుట్టుకలో ప్రహ్లాదుడు తల్లిగర్భములో యున్నప్పుడే నారద మహర్షి
చెప్పిన నారాయణ మంత్రమును విన్నాడని చెప్పియుండుట వలన
ఇవన్నియూ సత్యములని నమ్మిన ప్రజలు అందరూ గర్భోపనిషత్తులో ఇప్పుడు
చెప్పిన మాటలన్నీ సత్యములేయని నమ్మారు. అలా ప్రజలు నమ్మడము
వలన నేడు వీటిని సాకుగా చూపి, తప్పుడు జ్ఞానమును ప్రచారము చేయు
వారు ఎందరో తమదే నిజమైన జ్ఞానము అని అంటున్నారు.
తల్లిగర్భములోని శిశువుకు ప్రాణము లేదని ఎన్నో ప్రత్యక్ష
సాక్ష్యములను చూపుచూ నేను “జనన మరణ సిద్ధాంతము” అను
గ్రంథమును 1980వ సంవత్సరములోనే వ్రాశానని చెప్పాను. నేను
ప్రత్యక్షముగా జరిగిన ఎన్నో సంఘటనలను వ్రాయడము వలన గర్భస్థ
శిశువుకు ప్రాణము లేదని కొంతవరకు తెలిసినది. నేను ఈ మాట చెప్పుటకు
బలమైన సాక్ష్యము భగవద్గీతలో సాంఖ్యయోగమున గల 22వ శ్లోకమనియే
చెప్పవచ్చును. ఆ శ్లోక భావములో ఇలా వ్రాసి యున్నది. “చినిగిన
వస్త్రమును, ధరించుటకు యోగ్యత లేని వస్త్రమును మనిషి
వదలివేసి, క్రొత్త వస్త్రమును ఎట్లు ధరించుచున్నాడో అదే
విధముగా శిథిలమైన శరీరమును వదలి మనిషి క్రొత్త శరీరమును
తీసుకొంటున్నాడు.” ఈ విధముగా చెప్పిన భగవంతుని విషయము
నేను చెప్పిన జనన సిద్ధాంతమునకు ఆధారముగా యున్నది. చాలాచోట్ల
గర్భము నుండి బయటపడిన శిశువుకు ప్రాణము లేనిది చూచి గర్భములోనే
శిశువు చనిపోయిందని శిశువును మట్టిలో పూడ్చిన తర్వాత అదే శిశు
వుకు ప్రాణము వచ్చి అరుస్తుండగా, కొంత శబ్దమును విని తిరిగి శిశు
వును బయటికి తీసుకొన్న సంఘటనలు అనేకముగా అక్కడక్కడ జరిగినవి.
ఇలా జరిగిన వాటికి సమాధానము ఎవరూ చెప్పలేకున్నా గర్భములోని
శిశువుకు ప్రాణమున్నదను విషయమునే అందరూ నమ్ముచున్నారు.
ఎన్నో ప్రత్యక్ష సంఘటనలలో తల్లిగర్భము నుండి బయటకు వచ్చిన
శిశువులకు ఐదు, పది నిమిషములకు గానీ, గంట రెండు గంటలకుగానీ
ప్రాణమొచ్చిన సంఘటనలు అనేకము గలవు. అయినా ప్రజలు కొందరు
మూర్ఖముగా అసత్యమునే నమ్ముచూ కల్పిత పుక్కిడి పురాణములు, ఊహా
జనిత ఉపనిషత్తులను నమ్ముచున్నారు. సత్యమును విస్మరించుచున్నారు.
సత్యము ప్రకారము చూస్తే “గర్భములో శిశువుకు ప్రాణము లేదు” అనుట
వాస్తవము. అందువలన గర్భోపనిషత్తులో చెప్పినట్లు శిశువు గర్భములోనే
అనుకొనుచున్నాడు అను విషయములన్నియు పూర్తి అసత్యములు.
గర్భములో ప్రాణము లేదు. జీవుడు అంతకూ లేడు. మరణించినప్పుడు
శరీరములోని జీవుడు బయటికి వచ్చిన సెకను కాలములోనే, ఇంకా
వివరముగా చెప్పితే ఒక సెకనులో పదవ భాగములోనే క్రొత్తగా ప్రసవింప
బడిన శిశు శరీరములోనికి చేరుచున్నాడు. మరణించిన వెంటనే జన్మ
కలుగుచున్నది. మనిషి బయట శరీరమును వదలి, బయటనేగల శిశు
శరీరమును చేరుచున్నాడు. తల్లిగర్భములోనికి పోయి కొంతకాలముండును
అనుట పూర్తి అసత్యము. అందువలన గర్భోపనిషత్తులో చెప్పిన మాటలన్నీ
పూర్తి అసత్యములనీ, ఆ ఉపనిషత్తులోని లోపములని తెలియవలెను.
గర్భోపనిషత్తు మొత్తము కల్పనతో కూడుకొన్నదని తెలియవలెను.
నారాయణోపనిషత్తు
34) ప్రశ్నః " ఓం నమోనారాయణాయ" అను మంత్రము
అష్టాక్షర మంత్రమని నారాయణోపనిషత్తులో చెప్పి
యున్నారు. ఈ మాట వాస్తవమని నమ్మించుటకు
ప్రమాణముగా క్రింది శ్లోకమును చెప్పారు. అష్టాక్షరీ
మంత్రము అనునది వారు చెప్పిన నారాయణ
మంత్రమేనా యని అడుగుచున్నాము.
శ్లో || ఓ మిత్యగ్రే వ్యాహరేత్, నమ ఇతి పశ్చాత్, నారాయణాయేత్యు పరిష్టాత్;
ఓ మిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే, నారాయణాయేతి పంచాక్షరాణి,
ఎతద్వై నారాయణాస్యాష్టాక్షరం పదం, యోహవై నారాయణస్యాష్టాక్షరం
పదమధ్యేతి, అన ప్రబ్రువన్సర్వ మాయురేతి, విందతే ప్రాజా పత్యగ్ం
రాయస్పోషం గౌపత్యం తతోమృతత్వ మశ్నుతే తతోమృతత్వ మశ్నుత ఇతి
య ఏవం వేద. (2)
భావము :- మొదట “ఓం” అని ఉచ్చరించవలెను. తదుపరి “నమో”
యని ఉచ్ఛరించవలెను. పిమ్మట "నారాయణ" అని ఉచ్ఛ రించవలెను.
“ఓం” అను అక్షరము ఒకటి “నమో” అను అక్షరములు రెండు
“నారాయనాయ” అను అక్షరములు ఐదు అన్నిటినీ కలిపి ఇదియే శ్రీ
నారాయణ అష్టాక్షర మంత్రము. ఎనిమిది అక్షరములు గల ఈ
మంత్రమును ఎవడు భక్తి శ్రద్ధలతో, ప్రీతితో, విశ్వాసముతో స్మరణ చేయునో
అతడు దీర్ఘాయుష్సుకలవాడగును. ప్రజా పతిత్వమును పొందును. స్వర్గాధి
పత్యమును బడయును. ధన దాన్యాది ఐశ్వర్యములు, సంపదను పొందును.
ఎవడు దీనిని ఎరుగునో అతడు అమృతత్వమును (మోక్షమును) పొందు
చున్నాడు.
జవాబు :- “ఓం నమో నారాయనాయ” అను మంత్రమును అష్టాక్షరీ
మంత్రము అని చెప్పుచూ దీనిని స్మరించుట చేత ఎన్నో లాభములు కల్గుననీ,
చివరకు మోక్షము కల్గునని నారాయణోపనిషత్తు యందు చెప్పడము మంచిదే.
అయితే ఈ మాటకు వ్యతిరేఖముగా శైవులు మా పంచాక్షరీ మంత్రమును
జపించడము వలన పాపములన్నియు నశించిపోయి చివరకు మోక్షము
లభించునని చెప్పియున్నారు. వైష్ణవులు నారాయణ మంత్రమయిన 'అష్టాక్షరీ'
గొప్పదని చెప్పగా, అట్లే శైవులు శివునికి సంబంధించిన 'పంచాక్షరి' గొప్పదని
అంటున్నారు. వారివారి నమ్మకమునుబట్టి ఎవరికి వారి మంత్రము గొప్పది
కావచ్చును. అయితే నారాయణోపనిషత్తులో చెప్పిన మంత్రమును
అక్షరములు లెక్కించి అష్టాక్షరీ మంత్రము అని అన్నారు. అదే విధముగా
శైవులు చెప్పు పంచాక్షరీ మంత్రములో అక్షరములు లెక్కించితే ఐదు
అక్షరముల మంత్రము కాకుండా ఆరు అక్షరములు కనిపించుచున్నవి.
