65. అందరికీ ఒకేలా పారదు.

65. అందరికీ ఒకేలా పారదు.

ఇన్వెస్ట్మెంట్ అనగానే.. లాభాలను ఊహిస్తారు. ఇందుకోసం ఆర్థికవేత్తలు సూచించిన ఫార్ములాలను పాటిస్తారు. వయసు ఎంత ఉంటే అంత డెట్లో దాచాలనీ, వందలోంచి వయసు తీసే యగా వచ్చిన మొత్తం ఈక్విటీలో పెట్టాలనీ ఫిక్సయిపోతారు. కొంద రేమో.. నికర ఆస్తిలో ఇంత మొత్తం పెట్టుబడిగా పక్కన పెట్టాలని భావి స్తారు. కానీ, పర్పస్ లేకుండా ఇన్వెస్ట్ చేసే డబ్బులు అవసరానికి అక్కరకు రాకుండా పోతాయని గుర్తెరగాలి.

పేరుమోసిన ఆర్థికవేత్తలు సూచించిన విధానాలు కూడా సర్వజనీనం, సర్వ కాలీనం కాదని గుర్తుంచుకోవాలి. ప్రమోద్, ప్రణీత్ పరిస్థితులు దీనిని తేటతెల్లం చేస్తాయి. ప్రమోద్ ఎగువ మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇద్దరికీ పెన్షన్ వస్తుంది. ఊళ్లో సొంతింట్లో ఉంటారు. అక్కడ పొలం చూసుకుంటూ.. శేష జీవితం హాయిగా గడుపుతున్నారు. తల్లిదండ్రుల బాధ్యత ప్రమోదుకు లేదు. నెలకు ఒకసారి ఫ్యామిలీతో ఊరికి వెళ్తాడు. రెండు రోజులు సరదాగా గడిపి తిరుగు ప్రయాణం అవుతాడు. అతగాడి నెల వేతనం 80 వేలు. భార్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఆమెకు నెలకు 80 వేలు వస్తుంది. హైదరాబాద్లో ఫ్లాట్ కొంటానంటే.. పాతిక లక్షలు తల్లిదండ్రులు సర్దుబాటు చేశారు. మరో 40 లక్షల లోన్ తీసుకున్నాడు. భార్య, తన సేవింగ్స్లో రిజిస్ట్రేషన్, వుడ్వర్క్ చేయించాడు. ఇద్దరి జీతంలో పావువంతు ఈఎమ్ఐస్ఐ చెల్లిస్తున్నాడు ప్రమోద్.

ఇక ప్రణీత్ విషయానికి వద్దాం! అతనూ ప్రమోద్ పనిచేసే సంస్థలోనే ఉద్యోగి. జీతం నెలకు 90 వేలు. భార్య చిన్న ఉద్యోగం చేస్తుంది. ఆమెకు 30 వేల వరకు వస్తాయి. ప్రణీత్ తల్లిదండ్రులు కొడుకుతోపాటే ఉంటారు. వయసు పైబడటంతో ఇద్దరికీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. పైగా అతని తండ్రి ప్రైవేట్ సంస్థలో గుమాస్తాగా పనిచేసి రిటైర్ అయ్యాడు. కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులకు అతని సంపాదన అంతంత మాత్రంగా సరిపోయేది. వెనక వేసిందేమీ లేదు. పైగా చెల్లెలు పెండ్లి బాధ్యత ప్రణీతే! ఉద్యోగం చేస్తున్న చెల్లి సంపాదనను ఆమె పేరిట జాగ్రత్త చేసేవాడు. ప్రణీత్ దంపతుల సంపాదన ఇంటి వ్యవ హారాలు, ఇద్దరి పిల్లల చదువులకు  సరిపోయేది! చిన్నాచితకా చీటీలు, పాలసీలు గట్రా మినహా పెద్దగా ఇన్వెస్ట్ చేసేందుకు కూడా అతని దగ్గర ఏం లేవు.


