FP ramprasad 12.ఇల్లు పెట్టుబడి కాదు!

12.ఇల్లు పెట్టుబడి కాదు!

ప్రతి సామాన్యుడి కల సొంతిల్లు,
దాన్ని నెరవేర్చుకోవడమే జీవిత
లక్ష్యంగా భావిస్తారు కొందరు,
కొలువులో చేరింది మొదలు నచ్చిన
నెలవు కోసం వెతుకులాట మొదలు
పెడతారు ఈ రకం. జీతం అరంకెలు
అందుకున్నా ఇంట్లోవాళ్లు 'ఇల్లు
కొందాం' అనగానే రంకెలు వేసే
వారు మరో రకం. ఈ రెండు
ఆలోచనలూ సరైనవి కావు. ఇంటిని
పెట్టుబడిగా భావించొద్దు.
అత్యవసరమని తీర్మానించుకోవద్దు.

ఓ ముప్పయ్ ఏండ్లు వెనక్కి వెళ్తే.. సగటు ఉద్యోగి పదవీ విరమణ వయ
సుకు దగ్గర పడ్డప్పుడు గానీ, సొంతింటి గురించి ఆలోచించేవాడు కాదు.
పిల్లల చదువు, వారి పెండ్లిళ్లు మొదటి ప్రాధాన్యంగా ఉండేవి. ఆ తర్వాతే ఇంటి
సంగతి!

ఇప్పుడు ట్రెండ్ మారింది! పెండ్లికి ముందే ఓ ఇంటివాడు కావాలని భావించేవారి సంఖ్య
పెరుగుతున్నది. వేతనం 60 వేలు దాటిందో లేదో సొంతింటి మీదికి మనసు మళ్లుతున్నది.
కొందరైతే పెండ్లిచూపుల నాడే 'ఫలానా చోట ఫ్లాట్ చూశాను. నువ్వు చూసి ఓకే అంటే
అడ్వాన్స్ ఇచ్చేస్తాను' అని మాట్లాడేస్తున్నారు. పిల్లనిచ్చే అత్తామామ కూడా అబ్బాయికి తన
కంటూ సొంతిల్లు ఉందా? అని అడుగుతున్నారు. మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో
సొంతింటి కలను వీలైనంత త్వరగా నెరవేర్చుకునే వారు చాలామంది కనిపిస్తారు.

పక్కాగా లెక్కలు...

ఇప్పుడు కాస్త భిన్నమైన మనస్తత్వం ఉన్న వ్యక్తుల గురించి చర్చిద్దాం! వీళ్లకు ఎమోషన్స్
పెద్దగా ఉండవు. అలాగని చెడ్డవాళ్లు కాదు. లెక్కలు ఎక్కువగా వేసుకుంటారు. ప్రతి విషయం
లోనూ లాభనష్టాలు బేరీజు వేసుకుంటారు. కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇవ్వరూ అను
కుంటే పొరపాటు. వాళ్లు చేసే ప్రతి పనీ ఇంట్లోవాళ్ల బాగు కోసమే ఉంటుంది. కానీ, అది ఆ
ఇంట్లోవాళ్లకే రుచించదు. వీళ్ల ఈక్వేషన్ ఎలా ఉంటుదంటే.. 60 లక్షల్లో ఇల్లు తీసుకోవా
లంటే 10 లక్షల నుంచి 15 లక్షలు డౌన్ పేమెంట్ కావాలి. మరో 3 లక్షల వరకు
రిజిస్ట్రేషన్ ఇతరత్రా ఖర్చులు, 45 లక్షల రుణానికి గానూ ఇరవై ఏండ్లపాటు నెలకు
40 వేల చొప్పున వాయిదాలు చెల్లించాలి. అదే అద్దె ఇంట్లో ఉంటే 15 వేలల్లో
పోతుంది. గృహరుణం వాయిదా కడుతున్నాం అనుకొని నెలకు 25వేలు ఎస్ఐపీ
మ్యూచువల్ ఫండ్స్లో ఇదే 20 ఏండ్లు ఇన్వెస్ట్ చేస్తూపోతే.. కనీసం 3.20 కోట్ల నికర
లాభం చేతికి వస్తుంది అని లెక్కకడతారు. ముందస్తుగా డౌన్ పేమెంట్ గట్రా ఏమీ ఉండవు
కాబట్టి నెలకు 30వేలు ఎస్ఐపీలో పెడితే 4 కోట్ల రాబడి వస్తుందని లెక్కలు వేసుకుంటారు.
 ఈ ఆలోచన మంచిదే! ఆ నాలుగు కోట్లతో పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా
జీవితం గడుపొచ్చని భావిస్తారు! ఈయనగారి వైఖరినీ తప్పపట్టలేం.

తాహతుకు మించి సాహసం.

మూడోరకం మనుషులు మరింత వింతగొలుపుతారు. వీళ్లు సమాజంలో గుర్తింపు కోసం తమ
లక్ష్యాలను సవరించుకుంటారు. ఒకరకంగా విస్మరిస్తుంటారు కూడా! 'ఎంత చెట్టుకు అంత
గాలి' అనే ప్రాథమిక విషయాన్ని కూడా కాదని గాల్లో మేడలు కడుతుంటారు.
'ఫలానా బంధువు ఇంటికన్నా నాది గొప్పగా ఉండాలి' అని పులిని చూసి నక్క వాతలు పెట్టు
కున్నట్టుగా తాహతుకు మించి ప్రయత్నాలు చేస్తారు. బ్యాంకు రుణంతోపాటు డౌన్ పేమెంట్,
రిజిస్ట్రేషన్ కోసం అప్పోసొప్పో చేస్తారు. ఇవన్నీ తడిసి మోపెడు అవుతాయి. ఆర్థిక లావాదే
వీలు మోయలేనంతగా మారతాయి. జీవితకాలం రొటేషన్ చక్రవర్తులుగా మిగిలిపోతారు.
ఫలితంగా పిల్లలను మంచి కాలేజీలో చేర్పించే శక్తిలేక, సాదాసీదా చదువు చెప్పిస్తారు. ఆ
ప్రభావం వారి జీవితాలపైనా పడుతుంది. అందుకే ఇంటి విషయంలో భావోద్వేగాలకు
గురై శక్తికి మించి సాహసం చేయొద్దు. అదే సమయంలో సామర్థ్యం ఉన్నా సొంతింటి కల
నెరవేర్చుకోవడానికి తటపటాయించొద్దు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంటిని పెట్టుబడిగా
భావించొద్దు!

ఇల్లు కొనడం వల్ల 'జీవితంలో ఇంకేదైనా మిస్
అవుతామా?' అని ఆలోచించాలి. పిల్లల చదువు, ఇతర
లక్ష్యాలకు ఆటంకం రావొచ్చు అనుకుంటే ఇంటి
కొనుగోలు వాయిదా వేయండి. కానీ, ఇల్లు కొనకుండా ”
సంపద సృష్టిస్తానంటే సరికాదు. వ్యక్తిగా కుటుంబాన్ని
సంతోషపర్చడం మీ బాధ్యత! జీవిత భాగస్వామితో
బాగా ఆలోచించి మీ ఆదాయానికి లోబడి తెలివైన
నిర్ణయం తీసుకోండి.

Popular posts from this blog

SAP CPI : camle expression in sap cpi , cm, router, filter and groovy script. format

SAP CPI camel conditions and xpath conditions

chatgpt explanation: all retry messages in sap cpi, with example using jms sender.