అష్ట అనగా ఎనిమిది అన్నట్లు, పంచ అనగా ఐదు అని అర్థము కలదు.
అటువంటప్పుడు “ఓం నమః శివాయ" అను మంత్రములో ఆరు అక్షరములు
గలవు కదా! మీది పంచాక్షరి ఎలా అగును? అని శైవులను ప్రశ్నించినాము.
దానికి వారు తగిన జవాబును చెప్పారు.
శైవులు చెప్పిన జవాబులో వైష్ణవులు చెప్పు నారాయణమంత్రములో
ఎనిమిది అక్షరములు లేవు, అది ఏడు అక్షరముల మంత్రమేయని
అంటున్నారు. ఎందుకనగా! వారు చెప్పు విధానమును చూస్తే మొదట
గల “ఓం” అను శబ్దము దైవమునకు, దైవశక్తికి గుర్తుగా యున్నది.
అందువలన ఎక్కడయినా గానీ 'ఓం' అను శబ్దము ప్రతీ మంత్రము ముందర
చెప్పబడు పవిత్ర శబ్దము. అందువలన దానిని ప్రణవ శబ్దము లేక ప్రణవ
మంత్రము అని అంటున్నారు. ప్రతి మంత్రమునకు మొదటనే పలుకుచున్న
'ఓం' ను ఒక అక్షరముగా లెక్కించకూడదనీ, అది అన్నిటికీ సమానమైనదిగా
తలచి దాని ప్రక్కన యున్న మంత్రములోని అక్షరములను మాత్రము
లెక్కించవలెనని శైవులు చెప్పుచున్నారు. వారిమాట ప్రకారము “ఓం నమః
శివాయ” అను మంత్రములో మొదటగల ఓం ను వదలిపెట్టి
అను రెండు అక్షరములను, “శివాయ” అను మూడు అక్షరములను కలిపి
ఐదు అక్షరముల మంత్రమని అంటున్నారు. దానినే పంచాక్షరీ మంత్రమని
కూడా చెప్పుచున్నారు. వీరిమాట ప్రకారమైతే “నమో నారాయనాయ”
అను అక్షరములను మాత్రము లెక్కించి చూస్తే ఏడు అక్షరముల
మంత్రమేయగును. అటువంటప్పుడు నారాయణోపనిషత్తు నందు చెప్పినది
తప్పగునా యని అనుమానము వస్తున్నది. ప్రతి మంత్రము ముందర
చెప్పబడు ఓం ను వదలి వేయవలెనా లేక దానిని కూడా లెక్కించవలెనా?
ఇందులో పంచాక్షరీయను మంత్రములో చెప్పినట్లు చూస్తే అష్టాక్షరి
మంత్రము లేదు. అట్లే అష్టాక్షరిలో చెప్పినట్లు చూస్తే పంచాక్షరి మంత్రము
లేదు. ఇందులో ఏది సరియైనదని అనుమానము వచ్చును.
అనుమానమును లేకుండా చేయుటకు, అష్టాక్షరీ అనునది తప్పని చెప్పుటకు,
అక్షరముల సంఖ్యను బట్టి అష్టాక్షరి అని చెప్పుట తప్పని తెలియుటకు
సాక్ష్యముగా యున్న ఒక ఆధారమును ఇప్పుడు గమనిస్తాము.
ప్రపంచములో మొట్టమొదట తయారయిన భాష తెలుగు భాష.
అందువలన అన్నిటికంటే తెలుగు లిపియే మొదట తయారు చేయబడినది.
తెలుగు లిపి ఏర్పడిన తర్వాతే కదా! నారాయణోపనిషత్తు నందలి అష్టాక్షరి
మంత్రమును వ్రాసినది. తెలుగు భాష, లిపి తయారయిన కొంత
కాలమునకు అష్టాక్షరీ మంత్రము చెప్పబడినది. భాష తయారయినప్పుడే
పంచాక్షరి మంత్రము చెప్పబడినది. అష్టాక్షరి మంత్రముకంటే పంచాక్షరి
మంత్రము ఎంతోకాలము ముందు చెప్పబడినది. అంతేకాక పంచాక్షరి
మంత్రము అక్షరముల సంఖ్యను లెక్కించి చెప్పలేదు. అక్షరములలోని
అర్థమును తెలియునట్లు చెప్పియున్నారు. “ఓం నమః శివాయ” అను
అక్షరముల మొత్తము ఆరు గలవు. అయితే అక్షరములను లెక్కించి చెప్పలేదు.
కావున అక్షరమున భావమును పట్టి చెప్పునది కావున దానిని పంచాక్షరి
మంత్ర మనియే చెప్పవచ్చును.
“ఓం నమః శివాయ” అను ఆరు అక్షరములకు అర్థము ఈ
విధముగా చెప్పియున్నారు. ఈ ప్రపంచములో కనిపించే ప్రకృతి, కనిపించని
దేవుడు (పరమాత్మ) ఇద్దరే కలరు. కనిపించే ప్రకృతి ఆకాశము, గాలి,
అగ్ని, నీరు, భూమి అను ఐదు భాగములుగా యున్నది. కనిపించని
పరమాత్మ ఏక స్వరూపుడై ఎవరికీ తెలియనివాడై యున్నాడు. ప్రకృతి
యొక్క ఐదు భాగములలో ఏ ఒక్క భాగము చేతగానీ పరమాత్మ నశించువాడు
కాడు. అందువలన ఆయనను ఐదుకు నాశనము కానివాడని చెప్పుచూ
పంచ అక్షరీ (పంచాక్షరీ) యని చెప్పారు. పంచమునకు నాశనము కాని
వాడని దాని అర్థము.
దేవుడు అనగా పరమాత్మ ప్రకృతికి నాశనము కానివాడని అందరికీ
తెలియునట్లు పరమాత్మను 'పంచాక్షరి' అని అన్నారు. పంచాక్షరిలో ఆరు
అక్షరములున్నా అది అక్షరముల లెక్కకాదనీ క్షరము అనగా నాశనము
అనీ, అక్షరము అనగా నాశనము లేనిదియని తెలుపు ఆధ్యాత్మిక అర్థము
ప్రకారము 'పంచ అక్షరీ' అని అన్నారు. పంచ భూతములుగా యున్న
ప్రకృతిని ఒక్కొక్క భాగమునకు ఒక్కొక్క అక్షరమును గుర్తుగా చూపారు.
ప్రకృతిలో గల ఆకాశమునకు గర్తుగా లేక బీజాక్షరముగా “న” అను
కనుపించు భాషాలిపిలో యున్న అక్షరమును ఉంచారు. అలాగే గాలికి
గుర్తుగా లేక బీజాక్షరముగా “మః” అను అక్షరమును పెట్టారు. అట్లే
అగ్నికి గుర్తుగా లేక బీజాక్షరముగా "శి" అను అక్షరమును ఉంచారు.
తర్వాత గల నీరుకు గుర్తుగా లేక బీజాక్షరముగా “వా” అను భాషా లిపిని
ఉంచారు. చివరిగా ప్రకృతిలో భాగముగా యున్న భూమికి చిహ్నముగా
లేక బీజాక్షరముగా “య” అను అక్షరమును వ్రాశారు. ఈ విధముగా
ప్రకృతిలోని ఐదు భాగములకు ఐదు అక్షరములను “నమః శివాయ”
అని వ్రాశారు. ఈ ఐదు భాగముల ప్రకృతి, ముందేయున్న పరమాత్మ
చేత సృష్ఠింపబడినది కావున పరమాత్మకు గుర్తు లేక బీజాక్షరముగా “ఓం”
అను తెలుగు భాషా అక్షరమును వ్రాయడమే కాక, ప్రకృతికంటే ముందే
యుండి ప్రకృతిని సృష్టించినవాడు పరమాత్మ అయినదానివలన పరమాత్మ
గుర్తు అయిన 'ఓం' ను, నమః శివాయ అను ప్రకృతి గుర్తులకు ముందే
వ్రాయడము జరిగినది. అందువలన “ఓం నమఃశివాయ” అను
మంత్రమును చెప్పారు.
ఓం నమః శివాయలో ప్రకృతి ఐదు అక్షరములు, పరమాత్మ ఒక
అక్షరముగా యున్నది. ప్రకృతి చేత సమస్తము నశించినా పరమాత్మ
నాశనము చెందువాడు కాదు. కావున ఐదుకు అంతము కానివాడు
పరమాత్మయని తెలియునట్లు, 'ఓం' ను ముందు పెట్టి ప్రకృతి భాగములను
వెనుకపెట్టి 'పంచాక్షరీ' అని అన్నారు. పంచాక్షరి అనగా 'ఐదుకు నాశనము
కానివాడు' అని అర్థము. భాష తయారయిన మొదటిలోనే పంచాక్షరి
అను మంత్రము తయారయినది. తెలుగు భాషను నేర్వాలనుకొన్న
వారందరికీ ఈ విషయము తెలియునట్లు, భాషా అక్షరాభాస్యములోనే మొదట
పరమాత్మ ప్రకృతికి సంబంధించిన బీజాక్షరములను నేర్పించి తర్వాత భాషను
నేర్పేవారు. అందువలన అ ఆ లు నేర్పే ముందు “ఓం నమః శివాయ”
అని పూర్వము నేర్పేవారు. నేడు ఆధ్యాత్మిక విద్యను మరచిన గురువులు
పంచాక్షరిని వదలివేసి అచ్చులు మొదలుకొని భాషను నేర్పుచున్నారు. ఈ
విధముగా చూస్తే 'పంచాక్షరి', భాష పుట్టినప్పుడే పుట్టినదనీ, పంచాక్షరి
తర్వాత ఎంతోకాలమునకు అనగా విష్ణు భక్తులు వచ్చిన తర్వాత అష్టాక్షరి
మంత్రము వచ్చినదని చెప్పవచ్చును. పంచాక్షరి అర్థసహితముగా దేవుడు
ప్రకృతియనీ, ప్రకృతికి దేవుడు నశించడు అని తెలుపు భావమును చేకూర్చి
పంచాక్షరీ యని భావయుక్తముగా చెప్పియున్నారు. అట్లుకాకుండా భాషా
అక్షరముల కూడికతో చెప్పు అష్టాక్షరి మంత్రము భావయుక్తము కానిదని,
అటువంటి లెక్క చెప్పిన నారాయణోపనిషత్తులో 'ఓం నమోనారాయనాయ’
అను మంత్రము సప్త అక్షరి అనకుండా అష్టాక్షరియని చెప్పడము తప్పుగా
కనిపించుచున్నది. అర్థము ప్రకారమైతే ఓం ఏడు అక్షరముల ముందు
ఉండుట వలన సప్తాక్షరి అను కొంతవరకు మంచిదయినా ఏడు
అక్షరములకు అర్థము లేదు. అటుల సప్తాక్షరి చెప్పినా కొంత లోపముగానే
యుండును.
మైత్రాయణ్యుపనిషత్తు.
35) ప్రశ్న :- మనోనిగ్రహము జ్ఞానము వలననే మోక్షము
లభించునని చెప్పారు. మనోనిగ్రహముకంటే మించిన
బోధ లేదని చెప్పారు. ఈ విషయము మైత్రాయణ్యుప
నిషత్తులో చెప్పియున్నారు. దానికి సంబంధించిన
శ్లోకమును, భావమును క్రింద చూడవచ్చును.
తావదేవ నిరోద్ధవ్యం హృది యావత్ క్షయం గతమ్,
ఏత జ్ఞానం చ మోక్షం చ శేషాస్తు గ్రంథ విస్తారాః. (4-11)
భావము :- సాధకుడు తన హృదయమందలి సంకల్పములు నిశ్శేషముగా
నశించి పోవువరకు మనస్సును నిగ్రహించవలెను. సంపూర్ణ మనోనిగ్రహమే
జ్ఞానము అదియే మోక్షము. తక్కిన బోధలన్నియు గ్రంథవిస్తారములే.
ఇక్కడ చెప్పిన భావము ప్రకారము మనోనిగ్రహమునకు సమానమైనది ఏదీ
లేదంటారా? దీనికి మీ జవాబు ఏమి?
జవాబు :- మనోనిగ్రహము అను దానిని బ్రహ్మవిద్యా శాస్త్రమయిన
భగవద్గీతలో 'బ్రహ్మయోగము' అని అంటారు. మనిషి దేవున్ని చేరుటకు
రెండు రకముల సాధనములు గలవు. అందులో ఒకటి బ్రహ్మయోగము,
రెండు కర్మయోగము అని చెప్పవచ్చును. బ్రహ్మయోగముగానీ, కర్మయోగము
గానీ రెండూ ధర్మయుక్తమైన యోగములే. ధర్మములకు సంబంధము లేని
ధర్మాతీతమగు యోగము కూడా మరొకటి కలదు. అదియే భక్తియోగము.
ఇందులో బ్రహ్మయోగము యందు మనస్సును నిగ్రహించడమే ముఖ్యమైన
పనిగాయున్నది. కర్మయోగమునందు అహమును నిగ్రహించడమే
ముఖ్యమైన పనిగాయున్నది. ధర్మముతో కూడుకొన్న మనోనిగ్రహమును
బ్రహ్మయోగమును మరియు అహమును అణచివేయు కర్మయోగమును
మనుషులు ఆచరించుటకు ఏది శ్రేష్ఠమైనదని అర్జునుడు భగవంతున్ని
అడిగినప్పుడు కర్మయోగము అను అధ్యాయమున మరియు కర్మాసన్న్యాస
యోగము అను అధ్యాయమున మొదటిలోనే మనోనిగ్రహముకంటే కర్మములు
చేయు కర్మయోగమే శ్రేష్ఠము అని చెప్పియున్నారు.
మనోనిగ్రహమును కర్మసన్న్యాసము అనియు, అహమును
నిగ్రహించడము కర్మయోగము అనియు భగవద్గీతలో చెప్పారు. ఈ రెండు
యోగములలో ఏ యోగము గొప్పది అని అర్జునుడు భగవంతుడయిన
కృష్ణున్ని అడిగినప్పుడు, కృష్ణుడు “మనోనిగ్రహము అను సన్న్యాసముకంటే
కర్మయోగము చేయుటే గొప్పది" అని చెప్పాడు. అర్జునుడు అడిగినది,
కృష్ణుడు చెప్పినది రెండూ క్రింద కర్మసన్యాస యోగ శ్లోకములలో
గమనిద్దాము.
అర్జునుడు ఇట్లన్నాడు :
శ్లో॥ 1. సన్న్యాసం కర్మణాం కృష్ణ! పునర్యోగం ద శంససి |
య చ్చేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ॥
భావము :- కర్మసన్యాసమును, కర్మయోగమును రెండిటిని తెలిపావు. ఈ
రెండిటియందు నాకు ఏది శ్రేష్ఠమో దానిని నిశ్చయించి చెప్పుము.
భగవంతుడిట్లనియె :-
శ్లో॥ 2. సన్న్యాసం కర్మయోగశ్చ నిశేయ సకరావుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసా కర్మయోగో విశిష్టతే ॥
భావము :- కర్మయోగ మార్గము, కర్మసన్యాసమను బ్రహ్మయోగ మార్గము
రెండూ మంచినే చేయును. అయితే రెండిటిలో జ్ఞానిచేయు మనోనిగ్రహ
బ్రహ్మయోగముకంటే కర్మయోగమే మిగుల గొప్పదని చెప్పవచ్చును.
ఈ విధముగా భగవద్గీతలో భగవంతుడు చెప్పియుండట వలన,
మనోనిగ్రహముకంటే కర్మలను ఆచరించు కర్మయోగమే శ్రేష్ఠమని
చెప్పియుండుట వలన, మైత్రాయణ్యుపనిషత్తులో చెప్పిన మనోనిగ్రహము
కంటే సమానమైనది లేదు అనుమాట అసత్యమని తెలియుచున్నది.
మనోనిగ్రహము అను బ్రహ్మయోగముకంటే అహమును నిగ్రహించు
కర్మయోగము మిగుల గొప్పదని చెప్పడము వలన, ఈ ఉపనిషత్తులో కూడా
లోపము కనిపించుచున్నదని చెప్పవచ్చును.
మైత్రేయోపనిషత్తు.
