48. మధ్యతరగతి మహాభారతం.
సగటు ఉద్యోగికి ఒకటో తారీఖు
కలిగే సంతోషం.. మర్నాటికి
ఉండదు. పదో తేదీ వచ్చేసరికి
చేబదుళ్లు, నెలాఖరున చేతిలో
చిల్లిగవ్వ లేక 'ఈ మధ్యతరగతి
బతుకులింతే!' అని ఇదై పోవడాలు
రొటీన్! మిడిల్ క్లాస్ పరీక్షలు
తట్టుకొని నిలబడితే గానీ, అప్పర్
మిడిల్ క్లాస్లోకి ఎంట్రీ దొరకదు.
అక్కడ కూడా దెబ్బ తినకుండా
ఉండగలిగితే రిచ్ క్లాస్లో ఎంట్రీ
దొరుకుతుంది.
మావి మధ్యతరగతి జీవితాలు బాబు! రాస్తే రామాయణమంత..
వింటే భారతమంత!' అంటూ కడుపేదవాడి కన్నా దీనంగా మహా
నటులు చెప్పిన డైలాగులు ఎన్నో సినిమాల్లో చూశాం. విన్నాం! ఇంతకీ ఎవరీ
మిడిల్ క్లాస్? వీరిలో బోలెడన్ని రకాలు! లేని ధనాన్ని ముందుగానే ఎలా ఖర్చు
పెట్టాలో ఆలోచించే వాళ్లు ఒకరకం. రాబోయే అదృష్టాన్ని తలుచుకుంటూ చేతిలో
ఉన్నదంతా ఊడ్చి పెట్టుకునేవాళ్లు రెండో రకం. రాబడికి మించి పెరుగుతున్న
ఖర్చులను అదుపు చేయలేనివాళ్లు మూడో రకం. ఎల్లకాలం పొదుపు మంత్రాన్ని
పఠిస్తూ.. ఆశలను అదుపుచేసుకుంటూ భారంగా బతుకీడ్చేవాళ్లు మరో రకం. ఈ
రకరకాల మనస్తత్వాల కలగాపులగమే మిడిల్ క్లాస్ ప్రపంచం.
హెచ్చులకు పోయి..
ఓ పాతికేళ్లు వెనక్కి వెళ్తే... మధ్యతరగతి బతుకులు నిబ్బరంగా సాగేవి. ఉన్నంతలో ఫర్వా
లేదు అనేలా ఉండేవి. కానీ, ఇప్పటి మిడిల్ క్లాస్ నిర్వచనం ఇంటికో తీరుగా తయారైంది.
నెలకు లక్ష ఉన్నవ్యక్తిని కూడా మధ్యతరగతి కింద జమకట్టేస్తున్నారు. ఆదాయాన్ని
బట్టి పెరగదు. ఆస్తులు, ఆదాయం, కుటుంబసభ్యులు, భవిష్యత్ అవసరాలు, బాధ్యత
లను అన్నిటినీ బేరీజు వేసుకొని అంచనాకు రావాలి. అయితే, చాలామంది మధ్యతరగతి
కుటుంబీకులు సంపన్నులుగా కనిపించాలని భావిస్తుంటారు. పులిని చూసి నక్క వాత పెట్టుకు
న్నట్టుగా.. లేని హెచ్చులకు పోయి జీవితాన్ని అగమ్యగోచరంగా చేసుకుంటారు. పైగా, ఇ,ఎం,ఐ,
సంస్కృతి ప్రభావంతో ఇల్లు ,కారు ,ఇల్లు కారు గృహప్రకారణాలు అన్ని రుణం ద్వారా సమకూర్చు
కొని నెలవారీ వాయిదాలు కడుతూ ఎండ్లకు ఏళ్లు గడిపేస్తున్నారు. లోను ద్వారా తీసుకున్న
వాటిని కూడా ఓన్ గా భావిస్తూ శ్రీమంతులుగా భ్రమపడుతుంటారు. తీరా రుణవిముక్తులు
అయ్యేనాటికి మిడిల్ క్లాస్ నే మిగిలిపోతారు.