ఈ ఇద్దరూ ఒకే వయసు వారు. సంపాదన విషయంలోనూ ఇద్దరిదీ ఒకే రేంజ్. కానీ, ప్రమోద్ తన జీతంలో పాతిక శాతం రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. తండ్రి సపోర్ట్ ఊళ్లో పొలంలో పామాయిల్ తోట వేశాడు. భార్య పేరిట గోల్డ్ స్కీమ్ కడుతున్నాడు. ఆడంబ రాలకు పోకుండా, అదే సమయంలో కక్కుర్తి పడకుండా... పొదుపు, మదుపు చేస్తూనే జీవి తాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రమోద్ లీడ్ చేస్తున్న జీవితం ప్రణీతకు సాధ్యం అవుతుందా! ఆర్థికవేత్తలు సూచించిన ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాలు ఇద్దరికీ ఒకేలా వర్తించవు కదా ! కేవలం మనిషి ఆదాయం ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ముందుకుసాగవు. కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి మార్గాలు అన్వేషించాలి. చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పడం లేదు. మనకు తాహతు లేదని నిమ్మకు నీరెత్తినట్టు ఉండొద్దు. రాబడి పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా కన్నవారి అండదండలు లభించడం, సంపాదన స్థిరంగా ఉండటం మంచిదే! కానీ, ఇలాంటి వ్యక్తులు తాము ఏం చేసినా చెల్లుతుందనే వైఖ రితో ఉంటే ప్రమాదం. ఎందుకంటే.. లేని హెచ్చులకు పోయి బొక్కబోర్లాపడ్డ కుటుంబాలు ఎన్నో!

ఎందుకు.. ఎక్కడ?

జీవితం సాఫీగా సాగాలంటే.. ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాల్సిందే! అది ఎందుకు చేస్తున్నా మన్న లక్ష్యం ఉండాలి. ఎక్కడ చేయాలో విజ్ఞతతో ఆలోచించాలి. కూతురు ఉంటే.. బంగా రంపై ఇన్వెస్ట్ చేయాలి. బిస్కెట్ బంగారం కొని.. బీరువా లాకర్లో పెట్టడం సరికాదు! చిన్నదో పెద్దదో నగ చేయించి.. మీ కూతురికి బహుమానం చేయండి. అది ధరించినప్పుడు మీ బిడ్డ కండ్లలో కనిపించే ఆనందం మీ పెట్టుబడికి పదింతల లాభాన్ని ఇచ్చిన అనుభూతిని కలిగి స్తుంది. అదే కూతురును డాక్టర్ చదివించాలని భావించారు అనుకుందాం. మొదటి బర్త్ డే నుంచి తనకు పదహారో పుట్టిన రోజు దాకా.. ఏటా తులం బంగారం కొని దాచారే అను కుందాం! అప్పటికి పదహారు తులాలకు చేరుతుంది. అప్పుడు ఎంబీబీఎస్ ఫీజుకు ఏమైనా డబ్బు తక్కువైతే.. ఈ బంగారం కుదువ పెడితే, మీ బిడ్డ చదువుకు ఆటంకం తొలగిపోతుంది కదా! బంగారం కాకుండా.. ఓ స్థలం తీసుకున్నారే అనుకుందాం. మీ బిడ్డకు 24వ ఏట పెండ్లి చేయాలని భావించారు. ముహూర్తాలు పెట్టుకున్నాక.. ప్లాట్ అమ్మకానికి పెడితే అడ్డెకు పావు పేరు వస్తుంది. ఏడాది ముందునుంచే మార్కెట్లో బేరసారాలు సాగిస్తే.. మంచి లాభాలు వస్తాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఈక్విటీ షేర్లు అయినా.. ఎప్పటికి, ఎందుకు అవసరమో స్పష్టత వచ్చాకే ఇన్వెస్ట్ చేయండి.

Popular posts from this blog

pss book : శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా completed , second review needed. 26th April 2024

pss book: గురు ప్రార్థనామంజరి . completed 21st july 2024

pss book: కధల జ్ఞానము read review pending. 25th june 2024