23. స్థలం కొనాలా.. ఇల్లు కొనాలా?
ఇల్లు కట్టించాలా ? ప్లాట్ తీసుకో
వాలా నగర శివారులో స్థలం
కొనాలా?.. చాలామంది ఇలాంటి
ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతుం
టారు. దేనికో కట్టుబడి పట్టుదలతో
పెట్టుబడి పెట్టేస్తారు. ధర పెరిగితే
సంతోషమే! కానీ, తేడా జరిగితేనే
కష్టార్జితం బూడిదపాలై పోయిందని
బాధపడాల్సి వస్తుంది. స్థిరాస్తి
మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే
అందులో ఉండే సాధకబాధకా
లేంటో ఒకసారి పరిశీలిద్దాం.
ఒక సగటు ఉద్యోగి జీవితంలో కాస్త కుదురుకున్నాక ఇల్లు కొనాలనుకోవడం
సహజం. మొదటి పెట్టుబడి సొంతిల్లే కావాలి. అది ఇండిపెండెంట్ ఇల్లా,
ఫ్లాటా అన్నది వారివారి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా నిర్ణయించుకోవాలి.
సొంతింటి కల నెరవేరిన తర్వాత.. చేసే ఇన్వెస్ట్మెంట్ గురించి పక్కాగా ఆలోచిం
చాలి. 'ఎందులో ఎక్కువ లాభం' వస్తుంది అనుకోవడం కన్నా.. మన అసలుకు
ఎసరు రాకుండా చూసుకోవడం ప్రధానం అని గ్రహించాలి. ప్లాట్, ఫ్లాట్ రెండూ
మంచి ఇన్వెస్ట్మెంట్లే! అయితే, రెండిటి లాభాల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లే.. రిస్క్
లోనూ వ్యత్యాసం ఉంటుంది.
ప్లాట్ కొనాలంటే..
రియల్ఎస్టేట్లో పెట్టుబడికి అందరూ మొగ్గుచూపుతారు. కారణం మూడునాలుగేండ్లలో
రెండింతలు అవుతుందన్న నమ్మకం. అయితే, మొదటి రెండేండ్లు ఉన్నంత జోరు తర్వాత
ఉండకపోవచ్చు. మార్కెట్ అంచనాల ప్రకారం ప్లాట్ ధర సరాసరి ఆరేండ్లకు రెం
అవుతుంది. అంటే ఏడాదికి 12 శాతం వడ్డీ గిట్టుబాటు అవుతుందన్నమాట. అధిక లాభం
ఉన్నచోటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ప్లాట్ కొనుగోళ్ల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసు
కున్నా.. న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కొందరైతే తక్కువ ధరకు
వస్తుంది కదా! అని లిటిగేషన్ ప్లాట్లు కొనడానికి ఆసక్తి కనబరుస్తారు. ప్లాట్ కొనేవరకూ ఉన్న
ఉత్సాహం కొన్నాళ్లకు తగ్గిపోతుంది. ఎక్కడో ఉన్న స్థలాన్ని తరచూ వెళ్లి చూడటం కుదరదు.
చుట్టుపక్కల పరిస్థితులు ఎలా మారుతున్నాయో పట్టించుకునే తీరిక కూడా ఉండదు. ఓ
పదేండ్ల తర్వాత వెళ్తే.. మన ప్లాట్ ఎక్కడుందో తెలుసుకోవడం గగనమే! ఎంత కాదన్నా
భూముల విషయంలో ఇలాంటి రిస్క్లలు ఎప్పుడూ ఉంటాయి. అలాఅని ప్లాట్ కొనొద్దని
కాదు! ధర కాస్త ఎక్కువగా ఉన్నా అప్రూవ్డ్ లేఅవుట్లో కొనడం మంచిది. భూమి కొన్న
వెంటనే దాని చుట్టూ కాంపౌండ్ వాల్ గానీ, ఫెన్సింగ్ గానీ చేయిస్తే మరీ మంచిది. అన్నిటి
కన్నా ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు ఏమీ లేవని తేలాక గానీ, భూమిపై పెట్టుబడి
పెట్టాడు. ఈ జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు రియల్ మార్కెట్ను ఎప్పటికప్పుడు అంచనా
వేస్తూ ముందడుగు వేయాలి.
ఫ్లాట్ కొనేముందు.
నగరజీవికి యాభై, అరవై లక్షల్లో ఇల్లు కావాలంటే.. ఫ్లాట్ ఒక్కటే మార్గం! అయితే, ఫ్లాట్
మీద పెట్టుబడి పెట్టొచ్చా? లేదా? అన్నది చాలామంది అనుమానం. ప్లాట్తో పోలిస్తే ఫ్లాట్
మీద రిస్క్ తక్కువనే చెప్పొచ్చు. కబ్జా జరిగే అవకాశం దాదాపు ఉండదు. పొజిషన్లో (అదే
ఫ్లాట్) ఉంటారు కాబట్టి రిస్క్ ఉండదు. అద్దెకు ఇచ్చినా నెలకు 15,000 వరకు
వస్తుంది. అంటే ఫ్లాట్ను ఆదాయాన్నిచ్చే ఆస్తిగా పరిగణించాలి. భూమిలా ఫ్లాట్ విలువ ఆరేం
డ్లలో రెట్టింపు కాకపోవచ్చు. కానీ, మార్కెట్ విలువ, నెలకు వచ్చే అద్దె కలిపి లెక్కిస్తే ఏడా
10 శాతం వడ్డీ చొప్పున ఫ్లాట్ ధర పెరుగుతుంది. ఇరవై ఏండ్లు పోతే ఫ్లాట్ పాతబడిపోతుంది.
కదా! అంటారా? అన్లివైడెడ్ షేర్ కింద వచ్చే స్థలం ధర అప్పటికి మూడింతలు పెరుగు
తుంది కాబట్టి ఇబ్బందేం ఉండదు. ఇక ఇండిపెండెంట్ ఇల్లు కొనే స్తోమత ఉంటే.. ఇంటిపైన
ఇల్లు వేసే అవకాశం ఉంటుంది. నెలవారీ రాబడితోపాటు, ఇంటి విలువ పెరుగుతుంది.
అయితే, ఇల్లంతా అద్దెకు ఇవ్వడం కన్నా.. అందులో ఉంటూ, పై పోర్షన్లు అద్దెకిస్తే రిస్క్
లేకుండా ఉంటుంది.
లెక్క చూపించాల్సిందే!
మామూలుగా ప్రభుత్వ ధరకు, మార్కెట్ విలువకు ఓపెన్ ప్లాట్ల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపి
స్తుంది. తక్కువ ధరకు ప్లాట్ కొన్నా.. దాని విలువ ఊహించనంతగా పెరిగినా.. దాన్ని విక్ర
యించినప్పుడు యజమానికి ఓ చిక్కు ఉంటుంది. ప్లాట్ లావాదేవీలు నగదు రూపంలో జరీ
గితే.. ఆ మొత్తాన్ని ఖాతాలో చూపించలేకపోతారు. అలాగని ధరంతా చెక్కు రూపంలో ముట్ట
జెప్పాలని చెబితే.. అంత మొత్తం న్యాయ సమ్మతంగా బదిలీ చేసే బయ్యర్ దొరకడు. కాబట్టి
మీ పూర్తి ఆస్తుల్లో రియల్ ఎస్టేట్ ఆస్తులు యాభై శాతానికి మించకుండా జాగ్రత్తపడటం
అత్యావశ్యకం.