36) ప్రశ్న :- ఒక మనిషి నేనే దేవున్ని అనుకొన్నంత
మాత్రమున అతడు దేవుడు అగునా?యని ప్రశ్న
రాగలదు. ఈ విషయమును క్రింద మైత్రేయోపనిషత్తులో
చెప్పి యున్నారు చూడండి.
సర్వపూర్ణ స్వరూపో స్మి సచ్చిదానంద లక్షణః,
సర్వ తీర్థ స్వరూపోస్మి పరమాత్మా స్మృహరి శివః. (3-12)
భావము :- నేను సర్వత్ర పరిపూర్ణమైన స్వరూపము కలవాడను, సచ్చిదా
నంద స్వరూపుడను, సర్వతీర్థ స్వరూపుడను పరమాత్మను శివ స్వరూపుడను
అయియున్నాను.
అఖండాకాశరూపోస్మి హ్యఖండాకార మస్మ్యహమ్,
ప్రపంచముక్త చిత్తోస్మి ప్రపంచ రహితో స్మ్యహమ్. (3-20)
భావము :- నేను అఖండాకార స్వరూపుడను, అఖండాకార రూపుడను,
ప్రపంచ రహిత చిత్తుడను, ప్రపంచ రహితుడనై యున్నాను.
సర్వప్రకాశరూపోస్మి చిన్మాత్ర జ్యోతి రస్మ్యహమ్,
కాలత్రయ విముక్తోస్మి కామాది రహితో స్మ్యహమ్
(3-21)
భావము :- నేను సర్వప్రకాశ స్వరూపుడను, చిన్మాత్ర జ్యోతిస్వరూపుడను,
కాలత్రయ వర్జితుడను అయియున్నాను.
గన్తవ్యదేశహీనోస్మి గమనాది వివర్జిత ః,
సర్వదా సమరూపోస్మి శాంతోస్మి పురుశోత్తమః
(3-23)
భావము :- నేను గన్తవ్యమగు ప్రదేశము లేనివాడను, గమనాది రహితుడను
సదా సమరూపుడను శాంతుడను, పురుషోత్తముడను అయివున్నాను.
ఏవం స్వానుభవో యస్య సోహమస్మి న సంశయః, యశ్శృనోతి
సకృద్వాపి బ్రహ్మైవ భవతి స్వయం బ్రహ్మైవ భవతి స్వయమిత్యుపనిషత్
(3-24)
భావము :- ఈ ప్రకారముగా స్వానుభవము ఎవనికి కల్గియుండునో అతడు
నేనే దేవుడనయి ఉన్నాను. దీనిలో సంశయము లేదు. ఎవడు దీనిని
ఒకసారి అయినను వినునో అతడు స్వయముగా బ్రహ్మమే అగుచున్నాడు.
జవాబు :- ఈ విషయమున్న మైత్రేయోపనిషత్తును వ్రాసిన పెద్దాయన
ఎవరోగానీ, ఆయన వ్రాసిన వ్రాతనుబట్టి తనకు కూడా అనుభవము లేని
విషయమును చెప్పాడని తెలియుచున్నది. ఇంత లోతుగా వ్రాసిన వ్యక్తి
ముందు తాను జీవుడు నుండి దేవుడు అయివుండవలెను కదా! ఇతరులు
బ్రహ్మముగా మారుతారో లేదో గానీ, ముందు తాను మారివుంటే ఇది
సత్యము అని ఇతరులకు చెప్పాలి. మొట్టమొదట సూర్యునిచే జ్ఞానమును
వినిన మనువు కూడా ఆ జన్మలోగానీ తర్వాత జన్మలోగానీ మోక్షమును
పొందలేకపోయాడు. కృతయుగమునుండి చస్తూ పుట్టుతూ వచ్చి చివరకు
ద్వాపరయుగము చివరిలో భీష్ముడుగా పుట్టిన తర్వాత వృద్ధాప్యములో
మోక్షమును పొందాడు. ఆనాడు ప్రపంచానికే జ్ఞానమును తెలియజేసిన
మనువు చచ్చి పుట్టుచూ చివరికి భీష్ముని వరకు వచ్చాడు అంటే మోక్షము
అంటే ఎంత కష్టమైనదో అర్థము కాగలదు.
పై శ్లోకములలో చెప్పిన ప్రకారము నేను దేవున్ని అని అనుకొన్నంత
మాత్రమున ఎవడూ దేవుడు కానేరడు. ఏమీ తెలియని వారికి ఏమి
చెప్పినా నిజమేనేమో అని నమ్మగలరు. అలాగే నమ్మించుటకు ఈ
ఉపనిషత్తులో చెప్పారు తప్ప, మనిషి తాను బ్రహ్మమును అయివున్నాను
అనుకొన్నంత మాత్రమున ఎవడూ బ్రహ్మము కాలేడు. చాలామంది
అద్వైతులు ఈ విధముగానే చెప్పుచుందురు. జీవుడు కర్మలన్నీ అయిపోయిన
తర్వాత దేవునిగా మారుట వాస్తవమేగానీ, అది పూర్తి మనిషి యోగిగా
మారి తన కర్మలను యోగాగ్నిలో కాల్చుకొన్నప్పుడు మోక్షము పొంది
దేవునిగా మారవచ్చును. అట్లు అద్వైత సిద్ధాంతము చివరిలో నెరవేరగలదు.
ప్రస్తుతము మనిషి మొదట యోగిగా మారవలసియున్నది. దానికి మనిషి
ముందు జ్ఞానికావలెను. సంపూర్ణ జ్ఞాని అయిన తర్వాత యోగిగా మారితే
తర్వాత కర్మలు కాలు వరకు కొంతకాలముండి ఎన్నో జన్మలు యోగిగా
బ్రతికిన తర్వాత అద్వైత సిద్ధాంతము ప్రకారము జీవుడే దేవుడు కాగలడు.
మనిషి అనగా జీవుడుగా యున్నవాడు ఒక శరీరములో నివశించు
చుండును. శరీరము ప్రకృతి సంబంధముకాగా, జీవుడు ఆత్మ సంబంధముగా
యున్నాడు. కొంత వివరముగా చెప్పుకొంటే ప్రకృతి అనగా స్త్రీ తత్త్వము
(స్త్రీ లింగము) అనీ, అట్లే ఆత్మ అనగా పురుషతత్త్వము (పురుష లింగము)
అనీ చెప్పవచ్చును. జీవుడు కూడా జీవాత్మయని ఒక ఆత్మగా చెప్పబడు
చున్నాడు. కావున జీవాత్మను పురుషునిగా, జీవాత్మ నివశించు శరీరమును
స్త్రీగా చెప్పుచున్నాము. స్త్రీతత్త్వమైన శరీరములో పురుష తత్త్వమైన మూడు
ఆత్మలు గలవు. వాటిని వరుసగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మయని
చెప్పుచున్నాము. ప్రకృతి శరీరములో కర్మలు అను తాల్లతో కట్టబడియున్న
జీవాత్మ తన కర్మ బంధనములన్నీ తెంచుకొన్న తర్వాత కర్మ బంధములు
లేనివాడై చివరకు పరమాత్మతో కలిసిపోవడమును మోక్షము అని అంటాము.