ఎప్పుడు రిచ్ అంటే..
నెలవారీ ఆదాయం ఖర్చులకు సమానంగా ఉంటే మధ్య తరగతి. ఖర్చులకు మించి రెట్టింపు
ఆదాయం ఉన్నట్లయితే ఎగువ మధ్య తరగతిగా భావించొచ్చు. ఆదాయం స్థిరంగా ఉండదు.
ద్రవ్యోల్బణ శాతానికి మించి ఆదాయం పెరగడం లేదంటే.. మిడిల్ క్లాస్ నుంచి పేదవారి
జాబితాలోకి చేరుతున్నట్టే అని భావించాలి. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ధరలూ మండుతాయి.
ఖర్చులు అధికమవుతాయి. రాబడిలో మారకుండా ఖర్చులు తడిసి మోపెడైతే.. ఆర్థికంగా ఎదగడం
అసాధ్యం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. చెప్పినంత
తేలిక కాదు. ఆదాయంలో మిగులుబాటు సాధిస్తే.. ఆర్థిక నిల్వలు నిదానంగా పెరుగు
తాయి. ఉద్యోగం చేయకపోయినా.. ఐదేండ్లపాటు కుటుంబాన్ని పోషించగలిగే స్థితికి చేరుకు
న్నారంటే మీరు ఓ మోస్తరు ధనవంతులు అయినట్టే. అంటే, నగదు కూడబెట్టడంతోపాటు
స్థిరచరాస్తుల ద్వారా ఎంతోకొంత రాబడి సమకూర్చుకోవడం అన్నమాట! ఇలాంటి రాబడి
లక్షల్లో ఉన్నవాళ్లు శ్రీమంతులు. ఆదాయం పెరిగినా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఊరుకోదు!
దాన్ని మరోచోట ఇన్వెస్ట్ చేయమంటుంది. అక్కడినుంచీ లాభాలు పొందేలా చూస్తుంది.
ఆర్థిక క్రమశిక్షణను పూర్తిగా పాటించకున్నా, ఊహించని పరిణామాలు ఎదురైతే తప్ప ధనవం
తులు మిడిల్ క్లాస్కు పడిపోరు. కానీ, ఆర్థిక క్రమశిక్షణ, దూరదృష్టి ఉన్న మధ్యతరగతి కుటుం
బాలు ఎప్పటికైనా సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంటాయి.
తేడా.. దవాఖాన ఖర్చంత.
మధ్యతరగతి ర్యాంకును మెరుగుపర్చుకోవాలంటే చాలా ఏండ్లు కష్టపడాలి. కానీ, చిన్న తప్పు
చేసినా దిగువ మధ్యతరగతికి జారిపోవడం ఖాయం. మధ్యతరగతికి, నిరుపేదకూ మధ్య
తేడా ఆస్పత్రి ఖర్చంత! ఇంట్లో ఏ ఒక్కరికైనా ఊహించని అనారోగ్య సమస్య తలెత్తితే.. అన్ని
రోజులూ కడుపు కట్టుకొని కూడబెట్టిందంతా కర్పూరంలా కరిగిపోవచ్చు. ఆరోగ్య బీమా
లేకుండా జీవితాన్ని వెళ్లదీసుకోవచ్చు అనుకుంటే పొరపాటు. ఆరోగ్య బీమాతో మీరు రిచ్ కాక
పోవచ్చేమో కానీ, నిరుపేదలు కాకుండా ఉండగలుగుతారు. దీంతోపాటు జీవిత బీమా కూడా
తోడుంటే.. దురదృష్టవశాత్తు ఇంటి యజమాని దూరమైనా.. ఆ కుటుంబ పరిస్థితిలో మార్పు
ఉండదు. పిల్లల చదువులు ఆగవు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదు!