60. కాలంతోపాటే.. కాసుల విలువ.
నెలకు కేవలం వెయ్యి రూపాయలు పెట్టుబడితో నలభై ఏండ్ల తర్వాత మూడు కోట్ల రూపాయలు వచ్చే మార్గం ఉందన్నమాట వాస్తవమే. కూర్చున్నచోట మొబైల్లో ఎస్ఐపీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి కట్టే లెక్కలు బాగానే ఉంటాయి. వచ్చిన సమస్యంతా నిజ జీవితం గురించే. ఊహల్లో బతికేవాళ్లు ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకోవాలి. కాలంతోపాటే డబ్బు విలువ కూడా మారుతుందని గ్రహించాలి.
నెలకు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే నలభై ఏండ్ల తర్వాత మూడు కోట్లు. అదే 60 ఏండ్లపాటు చేస్తూ ఉంటే 50 కోట్లు! ఔను, ఇది నిజమే! మీరు చదివింది వాస్తవమే. ఈ లెక్కలన్నీ శుద్ధ ఒప్పులే. నెల నెలా పెట్టుబడి పెడుతూ ఉంటే దాని విలువ ప్రతి ఐదేండ్లకోసారి రెట్టింపు అవుతుంది. అది ఎలా గంటే ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 40 ఏండ్లకు దాని విలువ 3 కోట్లు. అదే 45 ఏండ్లకు 6 కోట్లు, 50 ఏండ్లకు 12 కోట్లు, 55 ఏండ్లకైతే 25 కోట్లు. ఇక 60 ఏండ్లపాటు ప్రతి నెలా 1000 డిపాజిట్ చేస్తే అప్పుడు వారి చేతికి వచ్చే మొత్తం 50 కోట్లకు పైమాటే! ఇలా లెక్క చాలా సులువు. కానీ, అరవై ఏండ్ల తర్వాత 50 కోట్లకు ఉండే విలువ ఎంత? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు విలువ కాలంతోపాటు మారుతూ ఉంటుంది.
ఆ మాటకొస్తే భారతదేశంలో దాని విలువ మరింత పడిపోతుందే తప్ప పెరగడంలేదు. ఇది మరిచిపోయి చాలా మంది టైం వ్యాల్యూ (విలువ) చూడటంలేదు. మనీ వాల్యూమ్ (పరి మాణం) మాత్రమే చూస్తున్నారు. భవిష్యత్తు గురించి రందిపడుతూ ఈ రోజు ఎలా బతకాలో మర్చిపోతున్నారు. ఈ రోజు ధైర్యంగా బతకడానికి ఏం చేయాలో ఆలోచించాలి. కానీ, నలభై ఏండ్ల తర్వాతి జీవితాన్ని ఇప్పట్నుంచి ఆలోచిస్తారు. ఒక పూట తినీ మరో పూట తినక డబ్బు అలా దాచిపెడుతూ అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మూడు కోట్లకు ఉన్న విలువ నలభై ఏండ్ల తర్వాత ఎంత ఉంటుందో తెలిస్తే ఇలాంటి లెక్కలేయడం, ఇలాంటి పొదు పులు చేయడం, పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించరు.
డ్రీమ్ సాలరీ దొల్లతనం.
ఒక 35 ఏండ్ల వయస్కుడు ఇప్పుడు 50 వేలు సంపాదిస్తుంటే గొప్ప ఆదాయంగా భావిం చేవారు చాలామంది ఉన్నారు. గొప్ప జీతం అంటే ఎంత? 20 ఏండ్ల వయసులో డ్రీమ్ సాలరీ 20 వేలు. మరి ఇప్పుడు 50 వేలు సంపాదిస్తున్నాడు. అంటే రెట్టింపు జీతం వస్తున్నది. కానీ ఏమైంది అతను తన కళ నెరవేర్చుకున్నాడు కదా ?అయినా సంతృప్తిగా బతుకుతున్నడా అంటే , లేదు. దీన్నిబట్టి ఏం అర్థమైంది? 15-20 ఏండ్ల క్రితం తాను అనుకున్నంత సంపాదిస్తున్నప్పటికీ అసంతృప్తే మిగులుతున్నది. తేడా ఎక్కడొచ్చింది. ఇరవై ఏండ్ల క్రితం వేసుకున్న లెక్క తప్పు. ఆ అంచనాలు తారుమారయ్యాయి. ఇరవై ఏండ్ల క్రితమే ఉన్న డబ్బు విలువను బట్టి అతను అలా ఊహించుకున్నాడు. అతను సంపాదించే రోజుల్లోకి వచ్చేసరికి డబ్బు విలువ తగ్గిపోయింది.
వాళ్లే ధన వంతులు...
1980ల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఉద్యోగం చేసే టీచర్లకు అలవెన్సులన్నీ కలిపి 620 వచ్చేది. ఆరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి వేతనం 400-600, గెజిటెడ్ ఆఫీసర్ జీతం 1200-1500. అలాంటి రోజుల్లో అద్భుతమైన బతుకు బతకడానికి నెలకు 500 సరిపో యేది. 40 ఏండ్ల కాలం గడిచింది.. అప్పటి ఉద్యోగికి ఇప్పుడు వస్తున్న పెన్షన్ 30 వేలు. అదే 40 ఏండ్ల క్రితం ఖర్చు పెట్టినట్టు నెలకు 500లతో సరిపెట్టుకోగలుగుతున్నాడా? కాదు కదా! నెలకు 50 వేలు కావాల్సి వస్తున్నది. నలభై ఏండ్లు వెనక్కి వెళ్తే 500 గొప్పగా అని పించింది.. ఇప్పుడు దానికి విలువే లేదు. 80ల్లో లక్ష ఉంటే లక్షాధికారి. 90ల్లో కోటీశ్వరుడు. ఇప్పుడు.. ఈరోజు ఖాతాలో కోటి రూపాయలుంటే పెద్ద విషయం కాదు. మరి 40 ఏండ్ల తర్వాత మూడు కోట్లు, 60 ఏండ్ల తర్వాత 50 కోట్ల మాటేంటి? కాబట్టి డబ్బుకు ఇప్పుడున్న విలువ భవిష్యత్తులో కొన్ని రెట్లు పెరుగుతుందన్న ఎరుకతో మసులుకునే వాళ్లే ధనవంతుల కింద లెక్క.