సజీవముగా యున్న మనిషి నిర్జీవముగా దేవునిలో కలియుటకు
మొదట జీవాత్మకు పరమాత్మకు మధ్యలోయున్న ఆత్మను తెలియవలసి
యుంటుంది. జీవునికి దేవునికి ఆత్మ మధ్యవర్తిలాంటిది. ఆత్మ ద్వారానే
ఎవడయినా దేవుడయిన పరమాత్మను చేరవలెనుగానీ ఆత్మను తెలియనిదే
ఏ జీవాత్మ పరమాత్మను చేరలేదు, మోక్షమును పొందలేడు. మొదట
మూడు ఆత్మలుగా యున్న జీవుడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను వరుసలో
యున్నాడని చెప్పవచ్చును. త్రైతముగా యున్న జీవుడు మొదట ఆత్మలో
చేరిపోయినప్పుడు యోగి అని అనిపించుకొనును. యోగము అనగా
కలయిక. జీవాత్మ ఆత్మతో కలియడమును యోగము అనవచ్చును. ఇట్లు
త్రైతముగా యున్నవాడు అనగా మూడవ వానిగాయున్న జీవుడు ఆత్మ
సంబంధముగా, ఆత్మగా మారిపోవుట వలన ద్వైతముగా (రెండు) గా
మారిపోవుచున్నాడు. జీవాత్మ ఆత్మగా మారిన తర్వాత, ఆత్మ పరమాత్మగా
మారిపోగలదు. అప్పుడు ఆత్మలో యున్న జీవాత్మ పరమాత్మలోనికి
పోవుచున్నాడు. జీవాత్మ, ఆత్మ ద్వారా పరమాత్మలో కలిసిపోవడమును
మోక్షము అని అంటున్నాము. అప్పుడు జీవాత్మ, ఆత్మ రెండు లేకుండాపోయి
పరమాత్మ ఒక్కడే యుంటున్నాడు. అప్పుడు మనిషి అద్వైతమును
పొందుచున్నాడు. అద్వైతము అనగా పరమాత్మ ఒక్కడేయనీ, ద్వైతము
అనగా ఆత్మ, పరమాత్మ రెండుయని, త్రైతము అనగా జీవాత్మ, ఆత్మ,
పరమాత్మ మూడుయని చెప్పవచ్చును. మొదట త్రైతములో యున్న సాధారణ
మనిషి జ్ఞానిగా మారి యోగియైతే అప్పుడు ద్వైతిగా మారిపోయాడు అని
చెప్పవచ్చును. తర్వాత ఆత్మ కూడా లేకుండా పోయి పరమాత్మలో కలిసిపోతే
అప్పుడు అద్వైతిగా మారిపోయాడని చెప్పవచ్చును. దానినిబట్టి సాధారణ
మనిషి ఎల్లప్పుడు త్రైతములో త్రైతిగా యున్నాడని చెప్పవచ్చును. అటువంటి
మనిషి యోగమును పొంది యోగిగా మారితే అప్పుడు ద్వైతములో ద్వైతిగా
యున్నాడని చెప్పవచ్చును. చివరకు మనిషి మోక్షమును పొందితే అప్పుడు
అద్వైతములో అద్వైతిగా మారిపోయాడని చెప్పవచ్చును. ఇట్లు మనిషి
మూడవ దశ పొందినప్పుడు మోక్షములో పరమాత్మగా మారిపోగలడు.
ఇట్లు ఇంత తతంగము జరుగ వలసియుండగా, 'నేను దేవున్ని' అని
అనుకొన్నంతమాత్రమున దేవుడు అగునని చెప్పడము ఈ ఉపనిషత్తులో
లోపమేయని చెప్పవచ్చును.
శుక రహస్యోపనిషత్తు.
37) ప్రశ్న :- క్రింద చెప్పిన శ్లోకములో ప్రజ్ఞానమును
గురించి చెప్పియున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ అని వేద
సారాంశముగా మరొకచోట గలదు. ఈ శుక రహస్య
ఉపనిషత్తులో చెప్పిన ప్రజ్ఞానమునకు వేదముల
సారమయిన ప్రజ్ఞానమునకు ఏమయినా తేడా
గలదా!యని అడుగు చున్నాము?
శ్లో॥
యేనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతిచ,
స్వాద్వ స్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితమ్.
(3-1)
భావము :- జీవుడు దేనిని చూచుచున్నాడో, వినుచున్నాడో, వాసన చూచు
చున్నాడో, మాట్లాడుచున్నాడో, రుచి చూచుచున్నాడో అదియే ప్రజ్ఞానమని
చెప్పబడినది.
జవాబు :- 'ప్రజ్ఞానం బ్రహ్మ'యని వేదసారాంశము అని కొందరు
వేదవాదులు చెప్పగా విన్నాము. ప్రజ్ఞానమే దేవుడు అనిగానీ, ప్రజ్ఞానమే
ఆత్మయని గాని దాని అర్థము. ఆత్మను బ్రహ్మయనడము జరుగుచున్నది.
బ్రహ్మ యనగా దేవుడు అని కూడా అర్థము గలదు. ఇక్కడ ఈ ఉపనిషత్తులో
నాలుగు జ్ఞానేంద్రియ జ్ఞానములను ప్రజ్ఞానమని చెప్పారు. తర్వాత ఇక
కర్మేంద్రియ కార్యమును అనగా నోరు మాట్లాడడమును కూడా ప్రజ్ఞానము
లోనికి కలిపివేశారు. శరీరములోని ఐదు జ్ఞానేంద్రియములయిన కన్ను,
చెవి, ముక్కు, చర్మము, నాలుక అను వాటికి మాత్రమే బయట ప్రపంచము
లోని విషయములను గ్రహించుకొను జ్ఞానముండును. అందువలన ఈ
ఐదును మాత్రమే జ్ఞానేంద్రియములని అన్నాము. అట్లే స్థూల శరీరమునకు
గల పది ఇంద్రియ భాగములలో ఐదు జ్ఞానేంద్రియములు కాగా, మిగతా
ఐదు కర్మేంద్రియములుగా యున్నవి. కర్మేంద్రియములు ఐదు వరుసగా
కాళ్ళు, చేతులు, నోరు, గుదము, లింగము అని చెప్పవచ్చును.
కర్మేంద్రియములు శరీరములోని కర్మనుబట్టి బుద్ధి నుండి వచ్చిన ఆజ్ఞ
ప్రకారము పనిని చేయుచుండును. కేవలము పనిని చేయు భాగములు
అయినందున వీటిని కర్మేంద్రియములు అని అన్నారు. కర్మేంద్రియములకు
ప్రపంచ జ్ఞానమును గ్రహించుకొను శక్తియుండదు. అయితే ఈ
ఉపనిషత్తులో జ్ఞానేంద్రియములలోనికి కర్మేంద్రియమైన నోరు మాట్లాడు
పనిని కలిపి చెప్పడము పెద్ద తప్పు. ఉపనిషత్తులు అని గొప్ప పేరుపెట్టి
వ్రాసిన వారికి శరీరములోని జ్ఞానేంద్రియములేవో, కర్మేంద్రియములేవో
తెలియక పోవడము అజ్ఞానము కాదా! కర్మేంద్రియమునకు జ్ఞానమున్నదని
జ్ఞానేంద్రియములలో కలుపడము ఇక్కడ పెద్ద లోపముగా యున్నది.
శరీరమునకు ఐదు జ్ఞానేంద్రియములు గలవు. ఈ ఐదు ప్రపంచ
జ్ఞానమును తెలియజేయుచున్నవి. అంతేగానీ దేవుని జ్ఞానమునుగానీ,
ఆత్మజ్ఞానమునుగానీ తెలియజేయడము లేదు కదా! ఆత్మజ్ఞానమును
ప్రజ్ఞానము అని చెప్పినా సరిపోవునుగానీ, ప్రపంచ జ్ఞానమును ప్రజ్ఞానమని
చెప్పడమేమిటని మేము ప్రశ్నించుచున్నాము. ప్రజ్ఞానమే బ్రహ్మయని
కొందరు వేదములను తెలిసినవారు చెప్పుచున్నారు కదా! ఆ మాట ప్రకారము
ప్రజ్ఞానము దేవునికి సంబంధించినదిగా ఉండవలెను. అయితే ఇక్కడ
శుకరహస్యోపనిషత్తు యందు శరీర జ్ఞానేంద్రియములు జ్ఞానమయిన
చూచుట, వినుట, రుచి చూచుట, వాసన చూచుట, స్పర్శ మొదలగు
శరీర ఇంద్రియ జ్ఞానములను ప్రజ్ఞానమని చెప్పడము వింతగా యున్నది.
ప్రపంచ జ్ఞానమును ప్రజ్ఞానమనీ లేక దైవజ్ఞానమని చెప్పడము
చింతకాయను నిమ్మకాయ అని చెప్పినట్లున్నది. దైవజ్ఞానము, ప్రపంచ
జ్ఞానము రెండు జ్ఞానములు అయితే ఏ జ్ఞానము ఎటు పోతుందని తెలియక
రెండిటినీ కలిపి చెప్పడము పెద్ద లోపము. నిమ్మకాయలో పులుపే
అలాగే చింతకాయలో పులుపే ఉంటుంది. అయితే ఏ
పులుపును ఎక్కడ వాడుతామని తెలియక పోతే వానికి ప్రపంచ జ్ఞానమే
ఉంటుంది.
తెలియదు అన్నట్లు దైవజ్ఞానము ప్రపంచ జ్ఞానము రెండూ జ్ఞానములే అయినా
ఏది మోక్షమునకు పనికి వచ్చునో తెలియకపోతే, వానికి పూర్తి దైవజ్ఞానము
తెలియదని చెప్పవచ్చును.
