67.ఖర్చులు తగ్గొద్దు.. రాబడి ఆగొద్దు!
ఖర్చులు తగ్గించుకుంటే లక్షాధి కారులం అయిపోతామనే భ్రమలో ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. అయితే, అనివార్య ఖర్చులకు కళ్లెం వేయడం పొదుపు అనిపించుకోదు. దుబారా ఎంత ప్రమాదమో... బలవంతంగా వ్యయాన్ని కట్టడి చేయాలనుకోవడమూ అంతే నష్టం కూడా! రూపాయి వచ్చేందుకు మార్గాలు అన్వేషించాలే కానీ, రూపాయి పోయే దారులు మూసేయొద్దు.
పోదుపుగా బతకడం అంటే.. పిసినారితనాన్ని పెంచి పోషించడమనే అను కుంటారు చాలామంది. కానీ, పీనాసిగా బతకడానికి, ఖర్చులను అదు పాజ్ఞల్లో ఉంచుకుంటూ జీవనయానం కొనసాగించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ తేడా తెలియక మధ్యతరగతి భారతం అంతా ఆశలను చంపుకొని భారంగా బతుకీడుస్తున్నది.
ఇందుకు ఉదాహరణే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన శివరామ్ జీవితం. ఆయన భార్య సులోచన గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఒకటో తారీఖునే జీతం వచ్చేది. పల్లెటూర్లో నివాసం. సొంతూళ్లో నాలుగెకరాల పొలం. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు. ఊరి నుంచి బియ్యం వచ్చేవి. పల్లెలో అగ్గువకు పాలు దొరికేవి. ఒక కుటుంబం రిచ్గా బతకడానికి ఇంతకన్నా ఏం కావాలి! మూడు పూటలా మృష్టాన్న భోజనం చేయగలిగే శక్తి ఉన్నా... పచ్చడి మెతుకులే పరమాన్నంగా భావించేవాళ్లు. పండుగలో పంపాలలో తప్ప ఆ ఇంట్లో పప్పు ఉండేది కాదు ఇలా ఇంటిళ్లపాది కడుపు కట్టుకొని కొని బాగానే కూడా పెట్టారు.ఏండ్లు గడిచాయి పిల్లలకు 30 ఏళ్లు వచ్చేసరికి రకరకాల రుగ్మతలు మొదలయ్యాయి. సరైన పోషకాహారం లేక తరచూ అనారోగ్యం పాలవడంలో,ఆ ఇంట ఇప్పుడు రివాజు. ఏళ్ళు తరబడి పోగుచేసుకున్న సొమ్మంతా వైద్యానికి చెల్లిస్తూ ఖర్చులను నియంత్రించలేకపోతున్నానే అని నేటికీ బాధపడుతుంటాడు శివరామ్.
ఎప్పుడూ ఉండేవే..
మన సమాజంలో శివరామ్ లాంటివాళ్లు ఎందరో కనిపిస్తారు. ఖర్చులకు భయపడటం మానవ నైజం అనిపించుకోదు. ఖర్చులు ఎప్పుడూ ఉండేవే! అందుకు తగ్గ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడమే నిజమైన మనిషి లక్షణం అనిపించుకుంటుంది. ఉదాహరణకు ఒక కుటుంబం రోజుకు లీటరు పాలు కొనుగోలు చేస్తుంది. ఖర్చుల నియంత్రణ పేరుతో అర లీట రకు పరిమితమైంది. అంతకన్నా తగ్గించుకుందామంటే కుదరదు. పాల కోట సగమయ్యేస రికి.. పిల్లలకు పోసే వాటిలో నీళ్లు వచ్చి చేరుతాయి. మంది ఎక్కువ కాకుండానే మజ్జిగ పల్చగా మారుతుంది. కానీ, నెలకు అదనంగా 900 సంపాదించగలితే.. లీటరు పాలు కొనసాగిం చొచ్చు. పిల్లలకు గ్లాసు నిండుగా చిక్కటి పాలు ఇవ్వొచ్చు. గడ్డ పెరుగు కాకపోయినా.. చిక్కటి మజ్జిగ అందించవచ్చు. సంపాదన ఎక్కువగా ఉందని లీటరు పాలు తీసుకునే చోట రెండు నర లీటర్లు తీసుకుంటామంటే దుబారా చేసినట్టు అవుతుంది. అవసరాలకు లోటు రాకుండా చూసుకోవాలి, అదే సమయంలో అనవసరమైన ఖర్చులను పరిహరించుకోవాలి.
ఛిన్నాభిన్నం చేసుకోవద్దు..
ఖర్చులు తగ్గించుకుంటే మహా పాపమని చెప్పడం కాదు. కానీ ఏది మంచి ఖర్చు, ఏది చెడ్డ ఖర్చు అన్న కనీస అవగాహన అవసరం. నాణ్యమైన వెచ్చాలు, తాజా కూరగాయలు, పండ్లు కాస్త ధర ఎక్కువున్నా తీసుకోవాలి. దానివల్ల ఇంట్లోవాళ్లకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది. అదే సమయంలో పిజ్జాలు, బర్గర్ల దగ్గర ఇదే సూత్రం పాటిస్తానంటే కుదరదు. ఇంట్లో ఓ వేడుక ఉంది. మీ శక్తిమేరకు అతిథులను పిలవడం మంచిది. అంతేకానీ, మరపురాని వేడుక అనుకొని అప్పుచేసి మరీ వందల్లో అతిథులను పిలిచి మీ ఆర్థికస్థితిని ఛిన్నాభిన్నం చేసుకోవడం క్షమించరాని తప్పిదమే అవుతుంది. ఒక్కగానొక్క కూతురు. ఆమె పెండ్లి గ్రాండ్గా చేయాలనుకోవడంలో తప్పు లేదు. అందుకు పదేండ్ల ముందు నుంచే ప్రణా ళిక సిద్ధం చేసుకోవాలి. మీ ఆదాయంలో కొంత భాగం జాగ్రత్త చేయాలి. ఆ మొత్తంతో వీలై నంత ఘనంగా పెండ్లి చేయాలి. అంతేకానీ, అందినకాడికి అప్పులు చేసి అంగరంగ వైభవంగా పెండ్లి చేశామని జబ్బలు చరుచుకుంటే ఎవరికి నష్టం!!
ఆదాయం పెంచుకుందాం..
ఊరు దాటను, ఉద్యోగం మారను అంటే ఆదాయం వీసమెత్తు పెరగదు. 'ధైర్యే సాహసే లక్ష్మి' అని మన పెద్దలు ఊరికే అనలేదు. ఉద్యోగంలో పురోగతికి అవసరమైతే పురం మారాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. సమయోచితంగా సంస్థలు మారాలి. సంపాదన పెంచుకోవడంపై దృష్టి సారించాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పొదుపు, మదుపు మంత్రాలు పఠించాలి. అంతేకానీ, బుజ్జిబాబు డైపర్స్ దగ్గర, పిల్లాడి స్కూల్ ఫీజ్ దగ్గర, ఆహారం విషయంలో కక్కుర్తిపడి ఖర్చు తగ్గించుకున్నాం అనుకున్నంత మాత్రాన మీ రాబడి పెరగదని గుర్తుంచుకోండి!!