ప్రజ్ఞానము అనగా దైవజ్ఞానము అయినందున అది మోక్ష సాధనకు
పనికి వచ్చును. ప్రపంచ జ్ఞానము అనగా అది ప్రపంచ కార్యసాధనకు
పనికి వచ్చును. అందువలన భగవద్గీతలో జ్ఞానయోగము అను
అధ్యాయమున 'జ్ఞాన యజ్ఞము' శ్రేష్ఠమైనది యని చెప్పియున్నారు. యజ్ఞము
అనగా కాల్చునది, బూడిద చేయునదియని అర్థము. ప్రపంచ సంబంధ
ఐదు జ్ఞానములను కాల్చివేయడము అని చెప్పుచూ జ్ఞానయజ్ఞము శ్రేష్ఠమైనది
యని అన్నారు. కడుపులో జఠరాగ్ని చేత తినిన ద్రవ్యములను యజ్ఞము
(కాల్చడము) కంటే బయట జ్ఞానేంద్రియముల ప్రపంచ జ్ఞానములను
యోగాగ్ని (జ్ఞానాగ్ని) చేత కాల్చడము శ్రేష్ఠము అని ఆ శ్లోకములో
చెప్పియుండగా, ఈ ఉపనిషత్తులో ఇంద్రియ జ్ఞానములను ప్రజ్ఞానమని
చెప్పడము పెద్ద తప్పు, తీరని లోపమని తెలియవలెను.
తేజబిందూపనిషత్సు.
38) ప్రశ్న:- నీవున్నావు నేనున్నాను. నేను నిన్ను ప్రశ్న
అడుగుచున్నాను. మీరు నాకు జవాబు చెప్పుచున్నారు.
నేను లేకపోతే, నీవు కూడా లేకపోతే నేను ప్రశ్న అడిగేది
ఉండదు, మీరు జవాబు చెప్పేది ఉండదు. మనము
ఇద్దరము ఉన్నాము కాబట్టి ప్రశ్న జవాబు అను మూడవ
పని జరుగుచున్నది. ఒకప్పటికి మనము ఇద్దరము
లేకుండా పోయాము అనుకొంటే, మనము లేము
కావున మన మధ్యలో జరుగు కార్యము కూడా ఉండదు.
అట్లే ఇప్పడే మనము లేకుండా పోయాము
అనుకుందాము. అప్పుడు మన మధ్య ఏ కార్యముండదు.
మనము ఉన్నాము లేము అనేదానికి సాక్ష్యముగా మన
మధ్యలో కార్యములున్నాయి.
ఒక పురుషుడు ఒక స్త్రీ యుంటే వారి ఇద్దరి
కలయిక వలన వారికి సంతానము కలుగవచ్చును.
ఇప్పుడు మనమున్నాము అంటే మన తల్లి తండ్రులు ఉన్నట్లే
కదా! మన తల్లి తండ్రులున్నారు అంటే గతములో వారి
తల్లి తండ్రియున్నట్లే కదా! నేను గానీ, నీవు గానీ, ఈ
ప్రపంచములో ఎవరుగానీ లేరు అంటే గతములో మన
పెద్దలు లేనట్లే, అలాగే ఇప్పుడు మనము లేకపోతే
భవిష్యత్తులో మన వారసులు కూడా లేనట్లే. అయితే
గతములో మన పెద్దలున్నారనుట సత్యమైతే ఇప్పుడు
మనమున్నామనుట సత్యము. తర్వాత భవిష్యత్తులో
మనవారసులుంటారనుట కూడా సత్యమే. సృష్ఠి,
సృష్టికర్త ఉండగా సృష్టింపబడినది ఉన్నదనియే చెప్పాలి.
అట్లు కాకుండా సృష్టి లేదు, సృష్టికర్త లేడు, ఎవరూ లేరు
అన్నప్పుడు ఆ మాట చెప్పేవాడు కూడా లేడు కదా!
అటువంటప్పుడు అతడు ఎవరున్నారని చెప్పుచున్నావు.
చెప్పేవానివి నీవుంటే వినేవాడు కూడా ఉండును కదా!
ఒకనికి తిక్కముదిరినప్పుడు రోకలిని తలకు
చుట్టమని చెప్పాడంట. రోకలి నిటారుగా, కొయ్యతో
చేయబడినది కదా! అది వంగదు కదా! అటువంటప్పుడు
పిచ్చిపట్టిన వాడు నా తలకు రోకలి చుట్టండి అనేమాటను
విని అందరూ నవ్వుతారు. అలా చెప్పిన వానికి పిచ్చి
పట్టింది, మతి స్థిమితము లేక అలా మాట్లాడుచున్నాడు
అని అంటారు. అదే విధముగా క్రింది శ్లోకములు
తేజబిందూపనిషత్తులో చెప్పియున్నారు చూడండి.
ఇదం ప్రపంచం నాస్త్యేవ నోత్పన్నం నో స్థితం క్వచిత్ (5-31)
భావము :- ఈ ప్రపంచము వాస్తవముగా లేదు. ఇది ఉత్పన్నం కాలేదు.
స్థితి గలిగి యుండలేదు.
చిత్తం ప్రపంచ మిత్యాహు ర్నాస్తి నాస్త్యేవ సర్వదా
(5-32)
నీ ప్రపంచం నచిత్తాది నాహంకారో న జీవకః
భావము :- ప్రపంచము వాస్తవముగా ఎన్నడును లేనేలేదు. ప్రపంచముగానీ,
చిత్తాదులుగానీ, అహంకారము గానీ, జీవుడుగానీ లేనే లేరు.
||
మాయాకార్యాధికం నాస్తిమాయా నాస్తిభయం నహి
కర్తా నాస్తి క్రియా నాస్తి శ్రవణం, మననం నహి
(5-33)
భావము :- మాయ కార్యాదులు లేనే లేవు. మాయ లేదు కావున భయము
లేదు. కర్త లేదు, క్రియలేదు. మననము లేదు.
జవాబు :- ఎవనికో పిచ్చి ముదిరి రోకలిని తలకు చుట్టమన్నట్లు మీరు
చెప్పారు. వాస్తవముగా ఈ శ్లోకములను చూచిన తర్వాత “నేనే ముదిరినాను
నన్ను రోకలికి చుట్టండి” అన్నట్లున్నది. మొత్తానికి మనము ఎవరూ లేము,
మాయలేదు, కర్తలేడు, క్రియలేదు అన్నప్పుడు ఎవనికి కర్మలు కూడా లేనట్లే
కదా! కర్మలేదు, పుట్టుకలేదు, మాయలేదు అన్నప్పుడు ఆ మాటలు చెప్పేవాడు
ఎక్కడి నుండి చెప్పినట్లు, ఎవరికి చెప్పినట్లు లెక్కించవలెను. ఏమీ లేదు,
ప్రపంచమే లేదు అన్నప్పుడు చెప్పేవానిని నేను లేను, వినే వానివి నీవు
లేవు అన్నట్లే కదా! ఇద్దరూ లేనప్పుడు మధ్యలో ఈ గ్రంథమెందుకు
చదవాలి. ఈ ఉపనిషత్తు మాట ఎందుకు వినాలి? మిగతా ఉపనిషత్తులలో
దేవుడు, మాయ, జీవుడు, జ్ఞానము, అజ్ఞానము, దేవతలు అని చెప్పిన
మాటలు అన్నీ అసత్యమా? అంతెందుకు ఇదే తేజ బిందూపనిషత్తులో
మరొకచోట ఏమి వ్రాశారో చూద్దాము.
అహమేవ హరిస్సాక్షా దహమేవ సదాశివ ః,
శుద్ధ చైతన్య భావోహం శుద్ధ సత్వాను భావనః (6-64)
భావము :- నేను సాక్ష్యాత్తు హరిని, నేనే సదాశివుడను, నేనే శుద్ధ చైతన్య
స్వరూపుడను, శుద్ధ సత్యము యొక్క అనుభవము కలవాడను.
మొదట ఈ ప్రపంచమే లేదు అనిన అతనే, ఇప్పుడు ఈ శ్లోకములో
నేను సాక్ష్యాత్తు హరిని, సదాశివుడను, చైతన్య స్వరూపుడను, శుద్ధ సత్యము
యొక్క అనుభవముగల వాడనని ఎలా చెప్పాడు? ప్రపంచమే లేదు అసలకది
పుట్టనే లేదు అన్నప్పుడు విష్ణువు ఎందుకున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు,
నీకు అనుభవములు ఎక్కడివి? అని మేము అడుగవచ్చును కదా! ఒకచోట
మాయలేదు అన్నవానివి మరొకచోట నాకు అనుభవములున్నవని చెప్పడము
అసత్యము చెప్పినట్లు కాదా! ఎంతో బాధ్యతగా జ్ఞానము చెప్పవలసినవారు
తమ ఉపనిషత్తులలో ఇలా వ్రాయడము ఉన్న ప్రపంచమును లేదు అనడము
అజ్ఞానమార్గములో చెప్పినట్లు కాదా! అందరము ఉండి అన్ని అనుభవములు
ఉన్నప్పుడు, అది అందరికీ తెలుస్తున్నప్పుడు ఏమీ లేదు, మనము పుట్టనే
లేదు అంటే అలా చెప్పేవానికి తిక్కముదిరింది యని చెప్పక తప్పదు.
పరమాత్మ భగవంతునిగా పుట్టి భగవద్గీతను చెప్పినప్పుడు
ప్రపంచము ఉంది, మనుషులు యున్నారు. వారిలో గుణములు ఉన్నవని
చెప్పాడు కదా! మనిషిగా అవతరించిన దేవునికి నీకు తెలిసినంత తెలియదా!
దేవుడు మనుషులు యున్నారు. మాయ, మనుషులలో గుణముల రూపములో
యున్నదని చెప్పడమేకాక, తన బోధను పదునెనిమిది అధ్యాయముల
భగవద్గీత గ్రంథముగా చెప్పియున్నాడు. ఎంతో బాధ్యతగా దేవుడు
మనుషులకు జ్ఞానమును చెప్పితే, ఏమీ తెలియనివారు ఎవరూ లేరు, ఏదీ
లేదు అనడము పూర్తి తప్పుకాదా! అందువలన తేజబిందూపనిషత్తులో ఇది
పెద్ద లోపముగా యున్నదని చెప్పుచున్నాము.
పైంగలోపనిషత్తు.
39) ప్రశ్న :- మీరు శాస్త్రప్రమాణము లేని జ్ఞానము ప్రజలకు
సరియైనది కాదు అని చెప్పారు. అంతేకాక దేవుడు
భగవంతునిగా వచ్చినప్పుడు ఆయన చెప్పు మాటలే
శాస్త్రములుగా ఉంటాయి. మనుషులు శాస్త్రమును
చూచి ముందుకు పోవలెను. భగవంతుడు శాస్త్రమును
చూడకనే బోధించును. అయినా ఆయన చెప్పినవన్నీ
శాస్త్రమునకు సంబంధించిన జ్ఞానమే యుండునని
గతములో మీరు చెప్పారు. ఇప్పుడు పైంగలోపనిషత్తులో
మీరు చెప్పిన మాటకు వ్యతిరేఖముగా శాస్త్రమును
సమూలముగా వదలి సత్యమగు దేవున్ని ఆరాధించవలె
నని చెప్పారు. అట్లు చేయుట శాస్త్రవిరుద్ధము అగును
మరియు అసత్యమార్గము అగును. అటువంటప్పుడు
సత్యము అయిన దేవుని ఎలా తెలియనగును? ఈ
విషయమును చెప్పిన పైంగలోపనిషత్తునందలి క్రింది
శ్లోకము చూడండి.
శ్లో॥ విజ్ఞేయో క్షర తన్మాత్రో జీవితం చాపి చంచలమ్,
విహాయ శాస్త్రా జాలాని యత్సత్యం తదుపాస్యతామ్. (చతుర్థోధ్యాయః)
భావము :- అక్షరమగు పరమాత్మను ఎరుంగవలెను. జీవితము
చంచలమైనది. శాస్త్రసమూలములను వదలి సత్యమగు పరమాత్మను
ఉపాశించవలెను.
జవాబు :- శాస్త్రము అనగా సత్యము అని ఒక విధముగా చెప్పవచ్చును.
ఇంకా వివరముగా చెప్పితే శాస్త్రము అనగా శాసనములతో కూడుకొన్నదని
చెప్పవచ్చును. శాసనము అనగా అమలు జరిగి తీరునదని చెప్పవచ్చును.
శాసనము అను పదము శాపము అను శబ్దము నుండి పుట్టినది. శాస్త్రము
కొన్ని సిద్ధాంతములతో లేక కొన్ని సూత్రములతో తయారయి ఉండును.
భూమిమీద శాస్త్రములు ఆరు గలవు. వాటినే షట్ శాస్త్రములు అని
అంటాము. ఆరు శాస్త్రములు వరుసగా ఈ విధముగా గలవు. 1) గణిత
శాస్త్రము 2) ఖగోళ శాస్త్రము 3) రసాయన శాస్త్రము 4) భౌతిక శాస్త్రము
5) జ్యోతిష్య శాస్త్రము 6) బ్రహ్మవిద్యా శాస్త్రము. ఆరు శాస్త్రములలో ఐదు
శాస్త్రములు ప్రపంచమునకు సంబంధించినవి కాగా, చివరిలో యున్న
బ్రహ్మవిద్యా శాస్త్రము ఒక్కటి మాత్రము దేవునికి, దేవుని జ్ఞానమునకు
సంబంధించిన శాస్త్రముగా చెప్పబడుచున్నది.
బ్రహ్మవిద్యా శాస్త్రము అనగా ఆత్మ విద్యా శాస్త్రము అని అర్థము.
ఆత్మవిద్యను ఆధ్యాయనము చేయడమే ఆధ్యాత్మికము అని అంటారు. ఇక్కడ
పై శ్లోకములో పరమాత్మను తెలియవలెనని చెప్పుచూ, శాస్త్రములను
సమూలముగా వదలి పరమాత్మను ఆరాధించవలెను అని చెప్పారు. బ్రహ్మ
విద్యా శాస్త్రము ఆత్మను గురించి జ్ఞానమును తెలియజేయును గానీ, పరమాత్మ
జ్ఞానమును చెప్పదు. అంతేకాక శాస్త్రములను వదలి పరమాత్మను
ఆరాధించమని ఈ ఉపనిషత్తులో చెప్పడము పెద్ద తప్పుగా యున్నది. ఎంత
పెద్ద జ్ఞాని అయినా ఆత్మను తెలిసి ఆరాధించవచ్చును గానీ, పరమాత్మను
ఆరాధించుటకు సాధ్యము కాదు. పరమాత్మను ఆరాధించుటకు ఆయన
ఫలానావాడు అని చెప్పుటకు పరమాత్మకు పేరు లేదు, రూపము లేదు.
ఫలానా పని చేయువాడని చెప్పుటకు కూడా వీలుపడదు ఎందుకనగా!
పరమాత్మకు కార్యములు కూడా లేవు. ఏదీ కాని వాడు, ఎవరికీ తెలియని
వాడు పరమాత్మ అయినందున ఆయనను ఎవరూ ఉపాశించుటకు
సాధ్యపడదు. శాస్త్రములు కూడా ఆయనను తెలుపలేవు. అట్లే పరమాత్మ
ధర్మములకు కూడా అతీతుడు. ధర్మములన్నియూ ఆత్మను తెల్పునవేగానీ
పరమాత్మను తెలుపు ధర్మములు ఉండవు. అందువలన సర్వ ధర్మములను
వదలి నన్నే ఆశ్రయింపుమని భగవద్గీతలో మోక్ష సన్న్యాసయోగమున అరవై
ఆరవ (66) శ్లోకమున చెప్పియున్నారు. “సర్వ ధర్మాన్ పరిత్యజ్య మా
మేకం శరణం వ్రజ” అని చెప్పారు. అలా ధర్మములకు అతీతునిగా
యున్న పరమాత్మను శరణు పొందితే ఆయన మనలను పాపముల నుండి
కాపాడును. పాపముల నుండి ఆత్మ రక్షించలేడు, కర్మలను లేకుండా
క్షమించగలుగు శక్తి పరమాత్మకు మాత్రముండును. అంత గొప్ప
పరమాత్మను ఎవరయినా శరణువేడవలసిందేగానీ, ఆరాధించకూడదు.
అయితే అన్నిటికీ విరుద్ధముగా పైంగలోపనిషత్తునందు పరమాత్మను
ఆరాధించవలెనని చెప్పడము పెద్ద తప్పు.
మహోపనిషత్తు.
40) ప్రశ్న :- దేహమునకు లోపల వెలుపల, పైన క్రింద
దశ దిశలు ఇటు అటు అంతటను ఆత్మయే కలదు. ఆత్మ
లేకుండా జగత్తు లేదు అని చెప్పారు. దేహమునకు
బయట అంతటా ఆత్మయున్నదా? అని మేము అడుగు
చున్నాము. నేడు గ్రంథములలో వ్రాసినది సత్యములని
నమ్ముటకు అవకాశము లేదు. అందువలన సత్యమును
తెల్పండి.
సబాహ్యా భ్యన్తరే దేహే హ్యథ ఊర్థ్వం చ దిక్షుచ,
ఇత ఆత్మా తతో స్వాత్మా నాస్త్య నాత్మ మయం జగత్. (6-10)
భావము :- దేహమునకు లోపల బయట క్రింద మీద మొత్తము దశ దిశలు
అంతటా ఆత్మయే కలదు. అనాత్మగా ఆత్మ లేకుండా ఎక్కడా లేదు.
జగత్తు అంతటా ఆత్మ నిండుకొని యున్నది.
జవాబు :- దేహము అనగా దేహి కలది అని అర్థము. దేహి అనగా ఆత్మ
అనియు, దేహమును ధరించి యున్నదనియు అర్థము చెప్పవచ్చును. ఆత్మకు
ముందు వెనుక రెండు ఆత్మలు గలవు. అందులో ఒకటి జీవాత్మకాగా,
రెండవది పరమాత్మయని చెప్పవచ్చును. వరుస క్రమముగా చెప్పితే జీవాత్మ,
ఆత్మ, పరమాత్మయని చెప్పవచ్చును. జీవాత్మను మూడుగా, ఆత్మను ఆరుగా,
పరమాత్మను తొమ్మిదిగా గుర్తించియున్నాము. ఈ మూడు ఆత్మలను
వివరముగా చెప్పుకొంటే జీవాత్మ, ఆత్మ రెండు జోడు ఆత్మలుగా
కలిసియుంటూ శరీరములో నివశించుచున్నవి. పరమాత్మ శరీరము లోపల,
శరీరము బయట అణువు అణువునా వ్యాపించియున్నాడు. అందువలన
పరమాత్మను అంతులేనివాడుయని చెప్పవచ్చును.
శరీరములో యున్నవారు, శరీరములో లేనివారు అని మూడు
ఆత్మలను రెండు భాగములుగా విభజించవచ్చును.
శరీరములో యున్నవారు = జీవాత్మ, ఆత్మ;
శరీరములో లేనివాడు =పరమాత్మ.
మరొక విధముగా కర్మలు యున్నవారు, కర్మలు లేనివారని మూడు ఆత్మలను
రెండు భాగములగా విడదీసి చెప్పవచ్చును.
కర్మలుయున్నవారు =జీవాత్మ
కర్మలు లేనివారు =ఆత్మ,
పరమాత్మ.
ఈ విధముగా కర్మలను బట్టి, శరీరములో గల వారిని బట్టి రెండు
విధములుగా విభజించి చూస్తే రెండు గుంపులలోను ఆత్మ కలదు. జీవాత్మ
కర్మలుగలవాడై వాటిని అనుభవించుటకు శరీరములో చిక్కుకొనియున్నాడు.
ఆత్మ జీవుని పాలిటి యమధర్మరాజుగా శరీరములో యుండి, జీవుని చేత
కర్మలను అనుభవింపజేయుచున్నది. జీవాత్మ, ఆత్మ శరీరములో యుండగా,
పరమాత్మ శరీరము లోపల, శరీరము బయట అంతటా వ్యాపించియున్నాడు.
ఇంకా వివరముగా చెప్పితే జీవాత్మ శరీరములో తలయందు ఎవరికీ
కనిపించక యున్న గుణచక్రములోని గుణముల మధ్య నివశించుచున్నది.
అట్లు జీవాత్మ దేహములో ఒక్కచోట రవ్వంతగాయుండగా, ఆత్మ
శరీరమంతయూ వ్యాపించి యున్నది. ఆత్మ శరీరమంతా యుండడమే
కాకుండా శరీరములోని జీవునికి అధిపతిగా యుండి, జీవుడు గతములో
సంపాదించుకొన్న కర్మలను అనుభవించునట్లు ఆత్మ ఎల్లప్పుడూ చేయు
చున్నది. శరీరములోని ప్రతి పనిని ఆత్మ చేయుచూ ఆ పనిలోని
అనుభవములను జీవుని చేత అనుభవింపజేయుచున్నది. ఆత్మ తన శక్తి
చేతనే పుట్టింది మొదలు మరణించువరకు శరీరమును కదలునట్లు
చేయుచున్నది. ఇక పరమాత్మ విషయమునకు వస్తే పరమాత్మ శరీరము
లోపల, శరీరము బయట అణువణువునా వ్యాపించి యున్నాడు. ఆయన
శరీరములో జీవాత్మకు, ఆత్మకు సాక్షిగా యున్నాడు తప్ప ఏమీ చేయువాడు
కాదు. ఈ విధముగా శరీరములో జీవాత్మ ఆత్మలు ఉండగా, శరీరము
లోపల బయట పరమాత్మగలడు. దీనినిబట్టి ఆత్మ బయట లేదని
చెప్పవచ్చును. అయితే ఈ మహోపనిషత్తులో ఆత్మ శరీరము బయట
లోపల యున్నదని చెప్పడము పెద్ద లోపముగా యున్నదని చెప్పవచ్చును.
ఈ విధముగా 1108 ఉపనిషత్తులలో అక్కడక్కడ అనేక లోపములు
కనిపించుచునే ఉన్నవి. ఉపనిషత్తులను వ్రాసిన వారు సాధారణ మనుషులే
అయివుండడము చేత ఈ విధముగా లోపములున్నవని చెప్పుచున్నాము.
పరమాత్మ భగవంతునిగా భూమిమీదికి వచ్చి చెప్పిన జ్ఞానము మూడు దైవ
గ్రంథములుగా యున్నది. అందులో ప్రథమ దైవగ్రంథము భగవద్గీతయని
చెప్పుచున్నాము. భగవద్గీత మిగతా రెండు దైవ గ్రంథములకు కూడా
ఆధారముగా యున్నది. భగవద్గీతలో కూడా కొన్ని లోపములు కనిపించినా
వాటిని మనుషులు మధ్యలో చేర్చారని చెప్పవచ్చును. దేవుడు చెప్పిన
జ్ఞానములో ఏ లోపము కనిపించడము లేదు. మనుషులు చెప్పిన
జ్ఞానములోనే లోపములు కనిపించుచున్నవి. మూడు దైవగ్రంథములలో
అక్కడక్కడా మనుషుల వ్రాతలు కలిసియున్నట్లు తెలియుచున్నది.
అందువలన అటువంటి లోపములను కాకుండా సక్రమమైన జ్ఞానమునే
తెలియునట్లు లోపముల ఎడల జాగ్రత్తగా యుండునట్లు ఉదాహరణకు
కొన్నిటియందు గల అజ్ఞానముతో కూడుకొన్న మాటలను మీకు కనిపించు
నట్లు ఈ గ్రంథములో వ్రాశాము. జ్ఞాన జిజ్ఞాసులు అజ్ఞానములో అడుగు
పెట్టకుండా ముందే జ్ఞానముగా కనిపించు వాటియందు అజ్ఞానము
ఎట్లుండునో కొంత చూపగలిగాను. అంతేగానీ నేను గొప్ప ఇతరులు
తక్కువ అన్నట్లు చెప్పలేదు. ఉపనిషత్తు అనుమాట గొప్ప జ్ఞానముతో
కూడుకొన్నదని చెప్పాము. అంత గొప్ప పేరున్న ఉపనిషత్తులలో కనిపించు
నట్లున్న లోపములను కొన్నింటిని మీకు చూపించడము జరిగినది.
ఒక విషయమును సమర్థించుటకు శాస్త్రము ఎంత అవసరమో, అట్లే
ఒక విషయమును ఖండించుటకు శాస్త్రము అంతే అవసరమగును.
అసత్యమును వేయిమంది చెప్పినా, అది సత్యము కాదు,
సత్యమును వేయిమంది కాదనినా, అది అసత్యము కాదు.